భగవద్గీత

06. ఆత్మ సంయమ యోగ అధ్యయన పుష్పం

మూలము : శ్రీ వ్యాస మహర్షిచే విరచించబడిన జయము / మహాభారతము (భీష్మ పర్వము)

అధ్యయన వ్యాఖ్యానము : (అధ్యయన విద్యార్థి) యేలేశ్వరపు హనుమ రామకృష్ణ


Krishna instructing Arjuna

మూల శ్లోకము


అధ్యయన వ్యాఖ్యానము


ఉపన్యాసము

శ్రీ భగవాన్ ఉవాచ :-

06–01

అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః ।
స సంన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్నచాక్రియః ॥

అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః ।
స సంన్యాసీ చ యోగీ చ, న నిరగ్నిః న చ అక్రియః ॥

శ్రీకృష్ణ భగవానుడు :-

ఓ అర్జునా! ‘‘కర్మసన్యాసి’’, ‘‘కర్మయోగి’’ అను రెండు శబ్దాలు నాచే ఉపయోగించబడుచున్నాయి కదా! వాటి పరమార్థం ఏమిటో విను.

సన్యాసము మరియు యోగము ఒక్కతీరైనవే!

అనాశ్రితః కర్మఫలం

‘‘కర్మసన్యాసి’’
- సర్వకర్మలకు, వాటియొక్క ఫలములకు అతీతుడై ఉంటున్నవాడు. సమర్పన చేసినవాడై ఉన్నవాడు.
- ఈతడు సర్వ ఇంద్రియ వ్యవహారములను తనకు వేరుగా సమన్వయించుకొని సందర్శించువాడు. (ఇంద్రయాణి ఇంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్‌).

‘‘కర్మయోగి’’
- తనయొక్క విద్యుక్త, నియోజిత ధర్మములను (one’s own duties and functions) యోగసాధనా భావనతో నిర్వర్తిస్తున్నవాడు.
- ఈతడు తనయొక్క సర్వకర్మ సంకల్పములను పూజా పుష్పములుగా మలచి సర్వాత్మకునకు సమర్పించువాడు.

అట్టి కర్మసన్యాసి - కర్మయోగి కూడా కర్మఫలముల పట్ల అనాశ్రితులై (as unattached) ఉంటారు కదా! కనుక, కర్మఫలములను ఆశ్రయించక (being unattached to worldly eventualities and worldly results for what one is doing) ఎవ్వరు కర్మలు నిర్వర్తిస్తున్నారో…. అట్టివారే కర్మ సన్యాసులు. వారే కర్మయోగులు కూడా! అంతే కాని, తమోగుణముచే కర్మలను చేయకుండా వదిలిపెట్టినవారు కాదు!

06–02

యం సంన్యాసమితి ప్రాహుర్యోగం తం విద్ధి పాణ్డవ ।
న హ్యసంన్యస్తసఙ్కల్పో యోగీ భవతి కశ్చన ॥

యం సంన్యాసమ్ ఇతి ప్రాహుః యోగం తం విద్ధి, పాండవ! ।
న హి అసంన్యస్త సంకల్పో యోగీ భవతి కశ్చన ॥

ఎందుకంటే ‘‘ఇది కావాలి - అది పొందాలి’’ అనే సంకల్పములను త్యజించకుండా ఎవ్వడూ కర్మసంగస్థితి నుండి కర్మయోగస్థితి పొందలేడు కదా! (సిద్ధ్యసిద్ధో సమోభూత్వా సమత్వమ్‌ యోగముచ్యతే).

అనేక జీవులు అభ్యాసవశం చేతనే కర్మఫలములపట్ల ఆశ - నిరాశ - దురాశ - వేదన మొదలైనవన్నీ ప్రవృద్ధం చేసుకొనినవారై తద్వారా కర్మబద్ధులై ఉంటున్నారు. అట్టివారు సంయోగ - వియోగములకు అతీతము - నిశ్చలము అగు యోగస్థితిని ఆస్వాదించలేకపోతున్నారు. వారి మనస్సు ఎక్కడా నిలకడ కలిగి ఉండటం లేదు. చంచలమైన మనస్సు కారణంగా అట్టి జీవులకు ఎక్కడా శాంతి గాని - ఆత్మత్వముగాని అనుభూతం కావటం లేదు. అద్దానియొక్క ఛాయకూడా ఎరుకకు - అనుభవానికి రావటం లేదు.

06–03

ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే ।
యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే ॥

ఆరురుక్షోః మునేః యోగం కర్మ కారణం ఉచ్యతే ।
యోగ ఆరూఢస్య తస్య ఏవ శమః కారణమ్ ఉచ్యతే ॥

ఆరురుక్షువు - కర్మల ఆశ్రయం

అయితే ఒకానొకడు ‘‘ఓహో! నా మనస్సు - ఆలోచనలు భావాలు ఎక్కడా స్థిరత్వం పొందక అతిచంచలంగా ఉంటున్నాయి కదా! అవి చంచలత్వం త్యజించేది ఎట్లా?’’… అనే ప్రశ్నకు వస్తున్నాడు. అట్టివానిని ‘‘ఆరురుక్షువు - ముముక్షువు’’ అని పిలుస్తున్నారు.

అట్టి మననశీలుడు - విచారణపరుడు అగు ఆరురుక్షువుకు సాధన-ప్రయత్నరూపంగా ‘కర్మలు’ అనే అవకాశం సృష్టికర్త ప్రసాదిస్తున్నారు. కనుక, నిశ్చలయోగ సాధకునకు ఉపాయం - ఆతనికి నియోజితమైన, విధించబడిన కర్మలే (స్వధర్మములే) అయి ఉన్నాయి. ‘ప్రయత్నం’ యొక్క బహిర్గతరూపం కర్మయే కదా!

యోగారూఢుడు - శమము

క్రమంగా బుద్ధి నిశ్చలమై, చాంచల్యమును త్యజించగలిగిన తదుపరి, ఇక ఆతనికి కర్మల రూపమైన సాధనయొక్క ఆవశ్యకత ఉండదు. అట్టి వానికి కర్మలనుండి ఉపశమనం (శమము) ఉపాయాలుగా శాస్త్రములు ప్రవచనం చేస్తున్నాయి.

ఓ అర్జునా! ఈ విధంగా (1) కర్మల ఆశ్రయము (2) కర్మల శమము అనే రెండు విధివిధానాలు ఆరురుక్షువుకు (యోగారూఢునకు) శాస్త్రములు బోధిస్తున్నాయి. శాస్త్రములు బోధించే రెండు మార్గాలు సమన్వయించుకొని సరి అయిన రీతిలో, సరి అయిన అవగాహనతో, సందర్భానునుకూలంగా (శాస్త్రాలు ప్రతిపాదించే ఉపాయాలను) సాధకుడు ఆశ్రయించాలి.

06–04

యదా హి నేన్ద్రియార్థేషు న కర్మస్వనుషజ్జతే ।
సర్వసఙ్కల్పసంన్యాసీ యోగారూఢస్తదోచ్యతే ॥

యదా హి న ఇంద్రియార్థేషు న కర్మసు అనుషజ్జతే ।
సర్వసంకల్పసంన్యాసీ యోగారూఢః తదా ఉచ్యతే ॥

యోగారూఢుడు : యోగసాధకునికి తనకు నియమించబడిన కర్మలే (స్వధర్మములే) సాధనోపాయములని చెప్పుకున్నాం కదా! యోగస్థితికి చేరినట్టి యోగారూఢునికి కర్మలనుండి ఉపశమనము ఉపాయమై ఉన్నదని కూడా అనుకున్నాం!

ఇప్పుడు యోగారూఢుని గురించి మరికొంత నిర్వచిస్తున్నాను. విను.

ఎప్పుడైతే ఒకని యొక్క బుద్ధి (Logic) శబ్ద-స్పర్శ-రూప-రస-గంధములనబడే ఇంద్రియార్థములందుగాని, వాటియొక్క ఉపకరణములైనట్టి ఇంద్రియములందుగాని, ప్రాపంచిక సర్వదృశ్య విషయములందుగాని తన్మయం కాకుండా, వాటినుండి వేరైన స్థితిని ఆస్వాదిస్తూ ఉంటుందో… అట్టివాడు ‘యోగారూఢుడు’… అని చెప్పబడుచున్నాడు.

06–05

ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ।
ఆత్మైవ హ్యాత్మనో బన్ధురాత్మైవ రిపురాత్మనః ॥

ఉద్ధరేత్ ఆత్మనా ఆత్మానం, న ఆత్మానమ్ అవసాదయేత్ ।
ఆత్మ ఏవ హి ఆత్మనో బంధుః, ఆత్మ ఏవ రిపుః ఆత్మనః ॥

ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి!

కర్మయోగము, కర్మసన్యాసము … ఈ రెండిటిలో ఏది ఆశ్రయించినప్పటికీ ఏది ఎట్లైనా….. ఆయా మార్గములలో నిన్ను నీవు ఉద్ధరించుకోవటం ముఖ్యం.

ఓ పార్థా!

➤ ప్రాపంచక సంఘటనలతో తన్మయమైన నీ మనో-బుద్ధులను సరి అయిన అవగాహనతో ఆయా ప్రాపంచిక విషయములనుండి విడదీసి, నిన్ను నీవు ఆత్మసాక్షాత్కార స్థితికి తరలించాలి.

