[[@YHRK]] [[@Spiritual]]

Pancha Brahma Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 2
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com
Courtesy - sanskritdocuments.org (For ORIGINAL Slokas Without Sandhi Splitting)


కృష్ణ యజుర్వేదాంతర్గత

17     పంచ బ్రహ్మోపనిషత్

శ్లోక తాత్పర్య పుష్పమ్



బ్రహ్మాదిపంచబ్రహ్మాణో యత్ర విశ్రాంతిమాప్నుయుః .
తదఖండసుఖాకారం రామచంద్రపదం భజే ..

శ్లో।। బ్రహ్మాది పంచబ్రహ్మాణో,
యత్ర విశ్రాంతిమ్ ఆప్నుయుః,
తత్ అఖండ సుఖాకారం
రామచంద్ర పదమ్ భజే।।

సృష్టికర్తయగు బ్రహ్మదేవుడు మొదలుగా పంచ బ్రహ్మలు ఎక్కడ ఆత్మానంద విశ్రాంతిని పొంది బ్రహ్మానందభరితులై ఉంటున్నారో,...అట్టి అఖండ సుఖ ఆకారమగు శ్రీరామచంద్ర పదమును భజించుచున్నాము.


అథ పైప్పలాదో భగవాన్భో కిమాదౌ కిం జాతమితి . సద్యోజాతమితి .
కిం భగవ ఇతి . అఘోర ఇతి . కిం భగవ ఇతి . వామదేవ ఇతి .
కిం వా పునరిమే భగవ ఇతి . తత్పురుష ఇతి . కిం వా పునరిమే భగవ ఇతి .
సర్వేషాం దివ్యానాం ప్రేరయితా ఈశాన ఇతి . ఈశానో భూతభవ్యస్య
సర్వేషాం దేవయోగినాం . కతి వర్ణాః . కతి భేదాః . కతి శక్తయః .
ఓం నమః శివాయ
01. ఓమ్। అథ పైప్పలాదో

ప్రశ్న : ‘‘భగవాన్! కిమ్ ఆదౌ?
కిమ్ జాతమ్?’’ ఇతి।
సమాధానం : ‘‘సద్యో జాతమ్’’ ఇతి।

ప్రశ్న : కిమ్ భగవ, ఇతి?
సమాధానం : ‘‘అఘోర’’ ఇతి।

ప్రశ్న : కిమ్ భగవ ఇతి?
సమాధానం : ‘‘వామదేవ’’ ఇతి।

ప్రశ్న : కిమ్ వా పునః ఇమే భగవ, ఇతి?
సమాధానం : ‘‘తత్పురుష’’ ఇతి।

ప్రశ్న : కిం వా పునః ఇమే ‘భగవ’ ఇతి?
సమాధానం : సర్వేషాం విద్యానాం
ప్రేరయితా ‘‘ఈశాన’’ ఇతి
ఈశానో భూతభవ్యస్య
సర్వేషామ్ దేవయోనినామ్।।

ప్రశ్న : కతి వర్ణాః? కతి భేదాః?
కతి శక్తయో?
మహాదేవ - పైప్పలాద సంవాదము
‘ఓం’కార స్వరూపమగు పంచాక్షరీ శివతత్త్వమునకు నమస్కరిస్తూ...,
ఒకప్పుడు పిప్పలాదమహర్షి కుమారుడగు (గాలవస్య నామధేయులగు) పైప్పలాదుడు - భగవంతుడగు మహాదేవుని గురించి ఉపాసించి, దర్శనం చేసుకొని- స్వామిని ఈ విధంగా ‘ఆధ్యాత్మ’ విద్య గురించి ప్రశ్నించారు.

పైప్పలాదుడు : హే మహాదేవా! సృష్టికి మొట్టమొదటగా ఏమి ఉండి ఉన్నది? తరువాత ఏమి జనించినది? కిమ్ అదౌ? కిమ్ జాతమ్?
మహేశుడు : ‘సత్తు’ మాత్రమే ఉన్నది. అదియే జననము పొందుటచే సద్యోజాతము! (The Absolute Presence is presenting itself as creation)
పిప్పలాదుడు : భగవానుడు (వెలిగించువాడు) అనగా ఎవరు?
మహేశుడు : సూక్ష్మతత్త్వము అయినట్టి అఘోర. (Subtle Divinity)
పైప్పలాదుడు : అఘోర - తరువాత ఆయనను వెలిగించు భగవానుడు?
మహేశుడు : వామదేవుడు (The Absolute witness)
పైప్పలాదుడు : ఇంకా ఆయనకు భగవంతుడెవ్వరు?
మహేశుడు : తత్పురుషుడు (The worker by being beyond)
పైప్పలాదుడు : ఆ తత్పురుషుని వెలిగించుచున్నది?-ఏ మరొక భగవంతుడు?
మహేశుడు : ఈశానుడు. (That which is enlightening itself as all else).
అన్ని విద్యలకు ప్రేరకుడు ఈశానుడు ఆయనయే సర్వ దేవతల యొక్క యోనిస్థానము. వర్తమాన - భవిష్యత్తుల ప్రేరకుడు. కాలస్వరూపుడు.
పంచబ్రహ్మతత్త్వములు
(1) సద్యోజాతుడు (2) అఘోరుడు (3) వామదేవుడు (4) తత్పురుషుడు (5) ఈశానుడు.

పైప్పలాదుడు : సర్వప్రేరకుడగు ఈశానుని వర్ణములు ఎన్ని? భేదములెన్ని? ఆయన ఏఏ శక్తులు కలిగిఉన్నారు?

యత్సర్వం తద్గుహ్యం . తస్మై నమో మహాదేవాయ మహారుద్రాయ ప్రోవాచ
తస్మై భగవాన్మహేశః .
గోప్యాద్గోప్యతరం లోకే యద్యస్తి శ్రుణు శాకల .
సమాధానం : యత్ సర్వమ్, తత్ గుహ్యమ్, తస్మై
నమో మహాదేవాయ। మహారుద్రాయ।
ప్రోవాచ :
తస్మై భగవాన్ మహేశః, గోప్యాత్ గోప్యతరమ్
లోకే యత్ అస్తి శృణు, శాకల!
మహేశుడు : సర్వ తత్త్వములకు, సర్వయోనులకు ప్రేరకుడు, గుహ్యము సర్వాంతర్యామి. అట్టి మహాదేవుడగు మహారుద్రునికి నమోవాకములు.
సర్వమునకు లయకారకుడగుటచే ‘మహారుద్రుడు’....సర్వజీవుల అంతరాంతర స్వరూపుడై సర్వత్రా సర్వముగా సంప్రదర్శితులు.
ఓ శాకలా! లోకంలో అనేక రహస్యాలు ఉంటూ ఉండవచ్చుగాక!
రహస్యములన్నింటికంటే రహస్యమైనది చెప్పుచున్నాను విను.

సద్యోజాతం మహీ పూషా రమా బ్రహ్మః త్రివృత్స్వరః .. 1..
ఋగ్వేదో గార్హపత్యం చ మంత్రాః సప్తస్వరాస్తథా .
వర్ణం పీతం క్రియా శక్తిః సర్వాభీష్టఫలప్రదం .. 2..
ఉపాసన
(1) సద్యోజాతమ్ :
మహీ। పూషా। రమా।
బ్రహ్మా। త్రివృత్ స్వరః।
ఋగ్వేదో గార్హపత్యం చ
మంత్రాః సప్తస్వరాః తథా।
వర్ణం → పీతం।
క్రియా శక్తిః । సర్వ అభీష్ట ఫలప్రదమ్।
ఉపాసన
(1) సద్యోజాతమ్ -
ఈ జీవునియొక్క జన్మ - కర్మలకంటే మునుముందటి స్వరూపము. కేవల సత్ సద్యోజాతము సర్వమునకు జననస్థానము. మహామహిమాన్వితము. పూషము (పవిత్రమైనది). రమా (సంపత్‌ప్రదము), సృష్టికర్తయగు బ్రహ్మదేవుని చైతన్యరూపము. త్రివృత్ (త్రిగుణ జనన స్థానము), స్వరరూపము, ఋగ్వేద ఋక్కులకు విషయము. గార్హపత్యాగ్ని స్వరూపము. మంత్రరూపము (మననాత్ త్రాయతే). సప్తస్వర రూపము. (స-రి-గ-మ-ప-ద-ని- సప్త స్వరరూపమే జగత్తు-జగదీశ్వరుడు కూడా).
ఎరుపు వర్ణము.
క్రియాశక్తి స్వరూపము. సర్వాభీష్ట ఫలప్రదము (కోరుకున్నవన్నీ) ప్రసాదించునది. ఈరీతిగా సద్యోజాత ముఖము ఉపాసించబడు చున్నది.

అఘోరం సలిలం చంద్రం గౌరీ వేద ద్వితీయకం .
నీర్దాభం స్వరం సాంద్రం దక్షిణాగ్నిరుదాహృతం .. 3..
(2) అఘోరగ్ం :
సలిలం। చంద్రం। గౌరీ।
వేద ద్వితీయకమ్। (యజుర్వేదమ్)।
నీరదాభగ్ం స్వరగ్ం।
సాంద్రం। దక్షిణాగ్నిః ఉదాహృతమ్।।
(2) అఘోరము -
సలిలము (జలస్వరూపం)। చంద్రము। గౌరీదేవీ స్వరూపము। రెండవదిగా తెలియబడునది। యజుర్వేదరూపము।
మేఘస్వర స్వరూపము. (మేఘ గర్జన శబ్దస్వరూపము)। సాంద్రమైన స్వరము।
దక్షిణాగ్ని రూపము - అని వర్ణించబడుచున్నది. ఈ విధంగా రెండవ సృష్టి ముఖముగా ఆరాధించబడుచున్నది.

పంచాశద్వర్ణసంయుక్తం స్థితిరిచ్ఛక్రియాన్వితం .
శక్తిరక్షణసంయుక్తం సర్వాఘౌఘవినాశనం .. 4..

సర్వదుష్టప్రశమనం సర్వైశ్వర్యఫలప్రదం .
02. పంచాశత్ (50) వర్ణ
సంయుక్తగ్ం స్థితిః।
ఇచ్ఛా క్రియాన్వితమ్।
శక్తి రక్షణ సంయుక్తగ్ం।
సర్వామౌఘ వినాశనమ్।
సర్వ దుష్ట ప్రశమనగ్ం।
సర్వైశ్వర్య ఫలప్రదమ్।
‘50’ వర్ణములతోకూడినట్టిది! సర్వత్రా స్థితి కలిగినట్టిది.
ఇచ్ఛా క్రియలతో కూడినట్టిది.
శక్తి, రక్షణలతో కూడినట్టిది. సర్వజీవులకు త్రాణ (శక్తి). సంరక్షణ పరిపోషణ రూపము సర్వపాపములను ప్రక్షాళనము చేయగలిగినట్టిది।
దుష్టత్వమును ప్రశమింపజేయునది. పూర్తిగా తొలగించునట్టిది.
సర్వ ఐశ్వర్యములు ప్రసాదించునదిగా - అఘోర ముఖము ఉపాసించ బడుచున్నది.

