భగవద్గీత

12. భక్తి యోగ అధ్యయన పుష్పం

మూలము : శ్రీ వ్యాస మహర్షిచే విరచించబడిన జయము / మహాభారతము (భీష్మ పర్వము)

అధ్యయన వ్యాఖ్యానము : (అధ్యయన విద్యార్థి) యేలేశ్వరపు హనుమ రామకృష్ణ


Lord Krishna instructing Arjuna

మూల శ్లోకము


అధ్యయన వ్యాఖ్యానము


ఉపన్యాసము

అర్జున ఉవాచ :-

12–01

ఏవం సతతయుక్తా యే భక్తాస్త్వాం పర్యుపాసతే ।
యే చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః ॥

ఏవం సతతయుక్తా యే భక్తాః త్వాం పరి-ఉపాసతే ।
యే చ అపి అక్షరమ్ అవ్యక్తం, తేషాం కే యోగవిత్తమాః? ॥

అర్జునుడు :

హే భగవాన్‌! మీరు అనుగ్రహించిన విశ్వరూపసందర్శనముచే మీయొక్క అవ్యక్త - అక్షర - సర్వాంతర్యామి - సర్వాతీత - కేవలీ స్వస్వరూపం వీక్షించగలిగాను. అట్టి మీ విశ్వాంతర్గత విశ్వాతీత విశ్వరూపమును మహర్షి - సిద్ధ సంఘములు స్వస్తి గానములతో స్తోత్ర - ఉపాసన - ప్రపత్తులు సమర్పించటం విశ్వరూప సందర్శన సమయంలో నేను చూడటం జరిగింది.

అయితే, అనేకులు మీయొక్క ప్రత్యక్షము - వ్యక్తము - లౌకికము - ప్రేమాస్పదము - అవతారమూర్తిత్వము - శంఖ - చక్రధారణ సమన్వితము అగు ప్రకృతిసిద్ధ రూపమును ఉపాసిస్తున్నారు. మీ లీలలు గానం చేస్తున్నారు. పూజ - రూప - భావనలతో భక్తి-ప్రపత్తులు సమర్పిస్తున్నారు. (గోపికలు మీ ఈ సౌమ్యరూపము చూచి తరిస్తున్నారు.)

ఇప్పుడు ఒక విషయం మిమ్ములను అడుగ తలుస్తున్నాను.

ఎవ్వరైతే మీ ఈ నామరూపాత్మక, గుణ సమన్వితమై, ప్రకృతిసిద్ధమై, సౌమ్య భౌతిక రూపమును భక్తి - గాన - ప్రపత్తులతో షోడశోపచార పూజ - అర్చన మొదలైనవి సమర్పిస్తూ, అనునిత్యమైన నిష్ఠతో ఉపాసిస్తున్నారో … వారి భక్తియోగం గొప్పదా? లేక…, మీయొక్క విశ్వమంతా స్వరూపముగా గలది, ఒక నామ-రూపములచే పరిమితముగానిది, నామరూపములన్నిటికీ ఆధారమై ‘ఇది’ అని వాక్కుతో నిర్వచించజాలనిది, అవ్యక్తము….. అగు నిరాకార బ్రహ్మమును ఉపాసించువారి భక్తియోగం ఉన్నతమైనదా?

సాకార - నిరాకార ఉపాసనల విషయమై సాకారోపాసకులు గొప్పవారా? నిరాకారోపాసకులు గొప్పవారా? సాకారోపాసన గొప్పదా? నిరాకారోపాసన గొప్పదా? ఏది సులభము? ఏది అనుసరణీయమని మీ అభిప్రాయం?

శ్రీ భగవాన్ ఉవాచ :-

12–02

మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే ।
శ్రద్ధయా పరయోపేతాస్తే మే యుక్తతమా మతాః ॥

మయి ఆవేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే ।
శ్రద్ధయా పరయా ఉపేతాః, తే మే యుక్తతమా మతాః ॥

శ్రీకృష్ణ భగవానుడు :-

ఓ అర్జునా! ఎవ్వరైతే ఈ ప్రకృతి సిద్ధము - సాకారము అగు భౌతికరూపమును ఏకాగ్రచిత్తముతో - మనసంతా నిలిపి ఉత్తమమైన శ్రద్ధతో అనన్యంగా ఉపాసిస్తారో… వారి ఉపాసన సులభము - ఉత్తమము అని నా అభిప్రాయం.
12–03

యే త్వక్షరమనిర్దేశ్యమవ్యక్తం పర్యుపాసతే ।
సర్వత్రగమచిన్త్యం చ కూటస్థమచలం ధ్రువమ్ ॥

యే తు అక్షరమ్ అనిర్దేశ్యమ్ అవ్యక్తం పరి-ఉపాసతే ।
సర్వత్రగమ్ అచింత్యం చ కూటస్థమ్ అచలం ధ్రువమ్ ॥

అయితే, ఎవ్వరైతే…
🙏 ’’అక్షరము (Changeless),
🙏 అనిర్దేశ్యము (That whuch cannot be defined and referenced by terminology),
🙏 అవ్యక్తము (That which manifests all else while itself is unmanifested),
🙏 సర్వగతము (సర్వ వ్యాపకము - That which is extending itself as all these forms),
🙏 అచింత్యము (ఆలోచనలకు - ఊహలకు మనస్సుకు కూడా అందనిది),
🙏 కూటస్థము (సర్వ సమయములందు మూలాధారము - యథాతథము),
🙏 ఆచలము (It has no movement from one place to another),
🙏 ధ్రువము (Constant)
↳ అగు పరబ్రహ్మ తత్వమును అనునిత్యంగా ఉపాసిస్తున్నారో … వారు కూడా నన్నే పొందుచున్నారు.

