భగవద్గీత

05. కర్మ సన్న్యాస యోగ అధ్యయన పుష్పం

మూలము : శ్రీ వ్యాస మహర్షిచే విరచించబడిన జయము / మహాభారతము (భీష్మ పర్వము)

అధ్యయన వ్యాఖ్యానము : (అధ్యయన విద్యార్థి) యేలేశ్వరపు హనుమ రామకృష్ణ


Krishna instructing Arjuna

మూల శ్లోకము


అధ్యయన వ్యాఖ్యానము


ఉపన్యాసము

అర్జున ఉవాచ :-

05–01

సంన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి ।
యచ్ఛ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితమ్ ॥

సంన్యాసం కర్మణాం, కృష్ణ! పునః యోగం చ శంససి ।
యత్ శ్రేయ ఏతయోః ఏకం తత్ మే బ్రూహి సునిశ్చితమ్ ॥

అర్జునుడు :

కర్మ యోగమా? కర్మ సన్యాసమా?

స్వామీ! శ్రీ కృష్ణా! మీరు మరల మరల “కర్మ యోగ” - “కర్మ సన్యాసము”లను సమ్మిళితం చేసి చెప్పుచున్నట్లుగా నాకు అనిపిస్తోంది.

➤ ఒకవైపేమో…, కర్మయోగం (నిష్కామ కర్మ)ను ఆశ్రయించి కర్మలన్నీ నిర్వర్తించమంటున్నారు!
➤ ఇంతలోనే…, కర్మలను ఆశ్రయిస్తూ తద్వారా క్రమంగా కర్మలు వదలివేయి’’ అని బోధిస్తున్నారు. (యోగః సన్యస్త కర్మాణం)
➤ ‘‘కర్మ సన్యాసం’’ …. అని అంటూనే "కర్మయోగం ద్వారా’’ అని కర్మలను మరల మరల ప్రోత్సహిస్తున్నారే!
➤ ఇంతకీ నాకు ఇప్పుడు కర్మ నిర్వహణ శుభప్రదమా? కర్మ సన్యాసమే శుభప్రదమా?
➤ ‘కర్మ యోగోపాసన’ తర్వాత కర్మలను సన్యసించే బదులు ఇప్పటికిప్పుడే కర్మలన్నీ సన్యసించి కర్మ బంధములను తొలగించుకోవచ్చును కదా?

ఇంతకీ కర్మ వదలాలో, ఆశ్రయించాలో సునిశ్చితంగా ఏదో ఒక్కటి ఆజ్ఞాపించండి. నేను అందుకు సంసిద్ధుడనై ఉన్నాను, మహాత్మా!

శ్రీ భగవాన్ ఉవాచ :-

05–02

సంన్యాసః కర్మయోగశ్చ నిఃశ్రేయసకరావుభౌ ।
తయోస్తు కర్మసంన్యాసాత్కర్మయోగో విశిష్యతే ॥

సంన్యాసః కర్మయోగః చ నిఃశ్రేయసకరౌ ఉభౌ ।
తయోః తు కర్మసంన్యాసాత్ కర్మయోగో విశిష్యతే ॥

శ్రీకృష్ణ భగవానుడు :-

ఓ అర్జునా! “కర్మ సన్యాసము” - “కర్మ యోగము” ….ఈ రెండు మార్గాలు శుభప్రదమేనయ్యా! అందులో ఒకటి సిద్ధాంతీకరించి రెండవదానిని ఖండించటం నా ఉద్దేశ్యం ఏ మాత్రం కాదు.

అయితే, నా అభిప్రాయంలో కర్మలు సన్యసించి ఏకాంతంగా ఎక్కడో కూర్చోవటం కంటే కర్మలు యోగబుద్ధితో నిర్వర్తించు మార్గమే సులభము.

ఒకే చోటికి చేర్చగల రెండు రహదారులున్నప్పుడు అందులో సులభ మార్గమునే ఎన్నుకుంటాం గాని, కష్టతరమైన మార్గం ఎంచుకోకపోవటం లోక ప్రసిద్ధమైన విషయమే కదా!

అది అట్లా ఉంచి ….
‘‘యోగః సన్యస్త కర్మాణం’’ ….. అను వాక్యంలో కర్మయోగముతో కర్మలు సన్యసించటమనే విషయంలో, …. ‘సన్యాసము’ అనగా ఏమో వివరిస్తాను. విను.

05–03

జ్ఞేయః స నిత్యసంన్యాసీ యో న ద్వేష్టి న కాఙ్క్షతి ।
నిర్ద్వన్ద్వో హి మహాబాహో సుఖం బన్ధాత్ప్రముచ్యతే ॥

జ్ఞేయః స నిత్యసంన్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి ।
నిర్ద్వంద్వో హి, మహాబాహో! సుఖం బంధాత్ ప్రముచ్యతే ॥

నిత్య సన్యాసి

ఎవ్వడైతే కర్మలు నిర్వహిస్తున్నా (లేక) కర్మలు వదలి ఏకాంతము ఆశ్రయించినా ….. ఏది ఏమైనా, హృదయములో దృశ్యాతీతత్వము - అనగా, ‘‘ఈ దృశ్యం ఇట్లా ఉన్నదెందుకు?’’ అనబడే ద్వేషముగాని, ‘‘ఇది ఇట్లాగే ఉండాలి’’ అనే ఆకాంక్ష గాని, ఎప్పుడైతే ఏ మాత్రం ఉండవో …… అట్టివాడే నిత్య సన్యాసి….. అని గ్రహించు.

