భగవద్గీత

02. సాంఖ్య యోగ అధ్యయన పుష్పం

మూలము : శ్రీ వ్యాస మహర్షిచే విరచించబడిన జయము / మహాభారతము (భీష్మ పర్వము)

అధ్యయన వ్యాఖ్యానము : (అధ్యయన విద్యార్థి) యేలేశ్వరపు హనుమ రామకృష్ణ


Arjuna collapses in grief

మూల శ్లోకము


అధ్యయన వ్యాఖ్యానము


ఉపన్యాసము

సంజయ ఉవాచ :-

02–01

తం తథా కృపయావిష్టమ్ అశ్రుపూర్ణాకులేక్షణమ్ ।
విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదన ॥

తం తథా కృపయా ఆవిష్టమ్ అశ్రుపూర్ణ ఆకుల ఈక్షణమ్ ।
విషీదంతమ్ ఇదం వాక్యం ఉవాచ మధుసూదన ॥

సంజయుడు :-

ఒక్కసారిగా అత్యంత విషాదము, జాలి, దుఃఖములతో నిండిపోయిన అర్జునుని విషణ్ణ వదనం చూచి శ్రీకృష్ణ భగవానుడు భుజంతట్టి, ప్రోత్సాహక వాక్యాలు పలుకసాగారు.

02–01
శ్రీ భగవాన్ ఉవాచ :-

02–02

కుతస్త్వా కశ్మలమిదం విషమే సముపస్థితమ్ ।
అనార్యజుష్టమస్వర్గమ్ అకీర్తికరమర్జున ॥

కుతః త్వా కశ్మలమ్ ఇదం విషమే సముపస్థితమ్ ।
అనార్యజుష్టమ్ అస్వర్గమ్ అకీర్తికరమ్, అర్జున! ॥

శ్రీకృష్ణ భగవానుడు :-

అర్జునా! ఏమిటయ్యా ఇదంతా? అసందర్భము, పెద్దలు మెచ్చనివి, నరక ద్వార హేతువు, విషముతో సమానము అయినట్టి దోష - నైరాశ్య - మోహములతో కూడిన ఈ మలిన భూయిష్టమైనదంతా (కశ్మలము) ఇప్పుడు నీకు ఎక్కడి నుండి వచ్చిపడిందయ్యా? ఇది అసమర్థతను, నిరుత్సాహమును తెచ్చి పెట్టుకునే సమయమేనా? కానే కాదు.

02–02
02–03

క్లైబ్యం మా స్మ గమః పార్థ నైతత్త్వయ్యుపపద్యతే ।
క్షుద్రం హృదయదౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప ॥

క్లైబ్యం మా స్మ గమః, పార్థ! న ఏతత్ త్వయి ఉపపద్యతే ।
క్షుద్రం హృదయదౌర్బల్యం త్యక్త్వ, ఉత్తిష్ఠ, పరంతప! ॥

ఇటువంటి పిరికితనపు పేడిమాటలు కట్టి పెట్టు. ధైర్యము - సాహసము - సామర్థ్యము ప్రదర్శించవలసినట్టి ఈ సమయంలో ఇటువంటి మనో దౌర్బల్యం ఆశ్రయించటం ఉచితం కాదు. ఇది కార్యసిద్ధికై ముందుకు అడుగులు వేయవలసిన సందర్భం సుమా! హృదయ బలహీనతకు చోటు ఇవ్వటం ఎంత క్షుద్రము, నీచము? చాలు చాలు. ఇక లే! అల్పమగు మనోదౌర్బల్యం వదలు. యుద్ధ కార్యక్రమమునకు ఉపక్రమించు. ధనుర్బాణాలు ధరించు. నైరాశ్యము నీవంటి వానికి అనుచితం సుమా! యుద్ధము చేయటానికి సిద్ధం కమ్ము!


02–03
Arjuna refuses to fight

మూల శ్లోకము


అధ్యయన వ్యాఖ్యానము


ఉపన్యాసము

అర్జున ఉవాచ :-

02–04

కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ।
ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన ॥

కథం భీష్మమ్ అహం సంఖ్యే ద్రోణమ్ చ, మధుసూదన! ।
ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హౌ, అరిసూదన! ॥

అర్జునుడు :-

బావా! శ్రీకృష్ణా! నా ఆవేదన ఏమిటో నీవు సరిగ్గా గమనించినట్లు లేవు. మనం ఇప్పుడు యుద్ధం చేయబోతున్నది ఎవరితో? ఈ యుద్ధ పర్యవసానంగా చంపాలనుకుంటున్నది ఎవరెవరిని? నావారినే కదా! బాల్యంలోనే తండ్రిని పోగొట్టుకున్న మమ్ములను చిన్నప్పటి నుండి తండ్రితో సమానంగా సాకి - ముద్దు చేసి - గురువులను చూపి - విద్యాబుద్ధులను నేర్పించి - సర్వవేళల సంరక్షకుడై కాపాడిన పూజనీయులగు తాతగారు భీష్మాచార్యులవారినా? శస్త్ర-అస్త్ర విద్యలలో ఇంతటి వారిగా మమ్ము తీర్చిదిద్దుటచే మా సేవకు సర్వదా అర్హులగు ద్రోణాచార్యులవారినేనా? వారిద్దరు నాచే అత్యంత భక్తితో సేవింపబడటానికి, పూజింపబడటానికి అర్హులైనట్టి మహనీయులు కదా! వారు తీర్చిదిద్దిన నేను నా ఈ చేతులతోనే వారిని గాయపరచటానికి, సంహరించటానికి బాణాలు వదలటమా? ఇంతకన్నా నీవు చెప్పే నరక ద్వారము, దుఃఖప్రదము, దౌర్బల్యము, దౌర్భాగ్యము, పేడితనము మరింకేమి ఉంటుంది?


02–04
02–05

గురూనహత్వా హి మహానుభావాన్
శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే ।
హత్వార్థకామాంస్తు గురూనిహైవ
భుంజీయ భోగాన్ రుధిరప్రదిగ్ధాన్ ॥

గురూన్ అహత్వా హి మహానుభావాన్
శ్రేయో భోక్తుం భైక్ష్యం అపి ఇహ లోకే ।
హత్వా అర్థకామాన్ తు గురూన్ ఇహ ఏవ
భుంజీయ భోగాన్ రుధిరప్రదిగ్ధాన్ ॥

మహానుభావులైన గురువులను సంహరించి అర్థ-కామాలు పొంది జీవించే బదులు భిక్షాటనంతో పొట్ట నింపుకొని జీవిస్తే సరిపోదా? అర్థ-కామాల కోసం రాజ్యపిపాసతో వారిని సంహరించే ప్రయత్నాలు చేయటం, ఆ రక్తపు కూడు తినటం ఎంత నీచం?
02–05
02–06

న చైతద్విద్మః కతరన్నో గరీయో
యద్వా జయేమ యది వా నో జయేయుః ।
యానేవ హత్వా న జిజీవిషామః
తేఽవస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః ॥

న చ ఏతత్ విద్మః కతరత్ నో గరీయో
యత్ వా జయేమ యది వా నో జయేయుః ।
యాన్ ఏవ హత్వా న జిజీవిషామః
తే అవస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః ॥

పోనీ… ‘రాజ్యం వీరభోజ్యం, మనం యుద్ధం చేసి రాజులమై రాజ్యాలు పరిపాలిద్దాం…’ అనుకుందామా? వారేమైనా తక్కువవారా? మహా వీరాధివీరులు అటువైపూ ఉన్నారు. వారు బలవంతులా? మనం బలవంతులమా? యుద్ధంలో వారు గెలుస్తారా? మనం గెలుస్తామా? అదీ చెప్పలేము. పోనీ మనమే గెలిచినప్పటికీ మన బంధువులను, పూజ్యనీయులగు తాతగారిని, గురువులను, సోదరులగు ధార్త్రరాష్ట్రులను పోగొట్టుకుని కదా మనం గెలువవలసింది? అంతా నావాళ్లే కదా! నావారిని చంపుకొని నేను జీవించి మాత్రం ఏమి లాభం?
02–06
02–07

కార్పణ్యదోషోపహతస్వభావః
పృచ్ఛామి త్వాం ధర్మసంమూఢచేతాః ।
యచ్ఛ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే
శిష్యస్తేఽహం శాధి మాం త్వాం ప్రపన్నమ్ ॥

కార్పణ్య దోష ఉపహత స్వభావః
పృచ్ఛామి త్వాం ధర్మసంమూఢచేతాః ।
యత్ శ్రేయః స్యాత్ నిశ్చితం బ్రూహి తత్ మే
శిష్యః తే అహం శాధి మాం త్వాం ప్రపన్నమ్ ॥


హే కృష్ణా! ఏదో దిగులు - జాలి - కార్పణ్యము - భయము- బాధ నా బుద్ధిని ఆవరించివేసినాయయ్యా! ఇప్పుడు “కిం కర్తవ్యా?” విమూఢుడనైనాను. ఎటువైపుగా ముందుకు పోవాలో ఏమీ పాలుపోవటం లేదు. అందుచేత పరంధామా! నేను నీకు శిష్యుడనై శరణు వేడుచున్నాను. నీకు ప్రపన్నుడను అగుచున్నాను. ఈ యుద్ధం చేయటం ఉచితమా? అనుచితమా? ఇక ఇచ్చట ఇంతటితో విరమించటం మంచిదా? ఏది శ్రేయోదాయకం? నేను నిర్ణయించుకోలేకపోతున్నాను. నీవే యోచించి నిర్ణయించు. నియమించు. ఆజ్ఞాపించు.


02–07
02–08

న హి ప్రపశ్యామి మమాపనుద్యాత్
యచ్ఛోకముచ్ఛోషణమిన్ద్రియాణామ్ ।
అవాప్య భూమావసపత్నమృద్ధమ్
రాజ్యం సురాణామపి చాధిపత్యమ్ ॥

న హి ప్రపశ్యామి మమ అపనుద్యాత్
యత్ శోకమ్ ఉత్ శోషణమ్ ఇన్ద్రియాణామ్ ।
అవాప్య భూమౌ అసపత్నమ్ ఋద్ధమ్
రాజ్యం సురాణామ్ అపి చ ఆధిపత్యమ్ ॥

ఇంతటి దుఃఖం నన్ను ఆవరించి ఉండగా నేను యుద్ధం ఎట్లా చేస్తాను? ఏ భయ-వేదన-దుఃఖాలు నన్ను ఆక్రమించుకొని ఉన్నాయో అవి శత్రువులందరూ తొలగినప్పటి రాజ్యలాభం చేతగాని, దేవలోకాధిపత్యం చేతగాని తొలగేవి కావని ఇప్పుడు నాకు అనిపిస్తోంది.

02–08
సంజయ ఉవాచ :-

02–09

ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతప ।
న యోత్స్య ఇతి గోవిందముక్త్వా తూష్ణీం బభూవ హ ॥

ఏవం ఉక్త్వా హృషీకేశం గుడాకేశః, పరంతప! ।
“న యోత్స్య” ఇతి గోవిందమ్ ఉక్త్వా తూష్ణీం బభూవ హ ॥

సంజయుడు :-

ఓ ధృతరాష్ట్ర మహారాజా! ఈ విధంగా పలికి ఆ అర్జునుడు ‘‘నేను యుద్ధం చేయలేనయ్యా’’ అంటూ గాండీవమును ప్రక్కకు నెట్టాడు. దుఃఖభారంతో మౌనం వహించాడు. చూచారా! ఎంత ఆశ్చర్యం!

02–09,
02–10
02–10

తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత ।
సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః ॥

తమ్ ఉవాచ హృషీకేశః ప్రహసన్ ఇవ, భారత! ।
సేనయోః ఉభయోః మధ్యే విషీదంతం ఇదం వచః ॥

అంతా వింటూ ఉన్న శ్రీకృష్ణ భగవానుని ముఖకవళికలు పెద్దగా నవ్వుచున్నట్లుగా మారాయి. ఉభయ సేనల మధ్య నిలిచియున్న రథంలో, విషాదమంతా గూడు కట్టుకొనియున్న ముఖంతో - చతికిలపడి కూర్చునియున్న (నిద్రను జయించటం చేత) గూడాకేశనామధేయుడగు అర్జునుని చూచి ఇట్లా ప్రవచించసాగారు.
Lord Krishna instructs Arjuna

మూల శ్లోకము


అధ్యయన వ్యాఖ్యానము


ఉపన్యాసము

శ్రీ భగవాన్ ఉవాచ :-

02–11

అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే ।
గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః ॥

అశోచ్యాన్ అన్వశోచః త్వం ప్రజ్ఞావాదాన్ చ భాషసే ।
గత అసూన్, అగత అసూన్ చ న అనుశోచంతి పండితాః ॥

శ్రీకృష్ణ భగవానుడు :-

అర్జునా! దేనిని గురించైతే దుఃఖించవలసిన అవసరమే లేదో, దుఃఖించి ప్రయోజనం కూడా లేదో …. అట్టి దాని గురించి నీవు దుఃఖం పొందుచున్నావయ్యా!

ఈ దృశ్యప్రపంచమంతా తనదైన శైలిలో అనేక సంగతి - సందర్భ సంఘటనా క్రమ పరంపరలు కొనసాగిస్తూనే ఉంటుంది. ఇక సుఖ-దుఃఖాలంటావా? అవన్నీ చిత్తములో పేర్చుకున్న ఇష్ట-అయిష్టములను అనుసరించి మనోకల్పితంగా అనుభవమౌతున్నాయి. ప్రకృతి విరచితమైన సంఘటనలు స్రవంతిగా వివిధ రీతులుగా కొనసాగుతూనే ఉంటాయి. వాటిని నిరోధించటం ఎవ్వరికి, ఎట్లా సాధ్యం? అనివార్యమగు ఈ జగత్‌ విషయ ప్రవాహ పరంపరల గురించి దుఃఖించటం అనవసరం! అసంగతము!

ప్రజ్ఞావాదం [Assumptions and Presumptions structured by one’s own self]: నీవు ప్రజ్ఞావాదివై ఇంతవరకూ సంభాషించావు. ప్రతి వ్యక్తి తన లౌకిక ప్రజ్ఞను ఉపయోగించి కొన్నిటిని నమ్ముకొని ఉంటాడు. కొన్నిటి పట్ల నమ్మకము ఉండదు. కొన్ని ఇష్టపడతాడు. మరికొన్నిటిని అయిష్టపడతాడు. ఈ విధంగా తనకు తానే అభిప్రాయము-భావన-అభిరుచుల రూపంతో కూడిన బుద్ధితో తత్ఫలితమైన సుఖ దుఃఖ సంబంధమైన నిర్వచనాలు కల్పించుకొని తన సుఖ-దుఃఖాలన్నీ తానే అనుభవముగా పొందుతూ ఉంటాడు. ఇప్పుడు ఇంతవరకు నీవు చెప్పుకొంటూ వచ్చినదంతా అటువంటి ప్రజ్ఞావాదం నుండి బయల్వెడలిన వాదనా విశేషాలు మాత్రమే!

అటువంటి నీ యొక్క ప్రజ్ఞావాదము నిత్య-అనిత్య వివేకమును కప్పి ఉంచుతోంది. అనగా నీ ప్రజ్ఞ అల్పకాలికమైన - సాపేక్షికమైన (Temporarily and Relatively) సత్యమును నీకు అనుభూతపరచుచుండగా, అది నిన్ను శాశ్వతమైన సత్యమును ఏమరచేటట్లు చేస్తోంది.

అయితే నిత్యానిత్య వివేకమును దృఢపరచుకొన్న మహనీయులగు పండితులకు ఇక్కడ కనిపించేది, అనిపించేది రెండు రకములుగా మాత్రమే! ఆ రెండిటి గురించి వారు దుఃఖించరు. అవేమిటో,…. విను.

