[[@YHRK]] [[@Spiritual]]

SāTyāyanēya Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 1
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com


శుక్ల యజుర్వేదాంతర్గత

17     శాట్యాయనీయోపనిషత్

శ్లోక తాత్పర్య పుష్పమ్


శ్లో॥ శాట్యాయనీ బ్రహ్మవిద్యా అఖండాకార సుఖాకృతీః
యతి బృంద హృత్-ఆగారం రామచంద్రపదం భజే॥

యతులు - ఏ “అఖండ సుఖాకృతి” (Un-ending form of pleasantness) అయినటువంటి తత్త్వమును - తమ హృదయమునందు సర్వదా ధారణ చేస్తూ ఉన్నారో, అట్టి “శాట్యాయనీ బ్రహ్మవిద్యా మార్గదర్శకము” అగు శ్రీరామచంద్ర పాద పద్మములను భజించుచున్నాము.


ఓం
1.) మన ఏవ మనుష్యాణాం
కారణం బంధ-మోక్షయోః |
బంధాయ విషయాసక్తమ్,
ముక్యైః నిర్విషయమ్ స్మృతమ్||

సమాసక్తం సదా చిత్తం
జంతోః విషయగోచరే,
యత్ ఏవం బ్రహ్మణిస్యాత్
తత్ కో న ముచ్యేత బంధనాత్?

చిత్తమేవ హి సంసారః,
తత్ ప్రయత్నేన శోధయేత్|
యత్ చిత్తః తన్మయో భవతి
గుహ్యమ్ ఏతత్ సనాతనమ్|

ప్రణవ స్వరూపుడగు పరమాత్మకు నమస్కరిస్తూ …..!!

ఆత్మ నిత్యముక్తము. జీవుడో… నిత్యబద్ధుడు. ఆత్మకు ‘బంధము’ అనునదే ఉండదు. ఈ జీవుడు స్వతఃగాను, సహజముగాను ఆత్మయే స్వరూపముగా కలిగి ఉన్నాడు. అటువంటప్పుడు ఈ జీవునికి బంధముయొక్క అనుభవమంతా ఎక్కడినుండి వచ్చిపడుతోంది? బంధ-మోక్షములకు కారణము మనస్సే! ‘బంధము’ అనగా విషయములపట్ల ఆసక్తి! ఆ విషయాసక్తి తొలగి మనస్సు విషయరహితమైతే (నిర్వషయమైతే) అదియే ‘ముక్తి’! ఇంతకు వేరుగా బంధము లేదు. ముక్తి లేదు.

ఈ జీవులయొక్క చిత్తము ఎల్లప్పుడూ ఎదురుగా కళ్ళకు చెవులకు - తదితర ఇంద్రియములకు విషయములుగా అగుచున్న వాటి పట్ల సమాసక్తము అగుచున్నది. ఆ విధముగా విషయములపై వ్రాలుచున్న ఈ చిత్తము - విషయములపై వ్రాలుచున్న విధంగానే - బ్రహ్మము వైపుగా ప్రసరించటము జరిగిందా, అప్పుడు ఎవ్వనికి మాత్రము ఎందుకు ముక్తి లభించదు? లభించి తీరుతుంది.

‘సంసారము’ అనగా ఈ చిత్తమే అయి ఉన్నది. మరింకేదో కాదు. అట్టి ఈ చిత్తమును ప్రయత్న పూర్వకంగా శోధించాలి. సనాతనమై, అతి దీర్ఘకాలంగానూ.., (మొట్టమొదటినుండి కూడా) వాస్తవమై, రహస్యము అయినదేమిటంటే - ఈ చిత్తము దేనిదేనిపై వ్రాలుచున్నది… ఈ జీవుడు ఆయా రూపములుగా ఆవిధంగా తానే అగుచున్నాడు.

న అవేదవిత్ మనుతే, తం
బృహంతం। న అబ్రహ్మవిత్
పరమం ప్రైతి ధామ,
విష్ణుక్రాంతం వాసుదేవం విజానన్,
విప్రో విప్రత్వం గచ్ఛతే తత్త్వదర్శీ!
అథ హ యత్ పరంబ్రహ్మ సనాతనమ్,
యే శ్రోత్రియా అకామహతా
అధీయుః। శాంతో,
దాంత ఉపరతి తితిక్షుః
యో అనూచానో హి "అభిజజ్ఞౌ” సమానః।

ఈ జీవుడు తెలుసుకుంటూ ఉన్నదానిని తెలుసుకుంటేనే “విదితవేత్త” అగుచున్నాడు. వేదవేత్త కానివాడు (తెలుసుకొంటున్న దానిని తెలుసుకొనని వాడు) పరమాత్మను మననము చేయలేడు. పరమాత్మను మననము చేయనివాడు బ్రహ్మవేత్త కాలేడు. బ్రహ్మవేత్త కానివాడు పరమపదమును పొందలేడు.

ఏది అయితే-అన్నీ తానే అయి ‘విష్ణుక్రాంతము’ (సర్వవ్యాపి, సర్వాతీతుడు) గాను, అన్నిటియందు వసించుచూ ’వాసుదేవము’గాను ప్రకాశించుచున్నదో అట్టి తత్త్వమును గ్రహించి, “తత్వదర్శి” అయి, ఈ జీవుడు ‘విప్రత్వము’ పొందుచున్నాడు. ’విప్రుడు’ అగుచున్నాడు.

అట్టి శ్రోత్రియుడు-ఈ దృశ్య ప్రపంచము నుండి ఏమీ అవసరములేనట్టి అకామవంతుడై, జన్మ-కర్మలకు ముందే ఉన్నట్టి సనాతన పరబ్రహ్మమును అధ్యయనము చేయుచున్నాడు. శాంతుడు-దాంతుడు (ఇంద్రియములను జయించువాడు) - ఉపరతిని (ఇంద్రియములను విషయములనుండి ఆవలకి తెచ్చి ఆత్మభావనయందు నియమించటము) ఆశ్రయించి, అనూచానుడై (జగత్తులను దాటివేసి) అభిజజ్ఞుడు (ఆత్మను ఎరిగినవాడు)
అగుచున్నాడు. సమాహితుడగుచున్నాడు.

2.) త్యక్త ఈషణో హి అనృణస్తం విదిత్వా,
మౌనీ వసేత్ ఆశ్రమే,
యత్ర కుత్ర అథ ఆశ్రమం చరమం సం ప్రవిశ్య |
యథా ఉపపత్తిం పంచమాత్రాం దధానః |
త్రిదండమ్ ఉపవీతం చ,
వాసః కౌపీన వేష్టనమ్,
శిక్యం పవిత్రమ్ ఇత్యేతత్
భిభృయాత్ యావత్ ఆయుషమ్।
పంచ ఏతాస్తు యతేః మాత్రాః
తా మాత్రా బ్రహ్మణే శ్రుతాః॥
న త్యజేత్ యావత్ ఉత్క్రాంతిః
అంతేఽపి నిఖనేత్ సహ|
విష్ణు లింగం ద్విధా ప్రోక్తం
వ్యక్తమ్, అవ్యక్తమ్ ఏవ చ
తయోః ఏకమపి త్యక్త్వా
పతత్యేవ న సంశయః|
త్రిదండం, వైష్ణవం లింగం
విప్రాణాం ముక్తి సాధనమ్|
నిర్వాణం సర్వధర్మాణామ్ |
ఇతి వేదానుశాసనమ్ |

ఈషణము (కోరిక, ప్రేమ, ఈషణత్రయము - భార్యేషణ పుత్రేషణ ధనేషణ)లను వదలి, ఋణములనుండి (ఋణచతుష్టయము దేవ-ఋషి-పిత్రు-మానవ ఋణముల నుండి) విముక్తుడై, మౌని అయి (సర్వప్రాపంచక విషయముల పట్ల మౌనము వహించినవాడై), ఇక ఆపై ఎక్కడో అక్కడ ఒక ఆశ్రమంలో ప్రవేశించి ఉంటున్నాడు.

సన్న్యాసి అయి పంచ మాత్రలను (శబ్ద-స్పర్శ-రూప-రస-గంధములను) పంచ సూత్రపు త్రాడు వలె ధరించువాడుగా అగుచున్నాడు.
1.) త్రిదండము 2.) ఉపవీతము 3.) వస్త్రము కౌపీనము (గోచి), వేష్టనము (వేపనము), 4.) శిక్యము 5.) పవిత్రము (దర్భతో చేసినది)… వీటిని ఎల్లప్పుడూ జీవితాంతమూ ధరించుచున్నాడు.
పై ‘5’ కూడా యతికి మాత్రమే బ్రాహ్మణములచే నియమముగా చెప్పబడుచున్నాయి.

"ప్రాణోత్క్రమణవము వరకు (ప్రాణము పోవువరకు) యతి వీటిని వదలరాదు. యతి దేహమును విడిచినప్పుడు ఈ ఐదింటిని ఆ దేహముతోబాటే ఖననము చేయబడుగాక!”…. అని బ్రాహ్మణములు (వేదములలోని విభాగములు) సూచిస్తున్నాయి.

విష్ణులింగము (విష్ణుతత్త్వము) రెండు విధములుగా చెప్పబడుచున్నది.
1.) వ్యక్తము 2.) అవ్యక్తము.
ఆ రెండిటిలో ఏ ఒక్కటి వదలినా కూడా ఆతడు పతితుడు అగుచున్నాడు. సంశయమే లేదు. (వ్యక్తముగా కనిపించేది బ్రహ్మమే! బ్రహ్మమే వ్యక్తమువలె
ఉన్నది). [వాటిని వదలటం కాదు. ఏకత్వం చూడటం]
1.) త్రిదండము 2.) వైష్ణవ లింగము
ఈ రెండూ కూడా విప్రులకు ముక్తి సాధనములు.

సర్వధర్మములకు ‘నిర్వాణము’ (అతిత్వము, కేవలసాక్షిత్వము)యే పరమ లక్ష్యము అని వేదమాత యొక్క అనుశాసనము.

అథ ఖలు సోమ్య।
కుటీచకో బహూదకో
హంసః పరమహంసః
ఇతి ఏతే పరివ్రాజకాః చతుర్విధా భవంతి।
సర్వ ఏతే విష్ణులింగినః శిఖిన ఉపవీతినః
శుద్ధచిత్తా ఆత్మానమ్ ఆత్మనా బ్రహ్మ భావయంతః,
శుద్ధ చిద్రూప ఉపాసనరతాః జప యమవంతో,
నియమవంతః సుశీలినః పుణ్యశ్లోకా భవంతి।
తత్ ఏతత్ ఋచా అభ్యుక్తమ్|

కుటీచకో బహూదకశ్చ అపి
హంసః పరమహంస ఇతి వృత్త్యా చ భిన్నాః ।

ఓ బిడ్డలారా! సౌమ్యా! ఇంకా వినండి. పరివ్రాజకులుగా అగు సన్యాసులు ‘4’ విధములైనవారుగా చెప్పబడుచున్నారు.
1.) కుటీచకుడు 2.) బహూదకుడు 3.) హంసుడు 4.) పరమహంస.
ఈ నలుగురు కూడా విష్ణులింగము కలవారై శిఖ - యజ్ఞోపవీతములు కలిగి ఉండి….,
శుద్ధ చిత్తులై, ఆత్మతో ఆత్మను బ్రహ్మముగా భావించుచున్నవారై, ’శుద్ధ చిద్రూపము’ను ఉపాసనా వస్తువుగా కలిగి ఉన్నవారై (శుద్ధ చిద్రూపోపాసనయందు రతులై), జప-తపములయందు యమ-నియమవంతులై, ఉత్తమ ప్రవర్తన-శీలము కలవారై… ‘పుణ్యకీర్తి’ కలవారగుచున్నారు.
ఈవిధముగా ఋక్కులచే చెప్పబడుచున్నది.

కుటీచకులు (త్రిదండధారులు), బహూదకులు (త్రిదండధారి), హంసలు (ఏకదండదారి), పరమహంసలు (దండరహితుడు)… ఈ నలుగురు బాహ్యవృత్తిచే మాత్రమే భేదముగా కనిపిస్తారు (అంతర్వృత్తి-ఆశయము-అంతిమసిద్ధి ఒక్కటే).

సర్వ ఏతే విష్ణులింగం దధానా వృత్త్యా వ్యక్తమ్
బహిః - అంతశ్చ నిత్యమ్ |
పంచయజ్ఞా వేదశిరః
ప్రవిష్టాః, క్రియావంతో
అమీ సంగతా బ్రహ్మవిద్యామ్|
త్యక్త్వా వృక్షం వృక్షమూలం
శ్రీతాసః సన్న్యస్త పుష్పా, రసమేవ అశ్ను వానాః
విష్ణుక్రీడా, విష్ణురతయో విముక్తా, విష్ణ్వాత్మకా
విష్ణుమేవా అపి యంతి।
త్రిసంధ్యం శక్తితః స్నానం తర్పణం మార్జనం తథా,
ఉపస్థానం పంచయజ్ఞాన్ కుర్యాత్ ఆమరణాంతికమ్।
దశభిః ప్రణవైః, సప్త వ్యాహృతిభిః,
చతుష్పదా, గాయత్రీ జపయజ్ఞశ్చ
త్రిసంధ్యం శిరసా సహ,
‘యోగ యజ్ఞః’ సత్ ఏకాగ్ర్య భక్త్యా
సేవా హరేః గురోః
అహింసా తు తపోయజ్ఞో
వాక్ - మనః - కాయ కర్మభిః,
నానా-ఉపనిషత్ అభ్యాసః
‘స్వాధ్యాయో యజ్ఞ’ ఈరితః।
“ఓం” ఇతి ఆత్మానమ్
అవ్యగ్రో బ్రహ్మణ్యగ్నౌ జుహెూతి తత్,
’జ్ఞానయజ్ఞః సవిజ్ఞేయః,
సర్వ యజ్ఞా ఉత్తమోత్తమః।

వీరందరూకూడా బాహ్యమున విష్ణులింగమును వృత్తిచే వ్యక్తీకరించువారై ఉంటారు.
బాహ్య-అంతరములో నిత్యవస్తువగు ఆత్మనే ధారణగా ఎల్లప్పుడూ కలిగి ఉంటారు.