➤ ఈ జగత్తు - శాస్త్రములు - గురువులు అందుకు నీకు సహకరించగల ఉపకరణములవంటివి మాత్రమే! పరీక్ష వ్రాసేది విద్యార్థిగాని, ఉపాధ్యాయుడు కాదు కదా! సహకారి కారణము అగు ఉపకరణమును ఎట్లా ఉపయోగించుకోవాలో… నీకు నీవే గ్రహించి… తద్వారా నిన్ను నీవే సముద్ధరించుకోవాలి సుమా! అంతేగాని అల్ప - స్వల్పకాలిక - స్వప్నపూర్వక జగత్‌ విషయములచే తన్మయుడవై, భ్రమలను ప్రవృద్ధపరచుకొని నిన్ను నీవు అల్పస్థితి - గతులకు ఈడ్చుకోకూడదు.

➤ నీకు శ్రద్ధ లేకపోతే శాస్త్రములు, గురువులు ఏమి చేయగలరు చెప్పు! “నా శ్రద్ధ అల్లరి-చిల్లర వ్యవహారములపైనే కొనసాగుతుంది. నాకు విద్య వచ్చేటట్లు గురువే చేయాలి!” అని అంటే గురువు ఏమి చేయగలడు?

➤ ప్రాపంచక సంకల్పములకు అతీతమైన ఆత్మోన్నత స్థితిని సుస్థిర పరచుకోవటమే జీవితాశయం కావాలి. అప్పుడు మాత్రమే గురువు, శాస్త్రములు నీకు దారి చూపగలుగుతాయి.

06–06

బన్ధురాత్మాత్మనస్తస్య యేనాత్మైవాత్మనా జితః ।
అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్ ॥

బంధుః ఆత్మా ఆత్మనః తస్య యేన ఆత్మ ఏవ ఆత్మనా జితః ।
అనాత్మనః తు శత్రుత్వే వర్తేత ఆత్మ ఏవ శత్రువత్ ॥

బంధువు

శ్రద్ధచే : నీ విచక్షణయే - నీ మనస్సే సాధనా మార్గంలో నీకు ఉపకరించి, నిన్ను జగత్తును అధిగమింపజేసి, జగత్తులకు ఆధారభూత స్వరూపమగు ఆత్మను స్ఫురింపజేయగల బంధువు, మిత్రుడు, శ్రేయోభిలాషి!

శత్రువు

అశ్రద్ధచే : ఆ నీ విచక్షణ-మనస్సులే (బుద్ధి-మనస్సులే) నిన్ను ప్రాపంచక - ఇంద్రియ విషయములవైపు, సంఘటనలవైపు నడిపించి నిన్ను వాటిచే నిబద్ధుని చేయగల శత్రువులు కూడా!

06–07

జితాత్మనః ప్రశాన్తస్య పరమాత్మా సమాహితః ।
శీతోష్ణసుఖదుఃఖేషు తథా మానాపమానయోః ॥

జిత ఆత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః ।
శీత-ఉష్ణ-సుఖ-దుఃఖేషు తథా మాన-అవమానయోః ॥

మరొక్కసారి విను!

ఎవ్వరి బుద్ధి (లేక) తెలివి (లేక, మనో-బుద్ధులు) దృశ్య సంఘటనలను విచక్షణ - విశ్లేషణలతో జయించే సానుకూల్యతకు సహకరించగలదో…. అది వారికి శ్రేయోభిలాషి, బంధువు.

ఎప్పుడెప్పుడు నీయొక్క నీ బుద్ధి (తెలివితేటలు) ఆత్మజ్ఞానమును వదలి ప్రాపంచక విషయములవైపుగా నిన్ను నెట్టుకుంటూ పోతున్నాయో …. అవి నీకు శత్రువుగా పరిణమిస్తున్నాయని గ్రహించు. అనగా, అవి నిన్ను నిమ్నగతులవైపుగా అధోస్థితులకు కూడా కొనిపోగలవు.

కనుక, ఇప్పుడు నీవు నీ బుద్ధికి పదునుపెట్టి, నీ సమున్నతికి అది నీకు సహకరించేటట్లుగా తీర్చిదిద్దుకో!
సంయోగ - వియోగములచే స్పర్శించబడని యోగస్థితిని సముపార్జించుకో!

06–08

జ్ఞానవిజ్ఞానతృప్తాత్మా కూటస్థో విజితేన్ద్రియః ।
యుక్త ఇత్యుచ్యతే యోగీ సమలోష్టాశ్మకాఞ్చనః ॥

జ్ఞాన విజ్ఞాన తృప్త ఆత్మా, కూటస్థో, విజితేంద్రియః ।
యుక్త ఇతి ఉచ్యతే యోగీ సమ లోష్ట అశ్మ కాంచనః ॥

యోగస్థితుని లక్షణాలు

అసంతృప్తులను అధిగమించినవాడు :
↳ యోగి ’‘జ్ఞానము (Theoretical Aspects), విజ్ఞానము (Practical Aspects)’’లను సముపార్జించుకొని సర్వ ప్రాపంచక అసంతృప్తులను స్వభావతః జయించివేసి…… తృప్తాత్ముడై ఉంటాడు.

కూటస్థుడు (అచలితుడు, సుస్థిరుడు-తిరగలి మధ్య గల తిరగని పిడివలె), సర్వమును తనయందే దర్శించువాడు :
↳ ఈ జగత్తునంతా తనకు అభిన్నమైన స్వరూపంగా దర్శిస్తూ ఉంటాడు. తనయందు సర్వరూపములను, తన స్వరూపమునందే సర్వజగత్తును సందర్శిస్తూ ఆస్వాదిస్తూ ఉంటాడు. కూటస్థుడై ఉంటాడు. తాను కదలక, సర్వము తనయందు కలిగి ఉన్నవాడై ఉంటాడు.

జితేంద్రియుడు :
↳ ఇంద్రియ - మనో - బుద్ధులను అధిగమించిన దృష్టితో ఈ ఇంద్రియములకు తాను సేవకుడుగా కాక,…. ఇంద్రియములన్నీ తన సేవకులుగా తీర్చుకొని ఉంటాడు. విజితీంద్రియుడై ఉంటాడు.

యుక్తుడు :
↳ ఎల్లవేళలా ప్రయత్నశీలుడై యోగస్థితిని ఆశ్రయించి, సంయోగ - వియోగములను అధిగమించుచున్నవాడై ఉంటాడు.

సమదృష్టి :
↳ ఆతని దృష్టికి మట్టి - రాయి - బంగారము ఒకేతీరుగా కనిపిస్తాయి. ఆతడు సర్వ ఆకర్షణ - వికర్షణలు అధిగమించినవాడై ఉంటాడు.

06–09

సుహృన్మిత్రార్యుదాసీనమధ్యస్థద్వేష్యబన్ధుషు ।
సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే ॥

సుహృత్ మిత్ర అరి ఉదాసీన మధ్యస్థ ద్వేష్య బంధుషు ।
సాధుషు అపి చ పాపేషు సమబుద్ధిః విశిష్యతే ॥

సమబుద్ధి :
↳ తనయొక్క బుద్ధిబలంచేత ఎవ్వరికైతే తన యొక్క 1.) శ్రేయోభిలాషి 2.) స్నేహితుడు 3.) శత్రువు 4.) కేవల పరిచితులు 5.) ద్వేషించేవారు 6.) సంబంధీకులు 7.) సాధువులు 8.) పాపులు … వీరందరూ ‘‘మమాత్మస్వరూపులే’‘గా అనుభూతమౌతారో, వారివారియందు బాహ్యానికి కనిపించే భేదమంతా స్వప్న మాత్రంగాను - కల్పిత మాత్రంగాను అవగాహన కలిగి ఉంటాడో,…. అట్టి పరమబుద్ధిని పొందిన సిద్ధయోగి తదితర తరగతుల యోగులకంటే పరమోన్నతుడు.


అయితే, అటువంటి సర్వసమదర్శన పూర్వకమగు ఆత్మదృష్టిని, జగదతీత దృష్టిని నీయొక్క మనో - బుద్ధులకు సముపార్జించుకోవటం ఎట్లా? ’‘ఇదంతా నా ఆత్మ స్వరూపమే’’ అను అనుభూతి కలిగి ఉండటమే ఆత్మదృష్టి, లేక బ్రాహ్మీస్థితి కదా! అటువంటి బ్రాహ్మీస్థితి ఆస్వాదించాలంటే …,
↳ ముందుగా ప్రాపంచక దృష్టున్నీ క్రమక్రమంగా ఉపశమించాలి.
↳ సహజీవులను చూస్తూ ఉన్నప్పుడు సందర్భ పరిమితమగు నామ-రూప-గుణములను అధిగమించివేసిన ఆత్మావగాహన స్థితి - ఆత్మ సందర్శన స్థితి క్రమంగా సుస్థీకరించుకోవాలి.

Krishna in meditation

మూల శ్లోకము


అధ్యయన వ్యాఖ్యానము


ఉపన్యాసము

శ్రీ భగవాన్ ఉవాచ :-

06–10

యోగీ యుఞ్జీత సతతమాత్మానం రహసి స్థితః ।
ఏకాకీ యతచిత్తాత్మా నిరాశీరపరిగ్రహః ॥

యోగీ యుంజీత సతతమ్ ఆత్మానం రహసి స్థితః ।
ఏకాకీ యతచిత్తాత్మా నిరాశీః అపరిగ్రహః ॥

ధ్యానయోగ సంసిద్ధత

ఓ అర్జునా! ‘ధ్యానము’ అనే అభ్యాసము నీకు నీవు బుద్ధి చాంచల్యమును తొలగించుకొని, బుద్ధి నిశ్చల - నిశ్చయస్థితిని సంపాదించుకోవటానికి ఉపకరించగలదు. అట్టి ధ్యానయోగం అభ్యసించేది ఎట్లాగో ఇప్పుడు చెప్పుచున్నాను. విను.

