[[@YHRK]] [[@Spiritual]]

Amruta Nāda Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 2
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: yhrkworks@gmail.com

కృష్ణ యజుర్వేదాంతర్గత

1     అమృతనాదోపనిషత్

శ్లోక తాత్పర్య పుష్పమ్


శ్లో।। అమృతనాదోపనిషత్ ప్రతిపాద్యం పరాక్షరం
త్రైపదానంద సామ్రాజ్యం హృది మే భాతు సర్వదా।।

‘‘అమృతనాదోపనిషత్’’ చే ప్రతిపాదించబడుచున్న పరాక్షరము, త్రైపదానంద సామ్రాజ్యము నా హృదయమునందు సదా భాసించును గాక!

ఓం
1. ఓం। శాస్త్రాణి అధీత్య మేధావీ
అభ్యస్య చ పునః పునః
పరమం బ్రహ్మ విజ్ఞాయ
ఉల్కావత్ తత్ అన్యథో విత్సృజేత్।।
‘ఓం’కార స్వరూపమగు పరబ్రహ్మమునకు నమస్కరిస్తున్నాము.
తెలివైన వాడెవ్వడూ ‘మానవజన్మ’ అనే మహత్తరమైన అవకాశమును వృథా చేసుకోడు.
ఆత్మతత్త్వమును ప్రతిపాదిస్తున్న శాస్త్రములను పునః పునః (మరల- మరల) అధ్యయనం చేయాలి. వాటియందలి పరబ్రహ్మతత్త్వసారమును గ్రహించాలి.
వంట చేసుకొన్న తరువాత మండుచున్న కట్టెలను ఆవల పారవేసి పచనమైన ఆహారం స్వీకరిస్తున్నట్లుగా శాస్త్రములలోని తదితరమైన విశేషాలు వదలివేయాలి. పచనమైన మధుర పదార్థము యొక్క రుచివలె ఆత్మానందమును ఆస్వాదించాలి.
2. ‘ఓం’ కార రథమ్ ఆరుహ్య,
విష్ణుం కృత్వా అథ సారధిమ్,
బ్రహ్మలోకపద అన్వేషీ
రుద్ర ఆరాధన తత్పరః।।
జాగృత్ - స్వప్న- సుషుప్తులకు ఆవల, వాటికి కేవల సాక్షి అయినట్టి ‘ఓం’ సంజ్ఞారూప పరతత్త్వమే మన రథము. సర్వాంతర్యామి - సర్వగతుడు అగు విష్ణుదేవుడు - (విష్ణుత్వమే) మన రథసారధి. సర్వము బ్రహ్మముగా సందర్శించగల బ్రహ్మలోకపదమే మన అన్వేషణ. రుద్రోపాసనయే మన ఆరాధనా తత్పరత్వము. శివో2హమ్। శివో2హమ్।
3. తావత్ రథేన గంతవ్యం
యావత్ రథపథి స్థితః,
స్థాతా రథపతి స్థానం
రథమ్ ఉత్సృజ్య గచ్ఛతి।।
బ్రహ్మజ్ఞాన పాఠ్యాంశాలచే బుద్ధి నిర్మలమయ్యేంత వరకు ఎంతెంత వరకు రథమార్గము (ఓంకారోపాసన) తీసుకువెళుతోందో, అంతవరకు (ఉపాసనాపరుడై) ప్రయాణించాలి. ఒక ప్రయాణీకుడు లక్ష్యమైనట్టి ప్రదేశము చేరగానే వాహనమునును వదలి, ఆ చోటు చేరుతాడు కదా!
(రథమార్గము ఉన్నంత వరకు రథమార్గంలో పోయి) ఆపై ఆ రథమును వదలి బ్రహ్మలోకములో ప్రవేశించాలి. (Just Like Parking the Vehicle aside and entering the Zone of Self)
4. మాత్రా-లింగపదం త్యక్త్వా
శబ్దవ్యంజన వర్జితమ్
అస్వరేణ మకారేణ
పదగ్ం సూక్ష్మం హి గచ్ఛతి।
ఈ భౌతిక ప్రపంచంలో అనుభవానికి వస్తున్న శబ్ద-స్పర్శ-రూప-రస-గంధ పంచాతన్మాత్రలను, స్త్రీ-పురుష-జాతి ఇత్యాది భేదములను, శబ్ద భేదములుగా చెప్పబడేవి - వినిపిస్తున్నవి- ఇవన్నీ త్యజించి అత్యంత సూక్ష్మ దృష్టితో సత్యవస్తువును వెతకాలి. ఆ బ్రహ్మపదమువైపుగా ప్రయాణించాలి. ఇక్కడి రూప-నామ-శబ్దాది విషయాలను చూచి మనస్సు చెదరకుండా జాగ్రత్తపడాలి.
5. శబ్దాది విషయాన్ పంచ, మనశ్చ ఏవ అతి చంచలమ్,
చింతయేత్ ఆత్మనో రశ్మీన్, ‘ప్రత్యాహారః’ స ఉచ్యతే।।
జగత్ విషయచింతనను వదలి, మనస్సు తేజోమయమగు ఆత్మ తేజస్సు, ఆత్మచైతన్యము గురించి మాత్రమే చింతన చేయటమునే అష్టాంగ యోగాలలో ఒకటైనట్టి ‘‘ప్రత్యాహారము’’గా చెప్పబడుతోంది.
6. ‘ప్రత్యాహారః’, తథా ‘ధ్యానం’, ‘ప్రాణాయామో’ అథ ధారణా,
తర్కశ్చ ఏవ ‘సమాధి’శ్చ, షట్(6) అంగో ‘యోగ’ ఉచ్యతే।।
(1) ప్రత్యాహారము, (2) ధ్యానము, (3) ప్రాణాయామము, (4) ధారణ, (5) తర్కము (నిత్యానిత్య వివేకముతో కూడిన విచారణ), (6) సమాధి.
ఈ ఆరు కూడా యోగము యొక్క అంగములుగా చెప్పబడుచున్నాయి.
7. యథా పర్వత ధాతూనాం
దహ్యంతే ధమనాన్ మలాః
తథా ఇంద్రియకృతా దోషాన్
దహ్యంతే ప్రాణ ధారణాత్।।
ఏ విధంగా అయితే పర్వత ప్రదేశాలలో లభించే ఖనిజ ధాతువులను కొలిమిలో కాల్చి మలినములను తొలగిస్తామో…..,
ఆ విధంగానే ఇంద్రియములను ఉపయోగిస్తున్నప్పుడు మనస్సును అంటుచున్న (సంబంధ - బాంధవ్య - సంగతి - అభిప్రాయ-ఆవేశ మొ।।న) దోషములను ప్రాణయోగధారణతో తొలగించుకోవాలి.
8. ప్రాణాయామైః దహేత్ దోషాన్
ధారణాభిశ్చ కిల్బిషమ్
ప్రత్యాహారేణ సంసర్గాన్
ధ్యానేన అనీశ్వరాన్ గుణాన్।।
ఈ విధంగా ప్రాణమాయ సాధన ద్వారా మనో దోషాలు తొలగించు కుంటూ.. ధారణచే మనస్సు యొక్క పాపదృష్టులను వదిలించుకుంటూ రావాలి. ప్రత్యాహారము సహాయంతో దృశ్య విషయములతో సంసర్గత (Relatedness)ను జయించాలి. ‘ధ్యానము’ సహాయంతో (అహంకారం, దర్పం, క్రోధం ఇత్యాది) అనీశ్వరీ-ఆసురీ గుణములను మొదలంట్లా తొలగించుకోవాలి.
9. కిల్బిషం హి క్షయం నీత్వా
రుచిరం చ ఏవ చింతయేత్।।
ఈ విధంగా దోషదృష్టులను, దోషభావములను క్షయింపజేసుకుంటూ మధురాతిమధురమగు పరమాత్మతత్త్వమును చింతన చేయటం వృద్ధి చేసుకోవాలి.
10. రుచిరగ్ం రేచకం చ ఏవ, వాయోః ఆకర్షణం తథా,
ప్రాణాయామాః త్రయః ప్రోక్తా, రేచక-పూరక-కుంభకాః।।
(1) కుంభకము (2) రేచకము, (3) పూరకము.. అను రీతిగా ప్రాణశక్త్యోపాసనా రూపమగు ప్రాణాయామము ‘3’ విధాలుగా చెప్పబడుతోంది. అవి రుచిరగము- రేచకము - వాయు ఆకర్షణము రూపంగా ఉంటున్నాయి.
11. స వ్యాహృతిమ్ స ప్రణవాం
గాయత్రీం శిరసా సహ
త్రిః పఠేత్ ఆయత ప్రాణః
‘ప్రాణాయామః’ స ఉచ్యతే।।
(1) వ్యాహృతి (prana placement) - (2) ‘ఓం’ అను ప్రణవము
(3) గాయత్రీ మహామంత్రము - అనే శిరస్సు - ‘3’ సార్లు పఠించటం
ఈ మూడూ కలిపి త్రిపఠన ప్రాణ ఉపాసనను ప్రాణాయామము → అని పిలుస్తున్నారు.
12. ఉతిప్య (ఉత్+క్షిప్య) వాయుమ్ ఆకాశమ్
శూన్యం కృత్వా నిరాత్మకమ్, శూన్యభావే నియుంజీయాత్
‘రేచకస్య’ ఇతి లక్షణమ్।।
రేచకము : శ్వాసకోశములోని వాయువును - బాగుగా బయటకు వదలి - నిరాత్మకమగు (నిర్విషయస్వరూపమగు) శూన్యాకాశములో లయింపజేసి నిర్విషయ - శూన్య భావనను యోగసాధనగా నిర్వర్తించటమును ‘రేచకము’ అను ప్రాణాయామ విభాగము యొక్క ముఖ్య లక్షణముగా చెప్పబడుతోంది.
