భగవద్గీత

08. అక్షర పరబ్రహ్మ యోగ అధ్యయన పుష్పం

మూలము : శ్రీ వ్యాస మహర్షిచే విరచించబడిన జయము / మహాభారతము (భీష్మ పర్వము)

అధ్యయన వ్యాఖ్యానము : (అధ్యయన విద్యార్థి) యేలేశ్వరపు హనుమ రామకృష్ణ


Arjuna asking Krishna

మూల శ్లోకము


అధ్యయన వ్యాఖ్యానము


ఉపన్యాసము

అర్జున ఉవాచ :-

08–01

కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ ।
అధిభూతం చ కిం ప్రోక్తమధిదైవం కిముచ్యతే ॥

కిం తత్ బ్రహ్మ? కిం అధ్యాత్మం? కిం కర్మ?, పురుషోత్తమ! ।
అధిభూతం చ కిం ప్రోక్తం? అధిదైవం కిం ఉచ్యతే? ॥

అర్జునుడు :

హే మహాత్మా! శ్రీకృష్ణా! మీరు ఈ విధంగా బోధించినారు కదా!

‘‘భక్తి - జ్ఞాన - కర్మ యోగులు తమ యొక్క పుణ్య కర్మలచే పాపదృష్టులను త్యజించి, ద్వంద్వమోహము నుండి వినిర్ముక్తులై, దృఢవ్రతశీలురై నన్నే ఆరాధిస్తూ - ఉపాసిస్తూ ఉంటారు. జరామరణముల నుండి విముక్తి పొందటానికై వారు నన్ను ఆశ్రయించి తద్వారా బ్రహ్మమును అధ్యాత్మమును, కర్మ తత్వమును ఎఱిగిన వారగుచున్నారు" … అని మీరు అనియున్న ఈ సందర్భంగా ’‘బ్రహ్మము’ మొదలైన శాస్త్రప్రవచిత శబ్దార్థ విశేషాలు నాకు బోధించవలసినదిగా ప్రార్థిస్తున్నాను.

శబ్దార్థ ప్రశ్నలు

ఓ పురుషోత్తమా! శ్రీకృష్ణా! ఇప్పటిదాకా మీరు ’‘నేను - నా ప్రకృతి’’ అను విభాగం చేసి జీవుని గురించి నిర్వచించారు కదా! ఈ సందర్భంగా, మిమ్ములను కొన్ని అధ్యాత్మశాస్త్ర ప్రవచితములగు శబ్దార్థ విశేషాలు విశ్లేషించి చెప్పవలసినదిగా… అభ్యర్థన చేస్తున్నాను.

Question#1.) ‘‘తత్‌-బ్రహ్మము’’ అనగా ఏమిటి?

Question#2.) ‘‘అధ్యాత్మము’’ అని దేనిని పిలుస్తున్నారు?

Question#3.) ‘‘కర్మ’’ అనగా అసలైన విశేషార్థమేమిటి?

Question#4.) ‘‘అధిభూతం’’ అని ఏది చెప్పబడుతోంది?

Question#5.) ‘‘అధిదైవం’’ అను శబ్దం ఎద్దానిని ఉద్దేశ్యిస్తోంది?

08–02

అధియజ్ఞః కథం కోఽత్ర దేహేఽస్మిన్మధుసూదన ।
ప్రయాణకాలే చ కథం జ్ఞేయోఽసి నియతాత్మభిః ॥

అధియజ్ఞః కథం కో అత్ర దేహే అస్మిన్? మధుసూదన! ।
ప్రయాణకాలే చ కథం జ్ఞేయో అసి నియతాత్మభిః? ॥

Question#6.) ‘‘అధియజ్ఞం’’ అని దేనిని పిలుస్తున్నారు? ‘‘ఈ దేహంలో అధియజ్ఞుడు ఉంటాడు’’ అని అంటూ ఉంటారు కదా! ఈ శరీరంలో ఆతని ఉనికి ఏది? ఎట్టిది?

Question#7.) యోగచిత్తులైన మహనీయులు నియతాత్ములై పయనిస్తున్నప్పుడు “అంత్యకాలంలో కూడా ఎద్దానిని ఎఱుగుచూ ప్రయాణశీలురగుచున్నారు?”. అనగా, ఈ జగత్ వ్యవహారంలో ఉన్నప్పుడు, మరియు జగత్తులోని సర్వ వ్యవహారములు త్యజించి వెళ్లుచున్న సమయంలో (అంత్యకాలంలో) కూడా ఎద్దానిని ఎఱుగుచూ ప్రయాణశీలురగుచున్నారు?

(NOTE: సామాన్య పరిభాషలో ‘‘బ్రహ్మము’’ అనగా సాధనానంతరం అనుభూతమయ్యేదని, ‘అధ్యాత్మము’ అంటే జీవుడు అని, ‘కర్మ’ అనగా చేస్తున్న పని అని, ‘అధిదైవం’ అనగా శివుడో - విష్ణువో - అల్లాయో - యహోవా (ఇష్టదైవం) అని, యజ్ఞము అంటే అగ్నికార్యము అని, జ్ఞేయము అంటే ఎక్కడో ఏర్పడిఉన్న ఏదో తెలుసుకోవటం అని - లోకరీతిగా అనుకుంటూ ఉంటారు. ఆ శబ్దముల యొక్క తత్వశాస్త్రార్థాలు ఏమిటని అర్జునుడు అగుచున్నారు.)

శ్రీ భగవాన్ ఉవాచ :-

08–03

అక్షరం బ్రహ్మ పరమం స్వభావోఽధ్యాత్మముచ్యతే ।
భూతభావోద్భవకరో విసర్గః కర్మసంజ్ఞితః ॥

అక్షరం బ్రహ్మ పరమం, స్వభావో అధ్యాత్మం ఉచ్యతే ।
భూతభావ ఉద్భవకరో విసర్గః కర్మ సంజ్ఞితః ॥

శ్రీకృష్ణ భగవానుడు :-

నీవు అడిగిన శబ్దాలకు అర్థాలు తత్వశాస్త్రానుసారం చెపుతాను. విను.

Answer#1) బ్రహ్మము :

కిం తత్ బ్రహ్మ? అక్షరం బ్రహ్మ పరమం ।

ఓ అర్జునా! ఈ కనబడే సర్వదృశ్య వ్యవహారములు మార్పుచెందేవీ, గమనశీలము కదా! అయితే, ఈ జీవుని స్వస్వరూపంగా వెలుగొందుచున్నట్టి ‘‘కేవలీ తత్వము’’ మార్పు - చేర్పులకు సంబంధించనిదై, అక్షరమై, సర్వములో విభాగం కాకుండా (సర్వమునకు వేరై) వెలుగొందుచున్నది. అది జన్మ - జీవిత సంఘటన - జర - మరణ - మరణానంతర స్థితిగతులచే మార్పు చేర్పులు చెందటమే లేదు. అట్టి జీవుని యొక్క అక్షర - పర స్వరూపము ‘‘బ్రహ్మము’’ అను శబ్దముతో చెప్పబడుతోంది.

పిపీలికాది బ్రహ్మ పర్యంతం సర్వజీవులు ఆ ‘‘అక్షర పరబ్రహ్మము’’ అనునదే తమ వాస్తవ స్వరూపంగా కలిగి ఉన్నారు.

గుణములచేతగాని, స్థితిగతుల చేతగాని అయ్యది స్పృశించబడేది కాదు. అద్దానిని పాప - పుణ్య, సుఖ - దుఃఖ, జ్ఞాన - అజ్ఞాన, జీవన్‌ - మరణ, భూత - వర్తమాన - భవిష్యత్‌ విశేషాలు స్పృశించవు.

