[[@YHRK]] [[@Spiritual]]
Gollakalāpam, Kuchipudi Dance Drama, Philosophical Interpretation by YHRK


కూచిపూడి నాట్య వేద ఆత్మయజ్ఞము

గొల్లకలాపము

అధ్యయన - వ్యాఖ్యాన పుష్పము

అధ్యయన విద్యార్థి , రచన : యేలేశ్వరపు హనుమ రామకృష్ణ (YHRK)


[Chapters 1 to 12 out of total 48]
విషయ సూచిక :


Page: 19

అధ్యాయము-1.) అగ్రహారం

కూచిపూడి అగ్రహారము! హేమంత ఋతువు. ఒకానొక శుభోదయం!

ఒక గొల్లభామ రోజూలాగానే శిరస్సుపై పాలు - పెరుగు - వెన్న పాత్రలను ధరించి,
“పాలోయమ్మ పాలో! వెన్నోయమ్మ వెన్న”
అని సుమధురంగా పలుకుతూ ....,
మధ్యమధ్యలో ....,

... అని కూనిరాగాలు పాడుతూ ....

వేదయజ్ఞ - యాగవిధి కోవిదులైన విప్రవర్యులు, యోగులు, ఉపాసకులు మొదలైనవారు నివశించే ఇళ్ళు ఉన్నట్టి వీధులలో సంచరిస్తూ ఉన్నది. హెూయలుగా - చురుకుగా అడుగులు వేస్తోంది.


Page: 20

క్రమంగా శ్రీ బాల త్రిపుర సుందరీ సహిత రామలింగేశ్వర స్వామి ప్రాంగణం సమీపించింది.

దేవాలయపు గోడలు స్పృశిస్తూ ఉండే రచ్చబండిపై, కించిత్ శ్రమచేత కాబోలు, కూర్చుని ఉన్నది.


శ్లో॥ పుంఖానుపుంఖ విషయేక్షణ తత్పరోఽపి
బ్రహ్మావలోకన ధిషణం న జహాతి యోగి ।
సంగీత తాళ లయ నృత్య (నృత్త) వశంగతోఽపి
మౌళిస్థ కుంభ పరిరక్షణ ధీర్నటీవ ॥

శ్లో॥ పుంఖ-అనుపుంఖ విషయ ఈక్షణ తత్పరో అపి
బ్రహ్మ-అవలోకన ధిషణం న జహాతి యోగి ।
సంగీత తాళ లయ నృత్య (నృత్త) వశం గతో అపి
మౌళిస్థ కుంభ పరిరక్షణ ధీః నటీ ఇవ ॥
Dancing Girl balancing the pot on head

... అని యోగుల గురించి అన్నట్లుగా, ఆ గొల్ల తలపై మూడు పాత్రలు ప్రకాశిస్తున్నాయి.

కాసేపటికి, సేదతీర్చుకోవడానికి కాబోలు, తలపై పాత్రలను రచ్చ బండపై దించి ప్రశాంతంగా స్వామి శిఖరం వైపు చూపు సారిస్తూ ఉన్నది.

ఇంతలో,
ఒకానొక బ్రాహ్మణుడు ...
బ్రాహ్మీ ముహూర్తంలో నిదురలేచి తన గృహంలో సంధ్యావందనము, దేవతార్చన, సూర్య నమస్కారాలు వేదవిహితంగా నిర్వర్తించి, ముగించుకొని ...
ఉషః కాలపు ఎండను ఆస్వాదిస్తూ ...
వేద శబ్దాలు తనలో తాను నెమ్మదిగా గానంచేస్తూ ఆ రచ్చబండవైపుగా వచ్చారు. ఆయన ముఖము విభూతి-గంధలేపనములతో గంభీరంగా ప్రకాశిస్తోంది. పండిత శాలువా భుజాన మెడచుట్టూ వ్రేలాడుతోంది.


Page: 21

మెడలో పొడవుగా రుద్రాక్షలు వ్రేలాడుచున్నాయి.

ఆ బ్రాహ్మణుడు యాదృచ్ఛికంగా గొల్లభామవైపు చూచారు. వాత్సల్యము చిరునవ్వులతో కూడిన ఆ గొల్లభామ ముఖంలో ఏదో అలౌకికానందం వెల్లివిరుస్తున్నట్లు ఆయనకు అనిపించింది. కాసేపు పలకరింపుగా సంభాషించాలనే ఉత్సుకత ఆయనకు కలిగింది. కొంచము దూరంగా రచ్చబండపై తానుకూడా ఆశీనులయ్యారు.

అధ్యాయము-2.) ఉభయ కుశలోపరి

బ్రాహ్మణుడు : ఓ తరుణీమణీ! నీ ముఖారవిందమున ఏదో అనిర్వచనీయము - అలౌకికము అగు ఆనందంతో కూడిన ప్రశాంతత నాకు కనబడుతోంది. నీ ఆకారం-చిరునవ్వు చూస్తుంటే మాకు, ఈ సభాసదులకు ఏదో చెప్పలేని సంతోషం కలుగుతోందమ్మా!

ఎవరమ్మా నీవు? ఏం చేస్తూ ఉంటావ్?

గొల్లభామ : హే మహాత్మా! పాదాభివందనములు. నేనా? మేము ఊరూరా తిరిగి పాలు-పెరుగు-వెన్న-చల్ల అమ్ముకొనే వాళ్ళం. చూస్తూనే ఉన్నారు కదా! మేము గొల్లవారము.

బ్రాహ్మణుడు : శతమానం భవతు! సుఖీభవ!
(కించిత్ వినోదంగా నవ్వుతూ) గొల్లవారమా..? మేము ఆదివారము విన్నాము. సోమవారము అనగా విన్నాము. మరి ఈ ‘గొల్లవారము' అంటే?

గొల్లభామ : మీరు వేదవేత్తలు! బ్రహ్మజ్ఞులు! ఏదో చమత్కారంగా అంటూ ఉంటారు. మీకు అన్నీ తెలుసు. అది సరీలేండి గాని, రుద్రాక్షలు, విభూతి, గంధము, పట్టుపంచ, శాలువ ధరించి మీరు అపర బ్రహ్మవలె నాకు కనబడుచున్నారు. మీ వాక్కు మధురంగాను, గంభీరంగానూ ఉన్నది. మీ రూపు-రేఖలు మాకు మీ పట్ల ఎంతో గౌరవం కలిగిస్తున్నాయి.

గొప్ప తేజస్సుతో ప్రకాశించే మీరెవ్వరో చెప్పితే నేను - ఈ సభకు వేంచేసిన మహాశయులు సంతోషిస్తాము స్వామీ! దయచేసి వివరించరూ!


Page: 22

బ్రాహ్మణుడు : మేమా? ఉత్తమ కులజులమగు బ్రాహ్మణులము.

గొల్లభామ : అట్లాగా? అయితే...

బ్రాహ్మణుడు : ఊ! ఏమైనా అడగాలనుకుంటున్నావా ఏమిటి?

గొల్లభామ : అవును. మీ అనుజ్ఞ అయితే!

అధ్యాయము-3.) షట్కర్మలు - షోడశకర్మలు

బ్రాహ్మణుడు : ఓ ! తప్పకుండా! నీకు ఏఏ సందేహాలుంటే అవన్నీ అడుగు. వేద - ఉపాంగ విహితంగా, శృతి-స్మృతి పూర్వకంగా నీ సందేహాలకు సమాధానం ఇచ్చి అవన్నీ తొలగిస్తాము. సమాధానాలు చెప్పటానికి మేము సిద్ధం.

గొల్లభామ : 'మేము ఉత్తమ కులజులము' అని అన్నారు కదా! అనగా.....?

బ్రాహ్మణుడు : అదా! ‘బ్రాహ్మణులము' - అని చెప్పాను కదా! జన్మతః బ్రాహ్మణ్యం మా వృత్తి - ప్రవృత్తి కూడా! మేము షట్కర్మ నిష్ఠులమై ఉంటాము.

