[[@YHRK]] [[@Spiritual]]

శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బహ్మసూత్ర భాష్యే

శ్రీకృష్ణ - శ్రీ ఉద్ధవ సంవాదము

(ఉద్ధవ గీత)

అధ్యయన పుష్పము (వచన కావ్యము)

సంస్కృత మూలము : శ్రీ వ్యాసమహర్షి విరచిత శ్రీమద్భాగవత ఏకాదశస్కంధాంతర్గతము
అధ్యయన విద్యార్థి , రచన : యేలేశ్వరపు హనుమ రామకృష్ణ


[Chapters 6 to 7 out of total 46]
విషయ సూచిక :


Page number:16

అధ్యాయము–6.) అవధూత - యదు సంవాదము

శ్రీ కృష్ణుడు :  ఓ ఉద్ధవా! బాల్యంలో పెద్దల దగ్గర మనం విన్న యదుమహారాజుకు, అవధూతకు జరిగిన సంభాషణను పునశ్చరణ చేసుకుంటున్నాం. సావధానంగా శ్రద్ధగా విను.

ధర్మజ్ఞుడగు యదుమహారాజు ఒకానొకరోజు యువకుడగు ఒకానొక అవధూతను ఇంటికి ఆహ్వానించి, ఉచిత మర్యాదలను సమర్పించి ఇట్లా ప్రశ్నించారు.

యదుమహారాజు :  ఓ యువకుడా! మేము యజ్ఞ యాగాది కార్యక్రమములను, అనుష్ఠానపూర్వకమై ఏవేవో సత్కర్మలను సుదీర్ఘకాలంగా నిర్వర్తిస్తున్నాము. ఇక మీరో? ఎటువంటి సుదీర్ఘకాల అనుష్ఠానములను, ఆయా శాస్త్రములు చెప్పు యజ్ఞ యాగాలను, సాధనములను నిర్వర్తిస్తున్నట్లు మాకు కనిపించటంలేదు. ఆయినప్పటికీ ఆత్మజ్ఞాన పాండిత్యము సముపార్జించినట్లు గుర్తుగా తృప్తి - సంతోషములతో కనిపిస్తున్నారు. మీ బుద్ధి బలముతో సర్వ ఇంద్రియ విషయములను అధిగమించివేసినట్లుగా మీ చంద్రహాస ముఖ కవళికలు చూస్తుంటే నాకు అనిపిస్తోంది.

లోకంలో జనులనేకులు ధర్మ - అర్థ - కామముల కొరకై ఆయుష్షును - యశస్సును - ఐశ్వర్యమును కోరి ప్రవర్తిస్తున్నారు. కొద్దిమంది మాత్రమే ఆత్మతత్త్వ జిజ్ఞాసువులై వర్తిస్తున్నారు. మీరు చూస్తే యువకులు. దక్షత గలవారు. సుందరమైన రూపంతో వెలుగొందుచున్నారు. అమృత ప్రాయమైన సంభాషణా చాతుర్యం మీలో కనిపిస్తోంది. అయితే, ఏ సాధనా పరంపరల సంబంధమైన కర్మలూ మీరు చేస్తున్నట్లు కనిపించటం లేదేం? ఒక జడునివలె, ఒక మత్తుని వలె సర్వలౌకిక - శాస్త్ర విహిత కార్యక్రమములు నిరిసించి లౌకిక పారలౌకికమైనవేవీ కోరకుండా పిశాచంవలె ఊరికే లోక సంచారాలు చేసున్నట్లున్నారు. అయినా కూడా ఆత్మతృప్తి సంపన్నులై కనిపిస్తున్నారే! ఎందుచేత? అది అట్లా ఉంచండి!


Page number:17

లోకంలో అనేక మంది జీవులు కామము - లోభము అనే రెండు భయంకరమైన అగ్నిశిఖలచే నిరంతరము దహించబడుచు అధైర్యము - నిరుత్సాహము - ఆవేదన - ఏదో చెప్పరాని భయము - రేపటి గురించి దిగులు - ఏదో అసంతృప్తి నిస్పృహలతో జీవితాలు గడపుచున్నారు.

ఇక మీరో… ఆనందైశ్వర్యంతో లక్ష్మీదేవి తాండవిస్తున్న ప్రశాంత-పూర్ణత్వములతో కూడిన ముఖకవళికలతో ఈ భూమిపై నిశ్చింతగా సంచరిస్తున్నారే! గంగలో స్నానం చేస్తున్న తెల్ల ఏనుగులాగా సంతాపరహితులై కనిపిస్తున్నారే! మీ వద్ద సంపద లేదు. భార్య పుత్రులు - ఆప్తులు ఇటువంటివేవీ (నా వారు అనునది) మీ వద్ద కనిపించటం లేదు. అయితేకూడా ఏం? ఏ లోటు ఏమాత్రము లేనివారై వేదాంతసిద్ధాంత భూషితులైనట్లుగా పరమానందంగా విహరిస్తున్నారే? ఇట్టి అనిర్వచనీయ ఆనందం మీరు ఎట్లా అనుభవించగలుగుచున్నారు?

ఇది నాకు తెలుసుకోవాలని ఉన్నది.

గురువు లేకుంటే గురి లభించదని, తత్త్వజ్ఞానానికి అర్హత సంపాదించుకోలేమని లోక ప్రతీతి - లోక నానుడి కదా! మీరు ఏ గురువును ఆశ్రయించి లోక వ్యవహారమున్నింటికీ అప్రమేయత్వమును, అతీతత్వమును సముపార్జించుకొని ఈ భూమిపై క్రీడా మైదానమువలె లీలగా, ఆనందంగా విహరించగలుగుచున్నారు? అట్టి మీ ఆధ్యాత్మిక అవగాహన యొక్క రహస్యమేమిటో విశదపరచవలసినదిగా ప్రార్థిస్తున్నాను.


Page number:17

అధ్యాయము–7.) 24 మంది గురువులు

అవధూత ద్విజుడు:  ఓ యదుమహారాజా!

శ్లో॥ సంతి మే గురవో రాజన్! బహవో బుద్ధ్యుపాశ్రితాః ।
యతో బుద్ధిమ్ ఉపాదాయ ముక్తోఽటామి ఇహ - తాన్ శృణు ॥
(అధ్యా 7, శ్లో 32)

నేను తెలియవలసినది తెలుసుకోవాలి - అని నా బుద్ధిని ప్రేరేపించాను. అట్టి వివేచనతో కూడిన విద్యార్థి బుద్ధితో దశదిశల అనేక విశేషములను ప్రకృతిలో గమనిస్తూ శిష్యత్వాన్ని ధారణ చేశాను. (I took the stance of a wondering student).

నాయొక్క లోకసంచారంలో నాకు 24 మంది మార్గదర్శకులై ఆధ్యాత్మజ్ఞాన నిత్యత్త్వము, తత్త్వజ్ఞానార్థ దర్శనము అనే సుమధుర సుగంధ పుష్పాలు వెల్లివిరిసే పూతోట వైపుగా నడిపిస్తున్నారు.

అట్టి నాకు మార్గం చూపే గురువులు ఎవ్వరో వినండి.

1.) భూమి, 2.) గాలి, 3.) ఆకాశము, 4.) జలము, 5.) అగ్ని, 6.) చంద్రుడు, 7.) సూర్యుడు, 8.) పావురము, 9.) అజగరము (కొండచిలువ), 10.) సముద్రము, 11.) పతంగము (మిడుత), 12.) తేనెటీగ, 13.) ఏనుగు, 14.) తేనెతుట్టెను పిండి తేనెను గ్రహిస్తున్న బోయవాడు, 15.) హరితము (జింక), 16.) చేప, 17.) పింగళ అనే పేరు గల ఒక వేశ్య, 18.) లకుముకిపిట్ట (కురర పక్షి), 19.) బాలుడు, 20.) కుమారి (కన్య), 21.) బాణమును తయారుచేయువాడు 22.) పాము, 23.) సాలెపురుగు 24.) భ్రమరకీటకము.


Page number:18

ఈ 24 మంది తమ తమ నడవడికలను అనుసరించి ఒక్కొక్కరు ఒక్కొక్క ముఖ్యవిశేషాన్ని నేను నేర్చుకోవటానికి, తెలుసుకోవటానికి కారణ భూతులైనారు. అందుచేత ఈ 24 మందిని గురువులుగా భావించి జ్ఞానమును సముపార్జించి ఈ లోకంలో లీలగా క్రీడగా సంచరించటం కొనసాగిస్తున్నాను.

యదుమహారాజు :  ఓ మహానుభావా! మీరు చెప్పేది ఆశ్చర్యంగా వున్నది. లోకంలో గురువు అంటే వేదమో - మంత్రమో - వేదాంతార్థమో - శాస్త్రమో బోధించేవాడని అందరమూ అనుకుంటూ వుంటాము. మీరు చెప్పిన 24 విశేషాలను అందరము అన్ని చోట్లనో, ఆయాచోట్లనో చూస్తూనే వుంటాము. వాటి వాటి నుండి నేర్చుకోవలసినది - తెలుసుకోవలసినది ఏమి ఉన్నదో మేము ఎప్పుడూ గమనించటం లేదు. మాకు అట్లా తోచటమూ లేదు. మాపై కనికరించి, మీరు వారి దగ్గర ఏమేమి గమనించి మీ మోక్షానందానికి - జ్ఞానానందానికి అధ్యాత్మిక మార్గ సుగమనానికి ఉపకరణాలుగా తీర్చి దిద్దుకున్నారో … నాకు వినాలని ఉన్నది.

ఆశ - నిరాశల మధ్య – కొట్టు మిట్టాడే మాకు ప్రకృతి నుండి నేరువవలసిన పాఠ్యాంశాలు విశదపరచవలసినదిగా ప్రార్థిస్తున్నాను.

అవధూత :  ఓ యయాతి నందనా! యదు మహారాజా! ఆ ఇరువది నలుగురిలో ఎవరెవరి నుండి ఏ ఏ జ్ఞాన విశేషాలు నేర్చుకొని హృదయస్థం ఏ తీరుగా చేసుకున్నానో విశదీకరిస్తాను. శ్రద్ధగా వినండి.

🌺🌺🌺

1వ గురువు - భూమి

ఏదైనా ఒక ధర్మ మార్గమో - సాధనయో ప్రారంభించామనుకో, ఎవ్వరో ఏదో అన్నారు కదా! నేను ఈ కర్తవ్యాన్ని (లేక) ధర్మాన్ని (లేక) సాధనను విరమిస్తాను. వారు ఆ మాటలు అనుకుంటూ (లేక) అంటూ వుంటే నేనెందుకు కొనసాగించటం?… అని పట్టుదలను సడలించటం, కార్యక్రమం నుండి వెనుతిరగటం సామాన్యంగా లోకంలో జరుగుతోంది. అయితే, ఫలితం? సహిష్టత (లేక) తితిక్ష (Forbearance, Tolerence) తరగటంచేత తత్త్వజ్ఞాన - విజ్ఞాన మార్గం నుండి మనం వెనుకడుగు వేస్తున్నాము. వెనుకకు తిరుగుచున్నాము.


Page number:19

కానీ ఈ భూమియో? ప్రాణుల పాదములచే త్రొక్కబడుతోంది. త్రవ్వబడుతోంది. కాల్చబడుతోంది. అయినా సరే! సూర్యుని నుండి సంపాదించుకుని తనలో ప్రక్షిప్తం చేసుకున్న ఓజోశక్తిని ప్రాణుల ఆహారం కొరకై సమర్పిస్తూ తన స్వధర్మాన్ని - జీవుల పట్ల అవ్యాజమైన ప్రేమను, ప్రతిఫలాపేక్షా రహితమైన వాత్సల్యమును కొనసాగిస్తోంది! తనలోని జలమును జీవులకు ప్రేమతో ప్రసాదిస్తోంది.

అట్లాగే, నేను కూడా దుఃఖ సంఘటనలను సహించటం, దైవాధీనంగా ఏర్పడే పరుల పీడనం చూస్తూ కూడా… అప్రతిహతమైన - అవ్యాజమైన - అఫలాపేక్షతో కూడిన వాత్సల్యం స్వభావంగా పెంపొందించుకోవటం ప్రారంభించాను. భూమాత వలె తదితర సర్వజీవుల పట్ల నేను వీరికి ఏమి ఇవ్వగలను? ఏమి మంచి చేయగలను? … అను ఒకానొక సహజమైన త్యాగనిరతితో కూడిన బుద్ధిని అంతరంగంలో కలిగియుండి పరిపోషించుకోసాగాను.

పర్వతము భూమిలో పాతుకొని ఉంటుంది. వృక్షములో… నేల గర్భంలో వ్రేళ్ళు కలిగి వుంటాయి. అందుచేతనే కాబోలు! పర్వతములకు వృక్షములకు అంతటి పరోపకార బుద్ధి!

పర్వతములోని పరోపకారవృత్తిని, వృక్షములోని పరులకు నీడ - ఆహారము నివాసము సమర్పించే వృత్తిని చూసి, ఆహా! భూదేవత ప్రసాదంగా మానవదేహంతో పుట్టి, ప్రకృతిచే బుద్ధి ప్రసాదించబడి, నేను భూమాతవలె తోటి జీవులను సంతోష పెట్టడం శ్రేయోదాయకం కదా! ఈ శరీరము తదితర జీవుల సమర్పణచే పరిపోషించబడుచుండగా, పరులకు శుభప్రదంగా జీవించటం కనీస ధర్మం కదా!… అని నేర్చుకోసాగాను.(ఉత్తమే శిఖరే జాతే భూమ్యాం, పర్వతమూర్ధనీ! నమో నమః).

🌺🌺🌺

2వ గురువు - వాయువు మరియు ప్రాణవాయువులు

ప్రాణశక్తి శరీరమంతా సంచరిస్తూ అన్నరసాన్ని ఇంద్రియములకు అందిస్తూ, తాను ఆ ఇంద్రియముల విషయానుభవముల పట్ల ఎట్టి అపేక్ష కలిగి వుండదు. పుష్పములపై ప్రసరిస్తూ వాయువు గంధమును జీవులకు అందజేస్తూ గంధమును మోస్తూ, తాను ఏమీ స్వీకరించకుండా జీవరాసులు ముక్కు పుటములకు అందిస్తూ వుంటుంది. ఆనందం కలుగజేస్తూ ఉంటుంది. తానుమాత్రం సుగంధమునుగాని దుర్గంధమునుగాని పొందక సర్వదా వేరుగా వుంటుంది. అప్రమేయమై-పరమై ఉంటోంది.


Page number:20

అట్లాగే…
“నేను కూడా వాక్ - మనస్సుల ప్రాపంచక ధర్మములచే స్పృశించబడకుండెదను గాక! నా జ్ఞానము అతీతత్వమును - సహజ అప్రమేయత్వములను ధారణ చేయును గాక!… అని వాయువు నుంచి నేర్చుకొనసాగాను. ఇంద్రియ విషయముల యొక్క ప్రియ - అప్రియుత్వములచే నా జ్ఞానము - భావన - అనుభవావేశ రూపంగా స్పృశించబడకుండా, దోషము పొందకుండా జాగరూకుడనై వుండటం అభ్యసించసాగాను.

వింజామరలచే (విసనికర్రలచే) తాడనం పొందుతూ, వాయువు వారికి వీరికి తన కదలికలచే ఆహ్లాదం కలుగజేస్తోందే!

వాయువు దేహంలో ప్రవేశించి ఆయా దేహ విభాగములలో సంచరిస్తూ కూడా ఆసక్తి (Attachment) పొందదు!

గదిలో ప్రవేశించిన గాలి వస్తువుల రూపంగా మారుతుందా?

ఈ పార్ధివ దేహం (Material Body) బాల్య-యౌవన-వార్ధక్య- మరణాలు పొందుచున్నప్పటికీ, దేహంలో ప్రవేశించినట్టి నేను అట్లాగే (వాయుదేవునిలాగానే) దేహ ధర్మములను పొందనివాడనై వుండటం అలవరచుకోసాగాను.

బ్రహ్మ స్వరూపాత్మ భావనను వాయువు నుండి నేర్చుకొని క్రమంగా ఈ దేహమంతా ఆత్మ స్వరూపముతో నింపివేస్తున్నాను. అట్లా ఈ దృశ్యమంతటినీ, దృశ్యాంతర్గతులగు సర్వ జీవరాసుల దేహములను ఆత్మస్వరూప భావనలో ముంచి ఆత్మతో ఏకము చేసి వేయసాగాను. (నమస్తే వాయుః! త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాఽసి!)

🌺🌺🌺

3వ గురువు - ఆకాశము

ఆకాశము అంతటా ఏర్పడినదై వుండి వుంటోంది. స్థావర - జంగమములలో (On the moving and Non-moving aspects) వ్యాపించి వుంటూనే ఆసంగముగా (Non Attached, Non Partitioned, Non Divisible గా) వుంటోంది. ఒక ప్రదేశంలో (in a space) ఇల్లు కట్టబడవచ్చు. ఆ ప్రదేశము ఇల్లుగా మారుతోందా? ఆ ఇల్లు కూలినప్పుడు ఆ ప్రదేశము యధాతథమే కదా! అక్కడ ఏ దేవాలయమో నిర్మించినప్పుడు కూడా అక్కడి ఆకాశము (Space) మార్పు చేర్పులు పొందదు కదా! వాయువుయొక్క ప్రేరణ చేత ఆకాశంలో మేఘాలు పరుగులు తీస్తూ వుండవచ్చుగాక! ఆకాశం ఎల్లప్పుడు నిశ్చలం - సుస్థిరం - ప్రశాంతము - అతీతము - అప్రమేయము కదా!


Page number:21

ఈ దేహంలో ప్రవేశించి వున్నప్పటికీ సర్వ దేహాంతర్గత - దృశ్యవిషయముల పట్ల నిశ్చల మౌనత్వం వహించి వుండటం ఆకాశము నుండి అభ్యసిస్తున్నాను. ఆకాశంలాగా ఆత్మాకాశ స్వరూపుడనై అన్నిటా వేరువేరుగా (కానీ) అఖండుడనై దృశ్యమంతా ఆస్వాదించటం అలవరచుకుంటున్నాను.

అన్నింటికీ పరమైవున్న పరమాత్మ తత్త్వము నేనే అయి, క్రీడగా ఈ అనేకత్వముతో కూడిన జగత్ రూపంగా ప్రదర్శించుకుంటూ క్రీడిస్తున్నాను.

ఆకాశంలాగా అపరిచ్ఛిన్నుడనై, అసంగుడనై లీలగా స్వయంకల్పిత భావనారూప జగత్తుగా వ్యక్తీకరించుకొని వ్యవహరిస్తున్నట్లు నన్ను నేను సందర్శించుకోనారంభించాను.

మేఘముల రాకపోకలతో ఆకాశం దోషం పొందుతోందా? లేదే! తేజస్సుచేత, జలముచేత, వాయువుచే, వాటి వాటి మేలు కలయికలచే ఆకాశము స్పృశించబడదు కదా! అట్లాగే…, కాలగతిచే వచ్చి - పోయే దేహదశలుగాని, దేహదేహంతరములుగాని, భావాభావములుగాని, సత్త్వ-రజో-తమో గుణముల రాక పోకలు గాని లోక సంబంధమైన, స్నేహ బాంధవ్యము మొదలైనవి గాని ఆత్మను స్పృశించవు.

ఆత్మకు దోషములు అంటవు. ఆత్మయొక్క అఖండత్వము - అప్రమేయత్వము - కాలముచే స్పృశించబడని నిత్యత్వము - సర్వమునకు అతీతత్వము మొదలైన విశిష్టలక్షణములు చెక్కు చెదరవు. నేను ఆత్మ స్వరూపుడను. అంతేగాని పాంచభౌతిక దేహ- గుణ భావ ఇత్యాది స్వరూప పరిమితుడను గాను!
… అని నా గురించి నేను నిర్వచనం కొనసాగించుకో సాగాను.

