భగవద్గీత

11. విశ్వరూప సందర్శన యోగ అధ్యయన పుష్పం

మూలము : శ్రీ వ్యాస మహర్షిచే విరచించబడిన జయము / మహాభారతము (భీష్మ పర్వము)

అధ్యయన వ్యాఖ్యానము : (అధ్యయన విద్యార్థి) యేలేశ్వరపు హనుమ రామకృష్ణ


Arjuna requesting Krishna to show his Original Form

మూల శ్లోకము


అధ్యయన వ్యాఖ్యానము


ఉపన్యాసము

అర్జున ఉవాచ :-

11–01

మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మసంజ్ఞితమ్ ।
యత్త్వయోక్తం వచస్తేన మోహోఽయం విగతో మమ ॥

మత్ అనుగ్రహాయ పరమం గుహ్యమ్ అధ్యాత్మసంజ్ఞితమ్ ।
యత్ త్వయా ఉక్తం వచః, తేన మోహో అయం విగతో మమ ॥

అర్జునుడు :

మీ ఆధ్యాత్మ సంజ్ఞిత వాక్యాలు

హే పరంధామా! శ్రీకృష్ణా! మీరు నాపై అత్యంత అనుగ్రహంచే తత్త్వజ్ఞాన పూర్వకమైన మహత్తర వాక్యామృతం ప్రసాదిస్తున్నారు. పరమార్థ శోభితము - అతి రహస్యము - అధ్యాత్మము అగు విశేషాలు ప్రవచనం చేస్తున్నారు. అధ్యాత్మ శాస్త్ర వాక్యసారంగా ప్రకటించబడిన - మహత్తర జీవిత సారాంశము - జీవుని నిర్వచనము అయిన మీ వాక్యములను వినినంత మాత్రం చేతనే నా మోహమంతా పటాపంచలయిపోతోంది.


11–02

భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరశో మయా ।
త్వత్తః కమలపత్రాక్ష మాహాత్మ్యమపి చావ్యయమ్ ॥

భవ-అప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరశో మయా ।
త్వత్తః, కమలపత్రాక్ష! మాహాత్మ్యమ్ అపి చ అవ్యయమ్ ॥

ఈ దృశ్యము, ఇందలి జీవజాలమంతా కూడా మీయందే ఏ విధంగా సృష్టి - స్థితి - లయము పొందుచున్నాయో, మీ అప్రమేయ మహాత్మ్య ఆత్మతత్త్వము, శాశ్వతానంద స్వతత్త్వము ఎట్టిదో - అదంతా మీ అమృత వాక్కుల ద్వారా ఇప్పుడు నేను మీ నుండే వింటున్నాను.

11–03

ఏవమేతద్యథాత్థ త్వమాత్మానం పరమేశ్వర ।
ద్రష్టుమిచ్ఛామి తే రూపమైశ్వరం పురుషోత్తమ ॥

ఏవమ్ ఏతత్ యథా ఆత్థ త్వమ్ ఆత్మానం, పరమేశ్వర! ।
ద్రష్టుమ్ ఇచ్ఛామి తే రూపమ్ ఐశ్వరం, పురుషోత్తమ! ॥

హే పరమేశ్వరా! మీరు ‘‘మయా తతమ్‌ ఇదమ్‌ సర్వమ్ జగత్‌ అవ్యక్త మూర్తినా - మస్థాని సర్వభూతాని - న చ మస్థాని భూతాని’’… అను వర్ణనచే ఏ మీ మహాత్మ్యమును విశదీకరించారో, మీ వేరువేరైన - ఏకస్థమైన విభూతులను అభివర్ణించారో… అవన్నీ పరమ సత్యముగా నేను గ్రహించుచున్నాను. గమనిస్తున్నాను.

అయితే స్వామీ! మీరు అభౌతిక - పరస్వరూపులు కదా! మీరు దేవకీ వసుదేవులకు ఆనందమును ప్రసాదించటానికి, ’కృష్ణ రాయబారము సందర్భంగాను, యశోదామాతకు శాంతిని ప్రసాదించటానికి …… మొదలైన కొన్ని సందర్భాలలో విశ్వరూపం ప్రదర్శించారని విన్నాను. ఈ భౌతిక రూపమునకు పరమై, జగత్‌పూర్ణమై జగత్‌ అంతర్గత - జగదతీత - జగత్‌ అప్రమేయ - జగత్‌ ఆధార విశ్వరూపం సందర్శించాలని నాకు వేడుక కలుగుతోంది.

11–04

మన్యసే యది తచ్ఛక్యం మయా ద్రష్టుమితి ప్రభో ।
యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయమ్ ॥

మన్యసే యది తత్ శక్యం మయా ద్రష్టుమ్ ఇతి, ప్రభో! ।
యోగేశ్వర! తతో మే త్వం దర్శయ ఆత్మానమ్ అవ్యయమ్ ॥

ఒక వేళ మీ విశ్వరూపమును సందర్శించగల సామర్థ్యము - అధికారము నాకు ఉన్నదని మీరు భావిస్తే, మీ అవ్యయమగు కేవలాత్మానంద విశ్వరూపం సందర్శించే అనుగ్రహమును ప్రసాదించండి. హే యోగీశ్వరా! మీ విశ్వరూప సందర్శన భాగ్యమును నాకు అనుగ్రహించండి.
శ్రీ భగవాన్ ఉవాచ :-

11–05

పశ్య మే పార్థ రూపాణి శతశోఽథ సహస్రశః ।
నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ ॥

పశ్య మే, పార్థ! రూపాణి శతశో అథ సహస్రశః ।
నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ ॥

శ్రీకృష్ణ భగవానుడు :-

అర్జునా! తథాస్తు!

నానావిధములైన వర్ణనములతో, ఆకృతులతో వందల వేల రూపములను చమత్కారంగా అవధరించియున్న నా దివ్యరూపమును సందర్శించెదవు గాక!

11–06

పశ్యాదిత్యాన్వసూన్రుద్రానశ్వినౌ మరుతస్తథా ।
బహూన్యదృష్టపూర్వాణి పశ్యాశ్చర్యాణి భారత ॥

పశ్య ఆదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతః తథా ।
బహూని అదృష్టపూర్వాణి పశ్య ఆశ్చర్యాణి, భారత! ॥

ద్వాదశ ఆదిత్యులను - అష్టవసువులను - ఏకాదశ రుద్రులను - అశ్వినీ దేవతలను - నవ మరుద్గణములను - ఇంకా ఎన్నెన్నో నీవు చూచి - విని ఉన్నవి, చూడని - విననివి అగు అనేకానేక విశేషాలను స్వరూపాంతర్గత చమత్కారంగా కలిగియున్న నా అప్రమేయ విశ్వాంతర్గత - విశ్వాతీత - విశ్వరూపమును సందర్శించు!

11–07

ఇహైకస్థం జగత్కృత్స్నం పశ్యాద్య సచరాచరమ్ ।
మమ దేహే గుడాకేశ యచ్చాన్యద్ద్రష్టుమిచ్ఛసి ॥

ఇహ ఏకస్థం జగత్ కృత్స్నం పశ్య అద్య స-చర-అచరమ్ ।
మమ దేహే, గుడాకేశ! యత్ చ అన్యత్ ద్రష్టుమ్ ఇచ్ఛసి ॥

ఈ స్థావర - జంగమాత్మక దృశ్య జగత్తంతా ఎందులో భావనానుసారంగా ప్రతిబింబిస్తోందో… అట్టి నా ఆత్మదేహమునందు ఇంకా నీకు ఏమేమి చూడవేడుక కలదో…. అదంతా చూడవచ్చు.

11–08

న తు మాం శక్యసే ద్రష్టుమనేనైవ స్వచక్షుషా ।
దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరమ్ ॥

న తు మాం శక్యసే ద్రష్టుమ్ అనేన ఏవ స్వచక్షుషా ।
దివ్యం దదామి తే చక్షుః, పశ్య మే యోగమ్ ఐశ్వరమ్ ॥

అయితే, భౌతిక నేత్రములు భౌతిక దృశ్యమునకు పరిమితమై ఉంటాయి. దివ్యమగు ఆత్మదేహం సందర్శించే సామర్థ్యము నీ భౌతిక నేత్రములకు లేదు.

అందుచేత దివ్యమగు విజ్ఞతా చకక్షువులు (Sharp perceptive ability of common sense)(లేక) జ్ఞాన నేత్రములు ప్రసాదిస్తున్నాను. నా యొక్క ఆత్మయోగైశ్వర్యమును ఇప్పుడు సందర్శించు.


