[[@YHRK]] [[@Spiritual]]
Yājnavalkya Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 1
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com
ఓం నమో యాజ్ఞవల్క్యాయ! జనకాయ! అత్రిమహర్షయే! సంవర్తకాయ! ఆరుణి! శ్వేతకేతవే! దూర్వాసాయ! ఋభు! నిదాఘాయ! దత్తాత్రేయాయ! శుక! వామదేవాయ! హరీతకాయ ప్రభృతయో నమో నమః||
సంన్యాసజ్ఞానసంపన్నా యాంతి యద్వైష్ణవం పదం . తద్వై పదం బ్రహ్మతత్త్వం రామచంద్రపదం భజే .. |
శ్లో॥ సన్న్యాస జ్ఞాన సంపన్నా యాంతి యత్ వైష్ణవం పదమ్
తద్వై పదమ్ బ్రహ్మతత్త్వం, రామచంద్రపదం భజేత్||
సన్యాస జ్ఞానసంపన్నులగు మహనీయులు ఏ సర్వత్రా సర్వముగా వేంచేసి యున్న 'వైష్ణవ పదమును సముపార్జించుకొని ఆనందభరితులగుచున్నారో.... అట్టి అద్వైత పదమును ప్రసాదించుటకై బ్రహ్మతత్త్వ స్వరూపమగు శ్రీరామచంద్ర పాదపద్మములను భజించుచున్నాము.
హరిః ఓం .. అథ జనకో హ వైదేహో యాజ్ఞవల్క్యముపసమేత్యోవాచ భగవన్సంన్యాసమనుబ్రూహీతి కథం సంన్యాసలక్షణం . స హోవాచ యాజ్ఞవల్క్యో బ్రహ్మచర్యం సమాప్య గృహీ భవేత్ . గృహాద్వనీ భూత్వా ప్రవ్రజేత్ . యది వేతరథా బ్రహ్మచర్యాదేవ ప్రవ్రజేద్గృహాద్వా వనాద్వా . అథ పునర్వ్రతీ వావ్రతీ వా స్నాతకో వాఽస్నాతకో వా ఉత్సన్నాగ్నిరనగ్నోకోఽవా యదహరేవ విరజేత్తదహరేవ ప్రవ్రజేత్ . |
|
ఓం 1.) అథ జనకో హ వై వైదేహెూ యాజ్ఞవల్యమ్ ఉపసమేతి యో, వాచః ‘భగవన్’! సన్న్యాసమ్ అనుబ్రూహీతి। కథం సన్న్యాస లక్షణమ్? సహెూ వాచ యాజ్ఞవల్క్యః బ్రహ్మచర్యం సమాప్య గృహీ భవేత్| గృహాత్ వనీ భూత్వా ప్రవ్రజేత్| యది వేతరధా బ్రహ్మచర్యాత్ ఏవ ప్రవ్రజేత్, గృహాద్వా, వనాద్వా! అథ పునః అవ్రతీ వా - వ్రతీ వా, స్నాతకో వా - అస్నాతకో వా, ఉత్సన్నాగ్నిః - అనగ్నికో వా, ....యత్ అహరేవ విరజ్యేత్, తత్ అహరేవ ప్రవ్రజేత్! |
ఒకానొకరోజు విదేహరాజగు జనక మహారాజు బ్రహ్మతత్త్వ జ్ఞాని అగు యాజ్ఞవల్క్య యతీంద్రులవారిని సమీపించారు. ఇట్ల సంభాషించసాగారు. జనకమహారాజు : హే భగవన్! యాజ్ఞవల్క్య మునీశ్వరా! 'సన్న్యాసము' అను దాని గురించి చెప్పండి. సన్న్యాసము యొక్క లక్షణములు ఏమేమియో దయచేసి వివరించండి! యాజ్ఞవల్క్యుడు : మహాత్మా! జనకమహారాజా! వినండి. గురు ఆశ్రమములో విద్యాభ్యాసము ముగించుకొని, ఆ బ్రహ్మచారి వ్రతస్తుడు (బ్రహ్మమును ఆచార్యులు వారి వద్ద నేర్చుకొనువాడు) - విద్యాభ్యాసం తరువాత ఇల్లు చేరుకొనుచున్నాడు. గృహమును చేరి, గృహస్థాశ్రమము స్వీకరించి, గృహస్థ ధర్మ నిరతుడై, అటు తరువాత తగిన సమయములో మోక్షార్థి అయి ఏకాంతము కొరకై వానప్రస్థ వ్రత పూర్వకంగా వనముల (అడవి) ఆశ్రయించుచున్నారు. అటునుండి సన్న్యసించుచున్నారు. లేదా, మనోస్థితిని అనుసరించి బ్రహ్మచర్యము నుండి గాని, గృహస్థాశ్రమము నుండి గాని, వానప్రస్తాశ్రమమునుండి గాని సన్న్యసించవచ్చు. మరొక మాట! ఒకడు బ్రహ్మచారి అయి ఉండవచ్చు, కాకపోవచ్చును. స్నాతకుడు (మంత్రముగ్ధముగా, బ్రహ్మచర్యము స్వీకరించువాడు) అవవచ్చు (లేక) అస్నాతకుడు కావచ్చుగాక! నిత్యాగ్నిహెూత్రవ్రతుడు కావచ్చు! (లేక) ఆవకపోవచ్చు. ఎవనికి ఏ రోజు, ఏ సమయములో ఈ జగద్విషయములన్నిటిపై సాత్విక వైరాగ్యము - విరక్తి కలుగుతుందో, ఆ వెనువెంటనే ఆ రోజే సన్న్యసించటము ఉచితము. |
తదేకే ప్రాజాపత్యామేవేష్టిం కుర్వంతి . అథ వా న కుర్యాదాగ్నేయ్యామేవ కుర్యాత్ . అగ్నిర్హి ప్రాణః . ప్రాణమేవైతయా కరోతి . త్రైధాతవీయామేవ కుర్యాత్ . ఏతయైవ త్రయో ధాతవో యదుత సత్త్వం రజస్తమ ఇతి అయం తే యోనిరృత్విజో యతో జాతో అరోచథాః . తం జానన్నగ్న ఆరోహాథానో వర్ధయా రయిమిత్యనేన మంత్రేణాగ్నిమాజిఘ్రేత్ . ఏష వా అగ్నేర్యోనిర్యః ప్రాణం గచ్ఛ స్వాం యోనిం గచ్ఛ స్వాహేత్యేవమేవైత- దాగ్రామాదగ్నిమాహృత్య పూర్వవదగ్నిమాజిఘ్రేత్ యదగ్నిం న విందేదప్సు జుహుయాదాపో వై సర్వా దేవతాః సర్వాభ్యో దేవతాభ్యో జుహోమి స్వాహేతి సాజ్యం హవిరనామయం . మోక్షమంత్రస్త్రయ్యేవం వేద తద్బ్రహ్మ తదుపాసితవ్యం . శిఖాం యజ్ఞోపవీతం ఛిత్త్వా సంన్యస్తం మయేతి త్రివారముచ్చరేత్ . ఏవమేవైతద్భగవన్నితి వై యాజ్ఞవల్క్యః .. 1.. |
|
2.) తత్ ఏకే ప్రజాపత్యామే వేష్టిం కుర్వంతి। అథవా, న కుర్యాత్ అగ్నేయా యామేవ కుర్యాత్। అగ్నిః హి ప్రాణః ప్రాణమేవ ఏతయా కరోతి। త్రై ధాతవీయామ్ ఏవ కుర్యాత్। ఏతయైవ త్రయో ధాతవో యదుత 'సత్వం రజః తమ’ ఇతి। అయం తే యోనిః ఋత్విజో యతో జాతో అరోచథాః, ‘తం జానన్’ అగ్ని ఆరోహా, ధానో వర్ధయా, ‘రయమ్’ ఇతి అనేన మంత్రేణ అగ్నిమ్ ఆజిఘ్రేత్, ఏష వా అగ్నేః యోనిః యః ప్రాణంగచ్ఛ, స్వాం యోనిం గచ్ఛ 'స్వాహా’ ఇత్యేవమ్ ఏవైతదాహ , గ్రామాగ్నిమ్ ఆహృత్య, పూర్వవత్ అగ్నిమ్ ఆజిఘ్రేత్| యత్ అగ్నిం న విందేత్, అప్సు జుహుయాత్। “ఆపో వై సర్వా దేవతాః సర్వాభ్యో దేవతాభ్యో జుహెూమి “స్వాహా!”- ఇతి సాజ్యగ్ం హవిః అనామయం మోక్షమంత్రః త్రైయ్యేవం వేద, తత్ బ్రహ్మ తత్ ఉపాసితవ్యమ్| శిఖాం యజ్ఞోపవీతం ఛిత్వా “సన్న్యస్తం మయా” ఇతి త్రివారమ్ ఉచ్ఛరేత్| ఏవమ్ ఏవైతత్ భగవన్ ఇతి వై యాజ్ఞవల్మ్యః | |
అట్టి సన్న్యాసము స్వీకరించు సందర్భములలో కొందరు "ప్రజాపత్యేష్టి" (యాగము) చేస్తూ ఉంటారు. (లేదా) మరికొందరు చేయపోకనూవచ్చు. అయితే, అగ్నేయ్యాష్టిని మాత్రము చేసి అగ్నిసాక్షిగా సన్న్యసిస్తున్నారు. ఈ దేహములో ప్రాణమే ‘అగ్ని', అందుచేత ప్రాణమే అగ్నిగా భావించి అగ్నేయాష్ఠి నిర్వర్తిస్తారు. అట్టి ప్రాణాగ్నిలో 'త్రైధాతవీయము' చేయుచున్నారు. అనగా (సత్య-రజో-తమో) త్రి గుణములను ప్రాణాగ్నికి సమర్పిస్తూ... హెూమము చేయుచున్నారు. ఆ త్రిగుణములకు మూల స్థానము - ఏదో అదే యోని (యాగశాల). గుణ సంబంధమైనదంతా అరోచన (రుచించకపోవటమే) ఋత్విజులు (వేద మంత్ర ద్రష్టలై యజ్ఞము చేయించువారు) - పలుకు మంత్రార్థములు. “తమ్ జానన్ (బ్రహ్మమును ఎరుగుట కొరకు)" అను మంత్రముతో అగ్నిని ఆహ్వానించి 'ధారణ' అనే మార్గముగా తేజస్సును (అగ్నిని) ప్రజ్వలింపజేస్తున్నారు. బ్రహ్మమును ఎరిగే మహామంత్రములతో అగ్ని ప్రూణము చేయుచున్నారు. "ఏషావా అగ్నేః యోనిః యః ప్రాణం గచ్ఛ, స్వాం యోనిం గచ్ఛ స్వాహా” (నా ప్రాణములను, అహంకారమును అగ్ని యోనికి సమర్పిస్తున్నాను) ... అను మంత్రమును చదువుతూ జ్ఞానాగ్నిలో ప్రాణములను-భౌతిక రూపమును ఆహుతి చేస్తున్నాడు. గ్రామాగ్నిని తెచ్చి పై విధంగా అగ్నికి ఆఘ్రాణము చేస్తున్నారు. కొందరు అగ్నిని ఉంచనివారై (అగ్నితో కాకుండా) నీటియందే నీటితో హెూమము చేయుచున్నారు. ఈ జలమే సర్వ దేవతా స్వరూపము! అందుచేత జపముతో సర్వ దేవతలకు జలమును హెూమము చేయుచున్నాను. దేవతలు స్వీకరించెదరు గాక! అను అర్థము గల మంత్రమును గానం చేస్తున్నారు. ఆజ్యముతో కూడిన హవిస్సును హెూమము చేయవలెను. “బ్రహ్మమునే ఉపాసిస్తున్నాను, '3'టిని (త్రిగుణములను, త్రిదేహములను త్రికాలములను) ఎరిగి మోక్ష మంత్రముతో మోక్షోపాసన నిర్వర్తిస్తున్నాను- అని పలుకుచూ పరబ్రహ్మమును (నిరాకార - నిర్గుణతత్వమును) ఉపాసించాలి. శిఖ (పిలక)ను, యజ్ఞోపవీతమును త్రెంచి "నేనిప్పుడు సన్యాసిని అగుచున్నాను.... అని 3 సార్లు ఉచ్చరించి - సన్న్యాసాశ్రమమును స్వీకరించుచున్నారు. ఇదియే సన్న్యాస విధిగా చెప్పబడినది - అని భగవంతుడగు యాజ్ఞవల్క్యుడు చెప్పారు. “ఏవమ్ ఏవ ఏతత్! ఇది ఆ తత్ వస్తువును జేరు త్రోవ అని పలికారు! |
అథ హైనమత్రిః పప్రచ్ఛ యాజ్ఞవల్క్యం యజ్ఞోపవీతీ కథం బ్రాహ్మణ ఇతి . |
