[[@YHRK]] [[@Spiritual]]

Aksha Mālika Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 1
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com
Courtesy - sanskritdocuments.org (For ORIGINAL Slokas Without Sandhi Splitting)


ఋగ్వేదాంతర్గత

1     అక్షమాలికోపనిషత్

మంగళశ్లోక - తాత్పర్య పుష్పము



అకారాదిక్షకారాంతవర్ణజాతకలేవరం .
వికలేవరకైవల్యం రామచంద్రపదం భజే ..
ఓం 

ఓం కార రూప పరబ్రహ్మమునకు నమస్కరిస్తూ!


హరిః ఓం . అథ ప్రజాపతిర్గుహం పప్రచ్ఛ భో
బ్రహ్మన్నక్షమాలాభేదవిధిం బ్రూహీతి . సా కిం
లక్షణా కతి భేదా అస్యాః కతి సూత్రాణి కథం
ఘటనాప్రకారః కే వర్ణాః కా ప్రతిష్ఠా
కైషాధిదేవతా కిం ఫలం చేతి .
1. అథ ప్రజాపతిః గుహమ్ పప్రచ్ఛ, 
“భో బ్రహ్మన్ | అక్షమాలాభేద విధిమ్ బ్రూహి” | - ఇతి
“సా కిం లక్షణా? కతి భేదా?
 అస్యాః కాని సూ(మా)త్రాణి? 
 కథం ఘటనా ప్రకారః? కే వర్ణాః? కా ప్రతిష్ఠా?
 క ఏష అధి దేవతా? కిం ఫలం చ? ఇతి |”
ఒకానొక సందర్భములో ప్రజాపతి భగవంతుడగు కుమారస్వామితో సత్సంగ పూర్వకంగా సంభాషిస్తూ ఇట్లు పరిప్రశ్నించసాగారు. 

భో బ్రహ్మన్! భగవన్! కుమారస్వామీ! ఇప్పుడు -
అక్షమాల యొక్క భేదవిధి అంతరార్థ వివరణ ఏమిటో వివరించి చెప్పమని అర్థిస్తున్నాను.

అక్షమాల యొక్క లక్షణములు ఏమి? అవన్నీ ఎన్ని విధములైనవి? 

ఎన్ని సూత్రములు (దారములు)తో ఏఏ ఆకారములుగా నిర్మించబడాలి?

గ్రుచ్చి ఉంచటం ఎట్లా? ఏమేమి రంగులు ఉంటాయి? 

అద్దాని అధి దేవతలు ఎవరు? అద్దాని ఉపాసనా విధి - ప్రయోజనములు, ఫలితములు ఎట్టివి?


తం గుహః ప్రత్యువాచ
తం గుహః ప్రత్యువాచ :- 
అప్పుడు బ్రహ్మవిద్యా విశారదుడు, శివపుత్రుడు అగు కుమారస్వామి ప్రజాపతికి ఇట్లు వివరించారు.


ప్రవాలమౌక్తికస్ఫటికశంఖ-
రజతాష్టాపదచందనపుత్రజీవికాబ్జే రుద్రాక్షా
ఇతి .
ప్రవాళ మౌక్తిక స్ఫటిక శంఖ రజత అష్టాపద చందన పుత్రజీవిక అబ్జ రుద్రాక్షా ఇతి
అక్షమాల ముఖ్యముగా 10 విధములైనవిగా లోక ప్రసిద్ధము.

  1. పగడములు 2. ముత్యములు 3. స్ఫటికములు 4. శంఖములు 5. వెండి 6. బంగారము 7. మంచి గంధము 8. పుత్రజీవిక 9. తామరగింజలు 10. రుద్రాక్షలు.

వీటిలో ఏ ఒక్కటిచే నిర్మితమైనప్పటికీ ఆ మాల శ్రేష్ఠమే!

ఆదిక్షాంతమూర్తిః
ఆది-క్షాంత మూర్తిః |
అక్ష - “అ నుండి క్ష” వరకు సంజ్ఞగా కలిగి ఉండటంచేత అక్షమాలను ఆదిక్షాంతమూర్తి - మూర్తీభవించిన అకారాది క్షకారాంత సర్వతత్త్వ స్వరూపిణి .…… అని అభివర్ణిస్తున్నారు.

సావధానభావా .
సౌవర్ణం రాజతం తామ్రం తన్ముఖే ముఖం
తత్పుచ్ఛే పుచ్ఛం తదంతరావర్తనక్రమేణ
యోజయేత్ .
సావధాన భావా,  సౌవర్ణం రాజతం తామ్రం చేతి సూత్రత్రయమ్।
తద్వివరే సౌవర్ణమ్।
తత్ అక్షపార్శ్వే - రాజతం।
తత్ వామే తామ్రం।
తత్ ముఖే ముఖమ్।   తత్ పుచ్ఛే పుచ్ఛమ్।
తదంతర - ఆవర్తన క్రమేణ యోజయేత్।।
అక్ష = ’అ’కార ఆది - ’క్ష’కార అంత సర్వస్వరూపిణి
’అక్ష’లు + మాల = అక్షమాల.
మాల = 3 సూత్రములు .
బంగారము - వెండి - రాగి సూత్రములు 3.

అక్షమాల యొక్క పూసలు గుచ్చే మాలా-సూత్రపు దారములలో….
- అక్ష రుద్రముల రంధ్రముల నుండి బంగారు దారము,
- కుడివైపుగా వెండి దారము,
- ఎడమవైపుగా రాగిదారములతో గ్రుచ్చుతున్నారు.

అక్ష యొక్క పైభాగము పైకి, క్రింద భాగము క్రిందకి వెనుక భాగము వెనుకకు ఉండునట్లుగా అక్షమాలను తయారు చేసుకుంటున్నారు.

యదస్యాంతరం సూత్రం తద్బ్రహ్మ .
2. యత్ అస్య అంతరం సూత్రం తత్ ‘బ్రహ్మ’।
లోపల ఉన్న సూత్రము - బ్రహ్మ సూత్రము గాను

యద్దక్షపార్శ్వే తచ్ఛైవం .
యత్ అక్ష పార్శ్వే తత్ ’శైవమ్’।
కుడివైపు సూత్రపు దారము శివతత్త్వము - శైవము గాను,

యద్వామే తద్వైష్ణవం .
యత్ వామే తత్ ’వైష్ణవమ్’।
ఎడమవైపు సూత్రపు దారమును విష్ణుతత్త్వము - వైష్ణవముగాను,

యన్ముఖం సా సరస్వతీ .
యత్ ముఖమ్, సా ‘సరస్వతీ’।
అక్షమాల యొక్క ముఖ భాగమును బ్రహ్మవిద్యా ప్రసాదిని అగు సరస్వతీ దేవిగాను,

యత్పుచ్ఛం సా గాయత్రీ .
యత్ పుచ్చమ్, సా ‘గాయత్రీ’।
అక్షమాల యొక్క అక్షల వెనుక (పుచ్చ) భాగమును గాయత్రీ దేవిగాను, 

యత్సుషిరం సా విద్యా .
యత్ సుషిరమ్ సా ‘విద్యా’।
అక్షమాల - రంధ్ర స్థానము (సుషిరము) విద్యా రూపము గాను, 

యా గ్రంథిః సా ప్రకృతిః .
యా గ్రంథిః సా ‘’ప్రకృతిః’।
గ్రంథిని (ముడులను) ప్రకృతి రూపముగాను,

యే స్వరాస్తే ధవలాః .
యే స్వరాః తే ధవళాః।  తెల్లని అక్షలను స్వరములుగాను, (అ-అః వరకు గల అచ్చులు గాను)

యే స్పర్శాస్తే పీతాః .
యే స్పర్శాః తే పీతాః।
పసుపు పచ్చనిరంగు అక్షలను స్పర్శములు (క నుండి మ వరకు కకారాది-మకారాంత హల్లులు) గాను

యే పరాస్తే రక్తాః .
యే పరాః తే రక్తాః।
ఎర్రని రంగు అక్షలను తక్కిన యకారాది - క్షకారాంత హల్లులుగాను, భావన చేసి అక్షలు అమర్చుకోవాలి.

అథ తాం పంచభిర్గంధైరమృతైః
పంచభిర్గవ్యైస్తనుభిః శోధయిత్వా
పంచభిర్గవ్యైర్గంధోదకేన సంస్రాప్య
అథ తాం పంచభిః గంథైః అమృతైః,
పంచభిగవ్యైః తనుభిః
శోధయిత్వా, పంచభిః గవ్యైః
గంధోదకేన సంస్నాప్య, 
అటు తరువాత ఆ అక్షమాలను పంచగంధములతోను, పంచామృతములతోను, పంచగవ్యములతోను, పంచ తనువులతోను శోధించాలి. రుద్దాలి. శుభ్రం చేయాలి.
(పంచ గవ్యములు = గోమూత్రము, గోపేడ, గోవుపాలు, గో పెరుగు, గోనెయ్యి)
(పంచామృతములు = ఉదకము, పాలు, పెరుగు, నేయి, తేనె)
పంచ గవ్యములతోను, పంచ గంధములతోను తడిపి సంస్నాప్యము చేయాలి.

తస్మాత్సోంకారేణ పత్రకూర్చేన స్నపయిత్వా
తస్మాత్ స ‘ఓం’ కారేణ పత్ర కూర్చేన స్నపయిత్వా,
- ఓంకారోచ్ఛారణచేస్తూ ఆకుల-కుంచె (కూర్చ)తో తుడవాలి. స్నపనం చేయాలి.

అష్టభిర్గంధైరాలిప్య సుమనఃస్థలే
నివేశ్య
అష్టభిః గంథైః ఆలిప్య
సుమనః స్థలే నివేశ్య,
- అష్ట గంధములతో (కర్పూరము, కస్తూరి, పునుగు, జవ్వాజి, అగరు, పన్నీరు, అత్తరు, శ్రీగంధము) తో పూత పూయాలి. మనస్సుకు ఆనందం కలిగించే తీరుగా - అమర్చుచూ, పుష్పములపై ఉంచాలి.

అక్షతపుష్పైరారాధ్య
ప్రత్యక్ష మాదిక్షాంతైర్వర్ణైర్భావయేత్ .
అక్షత పుష్పైః ఆరాధ్య, 
ప్రత్యక్షమ్ ఆది-క్షాంతైః వర్ణైః భావయేత్।।
అక్షమాలకు పుష్పాలంకరణ చేసి అక్షతలతోను, పుష్పములతోను పూజించాలి.  అట్లా పూజిస్తూ, “ఈ అక్షమాల యొక్క అక్షలు- ‘అ’ కారమునుండి ‘క్ష’ కారము వరకు గల వర్ణములు-ఆధ్యాత్మిక ప్రత్యక్ష రూపములు" - అని భావన చేయాలి. పరమాత్మ స్వరూపంగా సంభావించాలి! ఒక్కొక్క అక్షతను శబ్ద-అర్థభావ పూర్వకంగా ఈవిధంగా గంధ పుష్పాలతో పూజించాలి.


