[[@YHRK]] [[@Spiritual]]
PrāNa agnihōtra Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 2
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com
శరీరయజ్ఞసంశుద్ధచిత్తసంజాతబోధతః . మునయో యత్పదం యాంతి తద్రామపదమాశ్రయే .. |
శ్లో।। శరీర యజ్ఞ సంశుద్ధ |
‘శరీర యజ్ఞము’చే సంశుద్ధమైన చిత్తము వలన జనించుచున్న బోధచే మునులు ఎట్టి పదమును పొందుచున్నారో, అట్టి ‘రామపదము’ ను ఆశ్రయించుచున్నాము. |
హరిః ఓం .. అథాతః సర్వోపనిషత్సారం సంసారజ్ఞానాతీత- మంత్రసూక్తం శారీరయజ్ఞం వ్యాఖ్యాస్యామః . |
|
సర్వ ఉపనిషత్ సారగ్ం, సగ్ంసార జ్ఞాన అతీతమ్, అన్నసూక్తగ్ం, ‘‘శారీరయజ్ఞం’’ వ్యాఖ్యాస్యామో। |
(ఆత్మయజ్ఞ పురుషుని ఆరాధించటానికై) ఇప్పుడు, - సర్వ ఉపనిషత్ సారము, - సంసారజ్ఞానమునకు అతీతమైనట్టి ఆత్మజ్ఞాన సంబంధితము అగు ‘అన్నసూక్తము’ సంబంధించిన ‘శరీరయజ్ఞము’ గురించి వ్యాఖ్యానించుకొనుచున్నాము. ఇది సర్వ ఉపనిషత్ సారము అయి ఉన్నది. |
యస్మిన్నేవ పురుషః శరీరే వినాప్యగ్నిహోత్రేణ వినాపి సాంఖ్యయోగేన సంసారవిముక్తిర్భవతీతి . |
|
యస్మిన్ ఏవ పురుషః శరీరే, వినా - అపి అగ్నిహోత్రేణ, వినా - అపి సాంఖ్యేన - సంసార విముక్తిః భవతి ఇతి।। |
మనము చెప్పుకొంటున్న ఈ ‘అన్నసూక్త స్వరూప శారీర యజ్ఞము’ - జీవుని ఉద్ధరించునది. ఈ జీవుడు తన పురుషకారముచే ‘‘అగ్నిహోత్రము’’ మొదలైన యజ్ఞ - యాగములు నర్వర్తించకున్నా కూడా, ‘సాంఖ్యము’ (విభజనముచే వేదాంతశాస్త్ర పరిశీలనాజ్ఞానము) ఎరుగకున్నా కూడా… ఈ ఉపనిషత్ యొక్క విచారణచే సంసార బంధమునుండి విముక్తి పొందగలరు. |
స్వేన విధినాన్నం భూమౌ నిక్షిప్య యా ఓషధీః సోమరాజ్ఞీరితి తిసృభిరన్నపత ఇతి ద్వాభ్యా- మనుమంత్రయతే . యా ఓషధయః సోమరాజ్ఞీర్బహ్వీః శతవిచక్షణాః . బృహస్పతిప్రసూతాస్తా నో ముంచత్వంహసః .. 1.. |
|
స్వేన విధినా అన్నం, భూమౌ నిక్షిప్య ‘‘యా ఓషధయః సోమరాజ్ఞీ - ఇతి తిసృభిః, ‘‘అన్నపత’’ ఇతి ద్వాభ్యామ్ అనుమంత్రయతే। ‘‘యా ఓషధయః సోమరాజ్ఞీః బహ్వీః శతవిచక్షణాః బృహస్పతి ప్రసూతాః, తానో ముఞ్చం త్వగ్ం హసః। |
‘‘యా ఓషధయః సోమరాజ్ఞీ - ఇతి తిసృభిః, అన్నపతీ’’ ఇత్యాది (3) మంత్రములతో అన్న పాత్రను 2 సార్లు సంప్రోక్షము చేయాలి. ఏఏ ఓషధులు - సోముని (చంద్రుని) రాజుగా కలిగి, తాము రాణులు అయి ఉన్నాయో, అనేక సంఖ్యలుగా ఉండి వందల శారీరక వ్యాధులను నివారించుచున్నాయో, బృహస్పతిచే బోధితమై జీవులకు సునిశిత బుద్ధిని ప్రసాదించుచున్నాయో, బృహస్పతి అంశను పుణికి పుచ్చుకొని, ఈ జీవునికి ఆహారమై బుద్ధి ప్రవృద్ధమవటానికి కారణమగుచున్నాయో - అట్టి ఓషధులు మా బుద్ధి దోషములను, పాప ప్రవృత్తులను కడిగివేయుచుండునుగాక! |
యాః ఫలినీర్యా అఫలా అపుష్పా యాశ్చ పుష్పిణీః . బృహస్పతిప్రసూతాస్తా నో ముంచత్వంహసః .. 2.. |
|
యాః ఫలినీర్యా, అఫలా, అపుష్పా, యాశ్చ పుష్పిణీః, బృహస్పతి ప్రసూతాః, తానో మున్చం త్వగ్ం హసః।।’’ |
ఏఏ ఓషధులు… - ఫలములతో కూడియున్నవో, - ఫలములు లేనట్టివో…, - పుష్పములు ఉండినట్టివో…, - పుష్పములు కాయుచుండనట్టివో.., బృహస్పతి సంకల్పమునుండి జనించిన అట్టి ఓషధులన్నీ కూడా మమ్ములను పాపబుద్ధులనుండి విడిపించి, పవిత్రులుగా తీర్చిదిద్దునుగాక! |
జీవలా నఘారిషాం మాతే బధ్నామోషధిం . యాతయాయు రుపాహరాదప రక్షాంసి చాతయాత్ .. 3.. అన్నపతేఽన్నస్య నో ధేహ్యనమీవస్య శుష్మిణః . ప్రప్రదాతారం తారిష ఊర్జం నో ధేహి ద్విపదే చతుష్పదే .. 4.. యదన్నమగ్నిర్బహుధా విరాద్ధి రుద్రైః ప్రజగ్ధం యది వా పిశాచైః . సర్వం తదీశానో అభయం కృణోతు |
|
2. ‘‘జీవలాం న హారిషాం, మా తే బధ్నామి ఓషధీమ్, యాత ఆయుః ఉపాహరాదప, రక్షాగ్ంసిచాతయాత్। అన్నపతే! అన్నస్య నో ధేహ్య సమీపస్య శుష్మిణః ప్రప్రదాతారం తారిష। ఊర్జం నో ధేహి ద్విపదే, చతుష్పదే। యత్ అన్నమ్ అద్మి బహుధా విరుద్ధగ్ం రుద్రైః ప్రజార్థం యదివా పిశాచైః, సర్వం తత్ ఈశానో అభయం కృణోతు। |
భూమిపై ఓషధులను పరిరక్షించి మా పరిపోషణకై అందించుచున్న ఓ వనదేవతలారా! మీకు సంబంధించిన ఏఏ ఓషధులు మా జీవలమును (ఆయుష్షును) హరించే స్వభావము కలిగి ఉంటాయో, రాక్షసత్వమును (ఆసురీగుణములను) వృద్ధి చేస్తాయో, - ఆపదలను బంధములను కలిగించు అట్టి ఓషధులను మేము తీసుకోము! అందుకుగాను (తీసుకోకుండా) అనుగ్రహిస్తూ, ఆయుర్వృద్ధి, సత్వగుణము, ఉత్సాహము, తేజస్సు వృద్ధి చేయు ఓషధములను మాకు సమీపముగా ఉండునట్లుగా అనుగ్రహించండి. అన్నదాత, అన్నమునకు అధిపతి అగు ఓ పరమాత్మా! దయతో మాకు తేజస్సు ఆహ్లాదము ప్రసాదించండి! మేము ఉన్నచోటే సమీపంగా పరిపుష్టి - రుచి గల ఆహారము లభించేరీతిగా అనుగ్రహించండి. ద్విపదులగు మానవులకు, చతుష్పాదులగు గోవులు (ధేనువులు) ఇత్యాది సంపదకు అన్నము (ఆహారము) సమృద్ధిగా లభించునుగాక! రుద్రభూమిలోని పిశాచములు మొదలైనవాటిచే స్పృశించబడి, ఆశ్రయించబడి, ఎంగిలిచేయబడిన తినగూడని విరుద్ధాన్నము మేము భక్షించినప్పుడు కూడా ప్రమాదములు మమ్ము సమీపించకుండునుగాక! సర్వము ఈశ్వర సంబంధితమై, మేము ఈశ్వరునిచే అభయము పొందెదముగాక! |
