[[@YHRK]] [[@Spiritual]]

DakshiNā Mūrthi Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 2
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: yhrkworks@gmail.com

కృష్ణ యజుర్వేదాంతర్గత

14     దక్షిణామూర్త్యుపనిషత్

శ్లోక తాత్పర్య పుష్పమ్


శ్లో।। యత్ మౌన వ్యాఖ్యయా (యన్మౌన వ్యాఖ్యయా)
మౌని పటలం క్షణమాత్రతః।
‘మహామౌన పదం’ యాతి, స హి మే పరమాగతిః।।

ఏ ‘పరమాత్మ’ అగు శ్రీ దక్షిణామూర్తి స్వామి యొక్క ‘మౌనవ్యాఖ్యానము’ను విని మునిజనమంతా ‘మహామౌనపదము’ అను స్వాత్మసాక్షాత్కారము పొందుచున్నారో….అట్టి స్వామియే మాకు పరమా గతి!

ఓం
1. బ్రహ్మావర్తే ‘మహాభాండీర’
వట మూలే మహాసత్రాయ సమేతా,
మహర్షయః శౌనకాదయః।
తే హ సమిత్పాణయః,
తత్త్వజిజ్ఞాసవో మార్కండేయం,
చిరంజీవినమ్ ఉపసమేత్య పప్రచ్చుః।।
‘బ్రహ్మావర్తము’ అనే మహాపుణ్యప్రదేశం. మహావట (మర్రి) వృక్షము క్రింద జరుగుచున్న ‘మహాసత్రయాగము’. ఆ ప్రదేశమునకు శౌనకుడు మొదలైన మహర్షులు యాగపరికరములు (కట్టెలు మొ।।వి) చేత ధరించి వచ్చారు.

వారంతా ‘తత్త్వమును తెలుసుకోవాలి’ అనే జిజ్ఞాస కలవారై అక్కడకు విచ్చేసియున్న ‘చిరంజీవి’ అగు శ్రీ మార్కండేయ మహర్షిని సమీపించారు. హృదయపూర్వక నమస్కారములు సమర్పిస్తూ ఈ విధంగా పరిప్రశ్నించసాగారు.
శౌనకాదౌవాచే
2. కేన త్వం చిరంజీవసి?
కేన వా ఆనన్దమ్ అనుభవసీతి?

శ్రీ మార్కండేయౌవాచ :
‘పరమ రహస్య శివతత్త్వజ్ఞానేన ఇతి!’

స హో వాచ :(శౌనకాదయః)
కిం తత్ పరమ రహస్య ‘‘శివ తత్త్వ జ్ఞానమ్?’’
కో దేవః? తత్ర కో జపః?
కే మన్త్రాః? కా ముద్రా? కా నిష్ఠా?
కిం తత్ జ్ఞాన సాధనమ్?
కః పరికరః? కో బలిః?
కం కాలః? కిం స్థానమ్? ఇతి।।
శౌనకాది మహర్షులు : శివభక్తులై, ఆ పరమ శివుని వరప్రసాది అయి, ‘చిరంజీవత్వము’ సంతరింపజేసుకొన్నట్టి ఓ మార్కండేయ మహర్షీ! మీ దర్శనముచే మేము ధన్యులము. నమో నమః।
1. దేనిచే మీరు చిరంజీవులైనారు? మునిలోకంలో ఆత్మానందము గురించి చెప్పుచున్నప్పుడు - మిమ్ములను దృష్టాంతంగా చెప్పుతూ ఉంటారు.
2. ఎట్లా మీరు ఆత్మానంద నిత్యత్వమును పొందగలుగుచున్నారు? దయచేసి మాకు వివరించండి!

శ్రీ మార్కండేయ మహర్షి : మీరు చెప్పినదంతా నేను ‘శివతత్త్వజ్ఞానము’ చేతనే పొందుచున్నాను. అది పరమ రహస్యమైనట్టిది.

శౌనకాది మహర్షులు : పరమ రహస్యమగు అట్టి శివతత్త్వజ్ఞానము ఏమై ఉన్నది?
- అట్టి జ్ఞానమునకు అధిదేవత ఎవరు?
- అది పొందటానికి నిర్వర్తించవలసిన జపము - తపము ఏది? అందుకు మంత్రము ఏమి?
- అందుకు ఏ ‘ముద్ర’ను ధరించాలి? ఏఏ నిష్ఠలు పాటించాలి? అందుకుగాను జ్ఞానసాధన ఏది? అట్టి సాధనకు సహకారిక పరికరములు ఏమేమి? ఏమేమి (బలిగా) సమర్పించాలి?
- అట్టి మన్త్ర - జప - ముద్ర - నిష్ఠ - జ్ఞాన సాధన - బలి - ఇత్యాదులకు కాలనియమములు ఏమన్నా ఉన్నాయా?
- అట్టి శివతత్త్వజ్ఞానము కొరకై చేయు ఉపాసనలకు ప్రదేశము (place) సంబంధించిన ఏ నియమాలు పాటించాలి?
ఈ ఈ విశేషాలన్నీ దయచేసి వివరించండి!
సహోవాచ : (మార్కండేయౌ)
యేన దక్షిణాముఖః శివో,
(అ)పరోక్షీకృతో భవతి,
తత్ పరమరహస్య
శివతత్త్వ జ్ఞానమ్।
యః సర్వా ఉపరమే కాలే,
సర్వాన్ ఆత్మని ఉపసంహృత్య,
స్వాత్మానందే సుఖే మోదతే
ప్రకాశతే వా, స దేవః।
ఆత్ర ఏతే మంత్ర రహస్య శ్లోకా భవంతి।
‘‘మేధా దక్షిణామూర్తి’’ మంత్రస్య।-
బ్రహ్మా ఋషిః।
గాయత్రీ ఛందో।
దేవతా దక్షిణా-అస్యో మంత్రేణ ఆంగన్యాసః।
మార్కండేయ మహర్షి : ఏ జ్ఞానముచే పరోక్షుడు (ఇహమును పరదృష్టిలో దర్శించు మూడవ కన్నుగలవాడు), దక్షిణాభిముఖుడు అగు పరమ శివుడు-ప్రత్యక్షుడు అగుచున్నారో, అదియే పరమ రహస్యమగు మీరు ప్రశ్నిస్తున్న శివతత్త్వజ్ఞానము. అది అపరోక్షజ్ఞానమునకు మార్గము।।

దేవత = ఏ పరమశివుడు ప్రళయకాలంలో ఈ దృశ్య జగత్తులన్నీ తనయందు ఉపసంహరించుకొని, స్వాత్మానందసుఖరూపుడై ఆనందిస్తూ ఉన్నారో, సర్వత్రా ప్రకాశమానుడై వెలుగొందుచున్నారో, స్వస్వరూప - సర్వ స్వరూపుడై విరాజిల్లుచున్నారో, ఆయనయే శివతత్త్వజ్ఞానమునకై ఉపాసించవలసిన దేవత! (సమస్తము స్వస్వరూపమై నిస్సందేహంగా అనుభవమవటమే ‘‘ప్రళయము’’).

