భగవద్గీత

03- కర్మ యోగ అధ్యయన పుష్పం

మూలము : శ్రీ వ్యాస మహర్షిచే విరచించబడిన జయము / మహాభారతము (భీష్మ పర్వము)

అధ్యయన వ్యాఖ్యానము : (అధ్యయన విద్యార్థి) యేలేశ్వరపు హనుమ రామకృష్ణ


Arjuna asking Krishna

మూల శ్లోకము


అధ్యయన వ్యాఖ్యానము


ఉపన్యాసము

అర్జున ఉవాచ :-

03–01

జ్యాయసీ చేత్కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన ।
తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ ॥

జ్యాయసీ చేత్ కర్మణః తే మతా బుద్ధిః, జనార్దన! ।
తత్ కిం కర్మణి ఘోరే మాం నియోజయసి? కేశవ! ॥

అర్జునుడు :

ఓ జనార్దనా! మీరు ‘‘బుద్ధి యోగం’’ గురించి చెప్పారు. ‘‘ఉత్తమమైన, నిర్మలమైన, సుతీక్ష్ణమైన బుద్ధిని సమపార్జించుకోవటమే ‘జీవితము’ యొక్క సమున్నతమైన ప్రయోజనం. ఇక ప్రాపంచక కర్మలు - వాటి వాటి ప్రయోజనములన్నీ అల్ప విషయాలు’’ … అని ఒకానొక మహత్తరమైన బుద్ధి యోగ సిద్ధాంతమును ప్రతిపాదించారు. బుద్ధి నిశ్చలత్వం సంపాదించుకున్నట్టి స్థితప్రజ్ఞుని మహోన్నతమైన గుణగణాలు ప్రవచించారు. ‘‘నదులన్నీ సముద్రంలో ప్రవేశించి తమ నామరూపాలు త్యజించి సముద్రంలో కలసిపోతున్నట్లుగా, దృశ్యప్రపంచ సంబంధమైన సర్వ విషయాలు స్థితప్రజ్ఞునిలో ప్రవేశించి కూడా, అవి ‘సశాంతి’ని పొందుతాయి’’…. అని విశదీకరించారు. ’‘సర్వ కోరికలు త్యజించి ప్రపంచముపట్ల నిస్పృహ సముపార్జించుకొని అహంకార - మమకార దోషవర్జితుడై స్థితప్రజ్ఞుడు పరమశాంతిని సర్వదా ఆస్వాదిస్తున్నాడు’‘…. అని అభివర్ణించారు.

‘బుద్ధియోగం’ విషయమై మీరు విశదీకరించిన విశేషాలన్నీ అమోఘం! యుక్తి యుక్తం కూడా!

అయితే…., నాకు కొన్ని సందేహాలు ఇంకా తొలగటం లేదు!

’‘కర్మలు నిర్వర్తించటంకంటే బుద్ధి యోగం గొప్పది’’…. అనునది మీ ఉద్దేశ్యమా? అదే మీ ఉద్దేశ్యమయితే, హింసతో కూడిన ఈ యుద్ధం చేయమని నన్ను ఇంతలోనే ఎందుకు ప్రోత్సహిస్తున్నారు?

03–02

వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే ।
తదేకం వద నిశ్చిత్య యేన శ్రేయోఽహమాప్నుయామ్ ॥

వ్యామిశ్రేణ ఇవ వాక్యేన బుద్ధిం మోహయసి ఇవ మే ।
తత్ ఏకం వద నిశ్చిత్య యేన శ్రేయో అహమ్ ఆప్నుయామ్ ॥

మీరు చెప్పే వాక్యాలు కర్మయోగ - బుద్ధియోగ - జ్ఞానయోగముల విషయంలో మిశ్రమంగా - కలగలుపుగా ఉన్నాయని అనిపిస్తోంది. బుద్ధితో ఆత్మజ్ఞానం సంపాదించటమే జీవితాశయమని చెప్పి, ఇంతలోనే ‘‘కర్మ తప్పకుండా చేయి’’ అని ప్రోత్సహిస్తున్నారు.

‘‘కర్మచేయటం నీ పని, కర్మఫలితాలతో సంబంధం పెట్టుకోకు’’…. అని బోధిస్తున్నారు. ‘‘కర్మలు స్వల్ప విషయాలు’’… అని ఒకప్రక్క చెప్పుచూనే, ‘‘కర్మ బాగా చేయటమే యోగము’’ …. అని నిర్వచనం చేస్తున్నారే! (యోగః కర్మసు కౌశలమ్‌!)

మీరు చెప్పే - కొంత కొంత వ్యతిరిక్త సంబంధమైన వాక్యములచేత నా బుద్ధి మరికొంత మోహం (Confusion) సంతరించుకున్నదేగాని …. వర్తమానపు ‘యుద్ధం చేయటం’ అనే విషయంలో నేను ఒక నిర్ణయానికి రావటానికి నాకు దోహదం కావటం లేదు, స్వామీ!

సరే! ఇప్పుడు ఈ ‘యుద్ధం’ అనే కర్తవ్యం నిర్వర్తించమంటారా? లేక విరమించి, ఉద్విగ్నరహితమైన బుద్ధి కొరకై జ్ఞానమార్గం ఆశ్రయించమంటారా? బాగా నిశ్చయించి ఏదో ఒక్క మార్గం నాకు చెప్పండి. నాకు ఇప్పుడు ఏది శ్రేయమో అది చెప్పండి. అది నేను నిర్వర్తిస్తాను.

Krishna teaching Arjuna

మూల శ్లోకము


అధ్యయన వ్యాఖ్యానము


ఉపన్యాసము

శ్రీ భగవాన్ ఉవాచ :-

03–03

లోకేఽస్మిన్ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయానఘ ।
జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినామ్ ॥

లోకే అస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయా, అనఘ! ।
జ్ఞానయోగేన సాంఖ్యానాం, కర్మయోగేన యోగినామ్ ॥

శ్రీకృష్ణ భగవానుడు :-

పాపబుద్ధిరహితుడవగు ఓ అర్జునా! ఈ ప్రపంచంలో రెండు మార్గాలు (లేక) నిష్ఠలు నా చేత ఇతఃపూర్వమే చెప్పబడినాయి.

1.) కర్మలపట్ల విరక్త చిత్తులగు జ్ఞానానువర్తులకు : జ్ఞాన మార్గం (సాంఖ్యమార్గం. జ్ఞానయోగం)

2.) కర్మలపట్ల అభిలాషగల కర్మానువర్తులకు : కర్మమార్గం (కర్మ యోగం. నిష్కామకర్మ)

అయితే…. కర్మలతో అవసరములేని స్థితి ఎప్పుడు లభిస్తుంది?
ఎప్పుడు లభిస్తుందో చెపుతాను. విను.

03–04

న కర్మణామనారమ్భాన్నైష్కర్మ్యం పురుషోఽశ్నుతే ।
న చ సంన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్ఛతి ॥

న కర్మణామ్ అనారంభాత్ నైష్కర్మ్యం పురుషో అశ్నుతే ।
న చ సంన్యసనాత్ ఏవ సిద్ధిం సమధిగచ్ఛతి ॥

కర్మలు చేయకపోవటం అకర్మత్వం (కర్మరాహిత్యము) కాదు!

కర్మ నిర్వర్తించకుండానే కర్మలకు అతీతమైన స్థితి ఎవ్వరికీ లభించేది కాదు. కర్మలు వదిలివేసినంత మాత్రంచేత కర్మలకు అతీతమైన ’’సమాధాన స్థితి“ / ”సిద్ధి“ / ”కర్మరాహిత్య స్థితి" లభించదు సుమా!

03–05

న హి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్యకర్మకృత్ ।
కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః ॥

న హి కశ్చిత్ క్షణమ్ అపి జాతు తిష్ఠతి అకర్మకృత్ ।
కార్యతే హి అవశః కర్మ, సర్వః ప్రకృతిజైః గుణైః ॥

కర్మలు దేహమున్నంత వరకు అనివార్యం.

అయినా, ‘‘కర్మలేవీ నిర్వర్తించను’’ అనునది ఎట్లా కుదురుతుంది? ఏ ఒక్కడు కూడా ఏదో కర్మ నిర్వర్తించకుండా ఒక్క క్షణం కూడా ఏమాత్రం ఉండలేడే!

ఎందుకంటే, దేహము కలిగి ఉండటమంటే ప్రకృతితో (లేక) స్వభావముతో సంబంధం కలిగి ఉన్నట్లే కదా! ప్రకృతి (లేక) స్వభావ జనితమైన గుణములు ప్రతి జీవుడిని ఆశ్రయించియే ఉంటాయి. ఆ గుణములకు (లేక) స్వభావమునకు వశుడై ప్రతివాడు కర్మలు చేస్తూనే ఉంటాడే కాని, ‘‘నేను ఏ కర్మలు ఏమాత్రము నిర్వర్తించను’’ …..అని ఎవ్వరనగలరు? ఎవ్వరుండగలరు?

దేహం ఉన్నంతకాలం ఆహారం కావాలి! ఆహారం అరగాలంటే (Digestion) దేహం పనిచేయటానికి ఉపక్రమించియే ఉండాలి కదా!

పైగా, ప్రకృతి అత్యంత బలవత్తరమైనది. అది దేహములను కర్మలలో నియమిస్తోంది సుమా!

03–06

కర్మేన్ద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ।
ఇన్ద్రియార్థాన్విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే ॥

కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ।
ఇంద్రియార్థాన్ విమూఢాత్మా “మిథ్య ఆచారః” స ఉచ్యతే ॥

కాదు!.. ‘‘కర్మేంద్రియములను సంయమం చేసివేస్తాను. కట్టడి చేస్తాను. ఈ కళ్ళతో అందరూ చూచేవి నేను చూడను. అందరూ వినేవి నేను వినను. శబ్ద-స్పర్శ-రూప-రస-గంధాలన్నీ త్యజించి ఉంటాను…’’ అని ఒకానొకడు వాటిని నిరోధించాడనుకో, అప్పుడో? వాటినన్నిటినీ తనవిగా చేసుకొని వర్తించే ఆలోచనా రూపమైన మనస్సు సంగతేమిటి? అది ఆలోచిస్తూనే ఉంటుందే! ఆ మనస్సు ఆలోచించేదంతా ఇంద్రియ విషయ పరంపరలే కదా! ఇంద్రియములను మాత్రమే పూర్తిగా కట్టడి చేసి ఏం ప్రయోజనం?

