భగవద్గీత

13. క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగ అధ్యయన పుష్పం

మూలము : శ్రీ వ్యాస మహర్షిచే విరచించబడిన జయము / మహాభారతము (భీష్మ పర్వము)

అధ్యయన వ్యాఖ్యానము : (అధ్యయన విద్యార్థి) యేలేశ్వరపు హనుమ రామకృష్ణ


Krishna instructing Arjuna

మూల శ్లోకము


అధ్యయన వ్యాఖ్యానము


ఉపన్యాసము

అర్జున ఉవాచ :-

13–01

ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ।
ఏతద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ ॥

ప్రకృతిం పురుషం చ ఏవ, క్షేత్రం క్షేత్రజ్ఞం ఏవ చ ।
ఏతత్ వేదితుం ఇచ్ఛామి, జ్ఞానం జ్ఞేయం చ, కేశవ! ॥

అర్జునుడు :

హే కేశవా! ఇప్పుడు కొన్ని ద్వంద్వ పదజాల రూపమైన అధ్యాత్మశాస్త్ర ప్రవచిత శబ్దార్థాలు మీ వద్ద విని తెలుసుకోవాలనుకుంటున్నాను.

1. ప్రకృతి …… పురుషుడు
2. క్షేత్రము…… క్షేత్రజ్ఞుడు
3. జ్ఞానము….. జ్ఞేయము

ఇవి వివరించమని ప్రార్థిస్తున్నాను.


క్షేత్రము - క్షేత్రజ్ఞుడు


మూల శ్లోకము


అధ్యయన వ్యాఖ్యానము


ఉపన్యాసము

శ్రీ భగవాన్ ఉవాచ :-

13–02

ఇదం శరీరం కౌన్తేయ క్షేత్రమిత్యభిధీయతే ।
ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః ॥

ఇదం శరీరం, కౌంతేయ! క్షేత్రం ఇతి అభిధీయతే ।
ఏతత్ యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తత్ విదః ॥

శ్రీకృష్ణ భగవానుడు :-

కౌంతేయా! చెప్పుచున్నాను. విను.

తెలియబడుచున్నట్టి ఈ శరీరమును ‘క్షేత్రము’ అని పిలుస్తున్నారు.

ఈ శరీరమునందు ఉండిఉన్నదై, ‘‘ఏదైతే’’ తెలుసుకుంటోందో… ఆ తెలుసుకొనే తత్వము ‘క్షేత్రజ్ఞుడు’ (One who is knowing) అని చెప్పబడుతోంది.

తెలియబడుచున్నది (క్షేత్రము) + తెలుసుకునుచున్నట్టివాడు (క్షేత్రజ్ఞుడు)

13–03

క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత ।
క్షేత్రక్షేత్రజ్ఞయోః జ్ఞానం యత్తత్ జ్ఞానం మతం మమ ॥

క్షేత్రజ్ఞం చ అపి మాం విద్ధి సర్వక్షేత్రేషు, భారత! ।
క్షేత్రక్షేత్రజ్ఞయోః జ్ఞానం యత్ తత్ జ్ఞానం మతం మమ ॥

అనగా ….,
ఓ అర్జునా! ఇంతవరకు నీకు ‘‘నన్ను గ్రహించు. నన్ను ఆశ్రయించు. నన్ను శరణువేడు. నన్ను సందర్శించు’’…ఇత్యాదిగా చెప్పుచున్నాను కదా!

✤ ఈ సర్వదేహములు క్షేత్రములు!
✤ ఈ సర్వక్షేత్రములలోని క్షేత్రజ్ఞుడను నేనే!

‘‘ఇది నేను - ఇది నా పొలము’’ అని యజమాని చెప్పుకుంటాడుగాని, ‘‘ఈ పొలమే నేను’’ అని అనడుగదా! అట్లాగే ‘‘క్షేత్రము - క్షేత్రజ్ఞుడు’’ అనబడు రెండిటినీ వేదాంతశాస్త్రవేత్తలు విభజించి నిర్వచించి చెప్పుచున్నారు.

‘జ్ఞానము’ అనగా ఈ క్షేత్రము - క్షేత్రజ్ఞులను వేరు - వేరు చేసి చూపుతూ ప్రబోధించే శాస్త్రప్రవచనం! అదియే వేదాంతసారం!

13–04

తత్ క్షేత్రం యచ్చ యాదృక్చ యద్వికారి యతశ్చ యత్ ।
స చ యో యత్ప్రభావశ్చ తత్సమాసేన మే శ్రృణు ॥

తత్ క్షేత్రం యత్ చ, యాదృక్ చ, యత్ వికారి, యతః చ యత్? ।
స చ యో, యత్ ప్రభావః చ? తత్ సమాసేన మే శ్రృణు ॥

క్షేత్రము

ఇప్పుడు ఈ క్షేత్రము ఎట్టిదో ఎట్లా కనబడుచున్నదో, ఏఏ ఆకార - వికారములు కలిగియున్నదో, ఏమై ఉన్నదో, ఎట్టి ప్రభావము కలిగియున్నదో మునుముందుగా సంక్షిప్తంగా చెప్పుచున్నాను.

13–05

ఋషిభిర్బహుధా గీతం ఛన్దోభిర్వివిధైః పృథక్ ।
బ్రహ్మసూత్రపదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితైః ॥

ఋషిభిః బహుధా గీతం, ఛందోభిః వివిధైః పృథక్ ।
బ్రహ్మసూత్రపదైః చ ఏవ హేతుమద్భిః వినిశ్చితైః ॥

అనేకమంది ఋషులు ఈ క్షేత్రము - క్షేత్రజ్ఞుల గురించి, క్షేత్రము యొక్క నిర్వచన - ప్రభావాదుల గురించి ఎంతగానో గానం చేస్తూ గుర్తు చేస్తున్నారు. వేదములలో అనేక విభాగములందు అనేక రీతులుగా ఇది వివరించబడింది. బ్రహ్మసూత్రములు హేతుబద్ధంగా యుక్తియుక్తంగా ఈ క్షేత్ర - క్షేత్రజ్ఞ విభాగములను విశదీకరిస్తున్నాయి. ఇక విను చెపుతాను.

13–06

మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ।
ఇన్ద్రియాణి దశైకం చ పఞ్చ చేన్ద్రియగోచరాః ॥

మహాభూతాని అహంకారో బుద్ధిః అవ్యక్తమ్ ఏవ చ ।
ఇంద్రియాణి దశ, ఏకం చ, పంచ చ ఇంద్రియగోచరాః ॥

‘‘ఈ శరీరమే క్షేత్రము’’ అని చెప్పియున్నాను కదా! అయితే ‘క్షేత్రము’ అంటే ఈ కనబడే కాళ్లు - చేతులు - ముఖమేనా? కాదు.

ఇప్పుడు చెప్పబోవు అన్నీ కూడా క్షేత్రమే!

1.) మహాభూతాని : భూమి (Solid) - జలము (Liquid) - వాయువు (Vapour) - అగ్ని (Heat) - ఆకాశము (Space). ఈ ఐదు ఆయా పాళ్లకలయికచే ఈ భౌతిక శరీరం రూపుదిద్దుకుంటోంది. ఇది ‘క్షేత్రము’ అనబడుదానిలో మొట్టమొదటగా కళ్లకు కనిపించే విభాగము (The property of ‘Matter’).

2.) అహంకారః : ప్రతి శరీరంలోను “నేను - నాకు సంబంధించినది - నాది” అను శబ్దార్థంగా అనుక్షణం అనుభూతమగుచున్నదగు ‘‘అహంకారము’’ ఈ క్షేత్రములో కనబడే రెండవ విశేషము (The property of ‘Me’).

