భగవద్గీత

10. విభూతి యోగ అధ్యయన పుష్పం

మూలము : శ్రీ వ్యాస మహర్షిచే విరచించబడిన జయము / మహాభారతము (భీష్మ పర్వము)

అధ్యయన వ్యాఖ్యానము : (అధ్యయన విద్యార్థి) యేలేశ్వరపు హనుమ రామకృష్ణ


Lord Krishna instructing Arjuna

మూల శ్లోకము


అధ్యయన వ్యాఖ్యానము


ఉపన్యాసము

శ్రీ భగవాన్ ఉవాచ :-

10–01

భూయ ఏవ మహాబాహో శ్రృణు మే పరమం వచః ।
యత్తేఽహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా ॥

భూయ ఏవ, మహాబాహో! శ్రృణు మే పరమం వచః ।
యత్ తే అహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా ॥

శ్రీకృష్ణ భగవానుడు :-

ఓ మహాబాహో! అర్జునా!

నా పరమ తత్వార్థ ప్రదర్శితమగు మహావాక్యములను మరల మరికొంత విశేషణా పూర్వకంగా వివరించి చెపుతాను.

సంక్షిప్తంగా నేను చెప్పే - ఈ వాక్యములు నీ మీద గల ప్రీతిచే నీకు హితం కలిగించే ఉద్దేశ్యంతో చెప్పటం జరుగుతోంది సుమా!

10–02

న మే విదుః సురగణాః ప్రభవం న మహర్షయః ।
అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః ॥

న మే విదుః సురగణాః ప్రభవం న మహర్షయః ।
అహమ్ ఆదిః హి దేవానాం మహర్షీణాం చ సర్వశః ॥

పరమాత్మ స్వరూపుడనైన నాయొక్క ప్రభవము (the point of commencement)… (ఆత్మయొక్క ప్రారంభస్థానము) ఏమిటో దేవతలకు - మహర్షులకు కూడా తెలియదు. (శివలింగము యొక్క ఆద్యంతములు బ్రహ్మ-విష్ణులు తెలుసుకోలేకపోయినట్లుగా)!

దేవతలు = సృష్టి - జీవరాసుల యొక్క నిర్మాణ - కార్యక్రమ - పరిరక్షణలో పాల్గొనే అశరీర తత్వస్వరూపులు.

మహర్షులు = ఆత్మయొక్క తత్వమును సందర్శించి - పఠించి - గానంచేస్తూ ఉపనిషత్‌-పురాణ ఇత్యాది శాస్త్రపాఠ్యాంశాల రూపంగా తదితర జనులకు ప్రబోధిస్తున్న మహనీయులు.

వారిరువురికన్నా మునుముందే సర్వాత్మతత్వస్వరూపుడనగు నేను వేంచేసియే ఉన్నాను.

10–03

యో మామజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరమ్ ।
అసమ్మూఢః స మర్త్యేషు సర్వపాపైః ప్రముచ్యతే ॥

యో మామ్ అజమ్ అనాదిం చ వేత్తి లోకమహేశ్వరమ్ ।
అసమ్మూఢః స మర్త్యేషు సర్వపాపైః ప్రముచ్యతే ॥

ఆత్మ స్వరూపుడనై సర్వజీవుల యందు వెలుగొందుచున్న నేను జన్మరహితుడనని, అనాది (without beginning) అని, లోక నియామకుడనని - ఎవ్వరు అసమ్మూఢులై గ్రహిస్తారో.. వారు సర్వదోషములనుండి, పాపదృష్టులనుండి, విడివడినవారగుచున్నారు.

10–04

బుద్ధిర్జ్ఞానమసంమోహః క్షమా సత్యం దమః శమః ।
సుఖం దుఃఖం భవోఽభావో భయం చాభయమేవ చ ॥

బుద్ధిః జ్ఞానమ్ అసంమోహః క్షమా సత్యం దమః శమః ।
సుఖం దుఃఖం భవో అభావో భయం చ అభయమ్ ఏవ చ ॥

ఓ అర్జునా! ప్రతి జీవునియందు ఆత్మగా వేంచేసియున్న నా వలననే బుద్ధి - జ్ఞానము - సమ్మోహము (Illusion) - అసమ్మోహము (Clarity) - క్షమ - సత్యము - ఇంద్రియవిషయ వ్యాపకము - ఇంద్రియ నిగ్రహము - మనో వ్యాపారము - మనో నిగ్రహము - సుఖ భావము - దుఃఖ భావము - ఉత్పత్తి ప్రలయ భావ అభావములు - భయము - అభయము మొదలైన - ఇవన్నీ ఎర్పడటం జరుగుతోంది.

