భగవద్గీత

09. రాజవిద్యా రాజగుహ్య యోగ అధ్యయన పుష్పం

మూలము : శ్రీ వ్యాస మహర్షిచే విరచించబడిన జయము / మహాభారతము (భీష్మ పర్వము)

అధ్యయన వ్యాఖ్యానము : (అధ్యయన విద్యార్థి) యేలేశ్వరపు హనుమ రామకృష్ణ


Krishna instructing Arjuna

మూల శ్లోకము


అధ్యయన వ్యాఖ్యానము


ఉపన్యాసము

శ్రీ భగవాన్ ఉవాచ :-

09–01

ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే ।
జ్ఞానం విజ్ఞానసహితం యత్ జ్ఞాత్వా మోక్ష్యసేఽశుభాత్ ॥

ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామి అనసూయవే ।
జ్ఞానం విజ్ఞానసహితం యత్ జ్ఞాత్వా మోక్ష్యసే అశుభాత్ ॥

శ్రీకృష్ణ భగవానుడు :-

ఓ అర్జునా! నీలోని ఉత్తమ గుణాలు నాకు సంతోషాన్ని కలుగజేస్తున్నాయి. అసూయ, దోషదృష్టి లేనట్టివాడవు. నా భక్తుడవు. కాబట్టి, నీకు విజ్ఞాన సహితమైన జ్ఞానవిశేషాలు చెప్పుచున్నాను. వినవయ్యా!

‘అతి రహస్యము’ అయినట్టి ఇప్పుడు నా చే చెప్పబడబోయే ఆత్మతత్త్వ విశేషాలు అశుభము నుండి ఈ జీవుని సముద్ధరించగల విషయాలు సుమా!

09–02

రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమమ్ ।
ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయమ్ ॥

రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమ్ ఇదమ్ ఉత్తమమ్ ।
ప్రత్యక్ష అవగమం ధర్మ్యం సుసుఖం కర్తుమ్ అవ్యయమ్ ॥

రాజ విద్య - రాజగుహ్యము ప్రత్యక్షంగా అనుభవమవగలదు.

ఇప్పుడు ఈ చెప్పబడబోయే విషయం ‘‘రాజవిద్య (The utmost education)’’ అని, ‘‘రాజగుహ్యము (The ultimate secret)’’ అని వర్ణించబడుతోంది. ఇది అతి పవిత్రము - పరమోత్తమము అయినది.

ఈ విషయం ఇప్పుడే, ఇక్కడే అనుభవైక వేద్యము. అనగా, ‘‘ఎప్పటికో ఎన్నటికో లభించేది’’… కాదు!

ఈ చెప్పబోయే సమాచారం అనుసంధానం చేయటం అత్యంత సులభము, సుఖప్రదము కూడా!

09–03

అశ్రద్దధానాః పురుషా ధర్మస్యాస్య పరన్తప ।
అప్రాప్య మాం నివర్తన్తే మృత్యుసంసారవర్త్మని ॥

అశ్రద్దధానాః పురుషా ధర్మస్య అస్య, పరంతప! ।
అప్రాప్య మాం, నివర్తంతే మృత్యు సంసార వర్త్మని ॥

అంతేకాదు. నేను చెప్పబోయేది ఆత్మతత్వ లక్షణము. ఆత్మ ధర్మము (A natural feature).

అట్టి నా ధర్మము (స్వభావ లక్షణం - స్వభావ సిద్ధము) అయినట్టి నా యొక్క విలక్షణము విని, గ్రహించి, అనువర్తించటం పట్ల శ్రద్ధ లేని జీవుడు నన్ను పొందలేక, దిక్కుతోచక ఈ పునరావృత్తి దోష - మృత్యు దోష సహితమైన సుదీర్ఘ సంసార మహారణ్యంలో సంచారాలు చేయవలసివస్తోందని ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నాను.

ఇక ఆ మహత్తర ధర్మరూప పరమసత్య విశేషం విను. ఇది ప్రతి జీవుని స్వస్వరూపమునకు సంబంధించిన అతిరహస్యమగు నిర్దుష్ఠ - పరమ సత్యము! ఇప్పుడు వివరిస్తున్నాను! శ్రద్ధగా విను!

09–04

మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా ।
మత్ స్థాని సర్వభూతాని న చాహం తేష్వవస్థితః ॥

మయా తతమ్ ఇదం సర్వం జగత్ అవ్యక్తమూర్తినా ।
మత్ స్థాని సర్వభూతాని, న చ అహం తేషు అవస్థితః ॥

(1) మయాతతమ్‌ ఇదం సర్వమ్‌ జగత్‌ - అవ్యక్తమూర్తినా!

అవ్యక్తమూర్తి స్వరూపుడనగు నా చేతనే ఇదంతా - ఈ కనబడేదంతా ప్రసరించబడినదై, విస్తరించబడినదై యున్నది.

ప్రతిజీవుడు తాను సందర్శించే అనుభూత జగత్తంతా తన యొక్క అవ్యక్తమూర్తిత్వముచే ప్రసరించబడినదైయున్నది.

ఉదాహరణకు…, ఒకడు స్వప్నం చూస్తున్నాడనుకుందాం. అప్పుడు -
1.) స్వప్న దర్శి
2.) స్వప్నాంతర్గత ద్రష్ట
3.) స్వప్న దృశ్యము

స్వప్నద్రష్ట స్వప్నంలో విభాగం కాదు కదా! కాబట్టి ఆతడు స్వప్నంలో ఆవిర్భవించటం లేదు. కనుక, స్వప్నదృశ్యము దృష్ట్యా స్వప్నదర్శి అవ్యక్తము. కానీ, స్పప్నం స్వప్నదర్శి యొక్క ఊహారూపమే కదా! స్వప్నమంతా నిండి ఉన్నది స్పప్నదర్శి రూపమే కదా! ఊహ ఊహించువానికి అభిన్నమే కదా!

అట్లాగే, జాగృత్‌ విషయంలో కూడా ప్రతి జాగృత్‌ దర్శి దర్శించేదంతా తనయొక్క అవ్యక్త రూపముచే ప్రసరించబడినదైయున్నది.

ఈ విధంగా ప్రతి జీవుడు తన స్వస్వరూపమునకు అభేదమైన జగత్తును తనకు భేదరూపంగా మాయచే దర్శిస్తున్నాడు.

(2) మత్‌స్థాని సర్వభూతాని

ఈ కనబడే జగదంతర్గతమగు త్రిమూర్త్యాదిగా ఒక సూక్ష్మజీవి వరకుగల జగత్‌ జీవులంతా నా యందే ఉన్నారు.