గొల్లభామ : షట్కర్మలా! అనగా?

బ్రాహ్మణుడు : ఉత్తమమైన బ్రాహ్మణ కులంలో జన్మించటం చేత మేము షట్ అనగా ఆరు విధాలైన కర్మలు (Functions) దైనందికంగా (Every Day) నిర్వర్తిస్తూ ఉంటాము.

గొల్లభామ : అవి ఏమేమిటి? చెప్పరూ!

బ్రాహ్మణుడు : చెపుతాను, విను.
1.) యజనము అనగా యజ్ఞాలు, యాగాలు నిర్వర్తించటం
2.) యాజనము అనగా యజ్ఞయాగ, పూజావిధులు నిర్వర్తింపచేయడం. చేయించటము.


Page: 23

3.) అధ్యయనము అనగా వేద-వేదాంగాలు పఠించటము. పరిశీలించటము.
4.) అధ్యాపనము అనగా వేద-వేదాంగాలు పఠింపజేయటం. వ్యాఖ్యానించటము. వినిపించటము.
5.) దానము అనగా ఇతరుల క్షేమము కొరకై ఉద్దేశ్యించటం. కర్మలు నిర్వర్తించటము. దానధర్మాలు నిర్వర్తించటం. ఇతరులకు కూడా ప్రోత్సహించటం.
6.) ప్రతిగ్రహణము అనగా ఇచ్చేది ఇచ్చినంత వరకు ప్రశ్నించకుండా పుచ్చుకోవటము. ఆశీర్వాద వాక్యాల ద్వారా సర్వజనులకు క్షేమకారులమై, శ్రేయస్సు కోరుకునేవారమై ఉండటం.

అంతే కాదు!

ఈ ప్రజల చేత జన్మ-దేహ-లౌకిక సంబంధమైన ఆయా సందర్భోచితమైన - శాస్త్రములలో చెప్పబడే వివిధ కర్మలు కార్యక్రమములు
నిర్వర్తింపజేస్తూ, పురోహితులమై ఉంటాము. అందరిచేత గ్రహదోషాలు తొలగే మంత్ర-క్రియలు చేయిస్తూ, దోషనివారణ కలుగజేస్తూ ఉంటాము. దానాలు చేయిస్తూ ఉంటాము.

గొల్లభామ : వివిధ కర్మలు చేయిస్తూ ఉంటారా? అంటే? మరికొంత విశేషంగా వివరించరా? మహాత్మా!

బ్రాహ్మణుడు : అనగా పుణ్యాహవాచనం, జాతకకర్మ, నామకర్మ, విద్యాభ్యాసం, ఉపనయనం, వివాహం, షష్ఠిపూర్తి, సహస్రచంద్రదర్శనం, ఆయా వ్రతాలు నోములు, పూజలు, గ్రహదోషనివారణ శాంతులు, ఇత్యాది షోడశ కర్మలు - 16 రకాల కర్మలు, అందరి చేత వారివారి - ఇళ్ళలోనూ, దేవాలయాలలోనూ శాస్త్రాలలో చెప్పిన మంత్ర-తంత్రానుకూలంగా చేయిస్తూ ఉండే మంత్ర - తద్విధాన సామర్థ్యము కలవారము. ఎవ్వరిచేత - ఏఏ సందర్భాలలో ఎప్పుడెప్పుడు - ఏఏ శాస్త్ర విహిత కర్మలు చేయించాలో అవన్నీ ఎరిగినవారమై ఉంటాము. జనులకు మార్గదర్శకులమై పూజ-యజ్ఞ-యాగ-వ్రతములు చేయించే అర్హత మాకున్నది.


Page: 24

బ్రహ్మ యొక్క ముఖము నుండి పుట్టిన బ్రాహ్మణ కులజులం. అందుచేత విశిష్టమైనటువంటి వారుగా జనులచే పూజింపబడుతూ లోకానికి శ్రేయస్సు కలుగజేస్తూ ఉంటాము.

గొల్లభామ : స్వామీ! ఒక్క నిముషము ఆగండి. మీరు చెప్పుచున్న మాటలలో కించిత్ విపరీతమైన అర్థము నాకు కనిపిస్తోంది.

బ్రాహ్మణుడు : ఏమున్నది? చెప్పు!

గొల్లభామ : "మా ఈ బ్రాహ్మణ జన్మలు ఉత్తమమైనవి. విశిష్టమైనవి" అని పదే పదే అనటం న్యాయమా? ప్రపంచంలో ఎక్కడ పుట్టినా మానవుడైనా తన తల్లి-తండ్రుల నుంచే భౌతిక దేహం పొందటం జరుగుతోంది. ఈ కనబడే భౌతిక శరీరాలన్నీ కూడా ఒకే రీతిగా తల్లి గర్భంనుండి బయల్వెడలి, క్రమంగా ఈ ప్రకృతి ప్రసాదించే ఆహారం చేత పరిపోషించబడేవే కదా! మరి “మా జన్మలు మాత్రము కొంత ప్రత్యేకమైనవి. మేము ఉన్నత కులజులము” అని అంటున్నారేం?

బ్రాహ్మణుడు : ఓ గొల్లభామా! “ఈ జీవులందరి జన్మలు ఒక్కతీరైనవే” అని అనటం భావ్యం కాదు. కర్మలను అనుసరించి కదా, జన్మలు వస్తూ ఉంటాయి! అటువంటి పూర్వ కర్మలు వేదవిహితంగాను - వేదానుకూలముగానూ ఉండటం చేతనే మేము బ్రాహ్మణ జన్మ పొందటం జరుగుతోంది. ఇది పురాణాలలో చెప్పబడ్డ మాటే! "వేదోక్తమైన కర్మలచేత బ్రాహ్మణులు పూజనీయులు" .... అని మీ గొల్ల పెద్దలు అనగా నీవు ఎప్పుడూ వినియుండలేదా? మరొక్క విషయం. మేము ద్విజులము కూడా కదా!

గొల్లభామ : ‘ద్విజులు’ అనగా?

బ్రాహ్మణుడు : నీవు చెప్పినట్లు అన్ని భౌతిక దేహాలు ఒక్కతీరుగానే తల్లి గర్భం నుండి బయల్వెడలుచున్న మాట నిజమే! అయితే బ్రాహ్మణ కులంలో జన్మించిన మేము ఉపనయనము ద్వారా వేద విద్యకు అర్హత పొంది రెండవ జన్మ పొందిన వారము అవుతున్నాము. అందుకే 'ద్విజులు’ అని మమ్ములను అంటూ ఉంటారు.


Page: 25

గొల్లభామ : "జన్మ - కర్మల విధిని అనుసరించి మేము బ్రాహ్మణులము" అని అన్నారు కదా! ‘బ్రాహ్మణ' శబ్దము యొక్క అర్థాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక్క విషయం మనవి చేయవచ్చునా స్వామీ!

బ్రాహ్మణుడు : ఊ! అట్లాగే!

అధ్యాయము-4.) నాఽహమ్ దేహమ్! సోఽహమ్!

గొల్లభామ : ప్రతి జీవుడు పుట్టినప్పటి నుండీ ఏదో ఒక కర్మ నిర్వర్తించవలసినదే కదా! ఎవ్వరు ఏ విధమైన కర్మలు నిర్వహించినప్పటికీ...

... అను ‘ఎరుక' నిశ్చలంగా కలిగి ఉన్నప్పుడు కదా, ఒకానొక జీవుడు 'బ్రహ్మభూతుడు' అని అనిపించుకోగలిగేది! సర్వ దేహములలో సర్వదా సమంగా ప్రకాశించే బ్రహ్మమును ఎరిగి బ్రహ్మమే తానై బ్రాహ్మణుడు అయ్యేది! అవునా?

బ్రాహ్మణుడు : అవును. అది నిజమే! అందుచేతనే మేము చిన్నప్పటినుండీ కూడా...

