[[@YHRK]] [[@Spiritual]]
Muktikā Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 1
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com
[ముక్తికా = ముత్యము, Pearl]
ఈశాద్యష్టోత్తరశతవేదాంతపటలాశయం . ముక్తికోపనిషద్వేద్యం రామచంద్రపదం భజే .. |
శ్లో॥ ఈశాది అష్టోత్తర శత (108) వేదాంత పటలాశయమ్
ముక్తికోపనిషత్ వేద్యం రామచంద్రపదమ్ భజే ॥
ఆత్మజ్ఞానానంద వైభవమే ‘ఈశావాస్యోపనిషత్’ మొదలైన 108 ఉపనిషత్తులందు అంతటా రసస్వరూపమై, వేదాంతసార విశేషములతో విస్తరించి ఉన్నది. సర్వ ఉపనిషత్తుల మహదాశయమగు ఆత్మారామచంద్ర పదమును స్తుతిస్తున్నాను. ఈ ముక్తికోపనిషత్ సర్వ ఉపనిషత్తుల సారము.
ప్రథమాధ్యాయము
ఓం అయోధ్యానగరే రమ్యే రత్నమండపమధ్యమే . సీతాభరతసౌమిత్రిశత్రుఘ్నాద్యైః సమన్వితం .. 1.. సనకాద్యైర్మునిగణైర్వసిష్ఠాద్యైః శుకాదిభిః . అన్యైర్భాగవతైశ్చాపి స్తూయమానమహర్నిశం .. 2.. |
|||||
1.) ఓం అయోధ్యానగరే రమ్యే రత్న మంటప మధ్యమే, సీతా భరత సౌమిత్రి శత్రుఘ్నాద్యైః సమన్వితమ్, సనకాద్యైః మునిగణైః వసిష్ఠాద్యైః, శుక - ఆదిభిః, అన్యైః భాగవతైశ్చ అపి స్తూయమానమ్, అహర్నిశమ్ || |
ఓం కార స్వరూపుడగు శ్రీరామచంద్రమూర్తికి నమస్కరిస్తూ…, అతిరమ్యము - మనోహరము అగు అయోధ్యానగరమునందు, రత్నమంటపము మధ్యగా సీతా - భరత - లక్ష్మణ - శత్రుఘ్నులు మొదలైన వారితో కూడుకొని…, సనకుడు సనందనుడు మొదలైన అనేకమంది మునివర్యులతోను, శ్రీ వసిష్ఠ మహర్షి, శుక మహర్షి వంటి మహనీయులతోను, తదితర అనేకమంది భాగవతోత్తములతోను శ్రీరామచంద్రస్వామి ఉపపవేష్ఠితులై ఉన్నారు. వారంతా క్షణక్షణము, అహర్నిశము శ్రీరామచంద్ర పరబ్రహ్మమును స్తోత్రము చేస్తున్నారు. |
||||
ధీవిక్రియాసహస్రాణాం సాక్షిణం నిర్వికారిణం . స్వరూపధ్యాననిరతం సమాధివిరమే హరిం .. 3.. భక్త్యా శుశ్రూషయా రామం స్తువన్పప్రచ్ఛ మారుతిః . |
|||||
2.) ‘ధీ’ విక్రియా సహస్రాణాం సాక్షిణం నిర్వికారిణమ్ స్వరూప ధ్యాన నిరతం, సమాధి విరమే హరిమ్ | భక్త్యా శుశ్రూషయా రామం స్తువన్ పప్రచ్ఛ మారుతిః|| |
ఆ సమయంలో శ్రీరామచంద్ర ప్రభువు ఆత్మారాముడై, బుద్ధి నుండి బయల్వెడలుచున్న వేలాది భావనా వికారములకు కేవల సాక్షియై సమాధిని ఆశ్రయించినవారై ఉన్నారు. నిర్వికారుడై, స్వస్వరూప ధ్యాననిరతుడై సమాధిని ఆస్వాదిస్తూ ఉన్నారు. కొంతసేపు గడచింది. భక్తజనపరాయణుడు అవటముచేత అట్టి ‘సమాధి’ నుండి బయల్వెడలి కనులు తెరచారు. ఆ శ్రీహరి అవతారుడగు రామయ్య ఆ విధంగా సమాధి ఆనందమునుండి బయల్వెడలి బహిర్ముఖుడై చిరునవ్వుతో సభాసదులపై ప్రేమచూపుల వర్షము కురిపించసాగారు. స్వామి సమాధిని విరమించి బహిర్ముఖుడవటమును శ్రీరాముని పాదాలపై దృష్టిని నిలిపి శుశ్రూష చేస్తున్న ఆంజనేయ స్వామి ముందుగా గమనించారు. భక్తితో స్తుతిస్తూ, “ఇది తగిన సమయము" అని భావించి, శ్రీరామచంద్రుని ఇట్లు పరిప్రశ్నించనారంభిచారు. |
||||
రామ త్వం పరమాత్మసి సచ్చిదానందవిగ్రహః .. 4.. ఇదానీం త్వాం రఘుశ్రేష్ఠ ప్రణమామి ముహుర్ముహుః . త్వద్రూపం జ్ఞాతుమిచ్ఛామి తత్త్వతో రామ ముక్తయే .. 5.. అనాయాసేన యేనాహం ముచ్యేయం భవబంధనాత్ . కృపయా వద మే రామ యేన ముక్తో భవామ్యహం .. 6.. |
|||||
శ్రీ మారుతిః ఉవాచ : రామ! త్వం పరమాత్మాఽసి, సత్-చిత్-ఆనంద విగ్రహః| ఇదానీం త్వాం, రఘుశ్రేష్ఠ! ప్రణమామి ముహుర్ముహుః త్వత్ రూపమ్, జ్ఞాతుమ్ ఇచ్ఛామి తత్త్వతో, రామ! ముక్తయే | అనాయాసేన ఏన అహమ్ ముచ్యే అయం భవ బంధనాత్! కృపయా వద మే, రామ! యేన ముక్తో భవామి అహమ్? |
శ్రీ మారుతి : హే రామచంద్ర భగవన్! మీరు స్వయమ్ పరమాత్మానంద స్వరూపులు, సత్ (ఉనికి) - చిత్ (ఎరుక-వెలుగు) - ఆనంద విగ్రహులు! తండ్రీ! రఘుశ్రేష్ఠా! మీకు మరల మరల ప్రణామములు సమర్పించుకుంటున్నాను. స్వామీ! ఓ రామయ్యా! అనేక సంసార బంధములలో చిక్కుకున్న నేను మీ యొక్క తత్త్వరూపము తెలుసుకొని, ముక్తుడిని అవ్వాలని కోరుకొంటున్నానయ్యా! ఈ జగత్తు సత్యమే - అను రూపముగల ’భవ’ బంధములో చిక్కుకొనియున్నాను. అట్టి నాకు - ఈ దుర్భర భవబంధము నుండి అనాయాసముగా - సులభముగా ఏ విధంగా విముక్తి కలుగ గలదో - అట్టి ఆ మార్గమును దయతో శెలవీయండి. నా మీద కృపతో “దేని చేత నేను ముక్తుడను కాగలను?” అనునది ప్రబోధించ ప్రార్థన! |
||||
సాధు పృష్టం మహాబాహో వదామి శృణు తత్త్వతః . వేదాంతే సుప్రతిష్ఠోఽహం వేదాంతం సముపాశ్రయ .. 7.. |
|||||
శ్రీ రామచంద్రౌవాచ : సాధు పృష్టం మహాబాహెూ। వదామి, శ్రుణు తత్త్వతః। వేదాంతే సుప్రతిష్ఠా అహమ్। వేదాంతమ్ సముపాశ్రయ। |
శ్రీరామచంద్రుడు : ఉత్తమ భుజములు కలిగియున్న ఓ ప్రియ ఆంజనేయా! నీవు అడుగుచున్నది ఉత్తమమైన, పరమ శ్రేయోదాయకమైన విషయము. యదార్థతత్త్వమేమిటో తప్పక చెప్పుతాను. సావధాన చిత్తుడవై విను. ఈ దృశ్య జగత్తంతా ‘వేదమ్’ తెలియబడునది. దీనికంతటికీ ఆవల (అంతేన) - “తెలుసుకొనుచున్నవాడు - ఎరుగుచున్నవాడు" ఉన్నాడు. నేను అట్టి వేదాంత స్వరూపమునందు సుప్రతిష్ఠితుడనై ఉన్నాను. అందుచేత ప్రియ హనుమా! నీవు తెలియబడుచున్నదానిని అధిగమించి, వేదాంత తత్త్వమును ఆశ్రయించవయ్యా! అట్టి వేదాంతవిజ్ఞానము (ఉపనిషత్తులచే) అభివర్ణించబడుచున్నది. |
||||
వేదాంతాః కే రఘుశ్రేష్ఠ వర్తంతే కుత్ర తే వద . |
|||||
3.) శ్రీ హనుమాన్ - ఉవాచ : వేదాంతాః కే? రఘు శ్రేష్ఠా! వర్తంతే కుత్ర తే, వద? |
శ్రీ ఆంజనేయ స్వామి : ఓ రఘుశ్రేష్ఠా! వేదాంతము ఎట్టిది? అట్టి వేదాంత శాస్త్రమును విశదీకరించు శాస్త్రములు (ఉపనిషత్తులు) ఏమని శాస్త్రీకరిస్తున్నాయి? అవి ఎక్కడ ఎవరిచే చెప్పబడుచున్నాయి? ఆ ఉపనిషత్తులు బోధిస్తున్నది దేని గురించి? దయచేసి ఆ వివరాలు చెప్పండి. | ||||
హనూమంఛృణు వక్ష్యామి వేదాంతస్థితిమంజసా .. 8.. నిశ్వాసభూతా మే విష్ణోర్వేదా జాతాః సువిస్తరాః . తిలేషు తైలవద్వేదే వేదాంతః సుప్రతిష్ఠితః .. 9.. |
|||||
శ్రీరామచంద్రౌవాచ : హనుమాన్! శృణు వక్ష్యామి వేదాంత స్థితి మంజసా । నిశ్వాసభూతా మే విష్ణోః వేదా జాతాః సు విస్తరాః । తిలేషు తైలవత్ వేదే వేదాంతః సుప్రతిష్ఠితః । |
శ్రీరామచంద్రుడు : ఓ ప్రియ హనుమా! నీవు కోరిన విధముగా వేదాంతముల - ఉపనిషత్తుల వివరములు చెప్పుచున్నానయ్యా! విను. నాయొక్క విష్ణుతత్త్వమునుండి నిశ్వాస (గాలి వదలు) రూపముగా అనాయసముగా సువిస్త్రుతమగు విజ్ఞానభాండాగారముగా ‘వేదాంతములు’ పుట్టాయి. అవన్నీ సువిస్తారమై ఉన్నాయి. నువ్వులలో - నూనె దాగి ఉండు విధముగా, వేదములలో వేదాంత - జ్ఞానము సుప్రతిష్ఠితమైయున్నది. నేను వేదాంతస్వరూపుడనై ప్రకాశించుచున్నాను. |
||||
రామ వేదాః కతివిధాస్తేషాం శాఖాశ్చ రాఘవ . తాసూపనిషదాః కాః స్యుః కృపయా వద తత్త్వతః .. 10.. |
|||||
శ్రీ హనుమాన్ ఉవాచ : శ్రీరామా! వేదాః కతి విధాః తేషామ్ శాఖాశ్చ, రాఘవ? తాసు ఉపనిషదః కాః స్యుః? కృపయా వద తత్త్వతః। |
శ్రీ హనుమ : హే మమ ఆత్మేశ్వరా! శ్రీరామా! వేదములు - వాటి శాఖలు ఏ ఏ విధములై ఉన్నాయి? ఆ వేదములలో వేదాంత శాస్త్ర సూత్ర ప్రదర్శనములగు ఉపనిషత్తులు ఏ రీతులుగా ఉన్నాయి! కృపతో తత్త్వపూర్వకమైన విషయాలు చెప్పండి. | ||||
శ్రీరామ ఉవాచ . ఋగ్వేదాదివిభాగేన వేదాశ్చత్వార ఈరితాః . తేషాం శాఖా హ్యనేకాః స్యుస్తాసూపనిషదస్తథా .. 11.. ఋగ్వేదస్య తు శాఖాః స్యురేకవింశతిసంఖ్యకాః . నవాధికశతం శాఖా యజుషో మారుతాత్మజ .. 12.. సహస్రసంఖ్యయా జాతాః శాఖాః సామ్నః పరంతప . అథర్వణస్య శాఖాః స్యుః పంచాశద్భేదతో హరే .. 13.. |
|||||
శ్రీరామ ఉవాచ : ఋగ్వేదాది విభాగేన వేదాః చత్వార (4) ఈరితాః తేషాం శాఖా హి అనేకాః స్యుః। తాసు ఉపనిషదః తథా! - ఋగ్వేదస్య తు శాఖాః స్యుః ఏక వింశతి (21) సంఖ్యయా| - నవాధిక శతం (109) శాఖా “యజుషో, మారుతాత్మజా! - సహస్ర సంఖ్యయా (1000) జాతాః శాఖాః సామ్నః, పరంతప! - అధర్వణస్య శాఖాస్స్యుః పంచాశత్ (50) భేదతో, హరే! |
శ్రీరాముడు : వేదములు 4 విభాగములుగా విభజించబడ్డాయి. 1.) ఋగ్వేదము 2.) యజుర్వేదము 3.) సామవేదము 4.) అథర్వణవేదము. ఆ ’4’ వేదములకు అనేక శాఖలు, ఉపశాఖలు. వాటిని అనుసరించుచూ, ఉపనిషత్తులు కూడా ఆ శాఖ-ఉపశాఖలలో నిక్షిప్తమై ఉన్నాయి. ఓ మారుతాత్మజా! ఆ వివరాలు ప్రస్తావిస్తున్నాను. విను. ఋగ్వేదమునకు ‘21’ శాఖలు, యజుర్వేదమునకు ‘109’ శాఖలు, సామవేదమునకు ‘1000’ శాఖలు, అథర్వణ వేదమునకు ‘50’ శాఖలు. ఈ శాఖలన్నీ వేరువేరు రీతులుగా అనేక విశేష భేదములు కలిగి ఉన్నాయి. (మొత్తం–1180) |
||||
ఏకైకస్యాస్తు శాఖాయా ఏకైకోపనిషన్మతా . తాసామేకామృచం యశ్చ పఠతే భక్తితో మయి .. 14.. స మత్సాయుజ్యపదవీం ప్రాప్నోతి మునిదుర్లభాం . |
|||||
4.) ఏకైకస్య అస్తు శాఖాయా ఏకైక ఉపనిషత్ మతా! తాసామ్ ఏకాం ఋచం యేన పఠ్యతే భక్తితో మయి | స మత్ - సాయుజ్య పదవీం ప్రాప్నోతి ముని దుర్లభామ్ | |
మనము చేప్పుకున్న ఈ నాలుగు వేదముల - వివిధ శాఖలలో ఒక్కో శాఖలో ఒక్కొక్క ఉపనిషత్ వర్ణితమై, వేద అంతర్విభాగ (వేదాంత విభాగమై) - ఉన్నది. అట్టి ఉపనిషత్తులలోని సారభూతమైన బ్రహ్మ జ్ఞానమును ఎవ్వరు భక్తితో అధ్యయనము చేస్తారో, అట్టివారు మునులకు కూడా దుర్లభమైనటువంటి నా సాయుజ్య పదవిని పొందుచున్నారు. | ||||
రామ కేచిన్మునిశ్రేష్ఠా ముక్తిరేకేతి చక్షిరే .. 15.. కేచిత్త్వన్నామభజనాత్కాశ్యాం తారోపదేశతః . అన్యేతు సాంఖ్యయోగేన భక్తియోగేన చాపరే .. 16.. అన్యే వేదాంతవాక్యార్థవిచారాత్పరమర్షయః . సాలోక్యాదివిభాగేన చతుర్ధా ముక్తిరీరితా .. 17.. |
|||||
శ్రీ హనుమాన్ ఉవాచ : (హే) శ్రీరామ! - కేచిత్ మునిశ్రేష్ఠా ‘ముక్తిః’ ఏకేతి చక్షిరే! - కేచిత్ త్వమ్ నామభజనాత్ । - కాశ్యాం తారా-ఉపదేశతః । - అన్యేతు ’సాంఖ్య యోగేన’ । - ‘భక్తి యోగేన’ చ అపరే అన్యే ’వేదాంత వాక్యార్థ విచారాత్ పరమర్షయః’ । - "సాలోక్యాది విభాగేన చతుర్థా ముక్తిః” … ఈరితా । |
శ్రీ హనుమంతుడు : ఓ శ్రీరామా! వేరు వేరు మునిశ్రేష్ఠులు ముక్తికి వేరు వేరు మార్గములు ఉన్నాయని సిద్ధాంతీకరించి చెప్పుచూ ఉన్నారు. → కొందరేమో మీ (రామ) నామ భజన మాత్రమే తరుణోపాయమని ఉపదేశిస్తున్నారు. తారక మంత్రమే మార్గమంటున్నారు. → ఇంకొందరు ఆత్మ-అనాత్మ విచారణ, అంతరంగ చతుష్టయ విచారణలతో కూడిన తత్త్వ జ్ఞానము అగు ‘సాంఖ్య యోగము’ మాత్రమే త్రోవ అని అంటున్నారు. → వేరే కొందరు భక్తియోగము - భక్తి గుణ సంపద (అమానిత్వము మొదలైనవి) మార్గదర్శకముగా బోధిస్తున్నారు. → ఇక కొందరైతే “అయ్యా! అన్నీ అట్లా అట్టిబెట్టండి. తత్త్వమ్ - సోఽహమ్ - త్వమేవాహమ్ - ఇత్యాది మహా వాక్యముల విచారణ చేయండి” అని (పరమర్షులు) సూచిస్తున్నారు. → కొందరు మహనీయులు - “సారూప్యము - సామీప్యము - సాలోక్యము - సాయుజ్యము” అను చతుర్విధ (4) మార్గములను - మెట్లుగా మోక్షమార్గమును ప్రవచిస్తున్నారు. వీటిని గురించి దయతో వివరించండి. |
||||
సహోవాచ శ్రీరామః . కైవల్యముక్తిరేకైవ పరమార్థికరూపిణీ . దురాచారరతో వాపి మన్నామభజనాత్కపే .. 18.. సాలోక్యముక్తిమాప్నోతి న తు లోకాంతరాదికం . కాశ్యాం తు బ్రహ్మనాలేఽస్మిన్మృతో మత్తారమాప్నుయాత్ .. 19.. పునరావృత్తిరహితాం ముక్తిం ప్రాప్నోతి మానవః . యత్ర కుత్రాపి వా కాశ్యాం మరణే స మహేశ్వరః .. 20.. జంతోర్దక్షిణకర్ణే తు మత్తారం సముపాదిశేత్ . నిర్ధూతాశేషపాపౌఘో మత్సారూప్యం భజత్యయం .. 21.. సైవ సాలోక్యసారూప్యముక్తిరత్యభిధీయతే . |
|||||
5.) సహెూవాచ శ్రీరామః : కైవల్యముక్తిః ఏకైవ పారమార్థిక రూపిణీ। దురాచారరతోవాఽపి మన్నామ భజనాత్, కపే! “సాలోక్యముక్తిమ్”అప్నోఽతి న తు లోకాంతరాదికమ్| కాశ్యాంతు బ్రహ్మనాళే అస్మిన్, మృతో మత్ ‘తారమ్’ అప్నుయాత్, పునరావృత్తి రహితాం ముక్తిమ్ ప్రాప్నోతి మానవః। యత్ర కుత్రాపి వా కాశ్యాం మరణే స మహేశ్వరః, జంతోః దక్షిణ కర్ణేతు మత్ ‘తారమ్’ సముపాదిశేత్| నిర్ధూత అశేష పాపౌఘో మత్ సారూప్యమ్ భజతి అయమ్, స ఏవ “సాలోక్య సారూప్య ముక్తిః” - ఇతి అభిధీయతే। |
శ్రీరామచంద్రుడు : ’కైవల్యముక్తి’ పారమార్థికంగా ఏకమేగాని, అనేక రూపములైనట్టిది కాదు! ఓ కపీశ్వరా! ఒకడు దురాచారుడైనప్పటికీ ఇప్పుడు (శ్రీరామ్ జయ రామ్। జయ జయ రామ్ మొదలగు రీతిగా) నా నామస్మరణను ప్రారంభిస్తే ఆతడు తప్పక ’సాలోక్యముక్తి’ని ఇక్కడే పొందుచున్నాడు. ఆతడు ముక్తికై వెతుకుతూ మరొక లోకమునకు వెళ్ళవలసిన పని ఉండదు. ఏ మానవుడైతే బ్రహ్మనాళమునందు ఉన్నవాడై కాశీ సుక్షేత్రములో (లేక, బ్రహ్మరంధ్ర బాహ్య-అభ్యంతర క్షేత్రములో) మరణము పొందుతాడో (ఆతడు దురాచారుడైనప్పటికీ… తారక మంత్రముచే తరించుచున్నాడు. ఆట్టి తారక మంత్రమును పొంది ఆతడు పునరావృత్తి రహితమగు ముక్తిని పొందుచున్నాడు. ఏ జీవుడైనా సరే, ‘కాశీ’ (బ్రహ్మరంధ్ర) పుణ్యక్షేత్రములలో మరణము పొందుచున్నప్పుడు, (లేక బ్రహ్మరంద్ర స్థానములో ధ్యాస కలిగి ఉండి దేహమును త్యజించుచున్నప్పుడు) మహేశ్వరుడు ఆ జీవుని కుడిచెవిలో ప్రేమాస్పదముగా తారకమంత్రమును ఉపదేశించుచున్నారు. ఆ కరుణామయుడగు శివభగవానునిచే తారకమంత్రము పొందిన ఆ జీవుడు సమస్త పాపదోషముల నుండి పరిశుద్ధుడై, విముక్తుడై, నాయొక్క సారూప్యముక్తిని పొందుచున్నాడు. నా స్వరూపుడై బుద్ధి వృత్తులకు కేవల సాక్షి అయి, రామ తత్త్వములో ప్రవేశిస్తున్నాడు. రామబ్రహ్మ స్వరూపుడగుచున్నాడు. ఇదియే సాలోక్య - సారూప్య ముక్తి అని చెప్పబడుతోంది. |
||||
సదాచారరతో భూత్వా ద్విజో నిత్యమనన్యధీః .. 22.. మయి సర్వాత్మకో భావో మత్సామీప్యం భజత్యయం . సైవ సాలోక్యసారూప్యసామీప్యా ముక్తిరిష్యతే .. 23.. గురూపదిష్టమార్గేణ ధ్యాయన్మద్గుణమవ్యయం . మత్సాయుజ్యం ద్విజః సమ్యగ్భజేద్భ్రమరకీటవత్ .. 24.. సైవ సాయుజ్యముక్తిః స్యాద్బ్రహ్మానందకరీ శివా . చతుర్విధా తు యా ముక్తిర్మదుపాసనయా భవేత్ .. 25.. |
|||||
6.) సదాచార రతో భూత్వా ద్విజో నిత్యమ్ అనన్య ధీః, మయి సర్వాత్మకే భావో మత్ సామీప్యం భజతి అయమ్| స ఏవ “సాలోక్య సారూప్య సామీప్యా ముక్తిః” ఇష్యతే॥ గురూ - ఉపదిష్ఠ మార్గేణ ధ్యాయన్ మత్ రూపమ్ అవ్యయమ్, మత్ సాయుజ్యం ద్విజః సమ్యక్ భజేత్ భ్రమరకీటవత్| స ఏవ సాయుజ్యముక్తిః స్యాత్ బ్రహ్మానందకరీ, శివా! చతుర్విధా చ యా ముక్తిః మత్ ఉపాసనయా భవేత్| |
సాలోక్య సారూప్య సామీప్య ముక్తి : ఒకడు ఇహత్వమునకు ఆవలగల పరత్వమునందు నిష్ఠ - శ్రద్ధలచే ‘ద్విజుడు’ అయి సదాచారములను నిర్వర్తిస్తూ, ఆత్మారామునిగా, సర్వాత్మక భావముతో నన్ను సర్వరూపముల సామీప్యరూపుడుగా, (ఎదురుగా ’త్వమ్’ స్వరూపుడుగా) భజిస్తూ ఉంటే, అట్టివాడు ’సాలోక్య - సారూప్య - సామీప్య ముక్తి’ని కరతలామలకము చేసుకొనుచున్నాడు. సాయుజ్య ముక్తి : సద్గురువు ఉపదేశించుచున్న ‘తత్-త్వమ్’ మార్గముగా నా రూపమును (సర్వమునందు ఉన్న నన్ను - నాలోనే ఈ సర్వము ఉండటమును) అవ్యయమైనట్టిదిగా ధ్యానము చేస్తూ ఉంటే, ఆ ద్విజుడు - భ్రమరకీటక న్యాయము - వలె, సమ్యక్ భావనచే, నా సాయుజ్యము పొందుచున్నాడు. తానే ఆత్మారాముడని ఎరిగి, దర్శిస్తూ, ప్రవేశించటమే అది. అ శివానంద స్వరూపమగు సాయుజ్యముక్తి ఈ జీవునకు బ్రహ్మానందమును ప్రసాదించుచున్నది. సర్వసాంసారిక ఋగ్మతలను తొలగించునది. నన్ను ఆయా విధములుగా ఉపాసించుచుండగా, క్రమంగా సారూప్య - సామీప్య - సాలోక్య - సాయుజ్య ముక్తులు జీవుడు తప్పక సముపార్జించుకోగలడు. |
||||
ఇయం కైవల్యముక్తిస్తు కేనోపాయేన సిద్ధ్యతి . |
|||||
శ్రీ హనుమాన్ వాచ: ఇయం కైవల్యముక్తిస్తు కేన ఉపాయేన సిద్ధ్యతి? |
శ్రీ ఆంజనేయుడు : జీవులందరికీ సుఖము కలుగజేయు - లోకో రమయతీతి - ఓ శ్రీరామచంద్రా! ఇప్పుడే, ఇక్కడే కైవల్యముక్తిని సిద్ధింపజేసుకోవటానికై, మేము ఏ ఉపాయము ఆశ్రయించాలో దయతో శెలవివ్వండి! |
||||
మాండూక్యమేకమేవాలం ముముక్షూణాం విముక్తయే .. 26.. తథాప్యసిద్ధం చేజ్జ్ఞానం దశోపనిషదం పఠ . జ్ఞానం లబ్ధ్వా చిరాదేవ మామకం ధామ యాస్యసి .. 27.. |
|||||
శ్రీరామౌవాచ: ‘మాండూక్యమ్’ ఏకమేవ అలం ముముక్షూణాం విముక్తయే। తథాపి అసిద్ధం జ్ఞానం, దశ (10) ఉపనిషదం పఠ జ్ఞానం లబ్ధ్వా అచిరాదేవ మామకం ధామ యాస్యసి। |
శ్రీరాముడు : ఒక్క మాండూక్యోపనిషత్ యొక్క తత్త్వసారమును అధ్యయనము చేసినంత మాత్రముచేతనే ముముక్షువు - ఇక్కడే ఇప్పుడే ముక్తిని సంతరించుకోగలడు. ఓ హనుమా! ఒకవేళ మాండూక్యోపనిషత్ …. పరిశీలించిన తరువాత కూడా ఆ ముముక్షువుకు “నేను సర్వదా ముక్తుడనే" … అనే భావన సుస్థిరము కాకపోతే, దశోపనిషత్తులు (ఈశ - కేన - కఠ - ప్రశ్న - ముండక - మాండూక్య - తైత్తరీయ - ఐతరేయ - ఛాందోగ్య - బృహదారణ్యకములు) అధ్యయనము చేయటం చేత ఆత్మారామ జ్ఞానము లభించి, నా ధామమును ఆతడు చేరగలడు. |
||||
తథాపి దృఢతా న చేద్విద్జ్ఞానస్యాంజనాసుత . ద్వాత్రింశాఖ్యోపనిషదం సమభ్యస్య నివర్తయ .. 28.. విదేహముక్తావిచ్ఛా చేదష్టోత్తరశతం పఠ . తాసాం క్రమ సశాంతిం చ శ్రుణు వక్ష్యామి తత్త్వతః .. 29.. |
|||||
7.) తథాపి దృఢతా నో చేత్ విజ్ఞానస్య, అంజనా సుత! ద్వాత్రింశాఖ్యో (32) ఉపనిషదం సమభ్యస నివర్తయ। విదేహ ముక్తాః ఇచ్చాచేత్ అష్టోత్తర శతం (108) పఠ। తాసాం క్రమం స శాంతిం చ శృణు, వక్ష్యామి తత్త్వతః॥ |
ఓ అంజనాసుతా! ఒకవేళ అప్పుడు కూడా (సోఽహమ్, తత్త్వమ్, త్వమేవాహమ్, త్వమ్ అహమేవ… మహావాక్యాల) పరమార్థ నిశ్చల దృష్టి, ఆత్మాఽహమ్ భావన, తృప్తి ఇంకా లభించలేదని అనిపిస్తే, అప్పుడు ‘32’ ఉపనిషత్తులను పరమార్థ పూర్వకంగా అధ్యయనము చేయటముచేత సర్వ మనోబంధనములు పటాపంచలు కాగలవు! ఒకవేళ “నేను విదేహముక్తుడను అయ్యెదను గాక"… అని అభిలాష ఉంటే అప్పుడు ‘108’ ఉపనిషత్తులు పరిశీలించబడును గాక! ఆ 108 ఉపనిషత్తుల క్రమమును, అందలి శాంతి పాఠ్యాంశములతో సహా ఒక క్రమ విశేషంగా తత్త్వార్థ దృష్టిగా చెప్పుచున్నాను. విను! |
||||
ఈశకేనకఠప్రశ్నముండమాండూక్యతిత్తిరిః . ఐతరేయం చ ఛాందోగ్యం బృహదారణ్యకం తథా .. 30.. బ్రహ్మకైవల్యజాబాలశ్వేతాశ్వో హంస ఆరుణిః . గర్భో నారాయణో హంసో బిందుర్నాదశిరః శిఖా .. 31.. మైత్రాయణీ కౌషీతకీ బృహజ్జాబాలతాపనీ . కాలాగ్నిరుద్రమైత్రేయీ సుబాలక్షురిమంత్రికా .. 32.. సర్వసారం నిరాలంబం రహస్యం వజ్రసూచికం . తేజోనాదధ్యానవిద్యాయోగతత్త్వాత్మబోధకం .. 33.. |
|||||
8.) ఈశ కేన కఠ ప్రశ్న ముండక మాండ్యూక్య తిత్తిరిః ఐతరేయం చ ఛాందోగ్యమ్ బృహదారణ్యకం తథా! బ్రహ్మ కైవల్య జాబాల శ్వేతాశ్వో హంస ఆరుణిః గర్భో నారాయణో హంసో బిందు నాద శిరః శిఖా, మైత్రాయణీ కౌషీతకీ బృహజ్జాబాల తాపనీ కాలాగ్ని రుద్ర మైత్రేయీ సుబాల క్షురిక మంత్రికా సర్వసారం నిరాలంబం రహస్యం వజ్ర సూచికమ్, తేజో నాద ధ్యాన విద్యా యోగతత్త్వ ఆత్మబోధకమ్|| |
దశోపనిషత్తులు (10) 1. ఈశావాస్యోపనిషత్ 2. కేనోపనిషత్ 3. కఠోపనిషత్ 4. ప్రశ్నోపనిషత్ 5. ముండకోపనిషత్ 6. మాండుక్యోపనిషత్ 7. తైత్తిరీయోపనిషత్ 8. ఐతరేయోపనిషత్ 9. ఛాందోగ్యోపనిషత్ 10. బృహదారణ్యకోపనిషత్. ద్వాత్రింశాఖ్య (32) ఉపనిషత్తులు (11 నుండి 42) 11. బ్రహ్మోపనిషత్ 12. కైవల్యోపనిషత్ 13. జాబాలోపనిషత్ 14. శ్వేతాశ్వతరోపనిషత్ 15. హంసోపనిషత్ 16. ఆరుణికోపనిషత్ 17. గర్భోపనిషత్ 18. నారాయణోపనిషత్ 19. పరమహంసోపనిషత్ 20. అమృతబిందూపనిషత్ 21. అమృతనాదోపనిషత్ 22. అథర్వశిరోపనిషత్ 23. అథర్వశిఖోపనిషత్ 24. మైత్రాయణ్యుపనిషత్ 25. కౌషీతకీ బ్రాహ్మణోపనిషత్ 26. బృహజ్జాబాలోపనిషత్ 27. నృశింహతాపినీ [ (క) పూర్వతాపినీ (గ) ఉత్తరతాపినీ] ఉపనిషత్తులు 28. కాలాగ్ని రుద్రోపనిషత్ 29. మైత్రేయోపనిషత్ 30. సుబాలోపనిషత్ 31. క్షురికోపనిషత్ 32. మంత్రికోపనిషత్ 33. సర్వసారోపనిషత్ 34. నిరాలంబోపనిషత్ 35. శుకరహస్యోపనిషత్ 36. వజ్రసూచికోపనిషత్ 37. తేజోబిందూపనిషత్ 38. నాదబిందూపనిషత్ 39. ధ్యానబిందూపనిషత్ 40, బ్రహ్మవిద్యోపనిషత్ 41. యోగతత్వోపనిషత్ 42. ఆత్మబోధోపనిషత్ |
||||
పరివ్రాట్ త్రిశిఖీ సీతా చూడా నిర్వాణమండలం . దక్షిణా శరభం స్కందం మహానారాయణాహ్వయం .. 34.. రహస్యం రామతపనం వాసుదేవం చ ముద్గలం . శాండిల్యం పైంగలం భిక్షుమహచ్ఛారీరకం శిఖా .. 35.. తురీయాతీతసంన్యాసపరివ్రాజాక్షమాలికా . అవ్యక్తైకాక్షరం పూర్ణా సూర్యాక్ష్యధ్యాత్మకుండికా .. 36.. సావిత్ర్యాత్మా పాశుపతం పరం బ్రహ్మావధూతకం . త్రిపురాతపనం దేవీత్రిపురా కఠభావనా . హృదయం కుండలీ భస్మ రుద్రాక్షగణదర్శనం .. 37.. తారసారమహావాక్య పంచబ్రహ్మాగ్నిహోత్రకం . గోపాలతపనం కృష్ణం యాజ్ఞవల్క్యం వరాహకం .. 38.. శాట్యాయనీ హయగ్రీవం దత్తాత్రేయం చ గారుడం . కలిజాబాలిసౌభాగ్యరహస్యఋచముక్తికా .. 39.. |
|||||
పరివ్రాట్ త్రిశిఖీ సీతా, చూడా నిర్వాణ మండలమ్ దక్షిణా శరభం స్కందం, మహా నారాయణా అద్వయమ్| రహస్యం రామతపనం, వాసుదేవంచ ముద్గలమ్| శాండిల్యం పైఙ్గలమ్ భిక్షమ్, మహత్ శారీరకం శిఖా| తురీయాతీత సన్న్యాస, పరివ్రాజ అక్షమాలికా| అవ్యక్త ఏకాక్షరం పూర్ణా, సూర్యా అక్ష్యు అధ్యాత్మ కుండికా సావిత్ర్యా ఆత్మా పశుపతమ్, పరబ్రహ్మా అవధూతకమ్| త్రిపురాతపనం దేవీ, త్రిపురా కఠ భావనా। హృదయం కుండలీ భస్మ రుద్రాక్ష గణ దర్శనమ్ | తారసార మహావాక్య పంచ బ్రహ్మ-అగ్నిహెూత్రకమ్| గోపాలతపినం కృష్ణమ్, యాజ్ఞవల్క్యం వరాహకమ్| శాట్యాయనీ హయగ్రీవం, దత్తాత్రేయంచ గారుడమ్, కలి జాబాలి సౌభాగ్య, రహస్య ఋచ ముక్తికా। |
(మొత్తం 108లో) తదితర ఉపనిషత్తులు - 43. నారద పరివ్రాజకోపనిషత్ 44. త్రిశిఖిబ్రాహ్మణోపనిషత్ 45. సీతోపనిషత్ 46. యోగ-చూడామణీ ఉపనిషత్ 47. నిర్వాణోపనిషత్ 48. మండల బ్రాహ్మణోపనిషత్ 49. దక్షిణామూర్త్యుపనిషత్ 50. శరభోపనిషత్ 51. స్కందోపనిషత్ 52. మహానారాయణోపనిషత్ 53. అద్వయతారకోపనిషత్ 54. రామ రహస్యోపనిషత్ 55. రామ పూర్వతాపిన్యుపనిషత్, రామ ఉత్తర తాపిన్యుపనిషత్తు 56. వాసుదేవోపనిషత్ 57. ముద్గలోపనిషత్ 58. శాండిల్యోపనిషత్ 59. పైంగలోపనిషత్ 60. భిక్షుకోపనిషత్ 61. మహెూపనిషత్ 62. శారీరకోపనిషత్ 63. యోగశిఖోపనిషత్ 64. తురీయాతీతోపనిషత్ 65. సన్న్యాసోపనిషత్ 66. పరమహంస పరివ్రాజకోపనిషత్ 67. అక్షమాలికోపనిషత్ 68. అవ్యక్తోపనిషత్ 69, ఏకాక్షరోపనిషత్ 70. పూర్ణోపనిషత్ 71. సూర్యోపనిషత్ 72. అక్ష్యుపనిషత్ 73. అధ్యాత్మోపనిషత్ 74. కుండికోపనిషత్ 75. సావిత్ర్యుపనిషత్ 76. ఆత్మోపనిషత్ 77. పశుపత బ్రహ్మోపనిషత్ 78. పరబ్రహ్మోపనిషత్ 79. అవధూతోపనిషత్ 80. త్రిపురాతాపినీ ఉపనిషత్ 81. దేవ్యుపనిషత్ 82. త్రిపురోపనిషత్ 83. కఠ శ్రుత్యుపనిషత్ 84. భావనోపనిషత్ 85. రుద్రహృదయోపనిషత్ 86. యోగకుండలినీ ఉపనిషత్ 87. భస్మజాబాలోపనిషత్ 88. రుద్రాక్షజాబాలోపనిషత్ 89. గణపత్యుపనిషత్ 90. దర్శనోపనిషత్ 91. తారసారోపనిషత్ 92. మహావాక్యోపనిషత్ 93. పంచబ్రహ్మోపనిషత్ 94. ప్రాణాగ్నిహోత్రోపనిషత్ 95. గోపాలతాపణ్యుపనిషత్ 96. కృష్ణోపనిషత్ 97. యాజ్ఞవల్క్యోపనిషత్ 98. వరాహెూపనిషత్ 99. శాట్యాయనోపనిషత్ 100. హయగ్రీవోపనిషత్ 101. దత్తాత్రేయోపనిషత్ 102. గారుడోపనిషత్ 103. కలిసంతరణోపనిషత్ 104. జాబాలీ ఉపనిషత్ 105. సౌభాగ్యలక్ష్మ్యుపనిషత్ 106. సరస్వతీ రహస్యోపనిషత్ 107. బహ్వృచోపనిషత్ 108. ముక్తికోపనిషత్ |
||||
ఏవమష్టోత్తరశతం భావనాత్రయనాశనం . జ్ఞానవైరాగ్యదం పుంసాం వాసనాత్రయనాశనం .. 40.. పూర్వోత్తరేషు విహితతత్తచ్ఛాంతిపురఃసరం . వేదవిద్యావ్రతస్నాతదేశికస్య ముఖాత్స్వయం .. 41.. గృహీత్వాష్టోత్తరశతం యే పఠంతి ద్విజోత్తమాః . ప్రారబ్ధక్షయపర్యంతం జీవన్ముక్తా భవంతి తే .. 42.. తతః కాలవశాదేవ ప్రారబ్ధే తు క్షయం గతే . వైదేహీం మామకీం ముక్తిం యాంతి నాస్త్యత్రసంశయః .. 43.. సర్వోపనిషదాం మధ్యే సారమష్టోత్తరశతం . సకృచ్ఛ్రవణమాత్రేణ సర్వాఘౌఘనికృంతనం .. 44.. |
|||||
9.) ఏవమ్ అష్టోత్తర శతమ్ (108)
భావనాత్రయ నాశనమ్, జ్ఞాన వైరాగ్య దం పుంసాం వాసనా త్రయనాశనమ్| పూర్వ - ఉత్తరేషు విహిత తత్ తత్ ‘శాంతిః’ పురస్సరమ్|| వేదవిద్యా వ్రతస్నాత దేశికస్య ముఖాత్ స్వయమ్ గృహీత్వా అష్టోత్తర శతమ్ యే పఠంతి ద్విజోత్తమాః, ప్రారబ్ధ క్షయ పర్యంతం జీవన్ముక్తా భవంతి తే తతః కాలవశాత్ ఏవ ప్రారబ్ధే తు క్షయం గతే, వైదేహీం మామకీం ముక్తిం యాంతి। నాస్తి అత్ర సంశయః । సర్వోపనిషదాం మధ్యే సారమ్ అష్టోత్తరం శతమ్, సకృత్ శ్రవణమాత్రేణ సర్వామౌఘ నికృంతనమ్ || |
పైన మనము చెప్పుకున్న ‘108’ ఉపనిషత్ విశేషాలు పఠిస్తూ పరిశీలిస్తూ ఉంటే, (జగత్భావన - జీవభావన - ఈశ్వర భావన అనబడు) భావనా త్రయము తొలగిపోతాయి. ఆ పాఠకునికి జ్ఞాన - వైరాగ్యములు సిద్ధిస్తాయి. వాసనా త్రయము నశించగలదు. స్వయమాత్మానంద స్వరూపుడు కాగలడు! [భావనా త్రయము = సృష్టి - స్థితి - లయములపట్ల ‘వాస్తవమే’ అను భావన]. [వాసనాత్రయము = దృశ్య - దేహ - జీవాత్మ వాసనలు]. ఉపనిషత్ - పఠణమునకు ముందు వెనుక కూడా శాంతి పాఠము చేర్చి పఠించటము సముచితము. గురుముఖతః : ఈ ఉపనిషత్ ప్రవచన - విశ్లేషణ - అర్థ పరిశీలనలకొరకై వేదవిద్యాపారంగతుడు, వ్రతనియమ నిష్ఠుడు, బ్రహ్మమును ఎరిగి చరించు స్నాతకుడు - అగు పండితుని ఆశ్రయించెదరు గాక! ఆయన ముఖతః వింటూ, స్వయముగా పరిశీలిస్తూ 108 ఉపనిషత్తులను పఠించు ద్విజోత్తముడు ప్రారబ్ధము శేషించు వరకు జీవన్ముక్తుడై దృశ్యమును స్వీకరిస్తాడు. అటు తరువాత ప్రారబ్ధము క్షయము అయిన తరువాత స్వభావ సిద్ధముగా విదేహముక్తుడు అగుచున్నాడు. ఇందులో సందేహమే లేదు. సర్వ ఉపనిషత్తుల మధ్యగతముగా మనము ఉదహరించుకొన్న ’108’ ఉపనిషత్తులు అన్ని ఉపనిషత్తుల (1180 ఉపనిషత్తుల) సారరూపమై ఉన్నాయి. ఈ ఉపనిషత్తులు ఒకసారి శ్రవణము చేసినంత మాత్రముచేత సర్వ పాపములు, పాపదృష్టులు నశించగలవు. |
||||
మయోపదిష్టం శిష్యాయ తుభ్యం పవననందన . ఇదం శాస్త్రం మయాదిష్టం గుహ్యమష్టోత్తరం శతం .. 45.. జ్ఞానతోఽజ్ఞానతో వాపి పఠతాం బంధమోచకం . రాజ్యం దేయం ధనం దేయం యాచతః కామపూరణం .. 45.. ఇదమష్టోత్తరశతం న దేయం యస్య కస్యచిత్ . నాస్తికాయ కృతఘ్నాయ దురాచారరతాయ వై .. 47.. మద్భక్తివిముఖాయాపి శాస్త్రగర్తేషు ముహ్యతే . గురుభక్తివిహీనాయ దాతవ్యం న కదాచన .. 48.. సేవాపరాయ శిష్యాయ హితపుత్రాయ మారుతే . మద్భక్తాయ సుశీలాయ కులీనాయ సుమేధసే .. 49.. సమ్యక్ పరీక్ష్య దాతవ్యమేవమష్టోత్తరం శతం . యః పఠేచ్ఛృణుయాద్వాపి స మామేతి న సంశయః . |
|||||
10.) మయా ఉపదిష్టం శిష్యాయ తుభ్యం, పవననందన! ఇదం శాస్త్రం మయా, ఆదిష్టం గుహ్యమ్ | అష్టోత్తరం శతమ్ జ్ఞానతో - అజ్ఞానతోవాఽపి పఠతాం బంధమోచకమ్ | రాజ్యం దేయం, ధనం దేయం, యాచతః కామపూరణమ్…, ఇదమ్ అష్టోత్తర శతం న దేయమ్ యస్య కస్యచిత్ | నాస్తికాయ, కృతఘ్నాయ దురాచార రతాయ వై, మద్భక్తి విముఖాయా, సః శాస్త్రగర్తేషు ముహ్యతే, గురుభక్తి విహీనాయ దాతవ్యం న కదాచన | సేవాపరాయ శిష్యాయ హితపుత్రాయ, మారుతే! మద్భక్తాయ సుశీలాయ కులీనాయ సుమేధసే, సమ్యక్ పరీక్ష్య దాతవ్యం | ఏవమ్ అష్టోత్తరగ్ం శతం యః పఠేత్, శ్రుణుయాత్వాపి స మామ్ ఏతి, న సంశయః | |
ఓ పవన నందనా! నీవు నాకు ప్రియ భక్తుడవు - శిష్యుడవు అయి ఉండటముచేత, ఈ అతి రహస్యమైనటువంటి శాస్త్ర విషయాలు నీకు చెప్పబడుచున్నాయి. ఒకడు అజ్ఞాని అయినప్పటికీ కూడా…. 108 ఉపనిషత్ విశేషాలు తెలుసుకుంటూ, పఠిస్తూ ఉంటే, ఆతడు బంధవిముక్తుడు కాగలుగుతాడు. ఒకడు రాజ్యం ఇస్తానన్నా, ధనము ఇస్తానన్నా, కోరినవన్నీ ఇస్తానన్నా కూడా, (భౌతిక లౌకిక దృష్టికి పరిమితుడై, వైరాగ్యాచరణము, దైవీగుణ సంపద, గురుభక్తి, సాత్వికాచారాములు లేకుంటే) … అట్టి వానికి ఈ అష్టోత్తర శత ఉపనిషత్ బోధ ఇవ్వకూడదు. ‘దేవుడే లేడు - అంతా నేనే’ - అను అభిప్రాయములు గల నాస్తికునికి, చేసిన సహాయం మరచి ఉండే కృతఘ్నుడికి (ఉదా: తల్లి తండ్రులు మొదలైన వారు చేసిన మేలు మరచి మాట్లాడే వానికి), భగవంతునిపట్ల (భక్తి ప్రపత్తులు లేక) తిరస్కారభావము కలవానికి, శాస్త్రముల కథా విషయములు - చారిత్రక విషయాల బురదలో ఇరుక్కొని ఆత్మ విచారణకు సంసిద్ధుడు కానివానికి, గురుభక్తి లేని వానికి ఎట్టి పరిస్థితులలోనూ ఈ ఉపనిషత్ జ్ఞాన విషయాలు ప్రబోధించరాదు. ఎందుకంటే అది వృధా ప్రయాసయే కాబట్టి. ఓ మారుతీ! సేవా తత్పరత గల శిష్యులకు, హితమైన ప్రవర్తన గల పుత్రులకు, నా భక్తులకు, ఉత్తమ శీలము కలవారికి, ఉత్తమ కుల (జ్ఞాన) జాతులకు, గొప్ప మేధస్సు కలవారికి - ఇట్టి వారికి …, వారి వారి యోగస్థితిని పరిశీలించి జ్ఞాన విషయాల పరాకాష్ఠను బోధించాలి. ఎవ్వరు ‘108’ ఉపనిషత్తులను పఠిస్తారో, (లేక) చక్కగా వింటారో, హృదయస్థం చేసుకుంటూ ఉంటారో, అట్టి వారు ఆత్మారాముడనగు నన్ను తప్పక పొందుచున్నారయ్యా! అనుమానమే లేదు. |
||||
తదేతదృచాభ్యుక్తం . విద్యా హ వై బ్రాహ్మణమాజగామ గోపాయ మా శేవధిష్టీఽహమస్మి . అసూయకాయానృజవే శఠాయ మా మా బ్రూయా వీర్యవతీ తథా స్యాం . యమేవ విద్యాశ్రుతమప్రమత్తం మేధావినం బ్రహ్మచర్యోపపన్నం . తస్మా ఇమాముపసన్నాయ సమ్యక్ పరీక్ష్య దద్యాద్వైష్ణవీమాత్మనిష్ఠాం .. 1.. ఇతి .. |
|||||
11.) తత్ ఏతత్ ఋచా అభ్యుక్తమ్ విద్యా హ వై బ్రాహ్మణమ్ ఆజగామ గోపాయ మాం। శేవధిష్ఠే అహమస్మి। అసూయకాయా అనృజవే శఠాయ మా మా భ్రూయాత్। వీర్యవతీ తథా అస్యామ్| యమేవ ఏష విద్యా శ్రుతమ్, అప్రమత్తం, మేధావినం, బ్రహ్మచర్య - ఉపపన్నం అస్మాత్ ఇమామ్ ఉపసన్నాయ, సమ్యక్ పరీక్ష్య దద్యాత్ వైష్ణవీమ్, ఆత్మనిష్ఠామ్ ఇతి | |
వేద ఋక్ వాక్ దేవత పలుకులు : ఒకానొక సమయములో విద్యా దేవి - బ్రహ్మ తత్త్వమును అధ్యయనము చేయుచున్న బ్రాహ్మణుల వద్దకు వెళ్ళి ఇట్లా చెప్పటం జరిగింది. ఓ బ్రహ్మ తత్త్వమును ఎరుగుచున్న బ్రాహ్మణులారా! నన్ను మీరు మీ హృదయంలో ఉపాసించండి. నేను మిమ్ములను - ఒక చక్రవర్తి తన నిధులను కాపాడు తీరుగా కాపాడుకుంటాను. పరస్పరము బ్రహ్మవిద్యాబోధ నిర్వర్తించండి. అయితే ఒక నియమము విధిస్తున్నాను-వినండి. అసూయ కలవారికి, వంకర-టింకర కుటిల బుద్ధి గలవారికి, మోసము చేయు స్వభావము కలవారికి నన్ను బోధించకండి. నన్ను అప్పగించవద్దు. నేను మీ పట్ల వీర్యవతినై ఇష్ట - కామ్యములు తీరుస్తాను. ఎవ్వరైతే వేద పఠనము చేస్తూ ఉంటారో, ఆత్మతత్త్వ జ్ఞానము విషయములో అప్రమత్తులై ఉంటారో, మేధావి అయి ఉంటారో, బ్రహ్మచర్య వ్రతస్తులై ఉంటారో, వారిని చక్కగా, పరీక్షించి బోధించాలి. అర్హులు అవునా? కాదా - అని పరీక్ష చేసి అప్పుడు మాత్రమే విష్ణు సంబంధమైన ‘ఆత్మనిష్ఠ’ (నేనే ఆత్మారాముడు - అను నిష్ఠను) బోధించాలి. |
||||
అథ హైనం శ్రీరామచంద్రం మారుతిః పప్రచ్ఛ ఋగ్వేదాదివిభాగేన పృథక్ శాంతిమనుబ్రూహీతి . |
|||||
అథ హి ఏనం శ్రీరామచంద్రం మారుతిః పప్రచ్ఛ: "ఋగ్వేదాది విభాగేన పృథక్ ’శాంతిమ్’ అనుబ్రూహి….” ఇతి। |
ఆంజనేయుడు : తండ్రీ! ప్రభూ! శ్రీరామచంద్రా! ఋగ్వేదము మొదలైన విభాగములలో వేరువేరు శాంతిపాఠముల గురించి దయతో వివరించండి. | ||||
స హోవాచ శ్రీరామః . ఐతరేయకౌషీతకీనాదబింద్వాత్మప్రబోధనిర్వాణ- ముద్గలాక్షమాలికాత్రిపురాసౌభాగ్యబహ్వృచా నామృగ్వేదగతానాం దశసంఖ్యాకానాముపనిషదాం వాఙ్మే మనసీతి శాంతిః .. 1.. |
|||||
సహెూవాచ శ్రీరామః ఐతరేయ, కౌషీతకీ, నాదబిందు, ఆత్మబోధ, నిర్వాణ, ముద్గల, అక్షమాలికా, త్రిపురా, సౌభాగ్య బహ్వృచానామ్-ఋగ్వేద గతానాం.., దశ సంఖ్యా కానామ్ (10) ఉపనిషదామ్ “వాక్ మే మనసి…” ఇతి శాంతిః ।
|
ఋగ్వేదాంతర్గత - (అకారాదిగా) 1. అక్షమాలికా 2. ఆత్మబోధ 3. ఐతరేయ, 4. కౌషీతకీ, 5. త్రిపురా 6. నాదబిందు 7. నిర్వాణ 8. బహ్వృచ, 9. ముద్గల 10. సౌభాగ్యలక్ష్మీ - దశ ఉపనిషత్తులు.