మంత్రము : అందుకు చేయు మంత్రము శ్లోకములుగా ఉన్నాయి.
అట్టి మేధా దక్షిణామూర్తి మంత్రమునకు
ఋషి → సృష్టికర్త అగు బ్రహ్మదేవుడు।
ఛందస్సు → గాయత్రీ ఛందస్సు।
దేవత → శ్రీ దక్షిణామూర్తి।
దక్షిణామూర్తి మంత్రముతో అంగన్యాస కరన్యాసములు చెప్పాలి!
‘ఓం నమః శివాయ’। (5)
ఓం శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః (12)
3. ‘ఓం’ - ఆదౌ। ‘నమ’ ఉచ్చార్య
తతో భగవతే పదమ్।
‘దక్షిణా’ ఇతి పదం పశ్చాత్।
‘మూర్తయే’ పదమ్ ఉద్ధరేత్।
‘అస్మత్’ శబ్దం చతుర్థ్యంతమ్।
‘మేధాం’ ప్రజ్ఞాపదం వదేత్।
సముచ్చార్య తతో వాయుబీజం
‘ఛం’ చ తతః పఠేత్
వహ్నిజాయాం తతస్తు।
ఏష చతుర్వింశ (24) అక్షరో మనుః।
ఓం ఆదౌ చతుర్వింశతి అక్షర మంత్ర ప్రారంభము (ఓం నమో భగవతే తతో దక్షిణామూర్తయే అస్మత్ మేధాం సముచ్చార్య-ఛం) - (24)
నమో…నమస్కారములు.
భగవతే….. సర్వమును వెలిగించుచున్న చైతన్యస్ఫూర్తి,
దక్షిణా….. ఈ దృశ్యమునకు ఈవల ఆవల-బుద్ధి రూపుడై, సాక్షి దర్శకుడై,
మూర్తయే… సమస్తముగా మూర్తీభవించిఉన్నట్టి వారు, ఉద్ధరించునట్టి వారు,
అస్మత్…. నాయొక్క (అజ్ఞానము తొలగించుచూ),
మేధాం….విజ్ఞతను, మేధస్సు ప్రసాదించునుగాక!
సముచ్చార్య ….‘ఉత్’ను ప్రసాదించు ఆచార్యులై ‘సత్’కు చేర్చెదరు గాక!
సముద్ధరించు శ్రీ దక్షిణామూర్తిని ఆచార్యుల వారిని ఉపాసిస్తున్నాము.
- వాయువు బీజమై ‘ఛం’ అను అక్షరముతో వారిని ఉపాసిస్తున్నాము.
అగ్నివలే తేజోమయుడగు ఆ మేథా దక్షిణామూర్తిని 24 అక్షరములతో ఆరాధిస్తున్నాము.
ధ్యానమ్ :
స్ఫటిక రజత వర్ణమ్,
మౌక్తికీమ్ అక్షమాలామ్,
అమృత కలశ విద్యాం,
జ్ఞానముద్రాం కరాగ్రే,
దధతమ్ ఉరగ కక్షం
చంద్రచూడం త్రినేత్రమ్,
విధృత వివిధ భూషం
దక్షిణామూర్తి మీడే।।
దక్షిణామూర్తి స్వరూపవర్ణన - స్తోత్రం
స్ఫటికమువలె, వెండివలె నిర్మలముగా, తెల్లగా ప్రకాశించుచున్నట్టి వారు, ముత్యముల అక్షమాలను ధరించనట్టి వారు,
- మృత్యువును జయింపజేయు అమృత కలశ విద్యాస్వరూపులు, అమృతత్వమును నింపి ఉంచిన కలశమును ధరించియున్న వారు,
- ‘తత్ -త్వమ్’ను సూచించు (బొటనవ్రేలు-చూపుడు వ్రేలు, కలిపి ఉంచిన) చిన్ముద్ర (లేక) జ్ఞానముద్ర ధరించినవారు, నడుమున పామును అలంకారముగా ధరించినవారు, (జగద్విషయములన్నీ దివ్య దేహాలంకారములుగా అగుచున్నవారు),
- చంద్రుని శిరస్సుపై అలంకరించుకున్నవారు,
- (దృక్ - ద్రష్ట - దృశ్యములను), పగలు-రాత్రి-ప్రదోషకాలములను (త్రికాలములను) త్రినేత్రములుగా కలిగిఉన్నవారు.
- వివిధములైన భూషణములను ధరించినవారు.
అగు శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామిని ధ్యానించుచున్నాము.
మంత్రేణ న్యాసః :
ఆదౌ వేదాదిమ్ ఉచ్చార్య
స్వర-ఆద్యం, స-విసర్గకమ్,
పరిచార్ణం తత ఉద్ధృత్య
అంతరం స-విసర్గకమ్,
అంతే సముద్ధరేత్ తారం
మనుః ఏష నవాక్షరః।।
మంత్రముతో అంగన్యాస - కరన్యాసము:
హ్రస్వ-దీర్ఘ-ఉదాత్త-అనుదాత్త విసర్గక ఇత్యాదులతో కూడిన స్వరములు పలుకుచూ వేదమంత్రములలోని శ్రీ దక్షిణామూర్తి స్తోత్రములను లయ - గాన - విన్యాసములతో ఎలిగెత్తి పలికెదము గాక!
చివరికి విసర్గలతో, అంతరమున మనస్సులో ‘ఓం దక్షిణామూర్తయే నమః’ (లేక) ‘మేధా దక్షిణామూర్తయేచ్ఛ’ నవాక్షరములతో శాంతి ప్రవచనములు పలుకబడునుగాక!
స్తోత్రం :
ముద్రాం భద్రార్థ ధాత్రీం, స పరశు హరిణం
బాహుభిః బాహుమ్, ఏకమ్,
జాన్వాసక్తం దధానో,
భుజగవర సమాబద్ధ కక్ష్యో వటాధః
ఆసీనః చంద్ర ఖండ, ప్రతిఘటిత
జటాక్షీర గౌరః త్రినేత్రో, దద్యాత్ ఆద్యైః శుకాద్యైః
మునిభిః అభివృతో, భావశుద్ధిం భవో నః।
స్తోత్రము :
భద్రముద్ర యగు చిన్ముద్రను, జింక - పరసువులను చేతులకు ధరించినవారు, భుజములను సమాంతరముగా నిలిపి ఉంచువారు, మోకాలిపై ఒక చేతిని ఉంచుకొని ఉన్నవారు, పామును మొలత్రాడుగా ధరించినవారు, జటా జూటమునందు అర్థచంద్రుని అలంకారముగా కలిగియున్నవారు, క్షీరము (పాలు) వలే తెల్లటి తెలుపురంగు అయినవారు.
జీవ - ఈశ్వర - పరములనబడే త్రినేత్ర ధారులు, శ్రీ శుకుడు మొదలైన మహర్షి - ముని జనముచే పరివృతులైనవారు. (తనచుట్టూ ఆశీనులై బ్రహ్మతత్త్వమును వినుటకై సంసిద్ధులైన వారు)….అట్టి శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామి మాకు ‘భావశుద్ధి’ని అనుగ్రహించెదరు గాక!
4. మన్త్రేణ న్యాసః। బ్రహ్మా ఋషి న్యాసః
తారం ‘బ్లూం నమ’ ఉచ్చార్య
మాయాం వాక్ భవమేవ చ।
‘దక్షిణా’ పదమ్ ఉచ్చార్య
తతః స్యాత్ మూర్తయే పదమ్।
జ్ఞానం దేహి, తతః పశ్చాత్
వహ్నిజాయాం తతో వదేత్।
మనుః అష్టాదశార్ణో-యం
సర్వమంత్రేషు గోపితః।
మంత్రముతో న్యాసము - ‘దక్షిణా’ ఉపాసన - బ్రహ్మదేవుని ఋషిగా ఉపాసించుచున్నాము. ఉచ్ఛారణ. తారం ‘భూం నమః’

- వాక్కుగా ‘మాయ’ నుండి ఉద్ధారణ కలిగించునది అగు ‘దక్షిణా’ పదమును గట్టిగా నొక్కి పలుకుచూ, ‘మూర్తయే నమః’ అని తేలికగా ఉచ్ఛరించాలి. శివమూర్తిని ధ్యానించాలి! ‘జ్ఞానమును ప్రసాదించండి’ అని అభ్యర్ధిస్తూ ‘జ్ఞానాగ్ని’ని ఉద్దేశ్యిస్తూ అగ్నికార్యము నిర్వర్తించాలి.

‘18’ రెక్కలు (ఆకులు) గల బుద్ధి పుష్పము నందు (దక్షిణయందు) సర్వమంత్రములు దాచబడుచున్నాయి. (పంచేంద్రియములు-పంచ ప్రాణములు-పంచ భూతములు-మనోబుద్ధి చిత్తములు-ఇవి–18 రెక్కలు)
ధ్యానమ్ :
భస్మవ్యా పాండుర - అంగః
శశి శకలధరో, జ్ఞానముద్రాక్ష మాలా,
వీణా పుస్తైః విరాజః కర కమలధరో,
యోగ పట్టాభిరామః,
వ్యాఖ్యా పీఠే నిషణోణా మునివర నికరైః
సేవ్య మానః ప్రసన్నః, సః వ్యాళః కృత్తివాసాః
సతతమ్ అవతు నో దక్షిణామూర్తిః ఈశః।।
ధ్యానమ్ :
భస్మ భూషితాంగులు (విభూతి ధరించినవారు), తెల్లటి అంగములతో శోభిల్లువారు, (పాండుర అంగః), చంద్రకళలు ధరించినవారు, చేతులందు చిన్ముద్రను అక్షమాలను అలంకారముగా కలిగి యున్నవారు, వీణ - గంధములను చేతులలో అలంకారముగా కలిగియుండి విరాజమానులగుచున్నవారు, యోగపట్టాభిరాములు, మహావాక్య వ్యాఖ్యపీఠము అధిరోహించి ప్రకాశించువారు, మునిజనముచే పరివేష్ఠితులు
అయిన వారిచే సేవించబడుచూ ప్రసన్న వదనులు (నవ్వు ముఖమును ప్రదర్శించువారు), సర్పములను ఆభరణముగా ధరించినవారు, సర్వేశ్వరులు - అగు శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామి మమ్ములను కరుణారస దృక్కులతో సంరక్షించెదరుగాక!
మంత్రేణ న్యాసః।
బ్రహ్మా ఋషిః, న్యాసః
తారం మాయాం రమా బీజం
పదం సాంబశివాయ చ
తుభ్యంచ అనల జాయాం చ
మనుః ద్వాదశవర్ణకః।।
మంత్ర పూర్వకంగా మనన పూర్వకంగా అంగ - కర న్యాసములతో ఉపాసించుచున్నాము.
అందుకుగాను సృష్టికర్తయగు బ్రహ్మదేవుని ముందుగా ఋషిగా ఆశ్రయిస్తున్నాము.
మాయ నుండి తరింపజేయునది తారం → తారం మాయా।
బీజము → రమాదేవి (మూల ప్రకృతి / జ్ఞానస్వరూపిణి)।
ఆశ్రయం → సాంబ సదాశివుని పాదపద్మములు,
హృదయమూలమున 12 రెక్కలు గల (ద్వాదశాదిత్యుల) అగ్నిరూప పుష్పమును భావించు చున్నాము. స్వామికి సమర్పిస్తూ ఆహ్వానిస్తున్నాము.
ధ్యానమ్ :
5. వీణాం కరైః, పుస్తకమ్ అక్షమాలాం,
బీహ్రాణమ్ ఆహ్రాభ గళం వరాఢ్యం,
ఫణీంద్ర కక్ష్యం మునిభిః
శుకాద్యైః సేవ్యం,
వటాధః కృత నీడ మీడే।
విష్ణూ ఋషిః। అనుష్టుప్ ఛందో।
దేవతా దక్షిణా22స్యో।
మంత్రేణ అంగన్యాసః
తారం - నమో భగవతే తుభ్యం వటపదం తతః,
మూలేతి పదమ్ ఉచ్చార్య, వాసినే పదమ్ ఉద్ధరేత్।
(ప్రజ్ఞా మేధాపదం పశ్చాత్ ఆది సిద్ధిం తతో వదేత్)।
వాగీశాయ (తతః) పదం
పశ్చాత్, ‘మహాజ్ఞాన’ పదం తతః।
(వహ్నిజాయాం తతస్తు ఏష
ద్వాత్రింశత్ (32) వర్ణకో మనుః)
దాయినే పదమ్ ఉచ్చార్య, మాయినే ‘నమ’ ఉద్ధరేత్।
అనుష్టుభో మంత్రరాజః, సర్వ మంత్ర-ఉత్తమోత్తమః।
ధ్యానమ్ :
సంగీతమునకు సంజ్ఞయగు వీణను, విద్యకు గుర్తూగు పుస్తకమును, అక్షరమునకు ప్రతీక అగు అక్షమాలను ధరించిన స్వామి, నీల మేఘపు రంగు కంఠము కలవారు (గరళ కంఠులు), చేతులెత్తి నమస్కరించినంత మాత్రం చేతనే చిరునవ్వుతో మాకు కరుణతో వరములను ప్రసాదించు స్వామి, ఫణిరాజు (నాగు పాము)ను మొలత్రాడుగా కలిగి ఉన్నవారు, శుకుడు మొదలైన మునులచే పరివేష్ఠితులై సేవించబడువారు, వట (రావి) వృక్ష ఛాయలో ప్రశాంతంగా ఆశీనులైనట్టి వారు, - అగు శ్రీ దక్షిణామూర్తిని ధ్యానించుచున్నాము.
ఋషి → విష్ణుదేవుడు. ఛందస్సు → అనుష్టప్. దేవత → దక్షిణామూర్తి… అగు మేధా దక్షిణామూర్తి మంత్రమును అంగన్యాస - కరన్యాసముతో మంత్రోపాసన చేస్తున్నాము.
తారం - తరింపజేయు ధ్యానము
వటవృక్షమూలమున ఆసీనులైయున్న భగవంతుడగు దక్షిణామూర్తికి నమస్కరిస్తున్నాము.వారు మమ్ము సముద్ధరించెదరుగాక! ప్రజ్ఞ- మేధలను ప్రసాదించి ఆది స్వరూప సిద్ధికి మార్గదర్శకులయ్యెదరుగాక!
స్వామీ! ఉత్తమ వాక్కు, మహాజ్ఞాన పదము మాకు దయతో ప్రసాదించండి. సర్వమును వెలిగించు 32 వర్ణులగు మీకు నమస్కారము!
ఉత్తమ బుద్ధిని ప్రసాదించండి. మాయకు యజమాని (మాయి) అగు మీరు మమ్ములను మాయ నుండి ఉద్ధరించండి. (మాయినంతు మహేశ్వరః).
అనుష్టుప్ ఛందో బద్ధమగు ఈ దక్షిణామూర్తి మంత్ర రాజము ఉత్తమోత్తమ మైనది.
ధ్యానము
ముద్రా పుస్తక వహ్ని నాగ విలసత్ బాహుం
ప్రసన్న ఆననం, ముక్తాహార విభూషణం,
శశికలా భాస్వత్, కిరీటోజ్వలమ్,
అజ్ఞానాపహమ్, ఆదిమ్
ఆదిమగిరామ్, అర్థం భవానీపతిం।
న్యగ్రోధా-న్త నివాసినం, సురగురుం (పరగురుం)
ధ్యాయేత్ అభీష్టాప్తయే।।
ధ్యానము
జ్ఞానముద్రా సహితులు, పుస్తకము-అగ్ని తేజస్సు-సర్పములచే అలంకరించబడిన బాహువులు కలవారు, చిరునవ్వుతో కూడిన ప్రసన్నముఖులు, పుష్పమాలాంకితులు, చంద్రునిచే అలంకరించబడిన కిరీటధారులు, ఆత్మజ్ఞాన జ్యోతిని వెలిగించి అజ్ఞానాంధకారమును తొలగించువారు, గౌరీదేవిని అర్ధభాగముగా కలవారు, (భవానీ పతి),
వటవృక్షమూల నివాసి, దేవతలకు కూడా గురువు, భవుడై భవరోగమునకు వైద్యులు అగు - శ్రీ మేథా దక్షిణామూర్తిని అభిష్ట సిద్ధికై ధ్యానించు చున్నాము.
6. మౌనముద్రా ‘సో2హమ్’ ఇతి,
యావత్ ఆస్థితిః,
సా ‘నిష్ఠా’ భవతి।
తత్ అభేదేన మన్వామ్రేడనం
జ్ఞాన సాధనమ్।
చిత్తే తత్ ఏకతానతా ‘పరికరః’।