నీవు ఏవో కొన్ని కర్మలు కొంతసేపు వదలి ’సన్యాసి’వి కావటం సరిపోదు. నిత్య సన్యాసివి కావాలి. ఎవరైతే “కర్మలన్యాసము వేరు - సన్యాసము వేరు” అనే ద్వంద్వ స్థితిని తమయొక్క అవగాహనచే అధిగమించి ఉంటారో …. అట్టి నిర్ద్వంద్వులు అతి సులభంగా కర్మ బంధములను తొలగించుకున్నవారు అగుచున్నారు.

05–04

సాంఖ్యయోగౌ పృథగ్బాలాః ప్రవదన్తి న పణ్డితాః ।
ఏకమప్యాస్థితః సమ్యగుభయోర్విన్దతే ఫలమ్ ॥

సాంఖ్య-యోగౌ పృథక్ బాలాః ప్రవదంతి, న పండితాః ।
ఏకమ్ అపి ఆస్థితః సమ్యక్ ఉభయోః విందతే ఫలమ్ ॥

ఇంకొక విషయం.

’‘(1) సాంఖ్యమార్గం లేక విచారణ మార్గం (2) కర్మయోగ మార్గం ….. ఇవి రెండూ వేరు వేరు’’ - అని తెలిసీ తెలియని చిన్న పిల్లవాళ్ళు వంటివారు అనవచ్చు గాక!

నిత్యానిత్య వివేకి అయిన శాస్త్ర జ్ఞాన పండితులు మాత్రం అవి వేరువేరైనవిగా చూడరు. కొంత సాధన తరువాత - ఒకదానిలో రెండవది ఉండనే ఉంటుంది అని గమనిస్తున్నారు.

కర్మను యోగ - త్యాగ బుద్ధితో నిర్వర్తిస్తేనే అది కర్మయోగం కదా! అది త్యాగబుద్ధి, సమర్పణ బుద్ధి, విచారణ లేకుండా ఎట్లా సిద్ధిస్తుంది? కాబట్టి వివేకముతో కూడిన జ్ఞానము ప్రయత్న రూపములగు కర్మల యొక్క ప్రయోజనంగానే సిద్ధిస్తోంది. కర్మలు యోగబుద్ధితో నిర్వర్తిస్తే అప్పుడది మనోపరిశుద్ధతచే, వివేకముతో కూడిన విచారణకు మార్గం సుగమం చేస్తోంది. కనుక, కర్మ యోగి యొక్క, (మరియు) విచారణశీలుని యొక్క లక్ష్య స్థానం ఒక్కటే! ఉభయములు ఒకే ప్రయోజనానికి ఉద్దేశ్యించుచుండటం జరుగుతోంది.

05–05

యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ।
ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి ॥

యత్ సాంఖ్యైః ప్రాప్యతే స్థానం, తత్ యోగైః అపి గమ్యతే ।
ఏకం సాంఖ్యం చ యోగం చ, యః పశ్యతి స పశ్యతి ॥

"సాంఖ్యము (విచారణ మార్గం) ఏ స్థానానికి చేరుస్తోందో …., కర్మయోగము (సమర్పిత బుద్ధితో కర్మలు నిర్వర్తించటం) అదే స్థానానికి దారి తీస్తోంది’’ - అని మరొక్కసారి ప్రకటిస్తున్నాను.

05–06

సంన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః ।
యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేణాధిగచ్ఛతి ॥

సంన్యాసః తు, మహాబాహో! దుఃఖమ్ ఆప్తుమ్ అయోగతః ।
యోగయుక్తో మునిః బ్రహ్మ నచిరేణ అధిగచ్ఛతి ॥

‘‘ఇప్పుడే కర్మలు సన్యసించి ‘ఆత్మ విచారణ’ కు ఉపక్రమించవచ్చు కదా!’’ అని అంటావా?
‘‘సిద్ధ అసిద్ధో సమోభూత్వా సమత్వమ్‌’’ - ‘‘ఏది ఎట్లా సిద్ధించినా, లేక, సిద్ధించకున్నా కూడా సమత్వ భావన కలిగిఉండటం’’ అనే స్థితికి చేరటం అనునది కర్మలు సన్యసించే మార్గం దృష్ట్యా చూస్తే, అది అనేకులకు కష్టతరము, దుఃఖప్రదమైనది అవుతుంది కూడా!

కర్మలు నిర్వర్తిస్తూ కర్మయోగివై సర్వప్రాపంచక విశేషముల పట్ల ఒకానొక మౌనస్థితి (ఏది ఎట్లా ఉన్నా కూడా ఒక్కటే - అనే స్థితి) లేక అతీతస్థితి సంపాదించుకున్నావా …. అప్పుడు పరబ్రహ్మత్వమును (దృశ్యమంతా నా ఆత్మ స్వరూపమే - అనే అనుభూతి స్థితికి) అతి త్వరగా జేరుకోగలవు.

