[[@YHRK]] [[@Spiritual]]

Tāra Sāra Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 1
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com
Courtesy - sanskritdocuments.org (For ORIGINAL Slokas Without Sandhi Splitting)


శుక్ల యజుర్వేదాంతర్గత

5     తారసారోపనిషత్

శ్లోక తాత్పర్య పుష్పమ్



యన్నారాయణతారార్థసత్యజ్ఞానసుఖాకృతి .
త్రిపాన్నారాయణాకరం తద్బ్రహ్మైవాస్మి కేవలం ..

శ్లో॥ యత్ నారాయణ తారార్థ సత్యజ్ఞాన సుఖాకృతి
త్రిపాద్ నారాయణాకారం తత్ బ్రహ్మైవాస్మి కేవలమ్ ॥

ఏదైతే ‘నారాయణ’ అను శబ్దము యొక్క తారార్థమై, అంతరార్థమై, సత్య జ్ఞాన స్వరూపమై, సుఖానంద ప్రదమై, (ఋగ్వేద, యజుర్వేద, సామవేద) త్రిపాద సమన్వితమగు నారాయణాకారమై ఉన్నదో…. ఆ కేవలమగు బ్రహ్మమే నేను! నారాయణ పరబ్రహ్మ స్వరూప సోఽహమ్! నారాయణమ్ మహాజ్ఞేయమ్ అహమేవ!

ఓం నమో నారాయణాయః ఓం బృహస్పతయే నమః | ఓం యాజ్ఞవల్క్యాయ నమః | ఓం భారధ్వాజాయ నమః|


బృహస్పతిరువాచ యాజ్ఞవల్క్యం యదను కురుక్షేత్రం దేవానాం
దేవయజనం సర్వేషాం భూతానాం బ్రహ్మసదనం తస్మాద్యత్ర
క్వచన గచ్ఘ్ఛేత్తదేవ మన్యేతేతి . ఇదం వై కురుక్షేత్రం దేవానాం
దేవయజనం సర్వేషాం భూతానాం బ్రహ్మసదనం . అత్ర హి జంతోః
ప్రాణేషూత్క్రమమాణేషు రుద్రస్తారకం బ్రహ్మ వ్యాచష్టే
యేనాసావమృతీభూత్వా మోక్షీ భవతి . తస్మాదవిముక్తమేవ నిషేవేత .
అవిముక్తం న విముంచేత్ . ఏవమేవైష భగవన్నితి వై యాజ్ఞవల్క్యః .. 1..
1.) హరిః ఓం|
ఓం! బృహస్పతి ఉవాచ యజ్ఞవల్క్యమ్ :-
యదను కురుక్షేత్రం,
దేవానాం దేవయజనగ్ం,
సర్వేషాం భూతానాం బ్రహ్మ సదనమ్|
తస్మాత్ యత్ర క్వచ న గచ్ఛేత్
తదేవ మన్యేత ఇతి - ఇదమ్ వై కురుక్షేత్రం।
దేవానాం దేవయజనమ్|
సర్వేషాం భూతానాం బ్రహ్మసదనమ్|
అవిముక్తం వై కురుక్షేత్రం, దేవానాం దేవయజనం,
సర్వేషాం భూతానాం బ్రహ్మసదనమ్|
అత్ర హి జంతోః ప్రాణేషు ఉత్క్రమమాణేషు రుద్రః
’తారకం బ్రహ్మ’ వ్యాచష్టే|
తేన అసావత్ అమృతీభూత్వా
‘మోక్షీ’ భవతి। తస్మాత్ అవిముక్తమేవ నిషేవ
ఏతా అవిముక్తం న విముంచేత్!
ఏవమ్, ఏష ఏవైష భగవన్
ఇతి యాజ్ఞవల్క్యః ॥

ఓంకార - సర్వతత్త్వ స్వరూప - సర్వాంతర్యామియగు శ్రీరామచంద్ర బ్రహ్మమునకు నమస్కరిస్తూ… బృహస్పతి యాజ్ఞవల్క్యునితో ఇట్లు పలుకుచున్నారు.

ఓ యాజ్ఞవల్క్యా! భౌతికంగా కనిపిస్తూ ఉన్నట్టి ఈ శరీరమే (లేక) ఈ దేహమే కురుక్షేత్రము! దేవతలకు దేవాలయ స్థానము. వారు సృష్టి సంబంధమైన యజ్ఞము నిర్వర్తించు యజ్ఞశాల! సర్వ జీవుల బ్రహ్మీ స్థానము (బ్రహ్మము అనుభవమగు స్థానము).

ఈ దేహములో సర్వ దేవతలు నివసిస్తూ ఉండటము, ఆ దేవతలు యజ్ఞ కార్యక్రమములు నిర్వర్తించటమూ అనుక్షణం జరుగుచున్నాయి. జీవుల బ్రాహ్మీతత్వము కూడా ఈ దేహములోనే వేంచేసి ఉండగా దీనిని వదలి ఏదో పొందటానికై ముముక్షువు ఎక్కడికో వెళ్ళి, దేనికోసమో వెదుకవలసిన పనేమున్నదయ్యా? ఈ దేహమునందే తత్త్వసారమంతా ఉన్నది. అందుచే ఈ శరీరము ’కురుక్షేత్రము’గా భావించబజుచున్నది. ఎందుకంటే
దేవతలకు దేవ యజనము, జీవులకు బ్రహ్మసదనము కదా ఈ శరీరమే! ఇందలి చైతన్యాకాశమే ఈ విశ్వసంప్రదర్శనము కూడా! అవిముక్తులకు ఇదే కురుక్షేత్రమై, దేవతలకు కార్యక్రమశాల అయి జీవులకు బ్రహ్మస్థానము అగుచున్నది. యాజ్ఞకులకు యాగశాల కూడా!

అట్టి ఈ కురుక్షేత్రమునందు ఈ జీవుడు ప్రాణములను విడచుచున్నప్పుడు రుద్రభగవానుడు ఈ జీవులకు “తారక బ్రహ్మము” ను ఉపదేశించుచున్నారు. అట్టి తారకబ్రహ్మమును పొందిన జీవుడు మృత్యువును అధిగమించి, అమృత స్వరూపుడగుచున్నాడు. అందుచేత ’అవిముక్తము’ అయినట్టి (బంధము కలిగించగల) కురుక్షేత్రమునే (ఈ దేహమునే) బ్రహ్మీస్థితిని ప్రసాదించునదిగా భావించాలి. దీనిని అల్పవస్తువు అనుకోరాదు - అని భగవానుడగు బృహస్పతి యాజ్ఞవల్క్యునకు బోధించటము జరిగినది.


(నారాయణస్థూలాష్టాక్షరతారకం)

అథ హైనం భారద్వాజః పప్రచ్ఛ యాజ్ఞవల్క్యం కిం తారకం .
కిం తారయతీతి . స హోవాచ యాజ్ఞవల్క్యః . ఓం నమో నారాయణాయేతి
తారకం చిదాత్మకమిత్యుపాసితవ్యం . ఓమిత్యేకాక్షరమాత్మస్వరూపం .
నమ ఇతి ద్వ్యక్షరం ప్రకృతిస్వరూపం . నారాయణాయేతి పంచాక్షరం
పరంబ్రహ్మస్వరూపం . ఇతి య ఏవం వేద . సోఽమృతో భవతి . ఓమితి బ్రహ్మా
భవతి . నకారో విష్ణుర్భవతి . మకారో రుద్రో భవతి . నకార ఈశ్వరో భవతి .
రకారోఽణ్డం విరాడ్ భవతి . యకారః పురుషో భవతి . ణకారో భగవాన్భవతి .
యకారః పరమాత్మా భవతి . ఏతద్వై నారాయణస్యాష్టాక్షరం వేద
పరమపురుషో భవతి .
అయమృగ్వేదః ప్రథమః పాదః .. 1..
2.) అథ హి ఏనం భారద్వాజః పప్రచ్చ యాజ్ఞవల్యం|
కిం తారకం? కిం తారయతి? ఇతి

సహెూవాచ యజ్ఞవల్యః :
“ఓం నమో నారాయణాయ” ఇతి తారకం|
‘చిదాత్మకమ్’ - ఇతి ఉపాసితవ్యమ్|
‘ఓం’ ఇతి (ఏకమ్-అక్షరమ్) ఏకాక్షరమ్|
ఆత్మస్వరూపమ్
”నమ” ఇతి ద్వ్యక్షరమ్ - ప్రకృతి స్వరూపమ్ |
“నారాయణాయ” ఇతి పంచాక్షరమ్,
పరంబ్రహ్మ స్వరూపమ్ |
ఇతి య ఏవం వేద,
సో అమృతో భవతి |

‘ఓం’ ఇతి బ్రహ్మా భవతి।
‘న’ కారో విష్ణుః భవతి।
‘మ’ కారో రుద్రో భవతి|
’న’ కారో ఈశ్వరో భవతి|
’ర’ కారో విరాట్ భవతి।
‘య’ కారః పురోషో భవతి।
‘ణ’ కారో భగవాన్ భవతి।
‘య’ కారః పరమాత్మా భవతి|
ఏతత్ వై నారాయణస్య
అష్టాక్షరమ్ వేద….,
పరమపురుషో భవతి
అయం ఋగ్వేదః ప్రథమ పాదః ॥

మరొక సందర్భములో భారద్వాజుడు గురుమహారాజగు యాజ్ఞవల్క్యులవారిని ఇట్లా ప్రశ్నించారు.
తరింపచేయునది తారకము - అని అంటారు కదా! తారకము ఏదై ఉన్నది? దేనిని అది తరింపజేస్తుంది?

యాజ్ఞవల్క్యులవారు :
‘ఓం నమోనారాయణాయ’ అను అష్టాక్షరీ మంత్రము ‘తారకము’ అను పిలువబడుతోంది. ఈ మంత్రము యొక్క తాత్పర్యము సర్వాంతర్యామి - సర్వతత్త్వ స్వరూపము అగు “చిదాత్మయే" అను అన్వయము - అవగాహనలతో ఉపాసించెదరు గాక! ఇది జీవుని తరింపజేయగలదు.

“ఓం” : ఏకాక్షరము = ఏకము = Unity in the Diversity
అక్షరము : క్షరము కానిది. (That which is absolutely changeless)
ఓం అనగా ఆత్మ స్వరూపమే!
నమ = ప్రకృతి స్వరూపము! ద్వ్యక్షరము - ద్రష్ట + దృశ్యము, ఆలోచించువాడు - ఆలోచన చేయబడునది.
నారాయణాయ = ఇది పంచాక్షరి. పరబ్రహ్మ స్వరూపము. (ద్రష్ట-దృశ్యములకు ఆవల గల పరబ్రహ్మము. ‘దృక్’ స్వరూపము.)
ఇది తెలుసుకొనియుండి ఈ అష్టాక్షరీ మంత్రమును ఎవ్వరు సముపాసిస్తారో, వారు అమృత స్వరూపులగుచున్నారు.