ప్రతి జీవుడు తాను అనుభూతీకరించుకుంటున్న తదితర జీవజాలమంతా తన ఆత్మయందే, తన మనస్సుచే తనకు (ఆత్మకు) వేరైనట్లు దర్శిస్తున్నాడు. వాస్తవానికి ఈ దృశ్యమంతా తన ఆత్మయందే నెలకొని ఉన్నది. (నిజాంతర్గతం పశ్యన్‌ ఆత్మని మాయయా బహిరివోద్భూతం, యదా నిద్రయా’’ అని ఆదిశంకరులు అన్నట్లు) మనస్సునందు ఆత్మ జగత్తుగా ప్రతిబింబితమవుతోంది.

(3) న చ అహమ్‌ తేషు అవస్థితః

ఇదంతా నా యందే ఉన్నది. అంతేగాని, ఈ దృశ్యంలో నేను లేను.

పరమాత్మ దృశ్యాంతర్గతమైన ఒక వస్తువువో, జీవుడో కాదు. పరమాత్మయందే ఇవన్నీ ఉన్నాయి. ప్రతి జీవుడు పరమాత్మ స్వరూపుడే! ఆత్మయందే సర్వము ఉన్నది. అంతేగాని, వీటన్నిటియందు ఆత్మ చిక్కుకోలేదు.

స్వప్న ద్రష్టలోనే స్వప్నం ఉన్నది. అంతేగాని స్వప్నద్రష్ట స్వప్నాంతర్గతమైన ఒకానొక విభాగం కాదు కదా! ఒకవేళ స్వప్నదర్శి స్వప్నంలోని విభాగమే అయితే (లేక) స్వప్నంలో కనబడే రూపనామములందు ఉన్నవాడైతే, స్వప్నం నశించినపుడు స్వప్నదర్శి కూడా నశిస్తాడు కదా? అట్లా జరుగుతోందా? లేదు. నవలా రచయిత నవలలోని కొన్ని పేజీలా? సంఘటనలా? నవల ముగియగానే రచయిత ముగింపు పొందుతాడా? లేదే!

కనుక, ఈ జగత్తు ఉండవచ్చు గాక! అనేక దేహాలతో అనేక జగత్తుల ప్రవేశ-నిష్క్రమణములు జరగవచ్చు గాక! ఒకానొకప్పుడు దేహము నశించవచ్చు గాక! ప్రతి ఒక్కని పరమాత్మ స్వరూపమునకు వచ్చే లోటు ఏమీ లేదు. ఎందుకంటే ఆతడు జగత్తులో ఏదో ఒక రూపంగాగాని, కొన్ని రూపాలుగాగాని మారటం లేదు. ఆత్మయందు జగత్తు ఉన్నదేగాని, జనించి - గతించే జగత్తు వ్యవహారంలో ఆత్మ చిక్కుకొని లేదు.

09–05

న చ మత్ స్థాని భూతాని పశ్య మే యోగమైశ్వరమ్ ।
భూతభృన్న చ భూతస్థో మమాత్మా భూతభావనః ॥

న చ మత్ స్థాని భూతాని, పశ్య మే యోగమ్ ఐశ్వరమ్ ।
భూతభృత్ న చ భూతస్థో మమ ఆత్మా భూతభావనః ॥

(4) న చ మస్థాని భూతాని! పశ్య మే యోగమైశ్వరమ్‌!

ఓ అర్జునా! ‘‘నిర్మల - నిర్విషయ - సర్వాతీత’’ పరమాత్మ స్వరూపుడనగు నాయందు ఈ జీవజాల జగత్తు లేదు. చూచావా! నా యొక్క ఆత్మయోగస్థానం సర్వమునకు అతీతమై, నిర్గుణమై, అప్రమేయమైయున్నది.

ప్రతి జీవుడు కేవలాత్మ స్వరూపుడే!
- తాను దర్శిస్తున్న జాగ్రత్‌ - స్వప్న - సుషుప్త జగత్తులు స్వయంకల్పిత భావనా స్రవంతి మాత్రమే!
- అంతేగాని, ఈతడు జాగ్రత్‌-స్వప్న-సుషుప్త అంతర్విభాగం కాదు. ఆతనిలో జగత్తులు లేవు.

నవలలో కనిపించే పాత్రలు ఆ రచయితయొక్క ఊహా కల్పనయే. అయితే ఏం? అవన్నీ రచయితలో లేవు. రచయిత నవలలోని పాత్రకాదు. అట్లాగే…., జగత్‌ద్రష్ట (లేక) జగత్‌ సాక్షియగు జీవునిలో జగత్తులు లేవు. జగత్తులలో జీవుడు లేడు.

ఇట్టి అవగాహన యోగైశ్వర్యం.

ఈ విధంగా ప్రతి జీవుని ఆత్మ అప్రమేయం, నిర్మలం!

భూతభృత్‌ : ఈ తదితర జీవులుగా భ్రమచే అనిపించిదంతా ధారణచేస్తూ జగత్తుయొక్క ఉనికిని ప్రసాదిస్తున్నది స్వస్వరూపాత్మయే! ఆత్మ స్వరూపముగా నేనే!

న చ భూతస్థో : అట్టి స్వస్వరూపాత్మ యగు నేను దృశ్యధారణ చేస్తున్నప్పటికీ దృశ్యాంతర్గతమైన నామరూపములలో లేను.

ఆత్మ అంతటికీ అతీతంగా విడిగానే ఉన్నది. ‘ఊహలు’ నిర్వర్తించేవాడు ఊహలకు అతీతంగానే ఉన్నాడుగాని, ఆతడు ఊహలుగా అవటం లేదుకదా!
(One, from who ideas are coming out, is neither becoming as ideas nor is in the ideas. One is always away and ever placed as unconfined and unbounded by one’s ideas.)

(5) మమాత్మా భూత భావనః

నా ఆత్మయే ఈ అనేక జీవులుగా భావించబడుతోంది. ఈ జగత్‌ దృశ్యము - జగదంతర్గత తదితర జీవజాలము నాయొక్క ‘‘భూతజాల భావన’’ యొక్క ఒకానొక ప్రకటనావిశేషము మాత్రమే!

ప్రతిజీవుడు తాను చూస్తున్న జగత్తు రూపంగా తనయొక్క భావనా సాగరం నుండి భూత భావనను ప్రవృత్తం చేసుకుంటున్నాడు. అనగా, ‘భూతజాల భావన’ ద్వారా దృశ్యజగత్తును తనయందే పొందుచున్నవాడై, తనకు వేరైనట్లుగా అనుభవము మాత్రం పొందుచున్నాడు.

అద్వితీయమగు స్వస్వరూపాత్మయే తన స్వస్వరూపమును మనోవిలాసంగా “జగత్తు - జగత్‌ విషయములు - జగత్‌ జీవులు”గా సందర్శిస్తున్నది.