➤ (1) గతాసూన్ / గతాసమ్‌
➤ (2) అగతాసూన్ / అగతాసమ్‌

గతించిపోయినవారు ‌[గతాసూన్] - గతించపోబోయేవారు [అగతాసూన్] : ఈ కనబడే నామరూపాత్మక జీవ-జీవన ప్రపంచాంతర్గతమైనదంతా కాలముచేత ఏర్పడి, కాలముచే కొనసాగించబడుచు, కాలముచే లయించబడేదే కదా! మనకు తెలిసినట్టి, మనకు కనిపిస్తున్నట్టి జనుల సమూహమంతా ….. గతించిపోయినవారు - గతించబోయేవారు మాత్రమే! అనివార్యమగు అట్టి గతిని గురించి ఇక దుఃఖించవలసిన పనేమున్నది?

మార్పు చెందేది [గతాసమ్‌] - మార్పు చెందనిది [అగతాసమ్‌] : ప్రతి వ్యక్తిలోనూ రెండే విశేషాలు సమావేశమై సమకూడి, సంయోగం పొంది ఉంటున్నాయి.
(1) ‘‘గతాసమ్‌’’: గతించిపోబోయేవి, మార్పు చెందేవి (దృశ్యజగత్తు)
(2) ‘‘అగతాసమ్‌’’: నిశ్చలమైనది, మార్పు చెందనిది (ఆత్మ)

మార్పు చెందే స్వభావం గల ఈ దేహ - ఇంద్రియ - ఇంద్రియవిషయ - సంగతి - సంఘటన - సందర్భ - అభిరుచి - సంబంధ - బాంధవ్య - విషయ నిర్ణయాలన్నీ ఒక మహా సాగరంలోని కెరటాలులాగా ఎప్పటికప్పుడు మార్పు చెందుతూనే ఉంటాయి. అట్టివాటి గురించి దుఃఖించి ఏం ప్రయోజనం? ఒకడు దుఃఖించినా, దుఃఖించకున్నా అవి మార్పు-చేర్పులు అప్రతిహతంగా - అనివార్యంగా సంతరించుకుంటున్నాయి. ఇక ఆత్మయో! మార్పు-చేర్పులు చెందనిది. ఈ దేహాదుల రాకపోకలతో మార్పు చెందని ఆత్మ గురించి ఎవ్వరికైనా దుఃఖమెందుకు?

ప్రతి ఒక్కరు ఈ ‘‘మార్పు చెందే జగత్‌ విషయాలు - మార్పు చెందని ఆత్మ’’ ఈ రెండిటి కలయికయే తమ స్వరూపముగా కలిగియున్నారు.

మార్పు చెందే విభాగం మార్పు చెందుతూనే ఉంటుంది. మార్పు చెందని ఆత్మ సర్వదా యథాతథం. రెండిటి గురించీ దుఃఖించటం అనవసరం, అసందర్భము, అనుచితము, అనర్హము కూడా!02–11
02–12

న త్వేవాహం జాతు నాసం న త్వం నేమే జనాధిపాః ।
న చైవ న భవిష్యామః సర్వే వయమతః పరమ్ ॥

న తు ఏవ అహం జాతు న అసం న త్వం న ఇమే జన అధిపాః ।
న చ ఏవ న భవిష్యామః, సర్వే వయమ్ అతః పరమ్ ॥

‘‘నా ఈ బంధువులంతా గతిస్తారేమో?’’ అని కదా, నీ దిగులు? ఇక్కడ ఒక విషయం నీవు గమనించు.

దేహీ నిత్యమ్‌
నేను ఒకప్పుడు ఉండి, మరొకప్పుడు లేకుండా పోయేవాడినా? కానే కాదు.
అనగా,
→ ఈ పాంచభౌతిక దేహానికి మునుముందే ఉన్నాను.
→ సరే, ఈ దేహం వచ్చిన తరువాత కనబడుచూనే ఉన్నాను కదా!
→ అట్లాగే, ఈ దేహం నశించిన తరువాత కూడా నేను ఉండియే తీరుతాను.

నేనే కాదు. నీవు కూడా! భౌతిక దేహానికి మునుముందుగానే నీవు ఉన్నావు. ఇప్పుడున్నావు. తరువాత, దేహానంతరం, కూడా ఉంటావు. అనగా ముందుముందు కూడా ఎప్పటికీ ఉండబోయేవాడివే.

నేనూ, నీవే కాదు. ఇక్కడి రాజులంతా కూడా వారి వారి దేహములకంటే ముందు, దేహపతనానంతరము కూడా - ఇకముందు ఎప్పటికీ ఉండేవారే! భవిష్యత్‌లో రాబోయే జీవులు కూడా అంతే ! వారు - వీరు - మనం … అందరము ఎప్పటికీ సర్వదా సత్‌స్వరూపులమై ఉండియే తీరుతాము! ఇక ఎవరి గురించైనా ఎందుకు దుఃఖించటం?


02–12
02–13

దేహినోఽస్మిన్యథా దేహే కౌమారం యౌవనం జరా ।
తథా దేహాన్తరప్రాప్తిర్ధీరస్తత్ర న ముహ్యతి ॥

దేహినో అస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా ।
తథా దేహాన్తర ప్రాప్తిః ధీరః తత్ర న ముహ్యతి ॥

ప్రతి జీవుడు ఈ రెండిటి కలయికయే సుమా!

↳ దేహి (దేహము ధరించినవాడు) + దేహములు
↳ ఆలోచన చేయువాడు + ఆలోచనలు
↳ భావించువాడు + భావనలు
↳ అనుభవము ఆశ్రయించువాడు / ఆస్వాదించువాడు (అనుభవజ్ఞుడు) + అనుభవములు
↳ ఆత్మ ….. + దృశ్యము


కదిలేది దేహము - కదిలించువాడు దేహి
ఈ దేహములోని దేహి ఒకానొక సమయంలో ఈ దేహ వ్యవహారమును ఆశ్రయించినట్టి అప్రమేయ చైతన్యమూర్తి సుమా! దేహమును ఆశ్రయించినట్టి దేహి ఈ దేహమును పాంచభౌతిక జగత్తులో కదిలిస్తున్నాడు. అనగా, దేహ సంచారం ప్రారంభించుచున్నాడు. ఈ దేహము ఉత్పత్తి - వృద్ధి - బాల్యము - కౌమారము- యౌవనము - వార్ధక్యములను కాలానుగతంగా పొందుచున్నది. అటువంటి దృశ్యమానమగు దేహము యొక్క వృద్ధి - హానిలను చూస్తూనే ఉన్నాము కదా! పసిబాలత్వం పోయి యౌవనం వస్తోంది. అప్పుడు ‘‘అరెఁ! నా బాల్యం ఎటు పోయింది?’’ అని ఎవ్వరైనా ఇళ్లు వాకిళ్లు గాలిస్తున్నారా? వృద్ధాప్యం వచ్చినపుడు ‘‘యౌవనం ఏమైనది?’’ …. అని ఎక్కడైనా వెతుకుచున్నారా? లేదే! అదే రీతిగా ఈ దేహిపట్ల - వర్తమాన దేహం పోయి మరొక దేహం వస్తోంది. వివేకము - ధీశక్తి - పరిశీలనాత్మకమైన, సుతీక్ష్ణమైన బుద్ధిగల ధీరులు ఈ దేహముల రాకపోకలు చూస్తూ కూడా ఏ మాత్రం మోహం చెందటం లేదు. ఎందుకంటే ’‘ఈ దేహాదుల రాకపోకలు బాల్య - యౌవన - వార్ధక్యముల రాకపోకల వంటివే’’నని వారు గమనిస్తూ ఉండటం చేతనే!


02–13
02–14

మాత్రాస్పర్శాస్తు కౌన్తేయ శీతోష్ణసుఖదుఃఖదాః ।
ఆగమాపాయినోఽనిత్యాస్తాంస్తితిక్షస్వ భారత ॥

మాత్రాస్పర్శాః తు, కౌంతేయ! శీత-ఉష్ణ, సుఖ-దుఃఖదాః ।
ఆగమా అపాయినో అనిత్యాః, తాన్ తితిక్షస్వ, భారత! ॥

అయితే అనేకులు ఈ సుదీర్ఘ దేహ - దేహాంతర స్నప్న సదృశ చమత్కారం గమనించక (జాగ్రత్‌ పరిమితమగు) వర్తమానమునకు పరిమితులై, సుఖ-దుఃఖములచే తన్మయులై ఉంటున్నారు. ఎందుచేత? విను. చెపుతాను.

ఈ దేహమునకు ‘‘చెవులు - చర్మము - కళ్లు - నాలుక - ముక్కు’’ అనే ఇంద్రియాలు ఉన్నాయి కదా! వాటి ద్వారా చెవులతో వినటం - చర్మముతో స్పర్శ - కళ్ళతో చూడటం - నాలుకతో రుచి చూడటం - ముక్కుతో ఆఘ్రాణించటం (అనగా పంచతన్మాత్రలు), వాటి వాటి విషయ పరంపరలు ఈ జీవుడు పొందుచున్నాడు. అట్టి ఇంద్రియ విషయపరంపరలను పంచతన్మాత్రలతో కూడి పొందుతూ వాటి పట్ల ఇష్ట - అయిష్టములను పెంపొందించుకొని కాలము గడపుచున్నాడు. అవన్నీ ఆ జీవుని ఇష్ట - అయిష్టములను అనుసరించి సుఖ-దుఃఖాలు కలుగజేస్తూ పోతున్నాయి. తన శాశ్వతమగు ‘ఆత్మ’ను ఆస్వాదించటం ఏమరచినప్పుడు - ఈ జీవుడు…. అనిత్యము - రాకపోకలతో కూడినవి అయినట్టి విషయముల పట్ల భ్రమచే మోహ బుద్ధిని ఏర్పరచుకొని ఉంటున్నాడు.

తితిక్ష
అనిత్యమైన విషయాలు నిత్యమైన ఆనందమును కలుగజేయగలవా? లేనేలేదు. అందుచేత అభ్యాసవశం చేత మనస్సుకు అనుభవమగుచున్న ఇక్కడి సుఖ - దుఃఖాలకు తల్లడిల్లకూడదు. ’‘ఇవన్నీ ఇట్లే ఉంటాయి కదా!’’…. అని గ్రహించి, వాటి పట్ల ఓర్పు వహించి ఉండటం (తితీక్ష) అలవరచుకోవాలి.

ఎందుచేతనంటావా?


02–14
02–15

యం హి న వ్యథయన్త్యేతే పురుషం పురుషర్షభ ।
సమదుఃఖసుఖం ధీరం సోఽమృతత్వాయ కల్పతే ॥

యం హి న వ్యథయంతి ఏతే పురుషం, పురుషర్షభ! ।
సమదుఃఖసుఖం ధీరం సో అమృతత్వాయ కల్పతే ॥

ఎవరైతే ఈ దృశ్య సంఘటన - వ్యవహారము - సంపద - ఆపదల పట్ల వ్యధ చెందరో…. అట్టి పురుష ప్రయత్నశీలురగువారు మాత్రమే ‘‘అమృతము - మార్పు చేర్పులు చెందనిది’’ అగు ఆత్మానుభవరూప స్వస్థితికి అర్హులు అగుచున్నారు. స్వస్థత చెందగలుగుచున్నారు.

02–15
02–16

నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః ।
ఉభయోరపి దృష్టోఽన్తస్త్వనయోస్తత్త్వదర్శిభిః ॥

న అసతో విద్యతే భావో, న అభావో విద్యతే సతః ।
ఉభయోః అపి దృష్టో అంతః తు అనయోః తత్త్వదర్శిభిః ॥

ఇక్కడి దృశ్యప్రపంచమంతా ఒక సుదీర్ఘమైన కథలోని అంతర్విభాగం వలె, స్వప్నంలోని కథనంలాగా, ఊహలోని ఒక భావావేశం వలె, నాటకంలోని సంఘటనల వలె ఎదురుగా కొనసాగుతోంది.

అయితే, ’‘ద్రష్ట - దృశ్యము’’లలో …..
A.) ద్రష్ట సత్‌ స్వరూపుడు, వాస్తవము - శాశ్వతము - అప్రమేయము అయినట్టి ‘ఉనికి’ కలవాడు.
B.) ఇక దృశ్యమో …. భావనోద్వేగరూపంగా ద్రష్టకు స్వయంకృత నిర్వచనానుసారంగా సందర్భానుచితంగా ప్రాప్తిస్తూ పోతోంది.

కథలోని (లేక నాటకములోని) సంఘటనలు, పాత్రల సంబంధములు, సంఘటనలు, అనుబంధములు, బాంధవ్యములు ఆ కథను (లేక నాటకమును) ఆస్వాదించేవారికి ‘నిజమే కదా!’ అనే రక్తి, అనుభూతులతో కొనసాగవచ్చుగాక ! కానీ, ఆ కథ (లేక నాటకం) కల్పితమే అయి ఉన్నప్పుడు అందులోని విషయాలు, వ్యవహారాలు కూడా కేవలం కల్పితం కాక మరింకేమిటి?

తత్త్వదర్శులగు మహనీయులు ‘సత్తు’ అగు ఆత్మను, ‘అసత్తు’ అగు ఆత్మాంతర్గత జగత్‌ వ్యవహారమును వేరు వేరు చేసి సర్వదా దర్శిస్తున్నారు.

02–17

అవినాశి తు తద్విద్ధి యేన సర్వమిదం తతమ్ ।
వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి ॥

అవినాశి తు తత్ విద్ధి, యేన సర్వమ్ ఇదం తతమ్ ।
వినాశమ్ అవ్యయస్య అస్య న కశ్చిత్ కర్తుమ్ అర్హతి ॥

దేహి అవినాశి
ఈ కనబడే సర్వ దేహాలలో విస్తరించియున్నట్టి ‘దేహి’ నాశరహితుడు సుమా! అట్టి అవ్యయమగు ’దేహి’కి ఎవ్వరూ వినాశనము కలిగించజాలరు.


02–17
02–18

అన్తవన్త ఇమే దేహా నిత్యస్యోక్తాః శరీరిణః ।
అనాశినోఽప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత ॥

అంతవంత ఇమే దేహా నిత్యస్య ఉక్తాః శరీరిణః ।
అనాశినో అప్రమేయస్య, తస్మాత్ యుధ్యస్వ, భారత! ॥

ఈ ‘‘దేహము (+) దేహి’’ అను రెండింటిలో దేహము ఏదో ఒకప్పుడు అంతము కావటం అనివార్యం. ఇది అందరికీ తెలిసినదే! అందరమూ గమనిస్తున్నదే ! అయితే ‘దేహి నిత్యము’ అని మహనీయుల వాక్యాలు ప్రకటిస్తున్నాయి. వేద - వేదాంగ - పురాణాదులు గొంతు ఎత్తి గానం చేస్తున్నాయి. ‘నిత్యము’ అయినట్టి దేహిని ఎవ్వరూ నశింపజేయలేరు.

కాబట్టి, దేహముల దృష్టిని అధిగమించు. ఒక సైనికుడిగా నీ విధ్యుక్త ధర్మమగు ఈ యుద్ధమును నిర్వర్తించు.

ఎందుకంటావా?


