[[@YHRK]] [[@Spiritual]]
Aitarēya Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 1
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: yhrkworks@gmail.com
ప్రథమాధ్యాయము - 1వ ఖండము
1.) ఓం ఆత్మా వా ఇదమ్ ఏక ఏవ అగ్ర ఆసీత్ । న అన్యత్ కించనమ్ ఇషత్ । స ఈక్షత లోకాన్ను సృజా - ఇతి ॥ |
ఓం! ఈ అద్భుతమైన అనంత సృష్టికి మునుముందే ఉన్నట్టిదేది? ఆత్మయే! అట్టి ఆత్మ ఏక స్వరూపమై (అఖండమై-అద్వితీయమై) ఉండి ఉన్నది! ఏకము అఖండము అగు అట్టి ఆత్మకు “అన్యము” అనునది ఏదీ లేకుండెను. అనన్యమై ఉన్నది. ఈ పరిణామ జగత్తు (మొట్టమొదట) లేదు! అట్టి ఆత్మ “నేను ఏకమై, నాకు అన్యమైనదే లేనప్పుడు ఏమీ వినోదము, ఉబుసుపోక లేవు! అందుచేత లీలగా, (తమాషాగా, సరదాగా) లోకములను కల్పనగా సృష్టించుకొని క్రీడించెదను గాక! వినోదించెదను గాక!” - అని తలచింది. |
|||||||||||||||||||||||||||
2.) స ఇమామ్ లోకాన్ అసృజత । అంభో, మరీచిః, మరమ్ । ఆపో అంభః । పరేణ దివం ద్యౌః ప్రతిష్ఠా । అన్తరిక్షం - మరీచయః పృథివీ మరో । యా అధస్తాత్ తా ఆపః ॥ |
అట్లు “సృష్టించుకొనెదనుగాక!" అని ఆలోచించి, క్రమంగా…, 1. అంభో (పైన గల - స్వర్గ) లోకము (ద్యులోకము - స్వర్గలోకమునకు పైనగా ఉన్న లోకము) 2. మరీచి లోకము (ఆకాశ) 3. మరలోకము / భూలోకము (మరణమే స్వభావముగాగల భూలోకము) 4. ఆపోలోకము - భూలోకము కంటే క్రింద ఉన్నట్టి జలలోకము. పాతాళము మొ||వి. (ద్యులోకము అంభో లోకమునకు ఆధారము.) |
|||||||||||||||||||||||||||
3.) స ఈక్షత ఇమేను లోకా లోకపాలాన్ను సృజా - ఇతి సో అద్భ్య ఏవ పురుషమ్, - సముద్ధృత్యా - అమూర్ఛయత్। |
“సరే! లోకాలైతే సృజించాను. ఇప్పుడు వీటిని పరిపాలించటానికి లోకపాలకుడు కావాలి కదా!” అని (ఆత్మ భగవానుడు) అనుకున్నారు. ఈవిధంగా ఆలోచించి జలము మధ్యనుండి సమర్ధత-ఉత్సాహము గల సాహసవంతుడైన ఒక పురుషతత్త్వమును (పురుషాకారము కలవానిని) సృజియించారు! మంచి రూపము సామర్థ్యము-సాహసము-ఉత్సాహము కలవాడుగా చేశారు. (సృష్టికి కర్త - బ్రహ్మదేవుడు - ప్రజాపతి). |
|||||||||||||||||||||||||||
4.) తమ్ అభ్యతపత్ । తస్య అభితప్తస్య ముఖం నిరభిద్యత । యథా అణ్డమ్ । ముఖాత్ వాక్ । వాచో అగ్నిః, నాసికే నిరభిధ్య ఏతామ్, నాసికాభ్యాం ప్రాణః । ప్రాణాత్ - వాయుః । అక్షిణీ నిరభిద్యేతామ్ । అక్షిభ్యాం చక్షుః । చక్షుష ఆదిత్యః । కర్ణౌ నిరభిద్యేతామ్ । కర్ణాభ్యాం శ్రోతం । శ్రోత్రాత్ దిశః ॥ (అభిద్యా = పరధన - విషయే ఇచ్ఛా) |
ఆ పురుషాకారుని గురించి మరికొంతగా యోచనచేశారు. ఆ ఆత్మదేవుని సంకల్పానుసారం నోరు-ఒక గ్రుడ్డు బయల్వెడలు రీతిగా - వికాసమానమైనది. - నోరు నుండి - వాక్కు. - వాక్కు నుండి - అగ్ని పుట్టాయి. తరువాత ఆత్మకు అనన్యమైన ఆ పురుషకారమునకు నాశికా (ముక్కు) రంధ్రములు ఏర్పడినాయి. వాటి నుండి ప్రాణము ఉదయించింది. ఆ ప్రాణ శక్తినుండి వాయువు (చలనశక్తి) జనించింది. ఆపై పరమాత్మ నుండి రెండు నేత్రములు వికశించాయి. ఆ నేత్రముల నుండి చక్షురింద్రియశక్తి (చూపు), ఆ చూపునుండి ఆదిత్యుడు (సూర్యుడు) జనించారు. - ఇంకా ఆపై ఆ పరమాత్మ నుండి చెవులు వికశించాయి. ఆ చెవులనుండి వినికిడి శక్తి బయల్వెడలింది. ఆ వినికిడి నుండి దిక్కులు బయల్వెడలాయి. |
|||||||||||||||||||||||||||
త్వక్ నిరభిద్యత । త్వచో లోమాని । లోమభ్య ఓషధి - వనస్పతయః । |
ఆయనపట్ల చర్మము వికసితమయింది. ఆ చర్మము నుండి స్పర్శశక్తి, అట్టి స్పర్శ శక్తి నుండి ఓషధులు (వరి, గోధుమ మొ||వి), వనస్పతులు (వృక్షజాతులు) జనించాయి. |
|||||||||||||||||||||||||||
హృదయం నిరభిద్యత । హృదయాత్ మనః । మనసః చంద్రమాః । నాభిః నిరభిద్యత । నాభ్యా – అపానః । అపానాత్ – మృత్యుః । శిశ్నమ్ – నిరభిద్యత । శిశ్నాత్ – రేతః । రేతస – ఆపః॥ |
ఆయన నుండి హృదయము ప్రదర్శితమయింది. ఆ హృదయము నుండి మనస్సు బయల్వెడలింది. మనస్సు నుండి చంద్రుడు ఉదయించారు. ఆయన నుండి నాభి (బొడ్డు స్థానము) ఏర్పడినదైనది. ఆ బొడ్డు నుండి అపానవాయువు బయల్వెడలింది. అద్దానినుండి మృత్యు దేవత (మార్పు-చేర్పు) జనించింది. ఆయన నుండి శిశ్నము (శృంగారాంగము) ఏర్పడినదైనది. అద్దాని నుండి రేతస్సు జనించింది. అద్దాని నుండి “జలము” బయల్వెడలింది. |
|||||||||||||||||||||||||||
ఇతి ప్రథమాధ్యాయే ప్రథమ ఖండః సమాప్తం |
|
|||||||||||||||||||||||||||
ప్రథమాధ్యాయము - 2వ ఖండము
5.) తా ఏతా దేవతాః సృష్టా అస్మిన్ మహత్య అర్ణవే ప్రాపతం తమ్ అశనాయా - పిపాసాభ్యామ్ అన్వవార్జత్ । తా ఏనమ్ అబ్రువత్: “ఆయతనం నః ప్రజానీ హి యస్మిన్ ప్రతిష్ఠితా ”అన్నమదామా" ఇతి ॥ |
ఈవిధంగా ఆత్మ భగవానునిచే వాక్కు, అగ్ని, ప్రాణము, వాయువు, దృష్టి, ఆదిత్యుడు, వినికిడి, దిక్కులు, స్పర్శ, ఓషధులు, వనస్పతులు, హృదయము, చంద్రుడు, నాభి, అపానము, మృత్యువు, శిశ్న-రేతస్సు, మొదలుగా గల దేవతలంతా సృష్టించబడ్డారు. వారంతా (ఆత్మ) సముద్ర (దివ్య) జలతరంగాల వలె సృష్టిలో ప్రవేశించారు. ఆ కారణపురుషునికి (ఆత్మ లీలగా కల్పించిన జీవ పురుషునికి) ఆకలి-దప్పికలు కలిగేటట్లు చేశారు. అట్లా సృష్టించబడిన దేవతాశక్తులన్నీ ఆత్మభగవానుని సమీపించి… అయ్యా! మమ్ములను సృష్టించినారు సరే! ఇప్పుడు మేము అన్నము (Utillity /Activity / Executions) ఎక్కడ పొందగలమో అట్టి స్థానములను ప్రసాదించండి (Please show us the placement for our further functioning as per your pleasure) - అని కోరారు. |
6.) తాభ్యో గామాన యత్తా అబ్రువన్ “న వై నో అయమ్ అలమ్” ఇతి ॥ తాభ్యో అశ్వమ్ ఆనయత్తా । అబ్రువన్ । “న వై నో అయమ్ అలమ్” ఇతి ॥ |
ఆ దేవతా శక్తుల క్రియా విశేషముల నిమిత్తమై ఆత్మభగవానుడు ఒక ఆవును సృష్టించి అందించారు. అప్పుడా స్పష్టంతర్గత దేవతలు “ఓ ఆత్మదేవా! ఇంత మాత్రమే మా ఉనికికి, క్రియా విశేషాలకు ఏమాత్రము చాలదు కదా!!”…. అని పలికారు. అప్పుడు ఆత్మదేవుడు ఒక అశ్వము (గుర్రమును) సృష్టించి అందజేశారు. అప్పుడా దేవతలు - న వై నో అలమ్ ఇతి - “ఈ మాత్రం కూడా మాకు మామా ప్రదర్శనలకు సరిపోదే!” అని పలికారు. ఆవిధంగా అనేక జీవజాలము సంకల్పించబడింది. దేవతలు ఇంకనూ తృప్తిపడలేదు. |
7.) తాభ్యః పురుషమానయత్ । తా అబ్రువన్ సుకృతం బత । ఇతి ॥ పురుషోవా వ, సుకృతం తా అబ్రవీత్ యథా ఆయతనమ్ ప్రవిశత - ఇతి ॥ |
అప్పుడు ఆ పరమాత్మ పూర్ణ లక్షణ సంపన్నుడుగు ఒక పురుషుని (మానవుని) ఆకారము సృష్టించి ఆ దేవతలకు (దివ్య శక్తులకు ఎదురుగా నిలిపారు. అప్పుడా దేవతలు ఆ పురుషుని చూచి “ఆశ్చర్యం! ఈ పురుష (మానవ) రూపము బహు చక్కగా సృష్టించినారే!” అని సంతోషము ప్రకటించారు. అప్పుడు ఆత్మ దేవుడు - ”ఓ సృష్టి దేవతలారా! ఇక మీరంతా ఈ పురుష రూపములోని మీమీ స్థానములు మరింత నిండుగా చేరండి! మీమీ కార్యక్రమములను నిర్వర్తించండి.".. అని చెప్పారు. |
8.) అగ్నిః వాక్ భూత్వా ముఖం ప్రావిశత్ । వాయుః ప్రాణో భూత్వా నాశికే ప్రావిశత్ । ఆదిత్యః చక్షుః భూత్వా అక్షిణీ ప్రావిశత్ । దిశః శ్రోత్రం భూత్వా కర్ణా ప్రావిశత్ ॥ ఓషధీః - వనస్పతయో లోమాని భూత్వా, త్వక్ చం ప్రావిశత్ । చంద్రమా మనో భూత్వా హృదయం ప్రావిశన్ । మృత్యుః అపానో భూత్వా నాభిం ప్రావిశత్ । ఆపో రేతో భూత్వా శిశ్నం ప్రావిశన్ ॥ |
