[[@YHRK]] [[@Spiritual]]
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బహ్మసూత్ర భాష్యే
సంస్కృత మూలము : శ్రీ వ్యాసమహర్షి విరచిత శ్రీమద్భాగవత ఏకాదశస్కంధాంతర్గతము
అధ్యయన విద్యార్థి , రచన : యేలేశ్వరపు హనుమ రామకృష్ణ
[Chapters 12 to 16 out of total 46]
విషయ సూచిక :
Page number:76
అధ్యాయము–12.) దైవకార్యంగా స్వధర్మ నిర్వహణ
|
శ్రీకృష్ణ భగవానుడు: ఒకవేళ జీవాత్మ - పరమాత్మ అంతా బ్రహ్మమే! … అనే మనోనిశ్చయం నీకు కుదరటం లేదా? సరే! అయితే, సర్వ కర్మలు ఎటువంటి లోక సంబంధమైన అపేక్ష లేకుండా కేవలం నాకు సమర్పిస్తూ సమాచరించు. చక్కగా నిర్వర్తించు. లోక పావనము, క్షేమకారకము (శుభద్రము) అగు నా అవతార విశేషముల కథా శ్రవణం చేయి! సర్వ తత్త్వస్వరూపుడనగు నన్నే స్మరించు. గానం చేయి. దివ్యమైన నా జన్మ - కర్మ విశేషములను (చిన్ని కృష్ణుని లీలలు అవతార విశేషాలు) ఇత్యాది మననం చేయి.
ఓ ఉద్ధవా! నన్నే ఆశ్రయించినవాడవై నీ యొక్క ధర్మ - అర్థ - కామములను నన్ను ఉద్దేశ్యించి ఆచరిస్తూవుండు. అప్పుడు, సనాతన పురుషుడనైన నా పట్ల నీకు క్రమంగా నిశ్చలమైన - ఏకాగ్రమైన - అచంచలమైన భక్తి రూపు దిద్దుకుంటూ ఉంటుంది. సత్సంగమును ఆశ్రయిస్తూ వుండు. ధ్యానిస్తూ వుండు. నన్ను దర్శిస్తున్నవాడవై నా స్వరూపమును పొందగలవు.
ఉద్ధవుడు : ఓ దేవదేవా! ఎందరో సాధువులు, సత్పురుషులు వివిధ రీతులుగా నిన్ను కీర్తిస్తూ వుంటారు! నీ గురించి ఆర్తులై - జిజ్ఞాసువులై - అర్థార్థులై - మోక్షార్థులై గానం చేస్తూ వుంటారు కదా! వారిలో ఎవ్వరు ఉత్తములు? ఎట్టివారి మార్గము మాకు మరింత అనుసరణీయం? ఎట్టి సాధువుల మార్గం అనుసరిస్తే మేము సత్పురుషులకు ఆదరణీయులం అవుతాం?
ఓ పరుమపురుషా! పురషోత్తమా! ఓ లోకాధ్యక్షా! జగత్ప్రభూ! నీకు ప్రణామం చేస్తూ నీపట్ల అనురక్తుడనై అడుగుచున్నాను. శరణాగతుడనై వేడుకొనుచున్నాను.
ఎవరియొక్క ఏ ఏ రీతి అయిన మార్గము మాకు శిరోధార్యమో, అనుసరణీయమో… చెప్పండి!
హే శ్రీ కృష్ణా! మీరు ప్రకృతికి అతీతులు! పరబ్రహ్మ స్వరూపులు! ఆకాశమువలె అంతటా మౌనంగా వేంచేసి ఉన్నవారు! నిర్వికారులు! నిరాకారులు! అట్లు అయివుండి కూడా,…
Page number:77
మీ భక్తుల సౌలభ్యం కొరకై భిన్న భిన్న రూపములతో అవతరిస్తున్నారు! అట్టి మీ అవతారమును శ్రవణ-మననం చేస్తున్న భక్తులు మాకు అనుసరణయులు కదా! అట్టి భక్తుల గుణగణములు కూడా చెప్పండి! వారిని గుర్తించటమెట్లా? వారిని మేము శరణువేడి మనస్సును జయించటం, తమకు సమర్పించటం నేర్చుకుంటాం!.
శ్రీకృష్ణుడు : ఓ ఉద్ధవా! ఎవ్వరు ఏ కారణంగా నన్ను ఆశ్రయించినా సరే, వారు నాకు ఇష్టులేనయ్యా! ఎవ్వరు ఏ కారణముగా దీపమును సమీపించినా కూడా, వారిపై కాంతి ప్రసరితమౌతుంది కదా!
మహనీయులగు మార్గదర్శకుల విలక్షణ లక్షణములను వివరిస్తాను. ఏ ఏ మార్గములలో నీవు ఆదిపురుషుడనగు నన్ను చేరవచ్చునో… కొన్ని మార్గాలను ఇక్కడ ఉదహరిస్తున్నాను. విను… ఇవి ప్రవృద్ధం చేసుకోవటమే మీకు శ్రేయోదాయకం!
అధ్యాయము–13.) భక్తిలక్షణములు
|
శ్లో॥ కృపాలుః అకృతద్రోహః తితిక్షుః సర్వదేహినామ్ ॥
సత్యసారో అనవద్యాత్మా సమః సర్వోపకారకః ॥
కామైరహతధీః దాంతో మృదుః శుచిః అకించనః ॥
అనీహో మితభుక్ శాంతః స్థిరో మచ్ఛరణో మునిః ॥
అప్రమత్తో గభీరాత్మా ధృతిమాన్ జితషడ్గుణః ॥
అమానీ మానదః కల్యో మైత్రః కారుణికః కవిః ॥ (అధ్యా 11, శ్లో 29–31)
1.) కృపాలుడు : ఆతడు సర్వ జీవుల పట్ల అపారమైన - అకారణమైన కృపారసం కురిపిస్తూ వుంటాడు. ఈ కనబడే వారంతా కృష్ణ చైతన్య విన్యాసమే కదా! … అనే ఎరుకచే అతని ప్రేమ, కృప సర్వజీవులపట్ల స్వభావసిద్ధమై వుంటుంది. (Love for all is natural and unconditonal, by habit).
2.) అకృతద్రోహుడు : ఆతని బుద్ధియందు ఎవ్వరిపట్ల ద్రోహచింతన ఈషన్మాత్రం కూడా వుండదు. తాను ప్రేమించే పరమాత్మకు వేరైనది ఏదైనా వుంటే కదా… ద్వేషించటానికి? (Non-violent, Non-revengeful to anybody).
3.) సర్వ దేహినామ్ తితిక్షః : సర్వ దేహుల పట్ల మాతృ వాత్సల్యం కురిపిస్తూ ఓర్పు వహించినవాడై వుంటాడు (Maintaing utmost forbearance).
Page number:78
4.) సత్యసారుడు : ఆతడు సర్వదా అనిత్యమైనదానికి ఆధారమైన నిత్యమగు సత్ పట్ల దృష్టి, ధ్యాస కలిగి ఉంటాడు (Cogitation towards Final Truth).
5.) అనవద్యాత్మా : దృశ్యముచే జయింపబడక, తానే దృశ్యమును జయించినవాడై, అతీతుడై ఆత్మాభిషిక్తుడై వుంటాడు (Sensing unity in spite of apparent diversity).
6.) సమః : సర్వదా సర్వత్రా సమభావము కలిగి ఉంటాడు. గుణములకు ఆవల గుణాతీత దృష్టిచే సర్వసమభావంగా సర్వస్థితి గతులను చిరునవ్వుతో దర్శిస్తూ వుంటాడు (Maintaining beyondness with smile).
7.) సర్వోపకారకః : సర్వజీవుల పట్ల సమరస పూర్వక స్నేహ - సేవాభావనతో వీరికి నేనేమి సేవలు అందించగలను… (What is that I can do for these) అనే భావనచే సర్వులకు ఉపకారి అయివుంటాడు.
