[[@YHRK]] [[@Spiritual]]
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బహ్మసూత్ర భాష్యే
సంస్కృత మూలము : శ్రీ వ్యాసమహర్షి విరచిత శ్రీమద్భాగవత ఏకాదశస్కంధాంతర్గతము
అధ్యయన విద్యార్థి, రచన : యేలేశ్వరపు హనుమ రామకృష్ణ
[Chapters 17 to 18 out of total 46]
విషయ సూచిక :
Page number:96
అధ్యాయము-17.) గుణత్రయ త్యాగ ఉపాయాలు |
శ్రీ ఉద్ధవుడు : ఓ అనంతా! అద్వితీయా! శ్రీ కృష్ణా! నిర్మలుడు - నిత్యుడు - స్వయమానంద స్వరూపుడు అగు పరమాత్మ దేహధారియై దేహ బంధమును పొంది జీవాత్మగా కనిపిస్తున్నాడు కదా! మరి, ఈ దేహ బంధము ఏ రూపంగా ఏర్పడుతోంది?
శ్రీ కృష్ణుడు : పరమ్ ఆత్మ - ఆ ఆవల ఉన్న ఆత్మ - అని కదా, శబ్దార్థము! మరి, దేనికి ఆవల? జగత్ - దేహాదులకు ఆవలవున్న ఆత్మ స్వరూపం. తెలియబడేదంతా తెలుసుకుంటూ వున్నట్టిది "ఆత్మ". తెలుసుకుంటున్న వానిని కూడా తెలుసుకొనుచున్నట్టిది.
ఆత్మ సదా నిర్మలము - అప్రమేయము - సర్వాతీతము అయినదే!
అట్టి ఆత్మ స్వస్వరూపమును కించిత్ ఏమరచి గుణములను ఆశ్రయిస్తోంది. అట్టి సత్వ రజ తమోగుణ సంబంధంచేత (అనగా నేను గుణ సంబంధితుడను అనే భావన యొక్క పరిపుష్టిచేత) స్థూల దేహ భ్రమ రూపుదిద్దుకొన్నదై, ఈ శబ్ద - స్పర్శ - రూప - రస - గంధముల సమ్మేళన రూపమగు దృశ్యములో దేహముగా బంధింపబడినట్లుగా కనిపిస్తోంది! అనగా, స్థూల దేహ స్వరూపానుభూతి ఏర్పడుతుంది.
ఇక ఆత్మ తన పరతత్వాన్ని ఏమరచి ఇహత్వమును అభ్యసిస్తూ (having ignored the beyondness to what is here and practising whatever here) దేహ పరంపరలు పొందటం కొనసాగిస్తోంది. దృశ్యముపట్ల గల పరిమిత దృష్టిచే ఏర్పడిన ఒకానొక బంధనపూర్వక అవినాభావ సంబంధమునే సంసారము అని పిలుస్తున్నారు!
Page number:97
ఉద్ధవుడు : స్వామీ! ఈ జీవుడు వాస్తవానికి సర్వదా ఆత్మస్వరూపుడే కదా! ఆత్మ అఖండము, అప్రమేయము అని వేద ఉపనిషత్ ప్రవచిత ఆత్మ శాస్త్రములచే, ఆత్మజ్ఞులగు మహనీయులచే సిద్ధాంతీకరించబడుతోంది. మరి, ఆత్మకు సత్త్వ - రజ - తమో గుణములు ఎక్కడి నుండి వచ్చి బంధం కలిగిస్తున్నాయి?
ఈ దృశ్యము ఆత్మరూపమే అయివుండగా...
... ఇవన్నీ ఎట్లా ఎవరి కారణంగా ఏర్పడుతున్నాయి?
శ్రీకృష్ణుడు : ఓ ఉద్ధవా! నీవు చెప్పినట్లు ఆత్మ ఎల్లపుడూ అతీతము, నిర్మలము, అఖండము, నిత్యోదితము, ఆనందస్వరూపమే! మరి, త్రిగుణ రూపమగు ఈ లింగ శరీరము (సూక్ష్మ శరీరము) గురించి అడుగుతావా?
|
శ్లో॥ సత్త్వం రజస్తమ ఇతి గుణా బుద్ధేర్న చాత్మనః । సత్త్వేనాన్యతమౌ హన్యాత్సత్త్వం సత్వేన చైవ హి ॥ (వ్యాస భాగవతం, స్కంధం 11, అధ్యాయం 13, శ్లోకం 1) |
శ్లో॥ సత్త్వం రజః తమ ఇతి గుణాః బుద్ధేః, న చ ఆత్మనః । సత్త్వేన అన్యతమౌ హన్యాత్, సత్త్వం సత్వేన చ ఏవ హి ॥ |
సత్త్వము - రజము - తమము అను త్రిగుణములు ఆత్మకు సంబంధించినవి కానేకావు. మరి? అవి బుద్ధికి సంబంధించినవి మాత్రమే!
→ అజ్ఞానము - నిద్ర - బద్ధకము - భయము మొదలైన అంతర్గత విశేషములతో కూడిన తమోగుణమును,
→ నేను ఇది చేస్తున్నాను - అది చేయాలి - ఏదో చేయలేకపోతున్నాను - అక్కడికి వెళ్ళాను - ఇక్కడికి వెళ్ళాలి - ఈ లోకంలోకి వస్తున్నాను - ఆ లోకంలోకి ఇక వెళ్ళాలి - ఇటువంటి రూపమగు రజోగుణమును,
... మునుముందుగా జయించాలి, అది ఎట్లా?
శాంతి - ప్రేమ - ఓర్పు - దాక్షిణ్యము ఇటువంటి విశేషములతో కూడిన సత్త్వగుణ సంపదతో రజ తమోగుణములను జయించు. ఆ విధంగా (సత్య - దయా - శాంతి - ప్రేమ - ఓర్పు - దాక్షిణ్యము ... ఇటువంటి విశేషములతో కూడిన సత్త్వగుణ సంపదతో రజ తమో గుణములను) జయిస్తూ అటు తరువాత, గుణాతీత వృత్తిచే సత్య - దయా - శాంతి - ప్రేమ రూప వృత్తులకు కూడా క్రమంగా అతీతుడవు - సాక్షివి - గుణాతీతుడవు అగుము.
Page number:98
ఎప్పుడెప్పుడైతే సత్త్వగుణము వృద్ధి పొందుతూ వుంటుందో, అట్టి సందర్భాలలో క్రమక్రమంగా సర్వాంతర్యామి - సర్వతత్త్వ స్వరూపుడనగు నా పట్ల భక్తి - ప్రపత్తి స్వభావసిద్ధంగా ఉత్పన్నమౌతూ వుంటుంది.
