Narada Bhakti Aphorishms in Telugu, Sri Yeleswarapu Hanuma Rama Krishna - YHRK
1.) అథాతో భక్తిం వ్యాఖ్యాస్యామః ।
అథ అతో భక్తిం వ్యాఖ్య ఆస్య ఆమః ।
కాబట్టి ఇప్పుడు, ‘భక్తి’ గురించి వ్యాఖ్యానించుకుందాం. వివరించుకుందాం.
2.) సా త్వస్మిన్ పర ప్రేమరూపా (పరమ ప్రేమరూపా) ।
సా తు అస్మిన్ పర ప్రేమరూపా (పరమ ప్రేమరూపా) ।
అట్టి భక్తి అత్యుత్తమ ప్రేమరూపమైనది. స్వరూప స్వభావరీత్యా అభౌతికమైన ప్రేమ స్వరూపం సంతరించుకోవడమే భక్తి. సహజీవులు యొక్క ఇహత్వాన్ని అధిగమించి సర్వులలోని సర్వులుగా ఉన్న పరత్వాన్ని ప్రేమించడం.
3.) అమృతస్వరూపా చ ।
అమృత స్వరూపా చ ।
మరియు, అది అమృత స్వరూపము. తెంపు లేని మాధుర్య ధార. మృతములేని అకార-అకామబద్ధ ప్రేమ.
4.) యల్లబ్ద్వా పుమాన్ సిద్ధో భవతి, అమృతో భవతి, తృప్తో భవతి ।
యత్ లబ్ద్వా పుమాన్ సిద్ధో భవతి, అమృతో భవతి, తృప్తో భవతి ।
ఏ పరా ప్రేమైతే సంపాదించుకున్న తరువాత సిద్ధించవలసినది సిద్ధించినదగుచున్నదో, వారు స్వయంగా అమృత స్వరూపులగుచున్నారు. అనిర్వచనీయ తృప్తిని అనునిత్యం చేసుకుంటున్నారు.
5.) యత్ప్రాప్య న కించిత్ వాంఛతి, న శోచతి, న ద్వేష్టి, న రమతే, నోత్సాహీ భవతి ।
యత్ ప్రాప్య న కించిత్ వాంఛతి, న శోచతి, న ద్వేష్టి, న రమతే, న ఉత్సాహీ భవతి ।
పరాప్రేమ ప్రాప్తించిన తరువాత వారికిక క్రొత్తగా (లేక) వేరుగా కాంక్షించవలసినదిగాని, దుఃఖించవలసినదిగాని, ద్వేషించవలసినదిగాని, రమించ వలసినదిగాని, ఉత్సాహం కలిగి ఉండవలసినది గాని మరొకటేదీ ఉండదు. ఈ జగత్తంతా ప్రేమమయంగా గోచరిస్తుంది. పరమాత్మ యొక్క ప్రియ ప్రత్యక్ష రూపంగా గోచరమౌతుంది.
6.) యత్ జ్ఞాత్వా మత్తో భవతి, స్తబ్ధో భవతి, ఆత్మారామో భవతి ।
యత్ జ్ఞాత్వా మత్తో భవతి, స్తబ్ధో భవతి, ఆత్మా ఆరామో భవతి ।
పరా ప్రేమను ఎరిగిన తరువాత ఇక వారు భక్తి రసముచే మత్తులై, లౌకిక విషయముల పట్ల స్తబ్ధులై, సర్వదా ఆత్మయందే రమించుచున్నవారై (ఆత్మారాములై) ఉంటారు. జగత్తంతా కూడా పరా ప్రేమ స్వరూపంగా అగుపిస్తుంది.
7.) సా న కామయమానా, నిరోధరూపత్వాత్ ।
సా న కామే అమానా, నిరోధరూపత్వాత్ ।
అది లౌకిక వస్తువుల పట్ల ఏర్పడే కోరిక వంటిది కాదు. వారిది సర్వ లోక సంబంధమైన కోరికలకు నిరోధ రూపమైన ఆవలి ఒడ్డు. ఆ భక్తులు, “అయ్యా! మాకు భక్తి అనునిత్యమైతే చాలు! ఇంకేమీ అక్కర లేదు” అంటారు!
8.) నిరోధస్తు లోక వేద వ్యాపార న్యాసః
నిరోధః తు లోక వేద వ్యాపార న్యాసః ।
అది లోక వ్యాపారములకు, వేద (శాస్త్ర) క్రియాదులకు కూడా ఆవల (నిరోధ) రూపం. లౌకిక విషయాలను అధిగమించినట్టి అలౌకిక ఆనందం! అలౌకిక ప్రేమ!
9.) తస్మిన్ అనన్యతా, తత్ విరోధిషు ఉదాసీనతా చ ।
తస్మిన్ అనన్యతా, తత్ విరోధిషు ఉదాసీనతా చ ।
(అంతటా పరమాత్మయే సందర్శనమగుచుండగా) వారు పరమాత్మ స్వరూపముపట్ల అనన్య చిత్తులై ఉంటారు. తత్ విరోధ విషయములన్నింటిపట్ల (లౌకిక విశేషములపట్ల) ఉదాసీనులై ఉంటారు. సహజమగు పరతత్త్వము అత్యంత ప్రియంగాను, సందర్భమాత్రమగు ఇహతత్త్వము స్వల్ప విషయంగాను దర్శిస్తున్నారు.
10.) అన్యాశ్రయాణాం త్యాగో అనన్యతా ।
అన్య ఆశ్రయాణాం త్యాగో అనన్యతా ।
అన్యములైన ఆశ్రయములన్నీ త్యజించి ఉండటమే అనన్యత. అంతా అదే అయినప్పుడు అన్యమైనదంటూ ఏముంటుంది? పరమాత్మయే ఈ అన్ని రూపాలుగా అనిపించటమే అనన్యత!
11.) లోక వేదేషు తదనుకూలాచరణం, తత్ విరోధిషు ఉదాసీనతా చ ।
లోక వేదేషు తత్ అనుకూల ఆచరణం, తత్ విరోధిషు ఉదాసీనతా చ ।
లోక విషయాలలోను - శాస్త్ర విధులలోను లోకహితైషులై, అనుకూలాచరణులై ఉండటం, ప్రతికూల విషయాల పట్ల ఉదాసీనులై ఉండటం. పరమాత్మ కొఱకై లౌకిక విధులు నిర్వర్తిస్తూ ఉండటం (ఉదాసీనత). అంతా అదే! కనిపించేదంతా అదే అయివున్నప్పుడు ఇక కన్నుమూతలెందుకు - అని అస్వాదిస్తూ వుంటారు.