09–06

యథాకాశస్థితో నిత్యం వాయుః సర్వత్రగో మహాన్ ।
తథా సర్వాణి భూతాని మత్ స్థానీత్యుపధారయ ॥

యథా ఆకాశస్థితో నిత్యం వాయుః సర్వత్రగో మహాన్ ।
తథా సర్వాణి భూతాని మత్ స్థాని ఇతి ఉపధారయ ॥

ఓ అర్జునా!

ఆత్మయందు “జగత్తులు - దృశ్యములు - తదితర జీవులు” మొదలైనదంతా ఆత్మకు అభిన్నము. [One’s own Self is being experienced as the world, as if it is outside though it is also the same Self].

ఈ ఆత్మసాక్షాత్కార సిద్ధాంతమును అర్థం చేసుకోవటానికి వీలుగా ఒక దృష్టాంతం చెపుతాను. విను.

యదా ఆకాశ స్థితో వాయుః

‘‘ఆకాశము (Space)’’… అనే పంచభూతాత్మక తత్వం నుండి వాయువు బయల్వెడలుతోంది. మహత్తరమైన ఆ వాయువు వాయుతరంగాలుగా ఆకాశమునందు సుదీర్ఘ సంచారాలు చేస్తున్నప్పటికీ, వాయువు ఆకాశంతోగాని, ఆకాశం వాయువుతోగాని తమేకం - మమేకం అవవు కదా! ఆకాశం వాయువుగా రూపుదిద్దుకొంటోందా? లేదే?

అట్లాగే, ఆత్మయందు జన్మ - జన్మాంతర్గత తదితర దృశ్య - జీవాదులు, ఈ జగదనుభవాలు వాయు తరంగాల వలె సంచలనం సాగిస్తున్నప్పటికీ ఆత్మాకాశం అప్రమేయం. ఆత్మస్వరూపుడనగు నాయందు దృశ్య - దేహ - తదితర సంబంధిత జీవ పరంపరలు నాచే ఉపధారణంగా (Holding) నిర్వర్తించబడుచున్నాయి. నేను సర్వదృశ్యసంఘటన - వ్యవహారాదులకు వేరై, నాయందు వాటిని ధరిస్తున్నాను.

09–07

సర్వభూతాని కౌన్తేయ ప్రకృతిం యాన్తి మామికామ్ ।
కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహమ్ ॥

సర్వభూతాని, కౌంతేయ! ప్రకృతిం యాంతి మామికామ్ ।
కల్పక్షయే, పునః తాని కల్ప-ఆదౌ విసృజామి అహమ్ ॥

సర్వభూతజాలం నాయందే ఉనికిని కలిగి ఉన్నది.

ఈ భూతజాలమంతా నాయొక్క ప్రకృతి (లేక, స్వభావము)చే పొందబడుచున్నదై ఉన్నది.

జగత్తంతా నా సంకల్ప (లేక) భావనా చమత్కారమే!

నాయందు ‘‘భావనా కల్పన’’ ఉదయించగానే ……. భావనాంతర్గత జగత్‌దృశ్యాలన్నీ పరిఢవిల్లుచున్నాయి. అట్టి ‘‘భావనా కల్పన’’ యొక్క ఉపసంహారముచే జగత్‌దృశ్యాలన్నీ నాయొక్క ప్రకృతియందే లయిస్తున్నాయి.

09–08

ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః ।
భూతగ్రామమిమం కృత్స్నమవశం ప్రకృతేర్వశాత్ ॥

ప్రకృతిం స్వామ్ అవష్టభ్య విసృజామి పునః పునః ।
భూతగ్రామమ్ ఇమం కృత్స్నమ్ అవశం ప్రకృతేః వశాత్ ॥
ఆ ప్రకృతి నాయందు అభిన్నముగా అగుచున్నది!

ఈ విధంగా, నా నుంచి - నా యొక్క ప్రకృతి స్వరూపమై, భావనా కల్పన యొక్క ప్రవృత్తి - నివృత్తుల (blossoming of ideas and withdrawal of ideas) ఉభయ సందర్భములకు వేరై ఆత్మస్వరూపుడనగు నేను వెలుగొందుచున్నాను.

09–09

న చ మాం తాని కర్మాణి నిబధ్నన్తి ధనఞ్జయ ।
ఉదాసీనవదాసీనమసక్తం తేషు కర్మసు ॥

న చ మాం తాని కర్మాణి నిబధ్నన్తి, ధనంజయ! ।
ఉదాసీనవత్ ఆసీనమ్ అసక్తం తేషు కర్మసు ॥

అట్టి ప్రకృతి సంబంధమైన ప్రవృత్తి - నివృత్తి ధర్మములచే నిబంధించబడనివాడనై, స్పృశించబడనివాడనై, వాటి బంధ - సంబంధము లేనివాడనై, వాటికి ఆవల ఏక - అఖండత్వములను వహిస్తున్నట్లు సత్‌స్వరూపుడను.

ఆయా ప్రవృత్తి ధర్మముచే బంధముగాని, నివృత్తి ధర్మముచే బంధవిముక్తిగాని నాకు లేవు.

ఆ రెండిటి సందర్భములలో ఉదాసీనుడనై, కేవలసాక్షినై స్వయం ప్రకాశముతో ప్రకాశిస్తూ ఉన్నాను. (ఉదాసీనవత్‌ ఆసీనం అసక్తం తేషు కర్మసు).

09–10

మయాధ్యక్షేణ ప్రకృతిః సూయతే సచరాచరమ్ ।
హేతునానేన కౌన్తేయ జగద్విపరివర్తతే ॥

మయా అధ్యక్షేణ ప్రకృతిః సూయతే స-చర-అచరమ్ ।
హేతునా అనేన, కౌంతేయ! జగత్ విపరివర్తతే ॥

ఆత్మస్వరూపుడనగు నేను దేహములచే ప్రారంభమగువాడను కాను. దేహ పతనములచే నశించువాడనూ కాను.

మరి?

దేహములే నాయొక్క సంకల్పానుసారం, నాయొక్క అధ్యక్షతచే ఏర్పడుచున్నాయి. ఈ చరాచర ప్రకృతి నాయొక్క అధ్యక్షతచే ప్రవర్తిస్తోంది.

ఈ జగత్‌ (జ= జనించటం; గత్‌= గతించటం అను) కదలికకు కారణం నేనే!

ఓ అర్జునా! నా పర స్వరూపం ఈ చరాచర ప్రకృతికి కేవలసాక్షియై, ప్రకృతియొక్క వివర్తన - అనువర్తనలకు ఆధారమైయున్నది.

