వ్యాస కర్త: యేలేశ్వరపు హనుమ రామకృష్ణ


పునర్జన్మ ఉన్నదా? లేదా?

“పునర్జన్మ ఉన్నదా? లేదా?” ఈ విషయం గురించి -

అయితే……

వేదాంత శాస్త్రము (లేక) భారతీయ తత్త్వ శాస్త్రము దృష్ట్యా ఈ ప్రశ్నకు సమాధానమేమిటో పరిశీలిద్దాము.

ఒక ఇద్దరు స్నేహితులు ఒక నాటకం చూడటానికి వెళ్ళారు. ఆ నాటకంలోని కథా సంఘటనలను ఎంతో తన్మయత్వంగా ఆస్వాదిస్తున్నారు. ఇంతలో మొదటి స్నేహితుడు రెండవ వానితో ఇట్లా అంటున్నాడు.

మొదటివాడు:  మిత్రమా ! ఈ నాటిక భలే ఉన్నదే! అది సరే గాని, ఈ నాటకం తరువాత మరొక నాటకం ఉంటుందా ఎక్కడన్నా?

రెండవ వాడు:  ఆ! మనం ఇంకో నాటకం చూడటానికి వెళ్ళితే, ఉంటుంది. ఎందుకుండదూ?

మొదటివాడు:  ఇంకొక నాటకానికి మనం వెళ్ళకపోతేనో?

రెండవ వాడు:  ఇంకొక నాటకం చూడటానికి మనం వెళ్ళకపోతే,…… ఆ మరొక నాటకం మనకెందుకుంటుంది?

పునర్జన్మ కూడా మరొక నాటకం చూడటానికి-నటించటానికి వెళ్ళటం వంటిదే!

మనమందరము ఈ దేహముతో ఈ జీవితమును ప్రారంభిస్తున్నాము. అంతేగాని, ఈ దేహముతో మనము ప్రారంభమవటం లేదు! అనగా మనం ఈ దేహము కన్నా ముందే ఉన్నాము. తరువాత ఉంటాము!

శ్లో॥ దేహే జాతే న జాతోఽసి. దేహే నష్టే న నస్యఽసి ।
త్వమాత్మా అకలంకాత్మ దేహస్తవ న కశ్చన ॥ [యోగవాసిష్ఠం]

“దేహము నీది కాని, నీవు దేహమువు కావు. దేహము కన్నా మునుముందే ఉన్నావు. తరువాత ఉంటావు! అసలు నీవు దేహముగ అవటమే లేదు!”.

దేహాన్ని మనము కదలిస్తున్నాము. దేహము మనలని కదల్చటం లేదు. మనలో ప్రతి ఒక్కరం ఈ దేహమును కదల్చేవాళ్ళము. ‘దేహి’ స్వరూపులం. ఈ దేహమో?…….. కదల్చబడేది. కదలించే వాడు కదలించబడే వస్తువు కంటే మునుముందే ఉంటాడు కదా! ఉండి తీరాలి! మనందరికీ సంకల్పము అనేది మనయొక్క ఉపకరణము (లేక) కళ (Instrument / Art). అట్టి సంకల్పవిన్యాసముచే ఈ దేహము అనే యంత్రమును ఉపయోగించి శబ్ద-స్పర్శ-రూప-రస-గంధాలు ఆస్వాదిస్తున్నాము.

ఒక వాహనం నడిపే ప్రావీణ్యత గలవాడు అటువంటి అనేక వాహనాలు నడుపగలడు కదా! ఒక దేహమును ఉపయోగించే నిపుణత గలవాడు ఆ రీతిగానే అనేక దేహాలు ’కాలము’ అనే ప్రదేశంలో వివిధ కాలాలలో నడుపగలడు.

మనమంతా ‘దేహధారణ’ అనే కళా ప్రదర్శనను జగన్నాటకంలో నిర్వర్తిస్తున్న కళా నిపుణులం. కళా ప్రదర్శకులం. We are all artists acting in this World of Drama.

జాతస్య హి ధృవో మృత్యుః,   ధృవం జన్మ మృతస్య చ - అని భగవద్గీతా వాక్యం.

మనమంతా ఒక దేహము నుండి మరొక దేహానికి ప్రయాణిస్తూ ఉన్న బహుదూరపు బాటసారులం!

ఐతే, ‘దేహాలు’ అనే ప్రహసనం ప్రారంభించటానికి మునుముందే సత్ (ఉనికి) స్వరూపులమై ఉన్నాం. మనం ఉంటేనే దేహము-దేహ పరంపరలు. “దేహం ఉంటేనే మనం ఉండటం” అనేది కుదిరే వాక్యం కానే కాదు.

ఉండటము ‘Sense that I exist’ (సత్), తెలుసుకోవటము ‘Sense that I am knowing’ (చిత్), ఆనందించటము ‘Sense that I am Enjoying’ (ఆనందము) - మనమంతా సత్-చిత్-ఆనంద స్వరూపులం.