అప్పుడు పరమాత్మయొక్క ఆజ్ఞను ఆ దేవతలు శిరసావహించసాగారు. అగ్ని దేవుడు వాక్ స్వరూపులై ఆ పురుషుని ముఖములో ప్రవేశించారు. వాయు దేవుడు చూచువాడు అయి, చక్షువులు (చూపు) రూపము ధరించి కళ్ళు(Eyes)తో ప్రవేశించారు. దిక్ దేవతలు వినటము అయి, వినికిడి రూపము దాల్చి చెవులలో ప్రవేశించారు. ఓషధ-వనస్పత దేవతలు స్పర్శ రూప ధారణతో చర్మమునందు ప్రవేశించారు. చంద్రుడు ఆలోచనా స్వరూపుడై, మనోరూపము ధరించి హృదయంలో ప్రవేశించారు. మృత్యుదేవత మార్పు-చేర్పు శక్తి అయి, అపానవాయువు రూపము ధరించి నాభి (బొడ్డు)లో ప్రవేశించారు. ఆపః (జలము) దేవత రేతస్సు రూపము ధరించి శిశ్నము (పునరుత్పత్తి అంగము) నందు స్థానము స్వీకరించారు. |
9.) తమ్ అశనాయా-పిపాసే అబ్రూతామ్ ఆవాభ్యామ్ “అభిప్రజానీహి”, ఇతి ॥ తే అబ్రవీత్…, ఏతా స్వేవ వాం దేవతా స్వా భజామి ఏతాసు భాగిన్యౌ కరోమి ఇతి ॥ తస్మాత్ యస్య ఏకస్య చ దేవతాయైః హవిః గృహ్యతే, భాగిన్యాః ఏవ, అస్యామ్ అశనాయా - పిపాసే భవతః ॥ |
అప్పుడు ఇక ఆకలి - దప్పికలు పరమాత్మను సమీపించాయి. “హే ఆత్మభగవాన్! మరి మా ఇద్దరికీ కూడా ఎక్కడ ఉండాలో, స్థానమును నిర్దేశించి, మమ్ములను కూడా ఆజ్ఞాపించండి!” అని అభ్యర్థించాయి. అప్పుడు ఆత్మభగవానుడు “మిమ్ములను ఈ ఈ దేవతలతోపాటే అనుభాగినులుగా (లేక) సహభాగినులుగా.. (భాగస్వాములుగా) నిర్ణయించుచున్నాను. అంతేగాని, ఈ పురుష దేహములో మీకు వేరే ప్రత్యేక స్థానము ఉండదు. ”అందుచేత ఏ దేవతను ఉద్దేశ్యించి హవిస్సు ఇవ్వబడుచున్నదో… మీరు ఆ దేవతతోపాటే ఆ హవిస్సు స్వీకరించుచూ ఉండెదరు గాక!" అని నిర్ణయించారు. అందుచేత ఆకలి-దప్పికలు ఇంద్రియ దేవతలతోబాటే ఆయా స్థానములలో భాగస్వాములు కాసాగారు. ఇంద్రియములు పొందుచున్నవి తాము కూడా స్వీకరిస్తూ ఉండసాగారు. |
ప్రథమాధ్యాయము - 3వ ఖండము
10.) స ఈక్షత "ఇమే ను లోకాశ్చ, లోకపాలాశ్చ అన్నం ఏభ్యః సృజా”- ఇతి ॥ |
అప్పుడు ఆ పరమాత్మ – ఇదిగో ఇవి నేను సృష్టించిన భౌతిక లోకాలు, – వీరంతా నా కల్పనలోని లోకపాలకులు, వీరికి ఇక అన్నము (ఆహారము - Food Stuff / Consumption Material-Matters to Experience) కల్పించాలి కదా! అని యోచన చేశారు. |
11.) సో ఆపో (ద్రవము) అభ్యపత్ । తాభ్యో అభి-తప్తాభ్యో ‘ముర్తిః’ అజాయత । యా వై సా మూర్తిః అజాయత, అన్నం వై తత్ ॥ |
ముందుగా “జలము” గురించి యోచన-భావన చేశారు. ఆ జలము నుండి ఒక మూర్తి ప్రభవించింది. మూర్తీభవించిన శబ్ద-స్పర్శ-రూప-రస-గంధముల అనుభవజాలమే ‘ఆ మూర్తి’. అట్టి జలము నుండి ఏది మూర్తీభవించినదో…, అదియే అన్నముగా ఉండ సాగింది! (అదియే మూర్తీభవించిన స్థూల - సూక్ష్మ జాగ్రత్ రూపం) |
12.) తత్ ఏనత్ సృష్టమ్
పరాఙ్‌త్యజిఘాంసః
తత్ వాచా అజిఘృక్షత్ । తత్ న శక్నోత్ వాచా గ్రహీతుమ్ । స యత్ ఏనత్ వాచా అగ్రహైష్యత్ అభి-వ్యాహృత్య హైవ అన్నమ్ అత్రప్స్యత్ ॥ |
ఆవిధంగా పుట్టిన అన్నము వెనుకకు పరుగుతీయసాగింది. అప్పుడు ఆ అన్నదేవతను వాక్ శక్తి (వాక్ ఇంద్రియ దేవత) తన వాక్ బలముతో పట్టుకో యత్నించింది. వాక్ శక్తి అన్నమును (అనుభూతిని) పట్టుకోలేకపోయింది. ఒకవేళ వాక్కు అన్నమును పట్టుకోగలిగి ఉంటే అప్పుడు “మాట” చేతనే పురుషుడు అన్నము (ఆహారము) స్వీకరించి తృప్తిపొందగలిగేవాడు. అనగా “అన్నమ్” అని అనగానే మాట మాత్రంగానే ఆహారము దేహమునకు లభించేది. కాని, అది అట్లా జరుగలేదు మరి! |
13.) తత్ ప్రాణేన అజిఘృక్షత్ । తత్ న శక్నోత్ ప్రాణేన గ్రహీతుమ్ స యత్ అధైనత్ ప్రాణేన అగ్రహైప్యత్, అభిప్రాణ్య హి ఏవ అన్నమ్ అత్రప్స్యత్ ॥ |
అప్పుడు ప్రాణశక్తి (ప్రాణవిధి) ఆ అన్నమును ప్రాణశక్తి సమీపించి పట్టుకోవటానికి ప్రయత్నించింది. కానీ అన్నమును ప్రాణశక్తికి కూడా పట్టుకోవటం కుదరలేదు. ఒకవేళ ప్రాణశక్తి ఆ అన్నమును పట్టుకొనగలిగి ఉంటే, అప్పుడు గాలి పీల్చినంత మాత్రముచేతనే దేహమునకు అన్నము లభించి దేహము తృప్తి పొందేదే! మరి అట్లాగూ జరుగలేదు. |
14.) తత్ చక్షుషా అజిఘృక్షత్ తత్ న శక్నోః చక్షుషా గ్రహీతుమ్। స యత్ అధైనత్ చక్షుషా గ్రహ ఈష్యత్ దృష్ట్వా హి ఏవా అన్నమ్ అత్రప్స్యత్ ॥ |
అప్పుడు చక్షువులు చూపుతో ఆ అన్నమును (దృశ్యానుభవమును) పట్టుకోవటానికి ప్రయత్నించాయి. కానీ ఆ అన్నమును పట్టుకోలేకపోయాయి. ఒకవేళ చూపులు అన్నమును పట్టుకోగలిగి ఉంటే, అప్పుడు చూపుతోనే ఈ దేహి ఆహారము స్వీకరించి తృప్తి పొందగలిగేవాడే! కానీ అది ఆ తీరుగానూ సాధ్యపడలేదు! |
15.) తత్ శ్రోత్రేణా అజిఘృక్షత్ తత్ న శక్నోః శ్రోత్రేణ గ్రహీతుమ్। సయత్ అధైనత్ శ్రోత్రేణా అగ్రహి ఏష్యత్, శ్రుత్వా హి ఏవ అన్నమ్ అత్రప్స్యత్। |
అప్పుడు శ్రోత్రశక్తి (వినికిడి శక్తి) ఆ అన్నమును పట్టుకోవటానికై ప్రయత్నించింది. అది కూడా అన్నమును పట్టుకోలేక పోయింది. శ్రోత్రము (వినికిడి శక్తి) అన్నమును పట్టుకోగలిగి ఉంటే ఆహార పదార్థముల గురించి విన్నంత మాత్రము చేతనే ఆకలి తృప్తి పొందేది. కానీ అట్లా కూడా జరుగలేదు. |
16.) తత్ వచా అజిఘృక్షత్ తత్ న శక్నోతు వచా గ్రహీతుమ్। సయత్ అధ్యైనత్ వచా అగ్రహ ఏష్యత్ స్పృష్ట్వా హి ఏవ అన్నం అత్రప్స్యత్ ॥ |
అప్పుడు చర్మము యొక్క స్పర్శశక్తి అన్నమును అందుకోబోయినప్పటికీ అది స్పర్శకు సాధ్యం కాలేదు. ఒకవేళ స్పర్శశక్తి అన్నమును పట్టుకొన గలిగి ఉండి ఉంటే, అన్నమును స్పృశించినంత మాత్రముచేతనే దేహము అన్నమును పొందగలగటం జరిగేదే! కానీ అది అట్లాగూ అవలేదు! |
17.) తత్ మనసా అజిఘృక్షత్ తత్ న శక్నోత్ మనసా గ్రహీతుమ్। స యత్ అధైనత్ మనసా, గ్రహ్యైషత్, ధ్యాత్వా హి ఏవ అన్నమ్ అత్రప్స్యత్॥ |
ఇక మనస్సు అన్నమును పట్టుకోవటానికి ప్రయత్నించింది. కాని మనస్సు శక్యము కూడా కాలేదు. అన్నమును స్వీకరించలేకపోయింది. మనస్సు కనుక అన్నమును స్పృశించగలిగి ఉండి ఉంటే, అప్పుడు ఈ పురుషుడు (జీవుడు) అన్నము గురించి, ఆలోచన చేసినంత మాత్రం చేతనే ఆకలి తీరేది. అన్నపుష్టి లభించేదే! కానీ అట్లానైనా జరుగలేదు. |
18.) తత్ శిశ్నేనా అజిఘృక్షత్ తత్ న శక్నోః శిశ్నేన గ్రహీతుమ్। స యత్ యద్దైనత్ శిశ్నే న అగ్రహైష్యత్ విసృజ్య హి ఏవా అన్నమ్ అత్రప్స్యత్॥ |
అప్పుడు శిశ్నము స్థానంలో రేతస్సుగా వేంచేసియున్న దేవత అన్నమును పట్టుకోవడానికి ప్రయత్నించి, పట్టుకోలేకపోయింది. ఒకవేళ విసర్జననావయవమగు శిశ్నము తనయొక్క రేతస్సు శక్తిచే అన్నమును పట్టుకొనగలిగి ఉండి ఉంటే, అప్పుడు అన్నమును విసర్జించుటచే కడుపు నిండేది. అన్నము స్వీకరించిన ఫలము/ప్రయోజనము లభించేది. కానీ అది అట్లా అయి ఉండలేదు. |
19.) తత్ అపానేన అజిఘృక్షత్, తదా అవయత్| స ఏషోః అన్నస్య । గ్రహెూ యత్ వాయుః అన్నమ్ ఆయుర్వా ఏష యత్ వాయుః ॥ |
అప్పుడు అపానము అన్నమును పట్టుకొనే ప్రయత్నం చేసింది. అపానవాయువు అన్నమును గ్రహించగలిగింది. అట్టి అన్నమును పట్టుకోగలిగినట్టిదే వాయువు! ఈవిధంగా వాయువే అన్నము స్వీకరిస్తూ “ అన్నము” ద్వారా దేహములో ప్రాణధారణ చేయగలుగుచున్నది. |
20.) స ఈక్షత,