8.) అహతకాముడు : కోరికలు ఆతనని జయించలేవు. ఆతడు ప్రాపంచిక కోరికలకు దాసుడై వుండడు. ఆతని బుద్ది కోరికలను దాటివేసినదై వుంటుంది. సంయమి అయివుంటాడు. ఇంద్రియములను తన ఆధీనంలో ఉంచుకున్నవాడై వుంటాడు (Worldly expectations or possessions do not influence his stance).
9.) మృదుః : మృదు మధుర స్వభావుడై వుంటాడు (Soft and positive expressions).
10.) శుచిః : ఇతరుల పట్ల, ఆయా సంగతి, సందర్భముల పట్ల - అశుచి అయిన, అపవిత్రమైన అభిప్రాయాలు దరిజేరనీయడు. శుచి అయిన పవిత్రమైన భావాలు పెంపొందించుకొని వుంటాడు (Healthy, optimistic and pure ideas, views and opinions).
11.) ఆకించనుడు : వాళ్ళు అజ్ఞానులు - వీరు కారు. వారు మంచివారు వీరు కాదు…. ఇట్టి కించత్వము తదితరులపైగాని, తనపై గాని ఆపాదించుకోడు. (Belittling neither others nor self since one’s own self is pervading in and as all others).
12.) అలోకుడు : ఈ లోకంలో ఉంటూనే లోక రహితుడై లోకాతీతుడై వుంటాడు. పడవ నీళ్లల్లో ఉంటుంది. నీళ్లు పడవలోకి ప్రవేశించనీయం కదా! అట్లాగే, విజ్ఞుడు జగత్తులో వుంటూ కూడా, హృదయంలో ఆత్మ స్వరూపమునే మననం చేస్తూ వుంటాడు. బాహ్య రూప - గుణాలు కాదు! (Beyond the world but not belonging of the world).
Page number:79
13.) మితభుక్తుడు : ఏది ఎంతవరకు స్వీకరించాలో, తత్సమయంలోనే ఎంతవరకు త్యజించినవాడై వుండాలో… ఎరిగినవాడై వుంటాడు. మితంగా ఆహార (దృశ్య) స్వీకారం అనే సమర్ధమైన కళను ఎరిగినవాడై వుంటాడు! (Wel-controled while receiving the world)
14.) శాంతః : ఈ ప్రాపంచక విషయాలు ఆతనిని సమీపించినపుడు అవన్నీ తమతమ ఉద్వేగాలన్నీ త్యజించి సశాంతించినవై వుంటాయి. ఆయన పరమశాంతుడై జగద్విషయాలు చిద్విలాసంగా వీక్షిస్తూ వుంటాడు (Peaceful and pleasant).
15.) స్థిరుడు : ఇదంతా పరమానందమగు పరమాత్మ స్వరూపమే! శ్రీ కృష్ణ చైతన్యాందమే అనే ఎరుక విషయంలో అచ్యుతుడై వుంటాడు! ఈ కనబడేవారంతా నారాయణము అను పరతత్త్వముయొక్క ప్రత్యక్షరూపమే… అని గమనిస్తూ ఉంటాడు. (All this is manifestation of Divinity).
16.) మచ్ఛరణో : సర్వదా పరమాత్మ యొక్క మహిమను మననం చేస్తున్నవాడై, శరణాగతుడై వుంటాడు. మత్-పాదాశ్రయుడై, మత్-శరణాగతుడై వుంటాడు.
17.) మునిః : సర్వ ప్రాపంచక సందోహాల పట్ల - ఇది ఇట్లా ఉన్నా ఒక్కటే! మరొక రీతిగా ఉన్నా ఒక్కటే - అను రూపంగా మౌనం వహించినవాడై వుంటాడు! జగద్విషయముల పట్ల చిరుమందహాసముతో కూడిన మౌనము వహించినవాడై వుంటాడు! (మౌనేన కలహం నాస్తి).
18.) అప్రమత్తుడు : సర్వము మమాత్మయే! … అను భావనలో నిత్యోదితుడై వుంటాడు! ప్రమత్తత (Drowsyness / Dullness / Sleepy / Mildness) లేనివాడై వుంటాడు. సర్వదా “మామాత్మా సర్వభూతాత్మా” భావనలో మెళుకువ కలిగి వుంటాడు.
19.) గభీరాత్మా : పిరికితనం వదలి వుంటాడు! మేఘగంభీర స్వభావుడై వుంటాడు! హృదయంలో సర్వేశ్వరుడే కర్త-భోక్తగా వేంచేసి ఉండగా, ఇక లోటేమిటి?
20.) ధృతిమాన్ : ఆత్మ సర్వదా స్వస్వరూపంగా ఉండగా… ఇక భయం దేనికి? ఆతడు సర్వదా ఆయా సర్వ పరిస్థితులందు ధైర్యము కలిగిన వాడై వుంటాడు!
21.) జితషడ్గుణుడు : శోకము, మోహము, జననము, మరణము, ఆకలి, దప్పిక … అనే ఆరు గుణములచే నిబద్ధుడు - ఆకర్షితుడు కానివాడై వుంటాడు.
Page number:80
తినటం కోసం జీవించడు. జీవించటం కోసం తింటాడు. ఆ ఆరింటికి అందక, వేరైన స్వభావము పెంపొందించుకొనినవాడై వుంటాడు.
22.) అమాని : నన్ను ఇతరులు గౌరవించెదరు గాక! గుర్తించెదరుగాక! నా గొప్పతనములను గమనించెదరుగాక! అను రూపమైన సాంసారిక మానత్వజాడ్యం ఆతనికి ఉండదు.
23.) మానదః : ఇతరుల గొప్పతనము, ఆధ్యాత్మికత, ఔన్నత్యములను గుర్తించి, గమనిస్తూ… సంభాషించువాడై వుంటాడు. ఇతరులకు గౌరవమును తెలియజేయువాడై వుంటాడు (Respectful towards the other Learned).
24.) కల్యో : బ్రహ్మ జ్ఞానమును ఇతరులకు తెలియజేయుటలో వివరణ పూర్వకమైన వాక్ సంపత్తి, నిపుణత్వము కలిగినవాడై వుంటాడు. సంశయ రహితంగా భాగవతత్వమును ప్రకటించువాడై ఉంటాడు (Outspoken).
25.) మైత్రః : ఇతరులపట్ల స్నేహభావము, సౌహార్ద్రత కలిగి వుంటాడు (Friendly).
26.) కారుణికః : ఆతని హృదయం ప్రేమతో, కరుణతో సర్వదా నిండివుంటుంది (Love, Kindness and Empathy).
27.) కవిః : తత్త్వజ్ఞానము దృష్టాంత పూర్వకంగా గ్రహించువాడై, ఉపదేశించగలవాడై వుంటాడు. (Expertise in understanding and interpreting Celestial messages and ideas).
28.) ససత్తముడు : గురువులు బోధిస్తున్న చెప్పుచున్న గుణదోషములను తనయందు గమనించి, వాటిని తన దరిజేరనీయనివాడై వుంటాడు. తను విన్న గుణ దోషవాక్యములను తనపట్ల అన్వయించుకుంటూ, తన గుణదోషములను సరిదిద్దుకునే ప్రయత్నంలో వుంటాడు. సర్వ ధర్మములను (దేహ - మనో - చిత్త - బుద్ధి - అహంకార ధర్మాలను - All the functions) పరిత్యజించి, సర్వదా సర్వాత్మకుడనగు నన్నే భజిస్తూ వుంటాడు!.
29.) భజంతి అనన్య భావేన! అన్నీ వదలి పరమాత్మపై దృష్టిపెట్టి భజిస్తూనే ఉంటాడు. పరమాత్మ ఈ సర్వ జీవుల ప్రత్యక్షత్వమునకు అన్యము కాదు! - అని గ్రహించి ఈ విశ్వమును ఉపాసిస్తూ ఉంటాడు.
Page number:81
స్వామికి వేరుగా నేను లేను. నేను ఆయన యొక్క అనేక యోచనలలోని ఒక యోచనను. నావి అనిపించేవన్నీ మనో - బుద్ధి - చిత్త - అహంకారాలలతో సహా ఆయనవే…! అని నిర్ద్వంద్వుడై ఉంటాడు.