మరికొన్ని సంజ్ఞార్థములు -
ఓం ఇతి : సృష్టికర్తయగు బ్రహ్మ!
న కారో : స్థితికర్తయగు విష్ణువు!
మ కారో : లయకారుడగు రుద్రుడు.
న (నా) కార : అంతటా తానే విస్తరించియున్న ఈశ్వరుడు!
ర (రా) కారో : విరాట్ పురుషుడు. బ్రహ్మాండము! భౌతికంగా కనిపించేదంతా!
య కారః : వ్యష్టి పురుషుడు. జీవుడు.
ణ (ణా) కారో : సర్వమును వెలిగించు, ప్రకాశింపజేయువాడు. భగవంతుడు.
య కారః : సర్వమునకు పరమై, ఆవల ఉన్నదై, సర్వమునకు ఆధారమైయున్న పరమాత్మ! పై తదితరములన్నీ తనయొక్క కళలుగా ప్రదర్శించుచున్నట్టి ‘ఆత్మ’!

అట్టి “ఓం నమో నారాయణాయ” మంత్రమునకు పరమపురుషుడు - సర్వమునకు పరము అయినట్టి శ్రీమన్నారాయణుడే! అష్టాక్షరీ మననముచే జీవుడు పరమపురుషు అగుచున్నాడు.
ఈ అష్టాక్షర మంత్రార్థమునకు పై వర్ణన ఋగ్వేదము “ప్రథమ పాదము” అయి ఉన్నది.


(నారాయణసూక్ష్మాష్టాక్షరతారకం)

ఓంఇత్యేతదక్షరం పరం బ్రహ్మ . తదేవోపాసితవ్యం . ఏతదేవ
సూక్ష్మాష్టాక్షరం భవతి . తదేతదష్టాత్మకోఽష్టధా
భవతి . అకారః ప్రథమాక్షరో భవతి . ఉకారో ద్వితీయాక్షరో భవతి .
మకారస్తృతీయాక్షరో భవతి . బిందుస్తురీయాక్షరో భవతి . నాదః
పంచమాక్షరో భవతి . కలా షష్ఠాక్షరో భవతి . కలాతీతా
సప్తమాక్షరో భవతి . తత్పరశ్చాష్టమాక్షరో భవతి .
తారకత్త్వాత్తారకో భవతి . తదేవ తారకం బ్రహ్మ త్వం విద్ధి .
తదేవోపాసితవ్యం .. 1..
‘ఓం’ ఇతి ఏతత్ అక్షరం పరంబ్రహ్మ!
తదేవ ఉపాసితవ్యమ్|
ఏతత్ ఏవ సూక్ష్మ - అష్టాక్షరమ్ భవతి।
తత్ ఏతత్ అష్టాత్మకో అష్టధా భవతి।
‘అ’ కారః ప్రథమాక్షరో భవతి|
‘ఉ’ కారో ద్వితీయాక్షరో భవతి।
‘మ’ కారః తృతీయాక్షరో భవతి।
‘బిందుః’ (చ)తురీయాక్షరో భవతి।
‘నాదః’ పంచమాక్షరో భవతి।
‘కలా’ షష్టాక్షరో భవతి!
‘కలాతీతా’ సప్తమాక్షరో భవతి।
‘తత్పరశ్చ’ అష్టమాక్షరో భవతి।
తారకత్వాత్ తారకో భవతి।
తత్ ఏవ తారకం బ్రహ్మ, త్వం విద్ధి।
తదేవ ఉపాసితవ్యం।
అత్ర ఏతే శ్లోకా భవంతి।

ఓం - తత్ స్వరూపమగు అక్షరపరబ్రహ్మము.
‘ఓం’ అని ఉచ్ఛరిస్తున్నప్పుడు అక్షర పరబ్రహ్మమునే ఉద్దేశ్యించుచూ ఉపాసించాలి.
‘ఓం’ అనునది సూక్ష్మ - అష్టాక్షర తత్త్వముగా అగుచున్నది.
సూక్ష్మాక్షరము క్షరమును కల్పించుకొంటూ, త్యజించుచున్నట్టిది. తాను మాత్రము క్షరము కానట్టిది.

అఖండము-ఏకము అగు ‘ఓం’ - అష్టాత్మలు (8 విభాగములు)గా ప్రదర్శితమగుచున్నది.
’అ’కారము → మొదటి అక్షరము
’ఉ’కారము → ద్వితీయ అక్షరము
‘మ’ కారము → తృతీయాక్షరము
బిందుః → తురీయాక్షరము
నాదము → పంచమ
కలా → 6వ అక్షరము
కలాతీతము → 7వ అక్షరము
తత్పరుడు → 8వ అక్షరము.
ఓం నమోనారాయణాయ అను ఈ అష్టాక్షరి దృశ్యపరిమితత్వము నుండి తరింపజేయును కాబట్టి తారకము.
ఈ అష్టాక్షరియే తారక బ్రహ్మము! పరబ్రహ్మార్థము! అష్టాక్షరిచే ఉపాసించబడుచున్నది బ్రహ్మమే.

ఎందుకు ఉపాసించాలి? “ఆ తారక బ్రహ్మమే నేను-నీవు కూడా!” అనే బుద్ధి సునిశ్చిత కొరకు (సోఽహమ్! తత్ త్వమ్!).
ఈవిధంగా (ఋక్-యజుర్వేదాదులచే) గానము చేయబడుచున్నది.


(ప్రణవావయవదేవతాః)

అత్రైతే శ్లోకా భవంతి ..

అకారాదభవద్బ్రహ్మా జాంబవానితిసంజ్ఞకః .
ఉకారాక్షరసంభూత ఉపేంద్రో హరినాయకః .. 1..

మకారాక్షరసంభూతః శివస్తు హనుమాన్స్మృతః .
బిందురీశ్వరసంజ్ఞస్తు శత్రుఘ్నశ్చక్రరాట్ స్వయం .. 2..

నాదో మహాప్రభుర్జ్ఞేయో భరతః శంఖనామకః .
కలాయాః పురుషః సాక్షాల్లక్ష్మణో ధరణీధరః .. 3..

కలాతీతా భగవతీ స్వయం సీతేతి సంజ్ఞితా .
తత్పరః పరమాత్మా చ శ్రీరామః పురుషోత్తమః .. 4..

‘అ’ కారత్ అభవత్ బ్రహ్మా
‘జాంబవాన్’ ఇతి సంజ్ఞకః
‘ఉ’ కార అక్షర సంభూత
‘ఉపేంద్రో’ హరినాయకః|
‘మ’ కార అక్షర సమ్భూతః
‘శివస్తు హనుమాన్’ స్మృతః
‘బిందుః’ ఈశ్వర సంజ్ఞస్తు
శత్రుఘ్నః చక్రరాట్ స్వయం|
‘నాదో’ మహాప్రభుః జ్ఞేయో
భరతః ‘శంఖ’ నామకః।
కలాయాః పురుషః సాక్షాత్
లక్ష్మణో ధరణీ ధరః।
కలాతీతా భగవతీ,
స్వయం సీతేతి సంజ్ఞితా।
తత్పరః పరమాత్మా చ
శ్రీరామః పురుషోత్తమః ॥

వివిధ సంజ్ఞలు :-

‘అ’కారము నుండి అక్షర సంభూతుడు: అభవుడు (జన్మరహితుడు) అగు సృష్టికర్త బ్రహ్మదేవుని స్థానము క్రియారూపమగు సృష్టి రూపుడుగా దిద్దుకున్నవాడై “జాంబవాన్ - - జ + అంబవాన్ … జన్మ -అనుభవ కర్తగా” ప్రసిద్ధి పొందుచున్నారు. జాంబవంతుడు అందుకు సంజ్ఞ!

‘ఉ’ కారాక్షరమునుండి హరి జగత్తుకు నాయకుడు-పరిపోషకుడు అయి……‘ఉపేంద్రుడు’ గా ప్రసిద్ధి పొందుచున్నారు. ఉప = సామీప్యుడు, పరిపోషకుడు, ఆధారుడు. హరి (కోతుల) నాయకుడు - సుగ్రీవుడు - సంజ్ఞ!

‘మ’కార అక్షరము నుండి “శివుడు - హనుమంతుడు” శివాంశ అయిన హనుమ ’మ’కారమునకు సంజ్ఞ!
బిందు → ఈశ్వరునికి సంజ్ఞ. అంతటా అన్నీగా విస్తరించియున్నట్టి తత్త్వము సర్వ జీవులలోని ‘అహమ్’ స్వరూపుడు - శివుడే హనుమంతుడై ‘అహమ్’ స్వరూపముగా అన్ని దేహములలో వెలుగొందుచున్నది.

శత్రుఘ్నుడు స్వయముగా శ్రీచక్ర స్వరూపము - బిందువుకు సంజ్ఞ!
(జడ-చేతనములను ఒకచోటికి జేర్చు చైతన్యము)

నాదము స్వయముగా మహా ప్రభువు అని గ్రహించబడుగాక! నాదము, పిలుపు శ్రీరామచంద్రుడే ‘నాద’ స్వరూపుడై భరతుడుగా నమస్కరించబడుచున్నారు.

కలా (కాలబద్ధమైనది) (దృశ్యతత్త్వము). సాక్షాత్తు పురుషుడే! (Experiencing) (కల్పనా పురుషుడు). అనుభవములన్నీ తనవైన జీవుడు.

ఈ భూమిని ధారణ చేయువాడు ధరణీధరుడు → లక్ష్మణుడు. (లక్ష్యధారణా రూప -ఇతి లక్ష్మణః (ఆదిశేషుడుగా భూమిని నిలబెట్టు చైతన్యము) అని రామచైతన్యమే సంజ్ఞ!

దృశ్య తత్త్వమునకు ఆవల కలాతీతమైనది స్వయముగా సీతాదేవియే సంజ్ఞత అయి ఉన్నది. (ప్రకృతికి-మాయకు అధినేత తత్త్వము. మూల ప్రకృతి రూపము).

ద్రష్ట - దర్శనము - దృశ్యములకు ఆవల (పరమ్)… తత్పరమై, కేవలసాక్షి అయినట్టిదానికి, పురుషోత్తమునకు సంజ్ఞ. సాక్షాత్ శ్రీరామచంద్రుడు. (సర్వము తనయందు కలిగియుండి, సంపూర్ణుడై యున్నవాడు). (’నేను’కు ఆవల గల నిర్విషయము, సర్వము అయిన నేను)!