అక్షపూజ



ఓమంకార మృత్యుంజయ సర్వవ్యాపక ప్రథమేఽక్షే ప్రతితిష్ఠ .
ఓం “అం” కార మృత్యుంజయ సర్వవ్యాపక ప్రథమే అక్షే ప్రతితిష్ఠ ! (1) 

( ప్రతితిష్ఠ = శాశ్వతముగా నిలుపబడునది
ఓం-అమ్.. కారా! ఓ మృత్యుంజయా! సర్వ వ్యాపకా! ప్రథమ అక్షా!  మిమ్ములను స్థాపిస్తూ పూజిస్తున్నాను. ప్రతితిష్ఠ - వేంచేసి సుఖాశీనులవండి! 

ఓమాంకారాకర్షణాత్మకసర్వగత ద్వితీయేఽక్షే ప్రతితిష్ఠ .
ఓం “ఆం” కార ఆకర్షణాత్మక సర్వగత ద్వితీయే అక్షే ప్రతితిష్ఠ! (2)
ఓం-ఆమ్.. కారా! ఓ సర్వాకర్షణాత్మకా! సర్వగతా! ద్వితీయాక్షాయ నమః । ప్రతితిష్ఠ!

ఓమింకారపుష్టిదాక్షోభకర తృతీయేఽక్షే ప్రతితిష్ఠ .
ఓం “ఇం” కార పుష్టిద-అక్షోభకర తృతీయే అక్షే ప్రతితిష్ఠ ! (3)  ఓం-ఇమ్.. కారా! పుష్టిప్రదాతా! సర్వ క్షోభములు తొలగించే తృతీయ అక్షాయ నమః । ప్రతితిష్ఠ!

ఓమీంకార వాక్ప్రసాదకర నిర్మల చతుర్థేఽక్షే ప్రతితిష్ఠ .
ఓం “ఈం” కార వాక్ ప్రసాదకర నిర్మల  చతుర్థే అక్షే ప్రతితిష్ఠ ! (4)  ఓం-ఈమ్.. కారా! నిర్మలమైన వాక్కు, మనస్సు ప్రసాదించే చతుర్థ అక్షరాయ నమః । ప్రతితిష్ఠ!

ఓముంకార సర్వబలప్రద సారతర పంచమేఽక్షే ప్రతితిష్ఠ .
ఓం “ఉం” కార సర్వబలప్రద సారతర పంచమే అక్షే ప్రతితిష్ఠ ! (5)  ఓం-ఉమ్.. కారా! సర్వబల ప్రదాతా! సారతర స్వరూపా! పంచమ అక్షరాయ నమః । ప్రతితిష్ఠ!

ఓమూంకారోచ్చాటన దుఃసహ షష్ఠేఽక్షే ప్రతితిష్ఠ .
ఓం “ఊం” కార ఉచ్చాటనకర దుస్సహ షష్టే అక్షే ప్రతితిష్ఠ ! (6)
ఓం-ఊమ్.. కారా! ఉచ్చాటనశక్తి ప్రదాతా! సర్వమునూ ప్రకటించు స్వామీ!  శత్రువులకు సహించరాని శబ్దశక్తి ప్రదాతా! ఆరవ అక్షా! నమో నమః ! వేంచేసి సుఖాసీనులయ్యెదరు గాక! ప్రతితిష్ఠ !

ఓమృంకాకార సంక్షోభకర చంచల సప్తమేఽక్షే ప్రతితిష్ఠ .
ఓం “ఋం” కార సంక్షోభకర చంచల సప్తమే అక్షే ప్రతితిష్ఠ ! (7)  ఓం-ఋమ్.. కారా! యుద్ధములో వేగవంతమైన చంచలము, సంక్షోభకరము అగు శక్తితో విజయము ప్రసాదించు సప్తమాక్షా! నమోనమః! ప్రతిష్ఠితులయ్యెదరు గాక!

ఓమౄంకార సంమోహనకరోజవలాష్టమేఽక్షే ప్రతితిష్ఠ .
ఓం “ౠం” కార సంమోహనకర ఉజ్వల అష్టమే అక్షే ప్రతితిష్ఠ ! (8)  ఓం-ౠమ్.. కారా! యుద్ధభూమిలో శత్రువులకు సంమోహనమును కలగజేయగల, ఉజ్వలత్వము ప్రసాదించు అష్టమాక్షా! ప్రతిష్ఠితులవ్వండి!

ఓమ్లృంకారవిద్వేషణకర మోహక నవమేఽక్షే ప్రతితిష్ఠ .
ఓం “ఌం” కార - విద్వేషణకర మోహక నవమే అక్షే ప్రతితిష్ఠ! (9)
ఓం-ఌం.. కారా! యుద్ధోత్సాహము, విద్వేషకర- మోహము కలుగ నవమే (తొలుగ) జేయునది అగు నవమ అక్షే నమః ! ప్రతితిష్ఠ!

ఓమ్లౄంకార మోహకర దశమేఽక్షే ప్రతితిష్ఠ .
ఓం “ౡం” కార మోహకర దశమే అక్షే ప్రతితిష్ఠ ! (10)
ఓం-ౡం.. కార! సర్వమును మోహింపజేయ స్వామీ! పదవ అక్షా! ప్రతిష్ఠితులయ్యెదరు గాక!

ఓమేంకార సర్వవశ్యకర శుద్ధసత్త్వైకాదశేఽక్షే ప్రతితిష్ఠ .
ఓం “ఏం” కార సర్వవశ్యకర శుద్ధసత్వ ఏకాదశే అక్షే ప్రతితిష్ఠ ! (11)  ఓం-ఏమ్.. కార! శుద్ధ సాత్విక స్వరూపులు, సర్వవశ్యకరులు అగు 11వ అక్షే! ప్రతితిష్ఠ! నమో నమః !

ఓమైంకార శుద్ధసాత్త్విక పురుషవశ్యకర ద్వాదశేఽక్షే ప్రతితిష్ఠ .
ఓం “ఐం” కార శుద్ధసాత్త్విక పురుష వశ్యకర ద్వాదశే అక్షే ప్రతితిష్ఠ ! (12)
ఓం-ఐమ్.. కార! శుద్ధ సాత్విక పురుష స్వరూపులు, సర్వవశంకరులు అగు 12వ అక్షే! త్వమ్ ప్రతితిష్ఠ! నమోనమః !

ఓమోంకారాఖిలవాఙ్మయ నిత్యశుద్ధ త్రయోదశేఽక్షే ప్రతితిష్ఠ .
ఓం “ఓం” కార అఖిల వాఙ్మయ నిత్యశుద్ధ త్రయోదశే అక్షే ప్రతితిష్ఠ! (13)  ఓం-ఓమ్.. కార! అఖిల వాఙ్మయ స్వరూపులు, నిత్య శుద్ధ స్వరూపులు అగు 13వ అక్షే! ప్రతితిష్ఠులవండి!

ఓమౌంకార సర్వవాఙ్మయ వశ్యకర చతుర్దశేఽక్షే ప్రతితిష్ఠ .
ఓమంకార గజాదివశ్యకర మోహన పంచదశేఽక్షే ప్రతితిష్ఠ .
ఓమఃకార మృత్యునాశనకర రౌద్ర షోడశేఽక్షే ప్రతితిష్ఠ .
ఓం కంకార సర్వవిషహర కల్యాణద సప్తదశేఽక్షే ప్రతితిష్ఠ .
ఓం “ఔం” కార సర్వ వాఙ్మయ వశ్యకర చతుర్దశే అక్షే ప్రతితిష్ఠ ! (14)  ఓం-ఔమ్.. కార! సర్వ వాఙ్మయమును వశ్యకరం చేయు, పాండిత్యము ప్రసాదించు 14వ అక్షే! ప్రతితిష్ఠ!

ఓమంకార గజాదివశ్యకర మోహన పంచదశేఽక్షే ప్రతితిష్ఠ .
ఓం “అం” కార గజాది వశ్యకర మోహన పంచదశే అక్షే ప్రతితిష్ఠ ! (15)
ఓం-అం-కార! ఏనుగు మొదలైనవి వశముచేయు (ఏనుగువంటి వారిని వశము చేయు) - మోహనకరము అగు 15వ అక్షే! ప్రతితిష్ఠ!

ఓమఃకార మృత్యునాశనకర రౌద్ర షోడశేఽక్షే ప్రతితిష్ఠ .
ఓం “అః” కార మృత్యునాశకర రౌద్ర షోడశే అక్షే ప్రతితిష్ఠ ! (16)
ఓం-అః.. కార! రౌద్ర రూపియై, మృత్యుముఖమునుండి కూడా రక్షించునది అగు 16వ అక్షమాతా! ప్రతితిష్ఠ !

ఓం కంకార సర్వవిషహర కల్యాణద సప్తదశేఽక్షే ప్రతితిష్ఠ .
ఓం “కం” కార సర్వవిషహర కల్యాణద సప్తదశే అక్షే ప్రతితిష్ఠ ! (17)  ఓం-కమ్.. కార! సర్వవిషమ స్థితులనుండి, గతుల నుండి వాటిని తొలగించి కాపాడు కళ్యాణప్రదమగు 17వ అక్ష! ప్రతితిష్ఠ!

ఓం ఖంకార సర్వక్షోభకర వ్యాపకాష్టాదశేఽక్షే ప్రతితిష్ఠ .
ఓం “ఖం” కార సర్వక్షోభకర వ్యాపక  అష్టాదశే అక్షే ప్రతితిష్ఠ ! (18)
ఓం-ఖమ్.. కార! సర్వమును క్షోభింపజేయగల, వ్యాపకత్వ ప్రసాదకరము అగు 18వ అక్షను ప్రతితిష్ఠిస్తున్నాము.

ఓం గంకార సర్వవిఘ్నశమన మహత్తరైకోనవింశేఽక్షే ప్రతితిష్ఠ .
ఓం “గం” కార సర్వవిఘ్నశమన మహత్తర ఏకోనవింశే అక్షే ప్రతితిష్ఠ ! (19)
ఓం-గమ్.. కార! సర్వ విఘ్నములను శమింపజేయు, మహత్తరత్వము ప్రసాదించునదిగా 19వ అక్షను ప్రతితిష్ఠిస్తున్నాము.

ఓం ఘంకార సౌభాగ్యద స్తంభనకర వింశేఽక్షే ప్రతితిష్ఠ .
ఓం “ఘం” కార సౌభాగ్యద స్తంభనకర  వింశే అక్షే ప్రతితిష్ఠ ! (20)
ఓం-ఘమ్.. కార! సౌభాగ్యప్రదము, వ్యతిరేక శక్తులను స్తంభింపజేయునదిగా 20వ అక్షను పూజిస్తున్నాము.

ఓం ఙకార సర్వవిషనాశకరోగ్రైకవింశేఽక్షే ప్రతితిష్ఠ .
ఓం “ఙం” కార సర్వ విషనాశకర ఉగ్ర  ఏకవింశే అక్షే ప్రతితిష్ఠ ! (21)
ఓం-ఙమ్.. కార! సర్వ విషములను నశింపజేయునది, ఉగ్రమైనదిగా, ఉత్సాహముగా చేయునదిగా 21వ అక్షను ఆస్వాదించుచూ, ఉపాసిస్తున్నాము. 