12–04

సంనియమ్యేన్ద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః ।
తే ప్రాప్నువన్తి మామేవ సర్వభూతహితే రతాః ॥

సంనియమ్య ఇంద్రియగ్రామం, సర్వత్ర సమబుద్ధయః ।
తే ప్రాప్నువంతి మామ్ ఏవ, సర్వభూతహితే రతాః ॥

అట్టివారు ఈ ఇంద్రియ విషయములను నియమించినవారై, అధిగమించినవారై, సర్వే సర్వత్రా ఆత్మబుద్ధి - అద్వితీయ బ్రహ్మ భావమును పెంపొందించుకొనుచుండగా, వారు కూడా నన్నే చేరుచుండటం జరుగుతోందయ్యా!

ఇక సాకార బ్రహ్మోపాసకులు - నిరాకార బ్రహ్మోపాసకులు పొందుచున్న అంతిమ, పరాకాష్ట స్థానం-స్థితి మాత్రము ఒక్కటే అయి ఉన్నది సుమా!

కానీ, ఒక్క విషయం!

12–05

క్లేశోఽధికతరస్తేషామవ్యక్తాసక్తచేతసామ్ ।
అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే ॥

క్లేశో అధికతరః తేషామ్ అవ్యక్తా ఆసక్తచేతసామ్ ।
అవ్యక్తా హి గతిః దుఃఖం దేహవద్భిః అవాప్యతే ॥

సాకారోపాసన మార్గం

సాకార బ్రహ్మోపాసన (భగవంతుని నామ - గుణ - రూపాత్మకంగా అనునిత్యంగా ఉపాసించటం) నిర్వర్తించే యోగుల మార్గము సులభము అని నా అభిప్రాయం ప్రకటించాను కదా!

ఎందుచేతనంటావా?

‘‘నాకు దేహం - నామ రూపములు - ఆకారము ఉన్నాయి’’… అను సంస్కారము కలవారికి సాకారబ్రహ్మోపాసనయే సులభం. నామ రూపాత్మక జగత్తులో ‘‘నేను - తదితరులు సాకారులము’’ అను స్వభావముగలవారికి నిరాకార, నిర్గుణ పరబ్రహ్మోపాసన అనేక క్లేశములతో కూడినదై ఉంటుంది.

ఉభయ మార్గములు ఒకే ప్రయోజనమును కలుగజేస్తున్న సందర్భంలో సులభమైన మార్గం ఎన్నుకోవటం లోకన్యాయం కదా! కష్టములతో కూడిన మార్గములో ప్రయాణించటం ప్రసిద్ధమైన విషయం కాదు కదా!

దేహధారులకు అవ్యక్త బ్రహ్మోపాసన క్లేశములతో కూడినది, కష్టసాధ్యము కూడా!

సాకారం నిరాకారంలో! నిరాకారం జగదాకారంగా!

దేహమున్నంతవరకు దేహ పరిపోషణ, దేహదార్డ్యము కొరకై కర్మలు అనివార్యం కదా! దృశ్య జగత్తును తిరస్కరిస్తూ ‘‘నిర్గుణ పరబ్రహ్మ ఉపాసన’’ అనే శ్రమతో కూడిన ప్రయత్నము యొక్క అవశ్యకత్వం (inevitability) ఏమున్నది చెప్పు?

ఎవ్వరైతే సర్వ కర్మలు ‘‘నా ఇష్టదైవమును ఉపాసించే ప్రయత్నంలో అంతర్భాగంగా నిర్వర్తిస్తున్నాను’’ అను భావన - సంకల్పములతో నిర్వర్తిస్తారో… అట్టి కర్మలు వారికి ప్రతిబంధకములు కాకపోగా, అవి సాధనలుగా రూపుదిద్దుకుంటున్నాయి.

12–06

యే తు సర్వాణి కర్మాణి మయి సంన్యస్య మత్పరాః ।
అనన్యేనైవ యోగేన మాం ధ్యాయన్త ఉపాసతే ॥

యే తు సర్వాణి కర్మాణి మయి సంన్యస్య, మత్పరాః ।
అనన్యేన ఏవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే ॥

అందుచేత, అర్జునా! ఎవ్వరైతే…
⤿ వారివారి సర్వ కర్మలు నాకు సమర్పిస్తూ,
⤿ నన్ను ఉద్దేశిస్తూ, నన్ను పొందవలెననే ఆశయంతో నిర్వర్తిస్తూ ఉంటారో,
⤿ ‘‘సర్వ కర్మలు - సాధనములు - వాటి ప్రయోజనములు ఇష్టదైవరూపమే’’ అను ధ్యానంతో ఉపాసనా పూర్వకంగా అనువర్తిస్తారో …
🌺 వారి రక్షణ భారం నేను వహిస్తున్నాను.🌺

సాకారోపాసన నిరాకారంలో లయిస్తోంది. నిరాకారం జగదాకారోపాసనగా పరిణమిస్తోంది.