అంగ చేష్టార్పణం - ‘బలిః’।
త్రీణి ధామాని - ‘కాలః’।
ద్వాదశాంత పదం స్థానమ్ ఇతి।

తేహ పునః శ్రద్ధధానాస్తం ప్రత్యూచుః :
కథం వా అస్య ఉదయః?
కిం స్వరూపమ్?
కోవా అస్య ఉపాసకః? ఇతి।
ఈ జీవ-జగత్తులు ఏ తీరుగా ఉన్నప్పటికీ, సో2హమ్ మంత్రార్థముచే ఆత్మనగు నాకు లోటు లేదు’….అని భావించటమే మౌనముద్ర. ‘ఆ బ్రహ్మమే నేను’ అను స్థితిని సర్వకాల సర్వావస్ధలయందును కలిగి యుండటము → ‘నిష్ఠ’ అగుచున్నది.
ఆత్మకు అభేదముగా భావన కలిగియుండటము మనస్సుతో చేసే జ్ఞాన సాధనము. చిత్తము (ఇష్టము) సర్వదా, సర్వత్రా ఏకత్వమును ఆశ్రయించి, సంతరించుకొని ఉండటమే శివతత్త్వజ్ఞాన పరికరము.(తత్ శివః త్వమేవ-ఇతి తత్త్వ జ్ఞానమ్।)

ఈ దేహముతో ఇంద్రియములతో నిర్వర్తించే క్రియలన్నీ ‘శివార్పణమస్తు’ అని ఉద్దేశించటమే ‘బలి’ సమర్పణము! (యత్-యత్ కర్మ కరోమి తత్ తత్ అఖిలం, శంభో! తవారాధనం)
త్రికాలములు, త్రి అవస్థలు శివోపాసనకు కాలమే! నిదుర లేచింది మొదలు మరల నిదురించువరకు శివోపాసనకు తగిన కాలమే! [జడ దృష్టి (లేక) ‘భేద దృష్టి’ వదలి శివదృష్టిని ఉపాసించటానికి అనునిత్యమూ కాలమే].
‘ద్వాదశాంతపదం’ అనబడు శిరో ఊర్ధ్వ భాగమున గల బ్రహ్మరంధ్రము శివతత్త్వోపాసనకు ముఖ్య స్థానము. (అంతేగాని బాహ్యమున ఏదో ప్రదేశము స్థానముకాదు).

ఈ విధంగా మార్కండేయ మహర్షిచెప్పుచున్నదంతా శ్రద్ధగా విని శౌనకాది మహర్షులు మరల ఇట్లా ప్రశ్నించారు.
హే భగవాన్! ఓ మార్కండేయ మహర్షీ!
అట్టి కేవల-చైతన్యాత్మ స్వరూపుడగు దక్షిణామూర్తి (లేక) పరమాత్మ తత్త్వము సిద్ధించేది ఎట్లా?
దక్షిణామూర్తి స్వరూపమెట్టిది?
ఆయనను ఎవ్వరెవ్వరు ఉపాసిస్తూ ఉన్నారు? ఎట్లా మేము ఉపాసించాలి?

సహోవాచ :
వైరాగ్య తైల సంపూర్ణే,
భక్తి వర్తి సమన్వితే,
ప్రబోధ పూర్ణ పాత్రేతు,
జ్ఞప్తి దీపం విలోకయేత్।
మోహాంధకారే నిస్సారే
ఉదేతి స్వయమే వ హి।
‘వైరాగ్యమ్’ అరణిం కృత్వా,
‘జ్ఞానం’ కృత్వా ఉత్తర - అరణిం,
గాఢతా మిస్ర
సంశాంతం, ‘గూఢం అర్థం’ నివేదయేత్।
మోహ భానుజ, సంక్రాంతం
వివేకాఖ్యం మృకండుజమ్,
తత్త్వ - అవిచార పాశేన
మార్కండేయ మహర్షి : ఆ పరమ శివుని ఉపాసించు విధానమేమిటో వివరిస్తున్నాను. వినండి!
→ వైరాగ్యము ళిదృశ్య విషయములపట్ల - ‘‘నాది’’ అను రాగము (Attachment) ఉపసంహరించుకొనబడుచుండగా ఏర్పడు రాగరహిత స్థితిరి…అనే నూనెను సముపార్జించి,
→ ‘భక్తి’ అనే దీపవర్తి (లేక) ప్రపత్తిని తయారు చేసుకొని,
→ ప్రబోధము (పరమాత్మ గురించి తెలుసుకోవటము, శాస్త్ర - గురుబోధలు వినటము) అనే జ్ఞానబోధ పాత్రలో ఉంచి,
→ జ్ఞప్తి (పరమాత్మ-జ్ఞానము గురించిన జ్ఞాపకము) అనే దీపము వెలిగించి,
→ ఈ జగత్తును ఆత్మ జ్ఞానముతో అవలోకించాలి। సర్వము శివమయముగా అనుక్షణికంగా దర్శించాలి - అనిపించేంత వరకు అనుకుంటూనే ఉండాలి.
→ అప్పుడు ‘మోహము’ అనే చీకటి తొలగిపోతుంది. శివ సాక్షాత్కారం (సర్వము శివమయముగా శివో2హమ్‌గా) అనుభవమౌతుంది.
(యజ్ఞ - యాగముల కొరకై నిప్పు పుట్టించటానికి ‘అరణి’ అనే రెండు భాగములు గల ఉపకరిణం వాడుతారు). వైరాగ్యం క్రింద అరణ
బద్ధం ద్వైతభయాతురమ్,
ఉజ్జీవయత్ నిజానందే
స్వస్వరూపేణ సంస్థితః।
శేముషీ దక్షిణా ప్రోక్తా
సా యస్య అభీక్షణే ముఖమ్,
‘దక్షిణా అభిముఖః’ ప్రోక్తః
శివో2సౌ బ్రహ్మవాదిభిః।।
ఉపకరణ విభాగం. ‘జ్ఞానము’పై అరణి విభాగం. ఆ రెండింటి తాడనము చేయగా ‘వేదాంత గూఢార్థము’ అనే అగ్ని జనిస్తుంది. మోహభానుజ సంక్రాంతం వివేకాఖ్యం మృకుండుజమ్! ఓ శౌనకాది మహామునులారా! ఈ మార్కండేయుడు అనే జీవుడు ‘మోహము’ అనే సూర్యపుత్రుడగు యముని పాశములకు జన్మ - జన్మలుగా చిక్కుకుంటూ వచ్చాడు.
ఎందుచేత? తత్త్వ విచారణ లేకపోవటం చేత। తత్త్వజ్ఞాన రాహిత్యము అనే యమపాశములచే బంధింపబడి ద్వైతభయమును తెచ్చిపెట్టుకొని, జన్మ జన్మలుగా పరితాపము పొందుతూ ఉన్నాడు. ‘‘జీవుడు’’ అనే సందర్భంలో ఇరుక్కొన్నవాడిగా భావించి సహజమగు శివస్వరూపము ఏమరచాడు.

వైరాగ్యతైలంతో భక్తిని, వ్రత్తిని (వైరాగ్య - జ్ఞానముల అరుణితో తాడించగా జనించిన) జ్ఞానాగ్నితో వెలిగించగా, వివేకము అనే ఉష్ణముచే బుద్ధి ఉత్తేజితమవగా, ‘‘నిజానంద-స్వస్వరూపము’’- అనే పరమాత్మ మోహము - అనే యముని కాలితో తన్నగా, మోహము పటాపంచలయింది.