పంచయజ్ఞములు (వేదపఠనము, వైశ్వదేవము, అతిథిపూజ, పిత్రుతర్పణము, భూతబలి) లేక (దేవయజ్ఞము-పితృయజ్ఞము-భూతయజ్ఞము- బ్రహ్మయజ్ఞముమనుష్యయజ్ఞము)… నిర్వర్తించువారై ఉంటారు.

వేదాంత (ఉపనిషత్) విద్యయందు ఉపప్రవిష్టులై ఉంటారు.
బ్రహ్మ విద్యయందు ఎల్లప్పుడూ సంలగ్నులై, క్రియావంతులై ఉంటారు.
సర్వమును త్యజించి, వృక్షమునో, వృక్షమూలమునో ఆశ్రయించి, పుష్పములను త్యజించి రసమును మాత్రమే అనుభవించువారై ఉంటున్నారు.

విష్ణుక్రీడగా ఈ దృశ్యమునంతా దర్శించుచూ, విష్ణువునందే రమించువారై, విష్ణువునే ఆశ్రయించువారై, విష్ణ్వాత్మకులై ఉండువారు సర్వ బంధములనుండి విముక్తులై విష్ణుత్వమునందు ప్రవేశించుచున్నారు.

యథాశక్తి త్రిసంధ్యలయందు స్నానము, తర్పణము, మార్జనము (హృదయమును ప్రాపంచక విషయముల నుండి పరిశుభ్రపరచు విధులు), ఉపస్థానము (పరమాత్మయందు బుద్ధిని ప్రతిక్షేపించటము, పంచయజ్ఞములు) - ఇవన్నీ ఆమరణాంతము వదలరాదు.
(దశ) ‘10’ ప్రణవములతోను, (ఓం - 10 సార్లు), (సప్త) ‘7’ - వ్యాహృతులతోను (భూ-భువః-సువః-మహః-జనః-తపః-సత్యమ్), (చతు: 4 పాదములతోను - 1.) ఓం భూర్భువస్సు: 2.) తత్ సత్ వితర్వరేణ్యము 3.) భర్గో దేవస్య ధీమహి 4.) ధియోయోనః ప్రచోదయాత్ గాయత్రీ జపయజ్ఞమును త్రిసంధ్యలు శిరస్సుతో (ఎరుకతో) చేయాలి!

ఎల్లప్పుడు యోగయజ్ఞము, సత్ ఏకాగ్ర్యము, హరిభక్తి, గురుసేవ చేస్తూనే ఉండాలి.
తపో యజ్ఞమును అహింసో పరమో ధర్మపూర్వకంగా వాక్-మనో-కాయములచే చేయాలి.
వాక్-మనో- కాయములచే ఇతరులకు బాధ కలిగించకపోవటమే అహింసా యజ్ఞము.

అనేక ఉపనిషత్తుల అధ్యయనము, అభ్యాసము - స్వాధ్యాయయజ్ఞము నిర్వర్తిస్తూ ఉండాలి.
ఎటువంటి వ్యగ్రత (Emotional feelings) లేకుండా ‘ఓం’ అని పలుకుచు జీవాత్మను బ్రహ్మాగ్నియందు హెూమము చేయటమే జ్ఞానయజ్ఞము.

“పరబ్రహమ్మమే నాకు జీవాత్మలుగా అగుపిస్తోంది”- అను భావనతో జగత్ దర్శనముచే జీవాత్మను బ్రహ్మమునందు హెూమము చేయటము అగుచున్నది. అది యజ్ఞములలోకెల్లా ఉత్తమోత్తమమగు “ఆత్మయజ్ఞము”.

3.) జ్ఞానదండా, జ్ఞాన శిఖా జ్ఞానయజ్ఞోపవీతినః
శిఖా జ్ఞానమయీ యస్య
ఉపవీతం చ “తన్మయమ్”|
బ్రాహ్మణ్యం సకలం తస్య
ఇతి వేదానుశాసనమ్!

అథ ఖలు సౌమ్యః
ఏతే పరివ్రాజకా యథా ప్రాదుర్భవంతి,
తథా భవంతి।
కామ క్రోధ లోభ మోహ
దంభ దర్ప అసూయా మమత్వ
అహంకారాదీం తితీర్య,
మాన-అవమానౌ, నిందా-స్తుతీ చ
వర్ణయిత్వా, వృక్ష ఇవ
తిష్ఠాసేత్, చిద్యమానో న బ్రూయాత్।

తథైవం విద్వాంస ఇహైవ అమృతా భవంతి |
తత్ ఏతత్ ఋచా అభియుక్తమ్|

ఆత్మజ్ఞానమే త్రిదండము. జ్ఞానమే శిఖ. జ్ఞానమే యజ్ఞోపవీతము.
ఎవ్వరైతే జ్ఞానశిఖ, జ్ఞాన ఉపవీతము ధరించి ఈ జగత్తును అఖండాత్మకు అభిన్నముగా భావనచేస్తూ.., ఆత్మయందు తన్మయులై ‘సోఽహమ్’ భావనతో
ఈ సకలమును దర్శిస్తూ ఉంటారో, అతడే బ్రాహ్మణుడు. ఇది వేదానుశాసనము.

ఓ సౌమ్యా! ప్రియ శిష్యా! అప్పుడే పుట్టిన పిల్లవాడు ఏవిధముగా శబ్ద స్పర్శ రూప రస గంధములతోను సంబంధ-అనుబంధ-బాంధవ్య విషయముతోను ఏమాత్రము సంకల్పము లేకుండా ఉంటాడో…. పరివ్రాజకుడు కూడా ఈ జగత్తులో ఆ తీరుగా ఉంటాడు.
కామ-క్రోధ-లోభ-మోహ-దంభ-దర్ప-అసూయ-మమత్వ-అహంకారములు మొదలైనవన్నీ దాటివేసినవాడై (లేక) జయించినవాడై, మాన-అవమానములను, నింద-స్తుతులను మొదలంటా వదలివేసి (అతీతుడై వాటికి అందనివాడై) ఉంటాడు.

ఏవిధముగా ఒక వృక్షము ఖండింపబడుచున్నప్పటికీ "ఎందుకు? నీవెవ్వరు? నేనెంతటిదాననో తెలుసా? పళ్ళు-కాయలు నీకు ఇచ్చావే.!…. అని కూడా ఏమీ అనదు కదా! కోపము - అవమానము నింద పొందదు కదా! పరివ్రాజకుడు కూడా తనను బాధించువారిపట్ల కూడా అంతటి మౌనము, క్షమ కలిగి ఉంటాడు.

అట్టివాడు ఆత్మానుభవమునందు విద్వాంసుడై, ఇక్కడే అమృతత్వము పొందుతున్నాడు. ఇది ఈ ఋక్కుచే చెప్పబడుచున్నది.

బంధుం పుత్రం అనుమోదయిత్వా
న వేక్షమానో, ద్వంద్వసహః ప్రశాంతః,
ప్రాచీమ్ ఉదీచీం వా నిర్వర్తయం చరేత్,
పాత్రీ దండీయుగమ్ అత్రావలోకీ,
శిఖీ ముండీ చ ఉపవీతీ
కుటుంబీ యాత్రామాత్రం ప్రతిగృహ్ణన్
మనుష్యాత్, అయాచితం యాచితం
వోత భైక్షం, మృద్దార్వ లాబూ, ఫలవర్ణ పాత్రమ్,
క్షీణం క్షామం తృణం కథాం చ
పర్ణమ్ ఆచ్ఛాదనం స్యాత్, అహతమ్ విముక్తః,
ఋతుసంధౌ ముండయేత్ ఊర్ధ్వమాత్రం
న అధో, న అక్షం జాతు, శిఖాం న అవాపయేత్|

సన్న్యాసము స్వీకరించువాడు బంధువులను, పుత్రులను ఒప్పించి, సన్న్యసించి…. ఇక వెనుకకు చూడడు. సర్వ ద్వంద్వములను సహించువాడై, ప్రశాంత చిత్తముతో తూర్పుగా గాని, పడమర దిక్కుగా గాని బయల్వెడలుచున్నాడు. పాత్ర, త్రిదండమును ధరించి ఉంటాడు. పిలక మాత్రమే కలిగి ఉంటాడు. ఉపవీతుడై, దేహయాత్రకు (దేహము నిలవటానికి, ఎంత అవసరమో అంత మాత్రమే) భిక్షగా పొందుతూ ఉంటాడు. యాచితంగాగాని, అయాచితంగాగాని భిక్షాన్నమును స్వీకరిస్తాడు. మట్టి పాత్రతో గాని, సొరకాయ డిప్పతోగాని గ్రహిస్తున్నాడు. చిరిగిపోయినదిగాని, పట్టుదిగాని గడ్డిబొంతను, ఆకులను పరచుకొని ఆచ్ఛాదనముగా ఆశీనుడై ఉంటాడు. ఋతువు - ఋతువుకు ఒకసారి (రెండు నెలలకొకసారి) మాత్రమే ముండనము (జుట్టు తీసి వేయటం) చేయాలి. మెడకు పైభాగమున మాత్రమే ముండనము, చంకలు, శిఖను ముండనము చేయరాదు.

చతురోమాసాం ధ్రువశీలతః స్యాత్, స యావత్ సుప్తో
అంతరాత్మా పురుషో విశ్వరూపః,
అన్యావథా అష్టో పునరుత్థితే
అస్మిన్ స్వకర్మ లిప్సుః విహరేత్ వా,
వసేత దేవాద్యగారే, తరుమూలే, గుహాయాం వసేత్ |

చాతుర్మాస్యవ్రత నియమమును పాటిస్తూ ఉండాలి. పూర్తిగా సుప్తుడై (ప్రాపంచక విషయములు పట్టించుకోనివాడై), అంతరాత్మ పురుషుడగు విశ్వరూపుని ధ్యానిస్తూ, ధ్యాన-సమాధుల నుండి పునరుత్థానము పొందినప్పుడు లేచి నిలబడి మరల దేహమును ఉపయోగించుచూ దేహావసరముల కొరకై విహరిస్తూ ఉంటున్నారు. దేవాలయములలోను, వృక్షమూలములందు గుహలలోను వసిస్తూ ఉంటారు.

అసంగో, లక్షిత శీలవృత్తః,
నిరింధన జ్యోతిరివ ఉపశాంతో, న చ ఉద్విజేత్!
ఉద్విజేత్ యత్ర కుత్ర?
ఆత్మానం చేత్ విజానీయాత్ ‘అయమస్మి!” ఇతి పూరుషః
కిమ్ ఇచ్ఛత్, కస్య కామాయ, శరీరమ్ అనుసంజ్వరేత్?

తమేవ ధీరో విజ్ఞాయ, ప్రజ్ఞాం కుర్వీత బ్రాహ్మణః
న అనుధ్యాయాత్ బహూం శబ్దాన్, వాచో విగ్లాపనం హి తత్

బాల్యేనైవ హి తిష్ఠాసేః నిర్విద్య బ్రహ్మవేదనమ్|
బ్రహ్మవిద్యాం చ బాల్యం చ నిర్వద్య, మునిః ఆత్మవాన్।
యదా సర్వే ప్రముచ్యంతే కామాయ అస్య హృది శ్రితాః,
అథ మర్త్యో అమృతో భవతి, అత్ర బ్రహ్మ సమశ్నుతే॥

పరివ్రాజకుడు - దేనితోనూ సంగము లేనివాడై, ఉత్తమశీలము కలిగి ఉండాలి. ఇంధనము లేని దీపమువలె సర్వ జగద్విశేషములపట్లా ఉపశాంతుడై (రహితుడై) ఉండాలి. దేనికీ ఉద్వేగము (ఆవేశము) పొందడు. అంతా స్వస్వరూపాత్మయే అయి ఉండగా ఎందుకు ఎక్కడ ఎవ్వరికొరకు ఉద్వేగము పొందు అవసరమున్నది? ఆత్మతో ఆత్మను ఎరిగి, “నేనే ఆత్మస్వరూపుడను"… అని సుస్పష్టపరచుకొని ఉంటాడు. తానే సర్వ స్వరూపమగు ఆత్మ స్వరూపుడై ఉండగా ఏదంటే ఇష్టపడాలి? ఏమి కోరుకోవాలి? శరీరమును బాహ్య వస్తువులాగా చూస్తాడు.

