[[@YHRK]] [[@Spiritual]]
Nirvāna Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 1
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com
(ఋగ్వేదీయ సంన్యాసోపనిషత్) నిర్వాణోపనిషద్వేద్యం నిర్వాణానందతుందిలం . త్రైపదానందసామ్రాజ్యం స్వమాత్రమితి చింతయేత్ .. |
ఈ నిర్వాణోపనిషత్ పలుకుచున్న నిర్వాణానంద సామ్రాజ్యమును "త్రైపదానంద సామ్రాజ్యము”గాను, “స్వస్వరూప మహిమ”గాను తెలుసుకొనబడును గాక! అట్టి ఆస్వాదనకై చింతన చేయబడును గాక!
అథ నిర్వాణోపనిషదం వ్యాఖ్యాస్యామః . పరమహంసః సోఽహం . పరివ్రాజకాః పశ్చిమలింగాః . మన్మథ క్షేత్రపాలాః . గగనసిద్ధాంతః అమృతకల్లోలనదీ . అక్షయం నిరంజనం . నిఃసంశయ ఋషిః . నిర్వాణోదేవతా . నిష్కులప్రవృత్తిః . నిష్కేవలజ్ఞానం . ఊర్ధ్వామ్నాయః . నిరాలంబ పీఠః . సంయోగదీక్షా . వియోగోపదేశః . దీక్షాసంతోషపానం చ . ద్వాదశావదిత్యావలోకనం . |
|
1.) ఓం అథ నిర్వాణోపనిషదమ్ వ్యాఖ్యాస్యామః పరమహంసః సోఽహమ్| పరివ్రాజకాః పశ్చిమలింగాః| మన్మథః క్షేత్రపాలాః॥ గగన సిద్ధాంతః॥ అమృత కల్లోల నదీ అక్షయమ్ నిరంజనమ్| నిస్సంశయ ఋషిః| నిర్వాణో దేవతా! నిష్కుల ప్రవృత్తిః నిష్కేవల జ్ఞానమ్| ఊర్ధ్వామ్ ఆమ్నాయః। నిరాలంబ పీఠః సంయోగ దీక్షా! వియోగో ఉపదేశః| దీక్షా సంతోషపానం చ ద్వాదశాదిత్య అవలోకనమ్| |
ఇప్పుడు ఇక మనము ‘నిర్వాణము’ అను ఉపనిషదమును (పుణ్యక్షేత్రమును) గురించిన (సారూప్యత - సామీప్యత) విషయమై వ్యాఖ్యానించుకొనుచున్నాము. నేను ఆ పరమహంసయే సహజ స్వరూపముగా కలిగియున్నాను. పరమహంసయే అయి ఉన్నాను. పరివ్రాజకత్వము నాయొక్క ఆ తత్ చిహ్నము. నిర్వాణ స్థానము యొక్క ఒక గుర్తు మూలవిరాట్టు. మన్మథుడు క్షేత్రపాలకుడు. (నా ఇచ్ఛా స్వరూపమే ఈ జగత్తు). “నేను చిదాకాశమును” - అనునది సిద్ధాంతము. అమృత స్వరూప జలము-జన్మలు అను తరంగముల కల్లోలముతో కూడిన నది. క్షయమనునదే లేనట్టి నిరంజన (నిర్దోష) ఆత్మ స్వరూపము. (జీవాత్మ). సర్వ సందేహములు తొలగడమే ఋషి! నిర్వాణమే (లేక) మోక్షమే దేవత! కుల-జాతి భేదరహిత - నిర్మల బుద్ధియే ప్రవృత్తి. సాపేక్ష రూపమగు నిష్కేవలమే జ్ఞానము. వేదముల ప్రతిపాదితమగు ఏకతత్త్వమే ఊర్ధ్వము. నిర్విషయమగు నిరాలంబమే పీఠము! ఆత్మతో సంయోగము - దీక్ష! జగత్ విషయములతో వియోగమే - ఉపదేశము. సంతోషముగా ఉండటం, తృప్తి - అనునది దీక్ష. ద్వాదశ ఆదిత్యత్వమే అవలోకనము. |
వివేకరక్షా . కరుణైవ కేలిః . ఆనందమాలా . ఏకాంతగుహాయాం ముక్తాసనసుఖగోష్టీ . అకల్పితభిక్షాశీ . హంసాచారః .సర్వభూతాంతర్వర్తీ హంస ఇతి ప్రతిపాదనం . ధైర్యకంథా . ఉదాసీన కౌపీనం . విచారదండః . బ్రహ్మావలోకయోగపట్టః .శ్రియాం పాదుకా . పరేచ్ఛాచరణం . కుండలినీబంధః . పరాపవాదముక్తో జీవన్ముక్తః . శివయోగనిద్రా చ . ఖేచరీముద్రా చ . పరమానందీ . నిర్గతగుణత్రయం . వివేకలభ్యం మనోవాగగోచరం . అనిత్యం జగద్యజ్జనితం స్వప్నజగదభ్రగజాదితుల్యం . తథా దేహాదిసంఘాతం మోహగుణజాలకలితం తద్రజ్జుసర్పవత్కల్పితం . విష్ణువిద్యాదిశతాభిధానలక్ష్యం . అంకుశో మార్గః . శూన్యం న సంకేతః . పరమేశ్వరసత్తా . సత్యసిద్ధయోగో మఠః . అమరపదం తత్స్వరూపం . |
|
2.) వివేక రక్షా కరుణైవ ఆనందమాలా| ఏకాసన గుహాయామ్। ముక్తాసన సుఖగోష్ఠీ। అకల్పిత భిక్షాశీ। హంస ఆచారః సర్వభూతాంతర్వర్తీ హంస ఇతి ప్రతిపాదనమ్| ధైర్యమ్ కంథా! ఉదాసీన కౌపీనమ్। విచార దండః| బ్రహ్మావలోకో యోగపట్టః| శ్రియాం పాదుకా పర ఇచ్ఛ - ఆచరణమ్| కుండలినీ బంధఃI పరాపవాదముక్తో జీవన్ముక్తః। శివయోగనిద్రా ఖేచరీ ముద్రా చ పరమానందీ। నిర్గత గుణత్రయమ్। వివేక లభ్యమ్| మనో-వాక్ అగోచరమ్ | అనిత్యమ్ జగత్ యత్ చ అజ్జనితమ్| స్వప్న జగత్ అభ్ర-గజాది తుల్యమ్ | తథా దేహాది సంఘాతమ్, మోహగుణజాల కలితమ్ | తత్ రజ్జు-సర్పవత్ కల్పితమ్ | విష్ణు విద్యా-ఆది శతాభిధాన లక్ష్యమ్ | అంకుశో మార్గః శూన్యం న సంకేతః। పఠేశ్వర సత్తా। సత్య సిద్ధయోగో మఠః అమరపదమ్ తత్ స్వరూపమ్ | |
