[[@YHRK]] [[@Spiritual]]


శ్రీ యేలేశ్వరపు రామకృష్ణయ్య (భాగవతారు) గారి

గానలహరీ సౌరభాలు

గాన కుసుమ రచన : శ్రీ యేలేశ్వరపు రామకృష్ణయ్య (భాగవతారు)
[1866 - 1927]
(భాగవతారు = హరికథ చెప్పువాఁడు)

  వ్యాఖ్యానం : శ్రీ యేలేశ్వరపు హనుమ రామకృష్ణ (YHRK)
(భాగవతారు యేలేశ్వరపు రామకృష్ణయ్యగారి మనుమడు)
Chief Manager, Andhra Bank
[1951 - 2018]

ముద్రణ : March, 2002

Composed & Printed by :
M/S ELURU OFFSET PRINTERS
ELURU - 534002

ముఖచిత్రం:
శ్రీ మంచెం సుబ్రహ్మణ్యేశ్వరరావు, Andhra Bank
శ్రీ కె. పద్మావతి, Andhra Bank


YouTube Playlist for some of these Songs
https://www.youtube.com/playlist?list=PLVzJSjiA-oYmpXmWkAneSPPGq2UuIHqPB

Imaginary portrait of Sri Yeleswarapu Rama Krishnaiah Garu

విషయ సూచిక :


YouTube Playlist for some of these Songs
https://www.youtube.com/playlist?list=PLVzJSjiA-oYmpXmWkAneSPPGq2UuIHqPB

🌺🙏🌺

1.) నమో నమో గణనాయకా!


రాగం: గంభీరనాట
తాళం : ఆది

పల్లవి :
➤ నమో… నమో… గణనాయకా!
➤ ఉమా తనయ! భవ! కుమారాగ్రజా! ॥నమోనమో॥

చరణం 1 :
➤ సాంబ తనయ! సకలార్థ సిద్ధి వినాయకా!
➤ హేరంబా! విఘ్ననాశ! శుభకరా! ॥నమోనమో॥

చరణం 2 :
➤ వేదవేద్య! సకలాగమ పూజితా!
➤ ఆదిదేవ! సకలాధారా! స్థితా! ॥నమోనమో॥

చరణం 3 :
➤ శ్రీ కుచేలపురి వాస రామకృష్ణ
➤ వాంఛితార్థ ఫలదాయక నాయక! ॥నమోనమో॥
Lord Ganesha
హే గణనాయకా! ఉమా తనయా! భవుని (శివుని) కుమారా! కుమారస్వామికి అగ్రజుడా! నీకు మా నమస్సుమాంజలులు.

హే సాంబ తనయా! సకల అర్థములు, ఆశయములు సిద్ధించాలంటే తమ కరుణచేతనే అవి సుసాధ్యం అవుతాయి.

శుభకార్యములను ప్రోత్సహించి సముత్సాహపరచు స్వామీ! అన్ని విఘ్నములను తొలగించి సర్వశుభములు ప్రసాదించు భగవాన్! మీకు నమో వాక్కులు.

స్వామీ! వేదములు ఎలుగెత్తి గానం చేస్తూ ప్రకటిస్తున్నది మీ స్వరూపమే కదా! సర్వ పురాణములు మొట్టమొదట మిమ్ములనే ధ్యానం చేసి కథాశ్రవణం ప్రారంభిస్తున్నాయి.

హే దేవాదిదేవా! (దేవ! ఆదిదేవ!) సకలమునకు ఆధారభూతుడవైన గణపతీ! మీకు సాష్టాంగ దండ ప్రణామములు.

శ్రీ కుచేలపురి (కూచిపూడి) వాస్తవ్యుడైన రామకృష్ణయ్య యొక్క మనోవాంఛలు తీర్చి, సకలార్థములను ఫలప్రదం చేయుచున్న
లోకనాయకా! మహాగణపతీ! పాదాభివందనములు.

🌺🙏🌺

2.) మునివరదే! శారదే!


రాగం : ఆరభి
తాళం : ఆది

పల్లవి :
➤ వరదే… శారదే… మునివరదే! శారదే!

చరణం 1 :
➤ నలువరాణి నా వాక్కున నిలచీ
➤ సలలితముగ పలుకుల పలికించవే ॥మునివరదే శారదే॥

చరణం 2 :
➤ సరస వచన నా మనమున నిలచీ
➤ సరస కవిత వాగ్ధాటినొసగు ॥మునివరదే శారదే॥

చరణం 3 :
➤ శ్రీ కుచేలపురవాసి రామకృష్ణ
➤ భూసురుని కరుణతోనేలిన ॥మునివరదే శారదే॥
Goddess Saraswathi
అమ్మా! సర్వ వరప్రసాదినీ! శారదా! జగన్మాతా ! మునులచే ఆశ్రయించబడి స్తోత్రింపబడు జగజ్జననీ! ఈ విన్నపము ఆలకించమ్మా!

హే బ్రహ్మదేవుని సతీమణీ! నా వాక్కున నీవు నిలచినదానవై లలితమైన భగవత్ వాక్యములను పలికింపజేసి ఈ జన్మను సార్థకం చేయి తల్లీ!

హే సరస వచనా! నా మనస్సులోకి వేంచేయి! నీ యొక్క అవ్యాజమైన కరుణచే రససమన్వితమైన వాగ్ధాటిని ప్రసాదించి నన్ను ఉద్ధరించమ్మా!

ఈ కూచిపూడి నివాసి అయిన యేలేశ్వరపు రామకృష్ణయ్యకు దేహము - వాగ్ధాటి - జ్ఞాన - విజ్ఞానములు ప్రసాదించి కరుణా కటాక్షవీక్షణచే సర్వదా ఏలే లోకమాతా! నీకు వేలాది నమస్కారములమ్మా!

🌺🙏🌺

3.) శ్రీ బాల త్రిపుర సుందరీ …


రాగం : భౌళి
తాళం : రూపకం

పల్లవి :
➤ బాల త్రిపుర సుందరీ! అంబా!
➤ బాల త్రిపుర సుందరీ!

అనుపల్లవి :
➤ మము పాలన చేయవమ్మా … మాయమ్మా ॥బాల॥

చరణం 1 :
➤ బాలచంద్ర ధరుణిరాణీ…
➤ పాలిత త్రిభువన కళ్యాణీ…
➤ (మిత్రం) కాలహరణమేల? భక్త పాలన బిరుదును ధరియించీ…
➤ ఏలా నీమది కనికరమేలా గల్గదో! తల్లీ… ॥బాల॥

చరణం 2 :
➤ చిన్ననాడె నిను మది… కనుగొన్నా నీ కథ విన్నా…
➤ ఎన్న జాల నీదు మహిమా… కన్నతల్లివని నా…
➤ (మిత్రం) హృన్నిలయంబున నిలచియు
➤ క్రమ్మర నా మొఱ విని, దరి నున్న దాసజనుల జేర్చి
➤ తిన్నగ నను బ్రోవు జననీ… తిన్నగ నను బ్రోవు జననీ! ॥బాల॥

చరణం 3 :
➤ జ్ఞానమయీ… జ్ఞాన దాయీ… జ్ఞానానుమోదినీ…
➤ జ్ఞాన-సువిజ్ఞానాతీత జ్ఞాన ప్రసూనాంబా….
➤ (మిత్రం) మానక నీ నామము మది
➤ ధ్యానము చేసిన సుజనుల
➤ మానసమున నివసించి… వారి మానసమున నివసించి
➤ అమోఘ విభవములొసగుము తల్లీ…
➤ అమోఘ విభవముల్ ఒసగుము తల్లీ… అంబా! ॥బాల॥

చరణం 4 :
➤ సకల లోకాధారిణీ.. సచ్చిదానంద స్వరూపిణీ
➤ సకల సుకవి సంప్రేక్షణీ సాధుజనా సంరక్షణీ
➤ (మిత్రం) సకల దురిత సంహారిణి
➤ ప్రకటిత సురరిపు ద్వేషిణి
➤ శుక ప్రముఖ ముని పోషణి
➤ సూనృత వాణి పురాణీ ॥బాల॥

చరణం 5 :
➤ యేలేశ్వరపు రామకృష్ణ పాలినీ త్రిలోక జననీ
➤ బాలేందుని భానన నీ పాలబడితినమ్మా…. నీ పాలబడితినమ్మా
➤ (మిత్రం) కాలహరణమేల, భక్తపాలన బిరుదును ధరియించి
➤ ఏలా నీ మది కనికరమేలా గల్గదో తల్లీ ॥బాల॥
Goddess Bala Tripura Sundari
హే అంబా! బాలత్రిపుర సుందరీ జగన్మాతా! మా ఈ దేహ - మనో - బుద్ధి - చిత్త - అహంకార పుష్పములు మీ పాదారవిందములు చేరునట్లుగా కరుణించి మమ్ములను ఏలుకోవాలి సుమా!

బాలచంద్రుని తన శిఖలో అలంకారంగా ధరించిన ఆ శివదేవుని అర్ధాంగీ! మాకు అమ్మవై మమ్ములను కరుణించమ్మా!

హే లోకమాతా! భక్తులను పాలించే చల్లటి తల్లివని నీకు గొప్ప ప్రతిష్ఠ ఉన్నది కదమ్మా! మా పట్ల ఇంక ఆలస్యం దేనికి చెప్పు?

అమ్మా! నీవు కరుణామయివే! మరి మా పట్ల కరుణించి మమ్ములను సముద్ధరించాలనిపించటం లేదా? “అయ్యో ! వీరు అల్పజ్ఞులైనప్పటికీ, నా బిడ్డలే కాబట్టి, నేను కాక మరెవ్వరు రక్షిస్తారు?” … అని నీకు ఇంకా అనిపించటం లేదా?

హే లోకమాతా! చిన్నప్పుడే మా పెద్దలు నీవు కరుణారస సాగరివని చెప్పగా విన్నాను. నీ దర్శనంచే పులకాంకితుణ్ణి అయ్యాను!

వ్యాసులవారు నీ మాతృత్వము ఎంతటి మధురమైనదో (దేవీ పురాణంలో) ఎలుగెత్తి గానం చేయుచుండగా వింటున్నాము. ‘ఈ అమ్మ మహిమ ఇంతటిది’ అని వర్ణించేంత తెలివి నాకెక్కడిదమ్మా? ఒక్కటి మాత్రం నిజం. నీవు జగజ్జననివి. కనుక, నాకు కన్నతల్లివి నీవే కదా!

హే జగత్ స్వస్థికే! నేను నీవున్న కైలాసం వచ్చేంత యుక్తి కలవాడను కాదు. అయితే, నన్ను కన్నతల్లివి నీవే కదా! అందుచేత, నా హృదయం లోనికి నీకు సుస్వాగతం పలుకుచున్నాను. నా ‘హృదయం’ అనే గృహం వేంచేయి. వచ్చి, నా హృదయంలో నీకు చేస్తున్న విన్నపములు విను. విని ఇంకేమీ అనకుండా నన్ను ఈ జన్మ జన్మార్జితమైన ‘ఇంద్రియ లోలత్వము’ అనే దృశ్యతదాత్మ్య వ్యాధికి చికిత్స ప్రసాదించు.

ఓ జగదానంద జననీ! చిత్స్వరూపిణీ! జ్ఞానము నీ స్వరూపం! అందుచేత, జనులకు కరుణతో ఆత్మజ్ఞానం ప్రసాదించే తల్లివి నీవే! అంతే కాదు. మమ్ము కన్నతల్లివి కదా? అందుచేత, మా అజ్ఞానం తొలగించు. సుజ్ఞానులుగా తీర్చిదిద్ది స్వామికి ఆమోదయోగ్యంగా మమ్ములను తయారు చేసే తల్లివి నీవే! నీవు జ్ఞానము - అజ్ఞానముల కంటే కూడా ఆదివై ఉన్నావు.

కనుకనే, కవులు “ఓ జ్ఞాన ప్రసూనాంబా!” అని నిన్ను ఎలుగెత్తి గానం చేస్తున్నారు.

అమ్మా! ఎవ్వరైతే ‘ఓం శ్రీ బాలత్రిపుర సుందరీ జగన్మాత్రే నమః’ … అని జపిస్తూ నీ ధ్యాసలో ఆయుష్షు పవిత్రం చేసుకుంటూ ఉంటారో… అట్టివారు ధన్యులు. ఎందుకంటే, నీవు అట్టి మహనీయుల హృదయములలో తిష్ఠ చేసి ఉంటావుట. అట్టివారికి, వారి వలన మా అందరికీ అమోఘమైన విభవములు ప్రసాదిస్తూ ఉంటావుట కదా!

అందుకే, లలితా సహస్ర మాతృదేవతులు “నామపారాయణ ప్రీతా!”… అని గానం చేస్తున్నారు.

హే జగదంబికా! ఈ లోకములన్నీ ఆభరణముగా ధరించుచున్నది నీవే కదా! సర్వరూపములు నీవైనప్పుడు ఇక నీకు ‘ఇవి’ అనబడే నామరూపములు ఎక్కడున్నాయ్? అందుకే, వేదములు ‘సత్-చిత్-ఆనంద స్వరూపిణీ’… అని ఎలుగెత్తి పాడుచున్నాయి.

తల్లీ! మా యొక్క సకల దురితములను (దుష్ట కర్మల పరంపరను) తొలగించుకొనే శక్తి మాకెక్కడిది? మా దురితములను కాళీమాతవై తొలగించివేసి దుష్ట సంస్కారములను సంహరించే తల్లివని నిన్ను శరణువేడుచున్నాం. ”దుష్ట రాక్షసులను సంహరించటమే నా పని”… అని శపథము-వాగ్దానము చేసిన తల్లివి కదా! మాపై కరుణతో శ్రీ శుకుడు, వ్యాసుడు, వాల్మీకి మొదలైన పురాణ ప్రవక్తలను జ్ఞానం ప్రసాదించింది నీవే కదమ్మా! జ్ఞాన విషయాలను వారిచే మా కొఱకై పలికించి మమ్ము సముద్ధరించే తల్లీ! పురాణ దేవీ! నమో నమః!

త్రిలోకములను పాలించే నీవు ఈ యేలేశ్వరపు రామకృష్ణయ్యను కూడా పరిపాలిస్తున్న తల్లివి కావా?

హే సాంబశివుని అర్ధాంగీ! ఇప్పుడిక నాకు దిక్కు నీవే! ఇక ఆలస్యం దేనికి చెప్పు. ఆలస్యం చేస్తే నీ ’భక్తపాలని’ అనే బిరుదుకు భంగం వస్తుందేమోనని నా దిగులు. నీ మనస్సు అతి లలితమని కదా పెద్దల వాక్యం. మరి నాపై కరుణ ఎందుకు కలగటల్లేదమ్మా?

ఓ జగదానంద జననీ! కరుణించి నాకు తోడు అయి నన్ను ఈ అజ్ఞాన వీచికల నుండి సముద్ధరించు.

🌺🙏🌺

4.) ఓం నమఃశివాయ… సదాశివాయ


YouTube hyperlink to this Song - https://www.youtube.com/watch?v=hM_4Ep2Oibg
రాగం : దేవగుత్తి
తాళం : త్రిశనడక

పల్లవి :
➤ ఓం నమః శివాయ శంకరా! సదా శివాయ!
➤ ఓ నమః శివాయ శంకరా!
➤ సదాశివాయ! ఓం నమః శివాయ శంకరా!

అనుపల్లవి :
➤ ఓం నమః శివాయ శంకర!
➤ ఓంకార రూపాయ!
➤ కాలకంధరాయ! శ్రీ…. గౌరీ మనోహరాయ! ॥ఓం నమః॥

చరణం 1 :
➤ భక్తజన లోక పాలనా!
➤ పాపార్తి భంజన! భవ్యలోక పంచాననా!
➤ యుక్తియుక్తమైన… వేదసూక్తి వినుత! సత్ప్రభావ!
➤ ముక్తి మాకొసగు… సద్భక్తవేద్య సార్వభౌమ!
➤ జీవన్ ముక్తి మాకొసగు… సద్భక్త వేద్య సార్వభౌమ! ॥ఓం నమః॥

చరణం 2 :
➤ కోటిసూర్య ప్రభాసకా!
➤ తరుణేందుధరా! కైటభారి వినుత రూపకా!
➤ సూటిగా కనుగంటిపేట బాట చూపి… నన్ను మాయ
➤ దాటచేయు గురుని చూపిన మేటి బంధు రామలింగా ॥ఓం నమః॥

చరణం 3 :
➤ కూచిపూడీ నివాసకా.. యేలేశ్వరపు రామకృష్ణ దాసపోషకా…
➤ ఈశ… మహేశా… గిరీశా… సర్వేశా…
➤ మా పాపములను బాపి మీ లోకమిచ్చి బ్రోవుమయ్యా ॥ఓం నమః॥
Lord Shiva
ఓంకార స్వరూపా! జీవబ్రహ్మైక్య స్వరూపా! లోక శుభంకరా! జ్ఞానసుఖైశ్వర్య ప్రదాతా! సదా శివా! పాదాభివందనం.

అవాఙ్మానస (అ-వాక్-మానస) గోచరుడవని ఒప్పుకుంటూనే నిన్ను “ఓం” అను సంజ్ఞతో వేదములు గానం చేస్తున్నాయి.

నీవు కాలమునకే నియామకుడవు. ‘కాలః కాలః’ అని పిలువబడువాడవు కదా! కాలః కాల ప్రసన్నానాం కాలః కిన్ను కరిష్యతి? కాలునికే కాలుడవైన నీవు ప్రసన్నుడవైతే ఇక కాలయముడు మమ్మేమి చేయగలడు?

హే గౌరీ మనోహరా! పాలయ మాం! రక్షయ మాం!

భక్తజనులను అనునిత్యంగా రక్షకుడవై వారిలోని సంసారిక దృష్టులను తొలగించి వారియొక్క పాపార్తిని హరిస్తావుట కదా! అందుకే, నిన్ను ‘హరుడు’ అని పిలుస్తున్నారు.

మీ పాదపద్మములు ఆశ్రయించినవారికి జ్ఞానయుక్తమైన లోకములు ప్రసాదించే పంచముఖ స్వామీ! శరణు శరణు.

‘జీవశ్శివః శివో జీవః’, ‘సర్వమ్ శివమయమ్’, ‘శివాత్ పరతరం నాస్తి’ వంటి వేదసూక్తులచే గానం చేయబడుచున్న చల్లటి తండ్రీ! మాకు ‘సత్’ అనబడే బ్రాహ్మీస్థితిని కనికరించి ప్రసాదించే పిత్రుదేవులు మీరే కదా ! ‘ముక్తి - జీవన్ముక్తి’ అని శాస్త్రములచే ప్రతిపాదించబడే అత్యంతిక పరాస్థితిని ప్రసాదించవలసినదిగా మా విన్నపం.

భక్తులచే సత్స్వరూపుడుగా అంతరంగ సాక్షియగు ఆత్మస్వరూపుడుగా ఎఱుగబడే జగన్నాథా! సర్వలోకములకు నియామకుడవగుటచే, సార్వభౌమా! మీకు ప్రణతులివిగో!

"ఏకో వారిజ బాంధవః క్షితి-నభోవ్యాప్తం
తమో మండలం భిత్వా లోచన గోచరోఽపి
భవతః త్వమ్… కోటి సూర్యప్రభః!
వేద్యః కిమ్ నభవత్యహో?”

… అని ఆదిశంకరులవారు మిమ్ములను ప్రశ్నించారే? ఒక్క సూర్యుడు ఉదయించగానే చీకటంతా తుట్టున పారిపోతుందే! మీరో? కోటిసూర్య ప్రభాసికులు కదా! మిమ్ములను దర్శించనట్టి మా కళ్లు మూసుకుపోయిన స్థితిని ఏమని చెప్పుకోవాలి?

హే కోటిసూర్య ప్రభాసికా! (అంతర్ముఖముగా) కళ్ళు తెరవలేని మా దుస్థితిని చూచి కనికరించండి.

