భగవద్గీత

07. విజ్ఞాన యోగ అధ్యయన పుష్పం

మూలము : శ్రీ వ్యాస మహర్షిచే విరచించబడిన జయము / మహాభారతము (భీష్మ పర్వము)

అధ్యయన వ్యాఖ్యానము : (అధ్యయన విద్యార్థి) యేలేశ్వరపు హనుమ రామకృష్ణ


Krishna instructing Arjuna

మూల శ్లోకము


అధ్యయన వ్యాఖ్యానము


ఉపన్యాసము

శ్రీ భగవాన్ ఉవాచ :-

07–01

మయ్యాసక్తమనాః పార్థ యోగం యుఞ్జన్మదాశ్రయః ।
అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు ॥

మయి ఆసక్తమనాః, పార్థ! యోగం యుంజన్ మత్ ఆశ్రయః ।
అసంశయం సమగ్రం మామ్ యథా జ్ఞాస్యసి తత్ శృణు ॥

శ్రీకృష్ణ భగవానుడు :-

ఓ పార్థా! ఇప్పటివరకు ధ్యానయోగాభ్యాసం గురించి కొన్నికొన్ని విషయాలు చెప్పాను కదా!

ఇప్పుడిక పరమాత్మనగు నాయందు ఆసక్తితో కూడిన మనస్సుతో నన్నే ఆశ్రయిస్తూ, యోగసాధన కొనసాగించే యోగులు సర్వాంతర్యామినగు నన్ను ఏతీరుగా…, ఏమని (what is that actually “I am”?) తెలుసుకొంటారో…. ఏ రీతిగా నా తత్త్వాన్ని దర్శిస్తారో, ఆస్వాదిస్తారో - అద్దానిని ఇప్పుడు చెప్పుచున్నాను. విను.

(I am explaining you as what would be the way a ‘Yogathma’ experiences about oneself and all else).

07–02

జ్ఞానం తేఽహం సవిజ్ఞానమిదం వక్ష్యామ్యశేషతః ।
యత్ జ్ఞాత్వా నేహ భూయోఽన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే ॥

జ్ఞానం తే అహం సవిజ్ఞానమ్ ఇదం వక్ష్యామి అశేషతః ।
యత్ జ్ఞాత్వా న ఇహ భూయో అన్యత్ జ్ఞాతవ్యమ్ అవశిష్యతే ॥


జ్ఞానం-విజ్ఞాన సహితం

శాస్త్రములు ఆత్మ గురించి ప్రబోధిస్తున్నాయి. అట్టి సమాచారమే జ్ఞానము.

ఆ జ్ఞానము అనుభవరూపంగా పరిణమించటాన్ని ‘విజ్ఞానం’ అంటాం.

అట్టి విజ్ఞానముతో కూడుకున్న జ్ఞానముచే, ఏదైతే తెలుసుకుంటూ అనుభూతం చేసుకుంటున్నారో, ఏది తెలుసుకున్న తరువాత ఇక తెలుసుకోవలసినదేదీ ఉండదో…., అట్టి ‘‘విజ్ఞానయోగం’’ ఇప్పుడు సవివరణపూర్వకంగా చెప్పుచున్నాను.

మట్టిని గురించి తెలుసుకొన్న తరువాత ఇక మట్టి బొమ్మలు ఎన్నిటి గురించైనా… తెలుసుకోవలసినదేముంటుంది? బంగారం గురించి తెలిస్తే ఆభరణములు ఒక్కొక్కటిగా తెలుసుకోవలసిన పనేమి? జలం గురించి తెలిసిన తరువాత ఇక ఒక్కొక్క తరంగంలో పరిశీలించి క్రొత్తగా గ్రహించవలసినదేమీ మిగలదు కదా! అట్లాగే, …. ఈ మనం చెప్పుకోబోయే - విజ్ఞానయోగం గ్రహిస్తే ఇక తెలుసుకొనవలసినదేమీ శేషించి ఉండదు సుమా!

07–03

మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే ।
యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్త్వతః ॥

మనుష్యాణాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే ।
యతతామ్ అపి సిద్ధానాం కశ్చిత్ మామ్ వేత్తి తత్త్వతః ॥


విజ్ఞానము-అనుభూతమునకు సంసిద్ధత

ముందుగా మరొక్క విషయం! జగత్తులో అనేక విశేషాలు కనిపిస్తున్నాయి. వాటి గురించిన అనేక విజ్ఞాన విశేషాలు తెలుసుకోవచ్చు. చెప్పుకోవచ్చు. అయితే,… జ్ఞానవిజ్ఞాన పూర్వకమైన ఆత్మజ్ఞానం అన్ని విజ్ఞానములకంటే మహత్తరము, అత్యంత ప్రభావవంతము, శుభప్రదము అయి ఉన్నది.

ఇట్లయి ఉండి కూడా ఆశ్చర్యం! అట్టి నేను ఇట్టివాడను కదా అను విజ్ఞాన యోగోపాసనను, విజ్ఞాన సముపార్జనను, విజ్ఞాన దృష్టిని పరిపుష్టి చేసుకొని తద్వారా దేహ - జీవిత - జగత్‌దృశ్యములను అర్థం చేసుకోవటానికి గమనించటానికి, దర్శించటానికి అనేకులు ఏమాత్రం ప్రయత్నించటమే లేదు.

వేలాదిమందిలో ఎవ్వరో ఒక్కొక్కడు “నేను”కు సంబంధించి - విజ్ఞానదృష్టితో కూడిన పరిశీలనకై సంసిద్ధుడగుచున్నారు. అట్లా పరిశీలించాలనుకున్న వాళ్లలో కూడా వేలాదిమందిలో ఏ ఒక్కరో మాత్రమే తుది వరకు పరిశీలన కొనసాగించి ససంపూర్ణంగా (నేను ఇది కదా - అని) తెలుసుకుంటున్నారు.

అందుచేత, ఇప్పుడు ఈ విజ్ఞానపూర్వకమైన జ్ఞానపరిశీలనము నీ ముందు ఉంచుచున్నాను. ఈ దృశ్యము - దృశ్యమునకు ఆవల ఉన్న ద్రష్టను గురించిన విజ్ఞానం వివరిస్తున్నాను. శ్రద్ధతో కూడినవాడవై విను!

07–04

భూమిరాపోఽనలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ ।
అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా ॥

భూమిః ఆపో అనలో వాయుః ఖం మనో బుద్ధిః ఏవ చ ।
అహంకార ఇతి ఇయం మే భిన్నా ప్రకృతిః అష్టధా ॥

ప్రతి జీవునికి సంబంధించి “నేను, నా 8 తీరులైన ప్రకృతి” (లేక) ‘‘ద్రష్ట - అష్టవిధ ప్రకృతి’’ అను రెండు విశేషాలు ఇక్కడ సమావేశమై ఉన్నాయి.


