[[@YHRK]] [[@Spiritual]]
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బహ్మసూత్ర భాష్యే
సంస్కృత మూలము : శ్రీ వ్యాసమహర్షి విరచిత శ్రీమద్భాగవత ఏకాదశస్కంధాంతర్గతము
అధ్యయన విద్యార్థి , రచన : యేలేశ్వరపు హనుమ రామకృష్ణ
[Chapters 8 to 11 out of total 46]
విషయ సూచిక :
Page number:58
అధ్యాయము–8.) స్వధర్మనిరతి పుష్ప సమర్పణ
|
శ్రీకృష్ణ భగవానుడు: ఓ ఉద్దవా! జీవులందరికి వారు తరించటానికి సులభమైన ఒక ఉపాయం ఇప్పుడిక గుర్తు చేస్తున్నాను. విను.
దేహధారి దేహమున్నంతవరకు కర్మలు నిర్వర్తించక తప్పేది కాదు కదా! కనుక, స్వధర్మము తప్పక నిర్వర్తించవలసిందే!
కర్మ ధర్మానుకూలంగా ఉండటమే జీవునికి వాస్తవమైన సంపద. అయితే, అట్టి స్వధర్మమును సర్వంతర్యామియగు నన్ను ఉపాసించుటలో విభాగంగా నిర్వర్తించాలి సుమా! (Let alotted work be done as a worship to me).
విషయముల పట్ల నమ్మకము గల దేహి ఈ ఎదురుగా గల జగత్తు సత్యమే అని నమ్మి చేసే ప్రయత్నాలన్నీ విపరీత పరిణామప్రదములే అని జ్ఞానులు గమనిస్తున్నారు. అందుచేత, అట్టి తత్త్వవేత్తలు - ఇక్కడ నాకు ఏదో లభించును గాక! - అనే కామమును త్యజించి పరమాత్మను పూజించే సాధనయొక్క అంతర్విభాగంగా నిష్కామభావంతో విశుద్ధచిత్తంతో స్వకర్మలు - స్వధర్మములు నిర్వర్తిస్తున్నారు.
ఉదాహరణకు…, అనేక విషయ చింతలతో రాత్రి నిద్రపోయిన వ్యక్తికి స్వప్నంలో భోగ్యవస్తువులు, సుఖ దుఃఖ సంఘటనలు కనిపిస్తాయి. అవన్నీ నిజమా? కాదు కదా!
అట్లాగే, ఈ జాగ్రత్‌లో కూడా ఇంద్రియములకు తారసపడుచున్న - మనస్సుకు అనుభూతిగా కలుగుచున్న - భేదబుద్ధికి ప్రాప్తిస్తున్న వివిధములైన దృశ్యసంబంధమైన అనుభవములన్నీ స్వప్నసదృశమే సుమా! ఇంద్రియములకు విషయములైన సుఖదుఃఖ మిశ్రమ విశేషాలన్నీ కూడా అస్థిరం! పైగా, అర్థరహితం! ఇంద్రియముల ద్వారా కలిగే భేదబుద్ధి అంతా వ్యర్థమే!
Page number:59
అందుచేత, కామ్యకర్మము (Acts to satisfy one’s own expectations and cravings) వదలి, నిత్య నైమిత్తిక కర్మలు (Acts that are to be discharged on a daily basis or on occasional basis) మాత్రం నిర్వర్తిస్తూ సర్వ తత్త్వ స్వరూపుడనైన నన్ను ఆశ్రయించి ఉండటమే సముచితం!
క్రమ - క్రమంగా ఆ నిత్య - నైమిత్తిక ప్రవృత్తి ధర్మాలు కూడా త్యజించును గాక! కర్మ చోదనములను (Prompting factors for discharging various duties) కూడా వదలి నన్నే ఆశ్రయంగా కలిగి ఉండటం (అనగా, నివృత్తి మార్గం ఆశ్రయించటం) ఉచితం!
ఆత్మవిచారణ యందు సంప్రవృత్తుడగుచు, దృశ్యప్రపంచమునుండి నివృత్తుడగుచూ ఉండును గాక! జగత్తును ఆత్మ కళావిన్యాసముగా, ఆత్మ చైతన్యమునకు అభిన్నముగా సందర్శించును గాక!
క్రమంగా ఈ మానవుడు నా పట్ల సంపూర్ణ చిత్తమును ప్రవృద్ధపరచుకునే నిమిత్తం యమము - నియమము - అహింస - శౌచము ఇటువంటి సాధనములను ఆత్మజ్ఞాన లక్ష్యముతో పాటించు గాక!
జిజ్ఞాసువు అయి నన్ను ఎరుగుటకై శాంతభూషితుడగు విజ్ఞులైనవారిని కూడా గురుభావంతో ఆశ్రయించాలి, సేవించాలి… అని కూడా ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నారు.
అధ్యాయము–9.) గురు-శిష్య లక్షణాలు
|
గురు లక్షణాలు :-
↳ శాంతుడు, శిష్యుని యొక్క సందర్భ (ఇహ) - సహజ (పర) స్వరూపములను ఎరిగినవాడు, అవతారమూర్తి యొక్క శబ్ద - అర్థములను శిష్యుని స్వస్వరూపానుభవరూపంగా విశ్లేషించి ప్రవచించువాడు అయివుండు గాక!.
↳ “నీవు జన్మ-కర్మ రహితమగు ఆత్మవే అయిఉండి సృష్టిగా కూడా అవతరించుచున్నావు” అని నిరూపించి చూపువాడు, “సాక్షాత్తు తత్త్వమసి” అని సుస్పష్టపరచువాడు అయి ఉండాలి!
శిష్య లక్షణములు :- శిష్యుడు… ఎట్లా ఉండాలి మరి?
↳ గురువు పట్ల సేవానిరతిని ప్రదర్శించువాడు.
↳ శరణాగతిని ప్రకటించువాడు.
↳ స్వాభిమానము అనే జాడ్యమును జయించినవాడు.
↳ అహంకారమును అధిగమించినవాడు.
↳ మత్సరమును మొదలంట్లా వదలినవాడు.
Page number:60
↳ “వినటము - అవగాహన - సమన్వయములలో” దక్షత (Efficiency of assimilating and interpreting) గలవాడు.
↳ నాది - నేను అనే అల్ప మమకారములను త్యజించినవాడు.
↳ దృఢమైన పట్టుదల పెంపొందించుకొనుచుండువాడు.
↳ దిగులు - వ్యగ్రత మొదలైన బలహీనతలను దూరం చేసుకున్నవాడు.
↳ తత్త్వజ్ఞానము పట్ల జిజ్ఞాసతో ఉన్నవాడు.
↳ అసూయ - ద్వేషములు లేనివాడు.
↳ “ఇది ఇంతే కదా! అది అంతే కదా” అను రూపమైన అల్పభావములను, వ్యర్థ సంభాషణలను వదలివేసినవాడు.
… అయివుండాలి!
అతడు అందరిపట్ల - ఆయా అన్ని సందర్భముల పట్ల సమదర్శి అయువుండుగాక!
భార్య - పుత్రులు - బంధువులు - గృహము - భూ సంపద - ధన వ్యవహారము మొదలైన ప్రాపంచక విషయముల పట్ల ఉదాసీనత్వము కలిగిఉండును గాక! అవన్నీ ఆగమా అపాయినో అనిత్యాః … అను ఎరుక ఏమరచకుండును గాక!
