భగవద్గీత

15. పురుషోత్తమ ప్రాప్తి యోగ అధ్యయన పుష్పం

మూలము : శ్రీ వ్యాస మహర్షిచే విరచించబడిన జయము / మహాభారతము (భీష్మ పర్వము)

అధ్యయన వ్యాఖ్యానము : (అధ్యయన విద్యార్థి) యేలేశ్వరపు హనుమ రామకృష్ణ


Aswatha vruksham

మూల శ్లోకము


అధ్యయన వ్యాఖ్యానము


ఉపన్యాసము

శ్రీ భగవాన్ ఉవాచ :-

15–01

ఊర్ధ్వమూలమధఃశాఖమశ్వత్థం ప్రాహురవ్యయమ్ ।
ఛన్దాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ ॥

ఊర్ధ్వమూలమ్ అధఃశాఖమ్ అశ్వత్థం ప్రాహుః అవ్యయమ్ ।
ఛన్దాంసి యస్య పర్ణాని, యః తం వేద స వేదవిత్ ॥

శ్రీకృష్ణ భగవానుడు :-

ఓ అర్జునా! ‘‘ఈ దృశ్య జగత్తంతా పరమాత్మ అనే కవి నుండి బయల్వెడలిన త్రిగుణముల కథన విశేషమే’’ అని, ‘‘ఈ సర్వజీవులలో సర్వదా వేంచేసియున్న త్రిగుణాతీతుడగు పరమాత్మను సందర్శిచటం’’ అనే అభ్యాస యోగమును ఆశ్రయించమని, ‘‘అట్లు ఆశ్రయించి తద్వారా గుణాతీతత్వముచే ప్రకాశించవలసినది’’ అని చెప్పుతూ వస్తున్నాను కదా!

అయితే, స్వతఃగా ఆత్మ స్వరూపుడగు ఈ జీవుడు స్వస్వరూపానుసంధానం ఏమరచి “త్రిగుణపరిమిత దృష్టి”చే నిబద్ధితుడు ఎందుకు అగుచున్నాడో, ఈ పురుషుడు (జీవుడు) పురుషోత్తమత్వం సముపార్జించుకోవటం ఎట్లాగో… అది సవివరిస్తున్నాను. విను.

అంతరంగమే త్రిగుణ కల్పనా స్థానం

ఈ జీవునికి గుణముల చమత్కారము, తద్వారా జన్మ - కర్మ పరంపరలు, ఆ జన్మలలో ప్రకాశ - ప్రవృత్తి - మోహ పరంపరలతో కూడిన ఉత్తమ - అధమ, విజ్ఞాన - అజ్ఞాన స్థితిగతులు సంప్రాప్తించటానికి కారణం ఏమిటి? దృశ్యమా? కానేకాదు.

ఏ ఈ దృశ్యమైతే ద్రష్టచే ‘‘సుఖ-దుఃఖ; మాన - అవమాన; ప్రియ - అప్రియ; నింద - స్తుతి; మిత్ర - శత్రు; అయినవారు - కానివారు; జన్మ - మృత్యు’’ మొదలైన ద్వంద్వములతో కూడుకొనినదై అనుభవించబడుచున్నదో …, అంతటికీ మూల కారణం ఆ జీవుని అంతరంగమే!

అనగా, ఈ ద్రష్ట యొక్క అంతరంగమే త్రిగుణరూపమైన జగదనుభవాలన్నిటికీ స్థానముగా కలిగి ఉంటోంది. ఈ ‘‘సందర్శనము’’ అనే త్రిగుణ కల్పిత, అనుభవ పరంపరా రూప సంసారమునకు మూలము అంతరంగమే! అనగా, అంతరంగము యొక్క అనుభవ పరంపరలు (లేక) సంస్కారములు - ఈ జగత్ ‌దృశ్యానుభవాలుగా విస్తరించియున్నాయి.

అందుకని, శాస్త్రములు ఈ సంసారదృష్టిని అశ్వత్థ (రావి) వృక్షముతో పోల్చుచున్నాయి.

సంసార వృక్షము

అజ్ఞానముచే ఏర్పడిన ఈ ‘‘సంసారిక దృష్టి’’ అనే వృక్షముయొక్క మూలము హృదయాంతరంగమునందు ఉన్నది. దీని శాఖోపశాఖలు ‘‘బాహ్యదేహ పరంపరానుభవముల - జగత్ ‌పరంపరల’’ రూపముగా విస్తరించి ఉన్నాయి.