05–07

యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేన్ద్రియః ।
సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే ॥

యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః ।
సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్ అపి న లిప్యతే ॥

అందుచేత నీవు కర్మలు నిర్వర్తించు. యోగస్థుడవై ఉండు. సంయోగ - వియోగాతీతుడవై, యోగివై కర్మలు చేయి.

నీవు నిర్వర్తించే కర్మల ద్వారా ….

⤿ నీ బుద్ధిని క్రమంగా రాగ-ద్వేషభావములనుండి విశుద్ధం చేయు ఆశయము కలిగి ఉండు.
⤿ ఇంద్రియ విషయములు నీ ప్రజ్ఞపై చేస్తున్న దండయాత్రను గమనించి ‘‘కర్మలను యోగ బుద్ధితో ఆశ్రయించటం’’ ద్వారా ఇంద్రియములను జయించు.
⤿ ఇంద్రియములను స్వాధీన పరచుకొని తద్వారా పరిపరి పోకడలకు పోతున్నట్టి మనస్సును అరికట్టు.
⤿ సర్వజీవులను నీ ఆత్మస్వరూపంగా దర్శించగల అభ్యాసము - ప్రజ్ఞ - సంస్థితులను సంపాదించుకో.

అట్టి కర్మయోగంతో కర్మ బంధములను త్రెంచివేసే ‘‘కర్మ సన్యాస యోగ స్థితి’’ సంపాదించుకున్నప్పుడు ఇక ఆ యోగి తన యొక్క, తదితరుల యొక్క నిర్వర్తించబడుచున్న కర్మలచే గాని, త్యజించబడిన కర్మలచేత గాని బద్ధుడు కాడు.

ఇంద్రియ - ఇంద్రియ విషయములను అధిగమించుచున్న యోగి ఈ ఇంద్రియ విషయమాత్ర జగత్తును, ఇందలి తన - తదితరుల శరీరములతో సహా స్వప్నంలోని విశేషాలను చూస్తున్నట్లుగా సందర్శించగలిగినవాడై ఉంటాడు. ఈ దేహములు పాంచభౌతిక నిర్మాణమై ప్రవర్తిస్తున్నాయి. ‘‘నేను వీటికి అతీతమగు ఆత్మ స్వరూపుడను కదా!’’ అని గ్రహించి ఉంటున్నాడు.

05–08

నైవ కించిత్కరోమీతి యుక్తో మన్యేత తత్త్వవిత్ ।
పశ్యన్ శ్రృణవన్స్పృశఞ్జిఘ్రన్నశ్నన్గచ్ఛన్స్వపన్ శ్వసన్ ॥

న ఏవ కించిత్ కరోమి ఇతి యుక్తో మన్యేత తత్త్వవిత్ ।
పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్ఛన్ స్వపన్ శ్వసన్ ॥

నైవ కించిత్‌ కరోమి! యోగసిద్ధిని పొందిన యుక్తుడు, తత్త్వవేత్త..,
‘‘నేను సర్వ ఇంద్రియ వ్యవహారములచే స్పర్శించబడక యథాతథంగా సర్వదా వెలుగొందుచున్నాను’’ అను ఆత్మావలోకనస్థితిని ఆస్వాదిస్తున్నాడు.

👀 ఈ కళ్ళు చూస్తున్నాయి.
🦻 ఈ చెవులు వింటున్నాయి.
👄 ఈ దేహము స్పర్శానుభవం కలిగి ఉంటుంది.
👃 ఈ ముక్కు గాలి పీలుస్తోంది.
👅 ఈ నోరు తింటోంది.
🦵 ఈ కాళ్ళు సంచారములు సలుపుచున్నాయి.
😴 ఈ మనస్సు జాగ్రత్‌-స్వప్న-సుషుప్తులు పొందుతోంది.
🧠 ఈ బుద్ధి ఆయా దృశ్య విశేషములను స్వీకరిస్తోంది. త్యజిస్తోంది.

05–09

ప్రలపన్విసృజన్గృహ్ణన్నున్మిషన్నిమిషన్నపి ।
ఇన్ద్రియాణీన్ద్రియార్థేషు వర్తన్త ఇతి ధారయన్ ॥

ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్ అపి ।
ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్ ॥

🗣 మాటలాడుట.
🤜 గ్రహించుట, వదలుట.
👁 ఈ కళ్ళు మూసుకొనుట. తెరచుకొనుట.
ఆయా ఇంద్రియములు ఆయా ఇంద్రియ విషయములను ప్రదర్శిస్తున్నాయి.

ఇక నేనో …. దేహ-గృహములోని సరంజామాకు గృహ యజమాని వంటివాడను. వాటి యొక్క సాక్షిని, అతీతుడను, వాటి వాటి విషయములకు ప్రమేయము లేనివాడిని అనే ‘‘విషయ సన్యాస - ఆత్మ న్యాస’’ ధారణను కర్మసన్యాసయోగి వహించినవాడై ఉంటున్నాడు.

