[[@YHRK]] [[@Spiritual]]

BahvRucha Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 1
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com
Courtesy - sanskritdocuments.org (For ORIGINAL Slokas Without Sandhi Splitting)


ఋగ్వేదాంతర్గత

8     బహ్వృచోపనిషత్

శ్లోక తాత్పర్య పుష్పమ్



బహ్వృచాఖ్యబ్రహ్మవిద్యామహాఖండార్థవైభవం .
అఖండానందసామ్రాజ్యం రామచంద్రపదం భజే ..
శ్లో॥ బహ్వృచాఖ్య బ్రహ్మవిద్యా మహాఽఖండార్థ వైభవమ్
అఖండానంద సామ్రాజ్యం రామచంద్రపదమ్ భజే ॥

“ఈ బహ్వృచోపనిషత్ ఆఖ్యాయికము, బ్రహ్మవిద్యా విశేషము, జీవునియొక్క మహత్-అఖండార్థ వైభవము, అఖండానంద సామ్రాజ్యము” అయినట్టి “శ్రీరామచంద్ర పదము”ను ధ్యానిస్తున్నాము.
[ బహ్వృచో = అఖండము-ఏకము అగు పరతత్త్వస్వరూపిణి యొక్క అనేకవిధములైన అభిరుచులు.
బహు ఋచమ్ = సత్యము యొక్క బహుళత్వము, ఋక్కులు]


హరిః ఓం ..

దేవీ హ్యేకాగ్ర ఏవాసీత్ . సైవ జగదండమసృజత్ .
కామకలేతి విజ్ఞాయతే . శృంగారకలేతి విజ్ఞాయతే .. 1..

తస్యా ఏవ బ్రహ్మా అజీజనత్ . విష్ణురజీజనత్ .
రుద్రోఽజీజనత్ . సర్వే మరుద్గణా అజీజనత్ .
గంధర్వాప్సరసః కిన్నరా వాదిత్రవాదినః సమంతాదజీజనత్ .
భోగ్యమజీజనత్. సర్వమజీజనత్ . సర్వం శాక్తమజీజనత్ .
అండజం స్వేదజముద్భిజ్జం జరాయుజం యత్కించైతత్ ప్రాణి
స్థావరజంగమం మనుష్యమజీజనత్ .. 2..

1.)  ‘ఓం’ దేవీ హి ఏకా అగ్ర ఆసీత్ ।
స ఏవ జగత్-అండమ్ అసృజత ।
కామకళేతి విజ్ఞాయతే ।
శృంగార కళేతి విజ్ఞాయతే ।
తస్యా ఏవ బ్రహ్మా అజీజనత్ ।
విష్ణుః అజీజనత్ ।
రుద్రో అజీజనత్ ।
సర్వే మరుత్ గణా అజీజనత్ ।
గంధర్వ - అప్సరస - కిన్నరావ - ఆది త్రవాదినః
సమంతాత్ అజీజనత్ ।
భోగ్యమ్ అజీజనత్ ।
సర్వమ్ అజీజనత్ ।
సర్వమ్ శాక్తమ్ అజీజనత్ ।
అండజమ్, స్వేదజమ్, ఉద్భిజమ్, జరాయుజమ్
యత్కించిత్ ఏతత్ ప్రాణి స్థావర జంగమమ్
మనుష్యమ్ అజీజనత్ ।

ఓంకార సంజ్ఞార్థ స్వరూపమైనట్టి (కేవల-అంఖడాత్మరూపిణియగు) దేవియే సర్వమునకు మొట్టమొదట ఉన్నది. ఆ దేవియే జగత్ అనే అండమును (లేక) బ్రహ్మాండమును సృజించినది.

ఎందుకు సృష్టించింది? తనయొక్క ఇష్టము చేత! ఇచ్ఛ! బహురుచి! అభిరుచి! అందుచే ఇది ఆ దేవి యొక్క క్రీడా వినోదము, కామకేళీ విలాసము అని, శృంగారకళా వినోదము అని తెలియవచ్చుచున్నది. బాలా లీలా వినోదము… అని అనవలసివచ్చుచున్నది.
ఆ దేవియొక్క కామకేళీ-శృంగార విలాసములో ప్రప్రథమంగా సృష్టికర్తృత్వ రూపుడగు బ్రహ్మదేవుడు (స్పష్ట్యభిమాని) జనించారు! ఆ దేవి యొక్క ఇచ్ఛ నుండియే సృష్టి రక్షకుడు విష్ణువు (స్థితి అభిమాని), లయకారకుడగు రుద్రుడు(లయాభిమాని) కూడా జనించారు .

ఆ దేవియొక్క ఇచ్ఛారూప సంకల్పశక్తి నుండియే
- మరుత్ గణములు (భౌతిక దేహ నిర్మాణశీలురు),
- గంధర్వులు, అప్సరసలు, కిన్నరులు,
- సర్వవాద్యములు, స్వరములు, శబ్దజాలము,
- సర్వభోగ్యవస్తువులు జనించుట జరిగింది.
ఆ దేవి శృంగార రస రూపాలే అవన్నీ.

‘ఓం’ (అ + ఉ + మ) అను ఒక్కమాటతో (భావనచే) సర్వవస్తుజాలము జనించినది. అంతేకాదు, సర్వశక్తి తత్త్వమంతా కూడా జనించింది. ఆ దేవి నుండియే అంజములు (పక్షులు), స్వేదజములు (కీటకములు), ఉద్భిజములు (బీజమునుండి పుట్టిన వనస్పతులు), జరాయుజములు (గర్భమునుండి జనించేవి), స్థావరములు (కదలని రాళ్ళ కొండలు మొదలగునవి), కదిలే జంగములు, మనుష్యులు …. వీటన్నిటితో కూడిన ఈ సర్వసృష్టి జనించింది.


సైషా పరా శక్తిః . సైషా శాంభవీవిద్యా
కాదివిద్యేతి వా హాదివిద్యేతి వా సాదివిద్యేతి వా .
రహస్యమోమోం వాచి ప్రతిష్ఠా .. 3..

సైవ పురత్రయం శరీరత్రయం వ్యాప్య
బహిరంతరవభాసయంతీ
దేశకాలవస్త్వంతరసంగాన్మహాత్రిపురసుందరీ వై
ప్రత్యక్చితిః ..4..