Sanjaya-describing-Arjuna-experience

మూల శ్లోకము


అధ్యయన వ్యాఖ్యానము


ఉపన్యాసము

సంజయ ఉవాచ :-

11–09

ఏవముక్త్వా తతో రాజన్మహాయోగేశ్వరో హరిః ।
దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరమ్ ॥

ఏవమ్ ఉక్త్వా తతో, రాజన్! మహాయోగేశ్వరో హరిః ।
దర్శయామాస పార్థాయ పరమం రూపమ్ ఐశ్వరమ్ ॥

సంజయుడు :-

ఓ ధృతరాష్ట్ర మహారాజా! మహాయోగేశ్వరులగు ఆ శ్రీహరి అప్పుడు అర్జునునకు పరము - మహత్తరము - దృశ్యాతీతము - సర్వధారణా సమన్వితము అగు ఆత్మైశ్వర్య విశ్వరూపమును ప్రదర్శించి చూపనారంభించారు.

11–10

అనేకవక్త్రనయనమనేకాద్భుతదర్శనమ్ ।
అనేకదివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధమ్ ॥

అనేక వక్త్ర నయనమ్, అనేక అద్భుత దర్శనమ్ ।
అనేక దివ్య ఆభరణం, దివ్య అనేక ఉద్యత ఆయుధమ్ ॥

అర్జునునకు ఆ కృష్ణభగవానుని విశ్వ-విశ్వాంతర్గత తత్త్వరూపములో అనేక ముఖాలు, కళ్లు, దివ్యమైన ఆభరణధారులు, అనేక ఆయుధములు ధరించిన వారు అగుపించారు.

11–11

దివ్యమాల్యామ్బరధరం దివ్యగన్ధానులేపనమ్ ।
సర్వాశ్చర్యమయం దేవమనన్తం విశ్వతోముఖమ్ ॥

దివ్య మాల్య అంబరధరం, దివ్య గంధ అనులేపనమ్ ।
సర్వ ఆశ్చర్యమయం దేవమ్ అనంతం విశ్వతోముఖమ్ ॥

అసంఖ్యాక జీవులు, దివ్యమాలాంబరధారులు, దివ్యగంధములను అలంకరించుకున్న వారు అగుపించారు. ఆ దివ్యరూపం విశ్వమంతా ప్రసరించి ఆక్రమించియున్నదై కనిపించింది. ఆ విశ్వరూపములో అనేక ఆశ్చర్య దృశ్య పరంపరలు ప్రదర్శితమవటం అర్జునుడు సందర్శించసాగాడు.

11–12

దివి సూర్యసహస్రస్య భవేద్యుగపదుత్థితా ।
యది భాః సదృశీ సా స్యాద్భాసస్తస్య మహాత్మనః ॥

దివి సూర్య సహస్రస్య భవేత్ యుగపత్ ఉత్థితా ।
యది భాః సదృశీ సా స్యాత్ భాసః తస్య మహాత్మనః ॥

ఆ విశ్వరూపము వేలాది సూర్యుల తేజస్సు ఒక్కచోట సమావేశమైనట్లుగా మహాతేజో విరాజితమై కనిపించింది.

11–13

తత్రైకస్థం జగత్కృత్స్నం ప్రవిభక్తమనేకధా ।
అపశ్యద్దేవదేవస్య శరీరే పాణ్డవస్తదా ॥

తత్ర ఏకస్థం జగత్ కృత్స్నం ప్రవిభక్తమ్ అనేకధా ।
అపశ్యత్ దేవదేవస్య శరీరే పాండవః తదా ॥

అనేకవిధ ప్రకృతులు - స్వభావాలు - ఏకరూపంలో ఏకైక పరతత్వము యొక్క బహువిధ ప్రదర్శనా చమత్కారాలుగా అర్జునుడు సందర్శించ సాగాడు.

11–14

తతః స విస్మయావిష్టో హృష్టరోమా ధనఞ్జయః ।
ప్రణమ్య శిరసా దేవం కృతాఞ్జలిరభాషత ॥

తతః స విస్మయా ఆవిష్టో హృష్టరోమా ధనంజయః ।
ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిః అభాషత ॥

ఆనంద-ఆశ్చర్య - విస్మయములతో అర్జునుడు పులకాంకితుడయ్యాడు.

దేదీప్యమానంగా విశ్వమంతా ఆక్రమించ వెలుగొందుచున్న విశ్వ - విరాట్‌ రూపమును చూస్తున్న అర్జునుడు శ్రద్ధాభక్తులతో సాష్టాంగ దండప్రణామములు మరల మరల సమర్పించాడు.

చేతులు జోడించి నమస్కరిస్తూ తన్మయత్వంతో ఇట్లా స్తోత్రం చేయసాగాడు.


Arjuna describing Viswaroopa Darsanam

మూల శ్లోకము


అధ్యయన వ్యాఖ్యానము


ఉపన్యాసము

అర్జున ఉవాచ :-

11–15

పశ్యామి దేవాంస్తవ దేవ దేహే
సర్వాంస్తథా భూతవిశేషసంఘాన్ ।
బ్రహ్మాణమీశం కమలాసనస్థం
ఋషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్ ॥

పశ్యామి దేవాన్ తవ, దేవ! దేహే
సర్వాన్ తథా భూత విశేష సంఘాన్ ।
బ్రహ్మాణమ్ ఈశం కమల-ఆసన-స్థం
ఋషీన్ చ సర్వాన్ ఉరగాన్ చ దివ్యాన్ ॥

అర్జునుడు :

ఓ దేవదేవా! పరాత్పరా! మీ ఈ సర్వతత్త్వ స్వరూప - విశ్వాంతరాళ - విశ్వరూపంలో అనేకమంది దేవతలు, జీవసంఘ సమూహాలు, బ్రహ్మదేవుడు, శివుడు, సకల ఋషులు, దివ్య సర్ప సమూహములు నాకు అగుపిస్తున్నారు.

11–16

అనేకబాహూదరవక్త్రనేత్రం
పశ్యామి త్వాం సర్వతోఽనన్తరూపమ్ ।
నాన్తం న మధ్యం న పునస్తవాదిం
పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప ॥

అనేక బాహు ఉదర వక్త్ర నేత్రం,
పశ్యామి త్వాం సర్వతో అనంతరూపమ్ ।
న అంతం, న మధ్యం, న పునః తవ ఆదిం
పశ్యామి, విశ్వేశ్వర! విశ్వరూప! ॥

అసంఖ్యాకమగు చేతులు, పొట్టలు, ముఖములు కనిపిస్తున్నాయి. మీ విశ్వరూపం అనంతరూపమై విరాజిల్లుచున్నది.

ఆశ్చర్యం! మీ మొదలు ఏమిటో, మధ్య ఏమిటో , చివర ఏమిటో, పునః మీ ఆది ఎక్కడో నాకేమీ అంతు పట్టటమే లేదే!

11–17

కిరీటినం గదినం చక్రిణం చ
తేజోరాశిం సర్వతోదీప్తిమన్తమ్ ।
పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమన్తాత్
దీప్తానలార్కద్యుతిమప్రమేయమ్ ॥

కిరీటినం గదినం చక్రిణం చ
తేజోరాశిం సర్వతో దీప్తిమంతమ్ ।
పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతాత్
దీప్త అనల అర్క ద్యుతిమ్ అప్రమేయమ్ ॥

హే స్వామీ!

అనేక కాంతులు వెదజల్లే కిరీటములు - గదలు - శంఖములు - చక్రములు ధరించినట్టి, అనేక-అనేక రూపధారులై అగ్ని - సూర్యుల వలె తేజోమయ రూపులై ఊహకందని విధంగా సర్వజగత్తులను ఉత్తేజపరుస్తూ, చైతన్యస్వరూపులై వెలుగొందున్నట్లుగా మీరు నాకు అగుపిస్తున్నారు.

అన్నివైపులా కాంతులు వెదజల్లుతూ జగత్‌ దృశ్య - దర్శన కారకులై, జగత్ ‌దర్శకులై, జగత్‌ రూపులై, జగత్‌ అతీతులై, జగత్తులకు అప్రమేయులై, జగత్ ‌సాక్షిగా మీరు వెలుగొందుచూ కనిపిస్తున్నారు.