02–18
02–19

య ఏనం వేత్తి హన్తారం యశ్చైనం మన్యతే హతమ్ ।
ఉభౌ తౌ న విజానీతో నాయం హన్తి న హన్యతే ॥

య ఏనం వేత్తి హన్తారం యః చ ఏనం మన్యతే హతమ్ ।
ఉభౌ తౌ న విజానీతో, న అయం హన్తి న హన్యతే ॥

ఎవ్వరైతే ‘నేను చంపుతున్నాను’ అని చెప్పుచున్నాడో, ఎవ్వరైతే ‘నేను చచ్చుచున్నాను’ అని అంటున్నాడో, … ఆ ఇద్దరు కూడా శరీరముల దృష్ట్యా మాత్రమే అట్లా మాట్లాడుచున్నారని గమనించు. ఆత్మ దృష్ట్యా (లేక దేహి దృష్ట్యా) ఏమాత్రం కాదు.
02–19
02–20

న జాయతే మ్రియతే వా కదాచిత్
నాయం భూత్వా భవితా వా న భూయః ।
అజో నిత్యః శాశ్వతోఽయం పురాణో
న హన్యతే హన్యమానే శరీరే ॥

న జాయతే మ్రియతే వా కదాచిత్
న అయం భూత్వా భవితా వా న భూయః ।
అజో నిత్యః శాశ్వతో అయం పురాణో
న హన్యతే హన్యమానే శరీరే ॥

దేహి అగు ఆత్మ (లేక) దేహమునకు అప్రమేయమగు స్వస్వరూపచైతన్యం! ……
→ తాను చావదు. మరొక దేహిని చంపదు. (ఒక తరంగంలోని జలం మరొక తరంగంలోని జలమును నశింపజేయడమెక్కడిది?).
→ దేహి జన్మించటం లేదు. మరణించటం లేదు.
→ అది ఇతఃపూర్వం లేకుండా - మధ్యలో వచ్చి - మరొక కాలంలో లేకుండా పోయేది కాదు.


02–20
02–21

వేదావినాశినం నిత్యం య ఏనమజమవ్యయమ్ ।
కథం స పురుషః పార్థ కం ఘాతయతి హన్తి కమ్ ॥

వేద అవినాశినం నిత్యం య ఏనమ్ అజమ్ అవ్యయమ్ ।
కథం స పురుషః, పార్థ! కం ఘాతయతి హన్తి కమ్? ॥

‘దేహి’యగు ఆత్మ అజము (జన్మరహితము), నిత్యము, శాశ్వతము. ఎల్లప్పుడూ ఉండనే ఉంటుంది. అనంతకాలంగా కొనసాగేది. అట్టి దేహి నశించడు. ఈ దేహాలు మాత్రమే రూపం దిద్దుకోవటం, రూపాలు కోల్పోతూ ఉండటం జరుగుతోంది.

’‘దేహము - దేహి’’ (లేక) ‘‘దృశ్యమానమగుచున్న ఈ శరీరము + కళ్ళకు కనిపించని దేహమును కదిలించే ఆత్మ’’…… కలిపి మనం ఒకనిని జీవుడుగా చూస్తున్నాం.

ఈ దేహమునకు పుట్టుక - మార్పుచేర్పులు - వినాశనము అనే ధర్మాలు అందరికీ కనిపిస్తున్నాయి కదా! మరి ‘దేహి’ లేక ‘ఆత్మ’ యొక్క ధర్మములు ఎటువంటివి? అది గమనించాలి కదా! దేహి నాశరహితుడని, ఎల్లప్పుడూ ఉండియే తీరుతాడని, జన్మరహితుడని, మార్పుచేర్పులు లేనివాడని ఎవ్వరు గమనిస్తారో, …. ఇక ఆతని దృష్టిలో ‘‘చావటం - చంపటం’’ అనబడునవి ఎక్కడుంటాయి?

మరి, ఇప్పుడు ఈ ఎదురుగా కనిపిస్తున్న పుట్టుక - దేహవృద్ధి - బాల్య - యౌవన - వార్ధక్య - మరణాలు, దేహ - దేహాంతరాలు ….. ఇవన్నీ ఏమిటంటావేమో? విను.

02–21
02–22

వాసాంసి జీర్ణాని యథా విహాయ
నవాని గృహ్ణాతి నరోఽపరాణి ।
తథా శరీరాణి విహాయ జీర్ణా-
న్యన్యాని సంయాతి నవాని దేహీ ॥

వాసాంసి జీర్ణాని యథా విహాయ
నవాని గృహ్ణాతి నరో అపరాణి ।
తథా శరీరాణి విహాయ జీర్ణాని
అన్యాని సంయాతి నవాని దేహీ ॥

నూతన దేహము నూతన వస్త్రము వంటిది!

ఒకడు ఒక వస్త్రం ధరిస్తూ …. అది చినిగిపోయినప్పుడు దానిని విసర్జించి మరొక క్రొత్త వస్త్రం ధరిస్తున్నాడు కదా! అట్లాగే ఈ దేహి ‘‘దేవ - మనుష్య - జంతు’’…… ఇత్యాది దేహాలు ధరిస్తున్నాడు. ఆ దేహవస్త్రం చినిగిపోయినపుడు దానిని త్యజించి మరొక నూతన దేహవస్త్రం ధరిస్తున్నాడు. దేహి దృష్ట్యా జన్మ - జరా - మరణములు లేవు. దేహి (లేక ఆత్మ) సమక్షంలో దేహాలు రావచ్చు. కాలక్రమేణా అవి ఛిన్నం కావచ్చు గాక! దేహి (ఆత్మ) ధర్మాలు వేరు. దేహధర్మాలు వేరు. వేసుకున్న చొక్కాకు, ఆ చొక్కా ధరించిన జీవునికి ఉన్న సంబంధంవంటిదే ఈ దేహ-దేహి సంబంధం!

02–22
02–23

నైనం ఛిన్దన్తి శస్త్రాణి నైనం దహతి పావకః ।
న చైనం క్లేదయన్త్యాపో న శోషయతి మారుతః ॥

న ఏనం ఛిన్దన్తి శస్త్రాణి, న ఏనం దహతి పావకః ।
న చ ఏనం క్లేదయన్తి ఆపో, న శోషయతి మారుతః ॥

అర్జునా! ఇక ఇది గమనించు.

దేహము : దేహ ధర్మాలు

Qualities of Physical Body

దేహి : దేహి (ఆత్మ) ధర్మాలు

Qualities of User of the Body

దేహం బాణములచే ఛేదించబడ గలదు
దేహి ఛేదించబడడు
దేహం అగ్నికి ఆహుతి కాగలదు
దేహి అగ్నిచే దహించబడడు
దేహం నీళ్లచే తడుపబడగలదు
దేహిని నీరు తడుపజాలదు
దేహం గాలిచే ఎండింపబడగలదు
దేహి ఎండింపబడేవాడు కాడు
దేహం అనిత్యం
దేహి నిత్యము
దేహం ఒక ప్రదేశంలో మాత్రమే ఉంటుంది.
దేహి అక్కడ - ఇక్కడ - అంతటా ఆక్రమించుకొని ఉంటాడు.
దేహం ఒక చోటునుండి ఇంకొక చోటుకు వెళ్లుచున్నది
దేహి ఎక్కడున్నాడో, సర్వదా అక్కడే ఉంటాడు.
దేహం ఈ మధ్య వచ్చింది (Just like Light Rays of a Tubelight that emit and fall on various objects).
దేహి సనాతనం. ఇప్పుడున్నాడు. ఇతఃపూర్వం ఉన్నాడు. ఎప్పటికీ ఉంటాడు (Just like electricity, a function of which is to make a tube light emit light).


02–23
02–24

అచ్ఛేద్యోఽయమదాహ్యోఽయమక్లేద్యోఽశోష్య ఏవ చ ।
నిత్యః సర్వగతః స్థాణురచలోఽయం సనాతనః ॥

అచ్ఛేద్యో అయమ్ అదాహ్యో అయమ్ అక్లేద్యో అశోష్య ఏవ చ ।
నిత్యః సర్వగతః స్థాణుః అచలో అయం సనాతనః ॥

చూచావా అర్జునా! ఈ విధంగా ప్రతిజీవుని యొక్క ఆత్మస్వరూపం (లేక) దేహి స్వరూపం (One who is moving the body, ideas, feelings, thoughts, senses, etc.,) ఛేదించడేది, దహించబడేది, తడుపబడేది, ఎండించబడేది కాదు. దేహి నిత్యుడు. స్వప్నద్రష్ట స్వప్నమంతా ఆక్రమించుకొని ఉన్నట్లుగా ….. తాను దర్శించే దృశ్యమంతా ఆక్రమించుకొని ఉన్నవాడు. మార్పు - చేర్పులు లేనివాడు (యథాతథ స్వరూపుడు). ఇక్కడినుండి ఎక్కడికో - ఎక్కడినుంచో ఇక్కడికి వచ్చి వెళ్లేవాడు కాదు. ఇక్కడ - అక్కడా ఆతడు ‘తానే’ అయి ఉన్నవాడు. దేహికి ఎటువంటి ఆకారవికారాలు లేవు. కాబట్టి సర్వదా అనంతుడు.


02–24
02–25

అవ్యక్తోఽయమచిన్త్యోఽయమవికార్యోఽయముచ్యతే ।
తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి ॥

అవ్యక్తో అయమ్ అచిన్త్యో అయమ్ అవికార్యో అయమ్ ఉచ్యతే ।
తస్మాత్ ఏవం విదిత్వ ఏనం న అనుశోచితుమ్ అర్హసి ॥

దేహి అచింత్యుడు

దేహాలు వ్యక్తమై కనిపిస్తున్నాయి కదా! అయితే వీటిని వ్యక్తీకరించే, ప్రదర్శించే దేహి మాత్రం కళ్లకు కనిపించేవాడు కాదు, అవ్యక్తుడు. ఆయన దేహాదులను, వ్యక్తిత్వములను వ్యక్తీకరిస్తూ తాను సర్వదా, సర్వ సందర్భములలోను అవ్యక్తుడై ఉన్నాడు. ‘‘ఆతని దేహరూపం ఇది కదా’’ …. అని మనం చింతించగలమేమోగాని, దేహియొక్క స్వరూపం చింతకు (ఆలోచనకు) అందనిది. ఆలోచనలన్నీ కళ్లకు కనబడే దానికే పరిమితం కదా! కదిలే దేహం కనబడుతుందిగాని, కదిలించే వాడు అయినట్టి దేహి (లేక) ఆత్మను ఏమని ఊహించగలం? ఉదాహరణకు ‘‘శక్తి’’ యొక్క రూపం ఏమని ఊహించి చెప్పగలం? కోపము-ప్రేమ ఇత్యాదులకు రూపమేమున్నది?

కాబట్టి ఓ పార్థా! కదిలించే ‘దేహి’ యొక్క నిజ, వాస్తవ, తాత్విక ధర్మములు ఎటువంటివో గమనించు. ప్రతి జీవుడు ఆత్మ స్వరూపుడేగాని దేహస్వరూపుడు కాదని గ్రహించి, ఇక వారి కొరకై - వీరి కొరకై దుఃఖించటం అసంగతమని, అనవసరమని గమనించు!


02–25
02–26

అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతమ్ ।
తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి ॥

అథ చ ఏనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతమ్ ।
తథా అపి త్వం, మహాబాహో! న ఏవం శోచితుమ్ అర్హసి ॥

పుట్టినవాడు గిట్టక మానడు - గిట్టినవాడు పుట్టక మానడు!

ఒకవేళ ‘‘దేహి దేహంతో పుడతాడు. దేహంపోతే మరణిస్తాడు. మరల మరొక దేహంతో పుడతాడు’’ …. అని అంటావా? అప్పుడు కూడా నీవు ఏ జీవుని గురించి దుఃఖించవలసిన పనేమీ లేదు.

ఎందుచేతనంటావా?

02–26
02–27

జాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రువం జన్మ మృతస్య చ ।
తస్మాదపరిహార్యేఽర్థే న త్వం శోచితుమర్హసి ॥

జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ ।
తస్మాత్ అపరిహార్యే అర్థే న త్వం శోచితుమ్ అర్హసి ॥

పుట్టిన ప్రతివాడూ ఎప్పటికో అప్పటికి ఆ దేహం త్యజించవలసినదే! మరణించిన ప్రతివాడూ మరల దేహరూపంగా జనించవలసిందే!

ఉదయాస్తమయములు లాగా దేహముయొక్క రాక - పోకలు దేహికి అనివార్యం అయినప్పుడు దుఃఖించటం ఎందుకు?
‘‘రాత్రివేళ పగటి కోసం - పగటి వేళ రాత్రి కోసం’’ ఎవరైనా దుఃఖించటం ఎంత అర్థరహితమో ఈ అప్రమేయుడగు దేహియొక్క ఒకానొక స్వల్ప అంశ విభాగంలో జరుగుచున్న దేహము యొక్క రాకపోకలకు దుఃఖించటం - అంతటి అర్థరహితము, అసందర్భము అయిన విషయమే!


02–27
02–28

అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత ।
అవ్యక్తనిధనాన్యేవ తత్ర కా పరిదేవనా ॥

అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని, భారత! ।
అవ్యక్త నిధనాని ఏవ, తత్ర కా పరిదేవనా? ॥

వ్యక్తము - అవ్యక్తము

⌘ అవ్యక్తము ఒకప్పుడు వ్యక్తమౌతోంది. వ్యక్తమైనది తిరిగి మరొకప్పుడు అవ్యక్తంగా రూపుదిద్దుకుంటోంది. (ఉదాహరణకు, సుషుప్తి సందర్భములో జాగ్రత్‌-స్వప్నములు అవ్యక్తమై ఉంటున్నాయి - మాండూక్యోపనిషత్‌)

⌘ దేహి దేహం లేనప్పుడు అవ్యక్త స్వరూపుడై ఉన్నాడు.

⌘ దేహం వ్యక్తీకరిస్తూ దేహముతో కూడి కనిపిస్తున్నాడు.

⌘ మరల దేహం త్యజించి అవ్యక్తరూపం సంతరించుకుంటున్నాడు.

ఇటువంటి వ్యక్తీకరణ - అవ్యక్తీకరణలకు నాంది, ఆధారము, కారణము అయినట్టి దేహి గురించి నీవు వేదన చెందవలసినదేమున్నది?


02–28
02–29

ఆశ్చర్యవత్పశ్యతి కశ్చిదేనమ్
ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ।
ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి
శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్ ॥

ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిత్ ఏనమ్
ఆశ్చర్యవత్ వదతి తథా ఏవ చ అన్యః ।
ఆశ్చర్యవత్ చ ఏనమ్ అన్యః శృణోతి
శ్రుత్వా అపి ఏనం వేద న చ ఏవ కశ్చిత్ ॥

దేహీ విలక్షణః
‘‘ఈ దేహి అవ్యక్త స్థితినుండి దేహముతో ప్రకటనమవటం’’ …. అనేది కొందరు, ‘‘ఆహాఁ! ఏమి చమత్కారం! అవ్యక్తమగు ఆత్మ దేహములతో ప్రదర్శితమగుచున్నది కదా’’ అని ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇంకొకరు ‘‘ఆత్మ ఎట్టిది?’’ …. అని ఆశ్చర్యంగా మాట్లాడుచున్నారు. ఇంకొకరు ‘‘ఆత్మ ఎంత ఆశ్చర్యకరమైనది!’’ అని వింటున్నారు. మరికొందరేమో ఎంతో ఎంతో విన్నప్పటికీ (ఆత్మ) ఇట్టిది - అని గ్రహించ లేకపోతున్నారు.

కొందరు ‘‘ఆయన ఎంత గొప్పవాడండీ’’ అని ఒకని గురించి ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇంకొందరు ‘‘ఆయన ఏం మనిషండీ - ఈ ఈ లక్షణాలచేత!’’… అని చెప్పుచున్నారు. మరికొందరు ఆశ్చర్యంగా వింటున్నారు. ఇంతకీ ఆ వర్ణింపబడు దేహ విశేషాలే చెప్పుకుంటున్నారు గాని ‘దేహితత్త్వం’ ఏమిటో,….. దేహం ఏర్పడక ముందు ఎట్టిదో,…. దేహానంతరం దేహి స్వరూపం ఏమి అగుచున్నదో, …. అస్సలు దేహి యొక్క తాత్త్విక స్వరూప స్వభావాలు ఎటువంటివో … చాలామంది ఏమాత్రం పరిశీలించటమే లేదు కదా!


