Narada Bhakti Aphorishms in Telugu, Sri Yeleswarapu Hanuma Rama Krishna - YHRK
1.) అథాతో భక్తిం వ్యాఖ్యాస్యామః ॥
(అథ అతో) కాబట్టి ఇప్పుడు, ‘భక్తి’ గురించి వ్యాఖ్యానించుకుందాం. వివరించుకుందాం.
2.) సా త్వస్మిన్ పర(మ) ప్రేమరూపా ॥
అట్టి భక్తి అత్యుత్తమ ప్రేమరూపమైనది. స్వరూప స్వభావరీత్యా అభౌతికమైన ప్రేమ స్వరూపం సంతరించుకోవడమే భక్తి. సహజీవులుయొక్క ఇహత్వాన్ని అధిగమించి సర్వులలోని సర్వులుగా వున్న పరత్వాన్ని ప్రేమించడం.
3.) అమృత స్వరూపా చ ॥
అది అమృత స్వరూపము. తెంపు లేని మాధుర్య ధార. మృతములేని అకార-అకామబద్ధ ప్రేమ.
4.) యల్లబ్ద్వా పుమాన్ సిద్ధో భవతి, అమృతో భవతి, తృప్తో భవతి ॥
ఏ పరా ప్రేమైతే సంపాదించుకున్న తరువాత సిద్ధించవలసినది సిద్ధించినదగుచున్నదో వారు స్వయంగా అమృత స్వరూపులగుచున్నారు. అనిర్వచనీయ తృప్తిని అనునిత్యం చేసుకుంటున్నారు.
5.) యత్ ప్రాప్య న కించిత్ వాంఛతి, న శోచతి, న ద్వేష్టి, న రమతే, న ఉత్సాహీ భవతి ॥
పరాప్రేమ ప్రాప్తించిన తరువాత వారికిక క్రొత్తగా (లేక) వేరుగా కాంక్షించవలసినది గాని, దుఃఖించవలసినదిగాని, ద్వేషించవలసినదిగాని, రమించ వలసినదిగాని, ఉత్సాహం కలిగి ఉండవలసినది గాని మరొకటేదీ ఉండదు. ఈ జగత్తంతా ప్రేమమయంగా గోచరిస్తుంది. పరమాత్మయొక్క ప్రియ ప్రత్యక్ష రూపంగా గోచరమౌతుంది.
6.) యత్ జ్ఞాత్వా మత్తో భవతి, స్తబ్దో భవతి, ఆత్మారామో భవతి ॥
పరా ప్రేమను ఎరిగిన తరువాత ఇక వారు భక్తి రసముచే మత్తులై, లౌకిక విషయముల పట్ల స్తబ్ధులై, సర్వదా ఆత్మయందే రమించుచున్నవారై (ఆత్మారాములై) ఉంటారు. జగత్తంతా కూడా పరా ప్రేమ స్వరూపంగా అగుపిస్తుంది.
7.) సా న కామయమానా, నిరోధరూపత్వాత్ ॥
అది లౌకిక వస్తువుల పట్ల ఏర్పడే కోరిక వంటిది కాదు. వారిది సర్వ లోక సంబంధమైన కోరికలకు నిరోధ రూపమైన ఆవలి ఒడ్డు. ఆ భక్తులు, “అయ్యా! మాకు భక్తి అనునిత్యమైతే చాలు! ఇంకేమీ అక్కర లేదు” అంటారు!
8.) నిరోధః తు లోక వేద వ్యాపార న్యాసః ॥
అది లోక వ్యాపారములకు, వేద (శాస్త్ర) క్రియాదులకు కూడా ఆవల (నిరోధ) రూపం. లౌకిక విషయాలను అధిగమించినట్టి అలౌకిక ఆనందం! అలౌకిక ప్రేమ!
9.) తస్మిన్ అనన్యతా, తత్ విరోధిషు ఉదాసీనతా చ ॥
(అంతటా పరమాత్మయే సందర్శనమగుచుండగా) వారు పరమాత్మ స్వరూపముపట్ల అనన్య చిత్తులై ఉంటారు. తత్ విరోధ విషయములన్నింటిపట్ల (లౌకిక విశేషములపట్ల) ఉదానీసులై ఉంటారు. సహజమగు పరతత్త్వము అత్యంత ప్రియంగాను, సందర్భమాత్రమగు ఇహతత్వము స్వల్ప విషయంగాను దర్శిస్తున్నారు.
