[[@YHRK]] [[@Spiritual]]
ManDala Brāhmana Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 1
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com
బాహ్యాంతస్తారకాకరం వ్యోమపంచకవిగ్రహం . రాజయోగైకసంసిద్ధం రామచంద్రముపాస్మహే .. |
శ్లో॥ బాహ్య - అంతర తారక ఆకారం, వ్యోమ పంచక విగ్రహమ్।
రాజయోగైక సంసిద్ధం రామచంద్రమ్ ఉపాస్మహే॥
లోపల బయట తారక ఆకారమైయున్నది, పంచ ఆకాశరూపమైనది అగు రాజయోగ సిద్ధికొరకై శ్రీరామచంద్ర మూర్తిని ఉపాసించుచున్నాము.
ప్రథమ బ్రాహ్మణమ్
ఓం యాజ్ఞవల్క్యో హ వై మహామునిరాదిత్యలోకం జగామ . తమాదిత్యం నత్వా భో భగవన్నాదిత్యాత్మతత్త్వమనుబ్రూహీతి . |
|
1.) ఓం యాజ్ఞవల్యో హ వై మహామునిః ఆదిత్య లోకం జగామ। తమ్ ఆదిత్యం నత్వా, "భో భగవన్! ఆదిత్యాత్మన్! ‘తత్త్వమ్’ అనుబ్రూహి!” ఇతి॥ |
ఒకప్పుడు మహామునియగు యాజ్ఞవల్క్యుడు సూర్యభగవానుని దర్శించి, భక్తి - ప్రపత్తులు తెలియజేయు నిమిత్తమై ‘ఆదిత్య లోకము’ వెళ్ళారు. ఆదిత్య భగవానుని దర్శించి, కృతాంజలి సమర్పించారు. ‘హే భగవాన్! ఆదిత్యాత్మదేవా! దయచేసి నాకు పరమాత్మతత్త్వమును ప్రబోధించండి’ అని అభ్యర్థించారు. |
సహోవాచ నారాయణః . జ్ఞానయుక్తయమాద్యష్టాంగయోగ ఉచ్యతే . |
|
సహోవాచ నారాయణః : జ్ఞానయుక్త ’యమ’ ఆది అష్టాంగయోగ ఉచ్యతే । |
సూర్యనారాయణుడు : ఓ మునీశ్వరా! యాజ్ఞవల్క్యా! ఆత్మతత్వము వినినప్పటికీ, అనుభవానికి రావాలంటే మాత్రము అష్టాంగ యోగాలు తెలుసుకొని, ఆ యోగాలను అభ్యాసం (Practice) అవసరమని విజ్ఞులు చెప్పుచున్నారు. అందుచేత, ముందుగా అష్టాంగ యోగాలు చెప్పుకుందాం! |
శీతోష్ణాహారనిద్రావిజయః సర్వదా శాంతిర్నిశ్చలత్వం విషయేంద్రియనిగ్రహశ్చైతే యమాః . |
|
శీత-ఉష్ణ-ఆహార-నిద్రా విజయః, సర్వదా శాన్తిః, నిశ్చలత్వం, విషయేంద్రియ నిగ్రహశ్చ ఏతే ‘యమాః’। |
1.) యమములు :- - శీత-ఉష్ణములను, ఆహార నిద్రలను జయించటము; - అన్ని వేళల చిత్తమును ప్రశాంతముగా ఉంచుకొనుటము; - బుద్ధిని నిశ్చలముగా ఉంచుకొనుటము; - విషయముల పట్ల ఇంద్రియ నిగ్రహము. |
గురుభక్తిః సత్యమార్గానురక్తిః సుఖాగతవస్త్వనుభవశ్చ తద్వస్త్వనుభవేన తుష్టిర్నిఃసంగతా ఏకాంతవాసో మనోనివృత్తిః ఫలానభిలాషో వైరాగ్యభావశ్చ నియమాః . |
|
గురుభక్తిః, సత్యమార్గ అనురక్తిః, సుఖానుగత వస్తు అనుభవశ్చ, తద్వస్తు అనుభవేన తుష్టిః; నిస్సంగతా, ఏకాంతవాసో; మనోవృత్తిః; ఫలాన్ న-అభిలాషో, వైరాగ్య భావశ్చ - “నియమాః”। |
2.) నియమములు :- - గురుభక్తి; - సత్యమార్గము పట్ల అనురక్తి; అసత్య విషయముల పట్ల విరక్తి; - ఆత్మజ్ఞాన విషయములే వాస్తవ సుఖప్రదమను అవగాహన; - ఆ ఆత్మవస్తు అనుభూతిచే తుష్టి; - సంగము (Attachment) తొలగించుకొను ప్రయత్నము; - ఏకాంతవాసము (ఒంటరిగా భగవత్ ఉపాసన); జన సంసర్గమును వదిలి ఏకాంత మనోవృత్తి; - కర్మఫలముల పట్ల అభిలాష లేకపోవటము; - పరమాత్మకు సర్వము సమర్పించి ఉండటము; - వైరాగ్య భావములు. |
సుఖాసనవృత్తిశ్చీరవాసాశ్చైవమాసననియమో భవతి . |
|
సుఖాసనవృత్తిః చీరవాసాశ్చ ఏవమ్ ఆసన నియమా భవన్తి। |
3.) సుఖాసనము :- ఏ ఆసనముతో ఎక్కువ సేపు సుఖముగా కూర్చుని ఉండి, వృత్తులను నియమించగలమో అది సుఖాసనము. అదియే ఆసన నియమము. |
పూరకకుంభకరేచకైః షోడశచతుష్షష్టి- ద్వాత్రిఽన్శత్సంఖ్యయా యథాక్రమం ప్రాణాయామః . |
|
పూరక కుమ్బక రేచకైః ‘షోడశ’ (16), ‘చతుష్షష్టి’(64), ’ద్వాత్రింశతి’ (32) సంఖ్యయా యథాక్రమం “ప్రాణాయామః”। |
4.) ప్రాణాయామము :- పూరకము : బయట నుండి గాలిని లోనికి పీలుస్తూ.. 16 మాత్రలు కాలం (16 చిటికల కాలం) (మాత్ర = = సూదిని గ్రుచ్చి వెంటనే తీసివేయునంత కాలము) కుంభకము : లోపలికి పీల్చిన గాలి దేహమునందు అంతటా నింపి ఉంచుతూ.. 64 మాత్రల కాలం (64 చిటికల కాలం) రేచకము : దేహములో కుంభింపజేసిన గాలి బయటకు కదలటము… 32 మాత్రల కాలము. (పూరకము - కుడిముక్కుపుట మూసి ఎడమ ముక్కు పుటతో పీల్చటం. రేచకము - ఎడమ ముక్కు పుట మూసి ‘కుడి ముక్కు పుట’ ద్వారా వదలటం.) |
విషయేభ్య ఇంద్రియార్థేభ్యో మనోనిరోధనం ప్రత్యాహారః . |
|
విషయేభ్య ఇంద్రియార్థేభ్యో మనోనిరోధనం ‘ప్రత్యాహారః’। |
5.) ప్రత్యాహారము :- ఇంద్రియార్థముల యొక్క విషయముల నుండి మనస్సును నిరోధించుచూ, వెనుకకు మరల్చు ప్రయత్నములు. |
సర్వశరీరేషు చైతన్యైకతానతా ధ్యానం . |
|
సర్వశరీరేషు చైతన్య ఏకతానతా ’ధ్యానమ్’। | 6.) ధ్యానము :- అఖండమగు ఏక చైతన్యము సర్వశరీరములలోనూ సమముగా ఉన్నట్లు గమనిక, తత్ రీతిగా నిత్య సందర్శనము. |
విషయవ్యావర్తనపూర్వకం చైతన్యే చేతఃస్థాపనం ధారణం భవతి . |
|
విషయ వ్యావర్తన పూర్వకం, చైతన్యే చైతన్య స్థాపనం ‘ధారణా’ భవతి। |
7.) ధారణ :- విషయములందు ప్రవేశించి విహరించుచున్న చైతన్యమును విషయముల నుండి వెనుకకు మరల్చటము, అట్లా మరల్చిన చైతన్యమును చైతన్యమునందే స్థాపించి ఉంచటము. |
ధ్యానవిస్మృతిః సమాధిః . |
|
ధ్యాన విస్మృతిః ’సమాధిః’। | 8.) సమాధి :- నేను ధ్యానిని - ఇది ధ్యానింపబడు ధ్యేయము.. అను బేధము కూడా విస్మరించబడిన స్థితి. ధ్యాన-ధ్యేయముల ఏకత్వ యోగస్థితి. |
ఏవం సూక్ష్మాంగాని . య ఏవం వేద స ముక్తిభాగ్భవతి .. 1.. |
|
ఏవం సూక్ష్మాంగాని య ఏవం వేద, స ముక్తిభాగ్ భవతి॥ |
ఈ విధంగా యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధులు - అష్టాంగములు. వాటిని ఆచరిస్తూ, సూక్ష్మాంగములు (సూక్ష్మార్థములు) ఏమిటో తెలుసుకొన్నప్పుడు ఈ జీవుడు ముక్తికి అర్హుడగుచున్నాడు. |
దేహస్య పంచదోషా భవంతి కామక్రోధనిఃశ్వాసభయనిద్రాః . తన్నిరాసస్తు నిఃసంకల్పక్షమాలఘ్వాహారప్రమాదతాతత్త్వసేవనం . |
|
2.) దేహస్య పంచదోషా భవన్తి। ‘కామ- క్రోధ - నిశ్వాస - భయ - నిద్రాః’। తత్ నిరాసస్తు - ’నిస్సంకల్ప - క్షమా - లఘ్వాహారా - అప్రమాదతా- తత్త్వసేవనమ్’॥ |
ఈ భౌతిక దేహంలో ‘5’ దోషాలు ఉన్నాయి. దోషము నివారణోపాయము - కామమును - నిస్సంకల్పముతోను, క్రోధమును - క్షమాగుణముతోను, నిశ్వాసను (వాయుధారణ చేయలేకపోవటం) - మితభోజనముతోను, భయమును - అప్రమాదత (జాగరూకత, Alertness ), ఆప్రమశీలత, పరిమాత్మపై నమ్మికతోను, నిద్రా జడత్వమును - తత్వ సేవనతోను జయించాలి! (‘త్వమ్ తత్ అసి’ - ఇతి భావేన). |
నిద్రాభయసరీసృపం హింసాదితరంగం తృష్ణావర్తం దారపంకం సంసారవార్ధిం తర్తుం సూక్ష్మమార్గమవలంబ్య సత్త్వాదిగుణానతిక్రమ్య తారమవలోకయేత్ . భ్రూమధ్యే సచ్చిదానందతేజఃకూటరూపం తారకం బ్రహ్మ . |
|
నిద్రా భయ సరీసృపం, హింసా ఆది తరంగం, తృష్ణా ఆవర్తం దార పంకగ్ం (పంకం), సంసార వార్ధిం తర్తుం, ‘సూక్ష్మమార్గమ్’ అవలంబ్య, సత్త్వ - ఆది గుణాన్ అతిక్రమ్య ‘తారకమ్’.. అవలోకయేత్ భ్రూమధ్యే సత్-చిత్-ఆనంద తేజః కూటరూపం తారకం బ్రహ్మ॥ |
అష్టాంగ యోగములు అనబడే సూక్ష్మ మార్గములను అవలంబించి, నిద్ర - భయము…. అనే సర్పములను, హింస - బాధ అనే తరంగములను, భార్య - పుత్రాదులకు సంబంధించిన ఈషణములు అనే బురదను, తృష్ణ (దురాశ)…. అనే సుడిగుండములను, … కలిగియున్న సంసార సముద్రాన్ని దాటివేసి, సత్య-రజో-తమో త్రిగుణములను అతిక్రమించివేసి, తారకముబ్రహ్మమును (తరింపజేసి ఒడ్డు జేర్చు దానిని, ఆత్మను) అవలోకనము చేయాలి. తారకమ్ : ’భ్రూమధ్య’ స్థానములో సత్ చిత్-ఆనందలక్షణములతో ప్రకాశమై వెలుగొందుచున్న కూర్మ (తాబేలు) రూపమే తారకము. ఆ కూర్మరూప తారకమునే ‘బ్రహ్మము’ అంటున్నారు. |
తదుపాయం లక్ష్యత్రయావలోకనం . |
|
తత్ ఉపాయం? లక్ష్యత్రయ అవలోకనమ్। |
అందుకు ఉపాయము : లక్ష్యత్రయమును (ద్రష్ట - దర్శన - దృశ్యములను)… వాటికి ఆవల ఉండి వీక్షించటము. అవలోకించటము. |
మూలాధారాదారభ్య బ్రహ్మరంధ్రపర్యంతం సుషుమ్నా సూర్యాభా . మృణాలతంతుసూక్ష్మా కుండలినీ . తతో తమోనివృత్తిః . |
|
మూలాధారత్ ఆరభ్య - బ్రహ్మరంధ్ర పర్యంతమ్ సుషుమ్నా సూర్యాభా తన్మధ్యే తటిత్ - కోటి సమా, మృణాళ తన్తు సూక్ష్మా కుణ్డలినీ! తత్ర తమో నివృత్తిః తత్ దర్శనాత్ సర్వపాప నివృత్తిః॥ |
సుషుమ్నానాడి : మూలాధారము నుండి ఆరంభమై - బ్రహ్మరంధ్రము (సహస్రారము) పర్యంతము విస్తరించి ఉన్నది. కుండలినీ : సుషుమ్నకు మధ్య భాగములో విద్యుత్ కోటి ప్రభలతో సమానమై, తామరతూడులోని ‘దారమువలె ఒకానొక శక్తి అతి సూక్ష్మరూపముగా ప్రకాశించుచున్నది. అదియే కుండలినీ శక్తి. ఆ శక్తి స్థానములో తమోవృత్తులు, తమస్సు నశించుచున్నాయి. అద్దాని దర్శనముచే (బుద్ధి యొక్క ఏకాగ్రతతో అనుభవముగా సిద్ధించుకోవటంచేత) సర్వపాపవృత్తులు నివృత్తి పొందగలవు. |
తద్దర్శనాత్సర్వపాపనివృత్తిః . తర్జన్యగ్రోన్మీలితకర్ణరంధ్రద్వయే ఫూత్కారశబ్దో జాయతే . తత్ర స్థితే మనసి చక్షుర్మధ్య నీలజ్యోతిః పశ్యతి . ఏవం హృదయేఽపి . |
|
తర్జన్య అగ్ర ఉన్మీలిత రంధ్రద్వయే ‘ఫూత్..’ కార శబ్దా జాయతే। తత్ర స్థితే మనసి, చక్షుః మధ్య నీల జ్యోతిః పశ్యతిః ఏవం హృదయేఽపి। |
అంతర్లక్ష్య నీలజ్యోతి దర్శనము : చూపుడువ్రేళ్ళ కొనలతో చెవి రంధ్రములను రెండిటినీ మూసి ఉంచితే, అప్పుడు లోనుండి ’ఫూత్’కార శబ్దము వినబడుతూ ఉంటుంది. ఆ శబ్దముపై కేంద్రీకృతమైనప్పుడు మనస్సుకు రెండు కనుల మధ్య నీలలోహిత జ్యోతి (లేత నీలపు రంగు కాంతి) అనుభవమవుతుంది. ఈ విధంగా హృదయంలో తేజో మనో చక్షు దర్శనము చేయాలి. |
బహిర్లక్ష్యం తు నాసాగ్రే చతుః- షడష్టదశద్వాదశాంగులీభిః క్రమాన్నీలద్యుతిశ్యామత్వ- సదృగ్రక్తభంగీస్ఫురత్పీతవర్ణద్వయోపేతం వ్యోమత్వం పశ్యతి స తు యోగీ చలనదృష్ట్యా వ్యోమభాగవీక్షితుః పురుషస్య దృష్ట్యగ్రే జ్యోతిర్మయూఖా వర్తంతే . తద్దృష్టిః స్థిరా భవతి . శీర్షోపరి ద్వాదశాంగులిమానజ్యోతిః పశ్యతి తదాఽమృతత్వమేతి . |
|
బహిర్లక్ష్యంతు। నాసాఽగ్రే చతుః (4) షట్ (6) అష్ట (8) దశ (10), ద్వాదశ (12) - అంగుళీభిః క్రమాత్ నీలద్యుతిః శ్యామత్వ సదృక్ రక్తభంగీ స్ఫురత్ శుక్ల - పీత వర్ణ ద్వయోపేతం వ్యోమత్వం పశ్యతి, స తు యోగీ, చలత్ దృష్ట్యా వ్యోమభాగ వీక్షితుః । పురుషస్య దృష్ట్యగ్రే జ్యోతిర్మయూఖా వర్తనే! తత్ దృష్టిః స్థిరా భవతి। శీర్షోపరి ద్వాదశాంగులమాన (12) జ్యోతిః పశ్యతి| తదా అమృతత్వమేతి। |
బహిర్లక్ష్య జ్యోతి దర్శనము: నాసాగ్రముగా (భృకుటి స్థానము నుండి ఊర్ధ్వముగా యోగి ఆకాశతత్యమును, చతు (4) అంగుళముల దూరంలో - నీల ద్యుతి (నీలకాంతి)గాను, షట్ (6) అంగుళము దూరంలో - రక్త వర్ణము (ఎరుపు)తో కూడిన శ్యామల (నలుపు) జ్యోతియు, అష్ట (8) అంగుళములు దూరంలో - తెలుపు, దశ (10) అంగుళముల దూరంలో - పసుపుపచ్చ రంగు తేజము, ద్వాదశ (12) అంగుళముల దూరంలో శ్వేతవర్ణ మిశ్రమ కాంతిగాను దర్శించుచున్నాడు. యోగ అభ్యాసముచే అట్లు దర్శనమగుచున్నది. చలన దృష్టితో ఆకాశమును దర్శించు యోగికి దృష్టి యొక్క అగ్ర(పై) భాగములో జ్యోతి కిరణములు - తేజస్సు కనిపిస్తాయి. అట్టి జ్యోతి యొక్క దర్శనముచే దృష్టి స్థిరము అగుచున్నది. యోగికి శిరస్సు యొక్క ఉపరిభాగమునందు ’12’ అంగుళముల వరకు ఎప్పుడైతే జ్యోతి(వెలుగు) కనిపిస్తుందో, అప్పుడు ఆ యోగి ’అమృతత్వము’ను పొందుచున్నాడు. ఇది బహిర్లక్ష్యము. |
మధ్యలక్ష్యం తు ప్రాతశ్చిత్రాదివర్ణసూర్యచంద్రవహ్నిజ్వాలా- వలీవత్తద్విహీనాంతరిక్షవత్పశ్యతి . తదాకారాకారీ భవతి . |
|
మధ్య లక్ష్యం తు। ప్రాతః చిత్రాది వర్ణ సూర్య, చంద్ర, వహ్ని జ్వాలావలీవత్ తత్ విహీన అంతరిక్షవత్ పశ్యతి, తత్ ఆకారాకారీ భవతి। |
మధ్య లక్ష్యము : ఈ యోగ సాధన చేయుచున్న యోగి తన హృదయంలో 1) సూర్య-చంద్ర-అగ్ని జ్వాలల కాంతితో వెలుగొందుచున్న ఆకాశమును, 2) అవన్నీ లేనట్టి (సర్వశూన్య) ఆకాశమును కూడా దర్శిస్తూ ఉంటాడు. రెండు తీరులుగానూ సందర్శనము చేస్తూ ఉంటాడు. |
అభ్యాసాన్నిర్వికారం గుణరహితాకాశం భవతి . విస్ఫురత్తారకాకారగాఢ- తమోపమం పరాకాశం భవతి . కాలానలసమం ద్యోతమానం మహాకాశం భవతి . సర్వోత్కృష్ట- పరమాద్వితీయప్రద్యోతమానం తత్త్వాకాశం భవతి . కోటిసూర్యప్రకాశం సూర్యాకాశం భవతి . ఏవమభ్యాసాత్తన్మయో భవతి . య ఏవం వేద .. 2.. |
|
అభ్యాసాత్ నిర్వికారం, గుణరహితా ఆకాశం భవతి। విస్ఫురత్ తారక ఆకార గాఢతమోపమమ్ పరాకాశం భవతి। కాలా-అనల సమద్యోతమానం మహాకాశం భవతి॥ సర్వోత్కృష్ట పరమద్యుతి ప్రద్యోతమానం తత్త్వాకాశం భవతి। కోటి సూర్యప్రకాశం సూర్యాకాశం భవతి! ఏవమ్ అభ్యాసాత్ తన్మయో భవతి, య ఏవం వేద॥ |
1.) క్రమంగా ఆ యోగికి అభ్యాసవశంగా ‘నిర్వికార గుణరహిత ఆకాశము’ అనుభూతమవుతోంది. 2.) ఆ నిర్గుణ నిరాకార ఆకాశానుభవము కాస్తా ప్రకాశమాన (విస్ఫురత్) తారక (నక్షత్ర) ఆకారము గల గాఢతమము (నిర్విషయ రూపము) అగు ‘పరాకాశ స్వరూపము’గా రూపుదిద్దుకొనుచున్నది. 3.) అట్టి పరాకాశమును దర్శించుచుండగా, క్రమంగా ప్రళయకాలాగ్ని కాంతులలో సమానమైన ‘మహాకాశము’గా దర్శనము అగుచున్నది. 4.) ఆ పై ఆ యోగి యొక్క ఆకాశానుభవము - సర్వోత్కృష్టము, పరమ ప్రకాశ ప్రద్యోతమాన ‘తత్త్వాకాశము’గా అనుభూతమానము అగుచున్నది. 5.) అటుపై కోటి సూర్యప్రకాశమానమగు ‘సూర్యాకాశము’గా అనుభవము అగుచున్నది. ఈ విధంగా బాహ్య అభ్యంతర స్వరూపమైన ‘ఆకాశ పంచకము’ అను తారకమును అభ్యసిస్తూ ఉండగా అమనస్కమైన ‘తన్మయస్థితి’ కలుగుచున్నది. యోగి ఈ విధంగా ఆకాశపంచక తారకమును ఎరుగుచున్నాడు. |
తద్యోగం చ ద్విధా విద్ధి పూర్వోత్తరవిభాగతః . పూర్వం తు తారకం విద్యాదమనస్కం తదుత్తరమితి . |
|
3.) తత్ యోగం చ ద్విధా విద్ధి - పూర్వ – ఉత్తర విభాగతః॥ పూర్వం తు - తారకం విద్యాత్ అమనస్కమ్ - తత్ ఉత్తరమ్ ఇతి। |
తారకయోగి యొక్క యోగవిద్యా విధానము రెండు విధములుగా ఉంటోంది 1.) పూర్వము (First Part) - ‘తారకవిద్య’ 2.) ఉత్తర (Latter Part)- ’అమనస్కస్థితి’ |
తారకం ద్వివిధం . మూర్తితారకమమూర్తితారకమితి . యదింద్రియాంతం తన్మూర్తితారకం . యద్భ్రూయుగాతీతం తదమూర్తితారకమితి . ఉభయమపి మనోయుక్తమభ్యసేత్ . మనోయుక్తాంతరదృష్టిస్తారకప్రకాశాయ భవతి . |
|
తారకమ్ ద్వివిధమ్ మూర్తి తారకమ్ - అమూర్తి తారకమ్ ఇతి। యత్ ఇంద్రియాంతమ్, తత్ ’మూర్తితారకమ్’। యత్ భ్రూయుగాతీతమ్ తత్ ‘అమూర్తితారకమ్’ ఇతి। ఉభయమపి మనోయుక్తమ్ అభ్యసేత్। మనోయుక్తా అంతర్ - దృష్టిః తారక ప్రకాశాయ భవతి। |
తారకము : అట్టి తారక విద్య రెండు విధములై ఉంటోంది 1.) మూర్తి తారకము : ఏ యోగ సాధనలో నామ రూపాత్మకమైనది సిద్ధించుచున్నదో, ఇంద్రియాంతకమై ఉన్నదో.. అది మూర్తి తారకము (భ్రూయుగము వరకు). 2.) అమూర్తి తారకము : భ్రూమధ్య ఆకాశ సంబంధమునకు అతీతమైనది (భ్రూయుగమునకు ఊర్ధ్వముగా). ఈ (మూర్తి-అమూర్తి తారకములు) ఉభయము మనస్సుతో చేర్చి అభ్యసించవలసినవే! ఉభయము యోగాభ్యాసిచే అభ్యసించబడుతున్నాయి. మూర్తి - అమూర్తి తారకాభ్యాసముచే మనోయుక్తమైన ’అంతర్-దృష్టి’కి తారక ప్రకాశ (నక్షత్ర కాంతి) స్థితి (మనస్సుకు) సిద్ధించుచున్నవి. |
భ్రూయుగమధ్యబిలే తేజస ఆవిర్భావః . ఏతత్పూర్వతారకం . ఉత్తరం త్వమనస్కం . తాలుమూలోర్ధ్వభాగే మహాజ్యోతిర్విద్యతే . తద్దర్శనాదణిమాదిసిద్ధిః . |
|
భ్రూయుగ మధ్య బిలే ‘తేజస’ ఆవిర్భావః। ఏతత్ పూర్వతారకమ్। ఉత్తరమ్ తత్ - అమనస్కమ్। తాలుమూల ఊర్ధ్వభాగే మహజ్జ్యోతిః విద్యతే। తత్ దర్శనాత్ అణిమాది సిద్ధిః॥ |
పూర్వ తారకము : భూమధ్య ప్రదేశ బిలమునందు (రెండు కనుబొమ్మల మధ్య గల బిల - ఆకాశమునందు) ఒకానొక తేజస్సు జనిస్తోంది. ఇది పూర్వతారకము. ఉత్తర తారకము : ఇది మనోలయ రూపమైనట్టి అమనస్కము. తాలు(దవడ) మూల (beginning) ప్రదేశ ఊర్ధ్వభాగములో ‘మహత్ జ్యోతి’ వెలుగొందుచున్నది. అట్టి ఆ మహత్ జ్యోతి యొక్క సందర్శనముచే ఆ యోగికి అణిమ-మహిమ-గరిమ-లఘిమ-ప్రాకామ్య-వశిత్వ-ఈశిత్వ-ఇచ్ఛా అష్టసిద్ధులు సిద్ధించుచున్నాయి. |
లక్ష్యేఽన్తర్బాహ్యాయాం దృష్టౌ నిమేషోన్మేషవర్జితాయాం చ ఇయం శాంభవీ ముద్రా భవతి . |
|
లక్ష్యే అన్తస్థ - బాహ్యాయాం, దృష్టౌ దృష్టౌ నిమేష - ఉన్మేష వర్జితాయాం చ ఇయం ‘శామ్భవీ ముద్రా’ భవతి। |
తాలు మూల ఊర్ధ్వ భాగమున వెలుగొందుతున్న మహత్ జ్యోతి దర్శనమును ‘శాంభవీ’ ముద్ర- అంటారు. అట్టి శాంభవీముద్రను బాహ్యమునందును, అంతరమునందును ఉత్తమ (ఆత్మదర్శనము-అను) లక్ష్యమును గ్రహించి సాధన చేయాలి. కళ్లు - తెరచుట- మూయుటలను కూడా దాటిపోయినట్టిది ఈ శాంభవీ ముద్ర. ఇద్దాని యోగ సాధనకు కళ్లు మూతలతో పనిలేదు. కనిపించేదంతా అదే అయి ఉండగా కళ్లు మూతలెందుకు? |
సర్వతంత్రేషు గోప్యమహావిద్యా భవతి . తజ్జ్ఞానేన సంసారనివృత్తిః . తత్పూజనం మోక్షఫలదం . |
|
సర్వతన్త్రేషు గోప్యా మహావిద్యా భవతి! తత్ జ్ఞానేన సంసారనివృత్తిః తత్ పూజనం మోక్షఫలదమ్। |
ఓ యాజ్ఞవల్క్య మునీంద్రా! మనము ఇప్పుడు చెప్పుకున్నది సమస్త తంత్రములలోను రహస్యమగు యోగ మహావిద్య సుమా! అట్టి తాలుమూల ఆకాశములో వెలుగొందు మహత్ జ్యోతి యోగ విద్యను - ఎరుగుట చేత ‘సంసార నివృత్తి’ సిద్ధించగలదు. ఈ యోగవిద్యను ఆరాధించు యోగికి మోక్షము సిద్ధించగలదు. |
అంతర్లక్ష్యం జలజ్యోతిఃస్వరూపం భవతి . మహర్షివేద్యం అంతర్బాహ్యేంద్రియైరదృశ్యం .. 3.. |
|
అంతర్లక్ష్యం జలజ్యోతి స్వరూపం భవతి। మహర్షి వేద్యమ్। అన్తః - బాహ్య ఇంద్రియైః అదృశ్యమ్॥ |
అంతర్లక్ష్యము : జలజ్యోతి-స్వరూపము. ఈ అంతర్జ్యోతిని మహర్షులు సత్య దృష్టి - ఆశయములచే గమనించి గానము చేస్తున్నట్టిది. అట్టి అంతర్జ్యోతి మనో బుద్ధులకు సందర్శనమయ్యేదేగాని, బాహ్య అంతర ఇంద్రియములకు విషయము కాదు. |
సహస్రారే జలజ్యోతిరంతర్లక్ష్యం . బుద్ధిగుహాయాం సర్వాంగసుందరం పురుషరూపమంతర్లక్ష్యమిత్యపరే . |
|
4.) సహస్రారే జలజ్యోతిః అంతర్లక్ష్యమ్! బుద్ధి గుహాయాం సర్వాంగ సుందరం ‘పురుషరూపమ్ అంతర్లక్ష్యమ్’ ఇతి అపరే! |
అంతర్లక్ష్యము సహస్రార జలజ్యోతి (వెలుగుచున్న జ్యోతి) సందర్శనము అయి ఉన్నది. అట్టి జలజ్యోతి జీవుని బుద్ధి గుహయందు సర్వాంగసుందరముగా సర్వదా వెలుగొందుచూనే ఉన్నది సుమా! ఆ రీతిగా అంతర్లక్ష్యముగా కనిపించే జలజ్యోతి స్వరూపము పరమ పురుషుడే! ‘శ్రీమన్నారాయణుడే’ అని కొందరు అనుకొని దర్శిస్తున్నారు. |
శీర్షాంతర్గతమండలమధ్యగం పంచవక్త్రముమాసహాయం నీలకంఠం ప్రశాంతమంతర్లక్ష్యమితి కేచిత్ . అంగుష్ఠమాత్రః పురుషోఽన్తర్లక్ష్యమిత్యేకే . ఉక్తవికల్పం సర్వమాత్మైవ . |
|