12–07

తేషామహం సముద్ధర్తా మృత్యుసంసారసాగరాత్ ।
భవామి నచిరాత్పార్థ మయ్యావేశితచేతసామ్ ॥

తేషామ్ అహం సముద్ధర్తా మృత్యు సంసార సాగరాత్ ।
భవామి నచిరాత్, పార్థ! మయి ఆవేశిత చేతసామ్ ॥

ఓ ఫల్గుణా!
→ ఈ జీవుడు జన్మ పరంపరలు పొందుచున్నాడు. కనబడే దృశ్యంలో పరిభ్రమిస్తున్నాడు. తదాత్మ్యము చెందుచున్నాడు.
→ ఇంతలోనే మృత్యువు సమీపించగానే, ‘‘అయ్యో! ఏవేవో పోగొట్టుకొంటున్నానేమో? ఈ ధన జన వ్యవహారములు సంగతేమిటిరా?’’ అని అనుకుంటూ ఉండగా అనివార్యమగు దేహ పతనం ఈ జీవుని పట్ల జరుగుతోంది.
→ అనేక ఆశలు - భావాలు - దుఃఖాలు - వేదనలు - నమ్మకములు - భ్రమ - కామ - క్రోధ - లోభములు మూటకట్టుకొని, దేహం త్యజించిన ఈ జీవుడు మరల మరొక దేహం ఆశ్రయించి సంస్కార పరంపరల మూట విప్పుచున్నాడు.
→ ఈ విధంగా జన్మ - మృత్యు - పునర్జన్మ పరంపరా వ్యవహారములు జనించి, గతించిపోతూ ఉండగా సాగర తరంగములలో చిక్కిన కొయ్యముక్కవలె ఈ జీవుడు ఆ జన్మ - కర్మలలో దిక్కుతోచక చిక్కుకుంటున్నాడు.

అయితే, ఎవరైనా సరే…
🌹 సర్వకర్మలు నాకు సమర్పిస్తూ,
🌹 నన్ను ఉద్దేశ్యిస్తూ,
🌹 అనన్య యోగంతో (“అంతా పరమేశ్వర చమత్కారమే! సం-ప్రదర్శనమే!” - అను అవగాహనతో) ఉపాసిస్తూ ఉంటారో,
↳ నేను ఆ ఉపాసకుణ్ణి మృత్యు సంసార సాగరము నుండి త్వరితగతిగా సముద్ధరించటం నా స్వభావమైయున్నది!

12–08

మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ ।
నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః ॥

మయి ఏవ మన ఆధత్స్వ, మయి బుద్ధిం నివేశయ ।
నివసిష్యసి మయి ఏవ, అత ఊర్ధ్వం న సంశయః ॥

అందుచేత అర్జునా! ఉపాసన చేబూనిన జనులను ప్రోత్సాహపరుస్తూ, వారి సముద్ధరణ మార్గమును అభివర్ణిస్తూ ఇక్కడ కొన్ని విశేషాలు భక్తిమార్గ విశేషాలుగా (Qualities of Celestial Love) చెప్పుచున్నాను. నిరుత్సాహము - తాత్సారములను అధిగమించి నేను సూచిస్తున్న మార్గమును అనుసరించి ఈ మృత్యు సంసార దుఃఖములను (Worries from the perpetual series of births and deaths) అధిగమించవలసినదిగా ప్రేమాస్పదుడనై ప్రబోధిస్తున్నాను. విను.

(1) అంతరంగ నివేదన :
పరమాత్మయందే మనో-బుద్ధులు (దృశ్య జగత్తునందు-కాదు)
ఓ అర్జునా! నీ మనసంతా నాపై నిలుపు. సుస్థిరంగా ఉంచు. బుద్ధిని నాపై లగ్నం చేయి. నీయొక్క సర్వధ్యాసలు నా పట్లనే కలిగి ఉండు. అనగా, నీవు చూస్తున్న - నీకు కనబడుచున్న రూపాలన్నీ పరమాత్మగా భావించు. ఇకప్పుడు నీవు నాయందే ఉంటావు. మనస్సు - బుద్ధి నాపై నిలిపావా, నా విశ్వరూపమును నీవు స్వభావ సిద్ధంగా దర్శించగలవు. ఈ సంసారము నిన్ను స్పృశించదు. నా అఖండానందమయ స్వరూపం ఆస్వాదించగలవు. ఇందులో సందేహమునకు తావులేదు సుమా! ఇదంతా పరతత్త్వమే అని ఉపాసన ప్రారంభించు వానికి జగత్తు జగదీశ్వరుడుగా సాక్షాత్కరించగలడు.

12–09

అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరమ్ ।
అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనఞ్జయ ॥

అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరమ్ ।
అభ్యాసయోగేన తతో మామ్ ఇచ్ఛ ఆప్తుం, ధనంజయ! ॥

ఒకవేళ ‘‘మనస్సు - బుద్ధి’’ నాయందు స్థిరంగా నీవు నిలుపలేకపోతున్నావా? అట్లా అయితే, ఒక ఉపాయం చెపుతాను, విను.

