[[@YHRK]] [[@Spiritual]]
Mantrika Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 1
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com
స్వావిద్యాద్వయతత్కార్యాపహ్నవజ్ఞానభాసురం . మంత్రికోపనిషద్వేద్యం రామచంద్రమహం భజే .. |
శ్లో॥ స్వా అవిద్యా ద్వయ తత్కార్య అపహ్నమ్ అజ్ఞానభాస్కరమ్,
మన్త్రికోపనిషత్ వేద్యం రామచన్ద్రమ్ అహమ్ భజే ॥
నాయొక్క (జీవ - ఈశ్వర రూప) అవిద్యాద్వయమును, వాటివాటి కార్యపరంపరలను మొదలంట్లో పెకలించుచూ, అజ్ఞానాంధకారమును తొలగించి, అధిగమింపజేసి, ఆత్మను ప్రకాశమానము చేయు సూర్య తేజో రూపమగు ఈ “మన్త్రికోపనిషత్” చెప్పు “ఆత్మారామోఽహమ్”నకు నమస్కరించుచున్నాను.
ఓం అష్టపాదం శుచిం హంసం త్రిసూత్రమణుమవ్యయం . త్రివర్త్మానం తేజసోహం సర్వతఃపశ్యన్న పశ్యతి .. 1.. |
|
1.) హరిః ఓం|| అష్టపాదం, శుచిం, హంసం త్రిసూత్రమ్ అణుమ్, అవ్యయమ్, త్రివర్త్మానమ్ తేజసోఽహమ్ సర్వతః పశ్యన్, న పశ్యతి | |
ఓంకార స్వరూపుడగు శ్రీహరికి నమోవాక్కములు. ‘అహమ్’ అను చైతన్యము ఎనిమిది పాదములు కలిగినట్టిది. అత్యంత శుచి అయినది. మూడు సూత్రములు కలది. అణురూపమైనది. అవ్యయమైనది. మూడు తీరులైన వర్తనములు కలిగినది అయినట్టి “అహమ్" తన తేజస్సుతో సర్వదేహముల లోనూ వెలుగొందుచున్నది. ఆ హంస అంతటా చూస్తూ ఉన్నది. కానీ తాను మాత్రం ఎవ్వరికీ కనబడుటలేదు. చూడనిదిగానే ఉంటోంది కూడా! |
భూతసంమోహనే కాలే భిన్నే తమసి వైఖరే . అంతః పశ్యంతి సత్త్వస్థా నిర్గుణం గుణగహ్వరే .. 2.. |
|
2.) భూత సమ్మోహనే కాలే భిన్నే తమసి వైఖరే, అతః పశ్యన్తి సత్వస్థా, నిర్గుణమ్ గుణ గహ్వరే! |
జీవులపట్ల సంమోహన జనకమైన కాలమును జీవుడు దాటివేయగా, తమస్సు (అజ్ఞానము) ప్రక్కకు జరుగగా, అప్పుడు సత్వగుణమునందు స్థితి పొందినవాడై ఈ జీవుడు గుణములకు ఆవల గల నిర్గుణతత్త్వము అగు ’హంస’ను దర్శించగలడు. ఆతనికి ద్యోతకము కాగలదు. గుణములకు అంతరాంతరంగా, ఆధారముగా, జనన స్థానముగా ఉండి, ఈ సర్వమునకు ఆధారమై ‘హంస’ ప్రకాశించుచున్నది. |
అశక్యః సోఽన్యథా ద్రష్టుం ధ్యాయమానః కుమారకైః . వికారజననీమజ్ఞామష్టరూపామజాం ధ్రువాం .. 3.. |
|
3.) అశక్యః సో అన్యథా ద్రష్టుమ్ ధ్యాయమానః కుమారకైః| వికార జననీమ్, అజ్ఞామ్, అష్టరూపామ్ అజాం ధృవామ్ || |
కౌమారులు (చిన్నవారు) వంటి జీవులు అపరిపక్వమైన బుద్ధితో (గుణములకు పరిమితమైనటువంటి అవగాహనతో) ఎంతగా ధ్యానించినప్పటికీ నిర్గుణతత్త్వమగు (హంసతత్త్వమగు) ఆత్మను సందర్శించ లేరు. సాంసారిక బుద్ధి కొనసాగునంత వరకూ - వికారములకు తల్లి వంటిది, అజ్ఞానముతో కూడుకొని ఉన్నట్టిది, “8” రూపములతో కూడుకొన్నది అగు - “మాయ”యే ధృవముగా దర్శించబడుచూ, ధ్యానింప బడుచున్నది. ధ్యాస సంసారమునకే (లేక) మాయకే (లేక) కల్పనకే పరిమితమగుచున్నది. |
ధ్యాయతేఽధ్యాసితా తేన తన్యతే ప్రేర్యతే పునః . సూయతే పురుషార్థం చ తేనైవాధిష్ఠితం జగత్ .. 4.. |
|
4.) ధ్యాయతే అధ్యాసితా తేన, తస్యతే ప్రేర్యతే పునః సూయతే ‘పురుషార్థం’ చ తేన ఏవ అధిష్ఠితం జగత్|| |
దృశ్యముయొక్క అధ్యాసచే దృశ్యమే లభిస్తోంది. దృశ్యవ్యవహారములచే ఆతడు మరల మరల ప్రేరణ పొందుచున్నవాడై, పురుషార్థములకు పరిమితుడు అగుచు, వాటినే పొందుచున్నాడు. పరమ సత్యమగు ఆత్మను కాదు. అట్టి మాయచేతనే ఈ జగత్తు అధిష్ఠించబడియున్నది (మాయయే ఈ జగత్తుకు మూలపదార్థము అగుచున్నది). |
గౌరనాద్యంతవతీ సా జనిత్రీ భూతభావినీ . సితాసితా చ రక్తా చ సర్వకామదుధా విభోః .. 5.. |
|
5.) గౌరవా, ఆది-అన్తవతీ, సా జనిత్రీ, భూతభావినీ, సితా అసితా చ రక్తా చ, సర్వకామదుఘా విభోః॥ - |
ఈ సంసారము ఎట్టిది? సహజము కానిది. గౌరవమైనది (భారమైనది). ఆది-అంతములతో కూడుకొని ఉన్నట్టిది. దేహపరంపరలను జనింపజేయునది. దేహభావములను ఆశ్రయించి ఉండునది. తెల్లని-నల్లని-ఎర్రనిది (సత్య తమో రజో గుణములు కలది). అనేక కోరికల సమూహ విభవములను తనకు విభువగు ఆత్మకే ఆపాదించునది. |
పిబంత్యేనామవిషయామవిజ్ఞాతాం కుమారకాః . ఏకస్తు పిబతే దేవః స్వచ్ఛందోఽత్ర వశానుగః .. 6.. |
|
6.) పిబన్తి యే నామ విషయామ్ అవిజ్ఞాతామ్ కుమారకాః ఏకస్తు పిబతే దేవః స్వచ్ఛన్తో అత్ర వశానుగః॥ |