బుద్ధి అనే నేత్రములకు (మేధకు) ఎదురుగా బోధపడువారే స్వస్వరూపు లగు దక్షిణామూర్తి (దక్షిణ బుద్ధి)। ఆ దక్షిణామూర్తి యొక్క సందర్శనమే బుద్ధితో నిర్వర్తించ వలసిన ఆత్మ శివదర్శనము - అని బ్రహ్మవాదులు చెప్పుచున్నారు! (బుద్ధితో సిద్ధించుకోవలసినదే ‘శి2వోహమ్’)
7. సర్గాదికాలే భగవాన్ విరించిః
ఉపాస్య ఏనం
‘సర్గ సామర్థ్యమ్’ ఆప్య,
తుతోష చిత్తే వాంఛితార్థాంశ్చ
లబ్ధ్వా ధన్యః।
సో అస్య ఉపాసకో భవతి
ధాతా।
ఓ మునులారా! ఈ కనబడే సృష్టికి కర్తయగు విరించి (సృష్టికర్తయగు బ్రహ్మదేవుడు) సృష్టిని ప్రారంభించు సమయంలో సర్వాత్మకుడగు మేధా దక్షిణామూర్తి స్వామిని ఉపాసించి, సృష్టి సామర్థ్యమును పొందటం జరిగింది. స్వస్వరూపముయొక్క సర్వాత్మత్వమును ఎరుగుటచే సృష్టించు ప్రయోజకత్వము సిద్ధించింది.

ఎవ్వరైతే భక్తిచే వెలిగించిన ఆత్మజ్ఞాన దీపపు వెలుగులో తమయందే వేంచేసి యున్న శివతత్త్వమును దర్శిస్తారో అట్టి వారు బ్రహ్మదేవునివలెనే సృష్టి సామర్థ్యమునే పొందగలరు. ఇక సకల వాంఛితార్థములు వాటికవే నెరవేరగలవని వేరే చెప్పటమెందుకు?
య ఇమాం పరమ రహస్య
‘శివతత్త్వ విద్యామ్’ అధీతే,
స సర్వపాపేభ్యో ముక్తో భవతి।
య ఏవం వేద,
స కైవల్యమ్ అనుభవతి।।
పరమ రహస్యమగు ఈ ‘ఆత్మజ్ఞానముచే వాక్య విషయములపై రాగమును జయించి, ఆత్మయందే శివదర్శనం చేయటం!’ అనే శివతత్త్వజ్ఞాన విద్యను ఎవ్వరు అభ్యసిస్తారో, అట్టివారు సర్వదోషముల నుండి, సర్వ పాపములనుండి ‘విముక్తులు’ (Relieved) కాగలరు.
- శివతత్త్వజ్ఞానము…(‘త్వమ్ తత్ శివయేవ యత్ జ్ఞానమ్, తత్ శివతత్త్వజ్ఞానం!’) -….చే ‘కైవల్యము’ పొందగలరు. అనగా, ఈ జీవుడు తనయొక్క సందర్భ పరిమిత సంబంధమైన శృంఖలములను (బేడీలను) త్రెంచివేసి, కేవలీ స్వస్వరూపమును ఆస్వాదించగలరు. ‘‘నేను, నీవు, జగత్తు కూడా సర్వదా శివస్వరూపమే’’ అని అభ్యసించుటయే - ‘‘శివో2హమ్’’। తద్వారా ‘‘నేను జీవశ్శివ ఏక-అఖండ స్వరూపుడను’’ - అనునది సునిశ్చితము, అనుక్షణికము అగుచున్నది.

ఇతి దక్షిణామూర్త్యుపనిషత్ ।
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।।కృష్ణ యజుర్వేదాంతర్గత

14     దక్షిణా మూర్తి ఉపనిషత్

అధ్యయన పుష్పము


స్తుతి

ఓం శ్రీ మేధా దక్షిణామూర్తయే నమో నమః। ఓం నమశ్శివాయ।
।।శ్రీ మేధా దక్షిణామూర్త్యుపనిషత్ స్తుతి।।
యః మౌనవ్యాఖ్యయా మౌని పటలం క్షణమాత్రతః ‘‘మహామౌన పదం’’ యాతి……

ఎవ్వరైతే తన ‘మౌనవ్యాఖ్య’చే ‘పరబ్రహ్మతత్త్వము’ను ప్రకటించుచుండగా, ఆయన చుట్టూ పరివేష్ఠితులైయున్న మునుల పటలముయొక్క స్వస్వరూపమునకు సంబంధించిన సర్వసందేహములు మొదలంట్లా తొలగిపోయి……, ‘శివో2హమ్’ జ్ఞానానందరూపమగు ‘మహామౌనపదము’ను అధిరోహించి పరమానందించుచున్నారో….

స హి మే ‘పరమాగతిః’।।

అట్టి శ్రీ మేధా దక్షిణామూర్తియే, ఆ పరమశివుడే నాకు సర్వదా గతి - అని ప్రార్థిస్తున్నాను. నాకు-వేరే గతి లేదు.

ఉపనిషత్ - శౌనకాది మునుల ప్రశ్న

‘బ్రహ్మావర్తము’ → మునులు - ఋషులు - బ్రహ్మతత్త్వజ్ఞులు నివాసముంటున్న పరమ పవిత్రమగు ప్రదేశము. ఒక మహావటవృక్షమూలములో వేదజ్ఞులు, వేదాంతతత్త్వజ్ఞులు, లోకకళ్యాణ మహదాశయముతో వేయి సంవత్సరముల కాలం జరిగే ‘మహాసత్రయాగము’ ప్రారంభించారు. శ్రీ శౌనకుల వారు మొదలైన మహనీయులంతా సమిత్పాణులై (యజ్ఞ పరికములను వెంట నిడుకొన్నవారై) ఆ యాగమునకు విచ్చేసియున్నారు.

శ్రీ మార్కండేయ మహర్షి ఒకరోజు ఏకాంతంలో ప్రశాంత - ఆనందములతో సుఖాశీనులై ఉండగా శ్రీ శౌనకుడు మొదలైన మునులు, మహర్షులు - ఆ మహర్షిని దర్శించి, పాదాభివందనములు సమర్పించారు. ఈ విధంగా స్తుతించారు.

మార్కండేయులవారు ఆ శౌనకాది మహర్షులకు సుస్వాగతము పలికి ఉచితాసనములు సమర్పించారు.

శౌనకాది మునులు : హే శివతత్త్వజ్ఞానానంద ప్రజ్ఞాస్వరూపా! భగవాన్! మార్కండేయ మహాశయా! మీరు శాశ్వతమగు ఆత్మానందస్థితిని, పరమతాత్త్విక రూపమగు చిరంజీవత్వమును సిద్ధించుకున్నారని మునిలోకము మిమ్ములను ప్రస్తుతించుచూ ఉంటుంది. ఇది ఎట్లా మీకు సుసాధ్యమైనదో సవివరించవలసిందిగా అభ్యర్థిస్తున్నాము.

⁉️ కేన త్వం చిరంజీవసి? దేని చేత మీరు చిరంజీవులయ్యారు?
⁉️ కేన వా ఆనందమ్ అనుభవసి ఇతి? దేనివలన మీరు తెంపులేని ఆత్మానందమును సిద్ధించుకోగలుగుచున్నారు?

శ్రీ మార్కండేయ మహర్షి : మహనీయులారా! మీరు చెప్పుచున్నదంతా - పరమ రహస్యమగు ‘శివతత్త్వజ్ఞానము’ చేతనే శ్రీ దక్షిణామూర్తి ప్రసాదముగా నాకు సిద్ధించుచున్నది.

శౌనకాది మునులు :

⁉️ కిం తత్ పరమరహస్య శివతత్త్వజ్ఞానమ్? అట్టి పరమ రహస్యమగు శివతత్త్వజ్ఞానము ఏ విధమైనది? ఏ తీరైనది?
⁉️ కోదేవః? అందుకు ‘దేవత’ ఎవరు? కో జపః? జపము ఏది? కే మంత్రాః? అందుకు మంత్రములు ఏవి? ఏ ముద్రతో అట్టి జప మంత్ర ధ్యానములు నిర్వర్తించారు?
⁉️ కా నిష్ఠాః? ఎటువంటి నిష్ఠ కలిగి ఉండాలి?
⁉️ కిం తత్ జ్ఞాన సాధనం? అందుకు జ్ఞానసాధనములు (ఉపకరణములు Instruments) ఏమేమి? అందుకు పరికరములు?
⁉️ కిం బలిః? అందుకు సమర్పించవలసినవి ఏమేమి?
⁉️ కం కాలః? అందుకు ఏ ఏ సమయములు పాటించాలి? ఎప్పుడెప్పుడు చేయవచ్చు?
⁉️ కిం స్థానం? ఏఏ ప్రదేశములు అట్టి శివతత్త్వజ్ఞాన సాధనకు అనువైన స్థలములు / ప్రదేశములు అయి ఉంటున్నాయి? ఎక్కడెక్కడ నిర్వర్తించవచ్చు? దయతో వివరించండి!

శ్రీ మార్కండేయ మహర్షి :

యేన దక్షిణాముఖః శివో (అ)పరోక్షీకృతో భవతి - తత్ - పరమరహస్య శివతత్త్వజ్ఞానమ్! దక్షిణా (ఆత్మజ్ఞానా) అభిముఖుడగు ఆ పరమ శివుడు… ప్రత్యక్షమా? పరోక్షమా?
- ‘ప్రత్యక్షము కాదు. పరోక్షము కాదు. అపరోక్షము. నాకు ఇంద్రియముల విషయరూపము కాదు. కాబట్టి ప్రత్యక్షము కాదు.
మరెక్కడో నాకు వేరై ఉన్న వారు కాదు. నాకు భిన్నం కాదు! మనందరి స్వస్వరూపమునకు అభిన్నము. అందుచేత పరోక్షమూ కాదు.
అపరోక్షము…..! ‘ఇంద్రియములకు అవిషయుడగు స్వస్వరూపుడు. నాకు, సర్వజీవులకు కూడా స్వస్వరూపుడే!’’ అను జ్ఞానమునే పరమరహస్యమగు శివతత్త్వజ్ఞానము (‘త్వమ్ తత్ శివయేవ - ఇతిజ్ఞానమ్’) అంటున్నారు.

‘‘నీవుగా ఉన్నది ఆ పరమశివుడే’’ → అనునదే రహస్యమగు శివ - తత్ -త్వమ్। - తత్ శివః త్వమేవ। - ఏతత్ జ్ఞానమ్।

అట్టి దృష్టియే ‘పరోక్షము’ (పరము చెందిన దృష్టి).

సర్వాంతర్యామి, సర్వతత్త్వ స్వరూపుడు అగు ఏ స్వస్వరూప పరమాత్మ-ఈ జగత్ దృశ్యభావనా వ్యవహారమంతా తనయందు ప్రళయకాలమునందు, [ ఉపసంహార కాలమునందు (At the Time of with drawl) ] లయింపజేసుకొని ‘స్వాత్మ’ యందు బ్రహ్మానందంగా సుఖస్వరూపులై విరాజిల్లుచూ ప్రకాశించుచున్నారో - ఆయనయే ఆ పరమ దేవాది దేవుడు. (సమస్త దృశ్యమును నిస్సందేహముగా ‘‘స్వస్వరూపాత్మకు - అభిన్నంగా దర్శించటమే ‘‘ప్రళయము’’.