(ఆత్మాత్ ఆకాశం! ఆకాశాత్ సర్వమ్! ఆకాశ సద్గురవే నమః).

ఆకాశదేహినై అంతటా ఏర్పడి ఉన్న వాడనై సర్వమును ఆస్వాదించటం అభ్యసిస్తున్నాను.

🌺🌺🌺

4వ గురువు - జలము

జలము ప్రకృతిరీత్యా (సహజంగా - స్వభావ సిద్ధంగా) స్వచ్ఛంగా వుంటుంది. తనయందు రుచి అనే మాధుర్యం కలిగి వుండి జీవుల నాలుకకు మృదుమాధుర్యమును అనుభూతిగా ప్రసాదిస్తూ వుంటుంది. సహజ స్నేహశీలి అయి సర్వ జీవుల దాహ తాపాన్ని ఉపశమింపజేసి ఆనంద సుఖాన్ని ప్రసాదిస్తూ వుంటుంది. జీవుల దేహములను వస్త్రములను పరిశుభ్రపరస్తూ దుమ్ము - ధూళిని తొలగిస్తూ వుంటుంది. “దాహమును - తీరుస్తూ బ్రతుకునే ప్రసాదిస్తున్న నేను మురికిని శుభ్రంచేయటానికి వినియోగించబడటమా?” అని ప్రశ్నించదు. తప్పుపట్టుకోదు.


Page number:22

తదితర జీవులకు పరిశుభ్రతను ప్రసాదించటానికై వారి దేహ ధూళి - మురికి మొదలైన దోషములు స్వచ్ఛమగు తనయందు ప్రవేశించుచున్నప్పటికీ తాను తన పరోపకార నిరతినుండి ఏ మాత్రం వెనుకంజవేయదు.

అట్లాగే నేను కూడా…, సర్వ సహజీవుల పట్ల ఏమీ కోరకుండానే ప్రేమాస్పదుడనై వుండెదనుగాక! స్నేహ మాధుర్యాన్ని అందించెదనుగాక! - అని అనుకోసాగాను. మధుర సంభాషణ - గౌరవము - కీర్తించటం - బోధనలచే వారి దోషములను వారు తొలగించుకోవటానికి సహకరించటం - వాక్కుచే వారి మనోవేదనలను ఉపశమింపజేయటం … ఇటువంటివన్నీ జలము యొక్క పరోపకార నిరతినుండి నేర్చుకుంటూ స్వభావసిద్ధం చేసుకొనే ప్రయత్నం నిర్వర్తిస్తూ వున్నాను. “నా సహాయం పొంది కూడా కొందరు నన్ను అల్పముగా చూస్తున్నారే?” - అని ఎప్పుడైనా అనిపిస్తే “జలముకన్నా నేను ఏమిగొప్ప?” అని ప్రశ్నించుకుంటున్నాను.

(ఓం నమో వరుణదేవ సద్గురవేనమః! రసానందతత్వాయ నమో నమః!)

🌺🌺🌺

5వ గురువు - అగ్ని

అగ్ని తన తేజస్సుచే చీకట్లను పారత్రోలి జీవులకు ఎల్లప్పుడూ ఎంతటి సహకారం అందజేస్తోంది! వెలుతురు లేకపోతే జీవుల గతి ఏమిటి? అగ్ని సదా-సర్వత్రా సదా ప్రభావసంపన్నము. సర్వదా యుక్త స్వరూపము. అనగా, దేని చేతా బంధింపబడదు. దేని నుండి ఏదీ స్వీకరించదు. అన్నీ భక్షిస్తూ ఏ దోషములు ఏ మాత్రం తనయందు ప్రవేశింపనీయదు.

అగ్నిలేని చోటేలేదు కానీ, కొన్నిచోట్ల అగ్ని గూఢంగా - అప్రదర్శితంగా వుంటుంది. ఉన్నట్లనిపించదు. మరికొన్ని చోట్ల ధగధగ ప్రకాశమానంగా ప్రదర్శితం అగుచూ దిక్కులన్నీ తన తేజస్సుచే నింపివేస్తోంది. కారు చీకట్లను పటాపంచలు చేస్తోంది.

లోక కళ్యాణకారకులగు మహానీయుల యజ్ఞ కార్యములలో ప్రజ్వలించి ఆహూతులకు వాహకమై దేవతలను రంజింపజేస్తూ లోక జనులకు సర్వశుభములు ప్రసాదించబడటానికి కారణమగుచున్నది. యజ్ఞకర్తల పాపరాసులను - దోషములను పటాపంచలు చేస్తోంది. తేజోమయుడై ఉండటం, వస్తువులను స్పృశిస్తూ స్వీకరించకపోవటం, సర్వమును భక్షిస్తూ దోషమును పొందకపోవటం … ఇవన్నీ గమనించాను.

కొన్ని చోట్ల నా అవగాహనలను అభిప్రాయములను ఆధ్యాత్మిక భావములను ప్రదర్శించకుండా గూఢంగా వుండటం, మరికొన్ని చోట్ల నా జ్ఞాన తపో తేజస్సులను సహజీవుల అజ్ఞాకాంధకారమును తొలగించటానికై ఎలుగెత్తి ప్రదర్శించటము, అగ్ని నుండి నేర్చుకొనివున్నాను.


Page number:23

నాకు ఎవ్వరైనా ఏదైనా దానం చేస్తే వారి దాన-ధర్మ సౌహార్ద్రతను దేవతలకు నివేదించి వారి యొక్క దోషములను నివారించటము - ఇవన్నీ కూడా అగ్ని నుండి నేర్చుకొని లోకంలో ప్రదర్శిస్తూవున్నాను. ఈ దేహ - ఇంద్రియములతో జీవిస్తూ కూడా, అగ్నివలె వీటి వీటి దోషములు నాయందు ప్రవేశించకుండా జాగరూకుడనై వుండటం అభ్యసిస్తున్నాను.

(అగ్నిదేవ గురవే నమః!)

పరమాత్మచే సృష్టించబడిన సర్వ దేహములలోను అగ్ని ప్రవేశించి, కట్టెలలో కాష్ఠమౌనము - దేహములలో వెచ్చదన ప్రదర్శనమును నిర్వర్తిస్తున్నది కదా! నేను కూడా ఆత్మతేజస్సుతో దృశ్యమంతా నింపివేసి, నా జ్ఞానానందాకాశమును తగిన చోట్ల ప్రదర్శిస్తూ - మరికొన్ని చోట్ల మౌన భూమికను అవధరిస్తూ దృశ్య జగత్తులో సంచరించటం అభ్యసిస్తున్నాను.

ఒకప్పుడు అనివార్యంగా అగ్ని శిఖలు ఉత్పన్నమగుచు - వినాశనము పొందుచున్నాయి కదా! వాటి యొక్క ఉత్పత్తి-వినాశనములు ఏ రీతిగా జరుగుచున్నదో అర్థం కావటం లేదు. నదిలో కెరటములు ఆకారణంగా స్వభావంగా లేస్తున్నాయి. లయిస్తున్నాయి. అట్లాగే, కాల ప్రవాహం చేత ఈ దేహములు ప్రతిక్షణం స్వభావసిద్ధంగా ఉత్పన్నమౌతున్నాయి. నశిస్తున్నాయి. నేను నా దేహమును చూసి “అగ్నిశిఖలవలె - నదీ జలానికీ తరంగలులాగా ఆత్మకు దేహాలు వస్తూ వుంటాయి. పోతూ వుంటాయి. ఇందులో సుఖమేమిటి? దుఃఖమేమిటి? వీటికి నేను వేరై ఆత్మజ్యోతి స్వరూపముతో వెలుగొందుచున్నాను కదా!” … అని గమనిస్తూవున్నాను.

(వైశ్వానరాయ విద్మహే! లాలీయ ధీమహి! తన్నో అగ్నిః ప్రచోదయాత్!)

🌺🌺🌺

6వ గురువు - చంద్రుడు

కష్టముల ఉష్ణత్వమును నేను స్వీకరించి, లోకులకు చిరునవ్వుతో శుభదృష్టులు అందించటం చంద్రునివద్ద అభ్యసించి - నిర్వహిస్తున్నాను.

చంద్రుని యొక్క చంద్రకళలు పాడ్యమి నుండి పౌర్ణమి రాత్రి వరకు ప్రవృద్ధమౌతున్నాయి. మరల బహుళ పక్షంలో పాడ్యమి నుండి కళలు తరుగుచు అమావాస్య వచ్చేసరికి పూర్తిగా ఉపశమిస్తున్నాయి. అదంతా చంద్రుడు చంద్రమండల దేహంతో అనుభవిస్తూ తాను ఆ కళల పెరుగుదల - తరుగుదలలకు అతీతుడైవుంటున్నారు.

భూమికి ఔషధ రసమును తన మృదుమధుర ప్రశాంత అమృత కిరణముల ద్వారా ప్రసరింపజేస్తూ తనయొక్క లోక కళ్యాణ మూర్తిత్వమును అప్రతిహతంగా కొనసాగిస్తున్నారు. చంద్ర దేహమునకు సంబంధించిన వికారములేవీ దేహిగా తాను పొందటం లేదు.


Page number:24

అత్యంత తీక్షణమైన సూర్యకిరణములు తనయందు ప్రవేసిస్తూ ఉంటే, తాను వేడిమిని సహిస్తూ, చల్లటి చంద్ర కిరణములను లోకములకు ప్రసాదిస్తున్నారు. సంపద - ఆపదలకు, సమృద్ధి - అసమృద్ధిలకు అతీతత్వమును చంద్రుని నుండి గమనించి, నేర్చుకొని, ఆచరిస్తున్నాను.

జననము నుండి మరణము వరుకు (from Birth to Death) వచ్చి పోతున్న వికారాలన్నీ ఈ దేహమునకు సంబంధించినవే గాని, నాకు సంబంధించినవి కానే కావు కదా! గౌరవించబడటం, అవమానించబడటం, సుఖము, దుఃఖము మొదలైనవన్నీ ఈ దేహముతో జనించి, ఈ దేహంతో వుంటూ, ఈ దేహంతోనే పోతాయి. నేను దేహిని కదా! నాకు వాటితో సంబంధమే లేదు - అనే సునిశ్చితమైన నిర్ణయమును పరిపోషించుకుంటున్నాను. ఆత్మ స్వరూపడనై దేహముతో ప్రమేయము లేనివాడనై వుండటం చంద్రుని చూసి నేర్చు కుంటున్నాను.

(చంద్ర భగవన్ సద్గురవే నమో నమః!)

🌺🌺🌺

7వ గురువు - సూర్యుడు

సూర్యుడు తన సహస్రాధిక కిరణజాలంతో సముద్ర జలముపై ప్రసరించి, జలమును ఆవిరి రూపంగా స్వీకరిస్తున్నారు. మరొకప్పుడు, మరొక చోట వర్షింపజేసి లోకములకు మహోపకారం చేస్తున్నారు. అంతే కాదు. సూర్యుడు యథాతథంగా ఆకాశంలో వుంటూనే తటాక జలం, కుండలోని జలం మొదలైన అనేక చోట్ల భిన్న రూపములుగా కనిపిస్తూ ఉంటున్నారు. ఎన్నిచోట్ల ఎన్ని రూపములుగా ప్రతిబింబించినప్పటికీ సూర్యుడు తనయొక్క యథాతథత్వమును కించిత్ కూడా కోల్పోవటం లేదు.

నేను ఈ ఇంద్రియములకు కనబడేవి - వినబడేవి - స్పృశించబడేవి - రుచిచూడబడేవి - వాసగా పొందబడేవి మొదలైన విషయాలన్నీ స్వీకరిస్తూనే, సూర్యుడు జలమును వర్షరూపంగా త్యజించునట్లు …. పరుల శ్రేయస్సు ఆనందములను దృష్టిలో పెట్టుకొని ఈ దృశ్యప్రపంచమునకే సమర్పించి వుంటున్నాను.

ఓ పరమాత్మా! నాది అనబడేదంతా వాస్తవానికి ఎల్లపుడు నీదేనయ్యా!… అని సంబోధించి వుండటం సూర్యుని దగ్గర నేర్చుకుంటున్నాను. సర్వ పదార్ధముల పట్ల - విషయముల పట్ల - విశేషముల పట్ల ఆసక్తిని (Attatchment, Inquisitiveness, Involvement) తొలగించుకొని ఒకానొక పవిత్రమైన అతీతత్వమును పెంపొందించుకుంటూ వున్నాను. అనేక నాటకాలలో నటించే నటుడు ఏ నాటకానికీ పరిమితుడు కాదు కదా! అట్లాగే, ఇటువంటి అనేక దేహములలో జీవుడుగా ప్రతిబింబిస్తూ ఆకాశంలో సూర్యునివలె యథాతథ ఆత్మత్వమును స్వభావసిద్ధంగా ధారణ చేస్తూ వుండటం కొనసాగిస్తున్నాను.


Page number:25

తటాకంలో ప్రతిబింబించే సూర్యుడు ఆకాశం వదలి తటాకంలో ప్రవేశిస్తున్నాడా! లేదు కదా! నేను ఆత్మ స్వరూపుడను. జీవాత్మగా అనేక జగత్తులలో ప్రతిబింబింబించవచ్చు గాకా! ఆయా జగత్తులలో బద్ధుడవటం లేదనునది సూర్యుని చూస్తూ గమనిస్తున్నాను. పరమాత్మయే (పరమ్ఆవల) నా వాస్తవ స్వరూపం కదా! - అని మననం చేస్తూ ఆస్వాదిస్తున్నాను.

(భాస్కరాయ విద్మహే! మహద్యుతి కరాయ ధీమహి! తన్నో ఆదిత్యః ప్రచోదయాత్!)

🌺🌺🌺

8వ గురువు - పావురము

ప్రకృతిలో ఆయా జీవుల పట్ల సందర్భపడుచున్న ఆయా సంఘటనల నుంచి నేర్చుకోవలసినది నేర్చుకుంటూ దేహం వచ్చినందుకు (లేక) పొందినందుకు ప్రయోజనంగా ఆత్మజ్ఞానాన్ని పెంపొందించుకుంటున్నాను.

ఓ రాజా! ఈ సందర్భంగా ఒక పావురము యొక్క చేష్టనుండి విద్యార్ధినై ఏ విశేషము నేర్చుకున్నానో చెపుతాను. ఈ జీవుల సంబంధ - బాంధవ్యములు ఏ తీరుగా జీవుని నిబద్దుని చేసి జన్మించిన అసలు కారణమైనట్టి స్వస్వరూప ఔన్నత్యావగాహనలకు సంబంధించిన పాఠ్యాంశములనుండి దారి తప్పిస్తూ వుంటాయో…. వినండి.

ఒకానొక వనంలో ఒక పావురముల జంట వున్నది. ఆ రెండు పావురములు ఒక దానితో మరొకటి మానసికమైన అత్యంతానుబంధం కలిగివుండేవి. మనోబుద్ధులతో పరస్పరత్వం ఏర్పరచుకొని గృహస్థధర్మం నిర్వర్తిస్తూ రోజులు, నెలలు, సంవత్సరాలు గడుపుతూ వున్నాయి. ఒకటి రెండవదానికి కనబడకపోతే స్నేహబంధం (లేక) దాంపత్యబంధంతో విలవిల్లాడిపోతూ వుండేవి. “ఆహాఁ! మా పరస్పరానుబంధం! ఎంత బాగు!” అని చెప్పుకుంటూ మురిసిపోయేవి! ఆ పావురాలు రెండూ ఒకచోట కూర్చుని కబుర్లు చెప్పుకోవటం, కలసి సంచరించటం సరస-విరసాలు, ఆడుకోవటం, ఆహారాన్ని కలసి భుజించడం, ఒకే గూటిలో వానాకాలంలో - శీతాకాలంలో - యండాకాలంలో రోజుల తరబడి కలసి - మెలసి వుండటం చేస్తూ వుండేవి.

ఓ యదురాజన్ ! ఆడ పావురం గోముగా (సౌకుమార్యముగా) ఏది కోరితే అది మగ పావురం ఎంతో కష్టపడి సంపాదించి తెచ్చి ఇస్తూ వుండేది. ఇంద్రియనిగ్రహంలేని ఆ మగ పావురం ఆడపావురము యొక్క ముక్కు - కళ్ళు - రెక్కలు చూసి ఆకర్షించబడి, ఆ ఆకర్షణలో అదీ ఇదీ చేస్తూ రోజులు గడపుతూ వుండేది.


Page number:26

ఆడ పావురము తన క్రీగంటి చూపులతో, సరస విరస సంభాషణా చాతుర్యంతో మగ పావురాన్ని ఆకట్టుకుంటూ ఇంతటి కులుకుబెలుకులు గల నేను ఎంత గొప్పదాన్ని! ఈ మగపావురం నన్ను విడచి వుండలేదు కదా! ఇంతకన్నా నాకు ఇంకేమి కావాలి? …. అని తలుస్తూ చిక చిక ధ్వనులతో గంభీరంగా గూటిలోను, ఆడవిలోను సంచరిస్తూ వుండేది.

ఈ విధంగా అనేక రోజులు గడచిపోసాగాయి. కాలము యొక్క చమత్కృతులు వర్ణనాతీతం కదా!

కొంతకాలానికి, ఆడపావురం ఆ మగ పావురం సమక్షంలో గ్రుడ్లుపెట్టింది. ఆ శ్రీహరి యొక్క కాలస్వరూప పాశ వైచిత్రం చేత ఆ పావురపు గుడ్లు పొదగబడి, సున్నితమైన కాళ్లు ముక్కు - మెడ -చిట్టి చిట్టి కళ్ళు గల పావురపు పిల్లలు బయల్వెడలాయి. ఆ పావురపు పిల్లల కిచి ధ్వనులు చేస్తూ మెడలు సారించసాగాయి. రెక్కలాడించడం నేర్చుకోవటాలు ప్రారంభించాయి. ఇక ఆ పావురపు జంట ఆ పిల్లలను ముక్కుతో రెక్కలతో స్పృశిస్తూ “ఆహా! ఏమి మన భాగ్యం! మన పిల్లలు ఎంత ముద్దు వస్తున్నారు!” - అని అనుకుంటూ మురిసిపోయేవి. క్రమంగా ఆ ఆ పావురపు జంట విష్ణుమాయా మోహితులై ఒకరిపట్ల ఒకరు, పిల్ల పావురములతోను పరస్పరాసక్త చిత్తులై వుండేవారు. ఆహారం సముపార్జించుకోవటంలోను, పిల్లలను పరిపోషించుకోవటంతోను పగలంతా ఏకానేక శ్రమలతో కూడిన సంచారాలతోను, గూటికి రాక పోకలతోను గడచిపోయేవి.

ఇక రాత్రి అయిందా,.. ఏదైనా పిల్లి ఎటువైపునుంచో వచ్చిపడదు కదా! అని అనుకుంటూ చిన్న చప్పుడుకు కుహ్ కుహ్ శబ్దములతో లేస్తూ బహు వ్యగ్రతను పొందుతూ వుండేవి. ఒక రోజు…, ఆ పావురముల జంట తెలతెల్లవారగానే పిల్లలకు ఆహారం సమకూర్చాలనే తాపత్రయంతో గూటినుండి బయల్వెడలాయి. నలువైపులా ఆకాశంలో ఎగురుతూ ఆహారం కోసం వెతుకసాగాయి. ఇంతలో… ఒక ఆటవికుడు ఆయా పనిముట్లతో త్రాళ్ళతో, వలలతో పక్షుల మెడలు క్రూరంగా విరచి భుజములకు తగిలించుకొనే కఱ్ఱలతో కూర్చిన తాటియాకు బుట్టలతో ఆ పావురముల జంట నివసించే మహా వృక్షమువైపు సమీపించాడు. అతని క్రూరమైన ఎఱ్ఱటి కళ్ళనుండి బయల్వెడలిన చూపులు దట్టమైన కొమ్మల మధ్యగల ఆ పావురపు జంట నిర్మించుకొన్న విశాలమైన గూడుపై పడనే పడ్డాయి.