వివేకము — నిర్వాణయోగికి రక్ష! కరుణయే — ఆనందమాల! ఏకాసనమే — ఏకాంతగుహ! ముక్తాసనమే — సుఖగోష్ఠి! కల్పనరహితమైన ఆత్మత్వమే కోరుకొను బిక్ష. హంసోఽహమ్ - సోఽహమ్ - త్వమేవాహమ్ …. మహా వాక్యాలు - ఆచారము. సర్వజీవుల అంతరహృదయవర్తి “హంస”…. హంసయోగ ముఖ్యార్థముగా ప్రతిపాదనము. నేను సర్వ హృదయములలో అంతర్యామిని అనునదే హంస యోగము. “ధైర్యము” అను బొంత ధరించి ఉండటము. సర్వ వ్యధలను జయించి, సర్వ ప్రాపంచక విషయములపట్ల ఉదాసీనంగా ఉండటం (Unaffected and silently wel-balanced) అనునదే కౌపీనము! విచారణయే యోగదండకము. “జగత్తు బ్రహ్మమే” అను నిశ్చలబుద్ధితో బ్రహ్మావలోకనము యోగపట్టు. శ్రీపాదుకాపరమైన ఇచ్ఛయే (శ్రీవారి పాదుకలు హృదయములోను-శిరస్సుపై ధారణ చేయుట) … ఆచరణ. కుండలీ శక్తిని ఉపాసించటము - యోగ బంధము. పరాపవాదము నుండి (పరతత్వ జ్ఞాన అంశములను తిరస్కరించు సంభాషణములకు దూరంగా) ముక్తుడై ఉండటము … జీవన్ముక్తి. త్వమ్ శివేతి - శివతత్త్వ జ్ఞానములో విశ్రాంతియే ఖేచరీ ముద్ర. పరతత్త్వమును జ్ఞప్తిలో ఉంచుకొనినవాడు - పరమానందీ! త్రిగుణములను వదలి దాటి దర్శించువాడు నిర్గతగుణుడు! వివేకముచేతనే లభించునది ఆత్మానుభవము. అట్టి ఆత్మానుభవము (లేక) శివయోగ స్థానము (యోగనిద్ర) మనస్సుకు - వాక్కుకు అగోచరము. మనస్సునకు విషయము కాదు. ఏది జనిస్తోందో … అట్టి జగత్తు నిత్యమైనది కాదని గమనించి ఉండాలి. జగత్తు జనించనే లేదు. ఈ జగత్తు కలలో విశేషాలవంటివే! మేఘములందు మేఘాకారంగా కనిపించే ఏనుగు వంటిది. వాస్తవానికి మేఘములలో ఏనుగు ఉండదు కదా! ఈ దేహములతో సంఘాతము కూడా అటువంటిదే! మోహము (illusion) త్రిగుణములు అనే జాలము (వల)చే నిండి ఉన్నట్టిది. త్రాడుపై ఆపాదించబడిన పామువలె ఈ జగత్-దృశ్యమంతా కల్పితము. విష్ణుమాయ - (యోగమాయ) మొదలైన అనేక (శాస్త్రములుచెప్పే) పేర్లకు విషయము ఈ మోహము. ఏనుగుకు అంకుశమువలె ఈ మాయామయ, జగత్తును జగత్తుగా చూడక, ఆత్మగా చూచే మార్గము ఆశ్రయించాలి. ఈ జగత్తు వాస్తవానికి శూన్యమే అనునది సంకేతము కాదు. ఇది ఆత్మయే! పూర్ణమిదమ్! ఇహమంతా కూడా పరమగు ఈశ్వరసత్తాయే! దృశ్యమానమగు జగత్తును సత్యమగు పరేశ్వర స్వరూపముగా దర్శించు యోగాభ్యాసమే మఠము. అమరపదము (స్వర్గలోకము) ఆ తత్ స్వరూపము! |
ఆదిబ్రహ్మస్వసంవిత్ . అజపా గాయత్రీ . వికారదండో ధ్యేయః . మనోనిరోధినీ కంథా . యోగేన సదానందస్వరూపదర్శనం . ఆనంద భిక్షాశీ . మహాశ్మశానేఽప్యానందవనే వాసః . ఏకాంతస్థానం . ఆనందమఠం . ఉన్మన్యవస్థా . శారదా చేష్టా . ఉన్మనీ గతిః . నిర్మలగాత్రం . నిరాలంబపీఠం . అమృతకల్లోలానందక్రియా . పాండరగగనం . మహాసిద్ధాంతః . శమదమాదిదివ్యశక్త్యాచరణే క్షేత్రపాత్రపటుతా . పరావరసంయోగః . తారకోపదేశాః . |
|
3.) ఆది బ్రహ్మ స్వ సంవిత్| అజపా గాయత్రీ వికార దండో ధార్యః మనో నిరోధినీ కంథా| యోగేన సదానంద స్వరూప దర్శనమ్| ఆనంద భిక్షాశీ। మహాశ్మశానేఽపి ఆనందవనే వాసః| ఏకాంతస్థానమ్ ఆనంద మఠమ్| ఉన్మని - అవస్థా! శారదా చేష్టా! ఉన్మనీ గతిః నిర్మల గాత్రమ్| నిరాలంబ పీఠమ్। అమృతకల్లోల ఆనంద క్రియా। పాండరగగనం మహాసిద్ధాంతః॥ శమ-దమాది దివ్యశక్త్య ఆచరణే క్షేత్ర పాత్ర పటుతా। పరాపర సంయోగః తారక-ఉపదేశః| |
ఆది స్వరూప-స్వస్వరూపమగు సంవితే (సత్-ఉనికి, విత్-ఎరుక) అజపా గాయత్రి! అదియే స్వయం భావనోపాసన! అర్థముయొక్క భావనయే అజపా గాయత్రి! జగత్ వికారములు పూలదండవలె ధరించాలి. మనస్సును నిరోధించటమే కండువా! బొంత! యోగబలముతో సదానందరూపముగా ఈ సర్వమును దర్శించాలి! “ఆనందము” నే బిక్షగా స్వీకరించి ఉండాలి. విషయములన్నీ లయించినట్టి మహాశ్మశానమే ఆనందవన స్థానము. ఏకాంత స్థానమే ఆ ఆనంద మఠము. మనస్సును సాక్షిగా దర్శించు ఉన్మనీయే ఆ స్థితి, అవస్థ. చేష్ఠ ఆత్మవిద్యా (శారదావిద్యా) రూపముగా ఉండుగాక! గతి కూడా మనస్సును దాటినట్టి ఉన్మనియే! (భౌతిక-మానసిక-బుద్ధిరూప) దేహములను - నిర్మలము చేసుకోవాలి. ఆలంబనములన్నీ లయించినట్టి నిరాలంబమే (ఏదీ ఆధారముగా కలిగి ఉండక అన్నిటికి తానే ఆధారమైనదే) - పీఠము. క్రియలన్నీ అమృతసాగర ఆనంద క్రియలే! పాండవాకాశమే (బ్రహ్మాకాశమే)… మహా సిద్ధాంతము. మనో-ఇంద్రియ నిగ్రహమే ఆచరణగా ఉండవలసినది! అదియే క్షేత్రము - పాత్రల పటుత్వము. పరము-అపరముల ఏకత్వమే (సంయోగమే) తారకమంత్రము. తారకోపదేశము. |
అద్వైతసదానందో దేవతా . నియమః స్వాతరింద్రియనిగ్రహః . భయమోహశోకక్రోధత్యాగస్త్యాగః . అనియామకత్వనిర్మలశక్తిః . స్వప్రకాశబ్రహ్మతత్త్వే శివశక్తిసంపుటిత ప్రపంచచ్ఛేదనం . తథా పత్రాక్షాక్షికమండలుః . భవాభావదహనం . బిభ్రత్యాకాశాధారం . శివం తురీయం యజ్ఞోపవీతం . తన్మయా శిఖా . |
|
4.) అద్వైత సదానందో దేవతా। నియమస్య అంతరింద్రియనిగ్రహః భయ-మోహ-శోక-క్రోధ త్యాగః సత్యాగః పరావరైక్య రసాస్వాదనమ్ | అనియామకత్వ నిర్మలశక్తిః స్వప్రకాశ బ్రహ్మతత్త్వే శివ-శక్తి సంపుటిత ప్రపంచ ఛేదనమ్| తథా పత్రాక్ష అక్షి కమండలు భావాభావ దహనమ్| బిభ్రతి ఆకాశ ఆధారమ్| శివం తురీయం యజ్ఞోపవీతమ్| తన్మయీ శిఖా |