శివో2హమ్! నేను సర్వదా కేవలాత్మ యగు శివస్వరూపుడనే! (సో2హమ్). నీవు కూడా శివస్వరూపుడవే! తత్ త్వమ్। ప్రతి జీవుడు అదియే! అయం జీవోబ్రహ్మేతి నాపరః।

నా నుండి భావనామాత్రంగా బయల్వెడలుచూ ప్రత్యక్షమై కనిపిస్తున్న ఈ లోక-లోకాంతర దృశ్య వ్యవహారమంతా - ఒక స్వప్నదృశ్యము వలె - తిరిగి ఏ ‘కేవలా2హమ్’ స్వస్వరూపమునందు లయమగుచున్నదో, అదియే ‘శివో2హమ్’। సర్వశేష్య - సుఖానంద - పరమానందము మేధకు (లేక) స్వబుద్ధికి ప్రకాశమానమగుచున్నదో అదియే ‘శివో2హమ్’!

మేధా.......కేవల బుద్ధి స్వరూపమై, బుద్ధికి మాత్రమే అనుభవమై 
దక్షిణా.......కేవల జ్ఞానానందమై, ద-ప్రసాదిస్తూ, 
మూర్తిః........జగత్తుగా మూర్తీభవించినదై ఉన్న కేవలీతత్త్వమే శ్రీ మేధా దక్షిణామూర్తి తత్త్వము.

అట్టి శ్రీ మేధా దక్షిణామూర్తి గురించి శివతత్త్వజ్ఞులగు మహనీయులు స్తుతించుచున్నారు.

అట్టి స్తోత్రములు,….మంత్రరహస్య శ్లోకములే మేధా దక్షిణామూర్తి మంత్రములై శివతత్త్వోపాసకులకు ధ్యానశ్లోకములగుచున్నాయి. వారికి ఆశ్రయము అగుచున్నాయి.

అత్రైతే - మంత్రశ్లోకా

మొట్టమొదటగా నేను సేవించే అట్టి మేధా దక్షిణామూర్తి మంత్ర - శ్లోకములను వివరిస్తున్నాను. వినండి.

- ఓం శ్రీ మేధా దక్షిణామూర్తి మహా మంత్రస్య
- బ్రహ్మా - ఋషిః
- గాయత్రీ - ఛందో
- దేవతా, ‘దక్షిణా’

ఓం శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః

ఆస్యో మంత్రే అంగన్యాసః!

కరన్యాసః ఓం మేధా → అంగుష్టాభ్యోం నమః। → అనామికాభ్యోం నమః।
దక్షిణా → తర్జనీభ్యోం నమః। → కనిష్ఠికాభ్యోం నమః।
మూర్తయే నమః → మధ్యమాభ్యోం నమః। → కరతలకర పృష్టాభ్యోం నమః।
అంగన్యాసః ఓం మేధా → హృదయాయ నమః। → కవచాయహుమ్।
దక్షిణా → శిరసే స్వాహా। → నేత్రత్రయాయ వౌషట్।
మూర్తయే నమః → శిఖయాయ వౌషత్। → అస్త్రాయ ఫట్
  భూర్భుస్సువరోమ్ ...... ఇతి దిగ్బంధః।।

ఓం అని ప్రారంభించాలి. ‘‘నమో’’ ….. జీవబ్రహ్మైక్య భావం।

నమో ఊహవకే (6)
(న = కేవలము. మ = సందర్భము)
(న = పరమాత్మ. మ = జీవాత్మ)

ఆదౌ దక్షిణా మూర్తయే (8) … జ్ఞానమయమైన మూర్తికి-మూర్తీభవించినట్టి, ‘ఆది’ స్వరూపులకు,

చతుర్థ్యంతం (4) ……. తురీయమునకు సాక్షి అగు,

మేధాం (2) …..(ప్రజ్ఞాస్వరూపుడగు స్వామి)

సముచ్చార్య (4) … నా బుద్ధిని నిద్ర లేపువారై ‘చైతన్యస్ఫూర్తి’తో ప్రత్యక్షమగుదురుగాక!

‘ఛం ఛం ఛం’ వాయుబీజమై → జీవనాధారులై

వహ్నిజాయాం తత్ అస్తు → జ్ఞానాగ్నిచే నాయందు ‘వ్యష్టిభ్రమ’ అనే చీకటిని తొలగించి ‘‘తత్ స్వరూపులై’’ ప్రకాశించెదరుగాక!

(ఓం) నమో భగవతే
(6)
ఆదౌ దక్షిణా మూర్తయే
(8)
చతుర్థ్యంతం
(4)
మేధాం
(2)
సముచ్చార్య
(4)
ఏష చతుర్వింశాక్షరో
(24)

24 అక్షరములతో శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామిని నిత్యము అశ్రయిస్తున్నాను.

ధ్యానమ్

శ్లో।।   స్ఫటిక రజత వర్ణమ్, మౌక్తికీమ్ అక్షమాలామ్, 
    అమృత కలశ విద్యాం, జ్ఞానముద్రాం కరాగ్రే, 
    దధతమ్ ఉరగ కక్షం, చంద్రచూడం త్రినేత్రమ్, 
    విధృత వివిధ భూషం దక్షిణామూర్తి మీడే।।

స్ఫటికము - వెండిల వలె నిర్మల ప్రకాశ సమన్వితులు, ముక్తాహారము ధరించినట్టివారు, అక్షమాల -గ్రంథ (పుస్తక) ధారి, చేతులతో అమృత కలశమును, బ్రహ్మవిద్యా సంజ్ఞ అగు చిన్ముద్ర (జ్ఞానముద్ర)ను ధరించినవారు, నడుమున సర్పమును ధరించినవారు, చంద్రధారి, త్రినేత్రుడు అనేక ఆభరణములు ధరించినవారు - అగు శ్రీ మేధా దక్షిణామూర్తిని ధ్యానించుచున్నాను.

    ‘‘ఓం’’ నమో భగవతే ఆదౌ దక్షిణామూర్తయే 
    చతుర్ధ్యంతం మేధాం సముచ్చార్య (24) - ఛం।।

న్యాస మంత్రము

శ్లో।।   ఆదౌ వేదాదిమ్ ఉచ్చార్య । స్వరాత్ యం స-విసర్గకమ్। 
    పరిచార్ణం తత ఉధృత్య। అంతరం స విసర్గకమ్। 
    అంతే సముద్ధరేత్ తారం। మనుః ఏష నవాక్షరః।।

వేదములు ఆదిస్వరూపుడుగా స్వర - విసర్గలతో కూడిన మంత్రరూపంగా చెప్పుచున్నది, హృదయ కవాటములు విప్పునది, అంతరమున జగత్తులను లయము చేసుకొనునది, మమ్ములను సముద్ధరించునది, తరింపజేయునది, ఉత్తమబుద్ధిని ప్రసాదించునది అగు నవాక్షర మంత్రమును ఆశ్రయించుచున్నాను.

ఓం

శ్రీ మేధా దక్షిణామూర్తయే

నమః

స్తోత్రం (ప్రార్థన)

    శ్లో।। ముద్రాం భద్ర - అర్థ దాత్రీం, స పరశు హరిణం 
      బాహుభిః బాహుమ్ ఏకమ్,

భద్రార్థముద్ర (చిటికెన వేలు - చూపుడు వేలు కలిపిన - తత్ - త్వమ్ చిన్‌ముద్ర)ను ధరించినవారు, చేతులతో హరిణము (జింక)ను, పరశువు (గొడ్డలి) కలిగియున్నవారు. ఉభయ భుజములను సమాంతరముగా ధారణ చేయువారు,

      జాన్వాసక్తం దధానో, భుజగవర 
      సమాబద్ధ కక్ష్యో వటాధః, 

(చేతులను మోకాళ్లపై ఆనించుకొని ఉన్నవారు), పామును మొలత్రాడుగా కలిగియున్నవారు

      ఆసీనః చంద్రఖండ ప్రతిఘటిత 
      జటాక్షీర గౌరః త్రినేత్రో,

ముడిపెట్టిన జటాజూటములో చంద్రకళను ధరించి ఆసీనులై ఉన్న వారు, క్షీరము (పాలు) వలె తెల్లటి వర్ణులు, త్రినేత్రులు,

      దద్యాత్ ఆద్యైః శుకాద్యైః 
      మునిభిః అభివృతో భావశుద్ధిమ్ భవో నః।।

వటవృక్షమూలములో (మర్రిచెట్టు మొదలున) ఛాయలో శ్రీశుకుడు మొదలైన మహర్షులతో, మునిజనముతో పరివృతులు అగు శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామి మాకు భావసంశుద్ధిని ప్రసాదించి మా మనో బుద్ధి చిత్తములను పవిత్రము చేసెదరు గాక.


మంత్రముతో న్యాసము

ఋషి → బ్రహ్మదేవులవారు; తారకమంత్రం → ‘బ్లూం నమ’ ఉచ్ఛరించటం; మాయ → వాక్కు అగునుగాక, ‘దక్షిణా’→ అనుపద ఉచ్ఛారణ; పదము (మహదాశయము) → తతోమూర్తి।

    ఓం తారం బ్లూం నమ ఉచ్చార్య మాయాం వాగ్భవమేవ చ,దక్షిణాపదమ్ ఉచ్చార్య 
    తతః స్యాత్ మూర్తయే పదమ్। జ్ఞానం దేహి, తతః పశ్చాత్ వహ్న జాయాం తతో వదేత్।।

స్వామీ! ఈ మా అగ్నికార్యము స్వీకరించి మాకు ‘జ్ఞానము’ను ప్రసాదించండి! మాయకు యజమానులగు మీరు మమ్ము మాయ నుండి తరింపజేయండి? - ‘‘నమో దక్షిణామూర్తయే’’ - ఈ అష్టాదశాక్షర మేధా దక్షిణామూర్తి మంత్రము తనయందు సర్వ మంత్రములను కలిగియున్నట్టిది. ఉచ్ఛారణచేత దక్షిణామూర్తి పదము వాక్‌నందు ప్రవేశించగలదు.‘‘జ్ఞానందేహి’’ - అను శబ్దముచే ఆత్మజ్ఞానము సిద్ధించగలదు.

