[[@YHRK]] [[@Spiritual]]

Advaya Tāraka Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 1
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com


శుక్ల యజుర్వేదాంతర్గత

2     అద్వయతారకోపనిషత్

శ్లోక తాత్పర్య పుష్పమ్


శ్లో॥ ద్వైత-అసంభవ విజ్ఞాన సంసిద్ధ “అద్వయ తారకమ్”
తారక బ్రహ్మేతి యత్ గీతం వన్దే శ్రీరామ వైభవం ॥

ఈ అద్వయతారకోపనిషత్ "ద్వైతము అసంభవము” అను స్థానమునకు సంసిద్ధము చేయునదై, “తారక బ్రహ్మేంతి” అనే గీతమై, ఆత్మారామ వైభవమును ప్రకటించుచున్నది. అట్టి శ్రీరామ వైభవమునకు నమస్సుమాంజలుల

1.) ఓం
అథ అతో అద్వయ తారకోపనిషదమ్ వాఖ్యాస్యామో।
యతయే జితేంద్రియాయ,
శమ-దమాది షడ్గుణ పూర్ణాయ;
“చిత్ స్వరూపోఽహమ్”
ఇతి సదా భావయన్,
సమ్యక్ నిమీలితాక్షః
కించిత్ ఉన్మీలితాక్షో వా
అంతర్ దృష్ట్యా
భ్రూ-దహరాత్-ఉపరి
సత్-చిత్-ఆనంద తేజః,
కూటరూపం,
పరబ్రహ్మా - ‘అవలోకయన్’,
తద్రూపో భవతి।
గర్భ జన్మ జరా మరణ సంసార
మహత్ భయాత్ సన్తారయతి।
తస్మాత్ ‘తారకమ్’ ఇతి।

‘ఓం’ అక్షరము, పరమార్థము అయినట్టి ’అద్వయ పరమాత్మ’కు అద్వయ తారక సిద్ధికై ప్రణమిల్లుచున్నాము.
తారకమ్ - తరింపజేయునది.
అద్వయతారకమ్ - దేనికైతే ‘ద్వితీయము’ అనునదే (జీవాత్మ-జగత్తు అనబడే వేరైనదంతా) స్వతఃగా లేదో… అద్దానిని సిద్ధింపజేసి తరింపజేయునది.
అద్వయ తారకోపనిషత్ : అట్టి అద్వయమును సిద్ధింపజేసి తరింపజేయు తత్త్వము యొక్క సామీప్యత! అట్టి ’అద్వయ తారకోపనిషత్’ను ఇప్పుడు మనము వ్యాఖ్యానించుకొనుచున్నాము.

మొట్టమొదట శాస్త్రములు సూచించే భక్తి-యోగ-సాధనలు నిర్వర్తించి, తద్వారా ఈ ఇంద్రియములను - ఇంద్రియ విషయములను జయించి, “ఇవి నా కల్పనపై ఆధారపడి ఉన్నాయిగాని, నేను వీటిపై ఆధారపడి లేను….. అను స్థితి సంపాదించాలి. శమము-దమము-ఉపరతి-తితిక్ష-శ్రద్ధ-సమాధానము అను షడ్గుణ పూర్ణుడై ఉండి “నేను చిత్ స్వరూపుడను"… అని ఎల్లప్పుడు భావన చేస్తూ ఉండాలి.

కనులు మూసుకొనియో, లేక కనులు సగము తెరచి (అర్ధనిమీలిత నేత్రుడు అయి)యో….. సర్వ జీవులలో సర్వదా సమముగా వేంచేసి ఉన్న పరమేశ్వర స్వరూప ధ్యాని అయినట్టి యోగి అంతర్-దృష్టిని ఆశ్రయించువాడగుచున్నాడు. ద్రష్టదర్శన-దృశ్యములు ఏక రూపము పొందు త్రిపుటీ స్థానమగు భ్రూమధ్యముగా గల దహరాకాశమునకు ఆవల-అంతరాంతమున సర్వదా వేంచేసి ఉన్నట్టి సత్-చిత్-ఆనంద రూపము, తేజో రూపము, కూటస్థము (సర్వమునకు కేంద్రము, గరిమ-నాభి)-అగు పరబ్రహ్మమును అవలోకిస్తూ, ఆ పరబ్రహ్మమే తానగుచున్నాడు.

అట్టి అంతర్-దృష్టితో భ్రూమధ్యమున గల దహరాకాశమునకు ఆవలగల పరమాత్మ సందర్శనముచే, ఈ జీవుడు తరించగలడు. తల్లి గర్భములో నివాసము-జన్మవార్ధక్యము- మరణము” మొదలుగా గల అనేక జన్మ-కర్మ-కర్మఫలముల భయాలతో నిండి ఉన్న సంసారమునుండి బంధవిముక్తుడు అగుచున్నాడు. అందుచేత అది ‘తారకవిద్య’ అని చెప్పబడుచున్నది.

2.) "జీవ-ఈశ్వరౌ మాయికా!”
ఇతి విజ్ఞాయ, సర్వవిశేషం
నేతి నేతి - ఇతి విహాయ,
యత్ అవశిష్యతే,
తత్ “అద్వయం బ్రహ్మ”|

తత్ సిద్ధ్యై లక్ష్యత్రయా అనుసంధానం కర్తవ్యమ్ ||

జీవుడు - ఒక దేహములో ప్రదర్శనమగు ప్రజ్ఞా తేజస్సు. (దృష్టాంతము : ఒక నాటకంలోని పాత్ర)
ఈశ్వరుడు - (1). అనేక దేహములలో సంచారములు చేయు ప్రజ్ఞా తేజస్సు (దృష్టాంతము : అనేక నాటకములలో నటించే నాటక కళాకారుడు) (2). ఈవలగా ఉండి, కలలో అనేక నామరూపములు ధరిస్తున్న చైతన్యము.
ఈ రెండూ మాయా కల్పనా - అంతర్విభాగములే … అని తెలుసుకొని ఉండాలి!

ఇది నేను కాదు - ఇది నేను కాదు అని విచారణచే దృశ్య-దేహ-మనో-బుద్ధి-చిత్త-అహంకారాలను, జీవ-ఈశ్వర స్వరూపములను వాటి - వాటి విషయాలను దాటివేసి, ఆవల స్థానమును ఆశ్రయించి ఉండాలి.

ఆ పై శేషించునదే ‘తత్ త్వమ్ - తత్ అహమ్’ స్వరూపమగు అద్వయ బ్రహ్మము… అని నిర్ణయించుకొని అద్దానిని 1. అంతర్లక్ష్యము 2. బహిః లక్ష్యము 3. మధ్య లక్ష్యము అను లక్ష్య త్రయము(Three Dimensional - Three Phased Objective)తో ఆ అద్వయ బ్రహ్మమును అనుసంధానము చేయటమే (మానవ జన్మ వచ్చినందుకు) ఉపాయమై, కర్తవ్యమైయున్నది. అదియే తారకయోగము.

3.) దేహమధ్యే బ్రహ్మనాడీ
‘సుషుమ్నా’ - సూర్యరూపిణీ
పూర్ణ చన్ద్రాభా వర్తతే।
సా తు మూలాధారాత్ ఆరభ్య
బ్రహ్మరంధ్రగామినీ భవతి।
తన్మధ్యే తటిత్ కోటి సమాన కాన్త్యా
మృణాళ సూత్రవత్
సూక్ష్మాఙ్గీ కుణ్డలినీ ప్రసిద్ధా అస్తి।
తాం దృష్ట్వా మనసైవ నరః
సర్వ పాపవినాశ ద్వారా ముక్తో భవతి।
ఫాల - ఊర్ధ్వగ లలాట విశేష మండలే
నిరన్తరం తేజః తారక యోగ
విస్ఫురణేన పస్యతి చేత్ సిద్ధో భవతి।
తర్జనీ అగ్రా ఉన్మీలిత కర్ణరంధ్ర ద్వయే,
తత్ర ఫూత్ కార శబ్దో జాయతే|
తత్ర స్థితే మనసి, చక్షుః
మధ్యగత నీలజ్యోతిః స్థలం
విలోక్యా, అంతర్దృష్ట్యా
నిరతిశయ సుఖం ప్రాప్నోతి
ఏవమ్ హృదయే పశ్యతి|
ఏవమ్ అంతర్లక్ష్య లక్షణం
ముముక్షుభిః ఉపాస్యమ్ |

అంతర్లక్ష్య లక్షణము - ఈ దేహము మధ్యగా బ్రహ్మనాడి ఉన్నది. ఆ సుషుమ్న సూర్య తేజస్సుతోను, పూర్ణచంద్రుని ప్రకాశముతోను వర్తిస్తోంది.

ఆ సుషుమ్న నాడి ‘మూలాధారము (గుదస్థానము)’ నుండి ఆరంభమై, బ్రహ్మ రంధ్రము (కపాల చిట్ట చివరి స్థానము) వరకు విస్తరించినదై ఉంటోంది.
ఆ సుషుమ్న నాడి మధ్యలో కోటి మెరుపు కాంతులతో తామరతూడులోని సన్నటి దారము వలె అత్యంత సూక్ష్మ శక్తితత్వ రూపముగా కుండలినీ శక్తి ప్రసిద్ధమై వెలుగొందుచూ ఉన్నది.

కోటానుకోట్ల విద్యుత్కాంతి పుంజములతో సమానమైన ప్రకాశమానమగు ‘కుండలినీ మహాశక్తి" ని మనస్సుతో దర్శిస్తూ ఉండాలి. అట్లు కుండలినీ శక్తిని దర్శిస్తున్న జీవుడు సర్వ సంసార దోషముల నుండి విముక్తుడు కాగలడు. మోక్షము పొందుతున్నాడు.

ఫాల (Fore Face) భాగమునకు ఊర్ధ్వముగా(Upward) లలాట ప్రదేశములోవిశేషమగు (చంద్ర) మండలము నందు నిరస్తరము ప్రకాశించే కుండలినీ మహాతేజస్సును మనస్సు-ధ్యాసలతోను, స్ఫురణయొక్క శక్తితోనూ దర్శిస్తూ ఉంటే కూడా అట్టి తారకయోగ విస్ఫురణచే ఈ జీవుడు సిద్ధించవలసినది సిద్ధించుకొని సిద్ధి పొందగలడు.

చూపుడు వ్రేలు (తర్జనీ అగ్రము)తో రెండు చెవులను (కర్ణ రంధ్రములను) మూసి ఉంచినప్పుడు ‘పూ’ శబ్దమును (లోనుండి) వినబడుతూ వుంటుంది.
మనస్సు ఆ ’పూ’ శబ్దమును వినుచూ ఉన్నప్పుడు ఏర్పడే ఏకాగ్రతచే కనుల మధ్య ప్రదేశమున గల ‘నీలజ్యోతి’ యొక్క సందర్శనము మనస్సుకు అనుభూతమౌతుంది.

అట్టి అంతర్దృష్టిచే సిద్ధించు ‘నీలజ్యోతి మనో దర్శనము’… అనే సందర్శనముచే నిరతిశయమైన సుఖము ప్రాప్తించగలదు.

ఈ విధముగా యోగి తన హృదయమునందే ఆ అద్వయ పరమాత్మను ’మనస్సు’ అనే ఉపకరణముతో చక్షువుల మధ్య-ఆకాశ కాశంలో సందర్శిస్తున్నాడు. అటువంటి ఉపాసనను “అతర్లక్ష్య లక్షణము”…. అంటారు. ముముక్షువు అట్టి అంతర్లక్ష్య లక్షణోపాసకుడై అఖండాత్మతో మమేకము కాగలడు.