అట్టి ఇంద్రియ విషయాతీతమగు, కేవల సాక్షి స్థితియగు ‘‘స్వస్వరూపాత్మ స్థానం’’ ఆస్వాదించగలగటానికి, కర్మల దోషం మనుస్సును స్పర్శించకుండా ఉండగల స్థితి పొందటానికి మార్గం ఏమిటి? చెపుతాను. విను.

05–10

బ్రహ్మణ్యాధాయ కర్మాణి సఙ్గం త్యక్త్వా కరోతి యః ।
లిప్యతే న స పాపేన పద్మపత్రమివామ్భసా ॥

బ్రహ్మణ్య ఆధాయ, కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః ।
లిప్యతే న స పాపేన, పద్మపత్రమ్ ఇవ అంభసా ॥

ఎవరైతే తాను చేస్తున్న సర్వకర్మలు సర్వాత్మకుడగు పరమాత్మను సేవిస్తున్న భావంతో సర్వాంతర్యామికి సమర్పణ చేస్తూ, ఎట్టి సంగము (ఆసక్తి) మనస్సులో రూపుదిద్దుకోకుండా చూచుకుంటూ ఉంటాడో …. అట్టి కర్మ సన్యాస యోగిని కర్మలలోని దోషములు (అనగా బంధము - మమకారము - ఆశ - భయము - లోభము - మోహము మొదలైనవి) ఏ మాత్రం అంటవు.

పద్మము నీళ్ళలోనే ఉంటుంది. కాని, ఆ పద్మము యొక్క పూరెక్కలు నీటిని పీల్చవు కదా! అట్లాగే, సన్యాసయోగి ఈ జగత్‌ విషయముల మధ్య ఉండి కూడా, వాటిని పుంఖాను పుంఖములుగా పొందుతూ కూడా, వాటి యందు బంధితుడుగాని, సంబంధితుడుగాని కాడు. వాటిని స్వీకరించడు. ఆతని దృష్టి పథము కర్మలు, కర్మ ఫలములు, స్వభావములు ఇత్యాదుల కంటే అతీతమై, సమున్నతమై ఉంటుంది.


05–11

కాయేన మనసా బుద్ధ్యా కేవలైరిన్ద్రియైరపి ।
యోగినః కర్మ కుర్వన్తి సఙ్గం త్యక్త్వాత్మశుద్ధయే ॥

కాయేన మనసా బుద్ధ్యా కేవలైః ఇంద్రియైః అపి ।
యోగినః కర్మ కుర్వన్తి సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే ॥

అట్టి కర్మసన్యాస యోగి ఈ దేహంతోను, మనస్సుతోను, బుద్ధితోను, ఇంద్రియములతోను చేసే కర్మలన్నీ సంగరహితుడై (sans any relationship or attachment), ‘‘ఈఈ కర్మల ద్వారా సర్వాత్మకుడగు పరమాత్మను ఉపాసిస్తున్నాను’’ అను భావనతో, మనస్సును పరిశుద్ధ పరచుకొనే పరికర రూపములుగా ఉద్దేశ్యించి నిర్వర్తిస్తున్నాడు.

05–12

యుక్తః కర్మఫలం త్యక్త్వా శాన్తిమాప్నోతి నైష్ఠికీమ్ ।
అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే ॥

యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిం ఆప్నోతి నైష్ఠికీమ్ ।
అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే ॥

కర్మయోగి, కర్మసంగి - ఇరువురు కర్మలు నిర్వర్తిస్తున్నారు.
అయితే …..,
కర్మలు, కర్మఫలముల ఉపాయమేమిటో తెలిసినట్టి యుక్తుడు - “కర్మయోగి” - కర్మ ఫలములను పరమాత్మకు సమర్పిస్తూ, వాటిని త్యజించి హృదయంలో పరమశాంతిని ఆశ్రయించి ఉంటున్నాడు.
ఉపాయం తెలియని అయుక్తుడు - “కర్మసంగి” - ‘ఏదో పొందాలి’ అనే తపనను ప్రవృద్ధపరచుకొంటూ, ‘కోరికలు’ అనే వలలో చిక్కుకొని కర్మబంధములలో తగులుకుంటున్నాడు.

05–13

సర్వకర్మాణి మనసా సంన్యస్యాస్తే సుఖం వశీ ।
నవద్వారే పురే దేహీ నైవ కుర్వన్న కారయన్ ॥

సర్వకర్మాణి మనసా సంన్యస్య ఆస్తే సుఖం వశీ ।
నవద్వారే పురే దేహీ న ఏవ కుర్వన్, న కారయన్ ॥

కర్మయోగి (లేక) కర్మసన్యాసయోగి - ఒక ప్రక్క నియమిత కర్మలు నిర్వర్తిస్తూ కూడా…, మరొక ప్రక్క తన యొక్క మనస్సుచే సర్వ కర్మలను, వాటి ప్రయోజనములను త్యజించి ఈ 9 ద్వారములు గల దేహ గృహంలో ప్రశాంత చిత్తంతో దేనికీ కర్తృత్వం - భోక్తృత్వం - కారణత్వం వహించక, సుఖ స్వరూపుడై ఉంటున్నాడు.