ఓం చంకారాభిచారఘ్న క్రూర ద్వావింశేఽక్షే ప్రతితిష్ఠ .
ఓం “చం” కార అభిచారఘ్న క్రూర ద్వావింశే అక్షే ప్రతితిష్ఠ! (22)
ఓం-చమ్.. కార! అభిచారములను (హానిచేయు హోమము ఇత్యాదుల దోషములను) నిరోధించునదిగాను 22వ అక్షను ప్రార్థిస్తూ స్థాపిస్తున్నాను.

ఓం ఛంకార భూతనాశకర భీషణ త్రయోవింశేఽక్షే ప్రతితిష్ఠ .
ఓం “ఛం” కార భూతనాశకర భీషణ త్రయోవింశే అక్షే ప్రతితిష్ఠ ! (23)
ఓం-ఛమ్.. కార! భూత తత్త్వములను అధిగమింపజేయునది, భీషణము అగు 23వ అక్షను ప్రతితిష్ఠిస్తున్నాము.

ఓం జంకార కృత్యాదినాశకర దుర్ధర్ష చతుర్వింశేఽక్షే ప్రతితిష్ఠ .
ఓం “జం” కార కృత్యాదినాశకర దుర్ధర్ష  చతుర్వింశే అక్షే ప్రతితిష్ఠ ! (24)

ఓం-జమ్.. కార! కృత (కర్మ), అకృత (కర్మల) దోషములను నశింపజేయు (అతీతుని చేయు), ఇతరుల కర్మలకు అలభ్యము- దర్శము అగు 24వ అక్షను ప్రతితిష్ఠిస్తున్నాము.


ఓం ఝంకార భూతనాశకర పంచవింశేఽక్షే ప్రతితిష్ఠ .
ఓం “ఝుం” కార భూత నాశకర  పంచవింశే అక్షే ప్రతితిష్ఠ ! (25)
ఓం-ఝుమ్.. కార! భౌతిక పరిమిత భావ శృంఖలములను (బేడీలను) త్రెంచివేయు భూత నాశకరమగు 25వ అక్షను ప్రతితిష్ఠించి ఆరాధిస్తున్నాము.

ఓం ఞకార మృత్యుప్రమథన షడ్వింశేఽక్షే ప్రతితిష్ఠ .
ఓం “ఞం” కార మృత్యు ప్రమథన  షడ్వింశే అక్షే ప్రతితిష్ఠ ! (26)  ఓం-ఞమ్.. కార! మృత్యువుయొక్క విచారణచే మృత్యువును అధిగమించి అమృతత్వము చేర్చునదిగా 26వ అక్ష ప్రతితిష్ఠితమగు గాక!

ఓం టంకార సర్వవ్యాధిహర సుభగ సప్తవింశేఽక్షే ప్రతితిష్ఠ .
ఓం “టం” కార సర్వ వ్యాధిహర సుభగ  సప్తవింశే అక్షే ప్రతితిష్ఠ ! (27)  ఓం-టమ్.. కార! సర్వవ్యాధులను హరించు, భాగ్యవంతముగా తీర్చిదిద్దు అక్ష ప్రతితిష్ఠమగు గాక!

ఓం ఠంకార చంద్రరూపాష్టావింశేఽక్షే ప్రతితిష్ఠ .
ఓం “ఠం” కార చంద్రరూప అష్టావింశే అక్షే ప్రతితిష్ఠ ! (28)
ఓం-ఠమ్.. కార! ఓషధ-అమృతరస ప్రసాదియగు చంద్ర రసరూపముగా 28వ అక్ష ప్రతిష్ఠితమగు గాక!

ఓం డంకార గరుడాత్మక విషఘ్న శోభనైకోనత్రింశేఽక్షే ప్రతితిష్ఠ .
ఓం “డం” కార గరుడాత్మక విషఘ్న శోభన ఏకోనత్రింశే అక్షే ప్రతితిష్ఠ ! (29)
ఓం-డమ్.. కార! గరుడాత్మకమై విషత్వము తొలగించు 29వ అక్షను ప్రతితిష్ఠించు చున్నాము.

ఓం ఢంకార సర్వసంపత్ప్రద సుభగ త్రింశేఽక్షే ప్రతితిష్ఠ .
ఓం “ఢం” కార సర్వ సంపత్ప్రద సుభగ త్రింశే అక్షే ప్రతితిష్ఠ ! (30)  ఓం-ఢమ్.. కార! సర్వసంపదలను ప్రసాదించు, భాగ్యవంతవము అయినదిగా 30వ అక్ష ప్రతితిష్ఠిస్తున్నాము.

ఓం ణంకార సర్వసిద్ధిప్రద మోహకరైకత్రింశేఽక్షే ప్రతితిష్ఠ .
ఓం “ణం” కార సర్వసిద్ధిప్రద మోహకర ఏకత్రింశే అక్షే ప్రతితిష్ఠ ! (31)
ఓం-ణమ్.. కార! సర్వ ఆశయములను సిద్ధింపజేయునది, మోహనకరము అగు 31వ అక్షను ప్రతితిష్ఠిస్తున్నాము.

ఓం తంకార ధనధాన్యాదిసంపత్ప్రద ప్రసన్న ద్వాత్రింశేఽక్షే ప్రతితిష్ఠ .
ఓం “తం” కార ధనధాన్యాది సంపత్ప్రద ప్రసన్న ద్వాత్రింశే అక్షే ప్రతితిష్ఠ! (32)
ఓం-తమ్.. కార! ధన-ధాన్య-సంపదలను ప్రసాదించునది, ప్రసన్న స్వరూపిణిగా, 32వ అక్షను ప్రతితిష్ఠించి పూజిస్తున్నాము.

ఓం థంకార ధర్మప్రాప్తికర నిర్మల త్రయస్త్రింశేఽక్షే ప్రతితిష్ఠ .
ఓం “థం” కార ధర్మప్రాప్తికర నిర్మల త్రయస్త్రింశే అక్షే ప్రతితిష్ఠ ! (33)
ఓం-థమ్.. కార! ధర్మముపట్ల శ్రద్ధను ప్రాప్తింపజేయునదిగా, బుద్ధిని నిర్మలము చేయునదిగా 33వ అక్షను ప్రతితిష్ఠించి పూజిస్తున్నాము. 

ఓం దంకార పుష్టివృద్ధికర ప్రియదర్శన చతుస్త్రింశేఽక్షే ప్రతితిష్ఠ .
ఓం “దం” కార పుష్టివృద్ధికర ప్రియదర్శన చతుస్త్రింశే అక్షే ప్రతితిష్ఠ ! (34) 

ఓం-దమ్.. కార! పుష్టిను వృద్ధిఇచ్చు, ప్రియదర్శనమును ప్రసాదించు 34వ అక్ష ఆరాధిస్తున్నాము.


ఓం ధంకార విషజ్వరనిఘ్న విపుల పంచత్రింశేఽక్షే ప్రతితిష్ఠ .
ఓం “ధం” కార విషజ్వరఘ్న విపుల పంచత్రింశే అక్షే ప్రతితిష్ఠ ! (35)  ఓం-ధమ్.. కార! విషజ్వరమును తొలగించు, బుద్ధిని విస్తారము చేయు 35వ అక్షను ప్రతితిష్ఠించి సేవిస్తున్నాము.

ఓం నంకార భుక్తిముక్తిప్రద శాంత షట్త్రింశేఽక్షే ప్రతితిష్ఠ .
ఓం “నం” కార భుక్తి-ముక్తి ప్రద శాంత షట్రింశే అక్షే ప్రతితిష్ఠ ! (36)  ఓం-నమ్.. కార! భుక్తి-ముక్తి ప్రదము, పరమశాంత రూపము అగు 36వ అక్ష ప్రతితిష్ఠితమగు గాక!

ఓం పంకార విషవిఘ్ననాశన భవ్య సప్తత్రింశేఽక్షే ప్రతితిష్ఠ .
ఓం “పం” కార విషవిఘ్ననాశన, భవ్య సప్తత్రింశే అక్షే ప్రతితిష్ఠ ! (37)  ఓం-పమ్.. కార! విషముతో సమానమైన విఘ్నములను తొలగించుచూ  సంరక్షించు 37వ అక్షను పూజిస్తున్నాము.

ఓం ఫంకారాణిమాదిసిద్ధిప్రద జ్యోతీరూపాష్టత్రింశేఽక్షే ప్రతితిష్ఠ .
ఓం “ఫం” కార అణిమాది సిద్ధిప్రద జ్యోతీరూప అష్టత్రింశే అక్షే ప్రతితిష్ఠ ! (38)
ఓం-ఫమ్.. కార! అణిమాది అష్ట (8) సిద్దులను ప్రసాదించునదిగా, జ్యోతి స్వరూపముగా 38వ అక్షను ప్రతితిష్ఠించి నమస్కరిస్తున్నాము.

ఓం బంకార సర్వదోషహర శోభనైకోనచత్వారింశేఽక్షే ప్రతితిష్ఠ .
ఓం “బం” కార సర్వదోషహర శోభన ఏకోనచత్వారింశే అక్షే ప్రతితిష్ఠ ! (39)
ఓం-బమ్.. కార! సర్వదోషములను హరించునదిగా, శోభను ప్రసాదించునదిగా 39వ అక్షను ప్రతితిష్ఠితం !

ఓం భంకార భూతప్రశాంతికర భయానక చత్వారింశేఽక్షే ప్రతితిష్ఠ .
ఓం “భం” కార భూతశాంతికర భయానక చత్వారింశే అక్షే ప్రతితిష్ఠ ! (40)  ఓం-భమ్.. కార! భూత శాంతికరముగాను, దుష్టబుద్ధులకు భయానకముగాను 40వ అక్ష ప్రతితిష్ఠితము అగుగాక!

ఓం మంకార విద్వేషిమోహనకరైకచత్వారింశేఽక్షే ప్రతితిష్ఠ .
ఓం “మం” కార విద్వేషి మోహనకర ఏక చత్వారింశే అక్షే ప్రతితిష్ఠ ! (41)  ఓం-మమ్.. కార! విద్వేషి-మోహనకరముగాను, 41వ అక్షను ప్రతితిష్ఠిస్తున్నాము.

ఓం యంకార సర్వవ్యాపక పావన ద్విచత్వారింశేఽక్షే ప్రతితిష్ఠ .
ఓం “యం” కార సర్వవ్యాపక పావన ద్విచత్వారింశే అక్షే ప్రతితిష్ఠ! (42)
ఓం-యమ్.. కార! సర్వ వ్యాపకము, సర్వమును పావనము-పవిత్రము చేయునది అగు 42వ అక్షము ప్రతితిష్ఠిస్తున్నాము.

ఓం రంకార దాహకర వికృత త్రిచత్వారింశేఽక్షే ప్రతితిష్ఠ .
ఓం “రం” కార దాహకర వికృత త్రిచత్వారింశే అక్షే ప్రతితిష్ఠ ! (43)
ఓం-రమ్.. కార! దాహకరము, ప్రకృతికి వేరై, నామరూపాత్మకము వికృతము అగు 43వ అక్షను ప్రతితిష్ఠిస్తున్నాము.

