[[@YHRK]] [[@Spiritual]]
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బహ్మసూత్ర భాష్యే
సంస్కృత మూలము : శ్రీ వ్యాసమహర్షి విరచిత శ్రీమద్భాగవత ఏకాదశస్కంధాంతర్గతము
అధ్యయన విద్యార్థి , రచన : యేలేశ్వరపు హనుమ రామకృష్ణ
[Chapters 1 to 5 out of total 46]
విషయ సూచిక :
[Back Page]
శ్లో॥ దోషబుద్ధ్యోభయాతీతో నిషేధాత్ న వివర్తతే ।
గుణబుద్ధ్యా చ విహితం న కరోతి యథా అర్భకః ॥ (అధ్యా 7 శ్లో.11)
తా. దోషము - నిషేధము ఇవన్నీ ఆత్మజ్ఞాని సమక్షములో బాలా లీలా వినోదములే !
శ్లో॥ మల్లక్షణమిమం కాయం లబ్ద్వామద్ధర్మ ఆస్తితః ।
ఆనందం పరమాత్మానం ఆత్మస్ధం సముపైతి మామ్ ॥ (అధ్యా 26 శ్లో.1)
తా. పరమాత్మనగు నా తత్త్వమును గ్రహించి, ఆశ్రయించి, ప్రవేశించటమే మానవ జన్మ యొక్క సాఫల్యము.
శ్లో॥ విసృజ్య స్మయమానాన్ స్వాన్ దృశం వ్రీడాం చ దైహికీమ్ ।
ప్రణమేద్దండవత్ భూమావ అశ్వచాండాలగోఖరమ్ ॥ (అధ్యా 29 శ్లో.16)
తా. ఇతరుల పరిహాసాలను లెక్క చేయక ఒక గుఱ్ఱము - చండాలుడు - ఆవు - గాడిదకు కూడా పరమాత్మ భావనతో నమస్కరిస్తూ ఉండు.
Page number:1
అధ్యాయము–1.) దేవతల రాక
|
శ్రీ శుకదేవుడు : ఓ పరీక్షన్మహారాజా! భగవంతుడగు శ్రీ కృష్ణపరమాత్మ భక్తుడు, మిత్రుడు అగు ఉద్ధవునికి బోధించిన “పరమహంస విశేషము - బ్రహ్మసూత్ర భాష్యము” అని ప్రశంసించబడుచున్న విశేషములతో కూడిన “పరతత్వ విచారణ - గురు నిర్వచన” ఇత్యాది విషయముల గురించి చెప్పుచున్నాను.
మనం మననం చేసుకోబోయే ఈ విశేషాలు జీవుని సంసార సాగరము నుండి తరింపజేయగలవు. అందుచేత, ఓ మహారాజా! ఓ సర్వ సభికులారా! అందరు దయచేసి శ్రద్ధగా వినండి.
ఒకానొక రోజు సర్వలోక శుభంకరము పమరమానందప్రదము అగు శ్రీకృష్ణ భగవానుని దివ్య రూప సందర్శనము కొరకై బ్రహ్మ దేవుడు, రుద్రభగవానుడు ద్వారకకు వేంచేశారు. వారిని అనుసరించి ఇంద్రుడు, మరుత్తులు, ద్వాదశాదిత్యులు, అష్టవసువులు, అశ్వనీ దేవతలు, ఏకాదశ రుద్రులు, సిద్ధులు, అనేకమంది పితృదేవతలు మొదలైన దేవతా శ్రేష్ఠులంతా కూడా శ్రీకృష్ణ సందర్శనానందమునకై వచ్చారు.
స్వామి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని సందర్శించి పరమానందము పొందారు.
మధుర సుగంధమును వెదజల్లు నందనవన పుష్పములను, పుష్పమాలలను శ్రీకృష్ణ భగవానునికి సమర్పించారు.
ఆ వేంచేసిన దేవతా శ్రేష్ఠులు శ్రీకృష్ణుడు ప్రేమాస్పదంగా చూపిన ఆసనములపై సుఖాసీనులై శ్రీకృష్ణ దేవుని స్తుతించసాగారు.
Page number:2
అధ్యాయము–2.) శ్రీకృష్ణ స్తుతి
|
శ్రీ బ్రహ్మ రుద్రాది దేవతలు : హే భగవన్! ఏ మహత్తరమైన సంపదను తమ హృదయ పద్మమునందు నిలుపుకొని మార్గాణ్వేషకులగు ముముక్షువులంతా అనుక్షణం ఉపాసిస్తూ సర్వకర్మ పాశములనుండి విముక్తిని సముపార్జించుకుంటున్నారో, అట్టి తమ పాదారవిందములకు మా బుద్ధి-ఇంద్రియ-ప్రాణ-మనో-వాక్ పూర్వకంగా నమస్కరిస్తున్నాము. మీ పాద పద్మములకు సాష్టాంగదండ ప్రణామాలు!
స్వామీ! చెప్పుటకు ఊహించుటకు అలవికానిది, వ్యక్తరూపము, త్రిగుణసమన్వితము అయినట్టి ఈ ప్రపంచమును మీరు మీయొక్క మాయావిశేషంచేత మీ యందు మీరే సృష్టించుకుంటున్నారు. పరిపాలిస్తున్నారు. లయింపజేసుకుంటున్నారు. ఇంతటి చమత్కారం నిర్వహిస్తూ కూడా మీరు సర్వదా అప్రమేయులు. త్రిగుణ మాయాతీతులు. రాగ ద్వేషములచే స్పృంశించబడనివారు. మీ చిదానంద పరతత్త్వము ఆవరణ రహితము (Sans Borders). అఖండము (Indivisible). సర్వరూప ఆవిష్కరణము (All forms are always yours). పరమానందము (Pleasant Form Beyond all else).
అందుచేత మీచే నిర్వర్తించబడుచున్న లీలా విశేషములచేత, కర్మలచేత మీరు బద్ధులు కానేకారు.
మీ యొక్క అవతార విశేషసంబంధమైన జన్మ-కర్మలను విని, మిమ్ము ప్రస్తుతిస్తూ సత్పురుషులు విశుద్ధత్వమును సముపార్జించుకుంటున్నారు.