స ఏషా పరాశక్తిః ।
స ఏషా శాంభవీ విద్యా ।
కాది విద్యేతి వా । హాది విద్యేతి వా ।
సాది విద్యేతి వా । రహస్యమ్ ఓం ।
ఓం వాచి ప్రతిష్ఠా ।
స ఏవ పురత్రయమ్, శరీరత్రయమ్
వ్యాప్య, బహిః అంతరః అవభాసయంతీ,
దేశ-కాల-వస్తుః అంతరా సంగాత్
మహాత్రిపురసుందరీ వై ప్రత్యక్ - చితిః ॥

ఆ దేవియే సర్వమునకు ఆధారమై సర్వమునకు పరమై (వేరై) యున్న పరాశక్తి. అట్టి పరాశక్తిని విశదపరచు శాంభవీ విద్య కూడా ఆ దేవియే! ఆ దేవియే దేవీతత్యమును తెలియజేయునట్టి, ఆ దేవి ఎవ్వరో విశదపరచునట్టి ‘కా విద్య’!
ఈ సృష్టి లయించినప్పుడు శేషించు “హాది విద్య” కూడా! ఈ సృష్టియొక్క పరమ రహస్యము కూడా ఆ దేవియే! ‘సత్’ ఇత్యాది రూపములన్నీ ఆ దేవియే! అట్టి ఓంకార స్వరూపిణి, ‘ఓం’ శబ్ద స్వరూపిణి కూడా! శబ్దము - అర్థము … రెండూ ఆ దేవియే!

ఆ దేవియే జాగ్రత్-స్వప్న-సుషుప్తులనబడే త్రిపురములయందు, మనో-బుద్ధి-చిత్త త్రిశరీరములందు, స్థూల-సూక్ష్మ-కారణ శరీరములందు, దేహి దేహ దృశ్య త్రిదేహములయందు బయట లోపల కూడా వ్యాపించి, నీళ్ళలో ప్రతిబింబమువలె వాటియందు తానే ప్రతిబింబించుచున్నది.

ఆ దేవియే దేశము (Place Factor), కాలము (Time Factor), వస్తువు (Factor of Matter), (మరియు) వాటి కలయికలచే ఏర్పడే దృశ్యమంతా కూడా!
మహా త్రిపురసుందరియే మహా - తురీయము - త్రిపుర - (జాగ్రత్ స్వప్న సుషుప్తులు) కూడా!

ఆ మహా త్రిపుర సుందరియే ఎరుగబడుదానికి ఆవలగల ప్రత్యక్ చిత్! తెలివియొక్క కేవలీ రూపము. (ఎరుకయొక్క కేవల రూపము, విషయములను ఎరుగుటకు మునుముందే గల ఎరుక రూపము). చిదానందరూపము.


సైవాత్మా తతోఽన్యమసత్యమనాత్మా . అత ఏషా
బ్రహ్మాసంవిత్తిర్భావభావకలావినిర్ముక్తా
చిద్విద్యాఽద్వితీయబ్రహ్మసంవిత్తిః సచ్చిదానందలహరీ
మహాత్రిపురసుందరీ బహిరంతరనుప్రవిశ్య స్వయమేకైవ విభాతి .
యదస్తి సన్మాత్రం . యద్విభాతి చిన్మాత్రం .
యత్ప్రియమానందం తదేతత్ పూర్వాకారా మహాత్రిపురసుందరీ .
2.) స ఏవ ఆత్మా ।
తతో అన్యత్ అసత్యమ్, అనాత్మా ।
అత ఏషా బ్రహ్మ సంవిత్తిః ।
భావ-అభావ కళా వినిర్ముక్తా ।
చిద్విద్యా । అద్వితీయ । బ్రహ్మసంవిత్తిః ।
సత్-చిత్-ఆనంద లహరీ ।
మహా త్రిపురసుందరీ బహిరంతరమ్ అనుప్రవిశ్య
స్వయమ్ ఏక ఏవ విభాతి ।
యత్ అస్తి → సన్మాత్రమ్!
యత్ విభాతి → చిన్మాత్రమ్!
యత్ ప్రియమ్ ఆనందమ్ తత్
ఏతత్ సర్వాకారా మహాత్రిపుర సుందరీ ॥

ఏ దేవి నుండి త్రిమూర్తులు, త్రిశక్తులతో సహా ఈ సర్వము బయల్వెడలుచున్నదో … అట్టి దేవ దేవియే సత్య-నిత్య స్వరూపిణియగు ఆత్మ!

ఇక ఏదైతే అసత్యము-అనిత్యము-ఊహా సదృశము-భావనా మాత్రముగా-స్వతఃగా లేనిదియే అయి ఉన్నదో, అదీ ఆ దేవియే! - అసత్యము (న-సత్-యమ్), అనాత్మ (న ఆత్మ)గా కనిపించేదంతా కూడా ఆ దేవియే! మాయ-మాయి… రెండూ ఆ అమ్మయే.

ఏది వేదాంత వాఙ్మయముచే బ్రహ్మము; సత్ + విత్ = సంవిత్ (ఉనికి + ఎరుకరూపమగు) = సంవిత్తు శబ్దములచే ఉద్దేశ్యించబడుతోందో, అదీ ఆ దేవియే!

ఆ దేవి నుంచి భావములు, ఆ భావముల 64 కళలు బయల్వెడలుచున్నాయి. అనగా వాటికి ఆవల ఆ మాత చైతన్య స్వరూపిణి అయి - వేంచేసి ఉన్నది. వాటికి ముందే ఉన్న ఆది స్వరూపిణి కాబట్టి భావాభావములచే, కళావిశేషములచే పట్టుపడదు.

ఆ దేవియే తెలుసుకొనేది - తెలియబడేదీ అయి ఉండటముచే…. చిద్విద్యా (చిత్ స్వరూపిణి అయి చితు ఎరుగునది) - అయి ఉన్నది. ఎరుక - ఎరుగబడునది - ఎరుగువాడు ఆ దేవీ స్వరూపమే!

మనందరము ఆ అమ్మకు వేరుగా లేము. అందుచేత మనము ఆ దేవికి, ఆ దేవికి మనము వేరైనవారము గాము. అద్వితీయ సంవిత్ బ్రహ్మము! ఆ దేవి సత్ (ఉనికి) - చిత్ (ఎరుక) - ఆనంద (అనుభవి) … ప్రదర్శన స్వరూపిణి.

ఆ దేవీమాత త్రిపురములందు జాగ్రత్-స్వప్న-సుషుప్తులుగా విరాజిల్లుచూ, వాటియందు ప్రకాశమాన రూపమై, బాహ్య-అభ్యంతరములలో ప్రవేశించి-సర్వదా
’ఏక రూపమే’ అయి ఉన్నది. ఏకరూపిణియై త్రిపురములలో సర్వ విశేషములుగా ప్రదర్శితమగు మహాత్రిపుర సుందరి!