4.) అథ బహిర్లక్ష్య లక్షణమ్ |
నాసికాఽగ్రే చతుర్భిః (4“), షట్భిః (6”),
అష్టభిః (8“), దశభిః (10”), ద్వాదశభిః (12")
క్రమాత్ అంగుళార్తే నీలద్యుతిః,
శ్యామత్వ, సదృక్ రక్త భంగీ స్ఫురత్,
పీతవర్ణ ద్వయోపేతం
వ్యోమ యది పశ్యతి, స తు యోగీ భవతి
చలత్ దృష్ట్యా వ్యోమభాగం వీక్షితుః పురుషస్య
దృష్టగ్రే జ్యోతిర్మయూఖా వర్తంతే,
తత్ దర్శనేన “యోగీ” భవతి|
తప్తకాన్చన సంకాశా జ్యోతిర్మయూఖా
అపాంగానే భూమౌ వా పశ్యతి
తత్ దృష్టిః స్థిరా భవతి||
శీర్ష-ఉపరి ద్వాదశాంగుళ (12)
సమమ్ ఈక్షితుః అమృతత్వం భవతి।
యత్ర కుత్ర స్థితస్య శిరసి వ్యోమ జ్యోతిః
దృష్టం చేత్, స తు ‘యోగీ’ భవతి।

ఇప్పుడిక బహిర్లక్ష్య లక్షణము గురించి చెప్పుకుంటున్నాము!
నాసిక (ముక్క) అగ్రభాగమునకు పైనగా (నాసికాగ్రమునుండి) - వరుసగా 4 అంగుళాలు, అంగుళాలు, 8 అంగుళాలు, 10 అంగుళాలు, 12 అంగుళములు చిట్ట చివరిగా గల స్థానములలో నీలకాంతి, శ్యామ (నలుపు) వర్ణము, ఎరుపు వర్ణము, పసుపు రంగు, తెలుపు రంగులతో కూడియున్న గగనతలములను (Space) మనస్సుతో దర్శించు అభ్యాసము. అట్టి ‘యోగి’ - యోగారూఢుడు అగుచున్నాడు. అనగా, అట్టివాడు సంయోగ - వియోగాతీతమగు యోగ స్థానమును అలంకరించుచున్నాడు.

అప్పుడు క్రమంగా దేహ-ఇంద్రియాదుల రాకపోకలకు కూడా ‘సాక్షి’ అగుచున్నాడు. సంచలనము - సపరిశీలనము గల దృష్టితో ఆకాశ భాగమును వీక్షిస్తూ వస్తున్న పురుషుని దృష్టికి ఆవలగల జ్యోతిర్మయ స్వరూపుడగు ఆ ద్రష్టయొక్క సహజ స్వరూప సందర్శనము సిద్ధించగలడు. అట్టి జ్యోతిర్మయ తత్త్వమును దర్శిస్తూ, ఉపాసించటం చేత, ఆ ఆరాధకుడు, త్వరత్వరగా యోగి అగుచున్నాడు.

యోగి-బంగారు ఛాయలతో వెలుగొందు జ్యోతిర్మయ కిరణములను అంగాంగములందు గాని, భూమినంతటాగాని దర్శిస్తూ ఉండగా - ఆ దర్శనము
మనస్సునందు రూపము పొందుచున్నది. అట్టి బంగారు ఛాయగల జ్యోతి కిరణములను శిరస్సుకు 12 అంగుళముల విస్తీర్ణము వరకు ఊర్ధ్వముగా దర్శించుచూ ఉపాసించువాడు ’మృత్యువు’ను అధిగమించి ‘అమృత తుల్యుడు’ (అమృతానంద స్వరూపుడు) అగుచున్నాడు. అనగా, దేహముల రాక పోకలకు కూడా సాక్షిగా ప్రకాశిస్తున్నాడు. దేహముల రాక-పోకల సంబంధమైన జనన-మనన భ్రమ తొలగుతోంది. సాధకునకు ఎప్పుడు శిరస్సునందు ఆకాశజ్యోతి సంస్థితమై, దర్శనమౌతుందో… అప్పుడు అతడు యోగి అవుచున్నాడు. శిరస్సుకు ఊర్ధ్వంగా ఆత్మ జ్యోతి ధారణ ఆ యోగికి అనునిత్యమగుచున్నది.

5.) అథ మధ్య లక్ష్య లక్షణమ్।
ప్రాతశ్చిత్రాది వర్ణ అఖణ్డ
సూర్యచక్రవత్, వహ్నిజాలావలీవత్
తద్విహీనా అన్తరిక్షవత్ పశ్యతి।
తత్ ఆకారా ఆకారితయా అవతిష్ఠతి
తత్ భూయో దర్శనేన
గుణ రహితా ఆకాశం భవతి।
విస్ఫురత్ తారకా ఆకార సందీప్యమానా
గాఢ తమోపమం పరమాకాశం భవతి|
కాల అనల సమద్యోతమానం కాల ‘మహాకాశం’ భవతి!
సర్వోత్కృష్ట పరమద్యుతి
ప్రద్యోతమానం తత్త్వాకాశం భవతి।
కోటి సూర్య ప్రకాశ వైభవ
సంకాశం, సూర్యాకాశం భవతి।
ఏవం బాహ్యా - అభ్యన్తరస్థ
వ్యోమ పంచకం తారక లక్ష్యమ్|
తత్ దర్శీ విముక్త ఫలస్తాత్
(సా) దృక్ - వ్యోమ సమానో భవతి।
తస్మాత్ తారక ఏవ లక్ష్యమ్|
అమనస్క ఫలప్రదం భవతి||

ఇప్పుడు "మధ్య లక్ష్య లక్షణము” గురించి మనము చెప్పుకుంటున్నాము.
అనేక రంగులతో కూడినదై, అఖండ సూర్య మండలమువలె, అగ్నిజ్వాలాపుంజముల వలెను, (అంతే కాకుండా) కొన్నిసార్లు అవి కూడా ఏమియులేనట్టి నిర్మలాకాశము వలెను మధ్య లక్షణ లక్ష్యము గల యోగి - తన అభ్యాసమునందు దర్శన స్వరూపంగా దర్శించుచూ, అద్దానిని ఉపాసిస్తున్నాడు.

అట్టి అభ్యాసముచే - తాను చూస్తున్న సూర్య మండలము, అగ్ని జ్వాలా పుంజములు, నిర్మలాకాశము - తానే అవన్నీ అయి ప్రకాశించుచున్నాడు.
అట్టి అహమేవ తత్ సూర్యమండల - అగ్నిజ్యోతిః, నిర్మలాకాశస్వరూపమస్మి .. అను దర్శనము మరల మరల దర్శించటం చేత త్రిగుణాతీతుడై, గుణములకు సాక్షి అయి ప్రకాశించుచున్నాడు. నిర్గుణాకాశ స్వరూపుడగుచున్నాడు.

దూరంగా కనిపిస్తూ అసంఖ్యాక నక్షత్రమండలములతో నిండిన గాడాంధకారము (జగత్ రాహిత్యము)తో కూడా నిండియున్న పరమాకాశమే తానగుచున్నాడు. కాలాగ్ని తేజోమండలమునకు సమానమైన తేజోరూపమగు మహాకాశమై వెలుగొందుచున్నాడు.

అట్టి భావనయొక్క అభ్యాసముచే సర్వోత్కృష్టమై, అన్నిటికంటే అత్యుత్తమమై పరమజ్యోతి స్వరూపమై ప్రద్యోతమానమగు (ప్రకాశించు) తత్యాకాశ స్వరూపుడు అగుచున్నాడు. కోటి సూర్య మండలముల కాంతితో శోభితమగు సూర్యాకాశ ప్రకాశమానుడగుచున్నాడు. సర్వత్రా వెలుగొందు అఖండ - కేవలాత్మ అయి అంతటా ప్రదర్శనశీలుడగుచున్నాడు. ఈవిధంగా బాహ్యమునందు, అంతరమునందు ఏర్పడినదైయున్న వ్యోమ పంచకము తానై ప్రకాశించటము, తన యొక్క విశ్వ విశ్వాంతరాళ విశ్వంతర్గత - విశ్వ బాహ్య ఆకాశత్వము యొక్క అవధారణయే తారకయోగము యొక్క లక్ష్యము.

అట్టి “తారక లక్ష్యము”ను దర్శించుచున్నట్టి యోగి దృక్ ఆకాశ స్వరూపుడు (Absolute Perceiver prior to Perceptions) గా అగుచున్నాడు. అందుచేత “తారక యోగము”…. అనునది “అమనస్క యోగము” అనే ఉత్తమ ఫలమును ప్రసాదించుచున్నది. ఆలోచన జనించు స్థానమును ధారణ చేయటమే ‘అమనస్కము’.

6.) తత్ ‘తారకం’ ద్వివిధమ్|
పూర్వార్ధం తారకమ్,
ఉత్తరార్ధం అమనస్కం చ ఇతి
తత్ ఏష శ్లోకో భవతి।
తత్ యోగం చ ద్విధా విద్ధి -
పూర్వ - ఉత్తర విధానతః|
పూర్వంతు ‘తారకం’ విద్యాత్।
‘అమనస్కం’ తత్ ఉత్తరమ్ ఇతి
అక్ష్యన్తః తారయోః
‘చంద్ర-సూర్య’ ప్రతిఫలనం భవతి।
తారకాభ్యామ్ సూర్య-చంద్ర మండల దర్శనమ్|
బ్రాహ్మాణ్డమివపిజ్జా శిరో మధ్యస్థ ఆకాశే
రవి-ఇన్దు మండలమ్ ద్వితయమస్తి
ఇతి నిశ్చిత్య, తారకాభ్యాం
దర్శన మాత్రాపి ఉభయ
ఐక్య దృష్ట్యా మనోయుక్తం ధ్యాయేత్|
తత్ యోగ-అభావే, ఇంద్రియ ప్రవృత్తేః
అనవకాశాత్।
తస్మాత్ అంతర్ దృష్ట్యా
‘తారక’ ఏవా అనుసన్ధయః॥

అట్టి తారకము, రెండు రీతులైనవి.
1.) పూర్వార్ధము  → “తారకము”
2.) ఉత్తరార్ధము → “అమనస్కము”.
ఇది వివరిస్తూ ప్రాచీన శ్లోకములచే ఈవిధంగా గానం చేయబడుతోంది.

ఆ యోగము కూడా రెండుత తీరులు. ‘తారకవిద్య’ కు మొదటి పూర్వ) విభాగము ‘తారకము’, ఉత్తర విభాగము ‘అమనస్కము’ అని సిద్ధాంతము.
కనులకు సంబంధించిన తారక విద్యచే కనులలో సూర్య-చంద్రులు ప్రతిఫలించు చున్నారు.
అట్టి తారకముచే సూర్యమండల - చంద్రమండల దర్శనము కలుగుతోంది.
బ్రహ్మాండములో సూర్య-చంద్రులు తేజో-ఓషధ ప్రదాతలై ప్రకాశించుచున్నారు కదా! అదేవిధంగా పిండాండములో కూడా (ఈ భౌతిక వ్యష్ఠి దేహములో కూడా) శిరోమధ్య భాగములో సూర్య-చంద్ర మండలాలు ఉన్నాయి.

ఇది నిశ్చయించుకొని తారకాభ్యాసము ద్వారా “ఆకాశములోని సూర్య చంద్రుల చైతన్యమే దేహములోనూ ఉన్నదని గమనించి, వాటి ఐక్యత్వమును దర్శిస్తూ మనో పూర్వకంగా ధ్యానించాలి! ఉపాసించాలి! ఒకే చైతన్యము సూర్య-చంద్రులలోను, రెండు కనులలోను, ప్రకాశమానమగుచున్నట్లు ఉపాశించాలి.