వామదేవ మహాబోధదాయకం పావనాత్మకం .. 5..

విద్యాలోకసమాయుక్తం భానుకోటిసమప్రభం .
ప్రసన్నం సామవేదాఖ్యం నానాష్టకసమన్వితం .. 6..

ధీరస్వరమధీనం చావహనీయమనుత్తమం .
(3) వామదేవమ్ :
మహాబోధ దాయకమ్। పావకాత్మకమ్।
విద్యాలోక సమాయుక్తమ్।
భానుకోటి సమప్రభమ్। (సమప్రదమ్)।
ప్రసన్నగ్ం సామవేదాఖ్యం।
గానాష్టక సమన్వితమ్।
ధీరస్వరమ్ అధీనం చ।
ఆహవనీయమ్ అనుత్తమమ్।
(3) వామదేవము -
ఉత్తమమగు మహా బోధ (ఆత్మబోధ)ను ప్రసాదించునది. సాధకుని (ఉపాసకుని) పరమ పవిత్రముగా చేయునది. బ్రహ్మ విద్యా-అవలోకనకు సమాయుక్తుడుగా బ్రహ్మవిద్యకు సిద్ధము చేయునది.
- కోటి సూర్య ప్రభలచే ప్రకాశించునది.
- నిత్య ప్రసన్నము.
- సామ వేదముచే గానములుగా వివరించబడునది. గానాష్టకములతో కూడి ఉన్నట్టిది.
బుద్ధి - ధీశక్తిగా సంప్రదర్శితము.
యజ్ఞములో ఆహవనీయాగ్ని స్వరూపము. ఉత్తమోత్తమము. ఉత్తమ పురుష (నేను)కు జననస్థానము అగుటచే అనుత్తమము.

జ్ఞానసంహారసంయుక్తం శక్తిద్వయసమన్వితం .. 7..

వర్ణం శుక్లం తమోమిశ్రం పూర్ణబోధకరం స్వయం .
ధామత్రయనియంతారం ధామత్రయసమన్వితం .. 8..

సర్వసౌభాగ్యదం నౄణాం సర్వకర్మఫలప్రదం .
అష్టాక్షరసమాయుక్తమష్టపత్రాంతరస్థితం .. 9..

(అ)జ్ఞాన సగ్ంహార సంయుక్తగ్ం।
శక్తిద్వయ సమన్వితమ్।
వర్ణగ్ం → శుక్లమ్। తమో మిశ్రమ్।
పూర్ణబోధకరగ్ం స్వయమ్।
ధామత్రయ నియంతారమ్।
ధామత్రయ సమన్వితమ్।
సర్వసౌభాగ్యదం నౄణాం,
సర్వకర్మ ఫలప్రదమ్।
అష్టాక్షర సమాయుక్తమ్,
అష్టపత్ర - అంతర స్థితమ్।
జ్ఞాన (అజ్ఞాన) సంహార సంయుక్తులు (జ్ఞేయ స్వరూపులు) ।
శక్తిద్వయం (పురుష + ప్రకృతి శక్తుల)తో కూడుకున్నవారు।
వర్ణము → తెలుపు
తమో మిశ్రమగుణులై కనిపించువారు। స్వయముగా పూర్ణ బోధక స్వరూపులు। కేవల బుద్ధి స్వరూపులు। గురుస్వరూపులు। త్రిలోకముల నియంత। మర్త్య - పాతాళ - దేవలోకాధీసులు. త్రిలోకములు తనవై, తన అధీనమునందు కలవారు। త్రిలోక సమన్వితులు। త్రిలోకస్వరూపులు!
సర్వసౌభాగ్యములు ప్రసాదించువారు! సర్వకర్మలకు ప్రదాత!
అష్టాక్షర (ఓం నమో నారాయణాయ)...సమాయుక్తులు! హృదయము యొక్క ‘8’ రెక్కల అంతరమున సంస్థితులై ఉన్నవారు- అని వామదేవ ముఖము ఆరాధించబడుచున్నది.

యత్తత్పురుషం ప్రోక్తం వాయుమండలసంవృతం .
పంచాగ్నినా సమాయుక్తం మంత్రశక్తినియామకం .. 10..

పంచాశత్స్వరవర్ణాఖ్యమథర్వవేదస్వరూపకం .
కోటికోటిగణాధ్యక్షం బ్రహ్మాండాఖండవిగ్రహం .. 11..

వర్ణం రక్తం కామదం చ సర్వాధివ్యాధిభేషజం .
సృష్టిస్థితిలయాదీనాం కారణం సర్వశక్తిధృక్ .. 12..

అవస్థాత్రితయాతీతం తురీయం బ్రహ్మసంజ్ఞితం .
బ్రహ్మవిష్ణ్వాదిభిః సేవ్యం సర్వేషాం జనకం పరం .. 13..

(4) తత్పురుషమ్ :
యత్ తత్పురుషం ప్రోక్తం
వాయుమండల సంవృతమ్।
ప్రంచాగ్నినా (పంచ-అగ్నినా) సమాయుక్తం।
మంత్రశక్తి నియామకమ్।
పంచాశత్ (50) స్వర వర్ణాఖ్యమ్।
అథర్వవేద స్వరూపకమ్।
కోటికోటి గణాధ్యక్షమ్।
బ్రహ్మాండ అఖండ విగ్రహమ్। వర్ణగ్ం రక్తం।
కామదం చ।
సర్వ అధి - వ్యాధి భే(భి)షజమ్।
సృష్టి స్థితి లయ - ఆదీనామ్
కారణగ్ం, సర్వశక్తి ధృక్।
అవస్థా త్రితయ అతీతమ్
తురీయమ్। సత్ యత్ చిత్
సుఖమ్। బ్రహ్మ, విష్ణు -
ఆదిభిః సేవ్యగ్ం।
సర్వేషాం జనకం
పరమ్।
(4) తత్ పురుషుడు (తత్పురుషమ్) -
వాయు మండలమంతా వాయుస్వరూపుడై విస్తరించి ఉన్నవారు,
పంచాగ్నుల-(గార్హపత్యాగ్ని, ఆహవనీయాగ్ని, దక్షిణాగ్ని, అవసథ్యాగ్ని అను 4 వైపుల అగ్నులు, ఊర్ధ్వంగా సూర్యాగ్ని)...స్వరూపులు. మంత్రముల యందు శక్తి స్వరూపులై ప్రకాశించువారు. మంత్రశక్తి నియామకులు.
- పంచాశత్ (50) స్వర వర్ణములచే సంప్రదర్శితులు. అక్షర-శబ్ద-వాక్య ఉచ్ఛారణలకు ప్రభావము ప్రసాదించువారు. అథర్వణ వేద స్వరూపులు.
- కోటి-కోటి గణాధ్యక్షుడు (కోటానుకోట్ల గణములకు అధ్యక్షుడు) అయినవారు.
- అఖండ బ్రహ్మాండ స్వరూపులు.
- రక్తపు (ఎరుపు) రంగుతో ప్రకాశించువారు.
- సంకల్ప - సృష్టి - స్థితి - సంచార - లయ - కామ స్వరూపులు.
- మానసిక - శారీరక వ్యాధులకు భిషజులు (వైద్యులు).
- సృష్టి - స్థితి - లయము - మొదలైనవాటికి కారణులు. కారణ కారణులు.
- సర్వశక్తిమంతులు.
- (జాగ్రత్ - స్వప్న - సుషుప్తులనబడే) త్రి - అవస్థలకు అతీతమైన స్వరూపముగా (తురీయుడై) విరాజిల్లువారు. తురీయస్వరూపులు.
- సత్ - చిత్ - ఆనందమగు తురీయసాక్షీసుఖ స్వరూపులు, బ్రహ్మ - విష్ణు మొదలైన సర్వదేవతలచే సదా సేవించబడువారు.
- సర్వమునకు, సర్వులకు జననస్థానము అయి ఉన్నవారు.
సర్వమునకు పరము అగు - అట్టి తత్‌పురుషుని సర్వదా సేవించాలి. ( పై విశేషణములతో తత్పురుషముఖము ఉపాసించబడుచున్నది).

ఈశానం పరమం విద్యాత్ప్రేరకం బుద్ధిసాక్షిణం .
ఆకాశాత్మకమవ్యక్తమోంకారస్వరభూషితం .. 14..

సర్వదేవమయం శాంతం శాంత్యతీతం స్వరాద్బహిః .
(5) ఈశానమ్ :
పరమం విద్యాత్ ప్రేరకమ్।
బుద్ధిసాక్షిణమ్।
ఆకాశాత్మకమ్। అవ్యక్తమ్।
ఓంకార స్వర భూషితమ్।
సర్వదేవ మయగ్ం। శాంతగ్ం।
శాంతి అతీతగ్ం। స్వరాత్ బహిః।।
(5) ఈశానుడు (ఈశానమ్) -
- సర్వము విస్తరించి ఉన్నవారు. సర్వము తానే అయి, సర్వమునకు వేరైయున్నవారు. (సర్వ ఆభరణములకు ‘బంగారము’ వలె) సర్వమునకు ‘పరము’ అయినట్టివారు.
- ‘తెలుసుకోవటము’ అనబడు విద్యకు ప్రేరకస్థానము.. ‘పరావిద్య’కు ప్రేరణ స్వరూపులు.
- బుద్ధికి ఆవల ‘సాక్షి’ అయి, బుద్ధికి మునుముందే ఉన్నట్టివారు.
- ఆకాశమునకే ఆత్మ అయి ఉన్నట్టి చిదాకాశస్వరూపులు.

అకారాదిస్వరాధ్యక్షమాకాశమయవిగ్రహం .. 15..

పంచకృత్యనియంతారం పంచబ్రహ్మాత్మకం బృహత్ .
పంచబ్రహ్మోపసంహారం కృత్వా స్వాత్మని సంస్థితః .. 16..

స్వమాయావైభవాన్సర్వాన్సంహృత్య స్వాత్మని స్థితః .
పంచబ్రహ్మాత్మకాతీతో భాసతే స్వస్వతేజసా .. 17..

ఆదావంతే చ మధ్యే చ భాససే నాన్యహేతునా .
మాయయా మోహితాః శంభోర్మహాదేవం జగద్గురుం .. 18..