11–18

త్వమక్షరం పరమం వేదితవ్యం
త్వమస్య విశ్వస్య పరం నిధానమ్ ।
త్వమవ్యయః శాశ్వతధర్మగోప్తా
సనాతనస్త్వం పురుషో మతో మే ॥

త్వమ్ అక్షరం పరమం వేదితవ్యం
త్వమ్ అస్య విశ్వస్య పరం నిధానమ్ ।
త్వమ్ అవ్యయః శాశ్వతధర్మగోప్తా
సనాతనః త్వం పురుషో మతో మే ॥

హే పరమపురుషా!

జనించటం - గతించటం స్వభావంగా కలిగియుండి, ఈ జగత్తులకు ఆవల - జగత్తుకు ఆధారులై మీరు ప్రకాసిస్తున్నారు.

మార్పు - చేర్పులకు సంబంధించని అక్షర స్వరూపులు మీరు!

ఈ జగత్తులో కనిపించే సర్వదేహాలలోని అఖండమగు అక్షరపరబ్రహ్మము మీరు!

సర్వదేహాలలో వేంచేసి ఉండి సర్వమును ఎఱుగుచున్నది మీరే!

ఈ జగత్తులన్నీ మీ స్వరూపమును ఆశ్రయించి ఉనికిని ప్రదర్శిస్తున్నాయి. ప్రతి జీవుని యొక్క శాశ్వత ధర్మముగా, ఆత్మస్వరూపంగా సర్వదా వెలుగొందుచున్నది మీరే!

ఈ దృశ్య వ్యవహారమంతటికీ మునుముందుగా వేంచేసియున్న సనాతన పురుషులు - సనాతన పురుషకారము మీరే!

11–19

అనాదిమధ్యాన్తమనన్తవీర్యమ్
అనన్తబాహుం శశిసూర్యనేత్రమ్ ।
పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రమ్
స్వతేజసా విశ్వమిదం తపన్తమ్ ॥

అనాదిమధ్యాంతం అనంతవీర్యమ్
అనంతబాహుం శశిసూర్యనేత్రమ్ ।
పశ్యామి త్వాం దీప్త హుత-అశ వక్త్రమ్
స్వతేజసా విశ్వమ్ ఇదం తపంతం ॥

హే తేజోమయ స్వరూపా!

మీరు ఆది - మధ్య - అంతములనేవి లేనివారై వెలుగొందుచున్నారు.

సర్వ దేహములయొక్క చేతులు - చేతలు మీవే!

సూర్య - చంద్రులు చక్షువులుగా ధారణ చేస్తున్న మహత్తర ఆత్మస్వరూపులు.

స్వామీ! జ్వలిస్తున్న అగ్నిశిఖల వలె ముఖము కలిగియున్న మీరు ఈ విశ్వములోని అణువణువును అనుక్షణం ఉత్తేజితం చేస్తున్నారు. ప్రజ్వలింపజేస్తున్నారు. ప్రకాశింపజేస్తున్నారు.

11–20

ద్యావాపృథివ్యోరిదమన్తరం హి
వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః ।
దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం
లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్ ॥

ద్యావాపృథివ్యోః ఇదమ్ అంతరం హి
వ్యాప్తం త్వయా ఏకేన దిశః చ సర్వాః ।
దృష్ట్వా అద్భుతం రూపమ్ ఉగ్రం తవ ఇదం
లోకత్రయం ప్రవ్యథితం, మహాత్మన్! ॥

ఆకాశం - భూమి - మధ్య, ఆకాశభూముల అంతరం లోను, ఎనిమిది దిక్కులందు వ్యాపించి - విస్తరిల్లి ప్రకాశిస్తున్న చైతన్యం మీరే!

మీ సముత్సాహ - పరమానంద స్వరూపమే సర్వే సర్వత్రా విరాజిల్లుతోంది.

హే మహాత్మా! అద్భుతమైన మీ తేజోమయ - ప్రత్యుత్సాహమయ - సర్వవ్యాపక - సర్వ ఉత్తేజిత - విశ్వాంతర్గత - విశ్వరూపం సందర్శిస్తున్నప్పుడు ఈ ముల్లోక జీవులు భయమును పొందుచున్నారు స్వామీ! భయమును పొందుచున్నారు.

11–21

అమీ హి త్వాం సురసంఘాః విశన్తి
కేచిద్భీతాః ప్రాఞ్జలయో గృణన్తి ।
స్వస్తీత్యుక్త్వా మహర్షిసిద్ధసంఘాః
స్తువన్తి త్వాం స్తుతిభిః పుష్కలాభిః ॥

అమీ హి త్వాం సురసంఘాః విశంతి
కేచిత్ భీతాః ప్రాంజలయో గృణంతి ।
స్వస్తి ఇతి ఉక్త్వా మహర్షిసిద్ధసంఘాః
స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః ॥

ఆహా! ఏమి ఆశ్చర్యం!

హే మంగళస్వరూపా! ఒకవైపు అనేక దేవతా సమూహములు మీ ఉగ్ర - విశ్వాంతరాళ - జ్వాజ్వల్యమాన - ప్రళయాగ్ని సదృశ తేజోరూపంలోకి ప్రవేశించి క్షణాలలో మటుమాయమగుచున్నాయి.

ఇంకొకచోట మరి కొందరు… మీ ఉగ్రరూపం చూచి భయకంపితులై సాష్టాంగదండప్రణామములు సమర్పించుకొంటున్నారు.

వేరొకచోట మహర్షి - సిద్ధ సంఘములు లేచి నిలుచుని తన్మయులగుచు, భక్తిపారవశ్యంతో స్వస్తి వచనాలు బిగ్గరగా పలుకుచున్నారు. మీ గుణసంపదను అనేక స్తోత్రములతో స్తుతిస్తూ, కీర్తిస్తూ సామగానం చేస్తున్నారు. శాంతి ప్రవచనాలు చెప్పుచున్నారు.

11–22

రుద్రాదిత్యా వసవో యే చ సాధ్యా
విశ్వేఽశ్వినౌ మరుతశ్చోష్మపాశ్చ ।
గన్ధర్వయక్షాసురసిద్ధసంఘా
వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే ॥

రుద్రా ఆదిత్యా వసవో యే చ సాధ్యా
విశ్వే అశ్వినౌ మరుతః చ ఊష్మపాః చ ।
గంధర్వ యక్ష అసుర సిద్ధ సంఘా
వీక్షంతే త్వాం విస్మితాః చ ఏవ సర్వే ॥

హే మహాత్మా!

విశ్వ - విశ్వాంతరాళాలలో సముత్సాహ - సముత్తేజ - పరమానంద స్వరూపంగా జ్వాజ్వల్యమానంగా వెలుగొందుచున్న మీ చైతన్యానంద రూపం సందర్శిస్తూ ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, అష్ట వసువులు, సిద్ధులు, సాధ్యులు, విశ్వేదేవతలు, అశ్వనీ కుమారులు, మరుత్తులు, పిత్రుదేవతలు, యక్షులు, కిన్నెరులు, గంధర్వులు, అసురులు, సిద్ధులు - వీరంతా సంఘ సంఘములుగా నిలబడి చూస్తూ ఆశ్చర్యచకితులగుచున్నారు.

11–23

రూపం మహత్తే బహువక్త్రనేత్రం
మహాబాహో బహుబాహూరుపాదమ్ ।
బహూదరం బహుదంష్ట్రాకరాలం
దృష్ట్వా లోకాః ప్రవ్యథితాస్తథాహమ్ ॥

రూపం మహత్ తే బహు వక్త్ర నేత్రం
మహాబాహో! బహు బాహు ఊరు పాదమ్ ।
బహు ఉదరం, బహు దంష్ట్రా కరాలం
దృష్ట్వా లోకాః ప్రవ్యథితాః, తథా అహమ్ ॥

హే ప్రభూ!

అసంఖ్యాక ముఖములు - కన్నులు - దృష్టులు - పాదములు - నడతలు - తొడలు - కోఱలు - నోళ్లతో కూడిన మీ విరాట్‌ మహత్‌ స్వరూపం చూచి లోక - లోకాంతర దేవతలే భయమును చెందుచున్నారు. ఇక నాకు భయం కలగటం గురించి నేను మీకు చెప్పుకోవలసినదేమున్నది? నేను ఇప్పుడు ఎంతెంతో భయమునకు లోను అగుచున్నాను స్వామీ!