దేహధారణ మనయొక్క స్వభావం! ఈ దేహము మన సత్ చిత్ ఆనంద విన్యాస విభాగము.

ఒక సందర్భంలో శ్రీరాముడు తన సద్గురువైన వసిష్ఠుల వారిని ఇట్లా ప్రశ్నించారు. [యోగవాసిష్ఠము]

“ఈ దేహము కన్నా మునుముందే మనముండి ఉంటే, అప్పటి ఆ దేహ సంబంధాలు ఇప్పుడు జ్ఞాపకంలో లేవేం?”

ఈ ప్రశ్నకు శ్రీ వసిష్ఠ మహర్షి సమాధానం వినండి!

మొన్నరాత్రి మనకు ఒక కల వచ్చింది అనుకో! కొందరు మిత్రులు - బంధువులు - సంఘటనలు - సందర్భములు - సంబంధాలు ఆ కలలో ఆస్వాదించాం. తెల్లవారింది. మెళకువ వచ్చింది. కలలో కనిపించిన వారంతా మెళకువ వచ్చేసరికి ఎక్కడకి పోతున్నారు? స్వప్నంలో కనిపించిన వారు వాస్తవంగా ఉండి ఉంటే కదా, ఎటయినా పోవటానికి? ఈ జాగ్రత్‌ కూడా స్వప్నం వంటిదే!

నిన్న కలలో కనిపించిన వారు ఈ రోజు రాత్రి కలలో కనిపిస్తున్నారా? ఆ సంబంధాలు కొనసాగుతున్నాయా? లేదు కదా. ఎందుచేత? అవన్నీ ఉహా సమూహాలే కదా! క్రితం జన్మ సంబంధాలు - ఈ జన్మ సంబంధాలు కూడా - నిన్న కలలోని అనుభూతులు - ఈ రోజు కలలోని అనుభూతులు పరస్పర సంబంధం వంటిది!

మరొక విషయం. జాగ్రత్‌లో ప్రాప్తించేవన్నీ జాగ్రత్ ద్రష్ట యొక్క ఊహ - అభిరుచి - అభిప్రాయముల బాహ్య ప్రదర్శనా రూపములే! అనగా, ఈ బాహ్యంగా కనిపించే జగత్తు - అంతరంగంలో మనం చూస్తున్న మన జాగ్రత్‌ స్వప్న విన్యాసమే!

మెళకువ నుండి నిద్రలోకి జారి కలలో ప్రవేశించటం, కలలోంచి తిరిగి మెళుకువకు రావటం ఎటువంటిదో ఇప్పటి ఈ జాగ్రత్‌ దర్శనము, ముందుముందటి జాగ్రత్‌ దర్శనా పరంపరలు అటువంటివే! వాటినే ‘పునర్జన్మలు అని అంటున్నాము. అనగా పునర్జన్మలు స్వప్న పరంపరలు వలే స్వభావసిద్ధంగా ఉండియే ఉంటాయి.

ఇక్కడ చనిపోయినవాడు ఇక్కడ నుంచి ఎక్కడికి పోతున్నాడు?

ఈ ప్రశ్నకు అమృతబిందు ఉపనిషత్ చమత్కారంగా సమాధానం చెపుతోంది. వినండి.

ఘట సంవృతమ్ ఆకాశం, నీయమానే ఘటే యథా ।
ఘటో నీయత న ఆకాశః, తద్వత్ జీవో నభోపమః ॥

ఒకానొకచోట ఒక కుండ ఉన్నది. ఎవరో ఏదో పని మీద అక్కడికి వచ్చి ఆ కుండను చేతులతో పట్టుకుని ఎందుకో కొంత దూరం తీసుకపోయి ఆ మూల ఉంచారనుకుందాం. ఒకచోట ఉన్న కుండ మరోచోటకి మారింది. సరే! మరి కుండ ఉన్న ఆకాశం (Space where the pot is placed) మరొక చోటికి కొనిపోబడుతోందా? లేదు!

ఈ ‘దేహము’ అనే కుండ ఒక చోటు నుండి మరొక చోటికి ప్రయాణించవచ్చు గాక! లేదా ఎప్పుడో పగుల వచ్చుగాక! ఆత్మాకాశస్వరూపులమగు మనకు రాక - పోకలు లేవు.

నేను ఇంట్లో ఉన్నప్పుడు, కార్యాలయంలో ఉన్నప్పుడు, ఆశ్రమంలో ఉన్నప్పుడు, బాటలో ఉన్నప్పుడు, నేను నేనుగానే ఉన్నాను కదా!