Page number:27

ఇంకేమున్నది? ఆ ఆటవికుడు ఆ మహావృక్షాన్ని ఎక్కి పావురపు పిల్లల దేహములను తన అరచేతి మధ్యగా వ్రేళ్ళతో బంధించి బుట్టలో వేసుకొని చెట్టు దిగాడు.

అప్పుడే ఆ పావురముల జంట ధాన్యపు గింజలను నోట ధరించి ఆ మహావృక్షమును సమీపించాయి. ముందుగా చూసిన ఆడపావురము బుట్టలో చిక్ చిక్ కూతలు వేస్తున్న పావురపు పిల్లలను గమనించింది. తన సంతానానికి పట్టిన దుర్గతిని చూసి ఆక్రోశించింది. అలవికానంత దుఃఖం పొందింది. ఆ పరమాత్మ యొక్క మాయా రచనా విశేషం చేత యుక్తాయుక్తాలు ఆలోచించుకోకుండా స్మృతి పోగోట్టుకొని, పరుగులు తీసి, నేలపై పరచబడిన వలపై వ్రాలింది. ఆ ఆడ పావురము యొక్క కాళ్ళు వలత్రాళ్ళచే బంధించబడ్డాయి. పిల్లలమాట దేవుడికెరుక! తానే వలలో చిక్కుకున్నదాయె! ఇక చేసేది లేక రెక్కలాడిస్తూ వలలో చిక్కి దిక్కు తోచక ఏడవ సాగింది. మగపావురం ఇదంతా అల్లంత దూరం నుండి గమనించింది. తన ప్రియమై ఆడపావురమునకు ముద్దుల మూటలోలికే పిల్ల పావురములకు పట్టిన గతిని చూసి అత్యంత దుఃఖంతో ఏడువసాగింది.

మగ పావురము :-

అహో! మే పశ్యత అపాయమ్! అల్పపుణ్యస్య దుర్మతేః
అతృప్తస్య! అకృతార్థస్య ! గృహస్తః త్రైవర్గికో హతః!
(అధ్యా 7, శ్లో 68)

ఓ సహజీవులారా! ఓ దైవమా! ఇప్పుడు నాకు పట్టిన ఈ దౌర్భాగ్య స్థితిని చూస్తున్నారా? గమనిస్తున్నారా? నేను ఐహిక సుఖముల కొరకై అఱ్ఱులు చాస్తూ సుదీర్ఘకాలం ఆయుష్షును వెచ్చిస్తూ వచ్చాను. దేహం పొందినందినందుకు ఏ విధంగా కాలాన్ని సద్వినియోగ పరచుకోవాలో…, అట్టి పారమార్థిక సుఖముకొరకు (నేను దేహ - మనో - బుద్ధి - చిత్త - అహంకారములకు అతీతమై వున్న పరమాత్మ స్వరూపడను కదా! … అనే అవగాహనను పెంపొందింపజేసుకునే ప్రయత్నముల కొరకు) సిద్ధపడకుండా కాలాన్ని వ్యర్థం చేసుకున్నాను. అకృతార్థుడనైపోయాను. దుర్మతిని. అల్పపుణ్యుడను. గృహస్థుడనై త్రివర్గములకై (ధర్మార్థకామముల కొరకై) శక్తి-యుక్తులను వృధా చేసుకున్నాను.

ఇప్పుడు జరిగిందేమిటో… చూడండి! పతివ్రత - అనుకూలవతి - సౌందర్యవతి - నాకు తోడు నీడ అయినట్టి నా భార్య పావురము, సాధువులు - మృదు స్వభావులు - నా ముద్దుల మూటలు అయిన సంతానముతో సహా నా గృహాన్ని ఖాళీచేసి నన్ను వదిలి స్వర్గలోకానికి బయలుదేరి వెళ్ళుచున్నారు!


Page number:28

శ్లో॥ సోఽహం శూన్యేగృహే దీనో మృతదారో మృతప్రజః
జిజీవిషే కిమర్థం వా? విధురో దుఃఖజీవితః ॥
(అధ్యా 7, శ్లో 70)

ఇప్పుడిక నాకు ఖాళీ గూడు మిగిలింది. భార్య పిల్లలు పొగొట్టుకొని అతి దీనుడైనాను. విరహవేదనాగ్రస్తుడనైనాను. నా శేష జీవితమంతా దుఃఖమయం అయిపోయింది? ఇక నేను ఎవరికోసం బ్రతకాలి? బ్రతికి ఏం సాధించాలని, ఏమి అనుభవించాలని?

ఈ విధంగా ఆ మగ పావురం విలపిస్తూ తన భార్య బిడ్డలు చిక్కివున్న చోట చుట్టూ ఎగురుతూ ఎగురుతూ వుండసాగింది. ఒకానొక క్షణంలో దానికి దుఃఖముతో పిచ్చిపట్టిన దాని వలె అయి, ఎగురుతూ యథాలాపంగా వెళ్ళి తాను కూడా వలపై వ్రాలి వల త్రాళ్ళలో చిక్కుకున్నది. పోయి పోయి తనంతట తానుగా మృత్యువును నెత్తిపైకి తెచ్చుకొని, “అయ్యో! చచ్చానురా బాబూ! పోయేవాడిని పోక వచ్చి వచ్చి నేనే ఈ వలలో వాలానేంటిరా నాయనా?” అంటూ ఆక్రందనలు చేయసాగింది.

ఇక ఆ బోయివాడు, “ఆహా! ఏమి అదృష్టం! ఈనాడు సుదినం! నేను పెద్దగా ప్రయత్నించకుండానే ఈ ఆడ పావురం - ఆ మగ పావురం తమకు తామే నా వలలో చిక్కుకున్నాయే ! ఈ రోజంతా ఇక పండగే! … ఇవి తెలివితక్కువ పావురాలు! హాఁ! హాఁ!” అని చాలా సంతోషించసాగాడు. అటు తరువాత ఆ పావురములన్నింటినీ బుట్టలో బంధించి ఇంటికి పోసాగాడు.

ఓ యదుమహారాజా! ఇంద్రియములకు దాసుడై, కుటుంబ సంబంధములు శాశ్వతమని - సత్యమని నమ్ముకొని కాలం గడుపుతూ తదనంతర స్వీయస్థితి - గతులపై జ్ఞానదృష్టిని సారించని వాడి గతి ఏమిటి? అనేక సంబంధ బాంధవ్యములలో, వ్యవహార పరంపరలలో మనసంతా నిలుపుకొని ముందు వెనుకలను పరిశీలించనివాడు అయి, ఏ జీవుడైనా జీవితమనే అవకాశమును సద్వినియోగ పరచుకోకపోతే? ఆ పావురము వలె ఇంద్రియములకు దాసుడై దృశ్య విషయముల పట్ల ఆసక్తులతో కాలమును గడపివేస్తుంటే ఏమౌతుంది? దుర్గతిపాలు కాక తప్పదు! - అనే విషయం ఆ పావురము యొక్క అనుభవమును గమనించి నేర్చుకున్నాను.


Page number:29

ఆరూఢచ్యుతుడు

శాస్త్రములు, మహనీయులు మనకు ఒకానొక ముఖ్యవిషయం చర్వితచర్వణంగా గుర్తు చేస్తున్నట్లు నేను గుర్తెరిగాను!

శ్లో॥ యః ప్రాప్య మానుషం లోకం ముక్తిద్వారం అపావృతం,
గృహేషు ఖగవత్ సక్తస్తమ్ “ఆరూఢచ్యుతం” విదుః॥ 
(అధ్యా 7, శ్లో 74)

ఈ మానవజన్మ అతిదుర్లభమైన ఒకానొక మహత్తరమైన అవకాశం వంటిది! (It is a great, but unknown time-bound opportunity). ఎందుకంటారా? ఇది తెరువబడిన ముక్తిద్వారము. ఆత్మజ్ఞులు ఈ విషయం ఎలుగెత్తి గానం చేస్తున్నారే! మరి, అటువంటప్పుడు ఆ మగ పావురం వలె ఇల్లు - వాకిలి - సంబంధాలు - అనుంబంధాలు - బాంధవ్యాలు - భావావేశాలు - భావనా సంసర్గములు మొదలైన విషయాలపట్ల అత్యంతాసక్తి కలిగి ఉంటే.. ఫలితమేమిటి? బుద్ధి మాంద్యము! ఉత్తరోత్తరా అధమ గతులు! “ఈతడు శ్రేయోమార్గం పొంది కూడా పతితుడైనాడురా!” - అని అనిపించుకుంటాడు. పండితులు అట్టివానిని “ఆరూఢచ్యుతుడు” అని పిలుస్తున్నారు.

అందుచేత, ఈ మహత్తరమైన మానవ జన్మ అనే అవకాశముపట్ల నేను ఆ మగ పావురము వలె వ్యర్థం చేసుకోదలచుకోలేదు. ఆరూఢచ్యుతుడను కాకూడదు!… అని ఆ పావురం యొక్క అనుభవం నుండి నేను నేర్చుకోసాగాను.

శ్రేయోమార్గము నుండి పునః అధమ గతులకు వెళ్ళకూడదని మననం చేయసాగాను. ఈ ఇంద్రియ ప్రపంచంలో నాది అని అనిపించేది నాది కాదు. ఇదంతా పరమాత్మ యొక్క కల్పనా చమత్కారమే!… అనే ఆరూఢతను అంటి పెట్టుకొని ఉండటం
అభ్యసిస్తున్నాను.

🌺🌺🌺

9వ గురువు - కొండచిలువ

ఓ రాజా! ఈ జీవుడు ఎక్కడో ఏదో సుఖం పొందాలని ఆశించి వర్తమానాన్ని నిష్ప్రయోజనం చేసుకుంటున్నాడు. ధనం సంపాదించాలి! సుఖమయమగు స్వర్గలోకం నాకు లభించాలి!… అని అనుకుంటూ, ఇంద్రియ సుఖములకై వెంపర్లాడుచున్నాడు. ధ్యాసంతా - ఏమి సంపాదించుకోవాలి? ఎట్లా సంపాదించుకోవాలి?… అనే రంధిలో (పోరులో) వర్తమానమును పీకలదాకా ముంచి ఉంచుతున్నాడు. ఆత్మజ్ఞానమునకు సంబంధించి ప్రయత్నములను ఏమరుస్తున్నాడు.

ఒక్కసారి “సుఖదుఃఖాలకు సంబంధించి వాస్తవం ఏమిటి?” - అని గమనిస్తే “అవి వచ్చి పోయేవే!” అని తెలుస్తోంది. స్వర్గలోకంలో వున్నా - నరకలోకంలో వున్నా ప్రాణులకు సుఖ-దుఃఖాలు అనివార్యం. అవి రాకతప్పదు. పోక తప్పదు. దుఃఖాలు మనం పిలిస్తే వస్తున్నాయా? లేదు కదా! అట్లాగే సుఖాలు కూడా వాటంతట అవే వస్తూ వుంటాయి. ఇంతలోనే పోతాయి.


Page number:30

ఇది గ్రహించిన వివేకి ఇక్కడి పదార్థముల పట్ల ఆసక్తి కలిగి వుండడు. వాటి కొరకై వ్యధ చెందడం వృధా ప్రయాసయే! అందుచేత, యథా లభ్యమైనదానితో ప్రతిరోజు పరమాత్మకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ వుండటం ఒక అలవాటుగా చేసుకోసాగాను.

సుఖ-దుఃఖాలకై ఉదాసీనతయే ఉచితం!

ఈ విషయం నేను ఒక కొండచిలువను చూస్తూ గ్రహించాను. ఎట్లాగా?… వినండి.

అనేకమంది జీవులు “నాకు ఇట్టి ఆహారమే కావాలి” - అని నియమించుకొని ఇక అద్దాని కొరకై అనేక ప్రయత్న పరంపరలలో మునిగి తేలుచున్నారు. మరి కొండచిలువయో? తాను ఉన్నచోటనే ఆహారం కొరకు వేచి వుండి, లభించిన దానిని రుచిని గురించి
ఆలోచించకుండా స్వీకరిస్తోంది. యాదృచ్ఛికంగా లభించినదానితో తృప్తి పడుతోంది. లభించనప్పుడు మౌనంగా వేచి వుంటోంది. నేను కూడా ప్రాప్తాప్రాప్తముల విషయములలో కొండచిలువను అనుసరించసాగాను. ఏ సమయంలో ఏ ఆహారం లభిస్తే, ఏఏ సాంఘిక గౌరవాగౌరవాలు వచ్చినట్లు? అందుచేత, వస్తు సముదాయాలు ఎంతవరకు లభిస్తే అంతవరకు వాటిని దైవేచ్ఛగా స్వీకరిస్తున్నాను. “లభించినది రుచికరమైనదేనా? ఇంకేదో లభిస్తే బాగుండునే! ఇట్లా అయితే గొప్పకదా!”… ఇటువంటి ఆశ-నిరాశలను దరి రానీకుండా, ప్రాప్తించిన దానిని స్వీకరిస్తున్నాను. ఎప్పుడైనా ఏదైనా అనుకున్న ఆహారము లభించకపోతే ఇది కూడా దైవేచ్ఛయే - అని భావించి ఉపవాసదీక్షాభావం వహిస్తున్నాను. ధైర్యమును సడలకుండా చూసుకుంటున్నాను.

నాకు ఈ శరీరంలో మనోబలము, ఇంద్రియబలము, భౌతిక బలము ఉన్నప్పటికీ, వాటిని అధిగమించిన దృష్టితో వాటి పట్ల మౌనత్వమును అలవరచుకొని ఉంటున్నాను. పడుకుని నిద్రరానప్పుడు కూడా మౌనంగా తపస్సు చేస్తూ వుండటం అభ్యసిస్తున్నాను. కర్మేంద్రియముకు - ఏదో చేయాలి! ఎక్కడో తిరిగిరావాలి ! ఏదో చూడాలి! ఇంకేదో ఆఘ్రాణించాలి! మరేదో తినాలి - ఇత్యాది భావావేశములను దరి జేరనీయటం లేదు. మౌనంగా రోజులు గడుపుచూ యాదృచ్ఛికంగా లభించిన దానిని సంతోషంగా స్వీకరిస్తూ జీవించటమును కొండచిలువ దగ్గరే నేర్చుకున్నాను. ఆశించటం మొదలై ఆశ దురాశగాను, నిరాశగాను పరిణమించకుండా జాగరూకత వహిస్తున్నాను. ప్రాపంచక సంబంధమైన సర్వ విషయాలపట్ల - సందర్భముల పట్ల - సంఘటనల పట్ల మౌనం వహించినవాడనై వుండటం అభ్యిసిస్తూ మునినై వుంటున్నాను.


Page number:31

ప్రసన్నంగా, గంభీరంగా వుండటం అలవరచుకుంటున్నాను. నేను ఇంతటివాడను, అంతటి వాడను - అని ఇతరులతో చెప్పుకునే బలహీనతను త్యజించసాగాను. అంతరంగంలో దోష వృత్తులను - బలహీనమైన భావాలను దరిజేరనీయకుండా ఇతరులకు దుర్గ్రాహ్యుడుగా, ఇతరుల నిందాస్తుతులకు అతీతుడుగా వుంటున్నాను. ఇతరుల అభిప్రాయములకై ఆశించుకుండా దురత్యయుడనై వుంటున్నాను. దేశ-కాలముల ప్రభావానికి లోను కాకుండా నా నిశ్చలత్వాన్ని సంతోషాన్ని పరిపోషించుకుంటున్నాను.

🌺🌺🌺

10వ గురువు - సముద్రము

ఒక తటాకమైతే వసంత గ్రీష్మ ఋతువులలో (వేసవిలో) ఎండిపోతోంది. వర్షాకాలంలో నిండుగా కనిపిస్తుంది. అదే, సముద్రమో? వర్షరుతువులో వృద్ధిపొందదు. యండాకాలంలో ఎండిపోదు. ఎప్పుడూ యథాతథంగా వుంటుంది. ఇది గమనించి నేను సంపదలకు పొంగిపోరాదు, ఆపదలకు కృంగిపోరాదు - అని నేర్చుకున్నాను. ఎప్పుడూ నిండుగా, ప్రసన్నంగా, గంభీరంగా, ఇతరులకు దురవగాహ్యుడుగా వుంటున్నాను. “ఇదిగో! ఈ ఈ కష్టాలతో చచ్చి పోతున్నాననుకో!” అంటూ ఇతరులకు బాధలు చెప్పుకొని, వారి మెప్పు - ఓదార్పులపై ఆధారపడటం లేదు. కష్ట సుఖాలు ఎవరికుండవు?

అతి విస్తారము, సమగ్రము, తనయొక్క అంతరమున అనేక జీవరాసుల జీవన అనుభూతి - అనుభవములకు చోటును ప్రసాదించునది, సూర్యుకిరణములకు అనుక్షణం తన జలమును అందించి లోక కళ్యాణమునకు కారకము - అగు సముద్రమును గమనించి ఆశ్చర్యం పొందాను.

సముద్రమును మనస్సులో తలచుకొని, గురువర్యా! సముద్ర దేవా! మీ ఆయా మహత్తర లక్షణములను విద్యార్థినై నేను నేర్చుకొనెదను గాక! - అని వారికి మానసికంగా విన్నవించుకున్నాను.

సర్వఋతువులందు సముద్రం ఒకే రీతిగా వుండటం లేదా? అట్లాగే సర్వసమృద్ధులను పొందిన సమయంలోను, దరిద్ర నారాయణునిగా వీధులలో సంచరించవలసి వచ్చినప్పటికీ యోగి (లేక) ముని సంతోషముగాని దుఃఖముగాని పొందడు - అని యోగశాస్త్రం యోగుల గురించి చెప్పుతోంది కదా! నేను ఆయా ఉభయ సందర్భములలో సుఖ దుఃఖ భావాలకు అతీతత్వము వహించి ప్రశాంతంగా గంభీరంగా చిరునవ్వుతో కాలం గడపటం అభ్యసించసాగాను. (సంయోగ వియోగాతీతో యోగః)


Page number:32

🌺🌺🌺

11వ గురువు - పతంగము (మిడత)

మిడత ఎక్కడో ఏదో ఒక మూల ఆహారం భక్షిస్తూ హాయిగా కాలం గడుపుతూ వుండగా, ఇంతలో, మరెక్కడో దూరదూరంగా అగ్నిశిఖల మెరుపులు చూసి ఆకర్షణ పొందుతోంది. వెనువెంటనే, ముందు వెనుకలు ఆలోచించకుండా ఝమ్… మని గాలిలోకి లేచి ఆ అగ్ని శిఖలవైపు దబదబ రెక్కలాడించుకుంటూ బయల్వెడలుతోంది. అగ్నిని సమీపిస్తున్నప్పుడైనా ఆ అగ్ని శిఖలు తన దేహమును బాధించి భస్మం చేస్తాయని గమనించి, ఆగి, వెనుకకు మరల వచ్చును కదా? లేదు. తను కదలుచున్న వేగమును ఉపసంహరించుకోలేక, అందరు చూస్తూ వుండగానే పోయి - పోయి అగ్నిలోకి దూకి భస్మం అవనే అవుతోంది. ఆవేశంలో అనుకున్నది నిర్వర్తించటమేగాని, విచక్షణతో ముందు వెనుకలను పరిశీలించటానికి ప్రయత్నించటం లేదు.

ఈ జీవుని విషయానికి వద్దాం! దుర్గుణములు - దుష్ట సంభాషణములు - దురభ్యాసములు కలిగియున్నవారు ఆ పతంగమువంటి వారే కదా!