ఈ సంసారవృక్షము యొక్క వ్రేళ్లు అంతరమున లోతుగా వ్యాపించి ఉన్నాయి. అద్దాని విస్తారము - సంసారవృక్షము యొక్క ఆకులు వేదములలోని కామ్య కర్మ విభాగములే! అనగా, ‘‘దృశ్యంలో ఏదో పొందాలి. అందుకై ఉపాసించాలి’’… అనునవే ఆ సంసార వృక్షము యొక్క ఆకులు. అట్టి ఈ సంసార వృక్షము (The Tree of Illusionary Perceptions) యొక్క ఉనికి - వినాశన ఉపాయములు ఎవరు గ్రహించినవారై ఉంటారో… వారే విదిత వేత్తలు, వేదరహస్యం తెలిసినవారు, తెలియబడేదంతా ఏమై ఉన్నదో…అద్దానిని గ్రహించినవారగుచున్నారు.

(వేదము = తెలియబడుచున్నది. వేదవిదులు = తెలియబడుచున్న దానియొక్క తత్త్వము ఎరిగినవారు.)

15–02

అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖా
గుణప్రవృద్ధా విషయప్రవాలాః ।
అధశ్చ మూలాన్యనుసన్తతాని
కర్మానుబన్ధీని మనుష్యలోకే ॥

అధః చ ఊర్ధ్వం ప్రసృతాః తస్య శాఖా
గుణప్రవృద్ధా విషయప్రవాలాః ।
అధః చ మూలాని అనుసంతతాని
కర్మ అనుబంధీని మనుష్యలోకే ॥

సంసార వృక్ష విస్తరణ

ఈ ‘సంసారము’ అనే అశ్వత్థ వృక్షము యొక్క శాఖలు అటు దేవతా జన్మలవైపుగాను, ఇటు మానవ-జంతు-స్థావర జన్మములవైపుగాను విస్తరించియున్నాయి. అనగా, ఈ జీవుని దృష్టులు (The Perceptions of the Perceiver) అటు దేవతా లోకములలోనికి, ఇటు భూ-పాతాళ లోకములలోనికి విస్తారితమై ఉన్నాయి.

ఈ సంసారవృక్షము యొక్క వ్రేళ్లు ‘త్రిగుణములు’ అనే జలాన్ని పీల్చుకొని జీవనం పొందుతున్నాయి.

‘‘అనేక లౌకిక సమాచారాలు - అభిప్రాయాలు - కబుర్లు - దూషించుకోవటాలు భూషించుకోవటాలు - తిరస్కార పురస్కారాలు’’…. మొదలైన మిశ్రమములతో కూడిన ఎరువుచే పుష్టిని పొందుచున్నాయి.

ఈ జీవుని ‘‘అనేక కర్మ - తదితర వ్యవహార - సంబంధ’’ పరంపరలలో బంధించి ఉంచుతున్నాయి.

అవన్నీ కూడా ఈ మనుష్యలోకంలో (జీవలోకంలో) అనేక ఉపాధి పరంపరలు ఈ జీవుని పట్ల వచ్చి-పోతూ ఉండటానికి, సుధీర్ఘంగా కొనసాగటానికి కారణమగుచున్నాయి.

15–03

న రూపమస్యేహ తథోపలభ్యతే
నాన్తో న చాదిర్న చ సంప్రతిష్ఠా ।
అశ్వత్థమేనం సువిరూఢమూలమ్
అసఙ్గశస్త్రేణ దృఢేన ఛిత్త్వా ॥

న రూపమ్ అస్య ఇహ తథా ఉపలభ్యతే
న అంతో, న చ ఆదిః, న చ సంప్రతిష్ఠా ।
అశ్వత్థమ్ ఏనం సువిరూఢమూలమ్
అసంగశస్త్రేణ దృఢేన ఛిత్త్వా ॥

ఓ అర్జునా! ఈ విధంగా అంతరంగంలోంచి బయల్వెడలిన దృష్టియే ఈ జీవునికి అనేక ఉత్తమ - అధమ దేహ పరంపరలుగాను, సృష్టి పరంపరలనుగాను సంప్రాప్తిస్తోంది. ఈతనిని అనేక కర్మ - అనుబంధ పరంపరలకు కట్టిపడవేసి ఉంచుతోంది. దృష్టియే సృష్టి. దృష్టియే సంసారము.