(శ్రీరామస్య సర్వాత్మకత్వం)

ఓమిత్యేతదక్షరమిదం సర్వం . తస్యోపవ్యాఖ్యానం భూతం
భవ్యం భవిష్యద్యచ్చాన్యత్తత్త్వమంత్రవర్ణదేవతాఛందో
ఋక్కలాశక్తిసృష్ట్యాత్మకమితి . య ఏవం వేద .
యజుర్వేదో ద్వితీయః పాదః .. 2..
3.) ‘ఓం’ ఇతి ఏతత్ అక్షరమ్ ఇదమ్ సర్వమ్ |
తస్య ఉపాఖ్యానమ్।
భూతం భవ్యం భవిష్యం, యత్ చ అన్యత్
తత్త్వ మంత్ర వర్ణ దేవతాః, ఛందః
ఋక్ కలా శక్తి
సృష్ట్యాత్మకమ్ ఇతి
య ఏవం వేద
యజుర్వేదో ద్వితీయ పాదః॥

ఈ ఎదురుగా కనిపిస్తున్న విశ్వము, దీనికి ఆవల ఈవల ద్రష్టదర్శన-దృశ్యములతో సహా ఇదంతా కూడా ఓంకార స్వరూపమే! అందుకు
ఉపాఖ్యానంగా ఇప్పుడు కొన్ని విశేషాలు చెప్పుకొనుచున్నాము.
ఏదైతే ఇతఃపూర్వము ఉన్నదో, ఇప్పుడున్నదో, ఇకముందు ఉండబోవుచున్నదో - (అనగా) భూత వర్తమాన - భవిష్యతులలో ఉన్నదంతా అఖండము - ఏకము అగు ఓంకారమే. త్రికాలములకు సంబంధించనిదేదైనా అన్యంగా ఉంటే, అదీ ఓంకార స్వరూపమే!
అట్లాగే మంత్రములచే వర్ణింపబడు వివిధ దేవతా తత్యాలు, ఛందస్సు, ఋక్కులు, కలా (కల్పనా) శక్తి తత్త్వము, … ఈ తెలియబడేది అంతా కూడా ఓంకార స్వరూపమే! అంతా కూడా ఓంకారమునకు ఉపాఖ్యానమే!
ఈవిధంగా చేయబడుచున్న యజుర్వేద గానము తారక ద్వితీయ పాదము.


(జాంబవదాద్యష్టతనుమంత్రాః)

అథ హైనం భారద్వాజో యాజ్ఞవల్క్యమువాచాథ కైర్మంత్రైః
పరమాత్మా ప్రీతో భవతి స్వాత్మానం దర్శయతి తన్నో బ్రూహి
భగవ ఇతి .

స హోవాచ యాజ్ఞవల్క్యః .

ఓం యో హ వై శ్రీపరమాత్మా నారాయణః స భగవానకారవాచ్యో
జాంబవాన్భూర్భువః సువస్తస్మై వై నమోనమః .. 1..

ఓం యో హ వై శ్రీపరమాత్మా నారాయణః స భగవానుకారవాచ్య
ఉపేంద్రస్వరూపో హరినాయకో భూర్భువః సువస్తస్మై వై నమోనమః .. 2..

ఓం యో హ వై శ్రీపరమాత్మా నారాయణః స భగవాన్మకారవాచ్యః
శివస్వరూపో హనూమాన్భూర్భువః సువస్తస్మై వై నమోనమః .. 3..

అథ హి ఏనం భారద్వాజో యాజ్ఞవల్క్యమ్ ఉవాచ :
అథ కైః మత్రైః పరమాత్మా ప్రీతో భవతి?
స్వాత్మానం దర్శయతి?
తాన్నో బ్రూహి భగవన్। ఇతి।

సహెూవాచ యాజ్ఞవల్యః
(అష్టవిధ మంత్రము)

ఓం యో హ వై శ్రీ పరమాత్మా
నారాయణః, స భగవాన్
‘అ’ కారో వాచ్యో జాంబవాన్।
భూర్భువస్స్వః తస్మై వై నమో నమః|| (1)

ఓం యో హ వై శ్రీ పరమాత్మా నారాయణః స భగవాన్
‘ఉ’కార వాచ్య ఉపేంద్ర స్వరూపో, హరి నాయకో
‘భూర్భువస్స్వః’ తస్మై వై నమో నమః|| (2)

ఓం యో హ వై శ్రీ పరమాత్మా నారాయణః స భగవాన్
‘మ’కార వాచ్య శివ స్వరూపో హనుమాన్
‘భూర్భువస్స్వః’ తస్మై వై నమో నమః|| (3)

అప్పుడు భారద్వాజుడు యాజ్ఞవల్క్య మహర్షిని ఇట్లు ప్రశ్నించారు. ఏ మంత్రముచే పరమాత్మ ప్రీతి పొందగలరు? ప్రీతి పొంది స్వాత్మస్వరూప
దర్శనమును ప్రసాదించగలరు? హే భగవన్! యాజ్ఞవల్క్య మహనీయా! ఈ విషయం దయచేసి వివరించండి.

శ్రీ యాజ్ఞవల్క్య మహర్షి :
అష్టవిధ మంత్రము

1.) ఓంకార స్వరూపుడగు నారాయణుడే శ్రీకరుడు - శుభకరుడు అగు పరమాత్మ! సర్వమును ప్రకాశమానము చేయుటచే భగవంతుడు. ’అ’కారముచే
చెప్పబడుచున్నవాడు. జన్మల కంటే మునుముందే ఉండి (జన్మలు అనే కర్తృత్వమును మహిమగా కలిగి ఉండి), జన్మలు తనవిగా కలవాడై ఉన్నవారు. ఒక కార్యక్రమము నిర్వర్తించువాడు ఆ నిర్వహణకు మునుముందే ఉండి ఉండాలి కదా! ఆ మునుముందుగా ఉన్నవాడు నారాయణుడు. ఆయన వాస్తవానికి నిష్క్రియుడు. అయితే యిదంతా నవలా రచనలాగే, ఆయన కల్పనా విశేషమే! భూ-భువర్-సువర్లోక స్వరూపుడగు నారాయణునికి నమస్కరిస్తున్నాను. ఆ ‘అ’కారవాచ్య జాంబవంతునికి నమస్కరిస్తూ ఉపాసిస్తున్నాను.

2.) ఓంకార స్వరూపుడగు ఆ నారాయణ భగవానుడే శ్రీకరుడై ‘ఉ’కారముచే చెప్పబడుచున్నాడు. ఉపేంద్ర స్వరూపుడై, ఈ భూ-భువర్-సువర్ లోకములుగా, లోకపాలకులుగా, సర్వ జీవులుగా విస్తరించి, అధీశ్వరుడై, నాయకుడై ఉన్న ఆ పరమాత్మకు నమస్కరించుచున్నాము. ’ఉ’కార వాచ్య సుగ్రీవునికి నమస్కారము.

3.) ఓంకార స్వరూపుడగు పరమాత్మ శ్రీ శుభకరుడై ’మ’కారముచే పిలువబడుచున్నారు. సర్వశుభములు ఆయన నుండె వెలువడుతున్నాయి. శివ తత్త్వ స్వరూప హనుమాన్ భూ-భువర్-సువర్ లోక స్వరూపుడై వెలుగొందుచున్నారు. అట్టి శ్రీమన్- సర్వ శుభంకర నారాయణునికి నమస్కరించుచున్నాము. ‘మ’కార వాచ్య హనుమానకు నమస్కరిస్తున్నాను.


ఓం యో హ వై శ్రీపరమాత్మా నారాయణః స భగవాన్బిందుస్వరూపః
శత్రుఘ్నో భూర్భువః సువస్తస్మై వై నమోనమః .. 4..

ఓం యో హ వై శ్రీపరమాత్మా నారాయణః స భగవాన్నాదస్వరూపో
భరతో భూర్భువః సువస్తస్మై వై నమోనమః .. 5..

ఓం యో హ వై శ్రీపరమాత్మా నారాయణః స భగవాన్కలాస్వరూపో
లక్ష్మణో భూర్భువః సువస్తస్మై వై నమోనమః .. 6..

ఓం యో హ వై శ్రీ పరమాత్మా నారాయణః స భగవాన్
బిందుస్వరూప శతృఘ్న,
‘భూర్భువస్స్వః’ తస్మై వై నమో నమః| (4)

ఓం యో హ వై శ్రీ పరమాత్మా నారాయణః స భగవాన్
నాదస్వరూపో భరతో,
‘భూర్భువస్స్వః’ తస్మై వై నమో నమః|| (5)

ఓం యో హవై శ్రీ పరమాత్మా నారాయణః స భగవాన్
కలా స్వరూపో లక్ష్మణో
‘భూర్భువస్స్వుః’ తస్మై వై నమో నమః || (6)

4.) ఏ పరమాత్మ శ్రీకరుడు ఓంకారస్వరూపుడో, శ్రీమన్నారాయణుడో, బిందు స్వరూప శతృఘ్నుడో, భూ-భువర్-సువర్ త్రిలోక స్వరూపముగా ప్రదర్శితమగుచున్నారో, అట్టి సర్వము ప్రకాశింపజేయు భగవానునికి నమస్కరించుచున్నాము. ఈ లోకములన్నీ తన గర్భమున ధరించు బిందుస్వరూపులు! ‘బిందు’ వాచ్య శత్రుఘ్నులవారికి నమస్కారము.

5.) ఆ శ్రీమన్నారాయణుడే ఓంకార ప్రణవ స్వరూపుడు, శ్రీకరుడు - శుభకరుడు అయి వెలుగొందుచున్నారు. భగవానుడగు ఆ శ్రీమన్నారాయణుడే నాదస్వరూపుడై భరతుడుగా స్తుతించబడుచూ, భూ-భువర్-సువర్ త్రైలోక్య వ్యాపకులై ఉన్నారు. అట్టి శ్రీమన్నారాయణునికి నమస్కరించుచున్నాము. ‘నాద’ వాచ్య భరతుల వారికి నమస్కారము.

6.) ఆ ప్రణవ ‘ఓం’ కార స్వరూపమే శ్రీకరుడగు పరమాత్మ శ్రీమన్నారాయణుడు. ఆ భగవానుని కలా స్వరూపమే లక్ష్మణ స్వామి! జగత్ కల్పన అంతా కర్తృత్వ - భోక్తృత్వాలతో సహా - ఆయనయే! ఏ ఓంకార పరమాత్మయగు శ్రీమన్నారయణుడు తన కలా స్వరూపముచే లక్ష్మణ స్వామియై, భూ-భువర్-సువర్ లోక స్వరూపముగా ప్రకాశమానుడగుచున్నారో అట్టి శ్రీమన్నారాయణునికి నమస్కరించుచున్నాము.


ఓం యో హ వై శ్రీపరమాత్మా నారాయణః స భగవాన్కలాతీతా
భగవతీ సీతా చిత్స్వరూపా భూర్భువః సువస్తస్మై వై నమోనమః .. 7..

యథా ప్రథమమంత్రోక్తావాద్యంతౌ తథా సర్వమంత్రేషు ద్రష్టవ్యం .
ఉకారవాచ్య ఉపేంద్రస్వరూపో హరినాయకః 2 మకారవాచ్యః
శివస్వరూపో హనుమాన్ 3 బిందుస్వరూపః శత్రుఘ్నః 4 నాదస్వరూపో
భరతః 5 కలాస్వరూపో లక్ష్మణః 6 కలాతీతా భగవతీ సీతా
చిత్స్వరూపా 7 ఓం యో హ వై శ్రీపరమాత్మా నారాయణః స భగవాంస్తత్పరః
పరమపురుషః పురాణపురుషోత్తమో నిత్యశుద్ధబుద్ధముక్తసత్య-
పరమానంతాద్వయపరిపూర్ణః పరమాత్మా బ్రహ్మైవాహం రామోఽస్మి
భూర్భువః సువస్తస్మై నమోనమః .. 8..