శీర్షా అంతర్గత మండల మధ్యగం పంచవక్త్రమ్, ఉమాసహాయం, నీలకంఠం, ప్రశాంతం, అంతర్లక్ష్యమ్.. ఇతి కేచిత్। అగుష్ఠ మాత్రం పురుషో అంతర్లక్ష్యమ్ - ఇతి ఏకే। దర్శనేన జీవన్ముక్త దశాయాం స్వయమ్ అన్తర్లక్ష్యో భూతా-పరమ్ - ఇతి అపరే। ఉక్త వికల్పం| సర్వమ్ ఆత్మైవ ॥ |
ఈ అంతర్లక్ష్యము శిరస్సులో బ్రహ్మరంధ్రము నందు మధ్యమండలములో వెలుగొందు దివ్య జ్యోతి స్వరూపుడు - ‘పంచముఖుడు, ఉమా సహాయుడు, ప్రశాంత మూర్తియగు పరమశివుడు’ అని మరికొందరు యోగసిద్ధులు ఆనందంగా సందర్శిస్తున్నారు. ఆయనయే (బొటనవేలు ప్రమాణములగు, తత్ సంజ్ఞాలక్ష్యుడు అగు), అంగుష్ఠ మాత్ర స్వయం జ్యోతి స్వరూప పురుషుడు అని కొందరు గానము. ఆ అంతర్లక్ష్య పురుషుడు జీవన్ముక్త దశను దాటిన ఆ యోగి యొక్క విదేహముక్త స్వస్వరూపమే! అది పంచభూతములకు పరమైనట్టి - సర్వస్వరూపము కూడా! - అని ఇంకొందరి అభివర్ణన, స్వానుభవము. ఈ ఈ వివిధ యోగుల వివిధములుగా బయటకు కనిపించేవి కల్పానుభవములన్నీ… యుక్తియుక్తిమే! ఎవ్వరి అనుభవమును కాదనవలసిన పనిలేదు. ఎందుకంటే సర్వము అఖండమగు ఆత్మయే కదా! |
తల్లక్ష్యం శుద్ధాత్మదృష్ట్యా వా యః పశ్యతి స ఏవ బ్రహ్మనిష్ఠో భవతి . |
|
తత్ లక్ష్యం శుద్ధాత్మ దృష్ట్యా వా యః పశ్యతి, స ఏవ ‘బ్రహ్మానిష్ఠో’ భవతి। |
అట్టి లక్ష్యమును ’శుద్ధమగు ఆత్మ దృష్టి’తో ఎవ్వరు సందర్శిస్తారో, వారు బ్రహ్మనిష్ఠులే! |
జీవః పంచవింశకః స్వకల్పితచతుర్వింశతితత్త్వం పరిత్యజ్య షడ్వింశః పరమాత్మాహమితి నిశ్చయాజ్జీవన్ముక్తో భవతి . |
|
జీవః పఞ్చవింశకః (25) స్వకల్పిత చతుర్వింశతి (24) తత్త్వం పరిత్యజ్య షడ్వింశః (26) పరమాత్మాఽహమ్ ఇతి నిశ్చయాత్ జీవన్ముక్తో భవతి॥ |
ఈ జీవుడు తాను కల్పించుకొనిన [(5 కర్మేంద్రియము + 5 విషయములు + 5 జ్ఞానేంద్రియములు + 5 విషయములు)+ అంతఃకరణ చతుష్టయమగు మనో-బుద్ధి-చిత్త-అహంకారాలు) + జీవాత్మ అనే] 25 తత్త్వములలో మొదటి 24తత్త్వములను త్యజించి, 26వ తత్త్వమగు పరమాత్మనే నేను.. అని ఎరిగి 25వది అగు జీవాత్మను స్వీయ పరమాత్మత్వముతో ఏకము చేసినప్పుడు - జీవన్ముక్తుడు అగుచున్నాడు . |
ఏవమంతర్లక్ష్యదర్శనేన జీవన్ముక్తిదశాయాం స్వయమంతర్లక్ష్యో భూత్వా పరమాకాశాఖండమండలో భవతి .. 4.. ఇతి ప్రథమం బ్రాహ్మణం .. |
|
ఏవమ్ అంతర్లక్ష్య దర్శనేన జీవన్ముక్తి దశాయాం స్వయం - అంతర్లక్ష్యో భూత్వా, పరామ ఆకాశా - అఖణ్డమణ్డలో భవతి। |
అట్టి అంతర్లక్ష్య దర్శనముచే జీవన్ముక్తుడై జీవన్ముక్త దశను కూడా డాటి, తానే అఖండ మండలాకారుడగు పరమాకాశము.. అను స్వానుభవమునందు సంస్థితుడగుచున్నాడు. |
ద్వితీయ బ్రాహ్మణమ్
అథ హ యాజ్ఞవల్క్య ఆదిత్యమండలపురుషం పప్రచ్ఛ . భగవన్నంతర్లక్ష్యాదికం బహుధోక్తం . మయా తన్న జ్ఞాతం . తద్బ్రూహి మహ్యం . |
|
1.) అథ హ యాజ్ఞవల్క్య ఆదిత్యమణ్డల పురుషమ్ పప్రచ్ఛ :- భగవన్! అంతర్లక్ష్యాదికం బహుధా ఉక్తమ్ ! మాయా తత్ న జ్ఞాతమ్| తత్ బ్రూహి మహ్యమ్ । |
యాజ్ఞవల్క్యుడు : హే! ఆదిత్య మండల పురుషా! సూర్యభగవాన్! ఆదిత్య నారాయణా! ‘అంతర్లక్ష్యము’ మొదలగువాటి గురించి అనేక అనేక రీతులుగా చెప్పుచూ ఉన్నారు. అయితే.. అద్దాని యొక్క ప్రయోజనమగు జీవన్ముక్తి, బ్రహ్మనిష్ఠ, పరమాత్మాఽహమ్ - ఇవి ఎట్లా సిద్ధించగలవు? ఈ విషయాలు నేను ఎరిగి ఉండలేదు. కనుక ‘అంతర్లక్ష్యము’ గురించి మరికొంతగా వివరించ ప్రార్థన. |
తదుహోవాచ పంచభూత- కారణం తడిత్కూటాభం తద్వచ్చతుఃపీఠం . తన్మధ్యే తత్త్వప్రకాశో భవతి . సోఽతిగూఢ అవ్యక్తశ్చ . తజ్జ్ఞానప్లవాధిరూఢేన జ్ఞేయం . తద్బాహ్యాభ్యంతర్లక్ష్యం . |
|
తదు హోవాచ :- పఞ్చమహాభూత కారణమ్, తటిత్ కూటాఽభమ్, తద్వత్ చతుః పీఠమ్| తత్ మధ్యే తత్త్వ ప్రకాశో భవతి। సో అతి గూఢ అవ్యక్తశ్చ। తత్ జ్ఞాన-ప్లవ అధిరూఢేన జ్ఞేయమ్! తత్ బాహ్య అభ్యన్తరః లక్ష్యమ్। |
ఆదిత్యమండల పురుషుడు : పంచమహా తములు కారణముగా ప్రకాశమానమగు త్రికూటము (ద్రష్ట-దర్శన-దృశ్యములు), అద్దానికి ఆశ్రయించి జాగ్రత్ - స్వప్న - సుషిప్తి - తురీయములు; మనోబుద్ధి చిత్త-అహంకారములు అనునవి చతుఃపీఠము. వాటి మధ్యగా తత్త్వ ప్రకాశ రూపమగు ఆత్మ అతి గూఢమై వేంచేసి యున్నది. అదియే రహస్యమగు అవ్యక్తము కూడా. అట్టి అతి రహస్య అవ్యక్త రూపమగు ఆత్మ ‘జ్ఞానము’ అనే పడవను అధిరోహించిన వారికే జ్ఞేయముగా అగుచున్నది. తెలియబడుచున్నది. అట్టి తత్త్వ స్వరూప అఖండ పరమాత్మయే సర్వే సర్వత్రా సర్వదా సర్వమై ఉన్నది కాబట్టి.. అదియే బాహ్య అభ్యంతర లక్ష్యము. |
తన్మధ్యే జగల్లీనం . తన్నాదబిందుకలాతీతమఖండమండలం . తత్సగుణనిర్గుణస్వరూపం . తద్వేత్తా విముక్తః . |
|
తత్ మధ్యే జగత్ లీనమ్। తత్ నాద-బిందు-కలాతీతమ్, అఖణ్డ మణ్డలమ్! తత్ సగుణ - నిర్గుణ స్వరూపమ్| తత్ వేత్తా విముక్తః॥ |
అట్టి పరమాత్మయందే ఈ ఎదురుగా కనిపించే జగత్తు సర్వదా లీనమైయున్నది. అది నాదము (శబ్దము)నకు, బిందువు (చుక్క)నకు, కల (ఆకారములకు) అతీతమై అఖణ్డమణ్డలాకారమై యున్నది. సగుణ-నిర్గుణ ఉభయ స్వరూపమైయున్నది. అట్టి పరమాత్మను ఎరిగినవాడు సర్వబంధముల నుండి విడివడి విముక్తుడగుచున్నాడు. |
ఆదావగ్నిమండలం . తదుపరి సూర్యమండలం . తన్మధ్యే సుధాచంద్రమండలం . తన్మధ్యేఽఖండబ్రహ్మతేజోమండలం . తద్విద్యుల్లేఖావచ్ఛుక్ల- భాస్వరం . తదేవ శాంభవీలక్షణం . తద్దర్శనే తిస్రో మూర్తయ అమా ప్రతిపత్పూర్ణిమా చేతి . |
|
ఆదాః అగ్ని మండలమ్। తత్ ఉపరి సూర్య మణ్డలమ్। తత్ మధ్యే సుధా చంద్ర మండలమ్। తత్ మధ్యే అఖ తేజో మండలమ్। తత్ విద్యుల్లేఖావత్ శుక్ల భాస్వరమ్। తదేవ శామ్భవీ లక్షణమ్। తత్ దర్శనే తిస్రో దృష్టయః । అమా ప్రతిపత్ పూర్ణిమా చేతి ॥ |
మొదట - అగ్ని మండలము. ఆ తదుపరి - సూర్యమండలము. దాని మధ్యలో - సుధా చంద్రమండలము. అద్దాని మధ్యలో - అఖణ్ణ తేజోమండలము అయ్యది విద్యుత్ కాంతివలె తెల్లని ప్రకాశము. ఆ శుక్ల - అఖండ ‘తేజో మండలమే’ శామ్భవీ లక్షణము. అద్దాని దర్శనమే ‘తిస్రోదృష్టి’ (లేక) పరతత్త్వదృష్టి. ఆ శామ్భనీ లక్షణమునే బ్రహ్మ-విష్ణు- మహేశ్వరులుగా వేరువేరు ఉపాసకులు ధ్యానించుచున్నారు. అదియే కొందరు యోగులు ప్రతిపత్తి (వారి బుద్ధి)చే పూర్ణపరతత్వముగా దర్శిస్తున్నారు. మరికొందరు కళ్లు మూసుకుని ‘సోఽహమ్ - నేను అదే’ అను దృష్టితో అంతరంగమున దర్శిస్తున్నారు. (అంతరహృదయ ఆభ్రాంతమధ్య హృదయాంతరంగుడు). |
నిమీలితదర్శనమమాదృష్టిః . అర్ధోన్మీలితం ప్రతిపత్ . సర్వోన్మీలనం పూర్ణిమా భవతి . తాసు పూర్ణిమాభ్యాసః కర్తవ్యః |
|
నిమీలిత దర్శనమ్ అమా దృష్టిః అర్ధ ఉన్మీలితం ప్రతిపత్। సర్వ ఉన్మీలనం పూర్ణిమా భవతి। తాసు పూర్ణిమాభ్యాసః కర్తవ్యః। |
సగము మూసిన కళ్ళతో లోపల సర్వరూపముగానో (లేదా) బయట సర్వరూపముగానో అనిపిస్తోంది. పూర్తిగా తెరచిన (ఉన్మీలిత) కనులకు (దృష్టికి) పూర్ణముగా (బయట+లోపలగా) అగుపిస్తోంది. (శిలా విగ్రహమునందు అంతటా శిలయే ఉన్న రీతిగా) ఈ జగత్తంతా పరమాత్మతత్త్వమే! అట్టి శాంభవీలక్షణ ‘పూర్ణిమ-అభ్యాసమ్’ - ముముక్షు యోగసాధకునికి కర్తవ్యము. నిర్వర్తించవలసినది. |
తల్లక్ష్యం నాసాగ్రం . తదా తాలుమూలే గాఢతమో దృశ్యతే . తదభ్యాసాదఖండమండలాకార- జ్యోతిర్దృశ్యతే . తదేవ సచ్చిదానందం బ్రహ్మ భవతి . ఏవం సహజానందే యదా మనో లీయతే తదా శాంతో భవీ భవతి . తామేవ ఖేచరీమాహుః . |
|
తత్ లక్ష్యమ్ - ‘నాసాగ్రమ్’। తదా తాలుమూలే గాఢతమో దృశ్యతే। తత్ అభ్యాసాత్ ‘అఖణ్డమణ్డలాకార జ్యోతిః దృశ్యతే। తదేవ సత్-చిత్-ఆనన్దమ్ ‘బ్రహ్మ’ భవతి। ఏవం సహజానన్దే యదా మనో లీయతే, తదా ‘శామ్భవీ’ భవతి॥ తామేవ “ఖేచరీమ్” ఆహుః॥ |
అద్దానికై లక్ష్యము ఏకాగ్రము చేయవలసిన ప్రదేశము - నాశికకుపై భాగము (నాసాగ్రము - కనుబొమ్మల మధ్య-కించిత్ క్రిందగాగల పల్లము - స్థానము). అది తాలు (దవడ) మూల - ఆకాశములో కూడా ‘గాఢతమము’ రూపముగా అనుభూతమవుతోంది. అద్దానిని యోగాభ్యాసంగా ఆశ్రయించాలి! నాసాగ్రము - తాలు మూలములలోని తేజస్సును ఉపాసిస్తూ ఉండగా అఖండమండలాకార జ్యోతి యొక్క దర్శనము అగుచున్నది. అదియే సత్ - చిత్ - ఆనంద బ్రహ్మము. ఎప్పుడైతే ఆ సత్-చిత్ సహజానంద పరబ్రహ్మమునందు ఈ జీవుని మనస్సు విలీన మవుతుందో అది ‘శాంభవీ’ స్థితి యోగము అగుచున్నది. అదియే ‘ఖేచరీముద్ర’ అని కూడా పిలుస్తున్నారు. |
తదభ్యాసాన్మనఃస్థైర్యం . తతో వాయుస్థైర్యం . తచ్చిహ్నాని . ఆదౌ తారకవద్దృశ్యతే . తతో వజ్రదర్పణం . తత ఉపరి పూర్ణచంద్రమండలం . తతో వహ్నిశిఖామండలం క్రమాద్దృశ్యతే .. 1.. |
|
తత్ అభ్యాసాత్ మనః స్థైర్యమ్। తతో వాయు స్థైర్యమ్। తత్ చిహ్నాని ఆదౌ తారకవత్ దృశ్యతే। తతో వజ్రదర్పణమ్। తతః పరిపూర్ణచంద్రమణ్డలమ్। తతో నవరత్నప్రభా మణ్డలమ్। తతో మధ్యాహ్న - అర్కమండలమ్। తతో వహ్నిశిఖామణ్డలమ్। క్రమాత్ దృశ్యతే॥ |
అట్టి ‘శాంభవీ’ (లేక) ఖేచరీ ముద్రను అభ్యాసము చేస్తూ ఉండగా మనోస్థైర్యము, వాయు స్థైరము (మనో వాయునిశ్చలతలు) సిద్ధించుచున్నాయి. అట్టి శాంభవీముద్ర యొక్క చిహ్నములు మొట్టమొదట - నక్షత్రము వలె అగుపిస్తుంది. తర్వాత వజ్రముతో నిర్మితమైన దర్పణము వలె కనిపిస్తుంది. ఆ తర్వాత పూర్ణచంద్రమండలము వలె దృశ్యమానమవుతుంది. ఆపై మధ్యాహ్న సూర్యమండలము వలె దివ్యప్రకాశమానమవుతుంది. అటుపై అగ్నిశిఖామండలము వలె కనిపిస్తుంది. ఈ విధంగా క్రమక్రమంగా దృశ్యమానమగుచున్నది. |
తదా పశ్చిమాభిముఖప్రకాశః స్ఫటికధూమ్ర- బిందునాదకలానక్షత్రఖద్యోతదీపనేత్రసవర్ణనవ- రత్నాదిప్రభా దృశ్యంతే . తదేవ ప్రణవస్వరూపం . |
|
2.) తదా పశ్చిమ-అభిముఖ ప్రకాశః స్ఫటిక ధూమ్ర బిన్దు నాదకలా నక్షత్ర ఖద్యోత దీపనేత్ర సువర్ణ నవరత్నాది ప్రభా దృశ్యన్తే। తదేవ ప్రణవ స్వరూపమ్। |
అట్టి ‘శాంభవీముద్ర’ యొక్క చిహ్నములుగా.. - పశ్చిమ అభిముఖముగా (Left side) ప్రకాశము కనిపిస్తుంది. - స్ఫటికముతో సమానమైన తెల్లటి కాంతి పుంజము అనుభూతమౌతుంది. - ధూమ్రము (ఎక్కువ నలుపు, తక్కువ ఎరుపు) అగుపిస్తుంది. - తర్వాత బిన్దు-నాద-కలా-నక్షత్ర కాంతులు, విద్యుత్తు దీపకాంతులు, బంగారు, నవరత్నముల వన్నెలు, ప్రభలు కనిపిస్తాయి. అదియే ప్రణవ స్వరూపము. |
ప్రాణాపానయోరైక్యం కృత్వా ధృతకుంభకో నాసాగ్ర- దర్శనదృఢభావనయా ద్వికరాంగులిభిః షణ్ముఖీ- కరణేన ప్రణవధ్వనిం నిశమ్య మనస్తత్ర లీనం భవతి . తస్య న కర్మలేపః . |
|
ప్రాణా-అపానయోః ఐక్యం కృత్వా, ధృతకుమ్భకో నాసాఽగ్ర దర్శన దృఢభావనయా। ద్వికరా అంగుళీభిః షణ్ముఖీకరణేన ప్రణవ ధ్వనిం నిశమ్య మనః - తత్ర లీనం భవతి! తస్య న కర్మలేపః। |
ప్రాణ-అపానములను ఐక్యము చేసి ‘కుంభక ప్రాణాయామము’ అభ్యసించు యోగికి ముక్కుకు ఊర్ధ్వంగా ఆత్మానుభూతి సంబంధమగు - నాసాగ్ర దర్శనము యొక్క దృఢ భావన కలుగుతోంది. ’దృఢభావన’చే రెండు ఉంగరపు వ్రేళ్ళతో చెవులు మూసి ’షణ్ముఖీకరణము’ వలన ప్రణవనాదము నిరోధించబడుతుంది. ప్రణవ నిరోధము వలన ‘మనస్సు’ విలీనమగుచున్నవి. కుంభక - అభ్యాసము నిర్వర్తించుచున్న యోగికి క్రమంగా కర్మబంధములు తొలగి, కర్మలు - మొదలే లేనివిగా అగుచున్నాయి. ‘నేను కర్మ బద్ధుడను’ అనే భ్రమ తొలగుచున్నది. |
రవేరుదయాస్తమయయోః కిల కర్మ కర్తవ్యం . ఏవంవిదశ్చిదాదిత్యస్యోదయాస్తమయాభావా- త్సర్వకర్మాభావః . శబ్దకాలలయేన దివారాత్ర్యతీతో భూత్వా సర్వపరిపూర్ణజ్ఞానేనోన్యాన్యవస్థావశేన బ్రహ్మైక్యం భవతి . |
|
రవేః ఉదయాస్తమయయోః కిం కర్మ-కర్తవ్యమ్? ఏవం విపశ్చిత్ ఆదిత్యస్య ఊదయా-అస్తమయా భావాత్ సర్వకర్మా-అభావః। శబ్దకాల లయేన దివా-రాత్ర అతీతో భూత్వా, సర్వపరిపూర్ణ జ్ఞానేన ‘ఉన్మన్యవస్థా’ అవశేన, ‘బ్రహ్మైక్యం’ భవతి॥ |
ఏ విధంగా అయితే సూర్యునికి ఉదయ అస్తమయములు వాస్తవానికి లేవో, ప్రపంచములో జరిగే ఏ కర్మలతోనూ సంబంధమే ఉండదో, కుంభక ప్రాణ యామముతో మనస్సు లయింపజేసినవానికి కర్మలతో సంబంధమే ఉండదు. తాను సర్వమునకు ఆధారుడగుచూనే, ఈ జగత్ సర్వమ్ తనకు లేనివాడై ఉంటాడు. ఇది తెలుసుకొన్న తర్వాత ఇక, “శాంభవీ ముద్రలోని ధ్యేయవస్తువగు చిత్ ఆదిత్యునికి ఉదయాస్తమయాలు లేవు. ఆయనకు కర్మలు లేవు. కర్మ బంధములూ లేవు" అనునది సుస్పష్టమౌతుంది. శాంభవీ యోగమునందు కుంభక ప్రాణాయమము ద్వారా అంతర్జ్యోతిని దర్శించు యోగి పట్ల శబ్ద-కాలములు లయిస్తాయి. అతడు రాత్రింబవళ్లకు అతీతుడు, అప్రమేయుడు, సాక్షి అగుచున్నాడు. సర్వ పరిపూర్ణ జ్ఞానము చేత ‘ఉన్మనీ అవస్థ’ (జగత్ రహిత కేవలీ మనో స్థితి) మాత్రమే శేషించి, ఇక ఆతడు ’జీవ బ్రహ్మైక్య స్థితి’ పొందుచున్నాడు. |
ఉన్మన్యా అమనస్కం భవతి . తస్య నిశ్చింతా ధ్యానం . సర్వకర్మనిరాకరణమావాహనం . నిశ్చయజ్ఞానమాసనం . ఉన్మనీభావః పాద్యం . సదాఽమనస్కమర్ఘ్యం . సదాదీప్తిరపారామృతవృత్తిః స్నానం . సర్వత్ర భావనా గంధః . దృక్స్వరూపావస్థాన- మక్షతాః . చిదాప్తిః పుష్పం . చిదగ్నిస్వరూపం ధూపః . చిదాదిత్యస్వరూపం దీపః . పరిపూర్ణచంద్రామృతరసస్యైకీకరణం నైవేద్యం . నిశ్చలత్వం ప్రదక్షిణం . సోహంభావో నమస్కారః . మౌనం స్తుతిః . సర్వసంతోషో విసర్జనమితి య ఏవం వేద . .. 2.. |
|
ఉన్మన్యా … ‘అమనస్కం’ భవతి। తస్య నిశ్చిన్తతా - ధ్యానమ్। సర్వకర్మ నిరాకరణమ్ … ఆవాహనమ్। నిశ్చయ జ్ఞానమ్ … ఆసనమ్। ఉన్మనీ భావః పాద్యమ్। సదా అమనస్కమ్.. ఆర్ఘ్యమ్। సదా దీప్తిః.. ఆచమనం। అపారామృతవృత్తిః.. స్నానమ్। సర్వాత్మభావనా.. గన్ధః। దృక్ స్వరూపా అవస్థానమ్ … అక్షతాః। చిదాప్తిః … పుష్పమ్। చిదగ్ని స్వరూపం … ధూపః। చిదాదిత్య స్వరూపం … దీపః। పరిపూర్ణ చన్ద్రా అమృతస్త్య ఏకీకరణం.. నైవేద్యమ్। నిశ్చలత్వం … ప్రదక్షిణమ్। సోఽహమ్ భావో … నమస్కారః। మౌనం.. స్తుతిః। సర్వసన్తోషో.. విసర్జనమ్। ఇతి య ఏవం వేద॥ |
➤ ’ఉన్మనీ’యే అమనస్కము! చంచల మనస్సుకు ఆవలయున్న నిశ్చల మనో విభాగమే ఉన్మనీ! అమనస్కము కూడా! ➤ అమనస్కంతో ఆత్మ పూజ - జగద్విషయముల గురించిన ‘నిశ్చింత’ ఆతని ‘ధ్యానము’! ➤ సర్వకర్మలను ‘అవి నాకు సంబంధించినవి కావు. నేను వాటికి సంబంధించినవాడిని కాదు’ అను భావనతో సర్వకర్మల నిరాకరణము - ఆతని ‘ఆవాహనము’. ➤ అఖండాత్మజ్ఞానమే అతడు సమర్పించే ఆసనము. ➤ ఉన్మనీ (కేవల-జగత్ రహిత మనస్సు)యే భగవానునికి ‘పాద్యము’. ➤ సదా మనస్సుకు సాక్షిగా ఉండే అమనస్కమ్ - అర్ఘ్యము. ➤ ఎప్పుడూ జ్ఞాన దీప్తితో ఉండటమే - ఆచమనము. ➤ అపారమగు అమృత స్వస్వరూపముపట్ల ఆత్మభావనావృత్తియే - స్నానము. ➤ సర్వాత్మభావనయే - గంధ సమర్పణము. ➤ దృక్ స్వరూప అవస్థ కలిగి ఉండటమే - అక్షత సమర్పణ. ➤ చిత్ స్వరూపము పొంది ఉండటమే - పుష్పము. ➤ చిదగ్ని స్వరూపమే - ధూపము. ➤ చిదాదిత్య స్వరూపము - దీపము. ➤ పరిపూర్ణ చంద్రామృత ఏకీకరణము - నైవేద్యము. ➤ ఆత్మభావనయందు నిశ్చలత్వము - ప్రదక్షిణము. ➤ నేను ఆ ఆత్మ స్వరూపుడనే - సోఽహమ్ భావనయే - నమస్కారము. ➤ జగత్ విషయముల పట్ల మౌనము - స్థుతి. ➤ సర్వదా సంతోషముగా ఉండటయే - విసర్జనము. ఇదియే ఆత్మసందర్శనము చేయు ఆత్మ సంయమ యోగి యొక్క ఆత్మదేవుని పూజావిధి. ఈ విధంగా ఆత్మచే - ఆత్మ భగవానుని - ఆత్మయందు పూజించాలి. |
ఏవం త్రిపుట్యాం నిరస్తాయాం నిస్తరంగసముద్రవన్నివాత- స్థితదీపవదచలసంపూర్ణభావాభావవిహీనకైవల్యద్యోతిర్భవతి . |
|
3.) ఏవం త్రిపుట్యాం నిరస్తాయాం నిస్తరంగ సముద్రవత్, నివాత స్థిత దీపవత్, అచల సంపూర్ణ భావ-అభావ విహీన కైవల్య జ్యోతిః భవతి| |
క్రమంగా ద్రష్ట-దర్శన-దృశ్య రూప త్రిపుటిని దాటి పోయి (అధిగమించి / తిరస్కరించి) తరంగ రహితమైన సముద్రమువలె, గాలి వీచని చోట దీపమువలె, అచలము, భావ-అభావములను పూర్తిగా రహితము చేసుకున్నట్టిది అగు కైవల్య జ్యోతిస్వరూపుడు అగుచున్నాడు. ఈ జగత్తంతా ఆతని స్వయంజ్యోతి స్వరూపముయొక్క కాంతి పుంజమగుచున్నది. |
జాగ్రన్నిందాంతఃపరిజ్ఞానేన బ్రహ్మవిద్భవతి . సుషుప్తిసమాధ్యోర్మనోలయావిశేషేఽపి మహదస్త్యుభయో- ర్భేదస్తమసి లీనత్వాన్ముక్తిహేతుత్వాభావాచ్చ . సమాధౌ మృదితతమోవికారస్య తదాకారాకారితాఖండాకార- వృత్త్యాత్మకసాక్షిచైతన్యే ప్రపంచలయః సంపద్యతే |
|
జాగ్రత్ - నిద్రా అన్తః పరిజ్ఞానేన బ్రహ్మవిత్ భవతి। సుషుప్తి సమాధ్యోః మనోలయా విశేషేఽపి, మహదస్తు ఉభయోః భేదః। తమసి లీనత్వాత్ ముక్తిహేతుత్వాత్ ఆభావాచ్చ। సమాధౌ మృదిత తమో వికారస్య తదాకార ఆకారితా, అఖణ్డాకార వృత్యాత్మక సాక్షి చైతన్యే ‘ప్రపంచ లయః’ సంపద్యతే। |
జాగ్రత్-నిద్రలకు ఆవల సర్వదా ప్రకాశించు స్వస్వరూప పరిజ్ఞానము చేత ఈ జీవుడు ‘బ్రహ్మవిత్’ అగుచున్నాడు (బ్రహ్మవేత్త). సుషుప్తి - సమాధి.. ఈ రెండిటిలోనూ మనస్సు లయము పొందుచున్నది. కానీ ఆ రెండు ఒక్క తీరైనవి కానే కాదు. సుషుప్తి-సమాధిలకు రెండిటికీ చాలా భేదము ఉన్నది. సుషుప్తి - ఇది తమస్సులో లీనమైయున్న జడస్థితి.. కనుక ఇక్కడ ముక్తి హేతువులు భావించబడుటమే లేదు. ఇక్కడ తమో వికారములు అప్రదర్శితత్త్వమును సంతరించుకుని, దాగి ఉన్నాయి. అంతవరకే! సమాధిలో తమో వికారములన్నీ తత్ ఆత్మ - ఆకారము సంతరించుకుంటున్నవై.. తమోవృత్తులు అఖండాకార వృత్యాత్మకమైన సాక్షి చైతన్యము నందు ప్రవేశించుచూ, ‘ప్రపంచ విలయము’ సంభవించుచున్నది. అనగా ప్రపంచము ఆత్మస్వరూపమై అనుభూతమగుచున్నది. |
ప్రపంచస్య మనఃకల్పితత్వాత్ . తతో భేదాభావాత్కదాచి- ద్బహిర్గతేఽపి మిథ్యాత్వభానాత్ . సకృద్విభాతసదానందా- నుభవైకగోచరో బ్రహ్మవిత్తదేవ భవతి . యస్య సంకల్పనాశః స్యాత్తస్య ముక్తిః కరే స్థితా . |
|
ప్రపంచస్య మనః కల్పితత్వాత్, తతో భేదా అభావాత్। |
అసలీ ప్రపంచము ఎవ్వరి చేత కల్పించబడినది? మనస్సు చేతనే! మనో కల్పిత జగత్తంతా ఒకే కల్పన కాబట్టి భేదముగా కనిపించేదంతా కూడా (సమాధి స్థితియలందు) ఆభావించబడుచున్నది. |
కదాచిత్ బహిర్గతేఽపి మిథ్యాత్వ భావాత్ సకృత్ విభాత। సదా ఆనన్దా అనుభవైక గోచరో బ్రహ్మవిత్ తదేవ భవతి। యస్య సంకల్ప నాశః స్యాత్, తస్య ముక్తిః కరే స్థితా। |
ఉన్మనీ (లేక) శాంభవీ యోగ సిద్ధునికి - ఒకవేళ ఈ జగత్తు కొన్ని సమయాలలో బహిర్గతమై కనిపిస్తున్నప్పటికీ.. ‘మనో కల్పనయే కదా’ అని ఎరుగబడియే ఉండటం చేత మిథ్యాత్వ భావనచే (ఇది కలలోని విశేషాల వంటివేనని) అసత్తుగా ఎరుగబడుచున్నది. అంతేకాని భేదబుద్ధి కలుగదు. ద్వంద్వములన్నీ ఏకరూపమౌతాయి. ఏ యోగి అయితే ఈ దృశ్యమంతటినీ బ్రహ్మము యొక్క ప్రకాశము రూపమగు సదానన్ద అనుభవైకగోచరంగా దర్శిస్తాడో, ఆతడే బ్రహ్మవేత్త. అట్టి ఎరుకచే బ్రహ్మవేత్త బ్రహ్మమే అగుచున్నాడు. ఎవ్వరి పట్ల ‘ఇదంతా సర్వదా బ్రహ్మమే’ అనే భావన-అనుభూతుల పరిపుష్టిచే జగత్ సంకల్పము నశిస్తుందో, ఆతనికి ముక్తి ఆతని అరచేతిలోని పండు అగుచున్నది. |