ఈ జీవుడు ఆత్మను బుద్ధితో ఎరిగి, బ్రహ్మమే జగత్-స్వరూపముగా గమనించి బ్రాహ్మణుడు అగుచున్నాడు. అనేక శబ్దముల గురించి పెద్దగా ధ్యానించవలసిన పని కూడా లేదు. అదంతా వాచోవిగ్లాపనమే (మాటలలోపడి - ఆత్మను ఏమరచటమే) అవుతుంది.

బ్రహ్మమును తెలుసుకొని, పరివ్రాజకుడు ఈ జగత్తులో బాలునివలె (సంసార జీవులతో మెలగుచున్నప్పుడు ఏమీ తెలియనట్లే) ఉంటాడు. బ్రహ్మవిద్యను తెలిసి కూడా బాలునివలెను, విద్య తెలియనివానివలెను మౌనము వహించి ఉంటాడు. ఎప్పుడైతే హృదయమునందు ప్రవేశించియున్న సర్వ కామములనుండి (Desires, Wishes, Expectations, Influence of world related objectives etc.,) ఈ మానవుడు విముచ్యుడు అవుతాడో, అతడు ఇప్పుడే ఇక్కడే అమృత స్వరూపుడగుచున్నాడు. ఇక్కడే ఇప్పుడే బ్రహ్మమును పొందుచున్నాడు. అంతేగాని, బ్రహ్మము మరెప్పుడో-ఎక్కడో పొందవలసినది కాదు.

అథ ఖలు సోమ్యా।
ఏయం పారివ్రాజ్యం నైష్ఠికం ఆత్మధర్మం యో విజహాతి,
స వీరహా భవతి। స బ్రహ్మహా భవతి।
స భ్రూణహా భవతి।
స మహా పాతకీ భవతి।
య ఇమాం వైష్ణవీం నిష్ఠాం పరిత్యజతి,
స ’స్తేనో’ భవతి।
స గురుతల్పగో భవతి।
స మిత్రధృక్ భవతి।
స కృతఘ్నో భవతి।
స సర్వ-అస్మాత్ లోకాత్ ప్ర-చ్యుతో భవతి॥

ఓ సౌమ్యా! ప్రియ శిష్యుడా! మరొక్క విషయం, ఎవడైతే సన్న్యాస ఆశ్రమమును స్వీకరించి పారివ్రాజకుడై కూడా, ఆ ఆశ్రమ ధర్మాలకు వ్యతిరేకిఅయి చరిస్తాడో…, అట్టివాడు ధర్మచ్యుతి పొంది, ఆత్మతత్యానుభవ సామర్థ్యమును కోల్పోయిన వాడగుచున్నాడు, భ్రూణహాని (గర్భస్త శిశు హత్యాపాతకము మొదలగు) మహాపాతకము చేసినవానితో సమానము. జన్మను వృధా చేసుకున్నట్లే అగుచున్నది. పరివ్రాజకుడై వైష్ణవీ నిష్ఠను పరిత్యజించినవాడు దొంగతో సమానమగుచున్నాడు. గురుతల్ప - మిత్రదోహ - కృతఘ్నతా పాప దోషము పొందుచున్నాడు. ఈ లోకమును పోగొట్టుకొని చ్యుతుడై అల్పగతులు ఆశ్రయించువాడగుచున్నాడు.

4.) తత్ ఏతత్ ఋచా అభ్యుక్తమ్|
స్తేనః సురాపో గురుతల్పగామీ
మిత్ర ధృగేతే నిష్కృతేః యాంతి శుద్ధిమ్ |
వ్యక్తమ్ - అవ్యక్తం వా విధృతమ్
విష్ణులింగం త్యజత్ న శుద్ధ్యేత్ అఖిలైః।
ఆత్మ భాసా, త్యక్త్వా విష్ణోః లింగమ్, అంతర్బహిర్వా-యః
స్వా ఆశ్రమం సేవతే, న ఆశ్రమం వా,
ప్రత్యాపత్తిం భజతేవ అతిమూడో,
న ఏషాం గతిః కల్పకోట్యాపి దృష్టా!
త్యక్త్వా సర్వ ఆశ్రమాన్, ధీరో వశేత్ “మోక్షాశ్రమే” చిరమ్
మోక్షాశ్రమాత్ పరిభ్రష్టో న గతిః తస్య విద్యతే॥
ప్రారివ్రాజ్యం గృహీత్వా తు యః స్వధర్మే న తిష్ఠతి,
తమ్ “ఆరూఢచ్యుతం” విద్యాత్
ఇతి వేదానుశాసనమ్। 

ఋక్కులు ఇంకా కూడా ఈవిధముగా పలుకుచున్నాయి.
దొంగతనము, సురాపానము, గురుతల్పము, మిత్రద్రోహము ఈ దోషముల - నుండి ‘నిష్కృతి’ విధులు ఉన్నాయి. అట్టి నిష్కృతి క్రియలను ఆశ్రయించుటచే జీవుడు శుద్ధి పొందగలడు.
కానీ, పరివ్రాజకుడై వ్యక్త - అవ్యక్త రూపమగు విష్ణు లింగమును త్యజిస్తే శుద్ధి లేదు. విష్కృతి లేదు.
బాహ్య - అంతరములందు ప్రదర్శితమై ఉన్నట్టి ఆత్మ తేజో రూపమగు విష్ణు లింగమును వదలి తదితరములైన ఆశ్రమ ధర్మములను సేవించినా, సేవించకున్నా కూడా ఆతడు ప్రత్యాపత్తి (Downfall) పొందుచున్నాడు. అతి మూఢుడితో సమానము. కోటి కల్పములు గడచినా ‘ఉత్తమగతి’ లభించదు.
ఓ బిడ్డలారా! మిగతా ఆశ్రమములందు కూడా మోక్షాశ్రమము’ కొరకై చిరకాలము ధీరుడై (తెలివిగలవాడు) వసించునుగాక! ఆశ్రమముకంటే మోక్ష ఆశయము ముఖ్యము. మోక్షాశ్రమము నుండి పరిభ్రష్టుడైనవానికి గతి దుర్గతియే!
పరివ్రాజ్యమును (సన్న్యాసాశ్రమము) స్వీకరించి ఎవ్వడు స్వధర్మము (అట్టి ఆశ్రమ ధర్మము) నందు నిలచి ఉండడో ఆతడు ఆరూఢచ్యుతుడు (చెట్టు ఎక్కుతూ కిందకు పడినవాడు) అగుచున్నాడు.
ఇది వేదముల యొక్క అనుశాసనము.

అథ ఖలు సౌమ్యః
ఇమమ్ సనాతనమ్ ఆత్మ ధర్మం “వైష్ణవీం నిష్టాం”
లబ్ధ్వ, యః తామ్ అదూషయత్ వర్తతే, స ‘వశీ’ భవతి।

స పుణ్యశ్లోకో భవతిః స లోకజ్ఞో భవతి।
స వేదాంతజ్ఞో భవతి। స బ్రహ్మజ్ఞో భవతి,
స సర్వజ్ఞో భవతి, స సర్వరాట్ భవతి।
స పరంబ్రహ్మ భగవంతమ్ ఆప్నోతి।

స పితౄన్, సంబంధినో, బాంధవాన్, సుహృదో,
మిత్రాణి చ భవాత్ ఉత్తారయతి।
తదేతత్ ఋచా అభ్యుక్తమ్|

శకుంతలానాం ప్రథమం బభూవ,
తథా కులానాం త్రిశతం సమగ్రమ్,
ఏతే భవంతి సుకృతస్య లోకే
యేషాం కులే సస్యసతి ఇహ విద్వాన్,
త్రింశత్ పరాం, త్రింశత్ అపరాన్,
త్రింశత్ చ పరతః పరాన్, ఉత్తారయ ధర్మిష్ఠః
‘పరివ్రాట్’ ఇతి వై శ్రుతిః|

నాయనా! సనాతన (జన్మల కంటే మునుముందే ఉన్న) ఆత్మ ధర్మము” అయినట్టి ’వైష్ణవీనిష్ఠ’ను పొంది కూడా, అద్దానిని దూషించటముచే తిరిగి అవశుడు (No Control on Senses) అగుచున్నాడు. ఎవడు అట్టి దూషణ చేయడో - ఆతడే ‘వశీ’ (సంసారము తన వశము చేసుకున్నవాడు) అగుచున్నాడు.

వైష్ణవీ నిష్ఠ స్వీకరించువాడు పుణ్య శ్లోకములు పఠించినవాడగుచున్నాడు. లోకతత్త్వము ఎరుగినవాడవగలడు.
తెలుసుకొనుచున్నట్టి వానిని - (వేదాంతుని) ఎరుగుచున్నాడు, వేదాంతజ్ఞుడు అగుచున్నాడు. బ్రహ్మమును ఎరుగగలడు.
సర్వజ్ఞుడు అగు చున్నాడు. సర్వరాట్ (రాజాధిరాజు) అగుచున్నాడు.
పరబ్రహ్మ భగవంతత్వమును సముపార్జించుకొనుచున్నాడు. బ్రహ్మమే తానగుచున్నడు.

సన్న్యాసాశ్రమ ధర్మ నిష్ఠను భక్తి శ్రద్ధలతో ఆచరించువాడు తన పిత్రుదేవతలను, సంబంధులను, ఇతర బంధువులను, సుహృత్తులను, మిత్రులను సంసార సముద్రమునుండి దాటించగలడు. ఈ విధముగా ఋక్కుల గానం!

ఏ కులములో బ్రహ్మవేత్త ఉంటాడో, ఆతడు తన కులములోని ‘300’ మందిని ఉద్ధరించుచున్నాడు. ఆ వంశములోని వారంతా సుకృతములు (పుణ్యకర్మలు) చేసిన వారి లోకములు చేరగలరు. ఆ కులములోని వారు ఇక్కడే జ్ఞాన విద్వాంసులై తరించగలరు. ధర్మిష్ఠుడైన సన్న్యాసి (పరివ్రాట్) వెనుక 300 మందికి, ముందు 300 మందిని, 300 మంది ముందుకన్నా ముందువారిని తరింపజేయుచున్నాడు - ఇతి శ్రుతి వాక్యము.

సన్న్యస్తమ్ ఇతి యో బ్రూయాత్
కంఠస్థ ప్రాణవాన్ అపి, తారితాః పితరః తేన
ఇతి వేదానుశాసనమ్|

అథ ఖలు సౌమ్య।
ఇమం సనాతనమ్ ఆత్మధర్మమ్ వైష్ణవీం నిష్ఠాం
న అసమాప్య ప్రబ్రూయాత్।
న అనూచానాయన్, న అనాత్మవిదే
న అవీతరాగాయ, న అవిశుద్ధాయ,
న అనుపన్నాయ, న అప్రయత మానసాయేతి హస్మాహుః।

ప్రాణములు కంఠమున చేరిపోవడానికి సిద్ధముగా ఉన్నప్పుడైనా సరే “సన్న్యస్త మయా! నేను సన్న్యాసము స్వీకరించుచున్నాను"…. అని ఉచ్ఛరిస్తూ ప్రకటిస్తే కూడా…ఆతని పిత్రుదేవతలు తరిస్తారు. ఇది వేదానుశాసనము!

ప్రియ సౌమ్యా! బిడ్డా! ఈ సనాతన - ఆత్మధర్మరూపమగు “వైష్ణవీ నిష్ఠ”ను సమాప్యము (పైన చెప్పిన ఫలశ్రుతి)తో కూడియే బోధించాలి. సమాప్యము (ఫలశృతి) చేయకుండా చెప్పరాదు!
అసమాప్యునికి,… అనగా శాస్త్ర విధి - ఆచారములు గౌరవించనివానికి (సదాచారము లేని వానికి), ఆత్మ జ్ఞానముకొరకై ఉత్సాహము చూపని వానికి, రాగద్వేషములను త్యజించుటకు సంసిద్ధుడు కానివానికి, అపరిశుద్ధమైన (ద్రోహ చింతన ఇత్యాది భావములు తొలగని) బుద్ధి కలవానికి, ఆత్మ జ్ఞానమును అర్ధించని వానికి (సంసిద్ధుడు కానివానికి) ప్రయత్నమానసుడు - పరిశుద్ధ మానసుడు కానివానికి బోధించరాదు.

5.) తత్ ఏతత్ ఋచా అభ్యుక్తమ్|
విద్యా హ వై బ్రాహ్మణమ్ ఆజగామ
గోపాయ మాం శేవధిష్టే అహమస్మి।

అసూయకాయ, అనృజవే,
శఠాయ మా మా బ్రూయాత్।

వీర్యవతీ తథాస్యామ్।
యమ్ ఏవ విద్యాశ్రుతమ్, అప్రమత్తం,
మేధావినం, బ్రహ్మచర్య - ఉపపన్నమ్,
అస్మా ఇమామ్ ఉపపన్నాయ,
సమ్యక్ పరీక్ష్య ….,
దద్యాత్ వైష్ణవీమ్, ఆత్మనిష్ఠామ్|

ఋక్కులు ఇంకా ఈవిధంగా గానము చేస్తున్నాయి.
బ్రహ్మవిద్యా దేవి బ్రహ్మమును ఉపాసించువాని వద్దకు వచ్చి ఇట్లా పలుకుచున్నది.
బిడ్డా! బ్రహ్మ విద్యా స్వరూపునగు నన్ను ఉపాసించు. నేను నీకు వశమౌతాను.