మంత్రము

  ‘‘ఓం బ్లూం దక్షిణామూర్తయే నమః। జ్ఞానం దేహి। వహ్నిజాయాం మనః’’

ధ్యానమ్

  శ్లో।। భస్మవ్యా పాండురాంగః శశిశకల ధరో జ్ఞానముద్రాక్షమాలా, వీణా  పుస్తైః విరాజః 
    కరకమలధరో యోగపట్టాభిరామః, వ్యాఖ్యా పీఠే నిషణోణా మునివర నికరైః సేవ్యమానః ప్రసన్నః।।

తెల్లటి భస్మమును ధరించిన భస్మ భూషితాంగులు, శిఖలో చంద్రుని ధరించినవారు, చిన్ముద్ర (జ్ఞానముద్ర)ను ధరించినవారు, అక్షమాలను (రుద్రాక్షమాలను) అలంకరించుకొన్నవారు, వీణ - పుస్తకములను చేతిలో కలిగి ఉన్నవారు, కమల పుష్పము చేతిలో కలవారు, యోగీశ్వరులు, మౌనవ్యాఖ్యాపీఠముపై ఆశీనులైనవారు, చుట్టూ మునిజనము పరివేష్టితులై సేవించబడుచున్నవారు, ప్రసన్నవదనులు - అగు శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామికి నమస్కరించుచున్నాము.

  శ్లో।। సః వ్యాళః, కృత్తివాసాః, సతతమ్ అవతు నో 
    దక్షిణామూర్తి ఈశః

సర్వాభరణులు, కృత్తివాసులు ఈశుడు అగుసాక్షాత్ శ్రీ దక్షిణామూర్తి మాకు సదా రక్షకులై కాపాడుదురు గాక।

మన్త్రేణ న్యాసః మంత్రముతో కూడిన న్యాసములతో →

ఋషి → బ్రహ్మదేవుడు; బీజము → మాయ నుండి తరింపజేయు అమ్మవారు; రమాబీజం। 
దేవత → సాంబశివపాదపద్మములు; 
తుభ్యం చ అనల జాయం చ మనుః ద్వాదశ వర్ణకః ‘12’ వర్ణముల శోభితులు, అగ్నిప్రకాశము కలవారు 

ధ్యానము :

  శ్లోకము।। 
  వీణాం కరైః పుస్తకమ్ అక్షమాలాం, బీహ్రాణమ్ ఆహ్రాభ గళం వరాఢ్యమ్ 
  ఫణీంద్ర కక్ష్యం మునిభిః శుకాద్యైః, సేవ్యం వటాధః కృతనీడ మీడే।।

వీణా పుస్తక - అక్షమాలాధారులు, గరళకంఠులు, మేఘము వంటి కంఠపు రంగులో ప్రకాశించువారు, నాగరాజును మొలత్రాడుగా ధరించినవారు, శ్రీశుకుడు మొదలైన మునిగణముచుట్టూ ఆశీనులై ఉన్నట్టివారు, వటవృక్షమూలమున నీడయందు ఆశీనులై ఉన్న శ్రీ మేధా దక్షిణామూర్తిని భావించి ధ్యానిస్తున్నాము.

అంగన్యాస - కరన్యాసయుక్తంగా →

అంగన్యాస - కరన్యాసయుక్తంగా →
ఋషి → విష్ణువు; అనుష్టువ్ ఛందస్సు ; దేవత → శ్రీ దక్షిణామూర్తి ;

♠︎ అజ్ఞానము నుండి తరింపజేయువారు,
♠︎ భగవతితో కూడుకొన్నవారు,
♠︎ ‘‘మూలేతి’’ అను పదము ఉచ్ఛరిస్తూ హృదయ పీఠము ధరించి ఉద్ధరించువారు
♠︎ ప్రజ్ఞా - మేధను సిద్ధింపజేయువారు,
అగు శ్రీ మేధా దక్షిణామూర్తి మాకు ఉత్తమమగు వాక్కును, అహమాత్మా-తత్ పదమును ప్రసాదించెదరుగాక! 32 వర్ణములతో కూడిన సాంబసదాశివులకు నమస్కారము!

‘దాయినే’ (ప్రసాదించువారు) - అను పదోచ్ఛారణతో మేము ప్రార్థిస్తున్నాము. మమ్ములను ‘మాయ’ నుండి సముద్ధరించెదరుగాక! అనుష్టువ్ చంధస్సుతో కూడిన మంత్రమును అనుష్టించుచున్నాము.
మాయినంతు మహేశ్వరః। దురత్యయమగు మాయను దాటటానికి ‘మాయి’ అగు సాంబశివులవారిని ఉద్దేశించి, ‘శరణు! శరణు’ అని పలుకుచున్నాము.

ధ్యానము :

శ్లో।। ముద్రా పుస్తక వహ్ని నాగ విలసత్ బాహుం ప్రసన్నాననమ్। 
ముక్తాహార విభూషణం, శశికలా భాస్వత్ కిరీటోజ్వలమ్। 
అజ్ఞానాపహమ్ ఆదిమ్ ఆదిమగిరామ్ అర్థం, భవానీపతిం। 
న్యగ్రోధాన్త నివాసినం పరగురుం ధ్యాయేత్ అభీష్టాప్తయే।।

ధ్యానముద్ర-పుస్తకము-అగ్నితేజస్సు-సర్పము-ఈఈ మొదలైన ధారణా విశేషములతో అలంకరించబడిన బాహువులు కలవారు, ప్రసన్నముతో కూడిన ముఖపద్మము కలవారు, ముత్యాలహారము అలంకారముగా కలవారు, చంద్రబింబముతో ఉజ్వలముగా ప్రకాశించుచున్న కిరీటము ధరించినవారు, భావించినంతమాత్రం చేత అజ్ఞానంధకారమును పటాపంచలు చేసివేయువారు, సర్వమునకు ఆదిస్వరూపులు, వటవృక్షమూలమున ఆశీనులైన వారు, దేవతలకు గురువు అగు - శ్రీ మేధా దక్షిణామూర్తిని మా అభీప్సిత సిద్ధికొరకై ధ్యానము చేయుచున్నాము.

⌘⌘⌘

ఓ మునీశ్వరులారా! మనము ఇప్పటివరకు ‘శ్రీమేధా దక్షిణామూర్తి స్తుతి’ గురించి, శివతత్త్వ స్తోత్ర - ధ్యాన - అంగ ఉపాంగ ఉపాసనల గురించి చెప్పుకున్నాము.

ఇక మనము మీరు అడిగిన - మహత్తర రూపమగు ‘శివతత్త్వమ్-శివో2హమ్’ నకు సంబంధించిన వివరణాత్మక సూచనలను ప్రసాదించగల - ప్రశ్నలకు సమాధానములను వివరించుకుందాము.

శివతత్త్వజ్ఞానము - నిష్ఠ

నిష్ఠా : మౌనముద్రా సో2హమ్ ఇతి యావత్, ఆస్థితః - సా ‘నిష్ఠా’ భవతి।।
‘‘నేను దృశ్య - దేహ - మనో - బుద్ధి - చిత్త అహంకారములకు వేరై, కేవల ‘సాక్షి’ అయినట్టి ఆత్మ స్వరూపుడను! ఈ దృశ్యము మొ।। వన్నీ ఆత్మస్వరూపమే అయి, ఆత్మ యొక్క మౌనభావనచే నేను దర్శించెదనుగాక’’….అను నిష్ఠయే ‘మహామౌన నిష్ఠ! అదియే ‘శివతత్త్వజ్ఞానము’ (లేక), ‘చిదానందరూపమ్ - శివో2హమ్’…. భావన! ఈ సమస్తము పట్ల శివభావన, అనన్య భావన కలిగి ఉండటమే మౌనముద్ర.

‘త్వమ్ తత్ శివయేవ’ ఇతి జ్ఞానమ్ - ‘‘నీవు ఆకారమునకు, గుణములకు, స్వభావములకు ఆవల ప్రకాశిస్తున్న శివస్వరూపుడవే! జీవాత్మ - జగత్తులకు అతీతుడవు! సాక్షివి! కేవల మౌన స్వరూపడవు!’’ - ఇది జగద్గురువగు శ్రీ దక్షిణామూర్తి చిన్ముద్రా సమన్వితులై చిరునవ్వుతో చూపిస్తున్న స్వస్వరూపతత్త్వము.

ఈ సమస్త సహజీవులపట్ల, జగత్ దృశ్యముపట్ల - ‘‘తత్‌త్వమ్ - భావన’’యే శివతత్త్వజ్ఞానము.

చిదానందరూపమ్! శివో2హమ్! శివో2హమ్! శివో2హమ్! - ఇదియే సుస్థిరీకరించుకొనవలసిన మౌనవ్యాఖ్యాసారము.

ఈ కనబడేదంతా ‘శివతత్త్వమే’ - అని గురువాక్యానుసారం గ్రహించి, ఆ విధంగా మరల మరల అనుకొనుటము, సమయన్వించుకోవటము నిష్ఠ!

‘నాలోని నైన నేనే ఇదంతా’ అనునదే మౌనవ్యాఖ్య! అద్దాని మననమే ‘నిష్ఠ’ అని గ్రహించెదముగాక!

నేనే బ్రహ్మమును! నేను బహ్మమే! నాకు వేరుగా కనిపించే నీవు - జగత్తు → ఇవన్నీ భేదదృష్టిచే స్వప్నములోని వస్తువులవంటివై, ఆత్మదృష్టిచే మమాత్మయే అయి ఉన్నాయి - ఇతి భావనాభ్యాసమ్ నిష్ఠ!

అట్టి నిష్ఠ కలవాడు - అత్యంత స్వభావసిద్ధంగా, జన్మ మృత్యువులకు గాని, దేహముయొక్క స్థితి - గతులకు గాని విషయుడవడు.

సాక్షి అయి చిద్విలాసంగా అవలోకిస్తూ, వినోదిస్తూ ఉంటాడు. ‘త్వమ్’ (నీవు) - గా కనిపించేదంతా తత్‌గా (శివ స్వరూపంగా) అనుక్షణము దర్శించటమే ‘‘మౌనము’’.

జ్ఞాన సాధనం

తత్ అభేదేన మన్వామ్రేడనం జ్ఞాన సాధనం। ‘‘పరబ్రహ్మము అనగా నా సహజ స్వరూపమే! తదితరమైనదంతా (రచయితయొక్క తన కథా రచనా వ్యాసంగ సంబంధమువలె) కల్పనా మాత్రము. స్వయం కల్పిత భావనా మాత్రము’’….అని మనస్సుతో మననము కలిగి ఉండటమే జ్ఞానసాధనం.