అవన్నీ అంతరాత్మ స్వరూపుడనగు నాయొక్క సంకల్ప-వికల్ప ప్రభ యొక్క చమత్కారం!

10–05

అహింసా సమతా తుష్టిస్తపో దానం యశోఽయశః ।
భవన్తి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధాః ॥

అహింసా సమతా తుష్టిః తపో దానం యశో అయశః ।
భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథక్ విధాః ॥

నా చేతనే ఈ జీవుల యందు అహింస - సమత - తుష్టి - తపస్సు - దానం - యశస్సు - అయశస్సు … మొదలైన సమాంతర, వ్యతిరిక్త భావాలన్నీ ఏర్పడుచున్నాయి. అవన్నీ భావనా తరంగములే కదా! జల తరంగాలకు ఉత్పత్తి స్థానం ఏమిటి? జలమే కదా!
భావనా తరంగములకు ఉత్పతిస్థానం నేనే!

10–06

మహర్షయః సప్త పూర్వే చత్వారో మనవస్తథా ।
మద్భావా మానసా జాతా యేషాం లోక ఇమాః ప్రజాః ॥

మహర్షయః సప్త, పూర్వే చత్వారో, మనవః తథా ।
మత్ భావా మానసా జాతా యేషాం లోక ఇమాః ప్రజాః ॥

భావాలన్నీ భావములకు ఆవల ఉన్న ఆత్మతత్వము యొక్క చమత్కారమే!

10–07

ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్త్వతః ।
సోఽవికమ్పేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః ॥

ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్త్వతః ।
సో అవికంపేన యోగేన యుజ్యతే, న అత్ర సంశయః ॥

‘‘నా యొక్క విభూతులే ఈ చరాచర సృష్టి జగత్తు’’ అని నన్ను తత్త్వతః గమనించిన తత్వవేత్తలు మనోచాంచల్యము లేనట్టి యోగముచే (అవికంప మనస్కులై) గమనిస్తున్నారు. సర్వేసర్వత్రా నా విభూతులేనని ఉపాసిస్తున్నారు.

10–08

అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ।
ఇతి మత్వా భజన్తే మాం బుధా భావసమన్వితాః ॥

అహం సర్వస్య ప్రభవో, మత్తః సర్వం ప్రవర్తతే ।
ఇతి మత్వా భజంతే మాం బుధా భావసమన్వితాః ॥

ఈ కనబడేదంతా నా విభూతియే సుమా! ఈ జగత్తు, ఇందలి సర్వజీవులు, వారి అంతరంగ - బాహ్యరంగ విశేషాలు - ఇదంతా నా ఆత్మ విభూతియే!

సర్వజీవుల ఉత్పత్తికి స్థానం నేనే! అందరు ప్రభవిస్తున్నది - ప్రవర్తిస్తున్నదీ నాయందే! నా వలననే!

ఆత్మప్రజ్ఞానుసంధానము కలిగియున్నట్టి - ఈ మహత్తర సత్యమును ఎఱిగినట్టి ఆత్మజ్ఞులు తమ చిత్తమును నాయందే నిలిపి ఉంచుచున్నారు. (They are placing their entire interest in me).

10–09

మచ్చిత్తా మద్గతప్రాణా బోధయన్తః పరస్పరమ్ ।
కథయన్తశ్చ మాం నిత్యం తుష్యన్తి చ రమన్తి చ ॥

మత్ చిత్తా, మత్ గత ప్రాణా, బోధయంతః పరస్పరమ్ ।
కథయంతః చ మాం, నిత్యం తుష్యంతి చ రమంతి చ ॥

వారి చిత్త - ప్రాణములు (Interest and Energy) నాయందు ఏర్పరచుకొన్నవారై, సర్వాంతర్యామియగు నా తత్త్వమును అభివర్ణిస్తూ పరస్పరం బోధించుకుంటున్నారు. సంభాషించుకుంటున్నారు. అనునిత్యంగా పరతత్త్వ సంబంధమైన అఖండ - అప్రమేయ - నిత్య - సత్య ఆనందాది నా భగవత్‌ గుణములు ఒకరితో మరొకరు అభివర్ణించుకుంటూ, గానం చేస్తూ చెప్పుకొని ఆనందిస్తున్నారు.

10–10

తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకమ్ ।
దదామి బుద్ధియోగం తం యేన మాముపయాన్తి తే ॥

తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకమ్ ।
దదామి బుద్ధియోగం, తం యేన మామ్ ఉపయాంతి తే ॥

ఆ విధంగా ఎవ్వరైతే సతతయుక్తులై (ఎల్లప్పుడు పరమాత్మ ధ్యానపరులై), ప్రసంగ - కీర్తన - ధ్యాన - సంభాషణల ద్వారా ప్రీతిపూర్వకంగా నన్ను మననము చేస్తూ ఉంటారో,… అట్టివారికి నేను ‘బుద్ధియోగము’ అనే ఉపకరణమును ప్రసాదిస్తూ ఉంటాను.