తస్మాద్భావాభావౌ పరిత్యజ్య పరమాత్మధ్యానేన ముక్తో భవతి . పునఃపునః సర్వావస్థాసు జ్ఞానజ్ఞేయౌ ధ్యానధ్యేయౌ లక్ష్యాలక్ష్యే దృశ్యాదృశ్యే చోహాపోహాది పరిత్యజ్య జీవన్ముక్తో భవేత్ . య ఏవం వేద .. 3.. |
|
తస్మాత్ భావ-అభావౌ పరిత్యజ్య పరమాత్మ ధ్యానేన ముక్తో భవతి। పునః పునః సర్వ-అవస్థాను జ్ఞాన - జ్ఞేయౌ ధ్యాన - ధ్యేయౌ లక్ష్య - అలక్ష్యే దృశ్యా - అదృశ్యే చ ఊహా - అపోహా ఆది పరిత్యజ్య, జీవన్ముక్తో భవేత్। య ఏవం వేద॥ |
కనుక ఓ యజ్ఞవల్క్యా! ఈ భేదాత్మక జగత్తు గురించిన భావ - అభావములను రెండిటినీ పరిత్యజించి ‘అఖండమగు పరమాత్మయే ఇదంతా’ అను పరమాత్మ ధ్యానమును ఆశ్రయించువాడు ముక్తుడే అగుచున్నాడు. పరమాత్మ తానే అయి ప్రకాశిస్తున్నాడు. అట్టి అఖండ-అప్రమేయ-సర్వ బాహ్య అభ్యంతర స్వరూప పరబ్రహ్మమును తెలుసుకుని, ఆ ఆత్మ సంయమ యోగి…, → జ్ఞానము (తెలుసుకోవటం) - జ్ఞేయము (తెలియ బడునది), → ద్రష్ట (చూచువాడు) - దృశ్యము (చూడబడునది), → లక్ష్యము - అలక్ష్యము, → దృశ్యము (కనబడేది) - అదృశ్యము (కనబడనిది), → ఊహ - అపోహ, … మొదలైనవన్నీ పరిత్యంచుచున్నవాడై జీవన్ముకుడు అగుచున్నాడు. |
పంచావస్థాః జాగ్రత్స్వప్నసుషుప్తితురీయతురీయాతీతాః . |
|
4.) పంచ అవస్థాః జాగ్రత్; స్వప్న; సుషుప్తి; తురీయ; తురీయాతీతః। |
పంచ అవస్థలు - 1) జాగ్రత్ 2) స్వప్నము 3) సుషుప్తి 4) తురీయము 5) తురీయాతీతము |
జాగ్రతి ప్రవృత్తో జీవః ప్రవృత్తిమార్గాసక్తః . పాపఫలనరకాదిమాంస్తు శుభకర్మఫలస్వర్గమస్త్వితి కాంక్షతే . |
|
జాగ్రతి ప్రవృత్తో జీవః ప్రవృత్తి మార్గాసక్తః, పాపఫల నరకాదిమాంస్తు, ‘శుభకర్మఫల - స్వర్గఫలమస్తు’ ఇతి కాంక్షతే। |
జాగ్రత్తులో ప్రవర్తించుచున్న జీవుడు ‘ప్రవృత్తి మార్గ - ఆసక్తుడు’ అయి ఉంటున్నాడు. “అయ్యా! నాకు పాప ఫలములైనటువంటి నరకము, దుఃఖము మొదలైనవి రాకూడదు. శుభకర్మ ఫలములైనట్టి స్వర్గసుఖములు మొదలగునవి లభించాలి”.. ఇట్లా ఆకాంక్షిస్తున్నాడు. ఈ విధంగా ప్రవృత్తి మార్గము కొనసాగుతోంది. |
స ఏవ స్వీకృతవైరాగ్యాత్కర్మఫలజన్మాఽలం సంసారబంధనమలమితి విముక్త్యభిముఖో నివృత్తిమార్గ- ప్రవృత్తో భవతి . |
|
స ఏవ స్వీకృత వైరాగ్యాత్, "కర్మఫల జన్మ అలమ్। సంసార బన్ధనమ్ అలమ్!” ఇతి విముక్త్య అభిముఖ నివృత్తి మార్గ ప్రవృత్తో భవతి। |
ఆతడే మరొకప్పుడు జాగ్రత్‌లో మాత్రమే లభించే ఫలముల పట్ల వైరాగ్యము పొందుచున్నాడు. “ఈ జన్మ - కర్మ ఫలములు ఇక చాలు, ఇవన్నీ వాస్తవానికి బంధమే” అని భావించి, సర్వ సంసార బంధనముల నుండి విముక్తి కొరకై - నివృత్తి మార్గము వైపుగా అభిముఖుడగుచున్నాడు. |
స ఏవ సంసారతారణాయ గురుమాశ్రిత్య కామాది త్యక్త్వా విహితకర్మాచరన్సాధనచతుష్టయసంపన్నో హృదయకమలమధ్యే భగవత్సత్తామాత్రాంతర్లక్ష్యరూపమాసాద్య సుషుప్త్యవస్థాయా ముక్తబ్రహ్మానందస్మృతిం లబ్ధ్వా |
|
స ఏవ సంసార తారణాయ ’గురుమ్’ ఆశ్రిత్య, కామాది త్యక్త్వా విహిత కర్మాచరన్, సాధన చతుష్టయ సంపన్నో, హృదయ కమల మధ్యే భగవత్ సత్తామాత్రా అన్తర్లక్ష్య రూపమ్ ఆసాద్య, సుషుప్త అవస్థాయాం ముక్త, బ్రహ్మానంద స్మృతిం లబ్ధ్వా। |
అట్టి వైరాగ్య మార్గ అభిముఖుడు సంసార బంధముల నుండి విడివడుటకై ‘గురువు’ను తత్త్వ సమాచారము కొరకై ఆశ్రయిస్తున్నాడు. కామములు, కామ్యకర్మలు క్రమంగా వదలటం ప్రారంభిస్తున్నాడు. “విహిత - నియమిత సాధన” కర్మలకు మాత్రమే ‘పరిమితము’ అగుచున్నాడు. సాధన చతుష్టయ సంపత్తిని (శమము - సత్సంగము - విచారణ - సంతోషములను) ఆశ్రయించుచున్నాడు. సాధన సంపన్నుడై.. ఇకప్పుడు హృదయ కమలము నందు ‘భగవంతుని ఉనికి మాత్రమే’ లక్ష్యమగు అంతర్లక్ష్య రూపమును ఆశ్రయించి, సిద్ధింపజేసుకొంటూ.., ఆత్మయందు సుషుప్తి.. అనే అవస్థనుండి విముక్తుడై ’బ్రహ్మానందము’నకు సంబంధించిన జ్ఞానము (స్మృతి) పొందినవాడు అయి ఉంటున్నాడు. |
ఏక ఏవాహమద్వితీయః కంచిత్కాలమజ్ఞానవృత్త్యా విస్మృతజాగ్రద్వాసనానుఫలేన తైజసోఽస్మీతి |
|
’ఏక కంచిత్ కాలమ్ అజ్ఞానవృత్యా విస్మృత, జాగ్రత్ వాసనానుఫలేన ‘తేజసోఽస్మి’ - ఇతి। |
వాస్తవానికి నేను సర్వదా ఏకమే గానీ అనేకమును కాను. ఇదంతా నా యొక్క ఏక - అద్వితీయ బ్రహ్మానంద స్వరూపమే। నేను కొంత కాలము నా యొక్క అజ్ఞానవృత్తుల చేత, నా యొక్క ఏక - ‘సర్వాత్మక అద్వితీయ’ స్వరూపమును, ఏమరచుటచే - జాగ్రత్ వాసనలచేత ’విశ్వుడు’గా కనిపిస్తూ ఉన్నాను. మరొకప్పుడు జాగ్రత్ వాసనలచే అంతరంగంలో దృశ్యం కల్పించుకొనుచున్నప్పుడు ‘తేజసుడు’ అయి, స్వప్నమును అనుభవిస్తూ వస్తున్నాను. |
తదుభయనివృత్త్యా ప్రాజ్ఞ ఇదానీమస్మీత్యహమేక ఏవ స్థానభేదాదవస్థాభేదస్య పరంతు నహి మదన్యదితి జాతవివేకః |
|
తత్ ఉభయ నివృత్యా, ‘ప్రాజ్ఞ ఇదానీమ్ అస్మి’ ఇతి అహమ్ ఏక ఏవ! స్థాన భేదాత్, అవస్థా భేదస్య, పరంతు, ‘నహి మత్ అన్యత్’ ఇతి జాత వివేకః। |
ఇంకొకప్పుడు ‘జాగ్రత్-స్వప్న’ ఉభయ వాసనల నుండి నివృత్తుడనై కేవల ప్రాజ్ఞుడను అని భావించి ఉంటున్నాడు. నిజానికి ఈ జాగ్రత్-స్వప్న-సుషుప్తులు నా యొక్క వేరువేరైన సంచార ప్రదేశాలు, స్థానభేదాలు, అవస్థా భేదాలు’.. అని చింతన చేయాలి. “నేను ఏకాత్ముడను” అనునది వృద్ధి చేసుకోవాలి. “నాకు అన్యమైనదేదీ ఎక్కడా కించిత్తు కూడా లేనే లేదు కదా!" అనే వివేకము జనించినవాడై తనయందు హృదయాంతర్గత-అఖండ మండలాకార జ్యోతిని, సందర్శించుచున్నాడు. |
శుద్ధాద్వైతబ్రహ్మాహమితి భిదాగంధం నిరస్య స్వాంతర్విజృంభితభానుమండలధ్యాన- తదాకారాకారితపరంబ్రహ్మాకారితముక్తిమార్గమారూఢః పరిపక్వో భవతి . |
|
‘శుద్ధ-అద్వైత బ్రహ్మాఽహమ్’ ఇతి అభిదా, గన్ధం నిరస్య స్వాన్తః విజృమ్భిత భానుమణ్డల ధ్యాన తదాకార ఆకారిత పరంబ్రహ్మాకార ముక్తిమార్గమ్ ఆరూఢః ‘పరిపక్వో’ భవతి। |
‘శుద్ధ అద్వైత బ్రహ్మమే నేను’ అను మహాయోగభావము ఆశ్రయిస్తున్నాడు. సర్వ భేదవాసనలను పరిత్యజించి వేసి, తనలోనే సర్వదా అనుక్షణము విజృంభించుచునేయున్న ’భానుమండల ధ్యానము’చే తత్- ఆకార ఆకారితుడగుచున్నాడు. పరబ్రహ్మాకార ముక్తి మార్గమునందు ఆరూఢుడై ’పరిపక్వ స్థితుడు’ అగుచున్నాడు. |
సంకల్పాదికం మనో బంధహేతుః . తద్వియుక్తం మనో మోక్షాయ భవతి . |
|
సంకల్పాదికం మనోబన్ధ హేతుః। తత్ విముక్తం మనో మోక్షాయ భవతి। |
మనో బంధమునకు హేతువు (కారణము) ఏమిటి? సంకల్పములను ఆశ్రయించుటము చేతనే! సంకల్పముల నుండి విముక్తుడైతే, ఈ జీవుడు ‘మోక్షము’ పొందగలడు. |
తద్వాంశ్చక్షురాదిబాహ్యప్రపంచరతో విగతప్రపంచగంధః సర్వజగదాత్మత్వేన పశ్యంస్త్యక్తాహంకారో |
|
తద్వాం చక్షురాది బాహ్య ప్రపంచ ఉపరతః, విగత ప్రపంచ గంధః। సర్వమ్ జగదాత్మత్వేన పశ్యన్, త్యక్తా అహంకారో। |
హృదయము నందు జగత్ సంబంధమైనట్టి సర్వ సంకల్పములను రహితం చేసుకొన్న యోగి, ఇక ఆపై ఈ భౌతికమైన కళ్లకు కనిపిస్తున్న బాహ్య ప్రపంచమంతటినీ దాటి వేసినవాడై ఉంటున్నాడు. ప్రపంచ సంబంధమైన సర్వవాసనలు త్యజించివేసి.. తన యొక్క సర్వజగదాత్మత్వమును చూస్తూ ఆస్వాదిస్తూ.. ఈ జాగ్రత్‌లో వెంటనంటి తిరుగాడే ‘నేను, నాది’ అనే అహంకారమును త్యజించి, అధిగమించుచున్నాడు. |
బ్రహ్మాహమస్మీతి చింతయన్నిదం సర్వం యదయమాత్మేతి భావయన్కృతకృత్యో భవతి .. 4.. |
|
‘బ్రహ్మాఽహమస్మి’ ఇతి చిన్తయన్, ’ఇదమ్ సర్వమ్ యత్, అయమ్ ఆత్మేతి’ భావయన్.. కృతకృత్యో భవతి॥ |
‘నేను సర్వదా పరబ్రహ్మస్వరూపుడనే - బ్రహ్మమునే’ అనే రూపములో గల ’మహామహదహంకారము’ను చిన్తన చేస్తూ ‘ఇక్కడ ఏదేదైతే కనిపిస్తోందో ఇదంతా మమాత్మ స్వరూపమే’ అను భావనచే ఈ జీవుడు కృతకృత్యుడు అగుచున్నాడు. |
సర్వపరిపూర్ణతురీయాతీతబ్రహ్మభూతో యోగీ భవతి . తం బ్రహ్మేతి స్తువంతి . సర్వలోకస్తుతిపాత్రః సర్వదేశ- సంచారశీలః |
|
5.) సర్వ పరిపూర్ణ తురీయాతీత
బ్రహ్మభూతో ‘యోగీ’ భవతి। ‘తం బ్రహ్మేతి’ స్తువన్తి। సర్వలోక స్తుతి పాత్రః। సర్వదేశ సంచార శీలః। |
ఆ హృదయాంతర్గత నిత్యోదిత ఆత్మజ్యోతిని ధ్యానించుచున్న యోగి - సర్వపరిపూర్ణ - తురీయాతీత - బ్రహ్మభూతుడు అగుచున్నారు. అట్టి పరిపూర్ణ తురీయాతీత బ్రహ్మ భూతుడు ’బ్రహ్మమే’ అని స్తుతించబడుచున్నాడు. సర్వలోక స్తుతిపాత్రుడు, సర్వ(ప్ర) దేశములలో ఆత్మ సంచాలుడు అగుచున్నాడు. |
పరమాత్మగగనే బిందుం నిక్షిప్య శుద్ధాద్వైతాజాడ్యసహజామనస్కయోగనిద్రాఖండా- నందపదానువృత్త్యా జీవన్ముక్తో భవతి . |
|
పరమాత్మ గగనే బిన్దుం నిక్షిప్య శుద్ధా అద్వైత అజాడ్య సహజ అమనస్క యోగనిద్రా అఖణ్డానన్దపదా అనువృత్త్యా ‘జీవన్ముక్తో’ భవతి। |
పరమాత్మాకాశములో ’బిందువు’ను నిక్షేపించి (ఫిక్సింగ్), శుద్ధ అద్వైత అజాడ్య-సహజ అమనస్క - యోగ నిద్ర యందు ప్రవేశించి, ‘అఖండానంద పదము’ నందు అనునిత్యుడై (నిత్యవృత్తికలవాడై) ఉన్నవాడు ’జీవన్ముక్తుడే’! |
తచ్చానంద- సముద్రమగ్నా యోగినో భవంతి . తదపేక్షయా ఇంద్రాదయః స్వల్పానందాః . ఏవం ప్రాప్తానందః పరమయోగీ భవతీత్యుపనిషత్ .. 5.. ఇతి ద్వితీయం బ్రాహ్మణం .. 2.. |
|
తత్ చ ఆనంద సముద్రమగ్నా యోగినో భవన్తి। తత్ అపేక్షయా ఇన్ద్రాయః స్వల్ప ఆనందాః, ఏవం ప్రాప్తానందః పరమయోగీ భవతి॥ ఇత్యుపనిషత్॥ |
ఆతడు ‘ఆనంద సముద్రమగ్న యోగి’! అట్టి ‘సోఽహమాత్మానందము’ యొక్క కించిత్ అపేక్ష (సాపేక్ష) చేత ఇంద్రుడు మొదలైన పదవులు అధిష్టించి, లోకపాలకులై స్వల్పానందమును పొందుచున్నారు. అట్టి స్వయమత్మానందమును పొంది ఈ జీవుడు పరమయోగి అగుచున్నాడు. |
తృతీయ బ్రాహ్మణమ్ - అమనస్క యోగము
యాజ్ఞవల్క్యో మహామునిర్మండలపురుషం పప్రచ్ఛ స్వామిన్నమనస్కలక్షణముక్తమపి విస్మృతం పునస్తల్లక్షణం బ్రూహీతి . |
|
1.) యాజ్ఞవల్క్యో మహామునిః మణ్ణల పురుషం పప్రచ్ఛ! - స్వామిన్ ‘అమనస్క లక్షణమ్’ ఉక్తమపి, విస్తృతం పునః తత్ లక్షణమ్ బ్రూహి’.. ఇతి॥ |
యాజ్ఞవల్క్య మహాముని: స్వామీ ఆదిత్య భగవాన్ సూర్య మండల పురుషన్! ‘అమనస్క యోగము’ గురించి మీరు వివరంగా చెప్పి ఉన్నారు. అయితే ఏం? నేను కూడా ‘విస్మృతి - ఏమరచు’ అను జీవలక్షణము కలవాడను. అందుచేత మరొక్కసారి ‘అమనస్కయోగ లక్షణములు’ గురించి విశదీకరించమని ప్రార్థిస్తున్నాను. |
తథేతి మండలపురుషోఽబ్రవీత్ . ఇదమమనస్కమతిరహస్యం . యజ్జ్ఞానేన కృతార్థో భవతి |
|
తథేతి మండల పురుషో అబ్రవీత్: ఇదమ్ అమనస్కం అతిరహస్యం, యత్ జ్ఞానేన కృతార్థో భవతి। |
ఆదిత్య మండల పురుషుడగు సూర్యభగవానుడు: అవునయ్యా! ‘అమనస్క యోగము’ అనునది అతి రహస్యమైనది. ఇది తెలుసుకొంటే ఈ జీవుడు కృతార్థుడు కాగలడు. |
తన్నిత్యం శాంభవీముద్రాన్వితం . పరమాత్మదృష్ట్యా తత్ప్రత్యయలక్ష్యాణి దృష్ట్వా తదను సర్వేశమప్రమేయమజం శివం పరమాకాశం నిరాలంబమద్వయం బ్రహ్మవిష్ణురుద్రాదీనా- మేకలక్ష్యం సర్వకారణం పరంబ్రహ్మాత్మన్యేవ పశ్యమానో గుహావిహరణమేవ నిశ్చయేన జ్ఞాత్వా భావాభావాదిద్వంద్వాతీతః సంవిదితమనోన్మన్యనుభవస్తదనంతరమఖిలేంద్రియక్షయవశాదమనస్క- సుఖబ్రహ్మానందసముద్రే మనఃప్రవాహయోగరూపనివాతస్థితదీపవదచలం పరంబ్రహ్మ ప్రాప్నోతి . |
|
తత్ నిత్యం శాంభవీ ముద్రాన్వితం, పరమాత్మ దృష్ట్యా, తత్ ప్రత్యయ లక్ష్యాని దృష్ట్వా తదను సర్వేశమ్, అప్రమేయమ్, అజమ్, శివమ్, పరాకాశమ్, నిరాలంబమ్, అద్వయమ్, బ్రహ్మ-విష్ణు-రుద్రాదీనాం ఏకలక్ష్యమ్, సర్వకారణమ్, పరంబ్రహ్మా ఆత్మన్యేవ పశ్యమానో ’గుహా విహరణం’। |
అట్టి మనో ఉన్మనీ (మనస్సు యొక్క మనో కేవల సాక్షీ - అనుభము)నే ‘శాంభవీముద్ర’ అంటారు. అనగా శాంభవీ ముద్రాన్వితమైనది. పరమాత్మ దృష్టితో ఆత్మ యొక్క ప్రత్యయ లక్షణములను సర్వదా దృష్టిలో పెట్టుకోవాలి. అప్పుడిక సర్వేశ్వరుడును, అప్రమేయుడును, జన్మరహితుడును, సర్వశుభ-సుఖ ప్రదాత, పరాకాశ స్వరూపుడు, నిరాలంబుడు, సర్వజీవుల స్వరూపమునకు వేరు కానట్టి అద్వయుడు, బ్రహ్మ-విష్ణువు-రుద్రుడు మొదలైన వారికి కూడా ఏకైక లక్ష్యము అయి ఉన్నావాడు, సర్వకారణ కారణుడు, అకారణుడు.. అగు ‘పరంబ్రహ్మాత్మ తత్త్వము’ యొక్క అనుక్షణిక సందర్శనము సిద్ధిస్తోంది. అమనస్కయోగము’ బాహ్య-అభ్యంతరములన్నీ హృదయ రూపమై, సహృదయగుహలో విహరించటమే! |
ఏవం నిశ్చయేన జ్ఞాత్వా భావా-అభావాది ద్వంద్వాతీతః సంవిదిత మనో ఉన్మన్యనుభవః। తదనన్తరమ్, అఖిలేంద్రియ క్షయవశాత్ అమనస్క సుఖమ్। బ్రహ్మానన్ద సముద్రే మనః ప్రవాహ యోగ రూప, నివాత స్థిత దీపవత్ అచలమ్ ‘పరబ్రహ్మ’ ప్రాప్నోతి। |
ఈ విధంగా ఆత్మను తెలుసుకొని, భావ- అభావములు మొదలైన ద్వంద్వములను దాటి, తానే అదై వెలుగొందటమే అమనస్క స్థితి. నిశ్చల జలంలో చంచల తరంగములవలె నిశ్చల స్వస్వరూపంగా చంచల జగత్ దర్శనం అది! ఆ తదనంతరము - ఆతడు అఖిలేంద్రియ వ్యాపారములకు సంబంధించనివాడు అగుచున్నాడు. ‘అమనస్క సుఖ బ్రహ్మానంద సముద్రము’లో మనః ప్రవాహరూపుడు - అగుచున్నాడు. గాలి వీచికలు లేని చోట దీపము వలె అచలమగు పరబ్రహ్మస్వరూపము పొందినవాడగుచున్నాడు. |
తతః శుష్కవృక్షవన్మూర్చ్ఛానిద్రామయ- నిఃశ్వాసోచ్ఛ్వాసాభావాన్నష్టద్వంద్వః సదాచంచలగాత్రః పరమశాంతిం స్వీకృత్య మనః ప్రచారశూన్యం పరమాత్మని లీనం భవతి . పయస్రావానంతరం ధేనుస్తనక్షీరమివ సర్వేంద్రియవర్గే పరినష్టే మనోనాశం భవతి తదేవామనస్కం . |
|
తతః శుష్క వృక్షవత్ మూర్ఛా నిద్రామయ నిశ్వాసో ఉచ్ఛ్వాసా అభావాత్, నష్ట ద్వంద్వః, సదా అచంచల గాత్రః పరమశాన్తిం స్వీకృత్య మనః ప్రచార శూన్యం పరమాత్మని లీనం భవతి। పయః స్రావా.. అనన్తరం ధేనుః స్తన క్షీరమివ, సర్వేంద్రియవర్గే పరినష్టే ‘మనోనాశం’ భవతి। తదేవ అమనస్కం। |
ఇక ఆ తర్వాత.. ఎండిన వృక్షము వలె, మూర్ఛలోనూ - గాఢ నిద్రలోను ఉన్నవాని వలె - ఉచ్ఛ్వాస - నిశ్వాసల అభావనాపరుడై, ద్వంద్వములన్నీ త్యజించినవాడై, ఎల్లప్పుడు చంచలము పొందుచున్న ఈ భౌతికదేహముతో ’పరమశాంతి’ని స్వీకరించినవాడై ఉంటున్నాడు. ఆతని మనస్సు ప్రసారశూన్యమై…, ఆతని జీవాత్మత్వమంతా.. పరమాత్మయందు విలీనము అయినదగుచున్నది. పాలు పిండిన తర్వాత ఏవిధంగా అయితే, గోవు యొక్క స్తనము నుండి పాలు రావో, ఆ విధంగా ఎప్పుడైతే సర్వేంద్రియ వర్గములు విషయముల పొందని స్థితిలో ‘మనోనాశనము’ జరుగగలదు. అదియే అమనస్కము! |
తదను నిత్యశుద్ధః పరమాత్మాహమేవేతి తత్త్వమసీత్యుపదేశేన త్వమేవాహమహమేవ త్వమితి తారకయోగమార్గేణాఖండానందపూర్ణః కృతార్థో భవతి .. 1.. |
|
“తత్ అనునిత్య శుద్ధః పరమాత్మా అహమ్ ఏవ" ఇతి, “తత్త్వమ్ అసి” ఇతి, ఉపదేశేన ‘త్వమేవాహమ్’, ‘అహమేవ త్వమ్’ ఇతి, తారకయోగ మార్గేణ అఖణ్ణానంద పూర్ణః కృతార్థో భవతి॥ |
‘ఆ నిత్య శుద్ధ పరమాత్మ నేనే అయి ఉన్నాను’, ’తత్త్వమ్ అసి’.. మొదలైన మహావాక్యముల ఉపదేశమును గ్రహించిన తరువాత, “నేనే నీవుగా ఉన్నాను. నీవే నేనుగా ఉన్నావు” - అను నిశ్చల అవగాహనయే తారక యోగ మార్గము. ఇట్టి తారక యోగమార్గము నందు (శాంభవీ ముద్ర యోగి) అడుగులు వేయుచుండగా.. ఇక ఆతడు ‘అఖండానందపూర్ణుడు’ అగుచున్నాడు. ‘కృతార్థుడు’ ఆగుచున్నాడు. అనిర్వచనీయుడగుచున్నాడు. |
పరిపూర్ణపరాకాశమగ్నమనాః ప్రాప్తోన్మన్యవస్థః సంన్యస్తసర్వేంద్రియవర్గః అనేకజన్మార్జితపుణ్యపుంజపక్వ- కైవల్యఫలోఽఖండానందనిరస్తసర్వక్లేశకశ్మలో బ్రహ్మాహమస్మీతి కృతకృత్యో భవతి . త్వమేవాహం న భేదోఽస్తి పూర్ణత్వాత్పరమాత్మనః . ఇత్యుచ్చరంత్సమాలింగ్య శిష్యం జ్ఞప్తిమనీనయత్ .. 2.. ఇతి తృతీయం బ్రాహ్మణం .. 3.. |
|
2.) పరిపూర్ణ పరమాకాశమగ్నమానాః ప్రాప్తో ఉన్మన్యవస్థః, సన్యస్త సర్వేంద్రియవర్గ అనేక జన్మార్జిత పుణ్యపుంజ పక్వ కైవల్య ఫలో అఖణ్డానన్ద నిరస్త సర్వక్లేశ కశ్మలో.. ‘బ్రహ్మాఽహమస్మి’ ఇతి కృతకృత్యో భవతి। త్వమేవాహమ్, నభేదోఽస్తి పూర్ణత్వాత్ పరమాత్మనః ఇతి ఉచ్చరన్ సమాలింగ్య శిష్యం జ్ఞప్తిమ్ అనీనయత్॥ |
ఈ విధంగా తత్త్వమ్, సోహమ్, త్వమేవాహమ్, అహమేవ త్వమ్ యొక్క పరమార్థమును ఆశ్రయిస్తూ - ఆ శాంభవీ యోగి (ఆత్మయోగి) ‘పరిపూర్ణ పరమాకాశమగ్నుడు’.. అగుచున్నాడు. ఉన్మనీ (ఆత్మనే సర్వదా దర్శించు) స్థితిచే మనో అంతర్గతమైన సర్వభేద విషయములను పరిత్యజించుచున్నాడు. సర్వేంద్రియ వర్ణములను సన్యసించినవాడై, అనేక జన్మలలో ఆర్జించిన పుణ్య భావముల పరిపక్వతచే ‘కైవల్యము’ అనే మధురాతిమధురమైన ‘ఫలము’ను పొందుచున్నాడు. (కైవల్యము = ఇదంతా నా కేవలీ స్వరూపమే అను ఏక-అభేద సుస్థిరానుభూతి). ‘అఖండానందము’ అనే ఫలమును పొంది సర్వక్లేశ కశ్మలములను మొదలంట్లో తొలగించి వేయునట్టి “బ్రహ్మా హమ్. నేనే బ్రహ్మమును“ - అని సిద్ధించుకొని కృతకృత్యుడు అగుచున్నాడు. “నీవుగా ఉన్నది నేనే! నేనుగా ఉన్నది నీవే। నీకు నాకు భేదము లేదు. నీవు-నేను కూడా పూర్ణత్వము చేత పరమాత్మ స్వరూపులమే”! అని లేచి నిలబడి ఆతడు లోకములకు ప్రకటించుచున్నాడు. తన వద్ద తత్త్వమును తెలుసుకొనటానికై వచ్చిన శిష్యుని సమాలింగనము చేసుకొని, ఇకప్పుడు ‘తత్వమ్’ అనే స్మృతిజ్ఞానమును ప్రసాదించుచున్నాడు. |
చతుర్థమ్ బ్రాహ్మణమ్ - వ్యోమపంచక లక్షణములు
అథ హ యాజ్ఞవల్క్యో మండలపురుషం పప్రచ్ఛ వ్యోమపంచకలక్షణం విస్తరేణానుబ్రూహీతి . |
|
అథ హ యాజ్ఞవల్క్యో మణ్డల పురుషం పప్రచ్ఛ :- ’వ్యోమపఞ్చక లక్షణమ్ విస్తరేణా అనుబ్రూహి’.. ఇతి॥ |
యాజ్ఞవల్క్యుడు : ఓ మణ్డల పురుషా! సూర్యనారాయణస్వామీ! మరొక విన్నపము. దయతో ‘వ్యోమపంచక లక్షణములు’ గురించి మరికొంత విస్తరించి వివరించ ప్రార్థన. |
స హోవాచాకాశం పరాకాశం మహాకాశం సూర్యాకాశం పరమాకాశమితి పంచ భవంతి . |
|
స హోవాచ : ఆకాశం; పరాకాశం; మహాకాశం; సూర్యాకాశం; పరమాకాశమ్ - ఇతి పఞ్చ భవంతి। |
ఆదిత్య భగవానుడు : వ్యోమ పంచకము - (1) ఆకాశము (2) పరాకాశము (3) మహాకాశము (4) సూర్యాకాశము (5) పరమాకాశము |
బాహ్యాభ్యంతరమంధకారమయమాకాశం . |
|
బాహ్య-అభ్యన్తరమ్ అంధకారమయమ్ ‘ఆకాశమ్’। | 1) ఆకాశము : బాహ్యమున లోలోపల కూడా అంధకారమయమై ఉన్నట్టిది. |
బాహ్యస్యాభ్యంతరే కాలానలసదృశం పరాకాశం . |
|
బాహ్య అభ్యన్తరే కాల అనల సదృశమ్ ‘పరాకాశమ్’। |
2) పరాకాశము : బాహ్య - అభ్యంతరములలో ‘కాలాగ్ని’ సదృశమైనది. ఈ ఇహ రూపమునకు ఆవల పరస్వరూపము. |
సబాహ్యాభ్యంతరేఽపరిమితద్యుతినిభం తత్త్వం మహాకాశం . |
|
స బాహ్య-అభ్యన్తరే అపరిమిత ద్యుతినిభమ్ తత్త్వం ‘మహాకాశమ్’। |
3) మహాకాశము : బాహ్య - అభ్యంతరములలో అపరిమితమైన జ్యోతి - తేజస్సుచే నిండి ఉన్నట్టిది. (’త్వమ్’ను ‘తత్ బ్రహ్మము’ రూపంగా చూడడం) |
సబాహ్యాభ్యంతరే సూర్యనిభం సూర్యాకాశం . |