|
||||
ఈశావాస్యబృహదారణ్యజాబాలహంసపరమహంససుబాల- మంత్రికానిరాలంబత్రిశిఖీబ్రాహ్మణమండలబ్రాహ్మణాద్వయతారక- పైంగలభిక్షుతురీయాతీతాధ్యాత్మతారసారయాజ్ఞవల్క్య- శాట్యాయనీముక్తికానాం శుక్లయజుర్వేదగతానామేకోనవింశతి- సంఖ్యాకానాముపనిషదాం పూర్ణమద ఇతి శాంతిః .. 2.. |
|||||
12.) ఈశావాస్య, బృహదారణ్యక, జాబాల, హంస, పరమహంస, సుబాల, మంత్రికా, నిరాలంబ త్రిశిఖీ బ్రాహ్మణ, మండల బ్రాహ్మణ, అద్వయతారక, పైఙ్గల, భిక్షు, తురీయాతీత, అధ్యాత్మ, తారసార, యాజ్ఞవల్క్య, శాట్యాయనీ, ముక్తికానాం శుక్లయజుర్వేదగతానాం, ఏకోనవింశతి (19) సంఖ్యాకానామ్ ఉపనిషదామ్ - “పూర్ణమదః” ఇతి శాంతిః|
|
శుక్లయజుర్వేంతార్గత ఉపనిషత్‌లు (అకారాదిగా) - 1. అధ్యాత్మ 2. అద్వయతారక 3. ఈశావాస్య, 4. జాబాల 5. తారసార 6. తురీయాతీత, 7. త్రిశిఖి బ్రాహ్మణ 8. నిరాలంబ 9. పరమహంస, 10. పైంజ్ఞల 11. భిక్షుక, 12. మండల బ్రాహ్మణ 13. మంత్రిక, 14. ముక్తిక 15. సుబాల 16. యాజ్ఞవల్క్య 17. శాట్యాయనీ, 18 హంస 19. బృహదారణ్యక
|
||||
కఠవల్లీతైత్తిరీయకబ్రహ్మకైవల్యశ్వేతాశ్వతరగర్భ- నారాయణామృతబింద్వమృతనాదకాలాగ్నిరుద్రక్షురికా- సర్వసారశుకరహస్యతేజోబిందుధ్యానబిందుబ్రహ్మవిద్యా- యోగతత్త్వదక్షిణామూర్తిస్కందశారీరకయోగశిఖైకాక్షర- అక్ష్యవధూతకఠరుద్రహృదయయోగకుండలినీపంచబ్రహ్మ- ప్రాణాగ్నిహోత్రవరాహకలిసంతరణసరస్వతీరహస్యానాం కృష్ణయజుర్వేదగతానాం ద్వాత్రింశత్సంఖ్యాకానముపనిషదాం సహ నావవత్వితి శాంతిః .. 3.. |
|||||
13.) కఠవల్లి, తైత్తిరీయక, బ్రహ్మ, కైవల్య, శ్వేతాశ్వతర, గర్భ, నారాయణ, అమృతబిందు, అమృతనాద, కాలాగ్ని రుద్ర, క్షురికా, సర్వసార, శుకరహస్య, తేజోబిందు, ధ్యానబిందు, బ్రహ్మవిద్యా, యోగతత్త్వ, దక్షిణామూర్తి, స్కంద, శారీరక, యోగశిఖ, ఏకాక్షర, అక్ష్య, అవధూత, కఠరుద్ర, రుద్రహృదయ, యోగకుండలినీ, పంచబ్రహ్మ, ప్రాణాగ్నిహెూత్ర, వరాహ, కలిసంతరణ, సరస్వతీరహస్యానాం కృష్ణ యజుర్వేదగతానాం ద్వాత్రింశత్ (32) సంఖ్యాకానామ్ ఉపనిషదామ్ ‘సహనావవతు’ ఇతి శాంతిః ||
|
కృష్ణయజుర్వేంతార్గత ఉపనిషత్‌లు : (అకారాదిగా) - 1. అమృత నాద 2. అమృతబిందు 3. అవధూత 4. అక్ష్యు 5. ఏకాక్షర 6. కలిసంతారణ 7. కరవల్లీ (కఠోపనిషత్) 8. కఠరుద్ర 9. కాలాగ్ని రుద్ర 10. కైవల్య 11. గర్భ 12. తేజోబిందు 13. తైత్తిరీయ 14. దక్షిణామూర్తి 15. ధ్యాన బిందు 16. నారాయణ 17. పంచబ్రహ్మ 18. ప్రాణాగ్నిహోత్ర 19. బ్రహ్మ 20. బ్రహ్మ విద్యా 21. యోగకుండలినీ 22. యోగతత్త్వ 23. యోగశిఖ 24. వరాహ 25. శారీరక 26. శుక రహస్య 27. శ్వేతాశ్వతర 28. సరస్వతీ రహస్య 29. సర్వసార 30. స్కంద 31. రుద్రహృదయ 32. క్షురిక.
|
||||
కేనఛాందోగ్యారుణిమైత్రాయణిమైత్రేయీవజ్రసూచికాయోగచూడామణి- వాసుదేవమహత్సంన్యాసావ్యక్తకుండికాసావిత్రీరుద్రాక్షజాబాలదర్శన- జాబాలీనాం సామవేదగతానాం షోడశసంఖ్యాకానా- ముపనిషదానామాప్యాయంత్వితి శాంతిః .. 4.. |
|||||
14.) కేన, ఛాందోగ్య, ఆరుణి, మైత్రాయణి, మైత్రేయీ, వజ్రసూచిక, యోగచూడామణి, వాసుదేవ, మహత్, సన్న్యాస, అవ్యక్త, కుండికా, సావిత్రీ, రుద్రాక్ష జాబాల, దర్శన, జాబాలీనాం, సామవేదగతానాం షోడశ (16) సంఖ్యాకానామ్ ఉపనిషదామ్…, “ఓం ఆప్యాయన్తు మమ అంగాని”, - ఇతి శాంతిః|
|
సామవేదాంతర్గత ఉపనిషత్‌లు : (అకారాదిగా) - 1. అవ్యక్త 2. ఆరుణిక 3. కేన 4. కుండిక5. ఛాందోగ్య 6. జాబాల 7. దర్శన 8. మహత్ 9. మైత్రాయణి 10. యోగచూడామణి 12. వజ్రసూచిక 13. రుద్రాక్ష జాబాల 14. సన్న్యాస 15. సావిత్రి 16. వాసుదేవ
|
||||
ప్రశ్నముండకమాండుక్యాథర్వశిరోఽథర్వశిఖాబృహజ్జాబాల- నృసింహతాపనీనారదపరివ్రాజకసీతాశరభమహానారాయణ- రామరహస్యరామతాపనీశాండిల్యపరమహంసపరివ్రాజక- అన్నపూర్ణాసూర్యాత్మపాశుపతపరబ్రహ్మత్రిపురాతపనదేవీభావనా- బ్రహ్మజాబాలగణపతిమహావాక్యగోపాలతపనకృష్ణహయగ్రీవ- దత్తాత్రేయగారుడానామథర్వవేదగతానామేకత్రింశత్సంఖ్యాకానా- ముపనిషదాం భద్రం కర్ణేభిరితి శాంతిః .. 5.. |
|||||
15.) ప్రశ్న, ముండక, మాండూక్య, అధర్వ శిరో, అధర్వశిఖా, బృహజ్జాబాల, నృసింహతాపనీ, నారదపరివ్రాజక, సీతా, శరభ, మహానారాయణ, రామరహస్య, రామతాపనీ, శాండిల్య, పరమహంస పరివ్రాజక, అన్నపూర్ణా, సూర్యా, ఆత్మా, పాశుపత, పరబ్రహ్మ, త్రిపురా తాపినీ, దేవీ, భావనా, భస్మజాబాల, గణపతి, మహావాక్య, గోపాలతాపినీ, కృష్ణ, హయగ్రీవ, దత్తాత్రేయ, గరుడానామ్ అధర్వ వేదగతానాం ఏకత్రింశత్ (31) సంఖ్యాకానామ్ ఉపనిషదామ్…, ‘భద్రం కర్ణేభిః’ - ఇతి శాంతిః||
|
అధర్వణవేదాంతర్గత ఉపనిషత్‌లు : (అకారాదిగా) - 1. అథర్వశిఖ 2. అథర్వశిర 3. అన్నపూర్ణ 4. ఆత్మ 5. కృష్ణ 6. గణపతి 7. గరుడ 8. గోపాల 9. త్రిపుర తాపినీ 10. దేవీ 11. దత్తాత్రేయ 12. నారదపరివ్రాజక 13. నృశింహ తాపిని 14. పరమహంస పరివ్రాజక 15. పరబ్రహ్మ 16. పాశుపత బ్రహ్మ 17. ప్రశ్న 18. భావ 19. భస్మజాల 20. బృహత్ జాల 21. మహానారాయణ 22. మహావాక్య 23. మాండుక్య 24. ముండక 25. రామరహస్య 26. రామతాపినీ 27. శరభ 28. శాండిల్య 29. సీత 30 సూర్య 31. హయగ్రీవ
|
||||
ముముక్షవః పురుషాః సాధనచతుష్టయసంపన్నాః శ్రద్ధావంతః సుకులభవం శ్రోత్రియం శాస్త్రవాత్సల్య- గుణవంతమకుటిలం సర్వభూతహితేరతం దయాసముద్రం సద్గురుం విధివదుపసంగమ్యోపహారపాణయోఽష్టోత్తరశతోపనిషదం విధివదధీత్య శ్రవణమనననిదిధ్యాసనాని నైరంతర్యేణ కృత్వా ప్రారబ్ధక్షయాద్దేహత్రయభంగం ప్రాప్యోపాధివినిర్ముక్త- ఘటాకాశవత్పరిపూర్ణతా విదేహముక్తిః . సైవ కైవల్యముక్తిరితి . అత ఏవ బ్రహ్మలోకస్థా అపి బ్రహ్మముఖాద్వేదాంతశ్రవణాది కృత్వా తేన సహ కైవల్యం లభంతే . అతః సర్వేషాం కైవల్యముక్తిర్జ్ఞానమాత్రేణోక్తా . న కర్మసాంఖ్యయోగోపాసనాదిభిరిత్యుపనిషత్ .. ఇతి ప్రథమోఽధ్యాయః .. 1.. |
|||||
16.) ముముక్షవః, పురుషాః సాధన చతుష్టయ సంపన్నాః, శ్రద్ధావంతం, సత్కులభవం, శ్రోత్రియం, శాస్త్రవాత్సల్యం, గుణవంతం, అకుటిలం, సర్వభూతహితే రతం, దయాసముద్రమ్ సద్గురుమ్ విధివత్ ఉపసంగమ - ఉపహార పాణయ ‘అష్టోత్తరశత ఉపనిషదం’ విధివత్ అధీత్య, శ్రవణ - మనన - నిదిధ్యాసనాని నైరంతర్యేణ కృత్వా, పారబ్ధ క్షయాత్ దేహత్రయ భంగమ్ (కృత్వా), ప్రాప్య - ఉపాధి వినిర్ముక్త, ఘటాకాశవత్ పరిపూర్ణతామ్ ఏతి విదేహ ముక్తిః కైవల్య ముక్తిః ఇతి। అత ఏవ బ్రహ్మలోకస్థా, అపి బ్రహ్మముఖాత్ వేదాంత శ్రవణాది కృత్వా, తేన సహ కైవల్యం లభంతే। అతః సర్వేషాం ‘కైవల్యముక్తిః’ జ్ఞానమార్గేణ ఉక్తా! న కర్మ, సాంఖ్య, యోగ, ఉపాసనాదిభిః|| ఇతి ఉపనిషత్ | |
ఓ హనుమా! మానవ జన్మ అత్యంత దుర్లభము. స్థూల సూక్ష్మ కారణ శరీరత్రయ బంధనముల నుండి విముక్తుడను నేను అవ్వాలి - అను ఆశయముతో ముముక్షువుగా సంసిద్ధుడు కావాలి. అట్టి ముముక్షువైనవాడు - ఆత్మ తత్వజ్ఞానము కొరకై సద్గురువును ఆశ్రయించాలి. - సాధన చతుష్టయము (ఇంద్రియ నిగ్రహ రూప శమము - విచారణ - సంతోషము సత్సంగము) కలిగి ఉన్నట్టి…, - శ్రద్ధావంతుడైనట్టి, సత్కులజాతుడైనట్టి (సత్ వస్తువును ఎరిగిన పరంపరా సంబంధీకుడైనట్టి)…. - వేదతత్త్వము తెలిసి శ్రోత్రియుడైన.., - శాస్త్రములపట్ల గౌరవము - వాత్సల్యము కలిగి ఉన్నట్టి…. - గుణవంతుడు, కుటిలత్వము లేనివాడైన… - సర్వజీవుల క్షేమము కోరుకొనువాడగు.., - దయాసముద్రుడు…. అయినట్టి సద్గురువును విధివిధాన పూర్వకముగా సమీపించాలి. నమస్కార పూర్వకంగా శరణు వేడాలి. ‘108’ ఉపనిషత్తులు అధ్యయనము చేయాలి. శ్రవణము (వినటము - Hearing), మననము (ఆలోచించి తత్వార్థాన్ని బుద్ధిలో నిలపటము-Chanting), నిదిధ్యాస (ధ్యాసయందు నిలుపుకోవటము-Becoming)ల ద్వారా తత్వార్థాన్ని నిరంతరము, (ఎల్లప్పుడూ ఉపాసించాలి. ప్రారబ్ధమును క్షయింపచేసుకొంటూ స్థూల - సూక్ష్మ - కారణదేహ సంబంధములను త్రెంచి వేయాలి. అటు తరువాత ప్రారబ్ధముగా ప్రాప్తించిన వర్తమాన ఉపాధి నుండి విముక్తుడై ఇక ఆతడు-కుండ పగిలినపుడు కుండలోని ఆకాశము మహాకాశమును కలియురీతిగా-సర్వాత్మకుడు పరిపూర్ణుడు అగుచున్నాడు. దేహపరిధులను దాటి, విదేహముక్తుడు అగుచున్నాడు. అదియే కైవల్య ముక్తి కూడా! అట్టి ‘108’ ఉపనిషత్తులు అధ్యయనము చేసిన జ్ఞాని బ్రహ్మలోక నివాసము పొందుచున్నాడు. పరబ్రహ్మ స్వరూపానుభవి- సృష్టికర్తయగు బ్రహ్మదేవుని ముఖతః వేదాంత శ్రవణము చేసినవాడై-అద్దానిచే కైవల్యపదము సిద్ధింపజేసుకుంటున్నాడు. ఈ విధంగా ‘కైవల్యముక్తి’ అనునది జ్ఞానమార్గములోనే సాధ్యము అగుచున్నదని చెప్పబడుచున్నది. అట్టి కైవల్యము కర్మ-సాంఖ్య-యోగోపాసనలతో సిద్ధించటములేదు. అవన్నీ ’జ్ఞానము’నకు దారితీయుచుండగా ’ఆత్మజ్ఞానము’చే కైవల్యము సిద్ధించగలదు. ఇతి - ఉపనిషత్ వాణి। |
||||
ద్వితీయాధ్యాయము
తథా హైనం శ్రీరామచంద్రం మారుతిః పప్రచ్ఛ . కేయం వా తత్సిద్ధిః సిద్ధ్యా వా కిం ప్రయోజనమితి . |
|
1.) అథ హి ఏనం శ్రీరామచంద్రం మారుతిః పప్రచ్ఛ : కే అయం జీవన్ముక్తిః? కే అయం విదేహముక్తిః? కిం వా తత్ర ప్రమాణం? కథం వా తత్ సిద్ధిః? సిద్ధ్యా వా కిం ప్రయోజనం? ఇతి॥ |
మారుతి (ఆంజనేయస్వామి) : హే రామయ్యా! ఆత్మానంద స్వరూపా! జీవన్ముక్తి అనగా ఏది? విదేహ ముక్తి - అనగా? ఈ రెండు ముక్తులకు ప్రమాణము ఏమిటి? ఆ రెండూ ఏవిధంగా సిద్ధిస్తాయి? అవి సిద్ధించటముచేత వచ్చే ప్రయోజనము ఏమిటి? |
సహోవాచ శ్రీరామః . పురుషస్య కర్తృత్వభోక్తృత్వ- సుఖదుఃఖాదిలక్షణశ్చిత్తధర్మః క్లేశరూపత్వాద్బంధో భవతి . తన్నిరోధనం జీవన్ముక్తిః . ఉపాధివినిర్ముక్త- ఘటాకాశవత్ప్రారబ్ధక్షయాద్విదేహముక్తిః . జీవన్ముక్తివిదేహముక్త్యోరష్టోత్తరశతోపనిషదః ప్రమాణం . కర్తృత్వాదిదుఃఖనివృత్తిద్వారా నిత్యానందావాప్తిః ప్రయోజనం భవతి . |
|
సహెూవాచ శ్రీరామః పురుషస్య కర్తృత్వ - భోక్తృత్వ, సుఖ - దుఃఖాది లక్షణః చిత్త ధర్మః…, క్లేశ రూపత్వాత్ ‘బంధో’ భవతి। తత్ నిరోధనం ‘జీవన్ముక్తిః’ ॥ ఉపాధి వినిర్ముక్త, ఘటాకాశవత్ ప్రారబ్ధ క్షయాత్ ‘విదేహముక్తిః’ || జీవన్ముక్తి - విదేహముక్త్యోః అష్టోత్తర శతోపనిషదః ప్రమాణమ్|| కర్తృత్వ (భోక్తృత్వ) - ఆది దుఃఖ నివృత్తి ద్వారా “నిత్యానంద అవాప్తిః” ప్రయోజనం భవతి|| తత్ పురుషప్రయత్నే సాధ్యో భవతి। |
శ్రీరామచంద్రుడు : ఈ జీవునియొక్క చిత్తము - నేను కర్తను! నేను భోక్తను! సుఖ దుఃఖములు అనుభవించువాడను…., - దృశ్యమునకు పరిమితుడైనవాడను…, ఇటువంటి లక్షణాలన్నీ కలిగి ఉంటోంది. అది చిత్తము యొక్క ధర్మము. ఇప్పుడు ఈ జీవుడు చిత్తము యొక్క ఆయా ధర్మములను తన స్వరూపము పై ఆపాదించుకొంటున్నాడు. ఫలితంగా అనేక క్లేశములు తెచ్చిపెట్టుకొని బంధము కలిగినవాడగుచున్నాడు. అట్టి బంధనములను నిరోధించటమే “జీవన్ముక్తి”. ఒకచోట గల కుండలో ఉన్న ఆకాశము ఆ కుండ పగిలినప్పుడు ఏమౌతుంది? అంతటా ఉన్న మహాకాశముతో ఏకమగుచున్నది కదా! ప్రారబ్ధము క్షయించగా ఉపాధి నుండి విముక్తుడు అయి, ఈ జీవాత్మ పరమాత్మతో ఏకము కావటమే విదేహముక్తి. ఇక జీవన్ముక్తికి - విదేహముక్తికి ప్రమాణము ఏమిటంటావా? ‘108’ ఉపనిషత్తులలో చెప్పబడిన విశేషములే. (నాటకంలో ఒకడు ఒక పాత్రగా నటిస్తూ ఉంటే… ఆ పాత్రయొక్క కర్తృత్వ భోక్తృత్వాలు ఆ కళాకారునికి చెందినవి అవుతాయా? అవవు. అట్లాగే) ఈ జీవుడు కర్తృత్వ-భోక్తృత్వములచే పొందుచున్న దుఃఖములు తొలగటము - ద్వారా నిత్యానంద ప్రాప్తి సిద్ధించటమే జీవన్ - విదేహముక్తుల ప్రయోజనము. అట్టి జన్మ - కర్మ సంబంధములను అధిగమించివేసినట్టి - అతీతమైనట్టి నిత్యానందము సిద్ధింపజేయు జీవన్ముక్తి, విదేహముక్తి ఎట్లా లభిస్తాయి? పురుషప్రయత్నము చేతనే! |
తత్పురుషప్రయత్నసాధ్యం భవతి . యథా పుత్రకామేష్టినా పుత్రం వాణిజ్యాదినా విత్తం జ్యోతిష్టోమేన స్వర్గం తథా పురుషప్రయత్నసాధ్యవేదాంతశ్రవణాదిజనితసమాధినా జీవన్ముక్త్యాదిలాభో భవతి . సర్వవాసనాక్షయాత్తల్లాభః . |
|
2.) యథా…., పుత్ర కామేష్టినా… పుత్రం, వాణిజ్యాదినా విత్తం, జ్యోతిప్టోమేన స్వర్గం తథా …., పురుష ప్రయత్న సాధ్య, వేదాంత - శ్రవణ ఆది జనిత సమాధినా జీవన్ముక్త్యాది లాభో భవతి। ‘సర్వ వాసనా క్షయాత్’ - తత్ లాభః। |
ఏవిధంగా అయితే …, పుత్రకామేష్టి యాగము చేయడంచేత … సంతానము, వ్యాపారము చేయటము చేత … ధనము, ‘జ్యోతిష్టోమము’ మొదలైన యజ్ఞయాగములచేత … స్వర్గలోకము…, …. ఇవన్నీ లభిస్తున్నాయో, అదేవిధంగా ’పురుషప్రయత్నం’ చేతనే ఒకడు వేదాంత శాస్త్రము వినడానికి అర్హుడు అగుచున్నాడు. అట్టి శ్రవణముచేత జీవ - బ్రహ్మైక్య రూపమగు, ద్రష్ట - దృశ్య ఐక్య రూపము - అనే సమాధిస్థితి, జీవన్ముక్తి మొదలైనవి లభిస్తున్నాయి. సర్వ వాసనల క్షయము జీవన్ముక్తి వలన వచ్చే లాభమని విజ్ఞులు గానము చేస్తూ చెప్పుచున్నారు. |
అత్ర శ్లోకా భవంతి .. ఉచ్ఛాస్త్రం శాస్త్రితం చేతి పౌరుషం ద్వివిధం మతం . అత్రోచ్ఛస్త్రమనర్థాయ పరమార్థాయ శాస్త్రితం .. 1.. లోకవాసనయా జంతోః శాస్త్రవాసనయాపి చ . దేహవాసనయా జ్ఞానం యథావన్నైవ జాయతే .. 2.. |
|
అత్ర శ్లోకాః | 1. ఉచ్ఛాస్త్రం 2. శాస్త్రితం చ ఏతి పౌరుషం ద్వివిధమ్ మతమ్| తత్ర ’ఉత్ - శాస్త్రమ్’ అనర్థాయ, పరమార్థాయ … శాస్త్రితమ్| లోక వాసనయా జంతో, శాస్త్ర వాసనయాఽపి చ, దేహవాసనయా జ్ఞానం యథా తత్ న ఏవ జాయతే| |
ప్రతి జీవుడు దేహముతో పురుష ప్రయత్నము ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాడు. అయితే పురుషప్రయత్నం రెండు తీరులుగా ఉంటోంది. 1. ఉత్ (అసత్) శాస్త్రీయము: జీవితాశయమగు ఆత్మ తత్త్వమును తెలుసుకొనే మార్గమును, శాస్త్రములు చెప్పే సూచనలు ప్రక్కగా పెట్టి, ఇంద్రియ - దృశ్య వ్యవహారములకు సంబంధించి ఏదో పొందాలని చేసే పురుష - ప్రయత్నములు. 2. సత్-శాస్త్రీయము : సశాస్త్రీయంగా ఆత్మతత్త్వ జ్ఞానము ముఖ్యాశయముగా కలిగి ఉండి, ఇక అప్పుడు చేయు పురుష ప్రయత్నము. ఉత్ శాస్త్రీయ పురుష ప్రయత్నములు (ఆత్మశాస్త్ర వ్యతిరిక్త ప్రవర్తనలు) అనర్థము కొరకే అగుచున్నది. సత్ శాస్త్రీయ పురుష ప్రయత్నములు పరమార్థమగు జీవన్ముక్తి - విదేహముక్తులకు దారి చూపుచున్నాయి. లోక వాసనలను, శాస్త్రవాసనలను, దేహవాసనలను కొనసాగించుచూ చేయు పురుష ప్రయత్నములు “యథాతథ స్వరూపము" అయి ఉన్న స్వస్వరూపాత్మ జ్ఞానము వైపుగా ఈ జీవుని నడిపించజాలవు - అని గుర్తు చేస్తున్నాను. |
ద్వివిధా వాసనావ్యూహః శుభశ్చైవాశుభశ్చ తౌ . వాసనౌఘేన శుద్ధేన తత్ర చేదనునీయసే .. 3.. తత్క్రమేణాశు తేనైవ మామకం పదమాప్నుహి . |
|
3.) ద్వివిధో వాసనా వ్యూహః 1. శుభశ్చైవ, 2. అశుభశ్యతే। వాసనౌఘేన శుద్ధేన తత్రచేత్ అనునీయసే। తత్ క్రమేణాశు తేనైవ మామకమ్ పదమ్ ఆప్ను హి॥ |
ఓ ప్రియ హనుమా! ఈ జీవుడు పుట్టుకతోనే రెండు రకాల వాసనలు తనవెంట తెచ్చుకుంటున్నాడు. 1. శుభ వాసనలు 2. అశుభవాసనలు. ఇక వాటితో జీవితమును గడుపుచున్నాడు. ఇప్పుడు ఏమి చేయాలి? శుభవాసనలకు సంబంధించిన పురుష ప్రయత్నములను అధికం చేసుకుంటూ, అశుభ వాసనలను క్రమంగా జయిస్తూ, త్యజిస్తూ రావాలి. ఈవిధంగా శుభవాసనలను వృద్ధి చేయు పురుష ప్రయత్నములను క్రమక్రమంగా వృద్ధి చేసుకుంటూ వస్తే, ఇక అశుభవాసనా సంబంధమైన పురుష ప్రయత్నములు సన్నగిల్లుతూ వస్తాయి. అప్పుడు ఆ జీవుడు నాయొక్క “ఆత్మారామ పదము”ను తప్పక పొందగలవు. |
అథ చేదశుభో భావస్త్వాం యోజయతి సంకటే .. 4.. ప్రాక్తనస్తదసౌ యత్నాజ్జేతవ్యో భవతా కపే . శుభాశుభాభ్యాం మార్గాభ్యాం వహంతీ వాసనాసరిత్ .. 5.. పౌరుషేణ ప్రయత్నేన యోజనీయా శుభే పథి . అశుభేషు సమావిష్టం శుభేష్వేవావతారయేత్ .. 6.. అశుభాచ్చాలితం యాతి శుభం తస్మాదపీతరత్ . |
|
అథ చేత్ అశుభో భావః త్వాం యోజయతి సంకటే, ప్రాక్తనః తత్ అసౌ యత్నాత్ జేతవ్యో భవతా, కపే! శుభ-అశుభాభ్యాం మార్గాభ్యాం వహంతి వాసనా సరిత్। పౌరుషేణ ప్రయత్నేన యోజనీయా శుభే పథి। అశుభేషు సమావిష్టం శుభేష్వేవ అవతారయేత్| అశుభాత్ చాలితం యాతి శుభమ్ తస్మాత్ అపీతరత్| |
ఓ ప్రియ కపీశ్వరా! హనుమా! ఒకవేళ ఇతఃపూర్వపు అశుభవాసనలు నిన్ను ఆకర్షించుచూ, సంసార సంబంధమైన పురుషకారములవైపు ఆకర్షిస్తూ ఉంటే, అప్పుడు ఆ ప్రాక్తన (ఇతః పూర్వపు) కర్మవాసనలను వర్తమాన (ఆద్యతన) పురుషప్రయత్నముల సహాయముతో జయించివేయాలయ్యా! ఇతః పూర్వపు సంస్కారరూప వాసనలు అనే ప్రవాహము 1. శుభమార్గము 2. అశుభమార్గము అను రెండు మార్గములలో ప్రవహిస్తున్నదని ఈ జీవుడు గమనించాలి సుమా! అప్పుడిక పురుష ప్రయత్నముతో ఇప్పుడు అశుభ మార్గమును నిరోధించాలి. శుభ మార్గములోనికి (వర్తమాన పురుష ప్రయత్నముల ద్వారా) సంస్కారములను (వాసనలను) మరల్చాలి. శుభ ప్రయత్నములవైపు ప్రవహింపజేయాలి. శుభవాసనలను ప్రవృద్ధం చేసుకోవాలి. అశుభ మార్గములో చొచ్చుకుపోయి ఉన్నట్టి పురుష ప్రయత్నములను ఏదో ఒక ఉపాయములతో, వెనుకకు మరల్చి, ఆ పురుష ప్రయత్నములను శుభమార్గములో నియోగించాలి. అశుభ మార్గములో పోవుచున్న మనస్సును విజ్ఞులు - శాస్త్రములు చెప్పే సాధనల సహాయంతో శుభమార్గములోనికి క్రమంగా మరల్చాలి. |
పౌరుషేణ ప్రయత్నేన లాలయేచ్చిత్తబాలకం ..7.. ద్రాగభ్యాసవశాద్యాతి యదా తే వాసనోదయం . తదాభ్యాసస్య సాఫల్యం విద్ధి త్వమమరిమర్దన .. 8.. |
|
పౌరుషేణ ప్రయత్నేన లాలయేత్ చిత్తబాలకమ్| ద్రాగభ్యాస వశాత్ యాతి యదా తే వాసనోదయమ్, తత్ అభ్యాసస్య సాఫల్యమ్ విద్ధి త్వమ్, అరిమర్దన! |
ఈ చిత్తము అనే బాలుడు అల్లరి చిల్లరిగా అశుభ మార్గములలో పరుగులు తీస్తున్నాడు. ఇప్పుడు ఈ జీవుడు మానవ జన్మకు వచ్చాడు కదా! అందుచేత, ఆయా ప్రయత్నములతో పురుషకారముతో ఈ చిత్త బాలకుణ్ణి లాలించి, బుజ్జగించి అశుభ పురుషాకారము నుండి పిలుచుకొచ్చి, శుభపురుషకారములలో క్రమంగా నియమించాలి. ఓ శత్రు భయంకరా! హనుమా! ఇతః పూర్వపు ఇంద్రియ విషయములను ఆస్వాదించుటలో పెంపొందిన వాసనలనుండి ఈ చిత్తమును శుభ అభ్యాసములవైపు మరల్చగలిగినవాడే యోధుడు! విజయుడు! వీరుడు! శత్రుమర్దనుడు! |
సందిగ్ధాయామపి భృశం శుభామేవ సమాచర . శుభాయాం వాసనావృద్ధౌ న దోషాయ మరుత్సుత .. 9.. వాసనాక్షయవిజ్ఞానమనోనాశా మహామతే . సమకాలం చిరాభ్యస్తా భవంతి ఫలదా మతాః .. 10.. త్రయ ఏవం సమం యావన్నాభ్యస్తాశ్చ పునః పునః . |
|
4.) సందిగ్ధాయామ్ అపి భృశం ‘శుభామ్’ ఏవ సమాచరేత్। శుభాయాం వాసనా వృద్ధౌ న దోషాయ, మరుత్ సుతా! 1. వాసనా క్షయ, 2. విజ్ఞాన, 3. మనోనాశా, మహామతే! సమకాలం చిరాభ్యస్తా భవంతి ఫలదా మతాః। త్రయమ్ ఏతే సమం యావత్ న అభ్యస్తా చ పునః పునః, |
ఓ ఆంజనేయా! ఒకవేళ - “నా చిత్తము అశుభ వాసనలు కలిగి లేవు కదా? ఉన్నాయంటారా?” - అనే సందిగ్ధము నీలో ఉన్నప్పుడు కూడా, నీవు శుభ పురుషకారములను వదలవద్దు. కొనసాగించవలసిందే! ఎందుకంటావా? ఓ వాయుపుత్రా! విను. శుభ వాసనల సంవృద్ధి, ప్రభావముచేత అశుభవాసనలు ముందు ముందు కూడా నిన్ను సమీపించలేవు. నీపట్ల దోషక్రమము రూపు దిద్దుకోకుండా నశిస్తుంది. ఓ మహామతీ! 1. వాసనాక్షయము 2. ఆత్మజ్ఞానము 3. మనోనాశనము. ఈ మూడూ కూడా ఈ జీవుడు ఒకేసారి అభ్యసించాలయ్యా! అప్పుడు ఆత్మతత్త్వానుభవము ఫలప్రదమౌతుంది. విడివిడిగా ఒక్కొక్కటి అభ్యసిస్తే ఉత్తమ ఫలము లభించదు. |
తావన్న పదసంప్రాప్తిర్భవత్యపి సమాశతైః .. 11.. ఏకైకశో నిషేవ్యంతే యద్యేతే చిరమప్యలం . తన్న సిద్ధిం ప్రయచ్ఛంతి మంత్రాః సంకీర్తితా ఇవ .. 12.. త్రిభిరేతైశ్చిరాభ్యస్తైర్హృదయగ్రంథయో దృఢాః . నిఃశంకమేవ త్రుఠ్యంతి బిసచ్ఛేదాద్గుణా ఇవ .. 13.. జన్మాంతశతాభ్యస్తా మిథ్యా సంసారవాసనా . సా చిరాభ్యాసయోగేన వినా న క్షీయతే క్వచిత్ .. 14.. |
|
తావత్ న పద సంప్రాప్తిః భవతి అసమా శతైః| ఏకైకశో నిషేవ్యంతే యద్యేతే చిరమపి అలమ్ తత్ న సిద్ధిం ప్రయచ్ఛంతి మంత్రాత్ సంకీర్ణితా ఇవ త్రిభిః ఏతైః చిరాభ్యసైః హృదయ గ్రంథయో దృఢాః నిశ్శంకమేవ తృట్యంతి బిసచ్ఛేదాత్ గుణా ఇవ జన్మాంతర శతాభ్యస్తా మిథ్యా సంసార వాసనా సా చిరాభ్యాస యోగేన వినా న క్షీయతే క్వచిత్|| |
ఎంతెంతవరకైతే 1) వాసనాక్షయము 2) ఆత్మజ్ఞాన సముపార్జనము, 3) మనో నాశనము… అను మూడూ ఈ జీవుడు మరల మరల (ఒక్కసారే) అభ్యసించడో, అంతంత వరకు ఈ జీవునికి ఆత్మపద ప్రాప్తి, వంద జన్మలెత్తినా ఆత్మారామ స్థానము లభించదు. మంత్రమును - అర్థమును - ఉద్దేశ్యమును తెలుసుకొని పఠిస్తేనే ఉత్తమ ప్రయోజనము కదా! అట్లాగే పై మూడు ఒక్కసారే చిరకాలము అభ్యసించకపోతే రామబ్రహ్మానందము అనే సిద్ధిని ఈ జీవుడు పొందనే లేడయ్యా! ఒక తామరతూడును ఛేదిస్తూ ఉంటే అందులోని దారము కూడా తెగిపోతుంది కదా! అట్లాగే వాసనా క్షయము-ఆత్మ జ్ఞానము-మనోలయములనే ‘3’ అభ్యాసములు ఒక్కసారే నిర్వర్తిస్తూ ఉండగా హృదయములోని గ్రంధులు (చిక్కుముళ్లు), రాగ - ద్వేష - మోహ దోషములు, అవిద్య - ఆవరణ - విక్షేప త్రివిధ మాయలు, పుత్రేషణ - ధనేషణ - దారేషణ త్రివిధ ఈషణములు, ఆధ్యాతిక - ఆధిదైవిక - ఆధి భౌతిక దుఃఖములు (త్రివిధ తాపములు) … ఇవన్నీ ముడి వీడుతాయి. సర్వశంకలు (అనుమానాలు) (If there is constant practice) తొలగుతాయి. జీవుడు జన్మజన్మాంతరాలుగా అసంఖ్యాక మిథ్యాసంసార వాసనలు అభ్యాసవశంగా మూటలు కట్టుకొని తన సంస్కార శరీరము (కారణ శరీరము) నందు దాచుకుంటూ పోతున్నాడు. అవన్నీ చిరకాలము అభ్యాసమును ఆశ్రయించకపోతే క్షీణించవు. |
తస్మాత్సౌమ్య ప్రయత్నేన పౌరుషేణ వివేకినా . భోగేచ్ఛాం దూరతస్త్యక్త్వా త్రయమేవ సమాశ్రయ .. 15.. తస్మాద్వాసనయా యుక్తం మనో బద్ధం విదుర్బుధాః . సమ్యగ్వాసనయా త్యక్తం ముక్తమిత్యభిధీయతే . |
|
5.) తస్మాత్, సౌమ్య! ప్రయత్నేవ, పౌరుషేన వివేకినా, భోగేచ్చాం దూరతః త్యక్త్వా, త్రయమేవ సమాశ్రయ। తస్మాత్ వాసనయా యుక్తమ్ ‘మనోబద్ధమ్’ విదుః బుధాః। సమ్యక్ వాసనయా త్యక్తం ‘ముక్తమ్’ - ఇతి అభిధీయతే। |
అందుచేత ఓ సౌమ్యా! ప్రియ హనుమా! “శాస్త్ర సూచనానుసారంగా ప్రయత్నించటము” అనే వివేకముతో కూడిన కార్యక్రమమును ఆశ్రయించి, ఈ జీవుడు భోగేచ్ఛలన్నీ సుదూరముగా వదలివేయును గాక! నేను చెప్పిన త్రయీ (3) సాధనములకు ఉపక్రమించి భోగేచ్ఛలను త్యజించు బుద్ధిబలమును పెంపొందించుకొనును గాక! ఈ జీవుడు వాస్తవానికి ఆత్మారామ స్వరూపుడే కదా! మరి ‘బంధము’ అనునది ఎక్కడి నుండి వచ్చి ఇక్కడికి దిగుమతి అవుతోంది? దీనికి సమాధానము - వాసనలతో కూడియున్న మనస్సే బంధమునకు కారణము అని బుధుల (విజ్ఞుల) అభిప్రాయము. ప్రయత్నశీలుడవై మనస్సు నుండి వాసనలను తొలగించావా, అదియే ‘ముక్తి’ అని పిలువబడుతోంది. (వాసనలు = Tendency of Feelings & opinions about worldly appearences and incidents). |
మనోనిర్వాసనీభావమాచరాశు మహాకపే .. 16.. సమ్యగాలోచనాత్సత్యాద్వాసనా ప్రవిలీయతే . వాసనావిలయే చేతః శమమాయాతి దీపవత్ .. 17.. వాసనాం సంపరిత్యజ్య మయి చిన్మాత్ర విగ్రహే . యస్తిష్ఠతి గతో వ్యగ్రః సోఽహం సచ్చిత్సుఖాత్మకః .. 18.. సమాధిమథ కార్యాణి మా కరోతు కరోతు వా . హృదయేనాత్తసర్వేహో ముక్త ఏవోత్తమాశయః .. 19.. |
|