అయితే, అసూయ కలవానికి, ఋజుత్వము (సత్యమును స్వీకరించుటకు సంసిద్ధత, వంకర - టింకరకాని ఋజు బుద్ధి)… లేనివానికి, మొండితనము - మూర్ఖత్వము వహించి ఉన్నవానికి ఈ అధ్యాత్మ శాస్త్ర విద్య (బ్రహ్మ విద్య) బోధించవద్దు సుమా!

నేను నీయందు వీర్యవతినై ప్రకాశించగలను. నీవు పలికే వాక్యములలో ప్రవేశిస్తాను.
ఎవ్వడైతే విద్యాశ్రుతుడో (విద్యను అర్ధించి శ్రద్ధగా వినువాడో), అప్రమత్తుడో (నిద్ర-బద్ధకము లేనివాడో), తెలివికలవాడో (మేధావియో), బ్రహ్మమునందు
చరించు వ్రతము (దీక్ష) (లేక బ్రహ్మచర్య దీక్ష) స్వీకరిస్తాడో - ఆతడు సమీపించినప్పుడు, తెలివి-నిర్మల హృదయములను పరీక్షించి, అర్హుడైతేనే
ఆత్మనిష్ఠయగు బ్రహ్మ విద్యను బోధించాలి. తప్పక బోధించాలి.

అధ్యాపితా యే గురుం
వాద్రియంతే విప్రా వాచా మనసా కర్మణా వా,
యథైవ తేన న గురుః భోజనీయః, తథైవ చ
అన్నం న భునక్తి శ్రుతమ్ తత్ |

గురురేవ పరోధర్మో!
గురురేవ పరాగతిః|

ఏకాక్షర ప్రదాతారమ్
యో గురుం నా అభినందతి,
తస్య శ్రుతం తపో జ్ఞానమ్
స్రవతి ఆమ ఘట - అంబువత్।

యస్య దేవే పరా భక్తిః,
యథా దేవే తథా గురౌ,
స బ్రహ్మవిత్ పరం ప్రేయాత్||

ఇతి వేదానుశాసనమ్||

ఇక బ్రహ్మ విద్యను నేర్చుకొను ఆశయము గల విద్యార్థి మనసా-వాచా-కర్మణా
గురువును సేవించాలి. ఆశ్రయించాలి. అర్థించాలి!
గురువుకు భోజనము పెట్టపోతే (గురువుకు దక్షిణ ఇచ్చి, సేవించి, సంతోషింపజేయకపోతే) …. అట్టివాడు నేర్చిన విద్య అనుభవమునకు రాదు. అనుభవముగా సిద్ధింపజేసుకోలేడు. విన్న అర్థము అనుభూతిగా సిద్ధించదు సుమా!

గురువే పరమధర్మము! గురువే పరాగతి! పరమునకు మార్గము!

ఏకము - అక్షరము అగు పరబ్రహ్మతత్వమును బోధించిన సద్గురువును ఎవ్వడైతే పరతత్వ స్వరూపముగా ఉపాసించడో, ఆయనకు కృతజ్ఞతలు పలుకడో, అభినందించడో - అట్టివాడు నేర్చుకొన్న విద్య, విన్నది, తపస్సు, జ్ఞానము - ఇవన్నీ కూడా పచ్చి కుండలోని ‘నీరు’ వలె నిష్ప్రయోజనమౌతాయి.

పరమాత్మయందు ఎంతటి భక్తి ఉంటుందో, అంతటి భక్తి - ప్రపత్తులు గురువుపై కలిగి ఉన్నప్పుడే బ్రహ్మవిద్యపై గురి కుదురుతుంది. ‘గురి’ యొక్క ప్రభావముచేత ఆతడు బ్రహ్మవేత్త అయి, పరబ్రహ్మ స్వరూపము - తానే అగుచున్నాడు.

ఇది వేదానుశాసనము!

ఇతి శాట్యాయనీయోపనిషత్ |
ఓం శాంతిః శాంతిః శాంతిః ||


శుక్ల యజుర్వేదాంతర్గత

17     శాట్యాయనీయ ఉపనిషత్

అధ్యయన పుష్పము

శ్లో॥ శాట్యాయనీ బ్రహ్మవిద్యా - అఖండాకార సుఖాకృతీ।
యతి బృంద హృదాగారం - రామచంద్రపదం భజే॥

విద్యార్థులు కొందరు తపో-ధ్యాన శాస్త్ర విద్యా పారాయణుడై శాట్యాయనీ మునీంద్రులవారిని… సమీపించి “తండ్రీ ! సద్గురూ ! బ్రహ్మజ్ఞా ! బ్రహ్మజ్ఞానము కొరకై మీ పాదములు ఆశ్రయిస్తున్నాము. దయచేసి అనుగ్రహించండి”… అని అర్థించుచున్నారు.

శాట్యాయనీ మునీశ్వరులు : బిడ్డా ! సౌమ్యా ! సుస్వాగతము ! నీ గురుభక్తి గురించి విని ఆనందము ప్రకటిస్తున్నాను. నీకు సందేహములేమైనా ఉంటే… అడుగు.

సౌమ్యుడు (శిష్యుడు) : మహనీయా ! ఈ జీవుడు స్వతఃగా ఆత్మస్వరూపుడే కదా !

శాట్యాయనీ మునీశ్వరులు : అందులో సందేహించవలసినది ఏమున్నదయ్యా ! వేదాంగములైనటువంటి ఉపనిషత్తులు, వేదమంత్ర - అంతరార్థములు, మహనీయుల ఆత్మీయ వాక్యములు … ఇవన్నీ కూడా “జీవో బ్రహ్మేతి నా పరః” ఈ జీవుడు స్వతఃసిద్ధముగా బ్రహ్మమే - అని ఎలుగెత్తి గానము చేస్తున్నాయి కదా! గురు శాస్త్ర స్వవిచారణలు ఈ సత్యమును నిర్ద్వద్వంగా ప్రకటిస్తూనే వస్తున్నాయయ్యా!

సౌమ్యుడు : ఆత్మకు బంధముంటుందా ?

శాట్యాయనీ మునీశ్వరులు : సూర్యకాంతిలో కనిపించే ఒకానొక వస్తువుయొక్క ఆకార - రంగు - రుచి,… ఇత్యాది ధర్మములు (Features) సూర్యకాంతికి అంటుతాయా? సూర్యబింబానికి అంటుతాయా? లేదు కదా! అట్లాగే ఆత్మకు బంధమే ఉండజాలదు. ఆత్మ సర్వదా అఖండము, అప్రమేయము, నిత్యము, సత్యము, నిర్గుణము. కనుక ఆత్మ నిత్యముక్తము.

సౌమ్యుడు : అవును కదా ! మరి, స్వతఃగా ఆత్మ స్వరూపుడగు ఈ జీవునకు “నేను బద్ధుడను! పరిమితుడను! అజ్ఞానిని! దోషములు కలవాడను. దేహ పంజరములో చిక్కుకున్నవాడను!”… అనునదంతా ఎందువలన ఎవ్వరివలన, ఎప్పటి నుండి వచ్చి పడుతోంది?

శాట్యాయనీ మునీశ్వరులు : ఓఁ! అదా ? విను, చెప్పుతాను.

మన ఏవ మనుష్యాణాం కారణం బంధ - మోక్షయో !
ఆత్మకు ఏనాడు ‘బంధము’ అనునదే లేనప్పటికీ, కల్పితమాత్రమగు మనస్సే ఈ జీవుని పట్ల బంధ - మోక్షములకు కారణము అగుచున్నది. కనుక బంధ, మోక్షములు రెండూ - ఆత్మ సమక్షములో కల్పిత విశేషములే!

సౌమ్యుడు : స్వామీ! ‘బంధము’ అనగా ఏమి ? మోక్షము (లేక) ముక్తి అనగా ఏమి ?

శాట్యాయనీ మునీశ్వరులు : ఏమీ లేదయ్యా ! ఈ జీవుడు ఆశ్రయించిన దేహములో ఇంద్రియములు (కళ్ళు - చెవులు - నోరు - ముక్కు - చర్మము.. ఇవన్నీ) ఉన్నాయి కదా ! వీటన్నిటి చేత దృశ్యము - శబ్దము - రుచి - వాసన - స్పర్శ… ఇవన్నీ పొందబడుచున్నాయి. ఇవి అనేక విషయములపై వ్రాలుచున్నాయి. మనస్సు అట్టి విషయ పరంపరలతో “ఇవి నాకు చెందినవి ! నేను వీటికి సంబంధించిన దానను”… అను రూపముగల ఒకానొక అవినాభావ సంబంధము, ఎప్పటినుంచో పెంపొందించుకుని ఉంటోంది. ఈ తతంగమంతా అనేక ఉపాధి పరంపరలుగా కొనసాగుతూ వస్తోంది. అందుచేత, విషయముల పట్ల (తో) ఏర్పడుచున్న ఆసక్తియే … ‘బంధము’! నిర్విషయమే ( విషయములు మనస్సు పట్ల రహితమగుటయే)… ’మోక్షము’!

విషయములతో సమాసక్తత :  ఈ యొక్క చిత్తము జీవితమంతా కూడా ఇంద్రియములకు ఎదురుగా గోచరమగు దృశ్య విషయములపై వ్రాలుచూ, వాటితో సమాసక్తము (Deeply immersed) అగుచున్నది. మమేకము - అవినాభావ సంబంధము పొందుచున్నది. "ప్రేమ - ఇష్టము - కోరిక - దుఃఖము - ఆవేశము - అనుకరణము”… ఇవన్నీ పొందుతోంది. అప్పుడు ఆ చిత్తము జీవునకు బంధమంతా తెచ్చిపెడుతోంది.

బ్రహ్మముతో సమాసక్తత : ఇదే చిత్తము పరబ్రహ్మముతో మమేకము - అవినాభావ సంబంధము కలిగి ఉండగలదు కూడా! ఆ విధంగా ఆత్మవైపు చిత్తము మరిలినప్పుడు - ఎవ్వరికి మాత్రం సర్వబంధముల నుండి విముక్తి ఎందుకు కలుగదు? తప్పక (బంధ విముక్తి) కలుగుతుంది!

చిత్తమేవ హి సంసారః!
చిత్తము = ఇష్టముయొక్క సంప్రదర్శనము.
ఈ చిత్తమేనయ్యా, సంసారము! అట్టి చిత్తమును “ఇది దేని దేనిపై వ్రాలి అక్కడ చిక్కుకున్నదై ఉంటోంది? ఎట్లా చిక్కుకుంటోంది? వెనుకకు మరలి “అంతా ఆత్మస్వరూపమే” అను ధ్యాసను ఎట్లా పెంపొందించుకోగలుగుతుంది?”… ఈ ఈ మార్గములలో నిత్యము చిత్తమును శోధిస్తూ ఉండాలి.

యత్ చిత్తమ్ - తత్ మయో భవతి - గుహ్యమ్ ఏతత్ సనాతనమ్।
ఈ చిత్తమునకు సనాతనమైన (జన్మల ప్రహసనము కావటానికి కూడా మునుముందుగా) ఒక లక్షణము రహస్యముగా కలిగి ఉన్నది. చిత్తము దేనిపై వ్రాలి బహుకాలము ఉంటుందో,.. ఈ జీవుడు ఆ చిత్తవిషయ రూపమును సంతరించుకోవటము జరుగుతోంది. ఇదే చిత్తము సనాతనమగు పరబ్రహ్మమును ధ్యానిస్తూ ఉండగా, ఇక ఈ జీవుడు కూడా పరబ్రహ్మస్వరూపుడుగా రూపప్రాప్తి పొందుచున్నాడు.

చిత్తము బ్రహ్మమువైపు అడుగులు వేయాలీ-అంటే.., ముందుగా ఈ జీవుడు బ్రహ్మము ఎట్టిదో, బ్రహ్మతత్త్వమేమిటో బుద్ధితో గ్రహించాలి.

ఈ బుద్ధి ఇంద్రియములతో విషయములను తెలుసుకుంటోంది కదా! తెలియబడేదంతా ఏదైతే తెలుసుకుంటోందా,… ఆ తెలుసుకొనుచున్న దానిని (జీవాత్మను) (Perceiving the perceiver) … తెలుసుకోవటమే విదితవేద్యము. అట్టి దర్శనము చేయువాడే వేదవేద్యుడు.

“తెలుసుకొనబడుచున్నదానినంతటినీ తెలుసుకొనుచున్నవాడు” … ఈతడే వేదవేద్యుడు (knowing the one who is knowing) అని అనుకున్నాము కదా ! ఇక వేదవేత్త అయ్యేంతవరకు ఈ జీవుడు దృశ్యమననమే కొనసాగించగలడుగాని, ఆ "బృహత్ వస్తువు సర్వతత్త్వస్వరూపము”… అగు పరమాత్మను ధ్యానించలేడు. పరమాత్మ ధ్యానము లేకపోతే బ్రహ్మవేత్త కాలేడు. బ్రహ్మవేత్త కానివాడు పరమ పదమును పొందజాలడు. సంసార లంపటములోనే తిరుగాడుచూ ఉంటాడు.

ఏదైతే…,

విష్ణుక్రాంతమ్ :  దృశ్య - ద్రష్ట - మనో - బుద్ధి - చిత్త - అహంకారములతో సహా ఏదైతే అన్ని రూపములుగా అగుచున్నదో…, అది ‘విష్ణుక్రాంతము’ …. అనబడుచున్నది. (క్రాంతము = వ్యాప్తి పొందినట్టిది, ఆక్రమించుకొన్నట్టిది, తేజోప్రదర్శనము).