|
స బాహ్య - అభ్యన్తరే సూర్యనిభం ’సూర్యాకాశమ్’। |
4) సూర్యాకాశము : బాహ్య - అభ్యంతరములలో సూర్య సదృశ కిరణాత్మక భావనలచే నిండియున్నట్టిది. సర్వము స్వస్వరూప తేజోవిభవముగా చూడటం. |
అనిర్వచనీయజ్యోతిః సర్వవ్యాపకం నిరతిశయానందలక్షణం పరమాకాశం . |
|
అనిర్వచనీయ జ్యోతిః సర్యవ్యాపకమ్, నిరతిశయానన్ద లక్షణమ్ ‘పరమాకాశమ్’। |
5) పరమాకాశము : అనిర్వచనీయము! జ్యోతి స్వరూపము! సర్వవ్యాపకము! నిరతిశయానన్ద లక్షణ సమన్వితము. కేవల - అనుభవైకవేద్యము. అట్టి పరమాకాశమునకు ‘రెండవది’ అనునది వేరుగా లేదు. |
ఏవం తత్తల్లక్ష్యదర్శనాత్తత్తద్రూపో భవతి . |
|
ఏవం తత్ తత్ లక్ష్య దర్శనాత్ తత్ తత్ రూపో భవతి। |
అందుచే ఈ పరమాకాశము ఏఏ లక్ష్యములతో లక్ష్య దర్శనము చేస్తే, అది ఆ రూప లక్షణమే అగుచున్నది. ఎవరు ఏ లక్ష్యమును దర్శిస్తే ఆతడు ఆ రూపుడే అగుచున్నాడు. |
నవచక్రం షడాధారం త్రిలక్ష్యం వ్యోమపంచకం . సమ్యగేతన్న జానాతి స యోగీ నామతో భవేత్ .. 1.. ఇతి చతుర్థం బ్రాహ్మణం .. 4.. |
|
నవ చక్రం (9), షట్ ఆధారమ్ (6)! త్రిలక్ష్యమ్ (3), వ్యోమపఞ్చకమ్ (5) సమ్యక్ ఏతత్ న జానాతి, స యోగీ నామతో భవేత్॥ |
నవచక్రమ్ (9) - భూతాత్మ, ప్రేతాత్మ, అంతరాత్మ, జీవాత్మ, జ్ఞానాత్మ, నిర్మలాత్మ, శుద్ధాత్మ, మహాత్మ, పరమాత్మ. షట్ ఆధారము (6) - దృశ్యము, దృక్, దేహము, జీవుడు, ఈశ్వరుడు, పరమాత్మ. వ్యోమపంచకము (5) - (ఆకాశము, పరాకాశము, మహాకాశము, సూర్యాకాశము,పరమాకాశము. వీటన్నిటి యొక్క సమ్యక్ (సమరసము) ఎవరు గమనించరో.. వారు నామ మాత్రపు (పేరుకొరకు మాత్రమే) యోగులు. “అంతటా అన్నీగా అఖండ పరమాత్మ తతత్త్వమే! అనేకముగా కనిపిస్తూ ఏకముగా అయి ఉన్నట్టిదే. అహమ్-త్వమ్-ఇదమ్ ఏకస్వరూపమగు ఆత్మ!…. అని ఎరుగుచున్నవాడే వాస్తవమైన యోగి! |
పంచమం బ్రాహ్మణమ్
సవిషయం మనో బంధాయ నిర్విషయం ముక్తయే భవతి . అతః సర్వం జగచ్చిత్తగోచరం . |
|
సవిషయం మనో బన్ధాయ। నిర్విషయం ముక్తయో భవతి। అతః సర్వం జగత్ చిత్తగోచరమ్। |
మనస్సు విషయముల సమేతమై ఉండటమే బంధము. మనస్సు నిర్వషయమైయుంటే, అదియే ‘ముక్తి’ అగుచున్నది. ఈ సర్వ జగత్తు చిత్తమునకే గోచరమగుచున్నది. చిత్తము ఉంటేనే జగత్తు. చిత్తములేని వానికి జగత్తు ఎక్కడిది? |
తదేవ చిత్తం నిరాశ్రయం మనోన్మన్యవస్థాపరిపక్వం లయయోగ్యం భవతి . తల్లయం పరిపూర్ణే మయి సమభ్యసేత్ . మనోలయకారణమహమేవ . |
|
తదేవ చిత్తం నిరాశ్రయం, మనో ‘ఉన్మని అవస్థా’ పరిపక్వం, లయ యోగ్యం భవతి। తత్ లయం పరిపూర్ణే మయి సమభ్యసేత్। మనోలయకారణమ్ అహమేవ। |
అట్టి ఈ చిత్తమును - ఏదీ ఆశ్రయించకుండా నిరాశ్రయము చేశామనుకో.. అప్పుడు ఉన్మనీ అవస్థ పరిపక్వమై, ఇక - ఆత్మయందు ఆ చిత్తము లయించటానికి యోగ్యత పొందుతుంది. అట్టి మనోలయము యొక్క పరిపూర్ణత కొరకై (ఆదిత్య నారాయణుడనగు) నా యందు మనోలయాభ్యాసము చేయాలి. మనస్సు యొక్క లయ కారకుడను నేనే! |
అనాహతస్య శబ్దస్య తస్య శబ్దస్య యో ధ్వనిః . ధ్వనేరంతర్గతం జ్యోతిర్జ్యోతిరంతర్గతం మనః . |
|
అనాహతస్య శబ్దస్య। తస్య శబ్దస్య యో ధ్వనిః। ధ్వనే అంతర్గతం జ్యోతిః జ్యోతిః అంతర్గతం మనః॥ |
అనాహతములో (దేహములోని షట్చక్రములు స్థానముగా కలిగిన వెన్నెముక యందు) ‘శబ్దము’ ఉన్నది! ఆ శబ్దము యొక్క మధ్య భాగములో ’ధ్వని’ - ఉన్నది! ఆ ’ధ్వని’కి అంతర్గతంగా ‘జ్యోతి’ ఉన్నది! ఆ జ్యోతికి అంతర్గతంగా మనస్సు ఉన్నది! |
యన్మనస్త్రిజగత్సృష్టిస్థితివ్యసనకర్మకృత్ . తన్మనో విలయం యాతి తద్విష్ణోః పరమం పదం . తల్లయాచ్ఛుద్ధాద్వైతసిద్ధిర్భేదాభావాత్ . ఏతదేవ పరమతత్త్వం . |
|
యత్ మనః - త్రి జగత్ సృష్టిస్థితి - వ్యసన కర్మకృత్, తత్ మనో విలయం యాతి, ‘తత్ విష్ణోః పరమమ్ పదమ్’। తత్ లయాత్ ‘శుద్ధ అద్వైత సిద్ధిః”। భేదా అభావాత్ ఏతదేవ ‘పరమ తత్త్వమ్’। |
ఆ మనస్సే ముల్లోకముల సృష్టి - స్థితి-లయముల వ్యసనకర్మ నిర్వర్తిస్తోంది! ఆ మనస్సును లయింపజేస్తే అప్పుడు శేషించునది, లభించునదియే ఆ ‘విష్ణు పరమ పదము’. మనోలయము విష్ణు పరమపద ప్రాప్తికి కారణముగుచున్నది. మనస్సు యొక్క లయముచే ‘శుద్ధ అద్వైత సిద్ధి’ లభించుచున్నది. శుద్ధ అద్వైత సిద్ధిచే సర్వ భేద భావములు అభావించబడతాయి. భేదములన్నీ అభావించిన స్థితియే ’పరమతత్త్వము’. |
స తజ్జ్ఞో బాలోన్మత్త- పిశాచవజ్జడవృత్త్యా లోకమాచరేత్ |
|
స తత్ జ్ఞో బాలో, ఉన్మత్త పిశాచవత్, జడవృత్త్యా ‘లోకమ్’ ఆచరేత్। |
ఇంతవరకూ అజ్ఞాన వృత్తులచే కాపాడుకొంటూ వచ్చిన వ్యష్టిత్వము-ఇప్పుడు సమిష్టి రూపమగు పరతత్త్వమునందు లయించటం చేత - పరతత్త్వమును తెలుసుకొన్న యోగి ఈ జాగ్రత్తులో - ఒక బాలుని వలెను, ఉన్మత్తుని వలెను, పిశాచము వలెను జడవృత్తి కలిగియున్న వానివలె లోకంలో సంచరిస్తూ ఉంటున్నాడు. |
ఏవమమనస్కాభ్యాసేనైవ నిత్యతృప్తిరల్పమూత్రపురీషమితభోజనదృఢాంగా- జాడ్యనిద్రాదృగ్వాయుచలనాభావబ్రహ్మదర్శనాజ్జ్ఞాత- సుఖస్వరూపసిద్ధిర్భవతి . |
|
ఏవమ్ అమనస్కా అభ్యాసేనైన నిత్య తృప్తిః। అల్పమూత్ర - పురీష। మిత భోజన। దృఢ అంగా జాడ్య నిద్రా దృక్ వాయు చలనా। అభావ బ్రహ్మదర్శనా అజ్ఞాత సుఖ స్వరూప సిద్ధిః భవతి। |
ఈ విధముగా ‘అమనస్కము’ యొక్క అభ్యాసము చేత …, - ఆతడు ‘నిత్యతృప్తుడు’గా ఉంటాడు. - అల్పమైన మూత్ర - పురీషములు (అల్ప విసర్జనలు) స్వభావతః కలిగి ఉంటాడు. - అల్పముగా ఆహారముచే నిత్యతృప్తుడై ఉంటాడు. - మనోధార్డ్యము కలిగి ఉంటాడు. - దృఢమైన అంగములు కలిగి ఉంటాడు. - జాడ్యము, నిద్ర లేని దృష్టి పొంది ఉంటాడు. - వాయువును నిరోధించువాడై ఉంటాడు. - భావములను దాటి వేసి బ్రహ్మమును దర్శించుచూ తదితరులకు తెలియరాని ‘ఆత్మసుఖ స్వరూప సిద్ధి’ పొందినవాడై ఉంటాడు. |
ఏవం చిరసమాధిజనిత- బ్రహ్మామృతపానపరాయణోఽసౌ సంన్యాసీ పరమహంస అవధూతో భవతి . తద్దర్శనేన సకలం జగత్పవిత్రం భవతి . తత్సేవాపరోఽజ్ఞోఽపి ముక్తో భవతి . తత్కులమేకోత్తరశతం తారయతి . తన్మాతృపితృజాయాపత్యవర్గం చ ముక్తం భవతీత్యుపనిషత్ .. |
|
ఏవం చిర సమాధి జనిత బ్రహ్మాఽమృత పాన పరాయణో అసౌ సన్న్యాసీ, పరమహంసా, అవధూతో భవతి। తత్ దర్శనేన సకలం జగత్ పవిత్రం భవతి। తత్ సేవా పరో అజ్ఞోపి ముక్తో భవతి! తత్ కులమ్ ఏకోత్తరశతం తారయతి। తత్ మాతృ-పితృ-జాయా-అపత్యవర్గం చ ముక్తం భవతి! |
ఈ విధముగా చిరకాలము ’సమాధి’ని అభ్యసించిన యోగి, అట్టి సమాధి నుండి జనించిన ‘బ్రహ్మమేవాహమ్’అను ‘బ్రహ్మామృత పారాయణుడు’ అగుచున్నాడు. అట్టి వాడు సన్న్యాసి- పరమహంస-అవధూత కూడా! అట్టి ‘సమస్తము తానై-సమస్తమునకు వేరైనట్టి’ వ్యష్టి అతీత ఆత్మసుఖ స్వరూప సిద్ధయోగిని చూచినంతమాత్రము చేతనే ఈ సకల జగత్తు పవిత్రము పొందగలము. (జనులు పవిత్రులు కాగలరు.) ఆయన పట్ల సేవా పరులైనవారు - అజ్ఞానులైనప్పటికీ - ముక్తిని పొందగలరు. ఆతని 101 వంశములు తరించుచున్నారు. ఆతని తల్లి-తండ్రి-భార్య-పిల్లలు కూడా ముక్తులగుచున్నారు. |
ఇతి
మండల బ్రాహ్మణోపనిషత్।
ఓం శాంతిః శాంతిః శాంతిః॥
మండల బ్రాహ్మణోపనిషత్ = ఆదిత్య మండల పురుషుడగు సూర్యనారాయణ భగవానునిచే ప్రబోధించినబడిన బ్రహ్మము గురించిన తత్త్వబోధా బ్రాహ్మణము.
ఓం భాస్కరాయ విద్మహే। మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్॥
✤
ఓంకార సంజ్ఞయగు జీవబ్రహ్మైక్య అఖండ తత్త్వమునకు నమోవాక్కములు.
✤
1.) ప్రథమ బ్రాహ్మణము - తారక యోగము - శాంభవీ ముద్ర
యాజ్ఞవల్క్య మహామునీశ్వరుడు చతుర్వేద పారాయణుడు. మహాతపశ్శాలి. పరాపర శాస్త్రహృదయవేత్త. సద్గుణ సుసంపన్నుడు! ఆయన ఒక సందర్భములో జగదాధారుడు, సవితృ మండల మధ్యవర్తి, ఆదిత్య మండల పురుషుడు, విరించి-నారాయణ-శంకరాత్ముడుగా మునిజన వందితుడు - అగు ఆదిత్య భగవానుని దర్శనార్థమై సూర్యమండలము ప్రవేశించారు. ఆ సూర్యభగవానునికి భక్తి ప్రపత్తులతో ఆత్మప్రదక్షిణ నమస్కారములు సమర్పించారు.
యాజ్ఞవల్క్య మహాముని : స్వామీ! సూర్యనారాయణ భగవాన్! ఆదిత్య మండల పరమపురుషా! శతకోటి ప్రణామములు! నాపై దయతో నాకు ‘పరబ్రహ్మతత్త్వ’ విశేషములను ప్రబోధించవలసినదిగా అభ్యర్థన!
ఆదిత్య మండల పురుషుడగు సూర్యనారాయణ భగవానుడు : ఓ యాజ్ఞవల్క్య మహామునీ! ఆత్మ గురించిన తత్త్వ జ్ఞానము గురుముఖతః వినటము, అవగాహన, తెలుసుకోవటముచే.. తప్పక తెలియబడగలదు. అయితే ఈ జీవుడు అనేక ఉపాధులుగా వ్యష్టి తత్వముచే ప్రాభావితుడై ఇంద్రియ విషయములను ఆశ్రయించటము, నమ్మి ఉండుటము చేత బుద్ధిని నిర్మలము చేసుకోవాలి కాబట్టి జ్ఞాన శ్రవణముతోబాటుగా యోగాభ్యాసము అత్యవసరము. లేకుంటే వ్యష్టిని సమిష్టితోను, సమిష్టిని ఆత్మయందు లయింపజేయలేడు.ఇది బ్రహ్మతత్త్వవేత్తల అభిప్రాయము.
ఇది దృష్టిలో పెట్టుకొని మనము మునుముందుగా అష్టాంగ యోగముల గురించి చెప్పుకుందామయ్యా!
అష్టాంగ యోగములు
జ్ఞానయుక్త ‘యమ’ ఆది అష్టాంగయోగ - ఉచ్యతే॥
యోగము యొక్క అభ్యాసమును ‘8’ అంగములుగానూ వాటి వాటి ఉపాంగముల వివరణతోడను మార్గ దర్శకులచే మార్గాణ్వేషకులకు సవివరించబడుచున్నాయి. అవి జ్ఞానమునకు కూడా మార్గము అని చెప్పబడుచున్నాయి.
[1.] యమము ఉపాంగములు
1) శీత-ఉష్ణ ఆహార నిద్రా విజయం : కాలానుసారంగా వసంత-గ్రీష్మ-వర్ష-శరత్-హేమంత-శిశిర ఋతు షట్కములలో ప్రకృతి శీత - ఉష్ణ తాపములను కలుగజేస్తూ ఉంటుంది. వాటి పట్ల ఓర్పు వహించి స్వీకరించుటచే దేహము సానుకూలము అయి, సాధనమునకు ఉపకరిస్తుంది. అట్లాగే ‘నేను ఇదే తినాలి. ఆ రుచియే కావాలి’ - ఇటువంటి అభ్యాసములను జయిస్తూ, “దేహము అనే ఈ ఉపకరణము కొరకై ఆహారము అంతేగాని, ఇంద్రియముల ఆనందము కొరకు కాదు” అని గ్రహించి ఉండాలి. తత్త్వ జిజ్ఞాస-తత్త్వ జ్ఞాన సిద్ధి కొరకై ఆహారము-దేహము కూడా! ఆహారము ఆహారము కొరకై, రుచికొరకై కాదు. అతి నిద్ర పరమాత్మ ప్రసాదితమైన ఆయువును వృధా చేసుకోవటమే అవుతుంది.
2) సర్వదా ‘శాన్తి’ : ఇంద్రియ విషయ యోచనలతో హృదయమును అశాంతి చేసుకోకూడదు. మనస్సును ప్రశాంతముగా ఉంచుతూ తత్త్వ జ్ఞానమునకు సంసిద్ధము చేయాలి. ఎవ్వడైతే ప్రాపంచిక సందర్భములకు, సంగతులకు, సంబంధములకు వ్యధ చెందడో, సుఖ-దుఃఖ సమయములలో సమత్వమును వదలక ఉంటాడో, సూక్ష్మబుద్ధితో ధీరుడై ఉంటాడో.. ఆతడే అమృత స్వరూపమగు ఆత్మభావనకు అర్హుడు అగుచున్నాడు.
3) నిశ్చలత్వం : బుద్ధి యొక్క చంచలత్వమును, అనేక విషయములపై వ్రాలటమును పరిపరి రీతులుగా పరుగులు తీయు స్వభావమును అరికట్టు ప్రయత్నము చేస్తూ ఉండాలి. బుద్ధికి ఏకాగ్రతతో కూడిన నిశ్చలత్వమును అభ్యాసపూర్వకంగా అలవర్చాలి.
4) విషయేంద్రియ నిగ్రహం : మనస్సు ఇంద్రియ విషయములపై వ్రాలటమును గమనిస్తూ ‘నిగ్రహము’ (Control)ను అభ్యసిస్తూ ఉండాలి. రాగ - ద్వేషములు ఇంద్రియ - మనస్సులను శాసించకుండా జాగరూకులై ఉండాలి.
[2.] నియమము ఉపాంగములు
1) గురుభక్తి : ఈ జీవుడు ఇంద్రియ విషయముల వెంట వెళ్లి వెళ్లి వాటి యందు ప్రియాప్రియములకు సంబంధించిన అనేక అభిప్రాయములు, నమ్మకములు, భావ-ఆవేశములు, సుఖ - దుఃఖ దర్శనములు, మంచి-చెడుల ద్వంద్వ భావనలు.. ఇవన్నీ కలిగి ఉంటున్నాడు. ఎప్పుడో సత్యాన్వేషి అగుచున్నాడు. అందుకు మానవ జన్మ చక్కటి సందర్భము. ఈ జగత్తులో మహనీయులగు సత్యద్రష్టలు, ఆత్మతత్త్వజ్ఞులు ఉన్నారు. స్వకీయ భావావేశములను, అభిప్రాయ పరంపరలను, ఉద్వేగములను, కొంచెము ప్రక్కగా పెట్టి, శాస్త్ర ఉద్దేశ్యములను ఎరిగినట్టి అనుభవజ్ఞుడగు సద్గురువును ఆశ్రయించాలి. వారు చెప్పు సాధనలను శ్రద్ధగా స్వీకరిస్తూ, ఆత్మ గురించిన సమాచారము కొరకై బుద్ధిని సిద్ధము చేసుకొంటూ.., ఇక ఆపై గురువాక్యముల పట్ల బోధల పట్ల శ్రద్ధ-ఆసక్తు’లను పెంపొందించుకోవాలి. గురుభక్తిచే ‘శ్రద్ధ’ రూపుదిద్దుకొనగలదు.
2) సత్యమార్గ అనురక్తి : ఈ జీవుడు మనో కల్పనామాత్రమైనట్టి ఇంద్రియ విషయముల పట్ల, వాటి ఉపశాఖలు అగు ప్రియ-అప్రియ స్వజన-పరజన పుత్ర-కళత్ర.. ఇత్యాది బంధువర్గము పట్ల జన్మ-జన్మాంతరములుగా అనురక్తిని కొనసాగించుచూ, అజ్ఞాన భూములలో రాకపోక సంచారములు చేస్తూ వస్తున్నాడు. ‘ఏది నిత్యము? ఏది సత్యము?’… అను ప్రశ్నకు ఒకానొకప్పుడు వచ్చుచున్నాడు. కనుక ముముక్షువైనవాడు కాల్పిక విషయముల పట్ల, కాలాంతర్గత సంగతి- సందర్భముల పట్ల విరక్తి - వంటి జాగరూకతలను ఆశ్రయించాలి. సత్యమార్గము పట్ల ‘అనురక్తి’ ప్రవృద్ధ పరచుకొనునుగాక! ఇది. ’నియమము’లోని మరొక ఉపవిభాగ శాఖ.
3) సుఖానుగత అనుభవశ్చ నిస్సంగతా : ఇంద్రియముము నుండి లభించు సుఖములు వాస్తవానికి దుఃఖ మిశ్రితములు. భ్రమను జోడించినప్పుడు మాత్రమే మృగతృష్ణాజలంలాగా సుఖము వలె అనిపిస్తూ ఉంటాయి. ఇది గుర్తెరిగి ఉండాలి.
4) తద్వస్తు అనుభవేన తుష్టి : ఆత్మ జ్ఞాన సంబంధమైన విశేషములచే ఆనందించటము, (చదివినప్పుడో, వినినప్పుడో-అద్దాని ఆనందమునకు) ఆకర్షించబడటము ఇది కూడా నియమము యొక్క విభాగమే!
5) నిస్సంగతా : ’సంగము(Association - Attachment) చేత కామ-క్రోధ-సంయోగ-స్మృతి భ్రంశ-బుద్ధి నాశ-ప్రణస్యత (DownFall)లు ఏర్పడుచున్నాయి’ అని గమనించటమే నియమము యొక్క నిస్సంగ ఉపశాఖ. ఏది ఎట్లా నిర్వర్తించాలో, అట్లే నిర్వర్తించుచూ, సంగరహితుడై ఉండటము విజ్ఞాన దృష్టి చేత ఈ జీవునికి సుసాధ్యమే! నాటకంలో నటునివలె - జగత్ నాటకంలో తన జీవాత్మత్వమునుతాను ధరిస్తున్న పాత్రవలె చూస్తూ - తాను వేరై ఉండాలి.
6) ఏకాంత వాసో : ఏకాంతముగా (In Privacy) అభ్యాసము-సాధన-విచారణలను నిర్వర్తిస్తూ ఉండటము. “ఉపాసన నాకు - పరమాత్మకు సంబంధించినది మాత్రమే! పదిమంది గుర్తింపుకొరకు కాదు!" - అను ఎరుక. ‘శ్రవణము’ తరువాత నిర్వర్తించవలసిన మననముచే ఏకాంతవాసము ప్రారంభమగుచున్నది.
7) మనో నివృత్తి : ‘ప్రవృత్తి’ (Avocation) మార్గము నుండి (ఆయా ఇంద్రియ విషయముల నుండి) మనస్సును విరమింపజేయుటము.(Withdrawal of Avocation). వృత్తులకు అతీత స్థానములో బుద్ధిని నిలిపి, వృత్తులను ఆత్మోపాసనకు బాహ్య - ఉపకరణములవలె సమన్వయించుకొని, భావించి ఉండటం.
8) ఫలాన్ న అభిలాషో : ’నాకు దృశ్యములో ఎంతవరకు ప్రయోజనము లభించింది?’ అనే స్థితి నుండి, ‘ఈ ఈ కర్మ వ్యవహారములు నా బుద్ధిని నిర్మలము, సునిశితము, విస్తారము, పవిత్రము చేసుకొనటానికి ఉద్దేశ్యించెదను గాక!’ అనునదియే ‘ఫలాన్ న అభిలాషః’ అగుచున్నది. చేయవలసినదియే చేస్తూ, ఇక ‘పొందవలసినది ప్రపంచంలో కాదు. నా ఆధ్యాత్మ తత్త్వమార్గాణ్వేషణలో” అనునదే నిష్కామకర్మ!
9) వైరాగ్య భావశ్చ : దేని పట్లా రాగము లేకుండా “ఇదంతా కాలమహిమ. కాలము చేత సందర్భపడుచూ, కాలము చేత తొలగిపోయే స్వభావము కలిగి ఉన్నది కదా! ప్రకృత్యైవ చ కర్మాణి! - నాకు రాగ ద్వేషములు ఉండవలసిన పనేమి?”.. అను అవగాహనతో విరాగి అయి, వైరాగ్య భావము మనస్సు నందు కలిగి ఉండటము.
[3.] ఆసనము
సుఖాసనవృత్తిః చిరవాసశ్చ ఏవమ్ ఆసన నియమా భవన్తి |
ధ్యాసను ప్రాపంచిక విషయముల నుండి విరమింపజేసి ఒక్క చోటికి తెచ్చి ఏకాగ్రము చేస్తే గాని ‘పరతత్త్వము’ అనుభూతము కాదు. అందుకు శాస్త్రములు సూచించు ’పద్మాసనము’ మొదలగునవి (లేక) ఎక్కువ సేపు ఒకచోట సుఖముగా కూర్చుని చిత్త-వృత్తులను వెనుకకు తెచ్చి ఆత్మతత్త్వ ధ్యానము నందు నియమించుటకు వీలుగా ఉండేటటువంటి ఏదైనా ‘సుఖాసనము’ను స్వీకరించాలి. అభ్యాసం చేసుకోవాలి.
[4.] ప్రాణాయామము
పూరక-కుమ్భక-రేచకః - షోడశ (16) - చతుష్షష్టి (64) - ద్వాత్రింశతి (32) సంఖ్యయా యథాక్రమం - “ప్రాణాయామః”|
పూరకము - | కుడి బొటనవ్రేలుతో కుడి ముక్కుపుట మూసి, ఎడమ ముక్కుపుటతో గాలి శరీరములోనికి పీల్చుట. 16 మాత్రలు (చిటికెల) కాలము (మాత్ర = ఒక సూదిని వస్త్రములో గ్రుచ్చి వెనువెంటనే తీయునంత సమయము) |
కుంభకము - | ఎడమ ముక్కుపుటను కుడి ముక్కు పుటను మూసి, దేహము నుందు ఆ పీల్చినగాలిని స్థంభింపజేయుటము. 64 మాత్రల (చిటికెల) కాలము. అట్టి సమయంలో ధ్యాసను ఆజ్ఞాచక్రంలో నిలిపి, బుద్ధితో దేహమంతా వాయు సమత్వమును ధారణ చేయటము. |
రేచకము - | ఎడమ ముక్కుపుటను మూసియే ఉంచి, కుడి ముక్కు పుటను కొంచెము కొంచెముగా తెరుస్తూ దేహములో కుచించి ఉంచిన గాలిని నెమ్మదిగా వదలుచూ - మొత్తము గాలిని బయటకు పంపుట 32 మాత్రల (చిటికెల) కాలము. |
ఈ విధము యథాక్రమముగా (ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము, రాత్రి కూడా ప్రతి పూట 6 సార్లుగాని, 12 సార్లుగాని, 18 సార్లుగాని, 24 సార్లుగాని, 32 సార్లుగాని) నిర్వర్తించటము.
[5.] ప్రత్యాహారము
విషయేభ్య ఇంద్రియార్థేభ్యో మనోనిరోధనం!
మనస్సును ఇంద్రియార్థములైన శబ్ద-స్పర్శ-రూప-రస గంధముల నుండి వెనుకకు మరల్చి మరొక ఏదో ఒక ప్రదేశమునందు (ఇష్టదైవ రూప - పాదములు, బిందువు, గురుపాదములు.. ఇట్టి ఒక చోటు) ప్రతిక్షేపించటము.
[6.] ధ్యానము
సర్వ శరీరేషు చైతన్య ఏకతానతా!
సర్వశరీరములలో చైతన్యము యొక్క ఏకత్వమును-అఖండత్వమును భావిస్తూ, అట్టి ధ్యాస దర్శనములు కలిగి ఉండటము ధ్యానము.
[7.] ధారణా
విషయ వ్యావర్తన పూర్వకం చైతన్యే - చైతన్య స్థాపనం ధారణమ్|
ఈ మనస్సు అనుక్షణం ఆయా ఇంద్రియ సంబంధిత విషయములందు వ్యావర్తనము (Wondering Avocation) కలిగి ఉంటోంది, మనస్సు యొక్క రూపము? ఆలోచన! అట్టి ఆలోచన ఆత్మ యొక్క చైతన్య స్వరూపమే! కనుక విషయ వ్యావర్తన పూర్వక చేతనమును విషయముల వైపుగా పోకుండా నిరోధించి, ఆ చేతనమును (మనస్సును) కేవల చిత్ చైతన్యమునందు నిలిపి ఉంచటమే ‘ధారణ’. పాలతో పాలను ఏకము చేయు తీరుగా వ్యష్టి చైతన్యమును విశ్వ చైతన్యముతో ఏకము చేసి ఉండటము.
ధారణలో రెండు విభాగములు ఉంటాయి.
1) తన మనస్సును చిత్ చైతన్యము నందు నిలిపి ఉంచటము.
2) నిర్మల చిత్ చైతన్యముతో మమేకము.
ఈ విధంగా యోగి-యోగలక్ష్యము అనే రెండు మాత్రమే ధారణయందు శేషించి ఉంటాయి. తదితరమైనదంతా మనస్సు సహాయముతో త్యజించబడి ఉంటుంది. (లేక) ఆత్మ - చైతన్య స్వరూపముగా భావన చేయబడుతుంది.
[8.] సమాధి
ధ్యాన విస్మృతిః ‘సమాధిః’ |
ధ్యానములో 1) ధ్యానము చేయువాడు 2) ధ్యేయమగు ఆత్మ చైతన్యము ప్రవర్తితమౌతాయి.
అట్టి ‘ధ్యానాభ్యాసము’ యొక్క తదనంతర - ఉత్తమ స్థితిలో ధ్యాని - ధ్యానింపబడు ధ్యేయము (చైతన్యము) ద్వయ స్థితిని వీడి ‘ఏకస్థితి’ పొందుచున్నాయి. అప్పుడు ధ్యానయోగి ‘నేను ధ్యానము చేయువాడను’ అను అహమ్కారము (అహమ్ ధ్యానకర్తా)ను త్యజించి, ధ్యేయమగు చైతన్యమే తానగుచున్నాడు. ఈ జగత్తు ఏ చిత్ చైతన్య స్వరూపమో అట్టి తత్త్వము (ఆ ధ్యాని) తానే - అగుచున్నాడు.