“కథం ను ఇదమ్ అదృతేస్యాత్?” ఇతి ॥ స ఈక్షత , “కతరేణ ప్రపద్యా?” ఇతి ॥ స ఈక్షత యది వాచా అభివ్యాహృతం, యది ప్రాణేన అభిప్రాణితమ్, యది చక్షుషా దృష్టమ్, యది శ్రోత్రేణ శ్రుతమ్, యతి త్వచ స్పృష్టమ్, యది మనసా ధ్యాతమ్, యది అపానేన అభ్యపానితం, యది శిశ్నేన విసృష్టమ్, అథ, కో2హమ్? ఇతి॥ |
అప్పుడు ఆత్మభగవానుడు ఈ పిండశరీరము నన్ను వదలి జీవించగలదా! లేదు కదా! మరి ఈ ఇంద్రియములు-ఇంద్రియ ప్రదర్శనములతో కూడిన దేహము (పురుషుడు, జీవుడు) తనకు తానుగా చైతన్యము (స్వకీయ ప్రవర్తనము) కాదు. ఒక కీలుబొమ్మలాటిది మాత్రమే! ఇక్కడ రెండు ప్రశ్నలు. 1. ఈ తోలు బొమ్మ స్వీయ ప్రజ్ఞతో చైతన్యవంతము కావాలంటే ఇందులో నేను చైతన్య స్వరూపుడనై ప్రవేశించినవాడనై వుండాలి. 2. నాయొక్క చైతన్యముచేత ఈ పురుషుని చైతన్యముతో నింపివేస్తేనో? ఇప్పుడీ దేహములోని చైతన్యము నన్ను వదలి, నాయొక్క ఇష్టాయిష్టాలు ప్రమేయం లేకుండా తనకు తానే ఇచ్ఛలో కూడినదై… - వాక్కుతో తన ఇష్టానుసారం మాట్లాడటం… (అభివ్యాహృతము), - నాచే పొందిన ప్రాణశక్తితో ప్రవర్తించటము (అభిప్రాణితము) - కళ్ళతో తనకు ఇష్టమైనది చూడటం (దృష్టమ్) - చెవులతో తన ఇచ్ఛానుసారంగా ఇష్టమైనది వినటం (శ్రుతమ్) - చర్మముతో స్పర్శానుభవము పొందటం (స్పృష్టము) - మనస్సుతో తనకు తోచినది ఆలోచించటము, (ఆలోచితం), - అపానము మార్గంగా వాయువును బహిర్గతం చేయడం (అపానం) - శిశ్నముతో విసర్జించటము ఇవన్నీ అస్మత్ చైతన్య స్వరూపుడగు జీవుడు తనకుతానే నిర్వర్తించేడట్లుచేసెదనుగాక! అయితే, అప్పుడు పరమాత్మనగు నా పాత్ర ఏమిటి? అని యోచించారు. |
21.) స ఏతమ్ ఏవ సీమానం విదార్యైతయా ద్వారా ప్రాపద్యత । స ఏషా విదృతిః నామ ద్వాః తత్ ఏతత్ అన్నాదనం । తస్య త్రయ ఆవసథాత్ త్రయః స్వప్నాః| ఆయమా వసథో, ఆయమా అవసథో, ఆయమా అవసథ ఇతి॥ |
“అందుచేత నేను యథాతథముగా ఉండియే చైతన్యస్వరూపుడనై ఈ దేహములలో ప్రవేశించి ఉండెదనుగాక!” అని అనుకున్నారు. దేహములోని చైతన్యము పరమాత్మకు వేరు (ద్వితీయము) కాదు!” - అను రీతిగా జీవాత్మ సిద్ధించింది. ఆ పరమాత్మ సీమానము (శిరస్సు యొక్క చిట్టచివరి ప్రదేశము)ను ఛేదించి, ఆ ద్వారము నుండి తాను కల్పించిన పురుషకార దేహములోనికి చైతన్యము రూపంగా ప్రవేశించారు. అట్టి పరమాత్మ యొక్క పురుషదేహ ప్రవేశమార్గమును “విదృతి” అని అంటారు. అట్టి విదృత - ఆత్మభగవానునికి ఆనందస్థానము (సహస్రార స్థానము) అయింది. అట్టి ఆత్మకు నివాస స్థానములు, సంచారస్థానములు, విశ్రాంతి స్థానములు - మూడు. 1. జాగ్రత్ 2. స్వప్న 3. సుషుప్తులు నేత్రములు, కంఠము, హృదయము-దేహములో ఆత్మకు ముఖ్య నివాస స్థానములు అయ్యాయి. |
22.) స జాతో భూతాని అభివ్యైఖ్యత్, “కిం ఇహ అన్యంవా అవదిషత్?” ఇతి। స ఏతమ్ ఏవ పురుషం బ్రహ్మ తతమ్ అమపశ్యత్ “ఇదమ్ అదర్శం” ఇతి| |
ఈవిధంగా పరమాత్మ ” పురుష దేహము“ లో సత్ చిత్ చైతన్యముగా ప్రవేశించటం జరిగింది. జీవాత్మగా పంచభూత నిర్మిత దేహముతో, తాదాత్మ్యము పొందటం జరిగింది. మరొకప్పుడు “ఇక్కడ నాకు అన్యమైనదేదీ లేదు కదా! నేను మాత్రమే ఉన్నాను” - అని గమనించారు. అప్పుడు ఆ దేహములోని పురుషుని దర్శించి, ”ఈ పురుషుడే పరబ్రహ్మ పురుషుడు, ఈతడే సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు. సర్వోత్కృష్టుడు కదా?" అని “అదర్శుడు” అని దర్శించాడు. |
23.) తస్మాత్ ఇదం ఇంద్రో నామ ఏతమ్ ఇంద్రో హ వై నామ। తమ్ ఇదమ్ ఇంద్రమ్ సంతమ్, ఇంద్ర ఇతి ఆచక్షతే పరోక్షేణ। పరోక్ష ప్రియా ఇవ హి దేవాః పరోక్షప్రియా ఇవ హి దేవాః|| |
ఆత్మ దేవుడే ఇంద్రియ తత్వమును అవధరించి ఇంద్రియములను పర్యవేక్షించువాడు, అధినాయకుడు అయ్యారు. అందుచేత “ఇంద్రుడు” అను నామధేయుడగుచున్నారు. దేవతలకు నాయకుడు కాబట్టి దేవేంద్రుడు. దేవతలు పరోక్ష ప్రియులు. (మానవునికి ఇంద్రియ-ప్రత్యక్షము ప్రియంగా ఉంటుంది). మనస్సులో నిర్వర్తించేది పరోక్షము. పరోక్షమును, పరోక్షోపాసనను, పరోక్షానుభవములను దేవతలుకు ప్రియమై ఉంటుంది. |
ఇతి ప్రథమాధ్యాయః |
ఇతి ప్రథమాధ్యాయము |
ద్వితీయాధ్యాయము - 1వ ఖండము
24.) ఓం పురుషే హ వా అయమ్ ఆదితో గర్భో భవతి। యత్ ఏతత్ "రేతః” తత్ ఏతత్ సర్వేభ్యో అంగేభ్యః తేజః। సంభూతమ్ ఆత్మన్యేవ ఆత్మానం భిభర్తి। తత్ యదా స్త్రీయాంసిం చ అథైనః జనయతి। తత్ అస్య ప్రథమం జన్మ॥ |
పురుష స్త్రీ సమాగమముచే ఇంద్రియదేవతల గృహమువంటి ఈ జీవుల దేహపరంపరలు ఏర్పడుచున్నాయి. మొట్టమొదటగా పురుషునియందే గర్భమునకు సంబంధించిన బీజము ఏర్పడినదగుచున్నది. దేహములోని సర్వ అంగముల (ఇంద్రియ దేవతల) తేజస్సులు ఒకచోటికి చేరినవై రేతస్సు రూపము దాల్చుచున్నవి. ఆ రేతస్సే సార రూపము!
పురుషుడు తనయందే శుక్రరూపమగు ఆత్మను భరించినవాడుగా, ధరించినవాడుగా ఉంటున్నాడు. అట్టి పురుషుని వీర్యము ఎప్పుడైతే స్త్రీయందు నిషేకము అగుచున్నదో అప్పుడు వీర్యరూపములో ఉన్న ఆత్మ స్త్రీ గర్భమునందు జనించి ప్రవృద్ధి పొందుచున్నది. పురుషునితో వీర్యరూపముగా ఉన్న ఆత్మ ఆ పురుషుని నుండి వెలువడి స్త్రీ గర్భములో ప్రవేశించి సంతాన పురుషాకారము పొందటము… అనునది ఆత్మ భగవానుని సంకల్పమగుచున్నది. |
ద్వితీయాధ్యాయము - 2వ ఖండము
(అపక్రామంతు గర్భిణ్యః) |
(గర్భిణీ స్త్రీలు - కొద్దిసేపు వినకుండా - బయటకు) |
25.) తత్ స్త్రియా ఆత్మభూయమ్ గచ్ఛతి యథా స్వమ్ అంగం, తథా తస్మాత్ ఏనాం న హినస్తి। సా అస్యైనమ్ ఆత్మానమ్ అత్ర-గతం భావయతి॥ |
గర్భములోనికి పురుషవీర్యము స్వీకరించిన స్త్రీకి ఆ వీర్యము ఆ స్త్రీలో, స్వదేహ అంగమువలె (శరీరములోని చేతులు, కాళ్ళు, పొట్టవలె) అంతర్విభాగముగా అగుచున్నది. అందుచేత గర్భస్థ శిశువు స్త్రీ గర్భములో ఎదుగుచున్నప్పటికీ, అది ఆ స్త్రీని బాధించదు. ఆ స్త్రీ "ఆత్మయే (ఆత్మభగవానుడే) నా గర్భమున ప్రవేశించి గర్భస్థ శిశువుగా ఎదుగుచున్నది…. అను భావన పొందుతోంది. అందుచేత గర్భము స్త్రీకి సుఖప్రదము, ఆనందప్రదమే అగుచున్నది. |
26.) సా భావయిత్రీ। భావయితవ్యా భవతి। తం స్త్రీ గర్భం బిభర్తి। సో అగ్ర ఏవ కుమారం జన్మనో అగ్రే అధి భావయతి। స యత్ కుమారం జన్మనో అగ్రే అధిభావయతి। ఆత్మానమేవ తత్ భావయతి ఏషాం లోకానాం సంతత్యా! ఏవం సంతతా హి ఇమే లోకాః తత్ అస్య ద్వితీయం జన్మ॥ |
“నా ఈ గర్భమునందు పరమాత్మయొక్క స్వరూపమే గర్భస్థశిశువు” అని ఆ మాతృమూర్తి భావనను కలిగి ఉండి గర్భమును భరించుచున్నది. పురుషుడు కూడా గర్భములో ఉన్న ఆ స్త్రీని సందర్శించినప్పుడు “ఈ నా జీవిత భాగస్వామి గర్భములో ఎదుగుచున్నది ఆత్మయే (నా ఆత్మయే)” అని భావించుచున్నాడు. అట్టి ఆత్మ లక్షణమైనట్టి ప్రియము అను భావన ఆ శిశువు జనించిన తరువాత, ఎదుగుతూ ఉన్నప్పుడు కూడా కొనసాగుచున్నది. ఇదియే తల్లితండ్రులకు తమ సంతానముపట్ల ఏర్పడు ఆత్మసంబంధ వాత్సల్యం! ఆత్మభావన పుత్రునిపట్ల ఏర్పడి ఉండటంచేతనే పుత్రుడు ప్రియముగా అగుపిస్తున్నాడు. (ఆత్మా వై పుత్ర నామాసి)! ఆ ప్రియాత్మ భావనయే తనపట్ల తాను కలిగి ఉన్నాడు. జగత్తు (లోకము) ఆత్మ స్వరూపమే కనుక ఇందలి జీవనమును ప్రియముగా పరిపోషించుకొనుచున్నాడు. ఈ విధంగా ప్రజా సంతతియొక్క వృద్ధి ప్రియ స్వరూపంగా పరమాత్మచే కల్పితనుగుచున్నది. అదే ఆత్మయొక్క ద్వితీయ జన్మ… ఈ జీవితము, ఈ లోకములు అగుచున్నాయి. 1. తాను ఆత్మయే 2. ఈ సర్వము ఆత్మయే! 3. ఆత్మను ఎరిగినప్పుడు సర్వము ప్రియమే! |