|
అథ హి ఏనం అత్రిః పప్రచ్ఛ యాజ్ఞవల్క్యమ్ : అయజ్ఞోపవీతీ కథమ్ బ్రాహ్మణ - ఇతి? |
అత్రి మహాముని : ఓ యాజ్ఞవల్క్య మహాశయా! బ్రహ్మముకొరకే బ్రాహ్మణత్వము కదా! యజ్ఞోపవీతమును వదలితే బ్రాహ్మణుడు ఎట్లా అవుతాడు. |
స హోవాచ యాజ్ఞవల్క్య ఇదం ప్రణవమేవాస్య తద్యజ్ఞోపవీతం య ఆత్మా . ప్రాశ్యాచమ్యాయం విధిరథ వా పరివ్రాడ్వివర్ణవాసా ముండోఽపరిగ్రహః శుచిరద్రోహీ భైక్షమాణో బ్రహ్మ భూయాయ భవతి . ఏష పంథాః పరివ్రాజకానాం వీరాధ్వని వాఽనాశకే వాపాం ప్రవేశే వాగ్నిప్రవేశే వా మహాప్రస్థానే వా . ఏష పంథా బ్రహ్మణా హానువిత్తస్తేనేతి స సంన్యాసీ బ్రహ్మవిదితి . ఏవమేవైష భగవన్నితి వై యాజ్ఞవల్క్య . తత్ర పరమహంసా నామ సంవర్తకారుణి- శ్వేతకేతుదూర్వాసఋభునిదాఘదత్తాత్రేయశుకవామదేవ- హారీతకప్రభృతయోఽవ్యక్తలింగాఽవ్యక్తాచారా అనున్మత్తా ఉన్మత్తవదాచరంతః పరస్త్రీపురపరాఙ్ముఖాస్త్రిదండం కమండలుం భుక్తపాత్రం జలపవిత్రం శిఖాం యజ్ఞోపవీతం బహిరంతశ్చేత్యేతత్సర్వం భూః స్వాహేత్యప్సు పరిత్యజ్యాత్మాన- మన్విచ్ఛేత్ . యథా జాతరూపధరా నిర్ద్వంద్వా నిష్పరిగ్రహా- స్తత్త్వబ్రహ్మమార్గే సమ్యక్సంపన్నాః శుద్ధమానసాః ప్రాణసంధారణార్థం యథోక్తకాలే విముక్తో భైక్షమాచర- న్నుదరపాత్రేణ లాభాలాభౌ సమౌ భూత్వా కరపాత్రేణ వా కమండలూదకపో భైక్షమాచరన్ |
|
సహెూవాచ యాజ్ఞవల్క్యః ఇదం ప్రణవమేన అస్య తత్ యజ్ఞోపవీతం! య ఆత్మా ప్రాశ్య ఆచమ్యాయం విధిః అథవా,.... పరివ్రాట్ వివర్ణవాసో, ముండో, అపరిగ్రహః, శుచిః, అద్రోహీ, భైక్షమాణో, బ్రహ్మభూయాయ భవతి। ఏష పంథా పరివ్రాజకానాం। వీరాధ్వానేవ అనాఽశకేవా అపాం ప్రవేశే వా, అగ్నిః ప్రవేశే వా, మహాప్రస్థానే వా ఏష పంథా బ్రహ్మణా హా అనువిత్త, తేనేతి , స సన్న్యాసీ బ్రహ్మవిత్| ఇత్యేవమేవ ఏష, భగవన్ ఇతి వై యాజ్ఞవల్క్యః తత్ర పరమహంసా నామ సంవర్తక, ఆరుణి, శ్వేతకేతు, దూర్వాస, ఋభు నిదాఘ, దత్తాత్రేయ, శుక, వామదేవ, హారీతక ప్రభృతయో...., అవ్యక్తలింగా, అవ్యక్త ఆచారా, అనున్మత్తా - ఉన్మత్తవత్ ఆచరంతః! పరస్త్రీ - పుర పరాఙ్ముఖాః త్రిదండం, కమండలుం, భుక్త పాత్రం, జలపవిత్రగ్ం, శిఖాం, యజ్ఞోపవీతం, బహిరంతశ్చ ఏత్యే తత్సర్వం ‘భూ స్వాహా’ ఏతి, అప్సు పరిత్యజ్య ఆత్మానమ్ అన్విచ్ఛేత్! యథా ‘జాత’ రూప ధరా, నిర్ద్వంద్వా, నిష్పరిగ్రహాః, ‘తత్త్వ బ్రహ్మ’ మార్గే..., సమ్యక్ సంపన్నా..., శుద్ధమానసాః..., ప్రాణ సంధారణార్థమ్ యథోక్త కాలే, విముక్తో ‘భైక్షమ్’ ఆచరన్, ఉదరపాత్రేణ లాభ-అలాభౌ సమౌ భూత్వా, కరపాత్రేణ వా, కమండలు - ఉదకపో, ‘భైక్షమ్’ ఆచరన్|| |
యాజ్ఞవల్క్య మహనీయుడు : బ్రహ్మజ్ఞా! అత్రిమహర్షీ! ఆత్మతత్వ సూచకమగు ప్రణవమే ఆ సన్న్యాసాశ్రమ ప్రవేశికి యజ్ఞోపవీతము. ఆత్మనే ప్రాశనము (స్వీకరించు జలము)గా భావించి ఆచమనము చేస్తూ ఉంటారు. పరివ్రాజక మార్గము (సన్యాస మార్గము) - ఆ సన్న్యాసి (పరివ్రాట్) వివర్ణములయిన (రంగు చెడిన) వస్త్రము ధరించి, (ముండో) బోడి గుండు గలవాడై; అన్నీ వదలి - అపరిగ్రహుడై, శుచి - అద్రోహి అయి; భిక్షాటనము చేస్తూ-బ్రహ్మమును ఉపాసించువాడు బ్రహ్మమును పొందుచున్నాడు. ఇది పరివ్రాజకుల మార్గము. మహా ప్రస్థాన మార్గము - అంధకార ప్రదేశ ప్రవేశముచేసి, ఆహారము మానివేసి చివరికి జలములోగాని, అగ్నిలోగాని ప్రవేశించటము. ఆ మార్గముగా పరబ్రహ్మమును కొందరు పొందుచున్నారు. ఇట్టి మార్గముగా సన్న్యాసి బ్రహ్మమును ఎరిగి బ్రహ్మవేత్తగా అగుచున్నాడు. ఇది మహా ప్రస్థాన మార్గము. (ఈవిధంగా భగవంతుడగు యాజ్ఞవల్క్యుడు పలికారు) ఇక పరమహంసల గురించి - ఇట్లా యాజ్ఞవల్క్యులవారు పలుకసాగారు. కొందరు మహనీయులగు పరమహంసలు : సంవర్తకుడు, ఆరుణి, శ్వేతకేతు, దూర్వాసుడు, ఋబు,నిదాఘ, దత్తాత్రేయ, శుక, వామదేవ, హారీతక మొదలైనవారు. పరమహంసలు అవ్యక్తమగు రూప - ఆచారములు కలిగినవారై ఉంటారు. అవి బాహ్యమునకు వ్యక్తము అవవు. బాహ్యవేష ధారణబట్టి ఆశ్రమములను బట్టి పరమహంసను గుర్తించలేము. (జన్మ-మరణ - దృశ్య - దేహ - కర్మల రహస్యము, నిత్య - అనిత్యము ఎరుగుటచే) వారు ఏ మాత్రము ఉన్మత్తులు కారు. కానీ, బయటకు ఉన్మత్తుని వలె (పిచ్చివాని వలె) భౌతిక-లోకపు పరిమితులగు - లోక జనులకు కనిపిస్తూ ఉంటారు. పరస్త్రీ-పురనివాసము మొదలైనవాటిపట్ల పరాఙ్ముఖులై (ధ్యాసయే లేనివారై) ఉంటారు. త్రిదండము, కమండలువు, భిక్షాపాత్ర జలపవిత్రము, శిఖ, యజ్ఞోపవీతము మొదలైన సన్న్యాస - బ్రహ్మచారి ఆశ్రమవాసులు బాహ్య-అభ్యంతర లక్షణములన్నీ 'ఓం భూస్వాహా' అంటూ నీటియందు పరిత్యజించి, ఒక్క "ఆత్మతత్త్వము” కొరకు మాత్రమే అన్వేషణ చేస్తున్నవారై, ఆశ్రయించుచున్నవారై ఉంటారు. అప్పుడే పుట్టిన శిశువు వలె మనో రూపము ధరించినవారై, దేనితో సంబంధించనివారై, ద్వంద్వమునకు అతీతులై, ఏదీ పరిగ్రహించనివారై ఉంటారు. “త్వమ్ త్వత్ బ్రహ్మమేవ - నీవు, ఈ జగత్తు బ్రహ్మమే" - అను అవగాహనను సుస్థిరపరచుకొను మార్గములో, మహా వాక్యార్ధ సుసంపన్నత కలవారై,శుద్ధ (కేవల) మానస సమన్వితులై ఉంటారు. అట్టి పరమహంసలలో కొందరు ప్రాణములను నిలుపుకొనుటకు మాత్రమే - ఆయా ఉచిత సమయములలో సమాధిని వదిలి ఈవలకు వచ్చి భిక్షాటనము చేస్తూ ఉంటారు. భిక్షాటనతో లభించిన దానితో పొట్ట నింపుతూ, లాభ-అలాభములను సమదృష్టితో చూస్తూ, చేతులనే భిక్షక పాత్రగా కలిగి ఉండి, అన్నము పెట్టించుకొనుచు, కమండలములోని ఉదకము త్రాగుచూ ఉంటారు. |
ఉదరమాత్రసంగ్రహః పాత్రాంతరశూన్యో జలస్థలకమండలురబాధకరహఃస్థల- నికేతనో లాభాలాభౌ సమౌ భూత్వా శూన్యాగారదేవగృహ- తృణకూటవల్మీకవృక్షమూలకులాలశాలాగ్నిహోత్రశాలానదీ- పులునగిరికుహరకోటరకందరనిర్ఝరస్థండిలేష్వనికేతనివాస్య- ప్రయత్నఃశుభాశుభకర్మనిర్మూలనపరః సంన్యాసేన దేహత్యాగం కరోతి |
|
3.) ఉదరమాత్ర సంగ్రహః పాత్రాంతర శూన్యో జల - స్థల కమండలుః, అబాధక రహస్య స్థల నికేతనో, లాభ - అలాభౌ సమౌ భూత్వా, శూన్యాగార, దేవగృహ, తృణ, కూట, వల్మీక, వృక్షమూల, కులాలశాలా అగ్నిహెూత్రశాలా, నదీ పులినగిరి, కుహర, కోటర కందర నిర్ఝర స్థండిలేషు అనికేత నివాస్య, ప్రయత్నః శుభాశుభ కర్మ నిర్మూలన పరః సన్న్యాసేన దేహ త్యాగం కరోతి। |
ఇంకా కూడా, ఆ సమయమునకు, ఆ పూటకు కావలసినంత మాత్రమే స్వీకరిస్తూ ఉంటారు. రెండవపాత్ర (దాచుకొనుటకై) ఏదీ కలిగి ఉండరు. జలము ఉన్నచోటే కమండలువు బయటకు తీస్తారు. ఇతరచోట్ల బయట గుర్తుగా చూపించుకోరు. ఇతరులకు ఏ బాధ కలిగించనట్టి రహస్య స్థలము నివాస ప్రదేశముగా కలిగి ఉంటారు. లాభ - అలాభములను సర్వదా సమదృష్టితో చూస్తూ ఉంటారు. పాడుపడిన ఇళ్ళు, దేవాలయములు, రెల్లుగడ్డి గుబ్బు ప్రదేశములు, పుట్టలు ఉన్న చోట్లు, వృక్షముల మొదలు ప్రదేశములు, కుమ్మరి (కుండలు తయారగు) శాలలు, అగ్నిహెూత్రశాలలు, నదీ తీర ఖాళీ ప్రదేశములు, కుహరములు (కొండ గుహలు), కోటరములు (చెట్టు తొర్రలు), సెలయేర్లు గల ప్రదేశములు, కందరములు (గుహలు, కనుమలు), నిర్ఝరములు (బండరాళ్ళ ప్రదేశము) స్థండిలము (మట్టిగడ్డల దిబ్బలు)... ఇవన్నీ ఆతడు సంచారి అయి నివసించు ప్రదేశములు. ఆయనకు ‘ఇది ఇల్లు' అనునది ఏదీ ఉండదు. శాశ్వత గృహ నివాస ప్రయత్నము చేయరు. శుభ-అశుభ కర్మల పరిధిని దాటి వేసినవాడై, సన్యాసి అయి సర్వము త్యజించినవాడై దేహత్యాగము చేయువాడగుచున్నారు. దేహ ధర్మములను అధిగమించివేసి, కేవలసాక్షిత్వము సంచరించుకొని ఉంటారు. |
