భగవద్గీత

14. గుణత్రయ విభాగ యోగ అధ్యయన పుష్పం

మూలము : శ్రీ వ్యాస మహర్షిచే విరచించబడిన జయము / మహాభారతము (భీష్మ పర్వము)

అధ్యయన వ్యాఖ్యానము : (అధ్యయన విద్యార్థి) యేలేశ్వరపు హనుమ రామకృష్ణ


Sattva - Rajas - Tamas Gunas represented by Vibheeshana - Ravana - Kumbhakarna

మూల శ్లోకము


అధ్యయన వ్యాఖ్యానము


ఉపన్యాసము

శ్రీ భగవాన్ ఉవాచ :-

14–01

పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమమ్ ।
యత్ జ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః ॥

పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానమ్ ఉత్తమమ్ ।
యత్ జ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిం ఇతో గతాః ॥

శ్రీకృష్ణ భగవానుడు :-

ఓ అర్జునా! ఇప్పటిదాకా క్షేత్ర - క్షేత్రజ్ఞ విభాగం విన్నావు కదా! ఇప్పుడు గుణత్రయ విభాగం వివరిస్తున్నాను.

జ్ఞానములన్నిటిలో ఉత్తమజ్ఞానమని చెప్పబడుచున్న ‘‘త్రిగుణ విభాగం - త్రిగుణాతీతత్వం’’ గురించిన విశేషాలు ఇప్పుడు వినబోతున్నావు.

ఈ త్రిగుణ విభాగ విశేషమును గ్రహించి ఎందరెందరో ఈ దృశ్యముపట్ల మౌనయోగం సముపార్జించుకున్నవారై (మౌనులై) సంసారబంధముల నుండి విముక్తిని సులభంగా సముపార్జించుకోవటం జరుగుతోంది.

14–02

ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః ।
సర్గేఽపి నోపజాయన్తే ప్రలయే న వ్యథన్తి చ ॥

ఇదం జ్ఞానమ్ ఉపాశ్రిత్య మమ సాధర్మ్యమ్ ఆగతాః ।
సర్గే అపి న ఉపజాయంతే, ప్రలయే న వ్యథంతి చ ॥

న వ్యథంతి తే

నేను చెప్పబోవుచున్న ఈ త్రిగుణవిభాగ జ్ఞానమును సంపాదించుకొంటూ, త్రిగుణాతీతత్వమును ఉపాసించుటచే, అట్టి వారు ఈ లోకముల ఉత్పత్తికిగాని, ఇవి కొనసాగుచున్నప్పుడు గాని, లయం అగుచున్న సందర్భంలోగాని వ్యథ - ఆదుర్దాలను ఏమాత్రం పొందనివారై ఉంటున్నారు. వారికి దేహముల రాక-పోకలు చూస్తూ కూడా వ్యథ ఏమాత్రం చెందరు.

అనగా, లోక-లోకాంతర దృశ్యాదృశ్యములకు అతీత స్థానం అవధరిస్తున్నారు. నాతో సమము అగుచున్నారు.

14–03

మమ యోనిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహమ్ ।
సంభవః సర్వభూతానాం తతో భవతి భారత ॥

మమ యోనిః మహత్ బ్రహ్మ, తస్మిన్ గర్భం దధామి అహమ్ ।
సంభవః సర్వభూతానాం తతో భవతి, భారత! ॥

మహత్‌ బ్రహ్మ-యోని-గర్భము

నా యొక్క నిర్మల - నిరాకార - అనంత పరబ్రహ్మమునందు జగత్తుల ఉత్పత్తి స్థానమగు ఒకానొక విభాగం నా మాయచే పరిఢవిల్లుతోంది. అట్టి నా యొక్క ‘యోని’యే ఈ జగత్తులు - ఇందలి జీవరాసుల ఉత్పత్తికి స్థానమైయున్నది.

చిదానంద స్వరూపుడనగు నాయందు నాయొక్క ’‘ప్రదానము’’ (Contribution) అను చమత్కారంచేత జీవ ఉత్పత్తి-వినాశన ధర్మములతో కూడిన జగత్తులన్నీ - జలంలో తరంగాలవలె - ఆవిర్భవిస్తున్నాయి, ఉనికిని కొనసాగిస్తున్నాయి, నాయందే లయిస్తున్నాయి.

14–04

సర్వయోనిషు కౌన్తేయ మూర్తయః సమ్భవన్తి యాః ।
తాసాం బ్రహ్మ మహద్యోనిరహం బీజప్రదః పితా ॥

సర్వయోనిషు, కౌంతేయ! మూర్తయః సంభవంతి యాః ।
తాసాం బ్రహ్మ మహత్ యోనిః, అహం బీజప్రదః పితా ॥

అట్టి నాయొక్క నానావిధ యోనులందు ఉత్పత్తియగుచున్న ఈ వివిధ జీవరాసుల దేహములన్నిటికీ -
తల్లి : (ఉత్పత్తిస్థానం) : నాయొక్క ప్రకృతి అని,
తండ్రి : బీజప్రదాత (కారణం) : పరబ్రహ్మమగు నేనే అని గ్రహించు.

