భగవద్గీత

17. శ్రద్ధాత్రయ విభాగ యోగ అధ్యయన పుష్పం

మూలము : శ్రీ వ్యాస మహర్షిచే విరచించబడిన జయము / మహాభారతము (భీష్మ పర్వము)

అధ్యయన వ్యాఖ్యానము : (అధ్యయన విద్యార్థి) యేలేశ్వరపు హనుమ రామకృష్ణ


Lord Krishna teaching Arjuna

మూల శ్లోకము


అధ్యయన వ్యాఖ్యానము


ఉపన్యాసము

అర్జున ఉవాచ :-

17–01

యే శాస్త్రవిధిముత్సృజ్య యజన్తే శ్రద్ధయాన్వితాః ।
తేషాం నిష్ఠా తు కా కృష్ణ సత్త్వమాహో రజస్తమః ॥

యే శాస్త్రవిధిమ్ ఉత్సృజ్య యజంతే శ్రద్ధయా-అన్వితాః ।
తేషాం నిష్ఠా తు కా, కృష్ణ! సత్త్వమ్ ఆహో రజః తమః? ॥

అర్జునుడు :

స్వామీ! శాస్త్రములు ప్రవచించిన, నిర్వచించిన మార్గంలో కార్యాకార్యములను నిర్ణయించుకొని నిర్వర్తించటంచేత మేము సిద్ధిని పొందగలగుతామని చెప్పారు.

శాస్త్ర ప్రవచనాలు - విధి నియమాలు అనుసరించకుండా కామ్యకర్మలు స్వీయాభిరుచిని అనుసరించి ఆశ్రయించటంచేత మేము ఇహ - పరములలో సంసిద్ధి పొందలేమని ప్రవచించారు!

మీరు మా శ్రేయోభిలాషి. కాబట్టే మాకు శ్రేయోవాక్యాలు బోధిస్తున్నారు.

అయితే,……. ఇప్పుడు నాదొక సందేహం.

శాస్త్రవిధి తెలియనట్టి శ్రద్ధ

ఒకానొకడు శ్రద్ధతో ఆయా కార్యములను నిర్వర్తిస్తూ ఉంటాడుగాని, శాస్త్రములు చెప్పిన విధి - విధానములను తెలిసియో - తెలియకయో - లేక పరిశీలించకయో… అనుసరించడనుకోండి! శాస్త్ర విధులను అనుసరించకయే శ్రద్ధతో కర్మలు నిర్వర్తించువారి నిష్ఠ ఎట్టిదో, ఏఏ ప్రయోజనములు ఉండటం జరుగుతుందో వివరించండి.

అట్టి శాస్త్ర విధిని సమీకరించుకొనని వారి యొక్క నిష్ఠ (their determination to function) సాత్వికమైన నిష్ఠయా? లేక రాజసికమైన నిష్ఠయా? లేక తామసికమైన నిష్ఠయా?

ఉదాహరణకు, ఒకడు -
↳ భగవంతుని పుష్పాలతో పూజిస్తాడు. కానీ, శాస్త్ర విధానములు కొన్ని అనుసరించడు.
↳ సంధ్యోపాసనను నిర్వర్తిస్తాడు. కానీ, శాస్త్రములచే చెప్పబడిన క్రమంలా తెలియకపోవచ్చు.
↳ దేవాలయాలు సందర్శిస్తాడు. కానీ ఆచార - నియమాదులను తెలిసో - తెలియకో ఆచరించకపోవచ్చు.
↳ కర్మలు శ్రద్ధగా నిర్వర్తిస్తాడు. కానీ, శాస్త్ర విధి - శాస్త్ర విధానాలు ఏమంతగా తెలియక అనుసరించడు.

… ఇటువంటి ఆయా కర్మోపాసనల సందర్భములలో శాస్త్రవిధి - నియమములు పాటించక, కానీ శ్రద్ధ - ఆసక్తి కలిగియే ఉంటాడనుకోండి. అట్టివాని శ్రద్ధ - నిష్ఠ ఎట్టిదో, ప్రయోజనములు ఏరీతిగా ఉంటాయో వివరించ ప్రార్థన.