అట్టి భక్తి లక్షణములు కించిత్ సాధనచే కొంచెము కొంచము ప్రవృద్ధం అగుచుండగా, సత్త్వగుణం మరింతగా తనంతట తానే వృద్ధి అగుచూ వుంటుంది. సత్త్వగుణం నుండి ధర్మము అనే రుచికరమైన సాత్విక గుణఫలం ఫలదీకరిస్తూ వస్తుంది. అధర్మము క్రమంగా బలహీనమౌతూ వుంటుంది.
ఈ సత్త్వ - ధర్మ గుణాలు పరస్పరం అభివృద్ధి పరచుకుంటూ వుంటాయి. ధర్మమును మరికొంత - మరికొంతగా ఆశ్రయిస్తూ వుండగా, రజోతమో గుణాలు బలహీనమగుచూ, క్రమక్రమంగా మొదలంటా జయించివేయబడుతూ వస్తాయి. రజ-తమో గుణాలు బలహీనమగుచూ వుండగా ఆ రెండింటికీ మూలమైన అధర్మము కూడా (అధర్మభావాలైన కామము - రాగము - క్రోధము - లోభము మొదలైన ఆత్మానుభవానికి వ్యతిరిక్త భావాలు) శీఘ్రంగా బలహీనపడుచూ వస్తాయి.
ఉద్ధవుడు : త్రిగుణములు ఎందులోంచి జనిస్తున్నాయి? ఎందులో ఏర్పడి ఉంటున్నాయి? వాటిని జయించినప్పుడు ఎటువైపుగా పోతున్నాయి?
శ్రీకృష్ణుడు : త్రిగుణములు బుద్ధిలోనే ఏర్పడి, బుద్ధిలోనే దాగి ఉంటున్నాయి. అయితే, ఈ త్రిగుణములు ప్రదర్శనమవటానికి స్థానం ఏమిటంటావా?
Page number:99
ఈ పది వస్తువులు ఆయా వివిధ గుణ ప్రదర్శనమునకు కారణమవుతూ వుంటాయి.
మోక్ష శాస్త్రము ఎఱిగిన మహానీయుల బోధ విను.
ఏఏ అభ్యాసాలు సత్త్వగుణమును పెంపొందించుతాయో, అట్టి అభ్యాసములు ఆశ్రయించటం ఉచితం! అవసరం! అత్యావస్యకం కూడా! ... అని మహానీయులు బోధిస్తున్నారు.
ఓ ఉద్ధవా! జగత్ సంబంధమైన స్మృతి - అపోహ కొనసాగునంత వరకు, ఈ దృశ్యము స్వస్వరూపాత్మ యొక్క ప్రత్యక్షరూపంగా అనుభూతం కానంత వరకు, స్థూల సూక్ష్మ దేహభావాలు తొలగనంతవరకు ..., ఎంతెంత వరకైతే అవి కొనసాగుతూ వుంటాయో..., అంతంత వరకు సత్త్వ గుణాభివృద్ధికై సాత్విక గుణాలు సేవిస్తూనే ఉండాలి.
ఉత్తమ గుణాలు, దైవీ సంపత్తి పెంపొందించుకొనే ప్రయత్నాలకు ఉపక్రమించకుండా "కృష్ణా! రక్షించు!" అని మాత్రమే పలుకుతూ ఉంటే, ఈ సంసార పయోధి నుండి నేను రక్షించేదెట్లా?
అయితే, నా పట్ల భక్తి స్వభావసిద్ధంగా సాత్విక గుణములను ఉత్తేజపరచగలదు. సాత్విక గుణాలు సేవిస్తూ వుండగా ధర్మము అనే ఉత్తమ బుద్ధి ప్రేరేపించబడుతూ వుంటుంది. ధర్మముచే తత్త్వజ్ఞానం (త్వమ్ తత్ సత్ ఇతి జ్ఞానః - నీవుగా కనిపిస్తున్నది ఆత్మయొక్క ప్రత్యక్షానుభవరూపమే... అనే జ్ఞానం) వృద్ధి చెందుతూ వుంటుంది.
కనుక, బద్ధకం వదలు. ప్రేమ - కరుణ త్యాగము ఇత్యాది గుణాలను వృద్ధి చేసుకో!
ఉద్ధవుడు : ఓ శ్రీకృష్ణ ప్రభూ! మా జీవుల కథ - కమామీషు చూస్తూ వుంటే, నాకు ఆశ్చర్యంగా ఉంది! ఈ జగత్ విషయాలు, ఇక్కడి ఆయా సంబంధ - బాంధవ్య లౌకికాశయాలన్నీ అనేక దుఃఖపరంపరలకు కారణములగుచున్నాయని మేము అనేక సందర్భాలలో గమనిస్తూనే ఉన్నాము.
Page number:100
అల్పజ్ఞాన జంతువులగు కుక్క - గాడిద - మేక వలె అనేక దుఃఖాలు సహిస్తూ కూడా... మేము విషయానుభవములు కొనసాగించటానికే సిద్ధపడుచున్నామే! ఎందుచేత? దీనికి కారణం ఏమిటి? అట్టి విషయానుభవముల పట్ల భావావేశము - అనే రజోగుణ సంబంధమైన వృధా ఆయాసము నుండి విరమించటం ఎట్లా?
శ్రీకృష్ణుడు : అవివేకం చేతనే ఈ దేహరూపమే నా రూపం! దీనితోనే నా ఉనికి! ఇద్దాని స్థితిగతులే నా యొక్క స్థితి గతులు... అనే రూపముతో కూడిన దోషబుద్ధి ప్రమత్తతచేత (because of lazyness of intelligence) రూపుదిద్దుకుంటోంది!
దేహాత్మబుద్ధి యొక్క కొనసాగింపు వలన దుఃఖాత్మకమైనట్టి ఘోర (స్థూల) రజోగుణం వచ్చి మనస్సును (thought) కప్పివేస్తోంది.
రజోగుణ ప్రభావంచేత సత్త్వగుణం కప్పబడినదై... సంకల్ప - వికల్పాలు అనుక్షణికంగా, అవిశ్రాంతంగా బయల్వెడలుచున్నాయి.
అట్టి తరుణంలో, అల్పబుద్దితో కూడిన ఈ జీవుడు విషయములను ప్రవాహపతితంగా ఆలోచించనారంభిస్తున్నాడు. ఇక అప్పటినుండి పరంపరంగా విషయ వాసనలు పుట్టుకొస్తున్నాయి. విషయకామవశుడైన ఈ జీవుడు మరికొన్ని కర్మలు! కర్మపరంపరల వలన ప్రయోజనం దుఃఖమే! ... అని తెలిసికూడా, ఇచ్ఛలేకున్నప్పటికీ అభ్యాసము యొక్క బల వేగ ఉద్విగ్నతలకు లోను అయి, చేసిన కర్మలనే మరల మరల నిర్వర్తిస్తున్నాడు. చర్వితచర్వణుడౌతున్నాడు! జన్మ తరువాత మరణం, మరణం తరువాత జన్మ - ఇట్లా జన్మ పరంపరా వ్యవహారములను కొనసాగిస్తూనే పోతున్నాడు.