సదా అద్వైతానందమే దేవత! శాస్త్రములు - గురువులు నియమించి చెప్పే నియమములు… అంతరింద్రియ నిగ్రహరూపము. భయము-మోహము-శోకము-క్రోధములను త్యజించటమే నిజమైన త్యాగము. పరతత్త్వమును ఆస్వాదిస్తూ ఇహస్వరూపమును అధిగమించి-ఉండటము … రసాస్వాదనము. ఏకము-అక్షరము అగు తత్త్వమే రసాస్వాదనము. మనో-బుద్ధి - చిత్తములను నియమించి, వాటికి ఆవలసాక్షియై ఉండటమే నిర్మలశక్తి! ఆత్మ నిర్మలశక్తి స్వరూపము. బ్రహ్మతత్యము స్వయం ప్రకాశకమైనది. శివ-శక్తి తత్త్వములకు సంపుటీకరముచే ప్రపంచము ఛేదించబడగలదు. అదేవిధంగా పత్రాక్షము (Perception of Divisibility), అక్షికమండలు (నిశ్చలంగా నిలబడే దృష్టితో)లచే భావ- అభావములను దహింపజేయబడగలవు. కళ్లే పులి చర్మము, దృష్టియే కమండలము. ఆత్మాకాశమే సర్వమునకు ఆధారము. శివము, తురీయము అనునవే …. యజ్ఞోపవీతము. ఆత్మతో తన్మయత్వము - శిఖ! |
చిన్మయం చోత్సృష్టిదండం . సంతతాక్షికమండలుం . కర్మనిర్మూలనం కంథా . మాయామమతాహంకారదహనం . స్ప్రశానే అనాహతాంగీ . నిస్త్రైగుణ్యస్వరూపానుసంధానం సమయం . భ్రాంతిహరణం . కామాదివృత్తిదహనం . కాఠిన్యదృఢకౌపీనం . చీరాజినవాసః . అనాహతమంత్రః . అక్రియయైవ జుష్టం . స్వేచ్ఛాచారస్వస్వభావో మోక్షః పరం బ్రహ్మ . ప్లవవదాచరణం . బ్రహ్మచర్యశాంతిసంగ్రహణం . బ్రహ్మచర్యాశ్రమేఽధీత్య ససర్వసంవిన్న్యాసం సంన్యాసం . అంతే బ్రహ్మాఖండాకారం . నిత్యం సర్వసందేహనాశనం . ఏతన్నిర్వాణదర్శనం . శిష్యం పుత్రం వినా న దేయమిత్యుపనిషత్ . |
|
5.) చిన్మయం చ ఉత్-సృష్టి దండమ్| సంతత అక్షి కమండలుమ్| కర్మనిర్మూలన కంథా! మాయా మమత అహంకార దహనమ్ । శ్మశానే అనాహతాంగీ। నిస్త్రైగుణ్య స్వరూపానుసంధానమ్, సమయమ్। భ్రాంతి హరణమ్| కామాది వృత్తి దహనమ్| కాఠిన్య దృఢ కౌపీనమ్। చీరాజిన వాసః । అనాహత మంత్రః । అక్రియైవ జుష్టమ్। స్వేచ్ఛాచారో స్వస్వభావో మోక్షః । పరబ్రహ్మ ప్లవత్ ఆచరణమ్| బ్రహ్మచర్యః శాంతి సంగ్రహణమ్| బ్రహ్మచర్యాశ్రమే అధీత్య, వానప్రస్థాశ్రమే అధీత్య, సర్వ విన్న్యాసమ్ ’సన్యాసమ్’| అంతే బ్రహ్మ - అఖండాకారమ్| నిత్యం సర్వసందేహ నాశనమ్| ఏతత్ నిర్వాణ దర్శనమ్| పుత్రం వినా శిష్యం వినా న దేయమ్| ఇత్యుపనిషత్ |
చిన్మయానందమే సృష్టి! ఇదంతా ఎత్తబడిన చిన్మయానంద దండమే! చిన్మయానందరూపమగు దృష్టియే ఎల్లప్పుడు చేతితో ధరించవలసిన కమండలము. కర్మరాహిత్యము - కర్మల నిర్మూలనము గురించే ఎప్పుడు కథగా చెప్పుకోవాలి. మాయా రూపములయినట్టి మమత-అహంకారములను యోగాగ్నితో దహిస్తూ ఉండాలి. ఈ భౌతిక దేహమును శ్మశానము చేరబోవు వస్తువుగా చూస్తూ, (తనకు తానుగా) బాధింపజాలని వస్తువుగా దర్శించాలి. హృదయమే (అనాహతమే) విషయ రహిత శ్మశానము. సమయమంతా త్రిగుణములకు ఆవలగల నిర్గుణ నిర్మల స్వరూపమును అనుసంధానం చేస్తూ గడపాలి. సర్వభ్రాంతులను జ్ఞాననేత్రముతో మ్రింగివేయాలి. “ఏదో ఇంకా కావాలి” అనేదే కామము. సర్వకామ వృత్తులను దహించివేయాలి. ఈ దృశ్య విషయాలచే స్పర్ధ పొందని కఠినమైన బుద్ధిని కౌపీనముగా ధరించాలి. యోగ నార బట్టలను ధరించి ఉండాలి. అనాహతమే (వాయుస్తంభనయే) మంత్రముగా (మననముగా) స్వీకరించాలి. “నాహమ్ కర్తా” అను అక్రియత్వము (నిష్క్రియత్వము) స్వీకరించబడినదై ఉండుగాక! స్వస్వభావము-స్వస్వరూపము అగు ఆత్మ నిత్యస్వేచ్ఛా స్వరూపమైనదిగా దర్శింటమే మోక్షము. నాటక పాత్రవంటి జీవాత్మకు ముక్తి లేదు. అవసరమూ లేదు. సహజమగు ఆత్మకు బంధమే లేదు. ఆత్మకు ముక్తితో పని ఏమి? ఆత్మ నిత్య ముక్తము కదా? పరబ్రహ్మత్వమును ఆరాధిస్తూ తత్ ధారణ కలిగి ఉండటమే ఆచరణము. బ్రహ్మమే ఇదంతా-అను మనోబుద్ధులతో చరించు బ్రహ్మచర్యమే శాంతిని స్వీకరించటం. బ్రహ్మచర్యము అనే మార్గముగా ఆత్మగురించి అధ్యయనము చేయాలి. వనములో మనస్సు (Hands may be in the world. But Head should be in the forest). ఆత్మయొక్క విన్యాసమే ఇదంతా - అను నిశ్చల అవగాహనయే సన్యాసము. చివరికి అఖండ బ్రహ్మాకారమే నేనగుట! ఇక జ్ఞానమెందుకు? ఎల్లప్పుడు నేను బ్రహ్మమే అను విషయములో సర్వ సందేహాలు తొలగటానికై! స్వస్వరూపము గురించిన సందేహాలు నశింపజేసుకోవాలి. అఖండమగు బ్రహ్మమే నేను… అనునదే నిర్వాణ సందర్శనము. ఈ నిర్వాణోపనిషత్ పితృభక్తి గల పుత్రునికి, గురుభక్తి గల శిష్యునికి బోధించిన ఉత్తమ ప్రయోజనము సిద్ధించగలదు. అట్టి భక్తి లేనప్పుడు వారు ఇందలి జ్ఞానము విశదీకరించటానికి అనర్హులు. |
ఇతి నిర్వాణోపనిషత్
ఓం శాంతిః శాంతిః శాంతిః
ఇప్పుడిక మనము “నిర్వాణోపనిషదము”ను వ్యాఖ్యానించుకొనుచున్నాము. నిర్వాణయోగ సిద్ధి యొక్క సామీప్యానుభవం గురించి చెప్పుకుంటున్నాము.
పరమహంసోఽహమ్। సోఽహమ్। హంసోఽహమ్। నాయొక్క ఇహ (ఇక్కడి) స్వరూపము ఒక కలవంటిది. పరస్వరూపమే నేను! అది నా సహజ స్వరూపము!
“నిర్వాణయోగియొక్క తత్త్వ దర్శనము”
“నేను”…. పరమహంస స్వరూపుడను! పరమహంసత్వమే నా వాస్తవ సహజ స్వరూప స్వభావములు.
