[[@YHRK]] [[@Spiritual]]

TriSikhi Brāhmana Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 1
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com
Courtesy - sanskritdocuments.org (For ORIGINAL Slokas Without Sandhi Splitting)


శుక్ల యజుర్వేదాంతర్గత

7     త్రిశిఖి బ్రాహ్మణోపనిషత్

శ్లోక తాత్పర్య పుష్పమ్



యోగజ్ఞానైకసంసిద్ధశివతత్త్వతయోజ్జ్వలం .
ప్రతియోగివినిర్ముక్తం పరంబ్రహ్మ భవామ్యహం ..

శ్లో॥ యోగజ్ఞానైక సంసిద్ధ శివతత్త్వ తయోజ్వలమ్।
ప్రతియోగి వినిర్ముక్తం పరబ్రహ్మ భవామ్యహమ్॥



ఓం త్రిశిఖీ బ్రాహ్మణ ఆదిత్యలోకం జగామ తం గత్వోవాచ .
భగవన్ కిం దేహః కిం ప్రాణః కిం కారణ కిమాత్మా
ఓం
1.) త్రిశిఖీ బ్రాహ్మణ ఆదిత్యలోకం
జగామ। తం గత్వా, ఉవాచ -
“భగవన్! కిం దేహః? కిం ప్రాణః?
కిం కారణమ్? కిమ్ ఆత్మా?”

ఓంకార ఏకాక్షర స్వరూప పరబ్రహ్మమునకు అధ్యాత్మపూర్వక నమస్కారము!

ఒక సందర్భములో వేద-వేదాంగ పారంగతుడగు ‘త్రిశిఖి’ అను పేరుగల బ్రహ్మ తత్త్వజిజ్ఞాసువు సూర్యలోకం వెళ్ళారు. జగత్ త్రాణ రూపుడు - జగత్ రక్షకుడు అగు శ్రీమన్ సూర్యనారాయణుని సందర్శించి ఇట్లా ప్రశ్నించారు.

హే భగవన్! సూర్యమండలాధీశా! ఆదిత్యదేవా! జగద్గురూ! నాయీ ప్రశ్నలకు వివరణ ప్రసాదించ ప్రార్థన!

దేహము అనగా ఏమి? ప్రాణము అనగా? వాటికి కారకుడు - కారణము ఏమిటి? ఆత్మ అనగా ఏమి?


సహోవాచ సర్వమిదం శివ ఏవ విజానీహి . కింతు నిత్యః శుద్ధో
నిరంజనో విభురద్వయః శివ ఏకః స్వేన భాసేదం సర్వం
దృష్ట్వా తప్తాయఃపిండవదేకం భిన్నవదవభాసతే .
సహెూవాచ :
‘సర్వమ్ ఇదం శివ ఏవ’ విజానీహి।
కిం తు నిత్యశుద్ధో, నిరంజనో,
విభుః, అద్వయః, శివ ఏకః॥

స్వేనభాసా, ఇదం సర్వం
దృష్ట్వా, తప్తాయః
పిణ్డవత్ ఏకం - భిన్నవత్ అభాసతే॥

ఆదిత్య భగవానుడు :  నీవు అడుగుచున్న దేహము ప్రాణములు మరియు ఆత్మ గురించి సూటిగా సమాధానం చెప్పాలంటే ఆ మూడూ కూడా (అద్వయము - చిదానందము - ఏకము అగు) శివస్వరూపమే! ఎందుచేతనంటావా? నిత్యశుద్ధుడు, దోషములచే అంటబడడు - కాబట్టి నిరంజనుడు, సర్వనియామకుడు - కాబట్టి విభువు. అద్వయుడు అగు శివుడు ఒక్కడే ఉన్నారు (శివాత్ పరతరం నాస్తి). శివానందమునకు వేరై ఎక్కడా ఏదీ లేదు.

అట్టి శివతత్త్వము యొక్క వెలుగులో, తేజస్సులో నీవు అడుగుచున్న దేహ - ప్రాణ - జీవాత్మలు ప్రకాశమానమగుచున్నాయి. ఒకే ఒక్క ముద్దవలె ఐక్యముగా ఉండి కూడా వేరువేరుగా ఉన్నట్లుగా అవన్నీ భాసిస్తున్నాయి. (అగ్ని ఒక్కటే అయి కూడా అగ్ని శిఖలో ఉష్ణము, వెలుగు వేరువేరు లక్షణములుగా కనిపిస్తున్నట్లుగా)!


తద్భాసకం కిమితి చేదుచ్యతే . సచ్ఛబ్దవాచ్య-
మవిద్యాశబలం బ్రహ్మ . బ్రహ్మణోఽవ్యక్తం . అవ్యక్తాన్మహత్ .
మహతోఽహంకారః . అహంకారాత్పంచతన్మాత్రాణి .
పంచతన్మాత్రేభ్యః పంచమహాభూతాని .
పంచమహాభూతేభ్యోఽఖిలం జగత్ ..
2.) త్రిశిఖీ ఉవాచ :
తత్ భాసకం కిం?

త్రిశిఖి :
ఆ విధంగా ’3’ గా భాసించుచున్నదేది?

ఆదిత్యుడు :
ఇతి చేత్ ఉచ్యతే ‘సత్’ శబ్దవాచ్యమ్।
అవిద్యాశబళం బ్రహ్మ
బ్రహ్మణో → అవ్యక్తమ్।
అవ్యక్తాత్ → మహత్।
మహతో → అహంకారః|
అహంకారాత్ పంచతన్మాత్రాణి।
పంచతన్మాత్రేభ్యః → పంచమహాభూతాన్ని
పంచ మహాభూతేభ్యో → అఖిలం జగత్ |

ఆదిత్యుడు :
ఏకమగు బ్రహ్మమే ‘అవిద్య’ అనే స్వీయ శబల(చిత్ త్రిగుణ వర్ణ) బ్రహ్మచే ఈ అనేక రూపములుగా సర్వము భాసింపజేయబడుచున్నది.

శబల బ్రహ్మ నుండి → అవ్యక్తము (వ్యక్తీకరణమునకు వేరై, సర్వము వ్యక్తీకరించునదైనట్టిది) బయల్వెడలుతోంది.

అవ్యక్తము నుండి → మహత్ తత్త్వము జనించినదగుచున్నది.

మహత్ నుండి → అహంకారము ప్రదర్శితమౌతోంది.

అహంకారము నుండి → పంచ తన్మాత్రలు (The five senses of sound; Touch; Form; Taste and Smell] ప్రకటనమగుచున్నాయి.

పంచతన్మాత్రల నుండి → పంచమహాభూతములు [Solidity; Liquidity; Heat; Vapour and Space].

అటు తరువాత పంచ మహాభూతముల నుండి ఈ దృశ్యమానమగుచున్న జగత్తంతా విద్యమానము అగుచున్నది.


తదఖిలం కిమితి . భూతవికారవిభాగాదిరితి . ఏకస్మిన్పిండే
కథం భూతవికారవిభాగ ఇతి . తత్తత్కార్యకారణభేదరూపే-
ణాంశతత్త్వవాచకవాచ్యస్థానభేదవిషయదేవతాకోశ-
భేదవిభాగా భవంతి .
3.) తదఖిలం కిమ్? ఇతి
భూతవికార విభాగాదిః ఇతి |
ఏకస్మిన్ పిండే కథం
భూత వికార విభాగ ఇతి?
తత్ తత్, కార్య - కారణ భేద
రూపేణ అంశతత్వ
వాచక - వాచ్య, స్థాన భేద విషయ
దేవతాకోశ భేదవిభాగా భవన్తి |

త్రిశిఖి : అనేకముగా కనిపించే ఈ జగత్తుగా ఎట్లా అవుతోంది? ఏది ఇదంతాగా అగుచున్నది?

ఆదిత్యుడు :  ఇదంతా పంచమహాభూతముల సవికార విభాగమే! అంతకుమించి మరేమీ ఏదీ కాదు.

త్రిశిఖి : పిండము మొదట్లో ‘ఏకము’ అయి ఉండగా, ఎట్లా భూతవికార విభాగములుగా అవటం జరుగుతోంది?

ఆదిత్యుడు : వేరు వేరు ధర్మములు కలిగి ఉన్నట్టి పంచమహాభూతముల యొక్క కార్య - కారణ రూప భేదము చేత, వాటివాటి అంశ తత్త్వములచే - (ఆకాశము - శబ్దాంశ దేవత, వాయువు - స్పర్శాంశదేవత, అగ్ని - రూప దేవతాంశ, జలము - రస దేవతాంశ, భూమి - గంధ దేవతాంశ) … ఒకే అనుభవమునకు వేరువేరైన అనుభూతులతో కూడిన అనుభవ విభాగములు ఏర్పడుచున్నాయి. వాటివాటి వాచక (చెప్పువాడు Experiencer-), వాచ్య (చెప్పబడునది - Experienced) రూపముగా దేవతాంశల నుండి భేద విభాగమంతా ఏర్పడుచున్నది. అనుభవము ఒక్కటే అయినప్పటికీ శబ్ద-స్పర్శ-రూపాది అనుభవములు వేరువేరైనట్లుగా!

నిర్విషయ - నిరాకార బ్రహ్మమునుండి క్రీడగా, లీలగా బయల్వెడలిన అవిద్యా పిండము నుండి ఈఈ భేద విభాగాలు సంప్రదర్శనమగుచున్నాయి.


అథాకాశోఽన్తఃకరణమనోబుద్ధి-
చితాహంకారః . వాయుః సమానోదానవ్యానాపానప్రాణాః .
వహ్నిః శ్రోత్రత్వక్చక్షుర్జిహ్వాఘ్రాణాని . ఆపః శబ్దస్పర్శ-
రూపరసగంధాః . పృథివీ వాక్పాణిపాదపాయూపస్థాః .
4.) అథ
ఆకాశో → అంతఃకరణ మనో బుద్ధి చిత్త అహంకారాః|
వాయుః → సమాన ఉదాన వ్యాన అపాన ప్రాణాః|
వహ్నిః → శ్రోత్ర త్వక్ చక్షుః జిహ్వ ఆఘ్రాణాని
ఆపః → శబ్ద స్పర్శ రూప రస గంధాః
పృథివీ → వాక్ పాణి పాద పాయు ఉపస్థాః

ఆత్మ నుండి ‘అవిద్య’ అనే స్వీయ శబల బ్రహ్మము, దాని నుండి మాయాకల్పనచే బయల్వెడలిన ‘ఏకపిండము’ (ఆత్మాకాశము) అంతఃకరణముగా మరియు ఆకాశ - వాయు - వహ్ని - జల - పృథివిలు బయల్వెడలుచున్నాయి.
అంతఃకరణము - మనో బుద్ది చిత్త అహంకార రూపములుగా ప్రదర్శితమౌతోంది.
వాయువుయొక్క అంశలు : సమాన - ఉదాన - వ్యాన - అపాన - ప్రాణములు.
అగ్నియొక్క అంశలు : శ్రోత్రము (చెవులు), త్వక్ (చర్మము), చక్షుః (కనులు), జిహ్వ (రసము), ఆఘ్రాణాని (వాసనలు).
ఆపః (జలము) యొక్క అంశలు : శబ్ద - స్పర్శ - రూప - రస - గంధములు.
పృథివీ అంశలు :  వాక్కు, పాణి (చేతులు), పాదములు, పాయు (మల విసర్జనాంగము), ఉపస్థ (మూత్ర విసర్జనాంగము).


జ్ఞానసంకల్పనిశ్చయానుసంధానాభిమానా ఆకాశ-
కార్యాంతఃకరణవిషయాః . సమీకరణోన్ననయనగ్రహణ-
శ్రవణోచ్ఛ్వాసా వాయుకార్యప్రాణాదివిషయాః .
5.) జ్ఞాన-సంకల్ప-నిశ్చయా
అనుసంధానా - అభిమానా → ఆకాశకార్యాః,
అంతఃకరణ విషయాః॥
సమీకరణ, ఉన్నయన, గ్రహణ, శ్రవణ,
ఉచ్ఛ్వాసా → వాయు కార్య, ప్రాణాది విషయాః||

ఆకాశము యొక్క కార్యములు -
1. జ్ఞానము (Knowing)
2. సంకల్పము (The Thought Process)
3. అనుసంధానము (Getting connected to a context or an object)
4. అభిమానం (Sense of ‘I’ and ‘my’)

అంతఃకరణ విషయాలు -
- సమీకరణము (Collecting details).
- ఉన్నయన (Attaching meaning / perceiving).
- గ్రహణము (Interpreting).
- శ్రవణము (Hearing and Relating).

వాయువుయొక్క కార్యము - అద్దాని అంతఃకరణ విషయాలు -
ఉచ్ఛ్వాస, ప్రాణ - అపాన - వ్యాన - ఉదాన - సమానములు.


శబ్దస్పర్శరూపరసగంధా అగ్నికార్యజ్ఞానేంద్రియ-
విషయా అబాశ్రితాః . వచనాదానగమనవిసర్గానందాః
పృథివీకార్యకర్మేంద్రియవిషయాః . కర్మజ్ఞానేంద్రియ-
విషయేషు ప్రాణతన్మాత్రవిషయా అంతర్భూతాః .
మనోబుద్ధ్యోశ్చిత్తాహంకారౌ చాంతర్భూతౌ .
6.) శబ్ద స్పర్శ రూప రస గంధా - అగ్ని కార్యః॥
జ్ఞానేంద్రియ విషయా అబాశ్రితాః॥
వచనా ఆదాన గమన విసర్గ ఆనందాః - పృథివీ కార్యః||
కర్మేంద్రియ విషయాః।
కర్మ జ్ఞానేంద్రియ విషయాః।
ప్రాణ తన్మాత్ర విషయా, అంతర్భూతాః।
మనో బుద్ధ్యోః చిత్త అహంకారౌ చ అంతర్భూతౌ।

అగ్నియొక్క కార్యములు → శబ్ద - స్పర్శ - రూప - రస - గంధములు.
దేహములో ఆశ్రయించి ఉన్నవాటి స్థానములు → చెవులు, చర్మము, కనులు, నాలుక, ముక్కు అనబడు జ్ఞానేంద్రియములు.
పృథివియొక్క కార్యములు → వచనము, ఆదానము, గమనము, విసర్గ, ఆనందము.
వాటియొక్క స్థానములు → నోరు, చేతులు, కాళ్ళు, పాయువు, ఉపస్థ అనబడు కర్మేంద్రియములు.

ఈ విధంగా (5) కర్మేంద్రియములు, (5) జ్ఞానేంద్రియములు, వాటి వాటి విషయములు (5 + 5), పంచప్రాణములు (5), పంచ తన్మాత్రలు (5) … ఇవన్నీ పాంచభౌతిక దేహములో అంతర్భూతమై ఉన్నట్టివి.

మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము → ఇవి దేహములో అంతర్భూతమైయున్న అంతరంగ సూక్ష్మాంశలు.


అవకాశవిధూతదర్శనపిండీఈకరణధారణాః
సూక్ష్మతమా జైవతన్మాత్రవిషయాః .
7.) అవకాశ విధూత దర్శన
పిణ్డీకరణ ధారణాః
సూక్ష్మతమా ఏవ
తన్మాత్ర విషయాః।

సూక్ష్మతమ తన్మాత్ర విషయాలు :
1. అవకాశ 2. విధూత 3. దర్శన 4. పిణీకరణ 5. ధారణ
వీటి విషయాలే శబ్ద స్పర్శ రూప రస గంధ పంచతన్మాత్రలు. ఇవి సూక్ష్మతమ భూత మాత్రలు. (Superlatively Subtle Materialistics).


ఏవం ద్వాదశాంగాని
ఆధ్యాత్మికాన్యాధిభౌతికాన్యాధిదైవికాని . అత్ర
నిశాకరచతుర్ముఖదిగ్వాతార్కవరుణాశ్వ్యగ్నీంద్రోపేంద్ర-
ప్రజాపతియమా ఇత్యక్షాధిదేవతారూపైర్ద్వాదశ-
నాడ్యంతఃప్రవృత్తాః ప్రాణా ఏవాంగాని అంగజ్ఞానం
తదేవ జ్ఞాతేతి .
8.) ఏవం ద్వాదశాంగాని
ఆధ్యాత్మికాని, ఆధిభౌతికాని,
ఆధిదైవికాని।
అత్ర నిశాకర, చతుర్ముఖ,
దిక్, వాతా, అర్క, వరుణా
అశ్వినీ, అగ్ని, ఇంద్ర
ఉపేంద్ర, ప్రజాపతి, యమా
ఇతి అక్ష అధిదేవతా రూపైః ।
ద్వాదశ నాడ్యన్తః ప్రవృత్తాః
ప్రాణాయేవ అంగాని।
అంగ జ్ఞానం తదేవ జ్ఞాతేతి||

ఈ విధంగా 1. ఆధ్యాత్మికములు 2. ఆధి భౌతికములు 3. ఆధి దైవికములు,…
వాటివాటి 1. అంశలు 2. కార్యములు 3. ఇంద్రియ స్థానములు 4. విషయములు

3x4 = 12 - ఇవన్నీ ద్వాదశ (12) అంగములుగా వివరించబడుచున్నాయి.

12 అంగములు విశ్వరచనలో అంతర్భాగములై, సమిష్టిని సమీకరిస్తూ నడుపు 12 దివ్యాంశలు గల ఇంద్ర అధిదేవతలుగా
1. నిశాకరుడు (చంద్రుడు) 2. చతుర్ముఖబ్రహ్మ 3. దిక్ దేవత 4. వాయువు 5. అర్కుడు (సూర్యుడు) 6. వరుణుడు 7. అశ్వనీ దేవతలు 8. అగ్ని 9. ఇంద్రుడు 10. ఉపేంద్రుడు 11. ప్రజాపతి 12. యముడు ప్రవర్తిల్లుచున్నారు.

ఈ 12 అధి దేవతా భౌతిక రూపాలే సుషుమ్న మొదలుగా గల ద్వాదశ (12) నాడులు. వాటిలో గల అఖండమగు ప్రాణశక్తియే (ఏకమే అయి ఉండి) 12 నాడీ నాడీ దేవతా రూపములుగా వెలయుచున్నది. అంతా కూడా ప్రాణతత్త్వమేనని తెలుసుకొనువాడే జ్ఞాన జ్ఞాత. అంగతత్వ జ్ఞాత (తెలుసుకొనువాడు).


అథ వ్యోమానిలానలజలాన్నానాం
పంచీకరణమితి .
జ్ఞాతృత్వం సమానయోగేన శ్రోత్రద్వారా
శబ్దగుణో వాగధిష్ఠిత ఆకాశే తిష్ఠతి ఆకాశస్తిష్ఠతి .
9.) అథ వ్యోమ - అనిల - అనల -
జల - అన్నానాం పంచీకరణం
ఇతి జ్ఞాతృత్వం
సమాన యోగేన
శ్రోత్ర ద్వారా
శబ్దగుణో ‘వాక్’ అధిష్ఠితే,
ఆకాశే తిష్ఠతి ।
ఆకాశః తిష్ఠతి ॥

ఇక్కడ కనబడేదంతా కూడా ఆకాశ - వాయు - అగ్ని - జల - అన్నము (భౌతికానుభవము భూమి - Solid)ల సమ్మేళనమే! ఇదంతా “భూత
పంచీకరణము” - అని చెప్పబడుతోంది.

తెలియబడుచున్నది :  భూత పంచీకరణము.
తెలుసుకొనుచున్నవాడు : ఈయన వేరుగా కేవల-చిదాకాశ రూపుడై ఉండి, సమాన వాయు యోగ బంధముచే శ్రోత్రములచే (చెవుల ద్వారా) శబ్ద గుణ ప్రదర్శము చేయుచున్నాడు. ‘వాక్కు’ నందు అధిష్ఠితుడై, అన్నీ నిర్వర్తిస్తూ ఉన్నాడు. మరొకవైపు ఆకాశస్వరూపుడై ఆకాశమంతా నిండి ఉండి జ్ఞాతృ (తెలియబడు - తెలుసుకొను) ఉభయరూపుడై తిష్ఠించి ఉన్నాడు. వర్తిస్తున్నాడు.


మనోవ్యానయోగేన త్వగ్ద్వారా స్పర్శగుణః పాణ్యధిష్ఠితో
వాయౌ తిష్ఠతి వాయుస్తిష్ఠతి . బుద్ధిరుదానయోగేన
చక్షుర్ద్వారా రూపగుణః పాదాధిష్ఠితోఽగ్నౌ
తిష్ఠత్యగ్నిస్తిష్ఠతి . చిత్తమపానయోగేన జిహ్వాద్వారా
రసగుణ ఉపస్థాధిష్ఠితోఽప్సు తిష్ఠత్యాపస్తిష్ఠంతి .
అహంకారః ప్రాణయోగేన ఘ్రాణద్వారా గంధగుణో
గుదాధిష్ఠితః పృథివ్యాం తిష్ఠతి పృథివీ తిష్ఠతి
య ఏవం వేద . అత్రైతే శ్లోకా భవంతి .
10.) మనో వ్యాన యోగేన ‘త్వక్’ ద్వారా స్పర్శగుణః,
పాణి అధిష్ఠితో వాయౌ తిష్ఠతి,
వాయుః తిష్ఠతి।

బుద్ధిః ఉదాన యోగేన
చక్షుః ద్వారా రూపగుణః
పాదా అధిష్ఠితో అగ్నౌ తిష్ఠతి,
అగ్నిః తిష్ఠతి।

చిత్తమ్ అపాన యోగేన జిహ్వా ద్వారా రసగుణ
ఉపస్థా అధిష్ఠితో అప్సు తిష్ఠతి
ఆపః తిష్ఠతి।

అహంకారః ప్రాణయోగేన ఘ్రాణద్వారా
గన్ద గుణో గుద అధిష్ఠితః,
పృథివ్యాం తిష్ఠతి,
పృథివీ తిష్ఠతి।

ఇతి ఏవం వేద
అత్ర ఏతే శ్లోకా భవంతి ॥

ఆతని మనస్సు వాయు (వ్యాన) యోగముతో చర్మము ద్వారా స్పర్శ గుణము ప్రదర్శించుచున్నది. చిత్ స్వరూపుడగు ఆత్మ - “తెలుసుకొనుచున్నవాడు” రూపుడై, తన చేతులలో ప్రాణశక్తిరూపుడుగా ప్రవేశించి, చేతులను కదల్చుచు క్రియలు నిర్వర్తిస్తున్నాడు.

ఆతడు తన యొక్క బుద్ధి రూప ఉదాన ప్రాణయోగముచే చక్షువుల ద్వారా రూపగుణ యుక్తుడై, కళ్ళు దర్శించేవి కూడా తానే అయి కనబడునదంతా
ఆస్వాదిస్తున్నాడు. అగ్ని స్వరూపుడై పాదములయందు ప్రవేశించి తిష్ఠించుకొని నడకలు ఆస్వాదిస్తున్నారు.

ఆ చిత్ స్వరూపుడు చిత్తము అయి, అపాన యోగముచే జిహ్వ (నాలుక) ద్వారా రసగుణమును కల్పించుకొని, రసాస్వాదనను స్వకీయ తత్త్వముగా ఆస్వాదించుచున్నాడు. రూచి చూచువాడు - పదార్థములో రుచి స్వరూపము కూడా తానే అయి ఉంటున్నాడు. అ చిత్ ఆనందస్వరూపుడు ఉపస్థయందు అధిష్ఠితుడై ఉంటున్నాడు. జలమునందు ప్రవేశించి జలస్వరూపుడై ఉంటున్నారు.

అహంకారము ప్రాణ యోగము యొక్క సంబంధంచేత గంధ గుణము ధరించి పృథివియందు తిష్ఠించి ఉంటోంది. ఈ విధంగా నిర్విషయ బ్రహ్మము నుండి బయల్వెడలిన అహమ్-తత్త్వమే సూక్ష్మ తన్మాత్రలు అయి, ఇటు దేహములలో ఇంద్రియములుగాను, అటు, దివ్యసూక్ష్మదేవతా శక్తి రూపాలుగాను, ఇంకా కూడా బాహ్యమున బ్రహ్మాండములోని పంచభూత(సూక్ష్మతమ) తత్త్వములు, ధర్మములుగాను అగుచూ ఉన్నది

… అని (వేదవాజ్మయముచే) గానము చేయబడుచున్నది.


పృథగ్భూతే షోడశ కలాః స్వార్థభాగాన్పరాన్క్రమాత్ .
అంతఃకరణవ్యానాక్షిరసపాయునభఃక్రమాత్ .. 1..

ముఖ్యాత్పూర్వోత్తరైర్భాగైర్భూతేభూతే చతుశ్చతుః .
పూర్వమాకాశమాశ్రిత్య పృథివ్యాదిషు సంస్థితాః .. 2..

ముఖ్యాదూర్ధ్వే పరా జ్ఞేయా న పరానుత్తరాన్విదుః .
ఏవమంశో హ్యభూత్తస్మాత్తేభ్యశ్చాంశో హ్యభూత్తథా .. 3..

తస్మాదన్యోన్యమాశ్రిత్య హ్యోతం ప్రోతమనుక్రమాత్ .

11.) పృథక్ భూతే షోడశ కలాః
స్వార్థ భాగాన్ పరాన్ క్రమాత్,
అన్తఃకరణ వ్యాన అక్షి రస పాయు నభః క్రమాత్,
ముఖ్యాత్ పూర్వ - ఉత్తరైః భాగైః
భూతే - భూతే చతుః చతుః,
పూర్వమ్ ఆకాశమ్ ఆశ్రిత్య
పృథివి ఆదిషు సంస్థితాః,
ముఖ్యాత్ ఊర్ధ్వే పరా  జ్ఞేయాన్
అపరాన్ ఉత్తరాన్ విదుః
ఏవమ్ అంశో హి అభూత్, తస్మాత్
తేభ్యశ్చ అంశో అభూతః, తథా తస్మాత్ అన్యోన్యమ్
ఆశ్రిత్య హి ఓతం - ప్రోతమ్ అనుక్రమాత్||

పంచప్రాణములు - పంచకర్మ - పంచజ్ఞానేంద్రియములు ఎరుగుచున్నవాడు - షోడశ (16) కళలకు వేరై, విలక్షణమై ఉన్నాడు. ‘బ్రహ్మము’ సర్వప్రకాశకమై ఉన్నది. అట్టి బ్రహ్మమునందు ఆ 16 కళలు - ఒక అర్థ విభాగమునందు ఆరోపితమైయున్న వగుచున్నవి. అంతఃకరణము, ప్రాణము, అక్షి (ద్రష్టత్వము), రస (ఆస్వాదన), పాయు (విసర్జన) ఆకాశ క్రమముగా కనబడుచున్నవాటికి, వేరుగా అని ఉత్తరభాగము (2nd Half)గా ఉన్న అది నాలుగు భాగాలుగా అయి, ఒక్కొక్క భాగమును భూత చతుష్టయంతో చేర్చగా 4x4 చేరి, పంచీకరణము అగుచున్నది.

1) పూర్వ విభాగంలో ‘పృథివి’ మొదలైన బాహ్యమంతా ఉన్నది.
2) ఉత్తరభాగములో సూక్ష్మమగు మనోబుద్ధి చిత్త అహంకార అంతరంగ విభాగము.

దానికి ఆవల కేవల పురుషుడు. అంతరంగ చతుష్టయము అభూతములు (లేక) అభౌతికములు. వాటి అంశలే ఈ జగత్తులో స్థూలముగా కనిపిస్తున్నాయి. వాస్తవానికి ఇక్కడ స్థూలముగా కనిపించేది కూడా సూక్ష్మతత్త్వపు ప్రదర్శనమే. స్థూల స్థూలములు (పాంచభౌతిక దేహ ఇంద్రియ తత్త్వాలు - మనోబుద్ధి చిత్త అహంకారాలు) ఇవన్నీ అనోన్యము ఆశ్రయించి ఓత - ప్రోతమై ఉంటున్నాయి.


పంచభూతమయీ భూమిః సా చేతనసమన్వితా .. 4..

తత ఓషధయోఽన్నం చ తతః పిండాశ్చతుర్విధాః .
రసాసృఙ్మాంసమేదోఽస్థిమజ్జాశుక్రాణి ధాతవః .. 5..

కేచిత్తద్యోగతః పిండా భూతేభ్యః సంభవాః క్వచిత్ .

12.) పంచభూతమయా భూమిః
సా చేతన సమన్వితా।
తత ఓషధయో అన్నం చ
తతః పిణ్డాః చతుర్విధాః।
రసా - సృక్ - మాంస
మేదో - అస్తి - మజ్జా - శుక్లాని ధాతవః॥
కేచిత్ తత్ యోగతః
పిణ్డా భూతేభ్యః
సంభవాః క్వచిత్||

ఈ స్థూలంగా కనిపిస్తున్న భూమి - తదితర భౌతికాంశములు (అనగా) "ఆకాశ - వాయు అగ్ని - జలముల ఘనీభూత (స్థూలముల) సంపుటీకరణయే! పాంచభౌతికమయమగు ఈ భూమి అచేతనం కాదు. చేతనముతో కూడుకొని సచేతనమే అయి ఉన్నది.

అట్టి భూమినుండి చైతన్యవంతమగు ఓషధులు పుట్టుచున్నాయి. సచేతనమగు ఓషధుల నుండి ‘అన్నము’ ఉద్భవిస్తోంది.

అట్టి అన్నము నుండి సచేతనములగు అండజ, జరాయుజ (గర్భము నుండి), స్వేదజ (చమట జలము నుండి), ఉద్భిజ (విత్తులనుండి) చతుర్విధ ప్రాణులు పుట్టుచున్నారు.

“అన్న చైతన్యము” నుండియే రసము, రక్తము, మాంసము, మేదస్సు అస్తి (బొమికలు), మజ్జ, శుక్లము… అనే చైతన్యముతో కూడిన ధాతువులు జనిస్తున్నాయి.

కొందరు “అదేమీ లేదు. శుక్ల - శోణితములు సంయోగము చేతనే ప్రాణులు పుట్టుచున్నారు కదా!” అని అభిప్రాయపడుచున్నారు. (అది సరికాదు). ఈ ప్రాణులకు సంబంధించిన ’అన్నమయ పిండము…. దేహములకు నాభి మండల - మధ్యస్థమై సంస్థితము అగుచున్నది.


తస్మిన్నన్నమయః పిండో నాభిమండలసంస్థితాః .. 6..

అస్య మధ్యేఽస్తి హృదయం సనాలం పద్మకోశవత్ .
సత్త్వాంతర్వర్తినో దేవాః కర్త్రహంకారచేతనాః .. 7..

అస్య బీజం తమఃపిండం మోహరూపం జడం ఘనం .
వర్తతే కంఠమాశ్రిత్య మిశ్రీభూతమిదం జగత్ .. 8..

ప్రత్యగానందరూపాత్మా మూర్ధ్ని స్థానే పరే పదే .
అనంతశక్తిసంయుక్తో జగద్రూపేణ భాసతే .. 9..

13.) తస్మిన్ ను అన్నమయః పిణ్డో
నాభిమండల సంస్థితః
అస్య మధ్యే అస్తి హృదయం।
స నాళం పద్మకోశవత్
సత్త్వా అన్తర్వర్తినో దేవాః
కర్తృ - అహంకార చేతనాః।
అస్య బీజం తమః పిణ్డం
మోహరూపం జడం ఘనమ్,
వర్తతే కంఠమ్ ఆశ్రిత్య
మిశ్రీభూతమ్ ఇదమ్ జగత్।
ప్రత్యక్ - ఆనన్ద రూపాత్మా
మూర్ద్ని స్థానే పరం పదే
అనన్త శక్తి సంయుక్తో
‘జగత్’ రూపేణ భాసతే॥

ఈ ప్రాణులయందు ‘అన్నమయ పిండము’ దేహముయొక్క నాభిప్రదేశ ఆకాశంలో మధ్యగా (నాభిమండలమునందు) సంస్థితమైయున్నది. అట్టి నాభి ప్రదేశ దేహాకాశంలో పద్మకోశము వలె - ‘హృదయము’ నాళములతో కూడి ఉన్నది.

అట్టి హృదయకోశమును ఆశ్రయించి ఇంద్రియాధిష్ఠాన దేవతలు, కర్తృత్వభావనలు, అహంకార భావనలు - మొదలైన భావనా ప్రదర్శన పరంపరలు సచేతనములై పరిఢవిల్లుచున్నాయి. దేవతలు అంతర్వర్తులై వెలయుచున్నారు.

అట్టి హృదయ కోశము-మనస్సుకు బీజ (జనన) స్థానము. మూలకారణము. మనస్సు మోహ రూపము. జడము. అజ్ఞానముతో కూడుకొనిన "తమో పిండ (జీవాత్మ), తమోచైతన్య రూపము. ఇదంతా మనస్సే. అట్టి మనస్సు కంఠ ప్రదేశమును ఆశ్రయించి ఉంటోంది. కేవల మనో ఛైత్యము-అజ్ఞానముతో కూడిన మననముతో మిశ్రమమై ఈ జగత్ రూపానుభవముగా అగుచున్నది. మనోమయ పురుషుడే (రూపుడే) ఈ జీవుడు.

మూర్ద్ని స్థానములో ప్రత్యక్ - ఆనందరూపుడగు జీవాత్మ చైతన్య రూప ప్రదర్శితుడై ఉన్నాడు. ఆ జీవాత్మ చైతన్యమును తనయొక్క స్వప్రదర్శనముగా కలిగియున్న పరమాత్మ పరమపదమగు మూర్ధ్ని (శీర్ష) స్థానమునందు ప్రకాశమానులై ఉన్నారు.

ఆ పరమపదస్థాన పరమ చైతన్య స్వరూపుడు అనంత శక్తి సంయుతుడై జీవ-హృదయ-ఇంద్రియ-దృశ్య-చైతన్య స్వరూపుడై జగత్ రూపముగా కూడా భాసిస్తున్నారు.


సర్వత్ర వర్తతే జాగ్రత్స్వప్నం జాగ్రతి వర్తతే .
సుషుప్తం చ తురీయం చ నాన్యావస్థాసు కుత్రచిత్ .. 10..

సర్వదేశేష్వనుస్యూతశ్చతూరూపః శివాత్మకః .
యథా మహాఫలే సర్వే రసాః సర్వప్రవర్తకాః .. 11..

తథైవాన్నమయే కోశే కోశాస్తిష్ఠంతి చాంతరే .
యథా కోశస్తథా జీవో యథా జీవస్తథా శివః .. 12..

సవికారస్తథా జీవో నిర్వికారస్తథా శివః .
కోశాస్తస్య వికారాస్తే హ్యవస్థాసు ప్రవర్తకాః .. 13..

యథా రసాశయే ఫేనం మథనాదేవ జాయతే .
మనో నిర్మథనాదేవ వికల్పా బహవస్తథా .. 14..

14.) సర్వత్ర వర్తతే జాగ్రత్|
స్వప్నం జాగ్రతి వర్తతే
సుషుప్తం చ తురీయం చ
న అన్య అవస్థాసు కుత్రచిత్
సర్వ దేశేషు అనున్యూతః
చతూరూపః శివాత్మకః

యథా మహాఫలే సర్వే
రసాః సర్వ ప్రవర్తకాః
తథైవా అన్నమయే కోశే
కోశాః తిష్ఠన్తి చ అన్తరే!

యథా కోశః తథా జీవో,
యథా జీవః తథా శివః
సవికారః తథా జోవో,
నిర్వికారః తథా శివః|


కోశాః తస్య వికారాః
తే హి అవస్థాసు ప్రవర్తకాః|

యథా రసాశయే ఫేనం
మధనాత్ ఏవ జాయతే
మనో నిర్మథనాత్ ఏవ
వికల్పా బహవః తథా|

పరమాత్మ చైతన్యము నుండియే ‘ద్రష్ట (లేక) జీవుడు’ అని చెప్పబడు జీవాత్మ చైతన్యము బయల్వెడలుతోంది. ఆ పర చైతన్యమే జాగ్రత్ చైతన్యముగా అగుచున్నది. జాగ్రత్ అంతటా నిండి ఉండి, జీవ చైతన్య రూపముగా స్వకీయ జాగ్రత్ చైతన్యమును ఆస్వాదిస్తోంది.
జాగ్రత్‌కు ఆవల “స్వప్న చైతన్యము స్వప్న ద్రష్ట, స్వప్న దృశ్యము”ల రూపముగా కూడా ఆ కూటస్థ చైతన్యమే ప్రకాశమానమగుచున్నది. దానికి ఆవల సుషుప్తి. ఆపై తురీయము. జాగ్రత్-స్వప్న - సుషుప్తి - తురీయములగు చతురవస్థలకు వేరుగా మరే అవస్థా లేదు. ఆత్మ ఆ చతురవస్థలను తనకు తానే వినోదంగా కల్పించుకొనుచున్నది. విరమించుకొనుచున్నది కూడా! ప్రత్యగాత్మయే జాగ్రత్ - స్వప్న - సుషుప్తులలో అంతటా సంచారములు చేస్తూ తురీయమై, ఆ తురీయత్వమునకు సాక్షిగా కూడా వెలయుచున్నారు.

ఏవిధంగా అయితే ఒక ఫలమునందు (In a Fruit) రసము అంతటా వ్యాపించి, నిండినదై ఉన్నదో, ఆ రీతిగా అన్నమయ కోశమునందు ప్రాణమయకోశము అంతరముగా విస్తరించి స్థితించియున్నది. అట్లాగే ప్రాణమయ కోశమునందు మనోమయకోశము, మనోమయకోశమునందు విజ్ఞానమయకోశము, విజ్ఞానమయకోశమునందు, ఆనందమయ కోశముల విషయం కూడా! ఫలములో అంతటా రసము ఉండి రసమయమై ఉన్నట్లే… పంచకోశములలో జీవుడు, జీవునిలో సర్వాత్మకుడగు శివుడు రసపూరితం చేస్తూ వేంచేసియున్నారు. నిండి ఉన్నారు.

వాస్తవానికి జీవుడు - శివుడు ఏక చైతన్య స్వరూపులే. వేరు వేరు కాదు. సవికారమగు చైతన్యమును జీవుడు అని, నిర్వికార చైతన్యమును శివుడు అని… చెప్పుకుంటున్నాము.


పంచకోశములు, వాటి యొక్క వికారములు… ఇవియే జాగ్రత్ - స్వప్న సుషుప్తి - తురీయావస్థలుగా ప్రవర్తమానమగుచున్నాయి.

కుంకుడుకాయ రసమునకు వాటికి జలముచేర్చి, రెండు చేతులుతో నలుపుచున్నప్పుడు నురుగు బయల్వెడలుచున్నది చూచావా! అదే రీతిగా, మనస్సును నలుపుటచే సంకల్పములు బయల్వెడలుచున్నాయి. ఆ సంకల్పములనుండి అనేక వికల్పములు (విశేషేణ - కల్పన పరంపరానామ్) ప్రదర్శనమగుచున్నాయి. సంకల్పములకు ఆవల శివుడు - సంకల్పములకు ఈవల జీవుడు ఈ రెండు అఖండ ఏక చైతన్య స్వరూపములే! పరస్పరము అద్వితీయులే!


కర్మణా వర్తతే కర్మీ తత్త్యాగాచ్ఛాంతిమాప్నుయాత్ .
అయనే దక్షిణే ప్రాప్తే ప్రపంచాభిముఖం గతః .. 15..

అహంకారాభిమానేన జీవః స్యాద్ధి సదాశివః .
స చావివేకప్రకృతిసంగత్యా తత్ర ముహ్యతే .. 16..

నానాయోనిశతం గత్వా శేతేఽసౌ వాసనావశాత్ .
విమోక్షాత్సంచరత్యేవ మత్స్యః కూలద్వయం యథా .. 17..

తతః కాలవశాదేవ హ్యాత్మజ్ఞానవివేకతః .
ఉత్తరాభిముఖో భూత్వా స్థానాత్స్థానాంతరం క్రమాత్ .. 18..

మూర్ధ్న్యాధాయాత్మనః ప్రాణాన్యోగాభ్యాసం స్థితశ్చరన్ .

15.) కర్మణా వర్తతే కర్మీ,
తత్ త్యాగాత్ శాంతిమ్ ఆప్నుయాత్|
అయనే దక్షిణే ప్రాప్తే
ప్రపంచ అభిముఖం గతః |
అహంకార - అభిమానేన జీవస్య
అద్ధి సదాశివః।
స చ అవివేక ప్రకృతిః
సంగత్యా తత్ర ముహ్యతే!
నానా యోని శతం గత్వా
శతేఽసౌ వాసనా వశాత్|
విమోక్షాత్ సన్చరతి ఏవ
మత్స్యః కూల ద్వయం యథా।
తతః కాలవశాత్ ఏవ హి
ఆత్మజ్ఞాన వివేకతః
ఉత్తర - అభిముఖో భూత్వా
స్థానాత్ స్థానాన్తరం క్రమాత్,
మూర్ధ్న్య ఆధాయ ఆత్మనః ప్రాణాన్
యోగాభ్యాసస్థితః చరన్!

మనస్సు నుండి జనించుచున్న మనన - సంకల్పములచే కర్మల స్వభావము బయల్వెడులుతోంది. అనగా “అది ఇది నిర్వర్తించాలి" అనే రూపంగా - బయల్వెడలుచున్నది. కర్మలు మరి కొన్ని కర్మపరంపలకు దారి తీస్తున్నాయి.

మనన రూపమగు మనస్సు శమిస్తే సంకల్పము శమిస్తుంది. వాటితోబాటు కర్మలు శమించి, ఈ జీవుడు శాంతిని పొందుచున్నాడు. శివ స్వరూపుడై శేషించుచున్నాడు.

మనస్సు సంకల్పముల పరంపరలచేత దక్షిణంగా ప్రపంచాభిముఖముగా అయినప్పుడు, శివుడే జీవుడుగా బద్ధుడై దుఃఖభాగి అగుచున్నాడు. అనగా, ’జీవుడు’ అయి కన్పట్టుచున్నాడు. స్వతఃగా సదాశివ స్వరూపుడే అయి ఉండి కూడా, అహంకారము - దృశ్యమును అభిమానించటముచే ‘జీవుడు’గా అగుచున్నాడు. అవివేకమును స్వీకరించి స్వకీయమగు ప్రకృతియందు ప్రవేశించి, సంగము పొంది మోహమును పొందుచున్నాడు. మోహముచే అనేక యోనులలో ప్రవేశ-నిష్క్రమణములు చేస్తూ, వందలాది -వేలాది వాసనలను పెంపొందించుకుంటూ, వాటికి వశుడై ‘నేను జీవుడను, జీవబద్ధుడను’… అను భావనకు, దర్శనముకు బద్ధుడై, పరిమితత్వమును ఆపాదించుకొని దుఃఖితుడు, నిబద్ధుడు అగుచున్నాడు.