10.) అన్యాశ్రయాణాం త్యాగో అనన్యతా ॥
అన్యములైన ఆశ్రయములన్నీ త్యజించి ఉండటమే అనన్యత. అంతా అదే అయినప్పుడు అన్యమైనదంటూ ఏముంటుంది? పరమాత్మయే ఈ అన్ని రూపాలుగా అనిపించటమే అనన్యత!
11.) లోక వేదేషు తత్ అనుకూల ఆచరణం, తత్ విరోధిషు ఉదాసీనతా చ ॥
లోక విషయాలలోను - శాస్త్ర విధులలోను లోకహితైషులై, అనుకూలాచరణులై ఉండటం, ప్రతికూల విషయాల పట్ల ఉదాసీనులై ఉండటం. పరమాత్మ కొఱకై లౌకిక విధులు నిర్వర్తిస్తూ ఉండటం (ఉదాసీనత). అంతా అదే! కనిపించేదంతా అదే అయివున్నప్పుడు ఇక కన్నుమూతలెందుకు - అని అస్వాదిస్తూ వుంటారు.
12.) భవతు నిశ్చయ దార్ఢ్యాత్ ఊర్ధ్వం శాస్త్ర రక్షణమ్ ॥
భక్తియొక్క ‘నిశ్చయము - ఉన్నతి’ కొఱకై శాస్త్రములచే చెప్పబడే విధి విధానములను నిర్వర్తించే ఉద్దేశ్యం కలిగి ఉంటారు. శాస్త్ర ప్రవచిత వాక్యములకు ప్రచారకులై ఉంటారు. భక్తి కొఱకై శాస్త్రాలు ఆశ్రయిస్తారు గాని, శాస్త్రం కొరకు భక్తిని కాదు. భక్తి యొక్క సిద్ధియే ఆశయంగా కలిగి ఉంటారు. విధి-నియమాలు ఎందుకు? వారి మనస్సు పరాభక్తి, సర్వత్రా ప్రేమ యొక్క ప్రవృద్ధి కొఱకు! సర్వత్రా అనురాగము విరాగమే!
13.) అన్యథా పాతిత్యా శంకయా ॥
పరాభక్తికి అనుకూలం కానిది అయోగ్యమని తమ ప్రవర్తనాదులచే ప్రకటిస్తూ ఉంటారు. భక్తికి సానుకూల్యం కానిది త్యజించుచూ వుంటారు. సర్వత్రా ప్రేమ లేని విధి నియమాలు పతన హేతువులుగా శంకిస్తారు.
14.) లోకో అపి తావత్ ఏవ; కింతు భోజనాది వ్యాపారస్త్వా శరీరధారణావధి ॥
లోక వ్యవహారంగాని శాస్త్రంగాని అనన్య భక్తి కలిగేందుకే!
భోజనాది వ్యవహారాలు దేహం దేహధారణ కొఱకు మాత్రమే శరీరధారణ-కర్మలు… అన్నీ భక్తికొరకే!
పరాభక్తియే జీవిత పరమాశయం!
15.) తల్లక్షణాని వాచ్యంతే నానామత భేదాత్ ॥
ఆ భక్తి యొక్క వివిధ లక్షణములే వేరు వేరు మతములలోని భేదమంతా!
అన్ని మతములు విధి-విధానముల దృష్ట్యా వేరు వేరుగా కనిపిస్తున్నప్పటికీ..అవన్నీ చూపించే భక్తి తత్వము ఒక్కటే.
అన్ని మతముల అంతిమ సారం పరాప్రేమను సంతరించుకోవటమే.
భక్తి ఒకానొక మహత్తర లక్షణము! మతములన్నీ మానవులకు భక్తిని నేర్పటానికే వున్నాయి!