మిథ్య ఆచారం
ఇంద్రియాలు ఉపయోగించక, మనస్సుతో మాత్రం మననం చేస్తూ ఉంటే…. అప్పుడది కర్మలను అధిగమించినట్లో, నిరోధించినట్లో అవదయ్యా….! అటువంటివాడు ఇంద్రియములను వదలి ఇంద్రియార్థములచే విమూఢుడు (Illusioned) అయినట్లే! ‘‘ఇంద్రియములను ఉపయోగించను’’ అనే అతని ప్రయత్నం మిథ్యా ప్రయత్నమే! అందుచేత, ‘‘కర్మలు చేయను, కర్మమార్గం వదులుతాను’’…. అనునదంతా మిథ్యాప్రలాపములు, మిథ్యాప్రయత్నములు మాత్రమే! అది మిథ్యాచారమే!

ఒకానొకడు,

కళ్ళతో చూడడు కాని, దృశ్యాలు ఊహలో ఉండియే ఉంటాయి.
చెవులతో వినడు కాని, ఎవరెవరి మాటలో (మంచివో…. చెడువో) గుర్తుకొస్తూనే ఉంటాయి.
నోరుతో ఎవరితోనూ మాట్లాడడు కాని, ‘‘వాళ్ళు అటువంటివారు, వీరు ఇటువంటివారు’’ అని తనలో తానే అనుకుంటూనే ఉంటాడు.
దేనినీ స్పృశించడు కాని, భార్య - భర్త - పిల్లల - తల్లి - తండ్రి - స్నేహితుల స్పర్శ గుర్తు చేసుకుంటూ ఉంటాడు.
దేనినీ వాసన చూడడు కాని, ఆఘ్రాణానుభవాలు గుర్తుకు వస్తూ ఉంటాయి.
దేనినీ రుచి చూడడు కాని, అనేక రుచులు గుర్తుకు తెచ్చుకొని నాలుక పరవశం - అభిలాష పొందుతూ ఉంటుంది.

అదంతా మిథ్యాచారమనియే అనిపించుకోగలదు సుమా!

03–07

యస్త్విన్ద్రియాణి మనసా నియమ్యారభతేఽర్జున ।
కర్మేన్ద్రియైః కర్మయోగమసక్తః స విశిష్యతే ॥

యః తు ఇంద్రియాణి మనసా నియమ్య ఆరభతే, అర్జున! ।
కర్మేంద్రియైః కర్మయోగమ్ అసక్తః స విశిష్యతే ॥

ఇక ‘సదాచారం’ ఏమిటంటావా?

నీ మనస్సు ఇంద్రియములకు వశమై వుండటం - ఇంద్రియాలు మనస్సును నడపటం అనేది అధిగమించాలి.

నీవు మనస్సుతో ఇంద్రియములను నియమించి, అవి ఇంద్రియ విషయములతో ప్రవర్తించేటట్లు చేయాలి. అనగా ఇంద్రియములు - ఇంద్రియ విషయములు నీ మనస్సుకు ఉపకరణములుగా ఉండాలి.

వాహనం మనం నడుపుతాం గాని, వాహనము మనలను నడిపించదు కదా! అట్లాగే మనస్సు ఇంద్రియ విషయములను ఉపయోగించాలి కాని, ఇంద్రియ విషయములగు దృశ్యము - శబ్దము - రూపము - రసము మొదలైనవి మనస్సును పాడుచేయటం, స్వాధీనం చేసుకోవటం అనుచితం కదా!

03–08

నియతం కురు కర్మ త్వం కర్మ జ్యాయో హ్యకర్మణః ।
శరీరయాత్రాఽపి చ తే న ప్రసిద్ధ్యేదకర్మణః ॥

నియతం కురు కర్మ త్వం, కర్మ జ్యాయో హి అకర్మణః ।
శరీరయాత్రా అపి చ తే న ప్రసిద్ధ్యేత్ అకర్మణః ॥

అందుచేత ఓ అర్జునా! ఏ ‘అధ్యాస’ లేక ‘ధారణ’ (Cogitation of our thoughts (or) Thought instrumentation) చేత ‘‘దృశ్యాసక్తి రహితమైన - దృశ్యాతీతమైన’’ మనస్సుతో ఇంద్రియములను నియమించగలుగుతావో, …అట్టి మార్గంలో మనస్సును అవధరించటమే ఉత్తమం.

మనస్సు అప్రమేయ స్థానంలో ప్రతిక్షేపించబడి, ఇంద్రియములు - ఇంద్రియవిషయములు ఉపకరణమాత్రంగా (Merely as instruments), అంతేకాకుండా ఈ దేహమే ఉపకరణ మాత్రంగా అనుభూతమవటమే ‘కర్మయోగం’ అని చెప్పబడుతోంది. మనస్సును - ఇంద్రియాలను నీవు ఉపయోగించాలేగాని, అవి నిన్ను ఉపయోగించుకోవటమేమిటి? విషయాలు నీవు ఆస్వాదించవచ్చునేమోగాని, వాటియందు నీవు బద్ధుడవు కావటమేమిటి?

ఓ కిరీటీ! నీకు నియమితమైన కర్మలు నీవు నిర్వర్తించటమే యుక్తియుక్తం. అదియే ఎవ్వరికైనా ఉచితం. ‘‘కర్మలు నిర్వర్తించను’’ అనే పట్టుదల కలిగియుండటంకంటే కర్మలు కర్మయోగముతో కూడిన మనుస్సుతో నిర్వర్తించటమే మంచిది. లేదా? జనులంతా కర్మలు మానివేస్తే ఈ శరీరయాత్రలు కొనసాగేది ఎట్లా? దేహములు పరిపోషించేది ఎట్లా? అకర్మవర్తులకు దేహయాత్రయే క్లిష్టమౌతుంది కదా!

03–09

యజ్ఞార్థాత్కర్మణోఽన్యత్ర లోకోఽయం కర్మబన్ధనః ।
తదర్థం కర్మ కౌన్తేయ ముక్తసంగః సమాచర ॥

యజ్ఞార్థాత్ కర్మణో, అన్యత్ర లోకో అయం కర్మబంధనః ।
తత్ అర్థం కర్మ, కౌంతేయ! ముక్తసంగః సమాచర ॥

కర్మలు ఏ ఉద్దేశ్యంతో చేయాలి?

అయితే ‘‘నాకు నియమించబడిన కర్మలు నేను ఏ ప్రయోజనం ఉద్దేశ్యించి నిర్వర్తించాలి’’ అనే విషయంలో మాత్రం ఒక నిర్దుష్ఠమైన - సుస్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి.

‘‘నాకు ఇష్టం కదా - నాకు ఇష్టమైనవారి కొరకు - నాకు ప్రియమైనవారి కొరకై, లేక ఇక తప్పదురా బాబూ - ఏదో బాధ్యత కాబట్టి - మరి నేను గుర్తించబడాలి - నాకు తృప్తిని ఇస్తుందిలే - నాకు అనుకూలం కాబట్టి - నాకు భవిష్యత్‌ సానుకూలం కనుక……’’
ఇటువంటి అవగాహన - ఆదర్శము - ఆవేశము కలిగి ఉంటే…. అది నీకొరకు చేసినట్లు అవుతుంది.

‘‘విధినిర్వహణను - పరమాత్మ సమర్పితము - సమాజశ్రేయస్సు - స్వధర్మము - నియమితముల దృష్టితో (పరమాత్మయొక్క ఉద్దేశ్యము నెరవేర్చటం దృష్టితో) ఒక ఉపాసనగా నిర్వర్తించటం’’ …. ఇది యజ్ఞభావ సమన్వితమైన ‘‘కర్మ నిర్వహణ’’.

యజ్ఞార్థాత్‌ కర్మణః - Let my work be aligned with the Will of the Worker of the Universe!

యజ్ఞము అనగా సమగ్రము - Corporate or Collective Objective. పదిమంది కలసి చేయవలసియున్న కార్యక్రమంలో ఇది నా పాత్ర అని భావించటం యజ్ఞము కొరకు పని చేయటం అవుతుంది.

ఈ విధంగా, ‘యజ్ఞము’ కొరకై కాకుండా మరింకే ఉద్దేశ్యంతోనైనా (లేక వ్యక్తిగతమైన ఆశయంతోనైనా) కర్మ నిర్వహిస్తే… అది ‘కర్మబంధనము’నకు దారి తీస్తుంది.

అందుచేత అర్జునా! నీవు లోక సానుకూల్యత కొరకై స్వధర్మానుసారం కర్మ (Duty) నిర్వర్తించు. అంతేకాదు. సంగము (Attachment)నకు చోటు ఇవ్వకుండా కర్మ నిర్వర్తించు.

అనగా, ’‘ఇది నాకు సంబంధించినది. నేను దీనికి సంబంధించిన వాడను’’ అను భావనను క్రమక్రమంగా తొలగించుకుంటూ ’విధి’గా నిర్వహించు. అప్పుడు అది ’యజ్ఞకర్మ’గా రూపు దిద్దుకుంటుంది. (It is duty in consideration to the opportunity of my life).

కర్మ చక్కగా, బాగుగా నిర్వర్తించు. యోగః కర్మసు కౌశలమ్‌!

03–10

సహయజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః ।
అనేన ప్రసవిష్యధ్వమేష వోఽస్త్విష్టకామధుక్ ॥

సహయజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురా ఉవాచ ప్రజాపతిః ।
అనేన ప్రసవిష్యధ్వమ్ ఏష వో అస్తు ఇష్టకామధుక్ ॥

ఈ ‘సృష్టి’ అనే మహాయజ్ఞం రూపములో ఉండి నిర్వర్తిస్తున్న సృష్టికర్త, ‘‘జీవులు - యజ్ఞకర్మలు - దైవీతత్వాలు’’ సృష్టించారు.