నేను సంచారము చేయు దృశ్యజగత్తు నా యొక్క పరమహంస - పరివ్రాజకత్వము యొక్క ఒకానొక చిహ్నరూపము.
ఈ ఇంద్రియజగత్తుకు మనోరూపుడగు మన్మథుడు నాయొక్క నిర్వాణ సామ్రాజ్యమునకు క్షేత్రపాలకుడు.
ఈ అకాశమంతా నా సిద్ధస్వరూపముతో నిండినదై ఉన్నది! భూతాకాశము, చిత్తాకాశము కూడా నా చిదాకాశ స్వరూపమునకు అభిన్నము.
వివేక రక్షా : వివేకముతో కూడిన దృష్టి రక్షా బంధనము!
కరుణైవ ఆనందమాలా : కరుణ వాత్సల్యము - నా నిర్వాణ స్థానమును అలంకరించి ఉన్న → ఆనందమాల!
ఏకాసన గుహాయాం : బాహ్యమున అనేకముగా కనిపిస్తూ కూడా, అంతరమున (అంతర్ దృష్టిచే) ఏకముగా కనిపించు స్థానమే నిర్వాణము దాగి ఉన్న గుహ. త్రిగుణముల జనిత స్థానమే నా అంతరంగ స్వరూపము.
ముక్తాసన సుఖ గోష్ఠీ : “బంధమనునది స్వతఃగా లేదు” … అనురూపమైన వాఙ్మయము → నాకు సత్సంగరూప సుఖ గోష్ఠి.
అకల్పిత భిక్షాశీ : కల్పనలన్నీ లయించినట్టి అకల్పితాత్మ తత్త్వము నా యొక్క ఆ నిర్వాణస్వరూప శివరూపత్వపు→ఆది భిక్షుత్వము.
హంస ఆచారః : హంసః - సోఽహమ్ - ‘నేను’ గా అనుభవమగుచున్నదంతా బ్రహ్మమే… అనునది ఆచారము.
సర్వభూతాంతవర్తీ ‘హంసా’ : సర్వజీవుల (భూతముల) అంతర్వర్తిగాను, అంతర్యామిగానూ తనను తాను గమనించటమే ‘హంస’ రూపము.
‘ఇతి’ ప్రతిపాదనమ్ : నిర్వాణము - “ఆత్మయే - స్వస్వరూపముగా, సర్వస్వరూపంగా దర్శించటము”… అనునది ఆధ్యాత్మ శాస్త్ర ప్రతిపాదనము, శృతి ప్రతిపాదితము కూడా! ఆత్మయే జగత్ దృశ్యరూపముగా ఏక-అఖండమై యున్నది - అనునది అనుక్షణిక బుద్ధి ప్రతిపాదనము.
ధైర్యమ్ కంథా : సర్వ పిరికితనములను, దృశ్యసంబంధమైన సర్వసుఖ-దుఃఖ ద్వంద్వములను, జీవాత్మ - పరమాత్మ భేద భావములను అధిగమించుచున్నాను. బుద్ధితో “గొప్ప ధైర్యము” అనే గొంగళిని ధరించుచున్నాను. (నాఽయమాత్మా బలహీన లభ్యః)! సర్వ బేలతనములను వదలివేస్తున్నాను. నేను సర్వాత్మకుడనై ఉండగా భయమెందుకు? - అనునదే మోక్షార్థి అగు యోగి ధరించు గొంగళి (దుప్పటి).
ఉదాసీన కౌపీనమ్ : దృశ్యములో ’ఏమి పొందాము ? ఏమి పొందలేదు’ … ఇట్టి విషయములను తీసి దూరంగా ఉంచుచూ, “సర్వ సందర్భముల పట్ల, సర్వ ఇంద్రియ విషయముల పట్ల ఈ దేహము యొక్క రాక పోకల పట్ల" కూడా ఉదాసీనము వహించటమే నిర్వాణయోగోపాసన! జగత్ సన్యాసిగా ధరించే కౌపీనము (గోచి). (ఉదాసీనమ్ గత వ్యథా).
విచార దండః : ఆత్మ - అనాత్మ విచారణ, ఏది నిత్యము, సత్యము - ఏది అనిత్యము, అసత్యము (కల్పనా మాత్రము) .. అను విచారణయే నిర్వాణయోగినగు నా చేతిలోని దండము.
బ్రహ్మావలోకో యోగపట్టః : కనబడే లోకములన్నీ ఈ సర్వజీవులను కూడా బ్రహ్మముగా అవగాహనతో సందర్శించటము నా నిర్వాణయోగము యొక్క యోగ పట్టు (లేక) యోగ సాధన.
శ్రియాం పాదుకా పర ఇచ్ఛా ఆచరణం : శ్రీపాదుకాపరమైన ‘ఇచ్ఛ’యే → ఆచరణము. ‘అపరము’ అగు ఈ దృశ్యమునందు నేను సంచరిస్తున్నప్పుడు శ్రియమగు ఆత్మభావనయే నేను ధరించు పాదుకలు (చెప్పులు). సర్వాంతర్యామియగు పరమాత్మయొక్క పాదపద్మములను శరణు వేడుతూ పరాప్రేమతో ఆశ్రయించి ఉండటమే - ఆచరణము.
కుండలినీ బంధః : కుండలినీ యోగాభ్యాసమే చంచల ప్రాణములకు ఆధారమగు నిశ్చల ప్రాణశక్తిని ఆశ్రయించు ప్రాణబంధము.
పరవాదముక్తో జీవన్ముక్తః : ’పరబ్రహ్మమునకు జగత్తు జీవుడు వేరు”… అను సర్వ అపవాదముల నుండి (పరాపవాదముల నుండి) ఎవరు ముక్తుడౌతాడో, అట్టి నిర్వాణ యోగి జీవన్ముక్తుడు. నేను సర్వ అపవాదములనుండి విముక్తుడను - అగుచుండెదను గాక - అనునదే ముక్తికి మార్గము.
శివయోగనిద్రా ఖేచరీముద్రౌ చ : సర్వము శివమయముగా (శివాత్ పరతరమ్ నాస్తి), దర్శించుటయే శివతత్త్వ జ్ఞానము. అట్టి యోగనిద్రా మౌనమును ఆశ్రయించటమే నిర్వాణ యోగికి ఖేచరీ ముద్ర ! నిర్వాణయోగినై ’సర్వము శివమయమే’ అనే ఖేచరీ ముద్రను ధరించినవాడనై ఉండెదను గాక - అనునదే ఆత్మయోగి యొక్క ఖేచరీ ముద్ర.
పరమ - ఆనందీ : నిర్వాణ యోగి ఈ దృశ్య జగత్తులో క్రొత్తగా ఏదో చూచి ఆనందము పొందువాడు కాదు. అతని ఆనందమునకు ప్రసాదించునది - విఘాతము కలిగించునది అగు విషయమేదీ ఈ విశ్వములో ఉండదు. ఉండజాలదు. పరమగు ఆత్మ స్వరూపమును బుద్ధితో గ్రహించి, అదియే తనకు ఆనందమగు విషయముగా కలిగినవాడై ఉంటాడు. అతడు నాకు మార్గదర్శి. ఇహమును అధిగమించిన దృష్టియే పరమానందము.
నిర్గత గుణత్రయమ్ : సత్త్వ-రజో-తమో త్రిగుణములు కూడా అతని పట్ల గతించిపోయిన విషయాలై ఉంటాయి. ఇక ఆత్మజ్ఞుడు గుణములకు కేవలము సాక్షి అయి, త్రిగుణములకు అతీతుడై సర్వులయందు గల “గుణములకు సంబంధించని ఆత్మ” యందు దర్శనము కలిగి ఉంటాడు. అందరినీ ఆత్మ స్వరూపంగా చూస్తూ, ఆత్మయందు మాత్రమే రమిస్తూ ఆత్మారాముడై ఉంటాడు. గుణములకు అతీత దృష్టితో సహజీవులను గాంచటమే - నిర్గత గుణత్రయము.