న జానంతి సురాః సర్వే సర్వకారణకారణం .

అకారాది (క్షరాంతగ్ం) స్వరాధ్యక్షమ్।
ఆకాశమయ విగ్రహమ్।
పంచకృత్య నియంతారమ్।
పంచ బ్రహ్మాత్మకం బృహత్।
పంచబ్రహ్మ ఉపసగ్ంహారం।
కృత్వా, స్వా-త్మని
సగ్ంస్థితః।
స్వమాయావై భవాన్ సర్వాన్,
సగ్ంహృత్య స్వాత్మని స్థితః।
పంచబ్రహ్మాత్మక అతీతో భాసతే
స్వ స్వ తేజసా।
ఆదావంతే చ, మధ్యే చ
భాసతే న - అన్య
హేతునా। మాయయా
మోహితః శంభోః,
మహాదేవం జగద్గురుమ్।
న జానంతి సురాః సర్వే,
సర్వకారణ కారణమ్।
- ఈ సర్వమును వ్యక్తీకరిస్తూనే తాను మాత్రం ‘అవ్యక్తము’ అయి ఉన్నట్టివారు.
- ‘ఓం’ అను స్వరముచే అలంకరించబడినట్టివారు.
- తనయందు సర్వదేవతలు ఉనికిగా కలిగియున్న వారు. సర్వదేవతా స్వరూపులు.
- పరమ శాంత స్వరూపులు.
- ‘శాంతము’ అను స్వభావమునకు మునుముందే సాక్షిగా ఉండి ఉన్నట్టివారు, కాబట్టి - ‘‘శాంతాతీతస్వరూపులు’’ కూడా.
- బాహ్యమున ‘స్వ (నేను)’ అను స్వరస్వరూపులు! స్వ-రసస్వరూపులు.
- ‘అ’కారము నుండి ‘క్ష’ కారము వరకు (eT]యు) అ-ఉ-మ-అర్ధమాత్రలకు కూడా (సర్వ స్వరములకు) → అధ్యక్షులు.
- ఆకాశమంతా తన ఆకారముగా కలిగి ఉన్నట్టి ఆకాశమయ విగ్రహులు. చిదాకాశ-ఆత్మాకాశ స్వరూపులు.
- (సృష్టి-స్థితి-పరిషోపణ-శైధిల్యము-లయము అనబడు) పంచకృత్యముల నియంత.
- (సద్యోజాతుడు, అఘోర, వామదేవ, తత్పురుష, ఈశాన అనబడు) పంచబ్రహ్మాత్మకులు. వాటిని సంప్రదర్శించువారు,
- పంచబ్రహ్మలను సంప్రదర్శించుచూ, ఉపసంహరణ (withdraw) చేయుచున్నట్టివారు. ఈసర్వము ప్రదర్శిస్తూ, ఇచ్ఛానుసారంగా ఒకప్పుడు లయింపజేయు ‘లయకారులు’,
- ఆ విధంగా పంచ బ్రహ్మలను ఉపసంహరించుచూ, పంచబ్రహ్మాత్మ కత్వమునకు కూడా సాక్షి అయి, అతీతులై స్వ-ఆత్మయందు స్వస్వరూపులుగా, స్వతేజస్సుతో వెలుగొందువారు, రమించువారు,
ఎట్టి బాహ్య కారణము (హేతువు) ఏమీ లేకుండానే మొదలు - మధ్య - చివర అన్నీగా (జీవాత్మ - దృశ్యములుగా) భాసించువారు!

అట్టి స్వకీయ మాయచే మోహింపజేయు శంభుని మహాదేవుని, జగద్గురువు యొక్క కారణ స్వరూపమేమిటో, తత్త్వమేమిటో, దేవతలకు కూడా తెలియరానిది.
ఆయన సర్వకారణ కారణుడు! బాహ్యకారణము లేనివాడు. తనకు తానే కారణము కాబట్టి స్వకారణుడు. తనయొక్క జీవాత్మత్వమునకు తానే కారణుడు.

న సందృశే తిష్ఠతి రూపమస్య పరాత్పరం పురుషం విశ్వధామ .. 19..
న సందృశే తిష్ఠతి
రూపమ్ అస్య, పరాత్పరమ్।
పురుషం, విశ్వధామ।
ఆయన రూపము - కళ్ళకు కనిపించకయే సర్వత్రా అణువణువునా వ్యాపించినదై, తిష్ఠించినదై ఉన్నది. ఆయన పరమునకే పరమైన రూపము గలవాడు! పరమపురుషుడు! ఈ విశ్వమంతా ఆయనకు ధామమే! గృహమే!

యేన ప్రకాశతే విశ్వం యత్రైవ ప్రవిలీయతే .
తద్బ్రహ్మ పరమం శాంతం తద్బ్రహ్మాస్మి పరమం పదం .. 20..

పంచబ్రహ్మ పరం విద్యాత్సద్యోజాతాదిపూర్వకం .
దృశ్యతే శ్రూయతే యచ్చ పంచబ్రహ్మాత్మకం స్వయం .. 21..

పంచధా వర్తమానం తం బ్రహ్మకార్యమితి స్మృతం .
బ్రహ్మకార్యమితి జ్ఞాత్వా ఈశానం ప్రతిపద్యతే .. 22..

యేన ప్రకాశతే విశ్వం
యత్రైవ ప్రవిలీయతే,
తత్ బ్రహ్మ పరమగ్ం।
శాంతం। తత్ బ్రహ్మాస్మి పరంపదమ్।।
పంచబ్రహ్మపరం విద్యాత్, సద్యోజాతాది
పూర్వకమ్, దృశ్యతే శ్రూయతే
యత్ చ, పంచ బ్రహ్మాత్మకగ్ం స్వయమ్।
పంచధా వర్తమానం తం బ్రహ్మకార్యమ్
ఇతి స్మృతమ్।
బ్రహ్మకార్యమ్ ఇతి శ్రుత్వా,
ఈశానం ప్రతిపద్యతే।।
ఈ విశ్వమంతా ఎవ్వరి వలన ప్రకాశించుచున్నదో, ఎవ్వరియందు ప్రకాశించుచూ, లయమగుచున్నదో, అట్టి ‘పరబ్రహ్మమే’ ఆయన తత్త్వము. పరమశాంతమగు సద్యోజాత మొదలైన పంచబ్రహ్మలకు మునుముందే ఉన్నట్టివారు!
మునుముందే - ఆ తరువాత కూడా యథాతథమైయున్న శివతత్త్వమే ఆయన!
ఏది పంచబ్రహ్మాత్మకమై కనిపిస్తూ, వినిపించుచూ ఉన్నదో...అదంతా కూడా బ్రహ్మముయొక్క ‘5’ విధములుగా బ్రహ్మమే నిర్వర్తించుచున్నదని గమనించబడుగాక! అట్టి బ్రహ్మమే నేను - బ్రహ్మమే నీవు. సోఽహమ్। తత్త్వమ్।

ఎవ్వరు పంచ బ్రహ్మాత్మకమైనదంతా బ్రహ్మముయొక్క నిర్వహణా విశేషమై, బ్రహ్మమునకు అభిన్నమై ఉన్నదని గ్రహించి, గమనించి, ఉపాసిస్తూ ఉంటారో, వారు ఈశానత్వమును (ఈశ్వరత్వమును, ఈశ్వర లక్షణమును) సంతరించుకొనుచున్నారు.

పంచబ్రహ్మాత్మకం సర్వం స్వాత్మని ప్రవిలాప్య చ .
సోఽహమస్మీతి జానీయాద్విద్వాన్బ్రహ్మాఽమృతో భవేత్ .. 23..

ఇత్యేతద్బ్రహ్మ జానీయాద్యః స ముక్తో న సంశయః .

03. పంచ బ్రహ్మాత్మగ్ం
సర్వగ్ం, స్వ ఆత్మని ప్రవిలాప్య చ।
‘‘సోఽహమ్ అస్మి’’ ఇతి
జానీయాత్ విద్వాన్
బ్రహ్మ-అమృతో భవేత్।
ఇతి ఏతత్ బ్రహ్మ
జానీయాత్ యత్,
సః ముక్తో। న సగ్ంశయః।।
‘‘ఇదంతా పంచబ్రహ్మాత్మకమే’’ అని భావిస్తూ తెలుసుకుంటూ దీనినంతటినీ ఎవ్వరైతే ‘స్వాత్మ’యందు ప్రవిలాప్యము (విలీనము) చేయుచూ...‘‘ఇదంతా మమాత్మానంద విస్తార సంప్రదర్శనమే’’...అను ఎరుకను అనునిత్యం చేసుకుంటున్నారో, అట్టివాడు ఆ అమృత పరబ్రహ్మమే తానుగా అగుచున్నాడు.
స్వభావనయే ఇదంతా! ఇదంతా స్వకీయ స్వభావమే!

ఈ విధంగా సర్వ స్వరూపమగు బ్రహ్మమును స్వస్వరూపముగాను, పంచబ్రహ్మాత్మకముగాను, త్వమ్ తత్ శివేతి - శివతత్త్వజ్ఞానముగాను, సోఽహమ్-అట్టి బ్రహ్మమే నేను - అని ఎరుగుచున్నాడో, అట్టివాడు సర్వదా ముక్తుడే! ఇందులో సందేహమే లేదు!

పంచాక్షరమయం శంభుం పరబ్రహ్మస్వరూపిణం .. 24..

నకారాదియకారాంతం జ్ఞాత్వా పంచాక్షరం జపేత్ .
పంచాక్షరమయగ్ం శంభుం,
పరంబ్రహ్మ స్వరూపిణమ్।
‘న’కార ఆది - ‘య’కార అతం
జ్ఞాత్వా పంచాక్షరం జపేత్।।
(న-మః-శివా-య)
ఆ శంభు భగవానుడు, పరమశివుడు
- పంచ - అక్షరమయుడని, పంచాక్షర దేహ ప్రత్యక్షుడని,
- పరబ్రహ్మ స్వరూపుడని
- సర్వ స్వరూపుడు, స్వస్వరూపుడు అని
‘న’కారాది ‘య’కారాంతము వరకు (ఓం) ‘‘నమః శివాయ’’ - సద్యోజాత-అఘోర-వామదేవ-తత్పురుష-ఈశాన)
పంచబ్రహ్మాత్మకుడుగా తెలుసుకొని ‘పంచాక్షరి’ని జపించాలి.

సర్వం పంచాత్మకం విద్యాత్పంచబ్రహ్మాత్మతత్త్వతః .. 25..

