భగవద్గీత

16. దైవ-అసుర సంపద్ విభాగ యోగ అధ్యయన పుష్పం

మూలము : శ్రీ వ్యాస మహర్షిచే విరచించబడిన జయము / మహాభారతము (భీష్మ పర్వము)

అధ్యయన వ్యాఖ్యానము : (అధ్యయన విద్యార్థి) యేలేశ్వరపు హనుమ రామకృష్ణ


Lord Krishna instructing Arjuna
శ్రీకృష్ణ భగవానుడు :-

ఓ అర్జునా!

➤ ఈ మూడు లోకములు ఎద్దానియందైతే ఉన్నాయో అట్టి పరమాత్మయోగమును (పురుషోత్తమప్రాప్తి యోగమును) అభ్యసించి తద్వారా ఈ సంసార స్థితులను అధిగమించాలని చెప్పి ఉన్నాను కదా!

➤ అయితే, ఈ జీవుడు అందుకు తగిన సాధన సంపత్తిని సముపార్జించుకోవాలి.

➤ వాస్తవానికి కొంత సాధన సంపత్తి యొక్క ప్రయోజనంగానే ఈ జీవునికి మానవజన్మ లభించటం కూడా జరుగుతుంది!

➤ అట్టి సాధన సంపత్తిలో ఈతనికి సంసారబంధం (దేహాత్మ భావం - దృశ్యపరిమిత భావం) ప్రవృద్ధ పరచే సంపద కూడా (Negative Property) వెన్నంటి ఉంటోంది.

అందుచేత, ఈ జీవుడు తన సాధన సంపత్తిని విభాగం చేసి ఏది బంధమును తొలగించటానికి తనకు సహకరిస్తోందో, ఏ సంపద తనకు సంసార బంధమును మరింత అధికంగా చేస్తోందో… విభాగించుకోవాలి.

➤ బంధనివృత్తి కలుగజేసే దైవీసంపదను ప్రవృద్ధం చేసుకోవాలి.

➤ బంధమును అధికం చేసే ఆసురీ సంపదను క్రమంగా తొలగించుకోవాలి.

➤ అందుకు, ఈ మానవ జన్మ ఒక మహత్తరమైన సదవకాశం.

➤ అట్టి దైవ - అసుర సంపత్‌ విభాగ యోగం వివరించి చెప్పుచున్నాను. శ్రద్ధగా విను.


దైవీ సంపద
(Divine Qualities to be manifested during the opportunities given by the life)


మూల శ్లోకము


అధ్యయన వ్యాఖ్యానము


ఉపన్యాసము

శ్రీ భగవాన్ ఉవాచ :-

16–01

అభయం సత్త్వసంశుద్ధిః జ్ఞానయోగవ్యవస్థితిః ।
దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవమ్ ॥

అభయం, సత్త్వసంశుద్ధిః, జ్ఞానయోగ వ్యవస్థితిః ।
దానం, దమః చ, యజ్ఞః చ, స్వాధ్యాయః, తప, ఆర్జవమ్ ॥

శ్రీకృష్ణ భగవానుడు :-

1.) అభయం (Fearlessness) : ముందుగా భయము-పిరికితనము-నీరసము దరిజేరనీయరాదు. ‘‘తల్లి గర్భంలో రక్షించిన పరమాత్మ సర్వదా రక్షిస్తూనే ఉంటారుకదా!’’… ఈ రీతిగా భగవదనుగ్రహంపై నమ్మకంతో ధైర్యం వహించి ఉండాలి. ‘‘అయ్యో! భవిష్యత్తు సంగతేమిటి? ఏమౌతుందో? ఎట్లాగో? గతిఏమిటి? ఉన్నవేవో పోతాయేమో? లేని నష్టాలు-ఆపదలు వచ్చిపడతాయోమో?’’… ఇటువంటి అధైర్యముతో కూడిన ఆలోచనలతో జీవుని విలువైన కాలం వృథా అవుతోంది. కనుక, ముందు ధైర్యం సర్వదా గూడుకట్టుకొని ఉండే ఆలోచనలను పరిపుష్టిచేసుకో. (నాయమాత్మా బలహీనేన లభ్యః - ఉపనిషత్‌). మహనీయులు “భగవదనుగ్రహానుసారం రావలసింది వస్తూవుంటుంది, పోవలసింది పోతూ వుంటుంది” అని అభయులై ఉంటారు.

2.) సత్త్వ సంశుద్ధిః (Positive Attitude) : అంతఃకరణము సాత్వికమైన భావాలతో పవిత్రంగా ఉంచుకోవాలి. ‘‘కోపము - ఆవేశము - కసి - ద్వేషము - ఎదుటి వారిలో తప్పులుపట్టుకోవటం - దూషించటం - తప్పులు గుర్తుచేసుకొని రోజులతరబడి మాట్లాడుకోవటం’’… ఇవన్నీ స్వకీయ గుణదోషములుగా గ్రహించి, అట్టి అభ్యాసములను ఉపసంహరించుకోవటం అభ్యసించాలి. గుణములు పరమాత్మయొక్క జగత్‌ కల్పనా చమత్కారం అను అవగాహనతో, తాను మాత్రం సత్వగుణశీలుడై బుద్ధిని నిర్మలం చేసుకుంటూ ఉండుగాక!