11–24

నభఃస్పృశం దీప్తమనేకవర్ణం
వ్యాత్తాననం దీప్తవిశాలనేత్రమ్ ।
దృష్ట్వా హి త్వాం ప్రవ్యథితాన్తరాత్మా
ధృతిం న విన్దామి శమం చ విష్ణో ॥

నభః స్పృశం, దీప్తం అనేక వర్ణం
వ్యాత్త ఆననం, దీప్త విశాల నేత్రమ్ ।
దృష్ట్వా హి త్వాం ప్రవ్యథిత అంతరాత్మా
ధృతిం న విందామి శమం చ, విష్ణో! ॥

హే విశ్వాంతరాళా!

ఆకాశమును స్పృశిస్తూ - ఆకాశమును మ్రింగివేస్తూ - సర్వ దిక్కులందూ - దిక్‌దిశాంతములందు ప్రకాశిస్తూ, అనేక వర్ణములతో కూడినదై….., ప్రజ్వలిస్తున్న అసంఖ్యాక విశాల నేత్రములను ధరించినదై…….., తెరచియున్న అనేక నోరులతో ప్రదర్శితమగుచున్న మీ విశ్వరూపమును చూస్తూ ఉంటే నాకు ఇప్పుడు చెప్పలేనంత భయం కలుగుతోంది.

స్వామీ! నా అల్పబుద్ధి, నాకున్న కొద్దిపాటి ధైర్యము - ఆ భయమును ఏమాత్రం కూడా ఎదుర్కోలేకపోతున్నాయి. నాకు ధైర్యం ఏమాత్రం కలగటం లేదు. ప్రభూ! నేను అశాంతుడను అగుచున్నాను స్వామీ! మహాత్మన్‌!

ఎందుచేతనంటారా?

11–25

దంష్ట్రాకరాలాని చ తే ముఖాని
దృష్ట్వైవ కాలానలసన్నిభాని ।

దిశో న జానే న లభే చ శర్మ
ప్రసీద దేవేశ జగన్నివాస ॥

దంష్ట్రాకరాలాని చ తే ముఖాని
దృష్ట్వా ఏవ కాలా అనల సన్నిభాని ।

దిశో న జానే న లభే చ శర్మ
ప్రసీద దేవేశ! జగన్నివాస! ॥

భయంకరమైన కోరలతో అంతటా - అన్నిటా కాలస్వరూపమై అగ్ని శిఖలవలె ప్రజ్వలిస్తున్న మీ ఆత్మతత్త్వ స్వరూపమును సందర్శిస్తున్న నేను ఏ దిక్కు ఎక్కడో - ఎటువైపో? ఎవ్వరు ఎటువైపు వున్నారో - ఏమాత్రం గుర్తించ లేకపోతున్నాను.

హే విరాట్‌ స్వరూపమా! నాకు దిక్కుతోచటంలేదు. భయం వేస్తోంది. మనస్సు శాంతిని కోల్పోతోంది! సుఖం కలగటంలేదు!

ఓ దేవదేవా! లోకాశ్రయా! మీరు నాపట్ల ప్రసన్నులవండి! ప్రభో! ప్రసన్నులుకండి!

11–26

అమీ చ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః
సర్వే సహైవావనిపాలసంఘైః ।
భీష్మో ద్రోణః సూతపుత్రస్తథాసౌ
సహాస్మదీయైరపి యోధముఖ్యైః ॥

అమీ చ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః
సర్వే సహ ఏవ అవనిపాల సంఘైః ।
భీష్మో ద్రోణః సూతపుత్రః తథా అసౌ
సహ అస్మదీయైః అపి యోధముఖ్యైః ॥

హే భగవాన్‌!

ధృతరాష్ట్ర పుత్రులగు కౌరవసోదరులు, వైరి పక్షంలోని అనేకమంది రాజుల సమూహములు, భీష్మాచార్యులు, ద్రోణాచార్యులు, కర్ణుడు, మా వైపుగల అనేకమంది యోధాగ్రేసరులు అతివేగంగా, ఆపటానికి శక్యం కాకుండా మీలో ప్రవేశిస్తున్నారు.

11–27

వక్త్రాణి తే త్వరమాణా విశన్తి
దంష్ట్రాకరాలాని భయానకాని ।
కేచిద్విలగ్నా దశనాన్తరేషు
సందృశ్యన్తే చూర్ణితైరుత్తమాంగైః ॥

వక్త్రాణి తే త్వరమాణా విశంతి
దంష్ట్రా కరాలాని భయానకాని ।
కేచిత్ విలగ్నా దశన అంతరేషు
సందృశ్యంతే చూర్ణితైః ఉత్తమ అంగైః ॥

భయంకరమైన కోఱలతో అగ్నిజ్వాలలతో ప్రజ్వలిస్తున్న మీ ముఖంలోనికి వారంతా ప్రవేశిస్తున్నారు.

కొందరి శిరస్సులు ముక్కలైపోయి మీ భయంకర కోరలందు చిక్కుకొని చూర్ణం అయిపోతూ ఉండటం నాకు కనిపిస్తోంది.

11–28

యథా నదీనాం బహవోఽమ్బువేగాః
సముద్రమేవాభిముఖాః ద్రవన్తి ।
తథా తవామీ నరలోకవీరా
విశన్తి వక్త్రాణ్యభివిజ్వలన్తి ॥

యథా నదీనాం బహవో అంబువేగాః
సముద్రమ్ ఏవ అభిముఖాః ద్రవంతి ।
తథా తవ అమీ నరలోకవీరా
విశంతి వక్త్రాణి అభివిజ్వలంతి ॥

హే మహాతేజస్వీ!

నదులలోని జలాలు సముద్రము వైపునకు అభిముఖమై అతి వేగంగా ప్రవహించి-ప్రవహించి చివరకు సముద్రజలంలో కలిసిపోవుచున్నాయి, చూచారా! ఆ విధంగా అనేక మంది రాజవీరులంతా ప్రజ్వలించుచున్న మీ ముఖాగ్ని వైపుకు అభిముఖులై ప్రవేశిస్తున్నారు.

11–29

యథా ప్రదీప్తం జ్వలనం పతంగా
విశన్తి నాశాయ సమృద్ధవేగాః ।
తథైవ నాశాయ విశన్తి లోకాః
తవాపి వక్త్రాణి సమృద్ధవేగాః ॥

యథా ప్రదీప్తం జ్వలనం పతంగా
విశంతి నాశాయ సమృద్ధవేగాః ।
తథా ఏవ నాశాయ విశంతి లోకాః
తవ అపి వక్త్రాణి సమృద్ధవేగాః ॥

ఏ విధంగా అయితే మిడతల దండు మోహావేశంతో మండుచున్న అగ్నిగుండంలో ప్రవేశించి మలమల మాడి నశిస్తాయో,… అసంఖ్యాక జనసమూహములు అగ్ని తేజస్సుతో వెలుగొందే మీ ముఖమునందు మహా మోహావేశంతో తమ వినాశనముకొరకే ప్రవేశిస్తున్నాయి.

11–30

లేలిహ్యసే గ్రసమానః సమన్తాత్
లోకాన్సమగ్రాన్వదనైర్జ్వలద్భిః ।
తేజోభిరాపూర్య జగత్సమగ్రం
భాసస్తవోగ్రాః ప్రతపన్తి విష్ణో ॥

లేలిహ్యసే గ్రసమానః సమంతాత్
లోకాన్ సమగ్రాన్ వదనైః జ్వలద్భిః ।
తేజోభిః ఆపూర్య జగత్ సమగ్రం
భాసః తవ ఉగ్రాః ప్రతపంతి, విష్ణో! ॥

ఓ మహావిష్ణూ!

మండుచున్న ఆ నోళ్లతో లోకములలోని అసంఖ్యాక దేహాలన్నీ మ్రింగుతూ మీరు నాకు కనిపిస్తున్నారు. అన్నివైపులనుండి తరలి బయల్వెడలుచున్న మీ అసంఖ్యాక నాలుకలతో ఈ దృశ్యంలో కనబడే దేహాలను, వస్తు సముదాయాలను మీరు నాకి వేస్తున్నారు. మ్రింగివేస్తున్నారు. చప్పరించి వేస్తున్నారే! ఈ జగత్తులన్నీ మీ ప్రచండ కాంతితో కూడిన తేజస్సుచే దహించివేయబడుచున్నాయే!