12.) భవతు నిశ్చయదార్ఢ్యాదూర్ధ్వం శాస్త్ర రక్షణమ్ ।
భవతు నిశ్చయ దార్ఢ్యాత్ ఊర్ధ్వం శాస్త్ర రక్షణమ్ ।
భక్తియొక్క ‘నిశ్చయము - ఉన్నతి’ కొఱకై శాస్త్రములచే చెప్పబడే విధి విధానములను నిర్వర్తించే ఉద్దేశ్యం కలిగి ఉంటారు. శాస్త్ర ప్రవచిత వాక్యములకు ప్రచారకులై ఉంటారు. భక్తి కొఱకై శాస్త్రాలు ఆశ్రయిస్తారు గాని, శాస్త్రం కొరకు భక్తిని కాదు. భక్తి యొక్క సిద్ధియే ఆశయంగా కలిగి ఉంటారు. విధి-నియమాలు ఎందుకు? వారి మనస్సు పరాభక్తి, సర్వత్రా ప్రేమ యొక్క ప్రవృద్ధి కొఱకు! సర్వత్రా అనురాగము విరాగమే!
13.) అన్యథా పాతిత్యాశంకయా ।
అన్యథా పాతిత్యా శంకయా ।
పరాభక్తికి అనుకూలం కానిది అయోగ్యమని తమ ప్రవర్తనాదులచే ప్రకటిస్తూ ఉంటారు. భక్తికి సానుకూల్యం కానిది త్యజించుచూ వుంటారు. సర్వత్రా ప్రేమ లేని విధి నియమాలు పతన హేతువులుగా శంకిస్తారు.
14.) లోకోఽపి తావదేవ; కింతు భోజనాది వ్యాపారస్త్వా శరీరధారణావధి ।
లోకో అపి తావత్ ఏవ; కిం తు భోజనాది వ్యాపారః త్వా శరీరధారణ అవధి ।
లోక వ్యవహారంగాని, శాస్త్రంగాని అనన్య భక్తి కలిగేందుకే!
భోజనాది వ్యవహారాలు దేహం దేహధారణ కొఱకు మాత్రమే! శరీరధారణ-కర్మలు… అన్నీ భక్తికొరకే!
పరాభక్తియే జీవిత పరమాశయం!
15.) తల్లక్షణాని వాచ్యంతే నానామత భేదాత్ ।
తత్ లక్షణాని వాచ్యం తే నానా మత భేదాత్ ।
ఆ భక్తి యొక్క వివిధ లక్షణములే వేరు వేరు మతములలోని భేదమంతా!
అన్ని మతములు విధి-విధానముల దృష్ట్యా వేరు వేరుగా కనిపిస్తున్నప్పటికీ.. అవన్నీ చూపించే భక్తి తత్త్వము ఒక్కటే.
అన్ని మతముల అంతిమ సారం పరాప్రేమను సంతరించుకోవటమే.
భక్తి ఒకానొక మహత్తర లక్షణము! మతములన్నీ మానవులకు భక్తిని నేర్పటానికే వున్నాయి!
16.) పూజాదిష్వనురాగ ఇతి పారాశర్యః ।
పూజాదిషు అనురాగ ఇతి పారాశర్యః ।
పరాశరముని ‘పూజ ద్వారా భగవంతుని పట్ల అనురాగం పొందించుకొనటం’ అనే కాయిక భక్తిని ప్రబోధిస్తున్నారు. పూజచే భక్తి (లేక) పరాప్రేమ దినదిన ప్రవృద్ధమానమవుతూ వస్తుంది. సర్వే సర్వత్రా అనురాగమే పరాభక్తి యొక్క రూపంగా వారు చెప్పుచున్నారు. ఇంద్రియములను పరమాత్మకు సమర్పించే పూజా పుష్పాలుగా భావన చేయటం పరాభక్తికి మార్గంగా వారు ఉపదేశిస్తున్నారు!
17.) కథాదిష్వితి గర్గః ।
కథాదిషు ఇతి గర్గః ।
గర్గాచార్యులు ‘భక్తుల కథలను - అవతారమూర్తులను ఆరాధించి తద్వారా భక్తిని పెంపొందించుకోవటం’ సూచిస్తున్నారు. భక్తుల స్వభావ-లక్షణములను, అవతార మూర్తుల లీలను గానం చేయటం పరాభక్తికి ముఖ్యమైన మార్గంగా వారు చూపుచున్నారు!
18.) ఆత్మరత్యవిరోధేనేతి శాండిల్యః ।
ఆత్మరతి అవిరోధేన ఇతి శాండిల్యః ।
శాండిల్యముని “అత్మయొక్క లక్షణములుగా చెప్పబడిన - సర్వస్వరూపత్వము, అఖండత్వము, అప్రమేయత్వము, నిర్మలత్వము మొదలైనవి సంతరించుకోవటం, తదితర లక్షణమైన మనో-బుద్ధి-చిత్త-అహంకారాలకు సంబంధించిన స్వభావం వదలి ఉండటం” అను మార్గాన్ని ప్రవచిస్తున్నారు.
“సర్వులను ఆత్మరూపంగా దర్శిస్తూ వుండటం భక్తికి మార్గం”, అని శ్రీ శాండిల్యముని ప్రవచనం!
19.) నారదస్తు తదర్పితాఖిలాచారతా, తద్విస్మరణే పరమవ్యాకులతేతి (చ) ।
నారదః తు తత్ అర్పిత అఖిల ఆచారతా, తత్ విస్మరణే పరమవ్యాకులత ఇతి (చ) ।
ఇక ఈ నారదుని అభిప్రాయం వినండి. “సర్వ కార్యక్రమములను ఆ సర్వేశ్వరునికి సమర్పించటం, పరమాత్మను విస్మరించే సందర్భాలపట్ల వ్యాకులచిత్తులై ఉండటం, కర్మలను పరమాత్మకొఱకై అని భావిస్తూ, ఇదంతా నాతో సహా సర్వమూ పరమాత్మయొక్క ప్రత్యక్షరూపమే అని ఉపాసించటం!”
20.) అస్త్యేవమేవమ్ ।
అస్తి ఏవమ్ ఏవమ్ ।
అట్టి పరమోత్కృష్టమైన పరాభక్తిని సంపాదించుకున్నవారు ఎక్కడైనా ఉన్నారా? తప్పకుండా ఉన్నారు! అల్ప దృష్టిచే అల్ప విషయాలే గోచరిస్తాయి. ఉత్తమ దృష్టిచే పరాప్రేమ స్వరూపులను గుర్తించగలం.
21.) యథా వ్రజగోపికానామ్ ।
యథా వ్రజ గోపికానామ్ ।
బృందావన గోపికలే అందుకు మనకు ఒక నిదర్శనం. వారు ఈ సర్వ ప్రాపంచిక కర్మలు భగవంతుని ఉద్దేశించి నిర్వర్తించువారు. సర్వే సర్వత్రా కృష్ణచైతన్యమునే దర్శించి పరవశులౌతూ ఉంటారు.
22.) తత్రాపి న మహాత్మ్యజ్ఞాన విస్మృత్యపవాదః ।
తత్ర అపి న మహాత్మ్య జ్ఞాన విస్మృతి అపవాదః ।
ఆ గోపికలు ఈ దేహముతో దైనందిన కార్యక్రమములు నిర్వర్తిస్తున్నప్పటికీ వారు పరమాత్మ యొక్క మహత్తును కించిత్ కూడా ఏమరచుట లేదు. అంతా కూడా కృష్ణచైతన్యానందమే అని ఆస్వాదిస్తూ వున్నారు.