పెద్ద సొరచేప నదీజలంలో ఈ వడ్డు నుండి ఆ వడ్డుకు, అటునుంచి ఇటు తిరుగాడు విధంగా దృశ్యపరంపరలలో తిరుగాడుచున్నాడు. ఒకానొకప్పుడు కాలవశంగా ఆత్మజ్ఞాన వివేకము సంపాదించుటకున్నప్పుడు కర్మ బంధములను త్రెంచుకొని మోక్షాత్ముడగుచున్నాడు. ఉత్తరాభిముఖుడై, యోగశాస్త్రములో సూచించురీతిగా మూలాధారము నుండి సహస్రారము వరకు ఉత్తరోత్తర స్థానములను సముపార్జించుకుంటూ యోగాభ్యాసి అయి, ప్రాణములను సుషుమ్నామార్గంగా సహస్రారమునకు చేర్చుచున్నాడు.జీవాత్మను సహస్రార సంస్థితమైన పరమాత్మయందు ఏకముచేసి “పరబ్రహ్మాత్మస్వరూపుడు” అగుచున్నాడు.


యోగాత్సంజాయతే జ్ఞానం జ్ఞానాద్యోగః ప్రవర్తతే .. 19..

యోగజ్ఞానపరో నిత్యం స యోగీ న ప్రణశ్యతి .
వికారస్థం శివం పశ్యేద్వికారశ్చ శివేన తు .. 20..

యోగప్రకాశకం యోగైర్ధ్యాయేచ్చానన్య భావనః .

16.) యోగాత్ సంజాయతే జ్ఞానం।
జ్ఞానాత్ యోగః ప్రవర్తతే
యోగజ్ఞాన పరో నిత్యం
సయోగీ న ప్రణశ్యతి|
వికారాస్తం శివం పశ్యేత్,
వికారశ్చ శివే న తు।
యోగ ప్రకాశకం యోగైః
ధ్యాయేత్ చ అనన్య భావనః।

యోగ మార్గం గొప్పదా? జ్ఞానమార్గము గొప్పదా? అని ప్రశ్నిస్తే…. యోగాభ్యాసముచే జ్ఞానము ప్రవృద్ధమౌతోంది. జ్ఞానముచే యోగము ప్రవర్తమానమగుచున్నది.

కనుక ఎవ్వడైతే యోగ-జ్ఞానపరుడై ఉంటాడో, అట్టి యోగి ఇక దక్షిణాభిముఖుడవడు. ఇంద్రియవిషయములలో పడడు. ఆతనికి దృశ్యములో ప్రణశ్యత్వము ఉండదు. యోగ-జ్ఞానముల అభేదదర్శనమే సత్యదర్శనము.


ఓ త్రిశిఖా!
“దృశ్య వికారములకు ఆవల సర్వాత్మకుడై పరమ శివుడు (శివము) స్వస్వరూపుడై వేంచేసి ఉన్నారు” అను దృష్టిని యోగి సముపార్జించుకోవాలి. వికారముల దృష్టి (ఇవి సత్యమే అనే భావన) కొనసాగునంతవరకు శివము అనుభవమునకు రాదు. (దేహాకార-శవ-భౌతిక భావాలే కొనసాగుతాయి). యోగాభ్యాసముచే యోగస్థితి (సంయోగ - వియోగాతీత స్థానము) ప్రకాశమానమౌతుంది. అట్టి యోగాభ్యాసముచే ఒనగూడిన యోగరూప భావనచే అనన్యభావము (శివునకు వేరై ఏదీ లేదు. నీకు నాకు శివుడు అన్యుడు కాదు అను అవగాహన) పెంపొందుచున్నది.


యోగజ్ఞానే న విద్యేతే తస్య భావో న సిద్ధ్యతి .. 21..

తస్మాదభ్యాసయోగేన మనఃప్రాణాన్నిరోధయేత్ .
యోగీ నిశితధారేణ క్షురేణైవ నికృంతయేత్ .. 22..

శిఖా జ్ఞానమయీ వృత్తిర్యమాద్యష్టాంగసాధనైః .

17.) యోగ జ్ఞానే న విద్యేతే,
తస్య భావో న సిద్ధ్యతి।
తస్మాత్ అభ్యాస యోగేన
మనః ప్రాణాః నిరోధయేత్||
యోగీ నిశితధారేణ
క్షురేణేవ నికృన్తయేత్,
శిఖా ప్రాణమయీ వృత్తిః
‘యమ’ ఆది అష్టాంగ సాధనైః||
యోగ జ్ఞానములను ఆశ్రయించకపోతే ‘నేను జీవ బద్ధుడను’ అను జాడ్య భావము తొలగదు. శివ భావన అంకురించదు. రూపు దిద్దుకోదు.

అందుచేత ఓ త్రిశిఖా! ఈ జీవుడు అభ్యాసయోగమును ఆశ్రయించాలి. మనో - ప్రాణములను నిరోధించి, స్వ-వశము చేసుకోవాలి. ఒక పదునైన కత్తితో పిచ్చి ముళ్ళ చెట్లను - ఖండించి - పీకి వేయు విధంగా యోగి ‘తీవ్రమైన యోగాభ్యాసము’ అనే పదునైన కత్తితో దృశ్య-బంధ సంబంధితమైన సంకల్పములను సమూలంగా నశింపజేయాలి.

యమము-నియమము-ఆసనము-ప్రాణాయామము-ప్రత్యాహారము-ధ్యానము-ధారణ-సమాధి… అని చెప్పబడు అష్టాంగ యోగ సాధనలచే ప్రాణశక్తి - సహాయంతో వృత్తిని ఆత్మదర్శనమందు నియమించటమే …  ’శిఖ’ లేక ‘యోగశిఖ’.


జ్ఞానయోగః కర్మయోగ ఇతి యోగో ద్విధా మతః .. 23..

క్రియాయోగమథేదానీం శ్రుణు బ్రాహ్మణసత్తమ .
అవ్యాకులస్య చిత్తస్య బంధనం విషయే క్వచిత్ .. 24..

యత్సంయోగో ద్విజశ్రేష్ఠ స చ ద్వైవిధ్యమశ్నుతే .
కర్మ కర్తవ్యమిత్యేవ విహితేష్వేవ కర్మసు .. 25..

బంధనం మనసో నిత్యం కర్మయోగః స ఉచ్యతే .

18.) ‘జ్ఞానయోగః - కర్మయోగః’
ఇతి యోగో ద్విధామతః॥

క్రియా యోగమ్ అథ ఇదానీం
శృణు, బ్రాహ్మణ సత్తమ!

అవ్యాకులస్య చిత్తస్య
బన్ధనమ్ విషయే క్వచిత్,

యత్ సంయోగో, ద్విజశ్రేష్ఠ
స చ ద్వైవిధ్యమ్ అశ్నుతే!

కర్మ కర్తవ్యమ్ - ఇత్యేవ విహితేష్వేవ కర్మసు,
బన్ధనం మనసో నిత్యం
కర్మయోగః స ఉచ్యతే|

‘యోగము’ అనునది 1. జ్ఞానయోగము 2. కర్మయోగము అని రెండు … విధములుగా విభజించి సూచించబడుచున్నది.

ఓ బ్రాహ్మణ సత్తమా! త్రిశిఖీ! ముందుగా ‘క్రియాయోగము’ గురించి మనము చెప్పుకుంటున్నాము. వినండి!

ఈ చిత్తము అనేక విషయములలో ప్రవేశించుచూ వ్యాకులత (worry) పొందినదై ఉంటోంది. అట్టి చిత్తమును వ్యాకులతలనుండి ఈవలకి తెచ్చి, ఏదో ఒకే ఒక్క విషయమునకు మాత్రమే ముడిపెట్టి - సంబంధమును కలిగించి ఉంచటము “యోగము”నకు సంబంధించిన అభ్యాసము.

ఓ ద్విజశ్రేష్ఠా! ఆవిధంగా చిత్తమును అనేకముల నుండి ఉపసంహరిస్తూ, ఏకాగ్రము చేయనంతవరకు ‘ద్వైవిధ్యము’ … అని అంటారు. అది లేకపోవటమే యోగము.

ఈ జీవుడు “ఇది నాకు నియమించబడిన కర్తవ్యము" అను అవగాహనతో విహిత-విద్యుక్త ధర్మములను (కర్మలకు) నిర్వర్తించును గాక! మనస్సును విద్యుక్త విహిత ధర్మములకు మాత్రమే కట్టి ఉంచి, ఉపాసనా పూర్వకంగా నిర్వర్తించటము…., ‘కర్మయోగము’ అని పిలువబడుతోంది. (అవిహితము - ఇంద్రియ ప్రియము అగు కర్మలను తగ్గించటము కూడా కర్మయోగ విభాగమే!)


యత్త చిత్తస్య సతతమర్థే శ్రేయసి బంధనం .. 26..

జ్ఞానయోగః స విజ్ఞేయః సర్వసిద్ధికరః శివః .
యస్యోక్తలక్షణే యోగే ద్వివిధేఽప్యవ్యయం మనః .. 27..

స యాతి పరమం శ్రేయో మోక్షలక్షణమంజసా .

19.) యత్తు చిత్తస్య సతతం
అర్థే శ్రేయసి బస్ధనమ్,
జ్ఞానయోగః స విజ్ఞేయః
సర్వ సిద్ధికరః శివః
యస్య ఉక్తలక్షణే యోగే
ద్వివిధేఽపి అవ్యయం మనః,
సయాతి పరమం శ్రేయో
మోక్ష లక్షణమఞ్జసా।

ఈ చిత్తమును ఎల్లవేళలా శ్రేయోమార్గములగు పురుషార్థములకు బంధించి (మరొకవైపు పోకుండా) ఉంచటమును ‘జ్ఞానయోగము’ అంటారు. ధర్మార్థ కామ మోక్షముల పవిత్ర ఆశయములచే జ్ఞానయోగము సిద్ధిస్తోంది. అట్టి జ్ఞానయోగము - తెలుసుకోవలసినది తెలియబడుచూ సర్వసిద్ధికరము, ఈ జీవునిపట్ల మంగళప్రదము అగుచున్నది.

“కర్మయోగము - జ్ఞానయోగము"…. ఈ రెండూ పరస్పరము ఉక్త లక్షణములు కలిగి యున్నాయి. ఒకదానిచే రెండవది స్వభావంగా వృద్ధిపొందుతోంది. (లేక) ఒకదానిపట్ల అశ్రద్ధచే రెండవది బలహీనము అగుచున్నది. అవి రెండు విధములుగా కనబడుచున్నప్పటికీ ఒకే మనో సంలగ్నత కలిగియున్నవి. ఎవ్వని మనస్సు ఆ రెండిటియందు ఒకేసారి ఒకే తీరుగా సంలగ్నమై ఉంటుందో, ఆతడు మోక్ష లక్షణ సంపదను త్వరత్వరగా పొందగలడు.


దేహేంద్రియేషు వైరాగ్యం యమ ఇత్యుచ్యతే బుధైః .. 28..

అనురక్తిః పరే తత్త్వే సతతం నియమః స్మృతః .
సర్వవస్తున్యుదాసీనభావమాసనముత్తమం .. 29..

జగత్సర్వమిదం మిథ్యాప్రతీతిః ప్రాణసంయమః .
చిత్తస్యాంతర్ముఖీభావః ప్రత్యాహారస్తు సత్తమ .. 30..

చిత్తస్య నిశ్చలీభావో ధారణా ధారణం విదుః .
సోఽహం చిన్మాత్రమేవేతి చింతనం ధ్యానముచ్యతే .. 31..

ధ్యానస్య విస్మృతిః సమ్యక్సమాధిరభిధీయతే .

20.) దేహ-ఇంద్రియేషు వైరాగ్యం
‘యమ’ ఇతి ఉచ్యతే బుధైః|

అనురక్తిపరే తత్త్వే సతతం
‘నియమ’ స్మృతః |

సర్వవస్తుని ఉదాసీన భావమ్
‘ఆనసమ్’ ఉత్తమమ్’|

జగత్ సర్వం ఇదమ్ మిథ్యా
ప్రతీతిః ‘ప్రాణ సంయమః’ |

చిత్తస్య అంతర్ముఖీ భావః
ప్రత్యాహారః తు, సత్తమ!

చిత్తస్య నిశ్చలీ భావో
ధారణా - ఆధారణం విదుః।

‘సోఽహం చిన్మాత్ర మేవ’ ఇతి
చిన్తనమ్ ‘ధ్యానమ్’ ఉచ్యతే॥

ధ్యానస్య విస్మృతిః సమ్యక్
‘సమాధిః’ అభిధీయతే॥

అష్టాంగయోగాలు :-

యమము :  దేహ - ఇంద్రియ - ఇంద్రియ విషయములపట్ల రాగరహితంగా విరాగియై ఉండటము - యమము.

నియమము : పరతత్త్వమునందు అనురక్తి కలిగి ఉండటము - నియమము.

ఆసనమ్ : సర్వ దృశ్య సంబంధమైన లౌకిక విషయాలపట్ల కూడా ‘ఉదాసీనత్వము’ వహించి ఉండటమే ఆసనము! ఉత్తమాసనము యొక్క పరాకాష్ఠ

ప్రాణసంయమము : "ఈ కనబడే జగత్తంతా కూడా మనము చదువుచున్న కథలోని విశేషములవంటివి మాత్రమే! కనుక వస్తుదృష్టిగా చూస్తే మిధ్యయే! సహజరూపముగా బ్రహ్మమే… అను ఉపాసనయే ‘ప్రాణ సంయమము’.

ప్రత్యాహారము : చిత్తము బాహ్య విషయములను బాహ్యముననే త్యజించి, తనయందు - అంతర్ముఖ దృష్టిని పెంపొందించుకొనుచూ, తదితరులనందరినీ తనయందే తన స్వరూపంగా చూస్తూ, “అంతర్ముఖి” అయి ఉండటమును “ప్రత్యాహారము” అని అంటారు.

ధారణ : చంచలమై ఉంటున్న ఈ చిత్తమును నిశ్చలము చేయు ప్రయత్నమే ధారణాధారణ (ధారణ యొక్క ఆధారణ).

ధ్యానము : “సర్వత్రా వెలుగొందుచున్న సత్ - చిన్మాత్రమే నేను! కేవల ఎరుకతో కూడిన తేజో రూపమే నేను! అట్టి నేను దృశ్య - దేహ - మనో - బుద్ధి - చిత్త - అహంకారాదులకు, సంబంధితుడను కాను. బద్ధుడను కాను!” అను రూపము గల చిన్తన ధ్యానము.

సమాధి : ఇక ఆపై “నేను ధ్యానము - ఇది ధ్యానించబడునది”… అనే ద్విత్వమును దాటివేసి, ఆ రెండిటిని విస్మరించివేసిన “సమ్యక్ - సమాధాన స్థితి” ‘సమాధి’.


అహింసా సత్యమస్తేయం బ్రహ్మచర్యం దయార్జవం .. 32..

క్షమా ధృతిర్మితాహారః శౌచం చేతి యమాదశ .
తపఃసంతుష్టిరాస్తిక్యం దానమారాధనం హరేః .. 33..

వేదాంతశ్రవణం చైవ హ్రీర్మతిశ్చ జపో వ్రతం .. ఇతి .

21.) అహింసా సత్యమ్ అస్తేయమ్
బ్రహ్మచర్యం దయా ఆర్జవమ్
క్షమా ధృతిః మితాహారః
శౌచం చ ఇతి
‘యమా’ దశ॥

తపః సన్తుష్టిః ఆస్తిక్యమ్
దానం ఆరాధనం హరేః
వేదాన్త శ్రవణం హ్రీః చ
జప ఇత్యాది ‘నియమా’ లక్షణమ్||

యమము యొక్క అంగములు :-
1. అహింస (తదితరులకు బాధకలిగించక, సంతోషము కలుగజేయటము) 2. సత్యము 3. అస్తేయమ్ - ఇతరుల సొమ్ము ఆశించకపోవటం 4. బ్రహ్మచర్యము (బ్రహ్మమునందే చరించుచున్న అవగాహన - అంతేగాని, ఇంద్రియ ప్రపంచమున కాదు) 5. దయ6. ఆర్జవమ్ (ఆశయము - చెప్పునది-చేయునది… ఏకరూపమై ఉండటము) 7. క్షమ (ఇతరుల తప్పులు సహించటం) 8. ధృతి (ఉత్తమ ఆశయముతో కూడిన పట్టుదల) 9. మితాహారము 10. శుచి అయిన భావాలు, ప్రవర్తనలు.

నియమము యొక్క అంగములు :-
1. తపస్సు (తపనయే తపస్సు) 2. సన్తుష్టిః (లభించినదానితో తృప్తి) 3. ఆస్తిక్యము (ఈ దేహము, గొంతు ఇవన్నీ ఇచ్చిన పరమాత్మను గుర్తెరగటం). 4. దానము 5. భగవత్ - ఆరాధనము 6. వేదాంత శ్రవణము 7. మహనీయుల మహనీయత్వము గుర్తు చేసుకొంటూ తన తప్పులు గుర్తించటము (8) హ్రీ - సిగ్గు (9) జపము మొదలైనవి - నియమము యొక్క అంగములు.


ఆసనాని తదంగాని స్వస్తికాదీని వై ద్విజ .. 34..

వర్ణ్యంతే స్వస్తికం పాదతలయోరుభయోరపి .
పూర్వోత్తరే జానునీ ద్వే కృత్వాసనముదీరితం .. 35..

సవ్యే దక్షిణగుల్ఫం తు పృష్ఠపార్శ్వే నియోజయేత్ .
దక్షిణేఽపి తథా సవ్యం గోముఖం గోర్ముఖం యథా .. 36..

ఏకం చరణమన్యస్మిన్నూరావారోప్య నిశ్చలః .
ఆస్తే యదిదమేనోఘ్నం వీరాసనముదీరితం .. 37..

22.) ఆసనాని తత్ అంగాని
‘స్వస్తికా’ ఆదీని వై, ద్విజ! వర్ణ్యంతే|

స్వస్తికం - పాదతలయోః ఉభయోరపి,
పూర్వ-ఉత్తరే జానునీ ద్వే కృత్వా ఆసనమ్ ఉదీరితమ్|

సవ్యే దక్షిణ గుల్ఫం తు పృష్ఠ పార్శ్వే నియోజయేత్,
దక్షిణేఽపి తథా సవ్యం ‘గోముఖమ్’ గోముఖమ్ యదా।

ఏకం చరణమ్, అన్యస్మిన్ ఊరావ ఆరోప్య నిశ్చలః
ఆస్తే యది దమేన ఓష్నుం
‘వీరాసనమ్’ ఉదీరితమ్||

ద్విజోత్తమా! స్వస్తికము మొదలైన అంగనియమ రూపక ఆసనముల గురించి వినండి!

స్వస్తికాసనము :  కుడిపాదము - ఎడమకాలి పిక్క - తొడల మధ్యగాను, ఎడమపాదమును - కుడికాలి పిక్కతొడల - మధ్యగాను ఉంచి (బాసిపీట వేసుకొని) కూర్చుని ఉండటము.

గోముఖాసనము : గోవు కూర్చుని ఉండు తీరుగా, నడుము క్రిందగల కటి (మొల) ప్రదేశమునకు క్రిందుగా ఎడమకాలి మడమను కుడిప్రక్కగాను, కుడికాలి మడమను ఎడమ ప్రక్కగాను ఉంచి, మోకాలి మీద మోకాలిని తాకి - నొక్కి ఉంచి, ధ్యాసను భ్రూమధ్యముగా నిలిపి ఉంచటము.

వీరాసనము :  కుడి తొడ క్రింద ఎడమ పాదమును, ఎడమ తొడక్రింద కుడి పాదమును ఆనించి దేహమును శిరస్సును సమముగా, నిఠారుగా నిలిపి ఉంచటము.


గుదం నియమ్య గుల్ఫాభ్యాం వ్యుత్క్రమేణ సమాహితః .
యోగాసనం భవేదేతదితి యోగవిదో విదుః .. 38..

ఊర్వోరుపరివై ధత్తే యదా పాదతలే ఉభే .
పద్మాసనం భవేదేతత్సర్వవ్యాధివిషాపహం .. 39..

పద్మాసనం సుసంస్థాప్య తదంగుష్ఠద్వయం పునః .
వ్యుత్క్రమేణైవ హస్తాభ్యాం బద్ధపద్మాసనం భవేత్ .. 40..

పద్మాసనం సుసంస్థాప్య జానూర్వోరంతరే కరౌ .
నివేశ్య భూమావాతిష్ఠేద్వ్యోమస్థః కుక్కుటాసనః .. 41..

కుక్కుటాసనబంధస్థో దోర్భ్యాం సంబధ్య కంధరం .
శేతే కూర్మవదుత్తాన ఏతదుత్తానకూర్మకం .. 42..

పాదాంగుష్ఠౌ తు పాణిభ్యాం గృహీత్వా శ్రవణావధి .
ధనురాకర్షకాకృష్టం ధనురాసనమీరితం .. 43..

సీవనీం గుల్ఫదేశాభ్యాం నిపీడ్య వ్యుత్క్రమేణ తు .
ప్రసార్య జానునోర్హస్తావాసనం సింహరూపకం .. 44..

23.) గుదం నియమ్య గుల్ఫాభ్యాం
వ్యుత్రమేణ సమాహితః
యోగాసనం భవేత్ ఏతత్
ఇతి యోగవిదో విదుః|

ఊర్వోః ఉపరివై ధత్తే
యదా పాదతలే ఉభే,
పద్మాసనం భవేత్ ఏతత్
సర్వ వ్యాధి విషాపహమ్।

పద్మాసనం తు సంస్థాప్య
తత్ అంగుష్ఠ ద్వయం పునః।
వ్యుత్రమేణైవ హస్తాభ్యాం
బద్ధ పద్మాసనం భవేత్||

పద్మాసనం సుసంస్థాప్య
జానూః ఊర్వోః అన్తరే కరౌ,
నివేశ్య భూమా వాతిష్టేత్
వ్యోమస్థః ‘కుక్కటాసనః’|

కుక్కుటాసన బస్థస్థో
దోర్భ్యాం సంబధ్య కన్దరమ్, శేతే కూర్మవత్ ఉత్తాన
ఏతత్ ‘ఉత్తాన కూర్మకమ్’|

పాదా అఙ్గుష్ఠాతు పాణిభ్యాం గృహీత్వా శ్రవణావధి
ధనురాకర్షకా కృష్ణమ్ ‘ధనురాసనమ్’ ఈరితమ్|

సీవనీం గుల్బ దేశాభ్యాం నిపీడ్య వ్యుత్క్రమేణతు
ప్రసార్య జానునో హస్తాః ఆసనం ’సింహరూపకమ్’|

యోగాసనము : గుదము(మూలాధారము)నకు రెండు వైపులా రెండుకాళ్ళ
మడమలను వ్యుత్రమముగా ( ఎదురుగా - కుడికాలి మడమను ఎడమవైపు,
ఎడమకాలి మడమను కుడివైపు) అమర్చి ముక్కు - ముఖము - మెడ నిఠారుగా
నిలిపి సావధానముగా కూర్చుని ఉండటమును యోగవిదులు యోగాసనము అని
పిలుస్తున్నారు.

పద్మాసనము : కుడి పాదమును ఎడమ తొడమీదను, ఎడమ పాదమును కుడి
తొడమీదను ఉంచి…., చేతులను వీపుకు పైభాగమునుండి త్రిప్పి, కుడిచేతి బొటన
వ్రేలు - చూపుడు వ్రేలులతో కుడికాలి బొటనవేలు, ఎడమచేతి బొటను వ్రేలు -
చూపుడు వ్రేలుతో ఎడమకాలి బొటన వ్రేలును పట్టుకొని ఉండటము పద్మాసనము.
ఇది సర్వవ్యాధులను, విష పదార్ధములను నిరోధించగల ఆసనము.

బద్ధపద్మాసనము : పైన చెప్పినట్లుగా పద్మాసనమును ఆశ్రయించి, (అవలంబించి)
ఆపై గడ్డమును రొమ్ముపై తాకించుచు, భ్రూమధ్యమునందు దృష్టిని నిలిపి శరీరమును
నిఠారుగా గాని, కొంచెము ప్రక్కకు వంచిగాని సమఃగ్రీవ శిరకాయుడై ఉండటము.

కుక్కుటాసనము : మొట్టమొదట పద్మాసనమును సుసంస్థాప్యము (కదలికలు
లేని తీరుగా) అవలంబించి, పిక్కలకు - తొడలకు మధ్యగా చేతులను దూర్చి,
భూమిపై మోపి, ఆ చేతుల అదిమితో పైకి ఎగసిన తీరుగా ఉండటము.

ఉత్తానకూర్మాసనము : కుక్కుటాసనము వేసిన తరువాత, రెండు చేతులతో
కంఠమును పట్టుకొని, భుజములను రెండువైపులా దగ్గిరగా జేర్చి తాబేలువలె
వెలికిలబడి ఉండటము.

ధనురాసనము : రెండు పాదముల బొటనవ్రేళ్ళను రెండుచేతులతో ‘ధనస్సు’
ఆకృతిగా వీపు వెనుక - చెవుల వరకు సరిగ్గా లాగి పట్టుకొని ఉంచటము.

సింహరూపకాసనము : అండకోశమునకు క్రింది భాగములో గల ’సీవనీనాడి’కి
రెండు ప్రక్కలా-రెండు మడమలను-(కుడివైపు ఎడమమడమ-ఎడమవైపు కుడి
మడమ) చేర్చి ఉంచి, కుడి-ఎడమల చేతి వ్రేళ్ళను కుడి-ఎడమల మోకాళ్ళపై ఉంచి
- శరీర పై భాగమును నిలువుగా సూటిగా నిలిపి…,
- నోరు తెరచి, నాలుకను బయటకు చాచి…,
- నాసికకు అగ్ర (బృకుటి క్రింది) స్థానముపై దృష్టిని నిలిపి చూస్తూ ఉండటము.


గుల్ఫౌ చ వృషణస్యాధః సీవన్యుభయపార్శ్వయోః .
నివేశ్య పాదౌ హస్తాభ్యాం బధ్వా భద్రాసనం భవేత్ .. 45..

సీవనీపార్శ్వముభయం గుల్ఫాభ్యాం వ్యుత్క్రమేణ తు .
నిపీడ్యాసనమేతచ్చ ముక్తాసనముదీరితం .. 46..

అవష్టభ్య ధరాం సమ్యక్తలాభ్యాం హస్తయోర్ద్వయోః .
కూర్పరౌ నాభిపార్శ్వే తు స్థాపయిత్వా మయూరవత్ .. 47..

సమున్నతశిరఃపాదం మయూరాసనమిష్యతే .

24.) గుల్ఫౌ చ వృషణస్య అథ సీవిని ఉభయ పార్శ్వయోః
నివేశ్య పాదౌ హస్తాభ్యాం బద్ధ్వా ‘భద్రాసనం’ భవేత్|

సీవనీ పార్శ్వ హృదయం గుల్ఫాఖ్యాం వ్యుత్క్రమేణతు
నిపీడ్యా ఆసనమ్, ఏతత్ చ ‘ముక్తాసనమ్’ ఉదీరితమ్|

అవష్టభ్య ధరామ్ సమ్యక్
తలాభ్యాం హస్తయోః ద్వయోః
కూర్పరౌ నాభి పార్శ్వేతు స్థాపయిత్వా మయూరవత్
సమున్నత శిరః పాదమ్ ‘మయూరాసనమ్’ ఇష్యత్||

భద్రాసనము :  సీవనీ నాడికి రెండు ప్రక్కల - కుడికాలును ఎడమవైపు, ఎడమకాలిని కుడివైపు తాకి ఉంచి…, రెండు పాదములను చేతులతో కదలకుండా పట్టుకొని, శిరస్సును నిట్టనిలువుగా నిలిపి ఉంచటము.

ముక్తాసనము : సీవనీ నాడియొక్క రెండు చివరలను మడమలచే తాకి, రెండువైపులను ఊర్ధ్వముగా పట్టి, మెడ - ముఖము - శిరస్సును పైకి నిఠారుగా ధారణచేసి భుజములను కించిత్ పైకి ఎత్తి ఉంచటము.

మయూరాసనము : రెండు అరచేతులను చాచి, భూమిపై పూర్తిగా ఆనించి, రెండు మోచేతులను నాభి (బొడ్డు)కి రెండువైపులా ఆనించి, చేతులపై దేహమును పైకి ఎత్తి, ముఖమును ఊర్ధ్వముగా (పైకి నిట్టనిలువుగా) నిలిపి, రెండు కాళ్ళను దండమువలె మీదికి చాచి ఉంచటము.


వామోరుమూలే దక్షాంఘ్రిం జాన్వోర్వేష్టితపాణినా .. 48..

వామేన వామాంగుష్ఠం తు గృహీతం మత్స్యపీఠకం .
యోనిం వామేన సంపీడ్య మేఢ్రాదుపరి దక్షిణం .. 49..

ఋజుకాయః సమాసీనః సిద్ధాసనముదీరితం .
ప్రసార్య భువి పాదౌ తు దోర్భ్యామంగుష్ఠమాదరాత్ .. 50..

జానూపరి లలాటం తు పశ్చిమం తానముచ్యతే .

25.) వామ - ఊరుమూలే దక్షాంఫ్రిమ్
జానో ఉర్వేష్టిత పాణినా
వామేన వామాఙ్గుష్ఠంతు
గృహీతం ’మత్స్యపీఠకమ్’|

యోనిం వామేన సంపీడ్య
మేడ్రాత్ ఉపరి దక్షిణమ్,
ఋజుకాయః సమాసీనః
‘సిద్ధాసనమ్’ ఉదీరితమ్||

ప్రసార్య భువి పాదౌతు
దోర్భ్యామ్ అంగుష్ఠమ్ ఆదరాత్
జానూ ఉపరి లలాటం తు
‘పశ్చిమం తాణమ్’ ఉచ్యతే||

మత్స్యపీఠకాసనము :
- కుడి పాదమును ఎడమ తొడపై ఉంచి, ఎడమ చేతిని వీపువైపు నుండి త్రిప్పి తీసుకొని వచ్చి ఎడమకాలి మడమను కుడి కాలికి తగులునట్లుగా ఉంచి,
- కుడిచేతిని ఎడమ మోకాలి వెలుపలి నుండి త్రిప్పి తీసుకొనివచ్చి, ఎడమకాలి బొటనవ్రేలును పట్టుకొని ఉంచి,
- కంఠము, భుజములు, శిరస్సు ఊర్ధ్వముగా ధారణచేసి ఉండటము.

సిద్ధాసనము : 
- ఎడమకాలి మడమను లింగము యొక్క పైకి చేర్చి, నొక్కి పెట్టి ఉంచి,
- ఎడమకాలి పాదముమీదకు కుడికాలి మడమను చేర్చి, నొక్కి పెట్టి ఉంచి,
- భుజముల నుండి పై భాగమంతా పైకి ధారణ చేసి ఉంచటము.

పశ్చిమం తాణ ఆసనము : 
- భూమిపై కూర్చుని, భూమిపై రెండు కాళ్ళను నిలువుగా చాచి ఉంచి, కుడి చేతితో కుడి కాలి బొటన వ్రేలును, ఎడమ చేతితో ఎడమకాలి బొటన వ్రేలును పట్టుకొని ఉండి,
- లలాటమును మోకాలికి ఆనునట్లుగా ఉంచి…,
- మోకాళ్ళను భూమి ప్రదేశమునుండి పైకి ఎత్తకుండా, భూమినే తాకి ఉంచి
- భ్రూమధ్య స్థానమును చూస్తూ ఉండటము.


యేనకేన ప్రకారేణ సుఖం ధార్యం చ జాయతే .. 51..

తత్సుఖాసనమిత్యుక్తమశక్తస్తత్సమాచరేత్ .
ఆసనం విజితం యేన జితం తేన జగత్త్రయం .. 52..

యేన కేన ప్రకారేణ
సుఖం ధార్యంచ జాయతే,
తత్ ‘సుఖాసనమ్’ ఇత్యుక్తః
అశక్తః, తత్ సమాచరేత్||

ఆసనం విజితం యేన
జితం తేన జగత్రయమ్ ||

ఈ విధంగా ఆసనములలో ఏదో ఒక్కటి, శరీరమునకు అనుకూలమైనది ఆసన పండితుల సంప్రతింపులతో నేర్చుకొని అవధరించాలి. లేదా, శరీరమునకు ఏది సుఖాసనమైతే దానిని పైన చెప్పుకొన్నవాటిలో కొన్ని చిన్న మార్పులతో, ఏకాగ్రతకు సానుకూల్యమైన ఆసనమును అవధరించవచ్చును. సమాసన విద్వాంసుల పాఠ్యాంశములు సర్వదా సముచితము. శరీరమునకు సానుకూలమైన, శరీరదారుఢ్యమునకు - వయస్సు దృష్ట్యా అనుకూలమైన ఆసనము అభ్యసించి క్రమంగా అతి తేలికగా, స్వభావంగా, ఎంత సేపైనా కూర్చోకలిగేటట్లుగా ఆసనమును అవధరించటమును “ఆసన జయము” - అని అంటారు.

ఎవ్వడు ఆసన జయమును సంపాదిస్తాడో ఆతడు ఆ ఆసనముతో త్రిలోకము జయించగలడయ్యా!


యమైశ్చ నియమైశ్చైవ ఆసనైశ్చ సుసంయతః .
నాడీశుద్ధిం చ కృత్వాదౌ ప్రాణాయామం సమాచరేత్ .. 53..

దేహమానం స్వాంగులిభిః షణ్ణవత్యంగులాయతం .
ప్రాణః శరీరాదధికో ద్వాదశాంగులమానతః .. 54..

దేహస్థమనిలం దేహసముద్భూతేన వహ్నినా .
న్యూనం సమం వా యోగేన కుర్వన్బ్రహ్మవిదిష్యతే .. 55..

26.) యమైశ్చ నియమైశ్చైవ
ఆసనైశ్చ సుసంయుతః
నాడీ శుద్ధిం చ కృత్వా,
ఆదౌ ప్రాణాయామం సమాచరేత్ |
దేహమానం స్వాంగుళిభిః
షణ్ణవత్ (96) అంగులాయతమ్
ప్రాణః - శరీరాత్ అధికో
ద్వాదశాంగుళమానతః |

దేహస్థమ్ అనిలం
దేహ సముద్భూతేన వహ్నినా,
న్యూనం సమం వా యోగేన
కుర్వన్ బ్రహ్మ విదిష్యతే॥

ప్రాణాయామము :  ఈవిధంగా యమము నియమములతో కూడినవాడై, సుఖాసనమును అభ్యాసపూర్వకంగా స్వీకరించినవాడై, మొట్టమొదట ధ్యాసను నాడీ ప్రదేశములలో ప్రవేశింపజేసి, నాడీ శుద్ధిని దిని చేసుకుని, ఇక ఆపై చక్కగా ప్రాణాయామమును ఆచరించును గాక! (నాడీ భావనా కుంభకము) ఈ దేహము వారివారి అంగుళీకము (ఉంగరపు వ్రేలు చివరి భాగము)తో కొలిస్తే ఈ భౌతిక దేహము ‘96’ అంగుళీకముల పొడవు వుంటూ ఉంటుంది. ఇక ప్రాణశక్తి యొక్క ఉనికి దేహము కంటే కూడా 12 అంగుళముల వరకు అధిక పరిమాణము కలిగి
ఉంటుంది.

ఏ యోగికైతే తన యొక్క యోగాభ్యాసముచేత తన దేహములో జనించుచున్న ‘అగ్ని’ సహాయముతో ప్రాణవాయువును తక్కువగా కాని, ఎక్కువగా గాని, దేహమంతా సరిసమానముగాగానీ, చేయటము తెలిసియున్నదో - అట్టి యోగి, తత్ సాధనచే బుద్ధి సునిశితము అగుచున్నది. సులభముగా ‘బ్రహ్మజ్ఞాని’ అగుచున్నాడు.


దేహమధ్యే శిఖిస్థానం తప్తజాంబూనదప్రభం .
త్రికోణం ద్విపదామన్యచ్చతురస్రం చతుష్పదం .. 56..

వృత్తం విహంగమానాం తు షడస్రం సర్పజన్మనాం .
అష్టాస్రం స్వేదజానాం తు తస్మిందీపవదుజ్జ్వలం .
కందస్థానం మనుష్యాణాం దేహమధ్యం నవాంగులం .
చతురంగులముత్సేధం చతురంగులమాయతం .. 57..

అండాకృతి తిరశ్చాం చ ద్విజానాం చ చతుష్పదాం .
తుందమధ్యం తదిష్టం వై తన్మధ్యం నాభిరిప్యతే .. 58..

27.) దేహమధ్యే శిఖిస్థానం
తప్త జాంబూనద ప్రభమ్|
త్రికోణం ద్విపదాం అన్యత్।
చతురశ్రం చతుష్పదాం।
వృత్తమ్ విహంగమానాం తు।
షడశ్రం సర్పజన్మనామ్।
అష్టాశ్రం స్వేదజానాం తు
తస్మిన్ దీపవత్ ఉజ్వలమ్||
కన్దస్థానం మనుష్యాణాం
దేహమధ్యం నవాంఙ్గుళమ్,
చతురఙ్గుళమ్ ఉత్సేధం
చతురంగుళమ్ ఆయతమ్ |
అణ్డాకృతి తిరశ్చాం చ
ద్విజానాం చ చతుష్పదాం।
తున్దమధ్యం తదిష్టం వై
తన్మధ్యం నాభిః ఇష్యతే ॥

సర్వ దేహములలో దేహమధ్యగా శిఖి స్థానం (మూలాగ్ని మండలము) ఉష్ణముతో వెలుగొందుచూ ఉంటుంది.

ఆ మూలాగ్ని మండలము
- మానవ దేహము యొక్క మధ్య (గరిమనాభి) భాగములో       ⃤  త్రికోణాకారమై ఉంటుంది.
- నాలుగు కాళ్ళు కలిగిన జంతువులలో   ▭   చతురస్రాకారములో ఉంటోంది.
- పక్షులలో       ⃝  వృత్తాకారముగా ఉంటుంది.
- సర్పములలో   ⬡   షట్కోణ ఆకారముగా ఉంటుంది.

స్వేదజములలో (చెమట నుండి) జనించు కీటము మొదలుగాగల శరీరములలో - 8 కోణములతో కూడిన ఆకారముగా ఉంటుంది. దీపమువలె ఉజ్వలంగా ప్రకాశిస్తూ ఉంటుంది.

మనుష్యులకు శరీర మధ్య భాగము - ‘9’ అంగుళముల పరిమాణము గల కందస్థానము ఉన్నది. 4 అంగుళముల ఎత్తు, 4 అంగుళముల వెడల్పు కలిగి ఉంటుంది. ఇదియే శరీర మధ్య భాగము.

4 కాళ్ళు గల తిర్యక్ (జంతు) యోనిలలోను, పక్షుల యొక్క శరీరములలోను మధ్య భాగము అండాకృతి (పక్షిగుడ్డు ఆకారములో) కందస్థానము (శరీరమధ్య భాగము) ఏర్పడినదై ఉంటుంది. తున్దము (పొట్ట, ఉదరము) మధ్యలో కందస్థానము ఉంటోంది. ఇదియే దేహమునకు గరిమ నాభి స్థానము (Control place) కూడా!


తత్ర చక్రం ద్వాదశారం తేషు విష్ణ్వాదిమూర్తయః .
అహం తత్ర స్థితశ్చక్రం భ్రామయామి స్వమాయయా .. 59..

అరేషు భ్రమతే జీవః క్రమేణ ద్విజసత్తమ .
తంతుపంజరమధ్యస్థా యథా భ్రమతి లూతికా .. 60..

ప్రాణాధిరూఢశ్చరతి జీవస్తేన వినా నహి .

28.) తత్ర చక్రం ద్వాదశారం
తేషు విష్ణ్వాది మూర్తయః,
అహం తత్ర స్థితః చక్రం
భ్రామయామి స్వమాయయా।
అరేషు భ్రమతే జీవః
క్రమేణ, ద్విజసత్తమ!
తన్తు  పంజరమధ్యస్థా
యథా భ్రమతి లూతికా।
ప్రాణా-అధిరూఢః చరతి
జీవః తేన వినా న హి।

అట్టి కంద స్థానము యొక్క మధ్య భాగమునందు ’12’ దళములు గల నాభిచక్రము ఉన్నది. ఆ చక్రమునందు విష్ణువు మొదలైన సకల దేవతలు మూర్తీభవించినవారై ఉన్నారు.
ఆదినారాయణ మూర్తిని (సర్వాంతర్యామిని) అగు నేను ఆ నాభి చక్రములో స్థితించి (నివశిస్తూ) ఉంటున్నాను. నాయొక్క స్వకీయ సూయచే శరీరతత్త్వమునంతటినీ నడిపిస్తూ ఉంటున్నాను.

ఓ ద్విజసత్తమా! ఒక సాలెపురుగు తాను సాలెగూడులోనే చిక్కుకొని తిరుగుతూ ఉంటుంది చూచావా? అట్లాగే 12 దళముల నాభిలో ఒక దళములో మాత్రమే పరిమితుడగుచూ జీవుడు 12 దళములు గల నాభిలో వివిధ రీతులుగా ప్రాణమును అధిష్ఠించినవాడై సంచారములు చేయుచున్నాడు.  “ప్రాణములు ఉన్నప్పుడే నేనుండగలను. ప్రాణములు లేకుంటే నేనే లేను" - అను భావనకు బద్ధుడై ఉంటున్నాడు.


తస్యోర్ధ్వే కుండలీస్థానం నాభేస్తిర్యగథోర్ధ్వతః .. 61..

అష్టప్రకృతిరూపా సా చాష్టధా కుండలీకృతా .
యథావద్వాయుసారం చ జ్వలనాది చ నిత్యశః .. 62
పరితః కందపార్శ్వే తు నిరుధ్యేవ సదా స్థితా .
ముఖేనైవ సమావేష్ట్య బ్రహ్మరంధ్రముఖం తథా .. 63..

యోగకాలేన మరుతా సాగ్నినా బోధితా సతీ .
స్ఫురితా హృదయాకాశే నాగరూపా మహోజ్జ్వలా .. 64..

29.) తస్య ఊర్ధ్వే కుండలీస్థానం
నాభేః తిర్యక్ అధ ఊర్ధ్వతః
అష్ట ప్రకృతిరూపా సా చ
అష్టధా కుణ్డలీకృతా!
యథావత్ వాయుసారం చ
జ్వలనాది చ నిత్యశః
పరితః కన్ద పార్శ్వే తు
నిరుధ్యైవ సదా స్థితా!
మఖేనైవ సమావేష్ట్య
బ్రహ్మరంధ్ర ముఖం తథా!
యోగకాలేన మరుతా
సా అగ్నినా బోధితా సతీ!
స్ఫురితా హృదయాకాశే
నాగరూపా మహెూజ్వలా||

ఆ నాభి చక్రము యొక్క పైన - క్రింద నలువైపులా ప్రదేశంలో ‘కుండలీ స్థానము’ ఉన్నది. ఆకుండలినీ శక్తి అష్టవిధ ప్రకృతి కలిగియున్నదై, ‘8’ విధములుగా చుట్టుకొనియున్నది. (కుండలిని = ఇచ్ఛాశక్తి; చిత్తతత్త్వము; WILL). అట్టి కుండలినీశక్తి వాయు తరంగములను సంచాలనము చేస్తూ, ప్రాణ-అపానములను వెదురు కర్రలవలె ఉపయోగించి, అగ్నిని పుట్టించుచూ జ్వలముచే - తదితర పదార్థములను పచనము చేస్తున్నది. తాను కన్దమునకు (పొట్టకు) ప్రక్కవైపుగా కదలక - మెదలక సదా సంస్థితమై ఉన్నది. ముఖమునందు కూడా ఆ కుండలినీ శక్తి ఆక్రమించుకొని, బ్రహ్మరంధ్రము వరకు విస్తరించి, ఆ బ్రహ్మ రంధ్రమును కప్పి ఉంచుతోంది.