★★★
ఉద్ధవుడు : హే జగద్గురూ! మహాత్మా! ఆత్మ యొక్క విలక్షణ లక్షణము అభౌతికము అని అంటారు కదా! అట్టి అభౌతికత్వం గురించి చెప్పండి! భౌతిక దృష్టులనుండి నివృత్తి గురించి కూడా చెప్పండి.
శ్రీకృష్ణుడు : ఒక కట్టెను అగ్ని కాలుస్తోందనుకో! కాలుస్తూ, కాంతిని వెదజల్లే అగ్ని - కట్టె ఒక్కటా? కాదు. వేరు వేరే కదా! అట్లాగే, స్థూల దేహానికి (పాంచ భౌతిక దేహానికి) - (ఆలోచన, ఇష్టఅయిష్టములు, అవేశకావేశములు మొదలైనవన్నీ సమావేశమగుచున్న) సూక్ష్మ దేహానికి (to both the physical body and the thought body containing feelings, expectations, fears, opinions, etc.) కూడా మండే కట్టెకు వేరైన అగ్నివలె ఆత్మ సర్వదా వేరై వున్నది. విలక్షణమైయున్నది. భిన్నమైయున్నది.
అగ్ని కట్టెలో దాగి వుంటుంది. ఆ అగ్ని కట్టెల ఆకారంగా కనిపించే అణువుల ఆవరణలో దాగి ఉంటుంది.
Page number:61
ఇసుక రేణువులతో చేసిన ఏనుగువలె ఆ అణువుల ఆకారాదులచే, రంగుచే, రసాయిన స్వభావములచే అగ్ని కప్పబడి ఉంటోంది.
అట్లాగే, ఆత్మ దేహాంతర్గతంగా ప్రవేశించి దేహము యొక్క రక్తము - బొమిక - మాంసము - చర్మము ఇత్యాదులచే కప్పబడి వుంటోంది. అంతే కాకుండా, కోపము - ఆవేశము - ఆశ - నిరాశ ఇత్యాది గుణసమన్వితమగు భావనా దేహంచే కూడా (సూక్ష్మ దేహంచే కూడా) కప్పబడి వుంటోంది.
ఆత్మ యొక్క చమత్కారమైనట్టి స్వకీయమైన ఈశ్వరాధీన మాయచేత ఈ వస్తు గుణ సమన్వితమగు స్థూల దేహము - సూక్ష్మదేహము రచించబడుచున్నాయి.
జీవుడు ఇంద్రియ విషయములగు దృశ్యము అనే సంసారములో స్వయం కల్పితమైన ప్రియాప్రియ అహంకార మమకార విశేషములచే నిబద్ధుడగుచున్నాడు.
సంగము (Attachment) సంసార బంధమునకు కారణం. నిస్సంగముతో కూడిన ఆత్మవిద్యచే సర్వాతీతత్వమును సంతరించుకొని చిదాత్మస్వరూపుడై వెలుగొందుచున్నాడు.
అందుచేత, వస్తు బుద్ధిచే ఏర్పడుచున్న సంగమును (Attachment) ఈ జీవుడు నిరసించివేయాలి!
అట్టి జ్ఞానమును మహానీయులనుండి సాధకుడు శ్రద్ధగా వినాలి! జిజ్ఞాసతో పరస్వరూపము (That which is beyond all else) అగు స్వస్వరూపాత్మ వస్తువు గురించి తెలుసుకొని, ఆస్వాదించటమే ఉపాయం!.
అహమ్ సర్వస్య ప్రభవో - నా చేత ఏదేది ఎట్లు చూడబడుచున్నదో అనుభూతపరచుకోబడుచున్నదో… అదంతా నేనే కదా! అని గమనించి-తెలుసుకొని బ్రహ్మమే తానై ఉండటం - అనుననది ఆస్వాదించనారంభించాలి.
★
ఆచార్యులవారు క్రిందవున్న అరణి (Lower stone)
శిష్యుడు పైనున్న అరణి (Upper Stone)
ఉపదేశ వాక్యములు ఆ ఉభయ అరణుల ఒరిపిడి.
జనించేది జ్ఞానాగ్ని.
కాల్చబడునది “అజ్ఞానము” అనే కొయ్యి చెక్క.
ఆచార్య - శిష్యుల సంయోగముచే ఉత్పన్నమయ్యేదే అగ్నితుల్యమగు ఆత్మ తత్త్వ జ్ఞానము! ఆ జ్ఞానాగ్నిచే అజ్ఞానము దగ్ధమై ఈ జగత్తును స్వకీయ ఆత్మ స్వరూపంగా సందర్శించగల ఆత్మసుఖం అనుభవమౌతుంది!
Page number:62
నిపుణుడైన గురువుచే ప్రవచితమైన సాక్షాత్ “తత్ త్వమ్ అసి” అను విశుద్ధజ్ఞానముచే గుణపూర్వకంగా ఆవరించిన మాయ తనంతట తానే స్వభావసిద్ధంగా అంతర్హితమౌతుంది.
ఈ విశ్వము తన కార్య-కారణ-గుణ పరిధిని అధిగమించి, స్వస్వరూపాత్మ చమత్కారంగా, ఇంధన రహితమగు అగ్నివలె స్వయమాత్మ తేజో విలాసమై అనుభవం కాగలదు. అదియే విషయ-అభావ స్వరూపమగు నివృత్తి రూపముతో కూడిన సమగ్రావగాహన!
అధ్యాయము–10.) భిన్నంగా కనిపిస్తున్న ఏకత్వం
|
ఉద్ధవుడు : హే భగవన్! ఈ జగత్తులో వేరు వేరు గుణ సంయోగములచే జీవులు - జన్మలు, పునర్జన్మలు, జ్ఞానులు, అజ్ఞానులు, విజ్ఞులు, మూర్ఖులు, మునులు, మహర్షులు, భక్తులు, యోగులు, ఇంద్రియలోలులు - ఇత్యాది వేరువేరైన, రకరకముల స్వభావములుగా కనిపిస్తున్నారు కదా! వీరంతా ఎవరి సంకల్పము చేత వివిధ రీతులుగా ఉత్పన్నమౌతున్నారు? పరమాత్మచేతనేనా? మరొకరి చేతనా? జీవుని స్వభావానికి సంబంధించిన కర్తృత్వము జీవునిదా? ఈశ్వరునిదా? పరమాత్మదా? మరింకెవరిదన్నానా?
శ్రీకృష్ణుడు : ఇక్కడ ఏకము - అక్షరము అగు పరమాత్మయే ఉన్నారు. ఏకైక పరమాత్మయే వివిధ రూపములుగా మనస్సుచే పొందబడుతోంది. ఏకో సత్! ఏకమే అయివుండి భావావేశరూపమగు మనస్సుచే అనేకముగా భావించబడుతోంది!
ఒక వేళ.., నీకు - కర్మ, కర్తృత్వము, భోక్తృత్వము, సుఖము దుఃఖముల దృష్ట్యా - వేరువేరుగా కనిపించేదంతా నిత్యమని, సత్యమని అనిపిస్తోందా? సర్వ భోగ ప్రతి పాదితములైన శాస్త్రముల దృష్ట్యా సుఖ-దుఃఖములు, స్వర్గ నరకాది వివిధ లోకములు, జీవుల రాక-పోకలు వాస్తవమేనని భావిస్తున్నావా? ఆయా వస్తు ప్రభావం చేత అజ్ఞానం - జ్ఞానం ఉత్పన్నమై, కాలాంతరంగా మారుతూ వుంటుందని అనుకోదలచావా?
అట్లా అయితే…..