02–29
02–30

దేహీ నిత్యమవధ్యోఽయం దేహే సర్వస్య భారత ।
తస్మాత్సర్వాణి భూతాని న త్వం శోచితుమర్హసి ॥

దేహీ నిత్యమ్ అవధ్యో అయం దేహే సర్వస్య, భారత! ।
తస్మాత్ సర్వాణి భూతాని, న త్వం శోచితుమ్ అర్హసి ॥

అయితే…., ఎవ్వరి గురించి ఎవరు ఏమని ఆశ్చర్య వచనాలతో చెప్పుకున్నా….ఉన్న సత్యం ఏమిటి? విను…..

🌺 సర్వదేహములలోని దేహి ‘నిత్యుడు’.
🌺 దేహికి చావు - పుట్టుకలు, రాక - పోకలు, గుణ - స్థాన విభాగ చమత్కారాలు లేవు. దేహి వాటినన్నిటికీ ఆవల ఉన్నవాడు.
🌺 సర్వదేహములలోని దేహి దేహములకంటే సర్వదా ప్రత్యేకమైనవాడు.

కనుక, ఈ దేహధారులలో ఏ ఒక్కరి గురించి నీవు దుఃఖించవలసిన పని ఏమాత్రం లేదు.

02–31

స్వధర్మమపి చావేక్ష్య న వికమ్పితుమర్హసి ।
ధర్మ్యాద్ధి యుద్ధాచ్ఛ్రేయోఽన్యత్ క్షత్రియస్య న విద్యతే ॥

స్వధర్మమ్ అపి చ అవేక్ష్య న వికమ్పితుమ్ అర్హసి ।
ధర్మ్యాత్ హి యుద్ధాత్ శ్రేయో అన్యత్ క్షత్రియస్య న విద్యతే ॥

కాబట్టి అర్జునా! దేహి - దేహముల దృష్ట్యా కొంచెము విచారణ చేస్తూ - ఈ తదితర యుద్ధవీరులను చూచినప్పుడు ఇక్కడి వారి గురించి నీవు ఏమాత్రం దుఃఖించవలసిన పని లేదని అనుకున్నాం కదా!

ఇప్పుడు నీవు నిర్వర్తించవలసి యున్న ‘యుద్ధము’ అనే కర్మను ‘స్వధర్మం’ దృష్ట్యా చూద్దాం.

స్వధర్మము దృష్ట్యా చూస్తే!
నీకు నియమించబడి నీ స్వధర్మమును అనుసరించి మనం గమనిస్తే - ‘‘నేను ఈ యుద్ధం చేయవలసి వచ్చిందే!’’ ….. అని వేదన చెందవలసిన పనే నీకు లేదు. ఎందుకంటావా? నీవు ఎంతో శ్రమ - తపస్సులను నిర్వర్తించి అస్త్ర - శస్త్ర - యుద్ధ నైపుణ్యములను సంపాదించుకొన్నది ఎందుకు? నీకు నేర్పినవారు ఎందుకు నేర్పారు? ‘ధర్మ రక్షణ’ అనే సదుద్దేశ్యంతోనే అస్త్ర - శస్త్ర విద్యా పారంగతుడవు అయ్యావు కదా!

అట్టి నీ వంటి సైనికునికి ‘‘ధర్మ రక్షణకొరకై యుద్ధం చేయటం’’ అనేది ఒక మహత్తరమైన అవకాశం. ’ధర్మము’ను ప్రేమించేవాడు ధర్మముకొరకై యుద్ధం చేయటంకంటే శ్రేయోదాయకమైనది మరింకేమి ఉంటుంది? క్షత్రియునికి ధర్మము కొరకై యుద్ధం చేయటం ఒక సదవకాశమే కదా!

02–32

యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతమ్ ।
సుఖినః క్షత్రియాః పార్థ లభన్తే యుద్ధమీదృశమ్ ॥

యదృచ్ఛయా చ ఉపపన్నం స్వర్గద్వారమ్ అపావృతమ్ ।
సుఖినః క్షత్రియాః, పార్థ! లభన్తే యుద్ధమ్ ఈదృశమ్ ॥

ఈ యుద్ధం నీవు కోరి, నీ అభిరుచి కొరకై చేయటం లేదే! ఆయా సందర్భముల పరిణామం చేత ఇప్పుడు యుద్ధం చేయవలసిన సమయం వచ్చింది. ధర్మము కొరకై యుద్ధం చేసేవారికై స్వర్గద్వారాలు సర్వదా తెరిచి ఉంచబడతాయి. అంటే నీ శౌర్యము ప్రదర్శించవలసిన సమయ - సందర్భాలు ఇప్పుడు నీకు సమాయత్తమయ్యాయి. యాదృచ్ఛికంగా లభించిన ఈ ‘‘ధర్మ రక్షణ కొరకు యుద్ధం’’ అనే సందర్భమును సద్వినియోగ పరచుకొని, ఇట్టి పుణ్యకార్య సుఖఫల ప్రాప్తికి వీరుడు ఆనందిస్తాడేగాని దుఃఖించడే!

ఒకవేళ ఒక సైనికుడిగా యాదృచ్ఛికంగా నీకు ప్రాప్తించిన ‘‘ధర్మముకొరకై యుద్ధం చేయవలసి రావటం’’ అనే సందర్భమును తిరస్కరించి యుద్ధం చేయవనుకో! అప్పుడు నీకు సంబంధించిన పరిణామాలు ఏమేమిటి? అది కూడా విను, చెపుతాను.

02–33

అథ చేత్త్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి ।
తతస్స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి ॥

అథ చేత్ త్వమ్ ఇమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి ।
తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమ్ అవాప్స్యసి ॥

అపకీర్తి - నింద

నీవు ‘‘స్వధర్మ మార్గము - కీర్తి’’ ఈ రెండూ పొగొట్టుకొన్నవాడివౌతావు.

ఏ జీవుడైనా, తన స్వధర్మమును ఏమఱచినందుకు ఫలితంగా పాపము చేసినవాడై దుఃఖమార్గంలో ప్రయాణించువాడే అవుతాడు.

02–34

అకీర్తిం చాపి భూతాని కథయిష్యన్తి తేఽవ్యయామ్ ।
సంభావితస్య చాకీర్తిర్మరణాదతిరిచ్యతే ॥

అకీర్తిం చ అపి భూతాని కథయిష్యంతి తే అవ్యయామ్ ।
సంభావితస్య చ అకీర్తిః మరణాత్ అతిరిచ్యతే ॥

ఇంకా ఇంకా ఏవేవో వినరాని మాటలు వినిపిస్తాయి. ‘‘సంపదల లోభంతో, కక్కుర్తిగా దుర్యోధనునితో లోపాయికారి అయి ధర్మానికి, ధర్మరాజుకు ద్రోహం చేశాడు’’… అని చెప్పుకోవచ్చునేమో!

ఇక ఈ యుద్ధంలో మరణాదుల దుఃఖమంటావా? ‘‘ధర్మమును ఏమరచి ప్రవర్తించాడు’’…. అనే అపకీర్తితో బ్రతికేకంటే మరణమే మేలు అయి ఉండేదని నీకు అనిపించగలదు సుమా!

02–35

భయాద్రణాదుపరతం మంస్యన్తే త్వాం మహారథాః ।
యేషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవమ్ ॥

భయాత్ రణాత్ ఉపరతం మంస్యన్తే త్వాం మహారథాః ।
యేషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవమ్ ॥

‘‘అర్జునుడు అహింసావాదంతో యుద్ధం నుండి తొలగాడు’’ ….. అని ఇప్పటి సందర్భంలో నిన్ను గురించి జనులు అనుకోరు! ‘‘కర్ణునికో, మరొకరికో భయపడి యుద్ధ భూమి నుండి పారిపోయాడు’’…. అని నీ గురించి అనేకులు అనుకుంటారు.

ఎవ్వరైతే నిన్ను ‘మహాయోధుడు’ అని గానం చేస్తున్నారో, …… వారంతా, ‘‘అర్జునుని గురించి ఏదేదో అనుకున్నాం. నిజానికి ఆతడు ఒక పిరికివాడు’’….. అని మహారథులగు కర్ణ - భీష్మ - ద్రోణ - దుర్యోధనాదులు అనుకుంటారు.

02–36

అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యన్తి తవాహితాః ।
నిన్దన్తస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిమ్ ॥

అవాచ్యవాదాన్ చ బహూన్ వదిష్యన్తి తవ అహితాః ।
నిందంతః తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిమ్? ॥

‘‘అసలు అర్జునుడు ఒక అసమర్థుడు’’…. అని పలుకనారంభిస్తారు. ఇంతకన్నా నీకు కలుగగల దుఃఖం ఇంకేముంటుంది?
02–37

హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీమ్ ।
తస్మాదుత్తిష్ఠ కౌన్తేయ యుద్ధాయ కృతనిశ్చయః ॥

హతో వా ప్రాప్స్యసి స్వర్గం, జిత్వా వా భోక్ష్యసే మహీమ్ ।
తస్మాత్ ఉత్తిష్ఠ, కౌన్తేయ! యుద్ధాయ కృతనిశ్చయః ॥

‘‘వారు బలవంతులా - మనం బలవంతులమా….. తెలియదు కదా?’’ అని నీవు అన్నావు కదా! …..నిజమే! జయాపజయాలు దైవాధీనాలే! అయితే….. ఈ ‘యుద్ధము’ అనే ధర్మాన్ని ఎందుకు చేస్తున్నావు? అది సునిశ్చయం చేసుకోవాలి సుమా!

శంకర భగవానులు ప్రసాదించిన పాశుపతాస్త్రం, తదితర అస్త్ర - శస్త్ర దేవతల వరప్రసాదాలు లభించినదెందుకు? ధర్మ రక్షణ కొరకే కదా! ప్రకృతి మాత ప్రసాదిత శౌర్య - శస్త్రాస్త్ర సంపద ఇప్పుడు ధర్మరక్షణ కొరకై సద్వినియోగ పరచాలి కదా! ఈ యుద్ధంలో మరణించావా, …..స్వర్గ లోకాలు ప్రాప్తిస్తాయి. అథ వా, జయించావా…… రాజ్యభోగం లభించనున్నది. ఉభయత్రా శ్రేయోదాయకమే కదా!

అందుచేత ఓ అర్జునా! ఉత్తిష్ఠ! ఉత్తిష్ఠ! యుద్ధం చేయటానికే కృతనిశ్చయుడవగుము.

02–38

సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ ।
తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి ॥

సుఖదుఃఖే సమే కృత్వా లాభ-అలాభౌ జయ-అజయౌ ।
తతో యుద్ధాయ యుజ్యస్వ, న ఏవం పాపమ్ అవాప్స్యసి ॥

సుఖ-దుఃఖే సమే కృత్వా
అయితే…..
ప్రతి జీవుడు కర్మ అనుక్షణం నిర్వర్తిస్తూనే ఉన్నాడు. అందులో విశేషం లేదు. ‘‘కర్మ నిర్వర్తిస్తూ, కర్మలకు సంబంధించిన దోషం అంటకుండా ఉండటం ఎట్లా?’’….. అనునది గమనించాలి. ఒకానొక సమున్నత స్థానంలో తన యొక్క ‘ఆశయము’ను ప్రతిష్ఠించి ఈ జీవుడు కర్మ నిర్వర్తించటం తెలుసుకొని ఉండాలి సుమా!

అందుచేత …. ’‘గెలుస్తామా? ఓడుతామా? సుఖమా? దుఃఖమా? లాభమా? నష్టమా?’‘…. అనునది ప్రక్కకు పెట్టి ’‘ఇది నా స్వధర్మం కదా! కనుక ఈ ధర్మము నేను తప్పక నిర్వర్తించెదను గాక!’’….. అను సమున్నతమైన అవగాహనతో సమర్పణాపూర్వకంగా నిర్వర్తించు. అప్పుడు, ఆ కర్మ యొక్క దోషం నిన్ను అంటదు.

Bhagavan Krishna explaining

మూల శ్లోకము


అధ్యయన వ్యాఖ్యానము


ఉపన్యాసము

02–39

ఏషా తేఽభిహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శ్రృణు ।
బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబన్ధం ప్రహాస్యసి ॥

ఏషా తే అభిహితా సాంఖ్యే బుద్ధిః (కర్మ)యోగే తు ఇమాం శ్రృణు ।
బుద్ధ్యా యుక్తో యయా, పార్థ! కర్మబంధం ప్రహాస్యసి ॥

బుద్ధియోగం - బుద్ధి నిశ్చలత కొరకై కర్మ నిర్వహణ

ఇప్పటి వరకు ‘‘వివేకముతో నిత్యమైనది - అనిత్యమైనది పరిశీలిస్తూ ఉండటం’’ - అనే సాంఖ్యమార్గంలో యుక్తాయుక్తాలు ఏమిటో చెప్పుకున్నాం కదా! ఇప్పుడు ‘‘బుద్ధియోగ మార్గం’’ దృష్ట్యా విశదీకరిస్తాను.

ఏ ‘‘యుక్తి’’ లేక ‘‘యోగం’’ చేత కర్మ చేస్తూ కూడా ఆ కర్మ ‘బంధం’ అవదో, పైగా, కర్మ నిర్వర్తించటం చేత కర్మయొక్క బంధం ఈ జీవునికి మొదలంట్లా కూడా తొలగగలదో - బుద్ధి తన చంచలత్వం వీడి ఏకాగ్రత పొందగలదో - అట్టి బుద్ధిజ్ఞానయోగం గురించి వివరిస్తున్నాను. విను.

02–40

నేహాభిక్రమనాశోఽస్తి ప్రత్యవాయో న విద్యతే ।
స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ ॥

న ఇహ అభిక్రమనాశో అస్తి, ప్రత్యవాయో న విద్యతే ।
స్వల్పమ్ అపి అస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ ॥

జ్ఞానంతో కూడిన కర్మ నిర్వహణ

‘కర్మ’కు ఫలం ఉంటుంది. ప్రయోజనం ఉద్దేశ్యించే ఎవరైనా కర్మ చేస్తారు. అనేకులు ’‘ఈ కర్మకు ఈ దృశ్యమునుండి నాకు ఈ ప్రయోజనం సిద్ధించు గాక!’’ …..అను భావనతో నిర్వర్తిస్తున్నారు కదా!

సకామకర్మ :
⤿ ఈ కర్మ వలన మనకేమన్నా లాభమేనా ?
⤿ ఈ దానం చేస్తున్నాను. తీసుకునే ఆయన నేనిస్తున్నానని గమనించాలి కదా! నలుగురు చూస్తూ మెచ్చాలి కదా!
⤿ ఈ పని బాగా చేస్తున్నాను. నేను పని బాగా చేయగలనని అందరూ అనుకోవాలి కదా! పేరు - ప్రతిష్ఠలు కొనసాగాలి కదా!
⤿ ఇంత కష్టపడి చేస్తున్నాను. ఇది గుర్తించి నాకు నా స్థితిగతులలో, పదవులలో ఉన్నతి కావాలి కదా! ఆయా విషయాలలో కలసిరావాలి కదా!
⤿ వీరి కొరకై ఇంత చేస్తున్నాను. వీరు సుఖపడాలి కదా! పైకి రావాలి కదా!’
→ ఇటువంటి భావనలతో కర్మ నిర్వర్తిస్తూ ఉంటే ఇది ‘‘సకామ కర్మ’’ అవుతుంది.