ఎంతో కష్టపడి అనేక శ్రమ - త్యాగముల అనంతరం పంచేంద్రియములతో కూడిన మానవ దేహమును సంముపార్జించుకుంటున్నాడు. ఇది ఎంతో గొప్ప విశేషం! ఎందుకంటే, మానవ దేహంతో మోక్షమును కూడా పొందవచ్చును కదా! అటువంటి ఆత్మ విద్యా సముపార్జన సందర్భంలో పంచేంద్రియములతో ఇంద్రియవిషయములగు భౌతిక రూపముల దర్శనం మొదలైన వాటిని పరికించి చూస్తున్నాడు. అంతటితో ఆగటం లేదు. వాటి చేత ఆకర్షించబడి, లభించిన అవకాశాన్ని దుర్వినియోగపరచుకొని మిడతలాగా అనేక లోపములు - అజ్ఞాన జన్మలకు దారి తీయగల మార్గములోనికి తనను తానే ఆవేశంగా - వెను తిరగలేనంత వేగంగా త్రోసివేసుకుంటున్నాడు. ఇంద్రియదృశ్యాకర్షణలు అనే అగ్నిలోకి వెనక-ముందు చూడకుండా దూకుచున్నాడే!

మానవ జన్మ వచ్చింది ఇంద్రివిషయానందము కొరకా? కానే కాదు. అందుకే అయితే… ఇక జంతుజన్మయే అధికమైనది కాదా ఏమి? ఆహార-నిద్రా-మైధునాలు జంతువులకూ ఉంటాయి కదా!

ఎవ్వడైతే ఈ ఇంద్రియ విషయముల ఆకర్షణపై, దురభ్యాసములపై యుద్ధము ప్రకటించి జయించటానికి అవకాశములను సద్వినియోగ పరచుకుంటాడో అట్టివాడే నిజమైన వీరుడు.


Page number:33

ఇంద్రియములకు లోబడనట్టి జితేంద్రియుని మనస్సు మాత్రమే దైవమాయచే నిర్మితమైన జడ - మెడ - భుజములు - ముక్కు ఇత్యాది స్త్రీ - పురుష రక్తమాంస నిర్మిత దేహములకు ధన-జన సంపదలకు ఆకర్షితావేశమును పొందకుండా ఉంటోంది.

అజితేంద్రియుని మనస్సో ప్రలోభము పొందుతోంది. ఫలితమేమిటి? అగ్నివైపు పరుగులు తీసే మిడుతవలె నరక స్థితి గతులలో పడి అనేక విధాలైన కష్టములను నెత్తికి తెచ్చుకొని మరీ అనుభవిస్తోంది.

ఇది మిడుతను గమనించిన నేను, ఓ మిత్రమా! మిడుతా! నీవలె నేను ధనము, దేహము ఇత్యాది ఇంద్రియ విషయల పరంపరలచే జనించే ప్రలోభాగ్ని వైపుగా పరుగుపరుగున పోయి వినాశనము తెచ్చి పెట్టుకోను. ఈ విషయం నాకు గుర్తుచేసి మార్గదర్శివగుచున్నావు కదా! అందుచేత నీవు నాకు గురువువే!… అని సంబోధించి ప్రలోభముల నుండి నన్ను నేను రక్షించుకోవటం ప్రారంభించాను.

మిత్రమా! యయాతిపుత్రా! యదు మహారాజా! మరొక్కసారి గుర్తు చేస్తున్నాను, విను.

శ్లో॥ యోషిత్ హిరణ్య ఆభరణాంబరాది ద్రవ్యేషు మాయారచితేషు మూఢః ।
ప్రలోభితాత్మా హి ఉపభోగ బుద్ధ్యా  పతంగవత్ నశ్యతి నష్ట దృష్టిః ॥
 (అధ్యా 8, శ్లో 8)

స్త్రీ పురుష దేహముల పరస్పరాకర్షణ, ధన-వస్తు సంపద, ఆభరణములు ఇత్యాది మాయారచితమైన వస్తు విషయజాలములను అనుభవించాలనే ప్రలోభములో పడుచున్న జీవుడి దృష్టి - ఆ జీవునికి నష్టము, ఆపదలు కలిగించటానికే! ఇంద్రియాకర్షణలన్నీ పై పైకి ప్రమోదంగానో, యండమావులలోని జలం వలె భవిష్యత్కాలంలో లభించబోయే సుఖాశాసిద్ధివలెనో, వినోదంగానో కనిపించవచ్చు గాక! అంతిమ ఫలితం మాత్రం మిడుతవలె అశాంతియే, వినాశనమే! ఇది మును ముందుగానే గమనించటం ఉచితం… అని నేను మిడత నుండి నేర్చుకున్నాను.

🌺🌺🌺

12వ గురువు - తేనె టీగ

తేనెటీగలో మరొక విషయం గమనించాను.

శ్లో॥ స్తోకం స్తోకం గ్రసేత్ గ్రాసం దేహో వర్తేత యావతా ।
గృహాన్ న హింసత్ న తిష్ఠేత్ వృత్తిం మధుకరీం మునిః ॥
 (అధ్యా 8, శ్లో 9)

తేనెటీగ పుష్పముపై వ్రాలుతుంది. తేనెను కొంచం కొంచం గ్రోలుతుంది. అయితే, ఆ పుష్పానికి ఎటువంటి చేటు కలిగించదు. పుష్పపు రెక్కలకు హాని కలుగనీయదు.


Page number:34

అట్లాగే, రాజా! మనం సహజీవులకు ఎటువంటి హానిగాని బాధగాని కలుగనీయకుండా, వారి వద్ద అత్యంత సుకుమారంగా ఆహారము, సహకారము మొదలైనవి స్వీకరించాలి. అంతేగాని, ఎదుటివారి అభిమానమునో, మన అధికారములో అడ్డం పెట్టుకొని - ఏనుగు తటాకజలంతో ప్రవేశించి కలువ పూతీగలను పీకి నేలపైకి విసురునట్లు - సహజీవులకు కష్టం కలిగించరాదు.

ఎందుకంటే… సహజీవులంతా ఈశ్వర స్వరూపులే కదా! మమాత్మస్వరూపులే కదా!

సన్యాసాశ్రమవాసినైన నేను ఒకే గృహస్థుని వద్ద బహుకాలం తిష్టవేసుకొని వుండరాదని, తద్వారా మనో సంబంధ అనుబంధం బాంధవ్యాల వైపుగా నాకు తెలియకుండానే నా మనస్సు ప్రసరిస్తుందని గమనించాను. పైగా, ఆ గృహస్తునికి కొంత అసౌకర్యమే కదా! తేనెటీగ ఒకే పుష్పంపై బహుకాలం వ్రాలి ఉంటుందా? ఉండదు కదా!.

అనివార్యమైతేనే తదితరులు సహకారము - వారికి అసౌకర్యం కలిగించకుండా పొందాలి!

తేనేటీగ నుంచి మరొక విశేషం గమనించి, నేర్చుకున్నాను. అనేక చిన్న పెద్ద పుష్పాలపై వ్రాలి తుమ్మెద తేనెను స్వీకరిస్తోంది. “ఇది చిన్న పుష్పం కదా! నేను లెక్క చేయను గాక!” అని ఆ షట్పదము (ఆరు కాళ్ళుగల తుమ్మెద) తలచదు. అట్లాగే, బుద్ధిమంతుడు చిన్నవి పెద్దవి అగు అనేక శాస్త్రాలు వింటూ, పరిశీలిస్తూ… ఆ శాస్త్రముల సారాన్ని గ్రహిస్తూ వుంటాడు. ఈ శాస్త్రం వారి గురువు చెప్పింది కదా! ఆ పుస్తకము ఆ మతము వారిదేమో? - ఇత్యాది అల్పావగాహనలు కలిగి ఉండడు.

నేను కూడా అనేక శాస్త్రములు - అనేకమంది మహనీయుల వాక్యాలు వింటూ, వాటి సారమును గ్రహించటం అభ్యసించసాగాను. ఇది తేనెటీగ నుండి నేర్చుకొని అద్దానిని గురుతుల్యంగా భావించసాగాను. “వారి గురువులకంటే వీరి గురువులు గొప్పవారు. వీరికంటే మా గురువులు గొప్ప. మా శాస్త్రములు వారి శాస్త్రములకంటె అధికమైనవి” ఇట్లా ఆలోచించటమే మానివేశాను.

తేనెటీగ గురించి ఇంకొక విషయం కూడా గమనించి ఒకానొక జాగరూకతను ఆశ్రయించసాగాను. తేనెటీగ అనేక పుష్పములపై వ్రాలుచు గంటగంటకు శ్రమించి తేనె తెచ్చి తేనెతుట్టెలో గల అనేక తుట్టి విభాగములలో నింపుతూ జీవితమంతా గడపుతోంది. ఒకానొక రోజు ఏ బోయవాడో వచ్చి ఆ తేనెతుట్టెలోని తేనెటీగలను పాల త్రోలి (లేదా) పొగతో తేనెటీగల శరీరములను నేలకూల్చి తేనెతుట్టెను పిండి, తేనెను తన వెంట కొని పోవుచున్నాడు కదా!.


Page number:35

సంసార రహస్యమును, తదనంతర పర్యవసానములను ఎఱిగిన యోగి భవిష్యత్తుకై ఏవేవో సంపదలను పెంపొందించుకోవాలి కదా! … అనే ధ్యాసకు తావియ్యడు.

జ్ఞానియగు భిక్షువు అరచేతిని తెరచి గృహిణులు సమర్పించిన ఆహారమును స్వీకరించి వూరుకుంటాడు. రాత్రి - రేపు - మరి కొన్ని రోజులకు గ్రాసం… అనే ఆవేశకావేశములను పొందడు.

నేను అధికముగా సామాగ్రి సంపదలను సంపాదించి దాచుకొవటం తేనెటీగవలె ఒకానొకరోజు అంతా పోగొట్టుకోవటానికే! మృత్యువు సమీపించినవాడెవ్వడూ తన వెంట భోజనపు మూటలను, భవనములను, బంగారు ఆభరణములను వెంటబెట్టుకొని వెళ్లటం లేదు కదా! ఎంతో కూడబెట్టాలి అని భావించి జీవితమంతా శ్రమించటం దృశ్యము అనే స్వయంకల్పిత భావావేశముచే మోసపోవటమే కదా! - ఈ విషయం తేనెటీగ నుండి నేర్చుకున్నాను.

🌺🌺🌺

13వ గురువు - మగ ఏనుగు

సుదృఢము - మహాకాయము - అత్యుత్సాహముతో కూడినది అగు ఒకానొక గొప్ప తెలివైన మగ ఏనుగు వున్నది. అది గంభీరంగా, హుందాగా సంతోషంగా కొండ ప్రాంతాలలోను, అరణ్యాలలోను సంచరిస్తూ వుండేది. ఆ ఏనుగు యొక్క ప్రశాంతతతో కూడిన గంభీర్యరూపం చూసి ఆ అరణ్యంలో సంచరించే సింహము - పెద్దపులి మొదలైన జంతువులు కూడా సగౌరవంగా చూస్తూ వుండేవి. సహ జంతుజాలములను ఎంతో వాత్సల్యమైన, ప్రేమాస్పదమైన చూపులతో ఆ ఏనుగు ఆకట్టుకుంటూ ఉండేది!

అంతటి ఏనుగకు ఒక దుర్గుణం ఉండేది. ఆడ ఏనుగును చూడగా పరవశించిపోయి శృంగార చేష్టలకు ఉపక్రమించి, తన యొక్క గాంభీర్యత్వమును ఒక్క క్షణంలో సమూలంగా కోల్పోయేది.

ఒకానొక ఆటవికునికి ఆ మేఘగంభీర స్వభావియగు కొండ ఏనుగును బంధించి ఆ దేశపు రాజుకు అప్పజెప్పి ధనం సంపాదించాలనే పేరాశ కలిగింది. ఆ ఏనుగును బంధించాలని కందకము త్రవ్వటం మొదలైన అనేక ఉపాయాలకు ఉపక్రమించాడు. అవన్నీ - ఆ తెలివైన ఏనుగు ముందుగానే గమనించి తగు జాగరూకతతో ఉండేది.


Page number:36

అయితే, ఆ ఆటవికుడు ఏంచేస్తే ఈ ఏనుగును బంధించవచ్చురా? అని ఆలోచించసాగాడు. కొంతకాలము తరువాత ఆ ఏనుగు యొక్క స్త్రీచాపల్యమును గమనించాడు. ఒక రోజు ఒక గొప్ప కందకము త్రవ్వి, ఆడ ఏనుగువలె ఘీవూ-ఘీవూ అంటూ ఆకర్షణ ఘీంకార శబ్దములు చేయసాగాడు. ఆ అడవి ఏనుగు ఆ శబ్దాలు విన్నది. శృంగార చాపల్యంచేత ముందు వెనుకలు చూచుకోకుండా పోయిపోయి ఆ ఆటవికుడు త్రవ్విన కందకంలో జారి పడి బంధము తెచ్చి పెట్టుకున్నది.

ఈ సంఘటనను విన్న నేను ఆ అడవి ఏనుగు యొక్క దౌర్భాగ్యమైన పతన కారణాల నుండి కొన్ని ముఖ్య విశేషాలు గమనించాను.

సాధకుడైనవాడు ఈ స్త్రీ-పురుష భౌతికాకర్షణలు మొదలైనవాటి పట్ల అతి జాగరూకుడై వుండాలి. పరాయి స్త్రీ మూర్తిని చేతి వ్రేళ్ళచే గాని - కాలి వ్రేళ్ళచే కూడా స్పృశించరాదు. చేతి కఱ్ఱతో కూడా స్పృశించకూడదు. లేదా… ఆ మగ ఏనుగవలె వ్యామోహితుడై ఇంద్రియ విషయపరంపరలలో కూలిపోవలసివస్తుంది. ఆడ ఏనుగు క్రీగంటి చూపులకు బలమైన గజము ఓడి నేల కూలునట్లు - సాధకునికి భౌతికాకర్షణలు మృత్యు సదృశములు. అతని మహాశయములు కూడా అల్పాకర్షణలచే కూల్చివేయబడతాయి.

కాబట్టి ఓ మహారాజా! మృత్యువుతో పోల్చతగిన నామ రూపాత్మకమైన భౌతికాకర్షణలపట్ల అత్యంత జాగరూకుడనై వుండటం ఆ అడవి ఏనుగు యొక్క దుస్థితి నుండి నేర్చుకుంటున్నాను. ఓ ఇంద్రియాకర్షణములారా! మీరు దూర దూరంగా ఉండండి!… అను అభ్యాసము కలిగి ఉంటున్నాను.

🌺🌺🌺

14వ గురువు - తేనెతుట్టెల నుండి తేనె గ్రహించేవాడు

న దేయం నో ఉపభోగ్యం చ లుబ్దైః యత్ దుఃఖసంచితమ్ ।
భుంక్తే తదపి తచ్ఛ అన్యో మధుహేవ అర్థవిత్ మధుః ॥ 
(అధ్యా 8, శ్లో 15)

ఓ రాజా! తేనెతుట్టి నుండి తేనెను గ్రహించువాడిని గమనిస్తూ… లోభగుణం యొక్క పర్యవసానమేమిటో పాఠ్యాంశంగా నేర్చుకున్నాను. తేనెటీగ ఎంతో కష్టపడి సంపాదించిన తేనె తాను అనుభవించక ఇతరులకు దానమివ్వక జీవిస్తోంది. ఈ లోగా ఏ బోయవాడో ఒకానొక రోజు వచ్చి తేనెను ప్రరిగ్రహించి తేనెటీగలను బయటకు వెడలత్రోయుచున్నాను.


Page number:37

ఈ ప్రపంచంలో ఎన్నో శ్రమలకు ఓర్చి సంపాదించిన ధనం లోభి నాది - నాది అని అనుకుంటూ చూసుకుంటూ వుంటున్నాడు. తాను తినడు, అనుభవించడు. ఇతరులకు పెట్టడు. ఒకానొకరోజు మృత్యువు వచ్చి ఈ జీవుని కాళ్ళకు చేతులకు బేడీలు వేసి తనవెంట గొనిపోతోంది. ఆ లోభి దాచిన డబ్బు దొంగలపాలో, దొరలపాలోకావటం అనివార్యం కదా! అందుచేత, తన సంపదలను నలుగురిని ఆనందింపజేయటానికి వినియోగించేవాడు తెలివి కలవాడు. దాచి - దాచి, అవి అట్లా - అట్లా చూచుకుంటూ, చివరికి దేహము వదలి పోతూ… లోభ గుణం చేత సంపదల సముపార్జన శ్రమనుండి పొందవలసిన దాన పుణ్య ప్రయోజనం పొందనివాడు తెలివి తక్కువవాడుకాక మరింకేమిటి? లోభగుణం మనస్సును అనేక దుఃస్థితులకు - అల్పజన్మలకు గొనిపోతూ వుంటుంది.

ఇది గమనించి నేను, లోభగుణాన్ని దాన గుణంతో నిత్యము జయిస్తూ వుండాలి అనే పాఠ్యాంశాన్ని మననం చేయసాగాను. దానం చేయటం చేతగాని ఇంటిలోకి లోభగుణం వచ్చి పెత్తనం చెలాయిస్తుంది. ఆ యజమానిని తన సేవకుడిగా చేసుకుంటుంది అని గమనించాను.

🌺🌺🌺

15వ గురువు - వేటగాని సంగీత శబ్దాలకు ఆకర్షితమైన జింక

ఒక వేటగాడు అడవిలో సంచరించే లేడిని బంధించటానికి ఇంపైన సుందర సంగీత శబ్దములను వినిపించి ఆ లేడిని ఆకర్షిస్తాడు. ఆ రీతిగా, జన్మ అనే అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని అనుకునే సాధకుడు (ముముక్షువు) విషయ సంబంధములైన గీతములను (The songs pertaining to worldly attractions) వింటూ వింటూ వుండటం ఉచితం కాదు. లేడివలె ఆకర్షించబడకూడదు.

స్త్రీల నృత్య - గాన - శృంగార మొదలైన గీతములందు ఆసక్తి కలవాని మనస్సు వాటివాటియందు ఆకర్షణ పెంపొందించుకొనుచు ఇక వాటికి బందీ అయిపోతుంది.

ఋషి గర్భము నుండి జన్మ పొందిన ఋష్యశృంగుడు అనే మహాముని విషయసంబంధమైన గీత నృత్యాల యందు ఆసక్తుడై తపోమార్గం నుండి చ్యుతి పొందటం జరిగిందని మనం (శ్రీమద్రామాయణంలో) విన్నాము కదా!.

అందుచేత, నృత్య-గీతములందు, సంసార (దృశ్య) సంబంధమైన సమాచారములందు ఆసక్తిని కలిగివుండటం ప్రమాదకరమైనది. అవి నాయొక్క ధ్యానము - తపస్సు ఇత్యాది ప్రయత్నములకు అవరోధము - చ్యుతి కలిగిస్తాయి.


Page number:38

అందుచేత, లేడివలె శబ్దాకర్షణకు లోనై ప్రమాదములను ఆహ్వానించరాదు - అనే విషయం నేర్చుకున్నాను. ఆధ్యాత్మిక పురోగతికి అవసరంలేని లౌకిక సమాచారములకు సంఘటనలకు దూరంగా వుండటం అలవరచుకున్నాను.