వేరువేరైన నాటకాలలో వేరు వేరు పాత్రలను పోషిస్తున్న ఒక నటుడు ఏ ఒక్కొక్క పాత్రకు గుణపరిమితుడు, బద్ధుడు కాదు కదా! బ్రహ్మము అంతే.

అట్టి ప్రతి ఒక్క జీవుని యొక్క మార్పు - చేర్పులచే స్పృశించబడని స్వస్వరూప తత్త్వమే బ్రహ్మము.

బ్రహ్మము ఎప్పటికో పొందబడేది కాదు. అది ఎల్లప్పుడు ప్రతి ఒక్కరిచే సర్వదా పొందబడియే ఉన్నది.

‘‘మన ఆలోచనలో ఆలోచనలు చేయువానిని పట్టుకుందాం! ఆలోచనలలోంచి ఆలోచించువానిని సంపాదించుకొందాము’’….. అని అనం కదా! ఆలోచనలు చేయువాడు సర్వదా ఆలోచనలకు మునుముందుగానే ఉంటాడు. ఆలోచనలలో జన్మ - కర్మలు ఉన్నాయి. అట్టి సర్వ ఆలోచనలకు మునుముందుగా ఉన్నదే పరబ్రహ్మము. ఆలోచనల సహాయంతో ఆలోచించువానిని గమనిద్దాం - అని మాత్రం తప్పక అనగలం!

అట్టి నిత్య సత్యము - వాస్తవ స్వరూపము - కేవలము - నిశ్చలము అగు అక్షర తత్త్వము ‘బ్రహ్మము’ అను శబ్దముచే ఉద్దేశించబడుతోంది. అది ఈ సర్వమునకు సర్వదా వేఱై - పరమైయున్నది.

అట్టి నిర్గుణ - నిరాకార స్వస్వరూప సర్వరూప - కేవలీ - చైతన్యమే బ్రహ్మము. అద్దాని సమక్షంలో ఈ జన్మ-కర్మ సర్వచమత్కారాలు స్వయంకల్పితమై, లీలగా - క్రీడగా గోచరిస్తున్నాయి.

🌺🙏🌺

Answer#2) అధ్యాత్మము :

కిం అధ్యాత్మం? స్వభావో అధ్యాత్మం ఉచ్యతే ।

అట్టి అక్షర పరబ్రహ్మము ఈ దేహ - మనో- బుద్ధి - అహంకారములను ఉపకరణ చమత్కార మాత్రంగా కలిగి ఉంటోంది. బ్రహ్మమే స్వభావసిద్ధంగా జగత్తులను కల్పించటం - దేహములను ఆశ్రయించటం - జ్ఞానాజ్ఞానాలను సేవించటం… మొదలైన విశేషాలన్నీ కల్పించుకొని ఆస్వాదిస్తోంది. ఒకడు నిదురించి, ఆ నిదురలో స్వభావసిద్ధంగా స్వప్న - స్వప్నాంతర్గత విశేషాలు కల్పించుకొని ఆస్వాదిస్తున్నాడు చూచావా? బ్రహ్మము కూడా జగత్తులను కల్పించుకొని అద్దానియందు వ్యష్ఠి - సమష్ఠి తత్వములను ఆస్వాదిస్తోంది.

అట్టి ‘‘నిర్గుణ బ్రహ్మముయొక్క సగుణ (గుణసహిత) దృశ్య చమత్కార ఆస్వాదనయే’’… స్వభావము.

గుణములకు ముందే ఉన్న బ్రహ్మము గుణ విశేషములను స్వయంగా రచించుకొని ఆస్వాదించటం… అనే స్వభావ చమత్కారమును తత్వశాస్త్రజ్ఞులు ‘‘అధ్యాత్మము’’ అని పిలుస్తున్నారు.

ఒక వ్యక్తి - ఆతని స్వభావము వేరువేరు కాదు కదా! అట్లాగే బ్రహ్మము - స్వభావము వేరువేరు కాదు. (ఈ తత్త్వమే అర్ధనారీశ్వర తత్త్వం).
బ్రహ్మమే జగత్తు. బ్రహ్మమే జీవులు. ఎందుకంటే బ్రహ్మము సర్వదా యథాతథం కదా!

బ్రహ్మముయొక్క ‘‘ఇది ఇట్లు ఉండు గాక’’ అను చిత్కళా చమత్కారమే ఈ దేహ పరంపరలు, జగత్‌ దృశ్యములు కూడా!

🌺🙏🌺

Answer#3) కర్మ :

కిం కర్మ? భూతభావ ఉద్భవకరో విసర్గః కర్మ సంజ్ఞితః ।

సామాన్యార్థంలో ‘కర్మ’ అనగా ఒకడు నిర్వర్తిస్తున్న పని - కార్యక్రమము. కర్మలు - ఫలాలు - కర్మచే జన్మలు ఇవన్నీ … కర్మగా చెప్పుచూ ఉంటారు.

విశేషార్థంలో ‘కర్మ’ : అక్షరము, పరము, ప్రతి ఒక్క జీవుని నిజస్వరూపం అయినట్టి బ్రహ్మము తనయొక్క స్వభావము (అధ్యాత్మము) అనబడే స్వయంకల్పిత చమత్కారం చేత భూతభావన ప్రారంభించటం - కొనసాగించటం - ఉపసంహరించటం చేస్తోంది. అనగా పంచభూతాత్మికమైన రూప - నామ - వ్యష్టి - సమిష్టి చమత్కారం నిర్వర్తిస్తోంది. మరొకప్పుడు ఈ దృశ్య చమత్కారాన్ని ఉపసంహరించుకోవటం నిర్వర్తిస్తోంది. స్వప్నానుభవమే ఇందుకు దృష్టాంతము. ఆ విధంగా ‘స్వభావము’ అనే ఉపకరణంతో నామరూపత్మకత్వం, దృశ్య భావనా రచన, ఆ కల్పనయందు ప్రకాశించటం, ఇంకొకప్పుడు అద్దాని ఉపసంహరించటం - ఇదంతా కూడా బ్రహ్మముయొక్క కార్యక్రమ చమత్కారం. అద్దానిని ‘కర్మ’ అనే సంజ్ఞతో పిలుస్తున్నారు. (Funny, playful act of the Brahman).

ఈ జీవుడు స్వయంగా పరబ్రహ్మస్వరూపమే! కనుక, కర్మ - స్వభాములకు ఆవల వెలుగొందే పరబ్రహ్మ స్వరూపము సర్వదా స్వభావసిద్ధంగా సర్వదా ఏర్పడియే ఉన్నది.

అట్టి సర్వదా - సర్వత్రా ఏర్పడియున్న బ్రహ్మము ‘స్వభావము’ అనే అధ్యాత్మమును క్రీడా వినోదంగా అవధరించి ’‘దృశ్య అంగీకార సంజ్ఞ’‘తో కనిపిస్తోంది. అట్టి ’‘జీవ భావం (భూత భావం) అంగీకరించి - ఆస్వాదించటము’’ను ‘కర్మ’ అను సంజ్ఞతో చెప్పుచున్నారు.

