భగవద్గీత

18. మోక్ష సన్న్యాస యోగ అధ్యయన పుష్పం

మూలము : శ్రీ వ్యాస మహర్షిచే విరచించబడిన జయము / మహాభారతము (భీష్మ పర్వము)

అధ్యయన వ్యాఖ్యానము : (అధ్యయన విద్యార్థి) యేలేశ్వరపు హనుమ రామకృష్ణ


Krishna and Arjuna on the chariot

మూల శ్లోకము


అధ్యయన వ్యాఖ్యానము


ఉపన్యాసము

అర్జున ఉవాచ :-

18–01

సంన్యాసస్య మహాబాహో తత్త్వమిచ్ఛామి వేదితుమ్ ।
త్యాగస్య చ హృషీకేశ పృథక్కేశినిషూదన ॥

సంన్యాసస్య, మహాబాహో! తత్త్వమ్ ఇచ్ఛామి వేదితుమ్ ।
త్యాగస్య చ, హృషీకేశ! పృథక్, కేశినిషూదన! ॥

అర్జునుడు :

హే మహాబాహో! హృషీకేశా! సర్వాంతర్యామీ! కేశిరాక్షస సంహారకా! ‘‘సన్యాసము’’ అను శాస్త్రప్రవచిత శబ్దముయొక్క తత్త్వార్థం తెలుసుకోగోరుచున్నాను. అట్లాగే ‘త్యాగము’ అనగా ఏమి? ఈ సన్యాస - త్యాగములకు భేదమేమైనా ఉన్నదా? ఈ రెండు శబ్దాలు ఒకే అర్థాన్ని సూచిస్తున్నాయా? వేరువేరైన శాస్త్రార్థాలను కలిగి ప్రతిపాదిస్తున్నాయా? వివరించవలసినదిగా మిమ్ములను ప్రార్థిస్తున్నాను.

శ్రీ భగవాన్ ఉవాచ :-

18–02

కామ్యానాం కర్మణాం న్యాసం సంన్యాసం కవయో విదుః ।
సర్వకర్మఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః ॥

కామ్యానాం కర్మణాం న్యాసం సన్న్యాసం కవయో విదుః ।
సర్వకర్మఫలత్యాగం ప్రాహుః త్యాగం విచక్షణాః ॥

శ్రీకృష్ణ భగవానుడు :-

‘సన్యాసము’ మఱియు ‘త్యాగము’ అను శబ్దములను అధ్యాత్మ శాస్త్ర ప్రవచకులగు వేరు - వేరు శాస్త్రకారులు వేరు వేరు అర్థములతో శబ్దప్రయోగాలు చేయటం జరుగుతోందయ్యా!

కామ్య కర్మలు త్యజించటం - సన్యాసము

‘‘ఒకానొకడు తన వ్యక్తిగతమైన కోరికల కొరకై కర్మలు నిర్వర్తిస్తూ ఉంటే అప్పుడవి ‘కామ్యకర్మలు’ అవుతాయి. తన కోరికలు తీరుటకై కాకుండా, సహజీవుల సుఖ-శాంతుల కొరకై, స్వధర్మనిరతికై, ధర్మసంస్థాపనకొరకై నిర్వర్తిస్తే… అవి కామ్యకర్మలు కావు. కనుక, వ్యక్తిగతమైన కామ్యకర్మలు సన్యసించటము కర్మ సన్యాసము’’ అని కొందరు మహనీయులు చాటి చెప్పుచున్నాను.

సర్వ కర్మల ఫలాలు త్యజించటం - త్యాగము

ఇక మరికొందరు అధ్యాత్మశాస్త్రవేత్తలు - ‘‘సర్వ కర్మలు చేయవచ్చు. అయితే ఆ కర్మల సర్వఫలములు త్యజించి ఉండటమే త్యాగము’’ - అని అభివర్ణిస్తున్నారు.

18–03

త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః ।
యజ్ఞదానతపఃకర్మ న త్యాజ్యమితి చాపరే ॥

త్యాజ్యం దోషవత్ ఇతి ఏకే కర్మ ప్రాహుః మనీషిణః ।
యజ్ఞ దాన తపః కర్మ న త్యాజ్యమ్ ఇతి చ అపరే ॥


సర్వకర్మలను త్యజించటం

మరికొందరు శాస్త్రవేత్తలు, ‘‘కర్మలు నిర్వర్తించటంలో ఏదో కొంత దోషం తోడుగా తత్సమయంలో ఉండియే తీరుతుంది. అందుచేత, సర్వ కర్మలు (All Activities) త్యజించటమే కర్మసన్యాసం’’… అని చెప్పుచున్నారు.

అవిహిత కర్మల సన్యాసం

ఇక ఇంకొందరు శాస్త్రద్రష్టలు - ‘‘యజ్ఞము (Any function that serves the comfort of this world) - దానము (Giving and Contributing to others) - తపస్సు (Cogitation) - ఈ మూడు మాత్రం ఎవ్వరూ ఏమాత్రం త్యజించరాదు. తదితర కర్మలు త్యజించాలి. అదియే త్యాగము. అదియే కర్మసన్యాసము’’… అని ప్రబోధిస్తున్నారు.

18–04

నిశ్చయం శ్రృణు మే తత్ర త్యాగే భరతసత్తమ ।
త్యాగో హి పురుషవ్యాఘ్ర త్రివిధః సంప్రకీర్తితః ॥

నిశ్చయం శ్రృణు మే తత్ర త్యాగే, భరతసత్తమ! ।
త్యాగో హి, పురుషవ్యాఘ్ర! త్రివిధః సంప్రకీర్తితః ॥

ఓ భరతసత్తమా! ఇప్పుడిక నా అభిప్రాయం ఏమిటో చెప్పుచున్నాను విను.

ఓ పురుషవ్యాఘ్రా! ‘‘కర్మ - త్యాగము’’ అనునది కూడా ‘‘సత్వరజస్తమో కర్మ త్యాగములు’’ అను మూడు విధములుగా పరికీర్తించబడుతోంది.

సాత్విక త్యాగం : సర్వము పరమాత్మకు చెందినదిగా గమనిస్తూ, భావిస్తూ తనకు నియమించిన కర్మలు కర్మఫల-సమర్పిత బుద్ధితో చక్కగా నిర్వర్తించటం. అట్టి నియమిత కర్మలను సర్వాత్మకునకు సమర్పించబడే పూజాపుష్పాలుగా భావించటం. (‘నాది’ అనిపించేదంతా పరమాత్మదే!)

రాజసిక త్యాగం : ఫలాపేక్షతో కర్మలు నిర్వర్తించటం (లేక) మరింకేదో ఫలమును ఆశ్రయించి నియమిత కర్మలు త్యజించటం.

తామసిక త్యాగం : కోపం చేతనో, శ్రమ అని తలచో, బద్ధకము చేతనో, ఆవేశపూర్వకంగానో, తదితరులపై కక్ష చేతనో నియమిత కర్మలు త్యజించటం.

18–05

యజ్ఞదానతపఃకర్మ న త్యాజ్యం కార్యమేవ తత్ ।
యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణామ్ ॥

యజ్ఞ దాన తపః కర్మ న త్యాజ్యం, కార్యమ్ ఏవ తత్ ।
యజ్ఞో దానం తపః ఏవ పావనాని మనీషిణామ్ ॥

ఇంతకు పూర్వము యజ్ఞ-దాన-తపస్సులు అనే త్రివిధ కర్మల గురించి చెప్పుకున్నాం కదా!

యజ్ఞకర్మ :
(1) తదితరుల క్షేమ - శ్రేయస్సులను దృష్టిలోపెట్టుకొని ధర్మనిర్వహణ భావంతో నియమిత కర్మలు నిర్వర్తించటం.
(2) వేదములచే నియమించబడే యజ్ఞ-యాగాది దైవ ఉపాసనలు.

దానము : ఇతరుల సుఖసంతోషములకై త్యాగభావంతో దానం చేయటం. జీవన విధానమును దాన - ధర్మ - సేవా పూర్వకంగా తీర్చిదిద్దుకోవటం.

తపస్సు : శారీరక - వాచిక - మానసిక తపస్సులు.

ఈ జీవులు యజ్ఞ - దాన - తపో కర్మలు ఏమాత్రం విడువనే కూడదు. తప్పక నిర్వర్తించాలి.

ఎందుచేతనంటావా? అట్టి యజ్ఞ - దాన - తపో కర్మలు మనిషియొక్క మనస్సును పవిత్రంగా తయారు చేస్తాయి. ఆ వ్యక్తిని పావనం చేస్తాయి.

18–06

ఏతాన్యపి తు కర్మాణి సఙ్గం త్యక్త్వా ఫలాని చ ।
కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమమ్ ॥

ఏతాని అపి తు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ ।
కర్తవ్యాని ఇతి మే, పార్థ! నిశ్చితం మతమ్ ఉత్తమమ్ ॥

అయితే…..,
అటువంటి యజ్ఞ-దాన-తపో కర్మలు కూడా, వాటి-వాటి యొక్క కర్మఫలములను సమర్పణ బుద్ధితో త్యజించి ఉండటం, ‘‘ఇది నా కర్తవ్యం కదా!’’.. అని నిర్ణయించుకొని నిర్వర్తించటం ఉత్తమమని నా నిశ్చితాభిప్రాయం.

18–07

నియతస్య తు సంన్యాసః కర్మణో నోపపద్యతే ।
మోహాత్తస్య పరిత్యాగస్తామసః పరికీర్తితః ॥

నియతస్య తు సన్న్యాసః కర్మణో న ఉపపద్యతే ।
మోహాత్ తస్య పరిత్యాగః తామసః పరికీర్తితః ॥

ఓ అర్జునా! ఈ జీవులెవ్వరూ కూడా తమయొక్క నియమితమగు కర్మలను ఏమాత్రం విడువనేరాదు. ఒకవేళ ఏవేవో సాకులతో తనకు నియమించబడిన కర్మలను త్యజిస్తే (నిర్వర్తించటాన్ని మానటం ప్రారంభిస్తే),… అది తామస గుణము చేతనే అవుతుంది. అది మోహముతో కూడిన స్వభావమనియే అనిపించుకుంటుంది కాని త్యాగము అని చెప్పబడదు.

18–08

దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశభయాత్త్యజేత్ ।
స కృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్ ॥

దుఃఖమ్ ఇతి ఏవ యత్ కర్మ కాయక్లేశభయాత్ త్యజేత్ ।
స కృత్వా రాజసం త్యాగం, న ఏవ త్యాగఫలం లభేత్ ॥

‘‘శరీరకష్టం చేయవలసివస్తుందే! ఎందుకు శ్రమించాలి? అందుచేత ఈ శరీర కష్టం నేను ఎందుకు ఎగగొట్టరాదు?’’ అని నియమిత కర్మలు త్యజిస్తూ ఉంటే,… అప్పుడు అది ‘‘రాజస త్యాగం’’ మాత్రమే! మోక్షమునకు దారితీయగల ‘‘కర్మ ఫలత్యాగం’’ అనే ప్రయోజనం కలుగనే కలుగదు.

18–09

కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతేఽర్జున ।
సఙ్గం త్యక్త్వా ఫలం చైవ స త్యాగః సాత్త్వికో మతః ॥

కార్యమ్ ఇతి ఏవ యత్ కర్మ నియతం క్రియతే, అర్జున! ।
సంగం త్యక్త్వా ఫలం చ ఏవ, స త్యాగః సాత్త్వికో మతః ॥

‘‘నాకు నియమితమైన కర్మలు నేను తప్పక నిర్వర్తించటమే శుభప్రదం’’ … అను నిర్ణయంతో ఆ కర్మలు నిర్వర్తిస్తూ, ఆ కర్మఫలములను ఈశ్వరార్పితంగా సమర్పణ భావంతో ఉండటం సాత్వికత్యాగం అవుతుంది.

అట్టి కర్మ కర్మయోగమై, ఆ జీవుని అనేక దోషములనుండి సముద్ధరిస్తుంది.

ఆ ‘‘కర్మఫల త్యాగి, శుద్ధ సత్త్వయుక్తుడు’’ అగు సాత్విక కర్మఫల సన్యాసి - “ఈ ఈ కర్మలు ప్రియమైనవి కావు కదా!” అని త్యజించడు. ‘‘ఈ ఈ కర్మలంటే నాకు ఇష్టం కదా!’’… అని ఉద్దేశ్యించి అతిగా అనువర్తించడు. ’’ఇది నాకు నియమిత కర్మ. కనుక తప్పక నిర్వర్తిస్తాను. ఇందులో నాయొక్క ఇష్టాయిష్టములకు తావెక్కడిది? … అని సమన్వయించుకొని ఉంటాడు.