“నాఽహమ్ దేహమ్! అహమ్ బ్రహ్మాస్మి"

... అనే వేదమహావాక్యాలు, వాటి-వాటి అర్థాలు నేర్చుకుంటున్నాము. వేదాధ్యయనము చేస్తున్నాము. వేదములలో చెప్పబడిన కర్మలను అందుకు సానుకూలంగా నిర్వర్తిస్తున్నాము. వేదవిహితంగా పంచయజ్ఞములు ఆచరిస్తూ, దేహభ్రమను విడచి “బోధరూపమగు పరబ్రహ్మమే నేను! సోఽహమ్" అని గ్రహించి వర్తించువారము.


Page: 26

అది దృష్టిలో ఉంచుకునే, “బ్రాహ్మణ జన్మ ఉత్తమమైనది” అని శాస్త్ర-పురాణ-ఇతిహాసములు వర్ణిస్తున్నాయి. ఇది నీవెప్పుడూ వినలేదా?

గొల్లభామ : హే మహానుభావా! మీరు పంచయజ్ఞములు నిర్వర్తిస్తూ ఉండవచ్చుగాక! అంతమాత్రం చేత .....

“మేమే ఈశ్వరుని తెలుసుకున్నాం. యజ్ఞములు చేయనివారికి ఈశ్వరుని గురించి తెలియరాదు. జన్మచేత బ్రాహ్మణులమగు మేమే బ్రహ్మజ్ఞులము, బ్రహ్మము గురించి ఎరిగినవారము”

... అనే అభిప్రాయం కలిగి ఉండటం ఉచితమంటారా? అటువంటి అభిప్రాయం వలన - సర్వాత్మకుడగు శ్రీరామలింగేశ్వరస్వామిని తెలసుకోవటం అనవచ్చునంటారా?

బ్రాహ్మణుడు : మేము వంశాచారంగా, వ్యవస్థాపూర్వకంగా పంచయజ్ఞములు నిర్వర్తిస్తున్నాము. వాటిచే ఈశ్వరుని మెప్పిస్తున్నాము. పరబ్రహ్మమగు ఈశ్వరుని ముఖంలో నుంచి పుట్టుచున్నామని 'బ్రాహ్మణోఽస్యముఖమాసీత్' అను వాక్యము పురుషసూక్తములో చెప్పటం నీవెప్పుడూ వినలేదా? ఆ కారణం చేతనే, ఓ చంచలాక్షీ! మమ్ములను “బుధులు - బ్రాహ్మణులు" అని జనులు శ్లాఘిస్తూ వుంటారు కదా!

గొల్లభామ : మీరు చెప్పేది సాంసారికమైన అహంకారము సూచించుచున్నదేమో మహనీయా?

... అనే అహంకారం అనుచితమేమో? శాస్త్ర ఉద్దేశ్యము అదేనా? మీరు చెప్పేది శాస్త్ర సమ్మతమేనంటారా?


Page: 27

బ్రాహ్మణుడు : ఎందుకు కాదూ? వేదవిహితమైన కర్మలు, అనుష్ఠానము వంశపారంపర్యంగా అనుసరించే బ్రాహ్మణకులంలో పుట్టి బ్రాహ్మణులమయ్యాము. నీకు శాస్త్రవచనాప్రవచనాలపై గురిగాని, పట్టుగాని లేనట్లున్నదే? శాస్త్రములు వినకుండా ఏదో కొంచెం కొంటెతనంగా మాట్లాడుచున్నావేమమ్మా?

గొల్లభామ : మహాశయా! పుట్టుకచేతనే ఒకడు బ్రాహ్మణుడు అవుతాడా? వాస్తవానికి అందరి పుట్టుక ఒక్కతీరైనదే కదా! "జన్మనా జాయతే శూద్రః । కర్మనా జాయతే ద్విజః ॥ - జన్మచేత ప్రతి ఒక్కడు శూద్రుడే! కర్మచేతనే ద్విజుడు అవుతాడు” అనే శ్రుతి వాక్యాలు ప్రమాణవాక్యాలు కావా?

బ్రాహ్మణుడు : ఓహెూ! ధర్మ శాస్త్రవాక్యాలు బాగానే చెప్పుచున్నావే! నాకు సంతోషమే! అయితే... ఒక వాక్యం పూర్వపక్షమా? సిద్ధాంతమా? నీవు చెప్పిన ధర్మ శాస్త్రవాక్యము విషయంలో అది వివేచనయా (Is it an Analysis)? సూచనయా (Is it an Indication)? దశల వర్ణనమా (Is it a stage-by-stage Description)? గమనించి, అప్పుడు మాట్లాడాలి సుమా!

సరే! అది అట్లా కాసేపుంచు.

అధ్యాయము-5.) భౌతిక దేహము

బ్రాహ్మణుడు : “దేహములన్నీ ఒక్క తీరైనవే!” అని బహు సాహసంగా పలుకుచున్నావే!

ఈ వర్తమాన భౌతికదేహము జీవుని పట్ల ఎట్లా రూపుదిద్దుకుంటోందో నీకు తెలుసా? తెలిస్తే, తెలిసిఉన్నంత వరకు చెపుతావా?

గొల్లభామ : స్వామీ ! గురుతుల్యులగు మీవంటి పెద్దలు కొందరి దగ్గర విన్న విషయములు - విశ్లేషణను గుర్తుకు తెచ్చుకుంటూ పంచభూత సమ్మేళణము అయినట్టి భౌతికదేహము ఏ విధంగా రూపుదిద్దుకొంటోందో, నాకు తెలిసినది చెపుతున్నాను. వినండి.

పూర్వదేహస్థితి

ఈ జీవుడు భౌతిక దేహంతో "నేను దీనికి చెందినవాడను. ఇది నాకు చెందింది. దేహమునకు నాకు అవినాభావ సంబంధము" .... అని జీవితాంతం రోజులు గడుపుచున్నాడు.


Page: 28

అనగా, అజ్ఞానవశంగా మరణ సమయం ఆసన్నమయ్యే క్షణం వరకు దేహభావమును కొనసాగిస్తూనే ఉండటం జరుగుతోంది.

... ఇటువంటి బలవత్తరమైన-సాంసారికమైన (దృశ్య సంబంధమైన) అజ్ఞాన భావనా తరంగాల మధ్యలో మసలుతూ ఉండగా, ఇంతలో ఒకానొక క్షణంలో ఈ భౌతిక దేహం చమత్కారంగా నిరుపయోగమవటం జరుగుతోంది. 'మరణము' అనే విరామం సంప్రాప్తిస్తోంది.

ఆజన్మాంతరము ‘దేహమేవాహమ్' భావనల కారణంగా దృశ్యము పట్ల ఆతడు ఘనమైన మోహమునకు వశమై ఉండటం జరుగుతోంది. “నా తల్లిదండ్రులు - నా భార్య - నా భర్త - నా పిల్లలు - నా మనుమలు - నా పేరు - నా ఇల్లు - నా సంపద - నేను సంపాదించిన ఆస్తి - నా ప్రతిష్ఠ - నా ఊరు - నా జాతి”… ఇత్యాది మనోభావాలే ఆతడు పరిపోషించుకుంటున్నాడు.

అంతేకాని, స్వాత్ముడు, సర్వాత్మకుడు, సకల రూపములు తానైనవాడూ, సర్వసాక్షిగా వేరైనవాడు, అప్రమేయుడై ఉన్నవాడు - అగు ఈ రామలింగేశ్వర స్వామి యొక్క "శివతత్వజ్ఞానము” కొరకై ప్రయత్నించకున్నాడు. “చిదానందరూపం - శివోఽహమ్ - శివోఽహమ్' అనే ఆత్మతత్త్య జ్ఞానానికి ఉద్యుక్తుడు కావటం లేదు.