జీవులలో చాలామంది ‘‘నాకు ఈ వర్తమాన దృశ్యమువలననే సంబంధము - అనుబంధము - బంధము కలుగుచున్నాయి’’.. అని భ్రమిస్తున్నారు. అట్లా కానేకాదు. అందుచేతనే… అంతరంగములో వ్రేళ్లు విస్తరించియున్న సంబంధ - అనుబంధ - బంధ సాంసారిక దృష్టులు బాహ్యాన ఎంత వెతకినా కూడా, వాటి ఆను-పానులు దొరకవు.

‘‘నేను ఎందుకు బంధ - సంబంధములు అనుభవిస్తాను?’’ అని ప్రశ్నించుకొని ఒకానొకడు దృశ్యములో స్వర్గ-మర్త్య-పాతాళ లోకములలో ఎంతగా వెతికినప్పటికీ… అందుకు కార్య - కారణములు వాస్తవ రూపం ఇక్కడ (దృశ్యంలో) లభించదు. ఎందుకంటే, ఈ సంసారమనే అశ్వత్థవృక్షం యొక్క తన కార్య - కారణములు అనబడే వ్రేళ్లు అతని అంతరంగంలోనే అతి లోతుగా - విస్తారంగా విస్తరించుకొని ఉన్నాయి.

అంతటి ఈ సంసారవృక్షము కలుగజేస్తున్న దుఃఖాలకు (Worries) అంతులేదు. పొంతులేదు. అద్దాని మొదలేమిటో - చివరేమిటో - అసలు ఎటునుంచి వచ్చి భ్రమింపజేస్తోందో ఈ జీవుడు గమనించలేక పోతున్నాడు. గుర్తించలేకపోతున్నాడు.

అటువంటి లోతులోతులలో పాతుకొని - విస్తరించి ఉన్న ఈ సంసారవృక్షమును ఖండించటానికి ఓ గొప్ప ఆయుధం గురించి చెప్పుతాను. విను.

అసంగము

‘‘అసంగము - (Detached Attachment with all the incidents, the people, the situations including the events of Births and Deaths)’’ అనే గండ్రగొడ్డలితో ఈ సంసారవృక్షమును మొదలంట్లా ఖండించివేయాలి.

జగత్తుతో గుణసంబంధములను అతిక్రమించి గుణాతీతుడు-కేవలసాక్షి అగు పరమాత్మతో సంబంధ-బాంధవ్యములు పెంపొందించుకోవాలి.

15–04

తతః పదం తత్పరిమార్గితవ్యమ్
యస్మిన్గతా న నివర్తన్తి భూయః ।
తమేవ చాద్యం పురుషం ప్రపద్యే
యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణీ ॥

తతః పదం తత్ పరిమార్గితవ్యమ్
యస్మిన్ గతా న నివర్తంతి భూయః ।
తమ్ ఏవ చ ఆద్యం పురుషం ప్రపద్యే
యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణీ ॥

ఈ ‘‘జగత్‌దృష్టులు’’ అనే సంసార వృక్షమును మొదలంట్లా త్రెంచి, … ఆ అడ్డు తొలగించుకొని ‘‘పరమాత్మ’’ అనే పరమానంద స్థానమునకు త్రోవ చేసుకోవాలి.

ఈ సంసార ప్రవృత్తులన్నీ, జలంలోంచి తరంగాలవలె, ఎందులోంచి బయల్వెడలుచున్నాయో అట్టి ఆదిపురుష సంస్థానమగు నా స్థానము చేరినప్పుడు ఇక ‘‘పునరావృత్తి’’ అనే దోషం ఉండదు. అట్లాకాదూ…, దృశ్య సంబంధమగు తదితరమైనదంతా పునరావృత్తి దోషం కలిగి ఉంటుంది.

15–05

నిర్మానమోహా జితసఙ్గదోషా
అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః ।
ద్వంద్వైర్విముక్తాః సుఖదుఃఖసంజ్ఞైః
గచ్ఛన్త్యమూఢాః పదమవ్యయం తత్ ॥

నిర్మానమోహా, జితసంగదోషా,
అధ్యాత్మనిత్యా, వినివృత్తకామాః ।
ద్వంద్వైః విముక్తాః, సుఖదుఃఖసంజ్ఞైః
గచ్ఛంతి అమూఢాః పదమ్ అవ్యయం తత్ ॥

అటువంటి పునరావృత్తి దోషరహిత - సర్వజగదతీత - సర్వజగత్‌ ఆధార స్థానం చేరటానికి, ఈ దృశ్యమును - దృశ్యత్వమును అధిగమించాలి. అందుకు ఉపాయము - మార్గము చెప్పుచున్నాను. విను.