మనో నిర్వాసనీ భావమ్ ఆచరాశు, మహాకపే! సమ్యక్ ఆలోకనాః సత్యాత్ వాసనా ప్రవిలీయతే। వాసనా విలయే చేతః ’శమమ్’ ఆయాతి దీపవత్| వాసనాం సం పరిత్యజ్య మయి చిత్ - మాత్ర విగ్రహే, యః తిష్టతి గతవ్యగ్రః సోఽహమ్ సత్ చిత్ సుఖాత్మకః సమాధిమ్ అథ కర్మాణి మా కరోతు, కరోతు వా, హృదయేన ఆత్త సర్వేహెూ ముక్త ఏవ ఉత్తమాశయః॥ |
ఓ మహా కపీ! ఏదో ఒక ఉపాయంతోనో, కొన్ని ఉపాయాల సహాయంతోనో మనస్సును ఎంత త్వరగా వాసనా రహితము చేసుకుంటే అంతగా మంచిది. అయితే మనస్సు నుండి వాసనలు తొలగడానికి మార్గమేమిటి? ఉపాయమేమిటి? విను. ఈ కల్పిత జగత్తును అధిగమించి సర్వే సర్వత్రా సత్యమగు, సమమగు ఆత్మయొక్క సందర్శనాభ్యాసముచే వాసనలు త్వరగా వాటికవే తొలగుతాయి. వాసనల విలయము చేత ‘చిత్తము’ (అభిరుచి) అనబడునది - తైలము (నూనె) లేని దీపమువలె శమించగలదు. వాసనలు పూర్తిగా పరిత్యజించబడినాయా, ఇక ఆతడు అన్ని ఆదుర్దాలు, దిగుళ్ళు వదలివేసినవాడై, నా సత్ చిత్ రామానంద స్వరూపమునందు ప్రకాశించి, తానే నేనై, చిదానంద స్వరూపుడై, సత్ చిత్ ఆనంద సుఖమును అనుభవించగలడు. ఆతడు ఏ వేగిరపాటూ లేనివాడై రామానంద సాగరమునందు ఆనంద తరంగమై విహరించగలడు. ఒకడు కర్మలన్నీ త్యజించి సమాధి నిష్ఠుడై ఉండవచ్చు గాక! లేదా అనేక కర్మలు నిర్వర్తించుచూ ఉండవచ్చు గాక! సర్వ ప్రాపంచక సంబంధములు హృదయములో రహితము చేసుకొని, ఉత్తమాశయమును ఆశ్రయించినవాడు సర్వదా ముక్తుడేనయ్యా! |
నైష్కర్మ్యేణ న తస్యార్థస్తస్యార్థోఽస్తి న కర్మభిః . న ససాధనజాప్యాభ్యాం యస్య నిర్వాసనం మనః .. 20.. సంత్యక్తవాసనాన్మౌనాదృతే నాస్త్యుత్తమం పదం .. 21.. వాసనాహీనమప్యేతచ్చక్షురాదీంద్రియం స్వతః . ప్రవర్తతే బహిః స్వాఽర్థే వాసనామాత్రకారణం .. 22.. |
|
6.) నైష్కర్మ్యేణ న తస్య అర్థః, తస్య అర్థో అస్తి న కర్మభిః | న సమాధాన జాప్యాభ్యాం యస్య నిర్వాసనం మనః | సంత్యక్త వాసనాన్ మౌనాత్ ధృతే నాస్తి ఉత్తమం పదమ్| వాసనా హీనమపి ఏతః చక్షురాది ఇంద్రియః స్వతః॥ ప్రవర్తతే బహిః స్వార్థే వాసనామాత్ర కారణమ్ | |
ఎవని మనస్సైతే ప్రాపంచక సంబంధిత సంగతులు, సందర్భములు, సంబంధములపట్ల వాసనా శూన్యమై ఉంటుందో… అట్టి ఆత్మతత్త్వ జ్ఞానికి, - కర్మలు చేయకపోవడం చేతగాని, - కర్మలు చేయుచుండుట చేతగాని, - ‘సమాధి’ అనే సమాధాన యోగాభ్యాసము చేతగాని, - జప తపములు చేయుటచేతగాని, (లేక) చేయకపోవుట చేతగాని, .. క్రొత్తగా రావలసిన ప్రయోజనమూ ఉండదు. రాని ప్రయోజనమూ లేదు. “మనస్సును వాసనలను త్యజించి వేయగా అప్పుడు ప్రశాంతమగు మౌనము వహించి ఉండటము”… అనే స్థితిని మించిన పదము మరొకటి ఏదీ లేదు. ఉండదు. ఈ కళ్ళు - చెవులు మొదలైన ఇంద్రియములు స్వతఃగా వాసనాశూన్యములు. (ఎందుకంటే అవి ఉపయోగించబడు ఉపకరణముల వంటివి మాత్రమే కదా!). అయితే బహిర్గతమై విషయములను ఆశ్రయించటానికి పదార్థములను స్వీకరించటానికి కారణము ఎవరు? ఈ జీవునియొక్క పూర్వ వాసనలే! |
అయత్నోపనతేష్వక్షి దృగ్ద్రవ్యేషు యథా పునః . నీరాగమేవ పతతి తద్వత్కార్యేషు ధీరధీః .. 23.. భావసంవిత్ప్రకటితామనురూపా చ మారుతే . చిత్తస్యోత్పత్యుపరమా వాసనాం మునయో విదుః .. 24.. దృఢాభ్యస్తపదార్థైకభావనాదతిచంచలం . చిత్తం సంజాయతే జన్మజరామరణకారణం .. 25.. |
|
అయత్నా ఉపనతేషు అక్షిః దృక్ ద్రవ్యేషు యథా పునః…, నీరాగమేవ పతతి తద్వత్ కార్యేషు ధీర ధీః| భావ సంవిత్ ప్రకటితా మనురూపాం చ మారుతే! చిత్తస్య ఉత్పత్తి ఉపరమం హంసవా మునయో విదుః | దృఢాభ్యస్త పదార్థైక భావనాత్ అతి చంచలమ్, చిత్తం సంజాయతే జన్మ, జరా మరణ కారణమ్ | |
ఏవిధంగా అయితే స్వతఃగా జడము అయినట్టి ఈ కళ్ళు - చెవులు మొదలైన ఇంద్రియములు ఆయా పదార్థములపై వ్రాలి కూడా విషయానుభవము (బాగున్నది - బాగోలేదు - కావాలి - వద్దు … మొదలైన భావములు) అవి స్వతఃగా పొందకయే వర్తిస్తున్నాయో…, ఆ విధంగా, ధీరుడగు జ్ఞాని తాను పాల్గొనుచున్న కార్యక్రమములయందు రాగరహితుడై ప్రవర్తించుచున్నాడు. అజ్ఞానియో, రాగముతో కూడి ప్రవర్తిస్తున్నాడు. వారిద్దరి భేదము ఇంత వరకే! ఓ మారుతీ! జ్ఞాని తనయొక్క చిత్తములో భావములను అనుసరించి ఈ దృశ్య జగత్తులో ప్రవర్తిస్తూ ఉన్నప్పటికీ కూడా, “హంస” (క్షీర భాగమును స్వీకరిం - జల భాగము విడచుట) వలె, ఆత్మతత్త్వమును గ్రహించి, ఇక తదితరమైనదంతా అతడే త్యజించివేసినవాడై ఉంటున్నాడు. ఇక ఆత్మతత్త్వము ఏమిటో ఎరుగని అజ్ఞాని విషయానికి వస్తే… ఆతని చిత్తము పదార్థభావనలను అవిశ్రాంతంగా ఆశ్రయించి ఉండటంచేత - అనుక్షణము అతి చంచలమై ఉంటోంది. అట్టి చంచల చిత్తము జన్మ - జరా - మరణములకు కారణములను జనింపజేసుకుంటూ పోతోందయ్యా! |
వాసనావశతః ప్రాణస్పందస్తేన చ వాసనా . క్రియతే చిత్తబీజస్య తేన బీజాంకురక్రమః .. 26.. ద్వే బీజే చిత్తవృక్షస్య ప్రాణస్పందనవాసనే . ఏకస్మింశ్చ తయోః క్షీణే క్షిప్రం ద్వే అపి నశ్యతః .. 27.. |
|
7.) వాసనా వశతః ప్రాణః స్పందః, తేన చ వాసనా, క్రియతే చిత్తబీజస్య తేన బీజాంకుర క్రమః| ద్వే బీజే చిత్త వృక్షస్య 1) ప్రాణ స్పందన, 2) వాసనే। ఏకస్మింశ్చ తయో క్షీణే క్షిప్రం ద్వే అపి నశ్యతః॥ |
వాసనల కారణంగానే ప్రాణ స్పందన ఏర్పడుతోంది. ఆపై, ప్రాణ స్పందన వలన తిరిగి వాసనలు ఏర్పడుచున్ననగుచున్నాయి.ఈ విధంగా “బీజములోంచి వృక్షము, తిరిగి వృక్షములో నుండి బీజము” వలె - చిత్త బీజమునుండి ప్రాణస్పందన, - ప్రాణస్పందనచేత వాసనలు (చిత్తరూపము) ఏర్పడుచున్నాయి. కాబట్టి 1. వాసనలు 2. ప్రాణస్పందన … ఈ రెండిటిలో ఒకటి క్షయిస్తే, అతి త్వరగా రెండవది కూడా నశించడం జరుగుతోంది. ‘చిత్తము’ అనే వృక్షమునకు రెండు బీజములు 1. ప్రాణ స్పందన 2. వాసనలు. రెండు కలిసి ఉంటేనే ‘చిత్తము’ ఉంటుంది. ఒక్కటి నశిస్తే రెండవది నశిస్తోంది. చిత్తము నశిస్తుంది. |
అసంగవ్యవహారత్వాద్భవభావనవర్జనాత్ . శరీరనాశదర్శిత్వాద్వాసనా న ప్రవర్తతే . వాసనాసంపరిత్యాగాచ్చితం గచ్ఛత్యచిత్తతాం .. 28.. అవాసనత్వాత్సతతం యదా న మనుతే మనః . అమనస్తా తదోదేతి పరమోపశమప్రదా .. 29.. అవ్యుత్పన్నమనా యావద్భవానజ్ఞాతతత్పదః . గురుశాస్త్రప్రమాణైస్తు నిర్ణీతం తావదాచర .. 30.. |
|
అసంగ వ్యవహారత్వాత్ భావభావన వర్ణనాత్। శరీర నాశ దర్శిత్వాత్ వాసనా న ప్రవర్తతే॥ వాసనా సంపరిత్యాగాత్ చిత్తం గచ్ఛతి అచిత్తతామ్| అవాసనత్వాత్ సతతం యదా న మనుతే మనః॥ అమనస్తాత్ తత్ ఉదేతి పరమ ఉపశమప్రదా। అవ్యుత్పన్నమ్ మనా యావత్ భవాత్ అజ్ఞాత తత్పదః । గురు శాస్త్ర ప్రమాణైస్తు నిర్ణీతం తావత్ ఆచర । |
ఓ మారుతాత్మజా! సంగరహితముగా ప్రాపంచక వ్యవహారములను నిర్వర్తిస్తూ సందర్భములను దర్శించటముచేత భావ - అభావ సంసారము సన్నగిల్లుచున్నది. దృశ్యములోని వస్తువులన్నీ కాలతః నాశనశీలమే కదా! అట్లాగే ఈ శరీరము కూడా! ఈ శరీరము అతి త్వరలో నశించబోవు వస్తువుగా దర్శించటముచేత ‘వాసనలు’ తీవ్రతను కోల్పోసాగుతాయి. వాసనలు పరిత్యజించబడినప్పుడు ఇక ఈ చిత్తము అచిత్తముగా అగుచున్నది. వాసనలు నశించుచుండగా మనస్సు సంకల్పరహితమై ఉంటుంది. మనస్సు మననము సంత్యజించుచున్నది. ఇక అది అమనస్కము అగుచున్నది. మనస్సు శమించుటచే సిద్ధించు అమనస్కముచే జగత్తు ఉపశమించినదై పరమ విశ్రాంతి రూపమగు పరమపదము లభించుచున్నది. "అవిషయ భావాభావ వివర్జిత అమనస్కము” వ్యుత్పత్తి కానంత వరకు స్వస్వరూపమగు ఆత్మారామ పదము అనుభవమునకు రాదు. కనుక ఓ పవన తనయా! ఆంజనేయా! గురు శాస్త్ర ప్రమాణములచే ఆత్మభావనా యోగస్థితి లభించనంతవరకు (జగత్తు ఆత్మగా అనుభూతము కానంత వరకు) జగత్ భావ ఉపశమన రూపమగు అమనస్కయోగమును ఈ జీవుడు అభ్యసిస్తూ ఉండటమే ఉచితము. అందుకు శుభవాసనలు ఆశ్రయిస్తూనే ఉండాలి. అశుభవాసనలను జయించుటయందు ప్రయత్నశీలుడై ఉండక తప్పదు. |
తతః పక్వకషాయేణ నూనం విజ్ఞాత వస్తునా . శుభోఽప్యసౌ త్వయా త్యాజ్యో వాసనౌఘో నిరాధినా .. 31.. ద్వివిధచిత్తనాశోఽస్తి సరూపోఽరూప ఏవ చ . జీవన్ముక్తః సరూపః స్యాదరూపో దేహముక్తిగః .. 32.. |
|
8.) తతః పక్వ కషాయేన నూనం విజ్ఞాత వస్తునా, శుభోఽపి అసౌ త్వయా త్యాజ్యో వాసనౌఘో నిరాధినా। ద్వివిధః చిత్తనాశోఽస్తి 1. సరూపో 2. అరూప ఏవ చ। జీవన్ముక్తా సరూపస్యాత్, అరూపో దేహముక్తిగః। |
ఆవిధంగా గురు-శాస్త్ర-ధర్మ ప్రమాణములతో చెప్పబడిన శుభకర్మలను ఆచరిస్తూ, ఆ తరువాత - ఔషధము సేవించిన తరువాత రోగము ఉపశమించగా ఇక ఆ ఔషధమును వదలుచున్న విధంగా - శుభ వాసనలను కూడా త్యజించివేయాలి. ‘చిత్తనాశనము’ అనునది రెండు విధములైనదిగా చెప్పబడుచున్నది. 1. సరూపము : కనబడే నామరూపాలన్నీ ఆత్మారామ సంప్రదర్శనముగా దర్శించటము. దీనిని ‘జీవన్ముక్తి’ అని అంటారు. 2. అరూపము : సాకారముగా కనిపిస్తున్నదంతా సాకారముగా ఏమాత్రమూ అనిపించక, సర్వదా నిరాకార పరబ్రహ్మముగా అగుపించటము, అనిపించటము. ఇది ‘విదేహముక్తి’ అని పిలువబడుచున్నది. |
అస్య నాశమిదానీం త్వం పావనే శ్రుణు సాదరం .. 33. చిత్తానాశాభిధానం హి యదా తే విద్యతే పునః . మైత్ర్యాదిభిర్గుణైర్యుక్తం శాంతిమేతి న సంశయః . భూయోజన్మవినిర్ముక్తం జీవన్ముక్తస్య తన్మనః .. 34.. సరూపోఽసౌ మనోనాశో జీవన్ముక్తస్య విద్యతే . అరూపస్తు మనోనాశో వైదేహీ ముక్తిగో భవేత్ .. 35.. |
|
అస్య నాశమ్ ఇదానీం త్వం, పావనే శ్రుణు సాదరమ్! చిత్త నాశ అభిధానం హి యదా తే విద్యతే పునః, మైత్ర్యాదిభిః గుణైః యుక్తః శాంతిమ్ ఏతి న సంశయః । భూయో జన్మ వినిర్ముక్తం జీవన్ముక్తస్య తన్మనః। సరూపోఽసౌ మనో నాశో జీవన్ముక్తస్య విద్యతే! అరూపస్తు మనోనాశో వైదేహీ ముక్తిగో భవేత్| |
ఓ పవనసుతా! పాప దోషరహితుడా! ఆంజనేయా! మనము చెప్పుకున్న ఈ ‘చిత్తనాశనము’ను సాదరముగా విను. అభ్యసించు. మరల మరల అభ్యసించబడుచుండగా, మైత్రి-ప్రేమ-కరుణ మొదలైనవి (సర్వజీవుల పట్ల అమృత వర్షమువలె) నీ నుండి కురియును గాక! క్రమంగా నీయొక్క సర్వాత్మత్వము పట్ల సర్వ సందేహాలు తొలగి, స్వభావ సిద్ధముగా పరమశాంతిని పొందగలవు. అట్టి జీవన్ముక్తుని మనస్సు ‘పునర్జన్మ’ అను భ్రమ - స్వభావ దోషమునుండి స్వయముగా విముక్తి పొందగలదు. జీవన్ముక్త మనోనాశనము : ఈ కనబడే నామ-రూప- గుణాత్మకమైనదంతా యథాతథముగా నామ రూప - గుణాత్మకంగా కనిపిస్తూ సమరసమగు పరబ్రహ్మముగా భావింపబడటము, తెలియబడటము - ఇది జీవన్ముక్త లక్షణము. విదేహముక్త మనోనాశనము : సర్వదా సర్వత్రా సర్వము నామ - - రూప - గుణాత్మక భేదమంతా కోల్పోయి, కేవలము సర్వత్రా సమ స్వరూపమై శ్రీరామబ్రహ్మమేనని అనిపిస్తూ, అగుపిస్తూ ఉంటే… అట్టి స్వభావసిద్ధమగు అనునిత్యానుభూతి విదేహముక్త మనో నాశనముగా చెప్పబడుతోంది. అనన్యత్వమే విదేహముక్తియొక్క శుభలక్షణము. |
సహస్రాంకురశాఖాత్మఫలపల్లవశాలినః .. 36.. అస్య సంసారవృక్షస్య మనోమూలమిదం స్థితం . సంకల్ప ఏవ తన్మన్యే సంకల్పోపశమేన తత్ .. 37.. శోషయాశు యథా శోషమేతి సంసారపాదపః . ఉపాయ ఏక ఏవాస్తి మనసః స్వస్య నిగ్రహే .. 38.. |
|
9.) సహస్ర అంకుర శాఖాత్మ ఫల పల్లవశాలినః, అస్య సంసార వృక్షస్య మనోమూలమ్ ఇదమ్ స్థితమ్| సంకల్ప ఏవ తత్ మన్యే సంకల్ప - ఉపశమేన తత్, శోషయాశు యథా శోషమ్ ఏతి సంసార పాదపః | ఉపాయ ఏక ఏవ అస్తి మనసః స్వస్య నిగ్రహే | |
సంసార వృక్షము : వేలాది అంకురములు, శాఖలు, ఫలములు, పల్లవములు (చిగుళ్ళు) కలిగి ఉన్నట్టి “సంసారము’ అనే వృక్షము - మనస్సుయే మూలముగా కలిగి స్థితి పొంది ఉన్నది. “సంకల్పించటము” అనునదే మనస్సు యొక్క రూపము. సంకల్పించటము ఉపశమించిందా … వెంటనే మనస్సు అనునది కూడా మొదలంట్లా ఉపశమించినట్లే! సంకల్ప రాహిత్యము అనే అభ్యాసముచే సంకల్ప పరంపరలు అనే జలమును అందించటం మానివేస్తే అప్పుడు ఈ సంసార పూతీగ దానికదియే ఎండిపోతుంది. ఇక చిగురించదు. కాబట్టి ఓ ప్రియ అంజనీపుత్రా! ఈ మనస్సును నిగ్రహించటానికి, ఒకే ఒక్క మఖ్యమైన ఉపాయం. ఈ మనస్సును “సర్వము ఆత్మ స్వరూపమే” అను ఆత్మ భావనయందు నియమించి, క్రమంగా జగత్తును సన్న్యసించాలి. భేదదృష్టిని వదలి ఆత్మ దృష్టి (లేక) ఆత్మ భావనను ఆశ్రయించాలి. |
మనసోఽభ్యుదయో నాశో మనోనాశో మహోదయః . జ్ఞమనో నాశమభ్యేతి మనో జ్ఞస్య హి శృంఖలా .. 39.. తావన్నిశీవ వేతాలా వల్గంతి హృది వాసనాః . ఏకతత్త్వదృఢాభ్యాసాద్యావన్న విజితం మనః .. 40.. ప్రక్షీణచిత్తదర్పస్య నిగృహీతేంద్రియద్విషః . పద్మిన్య ఇవ హేమంతే క్షీయంతే భోగవాసనాః .. 41.. |
|
మనసో అభ్యుదయో నాశో, మనోనాశో మహెూదయః| ‘జ్ఞ’ మనో నాశమ్ అభ్యేతి మనో అజ్ఞస్య హి శృంఖలా| తావత్ నిశీవ వేతాళా వల్గంతి హృది వాసనాః ఏకతత్త్వ దృఢ - అభ్యాసాత్ యావత్ న విజితం మనః॥ ప్రక్షీణ చిత్త దర్పస్య నిగృహీత ఇంద్రియ ద్విషః| పద్మిన్య ఇవ హేమంతే క్షీయంతే భోగవాసనాః। |
మనస్సుయొక్క అభ్యుదయమే - సర్వ అనర్థములకు, నష్టములకు మూల కారణము. మనస్సు నశించిందా, అది ఈ జీవునికి మహెూదయమే అవుతుంది. (ఈ జీవుడు శివుడే అగుచున్నాడు). జ్ఞానిపట్ల ఆతని మనస్సే మనస్సును నశింపజేయు గొప్ప ఆయుధము అగుచున్నది. అజ్ఞానికో, ఆ మనస్సే బంధము. రాత్రిపూట చీకట్లో చూస్తూ ఉంటే అక్కడ భేతాళుడు (దయ్యము) ఉన్నట్లు కనిపించి, అజ్ఞాన బాలకునికి భయములన్నీ వచ్చి పడుచున్నాయి చూచావా? హృదయములో ప్రాపంచక వాసనలు ఉన్నంత వరకు నీపై మనస్సే పెత్తనము చెలాయిస్తుంది. “సర్వత్రా ఏకబ్రహ్మమే” అనే దృఢమైన అభ్యాసమును ఆశ్రయించనంత వరకు, మనస్సును నీవు జయించ లేవు. మనస్సే నీపై పెత్తనం చెలాయిస్తుంది. “ఇంద్రియ విషయములను స్వీకరించకపోవటము" - అను అభ్యాసముచే చిత్తము క్షీణించిపోతుంది. అప్పుడిక - హేమంత ఋతువులో తామరతీగలు నశించువిధంగా, తన చిత్తము క్షీణింపజేయు అభ్యాసము ఆశ్రయించువానిపట్ల - భోగవాసనలన్నీ తమకు తామే క్షీణించిపోతాయి. చిత్తము సంగతులకు, సందర్శనములకు అతీతత్వము సంతరించుకుంటుంది. |
హస్తం హస్తేన సంపీడ్య దంతైర్దంతాన్విచూర్ణ్య చ . అంగాన్యంగైః సమాక్రమ్య జయేదాదౌ స్వకం మనః .. 42.. ఉపవిశ్యోపవిశ్యైకాం చింతకేన ముహుర్ముహుః . న శక్యతే మనో జేతుం వినా యుక్తిమనిందితాం .. 43.. అంకుశేన వినా మత్తో యథా దుష్టమతంగజః . |
|
10.) హస్తం హస్తేన సంపీడ్య, దంతైః దంతాన్ విచూర్ణ్య చ, అంగాని అంగైః సమాక్రమ్య జయేత్ ఆదౌ స్వకం మనః॥ ఉపవిశ్య ఉపవిశ్యైకమ్ చింతకేన ముహుః ముహుః న శక్యతే మనో జేతుమ్, వినా యుక్తిం అనిందితామ్| అంకుశేన వినా మత్తో యథా దుష్ట మతం గజః | |
అందుచేత ఓ ప్రియ హనుమా! చేయి - చేయి అదిమిపెట్టి, పళ్ళు - పళ్ళు నొక్కి పెట్టి చూర్ణము చేసి అయినా సరే, అంగములను అంగములతో మూసి ఉంచైనా సరే, ఎట్లాగో ಅట్లా బలవంతముగా ‘సంకల్ప పరంపరలు’ అనే స్వభావముతో విర్రవీగుచున్న ఈ మనస్సుపై మొట్టమొదట యుద్ధము ప్రకటించి, జయించాలి. చక్కగా ఒకచోట కూర్చుని (ఆసనమును ఆశ్రయించి) మాటిమాటికి ఆత్మతత్వము గురించే ఈ మనస్సును నియమిస్తూ ఉండాలి. మనస్సు నియమించే ఉపాయాలు పట్టుకొని ఉండాలి. అనిందితమైన యుక్తులను (ఉపాయములను) ఆశ్రయించకపోతే ఈ మనస్సును జయించటము శక్యము కాదు. (అట్టి ఉపాయాలు ఇంద్రియములను క్షీణింపజేసి ఆత్మను క్షోభింపజేసేవిగా ఉండకూడదు). ఒకచోట దుష్ట ప్రవర్తన, భావ ఉద్వేగములు గల మదగజము ఉన్నది. దానిని స్వాధీనం చేసుకోవటానికి మావటివాడు అంకుశమును ఉపయోగిస్తాడు కదా! అంకుశము లేకుండా ఆ మద మత్తగజము (మదపుటేనుగు) స్వాధీనం అవుతుందా? కాదు కదా! మనస్సును కూడా ఉపాయాలతో జయించాల్సిందే! |
అధ్యాత్మవిద్యాధిగమః సాధుసంగతిరేవ చ .. 44.. వాసనాసంపరిత్యాగః ప్రాణస్పందనిరోధనం . ఏతాస్తా యుక్తయః పుష్టాః సంతి చిత్తజయే కిల .. 45.. సతీషు యుక్తిష్వేతాసు హఠాన్నియమంతి యే . చేతసో దీపముత్సృజ్య విచిన్వంతి తమోఽఞ్జనైః .. 46.. |
|
అధ్యాత్మ విద్యాధిగమః, సాధు సంగతిః ఏవ చ, వాసనా సం పరిత్యాగః, ప్రాణ స్పంద నిరోధనమ్, ఏతాః తా (ఏతాస్తా) యుక్తయః పుష్టాః సంతి చిత్తజయే కిల, సతీషు యుక్తిషు ఏతాసు। హఠాత్ నియమ యంతి యే, … చేతసో దీపమ్ ఉత్సృజ్య విచిన్వంతి తమో అంజనైః || |
- గురు ముఖతః మరియు శాస్త్రముల పరిశీలన సహాయంతో ఆత్మతత్త్వమును ఎరుకచేయు అధ్యాత్మ విద్యను ఆశ్రయించటము…, - సాధువులతో సంగము (సత్సంగము)…, - ఇంద్రియ నియమ-నిగ్రహముల సహాయముతో వాసనలను పరిత్యజించటము…, - ప్రాణాయామ అభ్యాసముచే ప్రాణ స్పందన నిరోధము.., అనబడు ఈ ఈ ఆయా ఉపాయాముల అభ్యాస పరిపుష్టి చేత చిత్తమును నీవు జయించివేయాలి. జయించి తీరాలి. ఉపాయాలు ఎప్పుడు సులభముగాను, దేహ-ఇంద్రియ, ఆత్మలను బాధ పెట్టనివి గాను ఉండాలి. అంతేగాని ఇంద్రియములను క్షోభింపచేసేవిగాను, క్షయింపజేసేవి గాను ఉండకూడదు. (ఈ మానవుడు ఇంద్రియములను దేవతలచే ప్రసాదించబడినవై, ఆయా దేవతల సొత్తుగాను, తిరిగి ఇవ్వబడవలసినవిగాను భావించాలి). ఇంద్రియములను హఠంచేసి పరమాత్మను సిద్ధించుకోవాలి అని అనుకొనువారు చేతిలోని దీపమును దూరంగా దాచి పెట్టుకుని, కాటుక పెట్టుకొన్న కళ్ళు చాలనుకొని చీకటిలోని ఒకానొక వస్తువు కోసము వెతకటము వంటిది. |
విమూఢాః కర్తుముద్యుక్తా యే హఠాచ్చేతసో జయం . తే నిబధ్నంతి నాగేంద్రమున్మత్తం బిసతంతుభిః .. 47.. ద్వే బీజే చిత్తవృక్షస్య వృత్తివ్రతతిధారణః . ఏకం ప్రాణపరిస్పందో ద్వితీయం దృఢభావనా .. 48.. సా హి సర్వగతా సంవిత్ప్రాణాస్పందేన చాల్యతే . చిత్తైకాగ్ర్యాద్యతో జ్ఞానముక్తం సముపజాయతే .. 49.. |
|
11.) విమూఢాః కర్తుమ్ ఉద్యుక్తా, యే హఠాత్ చేతసో జయమ్, తే నిబధ్నంతి నాగేంద్రమ్ ఉన్మత్తం … బిసతంతుభిః| ద్వే బీజే చిత్తవృక్షస్య వృత్తిః ప్రతతి ధారిణః 1. ఏకం ప్రాణ పరిస్పందో! 2. ద్వితీయం దృఢ భావనా। సా హి సర్వగతా సంవిత్ ప్రాణ స్పందేన చాల్యతే, చిత్త - ఏకాగ్రత్ యతో, జ్ఞాన ముక్తం సముపజాయతే| |
విమూఢులు అగు కొందరు మూర్ఖత్వముతో హఠయోగమును ఆశ్రయించి ఈ మనస్సును జయించాలని ప్రయత్నిస్తున్నారు! అది మదగజమును, నాగేంద్రుని (ఆదిశేషుని) తామరకాడలోని తంతువులతో బంధించాలని అనుకోవటము వంటిది సుమా! “వృత్తులు (Avocations)” అనే లతలచే చుట్టుచుట్టి ఆవరించబడియున్న ఈ “చిత్తము” అనే వృక్షము రెండు భాగములు గల బీజములో నుండి జనిస్తోంది. 1. ప్రాణ పరిస్పందన 2. దృఢముగా దృశ్య విషయములను భావన చేయటము. ‘సర్వగతము’ అయినట్టి సంవిత్ (సత్=ఉనికి, విత్ =ఎరుగుట) ప్రాణ స్పందనచే చలించబడుచున్నది. ఈ చిత్తము అనేక విషయములతో ఒక్కసారే పెను సంబంధము కలిగి ఉండటము చేతనే, తన ఉత్పత్తి స్థానమగు ఆత్మారాముని గుర్తించలేకపోవుచున్నది. ఈ చిత్తము ఏకాగ్రము పొందితే, అప్పుడు ఆత్మ జ్ఞానము ఉదయించుచున్నది. |
తత్సాధనమథో ధ్యానం యథావదుపదిశ్యతే . వినాప్యవికృతిం కృత్స్నాం సంభవవ్యత్యయక్రమాత్ . యశోఽరిష్టం చ చిన్మాత్రం చిదానందం విచింతయ .. 50.. అపానేఽస్తంగతే ప్రాణో యావన్నాభ్యుదితో హృది . తావత్సా కుంభకావస్థా యోగిభిర్యానుభూయతే .. 51.. |
|
తత్ సాధనమ్ అథో ధ్యానం యథావత్ ఉపదిశ్యతే| విలాప్య వికృతిం కృత్స్నాం సంభవ వ్యత్యయక్రమాత్, పరిశిష్టం చ చిన్మాత్రం చిదానందమ్ విచింతయ। అపానే అస్తంగతే ప్రాణో యావత్ న అభ్యుదితో హృది, తావత్ సా "కుంభకావస్థా” యోగిభిః యా అనుభూయతే|| |
అయితే, చిత్తము ఏకాగ్రత పొందేది ఎట్లా? అందుకు సాధనముగా ‘మనో ధ్యానము’ యథావిధిగా ఉపదేశించబడుతోంది. ఓ హనుమా! ఇది కాదు - ఇది కాదు (నేతి - నేతి) అను వివేచనచే క్రమముగా వికృతి (వికారములు) తొలగించుకో. దృశ్యభావమును పూర్తిగా త్యజించి, అప్పటికీ శేషించియుండే చిదానంద స్వరూపమగు చిన్మాత్రము (కేవల ఎరుక స్వరూపము)ను విచింతన చేయి. సాధారణంగా వాయువు దేహములోనికి వెళ్ళి (ప్రాణము) ఇంతలోనే బయటకు ప్రయాణిస్తూ (అపానము) ఉంటోంది కదా! ప్రాణకదలికలకు సంబంధించి ఎంతవరకైతే (ఎంత సమయమైతే) అపానము సంబంధింత కదలిక ఆగి ప్రాణవాయువు చలించక ఉంటుందో…, యోగాభ్యాసముచే యోగికి అనుభవమయ్యేదే “కుంభకావస్థ”. ఇదే అంతఃకుంభకం! |
బహిరస్తంగతే ప్రాణే యావన్నాపాన ఉద్గతః . తావత్పూర్ణాం సమావస్థాం బహిష్ఠం కుంభకం విదుః .. 52.. బ్రహ్మాకారమనోవృత్తిప్రవాహోఽహంకృతం వినా . సంప్రజ్ఞాతసమాధిః స్యాద్ధ్యానాభ్యాసప్రకర్షతః .. 53.. |
|
12.) బహిః అంస్తంగతే ప్రాణే యావత్ న అపాన ఉద్గతః తావత్ పూర్ణాం సమావస్థాం బహిష్టం కుంభకం విదుః|| బ్రహ్మాకార మనోవృత్తి ప్రవాహెూ అహంకృతిం వినా, సంప్రజ్ఞాత సమాధిస్స్యాత్ ధ్యాన అభ్యాస ప్రకర్ణతః ॥ |
బహిర్-కుంభకము : వాయువు దేహము నుండి బహిర్గతము అయినప్పుడు - ఇక దేహములో అపాన వాయువు కదలికలు ఉండవు. అప్పుడు కూడా దేహములో ప్రాణ - అపానముల కదలికలు లేక, దేహములో పూర్ణ సమావస్థ ఏర్పడుచున్నది. దీనిని ’బాహ్యకుంభకము’ అని పిలుస్తారు. సం ప్రజ్ఞాత సమాధి స్థితి : “ఈ జనులందరిలో నేనొక ప్రత్యేకత ఉన్నవాడిని”… అను అహంకారము - (బాహ్య అభ్యంతర కుంభక ప్రాణాభ్యాసము సహాయముచే) త్యజించబడుతూ రాగా “అందరిలోని నేనైన నేను - అందరూ నాలో నేనుగా ఉన్న నేను ….”, అను రూపము గల బ్రహ్మాకార మనోవృత్తికి సంప్రజ్ఞాత (ఎరుగుచున్నవాడై) ధ్యానాభ్యాసము చేయటమును “సమాధి అభ్యాసము - సంప్రజ్ఞాత సమాధి” అని గ్రహించు. |
ప్రశాంతవృత్తికం చిత్తం పరమానందదాయకం . అసంప్రజ్ఞాతనామాయం సమాధిర్యోగినాం ప్రియః .. 54.. ప్రభాశూన్యం మనఃశూన్యం బుద్ధిశూన్యం చిదాత్మకం . అతద్వ్యావృత్తిరూపోఽసౌ సమాధిర్మునిభావితః .. 55.. |
|
ప్రశాంత వృత్తికం చిత్తం పరమానంద దీపకమ్| ‘అసం ప్రజ్ఞాత’ నామాయం సమాధిః యోగినాం ప్రియః| ప్రభా శూన్యం, మనః శూన్యం బుద్ధి శూన్యం, చిదాత్మకమ్ అతత్ వ్యావృత్తి రూపోసౌ సమాధిః ముని భావితః| |
అసంప్రజ్ఞాత సమాధి స్థితి : ఈ చిత్తము-దృశ్య విషయముల నుండి వెనుకకు మరలినదై, ప్రశాంత వృత్తిని మాత్రమే ఆశ్రయించి ఉన్నదై,, పరమానంద జ్ఞాన దీపకముగా యోగికి అనుభూతమగుచున్నప్పుడు, అట్టి ప్రియత్వముతో కూడిన స్థితిని “అసంప్రజ్ఞాత సమాధి స్థితి” అని అంటారు. ఆతత్ వ్యావృత్తి రూపసౌ సమాధి (శూన్య సమాధి): ప్రభా (వెలుగు) శూన్యమై, మనఃశూన్యమై, బుద్ధి శూన్యమై - (జ్యోతి - మనస్సు - బుద్ధి లేనివై), “కేవల చిదాత్మాకము” మాత్రమే అనుభవముగా శేషించితే, "ఆతత్ వ్యావృత్తరూపసౌ సమాధి” అని మునులచే (యోగులచే) భావించబడుచున్నది. |
ఊర్ధ్వపూర్ణమధఃపూర్ణం మధ్యపూర్ణం శివాత్మకం . సాక్షాద్విధిముఖో హ్యేష సమాధిః పారమార్థికః .. 56.. దృఢభావనయా త్యక్తపూర్వాపరవిచారణం . యదాదానం పదార్థస్య వాసనా సా ప్రకీర్తితా .. 57.. |
|
ఊర్ధ్వపూర్ణమ్ అధః పూర్ణమ్ మధ్యపూర్ణమ్ శివాత్మకమ్| సాక్షాత్ విధిముఖో హి ఏష ‘సమాధిః’ పారమార్థికః ॥ దృఢ భావనయా, త్యక్త పూర్వాపర విచారణమ్, యత్ ఆదానం పదార్థస్య ‘వాసనా’ ప్రతికీర్తితా! |
పారమార్థిక సమాధి (పూర్ణసమాధి) : ఊర్ధ్వమున పూర్ణము. అధో (క్రింద) భాగమున కూడా పూర్ణమే. సర్వతత్వ స్వరూపమగు శివాత్మకము. ఈ ఈ సర్వము స్వముఖముగా విధిరూపము (బ్రహ్మ దేవుని ముఖరూపము), స్వముఖ బ్రాహ్మీ రూపము - అను యోగీభావ స్థితిని పారమార్థిక సమాధి (పూర్ణ సమాధి) అని పిలుస్తున్నారు. వాసన: ఒకడు తనకు ఎదురుగా ఉన్న పదార్థములను (అట్లాగే సంగతి - సంబంధ అనుబంధ సంఘటనలను) - “దీని పూర్వమేమిటి? పరమ (ఆవల) ఏమి కానున్నది?"….. అనే పూర్వాపర విచారణ ఏ మాత్రము చేయకుండానే - దృఢభావముతో (ఒక మూర్ఖునివలె) గ్రహించటమును ‘వాసన’ అను శబ్దము యొక్క అర్థము, ఉద్దేశ్యము కూడా! |