23.) తద్విహీనం జారాణామివ ।
తత్ విహీనం జారాణామ్ ఇవ ।
భగవంతుని ఏమరచటమే మనస్సు యొక్క జారత్వమని జనులు గ్రహించి ఉండెదరు గాక! ఆ ఏమరుపే అప్రతిష్ఠ (న-ప్రతిష్ఠ). “అంతా పరమాత్మ సంకల్పమే కదా!” అని అనుకుంటే పరాభక్తి. వాళ్ళు కారణం - వీళ్ళు కారణం అని అనుకుంటుంటే జీవత్వం.
24.) నాస్త్యేవ తస్మిస్తత్సుఖసుఖిత్వమ్ ।
నాస్తి ఏవ తస్మిన్ తత్ సుఖ సుఖిత్వమ్ ।
ఆ సర్వాత్మకుని మనసా - వాచా - కర్మణా భక్తితో ఆశ్రయించి ఉన్నవారికి లభించే సుఖం లౌకిక ప్రాపంచిక సుఖం వంటిది కాదు. వారికి లోక సంబంధమైనదేదీ రుచించదు. అది అలౌకిక సుఖం, ఆత్మానందం! “కనబడేదంతా - బయట, లోపల కూడా - శ్రీకృష్ణ చైతన్యమే!” అని తలచే గోపికల ఆత్మసుఖంతో పోల్చగలిగినదేమున్నది?
25.) సా తు కర్మజ్ఞానయోగేభ్యోఽప్యధికతరా ।
సా తు కర్మ-జ్ఞాన-యోగేభ్యో అపి అధికతరా ।
ఆ పరాభక్తి యొక్క సంస్థితి కర్మ-జ్ఞాన-యోగముల కంటే సమున్నతమైనది. ఆ మూడింటి పరాకాష్టయే భక్తి! ఆ మూడింటి క్రమమంతా పరాభక్తితో లయమౌతుంది.
26.) ఫలరూపత్వాత్ ।
ఫలరూపత్వాత్ ।
ఎందుకంటే, కర్మ-జ్ఞాన-యోగముల అంతిమ ప్రయోజనం ప్రేమ (భక్తి) స్వరూపాన్ని సంతరించుకోవటమే సుమా! ఇక భక్తికి భక్తియే ప్రయోజనమై ఉన్నది!
27.) ఈశ్వరస్యాప్యభిమానద్వేషిత్వాత్ దైన్య ప్రియత్వాచ్చ ।
ఈశ్వరస్య అపి అభిమాన ద్వేషిత్వాత్, దైన్య ప్రియత్వాత్ చ ।
అందుచేత ఈ ప్రాపంచిక విషయముల పట్ల అభిమాన-ద్వేషములను, దైన్య-ప్రియత్వాలను కలిగి ఉండటం కంటే వాటినన్నింటినీ ఆ పరమాత్మ వైపుగా మలచుకొని ఉండటమే సముచితం.
అభిమానము-ద్వేషము-దైన్యము-ప్రియము పరమాత్మ వైపుగా ఎక్కుబెట్టబడినప్పుడు పరమాత్మయే లభిస్తున్నారు. వరసగా ఉద్ధవుడు-శిశుపాలుడు-కంసుడు-వసుదేవుడు అందుకు ఉదాహరణాలు.
28.) తస్యా జ్ఞానమేవ సాధనమిత్యేకే ।
తస్యా జ్ఞానమ్ ఏవ సాధనమ్ ఇతి ఏకే ।
“అట్టి పరాప్రేమను సంపాదించాలంటే జ్ఞానమే ఉత్తమ సాధనము” … అని కొందరి సిద్ధాంతం. (It is one school of thought). జ్ఞానము పుష్పమైతే పరాప్రేమ (భక్తి) ఫలము అని వారి బోధ.
29.) అన్యోన్యాశ్రయమిత్యన్యే ।
అన్యోన్య ఆశ్రయం ఇతి అన్యే ।
“జ్ఞానము వలన భక్తి, భక్తి వలన జ్ఞానము ప్రవృద్ధమౌతూ ఉంటాయి. ఒకటి రెండవ దానిని ఆశ్రయించుకొని ఉంటుంది” … అని మరికొందరి సిద్ధాంతం. (It is another school of thought). జ్ఞానమున్నచోట భక్తి స్వభావసిద్ధం! భక్తి ఉన్నచోట జ్ఞానము స్వభావసిద్ధం!
30.) స్వయం ఫలరూపతేతి బ్రహ్మకుమారః ।
స్వయం ఫలరూపత ఇతి బ్రహ్మకుమారః ।
భక్తి యొక్క ఉత్తమ ప్రయోజనం నిశ్చలమైన భక్తియే. స్వస్వరూపం సంతరించుకోవటమే భక్తి యొక్క అత్యుత్తమ ప్రయోజనం… పరాభక్తిని కలిగి ఉండటమంటే….. తనను తాను పొందటమే! ఇది (బ్రహ్మ కుమారుడైన) నారదుని అభిప్రాయం. సముద్రంలో తరంగం లయమగుచున్నట్లు తాను ఇష్టదైవ విలీనుడవటం.
31.) రాజగృహభోజనాదిషు తథైవ దృష్టత్వాత్ ।
రాజ-గృహ-భోజనాదిషు తథా ఏవ దృష్టత్వాత్ ।
ప్రతి జీవుని వాస్తవ స్వభావం పరాభక్తి తత్త్వమే! తదితరమైనది అస్వభావము.
అందుకు మూడు దృష్టాంతాలు :
32.) న తేన రాజపరితోషః క్షుధాశాంతిర్వా ।
న తేన రాజ, పరితోషః, క్షుధాశాంతిః వా ।
ఆయా దృష్టాంతలు అనుసరించి -
33.) తస్మాత్సైవ గ్రాహ్య ముముక్షుభిః ।
తస్మాత్ స ఏవ గ్రాహ్య ముముక్షుభిః ।
అందుచేత ముముక్షువులంతా (ఏ మార్గంలో పయనిస్తున్నప్పటికీ) తన్మయస్థితి “స్వస్వరూప స్వస్థితి”యే లక్ష్యమైయున్నదని ఎఱిగి ఉండెదరు గాక. స్వభావసిద్ధమైన పరాప్రేమను సంతరించుకొనెదరు గాక!
34.) తస్యాః సాధనాని గాయంత్యాచార్యాః ।
తస్యాః సాధనాని గాయంతి ఆచార్యాః ।
అట్టి పరాప్రేమ స్థితిని (భక్తి స్థితిని) చేరటానికి సంబంధించిన సాధనముల గురించి వివిధ ఆచార్యులు గానం చేస్తున్నారు. జనులకు మార్గం చూపుచున్నారు!
35.) తత్తు విషయ త్యాగాత్ సంగత్యాగాచ్చ ।
తత్ తు విషయ త్యాగాత్, సంగ త్యాగాత్ చ ।
అట్టి ఆయా సాధనముల ద్వారా లౌకిక ప్రాపంచక విషయములను, ఆ విషయములతో ఏర్పడుచున్న సంగమును (Attatchment) జయించటమే ఆచార్యులందరి ఉద్దేశ్యము. సంగమును దాటితే సద్వస్తువే అనుభవమౌతుంది.