వాసుదేవమ్ విజానన్ విప్రో : సర్వ ద్రష్టలందరిలో - వారివారి దర్శన - దృశ్యములతో సహా ఏది వసించి ఉన్నదో…., అవన్నీ తానే అయిఉన్నదో… అదియే వాసుదేవము! అట్టి బ్రహ్మమును ఎరిగిన తత్త్వ దర్శియే విప్రుడు! అద్దానిని ఎరుగుటయే విప్రత్వము.

తత్త్వదర్శి : ‘త్వమ్’ (నీవు) యొక్క వాస్తవరూపమును ’తత్’గా (ఆత్మగా) దర్శించువాడు.

శ్రోత్రియుడు : శ్రుతులు (వేదవేదాంతములు) ప్రతిపాదిస్తున్న సత్యమును ఆశయముగా కలవాడు. దృశ్యము నుండి ఏ కించిత్ కావాలని కోరనివాడు (అకామవంతుడు). సనాతనమగు (జన్మ కర్మలకు మునుముందే ఉన్నట్టి) పరబ్రహ్మమును మాత్రమే ఉపాసన వస్తువుగా కలవాడు. శాంతుడు, దాంతుడు (ఇంద్రియ నిగ్రహముతో ఇంద్రియములను తన వశము ఉంచుకున్నవాడు). ఉపరతుడు (ధ్యాసలన్నీ విషయములనుండి వెనుకకు మరల్చి సర్వము ఆత్మ దృష్టితో చూచువాడు). ఇట్టి విశేషములను అభ్యసిస్తూ వస్తున్న యోగి - క్రమముగా ఈ మార్గములో ఈతడు “అభిజజ్ఞుడు” (తెలుసుకొనవలసిన బ్రహ్మమును బాగుగా ఎరిగినవాడు)గా అగుచున్నాడు.

అట్టి పరమాత్మ స్థానమును ఈ బుద్ధి చేరుటకై…,

ఈషణో త్యక్త : కోరిక - మమకారముల రూపమగు ఈషణములను (ఈషణత్రయము - భార్యేషణ ; పుత్రేషణ ; ధనేషణ) … ఇవి పరమాత్మకు చెందినవి - అను భావన సహాయంతో త్యజించాలి. భార్య - భర్త - పిల్లలు - స్నేహితులు - ఎరిగినవారు… వీరందరూ ఆత్మ స్వరూపముగా ఆత్మకు అనన్యముగా దర్శించబడుటచేత ఈషణములు ప్రక్కకు తొలుగగలవు. "ఆత్మైవహి బంధురూపేణ” - అను భావనచే ‘అన్యత్వము’ జయించబడుతోంది.

అనృణస్తమ్ : ఈ భౌతికదేహము తనకుతానుగా జీవించటంలేదు. ప్రకృతి ప్రసాదము-తదితరుల ప్రసాదముచేతను, దివ్యప్రజ్ఞల సహకారముచేతను జీవిస్తోంది. అందుచేత, ఋణ విముక్తుడు కావాలి. (ఋణ చతుష్టయము - దేవ ఋణము, ఋషి ఋణము, పిత్రు ఋణము, మానవ ఋణము). మనము పొందుచున్న దానిని గుర్తిస్తూ కృతజ్ఞులమై ఉండటమే అనృణస్తము. కర్మలు ధర్మసమ్మతంగా, కృతజ్ఞతాపూర్వకంగా, సమర్పితంగా నిర్వర్తించటము అందుకు విధానము.

మౌని : సర్వప్రాపంచక సంగతి - సందర్భ - సంబంధ - అనుబంధ - సంఘటనల పట్ల… అతీతుడై (అవన్నీ కథలోని కల్పిత విషయాలవలె) మౌనము వహించినవాడై (స్పర్థ పొందనివాడై) ఉండాలి.

ఇట్టి ప్రయత్నముల సానుకూల్యత కొరకై ఏదైనా - ఎక్కడైనా ఒక ఆశ్రమములో యథా-ఉపపత్తిగా (సందర్భానుకూలంగా ప్రవేశించి శాస్త్ర విధిగా సాధనకు ఉపక్రమించాలి.

అందుకు పంచసూత్రధారణ చేయును గాక !

సన్న్యాసాశ్రమము

త్యాగము చేతనే కైవల్యము. అందుకు శాస్త్రములు అందిస్తున్న మార్గమే సన్న్యాసాశ్రమము. ఆ విశేషాలు కొన్ని ఇక్కడ ఉదహరించుకుందాము.

పంచసూత్రధారణ :  1) త్రిదండము (త్రిగుణములను చేతిలో దండముగా (కర్రగా) ధరించటము
2) ఉపవీతము (బ్రహ్మముతో సామిష్యమునకు సంజ్ఞయగు త్రిసూత్రపు దంద్యము)
3) కౌపీనము - వేష్ఠము (వేపనము) - కాషాయ వస్త్రము విరాగమునకు సంజ్ఞ.
4) శిక్యము (శిరోమండనము)
5) పవిత్రము (దర్భత్రాడు)
- ఇవన్నీ సన్యాసి జీవితాంతము ధరించుచున్నాడు.

ఈ ఐదు కూడా యతికి మాత్రమే - బ్రాహ్మణములచే నియమముగా చెప్పబడుచున్నాయి. ప్రాణములు ఉన్నంతవరకు అవి యతి వదలరాదు. యతి దేహమును త్యజించిన తరువాత కూడా ఈ ఐదింటిని యతి యొక్క మృతదేహముతో బాటే ఖననము చేయాలి - అని బ్రాహ్మణములు సూచిస్తున్నాయి.

విష్ణు తత్త్వము (విష్ణు లింగము) రెండు విధములు - 1) వ్యక్తమ్ 2) అవ్యక్తమ్

విష్ణు తత్త్వము యొక్క వ్యక్త (ఎదురుగా కనబడేవి) - అవ్యక్తములు (అభౌతికతత్త్వములు) రెండూ పరమాత్మ యొక్క సంప్రదర్శనములే! రెండూ ఉపాసనీయములే! వ్యక్త - అవ్యక్త విష్ణుతత్త్వ విన్యాసములు రెండింటిలో (ఉపాసన దృష్ట్యా) ఏదీ వదలకూడదు. ఆ రెండు తత్త్వములలో ఒకటి ఉపాసిస్తూ రెండవది త్యజిస్తే అప్పుడు ఆ జీవుడు పతనమువైపునే జరుగుచున్నవాడౌతాడు. మోక్షము వైపుగా కాదు సుమా ! కనుక వ్యక్తము - అవ్యక్తము … ఈ రెండూ కూడా విష్ణు లింగ స్వరూపముగా ఉపాసించాలి. జగదోపాసన, సహజీవోపాసన - దైవోపాసనారూపమగు ఆత్మోపాసనయే!

విష్ణు లింగమ్:  ఏది వ్యక్త-అవ్యక్తములు (బంగారు +ఉంగరము తానే అయి) వ్యక్తావ్యక్త ఉభయములకు వేరై చెన్నోందుచున్నదో… అయ్యది -
1) త్రిదండము
2) వైష్ణవ లింగము… (1. త్రిగుణములు చేతిలో దండమువలె ధారణ చేయుటము 2. జగత్తుకు ఉత్పత్తి - స్థితి - లయ స్థానమై ఉండటము)
… ఈ రెండు కూడా విప్రులకు ముక్తిసాధనము.

సర్వధర్మములకు కేవలసాక్షిత్వమే (నిర్వాణమే) ముక్తి ! ఇది వేదములు సిద్ధాంతీకరించి గానము చేయుచున్న పరమసత్యము. ఇతి వేదానుశాసనమ్ !

పరివ్రాజకులు (సన్యాసులు) ‘4’ రకములుగా చెప్పబడుచున్నారు.

  1. కుటీచకుడు :  ఒక కుటీని (శరీరమును) ఆశ్రయించినవాడై ఉన్నవాడు. ఆత్యంతికార్థంగా…, ఈ జగత్తును తన శరీరముగా చూచువాడు. వసుధైక కుటుంబముగా భావించుచున్నవాడు. ’తన కుటుంబమే’గా ఈ సర్వమును దర్శించువాడు. ఈతని గుర్తు త్రిదండ ధారణ! “అంతా నాకు చెందినదే! అందరు నావారే!” అను దృష్టి కలవాడు.
  2. బహూదకుడు : సర్వ సహజీవులను (తనతో సహా) ఒకే సముద్ర జలము యొక్క వివిధ తరంగముల ప్రదర్శనముగా దర్శించు సిద్ధిని పొందినవాడు. “అహమ్ ఏకతరంగమస్మి - బ్రహ్మానంద సాగరే!”…. అను భావనతో ఉపాసించువాడు.
  3. హంస : “సోఽహమ్" భావన పునికి పుచ్చుకొన్నవాడు. “నేను - నీవు - ఆతడు ఈతడు ఈ కనబడేవారంతా మమాత్మ అగు ఆ పరమాత్మ స్వరూపమే” అను భావన పునికి పుచ్చుకొన్నవాడు. “ఇదంతా ఏదై ఉన్నదో - అదియే నేను” అను అభ్యాసి.
  4. పరమహంస : సర్వ జీవ జాలము, సర్వ జగత్తులు తానై, సర్వసాక్షిగా వేరై ఉండువాడు. ఈ సర్వము తనకు అభిన్నముగా - ఆత్మౌపమ్యేవ - అను అనుభూతిని అనునిత్యపరచుకొనినవాడు. (సోఽహమ్ పరమమ్ = సర్వమునకు పరమైయున్నదే ‘నేను’, కేవలుడను. సర్వమును.)

ఈ నలుగురు పరివ్రాజకులు కూడా - “విష్ణు లింగధారణ” చేయువారై ఉన్నట్లే!

ఈ విధముగా పరివ్రాజకులు ఋక్కులచే అభివర్ణించబడుచున్నారు.

ఓ సౌమ్యుడా! బిడ్డా!

మనము చెప్పుకున్న ఈ కుటీచకులు (ద్రష్ట-దర్శన-దృశ్యములనబడే త్రిదండి ధారలు), బహూదకులు (ఆ మూడిటిని త్రిదండముగా చేతియందు ధరించు (త్రిదండి ధాములు), హంసలు (ఏక దండధారులు సర్వము ఏకమగు అఖండ శివస్వరూపముగా దర్శించువారు), పరమహంసలు (దండమే ధరించనివారు, తమ ద్రష్టత్వమును పరబ్రహ్మమునందు మమేకము చేసి, కేవలము పరబ్రహ్మమొక్కటేగా ఏర్పడి ఉన్నవారు, అనన్యభావులు)…. ఈ నలుగురు బాహ్యాన కొన్ని కొన్ని వేరు వేరు లక్షణములు ఉన్నవారుగా కనిపిస్తారు. బాహ్యవృత్తి రీత్యా కొంచెము భేదము ఉన్నవారివలె అగుపిస్తుండవచ్చు గాక! వీరందరూ కూడా అంతరమున-బాహ్యమున కూడా అనునిత్యమూ-“ఇదంతా సస్వరూప -విష్ణుమయమే! అనన్యమగు విష్ణు స్వరూపమే! విష్ణు తత్త్వమే!” అను విష్ణులింగధారణ విషయంలో ఒకే తీరై ఉంటారు.

ఈ విధంగా ఈ కుటీచక, బహూదక, హంస, పరమహంసలు -

పంచయజ్ఞా :  పంచయజ్ఞాత్ములై ఉంటారు.

1) వేద పఠనము, వైశ్వ దేవము
2) (సహజీవులను బ్రహ్మముగా ఉపాసించి) అతిధి పూజ,
3) (జగత్తును-శరీరములను నిర్మించు ప్రజ్ఞలను ప్రదర్శించు దేవతారూపులగు) పిత్రు తర్పణము
4) సహజీవులకు ఆనందము కలిగించటము
5) వారిని బ్రహ్మముగా ఉపాసించటము అనే భూతబలి

(లేక)

i) దేవయజ్ఞము
ii) పితృయజ్ఞము
iii) భూతయజ్ఞము
iv) మనుష్యయజ్ఞము
v) బ్రహ్మయజ్ఞము.

ఈ పంచ పంచ యజ్ఞములను మనస్సుతో నిర్వర్తించువారు అయి ఉంటున్నారు.

వేదశిరః ప్రవిష్టాః : వేదములకు శిరస్సులగు ఉపనిషత్ అర్ధములందు సదా ప్రవేశించినవారై, ఉపవిష్ణులై (వాటియందు ఆశీనులై) ఉంటారు.

క్రియావంతో : వేదాంతార్థములను మననము చేయటయందు క్రియావంతులై ఉంటారు. (అంతేగాని బద్ధకము - అశ్రద్ధ, అతినిద్ర దరిచేరనీయరు).

అమీ సంగతా బ్రహ్మ విద్యామ్ : బ్రహ్మ విద్యకు సంబంధించిన సంగతులను ఎల్లప్పుడు పలుకువారు, బోధించువారు అయి ఉంటారు. సంసార వృక్షమును త్యజించినవారై, వృక్ష మూలము (At the Root point of all this being known) నందు సుఖాశీనులై, పుష్పములను (శాస్త్రముల బాహ్య కథా విశేషములకు, బాహ్యముగా కనిపించే సాధనము వ్యవహారములను) వదలి సర్వప్రయోజనములను సన్న్యసించు రసమును (బ్రహ్మ తత్త్వ జ్ఞాన సారమును), స్వీకరించువారై ఉంటున్నారు.