3.) బుద్ధిః : ప్రతి దేహంలో తెలివి (Intellect) అనబడే విచక్షణా విభాగం ఉన్నది. ఇది విశ్లేషణం - నిర్ణయము నిర్వర్తిస్తూ ఉండే విభాగం. (The property that differentiates things and takes decisions).

4.) అవ్యక్తమ్ : ఏ విభాగమైతే ఈ శరీరమును ఉజ్జీవింపజేస్తూ, అహంకారము - బుద్ధులను ప్రదర్శిస్తూ ,అట్టి ప్రదర్శనకు మునుముందే వేంచేసియున్నదో - అది అవ్యక్తము. (That which manifests while itself is remaining as unmanifested. The “MANIFESTOR” of that being “MANIFESTED”).

అవ్యక్తము = తాను వ్యక్తము కాకుండా తదితరమైనదంతా వ్యక్తీకరించుచున్నట్టిది. ఉదాహరణకు వాత్యల్యము వ్యక్తీకరించుచు, తాను ఆ వాత్సల్యమునకు వేరుగా ఈ జీవుని అంతర్విభాగంగా ఉన్నట్టిది (ఆ వాత్సల్యాన్ని ప్రదర్శించుచున్నట్టిది)

వ్యక్తము = అహంకారము - బుద్ధి, ప్రేమ - భావము మొదలైనవి (ప్రదర్శించబడుచున్నవి).

స్వప్న సమయంలో జాగ్రత్‌ అవ్యక్తము. గాఢ నిద్రా సందర్భంలో జాగ్రత్‌-స్వప్నాలు అవ్యక్తము.

5.) ఇంద్రియాణి దశ : 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు ఈ దేహంలో సమావేశమై ‘క్షేత్రము’ యొక్క అంతర్విభాగమై చెన్నొందుచున్నాయి.

i.) పంచ జ్ఞానేంద్రియములు : చెవులు, కళ్లు, ముక్కు, నాలుక, చర్మము. వాటి జ్ఞానములు : వినికిడి - చూపు - వాసన - రుచి - స్పర్శ.

ii.) పంచ కర్మేంద్రియములు : నోరు, చేతులు, కాళ్లు, గుదము, గుహ్యము.

ఈ పది ఇంద్రియములు (జ్ఞాన + కర్మేంద్రియములు) ఈ దేహము యొక్క జ్ఞాన కర్మ వ్యవహార సరళికి ఉపకరణములై ఉంటున్నాయి.

6.) ఏకం చ పంచ చ ఇంద్రియగోచరాః :
మనస్సు ద్వారా పంచ జ్ఞానేంద్రియ, పంచ కర్మేంద్రియ గోచరములు -
i.) చెవులకు → వినిపించేవి.
ii.) కళ్లకు → కనిపించేవి.
iii.) ముక్కుకు → ఘ్రాణ విషయములు
iv.) నాలుకకు → రుచికరములైనవి.
v.) చర్మమునకు → స్పర్శ విషయములు
vi.) నోటియొక్క → ఉచ్ఛారణ - శబ్దార్థములు
vii.) చేతులయొక్క → చేతలు, కదలికలు
viii.) కాళ్లయొక్క → చలనములు, నడక
ix.) గుదము యొక్క → విసర్జనములు
x.) గుహ్యము యొక్క → విసర్జనములు

ఇవన్నీ, ఇంద్రియగోచరములు + ఇంద్రియార్థములు, కలిసి ‘క్షేత్రము’ యొక్క విభాగమై క్రియాశీలకంగా ప్రవర్తిస్తున్నాయి.

13–07

ఇచ్ఛా ద్వేషః సుఖం దుఃఖం సంఘాతశ్చేతనాధృతిః ।
ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదాహృతమ్ ॥

ఇచ్ఛా ద్వేషః సుఖం దుఃఖం సంఘాతః చేతనా ధృతిః ।
ఏతత్ క్షేత్రం సమాసేన సవికారమ్ ఉదాహృతమ్ ॥

7.) ఇచ్ఛా ద్వేషః : (Interests and Disinterests) : ప్రతి జీవునిలోని ఇష్ట - అయిష్టములు, ప్రియ - అప్రియములు ప్రదర్శించే విభాగంగా క్షేత్రములో ఏర్పడినవై ఉంటున్నాయి.

8.) సుఖమ్‌ - దుఃఖమ్‌ : (Pleasure and Displeasure) : ప్రతి జీవుని క్షేత్ర విభాగంలోను అంతర్విభాగంగా ‘‘ఇది నాకు సుఖం - ఇది నాకు దుఃఖం’’ ఇట్టి నిర్వచనాలు పేరుకొని ఉన్న విభాగం. ‘‘ఇది సుఖం - ఇది దుఃఖం’’ ఇట్టి సంబంధమైన స్వకీయ నిర్వచనాలే ఈ విభాగమును పునఃపునః నిర్మిస్తున్నాయి.

9.) సంఘాతః : (Association of various factors) : వస్తు - విషయాదులతో ఏర్పడే సమావేశముచే ప్రాప్తిస్తున్న అనుభూతులు- అనుభవములు - అభిప్రాయములు - ఆవేశములు … ఈ సంఘాత విభాగపు అంతర్గత విశేష పరంపర.

10.) చేతనా : (Movement) : కదిలించేది - కదలికలు. ఆలోచనలు మొదలైన రూపమైన సర్వ కదలికలు (మనస్సు). కదిలేది-కదిలించేది కూడా క్షేత్రముయొక్క అంతర్విభాగములే.

11.) ధృతిః : జీవునిలోని ధైర్యము (Courage), ఉత్సాహము (Enthusiasm), పట్టుదల (Determination) మొదలైనవి.

ఇవన్నీ కలిపి ‘క్షేత్రము’ అని చెప్పబడుచున్నాయి.

ఇక్కడ మనం వీటిని సంక్షిప్తంగా చెప్పుకున్నాం. బ్రహ్మసూత్రములు మొదలైన శాస్త్రములు వీటన్నిటినీ అనేక విభాగములుగా విభజించి అనేక శబ్దార్థములతో ప్రబోధిస్తున్నాయి.


క్షేత్రజ్ఞుడు
‘‘అవన్నీ నావి’’ అని జీవుడు భావిస్తున్నాడు కదా! అట్టి భావన చేయువాడు భావనకు మునుముందే ఉండాలి కదా! అట్టి మునుముందు తత్వమే క్షేత్రజ్ఞుడు.

‘‘సర్వ దేహములలోని క్షేత్రజ్ఞుడు నేనే! పరమాత్మయే!’’ … అని గ్రహించు.


జ్ఞానం - జ్ఞేయం


మూల శ్లోకము


అధ్యయన వ్యాఖ్యానము


ఉపన్యాసము

13–08

అమానిత్వమదమ్భిత్వమహింసా క్షాన్తిరార్జవమ్ ।
ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మవినిగ్రహః ॥

అమానిత్వమ్, అదంభిత్వం, అహింసా, క్షాంతిః, ఆర్జవమ్ ।
ఆచార్య ఉపాసనం, శౌచం, స్థైర్యమ్, ఆత్మవినిగ్రహః ॥


జ్ఞానము

లోకంలో ‘‘జ్ఞానము’’ అనగా శాస్త్ర పరిజ్ఞానం అనో, పాండిత్యము అనియో ప్రచారంలో ఉన్నది కదా! అయితే ఆత్మజ్ఞులు దేనిని ‘జ్ఞానము’ అని పిలుస్తున్నారో, దేనిని ‘అజ్ఞానము’ అని అంటున్నారో … అది చెప్పుచున్నాను. విను.