ఉద్ధవుడు : స్వామీ! మరి, ఉపాయం?
శ్రీ కృష్ణుడు : విద్వాంసుడు, వివేకి అయినవాడు రజోగుణం - తమోగుణములచే విక్షిప్తుడు (sorrounded) అయినప్పటికీ, మనస్సుచే - ఇంద్రియములకు, ఇంద్రియార్థముల చమత్కారములగు జగత్ విషయములకు - అతీతత్వము అభ్యసిస్తున్నాడు. చిత్తమును నిగ్రహించి, విషయములకు అతీతత్వము సంపాదించినవాడై వుంటున్నాడు. "కర్మలయందు, కర్మఫలముల యందు దోషం ఉంటూనే ఉంటుంది" - అని గ్రహించినవారై... సర్వదా కర్మల యందు, వాటికి సంబంధితమై యుండే తదితర వ్యవహార పరంపరల యందు వారు అనాసక్తులై (Mentally unattached) వుంటున్నారు.
Page number:101
కనుక, మిత్రమా! ఈ జీవుడు సర్వదా అప్రమత్తుడై క్రమక్రమంగా మనస్సును సర్వతత్త్వస్వరూపుడనైన నా యందు నిలిపి ఉంచు గాక! "ఇదంతా మమాత్మ చైతన్య ప్రభావ వీచికా చమత్కారమేగదా!" అని ఆస్వాదించును గాక!
అందుకుగాను, అభ్యాసపూర్వకంగా శ్వాసను ప్రాణాయాయాదుల సహాయంతో నిశ్చలం చేస్తూ శిరస్సుకు ఊర్ధ్వంగా నిలుపుచూ ఆసనజయం సముపార్జించును గాక! క్రమంగా విషయాలకు అతీతమైన ఏకాగ్రతను అనుసంధానం చేయును గాక!
అధ్యాయము-18.) హంస బోధ - సాంఖ్యయోగము |
శ్రీకృష్ణుడు :
యోగము : సాధకుడు సర్వ జగద్విషయాల నుండి ధ్యాసను ఉపశమింపజేసి, ఈ దృశ్య జగత్తు ఏ ఆత్మయందు స్వయం కల్పనా చమత్కృతిగా కల్పితమై కనిపిస్తోందో..., అట్టి నా పరమాత్మ వైభవమునందు అతని ధ్యాసను నిశ్చలం చేసి వుంచటం! (లేక) గుణమయమగు జగత్తులో కనిపించే సహజీవులందరినీ పరమాత్మ యొక్క ప్రదర్శనా చమత్కార విన్యాసంగా సందర్శించటాన్ని సర్వదా అభ్యసించటం!
ఇదియే సనకుడు మొదలైన యోగశాస్త్ర ప్రావీణ్యులగు శిష్యులకు నేను ఒకానొక సందర్భంలో సిద్ధాంతీకరించి చెప్పటం జరిగింది!
ఉద్ధవుడు : ఓ కృష్ణా! మీరు ఎప్పుడు ఏ సందర్భంలో సనకుడు మొదలైన యోగ పండితవరేణ్యులకు గురువులై యోగశాస్త్రం బోధించారో... నాకు తెలుసుకోవలెనని కుతూహలంగా ఉన్నదయ్యా!
శ్రీ కృష్ణుడు : విను! చెప్పుతాను!
హంస ప్రవచనం
ఒకానొకప్పుడు ఒక సందర్భంలో బ్రహ్మమానస పుత్రులైనట్టి సనకుడు, సనందుడు మొదలైనవారు తమ తండ్రియగు బ్రహ్మదేవుని సమీపించి ప్రణామములు సమర్పించి... ఈ విధంగా ప్రశ్నించారు.
సనత్కుమారుడు మొదలైన బ్రహ్మమానస పుత్రులు : సృష్టికర్తా! పితృదేవా! మాదొక సందేహం.
యోగం అనే సాధననలో పరాకాష్ట ఏమిటి? సుసూక్ష్మము - ఉత్తమము అయినట్టి యోగసాధనము యొక్క అంతిమ ప్రయోజనస్థితి ఏమిటో అభివర్ణించి చెప్పవలసినదిగా ప్రార్థిస్తున్నాం. (What is the final state for the practices of yoga?)
Page number:102
బ్రహ్మదేవుడు ఆ ప్రశ్నను ప్రశాంతంగా విన్నారు. తాను స్వయంగా అకారణ స్వరూపులు, కారణాలన్నింటికీ కారణకారణుడు! అఖిల భూతకారణుడు! అయితే, నిరంతరం సృష్టి అనే నిత్య కర్మనిష్ఠుడు అయివుండటం చేత, అనేక రీతులుగా ఆలోచించి - ఆలోచించి, ప్రయత్నించి యోగ సాధనానంతర పరాకాష్టస్థితి ఏమిటో ఆతని పుత్రులకు అభివర్ణించి చెప్పినా కూడా వారు తృప్తిపడినట్లు కనబడలేదు. ఆ బ్రహ్మమానసపుత్రులు యోగ పరాకాష్ఠను బుద్ధితో గ్రహించి నిస్సందేహులు కాలేదు! అప్పుడు ఆయన తన మానస పుత్రులకు మరింత సమాధానము అందించటానికై నన్ను స్మరించటం జరిగింది. ఆయన యొక్క సంకల్పమును సిద్ధింపజేసే ఉద్దేశ్యముతో నేను హంస రూపంతో ఆయన ముందు ప్రత్యక్షమైనాను.
అప్పుడు సనక-సనందాదులే కాకుండా, బ్రహ్మలోకములోని మునీశ్వరులు, బ్రహ్మదేవునితో సహా వచ్చి నా ఎదురుగా నిలబడి "మీరు ఎవ్వరు?" అని ప్రశ్నించారు!
అక్కడి మునులు యోగతత్త్వాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశ్యంలో ఉన్నారని గమనించినట్టి నేను ఇట్లా సమాధానం చెప్పాను.
హంసరూప నారాయణ స్వామి : ఓ మునీశ్వరులారా! పరమార్థ వస్తువగు పరమాత్మ యందు నానాత్వమే లేదు. అన్ని నామరూపములకు వేరై - అన్నీ నేనై ఉన్నప్పుడు "నేను దేవతనా? జీవుడనా? జీవుడను నేనే! జీవాత్మనూ నేనే! పరమాత్మనూ నేనే!" ... ఇట్లా ఏమైనా చెప్పవచ్చు! అంతా - అన్నీ నేనే అయివుండగా, ఇక నేను ఎవ్వరినని చెప్పమంటారు?