అప్పుడు ఈ జీవుల దేహములు, సంవత్సరముల రూపంగా కనిపించే కాలము, ఆ కాలముచే ఏర్పడే జనన - బాల్య - యౌవన - వార్ధక్యాది అవస్థలు కూడా స్వతఃగానే సత్యమని నిత్యమని అనుకోవలసివస్తుంది..
Page number:63
అప్పుడు.., ఈ జీవుడు ఏదో శక్తిచేత నియమితుడై పరతంత్రుడై సుఖదుఃఖాలు అనివార్యంగా అనుభవిస్తున్నాడు - అని సమీక్షించవలసి వస్తుంది.
(If he is under strict control of some out-side Force) ఇక పరతంత్రుడైనవాడు తానుగా మోక్షం పొందలేడని, ఎవ్వరో ఎక్కడినుండో ఆతనికి మోక్షం ప్రసాదించవలసియున్నదని చెప్పవలసి వస్తుంది.
అనగా…, శాస్త్రములు తాము చెప్పే సాధనలు నిర్వర్తించాటానికి కూడా జీవుడు స్వతంత్రుడు కాదని, సాధనలు కూడా దైవము అనబడే మరొకరి ఆధీనంలో వున్నాయని అనవలసివస్తుంది.
శాస్త్రములు అట్లా చెప్పటం లేదు కదా! “సాధన చేయవయ్యా! పొందుతావు” - అని కదా చెప్పుచున్నది!
ఉద్ధవుడు : అవునయ్యా! సాధనచే మోక్షం లభిస్తుందని సూచిస్తున్నాయి కృష్ణయ్యా! నాకొక అనుమానం. ఈ జీవుడు పారతంత్రుడా? స్వాతంత్రుడా?
శ్రీకృష్ణుడు : ఒక వేళ జీవుడు పారతంత్రుడై (Under control of some remote force) సాధనములు గాని, జన్మ - మృత్యు - పునర్జన్మలుగాని పొందుచున్నాడని సిద్ధాంతీకరించవలసివస్తే… అప్పుడు శాస్త్రములు జీవునితో “నాయనా! నీవు బ్రాహ్మీ ముహూర్తంలో నిదురలే! సాధనలకు ఉపక్రమించు!” అని సంబోధించి ప్రయోజనం ఏమిటి? అందుచేత, అనేకత్వము - పారతంత్ర్యము (Multiplicity and forced bondage) అనివార్యమని చెప్పవలసి వస్తే శాస్త్రములు తాము చెప్పే సాధనల ప్రయోజనములను తామే ఖండింపవలసివస్తుంది.
పరాధీనము (Remotely controlled by some body) అయినట్టివానికి ఎట్టి పురుషార్థము సిద్ధించదు కదా! తానుగా ఏమీ చేయలేనప్పుడు శ్రద్ధ-సాధనాల గురించి శాస్త్రాలు నొక్కి వక్కాణించటమెందుకు?
ఉద్ధవుడు : హే సద్గురూ! వేదములచే విధి - విధానపూర్వకంగా చెప్పబడే దేవతోపాసన యజ్ఞయాగాది క్రతువులు ఎరిగిన పండితులు జీవుడు ఇహంలో సుఖం, పరంలో స్వర్గలోకాది సుఖ శాంతులు పొందాలంటే దేవతోపాసన, యజ్ఞ యాగాలు నిర్వర్తించాలి. వేద విభాగాలైన యజ్ఞ యాగ విధానం తెలిపే సంహిత బ్రాహ్మణముల పాండిత్యము లేకపోతే ఈ జీవునికి ఉద్ధరణ లేదు అంటూ వుంటారు కదా! అట్టి కర్మవిదుషుల ప్రతిపాదన గురించి తమ అభిప్రాయం చెప్పండి!.
Page number:64
శ్రీకృష్ణుడు : నీవు చెప్పిన కర్మకుశలురకు (దేవతోపాసకులకు) (Experts in yagna / yaga / veda vijnana) ఎల్లప్పుడు సుఖమే లభిస్తోందని మనం చెప్పలేం. అట్లాగే, అట్టి విషయాలలో నిష్ణాతులు కాని మూఢులకు దుఃఖములే వస్తున్నాయని కూడా సిద్ధాంతీకరించలేము.
ఒకవేళ, వేద ప్రవచిత కర్మల రహస్యం తెలిసినవారికి సుఖ దుఃఖ విఘాతాల గురించి తెలియవస్తోంది… అని అందామా? అయితే, వారివద్ద కూడా అనివార్యమగు మృత్యువు సంభవించకుండా ఉపాయాలు లేవు కదా! మృత్యు భయం కొనసాగుచునే ఉండగా, కర్మల వలన కోరికలు తీరుతాయి… అనే ప్రయోజనం నిష్ఫలమే కదా? ఉరి తీయటానికి తీసుకుపోబడుచున్న మానవుడికి సుగంధద్రవ్యాలు ఇస్తే అవి ఆతనికి ఏం సుఖం?
అట్లాగే, మృత్యువును ఎదురుగా పెట్టుకొని, మీరు ఈ ఆ కర్మలు చేయండి! అప్పుడు ఈ ఆ సుఖాలు పొందుతారు.. అని శాస్త్రీకరించటం అటువంటిదే కదా!
పోనీ! యజ్ఞ యాగ కర్మలు నిర్వర్తించటానికి ఇప్పుడు శ్రమిస్తే ఉత్తరోత్తరా స్వర్గలోకంలో స్థానం, స్వర్గ సుఖాలు లభిస్తాయి - అని కర్మ వాదులు అంటారంటావా? స్వర్గలోకంలో లభించే సుఖాలకు కూడా స్పర్థ - అసూయ - క్షయము - నాశనము (Conflict - Mutual Hatred - Decrease - Ending) అనేవి ఉండియే తీరుతాయి. అనగా, స్వర్గసుఖాలు కూడా ఇక్కడి ధనము - గృహములు మొదలైన ఐహిక భౌతిక సంపదలవలెనే అనేక దుఃఖములతో కూడుకొని ఉన్నవే కదా! (They are also accompanying many worries). పైగా…, యజ్ఞ యాగరూపములైన కృషికర్మలు నిర్వర్తించేటప్పుడే అవన్నీ కూడా అనేక శ్రమలు, విఘ్నములతో కూడుకొని ఉంటున్నాయి.
సరే! ఆ విఘ్నములన్నీ అధిగమించి అవి నిర్వర్తించినా కూడా, వాటి ఫలితంగా దేహ పతనానంతరం లభించే స్వర్గలోక సుఖాలు మాత్రం శాశ్వతమా? కాదే!
ఎట్లా అంటావా?
యజ్ఞములు చేసే పురుషుడు ఈ లోకంలో ఆ యజ్ఞములు ద్వారా దేవతలను ఆరాధించి స్వర్గమును పొందుచున్నాడు. తాను చేసిన పుణ్యకర్మలకు ప్రయోజనంగా స్వర్గలోకంలో దేవతా లోకాలలో దివ్య భోగాలు అనుభవిస్తున్నాడు. మనోహరమైన ఆభరణాదులు ధరించి దేవతా విమానాలలో దేవతాస్త్రీల మధ్య విహరిస్తున్నాడు. గంధర్వ గణముచే కీర్తించబడుచున్నాడు. అయితే! అవన్నీ ఇంద్రియ-విషయ సంబంధమైన భోగ విలాసములే కదా!