అట్టి ‘ఉత్తమబుద్ధి’ అనే వాహనమును ఉపయోగించుకొని పరమానంద స్వరూపుడగు నన్ను వారు సముపార్జించుకుంటున్నారు.

10–11

తేషామేవానుకమ్పార్థమహమజ్ఞానజం తమః ।
నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వతా ॥

తేషామ్ ఏవ అనుకంపార్థమ్ అహమ్ అజ్ఞానజం తమః ।
నాశయామి ఆత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వతా ॥

వారి హృదయములోని అజ్ఞానాంధకారము నేను వెలిగిస్తున్న ‘‘జ్ఞానము’’ అనే దీపము యొక్క వెలుగుచే పటాపంచలు అవటం జరుగుతోంది.మూల శ్లోకము


అధ్యయన వ్యాఖ్యానము


ఉపన్యాసము

అర్జున ఉవాచ :-

10–12

పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ ।
పురుషం శాశ్వతం దివ్యమాదిదేవమజం విభుమ్ ॥

పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ ।
పురుషం శాశ్వతం దివ్యమ్ ఆదిదేవమ్ అజం విభుమ్ ॥

అర్జునుడు :

హే పరబ్రహ్మా! హే పరంధామా! పవిత్రము - పరమము అగు హే భగవాన్‌! ఈ చరాచర సృష్టి తమయందు ప్రభవిస్తున్నట్టి ఓ శాశ్వత దివ్య పరమపురుషా! జన్మాదులకు మునుముందే సర్వదా ప్రకాశించే ఆదిదేవా! సర్వలోకములకు విభూ! స్వామీ!

10–13

ఆహుస్త్వామృషయః సర్వే దేవర్షిర్నారదస్తథా ।
అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే ॥

ఆహుః త్వామ్ ఋషయః సర్వే దేవర్షిః నారదః తథా ।
అసితో దేవలో వ్యాసః, స్వయం చ ఏవ బ్రవీషి మే ॥

‘‘మీరు పరబ్రహ్మము - పరంధామము - పరమ పవిత్రము అగు పరమాత్మ స్వరూపులు - శాశ్వత దివ్యపురుషులు - జన్మకర్మలకు అతీతులు - ఆదిదేవులు - సర్వమునకు విభువు - నియామకులు’’ అని మహర్షులు చెప్పుచుండగా విన్నాము.

దేవర్షి నారదులు మీ విలక్షణ లక్షణములు - విభూతులు గానం చేస్తూ ఉండటం విని ఆస్వాదించాము.

లోక కళ్యామూర్తులగు వ్యాసమహర్షి మీ తత్త్వమును ప్రవచిస్తూ ఉండగా కూడా విన్నాము.

ఆహాఁ! ఈ రోజు ఎంతటి సుదినం! మీ మహిమాన్విత పరబ్రహ్మతత్త్వం మీరే స్వయంగా చెప్పుచుండగా నేను వింటున్నాను.

10–14

సర్వమేతదృతం మన్యే యన్మాం వదసి కేశవ ।
న హి తే భగవన్ వ్యక్తిం విదుర్దేవా న దానవాః ॥

సర్వమ్ ఏతత్ ఋతం మన్యే యత్ మాం వదసి, కేశవ! ।
న హి తే, భగవన్! వ్యక్తిం విదుః దేవా న దానవాః ॥

ఔను స్వామీ! మీరు మీ అనంత దివ్య ఆత్మానంద స్వరూపం గురించి పరమసత్యమే చెప్పుచున్నారు - అని నాకు పూర్ణ విశ్వాసము కలిగింది.

హే కేశవా! సర్వాంతర్యామియగు మీ వ్యక్తిత్వము దేవ-దానవ శ్రేష్ఠులు కూడా గ్రహించలేకపోతున్నారు! ఇక నేను ఎంతటివాడను!

10–15

స్వయమేవాత్మనాత్మానం వేత్థ త్వం పురుషోత్తమ ।
భూతభావన భూతేశ దేవదేవ జగత్పతే ॥

స్వయమ్ ఏవ ఆత్మనా ఆత్మానం వేత్థ త్వం, పురుషోత్తమ! ।
భూతభావన! భూతేశ! దేవదేవ! జగత్పతే! ॥

మిమ్ములను మరెవ్వరు తెలుసుకోగలరు? హే పురుషోత్తమా! మిమ్ములను మీరే స్వయంగా (ఆత్మచే ఆత్మను) తెలుసుకోగలరు!