13. వక్త్రేణ ఉత్పల నాళేన, తోయమ్ ఆకర్షయేత్ నరః
ఏవం వాయుః గృహీతవ్యః, ‘పూరకస్య’ ఇతి లక్షణమ్।।
పూరకము : తామర కాడ ద్వారా నీరు పీల్చుతామే! ఆ రీతిగా శ్వాసవాయువును లోపలికి పీల్చి యోగమును అభ్యసించటమును ‘పూరకము’ యొక్క లక్షణముగా అభివర్ణించుచున్నారు.
14. న చ ఉచ్ఛ్యసేత్ న చ నిశ్వాసైః
నైవ గాత్రాణి చాలయేత్,
ఏవం భావే నియుంజీయాత్
‘కుంభకస్య’ ఇతి లక్షణమ్।।
కుంభకము : ఇక ‘కుంభకము’ యొక్క లక్షణము ఏమంటే..,
- ఉచ్ఛ్వాస - నిశ్వాసలను నిలిపి ఉంచి,
- దేహమును కదలకుండా అట్టేబెట్టి, పరస్వరూపమగు నిర్విషయ - నిరాకాశ - శూన్యరూపమగు నిర్మల భావనను అవధరించటము.
15. అంధవత్ పశ్య రూపాణి
శబ్దం - బధిరవత్ శృణు।
కాష్ఠవత్ పశ్య వై దేహమ్
ప్రశాంతస్య ఇతి లక్షణమ్।।
ప్రశాంతుని లక్షణము: మనస్సును ప్రశాంత స్థితికి తీసుకువస్తూ ఉండాలి.
ప్రశాంత స్థితి అనగా…
→ నామరూపాత్మకమైన దృశ్య విషయములను గ్రుడ్డివాడివలె చూస్తూ ఉండటం. కళ్ళకు కనబడుచూ ఉన్నప్పటికీ ఏమాత్రము కించిత్ కూడా లేనివిగా చూస్తూ ఉండటము.
→ శబ్దములను చెవిటి వానివలె వింటూ ఉండటం. చెవులకు వినబడుచున్నప్పటికీ ఏమాత్రము వినబడని నిశ్శబ్దము ఆస్వాదించటము.
→ ఈ శరీరమును, తదితర శరీరములను జడమగు కొయ్యలవలె భావించటము. ఇవి శాంతమనస్కుని లక్షణములు.
16. మనః సంకల్పకం ధ్యాత్వా,
సంక్షిప్య ఆత్మని బుద్ధిమాన్,
ధారయిత్వా తథా ఆత్మానం
‘ధారణా’ → పరికీర్తితా।।
ధారణ : మనస్సు సంకల్పక రూపము. అట్టి సంకల్పరూప మనస్సు యొక్క ధ్యాసను ధ్యాస సహాయంతో గమనిస్తూ ఆ మనస్సును బుద్ధిమంతుడు ఆత్మయందు స్థాపించుచున్నాడు. (భేదములను మనస్సుతో అధిగమించి సర్వము ఆత్మగా గాంచటమునే ‘‘ఆత్మయందు మనస్సును స్థాపించటము’’గా చెప్పబడుతోంది). ఆత్మ యందు మనస్సును నిలుపటమును ‘ధారణ’ అనే పేరుతో చెప్పుచున్నారు. మనస్సును కూడా ఆత్మకు అభిన్నంగా చూడటమే ఆత్మ యందు నిలపటం. ఆలోచనలు త్యజించినప్పటి కేవల మనస్సు ఆత్మస్వరూపమే. ‘కనబడేదంతా ఆత్మయే’ - అనునదే ధారణ!
17. ఆగమస్య అవిరోధేన,
ఊహనమ్ ‘తర్క’ ఉచ్యతే।
సమం మన్యేత యల్లబ్ద్వా,
స ‘సమాధిః’ పరికీర్తితః।।
తర్కము : వేద ప్రవచనములకు, వేదమహావాక్యములకు సానుకూలమైన రీతిగా అవగాహన-ఊహ-అనుభూతులను వృద్ధి చేసుకోవటమునే ‘తర్కము’ అని అంటున్నారు.
సమాధి: దేనిని పొందిన తరువాత అయితే ‘‘సర్వమూ సర్వే-సర్వత్రా సర్వదా బ్రహ్మము మాత్రమే’’గా అను సర్వసమత్వము అనుభూత మౌతుందో.. అయ్యదియే సమాధి.
18. భూమౌ దర్భాసనే రమ్యే, సర్వదోష వివర్జితే
కృత్వా మనోమయీం రక్షాం, జప్త్వా వై రథమండలే।।
జపము : అట్టి ధారణ - సమాధిల అభ్యాసము కొరకై.., రమ్యము - పరిశుద్ధము అగు స్థానములో భూమిపై దర్భలతో పరచిన ఆసనమును పరచుకోవాలి. రథమండలముపై ఆశీనుడై మంత్రమూర్తిని మనస్సుతో ఉపాసిస్తూ మంత్రమును జపించాలి.
19. పద్మకం స్వస్తికంవాపి, భద్రాసనం అథాపి వా
బధ్వా సుఖాసనం సమ్యక్, ఉత్తరాభిముఖః స్థితః।।
ఆసనం : పద్మకాసనంగాని, స్వస్తికాసనంగాని, భద్రాసనముగాని మరి ఏదైనా సాధకుని యొక్క సుఖమైన యోగాసనం వైచుకొని ఉత్తర దిక్కుకు అభిముఖంగా కూర్చోవాలి. కూర్చుని ధ్యానమును ఇక ప్రారంభించాలి.
20. నాసికాపుటం అంగుళ్యా పిధాయ
ఏకేన మారుతమ్ ఆకృష్య
ధారయేత్ అగ్నిం।
శబ్దమేవ విచింతయేత్।।
ఒక ముక్కు పుటమును బొటనవ్రేలుతో నొక్కిపట్టి, రెండవ ముక్కు పుటముతో గాలిని లోనికి నెమ్మది నెమ్మదిగా పీల్చి అగ్ని యొక్క తేజస్సును ధారణ చేస్తూ ప్రణవము (ఓం)నుగాని, గాయత్రీ మంత్రమును గాని, పంచాక్షరి - షోడషాక్షరి ఇత్యాది ఇష్టదైవ శబ్దబ్రహ్మమును మనస్సుతో అశబ్దరూపంగా శబ్దీకరించుకోవాలి.
21. ‘‘ఓం’’ ఇతి ఏక-అక్షరం బ్రహ్మ
ఓం ఇత్యేతేన రేచయేత్।
దివ్య మంత్రేణ బహుధా
కుర్యాత్ అమల ముక్తయే।।
ఏకము - అక్షరము - పరబ్రహ్మము యొక్క సంజ్ఞయగు ‘ఓం’కారముతో రేచకమును (గాలి బహిర్గతం చేసి నిలుపు ధ్యానమును) అభ్యసించాలి.
ఈ విధంగా (20, 21 శ్లో।। లలో చెప్పుచున్న విధంగా) అనేక మార్లు దివ్యమంత్రమును రేచకపూరక ప్రాణాయామ విధిగా మననం చేస్తూ మనస్సులోని మలినమంతా తొలగే వరకు కొనసాగించాలి.
22. పశ్చాత్ ధ్యాయీత పూర్వోక్త క్రమశో
మంత్రవిత్ బుధః
స్థూలాది స్థూల సూక్ష్మంచ
నాభేః ఊర్ధ్వమ్ ఉపక్రమః।।
తరువాత, శబ్ద బ్రహ్మమును ఉపాసించు విజ్ఞుడు పైన చెప్పిన విధంగా నాభి (బొడ్డు) యొక్క పై (ఊర్ధ్వ) భాగము నుండి ధ్యాసను ప్రారంభించి స్థూలాతి స్థూల, సూక్ష్మాతిసూక్ష్మమగు ఆత్మోపాసన కొనసాగించాలి.
23. తిర్యక్-ఊర్ధ్వమ్-అధో దృష్టిమ్, విహాయ చ మహామతిః
స్థిరస్థాయీ వినిష్కంపః, సదా ‘‘యోగం’’ సమభ్యసేత్।।
సాధకుడు మహామతి అయి, అడ్డముగా, నిలువుగా, క్రిందికిగా-ప్రసరిస్తున్న ధ్యాసలను, దృష్టులను వదలి, స్థిరమైన-కంపనములు లేనట్టి దేహ నిశ్చలతతో (కదలని నిశ్చలదేహధారణతో) నిత్యము యోగాభ్యాసము చేస్తూ ఉండాలి.
24. నాళమాత్ర వినిష్కంపో, ధారణా యోజనం తథా
ద్వాదశ మాత్రో (12) యోగస్తు, కాలతో నియమ స్మృతః
చలించని కంఠనాళముతో ధారణను అభ్యసిస్తూ ఉండాలి. ఈ విధంగా అభ్యాసకాలము పెంచుకుంటూ 12 మాత్రల వరకు వాయునిరోధక కాలమును యోగాభ్యాసము ద్వారా పెంచుకుంటూ పోవాలి.
25. అఘోషం, అవ్యంజనం, అస్వరంచ
యత్ తాలు - దంత-ఓష్ఠమ్ - అనాసికం చ యత్
అరేఫజాతం ఉభయోః ఊష్మ వర్జితం
యత్, అక్షరం న క్షరతే కథంచిత్।।
ఉపాస్య వస్తువగు అక్షరపరబ్రహ్మము ఎట్టిదో జ్ఞాపకం పెట్టుకునియే యోగాభ్యాసానికి ఉపక్రమించటం, నిర్వర్తించటం చేయాలి.
→ ఆ అక్షర పరబ్రహ్మము శబ్దరహితమైనది. ఎటువంటి విషయ- వ్యవహారములకు సంబంధం లేనిది. స్వరరహితమైనది. తాలు (కొండనాలుక) - దంత - పెదవులు - ముక్కు స్థాన పరిమితమైనది కాదు. రేఫము - ఉచ్ఛ్వాస - నిశ్వాస రూపం కాదు. అట్టి అక్షర - మధుర- బ్రహ్మరూపమగు ఆత్మయే ఉపాసనా విషయమై మననము చేయబడాలి.