శివమీశానాయ స్వాహా .. 5.. అంతశ్చరసి భూతేషు గుహాయాం విశ్వతోముఖః . |
|
శివమ్ ఈశానాయ స్వాహా। అంతః చరతి భూతేషు, గుహాయాం విశ్వతోముఖః। |
ఈశ్వరుని అనుగ్రహము కొరకై ముందుగా అన్నము (ఆహారము)ను ఈశానునికి సమర్పిస్తున్నాము. నైవేద్యంగా నివేదన చేస్తున్నాము. వైశ్వానర - జఠరాగ్ని రూపంగా సర్వజీవుల శరీరములలో వేంచేసియున్న హే ఆత్మభగవాన్! సర్వజీవులహృదయాలలో విశ్వతోముఖలై(విశ్వప్రదర్శనా - దృశ్య స్వరూపులై) వేంచేసియున్నారు. ఈ విశ్వమును మీరు ముఖముగా కలిగియున్నారు. అట్టి వైశ్వానర పరబ్రహ్మమునకు నమో నమః।। |
త్వం యజ్ఞస్త్వం బ్రహ్మా త్వం రుద్రస్తవం విష్ణుస్త్వం వషట్కార ఆపో జ్యోతీ రసోఽమృతం బ్రహ్మ భూర్భువః సువరోంనమః . |
|
త్వం యజ్ఞః। త్వం బ్రహ్మా। త్వం రుద్రః। త్వం వషట్కారః। ఆపో జ్యోతి రసో అమృతం బ్రహ్మ భూః భువః సువరోం నమః।।’’ ఇతి అన్నమంత్రేణ స్వాహా। |
- మీరే సృష్టి యజ్ఞములోని సర్వ క్రియావిశేషాలకూ సృష్టి - యజ్ఞపురుషులు. - మీరే సృష్టికర్తయగు బ్రహ్మ! - మీరే లయకారులగు రుద్ర దేవ స్వరూపులు! - మీరే-(సృష్టి-రక్షణ-పరిపోషణ-వృద్ధి-క్షయ-వినాశనములు అను షట్ కార్యములను నిర్వర్తిస్తున్న) వషట్‌కారులు. సర్వప్రత్యక్ష స్వరూపులు, పరిపోషకులు. - మీరే ఆపో (జల - త్రాణ) స్వరూపులు. జ్యోతిర్మయులు! - అమృతస్వరూపులు! - భూ - భువర్ - సువర్ లోకములందు బ్రహ్మముగా ప్రకాశిస్తూ…అవన్నీ మీ స్వరూపమే అయిఉన్నవారు. అట్టి శివానంద స్వరూపులగు మీకు నమస్కరిస్తున్నాము. |
ఆపః పునంతు పృథివీం పృథివీ పూతా పునాతు మాం . పునంతు బ్రహ్మణస్పతిర్బ్రహ్మపూతా పునాతు మాం . యదుచ్ఛిష్టమభోజ్యం యద్వా దుశ్చరితం మమ . సర్వం పునంతు మామాపోఽసతాం చ ప్రతిగ్రహం స్వాహా . |
|
3. ఆపః పునంతు పృథివీం। పృథివీ పూతా పునాతు మామ్। పునంతు బ్రహ్మణస్పతిః, బ్రహ్మ పూతా పునాతు మామ్। యత్ ఉచ్చిష్టం అభోజ్యం, యత్ వా దుశ్చరితం మమ, సర్వం పునంతు మామ్, ఆపో అసతాన్ చ ప్రతిగ్రహగ్ం స్వాహా। |
ఈ భూమి జలవనరులచే సమృద్ధమై యుండునుగాక! జలముచే పవిత్రమై ఈ పృథివి - మమ్ముల పవిత్రులను, పునీతులను చేయునుగాక! ఈ భూమిపైగల వేద - వేదాంగవేత్తలు-తమయొక్క వేదగానములతో, తమ ఉపనిషత్ ఆత్మతత్త్వవాక్య - ఆత్మతత్త్వ నిరూపణా వాదములతో కూడిన బ్రహ్మతత్త్వ బోధచే నన్ను పరమపవిత్రము చేయుదురుగాక! ఓ జలదేవతా! వరుణభగవాన్! నేను ఏఏ భుజింపకూడని, వదలవలసిన పదార్థములను భుజించియున్నానో, ఏఏ దుశ్చరితములను దురాచాలము లను నిర్వర్తించనివాడనై ఉన్నానో….అట్టి సర్వ దోషములనుండి జలములు నన్ను పునీతుని, పవిత్రుని చేయుగా - అని ప్రార్థిస్తున్నాను. అసత్యములగు ఏఏ వాటితో నేను సంబంధం పెట్టుకొనియున్నానో, వాటి నుండి నన్ను నిర్మలుని చేయండి! మా ఈ (అగ్నియందు ఆజ్యము రూపంగా) సమర్పించు సమర్పణములను స్వీకరించండి! |
అమృతమస్య మృతోపస్తరణమస్యమృతం ప్రాణే జుహోమ్యమాశిష్యాంతోఽసి . ప్రాణాయ స్వాహా . అపానాయ స్వాహా . వ్యానాయ స్వాహా . ఉదానాయ స్వాహా . సమానాయ స్వాహా . ఇతి |
|
అమృతమ్ అస్తు! అమృత ఉపస్తరణమ్ అసి। అమృతం ప్రాణే జుహోమి। యమాశిష్యంతో అసి, ఓం ప్రాణాయస్వాహా। ఓ అపానాయ స్వాహా। ఓ వ్యానాయ స్వాహా। ఓం ఉదానాయ స్వాహా। ఓం సమానాయ స్వాహా। ఓం బ్రహ్మణే స్వాహా। ఓం బ్రహ్మణి మ ఆత్మా అమృత్వా యేతి! - స్వాహేతి।। - |
ఓ జలదేవతా! మీరు అమృతస్వరూపులు! అమృతత్త్వము ఆచ్ఛాదనముగా కలవారు. ప్రాణముల ఉనికిని రక్షించు త్రాణ కాబట్టియే జీవులమగు మేము ప్రాణముయొక్క శుభము - అస్తిత్వముల కొరకై మీకు ప్రాణములకు (ప్రాణదేవతకు) సమర్పిస్తూ వ్రేల్చుచున్నాము. మీరు జీవులమగు మాకు శక్తి ప్రసాదితులు. జలదేవత యొక్క అమృత రసతత్త్వమును ఉపాసిస్తున్నాము. ప్రాణమునకు…, అపానమునకు…, వ్యానమునకు…, ఉదానమునకు…, సమానమునకు…, పంచ ప్రాణములకు జల తత్త్వామృతమును - ‘స్వాహా’ = నివేదనము. ఓంకార స్వరూపులగు పరబ్రహ్మమునకు సర్వము ఆహుతి ఇస్తున్నాము. నా ఆత్మయందు పరబ్రహ్మము అమృతస్వరూపమై విరాజిల్లుచున్నది. అట్టి బ్రహ్మమునకు సర్వము సమర్పిస్తున్నాను. ఓ ఆత్మ భగవాన్! ఈ మాయొక్క సమస్తమును స్వీకరించి మమ్ములను పవిత్రాత్మస్వరూపంగా తీర్చిదిద్దండి! |