’‘ఓ జీవులారా! మీతోబాటే దేవతలను (దైవీతత్వాలు) కూడా ఈ సృష్టిలో సృష్టిస్తున్నాను. దేవతలు మీ ఇష్ట - కామ్యాలకు అనుకూలంగా ఈ సృష్టి సంపదను, జీవజీవన స్రవంతిని యజ్ఞ భావితులై తమ కార్యక్రమములుగా నడుపుతూ ఉంటారు. దేహములను నిర్మించి-పరిపోషిస్తూ వుంటారు. మీ జీవులంతా దేవతల కార్యక్రమమైన ‘సృష్టిరచన’ను జీవిత విధానంగా ప్రయోజనం పొందండి. దేవతలు తమ క్రియల శోభచే మిమ్ములను ఆనందింపజేస్తారు. ఆ దేవతలకు సేవ - యజ్ఞ యాగాలు - భక్తి - సమర్పణ - ప్రపత్తులచే పూజించి వారిని సంతోషింపజేయండి. మీరు మీ నియమిత కర్మలచే సమర్పిత బుద్ధితో దేవతల కార్యక్రమములకు సహకరించండి’’… అని ఆదేశించారు. [God command]

(ఉదాహరణకు : దేవతలు ప్రకృతిలో రుచికరమైన-రసమయమైన, పుష్టికరమైన పదార్థాలు తయారు అవటానికి దోహదం చేస్తున్నారు. జీవులు శ్రమిస్తూ అందులో పాల్గొంటున్నారు. తిరిగి ఈ జీవుడు తనకున్న దానిలో కొంత ఆకలిగొన్నవానికి, ఆశ్రయించువానికి ఇచ్చుట ద్వారా సమర్పించాలి).

03–11

దేవాన్భావయతానేన తే దేవా భావయన్తు వః ।
పరస్పరం భావయన్తః శ్రేయః పరమవాప్స్యథ ॥

దేవాన్ భావయత అనేన తే దేవా భావయన్తు వః ।
పరస్పరం భావయన్తః శ్రేయః పరమ్ అవాప్స్యథ ॥

ఈ విధంగా - ‘‘జీవులు - దేవతలు పరస్పర ప్రయోజనంగా ఈ సృష్టిని ఆస్వాదిస్తూ, అనుసరిస్తూ, ఆనందించటం’’ ……… అనునది సృష్టికర్తయొక్క ఉద్దేశ్యం.

03–12

ఇష్టాన్భోగాన్హి వో దేవా దాస్యన్తే యజ్ఞభావితాః ।
తైర్దత్తానప్రదాయైభ్యో యో భుఙ్క్తే స్తేన ఏవ సః ॥

ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యన్తే యజ్ఞభావితాః ।
తైః దత్తాన్ అప్రదాయ ఏభ్యో యో భుంక్తే స్తేన ఏవ సః ॥

యజ్ఞభావితులై దేవతలు జీవులకు ఇష్ట - భోగాలను ప్రసాదిస్తూ ఉంటారు. దేవతల నుండి తాను పొందవలసినదంతా పొందుతూ కూడా ఏ జీవుడైతే - ‘‘స్వధర్మ కర్మ నిర్వహణ’’ అనే యజ్ఞ కర్మ నిర్వర్తించటానికి ఔత్సాహితుడు కాడో…. అట్టివాడు ఇతరుల సొమ్ము దొంగిలించే దొంగతో సమానం. అనగా దేవతలకు, సృష్టికర్తకు ఋణగ్రస్తుడు అగుచున్నాడు.

03–13

యజ్ఞశిష్టాశినః సన్తో ముచ్యన్తే సర్వకిల్బిషైః ।
భుఞ్జతే తే త్వఘం పాపా యే పచన్త్యాత్మకారణాత్ ॥

యజ్ఞశిష్ట ఆశినః సంతో ముచ్యన్తే సర్వకిల్బిషైః ।
భుంజతే తే తు అఘం పాపా యే పచంతి ఆత్మకారణాత్ ॥

కర్మలలో దోషం ఉంటే ఉండవచ్చు గాక! యజ్ఞభావంతో కర్మ నిర్వర్తించి యజ్ఞప్రసాదితమైన ఫలములను ఆస్వాదించటంలో పాల్గొనేవానికి ఆ కర్మ యొక్క దోషం అంటదు. వాస్తవానికి ఆతడు కర్మల ఫలితంగా సర్వ పాపభావములనుండి విముక్తుడు అవుతాడు.

(For example, One who works for the success of the Team (or) the Organisation as a Collective task, but not for Personal Gains, gets relieved from the bondage of Karma.)

అట్లా కాకుండా, ఎవ్వడైతే తన స్వార్థంతో ‘‘నా కొరకు - నా అభిరుచికై - నేను సుఖంగా వుండాలి కదా - నాకు ప్రియం కనుక - నేను గొప్పగా ఉండాలి కాబట్టి - నన్ను మెచ్చుకోవాలిగా…’’ ఇటువంటి స్వకీయ పరిమిత-సంకుచిత-వ్యక్తిగత భావములు ప్రవృద్ధం చేసుకొంటాడో - అట్టివాడు అనుభవించేది, పొందేది పాపపు కూడే అవుతుంది. వాస్తవమైన సుఖ-శాంతులను అవి ప్రసాదించజాలవు.

03–14

అన్నాద్భవన్తి భూతాని పర్జన్యాదన్నసమ్భవః ।
యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మసముద్భవః ॥

అన్నాత్ భవన్తి భూతాని, పర్జన్యాత్ అన్నసంభవః ।
యజ్ఞాత్ భవతి పర్జన్యో, యజ్ఞః కర్మసముద్భవః ॥

ఈ జీవులంతా పాంచభౌతికమైన దేహాలు కలిగి ఉన్నారు కదా! ఈ దేహరచనకు మూలపదార్థం (Raw material) ఆహారమే.

ఆహారం సృష్టిలో ఎట్లా రూపుదిద్దుకుంటోంది? ఆకాశంనుండి వర్షాలు సంభవించటం చేత కదా!

వర్షమో? సూర్య తేజస్సు యొక్క విధి - విధానం చేత ప్రాప్తిస్తోంది.

అనగా, సృష్టిలో అంతర్లీన గానంగా ప్రసరిస్తున్న ‘యజ్ఞము’ (A Function for Collective Gain) చేత జరుపబడుతోంది. అనగా, ఆ యజ్ఞము విధి - విధానములతో కూడిన కార్యక్రమం చేతనే జరుగుతోంది.

జరిగే కర్మలన్నీ జరిగితేనే ‘‘యజ్ఞకర్మ - సృష్టి - వర్షం - ఆహారం - జీవుల జీవిత విధానం’’…. ఇవన్నీ ఒనగూడుచున్నాయి.

అనేక కర్మలు - కార్యక్రమములు ఇవన్నీ…. పరబ్రహ్మమునుండే బయల్వెడలుచున్నాయి.

కనుక ‘‘కర్మ (Work)’’ అనునది సృష్టి చక్ర రచయిత అగు బ్రహ్మమునుండే ఉద్భవిస్తోంది… అని గమనించబడును గాక!

03–15

కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షరసముద్భవమ్ ।
తస్మాత్సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితమ్ ॥

కర్మ బ్రహ్మ ఉద్భవం విద్ధి, బ్రహ్మ అక్షర సముద్భవమ్ ।
తస్మాత్ సర్వగతం బ్రహ్మ, నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితమ్ ॥

బ్రహ్మము అక్షరస్వరూపం - అక్షయం కదా! అందుచేత నీవు వెతికే ‘‘పరబ్రహ్మము’’ లేక ‘‘పరమాత్మ’’ నీవు నిర్వర్తించవలసిన కర్మలలోనే దాగి ఉన్నది. జగదీశ్వరుడు జగత్‌రూపంగా నీ కర్మలు ఆస్వాదిస్తున్నారు.

కనుక, యజ్ఞభావంతో కర్మలు నిర్వర్తించు (So, please function with team or corporate objectives but not with the objective of personal gains).

03–16

ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ యః ।
అఘాయురిన్ద్రియారామో మోఘం పార్థ స జీవతి ॥

ఏవం ప్రవర్తితం చక్రం న అనువర్తయతి ఇహ యః ।
అఘాయుః, ఇంద్రియ ఆరామో, మోఘం పార్థ! స జీవతి ॥

కర్మ-చక్రం

జీవులు యజ్ఞభావంతో కర్మలు నిర్వర్తించి దేవతలకు సమర్పించాలి. దేవతలు కర్మోపాసనకు సంతోషించి జీవులకు కావలసిన ఋతుపవనాలు - రుచి మరియు పుష్టి ఇచ్చే ఆహార పదార్థాలు - సంపద - సుఖ - సంతోషాలు ప్రసాదించాలి. ఇది ఒక కర్మచక్రం. అట్టి కర్మ మహాచక్రం ఈ బ్రహ్మాండాలను - జీవులను - వారి జీవితములను నడుపుతూ వస్తున్నది.

1. జీవుడు తనకు లభించిన ఇంద్రియముల ద్వారా - ఇంద్రియ ప్రసాదకులు, ఇంద్రియ పరిరక్షకులు - అగు దేవతల ఉపాసన ఏమరుకపోవడం.
2. దేవతలు జీవులను సస్య సృష్టి-వృద్ధి ఇత్యాదుల ద్వారా పరిపోషించటం.
3. ఆ పరిపోషణ నుండి ప్రయోజనం పొందిన జీవులు దేవతలకు తమ ‘యజ్ఞకర్మ సమర్పణ’ ద్వారా ధర్మ రక్షణకు, ప్రకృతి వనరుల రక్షణకు సహకరించటం

ఇదంతా ఒక కర్మ మహాచక్రం.

(ఉదాహరణకు…
- కొంతమంది యొక్క సమాలోచన - పరిశ్రమలచే ఒక సంస్థ ఏర్పడుతోంది.
- ఒకడు ఆ సంస్థలో ఉద్యోగానికి చేరుతాడు.
- చేరి ఆ సంస్థ అందించే జీత భత్యములు పొందుతాడు.
- పొంది తానుకూడా సంస్థయొక్క ఆశయముల కొరకై, కార్యక్రమముల కొరకై శ్రమను అందిస్తాడు.
- ఆ సంస్థ అట్టి ఉద్యోగుల పరిశ్రమ యొక్క ప్రయోజనంగా ప్రవృద్ధమౌతూ ఉంటుంది.
- ఆ ప్రవృద్ధి నుండి తిరిగి ఆ ఉద్యోగి సత్ప్రయోజనాలు పొందుతూ ఉంటాడు.
- అనేకులు ఉద్యోగావకాశములు పొందుతూ ఉంటారు.
- వారందరి సమిష్టి కృషిచే సంస్థ మరింత గొప్పదౌతుంది.