(2) అభ్యాసయోగం :
జరిగిందేమో జరిగిపోయింది. జరిగిపోయిన దాని గురించి విచారించకు. ఇప్పుడు భక్తి - జ్ఞాన - యోగాది మార్గములలో బుద్ధి నిశ్చలం కాగల శాస్త్ర ప్రవచిత, ప్రబోధితమైన యజ్ఞ - యాగ - క్రతు - నియమాలకు, ఇత్యాది అభ్యాసములకు ఉపక్రమంచు. ఏఏ లోక సంబంధమైన అభ్యాసాలచే నీ బుద్ధి అపరిపక్వంగాను, మనస్సు చంచలముగాను అగుచున్నాయో గమనించి శాస్త్రప్రవచనానుసారం ఉత్తమ అభ్యాసాలను ఆశ్రయించు. నన్ను పొందాలనే ఇచ్ఛను ప్రవృద్ధం చేసుకో. క్రమంగా నీ మనస్సు నాపై నిలుస్తుంది. బుద్ధి సుస్థిరత్వం సంతరించుకోగలదు.

12–10

అభ్యాసేఽప్యసమర్థోఽసి మత్కర్మపరమో భవ ।
మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి ॥

అభ్యాసే అపి అసమర్థో అసి, మత్ కర్మ పరమో భవ ।
మత్ అర్థం అపి కర్మాణి కుర్వన్ సిద్ధిమ్ అవాప్స్యసి ॥

ఒకవేళ శాస్త్రార్థ ప్రతిపాదితమైన అభ్యాసాలు ఉపక్రమంచటానికి కూడా నీకు కుదరటం లేదా?

(3) భగవదోపాసన :
అప్పుడు భగవత్‌ సంబంధమైన కార్యక్రమములతో నిన్ను నీవు నియమించుకో. నోటితో స్తోత్రాలు, కళ్లతో భగవత్‌ - భాగవత సందర్శనాలు, గురుసేవ మొదలైన కార్యక్రమములు నిర్వర్తించనారంభించు.

12–11

అథైతదప్యశక్తోఽసి కర్తుం మద్యోగమాశ్రితః ।
సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్ ॥

అథ ఏతత్ అపి అశక్తో అసి కర్తుం మత్ యోగమ్ ఆశ్రితః ।
సర్వకర్మఫలత్యాగం తతః కురు యత-ఆత్మవాన్ ॥

భగవత్‌ ఉపాసన సంబంధమైన కార్యక్రమమును నిర్వర్తించటానికి కూడా సమర్థత పొందలేక పోతున్నావా? అయితే మరొక ఉపాయం.

(4) స్వకర్మ పుష్ప సమర్పణ :
నీవు ఏఏ కర్మలు అనివార్యంగా నిర్వర్తించవలసివస్తోందో అవన్నీ నాకు సమర్పించు. ‘‘ఓ సర్వాంతర్యామీ! నేను చేస్తున్న ఈ లోకసంబంధమైన కార్యక్రమములన్నీ - కర్మలన్నీ కూడా కర్మయోగ పుష్పములై మీ పాదాలు చేరును గాక’’ అని భావన చేసి అప్పుడు నీవు చేయవలసియున్న నియమిత - అనివార్య కార్యక్రమములకు ఉపక్రమించు.

12–12

శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాద్ధ్యానం విశిష్యతే ।
ధ్యానాత్కర్మఫలత్యాగస్త్యాగాచ్ఛాన్తిరనన్తరమ్ ॥

శ్రేయో హి జ్ఞానమ్ అభ్యాసాత్, జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే ।
ధ్యానాత్ కర్మఫలత్యాగః, త్యాగాత్ శాంతిః అనంతరమ్ ॥

ఏది ఉత్తమం?

ఓ అర్జునా!

⌘ కేవలం చేతులు, కాళ్లతో చేసే కర్మలకంటే బుద్ధి నియామకమగు వివేకముతో కూడిన జ్ఞానం గొప్పది. ఆత్మ-అనాత్మ, నిత్య-అనిత్య, దృశ్య-ద్రష్ట, దేహి-దేహముల (ఇట్టి) విభాగముల విచారణ కర్మలకంటే శ్రేయోదాయకం .

⌘ అయితే, జ్ఞానం కంటే ‘ధ్యానం’ అధికమైనది. కేవలం శాస్త్ర విచారణ, శాస్త్ర పాండిత్యము సరిపోదు కదా! ధ్యాసయే ధ్యానం. ఇదంతా విశ్వేశ్వర విశ్వరూపం కదా! సర్వము ఆత్మస్వరూపంగా సందర్శించగల ధ్యాస ప్రవృద్ధం కావాలి. అందుచేత, జ్ఞానంకంటే ధ్యాస (ధ్యానం) ఉత్తమం.

‘ధ్యానం’ కన్నా కూడా ‘కర్మఫల త్యాగం’ మరికొంత ఉత్తమం. సర్వకర్మలు భగవత్‌ సేవా భావంగా సమర్పితబుద్ధితో నిర్వర్తించటం మరింత శ్రేయోదాయకం, సులభం కూడా! సర్వము పరమాత్మమయంగా భావన చేసి నిర్వర్తించటం ‘‘కర్మఫలత్యాగం’’ అవుతుంది.