ఓం లంకార విశ్వంభర భాసుర చతుశ్చత్వారింశేఽక్షే ప్రతితిష్ఠ .
ఓం “లం” కార విశ్వంభర భాసుర చతుశ్చత్వారింశే అక్షే ప్రతితిష్ఠ ! (44)  ఓం-లమ్.. కార! విశ్వమును భరించునదిగాను, సర్వమును ప్రకాశింపజేయునదిగాను 44వ అక్షను ప్రతితిష్ఠిస్తున్నాము.

ఓం వంకార సర్వాప్యాయనకర నిర్మల పంచచత్వారింశేఽక్షే ప్రతితిష్ఠ .
ఓం “వం” కార సర్వాప్యాయనకర నిర్మల పంచచత్వారింశే అక్షే ప్రతితిష్ఠ ! (45)  ఓం-వమ్.. కార! సర్వమును ఆప్యాయకరముగా చేయునదిగాను, హృదయము నిర్మలము చేయునదిగా 45వ అక్షను నిలుపుచున్నాము. 

ఓం శంకార సర్వఫలప్రద పవిత్ర షట్చత్వారింశేఽక్షే ప్రతితిష్ఠ .
ఓం “శం” కార సర్వఫలప్రద పవిత్ర షట్చత్వారింశే అక్షే ప్రతితిష్ఠ ! (46)  ఓం-శమ్.. కార! సర్వఫలప్రదముగాను, పవిత్రముగాను 46వ అక్షను భావ నిశ్చలము చేస్తున్నాము.

ఓం షంకార ధర్మార్థకామద ధవల సప్తచత్వారింశేఽక్షే ప్రతితిష్ఠ .
ఓం “షం” కార ధర్మార్థకామద ధవళ సప్తచత్వారింశే అక్షే ప్రతితిష్ఠ ! (47)
ఓం-షమ్.. కార! ధర్మ-అర్థ-కామ ప్రదముగాను, ధగధగాయ మానము అగు, 47వ అక్షను సుస్థిరీకజేస్తున్నాము.

ఓం సంకార సర్వకారణ సార్వవర్ణికాష్టచత్వారింశేఽక్షే ప్రతితిష్ఠ .
ఓం “సం” కార సర్వకారణ సార్వవర్ణికా అష్టచత్వారింశే అక్షే ప్రతితిష్ఠ ! (48)
ఓం-సమ్.. కార! సర్వకారణ కారణముగాను, సర్వ వర్ణములతో ప్రకాశించునదిగాను, 48వ అక్షను స్థాపన చేస్తున్నాము.

ఓం హంకార సర్వవాఙ్మయ నిర్మలైకోనపంచాశదక్షే ప్రతితిష్ఠ .
ఓం “హం” కార సర్వవాఙ్మయ నిర్మల ఏకో న పంచాశత్ అక్షే ప్రతితిష్ఠ ! (49)
ఓం-హమ్.. కార! సర్వ వాఙ్మయ స్వరూపముగాను 49వ అక్షను  ప్రతిష్ఠిస్తున్నాము.

ఓం ళంకార సర్వశక్తిప్రద ప్రధాన పంచాశదక్షే ప్రతితిష్ఠ .
ఓం “ళం” కార సర్వశక్తిప్రద ప్రధాన పంచాశత్ అక్షే ప్రతితిష్ఠ ! (50)  ఓం-ళమ్.. కార! సర్వశక్తిప్రదము, ప్రధానముగాను 50వ అక్ష   స్థాపించుచున్నాము.

ఓం క్షంకార పరాపరతత్త్వజ్ఞాపక పరంజ్యోతీరూప శిఖామణౌ ప్రతితిష్ఠ .
ఓం “క్షం” కార పరాపరత్వ జ్ఞాపక పరజ్యోతి రూప శిఖామణౌ ప్రతితిష్ఠ ! (51)
ఓం-క్షమ్.. కార! పరమునకు ఆవలగల పరాపరత్వమును జ్ఞాపకము చేయునది గాను, పరంజ్యోతి స్వరూపముగాను భావనా ప్రతితిష్ఠితము చేస్తున్నాము.



అథోవాచ
అథ ఉవాచ : 
జగద్గురవగు, కుమారస్వామి మరల ఇట్లా చెప్పసాగారు! ఈవిధముగా అక్షమాలను అక్షములతో ప్రతితిష్ఠము చేసిన తరువాత, ఇట్లా ప్రార్థించాలి.

యే దేవాః పృథివీపదస్తేభ్యో నమో
భగవంతోఽనుమదంతు శోభాయై పితరోఽనుమదంతు
శోభాయై జ్ఞానమయీమక్షమాలికాం .
యే దేవాః పృథివి ఈషదః, తేభ్యో
నమో భగవంతో అనుమదంతు ।
శోభాయై పితరో అనుమదంతు ।  శోభాయై జ్ఞానమయీమ్  అక్షమాలికామ్ ।
"ఏఏ దేవతలు ఈ భూమినంతా వేంచేసి ఉన్నారో…  భగవంత స్వరూపులగు వారందరికీ నమస్కారము! మా ఈ ఉపాసన - ఆరాధనలను అనుమతించెదరు గాక! శోభన, సౌందర్యమును మా యీ కార్యక్రమమునకు ఇచ్చెదరు గాక! భూమిపై వేంచేసియున్న పితృదేవతలు అనుమతిస్తూ, ప్రసాదించుదురు గాక! ఈ అక్షమాలిక శోభతో జ్ఞానమయమై ప్రకాశించును గాక!”

అథోవాచ యే దేవా అంతరిక్షసదస్తేభ్యః ఓం నమో
భగవంతోఽనుమదంతు శోభాయై పితరోఽనుమదంతు
శోభాయైజ్ఞానమయీమక్షమాలికాం .
యే దేవా అంతరిక్షసత్ తేభ్య
ఓం నమో భగవంతో అనుమదంతు ।
శోభాయై పితరో అనుమదంతు ।
శోభాయై జ్ఞానమయీమ్ అక్షమాలికామ్ ।
ఏఏ దేవతలు అంతరిక్షమునందు వేంచేసియున్నారో, వారందరికి నమస్కరిస్తున్నాము. ఈ అక్షమాలికోపాసనకు అనుమతి ప్రసాదించ వేడుకొనుచున్నాము. అంతరిక్షములోని పితృదేవతలు శోభకై ఈ అక్షములను అంగీకరించెదరు గాక! శోభతో జ్ఞానమయమై ఈ అక్షమాల మాపట్ల ప్రకాశించును గాక!

అథోవాచ యే దేవా దివిషదస్తేభ్యో నమో
భగవంతోఽనుమదంతు శోభాయై పితరోఽనుమదంతు
శోభాయై జ్ఞానమయీమక్షమాలికాం .
యే దేవా దివిషదః  తేభ్యో నమో భగవంతో అనుమదంతు ।
శోభాయై పితరో అనుమదంతు ।
శోభాయై జ్ఞానమయీమ్ అక్షమాలికామ్ ।
ఏఏ దేవతలు స్వర్గ (దివ్య) లోకములో అవస్థితులై ఉన్నారో… వారందరికీ నమస్కరిస్తున్నాము. వారు ఈ అక్షమాలను అనుమదించెదరు గాక! అంగీకరించెదరు గాక! దివ్యలోకాలలోని పితరులు అనుమోదించి శోభాయమానముగా ఈ అక్షమాలను శోభింపజేసెదరు గాక! ఈ అక్షమాల శోభాయమానమై, జ్ఞానమయమై మా పట్ల వెలుగొందును గాక!

అథోవాచ యే మంత్రా యా విద్యాస్తేభ్యో
నమస్తాభ్యశ్చోన్నమస్తచ్ఛక్తిరస్యాః
ప్రతిష్ఠాపయతి .
యే మంత్రా యా విద్యాః  తేభ్యో నమఃతాభ్యశ్చ  ఓం నమస్తః శక్తిః
అస్యాః ప్రతిష్టాపయతి ।
ఈ భూమి పై ప్రకాశించుచున్న సర్వ మంత్ర దేవతలకు, సర్వ విద్యా దేవతలకు నమస్కరిస్తున్నాము. ఓ మంత్ర దేవతలారా! విద్యా దేవతలారా! మీమీ శక్తులను ఈ అక్షమాలయందు ప్రతిష్ఠింపజేయ వలసినదిగా ప్రార్థిస్తున్నాము. అర్థిస్తున్నాము.

అథోవాచ యే బ్రహ్మవిష్ణురుద్రాస్తేభ్యః
సగుణేభ్య ఓం నమస్తద్వీర్యమస్యాః
ప్రతిష్ఠాపయతి .
యే బ్రహ్మ-విష్ణు-రుద్రాః  తేభ్యః సగుణేభ్య  ఓం నమః
తత్ వీర్యమ్  అస్యాః ప్రతిష్ఠాపయతి ।
సగుణతత్త్వ స్వరూపులగు త్రిమూర్తులారా! బ్రహ్మ విష్ణు మహేశ్వరులారా! మీకు నమస్కరిస్తున్నాము. మీ వీర్య ఉత్సాహములను ఈ “అక్షమాల” యందు ప్రతిష్ఠాపన చేయవలసినదిగా మిమ్ము వేడుకుంటున్నాము! (ఆ మీ వీర్యశక్తి  మాయందలి బద్ధకము, అశ్రద్ధ, దురభ్యాసములు, మెతకతనములను తొలగించుచు మమ్ములను ఉత్సాహవంతులను, వీర్యవంతులను చేయును గాక!)

అథోవాచ యే సాంఖ్యాదితత్త్వభేదాస్తేభ్యో
నమో వర్తధ్వం విరోధేఽనువర్తధ్వం .
యే సాంఖ్యాది తత్త్వభేదాః
తేభ్యో నమో
వర్తధ్వం, విరోధే అనువర్తద్వమ్!
ఏఏ సాంఖ్య-భక్తి-జ్ఞాన-కర్మ యోగాది భేదములు (వేరువేరుగా) చెప్పబడుచున్నాయో…. అట్టి యోగ భేద దేవతలందరికీ నమస్కరిస్తున్నాము. ఇక్కడ ఉండండి! విరోధము (Differences) లను అనుసరిస్తూనే…. ఇక్కడికి రండి! (ఏకము అగు మార్గము చూపండి)

అథోవాచ యే శైవా వైష్ణవాః శాక్తాః
శతసహస్రశస్తేభ్యో నమోనమో భగవంతోఽ-
నుమదంత్వనుగృహ్ణంతు .
యే శైవా-వైష్ణవా-శాక్తేః శత సహస్రశః తేభ్యో నమో నమో భగవంతో అనుమదంతు!  అనుగృహంతు ।
శైవ-వైష్ణవ- శాక్త ….. ఇట్లు వందల - వేల వివిధ మార్గాణ్వేషకులు ఎవరెవరు ఉన్నారో…, వారందరికీ నమోనమః !
ఓ భగవంతులారా! ఈ అక్షమాలను అనుమతించండి! ఇది మా పట్ల దివ్యోపకరణమగు గాక - అని దీవించండి!