18–10

న ద్వేష్ట్యకుశలం కర్మ కుశలే నానుషజ్జతే ।
త్యాగీ సత్త్వసమావిష్టో మేధావీ ఛిన్నసంశయః ॥

న ద్వేష్టి అకుశలం కర్మ, కుశలే న అనుషజ్జతే ।
త్యాగీ, సత్త్వసమావిష్టో, మేధావీ, ఛిన్నసంశయః ॥

ఎవరు సమర్పిత భావంతో,… ‘‘నాకు నియమించబడిన కర్మలు తప్పక చేతనైనంత శ్రద్ధ - నైపుణ్యములతో నిర్వర్తిస్తాను’’.. అనే భావం సుదృఢం చేసుకోరో… వారు అత్యాగి (One who is not detached, but attached to all the actions) అవుతారు. అట్టివారు కర్మసన్యాసి కూడా కాలేడయ్యా!

18–11

న హి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః ।
యస్తు కర్మఫలత్యాగీ స త్యాగీత్యభిధీయతే ॥

న హి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణి అశేషతః ।
యః తు కర్మఫలత్యాగీ స త్యాగీ ఇతి అభిధీయతే ॥

ఓ అర్జునా! శరీరధారులెవ్వరికీ కూడా ‘‘నేను ఏ కర్మలూ నిర్వర్తించను’’… అను కర్మత్యాగంతో సర్వకర్మలు త్యజించి ఉండటం అసాధ్యం. అది కుదురనే కుదరదు.

ఎవ్వరైతే కర్మఫలములను సమర్పిత బుద్ధితో త్యజించినవారై ఉంటారో…. అట్టివారే ‘‘కర్మత్యాగి - యోగి - ఫలత్యాగి’’ అని శాస్త్రములచే అభివర్ణించబడుచున్నాయి.

18–12

అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలమ్ ।
భవత్యత్యాగినాం ప్రేత్య న తు సంన్యాసినాం క్వచిత్ ॥

అనిష్టమ్, ఇష్టం, మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలమ్ ।
భవతి అత్యాగినాం ప్రేత్య, న తు సన్న్యాసినాం క్వచిత్ ॥

ఒకడు తాను నిర్వర్తించుచున్న కర్మలలో కొన్ని ప్రియమైనవి (ఇష్టమైనవి), మరికొన్ని అప్రియమైనవి (అయిష్టమైనవి), ఇంకొన్ని మిశ్రమమైనవి ఉండి ఉండటం కర్మల తాదాత్మ్యం చేతనే జరుగుతోంది.

అయితే, అలా అనిపించటానికి కారణం? ఆతడు కర్మసంగి కాబట్టి. ఆ కర్మిష్ఠుని ‘‘అత్యాగి (Attached to what one has to do)’’ అని శాస్త్రకారులు చెప్పుతూ ఉంటారు.

కర్మ యోగి (లేక) కర్మఫల సన్యాసికి (To the one who has dedicated all the alloted functions, being discharged by oneself) - ‘‘ఈ కర్మలంటే ఇష్టం. ఇవంటే ఇష్టం లేకపోయినా చేస్తున్నాను. ఇవి కొంత ఇష్టం - కొంత అయిష్టం కూడా’’.. అనునది ఉండనే ఉండదు.

కర్మయోగికి తాను నిర్వర్తిస్తున్న కర్మలపట్ల ఇష్టాయిష్టాల ప్రసక్తి ఉండదు. ‘‘విహితమా? అవిహితమా? (Is it a function alloted to me or not? Is it as per the Will of the Worker of the Universe)’’… అనునది మాత్రమే ఉంటుంది.

ఇదియే “కర్మ-అత్యాగి”కి, ’‘కర్మ సన్యాసి (లేక) కర్మయోగి’’కి ఉన్న భేదం. ఇక కర్మల నిర్వహణ విషయానికి వస్తే - ఇరువురు అనివార్యంగా కర్మలు నిర్వర్తిస్తూనే ఉంటున్నారు.

18–13

పంచైతాని మహాబాహో కారణాని నిబోధ మే ।
సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణామ్ ॥

పంచ ఏతాని, మహాబాహో! కారణాని నిబోధ మే ।
సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణామ్ ॥

ఇది ఇట్లా ఉండగా….,
అధ్యాత్మ శాస్త్రములలో ఒకానొక ముఖ్యమైన విభాగం అయినట్టి ‘‘సాంఖ్యశాస్త్రం’’… ‘నైష్కర్మ్య సిద్ధి’ (లేక) ‘అకర్మ స్థితి’ లేక ‘కర్మాతీత స్థితి’ (లేక) ‘కర్మరాహిత్య స్థితి’ గురించి సిద్ధాంతీకరిస్తున్నది. అట్టి ‘‘కర్మ సంసిద్ధి’’ అనబడే కర్మయోగస్థితి గురించి సాంఖ్యశాస్త్రం ఏమని నిర్వచిస్తోందో…. ఇక్కడ ఉదహరిస్తున్నాను. విను.

ఒక కర్మ నిర్వర్తించబడాలంటే ‘‘ఐదు’’ విషయములు ఒకచోట ఒనగూడాలి. లేక, సమావేశము కావాలి. అప్పుడే ఏ కర్మ అయినా నిర్వర్తించబడగలదు.

18–14

అధిష్ఠానం తథా కర్తా కరణం చ పృథగ్విధమ్ ।
వివిధాశ్చ పృథక్చేష్టా దైవం చైవాత్ర పఞ్చమమ్ ॥

అధిష్ఠానం, తథా కర్తా, కరణం చ పృథక్ విధమ్ ।
వివిధాః చ పృథక్ చేష్టా, దైవం చ ఏవ, అత్ర పంచమమ్ ॥

కర్మ సంసిద్ధికి ఐదు కారణములు

1.) అధిష్ఠానం : ఉపాధి. ఈ పాంచభౌతిక దేహం. ప్రకృతి ఇద్దానిని నిర్మించి ఈ జీవులకు కర్మనిర్వహణము కొరకై ఉపకరణంగా ప్రసాదిస్తోంది. కాళ్ళు, చేతులు, కళ్ళు, నోరు మొదలైనవాటితో కదలటం, పట్టుకోవటం, చూడటం, మాట్లాడటం మొదలైనవి ఇందులోని క్రియాసామర్థ్య విశేషాలు. ఇంద్రుడు-అగ్ని-వాయువు-వరుణుడు ఇత్యాది అధిష్ఠాన దేవతల ప్రసాదము. కాబట్టి, కర్మల సామర్థ్యము ప్రయోజనము వారికే చెందుతాయి.

2.) కర్త : ఈ జీవుడు తన జీవతత్వంచే దేహమును చైతన్యవంతం చేస్తున్నాడు. నేను-నాది అని పలికే పరమాత్మ అంశ అగు జీవుడు.

3.) పృథక్‌ విధమ్‌ కరణం : ఆయా వివిధ ఉపకరణములు. సాధనా సామాగ్రి.

4.) వివిధాః పృథక్‌ చేష్టా : ఆయా అనేక సంఘటనలు. శబ్ద స్పర్శాది ఇంద్రియ తత్వాలు. ఇతఃపూర్వపు - ఇప్పటి - భవిష్యత్‌ మానసిక స్థితి గతులు.

5.) దైవం : దైవికమైన స్థితి (Various situations that take place unexpectedly and accidentally. The inexplicable Godliness, which is running the total show of the world from the time immemorial, places its role in the acts that take place). జగత్‌ కల్పన అనే కథా రచయిత - దైవము.

18–15

శరీరవాఙ్మనోభిర్యత్కర్మ ప్రారభతే నరః ।
న్యాయ్యం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః ॥

శరీర వాక్ మనోభిః యత్ కర్మ ప్రారభతే నరః ।
న్యాయ్యం వా విపరీతం వా పంచ ఏతే తస్య హేతవః ॥


ఈ ఐదు ఒనగూడితేనే ఒక మంచి లేక చెడు క్రియ సిద్ధిస్తోంది. ఆయా ప్రతి ఒక్క కార్యక్రమం కూడా - అది శరీరముతోగాని, వాక్కుచేతగాని (లేక) మనస్సుచేతగాని - ప్రారంభించబడే మంచి లేక చెడు (Positive or Negative) కార్యము కూడా — పైన చెప్పిన ఐదు ఒకచోట ఒనగూడితే మాత్రమే సిద్ధిస్తోంది.

18–16

తత్రైవం సతి కర్తారమాత్మానం కేవలం తు యః ।
పశ్యత్యకృతబుద్ధిత్వాన్న స పశ్యతి దుర్మతిః ॥

తత్ర ఏవం సతి కర్తారమ్ ఆత్మానం కేవలం తు యః ।
పశ్యతి అకృతబుద్ధిత్వాత్ న స పశ్యతి దుర్మతిః ॥


ఈ విధంగా అధిష్ఠానము (శరీరము) - కర్త (జీవుడు) - ఆయా సందర్భములు (లేక) పరిస్థితులు - ఉపకరణములు - దైవము - ఈ ఐదు కలిస్తేనే ఒక క్రియ సిద్ధిస్తూ ఉండగా, ఇక ఈ జీవుడు ‘‘ఇది నిర్వర్తించటానికి నేనే కారణం’’… అంటూ కర్తృత్వము తన పైననో, మరొక జీవుని పైనో ఆపాదించటం ‘‘అల్పబుద్ధి’’ యొక్క సందర్శనమేగాని, సత్యసందర్శనం కాదు.

18–17

యస్య నాహంకృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే ।
హత్వాపి స ఇమాల్లోకాన్న హన్తి న నిబధ్యతే ॥

యస్య న అహంకృతో భావో బుద్ధిః యస్య న లిప్యతే ।
హత్వా అపి స ఇమాన్ లోకాన్, న హన్తి న నిబధ్యతే ॥


విజ్ఞుడు ఇది గమనించి ‘‘నేనే కారణం. ఆతడే కారణం’’… ఇటువంటి అల్పశబ్దాలను పలుకడు. నేను చేస్తున్న కర్మయొక్క సామర్థ్యము-ఫలము కూడా ఈ ఐదుగురికి చెందినవే! - అని తలుస్తాడు గాని, నావే అని అనుకోడు!

ఓ అర్జునా! ఎవ్వరైతే…

↳ ఆయా కర్మలను నేను నిర్వర్తించటంలేదు. నేను వాస్తవానికి కర్తృత్వ - భోక్తృత్వ రహితుడను అను భావం బలవత్తరంగా కలిగి ఉంటాడో …,

↳ ఎవరియొక్క బుద్ధి అహంకార - మమకారదులచే దోషభూయిష్టమై ఉండదో (ఇష్టాయిష్టములచే - ప్రియాప్రియములచే, నా వారు - కాని వారు అను భావములచే అల్పత్వము వహించి ఉండదో)…,

→ అట్టివాడు ఈ లోకంలోని జీవులందరినీ సంహరించినప్పటికీ… ఆతడు ఎవ్వరినీ చంపనివాడే అవుతాడు. ఆతడు అట్టి కర్మచే నిబద్ధితుడు కాడు. ఆ కర్మ ఆతనిని బంధించదు.

(ఉదాహరణకు, ఒక తలారి ఉరిశిక్షను అమలు చేసినంతమాత్రంచేత ఆతడు ఆ కర్మచే హత్యచేసినవాడు కాదు కదా!)

18–18

జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాతా త్రివిధా కర్మచోదనా ।
కరణం కర్మ కర్తేతి త్రివిధః కర్మసంగ్రహః ॥

జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాతా త్రివిధా కర్మచోదనా ।
కరణం కర్మ కర్తా ఇతి త్రివిధః కర్మసంగ్రహః ॥

ఓ అర్జునా! ఒక కర్మ నిర్వర్తించబడాలంటే…,
↳ కర్మ ప్రోత్సాహకాలు మునుముందుగా ప్రేరణ పొందాలి.
↳ ఆ తరువాత, కర్మసంయోగాలు క్రియాశీలకమై ప్రవర్తించాలి.

అప్పుడే ఏ ఒక్క కర్మ అయినప్పటికీ…, అది నిర్వర్తించబడటం జరుగుతోంది.

అట్టి కర్మ ప్రోత్సాహకాలు మూడు విధములుగా, (మరియు) కర్మ సంయోగాలు (ఉపకరణాలు) మూడు విధములుగా ఉంటున్నాయి.

కర్మ ప్రోత్సాహకాలు (Action Inspirers)

1.) తెలివి (జ్ఞానం) (Knowing)
2.) తెలియబడేవి (జ్ఞేయం) (That being Known)
3.) తెలుసుకొనువాడు (జ్ఞాత) (Knower)

కర్మ సంగ్రహములు (Action Instruments)

1.) కర్మకు సంబంధించిన ఉపకరణాలు. సాధనములు. ఇంద్రియములు. కరణములు (Operating Instruments)
2.) క్రియావ్యవహారం (Action / Doing)
3.) కర్త - జీవుడు (Doer)

ఈ మూడు మూడు కూడా తిరిగి సాత్విక - రాజసిక - తామసిక గుణ స్వభావపూరితమై ఉండి ఉంటున్నాయి.