శ్రీ భగవాన్ ఉవాచ :-

17–02

త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా ।
సాత్త్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శ్రృణు ॥

త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా ।
సాత్త్వికీ రాజసీ చ ఏవ తామసీ చ ఏతి, తాం శ్రృణు ॥

శ్రీకృష్ణ భగవానుడు :-

శ్రద్ధ - స్వభావం

ఓ అర్జునా! శ్రద్ధచేతనే ఒకడు సాధకుడగుచున్నాడు. శాస్త్రము ఈ జీవుని శ్రద్ధను పెంపొందించటానికి ఉద్దేశ్యిస్తున్నాయి. అందుకుగాను ఉపాయము-మార్గాలు సూచిస్తున్నాయి. నీవు అడిగినదానికి సమాధానంగా ‘‘శ్రద్ధ’’ యొక్క స్వభావము-ప్రయోజనములు ఏరీతిగా ఉంటాయో వివరిస్తున్నాను. విను.

ఎందుకంటే, ఈ జీవుని శ్రద్ధయే ఈతని యానాన్ని నిర్ణయిస్తోంది. ఈ దేహులు అనేక దేహయాత్రలు చేస్తూ వారి యొక్క ’‘స్వభావము’’ను వెంటనంటి ఉంచుకుంటున్నారు. ‘శ్రద్ధ’ నుండి ‘స్వభావం’ రూపు దిద్దుకుంటోంది.

అట్టి ఈ దేహులయొక్క స్వభావము మూడు రీతులుగా ఉంటోంది.

1. సాత్విక స్వభావము
2. రాజసిక స్వభావము
3. తామసిక స్వభావము.

అట్టి త్రివిధములైన స్వభావములగురించి వివరిస్తున్నాను.

17–03

సత్త్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత ।
శ్రద్ధామయోఽయం పురుషో యో యచ్ఛ్రద్ధః స ఏవ సః ॥

సత్త్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి, భారత! ।
శ్రద్ధామయో అయం పురుషో, యో యత్ శ్రద్ధః స ఏవ సః ॥

కొందరు కొన్నిటిపట్ల శ్రద్ధ వహించి ఉంటున్నారు. మరికొన్నిటి పట్ల అశ్రద్ధగా ఉంటున్నారు. ఇంకొందరు మరికొన్ని వేరే విషయములపై శ్రద్ధ చూపటం జరుగుతోంది. ఈ జీవులు ఈరీతిగా వివిధ విశేషములపై శ్రద్ధ కలిగి ఉంటున్నారు.

ఏ జీవుడు ఎట్టి శ్రద్ధ కలిగి ఉంటాడో, ఆతడు అట్టివాడే అగుచున్నాడు. శ్రద్ధ ఎటువైపుగా ఎక్కుబెట్టబడి ఉంటే, ఆ పురుషుడు కాలక్రమంగా అట్టివాడై ఉండటం జరుగుతోంది. శ్రద్ధనుబట్టే ఉపాసన - ఉపాసించబడుచున్న వస్తువు నిర్ణయమగుచున్నాయి.

17–04

యజన్తే సాత్త్వికా దేవాన్యక్షరక్షాంసి రాజసాః ।
ప్రేతాన్భూతగణాంశ్చాన్యే యజన్తే తామసా జనాః ॥

యజంతే సాత్త్వికా దేవాన్, యక్ష రక్షాంసి రాజసాః ।
ప్రేతాన్ భూతగణాన్ చ అన్యే యజంతే తామసా జనాః ॥

ఉదాహరణకు,

సాత్వికమైన శ్రద్ధగలవారు : దైవీసంపత్తిని పెంపొందించుకోవటం, లోకశ్రేయస్సును ఉద్దేశ్యించటం, కళ్యాణమూర్తులగు దేవతారూపములను ఉపాసించటం జరుగుతోంది.

రాజసికమైన శ్రద్ధగలవారు : యక్ష - రాక్షస గణములను బల-దర్ప-భౌతిక సంపదలకై ఉపాసిస్తున్నారు.

తామసికమైన శ్రద్ధగలవారు : ‘‘వశపరచుకోవాలి - బాధించాలి’’ ఇటువంటి ఉద్దేశ్యములతో ప్రేత - భూత గణములను ఉపాసిస్తున్నారు.

17–05

అశాస్త్రవిహితం ఘోరం తప్యన్తే యే తపో జనాః ।
దమ్భాహంకారసంయుక్తాః కామరాగబలాన్వితాః ॥

అశాస్త్రవిహితం ఘోరం తప్యంతే యే తపో జనాః ।
దంభ అహంకార సంయుక్తాః, కామ రాగ బల అన్వితాః ॥

అసుర లక్షణం

ఇక్కడ మరొక్క విషయం దృష్టిలో ఉంచుకో.