అథోవాచ యాశ్చ మృత్యోః ప్రాణవత్యస్తాభ్యో
నమోనమస్తేనైతం మృడయత మృడయత .
యాశ్చ మృత్యోః ప్రాణవత్యస్తః
మాకు తేభ్యో నమో నమః।  తేన యేతాం మృడయత! మృడయత!
ఏ మృత్యు దేవతలు, ప్రాణ దేవతలు ఉన్నారో… వారందరికి నమస్కారము! నమస్కారము! మీరు ఇదంతా సుఖముగా ఉండునట్లు చేయండి! సుఖము ప్రసాదించెదరు గాక!

పునరేతస్యాం సర్వాత్మకత్వం భావయిత్వా భావేన
పూర్వమాలికాముత్పాద్యారభ్య తన్మయీం
మహోపహారైరుపహృత్య ఆదిక్షాంతైరక్షరైరక్ష-
మాలామష్టోత్తరశతం స్పృశేత్ .
అథ పునరుత్థాప్య ప్రదక్షిణీకృత్యోం నమస్తే
భగవతి మంత్రమాతృకేఽక్షమాలే
సర్వవశంకర్యోంనమస్తే భగవతి మంత్రమాతృకేఽ-
క్షమాలికే శేషస్తంభిన్యోంనమస్తే భగవతి
మంత్రమాతృకేఽక్షమాలే ఉచ్చాటన్యోంనమస్తే
పునః ఏతస్యాం సర్వాత్మకత్వమ్ భావయిత్వా, భావేన
పూర్వమాలికామ్ ఉత్పాద్య,
ఆరభ్య, తన్మయీం
మహోపహారైః ఉపహృత్య  ఆది-క్షాంతైః అక్షౌ: అక్షమాలామ్
అష్టోత్తరశతమ్ స్పృశేత్ ।
అథః పునః ఉతాప్య, ప్రదక్షిణీ కృత్య…,

ఓం నమస్తే భగవతి। మంత్రమాత్రృకే ।
అక్షమాలే । సర్వవశంకర్యోః ।
నమస్తే భగవతి మంత్రమాతృకే  అక్షమాలికే । శేష స్తంభిన్యోః ।
నమస్తే భగవతి।
మంత్రమాతృకే అక్షమాలికే ఉచ్చాటన్యోః నమస్తే ।
దీనియందు పునఃపునః సర్వాత్మకత్వము భావన చేయుచున్నాము. అట్టి భావనతో పూర్వమాలికను దారములతో నిర్మించుకొని, ధ్యానము ఆరంభించి, ఆ ధ్యాన ఫలమును పరమాత్మకు మహత్తరమైన కానుకగా సమర్పించెదము గాక! “అ” మొదలు “ క్ష ” అంతము వరకు అక్షములతో (పూసలతో) - అష్టోత్తరశతమును (108) సర్వాత్మక భావనతో స్పృశించుచున్నాము! అటు తరువాత ఒక ప్రదేశమున సుఖాశీనముగా ఉంచి అక్షమాలకు ప్రదక్షిణ నమస్కారములు చేయుచున్నాము.

ఓ భగవతీ! మంత్రమాతృకే! అక్షమాలికే! సర్వదృశ్యమును స్థంభింపజేయ గలవు! వశము చేయగలవు! ఆదిశేషత్వమును ప్రసాదించెదవు గాక! 
భగవతీ! నమస్తే!
హే మంత్రమాతృకే! అక్షమాలికే! సర్వోచ్ఛారిణివైయున్న (One whose expression is all this).
నీకు - నమస్తే!

భగవతి మంత్రమాతృకేఽక్షమాలే విశ్వామృత్యో
మృత్యుంజయస్వరూపిణి సకలలోకోద్దీపిని సకలలోక-
రక్షాధికే సకలలోకోజ్జీవికే సకలలోకోత్పాదికే
దివాప్రవర్తికే రాత్రిప్రవర్తికే నద్యంతరం యాసి
దేశాంతరం యాసి ద్వీపాంతరం యాసి లోకాంతరం
యాసి సర్వదా స్ఫురసి సర్వహృది వాససి .
నమస్తే పరారూపే నమస్తే పశ్యంతీరూపే నమస్తే
మధ్యమారూపే నమస్తే వైఖరీరూపే సర్వతత్త్వాత్మికే
సర్వవిద్యాత్మికే సర్వశక్త్యాత్మికే సర్వదేవాత్మికే
వసిష్ఠేన మునినారాధితే విశ్వామిత్రేణ
మునినోపజీవ్యమానే నమస్తే నమస్తే .
మంత్ర మాతృకే, అక్షమాలికే, విశ్వా!
మృత్యో, మృత్యుంజయ స్వరూపిణి!
సకలలోక ఉద్దీపిని!  సకల లోక రక్షాధికే!  సకలలోక ఉజ్జీవికే!  సకల - ఉత్పాదికే!
దివా ప్రవర్తికే, రాత్రి ప్రవర్తికే!  నద్యంతరమ్ యాసి!
దేశాంతరమ్ యాసి!
ద్వీపాంతరమ్ యాసి!  లోకాంతరమ్ యాసి!  సర్వదా స్ఫురసి!
సర్వహృది వాసయసి ॥
నమస్తే పరా రూపే ।  నమస్తే పశ్యంతీ రూపే ।  నమస్తే మధ్యమా రూపే ।  నమస్తే వైఖరీ రూపే ।
సర్వ తత్త్వాత్మికే ।
సర్వ విద్యాత్మికే ।
సర్వ శక్త్యాత్మికే ।
సర్వ దేవాత్మికే ।  వసిష్ఠేన మునినా ఆరాధితే ।
విశ్వామిత్రేణ మునినా ఉపసేవ్యమానే ।
నమస్తే । నమస్తే ।।
హే మంత్రమాతృకే! విశ్వ స్వరూపిణీ!
మృత్యు-మృత్యుంజయ స్వరూపిణీ!
సకల లోకములను ప్రకాశింపజేయు మాతృమూర్తీ!
లోక రక్షకే!
సకల లోకములను ఉజ్జీవింపజేయు మాతే!
సకల లోకముల ఉత్పత్తి నిర్వర్తిస్తున్న ఉత్పాదక స్థానమగు మాతృదేవీ!
పగలు - రాత్రులను ప్రవర్తింపజేయుచున్న జననీ!
నదులలో అంతర్లీనముగా గల జగదంబికే!
దేశ దేశాంతరములుగా వ్యాపించి ఉన్న మూర్తీ!
ద్వీప-ద్వీపాంతరములు, లోక-లోకాంతరములుగా మూర్తీభవించియున్న తల్లీ!
సర్వదా సర్వముగా స్ఫురిస్తున్న సర్వతత్త్వ స్వరూపిణీ!
ఓ సర్వ హృదయ నివాసినీ!
ఓ పరాత్పరీ! పరారూపే! నమస్తే!
ఓ సర్వముగా కనబడుచున్న పస్యంతీ రూపిణీ! నమస్తే!  మధ్యమా (శబ్దముల) రూపిణీ! నమస్తే!
వైఖరీ (వాక్య రూపమైన వాక్కు) రూపిణీ నమస్తే! నమస్తే!  సర్వతత్త్వములయొక్క ఆత్మ స్వరూపిణీ!  హే సర్వ విద్యా స్వరూపిణీ!  సర్వశక్తి స్వరూపిణీ!
సర్వ దేవతా స్వరూపిణీ!
వసిష్ఠ మహర్షిచే తత్త్వ స్వరూపిణిగా ఆరాధించబడే తల్లీ!  విశ్వామిత్ర మహర్షి చే (గాయత్రీ దేవిగా) సేవించబడు జననీ!  నమస్తే! నమస్తే!


ఫలశ్రుతి


ప్రాతరధీయానో రాత్రికృతం పాపం నాశయతి .
సాయమధీయానో దివసకృతం పాపం నాశయతి .
ప్రాతః అధీయానో రాత్రింకృతం పాపమ్ నాశయతి ।
సాయమ్ అధీయానో దివసకృతం పాపం నాశయతి । 
ఈవిధముగా అక్షమాలను, స్తోత్రము చేయువాడు ఉత్తమ ప్రయోజనం పొందుచున్నాడు.
ఉదయం పఠించువాడు (ఉపాసించువాడు) క్రితం రాత్రి పాపదోషములను తొలగించుకోగలడు!
సాయంకాలము అక్షమాలోపాసనచే రోజంతా చేసి పాపకర్మలనుండి విముక్తి పొందుచున్నాడు.

తత్సాయంప్రాతః ప్రయుంజానః పాపోఽపాపోభవతి .
తత్ సాయం ప్రాతః ప్రయుంజానః పాపో అపాపో భవతి।  ఉదయం-సాయంకాలం కూడా పఠించువాడు పాపి కూడా అపాపి అగుచున్నాడు. 

ఏవమక్షమాలికయా జప్తో మంత్రః సద్యః సిద్ధికరో
ఏవమ్ అక్షమాలిక యా జప్తో  మంత్రః సద్యః సిద్ధికరో భవతి
ఈ రీతిగా ఉపాశించిన అక్షమాలిక (పూసల దండ) జపం చేయు చుండగా, అట్టివాని మంత్రము అతి త్వరగా సిద్ధించగలదు.

భవతీత్యాహ భగవాన్గుహః ప్రజాపతిమిత్యుపనిఅషత్ ..
ఇతి ఆహ భగవాన్ గుహః ప్రజాపతిమ్ ।
ఇత్యుపనిషత్ 
ఈవిధంగా భగవానుడగు కుమారస్వామి ప్రజాపతికి సవివరించటం జరిగింది. 

ఇతి అక్షమాలికోపనిషత్।
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।।



ఋగ్వేదాంతర్గత

1     అక్షమాలిక ఉపనిషత్

అధ్యయన పుష్పము


“ఓం” కార సంజ్ఞార్థ స్వరూపుడు, సర్వాంతర్యామి, స్వయం పరిపూర్ణుడు అగు పరమాత్మకు నమోవాక్కములు!

ఒకానొక సందర్భములో ప్రజాపతి-సృష్టికర్త అగు బ్రహ్మదేవుడు కైలాసమును సందర్శించారు. తన బిడ్డలగు జీవుల సంసార దుఃఖ ప్రశమనము, జీవుల మోక్షానందము, లోకకళ్యాణము ఉద్దేశ్యించారు. అట్టి సమయములో భగవంతుడగు కుమారస్వామితో సందర్భమైనట్టి ఒక సమాగమమును లోక కళ్యాణపూర్వకంగా శుభప్రదము చేయాలని సంకల్పించి, ఇట్లు సంభాషించ సాగారు.

ప్రజాపతి :  భో బ్రహ్మన్! భగవన్! శివ ప్రియకుమారా! శ్రీ కుమారస్వామీ!