పై లక్షణములు గల వారు, ప్రవృద్ధ పరచుకొనుచున్నవారు… భక్తులుగా కీర్తించబడుచున్నారు!
తెలిసికొనియో, తెలియకయో.. ఎవ్వరైతే అనన్యభావం అనే ఉపకరణంతో సచ్చిదానందుడను, అనంతుడను, సర్వాంతర్యామినియగు నన్ను - నా సత్ స్వరూపమును విని, గమనించి, గ్రహించి ఏకాంతభావంతో కీర్తిస్తున్నారో.., అట్టివారు భక్తులు అని చెప్పబడుచున్నారు!.
🌹
ఓ ఉద్ధవా!
★ నా మూర్తిని దర్శించు!
★ నా భక్తులను సందర్శించు. వారి పాదపద్మములను స్మృశించు. వారిని సేవించు. స్తుతించు. నమస్కరించు.
★ భగవత్ గుణములను - కర్మలను మననం చేయి.
★ భక్తుల గుణ గణాలను గానం చేయి.
★ శ్రద్ధాసక్తులతో నా కథలను విను.
★ నిరంతరం నన్ను ధ్యానించు.
★ “నేను పరమాత్మకు దాసుడను కదా!” అను దాస్య భావనతో, “నాది అనునదేమీ లేదు! అంతా పరమాత్మదే! పరమాత్మయే!” - అని ఆత్మనివేదన చేయి!
★ నా జన్మ - కర్మ - కథనములను మననం చేయి.
★ నాకు సంబంధించిన పర్వదినములను (Festival Occasions / Days relating to Divine Activities) ఆనందంతో, ప్రత్యేక శ్రద్ధలతో నిర్వర్తించి వినియోగించుకో!
★ గానము - నృత్యము - గోష్ఠి (ఉపన్యాసములు) - మందిరములలో ఉత్సవములు జరుపుకోవటం …. మొదలైనవన్నీ నిర్వహిస్తూ - నిర్వర్తిస్తూ వుండు!
★ పవిత్ర స్థలములను సందర్శిస్తూ తీర్ధయాత్రలు సేవిస్తూ వుండు!
Page number:82
★ ఉత్సవములలో పాల్గొనుము.
★ వైదికమైన (ఉపవాసము, వేదగానము మొదలైన), తాంత్రికమైన (రుద్రాభిషేకము - వ్రతములు మొదలైన) దీక్షలను స్వీకరిస్తూ వుండు.
★ ఆలయములలో శ్రద్ధాభక్తులతో దేవతామూర్తులను ప్రతిష్ఠిస్తూ వుండు! ఒంటరిగా చేయి. అట్లాగే, నలుగురిని కలుపుకొని కూడా అట్టి కార్యములను నిర్వర్తించు.
★ పరమాత్మ కొరకై పుష్పగుచ్చాలను, పూదండలను, ఉద్యానవనాలను, పూజా మందిరాలను, తీర్థ ప్రదేశాలను, ఆలయములను నిర్మించటంలో పాల్గొనుము. నీవంతు సేవ నీవు నిర్వర్తించు.
★ సేవకా భావం కాలవాడవై శ్రద్ధాసక్తులతో, నిష్కపట భావనలతో భగవత్ మందిరాన్ని శుభ్రం చేయటం, అలకటం, నీళ్ళు జల్లటం, ముగ్గులు వేయటం… ఇటువంటి పనుల ద్వారా ఆలయ సేవలు చేయి.
★ అమానిత్వము (Not deeming oneself as someone greater than others), అదంభిత్వము (Not trying oneself to pose as better than others) త్యజించు. నీవు చేసే మంచి పనులను దంభముతో చెప్పుకోవద్దు.
★ పరమాత్మ సమక్షంలో దీపము వెలిగిస్తున్నాను… అని భావించి దీపం వెలిగించు. ఆ దీపపు కాంతిలో పరమాత్మ సమక్షంలో కార్యములు నెరవేరుస్తున్నాను కదా! అనే భావనను ఆశ్రయించివుండు!
★ నీకు ఎప్పుడు ఏ వస్తువు ప్రియంగా వుంటుందో… ఆ పదార్థాన్ని నాకు సమర్పించు! ప్రియమైన వస్తువును పరమాత్మకు సమర్పించినప్పుడు అట్టి సమర్పణ స్వతఃసిద్ధంగానే అమోఘఫలం ప్రసాదించగలదు.
అధ్యాయము–14.) ఉపాసన - పూజ విభూతులు
|
ఉద్ధవుడు : స్వామీ! మీ పూజా స్థానములు ఏవేవి?
శ్రీకృష్ణుడు : సూర్యుడు - అగ్ని - బ్రహ్మజ్ఞులు - ఆవు - విష్ణుభక్తులు - ఆకాశము - వాయువు - జలము - ఈ భూమి - ఆత్మ - సమస్త ప్రాణులు … ఇవన్నీ కూడా నా పూజా స్థానములే! ఉపాసనకొరకై విభూతులే! ఎక్కడ నీకు పవిత్రమైన భగవత్ భావన ఏర్పడి ఉపాసించాలని ఉంటుందో…. అక్కడ అట్లే నేను వేంచేయుటకు సంసిద్ధుడనై ఉంటాను.
Page number:83
→ వేద మంత్రములతో సూర్యుని రూపంగా ఉన్న నన్ను పూజించు.
→ నేయి (హవము)చే నాయొక్క అగ్ని రూపాన్ని పూజించు.
→ సన్యాసుల - బ్రాహ్మణుల రూపంలో ఉన్న నన్ను ఆతిథ్యముచే పూజించు.
→ గోవు - కుక్క మొదలైన రూపములలో ఉన్న నన్ను పచ్చగడ్డి, ఆహారము సమర్పిస్తూ పూజించు.
→ పేదవారి రూపములలో ఉన్న నన్ను దానము, ప్రియవాక్యములు, కుశల ప్రశ్నలు మొదలైనవాటిచే పూజించు.
→ భక్తుల రూపంగా ఉన్న నన్ను ఆత్మబంధు భావంతో - జ్ఞానుల రూపములో ఉన్న నన్ను సత్కారముల ద్వారా పూజించు.
→ నిరంతరం ధ్యానం ద్వారా నీ హృదయాకాశంలో ముఖ్యప్రాణ రూపంగా ఉన్న నన్ను పూజించు. పంచప్రాణములను ప్రాణేశ్వరరూపంగా భావించి పూజించు!
→ అర్ఘ్యప్రదానము - పుష్పములతో జల స్వరూపుడనై ఉన్న నా రూపమును పూజించు!
→ షోడశ ఉపచారములతో, మంత్రోచ్ఛారణతో నా శిల మృత్తికా పఠరూపములను పూజించు.
→ సహజీవుల రూపములో ఉన్న నన్ను సాత్విక వచనములు - సహకారము - సేవా భావము - శబ్దము - ఆహార సమర్పణ… ఇత్యాదులతో పూజించు!
→ సమదర్శివై, సర్వ జీవరాసులలో సర్వదా అంతర్యామిగా వేంచేసియున్నన్న నన్ను “పరమాత్మయే ఇన్ని రూపాలుగా కనిపిస్తున్నారు” - అను మననముచే సమదర్శనముతో అద్వితీయ కృష్ణచైతన్యానంద దర్శనంగా పూజించు.
→ సమహితత్వముతో సహ జీవులను ప్రేమాస్పదంగా - వాత్సల్య దృక్కులతో దర్శించటం ద్వారా సర్వాంతర్యామియగు నన్ను ఆరాధించుచున్నట్లే అవుతుంది.
→ ఈ సర్వ ప్రదేశములలోను శంఖ - చక్ర - గద - పద్మముల ధరించిన నా చతుర్భుజ సమన్వితమైన శాంతరూపమును ఏకాగ్రచిత్తంతో మనస్సులో మనోపూర్వకంగా, మనస్సు అనే కుంచతో చిత్రించుకొని ధ్యానించు! పూజించు!
Page number:84
→ ఇష్టా-పూర్తములతో నన్ను అనుష్టించు.