వివేక లభ్యమ్ : వివేకియై సర్వదా సర్వత్రా ఆత్మ దృష్టి లభించినవాడై ఆ నిర్వాణయోగి ఆనందిస్తూ ఉంటున్నాడు. వివేకము - వివేక దృష్టియే ఈ జగత్తు నుండి పొందవలసిన లాభము.
మనో-వాక్ అగోచరమ్ : మనస్సుకు వాక్కుకు కూడా అగోచరమై, బుద్ధిచే మాత్రమే (With mere common-sense) నిర్వాణస్థానమును దర్శిస్తూ, ఆస్వాదిస్తూ ఉంటున్నాను. కేవలము నిర్మల - సునిశిత బుద్ధికి మాత్రమే తెలియవచ్చునదే ‘ఆత్మ’!
అనిత్యమ్ జగత్ యత్ చ అజ్జనితమ్ : ఈ ఎదురుగా కనిపిస్తున్న దృశ్య జగత్తుకు గల ముఖ్య లక్షణాలు …..
స్వప్న జగత్ - అభ్రగజాదితుల్యమ్ : ఒక పిల్లవాడు ఆకాశంలో మేఘముల ఒక చివర చూచి, “అదిగో ! అక్కడ ఏనుగు కదులుతూ ముందుకు జరుగుతోంది" అని తలచినట్లుగా…, ఈ జగత్తు స్వప్న తుల్యము. ఇదంతా జాగ్రత్ స్వప్నము. స్వప్నములో కనిపించేదేమో… స్పప్న జాగ్రత్. ఉభయము ఊహచే కల్పించుకొని పొందబడుచున్నవే గాని, సహజ సత్యములు కావు.
తథా దేహాది సంఘాతమ్ : స్వప్నములో కనిపించే ఒక ఇల్లు, కొండ ఎటువంటివో, ఈ భౌతక దేహము కూడా అటువంటిదే ! ఇది కూడా అజ్ఞానికి స్వకీయమోహము వలననే సర్వదా ఉండే వస్తువువలె అనిపిస్తూ ఉండవచ్చుగాక ! ఇది స్వప్న వస్తువుతో సమానమైనదే. దేహికి దేహము ఐహిక మోహము-ఇదంతా కూడా స్వప్నంలో ధరించిన ఆభరణము వంటిది.
ఈ విధంగా భౌతిక దేహము, జీవుల సంబంధములు, దృశ్య వస్తు సంబంధములు, జన్మ-మృత్యువులు, మనోబుద్ధి చిత్త అహంకారాలు, బంధ - మోక్షములు… ఇవన్నీ కూడా స్వప్నములో కనిపించే వస్తు సముదాయమువంటివి మాత్రమే!
మోహగుణజాల కలితమ్ : మరి జాగ్రత్లోని వస్తువులన్నీ కలలోని వస్తువులవలె అనిత్యము అని, వస్తుతః అసత్యము అని అనిపిస్తున్నాయా? లేదుకదా? ఇవన్నీ ఘనీభూతమై ఉన్నట్లు, జీవునికి అనేక బంధములు కలిగిస్తున్నట్లు ఏర్పడినవై అనుభూతమగుచున్నాయి. ఎందుచేత? మోహము చేతనే! స్వబుద్ధి నిర్మించుకొన్న భ్రమ పరంపరలచేతనే! కలలో కనిపించేవి అవాస్తమే అయినప్పటికీ కలలో ఉన్నంతసేపు అనవ్నీ ఏకారణం చేత ‘వాస్తవమ్’ అని అనిపిస్తూ ఉండటం జరుగుతోందో…, అదియే మోహము.
ఈ జాగ్రత్ జగత్ కూడా వాస్తవానికి స్వప్నము వంటిదే అయి వుండి, నిర్వాణ రూప జ్ఞానము కలుగనంత వరకు ఇందులోని విశేషాలన్నీ ’సత్యమే’ అని ఏకారణంగా అనిపిస్తోందో … అద్దానిని కూడా ‘మోహము’ అని చెప్పుచున్నారు. ఈ విధంగా జాగత్ దృశ్యభావావేశము, దేహముల రాకపోకలు… ఇవన్నీ ‘మోహ గుణములు’ అనే జాలము (వల) నుండి పుట్టుకొస్తున్నాయి. మోహము (Illusion) నిర్వాణజ్ఞానముచే తొలగినప్పుడు బంధము లేదు. మోక్షము లేదు. జన్మ లేదు. మృత్యువులేదు. దేహము లేదు. ఇంద్రియ దృశ్యము లేదు.
తత్ సర్పరజ్జువత్ కల్పితం : శబ్ద - స్పర్శ - రూప రస - గంధములు అనే ‘5’ శక్తులు గల ఈ దేహములో పొందబడుచున్న దృశ్యానుభవ పరంపరల వలన కలుగుచున్న సుఖ-దుఃఖములు, బంధ - మోక్ష భావములు, కష్ట-సుఖములు, సంబంధ-బాంధవ్యములు… ఇవన్నీ కూడా త్రాడును చూచి “పామురా బాబూ” అని అనుకొని సర్వ వికారాలు పొందటము… వంటిది. ‘పాము’ అనుకోవటం తరువాత బంధము వచ్చి, త్రాడు అని తెలిసిన తరువాత క్షము వచ్చిందా? లేదు కదా ! ‘భ్రమ తొలగింది’ అని మాత్రమే మనము ఇక్కడ చెప్పుకోవాలి. అట్లాగే ‘నిర్వాణ స్వరూపుడే’ అయి ఉన్న ఈ జీవుడు దృశ్య వ్యవహారములను ‘సర్పరజ్జు దృష్టి’ అనే భ్రమ, భ్రాంతిచే పొందుచున్నాము. ’నిర్వాణ జ్ఞానము’చే దేహ - ఇంద్రియ - దృశ్య విషయములు సర్పభ్రాంతి వంటిది మాత్రమే అని గుర్తించి.. తొలగించుకొనుచున్నాను. భ్రమను మొదలంట్లో త్యజించివేసినవాడై బుద్ధితో మాత్రం చిరునవ్వుతో చూస్తున్నాడు.
విష్ణు విద్యాది శతాభిధాన లక్ష్యమ్ : సత్య ద్రష్టలగు మహనీయులు ‘విష్ణుమాయ’ అనబడే “జగత్ రూపరహస్యము”ను విశదపరచుచూ ‘విష్ణు విద్య’, ‘ఆత్మ విద్య’, ‘భక్తి-జ్ఞాన-క్రియా యోగ మార్గములు’ మొదలైన ఆయా వివరణలు, ఉపాయములు ఈ జీవులకు అందిస్తున్నారు. వాటన్నిటి యొక్క ఆశయము, “ఇవన్నీ నీకు బంధము కాదు. ఎందుకంటే నీవు నిర్వాణ స్వరూపుడవు. సర్వ విషయములకు ఆవల గల ఆత్మస్వరూపుడవు” … అని పరతత్త్వ జ్ఞానము ప్రతిపాదించి, బోధించటము కొరకే అయి ఉన్నది. జీవునకు అతని నిర్వాణ స్వరూపము గుర్తు చేసి ’నీవు బంధరహితుడవు. బంధము నీ కల్పన”…. అను బోధచే సత్యమును ఎరుగపరచటము కొరకు శాస్త్రములు ఉద్దేశ్యిస్తున్నాయి. “విష్ణు విద్య, ఆత్మవిద్య, భౌమావిద్య, శివతత్త్వ విద్య, మోక్ష విద్య, ఇటువంటి వందల పేర్ల లక్ష్యమంతా ఒక్కటే! తనను తాను ఎరుగుటయే!