హే ! అర్ధచంద్రుని ఆభరణంగా అలంకరించుకొన్న స్వామీ! మీరు నృత్యం చేస్తూ ఉంటే, భక్తిపారవశ్యంతో కైటభారియగు ఆ విష్ణుదేవుడు ఢమరుకం వాయిస్తూ మీకు వినుతి సమర్పిస్తూ ఉంటారు. అట్టి మీ స్వరూపం నేనెన్నటికయ్యా గాంచగలిగేది?

ఎక్కడో ఈ సంసార లంపటంలో చిక్కుకున్న నాకు నీ పాదాలు చేరే మార్గం, విధానం, యుక్తి, శక్తి, అనురక్తి, లక్ష్యశుద్ధి నీవే ప్రసాదించాలి.

ఓ శ్రీ రామలింగా! నీవే బంధువువై నన్ను ఆదుకోక తప్పదయ్యా!

ఓ కూచిపూడిలో వేంచేసిన శ్రీ రామలింగస్వామీ! ఈ ‘యేలేశ్వరపు రామకృష్ణయ్య’ అనే నీ దాసానుదాసుని పరిపోషకుడవు నీవే కదా!

ఓ ఈశ్వరా! మహేశ్వరా! అమ్మవారికి అత్యంత ప్రియమైన గిరీశా! ఈ జగత్తంతా సర్వదా ప్రసరించి ఆధారభూతుడవైయున్న సర్వేశ్వరా! మమ్ము ఈ పాప - దుష్ట - సాంసారిక దృష్టి - అభ్యాసములనుండి రక్షించి శివ సాయుజ్యం ప్రసాదించి మమ్ములను ఏలుకొమ్మని సాష్టాంగదండ ప్రణామపూర్వకంగా మనవి చేసుకుంటున్నాం!

🌺🙏🌺

5.) శ్రీ పార్వతీ రమణ… భవహరణ…


రాగం :
తాళం :

పల్లవి :
➤ శ్రీ కుచేలపురంబున వెలసిన
➤ శ్రీ పార్వతీ రమణ! భవహరణ! శ్రీ.. శివశ్రీ!
➤ భోగీశ్వరమాం పాహీ, ఆశ్రిత జన పోషకా… శివశ్రీ!

చరణం 1 :
➤ నిగమవేద్య! నిఖిలేశ్వర! నిరుపమా…! నీలకంఠా!
➤ నీలకంఠ…! నిత్యానంద శివా!
➤ ఖగవాహన మిత్ర! సర్వశంకర!
➤ కామితార్థ దాయక! వామదేవ…! శ్రీ…. శివశ్రీ!
➤ భోగేశ్వరమాంపాహీ ఆశ్రితజన పోషక శివశ్రీ

చరణం 2 :
➤ వ్యోమాతీత! నిరంజన! నిర్గుణ!
➤ కామాంతక! కలిదోషహరణ! భవ!
➤ కామాదులా… గెలువలేక నా మది
➤ స్వామీ! మిము కొలచితి కరుణించవే!
➤ స్వామీ! మిము తలచితి కరుణింపవె! శ్రీ
➤ శివశ్రీ! భోగీశ్వర మాం పాహీ… ఆశ్రిత జనపోషక శివశ్రీ!

చరణం 3 :
➤ పాపుడ కుపితుడ పలుగాకిని నే
➤ సహాపరాధుడను సాంబా! క్షమియించీ…
➤ ఏ పగిదినీ… నన్ను బ్రోతువో దొర…
➤ తాపస నుత ప్రాపు మీరె మాకిక…శ్రీ భోగీశ్వర మాం పాహీ!

చరణం 4 :
➤ యేలేశ్వరపు రామకృష్ణ కవినేలిన కవివర! బాలచంద్రధరా!
➤ కాలకంధరా…! గౌరిమనోహర! పాలిత ముని సుర భవ్యగుణాకర! శ్రీ…
➤ శ్రీ భోగేశ్వర! మాం పాహీ ఆశ్రిత జనపోషక శివశ్రీ!
Lord Shiva with Parvathi
కూచిపూడిలో వెలసిన హే బాలత్రిపుర సుందరీ సమేత శ్రీరామలింగేశ్వర స్వామీ! శ్రీ పార్వతీ రమణా! ఈ ‘సంసారము’ అనే ఇంద్రియ విషయ, దృశ్య విషయ, అజ్ఞాన కూపంలోని నిబిడాంధకారంలో (in the sheer dark well of ignorance) చిక్కుకున్నామయ్యా ! నీవు ‘భవము’ అనే రోగమును హరిస్తావట! అందుకే ‘హరుడు’ అని భక్తులు పిలుస్తారట కదయ్యా!

‘ఆత్మానందము’ అనే భోగమును ప్రసాదించే భోగీశ్వర బిరుదాంకిత రామలింగా! ఆశ్రయించినవారి సుజ్ఞానమును పరిపోషించే మా ఇలవేల్పా! రక్షించండి! కాపాడండి స్వామీ!

వేదోపనిషత్తులచే ప్రకటించబడు మహాత్మా! సర్వమునకు ఈశ్వరుడా! ఎవ్వరితోనూ పోల్చవీలులేని కళ్యాణ గుణములు అవధరించినవాడా! ఆ రోజు గర్భంలోని లోకములను రక్షించే నిమిత్తం కాలకూట విషం మ్రింగి నీలకంఠుడవైనావు కదా! ఆహాఁ! ఏమి నీ లోకరక్షణా చమత్కారం!

స్వామీ! గరుత్మంతుని వాహనంగా కలిగియున్న విష్ణుదేవుని స్నేహితుడా! శర్వుడా! లోకశుభంకరా! వామదేవా! భక్తులు అడిగీ అడక్కముందే వారికి కావలసిన్నవన్నీ ప్రసాదించు స్వామీ! మహాదేవా! మిమ్ముల ఆశ్రయిస్తున్నామయ్యా!

ఈ జగత్తంతా పంచభూతమయం! ఆకాశమునుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలం, జలం నుండి పృథ్వి (From Space the Vapour, from Vapour the Heat, from Heat the Liquid, from Liquid the Solid) వస్తున్నాయని ఉపనిషత్వాణి ప్రబోధిస్తోంది కదా! ఇక మీరో ? ఈ భౌతికాకాశానికి, ఈ చిత్తాకాశానికి ఆవలనున్న చిదాకాశస్వరూపులు కదా! అందుచే మీరు ‘వ్యోమాతీతః’ అను బిరుదును అలంకరించుకొని ఉన్నారు.

స్వామీ! నిరంజనస్వరూపా! ఈ జగత్తులో కనిపించే సర్వజీవులు తమ స్వరూప చమత్కారమే. ఈ సృష్టిగా ఉన్నది మీరే! అయినప్పటికీ మీరు ‘సృష్టి’ అనబడే దోష వ్యవహారముచే ఏమాత్రం స్పృశించబడనివారు.

మీ తాత్త్విక స్వరూపం సర్వదా యథాతథం. అంతే కాదు. గుణాలన్నీ మీవే అయినప్పటికీ గుణములకు ఆధారమై, గుణములచే స్పృశించబడనిదై, గుణాతీతమైనది కదా మీ తత్త్వం!

హే హృదయేశ్వరా! మా మనస్సు మిమ్ములను దర్శించక, ఈ దృశ్య ప్రపంచంలో ‘అది కావాలి, ఇది తొలగాలి’… అనే రూపంలో వ్యవహరిస్తోంది. ‘ఏదో కావాలి’.. అనే కామ దోషముచే ప్రాప్తించినదే ఈ బంధము. అది తెలిసికూడా మా కామ - క్రోధ - లోభ - మద - మోహ - మాత్సర్యాలను వదిలించుకోలేకపోతున్నామే!

హే కామాంతకా! కలిదోషములను హరించు మా స్వామీ! భవుడా! కామాదులను గెలువలేక ఇప్పటికి మా హృదయం మీ పాదపద్మములను అనుస్మరిస్తోందయ్యా! ఏదీ? మీ కరుణ మాపై ప్రసాదించండి.

అవును! నేను ‘బాధించుట - దూషించుట - తస్కరించుట - ద్వేషించుట - మోహించుట’ … అనే దోషములచే పాపకర్మలు నిర్వర్తించియున్న మాట నిజమే! కోపంతో వ్యవహరించి ఉన్నాను. నోటికొచ్చినట్లు దుష్ట భాషలను అభ్యసించి ఉన్నమాట కూడా వాస్తవమే. దుష్ట జనులతో కలసి అనేక అపరాధములు నిర్వర్తించి ఉన్నానే! నన్ను ఎట్లా కాపాడుతావో మరి!

ఓ దొరా! తాపసులచే ధ్యేయముగా ధ్యానించబడుచున్న ఓ సాంబశివా! ఇట్టి దోషములతో కూడిన నాకు దిక్కు నీవేనయ్యా! ఈ యేలేశ్వరపు రామకృష్ణయ్య అనబడే కవిని ఏలుచున్నది మీరే! ఎందుకంటే, మీరు కవులకే కవి కదా!

ఓ కవివరా! బాలచంద్రుని శిఖలో ధరించిన స్వామీ! అందరినీ అదుపులో ఉంచే కాలయముని గుండెపై తన్ని గడగడలాడించిన భగవాన్! జగజ్జనని గౌరీదేవి మనోహరా! అతి పవిత్రమైన గుణములు ఆశ్రయించి ఉన్న మహాత్మా! భోగేశ్వర స్వామీ! ఈ సంసార నిబిడాంధకారంలో అనేక జన్మలుగా చిక్కుకున్న నాపై ‘సుజ్ఞానము’ అనే వెలుగును ప్రసరింపజేయండి.

🌺🙏🌺

6.) శ్రీరాముని స్మరణము మరువకురా!


YouTube hyperlink to this Song - https://www.youtube.com/watch?v=XJ4dsPnU8kA
రాగం : శుద్ధసావేరి
తాళం : ఆది

పల్లవి :
➤ స్మరణము మరువకురా
➤ శ్రీరాముని… చరణము విడువకురా.. ఓ మానవా….
➤ స్మరణము మరువకురా…

అనుపల్లవి :
➤ కరుణ తోడ వచ్చి గజరాజును మును
➤ గాచిన దయగల కమలనయనునీ ॥స్మరణము॥

చరణం 1 :
➤ తల్లిదండ్రి తన దార సుతాదులు
➤ స్థిరమని నమ్మకురా… ఓ మానవా! స్థిరమని నమ్మకురా…
➤ ధరణి వంశమున దయతోడ పుట్టిన
➤ ధర్మరూపియగు…. ధరణిజ కాంతుని ॥స్మరణము॥

చరణం 2 :
➤ సాధన బూనుమురా… సంసార బాధను దాటుమురా… ఓ మానవా…
➤ సాధన బూనుమురా.. సంసార బాధను దాటుమురా!
➤ ఆది పరాబ్రహ్మ… అంతరాత్మాయనె
➤ బోధరూపమున బుద్ధిని నిలుపరా… ॥స్మరణము॥

చరణం 3 :
➤ సాహసమొందుమురా… మదిలోనా దుర్ ఊహలు మానుమురా
➤ దేహికి దేహము ఐహిక మోహము
➤ సోఽహమనెడు గురు భావము నొందరా… ॥స్మరణము॥

చరణం 4 :
➤ భ్రమలను చెందకురా వానితో కూడి
➤ తమకము నొందకురా
➤ శునకము ఎముకలా నమలిన రీతిరా
➤ భ్రమను విడచి నామ సుధమునే గ్రోలరా… ॥స్మరణము॥

చరణం 5 :
➤ పరధన పరదారా హరణము
➤ మదిని పాపమని తెలియుమురా…. ఓ మానవా!
➤ పాపమని తెలియుమురా…
➤ పరులకు ద్రోహము పరమునకపోహము
➤ మరణము చేరిన తరుణము ముప్పగు ॥స్మరణము॥

చరణం 6 :
➤ మానవ జన్మమురా… మరలిన రాదు
➤ తీరని దుఃఖమురా,
➤ కానిపోని కథ కల్పన ఏలరా?
➤ లేనిపోని కథ కల్పన ఏలరా?
➤ పూనికతో గురు పూజను చేయరా… ॥స్మరణము॥

చరణం 7 :
➤ భాగవతుల సేవ… బాగుగా చేసి
➤ భాగ్యము నొందుమురా… ఓ మానవా!
➤ భాగ్యము నొందుమురా!
➤ ఈ మహి లోపల ఈశ రామకృష్ణా దాసుని
➤ బ్రోచినా దశరథరాముని… ॥స్మరణము॥
Lord Sri Rama
ఓ ప్రియమిత్రమా ! నీకొక అతిముఖ్యమైన, అత్యవసరమైన, అతి ఫలప్రదమైన, అత్యంత సుఖ-శాంతిదాయకమైన, అతి శుభప్రదమైన, ఆపదల అపహర్తరూపమైన, సర్వసంపదప్రదమైన కార్యక్రమ విశేషం గుర్తుచేస్తాను. దయచేసి విను.

స్నేహితుడా! లోకవ్యవహార స్మరణ చేసి చేసి ఏమి లాభం? మానసిక రుగ్మత అధికమవటమే తప్పించి!

అందుచేత, శ్రీరామ నామస్మరణ మరువ వద్దు. జన్మజన్మల జాడ్యం తొలగించగల శ్రీరామ చరణముల ఆశ్రయమును విడువవద్దు.

ఆనాడు మొసలి చేతికి చిక్కి అలసి సొలసి ఇక తన శక్తియుక్తులను నమ్మి ప్రయోజనం లేదని గ్రహించిన గజేంద్రుడు, ‘ఓ విమల ప్రభావా! సుగుణోత్తమా! శరణాగతామరానోకహ! రావే? కరుణించవే! శరణార్థినైన నన్ను కావవా తండ్రీ !”…. అని ఎలుగెత్తి పిలువగానే క్షణం వృధా చేయకుండా గబగబా వచ్చి రక్షించలేదా?

[NOTE: శరణాగతామరానోకహ! = శరణాగత అమర అనోకహ! = శరణువేడినవారికి అమర వృక్షము వంటివాడా!]

అట్లాగే, ‘దృశ్య సంబంధం’ అనే సంసార సాగరంలో చిక్కిన మనలను మాత్రం ఎందుకు రక్షించరు?

ఈ జగత్తులో కనిపించే భార్య - భర్త - తండ్రి - సంతానం - ఇల్లు - పేరు మొదలైనవాటిని “ఇవి కలకాలం ఇట్లాగే ఉంటాయి కదా….” అని తలచి ఎన్నిసార్లు మోసపోయాం? ఇవి స్థిరమా? ఇవన్నీ కొద్దికాలం క్రితం వచ్చాయి. మరికొంత కాలం గడిస్తే కాలగర్భంలో కలసిపోతున్నాయి. అశాశ్వతమైన విషయాలను, సంబంధ బాంధవ్యములను నమ్మి ‘ఫరవా లేదులే’… అని కాలం గడుపుతూ ఉంటే శాశ్వతమైన ఆనందం లభిస్తుందా? లేదు. కనుక, శాశ్వతము - అఖండము - అద్వితీయము అగు సర్వాత్మారామునే మనం శరణు వేడాలి.

అజుడు - అనంతుడు - సర్వాత్మకుడు అగు ఆత్మారాముడే మనపై దయతో అయోధ్యలో దశరథునికి కుమారునిగా అవతరించి సీతమ్మను చేపట్టి మన మధ్యలో నిలిచారు కదా! ”అయ్యో! ఈ నా ప్రియజనులు అజ్ఞానం చేతనే కదా, … అనేక దుఃఖ - భేద - మోహములు పొందుచున్నారు! వీరి మానసిక రుగ్మతులు తొలిగేది ఎట్లా?”… అని తలచి రామచంద్రమూర్తిగా పరమాత్మ అవతరించారు. (లోకో రమయతేతి రామః).

ధర్మమే స్వరూపముగా దాల్చిన ఈ మన రామచంద్రుని సర్వదా స్మరించు. ఆయన పాదములు ఆశ్రయించు.

మిత్రమా! ఈ దృశ్య భ్రమలచే ప్రాప్తిస్తున్న సంసార భ్రాంతి కలుగజేయగల మానసిక ఋగ్మతలకు (Mental worries) అంతెక్కడ? వీటిలో ఎంత కాలంగా ఏది ఆశించి ఏం ప్రయోజనం? అందుచేత “రామ నామస్మరణ” అనే అభ్యాసానికి ఉపక్రమించు. తద్వారా సంసారం కలిగించే బాధను ఉపశమింపజేయి.

ఆ రాముని ఉనికి ఎక్కడో గమనించు. అంతటికీ ఆయనయే ఆది. (He is the source, where from everything else is emerging).

వేద ఉపనిషత్తులచే “పరబ్రహ్మము“గా గానం చేయబడుచున్నది రామతత్త్వమే! ఆయనయే ఆత్మారాముడు. నీ అంతరాత్మరూపంగా వేంచేసియున్నది ఈ రామచంద్రుడే!

తెలియబడే ఈ దృశ్య జగత్తును తెలుసుకునే ‘బోధ’ రూపుడై అఖండజ్యోతిగా వెలుగొందుచున్నది ఆ రామచంద్రుడే సుమా! అట్టి బోధరూపుడగు ఆత్మారామునిపై బుద్ధిని నిలుపు. ఈ నామరూపములపై ప్రసరించి పరిమితత్వము వహిస్తున్న బుద్ధికి, ”దృశ్యాదులను అధిగమించి వాటికి సర్వదా ఆధారమై చెన్నొందు రామతత్త్వమును అంతటా దర్శించు సామర్థ్యము“ను పెంపొందింపజేయి.

‘నాయమాత్మా బలహీనేన లభ్యః’ అను ఉపనిషత్ వాక్యానుసారం అంతటా వేంచేసియున్న - అన్నియు తానే అయిఉన్న రామ పరతత్త్వాన్ని సర్వదా దర్శించగలిగే శక్తిని రామనామ జపమే ఇస్తుంది.

‘నామోఽస్తు యావతీ శక్తిః నామ రూపాత్మక’ - కాలబద్ద జగద్విశేషములపట్ల ఊహలను ఉపశమింపజేసుకో!

నీవు ‘దేహి’ స్వరూపుడవే కాని, ‘దేహ’ స్వరూపుడవు కాదు.

‘నేను ఈ దేహమును. దేహసంబంధితుడును. ఈ ఎదురుగా ఉన్నవి నావి’… అనేవన్నీ మోహంచేత వచ్చి ఉంటున్నాయి. దేహికి ఈ దేహము సాధనవస్తువుగా ఉండవలసినది పోయి, ‘భ్రమ - మోహం’ పెంపొందటానికి కారణమగుచున్నదని గమనించు.

అందుచేత, ఈ దేహాన్ని సాధనంగా చేసుకొని ‘బోధ గురువు’ అయిన ఆత్మా రాముణ్ణి చేరు.

“ఆ ఆత్మారాముడినే నేను గాని, కాల పీడితాలైన ఈ దేహాదులు నేను కాదు”… అను ’సోఽహమ్’ భావనను ఆశ్రయించి పుణికి పుచ్చుకో.

ఓ ప్రియసఖుడా! ఇక్కడ కనబడే దృశ్య వ్యవహారములు, సంబంధ బాంధవ్యములు, నామరూపాదులు చూచి “అయ్యో! అది అలా ఉందేం? ఇది ఇలా ఉండదేం?”… అని భ్రమ చెందనూ వద్దు. వాటితో కూడి తమకము పొందనూ వద్దు. ఈ జగత్తులో ఏదేది ఎట్లున్నా నీకు వచ్చేదీ లేదు, పోయేదీ లేదని గమనించు. ఈ దృశ్యజగత్తులో “అది కావాలి - ఇది కావాలి”… అని ఆశించి కాలాన్ని వెచ్చించటం “కుక్క మాసం కొఱకై బొమికలను నమలటం” వంటిది. ఇక్కడ ఎప్పటికో ఏదో లభిస్తేగాని హాయి లేదు”… అనే భ్రమను విడిచిపెట్టు. ‘శ్రీరామ నామస్మరణ’ అనే అమృతాన్ని త్రాగటం ప్రారంభించు.