ఆవిధంగా సూర్య-చంద్ర తత్త్వములను శిరోభాగాకాశములో గమనించి ధ్యానించకపోతేనో? లేక తదితర విధములుగా యోగం అభ్యసించకపోతేనో ఇంద్రియ ప్రవృత్తులే పెత్తనం చెలాయిస్తాయే గాని, అంతర్-ప్రవృత్తికి (అంతరంగ యోగమునకు) మార్గము సుగమం కాదు.
అందుచేత అంతర్ దృష్టితో దేహములో తారక విద్యను, ఉపసానను అనుసంధానం చేయాలి!

7.) తత్ తారకమ్ ద్వివిధమ్|
“మూర్తి తారకమ్, అమూర్తితారకమ్" చ ఇతి |
యత్ ఇంద్రియాన్తమ్ తత్ మూర్తిమత్ |
యత్ భ్రూ యుగాతీతం, తత్ ‘అమూర్తిమత్’|
సర్వత్రా అన్తః పదార్థ వివేచనే,
‘మనో యుక్తా అభ్యాస’ ఇష్యతే|
తారకాభ్యాం తత్ ఊర్ధ్వస్థ సత్త్వ దర్శనాత్
మనోయుక్తేనా అన్తరీక్షణేన
సత్-చిత్-ఆనంద స్వరూపం బ్రహ్మైవ
తస్మాత్ శుక్ల తేజోమయం ‘బ్రహ్మేతి’ సిద్ధమ్ |
తత్ బ్రహ్మ మనః సహకారి చక్షుషా
అంతర్దృష్ట్యా వేద్యం భవతి।
ఏవమ్ ‘అమూర్తితారకమ్’ అపి
మనోయుక్తేన చక్షుషైవ దహరాదికం వేద్యం భవతి|
రూపగ్రహణ ప్రయోజనస్య మనశ్చక్షుః
అధీనత్వాత్।
బాహ్యవత్ అన్తరేఽపి ఆత్మ-మనః-చక్షుః
సంయోగేనైవ
రూప గ్రహణ కార్యోదయాత్|
తస్మాత్ మనోయుక్తా - అంతర్దృష్టిః
తారక ప్రకాశాయ భవతి।
భ్రూయుగ మధ్య బిలే దృష్టిమ్
తత్ ద్వార ఊర్ధ్వస్థిత తేజ
ఆవిర్భూతం “తారక యోగో” భవతి।
తేన సహ మనోయుక్తం
తారకం సుసంయోజ్యం
ప్రయత్నేన భ్రూయుగ్మమ్
సావధానతయా కించిత్
ఊర్ధ్వమ్ ఉత్-క్షేపయేత్
ఇతి పూర్వ భాగీ తారకయోగః ॥

అట్టి తారక విద్య రెండు తీరులైనది.
1.) మూర్తి తారకము 2.) అమూర్తి తారకము.

తారకవిద్య ఇంద్రియములకు ఉపయోగిస్తూ దృశ్యమును దాటివేయునదై ఉన్నదో… అది మూర్తి తారకము. ఇంద్రియాంతర్గతమైన ఇంద్రియాతీత తారకము.

ఏది భ్రూమధ్య ఆకాశయుగ అవధారణచే ఆకాశాతీతమో అది అమూర్తి తారకము. భ్రూమధ్య ప్రదేశమునందు భ్రూమధ్యాతీతతారకము. ఎక్కడైనప్పటికీ - అన్తః పదార్థ వివేచన మనస్సుతో కూడిన అభ్యాసము ముఖ్యము! బుద్ధితో వివేచన చేస్తూ, మనస్సుతో ఆత్మతత్త్వమును మననము చేయాలి.

తారకముచే అద్దాని (ఆ)పై గల సత్వము (The absolute presence) యొక్క సత్-చిత్-ఆనంద స్వరూపం బ్రహ్మైవ దర్శనము లభిస్తోంది. మనస్సుతో కూడిన అంతర్ముఖ దృష్టి చేత సత్-చిత్-ఆనంద రూపమగు ‘పరబ్రహ్మము’ తెలియబడుచున్నది. అనుభవమగుచున్నది. శుక్ల (తెల్లటి) తేజోమయ రూపమగు బ్రహ్మమే, సర్వే సర్వత్రా (బయట-లోపల కూడా) అన్ని రూపములుగా వెల్లి విరిసి, సిద్ధించినదైయున్నది.

“బ్రహ్మమే ఇదంతా (సర్వమ్ ఖల్విదమ్ బ్రహ్మ)“ అను పరమ సత్యము మనోరూపమైన అంతర్-నేత్రములకు (జ్ఞాన నేత్రములకు) అంతర్-దృష్టిచే తెలియబడునదగుచున్నది. అనుభూతికే విషయమగుచూ, చెప్పవీలు కానిదగుచున్నది.
అట్లాగే ‘అమూర్తి తారకము’ కూడా మనోయుక్తమైన చక్షువులకు (దృష్టికి) దహరాకాశ దర్శనముచే బ్రహ్మము తెలియబడగలదు. (దహరాకాశము భావన, ఆలోచన కూడా జనించే చోటు).

బాహ్యమున మనస్సు-చక్షువుల సంయోగము జరిగినప్పుడు మాత్రమే కళ్ళకు ఎదురుగా గల దృశ్యము అనుభవమౌతుంది కదా! అట్లాగే అంతరము కూడా మనస్సు - చక్షువులు ఒక చోటికి వస్తేనే మహత్తర తత్త్వము అనుభవమునకు వస్తుంది. కనుక ఇచ్ఛ - ఆలోచన ఏకమవ్వాలి!

ఈవిధంగా మనస్సులో కూడిన అంతర్దృష్టిచేత మాత్రమే భ్రూయుగ (మనస్సు-దృష్టి సంయోగము పొందినప్పుడే) “తారక తత్త్వము” ప్రకాశమానము అవగలదు. (లేక) అనుభవముగా సిద్ధించగలదు. లేక స్వతః సిద్ధమవగలదు.

భ్రూమధ్య ప్రదేశమునందు గల బిలము (ద్వారము) నందు దృష్టిని నిలపాలి. ఆ ద్వారము ద్వారా ఊర్ధ్వమున గల తేజస్సు నిత్యానుభవముగా ఆవిర్భూతము అగుచూ ఉండగా ఆ యోగసాధకుడు ‘తారక యోగి’ అగుచున్నాడు.

ఆ ప్రకాశమునందు మనస్సుతో కూడిన తారకము (దృష్టి)ని సుసంయోజ్యము చేసి (చక్కగా, నిశ్చలముగా, సుస్థిరముగా నిలిపి) సావధాన పూర్వకమైన ప్రయత్నముతో రెండు భ్రుకుటులను (కంటిపై గల నొసవులు) కొంచము పైకి ఎత్తి నిలపాలి. ఇది “పూర్వభాగీ తారకయోగము”…. అని పిలుస్తారు. దీని వలన ఆ యోగి మనస్సును దాటి వేసినవాడగుచున్నాడు. ‘ఉన్మనీ’ స్థితిని పొందుచున్నాడు. మనస్సు లయించినప్పుడు కూడా శేషించి ఉండే స్వస్థితి ఉన్మనీ స్థితి!

8.) ఉత్తరం తు అమూర్తిమత్ ‘అమనస్కమ్’ ఇతి ఉచ్యతే!
తాలు మూల ఊర్ధ్వభాగే మహాన్ జ్యోతిః మయూఖో వర్తతే!
తత్ యోగిభిః ధ్యేయం। తస్మాత్ అణిమాది సిద్ధిః భవతి।
అంతర్-బాహ్య లక్ష్యి దృష్టా
నిమేష - ఉన్మేష వర్జితాయాం
సత్యాం "శాంభవీ ముద్రా” భవతి।
తన్ముద్రా “ఆరూఢజ్ఞాని”
నివాసాత్ భూమిః పవిత్రా భవతి
తత్ దృష్ట్వా సర్వే లోకాః పవిత్రా భవన్తి।
తాదృశ పరమయోగి పూజా
యస్య లభ్యతే, సోఽపి ‘ముక్తో’ భవతి||

ఉత్తరభాగ తారకమును “అమూర్తిమంతమగు అమనస్కయోగము” …. అని పిలుస్తూ ఉంటారు.
తాలు (కొండ నాలుక) యొక్క ఊర్ధ్వ (పై) భాగమునందు తేజో ఆకాశమున్నది.
ఆ “మహా జ్యోతి కిరణము” (తాలు పై భాగమునందు)పై ధ్యాసను నిలిపి, ధ్యానము అంతర్-బాహ్య లక్ష్యే దృష్టా చేయు యోగులకు అణిమ-గరిమ మహిమ మొదలైన సిద్ధులు లభిస్తున్నాయి.

యోగి లోపలి - బయట ఉండే (అంతర్-బాహ్య) సర్వ దృష్టులను వెనుకకు మరల్చి కళ్ళు తెరవటం-మూయుటమును కూడా నిలిపి ఉంచు అభావనా స్థితిని అభ్యసించటమును శాంభవీ ముద్ర అంటారు.
అట్టి శాంభవీ ముద్రను అభ్యసించి, సాధనచే సిద్ధింపజేసుకొను యోగి నివశించు ప్రదేశము (స్థలము) ఆతని శాంభవీముద్ర ప్రభావంచేత పవిత్రమౌతోంది!
అట్టి శాంభవీముద్రను సిద్ధించుకొన్న యోగి చూపుతోనే లోకములను పవిత్రము చేయుచున్నారు.

అట్టి పరమ యోగిని ఎవ్వరు పూజిస్తారో, వారు కూడా ముక్తులు అగుచున్నారు.

9.) అన్తర్లక్ష్య ‘జలజ్యోతి స్వరూపం’ భవతి।
పరమ గురూపదేశేన సహస్రారే
జలజ్యోతిర్వా బుద్ధిగుహా నిహిత
చిత్ జ్యోతిర్వా, షోడశ అన్తస్థ
తురీయ చైతన్యం వా అన్తర్లక్ష్యం భవతి|
తత్ దర్శనం సదాచార్య మూలమ్|
ఆచార్యో వేద సమ్పన్నో,
విష్ణుభక్తో, విమత్సరః,
యోగజ్జో యోగనిష్ఠశ్చ
సదా యోగా ఆత్మకః శుచిః
గురుభక్తి సమాయుక్తః, పురుషజ్ఞో విశేషతః,
ఏవం లక్షణ సమ్పన్నో
’గురుః’ ఇతి అభిధీయతే।
‘గు’ శబ్దస్తు అంధకారస్స్యాత్
‘రు’ శబ్దః తత్ నిరోధకః
అంధకార నిరోధత్వాత్
‘గురుః’ ఇతి అభిధీయతే।
గురురేవ పరంబ్రహ్మ!
గురుః ఏవ పరాగతిః|
గురుః ఏవ పరావిద్యా,
గురుః ఏవ పరాయణమ్||
గురుః ఏవ పరాకాష్ఠాః
గురుః ఏవ పరం ధనం॥
యస్మాత్ తత్ ఉపదేష్టాఽసౌ
తస్మాత్ గురుతరో, ‘గురుః’ ఇతి||
యః సకృత్ ఉచ్చారయతి
తస్య సంసార మోచనం భవతి।
సర్వజన్మకృతం పాపం తత్ క్షణాత్ ఏవ నశ్యతి|
సర్వాన్ కామాన్ అవాప్నోతి।
సర్వ పురుషార్థ సిద్ధిః భవతి,
య ఏవం వేద ॥

అమనస్క రూపమగు అంతర్లక్ష్య ఉపాసకుడగు యోగి జలజ్యోతి స్వరూపుడు అగుచున్నాడు.
పరమగురువుల ఉపదేశముచేత సహస్రారమునందు గల ‘జలజ్యోతి’ దర్శనధ్యానములచేతగాని, బుద్ధి గుహయందు నిహితమై (స్థానము కలిగి) యున్న ‘చిత్జ్యోతి’ చేత గాని, షోడశాంతమున గల (శిరస్సుకు ఊర్థ్వముగా గల) తురీయ చైతన్యమును గాని ఆరాధించటము  “అంతర్లక్ష్యము”  అగుచున్నది.
సద్గురువుయొక్క అనుగ్రహము చేత అంతర్లక్ష్య సిద్ధి కలుగుచున్నది.
గురువు-స్వప్రయత్నము ఏకమవ్వాలి!
ఆచార్యుడు వేద విద్యా సంపన్నుడు, విష్ణుభక్తి కలిగియున్నవాడు, మత్సరము (గర్వము) లేనివాడు, యోగ శాస్త్రము తెలిసియున్న ప్రావీణ్యుడు, యోగ నిష్ణా సాధన సంపద గలవాడు, ఎల్లప్పుడు యోగాత్మకుడు, గురుభక్తితో కూడినవాడు, పరమపురుషుని విశేషముగా ఎరిగినవాడు…. ఇట్టి లక్షణములు కలవాడు. అట్టివాడు ‘గురువు’ లేక ‘ఆచార్యులు’ అవటానికి అర్హుడు అగుచున్నాడు.