🌺🙏🌺

08–04

అధిభూతం క్షరో భావః పురుషశ్చాధిదైవతమ్ ।
అధియజ్ఞోఽహమేవాత్ర దేహే దేహభృతాం వర ॥

అధిభూతం క్షరో భావః, పురుషః చ అధిదైవతమ్ ।
అధియజ్ఞో అహమ్ ఏవ అత్ర దేహే, దేహభృతాం వర! ॥

Answer#4) అధిభూతం :

అధిభూతం చ కిం ప్రోక్తం? అధిభూతం క్షరో భావః ।

ఏఏ విశేషాలైన ఒకానొకప్పుడు జనించి మరొకప్పటికి నశిస్తాయో… అట్టి క్షరోభావ చమత్కారముల విన్యాసము ‘అధిభూతం’ అని పిలువబడుతోంది.

ఏదైతే అనివార్యంగా కాలక్రమేణా నాశనశీలమో… అదంతా ‘అధిభూతము’ అను శబ్దముచే ఉద్దేశ్యించబడుతోంది.

దేహాలు, జన్మలు, ఆలోచనలు, జ్ఞాన-అజ్ఞానాలు, మంచి-చెడులు, గుణాలు, జాగ్రత్-స్వప్న-సుషుప్తులు ➡ ఇవన్నీ వస్తున్నాయి, ఉంటున్నాయి, పోతున్నాయి.

వీటన్నిటికి ఆధారం భూతభావ ‘‘ఉద్భవ - విసర్గ’’ రూపమైన ‘కర్మ’ అనబడునదే!

కర్మకు ఆధారం స్వభావం (లేక) అధ్యాత్మం.

అద్దానికి ఆధారం పరబ్రహ్మము.

గతించిపోయే స్వభావం కలవన్నీ ‘అధిభూతం’ అంటారు.

ఒక దర్పణం (అద్దం)లో ఒకానొకడు ఒక నిముషంలో ఒక ఎఱ్ఱ చొక్కా వేసుకొన్నవాని ప్రతిబింబం చూచాడనుకో. ‘అద్దంలో ఎఱ్ఱచొక్కా వాడు ఉండును’’… అని సిద్ధాంతీకరిస్తే అది హాస్యాస్పదం కదా! అద్దంలో ప్రతిబింబించేదంతా దృశ్యం తొలగగానే (లేక) అద్దం యొక్క కోణం (Angle) మారిస్తే - మారిపోతుంది. అయితే అద్దంలో ‘ప్రతిబింబించటం’ అను ప్రక్రియ శాశ్వతం. ఒకానొక ప్రతిబింబమో… అది క్షరం.

అట్లాగే బ్రహ్మము-స్వభావము (దర్పణము-ప్రతిబింబించటం వలె) శాశ్వతం. ఆ స్వభావము యొక్క ఒక అనుభూతి, ఒక అనుభవమో? క్షరం మాత్రమే!

🌺🙏🌺

Answer#5) అధిదైవతం :

అధిదైవం కిం ఉచ్యతే? పురుషః చ అధిదైవతమ్ ।

ప్రతిజీవుడు - ఆలోచనలు చేయువాడు, కర్మలు నిర్వర్తించువాడు, సమయ సందర్భములను అనుభవములుగా పొందుచున్నవాడు … అయి ఉన్నాడు కదా! అదియే జీవునియొక్క పురుషకారము. పురుషకారము నిర్వర్తించే తత్వమే పురుషుడు. అతడు అధిదైవం అను అధ్యాత్మశాస్త్ర శబ్దముచే ఉద్దేశ్యించబడుచున్నాడు.

ఆతడే కల్పనలకు కర్త - భోక్త. జీవుడు అను పేరుతో ఉద్దేశ్యించబడుచున్నవాడు.

⤿ ఇంద్రియములను ఉపయోగించటం - ఇంద్రియ విషయములను ఆస్వాదించటం.
⤿ దేహములను పొందటం - ఆ దేహములలోని ఇంద్రియములను పనిచేయించటం.
⤿ ఆలోచనలు చేయటం - ఆ ఆలోచనలను అనుభవములుగా అనుభూతం పొందటం.
⤿ ’సంస్కార పరంపరల కట్టెల మోపు’ను మోస్తూ దేహ పరంపరలలో విహరించటం.
… ఇవన్నీ నిర్వర్తిస్తున్న విభాగంలో పురుషుడు పురుషకారము - Functional feature - ఇవన్నీ ప్రదర్శితమగుచున్నాయి.

జీవుని అంతర్గత పురుషకారం - తత్వశాస్త్రంలో ‘అధిదైవతము’ అని చెప్పబడుచున్నది (It is micro level function).
జగత్తును నడిపిస్తున్న పురుషకారము కూడా అధిదైవతమే (It is macro level function).

🌺🙏🌺

Answer#6) అధియజ్ఞం :

అధియజ్ఞః కథం కో అత్ర దేహే అస్మిన్? అధియజ్ఞో అహమ్ ఏవ అత్ర దేహే ।

జీవులందరిలో వేంచేసియున్న ‘నేను’ అనునదే ‘అధియజ్ఞం’.
[The Micro-self and the Macro-self are the playful, prime functions of the Brahman].

ఓ అర్జునా! దేహభృతాం వర! (దేహములు పొందినవారిలో శ్రేష్ఠుడా!) ఈ జగత్తులోని జీవులు - వారి జీవన విధానాలు… అన్నీ కలిపి బ్రహ్మము నిర్వర్తించే యజ్ఞముగా దర్శించు. దేహములలోని జీవుడియొక్క ఉనికియే (అత్ర అహమేవ) ‘అధియజ్ఞం’ అను శబ్దముచే చెప్పబడుతోంది. సర్వజీవులలోని అంతర్యామియొక్క జీవ - దేహ ప్రదర్శనమే అధియజ్ఞం.

🌺🙏🌺

08–05

అన్తకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కలేవరమ్ ।
యః ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సంశయః ॥

అంతకాలే చ మామ్ ఏవ స్మరన్ ముక్త్వా కలేవరమ్ ।
యః ప్రయాతి స మత్ భావం యాతి న అస్తి అత్ర సంశయః ॥

Answer#7) ప్రయాణకాలే చ :

ప్రయాణకాలే చ కథం జ్ఞేయో అసి నియతాత్మభిః? అంతకాలే చ మామ్ ఏవ స్మరన్ ముక్త్వా కలేవరమ్ ।

ఓ అర్జునా! ప్రతి దేహికి కాలక్రమేణా ఎప్పుడో ఒకప్పుడు ఈ దేహమును త్యజిస్తున్న సందర్భం అనివార్యం కదా! అభ్యాసవశంచేత దేహి ఈ దేహమునకు సంబంధించిన సంబంధ - బాంధవ్య - సంఘటన - వ్యవహార - సందర్భములే గుర్తుకు వస్తూ ఉంటాయి. అయితే దేహం అధిభూత విభాగం కదా! అనగా,… క్షరో భావాంతర్గతం. అనుక్షణం ఈ దేహం మార్పులు చెందేది కనుక, దేహ సంబంధమైన సర్వవిశేషాలు మార్పు చెందుతూనే ఉంటాయి. దేహం కొనసాగుచున్నప్పుడు కూడా ఈ మార్పు - చేర్పులు కాలప్రవాహంగా అనివార్యం … అని అందరూ గమనిస్తున్నదే!

ఎవ్వరైతే (1) ఒక ఆలోచన నుండి మరొక ఆలోచనకు ప్రయాణిస్తున్నప్పుడు, (2) దేహం త్యజిస్తున్నప్పుడు … ‘‘సర్వాంతర్యామి - సర్వతత్వ స్వరూపము - అనునిత్యంగా అప్రమేయము - స్వస్వరూపమునకు అభిన్నము’’ అగు నా స్వరూపం స్మరిస్తూ ఉంటారో… వారు అప్రమేయ - సర్వాంతర్యామినగు నా భావనను తప్పక పొందుతారు. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు.