ఇష్టములు : “ఇష్ట” అనబడే కర్మలయినట్టి యజ్ఞ - యాగ - సవాస్రనామార్చనాదులతో ఏకాగ్ర చిత్తంతో నన్ను మనన పూర్వకంగా ఆరాధించు! పూజించు!
పూర్తములు : పూర్తములు అనబడే సహజీవుల సౌకర్యకర్మలు అయినట్టి… బావులు త్రవ్వించటం, చెఱువులు శుభ్రం చేయించటం, రహదారులు నిర్మించటం, త్రాగునీటి వసతి కల్పించటం, గ్రామాలలో వైద్య వసతి కల్పించటం, ఇటువంటి కర్మల ద్వారా… సర్వ రూపములు నావైన నన్ను పూజించు! ఆరాధించు! ప్రవృత్తిని పవిత్రం చేసుకొని ప్రదర్శించు!
అధ్యాయము–15.) సత్సంగము
|
శ్రీకృష్ణ భగవానుడు : ఓ ఉద్ధవా! ఈ సందర్భంలో మరొక ముఖ్యమైన విషయం కూడా నీకు సూచిస్తున్నాను. నేను సత్పురుషులచే సదా సమాకర్షుడును! వారున్న చోట నేను శంఖ - చక్ర - గదా - పద్మధారుడనై చతుర్భుజాలంకారుడనై ప్రియభావంతో వేంచేసి ఉంటాను. అందుచేత, సత్పురుషులు శాశ్వతానందప్రదమగు ఆత్మతత్త్వమును సంభాషించుకునే చోట నేను శాంత ఆనంద - జగద్రక్షక విశేషరూపంతో నాకు నేనే (నన్ను వేరుగా / ప్రత్యేకంగా ఆహ్వానించకుండానే) వచ్చి వుంటాను!
అట్టి మహానీయుల అమృత వాక్కులు ప్రవచనమగుచున్న చోటు అతి పవిత్రమైనది. సంత్సంగము అని చెప్పబడే వారి ఆత్మజ్ఞాన - ఆప్త వాక్యములు, పరస్పర సంవాదములు, గురు-శిష్య బోధలు అమోఘమైన ప్రభావం కలిగి ఉంటాయి.
నా మహిమ శ్రేయోదాయకమై అక్కడివారి వెంటనంటి వుంటుంది. సత్సంగం చేత భక్తి - జ్ఞానములు ప్రవృద్ధమైనట్లుగా మరొక ఉపాయం చేత ప్రవృద్ధం కాదని అందరికీ మనవి చేస్తున్నాను.
ఓ యదునందనా! ఉద్ధవా! నీవు నాకు భృత్యభావంతో సేవిస్తున్నవాడివి! స్నేహితుడివు! భక్తి-ప్రపత్తులు కలవాడివి! అందుచేత, నీపై నాకు ఉన్న అవ్యాజమైన ప్రేమచే చెప్పుచున్నాను. ఇప్పుడు సాధుసాంగత్య మహిమ గురించి విను!
Page number:85
ప్రాపంచికమైన సాధారణ మమకారములను పరమాత్మ వైపుగా నడిపించటం వలన ప్రాప్తించగల సర్వోత్కృష్టమైన ఫలితాలు గురించి కూడా కొన్ని గూఢమైన రహస్యాలు చెప్పుబోవుచున్నాను! శ్రద్ధగా విను.
సత్సంగ మహిమ
ఓ ఉద్ధవా! నాయొక్క పరతత్వం నీ వశం చేసుకోవటానికి అనేక ఉపాయాలు ఉన్నాయి. మార్గాలు ఉన్నాయి.
విచారణా మార్గం (లేక సాంఖ్య మార్గము) : “ఇది దేహము - ఇది ఆలోచనా రూపమైన మనస్సు - ఇది విమర్శన విచక్షణ విచారణ వివేచనా రూపమైన బుద్ధి - ఇది ఇష్టము అను రూపంగా ప్రదర్శితమగుచున్న చిత్తము - ఇది అహంకారము - ఇది జీవుడు - ఇది తత్సాక్షి అయిన ఆత్మ… ఇది సర్వ జీవులలోని సాక్షి - అట్టి కేవల సాక్షి సర్వుల రూపము!”. నేనే ఇట్టి విభాగ పాండిత్య అంతర్యామి → పరిశీలనా - పరిచింతనా - పరియోచనా యోగం!
ధర్మ మార్గం : పరమాత్మకు అనుకూలమైన ప్రార్థన - ఆలాపన - సహజీవుల పట్ల దయ… మొదలైనవి. నియమిత కర్మలు - ధర్మములు (The Duties and functions expected of you by the Society) ఉపాసనా పూర్వకంగా నిర్వర్తించటం.
స్వాధ్యాయ యోగం (లేక మార్గము) : భగవంతునికి సంబంధించిన పాఠ్యాంశాలు, వేద వాక్కులు మరల మరల పఠించటం. (Chanting and singing individually or in a group).
ఇష్టాయోగం (లేక మార్గము) : భగవంతుని ఉపాసించే విధంగా వ్రతాలు - యాగాలు యజ్ఞాలు పూజలు మొదలైనవి నిర్వర్తించి పరమాత్మకు ప్రియం కావటం! (The acts of Adoration).
పూర్తయోగం (లేక మార్గము) : లోక ప్రయోజన కారకములైన నూతులు త్రవ్వించటం, దేవాలయాలు కట్టించటం, బాటలు నిర్మించటం మొదలైనవి నలుగురికి పనికివచ్చే ఆయా శోభప్రదమైన కార్యక్రమములు నిర్వర్తించటం. (Acts that carry good to others).
Page number:86
వ్రతనియమ యోగం (లేక మార్గము) : ఇంద్రియనిగ్రహం కొరకై వ్రతములు, ఉపోషముల వంటి ఇంద్రియ నియమములు నిర్వర్తించటం.
దక్షిణవ్రత యోగం : తనకున్న సంపద పరులకు సమర్పించటం. ఇతరులతో పంచుకోవటం. పేదవారిని దాన - దక్షిణలతో తృప్తిపరచటం! (అంగసంబంధమైన శాస్త్రీయ ఉపాసనలు కూడా ఇందులోకి వస్తాయి).
ఛందోవ్రత యోగం (లేక మార్గము) : భాషాయుక్తమైన భగవత్ స్తోత్రాలు, పురాణాలు, వేదమంత్రాలు చదవటం, వ్రాయటం, వ్యాఖ్యాన గ్రంథాలు రచించటం మొదలైనవి.
తీర్థ యోగం : తీర్థ ప్రదేశాలు సందర్శించి ఆయా భగవత్ స్థానములను నమస్కార - ప్రదక్షణల పూర్వకంగా ఉపాసించటం.
యమ నియమ యోగం : ఇంద్రియములను అదుపులో పెట్టి వైదిక ధ్యాన యోగాది మార్గాలలో నియమించటం.
ఇక సత్సంగము గురించి …
ఇవన్నీ గొప్ప మార్గాలే! అయితే, సంత్సంగము ( Association with Spirituality and Godly Idealogies) అన్నిటికన్నా సులభము - మహత్తరము అయిన మార్గము సుమా! సత్సంగముతో మరేవీ సాటిరావు అని నా అభిప్రాయం!
సత్సంగము అనే సాధనా యోగం కేవలం మానవులకే పరిమితమనుకోకు! అది దేవతలు - రాక్షసులు - పక్షులు - మృగములు - నాగులు మొదలైన వారంతా ఆచరణలో పెట్టుచున్నదే!
ప్రతి యుగంలోను సత్సంగ ప్రభావం చేత అనేకులు పరమాత్మనగు మత్-పదమును చేరుచున్నారు! సాత్వికులైన దేవతలే కాదు! రజో-తమో గుణ సంపన్నులైన మానవులు, దైత్యులు, మృగములు, పక్షులు, గంధర్వులు, అప్సరసలు, నాగులు, సిద్ధులు, చారణులు, గుహ్యకులు, విద్యాధరులు, సిద్ధులు, సాధ్యులు, వైశ్యులు, శూద్రులు, స్త్రీస్వభావులు, అంత్యజులు ఇతర రజోగుణ స్వభావులు, తమోగుణ స్వభావులు… వీరంతా కూడా యుగయుగాలుగా అనేకానేకులు సత్సంగ ప్రభావంచేత జీవాత్మ పరిమితత్వమును అధిగమించి పరమాత్మత్వమును సముపార్జించుకుంటున్నారు.