చిన్న పిల్లలు (కౌమారులు) వంటి అజ్ఞానాశ్రయులు అవిషయములైనవాటిని విషయములుగా - సత్యాసత్యములు తెలియనివారై (అవిజ్ఞాతులై) ఆస్వాదించుచున్నారు. వీటిని అధిగమించిన దృష్టిగల ఆత్మజ్ఞాని (విజ్ఞాత) మాత్రమే అనేక విషయములలో ఏకస్థుడైయున్న ఆత్మదేవుని ఎరిగి, విషయములను నిజముగా ఆస్వాదించగలుగుచున్నాడు. అజ్ఞుడో? - విషయములచే బాధించబడుచున్నాడు. బద్ధుడగుచున్నాడు. |
ధ్యానక్రియాభ్యాం భగవాన్భుంక్తేఽసౌ ప్రసహద్విభుః . సర్వసాధారణీం దోగ్ధ్రీం పీయమానాం తు యజ్వమిః .. 7.. |
|
7.) ధ్యాన క్రియాభ్యాం భగవాన్ భుంక్తే అసౌ ప్రహసన్ విభుః సర్వసాధారణీం దోగ్రీమ్ పీయమానాంతు యజ్వభిః |
ధ్యాన క్రియలచే పరమాత్మ తత్త్వమును ఎరిగినవాడు స్వయమ్ భగవానుడై పక పక నవ్వుకొనుచూ, “వీటి నియామకుడను నేనే కదా!" - అని ఎరిగి ఆస్వాదిస్తూ, ఆనందిస్తున్నాడు. సర్వసాధారణము అగు ఆత్మను యజ్ఞభావి అయి ఎరిగి, తనకు అనుభవము అగు ఈ దృశ్యమును తాను త్రాణి ఆస్వాదించు పానీయము వంటిదిగా భావించి ఆస్వాదిస్తున్నాడు. |
పశ్యంత్యస్యాం మహాత్మానః సువర్ణం పిప్పలాశనం . ఉదాసీనం ధ్రువం హంసం స్నాతకాధ్వర్యవో జగుః .. 8.. |
|
8.) పశ్యతి అస్యాం మహాత్మానః సుపర్ణం పిప్పలాశనమ్, ఉదాసీనం ధ్రువం హంసమ్ స్నాతకా ఆధ్వర్యవో జగుః|| |
మహాత్ములగు కొందరు ఈ దృశ్యమును జీవ-బ్రహ్మాతత్వముల చమత్కారముగా, పిప్పల (పక్షియొక్క) రెండు రెక్కలుగా, పిప్పలాశనముగా చూస్తున్నారు. మరి కొందరు (ఆత్మను) ఉదాసీనము ధ్రువము అగు హంసగా దర్శిస్తున్నారు. ఇది స్నాతక ఆధ్వర్యువులు చెప్పు రీతి! పరమాత్మను శాశ్వతమైన వస్తువుగాను, జీవుడు పరమాత్మ యొక్క అంశగా కించిత్ కాలము కనిపించునదిగాను చెప్పుచున్నారు. |
శంసంతమనుశంసంతి బహ్వృచాః శాస్త్రకోవిదాః . రథంతరం బృహత్సామ సప్తవైధైస్తు గీయతే .. 9.. |
|
9.) శంసంతమ్ అనుశంసంతి బహ్వృచాః శాస్త్రకోవిదాః రథంతరం బృహత్ సామ సప్తవైధ్రైస్తు గీయతే| |
శాస్త్రకోవిదులగువారు ఆత్మ గురించి బృహత్ ఋచమ్ - మహత్తరమగు సత్యము అని గానం చేస్తున్నారు. ’రథంతరము’ అనే బృహత్ (అతి పెద్ద) సామగానము సప్త స్వరములతో ఆత్మతత్త్వమును గానము చేయుచున్నది. |
మంత్రోపనిషదం బ్రహ్మ పదక్రమసమన్వితం . పఠంతి భార్గవా హ్యేతే హ్యథర్వాణో భృగూత్తమాః .. 10.. |
|
10.) మంత్రోపనిషదమ్, బ్రహ్మపదక్రమ సమన్వితమ్, పఠంతి భార్గవా హి ఏతే హి అధర్వాణో, భృగూత్తమాః || |
భార్గవులు, అధర్వణులు భృగూత్తములు - వీరేమో మంత్ర - ఉపనిషదములతో కూడిన పదజాలముతో బ్రహ్మపదము గురించి మంత్రోచ్ఛారణా పూర్వకముగా వర్ణించి చెప్పుకొస్తున్నారు. |
సబ్రహ్మచారివృత్తిశ్చ స్తంభోఽథ ఫలితస్తథా . అనడ్వాన్రోహితోచ్ఛిష్టః పశ్యంతో బహువిస్తరం .. 11.. |
|
11.) స బ్రహ్మచారి వృత్తిచ్ఛ స్తంభో అథ ఫలితః తథా, అనడ్వాన్ రోహితా ఉచ్ఛిష్టః పశ్యంతో బహు విస్తరమ్ || |
హంస - “బ్రహ్మచారియొక్క వృత్తాలు కలిగియున్నదై, స్తంభమువలె కదలకుండా ఉన్నట్టిదై అనేక - ఫలితములు కలుగజేస్తూ ఉన్నట్టిది. ఎర్రటి అతిదీర్ఘము అయిన (పొడవైన) శరీరముగల ఎద్దువలె బహువిస్తారమైయున్నది" - అని విజ్ఞులు గుర్తుగా చెప్పుచున్నారు. |
కాలః ప్రాణశ్చ భగవాన్మృత్యుః శర్వో మహేశ్వరః . ఉగ్రో భవశ్చ రుద్రశ్చ ససురః సాసురస్తథా .. 12.. |
|
12.) కాలః ప్రాణశ్చ భగవాన్ మన్యుః శర్వో మహేశ్వరః ఉగ్రో భవశ్చ రుద్రశ్చ ససురః సా అసురః తథా॥ |
ఆ పరమాత్మ అథర్వణవేద మంత్రములచే, ఇతర వేదములచే, తదితర ప్రాజ్ఞులచే - “కాల స్వరూపుడు, ప్రాణేశ్వరుడు, భగవంతుడు, మన్యువు, శర్వుడు, మహేశ్వరుడు, ఉగ్రుడు, భవుడు, రుద్రుడు, సురుల స్వరూపుడు, అసురుల స్వరూపుడు, ప్రజాపతి, విరాట్టు, పురుషుడు, జలము (జలస్వరూపము), పరమాత్మ అని సంస్తుతించబడుచున్నారు. ఆ స్తుతులచే విభువు ఆగు పరమాత్మయే తెలియజేయబడుచున్నారు. |
ప్రజాపతిర్విరాట్ చైవ పురుషః సలిలమేవ చ . స్తూయతే మంత్రసంస్తుత్యైరథర్వవిదితైర్విభుః .. 13.. తం షడ్వింశక ఇత్యేతే సప్తవింశం తథాపరే . పురుషం నిర్గుణం సాంఖ్యమథర్వశిరసో విదుః .. 14.. |
|
13.) ప్రజాపతిః, విరాట్ చ ఏవ పురుషః సలిలమేవ చ స్తూయతే మంత్ర సంస్తుత్యైః (ర)అథర్వవిదితైః విభుః || 14.) తం షడ్వింశక (26), ఇత్యేతే, సప్తవింశం (27) తథా అపరే పురుషం నిర్గుణం సాంఖ్యమ్ అథర్వశిరసో విధుః || |