ఏదైతే “ఉన్నాను” అను భావరూపిణియై ఉనికి రూపమున (అస్తి) ఉన్నదో …., అది సన్మాత్రము.
ఏది తెలుసుకొనువాడు తెలియబడునది రూపమున ప్రకాశమానమగుచున్నదో (Being Enlightened) …., అది చిన్మాత్రము.
ఏది ప్రియము (అనుభూతి) రూపముగా ఉన్నదో…, అదియే ఆనందము.
ఈవిధంగా సన్మాత్ర - చిన్మాత్ర ఆనందములుగా ప్రదర్శనము అగుచున్నదగుటచేత మహాత్రిపురసుందరి!


త్వం చాహం చ సర్వం విశ్వం సర్వదేవతా ఇతరత్
సర్వం మహాత్రిపురసుందరీ .
సత్యమేకం లలితాఖ్యం వస్తు
తదద్వితీయమఖండార్థం పరం బ్రహ్మ .. 5..

పంచరూపపరిత్యాగా దర్వరూపప్రహాణతః .
అధిష్ఠానం పరం తత్త్వమేకం సచ్ఛిష్యతే మహత్ .. ఇతి .. 6..

ప్రజ్ఞానం బ్రహ్మేతి వా అహం బ్రహ్మాస్మీతి వా భాష్యతే .
తత్త్వమసీత్యేవ సంభాష్యతే .
అయమాత్మా బ్రహ్మేతి వా బ్రహ్మైవాహమస్మీతి వా .. 7..

యోఽహమస్మీతి వా సోహమస్మీతి వా యోఽసౌ సోఽహమస్మీతి వా
యా భావ్యతే సైషా షోడశీ శ్రీవిద్యా పంచదశాక్షరీ
శ్రీమహాత్రిపురసుందరీ

త్వమ్ చ - అహమ్ చ - సర్వమ్ విశ్వమ్ -
సర్వదేవతా - ఇతరత్ సర్వమ్ మహాత్రిపురసుందరీ ।
సత్యమ్ - ఏకమ్
లలితా ఆఖ్యమ్ వస్తుః,
తత్ అద్వితీయమ్ ॥
అఖండార్థమ్ । పరబ్రహ్మ
పంచరూప పరిత్యాగాత్ అస్వరూప ప్రహాణతః ।
అధిష్ఠానమ్ పరమ్ తత్త్వమ్ - ఏకమ్
సత్ శిష్యతే మహత్ ఇతి ।
“ప్రజ్ఞానమ్ బ్రహ్మ” ఇతి వా
“అహమ్ బ్రహ్మాఽస్మి” ఇతి వా భాష్యతే ।
“తత్ త్వమ్ అసి” ఇతి ఏవ సంభాష్యతే ।
“అయమాత్మా బ్రహ్మ” ఇతి వా,
“బ్రహ్మైవాహమస్మి” ఇతి వా,
“యో అహమస్మి” ఇతి వా,
“సోఽహమస్మి” ఇతి వా,
“యోఽసౌ సోఽహమస్మి" ఇతి వా,
యా భాష్యతే, స ఏషా
షోడశీ శ్రీవిద్యా పంచదశాక్షరీ
శ్రీ మహాత్రిపుర సుందరీ

“ఆ త్రిపురసుందరీ దేవి ఉన్న స్థానమేది?” అని ఆ అమ్మను పట్టుకోవడానికి బయల్వెడలితే….
- “నీవు” గా ఉన్నది ఆ దేవియే. (త్వమ్ తత్; తత్త్వమ్)
- “నేను” గా ఉన్నదీ ఆ దేవియే. (సోఽహమ్)
- ఈ విశ్వము రూపముగా కనిపిస్తున్నదీ ఆ దేవియే! (విశ్వేదేవీ)
- దేవతల రూపము - దేవతలు కాని రాక్షసుల, తదితరుల రూపముగా ఉన్నదీ కూడా ఆ దేవియే!

ఓ మహా త్రిపురసుందరీ! అంతా నీవేగదమ్మా!

సర్వదా సత్యమై, అనేకముగా కనిపిస్తూ ఏకమే అయి, “లలితాదేవి” అను పేరుచే మాచే పిలువబడుచూ, మాకు ఏమాత్రమూ వేరుగా లేక, మాకు అద్వితీయమై ఉన్నావు. నీకు అద్వితీయమై మేము ఉన్నాము. (అహమ్ ఇత్యేవ విభావయేత్ భవానీ!).

నీవు రెండుగా అవనట్టి అఖండార్థమువు! పరబ్రహ్మమువు! నేను నీకంటే వేరై ఎట్లా ఉండగలను? లేను.
నీ నుండి దృశ్య-మనో-బుద్ధి-చిత్త-అహంకారాలు, పంచభూతములు బయదేరుచున్నప్పటికీ నీ అఖండత్వమునకు వచ్చే హాని ఏదీ లేదు.
ఈ పంచవస్తు ప్రపంచమునకు అధిష్ఠానమై ఉన్నావు. పరమై ప్రకాశించు తల్లివి. ఈ (పంచభూత) పాంచభౌతికమును దాటి చూస్తే సర్వ జీవుల ఆత్మగా, మహత్ స్వరూపిణివై శేషిస్తున్న దేవీ స్వరూపిణివి నీవు!

అందుకే నీ గురించి తెలిసిన యోగజ్ఞాన వరేణ్యులు -‘ప్రజ్ఞానమే బ్రహ్మము’ అని అంటున్నారు.

తెలియబడేదంతా (ప్రజ్ఞానము) బ్రహ్మమే! తెలుసుకొనుచున్న నేను బ్రహ్మమే! ఆది శక్తియగు దేవియే బ్రహ్మము అని నీ - గురించి భాష్యము చెప్పుచున్నారు.
నీవుగా కనిపించేదంతా ఆ దేవీ తత్స్వరూపమే - అని భక్తులు సంభాషించు కుంటున్నారు.
“ఈ జీవాత్మ బ్రహ్మమే (అయమాత్మా బ్రహ్మ)” అని, “నేను బ్రహ్మమే అయి ఉన్నాను (సోఽహమ్)“ అని కూడా అభివర్ణిస్తున్నారు.
తెలియబడేదంతా బ్రహ్మమే! తెలుసుకొనుచున్నది బ్రహ్మమే! నేను బ్రహ్మమును అయి ఉన్నాను.
నీవు బ్రహ్మమే! జీవాత్మ బ్రహ్మమే! బ్రహ్మమే ’నేను’గా ఉన్నది.
ఇంకేదీ కానేలేదు. కాబోము కూడా!
అంతేకాదు. ఏదైతే ”నేనై ఉన్నాను“ గా ఉన్నదో, ఆ ”పరమైనదే నేను“ గా ఉన్నదో, ”ఆపరతత్త్వమే నేను" గా ఉన్నదని భాష్యము చెప్పబడుచూ, సంభాషించబడుచూ ఉన్నదో…
అదియే….,
షోడశీ అక్షరమంత్రము, శ్రీవిద్య, పంచదశాక్షరీ, అర్థస్వరూపమగు శ్రీ మహాత్రిపుర సుందరి అని,… యోగులు గమనిస్తున్నారు.