14–05

సత్త్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతిసంభవాః ।
నిబధ్నన్తి మహాబాహో దేహే దేహినమవ్యయమ్ ॥

సత్త్వం రజః తమ ఇతి గుణాః ప్రకృతిసంభవాః ।
నిబధ్నంతి, మహాబాహో! దేహే దేహినమ్ అవ్యయమ్ ॥


గుణస్పర్శ

(నిశ్చల జలంలో ‘చంచలము’ [లేక] ‘స్పందన’ చేత తరంగములు ప్రదర్శితమగుచున్నట్లు…) మూడు విధములైన గుణములు నాయొక్క ప్రకృతి (లేక ‘‘యోని’’) నుండి సంభవిస్తున్నాయి.
1.) సత్వ గుణము
2.) రజో గుణము
3.) తమో గుణము

ఈ జీవుడు వాస్తవానికి సర్వదా అప్రమేయము - గుణాతీతము అగు ఆత్మ స్వరూపుడే! అయితే ఏం? ఈ సత్వ-రజో-తమో గుణములు అవ్యయాత్మ స్వరూపుడగు దేహికి దేహముతో, దృశ్యముతో బంధము - సంబంధము కలుగజేస్తున్నాయి.

14–06

తత్ర సత్త్వం నిర్మలత్వాత్ప్రకాశకమనామయమ్ ।
సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘ ॥

తత్ర సత్త్వం నిర్మలత్వాత్ ప్రకాశకమ్ అనామయమ్ ।
సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చ, అనఘ! ॥

1.) సత్వగుణము : ఈ గుణముచే జీవుడు “అయ్యో! నా బుద్ధి కలుషితమైయున్నది కదా?” అని తలచి, ఇక నిర్మలము - ప్రకాశకము - విస్తారము అగు బుద్ధిని నిర్మించుకునే మార్గాలు అన్వేషిస్తున్నాడు.

అనగా, ఈ సత్త్వగుణం - “సుఖసంగము - జ్ఞాన సంగము…(సుఖం ఎట్లా పొందాలి? జ్ఞాన సమాచారాలు ఎట్లా పొందాలి?)” అను సంబంధముల చమత్కారం ద్వారా ఈ జీవుని దృశ్యపరంపరా వ్యవహారములకు సంబంధితునిగా చేస్తోంది. బంధిస్తోంది.

‘‘నేను ఇప్పుడు బద్ధుణ్ణి, దుఃఖిని కనుక సుఖిని కావాలి, జ్ఞానిని కావాలి’’ ….అని నిర్మలమగు ఆత్మకు బంధం ఆపాదించుకోవటం జరుగుతోంది.

14–07

రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగసముద్భవమ్ ।
తన్నిబధ్నాతి కౌన్తేయ కర్మసంగేన దేహినమ్ ॥

రజో రాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవమ్ ।
తత్ నిబధ్నాతి, కౌంతేయ! కర్మసంగేన దేహినమ్ ॥

2.) రజోగుణము : ఈ రజోగుణము ‘‘రాగము (Attachments)’’ కలుగజేయుచున్నది. ఇది ‘తృష్ణ’ (Desire) అను సంజ్ఞను ప్రదర్శిస్తోంది.

అట్టి ‘తృష్ణ’ అను స్వభావముచేతను, కర్మ (Tendency of Doing) అను సంజ్ఞచేతను ఈ జీవుని దేహముతో కట్టి ఉంచుతోంది.

‘‘ఏదో చేయాలి. ఇంకేదో పొందాలి’’ అను కర్మదాహరూపం ఈ రజోగుణ లక్షణం.

14–08

తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినామ్ ।
ప్రమాదాలస్యనిద్రాభిస్తన్నిబధ్నాతి భారత ॥

తమః తు అజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినామ్ ।
ప్రమాద-ఆలస్య-నిద్రాభిః తత్ నిబధ్నాతి, భారత! ॥

3.) తమోగుణము : దీపకాంతికి తెర అడ్డుపడితే చీకటి వచ్చిపడుతోంది కదా! స్వస్వరూప స్వస్థితిని ఏమరచటంచేత, అజ్ఞాన ఆవరణచేత తమోగుణము ప్రవృద్ధం కావటం జరుగుతోంది. అది ఈ దేహిని ‘‘నేను ఈ దేహముచే - దేహమునకు దేహాంతర్గతంగా పరిమితుడనై ఉన్నాను’’… అనే భ్రమలో - మోహంలో ఉంచి ఉంచుతోంది.