08–06

యం యం వాపి స్మరన్భావం త్యజత్యన్తే కలేవరమ్ ।
తం తమేవైతి కౌన్తేయ సదా తద్భావభావితః ॥

యం యం వా అపి స్మరన్ భావం త్యజతి అంతే కలేవరమ్ ।
తం తం ఏవ ఏతి, కౌంతేయ! సదా తత్ భావ భావితః ॥

ఎందుచేతనంటే….,
ఎవ్వరు ఏ భావన జీవితకాలమంతా అధికాధికంగా అభ్యాసం చేస్తూవస్తారో… వారు దేహపతనానంతరం అట్టి సంబంధమైన భావనలే కొనసాగిస్తూ ఉంటారు కాబట్టి, తదనుభవానికి అనుకూలమైన ప్రవాహ పతిత దేహాలను పొందటం కొనసాగిస్తూనే ఉంటారు.

భావముల అభ్యాసమును అనుసరించే భూత - వర్తమాన - భవిష్యత్‌ దేహములను ఈ జీవుడు నిర్మించుకోవటం (ఆశ్రయించటం) కొనసాగిస్తున్నాడని గమనించు.

ఎవ్వరు ఏ భావములు అభ్యసిస్తూ ఉంటే, వారు ఆ భావములే తాముగా అనుభవం పొందుతూ ఉంటారు.

08–07

తస్మాత్సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ ।
మయ్యర్పితమనోబుద్ధిర్మామేవైష్యస్యసంశయమ్ ॥

తస్మాత్ సర్వేషు కాలేషు మామ్ అనుస్మర యుధ్య చ ।
మయి అర్పిత మనోబుద్ధిః మామ్ ఏవ ఏష్యసి అసంశయమ్ ॥

కనుక, ఓ అర్జునా!

సర్వకాల సర్వ అవస్థలయందు, అనుక్షణికంగా - సర్వాంతర్యామిని, బ్రహ్మమే స్వరూపముగా గల నన్ను స్మరిస్తూనే, ‘స్వధర్మము’ అయినట్టి నీ యుద్ధ ధర్మం నిర్వర్తించు.

‘‘సర్వము పరబ్రహ్మ స్వరూపమే కదా!’’ అని భావిస్తూ నీ మనోబుద్ధులను నాకు సమర్పించు. అనగా, ‘‘నావిగా నాకు అనుభూతమయ్యే ఈ మనో-బుద్ధులు సర్వతత్వస్వరూపుడగు పరమాత్మవే!’’ అని భావన చేస్తూ నీకు నియమితమైన కార్యములను ధర్మబద్ధుడవై నిర్వర్తించు.

అప్పుడు నేను సర్వదోషముల నుండి మొదలంట్లా నిన్ను సముద్ధరిస్తాను. ఇందులో నీవు సందేహించవలసినదేదీ లేదు.


08–08

అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా ।
పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచిన్తయన్ ॥

అభ్యాసయోగయుక్తేన చేతసా న అన్యగామినా ।
పరమం పురుషం దివ్యం యాతి, పార్థ! అనుచింతయన్ ॥

అభ్యాసము (Practice)

అయితే…,
నీయొక్క మనోబుద్ధులకు - ‘‘సర్వజీవులు, సర్వ కర్మ వ్యవహారములు సర్వాంతర్యామి యొక్క విన్యాస చమత్కారమే’’ - అని గోచరించేది ఎట్లా? అనిపించేది ఎట్లా? అందుకు ఉపాయం అభ్యాసమే!

‘‘సర్వము సర్వాంతర్యామి యొక్క ప్రదర్శనమే’’ …. అని అన్నివేళలా అనుకోవటం అభ్యసించు.

అనుకోవటం అభ్యాసం. అనిపించటం అందుకు ప్రయోజనం.

అభ్యాసయోగయుక్తేన :
1) యుక్తి [ఉపాయం] 2) అభ్యాసయోగం … ఈ రెండిటి సహాయంతో, "నీ ఇంద్రియ - మనో - బుద్ధులకు గోచరమయ్యేది, అట్లాగే,…. తదితర సర్వుల మనో - బుద్ధి - ఇంద్రియగోచరములు పరబ్రహ్మము యొక్క చమత్కారమే కదా’‘…. అను ధారణను సునిశ్చితం చేసుకో! అట్టి సునిశ్చియము యొక్క బలము కొరకై చిన్న - చిన్న సందర్భములను కూడా సమన్వయించుకొనే ప్రయత్నంలో ఉండు. అభ్యాసయోగయుక్తుడవై ఉండు.

చేతసా న అన్యగామినా :
’‘సర్వజీవులతో కూడిన ఈ దృశ్యమంతా కుడా పరమాత్మకు అభిన్నమైనది’’ అను బుద్ధిని పెంపొందించుకుంటూ,…. తదితర అన్యత్వమును క్రమక్రమంగా త్యజిస్తూ… అట్టి అనుచింతన - అనన్య చింతనలచే (పరమాత్మకు అన్యమైనదేదీ లేదు కదా… అను భావనా బలిమిచే) పరమపురుషత్వమును ఈ జీవుడు తప్పక పొందగలడు.

08–09

కవిం పురాణమనుశాసితారమ్
అణోరణీయాంసమనుస్మరేద్యః ।
సర్వస్య ధాతారమచిన్త్యరూపమ్
ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ ॥

కవిం, పురాణమ్, అనుశాసితారమ్,
అణోః అణీయాంసమ్ అనుస్మరేత్ యః ।
సర్వస్య ధాతారమ్, అచింత్యరూపమ్,
ఆదిత్యవర్ణం, తమసః పరస్తాత్ ॥

అనన్య చింతన - అనుచింతన దేనిగురించి?

⤿ సర్వజ్ఞుడు
⤿ అనాది
⤿ సర్వనియామకుడు
⤿ పరమాణువు కంటే కూడా అతి సూక్ష్ముడు
⤿ సర్వమును పరిపోషణ చేయువాడు
⤿ సూర్యుని వలె స్వయంప్రకాశకుడు
⤿ అవిద్యకు ఆవలి గట్టువంటివాడు
⤿ సర్వ స్వరూపుడు
… అగు పరమాత్మను భావన చేస్తూ ఎవడు ఉపాసిస్తాడో
… అట్టివాడు ఆ ’‘పరమపురుష యోగస్థితి’’ని సముపార్జించుకుంటున్నాడు.

08–10

ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా
యుక్తో యోగబలేన చైవ ।
భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్
స తం పరం పురుషముపైతి దివ్యమ్ ॥

ప్రయాణకాలే మనసా అచలేన,
భక్త్యా యుక్తో యోగబలేన చ ఏవ ।
భ్రువోః మధ్యే ప్రాణమ్ ఆవేశ్య సమ్యక్,
స తం పరం పురుషమ్ ఉప ఏతి దివ్యమ్ ॥

అందుకు సాధనలు ‘‘భక్తి“, ”యోగము’’, మొదలైనవి.

భక్తియొక్క అభ్యాసముచేతనో (లేక) యోగాభ్యాసంచేతనో పరిపరి విధములుగా చంచలమగుచున్న మనస్సును నిశ్చలం చేయాలి. దృశ్యమును వేరు వేరు రీతులనుకుంటూ చూస్తున్న మనస్సును కొంత స్థిరం చేయాలి. మనోబుద్ధులను భ్రూమధ్యంగా ఏకాగ్రం చేయటం అభ్యసిస్తే అవి తమ చంచలత్వాన్ని క్రమ క్రమంగా త్యజించి స్వాధీనం కాగలవు.