అష్టవిధ ప్రకృతి

ఈ దేహం : 1.) భూమి / ఘనము / రూపము (Solid)
2.) ఆపః / జలము / రసము (Liquid)
3.) అనలము / అగ్ని / తేజము (Hear)
4.) వాయువు / గాలి / చలనము (Vapour)
5.) ఖం / ఆకాశము / స్థానము (Space)
… అనే 5 తత్వాలు వివిధ పాళ్లలో కలయిక పొందటం చేత ఈ భౌతిక దేహం తయారవుతోంది.

ఈ అయిదు కాకుండా అంతర్గతంగా -
6.) ఆలోచనలు (మనస్సు)
7.) విచక్షణ (బుద్ధి - Analytical feature),
8.) ‘నాది’- అని అనుకుంటున్న తత్వం (అహంకారం)
… ఇవన్నీ కలిపి ‘అష్టవిధ ప్రకృతి’ అని చెప్పబడింది. (పంచభూతాలు మరియి మనో-బుద్ధి-అహంకారాలు).

07–05

అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరామ్ ।
జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్ ॥

అపరా ఇయమ్ ఇతః తు అన్యాం ప్రకృతిం విద్ధి మే పరామ్ ।
జీవభూతాం, మహాబాహో! యయా ఇదం ధార్యతే జగత్ ॥

అయితే,
అపరేయమితి! నేను ప్రకృతికి వేరైనవాడను!

‘‘నేనెవ్వరు?’’ అన్న ప్రశ్నకు సమాధానంలో ఈ అష్టవిధ ప్రకృతి నాయొక్క - నా గురించిన ఒక విభాగం మాత్రమే. చిన్న విశేషం మాత్రమే!

(‘ఆ తెల్లచొక్కా ఆయన’ అను మాటలో తెల్లచొక్కా ఆతని గురించి ఒక చిన్న సందర్భ పరిమిత వివరణ మాత్రమే అయి ఉన్నట్లుగా)
‘నేను - నేను’ అనుకునేది ఏదైతే సర్వదా మనందరిలో మునుముందుగానే వేంచేసియున్నదో…. అదియే ఆత్మ - జీవాత్మ - పరమాత్మ - అని శాస్త్రములచే వ్యవహరించబడుచున్నది.

పరమాత్మయే అట్టి అష్టవిధప్రకృతిని ఒక ఆభరణమువలె, ఉపకరణమువలె ధరించినదై ధారణచేస్తున్నదై ఉంటోంది.

07–06

ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ ।
అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రలయస్తథా ॥

ఏతత్ యోనీని భూతాని సర్వాణి ఇతి ఉపధారయ ।
అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రలయః తథా ॥

ఓ అర్జునా! సర్వజీవులలోను అంతరాత్మయే (లేక) పరమాత్మయే నా స్వరూపం.

ప్రకృతి నాయొక్క అనుభూతి. అపరేయము (Secondary details).

ఈ అష్టవిధ ప్రకృతి ‘నాది’ కావచ్చునేమో గాని, ‘నేను’ కాదు. ఆభరణం ధరించే వాడు ఆభరణము అవడు కదా! (ప్రతి జీవుడు అట్టి అష్టవిధ ప్రకృతికి ఆవలగల కృష్ణ చైతన్య స్వరూపుడే!).

పరమాత్మ స్వరూపుడనగు నేను నా హృదయ (లేక) భావనా గర్భమునందు - ఈ నాకు కనబడుచున్న సర్వభూతజాలమును ఉపధరిస్తున్నాను. (What all being is seen is held in my heart through my thoughts.)

నాలోని భావనలచే ఈ జగత్తులు ప్రదర్శించబడుచున్నాయి. సందర్శించ బడుచున్నాయి. ‘భావన’ లయించినప్పుడు జగత్తులు కూడా లయిస్తున్నాయి.

కనుక, జగత్తుల దృశ్య-అదృశ్యములకు కారణ భూతుడను నేనే! నాయొక్క భావన (లేక) అనుభూతి యొక్క ప్రదర్శనచేతను జగదనుభవాలన్నీ ప్రకటితమగుచున్నాయి.

07–07

మత్తః పరతరం నాన్యత్కిఞ్చిదస్తి ధనఞ్జయ ।
మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ ॥

మత్తః పరతరం న అన్యత్ కించిత్ అస్తి, ధనంజయ! ।
మయి సర్వమ్ ఇదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ ॥

మత్తః పరతరమ్‌ న అన్యత్‌ కించిత్‌ ఆస్తి!

ఓ ధనంజయా! ఈ దేహాలు, దృశ్య జగత్తులు మొదలైనవన్నీ నా భావనా చమత్కారం నుండియే ఉద్భవించి, లయిస్తున్నాయి సుమా!
నానుండి బయల్వెడలినవన్నీ నా స్వరూపమే కదా!

స్వప్నద్రష్ట రూపమునకు వేరుగా స్వప్నము కించిత్‌ కూడా లేదు కదా! అట్లాగే సత్స్వరూపుడనగు నాకు వేరుగా ఎక్కడా ఏదీ కించిత్‌ కూడా ఉండి ఉండలేదు. ఉండదు.

ప్రతిజీవునిలోని ఆత్మ నా స్వరూపమే!

ప్రతి జీవుడు ఆత్మస్వరూపుడే! ఆత్మ అనిర్వచనీయము - అనిర్దేశ్యము.

స్వప్నద్రష్ట స్వప్నమంతా నిండి ఉన్నట్,లు నవలా రచయిత నవలా కథనమంతా విస్తరించబడి ఉన్నట్లు - అంతటా నేనే విస్తరించియున్నాను.

అద్దాని తత్వాన్ని అర్థం చేసుకునేందుకు వీలుగా కొన్ని దృష్టాంతాల సహాయంతో వివరిస్తున్నాను.