నిష్కామ కర్మ :
‘‘నాకు నియమితమైన కర్మలు (The functions alloted to me) నా బుద్ధిని నిర్మలము - సునిశితము - విస్తారము - నిశ్చలము - బలయుక్తము చేయటానికి నాకు ప్రసాదించబడిన అవకాశం’’… అను భావనతో నిర్వర్తించే కర్మను ‘నిష్కామకర్మ’ అని పిలుస్తున్నారు.

‘‘జీవుడు ఎందుకు పుడతాడు?’’ ….. అని ప్రశ్నిస్తే ‘‘బుద్ధిని నిర్మలము - నిశ్చలము - సునిశితము - విస్తారము చేసుకోవటానికే’’ అనునది సమాధానమైయున్నది.

‘‘వర్తమానపు స్వధర్మములను బుద్ధి నిర్మలం - సునిశితం చేసుకోవటానికి’’.. అని ఎవ్వరు ఉద్దేశిస్తారో… వారు ‘‘నిష్కామ కర్మిష్ఠులు’’ అని చెప్పబడుచున్నారు.

సామాన్యంగా జీవుని పట్ల కర్మలు అనేవి అనేక బంధాలుగా పరిణమిస్తున్నాయి. ఎందుచేత? ఒక కర్మ నిర్వర్తించినప్పుడు ‘‘సంస్కారాలు - కర్మ ఫలితాలు’’ అనే రెండు ప్రయోజనాలు అనివార్యం. కర్మల వలన ఫలితాలు, ఆ ఫలితాల వలన మరికొన్ని కర్మలు… ఈ విధంగా ఇదంతా అంతు లేకుండా ప్రవర్తించటంచేత జీవునికి కర్మలనుండి - కర్మ బంధములనుండి విశ్రాంతి లభించటం లేదు. ‘‘కర్మలను నియమిత ధర్మానుసారం సమర్పణ బుద్ధితో చేసి, తద్వారా, శుభప్రదమగు బుద్ధిని సంపాదించుకుంటాను’’…. అను ఉద్దేశ్యముతో కర్మలను నిర్వర్తించే నిష్కామ కర్మ యోగులు తాము నిర్వర్తించే కర్మల ప్రయోజనంగా సర్వకర్మబంధముల నుండి విడివడగలుగుచున్నారు.

బుద్ధినిశ్చలప్రదమైనట్టి నిష్కామ కర్మయోగమార్గంలో కొంచం కొంచం ముందుకు సాగుచున్నా సరే, … అది ఆ కర్తకు అమోఘమైన ప్రయోజనం ప్రసాదించగలదు.

లౌకిక ప్రయోజనముల కొరకై కర్మలు చేసేవారికి రెండు దోషాలు తారసపడుతూ ఉంటాయి.

1.) అభిక్రమనాశ దోషం (Task Incompletion) : [ప్రారంభానంతర విఘ్నాలు]
ఒకపనిని కొంతవరకు నిర్వర్తించి, సగంలో ఆపి పూర్తిగా, సమగ్రంగా నిర్వర్తించనందుకు ఏర్పడే దోషస్థితి. మధ్యలో ఆపినందుచేత వచ్చే అపక్రమస్థితి. (ఉదాహరణకు ఒక ఇల్లాలు ‘‘ఇల్లంతా శుభ్రం చేద్దాం. అనవసరమైన కాగితాలు మొదలైనవి తొలగిద్దాం’’… అని ఆ కార్యక్రమానికి ఉపక్రమించిందని అనుకుందాం. ఎక్కడో మూలలోను, అటకలపైన, చూర్లలోను గల అనవసరమైన కాగితాలను, చెత్తను ఊడ్చి నేలపై వేయనారంభించి మధ్యలో బద్ధకం చేతనో, కోపం చేతనో, మరేదో కారణం చేతనో ఆ పని ఆపిందనుకుందాం. అప్పుడు ఇల్లంతా చెత్తతో నిండి ఇతఃపూర్వంకంటే మరింతగా ఘోరంగా తయారవుతుంది కదా!)

2.) ప్రత్యవాయ దోషం (Negative Side-effects): [విపరీతమైన-వ్యతిరిక్తమైన ఫలాలు]
‘‘నేనే కదా, చేయగలిగాను! పొందగలిగాను!’’ అనే అహంకారం పొందటం. ‘‘నేను ఇతరులకంటే కొంత ప్రత్యేకత కలవాడను’’ ….అనిపించటం.

అయితే……,
అభిక్రమ దోషం, ప్రత్యవాయ దోషం సకామ కర్మలకు మాత్రమే ఉంటాయి. నిష్కామ కర్మలకు ఆ దోష ఫలితాలు ఉండవు. నిష్కామ కర్మిష్ఠులను ఆ దోషాలు అంటజాలవు.

‘నిష్కామ కర్మ’ కొంచం నిర్వర్తించినప్పటికీ…. అది భయంకరమైన ‘‘జన్మ - మృత్యు - జరా’’ ప్రవాహములతో కూడిన సుదీర్ఘ సంసార బంధ - భయములనుండి ఆ కర్తను రక్షించగలదు.

‘‘పిల్లలను పెంచటం - ఉద్యోగం చేయటం - ఇంటి పనులు చూడటం మొదలైనవన్నీ నేను నా యొక్క బుద్ధిని నిర్మలం చేసుకోవటానికి నిర్వర్తిస్తున్నాను.’’…. అను భావన పెంపొందించుకొని - సంతరించుకొని ఉండటం… ‘‘నిష్కామ కర్మ’’ యొక్క బాహ్య రూపం. ‘‘సర్వకర్మలు దైవోపాసనయే’’ అని అనుకోవటం నిష్కామకర్మ యొక్క అంతరంగ రూపం.

‘‘వారికోసం - వీరికోసం - వీరినో వారినో ఉద్ధరించటం కోసం - మెప్పుకోసం - కర్మకొద్దీ ఇక తప్పక’’ అనుకోవటం …. మొదలైనదంతా ‘సకామం’.

02–41

వ్యవసాయాత్మికా బుద్ధిరేకేహ కురునన్దన ।
బహుశాఖా హ్యనన్తాశ్చ బుద్ధయోఽవ్యవసాయినామ్ ॥

వ్యవసాయాత్మికా బుద్ధిః ఏకా ఇహ, కురునందన! ।
బహుశాఖా హి అనంతాః చ బుద్ధయో అవ్యవసాయినామ్ ॥

బుద్ధిని నిశ్చయాత్మకంగా ‘‘కర్మ ఉపాసనా భావన’‘తో తీర్చిదిద్దుకోవాలి. అప్పుడు బుద్ధి ఏకాగ్రమై పరి పరి విధాల ప్రయాణించకుండా ఉంటుంది.

ఎవరి బుద్ధి నిశ్చయాత్మకంగా ఉండదో… అట్టి బుద్ధి పరి పరి మార్గాలలో పయనిస్తూనే ఉంటుంది. ’‘ఏదో పొందాలి! ఏదో చేయాలి! ఏదో కావాలి! ఏదో తెలుసుకోవాలి! ఏదో గుర్తించబడాలి! ఏదో పోవాలి! ఏదో రావాలి!’’…. అని ఆ బుద్ధి ఎక్కడెక్కడో ఏదేదో ఒకటి తరువాత మరొక విషయాన్ని అవిశ్రాంతంగా ఆశ్రయిస్తూనే పోతుంది. ఫలాసక్తి గల బుద్ధి పొందే ఆటుపోట్లకు అంతూ - పొంతూ ఉండదు.

02–42

యామిమాం పుష్పితాం వాచం ప్రవదన్త్యవిపశ్చితః ।
వేదవాదరతాః పార్థ నాన్యదస్తీతి వాదినః ॥

యామ్ ఇమాం పుష్పితాం వాచం ప్రవదంతి అవిపశ్చితః ।
వేదవాదరతాః, పార్థ! న అన్యత్ అస్తి ఇతి వాదినః ॥

దృశ్యాంతర్గత ప్రయోజనాలు

వేదవాదరతులైన కొందరు ‘‘వేదాలలో చెప్పినట్లుగా యజ్ఞము-యాగము ఇత్యాది కర్మలు చేయండి. పూజలు-ఉపాసనలు మొదలైన వాటిచే మీకు అనేక లౌకిక - ప్రయోజనాలు, స్వర్గము మొదలైన పారలౌకిక ప్రయోజనాలు పొందుతారు. సత్ఫలితాలు వస్తాయి. మీరు గొప్పవారౌతారు. అందరిని మించిపోతారు.’’… ఇటువంటి ఇహ-పరలోక అర్థ సాధన వాక్యాలు ప్రచారం చేస్తున్నారు.

అయితే కర్మలయొక్క పూర్ణార్థము - అంతిమోద్దేశ్యము దర్శించక, కేవలం దృశ్యములోని ప్రయోజనాలు వల్లిస్తూ ‘‘ఈ దృశ్యము సత్యమే! శాశ్వతమే’’ …. అనే భ్రమను వీరు ఆ విధంగా మరింత పెంపొందించటం, పరిపోషించటం జరుగుతోంది.

‘‘కర్మలఫలం స్వర్గాది సుఖమయ లోకాలు’’ అంటూ గానం చేస్తున్నారు. ఇట్టి వారు ‘‘ఆత్మ యొక్క ఆనంద ఆస్వాదన అనుభవం’’ ఉద్దేశ్యించక, ఆయా విధాలుగా లోక సంబంధమైన - ఇంద్రియ సంబంధమైన ప్రయోజనాలను ప్రచారం చేస్తున్నారు.

కర్మల ఉత్తమ ప్రయోజనం బుద్ధి యొక్క కుశలత్వం - సమగ్రత్వం - ఉన్నతమైన అవగాహన పెంపొందటమే గాని…. అల్పమగు స్వప్నసదృశ - ఇంద్రియానంద - దృశ్యపరిమితమైన ఇహ-పరలోక ప్రయోజనాలు కాదు సుమా!

02–43

కామాత్మానః స్వర్గపరా జన్మకర్మఫలప్రదామ్ ।
క్రియావిశేషబహులాం భోగైశ్వర్యగతిం ప్రతి ॥

కామాత్మానః స్వర్గపరా జన్మకర్మఫలప్రదామ్ ।
క్రియా విశేష బహులాం భోగ ఐశ్వర్య గతిం ప్రతి ॥

స్వర్గలోక సుఖ సమాచారములకు, భోగైశ్వర్య గతులకు సంబంధించిన అనేక క్రియా విశేషాలు - కర్మ ఫల విశేషాలు - విని విని ఈ జీవుడు ఆశ - నిరాశల వలయంలో చిక్కుకుని, ఇక కర్మబంధములను తెంచుకోలేకపోతున్నాడు. వాటిని అతిక్రమించలేకపోతున్నాడు.


02–44

భోగైశ్వర్యప్రసక్తానాం తయాపహృతచేతసామ్ ।
వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే ॥

భోగైశ్వర్య ప్రసక్తానాం తయా అపహృత చేతసామ్ ।
వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే ॥

అనేక భోగ - ఐశ్వర్యములకు సంబంధించిన ఆశయముల మధ్య చిక్కిన ఆ మనుజుడు నిశ్చల బుద్ధిని కోల్పోవుచున్నాడు. ఆతని బుద్ధి ఏకాగ్రతతో కూడిన సమాధి స్థితికి చేరలేకపోతోంది. పైగా బుద్ధి భోగైశ్వర్యముల వైపు ఆకర్షించబడి మరింత చంచలత్వం సంతరించుకోవటం జరుగుతోంది. తత్ఫలితంగా స్వస్వరూప ఆనందమును ఆస్వాదించగల నిశ్చల బుద్ధి రూపు దిద్దుకోవటం లేదు. ఇప్పుడే ఇక్కడే పొందవలసిన ఆత్మబుద్ధి, ఇహ-పర ప్రయోజనముల ఆశయములచే చంచలము చేయబడుతోంది.

02–45

త్రైగుణ్యవిషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున ।
నిర్ద్వన్ద్వో నిత్యసత్త్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ ॥

త్రైగుణ్య విషయా వేదా నిఃత్రైగుణ్యో భవ, అర్జున! ।
నిఃద్వంద్వో నిత్యసత్త్వస్థో నిఃయోగక్షేమ ఆత్మవాన్ ॥

వేదములు త్రిగుణాత్మకంగా అనేక విధి - విధానములను కార్యక్రమముల రూపంగా ప్రతిపాదిస్తున్నాయి. త్రిగుణాత్మకమగు ఆచార - వ్యవహార - విధి - విధానములు మన ముందు ఉంచుతున్నాయి.

అయితే అర్జునా! త్రిగుణములతో కూడిన వేద ప్రవచిత విధి - విధానములను సాధనా మార్గంగా ఉపయోగించుకొని నీవు త్రిగుణాతీతుడవు కావాలి. గుణములకు ఆవల - గుణములకు మునుముందే సర్వదా వేంచేసియున్న నిర్హేతుక ఆనందమయమగు నీ ఆత్మతత్వం గమనించి, గ్రహించి ఆస్వాదించాలి సుమా! బుద్ధి నిశ్చలమై ఆత్మానుభవమునందు నిలకడ పొందాలి.

🌻 నిర్ద్వంద్వ స్థితి సంపాదించుకోవాలి. ద్వంద్వవిషయములను ఉపయోగించి …… ద్వంద్వాతీతుడవు కావాలి.
🌻 నిత్యసత్వ స్థితి సంపాదించుకోవాలి. ‘‘నేను ఆత్మయే స్వరూపముగా సర్వదా కలిగియున్నాను’’… అనే నిత్య సత్త్వస్థితిని (A sense that I am always present / existent) సంతరించుకోవాలి. సుస్థిరీకరించుకోవాలి.

‘‘ఇది పొందాలి - అది తొలగాలి. అప్పుడు గాని ఆత్మ సాక్షాత్కారం కాదు’’…. ఇటువంటి వాక్యాలను అధిగమించాలి. యోగ - క్షేమములచే స్పృశించబడని ఆత్మస్వరూపంగా ప్రకాశించాలి.

[NOTE: యోగక్షేమాలు = ఇప్పుడు లేనిది ఏదో ఒకప్పటికి పొందాలి అనేది వస్తు యోగం; ఇప్పుడు పొంది ఉన్నది వ్యతిరేకంగా మారకూడదు అనేది క్షేమం.]

02–46

యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే ।
తావాన్సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః ॥

యావాన్ అర్థ ఉదపానే సర్వతః సంప్లుత ఉదకే ।
తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః ॥

వివిధ సాధనములలోని ఏకత్వం

సాధనాలు అనేకం. అయితే ఒక విషయం!

ఒకాయన ఏదో కొత్త ఊరు వెళ్ళాడు. అక్కడ ‘స్నానం చేయాలి’ అని అనుకున్నాడు. అక్కడి వారిని ‘‘నీళ్ళు ఎక్కడ?’’ అని వాకబు చేశాడు. అక్కడివారంతా ఒక్కొక్కడు ఒకొక్కరీతిగా వివరించటం ప్రారంభించారు.