11–31

ఆఖ్యాహి మే కో భవానుగ్రరూపో
నమోఽస్తు తే దేవవర ప్రసీద ।
విజ్ఞాతుమిచ్ఛామి భవన్తమాద్యం
న హి ప్రజానామి తవ ప్రవృత్తిమ్ ॥

ఆఖ్యాహి మే కో భవాన్ ఉగ్రరూపో?
నమో అస్తు తే, దేవవర! ప్రసీద ।
విజ్ఞాతుమ్ ఇచ్ఛామి భవంతం ఆద్యం
న హి ప్రజానామి తవ ప్రవృత్తిమ్ ॥

అసలు ఎవరు మీరు?

హే సర్వసంహారకా! లయస్వరూప! తేజో విభవముతో కూడియున్న స్వామీ! ఇంతకీ మీరెవరో నేను ఏమాత్రం తెలుసుకోలేకపోతున్నాను. మీరు చేస్తున్నదేమిటి? ఎందుకు చేస్తున్నారు? ఏమిటి మీ స్వభావం?

ఇంత భయంకరంగా ఈ అసంఖ్యాక దేహ సమూహాలు అతిత్వరగా ప్రవేశిస్తూ ఉండగా, వీటిని మ్రింగివేస్తున్నట్టి భయంకర ఆకారులైన మీయొక్క స్వరూప-స్వభావాలు, మొదలు-చివరలు ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నాను.

అసలు మీరెవరు? మీ ప్రవృత్తి ఏమిటి? మీరు చేస్తున్న కార్యమేమిటి? మీ తత్త్వమేమిటో తెలుసుకోవాలని అభిలాష పొందుచున్నాను. స్వామీ! అనుగ్రహించండి! నా నమస్కారము స్వీకరించండి! నా పట్ల ప్రసన్నులు అవండి!


Lord Krishna Upadesam in Viswaroopa Darsanam

మూల శ్లోకము


అధ్యయన వ్యాఖ్యానము


ఉపన్యాసము

శ్రీ భగవాన్ ఉవాచ :-

11–32

కాలోఽస్మి లోకక్షయకృత్ప్రవృద్ధో
లోకాన్సమాహర్తుమిహ ప్రవృత్తః ।
ఋతేఽపి త్వాం న భవిష్యన్తి సర్వే
యేఽవస్థితాః ప్రత్యనీకేషు యోధాః ॥

కాలో అస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో
లోకాన్ సమాహర్తుమ్ ఇహ ప్రవృత్తః ।
ఋతే అపి త్వాం న భవిష్యంతి సర్వే
యే అవస్థితాః ప్రత్యనీకేషు యోధాః ॥

శ్రీకృష్ణ భగవానుడు :-

కాలో అస్మి - నేను కాలమును

ఓ అర్జునా!

ఈ లోకముల ఉత్పత్తికి, పరిపోషణకు, ఉపసంహారమునకు కర్త - ఆధారభూతము అయినట్టి కాలస్వరూపును నేను! కాలః కాలస్వరూపుడను! కాల నియామకుడను!

ఇప్పుడు ఇక్కడి యుద్ధరంగంలో ప్రవేశించియున్నట్టి ఈ అనేకమంది లోకజనులను సంహారరూపంగా ఉపసంహరించే ప్రవృత్తిని ధారణ చేసినవాడనై ఉన్నాను!

అందుచేత, ఈ దేహములన్నీ నా కాలగర్భంలోకి నెట్టి వేసే ప్రత్యుత్సాహమును అవధరించియున్న నన్ను ఏదీ ఆపలేదు.

ఒకవేళ నీవు యుద్ధము చేయనని నిశ్చయించుకున్నా కూడా, ఇక్కడ మిగులగలవారు ఎవ్వరూ ఉండరు. ఇది కాల నిర్ణయం! నియామకం! అందరిని మ్రింగివేయటానికి మునుముందుగానే సంసిద్ధుడనై ఉన్నాను!

11–33

తస్మాత్త్వముత్తిష్ఠ యశో లభస్వ
జిత్వా శత్రూన్ భుఙ్క్ష్వ రాజ్యం సమృద్ధమ్ ।
మయైవైతే నిహతాః పూర్వమేవ
నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్ ॥

తస్మాత్ త్వమ్ ఉత్తిష్ఠ యశో లభస్వ
జిత్వా శత్రూన్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధమ్ ।
మయా ఏవ ఏతే నిహతాః పూర్వమ్ ఏవ
నిమిత్తమాత్రం భవ, సవ్యసాచిన్! ॥

కాలస్వరూపుడనై నేను వీరందరినీ ఇప్పటికే ఎప్పుడో మ్రింగివేసియున్నాను.

ఓ సవ్యసాచీ! వీరిని సంహరించటానికి నీవు నిమిత్తమాత్రుడివి మాత్రమే! వీరి సంహారమునకు అసలు కారణం - ఉపాదాన కారణం…. ఉపసంహారమునందు ప్రవృత్తుడనైయున్న కాల స్వరూపుడనగు నేనే!

అందుచేత, ‘‘అయ్యో! నేను వీరిని సంహరిస్తున్నానే!’’.. అనే వ్యథ-భ్రమలను వదలు.

ఉతిష్ఠ! శత్రువులను సంహరించి కీర్తిని, రాజ్యమును గడించు. నీ కర్తవ్యం నీవు నిర్వర్తించు.

11–34

ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ
కర్ణం తథాన్యానపి యోధవీరాన్ ।
మయా హతాంస్త్వం జహి మా వ్యథిష్ఠా
యుధ్యస్వ జేతాసి రణే సపత్నాన్ ॥

ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ
కర్ణం తథా అన్యాన్ అపి యోధవీరాన్ ।
మయా హతాన్ త్వం జహి మా వ్యథిష్ఠా
యుధ్యస్వ జేతాసి రణే సపత్నాన్ ॥

ఇక్కడ యుద్ధభూమిలో నిలుచున్న ఆచార్య ద్రోణుడు, భీష్ముడు, జయద్రథుడు (సైంధవుడు), కర్ణుడు మొదలైన వారందరూ నాచే ఇప్పటికే సంహరించబడియున్నారు. ఇక, ఇందులో నీవు వ్యథ చెందవలసినదేమున్నది?

సర్వవ్యథలు త్యజించి నిశ్చింతగా నీ ధర్మమును నీవు నిర్వర్తించు.

యుద్ధమునందు విజయం చేబూని విజయుడవై ప్రకాశించు.


Sanjaya-describing-Arjuna-experience

మూల శ్లోకము


అధ్యయన వ్యాఖ్యానము


ఉపన్యాసము

సంజయ ఉవాచ :-

11–35

ఏతచ్ఛ్రుత్వా వచనం కేశవస్య
కృతాఞ్జలిర్వేపమానః కిరీటీ ।
నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం
సగద్గదం భీతభీతః ప్రణమ్య ॥

ఏతత్ శ్రుత్వా వచనం కేశవస్య
కృతాంజలిః వేపమానః కిరీటీ ।
నమః కృత్వా భూయ ఏవ ఆహ కృష్ణం
సగద్గదం భీతభీతః ప్రణమ్య ॥

సంజయుడు :-

ఓ ధృతరాష్ట్ర మహారాజా! ఆ అర్జునుడు శ్రీకృష్ణుడు పలికిన కర్తవ్య పరాయణ సమన్వితమైన వాక్యాలు శ్రద్ధగా విన్నాడు. రెండు చేతులు జోడించి స్వామికి మరల మరల నమస్కారములు సమర్పించాడు. భయముతో కూడుకొనిన గద్గదస్వరంతో ఈ విధంగా గానం చేయసాగాడు!


Arjuna describing Viswaroopa Darsanam

మూల శ్లోకము


అధ్యయన వ్యాఖ్యానము


ఉపన్యాసము

అర్జున ఉవాచ :-

11–36

స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా
జగత్ ప్రహృష్యత్యనురజ్యతే చ ।
రక్షాంసి భీతాని దిశో ద్రవన్తి
సర్వే నమస్యన్తి చ సిద్ధసంఘాః ॥

స్థానే, హృషీకేశ! తవ ప్రకీర్త్యా
జగత్ ప్రహృష్యతి అనురజ్యతే చ ।
రక్షాంసి భీతాని దిశో ద్రవన్తి
సర్వే నమస్యన్తి చ సిద్ధసంఘాః ॥

అర్జునుడు :

హే మహాత్మా! ఈ జగత్తుయొక్క అణువణువు మీ మహత్తర చైతన్య తత్వమును సంకీర్తనం చేస్తున్నది. మీ మహిమను గానం చేస్తూ జగత్తులు సంతోషమును పొందుచున్నాయి.