మయి సర్వమ్‌ ఇదమ్‌ ప్రోతమ్‌ సూత్రే మణిగణా ఇవ ।

ఒక పూలదండలో ఏముంటుంది? అనేక పూలు కలసి ఉంటాయి. ఆ పూలన్నీ వాటికవే కలసి ఉంటున్నాయా? లేదు, వాటిని కలుపుచూ ఉండేది పైన కనిపించని దారం కదా! పూదండలో పూలు కనిపిస్తాయి. దారం కనిపించదు. కానీ దారమే కదా, … పూలన్నిటినీ కలిపి ఉంచేది? అట్లాగే ఈ సర్వపాంచభౌతిక దేహ-మనో -బుద్ధి-చిత్త-అహంకారాదులందు, తదితర దృశ్యసమాచారములందు నేనే (ఆత్మయే) విస్తరించి ఆధారభూతమై వెలుగొందుచున్నాను. అంతయు ఆత్మస్వరూపమే! ఆత్మస్వరూపుడనగు నేనే!

07–08

రసోఽహమప్సు కౌన్తేయ ప్రభాస్మి శశిసూర్యయోః ।
ప్రణవః సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం నృషు ॥

రసో అహమ్ అప్సు, కౌంతేయ! ప్రభా అస్మి శశిసూర్యయోః ।
ప్రణవః సర్వవేదేషు, శబ్దః ఖే, పౌరుషం నృషు ॥

నాకు సంబంధించిన అనుభవమౌతున్న సర్వ సంబంధములు నా మనోకల్పనా చమత్కారమే!

ఈ సర్వములో నేనే!

🔵 జలంలో రసతత్వం (రుచి) నేనే! జలమును కళ్లతో చూడగలం. రుచిని కళ్ళతో చూడలేం కదా! అట్లాగే ఈ సర్వమునందు ఆత్మయే అంతర్గతంగా సర్వదా వేంచేసి ఉన్నది. నేనే సర్వాంతర్గతుడను!

🔵 సూర్యచంద్రులలో కనిపించే ప్రభవము (తేజస్సు) నేనే! ఆ నా తేజస్సే సూర్య - చంద్రాదుల ప్రభావముచే ప్రకాశించే వస్తువుల రూప విశేషం కూడా! అట్లాగే ఆత్మయే దేహ - దృశ్య - మనో - బుద్ధి - అహంకారరూపములను-తేజోమయంగా ప్రకాశింప జేస్తోంది.

అనగా…,
జలంలో రస స్వరూపంగా, సూర్య-చంద్ర-నక్షత్ర-అగ్ని మొదలైన వాటిలో తేజస్సుగా ఉన్నది నేనే. నా యొక్క రస-తేజో రూపాలే అవన్నీ!

🔵 ‘వేదము’ అనగా శబ్దార్థం ‘తెలియబడేది’ అని. తెలియబడేదానికి ఆవల (వేదాంతము)… వేదస్వరూపుడగు ‘తెలుసుకొనువాడు’ ఉన్నాడు కదా! అట్టి వేదపురుషుని (Knower behind Knowing)ని వేదములు ‘ఓం’ అనే ’సంజ్ఞ’తో ప్రవచిస్తూ… అద్దానిని సంబోధిస్తూ బోధిస్తున్నాయి.

అనగా…,
ఆత్మస్వరూపుడగు జీవునికి ఆత్మతత్వం తెలియజెప్పటమే వేదముల అంతర్గత రహస్యం. ఆత్మయే సర్వ దృశ్య వ్యవహారముల అంతర్లీన గానం. సర్వమునకు ఆధారం! అట్టి ఆత్మయే ‘ఓం’ అను సంజ్ఞగా చెప్పబడుతోంది. తెలియబడేదానికి ఆధారము నేనే! ఆధేయము కూడా నేనే! (శివపురాణములో శివుడు-శివతత్త్వము ధ్యేయము కదా! అట్లాగే వేదములలో అ+ఉ+మ = ఓంకారమే ధ్యేయము).

🔵 ఆకాశములోని శబ్దతత్వము నేనే! శబ్దతత్వం ప్రసరింపజేయటం అనే చమత్కారం ఆకాశంలో అంతర్లీనమై ఉన్నట్లు, దృశ్యములు ధారణ చేయటం - ప్రదర్శించటం మొదలైనదంతా ఆత్మయొక్క విలక్షణ లక్షణం.

🔵 సర్వజీవులలో దాగి ఉండి ఉన్న పురుషకారము (Ability) నేనే! సర్వాంతర్యామియగు నేనే…., పురుషకారం (Ability to do something) రూపంలో సర్వదేహాలలో ప్రత్యక్షమై వున్నాను.

07–09

పుణ్యో గన్ధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ ।
జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు ॥

పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చ అస్మి విభావసౌ ।
జీవనం సర్వభూతేషు, తపః చ అస్మి తపస్విషు ॥

🔵 భూమిలో ఓజోరూపుడనై - పవిత్ర గంధ స్వరూపమై, మొక్కలకు - పూలకు - తదితర సర్వ పదార్థములకు త్రాణగా, సువాసనగా విస్తరిస్తూ ఉన్నది కూడా నేనే!

🔵 బ్రహ్మజ్ఞానము - భక్తి - యోగము - కర్మనిష్ఠ గల యోగి పుంగవులలో తేజోరూపముతో (వర్చస్సు రూపంగా) విరాజిల్లుచున్నది నేనే!

🔵 సర్వజీవులలో ఉజ్జీవన తత్వమై దేహములను క్రియాశీలకం చేస్తున్నది కూడా నేనే!

🔵 తపోధనులలోని తపస్సు - ధ్యానముల నిష్టాస్వరూపుడనై నేనే ప్రకాశించుచున్నాను. ప్రకటనమగుచున్నాను.

07–10

బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనమ్ ।
బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహమ్ ॥

బీజం మామ్ సర్వభూతానాం విద్ధి, పార్థ! సనాతనమ్ ।
బుద్ధిః బుద్ధిమతామ్ అస్మి, తేజః తేజస్వినామ్ అహమ్ ॥

🔵 సర్వజీవరాసులయొక్క బీజము నేనే! నా నుండియే ప్రధమాంకురము రూపు దిద్దుకుంటున్నది. నా బీజతత్వంనుండే సర్వజీవుల దేహాలు నిర్మాణమై దృశ్యంగా వర్ధిల్లుచున్నాయి.

🔵 బుద్ధిమంతులలోని తెలివితేటల రూపంలో సూక్ష్మ గ్రాహ్యమును ప్రత్యుత్సాహపరస్తున్నది నా సర్వాంతర్యామిత్వమే! బుద్ధి స్వరూపుడనై సర్వ దేహాలలో ప్రవేశిస్తున్నది నేనే!

🔵 సుందర రూపాలలోని సౌందర్యమును, సమాలోచనపరులలోని ఆలోచనా స్రవంతిని, శాస్త్రవేత్తలలోని శాస్త్రపాటవాన్ని నేనే! ఈ విధంగా నేనే తేజోవంతులలో తేజస్సుగా విరాజిల్లుచున్నది. (సౌందర్యము-ఆలోచన-శాస్త్ర పాటవము - ఆత్మయొక్క చిత్‌ చైతన్య కిరణములే!)