3.) జ్ఞానయోగ వ్యవస్థితః (Keeping Wisdom) : జ్ఞాన మార్గము అనుసరణీయం. అజ్ఞాన మార్గము తిరస్కరణీయం. ప్రపంచంలో కొద్దిమంది జ్ఞానులు, అనేకమంది అజ్ఞానులు ఉండటం జగత్‌ స్వభావం. జ్ఞానులే జీవులకు మార్గ దర్శకులు. ఇక్కడి సంగతి - సందర్భము - వ్యవహారములను జ్ఞానదృష్టితో పరికించాలి. అజ్ఞాన దృష్టితో కాదు. మహనీయుల జ్ఞానవాక్యములను - ఆత్మజ్ఞానశాస్త్ర ప్రవచనములను మననం చేయాలి. సమాలోచన చేయాలి. అంతేగాని, ‘‘వాళ్లు మంచివారు కాదు! వీరి బుద్ధులు ఇంతే! వీరే ఇట్లా చేస్తుంటే, ఇక నేనెందుకు తప్పులు చేయకూడదు?’’… ఇటువంటి అజ్ఞాన జనిత ఉద్వేగాలను సమాలోచన చేయటం శ్రేయం కాదు. ఒక విద్యార్థి తనకన్నా బాగా చదివే వారినే ప్రమాణంగా తీసుకోవాలి. అంతేగాని, ‘‘చదవనివాళ్ళు ఎంతమంది లేరులే!’’… అని అనుకోకూడదు కదా!

4.) దానం (Giving Attitude) : ‘‘ఇతరులకు నేనేమి ఇస్తున్నాను?’’.. అను ప్రశ్న దానబుద్ధి నుండి వస్తోంది. ‘‘ఇతరులు నాకేమి ఇచ్చారు?’’… అనేది దానవబుద్ధి. ఆసురీస్వభావ బీజం. ‘‘నాకు ఇవ్వబడుచున్న దానిలో కొంతైనా స్వామి స్వరూపులగు తదితరులకు సమర్పిస్తాను’’.. అనే స్వభావం దైవీసంపద. ద = ఇచ్చుట. ఆనం = మోక్షమార్గం. దానం చేసే స్వభావం దేవతల ఆశీర్వాదానికి అర్హత ప్రసాదిస్తుంది.

5.) దమః (Control over Body Functions) : ‘‘అది కావాలి - ఇది పొందాలి?’’ అనే కోరికల పరంపరలను క్రమంగా జయించాలి. ఇంద్రియనిగ్రహమును అభ్యసించాలి. దూర ప్రయాణం చేసేవాడు దారిలో అనారోగ్యకరమైన పదార్థాలను అతిగా మ్రింగుతుంటే ఏమౌతుంది? ప్రయాణం దుఃఖప్రదమౌతుంది కదా! ఇంద్రియ విషయములపట్ల నిరోధము అభ్యసించకపోతే ‘‘స్వస్వరూప భావానందం - ఆత్మసాక్షాత్కారం’’ వైపు ప్రయాణం కొనసాగటం కుంటుపడుతూ ఉంటుంది.

6.) యజ్ఞః (Commitment to Team Fuctions) : పదిమందిలో ఒకడై, పదిమంది కోసం నిర్వర్తించేదే యజ్ఞకర్మ. యజ్ఞభావంతో, తదితరుల సుఖసంతోషాలను, సామాజిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కర్మలను నిర్వర్తించటం, దేవతలను పూజించటం, గురువులను సేవించటం, వేదప్రతిపాదిత అగ్నిహోత్రాది ఉత్తమ కార్యాచరణం మొదలైన కర్మలు ప్రవృద్ధం చేసుకుంటూ ఉండటం దైవీ సంపత్తిని ప్రవృద్ధం చేస్తాయి.

7.) స్వాధ్యాయః (Chanting and Self Study) : తత్వ శాస్త్ర గ్రంథాలను పఠించటం, పరిశీలించటం, వేదాంత పఠనం, స్తోత్ర - శ్లోక గానం, పరమాత్మ లీలల సంగీత లహరి - ఇవన్నీ దైవీ సంపత్తిని బలపరుస్తాయి. బుద్ధిని మృదు మధురంగా తీర్చిదిద్దుతాయి.

8.) తపః (Constant Application of Thought) : పరమాత్మ గురించిన తపనయే తపస్సు. పరమాత్మ గురించిన ధ్యాసయే ధ్యానం. ధ్యానము, నామపారాయణము వంటి తపోవిధాన అభ్యాసములను ప్రవృద్ధ పరచుకోవాలి.

9.) ఆర్జవం (Plain Character) : అకుటిలత్వము, మనోవాక్కాయములందు ఒకేరీతిగా భావన. ఐనవారిపట్ల-కానివారిపట్ల ఒకే ప్రమాణం. శరీర-మనో-ఇంద్రియములందు సరళత్వం పరిపోషించుకోవటం. అంతఃకరణంలో సౌమ్యత. సత్యమును ఉపాసించటం.

16–02

అహింసా సత్యమక్రోధస్త్యాగః శాన్తిరపైశునమ్ ।
దయా భూతేష్వలోలుప్త్వం మార్దవం హ్రీరచాపలమ్ ॥

అహింసా, సత్యమ్, అక్రోధః, త్యాగః, శాంతిః, అపైశునమ్ ।
దయా భూతేషు, అలోలుప్త్వం, మార్దవం, హ్రీః, అచాపలమ్ ॥

10.) అహింస (Non-violence) : తదితర జీవులను శారీరకంగాకాని, మానసికంగాకాని బాధించకుండటం.