ద్వితీయాధ్యాయము - 3వ ఖండము
27.) సో అస్య అయమాత్మా పుణ్యేభ్యః కర్మభ్యః ప్రతిధీయతే। అథా అస్యా అయమ్ ఇతర ఆత్మా కృతకృత్యో వయోగతః ప్రైతి। స ఇతః ప్రయన్నేవ పునః జాయతే। తత్ అస్య తృతీయం జన్మ తత్ ఉక్తమ్ ఋషిణా ॥ |
ఈ జీవాత్మ పుత్ర రూపముగా కనిపిస్తున్నది పరమాత్మయే! స్వీయ పుణ్య కార్యక్రమములచేత పిత్రుదేవులు (తండ్రి) సత్కర్మానుష్ఠానము చేత ఆ బిడ్డ పవిత్రుడగు చున్నాడు. పిత్రుదేవతలు ఆ పుత్రుని కృతకృత్యుని చేస్తున్నారు. ఆ సత్కర్మానుష్ఠానములను తండ్రి నుండి పుత్రుడు స్వీకరించి కొనసాగిస్తున్నాడు. తండ్రిని తన సత్కర్మలచే ఆ పుత్రుడు కృతకృత్యునిగా చేస్తున్నారు. ఆ తరువాత ఆ తండ్రి ముదుసలి అయి, ఈ లోకమును వీడి, వెనువెంటనే మరొక జన్మ పొందుచున్నాడు. ఇదియే మూడవ జన్మ అగుచున్నది. అనగా …., 1. తానే మొదటి ఆత్మ 2. పుత్రవాత్సల్యముయొక్క దర్శనముచే పొందబడు-ఆస్వాదించబడునది, పుత్ర రూపంగాను-జగత్తు రూపంగాను దర్శించునది ద్వితీయాత్మ . 3. వర్తమాన దేహానంతరము మరల పొందబడునది తృతీయాత్మ . అంతా ఆత్మ స్వరూపమే! ఈవిధంగా, మహనీయులగు-సత్యదర్శులగు ఋషులు పరమాత్మయొక్క త్రి-స్వరూప చమత్కారములను అభివర్ణించి చెప్పుచున్నారు. |
ద్వితీయాధ్యాయము - 4వ ఖండము
28.) “గర్భే అనుసన్ అన్వేషామ, వేదమ్-అహమ్ దేవానామ్, జనిమాని విశ్వా! శతమ్ మాపుర ఆయసీరరక్షన్ అథః శ్యేనో జవసా నిరదీయమ్ ఇతి, గర్భ ఏవై తచ్ఛయానో వామదేవ ఏవమ్ ఉవాచ ॥ |
వామదేవౌవాచ: “మాతృ గర్భములో ఉన్నప్పుడు ఈ జీవాత్మ తాను శబ్ద-స్పర్శ-రూప-రస-గంధ రూపధారులగు సర్వ దేవతల జన్మ వృత్తాంతములను నేను తెలుసుకొనియే ఉంటున్నాను. ఆ దేవతలందరు ఆత్మ నుండియే, ఆత్మ సంకల్ప రూపలై ప్రకటితులగుచున్నారనే విషయం గమనిస్తున్నాను. ఎందుకంటే జన్మించటానికి ముందు మాతృ గర్భములో ఉండగా మాతృదేహములో స్థానము కలిగియున్న ఆదేవతలంతా రక్షిస్తూ, నాకు వారి శబ్ద-స్పర్శ-రూప-రస-గంథ అంశలను ప్రసాదిస్తూ వస్తున్నారు. నేను గర్భము నుండి వారు ప్రసాదించిన శబ్ద-స్పర్శాదిగా గల జీవశక్తులతో బయటకు వచ్చిన తరువాత కూడా వారంతా ఆమాతృ గర్భములో నివాసితులై గర్భ ఏవై తచ్ఛయానో ఉన్నారు”. ఈ విధంగా గర్భరహస్యమును ఎరిగియున్న వామదేవ మహర్షుల వారు విశదీకరించుచున్నారు. |
29.) స ఏవమ్ విద్వాన్ అస్మాత్ శరీర భేదాత్ ఊర్ధ్వ ఉత్రమ్యా, ఆముష్మిన్ స్వర్గే లోకే సర్వాన్ కామాన్ ఆప్త్వా అమృతః సమభవత్। సమభవత్ ॥ |
అట్టి గర్భవాసతత్వమును, గర్భమునుండి బయల్వెడలుటను ఎరిగి, విశదీకరిస్తున్న మహనీయుడు వామదేవ మహర్షియొక్క గర్భవాస శాస్త్ర వాక్యములు - విని ఆకలింపు చేసుకొనువారు ఇహమందు శుభములను పొంది, ఆ తరువాత ఆముష్మిమున ఊర్ధ్వలోకములైనటువంటి స్వర్గము మొదలైన ఉత్తమలోకములు పొందగలరు. మృతత్వ పరిధులను దాటివేసి అమృతులగుచున్నారు. - దేహము రాకముందు-వచ్చిన తరువాత ఇది మృతించిన తరువాత స్థితులలోని సమరసతత్వమును ఎరిగినవారై ఆత్మస్వరూపత-సమరసభావ సమన్వితులగుచున్నారు. |
ఇతి ద్వితీయోధ్యాయః సమాప్తః ॥ |
ఇతి ద్వితీయో అధ్యాయమ్ సమాప్తము ॥ |
తృతీయాధ్యాయము
యథాస్థానంతు గర్భిణ్యః |
(గర్భిణీ స్త్రీలు ఇక మరల వినవచ్చును) |
30.) కో అయమ్ ఆత్మేతి వయమ్ ఉపాస్మహే, “కతరః స ఆత్మా?” యేన వా రూపం పశ్యతి, యేన వా శబ్దం శృణోతి, యేన వా గంధానా జిఘ్రతి, యేన వా వాచం వ్యాకరోతి, యేన వా స్వాదు చ, అస్వాదు చ విజానాతి॥ |
ఏ ఆత్మయొక్క అభిలాషచే నాటకీయంగా ఈ జీవాత్మ - దృశ్యము - పుత్రుడు పునర్జన్మలన్నీ క్రీడా విశేషాలుగా జరిగిపోవుచున్నాయో… అట్టి ఆత్మ గురించి ఇక మనము చెప్పుకుందాము. మనము ఆత్మ-పరమాత్మ అని చెప్పుకుంటున్నది ఎద్దాని గురించి? అట్టి ఆత్మ ఎట్టివాడు? ఎవరు? ఈ జీవుడుగా మనమంతా….. - దేనివలన రూపము చూచుచున్నామో…., - దేనివలన శబ్దములను వినుచున్నామో…, - దేనిచేత వాసన ఆస్వాదిస్తున్నామో…., - దేనివలన మన ఈ నోరు మాట్లాడుచున్నదో….. - దేనివలన - ఇది రుచి - అని రుచి అనుభవము పొందుచున్నదో…, దేనిచేత ఇదంతా తెలియవచ్చుచున్నదో…. అట్టి జీవాత్మలన్నిటికీ ఆత్మగా కలిగి ఉన్నట్టిదే ”మహదాత్మ"! అదియే నీవు. అదియే నేను. |
31.) యత్ ఏతత్ హృదయమ్ మనశ్చ, ఏతత్ సంజ్ఞానమ్, అజ్ఞానమ్, విజ్ఞానమ్, ప్రజ్ఞానమ్, మేధా, దృష్టిః, ధృతిః, మతిః, మనీషా జూతిః, స్మృతిః, సంకల్పః, క్రతురసుః, కామోవశ ఇతి। సర్వాణి ఏవ ఏతాని ప్రజ్ఞానస్య నామధేయాని భవంతి॥ |
ఏదైతే….. హృదయము, మనస్సుల సంజ్ఞారూపమై, అజ్ఞానము-విజ్ఞానము - మేధ-దృష్టి-ధృతి-మతి-బుద్ధిమంతత్వము-జ్ఞాపకము-సంకల్పము ఇవన్నీ తానే అయి, తన వికల్పములుగా వాటన్నిటినీ గాంచుచున్నదో…, ఏదైతే అవన్నీ తెలుసుకొనుచున్నదో… అవన్నీ తానేగా కూడా గమనించుచున్నదో…, అదియే “ప్రజ్ఞానము” అనే పేరుతో చెప్పబడుచున్నది. సర్వము ప్రజ్ఞాన స్వరూపమే అయి ఉన్నది. తెలుసుకొనువాడు - తెలియబడునది - తెలుసుకోవటము - అంతా సర్వదా కేవల ప్రజ్ఞాతత్త్యమే! |
32.) ఏష బ్రహ్మ। ఏష ఇంద్రః। ఏష ప్రజాపతిః। ఏతే సర్వే దేవా, ఇమాని చ పంచ మహాభూతాని, పృథివీ వాయుః ఆకాశః ఆపో జ్యోతీంషి ఇతి॥ ఏతాని ఇమాని చక్షుద్ర మిశ్రాణీవ, బీజాని ఇతరాణి చ, ఇతరాణి చ, అండజాని చ, జరాయుజాని చ, స్వేదజాని చ, ఉద్భిజాని చ, అశ్వా, గావః, పురుషా, హస్తినో, యత్ కిం చ ఇదం ప్రాణి జంగమం చ। పతత్రి చ యచ్చ స్థావరం, సర్వం, తత్ ప్రజ్ఞానేత్రం ప్రజ్ఞానే ప్రతిష్ఠితమ్। ప్రజ్ఞానేత్రో లోకః ప్రజ్ఞా ప్రతిష్ఠా ప్రజ్ఞానం బ్రహ్మ । |
అట్టి ఏది ప్రజ్ఞానము అని పిలువబడుచున్నదో - ప్రజ్ఞానమ్ బ్రహ్మ! - అదియే బ్రహ్మ! - అదియే ఇంద్రుడు! - అదియే ప్రజాపతి! అదియే చూపు-వినికిడి-స్పర్శ-రుచి గంధముల చమత్కారమంతా ప్రదర్శన చేయునట్టి ఈ దేహములోని దేవతా తత్త్వాలు కూడా! ఆ ప్రజ్ఞాన స్వరూపమే ఇక్కడి పంచభూతములయినటువంటి పృథ్వి (స్థూలము), వాయువు (చలనము), ఆకారము (స్థానము), ఆపః చ, (ద్రవము) జ్యోతీంషి (అగ్ని) కూడా! అల్ప జీవులగు కీటకములు, బీజ-అంకురములు, ఇతర చేతనములు, అండజములు (పక్షులు మొ॥వి), జరాయుజములు (గర్భము నుండి జనించే జంతువులు), స్వేదము (చెమట) నుండి పుట్టుచున్న జీవులు, ఉద్భుజములు (గాలిలో పుట్టేవి), గుర్రములు, ఆవులు, మానవులు, ఏనుగులు, తదితర సర్వజంగమ ప్రాణులు, పక్షులు, స్థావరములు … అన్నీ కూడా ప్రజ్ఞా నేత్రములే! ప్రజ్ఞాన దృష్టి రూపములే! అవన్నీ ఉన్నది ’ప్రజ్ఞానము’ నందే! లోకమంతా ప్రజ్ఞాన నేత్రమే! ప్రజ్ఞానమునందే ప్రతిష్ఠితమై యున్నది! ప్రజ్ఞానమే బ్రహ్మము! |
33.) స ఏతేన ప్రజ్ఞాన-ఆత్మనా అస్మాత్ లోకాన్ ఉత్క్రమ్య ఆముష్మిన్ స్వర్గలోకే। సర్వాన్ కామాన్ ఆప్త్వా, అమృతః సమభవత్। సమభవత్। ఇతి ఓం। |
అట్టి కేవల ప్రజ్ఞాన స్వరూపుడగు పరమాత్మను ఎరిగినవాడు ఈ లోక వ్యవహార జన్మ-కర్మ చట్రము నుండి బయల్వెడలినవాడై, ఆముష్మికమగు స్వర్గాదిలోకాలు చేరుచున్నాడు, సర్వకామములు సిద్ధించుకొన్నవాడై అమృత స్వరూపుడు అగుచున్నాడు. సర్వస్వరూపుడై, సర్వసముడై, ఓంకార సంజ్ఞార్థ స్వరూపుడై ప్రకాశించుచున్నాడు. బ్రహ్మమే తానై విరాజిల్లుచున్నాడు. |
ఇతి తృతీయోధ్యాయః సమాప్తః |
ఇతి తృతీయోధ్యాయము సమాప్తము! |
ఇతి ఐతరేయోపనిషత్ సమాప్తము!