“ఆ ప్రభువు (విభువు) 26 పదార్థములతో కూడి ఉన్నారు” - అని కొందరు వర్ణిస్తున్నారు. మరి కొందరేమో 27 విశేషముల (పదార్థముల) కలయిక అని చెప్పుచున్నారు. అథర్వశిరోవేత్తలు… ఆయన నిర్గుణుడని, సాంఖ్యుడని ఎరిగి, గానము చేయుచున్నారు. |
చతుర్వింశతిసంఖ్యాతం వ్యక్తమవ్యక్తమేవ చ . అద్వైతం ద్వైతమిత్యాహుస్త్రిధా తం పంచధా తథా .. 15.. |
|
15.) చతుర్వింశతి(24) సంఖ్యాతమ్, వ్యక్తమ్, అవ్యక్తమేవ చ అద్వైతం ద్వైతమ్ ఇతి ఆహుః త్రిధా తం పఞ్చధా తథా| |
ఆ పరతత్త్వ స్వరూపుడగు ఆత్మపురుషుడు 24 సంఖ్యలతో కూడుకొనినవారని, వ్యక్త-అవ్యక్త స్వరూపుడు కూడా అయి ఉన్నవారని, అద్వైతమని-ద్వైతమని మూడు విధములుగా ఐదు విధములుగా కూడా ప్రదర్శనమగుచున్నారని కొందరు చెప్పుచూ ఉన్నారు. |
బ్రహ్మాద్యం స్థావరాంతం చ పశ్యంతి జ్ఞానచక్షుషః . తమేకమేవ పశ్యంతి పరిశుభ్రం విభుం ద్విజాః .. 16.. |
|
16.) బ్రహ్మాద్యం స్థావరాన్తం చ పశ్యన్తి జ్ఞాన చక్షుషః తమ్ ఏకమేవ పశ్యంతి పరిశుభ్రం విభుం ద్విజాః ॥ |
జ్ఞాన చక్షువులతో ఆత్మజ్ఞులు ఆ పరమాత్మను - బ్రహ్మదేవుని నుండి స్థావరము వరకు ఏకస్వరూపుడే అయి ఉన్నట్లుగా దర్శిస్తున్నారు. పరిశుభ్రుడుగా, సర్వ నియామకుడగు విభువుగా ఆయనను మాత్రమే సర్వే సర్వత్రా ద్విజులు సందర్శిస్తున్నారు. ‘ఆయనకు అన్యమైనది లేదు’ (అనన్యుడు) అని అభివర్ణిస్తున్నారు. |
యస్మిన్సర్వమిదం ప్రోతం బ్రహ్మ స్థావరజంగమం . తస్మిన్నేవ లయం యాంతి స్రవంత్యః సాగరే యథా .. 17.. |
|
17.) యస్మిన్ సర్వమ్ ఇదమ్ ప్రోతమ్ బ్రహ్మః స్థావర-జంగమమ్ తస్మిన్ ఏవ లయం యాతి స్రవన్త్యః సాగరే యథా॥ |
పరమాత్మయందు (బ్రహ్మమునందు) ఈ ఎదురుగా కనిపిస్తున్న స్థావర జంగాత్మకమైనదంతా గ్రుచ్చబడినదైయున్నది. నదులన్నీ పోయిపోయి సముద్రమునందు కలుస్తున్న తీరుగా (నదీనామ్ సాగరో గతిః), ఈ కనబడేదంతా బ్రహ్మమునుండే బయల్వెడలి, బ్రహ్మమునందే కనిపిస్తూ, బ్రహ్మములోనే లయించుచున్నది. బ్రహ్మమే అయి ఉన్నది. అంతా సర్వదా బ్రహ్మమే! |
యస్మిన్భావాః ప్రలీయంతే లీనాశ్చావ్యక్తతాం యయుః . పశ్యంతి వ్యక్తతాం భూయో జాయంతే బుద్బుదా ఇవ .. 18.. |
|
18.) యస్మిన్ భావాః ప్రలీయన్తే లీనాశ్చ అవ్యక్తతాం యయుః పశ్యన్తి వ్యక్తతాం భూయో జాయన్తే బుద్బుదా ఇవ॥ |
బ్రహ్మదేవుని నుండి స్థావరము వరకు (ఆ బ్రహ్మ స్థావర పర్యన్తమ్) ఈ స్థావర జంగమాత్మక జగత్తంతా ఆపరమాత్మయందు భావనా రూపముగా జనించి, వ్యక్తమై, భావనగానే ఉన్నదై (ఆ బ్రహ్మమునందే), ఒకప్పుడు అభావనత్వము పొంది లయించుచున్నది. మరల మరొకప్పుడు భావరూపంగా పునర్వ్యక్తమగుచున్నది. ఏవిధంగా అయితే జలమునందు బుడగ జనించి, జలములోనే సంచరించుచు, జలమునందే లయించుచున్నదో అట్లాగే, ఇదంతా బ్రహ్మమునుండే బయల్వెడలి, బ్రహ్మమునందే చరిస్తూ బ్రహ్మమునందే లయిస్తోంది. |
క్షేత్రజ్ఞాధిష్ఠితం చైవ కారణైర్విద్యతే పునః . ఏవం స భగవాందేవం పశ్యంత్యన్యే పునః పునః .. 19.. |
|
19.) క్షేత్రజ్ఞ అధిష్ఠితం చ ఏవ, కారణైః విద్యతే పునః ఏవం స భగవాన్ దేవం, పశ్యన్తి అన్తే పునః పునః|| |
ఆ పరమాత్మ క్షేత్రజ్ఞత్వమును అధిష్ఠించి, కార్యకారణ కర్తృత్వాలు స్వీకరించి, సర్వమును (లీలగా) కల్పించుకొని, మరల మరొకప్పుడు క్షేత్రజ్ఞ-కార్యకారణ కర్తృత్వాలను తనయందే లయింపజేసుకుంటున్నారు. మరొకప్పుడు పునరావిర్భావము చేయుచున్నారు - అని జ్ఞానులు దర్శిస్తున్నారు. వారు ఆ తీరుగా దర్శిస్తున్నది. “శృణ్వంతి విశ్వే” ….. అని గానము చేయుచున్నారు. |
బ్రహ్మ బ్రహ్మేత్యథాయాంతి యే విదుర్బ్రాహ్మణాస్తథా . అత్రైవ తే లయం యాంతి లీనాశ్చావ్యక్తశాలినః .. ఇతి మంత్రికోపనిషత్సమాప్తా .. |
|
20.) బ్రహ్మ బ్రహ్మేతి యథా యాన్తి యే విదుః బ్రాహ్మణాః తథా, అత్రైవ తే లయం యాన్తి, లీనాశ్చ అవ్యక్తశాలినః లీనాశ్చా అవ్యక్త శాలినః|| |
జగత్తు లేదు. బ్రహ్మమే ఉన్నది. జగత్తును జగత్తుగా కాకుండా బ్రహ్మముగా ఎరుగు బ్రాహ్మణులు బ్రహ్మమునే పొందుచున్నారు. బ్రహ్మమునందే అవ్యక్త స్వరూపులై బ్రహ్మమునందే లీనము-లయము అగుచున్నారు. జగత్తుగా వ్యక్తము కానివారై అవ్యక్తమునందే లీనమై ఉంటున్నారు. తామే బ్రహ్మమై ఉంటున్నారు. |
ఇతి మంత్రికోపనిషత్ |
ఓం శాంతిః శాంతిః శాంతిః ||
ఓంకార స్వరూపుడగు శ్రీహరికి సద్గురు - సత్ భావనా పూర్వక నమస్కారము. త్రిప్రదక్షిణ పూర్వక సాష్టాంగదండ ప్రణామములు సమర్పిస్తూ….