బాలాంబికేతి బగలేతి వా మాతంగీతి
స్వయంవరకల్యాణీతి భువనేశ్వరీతి చాముండేతి చండేతి
వారాహీతి తిరస్కరిణీతి రాజమాతంగీతి వా శుకశ్యామలేతి వా
లఘుశ్యామలేతి వా అశ్వారూఢేతి వా ప్రత్యంగిరా ధూమావతీ
సావిత్రీ గాయత్రీ సరస్వతీ బ్రహ్మానందకలేతి .. 8..

ఋచో అక్షరే పరమే వ్యోమన్ . యస్మిన్ దేవా అధి విశ్వే నిషేదుః .
యస్తన్న వేద కిం ఋచా కరిష్యతి.
య ఇత్తద్విదుస్త ఇమే సమాసతే. ఇత్యుపనిషత్ .. 9..

బాలంబికా ఇతి,
బగళా ఇతి,
మాతంగీ ఇతి,
స్వయమ్ వరకళ్యాణీ ఇతి, భువనేశ్వరీ ఇతి,
చాముండి ఇతి,
చండి ఇతి,
వారాహీ ఇతి,
తిరస్కరిణీ ఇతి,
రాజమాతంగీతి వా
శుకశ్యామళేతి వా
లఘు శ్యామళేతి వా
అశ్వారూఢేతి వా
ప్రత్యంగిరా
ధూమావతీ
సావిత్రీ
గాయత్రీ
సరస్వతీ
బ్రహ్మానంద కళేతి |
ఋచో అక్షరే
పరమే వ్యోమన్
యస్మిన్ దేవా అధివిశ్వే నిషేదుః
యః తత్ న వేద, కిమ్ ఋచా కరిష్యతి?
యః ఇతి తత్ విదుః స ఇమే
సమాసత ॥
ఇత్యుపనిషత్ |

ఇంకా కూడా,
బాలాంబిక; బగళ; మాతంగీ ; స్వయం వరకళ్యాణి; భువనేశ్వరి; చాముండీ; చండే; వారాహి; తిరస్కరిణి; రాజమాతంగి; శుకశ్యామల; లఘుశ్యామల; అశ్వారూఢ; ప్రత్యంగిరా; ధూమావతి; సావిత్రి; గాయత్రి; సరస్వతి - అనే పేర్లతో ఒకే బ్రహ్మము ఉపాసించబడుతోంది.
ఇవన్నీ బ్రహ్మానందము యొక్క వివిధ కళావిశేషాలే!
అనేక పేర్లతో పిలువబడు ఏక - అఖండ దేవియే!
ఆ దేవియే ఋగ్వేదములోని ఋక్కులచే గానము చేయబడుచున్నది.
“ఋత్-చ”… అను వర్ణనచే పరమసత్యము. అక్షరే… అను వర్ణనచే మార్పుచెందు వాటన్నిటికీ ఆధారమగు మార్పుచెందని తత్త్వము. ఆ దేవీ తత్త్వమునందే సర్వ దేవతలు స్థితి కలిగి, ప్రకాశమానులగుచున్నారు. ఈ విశ్వమంతా ఏ ’దేవీ తత్త్వము’నందు సర్వదా (కల్పనచే) స్థితి పొందియున్నదో అది ఎరుగక, ఈ విశ్వమును, అన్య విశ్వదేవతల తత్త్వమును దర్శించునంతవరకు ఋక్కులు గానం చేయటం తెలిస్తే మాత్రము ఏమి ప్రయోజనము?

ఎవ్వరైతే నేను-నీవు (అహమ్-త్వమ్) ప్రత్యయములతో సహా ఈ విశ్వము - విశ్వరచనా అంతర్గతులగు దివ్యశక్తి స్వరూప దేవతలు…. ఇవన్నీ ఆ దేవీ తత్త్వమునకు అంతర్గతముగాను, అభిన్నముగాను దర్శిస్తున్నారో, వారు దేవీస్వరూపులే! దేవీ ఆత్మానంద స్వరూపులై, సర్వము తామై ప్రకాశించుచున్నారు.

ఇతి బహ్వృచోపనిషత్ సమాప్తః ।
ఓం శాంతిః శాంతిః శాంతిః ॥


ఋగ్వేదాంతర్గత

8     బహ్వృచ ఉపనిషత్

అధ్యయన పుష్పము

ఈ ఎదురుగా ఉన్న సృష్టికి మునుముందుగా, మొట్టమొదటిగా “ఓం” కార స్వరూపిణి, ఆదితత్త్వము అయినట్టి “దేవి” మాత్రమే ఉన్నది. దేవతలకే “ఆది” అగు ఆ దేవాది దేవి సంకల్పమాత్రముగా ఈ “జగత్తు” అనే అండమును (బ్రహ్మాండమును) సృజించింది.
ఎందుకొరకు? స్వకీయ వినోదము, లీల, ఆనందము కొరకై! అందుచేతనే ఆదేవి బాలా లీలా వినోదిని!

ఆ దేవి యొక్క ఇచ్ఛా రూపమే బ్రహ్మాండములకు ఉత్పత్తిస్థానము (It is a past time Entertainment).
అందుచేత…, ఇదంతా ఆ దేవి యొక్క కామకేళీ, విలాసవమే! శృంగార కళా ప్రదర్శనమే!

తెలియజేయు - తెలుసుకొను ‘విజ్ఞాయతే’ ఆ దేవి! తెలియబడుచున్నదంతా ఎక్కడి నుండి జనిస్తోంది? తెలియబడేదంతా ఆ దేవి - తన కేళీ వినోదము కొరకై - తనయొక్క ‘ఎరుక’ నుండి సంప్రదర్శిత పరచుచున్నది.

“నేను ఆడుకోవాలి. ఆనందించాలి”… అను - ఆ దేవి యొక్క బాలా లీలా వినోదినీ విజ్ఞాన తత్త్వము నుండియే “నాకు వేరైనది” అనే “కల్పన ఊహ, భావన”…. బయల్వెడలుతోంది.

అట్టి దేవీ ఇచ్ఛా శక్తియే…,
“బ్రహ్మదేవుడు” రూపమైన సృష్టిని సృష్టించటము, “విష్ణు దేవుడు” రూపమై… అట్టి సృష్టిని స్థితింపజేయటము, పరిపోషించటము, “రుద్రదేవుడు”
రూపమై లయ విన్యాసము చేయటం, “మరుత్ గణము” రూపముగా నామరూపాత్మక మాయను ప్రదర్శించటము చేయుచున్నది.