కర్మఫలత్యాగం ద్వారా ఆంతరంగిక శాంతి ఉదయిస్తుంది.


12–13

అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ ।
నిర్మమో నిరహంకారః సమదుఃఖసుఖః క్షమీ v

అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ ।
నిర్మమో నిరహంకారః సమదుఃఖసుఖః క్షమీ ॥


భక్తియోగ లక్షణాలు
(Characteristic Features of the Celestial Love)

ఓ అర్జునా! భక్తియోగంతో నన్ను ఆశ్రయించే వారు నాకు అత్యంత ఇష్టులు అగుచున్నారు సుమా! అందుచేత ఇప్పుడు భక్తియోగ లక్షణాలు వివరిస్తున్నాను. ఈ లక్షణాలు పెంపొందించుకొనేవారంటే నాకు ప్రియము. వారు పరమానంద స్వరూపుడనగు నాకు క్రమక్రమంగా దగ్గిరగుచున్నారు.

1.) అద్వేష్టా సర్వభూతానామ్‌ : ‘‘సర్వము పరమాత్మ స్వరూపము అయి ఉన్నది కదా’’… అను భావనను ప్రవృద్ధపరచుకొని, తద్వారా ద్వేషభావాలు పాఱదోలివేసుకోవాలి. ద్వేషభావాలు ఈ జీవుని పరమాత్మకు దూరం చేస్తున్నాయి. ‘‘సంగతులు - సంఘటనలు - సందర్భములు - సమయోచితములు - సాంగత్యములు - సంయోగములు - వియోగములు - సంక్లేశములు - అంతా పరమాత్మ చమత్కారమే’’… అను ప్రత్యాహార భావనలచే ద్వేషం తొలగుతూ వస్తోంది. తద్వారా పరమాత్మ యొక్క సామీప్యత సుగమమౌతోంది.

2.) మైత్రః : సర్వదేహాలు ప్రకృతిచే ప్రసాదించబడి పరిపోషించబడుచున్నాయి. ఇది గుర్తెరిగి సహజీవులపట్ల స్నేహ-సహకార భావములను పెంపొందించుకో. అప్పుడు సర్వాంతర్యామి యొక్క సామీప్యత సంపాదించుకోగలవు. సర్వము పరమాత్మ స్వరూపంగా-స్వభావంగా-చమత్కారంగా దర్శించటానికి స్నేహభావాలు ఉపకరణాలు అవుతాయి. ద్వేషభావాలు అపకరణాలు అగుచున్నాయి. క్రమంగా స్వభావసిద్ధమైన స్నేహభావ సంస్కారాలు ‘‘సర్వము పరమాత్మయే’’ అను విశ్వరూప సందర్శనం సులభతరం చేస్తున్నాయి.

3.) కరుణ ఏవ: సహజీవులపట్ల అవ్యాజమైన కరుణను (Kindness) హృదయంలోను - దృష్టిలోను - సంభాషణలోను - ప్రవర్తనయందు పరిపుష్టి చేసుకోవటంచేత “ఈ విశ్వము క్రమంగా ప్రియాతిప్రియమైన పరమాత్మ ప్రదర్శనం”గా అవగాహన కాగలదు.

4.) నిర్మమో : ‘‘నాది’’ అని అనుకుంటే - ఆ ‘నా’ అనుకున్నదంతా బంధమౌతుంది. ‘‘సర్వము పరమాత్మ యొక్క దివ్యకళామయము’’.. అని అనుకుంటే బంధం తొలగుతుంది. జగత్తు పరమాత్మ స్వరూపంగా సాక్షాత్కరిస్తుంది. ఈ దేహము, అద్దాని నిర్మాణము, భౌతిక తత్వాలు మొదలైనవన్నీ ఈ జీవుడు తన లౌకిక తెలివితేటలతో తయారుచేసుకున్నవి కాదు కదా! కనుక, అంతా పరమాత్మవే! అని గ్రహిస్తూ - క్రమంగా మమకారం తగ్గుముఖం పట్టుచుండగా ఆనందమయమగు పరమాత్మస్థానం సులభతరమౌతోంది.

5.) సమ ‘దుఃఖ-సుఖమ్‌’ : సుఖదుఃఖాలు మనోబుద్ధుల స్వకీయ నిర్వచనాలు. నాటకం చూస్తూ అందులోని సుఖ-దుఃఖ భావాలు తాను పొంది అనుభవించటం, మననం చేయటం ఎటువంటిదో… జీవితంలోని సుఖ-దుఃఖాలకు సమత్వం కోల్పోవటం, మననం చేయటం అటువంటిది. ‘‘సుఖ దుఃఖాలు అందరికీ ఉంటాయి. అవన్నీ జీవిత పాఠశాలయొక్క పాఠ్యాంశాలు నేర్చుకోవటానికి ఉపకరణాలు మాత్రమే! కనుక, సుస్వాగతం!’’… అను భావనచే సమత్వాన్ని కాపాడుకొన్నవారు జగత్తును పరమాత్మగా సందర్శించటానికి అర్హులగుచున్నారు.