1.) అమానిత్వమ్ : ‘‘నేను వారికంటే వీరికంటే గొప్పవాడిని కదా’’…. (ఆత్మస్తుతి - పరనింద) అని భావించటం అజ్ఞానం. అంతా పరమాత్మ ప్రాసాదితము. ‘‘నాకంటే సర్వవిధాలా అనేక-అనేక విషయాలలో ఎంతో అధికులు ఉన్నారు. వారు నాకు సోదాహరణాలు’’… అని బుద్ధితో గమనించటం జ్ఞానం.

2.) అదంభిత్వం : (నిగర్వత్వం) : (Not being proud of) : నేను వారికంటే గొప్ప కదా అనే గర్వం అజ్ఞానం. అణుకువ కలిగి ఉండటం జ్ఞానం (Humbleness). దంభము అజ్ఞానము.

3.) అహింసా : (Non-violence in deed, thought and speaking): చేతలచేత , ఆలోచనలచేత, మాటచేత ఇతరులను బాధించటం, అవమానించటం అజ్ఞానం.
‘‘ఇతరులను బాధించకూడదు కదా!’’ అనునది జ్ఞానం. బాధించటం అజ్ఞానం!

4.) క్షాంతిః : (ఓర్పు - Forbearance) : కోపం - ఆవేశం - పగ …. ఇవన్నీ అజ్ఞానం. ఇతరుల తప్పులపట్ల ఓర్పు (తితిక్ష) కలిగి ఉండటం జ్ఞానం.

5.) ఆర్జవమ్‌ : అకుటిలత్వము : మనస్సుచేత - వాక్కుచేత - కాయముచేత ఏకత్వం వహించటం. చెప్పేది - చేసేది - అనుకొనేది ఒక్కటే అయి ఉండటం.
లౌకిక ఉదాహరణకు - ‘‘కూతురు - కోడలు, నావారు - తదితరులు’’ - ఇటువంటి ద్వంద్వముల పట్ల ఒకే ప్రమాణం వహించి ఉండటం జ్ఞానం.
ఇష్ట-అయిష్టములను అనుసరించి వేరువేరైన ప్రమాణాలు కలిగి ఉండటం అజ్ఞానం.

6.) ఆచార్యోపాసనమ్‌ : గురువులపట్ల ఉపాసనా భావం పెంపొందించుకొని ఉండటం జ్ఞానం. గురువుపట్ల అపహాస్యము - దుర్భావాలు - దుర్భాషలు - ధిక్కారము - ఇటువంటివి అజ్ఞానం.

7.) శౌచమ్‌ : (Purity in view) : సహజనుల పట్ల అనుమానించటం - అవమానించటం - దూషించటం ….. ఇటువంటి అభ్యాసం అజ్ఞానం. సహజనుల పట్ల శుచి అయిన భావాలు కలిగి ఉండటం జ్ఞానం.

8.) స్థైర్యం : “పిరికితనము - భయము - అపనమ్మకము - ఆవేదన” …ఇవన్నీ అజ్ఞానము యొక్క సంకేతాలు. ‘‘తల్లిగర్భంలో ఉన్నప్పుడు రక్షించినవాడే సర్వదా సర్వత్రా సంరక్షకుడై ఉంటాడు’’ అను రూపంలో ధైర్యము కలిగి ఉండటం, ధైర్యంగా తాను అనుకున్నది చెప్పగలిగిన స్వభావం జ్ఞానమునకు సంకేతం, ఇతరులకు సందర్భానుసారంగా ధైర్యభావాలు-వాక్యాలు అందించటంం…. ఇటువంటివి జ్ఞానం.

9.) ఆత్మనిగ్రహం : ఇంద్రియ-ఇంద్రియార్థములపట్ల ఆవేశము పొందటం అజ్ఞానం. మనస్సు - ఇంద్రియములందు ఆవేశం తొలగించుకొంటూ నిగ్రహం పెంపొందించుకోవటం జ్ఞానం. (విగ్రహం ఎందుకు? అనే ప్రశ్నకు నిగ్రహం కోసమే విగ్రహం అని పెద్దలంటారు).

13–09

ఇన్ద్రియార్థేషు వైరాగ్యమనహంకార ఏవ చ ।
జన్మమృత్యుజరావ్యాధిదుఃఖదోషానుదర్శనమ్ ॥

ఇంద్రియార్థేషు వైరాగ్యమ్, అనహంకార ఏవ చ ।
జన్మ-మృత్యు-జరా-వ్యాధి దుఃఖదోషా అనుదర్శనమ్ ॥

10.) ఇంద్రియార్థేషు వైరాగ్యం : ఆవేశము - ఆకర్షణలకు లోనుకావటం అజ్ఞానం. శబ్ద స్పర్శ రూప రస గంధములవైపు రాగరహితులై ఉండటం (Unattached emotionally) జ్ఞానం. రాగ సహితంగా ఉండటమే అజ్ఞానం.

11.) అనహంకారం : ‘‘కోపము - పరదూషణ - క్రోధము - మాటలలో పరుషత్వం’’ మొదలైనవి అహంకార లక్షణాలు. అది అజ్ఞానము. అవి లేకుండా నిరహంకారులై ఉండటం జ్ఞానము. నాది అన్నదంతా, పరమాత్మా! నీదేనయ్యా! అని అనుకోవటమే అహంకారం. నాది అన్నచోట అహంకారం ఉన్నట్లే కదా! అహంకారము అజ్ఞానము. అనహంకారము జ్ఞానము.

12.) జన్మమృత్యు జరావ్యాధి దుఃఖదోషా అనుదర్శనం : ’’ఏదీ శాశ్వతం కాదు. జన్మ - మృత్యువులు సృష్టిస్తున్నాయి-మటుమాయం చేస్తున్నాయి అని గుర్తు ఉంచుకోబడు గాక! ఈ శరీరబలం చూచుకొని మురిసిపోకూడదు. ఇది జరా వ్యాధి దోషములు కలిగియున్నది కదా! ఏది ఎట్లా నిర్వర్తిస్తే ఇతరులకు, తనకు బాధగా ఉండదో అట్లా చేయాలి. “అనుచితమా? ఉచితమా? ధర్మమా? అధర్మమా?” అని అన్ని సమయాలలో ఇటువంటి విచక్షణ కలిగి ఉండటం జ్ఞానం. అట్టి విచక్షణ చేయకపోవటం అజ్ఞానం.

13–10

అసక్తిరనభిష్వఙ్గః పుత్రదారగృహాదిషు ।
నిత్యం చ సమచిత్తత్వమిష్టానిష్టోపపత్తిషు

అసక్తిః అనభిష్వంగః పుత్ర-దార-గృహాదిషు ।
నిత్యం చ సమచిత్తత్వమ్ ఇష్ట-అనిష్ట ఉపపత్తిషు ॥

13.) అసక్తిః : (Non-Attachement) : ‘‘ఇవన్నీ నావి కావు. నేను వీటిచే పరిమితుడను కాదు. అంతా ఈశ్వర ప్రసాదం. ఈశ్వర మహిమ’’ ఈశ్వరునివే! అని భావించటం జ్ఞానం.
‘‘ఇవన్నీ నావే! నాకే చెందాలి. నావే కావాలి. నాకే ఉండాలి. ఇట్లాగే ఉండాలి. వారికి ఉండకూడదు. ఇది నా సొంతం.’’….. ఇటువంటి భావాలు అజ్ఞానం.