1.) నిర్మామాన-మోహా : ‘‘మానము’’ (ఆత్మస్తుతి - పరనింద) - ‘‘మోహము’’ (Illusionary opinions, feelings, interpretations, perceptions)లను త్రెంచివేయాలి. హృదయములోని మానము - మోహము అనే మకిలిని కడిగివేయాలి.

2.) జిత సంగదోషా : మనస్సు ‘‘సంగతులు - సందర్భములు - విషయ పరంపరలు…, ఇత్యాది సంగదోషములను మూట కట్టుకొని ఉండటం’’ జరుగుతూ ఉంటుంది. అట్టి సంగదోషమును అసంగత్వము అనే ప్రయత్నముతో తొలగించుకోవాలి. (Attachment should be fought out with the help of the Detachment).

3.) అధ్యాత్మనిత్యా : అనునిత్యంగా ఈ దృశ్యాంతర్గత సహజీవులపట్ల ‘‘ఇదంతాగా పరమేశ్వరతత్వమే సర్వదా భాసిస్తున్నది కదా!’’.. అను సంభావనను అఖండ దీపమువలె అంతరంగమున ఉపాసనా పూర్వకంగా వెలిగించాలి. అట్లా అనువర్తింపజేయుటచే ‘ద్వితీయభావన’ను జయించాలి. ‘అద్వితీయత్వం’ సముపార్జించుకోవాలి.

4.) వినివృత్త కామా : ఈ దృశ్యమునకు సంబంధించిన సర్వ కామములు (All the expectations at their root level) హృదయమునుండి నివృత్తి చేసుకోవాలి. నిత్య యజ్ఞోపాసనాభావంతో కర్మబంధములను అధిగమించివేయాలి.

5.) ద్వంద్వైః విముక్తాః సుఖదుఃఖ సంజ్ఞైః : ’‘ఇది నాకు సుఖము - ఇది నాకు దుఃఖము’’ అను అంతరంగ నిర్వచనముల నుండి మనస్సుకు విముక్తిని (Relief) కలుగజేయాలి. మనోబుద్ధులు అట్టి స్వయంకృతములైనట్టి పరిమితత్వములను అధిగమించాలి.

6.) అమూఢాః : ఆయా విషయములను సమన్వయించుకోవటంలో ఈ బుద్ధి ‘‘వివేకము - విజ్ఞానము - దీర్ఘదర్శనము’’.. మొదలైనవి అలవరచుకొనగలిగి ఉండాలి. మూఢత్వం త్యజించి ఉండాలి.

ఇటువంటి ఆయా సాధన మార్గములచే ఆ ‘‘తత్‌’’ పదమును, (సర్వము స్వస్వరూపంగా పరమాత్మ తత్త్వంగా ఆస్వాదించే స్థితిని) తప్పక జేరుకోవచ్చు.

15–06

న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః ।
యద్గత్వా న నివర్తన్తే తద్ధామ పరమం మమ ॥

న తత్ భాసయతే సూర్యో, న శశాంకో, న పావకః ।
యత్ గత్వా న నివర్తంతే తత్ ధామ పరమం మమ ॥

ఓ అర్జునా! ఈ జీవునియొక్క బుద్ధిలో అజ్ఞానాంధకారము రూపుదిద్దుకొని స్వస్వరూపమును ఆవరించుకొనినదై ఉన్నది.

అట్టి అజ్ఞానాంధకారం తొలగాలంటే ఈ భౌతిక సూర్యుడు-చంద్రుడు ఉదయించుట చేతనో, ఒక పంచభూతాత్మకమైన అగ్నిచే దీపం వెలిగించటం చేతనో … తొలగేది కాదు.

సూర్యుడు ఉదయిస్తే తొలగుచున్న చీకటి సూర్యుడు అస్తమించగానే వచ్చి పడుతోంది. చంద్రుడు పౌర్ణమిరోజు ఆకాశంలో ప్రకాశిస్తున్నప్పుడు కనపడని చీకటి అమావాస్య రోజు తిరిగి వచ్చి పడుతోంది. దీపం వెలుగుతుంటే కనిపించని చీకటి దీపం తొలగించగానే వచ్చిపడుతోంది.

అయితే, బుద్ధి వికాసరూపమైన జ్ఞాన దీపంతో తొలగిపోతున్న అజ్ఞానాంధకారం మరల వచ్చిపడేది కాదు. నాయొక్క గుణాతీతమగు అధ్యాత్మానందస్థితికి చేరుకున్న తరువాత తిరిగి అది తొలగటం జరగదు. అట్టి పరంధామం స్వకీయమైన ప్రయత్నములచే తప్పక లభించగలదు.