సాత్విక స్వభావులగు జీవులు మీ మహిమను సందర్శిస్తూ ఆనందిస్తూ ఉంటే, ఇక దుష్ట - రాక్షస ప్రవృత్తిని సంతరించుకొనియున్న జీవులు, మిమ్ములను చూచి భయమునకు లోను అయినవారై నలుదిక్కులకు పరుగులు పెట్టుచున్నారు.

సిద్ధ సంఘములంతా నిలబడి మీకు నమస్కరిస్తూ సోత్రాలు సమర్పిస్తున్నారు.

11–37

కస్మాచ్చ తే న నమేరన్మహాత్మన్
గరీయసే బ్రహ్మణోఽప్యాదికర్త్రే ।
అనన్త దేవేశ జగన్నివాస
త్వమక్షరం సదసత్తత్పరం యత్ ॥

కస్మాత్ చ తే న నమేరన్, మహాత్మన్!
గరీయసే బ్రహ్మణో అపి ఆదికర్త్రే ।
అనంత! దేవేశ! జగన్నివాస!
త్వమ్ అక్షరం సత్ అసత్ తత్పరం యత్ ॥

స్వామీ! వారు మిమ్ములను స్తుతించటంలో ఆశ్చర్యం ఏమున్నది?

ఓ అనంతా! దేవదేవా! జగత్తంతా ఆక్రమించుకొన్న జగదాధారా!

మీరు సత్తు - అసత్తులకు అతీతమైన అక్షర స్వరూపులు. సృష్టికి సారభూతులు. సృష్టికర్తయగు బ్రహ్మను సృష్టించినవారు.

అట్టి మీకు అందరు నమస్కరించటం సహజమే కదా!

11–38

త్వమాదిదేవః పురుషః పురాణః
త్వమస్య విశ్వస్య పరం నిధానమ్ ।
వేత్తాసి వేద్యం చ పరం చ ధామ
త్వయా తతం విశ్వమనన్తరూప ॥

త్వమ్ ఆదిదేవః, పురుషః, పురాణః,
త్వమ్ అస్య విశ్వస్య పరం నిధానమ్ ।
వేత్తా అసి, వేద్యం చ, పరం చ ధామ
త్వయా తతం విశ్వమ్, అనంతరూప! ॥

హే భగవాన్‌!

మీరు దేవతలకు, మహర్షులకు మునుముందే ఉన్నట్టి ఆదిదేవులు! దేవాదిదేవులు!

ఈ సమస్తజగత్తు మీ యొక్క ఆధారంచేతనే ఉనికిని పొందినదై ఉంటోంది. జగత్తుకు ముందే ఉన్న పురాణ పురుషులు.

అసలు ఈ విశ్వరూపంగా విస్తరించియున్నది మీరే! అనంతరూపులై విశ్వముగా సాక్షాత్కరిస్తున్నది మీరే! ఈ కనబడేవారంతా మీరే! ఈ దృశ్యము యొక్క బాహ్యము-అంతరము కూడా మీరే!

11–39

వాయుర్యమోఽగ్నిర్వరుణశ్శశాఙ్కః
ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ ।
నమో నమస్తేఽస్తు సహస్రకృత్వః
పునశ్చ భూయోఽపి నమో నమస్తే ॥

వాయుః యమో అగ్నిః వరుణః శశాంకః
ప్రజాపతిః త్వం ప్రపితామహః చ ।
నమో నమస్తే అస్తు సహస్రకృత్వః
పునః చ భూయో అపి నమో నమస్తే ॥

ఈ జగత్తుకు ఆధారభూతంగా కనిపించే వాయువు, యముడు, అగ్ని, వరుణుడు, చంద్రుడు, ప్రజాపతి మొదలైనవారంతా మీ స్వరూప విన్యాసమే!

ప్రజాపతిగా, బ్రహ్మదేవునిగా వేంచేసి ఉంటున్నది మీరే! సృష్టి - స్థితి - లయములు మీ లీల! మీ క్రీడ! మీ ఆనందవిన్యాసం!

స్వామీ! మీకు నమస్కారం! రెండు నమస్కారాలు! వంద నమస్కారాలు! వేల వేల - కోట్ల కోట్ల నమస్కారాలు! మరల మరల ఇంకా ఇంకా మీకు నమస్కరిస్తున్నాను!

11–40

నమః పురస్తాదథ పృష్ఠతస్తే
నమోఽస్తు తే సర్వత ఏవ సర్వ ।
అనన్తవీర్యామితవిక్రమస్త్వం
సర్వం సమాప్నోషి తతోఽసి సర్వః ॥

నమః పురస్తాత్ అథ పృష్ఠతః తే
నమో అస్తు తే సర్వత ఏవ సర్వ ।
అనంతవీర్య అమితవిక్రమః త్వం
సర్వం సమాప్నోషి, తతో అసి సర్వః ॥

నా ఎదురుగా ఉన్న నీకు నమస్కారము. నాకు వెనక ఉన్న నీకు నమస్కారము. నాకు అన్ని వైపుల, నాకు బయట లోపల ఉన్న నీకు నమస్కారము!

హే మహాత్మా! అనంతగుణ గంభీరులు, ఆదిమధ్యాంత రహితులు, ఈ జగత్తుకు ఆధారము - ఉత్తేజము - జగత్‌ స్వరూపము అయి ఉన్నవారు మీరే!

11–41

సఖేతి మత్వా ప్రసభం యదుక్తం
హే కృష్ణ హే యాదవ హే సఖేతి ।
అజానతా మహిమానం తవేదం
మయా ప్రమాదాత్ప్రణయేన వాపి ॥

సఖా ఇతి మత్వా ప్రసభం యత్ ఉక్తం
హే కృష్ణ! హే యాదవ! హే సఖ! ఇతి ।
అజానతా మహిమానం తవ ఇదం
మయా ప్రమాదాత్ ప్రణయేన వ అపి ॥

జగత్తుకు అతీతులు అగు మిమ్ములను ఇంతవరకూ ‘‘ఈతడు నా సఖుడు - మన కృష్ణుడే కదా - మన బావయే కదా!’’ అని భావించాను. మీయొక్క మహిమను ఎఱుగక, ‘‘హే కృష్ణా! హే యాదవా! హే సఖా!’’ అంటూ ప్రణయంగానో, ప్రమాదంగానో, ప్రమోదంగానో పిలుస్తూ వచ్చాను.

11–42

యచ్చాపహాసార్థమసత్కృతోఽసి
విహారశయ్యాసనభోజనేషు ।
ఏకోఽథవాప్యచ్యుత తత్సమక్షం
తత్ క్షామయే త్వామహమప్రమేయమ్ ॥

యత్ చ అపహాసార్థమ్ అసత్ కృతో అసి
విహార శయ్యా ఆసన భోజనేషు ।
ఏకో అథవా అపి, అచ్యుత! తత్ సమక్షం
తత్ క్షామయే త్వామ్ అహమ్ అప్రమేయమ్ ॥

ఏఏ అపహాస్యాలతో అనగూడని విధంగా అన్నానో, విహారంలోనో - శయ్య - ఆసన - భోజన సమయాలలోనో మనిద్దరం ఒంటరిగా ఉన్నప్పుడో… మరికొంత మంది సమక్షంలోనో ఎగతాళిగా సంభాషించి ఉన్నానో… అందుకు క్షమాపణలు కోరుకుంటున్నాను. నన్ను క్షమించమని ప్రార్ధన చేస్తున్నాను. హే అప్రమేయా! నా తప్పులన్నీ మన్నించెదరుగాక!

11–43

పితాఽసి లోకస్య చరాచరస్య
త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్ ।
న త్వత్సమోఽస్త్యభ్యధికః కుతోఽన్యో
లోకత్రయేఽప్యప్రతిమప్రభావ ॥

పితా అసి లోకస్య చర-అచరస్య
త్వమ్ అస్య పూజ్యః చ గురుః గరీయాన్ ।
న త్వత్ సమో అస్తి, అభి అధికః కుతో అన్యో?
లోకత్రయే అపి, అప్రతిమప్రభావ! ॥

మీరు ఏమిటో, ఎంతటివారో, ఏమై ఉన్నారో ఇప్పుడు చూచాయగా తెలుసు కుంటున్నాను.

ఈ చరాచర సృష్టికంతటికీ మీరే తండ్రి, సంరక్షకులు.

పూజలు సమర్పించబడవలసిన వారందరికంటే పూజనీయులు మీరే!