ఓయీ ! ”ఇతరులకు ఎందుకు లభించాలి? అవన్నీ నాకే లభించవచ్చు కదా”…. అనే దురభ్యాసాన్ని క్రమంగా తొలగించుకో! ఇతరుల ధనాదులను ఆశించటం, ఇతరులకు ద్రోహం చేయబూనటం, ఇతరుల సొత్తు దొంగిలించ యత్నించటం - ఇవన్నీ ముందు ముందు అనేక దుఃఖ పరంపరలకు బీజం కానున్నాయని గ్రహించు. ’ద్రోహచింతన పరిపోషించుకున్నవారి మరణానంతరం దుఃఖాలు వర్ణనాతీతం”… అని పురాణాదులు మనకు గుర్తుచేస్తున్నాయి కదా ! కనుక, అట్టి దురభ్యాసాలనుండి ఉపశమింపజేసి ఈ మనస్సుకు “సర్వాత్మకుడు - సర్వస్వరూపుడు”… అగు శ్రీరామచంద్రమూర్తియొక్క నామస్మరణను అలవాటు చేయి.

ఓ నెచ్చెలుడా..! ఈ మానవజన్మ ఒక గొప్ప సదవకాశం సుమా! అశ్రద్ధ చేశావా… ఈ మహత్తరమైన - దుర్లభమైన అవకాశాన్ని చేజార్చుకున్నవాడవౌతావు.

ఈ దృశ్యము స్వతఃగా వాస్తవానికి లేదు. ఇక్కడ ఏదీ నీది కాదు. ఇక్కడ ఏదీ ఎక్కడికీ పోదు. కనుక, లేనిపోని కాని సంఘటనా పరంపరలతో అనుబంధం కల్పించుకొని ఎందుకు ఈ భ్రమాత్మక జగత్తును నమ్ముకుని ఉంటావు?

నీలో గురుస్వరూపుడు (the highest aspect in you) అగు రామచంద్రమూర్తికి ఈ దేహము - మనస్సు - బుద్ధి - చిత్తము అన్నీ సమర్పించు. ఇవన్నీ వారివిగా, వారి సేవకై ఏర్పడినవిగా గమనించి వర్తించు. ఇదే కదా “గురుపూజ”!

భగవత్ భక్తులగు భాగవతులను సందర్శించు. పవిత్రమైన వారి సామీప్యమును సంపాదించుకో. వారిని సేవించి తద్వారా భక్తి సౌరభమును పెంపొందించుకో!

ఆలోచనా పుష్పాలచే ఆత్మారాముని పూజించి సారూప్యం పొందు.

‘రామయ్యా ! హరేరామ్ ! శ్రీరామ్ - జయరామ్ - జయ జయరామ్’… అని గానంచేసేవారిని సమీపించి సేవించటమే సామీప్యం.

ఈ భూమిపై శ్రీరాముడై వెలసి ఈ రామకృష్ణయ్య భాగవతారును ఎల్లప్పుడు బ్రోచే ఆ ఆత్మారామయ్య - జానకిరామయ్య - దశరథరామయ్య స్మరణము మరచిపోవద్దు. ఆయన చరణములు విడువవద్దు.

🌺🙏🌺

7.) శ్రీరాముల భజన చేదామా


YouTube hyperlink to this Song - https://www.youtube.com/watch?v=wgkaV2YxmmE
రాగం : ముఖారి
తాళం : ఆది

పల్లవి:
➤ భజన చేదామా రాముల భజన చేదామా
➤ శ్రీరాముల… మా రాముల… భజన చేదామా
➤ అజహరాదులకు అందరానిదీ..
➤ అవ్యయుండగు ఆత్మారాముల ॥భజన॥

చరణం 1 :
➤ భక్తిసలుపుదమా… రాముల రక్తి వేడుదమా
➤ భక్తిగీతముల భక్తులకూడుకు… ముక్తినొందదగు యుక్తిచూపమని
➤ జీవన్ముక్తినొందదగు యుక్తి చూపమని ॥భజన॥

చరణం 2 :
➤ వినుతి చేదామా… రాముల ఘనత చూదామా
➤ అనుదినమును మనకభయంబిచ్చిన
➤ అవ్యయుండగు ఆత్మారాముల ॥భజన॥

చరణం 3 :
➤ మద్దెల తాళములు మ్రోయగ బుద్ధి కుదురుగాను
➤ మన బుద్ధి కుదురుగాను
➤ రద్దు సేయకను రవికుల సోముని
➤ ముద్దుమురిపెముల ఒద్దిక చూచుచు
➤ శ్రీరాముని ముద్దుమురిపెముల ఒద్దిక చూచుచు… ॥భజన॥

చరణం 4 :
➤ అనుదినమును మన మనవిని వినుమని
➤ అనుపమ భక్తి మహానందముతో ॥భజన॥

చరణం 5 :
➤ దండమిడుదామా… రాముల అండజేరుదమా
➤ మన రాముల అండజేరుదమా ॥భజన॥
➤ దండిగ రాముల.. భక్తులకూడుకు
➤ బ్రహ్మాండమంతటా నిండిన జ్యోతియని ॥భజన॥

చరణం 6 :
➤ కోరి పిలుదామా… రాముల కొలువు చేయుదమా
➤ కోరికతోను కుచేలపురంబున కోరిన భక్తుల కోర్కెలు
➤ తీర్చగ… రామకృష్ణ కవినేలేటి రాముల ॥భజన॥
Lord Sri Rama and Sita
ఓ సర్వాంతర్యామీ! శ్రీరామానంద సాగరా! ఈ జగత్తంతా నీవే అయి ఉన్న నా స్వామీ! ఈ దేహము, ఈ మనస్సు, ఈ బుద్ధి, ఈ చిత్తము నీవే. కాబట్టి అవి నిన్ను స్మరించటానికి, భజించటానికి సేవించటానికి ఉన్నాయయ్యా!

అంతయూ, అంతటా, అన్నిటా ఉన్న ఆత్మారామయ్యా! నా ఈ ఉపాధిలో కేవల సాక్షివై, సర్వులలోని నిత్యసత్యమై, సర్వజీవులను నీయందే కలవాడవై, సర్వమూ నీవై ఉన్న అనంతరామా! ఆనందరామా! ఆత్మారామా! లోకాతీతా! గుణాతీతా! పాహిమాం!

ఓ ప్రియ మిత్రులారా! మనం ఆ సీతారాముల భజన చేద్దాం రండి.

ఆ శ్రీరాముణ్ణి, మన రాముణ్ణి మననం చేద్దాం రండి.

ఆ రాముడు ఎంతటివాడయ్యా అంటే, ఆయన బ్రహ్మ-రుద్రులు కూడా అందుకోవటానికి అందడట. కాలాతీతుడట! మార్పు చేర్పులకు అతీతమైన వాడట! అవ్యయుడైన ఆ ఆత్మారాముని స్తోత్రం చేద్దాం రండి.

ప్రేమతో ఆయనని ఆరాధిద్దాం. గోముగా ఆయనని అభ్యర్థిద్దాం. ధన్యులగు రామభక్తులలో చేరి వారివలె మనం కూడా ఆ రామచంద్రమూర్తిని శరణువేడుదాం. మనం ఆశ్రయిస్తే ఆయన కాదనేవాడు కాదుట. అయితే, ఆయనను ఏమి అడగాలి? అవీ - ఇవీ అడిగే బదులు “ఓ రామస్వామీ! మేము ఎప్పటినుంచో ఈ సంసార లంపటంలో చిక్కుకున్నాం. అనేక జన్మలుగా అలసిపోయాం. మేము ముక్తిని సంపాదించే యుక్తిని ప్రసాదించండి. జీవన్ముక్తి సంపాదించే మార్గం చూపండి”… అని మనసారా వేడుకుందాం.

స్వామిని మద్దెల - తాళములు మ్రోగిస్తూ గానం చేద్దాం. ఈ బుద్ధి అటూ - ఇటూ చెదరకుండా ఆయనను మననం చేద్దాం. అనుదినమూ అభ్యాసపూర్వకంగా “మహాత్మా! జానకిరామా! రవికుల సోమా! పట్టాభిరామా!” … అని మరింకే సద్దూ చేయకుండా ఆయన ముద్దు మురిపుములే చూద్దాం! ఈ కనబడే సృష్టి అంతా ఆయన ముద్దు మురిపములే కదా! జగదభిరాముని ఒద్దికగా అంతటా అన్నిటా చూస్తూ సదా ఆనందిద్దాం.

ప్రతిరోజూ నిద్రలేచి ఆ సర్వజగత్ రాముడికే అంతా మనవి చేసుకుందాం. అంతా సమర్పించుకుందాం. అంతటా చూచి మురిసిపోదాం. “అనన్యమైన - అనునిత్యమైన అనుపమభక్తి“ అనే మహానందములో ఓలలాడుదాం.

సోదరులారా ! రండి, రండి! మనం ఆ అయోధ్యరాముడికే నమస్కరించుకుందాం. ఈ కనబడేదేదీ శాశ్వతం కాదు కదా ! శాశ్వతుడు - అజుడు - అప్రమేయుడు అగు ఆ రఘువంశ సుధాంబుధి చంద్రుని అండ చేరుదాం. ఆయన బ్రహ్మాండమంతా నిండియున్న జ్యోతిస్వరూపుడు కదా ! ఆయనను ఆశ్రయించి ఎందరు ధన్యులు కాలేదు ! అట్టి భక్తుల సహవాసం చేసి తద్వారా ఆ నిత్యానందరాముని దరి చేరుకుందాం.

“న జాతు కామః కామానామ్ ఉపభోగేన శామ్యతే” అని పెద్దలు చెప్పారు కదా! ఈ లోకంలో ఏమి ఆశ్రయించి ఏది పొంది ఏం ప్రయోజనం. కోరికలు తగ్గేవా? కాదు! అందుకని, మనం ఏకంగా ఆ చైతన్యరాముణ్ణి కోరుకుందాం. “దొరకునా ఇటువంటి సేవా?… నీ పద రాజీవములు చేరు నిర్వాణ సోపానమధిరోహనము చేయు త్రోవా…” అని త్యాగరాజుల వారు గానం చేసినట్లు మనం వారినే కోరి పిలుద్దాం. వారి కొలువు చేరుదాం.

ఆయన కోరి కోరి కుచేలపురం (కూచిపూడి) వేంచేసి “ఏ భక్తుడు ఏం కోఱుకుంటాడా?”… అని మనందరినీ గాంచుచున్నారు. ఇంక భక్తి పెంపొందించుకోవటమే మన పని. ఈ రామకృష్ణ కవిని ఎప్పుడూ ఏలేది ఆయనే కదా !

🌺🙏🌺

8.) పాండురంగా… పండరీపుర నాథా…


రాగం : ఆనందభైరవి
తాళం : త్రిశ్రగతి

పల్లవి :
➤ పాండురంగా! పాండురంగా! పండరి పురనాథా!
➤ నీ అండజేరియుంటిమి కోదండధరా! శ్రీ పండరి ॥పాండు॥

చరణం 1 :
➤ పౌండరీక క్షేత్రంబున… పుండరీక భక్తునికై
➤ దండిగ నివసించి ఉండగా… పండరిపుర రంగారి ॥పాండు॥

చరణం 2 :
➤ ఇతర దైవములను కొలువ… ఇక మనమున నిను విడువా
➤ ఇదె సమయము నన్ను కావగ ఈక్షితమీడేర్చు దేవ! ॥ పాండు ॥

చరణం 3 :
➤ తరముగాని సంసార భ్రమమున పడి దరిగానక
➤ ఈదఱి నిను శరణుజొచ్చితి అరయము దరిజేర్చు తండ్రీ! ॥పాండు॥

చరణం 4 :
➤ యేలేశ్వరపు రామకృష్ణ దాసుని మొర ఆలకించి
➤ ఓరిమితో ధరణి శ్రీ… కుచేలపురికి చేర రారమ్మి ॥పాండు॥
Lord Panduranga ViTTala
ఓ అంతర హృదయ అభ్యంతరంగ హృదయాంతరంగా! పాండురంగా! పండరి పురనాథా! ఇదిగో… శరణాగతులమై మీ అండజేరామయ్యా!

ఓ కోదండధరా! శ్రీ పండరీపురంలో వెలసి ఆశ్రయించినవారికి సర్వము ప్రసాదించే మా స్వామీ! పాండురంగా! శరణు శరణు.

ఆహాఁ! ఏమి నీ భక్తజన వాత్సల్యం! నీ భక్తుడగు పుండరీకుని కొరకై పాండురంగ క్షేత్రానికి వేంచేసావా! అందుకే, “ఆహాఁ! ఈయనే పండరీపుర రంగడు" అని భక్త సులభుడిగా, భక్తజన కొంగు బంగారంగా నిన్ను గానం చేస్తూ ఉంటారు.

స్వామీ! సర్వుల అంతరంగ నివాసి అగు నీవుండగా మాకు మరొక స్వామిని కొలవవలసిన అవసరమేమున్నది? నేను ఇంకెవ్వరినీ కొలవను. నిన్ను విడువను.

హే భగవాన్! అజ్ఞానముతో కూడుకొని, అనేక దేహ పురములలో సంచరించి అలసి సొలసి ఉన్న ఈ సమయంలో నాకు దిక్కు నీవే! ఇదే ఉచిత సమయమయ్యా! నన్ను కాచే సమయమిదే! తండ్రీ! నీ పాదాలు చేరాలనే నా అభీష్టం ఈడేర్చు.

ఈ సంసార సాగరంలో పడిన నాకు ఒడ్డు ఎక్కడా కనిపించటం లేదయ్యా! ఇది దాటటం నా తరమయ్యేది కాదు. ఇక దిక్కులేని నేను నీవే దిక్కని శరణు వేడుచున్నానయ్యా! అర్హతలు ఎంచక నీ దరిజేర్చుకో!

ఈ యేలేశ్వరపు రామకృష్ణదాసు మొఱ కొంచం వినవయ్యా! నీ దగ్గరకు వచ్చేంత తెలివి నాకు లేదు. అందుకని నీవే కూచిపూడి గ్రామం వేంచేసి నన్ను నీలో చేర్చుకో!

🌺🙏🌺

9.) పాలించరా… పాండురంగా


రాగం :
తాళం :

పల్లవి :
➤ పాలించరా పాండురంగా… నను పాలించరా పాండురంగా…
➤ నాపై చాలించు కోపమూ..
➤ స్వామీ శుభాంగా.. ॥పాలించరా॥

చరణం 1 :
➤ భక్తవత్సలుడవనీ… ప్రస్తుతించితి దేవా!
➤ ముక్తి దాయక నా.. మొఱ విన రారా! ॥పాలించరా॥

చరణం 2 :
➤ ఎందరినో నీవు.. బ్రోచితివట కాదా…
➤ నాయందు దయయుంచి… నన్నేలుకోరా.. ॥పాలించరా॥

చరణం 3 :
➤ యేలేశ్వరపు రామదాస ప్రాణేశా!
➤ మోసబుచ్చకు జగన్మోహనాకారా!
➤ నను మోసబుచ్చకు జగన్మోహనాకారా! ॥పాలించరా॥
Lord Panduranga Srirangam temple of Sri Rangam
పాండురంగనాథా! ఇక ఈ తనువును, మనస్సును పాలించవలసిన రాజాధిరాజువు నీవేనయ్యా!

ఓహో! ఏవేవో తప్పులు చేసి ఉన్నాను కదా అని నాపై కోపమా? జ్యోతియొక్క వెలుగులోకి వచ్చిన తరువాత ఇక చీకటి ఛాయలేమి ఉంటాయ్? నీ శరణువేడిన తరువాత ఇక దోషములెక్కడివి? అందుచేత, నాపై చిరుకోపం ఇక చాలించవయ్యా!

స్వామీ! మనోహరా! నీకు “భక్తవత్సలుడు” అని బిరుదు ఉన్నది కదయ్యా ! అందుకే, ఏరికోరి నిన్నే స్తుతిస్తున్నాను. నీ బిరుదుకు లోటురాకూడదు కదా! అందుచేత, నీవిక రాక తప్పదయ్యా! ఓ ముక్తిదాయకా! కాస్త ఇటొచ్చి, నా మొఱ ఆలకించు స్వామీ !

నీవు పుండరీకుడు, సక్కుబాయి, నిగమశర్మ మొదలైన అనేకమంది భక్తులను కాపాడి నీ దరి జేర్చుకున్నావట కదా! అట్లాగే, నాయందు దయయుంచి నన్ను నీవే ఏలుకో. అప్పుడు, ”అవును ! భక్తవత్సలుడే”.. అని లోకం నిన్ను శ్లాఘిస్తుంది సుమా !

ఈ జగత్తే నీ రూపం. జగత్తుగా ఉంటూ జగదీశ్వరుడివై ఉండి జనులను మోహింపజేస్తూ ఉంటావు కదా! నన్ను కూడా అట్లా “మోహింపజేసి మోసగిద్దాములే” అని అనుకుంటున్నావా? అది న్యాయం కాదు, స్వామీ! నీవు ఈ యేలేశ్వరపు రామకృష్ణయ్యకు ప్రాణేశ్వరుడవు కదా! అందుచేత, నన్ను పరిపాలించు స్వామీ !

🌺🙏🌺

10.) ఏదేదే నీదయ? పాండురంగా!


YouTube hyperlink to this Song - https://www.youtube.com/watch?v=l41iA9A9-fM
రాగం : ఆనందభైరవి
తాళం : మిశ్రచాపు

పల్లవి :
➤ ఏదేదే నీ దయా… పాండురంగా
➤ పండరీ..నాథా.. శ్రీ పాండురంగా.. నీదయ నాపై
➤ ఏదేదే నీదయా పాండురంగా

అనుపల్లవి :
➤ యాదీ లేదా దేవా! ఏదీ నాగతీ బ్రోవా… ॥ఏదేదే॥

చరణం 1 :
➤ అనయము అభయ కంకణము
➤ కట్టితీవనీ.. అని నే జేరితే నీ సన్ముఖమూ…
➤ నా మనవీ.. వినుటకైనా మనసూ రాదాయేనే
➤ నా.. మనవీ వినుటకైనా…మనసూ రాదాయెనే ॥ఏదేదే॥

చరణం 2 :
➤ ఎన్ని యోచనలు నీకున్నా… తప్పదోయన్నా
➤ తప్పదోయన్నా… నన్ను రక్షింపకయున్నా
➤ కన్న తండ్రీ! నీ…కన్నా దిక్కెవరన్నా…?
➤ నా కన్న తండ్రీ! నీ…కన్నా దిక్కెవరన్న? ॥ఏదేదే॥

చరణం 3 :
➤ మొదలే నావల్ల కాదన్న… నిన్నింతగా బ్రతిమాలే వారెవరన్నా ?
➤ సదయాహృదయా… నీ… మదిలో జ్ఞాపకమున్నా…
➤ ఓ సదయహృదయ! నీ…మదిలో జ్ఞాపకమున్న ॥ఏదేదే॥

చరణం 4 :
➤ ధర కూచిపూడికి రమ్మీ… నీ… దాసుడ రక్షించుకొమ్మీ
➤ ధర కూచిపూడికి రమ్మీ.. నీ దాసుడ రక్షించుకొమ్మీ
➤ ధర యేలేశ్వరపు రామ…కృష్ణ.. దాసుడను సుమ్మీ
➤ ధర యేలేశ్వరపు రామకృష్ణ దాసుడను సుమ్మీ ॥ఏదేదే॥
Lord Panduranga ViTTala
ఓ పాండురంగా! పండరీనాథా! నీవు గొప్ప దయామయుడవని అందరూ అంటూ ఉంటారే! ఏదీ? నాపై నీ దయ కాస్త చూపించవయ్యా!