సాధకులు ఇష్ట దైవ ప్రీతి కొరకై రుద్రాక్ష (లేక) స్ఫటిక (లేక) తులసి మొదలైన వాటితో కూడిన మాల (దండ) ను సహాయకారిగా తీసుకొని మంత్రోపాసన, నామ జపం చేస్తూ వుంటారు. అట్లాగే ఏకాగ్రత-తదేక భావన ధ్యాసలకొరకై అట్టి అక్షమాలికను ధరిస్తూ కూడా ఉండటం ఉపాసకులు అభ్యాసము కదా!

అట్టి అక్షమాలాదేవి యొక్క -

⁉️ సా కిం లక్షణా?
ఏఏ లక్షణములు కలిగి ఉంటున్నాయి?
⁉️ కతి భేదా?
ఎన్నివిధములుగా ఉంటున్నాయి?
⁉️ అస్యాః కాని సూ (మా)త్రాణి?
ఎన్ని సూత్రపు దారములు కలిగి వుంటున్నాయి?
⁉️ కథం ఘటనా ప్రకారః?
ఆ పూసలను గ్రుచ్చి ఉంచటం ఏఏ తీరులుగా?
⁉️ కా వర్ణాః?
ఏమేమి రంగులు కలిగినవై ఉంటున్నాయి? అక్షమాలికలోని అక్షరముల ఉపాసనావిధి ఏమిటి?
⁉️ కా ప్రతిష్ఠా?
ఆయా పూసలు ఏఏ అర్థ- పరమార్ధములతో ప్రతిస్థాపితం చేసుకోవాలి?
⁉️ క ఏష అధి దేవతాః?
అట్టి ధ్యాననిమిత్తమై ఉపయోగించబడుచున్న అక్షమాలికలకు (పూసల దండలకు) అధిదేవతలు ఎవ్వరెవ్వరు?
⁉️ కిం ఫలం?
అక్షమాలా దేవి సహాముతో చేయు ధ్యానోపాసనల ఫలములు ఎటువంటివి?

హే కుమారస్వామీ! శివప్రియ పుత్రా! మీరు శివతత్త్వజ్ఞాన సంపన్నులు. దైవీతత్త్వ సంరక్షక సంప్రదాయకులు. భక్తులపట్ల అవ్యాజమైన ప్రేమ కలవారు. సాధకుల మనోగతమైన ఉపాసనా శ్రద్ధలను ఉద్దేశ్యించి, అక్షమాలా దేవ్యుపాసన విశేషాలు చెప్పండి!

గుహమ్ (కుమార స్వామి) ఉవాచ :

ఓ ప్రజాపతీ! సర్వజనుల సంసార బాధా నివృత్తిని ఉద్దేశ్యించి మీరు అక్షమాలా దేవ్యుపాసనా విశేషాలు అడుగుచుండటం నాకు చాలా సంతోషమును కలుగజేస్తోంది. అక్షమాలా విశేషాలు చెప్పుచున్నాను. వినండి.

ముముక్షువులైన ఉపాసకజనులు, మునులు, ఋషులు, దేవతలు మొదలైనవారు ధారణ చేస్తున్న అక్షమాలలు అసంఖ్యాక తీరులుగా ఉంటాయి. అందులో “10” రకములు అతి ముఖ్యమైనవిగా చెప్పబడుచున్నాయి.

1.) పగడములు 2.) ముత్యములు 3.) స్పటికములు 4.) శంఖములు 5.) వెండి
6.) బంగారము 7.) మంచిగంధము 8.) పుత్ర జీవిక 9.) తామర గింజలు 10.) రుద్రాక్షతలు

ఆదిక్షాంత మూర్తిః = “ అ” కారంతో ప్రారంభమై “ క్ష” కారంతో అంతమయ్యే మూర్తీభవించిన దేవతగా దర్శిస్తున్నారు.

అక్షమాల = “ కారంతో ప్రారంభమై ” క్ష " కారంతో అంతమై యుండటంచేత సర్వతత్త్వ - మూల ప్రకృతి స్వరూపిణిగా అక్ష అనే పేరు వచ్చింది.

మాల = సూత్రము, దారము.

సావధానభావా = అక్ష “సావధానభావ ప్రసాదిని” అని అభివర్ణిస్తున్నారు. జీవునికి అధ్యాత్మ భావనపట్ల, విద్యపట్ల సావధానము (Full Attention) ప్రసాదించునది.

మాల (దారము, సూత్రము) : 3 సూత్రములు (దారములు) కలిగి ఉంటోంది.
1. సౌవర్ణము (బంగారము) 2. రజతము (వెండి) 3. తామ్రము (రాగి) … (సృష్టి కల్పనయొక్క సత్వ-రజో-తమో గుణముల సంజ్ఞ)

తద్వివరే సౌవర్ణమ్ → తొల (రంధ్రము)లో బంగారపు దారము
తత్ అక్ష పార్శ్వే రజతమ్ → కుడివైపు వెండి సూత్రము
తత్వామే తామ్రమ్ → ఎడమవైపు రాగి సూత్రము

పూసయొక్క పై భాగము (అగ్రము) ➡ పై వైపుగాను, క్రింద పృష్ట భాగమును క్రిందికిగాను, మధ్యలో ప్రదక్షిణ క్రమముగాను పూసలను దారములకు గ్రుచ్చి దండను నిర్మించుకొనుచున్నారు.
(అక్షముయొక్క పైభాగము పైకి - మధ్య భాగము మధ్యగా, క్రింద భాగము క్రిందకు ఉండుతీరుగ గ్రుచ్చుచున్నారు).

అంతరః తత్ బ్రహ్మ  → (లోపలి) సూత్రమును → బ్రహ్మము (యొక్క స్వరూపం) గాను,
దక్షపార్శ్వే తత్ శైవమ్ → కుడివైపున ఉన్నదానిని  → శివోపాసనారూపమగు శైవముగాను,
వామే తత్ వైష్ణవమ్  → ఎడమవైపు భాగము → విష్ణోపాసనారూపమగు వైష్ణవముగాను,
యత్ ముఖమ్ సా సరస్వతీ → ముఖమును  → సర్వశబ్ద స్వరూపిణియగు సరస్వతీదేవిగాను,
యత్ పుచ్ఛం సా గాయత్రీ → వెనుకభాగము  → గాయత్రీ-సావిత్రీ-సరస్వతీ తత్త్వమగు గాయత్రీదేవిగాను,
యత్ సుషిరమ్ సా విద్యా → రంధ్ర విభాగము → విద్య గాను, బుద్ధిస్వరూపిణి గాను,
యా గ్రంథిః సా ప్రకృతిః → ముడి ప్రదేశమును → ప్రకృతిస్వరూపిణిగాను,
యే స్వరా తే ధవళాః → తెల్లని విభాగములు → స్వరములు (అచ్చులు) గాను, (‘అ’ నుండి ‘అః’ వరకు)
యే స్పర్శాః తే పీతాః → పసుపుపచ్చనివి → స్పర్శములు (‘క’ నుండి ‘మ’ వరకు గల హల్లులు) గాను
యే పరాః తే రక్తాః  → ఎర్రనివి → పరములు (య కారాది క్షకారాంతము వరకు గల హల్లులు గాను)

భావన చేసి, ఒకానొక క్రమమైనవిధంగా అక్షమాలా నిర్మాణమును నిర్వర్తించి, మునిజనము ఉపాసిస్తున్నారు.

అటు తరువాత ఆ అక్షమాలను
→ పంచ గంధ (పంచ చందనములతో (సుగంధ ద్రవ్యములతో),
→ పంచామృతములతో (ఉదకము, పాలు, పెరుగు, నేయి, తేనెలతో)
→ పంచగవ్యములతో (గోమూత్రము, గోపేడ, గోవుపాలు, గోపెరుగు, గోనెయ్యిలతో),
→ పంచతనువులతో (పంచభూతత్వములతో)
శోధించి శుభ్రము చేస్తున్నారు. ప్రకాశమానంగా తీర్చిదిద్దుచున్నారు. ఆ తరువాత కూడా పంచగవ్యములతో, మంచి గంధ జలంతో తడపుచున్నారు.

ఓం కారము - ఆకారముతో చేసిన దర్భ కూర్చ యొక్క బ్రహ్మముడితో మార్జనము చేస్తున్నారు. అష్ట గంధములతో (కర్పూరము, కస్తూరి, పునుగు, జవ్వాజి, అగరు, పన్నీరు, అత్తరు, శ్రీగంధములతో) పూతపూస్తున్నారు.

చక్కటి మనో ఆహ్లాదపూరితమగు స్థలములో ఉంచి అక్షతలతో, పూలతో ఆరాధనపూర్వకంగా పూజిస్తున్నారు.

ఒక్కొక్క పూసను పూలతో, అక్షతలతో పూజిస్తూ ‘అ’ కారంతో ప్రారంభమై ’క్ష’ కారముతో అంతమయ్యే ఒక్కొక్క అక్షర-వర్ణ తత్త్వములను భావన చేస్తూ నమస్కరిస్తున్నారు.

అక్షర తత్త్వమును ఒక్కొక్క పూసలో ప్రతిష్ఠిపిస్తున్నారు. (ప్రతితిష్ఠ - ఆహ్వానించి శాశ్వతంగా నిలిపి ఉంచుట)

అక్షరము యొక్క విశేషతత్త్వ వర్ణనలు:

ఓం అంకార ప్రథమాక్షే
మృత్యుంజయ! సర్వ వ్యాపక! (1)
ఓం ఆంకార ద్వితీయాక్షే
ఆకర్షణాత్మక! సర్వగత!
ఓం ఇంకార తృతీయాక్షే
పుష్టిత! అక్షోభకర!
ఓం ఈంకార చతుర్థాక్షే
వాక్ ప్రసాదకర! నిర్మల!
ఓం ఉంకార పంచమాక్షే
సర్వబలప్రద! సార తర!
ఓం ఊంకార షష్ఠి అక్షే
ఉచ్చాటన (Exhibiting) కర దుస్సహ!
ఓం ఋంకార సప్తమే అక్షే
సంక్షోభకర! చంచల!
ఓం ఋంకార అష్టమే అక్షే
సంమోహనకర! ఉజ్వల!
ఓం “ఌం”కార నవమే అక్షే
విద్వేషణకర మోహన !
ఓం “ౡం”..కార దశమే అక్షే
మోహనకర | (10)
ఓం ఏంకార ఏకాదశే అక్షే
సర్వవస్యకర శుద్ధసత్వ |
ఓం ఐంకార ద్వాదశే అక్షే
శుద్ధసాత్వికః పురుష వశ్యకర |
ఓం ఓంకార త్రయోదశే అక్షే
అఖిలవాఙ్మయ | నిత్యశుద్ధ
ఓం ఔంకార చతుర్దశే అక్షే
సర్వ వాఙ్మయ వశ్యకర |
ఓం అంకార పంచదశే అక్షే
గజాది వశ్యకర మోహన |
ఓం అఃకార షోడశే అక్షే
మృత్యునాశకర రౌద్ర
ఓం కంకార సప్తదశే అక్షే
సర్వవిషహరణ | కళ్యాణ ద | 
ఓం ఖంకార అష్టాదశే అక్షే
సర్వ క్షోభకర వ్యాపక |
ఓం గంకార ఏకోనవింశతే అక్షే
సర్వవిఘ్న శమన మహత్తర |
ఓం ఘంకార వింశతే అక్షే
సౌభాగ్యద | స్తంభనకర | (20)
ఓం ఙంకార ఏకవింశే అక్షే
సర్వవిషనాశకర | ఉగ్ర
ఓం చంకార ద్వావింశౌ అక్షే
అభిచారఘ్న-క్రూర (దుష్ట ప్రయోగ నివారణ)
ఓం ఛంకార త్రయోవిశే అక్షే
భూతనాశకర | భీషణ |
ఓం జంకార చతుర్వింశే అక్షే
కృత్యాది నాశకర (బాధింపజాలని) | దుర్ధర్ష | 
ఓం ఝంకార పంచవింశే అక్షే
భూత నాశకర |
ఓం ఞంకార షడ్వింశే అక్షే
మృత్యు ప్రమథన |
ఓం టంకార సప్తవింశే అక్షే
సర్వవ్యాధిహర | సుభగ |
ఓం ఠంకార అష్టావింశే అక్షే
చంద్రరూప |
ఓం డంకార ఏకోనత్రింశే అక్షే
గరుడాత్మక | విషఘ్ను (విషమును విరచివేయు)
ఓం ఢంకార త్రింశే అక్షే
సర్వ సంపత్ ప్రద ! సుభాగ !
ఓం ణంకార ఏకత్రింశే అక్షే
సర్వసిద్ధిప్రద ! మోహకర !
ఓం తంకార ద్వాత్రింశే అక్షే
ధనధాన్యాది సంపత్ప్రద! ప్రసన్న!
ఓం థంకార త్రయస్త్రింశే అక్షే
ధర్మప్రాప్తికర ! నిర్మల !
ఓం దంకార చతుస్త్రింశే అక్షే  పుష్టివృద్ధికర ! ప్రియదర్శన!
ఓం ధంకార పంచత్రింశే అక్షే
విషజ్వరఘ్ను (విషజ్వరమును తొలగించునది) ! విపుల (సర్వము విశదీకరించునది)
ఓం నంకార షట్రింశే అక్షే
భుక్తి-ముక్తి ప్రద | శాంత
ఓం పంకార సప్తత్రిశే అక్షే
విష విఘ్న నాశన । భవ్య (విషమువంటి విఘ్నములను తొలగించునది! తేజోప్రదము)
ఓం ఫంకార అష్టత్రింశే అక్షే
అణిమాది సిద్ధిప్రద | జ్యోతిరూప |
ఓం బంకార ఏకోన చత్వారింశే అక్షే
సర్వదోష హర | శోభన | (దోషములను తొలగించి శోభను కలిగించేది)
ఓం భంకార చత్వారింశే అక్షే
భూతశాంతి కర | భయానక
ఓం మంకార ఏక చత్వారింశే అక్షే
విద్వేషి మోహనకర |
ఓం యంకార ద్విచత్వారింశే అక్షే
సర్వ వ్యాపక! పావన !
ఓం రంకార త్రిచత్వారింశే అక్షే
దాహకర వికృత | (ప్రకృతి ప్రతిబింబిత)
ఓం లంకార చతుశ్చత్వారింశే అక్షే
విశ్వంభర! భాసుర |
ఓం వంకార పంచ చత్వారింశే అక్షే
సర్వాప్యాయనకర నిర్మల |
ఓం శంకార షట్ చత్వారింశే అక్షే
సర్వఫలప్రద | పవిత్ర |
ఓం షంకార సప్తచత్వారింశే అక్షే
ధర్మార్థకామద! ధవళ।
ఓం సంకార అష్ట చత్వారింశే అక్షే
సర్వకారణ సార్వవర్ణికా |
ఓం హంకార ఏకోన పంచాశత్ అక్షే
సర్వవాఙ్మయ నిర్మల |
ఓం ళంకార పంచాశత్ అక్షే
సర్వశక్తిప్రద ప్రధాన ।
ఓం క్షంకార షష్ఠాశత్ అక్షే
పర-అపర జ్ఞాపక పరంజ్యోతీ రూప శిఖామణే |

ప్రతితిష్ఠ



భగవానుడగు కుమారస్వామి అక్షమాలికా విశేషములగురించి సృష్టికర్తయగు ప్రజాపతికి ఇంకా ఇట్లా చెప్పసాగారు.

ఈవిధంగా విజ్ఞులు అక్షమాలను అ-కారాది క్షకారాంత’ అక్షలను అక్షరసాగుణ్యంగా ప్రతితిష్ఠింపజేస్తున్నారు. అటు తరువాత అక్షమాలోపాసన ఈవిధంగా కొనసాగిస్తూ ప్రార్థనాగీతాలు సమర్పించబడుచున్నాయి.

ఏఏ దేవతలు కరుణాంతంగులై ప్రేమాస్పదంగా ఈ పృధివిపై వేంచేసి ఇదంతా పుణ్యక్షేత్రములుగా చేయుచున్నారో,…. అట్టి దివ్య భగవత్ ప్రజ్ఞా స్వరూపులారా! మా ఈ నమస్కారములు స్వీకరించండి. ఈ అక్షమాలతో మేము చేయబోవు ధ్యాన - మనన - ఉపాసనలకు అనుమతిని ప్రసాదించమని వేడుకొనుచున్నాము.

ఓ పృథివిపై వేంచేసియున్న పితృదేవతలారా! మా కార్యక్రమములకు శోభ-సౌందర్యములను అనుగ్రహిస్తూ అనుమతించెదరు గాక! ఈ అక్షమాల జ్ఞానప్రసాదిని అయి శోభించునుగాక!

ఏఏ కరుణామూర్తులగు దేవతలు అంతరిక్షములో పరివేష్ఠితులై ఉన్నారో,…. వారికి - ఓం నమో భగవంతో-భగవత్ స్వరూపులైన ఆ దేవతలందరికి వచసా - మనసా నమస్కరిస్తున్నాము. వారు ఈ అక్షమాలా ధ్యానసూత్రమును అనుమతించెదరు గాక! అట్లాగే సృష్టి నిర్మాతలు అగు అంతరిక్షములోని పితృ దేవతలు కూడా ఈ మా అక్షమాలా వ్రతవిధికి అంగీకారము ప్రసాదించెదరుగాక! ఈ అక్షమాలిక వారందరి అనుజ్ఞ కరుణలచే శోభాయమానము, జ్ఞానమయము, జ్ఞానప్రాసాదితము అగుచుండును గాక!

ఏఏ దివ్యస్వరూపులగు దేవతలు దివ్య (స్వర్గ) లోకము మొదలైన ఊర్ధ్వ లోకములలో వేంచేసి అవస్థితులై ఉన్నారో….. భగవత్ రూపులగు వారంతా కూడా ఈ అక్షమాలికను ఆరాధనకై అనుమతిని, అనుజ్ఞను అందజేయుచుండెదరు గాక! స్వర్గలోక నివాసులగు దేవతలు - పితృదేవతలు కరుణించి మా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమములకు అంగీకారము, సహకారము దయచేసెదరు గాక! వారందరి కరుణచే ఈ అక్షమాల మా పట్ల శోభాయమానము జ్ఞానమయము అయి శోభిల్లునుగాక!

ఈ విశ్వ-విశ్వాంతరాళాలలో ఏఏ మంత్రదేవతలు, విద్యాప్రసాద దేవతలు వేంచేసి, లోక కళ్యాణమూర్తులై సంచరించుచున్నారో…. వారందరికీ నమస్కరిస్తున్నాము. వారు వారివారి సాత్విక దివ్య-విద్యా శక్తులను ఈ అక్షమాలయందు ప్రతితిష్టాపన చేయవలసినదిగా వేడుకొనుచున్నాము.

సృష్టి - స్థితి - లయకారకులు, సగుణతత్త్వ స్వరూపులు అగు ఓ బ్రహ్మ-విష్ణు-మహేశ్వరులారా! త్రిమూర్తులారా! మీకు మా హృదయపూర్వక నమస్కారములు, సాష్టాంగ దండ ప్రణామములు సమర్పించుకుంటున్నాము. మీయొక్క వీర్యశక్తిని ఈ అక్షమాలయందు ప్రవేశింపజేసి, మా ధ్యాన-ఉపాసన-సాధనా కార్యక్రమములను దిగ్విజయము చేయవలసినదిగా విన్నపములు సమర్పించుకుంటున్నాము. మాలో బద్ధకము, అశ్రద్ధ, దోషదృష్టులను తొలగించి అధ్యాత్మవాఙ్మయమువైపుగా ప్రోత్సాహించండి! ఏఏ సాంఖ్య-భక్తి-జ్ఞాన-కర్మ-క్రియా యోగాది మహానుభావులు నిష్ణాతులై ఈ భూమిపై చిద్విలాసముగా సంచరిస్తున్నారో, వారందరికి నమోవాక్కుములు సమర్పించుకుంటున్నాము. ఓ మహామహనీయులారా! మీమీ పరస్పర విరోధ (వేరువేరైన ఆధ్యాత్మికవాదోపవాదములతో, తత్ సమాచార - వ్యాఖ్య విశేషాలతో ఇక్కడికి వేంచేయమని వేడుకుంటున్నాము. ఈ అక్షమాలతో ఏ పరమసత్య స్థానము పొందగలమో, అందుకు మీరందరూ మార్గదర్శకులయ్యెదరు గాక!

ఓ శైవ - వైష్ణవ - శాక్త్యాది వందల - వేల మార్గములలో పరమాత్మను ఉపాసిస్తున్న వివిధ పాండితీ ప్రావీణ్యులారా! మీకందరికీ నమస్కరిస్తున్నాము. మీరంతా వేంచేయండి! భగవత్ స్వరూపులగు మీరంతా ఈ అక్షమాలోపాసనను అంగీకరించండి! ఆశీర్వదిస్తూ అనుగ్రహించండి. మా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమములకు తోడై ఉండండి!

ఓ మృత్యుదేవతా ప్రాణదేవతలారా! జీవన-మరణ దేవతలారా! మీ అందరికీ నమో నమః ! మీరు మమ్ములను సుఖవంతులుగా చేయండి! సుఖ - శాంతులను మాపై ప్రసరింపచేయండి! ఈ మా ఆరాధనా-ఆధ్యాత్మిక కార్యక్రమములకు దిగ్విజయత్వము ప్రసాదించండి!


కుమారస్వామి ఇంకా ఇట్లా ప్రజాపతితో చెప్పసాగారు.

ఈ విధంగా దేవతా ప్రజ్ఞలను, భూ ప్రపంచంలోని దైవీతత్త్వాలను అర్థిస్తూ ఇక ఆపై అక్షమాలయందు సర్వాత్మకత్వము భావనాపూర్వకంగా ప్రతితిష్ఠపించబడును గాక!