భావితం తీవ్రసంవేగాదాత్మనా యత్తదేవ సః . భవత్యాశు కపిశ్రేష్ఠ విగతేతరవాసనః .. 58.. తాదృగ్రూపో హి పురుషో వాసనావివశీకృతః . సంపశ్యతి యదైవైతత్సద్వస్త్వితి విముహ్యతి .. 59.. వాసనావేగవైచిత్ర్యాత్స్వరూపం న జహాతి తత్ . భ్రాంతం పశ్యతి దుర్దృష్టిః సర్వం మదవశాదివ .. 60.. |
|
13.) భావితం తీవ్ర సంవేగాత్ ఆత్మనా యత్ తదేవ సః, భవతి ఆశు, కపిశ్రేష్ఠ! విగత ఇతర వాసనః, తాదృక్ రూపో హి పురుషో, వాసనా వివశీకృతః । సంపశ్యతి యదేవ ఏతత్ ‘సద్వస్తు’ ఇతి విముహ్యతి। వాసనా వేగ వైచిత్ర్యాత్ స్వరూపం న జహాతి తత్| భ్రాంతం పశ్యతి దుర్ దృష్టిః సర్వమ్ మదవశాత్ - ఇవ |
ఓ కపిశ్రేష్ఠా! ఇక్కడ ఒక చిన్న చమత్కారము. ఒకడు మనస్సుతో తక్కిన చింతనలను వదలి, దేనినైతే తీవ్రగతిగా భావిస్తూ (భావన చేస్తూ) ఉంటాడో (ఒక్క దాని గురించే మనస్సును నిలిపి తదితర వాసనలను వదలి ఉంటాడో), ఆతడు ఏకైక తీవ్ర వాసనా వస్తువే (వాసనా వివశత్వము చేత) తానుగా అగుచున్నాడయ్యా! ఈ పురుషుడు వాసనా రూపుడే! ఆ ఏకైక మనో భావనా వస్తువే తానై, అద్దానినే సందర్శిస్తూ ‘ఇదియే నేను’ లేక ‘ఇదియే సద్వస్తువు’ అను మోహమును పొందడం జరుగుతుంది. అట్టి వాసనా వేగ వైచిత్ర్యము కారణంగా తాను పొందిన ఆ రూపమును వదలలేడు (తత్ న జహాతి). అది సత్యము కాదు కాబట్టి పట్టుకొని ఉండనూ లేడు. అట్టి వాసనా ప్రభావముచేత సత్య దృష్టి మరుగునపడినదై, భ్రాంతి పెత్తనం చెలాయించ సాగుతోంది. దుర్దృష్టి చేత భ్రాంతి (లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు) భావించటం ప్రారంభించి సర్వమును మదవశుడై చూస్తున్నాడు. |
వాసనా ద్వివిధా ప్రోక్తా శుద్ధా చ మలినా తథా . మలినా జన్మహేతుః స్యాచ్ఛుద్ధా జన్మవినాశినీ .. 61.. అజ్ఞానసుఘనాకారా ఘనాహంకారశాలినీ . పునర్జన్మకరీ ప్రోక్తా మలినా వాసనా బుధైః . |
|
వాసనాత్ ద్వివిధా ప్రోక్తా 1. శుద్ధా చ, 2. మలినా తథా! మలినా జన్మ హేతుస్స్యాత్| శుద్ధాత్ జన్మ వినాశనీ। అజ్ఞాన సుఘనాకారా ఘనాహంకార శాలినీ, ‘పునర్జన్మకరీ’ ప్రోక్తా, మలినా వాసనా బుధైః| |
ఓ హనుమయ్యా! వాసనలు రెండు విధములుగా విభజించి చెప్పబడుచున్నారు. 1. శుద్ధ వాసనలు 2. మలిన వాసనలు. మలిన వాసనలు : జన్మ - జన్మాంతరములకు కారణమగుచున్నాయి. పునర్జన్మ పరంపరలు కలుగజేస్తున్నాయి. శుద్ధ వాసనలు : పునర్జన్మ పరంపరల తతంగమును నిరోధిస్తున్నాయి. నశింపజేస్తున్నాయి. మలినవాసనలు - అజ్ఞానముచే ఏర్పడునవి. వారు, వీరు, నేను - వేరు వేరు - అను రూపముగా ఘనీభూతమై ఉంటున్నాయి. అహంకారమును వృద్ధి చెందించుచున్నది. బుధులు “నాయనలారా! ఈ మలిన - వాసనలు ’పునర్జన్మలు’ అనే చక్రంలోకి తోస్తున్నాయి. జాగ్రత్త!" అని హెచ్చరిస్తున్నారు. |
పునర్జన్మాంకురం త్యక్త్వా స్థితిః సంభృష్టబీజవత్ .. 62.. బహుశాస్త్రకథాకంథారోమంథేన వృథైవ కిం . అన్వేష్టవ్యం ప్రయత్నేన మారుతే జ్యోతిరాంతరం .. 63.. |
|
14.) పునర్జన్మాంతరం త్యక్త్వా స్థితః సంభ్రష్ట బీజవత్, బహుశాస్త్ర కథా కంధా రోమంధేన వృథైవ కిం? అన్వేష్టవ్యం ప్రయత్నేన, మారుతే! జ్యోతిరాంతరమ్| |
నాయనా! ఆంజనేయా! వేయించిన విత్తనములు మరల మొలకెత్తవు కదా! చిగురించవు కదా! ఆవిధంగా ఈ జీవుడు పునర్జన్మలు కలుగజేయు మార్గమును గమనించి కర్మలను జ్ఞానాగ్నితో దహింపజేసి - ఆ త్రోవ నుండి ఈవల పడాలి. ఇక బహు శాస్త్రములను, కథా కథనములను వల్లించి, ఏమి ప్రయోజనము! అదంతా అంధకారంలో ప్రవేశమే అవుతుంది! కర్మ పరిధులను అధిగమించివేయటమే వర్తమాన కర్తవ్యము. ఆత్మగా సందర్శనమే కర్మ పరిధులకు ఆవలి వడ్డు. ఓ మారుతీ! వాయునందనా! అంతర్ హృదయములో సర్వదా వెలుగొందుచున్న ఆత్మజ్యోతి కొరకై ఈ జీవుడు ప్రయత్నపూర్వకముగా అన్వేషణ చేయాలి. |
దర్శనాదర్శనే హిత్వా స్వయం కేవలరూపతః . య ఆస్తే కపిశార్దూల బ్రహ్మ స బ్రహ్మవిత్స్వయం .. 64.. అధీత్య చతురో వేదాన్సర్వశాస్త్రాణ్యనేకశః . బ్రహ్మతత్త్వం న జానాతి దర్వీ పాకరసం యథా .. 65.. |
|
దర్శన - అదర్శనే హిత్వా “స్వయం కేవలరూపతః” య ఆస్తే, కపిశార్దూల! బ్రహ్మ, న బ్రహ్మవిత్, స్వయమ్ | అధీత్య చతురో వేదాః సర్వ శాస్త్రాణి అనేకశః బ్రహ్మతత్త్వం న జానాతి దర్వీపాక రసం యథా। |
అందుచేత ఓ కపిశార్దూలా! ఈ ఎదురుగా కనిపిస్తూ ఉన్నది - కనిపించనిదీ … ఇదంతా వదిలివేసి స్వయం కేవల రూపమగు (తానే అది అయి ఉన్నట్టి) ఆత్మజ్యోతిగా వెలుగొందాలి. బ్రహ్మమును తెలుసుకొని, అక్కడకు ఆగక, తానే స్వయముగా ‘బ్రహ్మము’ అవాలి! ఒక గరిట సహాయంతో ఒక ఇల్లాలు పాకము తయారు చేస్తూ ఉన్నప్పుడు, ఆ గరిట పాకములో ప్రవేశింపజేయబడినప్పటికీ, ఆ పాకముయొక్క రుచి గరిటకు తెలుస్తోందా? లేదు కదా! అట్లానే నాలుగు వేదములు, సర్వశాస్త్రములు, ఇంకా అనేక విషయాలు తెలిసినప్పటికీ బ్రహ్మతత్త్వము తెలిసికూడా, తద్భావము ఆశ్రయించకపోతే ఏమిటి లాభం? |
స్వదేహాశుచిగంధేన న విరజ్యేత యః పుమాన్ . విరాగకారణం తస్య కిమన్యదుపదిశ్యతే .. 66.. అత్యంతమలినో దేహో దేహీ చాత్యంతనిర్మలః . ఉభయోరంతరం జ్ఞాత్వా కస్య శౌచం విధీయతే .. 67.. |
|
స్వదేహా అశుచి గంధేన న విరజ్యేత యః పుమాన్, విరాగ కారణం తస్య కిమ్ అన్యత్ ఉపదిశ్యతే? అత్యంత మలినో దేహెూ, దేహీ చ అత్యంత నిర్మలః | ఉభయోః అంతరం జ్ఞాత్వా, కస్య శౌచం విధీయతే? |
తన దేహములోని అశుచితో కూడిన దుర్గంధములను, దుర్వాసనలను గమనించి, వాటి నుండి విరమించక, విరాగము పొందని మానవునికి ఏమి ఉపదేశించి ఏమి ప్రయోజనం? నాయనా! హనుమా! ఈ దేహము అనేక మలినములతో కూడుకొని ఉన్నది. దేహియో … ఆతడు ఆత్మ స్వరూపుడే కాబట్టి, అత్యంత నిర్మలుడు. దేహి - దేహముల అంతరము (భేదము) ఏమిటో తెలుసుకొన్నట్టి విజ్ఞునికి ఇక ‘శౌచము’ యొక్క విధి విధానములను నిర్దేశించి చెప్పవలసిన పనేమున్నది? |
బద్ధో హి వాసనాబద్ధో మోక్షః స్యాద్వాసనాక్షయః . వాసనాం సంపరిత్యజ్య మోక్షార్థిత్వమపి త్యజ .. 68.. |
|
15.) బంధో హి వాసనా గంధో, మోక్షస్స్యాత్ వాసనా క్షయః వాసనాం సంపరిత్యజ్య మోక్షార్థిత్వమ్ అపి త్యజ ॥ |
వాసనా గంధముయే ‘బంధము’ (Deeply sensing tendencies are blockades). వాసనా క్షయమే ’మోక్షము’. ఇంతకు మించి మోక్షమనునది వేరే ఏదీ లేదు. ఓ సీతా శోకవినాశకా! హనుమా! వాసనలన్నీ క్రమంగా పరిత్యజిస్తూ చివరికి “నాకు మోక్షము లభించాలి కదా!" - అనే రూపము గల వాసనను కూడా త్యజించి వేయవయ్యా! ఆత్మ నిత్యముక్తమైయుండగా మోక్షము ఎవరికి? |
మానసీర్వాసనాః పూర్వం త్యక్త్వా విషయవాసనాః . మైత్ర్యాదివాసనానామ్నీర్గృహాణామలవాసనాః .. 69.. తా అప్యతః పరిత్యజ్య తాభిర్వ్యవహరన్నపి . అంతఃశాంతః సమస్నేహో భవ చిన్మాత్రవాసనః .. 70.. తామప్యథ పరిత్యజ్య మనోబుద్ధిసమన్వితాం . శేషస్థిరసమాధానో మయి త్వం భవ మారుతే .. 71.. |
|
మానసీ వాసనాః పూర్వం త్యక్త్వా విషయ వాసనాః, మైత్ర్యాది వాసనా నామ్నీ: గృహాణ అమల వాసనాః। తాశ్చాపి అంతః పరిత్యజ్య, తాభిః వ్యవహరన్ అపి। అంతః శాంతః సమస్నేహెూ భవ చిన్మాత్ర వాసనాః, తామ్ అపి అధ పరిత్యజ్య మనో బుద్ధి సమన్వితామ్, శేష స్థిర సమాధానో మయి త్వం భవ। మారుతే! |
ముందుగా వాసనా పూర్వకమైన శబ్ద-స్పర్శ-రూప-రస-గంధ సంబంధములగు విషయ వాసనలు త్యజించు. మైత్రి - కరుణ - క్షమ - సేవ - వాత్సల్యము సర్వత్రా అనురాగము ఇటువంటి అమల వాసనలను స్వీకరించువాడై ఉండు. తరువాత వాటితో వ్యవహరిస్తూ, క్రమంగా ఆయా వాసనలను కూడా పరిత్యజించి ఉండు. అంతర హృదయములో పరమశాంతుడవై ఉండు. సర్వ సహదేహుల పట్ల సమాన స్నేహ - భావము కలవాడవై వుండు. “నేను సదా సత్ చిత్ స్వరూపుడను కదా! అట్లాగే, ఈ కనబడే జీవులంతా సహజంగా అదే సత్-చిత్-ఆనంద ఆత్మ స్వరూపులే!" అను రూపము గల చిన్మాత్ర వాసన మాత్రమే నీయందు శేషించినదై ఉండును గాక! ఆ తరువాత మనో - బుద్ధి - చిత్త సమన్వితమైన ఆ ’వాసన’ను కూడా త్యజించి, అప్పటికీ శేషించిన దానియందు స్థిర సమాధానుడవై, ఆసీనుడవై ఉండు. ఓ మారుతీ! రామబ్రహ్మమువై, నేనే నీవై, నీవే నేనై ప్రకాశించుము! |
అశబ్దమస్పర్శమరూపమవ్యయం తథాఽరసం నిత్యమగంధవచ్చ యత్ . అనామగోత్రం మమ రూపమీదృశం భజస్వ నిత్యం పవనాత్మజార్తిహన్ .. 72.. |
|
16.) అశబ్దమ్, అస్పర్శమ్ అరూపం, అవ్యయమ్, తథా అరసమ్ నిత్య సుగంధవత్ చ యత్, అనామ-గోత్రమ్ మమరూపమ్ ఈదృశమ్ భజస్వ, నిత్యం, పవనాత్మజ! త్వం || |
ప్రియ మారుతీ! పవనాత్మజా! ’అశబ్దము - అస్పర్శము - అరూపము - అవ్యయము - అరసము, నిత్య - సుగంధము వంటిది, నిత్యమైనది, నామ - గోత్ర రహితమైనది అగు పరబ్రహ్మమే నేను. అట్టి లక్షణ విలక్షమగు మమ రామబ్రహ్మతత్త్వమును అను నిత్యముగా భజించెదవు గాక! |
దృశిస్వరూపం గగనోపమం పరం సకృద్విభాతం త్వజమేకమక్షరం . అలేపకం సర్వగతం యదద్వయం తదేవ చాహం సకలం విముక్తఓం .. 73.. దృశిస్తు శుద్ధోఽహమవిక్రియాత్మకో న మేఽస్తి కశ్చిద్విషయః స్వభావతః . పురస్తిరశ్చోర్ధ్వమధశ్చ సర్వతః సుపూర్ణభూమాహమితీహ భావయ .. 74.. |
|
దృశి స్వరూపం గగనోపమం పరం, సకృత్ విభాతమ్ తు అజమ్, ఏకమ్, అక్షరమ్ । అలేపకం సర్వగతమ్ యత్ అద్వయం, “తదేవ చ అహమ్ సకలమ్ విముక్త ఓమ్” । దృశిస్తు శుద్ధోఽహమ్ అవిక్రియాత్మకో ॥ న మే అస్తి, కించిత్ విషయ స్వభావతః, పురః స్థిరశ్చ, ఊర్ధ్వమ్ అధశ్చ సర్వతః సు-పూర్ణ భూమాఽహమ్ ఇతి ఇహ భావాయ ॥ |
ద్రష్టకు - దర్శనమునకు - దృశ్యమునకు ఆధారమైయున్న తత్ స్వరూపమైయున్న కేవల దృక్ స్వరూపుడను! ఆకాశమువలె, అనంతుడను! సర్వమునకు పరమైనట్టివాడను! సర్వముగా ప్రకాశించువాడను! క్షరములన్నిటికీ ఆధారమైన అక్షర స్వరూపుడను! దేనిచేతనూ పూత వేయబడని అలేపనుడను! ద్వితీయమనునదియే లేనట్టి అద్వితీయుడను! సర్వదా సర్వము అయినట్టి వాడను! ఓంకార తత్ స్వరూపుడను! సర్వ దృశ్యములకంటే పరిశుద్ధుడను! సర్వక్రియా రహితుడను! నిష్క్రియుడను! విషయములు - అను స్వభావము కించిత్ కూడా లేనట్టి నిర్విషయుడను! పైన - క్రింద కూడా పరమాత్మ - జీవాత్మగా వ్యాపించి సుస్థిరుడనై ఉన్నవాడను. సర్వత్రా పరిపూర్ణుడను! సంపూర్ణుడను! భౌమానందుడును! నన్ను సంపూర్ణ రామ బ్రహ్మముగా భావన చేయి. |
అజోఽమరశ్చైవ తథాజరోఽమృతః స్వయంప్రభః సర్వగతోఽహమవ్యయః . న కారణం కార్యమతీత్య నిర్మలః సదైవ తృప్తోఽహమితీహ భావయ .. 75.. జీవన్ముక్తపదం త్యక్త్వా స్వదేహే కాలసాత్కృతే . విశత్యదేహముక్తత్వం పవనోఽస్పందతామివ .. 76.. |
|
17.) అజో అమరశ్చ ఏవ, తథా అజరో, అమృతః స్వయం ప్రభః సర్వగతోఽహమ్ అవ్యయః ॥ న కారణమ్ - కార్యమ్ అతీత్య నిర్మలః సదేవ తృప్తోఽహమ్ ఇతీహ భావయ। జీవన్ముక్త పదం త్యక్త్వా స్వదేహే కాలసాత్ కృతే, విశతి అదేహ ముక్తత్వం, పవనో అస్పందతామ్ ఇవ। |
జన్మ రహితుడను! మరణ - వార్ధక్య ధర్మములు లేనట్టి అమృత స్వరూపుడను! స్వయం జ్యోతి - స్వయం ప్రభా స్వరూపుడను! (కల తనదైనవాడు కలంతా నిండి ఉన్న రీతిగా) సర్వగతుడను! అవ్యయుడను! కార్య - కారణములకు అతీతుడను! నిర్మలుడను! నిత్య సత్య స్వరూపుడను! నిత్యుడను! నిత్యానంద - నిత్య తృప్త స్వరూపుడను! అని నన్ను తెలుసుకో! జీవన్ముక్తుడు - దేహము కాల ధర్మము పొందుచుండగా, ఆతడిక ఆ జీవన్ముక్త పదమును కూడా త్యజించి, వీచికలు లేనట్టి వాయువువలె విదేహముక్తి యందు ప్రవేశించుచున్నాడు. రామానంద తత్త్వమునందు స్వభావ సిద్ధముగా ’ఏకము’ అగుచున్నాడు. |
తదేతదృచాభ్యుక్తం .. తద్విష్ణోః పరమం పదం సదా పశ్యంతి సూరయః . దివీవ చక్షురాతతం .. తద్విప్రాసో విపన్యవో జాగృవాంసః సమింధతే . విష్ణోర్యత్పరమం పదం .. ఓం సత్యమిత్యుపనిషత్ . |
|
తదేతత్ ఋచ అభ్యుక్తం, తద్విష్ణోః పరమమ్ పదమ్ సదా పశ్యంతి సూరయః, దివీవ చక్షుః ఆతతమ్, తత్ విప్రాసో విపన్యవో జాగృవాంసః సమింధతే, ‘విష్ణోః యత్ పరమమ్ పదమ్ । ఓం సత్యమితి ఉపనిషత్ । |
ఈ ఉపనిషత్ విశేషము - ఋక్కుల రూపముగా వేదములచే ప్రవచించబడుచున్నాయి. బుద్ధి మంతులు విష్ణుపదమును - ఆకాశంలో సూర్యుని చూచువిధంగా - సుస్పష్టముగా దర్శించుచున్నారు. అట్టి స్వస్వరూప పరబ్రహ్మమును ఎరిగినవారు ఇక దేనికీ దుఃఖించరు. సర్వదా జాగరూకులై, ఉపాధి వినిర్ముక్తులై సర్వదా సర్వత్రా సమమైయున్న విష్ణుపదమును పొంది ఆత్మానందమునందు ఓలలాడుచున్నారు. అదియే పరమపదము! |
ఇతి ముక్తికోపనిషత్ |
ఓం శాంతిః శాంతిః శాంతిః ||
[ముక్తికా = ముత్యము, Pearl]
ఈశాది అష్టోత్తర శత వేదాంతపటలాశయమ్,
ముక్తికా - ఉపనిషత్ వేద్యం రామచంద్రపదం భజే॥
ఓంకార స్వరూపుడగు ‘శ్రీరామచంద్ర పరబ్రహ్మము’ అను ఆత్మారామునకు, కోదండరామునకు, సీతారామునకు నమస్కరిస్తున్నాము. అత్యంత రమ్యము, మనోహరము, సుందరము అగు అయోధ్యానగరము. రావణ సంహారానంతరము శ్రీరామచంద్రుడు పట్టాభిషిక్తుడైనారు. రామరాజ్యములో ప్రజలు సుఖశాంతి ఐశ్వర్య ఆనందములు పొందసాగారు. ఇహపర మహదాశయ సమన్వితులు అగుచుండగా రామరాజ్యపాలన కొనసాగుచున్నది. సీతా-భరత-సౌమిత్రి-శత్రుఘ్న సమేతుడై భూలోకమంతా పరమానందభరితము చేస్తున్న సమయము. మునులు, ఋషుల, భక్తుల, దేవతల రాకపోకలతో అయోధ్య నగరం కళకళలాడసాగినది.
ఒకానొక రోజు….,
శ్రీరామమందిరము. రత్నపండపము. శ్రీరామచంద్రస్వామి సీతాలక్ష్మణభరత శత్రుఘ్న సమేతులై సింహాసనాధిష్ఠితులై ఉన్నారు. సనకుడు, సనందుడు మొదలైన మునిపుంగవులు, శ్రీ వసిష్ఠమహర్షి, శుకమహర్షి తదితర అనేకమంది మహర్షులు, సుగ్రీవుడు, విభీషణుడు, ఆంజనేయుడు. జాంబవంతుడు గుహుడు మొదలైన పరమభాగవతోత్తములు - వారంతా ఆ సువిశాల మండపములో పరివేష్ఠితులై ఉన్నారు. వారంతా కూడా శ్రీరామచంద్రుని బ్రహ్మానందజనితమైన దివ్యమంగళ విగ్రహము దర్శిస్తూ రామతత్త్వమును స్తుతిస్తున్నారు.
ఇట్లా ఉండగా, కొంత సమయము సత్సంగ రూపముగా ఆత్మతత్త్వపరమార్థము ఉపనిషత్ వాక్యార్థపూర్వకంగా బ్రహ్మతత్త్వజ్ఞులు సంభాషించసాగారు. అది శ్రద్ధగా వింటూ అక్కడి సభలోని వారు ఆత్మా-ఆరామమునందు పరబ్రహ్మసందర్శనము చేయసాగారు.
శ్రీరామచంద్ర ప్రభువు కూడా ఆ సమయములో
- ఆత్మారాములై,
- ‘ధీ’విక్రియా సహస్రాణాం సాక్షిణమ్ - బుద్ధినుండి బయల్వెడలుచున్న వేలాది భావనా వికారములకు ఆవల-కేవలము సాక్షి అయి,
- నిర్వికారుడు - నిరాకారుడు నిరాలంబుడు అయి, నిర్వికల్ప - సమాధిని ఆశ్రయించసాగారు. స్వస్వరూపధ్యాన నిరతులై సమస్తమును అధిగమించివేసి ’కేవల సాక్షితత్త్వమునందు సంస్థితులై ఉండసాగారు.
అది గమనించిన అక్కడి మహర్షులు, భక్తజనులు…. శ్రీరామచంద్రుని ఉద్దేశ్యించి ఇట్లు పలుకసాగారు.
"తండ్రీ! శ్రీరామచంద్ర ప్రభూ! సర్వజ్ఞా! నిర్వికల్ప సమాధికి ఇది సమయము కాదు కదా! అజ్ఞానములో కొట్టుమిట్టాడుచున్న మమ్ములను సముద్ధరించటానికై అవతరించారు. అందుచేత సమాధిని చాలించి ఇహమునకు వేంచేయండి. శ్రీరామదర్శనమును, రామతత్త్వపానమును ప్రసాదిస్తూ మమ్ములను సముద్ధరించండి! మీరు భక్తవత్సలురు. మమ్ములను సంసాగరసాగరమునుండి ఉద్ధరించటమే మీ అవతార మహదుద్దేశ్యము! మా పట్ల ఈ సృష్టి - స్థితి - లయారూపమంతా కొనసాగునంతవరకూ ‘శ్రీరామా! జానకిరామా! కోదండరామా! పట్టాభిరామా!’…అని పిలువగానే ‘ఇదిగో ఇక్కడ! నేనున్నాను? భయపడకండి!’ అని పలికి మమ్ములను సంసార సాగరము నుండి రక్షించుటకై కంకణము కట్టుకొన్నవారు. మీ చల్లటి చూపులే మాకు శ్రీరామరక్ష. మాపై దయతో నిర్వికల్ప సమాధినుండి బయటకురండి!’
⌘
‘భక్తవత్సలత’ అను ఏకైక సంస్కారముతో కూడిన శ్రీరామచంద్రుడు భక్తుల ప్రేమపూర్వక అభ్యర్థనను విన్నవారై, సమాధిస్థితిని విరమించుచూ వాత్సల్య పూర్వకంగా కనులు తెరిచారు. శ్రీహరి అవతారుడగు ఆ రామయ్య ‘సమాధి ఆనందము’ నుండి బయల్వెడలి,బహిర్ముఖుడై చిరునవ్వు చిందిస్తూ అక్కడి సభలోని వారందరిపై తన చల్లటి చూపులతో ప్రేమవర్షము కురిపించసాగారు.
⌘
ప్రథమ అధ్యాయము
శ్రీరామచంద్రుని పాదాలపై దృష్టినంతటినీ నిలిపి శుశ్రూష చేస్తున్న ఆంజనేయస్వామి - శ్రీరామయ్య నిర్వికలిల్ప సమాధినుండి బహిర్ముఖుడవటము, ప్రశాంత ఆనంద చిత్తుడై ఉండటము గమనించారు. భక్తితో స్తుతించారు. “రామబ్రహ్మతత్త్వము గురించి నా స్వామి నుండి తెలుసుకోవటానికి ఇది తగిన సమయము కదా” - అని భావించారు. భక్తహృదయాంతరంగుడగు శ్రీరామచంద్రుడు పరమ భక్తుడగు ఆ హనుమంతుని చిరునగవుతో పలకరించారు. అప్పుడిక ఆ హనుమయ్య పులకిత శరీరుడై, నమస్కరించారు.
బ్రహ్మజ్ఞానార్థి అయి రామయ్యను ఈ విధంగా పరిప్రశ్నించసాగారు.
హనుమంతుడు: రామ త్వమ్ పరమాత్మాఽసి, సచ్చిదానంద విగ్రహః | ప్రభూ! రామచంద్రా! మీరు స్వయం పరమాత్మానందస్వరూపులు! కేవల సత్ (ఉనికి) - కేవల చిత్ (ఎరుక-సర్వము వెలిగించు) - కేవల ఆనంద విగ్రహులు… అని ఇప్పటివరకు వేదోపనిషత్ సోదాహరణములతో ఉపన్యసించిన మహామునివరేణ్యులు మీ గురించి సిద్ధాంతీకరించుచున్నారు.
ఇదానీం త్వాం, రఘుశ్రేష్ఠః ప్రణమామి ముహుర్ముహుః | తండ్రీ! రఘుశ్రేష్ఠా! మీకు మరల మరల ప్రణామములు. మిమ్ములను శరణువేడుచున్నాను. నాకు వచ్చిన గొప్ప ‘చిక్కు’ ఏమిటో వినండి! మిత్ర-శత్రు-మన పర భేదములతో కూడిన అనేక సంసార బంధములలో నేను జీవుడనై చిక్కుకొని ఉన్నానని గమనిస్తున్నాను. ఇక్కడి మహనీయులగు ఋషీశ్వరులు సూచించినట్టి మార్గముగా మీ యొక్క తత్త్వరూపమును మీ నుండే తెలుసుకొని భవబంధములనుండి విముక్తుడను కావాలని తీవ్రమైన అభిలాష పొందుచున్నాను.
హే అఖండతత్త్వానంద స్వరూపా! ఆత్మారామా! శ్రీరామచంద్ర ప్రభూ! ‘నీవు కల్పించిన మాయయే ఇదంతా!’ అని ఇక్కడి జ్ఞానలగు కొందరు సభిక మహాశయులు మాకు ఇప్పటివరకూ శెలవిస్తున్నారు కదా! నేను ‘ఈ ఇంద్రియ జగత్తు సత్యమే’ అను భవబంధమునందు చిక్కుకున్నానని గురువాక్యములచే ప్రబోధించబడ్డాను. అట్టి సంసార బంధములనుండి నేను అనాయాసముగాను, సులభముగాను విమక్తుడనై, బయటబడేది ఎట్లా? అట్టి మార్గమును నా మీద వాత్సల్యముతో నాకు దయచేసి చూపండి!
అనాయాసేన యేన అహం ముచ్యేయం భవబంధనాత్? దేని చేత నేను సులభముగా అనాయాసంగా, ముక్తుడను కాగలను? మార్గదర్శకులై, మార్గాన్వేషణకుడనగు నాకు ప్రబోధించమని, మీ పాదములను భక్తితో స్పృశిస్తూ, మీ పాదరజమును శిరస్సున దాల్చుచూ… మిమ్ములను అర్థిస్తున్నాను.
శ్రీరామచంద్రుడు: ఓ మహాబాహెూ! శత్రుమర్దనా! ఉత్తమ భుజసౌందర్యముతో ప్రకాశించుచున్న ప్రియ హనుమా! ‘ఈ దృశ్యమే సత్యము’ - అను రూపముగల భవబంధమును గమనించి ‘దీనికి ఉపాయమేమిటి?’ అని ప్రశ్నించుచున్నావు. ప్రతి జీవుడు బంధవిముక్తికై సమాధానము పొందవలసిన ప్రశ్నను నాముందు ఉంచావు. కాబట్టి నీవు అడుగుచున్నది. - సాధు పృష్టమ్! ఉత్తమమైన, పరమశ్రేయోదాయకమైన విషయము. ఇక్కడి యదార్థ తత్త్వమేమిటో - సవివరణ పూర్వకముగా చెప్పుతాను. సావధాన చిత్తుడవై వినెదవు గాక! శ్రుణు తత్త్వతః|
వేదము అను శబ్దముయొక్క అర్థము ‘తెలియబడునది’! దేనినైతే నీవు ‘భవము’ అని, ‘సంసారము’ అని పిలుస్తున్నావో - అదంతా కూడా ఈ ’తెలియబడునది - వేదము’నకు సంబంధించియే! ‘ఈ కనబడేదంతా సత్యమే’ అను భావనయే భవబంధము. ఇంద్రియ విషయములపై ఆరూఢతయే - బంధము.
‘వేదాన్తమ్’ అనగా? ఈ ఇంద్రియములకు, మనోబుద్ధి చిత్తములకు తెలియబడుచున్న దానికి ఆవల (అన్తమ్ - ఆవల) ఉన్నట్టిది. ఆవల ఏమున్నది? ‘తెలుసుకొనుచున్నవాడు’ ఉన్నాడు. వేదాన్తో సుప్రతిష్ఠా హమ్! అట్టి వేదాన్త స్వరూపుడనై వేదాన్తమునందు నేను సుప్రతిష్ఠుడనై (welplaced) ఉన్నానయ్యా!
అందుచేత ఓ మారుతీపుత్రా! ప్రియ హనుమా! నీవు ఈ ఇంద్రియ మనోబుద్ధి-చిత్త-అహంకారములకు ‘విషయములు’గా తెలియబడుచున్న దానినంతటినీ అధిగమించి ’వేదాంత తత్త్వము’ను ఆశ్రయించి, తద్వారా ఆత్మారాముడునగు నన్ను చేరవయ్యా! వేదోపనిషత్తుల ప్రవచన సారము, ఉద్దేశ్యము కూడా అట్టి వేదాంత తత్త్వమే సుమా!
శ్రీ హనుమంతుడు : ఓ రఘుశ్రేష్ఠా! ప్రియరామచంద్రా! అస్మత్ ప్రభూ!
‘వేదాంతము’ అనగా ఏమి? ఎట్టిది?
అట్టి వేదాంత శాస్త్రమును విశదీకరించుచున్న ఉపనిషత్తులు ఎద్దాని గురించి, ఏమని శాస్త్రీకరిస్తున్నాయి? ఏమని బోధిస్తున్నాయి?
అవన్నీ ఎవ్వరిచేత ఎప్పుడు, ఏ ఉద్దేశ్యముతో, ఎవ్వరికొరకై సిద్ధాంతీకరించబడుచున్నాయి? దేనిగురించి సూచిస్తున్నాయి?
దయచేసి ఈ వివరాలు చెప్పండి.
శ్రీరామచంద్రుడు : ప్రియ హనుమా! నీవు కోరినట్లుగా వేద - వేదాంతోపనిషత్తులు గురించిన వివరాలు చెప్పుచున్నాను. శృణు, వక్ష్యామి వేదాంత స్థితిమంజసా! శ్రద్ధతో కూడిన వాడవై విను.
ఒకడు స్వప్నము కంటున్నప్పుడు, అతనియొక్క స్వప్న చైతన్యమే స్వప్నములో 1) ‘స్వప్నాంతర్గత ద్రష్ట’గాను, 2) ‘స్వప్నదృశ్యము’గాను ప్రదర్శితమగుచున్నది కదా! ఆ విధంగానే, నాయొక్క విష్ణుతత్త్వమే ఈ 14 లోకములు - లోకపాలకులు - లోకాంతర దృశ్యములో - ద్రష్టలతో కూడిన బ్రహ్మాండ స్వరూపమై విరాజిల్లుచున్నది.
అట్టి నా యొక్క ‘విష్ణుతత్త్వము’ నుండి ‘నిశ్వాస’ (ముక్కు నుండి బహిర్గతమగు గాలి వీచికల) రూపముగా… అప్రయత్న - అనాయాస పూర్వకముగా…సువిస్తృతమైన భాండాగారము (All extended very big Library) వలె ‘వేదములు’ పుట్టాయి. అవన్నీ శబ్దము - అర్థముల రూపముగా విస్తరించినవై ఉన్నాయి. నువ్వుగింజలతో నూనె దాగి ఉంటుంది చూచావా? ఆ విధంగా సంహితల (శరీరావయములను వినియోగించి చేయు క్రియ రూప ఉపాసన), బ్రాహ్మణముల (మనస్సును నియమించి చేయు ధ్యానరూపోపాసనల) ప్రాముఖ్యముతో కూడిన వేదములతో (వేద మంత్రములు, యజ్ఞయాగవిధానములలో) ‘వేదాంతజ్ఞానము’ సుప్రతిష్ఠితమైయున్నది. అట్టి వేదాంత పరమపురుషడనై నేను ప్రకాశించుచున్నాను.
సర్వసాక్షినై, సర్వులలోను సాక్షిగా కూడా అయి వెలుగొందుచున్నాను.
శ్రీహనుమంతుడు : ఓ రామా! రాఘవేంద్రా! ముందుగా ఇది చెప్పండి! వేదాః కతి విధాః? తేషామ్ శాఖాశ్చ (కతి విధాః)? తాసు ఉపనిషదః కాః స్యుః? మమ ఆత్మేశ్వరా! వేదములు వాటి శాఖలు ఏ విధములుగా ఉన్నాయి? అట్టి వేదములలో వేదాంత శాస్త్ర ప్రవచనములగు ఉపనిషత్తులు ఏఏ పనితీరులై ఉన్నాయి? కృపయా వద తత్త్వతః! నామీద కృపతో ఆయా విశేషములు నాకు తత్త్వార్థపూర్వకముగా దయచేసి బోధించండి.
శ్రీరామచంద్రుడు : వేదములన్నీ ఒకచోటికి తేబడినవై ‘4’ భాగములుగా విభజించబడినాయి.
1) ఋగ్వేదము (ఋక్మంత్రములు. సత్యమును అభివర్ణించునవి)
2) యజుర్వేదము (యజ్ఞయాగ విధి - విధానములను తెలియజేయునవి)
3) సామవేదము (నాదము, సంగీతములతో భగవంతుని స్తోత్రములు సమర్పించునవి)
4) అథర్వణ వేదము (ప్రకృతిని, పురుషుని, పురుషోత్తముని నిర్వచించు మార్గము చూపుచున్నట్టివి)
ఈ నాలుగు వేదములనుండి అనేక శాఖలు, ఉపశాఖలు విభజన పూర్వకముగా (Like Different Chapters) బయల్వెడలినాయి. అట్టి శాఖ-ఉపశాఖలు, వాటిని అనుసరించి వేదాంత శాస్త్రము యొక్క విస్తార రూపములగు ఉపనిషత్తులు. ఆత్మతత్త్వము గురించి సూత్రీకరిస్తూ ఆయా శాఖ - ఉపశాఖలలో ఉపనిషత్తులు నిక్షిప్తమై ఉంటూ వస్తున్నాయి. ఓ మారుతాత్మజా! ఆయా కొన్ని వివరణములు ఇప్పుడు మనము ప్రస్తావించుకుంటున్నాము. విను.