ధ్యాన యోగసాధనకు ఉపక్రమించేవాడు (శ్లేష్మముపై ఈగవలె) ఆయా దృశ్య విషయములపై వ్రాలుచున్న తన చిత్తమును (లేక మనో బుద్ధులను) మును ముందుగా కొంచం కొంచెం ఉపశమింపజేస్తున్నాడు. వాటికి ఏకాంతము, నిర్విషయత్వము అభ్యసింపజేస్తున్నాడు.

విషయములతో సమావేశములను క్రమమ్రంగా దూరీకరిస్తూ ‘ఏకాకి’ అయి ‘నేను పరమాత్మమయ దృశ్య జగత్తు (All that is experienced by me including myself is a manifestation of Divinity)’ అను స్థితిని సుస్థిరీకుంచుకుంటూ ఉంటాడు.

మనస్సును మెట్టు మెట్టుగా వశం చేసుకోనారంభిస్తాడు. ‘‘ఏదో కావాలి - ఇంకేదో పొందాలి’’ ఇటువంటి దృశ్య జగత్‌ సంబంధమైన ‘ఆశించే స్వభావం’ పరిత్యజిస్తూ వస్తాడు. దృశ్య సంబంధంగా ఇక్కడ దేనినీ లోనికి స్వీకరించనివాడై ఉంటాడు.

నీళ్లలో పడవ ఉండవచ్చు గాక! పడవలోకి నీళ్లు ప్రవేసిస్తాయా? లేదు కదా! ప్రపంచంలో ఉంటూనే ప్రపంచమును - అద్దాని సంబంధ - సంఘటనా స్రవంతి హృదయంలో ప్రవేశించనీయడు. ఇటువంటి జగత్‌ అప్రమేయత్వం ఒకవైపు అభ్యసిస్తూ, ఇక మరొకవైపు ధ్యానయోగసాధనకు ఉపక్రమించ సాగుచున్నాడు.

06–11

శుచౌ దేశే ప్రతిష్ఠాప్య స్థిరమాసనమాత్మనః ।
నాత్యుచ్ఛ్రితం నాతినీచం చైలాజినకుశోత్తరమ్ ॥

శుచౌ దేశే ప్రతిష్ఠాప్య స్థిరమ్ ఆసనమ్ ఆత్మనః ।
న అతి ఉత్ శ్రితం, న అతి నీచం, చైల అజిన కుశోత్తరమ్ ॥

ధ్యానయోగం

ఇప్పుడు ధ్యానయోగం సంబంధించి కొన్ని విషయాలు ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. విను.

‘ధ్యానము’నకు ప్రారంభంలో రెండు ముఖ్యమైన అంగములు ఉన్నాయి.
(1) శుచి అయిన ప్రదేశం (A clean place with serenity)
(2) స్థిరమైన ఆసనం (A posture comfortable to oneself and that keeps one physically unmoved)

చోటు - ప్రదేశము (Place) :-

- ముందుగా మనస్సును సంసిద్ధం చేయాలి. ’‘నేను సంసిద్ధమగుచున్న ఈ ధ్యానయోగ ధారణ అత్యంత ప్రాముఖ్యమైనది. ఉత్కృష్టమైనది. అతి పవిత్రమైనది నన్ను తప్పక సముద్ధరించగలదు…’’ అని అనిపించాలి కదా!
- పవిత్రమైన మననమునకు అనుకూలమై, ధ్యానమునకు ఉపక్రమించే చోటు శుచిగాను, సాత్వికమైన భావాలు ప్రోత్సహించేదిగాను, దీర్ఘకాల ధ్యానానికి అనువుగాను ఉండాలి.
- అందుకు గురువుల యొక్క, ఇష్టదైవము యొక్క పటములు (photos) వంటి అలంకరణ పఠాలంకరణ మొదలగునవి సహకరించగల విశేషాలు.

అటు తరువాత ఇక ఆసనం ఈ దేహమునకు స్థిరత్వాన్ని అందించగల సానుకూల్యత కలిగి ఉండాలి.

కూర్చునే విధానం - స్థిరాసనం (Sitting Posture) :-

- ఏ ప్రదేశంలో ధ్యానానికి ఉపక్రమిస్తావో.. ఆ చోట దర్భపరచి, ఆపై మృగచర్మం / వస్త్రము పరచుకోవాలి.
- ఆ స్థానం మరీ ఎత్తుగాను, మరీ పల్లముగాను కాకుండా చూచుకోవాలి.
- ఆ ఆసనముపై ఆసీనుడవై ఇక మనస్సును అభ్యాసపూర్వకంగా ఏకాగ్రం చేయాలి.

06–12

తత్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేన్ద్రియక్రియః ।
ఉపవిశ్యాసనే యుఞ్జ్యాద్యోగమాత్మవిశుద్ధయే ॥

తత్ర ఏకాగ్రం మనః కృత్వా, యత చిత్త ఇంద్రియ క్రియః ।
ఉపవిశ్య ఆసనే యుంజ్యాత్ యోగమ్ ఆత్మవిశుద్ధయే ॥

మామూలుగా మనస్సు పరి పరి విధాల పరుగులు తీస్తూ ఉండటం, ఒక విషయం నుండి మరొక విషయం ఆశ్రయిస్తూ ఉండటం జరుగుతూ ఉంటుంది కదా! ఇప్పుడు అది ఎక్కడో… ఒక్కచోట.. ఏకాగ్రత్వం (constancy at one point) సంపాదించుకోవాలి.

అందుకుగాను ముందుగా ఎవరికివారికి తమను సుదీర్ఘకాలం నిశ్చలంగా ఉండటానికి సానుకూల్యమయ్యే ‘‘స్థిరాసనం’‘తో అభ్యాసం చేయాలి. (శరీరానికి కలిగే ఒరిపిడి - వ్యానవాయు అవిరోధ ప్రసరణల, శారీరక పరిస్థితుల దృష్ట్యా ఒక్కొక్క దేహానికి ఒక్కొక్క ఆసనం సానుకూల్యం అవుతుంది).

శుచి అయిన స్థలంలో అట్టి స్థిరాసనంతో ఆసీనుడై చిత్తము - ఇంద్రియముల చేష్టలను తన వశం చేసుకోవాలి. మనస్సును ఏకైక లక్ష్యంవైపుగా నియమిస్తూ ఉండాలి. అందుకుగాను యోగమును అభ్యసించాలి. యోగము యొక్క ఆశయము ’‘అంతఃకరణమును శుద్ధి పరచుకోవటం’’ … అని గమనించబడు గాక!

06–13

సమం కాయశిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః ।
సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్ ॥

సమం కాయ శిరో గ్రీవం, ధారయన్ అచలం స్థిరః ।
సంప్రేక్ష్య నాసిక అగ్రం స్వం, దిశః చ అనవలోకయన్ ॥

యోగోపాసన చేస్తూ ఉన్నప్పుడు దేహమును - శిరమును - కంఠమును సమానంగాను, నిఠారుగాను, కదలికలు లేకుండాను ధారణ చేయాలి.

చూపును తనయొక్క ముక్కుయొక్క ఉపరితలంపై (గాలి ముక్కులోనికి ప్రవేశించే స్థానములో) నిలపాలి.

దృష్టి ఆ దిక్కు - ఈ దిక్కూ పోకుండా నాసికకు అగ్రభాగంపై నిలపాలి.

06–14

ప్రశాన్తాత్మా విగతభీర్బ్రహ్మచారివ్రతే స్థితః ।
మనః సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః ॥

ప్రశాంత ఆత్మా, విగతభీః, బ్రహ్మచారివ్రతే స్థితః ।
మనః సంయమ్య, మత్ చిత్తో, యుక్త ఆసీత మత్ పరః ॥

వచ్చే ఆలోచనలనన్నిటినీ దృశ్య సంబంధమైన విషయముల నుండి క్రమంగా మరల్చాలి.

బ్రహ్మచర్య వ్రతంతో పవిత్రం చేయాలి. అనగా, జ్ఞాపకానికి వస్తున్న సర్వ రూప-నామ-దృశ్యాదులన్నీ ‘‘అంతా బ్రహ్మమే కదా!’’ అనే మననమునందు పవిత్రం చేయాలి. అట్టివాడే బ్రహ్మచర్యవ్రతుడు.

ఆశించే, వేదనచెందే, అనుమానించే, భయపడే, స్వభావములను క్రమక్రమంగా వర్జిస్తూ అంతరంగమును ప్రశాంతమయం చేసుకుంటూ యోగ సాధనను కొనసాగించాలి.

మనస్సుయొక్క చాంచల్యమును క్రమంగా నిరోధిస్తూ మనస్సును హృదయమునందే నిలిపి ఉంచి సర్వాంతర్యామి, సర్వతత్త్వ స్వరూపుడు అగు పరమాత్మను ఉపాసించాలి.