హే శ్రీ పాండురంగా! నన్ను మరచిపోయావా? గమనించటమే లేదేం? నీవు పట్టించుకోకపోతే నా గతి నిర్గతే కదా! స్వామీ! ఎక్కడయ్య నీ కరుణా కటాక్షవీక్షణ? నాపై ప్రసరింపజేయవూ..!

నీ భక్తజనులు ’మా స్వామి ఒక కంకణం కట్టుకున్నారు. అది ఏమంటే, ఎవ్వరైనా శరణు వేడితే చాలు, ఇక వాళ్ళను రక్షించటమే ఆయన పని’ అని ఎలుగెత్తి చెప్పుచున్నారే! సర్వదా “రక్షిస్తాను!” అని కంకణం కట్టుకొని, అన్ని దిక్కులలోనూ సంచరిస్తూ ఉంటావట! ఇది విని, నీ సమ్ముఖానికి వచ్చానయ్యా! మరి నీవు చూస్తేనేమో నా మొఱ ఆలకిస్తున్నట్లే కనిపించటం లేదే! నా మనవి కనీసం వినటానికైనా నీకు మనస్సు ఒప్పటం లేదా… ఏమిటి?

అవునులే! ఈ బ్రహ్మాండమంతా రచించి నడిపించే స్వామివి, ఇలవేల్పువు నీవే కదా! అందుచేత, నీకు ఎన్నో వ్యాపకాలు కదా!

ఇదుగో స్వామీ! నీకు ఎన్ని యోచనలు ఉన్నప్పటికీ నాకు మాత్రం కాస్త సమయం కేటాయించి రక్షించాలి సుమా!

నీవు జగత్ పితవి కదా! నన్ను కన్న తండ్రివి నీవే కదా! ఇక నీకన్నా నాకు దిక్కెవరుంటారు చెప్పు?

స్వామీ! నా ప్రార్థన, నా విన్నపాలు మౌనంగా వింటున్నావా? విని ఊరుకుంటున్నావా? ఇదెక్కడి న్యాయం?

హే సర్వాంతర్యామీ! మొట్టమొదటే “నావల్ల కాదబ్బాయి”.. అని ఉంటే… నిన్ను ఇంతగా బ్రతిమాలే వాడెవ్వడు?

హే కరుణామయా ! దయామయా ! నేను నీ కసలు జ్ఞాపకం ఉంటున్నానా? లేక, నా మనవి విన్నట్లే విని ఇట్టే మరచిపోతున్నావా?

స్వామీ! కూచిపూడికి వేంచేయండి. నేను మీ దాసానుదాసుణ్ణి. ఈ యేలేశ్వరపు రామకృష్ణయ్య హరిదాసును మీరే రక్షించుకోవాలి సుమా!

🌺🙏🌺

11.) రంగా.. రారా..


రాగం : ఆనందభైరవి
తాళం : ఆది

పల్లవి :
➤ రంగా రారా… పాండురంగా రారా..
➤ రంగా రారా…

అనుపల్లవి :
➤ రంగ రార.. ఈ సంగతి వినరా…
➤ పొంగుచు నీ దరి… ఇదె చేరితిరా… ॥రంగా॥

చరణం 1 :
➤ మరి లేదు ఏ దరి… ఇక నీ కన్ననూ
➤ మరి మరి నిన్నే.. శరణు జొచ్చితిరా.. ॥రంగా॥

చరణం 2 :
➤ యేలేశ్వరపు రామకృష్ణుని
➤ బాలలు పరిపరి.. హాస్యము చేసిరి..
➤ ఈ… పసికూనల దయతో… పరిరక్షించుము ॥రంగా॥
Lord Panduranga ViTTala
ఓ రంగా! పాండురంగా! ఉప్పొంగుచూ నీ దగ్గరికే వస్తున్నాను. ఆనంద పారవశ్యంతో నీ గానంతో మునిగి తేలుతున్నాను. ఈ పడవలో నీదరి చేరుచున్నాను.

ఎందుకు వస్తున్నానంటావా? ఎందుకేమిటయ్యా! నీ దివ్యమంగళ విగ్రహం చూచేవరకు ఈ సంసారం మమ్ములను అటూ ఇటూ పరుగులు తీయిస్తూనే ఉంటుంది కదా! ఇక వేరే మార్గమేమున్నది? అందుకే, నిన్ను శరణు వేడాలని, నా విన్నపాలన్నీ చెప్పుకోవాలని, ఈ పడవలో నది దాటి వస్తున్నాను.

ఇంతలో ఏమైనదో చూచావా?

ఇందులో ప్రయాణిస్తున్న నా కట్టు - బొట్టు - చేతిలో చిడతలు - రంగా! పాండురంగా! … అని ఎలుగెత్తి పిలవటం చూచి ఈ వారవనితలు పకపకా నవ్వుతున్నారు. ఈ నీ యేలేశ్వరపు రామకృష్ణదాసుని చూచి "పిచ్చివాడు”… అని ఎగతాళి చేస్తున్నారు.

పాపం! వాళ్ళు పసిబిడ్డలు! ఈ జగత్ రంగంలో మునిగితేలేవారు తెలివిగలవారా? లేక, పాండురంగడి పాదాలు చేరాలని పరితపిస్తూ అడుగులు వేసేవారు తెలివిగలవారా? వాళ్ళకి తెలియటం లేదు. అయితే మేమందరం మీ బిడ్డలమే కదా! అందుచేత, వీరి పరిహాస్యాలను అపహాస్యాలను పట్టించుకోక వీరందరిని క్షమించి - మమ్ములను ఆశీర్వదించు.

🌺🙏🌺

12.) కావరా..! సేతు మాధవా!


రాగం : సావేరి
తాళం :

పల్లవి :
➤ కావరా… సేతు మాధవా…!
➤ కరి రక్షక! సమయమిదే..! ॥కావరా॥

చరణం 1 :
➤ దేవాదిదేవా… వసుదేవ నందనా.. సమయమిదే.. ॥కావరా॥

చరణం 2 :
➤ భావజారీ మిత్రా… పరమపవిత్రా! సమయమిదే ॥కావరా॥

చరణం 3 :
➤ సురనుత రామకృష్ణా భూసురుని బ్రోవా… భూసురునీ.. బ్రోవా…
➤ సమయమిదే.. ॥కావరా॥
Lord Vishnu
ఓ సేతుమాధవా! ఈ “సంసారము" అనే దృశ్య సంబంధమైన జన్మజన్మార్జిత పరిపాకము నుండి నీవే రక్షించాలి! కాపాడాలి! తోడై ఈ మనఃకల్పిత లంపటం నుండి ఒడ్డుకు జేర్చి శుభ్రపరచాలి తండ్రీ!

స్వామీ! మాధవా! నీవు దేవతలకే దేవుడవు! “సర్వ దేవతలకు, ఋషులకు ముందే ఉన్నాను - అహమ్ ఆదిః హి దేవానాం మహర్షీణాం చ సర్వశః” అని మీరే భగవద్గీతలో ప్రకటించుకున్నారు కదా! ఓ వసుదేవ నందనా! ఇక ఇది సమయమేనయ్యా! మీరే నన్ను కాపాడాలి! ఏ దిక్కు తోచక ఉన్నాను. దిక్కులేనివారికి దిక్కు నీవే కదా! ఓ దేవతలకు కూడా ఆరాధ్యదైవమా! సమయమిదేనయ్యా! తమకు దూరంగా ఎలా ఉండగలను? కనుక, ఈ రామకృష్ణదాసును కనికరించి కాపాడమని మరీ మరీ మనవి చేసుకుంటున్నాను.

🌺🙏🌺

13.) రా..రా.. రామలింగా…!


రాగం : భూప్
తాళం : ఆది

పల్లవి :
➤ రా..రా… రామలింగా..
➤ రక్షించు శుభాంగా… ॥రా.. రా..॥

అనుపల్లవి :
➤ పార్వతీ మనోభ్య (మనసి) భృంగ
➤ భక్తజన సంగ లింగ..  ॥రా.. రా..॥

చరణం 1 :
➤ అందముగ నీకునే వందనమొదర్చెద
➤ ఇందుశేఖర రారా.. ఆదరముగ నందినెక్కి ॥రా.. రా..॥

చరణం 2 :
➤ రామకృష్ణదాసు బ్రోవ సమయమిదే కాదా?
➤ చంద్రశేఖర కరుణ తోడ
➤ ప్రేమగా కరుణాంతరంగా ॥రా.. రా..॥
Lord RamaLingeshwara
కూచిపూడి వేంచేసిన బాలత్రిపుర సుందరీ సమేత శ్రీరామలింగేశ్వరస్వామీ! రండి! త్వరగా రండి!

హే శంకరా! శుభంకరా! కనికరించండి!

అమ్మవారికి మీరంటే ఎంత ఇష్టం! పార్వతీ మాత మనస్సు అనే పుష్పంపై ప్రేమాన్వితులై వ్రాలే తేనెటీగ వంటి స్వామీ! మాపై ఆదరంతో, కరుణతో స్తోత్రాలు సమర్పించే ఈ మీ భక్తజనుల మధ్యకు రారూ!

ఈ రామకృష్ణదాసును బ్రోవటానికి ఇంకా సమయం కాలేదా చెప్పండి?

ఓ చంద్రశేఖరా! మీరు కరుణాంతరంగులు గదా! ప్రేమాస్పద స్వరూపులు కదా! అందుచేత, మా దోషాలు పట్టించుకోక,… వెంటనే వచ్చి మమ్ములను దరిజేర్చుకోండి.

🌺🙏🌺

14.) ఏదీ బ్రహ్మము చూపండి?


రాగం : శంకరాభరణము
తాళం : ఆది

పల్లవి :
➤ ఏదీ బ్రహ్మము చూపండీ…?
➤ మాతో వాదమేల? బ్రాహ్మణులండీ!
➤ నాదబిందు కళాతీతంబై
➤ వాద భేదముల కాదు కొననిదట ॥ఏదీ॥

చరణం 1 :
➤ జపములు లేవట తపములు కావట…
➤ చపలాత్ములకిది తెలియదట
➤ విపరీతంబులు వేఱైనను
➤ గురు కృప లేక ఈ గోప్యమెఱుగరట ॥ఏదీ॥

చరణం 2 :
➤ ముద్ర లక్ష్యమును చూచితిరే.. ప్రసిద్ధిగ విద్యలు నేర్చితిరే
➤ నిద్రానిద్రల ఛిద్రము చేసే భద్రమైన చిన్ముద్ర చూచితిరే ॥ఏదీ॥

చరణం 3 :
➤ తారక సాంఖ్య అమనస్కంబులు మఱి
➤ ధారాళంబుగ చదివితిరే
➤ సారాసార విచారుల గన్గొని
➤ మీరియున్న గురి నెఱుగరైతిరే… ॥ఏదీ॥

చరణం 4 :
➤ బుద్ధిమంతులకు.. పుణ్యపురుషులకు
➤ బుద్ధి చెప్ప పనిలేదండీ… 2
➤ అధ్యారోపా… వాదము చేసే
➤ అధములు చూడగ రాదండీ… 2 ॥ఏదీ॥

చరణం 5 :
➤ కనుగంటిలో గల వైకుంఠము.. ఘన శేషబ్రహ్మమైనండీ… 2
➤ అనుమానము తీరదు చదువులలో… 2
➤ ఘనము లేదు.. తనివి తీరదండీ… 2 ॥ఏదీ॥
➤ యేలేశ్వరపు రామకృష్ణునకు మేలే మీరూ తెలుపండీ
➤ వాలాయము వాదొద్దండీ … 2
➤ గురు కీలు తెలిసి యోచించండీ.. ॥ఏదీ॥
Om - Brahman
ఓ పండితులారా! మీకు హృదయ పూర్వకంగా నమస్కరిస్తున్నాను. “బ్రహ్మము ఎట్టిది?” అని వాదోపవాదములు చేయమని నన్ను ఆహ్వానిస్తున్నారా? మీరు పరబ్రహ్మము గురించి ఏమని గ్రహించారో… ఆ విశేషాలు చెప్పండి. నేను విని అందులో సారాన్ని గ్రహించి, తద్వారా ఆ సర్వాత్మకుణ్ణి సమీపించే ప్రయాణం కొనసాగించటానికి సంసిద్ధుడనై ఉన్నాను.

అంతేగాని, ఇందులో ఒకరితో మరొకరు వాదించుకొని ఏం ప్రయోజనం పొందగలం? అందువల్ల, బుద్ధి అలసిపోవడమే అవుతుంది కదా! అందుకే, నారదమహర్షి భక్తి సూత్రములలో ‘వాదో న అవలంబ్య’ అని మనలకు బోధించి ఉండలేదా?

ఆ పరమాత్మ సాయుజ్యం నాదమునకు (All words) , బిందువునకు (All pointed concentrations), కళలకు (All exhibition of Arts) అధిగమించినదైయున్నదని (నాద బిందు కళాతీతమని) పెద్దలు బోధించియే ఉన్నారు.

వాద - భేదములచే దృష్టాంతములకు, సోదాహరణములకు అందనిదని, అవన్నీ అందుకు మార్గము చూపే మధ్యేమార్గములో ఉన్న సూచనా ద్రవ్యములని మహనీయులు సిద్ధాంతీకరిస్తున్నారు. ఇక మనం వాదోపవాదములు ఎందుకు చేసుకోవటం? ఎందుకు పనికివస్తాయి? వంటపాత్రతో సముద్రజలం కొలవగలమా?

జపముల చేత, తపముల చేత అది లభించేది కాదట! అయితే, జపములు - తపములు మన మనస్సును పరిశుభ్రం చేస్తాయి. పవిత్రం చేస్తాయి. నిర్మలమైన అద్దంలో ఎదురుగా ఉన్న దృశ్యం సుస్పష్టంగా కనిపిస్తుంది కదా! అట్లాగే, నిర్మలమైన మనస్సులో జగత్తుగా కనిపించేదంతా పరమాత్మగా సుస్పష్టమవగలదు.

బుద్ధి చపలంగాను, చంచలంగాను ఉంటే - అంతటా ఉన్న పరమాత్మ ఎట్లా జ్యోతకమౌతుంది ? బుద్ధి నిశ్చలంగా ఉంటే పెద్దలు చెప్పిన “సర్వమ్ ఖల్విదమ్ బ్రహ్మ - జీవో బ్రహ్మేతి నా పరః - సోఽహమ్ - తత్త్వమ్ – అయమాత్మాబ్రహ్మా - ఏకోసత్ విప్రా బహుథా వదంతి” … అనే మహావాక్యముల ఉద్దేశ్యమేమిటో తప్పక అనుభూతమౌతుంది.

అందుచేత, చపలాత్ములకు తెలియరాదు. నిశ్చలాత్మలకు చెప్పవలసిన పనిలేదు.

“ఇదంతా బ్రహ్మమే”…అనునది సర్వత్రా ప్రదర్శితమగుచున్న రహస్యం (It is an open secret). అట్టి సర్వ ప్రకటిత రహస్యం గురువుల అనుభవ వాక్యముల సహాయంతో స్వయంగా గ్రహించవలసినదే! ఇక ఎన్ని సిద్ధాంతములు విశ్లేషించి, ఎంతగా వాదోపవాదములు చేసి, ఎన్ని క్రమాక్రమములు నిర్వర్తించినా.. అవన్నీ ఎక్కడోక్కడ ఆగిపోయేవే!

ఎవరు ఏ మార్గంలో ఎక్కడెక్కడ మజిలీలు చేస్తూ వచ్చినా, ”నేను, నీవు మొదలైనవన్నీ వాస్తవానికి లేవు. పరమాత్మ ఒక్కటే సర్వత్రా సర్వదా సర్వముగా ఉండి ఈ తదితరంగా దృష్టికి కనిపిస్తున్నారు” … అను దర్శనముచే సర్వ తదితర దృష్టులు లయమైపోతాయి.

సహ ఆత్మ స్వరూపులారా! ముద్రలు, ఆముద్రల అర్థములను చాలా నేర్చాం. (సంధ్యా వందనంలో 12….36 ముద్రలు వాటికి ఉద్దేశ్యార్థాలు ఉంటాయి). అందులో ప్రావీణ్యులమైనాం. మంచిదే! అట్లాగే, అనేక శాస్త్ర ప్రవచిత మూలాధారాది చక్రముల గురించి, జాగ్రత్ - స్వప్న - సుషుప్తి - తురీయముల గురించి, అంతరంగ చతుష్టయం గురించి,… ఇంకా అనేక సిద్ధాంత - ఉపసిద్ధాంతములన్నీ పఠించాం, ప్రావీణ్యులైనాం! మంచిదే!

ఇప్పుడు మనం వాటన్నిటి గురించి మరల మరల చర్చించుకొనే బదులు మనం ’చిన్ముద్ర’ అర్థం గమనిద్దాం. 

చిన్ముద్ర


Chinmudra

“జాగ్రత్ లోంచి స్వప్నంలోకి వెళ్ళితే జాగ్రత్ ఏమౌతోంది? స్వప్నం లోంచి సుషుప్తికి వెళ్ళితే స్వప్నం ఏమౌతోంది?… సుషుప్తి లోంచి జాగ్రత్‌లోకి వచ్చినపుడు సుషుప్తి ఎటు పోతోంది?”… ఇటువంటి నిద్రానిద్రల అనుమానాదులను పటాపంచలు చేసివేస్తోంది ఈ చిన్ముద్ర.

బొటన వేలు = తత్
చూపుడు వేలు = త్వమ్
ఈ రెండింటినీ తాకించటం = ఆ పరమాత్మయే నీ రూపంగా ఉన్నారు.

Chinmudra significance

ఎదురుగా కనిపించే ‘నీవు’ను పరమాత్మగా అనుకునే ’అభ్యాసం’ చేత ‘అనిపించే స్థితి’ ప్రాప్తిస్తోంది. తద్వారా ఈ నీవు - నేను ఎందులో అయితే - జలంలో తరంగాలులాగా ఉన్నాయని గ్రహించి - దర్శించబడుతుందో అదియే బ్రహ్మము. తరంగాలన్నీ జలమే కదా! సర్వభావ తరంగాలు బ్రహ్మమునందే, బ్రహ్మముగానే ఉన్నాయి. అట్టి చిన్ముద్రను అభ్యాస పూర్వకంగా ఆశ్రయిద్దాం.

ఓ స్వయం పరంబ్రహ్మ స్వరూపులారా! మీరు తారకవిద్య, సాంఖ్య సిద్ధాంత విద్య, అమనస్క విద్య మొదలైనవన్నీ ధారాళంగా చదివియే ఉన్నారు కదా! అయితే, సారాసార విచారులైన మహనీయుల అనుభవం మనకు శరణ్యం.

తరంగాలకు ఆకారాలు కనిపిస్తున్నప్పటికీ అవి ఆకార రహితమగు జలంతో తయారయ్యాయి. అట్లాగే, ఆకారపూర్వకంగా కనిపించే ఈ జీవుడు ఆకార వికార రహితమైన ‘బ్రహ్మము’ అని పిలువబడే నిర్విషయ నిర్వికల్ప శివతత్త్వమే మూలవిషయంగా కలిగి ఉన్నాడు … అనే ఉపనిషత్ వాక్యసారమును గమనించటం లేదా?

మీలోను, నాలోను సర్వదా శేషించి ఉన్నది బ్రహ్మము మాత్రమే! ఇక అవీ ఇవీ ఎన్ని చదివినా తనివి తీరదు, అనుమానం తీరదు, గొప్ప కాదు. "అంతా పరమాత్మయే” అను దృష్టియే మనం ఇప్పుడు అభ్యసిద్దాం. అట్టి అభ్యాసము యొక్క సాధన పరికరములే తదితర చదువులన్నీ కూడా! చివరికి ఆ బ్రహ్మమునకే మన అహంకార - మమకారములను కూడా ఆపాదించి, అదే మనంగా ఉందాం.