(సృష్టికర్తీ బ్రహ్మరూపీ, గోప్రీ గోవిందరూపిణీ, సంహారిణీ విశ్వరూపా ….! లలితా సహస్రము).

ఆ దేవియొక్క ఇచ్ఛయే (కామకేళీ-శృంగారీ) గంధర్వులు, అప్సరసలు, కిన్నెరులుగా… ఇత్యాది గాన-నృత్య-సౌందర్య రూపములుగా ప్రదర్శనమగుచున్నది. “ఆ” వాది (శబ్ద) రూపములుగా, వాద్య-స్వర-శబ్ద-నాద జాల రూపములుగా… సంప్రదర్శితమగుచున్నది.

భోగ్య వస్తువులన్నీ ఆ దేవియొక్క శృంగార రసరూపములుగా అగుచున్నాయి. పండు కొండ జీవుల దేహములు … - కాయ వీటన్నిటిలో కనిపించేదంతా ఆ దేవియొక్క ఇచ్ఛారూప సౌందర్యమే!

సర్వము ఆ దేవియే! ఆస్వాదించువాడు - ఆస్వాదించబడునది - ఆస్వాదన …. ఇవన్నీ ఆ దేవియొక్క శృంగార-నామ రూపాత్మక కేళీ విలాసములే!

ఆ దేవి నుండే విలాసరూపంగా శక్తితత్త్వము - శక్తి ప్రదర్శనములు కూడా జనించుచున్నాయి. ఆ శక్తులు అనేక రూపములుగా -
✤ అండజములు (గ్రుడ్డు నుండి జనించు పక్షులు),
✤ స్వేదజములు (చెమటనుండి, వాసన నుండి జనించు కీటకములు),
✤ ఉద్భిజములు (బీజము నుండి జనించు వృక్షములు, వనస్పతులు - కాయగూరలు, ధాన్యములు మొ॥వి),
✤ జరాయుజములు (గర్భము నుండి జనించే జంతువులు, మానవులు మొ॥వి),
ప్రదర్శనమగుచున్నాయి.

ఈ సృష్టిలో కనిపించే సర్వప్రాణులు, స్థావర జంగమములు…, ఈ మనుష్య రూపములతో సహా … ఇవన్నీ ఆ దేవియొక్క తేజో విలాసమే! ఇచ్ఛారూపమగు కామకేళీ విలాస-శక్తి జనితమే!

ఆ దేవీ ఇచ్ఛా తత్త్వమే ఈ సర్వమునకు ఆధారమై, సర్వరూపమై, సర్వమునకు శక్తియై, సర్వ బాహ్య-అభ్యంతరరూపమై, సర్వమై పరాశక్తి గా వెలయుచున్నది.

అట్టి “పరాశక్తితత్త్వము”ను విశదీకరించుచున్న “ఆత్మవిద్య” (లేక) “శాంభవీ విద్య” యొక్క రూపము కూడా ఆ పరాశక్తియే!

“కా”ది విద్యేతి వా - ఈ దృశ్యమంతా ఎవ్వరివలన? ఎవ్వరిచేత? ఎవ్వరి కొరకు? ఎందుకొరకు? ఏ రీతిగా? ఏది సహజము? ఏది కల్పితము? ఇట్టి “కిం తత్” రూపమగు వాఙ్మయ విద్య ఆ దేవీ రూపమే! “కా”రణ పంచకమగు కాల-స్వభావపురుష-కర్మ-నియతులు… ఆ దేవీ కళా విశేషాలే!

“హా”ది విద్యేతి వా - ఆ దేవియే ‘ఆహా’… రూపమైయున్నది. తెలుసుకొను రూపమై, తెలియబడు సత్యమై కూడా యున్నది. యోగ సాధన రూపములగు (ప్రాణాయామ-కుండలినీ-ఇత్యాది)… మార్గములు కూడా సర్వ విద్యాస్వరూపిణియగు ఆ ఆదిశక్తీ దేవియే!

అహమ్-నాహమ్-సోఽహమ్-చిదానందరూపోఽహమ్ - సర్వస్యప్రభవోఽహమ్-జీవశివైక్యోఽహమ్-విద్యలు ఆ దేవీ విద్యా విశేషాలే!

“సా”ది విద్యేతివా - సత్ రూపిణియై, స్వస్వరూప ఆత్మ నిరూపణ విద్యయై, వేదోపనిషత్ వేదాంతరూపిణిగా ఉన్నది… ఆ దేవియే!

సాధకుల పంచావస్థలు : శ్రవణ - వివరణ - స్మరణ - ఆపన - ప్రాపన దశలన్నీ కూడా - అవస్థ రహితయగు ఆ దేవీ తత్త్వ ప్రకాశ లీలా వినోదావస్థలు!

సాత్విక భావములు : స్తంభము, ప్రళయము, రోమాంచము, స్వేదము, వైవర్ణ్యము, వేపధు, అశ్రువు, వైస్వర్యము - ఈఈ ఉపాసనా స్థితులన్నీ ఆ దేవీ తత్త్వోపాసనా జనిత భావములే! కనుక దేవీ చిన్మయ చమత్కారమే!

మానసికమైనదంతా ఆ దేవీ - చిన్మయము. భౌతికమైనదంతా ఆ దేవీ - మృణ్మయము.

ప్రతి జీవుని అప్రదర్శిత - అంతర్ - హృదయ రహస్య స్వరూపము ఆ దేవీ మహత్మ్యమే! అట్లాగే ప్రదర్శితమగుచున్నట్టిదంతా కూడా… ఆ మాహత్మ్యమే!

ఓం ఓం వాచి ప్రతిష్ఠా! ఓం ఓం అను వాక్కునందు ప్రతిష్ఠితమైయున్న సర్వమాయ - సర్వాకార - సర్వాధార - నిరాధార తత్త్వము సర్వదా ఆ దేవియే. (ఈ నాలుగు ఆ దేవి శయనించే నాలుగు కోళ్ళు గల మంచము).

స ఏవ పురత్రయమ్ - శరీరత్రయమ్ వ్యాప్య బహిః - అంతరః : ఆ దేవీ దివ్య చైతన్యమే జాగ్రత్ - స్వప్న - సుషుప్త పురములయందు, మనో-బుద్ధి-చిత్త అంతరంగ త్రయమునందు, దేహి - దేహ - దృశ్య స్థానములందును, స్థూల - సూక్ష్మ - కారణ శరీరములందును, లోపల ఆరుబయట యందును, స్థూలాకాశ - చిత్తాకాశ చిదాకాశములయందును వ్యాపించి ఉన్నదై, — బాహ్య, అభ్యంతర రూపిణి అయి ఉన్నది. బంగారపు ఉంగరము… లోన-బయట కూడా బంగారమే అయి ఉన్నట్లుగా, అంతః బహిశ్చ తత్ సర్వమ్ వ్యాప్య నారాయణీ స్వరూపిణే!