09–11

అవజానన్తి మాం మూఢా మానుషీం తనుమాశ్రితమ్ ।
పరం భావమజానన్తో మమ భూతమహేశ్వరమ్ ॥

అవజానంతి మాం మూఢా మానుషీం తనుం ఆశ్రితమ్ ।
పరం భావమ్ అజానంతో మమ భూత-మహేశ్వరమ్ ॥

ఈ ‘‘భౌతిక దేహ తాదాత్మ్యము’’ అనే అజ్ఞానం ఆశ్రయించినట్టి మూఢులు నా పరస్వరూపం సందర్శించటం లేదు. ‘‘ఈతడు శరీరముగా - గుణములుగా వివర్తం పొందాడు. పరివర్తనం పొందాడు’’… అని నన్ను భావిస్తున్నారు. ‘‘ఈ పంచభూత జనిత దేహంచే నేను నిబద్ధుడు’’ అని భ్రమిస్తున్నారేగాని, ‘‘నేను పంచభూత నియామకమగు పరమాత్మ స్వరూపుడు కదా’’ ……. అని గమనించలేకపోతున్నారు.

ప్రతి జీవుడు మమాత్మస్వరూపపుడే!

‘‘నేను ఈ పంచభూతదేహం - ఇంద్రియ విషయ దృశ్యములచే సుఖ - దుఃఖితుడను కదా’’… అని ఈ దేహధారులలో అనేకులు తమ స్వరూపము గురించి తామే భ్రమ చెందుచున్నారు. ‘‘ఈ ప్రకృతి గతమైన పాంచభౌతిక దేహాదులకు - దృశ్యభావాదులకు నేను నియామకుడను. అంతేగాని, అవి నన్ను నియమించటం లేదు’’…. అని తమయొక్క సర్వనియామక ఆత్మసామ్రాజ్యాధినేతను గమనించి ఆస్వాదించటం లేదు.

ఎందుచేత? విను. చెపుతాను.

09–12

మోఘాశా మోఘకర్మాణో మోఘజ్ఞానా విచేతసః ।
రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః ॥

మోఘ ఆశా, మోఘ కర్మాణో, మోఘ జ్ఞానా, విచేతసః ।
రాక్షసీమ్ ఆసురీం చ ఏవ ప్రకృతిం మోహినీం శ్రితాః ॥

మోఘాశా : అనేక మంది ‘‘ఈ త్రిలోక దృశ్యజగత్తులలో ఏవేవో లోకాలు - దేహాలు పొందితేగాని నేను పొందవలసినది పొందినట్లు కాదు’’… అని ఏవేవో స్థితిగతులకై ఆశిస్తున్నారు. ‘‘ఆనందము నా నిర్వచనమే కదా’’… అనునది గమనించటం లేదు.

మోఘకర్మాణో : ‘‘ఏదో చేయాలి? ఇంకేదో పొందాలి’’ అనుకుంటూ దృష్టినంతా ఎక్కడో భవిష్యత్తువైపుగా ఏవేవో కార్యక్రమ వ్యవహారముల వైపుగా తరలిస్తున్నారు, కదిలిస్తున్నారు. ’’ నేను సర్వజగత్‌ నియామకము - ధారణకర్త - అప్రమేయము అగు ఆత్మను కదా’‘…. అనునది గమనించటం లేదు.

మోఘజ్ఞానా : ’‘ఇది చేయకపోతే ఎట్లా? అది పొందకపోతే ఏం కుదురుతుంది? ఇప్పుడు సరే! మరొకప్పటి మాటేమిటంట? వీరు మంచివారు. వారు చెడువారు. వీరు నా వారు. వారు కాదు. ఇది మంచిది. అది మంచిది కాదు’’… ఇత్యాదిగా కొన్నికొన్ని నిర్వచనములు - అనేక పొరపాట్లతో కూడిన అభిప్రాయములు - అవగాహనలు పెంపొందించుకొని దేహపరంపరలు కొనసాగిస్తున్నారు.

ఈ దోషపూరితమైన ఆశలు - కర్మలు - జ్ఞానములతో బుద్ధి అనుక్షణం పరిపరి విధాలుగా చంచలము పొందటం జరుగుతోంది. క్రమంగా మూర్ఖత్వము - దుష్టభావములు - మోహము కొనసాగించే స్వభావమును ఆశ్రయిస్తూ…. తమ ప్రకృతిచే తామే నిబద్ధులు అగుచున్నారు.

ఓ అర్జునా! నేను ప్రకృతికి - ప్రకృతి గుణములకు ఆవల పరమాత్మరూపంగా సర్వజీవులయందు సర్వదా వేంచేసియున్నాను. అట్టి సర్వాంతర్యామిని, వారి ఆత్మ స్వరూపుడను అగు నన్ను దర్శించటం లేదు. రాక్షస - ఆసురీ ప్రకృతి స్వభావమగు రాగము - ద్వేషము - ఆవేశము - దుర్భావములు - హింసా ప్రవృత్తి - భయావేశము వంటి గుణములచే మోహమును ఆశ్రయించువారు - వారి అంతర్యామినగు నన్ను గాంచుటలేదు. గమనించటం లేదు.

09–13

మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః ।
భజన్త్యనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయమ్ ॥

మహాత్మానః తు మాం, పార్థ! దైవీం ప్రకృతిమ్ ఆశ్రితాః ।
భజంతి అనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమ్ అవ్యయమ్ ॥

అయితే, పార్థా! దైవీ ప్రకృతియగు ప్రేమ - దాక్షిణ్యము - సహనము - సేవా భావము వంటి గుణములను పరిపోషించుకొన్నవారు ‘‘ఈ కనబడే సహజీవులు పరమాత్మ యొక్క (మమాత్మయొక్క) ప్రదర్శనా చమత్కారమే’’ అను రూపముతో కూడిన అనన్య మనస్సును సముపార్జించుకొంటున్నారు.

అట్టి అనన్య మనస్సుచే సర్వసహజీవులను పరమాత్మ విన్యాసంగా ఉపాసిస్తూ ‘‘మహాత్ముడను - సర్వాంతర్యామిని’’ అగు నన్ను తెలుసుకొని ఆస్వాదిస్తున్నారు.