సోఽహమ్ → స అహమ్ → సః + అహమ్ → అహమ్ సయేవ → హమ్‌స → “హంస” |
సోఽహమ్ తత్త్వము (లేక) పరమాత్మ - పరబ్రహ్మము అను “ఉపనిషత్ వాచక సారాంశ తత్త్వము” గురించి ఇప్పుడు మనము చెప్పుకుంటున్నాము. అనిర్వచనీయమగు ఆత్మగురించి నిర్వచనము చేసుకుంటున్నాము. మాటలకు - భావాలకు అందని స్వస్వరూప కేవలాత్మానందము గురించి కొన్ని మాటలు వివరించుకుంటున్నాము.
⌘
ఆ “హంస” రూప పరబ్రహ్మమును ఆత్మతత్త్వవేత్తలు ఏరీతిగా చూస్తున్నారు?
8 పాదములు కలిగి ఉన్నట్టిదిగాను….,
[1.) దృశ్యము 2.) ద్రష్ట; 3.) మనో 4.) బుద్ధి 5.) చిత్త 6.) అహంకారములు; 7.) జీవాత్మ-ఈశ్వరుడు. జీవుడు = ఒక దేహమును ఉపాధిగా కలిగియున్న నేను! 8.) ఈశ్వరుడు = అనేక దేహపరంపరలను కలిగి ఉండి “మాయ” ను ఉపాధిగా కలిగి ఉన్న నేను.]
శుచిమ్ : ఆ హంస (సోహమ్ స) … అనబడు ఆత్మ పరమశుచి అయినది. ఈ దృశ్య దేహ-మనో-బుద్ధి-చిత్త-అహంకార-జన్మ-కర్మల దోషాలు అద్దానిని స్పృశించవు. “ఆభరణము ధరించినవాడు ఎట్టివాడు? మంచివాడా? కాదా?” … అనుదానితో ఆ ఆభరణములోని బంగారమునకు ఏమి సంబంధము? ఆభరణము ధరించువాని సుగుణ-దుర్గుణములు ఆభరణమునకు అంటవుకదా! ఆత్మకు ఏ దోషము అంటదు. అది సర్వదా శుచివస్తువే! ఆత్మ త్రిగుణములకు ఆధారము కావచ్చుగాక! త్రిగుణసంబంధమైనదే కాదు!
త్రిసూత్రమ్ : దృశ్యము-జీవుడు ఈశ్వరుడు అనునది ఆ బ్రహ్మమును అలంకరించు త్రిసూత్రములు. అట్లాగే, సత్త్వ-రజో-తమో గుణములు కూడా అద్దానిని అలంకరించి ఉండేవే! దృశ్యము-ద్రష్ట-దృక్లలు కూడా ఆ ఆత్మచే ధరించబడే త్రిసూత్రములే! దృశ్యజగత్తు-ద్రష్ట-ఆత్మ … అనునవి ఆ “హంస” యొక్క చమత్కార ఆపాదిత విన్యాసములు.
అణుమ్ : ఈ దృశ్యము-దేహము-మనో-బుద్ధి-చిత్త అహంకారములకంటే కూడా “హంస” (ఆత్మ) అత్యంత సూక్ష్మము. అందుచేత కవులు అద్దానిని “అణువు వంటిది” అని అంటున్నారు. వస్తువు అణువులతో తయారవుతుంది. వస్తువు స్థూలము. అణువు సూక్ష్మము. ఇదంతా ఆత్మ అను అణు నిర్మితమే! ఆత్మ పరమాణువుకు కూడా అణువు!
అవ్యయమ్ : ఈ దృశ్యములో కనిపించేవన్నీ జనించి వ్యయము అయిపోతూ ఉంటాయి. “హంస”యో? వ్యయము పొందదు. మార్పు-చేర్పులు ఉండవు. అందుచేత ఆత్మ అవ్యయము!
త్రివర్త్మానమ్ : ఆ హంస (ఆత్మ) … జాగ్రత్ - స్వప్న - సుషుప్తులనబడే మూడు వీధులలోను (మూడు మార్గములలో) మూడు నడకలతో వర్తిస్తూ ఉంటుంది. కనుక త్రివర్మానము. ఈ జాగ్రత్-స్వప్న-సుషుప్తులు ఆత్మయొక్క వ్యక్తీకరణము. తాను అవ్యక్తమై ఈ సర్వము వ్యక్తీకరించుచున్నది.
అహమ్ తేజసో : ఆ పరమహంస - ప్రతి దేహములోను ‘నేను’ అనే తేజస్సుతో-ప్రకాశమానమై ఉన్నది.
అట్టి హంస అనబడు ఆత్మ ఏమి చేస్తూ ఉన్నది?
హంస సందర్శనము
పోనీ… ఆ హంస ఈ జీవునకు వేరుగా ఎక్కడో ఉన్నదా? లేదు. జీవునికి (ద్రష్టకు) దృశ్యములోని ఈ దేహముతో సహా, మనో-బుద్ధి-చిత్త-అహంకారములతో సహా - బాహ్య, అంతరంగ చతుష్టయ సర్వ విశేషములకంటే కూడా ఎంతో సమీపములో ఉన్నది. “ఎంత సమీపము?” అని అంటే, “ఈ జీవుడు హంస స్వరూపుడే!” … అనునంతగా!
మరి ఈ జీవుడు బాహ్యవస్తువు అయినట్టి దృశ్యమును చూస్తున్నాడు, తెలుసుకుంటున్నాడే గాని, స్వస్వరూపమగు హంసను గమనించటము లేదేమి? ఎందుకంటే, ఈ పాంచ భౌతిక జగత్తును చూచి “సమ్మోహనము” పొంది ఉండటముచేత! ఈ దృశ్యమంతా కాలముతో జనించి కాలముతో లయిస్తోంది. కాలమునందే జాగ్రత్-స్వప్న-సుషుప్తి - దేహ పతనానంతర-పునర్జన్మలు కూడా అంతర్గతమై ఉన్నాయి. అటువంటి భూత సమ్మోహితముతో (Illusioned by seeing matter relatedness) కూడిన కాలము (Time Factor) అనే తెరను ఖండిస్తే, అప్పుడు “దృశ్య సంబంధితుడను” … అనే చీకటి తొలగుతుంది. భూత సంమ్మోహనే కాలే భిన్నే, తమసి వైఖరే!