14.) పుత్ర - దార - గృహాదిషు అనభిష్వంగః : ‘‘ఈ పుత్రులు - భార్య - గృహములు మొదలైనవి నాయొక్క ఉనికిని చాటుచున్నాయి. ఇవి నాసొంతం. నేనే అధికారిని’’ ….ఇటువంటి భావాలు అజ్ఞానం. ‘‘ఇదంతా పరమేశ్వరునికి చెందినవి. పరమేశ్వర రూపం’’… అనునది జ్ఞానం.

15.) ఇష్ట - అనిష్ట ఉపపత్తిషు నిత్యం చ సమచిత్తత్వం : ఆవేశ - కావేశములకు లోనై చిత్తమును అస్థిరం చేసుకోవటం అజ్ఞానం. ఇష్టమైన - అయిష్టమైన ఆయా విషయములు తారసపడుచున్నపుడు పొంగి - క్రుంగిపోకుండా చిత్తమునందు సమత్వము - సమభావన కలిగిఉండటం జ్ఞానం.

13–11

మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణీ ।
వివిక్తదేశసేవిత్వమరతిర్జనసంసది ॥

మయి చ అనన్యయోగేన భక్తిః అవ్యభిచారిణీ ।
వివిక్తదేశసేవిత్వమ్, అరతిః జనసంసది ॥

16.) అనన్యయోగేన భక్తిః అవ్యభిచారిణీ : సర్వము పరమాత్మయొక్క ప్రదర్శనంగా చమత్కారంగా గమనించటం - అనన్యయోగం. అదియే జ్ఞానం! భక్తి యొక్క ప్రవృద్ధతచే చెదరని ప్రేమ - ప్రపత్తులు కలిగి ఉండటం జ్ఞానం.

17.) వివిక్తదేశ సేవిత్వం : ‘‘నేను ప్రత్యేకత గలవాడను, భక్తుడను - జ్ఞానిని అని సహజీవులు గుర్తించాలి. అది ఎట్లాగో ఆ మార్గం ఆశ్రయిస్తాను’’.. అనునది అజ్ఞానం. ఉపాసన అనునది వ్యక్తిగతమైన అంతరంగసాధన కదా!. ‘‘నేను పరమేశ్వరుని ఉపాసకుణ్ణి - ఈ చరాచర సృష్టిస్వరూపుడగు పరమాత్మ నా ఉపాస్య వస్తువు’’ అను ఏకాంతసేవ - వివిక్త దేశసేవను ఆశ్రయించటం జ్ఞానం.

18.) అరతిః జనసంసది : అనేకమంది యొక్క సమావేశము, వేరువేరు వాదోపవాదములు, వీరు ఇట్టివారు - వారు అట్టివారు అనే ఆరోపణలు, ఒక వాదనను అనేకమందిచేత ‘ఔను’ అనిపించాలనే ఆవేశం … ఇటువంటివి అజ్ఞానం. జనుల గురించిన చర్చలు-వాదోపవాదములకు దూరంగా ఉండటం జ్ఞానం.

13–12

అధ్యాత్మజ్ఞాననిత్యత్వం తత్త్వజ్ఞానార్థదర్శనమ్ ।
ఏతత్ జ్ఞానమితి ప్రోక్తమజ్ఞానం యదతోఽన్యథా ॥

అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం, తత్త్వజ్ఞానార్థ దర్శనమ్ ।
ఏతత్ జ్ఞానం ఇతి ప్రోక్తమ్, అజ్ఞానం యత్ అతో అన్యథా ॥

19.) అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం : అన్ని పరిస్థితులలోను అధ్యాత్మజ్ఞాన ప్రవచిత పాఠ్యాంశాలను దృష్టినుండి తొలగకుండా చూచుకోవటం జ్ఞానం. ఆయా పరిస్థితుల ప్రభావమునకు లోను అగుచు శాస్త్ర పాఠ్యాంశ సార విశేషాలను మరవటం, పరిస్థితులు బాగుగా లేవని సాధన, ధర్మనిరతి మొదలగునవి వదలటం అజ్ఞానం.

20.) తత్త్వజ్ఞానార్థ దర్శనం : ‘‘మోక్షము - జీవన్ముక్తి - జన్మరాహిత్యము - నిరహంకారము - సమాధి - భక్తి - జ్ఞానము - వైరాగ్యము - యోగము’’ … మొదలైన శాస్త్రవాక్యాల అంతరార్థము, సదుద్దేశ్యములను పరిశీలించటం, గమనించటం, అర్థం చేసుకోవటానికి ప్రయత్నించటం జ్ఞానం.

ఈ విధంగా జ్ఞానము - అజ్ఞానము తత్త్వ శాస్త్రకారులచే ఉద్దేశ్యించబడుచున్నాయి.

‘జ్ఞానము’ అనునది పరమాత్మను తెలుసుకొని జీవత్వము నుండి శివత్వమువైపుగా ప్రయాణించే మార్గము. తత్త్వజ్ఞాన సమాచారములను ఏమరచి, బద్ధకంచే రోజులు గడుపుతూ ఉండటం అజ్ఞానం.

13–13

జ్ఞేయం యత్తత్ప్రవక్ష్యామి యత్ జ్ఞాత్వామృతమశ్నుతే ।
అనాదిమత్పరం బ్రహ్మ న సత్తన్నాసదుచ్యతే ॥

జ్ఞేయం యత్ తత్ ప్రవక్ష్యామి, యత్ జ్ఞాత్వా అమృతమ్ అశ్నుతే ।
అనాదిమత్, పరం బ్రహ్మ, న సత్, న అసత్ ఉచ్యతే ॥

జ్ఞేయము (జ్ఞానముచే తెలియబడేది)

ఇక తెలియబడే పరమాత్మతత్వం జ్ఞేయము.

‘జ్ఞేయము’ గురించి శాస్త్రసారమేమిటో చెప్పుచున్నాను. విను.

‘జ్ఞేయము’ అనబడే ఈ జీవుని యొక్క పరతత్త్వ స్వరూపము గురించి తెలుసుకుంటూ ఉంటే మృతమునుండి అమృతత్వమునకు పరిణతి పొందగలవు.

అట్టి ‘‘స్వస్వరూప-పరమాత్మతత్త్వము’‘నకు ఆద్యంతాలు లేవు. పరబ్రహ్మము అదే! అది సత్‌ - అసత్‌లచే నిర్వచించబడేది కాదు.
ఉన్నదంతా అదే! అది ఇదిగా అవటంలేదు.

న సత్‌ తత్‌, న అసత్‌ ఉచ్యతే!
’‘ఆత్మ అనేది లేదు’’ అని కొందరికి అనిపిస్తూ ఉంటే, ‘‘ఆత్మయే ఉన్నది. తదితరమైనది లేదు’’ అని మరికొందరికి సుస్పష్టమౌతోంది! ఏమి చమత్కారం! ఆత్మ సత్‌-అసత్‌లను అధిగమించినదై ఉన్నది అని చెప్పబడుతోంది!

13–14

సర్వతః పాణిపాదం తత్సర్వతోఽక్షిశిరోముఖమ్ ।
సర్వతః శ్రుతిమల్లోకే సర్వమావృత్య తిష్ఠతి ॥

సర్వతః పాణి-పాదం తత్ సర్వతో అక్షి-శిరో-ముఖమ్ ।
సర్వతః శ్రుతిమత్ లోకే సర్వమ్ ఆవృత్య తిష్ఠతి ॥

ఈ సర్వ చేతలు - చేతులు - మార్గములు - పాదములు పరమాత్మవే! ఈ దృష్టులు - దర్శనము - చూపులు - కళ్లు - ఈ సర్వ శిరస్సులు - ముఖములు - అంతా ఆ పరమాత్మయొక్క చమత్కార విన్యాసములే! అంతటా చెవులు కలిగి అన్నీ వింటున్నది ఆ పరమాత్మ చైతన్యమే! సమస్తములోను - సమస్తముగాను ఆవరించి - వ్యాపించి - తిష్టించుకొని ఉన్నది పరమాత్మయే!