4.) ఓం యో హ వై శ్రీ పరమాత్మా నారాయణః స భగవాన్
కలాతీతా భగవతీ సీతా చిత్ స్వరూపా
‘భూర్భువస్స్వుః’ తస్మై వై నమో నమః || (7)

ఓం యో హ వై శ్రీ పరమాత్మా నారాయణః స భగవాన్
తత్ పరఃః పరమ పురుషః పురాణ పురుషోత్తమో।
నిత్య శుద్ధ బుద్ధ ముక్త సత్యపరమానంద అనంత అద్వయ
పరిపూర్ణః బ్రహ్మైవాహమ్ రామోస్మి
‘భూర్భువస్సువః’ తస్మై వై నమో నమః || (8)

7.) ఓం-ప్రణవ స్వరూప పరమాత్మయే శ్రీమన్నారాయణుడు. ఆ భగవానుని కలాతీత - భగవతి (కల్పనకు ఆవల సర్వమును వెలగించుచున్నదై) చితశక్తి స్వరూపమే సీతాదేవి. దేవి చిత్ స్వరూపిణి అయి భూ-భువర్-సువర్ లోకములుగా ద్యోతక మగుచున్నది. అట్టి ప్రమేయ శ్రీమన్నారాయణ స్వరూప మూల ప్రకృతి స్వరూపిణీ మాతయగు సీతా దేవికి నమస్కరించుచున్నాము. కలాతీతా వాచ్య ’సీతామాత’కు నమస్కారము.

8.) ఓంకార స్వరూపుడు, శ్రీకరుడు అగు పరమాత్మయే శ్రీమన్నారాయణుడు. అట్టి నారాయణస్వామి సర్వమునకు ఆవల ఉన్నట్టి తత్పరుడు! సర్వ జీవుల స్వరూపుడై వెలుగొందు పరమ పురుషుడు! త్రికాలములకంటే మునుముందే ఉండి, సర్వ జీవులలో ‘ఉత్తమ పురుషగా’ వెలుగొందు పురాణపురుషోత్తముడు. నిత్యుడు. శుద్ధుడు - నిర్మలుడు! కేవల బుద్ధ స్వరూపుడు. నిత్యముక్తుడు సత్యము! పరమానందుడు! తనకు వేరైనదేదీ లేనివాడు! స్వతఃగానే పరిపూర్ణుడు.
అట్టి పరాత్పరుడగు శ్రీ రామచంద్రమూర్తికి నమస్కరిస్తున్నాను.
అట్టి శ్రీరామచంద్ర పరబ్రహ్మమే ఈ సర్వము! ఆ పరబ్రహ్మమే నేను!
భూ-భువర్-సువర్ లోకములుగా ప్రకాశించు అద్వయ శ్రీరామ తత్త్వమే నేను!
నేనే ఇదంతా! (ఈ సర్వముగా మూర్తీభవించినవారు, జగత్తుగా రమించువారు అగు శ్రీరామచంద్రునికి నేను వేరు కాదు. వేరు - అనే అహంకారం త్యజిస్తున్నాను).


(విద్యాపఠనమంత్రార్థజ్ఞానయోః ఫలం)

ఏతదష్టవిధమంత్రం యోఽధీతే సోఽగ్నిపూతో భవతి . స వాయుపూతో
భవతి . స ఆదిత్యపూతో భవతి . స స్థాణుపూతో భవతి . స సర్వైర్దేవైర్జ్ఞాతో
భవతి . తేనేతిహాసపురాణానం రుద్రాణాం శతసహస్రాణి జప్తాని ఫలాని
భవంతి . శ్రీమన్నారాయణాష్టాక్షరానుస్మరణేన గాయత్ర్యాః
శతసహస్రం జప్తం భవతి . ప్రణవానామయుతం జప్తం భవతి .
దశపూర్వాందశోత్తరాన్పునాతి . నారాయణపదమవాప్నోతి య ఏవం వేద .
తద్విష్ణోః పరమం పదం సదా పశ్యంతి సూరయః . దివీవ చక్షురాతతం .
తద్విప్రాసో విపన్యవో జాగృవాంసః సమింధతే . విష్ణోర్యత్పరమం పదం ..

ఇత్యుపనిషత్ ..

ఏతత్ అష్టవిధ మంత్రమ్ యో అధీతే…,
సో అగ్ని పూతో భవతి|
స వాయు పూతో భవతి।
స ఆదిత్య పూతో భవతి।
స స్థాణు పూతో భవతి |
స సర్వైః దేవైః జ్ఞాతో భవతి।
తేన ఇతిహాస పురాణానాం
రుద్రాణాం శతసహస్రాణి
జప్తాని ఫలాని భవంతి।
శ్రీమన్నారాయణ అష్టాక్షర
అనుస్మరణేన గాయత్ర్యా
శతసహస్రం జప్తం భవతి।
ప్రణవా నామయుతం జప్తం భవతి
దశపూర్వాన్ దశోత్తరాన్ పునాతి।
‘నారాయణపదమ్’ అవాప్నోతి।
య ఏవం వేద, తత్ విష్ణోః పరమం పదగ్ం
సదా పశ్యంతి సూరయః।
దివీవ చక్షుః ఆతతమ్|
తత్ విప్రా సో విపన్యవో
జాగ్రవాగ్ం సః సమింధతే॥
విష్ణోః యత్ పరమం పదమ్|
సామవేద తృతీయ పాదః ॥

ఈ తత్ బ్రహ్మతత్త్వ వర్ణితమగు “అష్టవిధ మంత్రము”ను ఎవ్వరు ఉపాసిస్తారో, సేవిస్తారో, నిర్వర్తిస్తారో… వారు అగ్ని-వాయు-ఆదిత్య పవిత్ర స్వరూపులుగా అగుచున్నారు.
స్థాణువు (నిశ్చలులు) అయి సర్వ చాంచల్యములను జయించివేస్తున్నారు. సర్వ దేవతల తత్త్వ స్వరూపమేమిటో ఎరుగుచున్న వారగుచున్నారు.
ఈ అష్టవిధ మంత్ర జపముచే జీవుడు ఇతి హాస - పురాణములు పఠించిన ఫలమును, రుద్రమును లక్షసార్లు పారాయణము చేసిన ఉత్తమోత్తమ ఫలమును పొందుచున్నాడు.
“ఓం నమో నారాయణాయ” అను శ్రీమన్నారాయణ అష్టాక్షరీ మంత్రమును నిత్యము జపిస్తూ - స్మరించువాడు లక్ష గాయత్రీ జప ఫలమును పొందగలడు.
ప్రణవమును అనుక్షణము ఉచ్ఛరించిన జప ప్రయోజనము పొందగలడు. ఆతనికి వెనుక పదితరములవారు, ముందు పది తరముల వారు పవిత్రత సంతరించుకొనుచున్నారు.
విద్వాంసుడగు సూరుడు - సర్వే సర్వత్రా సర్వదా ఆ విష్ణు పరమ పదమునే, విష్ణుతత్త్వమునే చూస్తూ ఆస్వాదిస్తూ ఆనందిస్తున్నారు. "విశ్వమంతా విష్ణువే” అను ప్రశాంతత సంతరించుకుంటున్నాడు.
ఆ శ్రీమన్నారాయణ తత్త్వమే (శ్రీ సీతా లక్ష్మణ భరత శతృఘ్ను - హనుమత్ సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మ తత్త్వమే) ఆకాశమంతటా విస్తరించినదై ఉన్నది.
జాగరూకులగు వేదవిదులైన విప్రులు ఆత్మానారాయణ - శ్రీరామచంద్ర పరబ్రహ్మమునే సర్వదా పొంది, బ్రహ్మానంద సంతుష్టులగుచున్నారు. అదియే విష్ణు పరమపదము! విష్ణు సాయుజ్యము.
ఇది సామవేద గాన రూపమగు శ్రీమన్నారాయణ తృతీయ పాదము.

ఇతి తారసారోపనిషత్ ।
ఓం శాంతిః శాంతిః శాంతిః ॥


శుక్ల యజుర్వేదాంతర్గత

5     తారసార ఉపనిషత్

అధ్యయన పుష్పము


ఓంకార స్వరూపుడు, ప్రణవ స్వరూపుడు, సర్వతత్త్వ స్వరూపుడు, సోఽహమ్ స్వరూపుడు అగు శ్రీరామచంద్ర పరబ్రహ్మమునకు నమస్కరిస్తూ….

ఒకానొకప్పుడు వేద-వేదాంగ-పురాణ-ఇతిహాసకోవిదుడు, మహా తపశ్శాలి అగు యాజ్ఞవల్క్యుడు దేవతల గురువు, తత్త్వార్థకోవిదుడు, సర్వజన శ్రేయోభిలాషి, మహాప్రాజ్ఞుడు, పరమోదార స్వభావుడు,… “గురువరేణ్యులు” అగు శ్రీ బృహస్పతిని సమీపించారు.

ప్రదక్షణ పూర్వక సాష్టాంగదండ ప్రణామములు సమర్పించిన తరువాత యాజ్ఞవల్క్య మహర్షి, సద్గురువగు బృహస్పతితో ఆధ్యాత్మక విషయాలు సంభాషించసాగారు. “కురుక్షేత్రము” సంబంధించి సత్సంగ - ఆత్మజ్ఞానాభిలాష పూర్వక విశేషాలు చెప్పుకోసాగారు.


యాజ్ఞవల్క్యుడు : గురుదేవా! లోకకళ్యాణమూర్తీ! బృహత్ మేధావీ! దేవగురూ! బృహస్పతి భగవన్!

“కురుక్షేత్రము” అను యోగ-తత్త్వవిద్యా ప్రతిపాదితమగు పవిత్రస్థానము ఉన్నదెక్కడ? అద్దానిని ఏ సాధనచే చేరగలము? ఆశయములేమిటి? మార్గమేమిటి? ప్రయోజనమేమిటి?

ఈఈ సంబంధించిన విశేషాలు నాకు బోధించవలసినదిగా మిమ్ములను అభ్యర్థిస్తున్నాను.

జగద్గురువు బృహస్పతి : ఓ యాజ్ఞవల్యా! ఈ దేహమే కురుక్షేత్రమయ్యా! (దేహమ్ దేవాలయమ్ ప్రోక్తః). పంచమహాభూతాని, అహంకారో, బుద్ధిః, అవ్యక్తమ్, పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, ఇంద్రియములకు గోచరించే సమాచార విశేషాలు, ఇచ్ఛ, ద్వేషము, సుఖ-దుఃఖ భావాలు, విషయములతో ఏర్పడే వివిధ రీతులైన సంఘాతములు (Associated Experiences), కదలించే తత్త్వము, కదలునవి, ధృతి-ఉత్సాహాలు, ఊహ-అపోహలు - ఇవన్నీ క్షేత్రములోని విశేషాలు.

అట్టి క్షేత్రము అనబడే ఈ దేహము దేవతల దేవయజ్ఞములకు యజ్ఞశాల. దేవతలు వారి విద్యుక్త ధర్మముయొక్క ప్రదర్శనమునకు వేంచేసియున్న గృహము. అంతేకాదు. ‘బ్రహ్మీతత్త్వము’ కూడా ఇక్కడి “క్షేత్రము”లో సర్వదా వేంచేసి, దిక్కులన్నీ ప్రకాశింపజేయునదై ఉన్నది. 
ఈవిధంగా,…..