పంచబ్రహ్మాత్మికీం విద్యాం యోఽధీతే భక్తిభావితః .
స పంచాత్మకతామేత్య భాసతే పంచధా స్వయం .. 26..

సర్వం పంచాత్మకం
విద్యాత్, పంచ
బ్రహ్మాత్మ తత్త్వతః।।
పంచ బ్రహ్మాత్మికాం
విద్యాం యో అధీతే భక్తి భావితః,
స పంచాత్మకతామ్
ఏత్య, భాసతే ‘పంచధా’ స్వయమ్।।
ఓ పైప్పల మహర్షి ప్రియపుత్రుడా! పైప్పలాదా! ‘‘సర్వమ్ పంచ బ్రహ్మ అఖండ తత్త్వమ్’’ అని, పంచాత్మకమని తత్త్వతః గ్రహించెదవుగాక!

మనము చెప్పుకున్న ‘‘పంచ బ్రహ్మాత్మిక విద్య’’ను ఎవ్వడు భక్తి - జ్ఞానములతో పఠిస్తాడో, అధ్యయనం చేస్తాడో...అట్టివాడు స్వయముగా ‘పంచాత్మకత్వము’ను పొంది - సద్యోజాత , అఘోర, వామదేవ, తత్పురుష, ఈశాన - స్వరూపుడై స్వయముగా పంచ విధములుగా ప్రకాశమానుడగుచున్నాడు. స్వస్వరూప పంచతత్త్వ ప్రదర్శకుడై, ఈ దృశ్యమును విహారస్థానముగా చూస్తూ వినోదిస్తున్నాడు.

ఏవముక్త్వా మహాదేవో గాలవస్య మహాత్మనః .
కృపాం చకార తత్రైవ స్వాంతర్ధిమగమత్స్వయం .. 27..

ఏవమ్ ఉక్త్వా, మహాదేవో గాలవస్య
మహాత్మనః, కృపాం చకార తత్రైవ
స్వ అంతర్ధిమ్ అగమత్ - స్వయమ్।।
భక్తులపాలిటి కల్పవృక్షము అయినట్టి మహాదేవుడు ఈ విధంగా మహాత్ముడగు పిప్పలాదమహర్షి కుమారుడగు పైప్పలాద మునికి బోధించి, అటు తరువాత అంతర్థానం అయ్యారు.

పైప్పలాదుడగు గాలవస్యుడు ఇట్లా విచారణ చేయసాగారు.

యస్య శ్రవణమాత్రేణాశ్రుతమేవ శ్రుతం భవేత్ .
అమతం చ మతం జ్ఞాతమవిజ్ఞాతం చ శాకల .. 28..

ఏకేనైవ తు పిండేన మృత్తికాయాశ్చ గౌతమ .
విజ్ఞాతం మృణ్మయం సర్వం మృదభిన్నం హి కాయకం .. 29..

ఏకేన లోహమణినా సర్వం లోహమయం యథా .
విజ్ఞాతం స్యాదథైకేన నఖానాం కృంతనేన చ .. 30..

యస్య శ్రవణ మాత్రేణ శ్రుతమ్ ఏవ
శ్రుతం భవేత్, అమతం చ
మతం జ్ఞాతం, అవిజ్ఞాతం చ
శాకల! ఏకేనైవ తు
పిండేన మృత్తికాయాః చ
గౌతమ! విజ్ఞాతం
మృణ్మయగ్ం (మృత్ మయగ్ం) సర్వం,
మృత్ అభిన్నగ్ం హి కార్యకమ్।
ఏకేన లోహమణినా, సర్వం లోహమయం
యథా, విజ్ఞాతగ్ంస్యాత్ అథ ఏకేన
నఖానాం కృంతనేన చ।
గాలవస్య/శాకల నామధేయ పైప్పలాదుడు : ఎవ్వరు ఈ పంచ బ్రహ్మోపనిషత్‌ను (గురుముఖతః) శ్రవణం చేస్తారో.... అట్టివాడు వినవలసిన వేద - వేదాంతసారమును విన్నవాడగుచున్నాడు.

ఓ గాలవస్యా! మట్టి గురించి తెలుసుకుంటే, మట్టి పాత్రల గురించి, మట్టి బొమ్మల గురించి తెలుసుకున్నట్లే అవుతుంది కదా! అట్లాగే, ఓ గౌతమా! అమతము, (స్వానుభవము), మతము (మహనీయుల అభిప్రాయము), జ్ఞాతము (తెలియబడుచున్నట్టిది) అజ్ఞాతము (తెలియబడనట్టిది)...అన్నీ కూడా తెలియబడగలవు. మట్టి -కార్యకము, అకార్యకము కూడా అయి మట్టి పాత్రలుగా ప్రదర్శనమగుచున్నట్లే, బ్రహ్మము (లేక) శివము ఇదంతా ప్రదర్శనమగుచున్నది.

(వెండి) లోహపు ముక్క గురించి తెలుసుకుంటే ‘‘వెండి ఆభరణముల తత్త్వమంతా తెలిసిపోతుంది కదా. కారణము కంటే కార్యము (బ్రహ్మము కంటే సాహంకార జగత్తు) భిన్నము కాదు-అని స్వభావంగానే తెలియవచ్చు చున్నది. శివతత్త్వమును ఎరిగినప్పుడు-జీవుడు, జగత్తుల తత్త్వము కూడా తెలిసిపోగలదు.

సర్వం కార్ష్ణాయసం జ్ఞాతం తదభిన్నం స్వభావతః .
కారణాభిన్నరూపేణ కార్యం కారణమేవ హి .. 31..

తద్రూపేణ సదా సత్యం భేదేనోక్తిర్మృషా ఖలు .
తచ్చ కారణమేకం హి న భిన్నం నోభయాత్మకం .. 32..

భేదః సర్వత్ర మిథ్యైవ

సర్వం కారణాయ సంజ్ఞాతం తత్
అభిన్నగ్ం స్వభావతః।
కారణాత్ అభిన్నరూపేణ
కార్యం కారణం ఏవ హి।
తత్ రూపేణ సదా సత్యం, భేదేన
ఉక్తిః మృషా ఖలు।
తత్ చ కారణం ఏకం, హి న భిన్నం,
నో భయాత్మకమ్। భేదః సర్వత్ర మిథ్యా ఏవ।।
కార్యరూపమైన ‘నీవు’-‘జగత్తులు’ ఏకమగు బ్రహ్మమే అనునది సత్యము. భిన్నము సత్యము కాదు! భిన్నముగా కనిపించే దానిలోని ఏకత్వము సత్యము! కారణమే కార్యరూపముగా (అజ్ఞాన దృష్టికి) కనిపించుచున్నది.
ఆది స్వరూపమగు ఆత్మ ఈ దృశ్యమునకు భిన్నము కాదు. ఉభయాత్మకము కాదు! కారణమునకు వేరుగా కార్యమున్నదనటం - స్వకీయ భ్రమయే. నీటిలోని ప్రతిబింబము కనబడినంత మాత్రంచేత నీటిలో వస్తువు ఉన్నదనటము వలె భ్రమయే! బ్రహ్మమునకు జగత్తుకు భేదము మిధ్యయే! బ్రహ్మము అద్వితీయుడు కాబట్టి - ఈ జీవుడు శివ (బ్రహ్మ) స్వరూపుడే. జీవుడు-దేవుడు-దృశ్యముల భేదము భ్రమమాత్రమే.
ఈ జీవుడు కూడా చూడబడుచున్న సమస్తమునకు అద్వితీయుడే.

ధర్మాదేరనిరూపణాత్ .
అతశ్చ కారణం నిత్యమేకమేవాద్వయం ఖలు .. 33..

అత్ర కారణమద్వైతం శుద్ధచైతన్యమేవ హి .
అస్మిన్బ్రహ్మపురే వేశ్మ దహరం యదిదం మునే .. 34..

పుండరీకం తు తన్మధ్యే ఆకాశో దహరోఽస్తి తత్ .
స శివః సచ్చిదానందః

ధర్మాదేః అనిరూపణాత్,
అతశ్చ కారణం
నిత్యం ‘‘ఏకం ఏవ,
అద్వయం’’ (ఏకమేవాద్వయం) ఖలు।
అత్ర కారణం అద్వైతగ్ం,
శుద్ధచైతన్యమ్ ఏవ హి।
అస్మిన్ బ్రహ్మ పురే
వేశ్మ దహరం యత్
ఇదం, మునే! పుండరీకం తు।
తత్ మధ్యే ఆకాశో
దహరో అస్తి తత్।
స శివః సత్ చిత్ ఆనందః।
ధర్మము - అధర్మముల చర్చ మొదలైనవి అంతిమ నిర్ణయమై లభించటము లేదు. ఒకనికి ఏది ధర్మమనిపిస్తోందో, మరొకరికి అది అధర్మము - అనిపిస్తోంది. వాటివాటి భేదములు సందర్భ పరిమితములు మాత్రమే. కాబట్టి, ధర్మాధర్మముల చర్చ అంతిమ సత్యము కాదు. మిథ్యయే! ఆది-కారణస్వరూపమగు ఆత్మ మాత్రమే సర్వదా నిత్యము, సత్యము, ఏకము అయి ఉన్నది!
అద్దానికి (ఆత్మకు) ద్వితీయమే లేదు. అద్వితీయము. ఆభరణములు అనేకములైనప్పటికీ బంగారము ఒక్కటే కదా!
అట్టి సమస్తమునకు కారణస్వరూపమగు ఆత్మ సర్వదా శుద్ధ చైతన్యమే.
ఓ మునీశ్వరులారా! ఈ దేహము అనే బ్రహ్మపురిలో ’దహరకాశము’ ఉన్నది. ఆ దహరాకాశములో హృదయ పుండరీకము (హృదయపుష్పము) ఉన్నది.
- ఆ హృదయ పుష్పమునందు సత్ - చిత్ - ఆనందస్వరూపుడగు ‘శివుడు’ చైతన్యమూర్తిగా, చైతన్యస్ఫూర్తిగా వేంచేసి ఉన్నారు.

సోఽన్వేష్టవ్యో ముముక్షిభిః .. 35..

అయం హృది స్థితః సాక్షీ సర్వేషామవిశేషతః .
తేనాయం హృదయం ప్రోక్తః శివః సంసారమోచకః .. 36..