Page number:65
దేవతా స్త్రీలతో కలసి నందన వనాలలో విహరిస్తున్నంతవరకు - ఈ భోగమంతా కొంతకాలానికి ముగిసిపోయి, “నాకు పతనం అనివార్యం” - అని గమనించకుండానే కాలం గడిపివేస్తూ వుండవచ్చు గాక! పుణ్యమున్నంతవరకే స్వర్గలోకం! పుణ్యము క్షీణించగానే కాలముచే త్రోయబడి తిరిగి క్రిందకు రావలసిందే!
ఉద్ధవుడు : అలా యజ్ఞ యాగ దేవతోపాసనాది కర్మలు కాకుండా…, ఇంద్రియలోలుడై దుష్టసంగముతో అధర్మరతుడై ఇంద్రియ వాంఛలకు వశుడై జీవితమును గడపివేస్తేనో…? లోభ బుద్ధితో దానము ధర్మము వంటి సత్కార్యాలు నిర్వర్తించకుండా ఇతరులను మోసగించటం, బాధించటం మొదలైన దుష్టకర్మల లంపటంలో ఆయుష్షును వెచ్చిస్తూ
వుంటేనో…? ప్రాణి హింస చేస్తూ అమాయక జంతువులను హింసిస్తూ భూత ప్రేత పిశాచాదులను ఉపాసించి, ప్రకృతి శక్తులతో ఇతరులకు భయము - హాని కలుగజేస్తూ వుంటేనో…?
శ్రీకృష్ణుడు : అప్పుడా జీవుడు పశువుల కంటే కూడా హీనమైన నరక యాతనలు గల లోకాలలోకి కాలముచే నెట్టివేయబడుచున్నాడు. స్వార్థ - పరమార్థ శ్రేయస్సు లభించక అజ్ఞానముతో కూడి అనేక అల్ప ఉపాధులలో రాక పోకలు నిర్వర్తిస్తున్నాడు.
అందుచేత, ఓ ఉద్ధవా!
శ్లో॥ కర్మాణి దుఃఖోదర్కాణి కుర్వన్ దేహేన తైః పునః
దేహమాభజతే తత్ర! కిం సుఖం మర్త్య ధర్మిణః? (అధ్యా 10, శ్లో 29)
ఈ దేహముచే చేయబడే కర్మలు వాస్తవానికి ఒక రకంగా దుఃఖ జనకములే! ఎందుకంటే, అవన్నీ జన్మ - మృత్యు పరంపరలు కొనసాగటాన్ని ఆపలేకపోతున్నాయి. మరి? మరణము అనివార్యమై ఉండగా, ఈ జీవునికి లభించగల వాస్తవ సుఖం ఈ జగత్తులో ఏమున్నది? (లేక) ఏలోకంలోనైనా ఏ మున్నది చెప్పు?
అనంతకాలము యొక్క సుదీర్ఘ ప్రదర్శనలో లోకాలు, లోక పాలకుల జీవితాలే అల్పకాలానికి పరిమితమైవుంటున్నాయి. లోకాలు మహా అయితే, ఒక కల్పము వరకు కొనసాగుతాయి. బ్రహ్మదేవుడు కూడా కాలపరిమితుడే కాబట్టి, కాలస్వరూపుడనగు నన్ను చూసి భయమును పొందటం జరుగుతుంది. ఇక మానవుని ఆయుఃపరిమాణం గురించి వేరే చెప్పేదేమున్నది? స్వర్గము మొదలైన లోకములలో నివాసం కోరుకొని మాత్రం శాశ్వత ప్రయోజనమేమున్నది?
Page number:66
ప్రకృతిలోని సత్త్వ - రజో - తమో గుణాలు కర్మలను (Individual Roles and functions) కల్పిస్తూ వుంటాయి. ఆ కర్మల నుండి గుణాలు, మరల గుణముల నుండి కర్మలు!
గుణములతో తాదాప్యము చెంది ప్రవర్తించే జీవుడు ఆ కర్మల ఫలములను అనుభవిస్తూ, ఆ అనుభవం నుండి గుణ కర్మలను అంతులేని ప్రవాహంలాగా కొనసాగిస్తూనే వుంటాడు.
ఎంతెంతవరకైతే త్రిగుణములనబడే వైషమ్యం దృష్టియందు కొనసాగుచూ వుంటుందో.. అంతంత వరకు ఈ జీవునిపట్ల - “నేను వేరు - వారు వేరు - దేవతలు వేరు - మంచివారు వేరు - చెడువారు వేరు - పాపములు - పుణ్యములు - సుఖములు - దుఃఖములు - స్వర్గము - నరకము” .. ఇటువంటి నానాత్వమంతా ఉండియే ఉంటుంది. ఈ జీవుడు నిజం-నిజం అనుకుంటూ నానా రూపములు పొందుచూనే ఉంటాడు. బుద్ధియందు కల్పితమగు నానా రూపములు కొనసాగునంతవరకు జీవునికి కర్మలకు అధీనత్వము – పారతంత్ర్యము ఉండియే తీరుతోంది! అట్టి కర్మాధీనం ఉన్నంత వరకు కర్మ ఫల ప్రదాత నుండి సాంసారిక భయం ఏర్పడుతూనే వుంటోంది. గుణ వైషమ్యము, అద్దానిచే భోగానుభవము - బంధము ఉంటూనే ఉంటాయి. బంధకారణంగా కర్మలు అనివార్యంగా బలవంతంగా నిర్వర్తించటం - కర్మవలన సుఖ దుఃఖాలు… ఇవన్నీ చేయి చేయి కలుపుకుని కొనసాగుచున్నాయి.
కర్మ - కర్మ ఫలముల పట్ల ఆశ, అభినివేశము, నమ్మకము కొనసాగుచున్నంత వరకు ఈ జీవునికి శోక మోహములు తప్పేవి కావు. త్రిగుణ మాయకు లోను అయిన జీవులు పరమాత్మయగు నన్ను లోకము - కాలము - స్వభావము - ధర్మము ఇటువంటి రూపములుగా దర్శిస్తాడే గాని, “పరమాత్మ నా స్వస్వరూపమే!” - అనే విషయం గమనించలేకపోతున్నాడు.
ఉద్ధవుడు : స్వామీ! శ్రీ కృష్ణా! నాది మరొక్క సందేహం.
ఈ జీవునికి త్రిగుణముల ప్రభావం చేతనే దేహ పరంపరలు వచ్చి పోతున్నాయి కదా! అనగా, దేహం ఉన్నంతవరకు గుణములు పరిఢవిల్లుతూనే వుంటాయి కదా! మరప్పుడు దేహము ఏర్పడి ఉండికూడా, ఈ త్రిగుణములకు అతీతుడై వుండగలడా? దేహం ఉండి కూడా గుణాతీతుడై వుండటం ఎవ్వరికైనా సాధ్యమా? సాధ్యమైతే అట్టి గుణాతీతుడగు జీవుడు (దేహి) ఎట్లా ఉంటాడు?
Page number:67
గుణాతీతుడైనవాడు దేహం ఉంది కాబట్టి, బద్ధుడా? లేక ముక్తుడా? అతని విహారం ఎక్కడ? గుణాతీతుణ్ణి ఏ లక్షణములచే మనం గుర్తించగలం? ఆయన స్వీకార విసర్జనలు ఎట్లా వుంటాయి? ఎక్కడ ఎట్లా నివసిస్తాడు, ఎక్కడ శయనిస్తాడు?
ఓ అచ్యుతా! గుణములు ప్రదర్శిస్తున్నప్పటికీ గుణాతీతుడై వుండేవాడిని గురించి మీరు మాత్రమే విశదీకరించగలరు.