13–15

సర్వేన్ద్రియగుణాభాసం సర్వేన్ద్రియవివర్జితమ్ ।
అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృ చ ॥

సర్వ ఇంద్రియ గుణా భాసం, సర్వ ఇంద్రియ వివర్జితమ్ ।
అసక్తం సర్వభృత్ చ ఏవ, నిర్గుణం, గుణభోక్తృ చ ॥

నవలలో కనిపించే పాత్రలు - స్వభావాలు - సంఘటనలు రచయితయొక్క కవితా విశేషాలేగా! కానీ, వాటిలో ఏదీ రచయితకు ఆపాదించలేం కదా!

ఆ పరమాత్మ యొక్క మహిమయే సర్వ దేహములలోని సర్వ ఇంద్రియ తత్త్వములుగా ఆభాసిస్తోంది. ప్రతిబింబిస్తోంది. సర్వ ఇంద్రియములకు సంబంధించనిదై ఉంటోంది.

ఉంగరంగా ఉన్నది బంగారమే అయినప్పటికీ…, ‘‘బంగారం గుండ్రముగా ఉండును’’… అని అనం కదా! అట్లాగే ఇంద్రియాలుగా ప్రతిబింబిస్తున్నది పరమాత్మయే! అది ఇంద్రియ - ఇంద్రియార్థములుగా కూడా కనిపిస్తూనే…., ఆ పరమాత్మతత్వమే అన్నిటికీ భోక్త! (Experiencer). కానీ, దేని చేతకూ అది పరిమితం కాదు. దేనికీ సక్తత (Attachment / Confinement) కలిగిలేదు.

13–16

బహిరన్తశ్చ భూతానామచరం చరమేవ చ ।
సూక్ష్మత్వాత్తదవిజ్ఞేయం దూరస్థం చాన్తికే చ తత్ ॥

బహిః అంతః చ భూతానామ్, అచరం చరమ్ ఏవ చ ।
సూక్ష్మత్వాత్ తత్, అవిజ్ఞేయం, దూరస్థం చ, అంతికే చ తత్ ॥

సర్వ గుణ - లక్షణ - విలక్షణములు ఆ పరమాత్మ తత్త్వానివే! ప్రతి జీవుని యొక్క బాహ్య - అభ్యంతరములలో వ్యాపించి ఉన్నది పరమాత్మ తత్త్వమే! అంతటా అన్నిటా వ్యాపకమై ఉండి కూడా అది నిశ్చలం. చలనరహితం.

ఆత్మ అత్యంత సూక్ష్మతత్త్వమై ఉండటంచేత ఈ జీవులు తమయొక్క ఆత్మ తత్త్వాన్ని గమనించటం లేదు. అద్దానిని బాహ్య వస్తువుగా చూస్తే అంతకన్నా దూరమైనది లేదు. అంతఃతత్త్వంగా గమనిస్తే ద్రష్టయొక్క స్వస్వరూపమే అది. ఇక అద్దాని కంటే దగ్గిరైనదేముంటుంది?

13–17

అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితమ్ ।
భూతభర్తృ చ తత్ జ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ ॥

అవిభక్తం చ భూతేషు, విభక్తమ్ ఏవ చ స్థితమ్ ।
భూతభర్తృ చ తత్ జ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ ॥

అట్టి ఆత్మ అవిభక్తమైనది (Indivisible). అయినప్పటికీ ఈ వేరు వేరు జీవులలో వేరు వేరుగా, వేరు వేరు స్వభావములతో ఉన్నదానివలె ప్రదర్శనమగుచున్నది ఆ జ్ఞేయమగు పరమాత్మయే!

సర్వ జీవజాలమునకు మూలాధారము అదే! ఈ సర్వమును ప్రభవింపజేస్తున్నది - హరించుచున్నది అదియే! ఆ ఆత్మతత్వము నుండియే ఈ ఏకానేక ఉపాధులు - జీవజాలాలు - వారి వారి దర్శన ప్రదర్శనాలు ప్రకటితమగుచున్నాయి. ఇవన్నీ ప్రభవిస్తున్నది - లయిస్తున్నది పరమాత్మయందే! ఇదంతా పరమాత్మయే!

జలంలో తరంగాలు ఉద్భవించి - లయిస్తూ ఉండగా జలం సర్వదా యథాతథం కదా! తరంగాలుగా కనిపిస్తూ ఉన్నది జలమే కదా! పరమాత్మనుండి ఈ జగత్తులు - జగదంతర్గత జీవులు - వారి వారి మనో బుద్ధి చిత్త అహంకారాలు ప్రదర్శితమగుచు, లయిస్తూ ఉండగా జ్ఞేయమగు ఆత్మ సర్వదా యథాతథం. ఈ నామరూపాత్మక భిన్నత్వమంతా పరమాత్మత్వమునకు అభిన్నము.

13–18

జ్యోతిషామపి తత్ జ్యోతిస్తమసః పరముచ్యతే ।
జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితమ్ ॥

జ్యోతిషామ్ అపి తత్ జ్యోతిః, తమసః పరమ్ ఉచ్యతే ।
జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం, హృది సర్వస్య విష్ఠితమ్ ॥

జగత్తులలోని ప్రకాశమయ పదార్థములన్నిటినీ ఉద్దీపింపజేస్తున్నది ఆ పరమాత్మయే! అది జ్యోతులకే జ్యోతి. అంధకారమునకు ఆవల సర్వదా వెలుగొందుచున్నది అదే!

అదియే జ్ఞాన రూపంగా తెలుసుకొంటున్నది. తెలుసుకొనేది ఆత్మయే!

జ్ఞేయమగు తెలియబడేదంతా పరమాత్మయే. తెలియబడేది ఆత్మయే!

జ్ఞానమార్గములన్నిటియొక్క గమ్యము అదే! అన్ని మార్గముల గమ్యము ఆత్మయే!

అట్టి పరమాత్మ సర్వజీవుల హృదయాలలో జ్వాజ్వల్యమానంగా సర్వదా వెలుగొందుచున్నదయ్యా! సర్వ జీవులుగా కనిపిస్తున్నది ఆత్మయే!

13–19

ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః ।
మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే ॥

ఇతి క్షేత్రం, తథా జ్ఞానం జ్ఞేయం చ ఉక్తం సమాసతః ।
మత్ భక్త ఏతత్ విజ్ఞాయ, మత్ భావాయ ఉపపద్యతే ॥

ఫలశృతి :

ఓ అర్జునా! ఈ విధంగా క్షేత్రము అనగా ఏమో, జ్ఞాన - జ్ఞేయముల గురించి క్లుప్తంగా చెప్పాను. ఎవ్వరైతే నాపట్ల భక్తిని ప్రవృద్ధ పరచుకొని ఈ క్షేత్ర - క్షేత్రజ్ఞ, జ్ఞాన - జ్ఞేయ విశేషాలు విశ్లేషణపూర్వకంగా శ్రద్ధగా ఆలకించి విశ్లేషించుకొని బుద్ధిని సునిశితం చేసుకొంటారో…, అట్టివారు ’‘నేను ఆస్వాదిస్తున్న సర్వాంతర్యామియగు పరమాత్మస్వరూపము’’ను చేరుకొనగలరు.