18–19

జ్ఞానం కర్మ చ కర్తా చ త్రిధైవ గుణభేదతః ।
ప్రోచ్యతే గుణసంఖ్యానే యథావచ్ఛృణు తాన్యపి ॥

జ్ఞానం కర్మ చ కర్తా చ త్రిధా ఏవ గుణభేదతః ।
ప్రోచ్యతే గుణసంఖ్యానే యథావత్ శృణు తాని అపి ॥

ఇప్పుడు -
➤ జ్ఞానము - కర్మ - కర్త
… ఇవి గుణభేదం చేత ఎట్లా ప్రవర్తించుచున్నాయో వివరిస్తున్నాను. విను.

18–20

సర్వభూతేషు యేనైకం భావమవ్యయమీక్షతే ।
అవిభక్తం విభక్తేషు తత్ జ్ఞానం విద్ధి సాత్త్వికమ్ ॥

సర్వభూతేషు యేన ఏకం భావమ్ అవ్యయమ్ ఈక్షతే ।
అవిభక్తం విభక్తేషు తత్ జ్ఞానం విద్ధి సాత్త్వికమ్ ॥

సాత్విక జ్ఞానం

→ ఏ జ్ఞాన సమాచారం - ‘‘సర్వ జీవులు ఒకే పరమాత్మ యొక్క సంప్రదర్శనం! అవ్యయమగు పరమాత్మ సర్వదా అవిభక్తం! వేరువేరుగా ఈ ఈ జీవులంతా కనిపిస్తున్నప్పటికీ… జీవులందరిలోను నిత్యసత్యమగు పరమాత్మ ఒక్కటే!’’ - అను సారాంశము చెప్పుచున్నదో …,
→ ఏ జ్ఞాన సమాచారం ఆ రీతిగా నిరూపిస్తూ వస్తోందో …,
… అది సాత్విక జ్ఞానం.

భిన్నత్వంలోని ఏకత్వం సందర్శింపజేసేది సాత్విక జ్ఞానం.

18–21

పృథక్త్వేన తు యత్ జ్ఞానం నానాభావాన్పృథగ్విధాన్ ।
వేత్తి సర్వేషు భూతేషు తత్ జ్ఞానం విద్ధి రాజసమ్ ॥

పృథక్త్వేన తు యత్ జ్ఞానం నానాభావాన్ పృథక్ విధాన్ ।
వేత్తి సర్వేషు భూతేషు తత్ జ్ఞానం విద్ధి రాజసమ్ ॥

రాజసిక జ్ఞానం

ఏ విచక్షణచే …
↳ ఈ కళ్ళకు కనబడే జీవులు తమ గుణ-స్వభావ-భావన-జాతి-ప్రదేశాదుల రీత్యా భిన్న-భిన్నములుగా కనిపిస్తారో,
… అట్టి జ్ఞానం ‘‘రాజసిక జ్ఞానం’’.

జ్ఞానులు వేరు - అజ్ఞానులు వేరు, ఆ జాతి వేరు - మేము వేరు …. ఇత్యాది భేదములను నిరూపిస్తూ వుండే జ్ఞానము అది.

ఏకత్వంలో విభిన్నత్వం సందర్శింపజేసేది రాజసిక జ్ఞానం.

18–22

యత్తు కృత్స్నవదేకస్మిన్కార్యే సక్తమహైతుకమ్ ।
అతత్త్వార్థవదల్పం చ తత్తామసముదాహృతమ్ ॥

యత్ తు కృత్స్నవత్ ఏకస్మిన్ కార్యే సక్తమ్ అహైతుకమ్ ।
అతత్త్వార్థవత్ అల్పం చ తత్ తామసమ్ ఉదాహృతమ్ ॥

తామసిక జ్ఞానం

→ ‘‘ఈ శరీరము - శారీరక సుఖములు సర్వస్వము, శాశ్వతము. ఇంతకుమించి మరింకేమీ ఎక్కడా లేదు’’ అని సూచనలను ప్రవృద్ధం చేసే జ్ఞానం,
→ ఆయా కార్యక్రమములందు సక్తతలో నిబంధించునది, చేసే పని చెడుదని తెలిసికూడా వదలాలని అనిపించనిది,
→ అవిచక్షణ - ఆవేశము - పగ - అసూయలతో కూడినది. విచక్షణా జ్ఞానం - హేతు జ్ఞానం (Logic) లేకుండునది,
→ తుచ్ఛము - అల్పము అగు భావాలు (ఆవేశము - క్రోధము - పగ - ద్వేషము - అసూయలతో కూడిన భావాలు), అభిప్రాయాలు పెంపొందించేది,
… అగు జ్ఞానం ‘తామసిక జ్ఞానం’ అని చెప్పబడుతోంది.

18–23

నియతం సఙ్గరహితమరాగద్వేషతః కృతమ్ ।
అఫలప్రేప్సునా కర్మ యత్తత్సాత్త్వికముచ్యతే ॥

నియతం సంగరహితమ్ అరాగద్వేషతః కృతమ్ ।
అఫలప్రేప్సునా కర్మ యత్ తత్ సాత్త్వికమ్ ఉచ్యతే ॥

సాత్విక కర్మ

ఏ కర్మ అయితే …,
↳ ‘నియమిత కర్మ’ (A duty that is alloted) అయి ఉన్నదో …,
↳ సంగ రహితంగా నిర్వర్తించబడుతోందో (Being discharged without attachment) …,
↳ రాగ-ద్వేష రహితంగా నిర్వర్తించబడుతోందో (Being discharged without liking some people and disliking some others) …,
↳ ఫలాపేక్ష (Expectations on the fruits / results) లేకుండా నిర్వర్తించబడుచున్నదో …,
… అట్టి కర్మ ‘‘సాత్విక కర్మ’’ అని చెప్పబడుతోంది

18–24

యత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః ।
క్రియతే బహులాయాసం తద్రాజసముదాహృతమ్ ॥

యత్ తు కామేప్సునా కర్మ స-అహంకారేణ వా పునః ।
క్రియతే బహుల ఆయాసం తత్ రాజసమ్ ఉదాహృతమ్ ॥

రాజసిక కర్మ

⤿ అనేక ప్రయాసలతో కూడి,
⤿ కోరికలు సిద్ధించాలనే వేడుకతో,
⤿ అహంకార - మమకారములతో కూడి,
… ఇంకా ఏదో ఏదో పొందాలనే ఊహలతో నిర్వర్తించే కర్మ ‘‘రాజసిక కర్మ’’ అని పిలువబడుతోంది.

18–25

అనుబన్ధం క్షయం హింసామనపేక్ష్య చ పౌరుషమ్ ।
మోహాదారభ్యతే కర్మ యత్తత్తామసముచ్యతే ॥

అనుబంధం, క్షయం, హింసామ్, అనపేక్ష్య చ పౌరుషమ్ ।
మోహాత్ ఆరభ్యతే కర్మ యత్ తత్ తామసమ్ ఉచ్యతే ॥

తామసిక కర్మ

→ అనుబంధం (Attachment) కలుగజేసేది,
→ స్థితి - గతులను అధోమార్గంగా నడిపించేది,
→ హింస ప్రవృత్తితో కూడినది, దుష్ట ఆచార వ్యవహారములతో కూడినది,
→ ప్రేమ - దయ మొదలైనవి లేనట్టిది,
→ ‘‘నిర్వర్తించగలమా? - లేదా?’’… అను సామర్థ్యాసామర్థ్యములను పరిశీలించకుండానే కోపం - ఆవేశం - పగ - కసి….. మొదలైన వాటితో కూడి ప్రారంభించబడునది,
→ మోహము (Illusions - Misconceptions - Pre-Conceived Notions - Mis-interpretations)తో కూడి ప్రారంభించేది…..,
… అట్టి కర్మ ‘తామసిక కర్మ’ అని చెప్పబడుతోంది.

18–26

ముక్తసంగోఽనహంవాదీ ధృత్యుత్సాహసమన్వితః ।
సిద్ధ్యసిద్ధ్యోర్నిర్వికారః కర్తా సాత్త్విక ఉచ్యతే ॥

ముక్తసంగో, అనహంవాదీ, ధృతి ఉత్సాహ సమన్వితః ।
సిద్ధి అసిద్ధ్యోః, నిర్వికారః కర్తా సాత్త్విక ఉచ్యతే ॥

సాత్విక కర్త

ఏ ‘కర్త’ అయితే …,
↳ సంగము (Attachment to people or results) లేకుండా …,
↳ ‘‘నేను నిమిత్తమాత్రుడను మాత్రమే. అంతా పరమేశ్వరేచ్ఛ. పరమాత్మయొక్క ప్రదర్శనా చమత్కారం’’ అను అనహంకార - నిరహంకారములతో కూడిన అవగాహనతో నిర్వర్తిస్తున్నాడో …,
↳ ధైర్యము - ఉత్సాహము - కలుపుకోలుతనము (Duly keeping others also in view) కలిగి ఆయా కర్మలను నిర్వర్తిస్తున్నాడో …,
↳ తాను నిర్వర్తిస్తున్న స్వధర్మపూర్వకమైన కర్మ సిద్ధించినా - సిద్ధించకపోయినా నిర్వికారుడై ఉండి ఉంటున్నాడో …,
… అట్టి కర్త ‘‘సాత్విక కర్త’’ అని చెప్పబడుచున్నాడు.

18–27

రాగీ కర్మఫలప్రేప్సుర్లుబ్ధో హింసాత్మకోఽశుచిః ।
హర్షశోకాన్వితః కర్తా రాజసః పరికీర్తితః ॥

రాగీ, కర్మఫలప్రేప్సుః, లుబ్ధో, హింసాత్మకో, అశుచిః ।
హర్ష శోక అన్వితః కర్తా రాజసః పరికీర్తితః ॥

రాజసిక కర్త

⤿ రాగముతో (with deep attachment) నిర్వర్తిస్తూ …,
⤿ కర్మఫలములు ఎట్లాగైనా సముపార్జించాలనే భావనతో…,
⤿ సహజీవులను బాధించటానికి వెనుకాడక, హింసా ప్రవృత్తిని కొనసాగిస్తూ,
⤿ అశుచికరమైన భావాలతో (వారికన్నా - వీరికన్నా గొప్పకావాలి - జయించాలి - అణచివేయాలి మొదలైన అభిప్రాయాలతో),
⤿ లోభ గుణంతో ప్రారంభించువాడు,
⤿ హర్ష - శోకములు కలిగి ఉంటూ (continuing the senses of pleasures and displeasures) కార్యములు కొనసాగించువాడు,
… ‘రాజసిక కర్త’ అని చెప్పబడుచున్నాడు.

18–28

అయుక్తః ప్రాకృతః స్తబ్ధః శఠో నైష్కృతికోఽలసః ।
విషాదీ దీర్ఘసూత్రీ చ కర్తా తామస ఉచ్యతే ॥

అయుక్తః, ప్రాకృతః, స్తబ్ధః, శఠో, నైష్కృతికో, అలసః ।
విషాదీ, దీర్ఘసూత్రీ చ కర్తా తామస ఉచ్యతే ॥

తామసిక కర్త

→ యుక్తాయుక్తములను విడచినవాడు,
→ అవగాహనకు ప్రయత్నించనివాడు - వ్యతిరిక్త ఫలములను గమనించనివాడు,
→ లోభగుణముతో ప్రారంభించువాడు,
→ ఇతరులను కష్టపెట్టటానికి వెనుకాడనివాడు,
→ అశుద్ధమైన ఆచారములను స్వీకరించువాడు,
→ గర్వముతో - భయోద్వేగములతో నిర్వహించేవాడు,
→ శోకములలో మునిగితేలువాడు,
→ ఎప్పుడూ బాధపడుతూ పని నిర్వర్తించేవాడు,
→ ముందు ఆలోచనలు చేయకుండా బద్ధకముతో పని ప్రారంభించువాడు
… ఇట్టి కర్త ’తామసిక కర్త’గా చెప్పబడుచున్నాడు.

18–29

బుద్ధేర్భేదం ధృతేశ్చైవ గుణతస్త్రివిధం శ్రృణు ।
ప్రోచ్యమానమశేషేణ పృథక్త్వేన ధనఞ్జయ ॥

బుద్ధేః భేదం ధృతేః చ ఏవ గుణతః త్రివిధం శ్రృణు ।
ప్రోచ్యమానమ్ అశేషేణ పృథక్త్వేన, ధనంజయ! ॥


➤ బుద్ధి (Discrimination faculty) - ధృతి (Firmness)
… ఇవి గుణభేదం చేత ఎట్లా ప్రవర్తించుచున్నాయో, వివరిస్తున్నాను. విను.