36.) అవ్యావృత్తభజనాత్ ।
అవ్యావృత్త భజనాత్ ।
భగవంతుని కొరకై (అంతయు అయి ఉన్న) భగవంతుని అనునిత్యంగా (constantly) భజించటమే అందుకు సాధనం. ఇది కావాలి అని కాకుండా ఏది ఎట్లు వుంటే అదంతా నీవే - అని అకారణోపాసన. “అహం తు అకామః” అంటూ భక్తిని ఆశ్రయించటం!
37.) లోకేఽపి భగవద్గుణశ్రవణకీర్తనాత్ ।
లోకే అపి భగవద్ గుణ శ్రవణ కీర్తనాత్ ।
లౌకిక వ్యవహారాలలో ఉంటున్నప్పటికీ భగవంతుని గుణాదులను శ్రవణం, కీర్తనం చేస్తూ ఉండటం మరొక సాధనం!
పాలలోను, పండులోను, నీటిలోను పరమాత్మ తత్త్వాన్ని గమనించటం. “లోక స్వరూపము లోకేశ్వరునిదే!” అను భావనచే సర్వేశ్వరుని గుణాలే కీర్తించటం!
38.) ముఖ్యతస్తు మహత్కృపయైవ భగవత్కృపాలేశాద్వా ।
ముఖ్యతః తు మహత్ కృపయా ఏవ భగవత్ కృపా లేశాత్ వా ।
ఆ భగవంతుని చేరాలంటే మహాత్ముల కృపకు పాత్రులమవటమే ప్రధాన లక్ష్యం. భగవత్ తత్త్వాన్ని సముపార్జించిన మహనీయులను ఆశ్రయించుటయే ముఖ్యోపాయం. మహాత్ముల కృప భాగవత్ కృప. భగవదనుగ్రహంగా లభించేదే మహనీయులతో సాంగత్యం, సామీప్యత.
39.) మహత్సంగస్తు దుర్లభోఽగమ్యో2మోఘశ్చ ।
మహత్ సంగః తు దుర్లభో అగమ్యో (ఆగమ్యో) అమోఘః చ ।
[అగమ్యో = Unattainable; ఆగమ్యో = To be attained]
మహానీయులతో, భగవద్భక్తులతో (పరా ప్రేమస్వరూపులతో) ఏర్పడే సాంగత్యము దుర్లభము. అది అనిర్వచనీయమైన, అమోఘమైన ప్రయోజనం కలిగి ఉంటుంది. ఎట్లాగైనాసరే, మహనీయుల సామీప్యతను, స్నేహమును, కృపను సంపాదించుకోవాలి!
40.) లభ్యతేఽపి తత్కృపయైవ ।
లభ్యతే అపి తత్ కృపయా ఏవ ।
మహాత్ములతో సాంగత్యము దుర్లభమైనప్పటికీ అది భగవదనుగ్రహం చేత తప్పక లభిస్తుంది. సర్వదా మహనీయుల కృపకు అర్హులవటానికి యత్నించాలి! అది భగవదనుగ్రహమే! ఆ మహనీయులు అకారణ కృపాసాగరులై వుంటారు!
41.) తస్మిస్తజ్జనే భేదాభావాత్ ।
తస్మిన్ తత్ జనే భేద అభావాత్ ।
భగవంతునికి, మహనీయుడైన భగవత్ భక్తునికి భేదం ఉండదు. భక్తుని సమీపించటమంటే భగవంతుని సమీపించటంతో సమానమౌతుంది.
42.) తదేవ సాధ్యతాం తదేవ సాధ్యతామ్ ।
తత్ ఏవ సాధ్యతాం తత్ ఏవ సాధ్యతామ్ ।
అందుచేత, ఎంత కష్టపడైనా సరే! ప్రేమతో, సేవాభావంతో మహనీయులయొక్క సామీప్యతను సంపాదించుకోవాలి. తద్వారా హృదయంలో పరాప్రేమను అనుదినం ప్రవృద్ధం చేసుకోవాలి.
43.) దుఃసంగః సర్వథైవ త్యాజ్యః ।
దుఃసంగః సర్వథా ఏవ త్యాజ్యః ।
దుస్సంగమును ప్రయత్నపూర్వకంగా మొదలంట్ల త్యజిస్తూ క్రమక్రమంగా మహనీయులతో సత్సంగమును అభివృద్ధి పరచుకోవాలి. రెండిటికీ ఒక్కసారే ప్రయత్నించబడును గాక!
44.) కామక్రోధమోహస్మృతిభ్రంశబుద్ధినాశ(సర్వనాశ)కారణత్వాత్ ।
కామ క్రోధ మోహ స్మృతిభ్రంశ బుద్ధినాశ (సర్వనాశ) కారణత్వాత్ ।
ఎందుకంటే దుస్సంగము అల్పాశయపూర్వకమై ఉంటుంది. కోరికలు, ఆ కోరికల వలన క్రోధము, ఆ క్రోధం వలన స్మృతి భ్రంశము (స్వస్వరూప జ్ఞానము యొక్క ఏమఱుపు), దాని వలన బుద్ధి యొక్క అల్పత్వము సంప్రాప్తించే ప్రమాదము పొంచియున్నది. దుస్సంగము సర్వనాశనకారణమై అల్ప జన్మలకు దారితీయగలదు!
45.) తరంగాయితా అపీమే సంగాత్సముద్రాయంతి ।
తరంగాయితా అపి ఇమే సంగాత్ సముద్రాయంతి ।
చిన్న చిన్న తరంగాలే క్రమంగా మహాసముద్రమగుచున్నట్లు - చిన్న చిన్న సంసారిక సాంగత్యాలే క్రమంగా సంసార సాగరంగా రూపు దిద్దుకుంటున్నాయని గమనించబడు గాక!