11.) సత్యం (Practising Truthfulness) : ప్రియముగా సంభాషించటం. సత్యాసత్యములను వివేక దృష్టితో గమనించగలగటం. నిత్యానిత్యములను విభాగించి దర్శించటం. సత్యమేవ జయతే । న అనృతః ॥ యమ్‌ సత్‌ ఇతి సత్యమ్‌! ఏది సత్‌ రూపమో అదియే (ఆత్మయే) సత్యము!

12.) అక్రోధం (Sans Anger and Sans Revenge) : ఇతరులపై క్రోధము - పరుషత్వము - దుర్భావములు మనస్సునందు కలిగి ఉండకపోవటం.

13.) త్యాగః (Sacrificing Tendency) : ‘‘ఇదంతా నాది కాదు. పరమాత్మది’’ అని గ్రహించి ఉండటం. ఇతరుల కొరకై ‘త్యాగం’ చేయటానికి మనస్సులో సంకల్పము కలిగి ఉండటం. తదితర జీవులను ‘ఉపాసన’ భావంతో చూస్తూ సేవానిరతి కలిగి ఉండటం.

14.) శాంతి (Keeping Calmness) : ప్రశాంత స్వభావం అభ్యసిస్తూ ఉండటం. ఆవేశకావేశాలతో హృదయమును ఆశాంతి చేసుకోకపోవటం.

15.) అపైశునము (Non-cruelty) : ఇతరులను నిందించకపోవటం. ఉద్దేశ్య పూర్వకంగా బాధించాలనుకోకపోవటం. ఇతరుల లోపాలను అర్థం చేసుకొని ‘తల్లి’వలె ప్రేమచూపటం. ఇతరులకు బాధగా వుంటుందేమో!…. అనునది గమనించి, మరీ ప్రవర్తించటం, సంభాషించటం. బాధ కలిగించక పోవటం.

16.) భూతేషు దయా (Kindness) : సహజీవులపట్ల నిర్హేతుకమైన జాలి - దయ - కరుణ - ప్రేమ పెంపొందించుకోవటం.

17.) అలోలుప్తం (Non-attached) : ఇంద్రియ విషయాల పట్ల అనాసక్తులై ఉండటం.

18.) మార్దవమ్‌ (Softness) : పలుకులో - ప్రవర్తనలో కోమలత్వము, సౌకుమార్యము.

19.) హ్రీ (Shy from Bad Deeds): ’‘నేను చిన్నవాడిని. నాకన్నా కూడా జ్ఞానులు-భక్తులు-విజ్ఞులు అనేకులు మహనీయులు ఉన్నారు. నాకన్నా కష్టపడేవారు ఉన్నారు. నాకన్నా ధన-సంపదలు లేనివారూ ఉన్నారు…. నాకంటే కూడా మంచిపనులు చేసేవారు ఎంతమంది లేరు!’’ అని గమనించటం. అణుకువ కలిగి ఉండటం. తనకన్న గొప్పవారిని మార్గదర్శకులుగా మానసికంగా స్వీకరించటం!

20.) అచాపలమ్‌ (Undistracted from Sensory Delusions that Cause Degradation) : చంచలబుద్ధి కలిగి ఉండకపోవటం. జిహ్వ మొదలైన ఇంద్రియ చాపల్యమును జయించుచున్నవారై వుండటం.

16–03

తేజః క్షమా ధృతిః శౌచమద్రోహో నాతిమానితా ।
భవన్తి సమ్పదం దైవీమభిజాతస్య భారత ॥

తేజః, క్షమా, ధృతిః, శౌచమ్, అద్రోహో, న అతిమానితా ।
భవంతి సంపదం దైవీం అభిజాతస్య, భారత! ॥

21.) తేజః (Activeness and Alertness) : బుద్ధి ఎప్పుడూ జాగరూకమై ఉత్సాహవంతంగా ఉండటం.

22.) క్షమః (Excusing others for their mistakes) : ఇతరుల తప్పులను మన్నించగలగటం.

23.) ధృతిః (Courage and Being Initiative) : ధైర్యము - ఉత్సాహము - సాహసము - నైపుణ్యములను ఆశ్రయించటం.

24.) శౌచమ్‌ (Purity in Thought) : శుచి అయిన - ఆరోగ్యమైన భావములను, అభిప్రాయములను పెంపొందించుకొంటూ ఉండటం.

25.) అద్రోహః (Sans Cunningness) : ఇతరులకు నష్టపరచాలని, ద్రోహంచేయాలని, కష్టపెట్టాలని అనుకోకపోవటం.

26.) న అతిమానితః (Not Boasting) : తనను తానే ‘‘నేను చాలా కష్టపడుచున్నాను. నేను గొప్పవాడిని. నేను అర్హతగలవాడిని. ఇతరులు కారు.’’ … అని భావించకపోవటం.

ఓ అర్జునా! దైవీ సంపద ప్రవృద్ధమగుచూ ఉండగా ఈ ఈ గుణ సంపద అట్టి జీవునిలో అధికమగుచూ ఉంటుంది.ఆసురీ సంపద
(Negative Qualities to be get rid of during the opportunities given by the life)


మూల శ్లోకము


అధ్యయన వ్యాఖ్యానము


ఉపన్యాసము

16–04

దంభో దర్పోఽభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ ।
అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీమ్ ॥

దంభో, దర్పో, అభిమానః చ, క్రోధః, పారుష్యం ఏవ చ ।
అజ్ఞానం చ, అభిజాతస్య, పార్థ! సంపదమ్ ఆసురీమ్ ॥

1.) దంభః : కపటము, మోసము.

2.) దర్పః : గర్వము, ఆత్మస్తుతి, పరనింద.