➤ అశాస్త్రవిహితంగాను,
➤ సహజీవులను భయపెట్టే విధంగాను,
➤ దంభ-అహంకారములతో కూడుకొన్నదై,
➤ కామరాగ బలాన్వితంగాను,
17–06

కర్షయన్తః శరీరస్థం భూతగ్రామమచేతసః ।
మాం చైవాన్తఃశరీరస్థం తాన్విద్ధ్యాసురనిశ్చయాన్ ॥

కర్షయంతః శరీరస్థం భూతగ్రామమ్ అచేతసః ।
మాం చ ఏవ అంతఃశరీరస్థం, తాన్ విద్ధి ఆసుర నిశ్చయాన్ ॥

➤ పంచభూతాత్మికమైన ఈ శరీరాన్ని కృశింపజేస్తూ,
➤ స్వశరీరాంతర్గతుడనగు నన్ను కూడా వేధిస్తూ
… చేసే తపస్సు (శ్రద్ధతో చేస్తున్నప్పటికీ) అల్పబుద్ధిచే చేస్తున్న ఆసుర తపస్సే సుమా!

17–07

ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః ।
యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శ్రృణు ॥

ఆహారః తు అపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః ।
యజ్ఞః తపః తథా దానం తేషాం భేదమ్ ఇమం శ్రృణు ॥

అలవాట్లు (Habits) అనుసరించి శ్రద్ధ-ఆసక్తి-స్వభావాలు

🌺 చిన్న చిన్న అలవాట్లే (Atomic Habits) ఆయా విషయాలపై ఆసక్తిగా మారి ఆశయములుగా ఏర్పడుతాయి.
🌺 ఈ జీవుడు తన ఆశయములను అనుసరించి శ్రద్ధ కలిగిఉంటున్నాడు.
🌺 శ్రద్ధయొక్క స్వభావం అనుసరించి వ్యక్తిత్వము రూపుదిద్దుకుంటోంది.
🌺 శ్రద్ధను అనుసరించి స్వభావం, స్వభావాన్ని అనుసరించి శ్రద్ధ బలం పుంజుకుంటున్నాయి.

శ్రద్ధ - స్వభావాలు సూక్ష్మరూపాలు. అట్టి శ్రద్ధ - స్వభావములు స్థూల రూపములగు ఆయా అభ్యాసములచే రూపుదిద్దుకుంటున్నాయి.

అనగా ఆహారము, యజ్ఞము, శారీరక + వాక్‌ + మానసిక తపస్సులు, దానం మొదలైనవి ఎట్టి శ్రద్ధతో ఒకడు నిర్వర్తిస్తాడో… అట్టి ఆ శ్రద్ధ - ఆ ప్రయత్నములు జీవుని స్వభావం నిర్ణయిస్తున్నాయి.

కనుక, ఇక్కడ వాటి భేదాల గురించి వివరిస్తాను. విను.

17–08

ఆయుస్సత్త్వబలారోగ్యసుఖప్రీతివివర్ధనాః ।
రస్యాః స్నిగ్ధాః స్థిరా హృద్యా ఆహారాః సాత్త్వికప్రియాః ॥

ఆయుః సత్త్వ బల ఆరోగ్య సుఖ ప్రీతి వివర్ధనాః ।
రస్యాః స్నిగ్ధాః స్థిరా హృద్యా ఆహారాః సాత్త్వికప్రియాః ॥


సాత్విక ఆహారం

సాత్వికస్వభావం పెంపొందించుకొను సాధకులకు కమ్మటి రుచి, నేయితో కూడినవి, రసాయనిక మార్పులు చెందనివి స్వాభావికంగా లభించే పళ్లు - కాయలు మొదలైనవి ప్రియంగా ఉంటూ ఉంటాయి.

17–09

కట్వమ్లలవణాత్యుష్ణతీక్ష్ణరూక్షవిదాహినః ।
ఆహారా రాజసస్యేష్టా దుఃఖశోకామయప్రదాః ॥

కటు అమ్ల లవణ అతితుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహినః ।
ఆహారా రాజసస్య ఇష్టా, దుఃఖ శోక ఆమయ ప్రదాః ॥


రాజసిక ఆహారం

చేదు - పులుపు - ఉప్పు - మిక్కిలి వేడైనవి - ఎండినవి - మాడినవి - అత్యంత దాహం కలుగజేసేవి - శరీరంలో రోగములను ప్రవృద్ధం చేసేవి - ఆవేశమును కలుగజేసేవి మొదలైన పానీయాలు - పదార్థాలు రాజసిక ప్రవృత్తులకు ఇష్టంగా అనిపిస్తూ ఉంటాయి.