ఒక బొమ్మల కొలువులో రాజు-మంత్రి-సైనికులు... అన్నీ ఒకే మట్టి అయి ఉండగా, "ఓ మట్టీ! వీటిలో ఎవరు నీవు? రాజువా? మంత్రివా? సైనికునివా?" అని అంటే ఆ మట్టి ఏమి చెప్పుతుంది?
ఒక వేళ - నేను ఇది! ఈ నామరూపములు కలవాడను! - అని చెప్పాలంటే కూడా ఎట్లా చెప్పను? ఎవ్వరైనా, "నేను ఇది! ఇది కాదు!" అని - చెప్పవలసివస్తే వారు కొన్ని గుణ - క్రియా సంబంధాలను ఆశ్రయించి జాతి మాత్రమే చెప్పటం సాధ్యం కదా!
Page number:103
ఇప్పుడు నేనెవ్వరో మీరు కోరినట్లు వివరించి చెప్పటానికి నేను ఇప్పడు ఏ జాతి - గుణ - క్రియలను ఆశ్రయించి చెప్పాలో..., అదికూడా మీరే ముందుగా చెప్పండి?
అప్పుడు నేను సమాధానం చెప్పుతాను.
లేక... మరొక విధంగా మనం చెప్పుకోవాలంటే...,
జీవులందరు నారాయణ స్వరూపమే కదా! నారాయణుడు అనగా ఒక జీవుడా? కాదు కదా! సర్వజీవులు తానైనవాడు నారాయణుడు కదా! అందుచేత "నీవెవ్వరు?" అనే ప్రశ్నే సరికాదు, సమాధానం ఇవ్వదగ్గ ప్రశ్న కాదు!
పంచ మహాభూత నిర్మిత భౌతిక దేహం దృష్ట్యా :
ఈ దేవ - మనుష్య - జంతు దేహాలన్నీ వస్తుతః పంచ మహాభూతాలతో తయారైనవే కదా? అందుచేత, ఒక దేహధారిని పిలచి, "నీవెవరు?" అని ప్రశ్నించటం ఏమి ఉచితం? అన్ని ఆభరణాలు బంగారంతో తయారు అయివుండగా ఒక ఆభరణాన్ని పిలచి నీవెవ్వరు? అనే ప్రశ్నకు సమాధానం ఏమి చెప్పగలదు? ప్రశ్నించేవాడు, సమాధానం చెప్పేవాడు కూడా ఒకే పంచ భూత సమన్వయమే అయి వుండగా!
అందుచేత, ఈ దేహం దృష్ట్యా "నీవెవ్వడవు?" అనే ప్రశ్న అర్థరహితం! కేవలం వాచారంభమే! పంచభూతములు అనే 5 వస్తువుల కలగలపుగా ఒక బొమ్మను తయారుచేసి, ఓ బొమ్మా! నీవవరు? - అని అడిగితే? మట్టిని అంటుందా? జలమును అంటుందా?
"గాలికి గాలి అనే పేరు ఎందుకు పెట్టారు?" - అనే ప్రశ్నవలె మొదలే అర్థరహితం కదా!
ఒక మట్టి బొమ్మకు ఎక్కడో మట్టి కనబడతే "ఓ మట్టీ? నీవెవరు?" అని ప్రశ్నించినట్లున్నది మీ ప్రశ్న - అని మరల గుర్తు చేస్తున్నాను.
అందుచేత ఓ బ్రాహ్మణోత్తములారా! ఈ నామరూపాలు నేను కాదు.
అయితే కూడా...,
ఈ మనస్సు చేత, వాక్కు దృష్ట్యా పొందబడేది, చెప్పబడేది.. తదితర ఇంద్రియములచేత పొందబడేదంతా నా స్వరూపమే! నాకు వేరైనది, నేను కానట్టిది ఎక్కడా ఏదీ లేదు! ఉండజాలదు! ... ఈ నగ్న సత్యాన్ని తత్త్వచారణచే ముందుగా జాగరూకులై ఏకాగ్రతతో గ్రహించండి.
సనకాదులు : ఓ పరమహంసోత్తమా! తత్త్వ విచారణ చేసినప్పుడు కదా, మీరు చెప్పినట్లు అనిపించేది! జీవులమగు మాకు ఈ కనబడేదంతా నా ఆత్మ స్వరూపమే - అని అనిపించటంలేదే! మేము ఆ విధంగా గ్రహించటమూ లేదు. గమనించటల్లేదు. ఎందుచేత?
Page number:104
హంస : మమాత్మ స్వరూపులగు ఓ బిడ్డలారా! ఈ మానవుల చిత్తము ఇంద్రియ విషయములలో ప్రతిబింబిస్తోంది. అప్పుడు ఇంద్రియ విషయాలు తాము పోయి చిత్తములో ప్రతిబింబించటం జరుగుతోంది. అయితే, ఈ మానవుని (జీవుని) వాస్తవ రూపం ఏమిటి?
భౌతిక శరీరమా? కాదు!
భౌతిక శరీరం జీవునిచేత కదలించబడుచున్నట్టిది. జీవుడు పాంచభౌతిక దేహముకంటే విశిష్టుడు! అతడు కదిల్చేవాడు గాని, కదిలేవాడు కాదు! ఆలోచనలు చేయు వాడే గాని, ఆలోచనలలోని వాడు కాదు. ఆలోచనాపరిమితుడు కాదు! ఆలోచనలు ఆతని రూపము కాదు!
చిత్తము - విషయములు కూడా ఆతని స్వరూపం కాదు. అవి రెండు ఆతడు ధరించిన ఉపాధి రూపములు మాత్రమే! రంగు చొక్కా ధరించినవాడు ఆ రంగు చొక్కాగా మారుతాడా? లేదు కదా! అట్లాగే జీవుడు చిత్త - విషయములు ధారణ చేస్తున్నప్పటికీ చిత్త విషయములుగా రూపం దిద్దుకోవటం లేదు! ఆ రెండింటికీ అప్రమేయుడై వున్నాడు.
జీవుడు బ్రహ్మమే మూలస్వరూపంగా కలిగి ఉన్నాడు. ఈ జీవుని వాస్తవ రూపం బ్రహ్మమే!
దేహ - మనో - బుద్ధి - చిత్త - అహంకారాదులన్నీ అతడు ధరించే ఉపాధిరూపాలేగాని స్వరూపస్వభావాలు కాదు. అవి స్వస్వరూపమునకు సంబంధించినవీ కాదు. అనగా, బ్రహ్మతత్త్వ స్వరూపుడు మనో-బుద్ధి-చిత్త-అహంకారములతోను, దృశ్య సమన్వితుడుగాను కనిపించవచ్చుగాక! అవిగా ఆతడు అవటమే లేదుగా!