🌺🌺🌺

16వ గురువు - ఎరకు ఆకర్షితమై గాలమునకు చిక్కుకుంటున్న చేప

గాలమునకు తగిలించిన ఎరకు చేప ఆకర్షితమైపోయి గాలములో చిక్కుకుంటోంది. ఈ జిహ్వ (నాలుక) దేహానికి ముఖ్యద్వారం వంటిది కదా! తదితర ఇంద్రియాలన్నీ నిరాహారం (Non-using) చేస్తూ వుంటే క్రమంగా అవి జీవునిపై ప్రభావం చూపటం సన్నగిలుతుందేమో! కానీ, ఈ నాలుకయో? దీనిని నిరాహారం చేస్తూ వున్నకొలది రెచ్చిపోతూ వుంటుంది. ఆహారం తిననివాడు కోపంగా వుంటాడు కదా! జిహ్వచాపల్యం మరింత అధికమౌతుంది!

శ్లో॥ తావత్ జిత ఇంద్రియో న స్యాత్ విజిత అన్య ఇంద్రియః పుమాన్ ।
న జయేత్ రసనం యావత్, జితం సర్వం జితే రసే ॥ 
(అధ్యా 8, శ్లో 21)

ఈ రసేంద్రియం జయించటం అతి ముఖ్యమైన పని. అన్ని ఇతర ఇంద్రియములను జయించినప్పటికీ.. రసేంద్రియాన్ని జయించనంతవరకు ఇంద్రియములపై విజయం లభించనట్లే! రసేంద్రియాన్ని వశం చేసుకున్నామా… అన్ని ఇంద్రియాలను జయించినట్లే!

అందుచేత, చేప వలె కాకూడదు నేను. ఈ రసేంద్రియాన్ని (నాలుకను) జయించి వుండాలి. ఎప్పుడు ఏది ఆహారంగా లభిస్తే అద్దానిని ప్రసాదంగా భావించాలి. అంతేగాని, నాకు ఆ రుచి ఇష్టం! ఈ పదార్ధాన్ని మాత్రమే తింటాను… అని తిష్టవేసుకొని కూర్చోను. అట్టి మార్గంలో రసేంద్రియాన్ని జయించే ప్రయత్నాలు చేయసాగాను!

అంతేకాకుండా, సాత్వికమైన ప్రేమ పూరితమైన సంభాషణలతో రసేంద్రియ దేవతను ఉపాసించ నిశ్చయించుకున్నాను. వాక్కు సత్యం శివం సుందరంగా వుండటమే వాక్ తపస్సు కదా!

🌺🌺🌺

17వ గురువు - పింగళి అనే పేరు గల ఒక వేశ్య చేసిన వైరాగ్య బోధ

ఓ యదు మహారాజా! ఇక నా 17వ గురువు గురించి చెప్పుతాను. విను.

ఒకానొకప్పుడు పెద్దలచే చెప్పబడిన ఒక ఉదాహరణ నాకు గురువై, నేను నేర్చుకోవలసినది గుర్తు చేయసాగింది.


Page number:39

ప్రాచీన కాలంలో…., విదేహనగరంలో (మిథిలానగరంలో) పింగళ అనే ఒక వేశ్య వుండేవారు. ఆమె ఒక రోజు సాయంకాలం సుందరంగా అలంకరించుకొని వాకిట నిలుచుని ధనము ఇవ్వగల విటులను ఆకర్షించే ప్రయత్నం ప్రారంభించింది.

ఎవరో ఒకరు ఆ త్రోవన రాగానే “ఈతడు నేననుకున్నంత ధనం ఇవ్వడేమో! ఈతనిని పోనిద్దాం. ఇంకో పెద్ద ధనికునికోసం మరికొంత వేచి ఉందాం!” అని భావిస్తూ వేచి వుండసాగింది. ఆమె మనస్సులో దురాశ కొండంతగా ఎదగసాగింది. చాలా సేపు ఎదురుచూచింది.

ఇంతలో ఆమెకు నిద్ర ముంచుకు రాసాగింది. అయినా సరే, ఎట్లాగో అట్లా నిద్రను త్యజించి తన ప్రయత్నాలు కొనసాగించింది. ఇంట్లోకి పోవటం, కొంచం నడుం వాల్చడం, మరల ప్రవేశద్వారం వద్దకు వచ్చి కులుకు - బెలుకులు చూపుతూ నిలుచోవటం, చాలా సేపు అటువైపుగా ఎవ్వరూ రాకపోవటం, వచ్చినవారు ధనికులు కాకపోవటం.. ఇట్లా తెల్లవార్లూ… వేచి వేచి వుండసాగింది.

ఆమెలో ధనాశ - పేరాశ - దురాశ అధికమై ఇక, ఆమె నిరుత్సాహపడుతూ ఊసురోమనసాగింది. అనుకున్నట్లుగా ధనం ఇవ్వగలిగిన
విటుడెవ్వడూ తారసపడక పోవటంచేత ఆమెలో కసి కోపం ఆవేశం నీరసంతో కూడిన ఆక్రోశము అధికాధికం కాసాగాయి.

ఈ విధంగా నిమిషాలు, గంటలు గడచిపోయాయి. ఒకానొక సమయంలో ఆమెకు విటులపై - వారిచ్చే ధనంపై గల అనురక్తి కాస్తా విరక్తిరూపం దాల్చసాగింది. వైరాగ్య భావాలు ఆమెలో ఉదయించసాగాయి.

ఓ రాజా! ఏవేవో ఆశించటం, నిరాశ పొందటం అనే దురభ్యాసమే సంసారము అనబడుదాని మూల పదార్థం (Raw-material) కదా! అందుకు ఔషధం? వైరాగ్యమే సుమా!

ఉత్తములు “నిరాశా” సందర్భములను “వైరాగ్యం”గా మలచుకుంటారు. అంతేగాని, ఊసూరుమంటూ ఊరుకొని వుండరు.

శ్లో॥ న హి అంగాజాత నిర్వేదో దేహబంధం జిహాసతి ।
యథా విజ్ఞానరహితో మనుజో మమతాం! నృప!
(అధ్యా 8, శ్లో 29)

ఓ యదు మహారాజా! విజ్ఞాన రహితుడైన మనుజుడు మమకారమును (నాది, నాకు సంబంధించినదే… అనే భ్రమావేశమును) వదలుకో గలడా? లేదు.


Page number:40

ఉత్తమమైన వైరాగ్యం పొందనంతవరకు ఈ జీవుడు దేహముతో అనుబంధరూపమైన బంధమును వదలటానికి ఇష్టపడడు.

విరక్తి - వైరాగ్యము పొందిన ఆ పింగళ మాత్రం ఏ విధంగా వైరాగ్య మార్గము గురించి గానం చేసిందో చెపుతాను, వినండి.

పింగళ :  ఓ సహజనులరా!

శ్లో॥ అహో! మే మోహవితతిం పశ్యతా విజితాత్మనః ।
యా కాన్తాత్ అసతః కామం కామయే యేన బాలిశా ॥ 
(అధ్యా 8, శ్లో 30)

అహో! ఈ ఇంద్రియములకు ఆధీనం అయి వాటిచే జయింపబడి వుండటం చేత, నేను ఎంతటి మోహంలో పడిపోయానో గమనిస్తున్నారా? నా వివేకమంతా నశించటం చేతనే స్వప్నసదృశులగు (వాస్తవానికి లేక పోయినప్పటికీ కలలో కనిపించి మాయమయ్యేవారితో సమానమగు) దుష్టపురుషులకు తుచ్ఛ విషయసుఖముల కొరకై దాసోఽహం అయిపోతున్నాను. ఇదంతా ఎంతటి దుఃఖ విషయం! నాకు నిజంగానే బుద్ధి నశించింది. ఎందుకిట్లా అంటున్నావని అడుగుచున్నారా? అయితే, వినండి!

సర్వతత్త్వస్వరూపుడగు పరమాత్మ ఈ జగద్రూపుడై, సర్వజీవులకు సుఖప్రదాతయై, సర్వులకు సంపదలను ప్రసాదించువాడై, నిత్యుడై, ప్రతి ఒక్కరికి ఆత్మసముడై కళ్ళకు ఎదురుగా వేంచేసియే ఉన్నారు. అట్టి పరతత్త్వ స్వరూపుడగు ఆత్మారాముని ఆశ్రయించటం ఏమరచాను. ఆజ్ఞానం చేత సమర్థత లేనివారు, కోరుకున్న నిత్యసుఖాన్ని ఇవ్వలేని వారు, పైగా దుఃఖము - భయము - శోకము - మోహములను ప్రసాదించేవారు అగు భౌతిక దేహాలని - దేహులను ఆశ్రయించానే! ఇంతకన్నా తెలివితక్కువదనం ఇంకెక్కడన్నా వుంటుందా? అహాఁ! ఎదో బ్రతుకుతెరువు కోసం ఈ వేశ్యవృత్తిని ఆశ్రయించాను. ఈ శరీరాన్ని పోషించుకోవటానికి దీనికి అలంకారాలు షోకులు చేసి ఈ దేహాన్ని విటులకు సమర్పిస్తూ వచ్చాను. ఎవ్వరైనా పిల్లలను పోషించుకోవటానికి ఆ పిల్లలనే అమ్ముకోవటం ఎంత అర్థంలేని విషయమో.. నా విషయం అంతే కదా! శరీరమును పొందింది మనస్సును నిర్మలము - శక్తియుతము చేసుకోవటానికే అయివుండగా.. ఇప్పుడు ఈ శరీరమును మనస్సును కూడా వేశ్యవృత్తిద్వారా మరింత కలుషితం చేసుకుంటున్నానే!


Page number:41

ఈ పవిత్రమైన శరీరాన్ని నేను లోభులకు - మూర్ఖులకు, ఇంద్రియలోలులకు, విషయ లంపటులకు, వ్యర్థవాక్య కలాలాపులకు, అధర్మ నిరతులకు ధనాశచే అప్పగించి ఎంత ఆత్మ ద్రోహం చేసుకుంటున్నాను! మోక్ష సాధనమగు ఈ శరీరమును ధనము కోసము, రతి కోసము మూర్ఖురాలనై ఇంతకాలం దుర్వినియోగం చేసుకుంటూ వస్తున్నానే!

ఈ నా శరీరము ఎటువంటిదంటే… ఇది ఒక చూరిల్లు వంటిది. దీనిలో వెదురు బొంగుల స్థంభములవలె బొమికలు అమర్చబడి వున్నాయి. బొమికలు-చర్మముచే, వెంట్రుకలచే, గోళ్ళచే కప్పబడివున్నది. ఈ దేహ గృహానికి 9 ద్వారాలు వున్నాయి. (రెండు కళ్లు, రెండు చెవులు, రెండు ముక్కుపుటాలు, నోరు, గుదము, గుహ్యము). ఈ 9 ద్వారాలనుండి ధూళి దుర్వాసనలతో కూడిన జలము - కళ్ళె - మలము - మూత్రము ఇత్యాది దుర్గంధభూయిష్టమైన పదార్థాలు ఎల్లప్పుడూ బయల్వెడలుచూ వుంటాయి. దీనిలో దాగివున్న సంపదలు మలము-మూత్రము మొదలైన దుర్వాసన - దుమ్ము - దుష్ట పదార్థములతో కూడిన రక్త - మాంస - బొమికలే కదా! ఇటువంటి ఈ శరీరములో ఒకరు అభిమానించటానికి గాని, మరొకరు, ద్వేషించటానికి గాని విలువైన - పనికి వచ్చే పదార్థమేమున్నది? ఈ నా వెంట్రుకలు - మలము - దుష్టరసములు - మూత్రము - రక్త మాంస బొమికల శరీరంలో విటులకు కనిపిస్తున్న ఆనంద వస్తువేమిటి? ఇక వారిచ్చే ధన సంపదచే ఈ నా దేహము క్రొత్తగా పొందుచున్నదేమిటి? ఇదంతా పరస్పరం మోసగించుకొని ఒకరికొకరం లంపటంలోకి (బురదలోకి) త్రోసుకోవటమే అవుతోంది.

శబ్ద - స్పర్శ - రూప - రస - గంధ శక్తులతో కూడిన ఈ శరీర గృహంలో ప్రవేశించినది ఎందుకు? అజ్ఞాన ప్రవృత్తులను మరింత దట్టంగా ప్రవృద్ధి పరచుకోవటానికా? కాదు. కాకూడదు!

నా యందు ఆత్మానంద స్వరూపుడై సర్వదా వేంచేసియున్న నా ప్రియమైన శ్రీహరిని ఏమరుస్తున్నానే? తుచ్ఛము - దుఃఖప్రదము అగు భోగ వస్తువుల కోసం అన్య జనులగు విటులు మొదలైన వారిని ఆశ్రయిస్తున్నానే? ఇంతటి మూఢత్వం ఇంకెక్కడన్నా వుంటుందా? ఈ విదేహ నగరంలో నా కన్నా తెలివి తక్కువవారు మరెవ్వరూ వుండరేమో? ఇంటిలో గల మధుర పదార్థాలను తినటానికై వంటగది తలుపులు తెరవటానికి బద్ధగించి,…. ఒకామె ఒక బొచ్చె తీసుకొని ప్రక్కింటివారిని మాధవకోళం కొరకై బిచ్చమెత్తటం వంటిదే కదా, నాయొక్క విటుల నుండి ధనాశ!


Page number:42

ప్రతి ఒక్క జీవునికి అత్యంత ప్రియమైన వస్తువు - ఆతని అంతరంగమునకు సాక్షిగా వేంచేసియున్న శ్రీహరియే! ఆయనయే అందరికన్నా ప్రియతమము, స్నేహితుడు, శ్రేయోభిలాషి, ప్రభువు, అంతర్యామి, ఓదార్చేవాడు, తోడైననాడు కూడా! ఆ లక్ష్మీ సమేత శ్రీమన్నారాయణుని “ఆత్మ నివేదన” అనే ఉపాయంతో “ఆత్మార్పణ” అనే ధనంతో కొనుక్కొని శాశ్వతసుఖం సంపాదించుకోవాలి. ఆయనతో కూడి విహరించాలి. ఈ విటులతో కాదు! పాంచభౌతికము - భ్రమాత్మకము - దుఃఖపర్యవసానము అగు ఇంద్రియ విషయములతో కానేకాదు!

ఇక జగత్తు విషయమంటారా! ఇందులో కనిపించేదంతా కాలముచే వచ్చి - పోతూ వుంటుంది. ఒకరికి మరొకరు కలిగించగల సుఖమెంతటిది? ఆయా కామప్రదులగు జీవులతో సంబంధముచే అజ్ఞాన జనితమైన కోరికలు పెంపొందించుకోవటమే అవుతుంది. కోరికలు కలిగి వుండటమే సర్వ దఃఖాలకు మూల కారణం. కోరికలు, తీరాలని మానవులను ఆశ్రయించి ఏం ప్రయోజనం? దేవతలంతటివారు వారి భార్యలకు ఏం సుఖం కటబెట్టగలిగారు?

అమ్మయ్య! ఏ జన్మలో ఏం గురుసేవ చేశానో ఏమో? ఏ సత్కర్మల ప్రభావం చేతనో సర్వాంతర్యామియగు విష్ణు భగవానుడు నాకు ఈ రోజు స్ఫురిస్తున్నారు. ఆయన నా పట్ల ప్రసన్నుడు అవటం చేతనే నా లోని దృశ్య తాపత్రయం నీర్వేదమౌతోంది. ఆయన కృపచేత నాకు వైరాగ్య సంపద ఉద్భవించి క్షణక్షణం ప్రవృద్ధమౌతోంది. ఈ వర్తమాన వైరాగ్యము నాకు శాశ్వత సుఖమును ప్రసాదించటానికే అయివున్నది.

అహా! ఇంతకాలం నేను పొందిన కష్టాలే నాకు బాధ గురువులు. కష్టాలే వుండి వుండకపోతే వైరాగ్యము అనే సౌభాగ్యం నా బుద్ధికి ప్రాప్తించేది కాదు కదా! క్లేశాలే ఇంద్రియ విషయముల పట్ల వైరాగ్యము ప్రసాదించి, బంధమును త్రెంచి శాంతికి మార్గమును ప్రసాదిస్తాయి. అన్నీ ప్రసాదించేది పరమాత్మయే కదా! కష్టాలు ప్రసాదించినట్టి ఆ పరమాత్మకు నేనిప్పుడు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఆయన కరుణచే ఈ రోజు నేను దురాశను వదలి ఆ జగదీశ్వరుని శరణువేడుచున్నాను.

ఇప్పుడు… ఇక నేను ఏం చేయాలి? అప్రయత్నంగా భగవదనుగ్రహంచేత లభించిన శేష జీవితము అనే అవకాశాన్ని సంతోషంగా శ్రద్ధగా సద్వినియోగ పరచుకొంటాను. సర్వాత్ముడు - మమాత్మస్వరూపుడు అగు ఆ సర్వేశ్వరునితోనే ఇక నుంచి విహరిస్తాను.


Page number:43

అవును! ఈ జగత్తంతా కాలము అనే సర్పముచే మ్రింగి వేయబడియే వున్నదని వర్తమానంలో అందరము గమనించియే వుండటం ఉచితం. వివేకి అయినవాడు సర్వ విషయముల పట్ల అనురక్తిని దరిచేరనీయడు. ఎవ్వడు ఎల్లప్పుడు సర్వ విషయముల పట్ల విరక్తుడై వుంటాడో, అట్టివాడు మాత్రమే మాయనుండి తనను తాను రక్షించుకున్నవాడగుచున్నాడు. నేను శేషజీవితాన్ని వైరాగ్య సమన్వితంగా, సర్వాత్మకుడగు మహావిష్ణు సమర్పితంగా, భగవత మహిమా గానపూర్వకంగా, మహానీయుల ఆప్తవాక్యముల మననముతో గడిపెదను గాక!

ఓ యదు మహారాజా! ఆ పింగళ ఈ విధంగా ఆలోచన కొనసాగించింది. విటులతో సమాగమం, దేహమును అమ్ముకొని ధనం సంపాదించటం మొదలైన ఆలోచనలను అప్పటికప్పుడు పరిత్యజించింది.

క్రమంగా - సర్వరూపములు తానై, సర్వసాక్షి అనగ వేరై, సర్వ బ్రహ్మాండములకు తానె సూత్రధారియై – సర్వ జీవ బుద్ధులందు సంకల్ప వికల్పములను సర్వత చేయుచు నిర్వికల్పుడగు – అటువంటి విష్ణుతత్త్వాన్ని మననం చేస్తూ ప్రశాంతంగా నడుం వాల్చింది. అప్పడు ఆమె హాయిగా నిదుర ఆస్వాదించసాగింది.

ఓ రాజా! ఇంద్రియ సుఖాలు త్యజించి ఆత్మేశ్వరుని శరణువేడటం అనేది ఆ పింగళ అనే వేశ్య దగ్గర నేర్చుకున్నాను. కష్టాలు - కష్టపెట్టేవారు కూడా నాకు గురువులే! వైరాగ్యమును నేర్చుకోవటానికి సహకరిస్తున్నారు కదా!

🌺🌺🌺

18వ గురువు - కురర పక్షి (లకుముకి పిట్ట)

ఒకానొక చోట ఒక లకుముకి పిట్ట ఒక సుందర వనంలో హాయిగా ప్రశాంతంగా ఆనందిస్తూ రోజులు గడపుతూ వుండేది. ఒక రోజు ఆ పిట్టకు మధురమైన మాంసాహారం ఒక గుట్టగా దొరికింది. ఆహా! సాధ్యమైనంత అధికంగా నోట కరచుకొని గూటికి చేరి సంతానంతో – బంధు మిత్రులతో ఈ మాంసాహారాన్ని ఆస్వాదించెదను గాక! - అని అనుకున్నది. పొడవైన ముక్కునంతా కప్పివేయగల మాంసపు ముక్కలను నోటకరచుకొని బయల్వెడలింది. కొన్ని వేరైన పెద్ద పిట్టలు ఆ లకుముకి పిట్టను చూసి - ఈ ఆహారం దీని నుండి బలవంతంగానైనా లాగివేసి భుజిద్దాం అని అనుకున్నాయి. వెంట బడి తమ ముక్కులతో ఆ పిట్టను హింసించసాగాయి.