అప్పుడు ’చిదాత్మ’ గా మాత్రమే శేషించు ఆ ధ్యానయోగి, తానే చైతన్యాత్మ స్వరూపుడగుచున్నాడు. ధ్యేయమగు దృశ్యమంతా తన స్వరూపమే అయి.., ‘సర్వరూపములును తానై - సర్వ సాక్షిగా వేరై’ ఉండు స్థితియే ‘సమాధి’.
సమాధి స్థితిలో జగత్ దృశ్యమంతా, అట్టి నిష్ఠునకు అనన్యమై ‘రెండవది’ అనునదే లేనట్టి స్వస్వరూపానందమై అకృతిమంగా అనుభూతమౌతుంది.
🌺 🧘🏿♂️ 🌺
ఈ విధమైన అష్టాంగ యోగముల అనునిత్య - అభ్యాసముచే ఈ జీవుని హృదయము నిర్మలమై, ఆత్మజ్ఞానము వినుటకు, ఆత్మసాక్ష్యాత్కారము పొందుటకు అర్హత పొందుచున్నది. అప్పుడు మాత్రమే ఆత్మ సమాచారము అనుభవమునకు రాగలదు.
మనము చెప్పుకొన్న యమ-నియమ-ఆసన-ప్రాణాయామ-ప్రత్యాహార-ధ్యాన-ధారణ-సమాధులను, వాటివాటి సూక్ష్మాంగములను (అష్టాంగ యోగములను) ఎరుగుటచేతను, తత్ సాధనాక్రమము చేతను - జీవుడు సర్వ సంసార భ్రమల నుండి విముక్తి పొందగలడు.
సంసార దోషములు
ఈ జీవుడు దేహమును పరిగ్రహిస్తూ ఉండగా, దేహమునకు సంబంధించి పంచ (5) దోషములు ఆతనిని వెంటనంటినవై ఉంటున్నాయి.
ఆ పంచ దోషములను, వాటి నివారణోపాయములను ఇక్కడ మనము ఉదహరించుకొందాము.
దేహ పంచ దోషములు | నివారణ ఉపాయయములు |
---|---|
1) కామము : ఇప్పటికి ఉన్నవి కాకుండా, ఇంకా ఏదో పొందాలి. లేనివేవో లభించాలి. ఉన్నవేవో కొన్ని వృద్ధికావాలి. అప్పటివరకు అసంతృప్తే! ఇప్పటిదాకా ఏమీ పొందామని? (సంగాత్ సంజాయతే కామః). ఏదో పొందాలి? అవి-వారు అట్లా ఉండాలి - ఇట్లా కాదు, మారాలి, వెళ్ళాలి, చేరాలి… మొదలైనవన్నీ ‘కామము’ యొక్క ఉపశాఖలు. | నిస్సంగము : వస్తు - విషయముల గురించి సంకల్పించుట చేతను, ధ్యాసచేతను సంబంధము ఏర్పడుతోంది. (ధ్యాయతో విషయాన్ సంగః తేషు ఉపజాయతే!) కనుక, ‘నిస్సంగము’ అను ఉపాయముతో మనో-బుద్ధులపై దండయాత్ర చేస్తున్న (ఏదో కావాలనే) కామవృత్తులను జయించుచూ రావాలి? |
2) క్రోధము : కామాత్ క్రోధాభిజాయతే! పొందాలనుకొన్నవి పొందనప్పుడో తాను అనుకున్న రీతిగా తదితరులు ఉండనప్పుడో, దురాభిమానము చేతనో క్రోధము, క్రోధ రూపము (కోపము యొక్క ఆవేశ స్థితి)గా రూపు దిద్దుకుంటోంది. ఇంకేమున్నది? మనస్సుకు శాంతి లేదు. | క్షమ : తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు. ’ఇతరులు అనుకునేరీతిగా నేనూ ఉండలేనుకదా! నా దగ్గర తప్పులు లేవా?’ ఇటువంటి కించిత్ విచక్షణా పూర్వక వివేచనచే క్షమ (Forbearence) వృద్ధి పొందుతుంది. అది క్రోధమును జయించే ఉపాయము. లేదా, దేహ-మనోరుగ్మతలు, అనివార్యము. |
3) నిస్వాస : ప్రాణము-మనస్సు ఇష్టముయొక్క రెండు రెక్కలు. దేహ జీవనాకారమగు గాలి (ప్రాణశక్తి) ఎల్లప్పుడు చంచలముగా ఉండుటచే చిత్తము-మనస్సు ఏకాగ్రత సంతరించుకోవటము క్లిష్టమవుతుంది. ఎప్పుడూ ఏ విషయము మీదా నిలువదు. | లఘు ఆహారా! ఆహారము మితముగా ఉంటేనే, నిశ్వాస ప్రాణాయామాదులకు సహకరించి, చిత్త ఏకాగ్రతకు సహకరించగలదు. ప్రాణాయా మముచే శ్వాసమీద ధ్యాస-నిఘా… ఉపాయమై ఉన్నది. |
4) భయము : ఉన్నదేదైనాపోతుందేమోనని, లేనిది ఏదైనా జరిగి బాధిస్తుందేమోనని అనుకోవటం చేత ఏవేవో విన్నవి –విననివి జ్ఞాపకమునకు వచ్చి చెడు శంకించటము చేతను ‘భయము’ వెంటనంటినదై వృద్ధి పొందుతూ ఉంటోంది. | అప్రమాదత : అప్రమత్తత, అప్రమాదత (నిరుత్సాహము లేకుండా చేసుకోవటం చేత) అభయము సిద్ధించగలదు. సర్వ జగత్ - రక్షకుడగు పరమాత్మయొక్క స్మరణచే భయమును జయిస్తూ ఉండాలి. వైరాగ్యముతో కూడిన ఉత్సాహముచే భయము-అభయస్వరూపంగా సంతరించుకొనగలదు. |
5) నిద్రా : నిద్ర జడస్థితి. ఇది అధికమవటంచేత విచక్షణ-విజ్ఞానము సన్నగిల్లగలదు. అవకాశములు వృధా అవుతూ ఉంటాయి. | కాలము యొక్క విలువ ఎరిగి, తత్త్వజ్ఞానాశయము, సహజమగు స్వస్వరూప పరిజ్ఞానము వృద్ధి చెందుతుండగా, అతినిద్ర జయించబడుచున్నది. |
సంసార సాగరము దాటు ఉపాయము
ఓ యాజ్ఞవల్మ్యా! ఈ దృశ్యముచే ఏర్పడు అజ్ఞాన సంబంధమే ‘సంసారము’ అని చెప్పబడుచున్నది.
’ఏది నిత్యము? ఏది అనిత్యము? ఏది అనునిత్యము?” అనునది విచారణ చేయాలి.
‘అనిత్యము - సందర్భ పరిమితము-భావనచే రూపము పొందినది’ అగు ఇంద్రియ విషయములపట్ల, దృశ్య విషయములపట్ల ‘నిత్యము-నిజము’.. అను భావన నుండి సంసార సంబంధము ఏర్పడుతోంది. అవిశ్రాంతముగా జన్మజన్మలుగా పరిపోషించుకొనుచూ వస్తున్న అసంఖ్యాక విషయ సంబంధములచే ఏర్పడు స్థితిని ‘సంసార సాగరము’.. అని పిలుస్తున్నారు. అట్టి సంసార సాగరమును ‘ఎట్లా దాటాలిరా, బాబూ?’ అని ఈ జీవుడు వేదన చెందుతూ ఉంటే,
ఇక ఈ సంసార సాగరములో…..,
ఇటువంటి రూపము గల సంసార సాగరమును దాటటానికి స్థూలమైన క్రియలు సరిపోవు.
మనో-బుద్ధులను నియమించి, అల్పాశయములను మరియు భావావేశములను ప్రక్షాళణము చేయగల సూక్ష్మమార్గములను అనుసరించుట మనోవ్యాధియొక్క చికిత్సకై
అనివార్యము. ఆవశ్యకము. సూక్ష్మమార్గములో, సత్త్వ-రజో-తమో త్రిగుణములను అతిక్రమించి తారకబ్రహ్మమును అవలోకనం చేయాలి.
తారకము
భ్రూమధ్యములో ఏ ‘సత్-చిత్ ఆనంద ఆత్మతేజస్సు’ కూర్మము (తాబేలు) ఆకారముగా వెలుగొందుచున్నదో అద్దాని దర్శనమే తారక బ్రహ్మము యొక్క సందర్శనము. అందుకు ఉపాయము - లక్ష్యత్రయ (Triple objective) అవలోకనము.
1) బహిర్లక్ష్యము 2) మధ్య లక్ష్యము 3) అంతర్లక్ష్యము
ఓ యాజ్ఞవల్యా! త్రిగుణములకు ఆవల గల ’తారక బ్రహ్మము’ యొక్క ’3’ లక్ష్యముల ద్వారా అవలోకము ఏ విధంగానో.. ఇప్పుడు మనము చెప్పుకుంటున్నాము.
1) అంతర్లక్ష్య దర్శనము (అవలోకనము)
సుషుమ్న :
మూలాధారాత్ ఆరభ్య - బ్రహ్మరంధ్ర పర్యంతమ్ ‘సుషుమ్నా’ సూర్యాభా।
ప్రతి జీవుని దేహములోనూ కూడా…,
బ్రహ్మనాడి ‘మూలాధార చక్రము’ నుండి ప్రారంభమై శిరస్సుయొక్క ఊర్ధ్వ స్థానమున గల బ్రహ్మరంధ్రము పర్యంతము విస్తరించి సూర్యతేజస్సుతో సమానమై ప్రకాశించుచున్న నాడిని ‘సుషుమ్నా నాడి’ అని పిలుస్తున్నారు.
కుణ్డలినీ :
తన్మధ్యే తటితోకోటిసమా మృణాళ తన్తు సూక్ష్మా కుణ్డలినీ।
’సుషుమ్న’ యొక్క మధ్య భాగములో -విద్యుత్ కోటితో సమానమైనది, ’తామరతూడు’ లోని దారము వలె సూక్ష్మరూపమైనది అగు ఒకానొక ‘మహాశక్తి’ ప్రకాశించుచున్నది. ఆ మహాశక్తిని ’కుణ్డలినీ శక్తి’.. అని పిలుస్తున్నారు.
తత్ర తమో నివృత్తిః।
అట్టి సుషుమ్నలోని కుండలినీ మహాశక్తి యొక్క సమక్షములో తత్ తేజోవీచికల ప్రకాశ ప్రభావముచే-తమస్సు (చీకటి)కి నివృత్తి కలుగగలదు. కుండలినిని యోగాభ్యాసము సహాయముతో బుద్ధిచే ఉత్తేజ పరచాలి.
తత్ దర్శనాత్ సర్వపాప నివృత్తిః।
అట్టి కుణ్డలినీ తేజో దర్శనముచే సర్వ దృశ్య సంబంధిత అంతరంగ పాప-అధోవృత్తులు, అల్ప-ఆసురీ స్వభావములు నివృత్తిని పొందగలవు.
అంతర్-పూత్కార శబ్దము :
తర్జన్యగ్రోన్మీలిత కర్ణరంధ్ర ద్వయే - ’ఫూ-పూ’త్కార శబ్దా జాయతే।
రెండు చూపుడు వ్రేళ్ళ కొనలతో రెండు చెవి రంధ్రములను మూసి ఉంచితే, అప్పుడు లోనుండి ‘ఫూ’త్కార శబ్దము వినబడుతూ ఉంటుంది.
చక్షుర్మధ్యే ‘నీలజ్యోతి’ దర్శనము :
తత్ర ఫూత్కార శబ్దస్థితే మనసి, చక్షుర్మథ్యనీలజ్యోతిః పశ్యతి।
చూపుడు వ్రేళ్ళతో రెండు చెవి రంధ్రములను మూసి ఉంచినప్పుడు లోనుండి వినబడు ‘ఫూ’ త్కార ‘శబ్దము’ తత్రస్థితే మనసి- పై మనస్సు నిలిపి ఉంచుచుండగా అట్టి స్థితప్రజ్ఞతతో కూడిన మనస్సుకు రెండు కనుల మధ్య ప్రదేశములో ’నీలజ్యోతి’ - యొక్క దర్శనము సిద్ధించగలదు. ఆ నీలజ్యోతియే హృదయము నందు కూడా దర్శింపబడుచున్నది.
ఇట్టి అంతర్-కుండలినీ శక్తి యొక్క తేజో దర్శనమును చక్షుర్మధ్య-హృదయాంతర్గత నీలజ్యోతి దర్శనములను అంతర్లక్ష్య దర్శన-తారకావలోకనము - అని అంటారు.
2) బహిర్లక్ష్య దర్శనము (అవలోకనము)
నాసాగ్రే చతుః (4), షష్ఠ (6), అష్ట (8) దశ (10 ద్వాదశ (12) అఙ్గుళీభిః క్రమాత్।
నీలద్యుతిః - శ్యామత్వ సదృక్-రక్త భంగీ, స్ఫురత్
శుక్ల పీతవర్ణ ద్వయోపేతం - ‘వ్యోమత్వం’ - పశ్యతి స తు యోగీ॥
ముక్కుకు ఊర్ధ్వభాగం నుండి - ఊర్ధ్వంగా పై చివరకు,
(కనుబొమ్మలకు మధ్యగా కొంచం క్రింద స్థానమునుండి ఊర్ధ్వముగా)
1 నుండి 4 అంగుళముల వరకు .. నీలవర్ణ కాంతి పుంజములు గాను,
5 నుండి 6 అంగుళముల వరకు.. ఎరుపు-నలుపు కలగలపు కాంతిగాను,
6 నుండి 8 అంగుళముల వరకు.. తెలుపు కాంతి పుంజములతోను,
9 నుండి 10 అంగుళముల వరకు.. పసుపు పచ్చ కాంతి పుంజములతోను,
10 నుండి 12 అంగుళముల వరకు.. తెలుపు + పసుపు వర్ణ కాంతి పుంజములతోను,
ఆకాశ తత్త్వము .. ఏకాగ్ర అభ్యాసయోగికి సందర్శనమగుచూ ఉంటుంది.
అట్టి 12 అంగుల వరకు గల నాసాగ్రము నుండి బహిర్గతముగా గల ఆకాశము (Space)ను సందర్శించు అభ్యాసమును ఆశ్రయించువాడు - బహిర్లక్ష్య దర్శన యోగి.
ఆ విధంగా చలన దృష్టితో ఆకాశ విభాగము (వ్యోమభాగము)ను వీక్షించుచున్న యోగాభ్యాసికి 12 అంగుళముల ఆకాశమునకు ఆవలగా ‘జ్యోతి సమూహములు’ కనిపిస్తూ ఉంటాయి.
తత్ దృష్టిః స్థిరాభవతి। ఇట్టి 12 అంగుళముల బాహ్యాకాశ దర్శనాభ్యాసముచే దృష్టి స్థిరత్వమును పొందుతూ ఉంటుంది.
అట్టి చంచల రహిత స్థిరదృష్టిని అభ్యసించు యోగికి క్రమంగా (అభ్యాసవశంగా).. శిరస్సుపైన 12 అంగుళములకు ఆవల జ్యోతి సమూహములు కనిపిస్తాయి.
శీర్షోపరి ద్వాదశాంగుళమాన జ్యోతిః పశ్యతి, తదా అమృతత్వమేతి। శిరస్సుకు పైన 12 అంగుళములకు మీద జ్యోతిస్సమూహ దర్శనము చేయుచున్న యోగి ‘అమృతత్వము’ను ప్రాప్తింపజేసుకొనుచున్నాడు. ఇక ఆతని దృష్టి అనుభవములకు దేహము యొక్క రాకపోకలు.. ‘ఒకచొక్కా విప్పి, మరొక చొక్కా ధరించటము’ వంటిది. అంతేగాని శిరస్సుపై జ్యోతి దర్శనము చేయువానికి - భౌతిక దేహముతో తన్మయులగుచున్న తదితర జీవులవలె ‘మరణము’ అనే అనుభవ పరిమితత్వము ఉండదు.
3) మధ్య లక్ష్య దర్శనము (అవలోకనము)
ప్రాతశ్చిత్రాది వర్ణ సూర్య-చంద్ర-వహ్ని జ్వాలావలీవత్ తత్ విహీనాత్ అంతరిక్షవత్ పశ్యతి।
ఈ మధ్య లక్ష్య లక్షణ - తారకాయోభ్యాసి…., తన హృదయాకాశములో
1. సూర్య-చంద్ర-అగ్నిల యొక్క తేజస్సుతో నిండియున్న ఆకాశము.
2. అవన్నీ లేనట్టి కేవల నిర్మలకాశము.
ఈ రెండు విధములుగా (హృదయంలో)… దర్శనం చేస్తూ, అభ్యాసి అయి ఉంటాడు.
ఇట్టి యోగాభ్యాసముచే క్రమంగా ఆ యోగి -
తదాకార ఆకారీ భవతి। ఆకాశమే తన స్వరూపముగా అనుభవము పొందుచూ ఉంటాడు.
ఈ భౌతిక దేహము- ’నేను’ చేతిలో ధరించు ఒక కర్ర వంటిది. తేజోమయాకాశమే నా సహజ దేహము - స్వరూపము - అను అనుభవి అయి ఉంటాడు.
ఆకాశ పంచకానుభవము
గుణాతీతాకాశము - పరాకాశము - మహాకాశము - తత్త్వాకాశము - సూర్యాకాశము …. తారక యోగాభ్యాసి క్రమంగా అభ్యాసయోగముచేత పంచాకాశములుగా … ఒకదాని ఆవల మరొకటిగా స్వస్వరూపమును సోఽహమ్ దర్శనము చేయుచున్నాడు.
1) గుణాతీతాకాశము : ‘నిర్వికార గుణరహిత ఆకాశము’ : అనుభవమగుచు, అదియే తానగుచున్నాడు. గుణాతీతోఽస్మి! నిర్గుణోఽస్మి!
2) పరాకాశము : అప్పుడిక విస్ఫురత్ తారకాకార గాఢ తమోపమమ్ - నిర్గుణ - నిర్వికార ఆకాశ స్వరూపము కాస్తా మహాప్రకాశమాన తారకాలతో కూడిన (నక్షత్రములతో కూడిన ఆకారము గల గాఢతమ (చీకటి) రూప నిర్విషయ ఆకాశమగుచున్నది. అదియే ‘పరాకాశ’ సందర్శనము. క్రమంగా ఆ పరాకాశమే తానుగా అగుచున్నాడు. పరాకాశ స్వరూపోఽస్మి! పరాత్ పరాఽస్మి! "పరాకాశ స్వరూపుడను. పరమునకే పరమైనవాడను” - అను స్వస్వరూపాస్వాదన!
3) మహాకాశము : ఇక ఆపై - కాలా నల సమద్యోతమానం మహాకాశం భవతి - ఆ యోగికి కాలాగ్ని సమాన తేజోమయమగు ‘మహాకాశము’.. అనుభవమగుచున్నది. క్రమముగా ఆ మహాకాశమే తన స్వరూపముగా ఆ యోగి సంతరించుకొనుచున్నాడు.
మహత్ ఆకాశోఽస్మి! మహదస్మి! (మహత్ = అందరిలోని నేనైన నేను).
4) తత్త్వాకాశము : ఆ తర్వాత-సర్వోత్కృష్ట పరమద్యుతి ప్రద్యోతమానమ్ ’తత్త్వాకాశమ్’ భవతి। ఇక సర్వముకంటే ఎంతో ఉత్కృష్టమైనది, పరమ ప్రకాశముచే మహత్ తేజోమయమయినది అగు ’తత్యాకాశము’ను సందర్శించుచూ ఆ యోగి ’అదియే తానుగా’.. - అగుచున్నాడు.
తత్త్వాకాశమహమస్మి! తత్త్వమహమస్మి! అందరియొక్క తత్ స్వరూపుడనే నేను!
5) సూర్యాకాశము : ఇక చివరిగా కోటి సూర్య ప్రకాశం ‘సూర్యప్రకాశమ్’ భవతి! కోటి సూర్యుల ప్రకాశముతో సమానమైన మహాసూర్యప్రకాశమును దర్శించుచూ.. తానే ‘కోటి సూర్యప్రకాశమానుడు’ అగుచున్నాడు. అహమాత్మా కోటి సూర్య తేజో స్వయం ప్రకాశ స్వరూపః| సర్వులు, సర్వము నా సూర్య తేజో ప్రకాశ కిరణాంశలు!
ఈ విధంగా బాహ్య - అభ్యంతర స్వరూపమైనట్టి నిర్వికార గుణరహితాకాశ - పరాకాశ - మహాకాశ - తత్త్వాకాశ - సూర్యాకాశ.. పంచాకాశ స్వరూపుడై ఆ తారక యోగాభ్యాసముచే సత్చిత్ ఆనంద తారక పరబ్రహ్మముగా వెలుగొందుచున్నాడు.
ఈ విధంగా అంతర్లక్ష్య - మధ్యలక్ష్య - బాహ్య లక్ష్య యోగ అభ్యాసములచే పంచాకాశ సందర్శనముచేయుచు, పంచాకాశస్వరూపుడై వెలుగుగొందు ఈ విశేషములను ఎరుగుటచే, అట్టి యోగి - పంచాకాశస్వరూపమును దర్శించగలడు. తన్మయుడు అగుచున్నాడు. అమనస్కమును స్వభావసిద్ధంగా చేసుకొనుచున్నాడు.
✤
యాజ్ఞవల్క్య మహాబుద్ధీ! ఇంకా విను, ఈ యోగము (1) పూర్వ విభాగము (2) ఉత్తర విభాగము అని రెండు విభాగములుగా విధానము కలిగియున్నది.
పూర్వ యోగ విభాగము : ‘తారక విద్య’ అని,
ఉత్తర యోగ విభాగము : ‘అమనస్కము’ అని
… చెప్పబడుచున్నది. యోగజ్ఞులచే బోధించబడుచున్నది.
యోగ పూర్వ విభాగము - తారక విద్య :
తారకమ్ తారయితి ఇతి తారకమ్! తరింపజేయునది కాబట్టి తారకము. తారకము తిరిగి రెండు తీరులైనవి.
1) మూర్తి తారకమ్ : ఇంద్రియములకు - ఇంద్రియ విషయములకు ఆవలగా ఉపాసించబడుచున్నట్టిది. ఇంద్రియ విషయములను త్యజించి, ఆ ఇంద్రియములను - ఇంద్రియ జగత్తును ’తనవి’గా కలిగి ఉన్నట్టి తత్త్వమును ఉపాసించటము. కదలికలను ఆధారంగా చేసుకొని, ఆ కదలికల ఆధారమై ఉన్నట్టి ప్రేరణతత్త్వోపాసన.
2) అమూర్తి తారకమ్ : భ్రూమధ్య గల ఆకాశమునకు ఆవల బ్రహ్మరంధ్రము వరకు, ఆ తదుపరి బ్రహ్మరంధ్రమును కూడా దాటి 12 అంగుళముల ఆకాశమునందును, 12 అంగుళములకు ఆవల కూడా విస్తరించియున్న "తేజోచైతన్య తత్త్వము” ఇక్కడ ఉపాసనా వస్తువుగా అగుచున్నది.
ఉభయమపి మనోయుక్తమ్ అభ్యసేత్!
ఈ మూర్తి - అమూర్తి తారకములు రెండూ కూడా మనస్సును నియమించి, మనోయుక్తముగా అభ్యసించవలసినవే సుమా!
మనోయుక్తమైన ‘అంతర్ దృష్టి’ చేతనే తారక ప్రకాశము అనుభవమగుచున్నది.
భ్రూయుగ (భ్రుకుటీ ఆకాశము) మధ్యగా తారక యోగాభ్యాసనముచే ఏ తేజస్సు ఆవిర్భూతమై యోగికి అనుభవమగుచున్నదో, అదంతా పూర్వ తారకము!
✤
ఇక ఉత్తర తారకమో…, అమనస్కము.
ఈ దేహములోని మహత్తర విశేషములో కూడియున్న మరొక తారక యోగలక్ష్యస్థానము గురించి ఇప్పుడు మనము చెప్పుకుంటున్నాము.
తాలుమూలభాగే మహజ్జ్యోతిః |
తాలుమూల-ఊర్ధ్వభాగే మహత్-జ్యోతిః విద్యతే| తాలు (దవడ) మూలము యొక్క ఊర్ధ్వ (పై) భాగ ఆకాశములో ‘మహత్తోజ్యోతి’ వెలుగొందుచున్నదయ్యా! అట్టి మహజ్జ్యోతి యోగ సాధన చేత తారక యోగికి సందర్శనమగుచున్నది.
ఆ మహజ్జ్యోతి దర్శనముచే యోగికి అణిమ మొదలైన అష్టసిద్ధులు కూడా సిద్ధించుచున్నాయి. (Concentration in the space where inwards ide of upper Jaw is placed).
అష్టసిద్ధులు :-
అయితే ఈ మహజ్జ్యోతి దర్శనముచే, ఉత్తమ యోగులు అష్టాంగ యోగసిద్ధులను అతి చిన్న విషయములుగా భావిస్తూ, పరబ్రహ్మమే తానుగా అగుటయే తారక యోగముయొక్క మహాశయముగా కలిగి ఉంటారు.
శామ్భవీ ముద్ర
లక్ష్యే అన్తస్థ - బాహ్యయాం దృష్టా, నిమేష - ఉన్మేష వర్జితాయాం చ, ఇయం ’శామ్భవీ ముద్రా’ భవతి।
తాలు మూలాకాశమునందు సర్వదా వెలుగొందు మహత్ జ్యోతిని ఎవ్వడైతే బాహ్య అభ్యంతరములలో కళ్లు మూసి, మూయక కూడా (కళ్లు మూయటానికి.. తెరువటానికి సంబంధించకుండా) సర్వత్రా దర్శిస్తాడో,… అట్టి మహజ్జ్యోతి దర్శనమును ’శాంభవీముద్ర’ అంటారు.
అట్టి ‘అంతర్జ్యోతిః బహిర్జ్యోతిః - సర్వజ్యోతిః ఆత్మజ్యోతిః శివోస్మ్యహమ్’ భావనకు కళ్లు మూయనూ అఖర్లేదు. తెరువనూ అఖర్లేదు. కనిపించేదంతా ఆ దివ్యజ్యోతి స్వరూపమే అయి ఉండగా కళ్లు మూతలెందుకు? కళ్లు మూసుకొని శాంభవీముద్రా విధియగు అంతర్జ్యోతిని దర్శించు యోగి, కళ్ల తెరచినప్పుడు కూడా ఏతత్ అంతర్జ్యోతి యొక్క దర్శనము కొనసాగుచున్నప్పుడే అది ‘శాంభవీముద్ర’ అగుచున్నది.
సర్వతనే గోప్యా మహావిద్యా భవతి॥
‘తాలుమూల ఆకాశ మహత్ జ్యోతి దర్శనమే బాహ్య - అభ్యంతరములందు సర్వదా సర్వముగా దర్శించటము’ అనునది సర్వతంత్రములలో అంతర్లీన లక్ష్యముగా దాగి ఉన్న మహావిద్య!
అట్టి శాంభవీముద్రను ఎరిగినంత మాత్రం చేతనే సర్వసంసార రుగ్మతలు, వేదనలు, బంధములు పటాపంచలవుతాయి. ఇక అట్టి శాంభవీముద్రా భావనా పుష్పములచే సర్వాంతర్యామియగు పరమాత్మయొక్క పూజనము చేత ఈ జీవునకు మోక్షము తప్పక సిద్ధించగలదు.
అంతర్లక్ష్యము - అంతరంగ ధ్యేయవస్తువు
అంతర్లక్ష్యమ్ జలజ్యోతి స్వరూపమ్ భవతి.. ఇతి మహర్షి వేద్యమ్!
’తారక బ్రహ్మము’నకు సంబంధించిన అంతర్లక్ష్యము ‘జలజ్యోతి స్వరూపము’గా ఉన్నది. ఈ అంతర్జ్యోతి జలస్వరూపతత్త్వమును మహర్షులు గమనించి, ఆ అంతర్జ్యోతి జలస్వరూపమే బాహ్య ఇంద్రియ దృశ్యముగా కనబడచున్నది’ అను ఋత్ (సత్యము)ను లోకములో ప్రకటించుచున్నారు. అందుచేత అంతర్జల జ్యోతి దర్శనానుభవము బాహ్య ఇంద్రియముల అదృశ్యరూపముగా చెప్పబడుచున్నది.
‘సహస్రారములో జలజ్యోతియే - అంతర్లక్ష్యము’ అని తారక యోగ సిద్ధి పొందిన మహనీయులు సిద్ధాంతీకరించుచున్నారు. అదియే పరమాత్మగా అభివర్ణిస్తున్నారు.
ఇక మరికొందరు యోగవేత్తలు “అయ్యా! బుద్ధిగుహలో పరమ పురుషుడగు విష్ణు భగవానుడు సర్వదా శేషశయనుడై వేంచేసి ఉన్నారు. ఆయనయే శాంభవీముద్రకు దారిచూపగల తారకయోగ అంతర్లక్ష్య విషయుడగు యోగీశ్వరుడు" - అని సుస్పష్టపరచుచున్నారు.
ఇక మరికొందరు అంతర్లక్ష్య తారకయోగ సిద్ధపురుషులు, తారకయోగ అంతర్లక్ష్య (Inner objective, Inner point to be reached) గురించి…. ‘శిరస్సులో బ్రహ్మరంధ్రమునందు పరంజ్యోతి స్వరూపుడై పరమాత్మ, పంచవక్తృడు (ఐదు ముఖములుకలవాడు) ఉమతో (అమ్మవారు-మూలప్రకృతి)తో కూడుకున్నవారు, నీరకంఠుడు, పరమ ప్రశాంత చిద్విలాసానంద స్వరూపుడు అగు పరమశివుడే! ఆయననే ధ్యానించి శివతత్త్వ ధ్యానముచే ‘శివోఽహమ్’ భావనను పుణికిపుచ్చుకొని పునీతులవండి!’ అని జనులకు ఎలుగెత్తి గానం చేస్తూ చెప్పుచున్నారు.
ఇంకొందరు - ‘ఆ అంతర్లక్ష్యము అంగుష్ఠ బ్రొటన వ్రేలు ప్రమాణముగా జ్యోతి స్వరూపుడై స్వ-హృదయములోనే మహప్రకాశమానుడై వెలుగొందుచున్నారు. ఆయనయే తారక యోగ-శాంభవీ ముద్ర అంతర్లక్ష్య స్వరూపుడు’ అని సాధక జనులకు గుర్తు చెప్పుచున్నారు. ‘ఆ అంగుష్ట పురుషుని ఆశ్రయించి స్వయం ప్రకాశమానాత్మ ప్రకాశమాత్రులు అవండి’.. అని గుర్తు చేస్తున్నారు.
మరింకా రైతే, "తారక యోగముచే ఈ జీవాత్మ ముక్తుడు అయినప్పుడు తానే ఈ పాంచభౌతిక జగత్తుకు ఆధారమగు సత్-చిత్-ఆనంద పరబ్రహ్మ స్వరూపుడై అనుభవమగుచున్నాడు. కనుక శాంభవీముద్రచే పొందబడుచున్నది స్వస్వరూపమే! మరింకెవ్వరినో కాదు” - అను అంతర్లక్ష్యమును ముముక్షువులకు మునుముందు సమాచారముగా సిద్ధాంతీకరించి చెప్పుచున్నారు.