(అనేకాని చ శాస్త్రాని, కల్పాయుః విఘ్నకోటయః | తస్మాత్ సారమ్ విజానీయామ్ - అనురీతిగా) సారము స్వీకరించుటను ఎరిగినవారై ఉంటున్నారు. నిష్ణాతులుగా ఉంటున్నారు.

సౌమ్యుడు :  ఓ గురుదేవా ! మేము కూడా కుటీచక హంస పరమహంసలవలె శాస్త్రసారవంతులము కావటానికై ఏ సాధనా మార్గమును అనుసరించాలో ఏ త్రోవలో అడుగులు వేయాలో… దయతో సూచించండి.

గురుదేవుడు:  శాస్త్రములు 1) త్రిసంధ్యలయందు శక్తి కొలది స్నానము 2) తర్పణము 3) మార్జనము (హృదయ గృహమును ఆచరించు ప్రాపంచక విషయములు అనే ధూళిని ఎప్పటికప్పుడు ఊడ్చి శుభ్రపరచుకోవటము) 4) ఉపస్థానము (హృదయమునందు పరమాత్మ యొక్క తత్త్వజ్ఞాన-అనుభవములను ప్రతిక్షేపించుకోవటము 5) పంచ యజ్ఞములు (దేవ-పిత్రు-భూత-మనుష్య- బ్రహ్మయజ్ఞము)… సూచిస్తున్నాయి. ఇవన్నీ కూడా కుర్యాత్ అమరణాన్తికమ్ - జీవించి ఉన్నంతవరకు నిర్వర్తిస్తూ ఉండటమే ఉచితము.

గాయత్రీ జపయజ్ఞమును త్రిసంధ్యలయందు మనస్సుతో - ఎరుకతో (అర్ధమును మననము చేస్తూ) నిర్వర్తించాలి.

ఎల్లప్పుడుకూడా …

1) యోగ సాధనలు (యోగయజ్ఞము),

2) సత్ ఏకాగ్రమును (సత్ స్వరూప పరబ్రహ్మమే మహదాశయముగా కలిగి, బుద్ధిని ఏకాగ్రము చేయుటమును), ఆశయముగా కలిగి ఉండాలి.

3) భక్తితో - సర్వాత్మకుడు - సర్వ బాహ్య అభ్యంతరస్థుడు అగు పరమాత్మను జగత్లూపుడుగా సేవించటము,

4) బ్రహ్మజ్ఞానమును స్వానుభవం చేసుకొన్న బ్రహ్మతత్త్వజ్ఞులపట్ల గురుభక్తి,

ఈ నాలుగు వదలవద్దు.

తపస్సు :  పరతత్త్వముయొక్క సామీప్య-స్వానుభవముల కొరకు తపిస్తూ చేయు యత్నములు - తపస్సు.

అహింస : "వాక్ - మనో - కాయములతో సహజీవులెవ్వరినీ బాధించక, స్వదేహభాగమువలె దర్శించటము” .

స్వాధ్యాయ యజ్ఞము : “ఆయా ఉపనిషత్తులను, అవి ప్రతిపాదించు అర్థమును అభ్యసించటము-సంభాషించటము-బోధించటము” అను స్వాధ్యాయయజ్ఞము ప్రతి రోజు నిర్వర్తించబడు గాక.

జ్ఞాన యజ్ఞము : అన్ని వ్యగ్రతలను (All Emotions / Feelings) వదలివేస్తూ, ‘ఓం’ కారమును ఉచ్ఛరిస్తూ జీవాత్మను “బ్రహ్మమేవాగ్ని” యందు అనుక్షణము హోమము చేయటమే ’జ్ఞాన యజ్ఞము”. “పరబ్రహ్మమే నాకు అవిజ్ఞాన దృష్టిచే అనేక జీవాత్మలుగా కనిపిస్తున్నది. జ్ఞాన దృష్టిచే అంతా పరమాత్మయే!”… అను భావనతో ఈ దృశ్యజగత్తును దర్శిస్తూ ఉండటమే బ్రహ్మాగ్ని హోమము (లేక) జ్ఞానయజ్ఞము. అట్టి జ్ఞానయజ్ఞము - అన్ని యజ్ఞములకన్నా పరమోత్కృష్టము, పరమ పవిత్రము, సర్వదా సుసాధ్యము కూడా.

ఓ జనులారా ! ఆత్మ జ్ఞానమే దండము ! జ్ఞానమే శిఖ ! జ్ఞానమే యజ్ఞోపవీతము ! ఎవనికి జ్ఞానమయమైన శిఖ ఉంటుందో అతడు ‘తన్మయము’ (ఆత్మతో ఏకత్వము)… అనే ఉపవీతము స్వభావముగానే ధరించుచున్నవాడగుచున్నాడు. అదియే సకలురకు బ్రహ్మణ్యము. బ్రహ్మణ్యమే బ్రాహ్మణ లక్షణము.

సౌమ్యుడు :  స్వామీ మీ ఆజ్ఞలు, సూచనలు అమోఘములు! శిరోధార్యములు!
పరివ్రాజకుల గురించి మనము చెప్పుకుంటున్నాము. మరికొన్ని విశేషాలు చెప్ప ప్రార్థన.

గురుదేవుడు : ఓ సౌమ్యా ! ఏతే పరివ్రాజకా యథా ప్రాదుర్భవంతి, తథా భవంతి ! అప్పుడే పుట్టిన పిల్లవాడు ఈ జగత్తు విషయంలో ఏ విధంగా ఉంటాడో, పరివ్రాజకుడు ఆ విధముగా ఉంటాడు. ఇదంతా క్రీడా ప్రాంగణముగా, తాను క్రీడా-లీలా-వినోదిగా భావన కలిగి ఉంటాడు. ’శరీరమునకు మునుముందటి స్థితి’ పట్ల మననశీలుడై ఉంటాడు.

కామము, క్రోధము, లోభము, మోహము, దంభము, దర్పము, అసూయ, (నాది - అను) మమత్వము, (“నేను నేను ఇంతటి - వాడిని’… అనే) అహంకారము… మొదలైనవన్నీ మొదలంటా త్యజించిన వాడై, జయించినవాడై ఉంటాడు.

అతనికి- "నేను ఈ ఈ విశేషములు కలవాడిని కదా !”… అనే మానముగాని, “అయ్యో ! నన్ను ఇంతమాట అన్నారా”… అనే అవమానముగాని, “అరెఁ ! నన్ను నిందిస్తున్నారే ! ఆహాఁ ! వీళ్ళు నన్ను స్తుతిస్తున్నారు కదా !”… అనే నిందాస్తుతులుగాని లేనివాడై, వాటికి అతీతుడై - వదలివేసి ఉంటాడు. ఈ ఈ లక్షణములు గల వారెవ్వరైనా - గృహస్థుడు మొదలగు ఏ ఆశ్రమంలో ఉన్నప్పటికీ పరివ్రాజకులేనయ్యా!

అంతేకాదు. ఒక మహావృక్షము తాను నరకబడుచున్నప్పుడు కూడా “వీళ్ళకు ఇంత ఇచ్చానే ! నరుకుచున్నారు కదా ! నాపై వ్రాలే పక్షులు నావే కదా ! అవి ఏమౌతాయి ?”… ఇవన్నీ ఏమీ పొందక మౌనంగా ఉంటుంది చూచావా ? ఆ తీరుగా ఆత్మ తత్త్వమును ఎరిగిన మహనీయుడు ఇక్కడ ఏదీ ‘నాది’ అను భావన పొందనివాడై, మార్పు చేర్పులకు అతీతుడై, అమృతస్వరూపుడై పరతత్త్వమును ఆస్వాదించుటలో అనునిత్యము నిమగ్నుడై ఉంటాడు.

ఋత్విక్కులు గానం చేసే ఋక్కులు ఈవిధంగా ఎలుగెత్తి చెప్పుచున్నాయి.

సన్న్యాస స్వీకారము

బ్రహ్మచారిగాని, గృహస్థుడుగాని, బంధువుల-పుత్రుల ఆమోదముతో సన్న్యాసవ్రతము స్వీకరించుచున్నాడు. సన్న్యాసము పుచ్చుకొన్న వెంటనే, ఇక వెనుకకు తిరగకుండా గృహమునుండి బయల్వెడలుచూ అడుగులు వేస్తున్నాడు. ప్రశాంతమనస్కుడై, ద్వంద్వములను సహించుచూ, తూర్పు దిక్కుగాగాని, పడమర దిక్కుగా గాని బయల్వెడలుచున్నాడు. చేతిలో భిక్షక పాత్ర, త్రిదండము ధరించువాడై ఉంటున్నాడు. క్షౌరముచే పిలకమాత్రమే కలిగి ఉండి సంచరించసాగుచున్నాడు. ముండనము చేసినప్పటి శిఖ, పరమాత్మ స్వామీప్యము అనే ఉపవీతము (బ్రహ్మరంధ్రస్థానము - సహస్రారము) మాత్రమే అతని కుటుంబ సభ్యులు. ఈ విధంగా యాత్రలు చేస్తూ ఉంటాడు.

మట్టి పాత్రగాని, సొరకాయ డిప్పగాని అతని భిక్షకపాత్ర ! అయాచితంగాగాని, యాచితంగా గాని ఏది ఆహారముగా లభించితే “మహాప్రసాదము” అని పలుకుచూ - భావిస్తూ స్వీకరించుచున్నాడు. పట్టు వస్త్రములతోగాని, మరి ఏదైనా చిరిగిపోయిన వస్త్రములతో గాని తయారైన బొంతనో (లేక) గడ్డి బొంతనో ఆశీనమునకై అచ్ఛాదనముగా కలిగి ఉంటాడు. ఋతువునకు (రెండు నెలలకు) ఒకసారి మండనము (క్షౌరము) చేయించుకొంటూ (తలపై జట్టు తొలగించుకొంటూ) ఉంటాడు. మెడకు పై భాగము మాత్రమే ముండనముగాని, క్రింద భాగము కాదు. (చంకలు-శిఖను తీయరాదు).

అతడు వర్షరుతువుతో ప్రారంభించి, చాతుర్మాస్య వ్రత దీక్షతో 4 నెలలు ఒక్కచోట (ఆశ్రమంలోగాని, దేవాలయములోగాని, సత్సంగము జరుగు సాత్వికుని అభ్యర్థనను అనుసరించి వారి బాహ్యకుటీరములోగాని) ఉంటూ ఉంటారు. ఆ 4 నెలలు కూడా ప్రాపంచక విషయములు ఏ మాత్రము పట్టించుకోకుండా, అంతరాత్మ పురుషుడగు విశ్వరూపుని యందు బుద్ధిని నిలిపి ధ్యానమునందు ఆత్మతత్త్వము ప్రతిపాదించు ఉపనిషత్-ఇత్యాది గ్రంథ పఠనమునందు గాని, ఏకాంత తపస్సునందు గాని కాలము వెళ్ళబుచ్చుచూ ఉంటాడు.

ధ్యాన - సమాధుల నుండి పునరుత్థానము పొందినప్పుడు ప్రకృతిని నిర్మితమగు భౌతిక దేహము యొక్క సంరక్షణ - ఉపయుక్తముల కొరకై క్రియలు నిర్వర్తిస్తూ ఉంటారు. ఆయా విహిత “ఆహార - ఆశ్రితజన ఉద్ధారణ”… ఇత్యాది స్వకర్మ (ప్రకృతిచే సంకల్పించబడు విద్యుక్త కర్మలందు) ఇంద్రియములతో - ఇంద్రియార్ధములతో కూడిన ఈ దేహమును “ఉపయోగించబడుచున్న వస్తువు” వలె నియోగించుచూ, ఆనందముగా దృశ్యమునందు విహరించుచున్నారు.

పరివ్రాజక నివాస స్థానములు

వారు దేవాలయములను, వృక్షముల క్రింద స్థలములను, కొండగుహలను, కొండ ప్రదేశములను, నదుల ఒడ్డున, తీర్థప్రదేశములను… నివాసములుగా కలిగి ఉంటున్నారు. ఏ ఒక్క ప్రదేశముతోను, రూప నామములతోను, వ్యక్తులతోను అనుబంధ పూర్వకమగు బంధము కలిగి ఉండనివారై, “అసంగులు (unattached)" అయి ఉంటున్నారు. “ఇదంతాకూడా మమాత్మస్వరూపమే కదా !”… అను లక్ష్యముతో కూడిన శీలము (behaviour), వృత్తి (Avocation) కలిగి (లక్షిత శీల వృత్తులై) ఉంటున్నారు.

ఇంధనము అయిపోయినప్పటి అగ్నివలె సర్వవేదనలు, ఆవేశములు, ఆదుర్దాలు, సుఖ-దుఃఖ-భావ అభ్యాసములు సమసిపోయినవారై ఉంటున్నారు. పరమ ఉపశాంతులై మహత్తర ప్రశాంత స్థితితో కూడిన మౌనానందమును ఆస్వాదిస్తున్నారు.