‘గు’ అను శబ్దార్థము - ‘అంధకారము’!
‘రు’ అను శబ్దార్థము - నిరోధించువాడు!
అజ్ఞానాంధకారము నిరోధించి, స్వస్వరూపాత్మ జ్ఞాన వెలుగును ప్రసాదిస్తారు కనుక ‘గురువు’ అని పిలువబడుచున్నారు.

ఆత్మతత్త్వమును గుర్తు చేయు -
గురువే పరబ్రహ్మము!
గురువే పరమగతి!
గురువే పరావిద్య!
గురువే పరమాశ్రయము!
గురువే అత్యుత్తమమగు లాభము అయినట్టి “ఆత్మతత్త్వ జ్ఞానము”ను విశదీకరించు పరాకాష్ఠ!
“తత్ ఆత్మ త్వమేవ” - అని నిరూపించి చూపు మహాప్రావీణ్యతగల ఆధేయము!
గురు…… పరమునకు ధనము. గురువు ఆ తత్ వస్తువగు స్వస్వరూపము గురించి ఉపదేశిస్తారు. మిక్కిలి ఉన్నతుడు. కాబట్టి, ‘గురు’ అని శబ్దముతో పిలుస్తున్నాము. “ఇక్కడ తారసపడుచున్నదంతా - సందర్భ సత్యము మాత్రమే! ఇదిగో, ఇదీ నీయొక్క సహజసత్యము” అని చూపువారు గురువు.

గురువును మించినది గురువే! మరొక్కరు కాదు!

ఎవ్వరైతే ఈ గురు స్తోత్రమును, గురు ఉపాసనను, గురు ఔన్నత్యమును ఉచ్ఛరిస్తారో, వారు ‘సంసారము’ నుండి విముక్తులు అగుచున్నారు. గురువును ఆరాధించి, సేవించువారి సర్వ జన్మలకృతమైన పాపము - గురువును ఉపాసించుటచే, సేవించుటచే - తొలగి పోగలదు. అట్టి గురుస్తుతిని అభ్యసించు వారి సర్వ కోరికలు నెరవేరగలవు. ఆతడు సర్వ పురుషార్ధ సిద్ధి పొందుచున్నాడు. ఎవ్వరైతే ఈ ఉపనిషత్ పరామార్ధమును ఉచ్చరిస్తూ ఉపాసిస్తారో, అట్టివారు పైన చెప్పిన ప్రయోజనములు పొందుచున్నారు. ఇది వేదవాక్కు.

ఇతి అద్వయతారకోపనిషత్ ।
ఓం శాంతిః శాంతిః శాంతిః ॥


శుక్ల యజుర్వేదాంతర్గత

2     అద్వయతారక ఉపనిషత్

అధ్యయన పుష్పము

‘ఓం’ కార అక్షర పరమార్థమయినట్టి అద్వయ - సద్గురు - తారక పరమాత్మకు - అద్వయతారకసిద్ధికై ప్రణమిల్లుతూ…
ఇప్పుడిక “అద్వయతారక” ఉపనిషదులమై, సామీప్యము పొందుటకై, సముపాశ్రయించుటకై ఆరాధన పూర్వకముగా తారకము గురించి వివరించుకొనుచున్నాము. వ్యాఖ్యానించుకొనుచున్నాము. ’ద్వైతము అసంభవము’ అను విజ్ఞాన సంసిద్ధిని అద్వయతారకము ప్రసాదించుచున్నది. అట్టి తారక బ్రహ్మముగా కీర్తించబడుచున్న శ్రీ ఆత్మారామ వైభవమును స్తుతించుచున్నాము.

భవము : “ఈ దృశ్యము, ఇద్దానిలో అనేక వేరువేరైన జీవులు, సంబంధాలు, అనుబంధాలు, బాంధవ్యాలు, జీవ - ఈశ్వర భేదాలు, ఈశ్వర - పరమాత్మ భేదాలు.. ఇవన్నీ ఉన్నాయి కదా !” అనే నమ్మకముతో కూడిన ఆవేశము. అల్పావగాహన. దురవగాహన-‘భవము’, … ‘భవబంధము’ అని పిలువబడుతోంది.

భవసాగరము : అట్టి నమ్మికతోకూడిన అసంఖ్యాక భావావేశతరంగ పరంపరలతో కూడిన భవ (ఇదంతా నిజముగా ఉన్నది అనే) భావతరంగాల మహాసముద్రము. అట్టి భవభావతరంగాల నుండి జనించే భయ-ఆవేశ-సుఖ-దుఃఖ-ఆశ-నిరాశ-ఉద్వేగ-అనిశ్చత-ఏది ఏమిటో, ఎటో తెలియని అజ్ఞానము-ఇవన్నీ జల్-జల్ ఘోష శబ్దాలు. అజ్ఞానావేశ దృష్టులు. దృష్టుల నుండి తెచ్చిపెట్టుకున్న బంధనములు.

తారకము :  "ఈ దృశ్యము అనే పంజరములో ప్రవేశించి నేను చిక్కుకున్నాను. అనేక బంధములు నన్ను కట్టిపడేస్తున్నాయి. ఆశ నిరాశల మధ్య, సుఖ - దుఃఖాల మధ్య, జీవన్ - మరణముల మధ్య ఇరుక్కొని పోయి ఉన్నానే ! నాగతి ఏమిటిరా బాబూ ?”… అను రూపముగల సంసార భావోద్వేగముల నుండి ఈ జీవుని తరింపజేయునది (that which relieves) కాబట్టి “తారకము”! కామ క్రోధ - లోభ - మోహ మద - మత్సర్య రూపములగు తరంగములు గల సాగరంలో చిక్కుకున్న మనలను ఆవలి (పరమువైపు) జేర్చునది కాబట్టి తారకము! యత్ తారయతి, తత్ తారకమ్ !

అద్వయతారకము : ఇహ స్వరూప పరిమితత్వము నుండి తరింపజేసి ఆవలివడ్డు అగు “అద్వయ పరబ్రహ్మము” అను స్థానమునకు జేర్చునది. “అహమేవ ఇదగ్ం సర్వమ్” అని పట్టి చూపించునది.

అట్టి అద్వయతారకోపనిషత్తును ఇప్పుడు మనము విశదీకరించుకుంటున్నాము.

యతయే జితేంద్రియాయ… మొట్టమొదటగా ఆత్మబంధువులగు గురువులు, శాస్త్రములు మనలోని విజ్ఞతను, నిద్రలేపు ప్రయత్నముగా సూచించుచున్న సత్కర్మ యోగ - భక్తి - ప్రవత్తులను మొదలైనవి అత్యంత శ్రద్ధగా, మెళుకువతో ఆచరించాలి. అట్టి సాధన సహాయముతో “ఈ ఇంద్రియములు - ఇంద్రియ విషయములకు ఆధారము నేను. ఈ దేహము - ఇంద్రియములు, ఈ జగత్తు నా స్వకీయ కల్పనా విశేషములే! అంతేగాని, వీటిపై నేను ఆధారపడి ఉన్నవాడను కాను" అను అవగాహనతో ముముక్షువు జితేంద్రియుడు (ఇంద్రియములను జయించినవాడు) కావాలి.

అందుకు గాను -
శమదమాది షట్-గుణ పూర్ణాయ…,

1) శమము : అంతరింద్రియ నిగ్రహము. మనో-బుద్ధి-చిత్త-అహంకారములను విషయములనుండి మరల్చి, దైవీ విధులందు నియమించటము. (Internal Control)

2) దమము : బాహ్య - ఇంద్రియ నిగ్రహము. కళ్ళు - కాళ్ళు - చెవులు మొదలైనవి శాస్త్ర సమ్మతములైన కార్యక్రమములందు క్రియాశీలము చేయటము. విషయముల నుండి మరల్చటము. (External Control)

3) ఉపరతి : ప్రేయో మార్గము నుండి విరమిస్తూ, శ్రేయో మార్గానుసరణము. అవిహిత కర్మలను జ్ఞానపూర్వకంగా క్రమంగా విడిచి పెట్టటము. దృశ్య బంధములను ఆత్మీదృష్టితో దాటివేస్తూ ఉండటము. (Withdrawal)

4) తితీక్ష : శీత-ఉష్ణ, సుఖ-దుఃఖ, శత్రు-మిత్ర, సంపద - ఆపదల సందర్భములలో ఓర్పును విడువక, అటువంటి ద్వంద్వముల పట్ల సమబుద్ధిని కలిగి ఉండటము. (Forbearence)

5) శ్రద్ధ : సాధనములపట్ల, గురుబోధ-వేదాంత శాస్త్రము ప్రతిపాదించే మహావాక్యార్థముల పట్ల అను నిత్య విచారణ విశ్వాసము కలిగి ఉండటము. అశ్రద్ధను దరికి రానీయకపోవటము. వినినది మననము చేయటము. (Attentively chanting)

6) సమాధానము : సద్గురూపదేశములను, మహావాక్యార్థములను వినుచు సంతృప్తి పొంది ఉండటము. "దృశ్య-దేహములు ఇటువంటివి కదా! ఆత్మ ఇట్టిది కదా!”… అను నిశ్చయములను సుదృఢం చేసుకోవటము. నిత్యానుభవముగా తీర్చి దిద్దుకోవటము. (Wel-answered interpretatively)

ఈ విధంగా షట్ (6) గుణ పూర్ణులమై ఉండాలి. “ చిత్ స్వరూపో హమ్ - నేను కేవలమగు చిత్ - ఆనంద (ఎరుగుట - అనే ఆనంద గుణముతో కూడిన) స్వరూపము కలవాడిని కదా !"… అని, ఇతి సదా భావయేత్… ఎల్లప్పుడు భావన చేస్తూ ఉండాలి. కనులు మూసుకొనియో (లేక) సగము కళ్లు తెరచియో - సమ్యక్ నిమీలిత అక్షః, కించిత్ ఉన్మీలత అక్షో వా - అంతర దృష్టిని ఆశ్రయించాలి. అట్టి అంతర్దృష్టి సహాయంతో భ్రూమధ్యము (రెండు కనుబొమ్మల మధ్య గల ప్రదేశము) నుండి పైపైకి (అంతరాంతరముగా) దృష్టిని సారించాలి. ఆ విధముగా దృష్టిని సారించి, సత్ - చిత్ - ఆనంద లక్షణములతో ప్రకాశమానమగుచున్న కూటస్థ రూపమగు పరబ్రహ్మము’ను అవలోకనం చేయాలి! (కూటస్థము = బంగారు ఆభరణమునకు బంగారమువలె, తరంగమునకు జలమువలె సర్వ భావనలకు, దేహ-దృశ్యాదులకు జననస్థాన సహజరూపము).