యదను “కురుక్షేత్రం”,… దేవానాం దేవయజనగ్ం, సర్వేషాం భూతానాం బ్రహ్మ సదనమ్|
తస్మాత్ యత్ర క్వచ న గచ్ఛేత్!…

ఈ శరీరమే దివ్యశక్తి సమన్వితులగు దేవతల కార్యక్రమ - ప్రదర్శనములు, సర్వ స్వరూపమగు బ్రహ్మతత్త్వమునకు బ్రహ్మసదనము అయి ఉన్నది. ఇక దీనిని వదలి మరింకెక్కడికో, దేనికోసమో, మోక్షము కొరకై వెళ్ళి వెతకవలసినది ఏమున్నదయ్యా? దేహములో సర్వ తత్త్వములు వేంచేసి, జ్ఞానికి ఆత్మతత్త్వదర్శనమునకు ఉపయుక్తమై, సంసారబంధ విముక్తిని ప్రసాదించగల పవిత్ర తీర్థస్థానము కూడా! అందుచే, “ఇది అవిముక్త క్షేత్రము. బద్ధుడగు జీవుడు తన బంధ విముక్తి కొరకై ఆశ్రయించుచున్న పవిత్ర ప్రదేశము. జన్మయొక్క ఉద్దేశ్యము బంధవిముక్తియే” - అని గమనించాలి.

ఇక్కడ మరొక ముఖ్య విషయం కూడా!
అత్ర హి జంతోః ప్రాణేషు ఉత్రమమాణేషు రుద్రః తారకమ్ బ్రహ్మ వాచష్టే!
ఈ జీవుడు దేహములో ప్రాణములు విడుచుచున్నప్పుడు రుద్రభగవానుడు తారకబ్రహ్మతత్త్వమును ఉపదేశించుచున్నారు. (సర్వమ్ వ్యర్ధమ్ మరణ సమయే సాంబయేవః సహాయః - అని అందుకే అంటారు). తద్వారా ఈ తారకబ్రహ్మమును ఎరుగగలడు సుమా! అట్టి సమయములో ఈ జీవుడు దృశ్య ధ్యాసలను జయించినవాడై ఉంటే, రుద్రతారకమును తప్పక పొందగలడు.


అందుచేత విజ్ఞులగు యోగులు, వేదవిహితులు, తత్త్వజ్ఞులు (“దేహమ్ దేవాలయమ్ ప్రోక్తమ్”… అనువాక్యముల ద్వారా) ఈ దేహము మహదత్వముతో కూడిన "కురుక్షేత్ర పుణ్యస్థలము, తరింపజేయు పరమార్థమును సిద్ధింపజేయగల ఆశ్రమము, తీర్థస్థలము పుణ్యక్షేత్రము కూడా అని ఎలుగెత్తి గుర్తు చేస్తున్నారయ్యా!


తేన అసావత్ అమృతీభూత్వా ‘మోక్షీ’ భవతి। 

ఆవిధంగా రుద్రదేవునిచే (ఇష్టదైవము నుండి) అమృతరూపమగు ‘తారకము’ను పొందిన ఈ జీవుడు మోక్షము పొందగలడు. అందుచేత అవిముక్తము (బంధముతో కూడిన / కలిగించగల) కురుక్షేత్రమనబడు ఈ దేహమును, 
 “ఓ దేహమా! నీవు నాకు బాహ్మీస్థితిని కలిగించగలవు కదా!” అని భావించాలి. ఇద్దానిని అల్పవస్తువుగా చూస్తూ, ఇంద్రియ విషయములకు మాత్రమే సమర్పించి ఉండరాదు. ఇది జీవులచే సర్వదా గమనించబడు గాక!

ఈ విధముగా భగవానుడగు బృహస్పతి తనకు శిష్యుడై ఆశ్రయించిన యాజ్ఞవల్క్యునికి తారకమంత్రము - తారక బ్రహ్మముల గురించి, కురుక్షేత్రమగు ఈ దేహముయొక్క ఉపకరణత్వము గురించి అనేక విషయాలు బోధించారు. 


ఆ తీరుగా బృహస్పతి - యాజ్ఞవల్క్య గురు - శిష్య సమాగమము తరువాత చాలా రోజులు గడిచాయి. మరొక ఒకానొక సందర్భములో గురువగు యాజ్ఞవల్క్య మహాశయుని సందర్శనార్థమై భారధ్వాజ మునీశ్వరుడు యాజ్ఞవల్మ్యాశ్రమమును సందర్శించారు. నమస్కరించి, ఈ విధంగా పరిప్రశ్నించారు.

భారద్వాజ మునీంద్రుడు : హే మహాత్మా! యాజ్ఞవల్యా! ‘తారకము’ గురించి వివరించ ప్రార్థన! తారయతి-ఇతి తారకమ్ అంటారు కదా! తరింపజేయునదేది? తరింపజేయబడునది ఏది? తారకమును ఏ ఉపాసనచే మేము ఆశ్రయించాలి?… ఈ ఈ విషయాలు వివరించ వేడుచున్నాను.

యాజ్ఞవల్క్యుడు :  “ఓం నమో నారాయణాయ" ఈ అష్టాక్షరీ మంత్రము జీవుని సంసారమునుండి తరింపజేస్తుంది. కాబట్టి ‘తారకము’ అని స్తోత్రము చేయబడుచున్నది. ఈ మంత్రముచే ఉపాసించబడునది ‘చిదాత్మతత్త్వమే’! ఈ అష్టాక్షరీ మంత్ర తాత్పర్యము కేవలమగు స్వస్వరూపమే!… అను అవగాహనతో అనుసంధానము చేయు వాడు సంసార బంధము నుండి సముద్ధరించబడగలడు. అష్టాక్షరీ యొక్క అంతరార్థమును భావించి, మంత్రమును ఉపాసించాలి. అది వివరించుకుందాము! 




“ఓం”


“ఓం” సత్ (ఉనికి) - చిత్ (ఎరుక) - ఆనంద (అనుభూతి) స్వరూపము. ఏకము - అక్షరము అగు పరమాత్మ.

ఈ ద్రష్ట- దర్శనము - దృశ్యము - బ్రహ్మాండము ఎద్దానిలో కల్పనచే స్థానము కలిగియున్నాయో… అయ్యదియే ఆత్మకు సంజ్ఞయగు ‘ఓం’!

(దృష్టాంతంగా - ఒకడు కల కంటూ ఉన్న సందర్భములో, కల తనదైనవాడు; కథకు కథారచయిత వంటివాడు.)

ఏకమ్ …. ‘అనేకము’గా అనేక జీవులు - ద్రష్టలు మొదలైనవిగా కనిపిస్తూ, ఇదంతా కూడా సర్వదా ఏకమే అయి ఉన్నది! అట్టి అఖండాత్మను ఉద్దేశ్యించునదే ఓం! 
అక్షరమ్ …. జన్మలచే కర్మలచే - ఉపాధులచే - దృశ్యపరంపరలచే - ఎదగటముగాని తరగటము గాని లేనట్టిది. మార్పు చెందనిది.

దృష్టాంతానికి, అనేక ఆభరణములుగా అగుచూ కూడా బంగారము మార్పు చెందదుకదా! స్వప్నములోని వివిధ స్వప్న దృశ్య సందర్భ సంఘటనలచే స్వప్నము తనదైనట్టివాడు మరొకటేదోగా మారడుకదా!

బాల్యం నుండి - ఇప్పటి వరకు ఏ ఒక్క జీవుని ‘నేను’ కూడా పెరగదు, తరగదు కదా! ఆత్మ సర్వదా అక్షరము! జాగ్రత్ - స్వప్న - సుషుప్తులు తనవై, వాటి అంతర్గత విషయములచే తాను మార్పు చేర్పులు పొందనట్టి తత్త్వము.

సమగ్రము - సర్వము అగు ఆత్మయే ‘ఓం’ అను అక్షరముచే ఉద్దేశ్యించబడుచున్నది.


“నమో”


‘నమః’ (ద్వి-అక్షరీ!) : ప్రకృతి స్వరూపము. ద్రష్ట - దృశ్యముల సంబంధ రూపము. పరమాత్మ - జీవాత్మల ఏకత్వము, అభిన్నత్వము
సూచిస్తోంది.

(న = అందరిలోని ‘నేను’.
మ = వ్యష్ఠిగతంగా కనిపించే ‘నేను’.
ఓం = ఏకమే అయిన ఉన్నట్టి ’నేను’)


“నారాయణాయ”


‘నారాయణాయ’ (పంచాక్షరీ!) : జీవాత్మకు సాక్షియై, జీవాత్మను ఉపకరణముగా కలిగి ఉన్నట్టిది. పరమ్ ఆవల గల ఆత్మ స్వరూపము. కాబట్టి ‘పరమాత్మ’! అసంఖ్యాక తరంగములన్నీ సముద్ర జలస్వరూపమే అయినట్లు….. ఈ జీవులందరూ ’నారాయణాయ’ అను బ్రహ్మానందసాగర తరంగాలే!

(నార = జలము;
నారాయణమ్ = అనేక తరంగములలోని ఏక స్వరూప జలము,
జీవులు = అనేకంగా ఉన్నా కూడా,…. ఏకమే అయి ఉన్న ‘ఆత్మ’).

ఈ విధముగా ఏకాక్షరార్థము - ద్వి అక్షరార్ధము - పంచాక్షరార్థము … తెలుసుకొని, ఉద్దేశ్యించి, పూర్ణ భావనతో … అష్టాక్షరీమంత్రమును జపించువాడు ‘మార్పు’ యొక్క పరిధిని దాటినవాడై, అమృత స్వరూపుడగుచున్నాడు. అనగా, సందర్భములకు, జాగ్రత్ - స్వప్న - సుషుప్తులకు, దేహ-దేహాంతరములకు ’సాక్షి అయి ఉన్న “కేవలీరూపము” ను గమనిస్తున్నాడు. మనో-బుద్ధి-చిత్త-అహంకారములకు,
దేహ-దేహాంతరములకు ఆవల గల ’నేనైన నేను’ను ఆస్వాదిస్తున్నాడు.


“త్రిపాద నారాయణము”


‘ఓం నమో నారాయణాయ’ అను తారకమంత్రము గురించి ఋగ్వేద - యజుర్వేద-సామవేదములు గానం చేయు ‘త్రి’ వివరణలు త్రిపాదములుగా చెప్పబడుచున్నాయి.