18–30

ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యాకార్యే భయాభయే ।
బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధిః సా పార్థ సాత్త్వికీ ॥

ప్రవృత్తిం చ, నివృత్తిం చ, కార్య అకార్యే, భయ అభయే ।
బంధం మోక్షం చ, యా వేత్తి బుద్ధిః సా పార్థ! సాత్త్వికీ ॥

సాత్విక బుద్ధి

ఏ బుద్ధికైతే …,
↳ నా ప్రవృత్తి ఎటువంటిది? నివృత్తి ఎటువంటిది? నేను ‘చేయాలి’ అనుకున్నవి ఏమేమి? ఎట్టిది? నేను ‘చేయకూడనివి’ అని అనుకుంటున్నవి ఎట్టివి? ఏవేవి? అవి శాస్త్రానుకూలమేనా? లోకానుకూలమేనా?’’
↳ శాస్త్రముల ఉద్దేశ్యానుసారం నేను ఏది చేయటం ఉచితం? ఏది నాకు అనుచితం?
↳ నేను దేని పట్ల భయ - అభయములు కలిగినవాడనై ఉండాలి ?
↳ ఏ కర్మలు నాకు బంధం అధికంగా చేస్తాయి? ఏది నాకు విముక్తి - మోక్షము కలుగ జేయగలవు?
… ఇట్టి విచార - విమర్శలకు సంసిద్ధం అయి ఉన్న బుద్ధి సాత్వికబుద్ధి.

ప్రవృత్తి - నివృత్తులను, కార్య - అకార్యములను, భయ - అభయములను, బంధ - మోక్షములను విశదపరిచే బుద్ధియే ‘‘సాత్విక బుద్ధి’’.

18–31

యయా ధర్మమధర్మం చ కార్యం చాకార్యమేవ చ ।
అయథావత్ప్రజానాతి బుద్ధిః సా పార్థ రాజసీ ॥

యయా ధర్మమ్ అధర్మం చ, కార్యం చ అకార్యమ్ ఏవ చ ।
అయథావత్ ప్రజానాతి, బుద్ధిః సా పార్థ! రాజసీ ॥

రాజసిక బుద్ధి

⤿ ఏది ధర్మమో…. ఏది అధర్మమో,
⤿ ఏది కార్యమో… ఏది అకార్యమో (ఏది చేయవచ్చునో - ఏది చేయకూడదో),
⤿ ఏ మార్గం ఉచితమో - ఏ మార్గం అనుచితమో,
… ఇవన్నీ పరిశీలించకుండా ప్రవర్తించే బుద్ధిని ‘రాజసిక బుద్ధి’ అని అంటూ ఉంటారు.

కామ్యకర్మలపట్ల ప్రోత్సాహం కలిగియుండే బుద్ధి ‘రాజసిక బుద్ధి’.

18–32

అధర్మం ధర్మమితి యా మన్యతే తమసావృతా ।
సర్వార్థాన్విపరీతాంశ్చ బుద్ధిః సా పార్థ తామసీ ॥

అధర్మం ధర్మమ్ ఇతి యా మన్యతే తమసా ఆవృతా ।
సర్వార్థాన్ విపరీతాన్ చ బుద్ధిః సా పార్థ! తామసీ ॥

తామసిక బుద్ధి

ఏ బుద్ధికైతే …,
↳ ధర్మం అధర్మంగాను, అధర్మం ధర్మంగాను కనిపిస్తూ వస్తోందో …,
↳ అకార్యం కార్యంగాను - కార్యం అకార్యంగాను అనిపిస్తుందో …,
↳ అజ్ఞాన భావములతో, అభిప్రాయములతో నిండి ఉంటుందో …,
↳ ప్రతిదానికి వ్యతిరేకార్థం చేసి దోషములను ఆపాదిస్తూ ఉంటుందో …,
↳ చెడును చూపటంలో ప్రావీణ్యత, మంచిని చూపటంలో అసమర్థత కలిగి ఉంటుందో…..,
↳ మంచిని కప్పిపెట్టి వుంచే ప్రయత్నము కలిగివుంటుందో…
… అట్టి బుద్ధి ‘‘తామసిక బుద్ధి’’ అని అనిపించుకుంటోంది.

18–33

ధృత్యా యయా ధారయతే మనఃప్రాణేన్ద్రియక్రియాః ।
యోగేనావ్యభిచారిణ్యా ధృతిః సా పార్థ సాత్త్వికీ ॥

ధృత్యా యయా ధారయతే మనః-ప్రాణ-ఇంద్రియ క్రియాః ।
యోగేన అవ్యభిచారిణ్యా ధృతిః సా పార్థ! సాత్త్వికీ ॥

సాత్విక ధృతి (పట్టుదల)

ఏ ధృతి (పట్టుదల) అయితే ………,
↳ యోగబలమును ప్రవృద్ధం చేస్తూ,
↳ అనన్యయోగ స్థితికి సమాచారం బలం సమకూరుస్తూ,
↳ ఒకడు ఒక వస్త్రం ధరించునట్లు తాను మనస్సు - ప్రాణ - ఇంద్రియములకు వేరై,
… మనః - ప్రాణ - యింద్రియములను కంఠ-ఆభరణాలవలె ధారణ చేయునదై ఉన్న ధైర్యము.

‘‘నేను వేరు - ఈ మనస్సు ప్రాణములు ఇంద్రియాలు వేరు’’ - అను ధారణయే సాత్విక ధృతి.

18–34

యయా తు ధర్మకామార్థాన్ ధృత్యా ధారయతేఽర్జున ।
ప్రసంగేన ఫలాకాంక్షీ ధృతిః సా పార్థ రాజసీ ॥

యయా తు ధర్మకామార్థాన్ ధృత్యా ధారయతే, అర్జున! ।
ప్రసంగేన ఫలాకాంక్షీ ధృతిః సా పార్థ! రాజసీ ॥

రాజసిక ధృతి (ధైర్యము / పట్టుదల)

ఓ పార్థా!
→ అనుక్షణం ఫలితముల గురించి ప్రసంగిస్తూ,
→ అర్థ కామములతో - కర్మ ఫలితములతో సంబంధం కల్పించుకొని,
… కర్మ నిర్వర్తించే ధృతి (పట్టు) ‘రాజసిక ధృతి’ అని అనబడుతోంది.

ఫలితముల గురించి పట్టుదల వీడకపోవటం, ధర్మాధర్మములకు ప్రాముఖ్యత ఇవ్వకపోవటం రాజసిక ధృతి లక్షణాలై ఉన్నాయి.

18–35

యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ ।
న విముఞ్చతి దుర్మేధా ధృతిః సా పార్థ తామసీ ॥

యయా స్వప్నం, భయం, శోకం, విషాదం, మదమ్ ఏవ చ ।
న విముంచతి దుర్మేధా ధృతిః సా పార్థ! తామసీ ॥

తామసిక ధృతి / పట్టుదల (Courage / Initiative)

→ ‘‘అపోహ-ఆకర్షణ-ఆవేదన-ఆవేశము-అభినివేశము-ఆక్రోశము’’
… ఇటువంటి స్వప్నసదృశ భయ - శోక - విషాద - ద్వేషములతో కూడినదై ఉన్న ధైర్యము.

→ ఆయా ఆవేశ కావేశములను, వాస్తవ - అవాస్తవాలతో పరిశీలించకయే కొనసాగించటం, తొలగించుకోవటానికి ప్రయత్నించకపోవటం,
→ దుష్టమైన ఆలోచనలు, అభిప్రాయాలు బలం పుంజుకోనివ్వటం…
… ఇట్టి క్రియలకు కలిగి ఉండే పట్టుదల ‘తామసిక ధృతి’ అని అనిపించుకొంటోంది.

18–36

సుఖం త్విదానీం త్రివిధం శ్రృణు మే భరతర్షభ ।
అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాన్తం చ నిగచ్ఛతి ॥

సుఖం తు ఇదానీం త్రివిధం శ్రృణు మే, భరతర్షభ! ।
అభ్యాసాత్ రమతే, యత్ర దుఃఖాంతం చ నిగచ్ఛతి ॥


➤ సుఖము
… ఇది గుణభేదం చేత ఎట్లా మూడు విధములుగా ఉన్నదో వివరిస్తున్నాను. విను.

ఏ సుఖమునందు సాధకుడు అభ్యాసముచే అంతరంగమునందు రమించునో, దుఃఖము యొక్క అంతము పొందునో అది చెప్పెదను. విను, అర్జునా!

18–37

యత్తదగ్రే విషమివ పరిణామేఽమృతోపమమ్ ।
తత్సుఖం సాత్త్వికం ప్రోక్తమాత్మబుద్ధిప్రసాదజమ్ ॥

యత్ తత్ అగ్రే విషమ్ ఇవ పరిణామే అమృత ఉపమమ్ ।
తత్ సుఖం సాత్త్వికం ప్రోక్తమ్ ఆత్మబుద్ధిప్రసాదజమ్ ॥

సాత్విక సుఖం

ఏ సుఖమును …
↳ భావనా పూర్వకంగా అభ్యసిస్తూ రాగా, సర్వ దుఃఖములు ఉపశమిస్తాయో (By practising which, all worries simply vanish),
… అది ‘‘సాత్వికసుఖం’’.

మొట్టమొదట కష్టంగా ఉండి క్రమేపీ అమృతమయమై ఈ జీవుని హృదయం సుఖం ప్రసాదిస్తోందో - శాంతిమయం చేసివేస్తోందో… అట్టిది సాత్విక సుఖం.

ప్రారంభే విషమివ పరిణామో అమృతో భవతి!

18–38

విషయేన్ద్రియసంయోగాద్యత్తదగ్రేఽమృతోపమమ్ ।
పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతమ్ ॥

విషయ ఇంద్రియ సంయోగాత్ యత్ తత్ అగ్రే అమృత ఉపమమ్ ।
పరిణామే విషమ్ ఇవ, తత్ సుఖం రాజసం స్మృతమ్ ॥

రాజసిక సుఖం

మొట్టమొదట సుఖకరంగా ఉంటూ, పర్యవసానంగా కొద్దికాలంలో దుఃఖముగా పరిణమించబోవుచున్న సుఖం… అట్టి సుఖం ’రాజసిక సుఖం’గా నిర్వచించబడుతోంది.

18–39

యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మనః ।
నిద్రాలస్యప్రమాదోత్థం తత్తామసముదాహృతమ్ ॥

యత్ అగ్రే చ అనుబంధే చ సుఖం మోహనమ్ ఆత్మనః ।
నిద్రా ఆలస్య ప్రమాద ఉత్థం, తత్ తామసమ్ ఉదాహృతమ్ ॥

తామసిక సుఖం

→ ఇంద్రియ విషయములు - దృశ్య వ్యవహారములకు సంబంధించినదైన సుఖం తామసిక సుఖం.
→ మొట్టమొదటి నుండి అనుబంధం (Deep Attachment) కలిగిఉండే స్వభావంగల సుఖం.
→ తనను తానే మోహం (Illusionary senses, views, ideas)చే దట్టంగా ఆవరింపజేసుకొనే విధంగా ఉండేది.
→ నిద్ర - ఆలస్యము - బద్ధకము - మత్తు - సోమరితనము - నిస్తేజత్వము కలుగజేసేది
… ఇటువంటి సుఖాలు కోరుకోవటమే ‘తామసిక సుఖాభిలాష’ అని చెప్పబడుతోంది.


18–40

న తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః ।
సత్త్వం ప్రకృతిజైర్ముక్తం యదేభిః స్యాత్ త్రిభిర్గుణైః ॥

న తత్ అస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః ।
సత్త్వం ప్రకృతిజైః ముక్తం యత్ ఏభిః స్యాత్ త్రిభిః గుణైః ॥

ఓ అర్జునా! ఈ దేవ-మానవ-పాతాళ లోకాలలోని వ్యక్తిత్వములన్నీ ప్రకృతిజనితమైన ‘‘సత్వరజస్తమో త్రిగుణాల సంప్రదర్శనం’’ తప్పితే మరింకేమీ ఎక్కడా ఏదీ ఏ రూపంగానూ లేదయ్యా! ‘ఉనికి ఉన్నది’ అనగానే ఈ ‘‘త్రిగుణాల సమన్వయము ఉన్నది’’ అనియే అర్థం. ప్రతి వాడు, ప్రతి వస్తువు ఈ త్రిగుణ సమన్వయమే!

18–41

బ్రాహ్మణక్షత్రియవిశాం శూద్రాణాం చ పరంతప ।
కర్మాణి ప్రవిభక్తాని స్వభావప్రభవైర్గుణైః ॥

బ్రాహ్మణ క్షత్రియ విశాం శూద్రాణాం చ, పరంతప! ।
కర్మాణి ప్రవిభక్తాని స్వభావప్రభవైః గుణైః ॥

స్వభావము రీత్యా గుణవిభజన

అంతరంగంలోను - వ్యక్తిత్వంలోను (In the Inner Personality) ఈ సత్వ - రజ - తమోగుణములలోని ఒక గుణము యొక్క అధికత్వం - ఆధిపత్యం అనుసరించి శాస్త్రములు చతుర్విధ వర్ణములుగా ఈ జీవులను విభజిస్తున్నాయి.