కనిష్ఠికాంగుల్యాంగుష్ఠేన చ ప్రాణే జుహోతి . అనామికయాపానే . మధ్యమయా వ్యానే . సర్వాభిరుదానే . ప్రదేశిన్యా సమానే . తూష్ణీమేకామేకఋషౌ జుహోతి . ద్వే ఆహవనీయే . ఏకాం దక్షిణాగ్నౌ . ఏకాం గార్హపత్యే . ఏకాం సర్వప్రాయశ్చిత్తీయే .. |
|
4. కనిష్ఠిక - అంగుల్య అంగుష్ఠేన ప్రాణే జుహోతి। అనామికయా అపానే। మధ్యమయా వ్యానే। సర్వాభిః ఉదానే। ప్రదేశిన్యా సమానే। తూష్ణీమ్ ఏకామ్ ఏక ఋచా జుహోతి। ద్వే ఆహవనీయే। ఏకాం దక్షిణాగ్నౌ। ఏకాం గార్హపత్యే। ఏకాం సర్వ ప్రాయశ్చిత్తీయే! |
జలమును ఈ విధంగా హస్తములతో అమృతభావనగా సమర్పించాలి! ‘‘- కనిష్ఠ అంగుళీ వ్రేలు ద్వారా (చిటికిన వ్రేలు ద్వారా) ప్రాణమునకు జలమును సమర్పిస్తున్నాను. - అనామిక (ఉంగరపు వ్రేలు) ద్వారా అపానప్రాణమునకు అమృతజల సమర్పణ చేస్తున్నాను. - మధ్య వ్రేలు ద్వారా వ్యానప్రాణమునకు జలమును ‘స్వాహా’ అంటూ జలముతో అభిషేకము నిర్వర్తిస్తున్నాను. - అన్ని వ్రేళ్ళతో..ఉదానప్రాణమునకు, అరచేతితో సమానప్రాణమునకు తర్పణ హోమము చేస్తున్నాము. (జలము సమర్పిస్తున్నాను). అన్నిటికీ కలిపి అన్నివ్రేళ్ళతో ఒకసారి తర్పణము (జలామృత తర్పణము) చేయుచున్నాను. మరొక్కసారి అన్ని వ్రేళ్ళతో సత్యమగు ఆత్మసమర్పణముగా తర్పణము చేయుచున్నాను. (‘‘సర్వం హోమం జుహోమి’’ - అంటూ పంచాగ్నులకు నేయిని (లేక జలమును స్ఫురణపూర్వకంగా సమర్పించుచున్నాను). ఈ విధంగా చేయుటచే సూర్యాగ్నియందు ఒకసారి, ఆహవనీయాగ్ని యందు రెండుసార్లు, దక్షిణాగ్నియందు ఒకసారి, గార్హపత్యాగ్నియందు ఒకసారి, సర్వప్రాయశ్చిత్తము (దోషములు పోవుటకు) ఒకసారి హోమము చేయుటతో సమానమగుచున్నది. ఏతత్ ఫలములు ఈ శారీరక జలహోమముచే సిద్ధించగలదు. |
అథాపిధానమస్యమృతత్వాయోపస్పృశ్య పునరాదాయ పునరుపస్పృశేత్ . స తే ప్రాణా వాఽఽపో గృహీత్వా హృదయమన్వాలభ్య జపేత్ . ప్రాణో అగ్నిః పరమాత్మా పంచవాయుభిరావృతః . అభయం సర్వభూతేభ్యో న మే భీతిః కదాచన .. 1.. ఇతి ప్రథమః ఖండః .. 1.. |
|
అథా అపిధానమ్ అసి అస్య అమృతత్వాయ ఉపస్పృశ్య పునః ఆదాయ, పునః స్పృశేత్। సన్వే ప్రాణావ ఆపో గృహీత్వా హృదయం అనుపలభ్య జపేత్। ‘‘ప్రాణో అగ్నిః, పరమాత్మా, పంచ వాయుభిః ఆవృతః। అభయగ్ం సర్వభూతేభ్యో। న మే భీతిః కదాచన’’ ఇతి।। |
అటు తరువాత ‘‘అపిథామసి’’…,’’ ‘‘అమృతత్వాయ ఉప దధామి’’ అను మంత్రములతో అమృత (మృత్యువును దాటినట్టి) భావనతో జలమును వ్రేళ్ళతో స్పృశించటము. ఎడమచేతియందు ప్రాణ స్వరూప భావనతో జలమును పోసుకొని హృదయము దగ్గరగా ఎడమచేతిని తాకిస్తూ…ఈ విధంగా జపము చేయాలి. (‘‘ప్రాణో అగ్నిః’’ … అను మంత్రమును పఠించటము). ప్రాణాగ్ని స్వరూపుడగు పరమాత్మ ప్రాణ - అపాన - వ్యాన - ఉదాన - సమానములనబడు పంచవాయువులయందు (పంచప్రాణములుగా) ఆవృతులై విస్తరించి ఉన్నారు. అట్టి ప్రాణేశ్వరుడు సర్వజీవులకు అభయస్వరూపుడై, (రక్షకుడై, ప్రేమస్వభావియై) ఉన్నారు. సర్వజీవులు ఆత్మస్వరూపులే! కనుక నేనూ ఆత్మస్వరూపుడనే! ఇక భయమెందుకు! సర్వం ప్రాణాయ జుహోమి। |
విశ్వోఽసి వైశ్వానరో విశ్వరూపం త్వయా ధార్యతే జాయమానం . విశ్వం త్వాహుతథః సర్వా యత్ర బ్రహ్మాఽమృతోఽసి . మహానవోఽయం పురుషో |
|
విశ్వరూపం త్వయా ధార్యతే। జాయమానమ్, విశ్వం త్వా హుతయః సర్వా। యత్ర బ్రహ్మ అమృతో అస్తి। మహానవో అయం పురుషో |
ఏ పరమ పురుషుడైతే…సదా అనుభవమగుచూ కూడా ఎప్పటికప్పుడు నవ - అనుభావుడు అయి ఉన్నారో…, అన్న ప్రసాదితుడు అగు అట్టి ఆత్మభగవానుడగు పరమేశ్వరుడు - బొటనవ్రేలు అగ్రభాగంలో ప్రతిష్ఠితుడై ఉన్నారని దర్శిస్తున్నాను. ఆయనను అమృతరూప జలముతో పరిషేచించుచున్నాను. |
యోఽఙ్గుష్ఠాగ్రే ప్రతిష్ఠితః . తమద్భిః పరిషించామి సోఽస్యాంతే అమృతాయ చ . అనావిత్యేష బాహ్యాత్మా ధ్యాయేతాగ్నిహోత్రం జోహోమీతి . సర్వేషామేవ సూనుర్భవతి . అస్య యజ్ఞపరివృతా ఆహుతీర్హోమయతి . స్వశరీరే యజ్ఞం పరివర్తయామీతి . |
|
యో అంగుష్ఠ - అగ్రే ప్రతిష్ఠితః। తమ్ అద్భిః పరిషించామి। సో అస్యాం, తే అమృతాయ చ। అనావితి ఏష బాహ్య ఆత్మా ధ్యాయేత్ అగ్నిహోత్రం జుహోతి। సర్వేషాం ఏవ సూనుః భవతి। అస్య యజ్ఞ పరివృతా ఆహుతీః, హోమయతి, స్వే శరీర యజ్ఞమ్ పరివర్తయామి। ఇతి।। |
ఈ నా కుడిచేతి బొటనవ్రేలు యొక్క ఊర్థ్వ (పై) భాగమున అధిష్ఠించి యున్న ఆ తత్‌పురుషుడే నాకు మోక్షమును, అమృతత్వమును ప్రసాదించునది! ఈయనయే నాయొక్క బాహ్యమంతా ఆక్రమించుకొనియన్న స్వస్వరూప ఆత్మతత్త్వముగా ధ్యానిస్తున్నాను. అగ్నిహోత్రమునకు హోమరూపంగా ఆయనకొరకై సమర్పిస్తున్నాను. సర్వక్రియలు ధారబోస్తున్నాను. ఆయనయే సర్వజీవరాసులకు ఆనందమును ప్రసాదించువారు. ఈ విధంగా ముఖమునందు అగ్నిహోత్రుని ప్రత్యక్ష స్వరూపుడుగా భావించి, ఆహుతులను హోమం చేస్తూ, శరీరయజ్ఞమును సర్వదా నిర్వర్తిస్తూ ఉండాలి. స్వశరీరమునందే యజ్ఞమును అనుక్షణికంగా చేస్తున్నాము. |