ఈ జీవజాలమంతా మీ యొక్క భావనామాత్రం చేత ఏర్పడి ఉంటోంది. ఈ లోక - జీవాదులన్నిటికీ ఈశ్వరుడు మీరు! దేవతలకే దేవదేవా! హే జగత్‌పతీ!

10–16

వక్తుమర్హస్యశేషేణ దివ్యా హ్యాత్మవిభూతయః ।
యాభిర్విభూతిభిర్లోకానిమాంస్త్వం వ్యాప్య తిష్ఠసి ॥

వక్తుమ్ అర్హసి అశేషేణ దివ్యా హి ఆత్మవిభూతయః ।
యాభిః విభూతిభిః లోకాన్ ఇమాన్ త్వం వ్యాప్య తిష్ఠసి ॥

మిమ్ములను అర్థం చేసుకోవటం - సందర్శించటం - ఆస్వాదించటం భక్తి - ప్రపత్తులచేతనే సుసాధ్యం! అట్టి భక్తి - ప్రవృద్ధికై మీ విశేషమైన విభూతులను ఆశ్రయించటమే ఉపాయం. కాబట్టి, ఏఏ మీ విశేషభూతులు ఈ స్వర్గ - మర్త్య - పాతాళ త్రిలోకములు వ్యాపించి ఉన్నాయో…. అవి సమగ్రంగా మేము గ్రహించటం అత్యవసరం కదా!

10–17

కథం విద్యామహం యోగింస్త్వాం సదా పరిచింతయన్ ।
కేషు కేషు చ భావేషు చిన్త్యోఽసి భగవన్మయా ॥

కథం విద్యామ్ అహం యోగిన్ త్వాం సదా పరిచిన్తయన్ ।
కేషు కేషు చ భావేషు చిన్త్యో అసి, భగవన్! మయా? ॥

అట్టి మీ విస్తార విభూతులు? (Model Manifestations) మీ నోట వినటం ఎంతటి సదవకాశం!

మీ ఏ విభూతిని పరిచింతన చేసుకొంటూ భక్తి యోగమును మేము పరిపుష్టం చేసుకోగలమో…, ఏఏ భావములతో చింతన చేస్తూ మేము సర్వాంతర్యామివగు మీ దరి చేరగలమో - ఇప్పుడు ప్రవచించ ప్రార్థన!

10–18

విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన ।
భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మేఽమృతమ్ ॥

విస్తరేణ ఆత్మనో యోగం విభూతిం చ, జనార్దన! ।
భూయః కథయ తృప్తిః హి శృణ్వతో న అస్తి మే అమృతమ్ ॥

ఓ జనార్దనా! మీ ఆత్మవిభూతులు ఉపాసకులకు మార్గదర్శకాలు కదా!

కొన్నికొన్ని విభూతులు మీరు ఇప్పటికే చెప్పి ఉన్నారు. అయితే అమృత వాక్కులగు మీ విభూతులు ఇంతవరకు ఎంతగా మరలమరల చూస్తున్నప్పటికీ, వింటున్నప్పటికీ, ఇంకా ఇంకా వినాలని, భక్తి - ప్రపత్తుల పరిపుష్టికై వినియోగించుకోవాలని అనిపిస్తోందేగాని, ‘ఇక చాలులే’ అని తృప్తి కలుగటం లేదు సుమా!

కనుక, మా ఉపాసనా సౌలభ్యముకొరకై మేము ఏఏ మీ విభూతులు ఆశ్రయించవచ్చో శలవీయండి!


Lord-Krishna-exemplifying-his-significant-manifestations

మూల శ్లోకము


అధ్యయన వ్యాఖ్యానము


ఉపన్యాసము

శ్రీ భగవాన్ ఉవాచ :-

10–19

హన్త తే కథయిష్యామి దివ్యా హ్యాత్మవిభూతయః ।
ప్రాధాన్యతః కురుశ్రేష్ఠ నాస్త్యన్తో విస్తరస్య మే ॥

హంత తే కథయిష్యామి దివ్యా హి ఆత్మవిభూతయః ।
ప్రాధాన్యతః, కురుశ్రేష్ఠ! న అస్తి అంతో విస్తరస్య మే ॥

శ్రీకృష్ణ భగవానుడు :-

నాయనా! అర్జునా! నాయొక్క విభూతులు అనంతం. ఉపాసనా సౌలభ్యము కొరకై ప్రధానమైన కొన్ని ఆత్మ విభూతులను ఈ సందర్భంలో చెప్పుతాను, విను. నేను చెప్పబోవుచున్న నా విభూతులు నా స్వరూపముగా ఉపాసన చేయవచ్చు. అవి నీ ఆరాధనా విధానమునకు సహకరించు గాక! అవి మార్గదర్శకాలు - మార్గాన్వేషణ ప్రేరకాలు సుమా!