పరబ్రహ్మా అవలోకయన్,… తద్రూపో భవతి ! ఆ విధముగా తేజోమయమగు కూటస్థ పరబ్రహ్మము (The Absolute Self at the root of all else in which all else is placed and which is englightening all else) ను అవలోకించి “అదియే నేనై ఉన్నాను” అను సంస్థితి - అనుభవమును సంపాదించుకొని, అనునిత్యము చేసుకోవాలి. "ఈ సర్వము పరబ్రహ్మ రూపమే! నేను బ్రహ్మమునే! కనుక, ఈ కనబడే విశ్వమంతా నా యొక్క పరబ్రహ్మత్వపు తేజోకాంతి విశేషమే !” అను స్వాభావికానుభావమును సముపార్జించుకోవటమే ‘తారక యోగము’ .

అటువంటి “సర్వదా తత్ పరబ్రహ్మమేవా హమస్మి… ఆ పరబ్రహ్మమే నేనై, ఈ దృశ్యమును నా విభూతిగా కలిగియున్నాను కదా !” అనే సత్ యోగోపాసనచే, ఆ యోగి గర్భవాస జనన మరణ సంసార మహత్ భయములను దాటిపోవుచున్నాడు, తరిస్తున్నాడు. అట్టి - ఆత్మౌపమ్యేవ సర్వత్ర - రూపమగు యోగమార్గము ఈ జీవుని సర్వ అనర్ధములనుండి, మానసిక వేదనల నుండి తరింపజేయగలడు. కాబట్టి తస్మాత్ ‘తారకమ్’ ఇతి - ‘తారకము’ అని పిలువబడుతోంది.

అనేక నాటకములలో నటించేవాడు ఒకసారి ఒక నాటకంలో నటిస్తూ ఉండగా, అతని నాటకములోని ’ఉనికి’ని పాత్ర (Role) అంటాము. అనేక నాటకములలోన నటించే అతనిని ‘నటుడు’ (Action) లేక ‘నాటక కళాకారుడు’ (Artist) అంటాము కదా! అట్లాగే జీవ-ఈశ్వరులు కూడా! ఆ నటుని యొక్క ‘సహజ రూపము’ నటనాకౌశలమునకు కూడా వేరై, సాక్షియై ఉన్నది కదా! అది జీవ- ఈశ్వర సాక్షియగు పరాత్మ!

ఈ దృష్టాంతమును దృష్టిలో పెట్టుకుంటే…,

జీవుడు… వర్తమాన దేహములో దేహమును వర్తింపజేయువాడు.
ఈశ్వరుడు … అనేక దేహములకు సంబంధించినవాడు, దేహ దేహాంతరములకు ఈవల-ఆవల-మధ్యగా కూడా ఆక్రమించుకొని ఉన్నవాడు.
జీవుడు - ఈశ్వరుడు … ఈ ఇరువురూ కూడా దేహములకు సంబంధించినవారే కాబట్టి మాయలోనివారే !

ఈ విధంగా జీవ - ఈశ్వర న్యాయమును (తత్వతః) విచారణ చేసి, ఎరిగి ఆ రెండింటి సంబంధించిన సర్వ విశేషముల విషయమై ‘నేతి-నేతి! ఇది కాదు ఇది కాదు’… అని విచారణచే గమనించిన తరువాత, అప్పటికీ ఏదైతే శేషిస్తుందో అదియే అద్వయ బ్రహ్మము.

జీవ - ఈశ్వరౌ మాయకాః - జీవుడు - ఈశ్వరుడు ఈ రెండూ కూడా ‘కల్పన’ లేక ‘మాయ’ లోనివే! ఇతి విజ్ఞాయా ఇవి సుస్పష్టముగా, అనుభవపూర్వకంగా తెలుసుకొని,… సర్వ విశేషం నేతి ఇతి విహాయ - సర్వ విశేషయములు “ఇది నా కల్పనలోని విభాగమేగాని నేను ఎట్లా అవుతాను ? కాను !”… అని ప్రక్కకు పెట్టివేస్తూ ఉండగా….,
యత్ అవశిష్యతే.. ఏది చివరికి అవశేషించినదై, త్యజించటానికి వీలే కాదో…. అదియే “అద్వయ పరబ్రహ్మము”!

ఈ జీవుడు సిద్ధించుకోవలసినది అట్టి స్వస్వరూప అద్వయ బ్రహ్మమే సుమా! మరి అది ముముక్షువుకు సిద్ధించేది ఎట్లా ? అందుకు లక్ష్యత్రయమును (‘3’ లక్ష్య రూపములను) అనుసంధానము చేయును గాక !
1) అంతర్లక్ష్య లక్షణము 2) బహిర్లక్ష్య లక్షణము 3) మధ్య లక్ష్య లక్షణము

1.) అంతర్లక్ష్య లక్షణము
హృదయాంతర్గతోపాసన

1) కుండలినీ మహాశక్త్యుపాసన :

brahma-randhramu

ఈ దేహమునకు మధ్యగా బ్రహ్మనాడి ఉన్నది. దానినే ’సుషుమ్న’ అని కూడా అంటారు. అది సూర్య తేజస్సుతో వెలుగొందుచూ, పూర్ణచంద్రుని వలె అమృత కిరణ సమన్వితమై వర్తిస్తోంది.

సా తు మూలాధారాత్ ఆరభ్య.. బ్రహ్మరంధ్రగామినీ భవతి !
అ సూర్యప్రభలతో వెలుగొందుచున్న బ్రహ్మనాడి మూలాధారమునందు ఆరంభమై, శిరస్సు యొక్క ఉపరి భాగమున స్థానము కలిగినట్టి బ్రహ్మరంధ్రము వరకు విస్తరించినదై ఉన్నది.

తన్ మధ్యే తటితో కోటి సమాన కాన్త్యా, మృణాళసూత్రవత్ సూక్ష్మాజీ "కుణ్ణలినీ” ప్రసిద్ధా అస్తి! …
ఆ బ్రహ్మనాడికి మధ్యగా కోటి మెరుపుల కాంతులతో, తామరతూడులోని కళ్ళకు కనిపించనంత సన్నని దారమువలె సూక్ష్మాతిసూక్ష్మమైన మూలశక్తిగా వెలుగొందుచూ ఉన్నది. అది ‘కుండలినీ’ అను పేరుతో యోగశాస్త్రజ్ఞులచే పిలువబడుతోంది.

మనస్సుతో ఆ ‘కుణ్ణలినీ మహాశక్తి’ని దర్శించటము, ఉపాసించటము, తత్ తేజోరూపమవటము అనే కుబ్జలినీ ఉపాసనను ఎరిగి, యోగవేత్తలు నిర్వర్తిస్తున్నారు. ఎవ్వరు కుణ్డలినీ ఉపాసనను నిర్వర్తిస్తూ ఉన్నారో. అట్టివారు సర్వసంసార బంధములను దాటివేసినవారై ‘ముక్తులు’ అగుచున్నారు. వారికి ఈ దృశ్యమంతా క్రీడా-లీలా ఇంద్రదజాల వినోదము అగుచున్నది.

2) లలాట ఆకాశయోగోపాసన :

ఫాల భాగమునకు (Foreface) కు ఊర్ధ్వముగా లాలాటమునకు అంతర్గతమై, మహత్తరమగు తేజోమండలము నిరంతరము జ్వాజ్వల్య ప్రకాశమానమైయున్నది. ఆ లలాట తేజో ఆకాశము ముఖమంతా, (మరియు) బాహ్యమున విశ్వమంతటనూ విస్తరించి ఏర్పడినదై నిండియున్నది. ‘తారక యోగము’ చే యోగులు బుద్ధితో గమనిస్తున్నారు. విస్ఫురణ శక్తితో, ఆత్మ జ్ఞాన శక్తితో, దర్శించుటను అభ్యసించుచున్నారు. సిద్దించుకోవలసినది సిద్దించుకొని ‘సిద్దులు’ అగుచున్నారు.

3) దేహ అంతర్గత జనిత (ఫూ…) నాద శ్రుతోపాసన :

తర్జినీ (చూపుడు వ్రేలు Index finger) యొక్క పై భాగముతో చెవు మూసుకున్నప్పుడు తర్జని అగ్ర ఉన్మీలిత కర్ణ రంధ్రద్వయే, అ తత్ర ’ఫూ’త్కారశబ్దాజాయతే - లోపలి నుండి ’పూ’ త్కారముతో కూడిన ఒకానొక శబ్దము వినబడుచూ ఉంటుంది. మనస్సును ఆ శబ్దముపై ఏకాగ్రం చేసి వింటూ ఉండటము- ‘అంతరంగ నాదోపాసనా యోగము’ అయి ఉన్నది.

ఆ చక్షువుల మధ్యలో స్థితి కలిగియున్న నీల జ్యోతి స్థలమును (ఆకాశమును) వీక్షించుచూ ఉండటము.

ఈ విధమైన ఉభయముల సాధనచే, యోగి అంతర్దృష్టివంతుడై, నిరతిశయమగు సుఖమును పొందుచున్నాడు.

🦜

పై మూడు కూడా హృదయమునందు దర్శిస్తూ ఉండే యోగసాధనా విధానములు. మముక్షువులు ఇట్టి అంతర్లక్ష్య లక్షణ యోగ మార్గములను అనువర్తులై, ఉపాసించినవారై ఉత్తమ ప్రయోజనము పొందగలరు.

2.) బహిర్లక్ష్య లక్షణము

1) నాసికాఽగ్రే… ముక్కు యొక్క అగ్రభాగమునుండి క్రమంగా
అ) ‘4’ అంగుళముల పైస్థానము ; ఆ) ‘6’ అంగుళముల పైస్థానము
ఇ) ‘8’ అంగుళముల పైస్థానము ; ఈ) 10’ అంగుళముల పైస్థానము
ఉ) 12 అంగుళముల పైన ఉన్న స్థానము.
ఈ విధముగా బుద్ధిని ఐదు స్థానములలో నిలుపుచూ మనస్సుతో కొంత-కొంతసేపు ఉపాసిస్తూ క్రమంగా 12 అంగుళముల స్థానములలో గల నీలకాంతి, శ్యామ (నలుపు), ఎరుపు, పసుపురంగు, తెలుపురంగులతో కూడిన ఆకాశమును గగనతలములను దర్శించుచూ యోగాభ్యాసము చేయుటముచే అతి త్వరగా అతడు “పూర్ణయోగిత్వము” పొందుచున్నాడు. స తు యోగీ భవతి |

2) చలనము కలిగిన దృష్టులతో (కళ్లు ఇటు అటు కదల్చుచు)… ఆకాశ భాగమున చూస్తూ ఉండువాడు అట్టి దర్శనాభ్యాసముచే కూడా ‘యోగి’ అగుచున్నాడు.

3) జ్యోతిర్మండలములో బంగారు కాంతులు వెదజల్లు జ్యోతిర్మయ కిరణములను భావన చేస్తూ ఆ కిరణములయందు మనో దృష్టిని నిలుపుటచే కూడా అతని దృష్టి స్థిరత్వము పొందుతోంది.