స పరమహంసో నామేతి . ఆశాంబరో న నమస్కారో న దారపుత్రాభిలాషీ లక్ష్యాలక్ష్యనిర్వర్తకః పరివ్రాట్ పరమేశ్వరో భవతి . అత్రైతే శ్లోకా భవంతి . యో భవేత్పూర్వసంన్యాసీ తుల్యో వై ధర్మతో యది . తస్మై ప్రణామః కర్తవ్యో నేతరాయ కదాచన .. 1.. ప్రమాదినో బహిశ్చిత్తాః పిశునాః కలహోత్సుకాః . సంన్యాసినోఽపి దృశ్యంతే దేవసందూషితాశయాః .. 2.. |
|
స పరమహంసో సామేతి ఆశామ్బరో న నమస్కారో, న దారాపుత్రా అభిలాషీ, లక్ష్య-అలక్ష్య నిర్వర్తకః పరివ్రాట్ పరమేశ్వరో భవతి। అత్ర ఏతే శ్లోకా భవంతి॥ యో భవేత్ పూర్వసన్న్యాసీ తుల్యో వై ధర్మతో యది, తస్మై ప్రణామః కర్తవ్యో! నేతరాయ కదాచన| ప్రమాదినో బహిః చిత్తాః పిశునాః, కలహెూత్సుకాః॥ సన్న్యాసినోఽపి దృశ్యంతే ‘వేదసందూషిత-ఆశయాః' | |
ఆ పరమహంస ఆశాంబరుడు (వస్త్రములు త్యజించిన దిగంబరుడు). - నమస్కారములు లేనివారు, - భార్య పుత్రులపై అభిలాష లేనివారు, - పరివ్రాట్ - ప్రాపంచక లక్ష్య అలక్ష్యములేవీ లేనివారు అయి ఉంటారు. “అట్టివాడు పరమేశ్వరుడే (ఇహమును దాటివేసి పరమునందు స్వరూపతః ఏర్పడియున్న వాడు)” - అని విజ్ఞులు ఆయనగురించి గానము చేయుచున్నారు. ఒక సన్న్యాసి తన కన్నా ముందే సన్యసించినవానికి, తనతో సమాన ధర్మము కలవానికి మాత్రమే నమస్కరించుచుచూ, ప్రణామములు సమర్పించాలి. తదితరులకు నమస్కరించటము అను ధర్మము కలిగి ఉండరు. కొందరు బాహ్యమున సన్యాస వేషధారణ చేస్తూ కూడా..., దృశ్య ధ్యాసలచే (తదితర జీవులకు బాధ కలిగించువారు) ప్రమాదులు, బాహ్య చిత్తము (లౌకిక విషయములపట్ల ఇష్టము కలవారు), లోభగుణము కలవారు, కలహములయందు ఉత్సాహము చూపువారు.... ఇటువంటి సన్న్యాసులు కూడా ఉంటారు. వారిని “వేదసందూషిత ఆశయ సన్న్యాసులు” ….. అని పిలుస్తారు. |
నామాదిభ్యః పరే భూమ్ని స్వారాజ్యే చేత్స్థితోఽద్వథే . ప్రణమేత్కం తదాత్మజ్ఞో న కార్యం కర్మణా తదా .. 3.. ఈశ్వరో జీవకలయా ప్రవిష్టో భగవానితి . ప్రణమేద్దండవద్భూమావాశ్వచండాలగోఖరం .. 4.. మాంసపాంచాలికాయాస్తు యంత్రలోకేఽఙ్గపంజరే . స్నాయ్వస్థిగ్రంథిశాలిన్యః స్త్రియః కిమివ శోభనం .. 5.. త్వఙ్మాంసరక్తబాష్పాంబు పృథక్కృత్వా విలోచనే . సమాలోకయ రమ్యం చేత్కిం ముధా పరిముహ్యసి .. 6.. మేరుశృంగతటోల్లాసి గంగాజలస్యోపమా . దృష్టా యస్మిన్మునే ముక్తాహారస్యోల్లసశాలితా .. 7.. శ్మనానేషు దిగంతేషు స ఏవ లలనాస్తనః . శ్వభిరాస్వాద్యతే కాలే లఘుపిండ ఇవాంధసః .. 8.. కేశకజ్జలధారిణ్యో దుఃస్పర్శా లోచనప్రియాః . దుష్కృతాగ్నిశిఖా నార్యో దహంతి తృణవన్నరం .. 9.. |
|
నామాదిభ్యః పరే భూమ్ని స్వారాజ్యే చేత్ స్థితో అద్వయే, ప్రణమేత్ కం? తత్ ఆత్మజ్ఞో న కార్యం కర్మణా తదా | "ఈశ్వరో జీవకలయా ప్రవిష్ణో భగవాన్” ఇతి.... ప్రణమేత్ దండవత్ భూమా వా అశ్వ చండాల గోఖరమ్ మాగ్ంస పాంచాలికా యాస్తు యంత్రలోకే అంగ పంజరే స్నాయుః అస్థి గ్రంథి శాలిన్య స్త్రీయః కిమవ శోభనమ్? త్వక్ మాంస రక్త భాష్పాంబు పృథక్ కృత్వా విలోచనే సమాలోకయ రమ్యంచేత్ కిం ముధా పరిముహ్యసి? మేరు శృంగతటోల్లాసి, గంగాజల రయోపమా, దృష్టా యస్మిన్ మునే ముక్తాహారస్య ఉల్లాసి శాలితా, శ్మశానేషు దిగంతేషు స ఏవ లలనాస్తనః, శ్వభిః ఆస్వాద్యతే కాలే లఘు పిండ ఇవాంధనః॥ కేశ కజ్జల ధారిణ్యో, దుస్పర్శా, లోచప్రియాః, దుష్కృత అగ్నిశిఖా నార్యో దహంతి తృణవత్ నరమ్| |
ఓ జనకమహారాజా! నామరూపాదులకు ఆవల, (పరమై) అద్వయస్వారాజ్యమునందు సంస్థితుడై ఉన్నవాడు ఎవరికి ఏ ఉద్దేశ్యముతో నమస్కరించాలి? అట్టి ఆత్మ సామ్రాజ్యమునందు విహరించువానికి, ఆత్మమేవాహమ్ జ్ఞానికి "ఇది చేయాలి! ఇట్లాగే చేయాలి!'.... అనునదేమీ పరిధులుగా చెప్పలేము. ఆతనికిక కర్మలతో పని ఏముంటుంది? ‘అహమేవ ఇదమ్ సర్వమ్' అను అనన్య దృష్టి గల వానికి నియమాలు ఇవి అని అనలేం! ఓ విదేహ రాజా! యోగేశ్వరా! “ఆ సర్వేశ్వరుడగు భగవానుడే తన జీవకళతో సర్వ జీవులలో ప్రవేశించి సర్వము ప్రకాశమానము చేయుచున్నారు.... అని గమనిస్తూ ఉన్న బుద్ధితో ఒక గుర్రము - ఛండాలుడు, గోవు, గాడిదకు కూడా సాష్టాంగదండ ప్రణామములు సమర్పిస్తూ ఉంటున్న భావనతో దర్శించాలి. (ఇక ఇతరులకు చేయాలని వేరే చెప్పాలా?) నాయనా! జనకా! ఎందుకో ఈ జీవుడు ఆత్మ దృష్టిని ఏమరచి మాంస దృష్టితో దేహాలను చూస్తూ - మోహము చెందుచున్నాడు! ఈ దేహములు లోపల మాంసము గల బొమ్మ యంత్రములు. క్రొవ్వు - బొమికలు - గ్రంధులతో కూడిన ఈ స్త్రీపురుష దేహములలో గల ప్రత్యేకత ఏమున్నదయ్యా? ఓయీ జీవుడా? ఈ స్త్రీ పురుష దేహములలో చర్మము - మాంసము - రక్తము - కన్నీరు - బొమికలు ఇవన్నీ విడదీసి చూస్తే ఇందులో రమ్యమైన వస్తువు ఏమున్నది? ఎందుకు వృధాగా మోహము చెందుచున్నావు? "మేరు శిఖరముమీద నుండి క్రిందపడుచున్న సెలయేటి మెలికల వేగము వలె జడ, గంగా జలము వంటి అధరామృతము - ఇటువంటి కవుల వర్ణనలతో ముక్తాహారములు ధరించిన స్త్రీ పురుష దేహములను చూచుకొని ఒకరికొకరు రస-ఉల్లాసము పొందుచున్నారే గాని.... ఆ ముక్తాహారము-రంగు రంగు వస్త్రముల లోపల గల దేహము రక్తము- చీము-మాంసము-భౌమికల అమరికయే గదా!" - అని గమనించకపోతే ఎట్లా? ఓయీ! అమాయక జీవుడా! నీవు ఏఏ స్త్రీ స్థనములు - పురుష భుజస్కంధములు స్పృశించి ఆనందించాలని వేడుక పడుచున్నావో అవన్నీ కూడా కాలక్రమేణా ఒకానొక రోజు కుక్కులచేత ఆహార సంపదగా భావించబడుచు, అన్నపు ముద్దలవలె తినబడుచున్నాయి కదా!” అనునది గుర్తు పెట్టుకోబడు గాక! నల్లటి కురులు ధరించినట్టి, దుష్టమగు స్పర్శ - ఆలోచనలు గల ప్రియురాళ్ళు (అట్లాగే ప్రియులు) భౌతిక దేహ ధ్యాసలను మరింత ఉద్ధృతము చేస్తున్నారు. చివరికి అట్టి భౌతికాకర్షణలు ఈ జీవులను గడ్డి పోచలను కాలుస్తున్నట్లుగా కాలుస్తున్నాయి. |
జ్వలనా అతిదూరేఽపి సరసా అపి నీరసాః . స్త్రియో హి నరకాగ్నీనామింధనం చారు దారుణం .. 10.. కామనామ్నా కిరాతేన వికీర్ణా ముగ్ధచేతసః . నార్యో నరవిహంగానామంగబంధనవాగురాః .. 11.. జన్మపల్వలమత్స్యానాం చిత్తకర్దమచారిణాం . పుంసాం దుర్వాసనారజ్జుర్నారీబడిశపిండికా .. 12.. సర్వేషాం దోషరత్నానాం సుసముద్గికయానయా . దుఃఖశృంఖలయా నిత్యమలమస్తు మమ స్త్రియా .. 13.. |
|
జ్వలితా అతి దూరేఽపి। సరసా అపి నీరసాః | స్త్రియో హి నరకాగ్నీనామ్ ఇంధనం చారు దారుణమ్|| కామనామ్నా కిరాతేన వికీర్ణా ముగ్ధ చేతసః నార్యో నరవిహంగానామ్ అంగబంధన వా గురాః జన్మ పల్వల మత్స్యానాం చిత్త కర్దమచారిణామ్, పుంసాం దుర్వాసనాం రజ్జుః నాడీ బడిశ పిండికా| సర్వేషాం దోష రత్నానాగ్ం సుసముద్గికయా అనయా దుఃఖ శృంఖలయా నిత్యమ్। అలమ్ అస్తు మమ స్త్రీయా। |
ఈ భౌతిక దేహ ఆకర్షణలు (మాంస దేహ ధ్యాసలు) ఎటువంటివంటే.... తాను ప్రియముగా భావిస్తున్న మాంసమయ భౌతిక దేహము ఎంతో దూరములో ఉండి కూడా, ఇక్కడ ఆ జీవుని మనస్సులో మంట రేపగలదు. పైకి ఎంతో సరసరూపముగా కనిపిస్తూనే... చివరకు నీరసమును మిగుల్చుచున్నాయి. స్త్రీలకు (అట్లాగే స్త్రీలకు పురుష దేహాకర్షణలకు సంబంధించిన) భౌతిక దేహధ్యాసలు నరకాగ్నులకు ఇంధనము అయి దారుణములుగా పరిణమించటము ఎదురుగా జరుగుచూనే ఉన్నది. కాముడు అనే కిరాతకుడు ఈ 'జీవులు' అను పక్షులను నిష్క్రియులుగాను, ముగ్ధము అగు బుద్ధి కలవారు గాను - చేసి, వలలో చిక్కించుకొనటానికి, ఉపయోగించే వలలే ఈ స్త్రీ పురుష భౌతిక రూపాలు. “జన్మలు” అనే బుట్టలోనికి వేయటానికై 'జీవులు' అనే చేపల దుర్వాసనతో కూడిన గాలమువంటి వారు ఈ స్త్రీలు. (అట్లాగే స్త్రీల విషయంలో పురుషులు కూడా).అన్ని దోషరత్నములకు 'పేటిక' వంటిది ఈ శృంగార సంబంధమైన మోహాకర్షణ. నిత్యము దుఃఖ సంకెళ్ళు వేసి ఉంచునట్టిది. అయ్యా! స్త్రీలతో దేహాకర్షణా సంబంధం (అట్లాగే స్త్రీలకు పురుషులతో భౌతికదేహ ఆకర్షణా బంధము)... ఇక చాలు! |