07–11

బలం బలవతాం చాహం కామరాగవివర్జితమ్ ।
ధర్మావిరుద్ధో భూతేషు కామోఽస్మి భరతర్షభ ॥

బలం బలవతాం చ అహం కామ-రాగ-వివర్జితమ్ ।
ధర్మ అవిరుద్ధో భూతేషు కామో అస్మి, భరతర్షభ! ॥

🔵 బలవంతులలో, పట్టుదల కలవారిలో కామము - రాగము ప్రక్కన ఉంచితే, … అప్పటివారి పట్టుదల అనే విభవముగా ప్రదర్శితమగుచున్నది కూడా సర్వాత్మ స్వరూపుడనగు నేనే!

🔵 అట్లాగే ధర్మమునకు విరుద్ధంగాని జీవులలోని కామమును కూడా నేనే!

07–12

యే చైవ సాత్త్వికా భావా రాజసాస్తామసాశ్చ యే ।
మత్త ఏవేతి తాన్విద్ధి న త్వహం తేషు తే మయి ॥

యే చ ఏవ సాత్త్వికా భావా రాజసాః తామసాః చ యే ।
మత్త ఏవ ఏతి తాన్ విద్ధి న తు అహం తేషు, తే మయి ॥

🔵 ఓ అర్జునా! ఈ దృశ్యములోని భావనా చమత్కారమంతా ఆత్మతత్త్వ స్వరూపడనగు నా విన్యాసములే!

ఈ జీవునినుండి ప్రదర్శితమగుచున్న భావాలు (1) సాత్వికము (2) రాజసికము (3) తామసికము … అని మూడు విధాలుగా విభజించబడుచున్నాయి. అయితే భావాలు వేరు. జీవునిలోని ఆత్మస్వరూపుడనగు నేను వేరు. భావనలు వేరు -భావించువాడు వేరు కదా!

ఆయా సాత్విక-రాజసిక-తామసిక భావాలు సర్వాంతర్యామియగు నా చేతనే (అనగా ఆత్మ చేతనే) కలుగుచున్నాయి. అయితే భావనలు ప్రదర్శించువాడు భావనలుగా మారటం లేదే! తాను యథాతథ రూపుడై భావనలకు స్థానభూతమై మాత్రమే ఉన్నాడు కదా! కథ చెప్పుచున్నవాడు కథలోని విభాగమా? కాదు కదా! సర్వులలోని భావించువాడు రూపం నాయొక్క విభవమే!

జలంలోంచే తరంగాలు బయల్వెడలుచున్నప్పటికీ ‘‘జలం మారిపోయి తరంగాలుగా అగుచున్నది’’ అనేది యుక్తియుక్తవాక్యం కాదు కదా! జలము సర్వదా రూపరహితం! తరంగానికో… ఆకారం ఉన్నది. జలానికి వేరుగా తరంగం ఎక్కడ ఉన్నది? అట్లాగే… భావాలు ఆత్మవలననే ప్రకటించబడుచున్నప్పటికీ… ఆత్మయందు భావాదులు లేవు. భావములందు ఆత్మలేదు.

నవలారచయిత వలననే నవలలోని పాత్రలు - వారి గుణ స్వభావాలు ప్రదర్శితమగుచున్నాయి. కాని రచయితలో పాత్రలు ఉన్నాయని, (లేక) రచయిత తన రచనలోని ఒకానొక పాత్ర అని అందామా? లేదు కదా! ఈ జగత్‌ రచనలోని భావాలన్నీ నావే! అయితే, నేను భావాలలో లేను. భావాలు నాయందు లేవు. నవలలో నవలా రచయిత లేడు కదా! నవలా రచయితలో నవలా కథనమూ లేదు! ఆయా పాత్రలు లేవు!

07–13

త్రిభిర్గుణమయైర్భావైరేభిః సర్వమిదం జగత్ ।
మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయమ్ ॥

త్రిభిః గుణమయైః భావైః ఏభిః సర్వమ్ ఇదం జగత్ ।
మోహితం న అభిజానాతి మామ్ ఏభ్యః పరమ్ అవ్యయమ్ ॥

మోహితుడు

త్రిగుణ భావముల సంయోగ వియోగములచే ప్రదర్శితమగుచున్న జగత్‌ దృశ్యముచే మోహితుడగువాడు ‘‘నేనే ఈ సర్వమునందు అస్మదాత్మ స్వరూపముచే పూర్ణం చేస్తూ ఉన్నాను’’…. అనే విషయం ఏమాత్రము గమనించలేకపోవుచున్నాడు. ‘‘నేనే … ఈ దృశ్యమునకు వేరై, అవ్యయమై ఈ దేహాదులకు కేవల సాక్షినై, సర్వ దేహములలోను సర్వ త్రిగుణ చమత్కారములకు ఆవల అస్పుృశ్యుడనై వెలుగొందుచున్నాను’’… అను ఆత్మత్వమును ఆస్వాదించలేకపోవుచున్నాడు.

07–14

దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా ।
మామేవ యే ప్రపద్యన్తే మాయామేతాం తరన్తి తే ॥

దైవీ హి ఏషా గుణమయీ మమ మాయా దురత్యయా ।
మామ్ ఏవ యే ప్రపద్యంతే మాయామ్ ఏతాం తరంతి తే ॥

నేను - నా మాయ

ఓ అర్జునా! ఊహాజనితము - అత్యద్భుతము - మనోకల్పితము అగు త్రిగుణమయమైన నా మాయ బహు చమత్కారమైనది. ఈ నా త్రిగుణాత్మకమైన మాయను దాటివేయటం సులభం కాదు సుమా! దురత్యయం!

అయితే, ‘‘ఈ కనబడే ప్రతి ఒక్కరు పరమాత్మ స్వరూపులేకదా!