చుట్టచుట్టుకొని నిద్రాముద్ర వహించియున్న కుండలిని మేలుకొలపటం :
(1) ప్రాణాయామము (2) చక్రములలో ఏకాగ్రత (3) ప్రాణకదలికలకు సాక్షిగా దర్శనములతో కూడిన యోగమును అభ్యసించుచుండగా, అట్టి యోగాభ్యాసకాలంలో దేహములో సంచలనములు చేస్తున్న వాయువుచే శరీరములోని యోగాగ్ని - కొలిమిలోని అగ్నిని విసరుచున్నప్పుడువలె - ప్రజ్వలితమవగలదు. అప్పుడు - చుట్టలుచుట్టి పడుకున్నపాము వేడి తగలగానే బుస్సున లేచినట్లుగా - కుండలినీ శక్తి మహెూగ్రరూపి అయి హృదయాకాశములో స్ఫురణ రూపంగా ప్రకాశించుచున్నది.


అపనాద్ద్వయంగులాదూర్ధ్వమధో మేఢ్రస్య తావతా .
దేహమధ్యం మనుష్యాణాం హృన్మధ్యం తు చతుష్పదాం .. 65..

ఇతరేషాం తుందమధ్యే ప్రాణాపానసమాయుతాః .
చతుష్ప్రకారద్వ్యయుతే దేహమధ్యే సుషుమ్నయా .. 66..

కందమధ్యే స్థితా నాడీ సుషుమ్నా సుప్రతిష్ఠితా .
పద్మసూత్రప్రతీకాశా ఋజురూర్ధ్వప్రవర్తినీ .. 67..

30.) అపానాత్ ద్వ-అంగుళాత్ ఊర్ధ్వమ్
అధో మేఢ్రస్య తావతా,
దేహమధ్యం మనుష్యాణాం,
హృత్ మధ్యం తు చతుష్పదామ్ |
ఇతరేషాం తున్దమధ్యే
ప్రాణ-అపాన సమాయుతాః॥
చతుష్ప్రకార ద్వ్యయుతే
దేహమధ్యే సుషుమ్నయా!
కన్దమధ్యే స్థితా నాడీ
సుషుమ్నా సుప్రతిష్ఠితా।
పద్మసూత్ర ప్రతీకాశా
ఋజుః ఊర్ధ్వ ప్రవర్తినీ।

దేహమధ్య స్థానములు:

మనుష్యులకు - దేహమధ్య స్థానము = అపానము (గుదము)నకు 2 అంగుళములు పైన, లింగమునకు కొంచెము క్రిందగాను…,
చతుష్పాదులగు జంతువులకు తదితరులకు - దేహమధ్య స్థానము = హృదయ మధ్యమున పొట్ట మధ్యభాగమునను,
నాగులు మొదలగువాటికి తున్దము (పొట్ట) మధ్య స్థానమునందు సమీకృతమైయున్నది.

అట్టి దేహమధ్య స్థానమునందు ప్రాణ - అపానములు సమావేశమౌతూ ఉంటాయి. (The Inward Going Air flow and outward going Air flow - meet each other and push each other in the central zone of the physic).

అక్కడ గల    ▭   చతురస్ర మధ్యయందు ఇడ - పింగళనాడుల మధ్యగా, (కన్ద మధ్యగా) ’సుషుమ్ననాడి’ సుప్రతిష్ఠితమైయున్నది. అట్టి సుషన్ను తామర తూడులోని సన్నని తంతువు వలె సన్నగా నిడుపుగా ఉండి ఊర్ధ్వముగా సహస్రారము వరకు విస్తరించినదై, వ్యాపించినదై ప్రవర్తించుచున్నది.


బ్రహ్మణో వివరం యావద్విద్యుదాభాసనాలకం .
వైష్ణవీ బ్రహ్మనాడీ చ నిర్వాణప్రాప్తిపద్ధతిః .. 68..

ఇడా చ పింగలా చైవ తస్యాః సవ్యేతరే స్థితే .
ఇడా సముత్థితా కందాద్వామనాసాపుటావధి .. 69..
పింగలా చోత్థితా తస్మాద్దక్షనాసాపుటావధి .

31.) బ్రహ్మణో వివరం యావత్ విద్యుత్ - ఆభాస నాళకమ్,
వైష్ణవీ ‘బ్రహ్మనాడీ’ చ నిర్వాణప్రాప్తి పద్ధతిః||
ఇడా చ  పింగళా చ ఏవ
తస్యాత్ సవ్యే - ఇతరే స్ధితే
ఇడా సముత్థితా కన్దా
ద్వామ నాసాపుటా అవధిః|
పింగళా చ ఉత్థితా తస్మాత్
దక్షనాసాపుటా అవధిః||

‘సుషుమ్న’ నాడి (విద్యుతవలె సురసుర ప్రకాశించు నాళము) బ్రాహ్మీ స్థానము వరకు వ్యాపించి ఉన్నది. అందుచేత సుషుమ్నను “వైష్ణవి” అని "బ్రహ్మనాడి” అని కూడా అంటారు. అట్టి సుషుమ్నలో “బుద్ధి-భావన, మనో నియమము”లతో ప్రవేశించి సహస్రారము చేరటము నిర్వాణ ప్రాప్తికి విధానము.

ఇడ - పింగళ అను వేరైన రెండు నాడులు సుషుమ్నకు ఎడమ కుడిగా ఏర్పడినవై ఉన్నాయి.

సుషుమ్ననాడి ప్రకాశించుచున్న నాడీకందము (దేహ మధ్యస్థానము) నుండి పుట్టిన ’పింగళానాడి’ కుడి ముక్కు రంధ్రము వరకు వ్యాపించి ఉన్నది. అదే నాడీకందము నుండి పుట్టిన ’ఇడా నాడి’ ఎడమ ముక్కు రంధ్రము వరకు వ్యాపించినదై ఉన్నది.


గాంధారీ హస్తిజిహ్వా చ ద్వే చాన్యే నాడికే స్థితే .. 70..
పురతః పృష్ఠతస్తస్య వామేతరదృశౌ ప్రతి .
పూషా యశస్వినీ నాడ్యౌ తస్మాదేవ సముత్థితే .. 71..
సవ్యేతరశ్రుత్యవధి పాయుమూలాదలంబుఅసా .
అధోగతా శుభా నాడీ మేఢ్రాంతావధిరాయతా .. 72..
పాదాంగుష్ఠావధిః కందాదధోయాతా చ కౌశికీ .
32.) ’గాన్ధారి’, ‘హస్తి జిహ్వా’ చ ద్వే చ అన్యే నాడికే స్థితే,
పురతః, పృష్ఠతః తస్య వామే ఇతర దృశౌ ప్రతి |
పూషా యశస్వినీ నాడ్యౌ
తస్మాత్ ఏవ సముత్థితే
సవ్యే - ఇతర శ్రుత్యవధి
పాయు మూలా అలంబుసా|
అధో గతా శుభా నాడీ
మేఢ్రాన్తా అవధిరాయతా।
పాద - అంగుష్ఠావధిః కన్దాత్
అధో యాతా చ, కౌశికీ|

1.) గాంధారి 2.) హస్తి జిహ్వ అను పేర్లతో పిలువబడుచున్న వేరైన మరి రెండు నాడులు సుషుమ్నకు ముందు వైపు - వెనుకవైపుగా బయల్వెడలి ఉన్నవై, కుడి ఎడమ కన్నులలోని కంటిపాప మధ్య స్థానముల వరకు వ్యాపించి ఉంటున్నాయి.

‘పూష, యశస్విని’ అను మరి రెండు నాడులు ‘నాడీ కందము’ నుండి బయల్వెడలి, కుడి - ఎడమ చెవుల వరకు వ్యాపించినవై ఉన్నాయి. శృతి (వినికిడి) - అంత్య స్థానము వరకు విస్తరించి ఉన్నాయి.

అలంబసా నాడి పాయువు (మల విసర్జన స్థానము) వరకు వ్యాపించి ఉన్నది.

‘శుభానాడి’ నాడీ కందము (దేహమధ్యభాగము) నుండి లింగాంగము చివర వరకు వ్యాపించి ఉన్నది.

‘కౌశికీనాడి’ - కందస్థానము నుండి పాదముల వ్రేళ్ళ చిట్టచివరి వరకు వ్యాపించి ఉన్నది.


దశప్రకారభూతాస్తాః కథితాః కందసంభవాః .. 73..
తన్మూలా బహవో నాడ్యః స్థూలసూక్ష్మాశ్చ నాడికాః .
ద్వాసప్తతిసహస్రాణి స్థూలాః సూక్ష్మాశ్చ నాడయః .. 74..
సంఖ్యాతుం న శక్యంతే స్థూలమూలాః పృథగ్విధాః .
యథాశ్వత్థదలే సూక్ష్మాః స్థూలాశ్చ వితతాస్తథా .. 75..
33.) దశ ప్రకార భూతా స్తాః
కథితాః కన్దసమ్భవాః॥
తన్మూలా బహవో నాడ్యః
స్థూల - సూక్ష్మాశ్చ నాడికాః|
ద్వా సప్తతి సహస్రాణి (72,000)
స్థూలాః - సూక్ష్మాశ్చ నాడయః।
సంఖ్యాతుం నైవ శక్యంతే
స్థూలమూలాః పృథక్ విధాః|
యథా అశ్వత్థదళే సూక్ష్మాః
స్థూలాశ్చ వితతాః తథా॥

ఈ విధంగా నాడీ కందము నుండి దేహములోని ఆయా స్థానముల వరకు విస్తరించియున్న దశ విధ నాడుల గురించి యోగ శాస్త్రముచే అభివర్ణించబడుతోంది.

అదే విధంగా నాడీ కందము నుండి ఆ స్థానమును ఆధారముగా చేసుకొని ‘72000’ (డెబ్బది రెండువేల) స్థూల (మరియు) సూక్ష్మ నాడులు దేహమునంతా విస్తరించినవై ఉన్నాయి. అట్టి స్థూల - సూక్ష్మ నాడుల ఉపనాడుల సంఖ్య వాటి విధి - విధానాలు వాటికి పేర్లు పెట్టి చెప్పటం అలవికాని పని.

రావి ఆకులో ఎట్లా పెద్ద పెద్ద ఈనెలు, వాటినుండి చిన్న ఈనెలు, వాటి నుండి ఉప ఈనెలు ఏర్పడినవై ఉంటున్నాయో, దేహములో కూడా నాడీ కందము నుండి బయల్వెడలు నాడులన్నీ విస్తరించాయా అనేక దేహ ధర్మములకు కారణమగుచున్నాయి. ఈవిధంగా దేహ మధ్య స్థానమున గల నాడీ కందము నాడీ · సూక్ష్మ - స్థూల నాడీ శక్తి కేంద్రమైయున్నది.


ప్రాణాపానౌ సమానశ్చ ఉదానో వ్యాన ఏవ చ .
నాగః కూర్మశ్చ కృకరో దేవదత్తో ధనంజయః .. 76..

చరంతి దశనాడీషు దశ ప్రాణాదివాయవః .
ప్రాణాదిపంచకం తేషు ప్రధానం తత్ర చ ద్వయం .. 77..

ప్రాణ ఏవాథవా జ్యేష్ఠో జీవాత్మానం బిభర్తి యః .
ఆస్యనాసికయోర్మధ్యం హృదయం నాభిమండలం .. 78..

పాదాంగుష్ఠమితి ప్రాణస్థానాని ద్విజసత్తమ .
అపానశ్చరతి బ్రహ్మన్గుదమేఢ్రోరుజానుషు .. 79..

సమానః సర్వగాత్రేషు సర్వవ్యాపీ వ్యవస్థితః .
ఉదానః సర్వసంధిస్థః పాదయోర్హస్తయోరపి .. 80..

వ్యానః శ్రోత్రోరుకట్యాం చ గుల్ఫస్కంధగలేషు చ .

34.) ప్రాణ - అపాన - సమానాశ్చ - ఉదానో - వ్యాన ఏవ చ,
నాగః కూర్శశ్చ కృకరో దేవదత్తో ధనంజయః,
చరంతి దశనాడీషు
దశప్రాణాది వాయవః|
ప్రాణాది పంచకం తేషు।
ప్రధానం తత్ర చ ద్వయమ్|
ప్రాణ ఏవా అథవా శ్రేష్ఠో,
జీవాత్మానం బిభర్తి యః॥
ఆస్య-నాసికయోః మధ్యం
హృదయం నాభి మండలమ్|
పాద అంగుష్ఠమ్ ఇతి,
ప్రాణస్థానాని, ద్విజసత్తమ।
అపానః చరతి, బ్రహ్మన్!
గుద-మేడ్రో-ఊరు-జానుషు।
సమానః సర్వగాత్రేషు
సర్వవ్యాపీ వ్యవస్థితః ఉదానః సర్వ సన్దిస్థః
పాదయోః హస్తయోః అపి।
వ్యానః శ్రోత్రో ఊరు కట్యాం చ
గుల్ఫ స్కంధ గళేషు చ ॥

ఆ నాడులలో…,
- ప్రాణ - అపాన - సమాన - ఉదాన - వ్యానములుగా పిలువబడు ఐదు ప్రధాన వాయువులు (పంచ ప్రాణములు).
- నాగ - కూర్మ - కృకర - దేవదత్త - ధనంజయములనబడే ఉపవాయువులు (పంచ ఉప ప్రాణములు).
ఈ పది ప్రాణములు నాడులందు సంచరిస్తున్నాయి.

కొందరు యోగులు - దశ ప్రాణములలో పంచ ప్రాణములు ముఖ్యమైనవి అని అంటారు. మరికొందరు యోగులు దశ ప్రాణములలో ప్రాణ - అపానములే అతి ముఖ్యమై సర్వము నడపుచున్నాయి అని అంటారు. ఇంకొందరు యోగులు “జీవాత్మను ధరించుచున్న ముఖ్య ప్రాణమే - అన్నిటికన్నా
ప్రధానము” - అని అంటున్నారు.

ఓ ద్విజసత్తమా!
➤ ఆస్య (ప్రాణప్రథమ స్థానమగు నాడీ కందము) - నాశికల మధ్య స్థానము, హృదయము, నాభి (బొడ్డు) మండలము, పాదము యొక్క బొటనవేలు …. ఇవి ప్రాణము యొక్క ముఖ్య స్థానములుగా పేర్కొనబడుచున్నది.

బ్రహ్మన్! త్రిశిఖి మహాశయా!
➤ అపానవాయువేమో గుదము (మలవిసర్జన స్థానము), మేఢ్రము (లింగము), జానువు (భుజములు)లలో స్థానము పొంది సంచరించుచున్నదయ్యా!
➤ ఇక, సమానవాయువు దేహమునందు సర్వత్రా వ్యవస్థితమై సర్వవ్యాపి అయి ఉన్నది.
➤ ఉదానవాయువు - దేహము యొక్క సర్వ సంధులలో స్థానము కలిగి ఉండి పాదములలోను, మడమలలోను కూడా ఉన్నదై సంచారములు చేస్తోంది.
➤ వ్యానవాయువు - చెవులలోను, ఊరువుల(తొడల)లోను, కటి (మొల) స్థానమునందు, గుల్పము (చీలమండలము) నందు, స్కంధము (భుజములయందు) గళము (కంఠము) నందు స్థానము కలిగి సంచరించుచున్నది.


నాగాదివాయవః పంచ త్వగస్థాదిషు సంస్థితాః .. 81..

తుందస్థజలమన్నం చ రసాదీని సమీకృతం .
తుందమధ్యగతః ప్రాణస్తాని కుర్యాత్పృథక్పృథక్ .. 82..

ఇత్యాదిచేష్టనం ప్రాణః కరోతి చ పృథక్స్థితం .
అపానవాయుర్మూత్రాదేః కరోతి చ విసర్జనం .. 83..

ప్రాణాపానాదిచేష్టాది క్రియతే వ్యానవాయునా .

35.) నాగాది వాయవః పంచ
త్వక్ - అస్థి ఆదిషు సంస్థితాః
తున్దస్థం జలం అన్నం చ
రసాదీని సమీకృతమ్|
తున్దమధ్యగతః ప్రాణః
తాని కుర్యాత్ పృథక్ పృథక్
ఇత్యాది చేష్టనం ప్రాణః
కరోతి చ పృథక్ స్థితమ్|
అపానవాయుః మూత్రాదేః కరోతి చ విసర్జనమ్,
ప్రాణ - అపానాది చేష్టాది
క్రియతే వ్యాన వాయునా॥

ఇక 1. నాగము 2. కూర్మము 3. కృకరము 4. దేవదత్తము 5. ధనంజయము అను పంచ ఉపప్రాణములు చర్మము, బొమికలు ఇత్యాది స్థానములలో స్థితి కలిగి ప్రవర్తిస్తున్నాయి.

ప్రాణవాయువు తున్దమున (శరీరము యొక్క మధ్య భాగమున) స్థితి - చలనము కలిగియున్నదై, ఈ జీవుడు త్రాగు జలమును, తినుచున్న (భక్ష్య - బోజ్య - లేహ్య - చోహ్య) చతుర్విధ అన్నమును, రసాదులను సమీకరణము చేసి, వేరువేరు విభాగములుగా చేయుచు, శరీరపు మారుమూలల వరకు రసశక్తిని అందించుచున్నది.

ఈవిధంగా వ్యానవాయువు ప్రాణ-అపాన ధర్మములతో సహా అనేక చేష్టలను నిర్వర్తిస్తూ దేహకందమున ఉండి ఉంటోంది.

అపాన వాయువు శరీరమునకు మల - మూత్రముల విసర్జన శక్తిని ప్రసాదించుచున్నది.

వ్యాన వాయువే ప్రాణ వాయు ధర్మములను, అపానవాయు ధర్మములను ప్రాణ - అపాన వాయు రూపములుగా అయి, నిర్వర్తిస్తోంది.


ఉజ్జీర్యతే శరీరస్థముదానేన నభస్వతా .. 84..

పోషణాదిశరీరస్య సమానః కురుతే సదా .
ఉద్గారాదిక్రియో నాగః కూర్మోఽక్షాదినిమీలనః .. 85..

కృకరః క్షుతయోః కర్తా దత్తో నిద్రాదికర్మకృత్ .
మృతగాత్రస్య శోభాదేర్ధనంజయ ఉదాహృతః .. 86..
/br
36.) ఉజ్జీర్యతే శరీరస్థమ్
ఉదానేన నభస్వతా!
పోషణాది శరీరస్య
సమానః కురుతే సదా
ఉద్గారాది క్రియో నాగః|
కూర్మో అక్ష్యాది నిమీలనః॥
కృకరః క్షపయోః కర్తా!
దత్తో నిద్రాది కర్మకృత్|
మృతగాత్రస్య శోభాది
‘ధనంజయ’ ఉదాహృతః|

ఉదాన వాయువు - దేహములో ప్రవేశించిన ఆహార పదార్థములను జీర్ణము చేయుచున్నది.

సమాన వాయువు - ఈ శరీరమునందు అంతటా నిండి ఉన్నదై, అణువణువున ఉత్తేజతపరచుచూ, రక్షించుచున్నది.

నాగ ఉపానవాయువు - దేహములో అనవసరమైన వాయువును పర్యవేక్షిస్తూ… త్రేపులు మొదలైన రూపముగా ఉద్గతము చేయుచున్నది (బయటకు త్రోలుచున్నది).

కూర్మ ఉపవాయువు - కళ్ళుమూయటం, తెరవటం మొదలైన అనేక శరీరములోని శారీరావస్యకములగు కదలికలను పర్యవేక్షిస్తోంది.

కృకర ఉపవాయువు - రోగ క్రిములను నశింపజేసి దేహమును రక్షిస్తోంది.

దేవదత్త ఉపప్రాణము - జీవునికి నిద్ర మొదలైనవి కలుగజేస్తోంది.

ధనంజయము - శవము వంటి ఈ భౌతికదేహమునకు శోభ, తేజస్సు మొదలైనవి ప్రసాదిస్తోంది.


నాడీభేదం మరుద్భేదం మరుతాం స్థానమేవ చ .
చేష్టాశ్చ వివిధాస్తేషాం జ్ఞాత్వైవ నిజసత్తమ .. 87..

శుద్ధౌ యతేత నాడీనాం పూర్వోక్తజ్ఞానసంయుతః .
37.) నాడీ భేదం, మరుత్ భేదం
మరుతాం స్థానమేవ చ
చేష్టాశ్చ వివిధాః తేషాం
జ్ఞాత్వైవం, ద్విజసత్తమ!
శుద్ధౌ యతేత నాడీనాం
పూర్వోక్త జ్ఞాన సంయుతః

ఓ ద్విజసత్తమా! ఈవిధంగా
- నాడీస్థాన భేదములను,
- వాయువులు ఉండే స్థాన భేదములను,
- వాటి వాటి వివిధ కార్యక్రమములను,
- చేష్టలను …. ఇవన్నీ సంగ్రహముగా చెప్పుకున్నాము కదా!

ఇక ఇప్పుడు ‘నాడీశుద్ధి’ కొరకై (మరియు) ఇంతకుముందు మనం చెప్పుకున్న సర్వమునకు సాక్షి - ప్రేరకుడు అగు పరమాత్మ తత్త్వమును తెలుసుకోవటానికి… విధివిధానముల గురించి ప్రస్థావిస్తున్నాను. వినవయ్యా!


వివిక్తదేశమాసాద్య సర్వసంబంధవర్జితః .. 88..

యోగాంగద్రవ్యసంపూర్ణం తత్ర దారుమయే శుభే .
ఆసనే కల్పితే దర్భకుశకృష్ణాజినాదిభిః .. 89..

తావదాసనముత్సేధే తావద్ద్వయసమాయతే .
ఉపవిశ్యాసనం సమ్యక్స్వస్తికాది యథారుచి .. 90..
38.) వివిక్త దేశమ్ ఆసాద్య
సర్వ సంబంధ వర్జితః,
యోగాంగ ద్రవ్య సంపూర్ణం
తత్ర దారుమయే శుభే|
ఆసనే కల్పితే దర్భ - కుశ కృష్ణాఽజినాదిభిః,
తావత్ ఆసనమ్ ఉత్సేధే
తావత్ ద్వయ సమాయతే।
ఉపవిశ్యా ఆసనం సమ్యక్
స్వస్ధికాది యథా రుచి।

ఏకాంతమైన, ప్రశాంతమైన పరిసరములుగల ప్రదేశమును ఎన్నుకొని….,
- సర్వబాహ్య సంబంధములన్నీ బాహ్యముననే వదలివేసి..,
- ధ్యానప్రదేశమును యోగాంగ ద్రవ్యములతోను, చిత్రపఠములు మొదలైన వాటితో నింపి, అలంకరించి ఉంచి….,
అక్కడ దారువులతో (కొయ్యలతో, వాసపు బద్దీలతో) నిర్మితమైన ఆసనమును (పీటను) తయారుగా చేసుకోవాలి.
దారువుపై దర్భలు, కుశలు, కృష్ణాజినము (పులి/జింక చర్మము) పరచి అమర్చుకోవాలి.
ఆ ఆసీనముపై స్వస్థికము మొదలైన ఏదో ఒక సుఖాసనమును, (అభిరుచికి తగిన ఆసనమును) స్వీకరించాలి.


బధ్వా ప్రాగాసనం విప్రో ఋజుకాయః సమాహితః .
నాసాగ్రన్యస్తనయనో దంతైర్దంతానసంస్పృశన్ .. 91..

రసనాం తాలుని న్యస్య స్వస్థచిత్తో నిరామయః .
ఆకుంచితశిరః కించిన్నిబధ్నన్యోగముద్రయా .. 92..

హస్తౌ యథోక్తవిధినా ప్రాణాయామం సమాచరేత్ .
39.) బధ్వా ప్రాగాసనం, విప్ర! ఋజు కాయః సమాహితః,
నాసాఽగ్ర న్యస్త నయనో
దంతైః దంతా న సంస్కృశన్,
రసనాం తాలునిన్ అస్య స్వస్థచిత్తో నిరామయః
ఆకున్చిత శిరః కించిత్ నిబధ్నన్ యోగముద్రయా,
హస్తా యధోక్త విధినా ప్రాణాయామం సమాచరేత్||

ఓ విప్రుడా! ఈవిధంగా ప్రాగాసనమును స్వీకరిస్తూ దేహమును (మెడ-భుజ-శిరస్సులను) నిఠారుగా నిలిపి ఉంచాలి. సమాహిత (యోగ) చిత్తముతో యోగసాధనకు సిద్ధం కావాలి.

ముక్కుకు అగ్రప్రదేశము (Upward Space of Nose) నందు దృష్టిని నియమించి, పై దంతములు - క్రింద దంతములు కలవకుండా, నాలుకను తాలువుతో (దవడతో) తాకింపజేస్తూ, నిర్విషయ - నిరామయమగు స్వస్థ చిత్తము కలవాడై, యోగముద్రతో కించిత్ వంచిన శిరస్సు కలవాడై, చేతులను - తగిన రీతిగా దేహాసనమును అనుసరించి ఉంచి, “ప్రాణాయామము” నిర్వర్తించాలి.


రేచనం పూరణం వాయోః శోధనం రేచనం తథా .. 93..

చతుర్భిః క్లేశనం వాయోః ప్రాణాయామ ఉదీర్యతే .
40.) రేచనం పూరణం వాయోః
శోధనం రేచనం తథా,
చతుర్భిః క్లేశనం వాయోః ప్రాణాయామ ఉదీర్యతే|

1.) రేచనము (ఖాళీచేయటం) 2.) పూరణము (నింపటము) 3.) శోధనము (కుంభకము - నింపి ఉంచటము) 4.) పునః రేచకము (వదలటము).
ఈ నాలుగు (వాయువుయొక్క) వాయు సంచలన క్లేశనములను "ప్రాణాయామము” అని చెప్పబడుచున్నది.


హస్తేన దక్షిణేనైవ పీడయేన్నాసికాపుటం .. 94..

శనైః శనైరథ బహిః ప్రక్షిపేత్పింగలానిలం .
ఇడయా వాయుమాపూర్య బ్రహ్మన్షోడశమాత్రయా .. 95..

పూరితం కుంభయేత్పశ్చాచ్చతుఃషష్ట్యా తు మాత్రయా .
ద్వాత్రింశన్మాత్రయా సమ్యగ్రేచయేత్పింగలానిలం .. 96..

ఏవం పునః పునః కార్యం వ్యుత్క్రమానుక్రమేణ తు .

41.) హస్తేన దక్షిణేనైవ పీడయేత్ నాసికాపుటమ్
శనైః శనైః రథ బహిః ప్రక్షిపేత్ పింగళా అనిలమ్|
ఇడయా వాయుమ్ ఆపూర్య,
బ్రహ్మాన్! షోడశ (16) మాత్రయా
పూరితమ్, కుంభయేత్ పశ్చాత్
చతుషష్ట్యాతు (64) మాత్రయా,
ద్వాంత్రింశత్ (32) మాత్రయా సమ్యక్
రేచయేత్ పింగళా అనిలమ్|
ఏవం పునః పునః కార్యం వ్యుత్క్రామ అనుక్రమేణతు।

కుడిచేతి బొటన వ్రేలుతో నాసికాపుటము (ముక్కుపుటమును) పీడించి (నొక్కిపట్టి), అప్పుడు పింగళానాడిలో ’ ఉన్నవాయువును నెమ్మది నెమ్మదిగా బయటకు వదలటము - రేచకము .
తరువాత ఇడా నాడిని వాయువుతో (పీల్చటము ద్వారా) పూరించాలి. అట్లా 16 మాత్రల (చిటికల) కాలము పూరిస్తూ ఉండటము.
ఆ పూరించిన వాయువును 64 మాత్రమల కాలము (64 చిటికెల కాలము) కుంభించి ఉండటము.
ఆవిధంగా కుంభించి 64 మాత్రల కాలము తరువాత, పింగళనాడి మార్గముగా 32 మాత్రల కాలము రేచించటము, వదలటము. (పునః రేచకము).
ఈవిధంగా మరల మరల ఉత్ప్రేమక్రమంగాను (Taking Inward) అనుక్రమణ క్రమంగా (Leaving outward ) …. ప్రాణాయామము చేయాలి.


సంపూర్ణకుంభవద్దేహం కుంభయేన్మాతరిశ్వనా .. 97..

పూరణాన్నాడయః సర్వాః పూర్యంతే మాతరిశ్వనా .
ఏవం కృతే సతి బ్రహ్మంశ్చరంతి దశ వాయవః .. 98..

హృదయాంభోరుహం చాపి వ్యాకోచం భవతి స్ఫుటం .

42.) సంపూర్ణ కుంభవత్ దేహమ్
కుంభయేత్ మాతరిశ్వనా,
పూరణాత్ నాడయః సర్వాః
పూర్యంతే మాతరిశ్వనా, ఏవం కృతేసతి, బ్రహ్మన్!
చరన్తి దశ వాయవః
హృదయా అంభోరుహం చ అపి
వ్యాకోచం భవతి స్ఫుటమ్|

ఒక కుండలో నిండుగా నీరును పోస్తారు చూచావా! ఆవిధంగా (కుంభక సమయంలో) శరీరమంతా వాయువు యొక్క ఉనికి - నిశ్చలతలతో నింపి వేయాలి. దేహమంతా వాయువుతో పూరించటము వలన నాడులన్నీ కూడా వాయువుతో సంపూరితము అగుచున్నాయి.

హే బ్రహ్మన్! ఈవిధంగా ప్రాణాయామ పూర్వక - కుంభకములచే హృదయ పద్మముయొక్క దశదళములు వికశితోత్సాహము పొందుచున్నాయి.
అప్పుడు క్రమంగా హృదయ కమలమంతా కూడా స్ఫుటము - నిర్మలము అగుచు వ్యాకోచము పొందగలదు. (The space in the Heart blossoms).


తత్ర పశ్యేత్పరాత్మానం వాసుదేవమకల్మషం .. 99..

ప్రాతర్మధ్యందినే సాయమర్ధరాత్రే చ కుంభకాన్ .
శనైరశీతిపర్యంతం చతుర్వారం సమభ్యసేత్ .. 100..

ఏకాహమాత్రం కుర్వాణః సర్వపాపైః ప్రముచ్యతే .
సంవత్సరత్రయాదూర్ధ్వం ప్రాణాయామపరో నరః .. 101..

యోగసిద్ధో భవేద్యోగీ వాయుజిద్విజితేంద్రియః .
అల్పాశీ స్వల్పనిద్రశ్చ తేజస్వీ బలవాన్భవేత్ .. 102..

అపమృత్యుమతిక్రమ్య దీర్ఘమాయురవాప్నుయాత్ .

43.) తత్ర పశ్యేత్ పరాత్మానం
వాసుదేవమ్ అకల్మషమ్|
ప్రాతః మాధ్యన్దినే సాయమ్
అర్ధరాత్రే చ కుంభకాన్,
శనైః అశీతి పర్యన్తం
చతుర్వారం సమభ్యసేత్,
ఏకాహ మాత్రం కుర్వాణః సర్వపాపైః ప్రముచ్యతే॥
సంవత్సర త్రయాత్ ఊర్ధ్వం ప్రాణాయామ పరోనరః,
యోగసిద్ధో భావేత్ యోగీ వాయుజిః విజితేంద్రియః||
అల్పాశీ, స్వల్పనిద్రశ్చ తేజస్వీ బలవాన్ భవేత్
అపమృత్యుమ్ అపక్రమ్య
దీర్ఘమ్ ఆయుః అవాప్నుయాత్||

ఆ విధంగా రేచక - పూరక - కుంభక ప్రాణాయామము అనేకసార్లు నిర్వర్తిస్తూ నిర్వర్తిస్తూ ఉండగా హృదయము నిర్మలమై, సర్వులలోను, సర్వమునందు సమముగా సర్వదా వేంచేసియున్న అకల్మషుడగు వాసుదేవ-పరమాత్మ యొక్క సందర్శనము చేయుటకు బుద్ధి నిర్మలము - ఉత్తేజితము అవుతుంది.

కుంభక ప్రాణాయామమును ప్రాతః కాలము, మధ్యాహ్నము, సాయంకాలము, రాత్రియందు రోజుకు 4 సార్లు ( 4 ×20) 80 ప్రాణాయామములను అభ్యసించాలి. నెమ్మదిగా, గంభీరంగా, ఆదుర్దా లేకుండా, ప్రశాంతంగా అభ్యసించాలి!

ఈ విధంగా ఒక పగలుమాత్రంగా (ఏకాహంగా) నిర్వర్తిస్తే కూడా, ఆ యోగి సర్వ పాపములనుండి విముక్తుడగుచున్నాడు. సంవత్సర త్రయము (3 సం॥లు) అభ్యసించిన యోగికి, ఆ ఊర్ధ్వ ప్రాణాయామ పారాయణము వలన తప్పకుండా యోగసిద్ధి కలుగగలదు. అట్టి యోగి వాయు జయుడు అగుచున్నాడు. ఇంద్రియములను పూర్తిగా జయించి విజితేంద్రియుడు అగుచున్నాడు. అల్పాహారత్వము, స్వల్ప నిద్రత్వముతో అతడు తేజోవంతుడు, పుష్టిమంతుడు అగుచున్నాడు. అపమృత్యువు తొలగినదై, దీర్ఘాయుష్మంతుడు అగుచున్నాడు.


ప్రస్వేదజననం యస్య ప్రాణాయామస్తు సోఽధమః .. 103..

కంపనం వపుషో యస్య ప్రాణాయామేషు మధ్యమః .
ఉత్థానం వపుషో యస్య స ఉత్తమ ఉదాహృతః .. 104..

అధమే వ్యాధిపాపానాం నాశః స్యాన్మధ్యమే పునః .
పాపరోగమహావ్యాధినాశః స్యాదుత్తమే పునః .. 105..

అల్పమూత్రోఽల్పవిష్ఠశ్చ లఘుదేహో మితాశనః .
పట్వింద్రియః పటుమతిః కాలత్రయవిదాత్మవాన్ .. 106..

44.) ప్రస్వేద జననం యస్య
ప్రాణాయామస్తు సో ‘అధమః’ |
కమ్పనం వపుషో యస్య
ప్రాణాయామేషు ‘మధ్యమః’|
ఉత్తానం వపుషో యస్య
స ‘ఉత్తమ’ ఉదాహృతః।
అధమే వ్యాధి పాపానాం
నాశస్మాత్! మధ్యమే పునః
పాపరోగ మహా వ్యాధినాశస్యాత్||
ఉత్తమే పునః అల్పమూత్రో, అల్ప విష్ఠశ్చ, లఘు దేహెూ మితాశనః,
పట్వింద్రియః, పటుమతిః కాలత్రయవిత్ ఆత్మవాన్।

అధమ ప్రాణాయామ సాధ్య స్థితి : ప్రాణాయామము చేస్తూ ఉండగా శరీరమంతా చెమటపోస్తూ ఉంటే … అది అధమ ప్రాణాయామ స్థితి! (ప్రారంభ స్థితి)
ప్రాణాయామ మధ్యమ సిద్ధి స్థితి : శరీరము చలనము - వణుకు కలుగుతూ ఉంటే అది మధ్య సిద్ధి ప్రాణాయామ స్థితి. (రెండవ స్థితి)
ఉత్తమ ప్రాణాయామ సాధ్య స్థితి : దేహము ఉత్థాన (పైకి లేచు) స్థితి కలుగుతూ ఉంటే అది ఉత్తమ ప్రాణాయామ సిద్ధిస్థితి.

అధమ ప్రాణాయామ సంసిద్ధి చేత వ్యాధులు, పాప దృష్టులు నశించి హృదయము నిర్మలము అగుచున్నది. మధ్యమ ప్రాణాయామ సిద్ధిచే పాపకర్మల సంస్కారము జయించబడుచున్నది. మూల వ్యాధులు తొలగుతాయి. ఉత్తమ ప్రాణాయామ సిద్ధ స్థితి వలన పాప-రోగ-మహా వ్యాధులు మొదలంట్లా తొలగ గలవు. అంతే కాకుండా , అల్పమూత్రము, అల్ప మలము, తేలిక దేహము, తక్కువ ఆకలి, పటువైన ఇంద్రియములు, సునిశితము - సూక్ష్మము అగు బుద్ధి, త్రికాల జ్ఞానము - ఇవన్నీ లభించగలవు.


రేచకం పూరకం ముక్త్వా కుంభీకరణమేవ యః .
కరోతి త్రిషు కాలేషు నైవ తస్యాస్తి దుర్లభం .. 107..

నాభికందే చ నాసాగ్రే పాదాంగుష్ఠే చ యత్నవాన్ .
ధారయేన్మనసా ప్రాణాన్సంధ్యాకాలేషు వా సదా .. 108..

సర్వరోగైర్వినిర్ముక్తో జీవేద్యోగీ గతక్లమః .
కుక్షిరోగవినాశః స్యాన్నాభికందేషు ధారణాత్ .. 109..

నాసాగ్రే ధారణాద్దీర్ఘమాయుః స్యాద్దేహలాఘవం .

45.) రేచకం పూరకం ముక్త్వా కుంభీకరణమేవ యః
కరోతి త్రిషు కాలేషు,
నైవ తస్యాస్తి దుర్లభమ్ |
నాభికన్దే చ, నాసాగ్రే పాదాంగుష్ఠే చ
యత్నవాన్,
ధారయేత్ మనసా ప్రాణాన్ సన్ధ్యా కాలేషు వా సదా,
సర్వరోగైః వినిర్ముక్తో,
జీవేత్ యోగీ గతక్లమః।
కుక్షిరోగ వినాశస్స్యాత్
నాభి కన్దేషు ధారణాత్,
నాసాగ్రే ధారణాత్ దీర్ఘమ్-ఆయుష్యం, దేహలాఘవమ్|

ప్రాణాయామ యోగము యొక్క అభ్యాసముచేత, ఒకానొక సుస్థితిలో రేచకము - పూరకము లేకుండానే ఆ యోగి కుంభకము అవధరించగల స్థితి లభించగలదు. అట్టి స్వభావ కుంభకము ను ఎవ్వరు నిర్వర్తిస్తూ ఉంటారో, వారికి ఈ ముల్లోకములలో దుర్లభమనునదేదీ ఉండదు.

ఎవ్వరైతే సంధ్యా సమయమందుగాని, ఎల్లప్పుడూ గాని ప్రయత్నపూర్వకంగా నాభికందము (శరీరమధ్య నాభీ కేంద్రము) నందుగాని, ముక్కు యొక్క పై చివరగాని, కాలి బొటనవ్రేలినందుగాని, మార్చి మార్చి గాని, మనఃపూర్వకంగా ప్రాణశక్తిని ధారణ చేయుచున్నాడో, ఆతడు సర్వరోగముల నుండి విముక్తుడై ఆనందముగా జీవించుచున్నాడు. అందరికీ ఆ ఆనందమును పంచిపెట్ట గలడు.

నాభికన్దము (బొడ్డుచుట్టూ) కుంభక ప్రాణయోగ ధారణ చేయువాడు పొట్టలోని రోగములన్నిటి నుండి విముక్తుడు కాగలడు. ముక్కుకు ఊర్థ్వ స్థానమునందు ప్రాణయామ పూర్వక కుంభక ధారణ చేయువాడు దీర్ఘాయుష్షు కలిగినవాడగుచున్నాడు. దేహము తేలికగా, క్రియాశక్తి శీలముగా అయి ఆయుర్వృద్ధి పొందుచున్నాడు.


బ్రాహ్మే ముహూర్తే సంప్రాప్తే వాయుమాకృష్య జిహ్వయా .. 110..

పిబతస్త్రిషు మాసేషు వాక్సిద్ధిర్మహతీ భవేత్ .
అభ్యాసతశ్చ షణ్మాసాన్మహారోగవినాశనం .. 111..

యత్ర యత్ర ధృతో వాయురంగే రోగాదిదూషితే .
ధారణాదేవ మరుతస్తత్తదారోగ్యమశ్నుతే .. 112..

46.) బ్రాహ్మే ముహూర్తే సంప్రాప్తే
వాయుమ్ ఆకృష్య జిహ్వయా
పిబతః త్రిషుమాసేషు ‘వాక్ ‌సిద్ధిః మహతీ’ భవేత్|
అభ్యాసతశ్చ షణ్మాసాత్ మహారోగ వినాశనమ్|
యత్ర యత్ర ధృతో వాయుః
అంగే రోగాది దూషితే,
ధారణాదేవ మరుతః తత్ తత్ ఆరోగ్యమ్ అశ్నుతే |

బ్రాహ్మీముహూర్తమునందు (తెల్లవారు ఝాము 4 గంటల నుండి 6 గంటల) సమయంలో - ఏ యోగసాధకుడైతే - నాలుకలో గాలిని ఆకర్షించి పిబతము (గుక్కవేయటము) 3 నెలల కాలము అభ్యసిస్తాడో, ఆతనికి ‘వాక్శుద్ధి’ కలుగుచున్నది. 6 నెలలు కుంభక ప్రాణాయామముచే మహా రోగములు తొలగుచున్నాయి.

ఎక్కడెక్కడ దేహము యొక్క ఏఏ భాగము రోగాక్రాంతమై ఉంటుందో, ఆయా శరీర భాగమునందు పూరక, రేచక పూర్వకమైన కుంభకముగాని, అవి రెండూ లేకుండానే కుంభకము గాని నిర్వర్తిస్తూ… వాయువును కుంభిస్తూ ధరిస్తూ ఉండగా… ఆ చోట ఆ దోషము తొలగి స్వస్థత ఏర్పడ గలదు. అట్లాగే సహజీవుల అస్వస్థ బాధలను అట్టి యోగాభ్యాసి తొలగించగలడు.


మనసో ధారణాదేవ పవనో ధారితో భవేత్ .
మనసః స్థాపనే హేతురుచ్యతే ద్విజపుంగవ .. 113..

కరణాని సమాహృత్య విషయేభ్యః సమాహితః .
అపానమూర్ధ్వమాకృష్యేదుదరోపరి ధారయేత్ .. 114..

బంధన్కరాభ్యాం శ్రోత్రాదికరణాని యథాతథం .
యుంజానస్య యథోక్తేన వర్త్మనా స్వవశం మనః .. 115.. మనోవశాత్ప్రాణవాయుః స్వవశే స్థాప్యతే సదా .
నాసికాపుటయోః ప్రాణః పర్యాయేణ ప్రవర్తతే .. 116..

తిస్రశ్చ నాడికాస్తాసు స యావంతం చరత్యయం .
శంఖినీవివరే యామ్యే ప్రాణః ప్రాణభృతాం సతాం .. 117..