చత్వారోఽగ్నయస్తే కింభాగధేయాః . తత్రసూర్యోఽగ్నిర్నామ సూర్యమండలాకృతిః సహస్రరశ్మి- పరివృత ఏకఋషిర్భూత్వా మూర్ధని తిష్ఠతి . |
|
6. చత్వారో, అగ్నయః తే కిం ‘నారమ్’ అర్థయాః। (1) తత్ర ‘సూర్యాగ్నిః’ నామ సూర్యమండల ఆకృతిః, సహస్ర రశ్మి పరివృత ఏకర్షిః భూత్వా మూర్ధ్ని తిష్ఠతి। |
దేహాంతర్గత చతుర్విధాగ్నులు: ఈ భౌతిక శరీరముతో స్థానము కలిగి ఉన్నట్టి అగ్ని 4 విధములైనట్టిది - వాటి వాటి జలతత్త్వ అమృత స్వరూపార్థములను చెప్పుకుంటున్నాము. (1) సూర్యాగ్ని : ‘సూర్య మండల ఆకృతి కలిగి ఉన్నట్టిది. వేలాది కిరణములతో పరివృతమై, సంప్రదర్శితమై ఉన్నట్టిది. ఏకర్షి - ఏకైక సత్యమై ప్రకాశించుచున్నది. ఈ శరీరములో మూర్ధ్ని (ముఖము యొక్క ఊర్థ్వభాగంగా) యందు ప్రదర్శితమై ఉంటోంది. |
యస్మాదుక్తో దర్శనాగ్నిర్నామ చతురాకృతిరాహవనీయో భూత్వా ముఖే తిష్ఠతి . శారీరోగ్నిర్నామ జరాప్రణుదా హవిరవస్కందతి . అర్ధచంద్రాకృతిర్దక్షిణాగ్నిర్భూత్వా హృదయే తిష్ఠతి తత్ర కోష్ఠాగ్నిరితి . కోష్ఠాగ్నిర్నామాశితపీతలీఢఖాదితాని సమ్యగ్వ్యష్ట్యాం శ్రపయిత్వా గార్హపత్యో భూత్వా నాభ్యాం తిష్ఠతి . ఇతి ద్వితీయః ఖండః .. 2.. |
|
(2) యస్మాత్ ఉక్తో ‘‘దర్శనాగ్నిః’’ నామ చతుః ఆకృతిః, ఆహవనీయో భూత్వా, ముఖే తిష్ఠతి।। (3) ‘శారీరో అగ్నిః’ నామ జఠా (జరా) ప్రణుదా హవిః అవస్కందతి, అర్ధ చంద్రాకృతిః దక్షిణాగ్నిః భూత్వా, హృదయే తిష్ఠతి, (4) తత్ర ‘‘కోష్ఠాగ్నిః’’ ఇతి। కోష్ఠాగ్నిః నామ అశిత, పీత, లీఢ, ఖాదితగ్ం సమ్యక్ విషయిత్వా గార్హపత్యో భూత్వా నాభ్యాం తిష్ఠతి। |
(2) దర్శనాగ్ని : దేనిని ‘దర్శినాగ్ని’ అని అంటున్నామో, అయ్యది చతురాకృతి కలిగియున్నదై ‘ఆహవనీయాగ్ని’ అని పిలువబడుచూ, ముఖమునందు తిష్ఠించినదై ఉన్నది. (3) శరీరాగ్ని : ‘జఠరాగ్ని’గా అర్థచంద్రాకృతిగా ‘దక్షిణాగ్ని’, అని చెప్పబడుచూ, హృదయమునందు సంస్థితి కలిగి యున్నది. సర్వ హవిస్సులను ‘హుతము’ చేయుచున్నట్టి ‘అగ్ని’. (4) కోష్ఠాగ్ని : నాభి (బొడ్డు) స్థానములో సంస్థితమై ఉన్నట్టిది. అశితము (మ్రింగబడుచున్నవాటిని), పీతము (త్రాగబడువాటిని), లీఢము (నాలుకతో పీల్చబడువాటిని), ఖాదితము (పళ్ళతో నములబడువాటిని) - సమముగా చేసి జీర్ణమగునట్లు చేయుచున్న అగ్ని. ‘గార్హపత్యాగ్ని’ అని పిలువబడుచున్నది. |
ప్రాయశ్చిత్తయస్త్వధస్తాత్తిర్యక్ తిస్రో హిమాంశుప్రభాభిః ప్రజననకర్మా .. |
|
7. ‘ప్రాయశ్చిత్త’ యస్తు అధస్తాత్ తిర్యక్ తిస్రో హిమాంశుః ప్రభుః ప్రజనన కర్మా। |
‘ప్రాయశ్చిత్నాగ్ని’ - మంత్ర మనన రూపమున అన్ని అగ్నులకు క్రింద భాగముగా స్థితి కలిగి ఉంటోంది. అట్టి ప్రాయశ్చిత్తాగ్నికి - ఇడ - పింగళ - సుషుమ్న’ అను ‘నాడీత్రయము’ ‘ముగ్గురు స్త్రీలవలె కలిగి ఉంటోంది. ఆ మూడిటికి ప్రభువై, చంద్ర కిరణములతో ప్రజలను పుట్టించు కర్మలను నిర్వర్తించుచున్నది. |
అస్య శరీరయజ్ఞస్య యూపరశనాశోభితస్య కో యజమానః . కా పత్నీ . కే ఋత్విజః . కే సదస్యాః . కాని యజ్ఞపాత్రాణి . కాని హవీంషి . కా వేదిః . కోత్తరవేదిః . కో ద్రోణకలశః . కో రథః . కః పశుః . కోఽధ్వర్యుః . కో హోతా . కో బ్రాహ్మణాచ్ఛంసీ . కః ప్రతిప్రస్థాతా . కః ప్రస్తోతా . కో మైత్రావరుణః . క ఉద్గాతా . కా ధారాపోతా . కే దర్భాః . |
|
యూప రశనా శోభితస్య- కో యజమానః? కా పత్నీ? కే ఋత్విజః? కే సదస్యాః? కాని యజ్ఞపాత్రాణి? కాని హవీగ్ంషి? కా వేదిః? కా అంతర్వేదిః? కో ద్రోణ కలశః? కో రథః? కః పశుః? కో అధ్వర్యుః? కో హోతా? కో బ్రాహ్మణాచ్ఛగ్ంసీ? కః ప్రతి ప్రస్థాతా? కః ప్రస్తోతా? కో మైత్రావరుణః? క ఉద్గాతా? క ధారా? కః పోతా? కే దర్భాః? |
- యజమాని ఎవరు? - యజ్ఞపత్ని ఎవరు? ఈ శారీరక యజ్ఞమునకు ఋత్విజులెవరు? సదస్యులు (సభికులు) ఎవ్వరు? - యజ్ఞపాత్రలు ఏమేమి? హవిస్సు (అగ్నిలో తేల్చటానికి సిద్ధము చేయు ఇగురబెట్టిన అన్నము, నెయ్యి మొదలైనవి) - ఏది? అంతర్వేది (ఉత్తరవేదిక) ఏది? ‘ద్రోణకలశము’ అనగా? రథము ఏది? పశువు ఏది? అధ్వర్యులు - ఈ (శారీర యజ్ఞమునందు యజుర్వేదాది మంత్రములను నడుపువారు ) - ఎవ్వరు? హోతా → (ఋగ్వేదమంత్రములు తెలిసిన ఋత్విక్కు - హోమము చేయించువారు) ఎవ్వరు? బ్రాహ్మణములు (ఉపాసనలను) నిర్వర్తింపజేయు బ్రాహ్మణచ్ఛంసి ఎవ్వరు? - నిషేధములను, విధులను ప్రస్థావించి, నడిపించు ప్రతిప్రస్థాత, ప్రస్తోత ఎవ్వరెవ్వరు? మైత్రావరుణుడు (మిత్రకర్మము చేయించువాడు) ఎవ్వరు? - ఉద్గాత (యజ్ఞమునందు సామవేద తంత్రమును, దేవతాహ్వానగాన విధులను నడుపువాడు) ఎవ్వరు? - ఆధారము ఏది? - పోయువాడు (పోతా) ఎవరు? - శారీరక యజ్ఞములో దర్భలు ఏవి? |