ఎప్పుడైతే, కాలము-కాలాంతర్గత పంచభూత దృశ్యములు - కాలాంతర్గత త్రి అవస్థలు (జాగ్రత్-స్వప్న-సుషుప్తులు) … అనే విశేషములన్నీ అధిగమించిన దృష్టిని, అవగాహనను ఈ జీవుడు సముపార్జించుకుంటాడో,… అప్పుడు, అతః పశ్యన్తి సత్వస్థా నిర్గుణమ్ గుణగహ్వరే! త్రిగుణములనే గుహలోపల (ఆవల) సర్వదా సత్ స్వరూపమై, చిత్ చైతన్యమై, ఆనందమయమై వెలుగొందుచున్న “హంస” (సోఽహమ్ - స్వకీయ చైతన్య పరతత్త్వము)ను ఈ జీవుడు దర్శించగలడు. “నేనే అది కదా!” అని జ్ఞానదృష్టిచే (Common Sense) గమనించగలడు.
త్రిగుణాత్మక దృష్టి
కౌమారదశలో ఉన్న (చిన్న పిల్లవాని వంటి) ఈ జీవుడు అపరిపక్వమైన (Immatured) బుద్ధి కారణంగా సత్త్వ-రజో-తమో త్రిగుణదృష్టికి పరిమితుడు అగుచున్నాడు. "ఈ దృశ్యములో నేను ఇంకా ఏమి పొందాలి? ఎట్లా పొందాలి?”…. అనే త్రిగుణాత్మకమైన ధ్యాస-ఆశయములతో (లేక) అవగాహనలతో ఎంతగా ధ్యానించినప్పటికీ,… త్రిగుణములకు కూడా ఆధారమైన హంస (ఆత్మ) అనుభవముగా లభించదు. సాంసారికమైన దృశ్య విషయరూప బుద్ధి కొనసాగుచున్నంతవరకు అజ్ఞానము కొనసాగుచూనే ఉంటుంది.
అజ్ఞానమే మాయ! అజ్ఞానమే దృశ్యపరిమితానుభవము.
అజ్ఞానమే అనేక వికారములకు తల్లి! మాయనే ధృవముగా ధ్యానిస్తూ…, మాయలో వెతికితే, మాయయే ఆశయముగా అగుచున్నది. మాయా ప్రయోజనములే సిద్ధిస్తున్నాయి. స్వప్నములో స్వప్నద్రష్ట అగుపించనట్లుగానే, ఈ మాయా కల్పితమగు జగత్తులో ఆత్మను వెతికి ఏమి లాభం? లాభం లేదు!
అట్టి మాయయొక్క 8 రూపములు (శబ్ద - స్పర్శ - రూప - రస - గంధ విషయములు, మననము, ధ్యాస, ఆశ).
దృశ్యాంతర్గతమైనటువంటి ధ్యాస - ఆశయములు, ధ్యేయము కలవాడగు ఈ జీవుడు - దృశ్య వ్యవహారములచేత మరల - మరల ప్రేరణ పొందుచున్నాడు. అప్పుడిక చతుర్విధ (ధర్మ-అర్థ-కామ-మోక్షములకు) పరిమితుడై, వాటికై ప్రయత్నించుచూ, వాటినే పొందటము, కోల్పోవడము కూడా చేయుచున్నాడు. ఫలితం? నిత్యసత్యము, పరము, నిత్యముక్తము అగు “హంస (ఆత్మ)” తత్త్వము వైపుగా దృష్టిని తగినంతగా సారించటము లేదు.
అట్టి దృశ్యపరిమితమైన దృష్టియే “మాయ”.
అట్టి మాయ చేతనే - తేనఏవ అధిష్ఠితాం జగత్ - ఈ జగత్తు అధిష్ఠితిమైయున్నది. మాయయే ఈ సర్వ అన్య భావనా స్వరూపమగు జగదనుభవమునకు మూల పదార్థము. వాస్తవానికి జగత్తు ఆత్మస్వరూపమే! ఆత్మాధిష్ఠితమే!
ఇంద్రియ జగత్ దృశ్యానుభవముల రూపమగు సంసారము ఎట్టిది?
గౌరవాత్ → అత్యంత ఘనీభూతమై, భారమై, “దాటలేమేమో” అను రూపముగా ఈ జీవునికి ఎదురుగా కల్పితముగా ప్రదర్శితమగుచున్నట్టిది. భౌతికంగా కనిపిస్తూ ఆకట్టుకొంటూ ఉన్నది. ఆత్మను ఏమరపింపజేస్తోంది. సత్యమును మరుగు పరుస్తోంది.
ఆద్యస్తవతీ → ఈ శరీరము-సంబంధములు-అనుబంధములు-బాంధవ్యములు-జాతి మత కుల భేదాలు - సంపదలు - ఆపదలు… ఇవన్నీ సుదీర్ఘము …. శాశ్వతము - సత్యము అని అనిపిస్తూ ఉంటాయి. ఇందులో విషయములను కొంచెము సూక్ష్మదృష్టితో పరిశీలిస్తే…. ప్రతి ఒక్కటీ కూడా ఒకప్పటి కల్పనచే ప్రారంభమై, మరొకప్పటి తొలగిపోయేవే! ఇక్కడ “ఎల్లప్పటికీ ఇట్లే ఉంటాయి” అనునది ఒక్కటి కూడా లేదు. ఇదంతా ఆది-ఆంతము కలిగి ఉన్నట్టిది. ఆలోచన యొక్క ‘ఆది-అంతము’ - రూపమైనట్టిది.
సా జనిత్రీ → ఒక్క విషయం ఆశ్రయిస్తే చాలు, దానితోబాటే అనేక వికారాలు చిలవలు పలువలుగా జనించి వెంటనంటినవై ఉంటాయి.
భూతభావనీ → ఇక్కడ సిద్ధించే భూతభావనానుభవములు, వాటితో ఏర్పడే సంబంధ బాంధవ్యములూ… ఇవన్నీ కూడా “భావన”చే ఏర్పడుచున్నవే! నామ-రూపములు, తత్సంబంధితములు… ఇవన్నీ భావన చేస్తేనే ఉంటాయి. లేకుంటే,… ఉండవు. అట్టి భావనయే స్వప్నము వంటి - “నేను-నీవు-వారు-వీరు”… మొదలైనదంతా కల్పిస్తోంది.
సితా-అసితాచ-రక్తాచ : తెల్లని (సత్వగుణము), నల్లని (తమోగుణము), ఎరుపు (రజోగుణము) లతో కూడుకొని, మిశ్రమమై కనిపించుచున్నది.