ఈ గుణములకు అతీతమై పరమాత్మస్వరూపం - మమాత్మ స్వరూపం ఈ ఒక్కొక్కరిలో - అందరిలో వేంచేసియుండి, పూదండలోని దారంలాగా అంతర్లీనంగా ప్రకాశిస్తోంది కదా’’ … అనే మననము - ధ్యాస - దృష్టి - భావనలచే ఉపాసించేవారు ఈ మాయనుండి తరిస్తున్నారు. గుణములకు అతీతమైన పరమాత్మదృష్టిచే ఈ జగత్తును - సహజీవులను - సకల సంఘటనలను సందర్శిస్తూ ‘ఆత్మసందర్శనం’ అను రూపంగా ఉపాసించేవారు మాయను దాటివేస్తున్నారు. మాయకు ఆవలగా ఏ తమ ఆత్మస్వరూపం సర్వే - సర్వత్రా సర్వదా ఏర్పడియే ఉన్నదో … సర్వము తానై - సర్వ సాక్షిగా వేరై ఉన్నదో…., అద్దానిని తనతో సహా అందరిలోను - అందరుగాను ఆస్వాదిస్తున్నారు. ఆత్మజ్ఞులు - ఆత్మానందానుభవులు అగుచున్నారు.

07–15

న మాం దుష్కృతినో మూఢాః ప్రపద్యన్తే నరాధమాః ।
మాయయాపహృతజ్ఞానా ఆసురం భావమాశ్రితాః ॥

న మాం దుష్కృతినో మూఢాః ప్రపద్యన్తే నర-అధమాః ।
మాయయా అపహృతజ్ఞానా ఆసురం భావమ్ ఆశ్రితాః ॥

సుకృత - దుష్కృతులు

ఓ అర్జునా! ఈ జీవులు రెండు విధములుగా ఉంటున్నారు.

1) దుష్కృతులు - ఆసురీ భావములు ఆశ్రియించువారై ఉండుటం చేత వీరి జ్ఞానము మాయచే అపహృతమై (దొంగిలించబడి) ఉంటోంది.
2) సుకృతులు - వీరు నాలుగు రకములు - ఆర్తులు, అర్థార్థులు, జిజ్ఞాసులు, జ్ఞానులు.

వారి గురించి విను.

దుష్కృతులు - అసురీభావ ఆశ్రితులు :
↳ వీరు పరమాత్మ, సర్వాంతర్యామియగు నన్ను ఉపాసించే దృష్టిని ఆశ్రయించటమే లేదు.
↳ దృశ్యమును దృశ్యముగానే నమ్ముతూ ఉన్నారు. పైగా, దుష్కృత్యములను కొనసాగిస్తూ మూఢత్వముతో జీవితములను కొనసాగిస్తున్నారు.
↳ కోపము - ఉద్వేగము - తప్పులెంచటం - ద్వేషము - ఆధిపత్యము - అవమానించటం - దూషించటం - దుర్గుణములు ఆపాదించటం… ఇటువంటివి అభ్యసిస్తూ రోజులు వెళ్లపుచ్చుచున్నారే గాని ‘‘మమాత్మస్వరూపమే వీరంతా కదా!’’ … అనే భావనను దృశ్యముపట్ల ఆశ్రయించటం లేదు.
↳ ‘‘నా ఆత్మనే నేను ద్వేషిస్తున్నాను - దూషిస్తున్నాను’’…. అన్నటువంటి విషయం వారు గమనించటం లేదు.
↳ సర్వము ప్రసాదించే పరమాత్మయొక్క పాత్రను గమనించరు. ఉపాసించరు.
↳ వీరు మానవ జాతిలో అధములుగా ఎంచబడుచున్నారు. ఎందుకంటే వారు ఉపాసనాపూర్వకంగా జీవితమును సద్వినియోగపరచుకోవటం లేదు కదా! వారి బుద్ధి కళ్ళకు కనబడే దృశ్యమునకు బద్ధము అయి వుంటోంది.

07–16

చతుర్విధా భజన్తే మాం జనాః సుకృతినోఽర్జున ।
ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ ॥

చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినో, అర్జున! ।
ఆర్తో జిజ్ఞాసుః అర్థార్థీ జ్ఞానీ చ, భరతర్షభ! ॥

సుకృతులు : పరమాత్మను ఉపాసించే సుకృతులు నాలుగు విధములుగా ఉండి నన్ను భజిస్తున్నారు!

(i). ఆర్తులు : వీరు వీరికి వచ్చే కష్ట - నష్టముల నుండి ఉపశాంతిని కోరినవారై పరమాత్మను ఉపాసిస్తున్నారు.
➕ మంచిదే! ఏదో కారణంచేత పరమాత్మను ఆశ్రయిస్తున్నారు కదా!
➖ అయితే…., ఆ కష్ట - నష్టములు తొలగగానే మరల పరమాత్మను ఎంతో కొంత ఏమరచటం జరుగుతూ వస్తోంది.
నన్ను ఆశ్రయిస్తే కష్టములు తొలగించటం నా స్వభావము (సంకటములో వేంకట రమణుడు).

(ii). జిజ్ఞాసువులు : మరికొందరు - ‘‘పరమాత్మ గురించి తెలుసుకోవాలి. ఎవ్వరేమంటున్నారో శ్లోకార్థపూర్వకంగా అర్థం చేసుకోవాలి. అవన్నీ ఎవరికైనా చెప్పి ‘జ్ఞానులము’ అని అనిపించుకోవాలి. మేము చెప్పుచుండగా అనేకులు వినాలి’’.. ఇటువంటి జిజ్ఞాస కలిగినవారై పరమాత్మ గుణతత్వాన్ని పఠిస్తున్నారు. ఉపాసిస్తున్నారు. సంభాషిస్తున్నారు.
➖ అయితే జిజ్ఞాసకు అంతేమున్నది. అది ఈ దృశ్యమంత అనంతం. దృశ్యమునకు ఆవల గల ద్రష్ట యొక్క తత్వము ఎట్టిదో ఆస్వాదించనంతవరకు జిజ్ఞాస కొనసాగుతూనే ఉంటుంది.
➕ అయితే, ఆత్మ సంబంధమైన అనన్య జిజ్ఞాసచే అన్య జిజ్ఞాస తొలగుతూ వస్తుంది.

(iii). అర్థార్థులు : మరికొందరు సుకృతులు ఉత్తమ ప్రతిష్ఠ - సంపద - కళాప్రావీణ్యత - సమృద్ధి … ఇటువంటి విశేషాలు అర్థించినవారై పరమాత్మను కొలుస్తున్నారు.
➖ సంపదలకై మాత్రమే వారు పరమాత్మను ఉపాసిస్తున్నారు.
➕ దైవీగుణ సంపత్తిని సముపార్జించువాడు కూడా - అర్థార్థియే!

(iv). జ్ఞానులు : మహనీయుడైన జ్ఞాని ఈ జగత్తంతా కూడా (తన దేహ మనో - బుద్ధి - చిత్త - అహంకారాదులతో సహా) పరమాత్మ యొక్క స్వరూపమేనని ఎరుగుచూ… సర్వము పరమాత్మతత్త్వంగా, తత్త్వాంతర్గతంగా ఉపాసిస్తున్నవాడు. తత్త్వమ్‌ (నాకు కనిపించే త్వమ్‌-నీవు) అంతా పరమాత్మ విలాసమే అనే మార్గంలో ప్రయాణిస్తున్నాడు!