ఇవన్నీ దృష్టిలో ఉండటమే యజ్ఞభావన. నేను ఇప్పుడు వారికన్నా-వీరికన్నా పొందుచున్నదేమున్నది? ….. అనునది అయజ్ఞ (లేక) సంకుచిత భావన!)

ఈ కర్మ - కర్మప్రయోజన చక్రంతో ఎవ్వరైతే తమవంతు కర్మను యజ్ఞభావంతో నిర్వర్తించరో… వారు పాపం చేస్తున్నవారౌతారు. ఇంద్రియలోలులు - ఇంద్రియబద్ధులు అవుతారు. వారి జీవితం మోఘ- మోహభూయిష్టం, నిష్ప్రయోజనం అయిపోతుంది. వారు ఋణగ్రస్థులౌతారని మరొక్కసారి గుర్తు చేస్తున్నాను.

03–17

యస్త్వాత్మరతిరేవ స్యాదాత్మతృప్తశ్చ మానవః ।
ఆత్మన్యేవ చ సన్తుష్టస్తస్య కార్యం న విద్యతే ॥

యః తు ఆత్మరతిః ఏవ స్యాత్ ఆత్మతృప్తః చ మానవః ।
ఆత్మని ఏవ చ సంతుష్టః, తస్య కార్యం న విద్యతే ॥

ఇక ‘ఆత్మజ్ఞానం’ దృష్ట్యా ‘యజ్ఞకర్మ’ యొక్క విశేషమేమిటో పరిశీలిద్దాం.

ఆత్మ సర్వదా పొందబడియున్నది కదా! అందుకు క్రొత్తగా ప్రయత్నించి పొందవలసినదేమున్నది? జీవులంతా ‘ఏదో పొందాలి’ అని భావిస్తూ కర్మలు చేస్తూ ఉండగా, …. ఆత్మజ్ఞాని ఎట్లా భావిస్తున్నాడో… విను.

ఆత్మజ్ఞాని ఆత్మచేత ఆత్మయందే తృప్తిపొందినవాడై ఉంటున్నాడు.

ఆతడు ఆత్మయందే ఎల్లప్పుడు రమిస్తూ, ఆత్మచేతనే తృప్తినిపొందుచూ, తన యొక్క సహజత్వమగు ‘‘ఆత్మస్వరూపము’’ అయినట్టి పరమాత్మను సందర్శిస్తూ సర్వదా ‘‘సంతుష్టి’’ పొందినవాడై ఉంటున్నాడు. ఆత్మసందర్శనంచేత ఆనందించేవాడికి ఇక క్రొత్తగా కర్మలద్వారా సృష్టి నుండి పొందవలసినది - కావలసినది ఏమీ ఉండదు. అందుచేత ఆతనికి ‘ఇది కర్తవ్యము’ అనేది ఉండదు.

03–18

నైవ తస్య కృతేనార్థో నాకృతేనేహ కశ్చన ।
న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః ॥

న ఏవ తస్య కృతేన అర్థో న అకృతేన ఇహ కశ్చన ।
న చ అస్య సర్వభూతేషు కశ్చిత్ అర్థ వ్యపాశ్రయః ॥

అట్టి ఆత్మ సాక్షాత్కార దృష్టి సముపార్జించుకొన్న తరువాత - కర్మలు చేయటం చేత లభించేదికాని, చేయకపోయినందు చేత కోల్పోయేదికాని ఉండదు. ఆతనికి కర్మలు నిర్వర్తించేటప్పుడు ‘‘నాకు ఇది కావాలి - అది తొలగాలి’’…. అనే ఆసక్తి ఉండదు. ఇక ఆత్మయోగిగా రూపుదిద్దుకొను వరకు ఆత్మ సందర్శనముచే పరితృప్తి పొందే స్థితి వరకు ‘కర్మలు’ అవసరమే! ఆవస్యకమే!

03–19

తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర ।
అసక్తో హ్యాచరన్కర్మ పరమాప్నోతి పూరుషః ॥

తస్మాత్ అసక్తః సతతం కార్యం కర్మ సమాచర ।
అసక్తో హి ఆచరన్ కర్మ పరమ్ ఆప్నోతి పూరుషః ॥

అంతేకాదు. నియమిత కర్మలు సమర్పణ బుద్ధితో నిర్వర్తించటం ఆత్మయానానికి మార్గమై వున్నది. అనాసక్తుడవై, సృష్టి యజ్ఞ పురుషునికి సమర్పిస్తూ నిర్వర్తించే కుశల కర్మలు పరమపురుషత్వం సాధించగలదు.

కనుక, ఓ అర్జునా! నీకు నియమించిన కర్మలు - ధర్మములు (works & functions) చక్కగా నిర్వర్తించు. కౌశలముతో నిర్వర్తించు. ఈ సృష్టిని నడిపిస్తున్న యజ్ఞపురుషునికి సమర్పిస్తూ - యజ్ఞభావనతో నిర్వర్తించు. అయితే ‘‘ఆత్మానంద సందర్శి’’ వలె అనాసక్తితో నిర్వర్తించు. ‘‘ఇది నాకు చెందినది. నేను దీనికి చెందినవాడను. ఇది కావాలి. అది పోవాలి. ఇది అట్లా ఉండాలి. అది ఇట్లా ఉండకూడదు’’… అనే ఆసక్తి (Attachment) లేనివాడవై నిర్వర్తించు.

ఎందుకంటావా?
ఆసక్తి లేకుండా (Without attachment and without maintaining relatedness) కర్మలు నిర్వర్తించేవారికి స్వభావసిద్ధంగా ‘పరమపురుషత్వం’ అనే ప్రయోజనం లభిస్తోంది.

కర్మయోగి

కొందరు, ‘‘ఈ కర్మలు నిర్వర్తించవలసిరావటంచేత ‘ఆత్మజ్ఞానం - ఆత్మానందం’ సంపాదించుకునే ప్రయత్నాలు చేయలేకపోతున్నాం. ఇవన్నీ ఒక కొలిక్కి వచ్చిన తరువాత ఇక జ్ఞానమార్గం ఆశ్రయిస్తాం’’…. అని అనుకుంటూ రోజులు గడుపుచున్నారు. అది భ్రమ మాత్రమే.

1.) నిర్వర్తించవలసివస్తున్న కర్మలు ‘జ్ఞాన ప్రతిబంధకాలు’ కాకుండా చూచుకునేది ఎట్లా?
2.) అనివార్యంగా నిర్వహించవలసి వస్తున్న ఈ కర్మలు (Functions) జ్ఞానప్రదంగా - మోక్షదాయకంగా తీర్చిదిద్దుకునేది ఎట్లా?’’

ఈ రెండు తెలిసి కర్మలు నిర్వర్తించేవాడే కర్మయోగి. అదియే కర్మయోగం.

03–20

కర్మణైవ హి సంసిద్ధిమాస్థితా జనకాదయః ।
లోకసంగ్రహమేవాపి సంపశ్యన్కర్తుమర్హసి ॥

కర్మణ ఏవ హి సంసిద్ధిమ్ ఆస్థితా జనక ఆదయః ।
లోకసంగ్రహమ్ ఏవ అపి సంపశ్యన్ కర్తుమ్ అర్హసి ॥

మహనీయులెందరో అనివార్యంగా తాము చేయవలసివస్తున్న కర్మలను తమ ’‘మోక్షానంద సంసిద్ధి’’కి సోపానములుగా తీర్చి దిద్దుకుంటున్నారు. జనకుడు మొదలైన వారెందరో కర్మలే (Their duties / functions itself) తమను ఉద్ధరించే సాధనములుగా తీర్చిదిద్దుకున్నారు. తీర్చిదిద్దుకుంటున్నారు. కర్మలు ‘సంసిద్ధి’ (Fulfilment) ప్రసాదించే మార్గములుగా చేసుకొని, జీవిత మహదాశయాన్ని సిద్ధింప జేసుకుంటున్నారు. వారు స్వకర్మ నిర్వహణద్వారా మోక్షస్థితిని సముపార్జించుకుంటున్నారు. కర్మలు నిర్వహించటం కొనసాగిస్తూ కూడా కర్మరహితులై, కర్మాతీతులై ఉంటున్నారు. వారికి స్వకర్మలు సాధనరూపములుగా అగుచున్నాయి.

ఆత్మజ్ఞానులు, ఆత్మానుభవులు అయినవారు కర్మలవలన క్రొత్తగా పొందవలసినది లేకపోయినప్పటికీ కర్మలు లోక క్షేమం కోరి లోకానుకూల్యత కొరకై చేస్తున్నారు. అట్లాగే నీవు కూడా సహజీవుల సానుకూల్యత కొరకై - లోక క్షేమం ఏమిటో చక్కగా పరిశీలించి కర్మలు నిర్వర్తించటమే సముచితం.

ఎందుకంటావా?

03–21

యద్యదాచరతి శ్రేష్ఠస్తత్తదేవేతరో జనః ।
స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే ॥

యత్ యత్ ఆచరతి శ్రేష్ఠః తత్ తత్ ఏవ ఇతరో జనః ।
స యత్ ప్రమాణం కురుతే లోకః తత్ అనువర్తతే ॥

ఒక శ్రేష్ఠుడైనవాడు [ముఖ్యుడైనవాడు, A Leader or a Senior or a Head of the Family] ఏ ఏ ఉద్దేశ్యములతో, అవగాహనలతో కర్మలు ఆచరిస్తూ ఉంటాడో - తదితరులలో అనేకులు అదే మార్గంగా ఎన్నుకుంటూ ఉంటారు. ఆతనినే ప్రమాణంగా తీసుకొని తదితరులు ఆచరణను కొనసాగిస్తూ ఉంటారు.

ఉదాహరణకు…,

ఒకడు తల్లి - తండ్రులు పెద్దలతో తిరస్కారపూర్వకంగా, అవమానిస్తున్నట్లు మాట్లాడితే పిల్లలు కూడా ‘‘ఓహో! పెద్దలతో ఇట్లా పెంకిగా మాట్లాడవచ్చును కదా!’’…. అని నేర్చుకుంటూ ఉంటారు. అందుచేత తల్లితండ్రులు తమ ప్రవర్తన విషయంలో (తమకు లౌకికంగా సరియే అని అనిపించినా కూడా) జాగరూకులై ఉండాలి. జాగరూకతతో స్వీయ ప్రవర్తనను తీర్చిదిద్దుకొంటూ ఉండాల్సిందే!