అత్మకు దేహానికి ఉన్న సంబంధం ఆకాశానికి - కుండ (Space and Pot)కు ఉన్న సంబంధం వంటిది! దేహాలు రావచ్చు, పోవచ్చు! ‘దేహి ’ (Owner or User of the body) ఎక్కడినుంచీ ఇక్కడికి రాడు! ఇక్కడినుండి ఎక్కడికీ వెళ్ళడు! అట్టి దేహియే (Owner or User) ‘ఆత్మగా’ పిలువబడుచున్నాడు.

మనలో ప్రతి ఒక్కరికీ ‘4’ విధములైన దేహాలు ఉన్నాయి.

1. స్థూల దేహం (The form of matter - Physical Body)
2. సూక్ష్మదేహం (The form of views, opinions, feelings, interests, expectations, emotions, avocations etc., - Thought Body)
3. కారణ దేహం / సంస్కార దేహం (The form / personality formed because of habitual series of thoughts / avocations - Habit Body)
4. ఆత్మ దేహము (The mover of body / One who is feeling / One who is ever present as ‘SELF’)

మృత్యువు అనేది స్థూల దేహమునకు సంబంధించినది మాత్రమే. Death is something that relates to physical body only.

పరమాత్మ అనగా?

పరమాత్మ స్వరూపులమగు మనము ‘జగత్తు’ (జాగ్రత్) అనే స్వప్న సదృశమైన కల్పనా విభాగంలో లీలగా క్రీడగా సంచరిస్తూ ’జీవాత్మ’గా నటిస్తున్నాం.

మన యొక్క పరతత్త్వము (Original form / State )ను గ్రహించి - గమనించి ఆస్వాదించటానికి ఈ విశ్వము ఒక విద్యాలయము వంటిది. ఇదంతా విశ్వవిద్యాలయము. This Universe is the University for learning the nature of our ‘Self’ beyond our role and placement in this World.

సారాంశము:

  1. మనమంతా సర్వదా ఆత్మ స్వరూపులం. పరమాత్మ స్వరూపులం. సదా శివ స్వరూపులం.
  2. మన సమక్షంలో దేహముయెక్క రాకపోకలు జరుగుచున్నాయి.
  3. మనము దేహముచే పరిమితులముగాము. అఖండ - అప్రమేయ - నిత్య - సత్య - పరతత్త్వ స్వరూపమే మన సహజ రూపము - స్వభావము కూడా!

ఇక కష్టాల గురించి ఒక్కమాట చెప్పుకోవాలంటే….

1. ఈ కష్టాలు వాళ్ళవలనో వీళ్ళవలనో వస్తాయి. వారు అట్టివారు వీరు ఇట్టివారు అని అనుకోవటం. ఇది తమోగుణ లక్షణం. అల్పజన్మలకు త్రోవ.
2. ఇతఃపూర్వపు మన దోష కర్మలవలనే కష్టాలు వస్తాయి! అందుకని ఇప్పుడు ఉత్తమ కర్మలు ఆశ్రయించాలి అని అనుకోవటం. ఇది రజోగుణ లక్షణం. వీరు మరల విజ్ఞానార్జనకు అర్హమైన మానవ జన్మలు పొందుతారు.
3. కష్టాలన్నీ అత్మసాక్షాత్కారము అనే విద్యను నెరవేరటానికి ఉపకరణాలు - పాఠ్యాంశాలు అని అనుకోవటం. ఇది సత్వగుణ లక్షణం. ప్రజ్ఞను సునిశితపరచే మార్గం.
4. ఇక్కడి కష్ట - సుఖాలు, సంబంధాలు, సందర్భాలు నాకు సంబంధించినవి కావు. జగన్నాటకంలోని పాత్రకు సంబంధించినవి. అవన్నీ సందర్భములను అనుసరించి ఉంటాయి. సహజమగు ఆత్మను స్పృశించవు. నేను ఒక నాటకంలో నటిస్తుంటే, ఆ పాత్ర లక్షణాలు నావి అవుతాయా? లేదు! ఇది గుణాతీత లక్షణం. క్రమంగా ఈతడు జన్మలకు, కర్మలకు అతీతుడై కేవల సాక్షిగా అత్మస్వరూపుడుగా సర్వము దర్శిస్తూ ఉంటాడు. మెక్షస్వరూపుడై జన్మలను క్రీడగా, లీలగా ఆస్వాదిస్తూ ఉన్నాడు.

సాత్విక భావాలు, శాస్త్రోచితమైన సాధనలు, లోకానుకూలమైన కర్మలు మనలకు క్రమంగా ఇహస్వరూప పరిమిత భావన నుండి ‘ఆత్మౌపమ్యేవసర్వాత్రా సమం పశ్యతి’ అనే అలౌకికానందానికి ప్రయాణించే మార్గాలు, ఉపకరణాలగుచున్నాయి. ‘తత్ త్వమ్, సోఽహమ్’ యెక్క నిశ్చితార్థాన్ని సుస్పష్టపరచుచున్నాయి.


శుభం భూయాత్!
🙏