46.) కస్తరతి కస్తరతి మాయామ్? యః సంగాంస్త్యజతి, యో మహానుభావాన్సేవతే, నిర్మమో భవతి …
కః తరతి, కః తరతి మాయామ్? యః సంగాత్ త్యజతి, యో మహానుభావాన్ సేవతే, (యో) నిర్మమో భవతి …
ఈ మాయను దాటగలిగేది ఎవ్వరయ్యా… అంటే, ఎవ్వరైతే ఇంద్రియ లౌకిక - విషయములతో సంగం త్యజిస్తూ వస్తారో, ఎవ్వరైతే మహానుభావులగు పరాప్రేమ స్వరూపులను ఆశ్రయిస్తూ వస్తారో, ఎవ్వరైతే “ఇది నాది….. అది నాది" అనే మమకారాన్ని రహితం చేసుకుంటూ ఉంటారో…
47.) యో వివిక్తస్థానం సేవతే, యో లోక బంధమున్మూలయతి, (యో) నిస్త్రైగుణ్యో భవతి, (యో) యోగక్షేమం త్యజతి …
యో వివిక్తస్థానం సేవతే, యో లోక బంధం ఉన్మూలయతి, (యో) నిఃత్రైగుణ్యో భవతి, (యో) యోగక్షేమం త్యజతి …
ఎవ్వరైతే ఏకాంత చిత్తులై తమయందే స్వస్వరూపంగా వేంచేసియున్న ఆ భగవంతుని ఆరాధిస్తూ ఉంటారో, లోక బంధములన్నిటికీ అతీతత్వము అలవరచుకుంటూ ఉంటారో, త్రిగుణముల దర్శన పరిధిని దాటివేస్తూ ఉంటారో, యోగక్షేమములనుకునే దృశ్యసంబంధమైన సర్వ విషయాలు అధిగమిస్తూ ఉంటారో…
48.) యః కర్మఫలం త్యజతి, కర్మాణి సంన్యస్యతి - తతో నిర్ద్వంద్వో భవతి …
యః కర్మఫలం త్యజతి, కర్మాణి సంన్యస్యతి - తతో నిర్ద్వంద్వో భవతి …
సర్వ కర్మ ఫలములను (సమర్పిత భావనా బలంచేత) త్యజించివేస్తూ ఉంటారో, కార్యక్రమములన్నీ (నిర్లిప్తదృష్టిచే) సన్యసించి ఉంటారో,… అట్టివారు నిర్ద్వంద్వులై ఏకాంత భక్తిని ఆశ్రయిస్తూ వస్తారో…,
49.) (యో) వేదానపి సంన్యస్యతి; కేవలమవిచ్ఛిన్నానురాగం లభతే …
(యో) వేదాన్ అపి సంన్యస్యతి, కేవలం అవిచ్ఛిన్న అనురాగం లభతే …
ఎవ్వరైతే వేద (శాస్త్ర నియమరూప) పరిధులను కూడా దాటివేస్తూ ఉంటారో, ఇక ఆ పరమాత్మ పట్ల అవిచ్ఛిన్నమైన అనురాగం సంతరించుకుంటూ ఉంటారో…
50.) స తరతి, స తరతి, స లోకాంస్తారయతి ।
స తరతి, స తరతి, స లోకాన్ తారయతి ।
వారు తరిస్తున్నారు, వారు తరిస్తున్నారు! అట్టివారు తమను తాము తరింపజేసుకోవటమే కాకుండా, తదితర సంసార జీవులను కూడా తరింపజేయడానికి శ్రేయో మార్గమగుచున్నారు.
51.) అనిర్వచనీయమ్ ప్రేమస్వరూపమ్ ।
అనిర్వచనీయమ్ ప్రేమస్వరూపమ్ ।
ఆ పరాప్రేమ (పరాభక్తి) యొక్క అనుభూతి “ఇట్టిది" అని మనం మాటలతో నిర్వచించలేం! అది అనిర్వచనీయం. (Non-definable).
52.) మూకాస్వాదనవత్ ।
మూక ఆస్వాదనవత్ ।
మూగవాడు అతిరుచికరమైన ఒక పదార్థాన్ని భుజిస్తూ తదితరులకు ఆ రుచి గురించి ఎట్లా చెప్పగలడు? ఏమని వర్ణించగలడు? పరాభక్తిచే పారవశ్యులైనవారు తమ అనుభూతి గురించి చెప్పటానికి మాటలు లేవు, చాలవు. సంసారదృష్టి వీడనివారికి ఆ రసానుభూతిని వివరించటం అటువంటిది.
53.) ప్రకాశతే (ప్రకాశ్యతే) క్వాపి పాత్రే ।
ప్రకాశతే (ప్రకాశ్యతే) క్వ అపి పాత్రే ।
అది అనుభవిస్తున్న వారికే అర్థమవుతుంది. ఒకానొక శుద్ధాత్ముడగు సత్పాత్రుని యందు అది ప్రకాశిస్తోంది. అతని నుండి లోకములకు ప్రకాశమగుచున్నది. ప్రకాశమును వివరించి చెప్పటానికి మరొకరి అవసరం ఏముంటుంది? భక్తి రుచి తెలిసినవారికే భక్తుల మధురానుభవం తెలియవస్తుంది!
54.) గుణరహితం కామనారహితం ప్రతిక్షణవర్ధమానమవిచ్ఛిన్నం సూక్ష్మతరమనుభవరూపమ్ ।
గుణరహితం, కామనా రహితం, ప్రతి క్షణ వర్ధమానం, అవిచ్ఛిన్నం, సూక్ష్మతరం, అనుభవరూపమ్ ।
ఆ అనుభూతి సత్వ - రజ - తమో గుణ సంబంధమైనది కాదు. అది గుణ రహితమైనది. “ఏదో కావాలి”… అనే సంసారిక భావన లేనట్టిది. ప్రతి క్షణం ప్రవర్ధమాన స్వభావమే కలిగి ఉండేది. (That is ever-blossoming Inner Divinity). విచ్ఛిన్నం (తెంపు) లేనిది. మనోవాక్కుల దృష్ట్యా అత్యంత సూక్ష్మతరమైనది. అది కేవలం అనుభవరూపమే గాని, ఒకరు ఇంకొకరికి చెప్పి తెలిసేటట్లు చేయగలిగేది కాదు. అర్హులైతేనే పరాభక్తి యొక్క ఆనందమును గ్రహించగలరు.
55.) తత్ప్రాప్య తదేవావలోకయతి తదేవ శృణోతి (తదేవ భాషయతి) తదేవ చింతయతి ।
తత్ ప్రాప్య తత్ ఏవ అవలోకయతి, తత్ ఏవ శృణోతి, (తత్ ఏవ భాషయతి), తత్ ఏవ చింతయతి ।
అట్టి మహత్తరమగు పరాభక్తిని సంతరించుకున్న మహనీయులు తమ ప్రియాతిప్రియమగు ఆ భగవంతునే సర్వే - సర్వత్రా అవలోకిస్తూ ఉంటారు. ఆ భగవత్తత్త్వమే అన్ని వైపుల నుండి వారికి వినిపిస్తూ ఉంటుంది. వారి భాష - పరిభాష - భావన- అవగాహన … అంతా కూడా భగవన్మయమై ఉంటుంది. నీవుగా కనిపిస్తున్నది పరమాత్మయే అని గమనిస్తూనే - ఆస్వాదిస్తూనే వ్యవహరిస్తూ ఉంటారు.
56.) గౌణీ త్రిధా గుణభేదాదార్తాదిభేదాద్వా ।
గౌణీ త్రిధా, గుణ భేదాత్, ఆర్తాది భేదాత్ వా ।
ఆ భక్తి యొక్క గౌణీస్థితి (సాధనస్థితి)లో మాత్రమే 1) తామసిక భక్తి 2) రాజసిక భక్తి 3) సాత్విక భక్తి అని …, 1) ఆర్త భక్తి 2) జిజ్ఞాసు భక్తి 3) అర్థార్థి భక్తి … అని భేదాలన్నీ (మధ్యే మార్గంగా) ఉంటాయి. (పరాకాష్ఠయగు “పరాప్రేమ” స్థితిలోకి వచ్చేసరికి అట్టి భేదాలన్నీ సమసిపోతాయి). ఎవరు ఎటువైపునుంచి వచ్చినా కూడా, పరాభక్తిలోతన్మయులౌతారు. సముద్రం చేరిన జలానికి నదీ భేదం ఉంటుందా!