కర్మ సంగియో? ‘‘అన్నిటికీ నేనే కారణం. అవి పొందాలి. ఇవి తొలగాలి. ఇది ఇట్లా ఉండాలి. అది అట్లా కాకూడదు’’ అను భావనలను పెంపొందించుకొని కర్మబద్ధుడుగా అనేక దేహముల ప్రవేశ - నిష్క్రమణములను చర్వితచర్వణంగా పొందుచున్నాడు. అనుభవిస్తున్నాడు.

05–14

న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః ।
న కర్మఫలసంయోగం స్వభావస్తు ప్రవర్తతే ॥

న కర్తృత్వం, న కర్మాణి, లోకస్య సృజతి ప్రభుః ।
న కర్మఫల సంయోగం, స్వభావః తు ప్రవర్తతే ॥

జగత్‌ రచయిత (లేక ప్రకృతి) ప్రతి జీవుని పాత్రను జగదంతర్గతంగా నడిపిస్తూ ఉన్నాడు. జీవుల ప్రవృత్తులకు కూడా తానే కారణమై ఉన్నాడు. అయితే ఈ జీవుడు ‘‘ఆయా కర్మలకు నేనే కర్తను. నేనే భోక్తను. నేనే కారణమును’’…. అను భ్రమను తనకు తానే కల్పించుకొంటున్నాడు.

05–15

నాదత్తే కస్యచిత్పాపం న చైవ సుకృతం విభుః ।
అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యన్తి జన్తవః ॥

న ఆదత్తే కస్యచిత్ పాపం, న చ ఏవ సుకృతం విభుః ।
అజ్ఞానేన ఆవృతం జ్ఞానం, తేన ముహ్యంతి జంతవః ॥

ఈ జీవుడు సదా ఆత్మస్వరూపుడే అయిఉండి కూడా - తన స్వరూప జ్ఞానమును అజ్ఞానం ఆవరించటం చేత - ఈ దృశ్య జగత్తులో జరిగే జన్మ - జీవన్‌ - మరణాదిగా గల విశేషములచే మోహము చెందినవాడై ఉంటున్నాడు.

05–16

జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశితమాత్మనః ।
తేషామాదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరమ్ ॥

జ్ఞానేన తు తత్ అజ్ఞానం యేషాం నాశితమ్ ఆత్మనః ।
తేషామ్ ఆదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్ పరమ్ ॥

ఎవ్వడైతే తమ అంతరంగంలో గల అజ్ఞానమును ‘ఆత్మ జ్ఞానము’ అనే ప్రయత్నముచే మొదలంట్లా నశింపజేసుకుంటాడో అట్టివాడు ‘‘ఈ జన్మ-జీవన్‌-మరణ-తదంతర్గత సర్వకర్మలచే నేను బద్ధుడను కాను’’…. అని గ్రహించుచున్నాడు.

ఆకాశంలో సూర్యుడు ప్రకాశిస్తున్నప్పటికీ మేఘాలు ఆవరించటం చేత సూర్య కాంతి కనిపించక పోవచ్చు గాక! కానీ, ఆ మేఘాలు తొలగగానే, …. సూర్య ప్రకాశం మరల యథాతథంగా సందర్శించబడుచున్నది కదా! అట్లాగే జ్ఞాన వాయు ఝంఝా మారుతం చేత అజ్ఞాన మేఘాలు తొలుగగా, అప్పుడు ‘‘స్మాత్మసూర్యప్రకాశం’’ ఈ జీవునికి సుసందర్శనమవగలదు.

05–17

తద్బుద్ధయస్తదాత్మానస్తన్నిష్ఠాస్తత్పరాయణాః ।
గచ్ఛన్త్యపునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః ॥

తత్ బుద్ధయః, తత్ ఆత్మానః, తత్ నిష్ఠాః, తత్ పరాయణాః ।
గచ్ఛంతి అపునరావృత్తిం జ్ఞాన నిర్ధూతకల్మషాః ॥

🌹 ఎవరి బుద్ధి అయితే సర్వాత్మకమగు ఆత్మ తత్త్వము వైపుగా ఎక్కుబెట్టబడుచూ నడుపబడుతూ ఉంటోందో ……..,
🌹 ఎవరి మనస్సు యొక్క మననము ఆత్మజ్ఞాన సమాచారంతో పరిపుష్టమౌతూ ఉంటోందో ……..,
🌹 ఎవరి శ్రద్ధ - నిష్ఠ దృశ్యజగత్తు నుండి సర్వాత్మకుడగు పరమాత్మ వైపుగా అనుసంధానం చేయబడుచున్నదో ……..,
🌹 ఏవరి పారాయణమంతా ‘‘ఆత్మతత్త్వము’’ వైపుగా నడుపబడుతూ ఉంటుందో….,
↳ అట్టివాడు ఆత్మ జ్ఞానముచే సర్వదోషములు తొలగించుకొన్నవాడై పునరావృత్తి దోషము లేనట్టి సర్వాత్మత్వం ఆస్వాదించు స్థితికి, స్థానమునకు చేరుచున్నాడు.