అట్టి నా పరమపురుషస్థానం గురించి చెప్పుచున్నాను విను.

15–07

మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః ।
మనఃషష్ఠానీన్ద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి ॥

మమ ఏవ అంశో జీవలోకే జీవభూతః సనాతనః ।
మనః షష్ఠాని ఇంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి ॥

ఈ జీవుడు నా పురుషోత్తమత్వము యొక్క ఒక అంశయే!

మాయకు - సంసారమునకు ఆవల సర్వదా ఆత్మస్వరూపుడనై, నిత్యోదిత ఆత్మ చైతన్యంగా నేను వెలుగొందుచున్నాను.\

అట్టి అప్రమేయాత్మస్వరూపుడనగు నాయొక్క ఒకానొక అంశ ఈ జీవలోకంలో జీవతత్వంగా-జీవుడుగా ప్రవేశిస్తోంది.

సూర్యుని కాంతి భూమిపైగల ఆయా వస్తువులపై పడినప్పుడు, ఆ కాంతి వస్తువుయొక్క ఆకారంగా కనబడటం జరుగుతోంది చూచావా? అట్లాగే ఈ జీవలోకంలో ప్రవేశించినట్టి నాయొక్క అంశ జీవతత్వరూపంగా ప్రకృతియందు ప్రవేశించగానే ప్రకృతిలోని ‘‘పంచేంద్రియములు - ఆరవదియగు మనస్సు’’ అనే అంశ తన వైపు ఆకర్షిస్తోంది.

అట్టి నా అంశ ఆయా శరీరములను పొందుతూ - పంచేంద్రియములను - మనస్సును ఉత్తేజింపజేసి తద్వారా దేహయానం ప్రారంభిస్తోంది.

15–08

శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః ।
గృహీత్వైతాని సంయాతి వాయుర్గన్ధానివాశయాత్ ॥

శరీరం యత్ అవాప్నోతి యత్ చ అపి ఉత్క్రామతి ఈశ్వరః ।
గృహీత్వా ఏతాని సంయాతి వాయుః గంధాన్ ఇవ ఆశయాత్ ॥

వాయువు ఆయా పుష్పముల మీదుగా ప్రసరిస్తూ… పయనిస్తూ ఆ పుష్ప సుగంధమును తనవెంట గొనిపోతూ ఉంటుంది, చూచావా! అట్లాగే నా యొక్క జీవాంశ కూడా ఒక శరీరమునుండి నిష్క్రమిస్తూ మరొక శరీరముతో ఉపక్రమిస్తున్నప్పుడు తన ’‘పంచేద్రియ - మనస్సు’’లను తనవెంటనుంచుకొని ప్రయాణిస్తోంది. మరొక శరీరములో ప్రవేశిస్తూ ఉన్నది.

15–09

శ్రోత్రం చక్షుః స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ ।
అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే ॥

శ్రోత్రం చక్షుః స్పర్శనం చ రసనం ఘ్రాణమ్ ఏవ చ ।
అధిష్ఠాయ మనః చ అయం విషయాన్ ఉపసేవతే ॥

ఆ నూతన శరీరములో ఇతఃపూర్వపు సంస్కారములతో కూడుకొని, మరల చెవులతో వినడమనే అనుభవం, కళ్లతో రూపానుభవం, చర్మంతో స్పర్శానుభవం, నాలుకతో రుచి అనుభవం, ముక్కుతో ఆఘ్రాణానుభవం కొనసాగిస్తోంది. (పునః జన్మించడం)
నూతన దేహంతో ఆ శబ్ద - స్పర్శ - రూప - రస - గంధానుభవములను కొంతకాలం ఆస్వాదిస్తోంది.

ఇంతలోనే ఆ శరీరం నుండి నిష్క్రమించినపుడు మరల తన వెంట శబ్ద - స్పర్శ - రూప - రస - గంధానుభవాలు ‘‘సంస్కారరూపం’‘గా వెంట నిండుకొని మరొక నూతన దేహంలో మరల కొనసాగిస్తోంది.

ఈ రీతిగా నా యొక్క జీవచైతన్యాంశ ’‘దేహ - దేహాంతర’’ చమత్కార ప్రయాణం కొనసాగిస్తోంది.