అభేదమైనట్టి ‘సో2హమ్’ మననముతో కూడిన మంత్రజపమును ఉద్దేశించియే, పరోక్ష స్తోత్రములు (శివ - విష్ణు - దేవీస్తోత్రములు) కూడా మానవాళికి పురాణపురుషులగు ఆ మహనీయులచే అందించబడుచున్నాయి.
ముఖ్యార్థము - ఈ జీవునియొక్క కేవలమగు పరస్వరూపము గురించియే। అపరోక్షజ్ఞానమే ముఖ్యోద్దేశ్యము.

ధ్యాన పరికరములు

చిత్తే తదేకతో పరికరః। బాహ్య విశేషాలను అధిగమించిన దృష్టి - చిత్తముతో (ధ్యాస - ఇష్టములతో) ఏర్పరచుకొనుచూ, ప్రవృద్ధ పరచుకొనుచున్న తదేక ధ్యానమే - పరికరము (ఉపకరణము).

అనేకమును (భేదమును) అధిగమించిన అభేదమగు ఏకత్వమగు ఆత్మగురించిన ధ్యాసయే. → ‘‘తదేక ధ్యానము’’.

‘‘ఆత్మయే నాకు నాయొక్క జగత్ (భేద) దృష్టిచే అనేకముగా (బంధు మిత్ర - శత్రు - మధ్యస్థ - ద్వేష్య - పాప - పుణ్యులుగా) కనిపిస్తున్నది. ఇక్కడ కనిపించేవారంతా బ్రహ్మమే! నా కలలో కనిపించేవారంతా నా కల్పనయే అయినట్లు, జాగ్రత్‌లో కనిపించేదంతా నా జాగ్రత్ కల్పనా విశేషములే! ‘అంతా మమాత్మకు అభిన్నము’ …అను జ్ఞాన దృష్టితో కూడిన ధ్యాసలే ధ్యాన పరికరములు.

అంగచేష్టార్పణం బలిః

ఓ సర్వాత్మకుడువగు పరమాత్మా! పరమాశివా!

(యత్‌యత్ కర్మకరోమి తత్‌తత్ - అఖిలం, శంభో! తవారాధనమ్।) ఈ ఇంద్రియములు మీకు చెందినవి! నేను చేస్తున్న సర్వకర్మలు మీ వినోద - విలాసములే. జీవన్ - మరణములతో సహా సమస్త వ్యవహారములు నేను మీకు సమర్పించే పూజాపుష్పములే!
….అను అంగ చేష్ఠా సమర్పణమే - శివునికి అర్పించు బలి.

(‘శివాత్ పరతరమ్ నాస్తి’ అనునానుడిచే) ఈ సమస్త సందర్భములు, సంఘటనలు, సంప్రదర్శనములు మొ।।వి. జగన్నాటకములోనివిగా, రచయిత పరమ శివుడుగా - దర్శించటమే - సమర్పణ.

త్రీణి ధామాని కాలః

నిదురలేచింది మొదలు → మరల పరుండువరకు (ఉదయము - మధ్యాహ్నము - రాత్రి …..త్రికాలములు) శివతత్త్వోసనకు తగిన కాలమే! సర్వకాల - సర్వావస్థలయందు శివధ్యానమునకు శివతత్త్వోపాసనకు తగిన సమయమే! ‘ఈ కనబడేదంతా శివతత్త్వస్వరూపమే’ అను కాలఃకాల భావనకు కాలనియమమేముంటుంది? ‘‘శివుడే ఈ సమస్తము’’ అను శివతత్త్వ సమదర్శనమునకు ‘అకాలము’ అనునదే ఉండవలసినపనిలేదు.

ద్వాదశాంత పదం స్థానమ్ (లేక సహస్రార స్థానము)

ద్వాదశాంతపదము :

నాసాగ్రము నుండి (ముక్కు పైభాగమునుండి) కపాలముయొక్క ఊర్ధ్వభాగములోగల బ్రహ్మరంధ్రము వరకు బ్రహ్మమార్గము. బ్రహ్మరంధ్రమునకు ఆవల 12 అంగుళముల ఊర్ధ్వస్ధానము - ‘‘సహస్రారము’’.

‘‘లోకాలలో నేను లేను! నాలోనే ఈ లోకాలున్నాయి’’ అను ‘బ్రహ్మమేవా2హమ్’ భావనను - అనుభూతమై ఉండునదే ద్వాదశాంతపదము.

శిరస్సుకు ఉపరి భాగస్థానంలో అట్టి స్థానము అభ్యాసముచే స్వానుభవము అవగలదు. అట్టి ద్వాదశాంత (12 అం।।మ్ ఆవల) పరబ్రహ్మస్థానము - మనము శివతత్త్వోపాసన కొరకై ఎన్నుకొనబడుచున్న ఉత్తమ యోగాభ్యాస స్ధానము.

⌘⌘⌘

అది విని అత్యంత శ్రద్ధగా వినుచున్న శౌనకాది మునులు మార్కండేయుని పలుకులకు పరమానందము పొందుచూ, మరల ఇట్లా ప్రశ్నించారు.

శౌనకాది మునిగణము: హే మహాత్మన్! మార్కండేయా!

కథవా అస్య ఉదయః? హృదయంలో అట్టి ‘‘శివ తత్త్వజ్ఞానము’’ ఎట్లా ఉదయిస్తుంది?
కిం స్వరూపమ్? శివ పరమాత్మయొక్క స్వరూపము ఏది?
కోవా అస్య ఉపాసకః? ఆయనను ఉపాసిస్తూ ఉన్న ఈ జగత్ రచనలో ‘శివో2హమ్ - శివతత్త్వమ్’’ను స్వాభావికంగా సిద్ధించుకొన్న దృష్టాంతాలు ఎవరన్నా ఉన్నారా?

శ్రీ మార్కండేయ మహర్షి: శౌనకాది ప్రియ మునీంద్రులారా! వినండి.

హృదయంలో జీవులమగు మనము జ్ఞానదీపం వెలిగిస్తే ఆ జ్ఞాన తేజస్సుతో ఆత్మారాముడై ఆ శివభగవానుడు సందర్శితమగుచున్నారు. స్వాత్మయే ఆయన!

అపరోక్షస్వరూపుడగు ఆ శివభగవానుడు బాహ్యవస్తువు కాదు! అంతర వస్తువూ కాదు. బాహ్య-అభ్యంతర స్థితమగు మనయొక్క కేవల స్వస్వరూపమే ఆయన।

వైరాగ్య తైల సంపూర్ణే। ….దృశ్య విషయములపట్ల ‘‘రాగరాహిత్యము’ (లేక) విరాగము’’ అనే తైలమును ముందుగా సముపార్జించుకోవాలి.

భక్తివర్తి సమన్వితే : భక్తి (విశ్వప్రేమ - పరాప్రేమ) అనే ‘వర్తి’ని తయారుచేసుకోవాలి.

ప్రబోధపూర్ణపాత్రేతు : ఆత్మ మహావాక్యార్థముల విచారణతో కూడిన ‘ప్రబోధము’ అనే ఉత్తమ ఆత్మవిద్యాసమన్వితమైన బుద్ధిపాత్రలో……

జ్ఞప్తి దీపం విలోకయేత్ : ‘‘సర్వము శివమయమే’’ అను భావన యొక్క జ్ఞప్తి (Conscious Rememberance) - త్వమ్ తత్ శివయేవ - ‘నీవు’గా కనిపిస్తున్నది ఆ పరమశివుడే!’ అనే ‘‘దీపము’’ వెలిగించాలి.

మోహాంధకారే నిస్సారే…, ఎప్పుడైతే ఆత్మజ్ఞాన జ్యోతి వెలుగుచున్నదో, మరుక్షణం ‘మోహము’ అనే చీకటి తొలగుచున్నది. అనగా ‘శివతత్త్వమ్’ సందర్శనాభ్యాసమునుండి ‘శివో2హమ్’ జనించగా, మోహము పోతుంది. ఈ కల్పిత జగదృశ్యమునకు ఆధారమైయున్న మాయా విలోలుడు, బ్రహ్మస్వరూపుడు అగు పరమశివుని దర్శనమగుచున్నది.

మోహము అనగా? : భ్రమ! ఒకడు కథ చదువుచూ ‘అదంతా నిజమే’ అని ఆవేశకావేశముతో పొందటమువంటిది. స్వతఃగా లేనిదే అయికూడా, కల్పనచే అనుభవమయ్యేది. వాస్తవానికి లేనిదే అయి, ఉన్నట్లే అనుభూతమగుచూ,- అనేక స్పందనలకు కారణమగుచూ ఉన్నట్టిది. దీపము వెలిగించగానే చీకటిలో కనిపించిన భ్రమాకారములన్నీ లేనివగుతీరుగా, ‘శివతత్త్వజ్ఞానము’ అనే వెలుగులో ‘అన్యము’ అనే వ్యసనము మొదలంట్లా తొలగుతుంది.

కలలో చూచిన దేహములు, సందర్భములు, సంఘటనలు, కల జరుగుచున్నంతసేపు ‘నిజమే’ అని అనిపిస్తుంది. మెళుకువ రాగానే? ‘‘ఆ"! అదంతా నా భ్రమే!’’ అని అనిపిస్తుంది. కల సమయంలో కలలోని విషయాలు ‘నిజమే’ అని అనిపించటమే ‘మోహము’. ఈ దృశ్య జగత్తులో కనిపించే భేదమంతా - ఆత్మజ్ఞానం జనించనంత సేపు ‘నిజమే’ అని అనిపిస్తుంది! ఆత్మజ్ఞాన-ఆత్మదృష్టులచే ‘మమాత్మయే ఇదంతా కదా!’ అను అనుభూతి స్వభావసిద్ధమగుచున్నది. ‘అన్యము’ అని అనిపించినంతవరకు అది ‘మోహము’. ‘‘నాకు అనన్యమే’’ అని అనిపిస్తున్న మరుక్షణం మోహజాలమంతా వీగిపోవుచున్నది.

‘నేను-నా జీవాత్మ-ఈ జగత్తు-నా ఇష్టదైవము-నా గురువు…ఇవన్నీ సర్వదా ఏకము - అక్షరము అగు శివానంద తత్త్వమే’…పరమానంద పరబ్రహ్మత్తత్వమే’ అని బుద్ధికి అనన్యముగా, అఖండముగా సుస్పష్టమవటమే, అనుభూతమవటమే - మోహ నిర్మూలనము.

మోహము = మా + ఊహమ్ = వాస్తవానికి లేనట్టిది. ఊహయందు అనుభవమగుచున్నట్టిది.