06–15

యుఞ్జన్నేవం సదాత్మానం యోగీ నియతమానసః ।
శాన్తిం నిర్వాణపరమాం మత్సంస్థామధిగచ్ఛతి ॥

యుంజన్ ఏవం సదా ఆత్మానం యోగీ నియత మానసః ।
శాంతిం, నిర్వాణ పరమాం, మత్ సంస్థాం అధిగచ్ఛతి ॥

అంతే కాదయ్యా! జాగరూకతతో మరపు - నిద్ర - మత్తు దరిజేరకుండా, శ్రద్ధ - ఉత్సాహములను పరిపోషించుకుంటూ యోగమును అభ్యసించాలి సుమా!

మనస్సును సర్వతత్త్వ స్వరూపుడనగు నా యందే నిలిపి, నన్నే పారాయణం చేస్తూ యోగసాధన కొనసాగించాలి.

ఈ ప్రకారంగా మనస్సును వశంచేసుకొని, సర్వాత్మకుడనగు నన్నే ఉద్దేశ్యిస్తూ, చిత్తమును నా యందే లగ్నం చేస్తూ యోగమును అభ్యసిస్తూ ఉండగా, క్రమంగా అట్టి యోగి అభ్యాసపరంగా, పరమశాంత స్థానమగు నిర్వాణ స్థితిని సంపాదించుకుంటున్నాడు.

06–16

నాత్యశ్నతస్తు యోగోఽస్తి న చైకాన్తమనశ్నతః ।
న చాతిస్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున ॥

న అతి అశ్నతః తు యోగో అస్తి, న చ ఏకాంతమ్ అనశ్నతః ।
న చ అతి స్వప్నశీలస్య, (అతి) జాగ్రతో న ఏవ చ, అర్జున! ॥

‘యోగసాధన’ కొనసాగటానికి వీలుగా యోగసాధకులకు సానుకూల్యం కాగల కొన్ని సూచనలు చెప్పుచున్నాను. విను.

ఆహారం : అతిగా గాని, అల్పంగా గాని కాకూడదు. ఆహారం యుక్తంగా (తగినంత మాత్రమే) వుంటేనే యోగ సాధన సులభం.

ఇంద్రియ విషయాలు : ఇంద్రియవిషయాలు అతిగా ఆశ్రయించేవారికి యోగస్థితి పొందటం కష్టతరం. అట్లాగే ఇంద్రియాలు మరీ ఉపయోగించకపోతే కూడా యోగసాధన కుదరదు. మనసు అలసత్వం ఆశ్రయించి ధృతి - ఉత్సాహములను కోల్పోతాయి!

జాగ్రత్‌ - నిద్ర : అతిగా నిద్రను ఆశ్రయించేవానికి మనస్సు మందగించటంచేత యోగసాధనకు తగినంతగా సానుకూలం కాదు. అట్లాగే ‘నిద్ర లేమి’ అత్యధికమైతే కూడా చిత్తము హృదయంలో ఏకాగ్రత్వం సంతరించుకోజాలదు.

06–17

యుక్తాహారవిహారస్య యుక్తచేష్టస్య కర్మసు ।
యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖహా ॥

యుక్త ఆహార విహారస్య, యుక్త చేష్టస్య కర్మసు ।
యుక్త స్వప్న అవబోధస్య, యోగో భవతి దుఃఖహా ॥

ఆహారము - విహారము - కర్మలు - చేష్టలు - నిద్ర - మెలుకువ అతిగాగాని, అల్పంగాగాని కాకుండా, యుక్తంగా ఉండేటట్లు చూచుకోవాలి. అప్పుడు యోగసాధన కుంటుపడకుండా కొనసాగగలదు.

06–18

యదా వినియతం చిత్తమాత్మన్యేవావతిష్ఠతే ।
నిఃస్పృహః సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా ॥

యదా వినియతం చిత్తమ్ ఆత్మన్య ఏవ అవతిష్ఠతే ।
నిఃస్పృహః సర్వకామేభ్యో, యుక్త ఇతి ఉచ్యతే తదా ॥

యోగస్థితి / యోగస్థానం

యోగసాధన కొనసాగిస్తున్న యోగోపాసకుడు ఒకానొక మహత్తరమగు యోగ స్థానమును సముపార్జించుకుంటున్నాడు.

ఆతని చిత్తము యోగాభ్యాసఫలితంగా తనకు వశమై ఉంటుంది.

దృశ్యమును - దృశ్యాంతర్గతమగు సర్వజీవులను స్వస్వరూప పరమాత్మతత్వంగా, పరమాత్మ స్వరూపంగా అనుక్షణికంగా సందర్శించటంలో సుస్థిరత్వం సముపార్జించుకొంటోంది.

‘‘ఏదో పొందాలి. అప్పటికిగాని ఆత్మీస్థితి సంపాదించ వీలుకాదు’’…. అనే భ్రమ - విభ్రమములు తొలగుతాయి.

అట్టివాడు ’ఆత్మయోగి’గా చెప్పబడుచున్నాడు.

06–19

యథా దీపో నివాతస్థో నేఙ్గతే సోపమా స్మృతా ।
యోగినో యతచిత్తస్య యుఞ్జతో యోగమాత్మనః ॥

యథా దీపో నివాతస్థో, న ఇంగతే సా ఉపమా స్మృతా ।
యోగినో యతచిత్తస్య యుంజతో యోగమ్ ఆత్మనః ॥

నేను ఆత్మస్వరూపుడను. ఇదంతా ఆత్మస్వరూపమే!

‘‘సర్వము పరమాత్మ స్వరూపమేకదా, నాతో సహాఁ!’’… అను ఒకానొక నిశ్చలతత్వానికి ఆతడు చేరుచున్నాడు.

గాలి వీచని చోట దీపం ఎట్లా ఉంటుంది? నిశ్చలంగా - ఏకరీతిగా ప్రకాశిస్తూ ఉంటుంది కదా! ‘‘ఇది వేరు - వారువేరు - నాది - ఇది గొప్ప - అది కాదు’’ ఇటువంటి భేద భావనలు త్యజించి యోగి యొక్క చిత్తము పరమాత్మ ఏక భావనచే నిశ్చలమగుచున్నది.

యోగి తన చిత్తమును స్వాధీనపరచుకొని స్వయమాత్మ స్వరూపి అయి ప్రకాశిస్తున్నాడు.

యోగసాధన కొనసాగుచుండగా,… ఆ యోగి దృశ్యమును స్వస్వరూపానంద స్వరూపంగా సందర్శించుచున్నాడు.

యోగస్థితి సంపాదించిన యోగి సంయోగముకు (Getting or Acquiring), వియోగముకు (Losing or Missing) అతీతస్థితితో కూడిన నిశ్చలస్థితిని స్వానుభవంగా స్వభావసిద్ధం చేసుకుంటున్నాడు.

06–20

యత్రోపరమతే చిత్తం నిరుద్ధం యోగసేవయా ।
యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి ॥

యత్ర ఉపరమతే చిత్తం నిరుద్ధం యోగసేవయా ।
యత్ర చ ఏవ ఆత్మనా ఆత్మానం పశ్యన్ ఆత్మని తుష్యతి ॥

యోగస్థితి లక్షణాలు

అట్టి నిశ్చలానందముతోకూడిన ఆత్మసందర్శన స్థితికి చేరిన యోగి యొక్క విశేషణాలు చెప్పుచున్నాను. విను.

ఏ దశలో (లేక) స్థితియందైతే…,

🌺 చిత్తము యోగసాధనా క్రమంగా ఉపశాంతి పొందినదై చాంచల్యమును మొదలంట్లా త్యజిస్తూ వస్తోందో…,

🌺 ఆతడు ఆత్మచే ఆత్మను సందర్శనం చేస్తూ - ఆత్మచేత సంతృప్తి పొందుచున్నవాడై ఉంటున్నాడో…,

🌺 ఆత్మ స్వరూపము సర్వదా నాకు అభిన్నంగా నన్ను వెన్నంటియే ఉండినది కదా… అను తృప్తిని బుద్ధి తనకుతానై పెంపొందించుకొని ఉంటుందో…

06–21

సుఖమాత్యన్తికం యత్తద్బుద్ధిగ్రాహ్యమతీన్ద్రియమ్ ।
వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్త్వతః ॥

సుఖమ్ ఆత్యంతికం యత్ తత్ బుద్ధిగ్రాహ్యమ్ అతీంద్రియమ్ ।
వేత్తి యత్ర న చ ఏవ అయం స్థితః చలతి తత్త్వతః ॥

🌺 అతని బుద్ధి ఇక్కడి ఇంద్రియములను - ఇంద్రియ విషయములను దాటివేసి, ఆయా విషయములకు సంబంధించని ఆత్మానందమును పొందినదై అహేతుక ఆనందమును ఆస్వాదిస్తూ ఉంటుందో…,

🌺 ఏ స్థితిలో ఆ యోగి పరమాత్మ స్వరూపమునుండి కించిత్‌ కూడా విచలితుడు కాడో…, (జగత్తును జగదీశ్వర ప్రదర్శనంగా చూడటంలో విచలితము కాదో…)

🌺 ఏ దశ లభించిన తరువాత, ఇక అంతకుమించి మరింకేదో - ఎన్నటికో - ఎప్పటికో - ఎచ్చటనో పొందవలసినదంటూ ఏదీ మిగిలియున్నదేమో అనే భావన ఏమాత్రమూ శేషించదో…..,

06–22

యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః ।
యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే ॥

యం లబ్ధ్వా చ అపరం లాభం మన్యతే న అధికం తతః ।
యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణా అపి విచాల్యతే ॥

🌺 ఏ స్థితిలోఅయితే ఈ ప్రాపంచికంగా కనిపించే దుఃఖములు (worries) ఏమాత్రం దరిజేరలేవో… బాధించలేవో, సమీపించనేలేవో…,

↳ అట్టి స్థితికి యోగసాధకుడు స్వభావసిద్ధంగా జేరుచున్నాడు.