ఇత్యుపనిషత్ ..
సో అన్వేష్టవ్యో
ముముక్షుభిః।
అయగ్ం హృది
స్థితః సాక్షీ,
సర్వేషామ్
అవిశేషతః।
తేన అయగ్ం
హృదయం ప్రోక్తః,
శివః సంసారమోచక।
అట్టి అంతర హృదయాంతరంగుడు, సర్వము తానైనవాడు, సర్వసాక్షి అగు పరమశివుని ముముక్షువు చివరికి తన హృదయమునందే దర్శించాలి. మరింకెక్కడో కాదు. ఈ జగత్తులను శివునియందు, శివుని తన హృదయమునందు దర్శించాలి! శివోఽహమ్। శివోఽహమ్।
ఆయన హృదయములో వేంచేసి ఉండియే, హృదయమునకు ఈశ్వరుడు (హృదయేశ్వరుడు), సర్వసాక్షి కూడా!
ఆయన సర్వవిశేషములకు, విశేషణములకు సంబంధించనివారై సర్వదేహములలో ప్రకాశించుచున్నారు. సర్వము లయించగా కూడా శేషించువారై ఉండటము చేత (స్వస్వరూప) శివతత్త్వము - ఆదిశేష్యము. అట్టి స్వ-హృదయతత్త్వజ్ఞానము ఈ జీవుని సర్వ సంసార బంధములకు విమోచన రూపమైయున్నది. (ఇదియే శివతత్త్వ జ్ఞానము).

ఇతి పంచబ్రహ్మోపనిషత్।
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।।



కృష్ణ యజుర్వేదాంతర్గత

17     పంచ బ్రహ్మ ఉపనిషత్

అధ్యయన పుష్పము

సర్వ తత్త్వాత్మకమ్, సాంబమ్, సర్వతత్త్వ విదూరకమ్,
సర్వ తత్త్వస్వరూపం చ, ఏకబిల్వమ్ శివార్పణమ్।।

ఓం నమో నారాయణాయ।
ఓం నమః శివాయ।


బ్రహ్మ మొదలైన పంచబ్రహ్మలు ఏ కేవలానంద పరబ్రహ్మమునందు పరమప్రశాంతతను, అనిర్వచనీయమైన విశ్రాంతిని ఆస్వాదిస్తూ ఉన్నారో,
అట్టి బ్రహ్మానంద భరిత - అఖండా సుఖాకారమగు శ్రీరామచంద్ర పదమును భజించుచూ ఆశ్రయిస్తున్నాము.
‘ఓం’ కార శివ స్వరూపమగు పంచాక్షరీ - పంచముఖ శివతత్త్వమునకు నమస్కరిస్తూ....

ఒకప్పుడు పిప్పలాద మహర్షి కుమారుడు, ‘శకలముని’ నామధేయులు అగు పైప్పలాదుడు - ఒక ప్రశాంతమగు ఏకాంత ప్రదేశములో పరమ శివుని సాక్షాత్కారము కొరకై దీర్ఘకాలము శివోపాసన నిర్వర్తించారు. ఒకానొక శుభసమయంలో, పైప్పలాదుని ఆరాధనకు సంతోషించిన మహేశ్వరుడు త్రినేత్ర - త్రిశూల - త్రిరేఖ - త్రివిధ ప్రకృతి సిద్ధ - సగుణాత్మకులై, సర్వశుభలక్షణములతో సాక్షాత్కరించారు.

మహేశ్వరుడు : ఓ పైప్పలాద మహర్షి ప్రియకుమారా! శకలమునీంద్రా! నీ భక్తితత్పరతకు ఆనందించానయ్యా! వరము ప్రసాదించుటకై నీముందు సాక్షాత్కరిస్తున్నాను. ఏమి కావాలో కోరుకో బిడ్డా!

పైప్పలాదుడు : తండ్రీ! ఇహ - పర - పరాత్పరానంద స్వరూపా! మహేశ్వరా! సాష్టాంగదండ ప్రణామములు. మీరు ప్రేమానంద స్వరూపులు! దేవాదిదేవులు! మిమ్ములను ఆరాధించినంతమాత్రం చేతనే అన్ని శుభములు ఒనగూడినట్లే! స్వభావసిద్ధమగు భక్త్యానందముతో మిమ్ములను ఆరాధిస్తున్నాను. ఏదో కోరి కాదు. ఈరోజు నాకు శుభదినము. మీ ప్రకృతి సిద్ధమగు పరమపావన స్వరూపంతో సాక్షాత్కరించారు. నాయొక్క జన్మజన్మల జాడ్యము తొలగిపోయింది.

స్వామీ! వరం కోరుకోమన్నారు కాబట్టి బ్రహ్మతత్త్వజ్ఞానార్థినై, జగదానందకరుడు, జగద్గురువు అగు మిమ్ములను అస్మత్ సందేహనివృత్తి కొరకై అధ్యాత్మశాస్త్ర పూర్వకంగా మీయొక్క ‘పంచబ్రహ్మతత్త్వము’ గురించి విశదీకరించగోరుచున్నాను. విష్ణు బ్రహ్మలకు కూడా ఉపాసనాంశములని చెప్పబడు మీయొక్క ‘‘పంచముఖ-శివతత్త్వము’’ను దయతో వివరించండి!

హే భగవాన్! మహేశ్వరా!
- ఈ ఎదురుగా మా ఇంద్రియములకు కనబడుచున్న ‘సృష్టి’కి మొట్టమొదట ఉన్నదేది?
- ఆ తరువాత (Later) జనించుచున్నదేది?
- ఆ తదనంతర భగవత్ దివ్య స్వరూపులెవరు?
- ఏఏ రీతులుగా మేము సంసార నివృత్తికొరకై, బ్రహ్మతత్త్వ సిద్ధికొరకై ఉపాసించాలి?

దయతో ఈఈ విషయాలు కూడా నాకు బోధించమని అభ్యర్థన.

మహేశ్వరుడు : నీ ప్రశ్న నాకు సంతోషము కలుగజేస్తోందయ్యా। అస్మత్ ‘పంచబ్రహ్మతత్త్వము’ గురించి చెపుతాను. విను.

(1) సద్యోజాతము: ఈ ఇంద్రియానుభవమగుచున్న సృష్టికి ముందుగా కేవలము ‘ఉన్నాను’ అనురూపము గల ‘సత్’ తత్త్వము ఉన్నది. అట్టి ‘సత్తు’ యే....సృష్టి రూపముగా జనించినదగుచున్నది. అందుచేత నాయొక్క ప్రప్రథమతత్త్వము ‘సత్-యో-జాతమ్- సద్యోజాతము’ అని స్తుతించబడుచున్నది. సర్వమునకు మునుముందుగా ఉన్నది→ సర్వాత్మకుడను, సర్వతత్త్వ విదూరుడను అగు నేనే! అన్యమే లేనట్టి నాయొక్క ‘కేవలసత్’ నుండియే, ఈ సమస్త దృశ్య జగత్తులు ‘ఉనికి’ని సంతరించుకొంటున్నవై ‘సద్యోజాతబ్రహ్మము’ - అని పిలువబడుచున్నాయి.

(2)అఘోరము: అద్దాని నుండి ‘‘అనుభూతి’’ రూపంగా సూక్ష్మతత్త్వము బయల్వెడలుచూ ‘అఘోరబ్రహ్మము’ అని స్తోత్రము చేయబడుచున్నది.

(3) వామదేవము : ఇక ‘3’వ భగవత్ (వెలిగించు) తత్త్వము ప్రకృతి స్వరూపమగు వామదేవ బ్రహ్మము → ఎరుక (knowing) అను తేజస్సులో సర్వత్రా కనిపించటము జరుగుచున్నట్టిది. సమస్తమునకు ఆధారమై ఆవల ఉన్నట్టిది.

(4) తత్పురుషమ్ : తత్ స్వరూప పరబ్రహ్మము. ఈ సమస్తము తనయొక్క పురుషకారముగా కలిగియున్నట్టిదే - అస్మత్ తత్పురుషరూప బ్రహ్మము.

(5) ఈశాన : ఆపై, సర్వేషాం విద్యానాం ప్రేరయితా-అయినట్టి ప్రేరణ (Inspiration) స్వరూపమగు ‘ఈశానబ్రహ్మము’. అట్టి నా యొక్క ఈశానత్వము, భూత-వర్తమాన- భవిష్యత్తులలో ప్రదర్శితమగుచూ, సర్వదేవతల నివాసస్థానము అయి ఉన్నది. సర్వము అగుచూ కూడా, సర్వము కాకయే ఉన్నది.

పైప్పలాదుడు - శాకలుడు :
స్వామీ! పంచముఖా! పంచబ్రహ్మానంద స్వరూపా!
- ఆ ‘5’ బ్రహ్మలయొక్క ఉపాసన ఎట్లాగో చెప్పండి.
- వాటి వర్ణములు ఏమేమి? వాటి భేదములు ఏమి?
- ఆ మీ పంచశక్తి తత్త్వాలు ఎటువంటివి?
- ఏదైతే ‘‘ఇదమ్ సర్వమ్ - పరమగుహ్యమ్’’ అని వేదములచే, వేదవేత్తలచే, యజ్ఞ-యాగ-రుద్ర-మహాన్యాస ఇత్యాది మంత్రములచే స్తోత్రము చేయబడుచున్నదో, అట్టి మీ పంచబ్రహ్మ విశేషముల ఉపాసన గురించి వివరించండి!
- అంతే కాకుండా, హే మహాదేవా! రుద్ర భగవాన్! నాపై కరుణతో తత్త్వార్థములను కూడా బోధించండి!

మహేశ్వరుడు : బిడ్డా! శాకలమునీశ్వరా! నీవు కోరినట్లుగా, పంచబ్రహ్మ (పంచముఖ) తత్త్వవిశేషాల గురించి చెప్పుచున్నాను. విను.

సద్యోజాత-అఘోర-వామదేవ-తత్పురుష-ఈశానములు అనబడే పంచబ్రహ్మతత్త్వములు ఎట్టివో, ఎట్లా ఉపాసించాలో - వివరణ

(1) సద్యోజాత బ్రహ్మముఖ - ఉపాసన

సద్యోజాతం మహీ। పూషాం। రమా। బ్రహ్మా। త్రివృత్।
స్వరః। ఋగ్వేదో। గార్హపత్యం చ। మంత్రాః। సప్తస్వరః తథా। వర్ణం పీతం। క్రియాశక్తి।।

సత్: ఈ సర్వమునకు మునుముందే ఉండి, ఈ సర్వమునకు జాత (జనన) స్థానము - జనించునది కూడా అయినట్టిది.

యా జాతమ్: జన్మ-కర్మల కంటే ముందుగా ఉన్నట్టిది. నాయొక్క కేవల సత్‌యే। ‘సత్’ నుండియే సమస్తము జనిస్తూ ఉండి కూడా, సత్ నుం డి అన్యమైనదేదీ జనించటమే లేదు.