తావంతం చ పునః కాలం సౌమ్యే చరతి సంతతం .

47.) మనసో ధారణాత్ ఏవ పవనో ధారితో భవేత్|
మనసః స్థాపనే హేతుః ఉచ్యతే, ద్విజపుంగవ!
కరణాని సమాహృత్య విషయేభ్యః సమాహితః।
అపానమ్ ఊర్ధ్వమ్ ఆకృష్యేత్ ఉదరో పరిధారయేత్
బధ్నన్ కరాభ్యాం శ్రోత్రాది
కరణాని యథాతథమ్
యుంజానస్య యథా-ఉక్తేన
వర్త్మనా స్వవశం మనః
మనః కృ ష్టశ్చ వై వాయుః, స్వవశే స్థాప్యతే సదా
నాసికాపుటయోః ప్రాణః
పర్యాయేణ ప్రవర్తతే।
తిస్రశ్చ నాడికాః తాసు
సయావన్తం చరత్యయమ్
శఙ్కినీ వివరే యామ్యే
ప్రాణః ప్రాణభృతాం సతామ్,
తావన్తం చ పునః కాలం, సౌమ్యే! చరతి సన్తతమ్।

ఓ ద్విజ పుంగవా! ఒక ముఖ్య విషయం. మనస్సు ధరించబడిందా, వెనువెంటనే ప్రాణశక్తి (పవనశక్తి) కూడా ధరించబడుతుందయ్యా! అందుకే, “మనస్సు ఒకచోట స్థాపించాలంటే అందుకు ధాతువు ప్రాణశక్తియే. అందుచేత ప్రాణశక్తియే మనస్సును నియమించటానికి ఉపాయము" - అని చెప్పబడుతోంది. మనస్సును ఎక్కడ నియమిస్తే, అది ఆ చోట ప్రాణాయామముతో సమానమే!

విషయములందు ప్రవేశించినవైయున్న ఇంద్రియములను (అనగా మనస్సును) - ఆ విషయములనుండి వెనుకకు మరల్చి అప్పుడిక అపానవాయువును ఊర్ధ్వమునకు లాగి, ఉదరము (పొట్టకు)పై భాగమున చక్కగా ధారణ చేయాలి.

చేతులతో చెవులు మొదలైన ఇంద్రియములను మూసి ఉంచి, ప్రాణాయామ కుంభకమును సశాస్త్రీయంగా, పైన మనము చెప్పుకున్నవిధంగా సలుపుచున్నవాని మనస్సు తప్పక అధీనంలోకి వస్తుంది.

మనస్సు వశమైయిందా - ప్రాణవాయువు కూడా స్వవశము అగుచున్నది. ప్రాణము వశమైతే మనస్సు వశమౌతుంది.

నాసికా పుటలనుండి ప్రాణవాయువు మరల మరల స్వీయ ప్రవర్తనము కలిగినదై ఉంటోంది. ఇడ - పింగళా - సుషుమ్న - త్రినాడులు దేహమునందు చలనమును తమకు తామే (అసంకల్పితంగా) ప్రదర్శించుచూ ఉన్నాయి.

ప్రాణాయామ సాధనను సిద్ధించుకొన్న యోగుల ప్రాణశక్తి శంఖిణీ - వివర్తమగు సుషుమ్నయందు మాత్రమే అత్యధికంగా సంచారము కలిగి ఉంటోంది. ఇక, యోగాభ్యాసులు కానట్టి తదితరుల విషయానికి వస్తే వారిపట్ల ఇడ - పింగళ నాడులందు తదితరనాడులందు ఎక్కువగా వాయువు సంచరిస్తూ ఉంటుంది. ఈ విధంగా దేహము సజీవంగా ఉన్నంత వరకు ప్రాణవాయువు చరిస్తూనే ఉంటోంది.


ఇత్థం క్రమేణ చరతా వాయునా వాయుజిన్నరః .. 118..

అహశ్చ రాత్రిం పక్షం చ మాసమృత్వయనాదికం .
అంతర్ముఖో విజానీయాత్కాలభేదం సమాహితః .. 119..

అంగుష్ఠాదిస్వావయవస్ఫురణాదశనేరపి .
అరిష్టైర్జీవితస్యాపి జానీయాత్క్షయమాత్మనః ..120..

జ్ఞాత్వా యతేత కైవల్యప్రాప్తయే యోగవిత్తమః .

48.) ఇత్థం క్రమేణ చరతా
వాయునా వాయుజిత్ నరః,
అహశ్చ, రాత్రిం, పక్షం చ
మాసం మత్వా ఆయనాదికమ్,
అంతర్ముఖో విజానీయాత్
కాలభేదం సమాహితః,
అంగుష్ఠాది స్వావయవ
స్ఫురణాదశనేరపి,
అరిష్టైః జీవితస్య అపి
జానీయాత్ క్షయమ్, ఆత్మనః,
జ్ఞాత్వా, యతేత కైవల్య ప్రాప్తయే యోగవిత్తమః

మనం చెప్పుకొన్న పూరక - రేచక - కుంభక - పునః రేచక క్రమంలో ప్రాణాయామమును అభ్యాసంగా నిర్వర్తించు సాధక జనులు (ప్రాణాయామ యోగులు) క్రమంగా వాయువును జయించుచున్నారు. స్వాధీనం చేసుకొని సశాస్త్రీయంగా నియమిస్తున్నాడు. రాత్రి - పగలు - పక్షము - మాసములుగా ప్రాణోపాసన చేయుచు క్రమంగా అంతర్ముఖులై కాలబేధములను దాటివేయుచు కాలః కాలమగు ఆత్మను దర్శించుచున్నారు.

ఈ జీవుడు - మనో - ప్రాణ శక్తులను ఏకం చేసి ఈ దేహమును ఒక ఉపకరణముగా భావించి, కుంభక ప్రాణాయామము మరల మరల ఆశ్రయిస్తూ - తద్వారా ఆత్మను తెలుసుకొని, ఆత్మనే దర్శిస్తూ ఆత్మయందే ప్రవేశించాలి. ఇప్పటికిప్పుడే ప్రాణాయామాది సాధనకు ఉపక్రమించాలి. తాత్సారం చేయరాదు. ఈ దేహము శాశ్వతము కాదని గుర్తుంచుకోవాలి. “బొటన వేలు - తదితర అవయవములు స్పర్శ కోల్పోవటము” అనే మృత్యు సూచనలు, దేహక్షయము యొక్క అనివార్యత గుర్తెరిగి, ప్రాణాయామాభ్యాసముచే ఆత్మను ఎరగాలి. యోగవిత్తముడై కైవల్యమును సంపాదించుకోవాలి.


పాదాంగుష్ఠే కరాంగుష్ఠే స్ఫురణం యస్య న శ్రుతిః .. 121..

తస్య సంవత్సరాదూర్ధ్వం జీవితస్య క్షయో భవేత్ .
మణిబంధే తథా గుల్ఫే స్ఫురణం యస్య నశ్యతి .. 122..

షణ్మాసావధిరేతస్య జీవితస్య స్థితిర్భవేత్ .
కూర్పరే స్ఫురణం యస్య తస్య త్రైమాసికీ స్థితిః .. 123..

కుక్షిమేహనపార్శ్వే చ స్ఫురణానుపలంభనే .
మాసావధిర్జీవితస్య తదర్ధస్య తు దర్శనే .. 124..

49.) పాదాంగుష్ఠే, కరాంగుష్ఠే
స్ఫురణం యస్య నశ్యతి,
తస్య సంవత్సరాత్ ఊర్ధ్వమ్
జీవితస్య క్షయో భవేత్|
మణిబన్ధే తథా గుల్ఫే
స్ఫురణం యస్య నశ్యతి,
షణ్మాసా (6 నెలలు) అవధిరేతస్య
జీవితస్య స్థితిః భవేత్|
కూర్పరే స్ఫురణం యస్య
తస్య త్రైమాసికీ స్థితి
కుక్షి మేహన పార్శ్వేచ
స్ఫురణాత్ ఉపలమ్భనే॥
మాసా-అవధిః జీవితం స్యాత్

ఈ దేహమేదో ‘శాశ్వతము’ అనుకొని, దీనిని స్వయం సంకల్ప రేచక - పూరక - కుంభక (లేక) స్వయం సంకల్పక కుంభక ప్రాణాయామాభ్యాసమునకు ఉపయోగించుకోవలసినదిపోయి, ఇంద్రియ విషయములలో తాదాప్యము చెంది ఆయుష్షు వృధా చేసుకోవటమా? ఎంతటి దౌర్భాగ్యం? అందుకే మృత్యువు గురించి గుర్తు పెట్టుకోవాలి.

అందుచేత మృత్యు సూచనలను గురించి కొన్ని విషయాలు చెప్పుచున్నాను.

ఎవరికైతే కాలి బొటనవ్రేలు, చేతి బ్రొటనవ్రేలు ’స్ఫురణ’ నశిస్తుందో వారు సంవత్సర కాలం లోపల భౌతిక దేహము క్షయించు సూచన!
చేతి మణికట్టుయందు, గుల్ఫము (కాలి చీలమండలమునందు) స్ఫురణ ఎవరి దేహమునందు నశిస్తుందో వారి జీవిత స్థితి 6 మాసములు మాత్రమే శేషించుచున్నట్లు సూచన!
కూర్పరము (మోచేయి - మోకాలు మండల ప్రదేశము)నందు స్ఫురణ నశిస్తే వారి దేహము 3 మాసములు మాత్రమే జీవించగలదని సూచనగా భావించాలి.
కుక్షి, మేహన పార్శ్వములలో (పొట్టకు, మూత్రవిసర్జనావయ ప్రక్కలుగా) స్ఫురణ లభించటం ఆగుతుంటే ఆతని జీవితకాలము 1 నెల కాలము మాత్రమే శేషించుచున్నట్లు!


ఆశ్రితే జఠరద్వారే దినాని దశ జీవితం .
జ్యోతిః ఖద్యోతవద్యస్య తదర్ధం తస్య జీవితం .. 125..

జిహ్వాగ్రాదర్శనే త్రీణి దినాని స్థితిరాత్మనః .
జ్వాలాయా దర్శనే మృత్యుర్ద్విదినే భవతి ధ్రువం .. 126..

ఏవమాదీన్యరిష్టాని దృష్టాయుఃక్షయకారణం .
నిఃశ్రేయసాయ యుంజీత జపధ్యానపరాయణః .. 127..

మనసా పరమాత్మానం ధ్యాత్వా తద్రూపతామియాత్ .
యద్యష్టాదశభేదేషు మర్మస్థానేషు ధారణం .. 128..

స్థానాత్స్థానం సమాకృష్య ప్రత్యాహారః స ఉచ్యతే .
పాదాంగుష్ఠం తథా గుల్ఫం జంగామధ్యం తథైవ చ .. 129..

మధ్యమూర్వోశ్చ మూలం పాయుర్హృదయమేవ చ .

50.) తదర్ధంస్యతు దర్శనే,
ఆశ్రితే జఠరే ద్వారే
దినాని దశ జీవితమ్ |
జ్యోతిః ఖద్యోతవత్ యస్య, తదర్ధం తస్య జీవితమ్|
జిహ్వాగ్రా దర్శనే త్రీణి దినాని స్థితిరాత్మనః।
జ్వాలాయా దర్శనే మృత్యుః ద్విదినే భవతి ధ్రువమ్|
ఏవమ్ ఆదీని అరిష్టాని
దృష్ట్వాయుః క్షయకారణమ్ ||
నిత్రేయసాయ యుంజీత
జప ధ్యాన పరాయణః। మనసా పరమాత్మానం
ధ్యాత్వా తద్రూపతామియాత్।
యత్ అష్టాదశ భేదేషు
మర్మస్థానేషు ధారణమ్
స్థానాత్ స్థానమ్ సమాకృష్య
“ప్రత్యాహారః” స ఉచ్యతే॥
పాదాంగుష్ఠం తథా గుల్ఫం జంఘా మధ్యం తథైవ చ,
మధ్యమ్ ఊర్వోశ్చ మూలం చ పాయుః హృదయమేవ చ||

పొట్టయందు జఠరాగ్ని జనించు స్థానముతో స్ఫురణ కోల్పోతే, ఇక ఆ దేహము యొక్కఆయుష్షు 10 దినములు మాత్రమే అగుచున్నది.
ఎప్పుడైతే ‘జ్యోతి’ మిణుగురు పురుగువలె కనబడనారంభిస్తుందో (గదిలో దీపము మిణుగురు పురుగులాగా ఆరుతూ, వెలుగుతూ చిన్నగా కనిపించుచున్నదో…. ఆతని ఆయుష్షు కూడా 10 రోజులలోపే!
నాలుకయొక్క కొన స్ఫురించటం ఆగిపోతే, ‘3’ దినములు మాత్రమే బ్రతకపోవుచున్నట్లు!
అగ్ని జ్వాల కనిపించటం మానివేస్తే ఆతని శేషించిన కాలము ‘2’ రోజులు మాత్రమే!
ఇటువంటివన్నీ అరిష్ట సూచకములు. ఇవి కనబడుతూ ఉంటే, ఇక జీవిత కాలము ముగియబోతోందని గమనించాలి.

జీవుడు ఎల్లప్పుడూ జప - ధ్యాన పరాయణుడై “నిశ్రేయమగు మోక్షము” కొరకై సర్వ అవకాశములను ఆశ్రయించాలి. అంతే కాదు. దీపమున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి కదా! దేహము బాగున్నప్పుడే జప-ధ్యానములు ఆశ్రయించాలి!

ఎట్లా జపధ్యానములు నిర్వర్తించాలంటావా? విను.
మనస్సుతో పరమాత్మను ధ్యానిస్తూ ఉండగా, ఇక ఆతడు క్రమంగా తానే సర్వాంతర్యామి, సర్వతత్త్వ స్వరూపుడు, కేవలసాక్షి యగు ”తత్" రూపుడు అగుచున్నాడు.
యోగ ప్రత్యాహారము - దేహములో అష్టాదశ (18) వేరు వేరు భేదములతో కూడిన “మర్మస్థానములు” గుర్తించబడ్డాయి. ఆ మర్మస్థానములలో ఒకదానిలోని ’ధారణ’ను మరొక స్థానమునకు చేర్చుతూ ఆ ధారణను కొనసాగించటమును “యోగప్రత్యాహారము” … అని అంటారు.


మేహనం దేహమధ్యం చ నాభిం చ గలకూర్పరం .. 130..

తాలుమూలం చ మూలం చ ఘ్రాణస్యాక్ష్ణోశ్చ మండలం .
భ్రువోర్మధ్యే లలాటం చ మూలమూర్ధ్వం చ జానునీ .. 131..

మూలం చ కరయోర్మూలం మహాంత్యేతాని వై ద్విజ .
పంచభూతమయే దేహే భూతేష్వేతేషు పంచసు .. 132..

మనసో ధారణం యత్యద్యుక్తస్య చ యమాదిభిః .
ధారణా సా చ సంసారసాగరోత్తరకారణం .. 133..

51.) మేహనం దేహమధ్యం చ, నాభిం చ గళ కూర్పరమ్,
తాలుమూలం చ మూలం చ,
ఫ్రూణస్య అక్ష్ణోశ్చ మండలమ్,
భ్రువోర్మధ్యం లలాటం చ
మూలం ఊర్ధ్వం చ జానునీ।
మూలం చ కర్ణయోః మూలం మహాని ఏతాని వై, ద్విజ!
పంచభూతమయే దేహే
భూతేషు ఏతేషు పంచసు,
మానసో ధారణం యత్ తత్
యుక్తస్య చ యమాదిభిః
“ధారణా” సా చ సంసార సాగర ఉత్తర కారణమ్||

అష్టాదశ మర్మ స్థానములు :
1. పాదముల బొటనవ్రేలు (అంగుష్ఠము) 2. గుల్ఫము (చీలమండలము) 3. జంఘము (కాలిపిక్క) 4. ఊరూమధ్యము (తొడలమధ్య భాగము) 5. ఊరూమూలము (తొడలపై భాగము) 6. పాయువు (మల విసర్జనావయవము) 7. హృదయ స్థానము 8. మేహనస్థానము (మూత్ర విసర్జన స్థానము, లింగము) 9. దేహముయొక్క మధ్య స్థానములో గల నాభి (బొడ్డు) 10. గళకూర్పరము (కంఠ మండల - నిలువు భాగము) 11. తాలు (దవడ) మూలము 12. ఘ్రాణ (ముక్కు పైభాగపు) మూలము 13. అక్టో (కనుగ్రుడ్డు) మండలము 14. భ్రూమధ్య భాగము 15. లలాటము (భ్రుకుటి పైభాగము) 16. జానువుల (మోకాళ్ళు) యొక్క మూల ప్రదేశము 17. చెవుల లోపల మూలభాగము 18. చేతుల చివరి ప్రదేశము.

ఓ ద్విజుడా! ఇవి అష్టాదశ స్థానములయ్యా!

ధారణ :  లోపల ఈ పంచభూతమయ దేహమునందును, బయటగల ఈ పంచభూత ప్రపంచమునందును యమము - నియమములతో కూడిన మనో నియామకమును ‘ధారణ’ అని పిలుస్తున్నారు. అట్టి ధారణ ఈ జీవుని సంసార సాగరమునుండి తరించటానికి ఉత్తమమగు కారణము కాగలదు.


ఆజానుపాదపర్యంతం పృథివీస్థానమిష్యతే .
పిత్తలా చతురస్రా చ వసుధా వజ్రలాంఛితా .. 134..

స్మర్తవ్యా పంచఘటికాస్తత్రారోప్యప్రభంజనం .
ఆజానుకటిపర్యంతమపాం స్థానం ప్రకీర్తితం .. 135..

అర్ధచంద్రసమాకారం శ్వేతమర్జునలాంఛితం .
స్మర్తవ్యమంభఃశ్వసనమారోప్య దశనాడికాః .. 136..

ఆదేహమధ్యకట్యంతమగ్నిస్థానముదాహృతం .
తత్ర సిందూరవర్ణోఽగ్నిర్జ్వలనం దశపంచ చ .. 137..

స్మర్తవ్యో నాడికాః ప్రాణం కృత్వా కుంభే తథేరితం .

52.) ఆజాను పాద పర్యతం ‘పృథివీ స్థానమ్’ ఇష్యతే।
పిత్తళా చతురస్రా చ వసుధా వజ్రలాంఛితా,
స్మర్తవ్యా పంచఘటికా తత్ర ఆరోప్య ప్రభంజనమ్|

ఆజాను కటి పర్యంతమ్
“అపాం స్థానం” ప్రకీర్తితమ్|
అర్థచంద్ర సమాకారం శ్వేతమ్
అర్జున లాంఛితం,
స్మర్తవ్యమ్ అమ్భశ్శ్వసనమ్
ఆరోప్య దశ నాడికాః |

ఆదేహ మధ్య కట్యంతమ్
“అగ్ని స్థానమ్”  ఉదాహృతమ్ ।
తత్ర సిందూర వర్ణోగ్నిః జ్వలనం దశ పంచచ
స్మర్తవ్యా ఘటికా ప్రాణం కృత్వా కుంభే తథేరితమ్|

పృథివీ స్థానము :- అరి కాలునుండి మోకాళ్ళ ప్రదేశము వరకు - పృథివీ స్థానము.
పసుపు (పీత) వర్ణముతో చతురస్రముగా వజ్రలాంచితమైన ముఖము, వసుధ (భూమి) చిహ్నములు, (వజ్రలాంఛితమై) ఉంటుంది. భూతత్త్వమును హృదయములో ఆరోపించి ఈ జానునీ - పాదపర్యంతము వరకు కుంభక ప్రాణాయామమును ‘5’ ఘటికలు (5 x 24 నిమిషములు కాలము) చేయాలి.

అపాం స్థానము :- మోకాళ్ళ స్థానము నుండి కటి (మొల) వరకు జలస్థానము. అర్ధ చంద్రాకారము, తెలుపు వర్ణము. అర్జునలాంఛితము. జలతత్త్వమును హృదయమునందు ఆరోపించుకొని (తానే తత్త్వమైయున్నవానిగా భావించి) 10 ఘటికల కాలము (10 x
24 నిమిషములు) కుంభక ప్రాణాయామము నిర్వర్తించాలి.

అగ్ని స్థానము :- కటి (మొల) ప్రదేశము నుండి దేహమధ్య నాభిస్థానము వరకు - అగ్ని స్థానము అని చెప్పబడుతోంది. ఈ ప్రదేశములో సింధూర వర్ణము (ఎఱ్ఱగా) ప్రకాశించుచున్నది. అట్టి ఎఱ్ఱటి (సింధూర) వర్ణ అగ్నిని హృదయమునందు ఆరోపించి 15 ఘటికలపాటు కుంభక ప్రాణాయామము చేయాలి.


నాభేరుపరి నాసాంతం వాయుస్థానం తు తత్ర వై .. 138..

వేదికాకారవద్ధూమ్రో బలవాన్భూతమారుతః .
స్మర్తవ్యః కుంభకేనైవ ప్రాణమారోప్య మారుతం .. 139..

ఘటికావింశతిస్తస్మాద్ఘ్రాణాద్బ్రహ్మబిలావధి .
వ్యోమస్థానం నభస్తత్ర భిన్నాంజనసమప్రభం .. 140..

వ్యోమ్ని మారుతమారోప్య కుంభకేనైవ యత్నవాన్ .
పృథివ్యంశే తు దేహస్య చతుర్బాహుం కిరీటినం .. 141..

అనిరుద్ధం హరిం యోగీ యతేత భవముక్తయే .

53.) నాభేః ఉపరి నాసాంతం
“వాయు స్థానం” తు తత్రవై,
వేదికా ఆకారవత్ ధూమ్రో
బలవాన్ భూత మారుతః |
స్మర్తవ్యః కుమ్భకేనైవ
ప్రాణమ్ ఆరోప్య మారుతమ్,
ఘటికా వింశతిః తస్మాత్ |
ఘ్రూణాత్ - బ్రహ్మ బిలావధి
“వ్యోమ స్థానం” నభః తత్ర
భిన్నాంజన సమప్రభమ్
ధ్యేయం మారుతమ్ ఆరోప్య
కుమ్భకేనైవ యత్నవాన్ |
పృథివ్యం తే తు దేహస్య
చతుర్బాహుం కిరీటినమ్|
అనిరుద్ధం హరిం యోగీ
యతేత భవముక్తయే|

వాయు స్థానము :- నాభి నుండి ఉపరినాసాంతము (ముక్కు యొక్క పై కొన చివరివరకు) - ఇది వాయు స్థానము. ’వేదిక’(Stage / Plotform) ఆకారము. ధూమ్ర (పొగ - లేతనలుపు) రంగు. ఇది దేహములోని బలమునకు స్థానము. ఈ వాయుతత్త్వమును హృదయమునందు ఆరోపించి ‘20’ ఘటికల సమయము కుంభక ప్రాణాయామము చేయాలి.

ఆకాశ స్థానము :- నాసిక (ముక్కు) యొక్క ఊర్ధ్వ స్థానము నుండి బ్రహ్మరంధ్రము వరకు - ఇది ఆకాశ స్థానము. నిరాకారము. రంగు కాటుక నలుపు. అట్టి ఆకాశతత్వమును హృదయమునందు ఆరోపించుచూ కుంభక ప్రాణాయామమును నిర్వర్తించాలి.

దేహము యొక్క పృథివీ (Solid) అంశమునందు యోగి - నాలుగు బాహువులుగల ‘అనిరుద్ధహరి’ ని ధ్యానించుదురు గాక! “దృశ్యములోని పృథివీ తత్త్వమంతా చతుర్బాహు - కిరీటధారియగు అనిరుద్ధహరీ తత్త్వమే” … అని భావించుచూ కుంభక ప్రాణాయామమును నిర్వర్తించువాడు భవబంధముల నుండి విముక్తి పొందగలడు.


అబంశే పూరయేద్యోగీ నారాయణముదగ్రధీః .. 142..

ప్రద్యుమ్నమగ్నౌ వాయ్వంశే సంకర్షణమతః పరం .
వ్యోమాంశే పరమాత్మానం వాసుదేవం సదా స్మరేత్ .. 143..

అచిరాదేవ తత్ప్రాప్తిర్యుంజానస్య న సంశయః .

అబంశే పూరయేత్ యోగీ
నారాయణమ్ ఉదగ్రధీః
ప్రద్యుమ్నమ్ అగ్నౌ వాయ్వంచే ’సంకర్షణమ్’ అతఃపరమ్|
వ్యోమాంశే పరమాత్మానం, వాసుదేవం సదా స్మరేత్
అచిరాత్ ఏవ తత్రాప్తిః, యుంజానస్యః న సంశయః|
దేహమునందు - విశ్వమునందు కనిపిస్తున్న జలాంశ (Liquid)ను → నారాయణ తత్త్వముగాను, అగ్ని అంశను → ’ప్రద్యుముడు’గాను, వాయు అంశను → సంకర్షణుడు గాను, వ్యోమాంశను (ఆకాశాంశను) → పరబ్రహ్మస్వరూపుడగు “వాసుదేవుడు"గాను స్మరించాలి.

ఈ విధంగా దేహములోని - విశ్వములోని
పృథివీ అంశను → అనిరుద్ధుడు గాను,
జల అంశను → నారాయణుడుగాను,
అగ్ని అంశను → ప్రద్యమ్నుడుగాను,
వాయు అంశను → సంకర్షణుడుగాను,
ఆకాశ అంశను → వాసుదేవుడుగాను,
కుంభక ప్రాణాయామముతో స్మరించువాడు అతి శీఘ్రముగా అనిరుద్ధ - నారాయణ - సంకర్షణ - వాసుదేవ సోఽహమ్ స్వరూపములను సంతరించుకొనగలడు. ఇందులో సందేహమే లేదు.

బధ్వా యోగాసనం పూర్వం హృద్దేశే హృదయాంజలిః .. 144..

నాసాగ్రన్యస్తనయనో జిహ్వాం కృత్వా చ తాలుని .
దంతైర్దంతానసంస్పృశ్య ఊర్ధ్వకాయః సమాహితః .. 145..

సంయమేచ్చేంద్రియగ్రామమాత్మబుద్ధ్యా విశుద్ధయా .
చింతనం వాసుదేవస్య పరస్య పరమాత్మనః .. 146..

స్వరూపవ్యాప్తరూపస్య ధ్యానం కైవల్యసిద్ధిదం .
యామమాత్రం వాసుదేవం చింతయేత్కుంభకేన యః .. 147..

సప్తజన్మార్జితం పాపం తస్య నశ్యతి యోగినః .

54.) బధ్వా యోగాసనం పూర్ణం
హృత్ దేశే హృదయాంజలిః,
నాసాగ్ర న్యస్త నయనో
జిహ్వాం కృత్వా చ తాలుని,
దంతైః  దన్తాః న సంస్పృశ్య
ఊర్ధ్వకాయః సమాహితః,
సంయమేత్ చ ఇంద్రియ గ్రామమ్
ఆత్మబుద్ధ్యా విశుద్ధయా,
చింతనం వాసుదేవస్య
పరస్య పరమాత్మనః,
స్వరూప వ్యాప్తరూపస్య
ధ్యానం కైవల్య సిద్ధిదమ్ |
యామమాత్రం వాసుదేవం
చిన్తయేత్ కుమ్బకేన యః,
సప్తజన్మార్జితం పాపం
తస్య నశ్యతి యోగినః ||

యోగాభ్యాసి అయినవాడు…,
- యోగాసనమునందు దేహమును నియమించి,
- హృత్ ఆకాశములో (హృదయములో) హృదయాంజలిని నమస్కారమును) ఘటించినవాడై,
- నాసాగ్రము (ముక్కుకు పైభాగ ఆకాశమునందు) దృష్టిని నిలిపి,
- నాలుకను తాలు ప్రదేశము (దవడకు) సున్నితముగా తాకి ఉంచి,
- పై - క్రింది దంతములు ఒకటితో మరొకటి తాకనీయకుండా…,
- పృష్టము నుండి పై దేహమంతా నిలువుగా నిశ్చలంగా ధారణ చేస్తూ, సమాహితచిత్తుడై, నిర్మలబుద్ధితో,
- ఇంద్రియములన్నిటినీ జయించి (తిరస్కరించివేసి, ఆలోచనచేయక), సమదర్శన స్థితికి తెచ్చి ఉంచి,
నిర్మలమగు ఆత్మ బుద్ధితో, “ఈ సర్వము నేనై ఉన్న నేను”ను భావన చేస్తూ అంతయూ తానై, అంతటికీ సాక్షి అయి ఉన్న సర్వమునకు ఆవలగల వాసుదేవ పరమాత్మను ధ్యానిస్తూ (కుంభక ప్రాణాయామముచే) సర్వము తానైన వ్యాప్తరూపము ధ్యానించటము - కైవల్యసిద్ధి ప్రదము.

ఈవిధంగా యోగాభ్యాసి కుంభక ప్రాణాయామమును నిర్వర్తిస్తూ..,
- సర్వజీవులలోను-సర్వజీవులుగాను - జగత్తులలోను - జగత్తులు గాను - - సర్వమునకు సాక్షిగాను…, తత్త్వస్వరూపుడైయున్న వాసుదేవుని కొన్ని క్షణములు (యామమాత్రం) భావోపాసన చేసినంతమాత్రం చేత, ఆ యోగి యొక్క ఏడు జన్మలలో ఆర్జించిన పాపమంతా నశించ గలదు. (యామము = 1 రోజు / 8 = 3 గంటలు).


నాభికందాత్సమారభ్య యావద్ధృదయగోచరం .. 148..

జాగ్రద్వృత్తిం విజానీయాత్కంఠస్థం స్వప్నవర్తనం .
సుషుప్తం తాలుమధ్యస్థం తుర్యం భ్రూమధ్యసంస్థితం .. 149..

తుర్యాతీతం పరం బ్రహ్మ బ్రహ్మరంధ్రే తు లక్షయేత్ .
జాగ్రద్వృత్తిం సమారభ్య యావద్బ్రహ్మబిలాంతరం .. 150..

తత్రాత్మాయం తురీయస్య తుర్యాంతే విష్ణురుచ్యతే .

55.) నాభికన్దాత్ సమారభ్య
యావత్ హృదయగోచరమ్
జాగ్రత్ వృత్తిం విజానీయాత్।
కంఠస్థం స్వప్నవర్తనమ్।
సుషుప్తం తాలు మధ్యస్థం|
తుర్యం భ్రూమధ్య సంస్థితం।
తుర్యాతీతం పరంబ్రహ్మ బ్రహ్మరంద్రే తు లక్షయేత్|
జాగ్రత్ వృత్తిం సమారభ్య యావత్ బ్రహ్మ బిలాంతరమ్,
తత్ర ఆత్మా యం, తురీయస్య।
తుర్యాం తే ‘విష్ణుః’ ఉచ్యతే||

జాగ్రతవృత్తుడు :-  నాభిస్థానము నుండి హృదయ స్థానమువరకు స్వస్వరూపాత్మను జాగ్రత్ వృత్తివర్తనుడుగా గ్రహించి కుంభకము నిర్వర్తించబడుగాక! (అది జాగ్రత్ స్వరూపం),
కంఠమునందు (కంఠప్రదేశ ఆకాశము) స్వప్నవర్తన స్వరూపము,
తాలు (దవడ) మధ్యలో ఉన్న ఆకాశము సుషుప్తి వర్తన స్వరూపము,
భ్రూమధ్యములో (రెండు భ్రుకుటుల మధ్యగా గల ఆకాశము) తురీయవర్తనము సంస్థితమై ఉన్నది - అని భావిస్తూ కుంభకము నిర్వర్తించెదరు గాక!

ఇక బ్రహ్మరంధ్రమునకు పైన (Centrally present Top-point in the upper head space) నందు తుర్యాతీతమును భావనచేసి కుంభము నిర్వర్తించబడును గాక!

జాగ్రత్ వృత్తినుండి - బ్రహ్మరంధ్రము వరకు గల ఆకాశమంతా తురీయమే అని అనుభవజ్ఞులచే సిద్ధాంతీకరించబడుతోంది.

తురీయాతీతము - బ్రహ్మరంధ్రమునకు పైన ‘విష్ణువు’ అను శబ్దార్థముగా చెప్పబడుచున్నది.


ధ్యానేనైవ సమాయుక్తో వ్యోమ్ని చాత్యంతనిర్మలే .. 151..

సూర్యకోటిద్యుతిరథం నిత్యోదితమధోక్షజం .
హృదయాంబురుహాసీనం ధ్యాయేద్వా విశ్వరూపిణం .. 152..

అనేకాకారఖచితమనేకవదనాన్వితం .
అనేకభుజసంయుక్తమనేకాయుధమండితం .. 153..

ననావర్ణధరం దేవం శాతముగ్రముదాయుధం .
అనేకనయానాకీర్ణం సూర్యకోటిసమప్రభం .. 154..

ధ్యాయతో యోగినః సర్వమనోవృత్తిర్వినశ్యతి .

56.) ధ్యానేనైవ సమాయుక్తో
వ్యోమ్ని చ అత్యంత నిర్మలే,
సూర్యకోటిద్యుతి రథం
విద్యోదితమ్ అథోక్షజమ్||
హృదయ అమ్బురుహ ఆసీనం
ధ్యాయే ద్వా విశ్వరూపిణమ్ ||
అనేక ఆకార ఖచితమ్,
అనేక వదనాన్వితమ్,
అనేక భుజ సంయుక్తమ్,
అనేక ఆయుధ మణ్డితమ్,
నానావర్ణ ధరం దేవం,
శాంతమ్ ఉగ్రమ్, ఉత్ ఆయుధం,
అనేక నయన ఆకీర్ణం సూర్యకోటి సమప్రభమ్|
ధ్యాయతో యోగినః సర్వం
మనోవృత్తిః వినశ్యతి।

స్వతఃగా ఆత్మస్వరూపుడే అయి ఉండి కూడా ఈ జీవునికి బంధము దేనివలన కలుగుతోంది? మనో వృత్తుల వలన.
మరి వాటిని జయించటం ఎట్లా? అందుకు కుంభక ప్రాణాయమముతో కూడిన ధ్యాన నిష్ఠకై ధ్యేయమును వివరిస్తున్నాను.

’ధ్యానము’చే సమాయుక్తుడై యోగాభ్యాసి…,
- నిర్మల హృదయాకాశమునందు,
- కోటి సూర్యుల ప్రభావము కలవాడు,
- మహా ప్రకాశవంతుడు,
- విద్యుత్కాంతి స్వరూపుడు,
- విశ్వమంతా తన స్వరూపముగా కలవాడు,
అగు “అధోక్షజ శ్రీమన్నారాయణుడు నా హృదయ కమలమునందు ఆశీసుడై ఉన్నారు” - అని ధ్యానించాలయ్యా!

ఆ విష్ణు భగవానుని
- ఈ కనబడే సర్వ ఆకారములు తనవే అయి ఉన్నవాని గాను,
- అనేక వదనములు - భుజములు ధరించువానిగాను,
- అనేక ఆయుధములు ధరించిన నానావర్ణాత్మకుని గాను,
- పరమశాంత స్వరూపుడు - ఉగ్రస్వరూపుడు కూడా అయి ఉన్నవాని గాను,
- ఎత్తబడిన ఆయుధములు ధరించినవానిగాను,
- అనేక నేత్రములు కలవానిగాను
- కోటి సూర్య ప్రభాభాసునిగాను…,
యోగ కుంభక ప్రాణాయామ నిష్ఠతో ధ్యానం చేస్తూ ఉంటే, మనోవృత్తులు నశిస్తాయి.


హృత్పుండరీకమధ్యస్థం చైతన్యజ్యోతిరవ్యయం .. 155..

కదంబగోలకాకారం తుర్యాతీతం పరాత్పరం .
అనంతమానందమయం చిన్మయం భాస్కరం విభుం .. 156..

నివాతదీపసదృశమకృత్రిమమణిప్రభం .
ధ్యాయతో యోగినస్తస్య ముక్తిః కరతలే స్థితా .. 157..

57.) హృత్ పుండరీక మధ్యస్థం
చైతన్యం జ్యోతిః అవ్యయమ్,
కదమ్బగోళక ఆకారం
తుర్యాతీతం పరాత్పరమ్,
అనంతమ్, ఆనన్దమయం
చిన్మయం భాస్కరం విభుమ్|
నివాత దీప సదృశమ్,
అకృత్రిమ మణి ప్రభమ్,
ధ్యాయతో యోగినః తస్య,
ముక్తిః కరతలే స్థితా!

- హృదయ కమలమునందు సదా వేంచేసి ఉన్నవారు,
- చైతన్య జ్యోతి స్వరూపుడు,
- అవ్యయుడు,
- సర్వతత్త్వములు తనయందు కలిగి ఉన్నట్టి కదంబగోళక (అరటిపువ్వు) ఆకారుడు,
- తుర్యమునకు ఆవల గల తుర్యాతీతుడు,
- దరాత్ పరుడు (దహరాకాశమును అధిగమించి ఉన్నవాడు),
- అనంతుడు, ఆనన్దమయుడు, - కేవల చిత్మయ స్వరూపుడు,
- సర్వమును ప్రకాశింపజేస్తున్నట్టి భాస్కరుడు,
- సర్వనియామకుడైనట్టి విభుడు,
- వాయువుల కదలికలు లేని చోట నిశ్చల దీపమువలె స్వయంప్రకాశ కాంతి స్వరూపుడు,
- అకృత్రిమమైన మణి ప్రభావములుతో దివ్యకాంతులు వెదదజల్లువాడు,
అగు పరమాత్మను (కుంభక ప్రాణధారణతో) ధ్యానించు యోగికి ముక్తి కరతలామలకమై తీరుతుంది.


విశ్వరూపస్య దేవస్య రూపం యత్కించిదేవ హి .
స్థవీయః సూక్ష్మమన్యద్వా పశ్యన్హృదయపంకజే .. 158..

ధ్యాయతో యోగినో యస్తు సాక్షాదేవ ప్రకాశతే .
అణిమాదిఫలం చైవ సుఖేనైవోపజాయతే .. 159..

జీవాత్మనః పరస్యాపి యద్యేవముభయోరపి .
అహమేవ పరంబ్రహ్మ బ్రహ్మాహమితి సంస్థితిః .. 160..

58.) విశ్వరూపస్య దేవస్య రూపం యత్కించిత్ ఏవ హి
స్థవీయః సూక్ష్మమన్యద్వా పశ్యన్ హృదయ పఙ్కజే |
ధ్యాయతో యోగినో యస్తు, సాక్షాత్ ఏవ ప్రకాశతే
అణిమాది ఫలం చ ఏవ సుఖేనైవ ఉపజాయతే |
జీవాత్మనః పరస్యాపి యత్ ఏవమ్ ఉభయోరపి
“అహమేవ పరంబ్రహ్మ! బ్రహ్మాఽహమ్” ఇతి సంస్థితిః |

ఈ విశ్వమంతా తన రూపమై విరాజిల్లుచున్న దేవదేవుని, సర్వాత్మకుని-స్థూలరూపంగానో, సూక్ష్మరూపంగానో (ఏది అభిరుచి అయితే అదే) - తన హృదయపద్మమునందు ధ్యానిస్తూ ఉంటాడో, ఆతనికి అట్టి పరాత్పరుడు సులభముగా స్వస్వరూపమై సాక్షాత్కరిస్తున్నారు. అట్టి వానిని అణిమ-గరిమ ఇత్యాది సిద్ధులు తమకు తామే వచ్చి ఆశ్రయించగలవు.

ఈ జీవాత్మగా ఉన్నది నేనే!
దీనికి పరమై, ఆధారమై, సాక్షియై ఆవల ఉన్న పరమాత్మను నేనే.
నేనే ఆ పరబ్రహ్మమును! పరబ్రహ్మము అని చెప్పబడుచున్నది నాగురించే!
… అన్న స్థితిని ఆ ధ్యానయోగి సిద్ధించుకోగలడు.


సమాధిః స తు విజ్ఞేయః సర్వవృత్తివివర్జితః .
బ్రహ్మ సంపద్యతే యోగీ న భూయః సంసృతిం వ్రజేత్ .. 161..

ఏవం విశోధ్య తత్త్వాని యోగీ నిఃస్పృహచేతసా .
యథా నిరింధనో వహ్నిః స్వయమేవ ప్రశామ్యతి .. 162..

గ్రాహ్యాభావే మనః ప్రాణో నిశ్చయజ్ఞానసంయుతః .
శుద్ధసత్త్వే పరే లీనో జీవః సైంధవపిండవత్ .. 163..

మోహజాలకసంఘాతో విశ్వం పశ్యతి స్వప్నవత్ .
సుషుప్తివద్యశ్చరతి స్వభావపరినిశ్చలః .. 164..

నిర్వాణపదమాశ్రిత్య యోగీ కైవల్యమశ్నుత ఇత్యుపనిషత్ ..

59.) సమాధిః స తు విజ్ఞేయః
“సర్వవృత్తి వివర్జితః",
బ్రహ్మసంపద్యతే యోగీ,
న భూయః సంసృతిం వ్రజేత్|
ఏవం విశోధ్య తత్త్వాని
యోగీ నిఃస్పృహ చేతసా,
యథా నిరిన్ధనో వహ్నిః
స్వయమేవ ప్రశామ్యతి,
గ్రాహ్య అభావే మనః ప్రాణో
నిశ్చయజ్ఞాన సంయుతః,
శుద్ధసత్త్వే పరే లీనో
జీవః సైన్ధవ పిణ్డవత్|
మోహజాలక సంఘాతో
విశ్వం పశ్యతి స్వప్నవత్ |
సుషుప్తివత్ యః చరతి
స్వభావ పరినిశ్చలః,
నిర్వాణ పదమ్ ఆశ్రిత్య
యోగీ కైవల్యమ్ అశ్నుతే॥

ఇక ‘సమాధి’ అనునది అణిమ - గరిమ ఇత్యాది సర్వ సిద్ధులకు అతీతమైనది వాటికి సంబంధించినదే కాదు.

యోగి సర్వతత్వ స్వరూపమగు బ్రహ్మమును ఉపాసించి తాను సర్వతత్వ స్వరూపుడై, సర్వాతీతుడై వెలుగొందుచు, ఇక మరల సంస్కృతియందు ప్రవేశించటం లేదు. (దృశ్యముచే పరిమితత్వము పొందడు).

ఈ రీతిగా తత్త్వమ్ (“త్వమ్ తత్ - అసి” అను పరమార్ధమును) శోధించి, ఇక తదితర సందర్భ సత్యములగు సర్వ బాహ్య విషయములపట్ల నిస్పృహుడై ఉంటున్నాడు. బ్రహ్మమే తానై ప్రకాశించుచున్నాడు.

కట్టెలు లేని అగ్ని తనకుతానే స్వయముగా సశాంతిస్తుంది కదా! ఆ రీతిగా బ్రహ్మము గురించి స్వస్వరూపత్వము - సర్వ స్వరూపత్వము ఎరిగి భావాతీతుడై ఆ యోగి నిశ్చయజ్ఞాన - విజ్ఞాన సమన్వితుడగుచున్నాడు.