యాజ్ఞవల్క్యుడు : స్వామీ! సూర్యనారాయణ, ఆదిత్య భగవాన్! మీరు చెప్పిన వేరు వేరైన అంతర్లక్ష్యములలో ఏది యుక్తియుక్తం? ఏది సుగమము?
ఆదిత్య భగవానుడు :
ఉక్తమ్ వికల్పం (కిం తు) సర్వమ్ ఆత్మైవ!
నేను చెప్పిన విధంగా అంతర్లక్ష్య పరమపురుషుడు 1) సహస్రారంలో జలజ్యోతి (2) శ్రీమన్నారాయణుడు (3) పరమశివుడు (4) అంగుష్ఠ పురుషుడు (4) జీవాత్మస్వరూపమే…. ఇట్లా ఎవ్వరెవ్వరు ఏ రీతిగా (సాకారుడు, నిరాకరుడు మొదలగునవిగా) ఉపాసిస్తే అవి అన్నీ కూడా యుక్తియుక్తమే! ఎందుచేతనంటావా? అంతా అఖండాత్మయే కదా!
ఎవరు ఏ విధమైన రూపనామములతోను (లేక) నిర్గుణ-అనామరూప భావనతో - పరాకాష్ట (తారకయోగ-శాంభవీముద్రా) పరతత్త్వముగా, (అంతర్లక్ష్యముగా) స్వీకరించినప్పటికీ, శ్రద్ధానుసారంగా, సర్వము తానే అయినందున, ఆయా వివిధ ఉపాసకులంతా చివ్వరికి సహజానంద-కేవలీసాక్షీ స్థానమునకే చేరుచున్నారు.
అట్టి లక్ష్యమును ’శుద్ధమగు ఆత్మదృష్టి’తో ఎవ్వరు చేరుప్రయత్నములో ఉన్నారో, వారే ‘శుద్ధాత్మనిష్ఠులు’.
జీవన్ముక్తుడు : ఎవ్వరైతే స్వీయకల్పితములే అయినట్టి 24 తత్త్వములను (పంచకర్మేంద్రియములను, పంచజ్ఞానేంద్రియములను, పంచ-పంచ కర్మేంద్రియ జ్ఞానేంద్రియ విషయములను, అంతరంగ చతుష్టయమును = 5+5+5+5+4) పరిత్యజించి 25వది అగు స్వీయ కల్పిత జీవాత్మాఽహమత్వమును 26వదియగు ‘పరమాత్మాఽహమ్’ తత్త్వముగా నిశ్చయముతో దర్శిస్తాడో…. ఆతడు ‘జీవన్ముక్తుడు’ అగుచున్నాడు.
తనయందలి అంతర్లక్ష్యమగు పరమాత్మత్వము యొక్క దర్శనముచే జీవన్ముక్తత్వమును అధిగమించినవాడై తనకు తానే - తన స్వస్వరూప ధ్యానమే) - అంతర్లక్ష్యముగా స్వీకరించి, అఖండ మండలాకారుడు, చరాచరవ్యాప్తుడు అగు పరమాత్మస్వరూపుడుగా అగుచున్నాడు.
2.) ద్వితీయ బ్రాహ్మణము - పరమాత్మతో మమేకత్వము, అభిన్నత్వము
యాజ్ఞవల్క్యుడు : హే భగవాన్! ఆదిత్యమణ్డల పురుషన్! అంతర్లక్ష్యము, అద్దాని యోగము ఇత్యాదిమార్గములలో మమేకమవటము గురించి మహత్తరమగు విషయాలు చెప్పుకొస్తున్నారు. ఇంతవరకు మేము మా యొక్క చేరవలసిన స్థానము భక్తి-యోగ-జ్ఞానముల లక్ష్యము బాహ్యమున (కైలాస శివుడనో, వైకుంఠ నారాయణుడనో, ద్వారకా కృష్ణుడనియో సహస్ర దళమండప పరాశక్తి అనియో) ఎక్కడో ఉన్నదను భావనతో సాధనలు కొనసాగిస్తూ వస్తున్నాము. ఇప్పుడు జీవాత్మ స్వరూపము అంతర్లక్ష్యమగు పరమాత్మ తత్త్వమేనని, స్వస్వరూపమునందు మా జీవాత్మను లయింపజేయుటయే శాంభవీముద్రకు దారిచూపు తారక యోగమని చెప్పుచూ వస్తున్నారు.
అంతర్ - బహిర్ అఖండ జ్యోతి స్వరూపమునందు జీవాత్మజ్యోతిని ‘మమేకము’ చేయు మార్గమును చెప్పుచున్నారు. మీరు చెప్పునది మహత్తరమగు సోహమ్ నిర్వచన పరతత్త్వమే! అయితే మీరు చెప్పుచున్న మార్గము గురించి నేను ఇంకా ఎరుగవలసినంతగా ఎరిగి ఉండిలేదని నాకు అనిపిస్తోంది. అందుచేత యోగి, ఈ ’జగత్ - జీవాత్మ’లను స్వస్వరూప పరమాత్మయందు మమేకము చేయటము గురించి మరికొంత వివరించ ప్రార్థన.
ఆదిత్య భగవానుడు : సరే! విను! ఈ కనబడే దృశ్యమంతా సూక్ష్మ పంచ మహాభూత చమత్కారము! ఈ విధంగా పంచమహాభూత సముదాయమే ఈ విరాట్ దృశ్య మూలకారణము. అద్దానియందు ప్రకాశమానమగు ద్రష్ట-దర్శన-దృశ్య త్రికూటము కల్పనామాత్రమై ప్రదర్శితమగుచున్నది.
అద్దానిని ఆశ్రయించి చతుః పీఠము (జాగ్రత్-స్వప్న-సుషుప్తి-తురీయములు; మనో-బుద్ధి-చిత్త-అహంకారములు) ప్రదర్శమానమగుచున్నది.
ఆ చతుః పీఠము మధ్యగా ‘తత్త్వ ప్రకాశము’ ఉన్నది. అట్టి తత్త్య ప్రకాశమగు ఆత్మ అత్యంత గూఢమైనది. తదితరమైన వస్తువులు - మనోబుద్ధులు మొదలగు వాటి వలెను, జాగ్రత్ స్వప్న సుషుప్తుల వలెను, తెలియవచ్చునది కాదు. అత్యంత సూక్ష్మమైన బుద్ధికి మాత్రమే స్వీయ హృదయమున ‘అనుభవము (An Experience that is logically enjoyable) రూపమున తెలియవచ్చేది.
అవ్యక్తమైనది : మనో-బుద్ధి-చిత్త-అహంకారములను, జాగ్రత్-స్వప్న-సుషుప్తులను, త్రిగుణములను, భావ-అభావములను … ఇవన్నీ వ్యక్తీకరిస్తూ తాను మాత్రము సర్వ వ్యక్తీకరణములకు ఆవల ఆవ్యక్తమై ఉన్నది. అందుచే అది తెలియబడుట లేదు. తెలుసుకొనుచున్నదే అది కాబట్టి!
ఈ విధంగా ప్రతి జీవుడు ఇంద్రియ-మనో-బుద్ధి-చిత్త-అహంకారముల ద్వారా అనేక - అసంఖ్యాక విషయములను తెలుసుకొంటున్నాడు. మరి ఆత్మయో? అది తెలియబడేది కాదు. ఎందుకంటే 1. తెలియబడుతూ ఉన్నది 2. తెలుసుకొనువాడు ఈ రెండూ అద్దాని - వ్యక్తీకరణమై తాను అవ్యక్తరూపమైయున్నది కాబట్టి! ఆత్మ తెలుసుకొనుచున్న వానికి సాక్షి అయి ఉండటం చేత జనన స్థానమై ఉండటం చేత…. తెలుసుకొనుచున్నవానిచే తెలియబడటము లేదు.
యాజ్ఞవల్క్యుడు : ఆశ్చర్యము, ‘తెలుసుకొనుచున్న వాడు- తెలియబడునది’.. అను రూపములలో హృదయాకాశమున వ్యక్తీకరణము అగుచు, తాను అవ్యక్తమయి ఉంటున్న తత్త్వస్వరూపమగు (తానే అదై ఉన్న) ఆత్మను తెలుసుకోవటము ఎట్లా? ’అవ్యక్తము’ను ఎరుగునది ఏది? ఏ విధంగా?
ఆదిత్య మండల పురుషుడు (సూర్యభగవానుడు) : అవును? అందుకే ‘సో అతి గూఢ, అవ్యక్తశ్చ’ అని ఆత్మజ్ఞులచే చెప్పబడుతోంది కదా!
ఈ దృశ్యము ఇంద్రియములకు తెలియబడుతోంది కనుక ఇది ఇంద్రియముల వ్యక్తీకరణము.
ఇంద్రియములు ఇంద్రియార్థములచే ఉపయోగించబడు భౌతిక ఉపకరణములు. కనుక ఇంద్రియములు ఇంద్రియార్ధములచే
వ్యక్తీకరణములు.
ఇంద్రియార్థములు మనస్సు యొక్క ఉపకరణములు. కనుక, మనస్సు యొక్క వ్యక్తీకరణమే ఇంద్రియార్థములు.
మనస్సు జీవాత్మ యొక్క వ్యక్తీకరణము కనుక జీవాత్మ యొక్క ఉపకరణము.
జీవాత్మ ఎద్దాని ఉపకరణమో అది పరమాత్మ!
అట్టి పరమాత్మను వ్యక్తీకరించునది మరొకటిదీ లేదు. కనుక ‘అవ్యక్తము’ అని చెప్పబడుతోంది.
అట్టి పరమాత్మయందే జీవాత్మ - జగత్తులు (తెలుసుకొనుచున్నవాడు- తెలియబడుచున్నది - ఈ రెండూ) వ్యక్తీకరించబడుచున్నాయి.
అట్టి పరమాత్మయే తెలుసుకొనవలసిన అంతర్లక్ష్య వస్తువు. ఏ జీవాత్మగా మనము ఈ జగత్ దృశ్యమును తెలుసుకొంటున్నామో ఆ జీవాత్మ ద్వారా పరమాత్మను (తన నియామకుని) తెలుసుకోయత్నిస్తున్నాము. సూర్యకిరణము సూర్యుని తెలుసుకోవాలను రీతిగా!
అందుచేతనే ‘అంతర్లక్ష్యమగు అవ్యక్త స్వరూప పరమాత్మ అత్యంత నిగూఢమైనది. రహస్యమైనది’ అని మనము చెప్పుకోవటం జరుగుతోంది. పోనీ, ‘తెలియబడనిది’ అని ఊరుకుందామా? లేదు. అది తెలుసుకో యత్నించువాని స్వకీయ బోధ రూపమే! అట్టి స్వస్వరూపమే ‘శాస్త్రములు’. (అధ్యాత్మ శాస్త్రము-వేదాంత శాస్త్రము)అయి, సత్యద్రష్టలచే తెలుపబడుతోంది కదా! అద్దానిని తెలుసుకోగలము కాబట్టే మనిద్దరము అద్దాని గురించి సంభాషించుకుంటున్నాము. ‘అద్దానిని ఎరగటము ఎట్లా?’ అని అడిగావు కదా! విను.
తత్ జ్ఞాన ప్లవ అధిరూఢన జ్ఞేయమ్।
ఓ యాజ్ఞవల్మ్యా! అట్టి ‘అంతర్లక్ష్యము - శాంభవీ ముద్రారూపము-పరమాత్మ మొదలైన విశేషాలుగా చెప్పుకొంటున్న బ్రహ్మమును ‘జ్ఞానము’ అనే ‘పడవ’ను అధిరోహించి దర్శించుటచే జ్ఞేయముగా (తెలియబడునదిగా) అగుచున్నదయ్యా!
తత్ బాహ్య –అభ్యంతర లక్ష్యమ్।
అట్టి పరబ్రహ్మమే బాహ్య అభ్యంతర లక్ష్యము. అనగా తెలుసుకొంటున్న వానిని (One who is knowing) తెలుసుకోవటమే బాహ్య అభ్యంతర లక్ష్యము.
తత్ మధ్యే జగత్ లీనమ్।
ఏది తెలియబడుచూ ’జగత్’ అను శబ్దముచే ఉద్దేశించబడుచున్నదో, అట్టి ఇదంతా ఆ తెలుసుకొంటూ ఉన్న ద్రష్టయొక్క స్వస్వరూపమగు ఆత్మ తత్త్వమునందే లీనమైయున్నది.
తత్ నాద బిందు కలాతీతమ్।
అయ్యది నాదము (శబ్దము - Sound - Letters)కు అతీతమైనది. ధ్యానమునందు ఒక బిందువుగా లక్ష్యము అగుచున్న దానికి కూడా వేరై, అతీతమైనది. అది భావన - భావించబడు ’కల’కు కూడా (రూపములకు కూడా) అతీతమైయున్నది. నామరూపాత్మకమైనది కాదు. కనుక కలాతీతము.
అఖణ్డ మండలమ్
అది నీవు-నేను-జగత్తుగా గాని, ద్రష్ట-దర్శన-దృశ్యములుగా గాని, జీవాత్మ-ఈశ్వరుడు-పరమాత్మగా గాని, ధ్యానించువాడు-ధ్యానము-ధ్యానింపబడునదిగా గాని విభజనమవటము లేదు. అందుచేత ఆ అంతర-బహిర్లక్ష్యములగు పరమాత్మ అఖండ మండలాకారము (Indivisible and Un-Partitioned Sphere) అయి, సర్వచరాచరములలోను-సర్వచరాచరములుగాను వ్యాపించి ఉన్నదై (వ్యాప్తమ్ ఏన చరాచరమ్).. సర్వతత్త్వమై విరాజిల్లుచున్నది. అదియే సర్వజీవుల యొక్క - నీయొక్క - నాయొక్క పీపీలికాది బ్రహ్మపర్యంతము మనందరి యొక్క అఖండ స్వస్వరూపమై ప్రకాశించుచున్నది.
తత్ సగుణ-నిర్గుణ స్వరూపమ్।
ఆ స్వస్వరూప పరమాత్మయే సగుణ-నిర్గుణ స్వరూపమై దృష్టికి గోచరమగుచున్నది.
తత్ వేత్తా విముక్తః।
ఓ యాజ్ఞవల్క్యా! అట్టి స్వస్వరూపాత్మ గురించి తెలియనంత వరకు (అంతర్-బహిర్లక్ష్యము యొక్క తత్త్వము అవగాహన కానంతవరకు) బంధము తొలగదు. అద్దాని గురించి తెలిసిన తర్వాత బంధమే లేదు. అదియే ‘విముక్తి’గా చెప్పబడుతోంది.
శాంభవీ లక్షణమ్ (ఆత్మ లక్షణమ్)
మొట్టమొదట అగ్ని మండలము (శక్తి).
తదుపరి సూర్యమండలం (ప్రజ్ఞ).
అద్దాని మధ్యగా.. చంద్రమండలము! (సుధారూపము. చిత్తమండలము).
తన్మధ్యే అఖణ్డ తేజో మండలమ్। అద్దాని మధ్యగా అఖండ బ్రహ్మ తేజో మండలము - అఖండాత్మ తత్త్వము.
అట్టి అఖండ తేజో మండలము విద్యుత్ కాంతి వలె తెల్లని ప్రకాశమానమై ఉంటుంది.
ఇదియే శాంభవీ ముద్ర యొక్క ముఖ్య - లక్షణము.
అట్టి అఖండ తేజోమండల సందర్శనమే ‘తిప్రోదృష్టి’ లేక ‘అంతర్దృష్టి’ లేక ‘ఆత్మదృష్టి’.
తత్ ప్రతిపత్ పూర్ణిమాచేతి। అది అనేక తటాకములలో ప్రతిబింబిస్తూ ఆకాశములోనే ఉండి విహరిస్తున్న పూర్ణ చంద్ర బింబము వంటిది. ఆ అఖండ బ్రహ్మ తేజో మండలము నిప్పు యొక్క మెరుపు వంటిది. (నీవారశూకవత్ తన్వీ।).
తత్ దర్శనమ్
అద్దానిని కొందరు త్రిశ్రోదృష్టిచే బ్రహ్మ-విష్ణు-మహేశ్వరులుగా ధ్యానిస్తున్నారు.
మరికొందరు పూర్ణ ప్రతిపత్తి (స్వబుద్ధి) రూపమగు పూర్ణానంద తత్త్వముగా ఆరాధిస్తున్నారు.
ఇంకొందరు యోగులు కళ్ళు మూసుకుని ‘సోఽహమ్-అదియే నేను కదా!’ అను భావనతో ఉపాసిస్తున్నారు.
పరమాత్మను అంతర హృదయ-అభ్రాంత మధ్య-హృదయాంతరంగునిగా మరికొందరు నమస్కరిస్తున్నారు.
ఆ పరతత్త్వమే కొందరు సగము మూసిన కనులకు (అర్ధనిమీలిత) లోపల అర్ధభాగముగా బయట మిగతా అర్ధభాగముగా ప్రకాశించుచున్నట్లుగాను చూస్తున్నారు. తత్ దృష్టితో దర్శిస్తూ సేవిస్తున్నారు. (చూచునది-కనబడునది అదే!)
పూర్ణానిమిలిత నేత్రములకు (పూర్తిగా కనులు తెరిచిన యోగికి) అయ్యిది బయట లోపల పూర్ణమై సాక్షాత్కరించుచున్నది.
అట్టి ఆత్మదర్శనమే శాంభవీలక్షణము. అట్టి పూర్ణాభ్యాసమే యోగ సాధకునికి ప్రమాణము - లక్ష్యము కూడా.
తత్ లక్ష్యమ్ నాసాగ్రమ్ : అట్టి ఆత్మవస్తువును ఉపాసించుటకై లక్ష్య స్థానము నాసాగ్రము (ముక్కుకు ఉపరిభాగము మధ్య-ఆకాశము)గా గుర్తించబడి ధ్యానించబడుతోంది.
తాలు మూలస్థానము : మరొక ప్రదేశము (ఉపాసనా స్థలము) - తాలు మూలము (దవడ యొక్క ప్రారంభ స్థానము) అక్కడ గాఢ తమస్సు (చిమ్మచీకటి) వలె యోగాభ్యాసులకు దర్శనమగుచున్నది. అద్దాని ఏకాగ్ర బుద్ధితో కూడిన అభ్యాసముచే యోగాభ్యాసవశంగా ‘అఖణ్డ మండలాకార జ్యోతి’ దృశ్యతే అనుభూతమగుచున్నది. అదియే సత్చిత్ ఆనంద పరబ్రహ్మముగా యోగాభ్యాసము చేత ఉపాస్యవస్తువై సిద్ధించుచున్నది.
ఎప్పుడైతే ఈ మనస్సు అట్టి సహజానందమునందు లీనమవుతుందో (ఏవం సహజానన్దే యదా మనోలీయతే), అప్పుడు ‘శాంభవి’ అను జీవబ్రహ్మైక్యము సిద్ధించుచున్నది. తదా శామ్భవీ భవంతి!
అట్టి ’జీవాత్మను పరమాత్మ యందు యోగాభ్యాస పూర్వకంగా ఐక్యము చేయుటము’ను ‘ఖేచరీ’ అని పిలుస్తున్నారు.
అట్టి ఖేచరీ అభ్యాసముచే ఈ జీవుడు ‘మనోస్థైర్యము’ పొందుచున్నాడు.
ప్రాణావాయువులు సంచలనము నిశ్చలమై, ‘వాయు స్థైర్యము’ పొందుచున్నాడు.
అట్టి మనస్సును తాలుమూలము (దవడ మూల ప్రదేశములో) కనిపించు ’గాఢ తమము’లో నిలిపి ఉంచు ‘శామ్భవీ మమేకత్వము’ (లేక) ఖేచరీముద్ర యోగము యొక్క యోగభ్యాసగతి.. ఎట్లా ఉంటుంది?
… క్రమాత్ దృశ్యతే! క్రమక్రమముగా కనిపిస్తూ వస్తుంది. ఆ తర్వాత పశ్చిమాభిముఖమై ‘శాంభవీముద్ర చిహ్నములు’ అగుపించసాగుతాయి.
తదేవ ప్రణవ స్వరూపమ్!
ఇట్టి యోగాభ్యాసము చేయుచున్నవానికి కర్మ-కర్మఫలములతో సంబంధము తొలగుచున్నది.
రవేత్ ఉదయాస్తమయయోః కిం కర్మ కర్తవ్యమ్?
లోకరీతిగా “సూర్యుడు ఇప్పుడు ఉదయిస్తున్నాడు. ఇప్పుడు అస్తమిస్తున్నాడు" - అని మాట్లాడుకుంటాము. సూర్యగోళస్థితి – భూమియొక్క భ్రమణముల చేత రాత్రింబవళ్లు ఏర్పడుచూ ఉన్నాయి కదా! రాత్రింబవళ్ల కర్తృత్వము సూర్యునికి ఉన్నదా? లేదు. వాస్తవానికి సూర్యుడు – ఉదయించటము లేదు. అస్తమించటము లేదు. సూర్యుడు లేకుంటే,…. ఉదయ-అస్తమయములు, పగలు-రాత్రులు ఉండేవే కావు. కానీ, సూర్యుడు ఉదయాస్తమయములకు కర్త కాదు.
అట్లాగే ఈ జీవుడు వర్తమానములో కర్తృత్వ-భోక్తృత్వములు పొందుచూ ఉండవచ్చుగాక! ఆది స్వరూపమగు ఆత్మను ఎరిగిన తరువాత (ఆదిత్యునికి సూర్యాస్తమయ కర్తృత్వ భోక్తృత్వములే ఉండని తీరుగా) ‘ఆత్మనగు నాకు కర్తృత్వ భోక్తృత్వములు లేవు’ అని ఎరిగి సర్వకర్మల అభావము పొందుచున్నాడు.
కుంభక ప్రాణాయామము అభ్యసిస్తూ, మనో బుద్ధులను ఏకాగ్రంచే, అంతర్జ్యోతిని దర్శించుచున్న యోగి పట్ల శబ్దము-కాలము..రెండూ లయమును పొందినవగుచున్నాయి. ఆతడు ఆ రెండింటికీ అతీతుడగుచున్నాడు.
ఆత్మయొక్క సర్వపరిపూర్ణ (పూర్ణచంద్ర) జ్ఞానముచే ఆలోచనారహిత మనోరూపమగు ఉన్మనీ అవస్థ (జగత్ రహిత కేవలీమనోస్థితి) మాత్రమే శేషించుచుండగా, ఇక ఆతడు ‘జీవబ్రహ్మైక్యస్థితి’ లేక ‘బ్రహ్మైక్యము’ పొందినవాడగుచున్నాడు.
ఆత్మభగవానుని పూజ
ఓ యాజ్ఞవల్క్య మహాశయా! ఆత్మ భగవానుని పూజించటం ఎట్లాగో.. మహనీయులగు ఆత్మతత్త్వజ్ఞులు గానం చేస్తున్న విశేషములను ఇప్పుడు మనము చెప్పుకొనుచున్నాము.
ఉన్మనీ - అమనస్క ఆత్మ తత్త్యోపాసకుడగు యోగి యొక్క ఆత్మదేవ పూజ :-
ఇతి ఏవం వేద। అని తెలుసుకొనబడి ఉండునుగాక!
ఇదియే ఆత్మభగవానునికి ఆత్మసంయమయోగి యొక్క ఆత్మపూజా విధి.
ఈ విధమైన భావన-ధ్యానములచే… ద్రష్ట-దర్శన-దృశ్య త్రిపుటిని అధిగమించివేసి నిస్తరంగ (తరంగ రహిత) సముద్రమువలె, గాలి వీచని చోట నిశ్చల దీపమువలె, భావ-అభావములను దాటి (వాటిని సాక్షిత్వము వహించి), అచల-సంపూర్ణ-కేవలీ (ఆత్మ) జ్యోతి స్వరూపుడు అగుచున్నాడు.
ఈ జీవుడు అట్టి సాధనచే జాగ్రత్-నిద్రలకు ఆవల సర్వదా ప్రకాశించుచున్నట్టి స్వస్వరూప పరిజ్ఞానము పొంది ’బ్రహ్మవిత్’ అగుచున్నాడు.
అటుపై మనస్సు లయించగా ఈ జీవుడు కేవల పరబ్రహ్మ స్వరూపుడై ఆత్మానందముగా శేషించుచున్నాడు. బ్రహ్మవేత్త బ్రహ్మమే అయి ప్రకాశించుచున్నాడు.
🙏🙏🙏
సుషుప్తి స్థితి మరియు సమాధి స్థితి యొక్క వ్యత్యాసము
యాజ్ఞవల్క్యుడు : మహాత్మా! ఆదిత్యమండల ప్రభూ! బ్రహ్మ-విష్ణు-శివాత్మకా! ఆదిత్య దేవాదిదేవా! ఇప్పుడు నాదొక సందేహము.
మనస్సు లయిస్తే ఈ జీవుడు జీవాత్మత్వమును అధిగమించి పరమాత్మత్వమును సంతరించుకొంటున్నాడని మీరు శెలవిచ్చుచున్నారు కదా! ‘ఈ జీవుడు గాఢనిద్రలో ఉన్నప్పుడు ఈతనికి మనస్సు ఉండదు కదా! కనుక, “సుషుప్తి స్థితిలో ఈ జీవుడు పరమాత్మ స్వరూపుడే అయి ప్రకాశించుచున్నాడు" - అని అనవచ్చునా? అది యుక్తియుక్తమేనా? గాఢ నిద్రాస్థితి (సుషుప్తి) - పరమాత్మ స్వరూపస్థితి ఒక్కతీరైనవేనా? కాదా?
ఆదిత్య భగవానుడు : కానే కాదు. యుక్తియుక్తము ఏమాత్రమూ కాదు.
సుషుప్తి-సమాధ్యోః ‘మనోలయా’ - విశేషేఽపి, మహదస్తు ఉభయో భేదః।
నీవు చెప్పినట్లుగా సుషుప్తి - సమాధి స్థితులలో మనస్సు లయిస్తుందను మాట నిజమే కానీ, సుషుప్తి-సమాధి స్థితులు పూర్తిగా వేరువేరైనట్టివి! చాలా భేదము ఉన్నది.
సుషుప్తి :- ఇందులో మనస్సు తమస్సునందు లీనమగుచున్నది. ముక్తి హేతువులేవీ ఈ స్థితిలో భావించబడవు. ఎందుకంటే ఇది జడ అభావస్థితి. ఇక్కడ జాగ్రత్-స్వప్నములకు సంబంధించిన సంస్కారములు అప్రదర్శితముగా మాత్రమే ఉన్నాయి. అంతేగాని అవి ఏ మాత్రం తరగనూ లేదు. రహితము కానూ లేదు. మరల సుషుప్తి నుండి బయల్వెడలుచుండగా సంస్కారములు కూడా మౌనమును త్యజించి మనస్సును అనుసరించినవై జగదనుభవములకు మూలకారణమవటమును కొనసాగిస్తున్నాయి. గాఢనిద్రలో చాటుగా ( అప్రదర్శితంగా, Latent and Inherently) ఉన్న జగత్ సంస్కారములు జాగ్రత్ -స్వప్నములలో రెక్కలు విప్పి విజృంభిస్తున్నాయి. అంతేగాని, అట్టి సంస్కారములు ఆత్మభావనయందు లయమైపోవు సందర్భము (గాఢ నిద్ర) కాదు.
సమాధి :- సమాధి స్థితిలో తమోవికారములన్నీ ఆత్మరూపమును సంతరించుకుంటున్నాయి. తమోవృత్తులు అఖండాకారమగు సాక్షి చైతన్యములో ప్రవేశించగా, ‘ప్రపంచ లయము’ సంభవిస్తుంది. అనగా ప్రపంచము ప్రపంచముగా కాకుండా ఆత్మస్వరూపమై అనుభూతమగుచున్నది. ‘బంగారమే ఆభరణముగా ఉన్నది’ అని స్వర్ణ దృష్టి కలవానికి తెలియుచున్నట్లే, సమాధి నిష్ఠునికి ‘ఆత్మయే జగత్ రూపముగా ఉన్నది’.. అని స్వభావసిద్ధంగా అనుభూతమవుతుంది. “అహమేవ ఇదమ్ సర్వమ్” అను ఆనంద భావనతో ఇదంతా ఆస్వాదిస్తూ ఉంటాడు.
ఈ జగత్ బంధము కల్పిస్తున్నది ఎవరు?
యాజ్ఞవల్క్యుడు : అసలు అనేక బంధములకు ఆలవాలమగు ఈ ప్రపంచము ఎవరిచే కల్పించబడి జీవుని నిబద్ధునిగా చేసివేస్తోంది? అట్లా ఈ జీవుని నిబద్ధితునిగా చేయటము చేత, వారు పొందే ప్రయోజనము ఏమిటి?
ఆదిత్య భగవానుడు : ఓ యాజ్ఞవల్క్యా! ఇక్కడి జీవుని యొక్క బంధము-అనుబంధము-సంబంధము-మోక్షము ఇవన్నీ కూడా ఆతని మనోకల్పితమేగాని, మరొకరెవరో బయట దూరంగా ఉండి, ఈతనికి ఇక్కడ కల్పించుచున్నట్టివి కానే కావయ్యా! మనస్సుచే కల్పించబడే ‘కల్పన’ సర్వదా ఒక్కటే అయి ఉన్నది. కాబట్టి, ‘సర్వబేధములు సమాధిస్థితియందు అభావించబడినవి’గా అగుచున్నాయి. ఒకవేళ అట్టి సమాధి నిష్ఠుని పట్ల దృశ్యజగత్తు కొన్ని సమయములలో అనుభవరూపముగా సంభవించినప్పుడు కూడా. ఆ యోగి, ‘ఇదంతా స్వతఃగానే మనోకల్పనయే కదా!’ అని ఎరిగియే, ఇందలి విశేషములన్నీ మిథ్యాత్వ భావనచేతనే రూపుదిద్దుకుంటున్నాయని గమనిస్తూనే వీటిని దర్శించుచున్నాడు. అందుచేత ఈ కనబడేదంతా కలలోని విశేషాలతో సమానంగా చూస్తూ భేదబుద్ధికి తావు ఇవ్వటము లేదు.
కలలో కనిపించిన కొండరాయికి - రత్నాల హారమునకు భేదమేముటుంది? ఎవ్వరైతే “ఈ దృశ్యమునంతటినీ - పరబ్రహ్మముయొక్క (లేక) సదానందతత్త్వము యొక్క సంప్రదర్శనమే” అని సందర్శిస్తాడో, ఆతడే బ్రహ్మవేత్త! ఆతడే సమాధినిష్ఠుడు! అట్టి ఎరుకచే ఆ బ్రహ్మవేత్త బ్రహ్మమే అయి ప్రకాశించుచున్నాడు.
యస్య సంకల్ప నాశ స్యాత్, తస్య ముక్తిః కరే స్థితే।
ఎవ్వరి పట్ల సంకల్పములన్నీ బ్రాహ్మీభావనయందు లయించినవై ఉంటాయో, ఆతని పట్ల ‘ముక్తి’ అనునది అరచేతిలోని నిమ్మపండు వంటిది అగుచున్నది.
కనుక ఓ యాజ్ఞవల్మ్యా! ఈ పాంచభౌతిక జగత్తు గురించిన భావ-అభావములను పరిత్యజించినవాడవై ఉండు.