మహీ: అది మహత్తరమైనట్టిది. మహామహిమాన్వితము, ఎందుకంటే, ఆ నా సత్ స్వరూపముయొక్క కించిత్ స్ఫురణ నుండి 14 లోకాలు జనిస్తున్నాయి.

పూషా: నిత్య నిర్మలము. నిర్విషయ స్వరూపము.

రమా - తన కల్పనయందు తానే రమించు ఉత్సాహ ప్రదర్శనా రూపము. సర్వసంపత్ ప్రదాత! (‘జాత’ ధర్మము)

బ్రహ్మ → సృష్టి సంకల్పముయొక్క సిద్ధరూపమగు బ్రహ్మ దేవస్వరూపము. సృష్ట్యభిమాన స్వరూపము.

త్రివృత్ : జాగ్రత్ - స్వప్న - సుషుప్తిబీ దృశ్య - ద్రష్ట - దర్శనబీ సృష్టి - స్థితి - లయబీ భూత - వర్తమాన - భవిష్యత్‌బీ దృశ్య - దేహ - దేహ సంచాలక - ఇత్యాది త్రివృత్ (త్రివృత్తుల - త్రివృత్తముల) రూపము.

సప్త స్వరః : షడ్జము, రిషభము, గాంధారము, మధ్యమము, పంచమము, దైవతము, నిషాదము అనబడు - సప్త స్వరరూపము. స్వస్వరూపము యొక్క నాద సంజ్ఞా విశేషము.

ఋగ్వేదో : ఋగ్వేదములలోని ఋక్కుల (స్తోత్రములు) స్తుతికి విషయము.

గార్హపత్యాగ్ని రూపము : యాగవిధానములోని అగ్నిత్రయములలో (త్రేతాగ్నులలో) మొదటిది.

మంత్రాః : ‘మననాత్ త్రాయతే’.....అను అంతర్ విశేష రసముతో కూడిన మంత్రరూపము. మహర్షులు, మహనీయులు ప్రసాదించిన సమస్త మంత్రముల సిద్ధిరూపము.

వర్ణము (రంగు) = పీతము (పసుపుపచ్చరంగు)

శక్తి = ‘‘క్రియా శక్తి రూపము’’, ‘‘క్రియాశక్తి సమన్వితమ్’’

ఉపాసనాప్రయోజనము = సర్వాభీష్టఫలప్రదమ్! కోరుకొనునది ప్రసాదించు స్వరూపము.

ఓ పైప్పలాదా! ఈవిధంగా నామొట్టమొదటిదగు సద్యోజాత ముఖమును తెలుసుకొని, భావించి, పూజించు.
(ఓం సద్యోజాతం ప్రపద్యామి, సద్యోజాతాయవై నమో నమః)

(2) అఘోర బ్రహ్మముఖ - ఉపాసన

అఘోరగ్ం-సలిలం। చంద్రం। గౌరీ। వేదద్వితీయకమ్। నీరదాభగ్ం। స్వరగ్ం। సాంద్రం। దక్షిణాగ్నిః - ఉదాహృతమ్।।

అఘోరము = సూక్ష్మతత్త్వమగు అభిలాష, కల్పనా వినోదము. ద్వితీయమనే సరదా.

సలిలం : జలస్వరూపము (యో ఆపః మాం యతనం వేద)। అన్ని తరంగాలుగా జలమే విస్తరించియున్న తీరుగా సర్వత్రా నిండి ఉన్నట్టిది! జీవాత్మతత్త్వ ప్రదర్శనారూపము.

చంద్రము : ప్రశాంతము, ఔషధ ప్రదాతము. అన్న (ఆహార)తత్త్వరూపము. చంద్రుని ఆభరణముగా కలిగి ఉన్నట్టిది.

గౌరీ : శక్తితత్త్వము. జగజ్జననీ (పార్వతీ) తత్త్వము, ఓంకారములోని ‘ఉమ’. ప్రకృతి రూపము. స్వభావము. భావన. ఊహారూపము.

వేదద్వితీయకమ్ : రెండవదగు, యజుర్వేద స్వరూపము. (యజ్ఞ-యాగముల ఉపాసనా లక్ష్యము।). ‘జీవాత్మ’ అను అంశను రెండవదిగా - వేద (తెలియబడునది - తెలుసుకొనువాడుగా) కల్పించుకొనుచున్నట్టి రూపము. తెలుసుకొనబడుదాని కల్పనా క్రియావిశేషము.

నీరదాభగ్ం - స్వరం = నాదస్వరూపంగా గమనించు యోగులచే మేఘవర్ణముగా, మేఘగర్జన స్వరముతో ఉపాసించబడుచున్నట్టిది.

సాంద్రమ్ : జగత్ ప్రత్యక్షముచే దట్టముగా, నిండుగా ఉన్నది.

దాక్షిణాగ్ని : యజ్ఞ - యాగములలో దక్షిణాగ్ని మంత్రములచే ఉపాసించబడునది. దక్షిణాగ్నిగా ఉపాసించబడుచున్నట్టిది.
పంచాశత్ వర్ణ సంయుక్త గ్ం స్థితమ్: ‘50’ వర్ణములతో కూడి ఉన్నట్టిది. పంచాశత్(50) పీఠములను అలంకరించియున్న రూపము.

ఇచ్ఛాశక్తిరూపము : ఇచ్ఛా క్రియా న్వితము.

శక్తి రక్షణ సంయుక్తమ్ : విశ్వమునందు, దేహములయందు రక్షణ శక్తి స్వరూపము. ప్రభువు.

ఈ విశేషములతో నాయొక్క శివతత్త్వమును అఘోర బ్రహ్మముగా ఉపాసించుచుండగా, ఈ జీవునియొక్క పాప - దుష్ట సంస్కారములు, ప్రవృత్తులు శమించగలవు. అఘోర తత్త్వోపాసన సర్వైశ్వర్య ఫలప్రదము.
(అఘోరేభ్యో అథ ఘోరేభ్యో। ఘోర ఘోరత రేభ్యః సర్వేభ్య స్సర్వ శర్వేభ్యో। నమస్తే అస్తు రుద్ర రూపేభ్యః।।)

(3) వామదేవ బ్రహ్మముఖ - ఉపాసన

వామదేవం - మహాబోధదాయకం। పావకాత్మకమ్। విద్యాలోక సమాయుక్తం। భానుకోటి సమప్రభమ్। ప్రసన్నగ్ం। సామవేదాఖ్యం। గానాష్టక సమన్వితమ్।

శివతత్త్వమును (1) గురు (eT]యు) (2) ప్రకృతి రూపంగా ఉపాసించటము. ‘వామదేవ-మహాదేవ-శివశంకర’ అను ఉపాసన.

ఈ 3వదగు వామదేవోపాసన...‘ఆత్మబోధ’ (లేక) మహాబోధను ప్రసాదించునది. జీవునికి తనయొక్క ‘మహత్’ తత్త్వమును ప్రభోదించునట్టిది. జీవుని పవిత్రునిగా తీర్చిదిద్దుచున్నది. ‘బ్రహ్మవిద్య’తో కూడుకొన్న రూపము. సద్గురు రూపము.

కోటి సూర్యతేజోమయము. పరమానంద-ప్రసన్నముఖము.

సామవేదముయొక్క సామగానములచే వ్యాఖ్యానింపబడుచూ, ప్రస్తుతించబడుచున్నట్టిది. ‘శివాష్టకము’ మొదలైన గానాష్టకములచే స్తోత్రము చేయబడుచున్నట్టిది. (ఉదాహరణకు : బ్రహ్మమురారి సురార్చితలింగమ్, నిర్మలభాషిత శోభితలింగమ్....).

ధీర (ఉత్తమ బుద్ధికి నిర్మల బుద్ధికి) స్తుతి విషయము.

ఆహవనీయాగ్ని రూపముగా మంత్రస్తోత్రములు చేయబడుచున్నట్టిది.

అజ్ఞానమున సంహరించునది. ‘‘జ్ఞాన శక్తి సమన్వితమ్’’. శివ - శక్తి - ‘ద్విశక్తి’ సమన్వితము.

వర్ణము (రంగు) - శుక్లము (తెలుపు),
గుణము - తమో మిశ్రమము

ఇట్టి వామదేవ బ్రహ్మోపాసన - పూర్ణ బోధకరగ్ం స్వయమ్ - ఈ జీవునకు స్వయం - పూర్ణత్వముగురించి బోధించునది. వామదేవ రూపము త్రిథామములను (‘3’ లోకములను) నియమించు తత్త్వము. త్రిలోకములు తన శరీరముగా కలిగిఉన్నట్టిది కూడా! సర్వ సౌభాగ్యములు, పుణ్యకర్మఫలములు ఉపాసకునికి ప్రసాదించునది.

శ్రీమన్నారాయణునిచే ఉపాశ్యము! (‘ఓం నమో నారాయణాయ’ అను) అష్టాక్షరీ సమాయుక్తము కూడా! అష్టాక్షరీ అంతరార్థము.

అష్టాక్షరోపాస ఫలప్రదాత! హృదయముయొక్క ‘8’ దళముల మధ్యగా సంస్థితమై యున్న రూపము.

ఈ రీతిగా ‘వామదేవ బ్రహ్మముఖము’ను (లేక) వామదేవోపాసనను దేహ - మనో - బుద్ధులతో అభ్యసించు జనులు ఉత్తమ ప్రయోజనములను పొందగలరు.
(భవే భవే నాతి భవే భవస్వమామ్। భవోద్భవాయ నమః। వామదేవాయ నమః।)

(4) తత్పురుష బ్రహ్మముఖ - ఉపాసన

యత్ తత్ పురుషమ్ ప్రోక్తం - వాయు మండల సంవృతమ్। పంచాగ్నినా సమాయుక్తమ్। మంత్రశక్తి నియామకమ్। పంచాశత్ స్వరవర్ణాఖ్యమ్। అథర్వ వేద స్వరూపకమ్। కోటికోటి గణాధ్యక్షమ్। బ్రహ్మాండాఖండ విగ్రహమ్।

ఓ శాకలమునీ! - తత్పురుష - 4వ బ్రహ్మ (4వ ముఖము)ను ఎరుగుచూ ఉపాసించు విధానము చెప్పుచున్నాను. శ్రద్ధగా వినెదవుగాక!

వాయుమండల సంవృతమ్ : వాయు మండలమంతా విస్తరించియున్న రూపము, కదులుచున్న వాయువు, ఆ వాయువును కదల్చుచూ, ఆధారమై ఉన్న శక్తి...లను నాయొక్క తత్పురుష వైభవంగా ఉపాసించు. అట్లాగే దేహములోని ప్రాణశక్తిని ప్రాణేశ్వరుడగు తత్పురుషునిగా కొలువుము. నీలోని ప్రాణమును ప్రాణేశ్వరుడను నేనే!