ఓ విజ్ఞులారా ! మీరు ప్రతిపాదించిన ఆయా విశ్లేషణా సమాచారమంతా ఉత్తమమే! నాకు మేలే చేస్తున్నాయి. అందులోని సారమంతా వేద మహావాక్యాల వైపుగానే పయనిస్తున్నాయి. అందుచేత, మీకు కృతజ్ఞుడను. మనం వాదోపవాదాలు చేసుకోవద్దని మాత్రమే ఇక్కడ నా మనవి. మన అంతరంగంలో సాక్షీభూతుడై ఉన్న ఆత్మగురువును ఆశ్రయించే ఉపాయమును గమనించి యోచిస్తూ ఉండమని సూచనగా గుర్తుచేస్తున్నాను.

మనందరం వాదోపవాదములు మాని బ్రహ్మమునే అంతటా దర్శించే అభ్యాసం మరింతగా కొనసాగిద్దాం.

🌺🙏🌺

15.) లేని ఎఱుక… కలదని పలుకుటె భ్రమ!


రాగం:
తాళం :

పల్లవి :
➤ లేని ఎఱుక… కలదని… పలుకుటె భ్రమ
➤ లేనే లేదనరా…!

అనుపల్లవి :
➤ తాను అనేటి స్పృహలేని కాలమున
➤ తత్త్వము బయలవురా… గురుతిదెరా… ॥లేని॥

చరణం 1 :
➤ కలలో చూచిన దేహములన్నియు
➤ మెళకువందు కలవా…?
➤ కలకాలము కనిపించని ఎఱుకకు కలతలేల…?
➤ ఇది వినరా… గురి కనరా…! ॥లేని॥

చరణం 2 :
➤ సకల వేద - శాస్త్ర - పురాణంబుల సమ్మతంబు వినరా..
➤ అకలంక స్థితినొందుటె అచలము
➤ సర్వము కానిదిరా… సరణి ఇదెరా… ॥లేని॥

చరణం 3 :
➤ లేనిది కలదని అనుటే కలతకు
➤ మూలమాయె కనరా…!
➤ లేనిది కలదౌ… కలది లేనిదౌ…
➤ వాలాయము అచలము సత్యమురా… ॥లేని॥

చరణం 4 :
➤ కనుగంటి పుర శేషగురుని… సూచన కనుగొనరా…
➤ కనుమూసిన… కనుతెరచిన బ్రహ్మము
➤ ఈ సర్వము కానిదిరా… పరమదెరా… ॥లేని॥

చరణం 5 :
➤ యేలేశ్వరపు.. రామకృష్ణునకు
➤ ఎదురుగ నిలిచెనురా…
➤ కనుమూసిన… కనుతెరచిన… నిత్యము
➤ సర్వము అయినదిరా… ఇది కనరా… ॥లేని॥
Lord Dakshinamoorthy
ధ్యానం
ఓం మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్త్వం యువానం ।
వర్షిష్ఠ అంతేవసత్ ఋషిగణైః ఆవృతం బ్రహ్మనిష్ఠైః ।
ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రం ఆనందమూర్తిం ।
స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తి మీడే! ॥
శిష్యుడు :  స్వామీ ! ఈ జగత్తు అనేక వ్యాపకములతో, భ్రమతో, బంధములతో దుఃఖములతో కూడినదై ప్రాప్తిస్తోంది కదా! ఇట్టి జగత్తు ఎక్కడినుండి వచ్చి పడింది? భ్రమకు అసలైన కారణమేమిటి?

గురువు :  ఈ జగత్తు ఆయా సంబంధమలతోను, వ్యవహారములతో నిండి ఉండి అశాంతిని గొలుపుతోంది కదా! మరి నీవు రాత్రి నిద్రిస్తూ ఉన్నప్పుడు కలలో ఈ జగత్తు ఉంటోందా? లేదు ! సుషుప్తిలో జాగ్రత్ స్వప్నములు రెండూ లేవు. ఇక ఈ జగత్తు స్వతఃగా బంధమూ కాదు, సుఖమూ కాదు, దుఃఖమూ కాదు, మోక్షము కాదు. నీ మనస్సును అనుసరించే ఈ జగత్తు తదనుకూలంగా అనుభూతమౌతోంది.
ఉదాహరణకు… :

“ఇవన్నీ కష్టాలురా”… అని అనుకుంటే కష్టాలుగా కనిపిస్తాయి.

“ఇదంతా నాకు మనోజాడ్యం వదిలించుకోవటం కొఱకై నా ఇష్టదైవం ప్రసాదిస్తున్న ఔషధం”… అని తలిస్తే ఇదంతా సాధనాద్రవ్యమే అవుతుంది.

“నాదంటూ ఏది లేదు”… అనుకునేవానికి పోయేది లేదు.

“ఇంతవరకూ నావి”… అని అనుకుంటుంటే వాటి రాకపోకలు సుఖదుఃఖాలు ప్రసాదిస్తున్నాయి.

సంసారము దృష్టిలోనే ఉన్నది గాని, సృష్టిలో లేదు.
‘నాది’.. అనుకుంటే బంధం. ‘నాది కాదు’ అనుకుంటే ముక్తి.
(అహమిత్యేవ బంధాయ… నాహమిత్యేవ ముక్తయే).

ఈ సంబంధాలు, బాంధవ్యాలు జగత్తులో లేవు. కాని నీ మనస్సుచే కల్పించబడి అనుభవించబడుచున్నాయి.

కనుక….,
↳ ఈ తెలియబడేదంతా నీ మనోస్థితిని ఆశ్రయించి ఉన్నదేగాని, స్వయముగా ఏదీ లేదు.
↳ లేని దానిని "ఉన్నది - కలదు”… అని నీవు నమ్మి ఉండటమే భ్రమ.
↳ భ్రమ యొక్క రూపం ఇదే !

శిష్యుడు :  కాబట్టి నన్నేం చేయమన్నారు?

గురువు :  లేనిది ఉన్నదని అనుకొని ఉండటమే భ్రమ కాబట్టి లేనిది “లేనే లేదు” అని సిద్ధాంతీకరించుకాని, సుస్పష్టం చేసుకొని ఉండు. ‘నాది’ అనునదే అహంకారము యొక్క రూపం. ‘నాది కాదు’ అని క్రమ క్రమంగా గ్రహిస్తూ, గమనిస్తూ, అభ్యసిస్తూ వచ్చావా…, అహంకారం తనంతట తానే తొలగుతుంది. అహంకారం యొక్క స్పృహ ఎప్పుడు తొలగుతుందో అప్పుడు “అంతా నేనే” అనే తత్త్వస్థితి ఒనగూడుతోంది.

శిష్యుడు :  ఎదురుకుండా అంతా తల్లి - తండ్రి - భార్య - భర్త - పిల్లలు - స్నేహితులు - ఇళ్ళు - వాకిళ్ళు మొదలుగాల ఇవన్నీ కంటికి కనబడుతూ ఉంటే, “ఇవి లేవు” …. అని అనుకోవటమెట్లా”?

గురువు :  జాగ్రత్తులో అనేక సంబంధాలు, వ్యవహారాలు, విషయసామాగ్రి మొదలైనవి కనిపిస్తున్నాయి. బాగున్నది. మరి నిద్రలోకి పోయేసరికి ఇవన్నీ వస్తున్నాయా? రావటం లేదు. జాగ్రత్తును చూస్తున్న నీవే స్వప్నంలో కూడా భౌతికమైన కళ్ళతో కాకుండా…, అనుభూతి నేత్రాలతో చూస్తున్నావు. స్వప్నంలో ఏవేవో వస్తువులు, వ్యక్తులు సంబంధాలు అనుభవిస్తున్నావు. మెళుకువ వచ్చేసరికి ఆ దేహాలన్నీ ఏమౌతున్నాయి? ఒక్క క్షణంలో మటుమాయమౌతున్నాయి.

స్వప్న సమయంలో స్వప్న విశేషాలు ‘సత్యమే’ అని అనిపిస్తున్నట్లే ’జాగ్రత్’లో ఇక్కడి ఆయా విశేషాలు -


“మానాలు, అవమానాలు,
అనుబంధాలు, సంబంధాలు,
మిత్రత్వము, శతృత్వము,
సుఖము, దుఃఖము”


…ఇవన్నీ అభ్యాసవశం చేత వాస్తవమేనని అనిపిస్తున్నాయి.

ఈ జాగ్రత్తులో ఈరోజు ఉన్నట్లు రేపు ఉండదు. ఈ సంవత్సరం ఇట్లా ఉంటే… వచ్చే సంవత్సరం మరొకరకంగా ఉంటోంది. ఏదీ కలకాలం ఒకే రీతిగా ఉండటం లేదు.

ఒక రీతిగా ఉండకుండా, కలకాలం కనిపించకుండా ఉండే జగదనుభవాలు చూచి నీవు, ఎందుకు కలత చెందటం చెప్పు?

కాబట్టి, నాయనా! నీవు ఇక్కడ జరిగే ఆయా విశేష పరంపరలను చూస్తున్నప్పుడు… “నిశ్చలత్వము యొక్క అభ్యాస బలం” చేత కలత చెందే అభ్యాసము నుండి విరమించు.

ఋక్-యజుర్-సామ-అధర్వణ వేదములు, అష్టాదశ పురాణములు, సాంఖ్య - అమనస్క మొదలైన శాస్త్రములు అంగీకరించి చివరి పాఠంగా చెప్పుచున్నదేమిటి? “చుట్టూ అన్నీ కూడా అనుక్షణం మార్పుచేర్పులు చెందుచున్నప్పటికీ వాటన్నిటికీ ఆధారభూతమై ఉంటూ… తాను మార్పు చెందక ఏదైతే ఉంటోందో, అదియే పరమాత్మ యొక్క స్వరూపం. అట్టి పరమాత్మయే నీయొక్క - నాయొక్క వాస్తవ స్వరూపం”. కాబట్టి వేద - శాస్త్ర - పురాణముల ఉద్దేశ్యమేమిటో గమనించి అటువంటి ‘అకలంకస్థితి’ని సంపాదించుకొని ఉండటమే మన సాధన యొక్క ప్రయోజనం.

మరింకే స్థితీ కూడా మార్పుకు అతీతమై ఉండటం లేదు సుమా!

కాబట్టి అచంచలస్థితిని సముపార్జించుకో! మార్గమిదే!

శిష్యుడు :  అసలు అజ్ఞానానికి మూలం ఏమిటి?

గురువు :  అజ్ఞానం చేతనే జీవుడు కలతచెందుచున్నాడు. తన స్వరూపమును ఏమరుచుట చేత అజ్ఞానం రూపుదిద్దుకుంటోంది.

స్వప్నంలో ఉన్నవాడు స్వప్నమునకు ఈవల ఉన్న తన అప్రమేయ రూపమును, ఏమఱచుటచే స్వప్నంలోవన్నీ ‘నిజమే’ అని తలచి కలత చెందుచున్నాడు.

జాగ్రత్‌లో ఉన్నవాడు జాగ్రత్‌కు సాక్షియై, జాగ్రత్ కంటే వేతైన తన అప్రమేయ రూపమును ఏమరచి కలత చెందుచున్నాడు. మాయ ఇదే!

కాబట్టి ’లేనిది’ని చూచి ‘ఇది ఉన్నది’ అని అనటమే కలతకు మూలమై ఉంటోంది.

కంటికి ఎదురుగా కనిపించని ‘కేవల సాక్షి’ వాస్తవానికి ఉన్నది.

వ్యవహారాలలో కనిపించే ఈ ‘నేను’ అనేది వాస్తవానికి లేదు. ఇది స్వప్నాంతర్గతంగా పాల్గొనే ‘నేను’ వంటిదే !

జాగ్రత్-స్వప్న-సుషుప్తులలో ఏదైతే సమరూపమై ఉన్నదో, అచలమై ఉన్నదో… అదియే నీ వాస్తవ రూపం. అదియే సత్యము.

అది గ్రహించి ఇది అంటనివాడివై వర్తించు.

సర్వమును అధిగమించిన దృష్టికి ఆ ‘స్వస్వరూపాత్మ’ అనబడే శేష బ్రహ్మమును చూపటానికే శాస్త్రాలు ‘సోఽహమ్’, ‘తత్త్వమ్’ వంటి మహావాక్యార్థాల మననం చేత ఆ శేషగురుని జాడ నీ యందే నీవు కనుగొనాలి సుమా!

కనిపించేదంతా ఆ బ్రహ్మమే అయిఉండగా ఇక కనుమూతలు దేనికి? కనుమూసినా, కనుతెరచినా ఉన్నదదే! ఆ నీ బ్రాహ్మీతత్త్వమే! ఆ బ్రహ్మము (లేక ఆ నీ రూపము) ఈ జగత్తులో కనిపించే ఏ ఒక్క వస్తువో, దృశ్యమో కాదు. దృశ్యమునకు సాక్షి అది. అదియే నీవు. నీవు దేహమువు కాదు.

ఈ యేలేశ్వరపు రామకృష్ణయ్యకు అది ఎదురుగా ’నీవు’గా కనిపిస్తోంది. ’నీవు - నేను’ మొదలైనవన్నీ ఆ చిత్ సాగర తరంగాలు మాత్రమే! అది కనుమూసినా కనుతెరచినా కూడా అనునిత్యమై ప్రకాశమానమై ఉంటోంది.

సర్వమూ అదే!
ఇక దానికొఱకై వెతకటమెందుకు?
ఎక్కడికో వెళ్ళి చూడటమెందుకు?

🌺🙏🌺

16.) ఉన్నదేమో ఉన్నది… ఊహించకూరికే!


రాగం :
తాళం :

పల్లవి :
➤ ఉన్నదేమో ఉన్నదీ.. ఊహించకూరికే
➤ ఎన్న రాని బయలై… ఏకాకృతిగా… ॥ఉన్నదేమో॥

చరణం 1 :
➤ అండపిండ బ్రహ్మాండమంతటా
➤ నిండి… నిబిడమై అఖండముగా… నీలో ॥ఉన్నదేమో॥

చరణం 2 :
➤ స్థూలమూ గాకా … సూక్ష్మమూ గాకా
➤ స్థూల సూక్ష్మములా… మూలమూ గాకా ॥ఉన్నదేమో॥

చరణం 3 :
➤ ఆదియు లేక… అనాదియు గాకా..
➤ ఉప సాధనమూ లేక.. సర్వము తానై ॥ఉన్నదేమో॥

చరణం 4 :
➤ శేష…విశేషా… అశేషాధారమై
➤ దోషరహితా పూర్ణా… శేషా బ్రహ్మమై ॥ఉన్నదేమో॥

చరణం 5 :
➤ కనుగొంటిలోనా… కూచీపూడిలో
➤ యోచనా చేసే… ఆ రామకృష్ణ సర్వమై ॥ఉన్నదేమో॥
Ramakrishna Paramahamsa and Ramana Maharshi
ఆ పరమాత్మ సత్ స్వరూపుడు…
సత్ = ఉనికి

ఈ జీవుడో…
ఉన్నది + ఊహ

ఈ జగత్తులో పొందబడేదంతా ‘ఊహ’ (Assumptions + Presumptions) మాత్రమే!

స్వప్నంలో పొందబడేది కూడా అదే!

జాగ్రత్ - స్వప్న - సుషుప్తువులలో నీవు ఉన్నావు.

“నేను లేను”… అని ఎవ్వడూ అనలేడు కదా! ఒకవేళ ఎవ్వరైనా అంటే ఆ ’లేను’ అని అనేవాడెవడు ?

జన్మలు - కర్మలు - మరణము - పునర్జన్మ - బాల్యయౌవ్వన వార్థక్యాలు - ఉపాధుల రాకపోకలు ఇవన్నీ ఊహచే నిర్మించబడి,
ఊహచే త్యజించబడుచూ వస్తున్నాయి. అయితే…, జన్మ ఊహకు ప్రారంభమూ కాదు. మరణము ఊహకు అంతమూ కాదు.

కాబట్టి, సోదరా !
ఉన్న ఆత్మ ఎప్పుడూ ఉండనే ఉన్నది.
అదియే నేను ! అదియే నీవు.

అది బట్టబయలై (Ever wide-opened), ‘నీవు - నేను’ అను భేదము లేనిదై ఏకాకృతిగా ఏర్పడి ఉన్నది. సిద్ధాంతాలన్నీ అద్దానికి పరిమితమైన కొలతబద్దలు. ఊహ-అపోహలు ‘ఆత్మ’ అనే ఆకాశంలో వీచే వాయు తరంగాలు వంటివి. ఇక అందు సిద్ధాంత ఉపసిద్ధాంతములు, ఊహ అపోహలు పెద్దగా ఏం అవసరం?

అది అండములోను (As a Body), పిండములోను (As a living being), బ్రహ్మాండములోను (As an Association of all living beings) నిబిడమై, అఖండమై ఉన్నది. అది నీలో నీవుగా, నాలో నేనుగా ఉన్నది.

అది స్థూల వస్తువైన పంచభూతములా? కాదు! సూక్ష్మ వస్తువులైన మనోబుద్ధి-చిత్త-అహంకారాలా? కాదు! పోనీ, ఆ రెండింటికి కారణమా? కాదు. వీటన్నిటికీ మొదలు - చివర ఉన్నాయి.

ఇక ఆత్మ తత్త్వావనికో…? అద్దానికి ఆది లేదు. అంతము లేదు. అది ఆద్యంత రహితం. స్వప్రకాశకం.

అది సాధించటానికి ఉపసాధ్యములేమి ఉన్నాయి? ఇప్పుడు లేనిది సాధనచే ప్రాప్తించటమనేది ఉంటుంది. సర్వము తానై అంతటా సర్వదా ఉన్నదానికి సాధనలు ఎందుకు?

అంతా లయించినప్పుడు కూడా అది శేషించే ఉంటుంది.

అన్ని విశేషాలు అద్దానినుండే వెలువడుతున్నాయి.

అద్దానికి ఆధారం లేదు. కాని అన్నిటికీ అదే ఆధారం.

ఏ దోషం దానిని స్పృశించదు. అది నిత్యనిర్మలమై, శేషబ్రహ్మమై సర్వదా వరంజ్యోతి స్వరూపంగా, అఖండ జ్యోతిగా వెలుగొందుచున్నది.

కూచిపూడిలో దేహధారణ చేసినట్లుగా కనిపించే ఈ రామకృష్ణయ్య దాసు ఆ బ్రహ్మమే! ఈ దాసు యొక్క గురుదేవులు శ్రీ శేషబ్రహ్మయోగి ఆ బ్రహ్మమే!

ఈ రామకృష్ణయ్యకు అనుభవమయ్యేది అదే! ఈ రామకృష్ణయ్యే అది కదా!

🌺🙏🌺

17.) సర్వము నీలో ఉన్నదిరా…!


రాగం :
తాళం :

పల్లవి :
➤ నీ..లో ఉన్నదిరా.. సర్వము నీ..లో ఉన్నది
➤ నీది కానిదేది లేదురా!

చరణం 1 :
➤ తాను అనేటి.. అహమురా… అది దగ్ధమైన చాలురా
➤ తలపు దగ్ధమైన బీజము… తానెట్లూ ధర మొలచురా…? ॥నీ..లో॥

చరణం 2 :
➤ నది పదుగురు కలసిదాటి… తుదన్ అందర లెక్కబెట్టి
➤ పదిసంఖ్యలోన తనను… భావించక దుఃఖించు రీతిరా.. ॥నీ..లో॥

చరణం 3 :
➤ నామరూపమేదిరా… నిరామయంబె నీవురా
➤ నియమమొందవలదు మాయకు
➤ నిర్ణయంబె లేదురా… ॥నీ..లో॥

చరణం 4 :
➤ కనుగంటిలోపలా ఘనశేషబ్రహ్మమేరా
➤ అనయము శ్రీ ఈ రామకృష్ణకు అనుభవమై నిలచెరా ॥నీ..లో॥
Viswaroopam
శ్రీ యేలేశ్వరపు రామకృష్ణయ్య కవి :  ఓయీ! ప్రియమిత్రమా! 
“తత్ త్వమ్ అసి” అనే మహావాక్యం విన్నావు కదా!