ప్రకృతి - పురుషుడు


మూల శ్లోకము


అధ్యయన వ్యాఖ్యానము


ఉపన్యాసము

13–20

ప్రకృతిం పురుషం చైవ విద్ధ్యనాదీ ఉభావపి ।
వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతిసంభవాన్ ॥

ప్రకృతిం పురుషం చ ఏవ విద్ధి అనాదీ ఉభౌ అపి ।
వికారాన్ చ గుణాన్ చ, విద్ధి ప్రకృతిసంభవాన్ ॥

ప్రకృతి - పురుషుడు

ఓ పార్థా! ప్రకృతి - పురుషుడు (క్షేత్రము - క్షేత్రజ్ఞుడు)… ఈ రెండు కూడా అనాదియే (No beginning) అని గ్రహించు. ఇక వికారరూపములగు త్రిగుణములంటావా? ఇవన్నీ ప్రకృతి చేత ప్రకృతియందు సంభవిస్తున్నాయి. పరమాత్మస్వరూపుడగు ‘పురుషుడు’ సర్వజీవులలోను సర్వదా అప్రమేయుడు - నిత్యనిర్మలుడు - యథాతథుడు కూడా!

నేను - క్షేత్రజ్ఞుడు : పురుషుడు
నాది - స్వభావము : ప్రకృతి

13–21

కార్యకారణకర్తృత్వే హేతుః ప్రకృతిరుచ్యతే ।
పురుషః సుఖదుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే ॥

కార్య-కారణ-కర్తృత్వే హేతుః ప్రకృతిః ఉచ్యతే ।
పురుషః సుఖదుఃఖానాం భోక్తృత్వే హేతుః ఉచ్యతే ॥

‘‘కార్యము - కారణము - కర్తృతము (Doing - Cause - Doer)’’ ఈ మూడు ఆత్మయందే ఆత్మయొక్క ప్రకృతి విభాగమునందు ఉత్పత్తి పొందుచున్నాయి.

ఆ విధంగా ప్రకృతి యందు ఉత్పత్తి అగుచున్న గుణములకు భోక్త - పురుషుడే! సుఖ - దుఃఖములకు హేతువు కూడా పురుషుడే! (జీవుడే!)

13–22

పురుషః ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్గుణాన్ ।
కారణం గుణసంగోఽస్య సదసద్యోనిజన్మసు ॥

పురుషః ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ ।
కారణం గుణసంగో అస్య సత్ అసత్ యోని జన్మసు ॥

ఈ పురుషుడు ప్రకృతియందు ప్రవేశించి, ప్రకృతియందలి గుణములను ఆశ్రయించి, తనయొక్క అప్రమేయత్వం ఏమరచి సత్‌ - అసత్‌ యోనులలో జన్మపరంపరలు పొందుచున్నాడు. వాస్తవానికి పురుషుని స్వస్వరూపం (ప్రతి ఒక్క జీవుని స్వస్వరూపం) సర్వదా యథాతథం.

జీవుడే ఆత్మ! ఆత్మయే జీవుని స్వరూపం! సందర్భంగా జీవుడుగా కనిపిస్తున్నప్పటికీ, సహజంగా ఈ జీవాత్మ పరమాత్మయే!

13–23

ఉపద్రష్టానుమన్తా చ భర్తా భోక్తా మహేశ్వరః ।
పరమాత్మేతి చాప్యుక్తో దేహేఽస్మిన్పురుషః పరః ॥

ఉపద్రష్టా, అనుమంతా చ, భర్తా, భోక్తా, మహేశ్వరః ।
పరమాత్మ ఇతి చ అపి ఉక్తో దేహే అస్మిన్ పురుషః పరః ॥

అట్టి ఆత్మస్వరూపమగు పరమపురుషుడు ప్రతి జీవునిలోను, ప్రతి దేహమునందు జీవరూపంగా వేంచేసియుండి ఏ ఏ చమత్కారములు నిర్వర్తిస్తున్నారో… విను.

1.) ఉపద్రష్ట : కేవలం సాక్షిమాత్రంగా గుణములు - ఉపాధుల రాక - పోకలు మౌనంగా చూస్తూ ఉన్నారు. (Silent Self beyond Qualities, Thought and Logic Functions)

2.) అనుమంతా : సర్వగుణ - మనో - బుద్ధి ధర్మములకు అనుమతిస్తూ ఉన్నారు. (Upholding as well as permitting the functions and functional qualities)

3.) భర్తా : సర్వమును భరించుచూ కర్తృత్వము వహిస్తున్నారు. (Drafting the experiences)

4.) భోక్తా : అన్నిటికీ భోక్తగా ఉంటున్నారు. (Giver of meanings and experiences). అనుభవించువాడై ఉన్నాడు.

5.) మహేశ్వరః : సర్వ ప్రకృతి తత్వాలకు స్వామిత్వము - మహేశ్వరత్వము వహిస్తున్నారు. (Textures and commands)

6.) పరమాత్మ : సర్వమునకు అప్రమేయులై అంతర్యామి అయి ఉంటున్నారు. (Al-pervading and Al-present)

ఈ విధంగా పరమాత్మ దేహములకు - ప్రకృతికి ఆవల ప్రకాశిస్తూ సర్వాధారులై సర్వదా వేంచేసి ఉన్నారు. సర్వదేహాలలోను ఆక్రమించుకొని ఇహపర స్వరూపులై, జీవాత్మ-పరమాత్మ స్వరూపులై వెలుగొందుచున్నారు!

13–24

య ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైస్సహ ।
సర్వథా వర్తమానోఽపి న స భూయోఽభిజాయతే ॥

య ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ ।
సర్వథా వర్తమానో అపి, న స భూయో అభిజాయతే ॥

ఓ అర్జునా! అట్టి ‘‘పురుషుడు - ప్రకృతి - గుణములు’’ అను విభాగమును ఎవ్వరైతే అధ్యయనం చేసి, అవగాహన పెంపొందించుకొని ఉంటారో… అట్టివారు, ‘‘ఈ ఉపాధులు, ఆయా ధర్మములు వచ్చిపోతూ ఉన్నప్పటికీ.. నేను జన్మరహితుడను’’ అని గ్రహించినవారై ఉంటారు. వారు తమ యొక్క సర్వగుణాధార - సర్వగుణాతీత - ప్రకృతిసహిత - ప్రకృతి అతీత ఆత్మతత్వమును ఆస్వాదిస్తూ ఉంటున్నారు.

13–25

ధ్యానేనాత్మని పశ్యన్తి కేచిదాత్మానమాత్మనా ।
అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే ॥

ధ్యానేన ఆత్మని పశ్యంతి కేచిత్ ఆత్మానమ్ ఆత్మనా ।
అన్యే సాంఖ్యేన యోగేన, కర్మయోగేన చ అపరే ॥

అట్టి తనయొక్క పరమాత్మ స్వరూపం, “సర్వక్షేత్రాంతర్గత - సర్వ క్షేత్రజ్ఞస్వరూప” తత్వం ఆస్వాదించటానికి ప్రతి జీవుడు అర్హుడే! మనం చెప్పుకున్న జ్ఞానమును ప్రవృద్ధి పరచుకొంటూ ఉండగా క్రమంగా ఈ జీవుడు ఆత్మసాక్షాత్కారానంద స్వస్వరూపుడు కాగలడు. దానికి సాధనామార్గాలు మరికొన్ని ఇక్కడ ఉదహరిస్తున్నాను.