06–23

తం విద్యాద్దుఃఖసంయోగవియోగం యోగసంజ్ఞితమ్ ।
స నిశ్చయేన యోక్తవ్యో యోగోఽనిర్విణ్ణచేతసా ॥

తం విద్యాత్ దుఃఖసంయోగవియోగం యోగసంజ్ఞితమ్ ।
స నిశ్చయేన యోక్తవ్యో యోగో అనిర్విణ్ణచేతసా ॥

అట్టి మార్గమే ‘యోగసాధనం’. సుఖ - దుఃఖ, సంయోగ - వియోగములచే స్పృశించబడజాలని అట్టి “సర్వాతీత - కేవలసాక్షి - అహమేవ ఇదమ్‌ సర్వమ్‌” స్థితిని యోగాభ్యాసం చేత ‘యోగి’ సుస్థిరీకరించుకుంటూ అనునిత్యంగా ఆస్వాదిస్తున్నాడు.

06–24

సఙ్కల్పప్రభవాన్కామాంస్త్యక్త్వా సర్వానశేషతః ।
మనసైవేన్ద్రియగ్రామం వినియమ్య సమన్తతః ॥

సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ అశేషతః ।
మనసా ఏవ ఇంద్రియగ్రామం వినియమ్య సమంతః ॥

అసలు, ‘నిర్మలము - నిత్యము - సత్యము - అప్రమేయము - సర్వము’… అగు ఆత్మయే స్వరూపముగా గల ఈ జీవునికి బంధం ఎక్కడినుండి వస్తోంది? నేను దృశ్యములోనివాడిని - దృశ్యమునకు సంబంధించినవాడిని - అను దృశ్యసంపర్కము చేతనే కదా!

అయితే ఆత్మస్వరూపమును ఏమరచటానికి, దృశ్యతాదాప్యముచే అనేక జన్మ - కర్మ - దుఃఖ పరంపరలచే నిబద్ధుడు అవటానికి ఎవరు కారణం? బాహ్యం నుండి ఎవ్వరైనా బంధం కల్పిస్తున్నారా? లేనేలేదు. తనయొక్క దృశ్యమునకు సంబంధించిన ఆలోచనలే కదా!

ఆలోచనలు ఎవరివి? తనవే కదా! తన నుండి బయల్వెడలుచున్నట్టి ఆలోచనలచే తనే నిబద్ధుడవటం ఎంత హస్యాస్పదం? కానీ, ఇక్కడ జరుగుచున్నది అదే సుమా!

ఈ జీవుడు తన సంకల్పముల నుండి తానే ఆశ - నిరాశ - దురాశ - పేరాశ - మొదలైనవి ఆశ్రయించటం, హుతాసుడవటం… ఇవన్నీ జరుగుతోంది.

ఇక యోగియో?
తన సంకల్పముల నుండియే కామములు (Desires, Expectations, Wishes, etc.,) బయల్వెడలుచున్నాయని గమనిస్తున్నాడు. తన సంకల్పములనుండి - అగ్నినుండి పొగవల - బయల్వెడలుచున్న సర్వ కామములను మొదలంట్లా నిశ్శేషంగా త్యజించినవాడై ఉంటున్నాడు. ఆతడు దీర్ఘకాలంగా నిర్వర్తించిన యోగాభ్యాసముతో సుతీక్ష్ణమైన బుద్ధిబలం సంపాదిస్తున్నాడు. అట్టి బుద్ధి కుశలతతో మనస్సు, ఇంద్రియములను - వాటి వాటి విషయములను చక్కగా నిరోధించినవాడగుచున్నాడు. ఇంద్రియములను తన ఆజ్ఞావర్తులుగా తీర్చిదిద్దుకుంటున్నాడు. (Yogi organises his sense organs. He is not organised by them).

06–25

శనైః శనైరుపరమేద్బుద్ధ్యా ధృతిగృహీతయా ।
ఆత్మసంస్థం మనః కృత్వా న కిఞ్చిదపి చిన్తయేత్ ॥

శనైః శనైః ఉపరమేత్ బుద్ధ్యా ధృతిగృహీతయా ।
ఆత్మసంస్థం మనః కృత్వా న కించిత్ అపి చింతయేత్ ॥

అందుచేత అర్జునా! ఈ ఇంద్రియాలు, వాటివాటి విషయ సముదాయాలు అభ్యాస వశంగా బలవత్తరమై ఉంటాయి కదా! ఇప్పుడు నీ బుద్ధిని ప్రేరేపించాలి. ఉత్సాహపరచాలి.

ధైర్య - సాహసాలతో కూడిన బుద్ధితో నీ చిత్తము ఎక్కడెక్కడ ఆత్మదృష్టిని కోల్పోవుచున్నదో సునిశితంగా పరిశీలించాలి. గమనించాలి.

నెమ్మది - నెమ్మదిగా, ‘‘ఇది నా ఆత్మ స్వరూపమే కదా!’’… అను మననాన్ని ప్రవృద్ధం చేయాలి. తద్వ్యతిరిక్తమైన భావావేశమును ఉపశమింప జేసుకోవాలి.

మనస్సును ఆత్మయందు సంస్థాపింపజేయాలి. ‘‘మనస్సుకు తోచుచున్నదంతా ఆత్మస్వరూపమే’’ అనే రసముతో మనస్సును నింపివేయాలి. ఇక మరి దేనికొరకూ - దేనిగురించీ విచారించనేవద్దు. (Leave all worries for whatever it is, and about whatever it is!).

06–26

యతో యతో నిశ్చరతి మనశ్చఞ్చలమస్థిరమ్ ।
తతస్తతో నియమ్యైతదాత్మన్యేవ వశం నయేత్ ॥

యతో యతో నిశ్చరతి మనః చంచలమ్ అస్థిరమ్ ।
తతః తతో నియమ్య ఏతత్ ఆత్మని ఏవ వశం నయేత్ ॥

ఎక్కడెక్కడ ఏదేది ఆత్మ స్వరూపంగా (As form of one’s own self) అనిపించక ఈ మనస్సు చంచలము - అస్థిరము పొందుతోందో … అక్కడక్కడ మనస్సును అభ్యాసయుక్తంగా చేస్తూ అనునయంగా (in a positive way) ఆత్మమయం చేసివేయాలి.

06–27

ప్రశాన్తమనసం హ్యేనం యోగినం సుఖముత్తమమ్ ।
ఉపైతి శాన్తరజసం బ్రహ్మభూతమకల్మషమ్ ॥

ప్రశాంత మనసం హి ఏనం యోగినం సుఖమ్ ఉత్తమమ్ ।
ఉప ఏతి శాంతరజసం బ్రహ్మభూతమ్ అకల్మషమ్ ॥

ఎవని మనస్సైతే శాంతము - కల్మష రహితము - రజోగుణ రహితము అగుచూ పరబ్రహ్మత్వము, సర్వాత్మత్వము సంతరించుకుంటూ ఉంటుందో…… అట్టి మనస్సు కలవాడు పరమోత్తమము, అకృత్రిమము, తెంపులేనట్టిది అగు ఆనందమును అనుభవించుచున్నాడు.

06–28

యుఞ్జన్నేవం సదాత్మానం యోగీ విగతకల్మషః ।
సుఖేన బ్రహ్మసంస్పర్శమత్యన్తం సుఖమశ్నుతే ॥

యుంజన్ ఏవం సదా ఆత్మానం యోగీ విగతకల్మషః ।
సుఖేన బ్రహ్మసంస్పర్శమ్ అత్యంతం సుఖమ్ అశ్నుతే ॥

దోషదృష్టులు తొలగించుకొన్న యోగి పరమాత్మయందు సర్వ ధ్యాసలు సంలగ్నం చేసుకొన్నవాడై, క్రమంగా పరబ్రహ్మస్వరూపప్రాప్తి యొక్క అవధులు లేని ఆనందమును అనుభవించుచున్నాడు.

06–29

సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ।
ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః ॥

సర్వభూతస్థమ్ ఆత్మానం సర్వభూతాని చ ఆత్మని ।
ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః ॥

ఆత్మానందం

-➤ నాయందే వీరందరు ఉన్నారు. వీరందరిలోనూ నేనే ఉన్నాను!
-➤ నా ఆత్మయే సర్వ జీవులలోనూ ఆత్మగా ఉండి సర్వదా ప్రకాశించుచున్నది.
-➤ ఈ సర్వజీవులుగా ఉన్నది నా ఆత్మయందే …!
… అనునట్టి అనుసంధానంతో బ్రహ్మయోగయుక్తాత్ముడై ఈ దృశ్యజగత్తును ఆస్వాదిస్తున్నాడు.

ఆతడు సర్వత్రా, సర్వదా, సమదర్శియై సర్వమునందు తన ఆత్మనే సందర్శిస్తున్నాడు.