వింటున్నావా అర్జునా!
ఈ జీవుడు నిత్య ప్రయాణీకుడు…!

- ఒక ఆలోచన నుండి → మరొక ఆలోచనవైపుగా…,
- ఒక భావన నుండి → మరొక భావనవైపుగా…,
- ఒక సందర్భం నుండి → మరొక సందర్భానికి….,
- జాగ్రత్‌ నుండి → స్వప్నానికి….,
- స్వప్నం నుండి → సుషుప్తికి ….,
- సుషుప్తి నుండి → జాగ్రత్‌కు ….,
- ఒక దేహం నుండి → మరొకదేహానికి….,

… ఈ విధంగా ప్రయాణించు సందర్భములలో -
↳ పూర్వ, తత్‌ పూర్వ విషయాలను,
↳ ముందుముందటి దృశ్యసంబంధమైన ఆశల పరంపరలను
… కొంచం కొంచం జయిస్తూ, ధ్యాసను అంతర్గతం చేస్తూ ఉండగా …,
🙏 ఈ జీవుడు ‘‘దేహత్వం’’… అనే స్థితినుండి ‘‘పరమ పురుషత్వము’’ అను మహోన్నత స్థితిని సముపార్జించుకోగలుగుతాడు.

🙏 తన అప్రమేయ బ్రాహ్మీ స్వస్వరూపమును - తన యొక్క స్వభావమును - దృశ్య భావనయొక్క స్వీకార - ఉపసంహారములను వేరువేరు చేసి దర్శించగలుగుతాడు.

🙏 ఒకడు సర్వాంతర్గత - సర్వస్వరూప - సర్వాతీత పరమాత్మత్వమే సర్వదా అనుచింతన చేయుచుండగా ’‘తానే అది’’గా సంతరించుకోగలుగుతాడు.

08–11

యదక్షరం వేదవిదో వదన్తి
విశన్తి యద్యతయో వీతరాగాః ।
యదిచ్ఛన్తో బ్రహ్మచర్యం చరన్తి
తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే ॥

యత్ అక్షరం వేదవిదో వదంతి
విశంతి యత్ యతయో వీతరాగాః ।
యత్ ఇచ్ఛంతో బ్రహ్మచర్యం చరన్తి
తత్ తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే ॥

ఓ అర్జునా !

ఏ “సర్వాంతర్యామి - స్వస్వరూప పరమాత్మ” తత్త్వమును..,

⤿ వేదవేత్తలు ’అక్షర పరబ్రహ్మము’గా బోధించి చెప్పుచున్నారో,

⤿ మహనీయులు ఈ దృశ్య సంబంధమైన సర్వమును రాగరహితంగా చూస్తూ, ఎద్దానియందు ప్రవేశించినవారై ఆ సంస్థానమును అనునిత్య నివాసం చేసుకుంటున్నారో,

⤿ ఎద్దానిని సముపార్జించాలనే ఇచ్ఛచే బ్రహ్మచర్యులై ఉపాసిస్తున్నారో,

➤ అట్టి పదము (State) గురించి ఇక్కడ సంగ్రహంగా (In Nutshell) ఉదహరిస్తున్నాను. విను.

08–12

సర్వద్వారాణి సంయమ్య మనో హృది నిరుధ్య చ ।
మూర్ధ్న్యాధాయాత్మనః ప్రాణమాస్థితో యోగధారణామ్ ॥

సర్వ ద్వారాణి సంయమ్య, మనో హృది నిరుధ్య చ ।
మూర్ధ్ని ఆధాయ ఆత్మనః ప్రాణమ్ ఆస్థితో యోగధారణామ్ ॥

ఇంద్రియములు సర్వదా దృశ్యానుభవములను పొందుచుండగా మనోబుద్ధులు వాటి తదాత్మ్వముతో లీనమగుచూ ఉన్నాయి కదా!

అయితే ……. యోగసాధనాపరులు…,

↳ ఈ ఇంద్రియ ద్వారములను సంయమనం చేసి, ‘‘ఇదంతా నా ఆత్మస్వరూపమే’’… అను భావనలో లీనం చేయటానికి ప్రయత్నపరులై యోగధారణకు ఉపక్రమిస్తున్నారు.

↳ యోగధారణతో మనోహృదయములను ఇంద్రియాతీత స్థానమైనట్టి మస్తకస్థానము (Fore face) నందు ప్రాణశక్తిచే ఏకాగ్రపరుస్తున్నారు.

↳ ఏకాగ్రతగా (With Concentration) ప్రాణములను మస్తకస్థానంలో స్థాపిస్తూ యోగమును ‘ధారణ’ చేయటం అభ్యసిస్తున్నారు.

08–13

ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్మామనుస్మరన్ ।
యః ప్రయాతి త్యజన్దేహం స యాతి పరమాం గతిమ్ ॥

ఓమ్ ఇతి ఏక అక్షరం బ్రహ్మ, వ్యాహరన్ మామ్ అనుస్మరన్ ।
యః ప్రయాతి త్యజన్ దేహం, స యాతి పరమాం గతిమ్ ॥

↳ క్రమంగా అక్షరము (క్షరము, మార్పు లేనిది), ఏకము (అనేకముగా కానిది) అగు ‘ఓం’ సంజ్ఞార్థమైన పరమాత్మను ఉచ్ఛరిస్తూ పరమాత్మభావనను పెంపొందించుకుంటున్నారు. (‘ఓం’ ఇతి ఏక-అక్షరమ్‌ ‘బ్రహ్మ’)

↳ సగుణ - నిర్గుణ ప్రదర్శనము, అతీతము అగు నన్నే అనుస్మరిస్తున్నారు.

↳ అట్టి అనుస్మరణచే ‘‘నేను దేహమును. దేహపరిమితుడను. దేహముచే మార్పు చేర్పులు చెందువాడను. దేహము నాకు సంబంధించినది. నేను ఈ దేహమునకు సంబంధించినవాడను’’… అను దేహభావం క్రమక్రమంగా త్యజించివేస్తున్నారు.

↳ ఆ విధంగా దేహభావం త్యజించినవారై క్రమంగా సర్వస్రష్ట - సర్వకర్త - సర్వభోక్త - సర్వద్రష్టనగు నా స్వరూపమును తాము సంతరించుకొంటున్నారు. ఉత్తమోత్తమ స్థానమును (పరమగతిని) పొందినవారై ఉంటున్నారు.

08–14

అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః ।
తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః ॥

అనన్యచేతాః సతతం, యో మాం స్మరతి నిత్యశః ।
తస్య అహం సులభః, పార్థ! నిత్యయుక్తస్య యోగినః ॥

ఓ అర్జునా! ‘‘అట్టి సర్వాంతర్యామి - సర్వకర్త స్థానం సులభమా?’’ అని అడుగుతావా?

‘‘ఎవ్వరైతే ఈ కనబడేవన్నీ పరమాత్మ యొక్క ప్రదర్శనా చమత్కార రూపాలే! ఇదంతా పరమాత్మయొక్క మాయా చమత్కారమే!’’… అను అనన్యచింతనను ఆశ్రయిస్తూ సర్వ తత్వస్వరూపుడనగు నన్నే నిత్యమూ అనుస్మరిస్తూ నిత్యయుక్తితో యోగాభ్యాసం కొనసాగిస్తూ ఉంటారో, అట్టి వారికి వారి ప్రయత్న ఫలంగా అది తప్పక సులభమై అనుభవం కాగలదు. ఇందుకు సందేహమే లేదు!