(గుణములే ఈ విభజనకు కారణం కాని, జన్మలు కాదు. లోక విభజనలు కాదు).

1.) బ్రాహ్మణ : సత్వ గుణ ప్రధానులు.
2.) క్షత్రియ : రజో గుణ ప్రధానులు.
3.) వైశ్య : రజో - తమో గుణ ప్రధానులు.
4.) శూద్ర : తమో గుణ ప్రధానులు.

ఈ బ్రాహ్మణ - క్షత్రియ - వైశ్య - శూద్రులు అనబడే చతుర్విధ వ్యక్తిత్వ విభాగమంతా కూడా - జీవులయొక్క వారివారి స్వభావమునుండి ఉత్పన్నమగుచున్న గుణముల సంయోగమును (ఏఏ పాళ్లలో ఏ గుణం అధికమో… అద్దానిని) అనుసరించి ఉంటోంది.

ఈ చాతుర్యర్ణ్యములకు చెందిన జీవులందరిలోను ఆయా వివిధ స్వభావములు అంతర్లీనంగా అభ్యాసవశంగా ప్రవృద్ధమై, దాగి ఉన్నాయి.

అయితే, ఈ త్రిగుణముల కర్తృత్వము ప్రకృతిదే! త్రిగుణములు ఈ ప్రకృతికి మూల పదార్థాలు!

18–42

శమో దమస్తపః శౌచం క్షాన్తిరార్జవమేవ చ ।
జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజమ్ ॥

శమో, దమః, తపః, శౌచం, క్షాంతిః, ఆర్జవమ్ ఏవ చ ।
జ్ఞానం, విజ్ఞానమ్, ఆస్తిక్యం బ్రహ్మ కర్మ స్వభావజమ్ ॥

బ్రహ్మ కర్మ స్వభావజము

🌺 మనో నిగ్రహరూపమైన శమము.
🌺 ఇంద్రియ నిగ్రహరూపమైన దమము.
🌺 శాస్త్ర ప్రవిచతమైన - సానుకూల్యమైన భావాలు (Positive Thinking).
🌺 ఓర్పు - క్షాంతి.
🌺 ఆర్జవం (ముక్కుకు సూటిగా - మనోవాక్కుల ఏకీభావం). అకుటిలత్వము.
🌺 జ్ఞానమును ‘విజ్ఞానముగా’ తీర్చిదిద్దుకోవాలనే అంతరంగమునందలి పట్టుదల - అభిలాష (Enthusiasm to convert the Philosophical Theoretical Knowledge into Practice).
🌺 ‘పరమాత్మ’ యొక్క తత్త్వము పట్ల ‘‘పరమాత్మ ఉన్నారు. ఆయనే అంతటికీ కారణ కారణుడు. ఆయనను చేరాలి’’ అనే ఆశయం కలిగి ఉండటం, అట్టి బోధలు వినిపించటం. (ఆస్తిక్యము).
🌺 యజ్ఞ - యాగ - పూజ - తపస్సులపట్ల (బ్రహ్మకర్మలపట్ల) అభిరుచి
… మొదలైనవి.

18–43

శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనమ్ ।
దానమీశ్వరభావశ్చ క్షాత్రం కర్మ స్వభావజమ్ ॥

శౌర్యం, తేజో, ధృతిః, దాక్ష్యం, యుద్ధే చ అపి అపలాయనమ్ ।
దానమ్, ఈశ్వరభావః చ క్షాత్రం కర్మ స్వభావజమ్ ॥

క్షాత్ర కర్మ స్వభావజము

🌹 శౌర్యము (Ability to fight out evils).
🌹 తేజస్సు (Enlightened).
🌹 ధృతి (Courage and Initiative).
🌹 దక్షత (Commitment and Leadership).
🌹 యుద్ధమునందు అపలాయనం (Determination to continue to fight in spite of hurdles. Not withdrawaing from the efforts).
🌹 దానము (Contributing to others).
🌹 ఈశ్వరభావత్వం (Adoring Godliness in the Universe outside and within).
🌹 క్షాత్రం (Capabilities to achieve tasks)
… మొదలైనవి.

18–44

కృషిగౌరక్ష్యవాణిజ్యం వైశ్యకర్మ స్వభావజమ్ ।
పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజమ్ ॥

కృషి గౌరక్ష్య వాణిజ్యం వైశ్య కర్మ స్వభావజమ్ ।
పరిచర్యాత్మకం కర్మ శూద్రస్య అపి స్వభావజమ్ ॥

వైశ్య కర్మ స్వభావజము

🌼 కృషి,
🌼 గోరక్షణ (ఆహారాది సంపదలను సంరక్షించటం - పరిపోషించటం),
🌼 వాణిజ్యం (Business and Transportation Services)
… మొదలైనవి.

శూద్ర కర్మ స్వభావజము

🌸 పరిచర్యాత్మకం (Extending services to the physical needs of the others in the society),
🌸 సేవా స్వభావం (Enthusiasm to serve the people),
… మొదలైనవి.

18–45

స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః ।
స్వకర్మనిరతః సిద్ధిం యథా విన్దతి తచ్ఛృణు ॥

స్వే స్వే కర్మణి అభిరతః సంసిద్ధిం లభతే నరః ।
స్వకర్మనిరతః సిద్ధిం యథా విందతి తత్ శృణు ॥

ఓ అర్జునా! జీవులంతా కూడా ఈరీతిగా ప్రకృతియొక్క ప్రభావంచేత, వారివారి అభ్యాస - గుణాధిక్యతలను అనుసరించి చతుర్విధ గుణస్వభావులై ఉన్నారు.

ఈ విధంగా ‘‘శాస్త్రజ్ఞాన సంపత్తి - పురుషకారము - కృషి - సేవ’’ (Intellect - Protecting - Effort - Physical Services) …. ఈ నాలుగు వారియొక్క లక్షణ సంపద అయి ఉన్నది.

ఈ నాలుగు విధములగు గుణస్వభావజులు కూడా మోక్షరూపమైన ఆత్మానందానికి తప్పక అర్హులే!

ఈ జగన్నాటకము యొక్క చమత్కారమునకై ఈ నాలుగు స్వభావులు - వారివారి పాత్రలు తప్పక ఆవస్యకమే! ఇక తక్కువ ఎక్కువలు ఏమున్నాయి!

ఈ నలుగురు కూడా వారివారి స్వభావసిద్ధములగు బ్రాహ్మణ - క్షత్రియ - వైశ్య - శూద్ర గుణసంపత్తులతో వారివారి పాత్రోచితమైన స్వకర్మలను నిర్వర్తించి కర్మయోగులై, తద్వారా తప్పక సిద్ధిని పొందగలరు.

కొందరు అజ్ఞులు భావించే విధంగా ‘‘మోక్షస్థితి - సంసిద్ధి పొందటానికి వీరిలో ఒక గుణ ప్రధానులకే సాధ్యం. కొన్నికొన్ని గుణప్రధానులు సిద్ధిని పొందలేరు’’… అను వాక్యం యుక్తియుక్తమే కాదు.

ఈ విధమైన బ్రాహ్మణ - క్షత్రియ - వైశ్య - శూద్ర గుణసంపదా ప్రధానులు వారివారి గుణములను అనుసరించి కర్మలు నిర్వర్తిస్తూ సిద్ధిని - ఆత్మతాదాత్మ్యమును - ముక్తిని ఏవిధంగా పొందవచ్చో, … అది కూడా వివరిస్తున్నాను. విను.

18–46

యతః ప్రవృత్తిర్భూతానాం యేన సర్వమిదం తతమ్ ।
స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విన్దతి మానవః ॥

యతః ప్రవృత్తిః భూతానాం, యేన సర్వమ్ ఇదం తతమ్ ।
స్వకర్మణా తమ్ అభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః ॥

‘‘సంసిద్ధి’’

గుణ సంబంధమైన వ్యష్ఠి-సమిష్ఠి … అదంతా సందర్భ సత్యాలు మాత్రమే! సహజ సత్యము ఆత్మయే!

ఈ వివిధ గుణ ప్రధాన జీవులంతా ఒకే ఆత్మతత్వం నుంచి బయెల్వడలుచున్నారు కదా! అనగా అందరూ స్వతఃగా పరమాత్మ స్వరూప - స్వభావులే!

త్రిగుణములు ఆత్మనుండే బయల్వెడలుచున్నాయి. ఇందులో ప్రతి ఒక్కరూ (ప్రతి ఒక్క గుణప్రధానుడూ) తనయొక్క గుణ సంపదను అనుసరించి సర్వాత్మకుడగు పరమేశ్వరునికి సమర్పణపూర్వకంగా తనకు విధించబడిన విధులను, కార్యక్రమములను నిర్వర్తిస్తూ సిద్ధిని పొందగలడు. ఇందులో సందేహమే లేదు.

సాత్వికాధిక్యతగల స్వభావుడు (బ్రాహ్మణః) - ‘‘నేను క్షాత్రవ స్వభావునివలె రక్షణ కల్పించటల్లేదే! వైశ్య స్వభావునివలె కృషి చేసి సంపదాభివృద్ధికి శ్రమించటం లేదే? శూద్ర స్వభావునివలె సేవించలేకపోతున్నానే?’’…. అని అనుకోవలసిన పని లేదు. తన యొక్క మనో - ఇంద్రియ నిగ్రహం, తపస్సు, శుచి అయిన భావాలు, ఆత్మనిగ్రహం, నిర్దుష్టాభిప్రాయాలు, శాస్త్రజ్ఞాన విజ్ఞాన పాటవాలు, ఆస్తిక్యత వంటి గుణాలతో సర్వాంతర్యామి - సర్వతత్వ స్వరూపుడు - సర్వ జీవస్వరూపుడు అగు పరమాత్మను ఆరాధిస్తూ సిద్ధిని సముపార్జించుకోవటమే ఉచితం.

అట్లాగే క్షత్రియ స్వభావుడు (క్షత్రియః) - ‘‘నేను బ్రాహ్మణ గుణసంపన్నునివలె శాస్త్ర జ్ఞాన విజ్ఞానశాస్త్ర సంపద కలిగిలేనే? వైశ్యగుణ సంపన్నునివలె కృషి - గోరక్షణ - సంపదాభివృద్ధి నిర్వర్తించటం లేదే? శూద్రగుణ సంపన్నుని వలె సేవాతత్పరత ప్రదర్శించటం లేదే?’’…. అని దిగులుపడవలసిన అవసరం లేనే లేదు. తనయొక్క శౌర్య - తేజో గుణసంపద - ధైర్యము - త్యాగనిరతి - యుద్ధ లాఘము - దానము - ఈశ్వరభక్తి - క్షాత్రము … ఇత్యాది గుణములచే సర్వస్వరూపుడగు పరమాత్మను సేవిస్తూ తప్పక సంసిద్ధి పొందగలడు.

ఆ విధంగానే వైశ్యగుణ సంపన్నుడు - ‘‘నేను బ్రాహ్మణ గుణసంపన్నునివలె శాస్త్ర పఠణాదులు చేయలేకపోతున్నానే?’’…. అని వేదన చెందనవసరం లేదు. తనయొక్క ‘‘కృషి - గోరక్షణ - సంపద రక్షణ - వాణిజ్య’’ కర్మల ద్వారా ‘‘నేను సర్వాంతర్యామియగు పరమాత్మను ఈ రూపంగా సేవిస్తున్నాను’’…. అని భావన చేసి తన స్వభావసిద్ధమైన కర్మలను సమర్పణ - భక్తి పూర్వకంగా నిర్వర్తించును గాక! ఆతని ఆ కర్మనిరతి ఆతనిని సముద్ధరిస్తుంది.

అదే విధంగా శూద్రసంపద స్వభావుడు - ‘‘సేవించాలి. నా సేవ ద్వారా జనులను సంతసింపజేయాలి’’…. అను స్వభావము కొనసాగించు గాక! అయ్యో! నేను శాస్త్రాలు సేవించటం లేదే? పరాక్రమం ప్రదర్శించటం లేదే? సంపదలను వృద్ధి చేయటం లేదే?’‘…. అని బాధ పడవలసిందేమీ లేదు. ’‘నా యొక్క ఈ సేవా ప్రవృత్తిచే పరమాత్మను సర్వదా సేవిస్తున్నాను’’…. అని భావించి ఆ సేవానిరతిని నిర్వర్తించు గాక! తద్వారా ఆతడు తప్పకుండా సర్వాంతర్యామియగు పరమాత్మసందర్శనం సముపార్జించుకోగలడు.

18–47

శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ ।
స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషమ్ ॥

శ్రేయాన్ స్వధర్మో విగుణః, పరధర్మాత్ స్వనుష్ఠితాత్ ।
స్వభావ నియతం కర్మ కుర్వన్, న ఆప్నోతి కిల్బిషమ్ ॥

ఓ అర్జునా! ఏ గుణస్వభావునికి ఆ గుణసంపదద్వారా పరమాత్మ సమర్పణా భావంతో ఆ గుణసంపదకు సానుకూలమగుచున్న కర్మలు నిర్వర్తించటమే సముచితం.