06–30

యో మామ్ పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి ।
తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి ॥

యో మాం పశ్యతి సర్వత్ర, సర్వం చ మయి పశ్యతి ।
తస్య అహం న ప్రణశ్యామి, స చ మే న ప్రణశ్యతి ॥

ఓ అర్జునా!
ఏ యోగి అయితే సర్వాంతర్యామియగు నన్ను సర్వరూపస్థుడుగాను, అందరిలోను సర్వదా వేంచేసియున్నవాడుగాను సందర్శిస్తూ ఉంటాడో…
↳ అట్టివాడు క్రొత్తగా నన్ను ప్రత్యక్షం చేసుకొనవలసినదేముంటుంది? లౌకికమైన ప్రయత్నముల అనంతరంగా పొందవలసినదేమున్నది?
↳ ఆ యోగి సర్వమునందూ నన్ను, నాయందే సర్వమును సందర్శిస్తూ ఉంటాడు.
↳ అందుచేత ఆ ఆత్మయోగికి నేను కనబడుతూనే ఉంటాను. నాకు ఆతడు కనిపిస్తూనే ఉంటాడు.

06–31

సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః ।
సర్వథా వర్తమానోఽపి స యోగీ మయి వర్తతే ॥

సర్వభూతస్థితం యో మాం భజతి ఏకత్వమ్ ఆస్థితః ।
సర్వథా వర్తమానో అపి, స యోగీ మయి వర్తతే ॥

సర్వభూత జాలములతో ఏకస్థుడనైన నన్ను సర్వదా ఉపాసనా పూర్వకంగా దర్శించే ఆ ఆత్మయోగి ఎప్పుడు - ఎక్కడ - ఎచ్చట - ఏరీతిగా వర్తిస్తున్నప్పటికీ నన్నే సర్వదా అనువర్తిస్తూ - అనుభూతం చేసుకుంటూ - ఆస్వాదిస్తూ ఉంటాడు. సర్వ సహదేహులను నా స్వరూపంగా చూస్తూ ఉంటాడు. అకృత్రిమంగా, అకారణంగా ఆత్మధ్యానమును కొనసాగిస్తున్నాడు.

06–32

ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోఽర్జున ।
సుఖం వా యది వా దుఃఖం స యోగీ పరమో మతః ॥

ఆత్మ ఔపమ్య ఏన సర్వత్ర సమం పశ్యతి యో, అర్జున! ।
సుఖం వా యది వా దుఃఖం స యోగీ పరమో మతః ॥

తనలోనే సర్వమును, సర్వములోను తనను దర్శించుట

ఓ అర్జునా! సుఖ - దుఃఖ, ఇష్ట - అయిష్ట, సానుకూల్య - ప్రాతికూల్య సందర్భములన్నిటిలోను సర్వదా - సర్వేసర్వత్రా నన్నే సందర్శిస్తూ ఆత్మప్రదర్శనంగా ఆస్వాదించే ఆ ఆత్మయోగి - సర్వ తదితర యోగులలో - సమున్నతుడు సుమా!

Arjuna asking Krishna

మూల శ్లోకము


అధ్యయన వ్యాఖ్యానము


ఉపన్యాసము

అర్జున ఉవాచ :-

06–33

యోఽయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ।
ఏతస్యాహం న పశ్యామి చఞ్చలత్వాత్ స్థితిం స్థిరామ్ ॥

యో అయం యోగః త్వయా ప్రోక్తః సామ్యేన, మధుసూదన! ।
ఏతస్య అహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరామ్ ॥

అర్జునుడు :

స్వామీ! శ్రీకృష్ణా!

మీరు చెప్పుచున్నట్లు సర్వ సందర్భములలోను (సుఖ - దుఃఖాదులు, శత్రు - మిత్రులు మొదలైనవన్నీ సందర్భపడుచున్నప్పుడల్లా) ‘‘అంతయూ నా ఆత్మ స్వరూపమే’’ అను నిశ్చయమును కలిగియుండగల ‘‘ఆత్మయోగం’’ సాధ్యమేనంటారా?

మీరు చెప్పే సమరస ఆత్మీభావన… ఇక, నా విషయానికి వస్తే… చంచల చిత్తముగల నాకు అందటం లేదు. అగుపించటం లేదు. అనుభవానికి సుసాధ్యమని అనిపించటంలేదు. స్థిరమైన ఆత్మదృష్టితో నేను ఈ జగత్తును, ఇందులో అనుభూతమయ్యే అనుభవాలను శత్రు - మిత్రులతో సమన్వితమై కనబడే సహజీవులను సందర్శించలేకపొతున్నాను.

06–34

చఞ్చలం హి మనః కృష్ణ ప్రమాథి బలవద్దృఢమ్ ।
తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరమ్ ॥

చంచలం హి మనః, కృష్ణ! ప్రమాథి బలవత్ ధృఢమ్ ।
తస్య అహం నిగ్రహం మన్యే వాయోః ఇవ సుదుష్కరమ్ ॥

స్వామీ! నా మనస్సు అనేక చాంచల్యపరంపరలకు లోనై ఉంటోందేగాని, ‘‘అంతాకుడా మమాత్మ స్వరూపమే’’ అనే నిశ్చలబుద్ధిని ఆశ్రయించటం లేదు. నా మనస్సు తన చాంచల్యముతో నన్ను ఎంతగానో కలతబెట్టుటలో అత్యంత ప్రావీణ్యత చూపుతోంది. గాలిని ఎవరైనా అరచేతుల మధ్య నిలిపి ఉంచగలరా? అట్లాగే నా ఈ మనస్సును స్థిరము - నిశ్చలము అగు ఆత్మస్వరూప సందర్శన స్థితి - అవగాహనలకు సానుకూల్యంగా మేము నిలుపలేమేమోనని నాకు అనిపిస్తోంది.

శ్రీ భగవాన్ ఉవాచ :-

06–35

అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం ।
అభ్యాసేన తు కౌన్తేయ వైరాగ్యేణ చ గృహ్యతే ॥

అసంశయం, మహాబాహో! మనో దుర్నిగ్రహం చలం ।
అభ్యాసేన తు, కౌంతేయ! వైరాగ్యేణ చ గృహ్యతే ॥

శ్రీకృష్ణ భగవానుడు :-

అర్జునా! నీవు చెప్పినది వాస్తవమే! ఈ మనస్సు ‘‘అంతా నా ఆత్మ స్వరూపమే’’… అనే స్థితి యందు సుస్థిరీకరించటం సులభమైన విషయం కాదనునది ఒప్పుకుంటున్నాను. అయితే అట్టి చంచలమైన మనస్సును సుస్థిరస్థితికి తెచ్చి ఉంచటానికి నీవు ఉపాయాలు ఆశ్రయించాలి కదా? అందుకు రెండు ముఖ్యమైన ఉపాయాలు ఇక్కడ ఉదహరిస్తున్నాను. విను.

(1) అభ్యాసము (Practice): ‘‘స్వప్నాంతర్గతమైనదంతా స్వప్నద్రష్టస్వరూపమే కదా! అట్లాగే నాతో సహా సర్వ జీవులు ఆత్మస్వరూపమే’’… అనే అభ్యాసం ఆశ్రయించాలి. అభ్యాసంచేత దృష్టి దృఢము - పవిత్రము కాగలదు. (Practising makes it possible). ‘‘అంతా పరమాత్మ స్వరూపమే’’… అని అనుకుంటూ ఉండటం అభ్యాసం. ఇక అనిపించటమో…. ఆ అభ్యాసముయొక్క అంతిమ ప్రయోజనమైయున్నది. అనుకోగా అనుకోగా అనిపిస్తుంది!

(2) వైరాగ్యము (Non-Attachment): ఈ కనబడే సర్వ దృశ్య విశేషములపట్ల, త్రిగుణ ప్రదర్శనములపట్ల, సర్వలోక - లోకాంతర వ్యవహార సరళిపట్ల అనురాగం తొలగించుకోవాలి. (లేక) ‘‘సర్వత్రా వాత్సల్యము’’ అను మార్గంలో విరాగం పెంపొందిచుకోవాలి.
ఈ విధంగా అభ్యాస-వైరాగ్యముల ప్రభావం చేత యోగి ‘‘ఆత్మౌపమ్యేవ సర్వత్రా’’… అనబడు అద్వితీయ సందర్శనం చేయటం సుసాధ్యమేనని ప్రకటిస్తున్నాను.

06–36

అసంయతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతిః ।
వశ్యాత్మనా తు యతతా శక్యోఽవాప్తుముపాయతః ॥

అసంయత ఆత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతిః ।
వశ్య ఆత్మనా తు యతతా శక్యో అవాప్తుమ్ ఉపాయతః ॥

అయితే….,
మనస్సు పరిపరి విధములైన భావనలతో కూడుకొనినదై ఉంటోంది కదా! అట్టి మనస్సును కొంచం కొంచం వశం చేసుకొని, అద్దానితో అభ్యాస - వైరాగ్యాలు సాధన పూర్వకంగా సర్వాత్మత్వ భావనను అభ్యసింప చేయాలి సుమా!

అట్లా మనస్సును వశం చేసుకోకుండా కేవలం యోగాభ్యాసం మాత్రమే ఆశ్రయిస్తానంటే, …. అది ఆత్మస్వరూప సందర్శనమునకు దారి తీయటం దుర్లభమేనని నా ఉద్దేశ్యం.