సర్వకామ దుఘావిభోః : ఈ సంసారము అనేక కోరికల పరంపరలచే నిర్మితమై యున్నట్టిది. కోరికలకు అంతేమున్నది? ఒకటి తీరితే మరొకటి చోటుచేసుకుంటూ ఉంటుంది. తీరని కోరికలు దుఃఖము, ఆదుర్దాలను కలుగజేస్తూ పోతూ ఉంటాయి. “ఏమో! రేపు ఎట్లా ఉంటుందో? మరి ఏం చేయాలి? ఏమికానున్నది? ఎట్లా?” మొదలైన ఉద్వేగములతో నిండిపోయి ఈ సంసారానుభవము ఏర్పడి ఉంటోంది.
ఏమీ తెలియని “అమాయకబాలుడు” వంటి ఈ జీవుడు…..,
→ ఏదో పొందాలి….!
→ ఏదో ఉపాసించాలి. ఇంకా ఎక్కడికో వెళ్ళాలి. ఆ ప్రదేశం - ఆ చోటు … ఎప్పటికో ఏదో చేస్తేగాని లభించదే!
అని అనుకొంటూ రోజులు గడుపుచున్నాడు. "పరమ సత్యము ఏమిటి?” అనేది పరిశీలించటము లేదు.
అజ్ఞానముచే అవిషయములైనట్టి వాటిని విషయములుగా భావించి, వాటిని ఆలోచిస్తూనో, ఆస్వాదిస్తూనో కాలమును వృధా చేసుకుంటున్నాడు. ఆత్మతత్త్వము ఏమిటో-ఎట్టిదో-ఎందుకో తెలిసియున్నట్టి విజ్ఞుడు మాత్రమే విషయములలో తాను చిక్కక, ఏకస్థుడై, ఆత్మను ఎరిగి ఉన్నవాడై, విషయములను కథా విషయములుగా ఆస్వాదించి ఆనందించగలుగుచున్నాడు.
ఈ జీవుడు ధ్యానము మొదలైన ఆయా శాస్త్రములచే సూచించబడుచున్న అభ్యాసములచే పరమాత్మ తత్త్వమేమిటో ఎరుగుచున్నాడు. స్వయముగా తత్ పరమాత్మస్వరూపుడై, విషయములకు ఆవల ఉండి, విషయములను చూచుచూ “వీటినన్నిటియొక్క నియామకుడను నేనే కదా!” అని పకపకా నవ్వుతూ ఆస్వాదిస్తున్నాడు. ధ్యానక్రియాభ్యః భగవాన్ భుక్తో అసౌ ప్రహస్య విభుః॥ స్వయమ్ భగవానుడుగా ఈ జీవుడు అగుచున్నాడు. సర్వ దేహములలో ఏకస్థుడై ఉన్న తన ఆత్మస్వరూపమును ఎరిగినవాడై, స్వచ్ఛందముగా సందర్భానుగతమైన విషయములను ప్రశాంత దృక్కులతో ఆస్వాదిస్తున్నాడు. ఈవిధముగా ఆత్మజ్ఞుడే వాస్తవానికి విషయములను ఆస్వాదించటమును ఎరిగి ఉన్నవాడు సుమా!
సర్వ సాధారణీం దోథీమ్ పీయమానాం తు యజ్వభిః |
సర్వసాధారణమైయున్న ఆత్మను యజ్ఞభావనా బలముతో ఎరిగి ఉన్నవాడై ఆనందపూరిత మనో విన్యాసములో విషయములను విషయములుగా చూడగలుగుచున్నాడు. ఇదంతా తాను వినోదముగా త్రాగుచున్న “పానీయము” వలె భావించి సంతోషము చెదరనివాడై ఉంటున్నాడు. (యజ్వ - విద్యుక్తముగా యజ్ఞము చేయుచున్నవాడు).
ఆత్మదృష్టి
స్నాతక ఆధ్వర్యులు :
స్నాతకము = బ్రహ్మచారి వ్రతము.
ఆధ్వర్యులు = ఉపాసనానుభవము కలవారు. యోగవిదులు. యజ్ఞవిదులు, “ఆత్మానందము” అనే జలముతో స్నానము చేసి, “సుజ్ఞానము” అనే వస్త్రముకట్టి, సర్వవేదాంత సిద్ధాంతములను భూషణములుగా ధరించటమును యజ్ఞముగా భావించి నిర్వర్తించు అభ్యాసము కలవారు. సిద్ధాంతమును అనుసరించువారు.
వీరి సిద్ధాంతమును అనుసరించి
❖ జీవుడు - దృశ్యము అనునవి ఆత్మ అనే పక్షియొక్క రెండు రెక్కలు వంటివి.
❖ 1. జీవాత్మను సందర్భముగాను, పరమాత్మను పరమసత్యముగాను గ్రహించి, జీవాత్మత్వము పట్ల ఉదాశీనులై ఉండటము.
2. జీవాత్మ అనునది పరమాత్మయొక్క కించిత్ కాలము కనిపించే చమత్కార విశేషముగా భావించటము-ఇదియే ఆత్మారామోపాసనము!
ఉదాసీనం ధృవమ్ హంసమ్ - ఆత్మను ధృవమైనదిగాను ఉదాసీనము (దేనికి సంబంధించనిది) గాను ఉంటుందని చెప్పబడుచున్నది.
బహ్వృచులు : వీరు శాస్త్రకోవిదులై ఆత్మగురించి రథంతరము (Beyond the Chariot of this Physical Body) అనబడే సప్తస్వరములతో కూడి సామగానము చేస్తూ ఆత్మయొక్క అప్రమేయత్వ-నిత్యత్వ-సర్వత్వ-అఖండత్వ - దివ్యత్వ - వ్యాప్యత్వ - సత్యత్వ - అమృతత్వ - అమోఘత్వ - నిరంజనత్వ - నిరామయత్వ - నిశ్లేపత్వ ఇత్యాది లక్షణములను ఎలుగెత్తి గానము చేస్తున్నారు. పరమాత్మయే నిత్యసత్యమై జాగ్రత్-స్వప్న సుషుప్తులలో వేరువేరు “నేను”లను అలంకారముగా కలిగి ఉన్నది…. అని వీరు నిర్వచించుచున్నారు.
మంత్రోపనిషదులు : భార్గవుడు, అధర్వణుడు, భృగువు మొదలైన ఆత్మతత్త్వజ్ఞులగు మహనీయులు బ్రహ్మపదమును మహావాక్యముల రూపముగా….
తత్ త్వమ్। సోఽహమ్।
అహమ్ బ్రహ్మాస్మి । జీవో బ్రహ్మేతి నా పరః ।
సర్వమ్ ఖల్విదమ్ బ్రహ్మ త్వమేవాహమ్ ||
అహమ్ త్వమేవ ।
ఇత్యాది మంత్ర వర్ణనములద్వారా ముముక్షువులకు త్రోవచూపుచున్నారు. ఆత్మమననము - ధ్యాస - తదాత్మ్యములను ఎలుగెత్తి చాటుచున్నారు. ఈవిధంగా ఆత్మ పఠణము వినిపిస్తున్నారు.