కనుక, శ్రేష్ఠుడైనవాడు కర్మప్రయోజనములను అధిగమించిన ఆత్మజ్ఞాన దృష్టిని అభ్యసించవచ్చుగాక! ‘‘కర్మలకు - కర్మ ప్రయోజనములకు నాకు సంబంధం లేదు. వాటికి ఆవల గల ఆత్మను సందర్శిస్తూ ఉంటాను కదా!’’ … అని అనుకోవచ్చు గాక! … అయినా ఆతడు కర్మలు త్యజించకపోవటమే సముచితం. ‘‘కర్మ - కర్మఫల ధ్యాస అంతరంగంలో కలిగి ఉన్నవారు, కర్మలచే ఉద్ధరించబడవలసినవారు కర్మ భ్రష్టులు కాకూడదు కదా!’’…. అని అనుకొని, లోకక్షేమం ఉద్దేశ్యించి ఆత్మజ్ఞాని కూడా కర్మలు నిర్వర్తిస్తూనే ఉంటాడు.

ఉదాహరణకు …., నా గురించే చెపుతాను. విను.

03–22

న మే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కిఞ్చన ।
నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి ॥

న మే పార్థ! అస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన ।
న అనవాప్తమ్ అవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి ॥

లోక విధానం గౌరవించి కర్మలు నిర్వర్తించడం

ఈ మూడు లోకములలో ‘‘నేను ఇది చేయాలి - తద్వారా అది పొందాలి’’…. అనునదేమీ నాకు లేదు. నేను పొందవలసినది - నాకు తొలగవలసినది అంటూ నా ఉద్దేశ్యంలో నాకు ఏదీ కించిత్‌ కూడా ఎక్కడా లేదు. అయినప్పటికీ ఈ శ్రీకృష్ణ ఉపాధి యొక్క ‘‘లోక ప్రయోజనం - ఉపాసనా ప్రయోజనం’’ దృష్టియందు ఉంచుకొని కర్మలు నిర్వర్తిస్తూనే ఉన్నాను సుమా! ఇప్పుడు ఈ ‘పార్థ రథసారథ్యం’ కూడా అట్టిదే కదా!

03–23

యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతన్ద్రితః ।
మమ వర్త్మానువర్తన్తే మనుష్యాః పార్థ సర్వశః ॥

యది హి అహం న వర్త, ఇయం జాతు కర్మణి అతంద్రితః ।
మమ వర్త్మ అనువర్తన్తే మనుష్యాః, పార్థ! సర్వశః ॥

ఒకవేళ ‘‘సర్వాంతర్యామిత్వం ఆస్వాదించే నేను ఒకానొక విధి ఎందుకు నిర్వర్తించాలి?’’ …. అని అనుకున్నానే అనుకో! అప్పుడు? అప్పుడు నన్ను శ్రేష్ఠుడుగా - అవతారమూర్తిగా భావించేవారందరూ, ‘‘మేము కర్మలు మానివేస్తాం,…. శ్రీకృష్ణమూర్తివలె’’… అనే నిర్ణయానికి రావటం జరుగవచ్చు. అప్పుడు కర్మలే ఆధారముగా గల ఈ ప్రపంచంలోని కర్మచక్రాలకి అడ్డులు (Hurdles) తగులుతాయి. తల్లితండ్రులు ‘‘పిల్లలను వదిలేస్తాం. మేముకూడా కృష్ణుని ప్రమాణంగా తీసుకొని కర్మలు మానివేస్తాం’’…. అని అంటే? లోకమంతా కర్మలు మానివేసేవారి వలన అల్లకల్లోలం అవుతుంది కదా! తదితర అనేకమంది జనులకు క్లేశములు వస్తాయి.

03–24

ఉత్సీదేయురిమే లోకా న కుర్యాం కర్మ చేదహమ్ ।
సఙ్కరస్య చ కర్తా స్యాముపహన్యామిమాః ప్రజాః ॥

ఉత్సీదేయుః ఇమే లోకా న కుర్యాం కర్మ చేత్ అహమ్ ।
సంకరస్య చ కర్తా స్యామ్ ఉపహన్యామ్ ఇమాః ప్రజాః ॥

అట్టి కర్మసంకరమునకు నేనే బాధ్యుణ్ణి అవుతాను. అందుచేత నేను నియమిత కర్మలను నిర్వర్తిస్తూనే ఉన్నాను.

03–25

సక్తాః కర్మణ్యవిద్వాంసో యథా కుర్వన్తి భారత ।
కుర్యాద్విద్వాంస్తథాసక్తః చికీర్షుర్లోకసంగ్రహమ్ ॥

సక్తాః కర్మణి అవిద్వాంసో యథా కుర్వన్తి, భారత! ।
కుర్యాత్ విద్వాన్ తథా అసక్తః చికీర్షుః లోకసంగ్రహమ్ ॥

అయితే…,
అందరూ కర్మలు చేస్తున్నారు. వారిని రెండు విభాగాలుగా విభజించవచ్చు.
1.) ఆసక్తిపరులు (Those who have attachment).
2.) అనాసక్తి పరులు (Those who have no attachment).

ఆసక్తిపరులు ఎంతగా సక్తతతో (with attachment) చేస్తున్నారో, కర్మతత్త్వం గ్రహించిన విద్వాంసులు అదే శ్రద్ధతో - అంతగానూ - ఆసక్తిరహితంగా నిర్వర్తిస్తూ ఉంటున్నారు.

03–26

న బుద్ధిభేదం జనయేదజ్ఞానాం కర్మసఙ్గినామ్ ।
జోషయేత్సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్ ॥

న బుద్ధిభేదం జనయేత్ అజ్ఞానాం కర్మసంగినామ్ ।
జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్ ॥

అందుచేత ‘‘కర్మలయొక్క పరిమితి’’ తెలిసియున్న విద్వాంసులు - కర్మ ఫలముల పట్ల సక్తతతో (with attachment) మాత్రమే కర్మ చేయగలవారిని ఆ కర్మలనుండి నిరుత్సాహపరచరు.

ఎందుకంటే, కర్మలు నిర్వర్తించబడితేగాని లోకవ్యవహారం నడువదు. అందరూ కర్మలు మానివేస్తే లోకమే నశించగలదు.

జ్ఞాని కర్మనిష్ఠున్ని కర్మలకు ఉత్సాహపరచాలేగాని కర్మలను నిరుత్సాహపరచి ఉపశమింపజేయటం లోకశ్రేయం కాదు. జ్ఞాని తాను శాస్త్ర విహిత, లోక విహిత కర్మలు నిర్వహ్తిస్తూ, ఇతరులను ప్రోత్సహిస్తూ ‘‘కర్మయోగం’’ (కర్మలను ఆత్మజ్ఞానము వైపు నడిపే ఉపకరణములుగా మలచుకోవటం) ఎట్లాగో లోకానికి నేర్పుచున్నారు.

03–27

ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః ।
అహఙ్కారవిమూఢాత్మా కర్తాహమితి మన్యతే ॥

ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః ।
అహంకార విమూఢాత్మా కర్తాహమ్ ఇతి మన్యతే ॥

మరొక విషయం.

ప్రకృతియొక్క ప్రేరణచే కర్మలు

అసలు కర్మలు ప్రేరేపించేది ఎవరు? ప్రకృతియే సుమా!

ప్రకృతికి చెందిన సత్వ-రజో-తమో గుణములు, ఆయా సందర్భములు జీవులను కర్మలకు ఉపక్రమింపజేస్తున్నాయి. కనుక, ప్రేరేపణ ప్రకృతిదేగాని జీవునిది కాదు. అహంకారముచే విమూఢుడైన జీవుడు ‘‘ఇది నేనే చేస్తున్నాను సుమా! కర్తాఽహమ్‌! అది నీవు చేస్తున్నావు - ఆదంతా వారు చేస్తున్నారు….’’ అని ప్రకటించుకుంటున్నాడు.

03–28

తత్త్వవిత్తు మహాబాహో గుణకర్మవిభాగయోః ।
గుణా గుణేషు వర్తన్త ఇతి మత్వా న సజ్జతే ॥

తత్త్వవిత్ తు, మహాబాహో! గుణకర్మవిభాగయోః ।
గుణా గుణేషు వర్తంత, ఇతి మత్వా న సజ్జతే ॥

అయితే గుణ-కర్మ విభాగం అధ్యయనం చేసి గమనించిన తత్త్వవేత్త - ‘‘గుణములే గుణములచే ప్రేరేపించబడి, తద్వారా గుణములు కర్మరూపంగా ప్రదర్శనమగుచున్నాయి’’…. అని తెలుసుకొని, నిర్వర్తిస్తున్నాడు. వాటికి ఆవల ఉండి.., వాటిలో తన మనస్సు - బుద్ధి కలిసిపోకుండా, తన్మయం కాకుండా చూచుకుంటున్నాడు.

‘‘పిల్లలపై నాకు గల మమకారం నాది కాదు. జంతు - పక్షి - మానవాది సకల జీవులలో తమతమ సంతానంపై ప్రేమ ప్రకృతి కల్పించి తద్వారా జీవజాతుల పరిపోషణ నిర్వర్తిస్తోంది. కనుక, నాయొక్క - తదితరులయొక్క ప్రేమ - కోపం - ఆవేశం - ఆశ - నిరాశ - ఉత్సాహం - ప్రేరణ - నిరుత్సాహం - ఉపశమనం - అన్నీ కూడా ప్రకృతివే! స్వార్థం-త్యాగం మొదలైనవన్నీ కూడా ప్రకృతివే. నేను వాటితో తాదాత్మ్యం చెంది లోకదర్శనం చేయటం అహంకారమే!

కనుక, నిరహంకారంగా వీటికి అప్రమేయమైయున్న ఆత్మ నాలోను - తదితరులలోను దర్శించెదనుగాక!’’ అని తత్త్వవేత్త ఒకానొక సమున్నతమైన అవగాహన కొనసాగిస్తూ ఉంటాడు.

03–29

ప్రకృతేర్గుణసమ్మూఢాః సజ్జన్తే గుణకర్మసు ।
తానకృత్స్నవిదో మన్దాన్కృత్స్నవిన్న విచాలయేత్ ॥

ప్రకృతేః గుణసమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు ।
తాన్ అకృత్స్నవిదో మందాన్ కృత్స్నవిత్ న విచాలయేత్ ॥

ఒక మేకకు మేకపిల్లపై మమకారం ఎవరు పెట్టారు? ఒక పక్షికి గ్రుడ్డుపై, పక్షి పిల్లపై ప్రేమ ఎవరు నేర్పారు? ప్రకృతియే కదా!