05–18

విద్యావినయసంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని ।
శుని చైవ శ్వపాకే చ పణ్డితాః సమదర్శినః ॥

విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే, గవి, హస్తిని ।
శుని చ ఏవ, శ్వపాకే చ, పండితాః సమదర్శినః ॥

అట్టి కర్మసన్యాస యోగ స్థితి సంపాదించుకొని, దృశ్యమంతా స్వాత్మ స్వరూపంగా ఆస్వాదించు కర్మసన్యాసాత్మయోగి యొక్క సందర్శనము ‘సమదర్శనము’ అనే అమృతతత్వముతో కూడుకొని ఉంటుంది.

ఓ అర్జునా! నిత్యానిత్య వివేకియగు పండితుని యొక్క సందర్శనం ’సమదర్శనము’ను పుణికి పుచ్చుకుంటోంది.
(పండితుడు = one who has developed expertise in perceiving equality and oneness in everything).

ఉదాహరణకు,
👨‍🎨 విద్య - వినయము పుణికి పుచ్చుకొన్న ఒక బ్రహ్మజ్ఞాని యందు,
🐄 ఒక ఆవు యందు,
🐘 ఒక ఏనుగు యందు
🐕 ఒక కుక్క యందు,
👺 ఆ కుక్క మాంసము తినే ఒక చండాలుని యందు
↳ సమదర్శనము (ఒకే ఆత్మతత్త్వమును) సముపార్జించుకున్నవాడే నిత్యానిత్య వివేకియగు పండితుడు! అఖండాత్మను ఆతడు సర్వదా అన్నిటా అన్నీగా సందర్శిస్తున్నాడు.

05–19

ఇహైవ తైర్జితః సర్గో యేషాం సామ్యే స్థితం మనః ।
నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాద్బ్రహ్మణి తే స్థితాః ॥

ఇహ ఏవ తైః జితః సర్గో, యేషాం సామ్యే స్థితం మనః ।
నిర్దోషం హి సమం బ్రహ్మ, తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః ॥

భేద దృష్టి అనునది ఆత్మ సమాచార రాహిత్య సంబంధమైన అల్పత్వము చేతనే ఏర్పడి ఉంటోంది. అట్టి అల్పత్వము చేత ‘సర్గము’ అనే సాంసారిక దృష్టి ప్రబలుతోంది.

ఎవ్వరి మనస్సైతే…,
⤿ ‘‘సమ భావన’’ యందు సుస్థిరపడుతూ ఉన్నదో …
⤿ ‘‘సర్వము, నిర్దోషము, సమము’’ అగు బ్రహ్మమే అని సర్వత్రా సందర్శిస్తూ ఉన్నదో…
→ అట్టి మనస్సు పరబ్రహ్మమునందు క్రమంగా సుస్థిరత సముపార్జించుకొనుచున్నది.

05–20

న ప్రహృష్యేత్ప్రియం ప్రాప్య నోద్విజేత్ప్రాప్య చాప్రియమ్ ।
స్థిరబుద్ధిరసమ్మూఢో బ్రహ్మవిద్బ్రహ్మణి స్థితః ॥

న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య, న ఉద్విజేత్ ప్రాప్య చ అప్రియమ్ ।
స్థిరబుద్ధిః అసమ్మూఢో బ్రహ్మవిత్ బ్రహ్మణి స్థితః ॥

సుస్థిర బుద్ధి

అట్టి సుస్థిర బ్రాహ్మీ దృష్టిగల మననము (మనస్సు) సంపాదించుకున్నవాడు…,
…. ప్రియమైన వాటిని చూచి పొంగిపోడు.
…. అప్రియమైన వాటిని చూచి క్రుంగిపోడు.
…. మూఢత్వము లేనట్టి, సర్వమునకు ఆవల ప్రతిష్ఠితమైయున్న, సుస్థిర బుద్ధిని ప్రవృద్ధం చేసుకొని ఉంటాడు.

అట్టి బ్రహ్మవేత్త బ్రహ్మమే తానై ప్రకాశిస్తున్నాడు.

05–21

బాహ్యస్పర్శేష్వసక్తాత్మా విన్దత్యాత్మని యత్సుఖమ్ ।
స బ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే ॥

బాహ్యస్పర్శేషు అసక్తాత్మా విందతి ఆత్మని యత్ సుఖమ్ ।
స బ్రహ్మయోగయుక్తాత్మా సుఖమ్ అక్షయమ్ అశ్నుతే ॥

ఓ అర్జునా! అట్టి వాడు ‘‘బ్రహ్మయోగయుక్తాత్ముడు’’ అని పిలువబడుచున్నాడు.

అతడు బాహ్యము నుండి సమీపించే ఈ శబ్ద - స్పర్శ - రూపాది విషయాల పట్ల ఆసక్తి (Inquisitiveness, Attachment, Relatedness) అంతరంగమునందు రహితం చేసుకుంటున్నాడు.

అంతరంగమునందు అంతరంగముచే ఆత్మ సందర్శనం చేస్తూ ఆనందానుభూతిని పరిపుష్టం చేసుకుంటాడేగాని, - దృశ్యంలో ఏదో పొందాననో, పొందలేదనో, - సుఖదుఃఖ నిర్వచనాలు చేసుకోడు.