07–17

తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే ।
ప్రియో హి జ్ఞానినోఽత్యర్థమహం స చ మమ ప్రియః ॥

తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిః విశిష్యతే ।
ప్రియో హి జ్ఞానినో అత్యర్థమ్ అహం, స చ మమ ప్రియః ॥

ఈ విధమైన ఆర్త - జిజ్ఞాస - అర్ధార్థి - జ్ఞాన చతుర్విధ ఉపాసకులలో జ్ఞాని అధికంగా అకారణ - అనపేక్ష - అనునిత్యోపాసకుడై ఉంటున్నాడు. ఆతనిలో ఏకభక్తి అత్యధికమై ఉంటోంది. నన్ను చేరటమే ఉత్తమ గతిగా కలిగి ఉన్నాడు. ఆతడు పరమాత్మకొరకై జగత్తుతో ఉంటాడు. ‘‘జగద్విషయముల కొరకై పరమాత్మను ఉపాసించుట’’ - అను స్థితిని అధిగమించివేసి ఉంటాడు.

ఓ అర్జునా! సర్వాత్మకుడనగు నాకు భక్తులందరిలోకి జ్ఞానభక్తుడంటే మరీ ఇష్టం. అట్లాగే జ్ఞానికి నేనే పరమప్రీతి పాత్రుడను. ఆతడు జగత్తును జగదీశ్వరుడగు నాస్వరూపంగా అనుక్షణం ఉపాసిస్తున్నాడు. నన్నే మహదాశయముగా కలిగి ఉన్నాడు కదా!

07–18

ఉదారాః సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతమ్ ।
ఆస్థితః స హి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిమ్ ॥

ఉదారాః సర్వ ఏవ ఏతే జ్ఞానీ తు ఆత్మా ఏవ మే మతమ్ ।
ఆస్థితః స హి యుక్తాత్మా మామ్ ఏవ అనుత్తమాం గతిమ్ ॥

మనం చెప్పుకున్న ఆర్త - జిజ్ఞాస - అర్ధార్ధి - జ్ఞానులు నలుగురు ధన్యులే! ఎందుకంటే వారు నలుగురు భగవదోపాసన నిర్వర్తిస్తున్నారు. భక్తిని ప్రవృద్ధం చేసుకొంటున్నారు. నలుగురు సుకృతులే! నలుగురు తమతమ మనో-బుద్ధులను పవిత్రం చేసుకొంటున్నారు.

అయితే…, జ్ఞాని - ప్రాపంచికమైన ఏ ప్రయోజనం ఉద్దేశించకుండానే, స్వభావసిద్ధంగా పరమాత్మయొక్క నిత్య - సత్య - అప్రమేయ - అఖండ తత్త్వాన్ని పరమార్థయుక్తంగా ఆశ్రయిస్తున్నాడు. ఆతనికి పరమాత్మయే సాధన - సాధ్యము కూడా! మరింకేదీ ఆతని ఆశయం కాదు.

ఆతడు మహదాశయుడై వుంటాడు!

జ్ఞాని సర్వదా భగవత్‌ యోగానందమునందు ఓలలాడుచున్నాడు. అందుచేత ‘‘నేనే జ్ఞాని’’, ‘‘జ్ఞానియే నేను’’. మా ఉభయులకు భేదమే లేదు. ‘‘తత్త్వమ్‌ - సోఽహమ్‌ - త్వమేవాహమ్‌’’ అను మూడు వాక్యముల అర్థమును అనుక్షణికంగా జ్ఞాని ఆస్వాదిస్తున్నాడు సుమా! జ్ఞాని సర్వము నా స్వరూపంగా చూస్తూ ఆరాధిస్తున్నాడు.

(“అహమ్‌ తు అకామః” అను విధంగా) ఆర్తుడై - జిజ్ఞాసువు అయి - అర్థార్థియై నన్ను ఉపాసిస్తూ… కొంత కాలానికి ఆ సాధకుడు జ్ఞానిగా తనను తాను తీర్చిదిద్దుకొంటున్నాడు.

07–19

బహూనాం జన్మనామన్తే జ్ఞానవాన్మాం ప్రపద్యతే ।
వాసుదేవః సర్వమితి స మహాత్మా సుదుర్లభః ॥

బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మామ్ ప్రపద్యతే ।
వాసుదేవః సర్వమ్ ఇతి, స మహాత్మా సుదుర్లభః ॥

అనేక జన్మల ఉపాసన ప్రయోజనంగా జ్ఞాని సర్వతత్త్వస్వరూపుడను - సర్వాంతర్యామిని అగు నన్ను సందర్శిస్తూ ఉపాసిస్తున్నాడు. (వాసనాత్‌ వాసుదేవస్య వాసితంతే జగత్రయమ్‌). ‘‘పరమేశ్వరుడే సర్వే సర్వత్రా సర్వగుణ - దేహ - దృశ్య ప్రదర్శనంగా అగుపిస్తున్నాడు. ఇదంతా వాసుదేవమయమే! నా వాసుదేవత్వమే ఇదంతా!’’ …. అని గ్రహిస్తున్నాడు.

అట్టి ఆత్మసాక్షాత్కార సంపన్నుడు, వాసుదేవ సర్వమితి - అని గానం చేయువాడు ఎక్కడోగాని నీకు లభించడు సుమా!

07–20

కామైస్తైస్తైర్హృతజ్ఞానాః ప్రపద్యన్తేఽన్యదేవతాః ।
తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతాః స్వయా ॥

కామైః తైః తైః హృతజ్ఞానాః ప్రపద్యన్తే అన్యదేవతాః ।
తం తం నియమమ్ ఆస్థాయ ప్రకృత్యా నియతాః స్వయా ॥

ఆర్త - జిజ్ఞాస - అర్థార్థుల గురించి మరికొంత చెప్పుచున్నాను. విను.

సకామపూర్వక దేవతోపాసన

కొందరు జీవులు ఏవేవో జగత్‌సంబంధమైన సంపద - క్షేమాదులు పొందవలెనని ఉబలాటపడుచూ, …. ఉపాసిస్తున్నారు కదా! వారు ఆయా - తమతమ హృదయాంతర్గతమైన కోరికలను దృష్టిలో పెట్టుకొని ‘‘ఈ జగత్తు వేరు - నా ఉపాసనా దైవం వేరు’’ అనే రూపంగా అన్యదేవతోపాసన చేస్తున్నారు. వారివారి స్వభావములచే ప్రేరితులై అన్య దేవతోపాసనకు ఉపక్రమిస్తున్నారేగాని అనన్య తత్త్వమును గమనించటము లేదు.