ఈ తమోగుణం - “చేయాలని అనుకుని కూడా చేయలేకపోవటం (బద్ధకం → ప్రమాద ) - అప్రవృత్తి - ఆలస్యము (Slow approach, Procrastination) - మాంద్యము” … ఇటువంటి విశేషములచే దేహిని దేహములకు బంధించి, ఆ బంధం దేహ - దేహాంతర విన్యాసరూపంగా కొనసాగిస్తోంది.

14–09

సత్త్వం సుఖే సఞ్జయతి రజః కర్మణి భారత ।
జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సఞ్జయత్యుత ॥

సత్త్వం సుఖే సంజయతి, రజః కర్మణి, భారత! ।
జ్ఞానమ్ ఆవృత్య తు తమః ప్రమాదే సంజయతి ఉత ॥

ఇప్పుడు ఈ సత్వ-రజ-తమో గుణముల గురించి మరికొన్ని విశేషాలు విశదీకరిస్తున్నాను. శ్రద్ధగా విను.

సత్వగుణం :- ఈ సత్వగుణము జీవునిలో ఉత్సాహం - సదవగాహన పరిపోషిస్తుంది. ‘‘నేను, ఇతరులు ప్రశాంతంగా, సంతోషంగా, సుఖంగా ఉండాలి’’… అనే సాత్వికాశయమును ప్రవృద్ధం చేస్తోంది.

రజోగుణం :- రజోగుణము ఈ దృశ్య విషయ - విశేషములపట్ల రాగము (Attachment) కొంచం కొంచంగాను, క్రమక్రమంగాను అధికం చేస్తోంది. ఆ రాగము ‘‘కర్మ అభిలాష’‘ను (అది చేయాలి - ఇది పొందాలి అనే తపనను) పెంచుకొంటూ పోతోంది.

తమోగుణం :- అజ్ఞానము (ఆత్మజ్ఞానమును ఏమఱచటము) చేత ఈ తమోగుణం రూపుదిద్దుకొంటోంది. ఈ గుణము జ్ఞానమును మరింతగా ఆవరించి ఉన్నదై ఈ జీవునిలో ’‘అశ్రద్ధ - పరిశీలించకపోవటం - నిరుత్సాహము - అర్థం చేసుకోలేకపోవటం - అపార్థం చేసుకోవటం - ఆలస్యం’’ మొదలైనవి అధికం చేస్తోంది.

14–10

రజస్తమశ్చాభిభూయ సత్త్వం భవతి భారత ।
రజః సత్త్వం తమశ్చైవ తమః సత్త్వం రజస్తథా ॥

రజః తమః చ అభిభూయ “సత్త్వం” భవతి, భారత! ।
“రజః” సత్త్వం తమః చ ఏవ, “తమః” సత్త్వం రజః తథా ॥

సత్వగుణం :- సత్వగుణము ప్రవృద్ధమగుచూ ఉంటే, ఈ జీవునిలో ఇక తదితర రజో-తమో గుణములు సన్నగిలుతూ ఉంటాయి.

రజోగుణం :- రజోగుణం అధికమౌతూ ఉంటే, ఇకప్పుడు ఈ జీవునిలో సత్వ-తమో గుణాలు తగ్గుతూ, సన్నగిలుతూ వస్తాయి.

తమోగుణం :- తమోగుణం వృద్ధి చెందుతూ ఉంటే, అప్పుడిక సత్వగుణం - రజోగుణం ఈ జీవునిలో వెనుకంజవేస్తూ ఉంటాయి.

14–11

సర్వద్వారేషు దేహేఽస్మిన్ప్రకాశ ఉపజాయతే ।
జ్ఞానం యదా తదా విద్యాద్వివృద్ధం సత్త్వమిత్యుత ॥

సర్వద్వారేషు దేహే అస్మిన్ ప్రకాశ ఉపజాయతే ।
జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్త్వమ్ ఇతి ఉత ॥

సత్వగుణం :- ఎప్పుడెప్పుడైతే ఇంద్రియములన్నిటిలో చైతన్యము - వివేకము వృద్ధి పొందుతూ ఈ జీవుడు చైతన్యవంతుడగుచూ (with blossoming instinct and impulse) ఉంటాడో… అట్టి విజ్ఞాన విశేషము యొక్క ఉనికియే సత్వగుణ లక్షణము.

సత్వగుణం యొక్క ప్రవృద్ధత చేతనే సాత్విక స్వభావము - ఉత్సాహము (Instinct - Impulse) ప్రవృద్ధం అగుచూ ఉండగా జీవితపర్యంతం సాత్వికభావాలు (Positive Interpretations - సద్భావాలు) - సాధుభావాలతో కూడిన ప్రవర్తనలు ఈ జీవుడు అనువర్తిస్తున్నాడు.