వారు “బ్రహ్మమునందు చరించటము” అనే బ్రహ్మచారి (బ్రహ్మా హమ్ ఆచారిణ) వృత్తుల గురించి బోధించుచున్నారు. ఆత్మను స్థంభము (కదలని వస్తువు)గా దర్శించి స్థంభయోగముచే ఆత్మ నిశ్చలత్వమును సూచిస్తున్నారు.
ఆత్మను…,
మరికొందరు… ఆ హంస (స్వస్వరూపాత్మను)
→ ప్రజాపతిగాను (సృష్టికర్తగాను),
→ విరాట్ స్వరూపముగాను, (విశ్వరూపుడుగాను),
→ పురుషుడు గాను (సృష్టి స్థితి లయ పురుషకారమును సంప్రదర్శించువాడు గాను),
→ జలస్వరూపుడు, జలజ్యోతి స్వరూపుడుగాను,
మంత్ర-సంస్థుతిలతో స్తోత్రము చేయుచున్నారు.
స్థూయతే మంత్ర సంస్తుత్యైః |
అంతేకాకుండా -
రథర్వవిదితైః విభుః |
ఈ విశ్వము అనే రథములో అధిరోహించిన రధికునివంటిది ఆత్మ! రధికుని కనుసన్నలలో ఆజ్ఞానుసారము రథము చరించువిధంగా, ఆత్మయొక్క ఇచ్ఛా-సంకల్ప స్వరూపమే ఈ బ్రహ్మాండముల రాక - పోకలు అని స్తోత్రము చేయుచున్నారు.
అధర్వణ వేద మంత్రములలో ఆత్మమాహాత్మ్యమును సంస్తుతిస్తున్నారు.
❖ ❖ ❖
ఆ ఆత్మవస్తువగు “హంస” యొక్క తత్త్వము ఎట్టిదో - అది సాంఖ్యమార్గముగా బోధించటానికి మహనీయులగు వేరువేరు గురువులు - వేరు వేరు విభాగములుగా విభజించి ప్రవచించటము జరుగుతోంది.
ఆ పరతత్త్వము 26 అంశలతో (గుణములతో కూడి ఉన్నది
మరికొందరు గురువులు - ఆత్మ 27 గుణములతో కూడి ఉన్నట్లు చెప్పుచున్నారు.
పై మొదటి 24 తత్త్వములకు (25) అవ్యక్తము (26) ఈశ్వరుడు (అనేక దేహములు తనవై, మాయను ఉపాధిగా కలిగి ఉన్నట్టి వాడు) అని కొందరు విభజించి చెప్పుచున్నారు. ‘27వది పరమాత్మ’!
ఇక అథర్వశిరో తత్త్వవేత్తలు (ఆరోపణ వాదులు) :
ఆ పరమ పురుషుడు సర్వదా నిర్గుణుడు! గుణాతీతుడు! కేవలసాక్షి! ఆయనపై మిగతావన్నీ ఆరోపించబడుతున్నాయి అని సిద్ధాంతీకరించుచున్నారు.
ఇంకా, ఆ హంస (ఆత్మ) గురించి 24 తత్త్వములు గల వ్యక్త-అవ్యక్త పురుషుడుగా చెప్పబడుతోంది.
అద్వైత సిద్ధాంతానుసారము : ఆత్మ భగవానుడు ఒక్కడే ఉనికి కలిగి ఉన్నారు. ఆయనకు వేరు మరింకొకటేదీ లేదు. ఆ ఆత్మ దేవుడే జీవాత్మగా, జగత్తుగా కూడా అజ్ఞానదృష్టికి అగుపిస్తున్నారు. జ్ఞానదృష్టి సర్వము సర్వదా ఆత్మయే! ఈ జీవాత్మ జగత్తులు స్వప్నములోని ద్రష్ట - స్వప్న దృశ్యము వంటివి.
ద్వైత సిద్ధాంతానుసారము : జీవాత్మ పరమాత్మను ఆరాధించి పరమాత్మ పాదములు చేరి అఖండానందము సముపార్జించుచున్నాడు. అయితే జీవాత్మ కించిజ్ఞుడు (కొంతయే తెలిసినవాడు). పరమాత్మ సర్వజ్ఞుడు. జీవాత్మ సర్వజ్ఞుడు అయ్యే ప్రసక్తియే లేదు. కనుక ద్వైతము సర్వదా యథాతథము - అని బోధిస్తున్నారు. జీవాత్మ పరమాత్మను ఆశ్రయించి ఉండటమే మోక్షము-అని ప్రకటిస్తున్నారు.
త్రిధాతము : మరికొందరు జీవాత్మ - జగత్తు - పరమాత్మ ఎప్పటికీ వేరువేరుగా ఇట్లాగే ఉంటాయి-అను సిద్ధాంతమును - ప్రతిపాదిస్తున్నారు.
పంచధాతము : మరికొందరు…, జగత్తు - జీవాత్మ - మాయ - ఈశ్వరుడు - పరమాత్మ … సర్వదా వేరుగానే ఉంటాయి-అను నిశ్చయము తెలుపుచున్నారు. ఈవిధంగా…. అనేక సిద్ధాంతములు బోధింపబడుచున్నాయి.
ఇక ఈ ఉపనిషత్ ప్రతిపాదించుచున్న హంస తత్త్వము :
జ్ఞాన చక్షువులకు అనేకముగా ఉన్నదంతా ఏకముగా అనిపిస్తోంది. తెలియవస్తోంది. సృష్టికర్తయగు బ్రహ్మదేవుడినుండి – స్థావరము వరకు - బ్రహ్మాద్యమ్ స్థావరాన్తంచ పశ్యన్తి జ్ఞాన చక్షుషః తమ్ ఏకమేవ! ఏకమగు పరమాత్మయే సర్వదా ఉన్నది- . ఇక్కడ అనేకమనునదే లేదు. ఒకే స్వప్నములో అనేక నామ రూపముల కల్పన వంటిదే ఈ కనబడేదంతా!
తమ్ ఏకమేవ పశ్యంతి పరిశుభ్రమ్ విభుమ్ ద్విజాః | వేద హృదయమును, వేదాంత తత్త్వమును ఎరిగిన ద్విజులు ఆ పరమాత్మ జీవాత్మ-జగత్తు మొదలైన దోషములచే స్పృశించబడడని గమనిస్తున్నారు. సర్వ భావములకు ఆయనయే విభుడని, అంతా తానే అయి అఖండము - అప్రమేయము - నిత్యము - సత్యము అయి సర్వదా వెలుగొందుచున్నారని ఎలుగెత్తి సిద్ధాంతీకరించుచున్నారు.
ఇక ఈ స్థావర జంగమాత్మకమై కనిపించేది ఏమిటంటారా? సముద్రజలములో తరంగము ఆకార సమన్వితముగాలేచి, సముద్ర జలములోనే సంచరించి, చివరికి సముద్రజలములోనే లయిస్తోంది కదా! స్రవన్తి సాగరే యథా!