ఓం శాంతిః శాంతిః శాంతిః ॥
ఐతరేయమ్ = దీనికంతటికీ వేరై, ఇదంతా తానే అయి ఉన్నవాడు! |
ప్రథమాధ్యాయము - ప్రథమ ఖండము
ఈ అత్యద్భుతము, బహు చమత్కారము, నిరంతర పరిణామయుతము, "ద్రష్ట - దర్శన - దృశ్యము - దేహము - జననము - మరణము” మొదలైన అనేక విశేషములతో కూడుకున్నట్టిది అగు సృష్టి అందరికీ అనుభవమగుచున్నది కదా!
అట్టి ఆశ్చర్యకరమైన సృష్టికి మునుముందే, దీనికంతటికీ ఆధారమై ఇద్దానికి సకారణమై ఏదైనా ఉన్నదా? ఉన్నది!
మొట్టమొదట ఏకస్వరూపమై అఖండమై ఆత్మయే ఉండి ఉన్నది. అట్టి ఆత్మకు వేరైనదంటూ (మొదట) ఏదీ ఉండి ఉండనే లేదు. ఆత్మ
సర్వే సర్వత్రా సహజంగానే సర్వదా అనన్యము. అద్వితీయము. నిత్యము.
అన్యమే లేనట్టి అనన్యస్వరూపమగు ఆత్మ చైతన్యము-“ఏక స్వరూపుడనగు నేను ఒంటరివాడనై ఉండటము ఏమి మోదము? అందుచేత - క్రీడా వినోదంగా, లీలగా - తెలుసుకోవటం-తెలుసుకొనుచున్నట్టివాడు-తెలియబడునది-( perceiver - perception - object ; knower - knowing - that being known ) మొ||వి కల్పించుకొని ఆహ్లాదము పొందెదను గాక”.. అని భావించింది.
"సంకల్పశక్తిని ప్రేరేపించుకొని లోకములను సృష్టించుకొనెదను గాక !”… అని తలచింది. భావనలకు - సంకల్పములకు మునుముందే ఉన్నట్టి ఆ ఆత్మ భగవానుని సంకల్పశక్తి ప్రదర్శన రూపంగా, భావనా రూపంగా లోకములు కల్పించబడటం ఆరంభమయింది.
(అందుచేతనే ఆ కల్పనకు శివార్ధభాగము భావన - ఊహ - సంకల్ప - స్వభావ - ప్రకృతి - ఇత్యాది పేర్లు!)
1) ఊర్ధ్వమున ఆంభో (స్వర్గము మొ॥న) లోకములు,
2) మరీచి - సంకల్ప సిద్ధ లోకములు,
3) భౌతికంగా మర (భూ) లోకము,
4) జలమున అధో లోకములు (పాతాళము, జంతు ప్రవృత్తులు)
- చిన్న పిల్లవాని స్వకీయ ఊహా క్రీడలవలె, బాలా లీలా వినోదంలాగే… అవన్నీ కల్పించబడసాగాయి.
పాంచభౌతిక సృష్టికి ఆవల - ద్యౌః (స్వర్గ) లోకము,
అంతరిక్షంలో (Space) మరీచి లోకము,
భూమి (Solid) పై మరులోకము,
జలము (Liquid) లో క్రింది లోకములు
- కల్పించబడ్డాయి.
“సరే ! లోకాలైతే సృష్టించాను. మరి లోకాలను సృష్టించిన తరువాత, వాటికి పరిపాలించటానికి, పర్యవేక్షించటానికి, కథ నడపటానికి లోకపాలకుడు (One who manages) కావాలి కదా" అని ఆత్మ భగవానుడు అనుకున్నారు.
ఇట్లా ఆలోచించి ఒక పురుషుని ఆకారము సృజియించారు. (ఆయనే సృష్టికర్తయగు బ్రహ్మదేవుడు. ప్రథమ పురుషుడు).
అట్లా కల్పించబడిన పురుషాకారమును గురించి ఆత్మభగవానుడు మరల యోచన చేయసాగారు! ఆ పురుషాకారుడగు సృష్టికర్తను సృష్టి తపన రూపమగు తపస్సునందు నియమించారు. ’తపన’యే తపస్సు. ఆ తపన నుండియే ఈ సర్వము బయల్వెడలుతోంది.
పరమాత్మ నుండి సంకల్ప రూపమగు సృష్టిలోనికి - సమిష్టి సంకల్పుడగు సృష్టి పురుషునికి
నోరు వికాసమానం అయింది | నోరు నుండి - వాక్కు | వాక్కు నుండి ‘అగ్ని’ పుట్టింది. |
నాశికా రంధ్రములు వికసించాయి | ప్రాణము | ప్రాణశక్తి నుండి ‘వాయువు’ జనించింది. |
నేత్రములు వికసించాయి | చూపు | చూపు నుండి ఆదిత్యుడు ప్రకటితమైనారు. |
రెండు చెవులు వికసించాయి | వినికిడి శక్తి | వినికిడి శక్తి నుండి దిక్కులు బయల్వెడలాయి. |
చర్మము వికసితమయింది | చర్మము నుండి స్పర్శశక్తి | స్పర్శ నుండి ఓషధులు (ఆహార ధాన్యములు, పశు ధాన్యములు మొ||వి), వనస్పతులు (పసుపు, తదితర వృక్షములు మొ||నవి) జనించినాయి. |
హృదయము ప్రదర్శితమైనది | హృదయమ నుండి మనస్సు | మనస్సు నుండి చంద్రుడు ఉదయించారు. |
నాభిస్థానము ఏర్పడింది | నాభి నుండి (బొడ్డు నుండి) అపాన వాయువు | అపాన వాయువు నుండి మృత్యువు (మార్పు-చేర్పులు) ప్రదర్శనమైనాయి. |
శిశ్నము (విసర్జకావయవము) | శిశ్నము నుండి రేతస్సు | రేతస్సు నుండి ‘జలము’ జనించింది. |
ఈ విధంగా ఆత్మ భగవానుని నుండి, ఆత్మ భగవానుని చేతనే… సృజించబడిన “సృష్టికర్త” నుండి వాక్కు దేవత, అగ్ని దేవత, ప్రాణ దేవత, వాయు దేవత బయల్వెడలారు. దృష్టి, (ఆదిత్యుడు), వినికిడి, దిక్కులు, స్పర్శ, దేహ పరిపోషితములగు ఔషధులు, వనస్పతులు (వృక్షములు)…. వీటన్నిటికీ సంబంధించిన శక్తి సమన్విత దేవతా ప్రజ్ఞలుగా ఉదయించాయి. ఆ దేవతలంతా కూడా సముద్రజల తరంగాల వలె పరమాత్మ నుండి బయల్వెడలి, పరమాత్మ కల్పనా సృష్టియందు ప్రకటించబడి, సంసిద్ధులైనారు. వారందరి ప్రవేశముతో బాటు ఆకలి దప్పికలు కూడా వెంటనంటి వచ్చాయి.
(నోరు - నాశిక - చర్మ - హృదయ - నాభి - శిశ్న - అధిష్ఠాతలగు అగ్ని, వాయు, ఆదిత్య, దిక్, ఓషధ, వనస్పత, చంద్ర, జల దేవతా శక్తి ప్రజ్ఞలగు దేవతలు).
⌘
ప్రథమాధ్యాయము - ద్వితీయ ఖండము
ఆ దేవతలు ఆత్మ భగవానుని సమీపించి, “ఓ ఆత్మ భగవాన్ ! మేము మీ సంకల్పము నుండి సృష్టించబడి మీ ఎదురుగా నిలచి ఉన్నాము! మీచే జనించిన మేము ఎక్కడ అన్నము (ఆహారము - అర్థములు, కార్యక్రమములు Activitiy, Execution …) పొందగలమో, అట్టి మేము ఉండవలసిన స్థానమును మీరు నిర్ణయించి మాకు చెప్పండి ! మమ్ములను ఆజ్ఞాపించండి ! మేము మామా ధర్మములను నిర్వర్తించవలసిన విధులను నిర్దేశించండి !" అని అభ్యర్థించారు.
‘ఓ ! అట్లాగే’ … అని ఆత్మదేవుడగు పరమాత్మ అంగీకరించారు. ఆ దేవతా తత్వాలు తమ తమ స్థానములలో ఆత్మ సంకల్పితము - నిర్దేశితము అయిన తమ తమ ధర్మాలు (Function) నిర్వర్తిస్తూ ఉండటానికిగాను మొట్టమొదటగా.. ఒక ఆవు (కామధేనువు)ను సృష్టించి ఎదురుగా నిలిపారు. అప్పుడు ఇంద్రియ - పంచభూత - ఔషధ - చంద్ర ఆకలి దప్పికా దేవతలు ఆ ఆవును ప్రవేశించటానికి సంసిద్ధులౌతూనే … ఆత్మ భగవానునితో… "స్వామీ! మా ఉనికి ఆహారము కొరకు ఈ ఒక్క ఆవు కల్పన మాత్రమే చాలదు కదా !” అని మరల విన్నవించుకున్నారు.
అప్పుడు ఆత్మ భగవానుడు వారి స్థాన నిర్దేశము కొరకై ఒక గుర్రము (శ్వేతాశ్వము) ను కూడా సృష్టించి (కల్పించి) దేవతాతత్వాలకు (దేవతలకు) ఎదురుగా నిలిపారు. అప్పుడా దేవతలు “ఓ ఆత్మ దేవా ! ఈ మాత్రము కూడా మా మా విధి నిర్వహణలకు చాలదేమో కదా!" అని అభ్యర్థించారు. అప్పుడు అసంఖ్యాక జీవజాలము కల్పించబడింది.
అప్పటికీ దేవతలు పూర్తిగా సంతోషించనే లేదు.
అప్పుడు పరమాత్మ తన యొక్క సంకల్పానుసారంగా పూర్ణ లక్షణ సంపన్నుడైనటువంటి పురుషుని(మానవుని) సంకల్పించారు . ఆ దేవతలకు (దివ్య శక్తులకు ఎదురుగా నిలిపారు. అప్పుడు ఆ దేవతలు పురుషాకారమును చూచి “ఆహాఁ! చాలా సంతోషము ! ఈ పురుష, (మానవ) రూపము బహు లక్షణ సమన్వితమై సృష్టించబడినది”.. అని తమ ఆనందమును ప్రకటించారు.
అప్పుడు ఆత్మ భాగవానుడు -
ఓ ఇంద్రియ - పంచభూత - ఇత్యాది సంబంధితులగు దేవతలారా !
ఇక మీరు సృష్టి పురుషునిలో ప్రవేశించి మీమీ స్థానములు అలంకరించండి. మీ మీ ధర్మములు - కార్యక్రమములు (Functions and Activities) నిర్వర్తిస్తూ ఈ నా కల్పనా సృష్టిని అనుభవ ప్రదము చేయండి ! అని ఆజ్ఞాపించారు.
అప్పుడా దేవతలు పరమ పరుషుని యొక్క ఆజ్ఞను శిరసావహించసాగారు.
అగ్ని దేవుడు | వాక్ స్వరూపులై | నోటియందు, |
వాయుదేవుడు | ప్రాణ స్వరూపులై | నాశిక యందు, |
ఆదిత్యుడు (సూర్యుడు) | దర్శన (చూపు) స్వరూపులై | చక్షువుల (కళ్ళ)యందు, |
దిక్ దేవతలు | శ్రోత్ర (వినికిడి) స్వరూపులై | కర్ణముల (చెవుల) యందు, |
ఓషధ - వనస్పత దేవతలు | స్పర్శ స్వరూపులై | చర్మమునందు, |
చంద్రుడు | మనస్సురూపముదాల్చి | హృదయమునందు, |
(యమ) మృత్యు (మార్పు) దేవత | అపానరూపము దాల్చి | నాభిప్రదేశమునందును, |
జల దేవత (వరుణుడు) | రేతస్సు రూపము దాల్చి | శిశ్నము (పునరుత్పత్తి అవయవము) నందు |
ప్రవేశమును పొందారు. ఆయా స్థానములను ఆక్రమించి ఇక తమ తమ విధులను నిర్వర్తించటానికి ప్రయత్నశీలురు కాసాగారు.