అంతటి విశుద్ధత్వమును జీవులెవ్వరూ వేదాధ్యయనము చేతగాని, వేదార్థశ్రవణము చేతగాని, తపస్సు మొదలైన ఆయా క్రియా విశేషముల చేతగాని పొందవీలుకాదు. ముక్షువులగువారు పరమ శుభములు పొందటానికై, ప్రేమార హృదయంతో మిమ్ము స్మరిస్తూ తరిస్తున్నారు. జితేంద్రియులగు మరికొందరు స్వర్గమును అధిగమించి పునరావృత్తి దోషం లేనట్టి విష్ణులోకం జేరటానికై మీ పాద పద్మములను త్రికాలాలలోను ఆశ్రయించినవారై వుంటున్నారు. ఆశ్రితులగు అనేక మంది భక్త జనులు మీ వాసుదేవ (Al-present) సంకర్షణ (Al-Attracting) ప్రద్యుమ్న (సృష్టిగా రూపొందుచున్న) అనిరుద్ధ (అప్రతిహతమైన) చతుర్విధరూపములను ఆరాధిస్తున్నారు.
అట్టి మీ ఈ పాదపద్మములు మాపట్ల మా విషయవాసనలను మొదలంటా పెకలించివేయు ఝంఝామారుతమగుగాక!
యజ్ఞములు నిర్వర్తించే యాజ్ఞకులు ఋక్-యజుర్-సామవేద పూర్వకంగా మంత్రోచ్ఛారణ చేస్తూ యజ్ఞగుండమునకు ఆహూతులు సమర్పిస్తూ స్మరిస్తున్నది మీ స్వరూపమునే!
Page number:3
యోగులు అణిమ-గరిమ-లఘిమ-మహిమ-ఈశిత్వ-వశిత్వ-ప్రాకామ్య-ఇచ్ఛా ఇత్యాది సిద్ధులు సంపాదించుటకై ధ్యానిస్తున్నది కూడా మీ స్వరూపమునే!
పరమ భాగవతులు మోక్షాకాంక్షను కూడా త్యజించి తమ భక్తి పారవశ్యంతో ఆత్మానందానుభూతిని అనుభవిస్తూ ఇంకేమి అఖర్లేదు అని ఆస్వాదిస్తున్నది మీ తత్త్వమే!
ఓ దేవాదిదేవా! మేము తమ సందర్శనానందాభిలాషులమై వస్తూ, నందనవనము హిమాలయము మొదలైన ఆయా ప్రదేశములలో లభించిన సౌగంధిక పుష్పములు మొదలైనవాటితో కూడిన పూలమాలలను తెచ్చి ఒక్కొక్కరము మిమ్ములను అలంకరించి ఆనందిస్తున్నాం.
అయితే మీ హృదయ ప్రదేశమున నివసిస్తున్న లక్ష్మీదేవి-“ఇదేమిటి? ఈ బ్రహ్మాది దేవతలు అల్పములైనట్టి భౌతిక రూప పుష్పమాలలను నేనున్న స్థానంలో అలంకరిస్తున్నారు?” అని కించిత్ అవేశముతో మిమ్ములను ప్రశ్నిస్తోంది. మరి మీరో? అది పట్టించుకోకుండా మేము తెచ్చి సమర్పించిన మాలలను నిరాఘాతంగా ధరిస్తున్నారు. ఎందుకని? ఎందుచేతనంటే మీరు భక్తవత్సలులు కదా!
అట్టి పరమ ప్రేమాస్పదులగు మీ దివ్యచరణ కమలములు మా యొక్క 14 లోకముల సంబంధములైన సర్వ విషయవాసనలను తొలగించి మమ్ములను రక్షించునుగాక!
హే భగవన్! వామనావతారంలో బలిచక్రవర్తి యొక్క దానమును స్వీకరిస్తూ మీ యొక్క ఒక పాదము త్రిలోకములను ఆక్రమించి వేసింది. మీ పాద పద్మములనుండి జన్మించిన గంగానది లోకపావని అయి తన్ను సమీపించిన జీవులందరి పాపములను కడిగివేసి పవిత్రులుగా తీర్చిదిద్దుతోంది. అటువంటిదైన ఈ మీ చరణయుగళం మా యీ సాష్టాంగ దండ ప్రణామములు స్వీకరించి మాయొక్క అల్ప-సంకుచిత-పరిమిత దృష్టుల నుండి మమ్ము సదా కాపాడును గాక!
మాయందు తత్త్వదృష్టిని జనింపచేసి, పరిపోషించి, పరివేష్టించి పరిరక్షించును గాక!
“ఈ ఎదురుగా కనిపించేవారంతా శ్రీకృష్ణ రూపులే” - అని మా మనస్సు పొందునుగాక!
“ఇదంతా చైతన్యానంద ప్రదర్శనమే!” అనే ఎఱుక మా బుద్ధియందు ప్రవృద్ధమగుగాక!
హే స్వస్వరూప చైతన్యమూర్తీ! మా బ్రహ్మ రుద్రాది దేహములతో సహా ఈ సర్వజగత్తులు పరస్పరం కలహపీడితములై కాలమునకు వశములై వుంటున్నాయి. ప్రకృతిపురుషాతీతుడవగు కాలపురుషుడు మీరు! ఓ కాలః కాలా! కాలనియామకా! శంసస్తనోతు చరణః! పురుషోత్తమస్య! పురుషోత్తములగు మీ చరణములు మాకు సుఖశాంతులను ప్రసాదిస్తాయని గ్రహించి మీ చరణ సన్నిధిని చేరుకున్నాం.
Page number:4
ఓ పురుషోత్తమా! ప్రతి ఒక్క జీవునిలో అనుభూతమగుచున్న ఉత్తమ పురుషగా (The First Person. The “ I” in every body) ప్రదర్శిమగుచున్నది మీరే! కనుకనే మీరు పురుషోత్తములు! వేదములు ఇక్కడి ప్రకృతి-పురుష మహత్తత్త్వములకు నియామకుడు, ఆధారభూతుడు మీరే అని నిర్ణయించి ఎలుగెత్తి గానం చేస్తున్నాయి. ఈ చరాచరజగత్తు యొక్క సృష్టికర్త-పరిపోషకుడు-లయకర్త మీరే! అందుచేత కూడా, మిమ్ము వేదోపనిషత్తులు పురుషోత్తముడని లయ-విన్యాసంగా పలుకుచున్నాయి.