ఇదంతా గమనించి విజ్ఞుడు ఈ ప్రపంచంలోని సంబంధ - అనుబంధ - బాంధవ్య - ఇష్ట - అయిష్టాలతో తన బుద్ధిని తాదాప్యం చెందనీయడు.

ప్రకృతికి సంబంధించిన గుణములతో తదాప్యం చెంది ప్రవర్తించే తదితర జీవులను చూచి కొంచం కూడా ఖేదం పొందడు.

ప్రకృతియొక్క పాత్రని గమనించకుండానే ‘‘నేనే ఇవన్నీ చేస్తున్నాను’’…. అని అనుకుంటూ కర్మలు నిర్వర్తించేవారిని ఖండించడు. కర్మలు జరగవలసినదే కదా! జరుగుతూనే ఉంటాయి కదా!

03–30

మయి సర్వాణి కర్మాణి సంన్యస్యాధ్యాత్మచేతసా ।
నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః ॥

మయి సర్వాణి కర్మాణి సంన్యస్య అధ్యాత్మచేతసా ।
నిరాశీః నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః ॥

అయితే తత్త్వవేత్త కర్మలు చేస్తూ ‘‘ఇవన్నీ పరమాత్మని ఉద్దేశ్యించి - పరమాత్మకి సమర్పిస్తున్నాను.’’…. అనే అవగాహన బలవత్తరం చేసుకుంటూ ఉంటాడు.

అందుచేత ఓ అర్జునా!

→ సర్వకర్మలు కూడా నాకు సమర్పించు.

→ కర్మలు చేస్తూనే అవన్నీ ఉపాసనా పూర్వకంగా పూజాద్రవ్యాలుగా భావించి నాకు ఇచ్చివేయి. కర్మసన్యాసం వహించు.

→ నాకొరకు మాత్రమే ఉద్దేశ్యించి కర్మలన్నీ చేయి.

→ అంతరంగంలోగల ఆశలన్నీ వెడలగొట్టివేసి ‘నిరాశి’వి కమ్ము.

→ ’‘నాది - నాకు చెందినది - నేను పొందవలసినది - నా వారు.’‘…ఇటువంటి సర్వ మమకారములను అధిగమించినవాడవై కర్మలు నిర్వహించు.

→ అన్ని ఆదుర్దాలు త్యజించి ’‘నా ధర్మము ఇది కదా!’’ …. అను భావనతో ఈ యుద్ధం చేయి.

03–31

యే మే మతమిదం నిత్యమనుతిష్ఠన్తి మానవాః ।
శ్రద్ధావన్తోఽనసూయన్తో ముచ్యన్తే తేఽపి కర్మభిః ॥

యే మే మతమ్ ఇదం నిత్యమ్ అనుతిష్ఠంతి మానవాః ।
శ్రద్ధావన్తో అనసూయన్తో ముచ్యన్తే తే అపి కర్మభిః ॥

‘‘స్వధర్మము - కర్మ నిర్వహణ’’ విషయంలో నేను చెప్పిన ‘‘కర్మలు నిర్వర్తించటం - సమర్పణభావంతో నిర్వర్తించటం - కర్మలు సన్యసించి ఉండటం’’ …. అనే కర్మయోగము యొక్క అంగములను ఎవరు అనువర్తిస్తారో, కర్మల పట్ల శ్రద్ధ వీడకుండా ఉంటారో, హృదయంలో ‘అసూయ’ ప్రవేశించనీయకుండా ఉంటారో… అట్టివారు తాము నిర్వర్తిస్తున్న కర్మలచేతనే సర్వ కర్మ బంధములనుండి విముక్తి పొందగలరు.

ఉపాసనా పూర్వకంగా కర్మలు నిర్వర్తించే వారి విషయంలో, వారి కర్మలే వారికి ముక్తిని ప్రసాదించగలవు. (“My work is my worship” - This kind of sense relieves one from Bondages)

03–32

యే త్వేతదభ్యసూయన్తో నానుతిష్ఠన్తి మే మతమ్ ।
సర్వజ్ఞానవిమూఢాంస్తాన్విద్ధి నష్టానచేతసః ॥

యే తు ఏతత్ అభ్యసూయన్తో న అనుతిష్ఠన్తి మే మతమ్ ।
సర్వజ్ఞానవిమూఢాన్ తాన్ విద్ధి నష్టాన్ అచేతసః ॥

అట్లా కాకుండా….,

ఎవ్వరైతే, ‘‘అయ్యో! ఈ కర్మలు నేనే చేయవలసివస్తోందే? అందరూ హాయిగా ఉన్నారే!’’…. అని అసూయ - ద్వేష - వేదనలకు చోటు ఇస్తూ, తమకు విధించబడిన కర్మల పట్ల అశ్రద్ధవహిస్తారో, దైవదూషణకు ఆత్మదూషణకు ఉపక్రమిస్తారో… వారు సర్వజ్ఞానవిమూఢులై అల్పత్వముతో కూడిన బుద్ధిని పొందగలరని గుర్తు చేస్తున్నాను.

03–33

సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేర్జ్ఞానవానపి ।
ప్రకృతిం యాన్తి భూతాని నిగ్రహః కిం కరిష్యతి ॥

సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేః జ్ఞానవాన్ అపి ।
ప్రకృతిం యాన్తి భూతాని, నిగ్రహః కిం కరిష్యతి? ॥

అయినా, ఇక్కడ ఒక విషయం గమనించు!

సకల జీవులు ప్రకృతి నుండి స్వభావమును పొందుచున్నారు. అట్టి స్వభావమునకు లోబడి ఇష్టం ఉన్నా - లేకున్నా కర్మలు చేస్తూనే ఉన్నారు. అనివార్యంగా నిర్వర్తిస్తూనే ఉంటారు కూడా!

ప్రకృతియే జీవుల కర్మ - ప్రవృత్తికి కారణముగా అగుచున్నది. ఈ దేహము - ఇంద్రియములు మొదలైనవి ప్రకృతి చేతనే నిర్మింపబడి, వ్యవహరిస్తూ ఉండగా జీవునియొక్క ‘‘నేను కర్మలు చేయను’’ అనే పట్టుదల ఏమి చేయగలదు? (Nature preserves a driving force and instinct to work).

కనుక, ప్రతి జీవుడు తన ప్రకృతికి (లేక తన స్వభావమునకు) బద్ధుడై అనివార్యంగా కర్మలు చేయక తప్పేదేమీ కాదు.

03–34

ఇన్ద్రియస్యేన్ద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ ।
తయోర్న వశమాగచ్ఛేత్తౌ హ్యస్య పరిపన్థినౌ ॥

ఇంద్రియస్య ఇంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ ।
తయోః న వశమ్ ఆగచ్ఛేత్ తౌ హి అస్య పరిపన్థినౌ ॥

అయితే జీవునికి కర్మలు నిర్వర్తించవలసి రావటం చేత బంధం ఏర్పడటం లేదు. మరి? రాగ - ద్వేషములే మనస్సును కలచివేయటానికి అసలు కారణం.

రాగ-ద్వేషములకు వశుడవు కావద్దు

- కొందరంటే ఇష్టం (అనురాగం).
- మరికొందరంటే అయిష్టం (ద్వేషం).
- కొన్ని విషయాలు ఇష్టంగా - ప్రియంగా ఉంటాయి.
- మరికొన్ని విషయాలు అప్రియంగా ఉంటాయి.
- ఇష్టమైతే ఒక మాట. కాకుంటే వేరే మాట.

ఈ విధంగా జీవుడు ఇంద్రియముల పట్ల - ఇంద్రియార్థముల పట్ల (అనగా శబ్ద - స్పర్శ - రూప - రస - గంధముల పట్ల) ఇష్ట - అయిష్టములు, రాగ - ద్వేషములు, తనకు తెలియకుండా - తానే అభ్యాసవశం చేత పెంపొందించుకొని ఉంటున్నాడు. అట్టి ఇష్ట - అయిష్టములకు వశుడై తన స్వరూప - స్వభావములను ఏమరచి ఉంటున్నాడు. అదియే జీవుని ఆనందమును ప్రక్కత్రోవ పట్టిస్తోంది.

రాగ - ద్వేషములు ఈ జీవుని యందు అభ్యాసవశం చేత రూపుదిద్దుకొని ప్రవర్ధమానమగుచున్నాయి. అవి జీవునికి సర్వ బంధములు తెచ్చిపెడుచున్నాయి. అందుచేత ఆ రాగద్వేషములే ఈ జీవునికి శత్రువులు. ఈ జీవుడు రాగద్వేషములచే దృశ్యపరంపరలకు బద్ధుడు కాకుండా తనను తాను కాపాడుకోవాలి సుమా! తాను వాటికి వశుడు కాకూడదు.

03–35

శ్రేయాన్స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్ ।
స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః ॥

శ్రేయాన్ స్వధర్మో విగుణః, పరధర్మాత్ స్వనుష్ఠితాత్ ।
స్వధర్మే నిధనం శ్రేయః, పరధర్మో భయావహః ॥

అందుచేత ఓ అర్జునా! ప్రతి ఒక్క జీవునికీ స్వధర్మ నిర్వహణయే శ్రేయము. ‘‘వారు అట్లా ఉన్నారుగా! వీరిట్లా చేస్తున్నారుగా! నేను నా ధర్మం నిర్వర్తించకపోతే ఏం?’’ … అని స్వధర్మాన్ని ఏమరచి పరధర్మాన్ని ఆశ్రయించటం క్షేమం కాదు. ఎవ్వరికైనా స్వధర్మమే సర్వదా శుభప్రదం.

ఎవరెవరినో చూచి ‘‘నేనెందుకు చెయ్యాలి’’ అని తనకు విధించబడిన కర్మలు ఏమరచటం ఆతనికి అశుభప్రదము - భయకారణము అవుతుంది సుమా!