అసంగో లక్షిత శీలవృత్తః, నిరింధనజ్యోతిరివ ఉపశాంతో, న చ ఉద్విజేత్! అంతరంగమున ఏ మాత్రమూ కూడా ఉద్వేగము పొందుటయే లేదు. “అవును! ఉద్వేగమెందుకు? సర్వాత్మకము - సర్వస్వరూపము - సర్వ సంప్రదర్శనశీలము అగు ఆత్మ నేనే అయి ఉండగా నాది కానిదేది? అంతా ‘నేనే-నాదే’ అయి ఉండగా దేనిని చూసి ఉద్వేగపడాలి? క్రొత్తగా ఏ విభాగము చూసి ‘ఇచ్ఛ’ పొందాలి ? అంతా నా ఇచ్చానంద స్వరూపమేగా!” అను భావముతో హృదయమంతా పూరించుకొని ఉంటున్నారు.

శరీరమ్ అనుసంజ్వరేత్! శరీర భావములన్నీ ఆత్మజ్ఞానాగ్నిలో వ్రేల్చివేస్తున్నారు. ఆత్మ జ్ఞానము పొందినట్టి ధీరులై వారు బ్రహ్మభావనచే “బ్రాహ్మణులు"… అనబడుచున్నారు.

ఓ సౌమ్యా ! సర్వదా బ్రహ్మభావనయే ఆశ్రయించాలయ్యా! బ్రహ్మభావనను ఆశ్రయించకుండా బ్రహ్మము గురించి వంద శబ్దములు చెప్పుకొని ఊరుకుంటే ఏం లాంభం? న అనుధ్యాయాత్ బహూం శబ్దాన్, (కింతు) వాచా విగ్లాపనం హి తత్! అనేక శబ్దములు (Jorgons, Technical words and phrases) తో అంత పెద్దపనేమున్నది? ఎక్కువగా మాటలు (బ్రహ్మముగురించి) చెప్పుకోవటమనేది బ్రహ్మభావనకు గ్లాపన (Missing) అవవచ్చునేమో కూడా! ఎన్ని చెప్పుకున్నా, చెప్పుకోపోయినా “ఈ సర్వము… సర్వులు తానే” - అయి ఉన్న బ్రహ్మము నేనే”… అను సంభావనయే కదా, ముఖ్యము?

ఓ సౌమ్యా ! బ్రహ్మమును తెలుసుకొని, బ్రహ్మమే తాముగా తెలుసుకొనియున్న బ్రహ్మజ్ఞులు ఈ జగత్తులో-ఆడుకొనే బాలునివలె (చిన్నపిల్లవానివలె) కేరింతలు కొడుతూ ఉంటారు. ’అంతా బ్రహ్మమే’ అని తెలిసియే ఏమీ తెలియని చిన్న పిల్లవానివలె మునీశ్వరులు సంసారము నందు సంసారులై ఉంటున్నారు. సహజీవులతో ఉద్వేగరహితులై ఉంటున్నారు. బ్రహ్మమును ఎరిగినవారే బ్రహ్మజ్ఞులను గుర్తించగలరు.

ప్రతి జీవుడు సహజసిద్ధంగా పరమానందము కేవల సాక్షి యగు పరబ్రహ్మమే స్వరూపముగా కలిగి ఉన్నాడయ్యా! అయితే కేవలకల్పితమాత్రమగు ఈ దృశ్యములో “ఏదో పొందాలి ! అప్పుడు కానీ ఇప్పటికి లభించని ఆనందము ఏదో లభించదు”… అను “కామము”ను హృదయములో తనకు తానే పదిలపరచుకొని-వృద్ధిచేసుకొని ఉండటముచేతనే, ఈ జీవుడు తన హృదయములో సర్వదా వేంచేసియుండి, నిత్యప్రకాశతత్త్వమగు పరబ్రహ్మమును వీక్షించలేక పోవుచున్నాడు. హృదయములో “కామము” అను జన్మజన్మల స్వకీయ కల్పనావేశమే ”బ్రహ్మానందము”నకు అడ్డు తెరగా నిలచుచున్నది.

యదా సర్వే ప్రముచ్యంతే కామాయే అస్య హృదిశ్రితాః,
అథ మర్త్యో అమృతో భవతి | అత్ర బ్రహ్మ సమశ్నుతే ॥

ఏ మానవుడు - తన యొక్క హృదయములోకి (దొంగవలె) ప్రవేశించియున్న (“ఇంద్రియ విషయముల రూపముగా ఉన్నదేదో ఇంకా ఈ బాహ్య జగత్తు నుండి పొందాలి ! లేదా దుఃఖము తొలగాలి. అంతదాకా అసంతృప్తి కొనసాగక తప్పదు”… అను నిర్వచనముల రూపమగు) “కామము”ను హృదయము నుండి పూర్తిగా వెడల గొట్టి వేస్తాడో… ఆతడే ధన్యుడు. అతడు, ఇక్కడే ఇప్పుడే అమృత స్వరూపుడై ‘బ్రహ్మము’గా అగుచున్నాడు. బ్రహ్మమే తానై సర్వస్వస్వరూపత్వము - సర్వ సాక్షిత్వము పునికిపుచ్చుకొనుచున్నాడు.

సౌమ్యుడు :  స్వామీ ! కొందరు సన్న్యాసాశ్రమము స్వీకరించి కూడా, అజ్ఞాన ప్రభావము చేత లౌకికమైన ధన-కనక-కీర్తి-ప్రతిష్టల వైపుగా అడుగులు వేస్తున్నారే ! మీరు చెప్పినట్లు “ప్రముచ్యంతే కామాః హృదిస్థితా” వైపుగా తగినంత దృష్టి సారించక పోవటము కొంత గమనిస్తున్నాము. అట్టి చ్యుతి పొందినవారిగురించి మా యొక్క జాగరూకత కొరకై మాపై దయతో వివరించండి.

గురుదేవుడు :  అవును నాయనా ! సన్న్యాసాశ్రమ స్వీకారానంతరము కూడా అత్యంత జాగరూకత అవసరమే ! ఇంద్రియ విషయములు ఆకర్షించకుండా తగు జాగరూకత వహించలిసిందే. ఇది దృష్టి పెట్టుకోనివాడు ‘పతనము’ పొందుచున్నాడు. సన్న్యాసాశ్రమ నిష్ట నుండి (లేక) పారివ్రాజ్యక నియమమునుండి చ్యుతుడై, తిరిగి సంసార దృష్టులవైపుగా నడుచువాడు…, (లేక) సన్న్యాసవృత్తిని సాంసారిక ప్రవృత్తికి ఉపయోగించుకొనువాడు అగుచున్నాడు. అది నిప్పుతో ఒళ్ళు కాల్చుకోవటము వంటిది. ఆత్మధర్మమును విడిచి చరించువాడగుచున్నాడు. ఆత్మావగాహనకు సంబంధించిన బుద్ధి సామర్థ్యమును, అవకాశములను పోగొట్టుకొన్నవాడగుచున్నాడు. బ్రహ్మ మార్గమునుండి నిమ్నమార్గమునకు (దృశ్య మార్గమున) పడుచున్నవాడగుచున్నాడు. జన్మపరంపరల దోషమును వదిలించుకోబోయి, మరింతగా అంటించుకొనుచున్నాడు. వృధా జన్మలు పొందుచున్నాడు. మహాపాతకము చేయువానితో సమానమగుచున్నాడు.

ఏ సన్న్యాసి అయితే మనము చెప్పుకొన్న “సర్వే సర్వత్రా విష్ణుతత్త్వము దర్శించు మార్గము"ను వదలి, కేవలము వస్త్రధారణ - కమండలువు - దండము శిఖలు మాత్రమే ధరించి, సంసార దృష్టి పరంపరలలో మునిగి తేలుచూ కాలము వెళ్ళబుచ్చుతారో, - వారు “దొంగతో సమానము” అని చెప్పబడుచున్నారు. ఫలితముగా బాహ్యమున పరివ్రాజకుడుగాను, లోన సంసారచింతనలు ఆశ్రయించువాడుగాను అగుచున్నాడు. గురు / గురుపత్నీ తల్ప - మిత్ర ద్రోహ - కృతఘ్నతా క్రియలతో సమానమగు దోషములను మూటకట్టుకున్నవాడుగా అగుచున్నాడు. వర్తమాన లోకమును పోగొట్టుకొని, చ్యుతుడై అల్పగతులను ఆహ్వానించుచున్నాడు.

ఓ సౌమ్యా ! వేద వాక్యరూపములగు ఋక్కులు ఈ విధముగా గానము చేస్తున్నాయి.

స్తేన సురాపానో గురుతల్పగామీ మిత్ర ధృగేతే నిష్మృతేః యాంతి శుద్ధిమ్। 
దొంగతనము, సురాపానము, గురుతల్పము, మిత్రద్రోహము… ఇటువంటి పాతకములకైతే, “పశ్చాత్తాపముచే నిష్మృతి ఉన్నది” అని చెప్పబడుతోంది ఆ దోషము తొలగించుకోగల సాత్వికమార్గరూప ఉపాయాలు ఉన్నాయి. ఆయా కర్మలు (శాస్త్రములచే, ఆర్యులచే) సూచించబడుచున్నాయి.

కానీ -
వ్యక్తం అవ్యక్తంవా విధృతం విష్ణులింగం త్యజత్ న శుద్ధ్యేత్ అఖిలైః| వ్యక్త-అవ్యక్త రూప విష్ణు లింగమును, గురుముఖతః సన్న్యాసాశ్రమ విధిని స్వీకరించి కూడా… చ్యుతి పొందితే… అట్టి దోషమునకు నిష్కృతి (దోషము తొలగించగల కర్మలు) లేవు. పతనము అనివార్యము.

నిజాత్మాశ్రమము

ఓ సహజాత్మానంద స్వరూపులారా ! మీ యందే స్వస్వరూపాత్మ స్వరూపమై, బయట లోపల కూడా ఎల్లప్పుడు ప్రకాశమానమైయున్న, భాసించుచున్న-విష్ణులింగ స్వరూపమును (మరియు) స్వహృదయాశ్రమవాసిని ఏమరచి బాహ్యమున ఏదో వస్తువునో విషయమునో భజించటము కొనసాగిస్తూ ఉన్నవాడు మూఢుడే! హృదయమున పరమాత్మను ఏమరచి, బాహ్య జగత్తులో పరమాత్మ కొరకై వెతకువానికి కోట్ల కల్పములు గడచిపోయినా కూడా “ఉత్తమోత్తమగతి’ లభించటము లేదు. అనగా, బాహ్య ఇష్టదైవమును స్వస్వరూపముగా దర్శించినప్పుడే తత్త్వసిద్ధి!

అందుచేత ఓ ప్రియ మిత్రులారా! సర్వ ఆశ్రమములను (బ్రహ్మచారి-గృహస్థ-వానప్రస్థ-సన్న్యాసాశ్రమములను) బయటనే అట్టిబెట్టి, శాశ్వతమగు “సర్వత్రా స్వస్వరూపసందర్శనము. జగత్తును ఆత్మగా దర్శించటము”… అనబడే ’మోక్షాశ్రమము’ను మీరు సేవించెదరు గాక.

మోక్షాశ్రమాత్ పరిభ్రష్టో న గతిః తస్య విద్యతే |
ఏ ఆశ్రమము నుండి భ్రష్టుడైనా, లేకున్నాకూడా, మోక్షాశ్రమము నుండి పరిభ్రష్టుడైనవాడికి.. గతిలేదు.

ఓ సౌమ్యా!
పరివ్రాజధర్మము (సన్న్యాసధర్మము) శాస్త్రయముగా స్వీకరించికూడా, స్వధర్మము నందు (పరివ్రాజ ధర్మమునందు) బుద్ధిని నిలుపడో, దుష్టబుద్ధితో దుష్ప్రవర్తనుడు, సంసార విషయాశయుడు అవుతాడో… అతడు “ఆరూఢచ్యుతుడు” (వృక్షము ఎక్కుచూ క్రిందపడినవాడితో సమానము) అని గమనించు.

ఇతి వేదానుశాసనమ్ |

వైష్ణవీ నిష్ఠ - తత్ ప్రభావము

బిడ్డా ! సౌమ్యా ! సనాతన ఆత్మధర్మ రూపమగు “తత్ - త్వమ్; సోఽహమ్ః; త్వమేవాహమ్; అహమ్ బ్రహ్మాఽస్మి”…. అర్ధముతో కూడిన ”వైష్ణవ నిష్ఠ”ను సముపార్జించుకొని, నిర్మలమైన ప్రవర్తన కలిగియున్నవాడు (అదూషత్ వర్తతే)… సర్వశుభములు పొందగలడు. ‘జీవితము’ అనే అవకాశమును సద్వినియోగపరచుకొన్నవాడగుచున్నాడు. సర్వము తన వశమునందు కలిగి వున్నవాడు ‘వశీ’ అగుచున్నాడు.

- అతడు పుణ్య శ్లోకుడు (వేదాంతార్థమగు ఉపనిషత్ సారవాక్యము ఎరిగినవాడు).
- లోకతత్త్వము ఎరిగినవాడు - “లోకజ్ఞో” అగుచున్నాడు.
- వేదాంతము ఎరిగినవాడు, బ్రహ్మమును ఎరిగినవాడు సర్వమును ఎరిగినవాడు (వేదాంతజ్ఞ, బ్రహ్మాజ్ఞో, సర్వజ్ఞో) అగుచున్నాడు.