ఒక అత్యంత రహస్యం, కానీ బట్టబయలైన సత్యం నీ గురించి నీ ముందు ఉంచుతున్నాను.

నీవు ఈ లోకంలోనో, ఆ లోకంలోనే ఉన్నావనుకుంటున్నావా? లేదు. ఈ లోకాలన్నీ నీలోనే ఉన్నాయి. జగత్తుగా బాహ్యంగా కనిపించేదంతా నీలోనే ఉన్నది. ఎందుకంటే, జగత్తుగా నీకు కనిపించేదంతా నీయొక్క స్వకీయ భావనానుసారమే నీ చేత పొందబడుతోంది.

ఆత్మయే నీ వాస్తవ రూపం. అట్టి ఆత్మయందే సర్వము ఉన్నది. కాబట్టి, నీది కాకుండా మరొకరెవ్వరో నీకు సంసారము - భ్రమ మొదలైనవి ఏమీ కల్పించటం లేదు సుమా!

బాటసారి :  ఈ కనిపించేదంతా నాలోనే ఉన్నదా?

శ్రీరామకృష్ణ కవి :  అవును. “నేను - నాది”… అనే రూపంలో ఉంటున్న అహంకారమే నీకు పరిమితత్వమును కప్పి ఉంచుతోంది సుమా! అట్టి ’అహమ్’ దగ్ధమైతే, నీకూ ‘ఆత్మత్త్వము’ అనే స్వస్వభావమునకు భేదమెక్కడుంది? ఉడకబెట్టిన విత్తనం ఇక మరల మొలవదు కదా! అహంకారం తొలగిన తరువాత ఇక ‘సంసారము’, ‘లోక పరిమితత్త్వము’, ‘లోక విషయ జాడ్యము’ మొదలైనవన్నీ చిగురించవు.

బాటసారి :  ఆత్మ అంటే ఏమిటి? ఆత్మజ్ఞానం ఎట్లా లభిస్తుంది? పరమాత్మ ఎక్కడుంటారు? ఆత్మీయత అనగా ఏది? ఇంకా ఏ సాధనలు చేయాలి?

శ్రీరామకృష్ణ కవి :  ఒక పదిమంది కలసి నది దాటారుట. దాటిన తరువాత, “అందరమూ వచ్చామా? లేక, మనలో ఎవరైనా నీటిలో దొర్లుకుపోయారా? ఇప్పుడే లెక్కేసుకుందాం!”.. అనుకున్నారు. అందరూ ఒక వరుసలో నిలబడ్డారు. ఒకడు ఇవతలికి వచ్చి లెక్కవేస్తే తొమ్మిదిమందే వచ్చారు. అప్పుడు మరల ఇంకొకడు బయటకు వచ్చి మిగతా అందరినీ నిలబెట్టి లెక్కవేస్తే మరల తొమ్మిదిమందే వచ్చారు.

ఎందుచేత?

ఆ లెక్కవేసే అతడు తనను తాను లెక్కించుకోవటం లేదు.

‘ఆత్మ’ అనగా నీవే! ఆత్మకు ’అఖండము - అప్రమేయము - నిత్యము - పూర్ణము - గుణాతీతము - కాలాతీతము“ - అని చెప్పే మాటలన్నీ నీ స్వరూపం గురించే సుమా! నిన్ను నీవు తెలుసుకోకుండా మిగతావన్నీ ఎంతగా విశ్లేషించినా ఆత్మగురించి తెలియటం లేదు.

జాగ్రత్ - స్వప్న - సుషుప్తి - జన్మ పునర్జన్మాదులన్నిటికీ ఏది కేవల సాక్షియో… ఆ నీ స్వస్వరూపమే ఆత్మ! నిన్ను నీవు భావించక, లోక విషయములను భావన చేయటం చేత మాత్రమే నీకు దుఃఖం కలుగుతోంది. సత్-చిత్-ఆనంద స్వరూపమే నీ స్వరూపం.

ఈ శరీరానికి నామము ఉన్నది, రూపము ఉన్నది. మరి, శరీరిగా (as one who is operating this body) నీకు నామరూపాలు ఎక్కడున్నాయి? ”జీవ శివః - శివో జీవః - జీవో బ్రహ్మేతి న పరః” అని ఉపనిషత్తు చేతులెత్తి చెపుతోంది కదా! నీవు నామరూపములకు అతీతుడవై నిరామయుడవై ఉన్నావు. అందుచేత, యా మా (ఏదైతే స్వతఃగా లేదో)… అట్టి మాయకు బద్ధుడవు కాబోకు. ఈ జగత్తులో ‘ఇది ఇట్టిది మాత్రమే’… అనే నియమమేదీ లేనే లేదు. ఇది గమనించి ప్రశాంతుడవై ఉండు.

కన్ను చూస్తోంది. అయితే, ఆ కన్నులోంచి చూస్తున్నదెవరో గమనించు. చూచేవాడే ఘనీభూత స్వరూపుడు, అంతా లయించినా ఇంకనూ శేషించేవాడు అగు బ్రహ్మమైయున్నాడు. కంటిచూపును ఉపకరణంగా ధరించియున్న స్వస్వరూపమే బ్రహ్మము.

ఓయీ! బాటసారీ! ఈ రామకృష్ణయ్యకు సదా సర్వదా అంతటా ఆత్మయే అనుభూతమౌతూ, అన్నిటినీ తనయందు ఇముడ్చుకొని ఉన్న బ్రహ్మమే నీయందు అనినిత్యముగా దర్శనమౌతోంది.

అట్టి ఆత్మస్వరూపుడగు నీయందే అంతా ఉన్నదయ్యా! సర్వము నీలోనే ఉన్నది. నీవు కానిదంటూ ఏదీ లేదు.

🌺🙏🌺

18.) మంగళం సర్వలోక మంగళాంగునకు…!


YouTube hyperlink to this Song - https://www.youtube.com/watch?v=zYPOseMgJAE
రాగం : ఖరహరప్రియ
తాళం : త్రిశ్రగతి

పల్లవి :
➤ మంగళం సర్వలోక మంగళాంగునకు జయ మంగళం
➤ అంగజ జనకునకు ఖగతు రంగునికిని శ్రీ జయ ॥మంగళం॥

అనుపల్లవి :
➤ మంగళంబు శ్రీ దయా పాంగునకును,
➤ భక్తజన పుంగవునకును, రుక్మిణి భామకు,
➤ షండునకు, పండరిపుర రంగనుకిని నిత్య జయ ॥మంగళం॥

చరణం 1 :
➤ సర్వభూతములును తానై…. సర్వసాక్షి అనగ వేఱై
➤ సర్వబ్రహ్మాండములకు,… తానె సూత్రధారియై
➤ సర్వజీవ బుద్ధులందు సంకల్ప వికల్పకములను
➤ సర్వత జేయుచు…. నిర్వికల్పుడగుచు
➤ సర్వం ఖల్విదమ్ బ్రహ్మకు సార్వభౌమునకు |
➤ నిత్యజయ మంగళం ॥మంగళం॥

చరణం 2 :
➤ ఇలను దాస జనుల దోషములను నాశమొనగజేసి
➤ వెలసె కూచిపూడి పురికి, సలలితంబుగ సూరిజనుల
➤ కలసి వారినరసి వరములు విలసితంబుగ నొసగిసుసా…
➤ ధుల రక్షణ బిరుదుకరమున
➤ (మిత్రం) కలకాలము ధరియించి… సకలమును తానైన హరికి ॥మంగళం॥

చరణం 3 :
➤ ప్రేమమీర యేలేశ్వరపు రామకృష్ణదాసునేలు
➤ స్వామికిని సకల సుగుణ సోమునకును శ్రీ జయ…
➤ భామామణులార మీరు… హేమపళ్లెరముల తోడ
➤ శ్రీ మీరగా.. కర్పూరంపు హారతులూ
➤ (మిత్రం) నియమముతో నొసగుడీ… శేషనామమునకును
➤ నిత్య జయ…మంగళం సర్వలోక ॥మంగళం॥
Haarathi
సర్వలోకములకు శుభమును ప్రసాదించు సర్వాంతర్యామికి, మంగళ ప్రదునకు ఎలుగెత్తి జయజయధ్వానాలు పలుకుదాం.

స్వామి బ్రహ్మదేవునికి తండ్రి! గరుడుని వాహనంగా కలిగి భక్తులను పరామర్శించేందుకు లోకాలన్నీ తిరిగివస్తూ ఉంటారు. మన ప్రాణనాథుడు దయాసాగరుడు. భక్తజనులను సర్వదా రక్షించే కంకణం ధరించిన ఇలవేలుపు. చరాచర సృష్టికి యజమాని. ఆర్తత్రాణ పరాయణుడు. దుష్టశిక్షణ - శిష్టరక్షణార్థమై అవతరించిన శ్రీకృష్ణ భగవానునకు, రుక్మిణీ మాతకు జయీభవ! దిగ్వియీభవ!

మన స్వామి ఎటువంటివారు?
ఈ కనబడే సర్వలోకములలోని సర్వజీవులుగా ఉన్నది ఈ పరమాత్మయే!

అయితే, ఈ సర్వమునకు సాక్షిగా వేఱై ఉంటున్నారు. ఈ దేహ-మనో-బుద్ధి ధర్మాలు వారిని స్పృశించటం లేదు. ఇవి వారిని
ఆశ్రయించి ఉన్నా కూడా, వారు సర్వదా యథాతథం.

ఈ బ్రహ్మాండములన్నిటికీ ఈయన ఒక నవలా రచయిత వలె సూత్రధారి. ఇక ఈ బ్రహ్మాండములో, నవలలోని సంఘటనల
వంటివి. ఇందలి జీవ సమూహమంతా పిపీలికాది బ్రహ్మ పర్యంతము పాత్రధారులు.

ఈ సర్వజీవుల బుద్ధులలో పూదండలోని దారంలాగా అనున్యూతంగా ప్రవేశించి ఉండి వారందరిలో సంకల్ప - వికల్పములు
సర్వదా నిర్వర్తిస్తూ ఉన్న సర్వాంతర్యామి ఆయన. అయితే, ఆయన సర్వదా సంకల్ప వికల్పములకు సంబంధించనివాడు.
నిర్వికల్పుడు.

నాటకంలో పాత్రలు కనిపిస్తాయి. నాటక రచయిత కనిపించడు. అట్లాగే, ఈ జగన్నాటకం. ఇందులో పాత్రలు వహించే జంతు - మానవ - దేవత - యక్ష - కిన్నెర - గంధర్వ - పిశాచాది జీవుల వ్యవహారాలు కనిపిస్తున్నాయి. ఈ జగన్నాటక రచయిత ఆయన. నాటక రచయిత నాటకంలోని పాత్రలన్నిటికీ వేఱై పాత్రల లక్షణములను ఆపాదించటానికి వీలుకానివాడై ఉంటారు కదా! అయినా ఇదంతా ఆయనే!

“సర్వమ్ ఖల్విదమ్ బహ్ర్మా”… ఇదంతా ఈ పరబ్రహ్మమే అయి ఉన్నారు. మనకు పంచభూతముల రూపంగా కనిపించేది, వాటి మిశ్రమ రూపాలైన దేహాదులుగా కనిపించేది, అపంచీకృతములైన మనో-బుద్ధి-చిత్త-అహంకారాలు ఇవన్నీ బ్రహ్మమే అయి ఉన్నాయి. అట్టి బ్రహ్మమే స్వరూపుముగా కలిగిన అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకునకు, రాజాధిరాజునకు, సార్వభౌమునకు "నిత్య జయ మంగళం” అని వంగిమాగధ గానం చేద్దాం.

స్వామి నిష్క్రియుడు! అయితే, ఆయన దాసుల దోషములను హరింపజేసి, వారిని పరిరక్షిస్తూ, పరిపోషిస్తూ ఉండటం చేత “హరి” అను బిరుదాంకితుడైనారు. భక్తజనుల కొరకై మన స్వామి వెతకి వెతకి వస్తారు. భక్తులు ఏమీ అడగకుండానే వారి అవసరాలను తీర్చి వారికి వరములు ప్రసాదించటంలో మహోత్సాహులై ఉంటారు. వారిని సేవించే మనకు ప్రత్యక్షమై మన ఈప్సితములను వారికి మనం చెప్పకుండానే ఈడేరిస్తూ ఉంటారు. సుజనులను, సాధుజనులను సర్వదా రక్షిస్తూ, ’సాధు రక్షకుడు’ అను బిరుదును ఎల్లప్పుడూ చేతిలో ధరించి లోకాలన్నీ సంచరిస్తూ ఉంటారు.

→ సకలమును పరిరక్షిస్తూ…
→ సకలము ‘తానే’ అయిన శ్రీహరి స్వామికి… ఈ జయమంగళ హారతి.

ఈయన అవ్యాజమైన ప్రేమను, కరుణను మాటలలో వర్ణించగలమా? లేనే లేదు. ఈ యేలేశ్వరపు రామకృష్ణయ్య దాసును సర్వదా ఏలుచున్న మనోహరస్వామీ! సకల గుణసోముడు! జగదభిరాముడు!

ఓ భామామణులారా! రండి. బంగారు పళ్లాలతో కర్పూరహారతులు పట్టుకురండి. ఈ శేషనామునకు మనం “బుద్ధి” అనే బంగారు పళ్లెంలో “మనస్సు” అనే కర్పూరం వెలిగిద్దాం. ఈ స్వామికి సమర్పిద్దాం. “ఓ సర్వలోక మంగళాంగుడా! మీ నామరూపాదులకు నిత్యజయ మంగళమగు గాక! మీ అవతార కథలు లోకాలన్నిటిలోను మార్మోగు గాక! మహనీయుల - సద్గురువుల - భక్తజనుల ఆప్త వాక్యములు డప్పు మ్రోతలవలె మా చెవులకు మరల మరల చేరుగాక!

మేమంతా అంతటా అన్నిగా ఉన్న మీ తత్త్వమును - రూపమును దర్శించి పునీతులమగుదుము గాక! మమ్ములను మేము తమకు సమర్పించుకుని సంసార వీచికలచే స్పృశించనివారమై నీవే మేమై ఉండెదము గాక!

🌺🙏🌺

19.) వరాల తండ్రికే మంగళం


రాగం : సురభి
తాళం :

పల్లవి :
➤ వరాల తండ్రికే మంగళం…,
➤ మన మొహరీల తండ్రికే మంగళం..
➤ మన నవర్సుల తండ్రికే మంగళం..
➤ మాణిక్యం లాంటి తండ్రికే మంగళం…

చరణం 1 :
➤ బీరాన కరి మోరాలించిన,
➤ మన ప్రహ్లాదు పిలుపు విని పాలించినా
➤ మన త్యాగయ్య పాటవిని పులకించిన
➤ ముద్దుల మురారి తండ్రికే మంగళం
➤ మన నవర్సుల తండ్రికే మంగళం
➤ మాణిక్యంలాంటి తండ్రికే మంగళం ॥వరాల॥

చరణం 2 :
➤ మీరా గోదావరి తీరంబునా దివ్య
➤ చారూ సుందర భ్రద శైలంబునా
➤ సీతా లక్ష్మణ - సమేతు డైనట్టి మన
➤ రామచంద్రునకే మంగళం శ్రీ
➤ రామచంద్రునకే మంగళం ॥వరాల॥

చరణం 3 :
➤ నంద యశోద కుమారుడవై
➤ మందారా గిరిధర విహారుడవై
➤ కందర్ప జనక సుందరుడైనట్టి
➤ మన ఇందిరేశునకే మంగళం
➤ వసుదేవ కుమారునకే మంగళం ॥వరాల॥

చరణం 4 :
➤ ప్రాపౌదాసులనెల్ల పాలించుచూ
➤ ఆపదలన్నీ నివారింపుచూ
➤ మా పాల కలగిన వ్రేపల్లె పురిలో శ్రీ
➤ గోపాలకృష్ణునకే మంగళం రాజ
➤ గోపాలకృష్ణునకే మంగళం
➤ జనుల పాలించుచూ ॥వరాల॥

చరణం 5 :
➤ భూవలయమున జనుల పాలించుచూ
➤ ఠీవీ అలివేలుమంగను చేపట్టుచూ…
➤ పావనమైన శేషపర్వతమందు వెలసిన
➤ శ్రీ వేంకటప్ప నీకు మంగళం.. శ్రీ వేంకటప్ప నీకే మంగళం ॥వరాల॥

చరణం 6 :
➤ భక్తులనందరినీ పాలించుచూ భక్తి
➤ ముక్తులనిచ్చి పోషించుచూ
➤ పావనమైన కూచిపూడిలో వెలసిన
➤ శ్రీరామలింగనికీ మంగళం మన
➤ బాలాంబతల్లికే మంగళం
➤ మన బాలాంబ తల్లికే మంగళం ॥వరాల॥

చరణం 7 :
➤ శ్రీరామ భక్తాగ్రగణ్యుండవూ
➤ సేవకులకు పెన్నిధానంబువు
➤ శ్రీ మీరగా కూచిపూడి గుడిలోనున్న
➤ శ్రీ ఆంజనేయ నీకు మంగళం
➤ వీరాంజనేయ నీకు మంగళం ॥వరాల॥

➤ ఆకారమై సృష్టి వ్యాపించియూ
➤ సాకారమై స్థితిని వ్యాపించియూ
➤ నిరాకారమై మాయ బాపిన రామకృష్ణ
➤ ఏకబ్రహ్మమునకు మంగళమ్
➤ మన ఏకబ్రహ్మమునకే మంగళమ్ ॥వరాల॥
Gajendra Moksham and Nrusimha Avataram
“హే కృష్ణయ్యా! చిన్ని కృష్ణయ్యా!” అని ఎలుగెత్తి పిలుస్తే చాలు, పరుగు పరుగున వచ్చి పాలించే మన వరాల తండ్రికి, నవర్సూల తండ్రికి, మాణిక్యంలాంటి తండ్రికి, శ్రీకృష్ణయ్యకు జయ! జయ! దిగ్విజయమ్!

ఆనాడు “రావే! కరుణింపవే! శరణార్థిని నన్ను కావవా ”.. అన్న గజేంద్రుని మొఱ ఆలకించి “అల వైకుంఠపురంబులో - నగరిలో ఆ మూల సౌధంబులో - దాపల“ ఉన్న స్వామి ఉన్నపళాన ఎవ్వరికీ చెప్పే సమయం కూడా వృధా చేయకుండా “నా భక్తుడు నన్ను పిలిచాడు. నేను రక్షించుకోవాలి”… అని బయల్వెడలారు కదా!

ప్రహ్లాదుడు వాళ్ళ నాన్నగారితో ”ఇందుగలడు - అందు లేడు … అను సందేహము వలదు. చక్రి సర్వ ఉపగతుండు… ఎందెందు వెదకి చూచిన అందందే గలడు” అని పలికిన పలుకులు పాలించటానికి సృష్టిలో అణువణువునా ప్రదర్శనోత్సాహులై సిద్ధమైనారు కదా!

త్యాగరాజుగారి పాట విని పులకించేంత పెద్ద మనస్సుగల తండ్రీ! అట్టి సర్వాత్మకునికి, అవతారమూర్తికి, సద్గురు స్వరూపునికి జయీభవ! దిగ్విజయీ భవ! స్వామీ! లోకకళ్యాణార్థమై శ్రీరామచంద్రమూర్తిగా అవతరించారు. “యుగయుగాలుగా ఆశ్రయించే జనుల సంరక్షణార్థమై గోదావరీ తీరంలో గల భద్రాచలంలో సీతాలక్ష్మణాది పరివార సమేతులై వెలిసారు! అట్టి
శ్రీరామచంద్రునకు నిత్యజయమంగళం!