కః స్రువః . కాజ్యస్థాలీ . కావాఘారౌ . కావాజ్యభాగౌ . కేఽత్ర యాజాః . కే అనుయాజాః . కేడా . కః సూక్తవాకః . కః శంయోర్వాకః . కా హింసా . కే పత్నీసంయాజాః . కో యూపః . కా రశనా . కా ఇష్టయః . కా దక్షిణా . కిమవభృతమితి .. ఇతి తృతీయః ఖండః .. 3.. |
|
కః స్రువః? కా ఆజ్య స్థాలీ? కౌ అఘారౌ? (కావాఘారౌ)। కా వా ఆజ్య భాగౌ? కే ప్రయాజాః? కే అనూయాజాః? కా ఇడా? (కేడా) కః సూక్తవాకః? కః శంయోర్వాకః? కే పత్నీ సంయాజాః? కో యూపః? కా రశనా? కా ఇష్టయః? కా దక్షిణా? కిం అవభృథమ్? ఇతి? |
స్రువము (నేయిని ఆహుతి చేయు కొయ్య గరిట (మాను-గరిటి) ఏది? స్రుక్కు హోమపాత్ర, - ఆజ్యస్థాలి - ఏది? అఘారము (స్నానము చేయునపుడు, తదితర ఆ సందర్భములలో జపించు మంత్రములు) ఏమి? ఆజ్యభాగము ఏది? ప్రయాజ భాగమేది? అనుయాజము ఏది? ‘ఇడ’ ఏది? సూక్త వాకము (శ్రీసూక్తి - పురుష సూక్తి మొదలైనవి) ఏవి? శంయోర్వాకము (శంయవాకము - శంనోమిత్రశ్శంవరుణః మొదలైనవి) ఏవి? పత్నీ సంయాజిలు (భార్యలు) ఎవ్వరు? ‘యూప’ (యజ్ఞములో పశువును బంధించటానికై నాటిన పై పట్ట (లేక) కొయ్య) ఏది? రశనము (నడుముకట్టు) ఏది? ఇష్టములు ఏమి? ఋత్విక్కులకు, యాజ్ఞీకులకు మొదలైనవారికి ఇచ్చే దక్షిణ ఏది? శారీరక యాగములో అవభృథస్నానము అనగా? |
అస్య శారీరయజ్ఞస్య యూపరశనాశోభితస్యాత్మా యజమానః . బుద్ధిః పత్నీ . వేదా మహర్త్విజః . అహంకారోఽధ్వర్యుః . చిత్తం హోతా . ప్రాణో బ్రాహ్మణచ్ఛంసీ . అపానః ప్రతిప్రస్థాతా . వ్యానః ప్రస్తోతా . ఉదాన ఉద్గాతా . సమానో మైత్రవరుణః . శరీరం వేదిః . నాసికోత్తరవేదిః . మూర్ధా ద్రోణకలశః . పాదో రథః . దక్షిణహస్తః స్రువః . సవ్యహస్త ఆజ్యస్థాలీ . శ్రోత్రే ఆఘారౌ . చక్షుషీ ఆజ్యభాగౌ . గ్రీవా ధారాపోతా . |
|
యూప రశనా శోభితస్య,- ఆత్మా యజమానో। బుద్ధిః పత్నీ। వేదాః మహా ఋత్విజో। అహంకారో ఆథ్వర్యుః। చిత్తగ్ం హోతా। ప్రాణో బ్రాహ్మణాచ్ఛగ్ంసీ। అపానః ప్రతి ప్రస్థాతా। వ్యానః ప్రస్తోతా। ఉదానః ఉద్గాతా। సమానో మైత్రావరుణః। శరీరం వేదిః। నాసికా అంతర్వేదిః। మూర్ధా ద్రోణకలశః। పాదో రథో। దక్షిణహస్తః స్రువః। సవ్యహస్తః ఆజ్యస్థాలీ। శ్రోత్రే ఆఘారౌ। చక్షుషీ ఆజ్య భాగౌ। గ్రీవా ధారా। పాదః పోతా। |
ఈ జీవుడు (జీవాత్మ) → యజమాని. బుద్ధియే → పత్ని। వేదములు (చతుర్వేదములు, ఇంద్రియములకు తెలియబడేవి) ఋత్విక్కులు (మహాఋత్విజులు). అహంకారము → కర్మకాండను నడిపించు అథ్వర్యుడు చిత్తము → ఋగ్వేద మంత్రములు ఉచ్ఛరించు ‘హోత’ (‘ఋత్విక్కు’). ప్రాణములే బాహ్మణములు గానంచేయు బ్రాహ్మణాచ్ఛంసులు. అపానము - ప్రతిప్రస్థాత (నియమావళిని నడుపువారు). వ్యానము → ప్రస్తోత (యజ్ఞపరికరములన్నీ అమరికచేయువారు). ఉదానము → ఉద్గాత (దేవతాహ్వానము పలుకు యాజ్ఞీకుడు) సమానప్రాణము - మైత్రావరుణులు (అమరికలన్నీ చక్కదిద్దుతూ నడిపించు ఋత్విక్కు). ఈ శరీరమే - యజ్ఞవేదిక నాశికాస్థానము - అంతర్వేదిక (ఉత్తరవేదిక - పై వేదిక) మూర్ధము -(ముఖశిఖర భాగము Upper Fore - Face) - ద్రోణకలశము దక్షిణ (కుడి) చేయి → స్రువము (నేయిని ఆహుతి చేయు చెక్కతో చేసిన గరిట) ఎడమచేయి → నేయిపాత్ర (ఆజ్యస్థాలీ) చెవులు → అఘారము. నేయి కనులు - హవిస్సు. నేయిని అభికరించటానికి, ఉపకరించు పాత్ర. స్రుక్కు. కనులు, చూపు → నేయి విభాగము గ్రీవము (మెడ నరము) ఆధారము → పోత (పోయుటకు ఉపయోగించు చిల్లులతో కూడి పాత్ర!) |
తన్మాత్రాణి సదస్యాః . మహాభూతాని ప్రయాజాః . భూతాని గుణా అనుయాజాః . జిహ్వేడా . దంతోష్ఠౌ సూక్తవాకః . తాలుః శంయోర్వాకః . స్మృతిర్దయా క్షాంతిరహింసా పత్నీసంయాజాః . ఓంకారో యూపః . ఆశా రశనా . మనో రథః . కామః పశుః . కేశా దర్భాః . బుద్ధీంద్రియాణి యజ్ఞపాత్రాణి . కర్మేంద్రియాణి హవీంషి . అహింసా ఇష్టయః . త్యాగో దక్షిణా . అవభృతం మరణాత్ . సర్వా హ్యస్మిందేవతాః శరీరేఽధిసమాహితాః . వారాణస్యాం మృతో వాపి ఇదం వా బ్రహ్మ యః పఠేత్ . ఏకేన జన్మనా జంతుర్మోక్షం చ ప్రాప్నుయాదితి మోక్షం చ ప్రాప్నుయాదిత్యుపనిషత్ .. 3.. ఇతి ప్రాణాగ్నిహోత్రోపనిషత్సమాప్తా .. |
|
తన్మాత్రాణి సదస్యాః। మహాభూతాని ప్రయాజాః। భూత గుణా-అనూయాజాః। జిహ్వే ఇడా। దంత-ఓష్ఠౌ-సూక్తవాకః। తాలుః శంయోర్వాకః। స్మృతిః-దయా। క్షాంతిః అహిగ్ంసా। పత్నీ సంయాజాః। ఓంకారో యూపః। ఆశా రశనా। మనో రథః। కామః పశుః। కేశాః దర్భాః। ఇంద్రియాణి యజ్ఞపాత్రాణి। కర్మేంద్రియాణి హవీగ్ంషి। అహిగ్ంసా ఇష్టయః। త్యాగో దక్షిణా। అవభృథం మరణాత్। సర్వాణి అస్మిన్ దేవతా శరీరే అధి సమాహితాః। వారణస్యాం మృతోవాఽపి। ఇదం వా బ్రాహ్మణః పఠేత్, ఏకేన - జన్మనా జంతుః మోక్షం చ ప్రాప్నుయాత్।। |