🕉 ఋగ్వేదమునకు ఏకవింశతి (21) శాఖలు,
🕉 యజుర్వేదమునకు నవాధిక శత (109) శాఖలు,
🕉 సామవేదమునకు సహస్రసంఖ్యయా (1000) శాఖలు,
🕉 అథర్వణవేదమునకు పంచాశత్ (50) శాఖలు.
ఈ శాఖలన్నీ వేరు - వేరైన మంత్ర - తంత్ర - విధి - విధాన విశేషములతో అనేక విశేష భేదములు కలిగి ఉన్నాయి. పై 21 + 109 + 1000 + 50 = 1180 శాఖలలో ఒక్కొక్క దానిలో ఒక్కొక్క ఉపనిషత్ వేదాంత (వేదము చివరిగా) భాగముగా చెప్పబడుచూ సూత్ర - ఉపాసనా వివరణ - సిద్ధాంత - విధాన పూర్వకం చెప్పబడినవై ఉన్నాయి.
తాసామ్ ఏకామ్ ఋచం యేన పఠ్యతే భక్తిసా …… మయి,
స మత - సాయుజ్య పదవీం ప్రాప్నోతి, మునిదుర్లభమ్!
అట్టి 1180 ఉపనిషత్తులలోని ఏ ఒక్కటైనా సరే, ఎవ్వరైతే-అందులోని సారభూతమై యున్నట్టి బ్రహ్మజ్ఞానమును నా పట్ల భక్తితో శ్రద్ధగా పఠిస్తారో, అధ్యయనము చేస్తారో,-అట్టివారు మునులకు కూడా దుర్లభమగుచున్న నాయొక్క సాయుజ్య పదవిని అధిరోహించుచున్నారు.
శ్రీ హనుమంతుడు : ప్రియస్వామీ! శ్రీరామచంద్రా! ఒక్కొక్క ముని శ్రేష్ఠుడు ’ముక్తిమార్గము’ గురించి ఒక్కొక్క విధంగా నిర్వచిస్తూ ప్రపంచమునకు సూచిస్తున్నారు. “ఇదియే ముక్తికి మార్గము" - అని అనుశాసిస్తున్నారు కూడా!
ముక్తిః ఏ కేతి చక్షిరేః |
ఏకత్వమే ముక్తి! అనేకత్వమే బంధము! ఏకాగ్రతచే అది సిద్ధిస్తుందని, ఏకాగ్రత కొరకై ప్రాణాయామము, షట్చక్రములలో బుద్ధి నిలుపటము మొదలైనా క్రియాయోగమార్గమే శ్రేష్ఠమని చెప్పుచున్నారు.
కే చిత్ త్వం-తారకోపదేశము-నామభజనమ్ |
కొందరు "శ్రీరామ జయరామ, జయ జయరామ! హరేరామ హరే రామ రామరామ హరే హరే! శ్రీరామరామ రామేతి, రామేరామ మనోరమే … ఈ విధములైన” - నామభజనయే ముక్తికి ఏకైకమార్గమని ప్రబోధిస్తున్నారు.
“రామతారకమంత్రము మాత్రమే మిమ్ములను సంసారమునుండి తరింపజేస్తుంది" - అని కొందరు సిద్ధాంతీకరించుచున్నారు.
అన్యేత సాంఖ్య యోగేన
’నాయనలారా! సాంఖ్య విచారణకు ఇప్పటికిప్పుడే ప్రారంభించండి. దృశ్యము - దేహము - ఇంద్రియములు - ఇంద్రియ విషయములు - మనస్సు - బుద్ధి - చిత్తము - అహంకారము - అవ్యక్తము - జీవుడు - ఈశ్వరుడు - పరమాత్మ…. ఇవన్నీ విభాగించి ఒక్కొక్కదానియొక్క తత్త్వమేమిటో, వాటి వాటి జడ చైతన్య స్వభావములు ఎట్టివో….., విభాగించి తెలుసుకోండి. ఇవన్నీ తెలుసుకొన్నారా, ఇక ముక్తి మీకు కరతలామలకము!” - అని బుద్ధిచే విభాగించు బుద్ధియోగము (లేక) సాంఖ్యయోగమే మోక్షమునకు (బంధవిముక్తి) మార్గమని మరికొందరు ప్రవచిస్తున్నారు. బుద్ధితో విభాగము చేసి తెలుసుకోవటముచేత మాత్రమే (జ్ఞానమార్గమే) ముక్తిమార్గముగా నిర్ణయించి చెప్పుచున్నారు.
భక్తియోగేనచ అపరే |
మరికొందరు గురువులు శిష్యులకు తదితర జనులకు భక్తిమార్గమును చూపుచూ, “కైవల్య సిద్ధికి భక్తియే మార్గము. నీవు నీ భార్యను - భర్తను - పిల్లలిని, స్నేహితులను, తదితర బంధువులను, సంపదలను, పేరు - ప్రతిష్టలను ఎంతెంతగా ప్రేమిస్తూ వస్తున్నావో…అదంతా కలబోసి ఒకచోటికి జేర్చి (గోపికాస్త్రీలవలె) పరమాత్మకు సమర్పించండి. అట్టి భక్తియోగము మాత్రమే మార్గము. మిగతా జ్ఞాన - క్రియా మార్గములు భక్తుడుగా తీర్చిదిద్దటానికే ఉన్నాయి…!” - అని భక్తి యోగమును ప్రబోధిస్తున్నారు.
అమానిత్వము, అదంభిత్వము మొదలైన భక్తి గుణములే అందుకు మార్గమని చెప్పుచున్నారు.
అన్యే వేదాంతవాక్యార్థ విచారాత్ పరమర్షయః |
ఇక మరికొందరు మునిపుంగవులగు గురువులు. మహావాక్యవిచారణను సూచిస్తున్నారు.
‘అసలు విషయము పట్టుకోకుండా, ఏవేవో ప్రయత్నాలతో కాలం వెళ్లబుచ్చుచున్నారేమి? మానవ జీవితము కాలపరిమితమైయున్న మహత్తరమైన అవకాశము. అందుకే వేద ఉపనిషత్తులు మహావాక్యములను జీవులకు అందిస్తున్నాయి. వాటిని పరిశీలించాలి. పరమార్థాన్ని గ్రహించాలి.
’తత్ త్వమ్’→ ’నీవు’గాను జగత్తుగాను కనిపిస్తున్నది ఆ పరమాత్మయే!
‘సోఽహమ్’ →‘తత్త్వమ్’ను విచారణ చేసి, తద్వారా ‘నేను అదియే! ఆ పరమాత్మ స్వరూపమే’ అను అర్థమును బుద్ధితో సముపార్జించుకోవటానికే ఈ మానవ ఉపాధిని పొందటము యొక్క ముఖ్యోద్దేశ్యము.
‘త్వమ్ ఏవ అహమ్’ ’నీవుగా కనిపిస్తున్నది నేనే!’… ’మమాత్మా సర్వభూతాత్మ’ భావన!
త్వమ్ అహమేవ → ’నేను మీ ఆత్మ స్వరూపుడనే!’ అని తనను తాను తదితరులకు చెందిన సొత్తుగా అంగీకరించి ఉండటము.
జీవోబ్రహ్మేతి నాపరః → ఈ జీవుడగా కనిపిస్తున్నది పరబ్రహ్మమే!
ఇట్లా అనుకుంటూ ఉంటే అనిపిస్తుంది కూడా! అట్లా అనిపించటమే బ్రహ్మీ దృష్టి!
(ఈ మొదలైన) మహావాక్యముల పరమార్థ విచారణ లేనంతవరకూ కళ్లు మూసుకుని కూర్చుని కూడా ప్రయోజనము లేదు. కనుక జనులారా కనులు తెరవండి! మహావాక్యముల అర్థమును పరిశీలించి హృదయస్తం చేసుకోండి. బుద్ధిని మహావాక్యార్థములతో నింపివేయండి. అప్పుడు సాయుజ్య పదవి దానికదే సిద్ధిస్తుంది!…అని ఉపదేశిస్తున్నారు.
సాలోక్యాది విభాగేన చతుర్థా ముక్తిరీరితా : మరికొందరు మునీశ్వరులు, “సాలోక్యము ఇత్యాది చతుర్విధ మార్గమును ఆశ్రయిస్తేనే ముక్తి లభిస్తుంది. అది వదలి మరెటో వెళ్ళకండి" అని బోధిస్తున్నారు.
1.) సామీప్యము : ముందుగా ఇష్టమైన దేవత యొక్క రూపమును స్వీకరించి ఉపాసించటము. ఈ విధంగా ఇంద్రియములను పూజయందు నియమించటము. తత్ రూప్య భావనతో తత్స్వరూపాభిమానివి అవటము. ఈ జగత్తు తత్రూపముగా అనుభవమవటము.
2.) సారూప్యము : తతారూప్యభావనతో బాటుగా ‘సంకీర్తన’ ఇత్యాదులచే జగన్భావనను అధిగమించి ఇష్టదైవముతో మనస్సు ఏకమై తత్ రూప భావనతో సారూప్యము పొందటము.
3.) సాలోక్యము : సర్వము ఆ ఇష్ట దైవ భావనగా సందరిస్తూ ఉండటము, క్రమంగా ‘ఈ కనబడు జీవులు, రూపనామాలు - అన్నీ కూడా ఆ ఇష్ట దైవముయొక్క రూపములే” అను అనుభూతిచే ఇష్టదేవతా రూపముగా ఈ సర్వమును గాంచుచూ, ‘సాలోక్యము’ అను స్థితికి చేరటము.
4.) సాయుజ్యము : ఆ పరమాత్మతో మమేకమై, అభిన్నమై ’వారికి నేను వేరుగా లేను’ అను అద్వితీయస్థితి’ (లేక) ’అద్వైత స్థితి’ని సముపార్జించటము.
ఇట్టి సాలోక్యాది చతుర్విధ స్థితులను సంపాదించమని చెప్పుచున్నారు.
🦜
శ్రీ హనుమంతుడు : జీవులమగు మేము - పరబ్రహ్మమును పొందుటకు - వివిధ గురు ప్రవచితమై, అనుసరించతగ్గ ఆయా మార్గములలో ఉత్తమమైనదేది?
శ్రీరామచంద్రుడు : ఓ కపీశ్వరా! ఆంజనేయా! ఎవ్వరూ ఎట్టి మార్గమునైనను వారి వారి అభిరుచి చేతను, పూర్వ సంస్కారములచేతను అనుసరించవచ్చును గాక! శ్రద్ధ - ఏకాగ్రత - దృశ్య పరిత్యాగము చేతనే పారమార్థిక రూపమగు కైవల్యము లభించుచున్నది. అట్టి పారమార్థిక రూపమగు కైవల్యము ఏకరూపమే గాని అనేక రూపము కాదు.
ఏకరూపము : జీవ - బ్రహ్మములు అభేదస్థితి. ఏకత్వము.
సాలోక్య ముక్తి : ఒకడు దురాచారుడైనప్పటికీ ‘శ్రీరామనామజపము’ (నామస్మరణ)చే ఇక్కడే సాలోక్యముక్తిని పొందుచున్నాడు.
దురాచారరతోవాఽపి మన్నామ భజనాత్, కపే! సాలోక్యముక్తమ్ ఆప్నోతి।
ఓ కపిశ్రేష్ఠా! ఆతడిక మరొక లోకము (విష్ణు లోకము, శివలోకము, బ్రహ్మలోకము మొదలైనవి) పొందవలసినదేమీ ఇక ఉండదు. న తు లోకాంతరాదికమ్!
సాలోక్య - సారూప్య ముక్తి : ఎవ్వడైతే యోగమార్గములో బ్రహ్మనాళముతో ప్రకాశించినవాడై మూలాధారచక్రము నుండి బయల్వెడలి స్వాధిష్ఠాన - మణిపూరక - అనాహత - విశుద్ధ చక్రములను దాటి, ఆజ్ఞా చక్రమునందు ప్రకాశించినవాడై, అక్కడి ధ్యానబలిమిచే శిరస్సుకు ఊర్ధ్వభాగమునగల బ్రహ్మరంధ్రమును చేరి ధ్యానపరుడగుచున్నారో, అట్టివాడు కేవలీ రూపమును సంతరించుకుంటున్నాడు.
కాశి వంటి పవిత్ర ప్రదేశములలో దేహము త్యజిస్తున్నప్పుడు (మరణించుచున్నప్పుడు) అతనికి నాయొక్క తారకము (తరించు మనన స్థితి) లభించినదై, దేహానంతరము నా స్థానము జేరటం జరుగుతోంది. ఎక్కడి - ఎవ్వరి - ఎట్టి వారైనాసరే కాశీ పుణ్యక్షేత్రముతో మరణించుచున్నప్పుడు ఆ జీవునికి శివమహేశ్వరుడు ప్రేమాస్పదముగా కుడి చెవిలో తారకమంత్రము ఉపదేశించుచున్నారు.
కరుణామయుడగు ఆ పరమశివుడు బోధించు తారకవిద్యచే ఆ జీవుడు సమస్త పాప దోషములనుండి పరిశుభ్రుడు అగుచున్నాడు. అప్పుడాతడు నాయొక్క ఈ సారూప్యము భజించుచు ‘సాలోక్య -సారూప్యముక్తి’ పొందుచున్నాడు.
సాలోక్య-సారూప్య సామీప్య ముక్తి : ఒకడు ఇహమును అధిగమించుచు, పరమును ఆశ్రయించు దీక్ష చే ’ద్విజుడు’ అగుచున్నాడు. అట్టి శ్రద్ధ - నిష్ఠలను వృద్ధి చేసుకుంటూ, సదాచారములద్వారా (సహజీవుల పట్ల వాత్సల్యము మొదలైన మార్గములుగా) అత్మారామ సామీప్యము పొందుతూ, ఆతడు ‘సర్వులు అఖండ-ఆత్మస్వరూపులే’ అను రూపముగల సర్వాత్మభావమును సముపార్జించుకొనుచున్నాడు.
ఎదురుగా కనిపిస్తున్న ‘త్వమ్’ను ‘తత్’ పరమాత్మగా సర్వజీవులను దర్శించుచూ ‘తత్త్వదర్శి’ అగుచున్నాడు. సర్వసహజీవులను పరమాత్మ స్వరూపముగా భజించుచుండగా అట్టివాడు ఆ సర్వాత్మకత్వ భావనా సిద్ధిచేత నా సామీప్యతను అనుభూతము చేసుకొంటూ సామీప్య - సారూప్య - సామీప్య ముక్తిని పొందుచున్నాడు.
సాయుజ్య ముక్తి : సాలోక్య-సారూప్య-సామీప్య ముక్త స్థితి వృద్ధి చెందుచుండగా ‘తత్ త్వమ్’ అనబడు సర్వసహజీవులను రామబ్రహ్మము యొక్క ప్రత్యక్ష రూపములే-అను రూపముగల తాత్విక స్థితి రూపుదిద్దుకుంటున్నదని అనుకొన్నాము కదా! ఇక అప్పటి నుండి సద్గురువు ఉపదేశించు తత్త్వపాఠ్యాంశముల ప్రభావము చేత “సర్వము తనయందలి రామబ్రహ్మ స్వరూపముగాను, సర్వమునందు ప్రకాశమానమగునది స్వస్వరూప రామబ్రహ్మముగాను” దర్శించనారంభించుచున్నాడు. ఈ విధంగా అవ్యయమగు ఉత్తమోత్తమమైన సాయుజ్యముక్తిని పొందుచున్నాడు.
భ్రమరకీటక న్యాయము : ఒక గండుతుమ్మెద చిన్న పురుగును తెచ్చి ఒకచోట ఉంచి దానిచుట్టూ ‘ఝయ్’ అను భీకర శబ్దము చేస్తూ ఉండగా…ఆ కీటకము భయపడుచూ, భయపడుచూ ధ్యాసనంతటినీ ఆ భ్రమరము (తుమ్మెద)పైనే ఉంచసాగుతుంది. కొద్ది రోజులకు చిన్నకీటకము కాస్తా పెద్ద గండుతుమ్మెదగా అగుచున్నది. ఇట్టి భ్రమర - కీటక న్యాయమువలె ’సమ్యక్ భావన’చే (తత్వమ్ ఆ భావనచే) ‘సోఽహమ్’ భావమును పొంది, ఇక ఆతడు నా స్థానమునకు వచ్చి చేరుచున్నాడు. తానే ఆత్మారాముడై, లోకమంతా నావలె స్వస్వరూపముగా దర్శించుచూ రామానందసాగరుడు అగుచున్నాడు.
“ఇదంతా నా స్వరూప - స్వభావమే! పరమాత్మయే ఇదంతా! ఆత్మస్వరూపుడగు నాకు అన్యముగా ఏదీ ఏక్కడా లేదు” అను స్వభావానుభూతి పొందుచున్నాడు. ఇదియే ‘సాయుజ్యము’ అని చెప్పబడుతోంది.
ఏ విధంగా అయితే సముద్రాధిష్ఠాన దేవత సముద్ర తరంగములన్నీ తనయందు ‘నాకు అద్వితీయము’ అను భావనతో చిద్విలాసముగా దర్శించుచున్నదో…, సర్వ జగదంతర్గత జీవులను, వారి వారి స్వభావములను యోగి తన యొక్క బ్రహ్మానంద సముద్ర స్వరూపములోని ఆనంద తరంగాలుగా దర్శించటము ‘సాయుజ్యము’.
అట్టి సాయుజ్యముక్తినే "బ్రహ్మానంద స్వరూపము”. “శివానంద లహరి”, “ఆత్మ సాక్షాత్కారము” అని కూడా అంటూ ఉంటారు.
ఓ ప్రియ తనయా! ఆంజనేయా! ఎవ్వరైతే ’శ్రీరామోపాసన’ అనబడు నా ఉపాసకుడై ఉంటాడో, అట్టివాడు - చతుర్విధా చ యా ముక్తిః మత్ ఉపాసనయా భవేత్ - చతుర్విధములైన ముక్తులను సంపాదించుకొంటున్నాడు. అతని యొక్క భక్తి ప్రపత్తులకు వశుడనై నేను వారిని చతుర్విధముక్తుల వైపుగా అడుగులు వేయించి తీసుకువెళ్ళుచున్నాను. భక్తి ప్రపత్తుల మహత్తర ప్రభావముచే ఈ జీవుడు ‘కైవల్య ముక్తి’ పొందుచున్నాడు.
కైవల్యసిద్ధి (కేవలీభావన The Sense that ‘l am The Absolute’)
శ్రీ హనుమంతుడు : స్వామీ! రామచంద్రా! ’కైవల్యముక్తి’యే ‘పరాకాష్ఠ’ కదా! అట్టి కైవల్యముక్తిని జీవులమగు మాకు సులభముగా ఏ ఉపాయము చేత సిద్ధిస్తుంది? ఇయం కైవల్య ముక్తిస్తు కేన ఉపాయేన సిద్ధ్యతి? అట్టి కైవల్యసిద్ధిని ప్రసాదించుటకై మేము ఎవరిని ఆశ్రయించాలి?
శ్రీరాముడు : ‘కైవల్య సిద్ధి’ అనునది వాస్తవానికి ఎవరికివారే తమయొక్క ఉత్తమ బుద్ధి చేత, తత్త్వమ్ భావన చేత సిద్ధింపజేసుకోవలసిందే! అంతేగాని ఈ జీవునికి మరొకరెవరో ఎప్పటికో ప్రసాదించేది కాదు. అది ఇప్పుడే ఇక్కడే (ఇహైవ) సిద్ధింపజేసుకోవాలి. అందుకుగాను మునుముందుగా సాధన చతుష్ఠయము, భక్తి, దైవీగుణసంపత్తి…. ఇత్యాదులచే హృదయమును పరిశుభ్రపరచుకోవాలి. అటు తరువాత ‘బ్రహ్మజ్ఞానము’ను హృదయముతో వెలిగించాలి. అందుకు ముముక్షువులందరికీ ఒక ఉపాయము చెప్పుచున్నాను. విను.
అందుకు సులభోపాయము వేదాంతములగు ఉపనిషత్ అధ్యయనములు.
ఉపనిషత్ - అధ్యయనము :
ఓ ముముక్షువులారా! మీరు ఒక్క ‘మాండూక్యోపనిషత్తు’ను గురుముఖతఃగాను, ఆ తరువాత స్వయముగాను అధ్యయనము చేసినా కూడా చాలు. అప్పుడు ఆ ముముక్షువు అయినట్టి అధ్యయని (one who studies) కి ఇప్పుడే - ఒక్కడే సాయుజ్యము లభించగలదు.
ఒకవేళ ఆ ‘మాండూక్యోపనిషత్తు’ను అధ్యయనము చేసిన తరువాత కూడా ’నేను ఆత్మారాముడనే! నేనే బ్రహ్మమును! సముద్రములో అనేక తరంగములవలె సహజీవులు - బ్రహ్మాండములు లీలావినోదముగా నాయందే ఉత్పత్తి - స్థితి లయములు పొందుచున్నాయి’ అను స్థితి విషయంలో నిశ్చలత ఏర్పడక, ఇంకా కొన్ని అనుమానాలు కొనసాగుచున్నాయా? అయితే ఇంకొక ఉపాయం! ఓ ప్రియ మమాత్మానంద స్వరూపులగు ముముక్షువులారా! మరలా నడుముకట్టండి.
(1) ఈశావాస్య, (2) కేన, (3) కఠ (4) ప్రశ్న, (5) ముండక, (6) మాండూక్య, (7) తైత్తరీయ, (8) ఐతరేయ, (9) ఛాందోగ్య, (10) బృహదారణ్యకములు అనబడే దశోపనిషత్తులు అధ్యయనము చేయండి. గురుముఖతః వినండి. మీకు మీరుగా కూడా పఠించండి. అప్పుడు మీరు నాయొక్క ధామము (State, Placement) కు తప్పక చేరగలరు.
ఒకవేళ పూర్వజన్మల సుదీర్ఘ సంస్కార పంపరలు కారణంగా అప్పటికీ కూడా ‘తత్త్వమ్ - సోఽహమ్ - త్వమేవాహమ్ – త్వమ్ అహమేవ’ అను పరమార్థ నిశ్చయము సుస్థిరము కాలేదనుకో! అప్పుడు మరికొన్ని - ‘32’ ఉపనిషత్తులు అధ్యయమను చేయండి - అని వేదాంత-తత్త్వజ్ఞులచే సూచించబడుతోంది.
(1) బ్రహ్మో, (2) కైవల్య, (3) జాబాల, (4) శ్వేతాశ్వతరో (5) హంస, (6) ఆరుణిక, (7) గర్భ, (8) నారాయణ, (9) పరమహంస, (10) అమృతబిందు, (11) అమృతనాద, (12) అథర్వశిర, (13) అథర్వ శిఖ, (14) మైత్రాయణ్యు, (15) కౌషీకీ బ్రాహ్మణ, (16) బృహతాల, (17) నృశింహతాపనీ (పూర్వతాపనీ, ఉత్తర తాపనీ) (18) కాలాగ్ని రుద్ర, (19) మైత్రేయ, (20) సుబాల, (21) క్షురిక, (22) మంత్రిక, (23) సర్వసార, (24) నిరాలంబ, (25) శుక రహస్య, (26) వజ్ర సూచి, (27) తేజోబిందు, (28) నాదబిందు, (29) ధ్యానబిందు, (30) బ్రహ్మ విద్య, (31) యోగతత్త్వ, (32) ఆత్మబోధ.
మొత్తముమీద ఉపనిషత్ సాహిత్యముతో 108 ఉపనిషత్తులు అతి ముఖ్యమైనవి. వీటినన్నిటినీ పఠిస్తూ ఉంటే,…భావనాత్రయమును (దృశ్య భావన - ద్రష్ట భావన - దర్శన భావనలు) నశించగా, ‘కేవల దృక్’ భావన శేషించగలదు. ఇవి అటు ఆత్మజ్ఞానము పట్ల సరాగము, ఇటు దృశ్యము పట్ల విరాగమును కూడా ఆ అధ్యయనము) కలిగించగలవు. వాసనాత్రయము (జీవాత్మ వాసన దేహవాసన - దృశ్యవాసన) తొలగిపోగలవు. ఇక్కడ రెండు విషయాలు.
(1) అట్టి ఉపనిషత్ అధ్యయనము చేస్తున్నప్పుడు (లేక) పఠించుచున్నప్పుడు ఆ ఉపనిషత్ ప్రారంభములోను, చివర కూడా ఆ ఉపనిషత్కు సంబంధించిన ’శాంతి పాఠము’ను కూడా పారాయణము పఠించాలి.
(2) ఆత్మతత్త్వ జ్ఞానము వాక్కుకు - మనస్సుకు అగోచరము (అవాక్ - మానస గోచరం)గా చెప్పబడుచున్న స్వానుభవము, స్వా-అధ్యయన సారము కదా! అందుచేత ఉపనిషత్తులను కొద్దిమంది ఔత్సాహికులగు ముముక్షువులు పరస్పరము సంభాషించుకొంటూ అర్థ వివరణ చేసుకోవటము - ఉత్తమ ప్రయోజనకరము. ఒక్కరుగా కూర్చుని పఠించుటము కంటే కూడా, కొందరితో కలిసి అధ్యయనముచేయటము మరింత ఫలప్రదము.
గురుముఖతః విని, పఠించటము మరింత అధికమైన ఫలప్రదాత అగుచున్నవి. అందుచేత ఈ 108 ఉపనిషత్తులు పఠణ అధ్యయన - విశ్లేషణ - అవగాహన - స్వానుభవముల కొరకై….,
నిత్యానిత్య వివేకియగు అట్టి పండితుని ముఖతః స్వయముగా వినాలి.
అటు తరువాత తనకు తానుగానూ మననము చేస్తూ, అధ్యయనము చేస్తూఉంటే, అతిత్వరగా మహత్తరమైన ప్రయోజనము సిద్ధించగలదు.
అట్టివాడు తప్పక ముక్తిని పొందగలడు. ఈ కళ్ళకు కనిపించుచున్న దృశ్యము బంధమని అనిపించక, స్వస్వరూపముగా అనిపించటమే ముక్తి.
ఉపనిషత్తులను అధ్యయనము చేయుచున్నవాడు - జీవన్ముక్తుడై ప్రకాశించుచున్నాడు. అట్టివాడు - వర్తమాన దేహముతో ఏదేది ప్రారబ్ధవశముగా పొందాలో, అవన్నీ పొందుచూ, ప్రారబ్ధమును (సంచిత కర్మల నుండి వర్తమాన దేహముతో అనుభవించవలసినవిగా నిర్ణితమైనవి) ‘అనుభవించటము’ ద్వారా క్షయం చేసివేసుకొంటున్నాడు. ప్రారబ్ధానంతరము విదేహముక్తుడగుచూ నా యొక్క సన్నిధానమును చేరుచున్నాడు.
ఓ హనుమా! నాస్తి తత్ర సంశయః!
ఆ విధంగా ఉపనిషత్తుల అధ్యయనముచే ఈ జీవుడు జీవన్ముక్తి, ప్రారబ్ధ కర్మల క్షయము, ‘విదేహముక్తి’ పొందుతాడు. ఇందులో
ఏమాత్రము సందేహము లేనే లేదయ్యా!
మనం పైన చెప్పుకొన్న 108 ఉపనిషత్తులు కూడా సర్వ ఉపనిషత్తుల (1180 శాఖలలో గల ఒక్కొక్క ఉపనిషత్తు చొప్పున మొత్తము ఉపనిషత్తుల మధ్యగతమైయున్న 1180 ఉపనిషత్తుల) ‘సారము’గా చెప్పబడుచున్నాయి. ఈ 108 ఉపనిషత్తులు శ్రవణము చేసినంత మాత్రముచేత సర్వ పాపములు పాపదృష్టులు, దోషదృష్టులు తొలగి, హృదయము అత్యంత నిర్మలము కాగలదు.
⌘
ఓ పవన నందనా! నీవు నాకు ప్రియభక్తుడవు! అత్యంత బుద్ధి మంతుడవగు శిష్యుడవుకూడా! అందుచేత (108) ఉపనిషత్తులలోని అతి రహస్యమగు కొన్ని సార విశేషాలు నీకు విశదీకరిస్తున్నాను.
ఒకడు అజ్ఞాని అయినప్పటికీ కూడా, అష్టోత్తర శత (108) ఉపనిషత్తులలోని సారాంశములను పఠిస్తూ హృదయస్తము చేసుకొంటూ ఉంటే అట్టివాడు జన్మజన్మలుగా చిక్కు ముడిపడుతూ వస్తున్న సర్వ సంసార బంధములనుండి తప్పకుండా విమోచనము పొందగలడు.
ఈ ఉపనిషత్తులను గురుముఖతః గాను, స్వయము గాను అర్థము చేసుకొని, ‘తత్ పరబ్రహ్మమ్ అహమేవ’ అని సునిశ్చితుడు అగుచున్నవాడు, తాను తెలుసుకొన్న బ్రహ్మతత్త్వమును తనను ఆశ్రయించవచ్చిన వారికి - “నీవు వెతుకుతున్న ఆ పరబ్రహ్మతత్త్వము స్వయముగా నీవు, నేను కూడా! తరంగము జలము కోసము వెతుకుచున్నట్లు మనము బ్రహ్మము కొరకై వెతుకుచున్నాము. తత్త్వమ్! అహమ్ బ్రహ్మాఽస్మి!” - అని బోధించుచున్నాడు.
ఓ హనుమా! ఆత్మ తత్త్వము ఎరిగినవాడు తనను జ్ఞానము కోసము అర్థించినవారికి తప్పక బోధించాలి. అయితే… బ్రహ్మతత్త్వము బోధించుటకు ముందు, ఆ శ్రోత (శిష్యుడు) ’ఆత్మబోధ’ వినటానికి అర్హుడో, కాదో గమనించి అప్పుడు మాత్రమే విశదపరచటము ఉచితము.
హిత పుత్రాయ : కుమారుడైనా సరే, మరెవ్వరైనా సరే… తల్లి-తండ్రి-గురువు-దైవములపట్ల సేవ-కృతజ్ఞతలు కలిగి ఉంటేనే బోధించాలి.
మద్భక్తాయ : భక్తుడు కానివానికి బోధించకూడదు. హృదయములో భక్తి-ప్రపత్తులు కలవాడే ఆత్మజ్ఞాన సమాచారములకు ’అర్హుడు’ అగుచున్నాడు.
ఈ ఈ లక్షణములను చక్కగా సమ్యక్ పరీక్ష చేసి అప్పుడు ఈ 108 ఉపనిషత్తుల సార విషయములను తెలియజేప్పాలి.
పై…అర్హతలు లేకుండా ఒకడు ‘నేను రాజ్యం ఇస్తానండీ! ఎంత ధనమైనా ఇస్తాను. మీరు ఏమి అడిగితే అవన్నీ ఇచ్చి మీ కోరికలు తీరుస్తాను” అని అంటే కూడా ఈ 108 ఉపనిషత్ ప్రబోధమగు ‘సోఽ హమాత్మవిద్య’ లేక ’తత్త్వవిద్య’ను బోధించకూడదయ్యా! ఎందుకంటే ఉపనిషత్ బోధ అట్టివానిపట్ల ఉద్ద్యేసించిన ప్రయోజనము సిద్ధించదు. జగత్ వ్యవహారములు, లోభ-మోహములు దట్టంగా నిండి ఉన్న హృదయములో వేదాంత అంతర్గతమగు ఉపనిషత్ - జ్ఞానజ్యోతి వెలుగు విస్తరించజాలదు.
→ ‘ఈ సృష్టికి ఆవల కర్తా లేడు. ఇవన్నీ ప్రసాదించే దేవుడూ లేడు. భక్తి-జ్ఞానము ఇవన్నీ వృధా!…అను అభిప్రాయములు గల నాస్తికునికి…,
చేసిన మేలు మరచి తల్లి తండ్రులపట్ల, తదితర హితులపట్ల కృతఘ్నడై ఉండువానికి…..;
→ ఇతరులను వేధించటము, బాధించటము, దూషించటము, ఎగతాళి చేయటము, తక్కువగా చేసి మాట్లాడటము, ద్రోహము చేయాలనుకోవటము… ఇటువంటి దురాచారములు కొనసాగించువానికి….;
→ భక్తి - ప్రపత్తి - అణుకువ లేనివానికి, పరాప్రేమరూపమగు భక్తిభావన పట్ల విముఖత చూపువానికి….;
→ శాస్త్ర విషయములను-చారిత్రక విషయములను గట్టిగా పట్టుకొని జ్ఞానవిషయములవైపుగా దృష్టిసారించుటకు సిద్ధము కానివానికి…;
→ గురువులలో భేదము చూస్తూ దూషణ అనుమానము - తేలిక భావన చేయుచున్నవానికి….;
→ శాస్త్ర విషయముల వాదోపవాదములను చేబూని పరులను ఖండించటము… ఇదియే పరమావధిగా ఉండి ‘శాస్త్రములు’ అనే బురదగుంటలలో చిక్కుకున్నవానికి; శాస్త్ర చర్చలందు మాత్రమే అభిరుచిని పరిమితము చేసుకొని, జ్ఞానానుభవమునకు సిద్ధము కానివానికి….;
→ గురుభక్తి (నాకు తెలియదుకాబట్టి వారు చెప్పునది ముందుగా శ్రద్ధగా విందాము. అర్థము చేసుకొని, ఆ తరువాత ఆలోచన చేద్దాము - అనే శ్రద్ధ) లేనివానికి
→ గురువు మీద, శాస్త్రము మీద, తన మీద నమ్మకము (ప్రపత్తి) పెంపొందించుకొనుటకు సంసిద్ధుడు కానివానికి…;
→ గురిలేనివానికి, పిరికితనము - అపనమ్మకములను జయించ సిద్ధము కానివానికి…;
⚫️ ఈ అష్టోత్తర శతోపనిషత్ ప్రతిపాదితమగు ’పరబ్రహ్మత్వము’ను బోధించకూడదు.
అతడు ’తత్త్వమ్, సోఽహమ్’ సారాంశములను గ్రహించక, పెడార్థము చేసుకోవటము, స్వధర్మము ఇత్యాదులపట్ల వితండవాదము ఆశ్రయించటము… మొదలైన దోషములకు - లోను అయ్యే ఆస్కారము ఉన్నది. దోష నివృత్తికై ప్రయత్నశీలుడే ఉపనిషత్ శ్రవణమునకు అర్హులు.
ఓ రామచంద్రా! ఈ 108 ఉపనిషత్తుల పాఠ్యాంశములను ఎవ్వరూ చదువుతారో (లేక) వింటారో…ఆ పాఠకుడు - శ్రోత కూడా … సంయోగ-వియోగాతీత ‘రామ పరబ్రహ్మ స్థానము’ అని వర్ణించబడుచున్న నా స్థానమును చేరుచున్నారు.
⌘
వేద ఋక్ వాక్ దేవతాయగు శ్రీవిద్యాదేవి - వేదోపనిషత్తులను గానం చేస్తూ సంభాషించుకుంటూ బోధిస్తూ, అర్థ తాత్పర్యములను గానం చేస్తున్న - ప్రకటించుచున్న బ్రహ్మ విద్యా పారాయణుల వద్ద (బ్రాహ్మణుల వద్ద) ప్రత్యక్షమై ఇట్లా పలుకుచున్నది.
’ఓ వేదాంతరూపమగు ఉపనిషత్ విద్యను ఎలుగెత్తి గానము చేస్తున్న బ్రహ్మ విద్యాపారంగతులారా! బ్రహ్మవిద్యాస్వరూపిణినగు నన్ను మీయందు కొంచము దాచి ఉంచండి. మీయందు సర్వదా సంరక్షించుకొంటూనే, కొంత మాటుగా కూడా ఉంచండి. నేను మిమ్ములను ఒక నిధివలె కాపాడుకుంటాను. ఇష్ట కామ్యములు సిద్ధింపజేస్తాను. ఉపనిషత్ తత్త్వార్థము కొరకై మిమ్ములను సమీపించు శిష్యునికి గురుభక్తి, దృశ్య విషయములపట్ల విరక్తి, సత్ప్రవర్తన, జిజ్ఞాస, ఆత్మజ్ఞానార్తి, ధర్మ నిరతి …ఇవన్నీ ఉన్నాయో లేవో పరీక్షించి, అప్పుడు బ్రహ్మవిద్యను (ఆత్మతత్త్వబోధను) తప్పక బోధించండి.
అయితే ఒక నియమమును మాత్రమే విధిస్తున్నాను.
నన్ను బోధించవద్దు. వీర్యవతినగు నేను ఉత్సాహము, సాహసము, ధైర్యము, సూక్ష్మ విషయములు గ్రహించగలబుద్ధి, శక్తి, పరాక్రమము ప్రసిద్ధమైయున్న హృదయములలో మాత్రమే - ప్రవేశిస్తాను.
వీర్యవతినై బ్రహ్మజ్ఞాన మార్గము ఆశ్రయించువారికి కావలసినన్నీ ప్రసాదించుచూ తోడై ఉంటాను.
⌘
ఓ ఆంజనేయా! ఎవ్వరైతే వేదశబ్దములను, శ్లోకములను ఉపాసిస్తూ పలుకుచూ ఉంటారో, ఆత్మ తత్త్వజ్ఞానము కొరకై ఔత్సాహితులై - అప్రమత్తులై - అల్ప విషయ మననములను త్యజించినవారై ఉంటారో, బ్రహ్మమునందు చరించు ‘బ్రహ్మ చర్య వ్రతస్తులు’ అయి ఉంటారో, వారు కోరినప్పుడు, వారియొక్క ఆయా అర్హతలను - సంసిద్ధతలను పరీక్షించి, అప్పుడు… తప్పక ఈ ’విష్ణు స్వరూప సంబంధమైనటువంటి ‘ఆత్మనిష్ఠ’ లేక ‘నేనే ఆత్మను - అను నిష్ఠ’ను బోధించెదరుగాక!
ఓ హనుమా! ఇంకా ఏమైనా ’ఉపనిషత్ సాహిత్యము’ విషయమై తెలుసుకోవాలని అనుకుంటున్నావా?
శ్రీ హనుమంతుడు : అవును స్వామీ! "ప్రతి ఉపనిషత్తు పారాయణ చేస్తున్నప్పుడు శాంతి పాఠముతో ప్రారంభించబడి, శాంతి - పాఠముచే ముగించబడు గాక” అని మీరు శలవిచ్చి ఉన్నారు కదా!
ఋగ్వేదాది విభాగేన పృథక్ శాంతిమ్ అనుబ్రూహి!
ఋక్-యజుర్-సామ-అథర్వణ వేదములలో చెప్పబడుచున్న ’శాంతి పాఠము’ల గురించి కూడా వివరించ ప్రార్థన.
శ్రీరామచంద్రుడు : విను. చెప్పుచున్నాను.
⌘
బుగ్వేద అంతర్గత ఉపనిషత్తులు : అక్షమాలిక, ఆత్మబోధ, ఐతరేయ, కౌషీతకీ బ్రాహ్మణ, త్రిపుర, నాద బిందు, నిర్వాణ, బహ్వృచ,
ముద్గల, సౌభాగ్యలక్ష్మీ (10)
ఋగ్వేదాంతర్గత శాంతిమంత్రము
ఓం వాఙ్మే (వాక్ మే) మససి ప్రతిష్ఠితా! మనో మే వాచి ప్రతిష్టితమ్!
ఆవిః ఆవీర్మ ఏధి! వేదస్య మ ఆణీ స్థః! శృతం మే మా ప్రహాసీః।
అనేన అధీతేన అహెరాత్రాన్ సందధామి!
ఋతం వదిష్యామి! సత్యం వదిష్యామి!
తత్ మామ్ అవతు! తత్ వక్తారమ్ అవతు। అవతు మాం। అవతు వక్తారమ్ ॥
ఓం శాంతిః శాంతిః శాంతిః
నాయొక్క వాక్కు మనస్సునందు, మనస్సు వాక్కునందు ఎల్లప్పుడు ప్రతిష్ఠితములై నెలకొని ఉండునుగాక! నాలో జ్యోతిస్వరూపులై వేంచేసియున్న ఓ పరమాత్మా! నాయందలి అజ్ఞాన తెర తొలగి మీ ప్రకాశము వెల్లివిరియును గాక! ఎల్లప్పుడూ మీరు నాయందు తెలియబడుచూ ఉండెదురుగాక! అందుకై నా బుద్ధి-తెలివి సుసూక్ష్మము, సుతీక్షము అగును గాక! ఆత్మజ్ఞుల వద్ద నేను వినుచున్న సమాచారము మరుగున పడుకుండునుగాక! నేను అధ్యయనము చేస్తున్న గ్రంథములలోని ఆత్మశాస్త్ర సంబంధమైన విశేషములను రాత్రింబవళ్లు అనుసంధానము చేసెదనుగాక! ఋక్కులు పలుకు సత్యము-యదార్థము అగు మాటలనే ఎల్లప్పుడు మాట్లాడుదునుగాక! ఆ పరమాత్మ-నాకు రక్షకుడయ్యెదరు గాక! పరమాత్మ గురించి నాకు చెప్పుచున్న సద్గురువు అగు వక్తారుని కూడా సర్వదా రక్షించెదరు గాక! ఈ దృశ్యము, నా దేహిత్వము, నా అంతరంగము-మమాత్మ స్వరూపమై నా యందు సశాంతించునుగాక! (ఓం శాంతిః శాంతిః శాంతిః॥).