మృత్యువు వచ్చిపడుచున్నప్పుడు కూడా “నా వారు ఏమౌతారో? పరాయి వాళ్ళు నా సొమ్ములు మ్రింగుతారేమో? నా వారి కొరకు నేను ఏమి చేయాలో? వీరు - వారు నా సొమ్ములు సొంతం చేసుకుంటారేమో? వీళ్ల పెళ్ళిల్లు, వాళ్ల ఉపనయనాలు, నా పేరు - ప్రతిష్ఠ - గౌరవాలు".... అని అనుకుంటూ దుఃఖాలు, భయాలు, వేదనలు, రోదనలు కొనసాగిస్తూ తెలిసీ తెలియకుండా భౌతిక దేహం త్యజిస్తున్నాడు. ఫలితం? పునరపి జననం. పునరపి మరణం. పునరపి జననీ జఠరే శయనం.


Page: 29

పూర్వదేహానంతరము ఆ విధంగా అటువంటి అజ్ఞాన జీవుడు ఇతఃపూర్వపు సత్కర్మపు - దుష్కర్మపు ప్రభావములు, తత్సంబంధమైన భావావేశాలను అనుసరించి స్వర్గమో (సాత్విక సుఖ ప్రేమాదులతో కూడిన భావనాస్రవంతి), నరకమో (దుఃఖము-ఆదుర్దా-భయము ఇత్యాదులతో కూడిన భావనా స్రవంతియో) మనో అనుభూతం చేసుకుంటున్నాడు.

అయితే ...,
"జన్మించినవాడు మరణించక మానడు. మరణించినవాడు తిరిగి జన్మించక మానడు - జాతస్య హి ధృవో మృత్యుః, ధృవం జన్మ మృతస్య చ" అని కదా గీతా వాక్యం!

బ్రాహ్మణుడు : మరణించినవాడు తిరిగి ఎట్లా జన్మిస్తున్నాడు? అది కూడా చెప్పు! నీ వాక్చాతుర్యంతో అమృతవాణి వినిపించవమ్మా! మేమందరమూ విని సంతోషిస్తాము.

అధ్యాయము-6.) పునరపి జననం

గొల్లభామ : మరణించినవాడు భౌతికమైన ఇంద్రియములు కోల్పోవుచున్నప్పటికీ అతని యొక్క (1) భావనా చైతన్య సత్త (2) ఆత్మ చైతన్య సత్త కొనసాగుతూనే ఉంటాయి.

అజ్ఞానపూర్వకమైన భావనావేశముల చేత మరొక దేహము కొరకై తాపత్రయపడుచున్నాడు.

అట్టి భావనా దేహంతో ఆ దేహి....,


Page: 30

ఇంకొంతకాలము...

బ్రాహ్మణుడు : (చిన్నగా నవ్వుతూ) ఏమిటేమిటి? “చైత్రము - వైశాఖము - జేష్ఠము - ఆషాఢము - శ్రావణము - భాద్రపదము - ఆశ్వయుజము - కార్తీకము - మార్గశిరము - పుష్యము - మాఘము - పాల్గుణము”.... అనే 12 మాసముల కాలమానం అందరికీ తెలిసిందే! “వసంతము - గ్రీష్మము - శరదృతువు - హేమంత - వర్ష - శిశిర” అనబడే 6 ఋతువుల గురించి ఈ శ్రోతలందరికీ చిరపరచయమే! నీవు "స్త్రీ యొక్క ఋతుకాలంలో" ... అని అంటున్నావు. అంటే?

గొల్లభామ : అదా! స్త్రీ బహిష్టు అయిన రోజు నుండి 14వ రోజువరకు 'ఋతుకాలము' అని అంటారుగా, స్వామీ! ఋతుకాలంలో ఆ స్త్రీతో పురుషుడు సంగమించడం జరిగినప్పుడు ఆ శుక్ర - శోణితముల మిశ్రమం స్త్రీ యొక్క నాభికమలములోని గర్భసంచిలో ప్రవేశించటం జరుగుతోంది. తద్వారా శిశుదేహము రూపుదిద్దుకుంటోంది.


Page: 31

ఇక్కడ, ఒక ముఖ్య విషయం.

జీవుడు తన యొక్క పూర్వ కర్మ సంస్కారముల ప్రభావం చేత - దృశ్యములో ఏదో పొందవలసింది ఉన్నది అనే ఆవేశం చేత శిశు దేహధారణకు ఉపక్రమించటం జరుగుతోందని కూడా అనవచ్చు.

ఆ విధంగా స్త్రీ యొక్క నాభికమలములో బీజము ప్రవృద్ధమగుచూ, క్రమంగా శిశు దేహము రూపం పొందటం జరుగుతోంది.

బ్రాహ్మణుడు : బాగు బాగు! కానీ కొందరు దంపతులకు అతి దీర్ఘకాలం (లేదా) ఒకొక్కసారి జీవిత పర్యంతము శిశువులు కలగకపోవటం జరుగుతోంది కదా...!

గొల్లభామ : ఇదంతా ఈశ్వరమాయా చమత్కారం. భిన్నత్వంలో ఏకత్వం. కొందరి విషయంలో ఆ దంపతులు రమించే సమయంలో వారిలో ఒక్కరి (లేదా) వారిద్దరి బుద్ధి-మనస్సులు చాంచల్యానికి లోను కావటం జరుగుతోంది. ఆ కారణంగా కొందరు దంపతులకు అపుత్రత్వం సంభవిస్తోంది.

మనోచాంచల్యము = ఇతఃపూర్వపు దోషకర్మల - వ్యతిరిక్త కర్మల తీవ్ర ప్రభావం. ‘దోషము’ రూపమైన తీవ్ర భావన!

అందుకే ....సంతానం కావాలనుకునే దంపతులు 'ఋతుకాలము' యొక్క గుర్తును కలిగి ఉండటం, “సత్సంతాన ప్రాప్తి కలుగుగాక” అను భగవదనుగ్రహ ప్రార్థనా పూర్వకమైన భావం కలిగి ఉండటం ఉపాసనతో సమానంగా పెద్దలు పరిగణిస్తారు.

అయితే కూడా ఒక్క విషయం. ఇదంతా మాయా చమత్కారం. ఏకత్వములో అనేకత్వ నాటకీయం - అని గుర్తెరుగుదము గాక!


Page: 32


Page: 33

తల్లి ఆరగించే...

బ్రాహ్మణుడు : చాలా బాగా వివరిస్తున్నావు. అయితే ఆహారపు లక్షణాల గురించి కూడా చెప్పుతావా మరి?

అధ్యాయము-7.) ఆహారము

గొల్లభామ :

⁠ (1) సాత్విక ఆహారం : రుచిగా - తియ్యగా మధురమైన రసంతో కూడి ఉన్న ఆహారం.
⁠ (2) రాజసిక ఆహారం : కమ్మగా - చప్పగా కొంచము - కొంచము కారము ఉప్పు రుచులతో కూడిన ఆహారం.
⁠ (3) తామసిక ఆహారం : అధికమైన కారము - ఉప్పు - చేదు - వగరు మొదలైనవి కలిగియుండే ఆహారం. మత్తు పదార్థముల వలన ఏర్పడే మొద్దుతనము.

బ్రాహ్మణుడు : తల్లి తింటున్న ఆహారము యొక్క రసవిభాగము శిశువు దేహానికి ఎట్లా చేరుతోంది?

గొల్లభామ : కొన్ని నాళములు తల్లి దేహములోని ప్రేగుల నుండి - 'మావి’ అనే తిత్తిలోని శిశువు యొక్క బొడ్డులోనికి చొచ్చుకొన్నవై ఉండటం జరుగుతోంది. తల్లి తినుచున్న ఆహారములోని కొంత రసవిభాగం ఆ నాళములలోని సూక్ష్మరంధ్రముల ద్వారా శిశువు యొక్క దేహములోనికి ప్రవేశించటం జరుగుతోంది, ఆహా! ఎంతటి సృష్టి చమత్కారం!

అయితే అట్టి ప్రక్రియ నెరవేరటానికి ఒక కారణం శిశువు యొక్క పూర్వ కర్మల ప్రభావమేనని కూడా విజ్ఞులు అంటూ ఉంటారు.