07–21

యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్ఛతి ।
తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహమ్ ॥

యో యో యామ్ యామ్ తనుమ్ భక్తః శ్రద్ధయా అర్చితుమ్ ఇచ్ఛతి ।
తస్య తస్య అచలాం శ్రద్ధాం తామ్ ఏవ విదధామి అహమ్ ॥

ఎవరెవరు ఏఏ దేవతా స్వరూపమును ఏఏ ప్రయోజనము కొరకై శ్రద్ధతో అర్చించాలని తీవ్రముగా ఉద్దేశ్యిస్తున్నారో…, అట్టి వారి ఇచ్ఛ-ఆశయములను అనుసరించి - ఆ దేవతయందు శ్రద్ధను నేను ఆ ఉపాస్యపరులకు ప్రసాదిస్తున్నాను. అట్లు ఆయా ఉద్దేశ్యములలో పూజించేవారికి వారు కోరుకుంటున్న ఆయా ప్రయోజనములను నేనే అందింపజేస్తున్నాను.

07–22

స తయా శ్రద్ధయా యుక్తస్తస్యారాధనమీహతే ।
లభతే చ తతః కామాన్మయైవ విహితాన్ హి తాన్ ॥

స తయా శ్రద్ధయా యుక్తః తస్య ఆరాధనమ్ ఈహతే ।
లభతే చ తతః కామాన్ మయా ఏవ విహితాన్ హి తాన్ ॥

ఎవరు ఏ దేవతను ఏ ఆశయము (లేక ఉద్దేశ్యము)తో ఉపాసిస్తున్నారో… వారు ఆ ప్రయోజనమును ఆ నా దేవతారూపం నుండి పొందుచున్నారు… వారికి ఆ దేవతా రూపముగా ఆ ఉద్దేశ్యమును అట్లే సిద్ధింపజేస్తున్నాను.

07–23

అన్తవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసామ్ ।
దేవాన్దేవయజో యాన్తి మద్భక్తా యాన్తి మామపి ॥

అంతవత్ తు ఫలం తేషాం తత్ భవతి అల్పమేధసామ్ ।
దేవాన్ దేవయజో యాంతి, మత్ భక్తా యాంతి మామ్ అపి ॥

అయితే…,
అల్పమైన మేధస్సుచే అల్పమైన ఆకాంక్షలు - దృశ్యసంబంధమైన ఆశయములు కలిగిఉన్నవారు, అల్పము - కాలపరిమితము అగు ఫలములను పొందటం జరుగుతోంది. అనగా, దృశ్యప్రయోజనము ఆశించి దేవతలను ఉపాసించేవారు అద్దానికి ప్రయోజనంగా ఆ నా దేవతారూపము ద్వారా ఆ యొక్క దృశ్యసంబంధమైన ప్రయోజనములనే పొందుచున్నారు.

ఇక నా భక్తులు… నన్నే కోరుకొని ఉపాసించినవారై నన్నే పొందుచున్నారు సుమా!
07–24

అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యన్తే మామబుద్ధయః ।
పరం భావమజానన్తో మమావ్యయమనుత్తమమ్ ॥

అవ్యక్తం వ్యక్తిమ్ ఆపన్నం మన్యంతే మామ్ అబుద్ధయః ।
పరం భావమ్ అజానన్తో మమ అవ్యయమ్ అనుత్తమమ్ ॥

నిష్కామపూర్వక పరమాత్మోపాసన

→ దేహమునకు రూపం ఉన్నది. దేహికో? రూపమేమున్నది?
→ సర్వ దేహములలోని దేహి స్వరూపుడననగు నేను అవ్యక్తాత్మస్వరూపుడను.
→ ఈ జగత్తో,….. అవ్యక్తాత్ముడనగు నా యొక్క ప్రదర్శనా విన్యాసం.
→ ఈ నామరూపాత్మక సృష్టికి, జన్మకర్మలకు మునుముందే ఏర్పడిఉన్న సత్‌ స్వరూపుడను.
→ సర్వమునకు అంతర్యామిని. అప్రమేయ స్వరూపుడను.
→ దేశ - కాలములకు అప్రమేయుడను. కాని, దేశ కాలముల నియామకుడను. ఆధారభూతుడను. జీవులందరి స్వరూపుడనై ఆస్వాదించువాడను!
→ దేహ-మనో-ఇంద్రియములకు అవిషయుడను. కానీ వాటికి ఆధారం నేనే.
→ నేను అవ్యక్తుడననే అయినప్పటికీ…. ఈ దృశ్యమంతా నా వ్యక్తీకరణమే! (All this is my manifestation, whereas I am prior to this manifestation.)

పరంభావం అజానంతో

దేహము, గుణములు = వ్యక్తము.

దేహి = సర్వము వ్యక్తీకరించే తాను అవ్యక్తుడు.

అట్టి అవ్యక్తతత్వమగు నన్ను ‘వ్యక్తుడు’ అని అల్పమేధస్సుగల జనులు అనుకోవటం జరుగుతోంది.

‘‘ఎందులో ఈ దృశ్యమంతా వ్యక్తమౌతోందో… అట్టి నా స్వరూపం అవ్యక్తం’’… అని ఉత్తమ బుద్ధిగలవారు గమనిస్తున్నారు.

ఇక అల్పబుద్ధి కలవారో…, నా యొక్క అవ్యక్తము - పరమోత్తమము అగు పరతత్త్వమును గమనించటం లేదు.

వ్యక్తీకరించబడే సర్వమునకు వ్యక్తీకరించే నేను మునుముందుగానే ఉన్నాను. కదిలే దేహాలను కదిలించే చైతన్యమును.

07–25

నాహం ప్రకాశః సర్వస్య యోగమాయాసమావృతః ।
మూఢోఽయం నాభిజానాతి లోకో మామజమవ్యయమ్ ॥

న అహం ప్రకాశః సర్వస్య యోగమాయా సమావృతః ।
మూఢో అయం న అభిజానాతి లోకో మామ్ అజమ్ అవ్యయమ్ ॥

ఓ అర్జునా! ‘యోగమాయ’ అను దృశ్యతత్వ సమన్వితమైన చమత్కారమునకు ఆవల ఉన్న నా యొక్క పరరూపం అనేకులకు గోచరమగుటలేదు.