తారకముయొక్క మొదటి పాదము (ఋగ్వేదాంతర్గతము) (Explanation - 1)


‘ఓం’ కారో సృష్టికర్తయగు సంజ్ఞార్థము బ్రహ్మదేవుడు! సృష్టి ముందే గల సృష్టి సంకల్పుడు. (ఊహా జననము)
‘న’ కారో స్థితి - రక్షకుడు అగు విష్ణుదేవుడు! (ఊహా మననము)
‘మః’ కారో లయకారుడగు రుద్ర దేవుడు! (ఊహా లయము)
‘నా’ (న) కారో అంతటా … అన్నీగా విస్తరించినదైయున్న ‘ఈశ్వరత్వము’నకు సంజ్ఞ (ఊహలో అనేక రూపములుగా కనిపించు దృశ్యకల్పన)
‘రా’ కారో బ్రహ్మాండము (లేక) విరాట్పురుషుడు! (విశ్వాభిమాని)
‘యః’ కారో (వ్యష్ఠి) పురుషుడు (లేక) జీవుడు. (The one who is immersed and involved in experiencing) (వ్యష్ఠి అభిమాని)
‘ణా’ (ణ) కారో సర్వమును ‘ఎరుక’ అను చైతన్య ప్రజ్ఞచే ఉద్దీపింపజేయు, వెలిగించు భగవాన్! (ఎరుక)
‘య’ కారో ’జీవాత్మ’ను ఉపకరణముగా కలిగియున్న తత్త్వమగు పరమాత్మ. (ఉదాహరణకు నాటకంలోని పాత్ర ’జీవాత్మ’ అయితే, ఆ నటుని సహజ వ్యక్తిత్వస్వరూపము పరమాత్మ. జీవాత్మ జగన్నాటకములో పాత్రధారి అయితే, పరమాత్మ ఆ పాత్రకు వేరైన లక్షణుడగు పర(నాటకమునకు ఆవల) స్వరూపుడు.

స్వప్నమును దృష్టాంతంగా ఇక్కడ తీసుకుంటే (Vision of Dream - Visualising maintaining and withdrawing)

’ఓం’ → బ్రహ్మ మనలోని స్వప్న సంకల్పమును సృష్టించి, స్వప్న దృశ్యమునకు రూపునిచ్చు స్వప్న ప్రారంభ స్వకీయతత్త్వము.
‘న’ → విష్ణుః స్వప్న స్థితిని - గతిని నడపుచూ ఉన్న స్వకీయ తత్త్వము!
‘మః’ →> రుద్ర ఆ స్వప్నమును తనలో ఉపశమింపజేయు స్వకీయ లయతత్వము!
‘నా’ →  ఈశ్వరో స్వప్నమంతా నిండి ఉన్నట్టి స్వకీయ స్వప్న చైతన్య తత్వము. స్వప్న ప్రజ్ఞ.
’రా’→ విరాట్ అనేక స్వప్న పరంపరలన్నీ తనవైన, స్వప్నదృశ్య బ్రహ్మాండ పరంపరలు.
‘యః’→ వ్యష్ఠి పురుషః స్వప్నములోని - స్వపాంతర్గత ద్రష్ట. స్వప్నములో భాగమై స్వప్నములోని దృశ్యాలన్నీ జగత్ దృశ్యమువలె తనకు వేరైనట్లు చూచువాడు. (స్వప్న పరిమిత వ్యష్ఠి అభిమాని)
‘ణా’ → భగవాన్ స్వప్నములో అన్నీ ప్రకాశింపజేయు భగవంతుని స్వప్న చైతన్యము. ఏ ఏరుకచే సర్వము ఎరుగబడుచున్నదో….అట్టి “ఎరుక రూపుడు”.
’య’ → ’పరమాత్మ స్వప్నమంతటికీ పరమై (వేరే అయి) స్వప్నము నాదైన ‘నేను’ చైతన్యము.

“ఓం నమో నారాయణాయ” … అను అష్టాక్షరి ఈవిధంగా ’పరము’ అయినట్టి సర్వతత్త్వ సమన్వితుడగు పరమ పురుషునికి సంబంధించిన ఉపాసనయే!

అయం ఋగ్వేదః ప్రథమ పాదః | ఈ విధంగా తారకము యొక్క మూడు పాదములలో ఋగ్వేదముచే గానము చేయబడుచున్న మొదటి పాదము.

సర్వములోని ఏకస్వరూపుడు - సర్వమునకు వేరైనవాడు అగు నారాయణ ధ్యాత-ధ్యాన స్వరూపుని ఋగ్వేదములోని ఋక్కులు స్తుతించుచున్నాయి.


తారకము యొక్క రెండవ పాదము (యజుర్వేదాంతర్గతము) (Explanation - 2)


ఇక అష్టాక్షరి గురించి యజుర్వేదములోని వర్ణన దృష్ట్యా చెప్పుకుంటున్నాము.

ఓం = “తత్” అను శబ్దమునకు అర్థము అయినటువంటి (1) అక్షరము (2) ఏకము అగు పరబ్రహ్మము!
 అట్టి సూక్ష్మమగు “తత్ అక్షరపరబ్రహ్మము” - తనకు ద్వితీయము కానట్టి ’క్షరము’ను కల్పించుకొనుచూ, మరొకప్పుడు ఆ కల్పనను తన యందే లయింపజేసుకొనుచున్నది. పరమాత్మ తత్త్వమగు ఓంకారము అక్షయము - అఖండము అయి, అష్టవిధములుగా కూడా అక్షరమై సంప్రదర్శితమగుచూ కనిపిస్తోంది.

  1. అ కార ప్రధమాక్షరము జాగ్రత్ కల్పన! జాగ్రత్ పురుషకారము!
  2. ఉ కార ద్వితీయాక్షరము స్వప్న కల్పన! స్వప్న పురుషకారము!
  3. మ కార తృతీయాక్షరము …. సుషుప్తి కల్పన! సుషుప్తి పురుషకారము!
  4. ‘బిందు’ (చ)తురీయాక్షరము తురీయము. (జాగ్రత్-స్వప్న సుషుప్తి సంచార స్వరూపుడగు నాలుగవవాడు).
  5. ‘నాద’ పంచమాక్షరము …. నాదము. చెవులు మూసుకొనినప్పుడు అంతరమున వినబడు నాద సంజ్ఞా స్వరూపుడు.
  6. కలా షష్టాక్షరము (కల్పన)
  7. కలాతీతా (కల్పన తనదైనవాడు) …. సప్తమాక్షరము (జీవుడు)
  8. తత్-పరుడు. (అఖండముగా - సమముగా తిష్ఠితమైయున్న తత్) …. అష్టమాక్షరము (జీవునికి సాక్షి)

ఈ ఎనిమిది ఎద్దాని ప్రదర్శనములో అది ఏకాక్షర తారకము!

“ఈ ‘8’ అక్షరములు స్వస్వరూప - ఏకాక్షరముయొక్క లీలా వినోద కల్పనలే!” అని ఎరిగి ఉండటమును, మౌనముగా - అతీతముగా సాక్షిగా దర్శించు అభ్యాసమును “తారకత్వము” అనబడు తారకయోగము యొక్క తత్త్వార్థము తారకత్వాత్ తారకో భవతి। తారకత్వమే తరింపజేయు తారకం! తదేవతారకం బ్రహ్మ త్వమ్ విద్ధి। నీవే ఆ తారక బ్రహ్మమువు - అని ఎరుగుము.

తారకత్వమును అభ్యసించి ఈ జీవుడు తారకుడు (తరతిశోకమ్-తారయతి-తరించువాడు) అగుచున్నాడు. “పరమాత్మ స్వరూపుడనగు నేను ఈ ‘8’ అక్షరరూపములను (జాగ్రత్-స్వప్న-సుషుప్తి-తురీయ-నాద-కలా-కలాతీత-తత్పరము) నా యొక్క ‘8’ విశేషములుగాను, నేను వాటికి వేరై - శ్రేష్ఠమైనవాడుగాను ఉన్నాను - అని గమనించి దర్శించుచున్నాడు. తారకత్వమును ఆశ్రయించి, తరించువాడను నేనే! “కేవల పరమాత్మస్వరూపుడనే సర్వదా అయి ఉన్నాను” …. అను స్వయం పర-పరమాత్మ స్వరూపుడవై ఉండటమే తారకము.

అట్టి తారక యోగతత్త్వమే ఇక్కడ ఆరామ-విరామములతో కూడి ఉంటోంది. “రామ బ్రహ్మతత్త్వము”గా చెప్పబడుచూ, ఈవిధముగా గానము చేయబడుచున్నది.

‘అ’కారాత్ బ్రహ్మ-జాంబవాన్-ఇతి జన్మరహితమగు బ్రహ్మము సృష్టికి ఉపక్రమించటము సృష్టి-సృష్టించువాడు. జాంబవాన్ సంజ్ఞ.
’ఉ’కారాత్  ఉపేంద్రో హరి నాయకః అక్షర సంభూతుడు. క్షరమునకు ఆధారమైన అక్షరముగా అవతరించువాడు. స్థితి కల్పన. అందుకు సంజ్ఞ ఉపేంద్రుడు. ఆయనే హరి. ఆయనే సర్వమునకు నాయకత్వం వహిస్తున్నట్టివారు. హరి (కోతుల) నాయకుడగు సుగ్రీవుడుగా - సంజ్ఞ!
’మ’కారాత్ శివస్తు - హనుమాన్! అక్షర సంభూతము. అక్షరమై దేహములో సాక్షిగా ఉన్నట్టిది. బుద్ధి సాక్షి. బ్రహ్మాండమునందు శివుడు-హనుమంతుడుగా ప్రసిద్ధి పొందుచున్నట్టిది. హనుమంతుడుగా బుద్ధి రూపముగా, గురువుగా ప్రదర్శనమగుచున్న అక్షరము.
‘బిందు’ ఈశ్వర సంజ్ఞస్తు శత్రుఘ్నుః చక్రరాట్ స్వయమ్ ఈశ్వర, సంజ్ఞస్తు అంతటా సాకారమై విస్తరించి ఉన్నట్టిది. ఈశ్వరత్వము. స్వయముగా చక్రరాట్ తెలుసుకొనుచున్న జ్ఞేయతత్త్వము - మహాప్రభుః జ్ఞేయో ఈశ్వర నామ రూపంలో విస్తరించి అంతర్లీనుడై ఉన్నవాడు. ఎరుగుచున్నట్టిదే ఎరుగబడు దాని రూపమగు జ్ఞేయము. ఎరుగుచున్నవాడు ఎరుగబడుదాని నియామకుడు కాబట్టి మహాప్రభువు.
నాదో భరతః శంఖనామకః శంఖ నామకః - శంఖ నినాదము నినాద సంజ్ఞl సర్వశబ్ద స్వరూపుడు
కలాయాః పురుషఃసాక్షాత్. లక్ష్మణో ధరణీధరః | కల్పించుకొని అనుభవించు పురుషుడు! జీవుడు. ధరణీధరః. దేహములో ఉండి అన్నీ ఆస్వాదించువాడు! పురుషుడు! జీవుడు! ఈ భూమిని ధారణ చేయువాడు. భరించువాడు. భర్త.
కలాతీతా భగవతీ స్వయం సతేతి సంజ్జికా మూల ప్రకృతి స్వరూపము. ప్రకృతి. సర్వమును వెలగించు మూలతత్త్వము. భగవతి| ప్రప్రథమమగు ఊహ, భావన, సంకల్పము, స్వభావము!

తత్పరః పరమాత్మా చ! సర్వము తానే అయి, సర్వమునకు వేరైన తత్త్వము పరమాత్మ! ఆ పరమాత్మయే పురుషోత్తముడగు శ్రీరామచంద్రుడు ….!