జీవాత్మ బ్రహ్మము కాని క్షణమే లేదు. కనుక, మీరు మీ గురించి జీవాత్మలం అని చెప్పుకుంటున్నప్పటికీ, సాక్షాత్ బ్రహ్మమే - అయివున్నారయ్యా!
ఈ దేహ - మనో - బుద్ధి - చిత్త - అహంకారాది ఉపాధులు (వస్త్రముల వలె) ధరించినప్పటికీ అవి జీవునికి స్వస్వరూపములు కావు. నాటకంలో నటించేవాడు ఆ పాత్రగా మారిపోతాడా? లేక, ఆ పాత్రయొక్క స్వరూప-స్వభావాలు ఆతని స్వస్వరూపం అవుతాయా? లేదు కదా! ఇదీ అంతే!.
సనకాదులు : ఓ హంస గురువర్యా! మరైతే, నిర్మలాత్మస్వరూపులమగు మేము జీవాత్మలుగా కనిపిస్తూ, ఎందుచేత విషయాసక్తులమై వున్నాము?
Page number:105
హంస : బిడ్డలారా! వినండి! ఆత్మ సర్వదా మీరు చెప్పినట్లు నిర్మలము, నిత్యోదితము, సర్వమునకు అప్రమేయమే! అయితే, నిరాకారమగు బంగారమునకు అకారణంగా - స్వభావంగా ఆకారము ఉంటోంది కదా! అట్లాగే, ఆత్మ అకారణంగా, స్వభావసిద్ధంగా తనయందు తానే ద్వితీయానుభవమును ఆస్వాదించటానికి చిత్తమును కల్పించుకుంటోంది.
అనగా, చిత్తము యొక్క వాస్తవ స్వరూపము చిత్‌యే! చిత్ కల్పనయే చిత్తముయొక్క రూపము! చిత్ + ఆ చిత్ యొక్క ఊహ = చిత్తము.
లేక, చిత్‌యే చిత్తముగా అగుపిస్తోంది! ఆ చిత్తము త్రిగుణరూపంగా చెన్నొందుతోంది.
అట్టి చిత్తము తనయొక్క త్రిగుణత్వము నుండి బయల్వెడలే విషయములను తానే సేవించటం జరుగుతోంది! కనుక విషయములు చిత్తము నుండి జనించినవే! చిత్తము ఆత్మనుండి జనించినదే! ఆత్మ అద్వితీయం సుమా! ఆత్మకు భిన్నమైనది - ద్వితీయమైనది ఎక్కడా, ఏదీలేదు!
సనకాదులు : సరే! అయితే, ఇప్పుడు బంధము అనుభవమౌతోంది కదా?
హంస : "ఇప్పుడు నేను విషయములచే బద్ధుడనే అగుచున్నానే!" - అని బంధము అనుభవిస్తున్న జీవుడు సర్వతత్త్వ స్వరూపుడనగు నన్ను ఆశ్రయించి క్రమంగా విషయాసక్తిని త్యజించుగాక! అప్పుడు పరతత్త్వమే శేషిస్తోంది!
విషయాసక్తిని జయించటానికి "ఆత్మయందు ఆసక్తి"యే ఉపాయం!
ఏ వివేకము యొక్క విభాగము చిత్తము రూపమును సంతరించుకొని విషయములను ఆసక్తితో ఆస్వాదిస్తోందో.. అదియే బుద్ధి యొక్క విషయవృత్తులు (Avocation) లేక, బుద్ధి వృత్తులు అయివున్నాయి.
1.) జాగ్రత్ 2.) స్వప్నము 3.) సుషుప్తి...
ఈ మూడు కూడా త్రిగుణములచే కలిగిన బుద్ధివృత్తులే సుమా! ఈ జీవుడో? ఆ బుద్ధివృత్తులకు ఆవల కేవల సాక్షిస్వరూపుడై తురీయస్వరూపంగా వెలుగొందుచున్నాడు! అందుచేత, జీవుడు సర్వదా చిత్తమునకు, బుద్ధి వృత్తులకు, విషయములకు సర్వదా విలక్షణుడు... అని వేదాంత శాస్త్రం అనేక దృష్టాంతాల ద్వారా నిర్ద్వంద్వంగా నిరూపిస్తోంది! ఆత్మజ్ఞులు సుస్పష్టంగా ఈ విషయం ప్రకటిస్తున్నారు!
ఓ వత్సలారా! స్వకీయమైన బుద్ధి వృత్తుల ద్వారా ఈ జీవునకు సంసార బంధం ఏర్పడుతోంది.
Page number:106
అంతేగాని, సంసారబంధం - మరెవ్వరి చేతనో బయట నుండి ఈ జీవునకు కల్పించబడుచున్నది కానే కాదు! అందుచేత, మీరు సర్వ జీవులలో సర్వదా ప్రకాశిస్తున్న నాయందు మీ బుద్ధి వృత్తులను ప్రసరింపజేయండి! తద్వారా బుద్ధివృత్తుల చాంచల్యమును ఉపశమింపజేయండి. అప్పుడు చిత్తము విషయములచే బంధింపబడదు.
విషయములు లేనప్పుడు చిత్తము లేదు!
ఈ జీవుడు ఆనంద స్వరూపుడే! అయితే తాను కల్పించుకొన్న చిత్తము ద్వారా బుద్ధివృత్తులచే సేవిస్తున్న విషయముల ప్రభావం చేత ఆహంకారం (Relative sense of individually confined 'I') జనిస్తోంది. అట్టి అహంకారము స్వభావసిద్ధమగు ఆనందమును కప్పివుంచి బంధనభావములను కల్పిస్తోంది! ఆ బంధభావమే జీవుని పట్ల అనర్థమై సర్వ దుఃఖములకు కారణమౌతుంది! మరి ఉపాయం? క్రమంగా ఈ జీవుడు విషయముల పట్ల విరక్తుడై జగదతీత స్వస్వరూపమగు తురీయమును ఆశ్రయించటమే! తురీయమును ఆశ్రయిస్తూ క్రమంగా అభిమానము - భోగ చింతన...
ఈ రెండింటినీ విడచివేయును గాక!