ఓ పార్థా!
- ప్రపంచంలో అనేక విషయాలకొరకై అనేకానేకమంది జీవులు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు (Travelling towards material worlds and physical scenarios).
- కొద్దిమంది మాత్రం ఈ జగత్తులు ఎద్దానియందైతే భావనామాత్రంచేత అనుభూతమగుచున్నాయో… అట్టి పరమాత్మయందు స్థానము - భావన - సర్వాతీతత్వముకొరకు ప్రయత్నిస్తున్నారు (Travelling towards Al-present Self).

08–15

మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతమ్ ।
నాప్నువన్తి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః ॥

మామ్ ఉపేత్య పునర్జన్మ దుఃఖాలయమ్ అశాశ్వతమ్ ।
న ఆప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః ॥

దుఃఖాలయమ్ - అశాశ్వతమ్ ।

ఓ అర్జునా! మహత్తరము - పరమోత్కృష్టము అగు ‘‘సర్వాంతర్యామిత్వము - సర్వతత్త్వ స్వరూపము’’ అయినట్టి నాయొక్క స్థానము సముపార్జించుకొన్న తరువాత ఇక ఆ మహనీయులు దుఃఖాలయము (place with series of worries), అశాశ్వతము (place of insecurity, where nothing is permananent and everything is continuously changing spontaneously) అయినట్టి పునర్జన్మ పరంపరా వ్యవహారమును పొందుటలేదు.

ఎందుకంటావా?

08–16

ఆబ్రహ్మభువనాల్లోకాః పునరావర్తినోఽర్జున ।
మాముపేత్య తు కౌన్తేయ పునర్జన్మ న విద్యతే ॥

ఆబ్రహ్మభువనాత్ లోకాః పునః ఆవర్తినో, అర్జున! ।
మామ్ ఉపేత్య తు, కౌంతేయ! పునర్జన్మ న విద్యతే ॥


దృశ్య సంబంధమైన సర్వ స్థానాలు - పునరావృత్తి దోషము

బ్రహ్మలోకం నుండి భూలోకం వరకు ‘ఉపాధులు పొందటం’ అనే జన్మ కర్మ పరంపరా వ్యవహారమంతా కూడా పునరావృత్తి దోషం కలిగి ఉంటోంది. అనగా, ఈ దృశ్య వ్యవహారమంతా దృశ్యములు-జన్మలు పొందటం, పొందిన దృశ్య జన్మ కర్మ వ్యవహారములనే మరల మరల పొందుతూ ఉండటం అనే దోషం వెంటనంటి ఉంటోంది.

పరమాత్మనగు నన్ను ఆశ్రయించినవారు, ఈ జన్మల-పునర్జన్మల అతీతత్వం - అతీతస్థానం సముపార్జించుకొని ఉండగలుగుచున్నారు.

ఈ విధంగా మొదటిది (దృశ్య - జన్మపరంపరాశ్రయం) అనేక దుఃఖములలో (blended with multiple worries) కూడుకొన్నదైయున్నది. ఇక, నన్ను ఆశ్రయించావా, నా స్థానం ఆశ్రయించటం చేత పునరావృత్తి దోషభూయిష్టమైన జన్మపరంపరాచక్రము నుండి విడవడినవాడగుచున్నావు. దేహాలు వస్తే రావచ్చు. పోవచ్చు. నేను సర్వమునకు పరమగు కేవలసాక్షిని అని గమనించగలుగుచున్నావు.

08–17

సహస్రయుగపర్యన్తమహర్యద్బ్రహ్మణో విదుః ।
రాత్రిం యుగసహస్రాన్తాం తేఽహోరాత్రవిదో జనాః ॥

సహస్రయుగ పర్యంతం అహః యత్ బ్రహ్మణో విదుః ।
రాత్రిం యుగసహస్ర అంతం తే అహోరాత్ర విదో జనాః ॥

కాలతత్వ జ్ఞానం

పరబ్రహ్మము నుండి జల తరంగంవలె బయల్వెడలుచున్న బ్రహ్మ (మొట్టమదటి ప్రజాపతి) యొక్క మనస్సు నుండి దృశ్య రచన బయల్వెడలుతోంది.

మాయచే బయల్వెడలే దృశ్య రచనా చమత్కృతి వేయి యుగాల నిడివి గల ‘‘బ్రహ్మయొక్క పగలు’’. దృశ్య ఉపసంహార చమత్కృతితో కూడిన వేయి యుగముల నిడివి గల ‘‘బ్రహ్మయొక్క రాత్రి’‘గా యోగులు దర్శిస్తున్నారు.

కాల తత్వజ్ఞానం గల యోగులు ప్రతి జీవుని అంతర్గతంగా ప్రవర్తిస్తున్న ’‘బ్రహ్మయొక్క పగలు’’ - ’‘బ్రహ్మయొక్క రాత్రి’’లను గమనిస్తున్నారు.

08–18

అవ్యక్తాద్వ్యక్తయః సర్వాః ప్రభవన్త్యహరాగమే ।
రాత్ర్యాగమే ప్రలీయన్తే తత్రైవావ్యక్తసంజ్ఞకే ॥

అవ్యక్తాత్ వ్యక్తయః సర్వాః ప్రభవంతి అహః ఆగమే ।
రాత్ర్య ఆగమే ప్రలీయంతే తత్ర ఏవ అవ్యక్తసంజ్ఞకే ॥

అవ్యక్తంలోనుండి వ్యక్తం ప్రభవించి పరిఢవిల్లడం ➡ బ్రహ్మయొక్క పగలు.

వ్యక్తం అయినదంతా అవ్యక్తంలో లీనం కావటం ➡ బ్రహ్మయొక్క రాత్రి.

ఈ విధంగా పరబ్రహ్మమే స్వస్వరూపంగా గల ఈ జీవుని స్వస్వరూపం నుండి వ్యక్త - అవ్యక్తాలు ప్రదర్శితమౌతూ జన్మ పరంపరల అనుస్మరణ - జన్మరాహిత్య స్థితి ప్రవర్తిస్తున్నాయని కాలగమన యోగం గమనించిన యోగులు గుర్తిస్తున్నారు.

ఈ విధంగా… ఈ జీవునిపట్ల →

1) వ్యక్తము = జన్మపరంపరల చమత్కారము (Involvement in Perceptions)
2) అవ్యక్తము = జన్మలనుండి ఉపసంహారం (Withdrawal from Perceptions)

ఈ రెండు కాలగతిచే ప్రదర్శితమగుచు ఉపసంహారం పొందుచూ ఉన్నాయి.

అయితే….,
ఈ జీవుని వాస్తవ స్వరూపం ఆత్మయే!

భావనచే వ్యక్తము - భావనా రాహిత్యముచే అవ్యక్తము రూపుదిద్దుకుంటున్నాయి కదా! భావనకు ఆవల ఈ జీవుని వాస్తవరూపం సదా పరబ్రహ్మ - నిర్వికార - భావాభావాతీత - భావించువాని రూపమై వెలుగొందుతోంది. అట్టి భావాతీత, భావసాక్షీరూపం (భావములను ప్రదర్శిస్తూ - భావనలకు మునుముందే వేంచేసియున్న రూపం, సర్వము వ్యక్తీకరిస్తున్న అవ్యక్తము) ఈ జన్మ - కర్మల వ్యవహారరీతులకు, కాలగమన చమత్కారమునకు అప్రమేయమై కేవల సాక్షి అయి ప్రకాశిస్తోంది.