గురువులకే గురువులై మా స్వరూపాన్ని గుర్తుచేసే సద్గురువులు మీరు!

మహోన్నతమైనవాటిలో వెలుగొందే మహిమాన్వితులు!

ఈ సృష్టిలో మీతో సమానమైనది మరింకేదీ లేదు. మీకు సాటి అయినవారు లేరు. ఇక మీకంటే అధికులు లేరని చెప్పేదేమున్నది?

ముల్లోకములలోని అప్రతిహత ప్రభావులు మీరే! మిమ్ములను అడ్డగించకలిగేది, ఎదిరించగలిగినది ఎక్కడా ఏదీ లేదు!

11–44

తస్మాత్ప్రణమ్య ప్రణిధాయ కాయం
ప్రసాదయే త్వామహమీశమీడ్యమ్ ।
పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః
ప్రియః ప్రియాయార్హసి దేవ సోఢుమ్ ॥

తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం
ప్రసాదయే త్వామ్ అహమ్ ఈశమ్ ఈడ్యమ్ ।
పితేవ పుత్రస్య, సఖేవ సఖ్యుః,
ప్రియః ప్రియాయా అర్హసి, దేవ! సోఢుమ్ ॥

కాబట్టి ఈ దేహ - కర - చరణములతో మీకు సాష్టాంగ దండ ప్రణామములు చేసి నన్ను నేను పవిత్రునిగా చేసుకొంటున్నాను.

హే విశ్వేశ్వరా! హే సర్వేశ్వరా! నా ఈ నమస్కారములు స్వీకరించి నాపై ప్రసన్నులు కండి!

ఓ దేవదేవా! తండ్రి తన కుమారుని తప్పులు మన్నించినట్లు, స్నేహితుడు తన మిత్రుని లోపములు భరించినట్లు, ప్రియుడు తన ప్రియురాలియొక్క అపరాధములు సహించిట్లు మీరు నా తప్పులను మన్నించండి!

మీరు ఉదార స్వభావులు! దాసోఽహమ్‌! దాసదాసోఽహమ్‌! క్షమోఽహమ్‌!

11–45

అదృష్టపూర్వం హృషితోఽస్మి దృష్ట్వా
భయేన చ ప్రవ్యథితం మనో మే ।
తదేవ మే దర్శయ దేవ రూపం
ప్రసీద దేవేశ జగన్నివాస ॥

అదృష్టపూర్వం హృషితో అస్మి దృష్ట్వా
భయేన చ ప్రవ్యథితం మనో మే ।
తత్ ఏవ మే దర్శయ దేవరూపం
ప్రసీద దేవేశ! జగన్నివాస! ॥

మీ విశ్వ - విశ్వాంతర్గత - విశ్వాతీత - నిర్వికల్ప - నిరాకార - సర్వస్వరూపమును నేను ఇతః పూర్వం చూచి ఉండలేదు. అందుచేత మీ ఈ విశ్వరూపము యొక్క సందర్శనంచేత హర్షముచే పులకిత శరీరుడను అగుచున్నాను.

అంతే కాకుండా, నా మనస్సంతా అంతులేని భయంతో నిండి మహావ్యాకులత పొందుతోంది.

అందుచేత చతుర్భుజములతో సుదర్శనధారులై చిరునవ్వుతో కనిపించే మీ ప్రకృతి సిద్ధమగు భౌతిక రూప సందర్శనం - మేము రోజూ చూస్తున్న రూపం తిరిగి ప్రసాదించండి. ఓ దేవదేవా! నాపై ప్రసన్నత చూపండి.

11–46

కిరీటినం గదినం చక్రహస్తమ్
ఇచ్ఛామి త్వాం ద్రష్టుమహం తథైవ ।
తేనైవ రూపేణ చతుర్భుజేన
సహస్రబాహో భవ విశ్వమూర్తే ॥

కిరీటినం గదినం చక్రహస్తమ్
ఇచ్ఛామి త్వాం ద్రష్టుమ్ అహం తథా ఏవ ।
తేన ఏవ రూపేణ చతుఃభుజేన
సహస్రబాహో! భవ, విశ్వమూర్తే! ॥

హే మహాత్మా! మహోగ్రమై ఈ విశ్వ - విశ్వాంతరాళములను ఆక్రమిస్తున్న, అవధరిస్తూన్న మీ విశ్వరూప సందర్శం నేను భరింపజాలకున్నాను.

హే శ్రీకృష్ణా! కిరీటము ధరించి, చేతులకు గద - చక్రముల అలంకరించిన చతుర్భుజములతో ప్రశాంతమైన చిరునగువుతో నాకు అగుపించండి.

ఓ విశ్వమూర్తీ! సహస్రబాహూ! మీయొక్క సౌమ్యము - శాంతములతో కూడిన “ప్రకృతికి - అంతర్గతంగా కనిపించే రూపం” నాకిప్పుడు తిరిగి అనుగ్రహించండి!


Lord Krishna being pleasant while showing Viswaroopam

మూల శ్లోకము


అధ్యయన వ్యాఖ్యానము


ఉపన్యాసము

శ్రీ భగవాన్ ఉవాచ :-

11–47

మయా ప్రసన్నేన తవార్జునేదం
రూపం పరం దర్శితమాత్మయోగాత్ ।
తేజోమయం విశ్వమనన్తమాద్యం
యన్మే త్వదన్యేన న దృష్టపూర్వమ్ ॥

మయా ప్రసన్నేన తవ, అర్జున! ఇదం
రూపం పరం దర్శితమ్ ఆత్మయోగాత్ ।
తేజోమయం విశ్వమ్ అనంతమ్ ఆద్యం
యత్ మే త్వత్ అన్యేన న దృష్ట పూర్వమ్ ॥

శ్రీకృష్ణ భగవానుడు :-

ఓ అర్జునా! నా యొక్క పర స్వరూపమమైన విశ్వరూపం నా ఆత్మయోగం చేత, నీపై కలిగిన ప్రసన్నతకు చిహ్నంగా సందర్శింపజేస్తున్నాను.

తేజోమయం ఆద్యంతరహితం అయినట్టి ఈ నా విశ్వరూపమును ఇతఃపూర్వం ఎవ్వరూ దర్శించయుండ లేదు.

11–48

న వేదయజ్ఞాధ్యయనైర్న దానైః
న చ క్రియాభిర్న తపోభిరుగ్రైః ।
ఏవంరూపః శక్య అహం నృలోకే
ద్రష్టుం త్వదన్యేన కురుప్రవీర ॥

న వేద-యజ్ఞ-అధ్యయనైః, న దానైః,
న చ క్రియాభిః, న తపోభిః ఉగ్రైః ।
ఏవం రూపః శక్య అహం నృలోకే
ద్రష్టుం త్వత్ అన్యేన, కురుప్రవీర! ॥

ఓ కురుప్రవీరా! ఇట్టి స్వకీయాత్మయొక్క విశ్వరూప సందర్శనం వేదపారాయణం చేతగాని, యజ్ఞయాగాది క్రతువులచేతగాని, దానధర్మాది క్రియలచేతగాని, ఉగ్రమైన తపస్సుచేతగాని ఈ మానవ లోకంలో నీవుగాక వేరెవ్వరూ దర్శించలేరు.

11–49

మా తే వ్యథా మా చ విమూఢభావో
దృష్ట్వా రూపం ఘోరమీదృఙ్మమేదమ్ ।
వ్యపేతభీః ప్రీతమనాః పునస్త్వం
తదేవ మే రూపమిదం ప్రపశ్య ॥

మా తే వ్యథా, మా చ విమూఢ భావో,
దృష్ట్వా రూపం ఘోరమ్ ఈదృక్ మమ ఇదమ్ ।
వ్యపేతభీః ప్రీతమనాః పునః త్వం
తత్ ఏవ మే రూపమ్ ఇదం ప్రపశ్య ॥

ఓ అర్జునా!

అన్ని వ్యధలు త్యజించు. విమూఢ భావాలన్నీ వదిలివేయి! ఈ ఘోరమగు విశ్వరూప సందర్శనం చేత నీకు ఏర్పడిన భయాలన్నీ తొలగుగాక!