ఓ ప్రియ బాలకులారా! ఆత్మానంద - ఆత్మాకాశ స్వరూపుడనగు నేనే ఇన్ని రూపాలుగా మీ యొక్క భేదజ్ఞానముచే మీ ఆలోచనలకు ఆహారరూపమై లభిస్తున్నాను. ఇప్పుడు మీరు యుక్తితో కూడిన ఆలోచనలచే భేద జ్ఞానమును నివృత్తింపజేసుకోండి. భేదజ్ఞానం నివృత్తి కానంతవరకు అసత్యము-స్వప్నతుల్యము అగు దృశ్యము వాస్తము-నిత్యము వలె అనుభవమౌతూనే వుంటుంది. మీరు ఎంత సావధానులైవున్నప్పటికీ, నిత్యకర్మలను ఎంతగా నిర్వర్తిస్తున్నప్పటికీ, ఎంతగా జాగృతులైనప్పటికీ,... భేద జ్ఞానం జయించబడనంతవరకూ మీకు అనుభవమయ్యేదంతా స్వప్న - సదృశము, కల్పితము, అసత్యము కూడా! అమ్మ కల్పించి చెప్పే కథలోని పాత్రలను సంఘటనలను పిల్లవాడు ఊహతో ఆస్వాదిస్తూ - అవన్నీ ఎక్కడో ఉన్నాయని అనుకుంటూ, అనుభూతి పొందటం వంటిదే, ఇదంతా!
స్వప్నంలో కనిపించిన స్వప్నదృశ్యమునకు, స్వప్నములోని ప్రియ - అప్రియ రూపములకు ఆస్తిత్వము ఉన్నదా? లేదు! అట్లాగే పరమాత్మకు భిన్నంగా కనిపించే ఈ దేహముల సంబంధంగా, అట్టి ఈ దేహములకు కల్పించబడే వర్ణాశ్రమ భేద ధర్మములకు, వాటికి ప్రయోజనంగా చెప్పబడే స్వర్గలోకము మొదలైన కర్మఫలములకు, ఆ కర్మ ఫలములకు కారణమగుచున్న పూర్వ - తదనంతర కర్మలకు అస్తిత్వమే లేదు!
Page number:107
స్వప్నదర్శి స్వప్నంలో నిర్వర్తించిన కర్మలకు స్వప్నఫలములు లభించటం ఎటువంటిదో..., ఇక్కడి కర్మలు వాటి ఫలములు, స్వర్గాది లోకములు అటువంటివే సుమా! అందుచేత, పరమాత్మయే ఇన్ని రూపములుగా కనిపిస్తున్నారు - ఇటువంటి అభేదభావనతో కూడిన జగదోపాసన అభ్యాసములను ఆశ్రయించి మీరు "స్వప్నదర్శనము" అను రూపమనతగిన జగద్దర్శనము నుండి సత్యమగు సమదర్శనమును అభ్యసించండి. అదియే తురీయోపాసన!
1.) ఈ జాగ్రత్‌లో అనుభమయ్యే....
ఇంద్రియముల ద్వారా వెల్లడి అగుచుండే క్షణికములైన బాల్య - యౌవ్వన - వార్ధక్య అవస్థలు, స్థూల దేహముల రాకపోకలు, మనస్సుకు-ఇంద్రియములకు అనుభవమయ్యే రూప - నామ - స్పర్శాది అనుభవములు;
2.) స్వప్నాస్థలో అనుభవమయ్యే....
స్వప్న జాగ్రత్‌లో వాసనల ప్రభావంచేత కనిపించే విషయములు - స్వప్నదృశ్య పరంపరలు;
3.) ఆ స్వప్న విషయములను అనుభవించే స్వప్న ద్రష్ట (లేక) స్వప్నదర్శి (మరియు జాగ్రత్ దర్శి);
ఈ మూడింటినీ అధిగమించండి. ప్రత్యనుసంధానం [ప్రతి+అనుసంధానం] (Counter Practices) ద్వారా - వాటిని దాటివేయండి. ప్రక్కన పెట్టి వుంచటం అలవాటు చేసుకోండి!
జాగ్రత్ - స్వప్న - సుషుప్తులు అనబడే అవస్థాత్రయమును నేను వేరుగా ఉండి చూచువాడను! సాక్షిని! ఈ ఇంద్రియములకు అధిష్ఠాన స్వరూపుడనై, అతీతుడనై ఉన్నాను అని గమనించటం అభ్యసించండి! క్రమంగా ఇంద్రియ "విషయములతో తాదాత్య్మము"ను సాక్షి స్వరూపముతో తాదాత్మ్యము,... యొక్క ప్రభావంతో జయించివేయండి. ఒక
సందర్భంలో వుంటూ కూడా, ఈ సందర్భమునకు నేను వేరై వున్నాను అని గమనించటం ఏమి కష్టమున్నది చెప్పండి?
క్రమంగా ఇట్లా యోచిస్తూ, అభ్యసిస్తూ... సత్త్వ - రజ - తమో - త్రిగుణ రూపములగు జాగ్రత్ - స్వప్న - సుషుప్తులు నామనస్సు యొక్క అవస్థలు మాత్రమే! అవి నా యొక్క అవిద్యా ప్రభావపూర్వకంగా నాచేతనే నాయందు కల్పించబడుచున్నాయి కదా!.. అనే సత్యబుద్ధిని పరిపుష్టి చేసుకుంటూ వుండండి!
Page number:108
1.) ప్రత్యక్షమును పరిశీలించి సత్యమును ఆశ్రయించటం
2.) అనుమానమును ఆశ్రయించి శాస్త్రపరిశీలన చేయటం
3.) గురూపదేశము గురువు ఏ "తత్వమ్ అసి" అనే సిద్ధాంతాన్ని సోదాహరణ - దృష్టాంతపూర్వకంగా తన సదుపదేశములతో మీ ముందు ఉంచుచున్నారో... అద్దానిని (తత్-త్వమ్‌ను) బుద్ధి పూర్వకంగా అవగాహన చేసుకోవటం
... ఇటువంటి ప్రయత్నముల ద్వారా మీ జ్ఞానఖడ్గానికి పదునుపెట్టుకోండి!
సంశయములన్నింటికీ ఆధారం అహంకారమే!
అట్టి అహంకారము అనే దట్టమైన మబ్బును జ్ఞానముతో ఛేదించండి! మీ హృదయంలో వేంచేసియున్న సర్వాంతర్యామినగు నన్ను సమీపించి సేవించండి!
నాయనలారా! ఈ కనబడేదంతా మనో విలాసం! చిత్తభ్రమా కల్పితం! త్రాడును గాలిలో త్రిప్పుతూఉండగా కనిపించే చక్రముల (ఆలాత చక్రముల) వంటిది! కాలముచే నశించబోయేది! మరొక విధంగా ఇదంతా చిద్విలాసమే!