సర్వజీవులయొక్క జీవాంశ - దేహదేహాంతర ప్రయాణములు - అనుభూత - అనుభవములు కొనసాగించటం ఇట్టిదే! (ఇదియే పునర్జన్మల, జన్మ-జన్మాంతర సంస్కారముల చమత్కారమంతా!)

ఈ విధంగా ఈ జీవుడు నా యొక్క అంశయే!

15–10

ఉత్క్రామన్తం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితమ్ ।
విమూఢా నానుపశ్యన్తి పశ్యన్తి జ్ఞానచక్షుషః ॥

ఉత్క్రామంతం, స్థితం వా అపి, భుంజానం వా గుణాన్వితమ్ ।
విమూఢా న అనుపశ్యంతి, పశ్యంతి జ్ఞానచక్షుషః ॥

ప్రతి జీవుడు వాస్తవానికి ఆత్మస్వరూపుడే! జీవుడు అనునది అట్టి పరమాత్మయొక్క ఒకానొక కిరణ చమత్కారమే!

అయితే…,
‘‘నేను ఆత్మస్వరూపులై ఉండగా, నాయొక్క జీవాంశ ప్రకృతిలో ప్రవేశించి, ఇంద్రియమనస్సులను ఆకర్షించి, దేహ - దేహాంతర ప్రయాణాలు నిర్వర్తిస్తోంది’’…. అనే స్వకీయ చమత్కారమంతా వర్తమాన దేహంతో, దృశ్యంతో తదాత్మ్యతచే విమూఢులైనవారు గమనించలేకపోతున్నారు. వారు ‘‘ఎప్పుడో పుట్టాను - ఇప్పుడు జీవిస్తున్నాను - మరొకపుడు మరణించువాడను. ఇంతే!’’ … అని దేహాత్మభావనావేశపరులై ఉంటున్నారు.

అయితే…,
ఎవ్వరైతే జ్ఞానచక్షువులను నిశితం చేసుకొని గమనిస్తున్నారో, అట్టివారు ‘‘నాయొక్క ఒకానొక స్వల్పాంశము ప్రకృతిలో ప్రవేశించి, ఇంద్రియమనస్సులను ఆకర్షించి, జన్మపరంపరలు ఆస్వాదిస్తోంది. ఇక నేను ఆ అంశముకంటే గరిష్ఠుడనై, అప్రమేయమగు ఆత్మస్వరూపుడనై, ఈ జన్మ - కర్మ తతంగములకు కేవల సాక్షినై ఉన్నాను కదా!’’….. అని గమనిస్తున్నారు. ఆ రీతిగా సందర్శిస్తున్నారు.

అట్టి సందర్శనమే ‘‘పురుషోత్తమప్రాప్తి యోగం’’.

15–11

యతన్తో యోగినశ్చైనం పశ్యన్త్యాత్మన్యవస్థితమ్ ।
యతన్తోఽప్యకృతాత్మానో నైనం పశ్యన్త్యచేతసః ॥

యతంతో యోగినః చ ఏనం పశ్యంతి ఆత్మని అవస్థితమ్ ।
యతంతో అపి అకృతాత్మానో న ఏనం పశ్యంతి అచేతసః ॥

ఓ అర్జునా! నిర్మలహృదయులగు యోగులు ప్రయత్నపూర్వకంగా తమ హృదయాంతర్గతంగా సర్వదా వేంచేసియున్న - అప్రమేయ స్వస్వరూపాత్మను సదా సందర్శిస్తున్నారు.

మరికొందరు యోగులు హృదయముయొక్క నిర్మలత్వం ఇంకనూ సముపార్జించకపోవటంచేత,… ప్రయత్నశీలురై ఉండికూడా తమ హృదయాకాశంలో ఆత్మసాక్షాత్కారమును ఇంకనూ ఆవిష్కరించి - ఆస్వాదించలేకపోతున్నారు!

15–12

యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఽఖిలమ్ ।
యచ్చన్ద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకమ్ ॥

యత్ ఆదిత్యగతం తేజో జగత్ భాసయతే అఖిలమ్ ।
యత్ చంద్రమసి, యత్ చ అగ్నౌ, తత్ తేజో విద్ధి మామకమ్ ॥

ఓ అర్జునా!

తేజోరూపం : ఆత్మ తత్త్వస్వరూపుడనగు నేనే ఈ జగత్తుకు ‘‘తేజస్సు’’ అయి ఉన్నాను. ‘‘ఏ తేజో విలాసము సూర్యగోళంలో విరాజిల్లుతూ, చంద్రబింబములోను, అగ్నిలోను ప్రకాశిస్తోందో ఆ తేజస్సు ఆత్మస్వరూపుడనగు నా యొక్క అంశయే’’… అని గ్రహించు.