అంకుశో మార్గః : ఒక పిచ్చిపట్టిన ఏనుగు వనములో ఇచ్చవచ్చినట్లుగా సంచారములు చేస్తున్న తీరుగా, ఈ చిత్తము : జన్మ-కర్మలు, ఇంద్రియ దృశ్యపరంపరలు అనబడే - సంసారారణ్యములో సంచారములు చేస్తూ బహు దుఃఖములు తెచ్చిపెట్టుకొని అనుభవిస్తోంది. అందుకు ఉపాయములే “తపస్సు - ధ్యానము - భక్తి - వైరాగ్యము - కర్మ సమర్పణ” మొదలైన సాధనలతో కూడిన యోగములు. చిత్త ఏనుగును వశం చేసుకొనే అంకుశము - అట్టి యోగోపాయములే! శాస్త్రములు చెప్పు యోగశాస్త్రము, భక్తి గుణములు, జ్ఞాన సంపత్తి, సాధన చతుష్టయము, ఇవన్నీ కూడా చిత్తము అనే ఏనుగుకు ‘సంసార సంచారము’ అనే పిచ్చిని తొలగించి మనకు నిర్వాణ రూపమగు ‘ఆత్మా హమ్’ భావనకు త్రోవ తీసే అంకుశములు.
శూన్యం సంకేతః : అటువంటి నిర్వాణస్థానమును పునికిపుచ్చుకోవటానికి, “ఈ జగత్ బంధము మోహముచే మనోకల్పితము. వాస్తవానికి అంతటా ఆత్మయే ! స్పప్నంలో కనిపించేదంతా వాస్తవానికి అవిషయము, శూన్యము కదా ! అట్లాగే జాగ్రత్ కూడా ! ఆత్మ యొక్క ఊహా విలాసమే ! వస్తుతః శూన్యమే !” అను సమాచారము.
- ఎందుకు ఆత్మ మాత్రమే సత్తుయో,
- ఎందువలన జగత్తుగా కనిపించేదంతా ఆత్మకు వేరుగా చూస్తే శూన్యమో
… అదియే నిర్వాణస్థానము చేరుటకు సంకేతము.
పరేశ్వర సత్తా : స్వస్వరూప సత్తాయే పరేశ్వరుడు. అట్టి పరేశ్వర సాకారోపాసన, నిరాకార ధ్యానము, సర్వము తానైన సోఽహమ్ - అభ్యాసము ఇవన్నీ ఈశ్వర ధ్యాన రూపమగు మంత్రమననములు.
సత్య సిద్ధయోగో మఠః : సత్యమును సిద్ధింపజేయు సాధనలు (భక్తి-జ్ఞాన-విజ్ఞాన-ఆత్మ సంయమ యోగములు) ఉపాసించుచున్న ప్రదేశమే ఆశ్రమము. అదియే ‘మఠము’ కూడా!
అమర పదమ్ న తత్ స్వరూపమ్ : దేనికైతే మార్పు - చేర్పులు లేవో, అమృత-అమరపదమై యున్నదో, కేవల తత్ ఆత్మస్వరూపమైయున్నదో…. అట్టి కేవలీ ఆత్మాకాశము అనంతమైయుండగా, ఈ జగత్ భావాలు అనే మేఘము అద్దానిని కప్పి ఉంచుటము అనే మాటయే అర్ధరహితము. అట్టి మన నిర్వాణ స్వరూపము తత్ స్వరూపమై, శాస్త్రసాధనలచే గుర్తు చేయు - అనుక్షణిక విశేషమై ఉన్నాయి. ‘ఆత్మా హమ్’ అను బుద్ధియొక్క స్థితియే మహాశయము. తదితర ‘సర్గ’ మొదలైనవి (దృశ్య సంబంధమైన ఆశయములు) అల్పాశయములు.
ఆది బ్రహ్మ సంవిత్ : ఈ జగత్ దృశ్యము ఇంద్రియములకు విషయరూపము. ఇంద్రియములు దేహము యొక్క అంతర్భాగము. ఈ దేహమో - అనేక జనించి గతించుచున్న అసంఖ్యాక దేహములలో ఒకానొకటి. అట్టి దేహముల ప్రహసనమునకు ముందు - మధ్య - ఇకముందు దేహి ఉన్నాడు. అట్టి దేహి యొక్క దేహములకు వేరైన స్వస్వరూపమే “ఆది బ్రహ్మము”. అట్టి బ్రహ్మము… ఎటువంటి లక్షణములు కలిగి ఉన్నది ?…
సత్ - ఉనికి (నేను ఉన్నాను కదా !.. అను) రూపము.
విత్ - ఎరుక (తెలుసుకొనువాడనై ఉన్నాను కదా !… అను) రూపము.
అట్టి ఆదిబ్రహ్మ - సంవిత్యే నిర్వాణ రూపము.
అజపా గాయత్రి : "ఓం తత్ సవితుః వరేణ్యమ్ భర్గోదేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్… అను శబ్దిపాసన… “సాక్షాత్ ఉనికి రూపమున ఉంటూ, ఎరుక రూపమున - బుద్ధి రూపమున వెలిగించు వరేణ్యుడగు సవిత్రుదేవత (సత్ + విత్ + ఋత్) నా బుద్ధిని ప్రేరేపించును గాక”… అను అర్ధమును ప్రతిబింబిస్తున్న ఉపాసనా మంత్రము - జపాగాయత్రి. అట్టి జపాగాయత్రి యొక్క గానోపాసనచే ఈ సర్వముగా ఉండి, ఈ సర్వముగా తెలియబడుచున్న సంవిత్ స్వరూపము స్వానుభవముగా అగుచూ వస్తున్నది.
జపాగాయత్రి… స్వానుభవమగు ‘అజపాగాయత్రి’గా సంతరించుకొనుచున్నప్పుడు.. ఇక ఈ జగత్తు స్వాభావికంగానే ఆత్మరూపముగా అనుభవమగుచున్నది. అదియే నిర్వాణము. బుద్ధితో గాయత్రీ మంత్రార్ధమును భావన చేయటము ‘అజపా గాయత్రి’. తద్వారా నిర్వాణ భావన స్వయముగా సిద్ధిస్తున్న దగుచున్నది. శబ్ద వ్యవహారమంతా శాంతించగా సిద్ధించు ఆత్మభావనయే ‘అజపాగాయత్రి’.
వికార దండో ధార్యః : అట్టి నిర్వాణమును సమీపిస్తున్న యోగికి ప్రాపంచక విషయాలన్నీ “సన్యాసి చేతిలో ధరించే దండము” వంటివి అగుచున్నాయి. బాహ్య విషయములు బాహ్యముననే లయిస్తూ, అంతరంగమున ప్రవేశించకుండా దండించబడుచు, శాసించబడుచున్నాయి. జగత్ వికారములన్నీ దండమువలె బాహ్యమున మాత్రమే ధరించి, అంతరమున ఆత్మ భావన మాత్రమే శేషించటము - ధారణ.
మనో నిరోధినీ కంథా : మనస్సు విషయముల నుండి నిరోధించి, ఉపశమింపజేసి (withdrawal) నిర్వాణ రూపమగు బ్రహ్మము వైపు ప్రయాణింపజేయు విద్యుక్త విధానమే ఆ నిర్వాణ యోగసన్యాసి ధరించు బొంత / కండువా!
యోగేన సదానందరూప దర్శనమ్ : యోగాభ్యాసముతో నిర్వాణయోగి ఈ దృశ్యమునంతా ఆనంద రూపమగు పరబ్రహ్మ రూపంగా (లేక) ఆనందాత్మ రూపముగా దర్శించుచున్నాడు. స్వస్వరూపము యొక్క స్వకీయ ప్రదర్శనముగా దర్శిస్తున్నాడు.
ఆనంద భిక్షాసీ : “అంతా ఆత్మానందమే కదా! - అను బుద్ధి రూప భిక్ష"ను ఈ సన్యాసి ఈ మనో జగత్ గృహస్థుని నుండి పొందుచున్నాడు.