“కారణం కారణాని చ” అనబడు కారణ కారణ స్వరూప సంజ్ఞయగు క్షీరసాగరమున శయనించువారు, అమోఘ వీరుడు అగు మహావిష్ణువు కూడా సర్వతత్త్వస్వరూపుడగు మీ వలననే శక్తిని పొందుతున్నారు. అట్టి శక్తి చేత మాయతోగూడి ఈ జగత్తుకు బీజ స్వరూపమైన మహత్తత్త్వమును సృష్టిస్తున్నారు. అటు తరువాత ఆ మహత్తత్త్వమే త్రిగుణ రూప మాయను అనుసరించి సప్తవ్యాహృతులు అని చెప్పబడే ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓగ్ం సత్యం అను 7 ఆవరణములుతో కూడిన ఈ సువర్ణమయ బ్రహ్మాండమును (The universe with multi coverages) సృష్టించుచున్నది.
ఈ విధంగా, ఈ ఎదురుగా దేహ-మనో-బుద్ధి-చిత్త-అహంకార-జీవ ఈశ్వర అహంభావాలకు తారసబడే 7 ఆవరణములతో కూడిన బ్రహ్మాండము మీయందు కనిపించే నిర్విషయరూప విషయచమత్కారమే సుమా!
ఇక్కడి సృష్టి, ఈ సృష్టిని ఆస్వాదించే దృష్టి, ఆ దృష్టికి ఆధారమైన ద్రష్ట, ఆ ద్రష్టను గమనిస్తున్న దృక్ స్వరూపము కూడా మీరే! మీరే జీవుడు! మీరే ఈశ్వరుడు! మీరే సర్వేశ్వరుడు! ప్రతి జీవుని యందు కనిపించే మనో బుద్ధి చిత్త అహంకారాలు మీ సంప్రదర్శనమే!
ఈ రీతిగా త్రిగుణ సమన్వితమైన మాయచే జనిస్తున్న ఇంద్రియ సమూహముకు, ఇంద్రియ విషయ జగత్తుకు ఆధారము, ఇంద్రియములతో దృశ్యవిశేషాలను ఆస్వాదిస్తున్న ఇంద్రుడు కూడా మీరే! ఇంద్రియ విశేషాలన్నీ సర్వత్రా సర్వజీవుల రూపంగా నేను - నీవులతో సంభవింపజేస్తున్నది అనుభవిస్తున్నది మీరే! మీరే అయివుండి కూడా మీరు ఆయా ఇంద్రియ భూత రూప దృశ్య విశేషములచే బద్ధులు కానే కాదు. వాటివాటియందు ఆసక్తుడు కూడా కాదు!
Page number:5
అనగా, సర్వ జగద్విశేషాలు అనుభవిస్తున్న జీవుడు అనబడువాడు మీరే అయి వుండి కూడా, ఈ జీవుడు - ఇంద్రియములు - దేహములు - దృశ్యములు వగైరా మిమ్ము స్పృశించవు. వీటినన్నింటిని ఆస్వాదిస్తూనే వీటికి అప్రమేయులై స్వయంతేజోరూపంగా సర్వదా వెలుగొందుచున్నారు.
అందుచేతనే, అన్యయోగులు - వారు త్యజించ యత్నిస్తున్న విషయభోగములను వారే చూచుకొని, “ఎట్లాగురా త్యజించటం?” అని భయం పొందటం జరుగుతూవుంటే, యోగీశ్వరుడగు మీకు ఈ ఇంద్రియ విషయములతో కూడిన ఏడు ఆవరణల చమత్కారం కేవలం ఏడువారాల ఆభరణము వంటివి అగుచున్నాయి.
హే యోగ యోగీశ్వరా! శ్రీకృష్ణా! రుక్మిణి మొదలైన 16008 మంది భార్యలు సదా మిమ్ములను వెంటనంటి ఉంటున్నారు! తమ తమ చిరుమందహాసములతో, చిలిపి వీక్షణములతో ఆకర్షణ సంతరించుకున్న కనుబొమ్మలతో, రసానుభూతిని ప్రేరేపించే కదలికలతో కూడిన సంజ్ఞలతో శృంగార చేష్టలను ప్రోత్సహించే ప్రణయ వాక్యార్థముల రూపంతో అత్యంత సమ్మోహకములైన మన్మథ బాణాలు మీపై వదలుచున్నారు. మిమ్ము ఎట్లాగైనాసరే, తమతమ వైపుగా ఆకర్షించి ఎవరికివారే తమకు పరిమితం చేసుకోవాలని సర్వవిధాలా యత్నపరులై వుంటున్నారు. కాని ఏం లాభం? ఈ చరాచరసృష్టికి ఆతీతము - అన్నింటికీ ఆధారము అయిన మీ మనస్సును ఏ మాత్రం దోచుకోలేక పోతున్నారే!
మీరు మహామనోస్వరూపులు కదా! అందుచే ఓ దేవాదిదేవా! శ్రీకృష్ణప్రభూ! ఈ త్రిలోకములందలి సర్వజీవుల పాపరాసులను క్షాళనం చేయడానికై మీరు రెండు స్రవంతులను ఈ జగత్తులలో ప్రవహింపజేస్తున్నారు.
అందుచేత ఈ లోకంలోని వివేకవంతులగు జీవులు మనోచక్షవులతో మీ లీలా విశేషాలను స్మరిస్తూ, ఈ భౌతిక శరీరంతో గంగానదిలో మునకలు వేసి వారివారి అధిభౌతిక - అధిదైవిక - ఆధ్యాయాత్మిక త్రివిధ తాపములను ప్రక్షాళనం చేసుకుంటూ ధన్యులగుచున్నారు.
Page number:6
హే శ్రీకృష్ణ చైతన్యానందమూర్తీ! సర్వాంతర్యామీ!
మా మనో-వాక్-కాయములచే త్రికరణశుద్ధిగా సమర్పిస్తున్న ఈ మా సాష్టాంగదండ ప్రణామములు మరొక్కసారి స్వీకరించండి. మా మనో-బుద్ధి-చిత్త-అహంకారాలను ఆత్మానంద లహరిలో పరిశుద్ధం అయి మీ పాదపద్మములను అలంకరించి ఉండును గాక!
🌺
ఈ విధంగా దేవతలంతా బృంద గానంగా స్వామికి స్తోత్రాలు సమర్పించారు.
క్రమంగా శబ్దజాలము ఉపశమించగా అక్కడికి వేంచేసిన వారంతా శ్రీకృష్ణ భగవానుని అవతారరూపం చూస్తూ, అలౌకికమైన ఆత్మానందంలో ఓలలాడసాగారు. అప్పుడు బ్రహ్మదేవుడు స్వామితో ఇట్లు చెప్పనారంభించినారు.