ఆ దేవాది దేవియే దేశ (Place Factor) కాల (Time factor) వస్తు (Zone of Matter) త్రితత్త్వముల అంతర్వేణి! అంతర్వాణి! వాటి కలయికలచే ఏర్పడే దృశ్యమంతా ఆ దేవియే! అందుచేత ఆ దేవి మహా త్రిపుర సుందరిగా స్తోత్రము చేయబడుచున్నది.

మహా …. తురీయ ….,
త్రిపుర …. జాగ్రత్-స్వప్న-సుషుప్తి ప్రదర్శిత, సంచారీ…,
సుందరి …. ఆనంద స్వరూపిణీ !

ప్రత్యక్ చిత్ : “ఎరుగుచుండుట” అను “సందర్భ వ్యవహారము” నుండి ఎరుగుబడుచున్నది అనుదానిని ప్రక్కగా పెట్టినప్పుడు అప్పటికే శేషించు “కేవల ఎరుక స్వరూపిణి“! ప్రత్యక్ చిత్ స్వరూపిణి! ”ఎరుక" కు ముందే గల కేవల చిత్ తత్త్వి! కేవల తెలివి స్వరూపము!

ఆ త్రిపుర సుందరీ స్వరూపిణియగు దేవీ రూపమునే ‘ఆత్మ’ అనే శబ్దముతో ఉపనిషత్-వేదాంత వాఙ్మయము పిలచుచున్నది. ఆ “దేవి”కి వేరుగా ఏది ఉన్నట్లుగా అనిపిస్తుందో,… అదంతా “కథ-నాటకము-స్వప్నము” లోని దృశ్యసంఘటనా సందర్భములవలె “అసత్యము”, “అనాత్మ” కూడా! వాస్తవానికి వచ్చినప్పుడు ఆత్మ స్వరూపిణి అయి ఉన్న దేవి మాత్రమే సత్యమై నిత్యమై గ్రహించబడుచున్నది.

బ్రహ్మ సంవిత్:  ఆ దేవియే అద్వితీయము, బ్రహ్మసంవిత్ అయి ఉంటోంది. సర్వమునందు, సర్వముగా, సర్వము అయి ప్రకాశించుచున్నది.

బ్రహ్మము → సత్ + విత్ = సంవిత్ = బ్రహ్మసంవిత్తు అని కూడా వేదాంత శాస్త్రముచే బోధగా చెప్పబడుచున్నది.

భావాభావ కళా వినిర్ముక్తా : జలములో తరంగములు బయల్వెడలి, తిరిగి జలమునందే లయమగుచున్నాయి కదా! అట్లాగే పరతత్త్వ స్వరూపిణియగు ఆ దేవి నుండి భావ- అభావ తరంగములు బయల్వెడలి తిరిగి అ దేవియందే లయిస్తూ ఉన్నాయి. ఆ భావ-అభావములకు మునుముందే ఉండి, భావములకు సాక్షి - ఉత్పత్తి స్థానము అయి, భావనారాయణీ స్వరూపిణిగా ఉన్నది. భావ-అభావములచే పట్టుపడని దగుటచేత భావాభావవినిర్ముక్త! అట్టి భావ - అభావ తరంగములే సృష్టి - స్థితి - లయములు.

చితివిద్యా : “చిత్” చేతనే - చిత్గా తెలియచేయబడు “చిత్” విద్యా స్వరూపిణి! ఎరుగుచున్న తత్త్వము గురించిన “ఎరుక”చే ఎరుగబడుచున్న విద్యా స్వరూపిణి!

అద్వితీయ : ఆ దేవికి వేరుగా త్వమ్ లేదు. అహమ్ లేదు. జగత్తు లేదు. దృశ్య దర్శన -ద్రష్ట- దృక్ తత్త్వాదులు లేవు. ఆ దేవీ తత్త్వానికి వేరైనదనునదే ఉండి ఉండజాలదు. బంగారు అరవంకెలోని పుష్ప-దేవతా మొ॥న ఆకారాలన్నీ బంగారమునకు వేరు కాదు కదా!

సత్ చత్ ఆనంద లహరీ : ఉనికి (Existance-Presence), చిత్ (Knowing - Knowledge) ఆనంద (Enjoying) ప్రవాహమై సర్వే-సర్వత్రా, అంతటా విస్తరించి, సంచారము కలిగినదై ఉన్నది.

సత్ ఆనంద చిదానంద జలములో సచ్చిదానంద తరంగములుగా విహరించు సర్వతత్త్వ స్వరూపిణి ఆ దేవి! ఆ మహాత్రిపుర - సుందరి జాగ్రత్-స్వప్న సుషుప్తి త్రిపురములందు ప్రకాశించుచు, వాటి అంతర-బాహ్యములుగా ప్రభవించుచూ…. త్రిరూపధారణిగా విభాతి …. భాసించుచున్నది.

⌘ ఏది ఆ దేవియొక్క అస్తి (ఉనికి)యో అదియే సన్మాత్రము.
⌘ ఏది దేవి యొక్క ‘ఎరుక’గా ప్రకాశించుచున్నదో … అదియే చిన్మాత్రము.
⌘ ఏది దేవి ప్రియ స్వరూపిణి అయి వినోదించుచున్నదో …. అది ఆనందము.
ఆ మహాత్రిపుర సుందరి సర్వ ఆకారములు తానే అయి, తనవే అయి, సత్చిత్ ఆనంద రూపముగా… విశ్వరూప ప్రదర్శనమును ప్రకటన మానము చేయుచున్నది.

ఈ విధంగా

ఈ దృశ్యరూప విశ్వమునకు వేరై ఏదైనా, ఎక్కడైనా ఉంటే,…. అదీ ఆ దేవీ స్వరూపమే! అట్టి మహా త్రిపురసుందరి,
- సత్యమై (యమ్ సత్-ఉనికి స్వరూపిణియై),
- ఏకమై, అనేకంగా కనిపిస్తూ, [(దేవీ సర్వాంతర్యామి - సర్వ తత్త్వ స్వరూపీ జ్ఞానముచే) ఏకముగా అనిపించుచున్నదై]
లలితానామధేయియై శ్రీలలిత సహస్రనామావళీ-పరమార్థ ప్రకాశమానమగుచున్నది. అఖండార్థము-పరబ్రహ్మము… అయినట్టిది ఆ దేవి వైభవము.