10–20

అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః ।
అహమాదిశ్చ మధ్యం చ భూతానామన్త ఏవ చ ॥

అహమాత్మా, గుడాకేశ! సర్వభూత ఆశయస్థితః ।
అహమ్ ఆదిః చ మధ్యం చ భూతానామ్ అంత ఏవ చ ॥

ఓ గుడాకేశా! అర్జునా! సర్వ జీవజాలములలోని ఆశ - ఆశయములకు ఉత్పత్తి స్థానమగు ఆత్మను (The ‘SELF’ of everybody) నేనే!
‘‘ప్రతిజీవుని యొక్క మొదలు - మధ్య - అంతము నా ప్రదర్శన చమత్కారమే’’ అను సందర్శనం నాయొక్క విభూతి సందర్శనమే!
(Please develop comprehension that the beginning, the continuity and the end of every being is in Al-pervading Divinity.)

10–21

ఆదిత్యానామహం విష్ణుర్జ్యోతిషాం రవిరంశుమాన్ ।
మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశీ ॥

ఆదిత్యానామ్ అహం విష్ణుః, జ్యోతిషాం రవిః అంశుమాన్ ।
మరీచిః మరుతామ్ అస్మి, నక్షత్రాణామ్ అహం శశీ ॥

ద్వాదశ (12) ఆదిత్యులలో నేను విష్ణువును. సూర్యుని ద్వాదశ (12) కళలలో సర్వరక్షణ తత్త్వమగు విష్ణుకళ నేనే!

లోకమునకు ప్రకాశమును ప్రసాదించే తత్త్వములలో కిరణప్రదాతయగు సూర్యగోళము యొక్క తేజోవిశేషం నాదే!

‘మరుత్త’ అనే వాయుదేవతా తత్వములలో మరీచి వాయుతత్వమును (వాయు తరంగములు జగత్తులలోను - దేహములలోని నర-నరములలో ప్రసరింపజేసే ఉత్తేజ - చలన తత్వాధిపతి)ని నేనే!

ఆకాశములో కనిపించే జ్యోతిష సముదాయములో మనోజ్ఞము, మహామనోరూప సంజ్ఞయగు చంద్రగోళమును నేనే!

10–22

వేదానాం సామవేదోఽస్మి దేవానామస్మి వాసవః ।
ఇన్ద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతనా ॥

వేదానాం సామవేదో అస్మి, దేవానామ్ అస్మి వాసవః ।
ఇంద్రియాణాం మనః చ అస్మి, భూతానామ్ అస్మి చేతనా ॥

వేద - వేదాంత స్వరూపమగు పరమాత్మయొక్క విశేష విభవములను, చమత్కృతులను, విభూతులను గానం చేస్తున్న సామవేదం నా ఆనందస్వరూపం.

దేవతలలో దేవతాప్రభువగు ఇంద్రుడను!

సర్వ దేహములలో క్రియాశీలకమై ఉంటున్న ఇంద్రియములలో మనస్సు నా రూపమే! (మనస్సు విషయములకన్నా ముందే ఉండి, దృశ్యరహిత దర్పణంలాగా ఒకవైపు విషయములను ప్రతిబింబిస్తూ, మరొకవైపు విషయములకు ప్రమేయంలేనట్టిదై ఉంటోంది.)

ఈ దేహధారులగు సర్వ జీవులలోని బుద్ధి నేనే!

10–23

రుద్రాణాం శఙ్కరశ్చాస్మి విత్తేశో యక్షరక్షసామ్ ।
వసూనాం పావకశ్చాస్మి మేరుః శిఖరిణామహమ్ ॥

రుద్రాణాం శంకరః చ అస్మి, విత్తేశో యక్షరక్షసామ్ ।
వసూనాం పావకః చ అస్మి, మేరుః శిఖరిణామ్ అహమ్ ॥

ఏకాదశ (11) రుద్రులలో శంకర భగవానుడను నేనే!

యక్షరాక్షసులలో కుబేరడను నేనే!

అష్టవసువులలో అగ్నిస్వరూపుడగు పావకుడను!

శిఖరములలో మేరు పర్వతమును!

10–24

పురోధసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిమ్ ।
సేనానీనామహం స్కన్దః సరసామస్మి సాగరః ॥

పురోధసాం చ ముఖ్యం మాం విద్ధి, పార్థ! బృహస్పతిమ్ ।
సేనానీనామ్ అహం స్కందః, సరసామ్ అస్మి సాగరః ॥

పురోహితులలో ప్రప్రథముడు - శ్రేష్ఠుడు - దేవతల గురువు అగు బృహస్పతిని!