15–13

గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా ।
పుష్ణామి చౌషధీః సర్వాః సోమో భూత్వా రసాత్మకః ॥

గామ్ ఆవిశ్య చ భూతాని ధారయామి అహమ్ ఓజసా ।
పుష్ణామి చ ఓషధీః సర్వాః సోమో భూత్వా రసాత్మకః ॥


ఓజోరూపం : అట్టి నా అంశయగు తేజస్సే సూర్య - చంద్రమండలముల నుండి భూమియందు ప్రవేశించి ’ఓజస్సు’గా విరాజిల్లుతోంది. భూమియందు ఆ ఓజస్సు ఓషధులను పరిపోషిస్తూ రసరూపమగుచున్నది. ఆ రసతత్వం వృక్షజాలములకు పరిపోషణ ప్రసాదిస్తోంది. వృక్షజాలం జంతుజాలమునకు ‘ఆహారం’ ప్రసాదిస్తోంది.

15–14

అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ।
ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్ ॥

అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమ్ ఆశ్రితః ।
ప్రాణ-అపాన-సమాయుక్తః పచామి అన్నం చతుఃవిధమ్ ॥


వైశ్వానరాగ్ని : తేజోరూపంతో సూర్యచంద్రులలోను, ఓజోరూపంతో రసతత్వంగా భూమిలో ప్రవేశిస్తున్న నా జీవచైతన్యాంశయే సర్వజీవులలో వైశ్వానరాగ్ని రూపంగా ప్రవేశించుచున్నది. ప్రాణుల దేహములను ఆశ్రయించి, వారు భుజిస్తున్న భక్ష్య - భోజ్య - లేహ్య - చోహ్యములను చతుర్విధ ఆహారములను పచనం చేస్తూ దేహనాళములో అన్నరసము ప్రవేశించటానికి కారణమగుచున్నది. ప్రాణ - అపానములను చెకుముకిరాళ్లవలె ఉపయోగించి సకల జీవరాసులలో జఠరాగ్నిని జనింపజేస్తున్నది.

15–15

సర్వస్య చాహం హృది సన్నివిష్టో
మత్తః స్మృతిః జ్ఞానమపోహనం చ ।
వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో
వేదాన్తకృద్వేదవిదేవ చాహమ్ ॥

సర్వస్య చ అహం హృది సన్నివిష్టో
మత్తః స్మృతిః, జ్ఞానమ్, అపోహనం చ ।
వేదైః చ సర్వైః అహమ్ ఏవ వేద్యో
వేదాంతకృత్ వేదవిత్ ఏవ చ అహమ్ ॥
అంతేకాదు.

అంతర్యామినై-మనోవిన్యాసం!

నేను సర్వజీవుల హృదయంలో ప్రవేశించి అంతర్యామినై ఉంటున్నాను. ఆ జీవుల యొక్క మరపు - జ్ఞాపకము - జ్ఞానము - అపోహ (అనుమానము) నా వలననే కలుగుచున్నాయి.

వేదములన్నీ వేదవేద్యునిగా (తెసుసుకొనవలసిన వాటిలో అత్యుత్తమమైనదిగా) గానం చేస్తున్నది తేజో - ఓజో - వైశ్వానర - అంతర్యామిరూపుడనగు నన్నే సుమా!

15–16

ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ ।
క్షరః సర్వాణి భూతాని కూటస్థోఽక్షర ఉచ్యతే ॥

ద్వౌ ఇమౌ పురుషౌ లోకే క్షరః చ అక్షర ఏవ చ ।
క్షరః సర్వాణి భూతాని, కూటస్థో అక్షర ఉచ్యతే ॥

క్షరము-అక్షరము

ఓ అర్జునా! ప్రతి జీవుడు ‘‘మార్పు చెందునది - మార్పు చెందనిది’’ అను రెండు చమత్కార విశేషముల సమావేశముతో కూడుకొని ఉన్నాడు.

సర్వ విషయ - వ్యవహార - సంబంధ సంఘటనలు, తదంతర్గత పదార్థజాలము ‘‘క్షరము’’.

ప్రతి జీవునిలోని ‘నేను’ అనునది మార్పు - చేర్పులు చెందనిదై అక్షరమైయున్నది.