హే దేవీ! జగజ్జననీ!

అన్ని ఆభరణములకు బంగారమే అధిష్ఠానమైన తీరుగా,… సర్వజీవుల అధిష్ఠానము దేవీతత్త్వమే! సర్వభావాలకు, దేహాలకు, జగత్తులకు ఆవల-మునుముందే-అప్రమేయమై ఉండటముచేత ఆ దేవి “పరదేవత, పరమ్, పరస్వరూపిణి” అని,…. వ్యక్తావ్యక్త స్వరూపిణి అని కూడా చెప్పబడుతోంది.

“త్వమ్-నీవు” అను రూపముగా ఉన్నది ఆ దేవియే కాబట్టి "తత్త్వ (తత్-త్వమ్) స్వరూపిణీ దేవీ!” … అని అభివర్ణించబడుతోంది.

అనేకముగా కనిపిస్తున్న ఈ ఈ విశ్వమంతా దేవియొక్క ఏక స్వరూపము కనుక, “ఏకమ్ దేవీ” అని ఎలుగెత్తి పిలువబడుచున్నది.

ఈ జీవుల స్వతః సిద్ధమగు సత్యరూపము ఏమిటి అని పరిశీలిస్తే, జగత రూపజననియగు దేవీ మహత్మ్య విశేషమే! ఆ దేవియొక్క సత్స్వరూప విశేషమే ఈ జగత్తు … అని తెలియవచ్చుచున్నది. అందుచేత “మహత్ తత్ శిష్యతే” అనబడుచున్నది.

తెలియబడుచున్న ప్రజ్ఞానము బ్రహ్మము! తెలుసుకొనుచున్న ‘నేను’ ప్రజ్ఞానరూప బ్రహ్మమునే! ప్రజ్ఞానమ్ దేవీ స్వరూపమ్। - అని విజ్ఞులు దేవీ పరబ్రహ్మ స్వరూపము గురించి వ్యాఖ్యానిస్తున్నారు. “తెలియబడే జగత్తు దేవియే! తెలుసుకొనుచున్న ద్రష్టయూ దేవియే” అని భాష్యము చెప్పుచున్నారు. ఆ దేవీ తత్త్వసారము తెలిసియున్నవారు “తత్ త్వమ్ అసి! నా ఎదురుగా ”నీవు“ అను రూపముగా కనిపించేదంతా ఆ దేవియొక్క దివ్యానంద పరబ్రహ్మస్వరూపమే!”… అని సంభాషించుచున్నారు. అదియే తత్త్వశాస్త్రమై విరాజిల్లుచున్నది.

ఈ జగత్తు బంధము కాదు.  “ఆత్మేశ్వరి” అగు జగన్మాతా స్వరూపము! జగదీశ్వరీ క్రీడా - లీలా - ఆనంద స్వరూపము! ఈ జీవాత్మగా కనిపించేది దేవీ చైతన్యమే అని గ్రహించిన మహనీయులు అయమాత్మా బ్రహ్మ అను పరార్థ సమన్వయమును ఆశ్రయించినవారై ఉంటున్నారు.

అట్లాగే …., “దేవికి నేను వేరు” అను అహంకారమును త్యజించుచున్నారు. దేవి సర్వదా అనన్యము కదా!

నేను దేహ-మనో-బుద్ధి-చిత్త-అహంకారములను కాను. అవన్నీ ఆపాదితములు. సందర్భములో కనిపించే ఇవన్నీ సందర్భముతోనే తొలగుచున్నాయి. మరి నేను ఎవరు? జగన్మాతా భావనా కిరణ స్వరూపుడను! బ్రహ్మైవాహమస్మి! నేను బ్రహ్మమే అయి ఉన్నాను. అంతేగాని ఒక జీవజాతిని కాను. (లేక) ఒక లోకవాసిని కాను! రూప-మాన-గుణములు కాను! దేవీ మహత్మ స్వరూప విశేషమునే!

దేవీతత్త్వముతో తదాత్మ్యము-మమేకము అగు విజ్ఞులు దేవీ స్వరూప-తదాత్మ్య భావావిష్కరణను అనుక్షణము కలిగినవారై ఉంటున్నారు.

యో-అహమస్మి : ఆ దేవికంటే నేను వేరుకాదు. అందుచేత నేను ఏదై ఉన్నానో,…. అది దేవియే! దేవి ఏదై ఉన్నదో అదియే నేను. నాకు - దేవికి ఉన్న సంబంధము…. “బంగారు ఆభరణమునకు బంగారమునకు ఉన్న సంబంధము. ఆభరణములు అనేకం! బంగారము ఒక్కటే! ఇహజీవాత్మలు అనేకం! పర దేవీశ్వరీ దేవీ ఒక్కటే!

సోఽహమస్మి :  నేను ఆ దేవీ స్వరూపమే! మరింకేమీ కాదు. దేహము-జాతి-జన్మ-కర్మ-స్థానము-పదవి-గుణము-పాండిత్యము… మొదలైనవేవీ కూడా నేనై ఉండలేదు. అవి నావి కావు. జగన్నాటక సంబంధమైనవి మాత్రమే! అఖండాత్మ దేవికి సంబంధించినవి.

ఇక నేనో? కేవలము ఆ దేవీ స్వరూపుడనే అయి ఉన్నాను. తదితరమైనదంతా ఆ దేవికి ఆభరణములు!

యో అసౌ, సోఽహమస్మి : ఆ దేవి ఏమిటో నేనూ అదియే! ఆ దేవికి వేరై ఉన్నాను - అనటానికి నేను అహంకారము కలిగి ఉండాలి. కాని “అహంకారము” కూడా (సోఽహమస్మి-సయేవ అహమ్ అస్మి) ఆ దేవీ స్వరూపమే అయి ఉన్నది. ఎందుకంటే, ఆ దేవి అనన్యము - అద్వితీయము కదా! కనుక అహమ్-నేను గా ఉన్నది ఆ దేవియే! ‘నిర్గుణి’ యగు దేవియందు ‘సగుణి’ అగు నేను ‘దేవి’కి అభిన్నమై ఉన్నాను. నేను సగుణినై ఉంటే, అదంతా నిర్గుణియగు దేవియొక్క సగుణ చమత్కారమే!

యా భాష్యతే స ఏషా :  ఏది ఆ దేవి గురించి (లలితా సహస్రము - త్రిపురా రహస్యము - ఇత్యాది స్తోత్ర పఠణ - పరిశీలనా సాహిత్యము దృష్ట్యా) …. వ్యాఖ్యానించి, వివరించి…. భాష్యము చెప్పబడుచున్నదో,….. అది మమాత్మ స్వరూపము గురించే! మమాత్మ దేవీ స్వరూపమే అయి ఉన్నది కదా! ఎందుకంటే, దేవియే మమాత్మ స్వరూపిణి కాబట్టి!