Page: 34

ఆ శిశువు తల్లి తినే ఆహార రసమును నాళముల ద్వారా పొందుతూ కించిత్ ఉత్సాహంతో కదలటం ప్రారంభిస్తోంది. ఆ కదలిక మరికొంచెంగా అధికం అగుచున్నప్పుడు అట్టి కదలికలకు వెసులుబాటు కాక, క్రమంగా ఇరుకుగదిలో బంధించబడిన ఏనుగు వలె ఆ శిశువుకు అప్పటి స్థితి అనుభవమౌతోంది.

అంతే కాకుండా... మరో విషయం.

తల్లి యొక్క పొట్టలో ఆహారం జీర్ణింపజేయడానికి ఉత్పత్తి అయ్యే 'జఠరాగ్ని' యొక్క ఉష్ణస్పర్శ చేత ఆ శిశువు ఎంతో వేసట పొందనారంభిస్తోంది.

ఆ వేసటను తప్పించుకోవడానికి చేసే ప్రయత్నములో ఆ శిశువు గర్భసంచిలో క్రిందవైపుగా కదలటానికి ప్రయత్నిస్తోంది. అక్కడేమో పురీషనాళము అడ్డం!

పురీషనాళము నుంచి బయల్వెడలే మల-మూత్రముల దుర్వాసనచే ‘అసహ్యత’ పొంది, భరించలేక ఆ శిశువు మరల పైకి కదలుతూ వుంటోంది.

ఈ లోగా, శిశువు యొక్క దేహాకారం రోజురోజుకు పెరుగుతూ ఉంటుంది. ఒక విధంగా ఆ శిశువు బహుదీనదశను అనుభవిస్తూ ఉంటోంది.

అధ్యాయము-8.) గర్భనరకము - శిశువేదన

బ్రాహ్మణుడు : అవును కదా! ఆహా! ఏమి ఆ శిశువు యొక్క దుస్థితి! మావిలో చిక్కుకొనియున్న దేహము రోజురోజుకూ వృద్ధి పొందుతూ ఉండటమా! మరొకవైపు మలమూత్రముల దుర్వాసన - జఠరాగ్ని యొక్క ఉష్ణముల మధ్య అల్పస్థలంలో అగుచాట్లు పడుతూ ఉండటమా! దానినే 'గర్భ నరకం' అంటారు కదా?

గొల్లభామ : అవును. ఇంకొక వైపు నుండి అప్పుడప్పుడే చైతన్యం పొందే కాళ్ళు-చేతులు కదల్చటానికి అవకాశము, స్థలము లేక బిగబెట్టుకొని ఉండవలసి వస్తోంది. అదంతా ఆ శిశువుకు దుఃఖప్రదమేనని గర్భశాస్త్రం ఎరిగిన పెద్దలంటారు.


Page: 35

“ఆ శిశువుకు గర్భనరకం ఎందుకు ప్రాప్తిస్తోంది?"... అనునది శాస్త్రీయంగా పరిశీలిస్తే,

ఇక ఇప్పుడు, ఆ శిశువు ఆలోచనలలో పడుతోంది.

ఈ రీతిగా గర్భవాసదుఃఖాలు అనుభవిస్తూ ఆ జీవుడు క్రమంగా యోచించటం ప్రారంభిస్తున్నాడు.


Page: 36

ఆహా! ఇతఃపూర్వపు దేహాలు, దేహసంబంధ సందర్భములైనటువంటి తల్లి - తండ్రి - భార్య - పుత్రులు - పుత్రికలు - మనుమలు - ఇష్టమైనవారు - అయిష్టమైనవారు - అయినవారు - కానివారు - ఇవన్నీ ఇప్పుడేవీ? ఎక్కడికి పోయాయి? అవన్నీ ప్రతి ఒక్కసారి 'నిజమే' అని అనుకొని రాత్రింబవళ్ళు సంపద ఇత్యాది అల్పకాలపు మెరుపులాగా మెరిసే విషయాలను నమ్ముకొని కాలం వృధా చేసుకున్నానే!

ఓ పరమాత్మా! ఓ రామలింగేశ్వరా ! ఎక్కడయ్యా నీవు?

ఓ శ్రీహరీ!


Page: 37

... అని ఆ శిశువు మనస్సులో వేదనలు చెందుతూ గావు కేకలు పెట్టుచూ ఉంటాడు.

బ్రాహ్మణుడు : ఓ లలనామణీ! ఆ గర్భస్థశిశువు యొక్క గర్భయాతనా పరంపరలు నీవు వర్ణించి చెప్పుతూ ఉంటే, ఒళ్ళు గగుర్పొడుస్తోంది.

“పరమాత్మ తత్వాన్ని ఆశ్రయించి పునః పునః జన్మల జాడ్యం ఎంత త్వరగా వదిలించుకోవాలి!” అనే విషయం మాకందరికీ గుర్తుచేస్తున్నావు. సంతోషం.

ఓ గొల్లభామా ! ఇంకా చెప్పు! ఆ శిశువు అట్టి గర్భచెరసాలను అనుభవిస్తూ... ఎట్లా ఏ రీతిగా బయల్వెడలుచున్నాడు?

అధ్యాయము-9.) భూమిపై పడటం

గొల్లభామ : స్వామీ! వినండి! చెపుతాను.

ఆ గర్భస్థ శిశువు తన మనస్సులో “సర్వచరాచరాత్మకుడు - మునీశ్వర హృదయ విహారి - జగత్ విభుడు - ఆద్యంత శూన్యుడు - సర్వస్వరూపుడు - ప్రభువు” అగు పరమాత్మను గర్భ చెరసాల నుండి విముక్తికై త్రోవ చూపించమని వేడుకుంటూ ఉన్నాడు కదా! తనకు తానుగా త్రోవ దొరకక అల్లల్లాడిపోతూ ఉంటున్నాడు. కొంతసేపేమో రోదన-వేదన-వేసట అనుభవిస్తున్నాడు. మరి కొంతసేపేమో అ-వాక్-మానస గోచరమైన పరబ్రహ్మము యొక్క అనుభవమును పుణికి పుచ్చుకున్న బ్రహ్మజ్ఞాని వలె ఏదో ధ్యానిస్తూ మౌనంగా ఉంటున్నాడు.

ఈ విధంగా క్షణాలు-నిమిషాలు-గంటలు-రోజులు లెక్కపెట్టుచూ కాలం గడుపటం జరుగుతోంది. “భూమిపై ఎప్పుడు పడతానా?" అని ఎదురుచూస్తూ - ఉబలాటపడుతూ ఉంటాడు. అధ్యాత్మ సంబంధమైన సాధనల గురించి ప్రణాళికలు యోచిస్తూ ఉంటాడు. క్రమంగా 10 మాసాలు గడుస్తున్నాయి.


Page: 38

ఒకానొక సమయంలో...

సర్వాత్మకుడగు శ్రీరామలింగేశ్వరస్వామి యొక్క కరుణా సముద్ర తరంగాల రూపంగా తల్లి గర్భంలో ఎక్కడి నుండో 'ప్రసూతి వాయువులు' బయల్వెడలుచున్నాయి. ఆ శిశుదేహాన్ని అధోముఖం చేస్తున్నాయి. క్రమంగా నెట్టుచున్నాయి. ఊపిరి సరిగ్గా ఆడక ఆ శిశువు ప్రసూతి వాయు శక్తిచే నెట్టబడుచూ తల్లి యొక్క రహస్య ద్వారం గుండా బహిర్గతుడై భూమిపై పడుచున్నాడు.

భూమి పై పడిన మరుక్షణం వర్తమానానుభవములచే స్పృశించబడి 'మాయ'చే కప్పబడుచున్నాడు.