4) అంగాంగములందు గాని (తన దేహమునంతటాగాని, ఇష్ట దైవము యొక్క రూపమునందుగాని, పఠమునందు గాని, విగ్రహమునందు గాని, గురు రూపమునందు గాని) ఈ పృధ్విని (భూమి) అంతాటగాని మనో- దృష్టులను నిలుపుతూ వస్తే… అట్టివాని మనోధ్యాస, దృష్టి స్థిరత్వము పొందగలవు.

5) శీర్షా-ఉపరి ద్వాదశాంగుళ సమమ్ ఈక్షితుః అమృతత్వం భవతిః | శిరస్సు యొక్క ఊర్ధ్వ భాగమునుండి 12 అంగుళముల విస్తీర్ణము వరకు (మనో) దృష్టిని నిలిపి సమముగా సందర్శించు అభ్యాసము నిర్వర్తించవాడు అమృతత్వమును పుణికి పుచ్చుకొనుచున్నాడు. దృష్టి యొక్క సర్వసమత్వము (Feature of Equality perceiving) సిద్ధించుకోగలడు. ఈవిధంగా పైన చెప్పుకొన్న యోగాభ్యాసములచే… ఆ యోగసాధకునికి శిరస్సుపై “ఆకాశజ్యోతి’ (కాంతి పుంజములతో కూడిన తేజస్సు) యొక్క దర్శనము పొందుచున్నాడు. అతడు యోగ సిద్ధిని పొంది, ’యోగసిద్ధుడు’ అగుచున్నాడు.

3.) మధ్యలక్ష్య లక్షణము

మధ్య లక్షణ తారక యోగాభ్యాసులు అగు యోగ సాధకులు - ఉదయించుచున్న సూర్య ప్రభలను, సూర్యగోళమును, అగ్నిజ్వాలలను, నిర్విషయమగు శూన్యాకాశమును, వస్తు శూన్యమగు అంతరిక్షమును, ఆకాశము - భూమిల మధ్య భాగమును మనో నేత్రముతో (వాటిలో ఒకటిగాని, కొన్నిగాని, అన్నీ గాని) దర్శించుచూ బుద్ధిని ఏకాగ్రపరచుచూ యోగ ప్రక్రియను నిర్వర్తించుచున్నారు.

మనో - బుద్ధులను ఏకం చేసి ఆయా స్థితి - దర్శనములందు సుస్థిరీకరించి, (నిలిపి) యోగాభ్యాసము చేస్తూ ఉంటున్నారు. అట్టి ఉదయించు సూర్యుని - సూర్య గోళమును అగ్ని యొక్క తేజో ప్రభలను, శూన్యాకాశమును, అంతరిక్షమును (The vacant space in between any two objects) వాటిలో ఏ ఒక్కటైనా (లేక) కొన్ని, (లేక) అన్నీ ధ్యానము చేస్తూ చేస్తూ ఉండగా… ఆ యోగి - తత్ ఆకారా ఆకారితయో అవతిష్ఠతి।  ఆ ఆకారమే తానై ప్రకాశించుచున్నాడు. అట్టి తత్ ఆకార ఆకారత్వము చేత ఆ యోగి గుణరహిత ఆకాశ స్వరూపుడు అగుచున్నాడు. తత్ భూయో దర్శనేన ‘గుణ రహిత ఆకాశమ్’ భవతి !

అంతేకాదు.
విస్ఫురత్ తారకాకార సందీప్యమానా గాఢ తమోపమమ్ పరమాకాశమ్ భవతి !
1.) ఆకాశములోని నక్షత్ర ప్రకాశమును, 2.) నక్షత్రముల మధ్య గల అంధకారము, 3.) కళ్ళు మూసుకొన్న ప్పటి అంధకారమును,
ఈ ’3’ కూడా…, పరమాకాశరూప విభాగములై యోగసాధనయందు యోగులచే ఉపాసించబడుచూ, ఆరాధించబడుచున్నాయి.

సర్వోత్కృష్ట పరమద్యుతి ప్రద్యోతమానం తత్త్వాకాశమ్ భవతి |
ఈ భౌతికాకాశము కంటే కోటానుకోట్ల రెట్లు సూక్ష్మమైనట్టి ఆ పరమాకాశము సర్వోత్కోృష్టమై పరమ తేజోమయమై, జ్యోతిర్జ్యోతి స్వరూపమై యోగసాధకునకు అనునిత్య-ఆత్మానుభూతిని ప్రసాదించుచున్నది !

కోటి సూర్య ప్రకాశ వైభవ సంకాశం సూర్యాకాశం భవతి !
అట్టి యోగసాధకుడు కోటి సూర్యుల ప్రకాశమానుడై వెలుగొందుచున్నాడు. ఆ ప్రకాశమే తానై తారక తత్త్వాస్వాదన చేస్తున్నాడు.

ఈ విధంగా బయట అంతరమున వెలుగొందుచున్న -
1) నిర్మలాకాశము : “నేను నిత్యనిర్మల నిర్విషయ స్వరూపుడను!”
2) నిర్గుణాకాశము :“త్రి-గుణములను లీలా-క్రీడా విశేషములు గాను, ఆభరణములుగాను కలిగి వున్న-నిర్గుణ స్వరూపుడను !”
3) పరమాకాశము : “సర్వమునకు పరమై, ఇహమంతా కూడా నా యొక్క కళా విశేషమైనట్టి పరమాకాశ స్వరూపుడను !” “చీకటి - వెలుగులకు
4) మహాకాశము కూడా సాక్షిని అయి, భావ - అభావములకు స్థానమైయున్న మహదాకాశతత్త్వమగు : మహాకాశమును!”
5) తతత్త్వాకాశము : “నేను - నీవు మొదలైనవన్నీ ఎద్దాని యొక్క తేజో విభవ విలాసమో … అట్టి తత్యాకాశ స్వరూపుడను !” అను వ్యోమపంచకము - వాటిపట్ల మనస్సును నిలిపి, యోగాభ్యాసముచే స్వానుభవముగా … స్వస్వరూపము యొక్క పరమార్థ-అనుభవముగా సిద్ధించుటయే తారకయోగ లక్ష్యము..

తత్ దర్శీ విముక్త ఫలస్తాత్ (సా) ‘దృక్’ వ్యోమసమానో భవతి!
అట్టి వ్యోమపంచక సందర్శకుడు సర్వ దృశ్యాంతర్గతమైన ప్రయోజనములను అధిగమించి దృక్ ఆకాశ - (The absolute perceiver that is always present even prior to, as during the, and even after the ACTIVITY of PERCEPTIONS) స్వరూపమాత్రుడు అగుచున్నాడు !

ఈ విధమైనటువంటి తారకయోగోపాసన యొక్క అత్యుత్తమ ఫలము (లేక) ప్రయోజనమే “అమనస్కము”.
(అమనస్కము = ఆలోచనలకు సాక్షిత్వము అభ్యసిస్తూ సిద్ధించుకోవటము. ఆలోచనలు వచ్చి పోతూ ఉండగా, అట్టి ఆలోచనలకు జనన స్థానము, ఆలోచనలకు ముందేగల చైతన్య స్థానమును బుద్ధితో గమనిస్తూ మమేకమవటము.)

సాధన - సాధ్యము (ప్రయత్నము - ప్రయోజనము) ల ఏకత్వ సంస్థితియే ‘తారకము’ అను శబ్దము యొక్క పరమార్థ సారము.

అందుచేత అట్టి తారకమే ‘జీవితము’ అనే అవకాశముచే సిద్ధించుకోవలసిన ఉత్తమోత్తమ - పరమ ప్రయోజనము.

అట్టి తారక యోగము (పరాకాష్ఠ కొరకై) రెండు విభాగములు (Two phases) గా చెప్పబడుతోంది.

ప్రథమార్ధము :  మనము ఇంతవరకు చెప్పుకుంటూ వస్తున్న తారక యోగసాధ్యములు (అంతర్లక్ష్య తారకము, బహిర్లక్ష్యతారకము, మధ్య లక్ష్య తారకము).

ద్వితీయ విభాగము (ఉత్తరార్ధము) : అమనస్కము. మనస్సుకు ఆవల (ఈ యోగి) సంస్థితుడై, మనస్సును తన నుండి జనించు ‘కళ-అంశ’గా సందర్శిస్తూ ఉండటము. మనస్సుకు విషయములగుచున్నవన్నీ ఆత్మకు అభిన్నంగా గమనించటము. మనస్సు అఖండాత్మ రూపమును స్వయముగా సంతరించుకోవటము.

అక్ష - తారక విద్య

కనుల యందు ఆకాశమును మనస్సుతో గమనిస్తూ ఆరాధించు విధిని ‘అక్ష-తారకవిద్య’ అని పిలుస్తున్నారు. అట్టి తారక విద్యచే కనులలో గల చీకటి - తేజస్సులు ప్రవర్తిస్తూ కనిపించు స్ఫురణవ్యోమ్ని (ఆకాశము) ను ఉపాసించు యోగులకు సూర్యచంద్రుల ఉనికి కనులలో అనుభూతమౌతుంది. అనగా కనుల స్థానములో సూర్య - చంద్రమండలముల దర్శనము కాగలదు.

బ్రహ్మాండమివ…  పిణ్డాన్డ  … శిరో మధ్యస్త ఆకాశే, ’రవి ఇన్దుమండలమ్ - ద్వితీయమ్ అస్తి,
ఇతి నిశ్చిత్య తారకాభ్యాం, దర్శనమాత్రాపి ఉభయ ఐక్య దృష్ట్వా మనోయుక్తం ధ్యాయేత్ !

బ్రహ్మాండమువలె పిండాండము(భౌతిక వ్యష్ఠి - దేహము)లోగల ద్వితీయ సూర్య - చంద్ర మండలముల ఉనికిని యోగాభ్యాసముచేమనస్సుతో గమనిస్తున్నారు. (తత్ - ఆకాశాంతర్గముగా), "ఆకాశములోని సూర్య చంద్రమండల ద్వితీయ రూపమే నా శిరో ఆకాశములో వేంచేసి ఉన్నది”….. అని గమనించి ఉపాసిస్తున్నారు. అట్టి బుద్ధి నిశ్చయముతో శిరస్సులోను (లేక) రెండు కనులలోను గల దహరాకాశములో సూర్యచంద్రమండలముల స్థానమును మనోనిశ్చయము - మననము ద్వారా ధ్యానించాలి.

మూడవది జ్ఞానాగ్ని. ఈ విధంగా 1. ఆకాశములోని సూర్య చంద్రమండలములను, 2. స్వీయ శిరో ఆకాశములోని కనులలో గల సూర్యచంద్ర మండలములను ఈ రెండిటినీ మనస్సుతో ఏకంచేసి ధ్యానిస్తే, అట్టి యోగాభ్యాసి ఇంద్రియములను (శబ్ద - స్పర్శ - రూప - రస - గంధముల అభి నివేశమును, ఆకర్షణనను, వాటితో ఏర్పడుచున్న అనుబంధములను, అభ్యాస - ఆవేశములను) జయించి వేయగలడు. జ్ఞానాగ్నిచే దృశ్యవిషయములు దగ్ధమై ఆత్మత్వమును సంతరించుకుంటాయి.