ఏది స్వధర్మమైయున్నదో…, అయ్యది తప్పక ఆ జీవునికి శ్రేయస్సు కలుగజేయగలదు. అది గొప్పది - అని ఎవరికైనా అనిపించకపోయినప్పటికీ… అది శ్రేయోదాయకమే! గుణ స్వభావానుసారంగా (జగన్నాటకంలోని పాత్రోచితంగా) తనకు నియమించబడిన కర్మ నిర్వర్తించటంచేత కర్మలదోషం ఆతనికి ఏ మాత్రం అంటనే అంటదుసుమా!

18–48

సహజం కర్మ కౌంతేయ సదోషమపి న త్యజేత్ ।
సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః ॥

సహజం కర్మ, కౌంతేయ! సదోషమ్ అపి న త్యజేత్ ।
సర్వారంభా హి దోషేణ ధూమేన అగ్నిః ఇవ ఆవృతాః ॥

ఓ పార్థా! తనకు గుణస్వభావానుసారంగా సహజమైయున్న నియమిత కర్మ తనకు ప్రసాదించబడిన భగవత్‌ దత్తమైన సాధనంగా చూడాలి. గమనించాలి.

చాతుర్వర్ణ్య ధర్మములు స్వభావ సంబంధమైనవేగాని, జన్మసంబంధమైనవి కావు. ‘‘ఇందులో కొన్ని కొన్ని దోషాలు ఉన్నాయే? మరి ఎందుకు చేయటం?’’ అని ఆయా ‘‘బ్రాహ్మణ - క్షత్రియ - వైశ్య - శూద్ర’’ గుణస్వభావులు తలచరాదు. అందులో దోషములు ఉన్నప్పటికీ గుణస్వభావానుసారంగా నియమితమైన కర్మ తప్పక నిర్వర్తించవలసిందే!

ఇక ఆయా నియమిత కర్మలలో దోషం సంగతేమింటంటావా? ఇక్కడ ఒక్క విషయం ప్రతి ఒక్కరు గమనించాలి. అగ్ని ఉన్నచోట పొగలేకుండా ఉంటుందా? ఉండదు కదా! అట్లాగే ఏ (స్వభావ సంబంధమైన) కర్మ ప్రారంభించినప్పటికీ అందులో ఏవో కొన్ని దోషాలు అనివార్యంగా ఉంటాయి. అది ‘కర్మ’ యొక్క ఒకానొక అనివార్యమైన లక్షణం.

18–49

అసక్తబుద్ధిః సర్వత్ర జితాత్మా విగతస్పృహః ।
నైష్కర్మ్యసిద్ధిం పరమాం సంన్యాసేనాధిగచ్ఛతి ॥

అసక్తబుద్ధిః సర్వత్ర, జితాత్మా, విగతస్పృహః ।
నైష్కర్మ్యసిద్ధిం పరమాం సన్న్యాసేన అధిగచ్ఛతి ॥

వారు గుణ స్వభావ, సహజ, నియమిత కర్మ చేస్తున్నప్పుడు ఆ కర్మల యొక్క దోషం వారిని అంటకుండా ఉండటానికి ‘నైష్కర్మ్యసిద్ధి’ని అవలంబించుదురు గాక!

నైష్కర్మ్య సిద్ధి

ఎవ్వరికైనా …. నైష్కర్మ్యసిద్ధి ఎట్లా లభిస్తుందో విను!

సర్వత్ర అనాసక్తి బుద్ధితో : (By maintaining detachment with the help of understanding and intellectual ability)
జితాత్మా : ఇంద్రియ విషయములను - దృశ్య సంబంధమైన సర్వ విశేషములను మొదలంట్లా జయించినవాడవై, (అనగా) వాటికి అతీతస్థానం సముపార్జించి, వాటిచేత ఆకర్షితుడవు కానివాడవై ఉండి,
… నీ యొక్క ఆయా నియమిత గుణస్వభావానుకూలమైన కర్మను నిర్వర్తించు.

ఈ విధంగా సర్వత్రా అనాసక్తబుద్ధితో - సర్వ దృశ్యములచే స్పృశించబడనివాడవై స్వధర్మ-కర్మలు నిర్వర్తిస్తూరాగా…. నీకు ’‘నైష్కర్మ్యసిద్ధి’’ లేక ‘‘సన్యాసయోగము’’ సిద్ధించగలదు.

18–50

సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధ మే ।
సమాసేనైవ కౌన్తేయ నిష్ఠా జ్ఞానస్య యా పరా ॥

సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ, తథా ఆప్నోతి నిబోధ మే ।
సమాసేన ఏవ, కౌంతేయ! నిష్ఠా జ్ఞానస్య యా పరా ॥

అనగా,
↳ కర్మలు చేస్తూ చేయనివాడవై ఉండడం,
↳ జన్మలు పొందుతూ ఉన్నా జన్మరాహిత్యం ఆస్వాదిస్తూ ఉండడం,
↳ దృశ్యాంతర్గతంగా ఉంటూనే దృశ్యమునకు అతీతత్వమును స్వభావసిద్ధంగా సిద్ధించుకోవటం,
… ఈ ఈ మార్గంలో క్రమంగా, తప్పక ‘బ్రహ్మము’ అను స్థితిని సముపార్జించుకోగలవు.

పరబ్రహ్మ స్థితి - బ్రహ్మీ స్థితి

ఓ అర్జునా! ఏ విధములైన నిష్ఠ - జ్ఞానములచే (With the help of what kind of awareness and determined practises?) ఈ జీవుడు ‘బ్రహ్మము’ అను స్థితి - స్వరూప - స్థానములను సిద్ధించుకోవచ్చునో,… అది ఇక్కడ మరల సంక్షిప్తంగా చెప్పుచున్నాను. శ్రద్ధగా విని, గ్రహించు.

18–51

బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ ।
శబ్దాదీన్ విషయాంస్త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ ॥

బుద్ధ్యా విశుద్ధయా యుక్తో, ధృతి ఆత్మానం నియమ్య చ ।
శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా, రాగద్వేషౌ వ్యుదస్య చ ॥

బుద్ధ్యా విశుద్ధయా యుక్తః : బుద్ధిని నిర్మలం చేసుకో. ఆవేశము - కోపము - ఆశ - దురాశ - దృశ్యాకర్షణ మొదలైన దోషములను చిత్తము నుండి బుద్ధితో ప్రయత్నపూర్వకంగా తొలగించుకో.

ధృత్యాత్మానం : ధైర్యము - పట్టుదల సడలించుకోకు! దీనికీ - దానికీ దిగుళ్లుపడుతూ, అపనమ్మకములతో కాలం వృథా చేసుకోకు!

నియమ్య : ఆహారం - లోక విషయాలు… వీటియందు నిష్ఠ - నియమములను వహించు. ‘‘ఏది ఎంతవరకు నియమిత కర్మనిరతికై అత్యవసరమో, అంతకుమించి ఆశ్రయించక పోవటం’’ - అను నియమము యొక్క అభ్యాసం కలిగి ఉండు. నియమ - నిష్ఠలు రచించుకొని, పెద్దలు చెప్పే మార్గంలో అనుసరించు.

శబ్దాదీన్‌ విషయాన్‌ త్యక్త్వా : ఇక్కడి శబ్ద - స్పర్శ - రూప - రస - గంధాలను, వాటి వాటి విషయాలను మనస్సుతో క్రమక్రమంగా త్యజించినవాడవై ఉండు.

రాగద్వేషౌ వ్యుదస్య : రాగ-ద్వేషములను (Liking and Disliking) రెండిటికిని బద్ధుడవు కావద్దు. రాగద్వేషములను క్రమక్రమంగా వదలి ఉండు.

18–52

వివిక్తసేవీ లఘ్వాశీ యతవాక్కాయమానసః ।
ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః ॥

వివిక్తసేవీ, లఘు అశీ, యత వాక్ కాయ మానసః ।
ధ్యానయోగపరో, నిత్యం వైరాగ్యం సముపాశ్రితః ॥

వివిక్తసేవీ : ఏకాంతసేవ ఆశ్రయించి ‘‘నేను-సర్వాంతర్యామియగు పరమాత్మ’’ అను ఏకాంత సేవ హృదయాంతరంగంలో అలవరచుకో. తదితర జగత్తు బాహ్యమునందే వదిలివేయి. క్రమ-క్రమంగా బాహ్యజగత్తును భగవత్‌ స్వరూపంగా సందర్శించు.

లఘ్వాశీ : ప్రాపంచిక సంబంధమైన సర్వ ఆశలను అతి పరిమితంగా ఉంచుకో (Keep yourself satisfied by simplifying your satisfaction level)

యత వాక్‌-కాయ-మానసః : నీ శరీరమును - వాక్కును - మనస్సును అధీనంలో ఉంచుకో. వశం చేసుకొని ఆధ్యాత్మికమైన సాధన వస్తువులుగా తీర్చి దిద్దుకో.

ధ్యానయోగపరో : పరమేశ్వరధ్యానం, సర్వాంతర్యామి యొక్క ధ్యాస అలవరచుకో. ‘‘ఈ శరీరవాక్కులు ఈశ్వరప్రసాదితాలే కదా’’… అనే జ్ఞప్తిని పరిపుష్టి చేసుకో.

నిత్యం వైరాగ్యమ్‌ సముపాశ్రితః : అనునిత్యంగా వైరాగ్యం (Dispassion and Detachment) అలవరచుకో. ‘‘ఇదంతా పరమాత్మదే కాని, నాది కాదు’’… అను రూపంతో కూడిన రాగరాహిత్యం సకల సమయములలోను అభ్యసిస్తూ ఉండు.

18–53

అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహమ్ ।
విముచ్య నిర్మమః శాన్తో బ్రహ్మభూయాయ కల్పతే ॥

అహంకారం, బలం, దర్పం, కామం, క్రోధం, పరిగ్రహమ్ ।
విముచ్య, నిర్మమః, శాంతో, బ్రహ్మభూయాయ కల్పతే ॥

అహంకారం - బలం - దర్పం - కామం - క్రోధం పరిగ్రహమ్‌ విముచ్య : ‘‘విషయాలు వస్తువులు నాకు సంబంధించినవి! నేను వాటికి సంబంధించిన వాడను! వీటిచే పరిమితుడను’’ అనే భావావేశం, అహంకార - బల - దర్పములు, లేనివాటికోసం వెంపరలాడటం, వారిపై - వీరిపై క్రోధం… ఇవన్నీ వదలి వేస్తూ ఉండు. క్రమంగా మొదలంట్లా త్యజించివేయి.

నిర్మమః : మమకారం వదలు.

శాంతః : శాంతమును అంతరంగంలో అభ్యసిస్తూ, ఆస్వాదిస్తూ ఉండు.

ఇట్టి అభ్యాసములచే - “ప్రతి తరంగము జలమే అయినట్లు నేను పరబ్రహ్మమే అయిఉన్నాను” అను ’పరబ్రహ్మతో ఏకీభావము’నకు అర్హుడవగుచున్నావు.

18–54

బ్రహ్మభూతః ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి ।
సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరామ్ ॥

బ్రహ్మభూతః ప్రసన్నాత్మా, న శోచతి, న కాంక్షతి ।
సమః సర్వేషు భూతేషు, మత్ భక్తిం లభతే పరామ్ ॥

ఓ కౌంతేయా! బ్రహ్మముతో ఏకీ భావము అభ్యసించువాడు సర్వకాల, సర్వావస్థలయందు ప్రసన్నహృదయుడై ఉంటాడు. (He always practises and adopts pleasantness). ఆతడు సర్వ వేదనలను, దుఃఖములను అతిక్రమించివేస్తున్నాడు. ఏదీ కూడా కావాలనో - వద్దనో కాంక్షించటం లేదు, ద్వేషించటం లేదు.

ఓ ధనంజయా! అట్టివాడు క్రమంగా సర్వాంతర్యామియగు నా పట్ల భక్తితత్పరత పెంపొందించుకొని… సర్వభూతాంతర్గతుడనగు నన్ను ప్రేమిస్తూ ’‘పరాంగతి’’ని (Highest Path) సముపార్జించుకుంటున్నాడు. నా పట్ల పరాభక్తిని పెంపొందించుకొని, నన్ను చేరుచున్నాడు.

18–55

భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్త్వతః ।
తతో మాం తత్త్వతో జ్ఞాత్వా విశతే తదనంతరమ్ ॥

భక్త్యా మామ్ అభిజానాతి యావాన్ యః చ అస్మి తత్త్వతః ।
తతో మాం తత్త్వతో జ్ఞాత్వా విశతే తత్ అనంతరమ్ ॥

అట్టి భక్తి యొక్క ఔన్నత్యముచే ‘‘ఈ సర్వముగా కనిపిస్తున్నది పరమాత్మయగు నేనే’’ అని గమనిస్తున్నాడు. పరమాత్మతత్త్వం గ్రహిస్తున్నాడు.