ఒకే ఆత్మ నిత్య బద్ధమై వుంటోందా? నిత్య ముక్తమై కూడా వుంటోందా? ఆత్మ సర్వదా ఏకమే అయి ఉండికూడా, బద్ధులు - అజ్ఞులు - విజ్ఞులు - ముక్తుల రూపాలు ఎందుకు దాల్చుతున్నది? - అన్నటువంటి ఈ విషయంలో నాకు ఎన్నో అనుమానాలు
ఉంటున్నాయి. మీ సమాధానంతో నా అనుమానాలను తొలగించ ప్రార్థన!
“నిత్య బద్ధాత్మ - జీవాత్మ :: నిత్యముక్తాత్మ - పరమాత్మ” అనునది అధ్యాత్మ శాస్త్ర సమీక్షయేనా? శాస్త్రీయదృష్టిచే యుక్తియుక్తమేనా?
శ్రీకృష్ణ భగవానుడు : ఆధ్యాత్మశాస్త్రము బంధ-ముక్తుల గురించి నిర్వచిస్తోంది. అయితే, ఓ ఉద్ధవా! త్రిగుణములను దృష్టిలో పెట్టుకొని మాత్రమే “ఈతడు బద్ధాత్ముడు - ఈతడు ముక్తాత్ముడు” అని శాస్త్రములు వ్యాఖ్యానించటం జరుగుతోంది. త్రిగుణములు మాయచే కల్పించబడినవి మాత్రమే కదా! అందుచేత, ఆత్మకు వాస్తవానికి బంధము లేదు. బంధమనునదే లేదు కాబట్టి, ముక్తి అనబడునదేదీ కూడా లేదు! స్వప్నంలోని కొన్ని సంఘటనలకు స్వప్న ద్రష్ట బద్ధుడౌతున్నాడా? మరికొన్ని సంఘటనలచేత ముక్తుడౌతున్నాడా? లేదే! స్వప్నము తనదైనవాడు స్వప్నంలో ఏదేది కనిపించినా కూడా మెళుకవ వచ్చిన తరువాత యథాతథుడే కదా!
ఇక్కడి సుఖ దుఃఖాలు స్వప్నంలోని సంఘటనల వంటివే!
నేను జీవాత్మను - బద్ధుడను అనునది కూడా స్వస్వరూపాత్మ దృష్ట్యా ఒకరాత్రి ఒకడికి వచ్చిన ఒక కలవంటిదే!
కలగనేవాడికి కలలో బంధము ఉన్నట్లా? లేనట్లా? ఒకడు స్వప్నంలో ఒక గొప్ప 3 అంతస్తుల మేడ కట్టుచున్నానడనుకో! రెండవ అంతస్తు కట్టుచుండగా మేస్త్రీ - పనివారితో ఏవేవో ఇబ్బందులు వస్తున్నాయి. ఇంతలో… మెళుకువ వచ్చింది. నిద్ర లేవగానే, ఆ మేడ ఎక్కడ? ఆ పనివారు ఇంకా రారేం? .. అంటూ ఆ స్వప్న అప్పటి దర్శి ఇప్పటి జాగ్రత్‌లో - ఇంటి నుండి బయలుదేరుతాడా? లేదు కదా!
Page number:68
అదంతా స్వప్నమే కదా!.. అని అంతా క్షణంలో త్యజించి, ఇక వర్తమాన జాగ్రత్‌లో తన దిన చర్యలకు ఉపక్రమిస్తాడు కదా! దేహ దేహాంతరాలు ఈతీరైనవే!
స్వప్న బుద్ధి స్వప్నంలో అనేక సుఖ - దుఃఖాలుగా వివర్తమగుచున్నది కదా! అట్లాగే… జాగృత్ బుద్ధి దృశ్యమును పొందుచూ - ఇదంతా వాస్తవం - శాశ్వతం… అనే భ్రమకు (వర్తమానము పట్ల) లోను అగుచున్నది. ఏది ఎట్లైనా ఉండవచ్చు గాక! ఇక్కడ జాగ్రత్‌లో అనుభవమగుచున్న శోకము - మోహము - సుఖము - దుఃఖము - సామాన్యము - ఆశ్చర్యము - జననము - మరణము ఇవన్నీ కూడా దేహమునకు సంబంధించిన మాయా విశేషాలు అని గ్రహించు.
మాయ అనగా?
ఒకడు ఒక కథ వింటున్నాడు (లేక) ఒక నాటకం చూస్తున్నాడు. అందులోని సుఖ - దుఃఖ - హాస్య - సంగతి సందర్భ సంబంధ బాంధవ్యాలన్నీ నిజమే అని భావించి తాను అక్కడి పాత్రలకు సంబంధించిన రసానుభూతిని తన హృదయంలో పొందుచున్నాడు. “నిజానికి అతడు ఆమెతో అన్నన్ని బాధించే మాటలు అంటూవుంటే.. నాకు బాధ వేస్తోంది” - అని నాటక పాత్రలను చూసి అనుకోవటం వంటిదే, ఈ దృశ్యము నుండి జీవుడు అనుభవించే సుఖ దుఃఖాలు కూడా!
కనుక, “ఇక్కడి సుఖ దుఃఖాలకు వాస్తవమైన ఉనికి లేదు. ఇది కాల బద్ధము. స్వప్న సదృశమేగా ఇదంతా!” - అనునది మరచి ఈ జీవుడు ఆయా విషయాలతో తదాత్మ్యము పొంది వాటితో అవినాభావపూర్వకమైన అనుభవమును పునికిపుచ్చుకుంటూ కొనసాగించటమే జగత్తు (లేక) సంసారము అనబడుదాని నిర్వచనం.
ఓ ఉద్ధవా! “ఈ మాయా రచనకు రచయితను సర్వాంతర్యామినైన నేనే” - అని గ్రహించు! విద్య-అవిద్య.. ఈ రెండూ కూడా నా యొక్క మాయా రచనయే! ఈ శరీరి నా మాయా రచన యందు నిమగ్నుడగుచున్నాడు. జీవుల యొక్క బంధము మోక్షము అనే రెండింటికీ కారణం సర్వ తత్త్వస్వరూపుడగు నా మాయా చమత్కారమే! మాయా రచయితను నేనే! దేహిని నేనే! దృశ్యము నేనే!
ఇక ఈ బద్ధ-ముక్తులగు జీవులు (దృష్టిలో) ఎవ్వరంటావా? ఇక్కడి ద్రష్టలంతా కూడా అద్వితీయ స్వరూపుడనగు నా అంశయే! అట్టి నా అంశభూతులగు జీవులకు అవిద్య చేత బంధము, విద్య చేత బంధరాహిత్యము కలుగుతోంది.
“నేను జీవుడను” అను భావనయే బంధము. “ఇక్కడి ద్రష్టత్వమంతా ఏ పరమాత్మ యొక్క అంశయో అట్టి పరమాత్మ నాకు అద్వితీయుడు” అని గమనించటంచేత మోక్షము. ఇంతకు మించి వేరే బంధము లేదు. మోక్షము లేదు.
Page number:69
ఇప్పుడు నీకు బద్ధుని లక్షణములు, ముక్తుని లక్షణములు వివరిస్తాను. విరుద్ధమైన బంధ మోక్షములు ఆత్మకు ఏవిధంగా ఆపాదితములో (Attributed features) చెప్పుచున్నాను. విను!.