57.) ఉత్తరస్మాదుత్తరస్మాద్పూర్వపూర్వ శ్రేయాయ భవతి ।
ఉత్తరః అస్మాత్ ఉత్తరః అస్మాత్ పూర్వ పూర్వ శ్రేయాయ భవతి ।
ఆ సాధకులు, ఒక్కొక్క మెట్టు ముందుకుపోతూ ఉంటే పూర్వస్థితి కన్నా శ్రేయస్థితి పొందుతూ చివ్వరికి “పరాభక్తి స్థితి” చేరుకుంటూ ఉంటారు. ఆర్తభక్తి క్రమంగా జిజ్ఞాసుభక్తిగాను, అర్థార్థ (ఉత్తమగుణ సంపత్తి) భక్తిగాను అయి, ఆ పై పరాభక్తిగా రూపుదిద్దుకుంటోంది.
58.) అన్యస్మాత్ సౌలభ్యం భక్తౌ ।
అన్యస్మాత్ సౌలభ్యం భక్తౌ ।
భగవంతుని చేరటానికి అనేక మార్గాలు ఉన్న మాట నిజమే. అయితే, ఈ ప్రేమ (భక్తి) స్వభావతః మధురమై అందరికీ అన్నివేళలా సులభసాధ్యమైన మార్గం. జ్ఞానమార్గం, క్రియా యోగ మార్గం ఇత్యాదులకన్నా భక్తిమార్గం సులభతరం!
59.) ప్రమాణాంతరస్యానపేక్షత్వాత్, స్వయం ప్రమాణత్వాత్ ।
ప్రమాణాంతరస్య అనపేక్షత్వాత్, స్వయం ప్రమాణత్వాత్ ।
(జ్ఞాన - యోగాదులైతే వాటియొక్క ప్రవృద్ధికి వేరే ఏదైనా ప్రమాణం కావలసి రావచ్చు). భక్తికి వేరే ప్రమాణం అక్కరలేదు. సర్వము ప్రేమాస్పదం అగుచుండటమే భక్తికి ప్రమాణము. జ్ఞానమునకు భక్తి ప్రమాణం. కానీ భక్తికి మాత్రం భక్తియే ప్రమాణం!
60.) శాంతిరూపాత్పరమానందరూపాచ్చ ।
శాంతి రూపాత్, పరమానంద రూపాత్ చ ।
భక్తి యొక్క రూపమైన పరమశాంతి పరమానంద రూపము సంతరించుకొనుచుండటమే భక్తి యొక్క ప్రవృద్ధికి ప్రమాణం. పరాభక్తి స్వయముగా పరమశాంతి, పరమానంద రూపము అయి ఉన్నది.
61.) లోకహానౌ చింతా న కార్యాః నివేదితాత్మ లోకవేదత్వాత్ (లోకవేదశీలత్వాత్) ।
లోకహానౌ చింతా న కార్యాః నివేదితాత్మ లోకవేదత్వాత్ (లోకవేదశీలత్వాత్) ।
అట్టి మార్గంలో సాధన కొనసాగాలంటే లోకహాని కలిగించే చింతలను (ఇతరులకు బాధ కలిగించే వ్యవహారాలను) రహితం చేసుకుంటూ రావాలి. ఆ పరమాత్మయే ఈ కనబడే సర్వ దేహాలుగా, సర్వ చరాచర సృష్టిగా దర్శించటమే ఆత్మ నివేదన అవుతుంది. ప్రతి క్రియ ప్రేమరసముచే ముంచివేయబడి ఉండుగాక. పరిసరములు ప్రేమతో నింపబడుతాయి. వారు లోకమునకు సానుకూలురుగానే వుంటారుగాని, ప్రతికూలురుగా కాదు!
62.) న తత్సిద్ధౌ లోకవ్యవహారో హేయః కింతు ఫలత్యాగస్తత్సాధనం చ కార్యమేవ ।
న తత్ సిద్ధౌ లోకవ్యవహారో హేయః, కిం తు ఫలత్యాగః తత్ సాధనం చ కార్యం ఏవ ।
అట్టి భక్తిని సిద్ధించుకున్నవారు లోక వ్యవహారాలను, లౌకిక ధర్మాలను హేయంగా చూస్తారా? లేదు! భక్తియొక్క పరాకాష్ట స్థితి కర్మఫల త్యాగమే అవుతుంది. కనుక వారు నిర్వర్తించే కార్యములన్నీ కర్మఫలత్యాగ రూపంగా సమర్పిస్తారు. కాబట్టి వారికవి భక్తి యోగ సాధనాలే అగుచున్నాయి. పరాభక్తికి కర్మలు త్యజించవలసిన అగత్యమేదీ లేదు. కర్మఫల సమర్పణయే ఉంది!
63.) స్త్రీ ధన నాస్తిక (వైరి) చరిత్రం న శ్రవణీయమ్ ।
స్త్రీ ధన నాస్తిక (వైరి) చరిత్రం న శ్రవణీయమ్ ।
అయితే సాధకులు “కామము - ధనము - దైవ తిరస్కారం”… ఇటువంటి సంగతులను మననం చేయకుండా వాటికి దూరంగా ఉండటమే మంచిది. అట్టివారి గురించి మాట్లాడుకోకపోవడం ఉచితం. అట్టి సంగతుల సంభాషణ వలన బుద్ధి చంచలత్వం
పొందుతూ వుంటుంది కదా!
64.) అభిమానదంభాదికం త్యాజ్యమ్ ।
అభిమాన దంభ ఆదికం త్యాజ్యమ్ ।
అభిమానము - దంభము (కామము - క్రోధము - లోభము మొదలైనవి) ఎంత వేగంగా వీలైతే అంత త్వరగా వదిలివేస్తూ ఉండాలి. అభిమానము - దురభిమానము - దంభము మొదలైనవి పరా ప్రేమకు, పరా భక్తికి అడ్డు.
65.) తదర్పితాఖిలాచారః సన్ కామక్రోధాభిమానాదికం తస్మిన్నేవ కరణీయమ్ ।
తత్ అర్పిత అఖిల ఆచారః సన్, కామ క్రోధ అభిమాన ఆదికం తస్మిన్ ఏవ కరణీయమ్ ।
సర్వ ఆచార - విచారములు ఆ భగవంతునికే సమర్పణ చేయాలి. కామ-క్రోధ-అభిమానాదులన్నీ ఆ భగవంతుని వైపుగా తరలించబడాలి. ఆయనయందు లయం చేయాలి.
[ఎవడబ్బ సొమ్మని కులుకుచు తిరిగేవు, రామచంద్రా?…. అని భక్త రామదాసు ప్రశ్నించలేదా!]