అహమ్ = నేను…ఆత్మయొక్క కేవలీరూపము. శివస్వరూపము. ఈ విధంగా ‘జ్ఞానజ్యోతి’ యొక్క వెలుగులో మోహము తొలగగా ‘శివో2హమ్’ స్వరూపము అనునిత్యమై స్వతస్సిద్ధముగా స్వానుభవమగుచున్నది. (ఇదియే కేవలీ అనునిత్యానుభవము అగు ‘కైలవ్యము’).

ఉదేతి స్వయమేవ హి….స్వయముగా సుస్పష్టము, స్వానుభూతము అగుచున్నది.
….. ఈ జీవుని సందర్భరూపము….జీవాత్మ!
….. ఈతని నిత్య - సత్య - సహజరూపము….శివానంద పరబ్రహ్మమే! అది అమృతరూపమైయుండగా ఈ జీవునికి మృతమెక్కడిది?

⌘⌘⌘

శౌనకాది మునులు : అట్టి ‘స్వాత్మానంద-శివబ్రహ్మము’ అనునిత్యంగా, అనుక్షణికంగా అనుభవమయ్యే విధి - విధానమేది?

మార్కండేయ మహర్షి: నిప్పును జనింపజేయటానికై రెండు కొయ్యచట్రములు (చెక్కలు)గల అరణిలను ఉపయోగిస్తూ ఉంటాము కదా!
ఈ దృష్టామును ఉపయోగించి శివతత్త్వానుభవము గురించి చెప్పుకుంటున్నాము వినండి.

- సర్వప్రాపంచక విషయముల పట్ల అనురాగమును జయించివేసి, రాగరాహిత్యము (విరాగము) ప్రవృద్ధ పరచుకోవటము.
వైరాగ్య అరణం కృత్వా → వైరాగ్యమును అరణిగా చేసుకోవాలి.
- ఆత్మజ్ఞాన సమాచారసముపార్జనను - జ్ఞానం కృత్వా ఉత్తరారణిం → ఆత్మజ్ఞాన సమాచారమే ‘పై అరణి’ చేసుకోవాలి.
- జ్ఞానం వైరాగ్యములతో కూడి నిరంతరమై కర్మ-భక్తి-జ్ఞాన- యోగాభ్యాసములు - ‘‘గాఢతామిస్ర సంశాంతమ్’’ → ఆ రెండు అరణిల ఒరిపిడి.

ఈ విధంగా వైరాగ్య - జ్ఞాన అరణిల నిరంతరాభ్యాసము అనే ఒరిపిడినుండి గూఢం అర్థం నివేదయాత్!…..పరమ రహస్యమగు ‘చిదానందరూపమ్ - తత్ శివం అహమేవ’ అనే పరమార్థము బుద్ధికి స్వాభావికమగునట్లుగా సిద్ధించుకోవాలి.

స్వస్వరూపమే అయి ఉన్న ‘నిజానంద పరమాత్మ - భావన’ వికసించ సాగుతోంది.

అప్పుడీ వర్తమాన ఉపాధితో మార్కండేయ నామధేయ జీవాత్మ మృత్యువు నుండి, మృత్యు పాశములనుండి విడివడి
జన్మ - కర్మల సాక్షియగు స్వస్వరూపాత్మత్వము అగు శివానందము సంతరించుకొనుచున్నాను. ఇదియే నా చిరంజీవత్వ పరమార్థము.

అనగా,
‘మేధా దక్షిణామూర్తి’ అనబడు బుద్ధి వికాసత్వముచే ఆత్మ ఎరుగబడి - ‘‘కేవలము-సర్వము అగు ఆత్మయే నేను’’ → అను ఎరుకతో కూడిన స్వానుభవమే ‘చిరంజీవత్వము’.

ఏ విధంగా అయితే ఒక స్వప్నద్రష్ట విషయంలో స్వప్నము ప్రారంభంలో జనించటము, స్వప్నము ముగియగానే మరణించటము అనునదేదీ ఉండదో,….అదే తీరుగా….సహజమగు స్వస్వరూపాత్మ దృష్ట్యా ఈ జీవునికి దేహము యొక్క రాక ‘ప్రారంభము’ కాదు. దేహముయొక్క నాశనము ‘అంతము’ కాదు. ఎందుచేతనంటే, ఆ రెండిటికీ సాక్షి అయి, పరమై యున్న కేవలాత్మత్వముతో కూడిన శివానందస్వరూపమే నేను! అదియే నీవు! - ఇట్టి ఎరుకయే శివుని వామపాదము.

‘మార్పు - చేర్పుల పరిధి’ అగు యముడు - యమపాశములు నా పట్ల శివభక్తి-శివభావనాభ్యాసనములచే జనించిన శివుని వామపాదతాడనము కారణముగా - ‘మొదలే వాస్తవానికి లేనివి’ - అగుచున్నాయి.

తత్త్వ-అవిచార పాశేన బద్ధం ద్వైత భయాతురం। ఈ మార్కండేయుడు తత్త్వ -అవిచారణారూప పాశములను, ద్వైత భయములను శివానుష్ఠానముచే జనించిన వివేకముచే సర్వాతురతలను నిర్జించివేయుచున్నాడు.

ఈ విధంగా ‘‘దేహముల రాక పోకలచే నేను జనిస్తున్నాను - మరణిస్తున్నాను’’ అనే భ్రమ తొలగిపోవుచున్నది. ‘‘ఇప్పుడు ఇట్లా ఉన్నాను! మరణిస్తే మరొకవిధంగా ఉంటాను’ అనే మృత్యురూప ద్వైత భయ - ఆతురత తొలగిపోగా, ‘‘నిత్య జీవితుడను’’. క్రమంగా ‘‘నిజస్వరూపుడను’’ అగుచున్నాను.

ఉజ్జీవయన్ - నిజానందే స్వస్వరూపేణ సంస్థితః। నిజానంద స్వరూపుడగు స్వస్వరూప పరమశివత్వమునందు స్థానము (Sense of placement) లభించుటచే చిరంజీవుడను!

బుద్ధినేత్రములకు స్వస్వరూప పరమాత్మ సందృశ్యమగుచుండటంచేత - శేముషీ-దక్షిణా ప్రోక్తా సాయస్య అభీక్షణే ముఖమ్। దక్షిణాభిముఖః ప్రోక్తః శివో2సే బ్రహ్మవాదిభిః।। → ఆ స్వానుభవమగుచున్న కేవల - స్వస్వరూపమే మేధా దక్షిణామూర్తి సాక్షాత్కారము - అని బ్రహ్మతత్త్వము ఎరిగిన మహనీయులు నిర్వచిస్తూ విశదీకరిస్తున్నారు కూడా! దక్షిణ = పరాకాష్ఠబుద్ధికి అభిముఖవటము).

ఓ శౌనకాది మునిశ్రేష్ఠులారా!

నేను ఇప్పటివరకు చెప్పిన…..,
‘‘వైరాగ్య - జ్ఞాన కర్మలచే ద్వైతము జయించబడగా మేధకు (బుద్ధికి) ‘‘సహజ - నిత్య - సత్యస్వరూపుడగు కేవలాత్మదర్శనము’’ అనే మేధా దక్షిణామూర్తి దర్శనము (లేక) శివో2హమ్ - స్వాభావిక స్థానమును’’…. ఇతః పూర్వము మహనీయులెందరో సిద్ధింపజేసుకొని ‘‘శివో2హమ్’’ తత్త్వజ్ఞాన సంపన్నులై మృత్యుపరిధులను జయించి అమృతరూపులై ప్రకాశించుచున్నారు. వారందరు మనకు ఆదర్శ పురుషులు. వారి ప్రవచనములే మనకు శిరోధార్యము.

శివో2హమ్ భావసిద్ధిచే సృష్టి సామర్థ్యము

ఈ సృష్టి యొక్క ప్రారంభంలో సృష్టికర్త అగు బ్రహ్మదేవుడు సర్గాదికాలే భగవాన్ విరించిః - మనము చెప్పుకున్న జన్మ - మరణముల, మార్పు చేర్పులకు విషయమే కానట్టి శివతత్త్వమును ధ్యానించి, ఆరాధించి శివో2హమ్ జ్ఞానముచే ఆనందము పొందినవారై సృష్టి సామర్థ్యమును పొంది….ఈ లోకములన్నీ సృష్టించుచున్నారు.

ఈ పరమ రహస్యమగు శివతత్త్వజ్ఞానమును (త్వమ్ తత్ శివయేవ - జ్ఞానము) (లేక) శివతత్త్వవిద్యను లేక శివో2హమ్ విద్యను పొందిన ఉపాసకునికి సర్వసిద్ధులు సిద్ధిస్తాయి. బ్రహ్మదేవునివలె స్వరూపి సామర్థ్యమును పొందగలడు. ఇక తదితర సంపదల విషయం చెప్పేదేమున్నది?

సిద్ధుడు = ఈ దృశ్య - దేహ - మనో - చిత్త - అహంకార - జాగ్రత్ - స్వప్న - సుషుప్తులతో సహా సమస్తము నాయొక్క ఆత్మ స్వరూపముచే సిద్ధించుకొనుచున్నట్టివి - అను సునిశ్చలమగు ఎరుక కలిగిఉండువాడు. తదేవ చిరంజీవత్వమ్।

⌘⌘⌘

ఫలశృతి

య ఇమాం పరమరహస్య శివతత్త్వవిద్యాం అధీతే, స సర్వపాపేభ్యో ముక్తో భవతి।
దీనిని పఠించి, అభ్యసించి సర్వము తానైన ‘‘శివతత్త్వమ్ నిజస్వరూపమ్’’ దక్షిణ (బుద్ధి) నేత్రములతో దర్శించు భక్తుడు, యోగి, జ్ఞాని….ఇప్పుడే ఇక్కడే సమస్త దోషములనుండి వినిర్ముక్తుడై మోక్షమును సిద్ధింపజేసుకొనగలడు. ముక్తుడై ‘చిరంజీవి’ కాగలడు.

య ఏవం వేద, స కైవల్యమ్ అనుభవతి!
శివతత్త్వమును స్వతత్త్వముగా ఎరిగినవాడు ఇప్పుడే, ఇక్కడే ‘కైవల్యము’ను స్వానుభవంగా పొందుచున్నాడు. కేవలుడై, కేవలానందుడై విరాజిల్లుచున్నాడు.

కేవలమగు పరమాత్మత్త్వమును-సందర్భమాత్రమగు జీవాత్మత్త్వమును అద్వితీయ - అభేదదృష్టితో ఆస్వాదించు స్వానుభవమే కైవల్యము. (తదేవ చిరంజీవత్వమ్।)🙏 ఇతి కృష్ణయజుర్వేదాంతర్గత దక్షిణా మూర్తి ఉపనిషత్ ‌🙏
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।।