👱‍♂️ 1వ వ్యక్తి : స్నానం చేస్తారా? మంచిది. మీకు జలం కావాలి కదా! ఇక్కడ దగ్గిరలో ఒక నుయ్యి ఉంది. ఇక్కడే స్నానం చేయండి. ఇంకెక్కడన్నా స్నానం చేశారో …….. ఇక అంతే!
👱‍♂️ 2వ వ్యక్తి : అబ్బెబ్బే! వద్దండీ! ఊరి చివర కాలువ ఉన్నది. అక్కడ స్నానం చేయండి. కాలువలోనే స్నానం చేయండి. ఇంకెక్కడా చేయకండి. ఎవరి మాటలూ నమ్మకండి.
👱‍♂️ 3వ వ్యక్తి : అవన్నీ వద్దు. అనవసరం. కొంత దూరంలో పెద్ద తటాకం ఉన్నది. అక్కడైతే స్నానం మంచిది.
👱‍♂️ 4వ వ్యక్తి : భలేవారే! అవన్నీ మరచిపోండి! మరికొంత దూరంలో నదీజలం ఉన్నది. అక్కడే స్నానం చేయండి. ఇంకెక్కడా చేయకండి. చెయ్యనేవద్దు. అంతే!
👱‍♂️ 5వ వ్యక్తి : ఎవరండీ, మీకు చెప్పింది? వద్దొద్దు! ఆ కొంత మైళ్ళ దూరంలో సముద్రం ఉన్నది. అక్కడే స్నానం చేయవచ్చు. సముద్ర స్నానమే మంచిది. వెళ్ళండి. వెళ్ళండి. ఇంకెవరి మాటలూ పట్టించుకోకండి.

అప్పుడు ఆ బాటసారి అనుకున్నాడు గదా, ‘‘వీళ్ళందరి మాటలు నాకెందుకు స్వామీ! స్నానం చేయటం ముఖ్యం. అంతేగాని నూతి నీళ్లైతేనేం? కాలువ నీళ్లైతేనేం? తటాకజలం అయితేనేం? నదీజలం అయితేనేం? సాగరజలం అయితేనేం? కాలము - అవకాశము - సందర్భములను బట్టి ఎక్కడో - అక్కడ స్నానం చేస్తూ ఉంటాను. జలం అంతటా ఒక్కటే కదా!’’

అట్లా ఆ బాటసారి అనుకుంటున్నట్లే…..

‘బ్రహ్మజ్ఞానం’ లేక ‘ఆత్మజ్ఞానం’ అనే ఆశయం కలవాడు సర్వవేదములలోని అసంఖ్యాక విధి - విధానములలో వేరు - వేరైన ఉపాసనా మార్గాలలోనూ ‘‘బుద్ధి స్థిరపరచుకోవటం - బుద్ధి చాంచల్యమును వదిలించుకోవటం’’…. అనే ఒకే ఒక ఆశయాన్ని హృదయస్థం చేసుకొని ఉంటాడు. వివిధములైన వేద ప్రవచిత ఉపాసనా విధానాలలో ఏకత్వమును సందర్శిస్తూ ఉంటాడు. కర్మ - జ్ఞాన - భక్తి - యోగ మార్గాలలో గల ‘‘బుద్ధి నిశ్చయాత్మకత’’ అనే ఏకోపాసన - ఏకైక సాధనను ఆశ్రయించి ఉంటాడు. ఆతని దృష్టికి నిష్కామకర్మ - ధ్యాన నిష్ఠ - పూజ - ప్రాణాయామము - తపస్సు మొదలైనవన్నీ వేరు వేరు కాదు.

02–47

కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన ।
మా కర్మఫలహేతుర్భూర్మా తే సఙ్గోఽస్త్వకర్మణి ॥

కర్మణ్య ఏవ అధికారః తే, మా ఫలేషు కదాచన ।
మా కర్మఫలహేతుః భూః, మా తే సంగో అస్తు అకర్మణి ॥

కాబట్టి ఓ అర్జునా! నీవు కర్మయోగివై నిష్కామబుద్ధితో మనోనిర్మలత కొరకై కర్మలు ఆచరించు.

‘కర్మ’కు ప్రయోజనం అనివార్యం. అయితే, ’‘ఈ కర్మ లోకశ్రేయస్సు కొరకై ఉద్దేశ్యించబడి, వినియోగమగు గాక! నా బుద్ధి వికసించటం నాకు లభించవలసిన ప్రయోజనం. నా బుద్ధి నిర్మలమగు గాక!’’ అనునది మహదాశయం. “లోకంలో నాకేమి లభించింది?” అనునది అల్పాశయం.

సందర్భానుచిత ఆశయం (Incidental Objective) : ఒక విద్యార్థి ‘‘నేను బాగా చదవాలి’’ అని శ్రమించటం - సందర్భోచితమైన ఆశయం. అది అత్యవసరం. అయితే అది మహదాశయమునకు సోపానం కావాలి!

మహదాశయం : (Main Objective - Life Objective) : ‘‘ఇప్పుడు బాగా చదవి, తగిన ఉద్యోగం ద్వారా సంస్థకు సేవ చేస్తూ…. నా కుటుంబానికి - సంఘానికి ఉపయోగపడతాను’’ ……. అనునది మహదాశయం.

‘‘ఏ కర్మ చేస్తున్నాము?’’ అనేది ముఖ్యం కాదు. ‘‘ఏ ఉద్దేశ్యము, అవగాహనలతో - ఏ మహదాశయంతో ఆ కర్మ చేస్తున్నాము?’’ ….. అనేది ముఖ్యం సుమా!

శ్రద్ధ - కర్మ నిర్వహణ - కర్మఫల సమర్పణ - కర్మఫలాతీతత్వం :
➤ ‘‘ఎంత శ్రద్ధగా నాకు విధించబడిన కర్మలు నేను నిర్వర్తిస్తున్నాను?’’…. అనేదే నీ నిర్ణయాత్మక పరిధి.
➤ ‘‘నా పని నేను బాగా చేయాలి’’ అనుకునేంతవరకే నీకు కర్మతో సంబంధం.
➤ ‘‘ఈ కర్మలవలన నాకో - మరొకరికో ఇంతింత లాభం వస్తుందో రాదో మరి?’’ అనే శంక - భావనలు నీకు ఉండకుండుగాక!
➤ ‘‘కర్మఫలం’ నేను అనుకున్నట్లే ఉండాలి. మరొక రకంగా కాదు’’ అని తలుస్తూ కర్మఫలహేతువుగా నీ బుద్ధి పరిణమించకూడదు. బుద్ధి దిగజారకూడదు.

అంతే కాదు.

02–48

యోగస్థః కురు కర్మాణి సఙ్గం త్యక్త్వా ధనఞ్జయ ।
సిద్ధ్యసిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే ॥

యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా, ధనంజయ! ।
సిద్ధి-అసిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే ॥

ఫలాసక్తి త్యాజ్యం

కర్మఫలములందు ‘ఆసక్తి’ (Attachment) నీకు ఉండకుండు గాక!

‘‘ఈ కర్మల ద్వారా అది పొందాలి. అద్దాని తరువాత ఇదంతా చేయాలి’’…… ఇటువంటి ఆసక్త బుద్ధిని క్రమ క్రమంగా త్యజించుచున్నవానికి కర్మబంధం ఉండదు. ఉండకపోగా… ఆ కర్మలు ఉపాసనా రూపం సంతరించుకొని ఆ కర్తను సముద్ధరించగలవు.

అట్టి నిష్కామ కర్మలు బుద్ధి చాంచల్యాన్ని తొలగించి, బుద్ధి నిశ్చలతకు కారణమౌతున్నాయి.

కనుక, నేనెందుకు చేయాలి? - అను రూపమైన అశ్రద్ధగాని, బద్ధకముగాని కర్మల పట్ల నీకు ఉండకుండా ఉండు గాక!

కర్మయోగం

ఓ అర్జునా! ‘యోగము’నందు నిన్ను నీవు ప్రతిక్షేపించుకొని, అప్పుడు ఇక నియమిత కర్మలకు ఉపక్రమించు.

↳ కర్మయోగికి ’‘నేను చేయవలసిన కర్మ శ్రద్ధగా, శాస్త్ర - లోక విధి పూర్వకంగా కుశలతతో నిర్వర్తిస్తున్నానా? లేదా?’’ అనునది మాత్రమే ముఖ్యం.

↳ ‘‘నేను అనుకున్నది నాకుగాని, మరొకరికిగాని సిద్ధించిందా? అందరూ మెచ్చుకుంటున్నారా? ‘సంతోషం’ ప్రకటిస్తున్నారా? నాకు అనుకున్నది లభిస్తోందా? నేను చెప్పినట్లే చేయరేం? వీళ్లను బాగుపరచలేమా? నా పేరు - ప్రతిష్ఠలు శోభిస్తున్నాయా?’’ …. ఈ ప్రశ్నలకు సమాధానాలు కర్మయోగి ఏ మాత్రం వెతకడు.

↳ ‘‘కర్మ యొక్క ఫలం ఇప్పుడు సిద్ధించవచ్చు. నేను అనుకున్నట్లో, మరొకరు కోరుకున్నట్లో సిద్ధించవచ్చు. సిద్ధించకపోవచ్చు. కర్మను ఉపాసనగా నిర్వర్తించటమే ముఖ్యం’’ అను భావనతో సిద్ధ - అసిద్ధములను ఏకభావనతో దర్శిస్తూ కర్మను నిర్వర్తించటం కర్మయోగము. ఇదియే కర్మ సిద్ధాంతం.

↳‘‘నేను ఉత్తమమైన ఆశయంతో శ్రద్ధగా నా ధర్మము నిర్వర్తించటమే నా జీవితాశయం’’… అని కర్మయోగి గ్రహించి ఉంటాడు. (అందుకే ఇది ‘కర్మభూమి’ అంటారు.)

02–49

దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాద్ధనఞ్జయ ।
బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః ॥

దూరేణ హి అవరం కర్మ బుద్ధియోగాత్, ధనంజయ! ।
బుద్ధౌ శరణమ్ అన్విచ్ఛ కృపణాః ఫలహేతవః ॥

ఇక, కర్మచేస్తూ ‘‘ఇది అట్లా అవుతుందంటావా? అవదంటావా?’’ అని తలుస్తూ కర్మఫలం పట్ల ధ్యాసంతా కలిగి ఉండటం కర్మతాదాత్మ్యం. ‘‘కర్మ యోగం (లేక) నిష్కామ కర్మ’’ తో పోలిస్తే…. కర్మతాదాత్మ్యం చాలా స్వల్ప స్థితి అనిపించుకుంటుంది.

‘‘కర్మ ఫలాలు ఆశ్రయించి ఉండటం’’ అనేది ‘‘కొండను సొంతం చేసుకోవటానికి వెళుతూ గులకరాళ్ళు కనబడితే ప్రయాణం ఆపి, ఆ గులకరాళ్ళను జేబులో వేసుకోవటం’’…. వంటిది. రత్నాన్ని వదలి రాళ్ళకోసం పరుగులు తీయటం వంటిది. కర్మఫలాలకోసం ప్రార్థనలు చేసే బదులు ‘‘నా బుద్ధి సమున్నతమగు గాక’’ అని ఉత్తమబుద్ధి (నిశ్చయాత్మకబుద్ధి) కొరకై ప్రార్థన చేయి. ఎందుకంటే కర్మ ఫలాల కొరకై అఱ్ఱులుచాచటం కర్మ మార్గము యొక్క అల్పఫలాలను ఆశ్రయించటం వంటిది. తామరపుష్పాలను తటాకంలో వదలి తామరతూళ్ళ గుట్టలను ఇంటికి తెచ్చుకోవటం వంటిదని గమనించు.

కర్మ ఫలాలను ఆశ్రయించేబదులు ఉత్తమబుద్ధినే ఆశ్రయించు. శరణువేడు. కర్మఫల హేతువులను - లౌకిక స్థితి - గతులను ఆశ్రయించే వారు అల్పబుద్ధిని ఉపాసించుచున్నవారుగా అగుచున్నారు.

02–50

బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృతదుష్కృతే ।
తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలమ్ ॥

బుద్ధియుక్తో జహాతి ఇహ ఉభే సుకృతదుష్కృతే ।
తస్మాత్ యోగాయ యుజ్యస్వ, యోగః కర్మసు కౌశలమ్ ॥

అందుచేత ఓ అర్జునా! బలవత్తరమైన - ప్రశాంతమైన - సుతీక్ష్ణమైన - విస్తారమైన బుద్ధిని సంపాదించుకొని బుద్ధియుక్తుడవు కమ్ము. బుద్ధి యుక్తితో సుకృత ఫలాలను - దుష్కృత ఫలాలను రెండిటిని అధిగమించివేయి. అనగా ఫలితాలను దృశ్య ప్రపంచానికి వదిలివేయి.

సమత్వంతో కర్మఫలాలను కూడిన బుద్ధిని పెంపొందించుకో. కర్మలను నేర్పుగా…. కర్మదోషములకు అంటక, కర్మఫలములను అధిగమించి నిర్వర్తించటమే ‘కర్మయోగము’.

02–51

కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః ।
జన్మబన్ధవినిర్ముక్తాః పదం గచ్ఛన్త్యనామయమ్ ॥

కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః ।
జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్ఛంతి అనామయమ్ ॥

కర్మ బాగుగా నిర్వర్తించు. అయితే, ఆ నిర్వర్తిస్తున్న కర్మలను ’‘కర్మల అతీతత్వానికి ప్రయాణించే నౌక’’గా ఉపయోగించుకో. కర్మలు ఏ ఉద్దేశ్యంతో ఎంతవరకు ఎందుకు ఎట్లా చేయాలో తెలుసుకొని నిర్వర్తించటమును శాస్త్రములు కర్మయోగంగాను, బుద్ధియోగంగాను గానం చేస్తున్నాయి. బుద్ధి యొక్క సమత్వమును సంపాదించుకొన్న బుద్ధిమంతులు - శాస్త్రవిద్వాంసులు కర్మఫలములకు అతీతత్వం సముపార్జించుకొని ఉంటున్నారు. తద్వారా జన్మ - కర్మ - బంధములను త్రెంచి వేసుకొంటున్నారు. బంధరహితమగు అనామయ స్థానమును సంపాదించుకొని క్రమంగా ఆత్మానందం సుస్థిరీకరించుకుంటూ ఆస్వాదిస్తున్నారు. అనగా ఈలోక - లోకాంతర సంఘటనలేవీ వారి దృష్టిలో వారికి బంధం కాదు.

02–52

యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి ।
తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ ॥

యదా తే మోహకలిలం బుద్ధిః వ్యతితరిష్యతి ।
తదా గంతా అసి, నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ ॥

ఎప్పుడైతే నీ బుద్ధి ‘‘కర్మల ప్రాపంచక ప్రయోజనములు’’ … అనబడే మోహకాలుష్యాన్ని తొలగించుకొంటుందో…., అప్పుడు మాత్రమే ఆ నిర్మలమైన బుద్ధికి ఇతఃపూర్వం వినియున్న, ఇప్పుడు వింటున్న కల్పిత ఇహ-పర మోహ విషయాలు వదిలి, శాస్త్ర - గురు - మహనీయ ప్రవచితమైన ఆప్త వాక్యాలు అవగతమౌతాయి. నిర్మలమైన బుద్ధి సహజసిద్ధంగా లౌకిక ప్రయోజనముల పట్ల నిర్వేదం (Non - worrying) పొందినదై ఉండగలదు.

02–53

శ్రుతివిప్రతిపన్నా తే యదా స్థాస్యతి నిశ్చలా ।
సమాధావచలా బుద్ధిస్తదా యోగమవాప్స్యసి ॥

శ్రుతివిప్రతిపన్నా తే యదా స్థాస్యతి నిశ్చలా ।
సమాధౌ అచలా బుద్ధిః తదా యోగమ్ అవాప్సి అసి ॥

లౌకిక - లోకాంతర ప్రయోజనములకు సంబంధించిన శ్రుతి - శ్రుత వాక్యములతో నిండిన బుద్ధి అనుక్షణికంగా చంచలత్వం పొందుతోంది. బుద్ధి ఎప్పుడైతే లౌకిక - పారలౌకిక ప్రయోజనాలను త్యజించి నిశ్చలత్వం సంతరించుకుంటుందో…. అప్పుడు యోగస్థితి పొందినదగుచున్నది.