66.) త్రిరూపభంగపూర్వకం నిత్యదాసనిత్యకాంతాభజనాత్మకం వా ప్రేమైవ కార్యమ్ ప్రేమైవ కార్యమ్ ।
త్రిరూపభంగపూర్వకం నిత్యదాస నిత్యకాంతా భజనాత్మకం వా, ప్రేమ ఏవ కార్యమ్, ప్రేమ ఏవ కార్యమ్ ।
క్రమంగా “భక్తుడు - భక్తి - భజింపబడునది" అనే త్రిపుటిని దాటి వేయుచుండగా అతడు కేవల ప్రేమ స్వరూపుడు అగుచున్నాడు. అతని నిత్యదాస్యము క్రమంగా అవ్యాజమానమగుచున్నది. అతని ప్రేమ స్వభావసిద్ధము-అకారణముగా రూపుదిద్దుకుంటోంది! ప్రేమాస్పదుడు ప్రేమరూపుడు అగుచున్నాడు! (His Divine Love state is unconditional and for no purpose).
67.) భక్తా ఏకాంతినో ముఖ్యాః ।
భక్తా ఏకాంతినో ముఖ్యాః ।
(హృదయాంతరాలలో) “కేవల ప్రేమ (Absolute Love)” ఏర్పడుచుండగా అట్టివారు “ఏకాంత భక్తులు” అని పిలువబడుచున్నారు. సర్వేసర్వత్రా పరమాత్మగా దర్శించేవారు ఏకాంత భక్తులుగా చెప్పబడుచున్నారు. ఏకాంత భక్తియే ముఖ్యాశయం!
68.) కంఠావరోధరోమాన్చాశ్రుభిః పరస్పరం లపమానాః పావయంతి కులాని పృథివీం చ ।
కంఠ అవరోధ రోమాన్ చ అశ్రుభిః పరస్పరం లపమానాః, పావయంతి కులాని పృథివీం చ ।
అట్టి పరాభక్తులు (ఒకచోట కలిసినప్పుడు) పరమాత్మ గురించి సంభాషించుకొనునప్పుడు వారి గొంతు ప్రేమభావావేశం చేత దగ్గుత్తిక పొందటం, కళ్ళు చమర్చటం జరుగుతూ ఉంటుంది. వారి మాటలు, చేతలు భక్తి రసపూరితమై ఉంటాయి. వారు చూపుమాత్రంచేత
దుష్కృతులను కూడా పునీతులుగా తీర్చిదిద్దుతూ ఉంటారు. వారు తాము జన్మించిన వంశాన్ని, ఈ పృథివినీ తమ ఉనికిచే పరమ పావనం చేస్తూ ఉంటారు.
69.) తన్మయాః ।
తన్మయాః ।
వారెక్కడుంటే అక్కడ (ఆ పరిసరాలన్నీ) వారి మహిమచే పరమ పవిత్రమై ఉంటాయి. వారు భగవత్స్వరూపులే అగుచున్నారు. పువ్వు ఉన్నచోట పరిమళము వెదజల్లబడునట్లు, వారున్నచోట అవ్యక్తానందం వెల్లివిరుస్తూనే వుంటుంది.
70.) తీర్థీ కుర్వన్తి తీర్థాని, సుకర్మీ కుర్వన్తి కర్మాణి, సచ్ఛాస్త్రీ కుర్వన్తి శాస్త్రాణి ।
తీర్థీ కుర్వన్తి తీర్థాని, సుకర్మీ కుర్వన్తి కర్మాణి, సత్ శాస్త్రీ కుర్వన్తి శాస్త్రాణి ।
వారు తాముండే ప్రదేశములను తమ ఉనికిచే తీర్థములుగా చేస్తున్నారు. కర్మలన్నిటినీ సుకర్మలుగా మార్చివేస్తూ వుంటారు. శాస్త్రములను తమ భాష్య - ప్రవచనములచే సత్ శాస్త్రములుగా (జనులచే) సదుపయోగింపజేయగలరు.
71.) మోదన్తే పితరో, నృత్యన్తి దేవతాః సనాథా చేయం భూర్భవతి ।
మోదన్తే పితరో, నృత్యన్తి దేవతాః, సనాథా చ ఇయం భూః భవతి ।
వారి పిత్రుదేవతలు వారిని కన్నందుకు పరమానందం పొందుతూ ఉంటారు. దేవతలు కూడా ఆత్మానందభరితులై వారున్న చోట నాట్యం చేస్తూ ఉంటారు. అట్టి పరాప్రేమ స్వరూపుల మహిమ చేతనే ఈ భూమి సురక్షితమై ఉంటోందని గ్రహించబడు గాక!
72.) నాస్తి తేషు జాతివిద్యారూపకులధనక్రియాదిభేదః ।
నాస్తి తేషు జాతి, విద్యా, రూప, కుల, ధన, క్రియాది భేదః ।
అట్టి పరాప్రేమ స్వరూపులకు జాతి - విద్య - కుల - ధన - క్రియాది నిర్ణయాలు ఉండవు. ("ఈ జాతిలోనే - ఈ మతంలోనే - ఈ క్రియలు నిర్వర్తించేవారిలోనే అటువంటివారు ఉంటారు”… మొదలైనవన్నీ ఆపాదించలేం). పరాభక్తి జాతి-మత-కులాలను అనుసరించి వుండేది కాదు. అది అలౌకికమైన స్వమనోవికాస రూపం కదా! పరస్పర మత దూషణ పనికిరాదు! అదంతా పరాభక్తికి అడ్డుగోడలు!
73.) యతస్తదీయాః ।
యతః తదీయాః ।
వారెక్కడుంటే అదే భగవంతుని పెన్నిధి, సన్నిధి. పరాప్రేమకు పరాప్రేమయే సాటి!
74.) వాదో నావలంబ్యః ।
వాదో న అవలంబ్యః ।
(భగవత్ భక్తుల గురించి గాని, తత్త్వ విషయములు - మార్గముల గురించి గాని, ఆ సర్వాత్మకుడగు భగవానుని గురించి గాని) వాదోపవాదములలోకి ప్రవేశించటం ఉచితం కాదు. మార్గ విధివిధానములలోని చిన్న తేడాలను పెద్దవి చేసుకొని వాదించుకోవటం - పరస్పర దూషణ ఉచితం కాదు!
75.) బాహుల్యావకాశాదనియతత్వాచ్చ ।
బాహుల్య అవకాశాత్, అనియతత్వాత్ చ ।
ఎందుకంటే పరమాత్మ సర్వదా ఒక్కడే అయినప్పటికీ, (బుద్ధి - భక్తులను అనుసరించి) వివిధ రూపాదులచే, (కర్మ - జ్ఞాన - యోగాదులను అనుసరించి) వివిధ మార్గములుగా భక్తి సాధన, జిజ్ఞాసన కొనసాగించటం ఈ ప్రపంచంలో జరుగుతూనే ఉంటుంది. వాదోపవాదములు పెంచినకొలదీ పెరుగుతాయి గాని నిర్దిష్టమైన అవధి లభించదు. అన్ని మార్గాలు పరాభక్తికే దారి తీస్తున్నాయి. (నదీనాం సాగరో గతీ!).