3.) అభిమానః : దురహంకారము, దురభిమానము

4.) క్రోధః : కోపము, ఆవేశము, ఉద్వేగము, పగ.

5.) పారుష్యం : మాటలో కరుకుదనం. దెప్పిపొడవటం. తప్పులు ఎత్తి గేలిచేయటం. ఇతరులు బాధపడేటట్లు సంభాషించటం.

6.) అజ్ఞానం : నిజానిజాలు వివేచించకపోవటం. అర్థం చేసుకోవటానికి ప్రయత్నించక దుర్భావములు కొనసాగించటం (Poor and weak means of analysing the situations). అవివేకముతో కూడిన ఆవేశము.

7.) ఆభిజాత్యం : ‘‘మా పుట్టుక గొప్పది. మేము గొప్పవాళ్లం’’ … ఇటువంటి భావావేశాలు. ఇతరులను ఎగతాళి చేయటం. అవమానించటం. జాత్యహంకారంతో పరులను బాధించటానికి, హింసించటానికి సిద్ధపడటం.

ఇవన్నీ జీవునిలో ఆసురీ సంపద యొక్క ప్రవృద్ధికి సంజ్ఞలు అయిఉన్నాయి.

16–05

దైవీ సంపద్విమోక్షాయ నిబన్ధాయాసురీ మతా ।
మా శుచః సంపదం దైవీమభిజాతోఽసి పాణ్డవ ॥

దైవీ సంపత్ విమోక్షాయ, నిబంధాయ ఆసురీ మతా ।
మా శుచః సంపదం దైవీం అభిజాతో అసి, పాండవ! ॥

నాయనా! అర్జునా!

దైవీసంపద ఈ జీవుని సంసారవృక్షము నుండి విముక్తి ప్రసాదిస్తోంది.

ఆసురీ సంపదయో? ఈతనిని సంసారవృక్షమునకు కట్టిపడవేసి ఉంచుతోంది.

అందుచేత - నీవు బద్ధకము, ఆలస్యము, ఆదుర్దాలను త్యజించు. దైవీసంపద వృద్ధి పొందే ప్రయత్నములను అధికం చేసుకో. కాలాన్ని వృథాగా వ్యర్థం చేసుకోకు.

16–06

ద్వౌ భూతసర్గౌ లోకేఽస్మిన్ దైవ ఆసుర ఏవ చ ।
దైవో విస్తరశః ప్రోక్తః ఆసురం పార్థ మే శ్రృణు ॥

ద్వౌ భూతసర్గౌ లోకే అస్మిన్ దైవ ఆసుర ఏవ చ ।
దైవో విస్తరశః ప్రోక్తః ఆసురం, పార్థ! మే శ్రృణు ॥

ఈ విధంగా ఈ లోకంలో జీవులు దైవీ-ఆసురీ సంపదలను జన్మజన్మలుగా ఆర్జించుకొని ఉండటం జరుగుతోంది.

ఈ దైవీ-ఆసురీ సంబంధమైన రెండు రకాల సంపదలు ఈ జీవుని జన్మతః వెంటనంటి వున్నాయి.

దైవీ సంపద గురించి వివరణ పూర్వకంగా చెప్పాను. ఇక ఆసురీ సంపద గురించి మరికొంత సవివరంగా చెప్పుచున్నాను. విను.

16–07

ప్రవృత్తిం చ నివృత్తిం చ జనా న విదురాసురాః ।
న శౌచం నాపి చాచారో న సత్యం తేషు విద్యతే ॥

ప్రవృత్తిం చ, నివృత్తిం చ జనా న విదుః ఆసురాః ।
న శౌచం, న అపి చ ఆచారో, న సత్యం తేషు విద్యతే ॥


ఆసురీ సంపద స్వభావాలు - అభ్యాసాలు :

ఆసురీ సంపద అధికం అగుచుండగా అట్టి జీవుడు -

👹 ‘‘దేనియందు ప్రవృత్తి శుభప్రదం? దేనినుంచి నివృత్తి శుభప్రదం?’’ అనే వివేచన చేయటం లేదు.

👹 అశుచి అయిన భావాలు ఆశ్రయిస్తూ, క్రమంగా ఉత్తమ ఆచారములకు - ప్రవర్తనలకు - అవగాహనలకు దూరదూరంగా జరుగుచున్నాడు.

👹 ‘‘అసలు సత్యాసత్యాలు - నిత్యానిత్యాలు ఏమిటి?’’… అనే విచక్షణను క్రమక్రమంగా కోల్పోవుచున్నాడు.

16–08

అసత్యమప్రతిష్ఠం తే జగదాహురనీశ్వరమ్ ।
అపరస్పరసమ్భూతం కిమన్యత్కామహైతుకమ్ ॥

అసత్యమ్ అప్రతిష్ఠం తే జగత్ ఆహుః అనీశ్వరమ్ ।
అపరస్పరసంభూతం, కిమ్ అన్యత్? కామ హైతుకమ్ ॥

ఆసురీసంపదను పెంపొందించుకొనువాడు -

👹 సత్యమును వదలి అసత్యమును - భ్రమపూర్వక విశేషాలను ఆశ్రయిస్తున్నాడు. క్షణానికొక బుద్ధిని కలిగి ఉంటున్నాడు.

👹 ‘‘ఈ జగత్తే ఉన్నది. ఈశ్వరుడు లేడు’’… అని నమ్మటం - కేకలు వేయటం ప్రారంభిస్తున్నాడు.