మరొక ముఖ్య విషయం! ’సంసారము’ను తత్త్వదృష్టితో జయించకపోతేనో,… యోగ సాధనకు ఇంద్రియ విషయములు - ’ఏమార్చే అడ్డంకులు’గా ప్రవర్తిస్తూ ఉంటాయి. ఇంద్రియములను స్వాధీనం చేసుకోకపోతే-ఆ యోగ సాధకుడు అంతర్లక్ష్య-బహిర్లక్ష్య-మధ్య లక్ష్య తారక యోగములో ప్రవేశించలేడు. ఇక్కడి విషయములను, సంబంధములను, సంఘటనలను, సందర్భములను మొదలైన వాటిని లోక సంబంధమైన(లౌకిక) దృష్టితో కాకుండా, బ్రాహ్మీదృష్టితో చూడటమే సంసార జయము. తత్త్వ దృష్టియే సంసార రోగమునకు ఓషధం.

ఈ విధంగా అంతర్ - దృష్టి రూపమగు ‘తారకము’ యొక్క అనుసంధానము సంసార బద్ధునికి (దృశ్యముచే నేను బద్ధుడను కదా…. అని భావించువానికి) అత్యంత ఆవస్యకమైనదని ఈ అద్వయ తారకోపనిషత్ ఎలుగెత్తి గానము చేయుచున్నది.

మూర్తి - అమూర్తి విభాగ తారక - యోగము

ఇప్పుడు మనము ‘తారక యోగము’ నకు సంబంధించిన మరొక విభాగ యోగవిధి గురించి చెప్పుకుంటున్నాము. అట్టి ఈ మరొక విధమైన విభజన (Divisional Analysis) - రెండు రీతులుగా విభజించి చెప్పబడుతోంది. 1) మూర్తి తారకము 2) అమూర్తి తారకము.

మూర్తి తారకము - ఇన్ద్రయాన్తమ్ :

యత్ ఇన్జియాన్తమ్, తత్ మూర్తిమత్ |  ఏ తారక యోగ విధానములో "ఇంద్రియములను దాటి, ఇంద్రియములకు ఆధారమై… కదలుచున్న వాటినన్నిటినీ కదిలించుచున్నదై…” ఇంద్రియములను (కన్ను-చూపు, చెవి - వినికిడి, చర్మము - స్పర్శ, నాలుక - రుచి, ముక్కు – వాసనలను) చైతన్యవంతముగా చేయుచున్నదో అద్దానిని “మూర్తితారకము” అని అంటారు. అది భ్రూమధ్య గల ఆకాశములో - సమావేశమగుచున్న ఇంద్రియ తత్త్వములను గమనిస్తూ, వాటికి మూలమగు చైతన్యాకాశములో మనస్సును ప్రకాశింపజేసి ఉపాసించటము అయివున్నది.

అమూర్తి తారకము - భ్రూయుగాతీతమ్ - భ్రూమధ్యాతీతమ్ :

యత్ భ్రూయుగాతీతమ్, తత్ అమూర్తివత్ |  ఏదైతే భ్రూఆకాశమును దాటివేసిన, సహస్రారము వరకు, ఆపై 12 అంగుళముల వరకు, ఇంకా ఆపై బ్రహ్మాండమంతా వ్యాపించినదై ఉన్నదో, అట్టి దహరాకాశమును బుద్ధితో గమనించి, మనస్సుతో ఉపాసించు యోగసాధన ‘అమూర్తి తారక యోగ సాధన’ అని పిలువబడుచున్నది.

అయితే…
మూర్తి - అమూర్తి ఉభయతారక యోగములలో కూడా - బాహ్యమును బాహ్యముననే వదలి, “అంతః పదార్థ వివేచన” కొరకై బుద్ధిని ఉపయోగిస్తూ ఆ తారక యోగాభ్యాస మనోయుక్తమైన సాధనకు ఉపక్రమించవలసిందే!

తారకాభ్యాసముచేత బుద్ధిని నియోగించి, ఈ ముముక్షువు అంతరిక్షమునందు (లేక) నిర్విషము శూన్య స్థానమునందు మనస్సును జేర్చి యోగాభ్యాసము కొనసాగించుగాక ! అట్టి తారక యోగభ్యాసము యొక్క ఔనత్యముచే చివరికి అనుభూతమయ్యేది ఏది? సత్ చిత్ ఆనంద స్వరూపమగు పరబ్రహ్మమే.

తెల్లటి జ్యోతికాంతితో, శుక్ల తేజోమయమై బ్రహ్మమే సర్వే సర్వత్రా వెల్లివిరిసి యున్నది.
తస్మాత్ శుక్ల తేజోమయమ్ బ్రహ్మేతి సిద్ధమ్ ! అనునది స్వభావ సిద్ధమై అనుభవమునకు వచ్చుచున్నది.

తత్ బ్రహ్మ మనః సహకారి చక్షుషా అంతర్దృష్ట్యా వేద్యం భవతి ! అట్టి బ్రహ్మము మనో దృష్టికి అంతర్దృష్టిచే మాత్రమే అనుభవమవగలదు. అది మూర్తి తారక లక్షణ లక్ష్యముచే సాధ్యం ! అదే విధంగా మనోయుక్తమైన కనులకు (దివ్య చక్షువులను - perception with common sense) మాత్రమే అమూర్తి తారకము కూడా దహరాకాశ దర్శనమును అందించగలదు. అట్టి దహరాకాశ మనో దర్శన అభ్యాస - యోగోపాసనచే అఖండాత్మ అనుభూతము కాగలదు.

మనస్సుచేత ఆత్మ ఎరుగబడుచున్నది. అంతేగాని, భౌతికమైన చక్షువులకు కానే కాదు. ఆ మాటకువస్తే …, బాహ్యమున కూడా ఈ భౌతికమైన కళ్ళు ఒక రూపమును ంటే కూడా ఆ అనుభవము మనో చక్షువుల ఆధీనములోనే ఉన్నది. బాహ్యమున ఒక వస్తువును చూడటానికి గాని, అంతరమున తారక యోగా భ్యాసముచే దహరాకాశదర్శనముగాని, ఆ తరువాత ద్రష్ట - దృశ్యముల ’కేవల స్వస్వరూప’ దృక్ దర్శనానుభవానికి గాని… మనస్సే మార్గము. మనస్సే బంధము. మనస్సే ఆత్మానుభవమునకు ఉపకరణము.

మరల చెప్పుకుంటున్నాం!

బాహ్యమునగాని, అంతరమునగాని ఆత్మ + మనస్సు + చక్షువులు ఈ మూడింటి సంయోగము అయినప్పుడు మాత్రమే ఒక రూపము యొక్క గ్రహణము (Experiencing of any form or object) సాధ్యం.

అందుచేత…
తస్మాత్ మనోయుక్తా అంతర్దృష్టిః తారక ప్రకాశాయ భవతి | మనస్సుతో కూడిన అంతర్దృష్టి చేతనే (మనస్సు - అంతర్దృష్టి సంయోగము పొందినప్పుడు మాత్రమే)… తారకతత్త్వము కూడా ప్రకాశమానమై అనుభవముగా సిద్ధించగలదు.

తారక యోగము - భ్రూమధ్య బిల్వద్వార ఊర్ధ్వ తేజో ఉపాసన

తారకయోగ విధి - తత్త్వముల గురించి మరికొన్ని విశేషాలు దృష్టిలో పెట్టుకొని వివరించుకొనెదము గాక !

భ్రూయుగ మధ్య బిలే దృష్టిమ్, తత్ ద్వారా - ఊర్ధ్వస్థిత తేజ ఆవిర్భూతమ్… “తారకయోగో” భవతి !

పూర్వ భాగీతారకము - సహమనోయుక్త తారకము

తేన సహ మనోయుక్తం తారకమ్ సుసంయోజ్యం |
ప్రయత్నేన ‘భ్రుయుగ్మమ్’ సావధానతయా కించిత్
ఊర్ధ్వమ్, ఉత్-క్షేపయేత్ - ఇతి పూర్వభాగీ తారక యోగః ||

పైన చెప్పిన తారకములందు మనస్సును నియమించి, మనో దృష్టిని నిలిపి, నిశ్చలము చేసి, సుస్థిరముగా చేయు సావధాన పూర్వకమైన ప్రయత్నమే మనస్క - తారక యోగాభ్యాసము. అంతర్గతముగా మనస్సుతో కూడిన దృష్టిని నిలుపుట అందుకు విధానము. దృష్టిని భ్రూమధ్య స్థానము నందు నిలిపి, అద్దానియండలి ఆకాశ తేజో దర్శనము చేయుటము. అట్టి యోగసాధన చేయుచున్నప్పుడు కనుబొమ్మలను కొంచము ఊర్ధ్వము (upward) గా ఎత్తి ఉంచాలి. అట్లాగే దృష్టిని కూడా! అట్లా ఎత్తి ఉంచటము వలన సావధానము (Attentivity) వృద్ధి చెందగలదు. ఈవిధంగా మనస్సును అంతర్గతి - ఊర్ధ్వగతియందు నియమించుచూ, తారకోపాసన నిర్వర్తించు విధిని  ‘పూర్వభాగీ తారకము’ అని అంటారు.

ఉత్తర భాగీ తారకము - అమనస్కము

ఉత్తరం తు అమూర్తిమత్ అమనస్కమ్ ఇతి - ఉచ్యతే |
- అమూర్తివంతము (Formless)
- అమనస్కము. మనస్సు పాల్గొననట్టి కేవలీ-బుద్ధికి స్వభావంగా నిత్యానుభవమై సిద్ధించే - అభావస్థితి.

ఇది పూర్వభాగీతారకము యొక్క శ్రద్ధతో కూడిన అభ్యాసముచే లభించు ఉత్తరోత్తర స్థితి విభాగము.

మనస్కమ్ = మనస్సుతో వేరుగా చూడటము
అమనస్కమ్ = ఆ అనుభూతము - అనుభవము తానే అయి (తత్ రూపమై) ప్రకాశించటము. మనస్సుకు కూడా సాక్షిత్వము. మౌన స్వకీయము. దృశ్యమును తనయందు లయింపజేసుకొను స్థితి - తరంగము జలమునందు లయమగు తీరుగా!

తాలు మూలో ఊర్ధ్వ - మహత్ జ్యోతిర్మయూ - ఉపాసన

ఇక్కడ మరొక ఉపాసనకొరకై తారక లక్ష్యమును చెప్పుకుంటున్నాము.

తాలుమూల ఊర్థ్వభాగే … మహాన్ జ్యోతిర్మయూఖ్యో వర్తతే !
తాలువు (దవడ) యొక్క ఊర్థ్వ భాగముగా మహత్తరమైనటువంటి జ్యోతి (వెలుగు, కాంతి) విరాజమానమైయన్నది. తత్ యోగిభిః ధ్యేయమ్।  తారకయోగ అభ్యాసులచే అట్టి మహత్తరమగు జ్యోతి కాంతి పుంజములు బుద్ధితో గమనించబడుచూ, మనోబుద్ధులచే ధ్యానింపబడుచున్నాయి. అట్టి తాలు ఊర్ధ్వభాగ-మహత్ జ్యోతి తేజస్సును ఉపాసించుచున్నట్టి యోగులు “అణిమ - మహిమ - గరిమ - లఘిమ - ప్రాప్తి - ప్రాకామ్య - ఈశత్వ - వశిత్వములనబడే అష్టసిద్ధులు సిద్ధింప చేసుకోగలరు కూడా!

శాంభవీముద్ర

ఇప్పటి వరకు మనము చెప్పుకున్న అంతర - బాహ్య లక్ష్య లక్షణోపాసన రూపమగు తారకోపాసన సహాయంతో - నిమేష ఉన్మేష వర్జితాయాం! కనులు తెరిచినప్పుడు కనులు మూసుకున్నప్పుడు కూడా ఆ మూయటానికి తెరవటానికి సంబంధము లేకుండా… సమరసత్వమగు పరబ్రహ్మమునే ధ్యానిస్తూ భావిస్తూ ఏ యోగి దర్శిస్తూ ఉంటాడో… అట్టివారు ‘శాంభవీముద్ర’ ధరించినవాడుగా చెప్పబడుచున్నాడు.