అధ్యాయము–11.) జీవ-ఈశ్వర న్యాయం
|
ఒకానొక చోట ఒక మహావృక్షం వున్నది. దాని వ్రేళ్ళు నేలలో విస్తారంగా లోతుగా విస్తరించి వున్నాయి. ఆ వృక్షము యొక్క కొమ్మలు, ఆ కొమ్మల ఉపకొమ్మలు అతి వైశాల్యంగా ఆ చోటును ఆక్రమించుకొని వున్నాయి. ఆ కొమ్మలకు ఆకులు ఫలములు
పిందెలు అసంఖ్యాకంగా వ్రేలాడుచున్నాయి.
ఎక్కడి నుండో రెండు పక్షులు వచ్చి ఆ మహా వృక్షముపై వ్రాలాయి. ఒకటి పెద్దది. ఒకటి చిన్నది. కొద్దిసేపైన తరువాత చిన్న పక్షి అక్కడి కొమ్మలపై వ్రాలింది. ఫలాలు తింటోంది. అటుఇటు చూస్తోంది. గంతులేస్తోంది. కిచకిచ శబ్దాలు చేస్తూ ఆ కొమ్మ - ఈ కొమ్మ వైపుగా వ్రాలి అక్కడి ఆకులలో పూలలో తన దేహమును దాచుకుంటోంది. మరల ఎగురుతోంది. మరల మరల ఆ వృక్షముపై అనేక చోట్ల వ్రాలుతోంది. అవిశ్రాంతంగా కదులుతోంది. ఎన్నో ధ్యాసలు! ఎన్నో రుచులు! ఎన్నో వేదనలు, రోదనలు! ఆశిస్తోంది! నిరాశపడుతోంది! ఆవేశపడుతోంది! నవ్వుతోంది! దుఃఖిస్తోంది! పుల్లపళ్లు తింటోంది! బాధగా కూతలు పెడుతుంది. ఇంతలోనే తీయ పళ్ళు కొరకు వెతకుతోంది. గర్విస్తోంది! భంగపడుతోంది! అద్దాని అన్వేషణా - ఆవేదనా - ఆలోచనా - ఆకాంక్షా - ఆలింగనా వ్యవహారములకు అంతు ఉండుటలేదు. ఏది ఏమైతేనేం? అది పెద్ద పక్షిని ఒక వైపు చూసుకుంటూనే వున్నది. పెద్ద పక్షిని ఏమరచటమూ లేదు, వదలటమూ లేదు. కొమ్మలపై చంగ్ చంగ్ గంతులు ఆపటమూ లేదు!
ఇక పెద్ద పక్షియో! ఆ మహావృక్షానికి పైన గల ఒక ఏకాంత ప్రదేశంలో ప్రశాంతంగా ఆనందంగా సమగ్రమైన విజ్ఞతతో తనను తానే సంపూర్ణమైన అవగాహనతో ఆస్వాదిస్తూ చిద్విలాసంగా చూస్తోంది.
Page number:70
ఒక తండ్రి పిల్లవాడితో తమ ఇంటికి దూరంగా గల ఒకానొక ఉద్యానవనంలోకి వచ్చాడు. ఆ పిల్లవాడు ఉద్యానవనంలో ఆటలు ఆడుకుంటూవుంటే, తండ్రి ఒకానొక వాత్సల్యతతో గమనిస్తూ తన అనుభూతితో తాను ఉంటాడు చూచావా? పిల్లవాడు నాన్నను చూచుకుంటూనే ఆటలలో మునిగి గంతులు వేస్తూ వుంటాడు కదా!
అట్లా ఆ పెద్ద పక్షి చిన్న పక్షియొక్క వైనమంతా వాత్సల్యంగా గమనిస్తూనే తాను ప్రశాంత ముద్ర వహించివుంటోంది! అప్రమేయమై మౌన-ఆనందముల ఆస్వాదన కొనసాగిస్తోంది. ఆటలాడుకునే పిల్లవాడి వైనం - తన వైనం తండ్రికి తెలుసు కదా! అట్లాగే, పెద్ద పక్షి కూడా చిన్న పక్షి తన ఆనంద కల్పిత భావనా రూపము - అని ఎరిగి తానుమాత్రం చిత్స్వరూప చమత్కారంగా వెలయుచున్నది.
ఈ దృష్టాంతం పరమాత్మ (పెద్ద పక్షి) - జీవాత్మ (చిన్న పక్షి) పరంగా గమనించు.
జీవాత్మ తనను తాను దృశ్యాంతర్గతమైన దేహిగా దర్శిస్తోంది. దేహము అనే పంజరంలో చిక్కుకున్న పక్షివలె ఎరుగుచున్నది. సంగతి - సందర్భము - సంఘటనల మధ్య పరిమిత విశేషంగా తనను ఎరుగుచున్నది! కర్మలకు సంబంధించిన సత్ఫల దుష్ఫల భోక్తగా స్వకీయంగా భావిస్తోంది. అనగా, సత్ఫల దుష్ఫల భోక్తగా తనను తాను ఎరుగుచున్నది. ఈ దేహమునకు ఇక్కడి జన్మ - జరా - మృత్యు సంఘటనలకు వేరుగా తనను తాను ఎరుగుట లేదు. తనేమిటో ఎట్టిదో ఎందుచేతనో తానే ఏమరుస్తోంది!
ఇక పరమాత్మయో? నిత్య జ్ఞానాశ్రయుడు. జీవుడు అనబడు దానికి కేవల ఆనందస్వరూప సాక్షి! జన్మలు - కర్మలు - గుణములు - దృశ్యములు - సందర్భము - సంబంధములు మొదలైన వాటిచే స్పృశించబడనివాడు.
జీవుడు అవిద్యచే జనించుటచేత నిత్యబద్ధుడు!
పరమాత్మ విద్యామయుడై వుండటంచేత నిత్యముక్తుడు!
ప్రతి ఒక్క వ్యక్తి పరమాత్మ (నిత్యముక్తుడు), జీవాత్మ (నిత్య బద్ధుడు) - ఈ ఇరువురి ఏకస్థానవాస చమత్కారమే! (Everybody is a combination of mere silent al-powerful witness (+) worldly participant). ఈ పాంచభౌతిక దేహమే ఆ మహావృక్షము.
జీవాత్మ పరమాత్మల ఏకస్థాన - ఏకత్వపు చమత్కారం గమనించి సునిశ్చితుడైన వానిని వివేకి అని, విద్వాంసుడు అని, జ్ఞాతజ్ఞేయుడు అని శాస్త్రములు పిలుస్తున్నాయి.
Page number:71
“పరమాత్మ మరెక్కడో! జీవాత్మనగు నేనిక్కడ!” - అని పరిమితావగహనకు అనుబంధుడైన వానిని అవిద్వాంసుడు అని చెప్పుతారు.
అనగా, ప్రతి ఒక్కడు జీవాత్మగా నిత్యబద్ధుడు. పరమాత్మగా నిత్యముక్తుడు.
ఉద్ధవుడు : హే పరంజ్యోతి స్వరూపా! పరమాత్మా! జీవ బ్రహ్మైక్యానుభవుడగు విద్వాంసుడు దేహమును ధరించవలసిన అవసరం కలిగి వుంటాడా? పాంచభౌతిక దేహం త్యజించినవాడై వుంటాడా?