పంచాగ్నినా సమాయుక్తము : ‘తత్ త్వమ్’ అను మహావాక్యములోని నాయొక్క తత్ పురుషుని పంచాగ్ని స్వరూపునిగా ఉపాసించెదవుగాక! యజ్ఞవిధిలోని గార్హపత్యాగ్ని; ఆహవనీయాగ్ని; దక్షిణాగ్ని; అవసథ్యాగ్ని; సూర్యాగ్నిలతో కూడుకొని యజ్ఞపురుషుడనై ఉన్నాను - అను మననము కలిగియుండుము.

ఇంకనూ.... (మననాత్ త్రాయతే - ఇతి) మంత్ర శక్తి సమాయక్తుడుగా, ‘50’ స్వరవర్ణములచే గానము చేయబడుచున్నాను.

అథర్వణ వేద - వేదాంత స్వరూపుడునుగాను, కోటి కోటి గణములకు అధినేత - అధ్యక్షుడనుగాను, ఉపాసించుము.

అఖండ బ్రహ్మాండ మండల - దివ్య విగ్రహుడుగాను, ఒకే తత్త్వము బ్రహ్మాండములో అనేక ప్రదర్శనములు నిర్వర్తిస్తూ, ఇదంతా ‘తానే’ అయినట్టివాడుగాను నన్ను దర్శించాలి. ఆరాధించాలి. బుద్ధితోగ్రహించాలి. ‘‘సర్వశక్తి సమాన్వితము’’

వర్ణము - రక్త (ఎరుపు) వర్ణము.

కామ పంచరూపుడను
(1) సంకల్ప - (2) భౌతికసృష్టి - (3) పరిపోషక - (4) సంచార - (5) లయ - స్వరూపుడుగా ఎరిగి స్తుతించబడుచున్నాను.

- ‘‘ఆధి (మానసిక రుగ్మతలు) వ్యాధి (శారీరక రుగ్మత)లకు భిషజులు. వైద్యులు.
- సృష్టి - స్థితి - లయ...మొదలైన వాటినన్నిటికీ కారణ కారణులు. సర్వశక్తిమంతులు.
- జాగ్రత్ స్వప్నసుషుప్తులకు ఆవల తురీయస్వరూపులు.
- సత్ - చిత్ (ఉనికి - ఎరుక) - ఆనంద (సుఖ) స్వరూపులు.
- బ్రహ్మ, విష్ణువు మొదలైన దేవతలచే సేవించబడువారు.
- జగత్‌పిత. సర్వమునకు జననస్థానమై, సర్వమునకు పరమై ఆవల ఉన్నవారు’’
అను ఈ ఈ విధాలుగా నాయొక్క తత్ పురుష బ్రహ్మముఖమును వేదోపనిషత్తులు ఎలుగెత్తి గానము చేయుచున్నాయి.
(తత్పురుషస్య విద్మహే। సహస్రాక్షస్య మహాదేవస్య ధీమహి। తన్నో రుద్రః ప్రచోదయాత్)

(5) ఈశాన బ్రహ్మముఖ - ఉపాసన

ఈశానం పరమమ్। విద్యాత్ ప్రేరకం। బుద్ధి సాక్షిణమ్। ఆకాశాత్మకమ్। అవ్యక్తం। ఓంకార స్వరభూషితమ్। సర్వదేవమయగ్ం। శాంతగ్ం। శాంత్యతీతగ్ం। స్వరాత్ బహిః। అకారాది స్వరాధ్యక్షమ్। ఆకాశమయ విగ్రహమ్। పంచకృత్య నియంతారమ్। పంచబ్రహ్మాత్మకమ్ బృహత్।

- పరవిద్య (ఆత్మవిద్య)కు ప్రేరణస్వరూపులు;
- బుద్ధికి ఆవల సాక్షీస్వరూపులు; జగత్తుకే ఆత్మ అయినట్టివారు - సర్వాత్మకులు.
- ఆకాశమునకు అంతటికీ ఆత్మస్వరూపులు;
- సర్వమును వ్యక్తీకరిస్తూ....తాను అవ్యక్త స్వరూపులై ఉంటున్నవారు;
- ‘ఓం’ కార స్వరమును ఆభరణముగా ధరించినవారు;
- సర్వ దేవతలలో అంతరమునను, సర్వ దేవతా స్వరూపులుగాను విస్తరించి ఉన్నవారు;
- పరమ శాంత స్వభావులు; సర్వము సశాంతించిగా కూడా శేషించి ఉన్నవారు కాబట్టి, ‘శాంతి’కి కూడా అతీతులు. జగత్ - సాక్షికి పరమై ఉన్నవారు.
- ‘అ’ నుండి ‘క్ష’ వరకు స్వరముల రూపముగా శబ్ద స్వరూపులై, సర్వ బహిర్ నాదస్వరూపులై విరాజిల్లుచున్నవారు;
- ఆకాశమును తనయందు ప్రదర్శించువారు; ఆకాశమయ విగ్రహులు;
అని నన్ను యోగులు సందర్శిస్తూ గానం చేస్తున్నారు. నా ఈశాన ముఖమును ఉపాసిస్తున్నారు.

ఇంకా,

పంచకృత్య నియంతారమ్ - సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహములు అనబడుట పంచకృత్యములకు నియంత, నియామకుడను.

పంచబృహత్ బ్రహ్మాత్మకమ్ : సద్యోజాత - అఘోర - వామదేవ - తత్పురుష - ఈ శానములనబడు - పంచబ్రహ్మాత్మకుడను.

పంచబ్రహ్మ ఉపసగ్ంహారం కృత్వా స్వాత్మని సగ్ంస్థితః :
పంచబ్రహ్మలను నాయందు ఉపసంహరించుకొనుచున్నవాడను కూడా! ఆ విధంగా ఉపసంహరించుకొని ‘స్వాత్మ’యందు సంస్థితులై ఉండువాడను. స్వమాయలో అంతర్విభాగమగు ఈలోక-లోకాంతర వ్యవహారమంతా నాయందు లయం చేసుకొని, పంచబ్రహ్మాత్మకమైన దానికంతటికీ అతీతుడై ఉండువాడను. పంచబ్రహ్మ ఉపసంహార సమన్విత శక్తి రూపుడను.

బాహ్య కారణములంటూ ఏమీ లేకుండానే ఈ సర్వము యొక్క మొదలు, మధ్య, చివర, స్వయముగా, స్వ-విలాసముగా, స్వ-అభిన్నంగా భాసించువారు.
స్వయం పరబ్రహ్మ స్వరూపము అని నా ఈశానముఖము అంతటా స్తుతించబడుతోంది.

స్వమాయ వైభవాన్ సర్వాన్ సగ్ంహృత్య స్వాత్మాని స్థితః।।
స్వమాయచే సర్వమును భావించువాడను, స్వమాయకు లీలా వినోదంలో మోహము పొందుచున్నట్టివాడను కూడా! నా మాయను నేనే ఉపసంహరించి ఆత్మయందు సర్వదా సంస్థితుడనై ఉన్నవాడను.

అట్టి నా ఈశ్వర రూపము - కళ్ళకు కనిపించే భౌతిక రూపముకాదు. కానీ ఈ కళ్ళకు కనిపించే అంతటియందు తిష్ఠించుకొని ఉన్నట్టిది. ఆ నా ఈశ్వర రూపమే! ఇదంతా సర్వదా ఈశ్వర స్వరూపమే!

‘‘అట్టి సర్వులను మోహింపజేయు ఆ శంభుడే మహాదేవుడు, జగద్గురువు కూడా. కారణములకే కారణుడగు అట్టి ఈశ్వరుని మాయ సురులకు కూడా తెలియరానిది. ‘‘ఆయన కంటికి కనిపించకయే - ద్రష్ట దృశ్యములతో సహా సమస్తము అయి ఉన్నారు’’
- అని నా ఈశ్వర తత్త్వమును యోగజనులు ధ్యానించుచున్నారు.

పరమునకే పరమైనవట్టి ‘పరాత్‌పరుడను! పరమ పురుషుడను!

ఈ విశ్వమంతా నా ధామము, (నివాస స్థానముగా కలిగినట్టివాడను).
[ఈశాన స్సర్వ విద్యానాం। ఈశ్వర స్సర్వ భూతానాం।
బ్రహ్మాధిపతిః। బ్రహ్మణో-ధిపతిః। బ్రహ్మాశివోమే అస్తు సదాశివ ‘ఓం’।।]

⌘ ⌘ ⌘

ఓ పైప్పలాదా! ఈ విశ్వమంతా ఎవరివలన ప్రకాశించుచున్నదో....ఎద్దానియందు (ఎవ్వనియందు) ఇదంతా తిరిగి ఉపశమిస్తోందో....అట్టి పరమశాంతమైనట్టి, బ్రహ్మమే నేను.

పంచబ్రహ్మములకు ‘పరము’ (Beyond) అయినట్టి బ్రహ్మమే సర్వదా నేనై ఉన్నాను.

సోఽహమ్।। ఏది నేనై ఉన్నానో,... అదియే నీవు! తత్‌త్వమ్ ।। అదియే ఈ జీవుడు! జీవో బ్రహ్మేతి।। ఏది జగత్తుగా కనిపిస్తుందో అది బ్రహ్మమే! సర్వమ్ ఖలు ఇదమ్ బ్రహ్మ।। నేనుగా నీకు కనిపిస్తున్నది నీవే! త్వమేవాహమ్।।

అట్టి ఆత్మస్వరూపుడనగు నేను సద్యోజాతము, అఘోరము మొదలైన పంచబ్రహ్మలకు మునుమందే, వాటికి పరమై ఉన్నాను.

అట్టి నా కేవల - సహజ స్వరూపమగు పరస్వరూపముయొక్క స్వయం ప్రదర్శనారూప - పంచబ్రహ్మస్వరూపమే ఇదంతా!

⌘ ⌘ ⌘

ఈ విధంగా ఎవ్వరైతే పంచబ్రహ్మాత్మకమైనదంతా కూడా

(1) బ్రహ్మముయొక్క నిర్వహణా ప్రదర్శనా విశేషము - అని
(2) బ్రహ్మమునకు అభిన్నమని
(3) ‘‘బ్రహ్మమే నేను’’ అని
తెలుసుకుంటారో, వారు ఈశానత్వమును, ఈశ్వర లక్షణములను పొంది, ఈశ్వర తత్త్వరూపమును సంతరించుకొనుచున్నారు.