ఈ జగత్తంతా తన ఆత్మ స్వరూపంగాను, ఈ జగత్తును తన ఆత్మ యందు సందర్శిస్తూ ఉన్నట్టి బ్రహ్మయోగ యుక్తాత్మునికి సుఖం అక్షయ రూపం దాల్చుచున్నది.

05–22

యే హి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవ తే ।
ఆద్యన్తవన్తః కౌన్తేయ న తేషు రమతే బుధః ॥

యే హి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవ తే ।
ఆది-అంతవంతః, కౌంతేయ! న తేషు రమతే బుధః ॥

ఓ కౌంతేయా! ఇక్కడ (కొంత కొంత మంది దృశ్యాంతర్గతంగా తమతమ ఆశయములుగా పొంది ఉన్నట్టి) ’‘ఇంద్రియ సంస్పర్శ’’చే తారసబడే భోగములు (pleasure experiences triggered from the subjects of outer world) వాస్తవానికి, అనేక ఆదుర్దాలకు - దుఃఖాలకు కారణ భూతములు సుమా!

ఇవన్నీ దుఃఖకరములే.. ఎందుకంటావా? రథంలో ప్రయాణిస్తున్న ప్రయాణీకునికి మార్గ మధ్యంలో రహదారికి ప్రక్కగా గల వృక్షాలు - దృశ్యాలు - తదితర విశేషాలు అనుక్షణం రావటం - గతించి పోవటం జరుగుతుంది కదా! అట్లాగే ఈ జగత్‌ కూడా (జ - జనించటం : గత్‌ - గతించటం) జరుగుతూ ఉంటుంది. విజ్ఞుడైనవాడు వీటిని నమ్మి ఎట్లా ఉండగలడు? న తేషు రమతే బుధః! వివేకము కలవారు ఇట్టి అనిత్య దృశ్యపరంపరా సహిత జగత్తునందు రమించరు! మరి? మార్పు- చేర్పులు లేనట్టి ఆత్మ యందే రమిస్తారు.

05–23

శక్నోతీహైవ యః సోఢుం ప్రాక్శరీరవిమోక్షణాత్ ।
కామక్రోధోద్భవం వేగం స యుక్తః స సుఖీ నరః ॥

శక్నోతి ఇహ ఏవ యః సోఢుం ప్రాక్ శరీర విమోక్షణాత్ ।
కామక్రోధ ఉద్భవం వేగం స యుక్తః, స సుఖీ నరః ॥

కనుక అర్జునా! ఎవ్వడైతే తమయందు సమావేశమగుచున్నట్టి, కామ - క్రోధములను, దృశ్యవ్యవహార పరంపరావేశమును ఈ శరీరము నేల కూలటానికి మునుముందుగానే నిరోధించి ఉండగలుగుతాడో ……,
ఆతడే యోగి! ఆతడే సన్యాసి! ఆతడే సుఖి!

05–24

యోఽన్తఃసుఖోఽన్తరారామస్తథాన్తర్జ్యోతిరేవ యః ।
స యోగీ బ్రహ్మనిర్వాణం బ్రహ్మభూతోఽధిగచ్ఛతి ॥

యో అంతఃసుఖో, అంతర ఆరామః, తథా అంతః జ్యోతిః ఏవ యః ।
స యోగీ బ్రహ్మనిర్వాణం బ్రహ్మభూతో అధిగచ్ఛతి ॥

ఎవ్వడైతే తన అంతరాత్మయందే సుఖిస్తూ, అంతరాత్మయందే రమిస్తూ, ‘ఆత్మ’ అను అంతర్జ్యోతిని దర్శిస్తూ, అంతరమునందే ఈ దేహ - దృశ్యజగత్తును ఆస్వాదిస్తూ ఉంటాడో, ఆ యోగి బ్రహ్మతత్త్వమును, అధిరోహించి బ్రహ్మభూతుడై ప్రకాశిస్తున్నాడు.

05–25

లభన్తే బ్రహ్మనిర్వాణమృషయః క్షీణకల్మషాః ।
ఛిన్నద్వైధా యతాత్మానః సర్వభూతహితే రతాః ॥

లభంతే బ్రహ్మనిర్వాణమ్ ఋషయః క్షీణకల్మషాః ।
ఛిన్న-ద్వైధా, యత ఆత్మానః, సర్వభూతహితే రతాః ॥

అట్టి బ్రహ్మభూతుడు….,
- సర్వ సందేహములను నివృత్తి చేసుకున్నవాడై,
- బుద్ధి యొక్క దోషములను తొలగించుకొన్నవాడై,
- సర్వభూత జాలమును ఆత్మయందు, ఆత్మ స్వరూపంగా దర్శిస్తూ
… బ్రహ్మ నిర్వాణ స్థితిని ఆస్వాదిస్తున్నాడు.