అర్జునా! ఒక సైనికుడివయి ఉండి యుద్ధధర్మము నిర్వర్తించవలసిన తరుణంలో, ‘‘నేను సన్యాసివలె, వానప్రస్థునివలె యుద్ధంనుండి విరమించి జ్ఞానవిచారణ చేస్తూ ఎక్కడో ఉంటాను’’ …. అను పర ఆశ్రమ ధర్మాశ్రయం ఈ సందర్భంలో ఉచితం కాదు. పైగా, నీకు భయ - చాంచల్యాలు కలుగుటకు కారణం కాగలదు.

కనుక, దోషములు ఉన్నప్పటికీ స్వధర్మమే (తాను స్థితించియున్న ఆశ్రమ ధర్మమే) ఎవ్వరికైనా శ్రేయస్సు కలుగజేయగలదు.

Krishna instructing Arjuna

మూల శ్లోకము


అధ్యయన వ్యాఖ్యానము


ఉపన్యాసము

అర్జున ఉవాచ :-

03–36

అథ కేన ప్రయుక్తోఽయం పాపం చరతి పూరుషః ।
అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః ॥

అథ కేన ప్రయుక్తో అయం పాపం చరతి పూరుషః ।
అనిచ్ఛన్ అపి, వార్ష్ణేయ! బలాత్ ఇవ నియోజితః ॥

అర్జునుడు :

హే భగవాన్‌! శ్రీకృష్ణా! ఓ వార్ష్ణేయా! ‘‘అందరూ కర్మలు చేస్తూనే ఉన్నారు - ప్రకృతి చేతనే అందరూ ప్రేరేపించబడి కర్మలు నిర్వర్తిస్తున్నారు’’ అని మీరు అన్నారు కదా!

అయితే, మేము - చేస్తున్న ఆయా కర్మలు ……. సహజీవులపై అసూయ - కోపం - ఆవేశం - తప్పులు పట్టుకోవటం - క్రోధం - దురాశ - దెప్పిపొడవటం - తమకే అన్యాయం జరిగిందని వాపోవటం - ఆత్మస్తుతి - పరనింద - ‘ఎందుకొచ్చిందిరా’ అని బాధపడటం … మొదలైన దోషాలతో కూడి ఉంటున్నాయి. ఆవేశ-కావేశాలతో మిళితమై కర్మలు చేస్తూ ఉండగా రోజులు గడచి పోతున్నాయి. ‘‘ఆవేశపడటం, అసూయపడటం, ద్వేషించటం, దూషించటం, గర్హించటం, ఏవేవో తదితరుల తప్పులు వల్లెవేయటం, ‘పరిస్థితులు ఇట్లా ఉన్నాయే?’ అని వేదన చెందటం, చెడు విషయాలు మరల మరల గుర్తు చేసుకొని నిష్ప్రయోజనంగా సంభాషించుకోవటం’’ - ఇవన్నీ తప్పేనని, కాలం వృధా చేసుకోవటమేనని మాకు బాగా తెలుసు.

కానీ, మాకు ఇష్టంలేకపోయినప్పటికీ, కోరుకోకపోయినప్పటికీ, దోషములను ప్రవృద్ధం చేసే కర్మలు ‘‘ఏదో అదృశ్యశక్తి యొక్క హస్తలాఘవమా?’’ అన్నట్లుగా దోషభూయిష్ట - పాపభూయిష్ట భావములతో నిర్వర్తిస్తున్నామే! ఎందుచేత? బలవంతంగా - తీవ్ర ప్రేరణచే పాపపు పనులు తెలిసికూడా కొందరు కొనసాగిస్తున్నారే? అలా ఈ జీవులు ఎవరిచేత ప్రేరేపించబడుచున్నారు? ఎవరిచే అట్లు నియమించబడుచున్నారు? ప్రకృతియొక్క ప్రేరేపణతోనేనా? జీవుడే కారణమా? ఇంకెవరన్నా కారణమా?

శ్రీ భగవాన్ ఉవాచ :-

03–37

కామ ఏష క్రోధ ఏష రజోగుణసముద్భవః ।
మహాశనో మహాపాప్మా విద్ధ్యేనమిహ వైరిణమ్ ॥

కామ ఏష, క్రోధ ఏష రజోగుణసముద్భవః ।
మహా అశనో, మహా పాప్మా, విద్ధి ఏనమ్ ఇహ వైరిణమ్ ॥

శ్రీకృష్ణ భగవానుడు :-

కామ క్రోధాలే శత్రువులు

ఓ అర్జునా! ఇక్కడి చమత్కారమేమో విను, చెపుతాను!

‘‘ఏదో కావాలి - ఏదో పొందాలి - నేను అనుకున్నట్లే వారు, వీరు, ఇవి, అవి ఉండాలి - నేను చెప్పినట్లు వారు, వీరు చేయాలి - నేను చెప్పినదే వినాలి - నేను అనుకున్నట్లే జరగాలి’’….. అనే ఒకానొక సాంసారికమైన దోషగుణం జీవుడి మనస్సులో ప్రవేశించి ఉంటోంది. దీనినే ‘కామము’ (Expectational Tendency) అని పిలుస్తున్నారు. ‘‘ఇట్లా ఉండాలి - అట్లా వీరంతా చేయాలి’’ అనే ఆవేశ సంకల్పాలు (రజోగుణం చేత) ఈ దృశ్య ప్రపంచముపట్ల జీవుడు కర్మలు నిర్వర్తిస్తూ, నిర్వర్తిస్తూ క్రమక్రమంగా తెచ్చిపెట్టుకొని మనస్సులో పేర్చుకొంటున్నాడు. అనుకున్నది అనుకున్నట్లుగా లేనప్పుడు, తాను లౌకికంగా పొందాలనుకొన్నది పొందనప్పుడు, తాను అనుకున్నట్లుగా తదితర జీవులు ప్రవర్తించనప్పుడు, తన ఆశలు నెరవేరనప్పుడు ఇక ఆ కామము కాస్తా క్రోధంగా రూపుదిద్దుకుంటోంది. ‘‘నేను చదివించాను, పోషిస్తున్నాను, నేను అనుకున్నట్లుగా ఉండాలి కదా?’’… అనే కామ - క్రోధాలు క్రమంగా కొనసాగుచున్నాయి.

రజోగుణం, కర్మలు → ప్రకృతి రచన.
ఆశించటం, కామము, క్రోధం → జీవునిచే స్వయంకృతం.

జీవులు కర్మలు నిర్వర్తించటం అనివార్యం. అయితే ఆ కర్మలు మనం చెప్పుకున్నట్లు సమర్పణ - ఉపాసన బుద్ధితో మమకార - అహంకార రహితంగా నిర్వర్తించటం ఏమరచి, ఈ జీవుడు ఆశ - పేరాశ - దురాశ - నిరాశలతో కూడినవాడై నిర్వర్తించటం ప్రారంభిస్తున్నాడు. ఇది రజోగుణం నుండి ప్రాప్తిస్తున్న దోషం. క్రమంగా ఆతడు కామ - క్రోధాలు (Expectation and Anger) ప్రవృద్ధం చేసుకొంటున్నాడు.

అయితే, ఈ జగత్‌ దృశ్యము ప్రకృతిచే నడిపించబడుచుండగా, ఈ జీవుడు ‘‘తాను అనుకున్నవి అనుకున్నట్లుగా ఉండటం, జరగటం’’… అనే దానికి అంతు ఎక్కడ? ఆశించడం చేత క్రమంగా దృశ్యముతో సంబంధం రూపుదిద్దుకుంటోంది. తద్వారా కామ - క్రోధాలు ఇంతకింతకూ ప్రవృద్ధమౌతున్నాయేగాని, అవి ‘తీరటం’ అనే మాట ఎక్కడిది?

కామ - క్రోధాలే జీవునికి తెలిసి - తెలిసి దుష్టకర్మలు ఆశ్రయించటానికి కారణమగుచున్నాయి. క్రమంగా, అభ్యాసవశం చేత ఈ జీవుడు తన ప్రవర్తనను తానే ఉపశమింపజేయలేనంతగా కామ - క్రోధములు దురవగాహనల రూపంగా, దుష్టకర్మల వైపుగా ప్రేరేపకాలుగా అగుచున్నాయి.

కనుక ‘‘ఈ కామ - క్రోధాలు నాకు శత్రువులు! ఇవి నా పతనానికి, అజ్ఞాన యోనుల అనుభవానికి కారణం కాగలవు!’’…. అని గమనించు. కామ - క్రోధాలను నీవు యుద్ధం చేసి-చేసి ఓడించవలసిన (అనగా ప్రయత్నించి త్యజించవలసిన) శతృవులుగా చూడు. అంతేగాని ‘‘కామ - క్రోధాలు ఎవరికి మాత్రం ఉండవులే’’ …. అని నిన్ను నీవే ఓదార్చుకుంటూ వాటిని ప్రవృద్ధం చేసుకోకూడదు సుమా! ఎందుకంటే…. అవి అంతఃశత్రువులు. నిజమైన శత్రువులు.

03–38

ధూమేనావ్రియతే వహ్నిర్యథాదర్శో మలేన చ ।
యథోల్బేనావృతో గర్భస్తథా తేనేదమావృతమ్ ॥

ధూమేన ఆవ్రియతే వహ్నిః, యథా ఆదర్శో మలేన చ ।
యథా ఉల్బేన ఆవృతో గర్భః, తథా తేన ఇదమ్ ఆవృతమ్ ॥

ప్రతి జీవునిలోను ఆనందరూపమగు ఆత్మ జ్వాజ్వల్యమానంగా ప్రకాశిస్తోంది.

ప్రతి జీవునికి ఆత్మగురించి తెలుసు. తన స్వరూపం తనకు తెలియక, మరొకరు చెపితేగాని తెలియకపోవటం ఏమిటి? అయితే, ఆ ఆత్మ జ్ఞానమును కామ - క్రోధ - లోభ - మోహ - మద - మాత్సర్యాదులు (అరి షట్‌ వర్గం = ఆరుగురు శత్రువులుచే) ఆవరించి ఉన్నాయి. అవియే ఈ జీవుడు తన ఆత్మానంద స్వరూపం తాను ఆస్వాదించకుండా అడ్డు తగులుచున్నాయి.

🔥 పొగచేత కప్పబడిన అగ్ని వెలుగును ప్రదర్శించలేకపోవటం చేత చీకటి కొనసాగుతుంది చూచావా! అట్లాగే కామక్రోధాదులు ఆవరించినప్పుడు వాటి కారణంగా జీవునకు స్వస్వరూపాత్మ అనుభవం కావటం లేదు. అందుకు ఫలితంగా జీవుడు అజ్ఞానాంధకారంలో మ్రగ్గిపోతున్నాడు.