ఏ యోగి అయితే… మనస్సును వశం చేసుకొంటూ “సర్వము ఆ పరమాత్మయొక్క ప్రత్యక్ష రూపమే!” అను భావనను పెంపొందించుకుంటూ యోగసాధనను కొనసాగిస్తాడో… ఆతడు ‘‘నాతో సహా సర్వము కూడా ఆత్మయే’’ అనే ఆత్మానందాస్వాదనను తప్పక త్వరితంగా సొంతం చేసుకోగలడు. మత్‌ స్థానమును చేరుకోగలడు. ఇందులో సందేహించవలసినది ఏదీ లేదు.

Krishna instructing Arjuna

మూల శ్లోకము


అధ్యయన వ్యాఖ్యానము


ఉపన్యాసము

అర్జున ఉవాచ :-

06–37

అయతిః శ్రద్ధయోపేతో యోగాచ్చలితమానసః ।
అప్రాప్య యోగసంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్ఛతి ॥

అయతిః శ్రద్ధయా ఉపేతో యోగాత్ చలితమానసః ।
అప్రాప్య యోగసంసిద్ధిం, కాం గతిం, కృష్ణ! గచ్ఛతి ॥

అర్జునుడు :

హే భగవాన్‌! శ్రీకృష్ణా! ఇప్పుడు నాకు మరొక్క గొప్ప సందేహం వస్తోంది.

యోగమునందు చలించిన మనస్కుడి గతి?

మీరు చెప్పినట్లుగా మేము శుచి ప్రదేశంలో, స్థిరాసనంతో, ఆత్మశుద్ధికై, యోగసాధనా పూర్వకంగా. నాశికాగ్రం పై మనస్సును ఏకాగ్రం చేస్తూ, యోగమును అభ్యసిస్తున్నామనుకోండి. యోగమునందు శ్రద్ధ కలిగి ఉన్నప్పటికీ ఏ కారణంచేతనో యోగసంసిద్ధి పొందటానికి మునుముందే - మా మనస్సు అట్టి ప్రయత్నము నుండి చలిస్తేనో? లేక, ఈ భౌతిక దేహము పతనమైతేనో? ప్రాపంచకమైన వ్యవహారములు అడ్డుగా వస్తే, యోగ సాధనను మనోచాంచల్య కారణంగా కొనసాగించలేక విరమించినప్పుడు, మా గతి ఏమి కానున్నది?

06–38

కచ్చిన్నోభయవిభ్రష్టశ్ఛిన్నాభ్రమివ నశ్యతి ।
అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణః పథి ॥

కచ్చిత్ న ఉభయవిభ్రష్టః ఛిన్నాభ్రమ్ ఇవ నశ్యతి ।
అప్రతిష్ఠో, మహాబాహో! విమూఢో బ్రహ్మణః పథి ॥

ఒకవేళ అట్టివాడు ‘జ్ఞానము’ మొదలైన తదితరమార్గములు ప్రారంభమే చేయనివాడై, తాను ఇప్పుడు ఆశ్రయించిన ఏకాగ్రతా ధ్యానరూప (అభ్యాస) యోగసాధనా మార్గము కొనసాగించలేనివాడై, చివరికి ఉభయ భ్రష్టుడు కాదు కదా! ఛిన్నమైన మేఘం ఆకాశంలో గాలికి ఎటో కొట్టుకుపోతున్నట్లు మేము అప్రతిష్టులమై, ఆశ్రయములన్నీ పోగొట్టుకున్నవారమై ఆధ్యాత్మికంగా వినాశనము పొందము కదా?

ఎందుకంటే,…..
యోగసాధనా మార్గంలో ఏకాగ్రత ప్రాప్తించేవరకు మా సాధన ఏవేవో కారణాలచేత కొనసాగకపోవచ్చును కదా! దేహముయొక్క ఉనికి-ఆరోగ్యము నమ్మి ఉండగలిగేవి కావు కదా!

06–39

ఏతన్మే సంశయం కృష్ణ ఛేత్తుమర్హస్యశేషతః ।
త్వదన్యః సంశయస్యాస్య ఛేత్తా న హ్యుపపద్యతే ॥

ఏతత్ మే సంశయం, కృష్ణ! ఛేత్తుమ్ అర్హసి అశేషతః ।
త్వత్ అన్యః సంశయస్య అస్య ఛేత్తా న హి ఉపపద్యతే ॥

స్వామీ! ‘‘యోగమార్గంలో చ్యుతి పొంది సాధనను కొనసాగించలేని మా గతి ఏమికానున్నదో?’’… అని మాలో అనేకులు (క్రియా) యోగమార్గమును ఆశ్రయించటమే లేదు. అందుకే ఈ నా సందేహం మొదలంట్లా తొలగాలి! తొలగితేనే కదా… మేము ‘‘ధ్యాసను నిలపటం - మనస్సును నియమించటం’’…. అనే మీరు చెప్పుచున్న శాస్త్రప్రవచిత మార్గాన్ని ఆశ్రయించగలిగేది?

పైగా, ఇటువంటి ఈ నా సందేహాన్ని మీరు కాకుండా… ఇక ఎవ్వరు తొలగించగలరు చెప్పండి?

అందుచేత నా ఈ సందేహం మీరు ఆమూలాగ్రంగా పరిశీలించి దయచేసి తొలగించమని ప్రార్థిస్తున్నాను.

శ్రీ భగవాన్ ఉవాచ :-

06–40

పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే ।
నహి కల్యాణకృత్కశ్చిద్దుర్గతిం తాత గచ్ఛతి ॥

పార్థ! న ఏవ ఇహ, న అముత్ర వినాశః తస్య విద్యతే ।
న హి కల్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం, తాత! గచ్ఛతి ॥

శ్రీకృష్ణ భగవానుడు :-

ఓ అర్జునా! ఎవ్వరైతే బుద్ధిని ఏకాగ్రంచేసే మార్గంగా ధ్యాన యోగసాధనకు ఉపక్రమిస్తున్నారో,… వారికి - ‘‘ధ్యాన యోగ సాధనకు పరాకాష్ఠయగు ఆత్మసంయమం పొందకుండానే మధ్యలో యోగసాధన ఆపివేస్తామేమో! ఆగిపోతామేమో? సాధననుండి చ్యుతి పొందటంచే ఉభయ భ్రష్టత్వం పొందుతామేమో….’’ అనే అనుమానం ఏ మాత్రం కలిగి ఉండనఖర్లేదు …..’’ అని నిర్దంద్వంగా ప్రకటిస్తున్నాను.

ఎందుచేతనంటావా?

మనస్సును ఏకాగ్రం - నిశ్చలం చేయటమే ఆశయంగా కలిగియుండి, యోగసాధన ప్రారంభించినట్టివానికి - ఈ లోకమునందు గాని, తాను దేహానంతరం ప్రవేశించబోయే ఆయా పర లోకములందుగాని - ఆతని యొక్క సాధన ప్రయోజన కారకమే అవుతుంది. ఆ సాధకుడు ఇక్కడ - అక్కడ కూడా ‘నష్టబోవటం’ అనే ప్రసక్తియే లేదు. యోగసాధన ఎంతెంతవరకు కొనసాగితే అంతంతవరకు శుభప్రదమే అవుతుంది. యోగసాధన వలన దుర్గతి కలగటమనే మాటయే ఉండదు.

అది ఎట్లో చెపుతాను, విను.

06–41

ప్రాప్య పుణ్యకృతాం లోకానుషిత్వా శాశ్వతీః సమాః ।
శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోఽభిజాయతే ॥

ప్రాప్య పుణ్యకృతాం లోకాన్, ఉషిత్వా శాశ్వతీః సమాః ।
శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టో అభిజాయతే ॥

యోగ భ్రష్టుడు

ఒకవేళ (క్రియా) యోగసాధనకు ఉపక్రమించిన ఒకానొకడు కొంతసాధన తరువాత ఏవో కారణాలచేత ఆ అభ్యాసయోగ సాధనను కొనసాగించకపోవటమో, అద్దానినుండి చలించటమో జరిగిందనుకో! ఆవిధంగా ఎందుకు చలించటం జరిగింది? పూర్వ వాసనల ప్రభావం చేత ‘శ్రద్ధ’ కొనసాగక పోయినందువలననే కదా! అయితే ఆ మాత్రం చేత ఆ యోగసాధకుడు కోల్పోవుచున్నదేమీ లేదు. కళ్యాణప్రదమగు యోగసాధన దుర్గతికి ఏమాత్రం దారితీయదు సుమా! అయితే పూర్వాభ్యాసాలు ముందుకు వచ్చి నిలచి ఆతని యోగసాధనను ఏమరచేటట్లు చేయవచ్చు. అట్టి వానిని యోగభ్రష్టుడు (one who got distracted from the practise of yoga) అని చెపుతారు.

యోగభ్రష్టుడు తాను సాధన నుండి చ్యుతి (లేక) చాంచల్యము పొందుచున్నప్పటికీ ఏ యోగమార్గ స్థితిని ఎంతవరకూ పొందాడో, …. అది అంతవరకూ ఆతని పట్ల పదిలంగానే ఉంటుంది.

దేహానంతరం

అట్టి యోగ సాధకుడు మరణానంతరము మొట్టమొదటి ప్రయోజనంగా పుణ్యాత్ములు పొందే పుణ్యలోకాలు పొంది, వాటి సత్ఫలితాలను అనుభవిస్తున్నాడు. మరల యోగ సాధన కొనసాగించటానికి సానుకూల్యమగు వాతావరణములలో దేహములు పొందుచున్నాడు. అనగా, శుచి - ధనసమృద్ధి - యోగ భావములు - యోగ సాధనములు గల ఇళ్లలో జన్మలు పొంది యోగసాధనను మరల కొనసాగించటానికి అవకాశములను సముపార్జించుకొంటున్నాడు.