ఇది ఇట్లా ఉండగా, ఇంతలో ఆకలి దప్పిక శక్తులు పరమాత్మను సమీపించాయి -
“హే ఆత్మభగవాన్ ! తదితర దేవతలకు సృష్టిలో వారి వారి స్థానములను నిర్దేశించారు. పురుషుని దేహములో వారి వారి ధర్మములను
(functions) నిర్వచించారు. ఇక ఇప్పుడు మా స్థానములను కూడా సృష్టియందు నిర్ణయించి ఆజ్ఞాపించ ప్రార్ధిస్తున్నాము.” అని
విన్నవించుకొన్నారు.
అప్పుడు పరమాత్మ స్వరూపుడగు సృష్టికర్తపురుష ఆకారుడు కొంచము యోచన చేసి -
ఓ అశన - పిపాసలారా ! (ఆకలి దప్పికలారా !) మీకు పురుష దేహములో ఒక స్థానమంటూ ఏదీ నిర్దేశించటము లేదు. అందుచేత మీరిరువురు కూడా ఇప్పుడు పురుష సృష్టి దేహమునందు అనువర్తిస్తున్నటువంటి తదితర దేవతలను అనుసరిస్తున్నవారై ఉండండి. వారితోనే అనుభాగినులై (భాగస్వామ్యులై) ఉండవలసినదిగా నిర్ణయిస్తున్నాను. అంతేగాని, మీకు వేరుగా ప్రత్యేకమైన స్థానమనునదేదీ ఉండదు !
అందుచేత ఏ దేవతను ఉద్దేశ్యించి హవిస్సు (అన్నము - ఆహారము) ఇవ్వబడుచున్నదో, మీరు ఆ హవిస్సులోని భాగమును ఆ దేవతతో భాగస్వామ్యులై స్వీకరించుచుందెదరు గాక ! అని నిర్ణయించారు.
అప్పుడు ఆ అశన-పిపాసా దేవతలు (ఆకలి దప్పికలు) ఆ ఆజ్ఞాపించిన తీరుగానే ఆయా ఇంద్రియ దేవతలతోబాటే పురుష దేహమునందు ప్రవేశించారు. ఆయా స్థానములను అలంకరించినవారై, ఆయా దేవతలతో బాటే హవిస్సులకు భాగస్వామ్యులు కాసాగారు.
⌘
ప్రథమాధ్యాయము - తృతీయ ఖండము
అప్పుడు ఆ సృష్టికర్త “ఇదిగో ! ఇవన్నీ నేను సృష్టించిన లోకాలు, ఈ లోకాలు నడపటానికి లోకపాలకుడిని (సృష్టికర్తయగు ప్రజాపతిని), దేవతాతత్త్వాలను (ప్రజ్ఞలను) కూడా కల్పించాను. బాగానే ఉన్నది!
ఇప్పుడు…,
వీరందరి సృష్టి కథా సంవిధానము కొరకై
అన్నమ్ (Material as fuel, (లేక) ఆహారము Food stuff, consumption material, fuel for energy) కల్పించుచున్నాను…అని యోచన (భావన) చేశారు. (అన్నము = That Being Experienced, సర్వ ఇంద్రియనానుభవ వస్తువులు - విషయములు, అనుభవము, అనుభూతి)
అప్పుడు జలము నుండి ఒకానొక మూర్తీ విభవము ప్రభవించింది. ఆ విధంగా పరమాత్మ సంకల్పానుసారము ఏది జలము నుండి మూర్తీభవించినదో అదియే అన్నమ్! (అదియే జాగ్రత్ - స్వప్న సంబంధమైన స్థూల సూక్ష్మ రూపం కూడా!)
(ఆ అన్నము గురించి - ‘అన్నమ్ బ్రహ్మ’, ‘అహమ్ బ్రహ్మ - భోక్తా చ బ్రహ్మ’, అన్నమయమ్ మనః’ అన్నమ్ బ్రహ్మేతి య ఏవం వేద”…. ఇత్యాది స్తోత్రములు, అన్నసూక్తము వేదములలో వేరు వేరు చోట్లగా అభివర్ణించబడింది).
ఆ విధంగా పరమాత్మ సంకల్పానుసారము సృష్టి పురుషుని దేహమునకు ఎదురుగా ’అన్నము (Subject for Experiencing)’ సృష్టించబడింది. దేహమునందు స్థానమును పొందుచున్న (పైన చెప్పబడిన) నోరు - కళ్ళు - చెవులు చర్మము - శిశ్నము మొదలైన స్థాన దేవతా ప్రజ్ఞలు ఆ పరమాత్మ కల్పితమైన అన్నదేవతను చూచారు.
మొట్టమొదట వాక్ దేవత (వాక్ ఇంద్రియ ప్రజ్ఞాదేవత) - “ఈ మూర్తీభవించిన అన్న దేవతను నేను పట్టుకొని సొంతము చేసుకొనెదను గాక !” అని తలచి తన యొక్క వాక్ శక్తితో ఆ అన్న బ్రహ్మమును పట్టుకోవటానికి బయల్వెడలింది. కానీ, వెనుకకు పరుగులు తీస్తున్న ఆ అన్నతత్వమును వాక్శక్తి తన హస్తములతో పట్టుకోలేకపోయింది. (తత్న శక్నోత్ వాచా గ్రహీతుమ్) !
స యత్ అధేత్ వాచా అగ్రహి ఏష్యత్ అభివ్యాహృత్య హి, ఏవ అన్నమ్ అత్రప్స్యత్ ! ఒకవేళ ఆ సందర్భములో వాక్ దేవత కనుక తన వాక్ శక్తితో అన్నబ్రహ్మమును పట్టుకొనగలిగి ఉండి ఉంటే,… అప్పుడు ఈ జీవుడు “అన్నమ్” …. అని వాక్కుతో అనగానే దేహమునకు ఆహారము లభించినది అయ్యేదే! తృప్తి పొందేదే! కాని అది అట్లా జరగలేదు!
⌘
అప్పుడు ప్రాణదేవత కూడా తన ప్రాణశక్తి హస్తములను చాచి ఆ అన్న దేవతను ప్రాణ హస్తములతో పట్టుకోవటానికికై ప్రయత్నము చేసింది. కానీ అదీ కుదరలేదు. అనగా ప్రాణశక్తి అన్నమును పట్టుకోలేకపోయింది. అట్లా పట్టుకొనగలిగి ఉంటే, అప్పుడు ఈ దేహి గాలి పీల్చినంత మాత్రంచేతనే దేహము ఆహారము ఆహార రసము స్వీకరించి తృప్తి చెందగలిగేదే ! అట్లాగూ జరగలేదు.
⌘
తరువాత చక్షు దేవత అన్నమును పట్టుకోవటానికి ప్రయత్నించి, తాను కూడా విఫలమయింది. చక్షువులుగాని అన్నమును పట్టుకోగలిగితే, అప్పుడు ఈ భౌతిక శరీరధారి తన కంటి చూపుతో చూచినంత మాత్రము చేతనే - దేహము అన్నము (ఆహారము) పొంది తృప్తి పొందగలిగేది. కానీ అది అట్లా కూడా జరుగలేదు.
⌘
ఆ తరువాత, శ్రోత్ర (వినికిడి) శక్తి దేవత (శ్రవణేంద్రియము) ఆ వెనుకకు మరలుచున్న అన్నమును తన చేతులతో పట్టుకోవటానికి ప్రయత్నించింది. కానీ సాధ్యపడలేదు. ఒకవేళ శ్రోతశక్తి అన్నమును తన హస్తములతో పట్టుకొనగలిగి ఉంటే ఇక ఈ దేహి (పురుషుడు) ఆహారమును గురించి వర్ణన విన్నంత మాత్రము చేతనే శరీరమునకు ఆహారము లభించినదై దేహము తృప్తి పొందగలిగేదే ! మరి ఆ విధంగానూ జరుగలేదు.
⌘
ఇకప్పుడు త్వక్ ఇంద్రియ దేవత వెనుకకు జరుగుచూ పోతున్నట్టి అన్నదేవతను పట్టుకొనటానికి ప్రయత్నించింది. ఏమాత్రం సాధ్యం కాలేక విఫలమయ్యింది. అట్లా పట్టుకొనగలిగి ఉంటే, అప్పుడు పురుషుడు అన్నమును చేతితో స్పృశించినంత మాత్రము చేతనే ఆకలి - దప్పికలు తొలగి, దేహము అన్నము స్వీకరించినదై తృప్తిని పొందేదే ! అ తీరుగా కూడా జరుగలేదు.
⌘
అటు తరువాత మనస్సు ఆ అన్నరసతత్త్వ దేవతను అందుకోవటానికి సంసిద్ధమై, తన ప్రయత్నమంతా నిర్వర్తించింది. కానీ ఏమి లాభం? మనస్సు ఆ ప్రయత్నములో ఏమాత్రము సఫలం పొందలేదు. ఒకవేళ మనస్సు ఆ అన్నరస స్వీకారమునందు విజయము పొంది ఉంటే, అప్పుడు పురుషుడు (దేహి) అన్నము గురించి స యత్ అథైనన్ మనసా గ్రహ్యైషత్ ధ్యాత్వా హి, ఏవ అన్నమ్ అత్రప్స్యత్ - ఆలోచనా-భావన చేసినంత మాత్రము చేతనే ఆహార రూపమగు అన్నము ఈ దేహము పొందినదై తృప్తిగా ఉండేదే ?
ఆ విధంగానూ జరుగలేదు మరి !
⌘
ఆపై శిశ్నము నందు స్థానము పొందియున్న రేతస్సు “సరేఁ ! నేనన్నా ఈ అన్నరస దేవతను చేతులతో పట్టుకొనెదను గాక !” అని తలచి ప్రయత్నించింది. అదీ సాధ్యం కాలేదు. ఒకవేళ విసర్జ కావయమగు శిశ్నములో గల రేతస్సు ఆ ప్రయత్నమునందు విజయము పొంది ఉండి ఉంటే, అప్పుడు ‘అన్నము’ ను చూచి "నేను ఈ అన్నరసమును వదలుచున్నాను”… అని తలచగానే దేహము అన్నమును పొంది తృప్తి పడేదే ! అట్లా అవనేలేదు.
⌘
ఇకప్పుడు - తత్ అపానేన అజిఘృక్షత్ - అపాన వాయువు అన్నమును పట్టుకొనే ప్రయత్నము చేసింది.
స యేషో అన్నస్య గ్రహో!
అపానము (వాయువు) అన్నమును పట్టుకొనగలిగింది !
యత్ వాయుః అన్నమ్ ఆయుర్వా ఏష యద్వాయుః
అట్టి అన్నమును పట్టుకొనగలిగినదే ప్రాణాపాన వాయువు ! ఈ విధంగా ప్రాణాపాన వాయువే అన్నమును స్వీకరిస్తూ అట్టి అన్నము యొక్క రసతత్వముచే దేహమునందు ప్రాణశక్తిని నిలుపుచున్నదగుచున్నది.
⌘
ఆ తరువాత, అట్లు ప్రాణశక్తి సమన్వితముగా నిలచియున్న భౌతిదేహమును పరమాత్మ చూచినవారై "ఈ పిండ శరీరమును నేను ప్రవేశించకపోతే ఇది నిలవగలుగుతుందా ? లేదు కదా ! నా చైతన్యత్వము చేతనే ఇది స్వయంసత్త పొందగలదు. లేదా ఇంద్రియములకు, ఇంద్రియ శక్తులు వేరువేరుగా సంప్రదర్శనమగుచున్న ఈ దేహము ఒక జడమగు తోలు బొమ్మ వంటిదే! ఇందులో ఇచ్ఛ-జ్ఞాన-క్రియా శక్తుల సమిష్టి ప్రదర్శకుడనగు నా చైతన్యముయొక్క సంప్రవేశము అవసరం !