👹 ‘‘ఈ జనులంతా స్త్రీ - పురుష సంయోగం వలన ఉత్పత్తి అగుచున్నారు. ఇంతకు మించి వేరే సృష్టికర్త లేడు’’…. అనే నిర్ణయాలను, నిరీశ్వర వాదాన్ని, మిథ్యా సిద్ధాంతాలను అపరిశీలనాత్మకంగా ఆశ్రయించినవాడై ఉంటున్నాడు.

16–09

ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మానోఽల్పబుద్ధయః ।
ప్రభవన్త్యుగ్రకర్మాణః క్షయాయ జగతోఽహితాః ॥

ఏతాం దృష్టిం అవష్టభ్య నష్టాత్మానో, అల్పబుద్ధయః ।
ప్రభవంతి ఉగ్రకర్మాణః, క్షయాయ జగతో, అహితాః ॥

👹 ప్రాపంచిక విషయాలను - సంబంధాలను - అనుబంధాలను - బాంధవ్యాలను ఆవేశపూర్వకంగా ఆశ్రయించి అల్పబుద్ధితో జీవితములను గడపివేస్తున్నారు.

👹 తత్త్వ విషయాలను, తత్త్వవేత్తలను అధిక్షేపించటానికే సంసిద్ధుడగుచున్నాడుగాని, సత్యము గురించి అన్వేషించటం కాదు.

👹 ఆతడు క్రూర కర్మలను అవిచక్షణా పూర్వకంగా నిర్వర్తిస్తూ పర్యవసానములను గురించి యోచనయే చేయటం లేదు. ‘‘తదితర జీవులను దూషించటం. బాధించటం, వేధించటం, అవమానించటం’’ - ఇటువంటి అలవాట్లను అనాలోచనా పూర్వకంగా కొనసాగిస్తున్నాడు.

👹 సహజీవులను బాధించటానికై శ్రమించి తపో శక్తులను సంపాదించి మరీ, క్రూరకర్మలందు నిమగ్నమగుచున్నాడు. జగత్తును పీడించటానికి సంసిద్ధుడగుచున్నాడు.

👹 జగత్‌ - కళ్యాణానికి బదులుగా జగత్‌ అహితము కొరకై జన్మలు పొంది క్రూర కర్ముడై ఉంటున్నాడు.

16–10

కామమాశ్రిత్య దుష్పూరం దంభమానమదాన్వితాః ।
మోహాద్గృహీత్వాసద్గ్రాహాన్ప్రవర్తన్తేఽశుచివ్రతాః ॥

కామమ్ ఆశ్రిత్య, దుష్పూరం, దంభ-మాన-మద-అన్వితాః ।
మోహాత్ గృహీత్వా, అసత్ గ్రాహాన్, ప్రవర్తంతే అశుచివ్రతాః ॥

👹 దంభమును, గర్వమును మనసంతా నింపుకొని అంతులేని కోరికలను పెంపొందించుకుంటున్నాడు.

👹 మాన - మద - గర్వాలతో సంచరిస్తున్నాడు.

👹 అసత్యములగు మిథ్యా సిద్ధాంతములను, మిథ్యా నిర్ణయములను స్వీకరించినవాడై మోహ-మద-గర్వములను అనుక్షణికంగా ఉపాసిస్తున్నాడు.

👹 అశుచికరమైన హావభావాలు ప్రవృద్ధం చేసుకుంటున్నాడు.

👹 ‘‘సహజీవులకు హాని చేయటం, బాధించటం, అపకారాలు చేసే బుద్ధులతో సమాలోచనలు చేయటం’’.. ఇటువంటి కార్యక్రమ - వ్యవహార - ఆలోచనలను పెంపొందించుకొంటున్నాడు.

16–11

చిన్తామపరిమేయాం చ ప్రలయాన్తాముపాశ్రితాః ।
కామోపభోగపరమా ఏతావదితి నిశ్చితాః ॥

చింతామ్ అపరిమేయాం చ ప్రలయాంతాం ఉపాశ్రితాః ।
కామ ఉపభోగ పరమా, ఏతావత్ ఇతి నిశ్చితాః ॥

👹 ‘‘విషయ భోగములే జీవితసారం. వాటిని ఎట్లాగైనా పొందాలి. అందుకు ఏది చేసినా తప్పు ఏమీ లేదు’’… అను నిశ్చితాభిప్రాయములు పెంపొందించుకొని ఉంటున్నాడు.

👹 చావు వచ్చి గుమ్మాన నిలుచునేంత వరకు అంతులేని దురాలోచనలను కొనసాగిస్తూ ఆయష్షును దుర్వినియోగపరచుకుంటున్నాడు.

👹 దుష్టభావాలను ఉపాసిస్తూ కామ - క్రోధాలను ప్రవృద్ధం చేసుకుంటున్నాడు.

16–12

ఆశాపాశశతైర్బద్ధాః కామక్రోధపరాయణాః ।
ఈహన్తే కామభోగార్థమన్యాయేనార్థసఞ్చయాన్ ॥

ఆశా-పాశ-శతైః బద్ధాః, కామక్రోధ పరాయణాః ।
ఈహన్తే కామభోగార్థం అన్యాయేన అర్థసంచయాన్ ॥

👹 ఒకటి కాదు, రెండు కాదు. వందలవేల ఆశలకు నిబద్ధుడై జీవితములు గడపివేస్తున్నాడు.

👹 కామ - క్రోధ పరాయణుడై లోకంలో ఇష్టం వచ్చిన రీతిగా ప్రవర్తించుటకు సంసిద్ధుడగుచున్నాడు.