14–12

లోభః ప్రవృత్తిరారమ్భః కర్మణామశమః స్పృహా ।
రజస్యేతాని జాయన్తే వివృద్ధే భరతర్షభ ॥

లోభః ప్రవృత్తిః, ఆరంభః కర్మణామ్, అశమః, స్పృహా ।
రజసి ఏతాని జాయంతే వివృద్ధే, భరతర్షభ! ॥

రజోగుణం :- రజోగుణము వలన ఏర్పడే కర్మాసక్తి (కర్మ అభిలాష) చేత క్రమంగా కర్మలనుండి విరమించలేకపోవటం, లోభప్రవృత్తి, తృప్తిలేకపోవటం మొదలైనవి రూపుదిద్దుకుంటూ, వృద్ధి చెందుతూ ఉంటాయి.

ఓ అర్జునా! రజోగుణం నుండి ‘‘అసంతృప్తి [Dissatisfaction] - దృశ్యధ్యాస [Avocation] - ఆదుర్దా [Worrying]’’ అనే అలవాట్లు వచ్చిపడుతూ ఉంటాయి.

14–13

అప్రకాశోఽప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ ।
తమస్యేతాని జాయన్తే వివృద్ధే కురునన్దన ॥

అప్రకాశో, అప్రవృత్తిః చ, ప్రమాదో, మోహ ఏవ చ ।
తమసి ఏతాని జాయంతే వివృద్ధే, కురునందన! ॥

తమోగుణం :- అశ్రద్ధ - బద్ధకము - పరిశీలించకపోవటం - పనిలో నిరుత్సాహం - ఆలస్యము - అజాగ్రత్త మొదలైనవి తమోగుణం చేత వృద్ధి చెందుతూ ఉంటాయి.

14–14

యదా సత్త్వే ప్రవృద్ధే తు ప్రలయం యాతి దేహభృత్ ।
తదోత్తమవిదాం లోకానమలాన్ప్రతిపద్యతే ॥

యదా సత్త్వే ప్రవృద్ధే తు ప్రలయం యాతి దేహభృత్ ।
తదా ఉత్తమవిదాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే ॥

సత్వగుణం :- సాత్వికుడు ఈ దేహపతనానంతరం ‘‘దోషములు లేనివి - విజ్ఞతతో కూడినవారు నివసించేవి’’ అయినట్టి ఉత్తమ లోకాలలో నివాసం సముపార్జించుకుంటున్నాడు.

అనగా, సాత్వికమైన భావాలతో తమతమ ధర్మములు నిర్వర్తించేవారు, సాత్విక స్వభావ సమన్వితములగు జ్ఞానులు నివసించే లోకములను సముపార్జించుకుని, వారి సహవాసంతో తమ జ్ఞానం మరింతగా ప్రవృద్ధపరుచుకుంటున్నారు.

14–15

రజసి ప్రలయం గత్వా కర్మసంగిషు జాయతే ।
తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే ॥

రజసి ప్రలయం గత్వా కర్మసంగిషు జాయతే ।
తథా ప్రలీనః తమసి మూఢయోనిషు జాయతే ॥


రజోగుణం :- ఈ జీవుడు ఎంతో కష్టపడి మానవ జన్మకు వచ్చి ఉంటాడు కదా! ఇప్పుడు ఆతడు ముందుకు (ఊర్ధ్వస్థితులకు) పోకుండా ఈ రజోగుణం అడ్డుకుంటూ ఉంటుంది. కర్మాసక్తి కలిగిన (మానవ) యోనులలో పడత్రోస్తోంది.

తమోగుణం :- జీవితకాలమంతా ఈ తమోగుణ విభాగములైనట్టి అశ్రద్ధ - బద్ధకము - పరిశీలించకపోవటం - పనిలో నిరుత్సాహం - ఆలస్యము - అజాగ్రత్త మొదలైనవి అభ్యసించినవాడు… దేహానంతరం మూఢయోనులకు ప్రయాణిస్తున్నవాడగుచున్నాడు. జ్ఞానవృద్ధికి అవకాశములు అతి తక్కువగా ఉండే పక్షి - జంతు జన్మల వైపుగా దారి (Path) అనుసరిస్తున్నవాడై ఉంటున్నాడు.

14–16

కర్మణః సుకృతస్యాహుః సాత్త్వికం నిర్మలం ఫలమ్ ।
రజసస్తు ఫలం దుఃఖమజ్ఞానం తమసః ఫలమ్ ॥

కర్మణః సుకృతస్య ఆహుః సాత్త్వికం నిర్మలం ఫలమ్ ।
రజసః తు ఫలం దుఃఖమ్ అజ్ఞానం తమసః ఫలమ్ ॥

పెద్దలచే ఈ విధంగా చెప్పబడుతున్నది.