⌘
శుక్ల యజుర్వేదాంతర్గత ఉపనిషత్తులు : ఆధ్యాత్మ, అద్వయ తారక, ఈసావాస్య, జాబాల, తారసార, తురీయాతీత, త్రిశిఖి బ్రాహ్మణ, నిరాలంబ, పరమహంస, పైంఙ్గల, భిక్షుక, మండల బ్రాహ్మణ, మంత్రిక, ముక్తిక, సుబాల, యాజ్ఞవల్క్య, శాట్యాయనీ, హంస, బృహదారణ్యక (19)
శుక్ల యజుర్వేదాంతర్గత శాంతిమంత్రము
ఓం పూర్ణమ్ అదః పూర్ణమ్ ఇదమ్| పూర్ణాత్ పూర్ణమ్ ఉదచ్యతే।
పూర్ణస్య పూర్ణమ్ ఆదాయ, పూర్ణమేవ అవశిష్యతే॥
ఓం శాంతిః శాంతిః శాంతిః ॥
ఆ పరస్వరూపము సర్వదా పూర్ణము! ఇక్కడి ఈ ద్రష్ట - దర్శన - దృశ్యముల వెంటనిడుకొనియున్న ఇహస్వరూపము కూడా పూర్ణమే! పరమాత్మ సర్వదా పూర్ణుడే! పరమాత్మకు అభిన్నుడగు జీవాత్మ కూడా పూర్ణుడే! పరస్వరూప పూర్ణము నుండే ఇహ స్వరూప పూర్ణము బయల్వెడలుచున్నది. పరస్వరూపము నుండి ఇహ స్వరూపము బహిర్గతము అగుచున్నప్పుడు కూడా… పరస్వరూపము ఇహమును తనయందు ఇముడ్చుకొన్నదై, సర్వదా పూర్ణముగానే ఉన్నది. (ఎందుకంటే, ఈ ఇహము పరమునకు అభిన్నము కాబట్టి!).
⌘
కృష్ణయజుర్వేదాంతర్గత (32) ఉపనిషత్తులు : అమృతనాద, అమృతబిందు, అవధూత, అక్ష్యు, ఏకాక్షర, కలిసంతారణ, కరవల్లీ, కఠశృతి, కాలాగ్ని రుద్ర, కైవల్య, గర్భ, తేజోబిందు, తైత్తిరీయ, దక్షిణామూర్తి, ధ్యానబిందు, నారాయణ, పంచబ్రహ్మ, ప్రాణాగ్ని హెూత్ర, బ్రహ్మ, బ్రహ్మవిద్య, యోగకుండలినీ, యోగతత్త్వ, యోగశిఖ, వరాహ, శారీరక, శుకరహస్య, శ్వేతాశ్వతరో, సరస్వతీ రహస్య, సర్వసార, స్కంద, హృదయ, క్షురిక (32)
కృష్ణయజుర్వేదాంతర్గత శాంతిమంత్రము
1) ఓం సహనావవతు! సహనౌ భునక్తు!
సహ వీర్యం కరవావహై! తేజస్వి నావధీతమ్ అస్తుః మా విద్విషావహై!
ఓం శాంతిః శాంతిః శాంతిః ॥
(పరబ్రహ్మతత్త్వమును ప్రవచించుకుంటూ పరస్పరము సంభాషణ పూర్వకంగా ఉపాసిస్తున్న గురుశిష్యులమగు)…
మా ఇరువురిని పరమాత్మ సర్వదా సంరక్షించునుగాక! జీవితావసరములు ప్రసాదించి పరిపోషించును గాక!
(ఆత్మ విద్యను సునిశ్చితము, అనుభూతము చేసుకొనుచున్న మా ఈ ప్రయత్నము నందు) ఒకరి వలన మరొకరము సామర్థ్యము కలిగినవారిమయ్యెదము గాక! తేజోవంతులమయ్యెదము గాక!
మేము పరస్పరము ఆత్మతత్త్వము గురించి సంభాషించుకొనుచూ…,
‘ఈయనకు వినటము రాదు’ అని గురువుగానీ, - ‘ఈయనకు చెప్పటము రాదు’ అని శిష్యుడుగానీ అనుకొనుకుండెదముగాక? అనగా పరస్పరము విసుగు, ద్వేషభావము జనించకుండునుగాక! పరస్పరము ప్రేమ వెల్లివిరియును గాక!
2) ఓం శం నో మిత్ర శ్శం వరుణః శం నో భవతి అర్యమా!
శం న ఇంద్రో బృహస్పతిః శం నో విష్ణుః ఉరుక్రమః|
నమో బ్రహ్మణే! నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాణ సి!
త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి! ఋతం వదిష్యామి! సత్యం వదిష్యామి!
తత్ మామ్ అవతు। తత్ వక్తారమ్ అవతు అవతు మాం। అవతు వక్తారమ్!
ఓం శాంతిః శాంతిః శాంతిః ॥
ఈ పాంచభౌతిక దేహమును తమ దివ్యశక్తులతో నిర్మించి ఇచ్చి, దీనికి వాస్తవానికి యజమానులే అయి ఉన్న ఓ దివ్యతత్త్వ స్వరూప దేవతలారా! బ్రహ్మ విద్య కొరకై ఈ ఉపాధి మా పట్ల సానుకూలమగుగాక! ఓ మిత్రుడా! సూర్యభగవాన్! జలస్వరూపుడగు వరుణదేవా! గర్భములో దేహనిర్మాణమును ప్రజ్ఞచే పరిరక్షించి, ప్రసాదించిన ఓ అర్యమస్వామీ! ఇంద్రియములన్నిటికీ అధికారియగు ఓ ఇంద్రభగవాన్! బుద్ధికి అధిదేవత యగు ఓ బృహస్పతి సద్గురువా! సర్వత్రా, సమస్వరూపమై, సర్వము అయి ప్రకాశించుచున్న ఓ విష్ణు భగవాన్! మీరంతా కూడా క్రమముగా నాయొక్క ప్రాణమునందు, శక్తి - బలములందు, వాక్కు - బుద్ధులయందు, పాదములందు దివ్యశక్తితో ప్రకాశించుచూ, మేము బ్రహ్మవిద్యను శ్రవణము - ధారణ చేయుటకు సమర్థులమగునట్లుగా మా యీ దేహమును సానుకూలము చేసెదరు గాక!
ప్రాణచలనరూపుడగు ఓ వాయుదేవా! మీకు నమస్కారము! నమస్తే! మీరే నాకు ప్రత్యక్ష బ్రహ్మస్వరూపముగా అయిఉంటున్నారు! మీరే ప్రత్యక్షపరబ్రహ్మముగా మేము చెప్పుకొంటున్నాము. మీ కరుణచే మేము వేదములలోని ఋక్కులు పలుకు ఋతమును (Exact meaning) చెప్పుకొంటున్నాము. సత్స్వరూపమగు సత్యము (Ever present) గురించి చెప్పుకొంటున్నాము. మీరు మాకు సంరక్షకులై ఉండెదరుగాక! పరబ్రహ్మమును (మాకు విశదీకరిస్తున్న ఈ సద్గురువగు వక్తారునికి (speaker) కూడా) సంరక్షకులయ్యెదురు గాక! మమ్ములను - మా గురువగు వక్తారుని రక్షించమని ప్రార్థిస్తున్నాము.
(మా ఆధి భౌతిక - ఆధి దైవిక - ఆధ్యాత్మికములు → ఆత్మ స్వరూపము సంతరించుకొని - సశాంతించును గాక!)
⌘
సామవేదాంతర్గత షోడశ (16) ఉపనిషత్తులు : అవ్యక్త, ఆరుణిక, కేన/తలవర, కుండిక, ఛాందోగ్య, జాబాల, దర్శన, మహదో, మైత్రేయాణ్యు, మైత్రేయ, యోగచూడామణి, రుద్రాక్ష జాబాల, వజ్రసూచిక, వాసుదేవ, సన్న్యాస, సావిత్రి (16)
సామ వేదాంతర్గత శాంతిమంత్రము
ఓం ఆప్యాయన్తు మమ అంగాని, వాక్ ప్రాణః చక్షుః శ్రోత్రం అథో బలమ్ ఇంద్రియాణి చ సర్వాణి।
సర్వం బ్రహ్మ ఔపనిషదం। మాహం బ్రహ్మ నిరాకుర్యాం
మా మా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్తు, అనిరాకరణం మే అస్తు
తత్ ఆదాత్మని, నిరతేయ, ఉపనిషత్సు ధర్మాః తే మయి సన్తు! తే మయి సన్తు|
ఓం శాంతిః శాంతిః శాంతిః॥
(మాకు ఈ ఇంద్రియాకారములను - ఇంద్రియశక్తులను ప్రసాదించుచున్న దివ్యదైవీ తత్త్వమునకు నమస్కరిస్తూ)
ఓ దివ్యస్వరూపలగు దేవతలారా! ఇంద్రియములను ప్రసాదిస్తూ పరిరక్షించుచున్న దివ్య ప్రజ్ఞాస్వరూపులారా!
…మా ఈ అంగములన్నీ మేము పరమసత్యము ఎరుగుటకు, మాకు అనుభూతమగుటకు సానుకూల్యముగా, ఆప్యాయత కలవై సహకరించునుగాక! వాక్కు, పంచప్రాణములు, కళ్లు, చెవులు, ఇంతే కాకుండా ఈ బలము (శక్తి) ఈ తదితర కర్మేంద్రియములు ఇవన్నీ కూడా మా బ్రహ్మ యజ్ఞము నందు ప్రియముగా సహకరించునుగాక! బ్రహ్మము యొక్క సామీప్యమును మేము పొందెదముగాక!
బ్రహ్మము మమ్ము నిరాదరణ చేయుకుండునుగాక! మేము బ్రహ్మమును ఏమరచి ఉండకుండెదము గాక! నిరాకరించకుండెదము
గాక!
మా ఇరువురి మధ్య ఆదరణయే సర్వదా ఏర్పడినదగుగాక! నేను ఆత్మజ్ఞానము పట్ల, తత్త్వానుభవము పట్ల నిరతుడను (Engaged) అయి ఉండెదను గాక! ఉపనిషత్తులు ఎలుగెత్తి ప్రకటించుచున్న ఆత్మతత్త్వము-ఆత్మ ధర్మము మా హృదయమునందు ప్రకాశించునుగాక! సుస్థిరమై సునిశ్చితమగును గాక!
ఓం శాంతిః శాంతిః శాంతిః |
⌘
అథర్వణ వేదాంతర్గత ఉపనిషత్తులు : అధర్వశిఖ, అధర్వశిర, అన్నపూర్ణ, ఆత్మో, కృష్ణ, గణపతి, గరుడ, గోపాల, త్రిపురరూపిణి, దేవీ, దత్తాత్రేయ, నారదపరివ్రాజక, నృశింహతాపని (పూర్వ, ఉత్తర), పరమహంస పరివ్రాజక, పరబ్రహ్మ, పాశుపతబ్రహ్మ, ప్రశ్న, భావన, భస్మజాల, బృహతాల, మహానారాయణ, మహావాక్య, మాండూక్య, ముండక, రామరహస్య, రామ తాపని (పూర్వ-ఉత్తర), శరభ, శాండిల్య, సీత, సూర్య, హయగ్రీవ (31).
అథర్వణ వేదాంతర్గత శాంతిమంత్రము
ఓం భద్రం కర్ణేభి శ్రుణుయామ, దేవాః |
భద్రం పశ్యేమ అక్షభిః యజత్రాః
స్థిరైః అంగైః తుష్టువాగ్ంసః తునూభిః |
వ్యశేమ దేవహితం యత్ ఆయుః ||
స్వస్తి న ఇన్డో వృద్ధశ్రవాః |
స్వస్తి న పూషా విశ్వవేదాః |
స్వస్తి నః తార్యో అరిష్టనేమిః |
స్వస్తి నో బృహస్పతిః దధాతు |
ఓం శాంతిః శాంతిః శాంతిః॥
ఇంద్రియములను సంకల్పించి నిర్మించి మాకు ప్రసాదించుచూ పరిరక్షిస్తున్న ఓ దేవాది దేవా!
మీచే అనుగ్రహించబడిన ఈ చెవులతో మేము ఎల్లప్పుడూ పరమక్షేమకరము (భద్రము) అగు ఆత్మతత్త్వమునకు సంబంధించిన సమాచారమునే వినుచుండెదముగాక! ఆత్మయజ్ఞ శీలురమైయున్న మేము ఈ కనులతో భద్రము - శుభప్రదము అగు ఆత్మతత్త్వముగానే ఈ కనబడేదంతా చూచుచుండెదము గాక! స్థిరమైన (వణకని) బలోపేతమైన అవయవములతో ఆరోగ్యముతో కూడి ఉన్నవారమై, మిమ్ములను స్థుతించుచూ, మాకు విధించిన ఆయుఃకాలమును మేము వినియోగము చేసెదముగాక! మీ భావనతో (ఆత్మభావనలో) ఆయుష్షును గడుపుచుండెదముగాక!
త్రిలోకాధిపతి, పురాణప్రసిద్ధుడు, గొప్ప కీర్తిమంతుడు, విశాలమైన (సూక్ష్మ శబ్దతత్త్వగ్రహణముతో కూడిన పెద్ద చెవులు గల ఇంద్ర భగవానుడు మాకు స్వస్థి (శుభము) కలుగజేయునుగాక! ఈ విశ్వస్వరూపమేమిటో ఎరిగిన పూషుడు (సూర్యభగవానుడు) మాకు శుభములు కలుగజేయనుగాను!
మిక్కిలి వేగముగల గరుడుడు మాయందు ఆధ్యాత్మ సంపదను అమృతకలశమువలె సదా పరిరక్షించుదురు గాక! మా అరిష్టములు తొలగించును గాక!
దేవగురువగు బృహస్పతి మాకు ప్రశాంతము - విస్తారము సుతీక్ష్మము - సూక్ష్మము అగు బుద్ధిని ప్రసాదించి మాకు స్వస్థిని కలుగజేయును గాక! సాదృశ్యమగు దృశ్య-ద్రష్ట-దర్శనములు అస్మత్ ఆత్మయందు సశాంతించినవగుగాక!
ఓం శాంతిః శాంతిః శాంతిః ॥
⌘
యోగ విద్యా ప్రధాన ఉపనిషత్తులు
ఋగ్వేదాంతర్గత : అద్వయతారక, నాదబిందు (2)
శుక్లయజుర్వేద : త్రిశిఖిబ్రాహ్మణ, మండల బ్రాహ్మణ, హంస (3)
కృష్ణయజుర్వేద : అమృతనాద, అమృతబిందు, తేజోబిందు, ధ్యానబిందు, బ్రహ్మవిద్య, యోగకుండలి, యోగచూడామణి, యోగతత్త్వ, యోగశిఖ, వరాహ, క్షురిక (11)
సామవేద : దర్శన (1)
అథరణ్వవేద : పాశుపతబ్రహ్మ, మహావాక్య, శాండిల్య (3)
ఓ హనుమా! ఈ మానవజన్మ అత్యంత దుర్లభమైనది సుమా! మహత్తరమైన సందర్భము. స్థూల - సూక్ష్మ - కారణ శరీరముల నుండి పూర్తిగా విముక్తుడు కాగలుగుటకు ఇది సదవకాశము. దీనిని జీవుడు ఏమాత్రమూ వృధా చేసుకోకూడదు. “నేను సంసారబంధమునుండి మొదలంట్లా విడివడాలిసిందే” అను ఆశయమును ఆశ్రయించి మహదాశయుడు కావాలి. ముముక్షువు కావాలి. ఆ విధంగా ముముక్షువు అయి, ఇక తాత్సారము చేయరాదు. ఆత్మతత్త్వమును బోధించగల ’సద్గురువు’ను ఆశ్రయించాలి.
ఇక్కడ సద్గురువు యొక్క విశేష లక్షణముల గురించి కొన్ని విశదీకరిస్తున్నాను.
🙏 ఇంద్రియ నిగ్రహరూపమగు శమము (Control over ‘Indriamulu’), విచారణ (అధ్యయనము- Analytical), సంతోషము (Being content with whatever got) సత్సంగము (Relatedness with the permanent) - అను సాధన చతుష్ఠయమును అనుష్ఠానము చేయుచున్నవాడు;
శ్రద్ధావంతుడు; బ్రహ్మతత్త్వమును ఎరిగిన సంఘములోనివాడు (సత్కులజాతుడు);
🙏 శ్రుతుల హృదయము ఎరిగినట్టి శ్రోత్రియుడు; వేదాంత శాస్త్రముయొక్క ఆశయమగు ’తత్త్వమ్ - నీవే బ్రహ్మము’ అనునది నిర్దుష్టముగా, సునిర్ణయముగా కలిగి ఉన్నవాడు;
🙏 శాస్త్రములపట్ల, సదాచారములపట్ల గౌరవము, అవగాహన, ప్రియత్వము కలిగి ఉన్నట్టివాడు; సద్గుణవంతుడు;
🙏 కుటిలమైన బుద్ధి - ఆలోచనలు, లోక - దృశ్యసంబంధమైన ఆశ-ఆశయములను హృదయమునందు రహితము చేసుకొని ఉన్నవాడు;
🙏 సహజీవులపట్ల వాత్సల్యము కలిగి ఉండి, సర్వులపట్ల ప్రేమ పొంగుతూ ఉన్నవాడు. సర్వజీవుల క్షేమము కోరుకొనువాడు;
🙏 దయా సముద్రుడు;
🙏 ఓర్పు గలవాడు;
🙏 సూక్ష్మమగు తాత్త్విక విషయములను హృదయ రంజకముగా విశదీకరించగలిగినట్టి వాక్చాతురత కలిగినట్టివాడు;
🙏 శ్రోతను పరబ్రహ్మ స్వరూపముగా సంభావించువాడు (భావన చేయువాడు). “నీవు మహత్తరమగు ఆత్మవే”! అనునది సంభాషణయొక్క ఆశయముగా కలిగి ఉన్నట్టివాడు, తత్త్వవేత్త! మహదాశయుడైనవాడు! సర్వక్షుద్రాశయములను జయించినవాడు.
అట్టి లక్షణములు కొన్నిగాని, అన్నీగానీ గల సద్గురువును విధివిధానంగా ఆశ్రయించాలి. నమస్కరిస్తూ శరణువేడాలి. ఆ మహనీయుని వద్ద అష్టోత్తర శత ఉపనిషత్ విశేషములను (108 ఉపనిషత్తులను, సారమును)… - మొట్టమొదట శ్రద్ధగా శ్రవణము చేయాలి.
తన హావభావములను, ఆవేశపూరితమైన అభిప్రాయములను కొంతసేపు ఆప్రక్కనే ఉంచి, ఆ సద్గురువు ఉపనిషత్ సాహిత్య పూర్వకంగా నిరూపిస్తూ వస్తున్న “నీవు బ్రహ్మమువే! తత్త్వమసి"…అను మహత్తరార్థమును వినాలి. అనుమానాలు ఉన్నప్పుడు ఆ గురువర్యులు మెచ్చువిధముగా సానుకూల్యమైన పద్ధతిలో ఆధ్యాత్మశాస్త్ర విశేష నిరూపణ… అను ఆశ్రయముతో సున్నితంగా, అణకువగా ప్రశ్నించాలి. అంతేగానీ, ప్రశ్నలు మరొకరి గుణగణములు ఎంచురీతిగా ఉండరాదు. ఏ సిద్ధాంతము యొక్క ఉద్దేశ్యము ఏమై ఉన్నదో…అది ఎరుగుటకొరకై అడుగాలి. గురువు యొక్క అనుభవపూర్వకమగు అభిప్రాయము ఏమిటో తెలుసుకొనుటకై పరిప్రశ్నించాలి. అంతేగానీ, ప్రశ్నలు మరొకరి (లేక) మరొక గురువుయొక్క గుణగణములు విమర్శించు ఆశయము ఉండరాదు.
ఏ సిద్ధాంతము యొక్క ఉద్దేశ్యం ఏమై ఉన్నదో…అది ఎరుగుటకై అడగాలి. గురువుయొక్క అనుభవపూర్వకమగు అభిప్రాయము ఏమిటో ఎరుగుటకై పరిప్రశ్నించాలి. అంతేగాని, గురువుకు ఎంతవరకు తెలుసో పరీక్షించటానికి కాదు. వారి వద్ద తనకు అవసరమైనది, వారికి తెలియవచ్చినది తెలుసుకోవటమే ఆశయముగా కలిగి ఉండాలి.
ఆ విధముగా శ్రవణము చేసినది ఏకాంతముగానో, తన సహచరులగు ముముక్షుజనులతో కూడియో - మననము చేయాలి. ‘ఈ అభిప్రాయము వెనుక ఉద్దేశ్యమేమిటి? వారు చెప్పినట్లుగా నాకు అనిపించటము లేదే? ఎందుచేత?” అను విచారణచే పరిప్రశ్నలకు సమాధానము సద్గురువు వద్దనుండిగాని, తదితరులవద్ద నుండి సంపాదించుకోవాలి.
అదే సమయంలో (At the same time) నిదిధ్యాస. ఏ ఆత్మ గురించిన సమాచారము తాను విని మననము చేస్తున్నాడో, - ‘అట్టి అఖండ అప్రమేయమగు ఆత్మ నేనేకదా!’ అను ధ్యాస, ధ్యానములకు పెంపొందించుకోవాలి ‘అనిపించటమును’ - వృద్ధి చేసుకోవాలి.
ఈ విధంగా శ్రవణ మనన నిదిధ్యాసలను నిరంతరము అభ్యసిస్తూ… తత్త్వార్థమును అన్నివేళలా ధ్యాసయందు - నిలుపుకుంటూ ఉండాలి.
అను మనోకల్పిత సంబంధమును మొదలంట్లో త్యజించివేయాలి. త్రిదేహవిముక్తుడు కావాలి. త్రిదేహములకు వేరైన ’దేహి’ తాను కదా! సంబంధము నుండే బంధము వస్తోంది. సంబంధము లేనివాడికి బంధమే లేదు. ఆ త్రిదేహములను కలలో కనిపించే మూడు వస్తువులుగా అనగాహన కలిగి ఉండటము అనునది ఉపనిషత్ ప్రబోధకమగు సారము. ‘తత్త్వమ్ - సో హమ్ - త్వమేవా హమ్ - త్వమ్ అహమేవ’… అను మహవాక్యార్థములను బుద్ధియందు నిలిపి నిశ్చలము చేసుకోవాలి. అట్టివాడు జీవన్ముక్తుడై ఈ భూమిపై ప్రశాంత - ఆనంద సర్వాతీతత్వములతో కూడి సంచరిస్తున్నాడు. ప్రారబ్ధమున్నంతవరకు ఈ దేహము కలిగి ఉంటున్నాడు.
ఈ దేహము స్వభావముగా శిథిలమయినప్పుడు - ఇక ఆతడు - ఏమగుచున్నాడంటావా?
- కుండలో ఆకాశము (space) ఉన్నది కదా?
- కాలక్రమేణా (లేదా) ఏదో కారణం చేత ఆ కుండ పగిలినప్పుడు, ఆ కుండలోని ఆకాశము ఏమగుచున్నది? ఘటాకాశము మహాకాశములో ఏకమగుచున్నది కదా!
అట్లాగే ఆ జీవన్ముక్తుడు దేహమున్నప్పుడు - దేహము శిథిలమగుచుండగా కూడా,…. ప్రారబ్ధముగా లభించిన వర్తమాన దేహమునుండి వినిర్ముక్తుడై సర్వదా సర్వము అయి ఉన్న సర్వాత్మకమగు మహాత్మత్వమునందు మమేకమగుచున్నాడు. పరిపూర్ణుడై స్థూల - సూక్ష్మ - కారణ దేహపరిధులను దాటి ‘విదేహముక్తుడు’ అగుచున్నాడు. (లేక) ‘నేను దేని చేతనో బద్ధుడను’ అను భావనలను అధిగమించి, భావములకు ఆవల రామబ్రహ్మమై, శివాత్మకుడై, ఆత్మానారాయణుడై, భావనారాయణుడై వెలుగొందుచున్నాడు.
సయేవ కైలవ్య ముక్తిః! అదియే కైవల్యముక్తి…అని కూడా చెప్పబడుచున్నది. కేవలీస్థితి యొక్క సిద్ధియే కైవల్యసిద్ధి.
ఈ ‘108’ ఉపనిషత్తుల ఉపనిషత్ వాఙ్మయమును అధ్యయనము చేస్తూ ఉన్నవాడు. క్రమముగా సర్వలోకముల స్థితిగతులను పాము కుబుసమువలె విడచి ‘బ్రహ్మలోకనివాసి’ అగుచున్నాడు. దేహ-దేహానంతర స్థితులలో కూడా ’సర్వము బ్రహ్మముగా చూడటము’ అను సందర్శనము, సంభావనములతో కూడిన బుద్ధిస్థితియే “బ్రహ్మలోకము”. అట్టి బ్రహ్మలోకమును చేరి బ్రహ్మమే తానైనట్టి పూర్ణానందుడు-సృష్టికర్తయగు బ్రహ్మదేవుని ముఖతః వేదాంత శ్రవణము చేయువాడై, కైవల్యపీఠము నందు శాశ్వతుడై ఉంటున్నాడు.
ఆంజనేయుడు : అట్టి కైవల్యముక్తి లభించటానికై భక్తిమార్గము, కర్మమార్గము, క్రియాయోగమార్గము మొదలైన వేరు వేరు మార్గములు వేరు వేరు గురువులచే ‘ఇదియే మార్గము’ అని చెప్పబడుచున్నది కదా! అన్నిటికంటే ఉత్తమమైనదేది? శ్రీరామచంద్రుడు : అన్ని మార్గముల అంతిమ స్థానము కైలవ్యమేనయ్యా! ‘కేవలీ స్వరూపమగు ఆత్మయే నేను’ అని ఎరుగుటయే! అట్టి ఎరుక బుద్ధికి (అవగాహన)కు సంబంధించినది. క్రియలకు సంబంధించినది కాదు. అందుచేత కర్మ - సాంఖ్య - క్రియా యోగములను ‘ఉపాసనలు’ (లేక) ‘మార్గములు’ (లేక) ఉపకరణములు అని భావించు. చివరికి కైవల్యము జ్ఞానమార్గము చేతనే (తెలుసుకొనుటచేతనే) సిద్ధించుచున్నది. కర్మయోగము, భక్తియోగము, కుంభకాది - చక్రోపాసనాది క్రియాయోగము… చేత కాదు. అవన్నీ బుద్ధిచే బుద్ధికి ఆవలగల ’కేవలీ స్వస్వరూపానుభవము’ నందు లయము పొంది, ద్వితీయమేలేని నా అద్వితీయ స్థానము చేర్చుచున్నాయి…. అనునదే ఉపనిషత్ సారాంశము. “వెళ్ళవలసినచోటికి వెళ్ళామా? లేదా?” …. అనేది ముఖ్యం గాని, “ఏమార్గంలో ఏవాహనం ఉపయోగించాము” అనునది గొప్ప - తక్కువ అను రీతిగా చర్చనీయాంశం కాదు. |
ద్వితీయ అధ్యాయము
శ్రీ ఆంజనేయ స్వామి : హే భక్తవత్సలా! అపార కరుణాసాగరా! జీవులను తరింపజేయు తారకరామా! మీరు జీవన్ముక్తి - విదేహముక్తుల గురించి ప్రస్థావిస్తూ వస్తున్నారు కదా!
కే అయం జీవన్ముక్తి ? - ‘జీవన్ముక్తి’ అనగా ఏది?
కే అయం విదేహముక్తిః? - ‘విదేహముక్తి’ అనగా?
కిం వా తత్ర ప్రమాణమ్? - ఆ రెండింటికీ ’ఇది’ అని చెప్పు ప్రమాణము. (శాస్త్ర నిరూపణ)… ఏది?
కిం వా తత్ర సిద్ధి? - అవి ఈ జీవుడు ఎట్లా సిద్ధింపజేసుకోగలుగుతాడు?
సిద్ధ్యా వా కిం ప్రయోజనం? - సరే, అవి రెండూ సిద్ధిస్తాయనుకోండి, అప్పుడు ఈ జీవునికి కలిగే ప్రయోజనము ఏమిటి?
శ్రీరామచంద్రుడు : ఓ హనుమా! సర్వదా అనంత చిత్కళా స్వరూపమగు ఆత్మస్వరూపుడే అయి ఉన్న ఈ జీవునివద్ద - ’చిత్తము (అభిరుచి ఇష్టము)’ అనబడేది (అనంత కళలలో) ఒక కళ అయిఉన్నది. చిత్ సూర్యుని నుండి బయలుదేరే అనేక కిరణములతో ఈ చిత్తము ఒకానొక కళాకిరణము వంటిది. అట్టి ఈ జీవునియొక్క చిత్తము (చిత్ స్వరూపమునుండి బయెల్వడలినప్పటికీ)….. ఎప్పటి నుంచో కొన్ని చమత్కారమైన లక్షణములను ఆశ్రయించినదై ఉంటోంది.
”నేను దృశ్య సంఘటనలకు కర్తను! నేనే భోక్తను! ఈ ఇంద్రియ దృశ్యము నాకు సంబంధించినది! నేను వీటికి సంబంధించినవాడను! వీటికి పరిమితుడను! ఈ సుఖ దుఃఖములకు సంబంధించినవాడను. అందుచేత వీటికి బద్ధుడను!” ఇటువంటి లక్షణములను ఈ చిత్తము పుణికిపుచ్చుకుంటోంది. పురుషస్య కర్తృత్వ - భోక్తృత్వ సుఖ దుఃఖాది లక్షణః చిత్త ధర్మః ! ఇవన్నీ చిత్తము యొక్క ధర్మములు (Functions / Features) అయి ఉంటున్నాయి. క్లేశ రూపత్వాత్ ‘బంధో’ భవతి। క్లేశములకు కారణమగుచు, చివరికి ఈ పురుషునికి [పురుషకారము (Functional Consciousness) కలిగి ఉన్న ఈ జీవునికి] ‘నేను బద్ధుడను’ అను భావనను తెచ్చిపెడుచున్నాయి.
అట్టి ఈ చిత్తమును ‘కర్తృత్వ -భోక్తృత్వ భావనల నుండి, సుఖ-దుఃఖ-పాప-పుణ్య-ఇత్యాది లక్షణముల నుండి నిరోధించటమే ’జీవన్ముక్తి’ యొక్క రూపము.
అటు తరువాత ’నేను ఉపాధి పరిమితుడను. దేహము అను ఉపాధికో, మనస్సు అనే ఉపాధికో, జీవుడు అనబడు ఉపాధికో సంబంధించిన వాడను’ అనునదంతా వదిలివేసి, ‘ప్రారబ్ధము’ అనే స్వసంకల్పిత కల్పితమును కూడా దాటివేసిన స్థితి - ‘విదేహముక్తి’.
అట్టి ’జీవున్ముక్తి - విదేహముక్తి’లకు ప్రమాణము అష్టోత్తర శత ఉపనిషత్ వాఙ్మయమ్!
కర్తృత్వాది దుఃఖనివృత్తి ద్వారా నిత్యానంద అవాప్తిః ప్రయోజనమ్ భవతి!
‘నేను కర్తను - నేను భోక్తను - ఎదుటివాడు కర్త - అతడు భోక్త’ మొదలైనవన్నీ దుఃఖవృత్తులు (Avocations pertaining to one’s meloncholy). అట్టి వృత్తుల నివృత్తి చేత ‘నిత్యానంద స్థితి’ని సంపాదించుకోవటమే జీవన్ముక్తి-విదేహముక్తిల యొక్క ’ప్రయోజనము’.
అట్టి నివృత్తి కొరకే మానవజన్మయొక్క ఉద్దేశ్యము, ప్రయోజనము కూడా!
అట్టి జీవన్ విదేహముక్తి అగు ‘దుఃఖ నివృత్తి రూప నిత్యానంద స్థితి’ ఎట్లా ప్రాప్తిస్తుంది?
తత్ పురుష ప్రయత్నేన సాధ్యో! పురుషప్రయత్నము చేతనే! ఒకడు అందుకు ప్రయత్నించుటచే జగత్ అతీత దుఃఖరాహిత్య స్థితిని తప్పక సిద్ధింపజేసుకోగలడు.
ఒకడికి సంతానము కలుగనప్పుడు ‘పుత్రకామేష్టి యాగము’ అనే ప్రయత్నము చేస్తున్నాడు. అట్టివాడు అట్టి ప్రయత్నముచే సంతానము పొందుచున్నాడు కదా!
మరొకడు ‘ధనము సంపాదించాలి’ అని వ్యాపారము చేయుచున్నాడు. శ్రమించి డబ్బు సముపార్జిస్తున్నాడు. ఈ ప్రపంచములో పేరు ప్రతిష్టలు, యుద్ధ ప్రావీణ్యత, సంగీత సాహిత్యములు ఇటువంటి వాటిని కోరుకొనువాడు వాటి కొరకై ప్రయత్నించి - కదా…సంపాదిస్తున్నాడు!
అదే విధంగా…,
వేదాంత శ్రవణము-మనము-నిదిధ్యాస (వినటము, అనుకోవటము, అనిపించటము) - ఇటువంటి పురుష ప్రయత్నముల చేతనే ఈ జీవుడు జీవన్ముక్తి - విదేహముక్తి దుఃఖనివృత్తి (Relief from all worries), కైవల్యము, మొదలైనవి సిద్ధించుకోగలుగుతాడు.
‘పురుషప్రయత్నము’నకు సిద్ధపడకుండా, ఊరికే కూర్చుని ‘ఆ త్రోవన పోయేవాడు వచ్చి నాకు అవన్నీ ఇస్తే బాగుండుకదా’! అని అనుకుంటూ ఉంటే, పగటి కలలు కంటూ ఉంటే ఈ జీవునికి ఏమి ప్రయోజనము? పురుష ప్రయత్నము చేతనే అవి లభించగలవు - అని జీవుడు మొట్టమొదట విశ్వసించాలి.
అసలు ఈ జీవునికి బంధము ఎట్లా వచ్చి పడుతోంది? వాసనలు (Tendenicies) చేతనే! అభ్యాసవశం చేత “అది కావాలి! ఇది పొందాలి! అది ఆవిధంగానే ఉండాలి. లేదా నా గతి ఇంతే”… అని తలచుచూ ఉండగా వాసనలు ఏర్పడుచున్నాయి.
సర్వ వాసనా క్షయాత్ తత్ లాభః అత్ర శ్లోకాః!
‘నాయనలారా! వాసనాక్షయముకై ఉపక్రమించండి! అద్దాని చేతనే కైవల్యపదమగు ‘స్వయమాత్మాఽహమ్’ లభించుచున్నది’…అని శ్రేయోభిలాషులగు ఆత్మజ్ఞులు (ఊర్ధ్వ భాహుః విరౌమ్యేష)-ఎలుగెత్తి గుర్తు చేస్తున్నారు. గానం చేస్తూ వినిపిస్తున్నారు!
శ్రీ ఆంజనేయుడు : స్వామీ! ప్రతి జీవుడు వాస్తవానికి పురుషకారము కలిగియుండియే ఉన్నాడు కదా! ఏదో ఒక ప్రయత్నమునకు ఉపక్రమించి సామర్థ్యము కలిగియే ఉన్నాడు కదా!
శ్రీరామచంద్రుడు : అవును. ప్రతిజీవుడు పురుషకారము చేతనే ఈ భౌతికదేహము, శబ్ద - స్పర్శ - రూప - రస - గంధములను, ఇంద్రియశక్తులను, జాగ్రత్ - స్వప్న - సుషుప్తులు…మొదలైనవన్నీ ధారణ చేయుచున్నాడు. అట్టి పురుషకారము చేతనే వాసనలు కలిగి ఉంటున్నాడు. ఈతడు దేహధారణ చేయుచున్నప్పుడే తనవెంట వాసనలు (Tendenicies) కొన్ని తెచ్చుకుంటున్నాడు.
అట్టి వాసనలు రెండు తీరులైనవై ఉంటున్నాయి.
1) శుభ వాసనలు 2) అశుభవాసనలు
ఈ రెండింటితో ఇక ఈ దేహమును ఉపయోగించటము ప్రారంభిస్తున్నాడు. ఇప్పుడేమి చేయాలో, విను…
శుభవాసనలకు సంబంధించిన పురుష ప్రయత్నములను అధికాధికం చేసుకుంటూ, అశుభవాసనలను క్రమక్రమంగా తొలగించుకొనుచూ
ఉండాలి. ఈ రెండు విధములైన ప్రయోజనములకు కూడా పురుష ప్రయత్నమే మార్గము.
ఇది గమనించిన ఈ జీవుడు శుభవాసనలకు సంబంధించిన పురుష ప్రయత్నములను ఎప్పటికప్పుడు ఆవిష్కరిస్తూ, అశుభవాసనలు సన్నగిల్లచేయు పురుషప్రయత్నములను అధికం చేసుకోవాలి. అశుభవాసనలలోనికి లోతుగా చొచ్చుకుపోయి ఉన్న బుద్ధిని వెనుకకు మరల్చి, అద్దానిని శుభ ప్రయత్నములందు నియమించాలి. విజ్ఞులు-శాస్త్రములు సూచిస్తున్న సాధనలే అందుకు ఉపాయం.
పౌరుషేణ ప్రయత్నేన లాలయేత్ చిత్తబాలకమ్!
పురుషకారముతో కూడిన ప్రయత్నములతో ఈ చిత్తబాలకుడిని లాలిస్తూ దృశ్య సంబంధమైన ఆవేశబంధముల నుండి వెనుకకు మరల్చాలి. బుజ్జగించి క్రమంగా కొంచము ఆజ్ఞాపిస్తూ, సంస్కరిస్తూ శుభవాసనలవైపు నడిపించాలి.
ఓ శత్రు మర్దనా! ఆంజనేయా! ఏ జీవుడైతే - ఇంద్రియ విషయములపై వ్రాలుచూ గొప్ప ప్రతాపము చూపుచున్న ఈ చిత్తమును, అట్టి పునర్జన్మ హేతువులగు సంస్కారములను, గమనించి అట్టి ప్రవాహపతిత చిత్త విభాగముపై యుద్ధము ప్రకటించి, ఆ విభాగమును వశపరచుకొని, అద్దానిని శుభప్రదము. జ్ఞానప్రదము - మోక్షప్రదము అగు మార్గములోనికి మరల్చుతాడో, ఆతడే విజయము పొందుచున్న యోధుడు సుమా!
శ్రీ ఆంజనేయుడు : స్వామీ! కొందరైతే “మా చిత్తము అశుభ వాసనలవైపు వెళ్ళటము లేదు లెండి! మాకు చిత్తమును మరల్చవలసినంతగా అవసరమేమున్నది? మాకు సాధనలతో పనిలేదు” అని ఎదురు ప్రశ్న వేస్తూ ఉన్నారు! బద్ధకస్తులై కాలము గడుపుచున్నారు.
శ్రీరామచంద్రుడు : ఒకవేళ “నా చిత్తము అశుభ వాసనలవైపు మళ్ళటము లేదు”…అని అనిపించినప్పుడు కూడా, ఈ జీవుడు ఊరుకొని జీవితకాలము ఉండుటము మంచిదికాదు. అట్టి సందిగ్ధ సమయులో కూడా ఈ చిత్తమును శుభవాసనలను వృద్ధిచేయు పురుష ప్రయత్నములను ప్రారంభించటానికి, కొనసాగించటానికి నియోగించాలి. ఈ జీవుడు ప్రయత్నశీలుడై ఉండటమే మంచిదని నా అభిప్రాయము. (అందుకే ‘మానవజన్మ’ అనునది ’కర్మభూమి’గా చెప్పబడుతోంది).
ఓ వాయుపుత్రా ! నీవు పురుషకారములను ఎట్టి పరిస్థితులలోనూ వదలనే వద్దయ్యా ! కొనసాగించవలసిందే ! ఎందుకంటావా? శుభవాసనల సమృద్ధి చేత, ముందు-ముందటి స్థితిగతుల, పరిస్థితుల ప్రభావముగా ఉదయించయత్నించే అశుభపురుషకారములను ఇప్పుడే నిరోధించినవాడవవుతావు.
సందిగ్ధాయామ్ అపి భృశం శుభామ్ ఏవ సమాచరేత్!
శుభ వాసనలవలన (శుభ పురుషకారములవలన) శుభమే జరుగుతుంది కదా! శుభాయాం వాసనావృద్ధేన దోషాయ, మరుత్సుతా! కనుక శుభవాసనల ప్రవృద్ధి శుభప్రదామే అవుతుంది. దోషములు అంటని ఒక అతీతస్థితికి అవి సహకరిస్తాయి.
⌘
త్రి - అభ్యాసములు
ఓ మహామతీ!
(1) వాసనాక్షయము (2) ఆత్మజ్ఞానము (3) మనోనాశనము.
సమకాలమ్ చిరాభ్యస్తా భవంతి ఫలదా మతాః॥
ఈ మూడూ కూడా ఒకేసారి…చిరకాలము అభ్యసిస్తే, అది మహాఫలప్రదము కాగలదని నా అభిప్రాయము. అంతేగాని ఒకదాని తరువాత మరొకటి కాదు. ఎంతెంతవరకైతే ముముక్షువు ఈ మూడూ ఒకేసారిగా అభ్యసిస్తూ వస్తాడో…. అంతంతవరకు ఆత్మపద ప్రాప్తి యొక్క సామీప్యత లభించగలదు. అట్లా ఎంతెంతవరకు అనుసరించబడదో, అంతవరకు ఆత్మపదప్రాప్తి అల్లంత దూరముగానే ఉంటోంది.