Page number:87
అసుర - దానవ జాతులలో వృత్రాసురుడు, ప్రహ్లాదుడు, వృషపర్వుడు, బలి, విభీషణుడు, బాణుడు, మయుడు….!
అట్లాగే, జంతుజాతులలో సుగ్రీవుడు, హనుమంతుడు, జాంబవంతుడు, గజేంద్రుడు, జటాయువు, తులాదారుడు, వణిజుడు…!
ఇదే విధంగా ధర్మవ్యాధుడు, కుబ్జ, వ్రజగోపికలు, యజ్ఞానుష్టానపరులగు కొందరి భార్యలగు యజ్ఞపత్నులు… వీరంతా కూడా శ్రవణం చేత, వింటున్న ఆత్మవిద్య యొక్క మననం చేత సత్సంగ ప్రయోజనంగా అస్మత్పదమును సులభంగా పొందటం జరిగిందయ్యా!
వారిలో అనేకులు శ్రుతులను (వేదములను) నేర్వలేదు! మహనీయులగు వారికి శిష్యత్వము - ఉపాసనత్వము నిర్వర్తించనూ లేదు! వారంతా కేవలం సత్సంగ ప్రభావం చేత నన్ను అతి తేలికగా పొందటం జరిగింది! జరుగుతోంది! జరుగగలదు!
పరమాత్మతో అనన్యత్వం సంపాదించటానికి సత్సంగము కేవలం మానవులే కాదు! వృక్షములు - జంతువులు - కొండలు కూడా మహత్తత్వము సముపార్జించుకోగలవు సుమా! సత్సంగము వలన కలిగిన అనన్య భావం తత్త్వశాస్త్ర శ్రవణం (త్వమ్ తత్
అసి! అని నిరూపించే శాస్త్రీయ ప్రవచన శ్రవణం) చేత వ్రజగోపికలు, వ్రజములోని ఆవులు, అనేక వృక్షములు, నాగులు, ఇతర మూఢ గతిని అనుభవిస్తున్న కీటకము వంటి జీవులు సముద్ధరించబడ్డారు. వీరంతా కూడా - నేను కృష్ణ చైతన్యమే! నేనే ఈ
సర్వ జగత్ రూపంగా విస్తరించి నాకు అగుపిస్తున్నాను. ఈ జగత్తులు నాలో ఉన్నాయికాని, నేను ఈ జగత్తులలో లేను… అను రూపమైన కేవలీ ద్రష్టత్వ పరతత్వాన్ని ఆస్వాదించారు!
ఓ ఉద్ధవా! సంత్సంగమును ఆశ్రయించకుండా, యోగ - సాంఖ్య - దాన - వ్రత - తపో - వ్యాఖ్యాన పాండిత్యము - స్వాధ్యాయనము - సన్యాసము మొదలైన అనేక రీతులగా కూడా నన్ను అంత సులభంగా పొందలేరని మరొక్కసారి గుర్తుచేస్తున్నాను!
నా అభిప్రాయము చేతులెత్తి ప్రకటిస్తున్నాను (ఊర్ధ్వ బాహుర్విరేమ్యేష!).
అధ్యాయము–16.) పరాభక్తి : పరాప్రేమ : వ్రజ గోపికలు |
ఓ ఉద్ధవా! పరమాత్మయగు నా పట్ల అకుంఠితమైన - అనన్యరూపమైన ఆసక్తి ఏ ఏ రూపంగా, ఏ కారణంగా కలిగి ఉన్నా సరే, వారికి సర్వాంతర్యామినగు నేను వశం అవుతాను. ఆసక్తి నా పట్ల అనురక్తిగా రూపుదిద్దుకొని తదితరమైనదంతా అనాకర్షితమైనపుడు నేను తప్పక పట్టుబడతాను. ఇందుకు దృష్టాంతం మన వ్రజగోపికలే!
Page number:88
నేను చిన్ని కృష్ణునిగా మన గోపబాలురతో కూడి, గోపికల ఇళ్ళలో దొంగగా ప్రవేశించి, అనేక బాలా లీలా వినోదరూపమైన అల్లరి పనులు చేశావాడిని కదా!
అప్పుడు గోపికా స్త్రీలంతా అమ్మ యశోదతో, “ఓ యమ్మ! నీ కుమారుడు మా ఇళ్ళను పాలుపెరుగు మననీడమ్మా! పోయదమెక్కడికైనను!” - అంటూ మా అల్లరి పనులను ఏకరువు పెట్టేవారు! అమ్మ ఏమో, “కృష్ణయ్యా! ఎందుకురా ఈ అల్లరి పనులు? వాళ్ళ ఇళ్ళలోని పాలు - పెరుగు - వెన్నలతో నీకేమి కర్మ? మన ఇంట్లో పాడి తక్కువనా?” అని నన్ను నిలబెట్టి ప్రశ్నించేది. అది విని నేను “అమ్మా! ఎప్పుడూ నీ చీరకొంగు పట్టుకునే ఉన్నాను కదా! వీళ్ళవన్నీ లేనిపోని చాడీలు!” అని చెప్పితే, “ఆహా! మా బాబే! నిజమే నాయనా!” అని ముద్దు పెట్టుకునేది.
క్రమంగా కొన్ని గంటలు నేను అల్లరి చిల్లరి పనులు చేస్తూ ఆ గోపికల ఇళ్ళలో కనబడకపోతే “అయ్యో! కృష్ణయ్య ఏడీ! మా ఇంటికొచ్చి నాలుగు గంటలయింది? ఒక్కసారి వచ్చి కనబడితే బాగుగదా!” అంటూ వారు నా రాక కోసం, నన్ను చూడటానికి విరహం పెంచుకోసాగారు. ఒక్కొక్కరోజు నేను వారి ఇళ్ళకు వెళ్ళకపోతే “ఓ యమ్మా! ఆక్కా! వదినా! చిన్ని కృష్ణుడిని చూడక ఈ రోజంతా గడచింది. మీ ఇంటికేమన్నా వచ్చాడా? యశోద వదినగారింటికి వెళ్ళితే ఆమె, ”మా పిల్లవాడితో మీ కేమి పని? అని విసుగుకోదు కదా?"… ఈ విధంగా చిన్ని కృష్ణుని చూడటానికి బెంగపడసాగారు! ఎక్కడైనా చిన్నికృష్ణుడు కనబడగానే ఒళ్ళు - ఇల్లు - పరిసరాలు మరచి ముద్దు చేస్తూ ఆనందంగా అడుగులు వేయసాగేవారు. చుట్టూ నిలబడి పరవశంతో నృత్యం చేసేవారు.
ఆ గోపికలు బృందావనంలో మేమున్న చోటికి వచ్చి మాకు క్రొత్త క్రొత్త తినుబండారాలు పెట్టేవారు. ఇంతలో నేను కాస్త మరుగు అవగానే “మీ పొదలమాటున లేడుకదమ్మ చెప్పరే?” .. అంటూ ఉత్సుక - ఆవేదన - నివేదనా భావాలతో వెతికేవారు. నా వేణుగానం వినగానే పరవశంతో నా చుట్టూ చేరి నృత్యం చేయసాగేవారు. వారి తన్మయత్వాన్ని చూసి నేను కూడా నా విష్ణుత్వము - అవతార మూర్తిత్వము ఏమరచి వారితో నృత్యం చేసేవాడను!
Page number:89
వారు “నేను జీవుడను కదా!” అనునది అధిగమించి, ఈ చరాచర సృష్టి అంతా ఎందులో అయితే కల్పితచమత్కారంగా కనిపించేస్తోందో అట్టి శ్రీకృష్ణచైతన్య స్వరూపులము… అని తన్మయముతో విన్యాసం చేయసాగేవారు! ఇట్లా అనేక రోజులు నెలలు
సంవత్సరాలు గడిచాయి.