09–14

సతతం కీర్తయన్తో మాం యతన్తశ్చ దృఢవ్రతాః ।
నమస్యన్తశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే ॥

సతతం కీర్తయంతో మాం యతంతః చ దృఢవ్రతాః ।
నమస్యంతః చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే ॥

అట్టి దృఢ నిశ్చయము పెంపొందించుకొన్నట్టి నా భక్తులు సర్వగుణసంపన్నునిగా నన్నే స్తుతిస్తూ నిత్యోపాసనయందు దృఢవ్రతులై నాకు నమస్కరిస్తూ, సర్వాంతర్యామి - సర్వతత్త్వ స్వరూపుడు - సర్వజీవుల స్వస్వరూపాత్మగా నన్ను ఆరాధిస్తున్నారు. ఈ కనబడే వారంతా పరమాత్మ యొక్క ప్రత్యక్ష రూపులే అని అర్థం చేసుకొని,….. అటుపై జగత్తులో వ్యవహరిస్తున్నారు.

09–15

జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజన్తో మాముపాసతే ।
ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతోముఖమ్ ॥

జ్ఞానయజ్ఞేన చ అపి అన్యే యజంతో మామ్ ఉపాసతే ।
ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతోముఖమ్ ॥

మరికొందరు ‘జ్ఞానయజ్ఞము’ ద్వారా ’‘నిర్గుణ-నిరాకార బ్రహ్మము’’ను అభేదదృష్టితో - సమత్వసందర్శన బుద్ధితో ఉపాసిస్తున్నారు.

ఇంకొందరు పరమాత్మను ఏకము - అనేకము - విశ్వరూపము - విశ్వాంతర్యామి - విశ్వాంతర్గతుడు - విశ్వేశుడుగా, భేదాభేదరూపుడుగా దర్శిస్తూ సాకార-భక్తి భావన ప్రవృద్ధపరచుకొంటున్నారు.

09–16

అహం క్రతురహం యజ్ఞః స్వధాహమహమౌషధమ్ ।
మంత్రోఽహమహమేవాజ్యమహమగ్నిరహం హుతమ్ ॥

అహం క్రతుః, అహం యజ్ఞః, స్వధా అహమ్, అహమ్ ఔషధమ్ ।
మంత్రో అహమ్, అహమ్ ఏవ ఆజ్యమ్, అహమ్ అగ్నిః, అహం హుతమ్

ఓ అర్జునా! వేదమంత్ర - తంత్ర ప్రతిపాదితమగుచున్న క్రతువు - యజ్ఞము - పితృసమర్పితమగు పిండము - ఆహారరూపమగు ఔషధము - అగ్నిలో వేయబడే నేయి (ఆజ్యము) - ఆ నేయిచే ప్రజ్వలించే అగ్ని - హోమక్రియ - యజ్ఞఫలం ఇవన్నీ కూడా నేనే!

కర్మస్థానమైన సంస్థ, కర్మసేవా పరికరాలు, క్రియావ్యవహారం, కర్మయొక్క విధి విధానము, నిర్వర్తించే క్రియ, కర్మ చేయువాడు, కర్మఫలం - అంతా ‘నేనే!’

[The Organization, the Systems and Procedures, the Instruments with which the Services are rendered, the Acts and Services, the Colleagues, the Work and its Results → See them all as Godly and manifestations of God!]

09–17

పితాహమస్య జగతో మాతా ధాతా పితామహః ।
వేద్యం పవిత్రమోంకార ఋక్ సామ యజురేవ చ ॥

పితా అహమ్ అస్య జగతో మాతా ధాతా పితామహః ।
వేద్యం పవిత్రమ్ ఓంకార ఋక్ సామ యజుః ఏవ చ ॥

అంతే కాదు.

ఈ జగుత్తుయొక్క ‘‘పరిపోషకుడు’’ అగు తండ్రిని నేను.

ప్రేమ - పరిపోషణ జీవులకు అందిస్తున్న జగన్‌మాతను (ప్రకృతి) కూడా నేనే!

ఈ జగత్తు యొక్క ధారణ నిర్వర్తించే ’ధాత’ను నేనే.

ఋగ్వేవేదం-యజుర్వేదం-సామవేదం సంజ్ఞాపూర్వకంగా, సర్వాంతర్యామి పరంగా ఉపయోగిస్తున్న ‘ఓంకారం’ నా స్వరూపమే! అనగా, సర్వభావాంతర్గత స్వరూపమగు ఓంకార స్వరూపుడను నేనే! పర-ఇహ స్వరూప-స్వభావములతో కూడిన అనుభవము-అనుభవించువాడు (ఓం) నేనే!

09–18

గతిర్భర్తా ప్రభుః సాక్షీ నివాసః శరణం సుహృత్ ।
ప్రభవః ప్రలయః స్థానం నిధానం బీజమవ్యయమ్ ॥

గతిః, భర్తా, ప్రభుః, సాక్షీ, నివాసః, శరణం, సుహృత్ ।
ప్రభవః, ప్రలయః, స్థానం, నిధానం, బీజమ్, అవ్యయమ్ ॥

అంతే కాదు!

మార్గము - మార్గాంతర పరిపోషకుడు - సర్వయజమాని - సర్వమునకు కేవలసాక్షి - శరణాగతియగు పరంధామము - సర్వుల హృదయ రూపము - సర్వము ప్రభవించి లయించే స్థానము, సర్వులయొక్క సూక్ష్మరూపము - సర్వమునకు అవ్యయమగు బీజము కూడా నేనే సుమా!

09–19

తపామ్యహమహం వర్షం నిగృహ్ణామ్యుత్సృజామి చ ।
అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున ॥

తపామి అహమ్, అహం వర్షం నిగృహ్ణామి ఉత్సృజామి చ ।
అమృతం చ ఏవ, మృత్యుః చ, సత్ అసత్ చ అహమ్, అర్జున! ॥

సర్వకర్మలు నా వైపే అనుసంధానమై వున్నాయి. ఆత్మ వైపే అనుబంధితమై వున్నాయి. వాటి ఫలములు నన్నే చేరుచున్నాయి. వాటి ప్రతిఫలములు నానుండే బయల్వెడులుచున్నాయి.

సూర్యరూపంలో జలం స్వీకరించి వర్షరూపంలో తిరిగి లభించినట్లుగా, సర్వమునకు స్వీకార కర్తను - ప్రదాన కర్తను నేనే!

మృత్యువు నా రూపమే! నేనే సర్వజీవులలో అమృతరూపంగా సర్వదా సర్వేసర్వత్రా వేంచేసియున్నాను. సత్‌ - అసత్‌లు, (జీవునిలోని మార్పుచెందనిది - మార్పు చెందునది…) ఇదంతా నా సంప్రదర్శనమే!