త్రయం ఏతే సమం యావత్ న అభ్యస్తా చ పునః పునః, తావత్ న పద సంప్రాప్తిః భవత్యపి సమాశతైః।
మూడు ఒక్కసారే అభ్యసించకపోతే, వందల వేల సంవత్సరాలు, జన్మలు గడిచినా కూడా ముక్తి లభించటం లేదు. మంత్రమును, అర్థమును ఒకేసారి ఉపాసిస్తేనే ఉత్తమ ప్రయోజనము చేకూరుచున్న తీరుగా, ఆ మూడూ ఒక్కసారి ఆశ్రయిస్తేనే పరబ్రహ్మస్థానము లభిస్తోంది మరి!
ఒక తామరతూడును కత్తిరిస్తూ ఉండగా, అందులోని సన్నటి దారములు కూడా తెగిపోతాయి కదా! అట్లాగే వాసనా క్షయము, జ్ఞాన సముపార్జన, మనోలయములను ఒక్కసారే అభ్యసిస్తూ ఉండగా హృదయములోని చిక్కుముడుల రూపమున "సృష్టి సృష్టించబడుతోంది. స్థితి కలిగి ఉన్నది - లయిస్తోంది” - అను రూపముగా ఉంటున్న హృదయగ్రంథులు (చిక్కుముళ్లు) విడిపోతున్నాయి.
… ఇవన్నీ ముడి వీడుతాయి.
స్వస్వరూపముపై బనాయించుకున్న సర్వ శంకలు (Atributed Illusionary assumptions and pressumptions on one’s own
self) తొలగుతాయి.
ఓ ఆంజనేయా! ఈ జీవుడు అనేక జన్మ - జన్మాంతరములుగా అసంఖ్యాక-మిధ్యావాసనలన్నీ తన సంస్కార దేహములో మూటలు కట్టుకొని ఉండి, ఇప్పుడీ మానవ దేహము స్వీకరించినవాడై ఉన్నాడు. (ఆ సంస్కార దేహమే ‘కారణదేహము’ కూడా). అవన్నీ తొలగాలంటే చిరకాలము వాసనాక్షయ-ఆత్మజ్ఞాన-మనోనాశన త్రివిధములైన ఆశయములతో పురుషప్రయత్నము అత్యవసరము.
ఈ జీవుడు స్వతఃగా ఆత్మారామస్వరూపుడేనని మొట్టమొదటే అనుకున్నాము కదా! మరి ‘బంధము’ అనునది ఎక్కడినుండి వచ్చి ఇక్కడికి దిగుమతి అయింది? తస్మాత్ వాసనాయుక్తమ్ ‘మనోబద్ధమ్’ విదుః బుధాః | వాసనలతో కూడియున్న మనస్సే బంధమునకు కారణము - అని బుద్ధిమంతులగు విజ్ఞులు ప్రకటించుచున్నారు. నీవు కనుక ఇప్పుడు పురుషాకారముతో ప్రయత్నశీలుడవై మనస్సునుండి ఆయా విషయ వాసనలను తొలగించివేసుకొన్నావా…, ఇప్పుడే, ఇక్కడే ‘ముక్తి’ లభించగలదు. వాసనలకు వేరుగా బంధము లేదు. దృశ్యవాసనలు తొలగటము తప్పించి వేరుగా ‘ముక్తి’ అనునదేదీ వేరుగా లేదు.
అందుచేత ఓ మహాకపీ!
మనో నిర్వాసనీ భావమ్ ఆచరాశు!
ఏదో ఒక ఉపాయముతోనో, లేక కొన్ని కొన్ని ఆయా ఉపాయముల సహాయముతోనో - ఈ మనస్సును ఎంత త్వరగా ‘వాసనారహితము’ చేసుకొంటే, అంతగా మంచిది.
అయితే, మనస్సు నుండి దృశ్య సంబంధమైన వాసనలు తొలగటానికి మార్గమేమిటి? ఉపాయమేమిటి?
’ఈ కల్పిత జగత్తును అధిగమించి, ఈ జగత్తంతా ఎందులో అలంకారప్రాయ మాత్రము అయిఉన్నదో… అట్టి సర్వే - సర్వత్రా సమరస రూపమైయున్న ఆత్మ సందర్శనము’ అను అభ్యాసముచే వాసనలన్నీ తమకు తామే త్వరత్వరగా తోకముడుస్తాయి.
వాసనలు లయిస్తూ ఉండగా… ఇక ఈ ‘చిత్తము’ అనబడునది ‘తైలము (నూనె) అయిపోతూ వస్తున్న దీపము’ వలె తనకు తానే శమించగలదు.
ఓ వాయునందనా? ఆ విధంగా వాసనలు పరిత్యజించబడుచుండగా… మనస్సు స్వతఃగానే అన్ని ఆదుర్దాలు - దిగుళ్లు - దృశ్య సంబంధమైన ఆయా భావావేశాలు పాము కుబుసమువలె పరిత్యజించివేస్తూ… సత్-చిత్-ఆనందమగు రామానంద స్వరూపమునందు స్వయముగా ప్రవేశించుచున్నదగుచున్నది. ఆ జీవుడిక తత్ స్వరూపుడై, సత్-చిత్-ఆనంద అఖండ సుఖమును సిద్ధించుకొనుచున్నాడు. ఏ వేగిరపాటూ లేనివాడై రామానందసాగరమునందు ఆనంద తరంగమై, తదితరులను అట్టి ఆనంద తరంగములు గానే వీక్షిస్తూ, ఈ జగత్తులో తృప్తి - సంతోషములతో విహరిస్తున్నాడు. ఈ జగత్ సంగతి - సందర్భములకు ఏమాత్రము పట్టుబడనివాడై ఉంటున్నాడు.
శ్రీ ఆంజనేయస్వామి : ఆ తరువాత ఆతడు సమాధిలో ప్రవేశించి జగత్తును త్యజిస్తాడా, స్వామీ?
శ్రీరామచంద్రుడు : ఒకడు దృశ్య సంబంధమైన సర్వ స్థితి వ్యవహారములను త్యజించివేసి ’సమాధినిష్ఠడు’ అయిఉండవచ్చుగాక! (లేదా) ఈ దృశ్యములోనే ఉండి అనేక దృశ్య సంబంధమైన కర్మలు - వ్యవహారములు నిర్వర్తిస్తూ తలమునకలై ఉండవచ్చుగాక! ఎవ్వడైతే తన హృదయాంతరములో సర్వ ప్రాపంచక విషయములను రహితము చేసివేసుకొన్నవాడై ఉంటాడో… అతడు నిత్యముక్తుడేనయ్యా!
[యోగరతో వా భోగరతో వా, యద్యతి బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ! - శ్రీ ఆది శంకరాచార్యులు]
ఈ మనస్సు ప్రపంచములో ఉండవచ్చుగాక! మనస్సులో ఈ ప్రపంచము ఉండవలసిన పనిలేదే! నటించే వానిని నాటకంలోని సందర్భములు కలచివేయటమేమిటి? ఆత్మజ్ఞానముచే అది తప్పక సుసాధ్యమే!
అట్టి ఆత్మ తత్త్వజ్ఞానికి …,
… క్రొత్తగా వచ్చే ప్రయోజనమూ లేదు. కోల్పోవునదీ లేదు. ఆత్మయే సిద్ధించిన తరువాత ఇక క్రొత్తగా ప్రాప్తించవలసినదేమున్నది? ప్రాప్తించనిదేమి?
ఓ ప్రియ మారుతపుత్రా! ఆంజనేయా!
సంత్యక్త వాసనాన్ మౌన, ధృతే నాస్తి ఉత్తమం పదమ్!
ఈ మనస్సు సర్వవాసనలు త్యజించి, దృశ్యము గురించిన ఏ ఒక్క విషయమూ ఏ మాత్రమూ ‘మననము’ చేయకుండా సర్వాతీతమగు ’మౌనము’ వహించి, అట్టి ’ధృతి’ని కలిగి ఉండటము మించిన ఉత్తమ పదము మరొక్కటేదీ లేదయ్యా!
శ్రీ ఆంజనేయస్వామి : ప్రియ రామా! ఈ ఇంద్రియముల వలననే కదా, వాసనలు ఏర్పడుచున్నాయి? ఇంద్రియము లేకుంటే, వాసనలే ఏర్పడేవి కావేమోకదా?
శ్రీరామచంద్రుడు : ఈ కళ్ళు - చెవులు ముక్కు …ఈ ఇంద్రియములన్నీ ఉపకరణములు మాత్రమే. అనగా, స్వయముగా - జడములు. మరొకటి చేత ఉపయోగించబడుచున్నప్పుడు మాత్రమే క్రియాశీలకములు.
జడమైన వస్తువుకు వాసనలేమి ఉంటాయ్? అందుచేత అవన్నీ వాసనా శూన్యములు.
వాటికి వాసనలు కలిగించు కర్తృత్వమెక్కడిది? లేదు.
శ్రీ ఆంజనేయస్వామి : మరి బాహ్య విషయములను - పదార్థములను ఆశ్రయించటానికి, స్వీకరించటానికి కారణము ఎవ్వరు? జీవాత్మయా? పరమాత్మయా?
శ్రీరామచంద్రుడు : ఆత్మ ఎల్లప్పుడూ నిష్క్రియము. సర్వసాక్షి. విషయములచే స్పృశించబడనిది! ఇక్కడి దృశ్య విషయాలను, సంగతులను, సందర్భములను, సంబంధ - అనుబంధ - బాంధవ్యములను, ఇష్ట - అయిష్టములను, ప్రియ - అప్రియములను, శత్రు - మిత్ర ప్రభావములను, మాన - అవమానములను, ఆశ - నిరాశలను, భావ - అభావ ఉద్వేగములను మొదలైన వాటినన్నీ ఈ ఇంద్రియములు స్వీకరించటానికి కారణము… ఈ జీవుని యొక్క పూర్వవాసనలే! మనస్సే వాసనలకు కారణం.
ఏ విధముగా అయితే ‘స్వతహాగా జడమే’ అయినట్టి ఈ కళ్లు - చెవులు మొదలైన ఇంద్రియములు (పులుసులో ప్రవేశించిన గరిటవలె) ఆయా విషయములపై వ్రాలుచున్నప్పుడు కూడా, “ఇది బాగున్నది, అది బాగోలేదు, ఇవి కావాలి, అవి వద్దు" - మొదలైన భావములు తమకు తాముగా ఏమీ పొందకయే ఉన్నాయో….,
ఆ విధముగా ఒక ధీరుడైన ఆత్మజ్ఞాని తాను పొందుచున్న విషయములందు, పాల్గొనుచున్న కార్యక్రమములందు ఇంద్రియములతో నిర్వర్తిస్తున్న సర్వకర్మలయందు రాగరహితుడై తప్పక ఉండగలడు.
అజ్ఞానియో రాగసహితుడై పాల్గొనుచున్నాడు. జ్ఞాని - అజ్ఞానిల మధ్య అంతరము ఇంతవరకే!
ఓ మారుతీ! హనుమా!
జ్ఞాని తనయొక్క చిత్తముతో జగత్ భావములను అనుసరిస్తూ ఈ దృశ్య జగత్తుతో ప్రవర్తించుచున్నప్పటికీ - హంస క్షీరభాగమును స్వీకరించి జలవిభాగమును త్యజించివేయు విధంగా - ఇక్కడ ’ఆత్మతత్త్వసారము’ను మాత్రమే స్వీకరించి, తదితరమైనదంతా జగత్ నాటకముయొక్క ‘రక్తి’కే వదలివేయుచున్నాడు. అది ఎరిగినవాడే ముని! (మౌన ధారణాన్ మునిః!).
ఇక ఆత్మ తత్త్వమును పరిశీలించనట్టి, దృష్టిలో ఏమాత్రము కలిగి ఉండనట్టి, అందుకు సరిఅయిన మార్గములో ప్రయత్నించనట్టి జీవుని విషయము ఏమంటావా? ఆతని చిత్తము ఎల్లప్పుడూ పదార్థ భావననే అనుసరిస్తూ ఉండటము చేత… అనుక్షణమూ అతి చంచలమై ఉంటోంది. ఎందుకంటే దృశ్యములో ప్రతిది అనుక్షణము మార్పు చెందుతూనే ఉంటుంది కదా! ఈ చిత్తము అనేక భ్రమణములు కలిగి ఉండటముచేత ఆ జీవునికి శాంతిస్థానమేదో తెలియుటయే లేదు. అట్టి చంచలచిత్తము జన్మ-జనన-మరణ-మాతృగర్భ పునఃప్రవేశ - పునర్జన్మ పరంపరలకు కారణముగా అగుచున్నది.
వాసనలు - ప్రాణ స్పందన
ప్రాణస్పందనము కూడా వాసనల కారణముగానే ఏర్పడుతోంది. అటుపై ప్రాణ స్పందన వలన తిరిగి వాసనలు ఏర్పడుచున్నాయి.
బీజములోంచి వృక్షము, మరల ఆ వృక్షము లోంచి బీజము బయల్వెడలుచున్న విధంగా…,
వాసనల రూపమైన చిత్త బీజమునుండి ప్రాణస్పందన…,
ప్రాణస్పందన నుండి వాసనలు…,
ఏర్పడుచూ పోతున్నాయి.
చిత్తము అనే వృక్షమును రెండు బీజములు ఉన్నాయి. (1) ప్రాణస్పందన, 2) వాసనలు… ఈ రెండింటిలో ఒకటి నశిస్తే, ఇక రెండవది తనకు తానే నశించగలదు. ఈ రెండూ కలసి ఉంటేనే ‘చిత్తము’ అనబడునది మనుగడ కలిగినదై ఉండగలదు.
శ్రీ ఆంజనేయస్వామి : ’సంసారము’ అనునది కదా, ఈ జీవునికి బంధకారణము! అట్టి సంసారము శమించేది ఎట్లా?
శ్రీరామచంద్రుడు : సంసారము యొక్క రూపమేమిటి? వస్తు-విషయ-వ్యవహారములవైపుగా పరుగులు తీయు భావ - అభావములే! ఈ జీవుడు ప్రాపంచిక వ్యవహారములను సంగరహితుడై (sans any attachments) నిర్వర్తిస్తూ ఉంటే, క్రమంగా భావ-అభావరూపమగు సంసారము తనకు తానే శమించగలదు.
శరీరనాశ దర్శిత్వాత్ వాసనా న ప్రవర్తతే!
’ఈ శరీరము కూడా దృశ్య వస్తువువలె నశించబోవు స్వభావము కలిగియే ఉన్నది కదా!” అను జ్ఞప్తి - సందర్శనములచే వాసనలు సన్నగిల్లగలవు.
వాసనా సం పరిత్యాగాత్ చిత్తం గచ్ఛతి అచిత్తతామ్!
వాసనలు పరిత్యజించుచుండగా చిత్తము అచిత్తముగా (లేనిదిగా) అయి ‘చిత్స్వరూపము’నందు ఏకత్వము చెందినది అగుచున్నది.
ఎల్లప్పుడూ అవాసనత్వము అభ్యసించటం జరుగుతూ ఉంటే, మనస్సు మననము త్యజించినదగుచూ, ఆత్మకు అభిన్న స్వరూపమై ’అమనస్కము’ సిద్ధించుచున్నది. అట్టి అమనస్క స్థితి చేత దృష్టి - జగత్తు కూడా ఉపశమించినవై ఇదంతా ఆత్మరూపముగా అనుభవమగుచూ, ఇక ఆ జీవుడు పరమవిశ్రాంతి రూపమగు పరమపదమును పొందుచున్నాడు.
ఎంతెంతవరకైతే అట్టి అమనస్కము రూపుదిద్దుకుంటూ ఉండదో అంతంతవరకు స్వస్వరూపమగు ’ఆత్మతత్త్వము’ అనుభవమునకు విషయమై లభించదు. (అమనస్కము = విషయములను స్పృశించకముందే ఉన్నట్టి కేవల మనోరూపము).
కాబట్టి ఓ పవనతనయా! సర్వమునకు పరమై, సర్వస్వరూపమైయున్న ఆత్మ - గురు శాస్త్ర ప్రమాణముల సహాయముతో అనునిత్యానుభవముగా అయ్యేవరకు - అమనస్కయోగమును (ఈ ఎదురుగా ఉన్న దానిని ఆత్మస్వరూపముగా అనుకోవటము - అను అభ్యాసమును) అభ్యసించటము అవసరమే! అందుకుగాను శాస్త్రములచేతను, గురువుల చేతను సూచించబడుచున్న శుభకర్మలను, యోగాసాధనములను నిర్వర్తించుచూ ఉండాలి.
అటు తరువాత ఏ విధంగా అయితే వైద్యుడు సూచించిన ఔషధములను ఒక రోగి (రోగము తొలగిన తరువాత) సేవించటము మానివేస్తాడో… ఆ విధంగా శుభకర్మసంబంధమైన వాసనలను కూడా ఈ జీవుడు త్యజించివేస్తూ, ‘సంపూర్తిగా అంతరంగ వాసనా రాహిత్యము’ వైపుగా అడుగులు వేయును గాక!
కర్మలు నిర్వర్తించటముగాని, దైవసంబంధమైన యజ్ఞ-యాగ-వ్రత-జపములు చేయుటగాని, ‘లోక సానుకూలత్వము - సందర్భానుచితము’లను దృష్టిలో పెట్టుకొని, “ఇది ఇప్పుడు ఈ జగన్నాటకంలో నా పాత్రయొక్క ధర్మము. కనుక ఇట్లు నిర్వర్తిస్తాను!” - అను అవగాహనతో నిర్వహించునుగాక!
నాటకములో నటించువాడు పాత్ర ధర్మములను తనపై ఆపాదించుకొని ’ఇది నా ప్రేమ! ఇది నా ఆవేశము! ఇది నా కోపము’! ఇది నా పుణ్యము. ఇది నా పాపము” అని ‘మమ’ అనుకోకుండానే అవన్నీ పాత్రోచితముగా నిర్వర్తిస్తున్నాడు కదా! జగన్నాటకములో కూడా జీవుడు అంటీ - అంటక, ముట్టీ - ముట్టక జగత్తులోని తన పాత్రను ఎందుకు నిర్వర్తించలేడు? నిర్వర్తించగలడు! కనుక చిత్తము లేనివాడై చిత్తము ప్రదర్శించటమే చిత్త నాశనము, వాసనా నాశనము కూడా!
ఈ చిత్తము యొక్క నాశనము రెండు తీరులైనవిగా ఉంటుంది.
1) సరూపచిత్త నాశనము : కనబడే నామ - రూపాత్మకమైనదంతా ఆ పరమాత్మయొక్క మాయా విశేషముగా భావన చేయటము; పరమాత్మను చేరు విధానముగా నామరూపాత్మక జగత్తులో సందర్భోచితముగా సానుకూల్యుడై వర్తించటము - సరూపచిత్త నాశనము. ఆతనికి ఇదంతా సారూప్యముగా కనిపిస్తూ, ఆత్మ స్వరూపముగా మననము చేయబడుచూ, ఆతనిచే ఆత్మోపాసన చేయబడుచున్నది. ఇది జీవన్ముక్త లక్షణము.
2) అరూపచిత్త నాశనము : ‘ఆత్మ తప్పితే ఎక్కడా కూడా (ఆత్మకు వేరుగా) సాకారము లేదు. నిరాకారము లేదు’ అను ఎరుక, దృష్టి స్థిరముగా అయి ఉండటము. ఈతని దృష్టికి, జగత్తు అనునదే లేదు! ఆత్మయే ఉన్నది. ఇది విదేహముక్త లక్షణము. విదేహముక్తుని స్వభావసిద్ధానుభూతిచే దృశ్యజగత్తు అభిన్నము, ఏకరూపమేగాని, రెండు రూపములు కాదు. ఆత్మ సర్వదా అద్వితీయమే గాని ఆత్మకు వేరుగా ‘నేను నీవు - జగత్తు’ మొదలైనవి ఇదివరకు ఉన్నవి కావు. ఇప్పుడూ లేవు. మరొకొప్పుడూ ఉండజాలవు’ అంతా ఏకాత్మయే!…అనునది విదేహముక్తి! విశ్వమంతా తనదేహమై, విశ్వాతీతుడై ఉండటమే విదేహముక్తి.
ఓ పవనసుతా! ఓ ప్రియహనుమా! అట్టి చిత్తము నశించుటచే లభించగల ప్రయోజనము ఏమిటో చెప్పుచున్నాను. విను.
సాదరము - శ్రద్ధలతో ఎప్పుడైతే ’చిత్తనాశనము’ను (ఈ సరూప అరూప చిత్తనాశన మార్గములలో) మరల మరల అభ్యసిస్తూ ఉంటావో, అప్పుడు అంతటా అన్నిటా ప్రియమగు ఆత్మ వస్తువే సందర్శనమగుచూ అనుభమవమవసాగుతుంది. సహజీవులపట్ల మైత్రి, కరుణ - ప్రేమ ఇత్యాది మధురగుణాలు స్వభావంగానే హృదయ స్పందనంగా జనించి వృద్ధి చెందుతాయి. ఆతని నుండి సర్వజీవుల పట్ల ఆప్యాయత అను ’అమృతవర్షము’ స్వభావంగా వర్షిస్తూ ఉంటుంది.
సర్వభేద దృష్టులకు, భేద అనుభవములకు కారణము ఈ చిత్తమే! అట్టి చిత్తము ఆత్మయందు లయము పొందుచుండగా సర్వ జీవులు ఆత్మస్వరూపముగా అనుభూతమగుచూ ఉంటారు. భేద దర్శనమే అశాంతికి మూలము. చిత్తము లయిస్తూ ఉంటే, భేద దర్శనము కూడా తొలగుచున్నది. ఆ జీవుడు స్వభావ సిద్ధముగా పరమ శాంతిని పొందుచున్నాడు.
అట్టివాని మనస్సు ఆత్మతో తన్మయమగుటచే ఇక ‘పునర్జన్మ’ అనే వృత్తిని మొదలంట్లా త్యజించినదై…, ఆతడు జీవన్ముక్తుడు అగుచున్నాడు. ‘వర్తమానములోనే నేను జన్మరహితుడను’ అని గ్రహించినవాడై, ’జీవన్ముక్తుడు’ అగుచున్నాడు. ఇక మరొక జన్మ యొక్క ప్రసక్తి ఎక్కడిది? సరూపో సౌ మనో నాశో జీవన్ముక్తస్య విద్యతే! నామ-రూపాత్మక-సారూప్య సంబంధితమైన మనో నాశనమునే జీవన్ముక్తి అని కూడా పిలుస్తున్నారు.
సర్వభేదములు కనిపిస్తూ కూడా… కనిపించనివై (అనిపించనివై) సమమగు ఆత్మగా అనుభూతమగుచుండటమే జీవన్ముక్తి. జీవన్ముక్తునికి ఆత్మయే ఈ అనేక భేదములతో కనిపిస్తున్నట్లు నిత్యానుభూతమగుచున్నది.
అరూపస్తు మనోనాశో వైదేహీముక్తిగో భవేత్! ఇక్కడ ‘భేదరహితమగు ఆత్మ తప్పితే, భేదము మొదలేలేదు’.. అను దృష్టిచే అది క్రమంగా ‘అరూపమనోనాశనము’ అగుచూ.. ’విదేహముక్తి’గా రూపుదిద్దుకుంటోంది. అట్టివాడు ’విదేహముక్తుడు’ అగుచున్నాడు. ఆతని సంసార సృంఖలములన్నీ తెగిపోయి ఎక్కడో నేలరాలిపోవుచున్నాయి.
సంసార వృక్షము
శ్రీహనుమస్వామి : అసలు ఈ జీవుడు సంసార బద్ధుడు అవటానికి మూల కారణమేమిటి? ఇది తొలగటానికి మార్గము ఏది? ఉపాయమేమిటి?
శ్రీరామచంద్రుడు : అవును! ఈ ‘సంసారము’ అనే వృక్షము వేలాది అంకురములు (Reproductive Features), శాఖలు (Different
Extensions), ఫలములు (Many Results), పల్లవములు (చిగుళ్లు) కలిగి ఉన్నదై మహావృక్షరూపమున ఈ జీవుని యందు తిష్ఠ వేసుకొని ఉన్నది. ఈతడు అనేక బంధములు కలిగి ఉండటానికి కారణముగా అగుచున్నది.
అట్టి సంసార బంధము (లేక) సంసార వృక్షము బాహ్యమున దృశ్య ప్రపంచములో ఉన్నదా? లేనే లేదు. బాహ్యమున ఉన్నది అద్దాని శాఖలు మాత్రమే! అది హృదయమునందే స్థితి కలిగి ఉన్నది. అద్దాని యొక్క మూలము ఈ జీవుని యొక్క మనస్సే! అట్టి మనస్సు చేతనే ఈ జగత్తు, ఇక్కడి భేద భావములు.. ఇవన్నీ అనుభవమగుచూ, ఈ జీవుని కట్టిపడేసి, అనేక జన్మపరంపరలలోనికి దొర్లిస్తున్నాయి.
అస్య సంసార వృక్షస్య మనోమూలమ్ ఇదమ్ స్థితమ్ - సంసార వృక్షమునకు మూలము మనస్సే! మనస్సు అనగా ఏమి? సంకల్పయేవ తన్మన్యే। సంకల్పములే ‘మనస్సు’గా చెప్పబడుతోంది.
‘సంకల్పించటము’ అనే సుదీర్ఘముగా అభ్యసిస్తూ వస్తున్న దురలవాటు మానుకోబడిందా, అట్టి సంకల్ప ఉపశమనముచే ’మనస్సు’ అనబడునది కూడా ఉపశమిస్తుంది.
ఈ ‘సంసారము’ అనే పూతీగ 14 లోకములలోకి ప్రాకి విస్తరించి అనేక ఫల-పుష్ప-పునః ఉత్పత్తులను కొనసాగిస్తోంది. అది ‘సంకల్పములు’ అనే జలము పోస్తూ ఉండటము చేతనే ఆ విధంగా విస్తరిస్తూ, ప్రాకుతూపోతోంది. ఎప్పుడైతే నీవు ’సంకల్పములు’ అనే జలమును ఈ సంసార పూపాదుకు మొదట్లో పోయటము మానివేస్తావో…, అప్పుడు ఇది ఎండి తనకుతానే నశించగలదు.
సంకల్ప ఏవ తన్మన్యే - సంకల్పము రూపమే మనస్సు. మనస్సే సంసారము.
సంకల్ప ఉపశమేన తత్ - సంకల్పములు చేయకుండా ఉంటే మనస్సు ఉపశమిస్తుంది. ‘సంకల్పించకపోవటము’ అనునదే ఈ ‘మనోకల్పిత సంసారము’ యొక్క ఉపశమనమునకు ఏకైక ఉపాయము. “ఆఁ! ఏమున్నదిలే?” అని తలచి నీవు నిస్సంకల్పము (సంకల్పరాహిత్యము) కొరకు ప్రయత్నించకపోయినావా,…. అప్పుడు నీ మనస్సు సంసారమును వృద్ధి చేసుకుంటూనేపోతుంది.
మనస్సు వృద్ధి చెందటము చేతనే ఈ జీవుడు జన్మ-కర్మల అరణ్యములో చిక్కుకుని తిరుగాడుచున్నాడు.
మనసో అభ్యుదయో నాశో : మనస్సు యొక్క అభ్యుదయమే సర్వదుఃఖములకు, అజ్ఞానమునకు కారణమై ఈ జీవుని జన్మ-మృత్యువుల మధ్య వ్రేలాడునట్లుగా చేయుచున్నది. అదియే జీవునిపట్ల వినాశనము.
మనోనాశో మహోదయః : మనస్సు నశించటము చేత ఈ జీవుడు శివస్వరూపుడై మహోదయమును పొందుచున్నాడు.
విజ్ఞుడు మనస్సును ఉపయోగించుకొని మనస్సును నశింపజేసుకొని, సంసార బంధముల నుండి విముక్తుడై ఆత్మానుభవమునందు ఉదయిస్తున్నాడు.
అజ్ఞుడో.. ఆతని మనస్సే ఆతనికి బంధముగా అగుచున్నది.
‘మనస్సు యొక్క ముఖ్యలక్షణము ఏమిటి?’ అని ఆత్మతత్త్వ పరిశోధకులు పరిశీలించి ‘ఏకత్వమును విడిచి అనేకత్వమును ఆశ్రయించటమే’.. అని గమనించి మనందరికి చాటి చెప్పుచున్నారు. అందుచేత ఇప్పుడు ఏమి చేయాలి? ‘ఏకతత్త్వము’ అగు ఆత్మనే దర్శించటము అనే దృఢమైన అభ్యాసమునకు ఈ జీవుడు సంసిద్ధుడు కావాలి. అనేకత్వమును దాటి, ఏకత్వమునే దర్శించటం ప్రారంభించాలి. ‘ఈ అనేకముగా కనిపిస్తున్నదంతా వాస్తవానికి సర్వదా ఏకమగు ఆత్మయే’ అని దృఢముగా అనుకుంటూ ఉండటమును అన్ని సందర్భములలోను ఆశ్రయించినవాడై ఉండాలి. ఏ మనస్సుతో ‘అనేకత్వము’ యొక్క దర్శనాభ్యాసము సన్నగిల్లుతూ వచ్చి, ’ఏకత్వము’ యొక్క దర్శనము, దృఢమగుతూ వస్తుందో… అదియే ‘అమనస్కము’ యొక్క రూపము.
తావత్ నిశీవ వేతాళా వల్గంతి హృదివాసనాః,
ఏకతత్త్వ దృఢ-అభ్యాసాత్ యావత్ న విజితం మనః॥
ఎంతవరకైతే నీవు ‘ఏకత్వ దర్శనము’ అనే దృఢమైన అభ్యాసమునకు ఉపక్రమించి అత్యంత శక్తి-యుక్తులతో కొనసాగించవో,..
అంతవరకు హృదయములోని వాసనల నుండి జనించిన ‘అజ్ఞానము’ అనే చీకట్లో కనబడుచున్న ‘సంసారము’ అనే భేతాళుడు నిన్ను పట్టుకొని వదలడు. కొనసాగుతూనే ఉంటాడు.
సంకల్పములు తొలిగేది ఎట్లా! పడవ (Boat) లోనికి జలము ప్రవేశించని విధంగా ఇంద్రియ విషయములు స్వీకరించకపోతే.. సంకల్పములు క్షయిస్తాయి. హేమంత ఋతువులో తామరతీగలు ముడుచుకుపోయి నశించువిధంగా, ఇంద్రియ విషయములను మననము చేయటము తగ్గించుకొంటూపోతూ ఉంటే, అప్పుడు భోగవాసనలు క్షీణిస్తాయి. క్రమంగా చిత్తము అనునది కూడా క్షీణించి, నశించుచున్నది.
శ్రీ ఆంజనేయస్వామి : ఈ పాంచభౌతిక దేహధారణ చేస్తూ కాలాంతర్గతంగా దేహముతో జీవిస్తూ ఉన్న మాకు (1) దృశ్య సంబంధమైన సర్వ సంకల్పములు త్యజించటము, (2) తద్వారా చిత్తమును జయించటము, (3) భేద దృష్టిని దాటవేయుటము ఈ మూడూ కూడా అంత తేలికైన పనంటారా స్వామీ? కాదేమో? వాటిని మనస్సుకు అలవాటు చేయటం ఎట్లా?
శ్రీరామచంద్రమూర్తి : అవును. అయితే ఇంద్రియ దృశ్య వ్యవహారముల ఏర్పడుచున్న సంకల్ప పరంపరా ప్రవాహ వేగమును నిరోధించటమొక్కటే శాంతి స్థానమునకు మార్గము. అశాంతి తొలగి శాంతి కావాలంటే అందుకు ప్రయత్నమునకు నీవు ఉద్యుక్తుడవు కాక తప్పదు! కాలవలసిదే! వేరే త్రోవ లేదు!
హస్తం - హస్తేన సంపీడ్య - చేయిచేయి అదిమిపెట్టి ఉంచి అయినా సరే….,
దంతైః దంతాని విచూర్ణ్య చ - (లేక) పళ్లు-పళ్లు నొక్కిపెట్టి అయినా సరే…,
అంగాని అంగైః సమాక్రమ్య - శరీరములోని అంగములను (అవయములను) అంగములతో మూసిపెట్టి అయినాసరే…,
ఈ మనస్సును స్వాధీనం చేసుకోవటానికి ఎంతటి బలమైనా నియోగించాలి. ఎంతటి తెలివితేటలైనా చూపవలసిందే. మొట్టమొదట మనస్సును జయించటానికి ఉద్యుక్తుడు కానివాడు తదితర భక్తి జ్ఞానమార్గములను అనుసరించి కూడా ఆత్మభావన సిద్ధించుకోలేడు.
అందుకు ఒక ఉపాయం! ఒకచోట చక్కగా ఆశీనుడై, సుఖాసనమును ఆశ్రయించి, ‘ఆత్మతత్త్వము’ గురించి మనస్సును నియమిస్తూ ఉండాలి. శాస్త్రములు, గురువర్యులు సూచిస్తున్న మనో నిరోధక శమ-దమ-తితీక్ష ప్రాణాయామ ప్రత్యాహార-ధ్యాన-ధారణ-సమాధి ఉపాయములను ఉద్వేగరహితంగా ఆశ్రయించాలి. ప్రయత్నము, ఉపాయము ఈ రెండూ తెలుసుకొని సాధన చేయాలి. సాధనను ఆత్మవిచారణ దగ్గరకు కొనిపోవాలి.
అనిందితమైన (తదితరులకు ఇబ్బంది కలుగజేయునట్టి) ఉపాయములను ఆశ్రయిస్తూ మనస్సును జయించి, అద్దానిని.. ఆత్మతత్త్వము వైపు నియమించాలి.
ఓ హనుమా! ఒక ప్రదేశముతో ఒక దుష్ట ఏనుగు మదగర్వముతో జనులకు హాని కలిగిస్తోంది. అప్పుడేంచేస్తాము? గజము (ఏనుగు)ను వశం చేసుకోగల సామర్థ్యము గల మావటివానిని పిలిపిస్తాము. ఆతడు అంకుశముతో వచ్చి, ఆ మదగజమును స్వాధీనము చేసుకొంటాడు. అంకుశము లేకుంటే మత్తగజము మాట వింటుందా? వినదు కదా! మనస్సు అనే గజమును ఉపాయములతో కూడిన ప్రయత్నముతో (అనగా) ‘యోగము, భక్తి’ ఇత్యాది సాధనాలతో వశము చేసుకోవాలి.
ఒకవైపు మనస్సును నిస్సంగమార్గముగా స్వాధీనము చేసుకుంటూనే, ఆత్మతత్త్వమును పరిశీలించాలి. ’ఆత్మ అనగా ఏది? ఎక్కడున్నది? అద్దానికి నాకు సంబంధమేమి? నా స్వరూపమునకు ఆత్మకు ఏమి సంబంధము? నాకు బంధము ఉన్నాదా? లేక ఆపాదించబడుతోందా?’ మొదలైన ఆత్మ గురించిన ‘సమాచారము-వివేచన’ అందిస్తున్న ఆధ్యాత్మశాస్త్రమును పరిశీలించాలి. ఆత్మతత్త్వశాస్త్రమును ఎరిగిన సద్గురువును సందర్శించాలి. గురుముఖతః వినాలి. ‘సాధుసంగమము’ అనుబడు సదవకాశమును సద్వినియోగము చేసుకోవాలి.
1) ఆధ్యాత్మ విద్యా పరిశీలనము - సముపార్జనము.
2) సాధు సాంగత్యము.
3) ఇంద్రియములను సాధనలయందు నియమించటము, సాధనసహాయముతో వాసనలను పరిత్యజించే ప్రయత్నము.
4) ప్రాణాయామ అభ్యాసముచే ప్రాణస్పంద నిరోధము.
ఈ ఈ అభ్యాసములచేత చిత్తమును నీవు అదుపు చేసి, చిత్ స్థానమునకు చేర్చాలి. ఈవిధంగా శాస్త్రములచే, గురువులచే సూచించబడుచున్న సాధనలను, ఉపాయములను అనునిత్యముగా అభ్యసిస్తేనే సంసార రోగము శమిస్తుంది.
ఓ ప్రియభక్త శిఖామణి అగు హనుమా! ఒక్క ముఖ్య విషయము గుర్తు చేస్తున్నాను.
శ్లో॥ సతీషు యుక్తిషు ఏతాసు ‘హఠాః’ నియమయన్తి యే,
చేతసో దీపమ్ ఉత్సృజ్య విచిన్వన్తి తమో- అన్జనైః||
ఉపాయాలు ఎప్పుడూ అభ్యాససాధ్యమై, ఆ అభ్యాసికి, సహజనులకు కూడా సుఖానుకూల్య-సానుకూల్యములై ఉండటమే ఉచితము. అంతేగాని అట్టి సాధనోపాయములు ఇంద్రియములను క్షయింపజేసేవిగాను, ఆత్మను క్షోభింపజేసేవిగాను ఉండకూడదు. “ఇంద్రియములను బలవంతముగా హఠం చేసి, తద్వారా పరమాత్మను సిద్ధింపజేసుకుంటాను‘.. అనునది సముచితము కాదు. ‘హఠము’ (బలవంతము బాధతో కూడిన ప్రయత్నము) ద్వారా సత్యము, ప్రియమగు మహదాత్మను సంసాదించుకోవాలని అనుకోవటము - చీకట్లో ఏదో ముఖ్యమైన వస్తువు కనిపించలేదని, చేతిలోని వెలుగుచున్న దీపమును దూరంగా ఉంచి, కళ్లకు కాటుక పెట్టుకుంటే కనబడుతుందిలే అని అనుకొని ఇక కటిక చీకట్లో కావలసిన వస్తువుకై వెతకటము వంటిది.
ఓ పవన పుత్రా! విమూఢులగు కొందరు హఠయోగము (ఇంద్రియములను బాధించుకుంటూ), క్షోభింపజేస్తూ (లేక) తదితర జీవులను కూడా కొన్నిసార్లు బాధిస్తూ ఉంటున్నారు. తద్వారా మనస్సును జయించాలని ప్రయత్నించటం ముళ్ళున్న మార్గమే! అది క్రూరమైన అభ్యాసములచే కుదిరే పని కాదు.
ఒకడు ఒక మదగజమునుగాని, కొండశిలువనుగాని తామరతూడులోని సన్నని దారములతో బంధించాలనుకోవటము కుదిరే పనేనా? కాదు. గట్టి త్రాళ్ళతో ఉపాయంగా వాటిని బంధిస్తాము కదా! ఇదీ అంతే! ఇంద్రియములను తెలివిగా ఉపయోగించి మనస్సు - అనే మదగజమును ‘ఉపాయము’ అనే అంకుశంతో వశం చేసుకోవలసిందేగాని, ఇంద్రియములను క్షోభింపజేసి తద్వారా కానే కాదని ముముక్షువులందరికీ గుర్తు చేస్తున్నాను.
మనోవృత్తులు
శ్రీ ఆంజనేయస్వామి : తండ్రీ! శ్రీరామచంద్రా! ఈ మనోవృత్తులను మేము జయించుటకు మార్గమేమిటి?
శ్రీరామచంద్రుడు : అవును! "దృశ్య సంబంధమైన మనోవృత్తులు (Avocations)” అనే లతలచే ‘చిత్తము’ అనే మహావృక్షము ఆవరించబడినదై ఉన్నది. పైకి-క్రిందికి ఆ లతలు పిచ్చిపిచ్చిగా పాకినవై ఆక్రమిస్తున్నాయి. అయితే ‘చిత్తము’ అనే మహావృక్షము ఏ బీజము నుండి బయల్వెడలినదో, ఆబీజము రెండు విభాగములు కలిగి ఉన్నది.
1) ప్రాణపరిస్పందనము (తద్వారా జడమగు ఇంద్రియములు ప్రవర్తించగలగటము)
2) దృఢముగా దృశ్యవిషయములను భావన చేయుటము.
సర్వగతమైనట్టి సంవిత్ [సత్ = ఉనికి(+) విత్=ఎరుక (Awareness)] - ప్రాణస్పందనల చేతనే స్వీయరచనా వ్యసనరూపమగు - దృశ్యము నందు చిత్తమును - చలింపజేయటము జరుగుచున్నది.
మరొక్క విషయం కూడా! ఈ చిత్తము ఒకేసారి అనేక విషయ విభాగములతో పెనుసంబంధము కలిగి ఉండటము చేతనే, అది తనయొక్క జనన స్థానమగు (ఆది స్థానమగు) ఆత్మను ఏ మాత్రమూ కూడా గుర్తించలేకపోతోంది. ఎప్పుడైతే ఈ చిత్తము ‘అనేకములను స్మరించటము’ అనే దురభ్యాసము (దురలవాటు)ను జయించి, త్యజించి ‘ఒక విషయముపై ఉన్నప్పుడు తదితరములన్నీ త్యజించి ఉండటము’…, అనే ఏకాగ్రత కుదుర్చుకొనుచున్నదో,.., అప్పుడు ఆత్మజ్ఞానము ఉదయించటానికి పరిస్థితి సమకూరుచున్నట్లే! మరి చిత్తము ఏకాగ్రత (Concentration at one point) ను పొందేది ఎట్లా? అందుకు ధ్యానము, మార్గమైయున్నది.
అట్టి మనోధ్యానము గురించి ఈ సందర్భములో కొన్ని విషయాలు చెప్పుకుందాము. శ్రద్ధ-ఆసక్తిలతో వినెదవు గాక!
నేతి - నేతి (న ఇతి)
‘ఇది నేను కాదు! ఇది నేను కాదు’ అను మార్గములో దృశ్య-దేహ-ఇంద్రియ-ఇంద్రియ విషయ-మనో-బుద్ధి-చిత్త-అహంకారములను అధిగమించి వేయి. వికృతవికారములన్నీ తొలగించుకుంటూరమ్ము. క్రమంగా దృశ్యభావమును మొదలంట్లో త్యజించు. దృశ్య భావమంతా (దేహభావముతో సహా) తొలగిన తరువాత కూడా (ప్రక్కకు పెట్టిన తరువాత కూడా) ఏది శేషిస్తోందో, అట్టి కేవల చిన్మాత్రము (ఎరుగబడేదంతా తొలగిస్తే శేషించే కేవలీ ఎరుక)ను చింతన చేయి. తదితర చింతనలను దూరంగా వదలివేసి ఉండు.