మహాశ్మశానేఽపి ఆనందవనే వాసః : జగత్ దృశ్యమును మొదలే లేనట్టి, ఎప్పుడో గతించిపోయిన ఒకానొక దృశ్యమువలె చూస్తూ, ఆనందాస్వాదన చేయుచున్నాడు. జగత్ దృశ్యమును శ్మశానము వలె త్యజించి ‘ఆత్మానందము’ అనే వనములో ఆనందముగా సంచరించుచున్నాడు. “ఇదంతా - మహాశ్మశానమే అయి కూడా, నాకు ఆనందంగా విహరించు వనము వంటిదే”…. అను అనుభవము సిద్దించుకొనుచున్నాడు.
ఏకాంతస్థానే ఆనంద మఠమ్ : అనేకముగా కనిపిస్తున్న జగత్తును ఏకమునందు లయం చేసి, అప్పుడు శేషించు విషయానందాతీతమైన ఆత్మానందమును నివాస మఠముగా కలిగి ఉంటున్నాడు.
ఉన్మనీ అవస్థా : మనస్సుకు సాక్షి, మనస్సు నియమించు స్థానము అయినట్టి “ఉన్మనీ అవస్థ"ను ఆశ్రయించి ఉంటున్నాడు. అట్టి నిర్వాణమును ఆశ్రయించి సర్వ ఆలోచనలను, వాటి వాటి సంచారాలను చిరునవ్వుతో గమనిస్తూ ఉన్నాడు. స్వయమ్ తత్ స్వరూపముగా అయి ఉంటున్నాడు. మనస్సును, అద్దాని విషయ చింతనలను ఆత్మతో ‘ఏకము’ చేసి, ఏకాత్ముడై సర్వాతీత స్థానమునుండి ఈ మనోకల్పిత జగత్ దృశ్యమును మౌనంగా చూస్తున్నాడు.
శారదా చేష్టా : చేష్ఠలన్నీ ఆత్మ విద్యా సుమన్వితమై, శారదా చేష్ఠలగుచున్నాయి. శబ్ద బ్రహ్మమును ఆశ్రయిస్తూ ఉంటాడు. అనేకంగా కనిపించేదంతా ఏకాత్మ భావనతో దర్శిస్తున్నాడు.
ఉన్మనీగతిః : శబ్ద బ్రహ్మమును మనస్సుకు ఆవల సాక్షిగా ఉండునది ‘ఉన్మనీ గతి’. మనస్సుకు కనిపించేదంతా ఆత్మయందు క్షణక్షణము గతింపజేస్తున్నాడు.
నిర్మల గాత్రమ్ : శబ్దాపాసనతో దృశ్య - దేహ - మనో - బుద్ధి - చిత్త - అహంకారాలు నిర్మలమగుచున్నాయి.
నిరాలంబమ్ పీఠమ్ : నిరాధారమగు నిర్వాణ స్థానమే ఆ యోగికి ఆసీన ప్రదేశమగు పీఠము.
అమృతకల్లోల ఆనంద క్రియా : “అహమ్ ఏక తరంగమస్మి నిర్వాణానంద సాగరమ్"….. అను భావనతో తాను అమృత సాగరంలో ఆనంద తరంగమువలె సంచారములు సలుపుచూ ఉండటము అతడు నిర్వర్తించు యోగభ్యాస రూపమగు ’క్రియ’ అగుచున్నది.
పాండర గగన మహా సిద్ధాంతః : బ్రహ్మాకాశమే జగత్ రూప విశేషముగా దర్శించటము, సర్వమ్ ఖల్విదమ్ బ్రహ్మ - జీవో బ్రహ్మేతి నా పరః - అయమాత్మా బ్రహ్మ - అహమ్ బ్రహ్మాఽస్మి".. ఇత్యాది మహా వాక్యానుభవ విస్థారమే ఆ నిర్వాణ యోగి యొక్క మహత్తరమగు అంతిమ మహాసిద్ధాంతము అగుచున్నది.
శమ-దమాది దివ్యశక్త్య ఆచరణి : బాహ్య-అంతర ఇంద్రియముల నిగ్రహము, నియామకము.. ఇవియే అతని ఆచరణము. ఆచారము.
క్షేత్ర - పాత్రపటుతాః : దేహక్షేత్రము - ప్రకృతి ప్రసాదించే పాత్ర (Role) ఈ రెండిటినీ సమన్వయించుకొని ధర్మ నిర్వహణా భావముతో నిర్వర్తించవలసినది నిర్వర్తిస్తూ, అది నిర్వాణోపాసనగా భావిస్తూ ఉంటాడు. ఈ దేహమును పట్టుదలతో యోగమునందు నియమించుచూ ఉంటున్నాడు.
పర - అపరసంయోగః తారకోపదేశః : పర (జగత్ దృశ్యమునకు ఆవల గల సర్వాధారమగు సాక్షీరూపము - పరమాత్మ).. ఇహ (జగత్ దృశ్యము) … అను రెండిటి యొక్క సంయోగము (నటుడే పాత్రగా, పాత్రధారుడే నటుడుగా కనిపిస్తున్న రీతిగా అనిపించటమే) తారకోపదేశము. అదియే నిర్వాణయోగి ఆశ్రయించు తారకమంత్రము. తరింపజేయు మననము.
అద్వైత సదానందా దేవతా : ద్వితీయమైనది - (వేరైనది లేనట్టి) అద్వితీయ - సదానందమే అతని ఇష్ట దేవత ! ఆత్మయే జగత్‌గా కూడా భాసిస్తూ ఉన్నది. "జగత్ అహమ్ - త్వమ్” ప్రత్యయములు అద్దానికి వేరు కాదు. కాబట్టి అద్వైతమగు ఆత్మానంద - స్వరూపమే జగత్ అహమ్ త్వమ్ రూపము. “జీవాత్మగా ఉన్నది పరమాత్మయే”…. అను అద్వైత దేవదేవిని ఉపాసించుచున్నాడు.
నియమస్య అంతరింద్రియ నిగ్రహః : అంతరింద్రియమములైనట్టి మనో-బుద్ధి - చిత్త - అహంకారములను సాధననియమములతో నిగ్రహిస్తూ నిర్వాణమువైపుగా నడుపబడుగాక! ఆ అంతరింద్రియములను ఆత్మభావనతో సందర్శించటమే (లేక) భావించటమే నియమము, నిగ్రహము కూడా !
భయ - మోహ - శోక - క్రోధ త్యాగః సత్యగః : సన్యాసి మరి త్యజించవలసినవి ఏమేమి? భయము, మోహము, శోకము, క్రోధము. వాటిని వదిలి ఉండటమే నిజమైన త్యాగము. అంతేగాని భౌతిక వస్తువులు త్యజించిన మాత్రంచేత అది నిజమైన త్యాగము కాదు.
పరావరైక్య రసాస్వాదనమ్ : ఇహంగా ‘ఈ కనబడే జీవులంతా పరస్వరూపమగు బ్రహ్మమే’ ….. అను మధురమైన దృష్టితో నిర్వాణ యోగ పుంగవులు రసాస్వాదులై ఉంటున్నారు.
అనియామకత్వః నిర్మల శక్తిః : తానే ఇంద్రియ నియామకుడై ఉంటాడు. అంతేగాని…. తాను ఇంద్రియములచే నియమించబడు వాడు కాడు. నిర్మల శక్తి సంపన్నుడై, శబ్ద - స్పర్శ - రూప - రస - గంధముల సూక్ష్మ స్వరూప శక్తి సమన్వితుడై ఉంటాడు. ఇంద్రియములను మాయయందు దర్శించుచూ అనియామకత్వము వహిస్తూ కూడా ఉంటాడు.