ప్రతిజీవునిలోను మార్పుచెందు విభాగము (క్షరము - Changing Factor) మార్పుచెందని విభాగము (అక్షరము - The Changeless Self Concept) - ఈ రెండూ కూడా జంటకవుల వలె కూడి ఉంటున్నాయి.

Kshara PurushuDu, Akshara PurushuDu, Parmatma

15–17

ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః ।
యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః ॥

ఉత్తమః పురుషః తు అన్యః పరమాత్మా ఇతి ఉదాహృతః ।
యో లోకత్రయమ్ ఆవిశ్య బిభర్తి అవ్యయ ఈశ్వరః ॥

అయితే,…
జీవుడు దేహస్వరూపుడై కనిపిస్తున్నాడు కదా! ఈ జీవుడు ఒక దేహముచే పరిమితుడు కాడు. ఆతడు తాను సందర్శించే జగత్తంతటికీ సర్వాంతర్యామి కూడా!

అట్టి సర్వాంతర్యామియే ఉత్తమపురుష (The First Person).

అదియే ‘‘పరమాత్మ’’ అని వ్యవహరించబడుతోంది.

15–18

యస్మాత్ క్షరమతీతోఽహమక్షరాదపి చోత్తమః ।
అతోఽస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః ॥

యస్మాత్ క్షరమ్ అతీతో అహమ్ అక్షరాత్ అపి చ ఉత్తమః ।
అతో అస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః ॥


అట్టి స్వస్వరూపమే అయి ఉన్న పరమాత్మత్త్వమును ఉత్తమ బుద్ధితో ఆస్వాదించటమే “పురుషోత్తమప్రాప్తి యోగం”!
15–19

యో మామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమమ్ ।
స సర్వవిద్భజతి మాం సర్వభావేన భారత ॥

యో మామ్ ఏవమ్ అసమ్మూఢో జానాతి పురుషోత్తమమ్ ।
స సర్వవిత్ భజతి మాం సర్వభావేన, భారత! ॥

ఆత్మదృష్టి (పురుషోత్తమత్వం) ఆస్వాదించువాడు తత్వశాస్త్ర రహస్యం ఎఱిగినవాడగుచున్నాడు. తత్త్వశాస్త్ర ఉద్దేశ్యమును సిద్ధింపజేసుకున్నవాడగుచున్నాడు.

సర్వుల అంతరంగముగా నన్నే దర్శిస్తూ, తన హృదయమునందు సర్వభావనా యుక్తముగా నన్నే భజించుచున్నాడు.

15–20

ఇతి గుహ్యతమం శాస్త్రమిదముక్తం మయానఘ ।
ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్స్యాత్కృతకృత్యశ్చ భారత ॥

ఇతి గుహ్యతమం శాస్త్రమ్ ఇదమ్ ఉక్తం మయా, అనఘ! ।
ఏతత్ బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యః చ, భారత! ॥

ఓ అనఘా! పాపదృష్టి ఏమాత్రం లేనట్టి నిర్మలహృదయుడా! అర్జునా!

ఇప్పుడు నేను చెప్పినట్టి ‘‘జీవుడు సర్వాంతర్యామిత్వము ఆస్వాదించటం’’ అనునది పరమోత్తమమగు శాస్త్రసారం.
ఇది పురుషోత్తమ ప్రాప్తియోగం!
ఇది రహస్యములోకెల్ల గొప్ప రహస్యం.

‘‘ఈ కనబడే సర్వమునందు నా పురుషోత్తమ రూపమే సర్వదా అంతర్లీన గానంగా వేంచేసియున్నది.’’… అను స్థితిని బుద్ధితో గ్రహించినవాడు సర్వే-సర్వత్రా పొందవలసినది పొందినవాడు అగుచున్నాడు.

ఓ అర్జునా! అట్టి పురుషోత్తమ ప్రాప్తి యోగమునకై సంసిద్ధుడవగుము. అభ్యసించు. ఆస్వాదించు. యోగారూఢుడవు కమ్ము. అప్పుడు, నీవు దృశ్య కల్పిత బంధములన్నీ సహజంగాను, స్వతఃసిద్ధంగాను అధిగమించివేయగలవు. దృశ్యాతీతమగు అమృత స్వరూపంతో దృశ్యమును ఆస్వాదించగలవు.


ఇతి శ్రీమత్‌ భగవద్గీతాసు … పురుషోత్తమ ప్రాప్తి యోగ పుష్పః ।
శ్రీ సాంబ సదాశివ పాదారవిందార్పణమస్తు ॥
🙏