👹 ‘‘మనం అనుభవించటం కోసమే జీవితం. అందుకు ఇతరుల సంపదలను సంగ్రహిస్తే మాత్రం తప్పేమున్నది?’’…. అని తలచి తన కోరికలను తీర్చుకోవాలని సిద్ధపడుచున్నాడు. అన్యాయంగానైనా సరే, సంపదలు పెంచుకోవటానికి తప్పులేదులే? అని అనుకుంటూ సంసిద్ధపడుచున్నాడు.

16–13

ఇదమద్య మయా లబ్ధమిమం ప్రాప్స్యే మనోరథమ్ ।
ఇదమస్తీదమపి మే భవిష్యతి పునర్ధనమ్ ॥

ఇదమ్ అద్య మయా లబ్ధమ్, ఇమం ప్రాప్స్యే మనోరథమ్ ।
ఇదమ్ అస్తి, ఇదమ్ అపి మే భవిష్యతి పునః ధనమ్ ॥

→ ఇదిగో…, ఇంతవరకు నా చేత పొందబడినాయి.

→ ఇక ఇవన్నీ నేను పొందవలసి ఉన్నది.

→ ఇది ఇంతవరకే ఉన్నది. ఇంకా అంత సంపాదించవలసి ఉన్నది.

→ ఇది ముందు ముందు పెంపొందవలసియున్న నా సంపద.

16–14

అసౌ మయా హతః శత్రుర్హనిష్యే చాపరానపి ।
ఈశ్వరోఽహమహం భోగీ సిద్ధోఽహం బలవాన్సుఖీ ॥

అసౌ మయా హతః శత్రుః, హనిష్యే చ అపరాన్ అపి ।
ఈశ్వరో అహమ్, అహం భోగీ, సిద్ధో అహం, బలవాన్, సుఖీ ॥

→ వీరు మనకు గిట్టనివారు.

→ వారి అంతు చూచాను. ఇక వీరి అంతు చూడబోవుచున్నాను.

→ మిగతావాళ్ల సంగతి కూడా త్వరలోనే చూడబోతున్నానులే!

→ నేనే అంతటికీ కర్తను. యజమానిని. నేనే, ఈశ్వరుడను.

→ నేను యజమానిని. వీళ్లంతా నా క్రింద క్రింద వాళ్లు. వీరు వీరంతా నాకు ‘దాసోఽహం’ అంటున్నవారు. అనవలసినవారు. అని తీరవలసిందే మరి!

→ నేనే అన్నీ అనుభవిస్తాను. భోగిని.

→ అన్నీ నాకు తెలుసు. నేనే తెలివిగలవాడిని! అన్నీ నాకు సిద్ధించాయి. సిద్ధిస్తాయి కూడా! ఎవరు ఎట్లా పోతే నాకేం?

→ నా ప్రక్కన ఎవ్వరూ నిలువలేరు. బలవంతుడను. నేను సుఖపడవలసినవాడను. నా అంతగా ఎవ్వరూ ఏదీ అనుభవించలేరు. సముపార్జించలేరు! సంపాదిచకూడదు!

16–15

ఆఢ్యోఽభిజనవానస్మి కోఽన్యోఽస్తి సదృశో మయా ।
యక్ష్యే దాస్యామి మోదిష్య ఇత్యజ్ఞానవిమోహితాః ॥

ఆఢ్యో, అభిజనవాన్ అస్మి, కో అన్యో అస్తి సదృశో మయా ।
యక్ష్యే, దాస్యామి, మోదిష్య ఇతి అజ్ఞాన విమోహితాః ॥

→ గొప్పవాడిని నేనే! నా అంతవారు ఎవరున్నారు? సేవకులు - బంధుజనులు - మాట వినేవారు… వీరంతా నాకున్నారు.

→ ఈ చుట్టుప్రక్కల - ఇక్కడెక్కడా నా అంతవారు లేరు.

→ చెప్పుకోకూడదు గానీ,… నాతో ఎవరు సమానం చెప్పండి?

→ గొప్ప పూజలు - దానాలు - యజ్ఞాలు నేనే చేయగలవాడను.

→ ఇదిగో! ఈఈ దానాలు నేను చేసాను. అందరికీ నేనే సంతోషం కలుగజేయగలిగేవాడిని. నా అంతగా ఎవరు చేస్తున్నారు? ఎవరున్నారు?

… ఈ విధంగా అనేక అజ్ఞాన పరంపరా భావాలచే ఆతడు విమోహితుడై చరిస్తున్నాడు.

16–16

అనేకచిత్తవిభ్రాన్తాః మోహజాలసమావృతాః ।
ప్రసక్తాః కామభోగేషు పతన్తి నరకేఽశుచౌ ॥

అనేక చిత్తవిభ్రాంతాః, మోహజాల సమావృతాః ।
ప్రసక్తాః కామభోగేషు, పతంతి నరకే అశుచౌ ॥

👹 అనేక చిత్త విభ్రాంతములలో మునిగి - తేలుచున్నాడు.

👹 మోహముల పరంపరా వలయంలో (Net or Mesh of Series of Illusionary Views) చిక్కుకుని ‘‘మేము హాయిగానే ఉన్నామే!’’ అంటూ చెప్పుకుంటూ పోతున్నాడు.

👹 ‘‘అది అనుభవించాం. ఇది అనుభవించబోతున్నాం’’… అని అనుకుంటూ అనేక కామ - ఉపభోగ రచనలలో ఇరుక్కుని ఉంటున్నాడు.

👹 ‘‘ఇది ఇంతే’’ అని అనుకుంటూ విచక్షణా రహితంగా వర్తిస్తున్నాడు.