🪞 అద్దం (Mirror) ధూళిచే కప్పబడినప్పుడు ప్రతిబింబం దోషభూయిష్టంగా కనబడుతుంది కదా! సుస్పష్టత ఉండదు కదా! అట్లాగే జీవుడు జ్ఞానస్వరూపుడై ఉండి కూడా, ‘దృశ్యమ్‌ ఆత్మస్వరూపమ్‌’ - తన స్వరూపమే అయి ఉండి కూడా … కామ క్రోధాదులచే నింపబడిన దృష్టిచే గజిబిజిగా, అనేక దోషములతో కూడి ఉన్నట్లుగా చూస్తున్నాడు.

🤰🏻 తల్లి గర్భంలో పెరుగుచున్న శిశువు క్రితం దేహాలకు సంబంధించిన అనేక అనుభవ జ్ఞానాలు కలిగి ఉండి కూడా ‘మావి’లో ఉండి, తన హావభావాలు - అనుభవాలు - తెలివి తేటలు చెప్పుకోలేక, అనుభవానికి వచ్చీ - రాక స్తబ్దతతో ఉండిపోతుంది చూచావా? అట్లాగే ప్రతి ఒక్కని అంతరంగంలోను స్వస్వరూపజ్ఞానం ప్రకాశిస్తున్నప్పటికీ దృశ్యసంబంధమైన ఆశ - పేరాశ - నిరాశ - కోపం - ఆవేశం - వేదన - పగ - ఆభిజాత్యం - భయం ……ఇటువంటివన్నీ జ్ఞానమును కప్పి ఉండటంచేత ’‘అఖండమగు ఆత్మను నేనే’’ అనే పరమసత్యము అనుభవానికి రావటం లేదు.

03–39

ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా ।
కామరూపేణ కౌన్తేయ దుష్పూరేణానలేన చ ॥

ఆవృతం జ్ఞానమ్ ఏతేన జ్ఞానినో నిత్యవైరిణా ।
కామరూపేణ, కౌంతేయ! దుష్పూరేణ అనలేన చ ॥

కనుక ఓ అర్జునా!

జ్ఞానికి వేరే శత్రువు అంటూ ఉండడు. కర్మయోగి తన జ్ఞానాన్ని ఆవరించి ఉన్న కామక్రోధములే తనకు శత్రువులని గమనిస్తున్నాడు!

జ్ఞానికి తాను సమర్పిత బుద్ధితో కూడిన కర్మలచే, స్వధర్మములచే కామక్రోధాలను జాగరూకతతో జయిస్తూ ఉండాలనే ఆశయమును బలపరచుకుంటూ ఉంటాడు.

జ్ఞానికి ఆతని దృష్టిలో నిత్యవైరులు ఆతని కామక్రోధములే! ఈ కామములు, అగ్నికి ఆజ్యంలాగా, తీరుతున్న కొలది ప్రవృద్ధమౌతూనే ఉంటాయి. (The wishes and expectations never end up by fulfilment of them, because new wishes and new expectations emerge in multi-fold again and again while existing expectations are being attempted to be met). తగలబడుతున్న అగ్నిలో కట్టెలు వేసినకొలదీ అగ్ని ఉపశమిస్తుందా? లేదు. ఇంకా ప్రవృద్ధమౌతుంది కదా!

03–40

ఇన్ద్రియాణి మనో బుద్ధిరస్యాధిష్ఠానముచ్యతే ।
ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినమ్ ॥

ఇంద్రియాణి మనో బుద్ధిః అస్య అధిష్ఠానమ్ ఉచ్యతే ।
ఏతైః విమోహయతి ఏష జ్ఞానమ్ ఆవృత్య దేహినమ్ ॥

అయితే ఈ కామ - క్రోధ - లోభాలు ఉండే స్థానం ఏమిటి? అది గమనించు. అవి ఈ దృశ్యంలో లేవు. ఈ జీవుని అంతరంగంలోనే తిష్టవేసుకొని ఉన్నాయి.

ఈ జీవుడు కష్టపడి సంపాదించుకున్న ‘మానవజన్మ’ వంటి ఉత్తమ అవకాశములను, అతనియొక్క ఉత్తమ గుణాలను భ్రష్టు పట్టిస్తున్నాయి.

కామక్రోధాలు మనస్సులో వుంటూనే క్రమంగా ఇంద్రియములందు చోటు చేసుకుంటున్నాయి. ఇంద్రియ విషయములపై అనుభవమునకు మునుముందుగానే ప్రసరించి అమృతతుల్యమగు దృశ్యమును విషతుల్యంగా అనుభవం అయ్యేటట్లు చేస్తున్నాయి.

అంతేకాదు. అవి మనస్సులో ప్రవేశించి మనస్సుపై పెత్తనం చెలాయిస్తున్నాయి. తనయొక్క ఆలోచనలను కామ - క్రోధ - లోభ - మోహాదులు మనస్సుకు మకిలి పట్టిస్తున్నాయి.

ఈ కామ - క్రోధాలు అంతటితో ఆగక, బుద్ధిలో కూడా ప్రవేశించి బుద్ధిని కలుషితం చేస్తున్నాయి. (The Logic is getting polluted because of worldly wishes and expectations).

కనుక దోషములు కర్మలలో లేవు. భావన - ఆలోచన - ఉద్దేశ్యములలో దోషములు పేరుకొని ఉంటున్నాయి. అప్పుడిక అనుభవాలు, ఉద్దేశ్యాలు, అవగాహనలు, అభిప్రాయాలు కూడా మరికొన్ని దోషాలు తెచ్చిపెట్టుకుంటున్నాయి.

03–41

తస్మాత్త్వమిన్ద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ ।
పాప్మానం ప్రజహి హ్యేనం జ్ఞానవిజ్ఞాననాశనమ్ ॥

తస్మాత్ త్వం ఇంద్రియాణి ఆదౌ నియమ్య, భరతర్షభ! ।
పాప్మానం ప్రజహి హి ఏనం జ్ఞానవిజ్ఞాన నాశనమ్ ॥

అందుచేత ఓ భరతర్షభా!

మునుముందుగా ఈ ఇంద్రియములను సరి అయిన మార్గంలో నియమించు.

‘‘కామ క్రోధములు ప్రవృద్ధమయ్యే మార్గంలో ఇంద్రియములను నియమిస్తూ, నేను ఈ ఈ కార్యములను ఆశ్రయించటం లేదు కదా?’ …. అని తరచి తరచి ప్రశ్నించుకో! సరి అయిన విచక్షణతో కామ-క్రోధ రహితమైన మనస్సుతోనే ఈ ఇంద్రియములను ఉపయోగించు. ’‘నేను మాట్లాడేది, చూచేది, వినేది, నిర్వర్తించేది… కామ - క్రోధ రహితమైనదేనా? కాదా?’’… అని మరల మరల పరిశీలించి, అప్పుడు ఇంద్రియములను నియమించు. లేదా? కామ - క్రోధములు కొనసాగిస్తూ…. ఈ ఇంద్రియములు కర్మలలో నియోగించబడ్డాయా, అప్పుడు ఆ కర్మలలో అనేక దోషాలు కొనసాగుతాయి. ఆ కర్మలన్నీ జ్ఞాన - విజ్ఞానాలను పెడత్రోవను పట్టిస్తాయి.

03–42

ఇన్ద్రియాణి పరాణ్యాహురిన్ద్రియేభ్యః పరం మనః ।
మనసస్తు పరా బుద్ధిర్యో బుద్ధేః పరతస్తు సః ॥

ఇంద్రియాణి పరాణి ఆహుః, ఇంద్రియేభ్యః పరం మనః ।
మనసః తు పరా బుద్ధిః, యో బుద్ధేః పరతః తు సః ॥

బుద్ధికి ఆవల - బుద్ధికి సాక్షి - బుద్ధితో దర్శనం

ఇంద్రియములతో జీవుడు కర్మలు నిర్వర్తిస్తున్నాడు కదా! అయితే ఇంద్రియములను నియమిస్తున్నది ఎవరు? మనస్సు (లేక) ఆలోచనలు కదా! కనుక, ఇంద్రియములకంటే ఆలోచనల రూపమైన మనస్సు ఉన్నతమైనది కదా! ఇంద్రియ సమన్వితమైన ఈ భౌతిక దేహం నేలకూలినప్పటికీ ఆలోచనల రూపమైన మనస్సు కొనసాగుతూనే ఉంటుంది. (ఇందుకు దృష్టాంతం స్వప్నమే!)

ఆలోచనల రూపమైన మనస్సు ఎందులోంచి బయల్వెడలుతోంది? విచక్షణారూపమైన బుద్ధి (Logic / Differentiation) నుండి కదా! కనుక, మనస్సుకన్నా బుద్ధి సమున్నతమైనది.

అటువంటి బుద్ధి ఎద్దానిలోంచి ప్రదర్శించబడుతోంది? ఆత్మ నుండి!

కనుక, ప్రతిఒక్క జీవుని బుద్ధికి ఆవల పరమాత్మ సర్వదా - అనుక్షణికంగా వేంచేసి ఉన్నారు.

03–43

ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా ।
జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదమ్ ॥

ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్య ఆత్మానమ్ ఆత్మనా ।
జహి శత్రుం, మహాబాహో! కామరూపం దురాసదమ్ ॥

అనగా, బుద్ధికి ఆవల ఉన్న జ్ఞానానందమయము - అఖండము - సర్వాతీతము అగు పరమాత్మను బుద్ధితో గ్రహించాలి.

బుద్ధితో తన యందలి అట్టి పరమాత్మయొక్క సందర్శనమే జీవునికి ప్రశాంతతను ప్రసాదించగల ఏకైక స్థానం.

ఓ అర్జునా! అట్టి పరమాత్మయొక్క సర్వే - సర్వత్రా వేంచేసియున్న ఇహ జగత్‌ రూపమును ఆస్వాదిస్తూ నీవు క్రమంగా దుర్జయ శత్రువులైన కామ - క్రోధాలను జయించివేయి.

ఆత్మానందం ఆస్వాదించు.

ఇతి శ్రీమత్‌ భగవద్గీతాసు … కర్మ యోగ పుష్పః ।
శ్రీ సాంబ సదాశివ పాదారవిందార్పణమస్తు ॥
🙏