నా యందు అనన్య భక్తితో నన్నే చేరినవాడగుచున్నాడు.

నా యందు ప్రవేశించి నేనే తానగుచున్నాడు.

18–56

సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః ।
మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయమ్ ॥

సర్వకర్మాణి అపి సదా కుర్వాణో మత్ వ్యపాశ్రయః ।
మత్ ప్రసాదాత్ అవాప్నోతి శాశ్వతం పదమ్ అవ్యయమ్ ॥

ఓ అర్జునా! ఆయా గుణస్వభావానుసారం నియమిత (Alloted) కర్మలు నిర్వర్తిస్తూ కూడా…
⤿ నన్ను ఆశ్రయించువాడు,
⤿ నన్ను సర్వాంతర్యామిగా, సర్వతత్త్వాత్మకుడుగా, సర్వ తత్త్వస్వరూపుడుగా, ఉపాసనా పూర్వకంగా గ్రహించువాడు,
→ మత్‌ ప్రాసాదితంగా ‘‘శాశ్వతమగు స్థితి - స్థానము’’ పొందుచున్నాడు. శాశ్వత పదమును (Permanently placed undisturbed state) అలంకరించుచున్నాడు.

18–57

చేతసా సర్వకర్మాణి మయి సంన్యస్య మత్పరః ।
బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ ॥

చేతసా సర్వకర్మాణి, మయి సన్న్యస్య, మత్ పరః ।
బుద్ధియోగమ్ ఉపాశ్రిత్య, మత్ చిత్తః సతతం భవ ॥

అందుచేత ఓ అర్జునా! నీవు చేస్తున్న సర్వ కార్యక్రమములు నివేదన పూర్వకంగా నాకు సమర్పించు.

సమర్పణ బుద్ధితో సన్యసించియుండు.

బుద్ధియోగంతో సర్వ వ్యవహారములు త్యజించి ఉండు.

18–58

మచ్చిత్తః సర్వదుర్గాణి మత్ప్రసాదాత్తరిష్యసి ।
అథ చేత్త్వమహంకారాన్న శ్రోష్యసి వినంక్ష్యసి ॥

మత్ చిత్తః సర్వదుర్గాణి మత్ ప్రసాదాత్ తరిష్యసి ।
అథ చేత్, త్వమ్ అహంకారాత్ న శ్రోష్యసి వినంక్ష్యసి ॥

నీ చిత్తమును సర్వదా - సర్వత్రా - సర్వవిధములుగా, సర్వ తత్త్వ స్వరూపుడనగు నాకు సమర్పణ చేయి. ఏ చిత్తముతో జగద్వివిషయాలపట్ల అహంకార - మమకారములు ఏర్పడుచున్నాయో,… అట్టి ఆ చిత్తమును నాకు సమర్పించు. సతతము చిత్తమును సన్యసించి, పరమాత్మకు సమర్పించి, చిత్తము యొక్క పరిధిని అధిగమించి ఉండు. చిత్తముతో చిత్తమునకు సాక్షి అయిన చిత్‌ దర్శనము అభ్యసించు. నా యందు చిత్తమును నెలకొలిపి నీ స్వధర్మములను నిర్వహించు.

అప్పుడు, నీకు తారసపడుచున్న అడ్డంకులన్నీ నేను తొలగిస్తాను. తన విధ్యుక్త ధర్మనిర్వహణను పూర్తిగా నాకు సమర్పించినవాడు నా యొక్క ప్రసాదముచే (With the help, participation and sanction) తప్పక తరించగలడు. నేను అట్టివానిని సర్వ దుఃఖముల నుండి తరింపజేస్తున్నాను.

ఓ అర్జునా! ‘‘సన్యాసి - త్యాగి’‘వై ఉండు.

(1) సన్యాసయోగం : చిత్తమును సమర్పించటం - సర్వకర్మఫలములను సన్యసించటం. సత్‌స్వరూపుడగు పరమాత్మను సర్వ స్వరూపుడుగా మననం చేయటం.

(2) త్యాగయోగం : విహిత కర్మలను నిర్వర్తిస్తూ పరమాత్మకు ఆ కర్మలకు సమర్పించి త్యాగివై ఉండటం.

’‘సన్యాస - త్యాగ యోగం’’ అభ్యాసం చేయటం ఏమరిచి అహంకార మమకారాలనే సేవిస్తూ జీవితం కొనసాగించదలచితే… అప్పుడు నీకు వ్యతిరేక ప్రయోజనములు (నష్టము) అనివార్యం సుమా!

18–59

యదహంకారమాశ్రిత్య న యోత్స్య ఇతి మన్యసే ।
మిథ్యైష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి ॥

యత్ అహంకారమ్ ఆశ్రిత్య న యోత్స్య ఇతి మన్యసే ।
మిథ్య ఏష వ్యవసాయః తే ప్రకృతిః త్వాం నియోక్ష్యతి

ఒకవేళ నీవు అహంకారమును ఆశ్రయించి నీ స్వధర్మమగు ఈ ‘‘యుద్ధం చేయటం’’ అనే కర్మనుండి విరమించటానికి నిర్ణయించుకొన్నావా… నీ అట్టి ప్రయత్నం నిష్ప్రయోజనమే అవగలదు.

పైగా, స్వధర్మమును ఏమరచిన వానికి పతనం అనివార్యం!

మరొక విషయం!
ప్రకృతియే జీవులందరినీ ఆయా కర్మలందు నియమిస్తోంది! ఇక ‘నేను చేయను’’ అను స్వతంత్రం మాత్రం జీవులకు ఎక్కడిది?
ప్రతి జీవుడు తనయొక్క గుణస్వభావంచేత తాను నిర్వర్తించవలసియున్న ఆయా కర్మలయందు ప్రకృతిచే నిబద్ధుడై ఉన్నాడు. ప్రకృతి నియమిత కర్మల నిబద్ధత్వం నుండి ఎవ్వడూ ఏమాత్రం తప్పించుకోజాలడు.

18–60

స్వభావజేన కౌన్తేయ నిబద్ధః స్వేన కర్మణా ।
కర్తుం నేచ్ఛసి యన్మోహాత్కరిష్యస్యవశోఽపి తత్ ॥

స్వభావజ ఏన, కౌంతేయ! నిబద్ధః స్వేన కర్మణా ।
కర్తుం న ఇచ్ఛసి యత్ మోహాత్, కరిష్యసి అవశో అపి తత్ ॥

నీవు మోహావేశంలో ‘‘ఈ యుద్ధము అనే కర్మను నేను నిర్వర్తించను’’ అని నిర్ణయించుకొని విరమించ యత్నించినప్పటికీ, నీవు ప్రకృతికి బద్ధుడవై బలవంతంగా నిర్వర్తించవలసి వస్తుంది.

(ఉదాహరణకు, కౌరవులు క్రూరస్వభావంతో నీ సోదరులను హింసించటానికి సమీపించినప్పుడైనా… నీవు బలవంతంగా యుద్ధం చేయాలని నిర్ణయించుకోవటం అనివార్యమౌతుంది).

18–61

ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశేఽర్జున తిష్ఠతి ।
భ్రామయన్సర్వభూతాని యంత్రారూఢాని మాయయా ॥

ఈశ్వరః సర్వభూతానాం హృత్ దేశే, అర్జున! తిష్ఠతి ।
భ్రామయన్ సర్వభూతాని యంత్రా ఆరూఢాని మాయయా ॥

ఎందుకంటే,

🙏 ఈశ్వరుడు సర్వజీవుల హృదయాలలో సర్వదా వేంచేసియున్నారు.

🙏 ఈ దృశ్య చమత్కార యంత్రమును ఈశ్వరుడు అంతర్యామి అయి త్రిప్పుచున్నారు.

భ్రమణ యంత్రమును (Wheel) అధిరోహించినవాడు యంత్రముతోబాటు తానూ తిరుగుతాడు కదా!

ఈశ్వర సంకల్పానుసారం ఈ సంసార చక్రంలో, ఈ జీవులంతా వారి వారి ఇష్ట-అయిష్టాలతో సంబంధం లేకుండానే తిరుగాడుచున్నారు.

18–62

తమేవ శరణం గచ్ఛ సర్వభావేన భారత ।
తత్ప్రసాదాత్పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతమ్ ॥

తమ్ ఏవ శరణం గచ్ఛ సర్వభావేన, భారత! ।
తత్ ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతమ్ ॥

ఓ ఫల్గుణా! సర్వుల హృదయాలతో వేంచేసి, వారివారి మనో - బుద్ధి - చిత్త - అహంకారాలను తన వశం చేసుకొని త్రిప్పుచున్న ఈశ్వరుడు సర్వజీవుల దృష్టి - ప్రయత్నములను భ్రమింపజేస్తూ ఉన్నారు. హృదయేశ్వరుని లీలచే జీవులంతా ఆయా కర్మలను అనివార్యంగా, వశులై నిర్వర్తిస్తున్నారు.

అందుచేత, నీవు ఆ సర్వహృదయేశ్వరుని శరణు వేడు.

సర్వభావములు ఆ సర్వాంతర్యామికే సమర్పించి - సర్వభావములచే ఆయనను ఆశ్రయించు.

కార్యకారణ స్వరూపుడగు ఆ పరమాత్మయొక్క కృపచే శాశ్వత, శాంత స్థానమగు ‘ఆత్మాఽహమ్‌’ స్థితిని తప్పక పొందగలుగుతావు.

18–63

ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్గుహ్యతరం మయా ।
విమృశ్యైతదశేషేణ యథేచ్ఛసి తథా కురు ॥

ఇతి తే జ్ఞానమ్ ఆఖ్యాతం గుహ్యాత్ గుహ్యతరం మయా ।
విమృశ్య ఏతత్ అశేషేణ యథా ఇచ్ఛసి తథా కురు ॥

ఓ అర్జునా! రహస్యములలోకెల్ల అతిరహస్యమైన ఆత్మతత్త్వజ్ఞానాన్ని నీకు సవివరంగా ఇప్పటివరకు విశదీకరించాను.

నేను ఇప్పటివరకు చెప్పిన విశేషాలన్నీ ఆద్యంతంగా అన్నిటినీ క్రోడీకరించుకొని నీకు నీవుగా విచారణచేయి. విమర్శించుకో.

అటు తరువాత, ‘‘ఇప్పుడు ఈ యుద్ధం చేయాలా? లేక ఈ యుద్ధరంగం నుండి విరమించాలా?’’… అనునది నీకు నీవే నిర్ణయించుకో.

నీకు ఏది ఇష్టమని శ్రేయమని, సమయోచితమని నీవు అనుకుంటావో… అది చేయి.

(జీవులు భగవద్గీతాంతర్గత విచారణను పరిశీలించి…… ఇక తమ బుద్ధిచే తమ ఉచితానుచితములు, యోగ-సాంఖ్యాది మార్గములు నిర్ణయించుకొందురు గాక!)

18–64

సర్వగుహ్యతమం భూయః శ్రృణు మే పరమం వచః ।
ఇష్టోఽసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితమ్ ॥

సర్వగుహ్యతమం భూయః శ్రృణు మే పరమం వచః ।
ఇష్టో అసి మే దృఢమ్ ఇతి, తతో వక్ష్యామి తే హితమ్ ॥

అయితే, ఇప్పుడు సర్వరహస్యములలోను ‘‘అత్యంత రహస్యము’’ (The Greatest Factual Secret) అయి ఉన్నట్టి సర్వ వాక్య సారమైన పరమ విశేషాన్ని మరింకొక్కసారి ’సారవిషయం’గా క్రోడీకరించి (Brief Essence) చెప్పుచున్నాను.

నీవంటే నాకు ఎంతో ఇష్టం. పైగా శ్రద్ధగా వింటున్నావు. దృఢ చిత్త సమన్వితుడవు. కాబట్టి, నీపై ప్రేమ చేత మరల ఈ వాక్యం చెప్పుచున్నాను …. విను.

18–65

మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు ।
మామేవైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోఽసి మే ॥

మత్ మనా భవ, మత్ భక్తో, మత్ యాజీ, మాం నమః కురు ।
మామ్ ఏవ ఏష్యసి, సత్యం తే ప్రతిజానే, ప్రియో అసి మే ॥

సర్వత్యాగపూర్వక శరణాగతి

🍎 నీ మనసంతా నాపై నిలుపు!
🍎 నాయందు సర్వ విధాలా భక్తి - ప్రేమ తత్పరతలు కలిగిఉండు!
🍎 నీ సర్వ కర్మపుష్పములచే నన్ను పూజించువాడవై ఉండు!
🍎 నాకు జీవ బ్రహ్మైక్య భావతత్పరతతో కూడినవాడవై నమస్కరించు!
(న = సర్వాంతర్యామి; మ = జీవుడు= నమః)

నీవు నాకు అత్యంత ఆప్తుడవు సుమా!
సర్వజీవులు నాకు అత్యంత ఆప్తులు!
నన్ను శరణువేడితే సర్వ విధాలా నన్ను పొందగలరు!
దీపకాంతిని సమీపించినవాడు సహజంగానే చీకటినుండి బయల్వెడలతాడు కదా!