ఉప్పుగడ్డ జలములో ప్రవేశించినప్పుడు తన నామ - రూపములను కోల్పోవు రీతిగా “నేను జీవుడను, దేహముచే పరిమితుడను” … అనునదంతా శుద్ధసత్యమునందు (The Absolute Sense of Presence Unbound by Time and matter) విలీనమై రూపురేఖలు కోల్పోతోంది.

అట్టి యోగి ఇక ఈ పాంచభౌతిక జాగ్రత్ అంతా కూడా (విశ్వమంతా) స్వప్న దృశ్యమువలె ఊహా నిర్మిత కల్పనవలె అవగతమగుచున్నది. ఇదంతా మోహజాల సంఘాతము (Something that appears by virtue of association of Groups of Illusions) అని సుస్పష్టమై తెలియవచ్చుచున్నది.

సుషుప్తిలో ఉన్నవాడు జగత్తులో భౌతిక దేహము కలిగి ఉండి కూడా జగత్ దృశ్య రహితుడు, భౌతిక దేహ రహితుడు అయి ఉంటాడు కదా! ఆ తీరుగా యోగి జాగ్రత్తులో కూడా భౌతిక దేహరహితుడు అయి ఉంటున్నాడు. సర్వమునకు వేరై సాక్షిగా, ప్రశాంతముగా… కేవల స్వరూపుడై విరాజిల్లుచున్నాడు.

ఆతడే ఆత్మసంయమ యోగి. అన్ని విషయాలలో ఉండి కూడా, సర్వదా ఆత్మా హమ్ స్వరూపుడై ఈ సర్వమును స్వస్వరూపముగా ఆస్వాదించుచున్నాడు. నిర్వాణపదమును ఆశ్రయించి, కైవల్యమును ఆస్వాదిస్తూ ప్రకాశించుచున్నాడు.

ఇతి త్రిశిఖి బ్రాహ్మణోపనిషత్ |
ఓం శాంతిః శాంతిః శాంతిః ||


శుక్ల యజుర్వేదాంతర్గత

7     త్రిశిఖి బ్రాహ్మణ ఉపనిషత్

అధ్యయన పుష్పము

1 రోజు = 8 జాములు / యామములు,
1 యామము = 7 ½ ఘడియలు / ఘటికలు,
1 ఘడియ = 60 విఘడియలు ,
1 మాత్ర = హల్లు పలుకు సమయము (ఉదా: ‘క’ అనుటకు పట్టు కాలము)

ఓం శ్రీ ఆదిత్య భగవన్ జగద్గురవే నమో నమో నమో నమః
భాస్కరాయ విద్మహే! మహత్ ద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్||

పూర్వకాలంలో వేద - వేదాంగ పండితుడు, యోగతత్త్వాభిలాషి, ఆదిత్య నారాయణోపాసకుడు అగు ‘త్రిశిఖి’ అనే లోక ప్రసిద్ధుడైన బ్రాహ్మణోత్తముడు ఉండేవారు. ఆయన ఒకానొకరోజు ఆదిత్యోపాసనను కొనసాగిస్తూ, ’ఆహాఁ! జగద్గురువు అగు ఈ సూర్యభగవానుని సందర్శించి దేహము - ప్రాణము యోగము - ఆత్మతత్త్వముల గురించి స్వామి చెప్పు ప్రవచనములను వింటే బాగుంటుంది - కదా”… అని తలచారు. ఆయన తలంపు సందర్శనోత్సాహరూపము దాల్చింది. ఇక ఏ మాత్రము తాత్సారము చేయలేదు. యోగ శక్తితో సూక్ష్మదేహి అయి, సూర్య మండలము ప్రవేశించారు. లోక కళ్యాణమూర్తి, సర్వజీవుల త్రాణయగు సూర్యభగవానుని సమీపించారు.

భక్తతత్పరుడగు త్రిశిఖి బ్రాహ్మణుని సాదరంగా సూర్యభగవానుడు ఆహ్వానించారు. అప్పుడు త్రిశిఖి బ్రాహ్మణుడు సూర్యనారాయణ భగవానునికి పాదపద్మములకు త్రిప్రదక్షిణ పూర్వకంగా సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించారు. శ్రీ ఛాయా పద్మినీ ఉషాసమేతుడైన ఆదిత్యభగవానుడు అత్యంత వాత్సల్యంతో త్రిశిఖి బ్రాహ్మణోత్తముడిని ఉచితాసనముపై ఆశీనులుగా చేశారు.

ఆదిత్య భగవానుడు :  ప్రియ బ్రాహ్మణ సత్తమా ! త్రిశిఖీ ! మీ రాక యొక్క ఉద్దేశ్యమును తెలియజేయండి.

త్రిశిఖి :  హే భగవాన్ ! ఆదిత్యదేవా ! బృహత్ తేజోమయా ! భక్తుల పట్ల కరుణార్ద్ర హృదయలగు మీకు మరల మరల నమస్కరిస్తున్నానయ్యా! స్వామీ ! సద్గురూ ! కొన్ని తాత్త్విక విషయాలు మీ ముఖతః వినగోరుకొంటున్నాను. మహత్మా !

కిం దేహః? ఈ దేహము ఎటువంటిది?
కిం ప్రాణః? ప్రాణముల యొక్క తత్త్వమేమిటి?
కిం కారణమ్? దేహ - ప్రాణముల ఉనికి కొనసాగుతూ ఉండటానికి ఆధారమగుచున్న మూలకారణము ఏది?
తెలుసుకోవలసిన పరమార్థము, పరాకాష్ట ఏమై ఉన్నది?

ఇవన్నీ సవివరంగా తెలుసుకోవాలనుకుంటున్నాను. నాపై దయతో వాటివాటి స్వభావ విశేషాలు సవివరించండి.

ఆదిత్య భగవానుడు :  ఓ బ్రాహ్మణ సత్తమా !

స్వస్వరూపముతో సహా ఈ ఎదురుగా అనుభవమగుచూ కనిపిస్తున్నదంతా అఖండమగు శివతత్త్వమేనయ్యా ! ఇదియే ఎరుగబడవలసిన పరమ సత్యము.

అట్టి శివతత్త్వము నిత్యశుద్ధము. దోషములు గాని, బంధముగాని అద్దానికి లేవు. నిరంజనము. సర్వమునకు యజమాని. ఈ సర్వమును నియమించునట్టిది. విభువు. అద్దానికి వేరైనది ఎక్కడా లేదు. కనుక ఆద్యము! సర్వశుభ - ఆనందప్రదము. కనుక శివము. అనేకంగా అజ్ఞానదృష్టికి కనిపిస్తున్నప్పటికీ సర్వదా ఏకము.

చీకట్లో కనిపించని వస్తువుల ఆకారములు, వాటివాటి అమరికలు సూర్యుడు ఉదయించినప్పుడు సుస్పష్టముగా కనిపిస్తాయి కదా ! ఆ తీరుగా ఆత్మ భాసిస్తోంది కాబట్టే, అద్దాని వెలుగులో జగత్ విషయాలన్నీ కనబడుచున్నాయి, ప్రకాశిస్తున్నాయి.

అయితే ఈ కనబడేదంతా సర్వదా ఆత్మకు అభిన్నమే అయి ఉన్నది. ఒకే పిండము (ముద్ద) అనేక మట్టి ముద్దల వలె సర్వదా ఏకమే అయినప్పటికీ… భిన్నవత్ (భిన్న భిన్నములైనట్లుగా) అజ్ఞాన దృష్టికి కనిపిస్తోంది. అద్దము ఏకమే అయినప్పటికీ, అద్దములో వేరువేరు వస్తుజాలము ప్రతిబింబిస్తున్న తీరుగా ఆభాసించుచున్నది. అగ్ని ఒక్కటే అయి ఉండి కూడా అగ్నిశిఖలు - వెలుగు - ఉష్ణము వేరువేరుగా కనిపిస్తున్నట్లు, ద్రష్ట - దర్శనము - దృశ్యము ఆత్మకు వేరుగా అగుపిస్తున్నాయి!

త్రిశిఖి బ్రాహ్మణుడు : స్వామీ ! అట్లా భాసింపజేయునది ఎట్టిది ? భాసించుచున్నట్టిది ఎట్టిది ?

ఆదిత్య భగవానుడు :  ఏది సర్వమును భాసింపజేయుచున్నదో, ఏది భాసించుచున్నదో, ఎద్దానికి అది అనుభవమగుచున్నదో… ఈ మూడు కూడా ’సత్’ శబ్దముచే వాచ్యము అగు (పిలువబడుచున్న) బ్రహ్మము యొక్క అవిద్యాచమత్కారము మాత్రమే !

    బ్రహ్మము నుండి అనిర్వచనీయంగా - అవ్యక్తము బయల్వెడులుతోంది.
    అవ్యక్తము నుండి - వ్యక్తీకరణ రూపమగు ‘మహత్’ సంప్రదర్శితమౌతోంది.
    మహత్ నుండి - అహంకారము,
    అహంకారము నుండి - పంచతన్మాత్రలు,
    పంచతన్మాత్రాణి - పంచ మహాభూతములు,
    పంచమహాభూతముల నుండి ఈ దృశ్యజగత్తు
… ఇవన్నీ కూడా బయల్వెడలుచున్నాయి. విద్యమానమగుచున్నాయి.

త్రిశిఖి :  ‘ఏకము’ అగుదాని నుండి ఈ అనేకమైనదంతా ఎట్లా బయల్వెడలి విద్యమానమౌతోంది ? తదఖిలం కిమ్ ఇతి ?

ఆదిత్య భగవానుడు :  ఈ సవికారమై కనిపించేదంతా కూడా-భూత వికార విభాగాత్ ఇతి- కేవలాత్మయొక్క పంచభూత వికార విభాగ చమత్కార మాత్రమే !

త్రిశిఖి :  ఏకస్మిన్ పిండే కథం భూతవికార విభాగ ఇతి ? సద్గురూ ! ఏకమగు పిండ తత్త్వము నుండి అనేక విభాగములుగా కనిపిస్తున్న భూతవిభాగమంతా ఎట్లా ఏర్పడటం జరుగుతోంది ?

ఆదిత్య భగవానుడు :  సర్వాత్మకుడగు పరమాత్మ యొక్క కల్పనా చాతుర్యమే ఈ ద్రష్ట - దర్శన - దృశ్య జగత్ చమత్కారమంతా కూడా ! కల్పనకు కార్య - కారణ కర్తృత్వాలు కూడా కల్పనాత్మకమై ఉండాలి కదా ! తత్ పరమాత్మ యొక్క పంచమహా భూత (ఇంద్రియ) తత్త్వములగు శబ్ద - స్పర్శ - రూప - రస - గంధాల ‘అంశ’ చమత్కారములో కార్య - కారణ, వాచ్య - వాచక - స్థాన భేదాలన్నీ అంతర్గతమై ఉంటున్నాయి. త్రిమూర్తుల నుండి - పిపీలికము వరకు భేదవ్యవహారమంతా కల్పించబడి చెన్నొందుచున్నది.

నిర్విషయ నిరాకార బ్రహ్మము నుండి మాయాకల్పిత లీలా వినోదమే - అనతగిన అవిద్యాపిండము - స్వభావమై, సవిషయమై, సాకారమై సంప్రదర్శితమగుచున్నది. పృథివి మొదలైన పంచీకృత మహావిభాగములుగా ప్రారంభమై, మరల అవిభాగత్వము పొందుతూ… ఈ కనబడేదంతా ఒకప్పుడు బయల్వెడలటం, మరొకప్పుడు ఆత్మయందే లయించటం జరుగుతోంది.

ఏకమగు ఆత్మ నుండి ఆకాశము,

ఆకాశము నుండి ఆకాశాంశలుగా అంతఃకరణ చతుష్టయమగు మనో - బుద్ధి - చిత్త - అహంకారములు, (మరియు) వాయువు.

వాయువు నుండి వాయు అంశలుగా సమాన ఉదాన - వ్యాన - అపాన - ప్రాణములు (మరియు) అగ్ని (వహ్ని)

వహ్ని (అగ్ని) నుండి అగ్ని యొక్క అంశలుగా ఇంద్రియ ద్వారములగు శ్రోత్ర - త్వక్ - చక్షు - జిహ్వ - ఆఘ్రాణములు (చెవులు - చర్మము - కళ్ళు - నాలుక - ముక్కు) (మరియు) ఆపః (జలము)

ఆపః (జలము) నుండి జల అంశలుగా శబ్ద - స్పర్శ - రూప - రస - గంధములు (మరియు) పృథివి

పృథివి నుండి పృథివీ అంశలుగా వాక్కు, చేతులు, పాదములు, వాయువు (మలవిసర్జనా వయువము), ఉపస్థ (మూత్ర విసర్జనా వయము)…

ఇవన్నీ స్వప్నసదృశంగా, లీలా వినోదముగా, ఆత్మకు అభిన్నంగా సంప్రదర్శితం అగుచున్నాయి.

కార్యములు

ఆకాశ కార్యములు :  అవిద్యా పిండమునందు భూత - భౌతిక విభాగంలో - ఉపపన్నమయేదే ఆకాశము (Appearence).

ఆకాశాంశ యొక్క కార్యములు : జ్ఞానము (Knowing), నిశ్చయము (Decision taking), అనుసంధానము (Tendency of geting associated), అభిమానము (Sense of relatedness and belongingness).

వాయు అంశ యొక్క కార్యములు : అంతఃకరణ విషయ సమీకరణము (Mixing different permutations and combinations).

       ఉన్నయనము (ఉత్ + నయనము… Perceiving)
       గ్రహణము (Taking inward),
       ఉచ్ఛ్వాసనములు (Perspiration)

వాయు విషయములు : ప్రాణ - అపన - వ్యాన - ఉదాన సమాన - సప్రాణములు.

అగ్ని యొక్క కార్యములు : శబ్ద - స్పర్శ - రూప - రస - గంధములు.

అబాశ్రితములు (అనగా) జలము యొక్క కార్యములు : జ్ఞానేంద్రియములు (కళ్ళు, చెవులు, నోరు, ముక్కు, చర్మము).

పృథివి యొక్క కార్యములు : వచన (Speaking), ఆదాన (Taking), గమన (Walking) విసర్గ (Leaving)

పృథివీ విషయములు - కర్మేంద్రియములు (కాళ్ళు, చేతులు, గుదము, రహస్యావయము, నోరు).

“కర్మ - జ్ఞానేంద్రియ” విషయములలో - ప్రాణ, తన్మాత్రలు (శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు) అంతర్భూతమై ఉన్నాయి.

“మనస్సు - బుద్ధి”ల యందు, చిత్త - అహంకారములు అంతర్భూతములు

సూక్ష్మతన్మాత్రలు : 

       అవకాశము (స్వీకరణ)
       విధూతము (వదలటం)
       దర్శనము (Perception)
       పిణ్డీకరణము (వివిధ మిశ్రమములు సమ్మేళనములు)
       ధారణ (ఆకర్షణ)

ఏవం ద్వాదశాంగాని - ఆధ్యాత్మికా, ఆధిభౌతికా, అధిదైవికాని |

ఇవన్నీ కలిపి 1) ఆధ్యాత్మికములు 2) అధిభౌతికములు 3) అధి దైవికములు

వాటివాటి 1) అంశములు 2) కార్యములు 3) ఇంద్రియ స్థానములు 4) విషయములు

3×4 = ద్వాదశ (12) అంశములుగా శాస్త్రములు విభజించి వర్ణిస్తున్నాయి. ఇవన్నీ విశ్వరచనలో అందర్భూతములై, వివిధ ప్రజ్ఞలచే ప్రదర్శించబడుచున్నాయి. అవి ‘దివ్యప్రజ్ఞలు’ అని, ‘ప్రజ్ఞాధిష్ఠాన దేవతలు’ అని చెప్పబడుచూ వస్తున్నాయి. ఇవన్నీ ఈ దేహములో నిర్వర్తించబడు కార్యక్రమసమూహములుగా, ఇంద్రియ చైతన్యరూప దివ్యాంశలుగా ప్రత్యక్షమై ఉంటున్నాయి.

దివ్యాంశలగు ఇంద్రియ అధిదేవతలు :
1) నిశాకర (చంద్రుడు) 2) చతుర్ముఖ బ్రహ్మదేవుడు), 3) దిక్ (దిక్ దేవతలు), 4) వాయు-చలనాభిమాని 5) అర్క (సూర్యుడు), 6) వరుణ (జలదేవత), 7) అశ్వినీ (ఓషధ దేవతలు), 8) అగ్ని (తేజో -ఉష్ణ దేవత), 9) ఇంద్ర (ఇంద్రియముల అభిమాని), 10) ఉపేంద్ర (సూక్ష్మతత్త్వముల అభిమాని) 11) ప్రజాపతి (దేహముల అభిమాని) 12) యమా (మార్పు చేర్పుల అభిమాని).

వీరంతా అక్ష-అధి దేవతారూపులైనట్టి (సృష్టిలో సంఘటితమౌతున్నట్టి) ద్వాదశ (12) ఇంద్రియాధిదేవతలు. వీరి భౌతిక దేహాంతంగా నిర్వర్తించే క్రియా విశేషాలే సుషుమ్న మొదలగుగా గల ద్వాదశ ముఖ్యనాడులు.

అయితే సర్వము ప్రాణశక్తి ప్రదర్శనమే! ప్రాణశక్తి వాస్తవానికి ఏకమేగాని అనేకము కాదు. అట్లా అయి ఉండి కూడా,… (ఇడ, పింగళ, సుషుమ్న, గాంధారి, పూషా, యశస్విని, అలంబుస, కుహు, శంఖిని - మొదలైన) - 12 నాడులలో 12 రూపములుగా వెలయుచు వివిధ ధర్మములను నెరవేర్చుచున్నది.

ఈ అనేకములుగా కనిపించేదంతా ఏకరూపమగు ప్రాణతత్త్వమే - అని తెలుసుకోవాలి.

వ్యోమ అనిల అనల జల అన్నానాం పంచీకరణం ఇతి జ్ఞాతృత్వం సమానయోగేన శ్రోత్ర ద్వారా శబ్దగుణో అధిష్ఠితే ఆకాశేతిష్ఠతి| ఆకాశః తిష్ఠతి.

ఇక్కడ కనబడేదంతా కూడా ఆకాశ వాయు అగ్ని - జల అన్న (భూ) తత్త్వముల వివిధ సమ్మేళనములే ! ఇదంతా కూడా - “భూత పంచీకరణ”… చమత్కారము ! ఈ ద్వాదశాంగముల గురించి చక్కగా తెలుసుకొన్నవాడే జ్ఞాత!

తెలియబడుచున్నదంతా (వేదమ్) - పంచభూత సమీకరణమే!

తెలుసుకొనువాడు (వేదాంతుడు) ఈయన తెలియబడుచున్న దానికంతటికీ వేరై ఉన్నవాడై, యోగధారణచే, సమానవాయుసంబంధముచే

… ఆకాశమును తన ఆకాశ స్వరూపముతో నింపి ఉంచి, జ్ఞాతృత్వము (తెలుసుకొనటము) నిర్వర్తించున్నాడు.

ఆత్మ స్వరూపుడగు జ్ఞాత తనకు తానే ‘తెలియబడునది’ అను దానిని కల్పించుకొని, ప్రవేశించి - సర్వము తానే అయి ఉండి కూడా (అద్వితీయుడై కూడా), సర్వము తనకు వేరైనట్లుగా భావనచేసి భావబద్ధుడు అగుచున్నాడు ( యథా స్వప్నమ్ ).

గుణరహితుడగు పరమాత్మ లీలా - క్రీడా వినోదంగా గుణములను కల్పించుకొని, ఆ గుణములలో ప్రవేశించి గుణములచే బద్ధుడై ‘గుణి’, ‘జీవుడు’ అని పిలువబడుచున్నాడు. సమాన ప్రాణయోగముతో చెవుల ద్వారా శబ్ద గుణ సమన్వితుడై వాక్కునందు వాక్కుగాను ఆకాశమే అగుచు ఉంటోంది.

మనో వ్యానయోగేన ’త్వక్’ ద్వారా స్పర్శగుణః పాణ్యధిష్ఠితే వాయౌ తిష్ఠతి ! వాయుః తిష్ఠతి !

పరమాత్మ సర్వదా యథాతథుడై ఉండి కూడా, మనస్సు యొక ‘వ్యాన యోగము’ - అనే విస్తరించు ధర్మము చేత చర్మము (త్వక్) ద్వారా స్పర్శగుణము కలవాడగుచున్నాడు. అరచేతిని(ప్రాణిని) అధిష్టించి (ఆశ్రయించి), వాయు స్వరూపుడై వాయువునందు కూడా ఉంటున్నాడు.

బుద్ధి ఉదాన (అంతటా ఏర్పడి ఉండు) వాయు సంబంధముచేత చక్షువుల ద్వారా ’రూప గుణము’ను ప్రదర్శించుచున్నది. బుద్ధియేపాదములను అధిష్ఠించి, ఆశ్రయించి ఉన్నది. అగ్నియందు అగ్ని తత్త్వముగా అయి అధిష్ఠిత్వమును ప్రదర్శించుచున్నది.

చిత్తము అపానవాయు సంబంధము చేత జిహ్వ (నాలుక) ద్వారము గుండా రసగుణము కలిగియున్నదై ఉంటోంది. ఉపస్థ (శృంగారాంగము)ను ఆశ్రయించినదై, (అధిష్ఠించినదై) ఉంటోంది. జలమునందు జలస్వరూపమై ప్రవర్తించుచున్నది.

అహంకారః ప్రాణ యోగేన ఘ్రాణ ద్వారా, గన్జ గుణో గుణాధిష్ఠితాః పృధివ్యాం తిష్ఠతి | పృథివీ తిష్ఠతి - ఇత్యేవం వేద ।

అహంకారము-ప్రాణ వాయు సంబంధము చేత ముక్కు ద్వారా గంధగుణము కలిగియున్నదై, ’గుదము (మలవిసర్జకాయవము)ను కూడా ఆశ్రయించి - అధిష్ఠించినదై ఉన్నది. భూస్వరూపమును పొంది భూమియందు కూడా వేంచేసి ఉన్నదగుచున్నది.

ఎవ్వడైతే -
1) ఈ పంచీకరణమును,
2) పంచభూతముల యొక్క కార్యములను,
3) వాటి సంఘతములకు కారణమగుచున్న సంఘాత - అంతర్యామియగు పరమాత్మయొక్క (i) కర్తృత్వ, (ii) అకర్తృత్వ(iii) సాక్షిత్వములను…, తెలుసుకుంటాడో,
… ఆతడు స్వయముగా తానే ‘అంతర్యామి స్వరూపుడు’గా అయి సర్వత్రా ఆత్మానంద స్వరూపుడుగా ప్రకాశమానుడగుచున్నవాడగుచున్నాడు.
అత్ర ఏతా శ్లోకా భవన్తి | ఈ విషయమే విశదీకరించబడుచు తత్త్వదర్శులు శ్లోకములను గానము చేస్తున్నారు.

ఓ త్రిశిఖీ !

పరబ్రహ్మము సర్వదా సర్వమునకు విలక్షణమై, అప్రమేయమై, యథాతధమైయున్నదయ్యా! ఇక మిగతా వ్యవహారమంటావా? అంతఃకరణము, (మనో - బుద్ధి - చిత్త - అహంకారాలతో కూడిన అంతరంగము) ; పంచప్రాణములు - పంచజ్ఞానేంద్రియములు; పంచకర్మేంద్రియములు; … ఈ షోడశ (16) కళలు, వాటివాటి క్రియలు, వాటి విషయాలు - ఈ ఈ వ్యవహారాలతో సహా పరబ్రహ్మముపై ఆరోపించబడుచున్నది.

(దృష్టాంతానికి, బంగారము బిళ్లయే ఆభరణముగా కమ్మరి మార్చారు - అని మాటగా అంటాము. బంగారము బంగారముగానే ఉన్నదే గానీ, ’ఆభరణము’ అనబడు మరొకటిగా అవటమే లేదు కదా !)

ఈ విధంగా “ఆకాశము - వాయువు - అగ్ని - జలము - భూతత్త్వములు - అంతఃకరణము - వ్యానప్రాణము - కళ్ళు - రసము - పాయువు” మొదలైన శబ్దములన్నీ పరిగ్రహించబడుచున్నాయి. అట్లా పరిగ్రహించబడినవే విషయములుగా పొందబడుచున్నాయి.

యోగ పంచీకరణము :  ఆకాశ-వాయు-అగ్ని-జల-భూ … క్రమములగు పంచభూతముల యందు (ఆకాశాత్వాయుః; వాయురగ్నిః; అగ్నిరాపః; ఆపఃపృథివీ - క్రమమునందు)

ఇట్టి విభాగయోగమే  ‘మహాభూత పంచీకరణము’.

అట్లు విభాగించి - మిశ్రమముగా చేసిన పంచమహాభూత చతష్టయంలో -

  1. ఒక అర్ధ భాగము - ముఖ్యము, సూక్ష్మము.
  2. రెండవ అర్ధ భాగము - స్థూలము, గుణము.

సూక్ష్మభాగములతో గుణాంశాలు (స్థూలములు) అనుక్రమంగా, ఓతప్రోతములుగా ఆశ్రయించినవై ఉంటున్నాయి. అవన్నీ అన్యోన్యములై శబ్ద - స్పర్శ - రూప - రస శక్తులు, విషయములు… అగుచున్నాయి. ఇదియే ఈ కనబడే సృష్టి వైవిధ్యమంతా కూడా!

పై పంచమహాభూత సంపుటీకరణముల గురించి మరికొంత వివరంగా మనము చెప్పుకుందాము.

భూమి :  కళ్ళకు అచేతనమువలె కనిపించు ఈ భూమి అంతర్గముగా పరిశీలిస్తూ వస్తే, భూమిలో - ఆకాశ - వాయు - జల - అగ్నులు మిశ్రమము అయి ఉన్నాయి. పంచభూతమయీ భూమిః, సా చేతన సమన్వితాః | ఈ భూమి పంచభూతాత్మకమై, సచేతనమైయుండటం చేతనే భూమి నుండి ఓషధులు బహిర్గతమై, జీవులకు ఆహారరూపముగా ప్రాప్తమౌతున్నాయి.

సచేతనమగు భూమి నుండి… సచేతనమగు ఓషధులు! సచేతనమగు ఓషధుల నుండి సచేతనమగు ‘అన్నము’! సచేతనమగు అన్నమునుండి - చతుర్విధ సచేతనరూపమగు - పిండములు (జీవులు) బయల్వెడలుచున్నాయి.

1) అండజములు from Egg… పక్షులు మొదలగునవి,
2) జరాయుజ - గర్భధారణ చేత మానవులు, పశువులు మొదలగునవి,
3) ఉద్బీజములు - బీజము (విత్తనముల నుండి జనించేవి. చెట్లు మొదలగునవి),
4) స్వేదజములు - చమట మురికి నుండి జనించే పురుగులు మొదలగునవి,
“అన్నచైతన్యము” నుండియే రసము, రక్తము, మేదస్సు, బొమికలు, మజ్జ, శుక్లము … మొదలైనవి చైతన్యముతో కూడిన ధాతువులు దేహములో జనిస్తున్నాయి. స్వయం ప్రవర్తమానమగుచున్నాయి.

ఓ త్రిశిఖి బ్రాహ్మణా,

కొందరు అనుకుంటున్నారు కదా … “ఆఁ! ఏమీ కాదు! శుక్ల -శోణిత పరస్పర కలయిక చేతనే ప్రాణులు పుట్టుచున్నాయి !" - అని.
అది పరిమిత, సంకుచితమైన అయినట్టి అపరిశీలనాత్మక దృష్టి మాత్రమే. జీవుల దేహములన్నీ ఆహారము నుండే జనించి, ఆహారము (అన్నము) చేతనే జీవిస్తూ….. అన్నమునందే తిరిగి లయిస్తున్నాయి.

ఇదంతా ఇలా ఉండగా…,

ఈ భౌతిక దేహములో ‘నాభి’ (బొడ్డు) వద్ద అన్నమయ పిండ చైతన్యము సంస్థితమై, దేహము యొక్క పరిపోషణ, పరిరక్షణ నిర్వర్తించుచున్నది.

హృదయకోశము (హృదయ చైతన్యము)

అస్య మధ్యే అస్తి హృదయం సనాళం పద్మకోశవత్ !

అట్టి అన్నమయ పిండ చైతన్యమునకు వేరుగా (గృహములో, ఒక గదిలో వేరుగా మరొక గది ఉన్నతీరుగా) హృదయస్థానములో “హృదయ చైతన్యము” స్ఫూర్తి రూపమై వెలుగొందుచున్నది. ‘పద్మ కోశము’ వలె సన్నటి దారము మాల వంటి అనేక నాళములతో కూడి ఈ హృదయము అనుక్షణం దీపకాంతివలె చైతన్యవంతమై వెలుగొందుచున్నది. అట్టి హృదయ కోశమును ఆశ్రయించి (తస్యాంతే హృదయగం సూక్ష్మం, తస్మిన్ సర్వమ్ ప్రతిష్ఠితమ్)…,

ఇవన్నీ జీవుని పట్ల సచేతనములై వెలయుచున్నాయి.

హృదయకోశ బీజము - జీవాత్మయే

“అట్టి హృదయ కోశమునకు బీజమేమిటి?” అని ప్రశ్నిస్తే, మోహరూపము, అజ్ఞానముతో కూడుకొనినది, జడత్వము ఆపాదించుకొనుచున్నది - అగు ‘తమోపిండము’ (లేక) జీవాత్మయే!

అస్యబీజం తమః పిణ్ణం -మోహరూపం తమం ఘనమ్, వర్తతే కంఠమ్ ఆశ్రిత్య… మిశ్రీభూతమ్ ఇదమ్ జగత్ !

అట్టి తమో రూప చైతన్యము యొక్క ఒక అంతర్విభాగము ‘మనస్సు’గా రూపుదిద్దుకొని, దేహము యొక్క కంఠ ప్రదేశమును ఆశ్రయించుకొనినదై ఉంటోంది.

మనస్సు స్వతఃగా జడమా ? కాదు ! అదీ చైతన్యరూపమే ! మరి ? అట్టి చైతన్య రూపమనస్సు (అంతరంగము) (లేక) కేవల మనో చైతన్యము - దేహములోని కంఠ ప్రదేశమును స్థానముగా కలిగి ఉంటూనే, తన యొక్క ఒక విభాగము ద్వారా అనేక జడ విషయముల గురించి, జడ వస్తువుల గురించి సంబంధము పెంపొందించుకుంటోంది. తన సచేతనత్వమును ఏమరచి తాను జడమైనట్లు జడ విభాగము ద్వారా భావించి, ఆ భావనలతో తనను తానే కట్టి వేసుకొని ఉంటోంది. ఈ విధంగా అజ్ఞానముతో కూడిన మనస్సుతో, జడ విషయముల గురించి సంబంధము పెంపొందించుకొని “జగత్ రూపానుభవి’ అగుచున్నది. మరి కొంత సేపు తరువాత “నేను ఈ జగత్తులో బద్ధుడనై ఉన్నానే! ఏం చేయాలి ?" అని వాపోతూ ఉన్నది. జడమిశ్రమ చేతన మనస్సుకు దిక్కు తోచటమే లేదయ్యా !

జీవాత్మ మనస్సుతో తనయందు జగత్తును కల్పించుకొని, ఆ జగత్తులో ప్రవేశించి, వినోదిస్తూ…, ఇంతలో తన కల్పనా జగత్-పంజరములో తానే చిక్కుకొన్నట్లుగా మనస్సుతో బంధము పొందుచున్నది. “ఇదంతా నా కల్పనయే!”… అనునది ఏమరచుచున్నది.

జీవాత్మ చైతన్యము

ఇప్పటి వరకు నాభిస్థానము (లేక) అన్నమయ విశేషము (పొట్ట - నాభి అన్న స్థానము), హృదయ (అంతరంగ) స్థానము, మనోమయ స్థానము వరకు చెప్పుకున్నాము.

ఇప్పుడు ఇక మూర్ధ్నిస్థానము. మూర్డ్ని స్థానములో (At the space of the forespace) ప్రత్యక్ ఆనంద స్వరూపుడగు జీవాత్మ చైతన్యము వేంచేసినదై ఉన్నది. నాటకంలోని నటుని పాత్రధారణలాగా సంగతి - సందర్భములలో చిక్కుకున్న చైతన్యమును ’జీవాత్మ చైతన్యము’ అంటారు. పాత్రకు ఆవల గల నటుని వ్యక్తిత్వము (సహజరూపము) - పరమాత్మ చైతన్యము. జీవాత్మ పరమాత్మ యొక్క అంశయే! ఆ రెండూ ఏకమేగాని, ద్వైతము కాదు! (జీవో శివః ॥ శివో జీవః) |

పరమాత్మ చైతన్యము

జీవాత్మ చైతన్యమును తనయొక్క ఒకానొక ప్రదర్శనముగాను, ఉపకరణముగాను కలిగి ఉన్నట్టి పరమాత్మ - యోగ శాస్త్రములో ‘పరమపదము’ అని వర్ణించబడుచున్న  ‘శీర్ష’ (మూర్థి స్థానము నుండి తల ఉపరిస్థానము వరకు) నందు విషయాతీత ప్రశాంతరూపులై వేంచేసి ఉన్నారు. శిరస్సు పరమాత్మ చైతన్య స్థానముగా అభివర్ణించబడుతోంది. అట్టి పరమపద స్థానమునందు గల చైతన్య స్వరూపుడు అనంత శక్తియుతుడై, తన యొక్క చిత్కళా విన్యాసముగా జీవ - హృదయ - ఇంద్రియ - దృశ్యాంతర్గత - దృశ్యబాహ్య … సర్వస్వరూపుడై కూడా వెలుగొందుచున్నారు. అనన్యుడగు ఆ పరమాత్మయొక్క స్వరూపమే ఈ అన్యమైనదంతా!

అట్టి పరమాత్మ చైతన్యము నుండియే ద్రష్ట (జీవుడు) - దర్శనము - దృశ్యములు బయల్వెడలి, తత్ చైతన్యమునందే విన్యాసము నిర్వర్తిస్తున్నాయి.

ఆ పరమాత్మ చైతన్యమే జాగ్రత్ చైతన్య రూపమును ధరించి జాగ్రత్ కళగా జాగ్రత్ అంతటా నిండియున్నది.

పరమాత్మ యొక్క స్వప్న చిత్ కళయే స్వప్న దృశ్యముగా ఆవిర్భవించి, ఆయనచేతనే “స్వప్నాంతర్గత ద్రష్ట - స్వప్న దృశ్యము”లతో సహా సర్వము ఆస్వాదించబడుతోంది.

ఆయనయే సుషుప్తి రూపుడై జాగ్రత్ అనుభవములను స్వప్నానుభవములను తనయందు నిశ్శబ్దముగా-అప్రదర్శితముగా దాచివేసుకొని, నిర్విషయత్వము యొక్క “ఆస్వాదన ద్రష్ట” యై చెన్నొందుచున్నారు.

జాగ్రత్ స్వప్న సుషుప్తుల స్వీయకల్పనా రచనలో సంచారములు చేయు ‘తురీయము’ (4వది-చతురీయము) కూడా ఆ పరమాత్మ చైతన్య విభవమే! ఈ జాగ్రత్-స్వప్న-సుషుప్తి తురీయములకు వేరై మరింకే అవస్థా లేనే లేదు.

సర్వే దేశేషు అనున్యూతః చతురీ రూపః శివాత్మకః |

అప్రత్యగాత్మయే ‘4’ అవస్థలయందు ధారముచే నిర్మించబడిన వస్త్రములో దారమువలె అనున్యూతుడై, అనువర్తుడై ఉన్నారు.

యథా మహా ఫలే సర్వే రసాః సర్వ ప్రవర్తకాః,
తథైవ అన్నమయే కోశే కోశాః తిష్ఠన్తి చ అంతరే ||

ఏ విధంగా అయితే ఒక పెద్ద ఫలముయొక్క అంతరమంతా రసమయమై ఉంటోందో (Say a mango fruit is filled in by fruit juice), అదేవిధంగానే … అన్నమయ కోశమంతటా ప్రాణమయ కోశముచే నిండినదై ఉన్నది. అట్లాగే మనోమయ కోశముచే ప్రాణమయ కోశము, విజ్ఞానమయ కోశముచే మనోమయ కోశము, ఆనందమయ కోశముచే విజ్ఞానమయ కోశము పూరితములై ఉన్నాయి. ఆ ఆనందమయ కోశమును జీవుడు రసస్వరూపుడై పూరితము చేయుచూ ఉన్నాడు. ఈ జీవుడే శివుడు. శివతత్త్వమే జీవుడుగాను, పంచకోశములుగాను వెలయుచున్నది. ఏది జీవుడో అదే శివుడు. ఏది శివుడో అదే జీవుడు కూడా !

అయితే…
సవికారః తథా జీవో - సవికారత్వముచేత ‘జీవుడు’ అని, నిర్వికారః తథా శివః నిర్వికారత్వము చేత ‘శివుడు’ అని పిలువబడుచున్నాడు.

కోశాః తస్యవికారా తే హి అవస్థాసు ప్రవర్తకాః | పంచకోశములు, వాటివాటి వికారములే జాగ్రత్ - స్వప్న - సుషుప్తి - తురీయావస్థలై వెలయుచున్నాయి.

ఏ విధంగా అయితే తరంగముల పరస్పర తాకిడిచే ఫేనము (నురుగు) తెల్లగా ప్రకటనమగుచున్నదో…, అదేవిధంగా మనస్సులో భావనల - ఆలోచనల ఒరిపిడి చేత మనస్సు నుండి సంకల్ప - వికల్ప తరంగాలు బయల్వెడలి, అవియే జాగ్రత్ - స్వప్న సుషుప్తుల రూపములుగాను, వాటివాటి సర్వ అంతర్గత విశేషములుగాను సంతరించుకుంటున్నాయి. అవస్థలుగా ప్రవర్తకములగుచున్నాయి.

     అవస్థలకు → ఆవల శివుడు (సహజము)
     అవస్థలకు → ఈవల జీవుడు (సందర్భమునకు అంతర్గతము)
     ఈ రెండూ → ఏక అఖండ చైతన్యస్వరూపమే! (నాటకంలో పాత్రగా కనిపించేవాడు-పాత్రధారుడు వలె!)

మనస్సు నుండి సంఘర్షణరూపముగా బయల్వెడలు సంకల్పముల వల్లనే కర్మలతో సంబంధము ఏర్పడుతోంది. “ఆ కర్మలు నిర్వర్తించాను. ఇంకా ఇవి నిర్విర్తించాలి”… మొదలైన కర్మ వ్యవహారళ సరళి - అభ్యాసవశంగా సంస్కారాలు ఏర్పడినవై, స్పందన పూర్వకంగా ప్రవర్తిస్తున్నాయి.

కర్మణా వర్తతే కర్మః | తత్ త్యాగాత్ శాన్తిమ్ ఆప్నుయాత్। కర్మలవలన కర్మలు ప్రవర్తిస్తూనే పోతాయి గాని కర్మలవలన కర్మలు నశించవు. శాంతించవు. కర్మలు శమిస్తే మనస్సు శమిస్తుంది. మనస్సు శమిస్తే ఈ జీవునికి తన అప్రమేయమగు పరాత్మ అనుభవమునకు వచ్చినదై, శాంతి లభిస్తోంది.

మనస్సు దక్షిణాభిముఖముగా (అనగా, కర్మలవైపుగా) సంకల్ప - వికల్పముల పరంపరలతో కూడుకొని వ్యావహారికమునందు - కదలటం జరుగుచున్నప్పుడు, అది దృశ్యాభిముఖమై (లేక) ప్రపంచాభిముఖమై ఉంటోంది. అప్పుడు ‘జీవుడు’ అని పిలువబడుచూ బద్ధుడు, దుఃఖభాగితుడు అగుచున్నాడు. స్వతఃగా సదాశివుడే అయి ఉండికూడా, “అహంకారము + దృశ్యాభిమానము”ల - ఓత ప్రోతములచే జీవుడుగా అగుచున్నాడు. స్వకీయమే అగు అవివేకమునకు తలఒగ్గి, తన ప్రకృతితో ‘సంగము’ చేత మోహమునకు లోను అగుచున్నాడు.

నానా యోని శతం గత్వా శతేఽసౌ వాసనావశాత్ | ఇక ఆపై ఒక దేహమును వదలుచూ, మరియొక యోనిని ఆశ్రయిస్తూ నానా విధ వందలాది యోనులలో వాసనావశుడై ఉంటున్నాడు.

“నేను బద్ధుడను. అల్పుడను. నన్ను రక్షించేదెవ్వరు?” అని తనకు తానే తనపై దృశ్య బంధత్వమును ఆపాదించుకొనుచున్నాడు.

జ్ఞాన మార్గము - సద్యోముక్తి

ఓ త్రిశిఖీ ! ఆ జీవుడు ఎప్పుడైతే వివేకి అయి ఆత్మ జ్ఞానమును సంపాదించుకుంటూ ఉంటాడో.. అట్టివాడు క్రమంగా విజ్ఞాని అగుచున్నాడు. పెద్ద సొరచేపవలె సంసార నదీ జలంలో ఈవడ్డు నుండి ఆవడ్డుకు తిరుగాడుచున్నాడు. ఆత్మను ఎరిగినవాడు కర్మ బంధములన్నీ త్రెంచివేసుకొని ‘మోక్షము’ అనే ఆవలి ఒడ్డుకు చేరుచున్నాడు. అట్టి ‘మోక్షము’ జ్ఞాన శాస్త్ర రూపంగా వివరించబడి చెప్పబడుతోంది. అయితే ఈ జీవునికి అట్టి ముక్తి కాలవశంగా సుదీర్ఘమైన జ్ఞానార్జచే గానీ సిద్ధించటం లేదు. బుద్ధియొక్క నిర్మలము - సునిశితములచేతనే, అట్టి శ్రవణ రూపంగా సద్యోముక్తి లభ్యమౌతోంది.

యోగ మార్గము - క్రమముక్తి

అట్టి మోక్షము సముపార్జించటానికై ముముక్షువగు యోగసాధకుడు యోగ శాస్త్రములో సూచించిన మార్గములలో ఉత్తరాభిముఖుడై, మూలాధార స్థానమునందు యోగ సాధనను ప్రారంభించుచూ, క్రమక్రమంగా పైపై చక్రస్థానములను ఉపాసనాక్రమమును అనుసరించి అధిగమిస్తూ వస్తున్నాడు.

స్థానాత్ స్థానాన్తర క్రమాత్ | యోగ సాధన చేస్తూ మూలాధార చక్రము - స్వాధిష్టాన చక్రము - మణిపూరక-చక్రము-అనాహత చక్రము -విశుద్ధ చక్రము-ఆజ్ఞాచక్రముల స్థానములందు చిత్తమును నిలుపుతూ వస్తున్నాడు. అనగా గుదస్థానము (seating spot) ప్లీహస్థానము- నాభికేంద్రము (బొడ్డు) హృదయ కేంద్రము-కంఠస్థానము-భ్రూమధ్య కేంద్రము (లేక) స్థానములందు చిత్తము (ఇష్టము)ను, బుద్ధిని ఏకాగ్రపరచి నిలుపుచున్నాడు. ఆ తరువాత మూర్ధ్న స్థానము నుండి బ్రహ్మరంధ్రము చేరి తనయొక్క జీవాత్మత్వమును అక్కడ సహస్రారమునందు సంస్థితమైయున్న తనయొక్క పరమాత్మత్వమునందు ఏకం చేస్తున్నాడు. ఇది క్రమముక్తి మార్గముగా చెప్పబడుచున్నది, (లేక) ‘యోగ మార్గ మోక్ష సాధన’ అయి ఉన్నది.