నందయశోదుల కుమారుడవై చిన్నికృష్ణయ్యగా పూతన మొదలైన లోక కంటకులను దునుమాడావు. ఇంద్రుడు ఏడు రోజులు రాళ్ళవర్షం కురిపిస్తే గోవర్ధన గిరిని చిటికెనవేలుపై నిలిపి గోపబాలకులను, గోపీజనాన్ని కాపాడావు. చిన్ని కన్నయ్యవై చిరుపాదాలతో మందరగిరిపై గోపబాలకులతో ఆటలాడుకున్నావు. మన్మథుని తండ్రీ! నీ నామం - రూపం - క్రీడలు… అన్నీ సుందరం! … అట్టి మన ఇందిరేసునకు, వసుదేవ తనయునకు జయమంగళం. దాసులను పాలిస్తూ వారి ఆపదలను నివారిస్తూ వ్రేపల్లెలో అల్లరి చిల్లరి పనులు నిర్వర్తించే గోపాలకృష్ణయ్యకే నిత్యజయ మంగళం!

ఓ శ్రీమత్ వేంకటేశ్వర స్వామీ! ఈ లోకాలన్నీ పాలిస్తున్న కన్నతండ్రీ! ఠీవిగా మా అమ్మ అలివేలు మంగతో కూడి పరమ పావనమైన వేంకటాద్రిపై వెలసి “ఏడుకొండలవాడా! వెంకటరమణా! గోవిందా! ఓ గోవిందా!”… అని పిలిచే భక్తులకు “ఓయ్ ! నేను ఇక్కడే ఉన్నా! నీ ప్రక్కనే ఉన్నా!”… అని పలికే, ఆ పలుకులలో కులికే శ్రీ వెంకటప్పా! ఓ వరాల తండ్రీ! జయహో! దిగ్విజయహో!

ఆ సర్వాత్మకుడైన పరమాత్మ, పరంధాముడు కూచిపూడి గ్రామం వేంచేసి ’శ్రీ బాలాత్రిపుర సుందరీ సహిత రామలింగేశ్వరస్వామియై వెలిశారు. భక్తులు సాయంకాలం ఆ ప్రశాంత వాతావరణంలో అమ్మ బాలాత్రిపుర సుందరీ సమక్షంలో బారులుతీరి, కూర్చుని స్వామికి, అమ్మకు గాన లహరితో స్తోత్రం చేస్తూ పులకితులౌతూ ఉంటారు. నాట్యోపాసకులు శ్రీ సిద్ధేంద్రయోగి ప్రవచించిన కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శిస్తూ స్వామిని ప్రణతులు సమర్పిస్తూ ఉంటారు. అట్టి శ్రీ రామలింగేశ్వర స్వామికి ప్రణతులివిగో! అమ్మ బాలాంబికకి విన్నపములతో కూడిన మంగళ హారతులివిగో!

ఓ ఆంజనేయస్వామీ! ఈ శివాలయ ప్రాంగణానికి విచ్చేసి మమ్ములను కాపాడుచున్నారు కదా! నీవు శ్రీరామసేవలో పునీతుడవైనావు! శ్రీరామభక్తులలో అగ్రగణ్యుడవు! నీ చుట్టూ ప్రదక్షిణలు చేసి నమస్కరించినంత మాత్రంచేత జటిలమైనవనుకునే జీవిత సమస్యలు సమసిపోతున్నాయి. స్వామీ! వీరాంజనేయా! ప్రసన్నాంజనేయా! ప్రభా దివ్యకాయా! అభయాంజనేయా! నీకు జయమంగళం! నిత్య జయమంగళం!

ఓ శ్రీకాకుళ శ్రీ విష్ణుస్వామీ! ఇవే మీకు మంగళహారతులు!

ఓ అద్వితీయ స్వామీ! చిదానంద ఘనా! ఏకబ్రహ్మమా! రామకృష్ణయ్య ఏకబ్రహ్మమా!

సృష్టికర్త బ్రహ్మవు! ఈ సృష్టి - ఈ బ్రహ్మాండాలే నీ రూపం. సర్వ ఆకారాలు నీవే కాబట్టి నీవు నిరాకారుడవు. అన్ని ఆకారాలు తానే అయిన మా స్వామికి ఏ పరిమితాకారం ఆపాదించగలం?

స్థితికర్త విష్ణువువు! సాకారంగా ఈ సృష్టికి స్థితిని కల్పిస్తున్నది నీవే! ఈ ‘సృష్టి’ అనే గొప్ప చిత్రపఠానికి లేఖకుడవు. (You are the artist of this painting-like creation). సంరక్షకుడవు.

లయకారుడు శివుడివి!  ఇదంతా నీలోనే లయమై ఉండి, దీనికి లయకారుడవు నీవే!

నిరాకారుడవైన ఆకారుడా! నాలో ఉండే ‘రామకృష్ణయ్య’ అనే పేరుతో పిలువబడే పరబ్రహ్మమా! నీకు ఇవే మా ప్రణతులు! స్వామీ మా మంగళ హారతులు స్వీకరించండి!

మేము మా ‘బుద్ధి’ అనే ప్రమిదలో ’మనస్సు’ అనే దీపం దీపింపజేసే ‘భక్తి’ అనే కాంతి సర్వదా మీ పాదపద్మములను ఆశ్రయించు గాక!

మీరిచ్చిన ఈ ‘జన్మ’ పూజాపుష్పమై మీ పాదపద్మములను అనునిత్యంగా అలంకరించును గాక!

మీకు పరాక్…. బహుపరాక్…

🌺🙏🌺

20.) మంగళంబు నీకు.. ఉమాధవా పరాకు…


YouTube hyperlink to this Song - https://www.youtube.com/watch?v=GFDYrFBo6Pw
రాగం:
తాళం :

పల్లవి :
➤ మంగళంబు నీకు..ఊ… ఉమాధవా పరాకు..ఊ.. ॥మంగ॥
➤ అంగజారి శ్రీ… కుచేల పురవిహారి నీకు..ఊ..!

చరణం 1 :
➤ వృష తురంగ మరువబోకు..ఊ..
➤ ఏల నీకు..ఊ…. ఈ పరాకు..ఊ.. ఎందుబోకు..ఊ.. ॥మంగ॥

చరణం 2 :
➤ ఇందువదన రా.. రా… నీవెందు బోయెదవురా
➤ కందర్పదమనా.. నను కన్నతండ్రి నీవేరా
➤ ఏలరావూ… ఈ పరాకు..ఊ…. ఎందుబోకు..ఊ.. ॥ మంగ ॥

చరణం 3 :
➤ మకరిచేత చిక్కి ఈ మమతలెల్ల దక్కీ
➤ మరిచూచితె నిక్కీ ఏమనుట ఇది హుళక్కీ
➤ రాఞ్జక్కి.. రమ్మెక్కి… వలచిక్కీ… ॥మంగ॥

చరణం 4 :
➤ యేలేశ్వరపు రామ… కృష్ణ దాసుని మొఱవినుమా
➤ ఏలిక నీవేమా… మహేశ పొగడతరమా…
➤ నిను పొగడా.. నా తరమా… శేషనామా…
➤ మంగళంబు నీకు..ఊ.. ఉమాధవా పరాకు
Lord Shiva with Parvathi
ఓ ఉమాధవా! శ్రీ బాల త్రిపురసుందరీ సమేత రామలింగస్వామీ! సాంబశివా! ఇవే మా హృదయపూర్వక మంగళహారతులు.

ఈ జగత్తంతా సంచరించే స్వామీ! కూచిపూడి వేంచేసి… అమ్మ బాలత్రిపురసుందరీదేవి హృదయంలో విహరిస్తూ మమ్ములను పాలించే పరమాత్మా! సాంబశివా! నందీశ్వర వాహనుడా! మమ్ములను మరువకయ్యా ! మా పట్ల పరాకుగా ఉంటే ఎట్లా చెప్పండి? అటూ - ఇటూ తిరగక మా హృదయాలలో తిష్ఠ వేయండి. స్వామిన్! మయి ఏవ వాసం కురు!

హే సదాశివా ! మీరు అటూ ఇటూ వెళ్ళవలసిన పనేమున్నది చెప్పండి? ఆది కిరాతా! మా హృదయారణ్యంలో ప్రవేశించి అందులో గల కామ-క్రోధ-లోభ-మోహ-మద-మాత్సర్యాలనే మృగాలను వేటాడి వినోదించవచ్చు కదా!

ఓ కందర్పదమనా! మాలో ప్రాపంచక సంబంధమైన కోరికలను, అభిమాన మమకారాదులను మూడవ కంటితో భస్మంచేసి వినోదించండి.

మేము మీ బిడ్డలం కదా! బిడ్డలను తండ్రిగాక ఇంకెవరు రక్షిస్తారు? కాబట్టి ఎటూ పోక, మీరు ఇటు రండి.

మేము ‘సంసారము’ అనే మొసలి నోటికి చిక్కి ఉన్నాం. అనేక మమతాను బంధాలచే బంధితులమై ఉన్నాం. ఇదంతా హుళక్కే కదా! వీటిలో చిక్కి, నిన్ను గానక, నీకిప్పుడు మంగళధ్వానాలు పలుకుతున్నాం. రండి. మమ్ములను ఒడ్డుకు జేర్చండి.

ఈ యేలేశ్వరపు రామకృష్ణయ్య దాసు మీ దాసానుదాసుడు. ఈ మీ దాసు మొఱ వినండి. మా ఏలికవు నీవే సుమా! బ్రహ్మ ఉపేంద్రాదులే నిన్ను పొగడజాలరు. ఇక నేనెంతటివాడిని? నిన్ను పొగిడిమెప్పించటం నా తరం అవుతుందా? కనుక, కనికరంతో నీవే వచ్చి మమ్మేలుకో! మా వినతులు - ప్రణతులు - మంగళహారతులు స్వీకరించు.

🌺🙏🌺

21.) నిన్నుజూచి ధన్యత చెందెద…


రాగం : సౌరాష్ట్ర
తాళం : రూపకం

పల్లవి :
➤ నిన్నుజూచి ధన్యత చెందెద..ఆ…
➤ నీరజ పత్రేక్షణా! రామ! ॥నిన్నుజూచి॥

చరణం 1 :
➤ శోకమోహములకు నా మది
➤ లాగి ఈడ్చుచున్నదీ…
➤ మోహతలనెల్ల త్రుంచి
➤ నీ నామమిచ్చి బ్రోవవే… ॥నిన్నుజూచి॥

చరణం 2 :
➤ తల్లి తండ్రి గురువుయనచు
➤ నా… మదిలో ధ్యానించితి..ఈ..
➤ సాధనలను మాకిచ్చి
➤ కరుణతో నను బ్రోవవే ॥నిన్నుజూచి॥

చరణం 3 :
➤ రామకృష్ణదాసుడను
➤ శరణువేడి వచ్చినాను…
➤ కలుషితములనెల్ల బాపి
➤ తత్త్వమిచ్చి బ్రోవవే… ॥ నిన్నుజూచి ॥
Lord Sri Rama
ఓ రామయ్యా! పద్మనయనమువాడా! ఈ లోక విషయాలు చూచి చూచి నా కళ్ళు అలసిపోయాయయ్యా! ఇక నిన్ను చూచినప్పుడు మాత్రమే ఈ కళ్ళకు విశ్రాంతి. నిన్ను చూచి ధన్యుణ్ణి అవుతాను. ఏదీ? నీ రూపం నాకు కనిపింపజేయవూ!

ఈ మనస్సు దృశ్యము వైపుగా అనేక జన్మలనుండి ఆకర్షించబడుతూ వస్తోంది. అందుకు ఫలితంగా శోక మోహాలకు హరణమై పోతోంది.

జన్మలు గడుస్తున్నాయి. ఏమి లాభం? స్వామీ ! అయినదేదో అయింది. ఇకనన్నా వచ్చి ఈ మోహలతను త్రుంచి నన్ను రక్షించు. నీ ‘నామస్మరణ’ నాకు ప్రసాదించి కాపాడు.

ఇక నా ధ్యాసంతా నీవే! నిన్నే నాకు తల్లిగా, తండ్రిగా, గురువుగా ధ్యానిస్తున్నాను. నా సాధనయే నీవుగా అయి నన్ను కరుణతో నాయీ సంసార దృష్టులనుంచి నన్ను పరిరక్షించు.

ఈ రామకృష్ణదాసు ఇప్పటికైనా వచ్చి నిన్ను శరణువేడుచున్నాడు, తండ్రీ!

నీ తత్త్వము నాకు ప్రసాదించు. అన్నిటా, అంతటా, అన్నిగా రామతత్త్వాన్ని దర్శింపజేసి నన్ను ఒడ్డుకుజేర్చు.

నిన్ను చూచి ధన్యత చెందెదను గాక !

🌺🙏🌺

22.) జయ హారతి ఇదే రాములకు…


రాగం : ఆనందభైరవి
తాళం :

పల్లవి :
➤ హారతి ఇదే… రాములకు…
➤ జయహారతి ఇదే రాములకు…

➤ శ్రీకరమే, శుభా కరమే…
➤ మంగళమే… సుందరమే…  ॥జయహారతి॥

చరణం 1 :
➤ దశరథ పుత్రునకు, దానవా హంతునకు..
➤ శ్రీలక్ష్మీలోలునకు… సిరులొసగే రాములకు.. ॥జయహారతి॥

చరణం 2 :
➤ దీనమందారునకు… దేవతధారునకు
➤ వారధీ కట్టేనా…వనజాసునేత్రునకు…  ॥జయహారతి॥

చరణం 3 :
➤ భక్తుల బ్రోచేటి.. పట్టాభిరాములకు
➤ రామకృష్ణుని స్వామీ.. ప్రేమతో కర్పూర… ॥జయహారతి॥
Lord Sri Rama
లోకానందరూపులగు స్వామి రామచంద్రమూర్తీ! ఇదే మీకు మా కర్పూర జయహారతి! మీ అవతారం శ్రీకరమైనది. లోకానికి శుభకరం. మంగళప్రదం. మీ కథామృతం అతి సుందరం.

ఓ దశరథప్రియపుత్రా! లోకపీడితులగు దానవుల హంతకా! శ్రీలక్ష్మికి అతిప్రియమైన స్వామీ! మాకు జ్ఞానైశ్వర్య సిరి ప్రసాదించే స్వామీ! మీకివే మా మంగళ జయహారతులు.

ఓ దీనబాంధవా! దేవతలను తన దేహముగా ధరించినవాడా! కోతులచే వారధి కట్టించినవాడా!

మా సీతమ్మ తల్లికి అతిప్రియంగా కనిపించే స్వామీ! మీకివే జయ జయ ధ్వానపూర్వక సుమంగళ హారతి.

కృతి సమర్పణ - YHRK

శ్రీ రామకృష్ణయ్యగారు కూచిపూడిలోగల ఆలయంలోని అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠా కారకులని పెద్దలు చెప్పగా విన్నాను. దేవాలయంలోని ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ చేసినది కూడా వారేనట. తాతగారు, ఆ రామకృష్ణగారికి, మనుమడు హనుమ రామకృష్ణకు ఎప్పుడూ హృదయంలో వేంచేసి ఉండే కులదైవం రామలింగేశ్వర స్వామియే!

శ్రీ రామకృష్ణయ్య విరచిత గానలహరీ సౌరభాలను శ్రీ బాలత్రిపుర సుందరీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారికి కూచిపూడికి వేంచేసి వెలసినందుకు కృతజ్ఞతా పూర్వకంగా వ్యాఖ్యాన సమేతంగా సమర్పిస్తున్నాము. ఈ కార్యక్రమానికి ప్రయోజనంగా…., ఇందులోని పాటలు అనేక జనుల హృదయాలలో భక్తి-జ్ఞాన-ప్రపత్తి దీపకాంతులు ప్రవృద్ధ పరస్తూ…, మనందరి ఆధ్యాత్మిక మార్గంలో సేదదీర్చే మధురస్వరములై సుదీర్ఘ కాలంగా వినబడటమే స్వామికి నేను చేసే విన్నపం..

శం నో అస్తు ద్విపదే
శం చతుష్పదే
ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః

వై.హెచ్.రామకృష్ణ
సీనియర్ మేనేజర్
ఆంధ్రాబ్యాంక్, ఆర్. ఆర్. పేట
ఏలూరు - 534 002

తేదీ : 24–03–2002


నా పైన మా తాతగారు రామకృష్ణయ్య గారి ప్రభావం - YHRK

శ్లో॥ శ్రీ కుచేలపురి నివాసాయ
హరికథా నంద సింధవే ।
సర్వదా శాంతరూపాయ
నమః రామకృష్ణాయ తే ॥

శ్రీ సిద్ధేంద్రయోగి వేంచేసియున్న ప్రపంచ ప్రసిద్ధమైన కూచిపూడి గ్రామంలో 1866లో జన్మించిన ఒకానొక ఆణిముత్యం శ్రీ యేలేశ్వరపు రామకృష్ణయ్య గారు. హరికథాగానం ఆయన ఎంచుకున్న ఆథ్యాత్మిక సాధనామార్గం ‘వాసుదేవ సర్వమితి భావనాయాం వైసుదేవమ్’ అను నానుడిని అనుసరించి వైసుదేవదీక్ష అవధరించియున్నవారు. తత్త్వవేత్త. కర్మయోగి ‘సతీసక్కు బాయి’, ‘గజేంద్రమోక్షం’, ‘ఘోరాఖంబావా’, ‘భక్తరామదాసు’, ‘రుక్మిణీ కళ్యాణం’ మొదలైన ఆయా కథావిశేషాలను హరికథలుగా గానంచేస్తూ ఆంధ్రరాష్ట్రమంతటా ప్రదర్శనలు ఇచ్చేవారు. వారి వంశంలో జన్మించటం, వారు నాకు పితామహులవటం నా పూర్వజన్మ సుకృతం.

YHRK relationship to Bhagavatar

వారు భక్తి-జ్ఞాన-వైరాగ్య సంబంధమైన అనేక పాటలు ఆసువుగా రచించారు. అనేక ప్రదేశాలలో హరికథలు చెప్పుతూ అక్కడ దేవాలయంలో వేంచేసిన భగవానుని స్తుతి పూర్వకంగా పాట రచించటం ఆయనకు ఆనవాయితీ. వారి అనేక గాన కుసుమాల సౌరభం నుండి నా బాల్యం మాతృదేవత శ్రీమతి ఆదిలక్ష్మి కామేశ్వరమ్మగారు, నా అమ్మమ్మ (మరియి మేనత్త) శ్రీమతి చింతా పార్వతమ్మగారు, నా పెద్ద అమ్మమ్మ (మరియి మేనత్త) శ్రీమతి భాగవతుల సుభద్రమ్మగారు వినిపిస్తూ ఉండడంతో నాకు బాల్యంలోనే ఆధ్మాత్మిక అభ్యాసం అయినది.

మా కూచిపూడి గ్రామపెద్దలు బ్రహ్మశ్రీ వేదాంతం సత్యనారాయణశర్మ గారు (సత్యభామ మోహిని మొదలై స్త్రీ వేషములు ధరించి లోకప్రసిద్ధులైన కళాకారులు బ్రహ్మశ్రీ భాగవతుల రామకృష్ణశర్మగారు (విశ్వామిత్రుడు మొదలైన వేషధారణలో దిట్ట. చిత్రకళానిపుణులు, భరతముని నృత్య శాస్త్రానుసారం రచించిన సచిత్ర నృత్యబాణి గ్రంథం “అభినయవేదం“ రచయిత నృత్య భాంగి చిత్రకళాశిల్పి), బ్రహ్మశ్రీ యేలేశ్వరపు కనకదుర్గాప్రసాద్ గారు (శ్రీ యేలేశ్వరపు రామకృష్ణయ్యగారి అన్నగారైన శ్రీ యేలేశ్వరపు దుర్గయ్యగారి కుమారులు, నాకు అన్నగారు) మొదలైనవారంతా “ఏమయ్యా తాతగారి పాటలు ఒక పుస్తక రూపంలో ఎందుకు తయారు చేయకూడదు?”… అని ఎంతోకాలంగా నన్ను ఆజ్ఞాపిస్తూ ఉండేవారు. ఏది ఎప్పుడు జరగాలో ఆ దైవం నిర్ణయించవలసినదే కదా!