“అఖండమగు పరమాత్మయే ఇదంతా! అఖండ ఆత్మస్వరూపుడనే నేను! ఇదంతా అఖండమై నా స్వరూపమునకు అభిన్నంగా ప్రకాశించుచున్నది. సూర్యునకు సూర్యకాంతి పుంజములకు భేదమే లేనట్లు, నాకు - ఈ జగత్తుకు భేదమే లేదు”.. అను అనునిత్యధ్యానమును వదలకయే ఈ జగత్తులో సంచరించు.
అట్టి అఖండ-అప్రమేయ, సర్వ బాహ్య - అభ్యంతర స్వరూప, నిర్గుణ - సగుణ ప్రదర్శక ’పరబ్రహ్మము’ను ఎరిగిన తరువాత.., ఇక ఆపై ఆతడు జ్ఞానము-జ్ఞేయము (తెలుసుకోవటం-తెలియబడునది), ధ్యానము-ధ్యేయము (ధ్యానించటం-ధ్యానము చేయబడునది).
లక్ష్యముగా కలిగి ఉండవలసినది - అలక్ష్యము చేయవలసినది, ద్రష్ట (చూచువాడు) - దృశ్యము (చూడబడునది), ఊహ - అపోహ మొదలైన ద్వంద్వములన్నీ స్వభావసిద్ధముగానే పరిత్యజించుచున్నాడు. ఆ చర్చ అంతా ‘అఖండాత్మాఽహమ్’ సమక్షంలో మౌనము దాల్చుచున్నది.
ఓ యాజ్ఞవల్యా। ఓ ప్రియజనులారా। అఖండ - అప్రమేయ స్వస్వరూప ధ్యానము - జ్ఞాపకములే ’సమాధి నిష్ట’ అని గ్రహించెదరుగాక. ధ్యాని - ధ్యానవస్తువై ప్రకాశించటమే సమాధి స్థితి।
జీవుని పంచ అనుభవ స్థితులు
యాజ్ఞవల్క్యుడు : మహాత్మా! ఈ జీవుడు అనునిత్యముగా పొందుతున్న అవస్థల గురించి వివరించమని నా విన్నపము.
ఆదిత్య భగవానుడు : అవును. ఈ జీవుడు అనునిత్యముగా ‘5’ అవస్థలు కలిగినవాడై ఉంటున్నాడు.
జాగ్రత్
జాగ్రత్ ప్రవర్తనుడగు ఈ జీవుడు ‘ప్రవృత్తి’ మార్గమునందు ఆసక్తుడై ఉంటున్నాడు. ఎప్పుడో ‘నాకు సుఖము కలిగించే స్వర్గలోకము లభించాలి. అందుకు శుభకర్మలు చేయాలి మరి! దుఃఖము కలిగించే నరక కర్మలు వద్దు. అందుచేత పాపకర్మలు చేయకూడదు కదా!’ అని కాంక్షిస్తూ ఉండసాగుచున్నాడు. ఈ విధంగా సుకృత-దుష్కృత, విహిత-నిషిద్ధకర్మలు-కర్మ భావములలో జాగ్రత్ గడిచిపోతూ ఉంటుంది.
అట్టి స్వభావతః ప్రవృత్తిమార్గములో ఉన్న ఈ జీవుడు "ఎన్నాళ్లని ఈ ఇంద్రియ విషయములను నమ్మి ఉంటాము? ఇంద్రియములు స్వభావతః కొన్ని రోజులకు తేజస్సు కోల్పోతూ ఉంటాయి కదా! వీటిని నమ్మి ఉండటంలో ఏమి గొప్ప?”.. అని వైరాగ్యమును స్వీకరించటం ప్రారంభిస్తున్నాడు. ’కర్మలు-కర్మఫలముల వ్యవహారమంతా ఇకచాలు! ఇవన్నీ బంధమేగానీ సుఖము కాదు. పుట్టటం-చావటం, ఇంతకుమించి మరింకేమీ లేదా? నేను బద్ధుడనుగానే జీవితం గడుపుచున్నానే! సంసార బంధములు తొలగేది ఎట్లా? ఉపాయములేమిటి?” అని ప్రశ్నించుకొంటున్నాడు. విముక్తి గురించి యోచించ ప్రారంభిస్తున్నాడు. ప్రవృత్తి నుండి కొంచెం కొంచెం వెనుకకు మరలటమునకు సిద్ధపడుచున్నాడు. నివృత్తి మార్గమును ఆశ్రయించటమునందు ప్రవృత్తుడగుచున్నాడు.
అప్పుడిక సంసారము నుండి తరించుటకొరకై విజ్ఞుడు ఆత్మజ్ఞుడు-నిత్యానిత్యవివేకము కలిగిన వారు అగు గురువును - ఆశ్రయించుచున్నాడు.
ఆ యొక్క క్రమములో…,
ఇప్పుడు ఇక కళ్లుమూసుకుని ధ్యానమునకు సిద్ధమగుచున్నాడు.
హృదయ కమల మధ్యలో సర్వదా వేంచేసియున్నట్లుగా సూచించబడుచున్న శాస్త్ర విభాగములను పరిశీలిస్తూ యోగభ్యాసము ద్వారా ‘అంతర్లక్ష్యము’ కొరకై ధ్యాన-యోగాది యత్నములు చేయుచున్నాడు.
క్రమంగా తనయందలి పరతత్త్వమును అనుభూతపరచుకోవటం ప్రారంభించుచున్నాడు.
యోగ-జ్ఞాన-భక్తి మార్గముల ప్రయత్నముచే తన యొక్క ఇహ స్వరూపమునకు ఆవల ఇహస్వరూప ఉపకరణధారుడగు స్వకీయ పరస్వరూపమును తెలుసుకొని, దర్శిస్తూ మమేకమగుచున్నాడు.
‘నేను సర్వదా పరబ్రహ్మ స్వరూపుడనే కదా!’.. అను రూపము గల బ్రహ్మానంద స్మృతిని పొందనారంభిస్తున్నాడు.
“ఏక ఏవాహమ్-అద్వితీయః”! అని ఎలుగెత్తి తనను గురించి తానే గానం చేస్తున్నాడు.
స్వప్నములో అనేకములు కనబడవచ్చుగాక! వారంతా స్వప్నద్రష్టయొక్క ఒకే స్వప్నకళానైపుణ్య ప్రదర్శనమేకదా! అట్లాగే, ఈ జీవుడు తన జాగ్రత్ చైతన్యకళా ప్రదర్శనమునే జాగ్రత్‌గా పొందుచున్నాడు.
“జాగ్రత్ అంతా ’ఏకము - అద్వితీయము’ అగు నేనే!” .. అనే మహావాక్యార్థము యొక్క అర్థ-తాత్పర్యములను తన హృదయమున పదిలపరచుకొని ఈ జగత్తులో యధా సందర్భానుసారంగా చరిస్తున్నాడు.
ఆతని జీవ-బ్రహ్మైక్య అఖండభావనను మనము చెప్పుకోవటానికి మాటలు చాలవయ్యా! జాగ్రత్‌లో కనిపిస్తూ, కేవలమగు ఆత్మయందు సంస్థితుడై ఉన్నవానికి ఇక్కడ జాగ్రత్ స్వప్నము వంటిదే అగుచున్నది.
స్వప్నము
ఈ జీవుడు కొంత సమయము జాగ్రత్‌ను విస్మరించి అజ్ఞానవృత్తిని ఆశ్రయించి, జాగ్రత్ వాసనలలో కొన్నింటిని ఫలదీకరించుకొని ‘నేను తేజసుడను’ అని అనుకుంటూ స్వప్నదర్శనమునకు పరిమితుడై ఉంటున్నాడు.
అందుచేత, స్వప్నము సమయములో ‘స్వప్నము సత్యమే’ - అనియే ఆ ద్రష్ట భావన కలిగి ఉంటున్నాడు.
‘స్వప్న దృశ్యము’ - అప్పటికి జాగ్రత్ జగత్తు వంటిదే!
స్వప్న సమయంలో - స్వప్నదృశ్యము సత్యము, జాగ్రత్ దృశ్యము అసత్యము.
స్వప్నములోని “నేను” జీవాత్మ వంటిదే! జాగ్రత్తులోని “నేను” వంటిదే!
స్వప్నము నాదైన “నేను” - స్వప్నమునకు బాహ్యమున సర్వకారణుడై ఉన్నాడు కదా! అందుచేత స్వప్న ద్రష్ట - ’పరమ్’ (ఆవల ఉన్న) ఆత్మ స్వరూపుడే!
సుషుప్తి
జాగ్రత్-స్వప్నములు రెండు అవస్థలను త్యజించినప్పటి అవస్థా బేధరహిత స్థితి - ‘నేను ప్రాజ్ఞుడనై ఉన్నాను’ అని తలచి విషయ రహిత కేవల - ప్రాజ్ఞత్వమును పొందుచున్నాడు.
ప్రాజ్ఞు చైతన్యము నుండే (అనగా) గాఢ నిద్రావస్థ నుండియే జాగ్రత్ బయ్యల్వెడలటము తిరిగి విలీనము పొందటకు జరుగుతోంది. అట్లాగే స్వప్నము కూడా!
అందుచేత సుషుప్తి అవస్థ - జాగ్రత్ స్వప్నములకు జనన-లయ స్థానములు - అని చెప్పబడుతోంది.
తురీయము
త్రి అవస్థల తరువాత నాలుగవది - తురీయము (చతురీయము).
ఇది జాగ్రత్-స్వప్న-సుషుప్తులలో “సంచారము చేయుచున్న నేనైన ‘నేను’!”. జాగ్రత్ స్వప్న సుషుప్తలు తనవైయున్న స్వస్వరూపము.
తురీయాతీతము - తురీయాతీతుని స్వాత్మ గానము
ఇది తురీయత్వము తనదై ఉన్నట్టిది కేవల మౌనస్వరూప ’నేను’.
సుషప్త్యవస్థలో విశ్రమించి బ్రహ్మానందము పొందుచున్న “నేనైన నేను”కు కూడా ఉత్పత్తి స్థానము.
తురీయాతీత అవస్థ ఆస్వాదించు ’నేను’ యొక్క భావన ఏ విధంగా ఉంటుందో, విను….!
↳ ‘హృదయ మధ్యభాగములో సత్తా (THE SENSE THAT “I” AM PRESENT) రూపమును.
↳ జాగ్రత్ స్వప్నములను తురీయము ద్వారా కల్పించుకొనువాడను!
↳ బ్రహ్మానంద స్వరూపుడనగు నేను అద్వితీయుడను.
↳ నాకు వేరుగా జాగ్రత్ స్వప్న సుషుప్తులు గానీ, వాటి వాటి అంతర్గత విషయాలు గాని లేవు.
↳ నేనే కొంత సమయము ఇంద్రియములను ఆశ్రయించి, ఆ ఇంద్రియముల ద్వారా విషయములను అనుభవిస్తూ, జాగ్రత్‌లో సంచరించుచూ ’నా స్వరూపము జాగ్రత్‌లో ఏదైతే కనిపిస్తుందో అది మాత్రమే’ అని తలచుచూ, పరిమితుడనై ఉండటము జరుగుతోంది. ఇదియే జాగ్రత్! ఆ తరువాత ఒక సమయములో జాగ్రత్ వాసనలను అంతరమున దాచివేసి, ‘జాగ్రత్’ నుండి వెనుకకు మరలుచున్నాను.
↳ అప్పుడు జాగ్రత్‌ను దాచి ఉంచి, స్వప్నమును ప్రదర్శించుకొనుచున్నాను. ఇతః పూర్వపు “జాగ్రత్” - “స్వప్న జాగ్రత్” వాసనలలో కొన్నిటిని సమకూర్చుకుని మనస్సుతో దృశ్యము కల్పించుకొని ఆ స్వప్న దృశ్యములో ప్రవేశించి ఆయా విశేషములు ఆస్వాదిస్తూ “స్వప్నములో ఏది కనపిస్తోందో - అద్దానికి బద్ధుడను, తేజసుడనైనాను. స్వప్న విషయములే, స్వప్న దృశ్యములే నా మొత్తము స్వరూపము”.. అని భావిస్తూ కొంత సమయము గడుపుచున్నాను. మరల స్వప్నమును త్యజిస్తూ స్వప్న సంస్కారములను నాయందు దాచుకొనుచూ.. వెనుకకు మరలుచున్నాను. ఇది నా యొక్క స్వప్న సంబంధిత వృత్తాంతము.
↳ మరికొంత సమయము ‘ప్రాజ్ఞుడను’ అయి, ‘సుషుప్తి’ అను ఏకో - ఏకాంత స్థితిలో ఉంటున్నాను. జాగ్రత్ - స్వప్న ఇత్యాది ఆయా విభాగములను (అందలి సర్వ విశేషములతో సహా) నాలోనే (సంస్కార దేహములో) దాచుకొని ఉన్నవాడనై, వర్తమానంలో మాత్రము జాగ్రత్-స్వప్న ఇత్యాది విభాగములు ‘ఏకత్వము’ అనుభవించుచున్నాను.
↳ ఆ మూడు స్థితులలో తురీయడనై ప్రవేశించుచూ, నిష్క్రమిస్తూ నా సంస్కార దేహపు తలుపులు మూయుట - తెరచుట చేస్తున్నాను.
↳ తురీయునికి కేవలసాక్షినైనట్టి తురీయాతీతుడను!
↳ వివేకముచే నా స్వరూపము ఎరిగిన వాడనై, తత్ సంబంధమైన వివేకముతో ‘న హి మత్ అన్యత్’ .. నాకు వేరైనది ఎక్కడా ఏదీ లేదు.. అని గమనించుచున్నాను.
↳ ‘శుద్ధ అద్వైత బ్రహ్మమే నేను’ అని గమనించి సర్వభేద వాసనలు విసర్జించి వేయుచున్నాను.
↳ సర్వత్రా మమస్వరూపముగా భావన చేయుచూ, జాగ్రత్-స్వప్న-సుషుప్తాంతర్గతమైనదంతా మమాత్మయొక్క తేజోవిలాసముగా మననము చేయటము, సందర్శించటము ప్రారంభిస్తున్నాను.
↳ అభిదా సర్వగస్థమ్ నిరస్య, స్వాన్త విజృమ్భిత భానుమండల ధ్యానః। భేద గంధములు - దృష్టులు- సంస్కారములు ఒక పాము యొక్క కుబుసమువలె విసర్జించి హృదయాంతరంగమునందు విజృంభిస్తున్న ఆత్మతేజో భాను మండల ధ్యానిగా అగుచున్నాను.
↳ పరబ్రహ్మాకార ముక్తిమార్గమ్ ఆరూఢః పరిపక్వో భవతి। ‘పరబ్రహ్మము’ అను ఆకారమును పొందినవాడనై ముక్తిమార్గమునందు ఆరూఢుడను అగుచున్నాను!
🙏🙏🙏
ఓయాజ్ఞవల్క్య మహాశయా!
ఈ విధంగా మననము చేస్తూ ఆ యోగి తురీయాతీత ధ్యానమునందు పరిపక్వత పొందినవాడుగుచున్నాడయ్యా!
‘అసలీ జీవునకు బంధము ఎట్లా సంప్రాప్తిస్తోంది?’ అని ప్రశ్నించుకుంటే, ‘సంకల్పించుట వలననే’ అనునది సమాధానము లభిస్తోంది. సంకల్పాదికం మనోబస్థహేతుః। ‘సంకల్పించుట! (Thought Provocation by visualization) అను క్రియాశీలతచే ఏర్పడు సంకల్ప పరంపరలే మనోబంధమునకు హేతువు. తత్ విముక్తం మనో మోక్షాయ భవతి। సంకల్పములను ఉపశమింపజేసి, వాటియొక్క సాక్షిని నిశ్చలధారణ చేస్తున్నప్పుడు మనోమోక్షము సిద్ధిస్తోంది. సంకల్పరహిత ధ్యానము ఆత్మ ధ్యానమే అగుచున్నది. ఈ విధముగా ‘బంధము-మోక్షము’ అనునవి మనస్సుకు సంబంధించినవి మాత్రమే (మనయేవ మనుష్యాణాం కారణం బంధమోక్షయో!) ఆత్మకు బంధమే లేదు. ఇక మోక్షము యొక్క అగత్యముగాని, ప్రసక్తిగాని ఆత్మకు ఏముంటుంది? ఈ జీవుడు మనో-పరిమిత స్వరూపుడా? కాదు. సర్వదా ఆత్మస్వరూపుడే! |
యాజ్ఞువల్క్యుడు : సంకల్పించటమును ఉపశమింపజేయుటమంటే ‘ఆలోచించటమే మానివేయాలి’ అని తమ ఉద్దేశ్యమా, స్వామీ?
ఆదిత్య భగవానుడు : అది కాదు. కళ్లకు కనిపిస్తున్న ఈ సాకార నామరూపాత్మక ప్రపంచమును వస్తు దృష్టితో కాకుండా ఆత్మదృష్టితో దర్శించటమునే - ‘మనోవృత్తి నాశనము’ అని అంటున్నారు. వస్తు దృష్టిని అధిగమించటమే సంకల్ప నాశనము. హృదయము నందు అనేకము అను దానితో కూడి జగత్ సంబంధిత సర్వ భేద సంకల్పములను యోగి “ఆత్మ అఖండ భావన" యందు లయింపజేయును గాక! సంయమింపజేసివేయును గాక!
(1) సర్వ నామ - రూప - గుణ భేద వాసనలు త్యజించటము.
(2) తన యొక్క జగదాత్మత్వమును ప్రశాంత - ఆనందములతో కూడి - దృశ్యరూపముగా ఆస్వాదించటమే అది!
ఈ జాగ్రత్తులో ప్రవర్తించుచూ, పాల్గొనుచున్న ద్రష్టత్వమును ఆవరించి వెంటనంటి తిరుగాడుచున్న ’అహమ్-మమ’ (నేను-నాది) .. అనే అహంకారముపై నిశ్శబ్దయుద్ధము ప్రకటించాలి. జయించివేయాలి.
త్యక్త్యా అహంకారో, ‘బ్రహ్మాఽహమస్మి’ ఇతి చిన్తయన్।
అహంకారమును త్యజించి, ‘నేను అఖండము-అప్రమేయము-సత్యము-నిత్యము అగు బ్రహ్మమును’ అని చింతన చేయాలి.
ఊర్ధ్వ బాహుః విరౌమ్యేష। ఇదమ్ సర్వమ్ యత్ అయమ్ ఆత్మా - ఇతి భావయన్।
చేతులెత్తి మనో-వాచా-కర్మణా ఎలిగెత్తి గానం చేయాలి. “ఈ కనబడేదంతా ఆత్మస్వరూపమే! మమాత్మస్వరూపమే!” అని సర్వదా భావన చేయాలి. అనుకుంటూ ఉండాలి! అనుక్షణం - అన్ని సందర్భములలోను తత్ భావనను భావన చేస్తూ ఉండాలి. ఇక అనిపించక ఏం చేస్తుంది? అట్టివాడు కృతకృత్యుడయ్యా!
ఏ యోగి అయితే తన హృదయాంతర్గత నిత్యోదిత ఆత్మజ్యోతిని - అఖండ మండలాకారముగాను, చరాచర వ్యాప్త నిత్యోదిత తత్త్వప్రకాశముగాను, సర్వ బాహ్య-అభ్యంతర స్థితమైనట్టిదిగాను ‘ఏకీభావి’ అయి ఉపాసిస్తున్నాడో.. అట్టియోగి సర్వ పరిపూర్ణ తురీయాతీత బ్రహ్మభూతుడు అగుచున్నాడు.
తమ్ బ్రహ్మేతి స్తువన్తి।
ఎవ్వడూ ఈ లోకములను లోకాంతర్గత సర్వప్రదర్వనములను ’పరబ్రహ్మమే’ అను రూపంగా స్వస్వరూప ప్రదర్శనానందుడై భావన చేస్తూ ఉన్నాడో, అట్టివాడు ‘బ్రహ్మవేత్తయే కాదు! బ్రహ్మమే!’.. అని స్తుతించబడుచున్నాడు.
స సర్వలోక స్తుతి పాత్రః।
ఆతడు సర్వలోకస్తుతి పాత్రుడు అగుచున్నాడు.
అంతేకాదు!
స సర్వలోక సంచార శీలౌ।
‘అహమేవ ఆత్మా’ - నేనే ఆత్మను - అను భావన చేతనూ సర్వలోకములు - జలములో…, జలతరంగాకారములవలె ఆత్మయందే ప్రక్షిప్తమై ఉండటం చేతనూ,….. ఆతడు సర్వలోకసంచారశీలుడే అగుచున్నాడు.
బిందోపాసన
పరమాత్మ గగనే బిన్దుం నిక్షిప్య।
ఏ యోగి అయితే శుద్ధ పరమాకాశమునందు బిందువును నిక్షేపించుచున్నాడో, ఆతడు అద్వైత - శుద్ధాద్వైతి.
అద్వైతము : పరబ్రహ్మమునకు (లేక) పరమాత్మకు (లేక) నా యొక్క (మరియు ప్రతి ఒక్కరి యొక్క) - అఖండ స్వస్వరూపమునకు వేరుగా ద్వితీయమై ఏదీ లేదు - అనునదే అద్వైతభావన! ‘జీవుడు బ్రహ్మమే’ అను సునిశ్చయత. జీవుడు-జగత్తులను సదా అఖండాత్మకు అభిన్నంగా అవగాహన - అనుభూతులను కలిగి ఉండటము.
శుద్ధాద్వైతము : అట్టి పరబ్రహ్మము - అఖండమే కాకుండా సర్వదా ద్వైత దోషము పొందనట్టిది. జీవాత్మగా అగుటలేదు. జగత్-జన్మ-కర్మలు అద్దానికి ఎప్పుడూ లేవు! కనుక ‘సర్వదా శుద్ధమే’ అని ఎరిగినవాడై ఉండటము.
ఓ యాజ్ఞవల్క్యా!
అట్టి శుద్ధాద్వైత పరమాత్మ బిందుతత్త్వమునందు - ఎట్టి జాడ్యము (బద్ధకము, అశ్రద్ధ) లేనివాడవై, సహజానంద-అమనస్కుడవై-యోగనిద్రను ఆశ్రయిస్తూ ఉపాసించుము.
అట్టి అఖండానన్ద పదమును అనువర్తిస్తూ, అద్దానిపట్ల ఏకవృత్తి కలవాడవై భావోపాసన చేస్తూ ఉండును.
అప్పుడు నీవు సందర్భసత్యముల నుండి విడవడి, సహజ సత్యమగు ఆత్మగా ఈ సర్వమును సందర్శిస్తూ, జీవన్ముక్తుడుగా అగుచున్నావు. యోగానంద సముద్రములోని తరంగరూపుడుగా - తరంగమగ్నుడుగా స్వభావ సిద్ధముగా అగుచున్నావు.
తత్ అపేక్షయా ఇన్దాయ స్వల్పానన్దాః।
అట్టి బిందు నిక్షిప్య - శుద్ధాం ద్వైత - అజాడ్య - సహజ - అమనస్క - యోగనిద్రా - అఖండానంద సముద్రము యొక్క కొన్ని జల బిందువుల స్వీకారముచే ఇంద్రుని ఇంద్రియానందము రూపము పొందుతోంది.
ఇక, ఈ సర్వము మమాత్మస్వరూపమే అగు ఆత్మతత్త్వానందమును పొందిన పరమయోగి యొక్క ఆనందము ఎట్టిదని చెప్పగలం? అవర్ణనీయం! అనిర్వచనీయం!
3.) తృతీయ బ్రాహ్మణము - అమనస్కము గురించి మరికొన్ని విశేషాలు!
యాజ్ఞవల్యమహాముని : హే భగవన్! మండల పురుషా! ’అమనస్కము’ గురించి మీరు సవివరంగానే చెప్పుచున్నారు. అయినా కూడా - బహుశః అనేక జన్మలుగా ఈ మనస్సు అనేక విషయములపై వ్రాలు అలవాటు చేత కాబోలు - అమనస్కము గురించి నాకు ఇంకా బోధ పడలేదని, ఇంకా కూడా మీ వద్ద ఇంకొన్ని విశేషాలు వినటము అవసరమని నాకు అనిపిస్తోంది.
ఉక్తమపి విస్మృతమ్ |
విస్మృతి అనే జాడ్యము గల జీవుడునగు నేను! ఇంకా మీ వద్ద వినటము అత్యవసరమని భావిస్తున్నాను.
పునః తత్ లక్షణమ్ బ్రూహి!
మరల అమనస్క లక్షణముల గురించి మరికొన్ని విశేషాలు వివరించ ప్రార్థన!
అఖణ్డ మండల ఆదిత్యపురుషుడు : ఈ ‘అమనస్కము’ బాహ్యలక్షణముగా కనబడేదికాదు. కళ్లు మూసుకొంటే కనబడేదీ కాదు. అందుచే ’అమనస్క యోగము అతిరహస్యమైనది’ - అని చెప్పుకోబడుతోంది. అయితే అమనస్కము యొక్క రహస్య తత్త్వార్థము తెలుసుకొన్నప్పుడే ఈ జీవుడు కృతకృత్యుడు కాగలడు.
‘అమనస్కము’ అనునది - ఉన్మనీ (జగత్ విషయరహిత కేవల మనో ఉపకరణము)ను ఉపయోగించి, అంతర్-హృదయాంతరంగుడగు పరమాత్మయందు జగత్ దృశ్యమంతా సందర్శించే శాంభవీ (లేక) ఖేచరీ ముద్రతో కూడిన సంయోగ ఏకత్వము.
కేవలసాక్షీ లక్షణముతో కూడిన మనస్సుతో పరమాత్మను సర్వమునందు సర్వముగాను చూస్తూ ద్రష్టత్వమును కూడా లయింపజేయు స్థితి.
అట్టి శాంభవీ-(లేక)-ఖేచరీ ముద్రాధ్యాయుడు పరమాత్మ యొక్క ప్రత్యయ లక్షణములను దర్శించుచున్నాడు. పరమాత్మభావనా సమేతుడై ధ్యాసను (భావనచే) ఆత్మయందు నిలిపి ఉంచటమే ‘అమనస్కము’.
అట్టి అంతర్లక్ష్య వస్తువు, అంతర్ బహిర్ వాస్తవస్వరూపుడగు ఆత్మయొక్క విశేష లక్షణములను గురించి ముందుగా కొంచెము చెప్పుకుందాము.
ఆత్మయొక్క విలక్షణ లక్షణములు
ఆత్మ సర్వలక్షణ విలక్షణము: వాస్తవానికి అలక్షణము. లక్షణములకు అతీతము. అయితే ప్రత్యయ లక్షణంగా ఆత్మ లక్షణముల గురించి కొన్ని విశేషాలు చెప్పుకొందాము.
సర్వేశ్వరః : సర్వదేహములలో జ్యోతిస్వరూపుడై వెలుగొందుచున్న ఆ స్వస్వరూప అభిన్న ఆత్మభగవానుడు సర్వనియామకుడు. జీవాత్మ (The Experiencer)కు, దృశ్యమునకు, అట్టి దృశ్యమునకు ముడి పదార్థములైనట్టి సూక్ష్మ పంచభూతములకు ‘నియామకుడు’ కనుక సర్వేశ్వరుడు. ఈ సర్వము తన ఈశ్వరత్వముగా కలవాడు.
అప్రమేయమ్ : ఆయన కల్పనా కళావిన్యాసమే ఈ జగత్తు. అయితే, కల్పనకు చెందిన వాడు కాదు. మనోబుద్ధిచిత్త అహంకారములకు చెందినవాడు కాదు. స్వప్నము తనదైయున్నవాడు - స్వప్నములోని ఏ వస్తువుకు చెందనివాడై, స్వప్నమునకు వేరుగా ఉన్నాడుకదా! కథారచయిత కథలో ఏసంఘటనకు చెందనివాడై, ఆ కథకు వేరై ఉన్నట్టివాడు కదా! అట్లాగే ఆత్మ దేనికీ చెందినదికాదు. కనుక అప్రమేయము. దేనిలోనూ ప్రమేయము (Relatedness) లేనట్టిది.
అజమ్ : ఆత్మ ‘అహమ్ సృష్టి కామః”.. “నేను సృష్టిని (లేక) కల్పనను కోరుకొనుచున్నాను” అను భావతరంగము పొందిన సందర్భములో పాంచభౌతిక - అభౌతికములతో కూడిన సృష్టి జనించుచున్నది. అట్టి సృష్టిలో ఈ భౌతిక దేహముతో సహా సర్వము జనిస్తున్నాయి. మరొకప్పుడు లయిస్తున్నాయి. అయితే దేహమును కదిలించుచున్న ‘దేహి’ అనబడు ఆత్మయొక్క ఒకానొక చైతన్య వికాసకిరణము - దేహముకన్నా మునుముందే ఉన్నది. ఈ ‘దేహి’ సర్వదా ఏ ఆత్మను తన స్వరూపముగా కలిగి ఉన్నదో, అట్టి ఆత్మ-దేహముతోగాని, భావముతోగాని, సృష్టితోగాని జనించటము లేదు. ఆత్మ అంతకు మునుముందే ఉన్నది. కనుక ఆత్మ అజము. ‘జనించుట’ అను స్వభావము లేనట్టిది. జనించటము లేదుకాబట్టి, మరణించటమూ ఉండదు. జనన-మరణములు లేనట్టిది కాబట్టి ఆద్యంతరహితము.
శివమ్ : ఆత్మ సర్వదేహములలో వేంచేసి, సర్వము వినోదముకొరకై కల్పించుకొనుచూ, ‘జీవితము’ అనే క్రీడానందమునకు కారణమగుచున్నది. సర్వజీవుల యొక్క ‘సుఖము’ అనే అనుభూతి ఎదురుగా ఉండే వస్తువు నుండి రావటము లేదు. ’ఆత్మ’ నుండే జనించుచున్నది. అందుచేత ఆత్మ సర్వులకు సుఖప్రదాత! సర్వశుభప్రదాత! వినోదప్రదాత! పరమశివమ్!
పరాకాశమ్ : పరమ్-ఆవల. ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలము నుండి భూమి బయల్వెడలు చున్నాయి. మరి ఆకాశము (Absolute Space) ఎక్కడి నుండి బయలుదేరుతోంది? ఆత్మాత్ ఆకాశమ్. ఆత్మ నుండి! అట్టి ఆత్మ సర్వమునకు ఆవల ఉండి ఉన్నది. నాటక రచయిత యొక్క స్వస్వరూపము - నాటక పాత్రలకు, నాటకమునకు ’ఆవల’ పరమైయున్నది కదా! ఆత్మ కూడా ఇహాకాశమునకు జనన స్థానమై ఉన్నది. ఈ విధంగా ఆత్మ పరాకాశ స్వరూపము. ఇహాకాశ జనిత స్థానము కూడా!