🦚
ఒకానొక రోజు, కాల చమత్కారంగా అక్రూరులవారు మా మేనమామ కంసుని పనుపుపై నన్ను, అన్న బలరాముడిని మధురానగరం తీసుకెళ్ళటానికి వేంచాశారు.
అప్పటి పరిస్థితి ఏమిటంటే…?
గోపికలు నన్ను చూడటానికి నాతో గడపటానికి అత్యంత అనురక్త చిత్తులై వుండేవారు. తెల్లవారుజాము లేచి ఇంటి పనులన్నీ చక్కబెట్టుకొని గబగబా మేముండే బృందావనానికి దగ్గిరగా గల అడవి ప్రదేశాలకు వచ్చేవారు. “ఇంకా తెల్లవారటానికి రెండు ఘడియల కాలం వున్నదా? నిన్న సాయంకాలం కృష్ణుని చూసాం! ఎప్పుడు తెల్లవారాలి? ఎప్పుడు కృష్ణుడు కనిపిస్తాడు?” …. అని విరహవేదనతో వాత్సల్యావేశంతో క్షణక్షణం గడిపేవారు.
విః అహమ్ అవిహితాహంకారత్యాజ్యం - విరహం
విహితాహంకార సమాశ్రమం
అప్పుడు…,
నన్ను - అన్న బలరాములవారిని మధురా నగరానికి అక్రూరుని వెంట పంపటానికి మా నాన్న నందులవారు, అమ్మ యశోద అతి కష్టంమీద అంగీకరించారనే విషయం గోపికలకు తెలిసింది. నాపై గాఢమైన ప్రేమతో అత్యాసాసక్తులైయున్న గోపికల విరహపూర్వక మనస్తాపాన్ని చూసి అక్రూరులవారు ఆశ్చర్యం పొందారు.
“అహా! ఈ గోపికలు గృహము, పుత్ర పౌత్రుల పట్ల గల విరహవేదన - ప్రేమావేశం చిన్ని కృష్ణునిపై అచంచలంగా నిలిపారు. వీరు శ్రీ కృష్ణునితో ప్రియసమాగం తప్ప మరింకేమీ ఏమాత్రం కోరటంలేదే! శ్రీ కృష్ణునిపై కొంచము ప్రేమ సంపాదించుకోవటానికి నేను ఎన్నో వ్రత - జప - తపో - ధ్యాన - నియమాలు నిర్వర్తించవలసి వచ్చిందే! ఈ గోపికలు ఎంత ధన్యులు!” … అని మురిసిపోయారు!
ఓ ఉద్ధవా! ఆ గోపికలకు వారికి ప్రియతముడనగు నా సాంగత్యంలో సంవత్సరాలు క్షణాలుగా గడచిపోయాయి. నాతో ఎడబాటులో వారికి ఒక్కొక్క రాత్రి ఒక్కొక్క యుగంగా సుదీర్ఘంగా గడవసాగింది!
Page number:90
నదులు సముద్రంలో కలసిన తరువాత ఇక ఇది గంగా నదీజలం, ఇది గోదావరి నదీజలం, ఇది కృష్ణా నదీజలం, ఇది కావేరీ నదీజలం… అనే తేడా వుండదు కదా!
సమాధిలో ప్రవేశించిన మునీశ్వరులు నామ రూపములను అధిగమించినవారై, వాటిని గమనించరు కదా!
అట్లాగే, వ్రజగోపికలు నాయందు పరమ ప్రేమ చిత్తులై క్రమంగా సర్వమును మరచారు.
ఓ ఉద్ధవా! వాస్తవానికి నిర్వికారము - నిరామయము, ఓంకార సంజ్ఞార్థము అగు నా పరస్వరూప తత్త్వము గురించి వారికి ఏమాత్రం తెలియదు! వారికి నన్ను తమ ప్రియాతిప్రియ గొల్లవానిగా, తమవానిగా మాత్రమే తెలుసు! నాయందు అద్వితీయము, అమోఘము అగు ప్రేమతత్పరత మాత్రం వారు చూపుతూ ఎల్లప్పుడు నన్ను ఆశ్రయించినవారై వున్నారు. వారికి ఇంకే సాధనలు తెలియదు!
అటువంటి ప్రేమోత్కంఠత చేత - తల్లి బిడ్డను తనకే సొంతమని భావించినట్లుగా కృష్ణుడు తమవాడేనని భావించసాగారు. తమకు మాత్రమే చెందినవాడని కామోత్కంఠత పొందసాగారు. కృష్ణుడు ఎదురుగా ఉంటే చాలు! మరింకేమీ కించిత్ కూడా అవసరం లేదు అనే అనన్య చింతన ఆస్వాదించనారంభించారు.
అమ్మ కొద్దిసేపు కనబడకపోతే బిడ్డ బెంగ పడునట్లు, వారు కృష్ణ సాన్నిధ్యం కొరకై అనుక్షణికంగా బెంగ పడుచున్నారు.
ఒక ప్రియురాలు తన ప్రియుడితో ఏకాంతము కొరకై తదితర బంధువులనందరినీ త్యజించి ఎవ్వరికీ చెప్పా పెట్టకుండా బయల్వెడలుతుంది చూచావా? ఆ గోపికలు నా సాన్నిధ్యం కొరకై బంధువులు - ఐనవాళ్ళు మొదలైనవన్నీ త్యజించి జారభావంతో నేనున్న చోటుకు పరుగులు పెట్టుకొని వచ్చేవారు! నన్ను చూడగానే లోకమును దేహమును ఉపేక్షించి తన్మయులై వుండేవారు. మేము దేహులము కదా! స్త్రీ దేహులము కదా! ఇల్లు - వాకిలి - భర్త - పిల్లలు కలవారము కదా!…. అనే స్పృహ-అహంకారాలు వారికుండేవి కావు!
నేను బృందావనం వదలి వెళ్ళిన తరువాత కూడా, వారు నేను సంచరించిన ప్రదేశాలను మరల మరల ప్రవేశించి నాతో గడిపిన జ్ఞాపకములతో అనుక్షణం మనోసంయోగం పొందుతూ వుండేవారు!
Page number:91
వారిది తపస్సు కాదు! భక్తి కాదు! వేదాధ్యయనం కాదు! యజ్ఞయాగాది క్రతు నిర్వహణం కాదు! వ్రతాలు కాదు! సేవ కాదు! మరి? బిడ్డకు తల్లి కనబడకపోతే ఏర్పడే బెంగ. విరహము. దర్శనాకాంక్ష. తదితరమైనదంతా అవిషయమై పోవటం. ఇంకేదీ రుచించకపోవటం. అన్నింటినీ వదలి అమ్మను చూడటానికి పరుగులు తీసే బాలభావావేశము. ఈ మొదలైన విశేషములతో కూడిన అనుక్షణిక మననము!
ఏ సాధనము చేయని ఆ అబలలు - కృష్ణుడిని చూడాలి! కృష్ణుని నామ రూపములతో సంగము కలిగి ఉండాలి! కృష్ణ మననముచే ఏర్పడే ప్రియభావము కొరకై తదితరమైనదంతా ఉపేక్షార్హమే! ధర్మార్థ కామమోక్షములు కృష్ణునిపై అపేక్షారూపమగు
మొదలైన విరహం ముందు కొరగానివి! కామోత్కంఠావేశముచే పరబ్రహ్మరూపుడగు నన్ను ఆశ్రయించారు. వారికి క్రమంగా సర్వము కృష్ణతత్త్వంగా అనుభూతం కాసాగింది!
క్రమంగా పరబ్రహ్మమే తామై ఆనందించసాగారు!.
కనుక మిత్రమా! ఓ ఉద్ధవా!
శ్లో॥ తస్మాత్ త్వమ్, ఉద్ధవ! ఉత్సృజ్య చోదనామ్ - ప్రతి చోదనామ్,
ప్రవృత్తిం చ నివృత్తిం చ శ్రోతవ్యం శ్రుతమేవ చ!