26. యేనా అసౌ గచ్ఛతే మార్గం, ప్రాణః తేన అభిగచ్ఛతి।
అతః తమ్ అభ్యసేత్ నిత్యం, యత్ మార్గ గమనాయ వై।।
ప్రాణము ఇష్టరూపంగా ఎటు వెళ్లితే, జీవాత్మ కూడా అటే వెళ్ళగలదు. అందుచేత ప్రాణాయామ మార్గము సర్వాత్మకమగు సత్యవస్తువు వైపుగా అయి ఉండుగాక! అప్పుడు ఈ జీవాత్మ పరమాత్మయే అగుచున్నాడు.
27. హృత్ ద్వారం వాయు ద్వారం చ
మూర్ధ్ని ద్వారం అథా పరమ్,
మోక్ష ద్వారం బిలం చ ఏవ
సుషిరగ్ం మండలం విదుః।।
- ‘‘హృదయ ద్వారము,
- ప్రాణాయామాదులచే గమనించబడే వాయుద్వారము,
- సహస్రార ప్రారంభ స్థానములో (నుదురులో) అనుభూతమయ్యే బ్రహ్మద్వారము- ఇవన్నీ కూడా మోక్ష ద్వారమగు సుషిరగద్వారములే।’’
… అనే అవగాహనతో యోగాభ్యాసము నిర్వర్తించబడుగాక! ‘‘ఈ ప్రాణయోగ సాధన నాకు మోక్షము ప్రసాదించగలదు’’.. అనే నమ్మికతో సాధన కొనసాగాలి. సాధనపై, శాస్త్రముపై, గురువుపై, తనపై గురి ఉండాలి సుమా! ‘‘ఇదంతా వృధాయేమో?’’ అనే శంకను దరిజేరనీయరాదు.
28. భయం క్రోధం, అథ ఆలస్యమ్,
అతిస్వప్న, అతి జాగరమ్,
అత్యాహారమ్, అనాహారమ్,
నిత్యం యోగీ వివర్జయేత్।।
ప్రాణయోగ సాధన చేస్తూ ఉండగా, ఆ యోగాభ్యాసికి బద్ధకమే ముఖ్య శత్రువు.
(1) భయము (2) క్రోధము (కోపము), (3) బద్ధకము, (4) అతినిద్ర, (5) అతి మెళుకువ, (6) అధికంగా - ఆహారం, (7) అల్పంగా ఆహారం… ఇటువంటివి యోగి వదలినవాడై ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ యోగాభ్యాసానికి నిరోధకములు కాగలవు.
29. అనేన విధినా సమ్యక్
నిత్యం అభ్యస్యతే క్రమాత్,
స్వయం ఉత్పద్యతే జ్ఞానం
త్రిభిః మాసైః। (అత్ర) న సంశయః।।
ఈ విధంగా ఒక విధి-విధానంగా (With a regularity and Discipline), ఒక క్రమమైన రీతిగా ఏ యోగసాధకుడైతే రేచక - కుంభక- పూరక ప్రాణాయామాభ్యాసాలను నిర్వర్తిస్తాడో… అట్టి వాని హృదయంలో 3 నెలల కాలంలో ఆత్మసంబంధమైన జ్ఞానము అనే వెలుగు స్వయముగా వెల్లివిరియగలదు. ఇందులో సందేహమే లేదు.
30. చతుర్భిః పశ్యతే దేవాన్।
పంచభిః వితత క్రమాన్।
ఇచ్ఛయా ఆప్నోతి కైవల్యమ్
షష్ఠేమాసి న సంశయం।।
అట్టి ప్రాణాయామ సాధనను విధిగాను, అనునిత్యముగాను 4 నెలల కాలం యోగసాధన చేస్తే దేవతాదర్శనము కాగలదు. 5 నెలల పాటు నిర్వర్తిస్తే నిత్యానిత్య వివేకము రూపుదిద్దుకొనగలదు. ఇష్టంగా, శ్రద్ధగా 6 నెలల కాలం, ప్రాణాయామాభ్యాసమైన రేచక -కుంభక -పూరకములచే కైవల్యము లభించగలదు. ఇందులో సందేహం లేదు.
31. పార్థివః పంచమాత్రస్తు
చతుర్మాత్రస్తు వారుణః
ఆగ్నేయస్తు త్రి-మాత్రో అసౌ
వాయవ్యస్తు ద్విమాత్రకః।
అట్టి ప్రాణాయామ యోగ అభ్యాస కాలంలో..
5 మాత్రల కాలం → భూతత్త్వమును
4 మాత్రల కాలము → జల తత్త్వమును,
3 మాత్రల కాలము → అగ్నితత్త్వమును
2 మాత్రల కాలము → వాయు తత్త్వమును
32. ఏక మాత్ర తథా ఆకాశో హి
అమాత్రం తు విచింతయేత్
సంధిం కృత్వాతు మనసా
చింతయేత్ ఆత్మనా ఆత్మని
ఒక మాత్ర ఆకాశతత్త్వమును (అహమ్ పార్థివః, వరుణః.. ఇట్టి రూపంగా) భావనా భ్యాసం చేస్తూ, క్రమంగా మాత్రరహితంగా (Sans bit of time) అమాత్రమును→కాలః కాలమగు ఆత్మతో అనుసంధానం చేసుకుంటూ ఉండాలి. మనస్సును ఉపయోగించి ఆత్మతో ఆత్మ గురించి చింతన చేస్తూ రావాలి. (మాత్ర = కనురెప్పమూసి - తెరిచే కాలము).
33. త్రింశత్ సర్వ అంగుళః ప్రాణో
యత్ర ప్రాణైః ప్రతిష్ఠితః,
ఏష ‘ప్రాణ’ ఇతి (ఆ)ఖ్యాతో
బాహ్య ప్రాణస్య గోచరః।।
ప్రాణయోగ సాధన చేస్తూ ఉన్నప్పుడు ఆత్మయందు ప్రాణశక్తి జనిస్తూ - చరిస్తున్న విధిని గమనిస్తూ ఉండాలి. నాశికకు 30/2 = 15 అంగుళముల దూరంగా ఏ స్థానం వరకు ప్రాణశక్తి బాహ్యంగా సంచారాలు చేస్తోందో.. అది గమనించబడుగాక! అట్టి సంచరించు శక్తితత్త్వమునే ‘ప్రాణశక్తి’ అని పిలుస్తున్నారు. అదియే ‘బహిర్‌ప్రాణము’ అను గుర్తుగా కూడా చెప్పుచున్నారు.
34. ఆశీతిశ్చ షట్-శతం చ ఏవ, సహస్రాణి త్రయోదశః,
(1,13,680) లక్ష్యస్య ఏకో వినిశ్వాసో, అహోరాత్ర ప్రమాణతః।।
ఒక లక్ష పదమూడు వేల ఆరువందల ఎనుబది (1,13,680) శ్వాసలు ఒక రాత్రి - పగలు (ఒకరోజు)న జరుగుచున్నట్లుగా ప్రాణ యోగ శాస్త్రప్రావీణ్యులు విశదపరచుచున్నారు.
35. ప్రాణో ఆధ్యో హృది స్థానే। అపానస్తు పునః గుదే।।
సమానో నాభి దేశేతు, ఉదానః కంఠమ్ ఆశ్రితః।।
36. వ్యానః సర్వేషు చ అంగేషు వ్యాప్య తిష్ఠతి సర్వదా।
అథ వర్ణాస్తు పంచానాం, ప్రాణాదీనామ్ అనుక్రమాత్।।
పంచ ప్రాణములు ఎక్కడెక్కడ కేంద్రీకృతమై - వ్యాపిస్తూ ఉన్నట్లు ప్రాణామాయ యోగులు గమనిస్తున్నారో.. ఆ వివరాలు వినండి.
హృదయ స్థానంలోఉండునది ప్రాణము. గుదస్థానంలో చరించేది అపానము. కంఠ స్థానమును ఆశ్రయించి ఉండేది ఉదానము. నాభియందు సమానము. దేహము లోని సర్వ అంగములలో సర్వదా వ్యాపించి సంచారాలు చేస్తూ ఉన్నది వ్యాన ప్రాణము. ఇప్పుడిక పంచ ప్రాణముల యొక్క యోగానుభవమగు వర్ణము (రంగు) యొక్క (యోగుల) అనుభూతిని చెప్పుకుందాం.
37. రక్తవర్ణో మణిప్రఖ్యః, ప్రాణవాయుః ప్రకీర్తితః।
అపాన స్తనమధ్యేతు, ఇంద్రగోపసమః ప్రభః।।
ప్రాణవాయువు రక్తవర్ణంలో ఎర్రగా ప్రకాశించే మణివలె ధగద్ధగాయ మానకాంతులతో (హృదయ ప్రదేశమునందు) ప్రకాశిస్తోంది.
అపానవాయువు దేహము మధ్య భాగంలో స్తనముల మధ్యగా నీలంగా ఇంద్ర గోపమణి ప్రభలతో వెలుగుతూ కనిపిస్తోంది.
38. సమానస్తు ద్వయోః మధ్యే, గోక్షీర ధవళ ప్రభః
అపాండర ఉదానశ్చ, వ్యానో హి అర్చిః సమప్రభః।।
ఆ ప్రాణ -అపానముల మధ్యగా సమాన వాయువు ఆవుపాల వలె తెల్లటి కాంతులతో ప్రకాశిస్తూ అనుభూతమౌతోంది. ఉదాన వాయువు నల్లటి కాంతులతో ఊర్ధ్వముఖి అయి విరాజిల్లుతోంది. వ్యానవాయువు అగ్ని యొక్క తేజము వలె అగ్నికిరణ (బంగారు) రంగుగా అనుభవమౌతోంది.
39. యస్య ఇదం మండలం భిత్వా
మారుతో యాతి మూర్ధని,
యత్ర యత్ర మ్రియేత్ వాపి
న స భూయో అభిజాయతే!
న స భూయో అభిజాయత।।