09–20

త్రైవిద్యా మాం సోమపాః పూతపాపా
యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయన్తే ।
తే పుణ్యమాసాద్య సురేన్ద్రలోకమ్
అశ్నన్తి దివ్యాన్దివి దేవభోగాన్ ॥

త్రైవిద్యా మాం, సోమపాః, పూతపాపా,
యజ్ఞైః ఇష్ట్వా, స్వర్గతిం ప్రార్థయంతే ।
తే పుణ్యమ్ ఆసాద్య సురేంద్రలోకమ్
అశ్నన్తి దివ్యాన్ దివి దేవభోగాన్ ॥

సకామోపాసన (దృశ్య దృష్టితో ఉపాసన)

వేదప్రవచితము, త్రిగుణాత్మకము, త్రైవిద్యాసంబంధము అయిన యజ్ఞములతో నాయొక్క ‘‘ఇంద్రుడు’’ (అల్లా - యహోవా - శివుడు - విష్ణువు ఇత్యాది) మొదలైన దేవతారూపములను కొందరు సకామంగా ఉపాసిస్తున్నారు.

అట్టి యజ్ఞ యాగ సమన్వితమైన దేవతారాధన చేత పుణ్యం సంపాదించుకొనుచూ, పాపసంబంధమైన ఇతఃపూర్వపు కర్మలదోషములను తొలగించుకొన్నవారై స్వర్గాదిలోకాలు చేరి దేవలోక భోగములను అనుభవించుచున్నారు.

09–21

తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం
క్షీణే పుణ్యే మర్త్యలోకం విశన్తి ।
ఏవమ్ త్రయీధర్మమనుప్రపన్నా
గతాగతం కామకామా లభన్తే

తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం
క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ।
ఏవమ్ త్రయీధర్మమ్ అనుప్రపన్నా
గతా ఆగతం కామకామా లభంతే ॥

అట్టి యజ్ఞయాగ సమన్విత ఉపాసనలనచే స్వర్గలోకంలో ఆయా భోగాలు అనుభవిస్తూ ఉండగా, వారి పుణ్యఫల సంపద కొంతకాలం తరువాత క్షీణించగా తిరిగి మానవ లోకంలో జన్మలు పొందుచున్నారు.

మరల, ఈ లోకంలో యజ్ఞయాగాది త్రై విద్య (త్రిగుణాత్మకమైన ఉపాసన)ను స్వర్గలోకభోగముల కొరకై ఆశించి, నిర్వర్తించి, మరల స్వర్గలోకం చేరుచున్నారు.

త్రిగుణాత్మకమైన ‘‘యజ్ఞయాగాదులు నిర్వర్తించు ఉపాసకులు (సకాములు) స్వర్గలోకం జేరటం - దేవలోక భోగములు అనుభవించటం - యజ్ఞఫలం చెల్లిపోవటం - మరల మానవలోకం ప్రవేశించటం - మరల త్రైవిద్యాయజ్ఞ కర్మలు నిర్వర్తించటం - యజ్ఞఫలానుభవం కొరకై మరల స్వర్గలోకంచేరటం’’ ఈ విధంగా చర్వితచరణంగా కామ్యకర్మ వర్తనులు నిర్వర్తిస్తున్నారు. అట్టి కామ్య-కర్మలు నిర్వర్తించే ఉపాసకులు స్వర్గ - మర్త్యలోకాల మధ్య రాక - పోకలు నిరంతరంగా కొనసాగిస్తున్నారు.

వీరు దృశ్యాంతర్గత విషయాలకొరకై పరమాత్మను ఆశ్రయిస్తున్నవారగుచున్నారు. [They adop functions of Yoga for the fulfilment of desires].

09–22

అనన్యాశ్చిన్తయన్తో మాం యే జనాః పర్యుపాసతే ।
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్ ॥

అనన్యాః చింతయంతో మాం, యే జనాః పరి ఉపాసతే ।
తేషాం నిత్య అభియుక్తానాం, యోగక్షేమం వహామి అహమ్

నిష్కామోపాసన

ఇక మరి కొందరు నా దేవతా రూపములు (అనగా, సకామోపాసనలను) - తత్‌ దేవలోక భోగములు అతిక్రమించినవారై ‘‘సర్వము నేను ఉపాసించే ఇష్టదైవమగు పరమాత్మ స్వరూపమే కదా! ఇక మరొకచోట మరొకటేదో పొందవలసినది ఏముంటుంది?’’ అని గ్రహించినవారై, అనన్యచింతనతో సర్వతత్త్వాత్మకుడనగు నన్ను ఆశ్రయిస్తున్నారు. ‘‘సర్వాత్మకుడగు పరమాత్మయే సర్వ చరాచర జగత్తుగా, అస్మత్‌ ఆత్మరూపంగా ప్రదర్శనమగుచున్నారు కదా!’’ అని అనన్యోపాసన అభ్యసిస్తున్నారు.

అనన్య చింతన
‘‘ఏవో దృశ్య - ఇంద్రియ విషయ ఫలములు పొందాలి’’ అను ఆకాంక్షలను అధిగమించి ‘‘సర్వం పరబ్రహ్మరూపమేవ’’ అను అనన్యచింతనను (పరమాత్మ కొరకై పరమాత్మ చింతనను) ఉపాసనా పూర్వకంగా కొనసాగించేవారి ‘‘యోగక్షేమములు’’ సర్వతత్త్వస్వరూపుడనగు నేను వహిస్తున్నాను.

కోరికలతో ఉపాసించేవారికి కోరికలు ఉపాసనా దేవతారూపంగా తీర్చటం, కోరికలు లేకుండా ఉపాసించే వారి (అకామకాముల) యోగక్షేమములు నేనే నిర్వర్తించటం నా స్వభావమైయున్నది.

09–23

యేఽప్యన్యదేవతా భక్తా యజన్తే శ్రద్ధయాన్వితాః ।
తేఽపి మామేవ కౌన్తేయ యజన్త్యవిధిపూర్వకమ్ ॥

యే అపి అన్యదేవతా భక్తా యజంతే శ్రద్ధయా అన్వితాః ।
తే అపి మామ్ ఏవ, కౌంతేయ! యజంతి అవిధిపూర్వకమ్ ॥

విధి పూర్వకం
నన్ను స్వస్వరూపంగా, సర్వతత్వ స్వరూపుడుగా, సర్వజగత్‌ స్వరూపుడుగా ఉపాసించటం విధిపూర్వకం (Correct path as per the finest Truth) సుమా!

అవిధిపూర్వకం
అర్జునా! అన్య దేవతా ఉపాసన (కామకాములు) శ్రద్ధతో నిర్వర్తించేవారు కూడా ఆయా నాయొక్క దేవతారూపములద్వారా నన్నే ఉపాసిస్తున్నారు. అయితే, అవిధిపూర్వకంగా ఉపాసిస్తున్నారు.