17–10

యాతయామం గతరసం పూతి పర్యుషితం చ యత్ ।
ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామసప్రియమ్ ॥

యాతయామం గతరసం పూతి పరి-ఉషితం చ యత్ ।
ఉచ్ఛిష్టమ్ అపి చ అమేధ్యం భోజనం తామసప్రియమ్ ॥


తామసిక ఆహారం

కాలీ కాలని (పచనం కాని) ఆహారం, రస రహితం, దుర్గంధములతో కూడినది, పాచిపోయినది, తినగా మిగిలిపోయినది, అపవిత్రమైనవి అగు భోజన పదార్థాలు తామసికాహారులకు రుచికరమౌతూ ఉంటాయి.

17–11

అఫలాకాంక్షిభిర్యజ్ఞో విధిదృష్టో య ఇజ్యతే ।
యష్టవ్యమేవేతి మనః సమాధాయ స సాత్త్వికః ॥

అఫలాకాంక్షిభిః యజ్ఞో విధిదృష్టో య ఇజ్యతే ।
యష్టవ్యమ్ ఏవ ఇతి మనః సమాధాయ స సాత్త్వికః ॥


సాత్విక యజ్ఞము

ఫలాకాంక్ష రహితంగా ‘‘ఇది నాకు విధించబడిన విధ్యుక్తధర్మం’’ అను దృష్టిచే, ‘‘నేను ఇది తప్పక నిర్వర్తించాలి’’ అని ఉపాసనగా భావించి, మనస్సును సమరస భావంతో స్వార్థరహితంగా మలచుకుంటూ నిర్వర్తించేదంతా సాత్విక యజ్ఞం. సాత్విక స్వభావులు అట్టి సాత్వికయజ్ఞ అభ్యాసులై ఉంటారు.

17–12

అభిసంధాయ తు ఫలం దంభార్థమపి చైవ యత్ ।
ఇజ్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసమ్ ॥

అభిసంధాయ తు ఫలం దంభార్థం అపి చ ఏవ యత్ ।
ఇజ్యతే, భరతశ్రేష్ఠ! తం యజ్ఞం విద్ధి రాజసమ్ ॥


రాజసిక యజ్ఞము

ఓ భరతశ్రేష్ఠా ! ఫలములను ఆశిస్తూ, మునుముందుగానే కర్మఫలములను దృష్టిలో ఉంచుకొని, నలుగురూ చెప్పుకోవాలనే దంభముతో యజ్ఞములు చేస్తూ ఉంటే అది అంతరంగములోని రాజసగుణ ప్రవృత్తి. ‘‘దీనివలన నాకేం లాభం?’’….. అను ఆవేశంతో వారు కర్మలు నిర్వర్తిస్తూ ఉంటారు.

17–13

విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమదక్షిణమ్ ।
శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే ॥

విధిహీనం అసృష్ట-అన్నం మంత్రహీనం అదక్షిణమ్ ।
శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే ॥


తామసిక యజ్ఞము

శాస్త్ర విధి - విధానములను పూర్తిగా త్యజించి, అన్నదానం - జీవతృప్తులు లేకుండా, వేదమంత్రోచ్ఛారణలు లేకుండా, అతిథులకు సంభావనములు (Distribution to the poor) లేకుండా, శ్రద్ధ లేకుండా చేసే యజ్ఞాలు ‘‘తామసిక యజ్ఞం’’ అని పిలుస్తున్నారు.

17–14

దేవద్విజగురుప్రాజ్ఞపూజనం శౌచమార్జవమ్ ।
బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే ॥

దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం, శౌచమ్ ఆర్జవమ్ ।
బ్రహ్మచర్యమ్, అహింసా చ, శారీరం తప ఉచ్యతే ॥


సాత్విక శారీరక తపస్సు

శారీరక తపస్సు, దేవతలను, ద్విజులను, ప్రాజ్ఞులగు జ్ఞానులను పూజించటం. శుచి అయిన భావాలు (Positive and Optimistic Feelings) కలిగి ఉండటం. కుటిలత్వము లేకపోవటం. మనోవాక్కాయములచే ఒకే రీతి అయిన భావప్రకటనలు కలిగి ఉండటం (ఆర్జవము). బ్రహ్మచర్యము (సర్వము పరమాత్మయొక్క చమత్కార ప్రదర్శనమే - అను దృష్టి) వ్రతదీక్షగా పాటించటం - అహింసా వ్రతం - ఇదంతా ’శారీరక తపస్సు’గా చెప్పబడుతోంది.