సర్వమునకు చక్రవర్తి (స-సర్వరాట్), పరబ్రహ్మము, భగవంత - స్థానము పొందుచున్నాడు. అతని పిత్రు దేవతలు, సంబంధితులు, బంధువులు, సుహృత్తులు, మిత్రులు… వారు కూడా ఆ ఆత్మతత్త్వజ్ఞుని సాంగత్యములో తరించుచున్నారు. (స తరతి! స తరతి! స లోకాం తారయతి).

ఏ కులములో ‘బ్రహ్మవేత్త’ ఉంటాడో, అతడు ఆ కులములో ’300’ మందిని అజ్ఞానము నుండి ఉద్ధరించుచున్నాడు. అతని వంశములోనివారు సుకృతులు అగుచున్నారు. ఇక్కడే వారు కూడా జ్ఞాన విద్వాంసులగుచున్నారు. ఆత్మ ధర్మము ఎరిగిన ’పరివ్రాట్ఎక్కడ ఉంటే, అతని సమీపములో ఇటు, ‘300’ మంది, అటు ‘300’ మంది వెనుక - ముందు - ఇరువైపులా … ఉన్నవారు కూడా ఆత్మజ్ఞాన గంథమును పొంది తరిస్తున్నారు.

ఓ మిత్రులారా ! ఈ జగత్తును సన్యసించువిధిని, విధానమును, అద్దాని ప్రయోజనమును ఆశయములను కనీసము గ్రహించి - ఉండండి. హృదయములో సన్న్యాసభావములను పదిలపరచుకోండి. ఆత్మధర్మమును (The feature of experiencing Absolute self as a mere witness to Relativity) సుస్పష్టపరచుకోండి. ప్రాణములు కంఠములో చేరి దేహమును విడచుచున్నప్పుడైనా సరే (Atleast while leaving the body ప్రాక్ శరీర విమోక్షణాత్)… కామ - క్రోధములను మొదలంట్లో జయించి “మయా సన్న్యస్తమ్! నేను సర్వము సన్న్యసించుచున్నాను. కేవల సాక్షిత్వమునందు ప్రవేశించుచున్నాను…” అని బిగ్గరగా ప్రకటించి, హృదయస్థుడైనా కూడా, ఆతడు, అతని పిత్రు దేవతలు తరించుచున్నారు. ఆతడు భ్రమలను విడచుచున్నాడు.

బిడ్డా ! సౌమ్యా ! సనాతనమగు ఆత్మ ధర్మముగురించి బోధించుచున్నప్పుడు అట్టి “వైష్ణవీనిష్ఠ” యొక్క ఫలశృతి చెప్పుకోవాలి. పొందుటవలన ప్రయోజనము ఏమిటో, ఎరుగకపోవుట వలన పోగొట్టుకొనునది ఏమో చెప్పుకుంటూ ఉండాలి! ఈ జీవుడు గుర్తుచేసుకొంటూ ఉండాలి!

ఈ వైష్ణవీనిష్ఠ - సనాతన ఆత్మ ధర్మమును ఎవరికి చెప్పకూడదు?

శ్రోతను పై దోషములు పోగొట్టుకొనుటకు ప్రయత్నమునందు నియమించి, అప్పుడు తగిన సమయములో “వైష్ణవీనిష్ఠ” ను ఉపనిషత్తుల, (భగవద్గీత, యోగవాసిష్ఠము ఇత్యాది) ఆత్మతత్త్వ బోధక గ్రంధముల సహాయముతో బోధించాలి.

ఆత్మతత్త్వమును అవ్యాజమైన ప్రేమతో మనకు గుర్తు చేస్తున్న మహనీయుల వాక్వాహరూపములగు ఋక్కులు “విద్యాదేవి పలుకు అప్త వాక్యములు” గురించి ఇట్లా గానము చేస్తున్నాయి.

బ్రహ్మము గురించి సంభాషించుకొనుచున్న బ్రహ్మ విద్యా సభలోను, బ్రహ్మవిద్యను సంభాషించుకొనుచున్న గురు - శిష్యుల మధ్యను ప్రత్యక్షమై అమృత దృక్కులతో వాత్యల్యమును వర్షింపజేయుచూ బ్రాహ్మీదేవి - బ్రహ్మవిద్యాదేవి (మహాసరస్వతీదేవి)] ఈ విధముగా మృదుమధురవాక్కులు పలుకుచున్నది.

గోపాయ మాం శేవధిష్టేతి అహమస్మి! ఓ బిడ్డలారా ! మీ యందు రహస్యరూపిణి అయి దాగిన బ్రాహ్మీస్వరూపిణినగు నన్ను మీ స్వస్వరూపముగా ఉపాసించండి !

మీరు బ్రహ్మతత్త్వము గురించి విజ్ఞాన దృష్టితో సంభాషించుకొనుచుండగా, మీపై అవ్యాజమగు ప్రేమను వర్షింపజేస్తాను. బ్రహ్మ విద్యనగు నేను స్వభావసిద్ధముగా వశమౌతాను. ఇందులో సందేహమే లేదు.

ఓ బ్రహ్మజ్ఞులారా ! మీరు బ్రహ్మ విద్యను మీయందే దాచుకోకండి. ఎవ్వరైతే మిమ్ములను ఆశ్రయించి, నమస్కరించి, బ్రహ్మ విద్యను ‘దేహీ’ అని అభ్యర్ధిస్తారో, వారికి మీరు విద్యను దాచుకోకుండా "తత్-త్వమ్’ అను మహత్తర సత్యమును నిరూపిస్తూ బోధించండి. అంతేగాని, శిష్యులకు “మీరు స్వల్పులు - అల్పులు. మీ గతి ఇంతే”… అను రూపమున కాదు.

“తత్త్వమసి! మీరు సర్వదా స్వతఃగా బ్రహ్మమే అయి ఉన్నారు” అను అర్థమును నిరూపించుకుంటూ ఒకరినొకరు సంభాషించుకోండి. గురు శిష్యుల ఇరువురి హృదయములలోను - ఆత్మవిద్యానుభవముగా నేను సిద్ధించగలను. మీకు వశమై ఉంటాను. వాక్ ప్రవాహరూపముగాను, జ్ఞాపకశక్తి - శబ్దాచ్ఛారణ శక్తిగా మీ యందు ప్రకాశమానమగుచు, మీ బ్రహ్మ విద్యా ప్రవచనములలో రసరూపిణినై ఉంటాను.

ఓ ఆత్మ విద్యాబోధనము చేయుచూ, సత్సంగపూర్వకంగా సంభాషించు ఉత్తమజనులారా! మీ వాక్కునందు నేను సంతోషముగా ఉత్సాహము-జ్ఞప్తి - భావతరంగావేశముగా ప్రవేశించుచుచున్నాను. అయితే, శిష్యుని సత్ప్రవర్తన చూచి బ్రహ్మ విద్యను బోధించండి - అని మాత్రమే కోరుకుంటున్నాను.

ఓ సద్గురువును ఆశ్రయిస్తున్న శిష్యజనులారా! ఆత్మవిద్యను శ్రద్ధగా, ఉత్సాహముగా వినుచున్న శ్రోతలారా! నేను మీ బుద్ధిని వెంటనంటి ఉంటాను.

ఓ ఆత్మతత్త్వ ప్రవచకులారా!
అసూయ కలవానికి, ఇతరులను ’చిన్నచూపు చూస్తూ అవమానించు స్వభావము కలవానికి, ఇతరుల శుభమును చూచి ఓర్వలేని వానికి, ఇతరుల తప్పులను ఎంచుటలో ప్రావీణ్యత చూపాలనుకొనువానికి, ఋజుత్వము (Stright forwardness) లేనివానికి, సత్యమును స్వీకరించటానికి సంసిద్ధపడక, సంకుచితంగాను, వంకర టింకరగాను యోచించు బుద్ధి కలవానికి, విషయమును వక్రబుద్ధితో (సూటిగా కాకుండా) యోచించువానికి, “నేను నమ్మినదే నిజము! నాకు ఎవ్వరూ చెప్పలేరు” అని మొండితనము వహించి ఉన్నవారికి, శరులకు…., ఈ ఆధ్యాత్మ విద్య (లేక) బ్రహ్మ విద్యను బోధించక పోవటమే ఉచితము సుమా!

గురుస్థానము :

ఓ బ్రహ్మ విద్యను సమీపించి ఉపాసించి, నేర్చుకొనుచున్న శిష్యులారా! గురువుగా సంబోధించబడుచున్న విజ్ఞులారా! నేను మీయందు వీర్యవతినై ప్రకాశించగలనని ప్రతిజ్ఞ చేస్తున్నాను. మీరు పలికే వాక్యములలో, భావములతో, విజ్ఞానములో ప్రవేశించి మిమ్ములను ప్రజ్ఞావంతులుగా తీర్చిదిద్దుతాను. ఆత్మ విద్యాస్వరూపణినగు నాకు నమస్కరించినంత మాత్రముచేతనే ప్రేమాస్పదనై మీ వెంట నంటి ఉంటాను.

ఓ బ్రహ్మ విద్యను ఎరిగిన బిడ్డలారా !

ఎవ్వడైతే…,

అట్టి గుణములు ప్రదర్శించుచూ గురువును సమీపించి బ్రహ్మ విద్యను అర్ధించినప్పుడు, అతని హృదయనైర్మల్యత్వమును పరిశీలించి, అందుకు ఆ శిష్యునికి సహకరిస్తూ - బ్రహ్మ విద్యను తప్పక బోధించాలి ! అతనికి వైష్ణవీనిష్ఠ - ఆత్మత్త్వ దర్శనము - సోఽహమ్, తత్త్వమ్, త్వమేవ అహమ్’ ల పాఠ్యాంశములు తప్పక మహత్తరమగు ఆశమయతో బోధించాలి.

శిష్యుడి లక్షణాలు :

ఇక బ్రహ్మ విద్యను నేర్చుకొను ఆశయముగల శిష్యుడు (విద్యార్థి) మనసా, వాచా, కర్మణా గురువును ఆశ్రయించాలి. సేవించాలి. అర్ధించాలి. గురువునకు తన నిర్ణయములు చెప్పి ఒప్పించే పని ఉచితం కాదు.

గురువుకు దక్షిణ - భోజనము సమర్పించాలి. గురువు మనస్సును సంతోషింపజేయు “ఉపాసన” లేనివానికి బ్రహ్మ విద్య అనుభవమునకు రాదు. ఇది విధి శాసనము. వినుచున్న విద్యను అనుభవమునకు తెచ్చుకొనే ప్రజ్ఞ, సంసిద్ధత - శిష్యుని యందు సదా నిదురలేచి, ఉత్సాహపూర్వకంగా వేచి ఉండును గాక !

గురురేవ పరో ధర్మో :  గురువే పరమధర్మము ! వారిని పూజనీయులుగా భావించుట ఆత్మోపాసనతోను, ఆత్మ ధర్మనిరతితోను సమానము. గురువునే పరధర్మ స్వరూపనిగా దర్శించలేకపోతే, ఇక పరతత్త్వమును సర్వే-సర్వత్రా ఎట్లా దర్శించగలుగుతాడు?

గురురేవ పరాగతి : గురువు చెప్పు శాస్త్రీయ - స్వానుభవ సమాచారములే, మహత్ వాక్య ప్రవాహములే, సోదాహరణ పూర్వక నిరూపణలే-పరమునకు గతి, మార్గము కూడా!

ఏకాక్షర ప్రదాతారమ్ : అనేకముగాను, నశించబోవు స్వభావముతో కూడినది అగు ఈ దృశ్య జగత్తుకు ఆధారముగా ఉన్న “ఏకము - అక్షరము”… అగు ఆత్మతత్త్వమును హృదయమునందు ప్రవేశింపజేయువారు గురువు! ఆయన ఏకాక్షరమును ప్రసాదించు వారుగా ఉపాసించాలి.

అనగా…,
అట్టి గురువును ప్రత్యక్షముగా కనిపించే పరతత్త్వ స్వరూపముగా ఉపాసించటమే - శిష్యత్వ ధారణ!

ఎవ్వడు గురువుకు కృతజ్ఞతలు పలుకడో, పరతత్త్వ స్వరూపముగా ఉపాశించడో, అట్టివాడు నేర్చుకొను విద్య, విన్న విషయాలు, చేసిన తపస్సు… ఇవన్నీ పచ్చికుండలోని నీరువలె… అనుభవమునకు ఉపయోగించక, నిష్ప్రయోజనము అగుచున్నాయి. వృధా అగుచున్నాయి.

యస్య దేవే పరాభక్తిః, యథా దేవే తథా గురౌ।
స బ్రహ్మవిత్ పరం ప్రేయాత్ … ఇతి వేదానుశాసనమ్ ||

పరమాత్మయందు ఎంతట భక్తియో అంతటి భక్తిని - ప్రపత్తులను గురువుపై కలిగి ఉన్నప్పుడు… బ్రహ్మవిద్య తనకు తానే హృదయమున ప్రవేశించి, “పరబ్రహ్మానుభావము”గా ప్రకాశమానము అవగలదు.

ఆ బ్రహ్మవేత్త పరతత్త్వమును పొంది బ్రహ్మమే తానై సర్వే సర్వత్రా వెల్లివిరియగలడు.

ఇతి వేదానుశాసనమ్ |

🙏 ఇతి శాట్యాయనీయ ఉపనిషత్ | 🙏
ఓం శాంతిః శాంతిః శాంతిః ||