16.) పూజాదిషు అనురాగ ఇతి పారాశర్యః ॥
పరాశరముని ‘పూజ ద్వారా భగవంతుని పట్ల అనురాగం పొందించుకొనటం’ అనే కాయిక భక్తిని ప్రబోధిస్తున్నారు. పూజచే భక్తి (లేక) పరాప్రేమ దినదిన ప్రవృద్ధమానమవుతూ వస్తుంది. సర్వే సర్వత్రా అనురాగమే పరాభక్తి యొక్క రూపంగా వారు చెప్పుచున్నారు. ఇంద్రియములను పరమాత్మకు సమర్పించే పూజా పుష్పాలుగా భావన చేయటం పరాభక్తికి మార్గంగా వారు ఉపదేశిస్తున్నారు!
17.) కథాదిషు ఇతి గర్గః ॥
గర్గాచార్యులు ‘భక్తుల కధలను - అవతారమూర్తులను ఆరాధించి తద్వారా భక్తిని పెంపొందించుకోవటం’ సూచిస్తున్నారు. భక్తుల స్వభావ-లక్షణములను అవతార మూర్తుల లీలను గానం చేయటం పరాభక్తికి ముఖ్యమైన మార్గంగా వారు చూపుచున్నారు!
18.) ఆత్మరతి అవిరోధేన ఇతి శాండిల్యః ॥
శాండిల్యముని "అత్మయొక్క లక్షణములుగా చెప్పబడిన - సర్వస్వరూపత్వము, అఖండత్వము, అప్రమేయత్వము, నిర్మలత్వము మొదలైనవి సంతరించుకోవటం, తదితర లక్షణమైన మనో-బుద్ధి-చిత్త-అహంకారాలకు సంబంధించిన స్వభావం వదలి ఉండటం అను మార్గాన్ని ప్రవచిస్తున్నారు. సర్వులను ఆత్మరూపంగా దర్శిస్తూ వుండటం భక్తికి మార్గం అని శ్రీ శాండిల్యముని ప్రవచనం!
19.) నారదః తు తత్ అర్పిత అఖిల ఆచారతా, తత్ విస్మరణే పరమవ్యాకులత ఇతి (చ) ॥
ఇక ఈ నారదుని అభిప్రాయం వినండి. సర్వ కార్యక్రమములను ఆ సర్వేశ్వరునికి సమర్పించటం, పరమాత్మను విస్మరించే సందర్భాలపట్ల వ్యాకులచిత్తులై ఉండటం, కర్మలను పరమాత్మకొఱకై అని భావిస్తూ, ఇదంతా నాతో సహా సర్వమూ పరమాత్మయొక్క ప్రత్యక్షరూపమే అని ఉపాసించటం!
20.) అస్తి ఏవం ఏవం ॥
అట్టి పరమోత్కృష్టమైన పరాభక్తిని సంపాదించుకున్నవారు ఎక్కడైనా ఉన్నారా? తప్పకుండా ఉన్నారు! అల్ప దృష్టిచే అల్ప విషయాలే గోచరిస్తాయి. ఉత్తమ దృష్టిచే పరాప్రేమ స్వరూపులను గుర్తించగలం.
21.) యథా వ్రజగోపికానామ్ ॥
బృందావన గోపికలే అందుకు మనకు ఒక నిదర్శనం. వారు ఈ సర్వ ప్రాపంచిక కర్మలు భగవంతుని ఉద్దేశించి నిర్వర్తించువారు. సర్వే సర్వత్రా కృష్ణచైతన్యమునే దర్శించి పరవశులౌతూ ఉంటారు.
22.) తత్ర అపి న మహాత్మ్యజ్ఞాన విస్మృతి అపవాదః ॥
ఆ గోపికలు ఈ దేహముతో దైనందిన కార్యక్రమములు నిర్వర్తిస్తున్నప్పటికీ వారు పరమాత్మ యొక్క మహత్తును కించిత్ కూడా ఏమరచుట లేదు. అంతా కూడా కృష్ణచైతన్యానందమే అని ఆస్వాదిస్తూ వున్నారు.
23.) తత్ విహీనం జారాణాం ఇవ ॥
భగవంతుని ఏమరచటమే మనస్సు యొక్క జారత్వమని జనులు గ్రహించి ఉండెదరు గాక! ఆ ఏమరుపే అప్రతిష్ఠ (న-ప్రతిష్ఠ). “అంతా పరమాత్మ సంకల్పమే కదా!” అని అనుకుంటే పరాభక్తి. వాళ్ళు కారణం-వీళ్ళు కారణం అని అనుకుంటుంటే జీవత్వం.