76.) భక్తిశాస్త్రాణి మననీయాని తదుద్బోధకకర్మాణ్యపి కరణీయాని ।
భక్తిశాస్త్రాణి మననీయాని తత్ ఉద్బోధక కర్మాణి అపి కరణీయాని ।
భగవంతునిపై భక్తిని ప్రబోధించే (ప్రవృద్ధపరచే) శాస్త్రాలను మననం చేయటం, ఆ శాస్త్రాలు ఉద్బోధిస్తున్న కార్యక్రమములను ఆశ్రయించటం, భక్తుల కథలను శ్రవణం చేయడం సాధకులకు ఉచితమై ఉన్నది.
77.) సుఖదుఃఖేచ్ఛాలాభాదిత్యక్తో కాలే ప్రతీక్ష్యమాణే క్షణార్ధమపి వ్యర్థం న నేయమ్ ।
సుఖ దుఃఖ ఇచ్ఛా లాభాది త్యక్తో, కాలే ప్రతి ఈక్ష్యమాణే క్షణార్ధం అపి వ్యర్థం న నేయమ్ ।
ప్రాపంచకమైన సుఖ - దుఖ - ఇచ్ఛ - లాభాది వ్యవహారాలు మాట్లాడుకుంటూ సమయం వృథా పరచుకోరాదు. (ఆయుష్ష అనేది పరమాత్మ ఇచ్చిన వరం). కాలాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అర్ధక్షణం కూడా వృథా చేసుకోకూడదు.
78.) అహింసాసత్యశౌచదయాస్తిక్యాదిచారిత్ర్యాణి పరిపాలనీయాని ।
అహింసా సత్య శౌచ దయ ఆస్తిక్యాది చారిత్ర్యాణి పరిపాలనీయాని ।
అహింస - సత్యము - శుచి - దయ - భక్తి … వీటిని ప్రవృద్ధపరచే కార్యక్రమములు, సంగతులు మరల మరల ఆశ్రయిస్తూ ఉండాలి.
79.) సర్వదా సర్వభావేన నిశ్చింతైర్భగవానేవ భజనీయః ।
సర్వదా సర్వభావేన నిశ్చింతైః (చిత్త:), భగవాన్ ఏవ భజనీయః ।
లౌకికమైన అన్ని చింతలు వదలి సర్వదా సర్వభావములచే ఆ పరమాత్మనే భజించాలి. ఉపాసించాలి. “సర్వము ఆయనయే” అని దర్శించాలి.
80.) స కీర్త్యమానః శీఘ్రమేవావిర్భవతి అనుభావయతి చ భక్తాన్ ।
స కీర్త్యమానః (కీర్తనీయః) శీఘ్రం ఏవ ఆవిర్భవతి అనుభావయతి చ భక్తాన్ ।
అట్లా కీర్తన (ఆరాధన) చేస్తూ ఉండగా అతి శీఘ్రంగా హృదయంలోనే ఆ పరాభక్తి యొక్క అనుభవం ఆవిర్భవించగలదు.
81.) త్రిసత్యస్య భక్తిరేవ గరీయసి భక్తిరేవ గరీయసి ।
త్రి సత్యస్య భక్తిః ఏవ గరీయసి, భక్తిః ఏవ గరీయసి ।
త్రికాల సత్యమైనట్టి పరమాత్మ వైపుగా సంతరించుకునే భక్తియే అత్యుత్తమమైనది. భక్తి-జ్ఞాన-యోగ మార్గములలో భక్తి మార్గము సులభము. ఉత్తమము.
82.) గుణమాహాత్మ్యాసక్తి రూపాసక్తి పూజాసక్తి స్మరణాసక్తి దాస్యాసక్తి సఖ్యాసక్తి కాంతాసక్తి వాత్సల్యాసక్తి ఆత్మనివేదనాసక్తి తన్మయతాసక్తి పరమవిరహాసక్తి రూపధాప్యేకా (రూపైకధాప్యేకా) ఏకదశధా భవతి ।
గుణమాహాత్మ్య ఆసక్తి, రూప ఆసక్తి, పూజ ఆసక్తి, స్మరణ ఆసక్తి, దాస్య ఆసక్తి, సఖ్య ఆసక్తి, కాంత ఆసక్తి, వాత్సల్య ఆసక్తి, ఆత్మనివేదన ఆసక్తి, తన్మయత ఆసక్తి, పరమవిరహ ఆసక్తి రూపధా అపి ఏకా (రూప ఏకధా అపి ఏకా) ఏకదశధా భవతి ।
భక్తి (ప్రేమ) యొక్క ఏకాదశ [11] ఆసక్తులు - గుణ విశేషాలు -
ఇవన్నీ ఒకే భక్తి యొక్క పదకొండు రూపములు మాత్రమే.
83.) ఇత్యేవం వదంతి జనజల్పనిర్భయా ఏకమతాః కుమారవ్యాసశుకశాండిల్యగర్గవిష్ణుకౌండిన్యశేషోద్ధవారుణిబలిహనుమద్విభీషణాదయో భక్త్యాచార్యాః ।
ఇతి ఏవం వదంతి జనజల్పనిర్భయా ఏకమతాః కుమార వ్యాస శుక శాండిల్య గర్గ విష్ణు కౌండిన్య శేష ఉద్ధవ ఆరుణి బలి హనుమత్ విభీషణ ఆదయో భక్తి ఆచార్యాః ।
సనత్కుమారుడు - వ్యాసుడు - శుకుడు - శాండిల్యుడు - గర్గ - విష్ణువు - కౌండిన్యుడు - శేషుడు - ఉద్ధవుడు - అరుణి - బలి - హనుమ - విభీషణుడు మొదలైన పరాభక్తి శిఖామణులంతా ముక్తకంఠంతో భక్తి యొక్క మహత్మ్యాన్ని స్వయం దృష్టాంతపరంగా ప్రకటిస్తున్నారు. తదితరములన్నీ మధ్యే మార్గములేనని లోకాలకు చాటుచున్నారు. వారి జీవిత విధానాలే పరాభక్తికి సోదాహరణాలు.
84.) య ఇదం నారదప్రోక్తం శివానుశాసనం విశ్వసితి శ్రద్ధత్తే (స భక్తిమాన్ భవతి) స ప్రేష్ఠం లభతే స ప్రేష్ఠం లభత ఇతి ।
య ఇదం నారద ప్రోక్తం, శివ అనుశాసనం విశ్వసితి శ్రద్ధత్ తే - (స భక్తిమాన్ భవతి) స ప్రేష్ఠం లభతే, స ప్రేష్ఠం లభత ఇతి ।
శ్రీ నారద ప్రోక్తమైన, శివానుశాసనమైన ఈ భక్తి సూత్రములు విశ్వాసముతో, శ్రద్ధతో గ్రహించేవారు భక్తి యొక్క పరాకాష్ఠయగు శోభను, కళ్యాణమును పొందగలరు.
లోక కళ్యాణమస్తు ।
ఓం శాంతిః శాంతిః శాంతిః ॥
🙏