స్వప్రకాశ బ్రహ్మతత్త్వే : నిర్వాణ రూపము (సర్వము కదలుస్తూ, తాను కదలక ఉన్నట్టి కేవలీ చిత్ తత్త్వము)… అగు బ్రహ్మతత్త్వమును అనుభవైకవేద్యముగా కలిగి ఉంటాడు. స్వస్వరూప పరబ్రహ్మమే సర్వమును వెలిగిస్తూ తాను స్వక్రాశమానమై ఉన్నది. అద్దానిని వెలిగించునది మరొకటేమీ లేదు.
బ్రహ్మము యొక్క స్వయంప్రకాశ రూపమే… ఈ తదితరమైనదంతా కూడా ! అను ధారణ కలిగి ఉంటాడు.
శివ-శక్తి సంపుటి ప్రపంచ ఛేదనమ్ : శివుడు + శక్తి ఐక్యతత్త్వముచే ప్రపంచము ఆతనికి భాసిస్తోంది. శివశక్తి స్వరూపముగా అనుభవమగుచున్నది. అప్పుడిక భూతపంచక మాత్రంగా కనిపించదు. ప్ర+పంచము = శివశక్యైక్య రూపమునకు అభిన్నమైనది.
శివ | శక్తి | ఏకము-ఐక్యత్వము |
---|---|---|
భావించువాడు | భావించబడునది | భావనలు భావించువాని రూపమే! |
చూచువాడు | చూడబడునది | చూడబడుచున్నదంతా చూచువాని రూపమే! |
వినువాడు | వినబడునది | వినువాడి చైతన్యరూపమే వినబడునదంతా! |
ఆలోచించువాడు | ఆలోచనలు | ఆలోచనల రూపము ఆలోచించువాడే! |
తెలివితనదైనవాడు | తెలియబడునది | తెలుసుకొనుచున్నవాడే తెలియబడు రూపి! |
ఇష్టపడువాడు | ఇష్టమగుచున్నది | ఇష్టమంతా ఇష్టము తనదైనవాని రూపమే! |
అహంకారము తనదైనవాడు | అహంకారము | అహంకారము తనదైన వాడే అహంకార రూపముగా ఉన్నాడు! |
ఉభయము ఏకముకాగా ఇక, వీటికి వేరైన పాంచభౌతిక ప్రపంచము లేనిదే అగుచున్నది. ద్వంద్వములుగా కనిపించేది ఏకము యొక్క చమత్కారమే!
తథా పత్రాక్ష - అక్షి కమండలు బావాభావ దహనం : అట్టి ఏకత్వమునందు సాధన వస్తువులగు అక్షి కమండలు, ఉపకరణములు దహించవేయబడుచున్నాయి.
ఇవన్నీ ఏకస్వరూపమై, భావ- అభావ వ్యవహారమంతా దహించి వేయబడినదగుచున్నది.
బిభ్రతి ఆకాశ ఆథారమ్ : సర్వమునకు ఆధారము ఆత్మాకాశమే ! ఆత్మాకాశమో… నిరాధారము.
⌘
ఆత్మాకాశమే స్వరూపాధారముగా కలిగియున్న ఆ నిర్వాణ యోగి పుంగవుని స్వరూప - స్వభావములు, ఇంకా కూడా, ఎట్టివో … చెప్పుకుంటున్నాము.
ఆ నిర్వాణ యోగికి -
శివానంద స్వరూపగము శివోఽహమ్ తురీయము | - యజ్ఞోపవీతము |
ఆత్మతో తన్మయమగు చిత్తము | - శిఖ (పిలక) |
చిత్-మయమగు దర్శనము | - యోగదండము |
ఎల్లప్పుడు ఆత్మ దృష్టియే | - కమండలువు |
అకర్మయందు కర్మ దర్శనము, కర్మయందు అకర్మ దర్శనము | - ఇదియే జీవిత కథాగమనము |
మాయ-మమతలు | - దహనమునకు ఉపయోగించు కట్టెలు. అగ్నికి ఆహుతులు |
వాయువు కదలికల నిశ్చలత్వ ప్రాణాయామమే | - శ్మశానము, విషయ-రహితమగు హృదయాంతర్గత ప్రదేశము |
త్రిగుణములకు ఆవల త్రిగుణాతీతమగు నిస్త్రైగుణ్య - ఆత్మభావనయే | - స్వస్వరూపానుసంధాన సమయము |
భ్రాంతియే | - హరించివేయు హారతి కర్పూరము |
కామ - క్రోధ - లోభ - మద మాత్సర్యములే | - దహించవలసిన వస్తు సముదాయము. అగ్నిలో వేయు వస్తువులు |
బ్రహ్మ భావము పట్ల పట్టుదల, కఠినత్వము, మొండితనము | - దృఢముగా ధరించే కౌపీనము (పంచకట్టు) |
యోగసాధనలు | - నార వస్త్రములు |
అనాహతమ్ | - (ప్రాణనిరోధము) మంత్రము |
సర్వకర్మల విషయములో/అకర్తృత్వమ్ | - స్వీకరించబడు పానీయము |
స్వస్వరూపమగు ఆత్మ యొక్క నిత్య స్వాభావిక స్వాతంత్య్రత్వమును సర్వదా దర్శించటమే… | - మోక్షము. “ఆత్మకు ఏక్షణమందూ కూడా దేనిచేతనూ బంధము పొందుట లేదు”… అను అవగాహనయే మోక్షము. “నేను సర్వదా ఆత్మ స్వరూపుడను" అను భావనాభ్యాసముచే మోక్షము నిశ్చలమగుచున్నది. |
‘పరబ్రహ్మము’ అను ‘నావ’ (Boat) ఎక్కి ఉండటమే | - ఆచరణము. నావ నీళ్ళలో ఉంటుంది. కానీ నావలో నీళ్ళు వుండవు కదా. ఆ యోగి జగత్తులో ఉన్నప్పుడు కూడా తనలో జగత్తు ఉండనివ్వడు. “పరబ్రహ్మమే స్వరూపముగా గల నేను - జీవుడు జగత్తులందు కూడా ఉండవచ్చును గాక! కానీ నాయందు జీవుడు లేడు. జగత్తు లేదు”… అనునదే నిర్వాణయోగి యొక్క ఆచారము. |
బ్రహ్మచర్యమ్ (అనునిత్యము బ్రహ్మమునందే చరించటమే) | - బ్రహ్మముగా దర్శిస్తూ జగత్ రహితుడై ఉండటము… ఆతని శాంతి పాఠము. |
బ్రహ్మచర్యాశ్రమే అధీత్య! వాన ప్రస్థాశ్రమే అధిత్య! | - బ్రహ్మచర్యాశ్రమము - వానప్రస్థాశ్రమము ఆతని పాఠశాలలు. అధ్యయన స్థానములు. చేతులు దృశ్యములో ఉంచి కూడా తాను బ్రహ్మచర్య - వాన ప్రస్థాశ్రమ వాసిగానే ఉంటాడు. క్రమంగా ఉత్తరోత్తర పరాస్థానము చేరుచున్నాడు. (Hands in the world. But Head in the Forest). |
‘ఇదంతా ఆత్మ యొక్క విన్యాసము’ అను భావనయే | - ఆతని సన్యాసము సత్ + న్యాసము సత్‌ను ఉపాసించటము |
అఖండమగు బ్రహ్మమే తానగుట | - ఇదియే ఆ నిర్వాణయోగి యొక్క పరాకాష్ఠ అనుభవము, స్థానము కూడా. |
బ్రహ్మమునకు వేరుగా ద్వితీయమైనదేదీ లేదు…. అను నిస్సందేహత్వమే | - అతని సర్వసందేహ నివృత్తి స్థానము |
ఇది నిర్వాణ దర్శనము
ఇట్టి నిర్వాణయోగము యోగ్యతగలవారికే బోధించబడుగాక!
ఆయోగ్యుడగు పుత్రునికిగాని, శిష్యునికిగాని బోధించబడకుండును గాక!
ఇతి
🙏 నిర్వాణ ఉపనిషత్ 🙏
ఓం శాంతిః శాంతిః శాంతిః