ప్రాణవాయు (ప్రాణయోగ) అభ్యాసం చేత పైన చెప్పుకున్న వాయు మండలమును ఛేదించుకొని ఎవని యొక్క ప్రాణవాయు శక్తి చిత్త సమన్వితంగా బ్రహ్మరంధ్రమును ఛేదించి మూర్ధ ఊర్ధ్వ స్థానమైనట్టి సహస్రారమును చేరుచున్నదో,.. అట్టివాడు ఎక్కడ - ఎప్పుడు ఈ భౌతిక దేహమును త్యజించినా కూడా…. ఆతనికి పునఃజన్మలు లేవు. ఉండవు. వర్తమాన క్షణంలోనే దేహాతీతుడు అగుచున్నాడు.

ఇతి అమృతనాదోపనిషత్।
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।।



కృష్ణ యజుర్వేదాంతర్గత

1     అమృతనాద ఉపనిషత్

అధ్యయన పుష్పము

మానవ జీవిత లక్ష్యం

వేద-వేదాంగ శాస్త్రములచే ప్రతిపాదించబడుచున్న ‘ఓం’ అను సంజ్ఞార్థమగు పరమాత్మకు నమస్కరిస్తున్నాము.

ఎనుబది నాలుగు లక్షల జీవజాతులలో మానవ జన్మ మహత్తరమైన అవకాశము అయి ఉన్నది. తెలివైనవాడెవ్వడైనా అటువంటి ఉత్కృష్టమైన, దుర్లభమైన, కాలనియమితమైన అవకాశమును వృధా చేసుకోడు. ఆత్మజ్ఞాన సాధనలకు ఉపక్రమించాలి. ఆత్మతత్త్వమును ప్రకటించుచున్న సత్-శాస్త్రములను మరల - మరల అధ్యయనం చేయాలి. ఆ శాస్త్రములలోని పరబ్రహ్మతత్త్వమునకు సంబంధించిన సారవస్తువును తెలుసుకుంటూ ఉండాలి.

పొయ్యిలో మండుచున్న కట్టెలను చల్లపరచి, ప్రక్కను పడవేసి పచనమైన వంటపదార్థములను ఈవలకు తెచ్చి చక్కగా భుజిస్తాము కదా! ఆ విధంగా సాధన పరికరములను, శాస్త్రములలోని జ్ఞాన సారాంశమును స్వీకరించి, తదితరమైన (పేర్లు - రూపములు- కథ - చరిత్ర - వర్ణనలు ఇత్యాది) కథన విశేషాలను ఆ ప్రక్కగా వదిలివేయాలి.

జాగ్రత్ - స్వప్న - సుషుప్తులకు ఆవల కేవల సాక్షియై ప్రకాశించుచున్న పరతత్త్వ జ్ఞానమే మనము అధిరోహించవలసిన రథము. సర్వస్వరూపుడు, సర్వాంతర్యామి, సర్వగతుడు అగు విష్ణుభగవానుడే (అర్జున రథము వలె) మన ఆత్మజ్ఞాన రథమునకు రథసారధి. సర్వము బ్రహ్మతత్త్వముగా దర్శించే బ్రహ్మలోక నివాసమే మన అన్వేషణ యొక్క ముఖ్య ఆశయము. రుద్ర భగవానుని ఉపాసనయే ఆరాధనా తత్పరత్వము. బుద్ధి యొక్క సునిశితత్వము - నిర్మలత్వములే రథయానమార్గము.

బుద్ధి పూర్తిగా నిశ్చలత్వము, ఆత్మతత్త్వ సందర్శనా సామర్థ్యము సంపాదించుకొనే వరకు మనము శాస్త్రములు సూచిస్తున్న మార్గములో సాధనములు ఆశ్రయించవలసిందే! సాధన సంపత్తి సముపార్జించుకోవలసిందే! దృశ్యజాడ్యము పూర్తిగా తొలగిందా.., ఇక ఈ జీవుడు రథరూప సర్వసాధనలు (Practices) వదలి, లక్ష్యస్థానమగు బ్రాహ్మీభావము అనే బ్రహ్మలోక నివాసములో ప్రవేశిస్తున్నాడు.

ఆ రథికుడు అనుకున్న చోటికి వెళ్లిన తరువాత రథమును విడచి తాను చేరవలసిన ప్రదేశంలో ప్రవేశించటం సహజమే కదా! ఆ రీతిగానే శబ్ద-స్పర్శ-రూప-రస-గంధ సంబంధమైన, స్త్రీ పురుష ఇత్యాది భేదములతో కూడిన సర్వ విశేషములను, వ్యవహారిక సంబంధమైన సర్వ శబ్దజాలమును ప్రక్కకు పెట్టి.. ఇక అత్యంత సూక్ష్మ దృష్టితో సూక్ష్మాతి సూక్ష్మమగు ఆత్మను త్వమ్‌గాను, జగత్ స్వరూపముగాను, స్వస్వరూపాత్మగాను, ఈ సమస్తముగాను సర్వదా సర్వత్రా సందర్శించటం…. అనే ఆత్మపదమును చేరుకోవాలి!

ఇదియే వాస్తవ జీవితాశయం!

ప్రత్యాహారము

ఈ నామ రూపాత్మకమైనదంతా శబ్ద-స్పర్శ-రూప-రస-గంథములనబడే పంచతన్మాత్రలే! ఏ లోకంలో ఏది తారసబడినా కూడా ఈ ఐదిటి సంబంధమైనవే! వీటి పట్ల అజ్ఞానం చేత మనస్సు అతిచంచలమై ఉంటోంది. అందుచేత జీవుడు ఈ ఐదిటి సంబంధమైన చింతనలను అధిగమిస్తూ ‘‘అంతా ఆత్మ యొక్క సంప్రదర్శనమేకదా!’’.. అను చింతనను వృద్ధి చేయగల మార్గములను ఆశ్రయించాలి.

1) పంచతన్మాత్ర సంబంధమైన చింతన తగ్గుతూ రావటం,
2) సర్వాధారమగు ఆత్మ చింతన అధికాధికమగుచూ ఉండటం…..
ఇవియే అష్టాంగ యోగములలోని ‘ప్రత్యాహారము’.

ధ్యానము

ధ్యాసయే ధ్యానము. ‘‘కేవలుడు, సర్వస్వరూపుడు, స్వకీయ సందర్భాతీత స్వస్వరూపుడు’’ అగు పరమాత్మ ధ్యాసయే ధ్యానముయొక్క మహదాశయము.

యోగ షడంగములు

(1) ప్రత్యాహారము
(2) ధ్యానము
(3) ప్రాణాయామము
(4) ధారణ
(5) తర్కము (విచారణ -Analysis)
(6) సమాధి
ఈ ఆరు కూడా షష్టాంగ యోగములు. యోగము యొక్క ‘6’ అంగములు.

యోగసాధనా పూర్వకమైన ప్రాణధారణ ఎందుకోసం?

పర్వత ప్రదేశాలలో ఖనిజ ధాతువులు (Raw Metals) లభిస్తాయి కదా అని వెళ్ళుతాము. శ్రమించి వెతికి వెతికి తెచ్చుకుంటాము. అప్పుడు ఏమి చేస్తాం? ఆ ధాతువుతో కలిసిపోయి ఉన్న మలిన పదార్థములను తొలగించే ప్రయత్నంగా అగ్నిలో పుటం వేస్తాము. నిర్మలమైన ఖనిజమును బయటకు తీసి అటు తరువాత ఉపయోగిస్తాము.

అదే రీతిగా..
ఇంద్రియములను ఉపయోగించుచున్నప్పుడు మనస్సును తాకుచూ ఉండే దోషములను ‘ప్రాణాయామము’ అను యోగాగ్నిలో దహించి, అప్పుడు ఆ మనస్సును జ్ఞాన విశేషాలు సముపార్జించుకోవటానికై సంసిద్ధము చేయాలి. అట్లా ప్రాణయోగ సాధనను నిర్వహిస్తూ ఉద్దేశ్యిస్తూనే మరొక వైపు నుండి.. తదితర యోగాంగాలను కూడా మహదాశయసిద్ధికై ఆశ్రయిస్తూ ఉండవలెను సుమా!

ప్రాణాయామము : ప్రాణాయామము అనే అభ్యాసముచే మనస్సులోను, బుద్ధిలోను ఇంద్రియ వినియోగము కారణముగా రూపుదిద్దుకున్న దోషములను కాల్చివేయబడతాయి. విషయ సంయోగ దోషములు తొలగిపోతాయి.

ధారణ : ధారణచే మనస్సులో గల దోష దృష్టులను జయించి వేయాలి. ‘‘సర్వము పరమాత్మ యొక్క లీలా వినోదపూర్వకమైన ప్రత్యక్ష విన్యాస చమత్కారమే’’…. అను భావమును ప్రవృద్ధం చేసుకోవటమే ధారణ!

ప్రత్యాహారము : ఇంద్రియములను భక్తి - యోగ - జ్ఞాన సంబంధమైన కార్యక్రమములలో నియోగించాలి. ఆ రీతిగా శాస్త్రములు - గురువులు బోధిస్తున్న మార్గంగా ఆయా ప్రత్యేక కార్యక్రమములలో నియమించటమే ప్రత్యాహారము. తద్వారా ప్రాపంచక విషయములలో గల సంపర్కము (Attatchment/Relatedness)ను జయించివేస్తూ, త్యజిస్తూ ఉండే ప్రయత్నమును ‘ప్రత్యాహారము’ అని చెప్పుచున్నారు.

ధ్యానము : భగవత్ సంబంధమైన సాధనములు - జ్ఞాన విశేషాల పట్ల ధ్యాస ప్రవృద్ధ పరచుకోవటమే ధ్యానము యొక్క అంతర్లీన తత్త్వము. ధ్యాసయే ధ్యానము యొక్క మూల రూపము.

ఇదియే ధ్యానము యొక్క ముఖ్య ఆశయము, ప్రయోజనము కూడా.