సేనాధిపతులలో దేవసేనాధిపతియగు కుమారస్వామిని (స్కంధుడను)!

సరస్సులలో సప్తసముద్రాలు నేనే!

10–25

మహర్షీణాం భృగురహం గిరామస్మ్యేకమక్షరమ్ ।
యజ్ఞానాం జపయజ్ఞోఽస్మి స్థావరాణాం హిమాలయః ॥

మహర్షీణాం భృగుః అహం, గిరామ్ అస్మి ఏకమ్ అక్షరమ్ ।
యజ్ఞానాం జపయజ్ఞో అస్మి, స్థావరాణాం హిమాలయః ॥

మహర్షులలో భృగుమహర్షిని!

అర్థవంతమైన అక్షరములలో ఏకమక్షరం (ఏకము-అక్షరము) అయినట్టి ‘ఓం’ యొక్క తత్త్వార్థం నా స్వరూపమే!

యజ్ఞములలో జపయజ్ఞమును!

స్థావరములలో హిమాలయ పర్వతమును!

10–26

అశ్వత్థః సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః ।
గన్ధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః ॥

అశ్వత్థః సర్వవృక్షాణాం, దేవర్షీణాం చ నారదః ।
గంధర్వాణాం చిత్రరథః, సిద్ధానాం కపిలో మునిః ॥

వృక్షములన్నిటిలోను అశ్వత్ధ వృక్షమును!

దేవ ఋషులలో నారద మహర్షిని!

గంధర్వులలో చిత్రరథుడను!

సిద్ధులలో కపిల మునిని!

10–27

ఉచ్చైఃశ్రవసమశ్వానాం విద్ధి మామమృతోద్భవమ్ ।
ఐరావతం గజేన్ద్రాణాం నరాణాం చ నరాధిపమ్ ॥

ఉచ్చైఃశ్రవసమ్ అశ్వానాం విద్ధి మామ్ అమృత-ఉద్భవమ్ ।
ఐరావతం గజేంద్రాణాం, నరాణాం చ నరాధిపమ్ ॥

అశ్వములలో సముద్ర మథన సమయంలో జన్మించిన ఉచ్చైశ్రవశ అశ్వం నేనే!

శ్రేష్ఠమైన ఏనుగులలో (దిగ్గజములలో) ఐరావతమును!

మానవులలో నరాధిపుడును (రాజును).

10–28

ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ ।
ప్రజనశ్చాస్మి కన్దర్పః సర్పాణామస్మి వాసుకిః ॥

ఆయుధానామ్ అహం వజ్రం, ధేనూనామ్ అస్మి కామధుక్ ।
ప్రజనః చ అస్మి కందర్పః, సర్పాణామ్ అస్మి వాసుకిః ॥

ఆయుధములలో వజ్రమును!

ధేనువులలో (ఆవులలో) కామధేనువును!

ప్రజోత్పత్తికారకుడగు మన్మధుడను!

సర్పములలో వాసుకిని!

10–29

అనన్తశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహమ్ ।
పితౄణామర్యమా చాస్మి యమః సంయమతామహమ్ ॥

అనంతః చ అస్మి నాగానాం, వరుణో యాదసామ్ అహమ్ ।
పితౄణాం అర్యమా చ అస్మి, యమః సంయమతామ్ అహమ్ ॥

అనేక తలలు ఉండే నాగులలో ఆదిశేషుడను!

జల చరముల ప్రభువగు వరుణుడను!

పిత్రుదేవతలలో అధిపతియగు అర్యముడను!

దండించువారిలో యముడను!

10–30

ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహమ్ ।
మృగాణాం చ మృగేన్ద్రోఽహం వైనతేయశ్చ పక్షిణామ్ ॥

ప్రహ్లాదః చ అస్మి దైత్యానాం, కాలః కలయతామ్ అహమ్ ।
మృగాణాం చ మృగేంద్రో అహం, వైనతేయః చ పక్షిణామ్ ॥

దైత్యులలో ప్రహ్లాదుడను నేనే!

గణించువాటిలో (Among Computables) కాలుడను (The Time) నేను!

మృగములలో మృగ్రేంద్రుడగు సింహమును!

పకక్షులలో గరుత్మంతుడను!

10–31

పవనః పవతామస్మి రామః శస్త్రభృతామహమ్ ।
ఝషాణాం మకరశ్చాస్మి స్రోతసామస్మి జాహ్నవీ ॥

పవనః పవతామ్ అస్మి, రామః శస్త్రభృతామ్ అహమ్ ।
ఝషాణాం మకరః చ అస్మి, స్రోతసామ్ అస్మి జాహ్నవీ ॥

గమన స్వభావులలో వాయువును!

శస్త్రాస్త్రధారులలో శ్రీరామచంద్రుడను!