పురుషోత్తముడు = ఉత్తమ పురుషుడు! ‘నేను’ ను భావనచేస్తూ, అట్టి భావనకు ముందే ఉన్న ఉత్తమపురుష (First Person).

ఓ భారద్వాజా! పైన చెప్పుకొన్న తీరుగా ఈ కనబడేదంతా కూడా ఆ అక్షరమగు ‘ఓం’ కార స్వరూపమేనయ్యా!

ఓం ఇతి ఏతత్ అక్షరమ్ ఇదమ్ సర్వమ్।  పరమ సత్యమును సందర్శించు అభ్యాసమే ‘ఓంకారోపాసన’! ఈ అనేకమునకు ఆధారమగు ఏకత్వ దృష్టియే ఓంకార సిద్ధి! అదియే తారసారము.

‘సర్వము’ అయిన ‘ఓంకారము’ గురించి మరి కొంతగా ఉపాఖ్యానించుకుందాము.

భూతం భవ్యం భవిష్యం యచ్ఛ |  ఇతః పూర్వము ఏదైతే ఉన్నదో, ఇప్పుడేమేమి ఉన్నదో, ఇకముందు ఏవేమి ఉండినట్లుగా అనుభవము కానున్నదో … అదంతా కూడా సర్వదా ఓంకారమే! పరబ్రహ్మమే! ఈ జీవుని కేవల స్వస్వరూపమే! దేహముల రాక - పోకలకు కూడా సాక్షి - ఆధారము అయి ఉన్నట్టిదే ‘ఓం’ శబ్దార్థ ‘ఆత్మ’!

త్రిలాకలములకు (కాలమునకు అతీతమై) ఏదైనా ఉంటే,… అదీ ఓంకార స్వరూపమే!

సర్వమంత్రములు, సర్వదేవతా వర్ణనలు, ఛందస్సు, ఋగ్వేదములోని ఋక్కులు, కలాశక్తి (ప్రకృతి శక్తులు), సృష్ట్యాత్మకమైనది (సృష్టించబడుచున్నదిగా కనిపించేది), సృష్టించువాడు…. ఇదంతా పరమాత్మ యొక్క లీలా విలాసమే! ఓంకార రూపమే! ఆ పురమ పురుషునికి వేరైనట్టిదేదీ లేదు. జీవులుగా, అనుభవములుగా, మనోబుద్ధి చిత్త అహంకారములుగా, వాటి ఆకార సాకార వికార-నిరాకారములుగా, సృష్టి స్థితిలయములుగా… ఈవిధంగా కనిపించేది, అనుభవమయ్యేది, అనుభవముకానిది…. అంతా కూడా ఓంకార స్వరూపమే! ఇదియే ‘ఓం నమో నారాయణాయ’…… అను మంత్రముయొక్క మంత్రార్థము! తత్త్వార్థము!

ఇతి తారకము యొక్క యజుర్వేద సారమగు రెండవపాదము.


తారకము యొక్క మూడవ పాదము (Explanation - 3)
(సామవేదాంతర్గతము)


అప్పుడు భారద్వాజ మునీంద్రులవారు సద్గురువగు శ్రీ యాజ్ఞవల్క్య మహర్షిని ఇట్లా అడుగసాగారు.


భారధ్వాజ మునీంద్రుడు : మహాత్మా! యాజ్ఞవల్యా! సర్వమూ తానై, సర్వమునకు వేరైనట్టి పరబ్రహ్మమును ఉపాసించటమెట్లా?
అథ కైః మంత్రైః పరమాత్మా ప్రీతో భవతి? మననాత్ త్రాయతే … అను ప్రసిద్ధిగల ఏ మననముచే ఆ పరమాత్మ సంతోషిస్తారు? స్వాత్మానంద స్వరూపులై ప్రసన్నము అయి, సంప్రదర్శనములవుతారు? హే భగవాన్! ఈ విషయమై నాకు చెప్పి, త్రోవ చూపండి!


యాజ్ఞవల్క్యుడు :  ఓ భారద్వాజా! సర్వభూతములు - దృశ్యజాలములు తానే అయి, సర్వసాక్షిగా వేరే అయినట్టి పమాత్మయగు శ్రీమన్నారాయణుడు ‘ఓం నమోనారాయణాయ’ అను అష్టాక్షరీ మంత్రార్థ భావనచే తప్పక ప్రసన్నులై, స్వానుభవ రూపముగా ప్రదర్శితులు కాగలరని మరొక్కసారి గుర్తు చేస్తున్నానయ్యా! మంత్ర మననముచే అజ్ఞాన దృష్టులు పవిత్రత సంతరించుకొనుచుండగా, నారాయణత్వము స్వభావమై సిద్ధిస్తోంది. తరంగము జలమే కదా! జీవులందరూ ఏకోనారాయణ స్వరూపులే!

నీవు అడుగుచున్న విషయమై, శ్రీమన్నారాయణ పరబ్రహ్మతత్త్వమును అతి త్వరగా ప్రసాదించగల మహర్షి ప్రవచితమైన “అష్టశ్లోకీ అష్టాక్షరి”ని ఉదహరిస్తూ, అభివర్ణిస్తున్నాను. ముముక్షువులకు-సాధకులకు సులభ ప్రసన్నము అయి ఉన్నది కనుక …, వినండి.

1.) ఓం యో హ వై శ్రీ పరమాత్మా! నారాయణః స భగవాన్ “అ” కార వాచ్యో జాంబవాన్ భూర్భువస్సువః తస్మైవై నమో నమః |

ఓం-ప్రణవ స్వరూప పరమాత్మా! భగవాన్ నారాయణా! ‘అ’కారవాచ్యుడవై జాంబవాన్ (జనింపజేయువాడవుగా) భూ భువర
సువర్ త్రిలోక ప్రసిద్ధుడవైనట్టి నీకు నమో వాక్కములయ్యా! జాంబవాన్ నారాయణునికి నమోవాక్కములు. (బ్రహ్మయొక్క అంశ)

2.) ఓం యో హ వై శ్రీ పరమాత్మా! నారాయణః| స భగవాన్!“ఉ” కార వాచ్యో “ఉపేంద్ర” స్వరూపో, ‘హరి’ నాయకో భూర్భువస్సువః తస్మైవై నమో నమః |

ఆ నారాయణుడే ఓంకార స్వరూపుడగు పరమాత్మ! ఆ భగవానుడు,
-’ఉ’ కారముచే ఉద్దేశ్యించబడువాడు ఇంద్రియలోక స్వరూపుడు.
- ’సుగ్రీవుడు (హరి-కోతుల (ఇంద్రియములు) నాయకుడు)గా ఉన్నట్టి వారు! సృష్టి స్వరూపుడు! నియామకులు! సర్వము తానైన హరి భూ భువర్ సుర్ లోకములుగా ప్రకాశించుచున్నారు. అట్టి ఉకారవాచ్య-ఉపేంద్రనారాయణునికి, హరి (సుగ్రీవ) నారాయణునికి నమో నమో నమో నమః! (ఇంద్రుని అంశ)

3.) ఓం యో హ వై శ్రీ పరమాత్మా! నారాయణః। స భగవాన్।“మ” కార వాచ్యం, శివ స్వరూపో హనుమాన్ భూర్భువస్సువః తస్మైవై నమో నమః |

పరమాత్మ అగు ఆ శ్రీమన్నారాయణ భగవానుడు ‘మ’ శబ్దముచే చెప్పబడుచున్నారు. శివభగవానుడు అగు ఆయన సర్వశుభ ప్రదాత! ఆయనయే ‘హనుమాన్’ స్వరూపుడై పరతత్త్వమునకు జేర్చు సద్గురువు. భూ భువర్ సువర్ లోకముల రూపముగా ప్రకాశమానుడగుచున్న అట్టి పరమాత్మకు నమస్కార సహస్రములు! శివ-హనుమాన్ స్వరూప నారాయణునికి నమస్కృతులు! (శివాంశ)

4.) ఓం యో హ వై శ్రీ పరమాత్మా! నారాయణః| స భగవాన్ బిందు స్వరూప శతృఘ్నో భూర్భువస్సువః తస్మైవై నమో నమః |

ఆ పరమాత్మయే శ్రీమన్నారాయణుడు. ఆయన బిందు స్వరూపుడై శతృఘ్ను రూపములో భూ భువర్ సువర్ లోకములన్నీ ప్రకాశింపజేయుచున్నారు. అట్టి శతృఘ్న వాచ్య బిందుస్వరూప పరమాత్మకు మరల మరల నమస్కరించుచున్నాము. ఏ బిందువు నుండి లోకాలన్నీ జనిస్తూ, బిందువునందే అంతర్గతమైయున్నాయో…. అట్టి బిందు-శతృఘ్న నారాయణుని స్మరిస్తున్నాము. (చక్రాంశ).

5.) ఓం యో హ వై శ్రీ పరమాత్మా! నారాయణః| స భగవాన్! నాదస్వరూపో భరతో భూర్భువస్సువః తస్మైవై నమో నమః |

శ్రీ పరమాత్మ శ్రీమన్నారాయణుడే ప్రణవ స్వరూపుడు. నాద స్వరూపుడై, భరత స్వరూపుడై, సూక్ష్మముగా భూర్భువస్సువర్ త్రిలోకములో నిండియున్నారు. అట్టి పరమాత్మకు బహు ప్రణామములు. ఓంకారనాద తత్త్వ భరత నారాయణునికి
నమస్కారములు.(శంఖాంశ)

6.) ఓం యో హ వై శ్రీ పరమాత్మా! నారాయణః। స భగవాన్। కలాస్వరూపో, లక్ష్మణో భూర్భువస్సువః తస్మైవై నమో నమః |

ఓంకార స్వరూప పరమాత్మయే శ్రీమన్నారాయణుడు, కలా (కల్పనా-ప్రకృతి) స్వరూపులై విరాజిల్లుచున్న వారు. ఆరాధకులకు లక్ష్మణస్వరూపులై ప్రసాదితులు అగుచున్నారు. భూర్భువస్సువ దృశ్య తత్త్వములుగా ప్రదర్శితులగుచున్నారు. అట్టి పరమాత్మ - పరంధామునికి వేనవేల దండాలు. కల్పన నుండి విముక్తి కలిగించు కలాస్వరూప లక్ష్మణ-నారాయణునికి నమో నమః (ఆది శేషాంశ)

7.) ఓం యో హ వై శ్రీ పరమాత్మా! నారాయణః| స భగవాన్। కలాతీతా భగవతీ సీతా చిత్ స్వరూపా భూర్భువస్సువః తస్మైవై నమో నమః |

ఓంకార స్వరూప శ్రీ పరమాత్మా! శ్రీమన్నారాయణా! మీరు కలాతీతా (ప్రకృతిని దాటిన రూపుడవై) భగవతియగు సీతాదేవిగా ఉపాసనార్ధమై ప్రాప్తించుచున్నారు. చిత్ స్వరూపమై భూర్భువస్సువర్లోకములను వెలిగించుచున్నారు! అట్టి పరమాత్మకు పునః పునః సాష్టాంగ దండ ప్రణామములు. అవాక్ మానసగోచర నారాయణుని సీతా స్వరూప చిత్ (ఎరుక)-మూల ప్రకృతి ప్రదర్శన నారాయణునికి ప్రణామములు. (మూల ప్రకృతి - అంశ).