అట్టి సర్వాత్మ భావనతో మాలికను దారములతో గ్రుచ్చి నిర్మించుకోవాలి. ఇక ఆపై ఆ పరమ పవిత్రమగు అక్షమాలతో భగవత్ సమర్పణ పూర్వకంగా జప-ధ్యానములను ఆరంభించాలి. ఆ ధ్యాన ఫలమును సర్వాత్మకుడగు పరమాత్మకు సమర్పణ చేయాలి. ఆదిక్షాంత (“అ” కారముతో ప్రారంభమై - “క్ష” కారముతో చివరికి వచ్చే) అక్షమాలతో అష్టోత్తర శత (108) సార్లు మునివ్రేళ్ళతో స్పృశిస్తూ జప-ధ్యానములను నిర్వర్తించాలి.

అటు తరువాత ఆ అక్షమాలను ఒక పవిత్రమైన ప్రదేశములో ఉంచి ఆ అక్షమాలకు ప్రదక్షిణ నమస్కారములు సమర్పించాలి.

ఈ విధంగా ఆ అక్షమాలా దేవిని స్తుతిచేయుదురు గాక!

ఓం నమస్తే భగవతి! మంత్రమాతృకే! అక్షమాలే సర్వవశంకర్యోః!  
నమస్తే భగవతి ! మంత్రమాతృకే ! అక్షమాలే ! శేషస్తంభిన్యో !  
నమస్తే భగవతి ! మంత్ర మాతృకే ! అక్షమాలికే !  
నమస్తే ! మంత్రమాతృకే ! అక్షమాలికే! విశ్వా! మృత్యో ! మృత్యుంజయ స్వరూపిణీ !  
నమస్తే ! సకలలోక ఉద్దీపినీ ! సకల లోక రక్షాధికే ! సకల లోక ఉజ్జీవికే !

సకల ఉత్పాదికే ! దివా ప్రవర్తికే ! రాత్రి ప్రవర్తికే!

నాద్యంతరమ్ యాసి  ! దేశాంతరమ్ యాసి ! ద్వీపాంతరమ్ యాసి! లోకాంతరమ్ యాసి!

సర్వదా స్ఫురసి ! సర్వహృదయవాసయసి !

నమస్తే పరారూపే ! నమస్తే పశ్యంతీరూపే!

నమస్తే మధ్యమా రూపే! నమస్తే వైఖరీ రూపే!

సర్వతత్త్వాత్మికే ! సర్వ విద్యాత్మికే ! సర్వశక్త్యాత్మికే ! సర్వదేవాత్మికే ! వసిష్ఠన మునినా ఆరాధితే !

విశ్వామిత్రేణ మునినా ఉపసేవ్యమానే !

నమస్తే ! నమస్తే ! నమస్తే ! నమోనమః !

అమ్మా! అక్షమాలా దేవీ! ఓంకార స్వరూపిణీ! భగవతీ! నమస్తే! నమో నమః!

హే భగవతీ! మంత్రమాతృకే! సర్వవశంకరీ ! సర్వము లయించగా, అప్పటికీ శేషించియుండే ఆత్మానంద స్వరూపిణీ! చంచలమైన ఈ జగత్తుకు ఆధారమైయున్నట్టి నిశ్చలమైన, స్థంభీ భూతమైన పరమాత్మ స్వరూపిణీ! నీకు నమస్కారములు. సర్వమును వెలిగిస్తూ, తేజోమయం చేస్తున్న ఓ భగవతీ! నీకు నమస్కరిస్తున్నాము. ఈ 14 జగత్తులు ఎవ్వరి ప్రదర్శనమో, ఎవ్వరి ఉచ్చాటన యో, అట్టి నీకు

నమస్కారమమ్మా!

నీవు సర్వ మంత్రములకు మాతృకవు! సర్వమంత్ర-మంత్ర దేవతలకు ఉత్పత్తి స్థానమువు! తల్లివి! హే అక్షమాలికే! విశ్వేశ్వరీ! విశ్వ స్వరూపిణిదేవీ! విశ్వాధారీ! విశ్వే! ఓ మాతా! మార్పు చెందుచున్నది, మార్పు చెందనిదీ కూడా నీవే! అందుచేత మృత్యు-మృత్యుంజయ స్వరూపిణివి కూడా!

సకలలోకములను ఉద్దీపింపజేయునది (లేక) ప్రకాశింపజేయునది నీవేనమ్మా! ఈ లోకములన్నిటికీ అధికారిణివి! రక్షకురాలవు! అసలు ఈ లోకాలన్నీ నీ ఇచ్ఛ చేతనే ఉత్పత్తి చేయబడుచున్నాయి! నీవు లోక జననివి! ఇదంతా సంకల్పించి లీలగా ఉజ్జీవింప జేస్తున్నావు! మాకు ఉత్పత్తి - జీవితము నీ నుండే లభిస్తున్నాయి. నీవు మాకు, ఈ సర్వమునకు ఉత్పాదక - ఉజ్జీవన చైతన్య శక్తివైయున్నావు కదా! మేమంతా మీ ఇచ్ఛాశక్తి ప్రదర్శనములము అయి ఉన్నామమ్మా!

సూర్యభగవానుని రూపము ధరించినదానవై, సర్వాధారివి అయి ఉండి లోకములకు పగలు రాత్రులను ప్రవర్తింపజేయుచున్నది నీవే! జ్ఞాన అజ్ఞానములను, విద్యా-అవిద్యలను కల్పించుచున్నది కూడా నీవే! సర్వ నదులలో అంతర్లీనంగా ఉండే నదీమతల్లివి! దేశ దేశాంతరములుగా వ్యాపించి ఉన్న దానవు! ద్వీప- ద్వీపాంతరములుగా, లోక లోకాంతరములుగా విస్తరించి ఉన్నది నీవే!

సర్వత్రా సర్వదా సర్వముగా స్ఫురిస్తున్నదంతా నీరూపమేనమ్మా! నీవు ఎక్కడున్నావని వెతకాలి! మా హృదయాలలోనే సర్వదా వేంచేసియే ఉన్నావు! సర్వహృదయ నివాసినివి! ఈ కనబడేదంతా నీవే! కానీ ఇదేమీ కాకుండా వేరైకూడా ఉన్నావు! హే పరాస్వరూపిణీ! నమస్తే!

పర - శబ్దము - ఆవల ఉన్న పరతత్త్వము.

పశ్యంతి - మాటల కూర్పు - అర్థము - ఎదురుగా కనబడుచూ ఉన్న దృశ్యజగత్తు.

మధ్యమ - స్వరము - ఈ జగత్తును స్వానుభవముగా పొందుచున్న ద్రష్ట (జీవాత్మ)

వైఖరీ - వాక్యరూపమైన వాక్కులతో కూడిన - ఈ దృశ్యము వివిధ ద్రష్టలచే వివిధరీతులుగా దర్శించబడుచుండటము. 

పశ్యంతి - మధ్యమ - వైఖరీ శబ్ద జాలమంతా నీవే! -  వేద వేదాంత శబ్దజాలము.

అంతా నీవే! శబ్దములన్నీ నీవే! అందుచేత నీవు మధ్యమా స్వరూపిణివి! అంతేకాదు, ఆ శబ్దములతో ఏర్పడే వాక్యముల రూపమగు వైఖరీస్వరూపిణివి కూడా! వాక్యార్థములు కూడా నీ రూపమే! ఆ అర్ధముల పరమార్థము కూడా సర్వదా నీవే! పరము, ఇహము, ద్రష్ట, దర్శనము, దృశ్యము నీవే!

ఓ జగన్మాతా! మాకు ఈ జగత్తులో “నీవు” గా కనిపించేదంతా, నీవేనమ్మా! అందుచేత తత్-త్వమ్ ! తత్త్వస్వరూపిణివి! సర్వతత్త్వస్వరూపిణివి! సర్వ జీవులలోని ‘అహమ్’ స్వరూపిణివి!

ఓ సర్వ విద్యాత్మకే! ఈ తెలియబడేదంతా కూడా, ఇందలి సర్వ విషయ-విశేషాలతో సహా నీవే అయి ఉన్నావమ్మా! అందుచేత నీవు సర్వ విద్యాత్మికవు! వేద స్వరూపిణివి! తెలుసుకొంటున్నదీ నీవే! అందుచేత వేదాంత స్వరూపిణివి! వేద వేద్యవు! తెలుసుకొనుచున్న వానిని తెలుసుకొనుచున్నది కూడా నీవే! సర్వము ఆత్మగా తెలియజేయు ఆత్మవిద్యవు!

మా దేహాలన్నీ కూడా ఏ శక్తిచే నిలిచి ఉంటున్నాయో, ఆ శక్తి నీదే! నీవే! నీవు సర్వశక్తి స్వరూపిణివి! ఏఏ దేవతలు అరూపులై ఈ జగత్తులోని విత్తు-వృక్షము-ఆకులు-దేహములు-ఆహారములు …. ఇవన్నీ నిర్మించి జీవుల దేహములను పరిపోషిస్తున్నారో ఆ

దేవతలందరి రూపముగా వేంచేసి ఉన్నది నీవే! సర్వదేవతా స్వరూపిణివి!

శ్రీ వసిష్ఠమహర్షి ఏ తత్త్వమును ఆరాధిస్తూ, శ్రీరామ చంద్రమూర్తికి (యోగవాసిష్ఠ మహాగ్రంథములో) ప్రవచించారో, అట్టి ఆయనయొక్క పరతత్త్వ ఉపాసనా వస్తువు నీవేనమ్మా! విశ్వామిత్ర మహర్షిచే అహమ్ ఏకతరంగమస్మి తత్-రామచంద్ర ఆనందసాగరః అని గాయత్రీ రూపంగా గానం చేశారో ….. అది నీవే! ఆయనచే ఉపసేవ్యమానమైనది నీవే! మహర్షులంతా సర్వదా సేవిస్తున్నది నిన్నే!

నేనైన నీకు, నీవైన నాకు నమస్కారము.

అమ్మా! నమస్తే! నమస్తే! నమస్తే!


ఫలశృతి

ఈ అక్షమాలికా స్తోత్రము (ఉపనిషతన్ను) పగలు పఠిస్తే రాత్రి కృతమైన పాపములన్నీ నశిస్తున్నాయి. సాయంకాలము పఠిస్తూ పారాయణం చేసినవారియొక్క పగలు నిర్వర్తించిన కర్మదోషములు నశించగలవు.

ఉదయము-సాయంత్రము పఠించుచున్నప్పుడు పాపికూడా అపాపి, పుణ్యశీలి అగుచున్నాడు.

ఈ రీతిగా అక్షమాల (పూసల దండ)ను ముందుగా పూజించి, ఆ తరువాత జపము చేయువానికి అతి త్వరగా మంత్రసిద్ధి లభించగలదు. ఈ విధంగా భగవానుడగు శ్రీ కుమారస్వామి సృష్టికర్తయగు ప్రజాపతికి అక్షమాలా విశేషములను లోక కళ్యాణార్ధమై సవివరించారు.



🙏 ఇతి అక్షమాలిక ఉపనిషత్ ‌🙏

లోక కళ్యాణమస్తు ।
ఓం తత్ సత్ ।।