శబ్ద - స్పర్శ - రూప - రస గంధములనబడే తన్మాత్రలు → సదస్యులు (సభను అలంకరించిన జనులు) - పంచ మహాభూతములు → ప్రయాజులు (ముఖ్య యాజ్ఞీకులు) - భూతగుణములు → అనుయాజులు - జిహ్వ (నాలుక) → హవిస్సు. అన్నము, పురోడాశపాత్రము (ఇడ). దంతములు - ఓష్ఠములు (పెదవులు) → సూక్తవాకము (శ్రీసూక్తము, నారాయణసూక్తము, మొదలైనవి) తాలువు (దవడ) - శఃయోర్వాకము (శం నో అస్తు ద్విపదే, శం ద్విపదే ఇత్యాదులు) దేహయజ్ఞ యజమాని. (దేహి)కి భార్యలు → స్మృతి (తెలివి, జ్ఞాపకము), దయ (సర్వసహజీవుల పట్ల అవ్యాజమైన ప్రేమ) క్షాంతి (ఓర్పు)యే, అహింస. ఓంకారమే…యూపస్థంభము (పశువును కట్టు స్థంభము), ఆశ….పశువును కట్టు రశనపు త్రాడు. మనస్సే పరమాత్మను ఊరేగించు రథము. - కామము (కావాలి, నిర్వర్తించాలి…అను ఆవేశము) → యజ్ఞపశువు, యాగార్థపశువు. దేహముయొక్క వెంట్రుకలు → దర్భలు, ‘‘పంచజ్ఞానేంద్రియములు → యజ్ఞపాత్రలు. పంచకర్మేంద్రియములు (చేతులు, కాళ్ళు, వాక్కు, పాదములు, పాయువు, ఉపస్థ) → హవిస్సులు అహింస → యజ్ఞము యొక్క ‘ఇష్టము’ రూపము. ఇంద్రియ విషయములను త్యజించి, అతీతంగా ఉండటము అనబడు త్యాగము → దక్షిణ మరణమే → అవబృథ స్నానము. సర్వ దేవతలు కూడా ఈ శరీరమునందు సమాహితులై, అధిష్టితులై ఉన్నారు. ఈ శరీరము నశించు ధర్మము కలిగి ఉండి-వారణాస్యము. ‘‘శారీరబ్రాహ్మణము’’ (లేక) ‘‘ప్రాణాగ్ని హోత్రోపనిషత్’’ అనబడే ఈ ఉపనిషత్ పఠించుచుండగా ఈ జన్మయందే అట్టి అధ్యయనముచే మోక్షము సిద్ధించగలదు. |
ఇతి ప్రాణాగ్నిహోత్రోపనిషత్।
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।।
పరబ్రహ్మ । పరమేశ్వర । పురుషోత్తమ। సదానంద। పరంజ్యోతి। పరాత్పర।
పతిత పావన స్వప్రకాశ। వరదాయక సకలలోక వాంఛిత ఫలద అప్రమేయ।
పాహి పాహి మాం పాహి। పాహి పాహి మాం పాహి।
మునులంతా కూడా శరీరక యజ్ఞముచే పొందిన శుద్ధ చిత్తముతో ఏ పరమపదమును సిద్ధించుకొంటున్నారో - అట్టి శ్రీరామచంద్రమూర్తి పాదపద్మములకు నమస్కారము!
సర్వతత్త్వ స్వరూపుడగు ‘ఓం’కార సంజ్ఞార్థ పరమాత్మకు నమస్కరిస్తూ….
⌘
అనేక జన్మలుగా దృశ్య తదాత్మ్యముచే ఏకానేక వేదనలను ప్రోగుచేసుకొనియున్న ఈ జీవునికి ‘వర్తమాన మానవ ఉపాధి’ (Physical Body) ‘‘ఆత్మాహమ్ భావనాసిద్ధి’’ ప్రసాదించటానికై మహత్తరమైన ఉపకరణము అయిఉన్నది. అట్టి ఈ దేహము యొక్క తత్త్వమేమిటి? ఇందులో దేవతా ప్రజ్ఞలు ఏఏ స్థానములు ఆక్రమించి ఉన్నారు? కాలనిర్మితమగు ఈ భౌతిక దేహోపాధిని సద్వినియోగము పరచుకొనేది ఎట్లా?
ఇటువంటి కొన్ని ముఖ్య విశేషాలు ఈ ‘ప్రాణాగ్నిహోత్రోపనిషత్’లో చెప్పుకుంటున్నాము.
‘సర్వ ఉపనిషత్ సార విషయము, సంసార జ్ఞానమునకు ఆవలి గట్టు వంటిది’ అగు విశేషాలతో కూడిన అన్నసూక్త రూపమగు శరీర యజ్ఞమును ఇప్పుడు మనము వ్యాఖ్యానించుకొంటున్నాము.
1వ ఖండము
ఈ జీవునికి ఆయా ఇహలోక సంబంధమైన, పరలోకసంబంధమైన ఉత్తమ స్థానములు, స్థితిగతులు సంపదలు సిద్ధింపజేయగలుగు అనేక యజ్ఞ - యాగ - క్రతువులను 4 వేదములు సిద్ధాంతీకరించి చెప్పుచున్నాయి. విధి విధానములు ప్రబోధించుచున్నాయి. అవన్నీ కూడా యజ్ఞ - యాగములు నిర్వర్తించగోరు యజమాని (లేక) యజ్ఞకర్తచే నిర్వర్తింపజేయుటకై వేదమాతచే మానవాళికి ప్రసాదించబడుచున్నది.
ఇవన్నీ కూడా యజ్ఞ - యాగ నిర్వహణకై సహకారులు. నియమనిష్ఠలు సూచించినవారు, నడిపించువారు కూడా.
సంతానము కొరకై - పుత్రకామేష్ఠి యాగము,
ఇహసంపద, పరమున ఉత్తము లోకములు కొరకై - విశ్వజిత్ యాగము,
దిగ్విజయము, ప్రజాక్షేమము, సంపద వృద్ధి కొరకై - రాజసూయయాగము,
….మొదలైన యజ్ఞ-యాగములు వేదములలో (వాటివాటి 1180 ఉపశాఖలచే) అభివర్ణితమై ఉన్నాయి.
అయితే, అవన్నీ కూడా యాగవేదిక - అగ్నిహోత్రము - యాగశాలలు మొదలైన అనేక వ్యయ ప్రయాసలతో కూడినవై ఉన్నాయి.
అట్టి అనేకానేక ప్రయత్నములతో ప్రయాసలతో పనిలేకుండా ఈ జీవుడు తన శరీరము నుండే జరుగుచున్న శారీరక యజ్ఞరూపమగు అన్న సూక్త విధిని ‘ఎరుగుట, గమనించుట, భావనచేయుట’ అను విధానముగా ‘‘ప్రాణాగ్నిహోత్ర శారీరక యజ్ఞము’’ సులభము. ఎవ్వరైనా ఎక్కడైనా నిర్వర్తించవచ్చు.
అథా అతః ఉపనిషత్ సారగ్ం, సంసార జ్ఞానాతీతమ్ అన్నసూక్తగ్ం శారీర యజ్ఞం వ్యాఖ్యాస్యామో।।
- వినా అపి అగ్నిహోత్రేణ - అగ్నిహోత్రము వేదిక, యజ్ఞశాల, మొదలైన వాటి అవసరం లేకుండానే,
- వినా సాంఖ్యేన - అనేక శాస్త్రముల పరిశీల, విశ్లేషణ, పఠణ శ్రవణ శ్రమలతో కూడికొని ఉంటున్న ‘సాంఖ్యము’ యొక్క అగత్యము లేకుండా కూడా….