👹 ‘‘నాకు చెప్పేంతవారా?’’ అని చెప్పుకుంటూ, ఎవ్వరు ఏది చెప్పినా విన తిరస్కరిస్తున్నాడు.

16–17

ఆత్మసంభావితాః స్తబ్ధా ధనమానమదాన్వితాః ।
యజన్తే నామయజ్ఞైస్తే దంభేనావిధిపూర్వకమ్ ॥

ఆత్మసంభావితాః, స్తబ్ధా, ధన-మాన-మద-అన్వితాః ।
యజంతే నామయజ్ఞైః తే దంభేన అవిధిపూర్వకమ్ ॥

ఓ అర్జునా! అట్టి సంపత్తిచేత పర్యవసానం ఏమిటి? అశుచితో కూడిన అనేక నరకస్థితులవైపుగా ఆ జీవుడు పరుగులు తీస్తున్నాడయ్యా.

👹 ‘‘నేనే గొప్పవాడిని. వారు - వీరు తుచ్ఛులు’’ అని ఆతడు తనను తానే గొప్పనుకుంటూ చరిస్తున్నాడు.

👹 గర్విష్ఠుడై నిజానిజాల గురించి స్థబ్దులై ఉంటున్నాడు.

👹 ధన - మాన - మద గర్వితుడై చరిస్తున్నాడు.

👹 ఏదో పేరుకోసం - ప్రతిష్ఠకోసం అవిధిపూర్వకంగా కార్యాలు ఆచరిస్తూ ఉన్నాడు. ప్రచారం కోసం యజ్ఞాలు చేస్తున్నాడు.

16–18

అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః ।
మామాత్మపరదేహేషు ప్రద్విషన్తోఽభ్యసూయకాః ॥

అహంకారం, బలం, దర్పం, కామం, క్రోధం చ సంశ్రితాః ।
మామ్ ఆత్మ-పరదేహేషు ప్రద్విషంతో అభి అసూయకాః ॥

👹 “అహంకారము - బలము - దర్పము - కామము - క్రోధము”లచే ఆతని వివేకమంతా ఆవరించినదై ఉంటోంది.

👹 మాన - మద గర్వితుడై దుష్ట క్రియలను ఆచరించుచున్నాడు.

👹 అసూయాపరుడై చరిస్తూ, క్రమంగా తనయందు వేంచేసియున్న పరమాత్మనగు నన్ను ద్వేషిస్తూ, నన్ను దూరం చేసుకొంటున్నాడు.

16–19

తానహం ద్విషతః క్రూరాన్సంసారేషు నరాధమాన్ ।
క్షిపామ్యజస్రమశుభానాసురీష్వేవ యోనిషు ॥

తాన్ అహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ ।
క్షిపామి అజస్రమ్ అశుభాన్ ఆసురీషు ఏవ యోనిషు ॥

అధమ తరగతి (Lower Strata) :

ఓ అర్జునా! ఆ విధంగా ‘‘ద్వేషము - క్రూరత్వము’’ మొదలైన ఆసురీ గుణములు తమ స్వభావంగా కలవారు మానవజాతిలో అధమ తరగతికి చెందినవారు.

వారిని మరల మరల ఆసురీ యోనులలోకి నేను విసరివేస్తూ ఉంటాను.

16–20

అసురీం యోనిమాపన్నా మూఢా జన్మని జన్మని ।
మామప్రాప్యైవ కౌన్తేయ తతో యాన్త్యధమాం గతిమ్ ॥

అసురీం యోనిమ్ ఆపన్నా మూఢా జన్మని జన్మని ।
మామ్ అప్రాప్య ఏవ, కౌంతేయ! తతో యాంతి అధమాం గతిమ్ ॥

ఆసురీ యోనులలో జన్మలను ఆ విధంగా పొందుతూ పొందుతూ, మూఢ మార్గములను ఆశ్రయిస్తూ, ఆనందమయ ఆత్మస్వరూపుడనగు నన్ను ఏమరచి ఆతడు సుదీర్ఘ దేహపరంపరా ప్రయాణాలు చేయవలసి వస్తోంది.

అధమాధమ గతులకు, అజ్ఞానపూరిత జన్మలకు ఆతడు తనకు తానే త్రోవ చేసుకుంటున్నాడు. అజ్ఞానముతో కూడిన ఉపాధిసహస్రములు పొందుచున్నాడు.


ఆసురీ సంపదను త్యజించి, దైవీ సంపదను వృద్ధి చేసుకోవాలి!


మూల శ్లోకము


అధ్యయన వ్యాఖ్యానము


ఉపన్యాసము

16–21

త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః ।
కామః క్రోధస్తథా లోభస్తస్మాదేతత్త్రయం త్యజేత్ ॥

త్రివిధం నరకస్య ఇదం ద్వారం నాశనమ్ ఆత్మనః ।
కామః క్రోధః తథా లోభః, తస్మాత్ ఏతత్ త్రయం త్యజేత్ ॥


త్రివిధ నరక ద్వారములు :

ఓ ఫల్గుణా! ‘‘అజ్ఞాన పూరిత జన్మలు’’ అనబడే నరక స్థితికి దారితీయగల ద్వారాలు మూడు.

1.) కామము : ‘‘ఏదో కావాలి - ఏదో పొందాలి’’ - అనే భావావేశం వృద్ధి చేసుకోవటం. ‘‘ప్రాపంచికమైన దృశ్యసంబంధమైన’’ కోరికలను పెంపొందించుకోవటం.