8.) ఓం యో హ వై శ్రీ పరమాత్మా! నారాయణః |
ప్రణవ స్వరూప శ్రీ పరమాత్మయే నారాయణుడు!

భగవానుడుగా ఆ నారాయణతత్త్వము గురించి చెప్పుకుంటున్నాము. విను!


తత్ పరః :  ప్రకృతి - పురుషులకు ఆవల తత్ స్వరూపుడై సర్వదా ప్రకాశమానుడై ఉన్నారు. అందుచేత ఆయన తత్ పరుడు. నాటకంలో నటించువాని వ్యక్తిగత రూపము నాటకమునకు పరమైయున్న రీతిగా - సర్వమునకు వేరై ఉన్నారు. ఈ జీవుని సహజ స్వరూపమై ఉన్నట్టి వారు!

పరమ పురుషః :  జీవుడు - జగత్తు కూడా ఆయనయొక్క భావనారాయణత్వమే! ఇహము - పరమునకు ఆవల వేంచేసి, సర్వకారణుడై ఉండటం చేత పరమపురుషుడు. రచయిత యొక్క నాటక రచన నుండి పాత్రలన్నీ వస్తున్నట్లు, రచయిత నాటకములోని సర్వపాత్రలకు, కథాగమానికి, పాత్రల స్వభావాలకు సర్వదా వేరైనట్లు, ఆ పరమపురుషుడే సర్వము అయి, సర్వమునకు వేరై ఉన్నారు.

పురాణ పురుషః : జన్మలకు కర్మలకు ముందే ఉన్నది-ఆ ఓంకార పరమాత్మ భగవానుడగు శ్రీ సత్యనారాయణుడే! సర్వమునకు ముందే ఉన్నవాడు… ‘పురా’ - ముందుగానే ఉండి, న వేతి… ఇప్పటికీ, ఎప్పటికీ నూతనంగా యథాతథము.

పురాణ పురుషోత్తమో : సర్వులలోని - సర్వములోని ఉత్తమ పురుష (The First Person - Absolute Presence of I) ఆయనే ! ఆయన ఆది స్వరూపుడు! ఆయనయే మన నిత్య - సత్య సహజ స్వరూపము! కాబట్టి, ‘పురాణపురుషోత్తముడు’ అని కూడా వర్ణించబడుచున్నారు. జాగ్రత్-స్వప్న-సుషుప్తులలో నేను-నేను-నేను కంటే మునుముందే ఉన్న నేను కనుక పురుషోత్తముడు!

నిత్య-శుద్ధ-బుద్ధ-ముక్త : ఆ అష్టాక్షరీ తత్త్వ సర్వనారాయణుడు కాలమునకు అతీతుడు. త్రికాలములలోను ఏక స్వరూపుడు. కాబట్టి ‘నిత్యుడు’! ఈ దేహ, జగదంతర్గత భేద, మనో, బుద్ధి, చిత్త, అహంకారాల దోషాలు అంతర్గత - బహిర్గత పరాత్పరుడగు ఆ నారాయణ భగవానుని ఏ మాత్రము స్పృశించవు. ఆయన నిత్యుడు, నిత్యశుద్ధుడు కూడా!

ఆయన కేవల మౌనస్వరూపుడై, కేవల బుద్ధితత్త్వముగా 14 లోకాలలోని సర్వ జీవాత్మలయందు, చర-అచరములయందు వెలయుచున్నారు. నిత్య-శుద్ధ-బుద్ధ స్వరూపుడై సర్వమునకు వేరుగా ఉండి, సర్వము తానే అయి ఆనందించుచున్నారు. ఈ జీవాత్మ, ఈ నీవు-నేను-ఈ సర్వలోకాలు, బ్రహ్మ-విష్ణు-మహేశ్వరులు, పిసిపీలికాది బ్రహ్మ పర్యంతము ఆయన లీలా-క్రీడా-వినోద-ఆనంద సంకల్ప స్ఫురణలే! విస్ఫులింగములే! కనుక ఆయన నిత్య శుద్ధ - బుద్ధ స్వరూపుడు!

ఆయన దేనికీ సంబంధితుడు కాడు. మనో బుద్ధి చిత్త అహంకారములచే పరిమితుడు కాదు. ఆయన శాసనమే ఈ సర్వము. ఆయనను శాసించునదేదీ లేదు. దేనిచేతనూ నియమితుడు, నిబద్ధుడు కాదు. కాబట్టి ఆ శ్రీమన్నారాయణుడు నిత్యముక్త స్వరూపుడు!

సత్య : శ్రీమత్-నారాయణ పరబ్రహ్మమే సత్యము. మిగిలినదంతా కల్పన. అందుచేత అష్టాక్షరిచే సత్యమైనది ఉపాసించబడుచూ, “అసతోమా సద్గమయ”… అను వేద వాక్యార్ధమును సిద్ధింపజేయుచున్నది. “కేవలో తత్ నారాయణో హమస్మి" స్థానమును జేర్చుచున్నది.

పరమానంద : అష్టాక్షరీ - అఖండాక్షరీ ఉపాసన, తత్ అర్థమననము నిర్వర్తించు యోగి… పరిమితము, దుఃఖ సమ్మిళితము, అసత్ మార్గ ప్రయోజనము గల ఇహ ఇంద్రియ సుఖములను అధిగమించుచున్నాడు. ‘పరమ్-ఆవల’ గల ఆత్మ సంస్పర్శానందము,
సర్వాత్మత్వ సుఖమును సముపార్జించుకుంటున్నాడు.

అనన్తమ్ : ఆద్యంతరహితమగు ’సోహమ్ నారాయణాయమస్మి’ని అనుభవముగా సిద్ధింపజేసుకుంటున్నాడు.

అద్వయమ్ : అష్టాక్షరీ పరమాత్మోపాసనచే ఎద్దానికైతే ద్వితీయము - (స్వప్నములో స్వప్న ద్రష్టయొక్క స్వప్న చైతన్య ప్రదర్శనమునకు వేరైనదేదీ లేని తీరుగా), కాదో - అట్టి అద్వయ పరబ్రహ్మమే ఆశయమై యున్నది. నా స్వప్నములో నాకు వేరుగా ఏదీ లేని తీరుగానే, “జాగ్రత్‌లో గాని, మరింకెక్కడా గానీ మమాత్మ స్వరూపమునకు వేరైనదంటూ కించిత్ కూడా ఏదీ లేదు?”…. అనునదే అష్టాక్షరీ ఆశ్రయము యొక్క అంతిమము - అతి ముఖ్యము అగు ప్రయోజనము!

పరిపూర్ణః - [1.] జగత్ [2.] జీవ (జగత్ ద్రష్ట) [3.] ఈశ్వర (అనేక ఉపాధులుగా ప్రదర్శనమగు చైతన్య) 4. కేవల సాక్షియగు పరతత్త్వములన్నీ తనయందు కలుపుకొని, పరిపూర్ణ నారాయణత్వమునకు గొనిపోవు స్థానమైయున్నది. ఇదియే అష్టాక్షరీ ప్రయోజనము!

భు-భువర్-సువర్లోకముల ఉత్తేజితరూపుడు, తత్పరుడు, పరమపురుషుడు, పురాణ పురుషోత్తముడు, నిత్య శుద్ధ బుద్ధ ముక్తుడు,
సత్య - పరమానంద అనంత - అద్వయ స్వరూపములచే పరిపూర్ణుడు, బ్రహ్మము అయినట్టి రామ బ్రహ్మమును నేనే -
అయి ఉన్నాను. నేను అభిన్నుడను! తదితర జీవులు - జగత్తు కూడా అభిన్నమే!

అట్టి ఆత్మారామానంద - ఆత్మ స్వరూపమునకు నేను నమస్కరించుచున్నాను. జీవాత్మగా పరమాత్మను (లేక) నా శ్రీరామచంద్ర పరబ్రహ్మ స్వరూపమును ఉపాసిస్తున్నాను. పరబ్రహ్మముగా జీవాత్మను - ఒక శిల్పి తాను చెక్కిన శిల్పము చూచువిధముగా వీక్షిస్తున్నాను.

ఫలశ్రుతి

ఇట్టి అష్ట విధ - అష్ట తత్త్వార్ధ - అష్టాక్షరీ మంత్రమును ఎవ్వరు శ్రద్ధతో జపిస్తారో, పరమార్ధపూర్వకంగా ధ్యానిస్తారో, అట్టి వారు అగ్నిచే బంగారము, వాయువుచే మేఘావృత ఆకాశము, ఆదిత్యునిచే చీకటి ప్రదేశము పవిత్రమగు విధంగా…. పరమపునీతులగుచున్నారు.

వారు పిల్లగాలులు ఏమాత్రము కదల్చలేని గండ శిలవలె సంసార తరంగములచే కదలించబడనివారగుచున్నారు. సర్వ దేవతల మహత్-తత్త్వమేమిటో ఎరిగినవారగుచున్నారు. ఇతిహాస పురాణముల అంతరార్ధము ఎరిగిన ప్రయోజనము పొందుచున్నారు. రుద్రము లక్షసార్లు జపించినంతటి ఉత్తమ ఫలము సముపార్జించుటకున్నవారగుచున్నారు.

శ్రీమన్నారాయణ అష్టాక్షరీ మహామంత్రమును మనో-బుద్ధి సమన్వితంగా జపించినవారు (అనుస్మరించినవారు) శతసహస్ర (లక్ష) గాయత్రీ జపఫలము పొందగలరు. వారు ప్రణవమును అనేకసార్లు జపించిన వారగుచున్నారు. వారి వంశములో ఇతఃపూర్వపు పది తరములవారు, ఇక ముందటి పది తరములవారు కూడా పవిత్రత సంతరించుకొనగలరు.

అష్టవిధ మంత్రపూర్వక అష్టాక్షరీ జపము (ఓం నమో నారాయణాయ) చేయువారు స్వయముగా నారాయణ పదమును - అలంకరించి ఆనందించుచున్నారు. 
ఓ భారద్వాజా! ఆత్మజ్ఞాన విద్వాంసులగు సూరులు సర్వత్రా సర్వదా తత్ విష్ణుపదమునే దర్శించుచూ, విష్ణుస్వరూపులగుచున్నారయ్యా! ఈ త్రిలోక విశ్వము తమ స్వరూపమై, ఈ సర్వమునకు వేరుగా కూడా అయి విష్ణుత్వమును సదా ఆస్వాదించగలరు.

అట్టి సీతాలక్ష్మణ భరత శతృష్ను హనుమత్ జాంబవంతాది పరివార సమేత శుద్ధ తత్త్వమగు శ్రీరామచంద్ర పరబ్రహ్మమే ఆకాశము-భూమి-పాతాళములలో వెల్లివిరిసియున్నదయ్యా! అట్టి ఆత్మారామ-విష్ణుత్వమే జీవుని మహదాశయమగు పరమపదము సుమా!

🙏 ఇతి తారసార ఉపనిషత్ | 🙏
ఓం శాంతిః! శాంతిః! శాంతిః!