09–24

అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ ।
న తు మామభిజానన్తి తత్త్వేనాతశ్చ్యవన్తి తే ॥

అహం హి సర్వ యజ్ఞానాం, భోక్తా చ, ప్రభుః ఏవ చ ।
న తు మామ్ అభిజానంతి తత్త్వేన అతః చ్యవంతి తే ॥

ఎందుచేతనంటే… సర్వయజ్ఞముల యొక్క భోక్త (Receiver)ను, వాటియొక్క ఫలప్రదాత (Giver)ను నేనే! ఫలములను కోరుకొనే బదులు ఫలప్రదాతయగు నన్నే ఆశ్రయిస్తే… అడిగినవారికి అడిగినది, అడగనివారికి కావలసినది ఇస్తాను.

ఎవ్వరు ఏ దేవతారూపమును ఆశ్రయించినా అది నన్నేజేరుతోంది. ఆ ప్రయోజనం నా నుంచే ప్రసాదించబడుతోంది.

సర్వకర్మల భోక్త - ప్రభువు అయిన నా యొక్క సర్వతత్వ స్వరూపమును ఎరుగనట్టివారు పరమ పురుషార్థమును (పరతత్వమగు స్వస్వరూపానంద స్థితిని) పొందలేకపోతున్నారు. కర్మఫల పరిమితత్వమునకు లోనగుచున్నారు.

09–25

యాన్తి దేవవ్రతా దేవాన్ పితౄన్యాన్తి పితృవ్రతాః ।
భూతాని యాన్తి భూతేజ్యా యాన్తి మద్యాజినోఽపి మామ్ ॥

యాంతి దేవవ్రతా దేవాన్, పితౄన్ యాంతి పితృవ్రతాః ।
భూతాని యాంతి భూతేజ్యా, యాంతి మత్ యాజినో అపి మామ్ ॥

సకామోపాసనపూర్వకంగా ఇంద్రాది దేవతలను ఆరాధించు సంకల్పంతో యజ్ఞయాగాది కర్మలను ఫలాకాంక్షతో నిర్వర్తించేవారు దేవభోగ ప్రదాతలగు ఇంద్రాది దేవతలను పొందుచున్నారు.

సకాములై పితృదేవతలను ఉపాశ్రయించే వారు పితృదేవతా లోకములను పొందుచున్నారు.

సకామంగా భూతాత్మ తత్వములను ఉపాసించేవారు భూతలోకములు చేరుచున్నారు. భౌతిక శక్తులు పొందుచున్నారు.

వీరంతా ఆయా లోకపాలకులను చేరి కాలక్రమేనా… అవి నశించినప్పుడు అవన్నీ కోల్పోవుచున్నారు.

అకామ పరతత్త్వ ఉపాసన
అఖండము - అప్రమేయము - నిత్యము - అనంతము - కేవలసాక్షి అగు నన్ను ఆరాధించినవారు.. తత్‌ లక్షణ విలక్షణమగు నన్నే పొందుచున్నారు.

09–26

పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి ।
తదహం భక్త్యుపహృతమశ్నామి ప్రయతాత్మనః ॥

పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి ।
తత్ అహం భక్తి ఉపహృతమ్ అశ్నామి ప్రయత ఆత్మనః ॥

ఓ అర్జునా! ఇక సర్వాంతర్యామినగు నన్ను ఉపాసించటం ఎట్లా అంటావా? విను.

’‘అనన్యమైన భక్తి’’తో నా స్థానము చేరవచ్చు సుమా! నన్ను ఆరాధించటం అతి సులభం కూడా!

ఇక నాకు సమర్పించవలసినదంటావా?
నాకు భక్తి - ప్రేమ ప్రధానం. ఒక ఆకుగాని, పువ్వుగాని, ఫలముగాని, జలముగాని నాకు భక్తితో, ప్రేమగా ఏది సమర్పిస్తే అది చాలు. ఆ భక్తితో - ప్రేమతో సమర్పించినది నేను ప్రేమగా స్వీకరిస్తాను. అనగా, పెద్ద పెద్ద కార్యక్రమములతో కూడిన శ్రమా వ్యవహారములే కావాలని నేను కోరుకోను సుమా!

09–27

యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ ।
యత్తపస్యసి కౌన్తేయ తత్కురుష్వ మదర్పణమ్ ॥

యత్ కరోషి, యత్ అశ్నాసి, యత్ జుహోషి, దదాసి యత్ ।
యత్ తపస్యసి, కౌంతేయ! తత్ కురుష్వ మత్ అర్పణమ్ ॥

కాబట్టి, నన్ను ఉపాసించటం అతి సులభం. జీవితంలోని సందర్భాలన్నీ పరమాత్మోపాసనయే - అని ఉద్దేశ్యించు!

➡️ నీవు ఏమేమి నిర్వర్తిస్తూ ఉన్నావో,
➡️ ఏదేది స్వీకరిస్తున్నావో,
➡️ ఏదేది సమర్పిస్తున్నావో,
➡️ ఏదేది దానం చేస్తున్నావో…,
… అదంతా నాకు ప్రేమగా సమర్పించు. అట్టి సమర్పణను చూచి నేను తృప్తి చెందుతాను!

09–28

శుభాశుభఫలైరేవం మోక్ష్యసే కర్మబన్ధనైః ।
సంన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి ॥

శుభ అశుభ ఫలైః ఏవం మోక్ష్యసే కర్మబంధనైః ।
సంన్యాస యోగ యుక్తాత్మా విముక్తో మామ్ ఉప ఏష్యసి ॥

ఈ విధంగా సర్వ కర్మలను - సర్వ కర్మఫలములను నాకు సమర్పిస్తూ సన్యాసయోగ యుక్తాత్ముడవై ఉండుము. అప్పుడు నీవు నిర్వర్తించే సర్వకర్మల శుభ - అశుభ ద్వంద్వము నుండి విడివడినవాడవౌతావు. అఖండాత్ముడనగు నన్ను జేరగలవు.

09–29

సమోఽహం సర్వభూతేషు న మే ద్వేష్యోఽస్తి న ప్రియః ।
యే భజన్తి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహమ్ ॥

సమో అహం సర్వభూతేషు, న మే ద్వేష్యో అస్తి న ప్రియః ।
యే భజంతి తు మాం భక్త్యా మయి తే, తేషు చ అపి అహమ్ ॥

సమో అహం సర్వభూతేషు

నాయనా! ఫల్గుణా! సర్వాంతర్యామినగు నాకు సర్వ జీవులు సమానులే కాని, ఇందులో నాకు ప్రియమైనవారుగాని, అప్రియమైన వారుగాని లేరు.

అయితే, ఎవరైతే అనన్య భావనతో సర్వాంతర్గతుడునగు నన్ను ఉపాసిస్తారో…. అట్టివారు నాకు సామీప్యముగా అగుచున్నారు. వారికి సామీప్యముగా నేనగుచున్నాను.