జలచరములలో మొసలిని!

ప్రవాహలక్షణ సమన్వితములగు నదులలో గంగానదిని!

10–32

సర్గాణామాదిరన్తశ్చ మధ్యం చైవాహమర్జున ।
అధ్యాత్మవిద్యా విద్యానాం వాదః ప్రవదతామహమ్ ॥

సర్గాణామ్ ఆదిః అంతః చ మధ్యం చ ఏవ అహమ్, అర్జున! ।
అధ్యాత్మవిద్యా విద్యానాం, వాదః ప్రవదతామ్ అహమ్ ॥

ఈ సృష్టించబడిన సర్వసృష్టి యొక్క ఆది - మధ్య - అంతమును నేనే!

సర్వ విద్యలలో అధ్యాత్మవిద్యను!

వాదములలో తత్త్వనిర్ణయ వాదమును!

10–33

అక్షరాణామకారోఽస్మి ద్వన్ద్వః సామాసికస్య చ ।
అహమేవాక్షయః కాలో ధాతాహం విశ్వతోముఖః ॥

అక్షరాణామ్ అకారో అస్మి, ద్వంద్వః సామాసికస్య చ ।
అహమ్ ఏవ అక్షయః కాలో, ధాతా అహం విశ్వతోముఖః ॥

అక్షరములలో ‘శివస్వరూపము’ అనబడు ‘అ’ అక్షరమును!

సామాసములలో ద్వంద్వ సామాసము ( ఉదా: పురుషుడు-ప్రకృతి, దేహి-దేహము, లక్ష్మీనారాయణులు, పార్వతీపరమేశ్వరులు ఇత్యాది) నేను!

అక్షయ స్వరూపమగు కాలమును (Time factor) నేనే!

ఊర్ధ్వ - అధో ముఖములతో సహా సర్వదిక్‌ ముఖములు నేను.

10–34

మృత్యుః సర్వహరశ్చాహముద్భవశ్చ భవిష్యతామ్ ।
కీర్తిః శ్రీర్వాక్చ నారీణాం స్మృతిర్మేధా ధృతిః క్షమా ॥

మృత్యుః సర్వహరః చ అహమ్, ఉద్భవః చ భవిష్యతామ్ ।
కీర్తిః, శ్రీః వాక్ చ నారీణాం, స్మృతిః, మేధా, ధృతిః, క్షమా ॥

ఏ మృత్యువు భూత కాలమును మ్రింగివేయటం, భవిష్యత్‌ కాలమును ఉద్భవింపజేయటం నిర్వర్తిస్తోందో…. అట్టి మృత్యుదేవతను నేనే!

జీవులయొక్క కీర్తి - సిరి - వాక్‌ సంపద - నారీ పాణిగ్రహణ సంపద నేనే!

ప్రతి జీవునిలోని జ్ఞాపకము - మేధాశక్తి - ధైర్యము - క్షమా గుణము నేనే!

10–35

బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛన్దసామహమ్ ।
మాసానాం మార్గశీర్షోఽహమృతూనాం కుసుమాకరః ॥

బృహత్ సామ తథా సామ్నాం, గాయత్రీ ఛందసామ్ అహమ్ ।
మాసానాం మార్గశీర్షో అహమ్, ఋతూనాం కుసుమాకరః ॥

సామగానములలో బృహత్‌ సామగానమును!

ఛందస్సులలో గాయత్రీ ఛందస్సును!

మాసములలో మార్గశీర్షమును!

ఋతువులలో వసంత ఋతువును!

10–36

ద్యూతం ఛలయతామస్మి తేజస్తేజస్వినామహమ్ ।
జయోఽస్మి వ్యవసాయోఽస్మి సత్త్వం సత్త్వవతామహమ్ ॥

ద్యూతం ఛలయతామ్ అస్మి, తేజః తేజస్వినామ్ అహమ్ ।
జయో అస్మి, వ్యవసాయో అస్మి, సత్త్వం సత్త్వవతామ్ అహమ్ ॥

వంచనతో కూడిన ఆటలలో జూదమును!

తేజోవంతులలోని తేజస్సు నా రూపమే!

జయము - పరిశ్రమ… నా రూపములే!

సాత్విక జనులలోని సాత్వికత నేనే!

10–37

వృష్ణీనాం వాసుదేవోఽస్మి పాణ్డవానాం ధనంజయః ।
మునీనామప్యహం వ్యాసః కవీనాముశనా కవిః ॥

వృష్ణీనాం వాసుదేవో అస్మి, పాండవానాం ధనంజయః ।
మునీనామ్ అపి అహం వ్యాసః, కవీనామ్ ఉశనా కవిః ॥

వృష్టివంశజులలో వాసుదేవుడను (శ్రీకృష్ణుడను) నేను!