షోడశీ శ్రీవిద్యా : (ఓం ఐ హ్రీంక్లీం శ్రీం శ్రీ బాల త్రిపురసుందరీ నమః … అని) మంత్ర-తంత్ర ముగ్ధముగా చెప్పబడు ఆ దేవి యొక్క ఉపాసనచే - భక్తునకు (మంత్రోపాసనకు) దేవీత్వమే ప్రాప్తిస్తోంది.

పంచదశాక్షరీ : (15) బీజాక్షర స్వరూపిణి! (క ఏ ఈ ల హ్రీం హ సకహల హ్రీం - సకల హ్రీం)

మహాత్రితపుర సుందరీ : జాగ్రత్ స్వప్న సుషుప్తులను, భూత-వర్తమాన-భవిష్యత్తులను, జీవ-ఈశ్వర-పరబ్రహ్మములను తన సుందర రూపముగా కలిగి ఉన్నట్టి దేవి! కాబట్టి మహాత్రిపుర సుందరి!

బాలాంబికే : ఈ విశ్వము, ఈ జగత్ సృష్ఠి - స్థితి - లయములు ఆ దేవియొక్క బాలాలీలా వినోదము. అంతే కాకుండా….. సర్వజీవులు తానై, సర్వజీవులకు సర్వము ప్రసాదిస్తూ ఉండటముచే ఆ దేవి “అంబ”!

బగళేతి : సర్వశబ్దాక్షర స్వరూపిణి!

మాతంగేతి : సర్వ దేహములలోని ’మ’ కార (జీవాహంకార) స్వరూపిణి! “నేను” అను భావనకు మునుముందే గల ‘మహానేను’ స్వరూపిణి!

స్వయం వరకళ్యాణి : స్వయముగా వరప్రసాదిని, లోక కళ్యాణ ఆనంద స్వరూపిణి. ప్రేమగా, లాలనగా అర్ధిస్తే ఏదైనా ఇచ్చుటకు సంసిద్ధమైయున్న మాతృవాత్సల్య స్వరూపిణి!

భువనేశ్వరీ : చతుర్ధశ భువనములుగా తానే విస్తరించినదై ఉన్నది. ’స్వపద్రష్ట’ చైతన్యమే స్వప్నమంతా నిండి ఉండి, సర్వము అగుచున్న రీతిగా…. ఇదంతా దేవీ ఆనంద స్వరూప విస్తారమే!

చాముండేశ్వరి : దోషములను హరించు దేవి. మనో బుద్ధులలోని అసంఖ్యాక దోషములు తొలగడానికి-ఆ దేవిని ఆశ్రయించి, దేవీతత్త్వమును భావించుటయే ఉపాయము.

చండ : సర్వము శాసించునది.

వారాహీ : సర్వమును సర్వజీవులకు అందించుచున్నట్టిది. మాతృక!

తిరస్కరిణి : సర్వము తిరస్కరించగా శేషించు దేవి.

రాజమాతంగి : సర్వజీవులకు మాత. సర్వులయొక్క ఆత్యంతిక స్వస్వరూపము! మహాహంకార స్వరూపిణి! (అన్ని అహంకారములు తనవే అయినట్టి దేవి!)

శుక శ్యామల : ’వేదాంత శాస్త్రము’ అనే చిలక పలుకుల అంతర్భాగము.

లఘు శ్యామల : వేదాంతశాస్త్ర తర్కరూప బాహ్యార్థములు.

అశ్వారూఢ : మనస్సును అధిరోహించిఉన్న దేవి.

ప్రత్యంగిరా : జీవులందరి వాస్తవ అచంచల స్వస్వరూపము.

సావిత్రీ : సత్-విత్-ఋత్ :: ఉనికి - ఎరుక - సహజసత్యము.

గాయత్రీ : గాతయత్ త్రాయతే! గానము చేసినవారిని రక్షించునది.

సరస్వతీ : సత్ రస స్వరూపిణి! ప్రతి జీవునిలో సత్ చిత్ ఆనందరసముగా ప్రత్యక్షమై ఉన్నట్టిది.

బ్రహ్మానంద కళ : సర్వము బ్రహ్మముగా దర్శించునప్పటి ఆనంద కళ!

ఋచో అక్షకేరే : ఋత్-పరమసత్య స్వరూపిణి. మార్పులు చేర్పులు లేనందున అక్షరము. ఋగ్వేదములోని ఋక్కులచే స్తోత్రము చేయబడునది.

పరమే వ్యోమ్నే : పరమాకాశ స్వరూపిణి, పరమానంద రూపిణి, మార్పుచెందు సర్వ వస్తువులకు మూలాధారము.

ఎందులో అయితే ఈ విశ్వము, విశ్వ దేవతలు అలంకారప్రాయులై స్థితి కలిగి ఉన్నారో, అదియే ఆ దేవీ స్వరూపము. అట్టి సర్వాత్మస్వరూపము, సర్వదేవతల సర్వ మానవుల సర్వ జీవుల సమస్త విశ్వముల యొక్క వాస్తవరూపమగు దేవీ పరమాత్మచైతన్య తత్త్వము గురించి తెలుసుకోకుండా - తత్ న వేద, ఋచా కరిష్యతి?…, కేవలము ఋగ్వేద ఋక్కులు చదవటం, ఎలుగెత్తి స్వర విన్యాసంగా పలకటం మాత్రము చేత లాభమేమున్నది? అవన్నీ చిలుకలు నేర్చుకొని పలికే ‘బబ-మమ-తత’ పలుకుల వంటివే!

ఎవ్వరైతే సకల, “దేవతలతో కూడియున్న ఈ విశ్వమంతాకూడా, అహమ్-త్వమ్- సః ప్రత్యయార్థములతో సహా ఆ దేవీ తత్త్వమగు అఖండాత్మ స్వరూపమే” … అని గ్రహిస్తారో,
- వారు స్వయముగా దేవీ ఆనందరూపులై,
- పరమానందమగు పరమాత్మస్వరూపులై,
- సర్వమును తమయందే సందర్శిస్తూ సర్వతత్త్వ స్వరూపముగా,
- అంతటా సమముగా వేంచేసిన సమాసతరూపముతో,
- బ్రహ్మానందాస్వాదనమును అనునిత్యపరచుకోగలరు!

🙏 ఇతి బహ్వృచ ఉపనిషత్ 🙏
ఓం శాంతిః శాంతిః శాంతిః ॥