అట్లాగే ఈ జగత్ృశ్యానుభవమంతా కూడా భావనాతరంగ రూపమే అయి ఉండి, ఆత్మమహా సముద్రములో బయల్వెడలి, ఆత్మయందే అటూ-ఇటూ సంబరాలు చేసి చేసి, చివరికి ఆత్మయందే లయము పొందుచున్నది. యస్మిన్ సర్వమ్ ఇదమ్ ప్రోతమ్ బ్రహ్మః స్థావర జంగమమ్, తస్మిన్యేవ లయం యాతి। ఈ దృశ్య జగత్ అనుభవ పరంపరా వ్యవహారమంతా ఇద్దాని స్థావర-జంగమ విశేషాలతో సహా ఎద్దానియందు ప్రోతము (జలములో జలతరంగమువలె) అయి ఉన్నదో…., అట్టి ఆత్మయందే జగత్ భావములు మొదలంట్లో లయిస్తున్నాయి. అప్పుడు అనేకముగా కనిపిస్తున్న దృశ్యమంతా ఏకమగు ఆత్మగానే అనిపిస్తూ, అనుభూతము అగుచున్నది.
మరల చెప్పుకుందాము.
జలంలో ఒక బుడగ (Bubble) బయల్వెడలి, జలంలోనే సంచారాలు చేస్తూ, చివరికి తిరిగి జలమునందే లయము పొందుతోంది కదా! అట్లాగే, యస్మిన్ భావాః ప్రలీయన్తో లీనాశ్చ అవ్యక్తతాం యయుః, పశ్యన్తి వ్యక్తతాం భూయో జాయన్తో – బుద్బుదా ఇవ! ఎద్దానియందైతే (ఆత్మయందు) భావగతమైన తతంగమంతా లీనమై అవ్యక్తత్వము సంతరించుకుంటోందో, అద్దానినుండే బుద్బుదమువలె, భావన వ్యక్తమై మరల మరల దృశ్యరూపమున కనిపించునదిగా అగుచున్నది. దీనంతటి వలనా కూడా ఆత్మకు వచ్చే లోటు ఏమీ లేదు.
ఇదంతా బ్రహ్మమునుండే బయల్వెడలి, బ్రహ్మమునుండే ప్రదర్శనమగుచూ, బ్రహ్మమునందే లయించుచున్నది. బ్రహ్మము సర్వదా బ్రహ్మమే అయి ఉన్నది. ఇదంతా సర్వదా బ్రహ్మమే!
పరమాత్మ - క్షేత్రజ్ఞత్వము
పరమాత్మయే …, సర్వ దేహములలోనూ “క్షేత్రజ్ఞుడు (Knower)" - రూపమును అధిష్ఠించి, మరల కారణస్వరూపుడై తనకు అన్యమైనదిగా కనిపించుచున్న క్షేత్రమును భావనచేస్తూ సృష్టి స్థితి లయములను పునః పునః కల్పించుకొనుచున్నారు.
క్షేత్రజ్ఞుడు : ఎరుగుచున్నవాడు. ఇది నా దేహము - నేను పొందు దృశ్యము - బుద్ధి - ఇంద్రియములు - ఇంద్రియ విషయములు - సుఖ - దుఃఖములు… అను రూపముగా తనకు అన్యమైనదంతా ఎరుగుచున్నట్టివాడు.
క్షేత్రము : ఎరుగబడుచున్నట్టిది. పంచమహాభూతములు, బుద్ధి, అహంకారము, వ్యక్తీకరణమునకు ఆవలగల అవ్యక్తము (దేహి), పంచజ్ఞానేంద్రియములు - పంచకర్మేంద్రియములు, కర్మేంద్రియ-జ్ఞానేంద్రియ విషయములు, ఇచ్ఛ, ద్వేషము, సుఖ-దుఃఖ భావములు సంఘాతము (కలయిక), చేతనము (కదలించునది), ధైర్యము-ఉత్సాహము మొదలైనవన్నీ!
అయితే….,
- సముద్ర జలములో బయల్వెడలిన తరంగము జలము కానిదెప్పుడు? ఆ తరంగము జలమే అయి జలమునందే సంచరించుచున్నది కదా!
అట్లాగే…,
- ఆత్మనుండి (హంస-సోహమ్- అను సహజమగు “నేను” నుండి)…. “క్షేత్రజ్ఞుడు” (తెలుసుకొనువాడు) బయలుదేరి తనకు బాహ్యముగా “తెలియబడునది (క్షేత్రము)” ను కల్పించుకొని, జగత్తు అనబడు 14 లోకముల రూప దృశ్యములో సంచారములు చేస్తున్నప్పటికీ, ఆత్మయే క్షేత్రజ్ఞుని రూపము. క్షేత్రజ్ఞుడు ఆత్మ స్వరూపము కానిది ఎన్నడూ లేదు. (తరంగము జలముకాని క్షణమే లేనివిధంగా)!
- ఆత్మయే “తెలియబడునది” అను రూపము అయి ఉన్నది. అనగా, తెలియబడుదాని రూపమంతా ఆత్మయే! (తరంగము సంచారములు చేస్తున్నదంతా జలములోనే, జలమే అయి ఉంటున్న తీరుగా)! (The “Absolute Self” itself is always - ‘The knower’ as well “All that being known”).
సర్వము సర్వదా సర్వథా సర్వత్రా ఆత్మయే!
కనుక ఆత్మ నుండి వేరుగా ఏదీ బయల్వెడలటమూ లేదు. ఆత్మ నుండి (సముద్ర జలములో తరంగమువలె) ఏదైనా బయల్వెడలుచున్నదనుకొంటే… అట్టి క్షేత్రజ్ఞుడు - క్షేత్రము… మొదలైనదంతా ఆత్మకు అభిన్నము. అందుచేత ఆత్మ సర్వదా అద్వితీయము! అఖండము! నిత్య సత్యము! ఆత్మకు భిన్నమై ఒకప్పుడుగాని - ఇప్పుడు గాని, మరొకప్పుడు గాని ఏదీ లేదు! సర్వదా ఆత్మయే అయి, సదాశివ స్వరూపమై వెలుగొందుచున్నది.
ఎవ్వరైతే - బ్రహ్మ బ్రహ్మేతి యథా యాన్తి, యే విదుః బ్రాహ్మణాః తథా…. బ్రహ్మమునుండి బయలుదేరునది బ్రహ్మమే అయి ఉన్నది… అని ఎరుగుచున్నారో…. అట్టి వాడు బ్రాహ్మణుడు… అని చెప్పబడుచున్నాడు.
అత్రైవ తే లయం యాన్తి లీనాశ్చ అవ్యక్తశాలినః |
ఆతని వ్యక్త - అవ్యక్తములు ఇప్పుడే, ఇక్కడే బ్రహ్మము అయి ఉన్నాయి. బ్రహ్మమునందే క్షేత్రజ్ఞ - క్షేత్రములు బ్రహ్మముగా ప్రకాశించుచున్నవగుచున్నాయి.
🙏 ఇతి మంత్రిక ఉపనిషత్ | 🙏
ఓం శాంతిః శాంతిః శాంతిః ||