🦜 🧘🏿‍♂️

త్రిశిఖి :  హే ఆదిత్య భగవాన్ ! ఇప్పుడు మీరు 1) జ్ఞాన మార్గము 2) యోగ మార్గము అను రెండు మోక్ష మార్గములు సూచిస్తూ వస్తున్నారు కదా ! ఈ రెండిటిలో ఏది గొప్పది ?

ఆదిత్య భగవానుడు :  అవి రెండూ సాధనమార్గములే ! ఆ రెండింటినీ వేరు వేరు చేసి చూడకూడదు.

"జ్ఞానమార్గతత్పరులు వేరు, యోగమార్గ తత్పరులు వేరు”… అనునవి చిన్న పిల్లలు పలికే మాటలు.
ఎందుకంటే …,
యోగాత్ సంజాయతే జ్ఞానమ్ | జ్ఞానాత్ యోగః ప్రవర్తతే |
తెలుసుకోవటం జ్ఞానం. తెలుసుకొన్నది జ్ఞప్తి, అనుభూతులుగా రూపుదిద్దుకోవటం - యోగం!

యోగము చేత జ్ఞానము స్వయముగా ప్రవృద్ధమగుచూ రూపు దిద్దుకొనుచు… అనుభవముగా సిద్ధించుచున్నది. అట్లాగే జ్ఞానము చేతనే బుద్ధి ఏకాగ్రమగుచూ వస్తోంది. జ్ఞానాశయము - ఎరుకలతో యోగమార్గము విధి పూర్వకంగా నిర్ణయించి సూచించబడతోంది.

ఒకడు “నేను యోగ మార్గమే అనుసరిస్తాను, జ్ఞాన విషయాలు చెప్పకండి”… అని అనకూడదు. అట్లాగే "నేను జ్ఞానమార్గంలో ఉన్నాను. యోగముతో పనిలేదు”… అని కూడా అనరాదు. యోగ - జ్ఞానములు రెండూ రెండు చక్రములు గల వాహనముగా భావించి మోక్ష మార్గములో ప్రయాణించాలి. యోగ - జ్ఞానములలో ఒక్కటి నీవు వదలితే, రెండవది నిన్ను వదలగల అవకాశము ఉన్నది.

అందుచేత,
యోగ - జ్ఞాన పరోనిత్యం సయోగీ న ప్రణశ్యతి |
ఎవ్వడైతే యోగ - జ్ఞానపరుడై ఉంటాడో, ఆ రెండింటినీ వదలకయే ఉంటాడో, అట్టి యోగికి అపజయము - చ్యుతి - పడిపోవటం (ప్రణశ్యతము) ఉండవు.

ఓ త్రిశిఖి బ్రాహ్మణా !

“ఆత్మనగు నాకు ఇదంతా అన్యము కాదు!” అను స్థితియే యోగము. అదియే జ్ఞానము కూడా! ఆ రెండిటికి ఇక బేధమెక్కడిది?

“ఇదంతా శివతత్త్వమునకు అభిన్నము” అని ఘంటా పథముగా మీమాంసా పూర్వకంగా నిరూపించనూవచ్చు. అయితే అట్లు తెలుసుకొన్నది ఆ తీరుగా అనిపించాలి కదా? కేవలము తెలుసుకొన్నంత మాత్రం చేత అనిపించటము సిద్ధించజాలదు.

యోగ - జ్ఞానే న విద్యేతే, తస్య భావో న సిద్ధ్యతే |
ఒక్క యోగ మార్గము చేతగాని, ఒక్క జ్ఞాన మార్గము చేతగాని మోక్ష భావన (లేక) మోక్ష స్థానము సిద్ధించదు అని గమనించి ఉండాలి సుమా !అభ్యాసములేనిదే జ్ఞానము అనుభవమునకు రాదు. జ్ఞానము అభ్యాస యోగము యొక్క ఆశయము. శాస్త్ర విచారణ - విశ్లేషణల మాత్రం చేత భావన సిద్ధించదయ్యా ! అది అనుష్ఠానంగా మరల్చుకొంటేనే సిద్ధిస్తుంది.

మనస్సు నిరోధించబడాలంటే, అనుష్ఠాన రూపమగు అభ్యాసయోగమును ఎప్పటికప్పుడు ఆశ్రయించవలసినదే ! అభ్యాసముచేత మాత్రమే మనస్సును నిలువరించగలము. నియమించగలము.

తస్మాత్ అభ్యాస యోగేన మనః ప్రాణాః నిరోధయేత్ |
యోగముచే మనస్సును, ప్రాణచలనములను నిరోధించు అభ్యాసము ఆవస్యకము. అట్టి అభ్యాసము ఆత్మ జ్ఞాన సముపార్జనయే ఆశయముగా కలిగి ఉండవలసిందే!

ఒకడు తోటలో "ఇవి మంచి పూలు - ఫలములు ఇచ్చు మొక్కలు. ఇవి పిచ్చి మొక్కలు”…. అని తెలుసుకుంటే సరిపోతుందా ? లేదు. మంచి మొక్కలను పరిపోషించుకోవాలి. పిచ్చి మొక్కలను పదునైన కత్తిని ఉపయోగించి తొలగించివేయాలి. కత్తిరించాలి. పీకివేయాలి కూడా !

అట్లాగే యోగి కూడా తీవ్రమైన “యోగాభ్యాసము”… అనే పదునైన కత్తితో అనుక్షణము హృదయములో జనిస్తున్న “దృశ్య సంబంధమైనట్టి అనేక అభ్యాసముల - ఆశయముల రూపములుగా ఏర్పడుచున్న సంకల్పములు”… అనే పిచ్చి మొక్కలను కత్తిరించి, మొదలంట్లా పీకి ఆవల పారవేయాలి.

యోగో ద్వివిధః -  ఓ బ్రాహ్మణోత్తమా ! ‘యోగము’ అనునది రెండు విధములుగా విభజించ చెప్పబడుచున్నది.
జ్ఞాన యోగః, కర్మ యోగః - ఇతి యోగోద్విధామతః | 1) జ్ఞాన యోగము 2) కర్మ యోగము లేక క్రియా యోగము.

ముందుగా “క్రియాయోగము” గురించి మనము చెప్పుకుందాము. విను.

ఈ చిత్తము సుదీర్ఘకాలంగా దృశ్య రూప ఇంద్రియ విషయములలో నియమించబడుతూ వస్తున్నది. అట్టి అనేక విషయములలో ప్రవేశించటము చేత అశాంతి - శ్రమ - వ్యాకులత పొందుతోంది. ఆ విధంగా వ్యాకులమైన చిత్తము బంధము పొందినదగుచున్నది.

ఈ చిత్తము ఒక్క క్షణం కూడా ఒక్క విషయము మీద నిలవక పోవటం చేత వ్యాకులత్వము క్షణక్షణం కొనసాగిస్తోంది. ఈ విధంగా అనేక జన్మలలో అనేక ఉపాధులతో విషయములవెంట సంచరించటంచేత, ఈ చిత్తము శాంతిని కోల్పోతోంది. అదియే ఈ జీవుని సర్వబంధమునకు దుఃఖములకు కారణం. అదియే సంస్కృతి అని, సంసారము అని చెప్పబడుతోంది.

‘సంసారము’ అను దృశ్యరూప బంధమునకు కారణం మనో బుద్ధుల ఇతఃపూర్వపు అభ్యాసములు మాత్రమే! అంతేగాని, కళ్ళకు ఎదురుగా కనిపిస్తున్న ఈ దృశ్యము తనకుతానై బంధము కాదు. బంధము దృశ్య జగత్తులో లేదు. స్వకీయమగు బుద్ధిలోనే ఉండి ఉన్నది.

అయితే ఈ జీవుడు “నా చిత్తము ఈ సందర్భముల వలన, సంబంధముల వలన, సంపద ఆపద ఇత్యాది సంఘటనల వలన వ్యాకులత చెందుతోంది”… అని అజ్ఞానముచేతనే అనుకుంటున్నాడు. అది వాస్తవం కానే కాదు. విషయములతో ఏర్పడే అనుక్షణికమైన చిత్త చాంచల్యమే బంధమునకు, దుఃఖమునకు కారణం.

మరి ఇప్పుడు జీవుడు ఏం చేయాలి ?
అవ్యాకులస్య చిత్తస్య బన్దనమ్ విషయే క్వచిత్, యత్ సంయోగో, స చ ‘ద్వైవిధ్యమ్’ అశ్నుతే |
ఈ చిత్తము ఆత్మతో సంయోగము పొందిందా, ఇక ఇద్దాని వ్యాకులత అంతా తనకుతానే తొలగుతోంది. ఇక ఆపై దైవిధ్యము (రెండవ విషయముతో బేధము) అనునదే ఉండదు.

త్రిశిఖి :  మాకు శాస్త్రముల చేతను, సంఘ నియమముల చేను ఆయా కర్మలు విధించబడుచున్నాయి కదా ! అదీకాక, కర్మలు నిర్వర్తించనిదే ఎవ్వరికీ ఈ శరీరమే నిలవదు కూడా! చిత్తమును నియోగించకుండా కర్మలు చేయగలమా? లేదు. కర్మలను మానలేము. చిత్తమును నియమించనూ లేము. ఇప్పుడు మా గతి ఏమిటి స్వామీ? చిత్తమును లేకుండా చేయాలా? ఎట్లా?

ఆదిత్య భగవానుడు :  అవును. ఆ విధంగా చూచినప్పుడు కర్తవ్యములు - కర్మలు ప్రకృతి నియమానుసారము అనివార్యము, ఆవస్యకము కూడా ! చిత్తము కర్మల నిర్వహణయందు నియమించబడక తప్పదు. నియమించినప్పుడు ఆ చిత్తమునకు చాంచల్యము తప్పదు. చిత్త చాంచల్యమున్న చోట శాంతి ఉండని మాట కూడా నిజమే!

అయితే, దీనికొక సులభమైన ఉపాయము ఉన్నది.

నాకు నియమితమగు కర్మలు నా కర్తవ్యములు. అట్టి స్వధర్మము నాకు కర్మ యోగము. కర్మలచే నిర్వర్తించు ఉపాసనయే। క్రియా యోగములోని అంతర్భాగమే ! వాస్తవానికి సర్వ కర్మలు యోగ మార్గములో భగవత్ ప్రసాదితమైన ఉపాయ రూపమైన ఉపకరణములు” … అని భావించి కర్మలు చేయువాని విషయంలో చిత్తము విషయములలో ఉంటూ, విషయరహితమై ఉండగలదు.

మనస్సును -
(1) విహితకర్మలు-పుణ్య-ఉపాసనా కర్మములకు, స్వధర్మమునకు మాత్రమే పరిమితము చేస్తూ,
(2) ఉపాసనా పూర్వకముగా నిర్వర్తించటమును
… ‘కర్మయోగము’ అని అంటారు.

అందుచేత నీవు కర్మయోగివై కర్మలు చేయి. అప్పుడిక కర్మ బంధము నీకు ఎక్కడ ఉంటుంది? మమకార-అహంకార దోషములను బుద్ధి నుండి తొలగించబడగా, అప్పుడు చేయు కర్మలు మోక్ష మార్గములే! విహితకర్మలే ‘మోక్షమార్గము’ అగుచుండగా, ఇక ఈ జీవునికి దిగులెందుకయ్యా?

ఈ చిత్తము చతుర్విధ పురుషార్థములైనటువంటి ధర్మ - అర్థ - కామ - మోక్షములను ఒకేసారి దృష్టియందు కలిగియుండి ఎప్పుడైతే కర్మలయందు నియమించబడినదై ఉంటుందో.. అది “జ్ఞాన యోగము” అనియే గమించబడు గాక ! అవి ‘కర్మలు’ అని అనిపించుకోవు.

లక్ష్యము ఆశయము-ఉపాసన … ఇవన్నీ సరి అయిన రీతిలో తెలుసుకొని ఉత్తమ ఆశయములతో కర్మను నిర్వర్తించువాడు సర్వమును సిద్ధింపజేయు శివత్వమును సముపార్జించుకొనుచున్నాడు.

విహితకర్మలను ఎరిగి, కామ-క్రోధ-లోభ-మోహ-మద-మత్సర్యములకు లోనుకాకుండా ఉపాసనాభావముతో ఎవ్వరు కర్మలు నిర్వరిస్తారో, వారి కర్మలు సర్వసిద్ధికరములు, మంగళప్రదములు అగుచున్నాయి.

ఓ ద్విజోత్తమా ! మరల చెప్పుచున్నాను. విను.

“కర్మ యోగము - జ్ఞాన యోగము” ఈ రెండూ కూడా అవినాభావములగు ”ఉక్త లక్షణములు" అని అంటూ ఉంటారు. ఎందుకంటే -

అవి రెండుగా కనిపిస్తూ ఉన్నప్పటికీ ‘మనస్సు యొక్క లగ్నము’ దృష్ట్యా చూస్తే మాత్రం “ఆ రెండూ ఒక్క తీరైనవే” అని తెలియవచ్చుచున్నది.

కర్మ జ్ఞానములను రెండింటినీ అవగాహన చేసుకొని సమన్వయముతో నిర్వర్తించువాడు అతి త్వరగా మోక్ష లక్షణములను పునికి పుచ్చుకొనగలడు. కర్మయోగము రెండు విధములుగా నిర్వర్తించబడుగాక !

  1. విహిత ధర్మములను, కర్మలను ఉపాసనా పూర్వకంగా నిర్వర్తిస్తూ చిత్తమును దైవీ సంపదా లక్షణములతో అలంకరించుకొని ఉండటము.
  2. ఏకాగ్రత కొరకై అష్టాంగ యోగములను చిత్తముతో ఆశ్రయించి ఉండటము.

⌘⌘⌘

త్రిశిఖ బ్రాహ్మణుడు:  మహత్మా! అష్టాంగ యోగములను మా యీ చిత్తము ఆశ్రయించు తీరు గురించి, వాటి పరమార్థ నిర్వచనముల గురించి దయచేసి వివరించ ప్రార్థన. వాటిని పరాకాష్ఠ విశేషపరంగాను, వాటి యోగార్థముల గురించి చెప్పండి.

అష్టాంగ యోగములు - పరమార్థములు

ఆదిత్యభగవానుడు :  సరేఁ ! అష్టాంగయోగముల ఉత్కృష్టార్థ నిర్వచనము విషయమై ఇక్కడ కొన్ని విషయాలు సంక్షిప్తంగా చెప్పుకుందాము.

I.) యమము (ఆత్మ దృష్టి విరుద్ధము పట్ల విరక్తి) : ఆత్మస్వరూపుడు - స్వతఃగా పరతత్త్వ స్వరూపుడు అయి ఉండి కూడా…, ఈ దేహి (లేక జీవుడు) ఈ దేహము పట్ల, ఇంద్రియముల పట్ల, ఇంద్రియ విషయముల పట్ల…, స్వస్వరూపము యొక్క ఏమరపుతో కూడిన రాగమును పెంపొందించుకొనుచున్నాడు.

అందుచేతనే - “నేను బద్ధుడను. పరిమితుడను. కర్మలయందు జన్మలయందు చిక్కుకున్న వాడను! ఎవ్వరురా, నన్ను ఇప్పుడు రక్షించేది?”… అని వాపోవుచున్నాడు.

మరికొన్ని సందర్భములలో రాగద్వేషములకు లోనై అల్ప - అజ్ఞాన పరంపరలను తెచ్చిపెట్టుకుంటున్నాడు. అందుకు అష్టాంగయోగములలో మొట్టమొదటి తరుణోపాయముగా ‘యమము’ అనునది చెప్పబడుచున్నది.

దేహ - ఇంద్రియేషు వైరాగ్యమ్ ‘యమ’ ఇతి ఉచ్యతే బుధైః |
ఇంద్రియముల పట్ల రాగమును తొలగించుకొను ప్రయత్నములే “యమము” అని చెప్పబడుతోంది. “ఇవన్నీ నాకు చెందినవి కావు. నేను వీటికి చెందినవాడిని కాదు. ఈ దేహ-ఇంద్రియవిషయాలు సందర్భానుచితంగా వస్తూ వున్నాయి. సందర్భానుచితంగా పోతూ ఉన్నాయి. కనుక దర్భములకు సంబంధించినవన్నీ జగత్తుకు సంబంధించినవి. జగత్తు కల్పనచే ఏర్పడి, కల్పనచే తొలగబోవుచున్నట్టిది.”… అను అవగాహన పెంపొందించు యత్నములే యమము. విరాగి అయి (without attachment and belongingness)… ఉండటమే యమము - అని బుధుల అభిప్రాయము.

నటుడు పాత్రకు సంబంధించిన ఆయా ప్రవర్తనలు ప్రదర్శిస్తూ… అవన్నీ చేయనివాడై ఉంటాడు కదా! అట్లా జగన్నాటకంలో పాత్రధారణా భావము కలిగి ఉండటమే (లేక) తనయొక్క జీవాత్మత్వమును సమన్వయించుకొని ఉండటమే యమము.

II.) నియమము (ఆత్మ పట్ల అనురక్తి) : అనురక్తపరే తత్వే సతతం ‘నియమ’ స్మృతః !  ఈ ఇంద్రియ ప్రంచమునకు, అంతరంగ చతుష్టయమునకు కూడా ఆధారమై, (నాటకములో నటింటు పాత్రకు వేరైన పాత్రధారుని సహజ రూపము వలె) పరస్వరూపమై వెలుగొందుచున్న ‘పరతత్త్వము’ పట్ల అనురక్తిని ‘నియమము’ అంటారు. అది అష్టాంగ యోగములలో రెండవది.“నేను నటిస్తూన్నానే తప్పించి, నాటకము నిజం కాదు. పాత్ర నిజం కాదు”… అను ఎరుకను జగత్తుపట్ల తన జీవాత్మత్వము పట్ల కలిగి ఉండే ప్రయత్నము నియమము. తన యొక్క, సర్వ సహ దేహుల యొక్క, ఈ జగత్తు యొక్క అఖండ స్వరూపమగు ఆత్మ పట్ల అనురక్తియే నియమము.

III.) ఆసనము (ఉదాసీనత్వము) : సర్వవస్తుని ఉదాసీన భావనమ్-‘ఆసనమ్’ ఉచ్యతే | ఈ దేహము యొక్క రాక - పోకలతో సహా ఇక్కడి దృశ్యములోని సంగతులు, వ్యవహారములు, సుఖ-దుఃఖ సంఘటనలు, అనుబంధ సంబంధ బాంధవ్యములు, శత్రు - మాన - అవమాన విశేషాలన్నిటి పట్ల “ఉదాసీనత” కలిగి ఉండటమే ‘ఆసనము’ యొక్క ముఖ్యమైన ఉద్దేశ్యము, పరమార్థము కూడా!

“పరస్వరూపుడను-అప్రమేయడను-ప్రత్యక్ స్వరూపుడను అగు నాకు అవి సంబంధించి లేవు. నేను వాటికి సంబంధించి లేను. కనుక, ఎట్లా ఉన్నా నాకు వచ్చేదీ లేదు. పోయేదీ లేదు. యోగము ఇత్యాది సాధనములు, కర్మ ఫలములు అన్నీ ప్రపంచమునకే చెందినవై, నాకు సంబంధించనివై ఉండుగాక! నేను అప్రమేయుడను”… అను స్థానమును మెట్లు మెట్లుగా అధిరోహించి ఉండటమే “ఆసనము”.

IV.) ప్రాణసంయమము (మిథ్యత్వమును గుర్తించుట) : జగత్ సర్వం ఇదం మిధ్యా ప్రతీతిః ప్రాణసంయమః | ఈ జగత్తు స్వప్నములోని అంతర్గత విషయాలవలె, ఒక నాటకములోని రకరకాల సంబంధములవలె, ఒక కథలోని సంఘటణా క్రమముల వలె కల్పితము మాత్రమే ! (అందుకే సంకల్పము చెప్పేడప్పుడు - శ్వేతవరాహకల్పే… అని అంటాము కదా! ). “వాస్తవానికి ఇంద్రియాలకు విషయాలుగా తారసపడేదంతా మిథ్యయే” అనే పరాకాష్ఠ అవగాహనను అనునిత్యము చేసుకోవటమునే “ప్రాణసంయమము” యొక్క అంతిమార్థము, ఆశయము. (న తు సత్యమిహ అణ్వపి).

V.) ప్రత్యాహారము (తనను - తదితరులను ఆత్మీయమగు ఆత్మ దృష్టితో చూచు అభ్యాసము) : చిత్తస్య - అంతర్ముఖీభావః ప్రత్యాహారస్తు!  ఓ యోగిసత్తమా! ఈ చిత్తము బాహ్యమునే చూస్తూ, తదితరుల బాహ్యత్వమునకు మాత్రమే పరిమితమై తనయొక్క సహజీవులయొక్క దృశ్య జగత్తుయొక్క జననస్థానమగు ఆత్మను సందర్శించలేక ఆప - సోపాలు పడుతోంది. ఇప్పుడు ఈ చిత్తము బాహ్యమును దాటి అంతర్ముఖమై, తన యాజమాని యగు పరమాత్మను (చిత్ స్వరూపమును) - తనయందు సర్వజీవులయందు సందర్శించటమే ప్రత్యాహారము యొక్క ఉద్దేశ్యము, లక్ష్యము కూడా. దృశ్యమును భేద దృష్టితో కాకుండా ఆత్మ దృష్టితో చూడగలుగుటకు చేయు యత్నము - ‘ప్రత్యాహారము’ అగుచున్నది. సర్వ సహజీవులపట్ల బాహ్యనామ రూపగుణాత్మక దృష్టిని అధిగమించి బ్రహ్మీ దృష్టితో చూడటమే ’ప్రత్యాహారము’.

VI.) ధారణ : చిత్తస్య నిశ్చలీభావో ధారణా - ఆధారణం విదుః | చంచలమగు ఈ చిత్తము ఒక ఆధారము సహాయంతో ప్రాణనిష్ఠాగ్రత (ప్రాణోపాసన), ఇష్ట దైవరూపభావన, గురువుపై గల ఉత్తమగురి… మొదలైన వాటి సహాయంతో నిశ్చలమై ఉండటము కొరకు చేయు సాధనయే ‘ధారణ’। “గురి లేక, గురుతు ఎరుగలేక, పరమార్ధమును పొందలేక, పరితప్త హృదయాల శరణాగతాలు - నీ చరణాలు” అను ఇష్ట దైవ - ఆశ్రయమే “ధారణ”.

VII.) ధ్యానమ్ : “సోహమ్ చిన్మాత్రమేవ” ఇతి చిన్తనమ్ ధ్యానమ్ ఉచ్యతే… ”నేను పరతత్త్వమగు కేవల చిన్మాత్ర స్వరూపుడను | అదియే పరమ సత్యము. మిగిలినదంతా కేవలం సందర్భ కల్పిత సత్యాలు మాత్రమే” …. అను విజ్ఞతతో పరమసత్యము యొక్క చిన్తనమే - ధ్యానము అగుచున్నది.

VIII.) సమాధి (ధ్యాని-ధ్యాస-ధ్యాస్యముల భేద విస్మరణ) : ధ్యానస్య విస్మృతిః సమ్యక్ ’సమాధిః’ అభిదీయతే। ధ్యానములో ధ్యానించువాడు - ధ్యానించబడు చిత్ చైతన్య పరమాత్మ - ధ్యానించు విధానము… అనబడే త్రిపుటి కొనసాగుచూ ఉంటుంది. “నేను స్వతఃగానే సత్ చిత్ ఆనందమగు ఆత్మానంద స్వరూపుడనై, ఈ సర్వము నాకు అభిన్నముగా (స్వప్నమువలె) కల్పించుకొని లీలావినోదంగా ఆస్వాదించుచున్నాను. యథాతథంగా ఉండియే నా యందు ద్రష్ట - దర్శన దృశ్యములను, జాగ్రత్ - స్వప్న - సుషుప్తి తురీయములను, ఊహ - అపోహలను భావన చేస్తూ, సంకల్పిస్తూ మరల నాయందే అవన్నీ చిరునవ్వుతో లయం చేసుకొంటున్నారు. సర్వ స్వరూపుడనై, సర్వాతీతుడనై సర్వసాక్షినై, సర్వే సర్వత్రా వేంచేసియున్నవాడనై, యథా స్థానమునందు రాకపోకలు లేకయే ఉన్నవాడినై ఉన్నాను” …. అనునది, ఎప్పుడు అకృత్రిమమైన స్వభావసిద్ధానుభవము అవుతుందో… అదియే ’సమాధి’ అని పిలువబడుచున్నది.

ఓ ప్రియ త్రిశిఖీ బ్రాహ్మణోత్మమా!

ఈ విధంగా యమ-నియమ-ఆసన-ప్రాణసంయమ-ప్రత్యాహార-ధారణ-ధ్యాన-సమాధుల గురించిన పరాకాష్టార్థము (తాత్పర్యార్థము) ఏమిటో విన్నావు కదా! ఇప్పుడిక సాధనకు సంబంధించినంతవరకు ఇహార్థపూర్వకంగా వాటిని వివరిస్తున్నానయ్యా! విను.

యమము - దశాంగములు

1) అహింస : తదితరులను శారీరకంగాని, మాసికంగాని బాధించకపోవటం. “నా మనోవాక్కులచే, కాయక క్రియలచే, కర్మలచే ఇతరులకు సుఖ, శాంతి, ఆనందములు కలుగునుగాక ! నాకు కళ్ళకు కనిపిస్తున్న ఈ సహజీవులంతా నా ఇష్ట దైవము యొక్క సాక్షాత్ ప్రత్యక్ష రూపాలే! కనుక, సేవక భావము అంతరంగమున ప్రతిష్ఠించుకొనెదను గాక !” .. అను రూపముగా గల స్వకీయ ఉపాసన భావన - అభ్యాసములే ‘అహింస’గా చెప్పబడుచున్నాయి.

2) సత్యము : నిత్యమైనది మాత్రమే సత్యము. యత్ సత్ (సత్ యత్) ఇతి సత్యమ్! “ఇంద్రియ కలన’లను (Illusions) దాటివేసి, వాటికి ఆధారమైయున్న “సర్వతత్త్వస్వరూపము”ను సమాశ్రయించి ఉండటమును ‘సత్యమ్’ అను శబ్దమునకు అంతరార్ధముగా చెప్పబడుచున్నది.

3) అస్తేయమ్ : ఇతరుల సొమ్ము ఆశించటము, ఇతరుల సంపదలను చూచి అసూయపడటము, ఇతరులను నమ్మించియో, మోసము చేసియో వారి సొమ్ము అపహరించటము, ఇతరులకు తెలియకుండా వారి సొమ్ము హరించటము … ఇవన్నీ "స్థేయము”… యొక్క లక్షణములు. ఇవి శమమును హరిస్తాయి. శాంతిని పొగొట్టేవిగా పరిణమిస్తాయి. అశాంతికి పరోక్షంగా కారణమౌతాయి. యథావిధంగా ధర్మవిధిగా ప్రాప్తించిన పదివేలనుకొని తృప్తిపడువాడు అస్తేయుడు. అస్తేయము శమము యొక్క ఒక అంగము. శమము వలన శాంతి లభిస్తుంది.

4) బ్రహ్మచర్యము : అఖండ - అద్వితీయ బ్రహ్మమునందు స్వకీయ కల్పన చేత ఇదంతా అనేక బేధములతో కూడిన జగత్తుగా అనిపిస్తోంది. అజ్ఞాన దృష్టికి కనిపిస్తోంది. దివ్యదృష్టిచే (లేక) ఆత్మీదృష్టిచే సర్వము పరబ్రహ్మమే ! ఇట్టి దృష్టిని ప్రవృద్ధి చేసుకొని ఆశ్రయించి ఉండటమును ‘బ్రహ్మ చర్యము’ అని అంటున్నారు. సద్గురవగు ఆచార్యులవారి వద్ద బ్రహ్మమును అభ్యసించటమే బ్రహ్మచర్యము. బ్రహ్మమును అధ్యయనము చేయువాడు ‘బ్రహ్మచారి’.

5) దయ : ఏ దయ (Kindness) ఒక భక్తుడు తన ఇష్టదైవము నుండి అర్థిస్తూ ఉంటాడో, అది సహజీవుల పట్ల ఆప్యాయత రూపముగా కలిగి ఉండటము. దయగలవానిపై దేవతలు దయను ఆయాచితంగా కూడా కురిపిస్తూ ఉంటారు.

6) ఆర్జవమ్ : మాటయందుగాని, మనస్సునందుగాని, బుద్ధియందు గాని, కుటిలత్వము లేకపోవటము. త్రికరణ శుద్ధి (మనసా వాచా కర్మణా) సూటిగాను, సత్య దృష్టిని కలిగి ఉండటము. ఆర్జవమ్ = అకుటిలత్వము / నిష్కాపట్యము.

7) క్షమా : ఓర్పు - సహనము - ఇష్ట, అయిష్టముల సందర్భములలో సమత్వము. ఇతరుల తప్పులకు మున్ముందే తన తప్పులు గుర్తు చేసుకోగలగటము. సహించగల శక్తి. కష్ట - సుఖములను భగవత్ ప్రసాదితములుగా భావన చేయు అభ్యాసము.

8) ధృతి : "స్వభావతః ఆత్మ స్వరూపమే నేను ? సిద్ధించియే ఉన్న ఆత్మతత్త్వము నాకు స్వానుభవముగా లభించక ఏం చేస్తుంది ?”… అనే ధైర్యము. ఉత్సాహము. తనపై, శాస్త్రములపై, గురువాక్యములపై గల విశ్వాసము నుండి స్వీకరించబడిన ఉత్సాహముతో కూడిన ధైర్యము. పట్టుదలతో కూడిన ప్రయత్నశీలత్వము. ధైర్యము - ధారణ కలిగి ఉండటము.

9) మితాహారము : ఇంద్రియములకు తారసబడుచున్న విషయములను ఎంత వరకు అత్యవసరమో అంతవరకే పట్టించుకోవటము. స్వీకరించటము. (అత్ర ఆహారార్ధం కర్మ కుర్యాత్ అనింద్యమ్ కుర్యాత్ ఆహారమ్ దేహ సంరక్షణార్థమ్।  దేహమ్ సంరక్షణాత్ తత్త్వజిజ్ఞాసనార్థమ్! - అను రీతిగా) ఆహారము పట్ల, శబ్ద - స్పర్శ - రూప - రస- గంధముల పట్ల సంనియమితుడై ఉండుటము.

10) శుచి : శుచి అయిన, సాత్వికమైన, తత్త్వ దర్శనముతో కూడిన భావాలు, అభిప్రాయాలు కలిగి ఉండటము.

ఇవి యమము యొక్క ‘దశాంగములు’

నియమ - లక్షణములు (అంగములు)

1) తపస్సు : సత్యవస్తువు గురించిన తపనయే తపస్సు.

2) సన్తుష్టి : తృప్తి, సంతోషము, పొందినవాటిపట్ల కృతజ్ఞత, ఉత్సాహములను అలవాటుగా చేసుకొని ఉండటము. లభించినదానితో సంతోషిస్తూ, లభించని దాని గురించి అర్రులు చాచకపోవటము. అసంతృప్తికి చోటు ఇవ్వకపోవటము. సంపదల విషయంలో “నాకన్నా కూడా లేనివారు ఎంతమంది లేరు!” అనే గమనిక.

3) అస్తిక్యము : ఈ దేహమును నిర్మించిన ప్రకృతి, దివ్యమగు దైవీశక్తులు (దేవతలు), సర్వమునకు ఆధారమైన పరమాత్మ … వీటి ఉనికిపై గౌరవపూర్వకమైన నమ్మకము (faith). సంగతి - సంఘటన - సందర్భములలో జగత్ రచయిత యొక్క ఉనికి - ఉద్దేశ్యములను గమనించటము. ఈ జగత్తును పాఠ్యాంశములుగా, జగదాధారుడగు పరమాత్మను సద్గురువుగా భావించటము.

4) దానము : "భగవత్స్వరూపులగు తదితరుల గురించి నేను ఏది చేయగలను ! సమర్పించగలను!” … ఇటువంటి యోచనలు, “ఆనందము పొందుటలో లేదు. ఇచ్చుటలోనే దాగి వున్నది” … అను అవగాహన.

5) ఆరాధనమ్ : భగవత్ భక్తి. ఉపాసనాభావాలు. పరమాత్మపట్ల కృతజ్ఞత. తల్లి-తండ్రులపట్ల, పెద్దలపట్ల, మహనీయులపట్ల విధేయత.

6) వేదాన్త శ్రవణము : వేదము (తెలియబడునదంతా) యొక్క అంతము (ఆవల) గల "తెలుసుకొనుచున్నవాడు (The Knower)”… అను తత్త్వము యొక్క జ్ఞాన విషయముల శ్రవణ - మనన - నిదిధ్యాసలు.

7) హ్రీ : తనలోని అసత్ అవగాహనాలను, అల్పభావములను, అజ్ఞాన దృష్టులను గమనించి దృష్టిలో పెట్టుకోవటము. తదితర జీవులలోని ఉత్తమ జ్ఞానాభ్యాస విశేషములను దర్శిస్తూ ఉండటము. తన తప్పులను తాను గుర్తెరుగుచూ సిగ్గుపడుచూ ఉండటము.

ఇవన్నీ “నియమము” యొక్క అంగములు. లక్షణములు.

వివిధ ఆసనములు

మహనీయులగు యోగిపుంగవులు, ద్విజులు బోధిస్తున్న (జప ధ్యానముల కొరకై ఆశ్రయించే) వివిధ (17) ఆసనముల గురించి ఇప్పుడు చెప్పుకుందాము.

1.) స్వస్థికాసనము 2.) గోముఖాసనము 3.) వీరాసనము 4.) యోగాసనము 5.) పద్మాసనము 6.) బద్ధపద్మాసనము 7.) కుక్కుటాసనము 8.) ఉత్తాన కూర్మాసనము 9.) ధనురాసనము 10.) సింహాసనము 11.) భద్రాసనము 12.) ముక్తాసనము 13.) మయూరాసనము 14.) మత్స్యాసనము 15.) సిద్ధాసనము 16.) పశ్చిమతాణాసనము 17.) సుఖాసనము.

(మంగళ శ్లోక - తాత్పర్య విభాగంలో 22వ మంగళ శ్లోకము నుండి 25వ శ్లోకము వరకు సవివరంగా చెప్పిన) వివిధ ఆసనములలో ఒకటి గాని, మరింకే సుఖ - ఆసనముగాని అవధరించి జపము - తపము ఆచరించబడుగాక ! దేహమునకు ఏది సులభముగాను, సుదీర్ఘముగాను, నిశ్చలముగాను, అబాధాకరముగాను ఉంటుందో… అది ‘సుఖాసనము’ అనబడుచున్నది. పైన వర్ణించి చెప్పబడిన ఆసనము లేవీ ధరించలేకపోతే ఏ విధంగా వసతియో, అట్లాగే ఆశీనుడవవచ్చు.

… అయినట్టి ఆసనమును అభ్యసించాలి.

పై విధంగా ఆసనమును స్వభావసానుకూల్య ప్రజ్ఞాసమన్వితంగా ధరించగలగటమే ‘ఆసన జయము’.
ఆసనం విజితం యేన జితం తేన జగత్రయమ్| ఎవ్వరిచేత ఆసనజయము సముపార్జించుకోబడుచున్నదో, ఆతని చేత త్రిలోకములు జయించడుచున్నాయి.

ప్రాణాయామము

ఈ విధంగా -

ఆపై యోగాభ్యాసి ప్రాణాయామమునకు (లేక) ప్రాణోపాసనకు ఉపక్రమించును గాక !

ఈ దేహము వాస్తవానికి ఒక ఉపకరణమువంటిది. ఇది అంగుళీకముతో (ఉంగరపు వేలు యొక్క గీతల చివరి భాగముతో) కొలిస్తే ‘96’ అంగుళాయతనములు పొడవు కలిగి ఉంటోంది. ఇక ప్రాణశక్తి ఈ దేహమునందు అంతటా నిండి ఉన్నదై … ఇంకను 12 అంగుళములకు (శిరో ఊర్ధ్వ భాగము పైకి) విస్తరించినదై ఉన్నది.

దేహస్థమ్ అనిలం దేహసముద్భూతేన వహ్నినా, న్యూనం సమం వా యోగేన కుర్వన్ బ్రహ్మ విదిష్యతే |
ఏ యోగికైతే తన యొక్క యోగాభ్యాసముచే జనించిన ‘యోగాగ్ని’ సహాయముతో వాయువును (ప్రాణశక్తిని) దేహమంతా సమముగా చేసి ఉంచటము తెలిపియున్నదో - అతడు అతిత్వరగానూ, సులభముగానూ బ్రహ్మమును ఎరుగగలడు.

శిఖి స్థానము

సర్వ దేహములలో మధ్యగా “మూలాగ్ని మండలము” అను శిఖి స్థానము అగ్ని ప్రకాశిత ప్రదేశము…. కాల్చబడిన బంగారకాంతులు వెదజల్లుతూ ఉన్నది. ఇద్దాని తేజో-ఉష్ణకిరణములు శరీరము యొక్క మారుమూలల వరకు విస్తరించి దేహము శిధిలము కాకుండా, ఉత్తేజితము చేస్తూ పరిరక్షించుచున్నది.

త్రికోణమ్ ద్విపదామ్ : ద్విపదులగు మానవులలో ఈ మూలాగ్ని మండలము       ⃤   త్రికోణాకారమై వెలుగొందుచున్నది.

అన్యత్ చతరశ్రం చతుష్పదామ్ : నాలుగు పాదములు గల జంతువులలో అట్టి   ▭   చతురస్రాకారమై ఉంటోంది.

వృత్తం విహంగమానాంతు : పక్షులలో అది       ⃝   వృత్తాకారముగా ఉంటున్నది.

షట్ అశ్రం సర్పజన్మనామ్ : సర్పములలో ఆ మూలాగ్ని మండలము   ⬡   ‘6’ కోణములు కలిగి, అరుణోదయములు గల ఆకారముగా ప్రకాశించుచున్నది

అష్టాశ్రం స్వేదజానాం తు : చెమట నుండి పుట్టు పురుగులు మొదలైన శ్వేదజములలో అది   🛑   8- కోణములు 0 శరీరములో కేంద్రీకృత స్థానమగు కందరస్థానము: నాడీ కేంద్రరూపంగా శరీర కేంద్రములో కందస్థానము-గరిమనాభి స్థానముగా (శక్తి పాత స్థానముగా) ఉన్నది. మనుష్యులలో 9 అంగుళముల పరిమాణముగల(మందము) కందస్థానము. 4 అంగుళముల పొడవు. నాలుగు అంగుళముల వెడల్పు - మనుష్యాణాం దేహ మధ్య, నవాంగుళమ్, చతురంగుళవ్ ఉత్సేధం, చతురంగుళమ్ ఆయనమ్।

చతుష్పాదులైనట్టి తిర్యక్ జంతువులలోను, పక్షులలోను కందరస్థానము (ముఖ్య కేంద్ర స్థానము) శరీర మధ్య భాగములో  🥚  అండావృత్తిగా (కోడి గ్రుడ్డు) ఆకారంగా ఉంటోంది. ఇది తుందము, (పొట్ట మధ్య స్థానము). నాభిస్థానమును కలుపుకొని ఉంటోంది.

నాభి చక్రము

అట్టి దేహము యొక్క కేంద్రస్థానము (Central Zone) నకు మధ్యగా ‘12’ దళముల నాభి చక్రము ఉన్నది. అట్టి కందములో ప్రకాశించుచున్న చక్రము నందు విష్ణు భగవానుడు మొదలైన దేవతలంతా సర్వదా వారివారి అంశలతో మూర్తీ భవించినవారై ఉన్నారు. సూర్యనారాయణమూర్తినగు నేను కూడా అట్టి నాభి చక్రదళమునందు అంశాత్మకుడనై స్థితి కలిగి ఉన్నాను. ఆ రీతిగా ఉండి శరీర తత్త్వమునంతటినీ స్వమాయచే పర్యవేక్షిస్తూ సంచారము కలిగి ఉంటున్నాను.

ఓ ద్విజసత్తమా! త్రిశిఖిమహాశయా! ఇక ఈ “జీవుడు” విషయానికి వస్తే -
ఒక సాలెపురుగు తాను నిర్మించుకొనిన సాలెగూడులో చిక్కుకొని, ఆ గూడులోని దారములలో సంచారాలు చేస్తూ, బయటకు రాలేకపోతోంది చూచావా! అట్లాగే పరమాత్మ కూడా తాను క్రీడగా, లీలగా, వినోదంగా కల్పించుకొనిన జీవాత్మత్వమును ఆశ్రయించి, అద్దాని యందు ప్రవేశించి, తన నుండి బయల్వెడలిన జగత్ భావ పరంపరలయందు చిక్కుకొని 14 లోకములలో సంచారములు చేస్తున్నారు.

ప్రాణ - అధిరూఢః చరతి జీవః, తేన వినా న హి ! తన యొక్క ప్రాణశక్తిని అధిరోహించి ఉపాధి పరంపరలలో ప్రవేశ - నిష్క్రమణములను నిర్వర్తిస్తూ, “ఈ దేహము చేతనే నేను ఉనికిని పొందుచున్నాను. ఇది లేకుంటే నేను లేను.

దీనికి ఆపద వచ్చిందా, నా పని ఖాళీ”… అను రూపముతో కూడిన దేహ తదాత్మ్యము, దేహాభిమానము, దేహముతో అవినాభావ సంబంధము,… ఇవన్నీ కలిగి ఉంటున్నాడు.

కనుక -
ఆత్మ యొక్క స్వకీయ భావనారూప కల్పనయే జీవుడు. అట్టి ‘జీవుడు’ అనునది ఆయా ఒక సందర్భంలో తాను వహించు ‘పాత్ర’ వంటిది. జీవుని మోహకల్పనా రూపమే ఈ దేహము.

ఈ జీవుడు కందాంతర్గత నాభి చక్రము యొక్క 12 దళములలో ఏదో ఒక దళముపై ప్రాణశక్తితో కూడి సంచారములు చేయుచున్నాడు. దృశ్య భావాలు ఆశ్రయించుటచే ఆ ద్వాదశ దళ మధ్య స్థానమగు తన ఆత్మను దర్శించటము లేదు. ఇదియే మాయాబద్ధుడగు సంసార జీవుని స్థితి. ఆతని ఉపాధి “అజ్ఞానము”.