నిరాలంబమ్ : ఈ భౌతిక దేహము కదలటానికి ప్రాణశక్తి కారణము. అనగా ఈ పాంచ భౌతిక దేహము-అనే వస్తువు ప్రాణశక్తిని ‘ఆలంబనము’ కా కలిగిఉన్నది. ఆ ప్రాణశక్తి మనస్సు యొక్క ఆధీనములో ఉండి కదలుచున్నది. అందుచేత ప్రాణశక్తికి మనస్సు ఆలంబనమగుచున్నది. ఈ మనస్సు ఎవరిది? జీవాత్మది! కనుక మనస్సుకు జీవాత్మ ఆలంబనము. జీవాత్మకు కూడా మరొక ఆలంబనము (కదల్చువాడు) ఉన్నాడా? ఉన్నాడు. ‘జీవాత్మ’ అనగా జగత్తులో ఉండి, జగత్తులోని ఒక వస్తువగు ఈ దేహమును కదల్చుచుచు, దేహములోని ఇంద్రియములతో, ఇంద్రియ విషయములను ఆస్వాదించువాడు కదా! కలలో ఉండి కలలోని దృశ్యమును చూచు ‘నేను’ వంటివాడు. ఆ జీవాత్మకు ఆధారము, ఆలంబనము పరమాత్మ! మరి పరమాత్మకు ఆధారము? అద్దానికి మరొకటి ఏదీ ఆధారముగా గానీ, ఆలంబనముగా గానిలేదు. అవసరం కూడా లేదు. కనుక ఆత్మ నిరాలంబము.
అద్వయమ్ : దృశ్యము ఇంద్రియములచే పొందబడుతోంది. ఇంద్రియములు లేకపోతే దృశ్యము లేదు. కనుక దృశ్యము ఇంద్రియములకు వేరుకాదు. ఇంద్రియములు ఇంద్రియార్థములకు (శబ్ద స్పర్శ-రూప-రస-గంధములకు) ఉపకరణములు. కళ్లు స్వయముగా చూడవు. చూచు శక్తి ప్రవేశించి ఉంటేనే కళ్లు చూడగలవు. చూపుశక్తికి వేరుగా కనులకు ఉనికి లేదు. పంచ-ఇంద్రియార్థములు మనస్సుకు పంచశిరస్సులు వంటివి. మనస్సు లేకపోతే ఇంద్రియార్థములకు ఉనికిలేదు. మనస్సే ఇంద్రియార్థములుగా ఉన్నది. మనస్సుకు ఇంద్రియార్థములు వేరైనవి కావు. మనస్సు జీవాత్మది. జీవాత్మయే లేకపోతే ‘మనస్సు’ అనేదే లేదు. కనుక మనస్సు జీవాత్మకు వేరైనది కాదు. ఇక జీవాత్మయో? పరమాత్మయే జీవాత్మగా ఉన్నాడు. జీవాత్మ పరమాత్మకు వేరుగా ఉనికియే కలిగి ఉండలేదు. కనుక పరమాత్మయే జీవాత్మగా, మనస్సుగా, ఇంద్రియములుగా, ఇంద్రియ దృశ్య జగత్తుగా ఉన్నారు. పరమాత్మకు వేరుగా ఈ 14 లోకాలుగాని, వాటి వాటి విశేషాలు గాని లేవు. ‘ద్వితీయము-రెండవది’ అనునదే ఆత్మకు లేదు. కనుక ఆత్మ ‘అద్వయము’.
బ్రహ్మ-విష్ణు-రుద్రాదీనాం ఏకలక్ష్యమ్ : బ్రహ్మదేవుడు, విష్ణుభగవానుడు, రుద్రదేవుడు - ఈ త్రిమూర్తులు మొదలైన అందరికీ కూడా ఏకైక లక్ష్యము అయినట్టి ఈ ఆత్మ. ఏ జీవుడైనా సరే, ఇంద్రియ జగత్, ఇంద్రియ-మనో-బుద్ధి-చిత్త-అహంకారములను దాటి ఆవల చూస్తూ ఉండగా గమనికచే - అట్టి ఆ ప్రదర్శనమునకు వస్తువై ఉన్నట్టిదే.. పరమాత్మ! అట్టి పరమాత్మ సర్వస్వరూపమే అయి ఉన్నది! అందుచేత పిపీలికాది బ్రహ్మపర్యంతము.. ఎవ్వరైనా సరే తారకము లేక ఖేచరీముద్ర అనబడే ’అంతర్లక్ష్యము’..ను అంతర దృష్టిచే దర్శించ ప్రారంభిస్తే.. అప్పుడు అఖండమగు ఏకాత్మత్వమే సిద్ధిస్తోంది. అందుచేత ఆత్మ ‘ఏకలక్ష్యము’.. అయి ఉన్నది.
సర్వకారణమ్ : ‘ఇక్కడి దృశ్య-దేహ-మనో-బుద్ధి-చిత్త-అహంకారములకు కారణ కారణము ఎవరయ్యా?’ అని పరిశోధిస్తే అట్టి పరిశోధనలచే ‘ఆత్మయే కారణము’.. అని తెలియవచ్చుచున్నది. అందుచేత సృష్టి-స్థితి-లయములకు, జీవ-ఈశ్వరులకు.. అంతటికీ కారణము సర్వాత్మకము అగు స్వ-అంతర్గత కేవలాత్మయే! ఆభరణమునకు కారణము బంగారమే అయినట్లు, తరంగమునకు జలమే కారణమగుచున్నట్లు, మృత్తిక (మట్టి) బొమ్మలకు మట్టియే కారణమగుచున్నట్లు, ఈ సర్వజీవుల దేహములకు, వారివారి మనో-బుద్ధి-చిత్త అహంకారములకు మూలకారణము, ఆదికారణము, సర్వకారణము ఆత్మయే!
ఈ విధంగా ‘మమాత్మయే ప్రత్యయ లక్షణ సమన్వితమగు ‘పరబ్రహ్మాత్మ’ అయి ఉన్నది’.. అని హృదయగుహలోనే సునిశ్చయుడై, దర్శిస్తూ, ఎవ్వడు హృదయాంతర్గత పరమాత్మతత్త్వమును ‘భావాభావములకు ఆవలగా’గా గమనిస్తాడో …,
ఈ విధంగా ఉన్మనీ స్థితిని అభ్యాసము చేస్తూ ఉండగా, అఖిలేంద్రియ విషయాలు వాటివాటి కారణములతోసహా ఆత్మయందు ఆత్మస్వరూపముగా దర్శించబడుచూ.. విషయస్వరూపమును కోల్పోవుచున్నాయి. ఇదియే ఇంద్రియక్షయము.
ఎప్పుడైతే ఇంద్రియములు వాటి వాటి విషయములు ఆత్మకు అనన్యముగా మనస్సుకు తెలియవచ్చుచున్నాయో.., అదియే ‘అమనస్కస్థితి’!
తదనన్తరమ్ అఖిలేంద్రియక్షయవశాత్ అమనస్క సుఖ బ్రహ్మానంద సముద్రే మనః ప్రవాహరూపః।
అఖిలేంద్రియములు (ఉప్పుగడ్డ నీటియందు వలె) ఆత్మభావన యందు (ఆత్మగా) విస్మరించబడినవై, ఇతఃపూర్వపు మనస్సు - ‘అమనస్క సుఖము’ అనే ’జలముచే పరివృత్తమైన బ్రహ్మానందమనః ప్రవాహరూపము’గా అగుచున్నది.
అట్టి జగత్ సంయోగ వియోగాతీతమైనటువంటి యోగ స్థితి (లేక ధారణ) గాలి వీచని చోట దీపమువలె అచలమై (నిశ్చలమై), ’పరబ్రహ్మము’ను పొందినదిగా అగుచున్నది.
అట్టివాడు ఎండిన మ్రాను (లేక చెట్టు) వలె మరల జగత్ భావనలలో చిగురించనివాడై ఉంటాడు. గాఢ నిద్రలోను, మూర్ఛలోను ఉన్నవాని వలె ఉచ్ఛ్వాస - నిశ్వాస భావనలు (నేను, ఇప్పుడు గాలి పీలుస్తున్నాను. అప్పుడు వదలుచున్నాను.. అనే సంకల్పము) కూడా ఉండవు.
ఈ కనబడేదంతా ఆతని పట్ల ‘అసంకల్పితము’ అగుచున్నది. ‘ఆత్మ ఏవ అహం’ అను భావనను పునికిపుచ్చుకొన్న ఆ ఆత్మ తత్త్వవేత్త సమక్షములో సర్వ ద్వంద్వములు నశించినవిగా అగుచున్నాయి. సదా మార్పు చేర్పులు పొందుచూ చంచల స్వభావి అయి ఉన్న ఈ భౌతికదేహము - భౌతిక ప్రపంచము ఆతని పట్ల పరమ శాంతరూపము సంతరించుకున్నవి అగుచున్నాయి. మనస్సు శాంతిని అధిరోహించినదై ప్రచార శూన్యము పొంది పరమాత్మయందు విలీనము పొందినదిగా అగుచున్నది.
పయఃస్రావా-అనన్తరమ్ ధేనుః స్తనక్షీరమ్ ఇవ।
సర్వేంద్రియ వర్గే పరినష్టే, ’మనోనాశనమ్’ భవతి।
ఒకసారి పాలు మొత్తము పిండిన తరువాత ఏ విధంగా అయితే గోవు యొక్క స్తనముల నుండి ఇక పాలు రావటం కొనసాగదో.. ఆ తీరుగా… సర్వ
ఇంద్రియములు దృశ్యమును పొందటము మానివేసినవై… ఇక ’మనోనాశనము’ సిద్ధించుచున్నది. ఇంద్రియములు-విషయములు ఆత్మ రూపం సంతరించుకుంటున్నాయి.
‘అదియే అమనస్కము’!
అట్టి నిత్య శుద్ధుడగు పరమాత్మను నేనే! .. అనుఉపదేశము చేత -
1) తత్ పరమాత్మా నిత్య శుద్ధః
2) తత్ త్వమ్ అసి.. అదియే నీవు కూడా!
3) అందుచేత, త్వమేవాహమ్.. ‘నీవుగా’ ఉన్నది ‘నేనే’!
4) అహమేవ త్వమ్.. ‘నేను’గా ఉన్నది ‘నీవే’!
ఈ నాలుగు ‘తారక యోగ మార్గములు’ అనబడుచున్నాయి.
ఈ తారక యోగమార్గములో నడుచుచున్నవాడు అఖండానందపూర్ణుడగుచున్నాడు! కృతార్థుడు అగుచున్నాడు.
ఈ విధంగా “1) తత్ త్వమ్ 2) సోహమ్ 3) త్వమేవాహమ్ 4) అహమ్ త్వమేవ”..ల పరమార్థమును ఆశ్రయిస్తూ అంతర్లక్ష్యశీలుడుగు శాంభవీ ముద్రాయోగి (లేక) ఖేచరీము ద్రాయోగి ‘పరిపూర్ణ పరాకాశమగ్నుడు’ అగుచున్నాడు.
జగత్ భావనారహిత మనస్సు అనబడే ‘ఉన్మనీ’ సహాయముచే మనో అంతర్గతమైనట్టి సర్వభేద విషయములను త్యజించివేయుచున్నాడు.
ఆతని జీవాత్మత్వమంతా పరమాత్మత్వము సంతరించుకొన్నదై, పరమాత్మకు అభేదరూపము పొందుచున్నది. సర్వేంద్రియవర్గమును సన్న్యసించినవాడై.. అనేక జన్మలలో ఆర్జించిన పుణ్యపరిపాకము చేత.. ‘కైవల్యము’ అను మధురాతి మధురమైన ఫలమును పొందుచున్నాడు.
అఖండానంద ఫలమును ఆస్వాదిస్తూ సర్వక్లేశ కర్మలను వదిలివేయుచున్నాడు. కర్మపరిధులకు అందని ఆత్మ స్వరూపముతో ప్రకాశించుచున్నాడు.
‘బ్రహ్మాఽహమస్మి - నేనే బ్రహ్మమును’ అనునది సిద్ధించుకొని, కృతకృత్యుడు అగుచున్నాడు.
ఇప్పుడు ఎవ్వరైనా ఆత్మజ్ఞానార్హుడై ఆతనిని ఆశ్రయించినప్పుడు…., ఆతడు ముందుగా లేచి నిలబడి, కౌగిలించుకొని.. త్వమేవాహమ్- నీవుగా ఉన్నది నేనేనయ్యా! న భేదోస్తి - నీకు నాకు భేదమే లేదు! పూర్ణత్వాత్ పరమాత్మనః - పూర్ణాత్మత్వము చేత మనమిద్దరమూ కూడా అఖండ పరమాత్మ స్వరూపులమే! అని మనో-వాక్కులతో సమాలింగనము చేసుకొని, అప్పుడు ఇక శిష్యుని కూర్చోబెట్టి ‘తత్ త్వమ్’ అను స్మృతి జ్ఞానమునకు సంబంధించిన సమాచారమును సంభాషించుచున్నాడు. బోధించుచున్నాడు.
4.) చతుర్థ బ్రాహ్మణము - వ్యోమపంచక లక్షణములు
యాజ్ఞవల్క్యుడు : హే మహాత్మా! భగవన్! మండల పురుషా! ఆదిత్య సద్గురువరేణ్యా! ఇప్పుడు ఇక తత్త్వశాస్త్రముచే ప్రవచనము చేయబడుచున్న ‘వ్యోమపంచక లక్షణములు’ గురించి వినగోరుచున్నాను. వాటి లక్షణములు వివరించి చెప్ప వేడుకొంటున్నాను.
ఆదిత్య భగవానుడు : సరే, వినండి.
పంచ (5) ఆకాశములు ’వ్యోమ పంచకము’గా అభివర్ణించబడుచున్నాయి.
(భూత) ఆకాశము : బాహ్య అభ్యన్తరే అంధకారమయమ్| ఇది లోన-బయట కూడా అంధకారముతో నిండి ఉన్నది. పాంచభౌతిక దృష్టిచే అజ్ఞాన-అంధకార సంబంధమైనది. అజ్ఞాన అంధకార ఆకాశము, అజ్ఞాన స్వరూపము.
పరాకాశము : బాహ్య అభ్యన్తరే కాలా నల సదృశ్యమ్! ఇది అంధకారమునకు ఆవల కాలాగ్నితో సమానంగా అగ్నితో ఉన్నట్టిది. ఇది జ్ఞానసాధనా సమాచారమునకు సంబంధించిన ఆకాశము. యోగసాధనా సంబంధిత రూపము. యోగధ్యాన స్వరూపము. ‘యోగాగ్ని’ గా వర్ణించబడుతోంది.
తత్త్వమహాకాశము : స బాహ్య - అభ్యన్తరే అపరిమిత ద్యుతినిభమ్। ఇది బాహ్య - అభ్యంతరములలో అపరిమితమైన జ్యోతి (వెలుగు) స్వరూపమై వెలుగుతో నిండి ఉన్నట్టిది. సత్ స్వరూపమైనది. ‘త్వమ్ తత్ అసి - నీవుగా పరమాత్మయే ఉన్నది’ - అను దర్శనమునకు సంబంధించినది కాబట్టి తత్త్వాకాశము అని అంటారు. తత్త్వ జ్ఞాన స్వరూపము.
సూర్యాకాశమ్ : స బాహ్య అభ్యన్తరే సూర్యనిభమ్। ఇది లోన బయట కూడా జ్ఞాన ప్రభలతోనూ తేజస్సులోనూ వెలుగొందుచున్నట్టిది (చిత్స్వరూపము). జ్ఞానస్వరూపము. ప్రజ్ఞాస్వరూపము. సర్వ సహజీవులు ‘స్వస్వరూపాత్మ’ సూర్యుని కిరణములుగా అనుభవమగునట్టిది.
పరమాకాశము : ఇది ఇట్టిదని దృష్టాంతములచే నిర్వచించలేము! అనిర్వచనీయము! జ్యోతిస్వరూపము! సర్వము తానైనట్టిది! సర్వవ్యాపకము! నిరతిశయానంద లక్షణము! ఆత్మత్యానందమునకు సంబంధించినది. అఖండాత్మా పరస్వరూపము! అనేకముగా కనిపిస్తున్నదంతా ‘ఏకము-అక్షరము-అఖండము’ గా అనిపించునట్టిది.
ఎవడు ఏ లక్ష్యముతో అంతర్లక్ష్యముగా దర్శిస్తాడో ఆతడు అదియే అగుచున్నాడు. ఆ రూపలక్షణములే పొందుచున్నాడు.
ఉదాహరణకు, ‘నేను భూతాకాశ సంబంధమైన భౌతికవస్తువులు పొందాలి! అప్పుడే నేను పొందవలసినవి పొందినట్లు కదా’!.. అను అనిర్వచనము కలవాడు ఉపాధి పరంపరలను పొందుచున్నాడు. పరాకాశ లక్ష్యముగలవాడు ఈ సర్వమునకు పరమైన స్వరూపము పొంది ఇహమున (జీవాత్మ-దృశ్యములను) ఆవల పరమై ఉండి - ఇహమును (ఆవల ఉండి ఈవలను) దర్శించుచున్నట్టి యోగాభ్యాసి.
ఓ యాజ్ఞవల్క్యా! మహాత్మన్!
ముఖ్యముగా తెలుసుకొని ఉండవలసినవి ఇక్కడ ఉదహరిస్తున్నాను.
1) నవచక్రము (9) : భూతాత్మ, ప్రేతాత్మ, జీవాత్మ, అంతరాత్మ, పరమాత్మ, నిర్మలాత్మ, శుద్ధాత్మ, జ్ఞానాత్మ, మహాత్మ.
2) షట్ ఆధారములు
3) త్రిలక్ష్యము : (ఈ ఉపనిషత్‌లో చెప్పబడిన) 1) అంతర్లక్ష్యము 2) బహిర్లక్ష్యము 3) మధ్యలక్ష్యము
4) వ్యోమపంచకము : భూతాకాశము; పరాకాశము; మహాకాశము; సూర్యాకాశము; పరమాకాశము.
5) సమ్యక్ : సమ్యక్ దృష్టి కలవాడు. పైన చెప్పిన (మరియు) ఈ దృశ్యంలో గల భిన్నత్వములో అంతర్లీనమైయున్న ఏకత్వము దర్శించువాడు. అఖండాత్మ యొక్క స్వ-అభిన్న వినోద చమత్కారమే అయి, ఏకస్వరూపమే ఇదంతా అను అవగాహన! ఇవి ఎరుగుచున్నప్పుడే…, ఆతడు ‘యోగి’ అగుచున్నాడు. సమ్యక్ ఏతత్ న జానాతి, సయోగీ నామతో భవేత్। నవ చక్రములు మొదలైన పైవిషయములు తెలియనివాడు పేరుకు మాత్రమే యోగి!
5.) పంచమ బ్రాహ్మణము - న బంధోఽస్తి। న ముక్తోఽస్తి। చిదాకాశోఽస్తి కేవలమ్।
యాజ్ఞవల్క్య మునీంద్రుడు : హే భగవాన్! ప్రభాకరా! ఆదిత్య మహాదేవా! ‘బంధము’ అనగా ఏమి? ఎవరికి?
ఆదిత్య భగవానుడు :
పరమాత్మ నిత్యముక్తుడు. ‘బంధము’ అనే ప్రసక్తియే లేదు.
ఈ జీవాత్మ సర్వదా పరమాత్మ స్వరూపుడు. పరమాత్మకు అభిన్నుడు కూడా కదా!
కనుక జీవాత్మకు బంధము ఉన్నదనటము కూడా యుక్తియుక్తము కాదు.
అందుచేత బంధము గురించి ఈ విధముగా చెప్పబడుచున్నదో.. విను!
స విషయమ్ మనో ‘బంధాయ’। మనస్సు సవిషయ సహితమై (విషయములతో కూడి) ఉంటే… అది ‘బంధము’
నిర్విషయం ముక్తయో భవతి। మనస్సు విషయ రహితమై నిర్విషయమై ఉంటే.. అదియే ముక్తి!
అతః సర్వం చిత్తగోచరమ్। చిత్తము (సంకల్పము) ఉంటేనే ‘జగత్తు’ అనబడేది గోచరము అగుచున్నది. చిత్తము లేనివానికి జగత్తే లేదు. దృశ్య విషయముల పట్ల ఇష్టము రూపమే ఈ చిత్తము. అట్టి ఈ చిత్తము ఏ ఇంద్రియ విషయములనూ ఆశ్రయించకుండా నిశ్చలముగా, నిరాశ్రయంగా చేశామా, .. అప్పుడు క్రమంగా ’ఉన్మనీ అవస్థ (కేవల మనోరూపము) - నిర్విషయమనోస్థితి’..పరిపక్వమవుతూ వస్తుంది. మనో ఉన్మనీ పరిపక్వతచే మనస్సు ఆత్మయందు లయించటానికి యోగ్యమగుచున్నది.
భేదముతో కనిపించుచున్న ఈ దృశ్యము అభేదము-అఖండము అగు ఆత్మగా నిశ్చయ - నిశ్చలమవటమే ‘మనోలయము’.
ఓ యాజ్ఞవల్మ్యా! అట్టి మనోలయమును అభ్యసించాలి.
మనోలయము యొక్క పరిపూర్ణత కొరకై ఆది స్వరూపుడను, ఆదిత్య నారాయణుడను అయి, సర్వజీవులలో సాక్షిగా ఉన్న నా యందు మనస్సును, చిత్తమును ఏకాగ్రం చేస్తూ ఉండాలి.
మనస్సు యొక్క లయకారకుడను, లయ స్థానము కూడా ఆదిస్వరూపుడనగు నేనే!
దేహములోని షట్ (6) చక్రస్థానములు తనయందు కలిగియున్న వెన్నెముక-అయినట్టి ’అనాహతము’నందు అనుక్షణము ‘ఉ..మ్’ అను ‘శబ్దము’ సుదీర్ఘమై జనించుచూ ఉన్నది.
అనాహతస్య శబ్దస్య। ఆ శబ్దము యొక్క అంతర్గతముగా ’ధ్వని’ స్ఫురణగా ప్రకటితమగుచూ ఉన్నది.
తస్య శబ్దస్య యో ‘ధ్వనిః’। ఆ ధ్వనికి అంతర్గతముగా ‘జ్యోతి’ (కాంతి చైతన్యము) ఉన్నది.
ధ్వనే అంతర్గతమ్ - జ్యోతిః। ఆ జ్యోతికి అంతర్గతమై ‘మనస్సు’ ఉన్నది.
జ్యోతిః అంతర్గతో మనః । మనస్సు యొక్క కల్పనావిశేషమే ఈ స్వర్గ-మర్త్య-పాతాళ త్రిలోక సృష్టి! ఈ సృష్టి యొక్క ప్రారంభము, స్థితి, వ్యసనము, లయము, ఇందులోని కర్మలు, కర్మబంధములు, మనోబంధములు, మోక్షములు.. ఇవన్నీ మనస్సే.
మనస్సు లయిస్తే…. అన్నీ లయిస్తాయి.
త్రిలోకములు, సత్త్వాది త్రిగుణములు, జాగ్రత్ మొదలైన అవస్థలు, త్రికాలములు, త్రిపుటి (ద్రష్ట-దర్శన-దృశ్యము) - అన్నీ కూడా ఆత్మస్వరూపుడనైన ‘నేను’ యొక్క సహజరూపమగు ’ఆత్మ’యందు లయించుతాయి.
ఇష్టబడే నేను, ఇష్టము, ఇష్టమైన వస్తువు…,
ప్రేమించే నేను, ప్రేమ, ప్రేమించబడేది….,
కోపించే నేను, కోపము, కోపమునకు విషయము….,
జాగ్రత్-స్వప్న-సుషుప్తులు నావైన నేను, జాగ్రత్ - స్వప్న - సుషుప్తులు, తదంతర్గత భావాలు….,
ఇవన్నీ మనోభావనలుగాను, మనో స్వరూపముగాను తెలియబడగలవు.
మనస్సే ముల్లోకములు. మనస్సు లయిస్తే ముల్లోకాలు లేవు. మరింకేమీ లేవు.
మనస్సు లయిస్తే, అప్పటికీ ఏది శేషించినదై ఉంటోందో.. అదియే విష్ణుపదము.
ఈ విధంగా సర్వము ఆత్మస్వరూపమునకు అభిన్నంగా దర్శించబడటమే ’మనోలయము’.
మనోలయము పొందగా శేషించి, అనుభవమగుచున్నది - విష్ణుపదము.
మనస్సు యొక్క లయముచే సిద్ధించునదే - శుద్ధ అద్వైతస్థితి.
మనస్సు శాంతిస్తే సర్వభేదములు తొలగుతాయి. మరొక రకంగా చెప్పాలంటే సర్వభేదములు అభావించబడతాయి. (లేక) భిన్నత్వములోని ఏకత్వమగు ఆత్మతత్త్వమే సర్వదా అనుభవ వస్తువు (సర్వదర్శితము) అగుచున్నది.
అద్దానినే ‘పరమ తత్త్వము’.. అని కూడా అంటున్నారు.
అజ్ఞాన దృష్టి - అజ్ఞాన అవగాహన - అజ్ఞాన కర్మల కారణంగా ఇప్పటివరకూ పరిరక్షించుకొంటూ వచ్చిన వ్యష్టిత్వము సమిష్టితత్త్వమునందు, సమిష్టి ‘పరము’ నందు (ఉప్పుగడ్డ యొక్క ఆకారము జలమునందువలె) కరిగిపోవుచున్నది.
ఇక పరతత్త్వముతో మమేకత్వము సంపాదించిన ఆ మహనీయుడు ఎట్లా ఉంటాడంటావా?
పసిబాలుడు : అప్పుడే పుట్టిన పసిబాలునికి నాది నీది - నా వాళ్లు కాని వాళ్లు, మనకన్నా తక్కువవారు- ఎక్కువ వాళ్లు, ఏవేవో పొందాలనే తపన, ఇవన్నీ.. ఉండవు కదా! ఆ విష్ణు పద అధిరోహి (లేక) అద్వైత స్థాన సంస్థితుడు (లేక) పరతత్త్వ దర్శికి భేదములే కనిపించవు. పసి బాలునివలె క్రీడా వినోదంగా కేరింతలు ప్రదర్శిస్తూ ఈ జగత్ దృశ్యమును వీక్షిస్తాడు.
ఉన్మత్త : ఒకే ధ్యాసలో ఉండిపోయి మిగతా ఏదీ గమనించక, గుర్తించక, మరేదీ వినని చూడని - స్పందించనివాడే ఉన్మత్తుడు కదా! అట్లాగే పరతత్త్వ ధ్యాని అఖండమగు ఆత్మనే సర్వత్రా చూస్తూ మరింకే గుణ-రూప-సంబంధ-నామ-జాతి భేదములను లెక్కలోకి తీసుకోడు. అందుకే ‘ఉన్మత్తుని వలె’… అని చెప్పబడుతోంది.
పిశాచవత్ : పిశాచము పట్టినవాడు వర్తమానాన్ని వదలి ఎవరో మరొక వ్యక్తివలె సంభాషించు విధంగా, పరతత్త్వజ్ఞుడు తన వ్యష్టిత్వమును వదలి’…., అఖండము - సర్వగతము - సర్వమునకు అతీతము అగు కేవలీ తత్త్వమునందు సంస్థితుడై ఉంటాడు. అందుచేతనే ‘పిశాచవత్’ అని కూడా వర్ణించబడుచున్నాడు.
జడవృత్యా : ప్రపంచములో అనేక విలువైనవి, గొప్పవి అనుకొనే సంపద-ఆపద, స్వజనులు-పరజనులు, స్వజాతి-పరజాతి, స్వమత-పరమతమువారు.. ఇటువంటి విషయాన్ని ఆ ఆత్మజ్ఞుడు - మొదలే లేనట్టిది, కల్పితము, అవాస్తవము అగు విషయాలుగా చూస్తూ ఉంటాడు. అట్టివాటిలోని భేదదృష్టులను, అధిక - అల్పభావములను తిరస్కరించినవాడై ఉంటాడు. అందుచేత లౌకిక దృష్టి, భేదదృష్టి కలవారికి ఆతడు జడునివలెనూ, తెలివి తక్కువ వాడివలెనూ అనిపిస్తూ ఉంటాడు.
ఓ యాజ్ఞవల్మ్యా! మనము ఇప్పుడు చెప్పుకున్నవన్నీ అమనస్కము యొక్క అభ్యాస చిహ్నములేనయ్యా!
అయితే అమనస్కుని బాహ్య లక్షణములతో నిర్వచించలేము. అది అంతరంగ - బుద్ధి సంబంధిత పరాకాష్ఠ స్థితి!
అమనస్కుడు ఎల్లప్పుడూ ఏ ప్రాపంచిక విషయము, సందర్భము మొదలైన వాటితో సంబంధము లేకుండా ’నిత్య తృప్తుడు’ అయి ఉంటాడు.
సర్వమూ తానే అయి, సర్వమునకు సంబంధించనివాడై ఉంటాడు.
ఆతడు ఉద్వేగరహితుడై ’సమమ్ సర్వేషు భూతేషు తిష్ఠన్తమ్ పరమేశ్వరమ్’.. భావనను ఆశ్రయించుచుండుటచే, ఆతనిపట్ల ప్రాణశక్తి దేహమంతా స్వభావంగా సమత్వము పొందినదై ఉంటుంది.
ఆతని నిత్య తృప్తి - ప్రాణశక్తి సమత్వములచేత (సమానప్రాణ ప్రభావము)..
… ఇవన్నీ స్వభావ సిద్ధమగుచున్నాయి.
భావములకు ఆవల బ్రహ్మము. ఆ ఆత్మజ్ఞాని భావములను దాటివేసి ’బ్రహ్మము’ను దర్శిస్తూ ఉంటాడు .
ఇతరులకు ’ఇది’ అని తెలియరాని ’సుఖ స్వరూపస్థితి’ని పొందినవాడై ఉంటాడు.
‘మనస్సు’ ను జగన్నాటకంలోని దృశ్య విశేషంగా దర్శిస్తూ, తాను సర్వదా వేరై, పరమై ఉంటూ ఉంటాడు.
ఈ విధంగా స్వస్వరూప అఖండ పరమాత్మతత్త్వ దర్శనుడై ‘అహమేవ బ్రహ్మమ్’ భావనయందు ప్రశాంతస్థితి పొందినవాడగుచున్నాడు.
అట్టి సోఽహమ్-తత్త్వమ్-త్వమేవాహమ్, త్వమ్ అహమేవ గూడార్థము ఎరిగి, పవిత్ర ఆత్మను ఎరిగినవాడై.. ’బ్రహ్మామృత పారాయణుడు’ అయి ఉంటున్నాడు.
అట్టి ఆత్మస్వరూపము సిద్ధించుకొని “అద్వితీయాత్మా సోఽహమ్ - నేనే!” అని సిద్ధించుకొన్నవాడు. సమస్తము తానై, సర్వమునకు వేరై వ్యష్టి-అతీత ఆత్మ సుఖభావమును అనుభవించుచూ.. ఈ భూమిపై సంచరిస్తూ ఉంటే భూమి పులకించుచున్నది.
ఆయనను చూచినంత మాత్రము చేతనే జనులు పునీతులు, పవిత్రులు అయి, వారివారి మనోబుద్ధులు నిర్మలము కాగలవు.
తత్ సేవాపరః ముక్తోభవతి। అజ్ఞోఽపి ముక్తో భవతి।
ఆతనిని సేవించువారు (శిష్యులు), భక్తులు మొదలైనవారు కూడా ముక్తులగుచున్నారు. వారంతా అజ్ఞానులు అయినా కూడా ముక్తిని పొందుచున్నారు. ఇక జ్ఞానులు వారిని దర్శిస్తే.., వేరే చెప్పేదేమున్నది?
ఆతని వలన 101 వంశీయులు తరించుచున్నారు. ఆతని తల్లి, తండ్రి, భార్య సంతానము కూడా ముక్తులగుచున్నారు.
🙏 ఇతి మండల బ్రాహ్మణ ఉపనిషత్ 🙏
ఓం శాంతిః! శాంతిః! శాంతిః!