ఈ విధంగా దోష దృష్టులను, పాప స్వభావ-అభ్యాసములను ప్రాణాయామ-ధారణ-ప్రత్యాహార-ధ్యానాదుల ద్వారా వదిలించుకుంటూ, మరొక వైపుగా పరమసత్యమగు మధురాతిమధుర ఆత్మ గురించిన సమాచారమును, చింతనను వృద్ధి పరచుకుంటూ ఉండాలి.

ప్రాణాయామోపాసనలు

ప్రాణాయామము : ‘‘ప్రాణాయామోపాసన’’ అనగా వాయు ఆకర్షణ-ధారణ రూపమైన ఉపాసన. వాయు-ఆకర్షణం ద్వారా మధురమగు ఆత్మ యొక్క సమీప్య-సమక్ష-సతత్ భావనలను అభ్యసించటం.

అట్టి ప్రాణాయామము (1) పూరకము (2) కుంభకము (3) రేచకము అనే మూడు అంగములతో కూడికొని ఉన్నది.

ఈ రీతిగా పూరక - కుంభక- రేచకములతో, అంతటా నిండి యుండి, సర్వరూపములు తానే అయి ఉన్న (జగత్ దృశ్యమంతా నిండియున్న) ‘‘సప్రాణ స్వరూప ప్రాణేశ్వరునికి’’ వ్యాహృతులు సమర్పిస్తూ ఉండటం.

శిరస్సుతో సహా దేహమంతా ప్రాణధారణను ఉపాసిస్తూ, మనస్సుతో త్రిగాయత్రీ మననము (3సార్లు గాయత్రీ మహామంత్రమును) పూరక-కుంభక-రేచక సాధనా సమయంలో చేస్తూ ఉండటమును ‘ప్రాణాయామము’ అను సాధనగా చెప్పబడుతోంది.

రేచక ప్రాణాయామ లక్షణము :

శ్లో।। ఉత్‌క్షిప్య వాయుమ్ ఆకాశం
శూన్యం కృత్వా నిరాత్మకమ్
శూన్య భావే నియుంజీయాత్ (నియమించటం)
‘‘రేచకస్య’’ ఇతి లక్షణమ్।। (12)

హృదయ - శిర స్థానాలలో శరీరమంతా అనుక్షణికంగా సంచారాలు చేస్తూ ఉన్న వాయువును అమృత బిందుభావనతో అవధరించి, బాగుగా బయటకు వదలి, నిరాత్మకమగు శూన్యాకాశములో కొద్ది క్షణములు లయింపజేసి ఉంచే యోగసాధనను ‘రేచకము’ యొక్క లక్షణము.

పూరక ప్రాణాయామ లక్షణము :

శ్లో।। వక్త్రేణ ఉత్పల నాళేన తోయమ్ ఆకర్షయేత్ నరః
ఏవం వాయుః గృహీతవ్యః ‘‘పూరకస్య’’ ఇతి లక్షణమ్।। (13)

ఇక పూరక ప్రాణాయామ ప్రక్రియ ఎట్టిదంటే.. ఒకడు తామరతూడుతో జలమును పీల్చువిధంగా…
వాయువును బయట నుండి లోనికి శరీరములోని హృదయస్థానము వరకు పీల్చుచూ ఉండటమును పూరక లక్షణము.

కుంభక ప్రాణాయామ లక్షణము :

శ్లో।। న ఉచ్ఛ్వాసైః న చ నిశ్వాసైః, నైవ గాత్రాణి చాలయేత్
ఏవం భావే నియుంజయాత్, ‘‘కుంభకస్య’’ ఇతి లక్షణమ్।। (14)

దేహమంతా వాయువుతో నింపి, ఉచ్ఛ్వాస-నిశ్వాసలను నిలిపి ఉంచి, దేహమును కదలకుండా ధారణచేయు యోగాభ్యాసమును నిర్వర్తించటమును కుంభక ప్రాణాయామ లక్షణముగా పేర్కొనుచున్నారు.

ఈ మూడు సాధనల సందర్భంలో….
(1) నిర్విషయ-నిరాకాశ-శూన్య-కేవలీ రూపమగు ‘నిర్మలాత్మ భావన’ను అవధరించటం
(2) పరమ ప్రశాంతతను వహించటం.
ఈ ఉభయ భావనా విధిని నిర్వర్తించుచూ ఉండాలి.

ప్రశాంత లక్షణము :

శ్లో।। అంధవత్ పశ్య రూపాణి, శబ్దమ్ బధిరవత్ శృణు।
కాష్ఠవత్ పశ్య వై దేహమ్, ప్రశాంతస్య ఇతి లక్షణమ్।। (15)

యోగసాధనలో జ్ఞప్తి (లేక) భావనాకాశంలో కనిపించే నామ-రూపాలను గ్రుడ్డివాడివలె చూడనివాడై చూడాలి. చూచీ-చూడనివాడై సంబంధించీ - సంబంధించని వాడివలె ఉండాలి.

వినబడే సంభాషణాది శబ్దాలను చెవిటివానివలె వినకనే వినాలి. వినబడుచున్నా వినబడనివాడై ఉండాలి. క్రొత్తదైన సుదూర ప్రదేశము వెళ్లినప్పుడు అక్కడి రణగొణధ్వనులను ఏవిధంగా పట్టించుకొనీ - పట్టించుకోమో, జగత్‌లోని సాంసారిక జనుల పరస్పర సంబంధ వ్యవహార శబ్దములను వినీ విననట్లు ఉండాలి.

ఈ భౌతిక దేహమును ఎదురుగా ఉన్న ఒక కట్టెను చూస్తున్నట్లుగా జడమైన వస్తువుగా చూడాలి. దీని రాకపోకలను కూడా స్వప్న వస్తువులు ఉండి, లేకపోవటం వలె సందర్శించాలి. తదితర దేహములను కూడా స్వప్నంలో కనిపించిన అరణ్యములోని కట్టెలవలె చూడాలి.

వినీ విననివాడై, చూచీ చూడనివాడై, పలుకుతూ పలకనివాడై, జీవిస్తూ భౌతికదైహమునకు సంబంధించినవాడై ఉండటం - ఇదీ, ప్రశాంతత్వము యొక్క లక్షణము.

ధారణ :

‘‘మనస్సు యొక్క రూపమేమిటి?’’ అని పరిశీలిస్తే ‘‘ఒకటి తరువాత మరొకటిగా నిర్వర్తించబడే సంకల్ప పరంపరల అలవాటుయే’’ (A habit of operating thoughts while being backed by Assumptions and Pressumptions) అని తెలియబడగలదు.

సంకల్పము దృశ్య ధ్యాసచే దృశ్యముపై నమ్మకము ఏర్పడుతోంది. దృశ్యముతో ఏర్పడే సంకల్పావేశమే ఆత్మానుభవమును కప్పి ఉంచే ‘సంసారము’ (లేక) ‘కలన-భావము’ (లేక) ‘మాయ’ అయి ఉన్నది.

అందుచేత..

ఇప్పుడు : →

అట్టి సంకల్పరూప మనస్సును ఆత్మజ్ఞాన సంబంధమైన భగవత్ ఉపాసనా సంబంధమైన, ధ్యాసల సహాయంతో శబ్దాది విషయములను అధిగమించి, ‘ఆత్మదృష్టి’ యందు స్థాపించాలి.

మననమును / ధ్యాసను ఆత్మజ్ఞాన విశేషములపై, శాస్త్రములు సూచించే యోగసాధనములపై అభ్యాసవశం చేయటమే ధారణ.

బుద్ధిమంతుడైనవాడు ధ్యాస సహాయంతో మనస్సును సర్వభేదములను అధిగమింపజేసి సర్వమును ఆత్మభావనగా, ఆత్మకు అభిన్నంగా దర్శించుటయందు బుద్ధిని నిలిపి ఉంచటమే ధారణ.

ఆత్మయందు మనస్సును నిలపటం. ‘సర్వము’ ఆత్మస్వరూపంగా అనిపించేవరకు అనుకుంటూ ఉండటము. ఇదే ధారణ.

తర్కము:

వేద-వేదాంత వాఙ్మయము అందిస్తున్న మహా వాక్యములను (తత్ త్వమ్, ఆత్మాతిరిక్తావై సందర్భ సత్యమాత్రమేవ-ఆత్మావై సహజ సత్యమ్.. ఇత్యాది మహార్థములను) నిరూపిస్తూ దృష్టాంతములను, సంభాషణను విచారణ చేయటమే తర్కము.

ఆత్మకు అల్పత్వము - స్వల్పత్వము - జీవాత్మ పరిమితత్వము ఆపాదించి చెప్పే వాదోపవాదాలు ‘కుతర్కము’ అని అనిపించుకుంటాయి.

ప్రతి జీవుని స్వస్వరూపము ఏకము-అఖండము అగు ‘కేవలాత్మ’గా నిరూపించుకోవటమే - సత్కారము, సద్భావన, సద్గమనము.

సమాధి :

బుద్ధి యొక్క సునిశితత్వము - నిర్మలత్వము - ప్రశాంతత్వముల ప్రభావం చేత.. ఏది (ఏస్థితి) పొందిన తరువాతైతే ‘‘సర్వే, సర్వత్రా, సర్వదా బ్రహ్మమే’’.. అను సమభావన నిశ్చలమౌతుందో…. అట్టి సందర్శన స్థితి ‘సమాధి’ (సమ+అధి=సమం సర్వేషు భూతేషు తిష్ఠంతమ్ పరమేశ్వరమ్).. అని పిలువబడుతోంది.

జపము :

మననమును (లేక మనస్సును) పరమాత్మధ్యానము వైపుగా (పరతత్త్వ ధ్యాస మార్గంలో) నడిపించటానికి ‘జపము’ సుఖప్రదమైన ఉత్తమ మార్గము అయి ఉన్నది.