శుద్ధ విజ్ఞానస్వరూపము ఏకము అగు బ్రహ్మమే ఈ తదితర జీవులరూపంగాను, గుణముల భేదం గాను, మనోబుద్ధి చిత్త అహంకారాలుగాను, జాగ్రత్ - స్వప్న - సుషుప్తులుగాను, ఈ జన్మ - వచ్చే జన్మ ఇత్యాదులుగాను అగుపిస్తోంది! అవన్నీ స్వప్నంలో చూసిన భవనముల అనుభవం వంటివే! వాస్తవానికి ఇక్కడ నానాత్వం లేదు! (న ఇహ నానా అస్తి కించన!)
స్వస్వరూప బ్రహ్మమే ఈ సర్వ వివిధ రూపములుగా స్వకీయమాయాదృష్టికి అగుపిస్తోంది!
★ భిన్నత్వంలో సర్వదా వేంచేసియున్న ఏకత్వం దర్శించండి!
★ అనేకంగా కనిపిస్తున్నప్పటికీ ఒకటిగా కనిపించే పవిత్ర దృష్టిని ఆశ్రయించండి.
★ దృష్టిని ఆయా ఉపాయాల ద్వారా - అభ్యాసముల సహాయంతో దృశ్య ప్రపంచము నుండి, అనేకత్వ సందర్శనం నుండి మరలించండి!.
★ ఏదో పొందాలి! దొరకాలి! లభించాలి! ఇంకేదో తొలగాలి! - ఇటువంటి రూపముగా ఏర్పడి ఉన్న విషయ తృష్ణను క్రమంగా రహితం చేసుకోండి! తృష్ణను తౄష్టీకరించండి!
Page number:109
★ ధ్యానము - భక్తి - యోగము మొదలైన ప్రయత్నములతో అంతరమును (Inner zone), బహిర్జగత్తును ఆత్మస్వరూపంగాను ఆస్వాదించి ఆనందించటం అభ్యసించండి! నిజాత్మసుఖశీలురై ఉండటం అలవాటుగా చేసుకుంటూ వుండండి!
మరొక్కసారి చెప్పుచున్నాను! వినండి!
★ ఈ దేహ - ఇంద్రియ - విషయ జగత్తు ఎదురుగా ఆయా ఆహార - విహారాది సందర్భములలో అనివార్యంగా అగుపిస్తున్నప్పటికీ,... ఇదంతా స్వప్న సదృశమే! ఆత్మయే ఇదంతా! పరమాత్మయే ఇట్లా అగుపిస్తోంది... అనే మననమును సర్వకాల సర్వావస్థలలోను అభ్యసించండి! వస్తు దృష్టిని వదలుతూ, ఆత్మీదృష్టిని పెంపొందించుకోండి! దేహం ఉన్నంత వరకే ఇక్కడి సంబంధాలు! దేహికి దేహమే భ్రమ! ఇక ఇవన్నీ భ్రమ కాక మరేమిటి? ఇది దృష్టిలో ఉంచుకొని మరల మరల ధ్యానం చేయండి! సర్వ స్మృతులను (జ్ఞాపకాలను) ఆత్మగా దర్శించే సాధనలో లయింపజేయండి. అప్పుడు మోహము దానంతట అదే తొలగిపోతుంది.
ఓ సనక-సనందనాదులారా! దేహం ఉన్నంత వరకు సంబంధములు, అనుబంధములు, బాంధవ్యములు .. ఇత్యాది రూపములతో కూడిన వర్తమాన దృశ్య సంబంధం కొనసాగుతూనే వుంటుంది. దేహ సంబంధమైనవి దేహంతోనే పోతాయి. కాని సంస్కారములో? తదనంతర దేహముల రాక పోకలకు కారణమగుచు ఉన్నది! అనగా, మరల ఆ సంసారము క్రొత్త క్రొత్త పిందెలతో కొనసాగుతోంది. అయితే,... దేహము ఈ దేహికి ఐహిక మోహము లేక ఐహిక భ్రాంతి! ఏ ఆత్మసత్యమును సిద్ధింపజేసుకోవాలనే ప్రయత్నించుచున్నారో.. అటి సిద్ధయోగాభ్యాసకులు "ఈ దేహము నశ్వరము. నాశన శీలము. కనుక, వర్తమాన సంబంధ బాంధవ్యములు నశించబోవుచున్నాయి!" అని మునుముందుగానే గమనిస్తున్నారు. దానిని సాధన వస్తువుగా మాత్రమే చూస్తున్నారు. మమకార - అహంకారాదులతో కాదు!
అజ్ఞానియో...?
దైవవశాత్ వచ్చిపోతున్న ఈ దేహము, ఈ సహజీవుల సంబంధమైన మమకారములు, అనుబంధ బాంధవ్యములు, ఈ దేహముతో పెంపొందించుకున్న అవినాభావ తాదాప్యము.. ఇవన్నీ చూసుకొని మురిసిపోతున్నాడు! ఆహా! ఇవన్నీ ఎంత సత్యం! ఎంత ప్రియమైనవి! ఇవన్నీ కదా నాకు సుఖం కలిగించేవి!
Page number:110
అయ్యబాబోయ్! వీరితో ఈ సంబంధం దూరం అయిందా,.. ఇక నా పని ఖాళీయే కదా! వీరిని చూడకుండా ఉండలేను! వారంటే నాకు అయిష్టం! ఎట్లా వదులుతారో, ఏమో? .. ఇత్యాది భ్రమలన్నీ పొందుతూ జీవితము అనే గొప్ప అవకాశమును బూడిద చేసుకుంటున్నాడు. దృష్టిని దృశ్య పరిమితం (What is being seen with physical eyes) చేసినవానికి ఇది
నిజమా? నిత్యమా? శాశ్వతమైన సుఖం ప్రసాదించేదా? ఈ దేహాలు ఎందుకు వస్తున్నాయి? దీనిని ఏ దృష్టితో చూస్తే జీవితావకాశం సద్వినియోగం అవుతుంది? ఇటువంటి మార్గములలో పరిశీలించబుద్ధియే కావటం లేదు!
సిద్ధయోగియో....?
మత్తుపానీయం సేవించినవానికి తన ఒంటికి వస్త్రాలు ఉన్నాయో-లేవో కూడా తెలియకుండా తిరుగుతూ ఉంటాడు చుసావా? అట్లాగే... సిద్ధపురుషుడు ఈ దేహం ఉన్నదా? ఊడిందా?.. అనే పరిమిత భౌతికానుభూతిని అధిగమిస్తున్నాడు! నశ్వరమగు ఈ దేహం ఉన్నపుడు - లేనప్పుడు కూడా నిశ్చలంగా నిశ్చింతుడై వుంటాడు! దైవవశంగా ఈ శరీరం వచ్చినప్పుడు, మరొకప్పుడు తొలగుచున్నప్పుడు, జీవిస్తూ వున్నపుడు కూడా, తన దృష్టిని ఇంద్రియవిషయముల వైపు సారించడు. సహజీవులను ఇంద్రియవిషయములుగా కాకుండా, సహజాత్మ స్వరూపులుగా సందర్శిస్తూ ఆత్మావలోకనం చేస్తూ వుంటాడు. ఎట్టి సందర్భములలోను, స్థితి గతులలోను ఆత్మావనలోకనము నుండి చ్యుతి పొందడు! (బ్రహ్మావలోకధిషణం న జహాతి యోగీ).