05–26

కామక్రోధవియుక్తానాం యతీనాం యతచేతసామ్ ।
అభితో బ్రహ్మనిర్వాణం వర్తతే విదితాత్మనామ్ ॥

కామక్రోధ వియుక్తానాం, యతీనాం, యత చేతసామ్ ।
అభితో బ్రహ్మనిర్వాణం వర్తతే విదిత ఆత్మనామ్ ॥

సర్వ కామ - క్రోధములను తొలగించుకొన్నవాడు, చిత్తమునందలి భేద దృష్టి వ్యవహారమును జయించినవాడు, పరమాత్మ యొక్క అనన్య స్వరూపం ఎఱిగినవాడు అగు జ్ఞాని (లేక) యోగి తన చుట్టూ అంతటా అద్వితీయ బ్రహ్మమే సర్వదా, సర్వే సర్వత్రా సందర్శిస్తూ ఆస్వాదిస్తున్నాడు. తనను తాను బ్రహ్మముగానే గమనిస్తున్నాడు.

05–27

స్పర్శాన్కృత్వా బహిర్బాహ్యాంశ్చక్షుశ్చైవాన్తరే భ్రువోః ।
ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యన్తరచారిణౌ ॥

స్పర్శాన్ కృత్వా బహిః బాహ్యాన్, చక్షుః చ ఏవ అంతరే భ్రువోః ।
ప్రాణ-అపానౌ సమౌ కృత్వా నాస అభ్యంతర చారిణౌ ॥

ఎవ్వరైతే… ఈ ఈ దృశ్య సంబంధమైన బాహ్య జగత్‌ వ్యవహారములన్నీ బయటనే వదలి,
🧘🏽 తన దృష్టిని-చూపును (ధ్యాసను) అంతర్హితం చేసి, (అందరియొక్క కదలే దేహాలకు ఆధారమైన సర్వాంతర్యామియగు ఆత్మనే మననం చేస్తూ),
😔 భ్రూమధ్యంలో (త్రిపుటి అయినట్టి ద్రష్ట-దర్శన-దృశ్యముల ఏకత్వ స్థానంలో) దృష్టినంతా నిలిపి ఉంచి,
👃 నాసికయందు ఇచ్చ వచ్చినట్లు సంచరించే ప్రాణ - అపానములను సమత్వ స్థితికి తెచ్చి ఉంచి, (ప్రాణముల చేతనత్వమును గమనిస్తూ)

05–28

యతేన్ద్రియమనోబుద్ధిర్మునిర్మోక్షపరాయణః ।
విగతేచ్ఛాభయక్రోధో యః సదా ముక్త ఏవ సః ॥

యత ఇంద్రియ-మనో-బుద్ధిః, మునిః, మోక్షపరాయణః ।
విగత ఇచ్ఛా-భయ-క్రోధో, యః, సదా ముక్త ఏవ సః ॥

🧘🏿‍♂️ ఇంద్రియమనో బుద్ధులను తన అధీనంలోకి తెచ్చుకొని,
😌 జగత్‌సర్వ విషయముల పట్ల మౌనం వహించినవాడై,
🌹 కామ-క్రోధములను దరి జేరనీయనివాడై,
🙏 మోక్ష పరాయణుడై
… అటువంటి మార్గంలో సాధన-ఉపాసన-ఉపాయములను ఆశ్రయించి ఉంటాడో,
↳ అట్టి కర్మలను-సాధనలను నిర్వర్తించే యోగి ఇక, సర్వదా … సర్వత్రా ముక్తుడే!

ఆతనిని ప్రాపంచిక బంధములు ఏ మాత్రం సమీపించలేవు సుమా!

05–29

భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరమ్ ।
సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాన్తిమృచ్ఛతి ॥

భోక్తారం యజ్ఞతపసాం, సర్వలోకమహేశ్వరమ్ ।
సుహృదం సర్వభూతానాం, జ్ఞాత్వా మాం శాంతిం ఋచ్ఛతి ॥

యజ్ఞ-తపస్సుల భోక్తను నేనే!

నాయనా, అర్జునా!

సర్వ యజ్ఞ - తపస్సుల భోక్తగాను, సర్వలోకములకు కారణ కారణుడగు మహేశ్వరునిగా, సర్వ భూతముల పరిపోషణకుడిగాను - శ్రేయోభిలాషిగాను నన్ను అర్థం చేసుకుంటూ - ఆరాధించుచూ రాగా …. నీవు అట్టి పరమశాంతి స్వరూపమగు ఆత్మ సాక్షాత్కారం సముపార్జించుకోగలవు!

🕉

కనుక, సర్వకర్మ - కర్మఫలములను, సర్వ వ్యవహారములను, సంఘటనలను నాకు సమర్పించి, (తద్వారా) నా పట్ల సన్యసించినవాడవై, ప్రశాంతచిత్తుడవై సర్వదా వెలుగొందు! సర్వే - సర్వత్రా ’’స్వస్వరూపాత్మ"గా సందర్శించు. ఆస్వాదించు! సత్‌-న్యాసివై ప్రకాశించెదవు గాక!

ఇతి శ్రీమత్‌ భగవద్గీతాసు … కర్మ సంన్యాస యోగ పుష్పః ।
శ్రీ సాంబ సదాశివ పాదారవిందార్పణమస్తు ॥
🙏