అనన్యో పాసకులు (పరమాత్మను జగత్తుకు - స్వస్వరూపానికి అన్యం కానట్లుగా గ్రహించి ఉపాసించువారు) నన్ను సర్వే - సర్వత్రా దర్శిస్తున్నారు. అదే రీతిగా వారు సదా నా కనుచూపులోనే ఉంటారు కూడా!

09–30

అపి చేత్సుదురాచారో భజతే మామనన్యభాక్ ।
సాధురేవ స మన్తవ్యః సమ్యగ్వ్యవసితో హి సః ॥

అపి చేత్ సుదురాచారో భజతే మామ్ అనన్యభాక్ ।
సాధుః ఏవ స మంతవ్యః, సమ్యక్ వ్యవసితో హి సః ॥

సమదర్శనం!

ఒకానొకడు దురాచారపరుడు అయి ఉండవచ్చుగాక! అయినదేమో అయినది. ఇక ఇప్పటినుంచైనా సరే, ‘‘సర్వము పరమాత్మ చైతన్యస్వరూపమే కదా!’’….. అనుకొని సర్వులను పరమాత్మయొక్క స్వరూప చమత్కారంగా, పరతత్త్వముయొక్క ప్రత్యక్షరూపంగా భావిచటం ప్రారంభించితే… ఇక ఆతడు సాధువులతో సమానుడే! సమ్యక్‌ వ్యవసి (సాధనా తత్పరుడు - యోగ సాధకుడు)తో సమానుడే!

09–31

క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్ఛాన్తిం నిగచ్ఛతి ।
కౌన్తేయ ప్రతిజానీహి న మే భక్తః ప్రణశ్యతి ॥

క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వత్ శాంతిం నిగచ్ఛతి ।
కౌంతేయ! ప్రతిజానీహి న మే భక్తః ప్రణశ్యతి ॥

ఇక అతి త్వరలో - ఆత్మదర్శనము - సర్వాంతర్యామిత్వము - సర్వతత్త్వస్వరూపము ఆస్వాదించగలడు.

‘‘అంతా, అన్నిటా, సర్వదా వేంచేసియున్న ఆత్మయే నా ధర్మము’’ - అనే స్వాత్మానందముచే ‘‘ఆత్మధర్మాత్ముడు’‘గా తప్పక ప్రకాశించగలడు.

అందుచేత నిరుత్సాహము, తాత్సారము ఎందుకు?

ఓ కౌంతేయ! నా యొక్క ప్రతిజ్ఞ - అనుశాసనము - నిర్ణయం విను.
’‘నా భక్తునకు దుస్థితి కలుగటం అన్న ప్రసక్తే లేదు. భక్తుడు సర్వదా సుస్థితియే పొందగలడు!’’

09–32

మాం హి పార్థ వ్యపాశ్రిత్య యేఽపి స్యుః పాపయోనయః ।
స్త్రియో వైశ్యాస్తథా శూద్రాస్తేఽపి యాన్తి పరాం గతిమ్ ॥

మాం హి, పార్థ! వ్యపాశ్రిత్య యే అపి స్యుః పాపయోనయః ।
స్త్రియో వైశ్యాః తథా శూద్రాః తే అపి యాంతి పరాం గతిమ్ ॥

‘‘మావి అల్ప జన్మలు. మేము పాప యోనులం. స్త్రీ - వైశ్య - శూద్రులం. మాకు మోక్షార్హత లేదేమో?’’ అని ఇట్లు ఎవ్వరూ కించిత్ ‌కూడా నిరుత్సాహ పడవలసినదే లేదు.

ఎవ్వరైనా సరే, వారి వారి స్వకర్మలన్నీ సర్వాంతర్యామియొక్క ఉపాసనగా ఉద్దేశ్యించెదురుగాక! అది అనన్యమైన భక్తి చింతనలు కాగలవు.

అట్టి భక్తి ప్రపత్తులను ఆశ్రయిస్తే వారు అఖండ - అప్రమేయ - స్వయమాత్మస్థానమగు నన్ను తప్పక జేరగలరు. పరమోత్తమగతిని సముపార్జించుకోగలరు.

09–33

కిం పునర్బ్రాహ్మణాః పుణ్యా భక్తా రాజర్షయస్తథా ।
అనిత్యమసుఖం లోకమిమం ప్రాప్య భజస్వ మామ్ ॥

కిం పునః బ్రాహ్మణాః పుణ్యా భక్తా రాజర్షయః తథా? ।
అనిత్యం అసుఖం లోకమ్ ఇమం ప్రాప్య భజస్వ మామ్ ॥

ఇక యజ్ఞయాగ నిర్వాహకులగు బ్రహ్మోపాసక - శాస్త్రోపాసక - దైవోపాసకులగు బ్రాహ్మణ జన్ముల, భక్తుల, రాజర్షుల గురించి వేరే చెప్పేదేమున్నది?

ఓ అర్జునా!

‘‘ఈ లోకంలో ఏదో పొందనేలేదే? ఇంతవరకే పొందామే? ఈ స్థితిగతులు ఈ విధంగా పొందామేం?’’… అని దుఃఖిస్తూ ఆయుష్షును ఎందుకు వృధా పరచుకోవాలి? ఈ జగత్తులో పొందటం - పొందకపోవటం - ఇదంతా అనిత్యం. పైగా, శాశ్వతసుఖం ప్రసాదించగలిగినదేదీ ఇక్కడ లేదు సుమా!


09–34

మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు ।
మామేవైష్యసి యుక్త్వైవమాత్మానం మత్పరాయణః ॥

మన్మనా భవ, మత్ భక్తో, మత్ యాజీ, మాం నమః కురు ।
మామ్ ఏవ ఏష్యసి యుక్త్వా ఏవమ్ ఆత్మానం మత్ పరాయణః ॥

అందుచేత, ఓ పార్థా!

🌹 సర్వాంతర్యామిని, సర్వతత్వ స్వరూపుడను అగు నన్ను నీ మనసంతా నింపుకో!
🌹 నాకు భక్తుడవై ఉండు.
🌹 వ్యక్తావ్యక్త స్వరూపుడనగు నాకు నమస్కరించు. శరణువేడు.
🌹 పరమాత్మోపాసకుడవై సమర్పణ బుద్ధితో కర్మలు నిర్వర్తిస్తూ యోగివై ఉండు.
…. అప్పుడు నేను నిన్ను తప్పక సముద్ధరిస్తాను.


ఇతి శ్రీమత్‌ భగవద్గీతాసు … రాజవిద్యా రాజగుహ్య యోగ పుష్పః ।
శ్రీ సాంబ సదాశివ పాదారవిందార్పణమస్తు ॥
🙏