24.) నాస్తి ఏవ తస్మిన్ తత్ సుఖ సుఖిత్వమ్ ॥
ఆ సర్వాత్మకుని మనసా - వాచా - కర్మణా భక్తితో ఆశ్రయించి ఉన్నవారికి లభించే సుఖం లౌకిక ప్రాపంచిక సుఖం వంటిది కాదు. వారికి లోక సంబంధమైనదేదీ రుచించదు. అది అలౌకిక సుఖం, ఆత్మానందం! “కనబడేదంతా - బయట, లోపల కూడా - శ్రీకృష్ణ చైతన్యమే!” అని తలచే గోపికల ఆత్మసుఖంతో పోల్చగలిగినదేమున్నది?
పరాభక్తి స్వరూపము
25.) సా తు కర్మ జ్ఞాన యోగేభ్యో అపి అధికతరా ॥
ఆ పరాభక్తి యొక్క సంస్థితి కర్మ-జ్ఞాన-యోగముల కంటే సమున్నతమైనది. ఆ మూడింటి పరాకాష్టయే భక్తి! ఆ మూడింటి క్రమమంతా భక్తితో లయమౌతుంది.
26.) ఫలరూపత్వాత్ ॥
ఎందుకంటే, కర్మ-జ్ఞాన-యోగముల అంతిమ ప్రయోజనం ప్రేమ (భక్తి) స్వరూపాన్ని సంతరించుకోవటమే సుమా! ఇక భక్తికి భక్తియే ప్రయోజమై వున్నది!
27.) ఈశ్వరస్య అపి అభిమాన ద్వేషిత్వాత్ దైన్య ప్రియత్వాత్ ॥
అందుచేత ఈ ప్రాపంచిక విషయముల పట్ల అభిమాన-ద్వేష-దైన్య-ప్రియత్వాలను కలిగి ఉండటం కంటే వాటినన్నింటినీ ఆ పరమాత్మ వైపుగా మలచుకొని ఉండటమే సముచితం. అభిమానము-ద్వేషము-దైన్యము-ప్రియము పరమాత్మ వైపుగా ఎక్కుబెట్టబడినప్పుడు పరమాత్మయే లభిస్తున్నారు. ఉద్ధవుడు-శిశుపాలుడు-కంసుడు-వసుదేవుడు అందుకు ఉదాహరణాలు.
28.) తస్యా జ్ఞానమ్ ఏవ సాధనమ్ ఇతి ఏకే ॥
“అట్టి పరాప్రేమను సంపాదించాలంటే జ్ఞానమే ఉత్తమ సాధనము”… అని కొందరి సిద్ధాంతం. (It is one school of thought). జ్ఞానము పుష్పమైతే పరాప్రేమ (భక్తి) ఫలము అని వారి బోధ. జ్ఞానమున్నచోట భక్తి స్వభావ సిద్ధం! భక్తి ఉన్నచోట జ్ఞానము స్వభావ సిద్ధం!
29.) అన్యోన్య ఆశ్రయం (ఆశ్రయత్వం) ఇతి అన్యే ॥
“జ్ఞానము వలన భక్తి, భక్తి వలన జ్ఞానము ప్రవృద్ధమౌతూ ఉంటాయి. ఒకటి రెండవ దానిని ఆశ్రయించుకొని ఉంటుంది” అని మరికొందరి సిద్ధాంతం. (It is another school of thought).
30.) స్వయం ఫలరూపత ఇతి బ్రహ్మకుమారః ॥
భక్తి యొక్క ఉత్తమ ప్రయోజనం నిశ్చలమైన భక్తియే. స్వస్వరూపం సంతరించుకోవటమే భక్తి యొక్క అత్యుత్తమ ప్రయోజనం… పరాభక్తిని కలిగి ఉండటమంటే….. తనను తాను పొందటమే! ఇది (బ్రహ్మ కుమారుడైన) నారదుని అభిప్రాయం. సముద్రంలో తరంగం లయమగుచున్నట్లు తాను ఇష్టదైవ విలీనుడవటం.
TODO - Sutrams [31 to 84]