బ్రహ్మదేవుడు : హే ప్రభు! శ్రీహరీ! ఒకానొకప్పుడు మేమంతా సామవేదాంతర్గతమైన విష్ణుస్థవంతో ప్రార్థనచేయగా మాకు మీరు ప్రత్యక్షమైనారు. భూభారాన్ని హరించడానికి అవతరించవలసినదిగా మేము మిమ్ములను అభ్యర్థించాము. ఆహ్వానించాము! మా ప్రార్థనను మన్నించి ఈ కృష్ణావతారం మా అందరికి, అట్లాగే ఈ సర్వలోకాలకు ప్రసాదించారు. తగువిధంగా దుష్టశిక్షణ శిష్టరక్షణ నిర్వర్తించారు. సత్యాన్వేషకులగు భక్తమానసుల క్షేమము కొరకై ధర్మమును పునః స్థాపింపజేశారు. సర్వలోకములలోని పాపదృష్టులను శమింపజేయగల మీ అవతార కీర్తిని వ్యాపింపజేశారు. సర్వోత్తమమైన ఈ శ్రీకృష్ణ సుందర రూపంతో యాదవ కులంలో అవతరించి జగత్ హితమునకై అనేక కార్యక్రమములను నిర్వర్తించారు.
ఏ జనులైతే కలియుగంలో మీ ఈ లీలలను ఆధ్యాత్మార్థ పూర్వకంగా గానం - శ్రవణం చేస్తారో, వారంతా స్వభావసిద్ధంగా సాధుస్వభావులై సులువుగా అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేసివేసుకోగలుగుతారు.
హే మహాత్మా! ఈ యదువంశములో మీరు జనించి పంచవింశత్యాధికశత (125) సంవత్సరాలు గడిచిపోయాయి. ప్రభూ! మీరు నిర్వర్తించసంకల్పించిన దైవకార్యమంతా సంపూర్ణమైనది. ఇక కొద్ది కాలంలో కాలనియమానుసారం బ్రాహ్మణ శాపమును అనుసరించి యదువంశం వినాశనం కానున్నది! కాల చక్రానుసారం కలియుగం ప్రారంభంకానున్నది.
అందుచేత, మీరు మాయొక్క ఈ విన్నపము ఉచితమేనని భావిస్తే, పరమధామమగు విష్ణులోకానికి తిరిగి విచ్చేయండి. మీ సేవకులము మీచే కల్పించబడి వివిధ లోకములను పాలించువారము అగు మమ్ములను ఇతఃపూర్వంలాగానే పరిపాలించండి! మీ రాకకై విష్ణులోకాది ఊర్ధ్వలోక జనులంతా ఎంతగానో ఎదురు చూస్తూఉన్నారు. మీపట్ల విరహంతో తపిస్తున్నారు.
Page number:7
అందుచేత ఇంద్ర బ్రహ్మ రుద్ర లోకముల ద్వారా వేంచేసి వైకుంఠధామం అలంకరించండి.
శ్రీకృష్ణుడు : ఓ విబుధేశ్వరా! సృష్టికర్తా! బ్రహ్మదేవా! మీరు చెప్పినట్లుగా ఈ కృష్ణావతారము నిర్వర్తించవలసిన కార్యక్రమములన్నీ సంపూర్తి అయినట్లుగా నేను కూడా భావిస్తున్నాను. దేవతలు కోరుకున్నట్లు భూ భారమంతా అవసరమైనంత వరకు తొలగినది కదా! అయితే మరొక్క చిన్న కార్యక్రమం మాత్రం ఇంకా మిగిలి ఉన్నది. ఇక్కడి ఈ యాదవకులమంతా అప్రతిహతమగు వీర్య - శౌర్య జనులతో నిండివున్నది. వీరు తమ ప్రతాపములచే గర్వించి భూమినంతా ఆక్రమించే అవేశ కావేశములు కలిగినవారై ఉన్నారు. ఇన్నాళ్ళు వీరిని ఒక చెలియవికట్ట వలె ఆపి వుంచాను. ఈ యాదవ వీరులను సంహరించకుండా నేను విష్ణులోకం జేరటం జరిగితే, ఇక్కడి యదువీరులంతా హద్దులను అతిక్రమించి బలగర్వంతో లోకములకు అశాంతిని కలిగించగలరు. అందుచేత బ్రాహ్మణులు ఇచ్చిన శాపమును అనుసరిస్తూ దుష్టశిక్షణవిభాగమైనట్టి ఇక్కడి యాదవ వీరుల వినాశనమును ముగించుకొని బ్రహ్మ రుద్రలోకాలగుండా వైకుంఠధామం చేరగలవాడను.
శ్రీకృష్ణుని చిరునవ్వుతో కూడిన పెదముల నుండి జారువారిన ఈ వాక్యములు ప్రశాంత చిత్తముతో వినినవారై బ్రహ్మాది దేవతలు స్వామికి మరల ప్రణామములు సమర్పించి తమ తమ లోకములకు మరలారు.
అధ్యాయము–3.) శ్రీ ఉద్ధవ - శ్రీకృష్ణ సమాగమం
|
ఆ తరువాత ద్వారకా నగరంలో అనేక అపశకునాలు, మహోత్పాతాలు కనిపించసాగాయి. అది గమనించిన కొందరు ద్వారకా నగర శ్రేష్ఠులు శ్రీకృష్ణుని సమీపించారు.
శ్రీకృష్ణుడు : ఓ యాదవకుల శ్రేష్ఠులారా! ద్వారకలో అనేక మహోత్పాతాలు జరుగుతూ ఉండడం నేనూ గమనిస్తున్నాను. ఇదంతా బ్రాహ్మణ శాప ప్రభావం కాబోలు. మనలో ఎవ్వరైనా తమ ప్రాణాలు రక్షించుకోదలచుకుంటే మాత్రం ఇక్కడ ఇంకా వుండటం
ఉచితం కాదని నాకు అనిపిస్తోంది. ఇక ఆలస్యం చేయకూడదు. మీరంతా కూడా ప్రభాస క్షేత్రమునకు ఇప్పటికిప్పుడే బయలుదేరి వెళ్ళటం మంచిది. ఆ క్షేత్రం పరమ పవిత్రమైనదనే విషయం మీకు తెలుసు.