యస్య స్త్రీ తస్య భోగేచ్ఛా నిస్త్రీకస్య క్వ భోగభూః . స్త్రియం త్యక్త్వా జగత్త్యక్తం జగత్త్యక్త్వా సుఖీ భవేత్ .. 14.. |
|
యస్య స్త్రీ, తస్య భోగేచ్చా నిస్త్రీ కస్య క్వ బోగభూః? స్త్రీయం త్యక్త్వా జగత్ త్యక్తం, జగత్ త్యక్త్వా సుఖీ భవేత్| |
ఎక్కడ స్త్రీ (రక్త-మాంసదృష్టి) ఉంటే అక్కడే కదా, భోగేచ్ఛ. ఎక్కడ స్త్రీ సంబంధము ఉండదో, అక్కడ భోగేచ్ఛకు ఏమీ పని ఉండదు. స్త్రీని (భౌతికమైన శృంగార భావనను) త్యజిస్తే జగత్తును జయించినట్లే? జగత్తును త్యజించిన జీవుడు సుఖవంతుడు కాగలడు. |
అలభ్యమానస్తనయః పితరౌ క్లేశయేచ్చిరం . లబ్ధో హి గర్భపాతేన ప్రసవేన చ బాధతే .. 15.. జాతస్య గ్రహరోగాది కుమారస్య చ ధూర్తతా . ఉపనీతేఽప్యవిద్యత్వమనుద్వాహశ్చ పండితే .. 16.. యూనశ్చ పరదారాది దారిద్ర్యం చ కుటుంబినః . పుత్రదుఃఖస్య నాస్త్యంతో ధనీ చేన్మ్రియతే తదా .. 17.. |
|
4.) అలభ్యమానః తనయః పితం క్లేశయేత్ చిరమ్| లబ్ధో హి గర్భపాతేన ప్రసవేన చ బాధతే॥ జాతస్య గ్రహరోగాది కుమారస్య చ ధూర్తతా। ఉపవీతేఽపి అవిద్యత్వమ్ అనుద్వాహశ్చ పండితే యూనశ్చ పరదారాది। దారిద్ర్యం చ కుటుంబినః| పుత్ర దుఃఖస్య నాస్తి అంతో ధనీచేత్ మ్రియతే తదా। |
కొడుకులు చిరకాలముగా కలుగకపోతే, అదీ ఆ తండ్రికి ఎంతో బాధ (క్లేశము) కలిగించే విషయమే అవుతుంది. సంతానము కలుగుచున్నప్పుడో? గర్భపాతముతోను, ప్రసవముతోను... శారీరక బాధ అనివార్యము. పుట్టిన కుమారుడు (సంతానము) గ్రహ దోష- రోగాదులు పొందుతూ ఉంటే అదంతా మనస్సుకు ఎంతో ఆదుర్ధా! మనస్సును కలచివేస్తూ ఉంటుంది. ఆ పిల్లవాడు అల్లరి చిల్లరగా ధూర్తుడై తిరుగుతూ ఉంటే ఇంక బాధ చెప్పలేనట్టిది. ఎప్పుడూ భయమే! ఇంకెక్కడి తత్త్వవిచారణ? ఉపనయనము చేసినా కూడా, చదువు అబ్బకపోతే అది మరొక బాధ. ఆతడు పండితుడైనప్పటికీ పెళ్ళి అయ్యే వరకు మరొక బాధ, పెళ్ళి అవుతుందో, అవదో... అని! పడుచుతనములో పరస్త్రీ వ్యామోహము! కుటుంబము పెరుగుచున్నకొలదీ... దారిద్ర్యము వంటివి బాధిస్తూ ఉంటాయి. పుత్రుని వలన కలిగే దుఃఖములకు అంతు పొంతూ ఉండదు. ఒకవేళ ఒకడు ధనికుడైతే ఏ బాధా ఉండదా? కొడుకే ధనం గురించి చంపుకు తింటూ ఉంటాడు. ఆపై వార్ధక్య బాధ. మరణ బాధ ఉండనే ఉంటాయి కదా! |
న పాణిపాదచపలో న నేత్రచపలో యతిః . న చ వాక్చపలశ్చైవ బ్రహ్మభూతో జితేంద్రియః .. 18.. రిపౌ బద్ధే స్వదేహే చ సమైకాత్మ్యం ప్రపశ్యతః . వివేకినః కుతః కోపః స్వదేహావయవేష్వివ .. 19.. అపకారిణి కోపశ్చేత్కోపే కోపః కథం న తే . ధర్మార్థకామమోక్షాణాం ప్రసహ్య పరిపంథిని .. 20.. నమోఽస్తు మమ కోపాయ స్వాశ్రయజ్వాలినే భృశం . కోపస్య మమ వైరాగ్యదాయినే దోషబోధినే .. 21.. |
|
న పాణి - పాద చపలో, న నేత్ర చపలో యతిః। న చ వాక్ చపలశ్చైవ బ్రహ్మభూతో జితేంద్రియః| రిపౌ బుద్ధే స్వదేహే చ, సమైకాత్మ్యం ప్రపశ్యతః, వివేకినః కుతః కోపః స్వ దేహ అవయవేషి ఇవ అపకారిణి కోపశ్చేత్ కోప కోపః కథం న తే? ధర్మార్థ కామ మోక్షాణాం ప్రసహ్య పరిపంధిని? నమోఽస్తు మమ కోపాయ స్వ - ఆశ్రయ జ్వాలినే భృశమ్| కోపస్య మమ వైరాగ్యదాయినే, దోషబోధినే | |
యతి అయినవాడు (పరమాత్మను చేరు ప్రయత్నము చేయువాడు) చేతులూకాళ్ళు చపలముగా (ఏదో చేయాలి - ఎటో వెళ్ళాలి - అనే చపలత్వము) కలిగి ఉండరాదు. వాక్ చపలము (నోటికొచ్చినట్లు మాట్లాడటము) కూడదు. ఆతడు ఇంద్రియములను జయించి బ్రహ్మభూతుడు కావాలి. వివేకి అయినవాడు ఈ కనడేదంతా ఏకాత్మ స్వరూపముగాను, తన ఆత్మ దేహముగాను దర్శించుచున్నాడు. స్వదేహముపై ఎవరికైనా కోపముంటుందా? ఉండదు కదా! ఈ విశ్వమంతా తన దేహముగా చూచుకొంటున్న విశ్వదేహుడగు బ్రహ్మ భూతునకు (వివేకికి) ఎవ్వరిమీదైనా కోపము ఎట్లా ఉంటుంది? ఉండదు! ఓ జనకా! ఎవ్వరికైనా తనకు అపకారము ఎవ్వరు చేస్తున్నారో, వారి మీద కోపము వస్తుంది కదా? మరి 'కోపము' అనే గుణము శత్రువు అయి ఈ జీవుని ధర్మ-అర్థ-కామ-మోక్షములు భ్రష్టు పట్టిస్తున్నాయే! ఈతనికి తన కోపము మీద కోపము ఎందుకు రావటం లేదో మరి? నాకు ఇది ఆశ్చర్యమే! అవును! నా ‘కోపము’ పై నాకు వస్తున్న 'కోపము’నకు నమస్కరిస్తున్నాను! నేను ఆశ్రయిస్తూ నా ఆశ్రయమునే తగలబెడుతున్న నా “కోపము” పై నాకు వస్తున్న “కోపము” నా దోషములను నాకు బోధించి, నన్ను వైరాగ్యవంతునిగా చేయుచున్నది కదా! |
యత్ర సుప్తా జనా నిత్యం ప్రబుద్ధస్తత్ర సంయమీ . ప్రబుద్ధా యత్ర తే విద్వాన్సుషుప్తిం యాతి యోగిరాట్ .. 22.. |
|
యత్ర సుప్తా జనా నిత్యం ప్రబుద్ధః తత్ర సంయమీ। ప్రబుద్ధా యత్ర తే, విద్వాన్ సుషుప్తిం యాతి యోగిరాట్ | |
ఎక్కడ సామాన్య జనులంతా నిదురిస్తున్నారో, (అది గొప్ప విషయముగా చూడటం లేదో, దృశ్యమే సర్వస్వముగా చూస్తున్నారో) - అక్కడ (అట్టి ఆత్మ విషయమునందు) సంయమియగు యోగి ప్రబుద్ధుడై ఉంటున్నాడు. ఎక్కడ (ఏఏ ప్రాపంచిక విషయ సమూహములలో) అనేకమంది జనులు పీకలదాకా మునిగి, ప్రబుద్ధులై ఉంటున్నారో, అట్టి విషయములపట్ల ఆత్మతత్త్వ విద్వాంసుడగు యోగిరాట్ 'సుషుప్తి’ వహించినవాడై ఉంటున్నాడు. పట్టించుకోవటం లేదు. |
చిదిహాస్తీతి చిన్మాత్రమిదం చిన్మయమేవ చ . చిత్త్వం చిదహమేతే చ లోకాశ్చిదితి భావయ .. 23.. యతీనాం తదుపాదేయం పారహంస్యం పరం పదం . నాతః పరతరం కించిద్విద్యతే మునిపుంగవః .. 24.. ఇత్యుపనిషత్ .. |
|
చిత్ ఇహ అస్తీతి చిన్మాత్రమ్ ఇదమ్ చిన్మయమేవ చ ‘చిత్ త్వమ్, చిత్ అహమ్’, ఏతే చ, లోకాః ‘చిత్’ భావయ। యతీనాం తత్ ఉపాదేయమ్ పారహగ్ంస్యం పరంపదమ్ న అతః పరతరం కించిత్ విద్యతే మునిపుంగవే! |
చిత్ అనబడు చిదానంద చైతన్యము ఇప్పుడే, ఇక్కడే ఎదురుగా ఉన్నది. ఇదంతా కూడా చిన్మాత్రమే. ఈ దృశ్యమంతా చిన్మాత్రమే! ఓ జనకమహారాజా! ఉన్న సత్యమేమిటో చెప్పుచున్నానయ్యా! నీవు చిత్ స్వరూపుడవు. నేను అదే చిత్ స్వరూపుడను! వారు- వీరు కూడా చిత్రూపులే! ఈలోకమంతా చిత్ స్వరూపమే! అట్టి చిత్ స్వరూపమునే భావన చేయి. తదితరమంతా భావన చేయనేవద్దు. చూస్తూ అంతరంగమున మౌనస్వరూపుడవై ఊరుకొని ఉండు! యతులకు అట్టి అఖండ చిత్ స్వరూపమే యము (సర్వదా ఆశ్రయించి ఉండవలసినట్టిది). పరమహంసలు ఆ పరమపదమును ఆనందముగా ఆస్వాదిస్తూ మనకు విప్పి చూపిస్తూ, అవ్యాజమైన ప్రేమతో విశదీకరిస్తున్నారు. మన కనులు తెరచి మనకు చూపుచున్నారు! ఈ సర్వము - సర్వదా ఏకైక - అఖండ చిత్రూపమే! ఇంతకు మించి వేరే సత్యమేమీలేదు. ఉండదు. ఇది ముని పుంగవులకు నిత్యానుభవము! |
ఇతి యాజ్ఞవల్క్యోపనిషత్ |
ఓం శాంతిః శాంతిః శాంతిః ||
‘విదేహ రాజు’ అగు జనక మహారాజు - జగత్ తత్త్వము ఎరిగిన కర్మయోగి! దేహము ఉండి, జగత్తంతా తన దేహముగా భావించువాడు కాబట్టి ‘విదేహుడు’ అని లోక ప్రసిద్ధుడు. “కర్మణేవహి సంసిద్ధిమ్ ఆస్థితాః జనకాదయః”.. అని గీతాచార్యుల వారిచే కర్మ యోగమునకు దృష్టాంతముగా చెప్పబడినవారు. శ్రీమద్రామాయణములో మహర్షి వాల్మీకిచే మన అమ్మ సీతమ్మ పేర్లు చెప్పబడుచున్నప్పుడు‘జనకాత్మజ’ అని ముద్దుగా అనటమునకు సాకారములు. ప్రాతఃస్మరణీయులు. పేరు తలచినంత మాత్రము చేతనే హృదయములో ప్రవేశించి జ్ఞానదీపిక అయి వెలుగొందువారు.