శ్రీ కృష్ణపరమాత్మ :
శ్లో॥ దేహస్థోఽపి న దేహస్థో విద్వాన్ స్వప్నాత్ యథోత్థితః
అదేహస్థోఽపి దేహస్థః కుమతిః స్వప్నదృక్ యథా! (అధ్యా 11, శ్లో 8)
మిత్రమా! నటించువాడు - నాటకములోని పాత్రల వలె పరమాత్మ - జీవాత్మ ప్రతి దేహంలోను యథాతథంగా ప్రదర్శితులైవున్నారు. ఇది గమనించి ఆస్వాదించు. విద్వాంసుడు సదా ముక్తపురుషుడై వుంటాడు. “నేను దేహ బద్ధుడను!” అనే భ్రమ - బంధ భావాలచే పరిమితుడై వుండడు.
నిద్ర లేచినవాడు, “నేను నిద్ర సమయంలో (కలలో కనిపించిన సంపద ఆపదలకు చెందినవాడను!” అని భ్రమిస్తాడా? లేదు కదా! స్వప్నంలో కనిపించిన సంపదకు యజమాని ఎవరు? స్వప్నాంతర్గతుడైన ద్రష్టయా? స్వప్న సాక్షియా? మరొకరెవరన్నానా? ఊహచే జనించి, ఊహచే లయించేదానికి యజమాని అనునదేమున్నది?
నిద్ర లేచినవాడు స్వప్న దృశ్యాన్ని తన జ్ఞప్తిలో ఏ విధంగా చూస్తాడో.. విద్వాంసుడు (లేక) నిత్యవివేకి ఈ జాగృత్ దృశ్యాన్ని ఆ విధంగా వర్తమానంలోనే చూస్తూ ఆస్వాదిస్తాడు. దేహంలో ఉంటూనే దేహము నాది. అంతేగాని నేను దేహమును కాను… అనునది గమనిస్తున్నాడు.
“ఈ వాహనము నాది” అని చెప్పుచున్నాడు - “ఈ వాహనము నేను” అని అనడు కదా! దేహము విషయం కూడా అంతే!
అవివేకియో? నిద్రలో అడవిలో చిక్కుకున్నట్లు కలవచ్చిందనుకో? ఆ స్వప్నద్రష్ట తన ఇంట్లో పరుపుపై బంధువుల మధ్య వుండి నిద్రుస్తున్నప్పటికీ, “నేను అడవిలో చిక్కుకున్నానే! నా గతి ఏమిటి? ఏ మృగమైనా వచ్చి నా వెనక పడదు కదా!” .. అనే భయం పొందుతాడు చూచావా?
Page number:72
ఆ విధంగా కుమతి అయినట్టి అవివేకి దృశ్యము ఉన్నప్పుడు - లేనప్పుడు కూడా దృశ్యజాడ్యమును అనుభూతిగా పొందుచూనే ఉంటాడు.
అనగా…
అవివేకి దేహం ఉన్నప్పుడు, దేహం లేనప్పుడు కూడా దృశ్యతదాత్మ్యరూపమైన సంసారము అనబడేదానిని అనుభవిస్తూనే వుంటాడు. వివేకికి దేహం ఉన్నప్పటికీ ఆతని పట్ల సంసారము స్వప్న మాత్రమువలె మొదలే లేనిదై వుంటుంది. అందుచేత… వివేకికి దేహము యొక్క రాకతో వచ్చేదేదీ లేదు. పోయేదేదీ లేదు. అతని సందర్శనము (perception / interpretation) సుఖదుఃఖాలకు అతీతమై వుంటుంది. అవివేకికి దేహము యొక్క పోకతో బంధము పోయేదీ కాదు. అన్ని సంబంధ - బాంధవ్యాల బీజములు అంతరమున కొనసాగిస్తూనే ఉంటాడు. సుఖదుఃఖాలు స్వమనోకల్పితాలు! సంసారము అనునది ఉన్నది మనస్సులోనే! దేహములో కాదు. దృశ్యములో కాదు. జగత్తులో కాదు. ఆత్మయందు కాదు. |
స్వస్వరూపాత్మతత్త్వము గురించి వేదాంగములు - విజ్ఞులు చెప్పుచున్న వాక్యములను వివేకముతో గ్రహించాలి సుమా!
అట్టి వివేకి -
నటుడు నవరసాలు ప్రదర్శిస్తూ - ఈ కోపం, ఈ ప్రేమ, ఈ ఇష్టం, ఈ అయిష్టం, ఈ ఆవేశం నేను ప్రదర్శిస్తున్నప్పటికీ, ఇవన్నీ నేను నటిస్తున్న పాత్ర సంబంధమైనది! పాత్ర నాటకంలోనిది. నేను సర్వదా వీటితో ప్రమేయం లేని స్వరూపం కలవాడినే! … అని తెలిసియే వుంటాడు కదా! అందుచేత, వివేకి (లేక విజ్ఞుడు) ఇంద్రియార్థరూపమగు జగత్తు చేతగాని, ప్రకృతి రూపమగు గుణముల చేతగాని, సహ జీవులతో సందర్భానుచితంగా ఏర్పడే సంబంధ అనుబంధ - బాంధవ్యముల చేతగాని ప్రమేయము పొందడు! వాటిని స్వీకరిస్తూనే, స్వీకరించనివాడై ఉంటాడు.
Page number:73
ఆతనికి ఏదీ బంధము కాదు. ఇక క్రొత్తగా పొందవలసిన మోక్షమేమున్నది? “నేను పాత్రధారినై వుంటూనే…త్రిగుణములకు సూత్రధారిని కదా!” అని ఎరిగి వుంటాడు.
ఇక అవివేకి విషయానికి వస్తే…
విద్వాంసుడు నిత్యానిత్య వివేకి, వైరాగ్యయుక్తుడు అయినవాడు. పడుకున్నప్పుడు, కూర్చున్నపుడు, వ్యవహారాలలో ప్రవేశిస్తున్నప్పుడు, చూస్తున్నప్పుడు, స్పర్శిస్తున్నపుడు, వాసన చూస్తున్నప్పుడు, భుజిస్తున్నపుడు, వింటున్నప్పుడు - ఇటువంటి సర్వ సందర్భములలోనూ ఈ ఈ త్రిగుణ ప్రదర్శన సందర్భాలలోను నేను బద్ధుడిని అని భ్రమించడు. వాటిచే అతడు నిబద్ధుడు కాడు.
“ఈ శరీరములోని ఇంద్రియాలు ఇంద్రియార్థాలచే ప్రేరేపించబడి ప్రవర్తిస్తున్నాయి. వీటిచే నేను నిబద్ధుడును కాదు! పరిమితుడను కాను!”- అని గమనించుచున్నవాడై ఉంటున్నాడు.
సూర్యుడు ఆకాశంలో ప్రకాశిస్తున్నాడు. అట్టి సూర్య బింబం ఒక తటాక జలంలో ప్రతిబింబిస్తోంది. సూర్య బింబము తటాక జలంలో ప్రతిబింబిస్తోంది కాబట్టి… అది తటాకజలంచే బంధింపబడింది - అని అంటామా? ప్రతిబింబించినంత మాత్రం చేత - సూర్యబింబం జలానికి సంబంధించినదని గాని, జలంలో సూర్యబింబం చిక్కుకున్నదని గాని ఎవ్వరూ అర్ధం చేసుకోరు కదా!
గాలి అంతటా వీస్తూ వుంటుంది! అటువంటి గాలి దేహాలలోను, వస్తువులలోను, పాత్రలలోను (Eg. In four wheeler Tyres, Foot Balls, etc.,) చిక్కుకున్నదని ఎవ్వరమూ అనం కదా! స్వప్నం గురించి ఎరుకగలవాడు స్వప్నంలో నేను చిక్కుకున్నాను.. ఇప్పుడేమో, బయటకు వచ్చాను అని అనుకోడు కదా!