Page number:8
ఒకానొకప్పుడు దక్షప్రజాపతి శాపంచేత క్షయరోగమునకు గురి అయిన చంద్రుడు ప్రభాసక్షేత్రం సందర్శించి, అక్కడి నదిలో స్నానం ఆచరించి రోగవిముక్తుడైనాడని, కళాభివృద్ధిని పొందాడని మనమంతా వినియే వున్నాము కదా! మన యాదవకుల జనులంతా ఆ ప్రభాసక్షేత్రం వెళ్ళి స్నానాదులు నిర్వర్తించెదరు గాక! దేవతలకు నివేదనలు, పితృదేవతలకు తర్పణములు సమర్పించండి. అక్కడి ఉత్తమ బ్రాహ్మణులను పండితులను ఆహ్వానించి సంతర్పణలు చేయండి. దక్షిణలు ఇచ్చి వారి ఆశీర్వాదం పొందండి. వారి దయచేత, ఆశీర్వాద బలంచేత ఈ బ్రాహ్మణ శాప విపత్తు నుండి మిమ్ములను మీరు రక్షించుకోవటానికి ఒక ప్రయత్నం చేయటం ఉచితం!
శ్రీకృష్ణుని అభిప్రాయం విని అక్కడి పెద్దలంతా “అందరము పిల్ల-పాలతో సహా శ్రీకృష్ణుడు చెప్పినట్లే ప్రభాసక్షేత్రం సందర్శిద్దాం!” అని నిర్ణయించుకొన్నారు. అప్పటికప్పుడే యాదవ జనమంతా ప్రయాణానికి సన్నిద్ధులు కాసాగారు.
శ్రీ ఉద్ధవుడు శ్రీకృష్ణ నిత్య సేవా వ్రతుడు. ప్రకృతి వైపరీత్యాల గురించి శ్రీకృష్ణ సందేశము విన్నాడు. యాదవ జనులంతా ప్రభాస తీర్థానికి బయల్వెడలే ప్రయత్నంలో వుండటం గమనించాడు. అప్పటికప్పుడు మందిరంలో ఏకాంతంగా శ్రీకృష్ణుని సమీపించి, శ్రీకృష్ణస్వామియొక్క చరణములకు నమస్కారములు సమర్పించాడు. చేతులు జోడించి నిలుచుని ప్రార్థనా పూర్వకంగా మనస్సులోని మాటలను చెప్పసాగాడు.
అధ్యాయము–4.) పరతత్త్వాశ్రయం
|
ఉద్ధవుడు : హేకృష్ణా! దేవదేవేశా! పుణ్యశ్రవణ కీర్తనా! నీ లీలలు శ్రవణం చేయటంచేత, నిన్ను కీర్తించటంచేత జీవుడు పవిత్రత సంతరించుకోగలడు. నీవు పరమేశ్వరుడవే! భగవన్ స్వయమ్! సర్వ శక్తిమంతుడవే! అట్టి నీవు మన యాదవులకు పెద్దలను అవమానించడంచేత ప్రాప్తించిన బ్రాహ్మణ శాపము తొలగించలేవా? తప్పక తొలగించగలవు. అయినాకూడా ఎందుకో నీవు అట్లా చేయటం లేదు. సృష్టి-స్థితి-లయ లీలా వినోదివగు నీవు ఈ యదు వంశనాశనం ఉద్దేశ్యించి ఉంటావని నేను అనుకుంటున్నాను. ఈ కనబడేదంతా కూడా నీ యొక్క మాయా విశేష చమత్కారమే కదా! అయితే నాదొక విన్నపం! మీరు త్వరలో విష్ణుధామం చేరనున్నారని నేను దేవతలు వచ్చినప్పుడు గమనించాను.
Page number:9
శ్లో॥ నాహం తవాంఘ్ర కమలం క్షణార్ధమపి, కేశవ!
త్యక్తుం సముత్సహే, నాథ! స్వధామనయ మామపి ॥ (అధ్యా 6 శ్లో 43)
నేనైతే నీ పాదపద్మములను వదలి అరక్షణం కూడా ఎక్కడా వుండలేను. నిలువలేను. అందుచేత నాథా! నన్ను కూడా మీవెంట విష్ణుధామం అనుసరించనివ్వండి.
హే యదుభూషణా! పరమమంగళ ప్రదము, చెవులకు అమృతప్రాయము అగు నీ లీలలు, వాటి అంతరార్థాలు పానము చేసినవాడు ఇక ఈ లౌకిక విషయాలు - వాటిని సంబంధించిన విషయ వాసనలు అంటిపెట్టుకొని వుంటాడా? లేనే లేదు. మా ఆత్మేశ్వరుడువు, మా ఆత్మ స్వరూపుడవు, మాకు అధికాధిక అత్యంత ప్రియుడవు అగు నిన్ను నీ భక్తులమగు మేము పరుండినపుడు గాని, కూర్చున్నప్పుడుగాని, నడుస్తున్నపుడు గానీ, స్నానం-భోజన-క్రీడాదులప్పుడుగాని - విడిచి వుండగలమా! లేనేలేదే!
ఓ శృంగార రత్నాకరా! బాల్యం నుండి ఇంతకాలమూ నిన్ను ఆశ్రయించాను. వెంటనంటి వున్నాను. ఎందరెందరో భక్తులు నీకు పుష్పమాలలను సమర్పిస్తూ వుంటే… వాటిని కొద్దిక్షణాలు నీవు ధరించి, ఇంతలోనే నా చేతులకు ఇస్తూ వుండేవాడివి. నేను వాటిని ధరించి ఆనందిచే వాడిని. నీవు ధరించి త్యజించిన వస్త్రములను నేను మహాప్రసాద పూర్వకంగా ధరిస్తూ వస్తున్నాను.
స్వామీ! మేము నీకు సంబంధించినవారము. నీకు చెందినవారము. నీ వారము. నీవు తినగా మిగిలిన తినుబండారాలను ఆప్యాయముగా తిని ఆనందించే మీ సేవకులం. అందుచేత, మీ మాయ మమ్ము బంధించదు.
కొందరు మునులు, ఋషులు, తపోబల సంపన్నులు, సన్యాసులు మొదలగువారు కఠోర నియమాలతో సాధనలు నిర్వర్తించి బ్రహ్మలోకం చేరుచున్నారు. ఇక మోమో? ఇక్కడ కర్మమార్గమున పడి ప్రపంచంలో తెలిసీ తెలియకుండా వెట్టిగా పచార్లు చేస్తున్నాం. అయితే ఏం? మీ భక్తజనంలో కలిసిపోయి, వారిలో ఒకరిమై నీ కథలను గానం చేస్తూ నిన్ను కీర్తిస్తూ వున్నాము. లీలామానుష విగ్రహుడవగు నీ స్వరూపమును, సంచారములను, నీ అవతార క్రియా పరంపరలను, హాస్యభరిత సంభాషణలను, పరిహాసములను, ఉపదేశములను, మర్మగర్భబోధలను స్మరించుకుంటూ వుంటున్నాం. మిమ్ములనే కీర్తిస్తూ కాలం గడుపుచున్నాం. అందుచేత ఈ సంసార దుఃఖమంటే మేము ఏమాత్రం భయపడటం లేదు.