సంసార విముక్తః భవతి ఇతి।। ఈ పురుష (జీవ) శరీరములో (తన శరీరములో తానే) నిర్వర్తించు - ఉపనిషత్ సారము అయినట్టి - ‘శారీరక యజ్ఞము’ ఈ జీవునికి ఇప్పుడే, ఇక్కడే సంసారబంధములనుండి శాశ్వత విముక్తి కలిగించగలదు.
అట్టి ‘‘అన్నసూక్తి విధి’’తో కూడిన శారీరక యజ్ఞము గురించి వివరించుకుంటున్నాము.
⌘
ముందుగా…అన్నసూక్త ఉపాసన - అన్నోపాసన :
స్వేన విధినా అన్నం భూమౌ నిక్షిప్య…, వారి వారికి సానుకూలమైన విధిగా అన్నమును పచనము చేసి, అన్న పాత్రను సానుకూల్యమగు ఒకచోట భూమిపై నిక్షిప్యము చేయాలి. అప్పుడు
యా ఓషధయః సోమరాజ్ఞీః బహ్వీః శత విచక్షణాః
బృహస్పతి ప్రసూతాః తానో ముఞ్చంత్వగ్ం హసః।।
…..అని అన్నమును ఉపాసనగా ఉద్దేశ్యించి మంత్రములను, ‘3’ సార్లు పలకాలి.
‘‘అన్నపతేః’’ అను స్తోత్రములతో కూడిన అన్నమును ప్రసాదించిన పరమాత్మను స్తుతించి అన్నపతి మంత్రమును ‘2’ సార్లు గానం చేయాలి. అర్ధమును కూడా చదువుచూ, భావిస్తూ…మంత్రములను గానం చేయాలి.
అన్నపతేః నమః
యా ఓషధయః - ఆహార రూపములుగా పరిణమిస్తున్న ఓషధులు సోమరాజ్ఞులుగా (చంద్రునికి రాణులుగా) ఉన్నాయి. సోముని (చంద్రుని) తమ రాజుగా కలిగియున్నాయి. అట్టి ఓషధ దేవతలు తమయొక్క చంద్రాంశలచే అనేక సంఖ్యలలో రూపుదిద్దుకొనుచూ వందలకొలదిగా ఏర్పడుచూ ఉన్న ఈ భౌతిక శరీరములోని వ్యాధులను నివారిస్తూ ఉన్నాయి. ‘ఆకలి’ అనే వ్యాధిని ఉపశమింపజేసి ఆహార రసరూపంగా శరీరమునకు పుష్టి, శక్తి కలుగజేస్తున్నాయి. అంతేకాకుండా బృహస్పతిచే ప్రేరితమై, దివ్యుడగు బృహస్పతి యొక్క అంశలుగా దేహములలో ప్రవేశించి బుద్ధియొక్క ప్రవృద్ధికి కారణమగుచున్నాయి.
అట్టి ఓషధ దేవతా ప్రసాదములయినట్టి ఓషధుల పరిపక్వరూపము - ‘‘అన్నము’’. అట్టి ‘అన్నము’ నందు ప్రక్షిప్తమై పరిపోషకములు ఉన్నాయి. ఓషధరూప ‘అన్నము’నకు నమస్కరిస్తున్నాము.
ఇది మా దేహములలో ప్రవేశించునప్పుడు మాయొక్క చిత్త దోషములను, పాపవృత్తులను కడిగివేయుచూ, మా బుద్ధిని పవిత్రము, నిర్మలము, సునిశితము, విస్తారము, ప్రజ్ఞాసమన్వితముగా తీర్చిదిద్దునుగాక!
ఓ ప్రియ ఓషధరూప (ఆహారరూప) సోమరాజ్ఞీ!
యా ఫలినీర్యా, అఫలా, అపుష్పా యాశ్చ పుష్పిణీః,
బృహస్పతి ప్రసూతాః, తానో ముంచం త్వగ్ం హసః।। (మంత్రము అర్థములతో సహా ‘3’ సార్లు పఠించాలి)
అవన్నీ ఓషధులు, వనస్పతులుగా భూమిపై ప్రదర్శనమగుచున్నాయి.
బృహస్పతి భగవానుని సంకల్పము నుండి జనించినట్టి ఓషధులు, వనస్పతులు అన్నీ కూడా వాటి వాటి రసశక్తితో సహా మా ఈ భౌతిక దేహములలో ప్రవేశించినప్పుడు మా ‘ఆకలి’ అనే వ్యాధిని ఉపశమింపజేయుచుండగా, బుద్ధిని నిర్మలము చేయును గాక! మా బుద్ధులను పాప ధ్యాసలనుండి విడిపించి, మమ్ములను పవిత్రులుగా చేయునుగాక! మా చిత్తమును సునిశితముగాను, తత్త్వజ్ఞాన సవిమన్వతంగాను తీర్చిదిద్దుటకై ప్రార్థిస్తున్నాము.
వన దేవతా స్తుతి - నిషిద్ధ ఆహార త్యాగము
జీవలాం నహారిషాం మాతే బధ్నామి ఓషధీమ్,
యాత ఆయుః ఉపాహరాదప రక్షాగ్ంసి చ ఆతయాత్।। (3 సార్లు అర్థ పూర్వకంగా పఠించాలి)
భూమిపై ఓషధులను పరిరక్షించుచున్న ఓ వనదేవతలారా! మీకు మనసా, వాచా, కర్మణా - చేతులు జోడించి నమస్కరించుచున్నాము. మాపై దయ ఉంచండి.
ఏఏ ఓషధులు ఆయుష్షును వృద్ధి చేస్తూ దైవీగుణములను ప్రవృద్ధపరుస్తూ ఉన్నాయో ఆపదలను తొలగిస్తూ, మా బుద్ధులను పరమత్మోపాసనకు సిద్ధింపచేస్తున్నాయో, సహజీవులు శ్రేయో-ఆనందముల కొరకై మమ్ములను ప్రేరేపిస్తున్న అట్టి ఓషధులు (ఆహారములు) మమ్ములను చేరుచుండునుగాక!
ఏఏ ఓషధులను జీవలమును (ఆయుష్షును) బలహీనపరచి, ఆయుష్షును హరిస్తూ ఉంటాయో, కామము-క్రోధము, ఆవేశము- ఇతరులను బాధించు, హింసించువృత్తులను - దంభ దర్ప అహంకార పారుష్య అజ్ఞాన గర్వాదులను వృద్ధిపరుస్తూ ఉంటాయో, అట్టి ఓషధులను మేము స్వీకరించము.
ఓ వనదేవతా! ఈ విధంగా ఆయుఃవృద్ధి చేయు ఓషధములను మాత్రమే స్వీకరించుటకు అనుజ్ఞ ఇవ్వండి. ఆయుష్షును హరించు, ఆసురీగుణములను పెంపొందింపజేయు ఓషధులను తిరస్కరిస్తూ, స్వీకరించకుండా ఉండగల ఉత్తమబుద్ధిని దయతో ప్రసాదించండి.
అన్నపతి స్తుతి (2 సార్లు చదువవలసినది):
అన్నమునకు అధిపతియగు ఓ పరమేశ్వరా! అన్నపతే।
అన్నస్య నో దేహ్య సమీపస్య శుష్మిణః ప్రప్రదాతారం తారిష!
అన్నమును, అన్నపరిరక్షకులు అగు వనదేవతలను, అన్న పరిపోషణరూపియగు ఈ భూదేవతను తమయొక్క అంశలుగా కలిగియున్న ఓ అన్నపతీ! ఆత్మదేవా! దేవాది దేవా! దయతో మా బుద్ధులకు తేజస్సు (Enlightenment) ప్రసాదించ ప్రార్థన. మనస్సుకు ఆహ్లాదము కలుగజేయండి! జీవరాసులందరికి వారు ఉన్న చోటనే, వారికి సమీపంగా అన్నము (ఆహారము) లభించునట్లుగా అనుగ్రహించండి! అన్న పరిపోషకులగు మీకు సవినయ - కృతజ్ఞతాభివందనములు సమర్పించుకొనుచున్నాము.