1.) ధ్యానయోగ మార్గం (Path of Meditation) : నిరంతర ధ్యాసచే ధ్యాన యోగమును అభ్యసిస్తూ రాగా, తమయొక్క ఆత్మయందు ఆత్మచే అట్టి సర్వాంతర్యామిత్వము - అఖండ పరబ్రహ్మత్వమును దర్శించి - ప్రవేశించి - ఆస్వాదించవచ్చు. అట్టి ధ్యానయోగంచే అనేకులు ఆత్మ సాక్షాత్కారానందం సముపార్జించుకుంటున్నారు.

2.) సాంఖ్యయోగ మార్గం (Path of Discrimination) : మరికొందరు శాస్త్రములు - గురువులు చెప్పుచున్నది విశ్లేషిస్తూ
[1.] మనస్సు - బుద్ధి - చిత్తము - అహంకారములు క్షేత్రమని,
[2.] వాటికి ఆవల వాటికి కారణకారణంగా వెలుగుచున్నది క్షేత్రజ్ఞుడని,
[3.] సర్వక్షేత్రములలోని క్షేత్రజ్ఞుడు ఏకమేనని (అఖండమని) గ్రహించి
… అట్టి ‘‘క్షేత్రజ్ఞత్వం’’ పుణికిపుచ్చుకుంటున్నారు.

3.) కర్మయోగ మార్గం (Path of Work as Worship) : ఇంకొందరు తమయొక్క సర్వకర్మలు సర్వాత్మకునకు సమర్పించి కర్మయోగులై - కర్మసన్యాసులై - క్రమక్రమంగా కర్మాతీతులై…, ఇకప్పుడు క్షేత్రజ్ఞయోగత్వం సంపాదించుకుంటున్నారు.

13–26

అన్యే త్వేవమజానన్తః శ్రుత్వాన్యేభ్య ఉపాసతే ।
తేఽపి చాతితరన్త్యేవ మృత్యుం శ్రుతిపరాయణాః ॥

అన్యే తు ఏవమ్ అజానంతః శ్రుత్వా అన్యేభ్య ఉపాసతే ।
తే అపి చ అతితరంతి ఏవ మృత్యుం శ్రుతిపరాయణాః ॥

4.) శ్రుతియోగులు (Path of Constant Listening) : ఇంకొందరు ‘‘ఆత్మతత్వం మేము ఎఱుగము కదా! మహనీయులను ఆశ్రయించి వారి వద్ద శ్రద్ధగా వినెదము గాక!’’… అని వారి వివరణ విని, అట్టి సర్వాంతర్యామిత్వము, సర్వక్షేత్రజ్ఞత్వం వింటూ వింటూ హృదయస్థం చేసుకుంటున్నారు. అట్టి ఉపాసనచే వారుకూడా మార్పు చేర్పులతో కూడిన మృత్యుస్థితులను అతిక్రమించి అమృతత్వం, ఆత్మత్వం అనువర్తిస్తున్నవారగుచున్నారు.

13–27

యావత్సంజాయతే కిఞ్చిత్సత్త్వం స్థావరజఙ్గమమ్ ।
క్షేత్రక్షేత్రజ్ఞసంయోగాత్తద్విద్ధి భరతర్షభ ॥

యావత్ సంజాయతే కించిత్ సత్త్వం స్థావరజంగమమ్ ।
క్షేత్ర-క్షేత్రజ్ఞ సంయోగాత్ తత్ విద్ధి, భరతర్షభ! ॥

క్షేత్ర - క్షేత్రజ్ఞ సంయోగము

ఓ పార్థా! భరతర్షభా! ఈ 14 లోకములలోని చరాచర సృష్టిలో కనబడే స్థావర - జంగమాత్మకమైనదంతా ‘‘క్షేత్రము+క్షేత్రజ్ఞుడు’’… ఈ రెండిటియొక్క సంయోగమేనయ్యా!

‘‘సర్వే-సర్వత్రా క్షేత్రజ్ఞుడు నేనే’’ అని గ్రహించు. గమనించు. (స్వప్నంలో కనిపించేవారందరి క్షేత్రజ్ఞుడు (నేను) స్వప్నద్రష్టయే కదా!)

ఇక్కడ స్థావర - జంగమాత్మకంగా రాయినుండి బ్రహ్మదేవుని వరకు కనబడేదంతా కూడా క్షేత్రము - క్షేత్రజ్ఞుల సంయోగమేనయ్యా!

13–28

సమం సర్వేషు భూతేషు తిష్ఠన్తం పరమేశ్వరమ్ ।
వినశ్యత్స్వవినశ్యన్తం యః పశ్యతి స పశ్యతి ॥

సమం సర్వేషు భూతేషు తిష్ఠంతం పరమేశ్వరమ్ ।
వినశ్యత్సు అవినశ్యంతం, యః పశ్యతి స పశ్యతి ॥

క్షేత్రజ్ఞుడగు పరమేశ్వరుడు సర్వజీవులలోను సమస్వరూపుడై సర్వదా వేంచేసియున్నారు. అంతేగాని ఒక జీవునిలో అధికంగాను, మరొకరిలో స్వల్పంగాను కాదు.

ఈ కనబడే దేహాలు జనిస్తున్నాయి. నశిస్తున్నాయి. అయితే, ఈ నశ్వర దేహాలలో పరమాత్మ శాశ్వత పరంజ్యోతి స్వరూపుడై వెలుగొందుచున్నాడు.

ఏ పరమాత్మ సర్వదేహాలలో సర్వదా వినాశన రహితుడై, కాలఃకాలస్వరూపుడై అనునిత్యంగా ప్రకాశిస్తున్నారో,… అట్టి పరమాత్మ సందర్శనమే సరి అయిన సందర్శనము.

13–29

సమం పశ్యన్హి సర్వత్ర సమవస్థితమీశ్వరమ్ ।
న హినస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిమ్ ॥

సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమ్ ఈశ్వరమ్ ।
న హినస్తి ఆత్మనా ఆత్మానం, తతో యాతి పరాం గతిమ్ ॥

ఎద్దానికి మార్పు - చేర్పులు ఉండదో,…. అయ్యది ఆత్మ!

మార్పు చెందుచున్నదానిలో దాగియున్న మార్పు చెందని ఆత్మను సందర్శించువాడే సత్యమును చూస్తున్నవాడు.

ఎవ్వడైతే సర్వేసర్వత్రా సమమై వేంచేసియున్న ఆత్మతత్త్వమును సర్వదా - సర్వత్రా సందర్శిస్తాడో,… అట్టివాడు తాను ‘వినాశనము’ అను స్థితిని అధిగమించినవాడై మహత్తరమైన గతిని ‘‘క్షేత్రజ్ఞశ్చ మాం’’ స్థానం చేరుకున్నవాడగుచున్నాడు.

13–30

ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః ।
యః పశ్యతి తథాత్మానమకర్తారం స పశ్యతి ॥

ప్రకృతి ఏవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః ।
యః పశ్యతి తథా ఆత్మానమ్ అకర్తారం, స పశ్యతి ॥

ఓ అర్జునా! సర్వసహజీవులలో అఖండ అప్రమేయ నిత్యమగు క్షేత్రజ్ఞ సందర్శనం అభ్యసించు.

ఇక ఈ సకల జీవులయొక్క సర్వ ప్రవర్తనలను చూచి భ్రమ ఎందుకు?

ఈ దృశ్యములోని ప్రతి జీవునియొక్క కర్మ వ్యవహారములన్నీ, క్రియా విశేషములన్నీ నిర్వర్తిస్తున్నది కల్పనా చమత్కారమైనట్టి ప్రకృతి మాత్రమే!