మనస్సు నుండి సర్వ దోషములు తొలగటానికి, అల్ప-పాప మార్గములలో మనస్సు సంచరించకుండా, కల్పితమాత్ర విషయములపై ఈ మనస్సు వ్రాలకుండా రక్షణ కవచమే ‘జపము’.

1) నామ స్మరణ 2) పరమార్థ- మహాత్మ్య మననము.. ఈ రెండూ జపము యొక్క రెండు ముఖ్యాంగములు.

ఆసనము :

భూమిపై దర్భాసనము. ఆపై రమ్యమైన పులిచర్మము-శుభ్రవస్త్రము, ఇటువంటివేమైనా పరచుకొని జపము కొరకు కూర్చోవటం, ఆ రథ(స్థాన) మధ్యములో ఆశీనుడై జపమును చేయటం - మంచిది. దేహమునకు సానుకూల్యమైన ఆసనము వైచుకుని మనోఏకాగ్రతకు సానుకూల్యమైన పరిసరముల మధ్యగాను, ఎదురుగా అవతారమూర్తి యొక్క. (లేక) గురువు యొక్క చిత్రమునో, విగ్రహమునో కలిగియుండి జపము చేస్తూ ఉంటే ఏకాగ్రత లభించగలదు.

జపమునకు కూర్చొనుచున్నప్పుడు ఆసనము ఒక ముఖ్యమైన ఉపకరణము (లేక) ఉపాయము.

జపమునకు సంసిద్ధమగుచున్న సందర్భములో ఆర్యులచే వివిధమైన ఆసనములు సూచించబడ్డాయి. అట్టివాటిలో సుఖమయమగు ఆసనమును ముముక్షువు ఎన్నుకొనవచ్చు.
(1) పద్మకాసనము (పద్మాసనము)
(2) స్వస్తికాసనము (3) భద్రాసనము
ఇంకా ఏదైనా దేహమునకు అనుకూలమైన ఆసనము సాధకుడు జపము కొరకై నిర్ణయించుకోవచ్చును.

ఆ సమ్యక్ (సాధకుడు) సమరసభావనను ఆశ్రయిస్తూ, సర్వభేదదృష్టులను, భేద భావములను దూరంగా త్యజిస్తూ, జపమునకు సంసిద్ధుడు కావాలి.

ఉత్తర దిక్కుగా ఆసీనులై జపమునకు ఉపక్రమించటమును విజ్ఞులు శుభప్రదమని సూచిస్తున్నారు. (జగద్విషయములన్నిటికీ అతీతత్వమునకు ఉత్తరాభిముఖము సంజ్ఞారూపంగా యోగశాస్త్రజ్ఞులు ఉద్దేశ్యిస్తూ ఉంటారు).

ప్రాణాయామము - సాధనా ప్రక్రియ :

→ ఒక ముక్కు పుటమును బొటనవ్రేలుతో నొక్కిపెట్టి ఉంచి..
→ రెండవ ముక్కు పుటముతో నెమ్మది నెమ్మదిగా గాలిని లోనికి పీల్చుతూ..
→ బుద్ధితో అగ్ని యొక్క తేజోరూపమును ధారణ చేస్తూ…
→ మనో స్ఫురణగా ‘ఓం’ అను ప్రణవమును గాని, గాయత్రీ మంత్రమునుగానీ, ఇష్టదైవ-గురునామ పూర్వకమైన మూలమంత్రమును గాని ఉచ్ఛరిస్తూ… [నమఃశివాయ (లేక) నమో నారాయణాయ (లేక) భూర్భువస్సువః తత్ సవితుః వరేణ్యం…. అని అశబ్ద రూపనాదం పెదిమలు కదల్చకయే - బాహ్య శబ్దము చేయకయే]
→ ఇష్టదైవ (లేక) గురు రూపమును భావనచే మననం చేస్తూ…. పూరక-కుంభక-రేచక ప్రాణాయామ విధులను అభ్యసించాలి.
→ ‘ఓం’ అని అశబ్దరూపనాదం చేస్తూ (నోరు ఉపయోగించకయే మనస్సుతో ఉచ్ఛారణ చేస్తూ) పూరకమును..,
(శబ్దతన్మాత్రతో ఉచ్ఛరిస్తూ…) కుంభకమును నిర్వర్తించాలి.

‘ఓం’ అని అశబ్దరూపతన్మాత్రగా (బ్రాహ్య శబ్దరహితంగా) రేచకమును నిర్వర్తించాలి.

పూరకము పెదిమలతో శబ్దం చేయకుండానే.., వాయువును పీలుస్తూ → ఓం కేవలతన్మాత్రలతో-ఇంద్రియార్థములతో మనోతరంగ కదలికల రూపంగా ఉచ్ఛారణ. (ఇంద్రియములతో కాదు).

దేహమునందు వాయువును నిలుపుతూ → దివ్యమంత్రోచ్ఛారణా రూపమైన కేవల తన్మాత్రజనిత శబ్దమును ఆశ్రయించాలి.

[ దేహము నుండి వాయువును బయటకు వదలుచూ వాయు రహిత శూన్యమును ధారణ చేస్తూ → ఓం కేవల తన్మాత్రోచ్ఛారణను;
పెదిమలు గాని, దేహమునుగాని ఉపయోగించకయే… మనస్సుతో (ఆలోచనా తరంగాలతో/ఆలోచనా ప్రకంపనములతో) పలకాలి.
అనగా.. ఇంద్రియములకు ఆవలగల ఇంద్రియార్థరూపమగు శబ్ద తన్మాత్రతో మనస్సును మాత్రమే ఉపయోగించి ఎలుగెత్తి ఆత్మసామీప్యతను గానం చేయాలి ].

శబ్ద బ్రహ్మమును చిత్తముతో చింతన చేస్తూ - (శబ్దమును మనస్సుతో శబ్దతన్మాత్రను, రూపమును మనస్సుతో రూపతన్మాత్రను ఉపయోగించి).. పూరక-కుంభక-రేచకములు అభ్యసించాలి.

మహదాశయముతో ప్రాణాయామము నిర్వర్తించబడుగాక. అంటే? ‘‘నా యొక్క మనస్సులోని, బుద్ధిలోని, ఇంద్రియములలోని దోషవృత్తి-అల్పభావన-క్రియ-సంకల్పములను, దృశ్యము వాస్తవమనే భ్రమలను తొలగించుకోవటానికి ఈ ప్రాణాయామ ప్రక్రియను నిర్వర్తిస్తున్నాను’’ అనే ఆశయమును సుస్పష్టీకరించుకొని అటుపై ప్రాణయోగ సాధనకు సంసిద్ధమవ్వాలి.

ఆత్మ సర్వత్రా అనన్యంగా స్వాభావికానుభవమవటమే యోగాభ్యాసముయొక్క మహదాశయము.

యోగసాధకులు : ఆత్మతో సంయోగము

ఇక…, అటు తరువాత
- నాభి యొక్క ఉర్ధ్వస్థానంలో ధ్యానమును మంత్రోచ్ఛారణతో సహా ప్రారంభించి..,
- సూక్ష్మాతి సూక్ష్మమైనట్టి, ‘‘సర్వభూతములు తానై - సర్వసాక్షిగా వేరై’’ నట్టి…. ఆత్మ ధ్యానమునకు యోగాభ్యాస వరిష్ఠులు ఉపక్రమిస్తున్నారు.

ఆ విధంగా ఆత్మధ్యానం ప్రారంభిస్తున్నప్పుడు వారు (ప్రాణ-ధ్యాన యోగతత్పరులు) క్రిందకు, పైకి- ప్రక్కకు పూర్వ సంస్కారాల కారణంగా ప్రసరిస్తున్న దృశ్య సంబంధమైన సంసార దోష దృష్టులను మొదలంట్లా త్యజించివేస్తున్నారు.

దృష్టిని ఆత్మభావన-ఆత్మ సందర్శనము వైపుగా ఏకాగ్రం చేస్తున్నారు. దృష్టి-ధ్యాసలను ఎటూ పోకుండా చెదరకుండా నిశ్చలము-సుస్థిరము- నిష్కంపము- చేస్తూ ఎల్లవేళల యోగాభ్యాసము కొనసాగించుచున్నారు.

యోగాభ్యాసము ద్వారా నిశ్చలమైన బుద్ధితో ‘‘ఆత్మౌపమ్యేవ సర్వత్ర-సర్వము ఆత్మయొక్క విన్యాసమే కదా’’.. అనే ఉపాసన-ప్రాణయోగ అభ్యాస-సమయానికి మాత్రమే పరిమితం చేసుకోకూడదు. మరి? నా ఈ పూరక - కుంభక- రేచక ప్రాణయోగాభ్యాసము ‘సర్వము ఆత్మయే’ అనే అనుక్షణికమైన ఆత్మ సంయమయోగానుభవము సముపార్జించే ప్రయత్నంలో, ప్రారంభదశ వంటిది’ - అని భావించాలి. ఆత్మభావన అనుక్షణికమవటమే - మహదాశయము.

ప్రాణాయామముతో బాటే ధారణను కూడా బుద్ధితో ఆత్మీయ-ఆత్మజ్ఞానమును అవధరించటమును కూడా అప్పటికప్పుడే, తత్సమయంలోనే-అభ్యసించాలి.

చలించక స్థిరముగా కదలకుండా నిలిపిన కంఠనాళము - శిరస్సు యొక్క అభ్యాసముచే ధారణను (ధ్యాస యొక్క నిశ్చలతను) వృద్ధి చేసుకోవాలి. ఆలోచన-ఆలోచనల మధ్య గల నిరాలంబ-విషయాతీత రూపమగు ఆత్మయే అంతిమ ధారణ వస్తువు.

క్రమంగా ప్రాణాయామము (పూరక, కుంభక-రేచకములు) + ధారణ.. వీటి రెండింటి యొక్క అభ్యాసకాలమును పెంచుకుంటూ 12 మాత్రల వరకు (3 x 3 9ని।। వరకు) పెంచుకుంటూ పోవాలి. కాల నియమమును జాగ్రత్తగా పాటించుకుంటూ ప్రాణ-ధారణ యోగములను అభ్యసించాలి.