నా యోగమాయా రూపములగు దేహ - జగత్తులే నేనని అనేకులు అనుకుంటున్నారు. దృశ్య వ్యవహారములచే మోహం చెందువారు - నేను జన్మరహితుడనని, అవ్యయమగు (మార్పు - చేర్పులు లేని) కేవల స్వాత్మస్వరూపమని - సందర్శించ లేకపోతున్నారు. తన యొక్క ఆత్మయే నేనని గమనించటం లేదు. సర్వదేహములలోని ‘దేహి’ స్వరూపుడనుగా వారు నన్ను గుర్తించటం లేదు.

07–26

వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున ।
భవిష్యాణి చ భూతాని మాం తు వేద న కశ్చన ॥

వేద అహం సమతీతాని వర్తమానాని చ, అర్జున! ।
భవిష్యాణి చ భూతాని మాం తు వేద న కశ్చన ॥

ఈ జీవులందరియొక్క -
(1) దేహమునకు మునుముందు స్వరూపము,
(2) దేహము ధరిస్తున్నప్పటి స్వరూపము,
(3) దేహానంతర స్వరూపమును నేను ఎఱిగియే ఉన్నాను. నేనే అయి ఉన్నాను.

ఈ త్రికాలములందు నా ఆత్మయే వారి స్వరూపమై ఉన్నది కదా! అయితే సర్వాంతర్యామి - ఆత్మానంద స్వరూపము - పరము - శాశ్వతము - అప్రమేయము అగు నన్ను గుర్తించలేక పోతున్నారు.

ఎందుకంటే?…
తెలుసుకొనునదే నేనై ఉండగా… తెలియబడేదాని ద్వారా ఎట్లా తెలియబడతాను?

07–27

ఇచ్ఛాద్వేషసముత్థేన ద్వన్ద్వమోహేన భారత ।
సర్వభూతాని సంమోహం సర్గే యాన్తి పరన్తప ॥

ఇచ్ఛా ద్వేష సముత్థేన ద్వంద్వ మోహేన, భారత! ।
సర్వభూతాని సంమోహం సర్గే యాంతి, పరంతప! ॥

‘‘సర్వజీవులలోని ఆత్మస్వరూపము నేనే!’’. ‘‘అవ్యక్తము - శాశ్వతము’’ అగు ఆత్మ స్వరూపుడను. ‘‘ఈ దృశ్యమంతా నాయందే నా స్వరూపమైయున్నది’’… అని అనేకులు సందర్శించటం లేదు.

ఎందుచేతనంటావా?

ఇష్టా-ద్వేష సముత్థేన

‘‘ఇష్టము - అయిష్టము - ఇచ్ఛ - ద్వేషము’’ అనే ద్వంద్వములచే ఈ జీవులలో అనేకులు మోహము పొందుచున్నారు. అందుచేత వారు ఆత్మతత్వమును గ్రహించలేకున్నారు.

07–28

యేషాం త్వన్తగతం పాపం జనానాం పుణ్యకర్మణామ్ ।
తే ద్వన్ద్వమోహనిర్ముక్తా భజన్తే మాం దృఢవ్రతాః ॥

యేషాం తు అంతగతం పాపం జనానాం పుణ్యకర్మణామ్ ।
తే ద్వంద్వ మోహ నిర్ముక్తా భజంతే మామ్ దృఢవ్రతాః ॥

అయితే….,
ఏ ఏ జీవులైతే తమతమ పుణ్యకర్మలచేత తమయందలి పాపదృష్టులను తొలగించుకుంటారో, దృఢవ్రతులై ద్వంద్వమోహము నుండి తమను తాము ఉద్ధరించుకోవటానికి సంసిద్ధులై యత్నిస్తున్నారో… అట్టివారు ‘‘సర్వాంతర్యామి - సర్వస్వరూపము - స్వస్వరూపము - అఖండాత్మ స్వరూపము’’ అగు నన్ను సమీపించి, స్వస్వరూపాత్మనగు నాపై దృష్టిని నిలుపుకొంటున్నారు. ఆస్వాదిస్తున్నారు.

07–29

జరామరణమోక్షాయ మామాశ్రిత్య యతన్తి యే ।
తే బ్రహ్మ తద్విదుః కృత్స్నమధ్యాత్మం కర్మ చాఖిలమ్ ॥

జరా-మరణ మోక్షాయ మామ్ ఆశ్రిత్య యతంతి యే ।
తే బ్రహ్మ తత్ విదుః, కృత్స్నమ్ అధ్యాత్మం కర్మ చ అఖిలమ్ ॥

ఓ అర్జునా! అతిదీర్ఘ కాలంగా కొనసాగుచున్న జన్మ - జరా - మరణముల చక్రము నుండి విడివడుటకై, ఎవ్వడైతే నిశ్చలము - అప్రమేయము అగు నన్ను ఎప్పుడు ఆశ్రయించి ఉపాసిస్తాడో, …. అట్టివాడు అప్పుడు పరబ్రహ్మము - అధ్యాత్మము - సర్వము - సర్వకర్మలకు అతీతము - స్వస్వరూపమునకు అద్వితీయము అగు నన్ను తెలుసుకొని సంపూర్ణత్వమునకు అనుభవయోగ్యుడుగా అగుచున్నాడు.

07–30

సాధిభూతాధిదైవం మాం సాధియజ్ఞం చ యే విదుః ।
ప్రయాణకాలేఽపి చ మాం తే విదుర్యుక్తచేతసః ॥

స-అధిభూత-అధిదైవం మామ్ స-అధియజ్ఞం చ యే విదుః ।
ప్రయాణకాలే అపి చ మామ్ తే విదుః యుక్తచేతసః ॥

అట్టివాడు ఈ వర్తమాన దేహపర్యంతము - దేహత్యాజ్య సమయంలో కూడా అధిభూతుడను, అధిదైవమును, అధియజ్ఞ స్వరూపుడను అగు నన్ను యుక్తియుక్తంగా ఎఱిగినవాడై - నన్నే చేరుచున్నాడు.

యుక్త చేతసుడై యోగబుద్ధితో సర్వే-సర్వత్రా నన్నే దర్శిస్తున్నాడు.

నాయందు ప్రవేశించి - ప్రకాశించి తానే నేనుగా అగుచున్నాడు.

సర్వాత్మ స్వరూపుడై శాశ్వతాత్మానందం పొందుచున్నాడు.


ఇతి శ్రీమత్‌ భగవద్గీతాసు … విజ్ఞాన యోగ పుష్పః ।
శ్రీ సాంబ సదాశివ పాదారవిందార్పణమస్తు ॥
🙏