కుంభక ప్రాణాయామము (లేక) కుంభకావస్థ
సాధారణంగా ప్రకృతిచైతన్యము యొక్క చంచలశక్తి నియమానుసారముగా గాలి దేహములోనికి ప్రవేశించటము. (ప్రాణచలనము) లోపలి నుండి ఆ గాలి బహిర్గతము అవటము (అపాన చలనము) - స్వభావసిద్ధముగా జరుగుచూ ఉంటోంది. ఏఏ స్థానములలో అపాన చలనము (Air Move from inside to out side) ఇంకనూ ప్రారంభమవక - ప్రాణచలనము (Air Move from out side to inside) ముగిసినదై ఉంటుందో ఆ సమయము, స్థానము యోగికి మాత్రమే అభ్యాసముచే అనుభవమగుచున్నది. అట్టి ప్రాణచలనము ముగిసినదై - అపానము సంబంధమైన కదలిక ఇంకా ప్రారంభముకానట్టి ఉభయప్రాణ చంచల రహిత స్థితి ‘అంతరంగ ప్రాణ కుంభకము’ అంటారు.
ప్రాణము (వాయువు) దేహమునుండి బహిర్గతమై (రేచకము) యున్న సందర్భములో దేహములోని వాయువు బహిర్గతమవటము చేత కూడా దేహమునందు ‘పూర్ణసమానవస్థ’ ఏర్పడినదగుచున్నది. బాహ్యమున ప్రాణ-అపానములు నిశ్చల స్థానము బాహ్య ప్రాణ కుంభకము. అట్టి బాహ్య-అభ్యంతర కుంభక యోగము ఇచ్ఛా పూర్వకముగా అభ్యసించబడుచూ ఉండగా, అప్పుడు ఆజీవునిలో ‘బ్రహ్మాకారమనోవృత్తి’ జనించగలదు.
సంప్రజ్ఞాత సమాధి స్థితి
శ్లో॥ బ్రహ్మాకారమనోవృత్తి ప్రవాహో అహంకృతిమ్ వినా, I
సంప్రజ్ఞాత సమాధిస్స్యాత్, ధ్యాన అభ్యాస ప్రకర్ణతః ॥
‘అందరిలోనూ నేను ఏదో ఒక ప్రత్యేకమైనవాడను’ అను ప్రత్యేక అహంకారవృత్తి - బాహ్య -అభ్యంతర కుంభక ప్రాణాయామము చేతగాని, తదితర యోగాభ్యాసముల చేతగాని - లయించగలదు. “అందరూ నాలో నేనై ఉండటము నేనే అందరిలో ’నేను’గా - ఉండటము” అను బ్రహ్మాకారమనోవృత్తిని ధ్యాన అభ్యాసముచే పొందియున్న స్థితి - సంప్రజ్ఞాతసమాధి స్థితి. “వ్యష్ఠి అహంకార భావన” నశించగా ఏర్పడునదే బ్రహ్మాకారమనోవృతి (లేక) బ్రహ్మ భావన.
అసంప్రజ్ఞాత సమాధి స్థితి
భావన నశించగా ఏర్పడు బ్రహ్మకారమనోవృత్తి (లేక) బ్రహ్మభావన. ఈ చిత్తము దృశ్యవిషయములను పూర్తిగా త్యజించివేసి ఉన్నప్పుడు, ఇక ఈ కనిపించేదంతా ‘పరమానంద జ్ఞానదీపము’గా యోగికి అనుభూతమగుచుండగా ఏర్పడు యోగుల ప్రియస్థితిని ‘అసంప్రజ్ఞాత సమాధిస్థితి’ అంటారు. జగత్తు ఉంటే కదా, అది బ్రహ్మమా - మర్మమా అను ప్రశ్న?
అతత్ వ్యావృత్తిరూపసమాధిస్థితి : ఏ యోగి దృష్టిలో ప్రభ (జ్యోతి), శూన్యమునందు లయించినదై, అట్లాగే మనోబుద్ధులు కూడా శూన్యస్వరూపము పొందటము జరిగి ‘ఈ జగత్తంతా ఆత్మయొక్క వ్యాప్తరూపమే’ - అను భావన ఘనీభూతమౌతోందో, అదియే “అసంప్రజ్ఞాత సమాధిస్థితి”. అది మునులు పొందుచున్న సమాధి.
పారమార్థిక సమాధి
శ్లో॥ఊర్ధ్వపూర్ణమ్| అథః పూర్ణం। మధ్యపూర్ణం శివాత్మకమ్ |
సాక్షాత్ విధిముఖో హి ఏష సమాధిః పారమార్థికః॥
ఊర్ధ్వము (పైన), క్రింద, మధ్య కూడా ఆత్మ వస్తువుచే పూర్ణమై, ఈసర్వము శివాత్మకమై (శివాత్ పరతరమ్-నాస్తి).. ఈ సర్వము తన బ్రహ్మదేవత్వము (సృష్టించు సంస్కారము) యొక్క ముఖరూపమై అనుభవమవటము స్వయమ్ బ్రాహ్మీభావస్థితి. “ఇదంతా నాయొక్క పారమార్ధిక స్వరూపమే” - అను స్వకీయ నిశ్చల స్వస్థితిని “పారమార్థిక సమాధి” అని అంటున్నారు.
వాసనలు
శ్రీఆంజనేయస్వామి : రామచంద్రప్రభూ! ‘ఈ జీవుని ఉపాధి పరంపరల సుదీర్ఘ ప్రయాణములకు కారణము వాసనలే’ అని చెప్పబడుతోంది కదా! అట్టి ‘వాసనలు’ అనగా ఏమై ఉన్నదో, దయచేసి వివరించండి.
శ్రీరామచంద్రుడు : దృఢ భావనయా, త్యక్త పూర్వాపరవిచారణమ్, యత్ ఆదానం పదార్ధస్య ‘వాసనా’ ప్రతి కీర్తితా! ఒకడు ‘ఇది ఇతః పూర్వము (ముందుగా) ఏమి? ఇక ముందు ఏమి కానున్నది?" - అనునది (ఒక వస్తువు - పదార్ధము, సందర్భము-సంగతి గురించి) ఏ మాత్రమూ విచారణ చేయకుండా, అద్దానిని దృఢభావనతో స్వీకరించి, అద్దానిని (అవిచారణ పూర్వకంగా) అంటి పెట్టుకుని ఉండటమును - ‘వాసన’ అని పిలుస్తున్నారు.
ఓ కపిశ్రేష్ఠా! ఇక్కడ ఒక విశేషమున్నది. ఒకడు మనస్సుతో తక్కిన విషయాలన్నీ ప్రక్కన వదలి, ఏదో ఒకానొక విషయముపై మాత్రమే ధ్యాస-ఏకాగ్రత-శ్రద్ధ కలిగి ఉన్నాడనుకో. ఆతడు అతిత్వరగా ఆ ఏకైక వస్తు రూపుడే స్వయముగా అగుచున్నాడు. ఆ ఏకైక భావనా వస్తువు యొక్క అతి సామీప్యత పొందినవాడై, అద్దానినే దర్శిస్తూ - దర్శిస్తూ “ఇదియేనేను” (లేక) “ఇదియే సత్వస్తువు!” - అను ఆత్మీభావనకు చేరుచున్నాడు. చివరికి అదియే తానగుచున్నాడు. ఈ జీవుని పట్ల ఆతని వాసనా వివశత్వము (వాసనకు వశుడై ఉండటము) యొక్క ప్రభావము అట్టిది మరి!
భావితం తీవ్ర సంవేగాత్ ఆత్మనా యత్ : దేనినైతే తీవ్రమైన సంవేగముతో ’తాను’గా భావిస్తాడో,
తదేవ సః భవతి - ఆతడు అదిగానే పరిణమిస్తున్నాడు (యత్ భావమ్.. తత్ భవతి),
విగత ఇతర వాసనః - ఇతర వాసనలన్నీ వదలి….,
వాసనా వివశీకృతః - ఒకే వాసనకు (విషయమునకు) వివశీకృతుడై ఉంటూ ఉంటే
తాదృక్ రూపో హి భవతి - ఆరూపమే తానగుచున్నాడు
ఆవిధంగా ఆతడు దేనినైతే -
ఇది నాకు సంబంధించినది. నేను దీనికి సంబంధించిన వాడిని! | అది నాకు సంబంధించినది కాదు! |
దీనిపై ఆధారపడి ఉన్నాను! | దానిపై ఆధారపడి లేను! |
ఇది నాకు అత్యంత ప్రియము! | అది అప్రియము! |
ఇది బహు సుందరము! | అది కాదు! |
ఇది అంటే ఇష్టము! | అదంటే కోపము! |
ఇది నా సొంతము! | అది కాదు! |
… ఈ విధంగా దేనిని తనకు సంబంధితము అని అనో, తాను ఆధారపడి ఉన్నాననో, తనకు ప్రియము అనియో, ‘అందముగా ఉన్నది కదా’ అనియో, తనకు ఇష్టము -అనియో, సొంతము అనియో, తనకు అవినాభావన పంబంధము కలిగి అది లేకపోతే తాను లేననియో, అది గొప్ప అనియో - ఈ తీరుగా అనుకుంటూ ఉంటే.. అనేకసార్లు అనుకోవటము వలన అది ‘అలవాటు’గా అగుచున్నది.
ఆ అలవాటు సుదీర్ఘముగా కొనసాగిస్తే అది ’సంస్కారము’ అగుచున్నది.
ఆ ‘సంస్కారము’ అభ్యాసముగా ఇంకా కొనసాగిస్తే అది ‘వాసన’గా అగుచున్నది.
సంపశ్యతి ‘యత్ ఏవ ఏతత్ వస్తు’ ఇతి ముహ్యతే! ఏదైతే ఈ జీవుడు ‘ఇది ఇట్లే సత్యము’ అని అనుకుంటూ ఉంటాడో, క్రమంగా అభ్యాసవశంగా సంస్కారముచే ‘ఇది ఇంతే’ అని మోహము చెందుచూ ఉంటాడు.
ఈ జీవుడు ’నేను దేహమును - దృశ్యబద్ధుడను - అల్పుడను - దుఃఖిని పరిమితడను’.. ఇత్యాదులన్నీ కూడా “అనుకోవటము అభ్యాసము - సంస్కారము - వాసన - అట్లే అనిపించటము అదే తాను అవటము”.. అను అభ్యాస స్థితి గతులచే సిద్ధించినవే!
చమత్కారమైన విశేషమేమంటే……
వాసనా వేగము చేత ఈ జీవుడు తాను ఏమి అనుకుంటూ వస్తున్నాడో.. అదియే తానగుచున్నాడని చెప్పాను కదా!
వాసనా వేగము చేత ఏ రూపము తానయ్యాడో.. అది ఇక ఆతడు అది వదలలేకపోవుచున్నాడు. వాసనావేగ వైచిత్ర్యాత్ స్వరూపమ్ న జహాతి తత్!
ఆతడు దుర్-దృష్టిచే భ్రాంతి పొందటం జరుగుతోంది. ఆ భ్రాంతిని భ్రాంతిగా గుర్తించటమే లేదు. ఇక ఆపై, సర్వము భ్రాంతిమయమై ఆతని పట్ల సిద్ధిస్తోంది.
ఉదాహరణకు, ఒకడు మత్తుపానీయము తీసుకొని ఉండగా, అంతా మత్తు భ్రమతో నిండినదై అగుపిస్తూ ఉంటుంది కదా!
ఈ జీవుని పట్ల కూడా తలచటము - అనుకోవటము - అనిపించటము - అలవాటు - అభ్యాసము - సంస్కారము - వాసన.. అను మెట్లుగా నిర్మితమైన వాసనలచే తాను ఆత్మను ఏమరచి స్వకీయ వాసనారూపిగా పరిణతి అయి, ఇక ఆ వాసనా ఫలితరూపమును (లేక భావనను) ఏ మాత్రమూ వదలలేకపోవుచున్నాడు. ఈ తతంగమంతా అనేక ఉపాధులుగా కొనసాగుతూ వస్తోంది. ఇక్కడి ఉపాధులు, సంబంధ-అనుబంధ-బాంధవ్యములు, దేహముల రాక-పోకలు, అజ్ఞాన సంయోగ-వియోగ పరంపరలు, లోక-లోకాంతరములు, దృశ్య బ్రహ్మాండ పరంపరలు - ఇవన్నీ వాసనా ప్రభావములేనయ్యా!
శ్రీ ఆంజనేయస్వామి : హే ప్రియ రామచంద్రా! అస్మత్ ఆత్మానందస్వరూపా! జీవులమగు మేము మా వాసనల చిక్కుముడులలో చిక్కుకుని అనేక బంధములను, దుఃఖములను తెచ్చిపెట్టుకుంటున్నామని అర్థమగుచున్నది. మరి ఇప్పుడు ఈ బంధము-దుఃఖము తొలగటానికి, ఆత్మానందము పొందటానికి త్రోవ ఏది?
శ్రీరామచంద్రుడు : సరే! విను! ఇప్పుడు మనము వాసనల గురించి చెప్పుకుంటున్నాము కదా!
అట్టి వాసనలు రెండు విధములుగా విభజించబడుచున్నాయి. 1) శుద్ధ వాసనలు, 2) మలినవాసనలు.
మలినా జన్మహేతుస్స్యాయత్ : మలిన వాసనలు జన్మపరంపరలకు కారణముగా అగుచున్నాయి.
శుద్ధాత్ జన్మవినాశనీ : శుద్ధ వాసనలో, పునర్జన్మల అంకురములను నశింపజేయుచున్నాయి.
మలిన వాసనలు
"నేను జీవుడను! ఈ దేహ మాత్రుడను! ఇక్కడ చిక్కుకున్నాను! ఈ ఎదురుగా ఉన్నదంతా నిజమే! ఈ దేహముంటేనే నేను ఉంటాను! మరల ఇటువంటి దేహముతోటే పుట్టితే బాగుండును! వీరు నా వారు! వారు కాదు!” - ఇవన్నీ స్వకీయ నిర్మితమైన మలినవాసనలకు కొన్ని ఉదాహరణములు.
అహంకారము (నాది-నేను-ప్రత్యేకమగు నేను) అను దీర్ఘవ్యాధి నుండి మలిన వాసనలన్నీ బయల్వెడలుచున్నాయి.
అజ్ఞానము యొక్క ఘనీ భూతరూపమే అహంకారము. అజ్ఞానము వలన అహంకారము, అహంకారము వలన వాసనలు, వాసనల వలన అజ్ఞాన అహంకారము… ఈ విధంగా పరస్పరంగా ఇవి వృద్ధి చెంది, ఆత్మస్వరూపుడగు ఈ జీవుని ‘భావనా పరంపరలు - ఉపాధి పరంపరలు - జన్మమృత్యు పరంపలు’ అనే మూడు త్రాళ్లతో నిర్మితమైన వలలో చిక్కుకునేటట్లుగా చేస్తున్నాయి.
అందుచేత- బుధులు (విజ్ఞులు) – ‘ఓ జనులారా! అజ్ఞాన వాసనలు దరిజేరకుండా అతిజాగరూకులై ఉండండి.. అని శ్రేయోభిలాషులై హెచ్చరిస్తున్నారు.
అజ్ఞానసు ఘనాకారా, ఘనాహంకార శాలినీ, పునర్జన్మకరీప్రోక్తా, మలినావాసనైః బుధైః!
మలిన వాసనలు ’3’ లక్షణములను ప్రదర్శిస్తూ ఉన్నాయి.
1) అజ్ఞానమును మరింతగా ఘనీభూతము చేయటము.
2) అహంకారమును ఘనము (పెద్దది)గా చేయటము
3) ‘పునర్జన్మ పరంపరలు’ అనే మార్గములో త్రోసివేయటము.
అందుచేత ఈ జీవుడు మలిన వాసనలను సన్నగిల చేసుకోవటము - శుద్ధ వాసనలను పెంపొందించుకొనుటము.. అను ప్రయత్నములో అనుక్షణము నిమగ్నమై ఉండాలి. “మానవ ఉపాధి యొక్క పరమావధి మలిన వాసనలను వదలించుకొని, బుద్ధిని శుభ్రపరచుకోవటమే!”అని ఎల్లప్పుడూ దేహము కొనసాగునంతవరకు జ్ఞాపకము కలిగి ఉండాలి. మలిన వాసనలను గుర్తించి, వదిలించుకునే ప్రయత్నములకు ఉపక్రమించకుండా ‘మాకు ఇది తెలుసు. వాళ్లకు అది తెలియదు. మేము ఇటువంటి వాళ్లము. వాళ్లు అటువంటి వాళ్లు’ అని చిలకపలుకులు పలుకుతూ మీన-మేషాలు లెక్కపెట్టుకొంటూ ఉంటే, ఈ జీవునికి ఏమి ప్రయోజనం? కాబట్టి మలిన వాసనలను హృదయము నుండి వెడలగొట్టే ఉపాయము ఆశ్రయించాలి.
శుద్ధ వాసనలు
“అంతా పరమాత్మయే! పరమాత్మ సంకల్పమే! సత్ రసవతీ స్వరూపమే!” అను బలముతో కూడిన బుద్ధితో నా ఈ మనస్సును ఉత్తమ ధ్యానము-భక్తి-యోగాభ్యాసములతో శుద్ధ పరచుకోవాలి. ప్రయత్నశీలుడనై ఉండాలి"…. అనే ఈ జీవుని ఆలోచనలన్నీ శుద్ధవాసనల నుండే బయల్వెడలుచున్నాయి.
ఒక బీజమును అగ్నిలో వేయిస్తే (వేడిపెట్టి-ఉడికిస్తే) - అప్పుడు ఆ బీజము నందు మరల అంకురించటము అనునది నశిస్తూ, ఆకారతః మాత్రమే శేషించినదై ఉంటుంది కదా! అట్లాగే శుద్ధ వాసనల ప్రభావము చేత ఈ జీవుని అంతరంగము నందు పునర్జన్మహేతువులగు బీజము పునరంకురస్వభావము పోగొట్టుకొన్నదగుచున్నది. అప్పుడిక ప్రారబ్ధకర్మలు దేహమున్నంత వరకు మాత్రమే శేషిస్తాయి.
ఓ ఆంజనేయా! నిర్మోహమోటముగా నీకు ఒక్క విషయము గుర్తు చేస్తున్నానయ్యా!
బహుశాస్త్రకథా కంథా రోమంధేన వృదైవకిమ్? ఈ జీవుడు అనేక శాస్త్రములలోని కథలను, పాత్రలను, వంశచరిత్రలను, సంఘటనలను కేవలము వల్లించుకొంటూపోతూ ఉంటే ఏమి ప్రయోజనమయ్యా? “నా మలినవాసలు ఏఏ తీరులుగా ఉన్నాయి? వాటిని తొలగించుకొనే సాధనలు, విధానములు ఏమిటి? వాటిని ఎట్లా ఆశ్రయించాలి?” - అనేది వర్తమాన కర్తవ్యమని జనులందరికీ గుర్తుచేస్తున్నాను.
… అనే ప్రయత్నమునందు ఈ జీవుడు తనను తాను నియమించుకోవాలి కదా!
ఓ మారుతీ! అట్టి ప్రయత్నశీలుడైనవాడు ’హృదయాంతర్గ ఆత్మజ్యోతి’ని దర్శించి, ఆత్మతో మమేకమై ఆత్మారాముడై విరాజిల్లుచున్నాడు. ఇక్కడ ఎదురుగా కనిపిస్తూ - కనిపించకుండానే ఉన్నాయని అనిపిస్తూ ఉన్న (కనబడే-ఊహించబడే) సర్వవిశేషములనూ కూడా దర్శన అదర్శనే హిత్వా-వాటివాటి గతికి వాటిని వదలి, స్వయం కేవల రూపతః - తానే ఆత్మారామానందసాగరుడై విరాజిల్లాలి.
ఓ హనుమా! ఇక్కడ మరొక్క ముఖ్య విషయము కూడా విను! శుభ వాసనల సహాయముతో ఆత్మజ్ఞానము సంపాదించుకోవలసినదే! అయితే అంతటితో ఆగి ఊరుకోకూడదు మరి? ఆత్మయే తానై, సర్వవాసనలు త్యజించి ఉండాలి.
బ్రహ్మ! న బ్రహ్మవిత్, స్వయమ్ ।
ఓ కపిశార్దూలా! బ్రహ్మము గురించి తెలుసుకొన్నవాడై ఉన్నంత మాత్రముచేత సరిపోదు. ఈ జీవుడు (ముముక్షువు) తానే ’బ్రహ్మము’గా అయి విరాజిల్లాలి! తానే ఆత్మజ్యోతి స్వరూపుడై వెలుగొందాలి! జగత్ జ్యోతి స్వరూపుడై ఆత్మానందమును ఆస్వాదించాలి! ‘అహమ్ సర్వస్య ప్రభవో!’ అను అనుభవ స్థానము చేరాలి! కనుక ఓ వాయుపుత్రా! బ్రహ్మమే నీవై విరాజిల్లుము!
శ్రీ ఆంజనేయస్వామి : నాలుగు వేదముల పఠనము ఇత్యాదుల చేత కూడా అట్టి స్వయమాత్మానంద స్వస్వరూపము ఆవిష్కరించబడగలదు కదా, స్వామీ!
శ్రీరామచంద్రుడు : నాయనా! అంజనీపుత్రా! వేదపరణము ఇత్యాదులు శుభప్రదమే! అయితే నేను ఇక్కడ ఒక హెచ్చరికను వినిపిస్తున్నాను. విను.
శ్లో॥ అధీత్య చతురోవేదాః, సర్వశాస్త్రాణి అనేకశః
‘బ్రహ్మతత్త్వమ్’ న జానాతి, దర్వీపాక రసం యథా।
ఎప్పుడైనా పఠణము వేరు! అనుభవము వేరుకదా! అనుభవమునకు దారితీయకపోతే పఠణము వలన ప్రయోజనమేమున్నది? ఒక వంటవాడు (Cook) అత్యంత రుచి-సువాసనల (కమ్మటి వాసనలు) వెదజల్లుచున్న పులుసులో గరిటను ప్రవేశపెట్టి త్రిప్పుచున్నంత మాత్రము చేత, ఆ దర్వికి (గరిటకు) పులుసు యొక్క రుచి తెలిసి ఆనందించగలదా? లేదు కదా!
అట్లాగే, నాలుగు వేదములను, అనేక శాస్త్రములను ఆమూల నుండి ఈ మూల వరకు అనేకసార్లు వల్లె వేస్తున్నప్పటికీ, ధారాళముగా పలుకగలుగుచున్నప్పటికీ - ‘బ్రహ్మతత్త్వము’ తెలుసుకొని, అనుభవముగా సిద్ధించుకోకపోతే ఏమి లాభము? ’నీవు-నేను కూడా పరబ్రహ్మస్వరూపులమే’ అను మననము చేతనే బ్రహ్మభావన సిద్ధించుచు, క్రమంగా అభ్యాసమై, సంస్కారమై, ఆ బ్రహ్మభావనయే మహత్తరమగు వాసన (Tendency)గా రూపుదిద్దుకోగలదు.
కనుక వల్లె వేస్తే చాలదయ్యా! ‘అంతా బ్రహ్మమే’ అని అనిపించే వరకు అనుకుంటూ వుండాలి! అనిపించే బ్రహ్మమే నీవై సర్వత్రా వెలుగొందాలి!
శ్లో॥ స్వదేహా ‘అశుచి’ గంధేన న విరజ్యేత్ యః పుమాన్,
విరాగకారణమ్ తస్య కిమ్ అన్యత్ ఉపదిశ్యతే?
ఓ అంజనీ ప్రియపుత్రా! ఎవ్వడైతే స్వదేహములోని అశుచి అయిన గంధములను (Narrow, Pessimistic and negative Tendencies in the Inner-Self) గమనించి వాటి నుండి విరమించటానికి (కోపము - ఆవేశము - క్రోధము - దురాశ - రాగము - మమకారము - శత్రుభావము - విషాదము - పరదూషణ ఇతరులను పోరుపెట్టి బాధించటము - మాటలో పరుషత్వము - పరద్వేషము - ఆత్మస్తుతి - జాతి మత కులాహంకారములు - దుష్టాభ్యాసముల పట్ల అనురక్తి మొదలైనవి) తొలగించుకోవటానికి ప్రయత్నశీలుడై ఉండడో, అట్టి వానికి ఎంతగా ఆత్మవిషయము గుర్తు చేస్తే మాత్రము ఏమి ప్రయోజనమయ్యా? విరాగము లేనిచోట ఆత్మబోధ నిష్ప్రయోజనమే అవుతుంది.
దేహి-దేహముల భేదము గుర్తించ సిద్ధముకానివానికి ‘శుచి’ ఏముంటుంది? ఈ దేహము పట్ల విరాగము కలవాడే ఆత్మతత్త్వ బోధకు అర్హుడగుచున్నాడు.
వాస్తవానికి..? అత్యంత మలినోదేహో, దేహీచ అత్యంత నిర్మలః |
ఈ దేహము - అనేక మలినములతో కూడిన పదార్థము.
దేహియో - అత్యంత నిర్మలమగు ఆత్మయే స్వరూపముగా కలవాడు.
ఉభయోః అంతరమ్ జ్ఞాత్వా కస్య శౌచం విధీయతే? ఈ రెండిటి యొక్క భేదమేమిటో తెలిసిన వాడికి క్రొత్తగా ‘శుచి-శౌచము’లను నియమించి చెప్పవలసిన పనేమున్నది?
శ్రీ ఆంజనేయస్వామి : శ్రీరామచంద్ర భగవాన్! మోక్షము అనగా ఏమి? అది ఈ జీవునికి ఎప్పటికి ఎట్లా లభిస్తుంది?
శ్రీరామచంద్రమూర్తి : ‘నాకు బంధమే లేదు’ అని అనిపించు స్థితియే మోక్షము. అయితే ఈ జీవునికి బంధము ఎక్కడి నుంచి వచ్చిపడుతోంది? ఎవ్వరు కల్పిస్తున్నారు? మరెవ్వరూ కల్పించటము లేదయ్యా! మనము ఇంతవరకు వాసనలు ఎట్లా ఏర్పడుచున్నాయో చెప్పుకోవటము జరిగింది కదా!
బంధో హి వాసనా గంధో| - వాసన గంధములే బంధము!
మోక్షస్య వాసనా క్షయః | - అసత్ వాసనలు క్షయించటమే మోక్షము. వాసనలకు వేరుగా ఈ జీవునికి బంధము లేదు. మోక్షమూ లేదు.
ఓ మారుతీ! ‘మోక్షమును నేను సిద్ధించుకోవాలి!’ అనే లక్ష్యము కలవాడవై అశుభవాసనలను త్యజిస్తూ, శుభవాసనలను ఆశ్రయిస్తూ ఉండు. అశుభవాసనలన్నీ తొలగుచూ ఉంటే శుభవాసనలు తమ విధిని నిర్వర్తించుచున్నట్లే! ’వాసనలు బంధము’ అని అనుకున్నాము కదా! కనుక ‘నాకు మోక్షము కావాలి! పొందాలి’.. అనే వాసనను కూడా చిట్టచివరిగా త్యజించివేయి. ఎందుకంటే సర్వసాక్షియగు నీ స్వస్వరూప పరతత్త్వమునకు బంధమేమున్నది? అది నిత్యముక్త స్వరూపమే. ఇక ‘జీవుడు’ అనునదో? అది స్వకల్పిత మాత్రము కదా! కల్పితమైన దానికి బంధమేమి? మోక్షమేమి?
ఈ జగత్తులోని పాత్ర.. నాటకములోని పాత్ర వంటిదేకదా! అది జగన్నాటకమును అనుసరించి ఉండవచ్చుగాక! ఆత్మారామ స్వరూపుడవగు నీకు జీవాత్మత్వము వలన బంధమేముంటుంది? జీవాత్మ జగత్ నాటకములోని కల్పన కాబట్టి అద్దానికి మోక్షమేముంటుంది? ఒకడు ఒక నాటకములో ఒక ‘పాత్ర’గా నటిస్తూ ఉంటే, ఆ పాత్రయొక్క స్వభావము కష్టము-సుఖములచే పాత్రధారునికి బంధమేముంటుంది? మోక్షమేముంటుంది?
పరమాత్మ నిత్యముక్తము, జీవాత్మ నిత్యబద్ధము అయిఉన్నారు. ఈ విధమైన అవగాహనతో ’మోక్షేచ్ఛావాసన’ను కూడా త్యజించివేయి. మోక్షార్థిగా కూడా ఉండవలసిన పని నీకు లేదు. వాసనాం సంపరిత్యజ్య మోక్షార్థిత్వమపి త్యజ!
ముందుగా ఈ భౌతిక దేహసంబంధమైన శబ్ద స్పర్శ -రూప రస-గంధ వాసనలను దాటి అతీతదృష్టిని ఆశ్రయిస్తూ ఉండు.
భౌతిక దేహ-ఇంద్రియ వాసనలను త్యజించే ఉపాయములుగా - మైత్రి, కరుణ, క్షమ, సేవ, వాత్సల్యము, యజ్ఞభావముతో కర్మలు నిర్తర్తించటము, పరోపకారము, దాక్షిణ్యము, మొదలైన సాత్విక వాసనలు ఆశ్రయించు. మైత్ర్యాది వాసనా నామ్నీః గృహాణ అమల వాసనాః మైత్రి మొదలైన నిర్మల వాసనలను స్వీకరిస్తూ మలవాసనలను జయించు.
అటు తరువాత, ఆ సాత్విక స్వభావముతో వ్యవహరిస్తూనే.. స్నేహము - ఇత్యాది - సంబంధించిన వాసనలను కూడా హృదయములో రహితము చేసికొని ఉండు. తశ్చాపి అంతః పరిత్యజ్య తాభిః వ్యవహరన్ అపి! ఈ విధముగా క్రమంగా అంతర్హృదయము నుండి సర్వ సాత్విక- రాజసిక-తామసిక వాసనలను బయటకు పారత్రోలి వేయి.
❖ అంతర్హృదయములో పరమ శాంత స్వరూపుడవై ప్రకాశిస్తూ ఉండు!
❖ బాహ్య జగత్తులో మాత్రము సర్వదేహుల పట్లా సాత్విక - స్నేహ - వాత్సల్యభావాలు ప్రదర్శించుచూ ఉండు!
❖ ‘నేను సర్వదా సత్చిత్ ఆనంద స్వరూపుడను! అట్లాగే ఈ ఎదురుగా నాకు కనిపిస్తున్న జీవులంతా (నాతో సహా) సత్ చిత్ ఆనందమగు పరబ్రహ్మస్వరూపులే! సహజముగా అందరమూ ఆత్మానందరూపులమే! ఇహ ఇక్కడి సంగతి - సందర్భములు ఎట్లా ఉంటే మాత్రము ఆత్మత్వమునకు వచ్చేలోటు ఏమున్నది’….. అను రూపము గల ‘కేవల చిన్మాత్రము’ అను ఒక్క ‘వాసన’ మాత్రమే నీయందు సశేషించినదై ఉండు గాక!
❖ అటుపై పైన చెప్పుకున్న వాసనా రూపమైన మనో-బుద్ధి-చిత్త-అహంకార సంబంధమైన శాస్త్ర విశ్లేషణా వాసనలను కూడా త్యజించివేయి.
❖ ఆ విధముగా త్యజించి వేసిన తరువాత అప్పటికీ నీయందు శేషించియుండు నిర్మల-నిత్య సత్య-పరమానంద స్వరూపమగు స్వస్వరూప - ఆత్మజ్యోతితో మమేకమై, ఆసీనుడవై స్థిర సమాధాన సమన్వితుడువై ఉండు.
ఓ మారుతీ! నీవు నన్నుగా ఆరాధిస్తున్న ఆ రామబ్రహ్మము నీవేనయ్యా! నీవు నేనై ప్రకాశించుము. నీయందు నేను నీవై ఉన్నాను. మయి త్వమ్ భవ, మారుతే!
శ్రీ ఆంజనేయస్వామి : తండ్రీ! ప్రియ ఆత్మారామా! లోకములకు ఆనందము కలుగజేయు స్వామీ! లోకో రమయతీతి రామబ్రహ్మమా! నేనే రామబ్రహ్మమై యుండగా ఇక నేను ఎట్టి విశేషములతో సమన్వితుడవై ఉంటున్నానో.. అది కూడా దయతో అభివర్ణించ ప్రార్థన!
శ్రీరామచంద్రమూర్తి : ఓ హనుమా! “నేనే నీవు” అయిన నేను (లేక) ‘నీవే నేనైన నేను’ అయినట్టి రామపరబ్రహ్మము ఎట్టి మహత్ లక్షణ సమన్వితమో అది భాషకు అందనిది. అయినా, కొన్ని విశేషాలు ఇప్పుడు ఉదహరిస్తాను.
అశబ్దమ్ → అట్టి సర్వాత్మకమగు రామబ్రహ్మమును ఒక ‘శబ్దము’ చెప్పి వివరించలేము. వాక్ నివర్తంతే! వాక్కుకు అందనిది!
అస్పర్శన్ → అది స్పర్శకు విషయము కాదు. తాకుటచే అనుభవమయ్యేది కాదు.
అరూపమ్ → సర్వ నామ రూపములు అద్దానివే అయి ఉండగా, అది ఏ రూపమని అనాలి? అన్ని రూపములు అద్దానివే! కనుక అరూపము. రూపరహితము.
అవ్యయమ్ → పదార్థములు - కాలకల్పనల వలె అది వ్యయము అయ్యేది కాదు.
అరసమ్ → రుచికి విషయము గాని కాదు.
నిత్య సుగంధవత్ చ → సుగంధము ఎప్పటికప్పుడు ఖర్చు అవుతుంది. కాని అది నిత్యసుగంధ స్వరూపము.
అనామగోత్రమ్ → సర్వము అద్దాని సంప్రదర్శనమే అయి ఉండగా.. అది ‘ఈ నామము -ఆ గోత్రము’ అని ఎట్లా అంటాము?
మమరూపమ్ ఈదృశమ్ → అది ప్రతి ఒక్కరి స్వస్వరూపమే! అది ‘మమస్వరూపము’గా ప్రదర్శనమగుచున్నట్లుగా ఆరాధించు. “నా సహజ స్వరూపము అదియే! అద్దానికి వేరుగా కనిపించేదంతా సందర్భమాత్రము, అజ్ఞాన కల్పితము!”… అని మననము చేయుము.
నిత్యమ్ → అది ఎల్లప్పుడు అంతటా వేంచేసియే ఉన్నట్టిది. నిత్యమైనది. ఎల్లప్పుడు ఉండేది!
పవనాత్మజ త్వమ్ → ఓ పవనాత్మజా! నీవుగా ఉన్నది అదియే! నీవు అదియే!
దృశి స్వరూపము → కనబడుచున్నదంతా అదియే! రామబ్రహ్మమే! నేనే! ఈ దృశ్యమంతా తన స్వరూపంగా కలిగి ఉన్నట్టిది!
గగనోపమమ్ → ఆకాశము వలె అనంతము, నిర్విషయము, నిరామయము కూడా!
పరమ్ → స్వప్నము తనదై ఉన్నవాడు స్వప్నములోని స్వప్నద్రష్టకు స్వప్నదృశ్యమునకు వేరై ఉన్నతీరుగా, సర్వమునకు పరమై ఉన్నది.
సకృత్ విభాతమ్ తత్ → ఈ సర్వముగా ప్రకాశింపజేయుచున్నట్టిది. ఈ జగత్తు అను వెలుతురు ఆ రామబ్రహ్మముదే!
అజమ్ → జన్మరహితమైనది. పుట్టుక - ప్రారంభము లేనట్టిది.
ఏకమ్ → సర్వదా ఏకమేగాని అహమ్-త్వమ్ - సః.. ఇత్యాది అనేకముగా ఏ మాత్రము అగుచుండనట్టిది.
అలేపకమ్ → ఓ పవనాత్మజా! నీవు ఎల్లప్పుడూ ఉపాసించవలసినది అట్టి ఆ నా రూపమేనయ్యా! మనోబుద్ధి - చిత్తములుగా ఉన్నది నేనే! అహంకారము మొదలైన వాటి చేత ఏ మాత్రము లేపనము చేయబడి యుండదు. మేఘములు అనంతాకాశమును కప్పి ఉంచలేవుకదా!
సర్వగతమ్ → స్వప్నము తనదైనవాడు స్వప్నమంతా - అంతటా అన్నిటా నిండి ఉంటాడు కదా! ఒక కధారచయిత యొక్క రచనా విభవము కథలోని అన్ని పాత్రలు-కథా సంఘటనలుగా ఉంటుంది కదా! అట్లాగే, పరమాత్మ సర్వగతుడు.
అద్వయమ్ యత్ → ఈ విధంగా ఎద్దానికైతే ద్వితీయమనునదే లేదో…. అట్టిది - రామ పరబ్రహ్మతత్త్వమ్!
తదేవచాఽహమ్ → అదియే నేను! పరబ్రహ్మమే నాసహజ - నిత్య స్వరూపము!
సకలమ్ → ఉన్నదంతా అదియే! అంతా అదే! ఈ కనబడేదంతా నేనే! (నిస్కలమ్ → ఏదీగా అవనిదీ అదే!)
విముక్తమ్ → అంతా అయి, అన్నిటి నుండి వేరై ఉన్నవాడను. సర్వదా విముక్తుడను! సర్వభూతములు (జీవులు) నేనై, సర్వసాక్షిగా సర్వదా అతీతమై - వేరై ఉన్నవాడను. ఆత్మ నిత్యముక్తము.
ఓం → వేదములు ‘ఓం’ అను సంజ్ఞచే చెప్పబడుచున్నట్టి వాడను!
దృశిస్తు శుద్ధో హమ్ → దృశ్యముకంటే పరమ పవిత్రమగు దృక్ స్వరూపుడను!
అవిక్రియాత్మన్ → నాటకదీపము వలె నిష్క్రియుడను! కేవల సాక్షిని!
నమేఽస్తి కించిత్ విషయ స్వభావతః → విషయములుగాని, విషయ సంబంధమైన స్వభావముగాని కించిత్ కూడా నాకు లేవు! సూర్య తేజస్సు (వెలుగు)లో కనిపించే వస్తు ఆకారములతో వెలుగుకేమి సంబంధము? వెలుగు వస్తువుల వలన బంధము పొందరు కదా!
పురస్థిరశ్చ ఊర్ధ్వమ్ అధశ్చ సర్వతః - జాగ్రత్ స్వప్న సుషుప్తులలో పైన-క్రింద అంతటా సర్వత్రా వ్యాపించినదై ఉన్నవాడను.
సుసంపూర్ణ భూమా హమ్ → పూర్ణ భౌమానంద స్వరూపుడను!
ఈ విధముగా నున్ను భావన చేయి. (లేక) నీలోని నన్ను (రామపరబ్రహ్మమును) భావన చేయి. నీవుగా నన్ను ఎరుగుము!
అజో అమరశ్చ తదా అజరో → కాలసంబంధమైన జన్మ-జరా-మరణములచే స్పృశించబడనివాడను. అమృతః అమృతస్వరూపుడను ! కాలః కాలుడను!
స్వయం ప్రభః → నాకు నేనే ప్రభవించువాడను. నా ప్రభవమునకు మరొకటేదీ కారణమై లేదు!
న కారణ-కార్య → నాకు కార్య కారణములు లేవు. అట్టి సర్వకల్పనలకు ఆవల సర్వదా ప్రకాశించు కేవలుడను!
అతీత్య నిర్మలః → సర్వమునకు అతీతమైనట్టి నిర్మల స్వరూపుడను
సదేవ తృప్తో హమ్ → సత్స్వరూపముచే నిత్య తృప్తుడనై ఉన్నవాడను అని నన్ను భావించు.
ఈ విధముగా ఆత్మారామతత్త్వమును ఎరుగుచూ ఈ జీవుడు జీవన్ముక్తుడు కాగలడు.
ఆ తరువాత, భౌతిక దేహమును కాలగతికి చెందినదిగా సమర్పించుచూ క్రమముగా ‘విదేహముక్తుడు’ అగుచున్నాడు.
⌘
వీచికలు లేనట్టి వాయువువలె కేవలీ స్వరూపుడై, బ్రహ్మాండములను ధరించినవాడై, సర్వదృశ్య రహితుడై చెన్నొందుచున్నాడు!
ఈ చెప్పుకున్న విశేషములు వేదములచే ఋక్కుల రూపమున చెప్పబడుచూనే ఉన్నాయి. శ్రీరామబ్రహ్మతత్త్వమును ఎరిగిన బుద్ధిమంతుడు, ఆకాశములో సూర్యునివలె సదా సర్వత్రా విష్ణు పరమపదమును దర్శించుచున్నాడు. స్వస్వరూప పరబ్రహ్మతత్త్వమును ఎరిగి, ఉపాధి వినిర్ముక్తుడై ఆత్మతత్త్వమునందు నిత్య జాగ్రత్‌ను అనుభూతము చేసుకొన్నవాడగుచున్నాడు.
సర్వత్రా సమస్వరూపమైయున్న విష్ణుపదమును పొంది శ్రీరామానంద సాగరము నందు ఆత్మానంద తరంగ స్వరూపుడై బ్రహ్మానందమునందు ఓలలాడుచున్నాడు.
⌘
ఆత్మత్వమే పరమ సత్యము. తదితరమైనదంతా కల్పితము. రామచంద్ర ప్రబోధమును శ్రద్ధగా విని, రామభక్త హనుమంతుడు రామానంద సాగరస్వరూపుడై వెలుగొందసాగారు!
🙏 ఇతి ముక్తికా ఉపనిషత్ 🙏
ఓం శాంతిః శాంతిః శాంతిః