Page number:44

ఇక ఆ లకుముకి పిట్ట ఆ తదితర పిట్టల హింసలకు తుట్టుకోలేక పోయింది. ఏం చేయాలి? దానికి ఓ ఉపాయం తోచింది. వెంటనే ఒక బండరాయి పై వ్రాలింది. నోటనున్న మాంసపు ముక్కలను అక్కడ బండరాయిపై వదలి తుఱ్ఱున గాలిలోకి ఎగిరింది. అప్పుడు పిట్టను వెంటబడి బాధిస్తున్న తదితర పక్షులు ఆ పిట్టను హింసించటం ఆపాయి. వదలిన మాంసపు ముక్కలకై బండరాయివైపుగా పరుగులు తీశాయి.

చూసావా, యదు మహారాజా! ఆ లకుముకి పిట్ట యొక్క అనుభవానికి శిష్యుడనై ఒకానొక ముఖ్యమైన విశేషం నేర్చుకొని పాటించసాగాను.

పరిగ్రహో హి దుఃఖాయ యద్వత్ ప్రియతమం నృణామ్ ।
అనంతం సుఖమాప్నోతి తద్విద్వాన్ యస్తు అకించనః ॥ 
(అధ్యా 9, శ్లో 1)

స్వయమానంద స్వరూపుడగు ఈ జీవుడు దుఃఖం పొందటానికి అసలు కారణం ఏమిటి? ఆసక్తియే సుమా!

ఈ ఈ వస్తువులు నాకు ప్రియాతిప్రియములు అని మననం చేస్తూ క్రమంగా – తనకు తెలియకుండానే సుఖ-దుఃఖ భావ పారవశ్యానికి లోను అవటం చేతనే!

ఇది ప్రియం - ఇది అప్రియం అనే పరిమిత భావావేశములను, అల్ప ఆశయములను పరిత్యజించిన మరుక్షణం సర్వ దుఃఖాలు తమకు తామే తొలగిపోతాయి.

ఆ లకుమిక పిట్ట మాంసపు ముక్కను త్యజించినట్లు - వీరు మాత్రమే నాకు చెందినవారు, నేను వీరికి మాత్రమే చెందిన వాడిని అనే హ్రస్వదృష్టులను త్యజించసాగాను. క్రమక్రమంగా మానావమానములకు సంబంధించిన, బంధువుల-సంబంధీకుల, భార్య, పుత్ర సంబంధమైన సర్వ చింతలను త్యజించసాగాను. నాది - నాకుండాలి - నాకే వుండాలి - నాకు చెందినవి సంరక్షించుకోవాలి… ఇటువంటి లోభ-మోహాలు దూరంగా ఉండేటట్లు జాగ్రత్తపడుచున్నాను.

🌺🌺🌺

19వ గురువు - బాలుడు

ఒక బాలుడు అన్నీ మరచి ఆటలలో లీనమై కేరింతలు కొడతాడు చూచారా? అట్లాగే నేను ఆత్మసందర్శానందము అనే క్రీడా స్థలంలో బాలునివలె క్రీడోత్సాహంతో క్రీడించటం ప్రారంభించాను. ఈ జగత్తులో ఇద్దరు మాత్రమే చింతా రహితులై, ఇదంతా ఆట స్థలంలాగా ఆస్వాదిస్తూ విహరిస్తున్నారు. పరమానందాన్ని అనుభవిస్తున్నారు.


Page number:45

1.) చిన్నపిల్లవాడు. ఈతనికి సంపద ఆపదల గురించి ఏమీ తెలియదు. కనుక, ఆశ - భయం లేకుండా హాయిగా ఆటలలో లీనమై ఆనందిస్తున్నాడు, అయితే ఇది అజ్ఞానంతో కూడిన నిశ్చేష్టత చేత! విషయాలేమీ ఇంకా తెలుసుకొని వుండకపోవడం చేత - లభిస్తున్న బాలానందమేగానీ అఖండానందం కాదు.

2.) గుణాతీతత్వం ఆశ్రయించిన జ్ఞాని. ఈతనికి కనబడేదంతా ఆత్మయే! సత్య - నిత్య - నిర్మల స్వస్వరూపాత్మయే జగత్తు రూపంగా ఇంద్రియములచే పొందబడుతోంది అని గమనించి, ఆత్మసాక్షాత్కారం ఆస్వాదిస్తున్నాడు. కష్ట-సుఖాలు ఇత్యాదులన్నీ ఆతనికి
జగత్ క్రీడా విశేషాలుగా అయి ఉంటాయి.

నేను గుణాతీతుడనై ఈ దృశ్యమును క్రీడగా ఆస్వాదిస్తూ బాలునిలా కేరింతలు కొట్టడం, గుణభేదములతో లీనం కాకుండానే క్రీడగా వీక్షించడం అభ్యసించసాగాను.

🌺🌺🌺

20వ గురువు - కన్యక గాజుల గల గల త్యజించి ధాన్యం దంచటం

ఓ యదుమహారాజా! “నాకు ఈ బాధలు, ఆ బాధలు ఉన్నాయి సుమా! నేనే ఎంతో కష్టపడుచున్నాను! నేను అంతటి వాడిని. వారేమో మంచివారు కాదు! వారందరూ లోపాలు గలవారే!” - ఇటువంటి మాటలు పరస్పరం రోజుల తరబడి చెప్పుకోవటం రజో తమో గుణాధిక్యత చేతనే!

ఇతరులతో ఏదో మన కష్టాలు చెప్పి, ఇతరుల తప్పుల గురించి మరొకరితో మాట్లాడి స్వాంతన పొందాలనుకోవటం - ఆధ్యాత్మమార్గంలో ముందుకు అడుగు వేయలేకపోవటానికి స్వయంకృత దోషంగా కల్పించుకుంటున్న అవరోధాలు! నిరోధాలు!

తమోగుణం చేతనే - “నాకు వారి వలన, వీరి వలన కష్టాలు వస్తున్నాయి. వారు ఇటువంటి వారు. వీరు అటువంటివారు” - అనే మాటలు మనస్సులోంచి వుబుకుతున్నాయి.

రజోగుణం చేతనో - “ఇదంతా నా కర్మ! పూర్వకర్మల దోషం!” - అని అనిపిస్తూ వుంటుంది.

సత్వగుణం చేత - “ఈ కష్టసుఖాలు పరమాత్మ నన్ను బాగు పరచటానికి ప్రసాదిస్తున్న పరీక్షా విధానాలు!” – అని భావించబడుచున్నాయి. (These are all teachings, but not teasing).

గుణాతీతునకో, “ఇదంతా నాటకం! లీల! క్రీడ! స్వప్నం వంటిది! కథా శ్రవణం వంటిది!” - అనే అవగాహన పరిపుష్టి పొందుతూ వుంటుంది.

ఇదంతా ఒక సందర్భములో ఒక కన్యక వడ్లు దంచుతూ ఆశ్రయించిన ఒక ఉపాయం నుండి నేర్చుకున్నాను. ఆ కథా విశేషం చెప్పుచున్నాను. వినండి.


Page number:46

కనకావతి అనే పురంలో పుణ్య కార్యములు, దాన గుణములు, పరోపకారము మొదలైన ఉత్తమ గుణములచే లోక ప్రసిద్ధి - ప్రశంసలు పొందుచున్న ఒకానొక రైతు కుటుంబం వుండేది. వారి ఇంటిలో సుగుణాల రాసి, సౌందర్య రాసి అయిన ఒక కన్యక వుండేది. ఒకసారి ఏమి జరిగిందంటే …, “ఆహాఁ! ఈమె మాయింటికి కోడలుగా వస్తే ఎంత బాగు! లక్ష్మీదేవి వేంచేసినట్లే!” అని ఆ పరిసరాలలోని చాలా ధనికుడైన ఒకానొక ఉత్తమ కుటుంబీకుడు తలచాడు.

ఒకానొక రోజు… కాబోయే వరుడు, అతని తల్లిదండ్రులు, తదితర బంధువులు ఆ కన్యను చూడటానికి పెళ్ళిచూపులకు వచ్చారు. ఆ సమయానికి ఇంటి పెద్దలు వేరే పని మీద బయటకు వెళ్ళివున్నారు. వారంతా తిరిగి రావటానికి కొంచం సమయం పట్టేట్లుగా వున్నది. ఇంటిలో ఆ కన్యక మాత్రమే వున్నది. “అభ్యాగతిః స్వయం విష్ణుంః” … అని పెద్దల భాష్యం కదా! వచ్చినవారికిక అతిథి మర్యాదలు చేయటం గృహస్థధర్మం. పైగా మగ పెళ్ళివారాయె! ఆమె సిగ్గుతో, చిరునవ్వుతో వారందరిని అహ్వానించి అసనాలు సమకూర్చింది. అటు తరువాత వారికి ఆహార పానీయాలు సమకూర్చే ప్రయత్నాలు ప్రారంభించింది.

ఆ రైతు కుటుంబం సద్గుణములచే లోక ప్రసిద్ధమే అయినప్పటికీ ధన ధాన్య సంపదలతో తులతూగే కుటుంబమేమీ కాదు. ఇంటిలో అప్పుడు చూసుకుంటే అతిథులందరికీ భోజనము పెట్టగల బియ్యము ఉన్నట్లుగా లేదు. అందుచేత ఆ కన్య కొట్టంలోంచి వడ్లు తెచ్చి అప్పటికప్పుడు వంట ఇంటిలో రోకలితో దంచటానికి ఉపక్రమించింది.

వడ్లు దంచటం ప్రారంభించగానే ఆమె రెండు చేతులకు నిండుగా గల గాజులు బహు సుందరంగా “గల గల” శబ్దం చేయసాగాయి. వెంటనే ఆమె దంచటం ఒక్క క్షణం ఆపింది. "అరెరే! ఈ నా గాజుల శబ్దం ఈ వచ్చిన మగపెళ్లివారికి, వారి బంధువులకు వినబడుతుందేమో? వినబడితే ఇప్పటికిప్పుడు నేను వడ్లు దంచుచున్నానని వారికి తెలిసిపోతుంది. అనగా, ఈ ఇంటిలో బియ్యం సమృద్ధిగా వుండవని, మేము పేద వారిమని, పనివారు ఎవ్వరూ లేరని, నేనే వడ్లు దంచుచున్నానని వారు అభిప్రాయపడతారు. కుటుంబంలోని కష్టసుఖాలు ఇతరులకు తెలియటం ఉచితం కాదు కదా! అది ఇంటి పరువుకు శోభ కాదు. అట్లా అని, బియ్యం దంచకపోతే, మా ఇంటి పెద్దలు వచ్చిన తరువాత బియ్యము కొరకై బయటకు వెళ్ళటంకూడా మర్యాద కానేకాదు. అతిథుల ముందు ఆహార సామాగ్రి తేవటం గౌరవప్రదం కాదు. మరిప్పుడు ఏమి చేయాలి?..


Page number:47

ఇట్లా యోచిస్తూ చేతి గాజులను చూచుకుంటూ ఉన్నది. ఇంతలో తెలివిగలది సౌభాగ్యవతి అగు ఆ కన్యకు ఒక ఉపాయం తళుక్కున తోచింది. వెంటనే ఈ చేతికి, ఆ చేతికి రెండు రెండు గాజులు మాత్రమే వుంచి, మిగతాగాజులన్నీ తీసి ప్రక్కన పెట్టి ఇక నెమ్మదిగా వడ్లు దంచసాగింది. ఈ ఇంటి కన్యకయే వడ్లు దంచుతోంది - అనే విషయం చావడిలో ఆసీనులైన పెళ్ళికొడుకు వైపు బంధువులకు తెలిసే అవకాశం లేకుండా చేసింది.

అయితే…
అప్పుడు ఆమె ధాన్యం దంచుతూ వుంటే రెండు రెండు గాజుల శబ్దం మాత్రమే వెలువడసాగింది. ఈ మాత్రం గాజుల శబ్దం కూడా ఉచితం కాదు. ఇంటి గుట్టు రచ్చకు ఎందుకు ఎక్కాలి? అని తలచి ఆ కన్యక ఒక్కొక్క గాజును కూడా తీసి వేసింది. అప్పుడు ఈ చేతికి ఆ చేతికి ఒక్కొక్క గాజు మాత్రమే మిగిలివున్నది. అసలు గాజుల శబ్దమే కావటం లేదు.

ఓ యదు మహారాజా! జనుల ఆచార వ్యవహారాలు పరిశీలించే నిమిత్తం అనేక ప్రదేశాలు సంచారం చేస్తూ, దైవికంగా ఆ పురం వెళ్ళిన నేను ఈ సంఘటనను స్వయంగా గమనించాను. అనేక మంది జనులు వున్న చోట అసంగతమైన సంభాషణ, అనుచితమైన అభిప్రాయాలు, దోష నిర్ణయాలు, ఆవేశకావేశాలు, కలహాలు, తప్పొప్పుల మననములు జరుగుతూనే వుంటుందిగాని, శాశ్వత శ్రేయస్సు గురించి తగినంత యోచన జరగటం చాలాసార్లు జరుగదు. ఇద్దరు ఉన్నచోట కూడా ఎక్కువగా లోక విషయాలు, లౌకిక సంఘటనలే చర్చకు వస్తూ వుంటాయి.

అందుచేత, కన్యక చేతి ఒక గాజు వలె ఒంటరిగా అవకాశమున్నంతకాలం సంచరించటం, ఏకాంతంగా ఆధ్యాత్మికమైన యోచనలు చేయటం జీవునకు శుభప్రదం! - అనే పాఠము నేర్చుకున్నాను.

ఆ కన్యక ఒకే గాజుతో ధాన్యాన్ని దంచినట్లుగా ఏకాంతంగా ఈ జగత్తును పాఠ్యాంశాలవలె దర్శిస్తూ - నేర్చుకోవలసినది నేర్చుకోవాలి. విడువవలసిన లౌకిక భావావేశాలు, అభిలాషలు త్యజించి వుండాలి. అతీతుడనై వుండాలి - అని మరల మరల గుర్తు చేసుకోసాగాను!


Page number:48

🌺🌺🌺

21వ గురువు - కంసాలి - బాణము తయారు చేసేవాడు

మనస్సును ఏకాగ్రం చేయాలి. అందుకుగాను, మనస్సును ఒకే లక్ష్యం వైపుగా అధికాధిక కాలం నియమించాలి. అప్పుడుగాని, ఈ మనస్సు దృశ్యస్వభావమును అధిగమించి సర్వాతీతమగు నిర్మలద్రష్ట (ఆత్మ) యొక్క దర్శనమునకు సిద్ధపడజాలదు.

అట్టి ఏకాగ్రత ఈ మనస్సుకు లభ్యపడేది ఎట్లా? అందుకు ఉపాయాలుగా మహనీయులగు జ్ఞాన కోవిదులు శాస్త్రముల ద్వారా ప్రాణాయాయము, ఆసనము, ధ్యానము, తపస్సు, పూజ, ఇష్టదైవ స్తోత్రం ఇత్యాది ఉపాయాలు అందిస్తున్నారు. జాగరూకతతో తదితర లోక సంబంధమైన ఆలోచనలు కట్టిబెట్టి ప్రాణాయామాది సాధనలు నిర్వర్తించాలి. అనేకాగ్రత (Multi priority) వలననే జీవుడు దృశ్యమునకు - ద్రష్టకు పరము అగు ఆత్మభావనను ఆశ్రయించలేక పోవుచున్నాడు.

ఈ విషయంలో నాకు గొప్ప సూచనగా లభించటానికి కారణమైన ఒక సంఘటనను నీకు చెప్పుచున్నాను. విను.

ఇనుముతో పరికరములు తయారు చేయగల అతి నిపుణుడైన ఒకానొక కంసాలి వుండేవాడు. ఆ దేశపు రాజు ఆతని పనితనం గురించి విని అతనిని పదునైన బాణములు తయారుజేసే ఉద్యోగంలో నియమించాడు. ఒకానొక రోజు… మహారాజు గారు సేనా సమేతంగా వ్యాహ్యాళికై వెళ్ళుచూ, ఆ కంసాలి ఇంటి ముంగిట ఆగి, ఆ పరిసరాలను ఆస్వాదిస్తూ ఉన్నాడు. ఆ రాజు నిలబడిన చోటికి అతి సమీపంలో కంసాలి పదునైన నిడుపైన బాణమును తయారు చేస్తూ ఏకాగ్రతతో బాణపు కొనకు పదును పెట్టుచున్నాడు. మహారాజు ఆతనిని గమనిస్తూ చూస్తూ అతి సమీపంగా నిలబడ్డారు. పేరుపెట్టి పిలిచారు. కానీ, ఆ కంసాలి మాత్రం ఎటూ చూడక, పదును పెట్టే పనిలో లీనమైయున్నాడు. ప్రక్కనే వచ్చి మహారాజు నిలబడినప్పటికీ ఏ మాత్రం గమనించకుండా, పరిసరాలను మరచి బాణపుకొసకు పదును పెట్టటం ఏకాగ్రతతో కొనసాగించసాగాడు.

అదంతా ఆ బాటన వెళ్లుచూ నేను గమనించాను. అప్పుడు అనుకున్నాను.

ఆహా! ఏమి ఈ కంసాలి యొక్క ఏకాగ్రత! పరిసరాలన్నీ మరచి బాణముకొసకు పదును పెట్టే ప్రయత్నంలో మనసంతా సంపూర్ణంగా నియమించటం చేత అతడు తన మహారాజు యొక్క రాకను కూడా గమనించటం లేదే! నేను కూడా బాహ్య - అభ్యంతరములను మరచి, సర్వాత్మకుడు సర్వతత్త్వ స్వరూపుడు అగు ఈశ్వరునియందు దృష్టినంతా ఏకాగ్ర పరచటము అభ్యసించెదను గాక! - అనే నిర్ణయం చేసుకొనసాగాను.


Page number:49

🌺🌺🌺

22వ గురువు - పాము

పాము ఒంటరిగా సంచరిస్తూ రోజులు గడుపుతూ వుంటుంది. ఒక ఇల్లు కట్టుకొని ఇక్కడే వుంటాను - అనే నియమం దానికి లేదు. పరిసరముల పట్ల మమకారం కలిగి వుండదు. ఎప్పుడు ఏ ఆహారం పొందితో అదే ప్రేమగా ఆస్వాదిస్తుంది. ఎక్కడ చోటు దొరికే అక్కడ చుట్టలు చుట్టుకొని ఏకాంతంగా రోజులు రోజులు గడిపివేస్తుంది.

ఎక్కడికో వెళ్ళాలి. అప్పుడుగాని సాధన కుదరదు. అప్పుడుగాని హాయి లేదు. ఇది కాదు. మరొక ఆశ్రమం. ఇక్కడ ఇక ఎక్కువ కాలం నాకు ఇష్టంలేదు - అని భావిస్తూ ఈ మానవుడు వర్తమానంలో ఆత్మతత్త్వ జ్ఞాన సముపార్జనకు యోచించకుండా కాలమంతా
బుగ్గిపాలు చేసుకుంటున్నాడు.

పాము తన కొరకు తానుగా ఇల్లు కట్టుకోదు. పరుల ఇళ్ళలో, అనగా చీమలు నిర్మించిన పుట్టలలో, జీవితకాలం గడిపివేస్తుంది.

శ్లో॥ గృహారంభో హి దుఃఖాయ, విఫలశ్చ అధ్రువాత్మనః
సర్పః పరకృతం వేశ్మ ప్రవిశ్య సుఖమేధ తే॥
(అధ్యా 9, శ్లో 15)

అనిత్యము, అల్పఫల ప్రదాతయగు ఈ శరీరమును ఏదో దీర్ఘకాలం కాపాడుకోవాలనే ఉద్దేశ్యంతో గొప్ప ప్రదేశంలో గొప్ప గొప్ప గృహాలు కావాలని అభిలషించటం అల్పప్రయోజన విషయమే! ఈ విశేషం చీమలు నిర్మించిన పుట్టలో తల దాచుకొని తనకంటూ ఏ గృహము కలిగి వుండని పామును గమనించి నేను నేర్చుకున్నాను.