అధ్యాయము-10.) ఏమరపు

బ్రాహ్మణుడు : భూమిపై పడిన ఆ శిశువు ఇతఃపూర్వం తల్లి గర్భంలో గుర్తు చేసుకొన్న పూర్వజన్మల అనుభవ-అనుభూతులను, వాటికి సంబంధించిన జ్ఞాపకాలను, ప్రణాళికలను పూర్తిగా మరచిపోతున్నాడా? లేక కించిత్ ఏమరుస్తున్నాడా? కాక, జ్ఞప్తి పథములో కలిగియే ఉంటున్నాడా? అంతా మొదలంట్లా మరచి ఎదురుగా ఇప్పుడు ఇంద్రియాలకు తారసబడే దృశ్యప్రపంచంపట్ల ఆసక్తి పొందినవాడై ఉంటున్నాడా? ఇక్కడ జరుగుచున్నదేమిటి? చెప్పవమ్మా!

గొల్లభామ : తల్లి గర్భం నుండి భూమిపైకి పతనమైన (చేరిన) ఆ శిశువు (లేక) జీవుడు, "అమ్మయ్యా! ఇప్పుడు గొప్ప ఆపద తొలగిందిరా బాబూ!" అని అనుకుంటూ సంతోషం పొందుతూ ఉంటాడు. కొద్ది క్షణాలలో క్రమక్రమంగా అనేక ఇతఃపూర్వపు నారీజన - బంధు - కళత్ర - మిత్ర - విషయ వ్యవహార సంబంధమైన విశేషాలన్నీ ఏమరుస్తున్నాడు. అవన్నీ సంస్కారముల రూపంలో జీవుని స్వభావము నందు దాగినవై ఉంటున్నాయి.

మరికొద్ది క్షణాలలో మనోగతమైన ఇంద్రియార్థముల (శబ్ద - స్పర్శ - రూప - రస - గంధములకు మనోగతమైన సామర్థ్యముల ద్వారా) వర్తమానంలో దృశ్యాంతర్గతంగా లభించిన నూతన దేహము యొక్క ఇంద్రియములకు గోచరమగుచున్న విశేషములలో నిమగ్నమగుచున్నాడు.


Page: 39

అనగా ఇప్పుడు వినబడేవి (అమ్మ యొక్క తీయటి పిలుపులు), స్పర్శ (అమ్మ యొక్క చేతులు తన బుగ్గలను, నడుమును తాకుచున్న అనుభూతులు), ప్రియంగా పలకరిస్తూ కళ్ళకు కనబడే అమ్మ-నాన్న-అన్న-అక్కల రూపాలు, (అమ్మ పాలచే అనుభవమయ్యే మధురమైన) రుచి, (పుట్టిన గదిలోని) పరిమళాలు..... ఇవన్నీ అనుభవిస్తూ, అవి లభించనప్పుడు అవి 'పొందాలి-పొందాలి' అనే అభిలాషలు కలిగి ఉండటం ప్రారంభిస్తున్నాడు. వాటిని గురించి ధ్యానించటం మొదలు పెట్టుచున్నాడు.

విశేష వివరణం : దృష్టాంతాలు

1.) ఒకడు ‘కల’ కంటూ కంటూ మెళుకువ రాగానే స్వల్ప విషయాలు క్షణంలో త్యజించి జాగృత్తులో ఎదురుగా కనిపించే విశేషాలలో నిమగ్నమగుచున్నట్లు...
అట్లాగే,
జాగృతదృశ్యాన్ని ఆస్వాదిస్తూ - ఆస్వాదిస్తూ ఒకానొక క్షణంలో స్వప్నానుభవంలో ప్రవేశించి జాగృత్ దృశ్యాన్ని త్యజిస్తున్నట్లు...
గర్భంలో ఉన్నప్పుడు గుర్తొచ్చిన జ్ఞాపకాలను భూమిపై పడగానే ఏమరుస్తున్నాడు.

2.) గీతాచార్యులవారు

... అని చెప్పిన వాక్యాలు సందర్భోచితమౌతుందని అనుకుంటాను.


Page: 40

ఆ విధంగా మత్తు కలిగించే పదార్థాలు సేవించినవానివలె పూర్వజన్మల జ్ఞాపకాలు - సంస్కారాలు మరుగున - అడుగున పడిపోయి, వర్తమాన అనుభవాలు, అనుభూతులు, సందర్భాలు, జ్ఞాపకపరంపరలు భావించటం ఆరంభిస్తున్నాడు.

మొట్టమొదటగా ఆకలితో తల్లిస్తన్యం నుండి ప్రసాదించబడే తల్లి పాల ‘రుచి’ని ఆస్వాదించటం, తద్వారా ఆకలి-దప్పికలు తీర్చుకోవటం ప్రారంభిస్తున్నాడు. ఇక, ఆపై ఆయా జీవితదశలకు ‘నాంది’ పలుకుచున్నాడు.

ఇంకేమున్నది? ఈ దృశ్యపరంపరలను బాల్య-యౌవన-కౌమార-వార్ధక్యాలలో వేరువేరు విధాలుగా, ఒకటి తరువాత మరొకటిగా పొందటం జరుగుతోంది. ఒకేసారి అనేక పరస్పరానుకూలమైన - ప్రతికూలమైన విషయములలో చిక్కుకుంటున్నాడు. సుఖ-దుఃఖ, ప్రియ-అప్రియ, ఇష్ట-అయిష్ట భావ సమూహములను మనస్సులో కల్పించుకొని అనుభవరూపంగా (లేక) జగత్ రూపంగా పొందుచున్నాడు.

కామ-క్రోధ-లోభ-మోహ-మద-మాత్సర్యములనబడే అరిషట్ వర్గములకు లోనవుచున్నాడు. తాను పెంపొందించుకున్న ఆసక్తికి తానే “సంసారబద్ధుడు” అగుచున్నాడు. అట్టి ఆసక్తి రూప సంసారమే జీవునిపట్ల ఏర్పడే సర్వ అనర్థములకు కారణం, స్వామీ! అందుచేత సంసారమును త్యజించటమే ఉచితం కదా!

అధ్యాయము-11.) సంసార బంధము అనగా?

బ్రాహ్మణుడు : ఓ పూబోణీ! నీ మాటకు అడ్డువస్తున్నాను అని అనుకోవద్దు. జీవునికి సంసారము బంధమా? భార్య-పిల్లలు మొదలైనవి త్యజించాలని నీ ఉద్దేశ్యమా? ఆశ్రయాలు (లేక) ఆశ్రమాలు 4 విధాలుగా వేదజ్ఞులు చెప్పారు కదా! అవి క్లుప్తంగా చెప్పుకుందామా?

గొల్లభామ : తప్పక చెప్పండి మహాశయా! మీరు మీ వేద-యజ్ఞ-యాగ ప్రజ్ఞా దురంధరులని మీ వాక్ మాధుర్యమే చెప్పుచున్నది సుమా!

బ్రాహ్మణుడు : బ్రాహ్మణులకు, తదితరులకు కూడా నాలుగు ఆశ్రమాలు బ్రహ్మయజ్ఞ విధానంగా శాస్త్రాలు సూచన చేస్తున్నాయి.


Page: 41

1.) బ్రహ్మచర్యాశ్రమం : కొందరు విద్యార్థి దశ తరువాత లౌకిక సంబంధమైన "వివాహము - పిల్లలు - సంపదలు" ఇటువంటివి ఆశ్రయించకుండా, "గురు సేవ - వేదాధ్యయనము - బ్రహ్మము గురించిన సమాచార సేకరణ - బ్రహ్మము నందు రమించుటకై కావలసిన సాధనలు" ప్రయత్నములలో దైనందిక జీవితమును విధివిధానంగా నియమించుకోవటం.