తన్ముద్రా “ఆరూఢజ్ఞాని" నివాసాత్ భూమిః పవిత్రా భవతి |
అట్టి శాంభవీ ముద్ర (సర్వము పరమాత్మ యొక్క (లేక) పరహ్మము యొక్క ప్రత్యక్ష పరోక్ష రూపమే! పరమాత్మయే సర్వములో-సర్వముగా ఈ సర్వమై కనిపిస్తూ ఉన్నారు - అను బుద్ధినిశ్చలత) ను అభ్యసించి, సాధన చేస్తూ (అనుకుంటూ అనుకుంటూ ఉంటూ) ఉన్నవాడు, ఒకానొకప్పుడు - అప్రయత్నంగానే అనిపించే స్థితికి చేరుచున్నాడు. ఆ మహామహితాత్ముడగు మహనీయుడు ఏ భూప్రదేశములో ఉంటే ఆ ప్రదేశమంతా పరమపవిత్రము అగుచున్నది. (తీర్థం కరోతి తీర్థాని). ఆయనను దర్శించినంత మాత్రము చేతనే లోక జీవులు కూడా పవిత్రులు కాగలరు. అట్టి శాంభవీముద్రా దిగ్విజయ పరమయోగిని ఎవరు పూజిస్తారో… వారు కూడా ముక్తులు కాగలరు.

జలజ్యోతి (తరంగ అతీత దృష్టి)

అమనస్క రూపమగు తారక యోగము యొక్క అంతర్లలక్ష్య లక్షణోపాసకుడు అపః జ్యోతి (జల జ్యోతి జగత్జ్యోతి) స్వరూపుడగుచున్నాడు.

ఆ విధంగా అంతర్లక్షణ లక్షణులైన తారకసిద్ధ యోగీశ్వరులు ఉన్నారు. వారు ఈ భూమిపై సంచరిస్తూ తాము ఉన్న పరిసరములలో అద్వయ తారక కిరణములను వెదజల్లుచూ, ఆశ్రయించిన జీవుల అజ్ఞానాంధకారమును పటాపంచలు చేయుచున్నారు.

ఓ ప్రియజనులారా!

అట్టి పరమ గురువుల సూచనలను, మార్గదర్శనములను, బోధలను వినండి.

పరమగురూపదేశేన సహస్రారే జలజ్యోతిర్వా, బుద్ధి గుహా నిహిత చిత్ జ్యోతిర్వా,
షోడశ అన్తస్థ తురీయ చైతన్యం వా అన్తర్లక్ష్యమ్ భవతి। 

వారి ఉపదేశానుసారము సహస్రారస్థానమునందు జలజ్యోతి దర్శనము - తదుపాసనలు చేతను, తన్మయమగుట చేతనూ.. (లేక) బుద్ధి గుహయందు నిహితమై, సంస్థితమై, అజ్ఞానపొరల క్రింద దాగియున్న చిత్ జ్యోతిని దర్శిస్తూ, ఉపాసిస్తూ తత్స్వరూపమగుట చేతనూ.. (లేదా) షోడశ దళములకు (పంచ కర్మేంద్రియ - పంచజ్ఞానేంద్రియ - మనోబుద్ధి చిత్త అహంకార - జీవ - ఈశ్వరులకు) అంతస్థము అయి, మూల స్వరూపమైనటువంటి (By which all these are made up of) తురీయము యొక్క ధ్యానము చేతనూ తారకము సిద్ధించుచున్నది ! ఈ మూడు కూడా తారక అంతర్లక్ష్య లక్షణములు.

అయితే అట్టి తురీయ చైతన్య సందర్శనమునకు ముఖ్య సహకారికారణము - గురుబోధ, గురు అనుగ్రహము అయి ఉన్నది. గురియే గురువు. తురీయ చైతన్య సిద్ధి పొందిన మహనీయుడు గురువై తనను ఆశ్రయించిన శిష్యులకు మార్గము చూపుచున్నారు. తత్ దర్శనమ్ సదాచార్యమూలమ్! సదాచార్యుల కృపచే తారక యోగము సులభమగుచున్నది. అది సిద్ధించునొన్నవారు ‘ఆచార్యులు’ అని చెప్పబడుచున్నారు. తారకయోగ సిద్ధికై మహనీయులగు అట్టి ఆచార్యులను శరణువేడెదరు గాక!

ఆచార్య లక్షణములు

మహనీయులగు ఆచార్యుల సహజ లక్షణములు కొన్ని ఇప్పుడు మనము చెప్పుకుంటున్నాము.

ఆచార్యో వేద సంపన్నో : తెలుసుకొనవలసినది తెలుసకొన్నవారు. తెలియబడుచున్నదంతా తత్త్వతః బ్రహ్మముగా తెలిసియున్నవారై, వేద సంపన్నులు అయి ఉంటున్నవారు. వేదములు బోధించు సారవిషయము ఏమిటో ఎరిగి ఉన్నవారు. “తత్ త్వమ్ అసి - నీవు అదియే” అని శిష్యుని గురించి ఎరిగియే ఉన్నవారు.

విష్ణు భక్తో : సర్వే సర్వత్రా సమముగా వేంచేసియున్న విష్ణుతత్త్వ సందర్శకులు, సత్ఉపాసకులు. స్వయం విష్ణు తత్త్వ ప్రదర్శనాశీలురు అయి ఉంటున్నారు. భక్తిః జ్ఞానమ్ ప్రజాయతే! పూర్ణ జ్ఞానులై ఉండి కూడా, పరా ప్రేమ రూపమగు భక్తిని వదలని వారు. భక్తి-జ్ఞానములలో ఒకటి తాను వదలితే, రెండవది తనను వదలి దూరమవగలదని ఎరిగినవారు.

విమత్సరః : గర్వము-మదము-మత్సర్యము ఏ మాత్రము లేని వారు. “నేను గొప్ప ! వారు కాదు”… అను స్ఫురణయే లేని వారు. ‘సర్వము బ్రహ్మమే’ అను నిత్యధారణ కలవారు.

యోగజ్ఞో : యోగతత్త్వము తెలిసియున్నవారు. శిష్యుని స్థితి తెలిసి, అతనికి సానుకూలమగు ఉద్వేగరహితమైన యోగమార్గము చూపగలిగినవారు. శిష్యుని తత్ స్వరూపునిగా భావించువారు. భవరోగమును ఎరిగి, సరియగు ఔషధమును సూచించగల భిషజులు (వైద్యులు).

యోగ నిష్ఠశ్చ : యోగ నిష్ఠాపరులై ఉంటారు. “జీవబ్రహ్మైక్యమితి యోగమ్! మత్తః పరతరమ్ న అన్యత్ కించిత్ అస్తి - ఇతి
యోగమ్” ఇత్యాది నిర్వచనములు ఎరిగి ఉన్నవారు.

సదా యోగాత్మకః : సర్వదా తురీయాతీత స్వరూపులై జగత్తులను స్వస్వరూపముగా ధారణ చేస్తూ శ్రోత యొక్క ఆత్మను స్వస్వరూప భావనతో నిత్యానుసంధానము చేస్తూ సదానందులై ఉండువారు.

శుచిః : వారి వాక్కు - మనో - బుద్ధి - చిత్తములు శుచి అయినట్టి ఆత్మౌపమ్యేవ సర్వత్రా తత్ సందర్శనభావ అభిరుచులతో నిండి ఉంటాయి.

గురుభక్తి సమాయుక్తిః : గురుభక్తి సమాయుక్తులై ఉంటారు. అనుభవజ్ఞులు - దార్శనికుల మహనీయుల ప్రవచనములను, వేదవాక్యములను ప్రమాణములుగా దృష్టాంతములుగా వచించటం చేయువారు!

పురుషజ్ఞో విశేషతః : విశేషమగు పరమ పురుషుని ఎరిగి ఉంటారు. జీవాత్మకు ఆవల, జీవాత్మకు సాక్షి ప్రేరకుడు అగు చైతన్య పరమ పురుషుని ఎరిగినవారై ఉంటారు. చైతన్యానంద స్వరూపులై ప్రకాశించువారు.

ఇటువంటి విశేషగుణ సంపన్నులను గురుతుల్యులుగా భావించబడునుగాక ! పై లక్షణములు కలవారు గురుస్వరూపులే ! ఆరాధ్య దైవ సమానులే ! ఎందుచేతనంటారా? వినండి!

‘గు’ - కార అంధకారస్యాత్,
‘రు’ - కార తన్నిరోధకః |

మనలో ఆత్మ జ్ఞానజ్యోతిని వెలిగించి, అజ్ఞానాంధకారమును మొదలంట్లో తొలగిస్తారు కదా! కాబ ‘గురు’ అను శబ్దముచే చెప్పబడుచున్నారు.

గురురేవ … పరబ్రహ్మ ! జీవాత్మకు ఆవల గల ఆత్మసాక్షి స్వరూపము !

గురురేవ పరాగతిః ! పరమునకు మార్గము చూపువారు. ఇహత్వపరిమిత జన్మ-తదనంతర జన్మ - జన్మాంతరముల జాడ్యము తొలగించుకోవటానికి ‘గతి’ (మార్గము) అయి ఉన్నవారు. మార్గాన్వేషకులకు మార్గదర్శకులు.

గురురేవ… పరావిద్యా ! వారే పరా విద్యా స్వరూపులు! ఆత్మ విద్యా బోధకులు! స్వయమాత్మానంద స్వరూపులు!

గురురేవ పరాయణమ్ ! పరమాశ్రయలు వెతికి వెతికి చేరవలసినది ఆ సద్గురువు పాదాలనే!

గురురేవ పరంధనః ! పరమునకు ధనమువంటి వారు. యోగ-ధ్యాన సంపదను ప్రసాదించువారు.

యస్మాత్ తత్ ఉపదేష్టా సౌ, తస్మాత్ గురుతరో గురు ఇతి !

మహత్తరము, మనలో ప్రతి ఒక్కరి యొక్క సహజ స్వరూపముఅగు తత్ పరమాత్మత్వమును విశదీకరించి, ఉపదేశిస్తూ, మనకు సుస్పష్టపరుస్తారు కదా ! అందుచేత వారిని ‘గురు’… అని ఎలుగెత్తి పిలుస్తున్నాము ! శరణువేడుచున్నాము.

ఎవ్వరైతే గురుస్తోత్రముతో కూడి తారక యోగమును వివరిస్తున్న ఈ ‘ఆద్వయతారకోపనిషత్’ ను పరమార్ధతః పఠిస్తారో, ఉపాసిస్తారో, ఉపదేశిస్తారో, వారు సంసార సాగరము నుండి విముక్తులు కాగలరు.

గురోపాసన - తారకయోగాభ్యాసములను ప్రారంభించిన వెను వెంటనే, ఆ మరుక్షణమే, అనేక జన్మకృతములగు పాపములు అగ్నిలో వేసిన కట్టెలవలె భస్మము కాగలవు. వారు కోరుకొన్నది. సిద్ధించగలదు.

సర్వపురుషార్థ సిద్ధిఃభవత, య ఏవం వేద |
ఈ ఉపనిషత్ చూపు ‘పరబ్రహ్మము’ అనబడు స్వస్వరూప పరమ సత్యమును ఎరుగుచుండగా చతుర్విధ పురుషార్ధములు తమకుతామే సిద్ధించుచున్నాయి.

🙏 ఇతి అద్వయ తారకోపనిషత్ 🙏
ఓం శాంతిః శాంతిః శాంతిః