ఈ కనబడేదంతా మాయాజాగత్తు. కేవలం దైవ కల్పితం. ఇందులో నాకు ఇళ్ళు లేవు. సంపదలు లేవు - అని అనుకుంటూ ఉసూరుమనటం అర్థంలేని వ్యర్థమైన పని!

ఈ జగత్తుకు ఈశ్వరుడు, సర్వజన అంతర్యామి సర్వతత్త్వ స్వరూపుడు, అందరికి ఆరాధ్యుడు అగు నారాయణుడొక్కడే! ఆయన తన మాయా చమత్కారంతో ఈ జగత్తును ఒకానొకప్పుడు సంకల్ప చమత్కారంగా నిర్మిస్తున్నాడు. మరొకప్పుడు కాల స్వరూపుడై హరిస్తున్నాడు. తన అంశరూపంతో జీవుడు అనునది కల్పించుకుంటున్నాడు. ద్రష్ట అయి ఆస్వాదిస్తూ, ఎప్పుడో తనయందు ఇదంతా లయింపజేసుకుంటున్నాడు. ఆ నారాయణుడే సర్వజీవాత్మలకు ఆధారుడు! ఈ సర్వమునకు మూలకారణుడు! అందరియొక్క అంతరాత్మ!


Page number:50

సర్వము తానే అయి, దృశ్య రూపంగా ఆవిర్భవించి తానే ఆస్వాదిస్తున్న శ్రీమన్నారాయణునికి తన - మన - తనవారు కాని వారు - ఏకము - ద్విత్వముల అనేకము అనబడే భేదమంతా ఎక్కడున్నది? లేనే లేదు. ఆతడే జన్మలకు కర్మలకు మునుముందే వెలుగొందుచున్న సనాతన పురుషుడు.

ఆత్మయే ఆ నారాయణుని స్వరూపం! నేను, నీవు, వారు, వీరు… అంతా నారాయణ స్వరూపమే!

ఆత్మానుభవ స్వరూపమగు కాలముచే సత్వ-రజ-తమో గుణ సంపద ఒకానొకప్పుడు సామ్యం పొందినపుడు పురుషుడు (Experiencer) - ప్రకృతి (Experiences) లను పరమపురుషుడు తనయందు లయం చేసుకొంటున్నాడు. ఆ పరమ పురుషుడే నారాయణుడు! సనాతన పురుషుడు! నిరుపాధికుడు! తానే సర్వమునకు ఆధారమై తనకు “ఉపాధి-ఆధారము” యొక్క ఆవస్యకతయే లేనట్టి సత్ స్వరూపుడు! కేవలానుభవ ఆనందస్వరూపుడు! కైవల్యము అనే సంజ్ఞచే చెప్పుబడువాడు. నారాయణుడే ఈ సర్వమునకు బాహ్య-అభ్యంతర స్వరూపము.

ఆ సనాతన పురుషుడొక్కడే సర్వ జగత్ సంజ్ఞారూపంగా విరాజిల్లుచున్నాడు! అతడే సదా ఆవరణుడు! నిరావరణుడు! పరము! పరమాత్మ! ఈ జగత్ అనే అనుభవమునకు ఆవల ఉన్న - జీవులందరియొక్క స్వస్వరూపమే నారాయణుడు! పరాత్ పరుడు - అని విజ్ఞులచే దర్శింబడుచున్నాడు! కీర్తించబడుచున్నాడు. నేను నారాయణ స్వరూపుడను. ఆయనయే నా గృహం. ఇక ఈ భౌతిక దేహమంటారా, ఇది ఎక్కడో అక్కడ కొన్నాళ్ళు భూమిపై గడుపును గాక! మరెప్పుడో - తన దారి తాను చూచుకొనును గాక!

🌺🌺🌺

23వ గురువు - సాలెపురుగు

ఓ శత్రుమర్ధనా! యదు మహారాజా!

కేవలం ఆత్మానంద స్వరూపుడు - నిర్గుణుడు - నిరాలంబుడు మనందరి వాస్తవ స్వస్వరూపుడు అగు ఆ నారాయణుడు అనుభవము (Experiencing) అనే ఒకానొక చమత్కార సంజ్ఞను అకారణంగానే స్వీకరిస్తున్నారు.

అట్టి ఆత్మానుభవ విశేషం చేత, స్వమాయచే, త్రిగుణాత్మకంగా (సత్త్వ - రజః - తమోగుణ రూపంగా) ఈ కనబడే సర్వముగా ప్రదర్శించుచున్నారు.


Page number:51

తనయొక్క త్రిగుణాత్మకమగు మాయను సంక్షోభింపజేసి మహతత్త్వమును ఒక లీలగా (As a play), క్రీడగా (As a sport), వినోదంగా సృజించుచున్నారు. అట్టి త్రిగుణ స్వరూపమగు మహత్ తత్త్వము నుండి ఈ విశ్వములను ప్రకటించుచున్నారు (Manifesting the Universe).

ఒకడు వినోదం కోసం ఒక కథ చదువుచూ (లేక) వింటూ, ఆ కథలోని సంఘటనలతో, పాత్రలతో కల్పిత గుణ విశేషములతో తన్మయం పొంది సుఖము (Comfort) - దుఃఖము (Discomfort) - ఆశ్చర్యము (Surprise) - ఆనందము (Pleasure) - భయము (Fear) - ఆవేదన (Lamentation) - జిజ్ఞాస (Inquistiveness) ఇత్యాది పొందుతాడు చూచావా! అట్లాగే… ఈ దృశ్యము కూడా!

ఈ దృశ్య వ్యవహారమంతా ఎక్కడి నుండి వచ్చింది? దృశ్యాతీతుడు - జీవ జగత్ అతీతుడు అగు నారాయణుడే సృష్టికాలంలో జీవుడు అనే ద్రష్టరూప - అంశను కల్పించుకొని - దృశ్యము అనే చమత్కారమును కూడా రచించుకొని రసాస్వాదనను నిర్వర్తిస్తున్నారు.

మరొకప్పుడు, కాలము అనే మరొక అంశచే ఈ దృశ్యమును తనయందు ఉపశమింపజేసుకుంటున్నారు. ప్రతి జీవుని యొక్క వాస్తవ స్వరూపము ఆ నారాయణుడే!

ఆయనయే జీవాత్మలకు ఆధారుడు, ఆశ్రయుడు! ఆయన ఒక్కటిగానే ఉన్నారు! రెండు గాను, అనేకంగాను, అసంఖ్యాకంగాను కనిపిస్తున్నది కూడా ఆయనే! అంతటా, అన్నింటా, అన్నీగా కనిపిస్తున్నది ఆయనయే! ఇక ఆయనకు తన - పర భేదం ఎక్కడుంటుంది? ఆయనకు సజాతీయ - విజాతీయ భేదం లేనే లేదు! కల కనేవానికి తన కలలో కనిపించినవారిలో అయివారెవ్వరు? కానివారెవ్వరు? కలంతా కూడా స్వప్నదర్శియొక్క స్వయంకృత కల్పనా విశేషమేగా? కల కనేవానికి తన కలలో కనిపించే ప్రియమైనవారు - ప్రియం కానివారు ఇరువురు స్వకీయ కల్పనా వినోద విశేషాలే కదా!

కాలము అనునది కూడా నారాయణుని యొక్క ఆత్మానుభవ స్వరూప చమత్కారమే!

అట్టి కాలముచే ఒకానొకప్పుడు సత్త్వము మొదలైన శక్తులన్నీ సామ్యత్వం సంతరించుకుంటున్నాయి.


Page number:52

అప్పుడు సనాతన పరమ పురుషుడగు నారాయణుడు ఒక్కడే శేషించుచు విరాజిల్లుచున్నాడు.

ఆతని నుండి బయల్వెడలిన బ్రహ్మదేవుడు (సృష్టికర్త) - జీవుడు (సృష్టించబడినవాడు) మొదలైనవన్నీ ఆయన యందు లయిస్తున్నాయి. ఆయనయే సర్వ జీవులకు ఆశ్రయ యోగ్యుడు! ఆయన ఉపాధి రహితుడు! పరమానందరూపుడు! ఆయన యొక్క స్వానుభవమే కైవల్యము! నేను “ఓం” సంజ్ఞా స్వరూపుడనగు నారాయణడనే… అనునదే నిత్య సత్యము.

యదు మహారాజు:  ఓ సాధూ! ఆవధూతా! ఈ కనబడే దృశ్యమంతా ఏ రీతిగా ఎవరిచే ఏర్పడుతోంది? మరింతగా వివరించండి!

అవధూత:  ఈ జగత్తుగా కనిపించేదంతా ప్రతి జీవుని స్వస్వరూపమగు శ్రీమన్నారాయణుడే! ఆయనయే అకారణంగా కల్పనామాత్రంగా, పిల్లలకు కల్పించి చెప్పే కథలాగా, ఒక వినోదంగా తనయందు తానే తనకు అద్వితీయంగా సృష్టి అనే చమత్కారమునకు ఉపక్రమిస్తున్నారు. అట్టి సృష్టి అనే కారణంగా మొట్ట మొదట కాలము అనే కార్యము జనిస్తోంది. అట్టి కాలము అనే అనిర్దేశ్యము (Non-Definable), అభౌతికము (Non-material) నుండి (కాలచమత్కారంచేత) ఆత్మయొక్క స్వకీయ ప్రభావ రూపములగు సత్వము - రజము - తమము అనే త్రిగుణాలు బయల్వెడలుచున్నాయి.

ఆ త్రిగుణములనుండి ప్రదర్శన రూపమగు కార్య - కారణ - కర్తృత్వ భేదరూపంతో కూడుకొనిన క్రియాశక్తి వెలువడుతోంది. అట్టి క్రియా శక్తి యొక్క చమత్కారంగా మహత్తత్వము (Multiplicity) ప్రదర్శితమౌతోంది. అట్టి మహత్తత్వము త్రిగుణములచే జనింపబడుచున్నది!… అని చెప్పబడుతోంది.

ఆ మహత్తత్వము చేతనే జీవుడు - ఆ జీవుని ఊహానుభవ జనితమగు జగత్తు (Experiencer and Visualization of Experiences) బయల్వెడలుచున్నాయి. జీవుడు - అనుభూతి అనే జంట కవుల గానమే ఈ అనేక విశ్వముల చమత్కారం! ఇదంతా ఒక వ్యక్తి యొక్క అనేక వేరు - వేరు స్వప్న పరంపరా సందర్శనముల వంటిదే!

ఈ విధంగా ఆత్మనుండే ఈ విశ్వములు (Flock of Universes from one’s own Self) బయల్వెడలుచున్నాయి అనే శాస్త్ర పాఠ్యాంశాన్ని నేను సాలెపురుగును చూసి ఆరూఢ పరచుకున్నాను.


Page number:53

సాలెపురుగు తన హృదయము నుండి ముఖము ద్వారా దారమును వ్యాపింపజేస్తోంది. ఆ దారములో తానే విహారాలు చేస్తోంది. అట్లాగే పరమాత్మ స్వకీయ కల్పనచే జీవాత్మలు అనే దారములను విస్తరింపజేసుకొని వాటియందు విహరిస్తున్నారు. ఈ విశ్వము పరమాత్మచే సృష్టించబడి, పరమాత్మ యొక్క స్వప్నాంతర్గత ద్రష్ట వంటి జీవాత్మచే అనుభవించబడుతోంది.

మరొకప్పుడు పరమాత్మ యొక్క అంశమగు ఈ జీవాత్మ (Expriencer) తాను అనుభవ రూపంగా పొందుచున్న విశ్వముతో సహా పరమాత్మ యందు లయస్తున్నాడు - తరంగం జలంలో లయిస్తున్నట్లుగా! అయితే, తరంగము జలము కానిదెప్పుడు? ఈ జీవుడు పరమాత్మ స్వరూపుడు కానిదెప్పుడు? ఎప్పుడూ లేదు!

జీవాత్మయే ఈ దేహము యొక్క ధారణచే దేహి అయివుంటున్నాడు.

🌺🌺🌺

24వ గురువు - భ్రమర కీటకము

శ్లో॥ యత్ర యత్ర మనో దేహీ ధారయేత్ సకలం ధియా ।
స్నేహాత్ - ద్వేషాత్ - భయాత్ వా అపి యాతి తత్ తత్ స్వరూపతామ్ ॥ 
(అధ్యా 9, శ్లో 22)

ఈ దేహి మనన రూపమగు మనస్సుచే దేని దేని పట్ల ఎక్కడెక్కడ స్నేహము - ద్వేషము - భయము రూపంగా ఏకాగ్రతను లగ్నం చేస్తాడో, అక్కడక్కడ ఆయా సంబంధమైన వస్తు విషయ రూపంగా పరిణమిస్తూ ప్రదర్శితమగుచూ వుంటాడు.

(Where ever the Holder / User of body applies concentration by virtue of inclination, envy or fear, the User oneself appears and becomes in and as those expressions.)

ఈ విషయం నేను భ్రమర కీటక న్యాయం అనే సంఘటన నుండి నేర్చుకున్నాను.

ఒక గండు తుమ్మెద ఒక కీటకమును తెచ్చి తను ఉన్న ప్రదేశంలో వుంచుతుంది. ఆపై ఆ తుమ్మెద ఝుమ్ - ఝుమ్ అంటూ పెద్ద శబ్దములు చేస్తూ ఆ కీటకము చుట్టూ తిరగటం ప్రారంభించుతుంది.

ఆ కీటకం (చిన్నపురుగు) ఆ శబ్దం వింటూ ఈ తుమ్మెద నన్ను మ్రింగుతుందేమో? చాచికొడుతుందేమో? … అని భయపడుతూ వణకసాగుతుంది. దృష్టినంతా తుమ్మెద యొక్క కదలికల వైపు లగ్నం చేయసాగుతుంది. అనుక్షణం ఆ తుమ్మెద గురించే భయముతో అతి తీవ్రంగా యోచిస్తూ నవనాడులను ఏకాగ్రం చేసి దృష్టంతా తుమ్మెదపై నిలుపుతుంది.

శ్లో॥ కీటః పేశస్కృతం ధ్యాయన్ కుడ్యాం తేన ప్రవేశితః ।
యాతి తత్ సా ఆత్మ తాం, రాజన్! పూర్వ రూపం అసంత్యజన్ ॥
(అధ్యా 9, శ్లో 23)


Page number:54

ఆ చిన్న పురుగు ఈ తుమ్మెద ఎప్పుడు నన్ను మ్రింగుతుందో, ఏమో? - అని క్షణ క్షణం గండు తుమ్మెదపై ఏకాగ్రంగా దృష్టి నిలుపుతుంది కదా! క్రమక్రమంగా ఒకానొక చమత్కారం జరుగుతోంది. ఆ చిన్న కీటకం తన పూర్వ శరీరం త్యజించకుండానే క్రమక్రమంగా అద్దాని శరీరం వ్యాకోచం పొంది ఆ చిన్న పురుగు కాస్తా గండు తుమ్మెదగా మారిపోతోంది. ఇది ఒక ప్రకృతి చమత్కారం!

ఆ కీటకం గండు తుమ్మెదపై భయంతో దృష్టిని - శ్రద్ధను కేంద్రీకరించినట్లుగా నేను మహానీయులగు గురువుల వద్ద శ్రద్ధ - భయ - భక్తులతో ధ్యాసను బుద్ధిని ఏకాగ్ర పరచటం కొనసాగించసాగాను. వారిచే సుశిక్షితుడనై ఆ మహనీయులవలెనే సంస్కరించబడిన నిర్మల సునిశిత బుద్ధిని పొందసాగాను. అంతేగాని, అల్పదృష్టి - ధ్యాసల గురించి, అట్టివారి గురించి మననమే చేయటం లేదు. తద్వారా అల్పత్వం వచ్చిపడుతుందని గమనించాను కనుక!

🙏🌺

24 మంది గురువులు - సమీక్ష (Summary)

యువకుడైన అవధూత తాను జగత్ అనుభవములో ఎంచుకొని పాఠములు నేర్చుకున్న 24 మంది గురువులు / సంఘటనలు.

🌍 1.) భూమి నుండి ఓర్పు వహించటం, క్షమించటం, అపకారికి కూడా ఉపకారము చెయ్యటం నేర్చుకున్నాను.

💨 2.) వాయువు నుండి ప్రతిఫలాపేక్ష లేకుండా తన ధర్మమును తాను నిర్వర్తించటం నేర్చుకున్నాను.

☁️ 3.) ఆకాశమును చూచి ఆత్మాఖండత్వము, విషయముల పట్ల అప్రమేయత్వము, అసంగత్వము అభ్యసించుచున్నాను.

💦 4.) జలము వలె పరులయందు మధుర మృదు స్వభావముతో ఉండటం, పరోపకార నిరతి నేర్చుకున్నాను.

🔥 5.) అగ్ని వలె విషయములను భక్షిస్తూ కూడా దోషము పొందకపోవటం, జ్ఞాన కాంతులు అవసరమైన చోట ప్రసాదించటం తెలుసుకున్నాను.

🌙 6.) చంద్రుని నుండి గమనించి సంపద - ఆపదలకు, సమృద్ధి - అసమృద్ధిలకు అతీతత్వమును నేర్చుకొని, ఆచరిస్తున్నాను.

☀️ 7.) సూర్యునివలె యథాతథ ఆత్మత్వమును స్వభావసిద్ధంగా ధారణ చేస్తూ వుండటం కొనసాగిస్తున్నాను.

🕊 8.) ఒక పావురము వలె చాలా కాలము ఇంద్రియ వ్యామోహములో సంసార సుఖదుఃఖములలోనే చిక్కుకొని, ఈ మహత్తరమైన మానవ జన్మ అనే అవకాశము నేను వ్యర్థం చేసుకోదలచుకోలేదు. ఆరూఢచ్యుతుడను కాకూడదు!… అని చివరకు మృత్యువుచే నాశనమైన ఆ పావురం యొక్క అనుభవం నుండి నేను నేర్చుకోసాగాను.

🐍 9.) ఒక కొండచిలువను చూస్తూ నేను సుఖ-దుఃఖాల పట్ల ఉదాసీనత, లభించిన ఆహారముతో సంతృప్తి చెందటం గ్రహించాను.

🌊 10.) సముద్రమును మనస్సులో తలచుకొని ఎప్పుడూ నిండుగా - ప్రసన్నంగా - గంభీరంగా ఉంటూ, సమృద్ధి - ఆపదలలోను ఏక రీతిగా ఉంటూ, ఇతరులకు బాధలు చెప్పుకొని వారి మెప్పు - ఓదార్పులపై ఆధారపడటం లేదు.

🦗 11.) ఒక మిడుత (పతంగము) ఏ విధంగా అగ్నిశిఖలను చూసి ఆకర్షితమై అగ్నిలో పడి హాని తెచ్చిపెట్టుకుంటున్నదో, అదే విధంగా మానవుడు ఇంద్రియ విషయ సుఖాపేక్షకు లోనై, తత్త్వ దృష్టిని అభ్యసించటం వదిలివేసి దుఃఖములు, మృత్యువు తెచ్చిపెట్టుకుంటున్నట్లు నేను గమనించాను.

🐝 12.) ఒక తేనెటీగ ఏ విధంగా పుష్పములకు హాని కలుగకుండా వాటిలోని తేనెను స్వీకరిస్తుందో, నేను కూడా ఈ సంఘమునకు, ప్రకృతికి హాని కలుగకుండా అవసరం మేర వరకే ఆధారపడి ఉండటం గ్రహించి ఉన్నాను. ఎట్లాగైతే తేనెటీగలు సంపాదించిన తేనె కొల్లగొట్టబడుతుందో, నేను అతిగా చేసిన సంపాదన ఏదో ఒక రోజు ఈ కాలం కొల్లగొడుతుందని తెలుసుకొని, కేవలం సంపాదనకే జీవితం వృధా చేసుకోకూడదని అర్థం చేసుకున్నాను.