ఇక ఈ దేహముయొక్క గతి గురించి ఏమిటంటారా?
ఈ దేహం కర్మానుసారంగా దైవవశాత్ ప్రాణములతో కూడి జీవిస్తూ వుంటుంది! ఈ ఇంద్రియములు ప్రవర్తిస్తూ వుంటాయి! "సర్వ సమదర్శనము (లేక) ఆత్మౌపమ్యేవ సర్వత్రా సమం పశ్యతి - అను రూపంగా నాకు నేనే, నన్ను నేనే ఈ సర్వరూపాలుగా భావన చేసుకొని ఆస్వాదిస్తున్నాను" - ఇటువంటి అనుభూతిని నిశ్చలంచేసుకొన్న తరువాతనో? ఆతడు తత్త్వజ్ఞుడు అని చెప్పబడుచున్నాడు. "సిద్ధ సమాధి యోగి" అని పిలువబడుచున్నాడు! ఓ ప్రియ బిడ్డలారా! పరమార్ధ తత్త్వజ్ఞులు అవండి! సమాధియోగులుగా మిమ్ములను మీరు తీర్చిదిద్దుకోండి!
ఈ భౌతిక దేహంతో ఆసక్తి విడచినవారై ఉండండి!
Page number:111
"నేను - నాకు కనబడేవారు .. అంతా కూడా అఖండమగు ఆత్మయొక్క చమత్కార ప్రదర్శనమే! ఆత్మ సర్వదా, యథాతథం! అనేకత్వం ఎక్కడా లేదు! ఏకము - నిత్యము అగు ఆత్మయే నేను - నీవు కూడా!" అను దృష్టిని సిద్ధించుకున్నవారై... ఆపై ఇక యథేచ్ఛగా మీ ఇచ్ఛ వచ్చిన చోట సంచరించండి!
సిద్ధయోగి సర్వత్ర ఆత్మనే దర్శిస్తున్నాడు! ఇక ఆపై స్వప్న తుల్యమగు ఈ దేహ ఇంద్రియ విషయ పరంపరలను స్వప్న దృశ్యంగా దర్శిస్తున్నాడు! అనగా,... భౌతిక దేహము - విషయముల పట్ల అనాసక్తి (ఆసక్తిరహితుడై) ఉంటున్నాడు! (లేక) తాను చదువుచున్న కథలో కల్పించబడిన పాత్రలవలె సందర్శిస్తున్నాడు.
ఓ విప్రవర్యులారా! హంసరూపుడనై ఇప్పుడు మీకు సాంఖ్య యోగ రహస్యాన్ని దేహమును - దృశ్యమును దర్శించవలసిన విధానాన్ని, దర్శించకూడని విధానాన్ని వివరించాను!
సనకాదులు : ఓ హంస మహాశయా! పరమహంసా? ఎవరు మీరు? దేహ తదాత్మ్యముతో
కూడిన చిత్త విభ్రమముల మధ్య చిక్కియున్న మాకు సిద్ధపురుష యోగాన్ని ప్రభోదించిన మీరు మా యందు దయతో పరమసత్యాన్ని బోధించి నిద్రలేపారు! ఆత్మసాక్షాత్కారం అభ్యసింపజేసినట్టి తమరెవ్వరు?
హంస: నాయనలారా! నేను స్వయంగా విష్ణు భగవానుడను! మీకు సాంఖ్యయోగ రహస్యం వివరించటానికి మీ ముందు ఈ హంసరూపంగా ప్రత్యక్షం అయ్యాను! నా స్వరూపం సాంఖ్యం - యోగం - సత్యం - ఋతము (ఆప్తవాక్యాలు) - తేజస్సు - శ్రీ - కీర్తి - దమము ... ఇత్యాదులన్నింటికీ సమాశ్రయమగు సర్వముగా ప్రదర్శితమగుచున్న
విష్ణుతత్త్వమే! సర్వ జీవరాసులలోను సర్వదా స్వస్వరూపంగా ప్రత్యక్షమైయున్న విష్ణుత్వమే నా వాస్తవరూపం!
నిత్యుడను! నిత్య సత్యమును!
అప్రాకృతుడను! నిర్గుణుడను! నిరాకారుడను!
సంగరహితుడను!
అపేక్షారహితుడను!
సర్వ జీవులకు హితుడను! దయామయుడను!
Page number:112
సర్వుల స్వస్వరూపుడనై వుండటం చేత, సర్వ ప్రేమాస్పదుడను! అందరిచే ప్రేమించబడుచున్నది నేనే! సర్వులు నా ప్రేమాస్పద స్వరూపాలే!
సర్వాంతర్యామిని!
నిర్గుణుడగు నన్ను సర్వగుణములు సేవిస్తూ వున్నాయి! నేను మీ యొక్క స్వస్వరూరుడనే సుమా!
🙏 🙏 🙏
శ్రీకృష్ణుడు :
ఓ మిత్రమా! ఉద్ధవా! ఆవిధంగా నా సిద్ధపురుషవాక్యములు విన్న తరువాత సనకుడు మొదలైన మునులంతా సంశయ నివృత్తులు అయ్యారు! ప్రేమాస్పదంగా నన్ను పూజించారు! దివ్యస్తోత్రములతో....
భావమును నీవయ్యా...,
రాగమును నీవయ్యా....,
యోగమును నీవయ్యా.....,
సకలమును నీవే!
నేనే నీవు! మేమే నీవు! నీవే మేము!
నీ యొక్క అంశయే మేము!
మేము మీకు అద్వితీయులం!
ఇక్కడ, ఈ దృశ్యములోని దేహ - బుద్ధి - చిత్త - అహంకారాలు ఆత్మను సేవించటానికై ఆత్మచే కల్పించబడి - కదలింపబడుచున్నాయి! మేము ఆత్మ స్వరూపులం.
త్వమేవాఽహమ్ ! త్వమేవాఽహమ్!
... అని గానం చేశారు! తమ ఆత్మేశ్వరుడనగు నన్ను కీర్తించారు!
అప్పుడు నేను అలవోకగా చిరునవ్వు చిందిస్తూ అక్కడి వారంతా చూస్తూ వుండగా.... వాయుతరంగం వాయువులో ఐక్యం అయినట్లు జలతరంగం జలంతో ఐక్యత పొందినట్లు - ఆ హంస రూపం ఉపశమింపజేసి నిజధామమునకు వెడలాను.