పంచపాండవులలో అర్జునుడను నేనే! (త్వమేవాహమ్‌)

మునీశ్వర సంఘములో వ్యాస మహర్షిని!

విద్వాంసులలో శుక్రాచార్యుడను!

10–38

దణ్డో దమయతామస్మి నీతిరస్మి జిగీషతామ్ ।
మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహమ్ ॥

దండో దమయతామ్ అస్మి, నీతిః అస్మి జిగీషతామ్ ।
మౌనం చ ఏవ అస్మి గుహ్యానాం, జ్ఞానం జ్ఞానవతామ్ అహమ్ ॥

శిక్షించువారిలో ‘శిక్ష’ నా ప్రదర్శనమే! సర్వ శిక్షకుడగు యముడను నేనే!

‘‘జయించాలి’’ అనుకొనేవారిలోని నీతి రూపము (Principles and Practices) నేనే!

రహస్యములకు సంబంధించిన ‘మౌనము’ నేనే!

జ్ఞానవంతులలోని జ్ఞానము నా స్వరూపమే! వారిలోని జ్ఞానము నేనే!

10–39

యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున ।
న తదస్తి వినా యత్స్యాన్మయా భూతం చరాచరమ్ ॥

యత్ చ అపి సర్వభూతానాం బీజం తత్ అహమ్, అర్జున! ।
న తత్ అస్తి వినా యత్ స్యాత్ మయా భూతం చర-అచరమ్ ॥

ప్రతి ఒక్క జీవుని యొక్క ఆదిబీజము నాయందే ఏర్పడినదై ఉన్నది.

నేను కానిదేదీ లేదు.

ఓ అర్జునా! ఈ స్థావరజంగమముల సమస్తములో నాకు వేరైనదంటూ ఎక్కడా ఏదీ లేదు. ఉదహరణకు, స్వప్నద్రష్టకు వేరుగా స్వప్నంలో ఏ ఒక్క చిన్న వస్తువు ఉండదు కదా! సర్వము అస్మత్‌ సంకల్పనా, భావనా చమత్కారమే!

10–40

నాన్తోఽస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప ।
ఏష తూద్దేశతః ప్రోక్తో విభూతేర్విస్తరో మయా ॥

న అంతో అస్తి మమ దివ్యానాం విభూతీనాం, పరంతప! ।
ఏష తు ఉద్దేశతః ప్రోక్తో విభూతేః విస్తరో మయా ॥

ఓ అర్జునా! ఈ విధంగా నా విభూతులు అనంతము. అట్టి అనంత తేజో విశేషాలలో కొన్నిటిని నీయొక్క ప్రశ్నకు సమాధానంగా అభివర్ణించి చెప్పాను.

10–41

యద్యద్విభూతిమత్సత్త్వం శ్రీమదూర్జితమేవ వా ।
తత్తదేవావగచ్ఛ త్వం మమ తేజోంశసంభవమ్ ॥

యత్ యత్ విభూతిమత్ సత్త్వం శ్రీమత్ ఊర్జితమ్ ఏవ వా ।
తత్ తత్ ఏవ అవగచ్ఛ త్వం మమ తేజో అంశసంభవమ్ ॥

ఎక్కడెక్కడైతే ఏదేది సంపత్తి - కాంతియుక్తము - రమ్యము - కళ్యాణకారకము అయిఉంటుందో అదంతా నా తేజస్సు యొక్క అంశ చేతనే సంభవిస్తోందని గమనిస్తూ…. ఉపాసించవచ్చు!

10–42

అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున ।
విష్టభ్యాహమిదం కృత్స్నమేకాంశేన స్థితో జగత్ ॥

అథవా బహునా ఏతేన కిం జ్ఞాతేన తవ, అర్జున! ।
విష్టభ్య అహమ్ ఇదం కృత్స్నమ్ ఏక అంశేన స్థితో జగత్ ॥

అయినా ఇన్నిన్ని మాటలెందుకు! ఒక్క విశేష వాక్యం చెపుతాను. విను.

‘‘ఈ కనబడే చరాచర జగత్తంతా కూడా, అనంతుడనగు నాకు చెందిన ఒకానొక అంశముయొక్క స్వల్ప విభాగమునందు ఏర్పడినదై యున్నది.’’

ఈ జగత్తంతా కుడా నా అంశలోని ఒకానొక స్వల్ప చమత్కారం మాత్రమే! అందుచేత… ఇదంతా కూడా…. నేనే!


ఇతి శ్రీమత్‌ భగవద్గీతాసు … విభూతి యోగ పుష్పః ।
శ్రీ సాంబ సదాశివ పాదారవిందార్పణమస్తు ॥
🙏