సత్వగుణం :- సుకృత కర్మలకు నిర్మలము అయిన జ్ఞానము ఫలము.

రజోగుణం :- రజోగుణ ప్రవృత్తులకు దుఃఖము ఫలము.

తమోగుణం :- తామసులకు అజ్ఞానము ఫలము.

14–17

సత్త్వాత్సఞ్జాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ ।
ప్రమాదమోహౌ తమసో భవతోఽజ్ఞానమేవ చ ॥

సత్త్వాత్ సంజాయతే జ్ఞానం, రజసో లోభ ఏవ చ ।
ప్రమాదమోహౌ తమసో భవతో అజ్ఞానమ్ ఏవ చ ॥

సత్వగుణం :- ఈ విధంగా సత్వగుణము ‘జ్ఞానము’ను ప్రవృద్ధ పరుస్తోంది.

రజోగుణం :- ’‘నాకున్నదంతా నాదే - నాకే ఉండాలి’’… అనే లోభగుణం ఈ జీవుని కట్టి ఉంచుతోంది. అజ్ఞానం చేత బద్ధుడవుతున్నాడు.

తమోగుణం :- ఈ జీవుడు బద్ధకము - అశ్రద్ధ - నెమ్మదితనము - నిద్ర (మౌర్ధ్యము) అభ్యసిస్తున్న కారణంగా అప్రవృతి (Lazyness to take up anything) వచ్చి చేరుతోంది. పరిశీలనాశక్తి, ప్రదర్శనాశక్తి నెమ్మదిస్తూ వస్తాయి. తమస్సు యొక్క ఫలితం అజ్ఞానం మరింత వృద్ధి కావటమే సుమా!

14–18

ఊర్ధ్వం గచ్ఛన్తి సత్త్వస్థా మధ్యే తిష్ఠన్తి రాజసాః ।
జఘన్యగుణవృత్తిస్థా అధో గచ్ఛన్తి తామసాః ॥

ఊర్ధ్వం గచ్ఛంతి సత్త్వస్థా, మధ్యే తిష్ఠంతి రాజసాః ।
జఘన్య గుణ వృత్తిస్థా అధో గచ్ఛంతి తామసాః ॥

సత్వగుణం :- ‘జ్ఞానము’ ప్రవృద్ధమవుచుండగా క్రమక్రమంగా ఆ జీవునికి ‘‘నేను సర్వదా ఆత్మనే’’ అనే సమున్నతమగు స్థితి - గతులకు దారిచూపుతోంది.

రజోగుణం :- రజోగుణ సంపన్నులు మధ్యగతులు పొందుతారు.

తమోగుణం :- తమస్సు వలన జనించిన అజ్ఞానానికి ఫలితంగా అజాగరూకత - మోహము - అజ్ఞానదశలు ఇంకా ఇంకా వృద్ధి పొందటం జరుగుతోంది. ఈ విధంగా తమోగుణం అలసత్వానికి - అంధకార బంధురమైన స్థానాలకు - అజ్ఞానమునకు ఆలవాలమగు స్థితిగతులకు త్రోవతీస్తూ ఈ జీవుని అధోగతిపాలు చేస్తోంది.

అభ్యాసమే కారణం

ఓ అర్జునా! వింటున్నావు కదా!

ఈ విధంగా జీవితమంతా సత్వ - రజ - తమో గుణములలో (ప్రకాశము, ప్రవృత్తి-మోహము, బద్ధకము) ఏదైతే ఎక్కువగా ఈ జీవుడు జీవితమంతా అభ్యసిస్తూ వస్తాడో.. అదియే ఈ జీవుని యొక్క ఉత్తరోత్తర స్థితిగతులకు వెంటనంటి త్రోవ చూపుతోంది.

14–19

నాన్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టానుపశ్యతి ।
గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోఽధిగచ్ఛతి ॥

న అన్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టా అనుపశ్యతి ।
గుణేభ్యః చ పరం వేత్తి మత్ భావం సో అధిగచ్ఛతి ॥

అనగా, ఇక్కడ రెండు విషయాలు నీవు గమనించు.

1.) గుణముల ప్రభావము : ఈ త్రిలోకములలోని సర్వజీవుల ఆయా స్థితి - ప్రవర్తన - అవగాహన - జన్మ - కర్మ విధానములన్నిటికీ త్రిగుణములే కారణం. ఏ జీవుడు ఏఏ జన్మలు పొందుచున్నాడో, ఏఏ మానసిక స్థితులు అనుభవిస్తున్నాడో… అదంతా ఆతని (త్రిగుణ విభాగంలో చెప్పుకున్న) అభ్యాసఫలములే! అభ్యాసములు గుణవృద్ధిని నిర్ణయం చేస్తున్నాయి. కనుక, ఈ జగత్తులోని సర్వ జీవుల జ్ఞాన - ప్రవృత్తి - అజ్ఞానములకు ఆయా జీవులు ఆశ్రయించే గుణములు కర్తృత్వము వహిస్తున్నాయి. ఒకడు జీవితాంతం ఏ గుణములను అభ్యసిస్తాడో, అవియే ఉత్తరోత్తర ఉపాధులను నిర్మించుకుంటూ పోతున్నాయి.