శ్రీ రామకృష్ణయ్యగారి పాటలు “22” మాత్రం సేకరించగలిగాను. ఆ పాటలకు గల అర్థభావనను వచనరూపంగా చిన్నప్పటి నుండి నేను పొందిన అనుభూతిని పురస్కరించుకొని వ్రాసే సాహసం చేసాను. శ్రీ రామకృష్ణయ్యగారు నాకు పితామహులే కాదు. నన్ను వెంటనంటి సర్వదా నడిపిస్తూ నాచేత “యోగవాసిష్ఠం” అనే వాల్మీకి విరచిత మహా రామాయణాన్ని “శ్రీ వసిష్ఠ రామ సంవాదము" అనే పేరుతో వచన కావ్యంగా రచింపజేస్తూ అదృశ్యంగా నన్ను ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తున్న గురుదేవులు కూడా! వారిని నేను ఎప్పుడూ భౌతికంగా చూడలేదు. మానసికంగా వారు నన్ను విడచిన క్షణమే నా జీవితంలో లేదు.

ఓ తాతగారూ! సద్గురూ! రామకృష్ణయ్య నామాంతిక మహాశయా! మీ మానసిక సాన్నిధ్యాన్ని అనుభవిస్తూ మీ పాటల సారాంస్యాన్ని వచనరూపంలో తోడుచేసి తద్వారా గానంతోబాటు భావాన్ని కూడా సాధకజనులు ఆస్వాదించాలని చేసిన ఈ ప్రయత్నం మీ భావనా పరంపరయేనని నా అనుభూతి.

ఓ స్వయమాత్మ స్వరూపులగు పాఠకమహాశయులారా! ఈ పుస్తకంలోని పాటలు మృదుమధురమైన సంగీత బాణీలో లయబద్ధంగా రచించ బడ్డాయి. ఈ పాటలన్నీ కూచిపూడి గ్రామంలోను, సమీప గ్రామాలలోను క్రిందటి తరంలో అతి ప్రాచుర్యమై ఉండేవి. కాలక్రమేణా మరపున పడుతూ కొందరు పెద్దలు పాడుకునే పాటలుగా మాత్రమే మిగిలిపోవడం గమనించాను. నిజానికి మరింకెన్నో గాన కుసుమాలు ఇప్పటికీ అలభ్యంగానే ఉన్నాయి. ఇప్పటికి లభించిన 22 పాటలు ఈ పుస్తకం రూపంలోకి తీసుకువచ్చాను. మరికొన్ని పాటలు లభించినప్పుడు ప్రచురించాలని నా ఉద్దేశ్యం.

ఓ రామకృష్ణయ్య తాతగారూ! మీ హృదయంలో నేను, నా హృదయంలో మీరు నిత్యనివాసులం. మీ ఇద్దరు కుమార్తెలైన శ్రీమతి చింతా పార్వతమ్మ గారి, భాగవతుల సుభద్రమ్మగారి హస్తస్పర్శచే పునీతమై మస్తకముచే మీ పాదములు స్పృశిస్తూ సాష్టాంగదండ ప్రణామములు మీకు సమర్పిస్తున్నాను.

– యేలేశ్వరపు హనుమ రామకృష్ణ (YHRK)


కృతజ్ఞతలు (Acknowledgements)

నాకు ఈ ఉపాధిని ప్రసాదించి, నాలో జ్ఞానబీజం నాటిన మాతృ పితృదేవతలైన శ్రీమతి ఆదిలక్ష్మీకామేశ్వరమ్మ గారి, శ్రీ లక్ష్మీ నారాయణగారి పాదపద్మములను భక్తితో స్పృశిస్తూ, నమస్కారములు సమర్పించుకుంటున్నాను.

నా జీవిత భాగస్వామి శ్రీమతి కనకదుర్గ గడుసైన ప్రేమమూర్తి. ఆమె సహకారమే నా సర్వప్రయత్నముల వెనుక ఉన్న శక్తి - యుక్తి కూడా!

నన్ను ఈ కార్యక్రమంలో ప్రోత్సహించిన కూచిపూడి పెద్దలందరికీ పేరుపేరునా పాదాభివందనములు.

సంగీత బాణీకి రాగ-తాళ వివరములకు సమకూర్చిన శ్రీ మల్లాది నారాయణశర్మగారికి హనుమాన్ (సంగీత నగర్విద్వాంసులు, ఏలూరు - 534001) కృతజ్ఞతాభివందనములు.

– యేలేశ్వరపు హనుమ రామకృష్ణ (YHRK)


భాగవతార్ శ్రీ యేలేశ్వరపు రామకృష్ణయ్య గారి కొన్ని జీవిత విశేషాలు

భాగవతుల రామకృష్ణశర్మ
(చిత్రకళాకారుడు)
కూచిపూడి - 521136
వయా మొవ్వ, కృష్ణా జిల్లా, ఆం.ప్ర.

శ్రీ యేలేశ్వరపు రామకృష్ణయ్యగారు ఒక హరిదాసే కాదు. కర్మయోగి కూడా ! అందరిలాగా కర్మలు నిర్వర్తిస్తూనే సర్వకర్మలను పూజాపుష్పాలుగా సమర్పించటం నేర్చిన - నేర్పిన యోగి పుంగవులు “ఆయన ఎల్లప్పుడూ యోగంలోనే ఉండేవారు" అని మా అమ్మ శ్రీమతి సుభద్రమ్మగారు మాకు చెప్పిన మాటలు. ఆ రామకృష్ణయ్య భాగవతారే ఈ మన హనుమ రామకృష్ణగా వచ్చాడేమో”… అని ఈ పుస్తక వ్యాఖ్యాత గురించి కూచిపూడిలో చెప్పుకుంటూ ఉంటారు.

ఆయన జ్ఞానమే కొంచం మాకు అంటింది. “ఇదంతా మనది కాదు. ఆ శివునిదే. “నాదే”.. అన్నామా ?.. ఇక అది బంధమే. “ఈ దేహమే కాదు ! ఈ మనస్సు-బుద్ధి-చిత్త-అహంకారాలు కూడా ఆయనవే”.

ఇటువంటి వాక్యాల ప్రభావం నా బాహ్య జీవితంలో కనబడక పోయినా…. అంతరంలో బీజరూపంలో ఉండకపోలేదు. మహానుభావుల వాక్యాలు వింటే అవి వృధా అవుతాయా ? కావు. నా జీవితం అపశృతి పలికినప్పుడల్లా రామకృష్ణయ్య తాతగారు చుఱక వేస్తూనే ఉన్నారు. ఆయనయే నా sixth sense! యోగులు, సన్యాసులు అనేకమంది రామకృష్ణయ్యగారి హరికథ విని ఆనందిస్తూ ఉండేవారు.

పీఠాధిపతులు ఆయన హరికథ విని లేచి శాఠీలు కప్పి అభినందించే వారు. వారి గుఱువుగారు శ్రీ శేషబ్రహ్మేంద్రయోగివర్యులకు ఆయనంటే ఎంతటి వాత్సల్యం ! శిష్యుడి హరికథ విని పీఠం దిగి శారీ కప్పేవారు. వారి అన్న శ్రీ దుర్గయ్యగారికి వారి హరికథా శ్రవణమన్నా, వేదాంత వేదాంత ప్రవచనమన్నా ఎంతో ఇష్టం. పులకిత శరీరులై తమ్ముని మాటలను మనన పూర్వకంగా అందరితోనూ చెప్పుకొని ఆనందిస్తూ ఉండేవారు. ఆయన హరికథ ‘పూర్వమీమాంస’, ‘ఉత్తరమీమాంస’, అని రెండు విభాగాలుగా ఉండేవి. పూర్వ విభాగంలో (In the First Part) కథావిశేషాలు ఉండేవి. శ్రోతలను పకపకా నవ్విస్తూ కథ చెప్పటం ఆయన ప్రత్యేకత.

ఇక ఉత్తర విభాగంలో (In the Second Part) చెప్పిన కథయొక్క తాత్త్వికాంశం మాత్రమే చోటు చేసుకొనేది. అందుకే ఆయన హరికథకు పండితులు - పామరులు, యోగులు-భోగులు, సంగులు-నిస్సంగులు అందరూ ఆకర్షితులయ్యేవారు. రెండవ విభాగమంతా వైరాగ్యం - సూక్ష్మార్థం – నేర్చుకొనవలసిన విషయం-జీవితాన్ని మలచుకోవలసిన విధానం ఈ దృశ్య జగత్తును నమన్వయించుకోవలసిన పద్ధతి మొదలైన ఆధ్యాత్మ విశేషాలతో ఆలోచనలకు సానపెట్టేడట్లు ఉండేవి.

ఆయన విరాగి-రాగి కూడా. యోగి-భోగి కూడా. ’ఏదీ వదలనక్కర్లేదు. అన్నీ పరమాత్మవని అనుకుంటే చాలు. ఆయన మనకు దర్శనమిస్తారు’ అనేది ఆయన బోధసారం. ఆయన అతిథి లేకుండా భోజనానికి కూర్చునేవారు కాదు.

ఆయన ధర్మపత్ని శ్రీమతి మంగమ్మగారు నిజంగా సహధర్మచారిణియే. వచ్చిన వాళ్ళకు విసుగులేకుండా భోజనం వడ్డిం చేది. వాళ్ళ అన్నదానమే వారి దేహిత్రులవటంచేత తత్ప్రయోజనంగా లోటు లేకుండా మా జీవితాలు ఉండటానికి కారణమగుచున్నదని నా విశ్వాసం.

ఆయన హరికథలు చెప్పటానికి సుదూరప్రాంతాలు వెళ్లేవారు. హరికథ చెప్పుతూనే అక్కడ వేంచేసిన దేవుని ఉద్దేశిస్తూ ఆసువుగా గానం చేసేవారు. అట్లా రచించబడినవే ఈ పుస్తకంలోని పాటలన్నీ కూడా! ప్రేక్షకులలో ఎవరైనా వక్రంగానో, ఎగతాళిగానో మాట్లాడితే అందుకు సమన్వయిస్తూ సమాధానపూర్వకంగా గానంచేసేవారు. “ఏదీ బ్రహ్మము చూపండీ! మాతో వాదమేల, బ్రాహ్మణులండీ! జపములు కావుట, తపములు కావట! చపలాక్షులకు ఇది తెలియడట!"…. అని అట్టి సందర్భంగానే ఆసువుగా గానంచేసి మెప్పించారని ప్రతీతి.

ఒకానొక సమయంలో (1910 ఆ ప్రాంతంలో) కూచిపూడిలో అనేక అరిష్టాలు పొడచూపాయి. కొద్దికాలంలో ఊరిలో అనేకమంది విషజ్వరం పాలై అకాలమరణాలు పొందటం జరిగింది. ఇందుకు కారణం కనిపెట్టవలసినదిగా ఊరి పెద్దలు యోగియగు రామకృష్ణయ్యగారిని నియమించారు. ఆయన అనేక విషయాలు పరిశోధించి “ఆగమ శాస్త్రరీత్యా గుడిలోని అమ్మవారి విగ్రహం వక్రదృష్టి కలిగి ఉండటమే ఇందుకు కారణం” అని విశదీకరించారు. అప్పుడు ఆయన, తదితర పెద్దలు ఆ విగ్రహాన్ని కృష్ణానదీజలంలో నిమజ్జనంచేసి ఇప్పుడున్న బాలత్రిపుర సుందరీమాత నూతన విగ్రహాన్ని గుడిలో ప్రతిష్ఠించారు. ఇప్పుడున్న అమ్మవారి విగ్రహం దరహాసంతో భక్తులకు కన్నులపండుగగా అయి మనల్ని పులకింపజేస్తూ ఉండటమనేది మనందరికీ నిత్యానుభవమే కదా! ఆ సమయంలోనే వారు హనుమంతుని విగ్రహం ప్రతిష్ఠించారు కూడా! ఆ హనుమంతుని ప్రసాదమే అఖండ రామాణయాన్ని వచనకావ్యంగా తీర్చిదిద్దే వచన రచనాశిల్పి అగు మన హనుమ రామకృష్ణ (i.e., The Narrator of Songs in this book). తాతగారి నిత్యకృత్యమైన అన్నదాన ఫలమే మన రామకృష్ణ ద్వారా లోకానికి తేటతెలుగులో వసిష్ఠ-రాముల సంవాదం వినిపిపజేస్తోందని కూచిపూడి గ్రామపెద్దల అనుభూతి. రామకృష్ణయ్యగారి సహనం, ఓర్పు, కవితా నేర్పు అనన్యసామాన్యం.

ఇక్కడ ఒక సంఘటన వివరిస్తాను. ఒకరోజు ఒక అతిథి దూరప్రదేశం నుండి కూచిపూడి వచ్చారు. యథాభ్యాసంగా రామకృష్ణయ్యగారి ఇంటికి విచ్చేసి ఒక అందమైన చిన్నపాప మట్టిబొమ్మను తెచ్చి రామకృష్ణయ్యగారి పెద్దమ్మాయి సుభద్రమ్మ చేతిలో పెట్టారు. ఇంకేమున్నది? వారి 6 సంవత్సరముల చిన్నమ్మాయి పార్వతమ్మ “నాన్నా! నాకు ఆ బొమ్మ కావాలి” అని ఏడుపు లంకించుకున్నది. ఉన్నది ఒక్క బొమ్మేనాయె! ఏంచేయాలి? అప్పుడు రామకృష్ణయ్యగారు చిన్నమ్మాయిని తొడపై కూర్చోపెట్టుకొని “ఎందుకమ్మా ఏడుస్తావు? ఈ లోకంలో బొమ్మలకు కొదువా? ఇటుచూడు. అమ్మ ఒక బొమ్మ! నేనొక బొమ్మ! అక్కయ్య ఒక బొమ్మ! ఈ లోకంలో కనబడేవన్నీ మట్టి బొమ్మలే! బొమ్మలను చూడకు. మట్టిని చూడు. మట్టి అంతటా ఉన్నదే కదా! ఇక బొమ్మలు తక్కువ అవుతాయా?”… అని మహత్తరమైన తాత్త్విక సత్యాన్ని ప్రభోదించారు. అప్పుడు చెప్పిన ఆ రెండు మూడు వాక్యాలు ఇప్పటికీ పెద్దలకు వేదాంతసార పరిగ్రహణానికి నాందీవాక్యాలే!

రామకృష్ణయ్యగారు 1927లో దేహత్యాజ్యం చేశారు. ఆ తరువాత తరువాత మేము పల్నాడు - గురజాల - మాచర్ల మొదలైన ప్రదేశాలు వెళ్ళినపుడు “నాయనా! రామకృష్ణశర్మా! కూచిపూడి వచ్చినపుడు మీ ఇంట్లో భోజనం చేశాం. మీ తాతగారు ఆప్యాయంగా పిలిస్తే మీ అమ్మమ్మగారు ఆదరంగా వడ్డించారు. ఈరోజు మా ఇంటికి వచ్చి భోజనం చేసి మమ్ములను పవిత్రులను చేయండి”… అని మమ్ములను సాదరంగా ఆహ్వానించేవారు. ఆహాఁ! "పెద్దలు, పిల్లలకు వందఏళ్ళ భోజనం తయారు చేసి ఉంచుతారు”… అనే వాక్యానికి అర్థం ఇదే కాబోలు.

ఒకసారి “అంబాపురం” అనే గ్రామంలో “వేంకటశ్వర్లు” అనే ఆసామి ఇంటికి పనిఉండి వెళ్ళాం. ఆయన మద్రాస్ వెళ్ళారు. సమయం మిట్టమధ్యాహ్నం. ఆ ఇల్లాలు “అయ్యా! మీరు ఆకలితో ఉన్నట్లున్నారు. అదిగో, ఆ ఎదురింటికి భోజనానికి వెళ్ళిరండి”… అన్నది. నేను ఆశ్చర్యపోయి, “అమ్మా! ఇదేమిటి ? అతిథిగా వచ్చిన మాకు మీరు భోజనం పెట్టకుండా, ఎదురిల్లు చూపుతున్నారేమిటి?”… అని బాల్యచాపల్యంగా అడిగాను. అప్పుడా ఇల్లాలు ఇట్లా అన్నది. “శర్మా! మీకు వరి భోజనం అలవాటు కదా ! మా ఇంట్లో ‘వరిగ’ భోజనం మాత్రమే లభ్యం. మా ఇంటాయన మీ తాతగారింట్లో అనేకసార్లు భోజనం చేశారు. అందుచేత మీరు మాకు ఎంతో పూజనీయులు, ఆదరణీయులు. మీకు వరిగభోజనం పెట్టడం ఇష్టంలేదు. బియ్యానికి పంపిన పాలేరు ఇంకా రాలేదు. సమయం మిట్టమిధ్యాహ్నం అవుతోంది. అందుకే ఎదురింట్లో బియ్యం భోజనం వండారని మిమ్ములను వారి ఇంటికి వెళ్ళమన్నాను”… అన్నది. మేము ఆమె చూపే ఆదరాభిమానాలను గుర్తించి ”అమ్మా! వరిభోజనం ఎప్పుడూ తింటూనే ఉంటాం కదా!, వరిగ భోజనం వడ్డించమ్మా”.. అన్నాను. రామకృష్ణయ్య తాతగారిని తలచుకుంటూ వరిగ అన్నం, పండు మిరపకారం, గోంగూర పచ్చడి, నెయ్యి, గమిడగేదెల పెఱుగుతో భోజనం చేశాం.

ఆ తరువాత మూడు రోజుల దాకా పొట్ట తృప్తిగా ఉండి ఎంతో బలమనిపించింది. ఇది రామకృష్ణయ్య తాతగారి కర్మయోగ ప్రభావం.

ఈ గ్రంథంలో…

మన హనుమరామకృష్ణ వ్యాఖ్యానం మృదుమధురమైన శైలితో ఉన్నది. నేను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. ఇక రామకృష్ణయ్య తాతగారి పాటల గురించి గొప్పచెప్పటం, “హిమాలయం ఎత్తైన శిఖరం”… అని లోకవిదితమైనది చెప్పటం వంటిది. ప్రతిపాటలోను అద్భుతమైన సాహిత్యం, లయ, సంగీత విన్యాసం మనకు కనబడతాయి.

చి॥ రామకృష్ణకు రెండు సలహాలు.
1) మాతృపిత్రుదేవతలను ప్రేమపూర్వకంగా సేవించి తరించమని
2) హనుమ రామకృష్ణ తల్లి, నాకు అక్కయ్య అయిన శ్రీమతి ఆదిలక్ష్మి కామేశ్వరమ్మ గారిచే ఇందలి పాటలను పాడించి వాటిని రికార్డ్ చేసి ఇక్కడి ఆలయనంలో ఆ ‘క్యాసెట్’ ఉండేటట్లు చేయమని.

చి॥ రామకృష్ణకు శుభాశీస్సులు. శ్రీ రామకృష్ణయ్య తాతగారికి, వారి సతీమణి శ్రీమతి మంగమ్మ అమ్మమ్మగారికి సాష్టాంగదండ ప్రణామములు.


శివ స్తుతి

ఆ-పాతాళ-నభస్థలాంత భువన బ్రహ్మాండ మావిస్ఫుర
జ్యోతి స్ఫాటిక లింగమౌళి విలసత్ పూర్ణేందు వాంతామృతైః
అస్తోకాప్లుతమ్ ఏకమ్ ఈశమ్ అనిశమ్ రుద్రానువాకాన్ జపన్
ధ్యాయేత్ ఈప్సితసిద్ధయే ధ్రువపదమ్ విప్రో అభిషించేచ్ఛివమ్

ఆంగికం భువనం యస్య
వాచికం సర్వ వాఙ్మయం
ఆహార్యం చంద్రతారాది
తం వందే సాత్వికమ్ శివమ్

నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ
త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ
కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ
సర్వేశ్వరాయ సదా శివాయ శ్రీమన్ మహాదేవాయ నమః


YouTube Playlist for some of these Songs

https://www.youtube.com/playlist?list=PLVzJSjiA-oYmpXmWkAneSPPGq2UuIHqPB