08–19

భూతగ్రామః స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే ।
రాత్ర్యాగమేఽవశః పార్థ ప్రభవత్యహరాగమే ॥

భూతగ్రామః స ఏవ అయం భూత్వా భూత్వా ప్రలీయతే ।
రాత్ర్య ఆగమే అవశః, పార్థ! ప్రభవతి అహః ఆగమే ॥

అహోరాత్రములు - భావ అభావములు :

భావనా సామ్రాజ్యంలో పంచ భూతగ్రామ రూపమైన ఈ భౌతిక దేహములు, తత్సంబంధితమైన దృశ్యరూప భావనా దేహ పరంపరలు మరల మరల ప్రకటనమగుచు ‘బ్రహ్మరాత్రి’ సమయంలో అభావ స్థానంలో విలీనమగుచున్నాయి.

08–20

పరస్తస్మాత్తు భావోఽన్యోఽవ్యక్తోఽవ్యక్తాత్సనాతనః ।
యః స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి ॥

పరః తస్మాత్ తు భావో అన్యో అవ్యక్తో అవ్యక్తాత్ సనాతనః ।
యః స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి ॥

పరః తస్మాత్‌ భావ - అభావ అన్యో :

ఇక ఆత్మయో…, భావాభావములకు నాంది స్థానమై, వ్యక్తావ్యక్తములకు అప్రమేయమై, అతీతమై, కేవల ఉత్ప్రేరణా చమత్కార సామర్థ్యమై వెలుగొందుతోంది.

అట్టి పరతత్వమైన స్వస్వరూపస్థానం ఈ ఉపాధుల, ఉపాధి పరంపరల వ్యక్త - అవ్యక్త సుదీర్ఘ సహస్రయుగ పర్యంత వ్యవహార, వ్యవహార రాహిత్యములచే స్పృశించబడక నిరుపమానమై వెలుగొందుతోంది.

అట్టి వ్యక్తావ్యక్తాతీత ఆనంద స్వస్వరూపము ఈ ఉపాధుల వినాశనముచే నశించేది కాదు. ఉపాధుల ప్రభవముచే ఉత్పన్నమయ్యేది కాదు … అని గ్రహించు!

08–21

అవ్యక్తోఽక్షర ఇత్యుక్తస్తమాహుః పరమాం గతిమ్ ।
యం ప్రాప్య న నివర్తన్తే తద్ధామ పరమం మమ ॥

అవ్యక్తో అక్షర ఇతి ఉక్తః, తమ్ ఆహుః పరమాం గతిమ్ ।
యం ప్రాప్య న నివర్తంతే, తత్ ధామ పరమం మమ ॥

ఓ అర్జునా! అట్టి కాలాతీత - దృశ్యాతీత - అవ్యక్తానంద ఆత్మస్థానమును గమనించి, ఆశ్రయించి, స్వస్థానంగా నిర్దుష్టపరుచుకొన్న మహనీయులు నా స్థానము పొందినవారై ప్రశాంత - ఆనందములను ఆస్వాదిస్తున్నారు.

మహనీయులు అద్దానిని ‘‘అవ్యక్తము - అక్షరము’’… అని గానం చేస్తూ లోకాలకు ప్రవచిస్తున్నారు. అట్టి స్థానం సముపార్జిస్తూ ఈ దృశ్యమును సందర్శించువారికి ఇక ‘చ్యుతి’ అనేది ఉండదు.

అట్టి నా అచ్యుత - పరంధామం నేను నీకు బోధిస్తూ గుర్తు చేస్తున్నాను.

08–22

పురుషః స పరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా ।
యస్యాన్తఃస్థాని భూతాని యేన సర్వమిదం తతమ్ ॥

పురుషః స పరః, పార్థ! భక్త్యా లభ్యః తు అనన్యయా ।
యస్య అంతఃస్థాని భూతాని యేన సర్వమ్ ఇదం తతమ్ ॥

అట్టి అక్షర - అవ్యక్త - పరంథామ - అచ్యుత - స్వస్థానం సముపార్జించుకోవటానికి మార్గము ఏమిటంటావా?

అనన్యమైన భక్తియే!

‘‘ఇదంతా అవ్యక్త, అక్షర పరబ్రహ్మము యొక్క చమత్కార ప్రదర్శనమే’’… అను ప్రేమభావం పెంపొందించుకోవటంచేత ఈ సర్వజీవులలోను ఏ ఆత్మ ప్రసరించియున్నదో, ఈ సర్వము ఏ ఆత్మయందు ప్రకటనమగుచున్నదో - అట్టి సర్వాంతర్యామి, సర్వ తత్వ స్వరూపము అగు స్వస్వరూపం’’.. అనే స్థానం ప్రాప్తించగలదు.

08–23

యత్ర కాలే త్వనావృత్తిమావృత్తిం చైవ యోగినః ।
ప్రయాతా యాన్తి తం కాలం వక్ష్యామి భరతర్షభ ॥

యత్ర కాలే తు అనావృత్తిమ్ ఆవృత్తిం చ ఏవ యోగినః ।
ప్రయాతా యాంతి, తం కాలం వక్ష్యామి, భరతర్షభ! ॥

శుక్ల - కృష్ణ గతులు - జీవ బాటసారులు

భరత వంశోత్తముడా! అర్జునా!
పునరావృత్తి చెందనివారు మరియు జన్మ పరంపరలు మరలా మరలా కొనసాగించేవారు యొక్క కాల గతులు ఎట్లు ఉండునో చెప్పుదును. విను.

శుక్లగతి (State of no further avocation) :

ద్వితీయభావం నుండి (ఈ జగదృశ్యము నా నుండి వేరు… అను భావం నుండి) → అద్వితీయభావం (‘ఈ జగత్తు నా స్వరూపము’ అను భావము వైపుగా) ప్రయాణించటం ‘‘శుక్లగతి’’ అని కాలయోగ శాస్త్రజ్ఞులు పిలుస్తున్నారు.

(లేక) ప్రవృత్తి నుండి → నివృత్తివైపుగా

(లేక) జగత్‌ సంబంధము నుండి → నిర్గుణ పరబ్రహ్మమునకు

ఇది శుక్లగతి.

కృష్ణగతి (State of avocation) :

నివృత్తి నుండి → ప్రవృత్తివైపుగా

నిర్గుణత్వం నుండి → సగుణత్వం వైపుగా

అద్వితీయము నుండి దృశ్య రచనా భావం వైపు ప్రయాణించటం

ఇది ‘కృష్ణగతి’ అని చెప్పబడుతోంది.

1) శుక్లగతి అగు అనావృత్తియోగం (Path towards state of no avocation)
2) కృష్ణగతి అగు ఆవృత్తి యోగం (Path in the state of avocation)
ఈ రెండు సంజ్ఞాపూర్వకంగా ఎలా చెప్పబడుచున్నాయో,…. విను!