అట్టి జనక మహారాజు ఒకానొక రాజు యాజ్ఞవల్క్య జగద్గురువు యొక్క ఆశ్రమమును దర్శించారు. ఇరువురి మహాపురుషుల కలయిక లోక కళ్యాణమే కదా!జనకుడు స్వామి యాజ్ఞవల్క్యునికి ప్రదక్షిణము చేసి సాష్టాంగ దండ ప్రణామములు సమర్పించారు. తత్త్వవేత్తయగు యాజ్ఞవల్క్యుల వారితో సత్సంగ విధిని ప్రారంభిస్తూ... ఈ విధముగా పరిప్రశ్నించసాగారు.
జనక మహారాజు : భగవాన్ ! లోకగురూ ! యాజ్ఞవల్క్య మునీశ్వరా ! "సన్న్యాసము” ... అను విషయమై మీ నుండి శాస్త్రీయ సంబంధమైన మరియు స్వానుభవసంబంధమైన విశేషాలు వినాలని కుతూహలము కలిగి ఉన్నాను. దయచేసి 'సన్న్యాసము' యొక్క విశేష లక్షణములేమిటో వివరించండి.
యాజ్ఞవల్క్యుడు : మహాత్మా ! జనక మహారాజా ! చెప్పుచున్నాను వినండి.
పిల్లవానికి 5వ ఏట ఉపనయన సంస్కారమును కులానుచారముగా నిర్వర్తించి, ఇక అటుపై 'గురు ఆశ్రమము’లో విద్యాభ్యాసమునకై చేర్చగానే బ్రహ్మచారి అగుచున్నాడు. ఆ బ్రహ్మచారి (7 సంవత్సరముల కాలము) ఆశ్రమములో సర్వవిద్యలు అభ్యసించి, పారంగతుడై తిరిగి గృహమును చేరుచున్నాడు.
ఇల్లు చేరిన తరువాత, తీర్థయాత్రలు చేసి లోకరీతులను గమనిస్తున్నాడు. వంశానుచారముగా సంధ్యావందనము - దైవోపాసన వ్రతములు - ధ్యానములు నిర్వర్తిస్తూ తగిన సమయములో వివాహము చేసుకొని 'గృహస్థాశ్రమము'ను స్వీకరించుచున్నాడు. ఇక ఆ తరువాత గృహస్థ ధర్మములు నిర్వర్తిస్తూ... ఉచిత సమయంలో 'పరివ్రాజకుడు’గా అగుచున్నాడు (లేక) వాన ప్రస్థాశ్రమము స్వీకరించి వనములలో ప్రవేశించి ఏకాంతముగా యోగ - తపోధ్యానములు కొనసాగిస్తున్నారు.
విరక్తి - మానసిక పరిపక్వత –సంసిద్ధతలను అనుసరించి బ్రహ్మచర్యాశ్రమమునుండే కొందరు సన్న్యాసము స్వీకరిస్తున్నారు. మరికొందరు గృహస్థాశ్రమము నుండి, ఇంకొందరు వానప్రస్థాశ్రమము నుండి సన్న్యాసము స్వీకరించుచున్నారు.
జనక మహారాజు : ఒకడు సన్న్యాసాశ్రమము స్వీకరించి, పరివ్రాజకుడు అవటానికి ఏది సరి అయిన సమయము?
యాజ్ఞవల్క్యుడు : ఓ ఆర్యా! "సన్న్యాసము - స్వీకరించటానికి ఇదీ సమయము”... అని ఎక్కడా శాస్త్రములు నిర్ధేశించలేదు. ఒక్క విషయము మాత్రము చెప్పబడుతోంది. యత్ అహరేవ విరజ్యేత, తత్ అవహరేన ప్రవ్రజేత్ | ఎప్పుడు సర్వప్రాపంచిక విషయములు విశేషములపై సాత్వికమైన - స్వాభావసిద్ధమైన విరక్తి కలుగుతుందో (స్వాభావికంగా అనురక్తి తొలుగుతుందో)... ఆ రోజే సన్న్యసించటానికి తగిన రోజుగా భావించబడుగాక ! ఒకడు అనేక వ్రతములు చేయువాడు కావచ్చు. కాకపోవచ్చు. శాస్త్రీయంగా స్నాతక వ్రతము (బ్రహ్మచర్యాశ్రమ నిరతి) స్వీకరించి ఉండవచ్చు - ఉండకపోవచ్చు (అస్నాతకుడు కావచ్చు). మరొకడు నిత్యాగ్నిహోత్రుడు కావచ్చు. కాకనూ పోవచ్చును. సశాస్త్రీయముగా బ్రాహ్మణ - క్షత్రియ - వైశ్య - శూద్ర వర్జ్య ధర్మములు నిరతితో అనుసరించువాడు అయితే అయివుండవచ్చు. లేదా, అయి ఉండకనూ పోవచ్చు. ఏది ఏమైనా కూడా ఎప్పుడు ప్రాపంచిక సర్వ విషయముల పైనా (సాత్విక) వైరాగ్యము కలుగుతుందో ఆ రోజే సన్న్యసించటానికి మంచిరోజు. అంతే !
జనక మహారాజు: సన్న్యాసాశ్రమము స్వీకరిస్తూ, మునుముందుగా తప్పక నిర్వర్తించవలసిన శాస్త్రీయ విధి విధానాలేమైనా ఉన్నాయా!
యాజ్ఞవల్క్యుడు : అవును. కొన్ని కొన్ని విధానాలు శాస్త్రములచే సూచించబడినాయి. అదంతా లోకరీతి కొరకు, తదితరులకు తన 'సన్న్యాసాశ్రమ స్వీకారము’ ను తెలియజేస్తూ... ప్రకటించటానికి మాత్రమే. సన్న్యాసాశ్రమము స్వీకరించు సందర్భములో కొందరు ‘ప్రజోపత్యేష్టి’ అనే పేరుగల యాగమును చేస్తూ ఉన్నారు. మరికొందరు చేయుచుండటము లేదు. అయితే ‘అగ్నిసాక్షిగా సన్న్యసించటము’ అను రూపముగల ‘అగ్నౌయేష్ఠి' అనే వ్రతమును చాలామంది నిర్వర్తించి, అటుపై సన్న్యాస స్వీకారము చేస్తూ ఉండటము ఒక సదాచారమై ఉన్నది.
వాస్తవానికి ఈ దేహములోగల ప్రాణమే అగ్ని । అందుచేత కొందరు ఈ దేహమునే అగ్నిశాలగా ఉద్దేశ్యించి 'అగ్నేయాష్ఠి’ని నిర్వర్తిస్తు ఉన్నారు. అట్టి ప్రాణాగ్నిలో లోక సంబంధమైన "త్రైధాతవీయము”ను నిర్వర్తిస్తున్నారు. 1) లోక సంబంధమైన దేహము 2) లోక సంబంధమైన మనో - బుద్ధి - చిత్త - అహంకారములను 3) లోక సంబంధమైన కార్య - కారణ - కర్తృత్వ దేహములను ప్రాణాగ్నికి ఆహుతి చేసినవారై సన్న్యసించుచున్నారు.
జనక మహారాజు : స్వామీ ! మీరు ఉదహరిస్తున్న ‘తైధాతవీయము' గురించి మరికొంత వివరించండి.
యాజ్ఞవల్క్యుడు : ఏతయైన త్రయోదాతవో యదుత “సత్వం - రజః తమ” ఇతి | ప్రాణాగ్నికి సన్న్యాస సమయములో ‘ఆహుతి’ చేయు ప్రకృతికి సంబంధించిన సత్వ - రజో - తమో గుణములే ! ఈ త్రిగుణములను ప్రాణాగ్నిలో హోమము చేయటమే... అంతర్లీన ఉద్దేశ్యమని గ్రహించబడుగాక ! అది గమనించియే త్రైధాతవీయము నిర్వర్తించాలి.
ఆ త్రిగుణముల ఉత్పత్తి స్థానమేదో అట్టి హృదయస్థానమే... యాగశాల! ప్రాణములే అగ్ని! త్రిగుణ సంబంధమైన సర్వ ఇంద్రియ విషయముల పట్ల 'అరుచి' యే (అరోచన రుచించక పోవటమే) మంత్రమును ఉచ్ఛరించు ఋత్విజులు (వేద మంత్రములను ఉచ్ఛరిస్తూ త్రైధాతవీయము నిర్వర్తింపజేసే ఋత్విక్కులు). “తమ్ జనన్” - (ఆ బ్రహ్మమును ఎరుగుటకై సంసిద్ధపడుచున్నాను)... అను భావనా సమృద్ధియే అగ్నిని (ప్రాణాగ్నిని) సుస్వాగతము (ఆహ్వానము) పలుక భావోచ్ఛారణ ధారణయే అగ్ని తేజస్సు యొక్క ప్రజ్వలనము. తమ్ జానన్ అగ్ని ఆరోహా ధానో వర్ధయా రయమ్, అగ్నిమ్ అజిఘ్రేత్ | అను మంత్రముతో చెప్పుతారు.
బ్రహ్మమును నిర్వచించు మహావాక్యములతో కూడిన మంత్రములతో అగ్ని ఘ్రాణము (పొగను వాసన చూచుటతో కూడిన విధి) చేయుచున్నారు.
"ఏష వా అగ్నే యోనిః ప్రాణంగచ్ఛ | స్వాం యోని గచ్చ స్వాహా" ||
“నా ప్రాణములను, అహంకారమును జ్ఞానాగ్ని యోని యందు సమర్పిస్తున్నాను! ఓ అగ్నిదేవా! ఆహూతిని జ్ఞానస్వరూపమగు పరమాత్మ
యొక్క సమక్షమునకు చేర్చండి” ... అని పలుకుచూ తన సర్వ భౌతిక రూపానుభవములను, ప్రాణశక్తులను జ్ఞానాగ్నికి ఆహుతి చేస్తున్నారు.
కొందరు “గ్రామాగ్ని” (త్రిగుణ-త్రిఅవస్థల సముదాయముగా భావిస్తూ) తెచ్చి మనం చెప్పుకున్నట్లు అగ్నిలో ఆహుతి చేస్తున్నారు.
మరికొందరు అగ్నితో కాకుండా - యద్యత్ అగ్నిం న విదేయాం - అప్పు జుహుయాత్ - జలమును తెచ్చి, జలమును జలములో ఆహుతిగా సమర్పిస్తున్నారు.
“ఆపో వై సర్వాదేవతాః ! సర్వేభ్యో దేవతాభ్యో జుహోమి స్వాహా” అని మంత్రమును ఉచ్ఛరిస్తూ నీటియందు నీటిని హోమము చేస్తున్నారు !
“ఓ సర్వదేవతలారా ! నేను జలమునందు సమర్పిస్తున్న జల ఆహుతులను స్వీకరించి "ఆత్మైవ ఇదమ్ దర్శనమ్" నకు తోడు అవండి !”... అని దేవతలను తలచుకొంటున్నారు.
సాజ్యగ్ం హవిః అనామయం మోక్షమంత్రః
త్రైయ్యేవం వేద... తత్ బ్రహ్మ | తత్ ఉపాసితవ్యమ్|
ఈ జలమే సర్వదేవతల స్వరూపముకదా! అందుచేత సర్వదేవతలకు జలమునే వారి నివాసస్థానమగు జలమునకు హవిస్సుగా సమర్పిస్తున్నాను... అని "సమర్పించునేను సమర్పించబడుచున్న జలము - స్వీకరించు జలము బ్రహ్మమే।”... అని మరి ఉపాసించబడును గాక!
అప్పుడు ఆజ్యముతో కూడిన 'హవిస్సు’ను కూడా హోమము చేస్తూ నిరాకార - నిర్గుణ పరబ్రహ్మమును ధ్యానిస్తు ఉండాలి.