17–15

అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ ।
స్వాధ్యాయాభ్యసనం చైవ వాఙ్మయం తప ఉచ్యతే ॥

అనుద్వేగకరం వాక్యం, సత్యం, ప్రియహితం చ యత్ ।
స్వాధ్యాయ అభ్యసనం చ ఏవ, వాఙ్మయం తప ఉచ్యతే ॥


సాత్విక వాచిక తపస్సు

సహజీవులకు ఉద్రేకము - భయము - ఆవేశము - ఉద్వేగము ఏర్పడకుండని విధంగా సంభాషించటం, సత్యము - ప్రియములు వాక్‌ లక్షణ శోభితమై ఉండటం, శాస్త్రగ్రంథముల ప్రవచనం, భగవంతుని గుణగానం, వేదాభ్యాసం మొదలైనవన్నీ వాచిక తపస్సుగా చెప్పబడుతోంది.

17–16

మనఃప్రసాదః సౌమ్యత్వం మౌనమాత్మవినిగ్రహః ।
భావసంశుద్ధిరిత్యేతత్తపో మానసముచ్యతే ॥

మనఃప్రసాదః, సౌమ్యత్వం, మౌనమ్, ఆత్మవినిగ్రహః ।
భావసంశుద్ధిః ఇతి ఏతత్ తపో మానసమ్ ఉచ్యతే ॥


సాత్విక మానసిక తపస్సు

మనస్సు పవిత్రంగా, దుష్టభావ రహితంగా, దురభిప్రాయ రహితంగా ఉంచుకోవటం, ప్రాపంచిక విషయాలన్నిటిపట్లా - జీవితంలోని సర్వ సంఘటనలపట్ల కథాంతర్గత విశేషాలవలె - స్వప్నసదృశ విశేషాలవలె ఉద్వేగరహితమైన మౌనం వహించి ఉండటం, పరిశుద్ధమైన భావాలు - అభిప్రాయాలు పెంపొందించుకోవటం - ఇది మానసిక తపస్సు.

17–17

శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్ త్రివిధం నరైః ।
అఫలాకాంక్షిభిర్యుక్తైః సాత్త్వికం పరిచక్షతే ॥

శ్రద్ధయా పరయా తప్తం తపః తత్ త్రివిధం నరైః ।
అఫలాకాంక్షిభిః యుక్తైః సాత్త్వికం పరిచక్షతే ॥


సాత్వికస్వభావం గలవారు ఈ శారీరక - వాచిక - మానసిక తపస్సులను శ్రద్ధగాను, అభ్యాసపూర్వకంగానూ నిర్వర్తిస్తూ ఉంటారు.

ప్రాపంచక ఫలములేవీ కోరకుండానే, స్వభావపూర్వకంగా సాత్విక ‘‘శారీరక - వాచిక - మానసిక’’ తపస్సులను సత్వగుణోపాసకులు ఉపాసిస్తున్నారు.

17–18

సత్కారమానపూజార్థం తపో దంభేన చైవ యత్ ।
క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువమ్ ॥

సత్కార మాన పూజార్థం తపో దంభేన చ ఏవ యత్ ।
క్రియతే తత్ ఇహ ప్రోక్తం రాజసం చలమ్ అధ్రువమ్ ॥


రాజసిక తపస్సు

గుర్తింపు కొరకై, సత్కారముల కొరకై, స్వల్పకాలిక ప్రయోజనముల కొరకై చేస్తున్న శారీరక - వాక్‌ - మానసిక తపస్సు ‘రాజసిక తపస్సు’ అని చెప్పబడుతోంది.

17–19

మూఢగ్రాహేణాత్మనో యత్పీడయా క్రియతే తపః ।
పరస్యోత్సాదనార్థం వా తత్తామసముదాహృతమ్ ॥

మూఢగ్రాహేణ ఆత్మనో యత్ పీడయా క్రియతే తపః ।
పరస్య ఉత్సాదనార్థం వా, తత్ తామసమ్ ఉదాహృతమ్ ॥


తామసిక తపస్సు

మూఢత్వముతో కూడిన పట్టుదల - హఠములతో, సహజీవులను హింసించాలని, వారికి నష్టం కలుగజేయాలనే ఉద్దేశ్యములతో, ఇతరులను తన వశంలో ఉంచుకోవాలనే ఆశయాలతో చేసే శారీరక - వాచిక - మానసిక తపస్సు ‘‘తామస తపస్సు’’ అని చెప్పబడుతోంది.