నీవు కోరినట్లు చక్ర-గదాధారియగు ప్రకృతిసిద్ధమైన చతుర్భుజరూపం తిరిగి సందర్శించెదవు గాక!


krishna-showing-serene-chaturbhuja-roopam

మూల శ్లోకము


అధ్యయన వ్యాఖ్యానము


ఉపన్యాసము

సంజయ ఉవాచ :-

11–50

ఇత్యర్జునం వాసుదేవస్తథోక్త్వా
స్వకం రూపం దర్శయామాస భూయః ।
ఆశ్వాసయామాస చ భీతమేనం
భూత్వా పునః సౌమ్యవపుర్మహాత్మా ॥

ఇతి అర్జునం వాసుదేవః తథా ఉక్త్వా
స్వకం రూపం దర్శయామాస భూయః ।
ఆశ్వాసయామాస చ భీతమ్ ఏనం
భూత్వా పునః సౌమ్యవపుః మహాత్మా ॥

సంజయుడు :-

ఓ ధృతారాష్ట్ర మహారాజా! విశ్వరూపమును ప్రదర్శిస్తున్న ఆ వాసుదేవుడు అర్జునునితో ఆ విధంగా పలికారు. ప్రకృతి సిద్ధమగు చతుర్భుజరూపం ప్రదర్శించారు. సౌమ్యమూర్తి అయి అర్జునుని స్పృశించి, భుజంతట్టి, లాలించి సర్వ భయములు తొలగించారు.

అర్జున ఉవాచ :-

11–51

దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ।
ఇదానీమస్మి సంవృత్తః సచేతాః ప్రకృతిం గతః ॥

దృష్ట్వా ఇదం మానుషం రూపం తవ సౌమ్యం, జనార్దన! ।
ఇదానీమ్ అస్మి సంవృత్తః సచేతాః ప్రకృతిం గతః ॥

అర్జునుడు :

హే భగవాన్‌! శ్రీకృష్ణా! ప్రశాంతతతో కూడిన ప్రకృతి నిర్మితమగు మీ యొక్క సౌమ్య మానవ రూపం చూచి నేను స్థిరచిత్తుడనయ్యాను. ఇప్పుడు నేను తిరిగి నా స్వాభావిక స్థితిని పొందాను. శాంతమనస్కుడనయ్యాను.


Lord Krishna instructing Arjuna

మూల శ్లోకము


అధ్యయన వ్యాఖ్యానము


ఉపన్యాసము

శ్రీ భగవాన్ ఉవాచ :-

11–52

సుదుర్దర్శమిదం రూపం దృష్టవానసి యన్మమ ।
దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః ॥

సుదుర్దర్శమ్ ఇదం రూపం దృష్టవాన్ అసి యత్ మమ ।
దేవా అపి అస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః ॥

శ్రీకృష్ణ భగవానుడు :-

ఓ అర్జునా! నాయొక్క ఏ విశ్వరూపము సందర్శించావో, అది బహుదుర్లభం సుమా! దేవతలు కూడా ఈ రూపమును నిత్యసందర్శన ఆకాంక్షను కలిగినవారై ఉంటారు. అదియే విశ్వరూప సందర్శన యోగం!

11–53

నాహం వేదైర్న తపసా న దానేన న చేజ్యయా ।
శక్య ఏవంవిధో ద్రష్టుం దృష్టవానసి మాం యథా ॥

న అహం వేదైః, న తపసా, న దానేన, న చ ఇజ్యయా ।
శక్య ఏవంవిధో ద్రష్టుం దృష్టవాన్ అసి మాం యథా ॥

విశ్వరూప సందర్శనం - మార్గం

పరమాత్మను విశ్వరూపంగా, విశ్వాధారరూపంగా, విశ్వాతీత తేజోమయ రూపంగా, సకల జగత్‌ ఉత్తేజోత్సాహ రూపంగా, సర్వాంతర్యామిగా, సర్వాధారంగా, సర్వాప్రమేయంగా దర్శించటం ఎట్లా? ఎట్లాగో చెపుతాను విను.

నాయొక్క ఇట్టి విశ్వరూపం వేదాధ్యయనంచేతగాని, తపోదానాది తదితర ప్రయత్నములచేతగాని లభించేది కాదు. ఈ విశ్వరూపం ఏకానేక ప్రయత్నములచే లభ్యమయ్యేదికాదు.

అయితే అందుకు సులభమైన ఒక ఉపాయం ఉన్నది.

11–54

భక్త్యా త్వనన్యయా శక్యమహమేవంవిధోఽర్జున ।
జ్ఞాతుం దృష్టుం చ తత్త్వేన ప్రవేష్టుం చ పరంతప ॥

భక్త్యా తు అనన్యయా శక్యమ్ అహమ్ ఏవంవిధో, అర్జున! ।
జ్ఞాతుం దృష్టుం చ తత్త్వేన ప్రవేష్టుం చ, పరంతప! ॥

‘‘ఇదంతా పరమాత్మ స్వరూపమే - పరమాత్మమయమే కదా!’’ అను అనన్యభక్తి యొక్క ఆధిక్యతచే - విశ్వరూపమును సందర్శించటం తప్పక సుసాధ్యమే. పరమాత్మనగు నాపట్ల పెంపొందిన అనన్య భక్తియే అందుకు సుమార్గం కూడా!

భక్తియొక్క ప్రవృద్ధిచే ‘‘ఇదంతా పరమాత్మయొక్క విన్యాస చమత్కారమే’’ అనే జ్ఞానం ప్రవృద్ధమౌతుంది.

అట్టి జ్ఞానం (సర్వం ఖల్విదం బ్రహ్మ - అను అవగాహన) క్రమంగా ‘‘జగత్తంతా పరమాత్మయే’’ … అనే దృష్టిని పటిష్ట పరుస్తుంది. పెంపొందిస్తుంది. విశ్వమంతా భగవత్‌ ప్రేమ స్వరూపంగా అనుభవమౌతుంది.

అప్పుడాతడు ఆ అనన్యభక్తి - ఆత్మజ్ఞానము - ఆత్మసాక్షాత్కరములచే విశ్వరూపమునందు ప్రవేశితుడై, విశ్వమే తన రూపంగాను, తన ఆత్మయే విశ్వాధారమైనది - అప్రమేయమైనదిగాను సందర్శిస్తూ ఆస్వాదించగలడు.

11–55

మత్కర్మకృన్మత్పరమో మద్భక్తస్సంగవర్జితః ।
నిర్వైరస్సర్వభూతేషు యస్స మామేతి పాణ్డవ ॥

మత్ కర్మకృత్, మత్ పరమో, మత్ భక్తః, సంగవర్జితః ।
నిర్వైరః సర్వభూతేషు యః, స మామ్ ఏతి, పాండవ! ॥

అందుకుగాను అతిసులభమగు ఒకానొక విధి - విధానం నీ ముందు, సర్వజనులను ఉద్దేశించి ప్రవచిస్తున్నాను. విను.

విశ్వము పరమాత్మ స్వరూపమే కదా!… అని గ్రహించి ఈ చెప్పబోవుచున్న మార్గం అనుసరించు!…

➡️ మత్‌ కర్మకృత్‌ → సర్వ కర్మలు సర్వాత్మకుడనగు నాకొరకై ఉద్దేశ్యించి నిర్వర్తించు.

➡️ మత్‌ పరమో → సర్వాత్మకుడనగు నన్నే బృహత్‌ లక్ష్యంగా కలిగియుండు. మహదాశయుడవై, మహాశయుడవై నీ స్వధర్మములు నిర్వర్తించు.

➡️ సంగవర్జితః → సర్వ సంగములు మనస్సునుండి మనస్సుద్వారా త్యజించు. (Relinquish all attachments to worldly matters, incidents and persons).

➡️ మద్భక్తః → విశ్వప్రేమద్వారా విశ్వేశ్వర ప్రేమను అలవరచుకో.

➡️ నిర్వైరః → సర్వ తదితర జీవులపట్ల మనస్సులోని వైషమ్యమును తొలగించుకో.

➡️ సర్వభూతేషు యః స మామ్‌ ఏతి → సర్వ సహజీవులలో సర్వదా సమస్వరూపమై వేంచేసియున్న శ్రీకృష్ణ చైతన్య తత్త్వమును ఉపాసించు. ఆస్వాదించు.

అప్పుడు ఈ దేహాత్మభావమును అధిగమించి జన్మ-కర్మ రహితమగు విశ్వాత్మ భావమును సముపార్జించుకోగలవు.


ఇతి శ్రీమత్‌ భగవద్గీతాసు … విశ్వరూప సందర్శన యోగ పుష్పః ।
శ్రీ సాంబ సదాశివ పాదారవిందార్పణమస్తు ॥
🙏