పైన చెప్పిన వివిధ రీతులైన హోమము చేసిన తరువాత శిఖ పిలక - యజ్ఞోపవీతమును త్రెంచి (ఖండించి) -
“సన్న్యస్తం మయా” -
“మయా సత్ + యత్ + అస్తమ్” - నా చేత (ఇప్పటి నుండి 'సత్' వస్తువగు బ్రహ్మమునందే స్వరూపతః - స్వభావతః నేను ఉనికిని పొందబడుచున్నది. నా చేత ఆశ్రయించబడుచున్నది) అని ‘3’సార్లు ఎలుగెత్తి పూర్వ - పరమంత్రపూర్వకముగా ప్రకటించుచున్నాడు.
ఓ జనక మహారాజా !
ఇవి సన్న్యాసాశ్రమమును ఆశ్రయించటమునకు సంబంధించిన కొన్ని విధి విశేషాలు.
🌺 🌺 🌺
అప్పుడు ఆ ప్రక్కనే ఆశీనులై తపోతేజస్సుతో ప్రకాశించుచున్న అత్రి మునీంద్రులు ఇట్లా ప్రశ్నించారు.
అత్రి మునీంద్రుడు : హే మహానుభావన్ ! యజ్ఞవల్యా ! ఈ సందర్భములో తమ ప్రవచనమును కోరుతూ, ఒక ప్రశ్నకు మీ ముందు ఉంచుచున్నాను. అనుజ్ఞ ఇవ్వండి.
ఆ సన్న్యాసి యజ్ఞోపవీతమును త్యజించుచున్నారు కదా! యజ్ఞోపవీతము విడిచిన తరువాత అట్టివాడు 'బ్రాహ్మణుడు’ అని ఎట్లా అనిపించుకుంటాడు? అనిపించుకోడేమో కదా!
యాజ్ఞవల్క్యుడు : ఓహో ! అదా? స్వామీ ! అత్రి మునీంద్రా ! 'యజ్ఞోపవీతము' అనగా త్రిసూత్రపు దారము కాదు కదా!
సన్న్యాసము పుచ్చుకున్న తరువాత ఆ సన్న్యాస విషయములో - |
'ప్రణవమేవ అస్య తత్ యజ్ఞోపవీతమ్”. “ఆత్మతత్త్వధ్యానము'నే ప్రాశనము (స్వీకరించు జలము) గా భావించి మనస్సుతో “సర్వతత్వాత్మకమ్”ను, బుద్ధితో “సర్వతత్త్వసాక్షి"ని యజ్ఞోపవీతముగా స్వీకరించువారై ఉంటారు.
ఆత్మ భావనయే అతనికి ఆచమనముచేయు విధి అగుచున్నది. య ఆత్మా ప్రాశ్య ఆచమ్యాయం విధిః |
ఆ సన్యాసి ఇక అక్కడి నుండి (సన్యాస ఆశ్రమమును ఆశ్రయించినది మొదలు)...
వివర్ణ వాసో - వివర్ణములైన (రంగులు చెడిన) వస్త్రములు ధరిస్తూ ఉంటారు. కొందరు దిగంబరులై ఉంటారు.
ముండో - బోడిగుండు కలవారై ఉంటారు.
అపరిగ్రహః - ఏ లోక సంబంధమైన విషయములను తనకు తానుగా స్వీకరించనివారై, పరిగ్రహించనివారై ఉంటారు.
శుచిః - 'సర్వము పరమాత్మ యొక్క నాటకరంగ రచనాకల్పనయే' అను భావనతో ఎవ్వరినీ, దేని విషయములోనూ తప్పుపట్టనివాడై ఉంటారు.
అను శుచి అయిన భావననను ఆశ్రయిస్తూ... ఉంటారు.
అద్రోహీ : ఎవ్వరికైనా కూడా కించిత్ కూడా హాని కలిగించాలనే ఉద్దేశ్యమే లేనివారై, మహత్తర క్షమాగుణ సంపన్నులై ఉంటారు.
భైక్షమానో : భిక్షము ఎత్తుతూ శరీరమునకు ఆహారము అందిస్తూ... ఉంటూ... క్రమముగా 'బ్రహ్మీభూతుడు' అగుచున్నాడు. ఈ విధము ఒక చోట నిలువక, నివశించక పరివ్రాజకుడై తిరుగుచూ కేవలము పరబ్రహ్మోపాసకుడై కాలము గడుపుచూ ఉంటున్నారు.
సన్న్యాసుల మహాప్రస్థాన మార్గము :
వీరి మహాప్రస్థాన మార్గము ఎట్లా ఉంటోందంటే...,
అయితే వారి గురించి ఇవియే నియమము అని ఏమీ చెప్పలేము. వారు సర్వ నియమములను దాటినవారై ఉంటారు.
ఈ విధంగా సన్న్యాసమార్గమును ఆశ్రయించి బ్రహ్మవేత్తలై... ప్రకాశించుచున్నారు.
పరమహంస
అట్టి సన్న్యాసులలోను, యోగులలోను కొందరు 'పరమహంస' అను మహత్తర స్థానమును ఆశ్రయించినవారై ఉంటున్నారు. అట్టివారిలో కొందరు ఇప్పుడు దృష్టాంత పూర్వకముగా స్మరిస్తూ, వారికి ప్రణామములు సమర్పిస్తున్నాము.
ఓం
సంవర్తకాయ నమః | ఆరుణియే నమః |
శ్వేతకేతవే నమః । దూర్వాసాయ నమః |
ఋభుయే నమః | నిదాఘాయ నమః |
దత్తాత్రేయాయ నమః | శుకాయ నమః |
వామదేవాయ నమః । హరీతకాయ నమః |
ఇత్యాది ప్రభృతయో పరమహంస మహాజనే నమో నమో నమో నమః ||
అవ్యక్త లింగాయ : వారు ఇటువంటి గుర్తులు, ఆకారములు, వస్త్రములు, రంగు రూపులు ... మొదలైనవి కలిగి ఉంటారని నిర్వచించలేము. అవ్యక్తమైన స్వరూపము కలిగి ఉంటారు. జగత్తుకు కేవలసాక్షిత్వము వహించువారికి జగత్ అంతర్గత లక్షణములు ఏమని మనము చెప్పుకోగలము. అట్టివారు ఏ ఆశ్రమములోనైనా ఉండి ఉండవచ్చు.
అవ్యక్త ఆచారా : ఆ పరమహంసలను ఆచార పరిధులకు తీసుకొని రాలేము. తమ యొక్క పరమహంసత్వము అర్హత - అవసరములను అనుసరించి మాత్రమే తెలియనిస్తారు. లేకుంటే ఎవ్వరికీ తెలియనీయరు కూడా.
అనున్మత్త - ఉన్మత్తవత్ ఆచరంతః : వారు ఏమాత్రము అమాయకులు - తెలియనివారు - ఉన్మత్తులు (పిచ్చివారు) కాకపోయినప్పటికీ.. సాంసార జీవుల దృష్టికి ఉన్మత్తులవలెనే అగుపిస్తారు.
తమ యొక్క అఖండానంద సర్వాత్మకత్వమును, అంతర్ దృష్టిని లోకసంబంధమైన ఆశయములు కలవారికి తెలియనీయనివ్వరు.
పాము అడుగుల జాడ పామే కనిపెట్టగలదు కదా ! పరమహంసలను యోగయుక్తులు మాత్రమే గమనించగలరు.
జన్మ-కర్మ-మరణ-దేహ-దృశ్య-రహస్యములు, వాటివాటి సత్యాసత్యములు ఎరిగియే, బాహ్యమున ఏమీ తెలియని వారివలె కనిపిస్తూ ఉంటారు.
ఈ భౌతిక స్త్రీ - పురుష సంబంధ - అనుబంధ - బాంధవ్యములకు, పురనివాస భేషజములకు, సంపద ప్రతిష్ఠ వంటి వాటికి ... “ఇవన్నీ అర్ధరహితములు. నిస్సారములు, భూటకము ! నాటకము !”... అను బుద్ధితో మొదలే వాటన్నిటికీ అంతరంగమునందు సుదూరులై ఉంటారు.
బాహ్యమున “ఇట్లా ఉంటారు - అట్లా ఉండరు".. అనేమీ చెప్పలేము.
సన్యాస - బ్రహ్మచారి ఆశ్రమముల వారి బాహ్య లక్షణములైనట్టి త్రిదండము - కమండలువు - భిక్షాపాత్ర - జలపాత్ర - శిఖ - యజ్ఞోపవీతము మొదలై లక్షణములన్నీ కూడా ఆ పరమహంసలు 'ఓం భూస్వాహా' అంటూ నీటియందు శవభస్మమువలె పరిత్యజించి వేసి వుంటారు. వారి చూపు - అన్వేషణ - భావన - సంకల్పము - దృష్టి - ధ్యాస - శ్రుతము - కృతము ... ఇవన్నీ కూడా “శివోఽహమ్ - ఆత్మాఽహమ్” సందర్శనమునందు, తత్త్వమార్గమునందు మాత్రమే నియమితమై ఉంటాయి.
యథా జాతరూపధరా నిర్ద్వంద్వా, నిష్పరిగ్రహః |
ఏ విధంగా అయితే అప్పుడే పుట్టిన శిశువుకు ఏ విషయముతోనూ ఏ మాత్రమూ కించిత్ కూడా సంబంధము ఏర్పడి ఉండలేదో,... ఆ విధంగా ఆ పరివ్రాట్... పరమహంస -
ఈ జగత్తునందు సంచరించుచున్నారు.
తానున్న ప్రదేశములను “ఆత్మానుభావానందము”లో నింపివేస్తూ ఆశ్రయించినంత మాత్రము చేతనే సహజీవుల స్వస్వరూపాత్మ సంబంధితమైన సర్వసందేహములు మొదలంట్లా తొలగించువారై ఉంటారు.
ఓ జనక మహారాజా !
సన్న్యాసి - పరివ్రాట్ - అవధూత ... వీరి ఆహారము విషయమై తత్ - విశేషము చెప్పుచున్నాను. వినండి.
మహత్ములగు సన్న్యాసులు, అవధూతలు, పరివ్రాట్లు ఎల్లప్పుడు సర్వ సమరస స్వరూపమునందు సమాధినిష్ఠులై ఉంటారు.
ఈ విధంగా ఆ సన్న్యాసులు శుభా - అశుభ కర్మలను తమ హృదయమునుండి నిర్మూలనము చేసుకొను ప్రయత్నమే సన్న్యాసము.
క్రమంగా సర్వపరిధులను అతిక్రమించి దేహమును 'లేనిది'గా దర్శించుచూ, దేహరహితత్వమును స్వభావముగా చేసుకొంటూ, సామ్రాట్ సర్వలోక సంచార భావనలచే పరివ్రాట్టులై చివ్వరికి నిర్వికల్ప సమాధినిష్టులై అవధూతలుగా భూమిపై ప్రకాశించుచున్నారు.
పరమహంస ఆకాశాంబరులై (సర్వ జగత్ రూప వస్త్రములను పరిత్యజించి)
- పరము + ఇహము రూపములగు నమస్కారమును కూడా (జీవాత్మ - పరమాత్మల భేదమును) అధిగమించినవారై ఉంటున్నారు. ‘నమస్కారులై’ ఉంటున్నారు.
- భార్య పుత్రులు ఇవన్నీ ఆత్మకు అభిన్న భావముతో ఆత్మలీలగా అవలోకిస్తూ ... వాటికి సంబంధించిన ప్రాపంచక అభిలాషలను తూష్టీకరించి వేసి ఉంటున్నారు.
- ప్రాపంచక లక్ష్య - అలక్ష్యములను ఎరిగి పరివ్రాట్ ప్రకాశించుచున్నారు.
‘ఇహము’ను దాటివేసి పరమేశ్వర స్వరూపులై దృశ్యమంతా తమ పరమాత్మత్వములో నింపివేసి ఉంటున్నారు.
జనక మహారాజు : సన్న్యాసాశ్రమ నియమానుసారము వారు న-నమస్కారులు (తదితర జనులకు నమస్కరించనివారై) అయి ఉంటారా ? నామ - రూపాదులను ఉపాసించువారై ఉంటారు ?
యాజ్ఞవల్క్యుడు : ఈ విషయమై ఇట్లా చెప్పబడుతోంది. “ఒక సన్న్యాసి పూర్వసన్న్యాసులకు (తనకన్నా మునుముందే సన్న్యసించినవారికి) తనతో సమాన ధర్మనిరతులకు నమస్కరిస్తారు. తదితరులకు నమస్కరించరనునది సన్న్యాసాచారముగా చెప్పబడుచున్నది.