కనుక, లోక సంబంధమైన - దృశ్య సంబంధమైనట్టి విన్నవి-వింటున్నవి త్యజించి, అతీతుడవై ఉండు.

Arjuna questions Bhagavan Krishna

మూల శ్లోకము


అధ్యయన వ్యాఖ్యానము


ఉపన్యాసము

అర్జున ఉవాచ :-

02–54

స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థస్య కేశవ ।
స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిమ్ ॥

స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థస్య? కేశవ! ।
స్థితధీః కిం ప్రభాషేత? కిమ్ ఆసీత? వ్రజేత కిమ్? ॥

స్థితప్రజ్ఞుడు
(ఏకాగ్ర బుద్ధియోగి : సమాధి స్థితుడు)

అర్జునుడు :-

ఓ కేశవా! నిశ్చయాత్మకమై, నిశ్చలత్వం పొంది, సమాధిస్థితికి చేరిన బుద్ధిని సముపార్జించుకొన్న స్థితప్రజ్ఞుడి భాష - మాటలు ఎట్లా ఉంటాయి? ఆతను ఎచ్చట ఆసీనుడై ఉంటాడు? ఎక్కడ సంచరిస్తూ ఉంటాడు? ఆతని సమాధాన స్థితి (Wel-answered state of one’s one self) ఎట్లా ఉంటుంది?

శ్రీ భగవాన్ ఉవాచ :-

02–55

ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ।
ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే ॥

ప్రజహాతి యదా కామాన్ సర్వాన్, పార్థ! మనోగతాన్ ।
ఆత్మని ఏవ ఆత్మనా తుష్టః స్థితప్రజ్ఞః తదా ఉచ్యతే ॥

శ్రీకృష్ణ భగవానుడు :-

ఓ పార్థా! బుద్ధి యొక్క నిశ్చలత సముపార్జించుకున్నట్టి స్థితప్రజ్ఞుని లక్షణ - ప్రవర్తన - అవగాహన - సందర్శన - సమభావనా విశేషాలు చెపుతాను. విను.

స్థిత ప్రజ్ఞ లక్షణాలు

(స్థితా ప్రతిష్ఠితా ‘‘అహమస్మి బ్రహ్మా’’ ఇతి ప్రజ్ఞా యస్య, సః ‘‘స్థితప్రజ్ఞః’’)

✤ ఎప్పుడైతే ఒకడు మనస్సులో ప్రవేశించియున్న - ప్రవేశించుచున్న సర్వ ప్రాపంచకార్థములను (సర్వ కామములను - All expectations in this world) మొదలంట్లా త్యజించి ఉంటాడో….,

✤ ఎప్పుడైతే, లౌకికమైన సంగతులను, సంఘటనలను అధిగమించి సర్వే సర్వత్రా ‘ఆత్మ’ను సందర్శిస్తూ (ఆత్మయే ఇదంతా - నేను ఆత్మస్వరూపుడను అను) తృప్తి - ఆనందములను అనుక్షణికము, స్వభావసిద్ధము చేసుకొని ఉంటాడో…

… అప్పుడు ఆతనిని శాస్త్రవాక్యములు ’‘స్థిత ప్రజ్ఞుడు’’ అని పిలుస్తున్నాయి.

02–56

దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః ।
వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే ॥

దుఃఖేషు అనుద్విగ్నమనాః, సుఖేషు విగతస్పృహః ।
వీతరాగభయక్రోధః స్థితధీః మునిః ఉచ్యతే ॥

ఆ స్థితప్రజ్ఞుడు జీవితంలో సందర్భపడే వేదన, దుఃఖ సంఘటనలను చూచి బెంబేలు పడడు. మనస్సులో అంతర్గతంగా ఉద్విగ్నం (Emotion) పొందడు. ‘‘ప్రపంచంలో అందరికీ కష్టాలు వస్తూ - పోతూ ఉంటాయి. ఇవన్నీ సహజమే’’… అనే అవగాహనతో మనస్సును ప్రశాంత స్థితి నుండి చ్యుతి పొందకుండా, ఉద్విగ్నం కాకుండా చూచుకుంటాడు. అట్లాగే సుఖ సంఘటనలు వస్తున్నప్పుడు ‘‘ఇటువంటివన్నీ కూడా వస్తూనే ఉంటాయి. పోతూనే ఉంటాయి. ఈ మాత్రం పొందుటచే ఇదీ శాశ్వతం కాదు. నేను తదితర జీవుల కంటే గొప్ప కాదు.’’… అనే అవగాహనతో గర్వము తనను సమీపించకుండా చూచుకొంటాడు.

‘‘ప్రపంచంలో ప్రతిదీ ప్రపంచం కొరకే అయి ఉంటుందేకాని నా కొరకు కాదు. నాది కాదు. ఇదం న మమ! (Whatever is here neither belongs to me nor it is addressed to me). నేను విద్యార్థినై నేర్చుకోవటమొక్కటే నాకు చెందినది’’ అని గ్రహించి ఉంటాడు.

→ ‘‘ఇది ఇష్టం. కాబట్టి నాకే ఎల్లకాలం ఉండాలి’’…. అనే రాగము కలిగి ఉండడు.
→ ‘‘వారు నాకు అనుకూలంగా ఉండటం లేదు. అందుకే ఇష్టం ఉండదు’’…. అనే ద్వేషమునకు చోటు ఇవ్వడు.
→ ‘‘ఇది అట్లా ఉండదేమో! అది ఇట్లా ఉంటుందేమో! ఏది ఏమి కానున్నదో’’…. అనే భయం దగ్గరకు రానివ్వడు.
→ ‘‘వారు నాకు ప్రతికూలురు. వీరి సంగతి చూడాలి’’…. ఇటువంటి క్రోధమునకు లోనుకాడు.

రాగము - ద్వేషము - భయము - క్రోధము మనస్సునుండి తొలగించుకొని ఉంటాడు. అట్టి వాడు ‘‘నిశ్చల బుద్ధి సముపార్జించుకొన్న మౌని’’ అని, ‘‘స్థితధీర్ముని’’ అని చెప్పబడుచున్నాడు.

02–57

యః సర్వత్రానభిస్నేహస్తత్తత్ప్రాప్య శుభాశుభమ్ ।
నాభినన్దతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ॥

యః సర్వత్ర అనభిస్నేహః తత్ తత్ ప్రాప్య శుభాశుభమ్ ।
న అభినందతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ॥

ఆతడు ఆయా విషయ - వ్యవహార - సంబంధముల పట్ల అతిస్నేహం (Heavily attached relationship) కలిగి ఉండడు. ఆయా ప్రాప్తించే శుభ - అశుభ విశేషాలను చూచి సంతోష - ద్వేష - ఉద్వేగములను దరిజేరనీయడు. ఆతని బుద్ధి చాంచల్యమును వీడి, ప్రతిష్ఠితమై, ప్రశాంత - నిర్వేద - నిర్లేపమై ఉంటుంది. ఆతడు స్థిరచిత్తుడై ఉంటాడు.

02–58

యదా సంహరతే చాయం కూర్మోఽఙ్గానీవ సర్వశః ।
ఇన్ద్రియాణీన్ద్రియార్థేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ॥

యదా సంహరతే చ అయం కూర్మో అంగాని ఇవ సర్వశః ।
ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ॥

తాబేలులాగా విషయములనుండి నివృత్తి

ఓ అర్జునా! తాబేలును గమనించావా? అది ప్రమాద సంకేతాలు గమనించగానే తన అంగాలన్నీ ఉపసంహరించుకొంటుంది చూచావా? అట్లాగే, ఇంద్రియములద్వారా ఇంద్రియార్థములు ఆయా శబ్ద - స్పర్శ - రూప - రస - గంధ విశేషములను సమీపిస్తున్నప్పుడు స్థితప్రజ్ఞుడు తన బుద్ధి ఆసక్తిచే చంచలం కాకుండా చూచుకుంటూ, పరిపోషించుకుంటూ ఉంటాడు. అనగా, తన బుద్ధి నిశ్చలతను అనాసక్తి బలము (Not being interestedly inquisitive) చేత సంరక్షించుకుంటూ ఉంటాడు.

02–59

విషయా వినివర్తన్తే నిరాహారస్య దేహినః ।
రసవర్జం రసోఽప్యస్య పరం దృష్ట్వా నివర్తతే ॥

విషయా వినివర్తన్తే నిరాహారస్య దేహినః ।
రసవర్జం రసో అపి అస్య పరం దృష్ట్వా నివర్తతే ॥

ఇంద్రియార్థములు విషయ నిర్వహణ చేయవచ్చు గాక! విషయములను పొందుతూ కూడా విషయముల ఆస్వాదనను, విషయముల పట్ల రాగమును తగ్గించుకొంటూ వస్తున్న యోగియొక్క బుద్ధి ‘విషయ నిరాహారం’ సముపార్జించుకొంటోంది. ఇంకొకవైపుగా ‘‘సర్వము పరమాత్మయొక్క ప్రదర్శనా చమత్కారమే’’… అను దృష్టి క్రమంగా పెంపొందుచుండగా…. స్వభావసిద్ధంగానే, ఆతని బుద్ధి విషయాతీత స్థితి పొంది, సర్వే - సర్వత్రా పరమాత్మ తత్త్వ సాక్షాత్కార స్థితిని సముపార్జించుకొని ఆనందిస్తోంది!

02–60

యతతో హ్యపి కౌన్తేయ పురుషస్య విపశ్చితః ।
ఇన్ద్రియాణి ప్రమాథీని హరన్తి ప్రసభం మనః ॥

యతతో హి అపి, కౌన్తేయ! పురుషస్య విపశ్చితః ।
ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః ॥

ఒక విద్యార్థికి ‘‘బాగా చదువుకోవాలి. తెలివిగలవాడిని కావాలి’’ అని ఉన్నప్పటికీ ‘‘బజార్లలో పచార్లు చేయాలి! స్నేహితులతో ఆయా కాలక్షేపాలు చేయాలి’’…. అనే ధ్యాస చేత చదువుపై ఏకాగ్రత కుదరకుండా ఉంటోంది చూచావా? అట్లాగే ఒకనికి అల్పమగు ఇంద్రియానంద సంభ్రమములను - ఇంద్రియ విషయ యండమావులను అధిగమించి ‘‘దృశ్యజగత్తును పరమాత్మగా సందర్శించటం’’ …. అనే శాశ్వతాత్మానందం సంపాదించుకోవాలని ఉన్నప్పటికీ, తాను విద్వాంసుడైకూడా, అది సముపార్జించుకోలేకపోవటం లోకంలో జరుగుచూ ఉన్నది.

ఎందుచేత?

ఈ ఇంద్రియములు ఇతఃపూర్వపు అనేకములైన అభ్యాసముల కారణం చేత ఇవి ఎల్లప్పుడూ ఇంద్రియ విషయములవైపుకే ఎక్కుపెట్టబడినవై ఉంటున్నాయి. అవి బలవత్తరమై, బలవంతంగా మనస్సును కూడా తమవెంట ఈడ్చుకుపోయి ఇంద్రియ విషయములలో ప్రవేశింపజేసివేస్తున్నాయి. వాస్తవానికి ఇంద్రియములు మనస్సుకు సేవకులై ఉండాలి కదా! కానీ, ఆత్మస్వరూపుడగు ఈ ద్రష్టను ఇంద్రియ విషయాభిముఖం చేసివేస్తున్నాయి.

02–61

తాని సర్వాణి సంయమ్య యుక్తాసీత మత్పరః ।
వశే హి యస్యేన్ద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ॥

తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్ పరః ।
వశే హి యస్య ఇంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ॥

అందుచేత అట్టి ఇంద్రియాలను, వాటి కార్యక్రమములను అదుపులో ఉంచాలి. ఎవ్వడైతే ఏకాగ్రచిత్తం కలవాడై ఇంద్రియ విషయ ప్రవాహములను నిగ్రహించి, వాటిని వశం చేసుకొని ఉంటాడో అట్టివాని బుద్ధి క్రమక్రమంగా చంచలత్వం త్యజించి నిశ్చలత్వం సంతరించుకుంటోంది. ఆత్మను దర్శించటంలో, ఆత్మభావన నిర్దుష్టం చేసుకోవడంలో అట్టి ‘‘నిగ్రహించబడిన ఇంద్రియములు’’ మాత్రమే సహకరించగలవు.

02–62

ధ్యాయతో విషయాన్పుంసః సఙ్గస్తేషూపజాయతే ।
సఙ్గాత్ సంజాయతే కామః కామాత్క్రోధోఽభిజాయతే ॥

ధ్యాయతో విషయాన్ పుంసః సంగః తేషు ఉపజాయతే ।
సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో అభిజాయతే ॥

సదా మననముతో ఇంద్రియ విషయ బంధము

ఈ దృశ్యముతో అనుబంధం అతి చమత్కారంగా ఎవరికి వారు కల్పించుకుంటున్నదే సుమా! ఇది స్వయంకల్పితంగా ఎట్లా ఏర్పడుతోందో చెపుతాను. విను.

⤿ విషయముల గురించి మననము - ఆ తరువాత ధ్యాస - ఆ తరువాత ధ్యానముల చేత ఈ జీవునికి క్రమంగా ఆయా ఇంద్రియవిషయములతో ‘‘సంగము (Relatedness - Attachment)’’ ఏర్పడుతోంది.

⤿ క్రమంగా ఆ సంగము మరికొంత కొనసాగుచుండగా ‘‘అది పొందాలి - ఇది కావాలి’’ అను రూపంతో కూడిన ‘కామం’ (Emotionally Expecting) రూపుదిద్దుకుంటోంది.

⤿ ఆ కామం ఇంకొంతగా కొనసాగుచుండగా…., అది కాస్తా ‘‘ఏమిటిరా ఇది? నాకు ఎందుకు లభించటం లేదు? ఏమి చేయాలి? ఏమి చేయాలి?’’ అనే క్రోధావేశస్థితిగా పరిణమిస్తోంది.

02–63

క్రోధాద్భవతి సంమోహః సంమోహాత్స్మతివిభ్రమః ।
స్మృతిభ్రంశాద్బుద్ధినాశో బుద్ధినాశాత్ప్రణశ్యతి ॥

క్రోధాత్ భవతి సంమోహః, సంమోహాత్ స్మృతివిభ్రమః ।
స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి ॥

⤿ ఆ క్రోధం కాస్తా క్రమక్రమంగా ‘‘సమ్మోహస్థితి (A State of Illusionary Sense)’‘కి దారి తీస్తోంది.

⤿ ఆ సమ్మోహస్థితి ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా అనుభవం కలిగించటం ప్రారంభిస్తోంది.

⤿ అటువంటి సమ్మోహస్థితి ఇంకొంత కాలం కొనసాగటంచేత… అది కాస్తా ’‘స్మృతి విభ్రమం (A forgotten State of what originally one is)’‘గా ప్రాప్తిస్తోంది. జ్ఞాపకశక్తి నశించటం - ఏమరచటం జరుగుతోంది.

⤿ స్మృతి (Remembrance) భ్రంశం అవటం చేత బుద్ధి (Intellect) నశిస్తోంది. (అల్పమైన అవగాహనలు పెంపొందించుకుంటోంది. తదితరులలో దోషాలే ఆ బుద్ధికి కనిపిస్తున్నాయిగాని ఆత్మతత్త్వముగా కాదు!)

⤿ బుద్ధి అపక్రమస్థితి పొందుటచే ఆత్మ స్వరూపుడగు జీవుడు ’‘నేనొక మానవదేహాన్ని - కోతి దేహాన్ని - కాకి దేహాన్ని - పురుగు దేహాన్ని’’…. ఇట్లా అవరోహన స్థితిని - దేహతాదాత్మ్య స్థితిని నెత్తిపైకి తెచ్చి పెట్టుకుంటున్నాడు.