Page number:10
మీ అవతార విశేషములను చెప్పుకుంటూ సులభంగా సంసార సముద్రాన్ని దాటివేయగలం. అందుచేత మద్గురువగు నిన్ను అనుసరిస్తాను. కాల దేవతకు ఇక ఈ భౌతిక దేహమును సమర్పిస్తాను. ఏ కాల చమత్కారంచేత జలంలో బుడగవలె ఇది బయల్వెడలిందో ఆ కాలదేవత ఇచ్ఛానుసారం ఏది ఎట్లో అట్లే అగుగాక!
శ్రీకృష్ణుడు : ప్రియ మిత్రమా! మహాభాగా! ఉద్ధవా! నీవు చెప్పినట్లు నేను అనుకుంటున్న మాట వాస్తవమే! బ్రహ్మదేవుడు, రుద్రభగవానుడు మొదలైన లోకపాలకులు నాయొక్క విష్ణులోక పునరాగమనాన్ని వాంఛిస్తున్నారు. దేవతలు ఇతఃపూర్వం నన్ను కోరినట్లుగా దైవకార్యమంతా పూర్తి అయింది. వారు కోరుటచేతనే నేను, అన్న బలరామునితో కూడి భూమిపై అవతరించటం జరిగింది.
ఇక ఇప్పటి విషయానికివస్తే…. మన ఈ యదుకులం బ్రాహ్మణ శాపాగ్నికి దగ్ధంకావడం ఇప్పటికే జరిగిపోయింది. ఇక తదనుసారంగా దృశ్యపరంగా పరస్పర వివాదములు మిషచే వినష్టం కానున్నది. నేటి నుండి 7వరోజుకు ఈ ద్వారకను సముద్రజలం ముంచివేయబోతోంది. నేను అవతారమును చాలించిన మరుక్షణం కొన్ని మంగళప్రదమగు విశిష్టవిశేషాలు కాల నియమానుసారం భూలోకమును వీడనున్నాయి.
తదనుగతంగా కొద్దిరోజులలో కలియుగం ప్రవేశించబోతోంది. కలియుగంలో అధికమంది జనులు అధర్మవిషయాలపట్ల అధికమైన అభిరుచి కలిగినవారై వుంటారు. అందుచేత, నా అవతార పరిసమాప్తి తరువాత అనేక ప్రదేశాలు నీవంటి పుణ్యస్వభావ, కోమల సహృదయుల నివాసమునకు యోగ్యమై వుండవు.
ఉద్ధవుడు : స్వామీ! రాబోయే కలియుగం గురించి, జనుల అధర్మ ప్రవృత్తుల గురించి పురాణ ద్రష్టల వద్ద నేను చూచాయగా విన్నాను. అందుకే మీ అవతారమును స్మరిస్తూ మీతో వైకుంఠానికి అనుసరించటానికి అనుజ్ఞను వేడుకుంటున్నాను.
శ్రీకృష్ణుడు : ఓ ఉద్ధవా! నీవు నేను కూడా కాలనియమానుసారమే వర్తించవలసియున్నది సుమా! అందుచేత నీవు నీకు ప్రసాదితమైన ఆయుఃపరిమాణంతో ఈ భూమిపై మరికొంత కాలం కొనసాగించవలసియున్నది.
ఉద్ధవుడు : అట్లాగా? అయితే ఇప్పుడు నాకు కర్తవ్య - అకర్తవ్యలేమిటో విశదపరచ ప్రార్థన! నావారైన యాదవులు అదిగో, వెళ్ళిపోతున్నారు కదా!
Page number:11
శ్రీకృష్ణుడు : ఇక ఇప్పుడు - నా వారు, నా బంధువులు, నాకు స్వజనులు, నా స్నేహితులు, నాకు ఆత్మీయులైనవారు - ఇత్యాది పరిమిత దృష్టులను అధిగమించిన వాడవై వుండు.
శ్లో॥ త్వం తు సర్వం పరిత్యజ్య స్నేహం స్వజన-బంధుషు ।
మయ్యావేశ్య మనః సమ్యక్ సమదృక్ విచరస్వగామ్ ॥ (అధ్యా 7, శ్లో 6)
సర్వే సర్వత్రా సమదృష్టిని పెంపొందించుకొని సర్వతత్త్వస్వరూపుడనగు నాపై నీ
మనస్సంతా నిలుపుకొని ఉండు. సమ్యక్ (ఒకే పరమాత్మయొక్క వివిధ రూపములుగా)
భావనను ఆశ్రయించుకొని ఉండు.
శ్లో॥ యత్ ఇదం మనసా వాచా - చక్షుర్భ్యాం - శ్రవణాదిభిః ।
నశ్వరం గృహ్యమాణం చ విద్ది మాయామనోమయమ్ ॥ (అధ్యా 7, శ్లో 7)
నీయొక్క మనస్సుకు, వాక్కుకు, కళ్ళకు, చెవులకు విషయములై తారసపడేదంతా కూడా…
… గ్రహించినవాడవై వాటన్నిటిపట్ల చిరునవ్వుతో కూడిన మౌనము వహించి ఉండు.
ఎవరి మనో చిత్తములైతే (Thought and Interests) చంచలంగాను, అశాంతముగాను, అయుక్తముగాను (Unbalanced) వుంటాయో అట్టివారికి మాత్రమే ఈ దృశ్యజగత్తులో నానావస్తు విభ్రమమంతా సత్యము, నిత్యము వలె అనుభవమౌతూ ఉంటాయి. వారు, వీరు, వారి వారు, నా వారు, నీ వారు - ప్రియము, అప్రియము - శుభము, అశుభము ఇత్యాది భ్రమానుభవములన్నీ కలుగుతున్నాయి.
అట్టి చంచలమైన అనుభూతమంతా గుణదోషములచేతనే ఏర్పడుతోంది.
తద్వారా …
… అనే భ్రమలు మనోవృత్తుల రూపంగా ఉదయిస్తున్నాయి.
Page number:12
అందుచేత, ఓ ఉద్ధవా!
ఈ విధంగా నీ పరిమిత దృష్టులపై యుద్ధం ప్రకటించి జయించు.