ఉపాసనా వస్తువు ఆత్మయే!

అట్టి పర-ఇహతత్త్వ రూపమగు ఆత్మ ఎట్టిదో.. (ఆత్మా2హమ్ అనుభవము ఏ రూపమైనదో) జ్ఞప్తియందు కలిగి ఉండాలి.

అట్టి అక్షర పరబ్రహ్మము -యత్-ఎట్టిదంటే …..,

అఘోషమ్ = ఎటువంటి ఘోషశబ్దము లేనట్టిది!
అవ్యంజనం = ఎటువంటి దృశ్య వ్యవహారములచే స్పృశించబడనిది. ఇంద్రియ దృశ్య వ్యవహార సంబంధమైనది కాదు.
అస్వరం = స్వరము (గొంతుకతో చేసే శబ్దము)నకు పరిమితమైనది. సంబంధించినది కాదు.
తాలు-దంతోష్ఠ నాశికం చ న = గడ్డము-పెదిమలు-కొండనాలుక-ముక్కు.. ఇత్యాది దేహవిభాగములకు సంబంధించినది కాదు.
అరేఫమ్ = అది రేఫము - ఉచ్ఛ్వాస-నిశ్వాస సంబంధమైనదేదీ కూడా కాదు.

మహదాశయమగు ఆత్మతత్త్వానుభవము→ అక్షరము (క్షయించు ధర్మము లేనిది) - పరము (సర్వమునకు ఆవల అయినది) - సర్వము (సర్వమై ఉన్నట్టిది) - సర్వసాక్షి (మౌనంగా ప్రశాంతంగా సర్వమును చూస్తూ ఉన్నట్టిది) - అయి ఉన్నది.

అట్టి ఆత్మోపాసనయే ప్రాణోపాసన యొక్క లక్ష్యము. అంతేగాని దృశ్యముతో ఏదో పొందటం, కనబడటం, సాపేక్షికంగా ఎవరికంటేనో గొప్పగా ఉండటము కాదు.

‘‘సర్వము ఆత్మయే’’ అని అనిపించటమే ముఖ్యోద్దేశం.

కేవలీస్వరూపమగు తత్త్వానుభూతికి మరి ప్రాణయోగసాధన ఎందుకంటారా? వినండి.

✤ ప్రాణము ఇష్టము యొక్క శక్తి రూపము. ఇష్టము - ప్రాణములు పరస్పరము వేరైనవి కావు.
✤ ఇష్టరూపమగు ప్రాణము ఎటువైపుగా వెళ్ళుచూ ఉంటే.., జీవాత్మ కూడా అటు వైపే ప్రయాణం సాగిస్తూ ఉంటుంది.

అందుచేత అట్టి ప్రాణ ప్రయాణమును ప్రాణయోగసాధనచే (పూరక - కుంభక- రేచక యోగసాధనలచే)… అనామయమైనట్టి (సర్వ విషయములకు, విశేషాలకు స్థానమై వాటిచే స్పృశించబడక - ఆవల ఉన్నట్టి) దోషరహిత నిత్య నిర్మల పరబ్రహ్మమువైపుగా నడిపించటం పరాకాష్ఠ సాధన అయి ఉన్నది.

⌘ ప్రాణయోగసాధనచే వాయు ద్వారము (Gate),
⌘ వాయుద్వారముచే హృదయ ద్వారము,
⌘ హృదయ ద్వారము చే మూర్ధ్ని (నుదురు) ద్వారము,
⌘ మూర్ధ్ని ద్వారముచే శిరస్సు యొక్క ఉపరి స్థానమగు బ్రహ్మరంధ్రము, బ్రహ్మరంధ్రము ద్వారా సహస్రారము,
⌘ సహస్రారముచే విశ్వప్రాణము, విశ్వతత్త్వము, విశ్వాత్మత్త్వము
…. ఇవియే సుషిరగస్థాన ప్రవేశము (శిరో ఉపరిస్థానమున గల సూక్ష్మ బ్రహ్మరంధ్రమును మూత తెరచి సహస్రార ప్రవేశం).

విశ్వమంతా స్వస్వరూపముగా అనుభూతం కావటం - ఇదియే యోగమార్గం! ఇదియే మోక్షమార్గముగా కూడా చెప్పబడుతోంది.

సర్వము తానై, సర్వము తనకు అభిన్నమై, తానే విశ్వరూపమై ఆస్వాదించే సుషిరగ-సూక్ష్మ రంధ్ర అన్త (ఆవల) స్థానమే, (సర్వతత్త్వ రూప అనుభావనయే, అనుభూతియే) యోగ సాధనల లక్ష్యము.

అందుచేత.. అనుభవజ్ఞులు అందించే మార్గమైనట్టి ‘‘ఈ ప్రాణయోగ సాధన నన్ను జగత్ సంబంధమైన నామరూప పరిమిత హ్రస్వభావనల నుండి సముద్ధరించి ఆత్మతత్త్వ భావన - అనే ఒడ్డుకు చేర్చగలదు! - ఇటువంటి దృఢమైన నమ్మికతో ప్రాణయోగ సాధన నిర్వర్తించబడుగాక! ‘‘ఇదంతా వృధాయేమో? నన్ను ఉద్ధరించదేమో?’’ అనే అల్ప భావనలను, శంకలను - ‘‘శాస్త్ర విశ్వాసము. గురు విశ్వాసము, ఆత్మవిశ్వాసము’’ల సహకారంతో - దూరంగా త్రోసివేయాలి.

ప్రాణయోగసాధన - ముఖ్యమైన కొన్ని జాగ్రత్తలు :

(1) అభయము : మార్పు-చేర్పులు లేనట్టి ఆత్మ సర్వదా వేంచేసి, మనందరి హృదయములో, మనయొక్క సహజమగు సొత్తు-సొమ్ము అయ్యే ఉన్నదికదా! ఈ దృశ్య జగత్తు స్వప్నసదృశ్యం. ఇందు వాస్తవానికి పోయేది లేదు. వచ్చేది లేదు. కనుక భయమును దరిజేరనీయకూడదు. అభయము ఆత్మజ్ఞాన లక్షణము.

(2) అక్రోధము : నాటకంలో నటిస్తూ తదితర పాత్రల మాటలకు (Dialogues), వర్తనకు (Behaviour) కోపం తెచ్చుకుంటామా? ‘‘ఇదంతా నాటకం! నేను ఒక పాత్రగా నటిస్తున్నాను. వారు మరొక పాత్రగా!’’… అని ఏమరువము కదా!

ఈ జగత్‌నాటకంలో తదితర పాత్రలను విజ్ఞుడు నాటకీయతగా చూస్తాడేగానీ వారిపై వీరిపై హృదయంలో కోప ద్వేషాలు, మనోతాపములు పెట్టుకోడు. అవివేకి (వివదంతి అవివేకినః- అన్నట్లుగా) కోప-తాపములకు హృదయంలో చోటిస్తున్నాడు. ప్రాణయోగాభ్యాసానికి సిద్ధపడువాడు ‘‘అంతా ప్రియాతిప్రియమగు ఆత్మయే! ప్రాణేశ్వర రూపమే! కనబడేవన్నీ ఇష్టదైవ రూపములే’’…. అను భావనతో క్రోధభావములు సమీపించకుండా చూచుకోవాలి.

(3) న ఆలస్యమ్ : సాధకునకు అతి ముఖ్యమైన విరోధి ఒకటి ఉన్నది. అదియే ‘బద్ధకము’. అందుకే శాస్త్రములు ‘‘బ్రాహ్మీముహూర్తంలో (4\x41వీ) నిదుర లేచి ప్రార్థన చేయండి. ఆలస్యం చేయకండి. తెల్లవారుఝామునే దంత ధావనము, స్నానము మొ।। వాటిని నిర్వర్తించండి’’.. అని సూచిస్తున్నాయి. ఉత్సాహము - సాహసము - సమయపాలన… ఈ మూడు అతిముఖ్యము. కాలమును అనవసరమైన లౌకిక వ్యాపకములచే వృధా పరచుకోరాదు.

నియమిత ధర్మములు ఉపాసన యొక్క అంతర్విభాగముగా చూడబడుగాక!

న అతిస్వప్నః : అతి నిద్రచే బుద్ధి మొద్దుబారుతుంది. బద్ధకము పెరుగుతుంది. ‘‘నిద్రచాలినంత లేకపోతే ఎట్లా?’’ అని అనుకుంటూ, కొందరు మహదాశయము కలిగి ఉండి కూడా-కాలాన్ని, దేహశక్తులను, అతి నిద్రలోకి నెట్టివేస్తూ వృధా చేసుకుంటున్నారు. అందుచేత యోగాభ్యాసికి అతి నిద్ర కూడదు.

న అతి జాగరమ్ : అలా అని అర్ధరాత్రి వరకు నిద్రపోకుండా ఉండటం యోగాభ్యాసానికి సానుకూల్యము కాదు. అతిజాగరణ బుద్ధికి నిశితత్వమును కలిగించదు.

న అత్యాహారమ్ : అతిగాను, సమయపాలన లేకుండాను ఆహారం తీసుకుంటూ ఉంటే, దేహము యోగసాధనకు సహకరించక శరీరము మొరాయిస్తుంది.

న అనాహారమ్ : అలా అని, ఆహారము తీసుకోకుండా దేహమును అతిగా ఉపవాసములతో క్రుంగతీసుకుంటే, యోగసాధనకు దేహము బలహీనమైన ఉపకరణం కాగలదు.

ఈ విధంగా యోగసాధనకు వ్యతిరిక్తమయ్యే అభ్యాసాల పట్ల (అలవాట్లను) యోగి జాగరూకుడై విసర్జించాలి!