6.) క్షమీ : సహజీవుల తప్పులెన్నటం, దూషించటం మొదలైనవి అనేక మనోభ్రమలకు కారణమై పరమాత్మ సందర్శనమును మరింత దూర దూరం చేయగలదు. ‘‘పరమాత్మా! క్షమించు’’ అని వేడుకొనువాడు తాను క్షమాగుణం కలిగి ఉండాలి కదా?

12–14

సన్తుష్టః సతతం యోగీ యతాత్మా దృఢనిశ్చయః ।
మయ్యర్పితమనోబుద్ధిర్యో మద్భక్తః స మే ప్రియః ॥

సంతుష్టః సతతం, యోగీ, యతాత్మా, దృఢనిశ్చయః ।
మయి అర్పిత మనోబుద్ధిః, యో మత్ భక్తః స మే ప్రియః ॥

7.) యోగీ : సంయోగ - వియోగములకు అతీతత్వము వహించినవాడవై ఉండు. ఈ జగత్తులో అనుకున్నవి జరిగినా - అనుకోనివి జరిగినా - జరుగకపోయినా యోగి సర్వదా ప్రశాంతచిత్తుడై ఉంటాడు.

8.) సతతం సంతుష్టః : అర్జునా! సర్వదా సంతోషము, సంతృప్తిలకు కారణాలను ఆశ్రయించి ఉండు. ‘‘పరమాత్మా! ఇవి ఇవి నాకు ప్రసాదించావు. సంతోషము’’ అను భావనను అభ్యాసపూర్వకంగా అలవరచుకోవాలేగాని, ‘‘ఇది ఇంతేనా? ఇంకా ఏమీ లేదా? అయ్యో?’’… అను అసంతృప్తిని దరిజేరనీయకూడదు.

9.) యతాత్మా : మనస్సును, ఇంద్రియములను నియమించి నిగ్రహం అభ్యసిస్తూ ఉంటాడు. ఇంద్రియ నిగ్రహము లేనివానికి అల్పవిషయాలు కూడా బాధిస్తాయి.

10.) దృఢ నిశ్చయః : శాస్త్ర వాక్య - శాస్త్ర ప్రవచిత సాధనములందు, అనుభవజ్ఞులగు గురువుల ఉద్దేశ్యములందు, స్వాత్మస్వరూపంపై దృఢమైన విశ్వాసము - నిశ్చయము పెంపొందించుకుంటూ ఉంటాడు.

11.) మయ్యర్పిత మనోబుద్ధిః : మనస్సు - బుద్ధి సర్వాధార స్వరూపుడను అగు నాకు సమర్పించినవాడవై ఉంటాడు. ‘‘ఈ మనోబుద్ధులు కూడా పరమాత్మ విన్యాసమే కదా!’’… అను అవగాహన కలిగినవాడవై ఉంటాడు.

12–15

యస్మాన్నోద్విజతే లోకో లోకాన్నోద్విజతే చ యః ।
హర్షామర్షభయోద్వేగైర్ముక్తో యస్స చ మే ప్రియః ॥

యస్మాత్ న ఉద్విజతే లోకో, లోకాత్ న ఉద్విజతే చ యః ।
హర్ష-ఆమర్ష-భయ-ఉద్వేగైః ముక్తో యః స చ మే ప్రియః ॥

12.) న ఉద్విజతే లోకే : ఎవరైతే తదితర జీవులకు క్షోభ - బాధ కలిగించరో,… అట్టివాడు తదితర జీవులను పరమాత్మ స్వరూపంగా ఆస్వాదించటానికి, ఆత్మసాక్షాత్కారమునకు ముందుకు అడుగులు వేయగలుగుతాడు. కనుక ఇతరులను మాటలతో - చేతలతో ఉద్వేగ ఆవేశాలు కలిగించటం, బాధించటం, భయపెట్టటం మొదలైనవి త్యజిస్తూ ఉండాలి.

13.) యః లోకాత్‌ న ఉద్విజతే : ఎవ్వడైతే ఇతరులను చూచి, వారి వ్యవహార - అనువర్తనములను జూచి తాను వ్యథ చెందడో, అట్టివాడు శ్రీకృష్ణ చైతన్య తత్వాన్ని ఆస్వాదించగలడు. తదితర జీవుల వర్తనములు మాయా బద్ధములు అయి ఉండటం చూచి తాను ఆశ్చర్యపడవలసినదేమున్నది? జ్ఞానులను చూచి ఆశ్చర్యపడతాం. కానీ, పాఠశాలలో తక్కువ శ్రద్ధగలవారే అధికంగా ఉండటం లోకరీతియే కదా! అధికులలో అజ్ఞానం ఉండటంలో ఆశ్చర్యమేమున్నది? అందుచేత పరమాత్మకు ప్రియం కావాలనుకొనేవాడు లోకాన్ని చూచి ఉద్వేగపడడు. అట్టివాడు నాకు ప్రియమగుచున్నాడు.

14.) యః హర్ష-అమర్ష-భయ-ఉద్వేగైః ముక్తో : ఎవ్వడైతే భూషణ - దూషణ - భయ - ఉద్వేగములకు (Over appreciation - Hatred - Fear - Emotion) అతీతత్వము సంతరించుకునే ప్రయత్నంలో ఉంటాడో, అట్టివాడు సత్యవస్తు దర్శనమునకు సంసిద్ధతను పెంపొందించుకొనువాడై ఉండగలడు. అట్టివాడు నాకు ఇష్టుడు.