2.) క్రోధము : సహజీవులపై క్రోధము, ఆవేశము ప్రదర్శించటం. హింసించు - బాధించు స్వభావము.

3.) లోభము : ‘‘ఇవన్నీ నావే! నాకే ఉండాలి’’… అనే లోభ గుణం.

అందుచేత, సత్యావగాహన - ఆనందము కోరుకొనే జీవుడు దుఃఖమార్గములగు కామ - క్రోధ - లోభములను సర్వప్రయత్నములతో త్యజించాలి!

16–22

ఏతైర్విముక్తః కౌన్తేయ తమోద్వారైస్త్రిభిర్నరః ।
ఆచరత్యాత్మనః శ్రేయస్తతో యాతి పరాం గతిమ్ ॥

ఏతైః విముక్తః, కౌంతేయ! తమో ద్వారైః త్రిభిః నరః ।
ఆచరతి ఆత్మనః శ్రేయః తతో యాతి పరాం గతిమ్ ॥

తమోగుణ నిర్మితములైన ఈ మూడు “కామ - క్రోధ - లోభ” ద్వారములను మూసివేసికొంటూ అటువైపుగా ఎవ్వరు అడుగులు వేయరో…, అట్టివారు తమకు తాము శ్రేయస్సును కలుగజేసుకొన్నవారగుచున్నారు.

16–23

యః శాస్త్రవిధిముత్సృజ్య వర్తతే కామకారతః ।
న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిమ్ ॥

యః శాస్త్రవిధిమ్ ఉత్సృజ్య వర్తతే కామకారతః ।
న స సిద్ధిమ్ అవాప్నోతి, న సుఖం న పరాం గతిమ్ ॥


శాస్త్ర ప్రవచనానుసారం

ఓ అర్జునా! శాస్త్రములు మానవ జాతియొక్క మనుగడకై, శ్రేయస్సుకై మహనీయులగు అనుభవజ్ఞులచే ప్రవచనం చేయబడ్డాయి. అవి మానవాళికి ఏమేమి నిర్వర్తించాలో (విధి), ఏమేమి నిర్వర్తించకూడదో (నిషేధం) చెప్పుచున్నాయి.

అట్టి కార్య - అకార్యములను ఆలకించి, పర్యాలోచన చేసి జీవుడు తన జీవితాన్ని శాస్త్రప్రవచనానుకూల్యంగా మలచుకోవాలి. శాస్త్రానుకూలంగా ప్రవర్తన కలిగి ఉండాలి.

ఎవ్వడైతే శాస్త్ర ప్రవచనములను - నియమావళిని - కర్మ నిర్దేశ్యములను పెడచెవిని పెట్టి తనకు తానే ఏది అనుకూలమని అనిపిస్తే ఆ మార్గంలో సంచరించనారంభిస్తాడో…, అట్టివాడు ఇహమందుగాని, పరమందుగాని తాను ఆశించుచున్న సుఖ-శాంతులు పొందలేడు.

16–24

తస్మాచ్ఛాస్త్రం ప్రమాణం తే కార్యాకార్యవ్యవస్థితౌ ।
జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మ కర్తుమిహార్హసి ॥

తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్య-అకార్య-వ్యవస్థితౌ ।
జ్ఞాత్వా శాస్త్రవిధాన ఉక్తం, కర్మ కర్తుమ్ ఇహ అర్హసి ॥

అందుచేత ఓ పార్థా! ‘‘ఏమి చేయాలి? ఏమి చేయకూడదు? ఇప్పుడు యుద్ధం చేయాలా? చేయవద్దా?’’… మొదలైన సందర్భములలో ‘‘శాస్త్రములు ఏది చెప్పుచున్నాయి? ఏఏ ప్రమాణాలు నిర్ణయిస్తున్నాయి? నిర్దేసిస్తున్నాయి?’’… అని గమనించు.

శాస్త్రములు ఏ మార్గం చూపుచున్నాయో ఆ మార్గంలో కార్యాకార్యములు నిర్ణయించుకో. అంతేగాని, ఏవేవో అభిప్రాయములతో స్వధర్మ చ్యుతుడవు, సదవగాహన చ్యుతుడవు కారాదు సుమా!

శాస్త్ర విధివిధానములేమిటో పెద్దల వద్ద అభ్యసించి చేయవలసియున్న విధులను ఆచరించటం, చెయ్యరానివి చేయకపోటమే నీ నిర్ణయమగుగాక!

అంతేగాని, ‘‘ఇది చేస్తే ఏమిటి నాకు లాభం? నా కోరికలు ఆశలు తీరుతాయా? లేదా? ఏం పొందాలి? ఏదో కావాలి? వారికన్నా వీరికన్నా గొప్ప అని అనిపించుకోవాలి కదా? వారు అల్పులు - నన్ను దూషించారు. వారి-వీరి సంగతి చూడాలి’’… ఇటువంటివి కార్యాకార్యాములకు సంసిద్ధపడి కాకూడదు సుమా!

‘‘నా యిష్టం, నేను ఇంతే’’…… అని మూర్ఖత్వం వహించకూడదు.

శాస్త్రమే ప్రమాణంగా, స్వధర్మోన్ముఖుడై కార్య-అకార్యములు నిర్ణయించుకొనువాడు తప్పక ఆ మార్గంలో సిద్ధిని పొందగలుగుతాడు.


ఇతి శ్రీమత్‌ భగవద్గీతాసు … దైవ-అసుర సంపద్ విభాగ యోగ పుష్పః ।
శ్రీ సాంబ సదాశివ పాదారవిందార్పణమస్తు ॥
🙏