17–20

దాతవ్యమితి యద్దానం దీయతేఽనుపకారిణే ।
దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్త్వికం స్మృతమ్ ॥

దాతవ్యమ్ ఇతి యత్ దానం దీయతే అనుపకారిణే ।
దేశే కాలే చ పాత్రే చ, తత్ దానం సాత్త్వికం స్మృతమ్ ॥


సాత్విక దానం

‘‘ఈ దానం చేయటం నా ధర్మము. ఇదంతా ప్రసాదించిన పరమాత్మకు కృతజ్ఞతలు చెప్పుకోవటం’’ అని భావించి ఎటువంటి ప్రత్యుపకారం ఆశించకుండా దేశ - కాల - పాత్రలను అనుసరించి చేసే దానం ’సాత్వికదానం’గా అభివర్ణించబడుతోంది.

ఈ విధంగా సాత్వికమైన అభ్యాసపరులు స్వభావసిద్ధంగా సాత్విక సంపద పెంపొందించుకుంటూ సాత్విక - శ్రద్ధా స్వభావములను తమ వ్యక్తిత్వంగా (As a personality) తీర్చిదిద్దుకుంటున్నారు.

17–21

యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః ।
దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసం స్మృతమ్ ॥

యత్ తు ప్రత్యుపకారార్థం ఫలమ్ ఉద్దిశ్య వా పునః ।
దీయతే చ పరిక్లిష్టం, తత్ దానం రాజసం స్మృతమ్ ॥


రాజసిక దానం

ప్రత్యుపకారఫలము తిరిగి ఆశిస్తూ, కలుగబోయే లాభ-నష్టాలను దృష్టిలో ఉంచుకుంటూ, ఆ ప్రత్యుపకారం లభించనప్పుడు అవతలివారిని దూషిస్తూ - బాధిస్తూ చేస్తున్న దానం ‘రాజసిక దానం’ అనిపించుకుంటూ ఉంటుంది.

17–22

అదేశకాలే యద్దానమపాత్రేభ్యశ్చ దీయతే ।
అసత్కృతమవజ్ఞాతం తత్తామసముదాహృతమ్ ॥

అదేశకాలే యత్ దానమ్ అపాత్రేభ్యః చ దీయతే ।
అసత్ కృతమ్, అవజ్ఞాతం, తత్ తామసమ్ ఉదాహృతమ్ ॥


తామసిక దానం

దేశకాలములు సరిగా చూసుకోకుండా, అర్హత పట్టించుకోకుండా, దానం తీసుకునేవారి పట్ల సద్భావం లేకుండా, తృణీకార భావంతో, అశ్రద్ధతో, అహంకారంతో చేసే దానాలను “తామసిక దానం” అని చెప్పబడును.

17–23

ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధః స్మృతః ।
బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా ॥

“ఓం, తత్, సత్” ఇతి నిర్దేశో బ్రహ్మణః త్రివిధః స్మృతః ।
బ్రాహ్మణాః తేన వేదాః చ యజ్ఞాః చ విహితాః పురా ॥

అందుచేత, ఓ అర్జునా! నీవు సాత్వికమైన భావాలు - ఉద్దేశ్యాలతో ఆహారసేవనం, యజ్ఞభావాలు, తపోక్రియలు, దానధర్మాలు నిర్వర్తించు. సర్వము పరమాత్మమయంగా గమనించి, పరమాత్మ సమర్పణ పూర్వకంగా స్వకర్మ - వ్యవహారాదులను ఉద్దేశ్యించు.

“ఓం, తత్, సత్”

అట్టి పరమాత్మ ఎట్టిదో చెప్పటానికి వేదములు ‘‘ఓం, తత్,‌ సత్‌’’ అని సంజ్ఞలను ప్రతిపాదిస్తున్నాయి. వేదాంతర్భాగములగు క్రియాభాగములు (సంహితములు), ఉపాసనా కాండలు (బ్రాహ్మణములు), జ్ఞాన కాండలు (ఉపనిషత్‌ విభాగములు) ఈ “ఓం - తత్‌ - సత్”‌ అను గంభీర శబ్దార్థములను సర్వాంతర్యామియగు పరమాత్మపరంగా గానం చేస్తూ వినిపిస్తున్నాయి.