ఇక్కడ రెండు విషయములు -
1) తోలు బొమ్మ (జీవ దేహము / పురుషుడు / జీవుడు) స్వకీయముగా ఇచ్ఛ - జ్ఞాన-క్రియా శక్తిమంతుడై చైతన్యవంతుడై ఉండాలి. అందుకు నేను ఇందులో అస్మత్ చైతన్య విశేషముతో ప్రవేశించాలి కదా ! లేకుంటే ఇది చైతన్యవంతము కాదు.
2) నేను చైతన్య స్వరూపముగా ఇందులే ప్రవేశించి, ఇద్దానికి నా చైతన్యవంతము ప్రసాదిస్తే ? అప్పుడు ఈ జీవుడు నా ప్రమేయం లేకుండానే తన ఇచ్ఛను అనుసరించి…, యది (if) (ఒకవేళ)
ఇవన్నీ ఈ పురుషుడు (తనకు తానే, నా ప్రమేయము లేకుండా) నిర్వర్తిస్తూ ఉంటే… అప్పుడు
కథం ను ఇదం అదృతే స్యాత్ ? కతరేణ ప్రపద్యా ?
‘అప్పుడు నేనెవరును ? నా వలన ప్రయోజనము ఏమిటి మరి ?" అని (ఆత్మ భగవానుడు) యోచించారు ?
అప్పుడు “అనంత - సహస్ర చైతన్య కిరణ స్వరూపుడనగు నేను ఒకానొక చేతన కిరణముచే ఈ దేహములలో ప్రవేశించి ఉండటం చేత నాకేమి లోటు?” అని భావించారు.
ఆ పరమ పురుషుడు తాను లీలగా కల్పించిన పురుష దేహము యొక్క ఊర్ధ్వశిరో (సహస్రార) భాగము ద్వారా శిరస్సును ఛేదించి, ఆ ద్వారముగుండా దేహములోనికి (పురుషుని లోనికి) తనయొక్క అంశను (జీవ చైతన్యాంశను) ప్రవేశింపజేసారు.
అట్టి మార్గమును ‘విదృతి’ అని పిలుస్తున్నారు. (అదియే యోగవిద్యలో బ్రహ్మరంధ్ర ప్రాణప్రవేశ గమనిక - యోగము).
అది ఆనంద స్థానము. ఎందుకంటే కల్పన అంతా ఆత్మభగవానుడు తన వినోదముకొరకే కల్పించారు కాబట్టి!
అట్టి ఆత్మ యొక్క త్రయోనివాస స్థానములు :
1) జాగ్రత్ - స్వప్న - సుషుప్తులు - (మనస్సునందు)
2) నేత్రము - కంఠము - హృదయము - (దేహములో)
అయమ్ ఆవసథో! అయమ్ ఆవసథో! అయమ్ ఆవసథో! ఇందులో నేను ఉన్నవాడను అగుచున్నాను అని భావించారు. అని సంకల్పించారు.
⌘
ఈ విధంగా పరమాత్మ చైతన్యానంద స్వరూపుడై పురుష (జీవుని) దేహములోనికి (స్వయం పురుషాకార - స్వీయాంశలోనికి) - తన స్థానమునందు తాను యథాతథుడై ఉంటూనే - ప్రవేశించారు. జీవరూపుడు (Experience, Perceiver) గా అయినారు.
తన కల్పనా చమత్కృతినే తాను ’భూతభావన’తో తదాత్మ్యము పొందుతూ దృశ్యమును గ్రహించసాగారు. ఆ తరువాత,
కిమ్ ఇహ అన్యంవా అవదిషత్?
“ఇక్కడ నేను కానిది ఏది? వాస్తవానికి ఇక్కడ ఉన్నదంతా నేనే! నాకు వేరైనది ఏదీ ఎక్కడా లేదు కదా!” - అని గమనించి, ఎలుగెత్తి ఉచ్ఛరించారు. “ఇదంతా ఏమిటో తెలుసుకున్నాను కదా!” అని తృప్తిని పొందారు, కనుక, పరబ్రహ్మము…,
“ఈ ఇంద్రియములన్నిటికీ అధిపతిని, (ఉపయోగించువాడను), యజమానిని (User and Owner) నేనే కదా !”… అని గ్రహించుటచే ఆయన “ఇంద్రుడు” - అని ప్రసిద్ధికెక్కారు. దేహములోని శబ్ద - స్పర్శ మొదలైన సర్వ అధిష్ఠాన దేవతలను పరిపాలించువాడు కాబట్టి “దేవేంద్రుడు” - అయ్యారు ! ఈ మానవుడు ఇంద్రియ విషయములకు ప్రత్యక్ష ప్రియలు కదా ! అయితే దేవతలు
- పరోక్ష ప్రియులు
- పరోక్షముగా ప్రియత్వము కలవారు ! భావమాత్ర సంతుష్ఠులుగా ఉండసాగారు !
అందుకని "ఓ ఇంద్రియముల యజమానీ! ఓ వర్షమునకు అధికారీ! ఓ నిప్పును శరీరముగా కలవాడా!” అని అనము. ఓ ఇంద్రదేవా! వరుణదేవా! అగ్ని భగవన్! జాతవేదా! - అని అంటాము.
⌘
ద్వితీయో2ధ్యాయః - ప్రథమ ఖండః
అపక్రామంతు గర్భిణ్యం:-విషయము గర్భిణీస్త్రీలు వినవద్దని ఉద్దేశించబడింది. (శ్రోతలలో గల గర్భిణీ స్త్రీలను బయటకు వెళ్ళమని చెప్పుతారు).
ఓం పురుషే హ వా అయమ్ ఆదితో గర్భోభవతి ! మొట్టమొదటగా గర్భము (శిశువు యొక్క మొట్టమొదటి ప్రారంభము) పురుషునియందే సంభవించుచున్నదగుచున్నది.
పురుషునిలోగల - శబ్దము (వినికిడి) - దర్శన (చూపు) - స్పర్శ (తాకుటకు సంబంధమైన చర్మ ధర్మము) నాలుకలోని రసదేవత, ముక్కులోని గంధ దేవత - ఈ ఈ దేవతలంతా సమర్పించిన తమ తమ తేజస్సులచే పురుషుని యందు ‘రేతస్సు’ రూపు దిద్దుకుంటోంది.
అనగా పురుషునిలో సర్వాంగములలోని శక్తితత్వములు ఏకరూపముగా దాల్చి ఒక చోటికి వచ్చి ఆ పురుషునిలో వీర్య రూపమగు రేతస్సుగా ఏర్పడుచున్నాయి. దేవతా శక్తులన్నీ ఆత్మ పరికల్పితములే కాబట్టి ఆత్మరూపములే!
సంభూతమ్ ఆత్మన్యేవ ఆత్మానం బిభర్తి !
స్వతఃగా ఆత్మస్వరూపుడే అయి ఉన్న పురుషుడు తన అంతరములో ఆత్మనే ‘శుక్రము’ రూపముగా భరించుచున్నాడు. ఎప్పుడైతే ఆ పురుషుడు ఆ శుక్రమును స్త్రీ యోనియందు (లేక గర్భమునందు) నిషేకము చేయటం జరుగుతుందో, అప్పుడు వీర్యము (రేతస్సు) రూపములో ఉన్న ఆత్మ - పురుష శరీరము నుండి బయల్వెడలి - స్త్రీ గర్భమున ప్రవేశించినదగుచున్నది.
ఇదియే పురుషుని (జీవుని) - దేహముతో కూడి ఉన్నట్టి - ప్రథమ జన్మ.
⌘
ద్వితీయో2ధ్యాయః - ద్వితీయ ఖండః
తత్ స్త్రీయా ఆత్మభూయం గచ్ఛతి |
యథా స్వమంగం, తథా తస్మాత్ ఏనాం న హినస్తి॥
స్త్రీ దేహమునందు ప్రవేశించిన వీర్యము బిడ్డగా రూపుదిద్దుకొనునప్పుడు స్త్రీకి ఆత్మభాగివలె అగుచున్నది. స్వదేహములోని ఒక అంగ విభాగమువలె అయి ఉండటంచేత, ఆ వీర్యముగాని, తదనంతర శిశువుగాని ఆ తల్లిని బాధించుట లేదు. స్వీయ - అవయవము వలె ఆనందమే కలుగజేయుచున్నది. వీర్యము ఏ విధంగా శరీరములోని భాగమే అయి పురుషుని బాధించదో, ఆవిధంగానే, స్త్రీ విషయంలో కూడా గర్భము దాల్చటం దేహాంతర్విభాగమై, ఆ తల్లికి సంతోషమే అగుచున్నది. “నా ప్రియమైన భర్త ఆత్మరూపుడై నా యొక్క గర్భమునందు ఉన్నారు” … అను భావనతో ప్రేమగా గర్భమును ఆ మాతృమూర్తి గ్రహించుచున్నది.
గర్భముతో ఉన్న స్త్రీ ఆత్మస్వరూపుడగు శిశువును ధరించి ఉండటంచేతనే, ఆ భర్త తన అర్ధాంగి అగు ఆమెకు ప్రియమైన ఆరోగ్యప్రదమైన తినుబండారములు అందించడము ఆచారమగుచున్నది. ఎందుకంటే - తం స్త్రీ గర్భం బిభర్తి - ఆ స్త్రీ గర్భస్థ శిశువును భరించుచున్నది కదా ! సా భావయత్రీ భావయితవ్యా భవతి ! ఆమె భావసుమన్వితురాలై, గర్భస్తు శిశువును భావసంపూర్ణునిగా చేయుచున్నది.
అందుచేత గర్భస్త స్త్రీ పవిత్రమైన దైవీ సంబంధ భావనలు కలిగి ఉండటం చేత శిశువు అదే రీతిగా దైవీ గుణ సంపత్తి, భావాలు కలిగినవాడుగా అగుచున్నాడు.
శిశువు జన్మించిన తరువాత తండ్రి అనేక సంస్కారములు నిర్వర్తించవలసిన బాధ్యతను పొందుచున్నాడు. ఎందుకు ? పుత్రుడు ఆత్మ నుండి ఉదయించిన కారణంచేత, ఆ సంస్కారములు తన కొరకై తానే నిర్వర్తించుచూ, పరిపోషించుకొనుచున్నట్లే అగుచున్నది !
ఆ విధంగా ప్రజాసంతతి వృద్ధి కొరకై ఆ తండ్రి శిశువుకు సంస్కారములు నిర్వర్తించి ప్రజా సంతతి యజ్ఞము నిర్వర్తించుచున్న వాడగుచున్నాడు. ఇట్లు సంతతి వృద్ధి చెందును గాక !
ఇది ఆత్మ యొక్క ద్వితీయ జన్మ ! (ఆత్మా వై పుత్రః)|
⌘
ద్వితీయో2ధ్యాయః - తృతీయ ఖండః
ఈ విధంగా సంతానము నిమిత్తమై పుణ్యకర్మలు నిర్వర్తిస్తూ తండ్రి ఆ మార్గములో ‘ఆత్మోపాసకుడు’ అనియే చెప్పబడుచున్నాడు.
ఆ తరువాత ఆత్మస్వరూపుడే అయి ఉన్న తండ్రి తన యొక్క జగదంతర్గతమైన ఆత్మ (జీవాత్మ)ను ఉత్తమ కర్మలతో కృతకృత్యుడుగా చేయుచున్నాడు. ఆయుర్దాయము ముగిసిన తరువాత అతడు (తండ్రి) తన భౌతిక శరీరమును వీడి వెళ్ళుచున్నాడు. అతడు ఈ లోకము నుండి బయల్వెడలుచూనే, తిరిగి మరొక శరీరమును ఆశ్రయించి వెంటనే పునర్జన్మను పొందుచున్నాడు.
తదస్య తృతీయ జన్మ తత్ ఉక్తమ్ ఋషీణాం !
ఒక శరీరము వదలి మరొక శరీరమును స్వీకరించటము (పునర్జన్మ పొందటము) ఆత్మకు ‘తృతీయ జన్మ’ అగుచున్నది. ఇది ఈ విధంగా మహర్షి ప్రోక్తము. అట్టి పునర్జన్మ - పాత వస్త్రము వీడి, కొత్త వస్త్రము ధరించటము వంటిదే కాబట్టి, … దేహముల రాక-పోకలచే ఆత్మయొక్క యథాతథత్వము చెక్కుచెదురునది కాదు.