Page number:74
అట్లాగే, విద్వాంసుడు కూడా -
ఒకడు అద్దంలో ముఖం చూచుకుంటూ, ఈ అద్దంలో నా ముఖం చిక్కుకున్నది - అని వాపోతాడా? పసిపిల్లవాడు అద్దం గురించి తెలియక అట్లా (Having no knowledge about a mirror) అనుకుంటాడేమో మరి!
ఒకడు నిదురలేచిన తరువాత స్వప్నదృశ్యం గురించి ఎట్లా అనుకుంటూ వుంటాడు? వివేకి వర్తమానంలోనే తన ఎదురుగా వున్న ఇంద్రియార్థ సమ్మేళనము - సంగతి, సందర్భముల మేళా వంటి ఈ జగత్తును ఆ రీతిగా చూస్తూ ఉంటాడు.
వివేకి జగత్తు నుండి, దేహమునుండి, తదితదిత దేహ సంబంధములనుండి సదా సర్వదా నివృత్తుడై, అతీతుడై, దర్పణ స్వబింబదర్శనదృష్టి కలవాడై వుంటాడు.
విజ్ఞానియగు వివేకి ఇంద్రియములను విషయములతో ప్రవర్తింపజేస్తూ.. తాను సర్వదా అతీతమైన అప్రమేయత్వమును వహించియే ఉంటాడు.
ఎవని సంకల్పమైతే ప్రాణ - ఇంద్రియ - మనో - దేహాదుల క్రియలతో తాదాత్మ్యము చెందకుండా వుంటుందో.. అట్టివాడు
దేహస్థుడై వుండి కూడా, గుణములకు అతీతుడు, వినిర్ముక్తుడు (Ever beyond and Ever relieved) అయివుంటాడు.
ఎవ్వరైతే ఈ శరీరము ఒకరిచే అర్చించబడుచున్నప్పుడు, మరొకరిచే అవమానించబడుచున్నప్పుడు ఉభయ సందర్భములలో కూడా సంతోష దుఃఖములచే స్పర్శించబడకుండా ఇదంతా “యాదృచ్ఛికం (Nobody as cause)” అని గమనిస్తూ సమదృష్టితో చూస్తూ వుంటాడో అతడే బుధుడు! ముక్త పురుషుడు! అట్టివాడు సాధువులను చూసి స్తుతించడు! అసాధువులను దూషించడు (లేక) నిందించడు. గుణ దోషములకు వ్యధ చెందడు! సద్గుణములను చూసి మురిసిపోడు!
Page number:75
దేనినీ ఎవ్వరినీ దూషించడు, ఆశ్చర్యపడిపోడు. ఆతడు జగత్తుకు ఆవల ఆత్మారాముడై జగత్ వృత్తులకు పట్టుబడనివాడై వుంటాడు! ఒక జడునివలె ప్రాపంచిక సత్ అసత్ విషయ పరంపరలలో చిక్కుకోడు, మాట్లాడడు, ధ్యానించడు. అన్నింటా ఆత్మనే ధ్యానిస్తూ వుంటాడు. జగత్ నాటకంలో నటిస్తూనే ప్రేక్షకుడిలాగా చూస్తూ ఉంటాడు.
ఉద్ధవుడు : స్వామీ! అంతటి అతీతత్త్వము ఆత్మారామత్వము ఒనగూడాలంటే వేద వేదాంగ పాండిత్యం అవసరమంటారా? (లేక) వాటి ఆవస్యకత అనివార్యం కాదంటారా?
శ్రీకృష్ణుడు : ఓ ఉద్ధవా!
ఆత్మ యొక్క జగత్ ప్రదర్శనా చమత్కారము - జగత్తు ఆత్మకు అద్వితీయము … అను విశేషం ఎరుగక, నా ఆత్మయే జగత్ దృష్టిచే జగత్ రూపంగా కనిపిస్తోంది… అని గమనించక… రోజులు గడుపుచున్నవానికి ఏ పాండిత్యము వలన ఏం లాభం? శబ్ద బ్రహ్మమునందు (వేద మంత్రోచ్ఛారణమునందు) నిష్ణాతుడై కూడా ఆత్మతత్త్వము యొక్క అవగాహనయందు నిష్ణాతుడవకపోతే,… అట్టి శాస్త్ర పాండిత్యము నిష్ఫలమైన శ్రమయే సుమా! పాలు ఈయని ఆవు, పతి పట్ల శ్రద్ధలేని భార్య, పరాధీనమైన దేహం, దుష్టగుణములు గల కొడుకు, దానం చేయని లోభి యొక్క ధనము, అర్థం లేని వాక్ శబ్దాలు … ఏ విధంగా వ్యర్థమో, అనేక దుఃఖములకు కారణమో… అట్లాగే - ఆత్మ జ్ఞానమును, ఆత్మతత్త్వానుభూతిని పెంపొందించుకొనే ఉద్దేశ్యము లేని వేద శబ్దాచ్ఛారణ నిష్ఫలము, దుఃఖభారము కూడా!
ఈ దృశ్య జగత్ యొక్క ఉత్పత్తి - స్థితి - లయములు ఎందులో చమత్కారంగా దృష్టికి అగుపిస్తున్నాయో - అట్టిదంతా ఆత్మతత్త్వ స్వరూపుడనగు నా లీలావినోదావతారముగా గమనిస్తూ - ఈ జగత్తు నాయొక్క లీలగా, క్రీడగా స్తుతించే వాక్కే ప్రయోజనకరము. ఈ దృశ్యమంతా పరమాత్మయొక్క లీలా వినోదమే! అని గమనించక, ఇక్కడి ప్రాప్తాప్రాప్తములకు సుఖదుఃఖములకు సంబంధించిన మాటలనే చెప్పుకుంటూ పోతుంటే ఏమి లాభము? బుద్ధిమంతుడైనవాడు అటువంటి వాక్యాలు ఉచ్ఛరించడు! ఇంకొకరు మాట్లాడుతుంటే వినడు! ఆహాఁ! ఈ బంగారము ఎంత విలువైనది!…. అని గమనించేవానికి ఆభరణముయొక్క వంపుసొంపులు విషయమే కాదు కదా!
సర్వము బ్రహ్మమే!
ఓ ఉద్ధవా! ఇక్కడ నీకు కనిపించే నానాత్వము (Multiplicity) అనే భ్రమను విడచిపెట్టు. ఇక్కడి భిన్నత్వంలోని ఏకత్వస్వరూపుడను - సర్వగతుడను అగు నన్నే ఆశ్రయించు.
Page number:76
నీ మనోబుద్ధులను పరస్వరూపుడనగు నాకు సమర్పించు. నిర్మలమైన మనస్సుతో “అంతా పరమాత్మ యొక్క ప్రదర్శనమే” అని గమనించటం ద్వారా మనస్సును నాకు సమర్పించు.
“నా యొక్క దేహ - మనో - బుద్ధి - చిత్త - అహంకారాలతో సహా ఈ సర్వము, ఈ సర్వ జీవులు పరమాత్మ స్వరూపమే” - అని గ్రహించి వర్తించు. సర్వకాల - సర్వావస్థల యందు జిజ్ఞాసాపూర్వకంగా ఆత్మ ధ్యానం చేయి. నానాత్వ దర్శనం మొదలంట్ల విడనాడు.