17–24

తస్మాదోమిత్యుదాహృత్య యజ్ఞదానతపఃక్రియాః ।
ప్రవర్తన్తే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినామ్ ॥

తస్మాత్ ఓం ఇతి ఉదాహృత్య యజ్ఞ దాన తపః క్రియాః ।
ప్రవర్తంతే విధాన ఉక్తాః సతతం బ్రహ్మవాదినామ్ ॥


1.) ‘ఓం’కారోపాసకులు - బ్రహ్మవాదినమ్‌!

వేదముల సారమును గ్రహించి గానం చేసే మహనీయులు తమయొక్క యజ్ఞ - దాన - తపస్సులను ఓంకారోచ్ఛారణతో ప్రారంభిస్తూ, ’‘సర్వాత్మకుడగు పరమాత్మ యొక్క అవగాహనయే అంతిమ సారం. అసలైన ఆశయం. ఇచ్చేవాడు, ఇచ్చేది, స్వీకరించేవాడు పరమాత్మయే’’గా ప్రకటన చేసి మరీ ప్రారంభిస్తున్నారు.

17–25

తదిత్యనభిసన్ధాయ ఫలం యజ్ఞతపఃక్రియాః ।
దానక్రియాశ్చ వివిధాః క్రియన్తే మోక్షకాంక్షిభిః ॥

తత్ ఇతి అనభిసంధాయ ఫలం, యజ్ఞ తపః క్రియాః ।
దానక్రియాః చ వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభిః ॥


2.) తత్‌ తత్త్వోపాసకులు - ‘‘తత్‌ త్వమ్‌’’ ఉపాసకులు - మోక్షకాంక్షభిః

వేదజ్ఞులు తాము ప్రారంభించే సర్వ యజ్ఞ దాన తపస్సులను సర్వాత్మకుడగు పరమాత్మయందు శ్రద్ధను లగ్నం చేసి సమాచరిస్తుంటారు. ఏది చేసినా అది పరమాత్మ పరంగా సమర్పిస్తున్నారు. స్వీకరించు వానిని పరమాత్మగా భావించి ఆ వేదవిదులు తమ విధులను నిర్వర్తిస్తున్నారు.

తత్త్వోపాసకులు (‘‘తత్‌-త్వమ్‌’’ ఉపాసకులు) యజ్ఞదానతపోక్రియలకు ఫలితం ఆశించకుండా, సర్వము తత్‌ స్వరూపుడగు పరమాత్మకు సమర్పించి, మోక్షకాంకక్షులై కొనసాగిస్తున్నారు. అనగా, ’‘జగత్తులోని జీవులంతా (త్వమ్‌) పరమాత్మ స్వరూపం’’గా (తత్‌-స్వరూపంగా) ఉపాసిస్తున్నారు.

‘ఓం’ పరమాత్మ స్వరూపమునకు సంజ్ఞగాను, ‘తత్‌’ ఈ జీవాత్మ చేరవలసిన స్థానంగాను (తత్‌ త్వమ్‌ అసి) భావిస్తూ, ఉపాసిస్తూ, వారు యజ్ఞ దాన తపస్సులు నిర్వర్తిస్తున్నారు.

17–26

సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ప్రయుజ్యతే ।
ప్రశస్తే కర్మణి తథా సచ్ఛబ్దః పార్థ యుజ్యతే ॥

సత్ భావే, సాధుభావే చ, సత్ ఇతి ఏతత్ ప్రయుజ్యతే ।
ప్రశస్తే కర్మణి తథా సత్ శబ్దః, పార్థ! యుజ్యతే ॥


3.) సత్‌ - సాధుభావోపాసకులు : సద్భావే

వీరు సాధుస్వభావులై సహ జీవులందరినీ ప్రేమ - దయ - కారుణ్యములతో, సేవా భావంతో ఉపాసిస్తున్నారు. ఏది చేసినా ‘‘లోకములకు శుభమగు గాక! సర్వేజనాః సుఖినో భవన్తు ! శం నో అస్తు ద్విపదే! శం చతుష్పదే’’… ఇటువంటి లోక శుభంకర - ’శం’కర వాక్యముల అర్థాన్ని ఉద్దేశ్యించి నిర్వర్తిస్తున్నారు.