2.) గృహస్థాశ్రమం : మరికొందరేమో... విద్యార్థి దశ తరువాత బ్రాహ్మణ తదితర కులాచారాలను అనుసరించి ఆ వంశాభివృద్ధి కొరకై వైవాహిక జీవితాన్ని ఎన్నుకుంటున్నారు. వైవాహిక జీవితంలో శాస్త్రోచితంగా కొనసాగిస్తున్నారు. పెద్దల వద్ద విద్యార్థిగా నేర్చిన వేదాధ్యయనము, పఠనము, బోధనము అన్ని వర్ణాలలోని జనులచే యజ్ఞ-యాగ-వ్రత-పూజాదులు, స్మార్తకర్మలు నిర్వర్తింపజేయటానికి, మంత్ర-తంత్ర పూర్వకమైనదంతా వృత్తి ధర్మంగా స్వీకరిస్తున్నారు. సంతానము-సంపద ఆస్వాదిస్తూ లోక-వేద విధాన పూర్వకంగా సాంఘికమైన, సర్వజనానుకూలమైన గృహస్థ జీవితం శాస్త్రప్రవచితమైన మార్గంగా అనుసరిస్తున్నారు.

మరి కొందరు... లోకావసరాలైన ఆర్థిక - గృహ - సామాజిక - ఆహార ఉత్పత్తి కార్యక్రమాలు నిర్వర్తిస్తూ వేదోపాసన - నాదోపాసన - వేదాంత శాస్త్రాధ్యయనం నిర్వర్తించుతూ ఉండటం జరుగుతోంది. వీరంతా గృహస్థాశ్రమవాసులుగా చెప్పబడుచున్నారు.

ఇక అజ్ఞులైన ఇంకొందరి గురించి చెప్పాలంటే, వారు గృహస్థాశ్రమాన్ని అరిషట్ వర్గములచే వమ్ము చేసుకుంటున్నారు.

3.) వానప్రస్థాశ్రమం (వనజీవితం) : విజ్ఞులలో కొందరు గృహస్థాశ్రమం కొన్ని సంవత్సరాలు గడుపుతూ సంతానము - సంపద - గృహస్థ ధర్మాలైన లోకకళ్యాణ పూర్వక యజ్ఞయాగాదులు మొదలైనవి నిర్వహిస్తూ ఒకానొక సమయంలో ఆ గృహస్థాశ్రమం త్యజిస్తున్నారు. ఏకాంత జీవితం ఆశ్రయిస్తున్నారు. ధర్మపత్నీసమేతంగా ఆ ఏకాంత ప్రదేశంలో తపస్సు - ధ్యానము కొనసాగిస్తున్నారు. శాస్త్రాధ్యయనం చేస్తూ ఆత్మతత్త్వానుభూతిని సుస్థిర పరచుకుంటున్నారు. వీరిని “వానప్రస్థులు” అని అంటారు.


Page: 42

4.) సన్యాసాశ్రమం : విద్యార్థి - బ్రహ్మచర్య - గృహస్థాశ్రమములలోని స్థితి నుండి సన్యాసాశ్రమం కొందరు స్వీకరిస్తూ ఉంటారు. ఇల్లు - వాకిలి - సంపదలు - బంధువులు ఇత్యాది సాంఘికమైన విశేషాలన్ని త్యజించి, శాస్త్రవిధి మంత్ర-తంత్ర నియమానుసారం సన్యాసాశ్రమంలో ప్రవేశిస్తూ, చిరకాలం ఒక ప్రదేశములో నివసించకుండా, ప్రదేశముల పట్ల ఏర్పడే మమకారాలను దరిజేరనీయకుండా, పరివ్రాజకులై ఉంటారు. శాస్త్రసాధనాలైన అష్టాంగయోగాలు అభ్యాసం చేస్తూ జనులకు ఆధ్యాత్మక దృష్టిని గుర్తు చేస్తూ ఉంటారు.

బ్రాహ్మణ - క్షత్రియాది 4 వర్ణాలకు కూడా వేరు విధివిధానాలతో సూత్రప్రాయంగా శాస్త్రములచే మార్గదర్శకమౌతున్న ఈ 4 ఆశ్రమాలలో “గృహస్థాశ్రమమే ఉత్తమమైనది".... అనే వాక్యం నీవు వినివుండలేదా?

గొల్లభామ : విన్నాను! ఎందుచేతనో మీరు చెప్పండి!

బ్రాహ్మణుడు : ఎందుచేతనంటావా? మిగతా మూడు ఆశ్రమవాసులు కొంతకొంతగా ఆహార-సంచార జీవన వసతుల కొరకై నిత్య శ్రామికులైన గృహస్థులపై ఆధారపడి ఉంటారనే ఉద్దేశ్యముతో సుమా! ఇంకాకూడా చెప్పాలంటే...

సంసారాశ్రమంలో (లేక) గృహస్థాశ్రమంలో ఉన్నవాడు,

... ఈ విధంగా ఇహ-పరంగా ఉభయ శ్రేయస్సులను నిత్యమూ సంపాదించుకోవచ్చు కదా!


Page: 43

ఇక నీవు చెప్పే మాటల విషయానికి వద్దాం.

ఓ భామా! నీవు అంటున్నదేమిటి? "సంసారమే అన్ని అనర్థాలకు మూలం!” అని సిద్ధాంతీకరిస్తున్నావేమిటి?

ఓహెూ! నాకు అర్థం అయ్యిందిలే!
“ఈ జీవుడు సంసారంలో చిక్కుకుంటున్నాడు” అని అనేటప్పుడు, “ఈతడు తెలియక, సరియైన అవగాహన - విశ్లేషన చేయనట్టి సందర్భాలలో కొన్ని కొరగాని మార్గములు - ఉద్దేశ్యములు - అవగాహనలు - అభిప్రాయములు కలిగి ఉండటం చేత”... అని నీ అభిప్రాయము అయిఉంటుందేమో కదా!

గొల్లభామ : అవును! నా అభిప్రాయము అదేలే... స్వామీ!

బ్రాహ్మణుడు : అయితే, ఓ గొల్లభామామణీ! అటువంటి ‘కొరగాని పనులు’ అనగా ఏమేమో నీ ఉద్దేశ్యము మాకు, విజ్ఞులగు ఈ సభకు వేంచేసిన ప్రేక్షకమహాశయులకు సవివరంగా చెప్పవూ!

గొల్లభామ : ఓ బ్రాహ్మణ మహాశయా! వినండి.

తెలివైనవాడు ఈ సంసారములో జీవన యాత్ర సాగిస్తూనే రాగ - ద్వేష - లోభ - మోహ - మద - మాత్సర్య - మమకారాదులు తన మనస్సును మకిలం చేయకుండా చూచుకుంటూ ఉంటాడు. అది దృష్టిలో పెట్టుకునే ధర్మశాస్త్రాలు గృహస్థాశ్రమ ధర్మాలు జీవులకు సూచిస్తున్నాయి.

ఒక తామరాకుపై కొంచం నీళ్ళు పోసామనుకోండీ!

అట్లాగే, ఇక్కడి సంగతి సందర్భాలు, సంపద-ఆపదలు, సంబంధ-బాంధవ్యాలు, సానుకూల-ప్రతికూల వ్యవహారాలు, శతృ-మిత్రులు ఇత్యాదులన్నీ ‘మనస్సు’ అనే తామరాకుపై పడితే పడవచ్చు గాక! ఆ మనోనళినీదళం ఆయా ప్రాపంచిక వ్యవహార జలబిందువులు తనలోకి పీల్చనట్టి సామర్థ్యమును ఈ గృహస్థాశ్రమవాసి సర్వదా అలవరచుకుంటూ ఉండాలి.


Page: 44

బాహ్య విషయాలు బాహ్యానే ఉంచాలి (స్పర్శాత్ కృత్వా బహిః బాహ్యాన్). అంతేగాని, వాటిని విషయముల రూపంగా మనస్సులో ప్రవేశించనీయరాదు.

ఈ మాత్రం... నిత్యసాధనలో కష్టం ఏముంటుంది చెప్పండి?

అట్లాగే, ఇంకొక దృష్టాంతం చెపుతాను. మీరు, ఈ 'గొల్లకలాపం' అనే ఆత్మయజ్ఞము వీక్షించి ఆనందించటానికి వచ్చిన సభిక మహాశయులు. నాపై వాత్సల్యంతో వినండి!