2.) గుణములకు మునుముందే ఉన్న ‘‘గుణి’’ : ఇక ప్రతి జీవునిలోని ‘‘ద్రష్ట’’ గుణములకు వేరై, ఆత్మస్వరూపుడై ఉన్నాడు. ప్రతి జీవునిలో సర్వదా వేంచేసియున్న పరమాత్మ సర్వదా నిర్మలుడు. గుణాతీతుడు.

ఈ రెండు విషయములు ఎవరు గమనిస్తారో అట్టివారు నా స్థానమును చేరి, అస్మత్‌ స్థానమైనటువంటి ’‘అప్రమేయ - అఖండ - నిత్య - సర్వాత్మత్వము’’ను ఆస్వాదించగలరు. గుణాతీతులు కాగలుగుచున్నారు.

14–20

గుణానేతానతీత్య త్రీన్దేహీ దేహసముద్భవాన్ ।
జన్మమృత్యుజరాదుఃఖైర్విముక్తోఽమృతమశ్నుతే ॥

గుణాన్ ఏతాన్ అతీత్య త్రీన్ దేహీ దేహసముద్భవాన్ ।
జన్మమృత్యుజరాదుఃఖైః విముక్తో అమృతమ్ అశ్నుతే ॥

ఏ జీవుడైతే ఈ దేహపరంపరల ఉత్పత్తి - స్థితి - గతులకు కారణమగుచున్న త్రిగుణముల ప్రభావమును గమనించి క్రమంగా త్రిగుణాతీత దృష్టిచే (లేక ఆత్మ దృష్టిచే) ఈ సహజీవులను - ఈ జగత్తును సందర్శిస్తూ వస్తాడో… అట్టివాడు తన యొక్క త్రిగుణాతీతత్వం ఆస్వాదిస్తున్నాడు. ఇక తానే గుణాతీతుడగుచున్నాడు.

అట్టి గుణాతీతత్వముచే ఈ జగత్తులో అగుపిస్తున్న జన్మ-మృత్యు-జరా-పునర్జన్మాది దుఃఖములను (concerned all worries) అధిగమించినవాడై అమృతానంద స్వరూపుడు, మృత్యుంజయుడు అగుచున్నాడు. ‘‘నేను గుణములచేతగాని ఉపాధుల రాకపోకలచేతగాని బద్ధుడను కాదు’’ - అని గ్రహిస్తున్నాడు.


త్రిగుణాతీతుడు


మూల శ్లోకము


అధ్యయన వ్యాఖ్యానము


ఉపన్యాసము

అర్జున ఉవాచ :-

14–21

కైర్లింగైస్త్రీన్గుణానేతానతీతో భవతి ప్రభో ।
కిమాచారః కథం చైతాంస్త్రీన్గుణానతివర్తతే ॥

కైః లింగైః త్రీన్ గుణాన్ ఏతాన్ అతీతో భవతి, ప్రభో! ।
కిమ్ ఆచారః? కథం చ ఏతాన్ త్రీన్ గుణాన్ అతివర్తతే? ॥

అర్జునుడు :

మహాత్మా! శ్రీకృష్ణా! ఏఏ గుణ అభ్యాసములచేత ఈ జీవుడు తనను తాను త్రిగుణాతీతంగా తీర్చిదిద్దుకోగలుగుచున్నాడో, సందర్శించ గలుగుచున్నాడో అది వివరించండి.

ఏఏ ఆచార - వ్యవహారాదులచే ఈ జీవుడు త్రిగుణములచే స్పృశించబడక, వాటికి వేరుగా సహజీవులలోని త్రిగుణాతీతమగు ’‘స్వస్వరూప - అకర్తృత్వ - నిత్యనిర్మల ఆత్మ’’ను అవలోకించగలుగుతాడు?

తనను తాను ఎట్లా గుణాతీతమగు నిత్యానందాత్మ స్వరూపంగా సాక్షాత్కరించుకోగలుగుతాడు?

త్రిగుణాతీతుడు ఎట్లా వుంటాడో…. చెప్పండి!