వేద సందూషితాశయ సన్న్యాసులు
ఓ జనక మహారాజా! సన్న్యాసాశ్రమవాసుల క్షేమము-జాగరూకతలను దృష్టిలో పెట్టుకొని ఈ విషయములను ఇక్కడ చెప్పుకుంటున్నాము.
సన్న్యాసాశ్రమము... ఒకానొక “ఉపాసన” యొక్క ఆశ్రయము కదా ! అందుచేత సన్న్యాసము అవధరించిన వెంటనే సన్న్యాసత్వము మనస్సు పునికి పుచ్చుకున్నట్లు కాదు. ఆశ్రమము, ఆకారము మారినంతమాత్రంచేత బుద్ధికి సర్వాతీతత్వము సిద్ధించినదని అన వీలు కాదు కదా!
సన్న్యాసులలో కొందరు..
ప్రమాదినో - బద్ధకముతో అశ్రద్ధ కొనసాగించున్నారు.
బహిఃచిత్తః - బాహ్యేంద్రియ చిత్తము ఇంకనూ ఉపసంహరించని వారై ఉంటున్నారు.
కలహ ఉత్సుకాః - కోపము - ఆవేశము - పోట్లాటల నుండి ఇంకనూ వెనుతిరగనివారుగా ఉంటున్నారు.
ఇటువంటి స్వభావములు ఉన్నవారు ఉంటూ ఉంటారు. వీరిని "వేదదూషిత ఆశయ సన్న్యాసులు” అంటారు.
అయితే,
అజ్ఞానము యొక్క విన్యాసము చేత కొందరు సన్న్యాసము స్వీకరించికూడా, ప్రాపంచక రుగ్మతలు వదల లేకపోయి ఉండవచ్చు. అంత మాత్రము చేత - అది 'సన్యాస ఆశ్రమ విధి'కి (మరియు) ‘నామరూపాదులకు ఆవల పరమైయున్నట్టి అద్వయ సామ్రాజ్యమునందు సంస్థితులైయున్న మహనీయులగు అవధూతలకు, పరివ్రాజకులకు-వీరందరికీ ఆపాదించటము ఉచితమా? కాదు.
గొప్ప వేద పాఠశాలలో చేరిన కొందరు విద్యార్థులు అల్లరిని వదలక - వేద హృదయములో ప్రవేశించలేదు కాబట్టి, ఆ అల్లరి అనే దోషమును వేద అధ్యయనమునకు వేద పాఠశాలకు, ఉపాధ్యాయులకు, ఉత్తమ విద్యార్థులకు ఆపాదించటము కదా! అందరినీ కలిపి ఒకగాటున కట్టటము వీలుకాదు కదా !
అది అటుంచి ఇక, ఆ పరమహంసల మరికొన్ని విశేష లక్షణములు చెప్పుకుందాము.
పరమ హంసల నామ - రూపార్చన
ఓ జనక మహారాజా ! ‘పరమహంసల నామ - రూపాదుల అర్చన ఎట్లా ఉంటుంది ?”... అను ప్రశ్నకు సమాధానము చెప్పుకుందాము.
నామాదిభ్యః పఠే భూమ్ని స్వారాజ్యే చేత్ స్థితో అద్వయే, ... ప్రణమేతకమ్, తత్ ఆత్మజ్ఞో న కార్యం కర్మణా తదా!
ఏ యోగి (లేక) సన్యాసి (లేక) జ్ఞాని (లకే) పరమహంస అయితే నామ - రూపములకు పరమై - వేరై - ఆవల ఆక్రమించుకొని ఉన్నట్టువంటి “అద్వయ-ఆత్మ సామ్రాజ్యము నందు సంస్థితుడై ఉన్నాడో-ఇక అతడు ఎవరికి, ఏమని, ఎందుకు నమస్కరిస్తాడు?
జనక మహారాజు : అట్టి ‘అంతానేనే' అను 'ఆత్మసామ్రాజ్య - అభిషిక్తుడు' అవటానికి ఏ ఏ కర్మలు, సాధనలు, మార్గములు ఇప్పుడు
జీవులమగు మేము అనుసరించాలి?
యాజ్ఞవల్క్యుడు : ఆత్మజ్ఞానమే అందుకు మార్గము ! ఈ జీవుడు తాను “దేహమును ఏలుచూ దేహములోనే సంస్థితుడై ఉన్నాను”... అని భ్రమిస్తూ ఉన్నాడు. "సర్వమును నేనే అయి సర్వమునకు వేరై” ఉన్నట్టి ఆత్మ సామ్రాజ్యము యొక్క జ్ఞానము చేతనే - గుర్తించబడుతోంది. అట్టి 'ఆత్మ జ్ఞానము’నకు వాస్తవానికి ఎటువంటి కర్మలతోను పని లేదు. ఆత్మజ్ఞునికి “ఇది ఇట్లా చేయాలి ! అది అట్లా చేయకు, ఇది మార్గము. అది కాదు !”... ఇటువంటి త్యాజ్య - గ్రాహ్య, కృత - అకృత సంబంధమైన పరిధులు చెప్పబడజాలవు. మరి ఎవరికి శాస్త్రములు చెప్పుచున్నది ? ‘దేహ భ్రాంతి - ఇంద్రియ విషయ పరిమితత్వము తనపై ఆపాదించుకొనుచున్న సందర్భములో మాత్రమే ఉపాయముల రూపముగా హేయ (వదల వలసిన) - ఉపదేయములు (స్వీకరించవలసినవి) చెప్పబడుచున్నాయి.
జనక మహారాజు : మీరు చెప్పుచున్నట్లు స్వస్వరూపాత్మపట్ల అజ్ఞానము తొలగటానికి, నేను ఎటువంటి ఉపాయము ఆశ్రయించటము ఉచితమో, ఆజ్ఞాపించండి.
యాజ్ఞవల్క్యుడు : ఓ విదేహరాజ్య చక్రవర్తీ ! జనక మహారాజా !
ఈశ్వరో జీవకలయా ప్రవిష్టో భగవాన్ - ఇతి, ప్రణమేత దండవత్ భూమో వా - అశ్వ చండాల గోకరమ్ |
"ఆ సర్వేశ్వరుడు, సర్వకళామయుడు అగు పరబ్రహ్మమే (లేక) భగవానుడే తన యొక్క అద్భుతము - అనంతము అగు జీవకళలతో సర్వ దేహములలోను ప్రవేశించి సర్వమును ప్రకాశమానము చేయుచున్నారు. సర్వ స్వరూపుడై వెలుగొందుచున్నారు. ఈ కనబడే సర్వముఖములు ఆయనకు నివాసస్థానమే" అను దృష్టి మననము కలవాడనై, ఉత్తమము, ఆత్మీయము అయినట్టి బుద్ధితో సర్వులను చూడు.
ఒక గుర్రమును, ఛండాలుని, గోవును, గాడిదను చూస్తూ ఉన్నప్పుడు కూడా మనస్సులో “ఓ సర్వాత్మకా ! పరమాత్మా !" అని అంతరగమునందు మనస్సుతో ఉచ్చరిస్తూ సాష్టాంగ దండ ప్రణామములు సమర్పిస్తూ ఉండు. నీవి అని అనుకొన్నవి ఆయనివిగా భావన చేయి. అప్పుడు క్రమంగా “సర్వముగా ఉన్నది మమాత్మయే”... అనునది అతి త్వరలో అనిపించగలదు. నమస్కార పూర్వక భావనతో అనుకుంటూ ఉంటే... తప్పకుండా అనిపించగలదు.
మాంస దృష్టి - ఆత్మ దృష్టి
నాయనా ! జనకా ! ఎందుచేతనో ఈ జీవుడు ఆత్మదృష్టిని ఏమరచి మాంస దృష్టిని కొన్ని దేహపరంపరలుగా పెంపొందించుకొన్నమవాడై ఉంటున్నాడు. ఈతడు మోహము చెందుచున్నాడు! ఈ భౌతిక దేహములు ఎటువంటివి ? మాంసముతోను, బొమికలతోను, గ్రంధులతోను, క్రొవ్వు - రక్త - చీములతోను తయారుకాబడిన భౌతికమైన (మెటీరియల్) బొమ్మలే కదా ! అవి కాస్త ప్రక్కన పెడితే ఏ దేహములో ఏమి ప్రత్యేకత ఉన్నది?
తత్ మాంసరక్త భాష్పాంబు పృథక్ కృత్వా విలోచనే, సమాలోకయ ! గమ్యం చేత్ కింముధా పరిముహ్యసి?
ఓ జీవుడా ! చర్మము - మాంసము - రక్తము - కన్నీరు... ఇవన్నీ విడివిడిగా ఒక చోట ఒక వరుసలో పెట్టి పరిశీలించిచూడవయ్యా. వీటన్నిటిలోని ఏ ఒక్కటిలో ఏమి ప్రత్యేకత ! ఏమి రమ్యత ? ఎందుకు నీవు పరిమోహము పొందుచున్నావయ్యా ? భావకవులు “మేరు శిఖరము మీద నుండి తెల్లటి మెరుపులతో కూడి జాలువాడుచున్న సెలయేరువంటి మల్లెపూలచే గ్రుచ్చబడిన పొడవైన జడవలె, గంగాజలము వంటి అధరామృతముతో”... ఇటువంటి వర్ణనలతో ముక్తాహారములతో కూడిన స్త్రీ - పురుష దేహములను వర్ణిస్తూ పాఠకుల భ్రమలను మరింత అధికము చేస్తున్నారు.
ఇటు వంటి వన్నీ మననము చేసుకొంటూ స్త్రీ - పురుష జీవులు ఒకరినొకరు దేహములవైపు చూచుకొనుచూ రస-సముల్లాసము పొందుచున్నారే! “జిలుగు - జిగేల్ వస్త్రములచే, పుష్పహారములచే అలంకరించబడిన భౌతిక దేహముల లోపల రక్త -చీము - మాంస - బొమికల అమరికయే కదా !”... అనేది ఈ జీవుడు గుర్తు పెట్టుకొని ఉండకపోతే ఎట్లా ? అభౌతికము - అప్రమేయము అయి, సర్వమును కదలుటకు కారణముగుచున్న ఆత్మను గుర్తించి దర్శించాలి కదా !
ఓయీ ! అమాయక జీవుడా !
శ్మశానేషు దిగంతేషు స ఏవ లలనాస్తనః శ్వభిరా అస్వాద్యతే కాలే లఘుపిండ ఇవాంధనః !
ఏ ఏ స్త్రీ స్థనములు, పురుషుల భుజస్కంధములు చూచి ఒకరికొకరు స్పృశించి మురిసిపోతూ ఆనందించుచున్నారో, అవన్నీ కూడా “కాలక్రమేణా ఒకానొక రోజు కుక్కల చేత - నక్కల చేత అన్నపు ముద్దలవలె, తమకు ఇవ్వబడగా లభించిన సొంత సొమ్ము వలెను గుటకలు వేస్తూ మ్రింగబడబోవుచున్నాయి కదా !"... అనునది గుర్తు కలిగి ఉండకపోతే ఎట్లా? ఎప్పటికప్పుడు మార్పు చెందుచున్న భౌతిక రూపములు చూచి పిచ్చిగా ఆకర్షితులవటము మానవ జన్మ పొందిన మీకు ఉచితమా? కాదు.
నల్లటి కురులు ధరించి మనస్సులో దుష్టమగు పరస్పర స్పర్శభావన - ఆలోచనలతో కూడుకొని ప్రియురాండ్లు ప్రియుల పట్లా, ప్రియులు ప్రియురాండ్ల పట్లా భౌతిక ధ్యాసలు పెంపొందించుకొని ఫలితంగా మండుటెండలో గడ్డివలె ఈ జీవులు కాలుతూ ఉడికిపోవుచున్నారు.
ఈ భౌతిక దేహములకు సంబంధించిన ధ్యాసలు ఎటువంటివంటే....
అన్ని దోషములకు పేటిక వంటిది ఈ నారీ సంబంధింత (దృశ్య సంబంధిత) వ్యవహారమంతా! ఇక్కడ ఏదో పొందాలి - కావాలి- ఏదో చేయాలి. అనునదంతా ఈ జీవునికి దాస్య శృంఖలములుగా పరిణమిస్తున్నాయి. అట్టి బంధములకు అంతూ-పొంతూ ఏముంటుంది?