‘‘ఇదంతా కూడా నాయొక్క పంచబ్రహ్మాత్మకమే! నాలోని నేనే ఇదంతా! నేను కానిదేదీ లేదు! నేను ఏదీ అగుటయూ లేదు’’.
- అని గమనిస్తూ ఇదంతా ‘ఆత్మ’యందు విలీనము చేయుచూ,
‘‘అట్టి నాయందు సర్వము విలీనము అగుచుండగా శేషించియుండు ఆత్మయే నేను! సోఽహమస్మి!’’ అని ఏ విద్వాంసుడైతే గ్రహించి ఉంటాడో,
అట్టివాడు జనన-మరణ పరిధులను దాటివేసి ‘అమృతస్వరూపుడు’ అగుచున్నాడు.

‘ఇదంతా బ్రహ్మమే! నేను బ్రహ్మమునే! నేనే ఇదంతా’ అని ఎరిగినవాడు ఎల్లప్పుడు ముక్తుడే! సందేహమే లేదు. ఆతడు నాకు అభిన్నుడు. (పంచబ్రహ్మాసనాసీనాయైనమః। పంచబ్రహ్మ స్వరూపిణ్యై నమః। - లలితా సహస్ర నామములు)

పంచాక్షరీ - పంచబ్రహ్మోపాసన

ఈ విధంగా పరమశివ (శంభు) స్వరూపము పంచాక్షరమయుడని, పంచబ్రహ్మతత్త్వుడని గ్రహించి, పరబ్రహ్మమే సర్వస్వరూపమని, స్వస్వరూపమని బుద్ధితో సునిశ్చితము చేసుకొని ‘న’కారాది ‘య’ కారాంతమగు, ‘‘ఓం నమః శివాయ’’ అను పంచాక్షరీ మంత్రమును శ్రద్ధతో నీ అంతరహృదయుడనగు నన్ను ఉద్దేశ్యించి జపించు! పరమశివుని పరబ్రహ్మస్వరూపముగా ఆరాధించెదవు గాక!

ఓ శకలమునీ! పైప్పలాదుడా! సర్వము పంచబ్రహ్మతత్త్వమగు పంచాక్షరీ ప్రత్యక్ష రూపమేనయ్యా! అట్టి పంచ బ్రహ్మాత్మిక తత్త్వమును ఎవ్వరు శ్రద్ధతో, భక్తి భావనతో ఉపాసిస్తారో - అట్టివాడు పంచబ్రహ్మాత్మకుడై స్వయముగా పంచబ్రహ్మమునకు కూడా సాక్షియగు ‘చిదానంద రూపమ్ - శివోఽహమ్ శివోఽహమ్ ’ అను పంచధామము చేరుచున్నాడు. అట్టి లక్ష్యశుద్ధి పొందెదవు గాక!

ఈ విధంగా మహాదేవుడగు పరమశివుడు భక్తుడగు ‘గాలవశ్యుడు’ అను మరొక పేరుగల శాకల్యునకు (పిప్పలాద మహర్షికుమారుడగు పైప్పలాదునకు) స్వతత్త్వమగు ‘పంచబ్రహ్మాత్మక - పంచబ్రహ్మాతీత’ తత్త్వమును ‘త్వమేవ తత్ శివేతి’ అను రూపవర్ణనతో సుస్పష్టముగా బోధించి ఆ పైప్పలాదుడు చూస్తూ ఉండగానే - అంతర్థానమైనారు.

మహనీయుడగు ఆ శాకలుడు మహాదేవుడు చెప్పనదంతా శ్రద్ధా భక్తులతో విన్నారు. ఈవిధంగా సహ శిష్యునితో కూడి మననము చేయసాగారు.

శ్లో।। ఏకేనైవ తు పిండేన మృత్తికాయాశ్చ, గౌతమ।
విజ్ఞాతం మృణ్మయగ్ం సర్వమ్, ‘మృత్’ అభిన్నగ్ం హి కార్యకమ్।

ఓ గౌతమా! ‘అనేక మట్టి బొమ్మలలో మట్టి సర్వదా అఖండమే కదా! ఒక్కటే కదా! అట్లాగే శివతత్త్వమే ఈ సర్వజీవుల దేహముల -దేహిల రూపముగా ప్రత్యక్షమైయున్నది. ఒకడు అమతుడు అయినా, సమతుడు అయినా (తెలిసినా, తెలియకున్నా)...శివస్వరూపము యథాతథము. మట్టిని తెలుసుకుంటే, వేలాది మట్టి బొమ్మల గురించి క్రొత్తగా తెలుసుకోవలసినది ఏమున్నది? బొమ్మలన్నీ మట్టిమయమే కదా! కారణరూపమగు బ్రహ్మమే కార్యరూపమగు జగత్తు - జీవుడుగా కూడా సంప్రదర్శనమగుచున్నది.

లోహమణినా సర్వం లోహమయం యథా।
లోహమణిలో (లేక) ఒక వెండి వస్తువులో ఉన్నదంతా లోహమే (వెండియే) కదా!

కారణము కంటే కార్యము వేరు కాదు. బ్రహ్మము కంటే ‘అహం’కారముగాని, ఈ సాహంకార జగత్తుగాని వేరు కాదు! కారణరూపమగు ఆత్మ సర్వదా సత్యము. ఇక్కడ కనబడే భిన్నత్వమో? బంగారముతో తయారుచేయబడిన వివిధ ఆభరణములు బంగారముకంటే వేరా? కాదు. అట్లాగే ఇక్కడి భిన్నత్వము సత్యము కాదు! భిన్నత్వమునందు అంతర్లీనమైయున్న ఏకత్వమే సత్యము!

కనుక...,
అజ్ఞాన దృష్టిచే అనేకముగా కనిపిస్తున్న ఇదంతా కూడా, శివతత్త్వజ్ఞానముచే ఏకత్వముగా అనిపించగలదు! ఇదియే ‘బ్రహ్మసత్యమ్ - జగత్ మిథ్య’ అను సిద్ధాంతము.

ఆదిస్వరూపమగు ఆత్మయే అఖండమై ఉండికూడా ఈ భిన్న భిన్న విశేషములతో కూడిన ప్రదర్శనములతో అగుపిస్తోంది. నేను సర్వదా అఖండము, అభిన్నము - అగు ఆత్మస్వరూపుడనే! ఇదంతా నేనే! కారణస్వరూపుడునగు నాకు స్వీయ కార్యస్వరూపమగు జగత్తు భిన్నము కాదు!

నేను వేరు - నాలోని చూచేవాడు, వినేవాడు, స్పర్శానుభవి, యోచించేవాడు, రుచిచూచేవాడు వేరు వేరు - కాదు కదా! అట్లాగే సర్వగతమగు ఆత్మయే సర్వత్రా సర్వదా సంప్రదర్శితమైయున్నది.

దర్పణములో వస్తువులు కనబడుచున్నప్పటికీ, దర్పణంలో అవేవీ ఉండవు. నీటిలో ప్రతిబింబము కనబడినంత మాత్రంచేత నీటిలో ఆ వస్తువు ఉండదు. (అట్లాగే) ఆత్మయందు జగత్తు, ఖండమగు జీవాత్మ-ప్రతిబింబిస్తూ ఉన్నప్పటికీ, ఆత్మయందు అవేవీ మొదలే లేవు.

లేనివి తొలగించుట మాత్రం ఎక్కడిది?

ఈ దృశ్యము ఆత్మకు భిన్నము కాదు. ఆదిస్వరూపమగు ఆత్మ దృశ్యముగా అగుటయూ లేదు. (దృష్టాంతము - నాటకంలోని పాత్రయొక్క లక్షణాలన్నీ రచయితయొక్క ఊహయే! కానీ పార్తయొక్క లక్షణాలు రచయితకు ఆపాదించలేము).

ఆత్మ - దృశ్యము అనబడు రెండు వేరైన వస్తువులు లేవు.

రెండవదగు దృశ్యము మొదలే లేదు. కారణమునకు భిన్నముగా కార్యము లేదు.

ఆత్మకు భిన్నముగా జగత్తు లేదు.

ఆత్మ నిత్య నిర్మలము. అద్దానియందు జగత్తు అనబడేదేదీ మొదలే లేదు.
జగత్తుగా కనిపించేది ఆత్మయే! కానీ, ఆత్మ జగత్తుగా అగుటయే లేదు.

దర్పణంతో దృశ్యము కనబడుచూ ఉన్నప్పటికీ, దర్పణములో దర్పణమే ఉంటుందికాని, వస్తువులు ఉంటాయా? ప్రతిబింబిత వస్తువు నీటితో ఉన్నదనటం సమంజసము కాదు కదా!

బ్రహ్మమే జగత్తు! బ్రహ్మమే ‘నీవు’! బ్రహ్మమే నేను! ‘‘నేను-నీవు’’ గా కనిపిస్తున్నది పమర ఆత్మయే. అయితే, ఆత్మ సర్వదా అఖండము.

ఈ సత్యమును ఆస్వాదించుటయే మహాదేవుల వారు బోధించిన పంచబ్రహ్మోపనిషత్ సారము!

కారణము నిత్యము. కార్యము సందర్భ పరిమితము మాత్రమే. కారణము అద్వైతమగు శుద్ధ చైతన్యమే!

బ్రహ్మపురములో దహరము ఉన్నది. దేహపురంలో కూడా ఉన్నది. దహరములో సర్వము ఉండీ - లేనివై ఉన్నాయి.
అందు హృదయ పద్మము. ఆ హృదయ పద్మములో దహరాకాశము.

ముముక్షువు స్వీయ హృదయంలోని దహరాకాశములోనే సర్వాత్మకుడగు సచ్చిదానందుడగు పరమశివుని కొరకై - అన్వేషించాలి.
ఆయన సర్వము అయి, సర్వమునకు వేరై, సాక్షి అయి వెలుగొందుచున్నారు.

స శివః సచ్చిదానందః సో అన్వేష్టవ్యో ముముక్షుభిః। అయగ్ం హృది స్థితః సాక్షీ సర్వేషాం అవిశేషతః।।
తేన అయగ్ం హృదయం ప్రోక్తః ‘‘శివః’’ । సంసార మోచకః।।

అట్టి శివతత్త్వమును తెలుసుకొని, ఉపాసించి, ఆరాధించి ఆయనతో ఏకమగుటయే సర్వ సంసార దోషములకు ‘‘దివ్యౌషధము’’.
పైప్పలాదమునీంద్రుడు ఈవిధంగా ఎరిగినవాడై బ్రహ్మానందముగా, సర్వము శివమయంగా జగత్తును దర్శించసాగారు.



🙏 ఇతి కృష్ణయజుర్వేదాంతర్గత పంచ బ్రహ్మ ఉపనిషత్ ‌🙏
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।।