శ్లో॥ మామేకమేవ శరణమ్ ఆత్మానం సర్వ దేహినామ్
యా హి సర్వాత్మభావేన మయాస్యా హి అకుతో భయః? (అధ్యా 12, శ్లో 14, 15)
నీవు చోదనములు (Driving Tools), ప్రతి చోదనములు (Tools for withdrawing) ప్రవృత్తి ధర్మాలు - నివృత్తి ధర్మాలు, వినవలసినవి - వింటున్నవి… అన్నీ ప్రక్కకు పెట్టు! అధిగమించు! సర్వదేహులలో ఆత్మగా ప్రదర్శితమగుచున్న నన్ను మాత్రమే వాత్సల్య భక్తితో ఆశ్రయించు! శరుణువేడు! పరమాత్మయే ఈ కనబడే అన్ని రూపాలుగా కనిపిస్తున్నారు కదా! అను పరతత్త్వమును అనుక్షణికంగా మహాభావన చేయి!
తల్లికి బిడ్డపై, ప్రియురాలికి ప్రియునికి పై, తండ్రికి కొడుకుపై ఉండే ప్రేమంతా రంగరించి ఆత్మబంధువగు నాకు సమర్పించు. నేను నాదిగా కనిపించేది కూడా పరమాత్మయే… అని క్రమంగా స్వభావ సిద్ధంగా నీవప్పుడు సంతరించుకుంటావు. పరబ్రహ్మమే నీవై ప్రకాశిస్తావు.
Page number:92
అప్పుడు నీవు ఎక్కడ ఎట్లా వున్నా సర్వ కాంక్షలను కుతిని అధిగమించి అభయస్వరూపుడవై, కేవలం దృశ్య సాక్షివై, దృశ్యాంతర్యామివై తదితరమైనదానికంతటికీ అంతర్గతాంతుడవై ఆనందిస్తావు! అప్పుడు…. ఈ జగత్తులు నీలో వుంటాయి! నీవు జగత్తులలో కాదు!
శ్రీ ఉద్ధవుడు : హే యోగ యోగీశ్వరేశ్వరా! మీరు చెప్పినదంతా శ్రద్ధగా వింటున్నాను. సంతోషం! అయితే కూడా, ఎందుకో నాకు కొన్ని సందేహాలు తీరటం లేదు. నాకు భ్రాంతి కొనగాసుగుచున్నట్లే వున్నదని అనిపిస్తోంది! అంతేకాదు. నాలో ఏవేవో క్రొత్తక్రొత్త అనుమానాలు చిగురిస్తున్నాయి.
మీరు చెప్పుచున్నదేమిటి? విధి - నిషేధాలు (Do’s and Donts) వేదాలు - శాస్త్రాలు చెప్పుచున్నాయి కదా! అవన్నీ వదలి వేయమంటారా? శాస్త్రాలచే చెప్పబడే సాధనలు (చేయవలసినవి) - ప్రతి సాధనలు (వదలవలసినవి) ఆశ్రయించటం - వదలటం చేయనవసరం లేదా? శ్రోతవ్యం - శ్రుతం (to be listened to and already listened to) అయినట్టి పురాణ ఇతి హాస ప్రవచిత ధర్మాలు పట్టించుకోనఖర్లేదా?
మీరు చెప్పినదంతా విన్న తరువాత నా మనస్సు భ్రాంతిని వీడటం లేదు ఎందుకో మరి? నివృత్తి పొందటం లేదు! ఆత్మయందు నిలవటం లేదు! అల్పజ్ఞుడగు ఈ జీవుడు గోపికలవలె దర్శనోత్కంఠట స్వర్శనాకాంక్ష మొదలై మార్గముల సహాయంతో (లేక) తదితర ఆట-పాటల రూపమైనట్టి వ్రజ గోపికల బాల చేష్టల సహాయంతో పరమాత్మతో మమేకమౌతాడా?సర్వాంతర్యామి - సర్వతత్త్వ స్వరూపుడుగా రూపు చెందుతాడా? మీ పట్ల చూపే లోకసంబంధమైన విరహం - తపస్సు, వేదపఠనము ప్రాణాయామాది విధానములకంటే గొప్పవంటారా? మీరు అంటున్నదేమిటో, విడమరచి చెప్పండి!
శ్రీ కృష్ణుడు (పక పక నవ్వుతూ) : ఓహో! అల్పజ్ఞుడు - కించజ్ఞుడు అగు ఈ జీవుడు విరహోత్కరతతో పరమాత్మత్వమును ఎట్లా సంతరించుకుంటాడనియా, నీ ప్రశ్న? సర్వ ధర్మాలు, విధి నిషేధాలు వదలితే పరతత్త్వంతో ఐక్యత లభించేదేట్లా? - అనిగదా నీ సంశయం?
Page number:93
అసలు, ఒక్క ముఖ్యమైన ప్రశ్న!
ఈ జీవాత్మగా కనిపిస్తున్నదెవ్వరు? పరమాత్మయే కదా!
సర్వ విషయమతీతుడు - సర్వ తత్త్వాతీతుడు అగు పరమాత్మ ఒక లీలగా - ఒక క్రీడగా నాద స్వరూపమగు ప్రాణశక్తిని ధరించి సూక్ష్మ దేహంలోను (Into Body of feeling and thought), అటు తరువాత శబ్ద - స్పర్శాది ఇంద్రియములతోను కూడిన స్థూలదేహాలలోను ప్రవేశించి స్వయంకల్పిత దృశ్యరూపమనతగు ఈ జగత్తును ఆస్వాదిస్తున్నాడు.
దేహమంతా తన ప్రాణ శక్తితో నింపుతున్నాడు. (మూలాధారాది) చక్రములలో వేంచేసి, పంచతన్మాత్రలు (శబ్ద - స్పర్శ - రూప - రస - గంధములు) స్వరము, వర్ణము (గుణ సముదాయము) మొదలైన వాటిని వస్త్రము వలె ధరించుచున్నాడు! అనగా,
పంచతన్మాత్రలు - స్వరము వర్ణములతో కూడిన ఈ పాంచ భౌతిక దేహం ధారణ చేసి, తెలియబడేది అనబడే - వేదశబ్దార్థ దృశ్యముగా వెల్లడి అగుచున్నాడు!
కనుక, ఇక్కడ జీవుడుగా పదర్శితమగుచున్నది… ఆ జీవుడికి దృశ్యము (వేదము-తెలియబడేది)గా వెల్లడి అగుచున్నది కూడా యథాతథంగా పరబ్రహ్మమే సుమా!
అగ్ని ఆకాశంలో సూక్ష్మరూపంగా వుంటుంది. ఒకడు రెండు కొయ్యముక్కలను ఒక చోటికి చేర్చి ఒరిపిడి కలిగించినప్పుడు నిప్పురవ్వలు బయల్వెడలుతాయి. ఆ అగ్నియే ఆహుతి ఇచ్చినప్పుడు (నేయి పోసినపుడు) జ్వాజ్వల్వమానంగా అగ్ని శిఖలతో వెలుగొందుతుంది. అనగా.., అగ్ని ఆకాశంలో అప్రకటిత రూపంగాను, కట్టెల ఒరిపిడికి నిప్పురవ్వలుగాను, వెలుగుచున్న కట్టెలపై నేయి పోసినప్పుడు అత్యంత కాంతివంతంగాను వెలుగుచున్నది. అట్లాగే, పరమాత్మతత్త్వమే సర్వాతీత నిర్విషయంగాను, సూక్ష్మ దేహంతోను (Body of feeling and throught), స్థూల దేహంగాను (physical body that is solidly being experienced) ప్రదర్శితమౌతోంది! ఈ విధంగా….. అంతా పరమాత్మ యొక్క అభివ్యక్త రూపమేనయ్యా!