18–66

సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ ।
అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః ॥

సర్వధర్మాన్ పరిత్యజ్య, మామ్ ఏకం శరణం వ్రజ ।
అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి, మా శుచః ॥

నీయొక్క సర్వ కృత - అకృత ధర్మములు, గుణస్వభావ సిద్ధమగు సాత్విక - రాజసిక - వైశ్య - శూద్ర స్వభావ సిద్ధమైన కర్మలు నా పట్ల సన్యసించినవాడవై, త్యాగివై ఉండు. సర్వదా (ఎల్లప్పుడు), సర్వథా (అన్ని విధములుగా) నన్ను శరణువేడు.

నిన్ను సర్వ దోషముల నుండి నేను తప్పక సముద్ధరిస్తాను.

కనుక, అన్ని దిగుళ్లు వదలివేయి.
(Leave all worries. I am there to take care of!)

18–67

ఇదం తే నాతపస్కాయ నాభక్తాయ కదాచన ।
న చాశుశ్రూషవే వాచ్యం న చ మాం యోఽభ్యసూయతి ॥

ఇదం తే న అతపః కాయ, న అభక్తాయ కదాచన ।
న చ అశుశ్రూషవే వాచ్యం, న చ మాం యో అభి అసూయతి ॥

పరమోత్తమమగు ఈ గీతా శాస్త్ర రహస్యాన్ని తపస్సు, సేవాభావం, గురుశుశ్రూష, భక్తి - ఇటువంటి అభ్యాస గుణాలు లేనివానికి, నాపట్ల అసూయ పెంపొందించుకొని ఉన్నవానికి నీవు చెప్పవద్దు.

అత్యంత సూక్ష్మతత్త్వమగు ఈ ప్రవచన సారాంశము అసూయారాహిత్యము, భక్తి - శుశ్రూష - తపస్సు లేని వానికి చెప్పితే ’పెడర్థం’గా అర్థం చేసుకుంటాడేగాని సునిశిత దృష్టిచే సారాంశాన్ని గ్రహించలేడు.

18–68

య ఇమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి ।
భక్తిం మయి పరాం కృత్వా మామేవైష్యత్యసంశయః ॥

య ఇమం పరమం గుహ్యం మత్ భక్తేషు అభిధాస్యతి ।
భక్తిం మయి పరాం కృత్వా మామ్ ఏవ ఏష్యతి అసంశయః ॥

ఎవ్వరైతే ఈ గీతా శాస్త్ర వ్యాఖ్యాన పూర్వక జ్ఞానాన్ని నాయందు భక్తి కలిగి ఉండి, నా భక్తులకు విశదీకరిస్తూ ఉంటారో… అట్టివారికి ఇది భక్తి - జ్ఞాన సాధన కాగలదు.

అట్టివాడు సర్వాంతర్యామినగు నన్ను తప్పక చేరుకోగలడు.

ఇందులో ఏమాత్రం సందేహం లేదు.

18–69

న చ తస్మాన్మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః ।
భవితా న చ మే తస్మాదన్యః ప్రియతరో భువి ॥

న చ తస్మాత్ మనుష్యేషు కశ్చిత్ మే ప్రియకృత్తమః ।
భవితా న చ మే తస్మాత్ అన్యః ప్రియతరో భువి ॥

ఇట్టి గీతాశాస్త్ర రహస్య తత్త్వాన్ని విశదీకరించు ఉత్సుకతతో ఉపాసించువారు నాకు అత్యంత ప్రియం అగుచున్నారు.
అంతకుమించిన ప్రియమైనవారు నాకు మరెవ్వరుంటారు, చెప్పు?

18–70

అధ్యేష్యతే చ య ఇమం ధర్మ్యం సంవాదమావయోః ।
జ్ఞానయజ్ఞేన తేనాహమిష్టః స్యామితి మే మతిః ॥

అధ్యేష్యతే చ య ఇమం ధర్మ్యం సంవాదమ్ ఆవయోః ।
జ్ఞానయజ్ఞేన తేన అహమ్ ఇష్టః స్యామ్ ఇతి మే మతిః ॥

ధర్మసూక్ష్మ తత్త్వాన్ని - ఆత్మతత్త్వాన్ని ప్రకటిస్తున్న మనిద్దరి ఈ సంవాద రూపకమగు ఈ గీతాశాస్త్ర తత్త్వరహస్యమును ఎవ్వరైతే అధ్యయనం చేస్తూ ఉంటారో, అట్టివారు జ్ఞానయజ్ఞం నిర్వర్తించినవారై నాకు అత్యంత ప్రియతములగుచున్నారు.

18–71

శ్రద్ధావాననసూయశ్చ శ్రృణుయాదపి యో నరః ।
సోఽపి ముక్తః శుభాల్లోకాన్ప్రాప్నుయాత్పుణ్యకర్మణామ్ ॥

శ్రద్ధావాన్ అనసూయః చ శ్రృణుయాత్ అపి యో నరః ।
సో అపి ముక్తః శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణామ్ ॥

ఎవ్వరైతే అసూయారహితమైన హృదయంతో ఈ గీతా శాస్త్రం వింటూ ఉంటారో … వారు జీవన్ముక్తులగుచున్నారు. ఉత్తరోత్తర కాలంలో శుభలోకములు పొందుచున్నారు.

18–72

కచ్చిదేతచ్ఛ్రుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా ।
కచ్చిదజ్ఞానసంమోహః ప్రనష్టస్తే ధనఞ్జయ ॥

కత్ చిత్ ఏతత్ శ్రుతం, పార్థ! త్వయా ఏకాగ్రేణ చేతసా? ।
కత్ చిత్ అజ్ఞాన సంమోహః ప్రనష్టః తే? ధనంజయ! ॥

పార్థా! ఇప్పుడు నేను చెప్పిన ఈ గీతాశాస్త్రము ఆమూలాగ్రం ఏకాగ్రచిత్తంతో విన్నావు కదా?

ఓ ధనంజయా! నీలోని అజ్ఞాన మోహమంతా నశించిందా? చెప్పు!

అర్జున ఉవాచ :-

18–73

నష్టో మోహః స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత ।
స్థితోఽస్మి గతసందేహః కరిష్యే వచనం తవ ॥

నష్టో మోహః, స్మృతిః లబ్ధా, త్వత్ ప్రసాదాత్ మయా, అచ్యుత! ।
స్థితో అస్మి, గతసందేహః, కరిష్యే వచనం తవ ॥

అర్జునుడు :

హే అచ్యుతా! మీ ప్రసాద లభ్యమగు గీతాశాస్త్ర ప్రవచనాలు ఏకాగ్రచిత్తంతో విన్నాను.

నాలోని మోహం తొలగింది. నష్టో మోహః!

నిత్యానిత్యవివేకము - కర్మ - యోగం - భక్తి - జ్ఞాన - శరణాగతులు ఫలమైన స్మృతి లభించినవాడనయ్యాను. స్మృతిర్లబ్దః!

నా సందేహాలన్నీ తొలిగాయి. స్థితోఽస్మి గత సందేహః!

ప్రశాంత చిత్తుడనయ్యాను.

మీరు ఆజ్ఞాపించినట్లే కర్మయోగం, ధ్యానయోగం, భక్తియోగం, జ్ఞానయోగం, సమర్పణయోగం, శరణాగతియోగం మొదలైనవన్నీ ఆచరిస్తాను. అనుసరిస్తాను. కరిష్యే వచనం తవ!

ఇప్పుడు నా స్వధర్మమగు ఈ యుద్ధము నిర్వర్తింటానికి సముత్సాహుడనై, సంసిద్ధుడనై ఉన్నాను.


Krishna and Arjuna on the chariot

మూల శ్లోకము


అధ్యయన వ్యాఖ్యానము


ఉపన్యాసము

సంజయ ఉవాచ :-

18–74

ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః ।
సంవాదమిమమశ్రౌషమద్భుతం రోమహర్షణమ్ ॥

ఇతి అహం వాసుదేవస్య, పార్థస్య చ మహాత్మనః ।
సంవాదమ్ ఇమమ్ అశ్రౌషమ్, అద్భుతం, రోమహర్షణమ్ ॥

సంజయుడు :-

ఓ ధృతరాష్ట్ర మహారాజా! అవతారమూర్తియగు వాసుదేవుడు - మహాత్ముడగు పార్థుల మధ్య జరిగిన సంవాదము నేను వినటం జరిగింది. ఇది మహాద్భుతం. వెంట్రుకలు నిక్కపొడిచేంత ఆశ్చర్యకరమైన గీతా గానం!

18–75

వ్యాసప్రసాదాచ్ఛ్రుతవానేతద్గుహ్యమహం పరమ్ ।
యోగం యోగేశ్వరాత్కృష్ణాత్సాక్షాత్కథయతః స్వయమ్ ॥

వ్యాసప్రసాదాత్ శ్రుతవాన్ ఏతత్ గుహ్యమ్ అహం పరమ్ ।
యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయతః స్వయమ్ ॥

రహస్యములలోకెల్ల అతి రహస్యమైనట్టి పరమాత్మ తత్త్వసారమైన ఈ శ్రీకృష్ణ ప్రవచితమగు ’‘భగవత్‌ గీత’’ను వ్యాసమహర్షి యొక్క వరప్రసాదంచేత నేను వినగలిగాను.

యోగీశ్వరుడగు సాక్షాత్‌ శ్రీకృష్ణ భగవానుని పెదిమలనుండి జాలువారిన యోగతత్త్వాన్ని స్వయంగా వినగలగటం నాకు లభించిన మహోన్నతమగు అవకాశంగా భావిస్తున్నాను.

18–76

రాజన్ సంస్మృత్య సంస్మృత్య సంవాదమిమమద్భుతమ్ ।
కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః ॥

రాజన్! సంస్మృత్య సంస్మృత్య సంవాదమ్ ఇమమ్ అద్భుతమ్ ।
కేశవ-అర్జునయోః పుణ్యం, హృష్యామి చ ముహుః ముహుః ॥

హే రాజన్‌! శ్రీ కేశవ - అర్జునుల మధ్య జరిగిన ఈ సంవాదమును మరల మరల స్మరిస్తూ ఉండగా నా హృదయం ఆనందడోలికలలో తేలియాడుతోంది.

18–77

తచ్చ సంస్మృత్య సంస్మృత్య రూపమత్యద్భుతం హరేః ।
విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునః పునః ॥

తత్ చ సంస్మృత్య సంస్మృత్య రూపమ్ అత్యద్భుతం హరేః ।
విస్మయో మే మహాన్, రాజన్! హృష్యామి చ పునః పునః ॥

శ్రీకృష్ణ భగవానుని అత్యద్భుత గీతాగాన సందేశాలు మరల మరల మననం చేస్తూ ఉంటే నా అంతరంగమంతా ఆశ్చర్యముతో, జ్ఞానానందంతో నిండిపోతోంది. బ్రహ్మనందమగుచున్నది.

18–78

యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః ।
తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ ॥

యత్ర యోగేశ్వరః కృష్ణో, యత్ర పార్థో ధనుఃధరః ।
తత్ర శ్రీః, విజయో, భూతిః, ధ్రువా నీతిః, మతిః మమ ॥


‘‘ఎక్కడైతే యోగీశ్వరులగు శ్రీకృష్ణ భగవానుడు, ధనుర్ధారి అయిన అర్జునుడు వేంచేసి ఉంటారో … అక్కడ విజయము, నీతి, న్యాయము, నిత్యానిత్య వివేకజ్ఞానము సర్వదా వేంచేసి ఉంటాయి’’ అని అభిప్రాయపడుచున్నాను!ఇతి శ్రీమత్‌ భగవద్గీతాసు … మోక్ష సన్న్యాస యోగ పుష్పః ।
శ్రీ సాంబ సదాశివ పాదారవిందార్పణమస్తు ॥
🙏
లోకకళ్యాణమస్తు !
శం నో అస్తు ద్విపదే !
శం చతుష్పదే !
సర్వ మత గురువులకు, మహర్షులకు,
ద్వైత, విసిష్ఠ అద్వైత మఱియు అద్వైత త్రిమతాచార్యులకు,
సాష్టాంగదండ ప్రణామములు సమర్పిస్తూ……,
మద్గురువులు శ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాముల వారికి ప్రణమిల్లుతూ…..,
దాసానుదాస
చరమావధి
దాసదాసః

Yeleswarapu Hanuma Rama Krishna
యేలేశ్వరపు హనుమరామకృష్ణ
(భగవద్గీతా అధ్యయన విద్యార్థి)