⤿ ‘‘ఆత్మస్వరూప ఆస్వాదన’’ అను స్థితి నుండి ఈ జీవుడు ‘విషయానంద అనుస్మరణ’చే వివశుడై ’‘ఈ దేహమే నేను. ఈ దేహం నాది. నేను ఈ దేహమునకు సంబంధించినవాడను. ఈ దేహం నాకు సంబంధించినది’’….. అను అనాత్మ అనుభూత స్థితికి చేరుచున్నాడు. బద్ధుడుగా అగుచున్నాడు.

02–64

రాగద్వేషవియుక్తైస్తు విషయానిన్ద్రియైశ్చరన్ ।
ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్ఛతి ॥

రాగద్వేషవియుక్తైః తు విషయాన్ ఇంద్రియైః చరన్ ।
ఆత్మవశ్యైః విధేయాత్మా ప్రసాదమ్ అధిగచ్ఛతి ॥

రాగ ద్వేషములపై జయం

అందుచేత అర్జునా! ఇప్పుడు ఈ మనస్సును ‘‘రాగ - ద్వేషములు, ఇష్ట - అయిష్టములు’’ అనే స్థితినుండి విడిపించి అందరిలోను సర్వదా ఏకరూపమైయున్న ‘‘ఆత్మ తత్త్వము’’ వైపుగా నడిపిస్తూ ఉండగా అప్పుడు క్రమంగా (ఇష్టము, అభిరుచి రూపముగాగల) చిత్తము నిర్మలత్వం సంతరించుకుంటూ ఉంటుంది.

02–65

ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ।
ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్ఠతే ॥

ప్రసాదే సర్వదుఃఖానాం హానిః అస్య ఉపజాయతే ।
ప్రసన్నచేతసో హి ఆశు బుద్ధిః పర్యవతిష్ఠతే ॥

చిత్తం నిర్మలం అవుతూ ఉంటే, అప్పుడు క్రమక్రమంగా అన్ని ఆందోళనలు, ఆదుర్దాలు, ఆవేదనలు, ఆవేశాలు వాటికవే తొలగుతూ వస్తాయి. చిత్తము ఆత్మబలమును పెంపొందించుకుంటూ ప్రసన్నం అవుతూ వస్తుంది. ప్రసన్నమైన చిత్తము వలన బుద్ధి వికసించగలదు. వికసించిన బుద్ధి ప్రత్యక్షంగా ఆత్మసాక్షాత్కారం సంతరించుకొని ప్రశాంతపడగలదు.

జీవులందరూ ’సుఖం’గా ఉండాలనే కోరుకొని, అద్దానికోసం సుదీర్ఘంగా వెతుకుతున్నారు. శ్రమిస్తున్నారు.

మంచిదే! అయితే…..,

02–66

నాస్తి బుద్ధిరయుక్తస్య న చాయుక్తస్య భావనా ।
న చాభావయతః శాన్తిరశాన్తస్య కుతః సుఖమ్ ॥

నాస్తి బుద్ధిః అయుక్తస్య, న చ అయుక్తస్య భావనా ।
న చ అభావయతః శాంతిః, అశాంతస్య కుతః సుఖమ్? ॥

దృశ్య ధ్యాస - సంసారము

ఎవరికి ప్రాపంచకవిషయ - విశేష - వ్యవహార - సంఘటనల సమూహముల పట్ల యుక్తియుక్తమైన చిత్తము రూపం దిద్దుకోదో… వారి అవగాహన రూపమైన ‘బుద్ధి’ సక్రమమైన మార్గంలో ప్రయాణించదు.

బుద్ధి సునిశితంగాను, నిర్మలంగాను, సువిశాలంగాను ఉండకపోతే సరి అయిన (ఆత్మ సంబంధమైన) అవగాహన - భావన ఉండవు.

సత్‌-అసత్‌ వివేకముతో కూడిన భావన, పెంపొందకపోతే మనస్సుకు ‘శాంతి’ ఉండదు.

ఇక శాంతి సముపార్జించుకొనని చిత్తమునకు సుఖం ఎక్కడిది చెప్పు?

02–67

ఇన్ద్రియాణాం హి చరతాం యన్మనోఽనువిధీయతే ।
తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివామ్భసి ॥

ఇంద్రియాణాం హి చరతాం యత్ మనో అనువిధీయతే ।
తత్ అస్య హరతి ప్రజ్ఞాం వాయుః నావం ఇవ అంభసి ॥

ఎవరి చిత్తము (లేక) మనస్సు - ఇంద్రియముల - ఇంద్రియవిషయములగు దృశ్య పరంపరలవైపుగా ఏమాత్రం విధీయత (Control) లేకుండా ప్రయాణిస్తూ ఉంటుందో… వారి ప్రజ్ఞ (లేక తెలివితేటలు) కూడా ఇంద్రియవిషయ పరంపరల వైపుగానే ప్రసరిస్తాయేగాని ‘‘ఇదంతా నా స్వరూపమే’’ … అను ఆత్మజ్ఞానము వైపుగా కాదు.

పెనుగాలులు వీస్తూ ఉండగా సముద్ర మధ్యంలో చిక్కుకున్న నావ సముద్రపు ఆటుపోట్లకు లోనై ఎటు కొట్టుకుపోతుందో ఎవరు చెప్పగలరు? ఇంద్రియ - ఇంద్రియవిషయ ధ్యాసలలో చిక్కుకున్న మనస్సుగలవాని ప్రజ్ఞ కూడా ఈ సంసార నడిసముద్రంలో ఏఏ ఉపాధి పరంపరల వైపు కొట్టుకుపోతుంతో… ఏం చెప్పగలం - వర్ణతాతీతం!

02–68

తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ।
ఇన్ద్రియాణీన్ద్రియార్థేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ॥

తస్మాత్ అస్య, మహాబాహో! నిగృహీతాని సర్వశః ।
ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ॥

అందుచేత గొప్ప బాహువులుగల ఓ అర్జునా! ఎవని యొక్క ఇంద్రియాలు ఇంద్రియార్థ విషయములైనట్టి ఈ దృశ్యమానమగుచున్న శబ్ద - స్పర్శ - రూప - రస - గంధములకు వశం అయిఉండవో… అట్టివాని ‘ప్రజ్ఞ’ లేక ‘తెలివి’ లేక ‘బుద్ధి’ ప్రతిష్ఠితమై ఉంటుంది. స్థిరంగా ఉంటుంది.

ఎవనికి ఈ ఇంద్రియములు విషయముల వైపుగానే క్షణక్షణం పరుగులు తీస్తున్నాయా… అట్టి వాని బుద్ధికి నిశ్చలత - ప్రతిష్ఠత ఉండదు సుమా!

02–69

యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ ।
యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః ॥

యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ ।
యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః ॥

సంసార ధ్యాస అధికముగా గల జీవులు ఆత్మ సమాచారము తగినంతగా పట్టించుకోవటం లేదు. అనేకమంది సంసారజీవులు దేనినైతే ఏమాత్రం పరిశీలించకుండా ప్రాముఖ్యత ఇవ్వకుండా (దృశ్యస్వప్న ద్రష్టలుగా) రోజులు గడిపివేస్తున్నారో, …. అట్టి ‘‘ఆత్మస్వరూప సమాచారం’’ పట్ల ఇంద్రియములపై అజమాయిషీ గల యోగి జాగరూకుడై పరిశీలించి వాటికి అత్యంత ప్రాముఖ్యతను ఇస్తూ - ఆత్మజ్ఞానమును హృదయస్థం చేసుకుంటున్నాడు.

ఇక తదితరుల విషయం! వారు ఏ ఇంద్రియ విషయమాత్రములు, స్వప్న సదృశ లోకవ్యవహారముల పట్ల - ఇవి గొప్పవి అని తలచి, వాటిపట్ల అతిజాగరూకులై రాత్రింబవళ్ళు అనేక ధ్యాసలతో కూడి ప్రవర్తిస్తున్నారో……… అట్టివాటి పట్ల స్థితప్రజ్ఞుడగు ‘సంయమి’ (లేక ‘యోగి’)… అవన్నీ కూడా తుచ్ఛ - స్వల్ప - అల్ప విషయములు కదా! - అను దృష్టితో - చూడటం జరుగుతోంది.

02–70

ఆపూర్యమాణమచలప్రతిష్ఠం
సముద్రమాపః ప్రవిశన్తి యద్వత్ ।
తద్వత్కామా యం ప్రవిశన్తి సర్వే
స శాన్తిమాప్నోతి న కామకామీ ॥

ఆపూర్యమాణమ్ అచలప్రతిష్ఠం
సముద్రమ్ ఆపః ప్రవిశంతి యద్వత్ ।
తద్వత్ కామా యం ప్రవిశంతి సర్వే
స శాంతిమ్ ఆప్నోతి న కామకామీ ॥

స్థితప్రజ్ఞుని మరొక విశేషం విను.

సముద్రంలో ప్రవేశించే నదీ ప్రవాహాలు తమ రూప-నామాదులు త్యజించి శాంతిస్తున్నట్లుగా - ప్రాపంచిక విశేషాలన్నీ కూడా స్థితప్రజ్ఞుని సమీపించగానే సశాంతిస్తున్నాయి.

సముద్రం ఎల్లప్పుడూ జలంతో నిండుగా ఉంటుంది. సర్వదా యథాతథంగా ప్రతిష్ఠితమై ఉంటుంది. ‘‘ఆహాఁ! ఈ నదుల జలం నా యందే ప్రవేశిస్తోంది కదా!’’ … అని పొంగిపోదు. ‘‘అయ్యో! ఈ జలమును సూర్య కిరణాలు పీల్చి - ఆవిరిచేసి ఎత్తుకు పోతున్నాయే?’’ …. అని క్రుంగిపోదు. సముద్రం ఎప్పుడూ సమగ్రంగానే ఉంటుంది.

అట్లాగే స్థితప్రజ్ఞుడు ‘‘ఆహాఁ! నేను అనుకున్నవన్నీ జరుగుచున్నాయి. వద్దనుకొన్నవి తొలగుచున్నాయి’’ అని పొంగిపోడు. ‘‘అయ్యయ్యో! ఈ నా కోరికలు తీరటంలేదేం! అనుకున్నవి లభించటం లేదే? అనుకున్నవి అనుకున్నట్లుగా జరగటం లేదేం?’’ అని కృంగిపోడు. సర్వదా - సర్వవిధములగాను జీవితపు ఆటుపోట్లను చిద్విలాసంగా గమనిస్తూ సర్వాతీతమైన ప్రశాంత స్థానమును బుద్ధిచే ఆశ్రయించినవాడై ఉంటాడు.

ఈ ప్రాపంచక విషయాలు, సంఘటనలు, కోరికలు స్థితప్రజ్ఞుడు యందు ప్రవేశించి సముద్రంలో ప్రవేశించే నదీ జలంలాగే ఆతని ప్రజ్ఞాసముద్రంలో కలిసిపోతాయి. ఆతని ప్రశాంతతను తాము కూడా సంతరించుకుంటాయి.

ఇక ‘కామకామి’ (కోరికలు కోరుకునేవాడు) కోరికలు తీరినా, తీరకున్నా శాంతిని పొందలేడు. ఎందుకంటే కోరికలు కలిగి ఉండే స్వభావం కొనసాగేంతవరకు కోరికలకు అంతు ఎక్కడ? ఒకటి తీరితే పది ఆ ప్రక్కనే ఉండియే ఉంటాయి. లేదా క్రొత్తక్రొత్తవి మొలకెత్తుతూనే ఉంటాయి.

02–71

విహాయ కామాన్యః సర్వాన్పుమాంశ్చరతి నిఃస్పృహః ।
నిర్మమో నిరహంకారః స శాంతిమధిగచ్ఛతి ॥

విహాయ కామాన్ యః సర్వాన్ పుమాన్ చరతి నిఃస్పృహః ।
నిర్మమో నిరహంకారః స శాంతిమ్ అధిగచ్ఛతి ॥

ఎవ్వడైతే అంతర్గతమైన సర్వ దృశ్యసంబంధ కోరికలు త్యజించి ‘నేను - నాది’ అనే అహంకార - మమకారములను మొదలంట్లా తొలగించుకొని ఉంటాడో….. అట్టి స్థితప్రజ్ఞుడు పరమ ప్రశాంత స్థానమును తనకు తానే, తనయందు తానే సముపార్జించుకొని ఉండగలడు.

02–72

ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి ।
స్థిత్వాస్యామన్తకాలేఽపి బ్రహ్మనిర్వాణమృచ్ఛతి ॥

ఏషా బ్రాహ్మీ స్థితిః, పార్థ! న ఏనామ్ ప్రాప్య విముహ్యతి ।
స్థిత్వా అస్యామ్ అంతకాలే అపి బ్రహ్మనిర్వాణమ్ ఋచ్ఛతి ॥

బ్రాహ్మీస్థితి :
ఓ పార్థా! అటువంటి సర్వకామాతీత - అహంకారాతీత - మమకారాతీతమై ప్రకాశించే స్థితి, స్వఉపాధితో సహా సర్వమును కేవలాత్మ తత్త్వ చమత్కారంగా సందర్శిస్తూ ఆస్వాదించే స్వభావం ‘‘బ్రాహ్మీస్థితి’’ అని చెప్పబడుతోంది. అది, ‘‘లోకాలలో నేను లేను. లోకాలన్నీ నాయందే ఉన్నాయి’’ అను అవగాహన - అనుభూతి సంతరించుకునే స్థితి.

అట్టి బ్రాహ్మీ స్థితి ‘‘సర్వము బ్రహ్మమే’’….. అను అభ్యాసముచే స్వభావసిద్ధంగా సుస్థిరీకరించుకొన్న స్థితప్రజ్ఞుడు ఇక ఈ లోక - లోకాంతర సంఘటన - వ్యవహార సముదాయములను చూచి ఏమాత్రం మోహం పొందడు. ముగ్ధుడు కాడు.

ప్రాపంచక విషయ విశేషాలన్నీ స్థితప్రజ్ఞునికి ఒక కలలోని (లేదా) చదువుచున్న ఒక కథలోని సంఘటనలవంటివి అగుచున్నాయి. ‘‘ఇది కలయే’’, ‘‘ఇది నేను వింటున్న కథలో చమత్కారమే’’ అని గ్రహించిన తరువాత ఇక ‘‘ఈ కలలో కనిపించిన ప్రదేశం ఏ ఊళ్ళో ఉండి ఉండవచ్చు?’’ అని సమాలోచన చేసే వాడెవ్వడుంటాడు? ‘‘కథలో చెప్పబడే బంగారం లభించే కొండ ఎక్కడ ఉండి ఉండవచ్చు?’’ అని వాకబు చేస్తాడా? లేదు కదా! స్థితప్రజ్ఞుని అంతరము ఆ రీతిగా ఆవేశ-కావేశ రహితమై ప్రశాంతతను కోల్పోకయే ఉంటోంది.


ప్రాక్‌ శరీర విమోక్షనాత్‌ :
అట్టి బ్రాహ్మీస్థితి ఈ శరీరం నేలరాలకముందే (Before fall of the body) జీవితంలో ఎవ్వడు సంపాదించుకుంటాడో…అట్టివాడు జీవితమును సార్థకపరచుకొన్నవాడు అవుతాడు. ఆతడు తానే బ్రహ్మమై సర్వాంతర్యామి అయి, కేవలానంద స్వరూపుడై, సర్వబంధములను తృణీకరించినవాడై ఆత్మానందములో ఓలలాడుతూ ప్రకాశించగలడు. బ్రహ్మమే తానై వెలయగలడు.

ఇతి శ్రీమత్‌ భగవద్గీతాసు … సాంఖ్య యోగ పుష్పః ।
శ్రీ సాంబ సదాశివ పాదారవిందార్పణమస్తు ॥
🙏