06–42

అథవా యోగినామేవ కులే భవతి ధీమతామ్ ।
ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశమ్ ॥

అథవా యోగినామ్ ఏవ కులే భవతి ధీమతామ్ ।
ఏతత్ హి దుర్లభతరం లోకే జన్మ యత్ ఈదృశమ్ ॥

‘యోగసాధన’ మరింత అధికముగా నిర్వర్తించియున్నవారైతేనో! వారు మహనీయులగు యోగుల కుటుంబాలలో జన్మించి యోగము యొక్క పరాకాష్ఠయగు ‘‘మనో-బుద్ధుల సందర్శనమంతా కూడా ఆత్మయే’’… అను ‘ఆత్మసంయమ యోగం’ సముపార్జించుకొంటున్నారు.

అటువంటి మహా యోగుల స్థానాలలో (ప్రదేశాలలో) జన్మించటం యోగసాధనయొక్క అధికమైన సాధన - మనో నిర్మలత - జ్ఞాన భావముల ఉన్నతిచేత మాత్రమే సాధ్యం. అంతేగాని తేలికగా లభించేది కాదు.

(ఉదాహరణకు -
→ నాలుగవ వంతు (25%) యోగస్థితిని సంపాదించినవారు - పుణ్యలోకాలు పొంది సుఖించి, మరల తదుపరి జన్మలలో యోగసాధనకు ఉపక్రమిస్తున్నారు.
→ సగము (50%) యోగస్థితి సంపాదించినవారు - ఉత్తమ జ్ఞానాభ్యాసానికి అర్హులగుచున్నారు.
→ ముప్పావు వంతు (75%) యోగస్థితి సంపాదించినవారు - యోగులతో సాంగత్యం పొంది తమ యోగసాధన మహత్తరం చేసుకుంటున్నారు.)

06–43

తత్ర తం బుద్ధిసంయోగం లభతే పౌర్వదేహికమ్ ।
యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురునన్దన ॥

తత్ర తం బుద్ధిసంయోగం లభతే పౌర్వదేహికమ్ ।
యతతే చ తతో భూయః సంసిద్ధౌ, కురునందన! ॥

యోగసాధన నుండి చలనం పొందిన యోగి పుణ్యలోకముల అనుభవం తరువాత ‘‘శుచి - శ్రీమంతము (సమృద్ధి)’’ గల గృహంలో జన్మిస్తాడని అనుకున్నాం కదా!

అప్పుడు ఆతడు పూర్వదేహంతో నిర్వర్తించియున్న యోగసాధనచే ఏ స్థితి చేరియున్నాడో… ఆ స్థితి - తన సంసిద్ధతతో సహా వెంటనంటియే ఉంటుంది. ఆతని బుద్ధియొక్క సంయోగంచే మరల మనస్సు సాధనకు ప్రోత్సాహం పొందుతోంది. అనగా, ఏదో సందర్భమో, సంఘటనయో ఆతనిని యోగసాధనను కొనసాగించటానికి ఉపక్రమింపజేస్తోంది. మరల ఆతడు ఇతః పూర్వపు యోగ స్థితి నుండి ఇంకా ముందుకు యోగసాధన కొనసాగిస్తున్నాడు.

06–44

పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోఽపి సః ।
జిజ్ఞాసురపి యోగస్య శబ్దబ్రహ్మాతివర్తతే ॥

పూర్వాభ్యాసేన తేన ఏవ హ్రియతే హి అవశో అపి సః ।
జిజ్ఞాసుః అపి యోగస్య శబ్దబ్రహ్మ అతివర్తతే ॥

ఇతఃపూర్వపు అభ్యాసమే మరల యోగసాధనకు ఆతనిని ఆకర్షిస్తోంది సుమా!

అనగా మరల మరల ఆతడు కామ్య కర్మల స్థితి నుండి యోగాభ్యాసానికి వచ్చి అద్దానిని కొనసాగిస్తున్నాడు.

ఆతడు యోగ సాధనకు ఉపక్రమిస్తూ - ఉపక్రమిస్తూ క్రమక్రమంగా బుద్ధిలోని కామ్యకర్మలకు సంబంధించిన దోషములను తొలగించుకొంటున్నాడు.

06–45

ప్రయత్నాద్యతమానస్తు యోగీ సంశుద్ధకిల్బిషః ।
అనేకజన్మసంసిద్ధస్తతో యాతి పరాం గతిమ్ ॥

ప్రయత్నాత్ యతమానస్తు యోగీ సంశుద్ధకిల్బిషః ।
అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాం గతిమ్ ॥

ఈ విధంగా ఏకానేక జన్మలలో యోగసాధన కొనసాగిస్తూ ఆత్మసంయమయోగస్థితిని సంపాదించుకుంటున్నాడు.
.br
యోగమునకు పరాకాష్ఠయగు ‘‘సర్వము తన ఆత్మస్వరూపంగా సందర్శించటం, ఆస్వాదించటం’’… అనే మహత్తర స్థితిపొంది ఆనందిస్తున్నాడు.

06–46

తపస్విభ్యోఽధికో యోగీ జ్ఞానిభ్యోఽపి మతోఽధికః ।
కర్మిభ్యశ్చాధికో యోగీ తస్మాద్యోగీ భవార్జున ॥

తపస్విభ్యో అధికో యోగీ, జ్ఞానిభ్యో అపి మతో అధికః ।
కర్మిభ్యః చ అధికో యోగీ, తస్మాత్ యోగీ భవ, అర్జున! ॥

ఆత్మసంయమ యోగి

తపిస్విభ్యో అధికో యోగీ :-
ఏదో కోరి తపస్సు చేసేవాడికన్నా ఆత్మదృష్టిని ఆశయంగా కలిగి యుండి ఏకాగ్రతతో కూడిన ధ్యాన - యోగి గొప్పవాడు. ఎందుకంటే తపస్వి ఏదో ఆశిస్తున్నాడు కదా! అది పొందగానే తపస్సును విరమిస్తున్నాడు. యోగసాధకుడో,…. మనస్సును ఆత్మాఽహమ్‌ రూపమైనట్టి ఆత్మానందంవైపు నడిపిస్తున్నాడాయె!

జ్ఞానిభ్యో అపి అధికః :-
అంతేకాదు. నా అభిప్రాయంలో - యోగి జ్ఞాని కన్నాకూడా గొప్పవాడగుచున్నాడు సుమా! జ్ఞాని నిత్యానిత్య, ఆత్మ-అనాత్మా, అంతరంగ విశేష పరిశీలన చేస్తూ సమాచారం సంపాదిస్తున్నాడు. మంచిదే! తాను ఆత్మయే అయి సర్వము తన ఆత్మ స్వరూపంగా ఆస్వాదించాలి కదా! తెలుసుకొని ఆగిపోతే ఎట్లా? అది అనుభూతిని-అనుభవంగా రూపుదిద్దుకోవాలి కదా! అందుచేతే జ్ఞానికన్నా కూడా ‘‘ఆత్మసంయమయోగి’’ గొప్పవాడగుచున్నాడు. అధికుడగుచున్నాడు.

కర్మిభ్యశ్చ అపి అధికో యోగీ :-
వేద - వేదాంగాలలోని యజ్ఞయాగాదుల ఆయా కర్మలయందు నిష్ఠ కలవానికన్నా కూడా… ఆత్మసంయమయోగి అధికుడగుచున్నాడు. కర్మిష్ఠుడై, వాటిని సమర్పించి సర్వము ఆత్మగా సందర్శిస్తే కదా… ఆత్మానందం లభించేది?

తస్మాత్‌ యోగీ భవ :-
అందుచేత అర్జునా! నీవు ఆత్మసంయమయోగివి అగుదువుగాక!

06–47

యోగినామపి సర్వేషాం మద్గతేనాన్తరాత్మనా ।
శ్రద్ధావాన్భజతే యో మాం స మే యుక్తతమో మతః ॥

యోగినామ్ అపి సర్వేషాం మత్ గతేన అంతరాత్మనా ।
శ్రద్ధావాన్ భజతే యో మామ్ స మే యుక్తతమో మతః ॥

యోగులందరిలో కూడా… ఏ యోగి అయితే సర్వాంతర్యామినగు నన్ను శ్రద్ధగా ఉపాసిస్తూ, అంతరాత్మతో అంతరాత్మయగు నన్ను శ్రద్ధతో భజిస్తున్నాడో… అట్టి ‘‘సర్వాంతర్యామి ఉపాసన’’ చేస్తున్నవాడు పరమశ్రేష్ఠుడు.

నామ-రూపాత్మకంగా వేరువేరుగా కనిపిస్తున్నప్పటికీ సర్వసహజీవులంతా పరమాత్మరూపంగా ఎవరికి అనిపిస్తోందో, ఆతడు యోగి శ్రేష్ఠుడు, యోగతముడు!

సర్వము పరమాత్మగా దర్శిస్తూ ఆస్వాదించేవాడు యోగము యొక్క పరాకాష్ఠకు చేరినవాడని నా అభిప్రాయం.

ఇతి శ్రీమత్‌ భగవద్గీతాసు … ఆత్మ సంయమ యోగ పుష్పః ।
శ్రీ సాంబ సదాశివ పాదారవిందార్పణమస్తు ॥
🙏