08–24

అగ్నిర్జ్యోతిరహః శుక్లః షణ్మాసా ఉత్తరాయణమ్ ।
తత్ర ప్రయాతా గచ్ఛన్తి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః ॥

అగ్నిః జ్యోతిః అహః శుక్లః షట్ మాసా ఉత్తరాయణమ్ ।
తత్ర ప్రయాతా గచ్ఛంతి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః ॥

శుక్ల గతి

జగత్‌ భావ ప్రవృత్తి నుండి → జగత్‌ భావ నివృత్తివైపు → ఆత్మభావ ప్రవృత్తివైపుగా

దేవయానం - నిష్కామ కర్మయోగం - అనావృత్తియోగం - అభావరూపమగు ఆత్మభావనా అనుభవ స్థానం :

ఈ శుక్లగతి ఎటువంటిదంటే….,

అగ్ని : అగ్ని వలె అది నిత్యజ్వాజ్వల్యమానం.
సూర్యజ్యోతి : వెలుతురు వలె అది స్వస్వరూప ప్రకాశకం.
అహః : పగలువలె సర్వము సుస్పష్టం చేసేది.
శుక్లం : శుక్లపక్ష చంద్రునివలె వ్యక్తిత్వమును సువిస్థారపరచేది.
ఉత్తరాయనం : జగత్‌ విషయాలకు అతీతత్వము ప్రతిపాదించునది.
సూర్యస్థానం : జ్ఞానమునకు ప్రవృద్ధత కల్పించేది.

బ్రహ్మజ్ఞానము ప్రవృద్ధపరచుకొంటున్న మహనీయులు క్రమంగా ఈ శుక్లగతిలో (దేవయానంలో) ప్రయాణిస్తూ వ్యక్తావ్యక్తాతీత స్వస్వరూపము దిశగా, జన్మా-జన్మాంతర ప్రయాణం కొనసాగిస్తూ, ఒకానొకప్పుడు జన్మరాహిత్య స్థానం ఆస్వాదిస్తున్నారు.

‘‘జన్మ - కర్మ రహితమగు సర్వాంతర్యామియగు ఆత్మయే నేను’’ అని పరిగ్రహిస్తున్నారు. ఆత్మసాక్షాత్కారం అవధరిస్తున్నారు.

08–25

ధూమో రాత్రిస్తథా కృష్ణః షణ్మాసా దక్షిణాయనమ్ ।
తత్ర చాన్ద్రమసం జ్యోతిర్యోగీ ప్రాప్య నివర్తతే ॥

ధూమో రాత్రిః తథా కృష్ణః షట్ మాసా దక్షిణాయనమ్ ।
తత్ర చాంద్రమసం జ్యోతిః యోగీ ప్రాప్య నివర్తతే ॥

కృష్ణ గతి

జగత్‌ నివృత్తి నుండి → జగత్‌ - దృశ్య - ప్రవృత్తి వైపుగా

పితృయానం : సకామ కర్మ మార్గం: ఆవృత్తియోగం

ఈ కృష్ణగతిని సందర్శించు కాలయోగజ్ఞులు ఈ విధంగా సంజ్ఞాపూర్వకంగా చెప్పుచున్నారు.

ధూమం : అగ్నియొక్క అవశేషమైన ధూళి వలె ఘనీభూతము, సారరహితము
రాత్రి : అంధకారం వలె అనేక అజ్ఞాన విశేషాల పట్ల ప్రవృత్తితో కూడినది.
కృష్ణం : కృష్ణపక్ష చంద్రుడు రోజు రోజుకు కాంతిని కోల్పోతున్నట్లుగా… ఆత్మావలోకమునకు దూర-దూరముగా (సంకల్ప సమూహ రూపంగా) గొనిపోవునది.
దక్షిణాయనం : ఆత్మభావన నుండి దృశ్య పరంపరా భావనలోనికి ప్రయాణం చేయించేది.
చంద్రస్థానం : మనోభూములకు (చంద్రజ్యోతి) తరలించేది.

08–26

శుక్లకృష్ణే గతీ హ్యేతే జగతః శాశ్వతే మతే ।
ఏకయా యాత్యనావృత్తిమన్యయావర్తతే పునః ॥

శుక్ల కృష్ణే గతీ హి ఏతే జగతః శాశ్వతే మతే ।
ఏకయా యాతి అనావృత్తిమ్ అన్యయా ఆవర్తతే పునః ॥

చేసే ప్రయాణం (లేక సాధన) ఒక్కటే అయినా,… మొదటిది (శుక్లగతి) అకామం. రెండది (కృష్ణగతి) సకామం.

శుక్లగతి : భావాతీత ఆత్మవైపు ప్రయాణం పునరావృత్తి రహితమైనది.

కృష్ణగతి : భావసమృద్ధ స్థితి-గతులకు తరలించేది. చక్రభ్రమణమువలె పునరావృత్తి దోషం కలిగి ఉంటోంది.

ఈ జీవ బాటసారులలో కొందరు జగత్‌ దృశ్యాన్ని వదిలే మార్గంలో ఉన్నారు. మరి కొందరు జగత్తును పట్టుకునే మార్గంలో ఉన్నారు.

ఈ విధంగా…
ఈ జీవులలో కొందరు శుక్లగతిలోను, మరికొందరు కృష్ణగతిలోను ప్రయాణిస్తున్నారు.

08–27

నైతే సృతీ పార్థ జానన్యోగీ ముహ్యతి కశ్చన ।
తస్మాత్సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున ॥

న ఏతే సృతీ, పార్థ! జానన్ యోగీ ముహ్యతి కశ్చన ।
తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవ, అర్జున! ॥

యోగి ఎప్పుడైతే ఈ శుక్ల - కృష్ణ గతులతో కూడిన ప్రయాణములను అర్థం చేసికొని ఉంటాడో… అట్టివాడు ఈ దృశ్య తదాప్యము పొందడు. మోహం దరిజేరనీయడు. ఎందుకంటే, ఈ శుక్ల - కృష్ణ గతుల బాటసారులంతా ఈ స్థితిగతులకు అప్రమేయమైనట్టి అఖండాత్మ చమత్కారమే!

కాబట్టి అర్జునా!

బద్ధకము - అశ్రద్ధ వదులు. శుక్ల - కృష్ణ ప్రయాణ మార్గాలు గమనించు. సర్వకాల - సర్వ అవస్థలయందు యోగమార్గం ఆశ్రయించు. యోగివైయుండు.

ఉభయ గతులకు అప్రమేయము - ఆధారము అగు పరమాత్మతత్వమును ఆశ్రయించు. సర్వజీవుల అంతర్యామియగు పరమాత్మను సందర్శించు.

08–28

వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ
దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టమ్ ।
అత్యేతి తత్సర్వమిదం విదిత్వా
యోగీ పరం స్థానముపైతి చాద్యమ్ ॥

వేదేషు యజ్ఞేషు తపఃసు చ ఏవ
దానేషు యత్ పుణ్యఫలం ప్రదిష్టమ్ ।
అతి ఏతి తత్ సర్వమ్ ఇదం విదిత్వా
యోగీ పరం స్థానమ్ ఉప ఏతి చ ఆద్యమ్ ॥

వేదాధ్యయనం, యజ్ఞకార్యములు, తపస్సు, దానము, ధర్మము ఇవన్నీ నీ యోగమార్గంలో ఉపకరణములుగా ఉపయోగించుకో. అవన్నీ ఎందుకు ప్రవచించబడి మానవాళికి అందింపబడుచున్నాయో గ్రహించి, వీటికి అతీతుడవై యోగులు పొందుతున్న పరమ స్థానము (లేక) ‘ఆత్మాఽహమ్‌’ స్థానమును సముపార్జించుకో.


ఇతి శ్రీమత్‌ భగవద్గీతాసు … అక్షర పరబ్రహ్మ యోగ పుష్పః ।
శ్రీ సాంబ సదాశివ పాదారవిందార్పణమస్తు ॥
🙏