“కనబడేదంతా ఆత్మయందు శ్రీకృష్ణ పరమాత్మయందు అభిన్నరూపమై ఉన్నాయి” - అని గ్రహించిన తరువాత ఇక నీవు కోల్పోయినదెక్కడుంటుంది? ఏమున్నది?
క్రమంగా నీ యొక్క…
… పవిత్రమై నిశ్చలత్వము, పరమ పవిత్రత్వము సంతరించుకొనును గాక!
భౌతిక దేహిత్వమును అధిగమించి నేను ఆత్మస్వరూపుడను కదా! ఈ జగత్తు నాయందున్నది. అంతేగాని, నేను జగత్తులో వుండటమేమిటి?… అనే అవగాహనతో జీవాత్మత్వమునకు ఆవల వున్న పరమాత్మత్వమును సంతరించుకో! అప్పుడు జగత్తు తత్ జనితమైన విఘ్నములు నీపట్ల వుండవు. కనిపించవు. (లేక) స్వభావ సిద్ధంగా అధిగమించబడతాయి. అప్పుడు ఆత్మానుభవ తుష్టాత్ముడవే నీవు. అనగా, ఆత్మానుభవముచే సంతుష్టుడువై వుంటావు.
సంసారమును జయించటం అంటే దృశ్య-ద్రష్ట రూపములగు జగత్-జీవాత్మలు నా పరమాత్మ తత్వమునందలి అంతర్విభాగ కల్పిత (అభిన్న) చమత్కారములే కదా అను అవగాహనతో ఒకానొక సంతృప్తిని, సమగ్రత్వమును, సంపూర్ణత్వమును సంతరించుకోవటమే సుమా!
ఉద్ధవుడు : హే జగద్గురూ! అట్టి పరమాత్మావగాహన సంతరించుకొన్నవాడు ఇక విహిత అవిహిత కర్మలను నిర్వర్తిస్తాడా? త్యజిస్తాడా?
శ్రీకృష్ణ పరమాత్మ :
శ్లో॥ దోషబుద్ధ్యోభయాతీతో నిషేధాత్ న నివర్తతే ।
గుణబుద్ధ్యా చ విహితం న కరోతి యథా అర్భకః ॥ (అధ్యా 7, శ్లో 11)
Page number:13
చిన్న పిల్లవాడికి - ఇది పాపం! చేయకూడదు, ఇది పుణ్యం! చేయాలి ఇటువంటివి ఏమైనా ఉంటాయా? అటువంటివేమీ లేకుండానే ఒక క్రీడలాగా ఆడుకోవడం మొదలైన ఆయా బాలా లీలా వినోదాలు ప్రదర్శిస్తాడు కదా! అట్లాగే ఆత్మానుభవ తుష్టాత్ముడు కూడా…! అతనిపట్ల విహితములు-నిషేధములు అనే ప్రతిపాదనలు అపాదించబడజాలవు. గుణబుద్ధితో విహితములను అనువర్తించటం వుండదు. దోషబుద్ధి, భయములతో నిషేధములనుండి విరమించటము వుండదు. లౌకిక విశేషములైన శాస్త్ర నిర్దేశములైన విహిత-అవిహిత, విధి-నిషేధములు ఆతని ఆత్మదృష్టికి విఘాతం కలిగించలేవు. ఆతని ఆత్మదృష్టి ఆ రెండింటినీ అధిగమించినదై వుంటుంది. ఆత్మదృష్టికి ఇదంతా వినోదమేగాని విషాదం కాదు.
మిత్రమా! ఉద్ధవా! పరమాత్మను ఆశ్రయించువాడు ఈ విశ్వమంతా నా స్వరూపంగా గమనిస్తాడు. సర్వసహజీవులను పరమాత్మస్వరూపంగా సందర్శిస్తూ జ్ఞాన విజ్ఞాన పూర్వకంగా సునిశ్చయుడై వుంటాడు. ఎక్కడెక్కడ ఏంచేస్తున్నా - చేయకున్నా.. నా చుట్టూ తనతో సహా పరమాత్మ ప్రదర్శనా చమత్కారమే కదా! - అని నన్ను అర్థం చేసుకొన్నవాడై వుంటాడు. సర్వ జీవుల పట్ల స్వభావసిద్ధంగా సుహృత్ స్వభావుడై మెలగుతాడు. మరల అట్టివాడు భౌతిక దృష్టికి - ద్వితీయత్వానికి దిగిరాడు. సర్వదా అద్వితీయత్వం ఆస్వాదిస్తూ వుంటాడు.
అధ్యాయము–5.) ఆత్మైవ హి సద్గురుః
|
ఉద్ధవుడు :
శ్లో॥ యోగేశ! యోగవిన్యాస ! యోగాత్మన్! యోగసంభవ!
నిశ్రేయసాయ మే ప్రోక్తః త్యాగః - సన్యాసలక్షణః ॥ (అధ్యా 7, శ్లో 14)
హే యోగీశ్వరా! యోగాధారా! మిమ్ములను ఆశ్రయించినట్టి మా వంటి ఆశ్రితుల క్షేమము కొరకై సన్యాసరూప త్యాగము గురించి ఉపదేశించండి.
ఎందుకంటారా? సర్వాత్మకుడవగు నీ పట్ల పూర్ణభక్తిని మా బుద్ధి సంతరించుకోనంతవరకూ మేము మా దృశ్య విషయాభిలాషకు బద్ధులమై మా ఈ బ్రతుకులను కొనసాగిస్తూనే వుంటున్నాము. విషయాభిలాష ఉన్నంతవరకు దృశ్య విషయములపట్ల కోరికలను త్యజించలేము. కోరికలు కొనసాగుచున్నంత వరకు భగవత్-విముఖత్వం వదలదు.
Page number:14
సోఽహమ్ మమాహమ్ ఇతి మూఢ మతిః విగాఢః
త్వన్మాయయా విరచితాత్మని సానుబంధే ।
తత్త్వంజసా నిగదితం భగతా యథాఽహమ్
సంసాధయామి భగవన్! అనుశాధి భృత్యమ్ ॥ (అధ్యా 7, శ్లో 16)
స్వామీ! నీ మాయచే రచించబడిన పుత్ర-మిత్ర-కళత్ర ఇత్యాది విషయముల పట్ల నేను నాది అనే గాఢమైన విమూఢత్వముచే మేము ఆవరించబడి, ఇరుక్కొని ఉన్నాము. అందుచేత, నీవు ఇప్పుడు ఉపదేశించిన “జగత్తును జయించటం, జీవాత్మను అధిగమించటం, పరమాత్మత్వము సంతరించుకోవటం” అనే మార్గంలో మేము ప్రయాణించలేక పోతున్నాం. నేను దృశ్యములో మగ్నుడనై - మూఢుడనైన ఇక నాకు త్రోవ తెలియటం లేదు. ఈ ప్రాపంచక విషయాలు నేను ఎప్పుడు పట్టుకొన్ననో నాకే తెలియదు గాని, ఇప్పుడు మాత్రం వదలలేకపోతున్నాను. ఇదంతా - ఆత్మయందు ఆత్మగా దర్శించటం - ఎట్లాగో అర్థం కావటం లేదు.