ఎర్రపురుగును మనమందరమూ చూచియే ఉంటాము కదా! ఆ ఎర్రపురుగు బురదలోను - నీటిలోనూ కూడా తిరుగాడుతూ ఉంటుంది. అయితే ఏం? అది బురదనూ అంటించుకోదు. నీటినీ (తడినీ) అంటించుకోదు.

మరి ఈ మానవుడో? ఈతనికి సర్వాంతర్యామి అయిన శ్రీరామలింగేశ్వరస్వామి ఉత్తమ బుద్ధిని ప్రసాదించారే! సమాలోచన చేసి సమన్వయించుకోగల మనో-బుద్ధులు ఈతనికున్నాయి కదా! ఆ ఎర్ర పురుగుమాత్రం తెలివి లేకపోతే ఎట్లా మరి?

దృశ్య విషయాలలో మనస్సు పాల్గొనుచున్నంత మాత్రం చేత దుష్టములైన రాగ-ద్వేష, మాన-అవమాన భావ పరంపరలను మనస్సులో పెంపొందించుకోవలసిన అగత్యమేమిటో చెప్పండి?

పడవ నీటిలోనే ఉంటుంది. కానీ, పడవ తనలోకి నీరు ప్రవేశించనీయదు. ఒకవేళ ఏ కారణం చేతనో ప్రవేశిస్తే... పడవ మునిగిపోతుంది కదా! అట్లాగే ఈ దృశ్యము యొక్క స్వభావము తెలిసియున్నవాడు తన మనస్సు జగద్విషయములలో ఉన్నప్పటికీ జగద్విషయములను మనస్సులో ప్రవేశించకుండా జాగరూకుడై ఉండటం అభ్యసిస్తూ ఉంటాడు.


Page: 45

అనగా,

ఇక్కడి దృశ్యములోని, సంఘటనలు - సందర్భాలు - సంబంధములు - వ్యవహారములు - సుఖదుఃఖములు - లాభనష్టముల మధ్య జీవనయాగం కొనసాగిస్తూనే ... వాటిచే స్పృశించకపోవటం అభ్యసిస్తూ ఉంటాడు. వాటికి తాను సంబంధించక, అవి తనకు సంబంధించనీక...., ఒకానొక అతీతత్వము, అప్రమేయత్వము హృదయాంతరంగంలో అభ్యసిస్తూ ఉంటాడు. ఇదే శాస్త్రాలు చెప్పే అస్పృశ్యత!

మహాత్మా! ఈ దేహి ఆయా లౌకిక-వ్యవహారిక విశేషములచే అస్పృశ్యుడై ఉంటూ, ఆత్మజ్ఞానాశయంతో లీలగా-క్రీడగా ఈ జగత్తులో చరిస్తూ ఉండటమే ఉచితం కదా!

అంతేగాని......,

“ఇవన్నీ నావే! నాకు సంబంధించినవే!” అనే భావాలను ఆశ్రయిస్తూ వాటిచే బద్ధుడై ఉండటం అవసరమా? సముచితమా? కానేకాదు!

పట్టుపురుగు తెలివితక్కువగా తన లాలాజల ధారములలో తానే చిక్కుకుంటోంది. ఆ రీతిగా అజ్ఞాని తన ఆశ-నిరాశ సంబంధ-బాంధవ్య, ప్రియ-అప్రియ భావావేశములలో తానే బద్ధుడౌతున్నాడని వేదాంత శాస్త్రం గుర్తుచేస్తూనే ఉన్నది కదా స్వామీ! స్వతహాగా ఆత్మస్వరూపుడే అయి ఉన్న జీవునకు అట్టి బంధము ఉచితం కాదు కదా? కాదు. కాకూడదు.

అధ్యాయము-12.) సంసార బంధ విశేషాలు

ఓ విప్రవర్యా! 'సంసార బంధము' గురించి - గృహస్థాశ్రమము గురించి మరికొన్ని వివరాలు మరికొంతగా చెప్పుకోవాలంటే...

"నా ఇల్లు - నా వాకిలి - నా పేరుప్రతిష్టలు - నా కళత్రం - నా పిల్లలు - నా సంపద - నావాళ్ళు - కానివారు - నా గొప్పతనం - నా అధికారం - నాకు ఇష్టమైనవారు - నాకు గిట్టనివారు" ... ఇత్యాది విశేషాలు మననం చేస్తూ దృశ్యముతో 'స్వకీయకల్పన' అనదగిన 'బంధము'ను మనస్సుచే పొందటమునే 'సంసారము' అని అంటున్నారు.


Page: 46

అంతేగాని, సంసారము అనగా 'గృహస్థాశ్రమం' అయి ఉండలేదు.

దృశ్యముతో ఉద్వేగపూర్వకమైన సంబంధము యొక్క తీవ్రతచే ఆత్మత్వము ఏమరచటమే సంసారము.

అట్టి సంసార దీర్ఘరోగము నుండి, సంసారసృంఖలముల నుండి విడివడటమే వర్తమాన "జన్మ" అనబడుదాని సద్వినియోగమని శాస్త్రహృదయమును ఎరిగినవారు హెచ్చరిస్తున్నారు కదా!

మహనీయా! వింటున్నారు కదా! ఓ విప్రవర్యా!

దృశ్యముతో పెట్టుకొనబడే మానసిక సంబంధము అనునది సంసారము.

ఆహా! 'సంసారము' అనే దీర్ఘ మానసిక బంధముచే ఈ జీవుడు వివశుడౌతున్నాడు కదా! ఇదంతా స్వకీయమైన అభ్యాసంచేతనే ఏర్పడుతోంది. తనకు తానే స్వకీయ కల్పనలు అయినట్టి “దుర్మదము - దుర్మతి” అనేవి కళ్ళను కప్పి వేయచుండగా ఈతడు గ్రుడ్డివాడగుచున్నాడు.

“ఆర్జిత కర్మలు” అనే దేవతకు తనకు తానే బానిసగా అగుచున్నాడు - చేసుకుంటున్నాడు. ఇంద్రియములకు - ఇంద్రియ విషయములకు దాసుడై రోజులు వృధా చేసుకుంటూ ఉండగా, .... ఈ లోగా బాల్య-యౌవన-కౌమార-వార్ధక్యాలు గడచిపోతున్నాయి.

ఎప్పుడో మృత్యువు వచ్చి ఈ భౌతిక దేహమును కబళించివేస్తోంది.

నిస్తేజము - నిరుపయోగము అయిన జీర్ణదేహాన్ని త్యజించి, ఇతఃపూర్వం చెప్పుకున్నట్లుగా, ఈ జీవుడు సంస్కారానుసారంగా మరొక భౌతిక దేహమును ఆశ్రయించి గర్భనరకములన్నిటికీ పాత్రుడుగా (qualified) అగుచున్నాడే!

ఈ విధంగా ఉపాధిపరంపరలు అసంఖ్యాకంగా అజ్ఞాన జీవుని పట్ల వస్తున్నాయి. పోతున్నాయి.

ఓ విప్రపుంగవుడా! ఇప్పుడు చెప్పండి!

కాలానుగతంగా వచ్చి పోతున్న, ఉత్పత్తి అయి నశిస్తున్న ఈ భౌతిక దేహాలలో కొన్ని గొప్పవి - మరికొన్ని అల్పమైనవి - అనేది ఎక్కడ? వాస్తవానికి అటువంటి భేదము ఎక్కడున్నది? ఈ అన్ని దేహాల యొక్క పుట్టుక-చావులు ఒక్క తీరైనవే కదా! మరి “మా బ్రాహ్మణ దేహములు ప్రత్యేకమైనవి”... అని ఎట్లా అంటున్నారో చెప్పండి!

నేను, ఈ సభకు వేంచేసిన ప్రేక్షకులు వింటాము.