కుండలినీ శక్తి స్థానము

తస్య ఊర్వే కుండలీస్థానం నాభే తిర్యక్ అథ ఊర్ధ్వతః |
ఓ ప్రియ త్రిశిఖా ! మనము చెప్పుకుంటూ వస్తున్న దేహ కేంద్రస్థానమునకు, అద్దానియందు ఉనికి కలిగి 12 దళములతో ఒప్పారుచున్న ‘ద్వాదశ దళ’ (హృదయ) చక్రమునకు, ఈవల - ఆవల, పైన - క్రింద కూడా ఒకానొక ఈ మహత్తరమగు శక్తి వ్యాపించినదై ఉన్నది. అదియే కుండలినీ శక్తి అని పిలువబడుచున్నది.

ఆ కుండలిని నాభికి అన్ని వేపులా విస్తరించి ఉండి, అష్ట ప్రకృతి (పంచభూత శక్తులు, మనో, బుద్ధి చిత్తముల) రూపముతో ‘8’ విధములుగా చుట్టలు చుట్టుకొని ఉంటోంది.

ప్రకృతికి చెందిన కుండలినీ శక్తియే ప్రాణశక్తి కూడా! అది దేహములో వాయువు యొక్క కదిలకలను స్వశక్తిచే నిర్వర్తిస్తూ పర్యవేక్షిస్తున్నది. ప్రాణ-అపానములు అనే వాయువు తరంగముల లోపలికి బయటకు వచ్చి-తరలి వెళ్ళు కదలికలను రెండు వెదురు కర్రల వలె చేతబూని-దేహములో జఠరాగ్నిని జనింపజేయుచున్నది. జఠరాగ్ని ఆ విధంగా జనించి తన యొక్క జ్వలనశక్తిచే పొట్టలో ప్రవేశించుచున్న ఆహార పదార్ధములను పచనము చేయుచున్నది. తాను మాత్రము పొట్ట (కండరము) లోపల ఆక్రమించుకొని కదలక-మెదలక, వాయు తరంగములను (ప్రాణ వాయు సంచలనములను) విధిపూర్వకంగా కదల్చుచు, దేహతత్త్వమంతా సంరక్షణ పూర్వకంగా పర్యవేక్షిస్తోంది.

ఆ కుండలినీ శక్తి -
ముఖేనైవ సమావేష్ట్య బ్రహ్మరంధ్ర ముఖం తథా |
బ్రహ్మ రంధ్రము యొక్క ముఖద్వారమును కప్పి ఉంచుతోంది.

చుట్టలు చుట్టుకొని నిద్రాముద్ర వహించి బ్రహ్మరంధ్రమును కప్పి ఉన్న ’కుండలిని’ని మేలుకొలపటం!

ఒకడు కలకంటూ ‘కలలోని నేను’ తో తదాత్మ్యముచెంది, సుఖ - దుఃఖ సంఘటనలను అనుభవిస్తూ  “ఇక్కడ కనిపిస్తున్న సంఘటనలచే నేను పరిమితుడను” అనుకుంటూ ఉంటున్నాడు. అనేక పరిమితత్త్వములకు, స్వప్న సదృశ-దృశ్యములకు బద్ధుడై ఉంటున్నాడు. “ఈ స్వప్నము, స్వప్నములోని ద్రష్ట - దృశ్యములు నా కల్పనయే, ఈ స్వప్నము నేను జాగ్రత్నండియే కల్పించుకోవటం ప్రారంభించాను”… అనేది పూర్తిగా ఏమరచి స్వప్నాంతర్గత పరిమితత్వమంతా తెచ్చిపెట్టుకొని అనుభవిస్తున్నాడు కదా!

అదే తీరుగా -

జాగ్రత్‌లో ఉండి, “నేను ఆత్మ స్వరూపుడను. ఈ జాగ్రత్ అంతా నా ఉహా కల్పనయే! దీనికంతటికి నేను సహజంగానే వేరై ఉన్నాను!” - అనునది కూడా ఏమరుస్తున్నాడు. “ఈ జాగ్రత్లోని విషయాలు, జాగ్రత్లోని ఈ దేహము నాకు సంబంధించినవి. నేను వీటికి కట్టుబడినవాడను” అని తలచుచున్నాడు. ఈ వ్యవహారమంతా ఆత్మస్వరూపుడే అయిఉన్న ఈ జీవునకు అనేక చిత్త భ్రమలకు, బంధములకు, దుఃఖములకు కారణమగుచున్నది.

అందుచేత వేదాంత శాస్త్రము (లేక) అధ్యాత్మ శాస్త్రముచే సూచించబడుచున్న యోగాభ్యాస - జ్ఞాన సమాచారముల యొక్క అనునిత్యాభ్యాసముల ఆవశ్యకత ఏర్పడుచున్నదగుచున్నది.

1) ప్రాణాయామము.
2) ధ్యానము : మూలాధారము మొదలుకొని సహస్రారము వరకు గల శక్తిస్థానరూపములగు చక్రములలో బుద్ధితో ప్రవేశించటము. ధ్యాసను నిలపటము.
3) సాక్షీభూతత్వము : ప్రాణముల కదలికలను కేవలసాక్షియై దర్శించటము.

ఆయా అంగములతో కూడిన యోగాభ్యాసముల గురించి అధ్యాత్మశాస్త్ర - శాస్త్ర విభాగమగు యోగశాస్త్రముచే చెప్పబడుతోంది. అనుభవజ్ఞులగు యోగపుంగవుల స్వీయానుభవము - సవివరణగా సూచించబడుతోంది. ఆ విధంగా మముక్షువు యోగాభ్యాసి అయి ప్రాణాయామాదులు నిర్వర్తిస్తూ ఉండగా…. అట్టి యోగాభ్యాసము యొక్క పరిపక్వ దశలో ప్రాణ - అపానముల అభ్యాస పూర్వక కదలికలచే ‘యోగాగ్ని’ జనిస్తోంది.

అట్టి యోగాగ్ని ప్రజ్వలితమై, నిద్రాణమైన ’కుండలిని’ని సమీపించుచుండగా, నిదురిస్తున్న త్రాచు పాము అగ్ని యొక్క వేడి తగులుటచే బుస్సున లేచు విధంగా, ఆ కుండలిని నిద్రాముద్రను వదలుచున్నది. క్రమంగా చైతన్యవంతమై, మహోగ్రరూపి అగుచున్నది. భద్రకాళివలె ప్రళయ నృత్యము చేయుచూ, అన్యత్వమంతా తనయందు మ్రింగివేసి, ’అనన్యత్వము’ను సంతరించుకొనుచున్నది. ఇదియే బ్రహ్మజ్ఞాన వికాసము కూడా!

అనగా,
ప్రాణయోగముచే ప్రాణ - అపానముల నిరోధము జరుగుతుండగా, శరీరములోని యోగాగ్ని ప్రజ్వలితమై నిద్రాణమై యున్న కుండలినీ శక్తిని నిదురలేపి చైతన్యపరచుచున్నది. అప్పుడు కుండలినీ శక్తి ప్రత్యుత్యాహము పొందినదై, హృదయాకాశములో ’ఆత్మస్ఫురణ’ రూపములో క్రియా శీలకమగుచున్నది.

సుషుమ్న నాడి

త్రిశిఖి బ్రాహ్మణుడు : హే సద్గురూ ! జగద్గురూ ! ‘యోగ కేంద్రీకృత స్థానము’ అని చెప్పబడు ‘దేహ మధ్యస్థానము’ సరిగ్గా ఈ
దేహములో ఎక్కడున్నదో ఇప్పుడు కొంచము మరొక్కసారి వివరించ ప్రార్థన. దేహ మధ్య ప్రదేశము యొక్క ప్రాముఖ్యత ఏమిటో … అది కూడా వివరించండి.

ఆదిత్య భగవానుడు :

మనుష్యులకు - దేహమధ్య స్థానము (గరిమ నాభి స్థానము) : అపానాత్ ద్వ అంగుళాత్ ఊర్ధ్వమ్, అధోమేడ్రస్య తావతా దేహమధ్యం మనుష్యాణాం - గుదమునకు ‘రెండు’ అంగుళములు పైగా, లింగమునకు క్రిందుగా దేహమధ్యలో కేంద్రీకృతమై గరిమనాభి ప్రదేశము ఏర్పడినదై ఉన్నది.

చతుష్పాద (నాలుగు పాదములుగల జంతువులకు) - దేహమధ్య స్థానము : హృత్ మధ్యం హృదయము దేహ మధ్య స్థానముగా చెప్పబడుచున్నది.

తదితర దేహాలకు -దేహమధ్య స్థానము : ఇతరేషామ్ తున్ద మధ్యే - పొట్టమధ్యగా దేహ మధ్య స్థానము కేంద్రీకృతమై ఉంటోంది.

అట్టి దేహమధ్య స్థానములో ప్రాణ అపానములు ఒకదానితో మరొకటి ఎదురుపడినవగుచున్నాయి. ఒక దానితో మరొకటి సమాయతనము అగుచున్నాయి. అట్టి దేహమధ్య కందము యొక్క స్థానములో   ▭   చతురస్రముగా నానావిధ నాడీ సమేతమై ఉంటోంది. ఆ నాడీ కంద (Centrally) మధ్యభాగమునందు ‘సుషుమ్ననాడి’ సుప్రతిష్ఠితమైయున్నది. అట్టి సుషుమ్నానాడి - తామర తూడులోని సన్నటి తంతువు వలె సన్నగా, నిలువుగా ఉండి ఊర్ధ్వముగా (పై వైపుగా) బ్రహ్మరంధ్రము, నిర్వాణ స్థానము (సహస్రారము) వరకు విస్తరించి వ్యాపించినదై ప్రవర్తించుచున్నది. (వైదాంత పరిభాషదృష్ట్యా) విద్యుత్వలె ‘సురసుర’ ప్రకాశించుచూ బ్రాహ్మీస్థానము వరకు వ్యాపించుచున్నది.

సహస్రారము దేహములోని విష్ణు స్థానము. సుషుమ్నను ‘బ్రహ్మనాడి’ అని, ‘వైష్ణవీ’ అని కూడా పిలుస్తారు. “అట్టి సుషుమ్నానాడి మనో-చిత్తములచే ప్రేరేపించబడి, బుద్ధితో శిరస్సు ఉపరిస్థలమున గల బ్రహ్మనాడిని దాటి సహస్రార - ఉన్నత స్థానము చేరి ఉండటము”… అనునది ’నిర్వాణప్రాప్తి’గా చెప్పబడుచున్నది.

పింగళ - ఇడ నాడులు

సుషుమ్నానాడి ప్రకాశించుచున్న ’నాడి కందము’ (దేహమధ్య స్థాన - కేంద్రీకృత నాడీ మండలము) నుండియే ’పింగళనాడి’ బయల్వెడలినదై కుడి ముక్కు రంధ్రము వరకు వ్యాపించి ఉన్నది.

అదే “నాడీ మండలము’ నుండి బయల్వెడలే ’ఇడ’ నాడి ఎడమ ముక్కు రంధ్రము వరకు వ్యాపించినదై ఉన్నది.

ఈ విధంగా ఇడ - పింగళ అను రెండు ముఖ్య నాడులు సుషుమ్నకు ఎడమ కుడి ప్రదేశముల వెంటగా ఏర్పడినవై ఉన్నాయి.

ఇతర ముఖ్య నాడులు

‘గాంధారి’, ‘హస్తిజిహ్వ’ అను పేర్లతో పిలువబడుచున్న వేరైన రెండు నాడులు కూడా సుషుమ్నకు ముందువైపుగాను, వెనుక వైపుగాను వెంటనంటినవై, ‘కుడి-ఎడమ’ కన్నులలోని ‘కంటిపాప మధ్యస్థానము’ వరకు వ్యాపించి ఉంటున్నాయి.

పూషనాడి - యశశ్విని అను పేర్లు గల మరి రెండు నాడులు ’నాడీ కందము’ నుండి బయలుదేరి కుడి ఎడమ చెవుల వినికిడి పొరల స్థానము వరకు వ్యాపించినవై ఉంటున్నాయి. సవ్య నాడి చెవులకు పై స్థానముల వరకు విస్తరించి ఉన్నది.

అలంబసానాడి: పాయువు (మల విసర్జన స్థానము) వరకు (దేహ మధ్య నాడీ కంద స్థానము నుండి బయల్వెడలి) వ్యాపించి ఉన్నది.

శుభానాడి: నాడీ కందము నుండి (దేహ కేంద్రనాభీ ప్రదేశము నుండి)-లింగాంగము చిట్టచివరి కొస వరకు వ్యాపించినదై ఉన్నది.

కౌశికీనాడి : కందస్థానము నుండి పాదముల వ్రేళ్ళ చిట్టచివరి కొసవరకు వ్యాపితమై ఉన్నది.

ఈ విధంగా నాడీ కందము నుండి - ఇడ - పింగళ - గాంధారి - హస్తి జిహ్వ-పూష - యశస్విని-సవ్య-అలంసబా-శుభా-కౌశికీ నాడులు దేహములోని ముఖ్యేంద్రియముల వరకు విస్తరించి ఉన్న “దశవిధముఖ్యేంద్రియనాడులు” అని (యోగశాస్త్రముచే) అభివర్ణించబడుచున్నాయి.

అదే విధంగా నాడీ కందము నుండి బయల్వెడలుచూ ‘72000’ స్థూల - సూక్ష్మ నాడులు దేహముందు మూల మూలలకు విస్తరించి
వ్యాపించినవై ఉంటున్నాయి.

అట్టి సూక్ష్మ నాడులు వాటి వాటి ఉపనాడులు… వాటిన్నిటికీ పేర్లు పెట్టి చెప్పటము తేలికైన విషయం కాదు, అద్దాని అగత్యమూ లేదు. రావి ఆకులో ఎట్లాగైతే పెద్ద - చిన్న నాడి - ఉపనాడి ఈనెలు ఆ రావి ఆకు నిండా విస్తరించినవై ఉంటున్నాయో, దేహములో కూడా పైన మనము చెప్పుకొన్న 72000 సంఖ్య గల నాడులు దేహములోని నాభి స్థానములోని నాడీ కందము నుండి బయల్వెడలి దేహములో అనేక క్రియాత్మకమగు ధర్మములు (Functions) జరగటానికి కారణభూతమగుచున్నాయి.

ఈ విధంగా దేహ కందస్థానము (పొట్ట - దేహకేంద్రస్థానము) సూక్ష్మ - స్థూల నాడీ - ఉపనాడులకు పుట్టుక స్థానమై చెన్నొందుతోంది.

పంచ ప్రాణ వాయువులు - ప్రాణ ముఖ్య కేంద్ర స్థానములు

ఈ నాడులలో 1) ప్రాణము 2) అపానము 3) సమానము 4) ఉదానము 5) వ్యానము అనే వివిధ చలనములకు సంబంధించిన పంచప్రాణ వాయువులు అన్ని నాడులలోను సంచారములు చేస్తున్నాయి.

ప్రాణశక్తి సర్వదా ఒక్కటే అయినప్పటికీ, సంచలనమును అనుసరించి వివిధ పేర్లు పెట్టబడ్డాయి.

అంతేకాకుండా 1) నాగ 2) కూర్మ 3) కృకర 4) దేవదత్త 5) ధనంజయ అనే పేర్లతో ఉపప్రాణములు కూడా ఆయా ధర్మములను నిర్వహించుచూ నాడులందు సంచలనములు కలిగి ఉంటున్నాయి.

కొందరు ప్రాణతత్త్వవేత్తలు పైన చెప్పిన దశ ప్రాణములలో “పంచప్రాణములైనట్టి ప్రాణ - అపాన - సమాన - ఉదాన - వ్యానములే ముఖ్యంగా దేహమును నడిపించేవి. మిగతావన్నీ ఆ పంచ ప్రాణములచేతనే నియమించబడుచున్నాయి”… అని చెప్పుచున్నారు.

మరికొందరు యోగశాస్త్ర పండితులు “ప్రాణ - అపానములే ముఖ్యమైనవి. మిగతాదంతా ఆ రెండింటి కార్యక్రమములలోని అంతర్విభాగములే” - అని కూడా చెప్పుతూ ఉంటారు.

ఇంకొందరు యోగ శాస్త్రవేత్తలు - జీవాత్మ ధారణ చేస్తున్నది ముఖ్యప్రాణమే. అదియే ప్రప్రథమము. అద్దాని కార్యక్రమములే మిగతావన్నీ… అని సిద్ధాంతీకరిస్తున్నారు.

ఓ ద్విజసత్తమా ! త్రిశిఖి మహాశయా ! ప్రాణముఖ్య కేంద్ర స్థానముల గురించి విను.

1) ప్రాణమునకు స్థానములు : (1) ప్రాణ ప్రథమ స్థానమగు నాడీకందము 2) నాభి మండలము (బొడ్డు) 3) ఆస్య - నాసికల మధ్య ప్రదేశము (బాహ్య స్థిర ప్రాణ బిందువు నుండి నాశికయొక్క ఊర్ధ్వ భాగము వరకు) 4) పాదముల యొక్క బొటన వ్రేలు … ఈ ఈ స్థానములు “ప్రాణకేంద్రీకృత స్థానములు” అని పేర్కొనబడుచున్నాయి. ఆస్య నాశికయోః మధ్యం - హృదయం నాభిమండలమ్, ప్రాణ అంగుష్టమ్ ఇతి ప్రాణస్థానాని ।

ప్రాణవాయువు శరీర మధ్య భాగము (తుందులము - పొట్ట) యందు స్థితి కలిగి, ఈ జీవుడు స్వీకరించు అహారములను, పానీయములను అహార రసముగా సమీకృతము చేయుచున్నది.

2) అపాన వాయువుకు స్థానములు : 1) గుదము (మలవిసర్జన ద్వార స్థానము) 2) మేధ్రము (లింగము), 3) జానువులు (మోకాళ్ళు) … ఈ మూడు చోట్ల ముఖ్యంగా అపానవాయువు స్థానము పొందినదై సంచరించుచున్నది. ఇది దేహము నుండి మల - మూత్రాది విసర్జనములకు సహకరించుచున్నది.

3) సమాన వాయువునకు స్థానములు : సర్వగాత్రేషు సర్వవ్యాపీ వ్యవస్థితః దేహమునందు అంతటా సమాన వాయువు వ్యవస్థితమై స్థానములు కలిగి ఉన్నది. ఇది దేహమునందు సర్వవ్యాపి. శరీర పరిపోషణములను నిర్వర్తించుచున్నది.

4) ఉదాన వాయువునకు స్థానములు : దేహము యొక్క సర్వ సంధులలోను (In the joints, joint corners ) స్థానము కలిగి ఉండి, పాదములలోను - మడమల లోను కూడా ఉన్నదై సంచారములు చేయుచున్నది. ఇది దేహములో ప్రవేశించిన ఆహార పదార్థములను జీర్ణము అగు ప్రక్రియలన్నిటినీ నడుపుచూ, నిర్వర్తించుచున్నది.

5) వ్యానవాయువునకు స్థానములు :  శ్రోత్రో - ఊరు కట్యాం చ గుల్ప స్కంధ గళేషు చ | చెవులులోను, తొడలలోను (ఊరువులలోను), కటి (మొల) ప్రదేశమునందు, గుల్ఫము (చీలమండలము) నందు స్కంధములయందు (భుజములయందు), గళము (కంఠము) నందు… తన సంచారము కొరకై స్థానములుగా కలిగి ఉన్నది. ఈ వ్యానవాయువు ప్రాణవాయు చేష్టలను పర్యవేక్షించుచున్నది. (ప్రాణ - అపానాది చేష్టాది క్రియతే వ్యానవాయునా).

పంచ ఉపప్రాణములు

నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయములని పిలువబడేవి పంచ ఉపప్రాణములు. ఇవన్నీకూడా, చర్మము - బొమికలు మొదలైన వాటిని అంతరము - బాహ్యమున ఆశ్రయించి ఉంటున్నాయి.

(1) నాగ ఉప ప్రాణ వాయువు : ఉద్గారాది క్రియో నాగః | దేహములోని అనవసరమైన వాయువులను దేహము నుండి బయటకు పంపుతూ ఉంటుంది. త్రేపులు మొదలైన ప్రక్రియ మార్గములను పర్యవేక్షిస్తూ, ఉద్గరము (బయటకు నెట్టుట) మొదలైన క్రియలు నిర్వర్తిస్తున్నది.

(2) కూర్మ ఉప ప్రాణ వాయువు : కూర్మా అక్షాది నిమీలినః | కూర్మ ఉపానవాయువు కళ్ళు మూయుట తెరచుట, గుండె - స్పందము మొదలైన శరీరములోని అనేక శారీరక వ్యవస్థా సంబంధమైన కదలికలను నిర్వర్తింపజేయుచూ ఉంటుంది.

(3) కృకర ప్రాణ వాయువు : “కృకరః” క్షపయోః కర్త | దేహమునకు, హాని చేయగల రోగ క్రిముల ప్రవేశమును నిరోధించటం, దేహములోని రోగ జీవాణువులను నశింపజేసి దేహమును పరిరక్షించుట నిర్వర్తిస్తూ ఉంటుంది.

(4) దత్త ఉపాన వాయువు : “దత్తో” నిద్రాది కర్మకృత్ | ఈ జీవుడు నిద్రపోవటం మొదలైన కార్యక్రమములకు సహకారము అందజేస్తూ ఉంటోంది.

(5) ధనంజయ ఉపానవాయువు : మృతగాత్రం చ శోభాది “ధనంజయః” | శవముతో సమానమైన ఈ భౌతిక దేహమును కాంతియుతము, తేజోమయము చేయుచున్నది. జీవ తేజస్సును దేహము కలిగి ఉండునట్లుగా పరిరక్షించుచున్నది. శరీరము శిథిలము కాకుండా కాపాడుచున్నది.

ఓ ద్విజసత్తమా ! మనం ఇప్పటి వరకూ పింగళ సుషుమ్న ఇత్యాది నాడీ భేదముల గురించి, ప్రాణ - అపాన - వ్యాన - ఉదాన - సమాన ఇత్యాది వాయు ధర్మముల భేదము గురించి, ప్రాణ ఉపప్రాణములు దేహములో కలిగియుండే స్థానముల గురించి, పంచప్రాణ - పంచ ఉపప్రాణములు నిర్వర్తించు ఆయా ధర్మముల గురించిన కొన్ని విషయాలు చెప్పుకున్నాం కదా !

ఇప్పుడు, సందర్భోచితం కాబట్టి, రెండు ముఖ్యమైన విషయాలు సంభాషించుకుందాము.
1) నాడీ శుద్ధి గురించి.
2) సర్వమునకు సాక్షి, ప్రేరకుడు, సర్వస్వరూపుడు, స్వస్వరూపుడు … అగు పరమాత్మతత్త్వము గురించిన ధ్యానము.

ధ్యానము

ధ్యానముచే నాడీ శుద్ధి కాగలదు. నాడీ శుద్ధిచే జన్మ - కర్మలకు ఆవల గల ఆత్మ స్వరూపము సుస్పష్టమవగలదు.

ధ్యానమునకై ఏకాంతమైనట్టి ప్రశాంత - ప్రదేశమును ఎన్నుకోవాలి. పరిసరములను ఏకాగ్రతకు సానుకూల్యముగా తీర్చి దిద్దుకోవాలి. గురు - ఇష్టదైవ పఠములు మనస్సును ఆకర్షించు రీతిగా అమర్చుకోవాలి. మనస్సును ఉత్సాహపరచేటట్లు, ఆకర్షించునట్లు ఉండాలి.

సర్వ బాహ్య సంబంధములన్నీ బాహ్యముననే సుదూరముగా ఉంచుతూ ఉండాలి. అంతరంగమున ఓర్పు-నేర్పులతో అవతారమూర్తుల సంబంధమైన, బ్రహ్మజ్ఞాన సంబంధమైన సమాచారముతో నింపుకోవాలి.

దారువులో (కొయ్య వాసపు బద్దలతో) నిర్మితమైన ఆసనమును (పీటన) తయారు చేసుకోవాలి. ఆ దారువుపై దర్భలు, కుశలు, కృష్ణాజినము (జింక చర్మము) పరచుకోవాలి. ఆ కృష్ణాజిన - ఆసనముపై స్వస్తికము మొదలైన యోగ శాస్త్రము సూచించే ఏదో ఒక ఆసనము గాని (లేక) మరేదైనా సుఖాసనమును గాని-అభిరుచి అయినది దేహముతో స్వీకరించాలి.

ఓ విప్రమిత్రుడా! యోగాసనమును స్వీకరించుచూ (ధారణ చేస్తూ) ఆసీనుడైనప్పుడు మెడ - భుజము - శిరస్సులను నిఠారుగా నిలిపి ఉంచాలి. సమాహితము (wel - conditioned and wel - placed) చిత్తముతో యోగసాధనకు ’సంసిద్ధము’ కావాలి.

భద్వా ప్రాగాసనం, ఋజుకాయ సమాహితః, నాసాగ్ర న్యస్తనయనో, దనైః దన్తాః న సంస్పృశన్, రసనాం తాలునిన్ అస్య స్వస్థచిత్తో నిరామయః, ఆకున్చిత శిరః కించిత్ నిబధ్నన్ యోగముద్రయా, హస్తా యధోక్త విధినా ప్రాణాయామమ్ సమాచరేత్ |

ప్రాణాయామము నిర్వర్తించుచూ ఉండాలి!

ప్రాణాయామము
(Conscious modulation of Prana Energy through disciplining of Air Movements)

1) రేచకము : గుండె నుండి ముక్కు రంధ్రముల ద్వారా వాయువును (గాలిని) బయటకు వదలటము (Push out)
2) పూరణం : బయట (12" దూరం నుండి) నుండి ముక్కు రంధ్రముల ద్వారా లోనికి స్వీకరించటము (Pull-in)
3) శోధనము (కుంభకము) : లోపలకు వచ్చిన గాలిని దేహమునందు నిలిపి శోధింపజేయటం (To activite the inside of the body by holding the air knowingly and actively)
4) పునః రేచకము : దేహములో నిలిపి ఉంచి వాయువును దేహములో ఖాళీ చేస్తూ ముక్కు పుటములతో బయటకు వదలటము

వాయువు యొక్క ఈ ‘4’ క్లేశనములు (ప్రక్రియలు) కలిపి ‘ప్రాణాయమము’ అని యోగులచే ప్రవచించబడినదై యోగ వాఙ్మయములో వివరించబడుతోంది. వాయుజయము సిద్ధించుకొన్న యోగవిత్తములచే యోగసాధకులకు సూచించబడుతోంది.

1) రేచకము : హస్తేన దక్షిణేనైవ పీడయేత్ నాసికాపుటమ్! శనైః శనైః రథబహిః ప్రక్షిపేత్ పింగళా అనిలమ్ | కుడిచేతి బొటనవ్రేలుతో కుడివైపు నాసికాపుటము (ముక్కు పుటమును) మూసివుంచి, నెమ్మది నెమ్మదిగా శరీరమునందలి పింగళనాడిచేత గాలిని బయటకు వదలటము ‘రేచకము’ (బయటకు వదలటము).

2) పూరకమ్ : ఇడయా వాయుమ్ ఆపూర్య షోడశ మాత్రయా |  తరువాత బయట నుండి ఇడనాడి లోనికి (ఎడమ ముక్కు రంధ్రము గుండా) నిండుగా గాలిని 16 మాత్రలకాలము (16 చిటికెల కాలము) పీలవటము (లోనికి పీలవటము).

(మాత్ర = ఒక హల్లు ఉచ్చరించు సమయము)

3) కుంభకము : పశ్చాత్ పూరితం కుమ్భయే చతుఃషష్ట్యాతు మాత్రయా |  పూరించిన వాయువును ఇడా నాడిలో 64 మాత్రల కాలము (64 చిటికెల కాలము) కుంభించి ఉంచటము.

4) పునఃరేచకము : ద్వాంత్రింశత్ మాత్రయా సమ్యక్ రేచయేత్ పింగళా అనిలమ్ | ఆ విధంగా కుంభించిన వాయువును నెమ్మదిగా పింగళనాడి ద్వారా (ముక్కు యొక్క కుడి రంధ్రము ద్వారా) 32 మాత్రల కాలము బయటకు వదలటము.

ఏవం పునః పునః కార్యం ’వ్యుత్రామ - అనుత్రమేణతు’ |  ఈ విధంగా ఉత్క్రామం (Inward pulling) - అనుత్క్రమేణ (outward pushing) మరల మరల నిర్వర్తించబడుచూ ఉండాలి.

సంపూర్ణ దేహ కుంభకము :

సంపూర్ణ కుంభవత్ దేహము కుంభయేత్ మాతరిశ్వనా। 

నిండుకుండలో నీరు అంతటా ఆక్రమించి ఉంటున్న తీరుగా పూరకము కుంభకముల సందర్భములలో వాయువును ఆ ప్రాణా యోగాభ్యాసి దేహమంతటా సుసాధ్యమైనంతవరకు - నిండుగా నింపి ఉంచాలి.

పూరణాత్ నాడయః సర్వాః పూర్యంతే మాతరిశ్వనా ।

దేహములోని నాడులన్నీ కూడా పూర్ణముగా వాయుతో నింపి ఉంచాలి.

ఈ విధంగా నాడులన్నిటిలోను వాయువును కుంభకయామ పూర్వకంగా కొన్ని మాత్రల కాలము (చిటికల కాలము) నిలిపి ఉంచు ప్రక్రియ ప్రాణాయమము.

ప్రాణాయామ సాధనము చేత….

అందుచేత ఓ త్రిశిఖి బ్రాహ్మణోత్తమా ! మముక్షువైనవాడు ప్రాణాయామ సాధనను ప్రతి రోజు నిర్వర్తిస్తూ ఉండటం శుభదాయకము.

1) ప్రాతఃకాలము 4 AM to 6 AM
2) మధ్యాహ్నకాలము 12 noon to 2 pm
3) సాయంకాలము 4 PM to 6 PM
4) రాత్రి 8 PM to 10 PM
5) అర్ధ రాత్రి 12 Night to 2 AM

ఈ విధంగా,
ప్రాతః మధ్యన్దినే సాయమ్ అర్ధ రాత్రే చ కుమ్బకాన్ |
రోజులో నాలుగు సార్లు లేదా ఐదుసార్లు కుంభన - ప్రాణాయామమును అభ్యసించాలయ్యా !

నెమ్మది - నెమ్మదిగా ప్రాణాయామముల సంఖ్యను పెంచుకుంటూ, రోజుకు ‘80’ సార్లు అభ్యాసము చేయాలి.

ఈ విధంగా ఒక్క రోజు చేసినా కూడా అనేక బుద్ధి దోషములు, పాప దృష్టులు సన్నగిలుతాయి.

సంవత్సరత్రయాత్ ఊర్ధ్వం ప్రాణాయామ పరోనరః, యోగసిద్ధి భవేత్ |

ఏ యోగి అయితే ప్రాణాయోగపరుడై ‘3’ సంవత్సరముల కాలము నిర్వస్తాడో…

ఇక ప్రాణాయామాభ్యాసి యొక్క బాహ్యలక్షణాల గురించి చెప్పవలసివస్తే…

ఆతనికి ఇంద్రియ వ్యాపారములపట్ల ఇతః పూర్వము కొనసాగుచున్న ఆకలి రూపమైన ఆవేశము సన్నగిలగలదు. అతడు అల్పాసి (ఆకలి స్వల్పముగా మాత్రమే కలవాడు) కాగలడు. అతడు ఆకలిని జయించుటచే “అల్పస్వీకారీ” - స్వల్పముగా తినినా కూడా శరీరమునకు కావలసిన శక్తిని సముపార్జించుకోగలడు. అతని దేహము కించిత్ సమయము నిద్రించినా కూడా ఆతడు దేహమునకు అవసరమైనంత విశ్రాంతిని పొందగలడు. నిద్రను జయించగలడు. నిద్ర ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తుంది, వద్దంటే మానుతుంది.

ఇంతే కాకుండా అతడు తేజస్వి, బలవంతుడు అగుచున్నాడు.

అతడు అపమృత్యువు (The incident like sudden death, sudden sickness etc.,) అను దోషమును తొలగించుకొని,దీర్ఘాయుష్మంతుడు అగుచున్నాడు. ఈ దేహసంబంధితమైన, అంతిమ క్షణము వరకు సదుపయోగమగు ఉత్సాహపూరితము అయిన రీతిగా అతని దేహము రూపుదిద్దుకుంటోంది. ఉత్తమ ప్రయోజనముతో కూడిన ఉపకరణము అవుతుంది.

ఇప్పుడు ప్రాణాయామము నిర్వర్తించు యోగి యొక్క నాలుగు స్థితుల గురించి చెప్పుచున్నాను.

1) ప్రస్వేద జననం (అధమ) : ప్రాణాయామము నిర్వర్తిస్తూ ఉండగా మొట్ట మొదటి దశలో (State of Begining) దేహమంతా చెమట (Sweating) ప్రదర్శితమౌతుంది. ఇది మొదటి దశ. మొట్టమొదటిది కాబట్టి యోగభాషలో “ప్రాణాయామ అధమ ప్రస్ఫుటము”…. అని అంటూ ఉంటారు. ప్రస్వేద జననం యస్య ప్రాణాయామస్తు సో అధమః॥

2) కన్ననము (మధ్యమ) : ఇక రెండవ దశలో (Middles State) దేహములో కొన్ని కదలికలు, కన్పనములు కనబడుతూ వస్తాయి. ముఖ్యముగా భుజముపైన, ముఖము ప్రదేశములోను, నడుముకు క్రింద ప్రదేశాలలోను ఈ కన్పనములు అధికంగా అనుభూతమౌతూ ఉంటాయి. దీనిని “ప్రాణాయామ ద్వితీయ సాధన దశ” (లేక) ‘మధ్యమ దశ’ అంటారు. కన్ననం వపుషో యస్య ప్రాణాయామేషు మధ్యమః॥

3) ఉత్థానము (ఉత్తమ) (Higher State): ప్రాణాయమాభ్యాసముచే 1) శరీరము తేలికగా అనుభవమవటము 2) శిరస్సు యొక్క ఉపరితల ఆకాశము ఉత్తేజమవటము జరుగుతుంది. క్రమంగా ఆ యోగ సాధకుని శరీరము దూదిపింజమువలె అతి తేలిక అగుచున్నది.

ఏ విధంగా భూమ్యాకర్షణ గాలితో నిండిన బూరను తన ఆకర్షణ శక్తితో ఒకచోట భూమిపై నిలపలేదో, అట్లాగే ఈ దేహము భూమ్యాకర్షణమును జయిస్తోంది. ప్రాణవాయు అభ్యాసముచే నియమితమగుచుండగా, దేహములోని అణువణువు గాలి రేణువులకంటే తేలిక అగుచున్నది. ఇక ప్రాణాయామాభ్యాసము కొనసాగుచుండగా, ఆ యోగి యొక్క దేహము దూదిపింజమువలె అయి ఆతని ఇచ్ఛానుసారం పైకి లేవటం ప్రారంభించి, కొన్ని అడుగులుపైకి (గాలికలో) నిలువగలదు. అతడు క్రమంగా ప్రాణాయామ కుంభకము నెమ్మది నెమ్మదిగా రేచకం చేస్తూ ఉండగా… ఆ గాలిలో పైకి లేచిన శరీరము కొంచము కొంచము బరువును పొందుచు, తిరిగి ఇతఃపూర్వము ఆసనముపై ప్రతిష్ఠితము అగుచున్నది.

ఉత్థానం వపుషో యస్య స ’ఉత్తమ’ ఉదాహృతః । 

ఈ విధముగా ప్రాణాయామయోగ - కుంభక విధానము అభ్యసించు యోగి యొక్క భౌతిక దేహము కుంభకము సమయంలో పైకి దూది పింజమువలె లేచు యోగస్థితిని పొందినవానిని ’ఉత్తమ’ ప్రాణయోగ సాధన సిద్ధుడుగా - చెప్పబడుచున్నాడు.

అధమ (Stage 1) ప్రాణయామ సిద్ధి (దేహమునకు చెమటపట్టు) వరకు వచ్చినట్టి యోగి, “పూర్వజన్మకృతం పాపమ్ వ్యాధిగ్రస్తేన పీడితః" - అను సూత్రముననుసరించి ఏ పాప అనుభవములు వ్యాధి రూపమై బాధించటానికి సంసిద్ధమగుచున్నాయో, ఆ వ్యాధులు వాటి బాధలు తొలగుతూ వస్తాయి.

మధ్యమ ప్రాణాయామ సిద్ధి పొందుచున్న యోగి పట్ల, ఆయా జన్మజన్మల శారీరక - మానసిక బుద్ధి దోష వ్యాధులు మొదలంట్లా తొలగగలవు.

ఇక ఉత్తమ ప్రాణాయామ యోగ సంసిద్ధుల విషయానికి వస్తే, వారి పట్ల జన్మ జన్మార్జితమైన కుసంస్కారములు కూడా - మరల మొలకెత్తలేనంతగా - మొదలంట్లో తొలగుచున్నాయి. క్రమంగా ఆతడు యోగీశ్వరుడై, ఈ విశ్వమంతా తన రూపముగా సందర్శించుచూ, అవిఘ్నమగు బ్రహ్మానందమును అనునిత్యం ఆస్వాదించుచున్నాడు.

ప్రాణాయామ పరాయణులకు సంబంధించి తదితర విషయములు - పరివర్తనముల గురించి చెప్పుకోవాలంటే …,

ప్రాణయోగ సాధన సంపత్తి చేత ఆ యోగి త్రికాలజ్ఞుడు అగుచున్నాడు. దేహమునకు మునుముందటి ’అవ్యక్తరూపము’, ‘దేహవ్యక్తతత్త్వము’, ‘దేహానంతర అవ్యక్త చమత్కారము’… ఈ మూడు బుద్ధికి అర్థము కాగలవు. దృష్టికి కరతలామలకము అగుచున్నది. అతడు భూత - వర్తమాన - భవిష్యత్తులను ఎరుగుచున్నవాడగుచున్నాడు. చెదరని చిరునవ్వుతో కాలః క్రీడకు సాక్షీభూతుడగుచున్నాడు.

కేవల కుంభక ప్రాణాయామ సిద్ధి

యోగాభ్యాసము యొక్క ఒకానొక ఉత్తమ దశలో ఆ యోగి “వాయుబాహ్యనిష్క్రమణ పూర్వక రేచకము, వాయు అంతర్ద్రవేశ పూర్వక పూరకముల మునుముందట ప్రక్రియలు”… మొదలైన ఇవన్నీ లేకుండానే, సూటిగా…. “కుంభక ప్రాణాయామము” యొక్క ధారణను….. నిర్వర్తించుచున్నారు.

అనగా, మనస్సును, బుద్ధిని, చిత్తమును ఒక అనుకున్నచోట అనుకున్నంతసేపు కేంద్రీకృతం చేసి ఉంచగలుగుచున్నాడు. అట్టి ’సహజ కుంభకము’ను అవధరించువానికి ఈ త్రిలోకములలో అసాధ్యం అంటూ ఏదీ ఉండదు.

ఏ యోగి అయితే …,

యత్న పూర్వకంగా మనో - ప్రాణములను నిలిపి ధారణ నిర్వర్తించుచున్నాడో, అట్టివాడు సర్వరోగముల నుండి విముక్తుడగుచున్నాడు.

సర్వశారీరక - మానసిక రుగ్మతల నుండి విముక్తుడై ఆనందముగా జీవించగలడు. నాభి - పొట్ట ప్రదేశములో (నాభికంద ప్రదేశములో) రేచక - పూరక ఆవస్యకత లేని “కుంభక ప్రాణాయాజనము” చేయువాని పొట్టలోని రోగములు వాటికవే తొలగగలవు.

నాసాగ్రము (ముక్కు యొక్క ఊర్ధ్వయంగా - కనుబొమ్మలకు క్రిందుగా) ధారణ చేయువాడు దీర్ఘాయుష్మంతుడు అగుచున్నాడు. ఆతని దేహము అతి లాఘవంగాను, క్రియా సామర్థ్యవంతముగాను కాగలదు.

ఏ యోగి అయితే - తెల్లవారుఝామున, సాయంకాలము 4 గంటల నుండి 6 (లేక) 7 గంటల సమయము వరకు గల బ్రాహ్మీ ముహూర్తమునందు - బ్రహ్మే ముహూర్తే సంప్రాప్తే వాయుమ్ అకృష్య జిహ్వయా - నాలుకతో గాలిని ఆకర్షించి - పిబతః త్రిషు మాసేషు వాక్సిద్ధిః మహతా భవేత్ - నోటితో పిల్చు యోగసాధనను -

యత్ర యత్ర ధృతో వాయుః అంగే రోగాది దూషితే, ధారణాత్ ఏవ మరుతః తత్ తత్ ఆరోగ్యమశ్నుతే ।

దేహములో ఏ అంగమునందు రోగదోషము కలుగుటం జరుగుతుందో, ఆచోట ‘పూరక రేచక సహిత’ (లేక) ’పూరక - రేచక రహిత’ - (సూటిగా మనస్సుతోనే, బుద్ధితోనే) … కుంభక ప్రాణాయమము ధారణ చేయుట చేత, ఆరోగ్యము పొందగలదు. ఆ దేహ ప్రదేశమునందు గల రోగము, బాధ తొలగగలవు.

ఓ ద్విజపుంగవా ! ఇక్కడ ఒక ముఖ్య విషయం !

మనసో ధారణాత్ ఏవ, పవనో ధారితో భవేత్, ‘మనసః స్థాపనే హేతుః’ ఉచ్యతే!

ఈ విధంగా చిత్తము (ఇష్టము), బుద్ధి (తెలివి), మనస్సు (ఆలోచన)లను ఏక ప్రదేశంలో నియమించగలగటమే ప్రాణాయామ యోగసిద్ధి.

ఇంద్రియ విషయ ఉపశమన ప్రక్రియ

ఈ జీవుని మనస్సు (లేక) ఆలోచనాపరంపరలు ప్రాణ యోగ సాధనకు ఉపక్రమించక ముందు, ఇంద్రియముల వెంట వెళ్ళి ఇంద్రియ విషయముల పరంపరలలో ప్రవేశితమై ఉంటోంది. ప్రాణముయొక్క తాత్విక రూపము ఇష్టమే కాబట్టి మనస్సు వెంట వెళుతోంది. అందుచేత యోగాభ్యాసి ఇంద్రియములను వాటివాటి విషయముల నుండి వెనుకకు మరల్చాలి. విషయముల పై పడుచున్న ధ్యాసలను వెనుకకు మరల్చు ప్రాణాయామ సాధనోపాయమును ఆశ్రయించాలి. అప్పుడు ఈ ప్రాణములతోబాటు మనస్సు కూడా వశమౌతుంది.

ఆపానమ్ ఊర్థ్వమ్ అకృష్యేత్ ఉదరో పరిధారయేత్ ।
క్రిందకు వేగముగా వెళ్ళుచుండు అపానవాయువును మనస్సుతో (లేక చిత్తముతో) పట్టుకొని నెమ్మదిగా, ఉదరము (పొట్ట) యొక్క పై భాగమునకు చేర్చి ధారణ చేయుటచే దోషపదార్థాలు నిర్వీర్యమౌతాయి. అపానవాయువును చిత్తముతో పొట్టలో బాహ్యరేచక-తదనంతర కుంభక పూర్వకంగా ధరించటంచేత పొట్టలోని దోషాలు పోతాయి. అట్టి సమయంలో పొట్ట లోపలికి కుంచించుకొనినదై ఉంచాలి.