అందుచేత నీకు భృత్యుడనై నిన్నే ఆశ్రయిస్తున్నాను.
ఈ జగత్తును జగత్తుగా త్యజించి ఆత్మ స్వరూపముగా సందర్శించటమెట్లా?
హే శ్రీ కృష్ణప్రభూ!
నీవు భూత - భవిష్యత్ - వర్తమాన విభాగములతో కూడిన కాలముచే స్పృశించబడని నిత్యసత్యస్వరూపుడవు! సర్వప్రకాశకుడవు ! స్వయంప్రకాశకుడవు ! జన్మజన్మల సుకృతంచేత మీ సామిప్యత లభించింది. నాకు ఆత్మతత్త్వము తెలియజేయగలవారు నీకన్నా మరెవ్వరు సమర్థులు? ఎందుకంటే, మీరు మాయకు యాజమానులు! బ్రహ్మాది దేవతా శ్రేష్ఠులు కూడా మీ మాయకు వశులై దేహము, పుత్రులు మొదలైన విషయములు పరమార్థములుగా భావిస్తున్నారు. ఇక నేనెంతటి వాడిని చెప్పండి? ఇదంతా గమనిస్తున్న నా ధైర్యమంతా నిర్వీర్యం (Mild and stoic) అవటం జరుగుతోంది. దుఃఖము విరాగము నన్ను కమ్మివేస్తున్నాయి. అందుచేత సర్వజ్ఞుడవు, సర్వ శక్తిమంతుడవు, వైకుంఠవాసివి, దేశ-కాలములచే పరిమితము కానివాడవు, సర్వజీవులకు హితుడవు, నరసఖుడవు అగు నిన్ను శరణువేడుచున్నాము.
Page number:15
శ్రీకృష్ణుడు : ఓ ఉద్ధవా! ఈ జీవుడు బద్ధుడు అవటానికి విషయవాసనలే కారణం సుమా!
అట్టి విషయవాసనలు చిత్తము యొక్క అంతరమున దట్టముగా వ్యాపించి ఉపాధి పరంపరలు అనే భ్రమలకు కారణమగుచున్నాయి. అందుచేత, వివేకి అయినవాడు తత్త్వవిచారణచేతను, వివేకముతో కూడిన బుద్ధిచేతను తనను తాను విషయవాసనల నుండి సముద్ధరించుకోవాలి. మానవుడైనవాడు తన బుద్ధిచే విచారణకు ఉపక్రమించాలి.
ఈ జీవుడు ప్రత్యక్ష - అనుమానముల ద్వారా తనకు ఏది హితమో, ఏది అహితమో నిర్ణయించుకోవటానికి సముర్థుడే! అయితే, వివేకముతో కూడి బుద్ధితో వివేచన చేసి ఆత్మదృష్టిని అభ్యసించి అలవరచుకొంటేనే ఆత్మవిద్య లభిస్తుంది.
శ్లో॥ ఆత్మనో గురుః ఆత్మైవ పురుషస్య విశేషతః ।
యత్ ప్రత్యక్ష-అనుమానాభ్యాం శ్రేయోఽసావను విన్దతే ॥ (అధ్యా 7, శ్లో 20)
ఈ జీవునకు వాస్తవమైన గురువు తన ఆత్మయే! నేను సర్వ జీవుల ఆత్మస్వరూపుడను. అది గ్రహించిన సాంఖ్యయోగ విశారదులగు ధీరులు నిర్మలము, సుతీక్షణము, విశాలము అగు బుద్ధిని పెంపొందించుకొని వర్తమాన జన్మయందే నన్ను సంపూర్ణ సమగ్ర ప్రకటన పూర్వకంగా సందర్శిస్తున్నారు. సర్వాత్మత్వానందమును పుణికిపుచ్చుకుంటున్నారు.
ఓ ఉద్దవా! నేను ఒకటి - రెండు - నాలుగు అనేక పాదములతో కూడిన అనేక జీవజాతునెన్నిటినో సృష్టించాను. వాటిన్నింటిలో మానవ జన్మ ఉత్కృష్టమైనది. ఇది ఎంతగానో పురుషార్థ సాధకమైనది సుమా!.
వాస్తవానికి నా స్వరూపము ప్రత్యక్షము కాదు - పరోక్షము కాదు. అట్టి నా అపరోక్ష ఆత్మతత్త్వ స్వరూపం ఈ మానవ దేహులు తమ బుద్ధి కౌశలంతో అనుమానము అనే అన్వేషణ సహాయంతో తప్పక గ్రహించగలుగుతారు.
కాబట్టి, నన్ను నీ ఆత్మ స్వరూపంగా గ్రహించు. అట్టి ఆత్మతత్త్వమునందే విద్యమానమైయుంటున్న జాగృత్ - స్వప్న - సుషుప్త జగత్తులు - కవియొక్క యోచనలోని కల్పిత కథా సంఘటనల వలె - భావనామాత్రమై కన్పిస్తున్నాయి.
వాస్తవానికి జన్మ - మరణముల మధ్య స్ఫురించేదంతా జ్ఞానాన్వేషకునకు జ్ఞాన సాధనా రూపమే! గురువు వంటిదే స్వస్వరూపము. స్వస్వరూపమే సర్వమునకు ఆధారము, సర్వ స్వరూపము కూడా! స్వస్వరూపమే సద్గురువు, సత్ శాస్త్రము కూడా!
అట్లాగే, ఈ దృశ్యజగత్తు కూడా పాఠ్యాంశమే! గురువే!
ఈ విషయం నిరూపిస్తూ యాదవుల వంశ ఆది పురుషుడు, వివేకి, భయరహితుడు యయాతినందనుడు అగు యదుమహారాజుకు - ఒకానొక అవధూతకు మధ్య జరిగిన సంవాదమును చెప్పుతాను. విను!.