శ్రీ భగవాన్ ఉవాచ :-

14–22

ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాణ్డవ ।
న ద్వేష్టి సమ్ప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి ॥

ప్రకాశం చ, ప్రవృత్తిం చ, మోహమ్ ఏవ చ, పాండవ! ।
న ద్వేష్టి సంప్రవృత్తాని, న నివృత్తాని కాంక్షతి ॥

శ్రీకృష్ణ భగవానుడు :-

అర్జునా! ఈ త్రిగుణములను అధిగమించనెంచి, ‘‘త్రిగుణాతీతుడు - అంతరంగ హృదయాంతరంగుడు’’ అగు పరమాత్మ సందర్శనమును ఆశయముగా కలిగియున్న మహాత్ములు ఏఏ అభ్యాసములు ఆశ్రయిస్తున్నారో ….అది చెప్పుచున్నాను. విను.

ఈ జీవులు ‘‘ప్రకాశము - ప్రవృత్తి - మోహము’’ అను త్రిగుణములలో ఏదో ఒకటి అధికంగా అభ్యసిస్తూ ఉండటంచేత… వారు ఆయా ప్రవర్తనలు - స్వభావములు - వ్యక్తిత్వములు కలిగిఉండటం జరుగుతోంది. (The practises of a person are framing and shaping the behaviour, features and personality of that person.)

ఈ జగన్నాటక దృశ్య త్రిగుణ చమత్కారమంతా గమనించిన జ్ఞానయోగి -

↳ ఇదంతా చూస్తూ కూడా ఏమాత్రం వేదన చెందడు.

↳ ఆయా గుణముల “సంప్రవృత్తి”ని ద్వేషించడు. “నివృత్తి”ని కాంక్షించడు.

↳ అనగా, ఈ జగత్తులో దేనినీ ద్వేషించడు, ఆకాంక్షించడు.

14–23

ఉదాసీనవదాసీనో గుణైర్యో న విచాల్యతే ।
గుణా వర్తన్త ఇత్యేవ యోఽవతిష్ఠతి నేఙ్గతే ॥

ఉదాసీనవత్ ఆసీనో గుణైః యో న విచాల్యతే ।
గుణా వర్తంత ఇతి ఏవ, యో అవతిష్ఠతి న ఇంగతే ॥

↳ ఈ జీవుల గుణములపట్ల ‘‘వారు అట్లా ఉన్నారేం? వీరు ఇట్లా ఉండాలి కదా?’’… అనే ఆవేశము - స్పర్థ - ఇష్టము - అయిష్టము మొదలైనవి పొందడు.

↳ ‘‘ఈ ప్రతి జీవునిలోను ఈ ఈ గుణముల వెనుక పరమాత్మ యొక్క జగన్నాటక సూత్రధారణయే వేంచేసియున్నది కదా!’’.. అను భావమును పెంపొందించుకొని ఉంటాడు.

↳ ఇక, ఈ గుణములచే భావ-గుణ సంఘర్షణలు, వాటి - వాటి పర్యవసానములు చూచి ‘‘ఇదంతా కథా కల్పనా చమత్కారం!’’ అని గమనిస్తున్నాడు. వాటిపట్ల ఉదాసీనత వహిస్తున్నాడు.

↳ వాటియందు ప్రవృత్తిని కోరుకోడు. నివృత్తిని కోరుకోడు.

↳ ఈ జగత్తులోని సర్వసంఘటనలను చూచీ చూడనట్లే ఉంటాడు. అంతేగాని ఈ జగత్తులోని వ్యక్తులను - సంఘటనలను చూచి వ్యథ (Disturbance - Perturbance) చెందడు.

↳ ఈ సర్వగుణములకు ఆధారమైన పరమాత్మనే సర్వేసర్వత్రా సందర్శిస్తూ ఉంటాడు.

↳ ‘‘గుణాతీతుడగు పరమాత్మయే ఈ సర్వజీవులుగా ప్రదర్శితమగుచున్నారు కదా!’’ అనే అనునిత్య సందర్శనమును ఏమరువడు.

↳ నిశ్చలంగా - గుణాతీతంగా - పరమాత్మ భావంతో కూడుకొని ఉంటాడు.

↳ ఈ జగత్తును ’‘నిశ్చింతతో కూడిన దృష్టి’’తో సందర్శిస్తూ ఉంటాడు.

14–24

సమదుఃఖసుఖః స్వస్థః సమలోష్టాశ్మకాఞ్చనః ।
తుల్యప్రియాప్రియో ధీరస్తుల్యనిన్దాత్మసంస్తుతిః ॥

సమ దుఃఖ-సుఖః, స్వస్థః, సమ లోష్ట-అశ్మ-కాంచనః ।
తుల్య ప్రియ-అప్రియో, ధీరః, తుల్య నింద-ఆత్మసంస్తుతిః ॥

↳ ఆతడు సుఖాలు చూచి పొంగడు. దుఃఖాలు చూచి క్రుంగడు.

↳ సహజీవుల ప్రవర్తనలు చూచి ‘‘అయ్యో! ఆహాఁ!’’… మొదలైన రూపంగా లోనుకాడు.