Page number:94
ఈ జీవుడు, వాక్కు, కర్మ, గతి (మార్గము), స్వీకారము, విసర్జనము, ఘ్రాణము (smelling), రస గ్రహణం (Tasting), దర్శనము (seeing), స్పర్శ (touching), శ్రవణము (hearing), సంకల్పము (ideation), విజ్ఞానము (knowing), అభిమానము (deeming / treating / assuming), ప్రకృతివ్యాపారము (playing roles in the drama of the world), సత్త్వ - రజ - తమో గుణములు, వాటి వికారములుచే కలిగే సుఖదుఃఖానుభూతులు (అధిదైవికము), పంచభూత సమ్మేళన రూపమైన ఈ ప్రపంచము… ఇవన్నీ కూడా, ఇదంతా కూడా పరమాత్మయొక్క … ప్రదర్శనా విన్యాసమే!
దృష్టాంతానికి, స్వప్నములో ఉన్నది-కనిపించేదీ…. ఆ సర్వములో స్వప్నద్రష్ట యొక్క స్వప్నచిత్కాళా విన్యాసము కానిదేది? అంతేకాదు! పరమాత్మ సర్వదా యథాతథము! స్వప్నంలో ఏమున్నా, ఏమి జరిగినా - జరగకున్నా… స్వప్నద్రష్ట సర్వదా యథాతథము కదా!
ఇంకొక దృష్టాంతం. ఒక చిన్న మట్టి బీజంలో మహత్తరమైన అంకుర శక్తి వేంచేసి ఉన్నది. అది అప్రదర్శితంగా వున్నది! ఆ బీజమును నేలలో నాటామనుకో! అప్పుడేమౌతుంది?
ఉద్ధవుడు: అది మహావృక్షమై కొమ్మలు ఆకులు, వేళ్ళు, కాయలు ఇత్యాధికంగా విస్తరించి కనబడుతుంది.
శ్రీకృష్ణుడు : అట్లాగే సనాతనుడు, ఆదిపురుషుడు అగు పరమాత్మ మొట్టమొదట (బీజంలో భవిష్యత్ అంకుర చమత్కారంగా) అవ్యక్తుడై వుంటాడు. ఆయన త్రిగుణములు ఆశ్రయించి లోక కారకుడగుచున్నాడు. ఏక స్వరూపుడైవుండి, ఒకానొక కాలంలో కళ్ళు - చూపు, నోరు - వాక్కు, చెవులు - వినికిడి … ఇటువంటి వికారక్రమంగా బహురూపములుగా వ్యక్తుడగుచున్నాడు.
దృష్టాంతానికి, గొప్ప నటునియొక్క నటనా చాతుర్యము…. ఆతడు స్నేహితులతో ఉన్నప్పుడు అవ్యక్తంగాను, నాటకంలో నటిస్తున్నప్పుడు వ్యక్తంగాను ఉంటుంది.
వస్త్రము అంటే ఏమిటి? ధారముల అల్లికయే కదా! జగత్తు అనబడే దృశ్యము పరమాత్మ అనే దూది నుండి తీయబడిన దారముచే ప్రదర్శితమగుచున్న వస్త్రము వంటిది!
దృశ్యమునకు సంబంధించిన అనుభూతి - అనుబంధ భావనయే సంసారము!.
ప్రవృత్తిచే సంసారము ఏర్పడుతోంది! ఈ సంసార వృక్షము భోగరూప పుష్ప ఫలములను ఆత్మరూపుడగు జీవునకు అందిస్తోంది.
ఈ సంసార వృక్షము పాప పుణ్యములు అనే రెండు విభాగములు గల బీజం నుండి పుట్టింది. దృష్టులచే పరిపోషించబడుతోంది.
అపరిమిత వాసనల రాసి (Limitless Bundle of Tendencies) దీని మూల విభాగం.
సత్త్వ - రజ - తమో గుణములచే ఈ సంసారవృక్షము యొక్క కాండము రూపుదిద్దుకుని ఉన్నది.
Page number:95
పంచ భూతములు ఈ వృక్షముయొక్క కొమ్మల ప్రారంభప్రదేశం.
11 ఇంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు ఈ సంసార వృక్షములోని రసము.
రక్తము - శ్లేష్మము ఇందులోని అంతరంగ ద్రావణములు.
సుఖ - దుఃఖములనబడే రెండు వేరైన తియ్యని - పుల్లని పళ్లు దీనికి కాస్తున్నాయి.
ఈ విశాల సంసార వృక్షము భూమండలము నుండి అటు ఆకాశమంతా ఇటు - పాతాళంలోకి విస్తరించి ఉన్నది!
జీవుడు - ఈశ్వరుడు అనే జంట పక్షులు ఈ వృక్షమును అంటిపెట్టుకొని ఉన్నాయి!
ఈ సంసార వృక్షమును కాముకులైన జీవులు అనే గబ్బిలాయిలు అంటి పెట్టుకొని ఉన్నాయి.
వివేకులు త్యాగ నిరతిగలవారు అగు హంసలు కూడా ఇదే వృక్షమును ఆశ్రయించి జీవిస్తున్నాయి! వాళ్ళు ఈ వృక్షము యొక్క ఆత్మ సుఖము అనే రూపముగల ఫలములను సదా రక్షిస్తున్నారు. తాము ఆస్వాదిస్తున్నారు!
ఓ ఉద్ధవా! వాస్తవానికి ఉన్నది సత్ స్వరూపుడనగు నేనొక్కడినే! మాయా శక్తి ప్రభావముచే నేనే ఇన్ని రూపములుగా, నామములుగా వ్యవహారములుగా చూడబడుచున్నాను! ఇదియే తత్త్వార్థజ్ఞానం! తత్త్వరహస్యం! అద్వైతం! ఎవ్వరైతే గురువులను ఆశ్రయించి (ఏకో సత్! విప్రా బహుధా వదంతి) అనే జ్ఞానవాక్యము యొక్క వేద-వేదాంగములచే గానము చేయబడుచున్న యథార్థతత్త్వము తెలుసుకుంటాడో … అట్టివాడు విదితవేద్యుడు, తత్త్వజ్ఞాని అవుతాడు.
“నాకు నేనే ఇన్ని రూపనామాలుగా (జలమున తరంగాలవలె) స్వయం అనుభూతమగుచున్నాను!” - అని ఆతడు గ్రహిస్తున్నాడు!
మిత్రమా! నేను చెప్పుచున్న భిన్నత్వంలోని అంతర్లీన ఏకత్వం (The inner unity in the outward diversity) గ్రహించి సర్వదా గమనిస్తూ ఆస్వాదిస్తున్న గురువులు ఉన్నారు. వారిని సమీపించి సేవించు! ఏకాంత భక్తి కొరకై ప్రశ్నించి నీ సంశయములను నివర్తించుకో!
అట్టి ఏకాంత భక్తితో క్రమంగా నేను విశ్వరూపమగు పరబ్రహ్మమును అను పరతత్త్వమును ఆశ్రయించు! అట్టి నీ ప్రయత్నముచే నీ ఈ త్రిగుణాత్మకమగు కారణ శరీరము (లేక) త్రిగుణ శరీరము (లేక) త్రిలింగ శరీరమును ఖండించి వేయి! ఆత్మయందు ఆత్మకు అభిన్నంగా ఆత్మస్వరూపుడవై ఉండు.
Page number:96
పరమాత్మ తత్త్వము విను. మననం చేయి. భక్తితో ఉపాసించు! క్రమంగా పరమాత్మ స్వరూపుడవై నీయందే కల్పితమైన ఆత్మ స్వరూప జగత్తును ఆత్మగా ఆస్వాదించగలవు!
ఆ తరువాత, జ్ఞానమును అందుకొరకై సాధనలు మొదలైన వ్యవహారాలను కూడా పరిత్యజించు!
పరమాత్మవై పరిపూర్ణుడవై… నీ యొక్క జీవాత్మత్వమునకు కర్తవు - కల్పించుకొన్నవాడివి (One who visualized individual self) సాక్షివి… అయి ఉండు! ఆపై ఈ ఆత్మాభిన్న జగత్తులో నీ ఇష్టానుసారం ఉండు! జగత్ రూపుడవై జగత్తును ఆస్వాదించు! జగత్ అతీతుడవై నిర్లిప్త పరమానంద స్థితి నుండి చ్యుతి పొందకు! అచ్యుతుడవై వుండు.
🌺🙏🌹