🐘 13.) ఒక మగ ఏనుగు ఏ విధముగా ఆడ ఏనుగును చూసి తన గాంభీర్యము వదిలి, పరవశించి, వేటగాని చేతిలో చిక్కుకొనుచున్నదో గమనించి, నేను కూడా పరస్త్రీ చాపల్యముచే ఎంత పతితుడను అవగలనో సాధనా మార్గంలో తెలుసుకొని, జాగ్రత్తగా వ్యవహరిస్తూ, మనస్సును అదుపులో ఉంచుకుంటున్నాను.

🐝 14.) ఒక తేనెతుట్ట కొట్టేవానిచే ఎట్లాగైతే తేనెటీగలు కూడబెట్టిన తేనె కొల్లగొట్టబడుతుందో, నా లోభ గుణము చేత దానధర్మాలు చేసి పుణ్య సంపాదన చేసుకొనకపోతే, ఉత్తమ జన్మలు పొందలేక పతనమైపోతాను అని జాగరూకత వహించి ఉన్నాను.

🦌 🥁15.) ఒక లేడి వలె శబ్దాకర్షణకు లోనై ప్రమాదములను ఆహ్వానించరాదు… అనే విషయం నేర్చుకున్నాను. భావోద్రేక గీతాలు మరియు విషయ వార్తలు వినటం అనే దురభ్యాసమును వదలుచున్నాను. ఆధ్యాత్మిక పురోగతికి అవసరంలేని లౌకిక సమాచారములకు, సంఘటనలకు దూరంగా వుండటం అలవరచుకున్నాను.

🐟 16.) ఒక చేప గాలమునకు ఉన్న ఎరకు ఆకర్షితమై ఘోరముగా మృత్యువు కొనితెచ్చుకోవటం చూచి, నేను జిహ్వా చాపల్యం నియంత్రించుకొని, సాత్వికమైన మితాహారాన్ని మాత్రమే సమయానుకూలముగా భుజిస్తూ, మృదువుగా మితముగా - సత్యము మాత్రమే మాట్లాడుచూ వాక్ తపస్సు చేయటం అభ్యసిస్తున్నాను.

🧞‍♀️ 17.) పింగళ అనే ఒక వేశ్య తన ఇంద్రియ చాపల్యమునకు, ధనాశతో విషయప్రవిష్టులైన విటులకు దాస్యము చేస్తూ, తనకు మహత్తరమైన మానవ జన్మను ప్రసాదించిన ఈశ్వరుని ఏమరుచుట చూచుకొని తనపై తనకే అసహ్యము వేసి, వైరాగ్యము పొంది, ఒకప్పుడు మానవులకు తాను చేసిన హితబోధ తెలుసుకొని నేను ఆ పింగళ బోధను గురువుగా భావిస్తున్నాను.

🐦 18.) ఒక కురర పక్షి (లకుముకి పిట్ట) తాను నోట కరచుకుని ఉన్న మాంసపు ముక్కలను విసర్జించి, వాటికోసం తనను వెంటాడుతున్న ఇతర క్రూర పక్షులనుండి తప్పించుకున్నట్లుగా, నేను కూడా నాకు ఇష్టమైనవాళ్ళు, పరాయివాళ్ళు అనే భేదభావనలను వదిలించుకుని హాయిగా ఉండటం అభ్యసిస్తున్నాను.

👶🏻 19.) ఒక బాలునిలా నేను గుణాతీతుడనై ఈ దృశ్యమును క్రీడగా ఆస్వాదిస్తూ కేరింతలు కొట్టడం, గుణభేదములతో లీనం కాకుండానే క్రీడగా వీక్షించడం అభ్యసించసాగాను.

👧🏻 20.) ఒక కన్యక ధాన్యము దంచేటప్పుడు చేతికి ఉన్న ఎక్కువ గాజులతో వచ్చే శబ్దం రానివ్వకుండా ఉండటానికి ఒకే గాజుతో ధాన్యాన్ని దంచినట్లుగా, ఏకాంతంగా ఉంటూ ఈ జగత్తును పాఠ్యాంశాలవలె దర్శిస్తూ నేర్చుకోవలసినది నేర్చుకోవాలి. విడువవలసిన లౌకిక భావావేశాలు, అభిలాషలు త్యజించి వుండాలి. అతీతుడనై వుండాలి… అని మరల మరల గుర్తు చేసుకోసాగాను!

🙇🏻‍♂️ 21.) ఒక కంసాలి ఏకాగ్రతతో, పరిసరాలన్నీ మరచి బాణముకొసకు పదును పెట్టే ప్రయత్నంలో మనసంతా సంపూర్ణంగా నియమించటం చూసి, నేను కూడా బాహ్య - అభ్యంతరములను మరచి, సర్వాత్మకుడు సర్వతత్త్వ స్వరూపుడు అగు ఈశ్వరునియందు దృష్టినంతా ఏకాగ్ర పరచటము అభ్యసించెదను గాక! - అనే నిర్ణయం చేసుకొనసాగాను.

🐍 22.) ఒక పాము వలె సొంత ఇల్లు అనునది లేకుండా అనికేతుడనై, సర్వ సంగ పరిత్యాగినై, ఈ జగత్ సర్వము ఈశ్వర లీలా వినోదంగా చూస్తూ, దేహ రక్షణకై లోకానుకూలంగా వ్యవహరిస్తున్నాను.

🕷 23.) ఒక సాలెపురుగు తన హృదయము నుండి ముఖము ద్వారా దారమును వ్యాపింపజేస్తోంది. ఆ దారములో తానే విహారాలు చేస్తోంది. అట్లాగే పరమాత్మ స్వకీయ కల్పనచే జీవాత్మలు అనే దారములను విస్తరింపజేసుకొని వాటియందు విహరిస్తున్నారు. ఈ విశ్వము పరమాత్మచే సృష్టించబడి, పరమాత్మ యొక్క స్వప్నాంతర్గత ద్రష్ట వంటి జీవాత్మచే అనుభవించబడుతోంది.

🐝 24.) భ్రమర కీటక న్యాయములో ఒక కీటకం గండు తుమ్మెదపై భయంతో దృష్టిని - శ్రద్ధను కేంద్రీకరించినట్లుగా, నేను మహానీయులగు గురువుల వద్ద శ్రద్ధ - భయ - భక్తులతో ధ్యాసను బుద్ధిని ఏకాగ్ర పరచటం కొనసాగించసాగాను. వారిచే సుశిక్షితుడనై ఆ మహనీయులవలెనే సంస్కరించబడిన నిర్మల సునిశిత బుద్ధిని పొందసాగాను. అంతేగాని, అల్పదృష్టి - ధ్యాసల గురించి, అట్టివారి గురించి మననమే చేయటం లేదు. తద్వారా అల్పత్వం వచ్చిపడుతుందని గమనించాను కనుక!

🌺🌹🙏🌹🌺


Page number:55

ఓ యదు మహారాజా! ఈ విధంగా 24 మంది గురువుల దగ్గర కొన్ని తాత్త్వికమైన సూక్ష్మ రహస్యాలను గ్రహించాను. అందుచేతనే ఈ దృశ్యప్రపంచాన్ని, ఈ దృశ్య ప్రపంచంలో కదలించబడుతూ కనిపించే ఈ భౌతిక దేహాన్ని, ఇక్కడి ప్రకృతి యొక్క సంపదలగు మనో - బుద్ధి - చిత్త - అహంకారాలను నాకు వేరుగా చూస్తూ స్వాత్మాణి పరమేశ్వరః అను ఆత్మజ్ఞానానందాన్ని పెంపొందించుకుంటూ పరిపుష్టిచేసుకొంటున్నాను.

దేహమే గురువు

యదు మహారాజు :  ఓ యతీశ్వరా! ఈ దేహమే దేహికి ఐహిక మోహం కదా! దేహబద్ధునికి సంసారం (illusionary perceptual blockade) తొలగదు కదా?

అవధూత :  ఓ యదు మహారాజా! ఈ దేహము ముఖ్య వేదాంత శాస్త్ర సిద్ధాంతాలను అవగతం చేసే దృష్టాంతగరువు సుమా! ఇది కూడా నాకు గురువే!

శ్లో॥ దేహో గురుః మమ, విరక్తి - వివేక హేతుః
బిభ్రత్ స్మ సత్త్వ నిధనం సతతార్యుదర్కమ్ ।
తత్త్వ - అన్యనేన విమృశామి యథా తథాపి
పారక్యమిత్యవసితో విచరామ్యసంగః ॥ 
(అధ్యా 9, శ్లో 25)

ఈ దేహమే గురువుగా భావించి కొన్ని విశేషాలు నేర్చుకుంటున్నాను! ఇది ఎటువంటిది? దీనికి ఉత్పతి పరిణామము ఉన్నట్లే వినాశనము కూడా వున్నది. ఇది సుఖంగా పైకి కాసేపు అనిపించినా దీనిలో ఎన్నో దుఃఖ పరిణామాలు - బాధలు అనుక్షణికంగా కట్టకట్టుకొని వేచివున్నాయి. ఎప్పుడో - ఏ క్షణంలోనో నేలకూలి, చెప్పాపెట్టకుండా వచ్చినట్లే - చెప్పాపెట్టకుండా నేలకూలనున్నది. ఎప్పుడు నక్కలకు - కుక్కలకు ఆహారం అవుతానా! - అని ఎగిరెగిరి పడుతోంది. అయితే ఏం? ఇది నాకు వైరాగ్యమును వివేకమును ప్రసాదించగల గురువు సుమా! నాశన శీలమగుటచే దీనిపై ఆసక్తి వదలి, గురువుగా భావించి తత్త్వానుసంధానము కలిగే వరకు అవసరమైనంత మాత్రమే సంబంధం పెట్టుకొనుచున్నాను. తత్త్వ విచారణకై ఈ శరీరం గొప్ప ఉపకరణం కదా!

ఆహా! ఈ జీవుడు ఈ భౌతిక దేహాన్ని సంతోషపెట్టాలనే ఉద్దేశ్యంతో చాలా చాలా కష్టపడి ధనమును కూడబెట్టుచున్నాడే! భార్య - పుత్రులు - మిత్రులు - పశువులు - సేవకులు - ఇళ్ళు - ఆత్మీయులు ఇటువంటి సంపదలను పెంపొందించుకుంటూ నానా హైరానా పడుచున్నాడే! సరే! ఇంత శ్రమపడి ప్రోగు చేసినందంతా ఏమి కానున్నది? ఈ శరీరానికి ఆయుర్దాయం అనేది ఒకటి వున్నది కదా! ఆయర్దాయం పూర్తికాగానే ఈ శరీరం నశించి గుప్పెడు బూడిదగా మిగిలిపోబోతోందే!

చెట్టు కొన్ని బీజములను జనింపచేసి భవిష్యత్తులో మరికొన్ని వృక్షములకు బీజభూతమై తాను నశిస్తోంది చూచావా? అట్లాగే, ఈ దేహం కూడా మరికొన్ని దేహోత్పత్తులకు కారణమై తాను ఎప్పుడో నామరూపాలు లేకుండా నశించిపోతోంది!

ఇది ఇట్లా వుండగా…..,

ఒక గృహస్థుడు వున్నాడు. ఆయనకు అనేక మంది భార్యలు. వాళ్ళంతా ఆ గృహస్థుని ఎవరికివారే తమ వైపుగా తీవ్రంగా లాక్కుంటూ వుంటే… ఆ ఇంటాయనయొక్క బాధలు వర్ణనాతీతం కదా!

అట్లాగే, ఈ దేహమును ధరించిన దేహిని రుచికై నాలుక ఒక వైపుకు లాగుతూ వుంటుంది. మరొకవైపుకు చర్మము స్పర్శకై, పొట్ట ఆకలి వైపుగా, చెవులేమో శబ్దము దిక్కుగా, ముక్కు సువాసనల కొరకు, కళ్ళు రూపముల మార్గంలో, ఈ విధంగా దేహముపై అభిమానము పెంచుకొన్న జీవుని ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్క వైపుగా బలవంతంగా లాగుతూ వుంటోంది.


Page number:56

ఈ జీవుడు (లేక దేహి) ఆపై అసంఖ్యాక విషయములలోపడి దారి తెన్ను లేక అవిశిపోతున్నాడు.

మానవ జన్మ మహత్తరమైన అవకాశం

అదంతా ఒకవైపు! ఇక మరొకవైపు! ఆహా! వాస్తవానికి ఈ మనుజ దేహం ఎంతటి అవకాశం! మానవదేహం చిన్న సందర్భం కాదు! గొప్ప అవకాశం పొందిన ఈ జీవుడు, ఈ మానవదేహాన్ని గొప్ప ఉపకరణంగా ఉపయోగించుకోవలిసింది పోయి, వీటిలోని ఒక్కొక్క ఇంద్రియానికి దాసానుదాసుడై విషయములచే బుద్ధుడు అవటమా? ఎంతటి హాస్యం! చదువుకునేందుకు బడికి వెళ్ళి అల్లరి-చిల్లరి పనులు మాత్రమే నేర్చుకొని రావటం వంటిదే గదా అది!

శ్లో॥ సృష్ట్వా పురాణి వివిధాని అజయాఽఽత్మశక్త్యా
వృక్షాన్ సరీ సృప పశూన్ ఖగ దంద శూకాన్ ।
తైస్తైరతుష్ట హృదయః పురుషం విధాయ
బ్రహ్మవలోక ధిషణం ముదమాప దేవః ॥
(అధ్యా 9, శ్లో 28)

ఆ పరమాత్మయగు బ్రహ్మదేవుడు తన యొక్క అజేయమగు ఆత్మశక్తిచే మాయా రచనా చమత్కారంగా వృక్షాలను, నదీ-తటాకాలను, జంతువులను, పక్షులను సృష్టించారు. అయితే “నా సృష్టిలో ఏదో అసంపూర్ణత్వం ఇంకా కొనసాగుతూనే ఉన్నది!” - అని అనుకున్నారు. తృప్తి కలుగలేదు. అప్పుడు బ్రహ్మసాక్షాత్కారము సముపార్జించే యోగ్యత గల బుద్ధితో కూడుకొనియున్న మానవులను సృష్టించారు.

అప్పటికి గాని ఆయనకు సృష్టి అనే చమత్కారము యొక్క ఆనందం కలుగలేదు!.

అనేక జన్మల తరువాత మహత్తరమైన మానవ జన్మ ఈ జీవునికి గొప్ప అవకాశంగా లభిస్తోంది. ఇది అనిర్దేశ్యకాలబద్ధమైన అవకాశం (It is uncertain and unknown time bound opportunity). ఇక ఈ దృశ్యము పట్ల గల అవేశము అను రూపమగు సంసార విషయమందామా? ఇక్కడి అర్థ - నారీ - బంధు - పేరు - ప్రతిష్ఠ ఇత్యాది సంపదలు అనిత్యం. ఎల్లవేళలా మృత్యువు అనే సంఘటన ఈ దేహమును వెంటనంటియే ఉంటోంది. బుద్ధి గల వాడెవ్వడూ ఇక్కడి అర్ధ సంపదను నమ్ముకొని కాలం వ్యర్థం చేసుకోడు. మృత్యువు వచ్చి తలుపు తట్టకముందే నిఃశ్రేయమగు ఆత్మజ్ఞానానందమును పరిపుష్టపరచుకొని ఉంటాడు.


Page number:57

ఈ జీవాత్మ లక్షణముల కంటే విలక్షణము, జీవాత్మకు కేవల సాక్షియగు పరమాత్మయే నా వాస్తవ స్వరూపము - స్వభావము కూడా! … అనే అవగాహనతో కూడిన బుద్ధిని నిర్దుష్టపరచుకొంటాడు. బుద్ధిని నిర్మలం చేయగల సాధనలను పరిపూర్తి చేసుకొని వుంటాడు.

ఇక శబ్దము - స్పర్శ - రూపము - రసము - గంధము ఇటుంవంటి విషయ సుఖముల గురించి చెప్పుకోవలసి వస్తే…

నిః శ్రేయసాయ విషయః ఖలు సర్వతః స్యాత్ । (అధ్యా 9, శ్లో 29)

విషయ సుఖాలు కుక్కలు - నక్కలు - మేకలు - పక్షులు - కీటకములు మొదలైనవి కూడా అనుభవిస్తూనే వున్నాయి. అందుకొరకై అతిదుర్లభమైన మానవ జన్మను ఖర్చు చేసుకోవలసిన అవసరం వున్నదా? ఏమున్నది?

జీవితమే గురువు!

ఓ యదు మహారాజా! ఈ విధంగా అనేక మందిని - సందర్భములను సంఘటనలను శిష్య భావంతో గురోపాసన చేశాను. గురియే గురువు - గురుతే గురువు కదా! నాలో - జనించిన వైరాగ్యాన్ని ఆయా పాఠ్యాంశాలతో పరిపోషించుకొంటున్నాను.

విజ్ఞాన దృష్టితో ఆత్మావలోకనం చేస్తూ, సంగరహితుడనై, వ్యష్టి అహంకారాన్ని త్యజిస్తూ, ఈ భూమిపై వ్యాహ్యాళిగా సంచరించే ప్రయత్నం చేస్తున్నాను.

బుద్ధిని ఆత్మయందు నిలిపి ద్రష్ట - దృశ్యములు నా యొక్క చమత్కారమైన అంశలే అనే అవగాహనను సుస్థిరం చేసుకుంటూ
వున్నాను. (మమైవాంశో జీవలోకే జీవభూతస్సనాతనః).

నేను బ్రహ్మమే! బ్రహ్మమే జగత్తుగా ప్రదర్శితమౌతోంది! … అని అనేక మంది మహర్షిత్వము అవధరించిన గురువులు ఎలుగెత్తి గానం చేస్తున్నారు. వివిధ వర్ణనలతో - పాఠ్యాంశాలతో మనందరికీ బోధిస్తున్నారు. అయితే, నా ఉద్దేశ్యంలో ఒక్క వ్యక్తి మాత్రమే గురువు - అనేది పరిమితమైన అవగాహన ! సుస్థిరమైన నిశ్చలమైన బ్రహ్మీదృష్టికి జీవితమే గురువు! జీవితంలో సందర్భాలన్నీ గురువులే! అనేక సంఘటనలు గురువులతో సమానమే! గురువు-సద్గురువుల ఉద్దేశ్యము కూడా అదేనని నేను గమనిస్తూ ఉన్నాను.

🌺🙏🌹

శ్రీకృష్ణ భగవానుడు :  మిత్రమా! ఉద్ధవా! ఆ అవధూత ఈ విధంగా యదుమహారాజుకు గురువు అనే విశేషానికి నిర్వచనం చెప్పి, మహారాజు యొక్క నమస్కారమును ప్రసన్నమైన హృదయంతో స్వీకరించినవాడై, యథేచ్ఛానుసారంగా అక్కడి నుండి బయల్వెడలారు!.

మా పూర్వీకులకు పూర్వీకుడైన మా వంశకర్త శ్రీ యదుమహారాజు ఆ అవధూత యొక్క వచనములు విన్నవారై మరల మరల మననం చేసుకున్నారు. ఆయా సందర్భములనుండి ఆయా దృశ్య సంఘటనలనుండి గ్రాహ్యములు - త్యాజ్యములు నేర్వవలసినవి గమనించినారు. క్రమంగా దృశ్య సంగమ ఆసక్తుల నుండి విడివడినవాడయ్యారు. సమ చిత్తులై దేదీప్యమానంగా ఆత్మాఽహం ధ్యానంతో ప్రకాశించారు.