17–27

యజ్ఞే తపసి దానే చ స్థితిః సదితి చోచ్యతే ।
కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే ॥

యజ్ఞే, తపసి, దానే చ స్థితిః సత్ ఇతి చ ఉచ్యతే ।
కర్మ చ ఏవ తదర్థి ఇయం సత్ ఇతి ఏవ అభిధీయతే ॥


సత్ స్వభావులు

శాస్త్ర ప్రవచనములైనట్టి వీరి యొక్క యజ్ఞ - దాన - తపో క్రియా కార్యక్రమాలన్నీ లోకకళ్యాణమే తమ ఆశయంగా - అంతర్లీనగానంగా కలిగి ఉంటాయి.

‘‘లోక శుభం కొరకు చేసే కర్మలన్నీ సత్కర్మలే’’ అని లోక గురువులు బోధిస్తున్నారు.

అట్టి పరమాత్మ స్వరూపమగు లోకకళ్యాణమే నీ సర్వకర్మల ఉద్దేశ్యములు అగుగాక! కర్మ శ్రద్ధగా చేయి. పరమాత్మకు సమర్పించి, జగత్‌ రూపుడగు పరమాత్మను ఈ రూపంగా సేవిస్తున్నాను అను సద్భావనను పెంపొందించుకో.

సర్వ పరిపోషకుడగు ఓంకార సంజ్ఞార్థ పరబ్రహ్మమును నీ ఎదురుగా ఉన్న ‘‘సర్వజీవ స్వరూపుడు’‘గా ఆరాధిస్తూ లోకశుభం కోరి, సద్భావంతో శ్రద్ధగా ’‘యజ్ఞం - దానం - తపస్సు - సహజీవుల సేవ - ధర్మరక్షణ’’ … మొదలైన నీ స్వధర్మములను నిర్వర్తించు.

జీవితంలోని ప్రతి కర్మను పరమాత్మ స్వరూపంగా ఉపాసిస్తూ, పరమాత్మ పరంగా పరమాత్మ స్వరూపమగు లోకములకు శుభం కలుగజేసే ఉద్దేశ్యంతో ధర్మాచరణ పూర్వకంగా శాస్త్రములు సూచిస్తున్న విధానంగా నిర్వహించు.

17–28

అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చ యత్ ।
అసదిత్యుచ్యతే పార్థ న చ తత్ప్రేత్య నో ఇహ ॥

అశ్రద్ధయా హుతం, దత్తం, తపః తప్తం, కృతం చ యత్ ।
అసత్ ఇతి ఉచ్యతే, పార్థ! న చ తత్ ప్రేత్య నో ఇహ ॥


అసత్ స్వభావులు

నేను గుర్తుచేస్తున్న ‘‘ఓం తత్‌ సత్‌’’ మార్గంగా కాకుండా అశ్రద్ధగా, పరమాత్మకు సమర్పించకుండా…వారి కొరకో - వీరు సంతోషించాలనో - గొప్పలకోసమో - వారు వీరు పొగడాలనో… ఇటువంటి ఉద్దేశ్యాలతో ఏ కర్మ చేసినప్పటికీ అది వృథా ప్రయాసయే.

‘‘నా కొరకు’’ అని చేసే కర్మలు బంధాలవుతాయి. ‘‘పరమాత్మ కొరకు’’…. అని చేసేవన్నీ మోక్షం ప్రసాదిస్తాయి.

అశ్రద్ధగా - అల్ప ఆశయములతో చేసే కర్మలన్నీ ఇహంలోగాని - పరంలోగాని నీకు జీవితాశయమగు ‘‘పరమోత్తమ శ్రేయస్సు’’ కలిగించలేవు.



శ్రద్ధచేతనే మోక్షము

అందుచేత,
‘‘ఓం తత్‌ సత్‌’’ శబ్దార్థమును గ్రహించి, పరమాత్మను సేవించే ఉద్దేశ్యంతో శ్రద్ధగా నీ స్వధర్మము నిర్వర్తించు.

శ్రద్ధను బట్టి కర్మలు పవిత్రమౌతాయి.

కర్మలను అనుసరించి స్వభావం పవిత్రత పొందుతుంది.

పవిత్రమైన స్వభావం శాశ్వతానందమగు అఖండబ్రహ్మతత్వమును ఆస్వాదింపజేస్తున్నది.


ఇతి శ్రీమత్‌ భగవద్గీతాసు … శ్రద్ధా-త్రయ విభాగ యోగ పుష్పః ।
శ్రీ సాంబ సదాశివ పాదారవిందార్పణమస్తు ॥
🙏