12–16

అనపేక్షః శుచిర్దక్షః ఉదాసీనో గతవ్యథః ।
సర్వారమ్భపరిత్యాగీ యో మద్భక్తస్స మే ప్రియః ॥

అనపేక్షః, శుచిః, దక్షః, ఉదాసీనో, గతవ్యథః ।
సర్వా ఆరంభ పరిత్యాగీ, యో మత్ భక్తః స మే ప్రియః ॥

15.) అనపేక్షః : ఈ ప్రాపంచక వస్తు - సంఘటన - వ్యవహారాదులపై ‘ఆకాంక్ష - ఆపేక్ష’ లేనివాడవై సర్వము చరాచర సృష్టికర్త యొక్క సృష్టి చమత్కారంగా, పరమాత్మకు చెందినదిగా దర్శించేవాడు నాకు ఇష్టుడు అగుచున్నాడు. ఎవడైతే ఎంతెంతగా సర్వ విషయ, విశేషములపట్ల ఆపేక్ష తగ్గించుకుంటూ ఉంటాడో ఆతడు అంతంతగా పరమాత్మానందానికి దగ్గర అవుతూ ఉంటాడు.

16.) ఉదాసీనో : మహనీయ వాక్యం - “చేయవలసినది చేయి. జరుగవలసినది జరుగుతూ ఉంటుంది. ప్రశాంతచిత్తుడవై చూస్తూ ఉండు”. సర్వము జగన్నాటక సూత్రధారినగు నా వినోద రచనయే అయి ఉండగా ఆదుర్దా - ఆవేదనలు ఎందుకు? సర్వత్రా సమబుద్ధితో ఇదంతా పరమాత్మ విన్యాసంగా చూచేవాడు పరమాత్మత్వాన్ని దర్శించగల పవిత్రదృష్టిని సముపార్జించుకుంటున్నాడు. సర్వ ప్రాపంచక విషయములపట్ల అంతరంగంలో మౌనత్వాన్ని పెంపొందించుకుంటున్నవాడే ముని.


17.) గతవ్యధః : దేనికీ ‘వ్యత’ చెందడు. (Get rid of all worries!). వారి గురించి - వీరి గురించి, ఆయా విషయ-విశేషముల గురించి వ్యథచెందుతూ, మనోబుద్ధులను వ్యథతో నింపటం వృధా ప్రయాస, కాలయాపన కదా! అందుచేత మనోబుద్ధులను ‘వ్యథ’ అనే నిమ్నమార్గము నుండి మరల్చుకొంటూ, ఉత్సాహము-సాహసము-బుద్ధి-శక్తి-సంతోషము-ధృతిలను అలవరచుకుంటున్నాడు.

18.) సర్వారంభపరిత్యాగి : సర్వకార్యములను నిర్వర్తిస్తూనే, వాటి ప్రయోజనముల పట్ల అభిలాష-ఫలానుభవావేశము లేకుండా ప్రశాంతచిత్తుడవై మహదాశయంతో, సమర్పితభావంతో కర్మయోగియై కర్మలు చేయు గాక! కర్మలు నిర్వర్తిస్తూ కర్మరహితుడవై-కర్మాతీతుడవై ఉండు గాక! సర్వ సంబంధములు కలిగి ఉంటూనే అప్రమేయత్వం ఆస్వాదిస్తూ ఉండు గాక! అట్టివాడు నాకు ప్రియం కలిగిస్తున్నాడు.

12–17

యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి ।
శుభాశుభపరిత్యాగీ భక్తిమాన్యస్స మే ప్రియః ॥

యో న హృష్యతి, న ద్వేష్టి, న శోచతి, న కాంక్షతి ।
శుభ-అశుభ-పరిత్యాగీ భక్తిమాన్ యః సః మే ప్రియః ॥

19.) యో న హృష్యతి, న ద్వేష్టి, న శోచతి, న కాంక్షతి : ఎవ్వడైతే దేనికీ హర్షించడో, దేనినీ ద్వేషించడో, దేనికీ దుఃఖము - వ్యథ పొందడో, దేనినీ కాంక్షించడో అట్టివాడు నాకు ఇష్టుడగుచున్నాడు.

20.) శుభాశుభ పరిత్యాగీ : ఎవ్వరైతే ఈ ప్రపంచములోని శుభ - అశుభములకు బద్ధుడవక, వాటికి అతీతుడై సమత్వమును అధిరోహించినవాడై ఉంటాడో,…. అట్టి వాడు నాకు ఇష్టుడు.

12–18

సమః శత్రౌ చ మిత్రే చ తథా మానావమానయోః ।
శీతోష్ణసుఖదుఃఖేషు సమస్సంగవివర్జితః ॥

సమః శత్రౌ చ మిత్రే చ, తథా మాన-అవమానయోః ।
శీత-ఉష్ణ-సుఖ-దుఃఖేషు సమః, సంగ వివర్జితః ॥

21.) సమః శత్రౌ చ మిత్రే చ : ‘‘నా పట్ల శత్రుత్వము - మిత్రత్వము వహించిన వారిరువురు నా ఉపాస్యమగు పరమాత్మ స్వరూపులే’’… అను అవగాహన - అభిప్రాయము పెంపొందించుకొన్నవారు నాకు ఇష్టులు.