అందుచేత,
అలమ్ అస్తు మమ స్త్రీయా - ఓ మనసా ! ఈ సంబంధములను, అనుబంధములను ఇక చాలించు. మనము అసలు విషయమునకు వచ్చి పరిశీలిద్దాము” ... అని ఈ జీవుడు వివేకి అయి ఆత్మతత్త్వ జ్ఞానము కొరకై అత్యంత త్వరగా నాంది పలకటము ఉచితము.
యస్య స్త్రీ, తస్య బోగేచ్ఛా ! ని స్త్రీ కస్య క్వ భోగభూః? - స్త్రీ (దేహ) ధ్యాస కలిగి ఉంటేనే భోగేచ్ఛ ఉంటుంది ? భోగేచ్ఛ లేనప్పుడు భోగభూములూ ఉండవు. స్త్రీయం త్యక్త్వా జగత్ త్యక్త్వం ! స్త్రీ (సంబంధము)ను త్యజిస్తే జగత్తును త్యజించినట్లే అవుతుంది.
జగత్ త్యక్త్యా సుఖీ భావేత్ ! జగత్తును త్యజించినవాడు 'సుఖి' అగుచున్నాడు. (స్త్రీ = సత్వ + రజో + తమో = స + ర + త). ఈ పరస్పర సంబంధములు, భార్య - పుత్ర - కళత్ర - మిత్ర... ఇత్యాది వ్యవహారములు ఈ జీవుని భ్రమింపజేస్తూ ఉన్నాయి. ఈ జీవుడు సత్యము వైపుగా దృష్టి సారించకుండానే రోజులు - జీవితములలను గడిపివేస్తున్నాడు. ఈ సంసారమును నమ్మి ఉండకూడదు
ఎందుకంటే ...
ధనీ చేత్ మ్రియతే తదా!
ఒకవేళ, “అన్నీ బాగానే ఉన్నాయి కదా ! సంతానము, సంపద అన్నీ అనుకూలమే”... అని అనుకుంటూ మురిసిపోయేవారికి ఖరా-మృత్యువులు దేహగతియే మార్చివేస్తున్నాయి. ఎవ్వడూ కాలమును నమ్మి ఉండటము కుదరదు. ఏది ఎప్పుడు ఎందుకు ఎట్లా అవుతుందో ఎవ్వరూ ముందుగా తెలుసుకోలేని కాలగతి ఇక్కడ తాండవ మాడుతోంది. కాలమునకు "ఎర" కానిదేది, ఒక్క ఆత్మ తప్ప? |
చపలత్వము జయించాలి
ఓ జనక మహారాజా ! తన యొక్క సర్వతత్వాత్మకమగు స్వరూపాత్మ స్వభావమును పునికి పుచ్చుకోవటానికి ఈ జీవుడు బుద్ధి యొక్క చపలత్వమును త్యజించాలి.
కదులుచున్న అద్దము (Mirror) లో ప్రతిబింబమును స్పష్టముగా చూడలేము కదా ! ఇదీ అంతే ! అందుచేత...,
న పాణి పాద చపలో యతిః : యోగ సిద్ధి పొందతలచువాడు చేతులను, వేళ్ళను ఎల్లప్పుడూ చపలముగా ఉంచుకోరాదు. చేతులతో ఏదేదో చేయాలని, కాళ్ళతో ఎటో ఎటో వెళ్ళాలని చపలత్వము పొందరాదు.
న చ వాక్ చపలశ్చైవ : వాక్కుతో అనవసరమైన సంభాషణ పరదూషణ తెలిసీ తెలియని - విషయాలను తెలిసిన వారిపై ఆపాదించటము, లౌకిక విషయాలపై అతిభాషణము... ఇవన్నీ కూడదు.
యతి అవటానికై వాక్ పాణి పాదములపై (జ్ఞానేంద్రియములపై కర్మేంద్రియములపై) స్వాధీనత - నిగ్రహము అలవరచుకోవటము అవసరము.
బ్రహ్మభూతో జితేంద్రియః - ఇంద్రియములను జయించువాడే... బ్రహ్మ భూతుడు (తనను బ్రహ్మముగా అనుభూతపరచుకొన్నవాడు) కాగలడు.
కోపముపై కోపము
ఈ జీవునికి అన్నికన్నా పెద్ద శత్రువు 'కోపము’. వారిపై - వీరిపై మనస్సులో కోపమున్నంత సమయము-వివేకమునకు చోటు దొరకదు. అందుచేత సాధకుడు కోపము విషయములో అతి జాగరుకుడై ఉండాలి.
జనక మహారాజ : మహాత్మా! కోపము ఎల్లప్పుడూ శతృవే. ఇందులో సందేహము లేదు. అయితే అట్టి కోపము మా మనో-బుద్ధి-చిత్తములలో ప్రవేశించనీయకుండా ఎట్లా చూచుకోవాలి? మాపై దయతో, కోపమును దూరంగా ఉంచగలిగే ఉపాయాలేమన్నా శెలవివ్వండి.
యాజ్ఞవల్క్యుడు : ఓ జనక మహారాజా ! ఎవ్వరికైనా తన దేహావయములపై తనకు కోపముంటుందా ? ఉండదు కదా !
రిపే బుధౌ స్వదేహేచ సమైకాత్మ్యం ప్రపశ్యతః, వివేకినః కుతః కోపమ్?
వివేకవంతుడగు ఆత్మ సంయమ యోగికి ఈ విశ్వమంతా తన శరీరము అగుచున్నది. పరమహంసలకు తాము విశ్వాత్మకునిగాను, ఈ విశ్వము తమ ఆత్మ దేహముగాను స్వభావసిద్ధముగా అనిపించుచున్నది. ఆత్మ జ్ఞానముచే కోపము హృదయమునుండి తనకు తానే తోకముడుస్తోంది. |
తన కోపమే తనకు శత్రువు
ఓ సహజీవులారా ! కోపము అతి ప్రమాదకరమైనది అని గుర్తు చేస్తున్నాను. అది ఉన్నచోట ఎంతో కష్టపడి సముపార్చించుకొన్న సత్వగుణము, తద్వారా పొందవలసియున్న పురుషార్థములు (ధర్మ - అర్థ - కామ మోక్షములు) భ్రష్టుపట్టుచున్నాయనునది దయచేసి గమనించండి.
అపకారిణి కోపశ్చేత్ కోప కోపః కథం న తే?
ఓ విదేహరాజా ! జనక మహారాజా ! ముందుగా ఒక ప్రశ్న. ఒకరిపై కోపము ఎందుకు వస్తోంది ? అతని వలన హాని కలుగుట చేతనే కదా ! అటువంటప్పుడు శుభములను పాడుచేసి అశుభములను కలిగించు ‘కోపము’ పై కోపము ఈ జీవునకు ఎందుకు కలుగటము లేదు? అందుచేత “నా యొక్క ధర్మార్థకామమోక్ష చతుర్విధ ఫలములు పరిరక్షించుకోవటానికై నేను నా ‘కోపము’ పై కోపము కలిగి ఉండెదను గాక” అని జీవుడు తలచును గాక.
నా కోపము పై తిరగబడుచున్న ఓ నా కోప-కోపమా! నీకు నమస్కరిస్తున్నానయ్యా! నీ దయవలన (నా కోపము పై కోపము వలన) నా ఇంటికి వచ్చి, నా ఇంటినే తగలబెట్టు ప్రయత్నిస్తున్న - నా 'కోపము’ ను గృహ బహిష్కరణ చేయుచున్నాను కదా! నమోస్తు! కోపముపై కోపము వలన నాకు 'వైరాగ్యము' అనే మహత్తర గుణము అబ్బుతోంది. అందుచేత కోపము పై నాకు వస్తున్న కోపము నన్ను కాపాడే ఆత్మ బంధువు !... అని ఈ జీవుడు గమనిస్తూ... కోపముపై కోపము కలిగి ఉండును గాక!
సంసార దృష్టి - సన్న్యాసయోగి దృష్టి
దేని దేని పట్ల అయితే అనేకమంది జనులు 'ఇవన్నీ అవసరము! సంపాదించుకోవాలి! దాచుకోవాలి! దోచుకోవాలి! ఇంకా పొందాలి! కలిగి ఉండాలి! ఎంతగానో పెంపొందించుకోవాలి !” ... అని తాపత్రయపడుచున్నారో.. సంయమియగు యోగికి అవన్నీ నిస్సారములై కనిపిస్తున్నాయి. “నన్ను గొప్ప అనుకోవాలి” ఇటువంటివన్నీ సంయమి అగు యోగరాట్‌ను కించిత్ కూడా సమీపించజాలవు.
ఇక ప్రబుద్ధుడగు సన్యాస యోగికి - యోగ విరాట్‌కు పరమహంసకు ఏది పరలక్ష్యమై అనునిత్యముగా, ఉపాసించవలసినదిగా అగుచున్నదో, అది సామాన్య (ఆత్మ విషయమై, అజ్ఞానము కొనసాగించు) జనులకు “అది పట్టించుకోవలసిన విషయమ్ కాదు లెండి. ఇప్పుడు కాదు ! ఎప్పుడో చూద్దాంలే! అయినా ఏమిటి లాభం ! ముందుగా ఇక్కడ పొందేవన్నీ లెక్కించుకోనీ ! చివరి విషయం ఆత్మజ్ఞానమే లెండి !”... అని తలుస్తున్నాడు.
వర్తమానమునందు - ఆత్మ సమాచారమును ఏమాత్రమూ లక్ష్యముగా, ఆశయముగా కలిగియే ఉండటము లేదు! ఆధ్యాత్మ శాస్త్రమును శాస్త్రముగా పరిగణించటమే లేదు.
ఓ జనక మహారాజా ! పరశీలించటానికి వెనుకాడటమే, తిరస్కరించటమో, బద్ధగించటమో, అల్పాశయములతో రోజులు గడపటమో, సందిగ్ధత కొనసాగించటమో, ఇదియే ఈ జీవుడు అజ్ఞానిగా ఉండిపోవటానికి కారణం.
"చిత్ ఆనందము ఎక్కడ ఉన్నది?”
ఓ మహారాజా ! ‘చిదాత్మ' అనబడే చిదానందము ఇప్పుడే ఇక్కడే ఈ జీవునికి లోన - బయట కూడా సర్వదా వేంచేసియే ఉన్నది.
ఈ కనబడే జగత్తంతా 'ఎరుక' అను రూపము దాల్చిన చిత్ తేజ చిదానందమ్ !
నాయనా ! ఒక పరమసత్యము వేదాంతసారవాక్యము నీ ముందు ఉంచుచున్నాను.
చిత్ త్వమ్ - నీవు సర్వదా చిదాకార చిదానంద సదాశివ స్వరూపుడవే అయి ఉన్నావయ్యా !
చిదహమ్ - నేను కూడా అట్టి చిదానంద చిత్ - ప్రకాశ స్వరూపుడనే !
ఏతే చ లోకాః చిత్ ఇతి భావయ - ఈ కనబడే లోకము, ఈ దృశ్యము ఇదంతా సర్వదా చిదానంద స్వరూపమే !
ఈ పరమ సత్యమును గ్రహించి, సర్వదా తత్భావనయందు ఉండుము. యతులకు, మహాయోగులకు, పరమహంసలకు -
సర్వము బ్రహ్మమే !
నేను బ్రహ్మమే !
ఈ సర్వము నేనే !
... అనునదే ఎల్లప్పుడూ నిత్యోపాసన, అనునిత్య నిష్ఠ, ఆనంద దర్శనము అయి ఉన్నది.
వారు సర్వదా సర్వత్రా ఈ విశ్వమంతా, సర్వ జీవులతో సహా తమ ఆత్మ స్వరూపముగా దర్శించుచూ ఆనందిస్తున్నారు.
"నేను - నీవు అఖండ బ్రహ్మమే” అట్టి అనుక్షణిక భావనయే నిశ్చల సమాధి-మోక్షము-జ్ఞానము కూడా!
అంతే! ఇంతకుమించిన సత్యము మరేదీ లేదు.
మనం ఇప్పుడు చెప్పుకొన్న విషయములన్నీ కూడా మునిపుంగవులు తమలో తాము సంభాషించుకొని ఆనందిస్తున్న విషయాలేనయ్యా ! మనపై అవ్యాజమైన ప్రేమతో వారు ఎలుగెత్తి మనందరికీ చాటుచున్నారు.
🙏 ఇతి యాజ్ఞవల్క్య ఉపనిషత్ | 🙏
ఓం శాంతిః శాంతిః శాంతిః ||