ఇదంతా జగన్నాటకం. జీవులందరిలో దేహములు ఉన్నప్పుడు, పతనమైనప్పుడు కూడా సర్వదా వేంచేసియున్న క్షేత్రజ్ఞ స్వరూపమైన ఆత్మ దేనికీ కర్త కాదు, భోక్త కాదు. ఆత్మ సర్వదా అప్రమేయం.

సర్వ సహజీవులలోని అప్రమేయము, విభాగ దోష రహితము, నిత్య నిర్మలము, అకర్తా తత్వము అగు ఆత్మను (లేక) క్షేత్రజ్ఞుని ఎవ్వరు సర్వదా సందర్శిస్తూ ఉంటారో… అట్టివారు వాస్తవమును దర్శిస్తున్నవారు అగుచున్నారు.

13–31

యదా భూతపృథగ్భావమేకస్థమనుపశ్యతి ।
తత ఏవ చ విస్తారం బ్రహ్మ సమ్పద్యతే తదా ॥

యదా భూత పృథక్ భావమ్ ఏకస్థమ్ అనుపశ్యతి ।
తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా ॥

ఎప్పుడైతే…
⤿ ఈ వేరువేరు భావములతో కూడిన జీవులంతా ఒకే ఆత్మస్వరూపులు - క్షేత్రజ్ఞ స్వరూపులు,
⤿ ఒకే ఆత్మనుండి ఈ వేరు వేరు భావ తరంగ స్వరూపాలైన జీవ తరంగాలు - ఒకే జలంలో అనేక తరంగాలు బయల్వెడలుచున్నట్లు-బయల్వెడలుచున్నాయి,
… అని గమనిస్తున్నాడో, ఆస్వాదిస్తున్నాడో - అట్టివాడు బ్రహ్మమును సముపార్జించి బ్రహ్మమే తానై స్వయంజ్యోతి స్వరూపుడై ప్రకాశిస్తున్నాడు.


13–32

అనాదిత్వాన్నిర్గుణత్వాత్పరమాత్మాయమవ్యయః ।
శరీరస్థోఽపి కౌన్తేయ న కరోతి న లిప్యతే ॥

అనాదిత్వాత్ నిర్గుణత్వాత్ పరమాత్మా అయమ్ అవ్యయః ।
శరీరస్థో అపి, కౌంతేయ! న కరోతి న లిప్యతే ॥

సమీక్ష

ఓ అర్జునా! ఈ క్షేత్ర - క్షేత్రజ్ఞ విభాగ యోగ సారాంశాన్ని మరొక్కసారి క్రోడీకరించి చెప్పుచున్నాను. విను.

సర్వదేహాలలో పరమాత్మ సర్వదా ప్రకాశిస్తూ ఉన్నారు.

ఈ దేహములు మార్పు చేర్పులు చెందుచున్నప్పటికీ, ఇందలి పరమాత్మ ఈ దేహ - మనో - బుద్ధి - చిత్త ధర్మములచే స్పృశించబడటం లేదు. అప్రమేయుడై - ఏకస్వరూపుడై వెలుగొందుచున్నాడు.

క్షేత్రజ్ఞ స్వరూపుడగు పరమాత్మ దేహముల ప్రారంభంకంటే మునుముందే ఉన్నవారు. ఆదిమధ్యాంతరహితుడు. గుణములకు అతీతుడు.

అట్టి పరమాత్మ సర్వదేహములలో కేవలసాక్షిగా అమృతరూపుడై, దివ్యుడై సర్వదా ప్రకాశిస్తున్నారు. ఆయన ఈ దేహాలలో ఉన్నప్పటికీ, దేహ - మనో - బుద్ధి - చిత్త - అహంకారాలకు తానే ఆధారమై ఉంటున్నప్పటికీ… ఆయన నిర్గుణుడై - అవ్యయుడై (మార్పు చేర్పులు లేనివాడై) వెలుగొందుచున్నాడు.

13–33

యథా సర్వగతం సౌక్ష్మ్యాదాకాశం నోపలిప్యతే ।
సర్వత్రావస్థితో దేహే తథాత్మా నోపలిప్యతే ॥

యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం న ఉపలిప్యతే ।
సర్వత్ర అవస్థితో దేహే తథా అత్మా న ఉపలిప్యతే ॥

ఆకాశ దృష్టాంతం

ఉదాహరణకు, ఆకాశం (Space) అతి సూక్ష్మరూపంగా సర్వేసర్వత్రా ఆక్రమించుకొని ఉన్నది కదా!

ఒక చోట ఒక గృహం నిర్మించబడటం చేతగాని, అనేక సంవత్సరాలు తరువాత ఆ గృహం నేలకూలటంచేతగాని అక్కడి ఆకాశము (Space)నకు మార్పు - చేర్పులు ఉండవు కదా!

(Space is so subtle that it can not, at all, be affected by the formation of the matter and its destruction).

అట్లాగే ఈ కనబడే అన్ని చరాచర జీవులలో జీవాత్మగా ఉన్నప్పటికీ పరమాత్మను ఎట్టి దేహ - మనో - బుద్ధి - చిత్త - అహంకార దోషములు ఏమాత్రం స్పృశించవు.

13–34

యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః ।
క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత ॥

యథా ప్రకాశయతి ఏకః కృత్స్నం లోకమ్ ఇమం రవిః ।
క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి, భారత! ॥

ఇంకొక దృష్టాంతం చెపుతాను. విను.

సూర్యకాంతి దృష్టాంతం

ఒకే సూర్యుడు ఈ భూమియొక్క అనేక ప్రదేశాలలో ఒకేసారి ప్రకాశిస్తున్నాడు. (ఉత్తర భారతంలో ఒక సూర్యుడు - దక్షిణ భారతంలో మరొక సూర్యుడు - తూర్పున ఒక సూర్యుడు - పడమరలో వేరొక సూర్యుడు ప్రకాశించటంలేదు కదా!).

అట్లాగే ఒకే పరమాత్మ (లేక) క్షేత్రజ్ఞుడు - ఈ కనబడే సర్వ స్థావర జంగమ జీవులలో ఏకరూపుడై ప్రకాశిస్తున్నారు.

13–35

క్షేత్రక్షేత్రజ్ఞయోరేవమన్తరం జ్ఞానచక్షుషా ।
భూతప్రకృతిమోక్షం చ యే విదుర్యాన్తి తే పరమ్ ॥

క్షేత్రక్షేత్రజ్ఞయోః ఏవమ్ అంతరం జ్ఞానచక్షుషా ।
భూతప్రకృతిమోక్షం చ యే విదుః యాంతి తే పరమ్ ॥

ఈ విధంగా ‘‘క్షేత్రము - క్షేత్రజ్ఞుడు - ఈ సర్వదేహాలలో క్షేత్రజ్ఞుడు ప్రకాశించటం’’…. అనే తాత్విక సత్య రహస్యాన్ని ఎవ్వరైతే తమ జ్ఞాన చక్షువులతో గమనిస్తారో….. అట్టివారు ఈ ‘‘భూతప్రకృతి’’ అనే ‘బంధము’ లేక ‘‘పరిమిత దృష్టి’’ నుండి విముక్తులై, ఆ ‘‘ఆత్మ తేజోసూర్య తత్వము’‘ను చేరుకోగలరు. ’‘కిరణములన్నీ సూర్యునివే అయినట్లుగా ……… ఈ సహజీవులంతా - ఈ దృశ్యమంతా మమాత్మ సూర్యునియొక్క కిరణ చమత్కారములే!’’ అని ఆస్వాదించగలరు.


ఇతి శ్రీమత్‌ భగవద్గీతాసు … క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగ పుష్పః ।
శ్రీ సాంబ సదాశివ పాదారవిందార్పణమస్తు ॥
🙏