ఫలశృతి:

ఈ విధంగా ఒక విధిగా (with Regularity and Punctuality), ఒక క్రమమైన మార్గంగా రేచక-కుంభక-పూరక ప్రాణయోగ సాధన, ధారణ, ప్రత్యాహారము, మనోమననము, మనోమంత్రోచ్ఛారణ.. ఇవి 3 నెలల కాలం అభ్యసించువాని అంతరంగములో ‘ఆత్మజ్ఞానము’ అనే జ్యోతి స్వయముగా ప్రకాశించగలదు. (తత్ స్వయమ్ యోగ సంసిద్ధః కాలేన ఆత్మని విందతి-భగవద్గీత).

నిత్యమ్ అభ్యస్యతే క్రమాత్, స్వయం ఉత్పద్యతే జ్ఞానమ్ త్రిభిర్మాసైః! అత్ర న సంశయః!
ప్రాణాయామసాధనను విధి పూర్వకంగాను అనునిత్యముగాను 4 నెలల కాలం సాధన చేయువారికి దేవతా దర్శనం (ఇష్టదైవ దర్శనం) లభించగలదు.

5 నెలల పాటు శ్రద్ధగా యోగోపాసన చేయువారికి - వితతక్రమాన్ - నిత్యానిత్యవివేకము దృఢముగా రూపుదిద్దుకోగలదు.

6 నెలల పాటు పట్టుదలగా యోగాభ్యాసము చేయువారికి కైవల్యమే లభించగలదు. కేవలము, సనాతనము అగు ఆత్మ ‘సో2హమ్’ అనుభవము అనునిత్యమవగలదు.

ఇందులో సందేహమే లేదు.

┄ ┄ ┄

అట్టి ప్రాణాయామ అభ్యాసకాలంలో…,

(మాత్ర = కనురెప్ప కాలము)
5 మాత్రల కాలము → భూతత్త్వమును
4 మాత్రల కాలము → రసతత్త్వమును
3 మాత్రల కాలము → తేజోతత్త్వమును
2 మాత్రల కాలము → చలన తత్త్వమును, (వాయుతత్త్వమును)
1 మాత్ర కాలము → ఆకాశ (నిర్విషయ) తత్త్వము - శూన్యతత్త్వము) తత్త్వమును
క్రమంగా అమాత్రత్వమును ధారణ చేయును గాక!

అహమ్ పార్ధివః → సర్వభూతరూపో2హమ్! పార్థివ స్వరూపమంతా నేనైన ‘‘నేను’’!
అహమ్ వరుణః → రసరూపో2హమ్! జలముగా త్రాణ-రస స్వరూపమంతా నేనైన ‘‘నేను’’!
అహమ్ అగ్నిః → తేజోరూపో2హమ్! తేజో - ఉష్ణ స్వరూపమంతా నేనైన ‘‘నేను’’!
అహమ్ వాయుః → స్పందరూపో2హమ్! వాయు-స్పందనా-పంచప్రాణ-సప్రాణ స్వరూపమంతా నేనైన ‘‘నేను’’!
అహమ్ ఆకాశః → నిర్విషయరూపో2హమ్ నిర్విషయ నిరాలంబ-సర్వాంతర్యామి-సర్వ అంతరంతరాంత స్వరూపమంతా నేనైన ‘‘నేను’’!
అహమ్ కేవలాత్మః → ఆత్మరూపో2హమ్ కేవల-సర్వాతీత-సరాత్మక స్వరూపమంతా నేనైన ‘‘నేను’’!

ఈ విధంగా మనస్సును ఆత్మతో అనుసంధానం చేస్తూ రావాలి. మనస్సుతో ఆత్మతత్త్వమునే చింతన చేస్తూ ఉండాలి. తదితరములైన ఆలోచనలు వస్తూ ఉంటే.. అట్టి ఆలోచనలకు కొంతసేపు కేవలసాక్షిగా (పట్టించుకోకుండా) ఉంటే.. అవి తొలగుతూ వాటి స్థానంలో ఆత్మవిచారణ, ఆత్మభావన, ఆత్మతత్త్వసమాచారము క్రమంగా చోటుచేసుకోగలవు.

ప్రాణయోగ సాధన చేస్తూ ఉన్నప్పుడు…,
‘‘ప్రాణశక్తి ఆత్మనుండే జనిస్తూ ఆత్మయందే చరిస్తోంది కదా!’’
→ అని గమనించబడుతూ ఉండుగాక!
→ నాశికకు త్రింశత్వార్థ అంగుళ (30/2 = 15 అంగుళముల) దూరంలో ఏ స్థానములో ప్రాణశక్తి ఉత్తేజితమై దేహంలో ప్రవేశిస్తూ ఉన్నదో.. బాహ్యమున - అంతరమున సంచారాలు చేస్తోందో, అది బుద్ధితో గమనించబడుగాక.
→ ఆ విధంగా బాహ్య అభ్యంతరములలో అనుక్షణికంగా సంచారాలు చేస్తున్న ప్రాణ వాయు స్పందన-కారణతత్త్వమునే ‘ప్రాణము’ అని పిలుస్తున్నాము.
→ అట్టి ప్రాణచైతన్య స్పందన-కేవలీశక్తిని బాహ్యమున గుర్తించటం, గమనించటం, అభ్యాసవశంగా, ఉపాసించటం- సులభ ప్రాణగమన సందర్శనము అయి ఉన్నది.

ప్రాణతత్త్వాన్ని విజ్ఞులై గమనించిన మహనీయులు - ప్రాణశక్తి క్రియాత్మకమై యున్నట్లుగాను, ఒక్క రాత్రి - ఒక్క పగలులో ఒక లక్ష పదమూడు వేల నూట ఎనుబది (1,13,180) శ్వాసలతో సంచరిస్తున్నట్లుగాను గమనిస్తున్నారు. (ఒక రోజులో జరిగే శ్వాసల సంఖ్య అది!)

పంచప్రాణముల స్పందన - సంచారముల స్థానములు

ఇప్పుడు… వాయువు దేహమునందు నిర్వర్తిస్తున్న గమనములను అనుసరించి మనం ఇప్పటిదాకా విభజించి చెప్పుకున్నట్టి పంచప్రాణముల ముఖ్య సంచార స్థానముల గురించి (ఉపాసన నిమిత్తమై) చెప్పుకుందాము.

ప్రాణము → హృదయస్థానములో ముఖ్యసంచలనము కలిగి, గుర్తింపబడగలిగినదై ఉన్నది.
అపానము → గుదస్థానము, హృదయస్థానములలో ముఖ్యసంచలనము కలిగి, గుర్తింపబడగలిగినదై ఉన్నది.
ఉదానము → కంఠ స్థానము, హృదయస్థానములలో ముఖ్యసంచలనము కలిగి, గుర్తింపబడగలిగినదై ఉన్నది.
వ్యానము → సర్వ అంగములలో అవిశ్రాంతంగా సంచరిస్తూ పర్యవేక్షిస్తూ ఉన్నది. దేహమంతా వ్యాపించినదై ఉన్నది.

పంచప్రాణముల యొక్క యోగానుభవమగు రంగులు

ప్రాణవాయువు : రక్తవర్ణములో ఎర్రటి మణివలె ధగధగాయమానంగా ప్రకాశిస్తూ హృదయమును ముఖ్యస్థానముగా కలిగియున్నది.

అపానవాయువు : దేహము యొక్క మధ్యభాగమును ముఖ్యస్థానముగా కలిగియున్నదై, నీలంగా ఇంద్రగోపమణి ప్రభలతో విరాజిల్లుతూ ఉంటోంది.

సమానవాయువు : ప్రాణ-అపానముల మధ్య ప్రదేశమును ముఖ్య స్థానముగా కలిగియున్నదై, ఆవు పాలవలె తెల్లటి కాంతులతో మృదుమధురంగా ప్రకాశమానమౌతోంది.

ఉదానవాయువు : నల్లటి కాంతులతో కంఠనాళము క్రింద ప్రదేశంగా ఊర్ధ్వముఖముగా కాంతులు వెదజల్లుతూ ఉంటోంది.

వ్యానవాయువు : అగ్ని యొక్క తేజమువలె అగ్నికిరణ (బంగారు) రంగుగా కుక్షిభాగమును ముఖ్యస్థానంగా కలిగి ఉంటోంది.

మహదాశయము :: పరమాశయము

ఎవ్వరైతే…,
➤ ప్రాణయోగాభ్యాసము యొక్క పరిపక్వతచే..,
➤ పైన మనం వర్ణించి చెప్పుకున్న ప్రాణవాయు మండలమును ఛేదించుకొని..,
➤ తమ యొక్క ప్రాణశక్తిని చిత్తముతో సహా..,
➤ సహస్రారస్థానముగా చెప్పబడే మూర్ధ్ని ఉపరి చేర్చుతారో…,
➤ అటుపై బ్రహ్మరంధ్రస్థానమునకు చిత్త-ప్రాణములను చేర్చి నిలిపి ఉంచుతారో…,
➤ క్రమంగా బ్రహ్మరంధ్రమును (సుషిరగమును) తెరిచి ‘‘సహస్రారమును’’ ప్రవేశించుచున్నారో…,
వారు సర్వేంద్రియములను తమ స్వాధీనములో ఉంచుకున్న వారగుచున్నారు.

అట్టి వారు ఎప్పుడు - ఎక్కడ దేహము త్యజించినాకూడా.. జన్మ - కర్మలకు ఆవలగల కేవలీ రూపము (లేక) కేవల సాక్షీరూపమును సంపాదించుకుంటున్నారు. అట్టివారిపట్ల వర్తమాన జన్మ కూడా స్వతఃగా లేనిదై, కల్పనామాత్రమై శేషించగలదు.

వారికి ఇక పునఃజన్మలు లేవు. ఉండవు.

‘‘నేను జన్మ-కర్మలకు సంబంధించినవాడను’’.. అనే భ్రమ తొలగి, సర్వాత్మస్వరూపులై వెలుగొందుచున్నారు.
దేహముల రాక-పోకలు వారికి లీలా - క్రీడా - ఆనంద వినోదమగుచున్నది.



🙏 ఇతి అమృతనాద ఉపనిషత్ 🙏
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।।