22.) తథా మానావమానయోః : జీవితములో సందర్భపడే గౌరవము - అవమానము ఒకేతీరుగా స్వీకరిస్తూ సమత్వము అవధరించువారు పరమాత్మకు ప్రియులు అగుచున్నారు. నాటకంలో తన పాత్ర పొందే మాన-అవమానములు ఆ పాత్రధారుడు తనవిగా పొందుచున్నాడా? కనబడేదంతా జగన్నాటకమేగా!

23.) సమః శీతోష్ణ-సుఖదుఃఖేషు : శీత - ఉష్ణములను, సుఖ-దుఃఖములను సమానంగా స్వీకరించువాడు ఆత్మతత్వాస్వాదనకు అర్హతను అధికం చేసుకుంటున్నాడు. శీతాకాలంలో చలివేస్తుంటే ఎండాకాలం వేడిగా ఉంటుంది. కష్టకాలంలో కష్టాలు వస్తూ ఉంటాయి. సుఖ కాలంలో సుఖాలు వస్తూ వుంటాయి - చలికాలం, వేసవికాలం లాగా!

24.) సంగవివర్జితః : దేనితోనూ సంగము (Attachment) కలిగియుండనివాడు పరతత్వమును సులభంగా అభ్యసించగలుగుచున్నాడు. ఆతడు, ‘‘నేను ఈ జగత్తుకు సంబంధించినవాడను కాను. జగత్తు నాకు సంబంధించినది కాదు’’ అని జ్ఞానదృష్టితో గ్రహించియుండి, అంతరంగములో సంగరహితుడై ఈ జగత్తులో సందర్భోచితముగా చరిస్తూ ఉంటాడు. అట్టివాడు నాకు ఇష్టుడగుచున్నాడు.

12–19

తుల్యనిన్దాస్తుతిర్మౌనీ సన్తుష్టో యేనకేనచిత్ ।
అనికేతః స్థిరమతిర్భక్తిమాన్మే ప్రియో నరః ॥

తుల్యనిందాస్తుతిః, మౌనీ, సంతుష్టో యేనకేనచిత్ ।
అనికేతః, స్థిరమతిః, భక్తిమాన్ మే ప్రియో నరః ॥

25.) తుల్య నిందా-స్తుతి : ఈ దృశ్య జగత్తులో సంప్రాప్తిస్తున్న నిందా - స్తుతులను, పొగడ్త - తెగడ్తలను ఈ ప్రపంచానికే వదలివేసి ఉంటున్నవాడు పరమాత్మ సందర్శనముపై ధ్యాస నిలుపుకోగలుగుచున్నాడు.

26.) మౌనీ : ప్రాపంచక సర్వ విషయముల గురించి, సమాచారముల గురించి మౌనం వహించియున్నవాడు లోక-దృశ్య విషయాలకు అతీతుడు కాగలడు. ‘‘ఇవన్నీ ఇట్లా ఉండటం సహజమే’’ అను భావనచే వాటిపట్ల మౌనం వహించినవాడు మౌని. ‘‘సరే! కానీ! ఏది ఎట్లైతే ఏమి విశేషం!’’ అను అవగాహన కలవాడు ‘‘మౌనాభ్యాసి’’ అగుచున్నాడు. అట్టివాడు ‘‘ముని’’ అని పిలువబడుచున్నాడు.

27.) సంతుష్టో : పొందినవాటితో సంతోషమును - సంతృప్తిని ఒక అలవాటుగా చేసుకొనియున్నవాడు.

28.) అనికేతః : నివసించుచున్న గృహముపట్ల, స్థానముపై, ప్రదేశముపై మమతారహితుడై యున్నవాడు. సర్వము పరమాత్మకు చెందినదిగా, పరమాత్మ దివ్యకళామయంగా దర్శించువాడు.

29.) స్థిరమతిః : పరమాత్మపట్ల స్థిరమైన బుద్ధిని పెంపొందించుకున్నవాడు. ఇదంతా పరమాత్మయొక్క లీలా విలాసమే!.. అను అభిప్రాయం సంతరించుకున్నవాడు.

12–20

యే తు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే ।
శ్రద్దధానా మత్పరమా భక్తాస్తేఽతీవ మే ప్రియాః ॥

యే తు ధర్మ్య అమృతమ్ ఇదం యథా ఉక్తం పరి-ఉపాసతే ।
శ్రద్ధధానా, మత్ పరమా, భక్తాః తే అతి ఇవ మే ప్రియాః ॥

ఓ అర్జునా! ఇప్పుడు నేను చెప్పిన లక్షణములతో కూడిన స్వభావమును పర్యుపాసిస్తూ నాపట్ల భక్తి-శ్రద్ధలను పెంపొందించుకుంటున్నవాడు నాకు ప్రియుడు అగుచున్నాడు.

అట్టి భక్తులకు నేను సర్వదా అత్యంత సమీపుడనై ఉంటున్నాను!


ఇతి శ్రీమత్‌ భగవద్గీతాసు … భక్తి యోగ పుష్పః ।
శ్రీ సాంబ సదాశివ పాదారవిందార్పణమస్తు ॥
🙏