మనస్సును ప్రాణోపాసనచే వశం చేసుకోవడం

బధ్నన్ కరాభ్యాం శ్రోత్రాది కరణాని యథాతథమ్,
యుంజానస్య యథా ఉత్తేన వర్త్మనా స్వవశం మనః।

చేతులతో (లేక చూపుడు వ్రేళ్ళతో) లోపలిగా నొక్కి యథాతథముగా మూసి ఉంచి రేచక - పూరక శాస్త్ర విధిగా గాని, (లేక) సూటిగా మనో-బుద్ధులతోగాని గాని కుంభక ప్రాణాయామమును అభ్యసించువానికి అతిత్వరగా మనస్సు స్వాధీనము అగుచున్నది.

విషయములనుండి మనస్సు కొంచము కొంచెము వశమగుచుండగా… ఇక మరికొంతగా ప్రాణశక్తి కూడా వశమగుచూ వస్తోంది.

మనో-ప్రాణములు పరస్పర సాహకారికములు సుమా!

సర్వదేహుల విషయంలోనూ, ఎట్టి స్వకీయ ప్రయత్నము లేకుండానే (అసంకల్పితంగా) నాసికా పుటముల నుండి గుండెలోనికి, గుండె నుండి ఇడ పింగళనాడుల ద్వారా లోనికి - బాహ్యానికి వాయు సంచలనము జరుగుచూ, ఈ దేహమంతా ప్రాణ సమన్వితమై ఉండటానికి కారణమగుచున్నది. ఉద్దేశ్యపూర్వకంగా మనో-బుద్ధులకు సాధనోపకరణముగా తీర్చిదిద్దుకోవటమే ప్రాణాయామము.

ఓ సౌమ్యా! ప్రాణాయామము ద్వారా ’ప్రాణ నిరోధము’ అను సిద్ధిని సిద్ధించుకొన్న యోగుల విషయంలో వాయువు ’శంఖిణీ వివరము’ అని పిలువబడుచున్న సుషుమ్నయందు ఉత్సాహపూరితమై సంచారము కలిగియున్నదగుచున్నది. తదితరుల విషయంలో ఇడ పింగళల యందే అత్యధికంగాను వాయుసంచలనము జరుగుచుండటం జరుగుతోంది. ఈ విధంగా దేహము జీవించి ఉన్నంతవరకు ప్రాణవాయువు నాడులన్నిటిలో సంచలము కొనసాగుతూనే ఉంటుంది.

అయితే, సాధారణ సమయంలో సుషుమ్ననాడి మందత్వము వహించి ఉంటోంది. చురుకుతనము ఉండదు. ప్రాణాయామముచే సుషుమ్ననాడి చురుకుగా అయి ఆ యోగికి ఉత్సాహం, ఆనందం ప్రసాదిస్తోంది.

మనం చెప్పుకొన్న రేచక - పూరక - కుంభక పునఃరేచక విధి విధానంగా ప్రాణాయామాభ్యాసమును ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి కూడా నిర్వర్తిస్తూ కొన్ని నెలలు నిర్వర్తించువాడు క్రమంగా అంతర్ముఖుడు అగుచున్నాడు. అట్టివాడు కాలపరిధులను కూడా దాటివేయుచున్నాడు. కాలమునకు నియామకుడగు ఆత్మ భగవానుని సమక్షమును చేరి ఆత్మతో అద్వితీయత్వము సముపార్జించుకొనుచున్నాడు. త్రికాలజ్ఞాని అగుచున్నాడు. తదితర సర్వజీవులలో స్వస్వరూపమగు అంతరాత్మను సందర్శించుచూ పరమానంద సంభరితుడు అగుచున్నాడు.

ఓ త్రిశిఖి బ్రాహ్మాణోత్తమా ! అంతేకాదయ్యా! ఆ యోగి అవసాన కాలము గురించిన జ్ఞానము కూడా కలవాడై జీవితావకాశమును ఎల్లప్పుడు సద్వినియోగము చేసుకొనుచున్నాడు. దేహముల రాక పోకలను ప్రాణాయామాభ్యాసముచే జనించిన యోగశక్తిచే సాక్షీభూతుడై లీలా-క్రీడా వినోదిగా సదర్శించుచున్నాడు. యోగము అభ్యసించు యోగికి దేహముల రాకపోకలు వినోదభరితంగా అనుభూతమగుచున్నాయి. దేహముల రాకపోకలు, తదనంతర దేహనిర్ణయములు అతని బుద్ధికి వశమై ఉండగలవు కూడా!

అవసాన కాలము - గుర్తెరుగుట

త్రిశిఖి బ్రాహ్మణుడు : యోగులు అవసాన కాలము గురించి గుర్తెరుగుచున్నారని, తదనంతర 14 లోకముల సంచారముల గురించి ఎరిగి ఉంటారని దేహ-దేహాంతరములను తమ ఆధీనంలో కలిగి ఉంటారని తమరు అంటున్నారు కదా! దేహ - యోగ శాస్త్రములను అనుసరించి ‘అవసానదశ’ ను గుర్తెరగటం అవసానకాలం గురించి ఆయా సూచనల విషయమై వివరించ ప్రార్థన.

ఆదిత్య భగవానుడు :  ఓ త్రిశిఖా ! వినండి.

అంగుష్ఠాది స్వ-అవయవ స్ఫురణాదశనేరపి, అరిష్టైః జీవితస్యాపి జానీయాత్ ।
క్షయమ్ ఆత్మనః జ్ఞాత్వా, యతేత కైవల్య ప్రాప్తయే యోగ విత్తమః ॥

"కాలి చేతుల బొటన వ్రేళ్ళు మొదలైన ఆయా శరీరములోని ప్రదేశములలో “ఇది నా అవయవము కదా”… అనే స్వ అవయవ స్ఫురణ తగ్గిపోవుచున్నప్పుడు, “ఆహాఁ! ఇక దేహము అవసానదశను సమీపిస్తున్నది కదా!” అని యోగ విత్తములు గుర్తించుచున్నారు. అప్పుడిక కైవల్యప్రాప్తి కొరకై ప్రయత్నములను ఇనుమడింపజేసుకొని, మోక్షమును సిద్ధింపజేసుకుంటున్నారు. జీవులు అట్టి మార్గమును గుర్తెరిగి అనుసరించాలి.

పాదముల - చేతుల బొటన వ్రేళ్ళు - అవి ఉన్నట్లేఉండని రీతిగా స్ఫురణ - నశించటం జరుగుతూ ఉంటే…? - ఇక ఆతని వర్తమాన దేహము యొక్క మునుముందు ఆయుష్షు ఒక్క సంవత్సర కాలములోపే… అని గుర్తించబడుచున్నది.

చేతుల, మణిబంధము (లేక) మణికట్టు యందు, గుల్ఫములయందు (కీళ్ళచీలమండలములందు) ఆ భాగములు ఉండినట్లే అనిపించక, స్ఫురణ నశించుచున్నప్పుడు - అతనికి ఆదేహముతో శేషించిన కాలము ‘6’ నెలల మించి కాదని గమనించబడుచున్నది.

కర్పర (మోచేయి – మోకాలు) మండలములందు, స్ఫురణ నశించి, అవి తన దేహానుభవమునకు లభించనివగుచున్నప్పుడు అతడు ఆ దేహమును కలిగియుండబోవుకాలము ‘3’ నెలలు మించదని యోగి తెలుసుకొని ఉంటున్నాడు.

కుక్షి (పొట్ట) - పార్శ్వ భాగములు, మేహన (మూత్ర విసర్జకాయవము, మొగగులు) యందు, పార్శ్వములయందు (చంకలయందు) స్పర్శ నశిస్తే (లేక) స్ఫురణ కోల్పోతూ ఉంటే, అతనిక ఆ దేహముతో శేషించియున్న ఆయుర్ధాయము ఒక నెల రోజులు మాత్రమే అని చెప్పబడుచున్నది.

ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాము? శేషించిన ఆయుష్షునైనా తత్త్వ దర్శనార్ధము సద్వినియోగపరచుకోవాలని ఈ జీవుడు తీవ్రముగా అనుకొని, చివ్వరి అవకాశమునన్నా సద్వినియోగమగునట్లు చేసుకోవటానికి!

ఓ త్రిశిఖా ! ఇంకా కూడా వినండి.

జఠరము (కడుపు)నందు స్ఫురణ కోల్పోతే, అనగా, పొట్టభాగము ఉన్నట్లే అనిపించటం మానివేసి “నా పొట్ట భాగముఏమైందిరా?”… అని అనిపించటం ప్రారంభమైతే… అతనికి ఆ దేహముతో సంబంధము 10 రోజులు మాత్రమేనని అనుకోవాలి.

ఎవనికి కనులు తెరిచి చూస్తున్నప్పుడు మిణుగురు పురుగు కాంతివలె కాంతి వెలగటం - ఆరటంలాగా చుక్కలు చుక్కలుగా కనిపించటం ప్రారంభమౌతాయో… అట్టి వాని ఆయుర్ధాయము ‘5’ రోజుల మాత్రమే మిగిలి ఉన్నట్లు.

జిహ్వాగ్ర అదర్శనే త్రిణి దినాని స్థితి రాత్మనః ॥
నాలుక చివర అనుభవానికి లభించకపోతూ ఉంటే, ఇక ఆ దేహము ‘3’ దినములు మాత్రమే జీవించబోవుచున్నదని అర్ధము అగుచున్నది.

కంటికి ఆరని అగ్ని జ్వాలలు కనిపిస్తూ ఉంటే, అతని దేహము పట్ల శేషించిన కాలవ్యవధి ‘రెండు’ రోజులు మాత్రమే.

ఇటువంటి ఆయా అనుభవములు, స్పర్శకోల్పోవుచున్న సూచనలు అనుభవమగుచూ ఉంటే, ఇంక ఆ దేహము క్షయించనున్నదని గుర్తెరగాలి.

ఓ త్రిశిఖా ! ఈ మృత్యు (దేహ నాశన సంబంధిత) సూచనలు ఎందుకు చెప్పుకుంటున్నాము? గతించిన దాని గురించి వ్యధలు త్యజించి, మిగిలిన సమయమును సద్వినియోగపరచుకోవటానికి.

ఈ జీవుడు జపము, తపస్సు, కుంభకాది ప్రాణాయామములు, ఆధ్యాత్మ శాస్త్ర శ్రవణము, తత్త్వమ్, సోఽహమ్ ఇత్యాది మహా వాక్యార్థాల వివరణలను ఆత్మజ్ఞుల ముఖతః వినటము, మహనీయులను దర్శించటము, వారిని ఆహ్వానించి వారి ఆత్మ సంబంధమగు ఆప్త వాక్యములను పదిలపరచుకోవటం! లౌకిక విషయములన్నీ త్యజించి వేయటము… ఇత్యాది ప్రయత్నములను సిద్ధింపజేసుకోవటానికి నిశ్రేయమగు మోక్షము కొరకై సర్వవిధముల మనో బుద్ధులను అత్యంత ఉత్సాహ - ఏకాగ్రతలతో నియమించటానికి. మనస్సుతో పరమాత్మనే ధ్యానించాలి. సర్వాంతర్యామినే సర్వత్రా సర్వ- స్వరూపుడుగా దర్శించాలి. స్వస్వరూపుడుగా ఆస్వాదించాలి.

మనసా పరమాత్మానం ధ్యాత్వా ‘తత్’ రూపమ్ ఆప్నుయాత్ |
మనస్సుతో తత్ రూపమే ధ్యానిస్తూ ఉంటే, తత్ రూపుడు కాగలడు.

’యోగ ప్రత్యాహారము’ను అతి శ్రద్ధగా, తీవ్రంగా ఆరంభించాలి. అంతేగాని, భయపడుచూ క్షణక్షణం గడపటం బుద్ధిజీవుడగు మానవునికి ఉచితం కాదు.

యోగ ప్రత్యాహారము :

యత్ అష్టాదశ భేదేషు మర్మ స్థాసేషు ధారణమ్ స్థానాత్ స్థానమ్ సమాకృష్య "ప్రత్యాహారః” … స ఉచ్యతే |

దేహములోని ‘18’ బేధములతో కూడిన మర్మ స్థానములందు ఏ ప్రాణశక్తి ధారణ చేయబడుచున్నదో… అట్టి ధారణను బుద్ధితో ధరించి ప్రాణ వాయువును ఒక చోట నుండి మరొకచోటికి చేర్చుటను (స్వకీయ ఇచ్ఛచే కొంతకొంతసేపు చేర్చి ఉంచు యోగసాధనను) “ప్రత్యాహారము” అంటున్నారు.

ప్రత్యాహార విశేష నిర్వచనము :

       చూచువాడు - చూడబడునది - చూడటము.
       వినువాడు - వినబడునది - వినటము.
       చెప్పువాడు - చెప్పబడునది - చెప్పటము.
       స్పర్శించువాడు - స్పర్శించబడునది - స్పర్శ.
       రుచి చూచువాడు - రుచి చూడబడునది - రుచి.
       ఆలోచించువాడు - ఆలోచించబడునది - ఆలోచన.

ఇవన్నీ ఏ ప్రాణశక్తితో ధారణ చేయబడుచున్నదో అదే ధారణచే వాటికి ఆధారమై, వాటికి వేరై, వాటి రూపములను ప్రదర్శించు ఆత్మయందు ధ్యాస కలిగి ఉండటమే ప్రత్యాహారము.

18 మర్మ స్థానములలో ప్రత్యాహారము :

చిత్తమును (లేక) ధ్యాసను (లేక) మనస్సును ఆరోహన (క్రిందనుంచి పైకి), అవరోహణ (పై నుండి క్రిందికి) క్రమముగా మార్చి మార్చి 18 మర్మ స్థానములలో నిలపటమును ‘ప్రత్యాహారము’. వాటిని వివరిస్తున్నాను, విను.

18 మర్మ స్థానములు

1) పాదాంగుష్టమ్  - కాళ్ళ బొటన వేళ్ళు
2) గుల్పము - కాలి చీలమండలము
3) జంఘా - మధ్యము కాలి పిక్క భాగము
4) ఊరు మధ్యము - కాళ్ళ మోచిప్పలు మరియ తొడల మధ్య భాగము
5) ఊరు మూలము - తొడల మూల భాగము
6) పాయువు - గుదము మల విసర్జనా అంగము
7) హృదయము - గుండె ప్రదేశము
8) లింగము - ఉపస్థ, పునరుత్పత్తి అవయవ ప్రదేశము
9) నాభి - దేహ మధ్య నాభి, దేహకేంద్ర ప్రదేశము
10) కంఠ కూర్పరము - కంఠ కేంద్రస్థానము
11) తాలు మూలము - దవడ మూల స్థానము
12) ఘ్రాణ మూలము - ముక్కుకు ఉపరితల, లోతు ప్రదేశము
13) నేత్ర గోలములు - కనుగ్రుడ్లు స్థానము
14) భ్రూమధ్యము - రెండు కనుబొమ్మల మధ్య ప్రదేశము
15) లలాటము - నుదురు ప్రదేశము
16) జానువులు - మోకాళ్లు
17) మూర్ధము - ముఖ ఊర్ధ్వ భాగము (Upper Fore face)
18) కర్ణమూలములు - చెవుల మూల ప్రదేశము

ఈ 18 స్థానములయందు మార్చి మార్చి కుంభక ధారణ చేయాలి.

ఈ పాంచభౌతిక దేహమునందుగల పంచభూతములయందు ధారణను గురించి కూడా విను.

యమ నియమముమలతో - సంస్కరింపబడిన (యుక్తమైన నియమితమైన) మనస్సును దేహములోని పంచభూతములపై నియమించటము దేహాంతర్గత - పాంచభౌతికధారణ అని అంటారు.

పంచభౌతిక ధారణ యోగ విశేషములు
(దేహాంతర్గతంగా)

ఈ దేహములోని వేరువేరు విభాగములలో ఒక్కొక్క పాంచభౌతిక తత్త్వము విశేష ధర్మము కలిగియున్నట్లుగా యోగ శాస్త్రముచే విశదీకరించబడుచున్నది.

అట్టి విశేషాలు ఇక్కడ ఉదహరించుకొనెదము గాక.

పృథివీ స్థాన ధారణ : (భూమి)

ఆజానుపాద పర్యంతం పృథివీ స్థానం ఇష్యతే । → ఆజానుపాద పర్యంతము - భూ ఉపాసన

పాదములు మొదలుకొని మోకాలు వరకు … పృథివీస్థానము. ఈ పృథివీ స్థానము పీత (పసుపు) వర్ణము చతురస్రాకారము కలది. వజ్ర లాంఛితమై యున్నట్టిది. ఈ స్థానములో ‘భూతత్త్వము’ను ఉపాసించాలి. (పాదములనుండి మోకాళ్ళ వరకు) ఈ భూతత్త్వమును హృదయమునందు ఆరోపించి ’5’ ఘటికల (24 నిమిషములు x 5 = 2 గంటలు) కాలము కుంభక ప్రాణాయామము చేయబడును గాక!

అంభసి స్థాన ధారణ : (జలము)

ఆజానుకటి పర్యంతం ‘అపాం స్థానం’ ప్రకీర్తితం । → ఆజానుకటి పర్యంతం - జలోపాసన!

మోకాలి నుండి కటి (నడుము) ప్రదేశము వరకు జలతత్త్వము ఆవరించి ఉన్నది.
- అర్ధచంద్ర సమాకారము
- శ్వేత (తెలుపు) వర్ణలాంఛితము
ఈ జలతత్త్వమును హృదయమునందు ఆరోపించి ‘10’ ఘటికల (24 నిమిషములు x 10 = 4 గంటలు) కాలము కుంభక ప్రాణాయామము నిర్వర్తించబడుగాక.

అగ్ని స్థాన ధారణ :

ఆదేహమధ్య కట్యంతం ‘అగ్ని స్థానం’ ఉదాహృతమ్ ।  కటి → ప్రదేశం నుండి బొడ్డు వరకు - అగ్ని ఉపాసన.

కటి (మొల) ప్రదేశమునుండి దేహము యొక్క మధ్యగాగల ‘నాభి’ (బొడ్డు) వరకు అగ్ని స్థానము. వర్ణము - సింధూరము (ఎరుపు) అగ్ని జ్వలించుచూ ఉండు ప్రదేశము.

ఈ అగ్ని తత్త్వమును హృదయమునందు ఆరోపిస్తూ ‘15’ ఘటికల (24 నిమిషములు × 15 = 6 గంటలు) కాలము కుంభక ప్రాణాయామము చేయాలి.

వాయు స్థాన ధారణ :

నాభేః ఉపరి నాసాంతం ’వాయుస్థానం తు’ తత్ర వై । → నాభి నుండి ముక్కు రంధ్రము వరకు వాయు ఉపాసన

నాభిప్రదేశము నుండి ముక్కు యొక్క ఉపరిస్థానము వరకు.. వాయు స్థానము. వేదిక (Drama Stage) వంటి ఆకారము.
వర్ణము - పొగ (ధూమ్ర) వర్ణము. ఈ వాయు తత్త్వమును హృదయమునందు ఆరోపించి ‘20’ ఘటికల సమయము
కుంభక ప్రాణాయామము చేయుదురు గాక.

ఆకాశ స్థాన ధారణ :

వ్యోమస్థానం నభస్తస్ర భిన్నాంజన సమప్రభమ్। ధ్యేయం మారుతం ఆరోప్య కుమ్భకేనైవ యత్నవాన్॥ ముక్కు ఉపరిభాగము నుండి బ్రహ్మ రంధ్రము వరకు ఆకాశ - ఉపాసన.

నాసా ఉపరిరంధ్రము నుండి బ్రహ్మ రంధ్రము వరుకు - ఆకాశ స్థానము.

ఇది నిరాకారము.

రంగు కాటుక వర్ణము (భిన్నాంజన సమప్రభమ్)

ఇట్టి ఆకాశతత్త్వమును హృదయమునందు ఆరోపించాలి.

ముక్కు పై రంధ్రము నుండి బ్రహ్మ రంధ్రము వరకు గల ఆకాశతత్త్వమును హృదయమునందు ఆరోపించి ‘20’ ఘటికల కాలము ’కుంభక ప్రాణాయమము’ నిర్వర్తించుదురు గాక.

పంచభూత స్థాన ధారణ - సాకార రూప భావన :

పృథివ్యం శేతు దేహస్య చతుర్బాహుమ్, కిరీటినమ్, అనిరుద్దం హరిం యోగీ యతేత భవముక్తయే।

దేహము యొక్క పృథివీ అంశమును ధ్యానించుచున్నప్పుడు - చతుర్బాహుడు కిరీటధారి అగు హరి యొక్క అనిరుద్ధ అంశను ధ్యానించుచూ యోగధ్యానము చేయాలి. అట్టి యోగి సర్వ సంసార బంధముల నుండి విముక్తుడగుచున్నాడు.

దేహములోని ‘జలాంశ’ యందు నారాయణ భగవానుని, అగ్ని అంశ యందు ప్రద్యుమ్నుని, వాయు - అంశయందు సంకర్షణుని, ఆకాశము నందు పరమాత్మయగు వాసుదేవుని ఎల్లప్పుడు స్మరించాలి.

ఎవ్వరైతే దేహములోని పృథివీ - జల - అగ్ని - వాయు ఆకాశ తత్త్వములను చతుర్బాహు - కిరీటధారియగు అనిరుద్ధ - నారాయణ - ప్రద్యుమ్న - సంకర్షణ వాసుదేవ స్వరూపులుగా సదా స్మరిస్తూ ఉంటారో, అట్టి యోగి ఆయా దేవతా స్వరూపములను తప్పక సిద్ధించుకొనగలడు. ఇందులో సందేహమే లేదు.

యోగసాధకుడైనవాడు….,

ఈ భౌతిక దేహమును స్వస్తిక - గోముఖ - వీర - యోగ - పద్మ - బద్ధ పద్మ - కుక్కుట - ఉత్థాన కూర్మ - ధను - సింహ - భద్ర - ముక్త - మయూర - మత్స్య పీఠక - సిద్ధ - పశ్చిమాంతాణ - సుఖాసనములలో ఏదో ఒకటి - శరీరమునకు అనుకూలమైనది ధరించవచ్చు. ఆతనికి ఆ ఆసనము క్షణముల కాలంలో (అతిత్వరగా) స్వీకరిస్తూ దీర్ఘ కాలము ధరించగలిగనది అయి ఉండాలి.

అట్టి సానుకూల్య ఆసనమును ఎన్నుకొని - బద్ధ్వా యోగాసనం పూర్ణం - యోగాసనముచే భౌతిక దేహమును నియమించి…,

హృతేశే హృదయాంజలి :  హృదయాకాశములో హృదయాంజలి సమర్పిస్తూ…,

నాసాగ్రన్యస్త నయనో : ముక్కుకు అగ్రభాగమునందు దృష్టిని నిలిపి…,

జిహ్వాం కృత్వాచ తాలుని : నాలుకను తాలు దేశమునకు (దవడకు) సున్నితముగా తాకి ఉంచి

దంతైః దంతైః న సంస్పృశ్య : క్రింది - పైన దంతములు తాకకుండా ఉంచుతూ…

ఊర్ధ్వ కాయః సమాహితః : నడుమును, ముఖమును నిలువుగా ఉంచి, సమాహితమైన - నిర్మలమైన బుద్ధితో…,

సంయమేత ఇంద్రియ గ్రామం : "ఇంద్రియములను బాహ్య విషయాలపై వ్రాలకుండా (శబ్ద స్పర్శ రూప రస గంధములచే ఆకర్షించబడకుండా) నిలిపి ఉంచి…,

ఆత్మ బుద్ధ్యా విశుద్ధయా : బుద్ధిని నిర్మలముగా రూపొందిస్తూ, ఆత్మను సర్వత్రా దర్శించు స్వభావమును అభ్యసింపజేస్తూ…,

చింతనమ్ వాసుదేవస్య పరస్య పరమాత్మనః, స్వరూప వ్యాప్త రూపస్య ధ్యానం కైవల్య సిద్ధిదమ్ |

సర్వమునకు ‘పరము’ అయినవాడు (ఆవల ఉన్నవాడు), సర్వస్వరూపుడై వ్యాప్తి పొంది విస్తరించి ఉన్నవాడు -అగు వాసుదేవుని సర్వ జీవులలో, సర్వ జీవులుగా కూడా సర్వదా వేంచేసి ఉన్నవానిని ధ్యానచింతన చేయాలి ! అట్టి ధ్యానము కైవల్యమును సిద్ధింపజేయగలదు.

ఈ విధంగా ఒక యామము (ఒకపూట కొద్ది క్షణములు) సమయము కుంభక ప్రాణాయామ విధానములో సర్వాంతర్యామి - సర్వతత్త్వ స్వరూపుడు అగు వాసుదేవుని భావోపాసన చేసినంత మాత్రం చేత ’7’ జన్మలుగా వచ్చిపడియున్న పాపదృష్టులు, పాపకర్మల దోషాలు తొలగిపోగలవు.

జీవుని యొక్క జాగ్రత్ - స్వప్న - సుషుప్తి - తురీయ - దేహాంతర్గత - వర్తన ప్రదేశములు

త్రిశిఖి బ్రాహ్మణుడు : స్వామీ! పరమాత్మా! త్రిలోకవర్తీ! లోక ప్రకాశకా! ఆదిత్య భగవాన్! ఇక ఇప్పుడు యోగ శాస్త్రప్రవచనానుసారంగా భౌతిక దేహములో జాగ్రత్-స్వప్న-సుషుప్త తురీయముల కేంద్రీకృత - సంచారస్థానముల గురించి వివరించ ప్రార్థన.

ఆదిత్య భగవానుడు :  కొన్ని విశేషాలు వివరిస్తున్నాను. వినండి .

జాగ్రత్ వృత్తి :

శ్లో॥ నాభికందాత్ సమారభ్య యావత్ హృదయ గోచరమ్ జాగ్రత్ వృత్తిం విజానీయాత్ । → హృదయ ప్రదేశం జాగ్రత్ వృత్తి స్థానం. నాభి (బొడ్డు) కందము నుండి - హృదయ ప్రదేశము వరకు అంతటా గోచరము అగుచున్నది జాగ్రత్ వృత్తి |

స్వప్న వృత్తి :   కంఠస్థం స్వప్న వర్తనమ్ । → కంఠ హృదయ ప్రదేశం స్వప్న వృత్తి స్థానం. హృదయప్రదేశము నుండి కంఠము వరకు గల ప్రదేశము “స్వప్న వర్తన ప్రదేశము”… అని గమనించబడును గాక!

సుషుప్త వృత్తి :  సుషుప్తం తాలు మధ్యస్తం । → సుషుప్తి స్థానం. తాలు (దవడ) మధ్య ప్రదేశము సుషుప్త సంచార స్థానమని గుర్తెరుగబడు గాక!

తుర్యగ వృత్తి స్థానము : తుర్యం భ్రూమధ్య సంస్థితః । → భృకుటి తురీయ స్థానం. రెండు భ్రుకుటుల మధ్యగా పై ప్రదేశములో గల ఆకాశములో - తుర్యగుని సంచార స్థానము.

తుర్యాతీత స్థానము :  తుర్యాతీతం పరబ్రహ్మ బ్రహ్మరంధ్రీతు లక్షయేత్ । → బ్రహ్మరంధ్రం తురీయాతీత స్థానం. తుర్యాతీతమైన స్థానము కొరకై ’బ్రహ్మరంధ్రము’ను లక్ష్యముగా చేసుకొని ఉండాలి.

విష్ణుతత్త్వము - విష్ణుపదము :

జాగ్రత్ వృత్తిం సమారభ్య యావత్ బ్రహ్మ బిలాంతరమ్ తత్ర ఆత్మానం తురీయస్య తుర్యాం తే ‘విష్ణు’ ఉచ్యతే ।

జాగ్రత్ వృత్తి గల నాభి మొదలుకొని - బ్రహ్మరంధము వరకు గల ఆత్మ యొక్క ఉనికిని 4 ప్రదర్శనములు గల ‘తురీయము’ - అని అంటారు.

తురీయము యొక్క ఆవల తురీయాతీత ఆత్మ స్వరూపమును "విష్ణు భగవానుని స్వరూపము, సంస్థానము” కూడా! అదియే విష్ణు పదము.

బ్రహ్మరంధ్రమునకు ఆవల తురీయాతీత స్థానంలో “ఇదమేవ తత్ విష్ణుః”… అనునది సులభంగా అనుభూతం కాగలదు.

ఈ జీవుడు స్వతఃగా ఆత్మానందస్వరూపుడే అయి ఉండి కూడా…, స్వప్న సంఘటనాచమత్కారము వలె, తనకు తానే కల్పించుకొనుచున్నట్టి స్వకీయసంకల్పనా పరంపరలలో చిక్కుకొని, దేహ దేహాంతరములకు ఒక కాందిశీకునివలె ప్రయాణములు చేయుచు, “నేను - బద్ధుడను ! దేహపరిమితుడను! దుఃఖతుడను! ఇంతే! ఈ బంధము తొలిగేది ఎట్లారా బాబూ?” అని నిర్వీర్యుడగుచున్నాడు.

మరి అందుకు తరుణోపాయం? చెప్పుచున్నాను, విను!

ఈ జీవుడు ధ్యానమునకు ఉపక్రమించాలయ్యా! జగత్ విషయ ధ్యానమును నెమ్మది నెమ్మదిగా సన్నగిల చేసుకొనుచూ, తురీయాతీత తత్త్వమును ఆశ్రయించాలి. అనగా, సర్వజీవుల సహజానంద స్వరూపుడు, ధ్యాని యొక్క స్వస్వరూపుడే అగు విష్ణు భగవానుని ధ్యానించాలి.

కుంభక ప్రాణ యోగాభ్యాసముచే ఆ విష్ణు భగవానుని తత్త్వము పట్ల మనో ప్రాణములను ఏకాగ్రం చేసి నిలుపుచూ తన్మయుడు, తత్ - స్వరూపుడు కావాలి.

🙏 నిర్మల హృదయాకాశమునందు (రాగ - ద్వేష - దృశ్య సంభావన అనే మేఘములు తొలగించబడిన హృదయాకాశంలో),
🙏 కోటి సూర్యకాంతుల ప్రభాభాసమానుడు,
🙏 విద్యుత్ కాంతివలె మహాతేజోవిలాస స్వరూపుడు,
🙏 హృదయపుష్పముయొక్క అంతరమున చిరునవ్వులు చిందిస్తూ ఆసీనుడై ఉన్నవాడు,
🙏 ఈ విశ్వమంతా తన స్వరూపముగా కలిగి ఉన్నవాడు
అగు ఆ అధోక్షజ శ్రీమన్నారాయణుని కుంభక ప్రాణాయామయుక్తుడై ఉపాసించాలి!

ఇంకా కూడా …,

🙏 ఈ దృశ్య జగత్తులో కనిపించే జీవాకారములన్నీ తనవే అయి ఉన్నవారు,
🙏 దృశ్యకల్పనా కళాకారుడు,
🙏 ఈ అనేక ముఖములతో ప్రదర్శమగుచున్నవారు (సహస్ర శీర్షి పురుషః)
🙏 అనేక భుజములను కలిగియున్నవారు…,
🙏 అనేక సృష్టికల్పనా సామర్థ్య సమన్వితుడు…,
🙏 సర్వత్రా - సర్వహృదయస్థుడై ప్రకాశమానమగుచు, ఎత్తబడిన అనేక ఆయుధములు ధరించియున్నవారు…,
🙏 అనేక వర్ణములతో ప్రకాశించువారు…,
🙏 పరమోగ్ర స్వరూపుడుగా కనిపిస్తూ పరమశాంత స్వరూపుడైయున్నవారు,
🙏 అనేక కళ్ళు - దర్శనములు - దృష్టులు కలవారు…,
🙏 కోటి సూర్య సమప్రభా భాసులు….,
అగు ఆ ఆత్మ భగవానుని ఏ యోగి ధ్యానము చేస్తూ ఉంటాడో… అట్టివానియొక్క సర్వ దృశ్య - మనోవృత్తులన్నీ తమకు తామే వినాశనము కాగలవు.

అనగా, దృశ్యమంతా - మనస్సుతో సహా ఆత్మకు అభిన్నమై అనుభవమవగలదు.

🙏 హృత్ పుండరీక మధ్యస్థం - హృదయ కమలమునందు సదా వేంచేసి ఉన్నవారు!
🙏 చైతన్యం, జ్యోతిం - చైతన్య జ్యోతిస్వరూపులు!
🙏 కదన్బగోళాకారం - సర్వతత్త్వములు తన కుక్షియందు కలిగియున్నట్టి కదంబ గోళాకారుడు!
🙏 తుర్యాతీతమ్ - జాగ్రత్ స్వప్న సుషుప్తులలో సంచరించు తురీయమునకు కూడా ఆవలవాడు, తురీయ - నియమామకుడు!
🙏 పరాత్ పరమ్ - జీవునికి చెందిన ఇహమునకు ఆవల గల ‘పరము’నకు కూడా (సర్వ దృశ్య జగత్తు తనయందు కలిగియున్నట్టి) … పరాత్పరుడు!
🙏 అనంతమ్ - అంతము అనునది లేనివాడు. అనంతుడు. దృశ్య-దేహ-మనో-బుద్ధి-చిత్త-అహంకారాలు, లోకములు, లోకపాలకులు… మొదలైనవన్నీ ఆయన రచనలేగాని, వాటిచే ఆయన పరిమితుడు కాదు. అపరిమితుడు. నవలలోని పాత్రలకు, పాత్రల స్వభావములకు, సంఘటనలకు, సంబంధములకు, సందర్భములకు రచయిత పరిమితుడు అవుతాడా?
🙏 ఆనందమయమ్ - కేవలానంద స్వరూపుడు!
🙏 చిన్మయమ్ - సర్వము ‘ఎరుక’ చే వెలిగించు చిన్మయ స్వరూపుడు!
🙏 భాస్కరమ్ - సర్వ ప్రకాశకుడు! ఆయనయొక్క ప్రకాశమే ఈ జగత్ చమత్కారములు!
🙏 విభుమ్ - సర్వ నియామకుడు!
🙏 నివాత దీప సదృశమ్ - గాలి వీచికలు లేని చోట కదలిక లేకుండా వెలుగొందు దీప శిఖవంటివాడు!
🙏 అకృత్రిమ మణిప్రభమ్ - స్వభావంగానే అనేక మణికాంతులతో వెలుగొందువాడు!
అగు ఆ హరిని ధ్యానము చేయుచున్న యోగులకు ‘ముక్తి’ అనునది (అరచేతిలోని ఉసరికాయవలె) కరతలామలకమగుచున్నది.

ఈ విశ్వమంతా తన రూపమై విరాజిల్లుచున్న ఆ దేవదేవుని, ఎవ్వడైతే, తన అభిరుచిని అనుసరించి, సాకారంగానో, నిరాకారంగానో, స్థూలరూపంగానో, సూక్ష్మ రూపంగానో హృదయ పద్మములో ధ్యానిస్తాడో, అట్టి యోగికి ఆ పరమాత్మ సులభముగా స్వస్వరూపుడై సాక్షాత్కరించుచున్నారు.

అట్టి వానిని స్వయముగా అణిమ, గరిమ మొదలైన అష్టసిద్ధులు తమకు తామే ఆశ్రయించుచున్నవగుచున్నాయి.

ఈ జీవాత్మగాను, దీనికి ఆవల పరమాత్మగాను ఉన్నది నేనే ! అభయ స్వరూపుడగు ఆ భగవానుడను నేనే ! ‘పరబ్రహ్మము’ అని శాస్త్రములు ఎలుగెత్తి గానం చేస్తున్నది నా యొక్క సహజము - నిత్యము - పరము - అప్రమేయము అగు స్వరూపము గురించి మాత్రమే ! అంతేగాని పరబ్రహ్మమనగా ఎక్కడో ఉన్నది కాదు. మరెన్నిటికో ఏదే ప్రయత్నముల అనంతరము ఏచోటనో ఎప్పటికో లభించవలసినది ఏ మాత్రం అయి ఉండలేదు! ఈ సర్వజీవుల స్వరూపుడనై ఉన్నాను!

అహమ్ బ్రహ్మమేవ | అహమ్ బ్రహ్మాస్మి | సర్వమ్ ఖల్విదమ్ బ్రహ్మ | జీవో బ్రహ్మేతి నా పరః |

ఇట్టి ప్రయోజనము తురీయాతీత స్వరూపమగు నారాయణ (లేక) హరి ఉపాసన “కుంభక ప్రాణాయామోపాసనా క్రమము”చే తప్పక సిద్ధించగలదయ్యా! లక్ష్యముగా అట్టి శివోఽహమ్ అయిఉండును గాక! (Let it be the main objective).

సమాధి

తురీయ - తురీయాతీత స్వరూపము, సర్వాత్మకము అగు శ్రీహరి - ఉపాసనను కుంభక ప్రాణాయామ మార్గములో ఉపాసించువారికి అణిమ గరిమ మొదలైన అష్టసిద్ధులు స్వయముగా ఆశ్రయిస్తూ ఉంటాయని అనుకున్నాము కదా!

అయితే, అట్టి కుంభక ప్రాణ పూర్వక పరమాత్మోపాసన యొక్క అంతిమ లక్ష్యము ’సమాధి’ యోగమే గాని, సిద్ధులు సంపాదించటము కానేకాదు.

ఎందుకంటే, అట్టి సిద్ధులు ధనము ఇత్యాది సంపదలవలె మాయలోనివి మాత్రమే. అవన్నీ ’సమాధి’కి సంబంధించినవి కానేకావు. సమాధికి అవి అగత్యము కాదు. మెట్టువంటివి కూడా కానే కావు. వాస్తవానికి అవి సంస్కృతి (సంసార) సంబంధమైనవే! అల్పజ్ఞానికి అవి ఆత్మసాక్షాత్కారమునకు అడ్డులు కాగలవు కూడా ! సమాధి స్థితి సర్వసిద్ధులకు సంబంధించినదే కాదని గ్రహించబడుగాక! ఆ స్థితి వాస్తవానికి సర్వసిద్ధుల వివర్జితమైనది.

బ్రహ్మమును సిద్ధింపజేసుకొన్న యోగి తిరిగి సంస్కృతి (సంసారము) నందు దిగజారటము లేదు. అతడు “తత్త్వమ్ (తత్ - త్వమ్… త్వమ్‌గా కనిపించేది తత్స్వరూపమగు పరబ్రహ్మమే)”ను శోధించి, ఇక ప్రాపంచక సంగతి - సందర్భము - సంబంధముల వ్యవహారముల పట్ల కధా శ్రవణమువలె సస్పృహ-నిస్పృహుడై ఉంటునా నాటకమును చూస్తూ ఉన్నవాని వలె జగత్ దృశ్యమునకు అతీతమైన బుద్ధిని కలిగినవాడై ప్రకాశిస్తున్నాడు.

ఏ విధంగా ఇంధనము లేనప్పుడు అగ్ని మొదలంటా శ్రమిస్తుందో (Subsides), ఆ రీతిగా ఆత్మతత్త్వమును తన అప్రమేయ స్వస్వరూపమును ఎరిగినవాని సర్వ ఆదుర్దాలు తొలగుతాయి. ఆతడు నిశ్చయ సిద్ధుడు - తత్త్వజ్ఞాని అగుచున్నాడు. అతని పట్ల మనస్సు, ప్రాణము కూడా స్వయముగా శాంతిస్తున్నాయి. శమిస్తున్నాయి. ఆత్మతత్త్వమును సంతరించుకొనుచున్నాయి.

ఓ త్రిశిఖి బ్రాహ్మణోత్తమా ! ఒక ఉప్పు బొమ్మ జలములో ప్రవేశించినప్పుడు ఆ బొమ్మ యొక్క రూపు - రేఖలు, దానియందలి సైంధవ లవణరేణువులు ఏమగుచున్నాయి? తమ నామ - రూప - వస్తుతత్త్వము కోల్పోయి జలముతో ఏకమై జలమునకు వేరుగా కనబడనివి అగుచున్నాయి కదా !

అట్లాగే…,

బ్రాహ్మీస్థితి సంపాదించుకొన్నవానికి ఈ ఎదురుగా కనిపిస్తున్న జగత్తంతా కూడా పైకి అనేక మోహజాలములలో (Nets of Illusion) కూడినదిగా, అయితే వాస్తవానికి బ్రహ్మముగా - సుస్పష్టముగా తెలిసిపోతోంది. స్వకీయ భ్రమ అనే లీలా విశేషంగా - తెలియవచ్చుచున్నది.

మోహ జాలక సంఘాతో విశ్వం పశ్యతి స్వప్నవత్ |

ఒకడు రాత్రి భోజనానంతరము ప్రశాంతంగా నిదురించి కల గనటం ప్రారంభిస్తున్నాడు. ఆ కలలో అనేక సందర్భములు, సంఘటనలు, దృశ్యాలు ! కొన్ని భయం కలిగించేవి ! మరికొన్ని ఆవేదన, రోషము కలిగించేవి ! ఇంకొన్ని సంతోషము కలిగించేవి, గర్వము జనింపజేసేవి ! ఇంకాకొన్ని అర్ధరహితంగాను, ఆయుక్తంగాను, అసందర్భముగాను ఉంటాయి. తెల్లవారింది అతడు నిదురలేచాడు. తెల్లవారిన తరువాత? ఆ స్వప్నము తనదైన జీవుడు తెల్లవారిలేచి “ఆఁ! ఏముందిలే ! కించిత్ కూడా సత్యమే లేనప్పుడు, ఇక కలలో జరిగిన దాని గురించి చర్చించేదేమున్నది? ఆలోచించవలసినది ఏముంటుంది ?”… అని అనుకుని మరుక్షణం స్వప్న దృశ్యాంతర్గత విషయాలన్నీ మొదలంట్లా త్యజించి ఉంటాడు. అంతేగాని “నా కలలో కనిపించి గృహంలో కాసేపు విశ్రాంతి తీసుకుంటాను” - అని జాగ్రత్‌లో బయల్వెడలుతాడా? లేదే! కలలో పొందిన కష్టములను గుర్తు చేసుకుంటూ రోజులతరబడి దుఃఖిస్తూ కూర్చుంటాడా? లేదు కదా!

అట్లాగే …

బ్రహ్మ తత్త్వ జ్ఞానైశ్వర్యము సంపాదించుకొన్నవారు -

నిర్వాణపదమ్ ఆశ్రిత్య యోగీ కైవల్యమ్ అశ్నుతే ।

అట్టి ఆత్మ సంయమయోగులు…, నిర్వాణపదమును ఆశ్రయించినవారై కైవల్యపదమును సముపార్జించి, బ్రహ్మానందమును అనుక్షణికంగా ఆస్వాదిస్తూనే, ఈ కల్పనా జగత్తులో లీలగా, క్రీడగా సంచరిస్తున్నారయ్యా!

ఇతి
🙏 త్రిశిఖి బ్రాహ్మణ ఉపనిషత్ । 🙏
ఓం శాంతిః శాంతిః శాంతిః ॥