⌘
ద్వితీయో2ధ్యాయః - చతుర్థ ఖండః
మహర్షియగు వామదేవులవారు (వాసుదేవ మహర్షి) తల్లి గర్భమున ఉన్నప్పుడు - స్వీయానుభవంగా మనం చెప్పుకున్న త్రిజన్మల గురించి, పురుష - స్త్రీ దేహములోని ఆత్మభగవానుని క్రీడా వినోదంగా దేహ పట్టణములో ప్రవేశించు దేవతా ప్రజ్ఞల చమత్కారము గురించి స్వయంగా గమనించి శిష్యులకు వివరించి చెప్పుచున్నారు.
శ్రీ వామదేవౌ వాచ :
ఓ స్వయమాత్మానంద స్వరూపులారా వినండి !
మాతృగర్భములో నివసించుచూ ఉండగా, సకల దేవతల జన్మవృత్తాంతములను ఇప్పటి వరకూ చెప్పుకొనియున్న రీతిగా తెలుసుకొన్నాను.
అగ్నిదేవుడు | వాక్ స్వరూపంగా | నోటియందు, |
వాయుదేవుడు | ప్రాణ స్వరూపులై | నాశిక (ముక్కు) యందు, |
సూర్య తేజస్సు | దర్శన శక్తియై | కనులయందు, |
అశ్వనీ దేవతలు(ఓషధ-వనస్పతి దేవతలు) | స్పర్శ శక్తితో | చర్మమునందు, |
దిక్ దేవతలు | శ్రోత్ర శక్తితో | చెవులయందు, |
చంద్రుడు | మనోరూపుడై | హృదయములోను, |
యమదేవత(మృత్యుదేవత) | అపానరూపులై | నాభి ప్రదేశమునందు, |
వరుణ (జల) దేవులు | రేతస్సు రూపులై | శిశ్నమునందు, |
ప్రవేశించి తమ తమ అంశల-శక్తులతో నివసిస్తూ, ఈ దేహ నిర్మాణాన్ని నిర్వర్తిస్తూ రక్షిస్తూ పర్యవేక్షకులై ఉండటం చేతనే నా
దేహము నిర్మితమై, క్రియా సామర్థ్యము పొందుచున్నట్లు నేను గమనించుచున్నాను. (ఇదియే సర్వ దేహముల విషయం కూడా!)
ఎవ్వరైతే ఈ విధమైన దేహ నిర్మాణ విశేషాలతో కూడిన జన్మ-కర్మల రహస్యము, దైవీతత్త్వాలు, పరమాత్మ విన్యాసము ఎరుగుతారో
స ఏవమ్ విద్వాన్ అస్మాత్ శరీర భేదాత్ ఊర్ధ్వమ్ ఉత్రమ్యా…
ఆముష్మిన్ స్వర్గలోకే సర్వాన్ కామాన్ అప్యా… అమృతః సమభవత్ ! సమభవత్ ! ఇతి ‘ఓం’
అట్టివాడు ఈ జనన - మరణ (దేహ - దేహాంతర) మహాచక్రము నుండి విడివడినవాడై, బయల్పడి ఆముష్మిక లోకములు ప్రవేశిస్తాడు.
సర్వకామములు సిద్ధింపజేసుకొన్నవాడై “ఏదో కావాలి” అను కామరూప పరిధులను దాటివేయుచున్నాడు.
దేహ నిర్మాణ - దేవతాశక్తి ప్రాప్తముల చమత్మనిని ఎరిగిన యోగి ఆపై ఇక సర్వసమభావుడై, అమృతానంద స్వరూపుడై, స్వయమాత్మానంద
విభవుడై ఓంకార స్వరూపుడై ప్రకాశించుచున్నాడు. ఇది వామదేవ మహర్షి ప్రవచనమ్ ! ఓం నమో వామ దేవాయ।
⌘
తృతీయో2ధ్యాయః
(యధాస్థానం గర్భిణ్యః - ఇప్పుడిక్కడనుండి గర్భిణి స్త్రీలు కూడా వచ్చి కూర్చుని వినవచ్చు)
ఈ విధంగా - ఆ ఆత్మ భగవానుని సంకల్పము నుండి లీలా - క్రీడా - ఆనందరూప కల్పనగా బయల్వెడలిన దేవతలు, దేహములలో ప్రవేశించి, తమ ప్రజ్ఞలచే - దేహములోని చూపు వినికిడి స్పర్శ మొదలైన తత్త్వాంశలను పర్యవేక్షిస్తూ, సర్వమూ ఆత్మ భగవానునికి సమర్పణగా కార్యక్రమములన్నీ నిర్వర్తించటం….,
ఆత్మ భగవానునికి అభిన్నుడగు ఈ జీవుడు దేహ ప్రవేశ - నిష్క్రమణములు నిర్వర్తించటము…, ఇదంతా జరుగుచున్నది.
అట్టి ఆత్మను ఎరుగనంతవరకు జీవుడుగాను, ఆత్మను ఎరుగుటచే స్వయమాత్మ స్వరూపుడుగా ఉత్రమణ పొందటం. … జరుగుచున్నది.
ఇక ఇప్పుడు,
కో అయమ్ ఆత్మేతి వయమ్ ఉపాస్మహే - కతరః ఆత్మా?
మనము ఉపాసించుచున్న ఆ ఆత్మ భగవానుడు ఎట్టివాడు ? ఆత్మ అనగా ఏమి? ఎట్టిది? ఎక్కడిది? మనమంతా దేనివలన దేనిచేత… దేహ-మనో-బుద్ధి-చిత్త-అహంకారాలతో ఏదైనా చేయుచూ ఉన్నామో…. అదియే మనము ఉపాసించు “ఆత్మ”!
ఈ జీవుడు
- యేన వా రూపం పశ్యతి - దేనివలన కనులతో దృశ్యమును చూచుచున్నాడో…,
- యేన వా శబ్దం శృణోతి - దేనివలన చెవులతో శబ్దమును వినుచున్నాడో….,
- యేన వా గంధానా జిఘ్రతి - దేనివలన ముక్కుతో వాసనలను ఆఘ్రాణిస్తున్నాడో
- యేన వా వాచం వ్యాకరోతి - దేనివలన నోటితో మాటలు మాట్లాడుచున్నాడో
- యేన వా స్వాదు చ అస్వాదు చ విజానాతి - దేనివలన నాలుకతో రుచి ఆస్వాదిస్తున్నాడో దేని వలన ‘ఇది రుచిగా లేదు’ అని ఎరుగుచున్నాడో,
- దేనివలన “ఇది ఇట్లు కదా !” అని బుద్ధితో తెలుసుకుంటున్నాడో, మనస్సుతో నవరసముల భావనలు చేస్తున్నాడో, ఏది హృదయము, మనస్సు కూడా అయి ఉన్నదో అదియే ఆత్మ ! ఆత్మదేవుడు ప్రజ్ఞా స్వరూపుడై ఈ సర్వము నిర్వర్తిస్తున్నారు. కనుక ప్రజ్ఞానం బ్రహ్మ ! ప్రజ్ఞానమే బ్రహ్మ ! ఈ సర్వము ప్రజ్ఞానస్వరూపమ్ ! పరబ్రహ్మమ్ !
- లోక లోకాంతరములు తనయందు కలిగి ఉన్న ఈ హృదయము.
- అనేక విషయములను ఒకటి తరువాత మరొకటిగా ఆలోచిస్తూ ఉన్న ఈ మనస్సు.
- తాను కదలక ప్రాణ - మనో - బుద్ధి ఇత్యాదులన్నీ కదల్చు చైతన్యము,
- అనేక జ్ఞాన విశేషములతో కూడిన సంజ్ఞారూప జగత్తు, అజ్ఞానము,
- ఇవన్నీ సమన్వయించు విజ్ఞానము, కేవల రూపమగు ప్రజ్ఞానము,
- తెలివితేటల రూపమగు మేధస్సు,
- ధ్యాసరూపమగు దృష్టి,
- అనేక అనుభవపరంపరలతో కూడిన మతి, మనోధైర్యరూపమైన ధృతి, మనోదార్ద్యము,
- విచక్షణాజ్ఞానము, నిర్ణయములను నిర్ణయించు మనీషము (బుద్ధి), మనోవేదనా జ్ఞానము,
- అసంఖ్యాక జ్ఞాపకములతో కూడిన జ్ఞప్తి, స్మృతి, స్మృతులు, స్మరణము, శాస్త్ర జ్ఞానము,
- భావనా పరంపరల రూపమైనట్టి సంకల్పము, కల్పనను జోడించి చూచు వికల్పము,
- కార్యక్రమముల ధ్యాసరూపమైన క్రతువు,
- స్వాధీన రూపమైన అసుః, ఆశ్రయము,
- ‘ఏదో కావాలి’ అనే రూపమైన కామము,
- కొన్ని నామ-రూప-ధ్యాసలకు, వశమైయుండు ‘అవశము’,
“ఇతి సర్వాణి ఏతాని ప్రజ్ఞానస్య నామధేయాని భవంతి ”
ఆయా మొదలైన ఇవన్నీ కూడా ప్రజ్ఞారూపములే ! (లేక) ప్రజ్ఞాన బ్రహ్మమే - ఈ ఈ వివిధ నామధేయములతో చెన్నొందుచున్నది.
అట్టి ప్రజ్ఞయే సృష్టికర్తయగు బ్రహ్మ దేవుడు ! ఆ ఆత్మ భగవానుడే ఇంద్రుడు. ఆయనయే ప్రజాపతి ! సర్వదేవతలు ఆ పరబ్రహ్మ మూర్తియే ! అతడే భూమి జలము అగ్ని - వాయువు ఆకాశము కూడా ! పంచ భూతములు ఆ పరమాత్మ స్వరూపమే ! - - అల్పములగు జంతువులు, సర్వ వస్తు మిశ్రమములు, విత్తనములు, వృక్షములు, మిగతా సర్వస్థావర - జంగమములు, అండజములు, బీజజములు, జరాయుజములు (గర్భ, జనితములు), స్వేదజములు, ఉద్భుజములు ఆ పరమాత్మ స్వరూప విన్యాసములే ! కథా రచయితయొక్క కథా కల్పనా చైతన్యమే కథలోని సర్వ విశేషములు కదా!
ఇక్కడి గుర్రము, ఆవు, మానవుడు, ఏనుగు మొదలైన జంగమములు, స్థావరములు, ప్రాణములున్నవి, ప్రాణములు లేనివి… ఇవన్నీ ఆ ప్రజ్ఞాన భగవానుని వివిధ నేత్రములే! నేను-నీవు-ఆతడు-ఈతడు-అది-ఇది ఆత్మయే అయి ఉన్న ప్రజ్ఞాన స్వరూపులమే! ప్రజ్ఞానం బ్రహ్మ!
ప్రజ్ఞా నేత్రో లోకః : ఈ లోకములన్నీ ఆ ప్రజ్ఞాన భగవానుని నేత్రమే !
ప్రజ్ఞా ప్రతిష్ట : ఇవన్నీ ప్రజ్ఞ యందే ప్రతిష్ఠితమై ఉన్నాయి. ప్రజ్ఞాన బ్రహ్మమునందే అంతర్గతము!
ప్రజ్ఞానం బ్రహ్మ : ప్రజ్ఞానమే బ్రహ్మము !
స్వప్నంలో కనిపించే ఇల్లు - రాయి - మట్టి - గోడ - జంతువులు - పక్షులు - మానవులు - దేవతలు - అన్నీ స్వప్న ద్రష్టయొక్క స్వప్న చైతన్య రూపమే అగుటయే ఇందుకు దృష్టాంతము.
ఈ కనబడేదంతా బ్రహ్మమునందే ప్రతిష్టితమైయున్నది - ఐతరేయమ్! దీనికంతటికీ వేరై, ఇదంతా అయి ఉన్నవాడు.
ఆత్మ నుండియే ఆత్మ బయల్వెడలి ఆత్మయందు సంచరించి ఆత్మయందే లయించుచున్నది.
🙏 ఇతి ఐతరేయో పనిషత్ సమాప్తః 🙏
ఓం శాంతిః శాంతిః శాంతిః ॥