↳ ఈ జగత్తులోని మట్టి - రాయి - బంగారములను ఒకే తీరుగా, ఉద్వేగరహితంగా దర్శించటం అభ్యసిస్తూ ఉంటాడు.

↳ గుణాతీతమగు ‘‘ఏకీభావము’’ నుండి ఏమాత్రం చెదరడు.

↳ సర్వమునకు సాక్షిత్వము వహించి, తనయొక్క ఆ కేవల సాక్షిత్వమును సర్వదా పరిపోషించుకుంటూ ఉంటాడు.

14–25

మానావమానయోస్తుల్యస్తుల్యో మిత్రారిపక్షయోః ।
సర్వారమ్భపరిత్యాగీ గుణాతీతః స ఉచ్యతే ॥

మాన-అవమానయోః తుల్యః, తుల్యో మిత్ర-అరి పక్షయోః ।
సర్వ ఆరంభ పరిత్యాగీ, గుణ అతీతః, స ఉచ్యతే ॥

ఇక్కడ తనకు తారసపడుచున్న ప్రియ-అప్రియములను, నిందా-స్తుతులను, మాన-అవమానములను, శత్రు-మిత్రులను ఎవ్వరైతే ఉత్తమబుద్ధిచే సందర్శిస్తూ, అతీతులై ఉంటారో… సర్వకర్మలు నిర్వర్తిస్తూనే సర్వదా ‘పరిత్యాగి’ అయి ఉంటారో… అట్టివారు ‘‘గుణాతీతులు’’- అని శాస్త్రములు గానం చేస్తూ చెప్పుచున్నాయి.

14–26

మాం చ యోఽవ్యభిచారేణ భక్తియోగేన సేవతే ।
స గుణాన్సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే ॥

మామ్ చ యో అవ్యభిచారేణ భక్తియోగేన సేవతే ।
స గుణాన్ సమతీత్య ఏతాన్ బ్రహ్మభూయాయ కల్పతే ॥

అట్టి గుణాతీత అభ్యాసి కర్తృత్వ అభిమానం లేనివాడై ఉంటాడు. ఆపై ఇక, భోక్తృత్వమును కూడా అధిగమించిన వాడై ఉంటాడు. ఆతడు ‘‘సర్వాత్మకుడను - కేవలీస్వరూపుడను’’ అగు నా పట్ల భక్తి - ప్రపత్తులు సమర్పిస్తూ క్రమంగా ఈ త్రిగుణముల ప్రభావము - ప్రయోజనము - ఇతః పూర్వపు - ఉత్తరోత్తర ఫలములను అధిగమించిన వాడై…. సచ్చిదానంద పరబ్రహ్మమును పొందుటకు సంసిద్ధుడగుచున్నాడు. అనగా, ’‘బ్రాహ్మీస్థితి’’కి యోగ్యతను సిద్ధింపజేసుకుంటున్నాడు.

14–27

బ్రహ్మణో హి ప్రతిష్ఠాహమమృతస్యావ్యయస్య చ ।
శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాన్తికస్య చ ॥

బ్రహ్మణో హి ప్రతిష్ఠా అహమ్ అమృతస్య అవ్యయస్య చ ।
శాశ్వతస్య చ, ధర్మస్య, సుఖస్య ఐకాంతికస్య (ఏకాంతికస్య) చ ॥

ఆత్మనుండి గుణములు, గుణములనుండి జగత్‌ దృశ్య అనుభవములు ప్రదర్శితమగుచున్నాయి కదా!

అయితే, జగత్తులకు, జగదంతర్గత దేహములకు, ఆ దేహములకు కారణభూతమగు గుణములకు ముందే స్థితి కలిగియున్న స్వరూపమే ‘‘నేను’’.

అట్టి - గుణములకు మునుముందే ఉన్న సత్‌ స్వరూపుడను.

బ్రహ్మమే నా స్థితి-స్థానము-నివాసము-తత్వము-స్వభావము కూడా!

ఓ అర్జునా!
➤ అట్టి గుణములకు మునుముందే ఉన్న సత్‌ స్వరూపమును, నా గుణాతీత స్వరూపమును గుర్తెరిగినవాడవై ఉండు.
➤ ‘‘బ్రహ్మమే నా స్వరూపము-ఉనికి-స్థానము’’ అని గ్రహించు. గమనించు.
➤ త్రిగుణాతీత, త్రిగుణాధారుడనగు నన్ను చేరు.
➤ త్రిగుణాతీతుడవై ఆత్మసుఖం ఆస్వాదించు.


ఇతి శ్రీమత్‌ భగవద్గీతాసు … గుణత్రయ విభాగ యోగ పుష్పః ।
శ్రీ సాంబ సదాశివ పాదారవిందార్పణమస్తు ॥
🙏