ఊర్జం నో దేహి ద్విపదే, చతుష్పదే!
ద్విపాదులగు సర్వ మానవులకు, చతుష్పాదులగు పశువులు మొదలైన వాటికి, పక్షులకు, తదితర సర్వ జీవులకు ‘అన్నము’ సమృద్ధిగాను, వారివారికి సమీపముగాను, ఓషధీ రసయుక్తముగాను లభించునుగాక - అని మిమ్ములను నమస్కరిస్తూ వేడుకొనుచున్నాము.
ఓ ఈశ్వరా! విశ్వేశ్వరా! సర్వేశ్వరా! మరొక విన్నపం కూడా!
యత్ అన్నమ్ అద్మి బహుధా విరుద్ధగ్ం, రుద్రైః ప్రజార్థం,
యది వా పిశాచైః సర్వంతత్, ఈశానో అభయం కృణోతు।
ఏ ‘అన్నము’ అయితే అనేక దోషములు (ఆవేశము, మత్తు, ఉద్రేకము మొదలైనవి) కలిగించేవో, ఏ అన్నమైతే రుద్రునిచే తదితర జీవులకు ప్రసాదించి ఉండగా, అది మేము స్వీకరిస్తున్నామో, ఏ అన్నమైతే పైశాచక (Crual, Hearting) స్వభావముగల పిశాచములచే స్పృశించబడినదై ఉన్నదో….అట్టి ‘అన్నము’ను మేముస్వీకరించటం జరిగి ఉంటే….వాటివాటి సంబంధితమైన దోషములు మమ్ములను శారీరకంగా, మానసికంగా, బుద్ధిపరంగా ఈశ్వరానుగ్రహంచేత తాకకుండును గాక! మా ఈశ్వరోపాసనకు విరోధము కలుగకుండా మాకు అభయము ప్రసాదించండి. మేము ఈశ్వరేచ్ఛకు ప్రణమిల్లుచున్నాము.
ఈశ్వరార్పితమ్
మేము అన్నమును మితముగా, దైవార్పితంగా, న్యాయార్జితంగా స్వీకరించెదముగాక! సాత్వికమైన లక్షణ సమన్వితంగా ఆహారము మేము అవసరమైనంత పొందెదము గాక!
మొట్టమొదటగా మేము స్వీకరించబోవు అన్నమును ఈశ్వరునికి నివేదనము చేస్తున్నాము. శివమ్ ఈశానమ్ స్వాహా! అన్నముతో కొంత భాగమును తదితర జీవులకు సమర్పించుకొనుచున్నాము. శివస్వరూపుడగు సర్వేశ్వరుడు మేము అతిథులకు, తదితర జీవరాసులకు సమర్పిస్తున్న అన్నమును సర్వాంతర్యామియై స్వీకరించునుగాక!
ఈశ్వర స్తుతి
అంతః చరతి భూతేషు గుహాయాం విశ్వతో ముఖః।
త్వం యజ్ఞః। త్వం బ్రహ్మా। త్వగ్ం రుద్రః।
త్వం వషట్కారః। అపోజ్యోతి రసో అమృతం బ్రహ్మ।
భూః భువః సువః ఓం నమః।।
సర్వతత్త్వ స్వరూపుడవగు ఓ పరమాత్మా! పరంధామా!
మీరు జ్యోతికే జ్యోతి స్వరూపులు!
జగత్తునందు రసస్వరూపులై బాహ్య అభ్యంతరములకు స్థితిని కలుగజేస్తున్నారు. భూ(Matter Related), భువర్ (Subtla form related), సువర్ (Devine Formless Intelectual), త్రిలోకములలో అమృతస్వరూపులై - సాకారమగు మట్టిబొమ్మలందు నిరాకారమగు మట్టి వలె - పరబ్రహ్మతత్త్వమై ప్రదర్శమగుచున్నారు.
అట్టి వేద - వేదాంత - పరబ్రహ్మానంద స్వరూపులగు పరమాత్మకు, అన్న భగవానునికి నమో నమః! నమస్కరించుచున్నాము!
జల దేవతా భ్యోం నమః
ఆపః పునంతు పృథివీ! ఈ పృథివి జలముతో సమృద్ధమై, సర్వజీవులకు సానుకూల్యమై, జలముచే పవిత్రమై ఉండును గాక!
పృథివీ పూతా పునాతు మామ్! రస సమృద్ధి స్వరూపియగు పృథివీమాత కరుణారస రూపిణియై మా దేహ - మనో - హృదయములను పవిత్రము చేయుచుండునుగాక!
పునంతు బ్రహ్మణస్పతిః।
వేదహృదయము, ఉపనిషత్ - అత్యాంతికార్థము తెలిసి, వేదగానము చేయు వేద వేదాంగ వేత్తలయొక్క బ్రహ్మణస్పతములు మా చెవులలో మార్మ్రోగి మా హృదయములను పవిత్రము చేయునుగాక!
యత్ ఉచ్ఛిష్టమ్ అభోజ్యం, యద్వా దుశ్చరితం మమ, సర్వం పునంతుమాం ఆపో।
వేదవాక్కుల సౌరభముచే మాయొక్క ఉచ్ఛిష్ఠము (త్యజించవలసినవి) భుజించటము, (భుజింపకూడనివి భుజించటము) అను దోషములు తొలగించబడునుగాక! ఈ జలము మాయొక్క దుశ్చరితములన్నీ కడిగి వేయుచూ సచ్ఛరితముల వైపు నడిపించుచూ మమ్ములను పునీతము (పవిత్రము) చేయునుగాక!
ఆపో అసతాన్ చ ప్రతిగ్రహగ్ం స్వాహా!
ఈ జలము మా యొక్క ‘అసత్’ భావములన్నీ కడిగివేయుచు, మా బుద్ధియందు సత్‌తత్త్వమును సుప్రతిష్ఠితము చేయునుగాక! ప్రతి గ్రహణములన్నీ జలమునందు తర్పణము చేయుచున్నాము. (అసతోమా సద్గమయ।)
అమృత జలముతో అమృతాత్మకు తర్పణము
ఓ ఉదకములారా!
అమృతమ్ అస్తు! మీరు అమృత స్వరూపులై ఉన్నారు.
అమృతం ఉపస్తరణమసి! అమృతమును ఆచ్ఛాదనముగా కలిగి ఉన్నారు.
అమృతం ప్రాణే జుహోమి। ఉదకము ద్వారా ఉదకమును ఆచ్ఛాదించియున్న అమృతరసమును ప్రాణములందు హోమము చేయుచున్నాము.
మా భౌతికదేహమునందు దాహము, మనస్సునందుగల అశాంతి శమించుటకై అమృతముచే ఆచ్ఛాదించబడిన జలమును స్వీకరించుచున్నాము. ప్రాణదేవతకు సమర్పిస్తున్నాము. జలమును ప్రాణ ప్రాణమునకు, అపాన ప్రాణమునకు, వ్యాన ప్రాణమునకు, ఉదాన ప్రాణమునకు, నమాన ప్రాణమునకు సమర్పించుచున్నాము. పంచప్రాణాయ స్వాహా।
ఈ జలముతో ఓంకార సంజ్ఞార్థరూపమగు పరబ్రహ్మ తత్త్వమునకు తర్పణము చేయుచున్నాము. నా ఆత్మ - బ్రహ్మమునందు, బ్రహ్మమునకు అభిన్నమై, అమృత స్వరూపమై అనుభవమగుగాక. అట్టి బ్రహ్మమునకు మమాత్మ చైతన్య హస్తములతో అమృతజలమును తర్పణము చేయుచున్నాను.
⌘ కనిష్ఠిక అంగుల్య అంగుష్ఠేన ప్రాణే జుహోతి। - చిటికిన వ్రేలుతో అమృత రూపమగు జలమును ప్రాణ-ప్రాణమునకు తర్పణము సమర్పిస్తున్నాను.
⌘ అనామికాయా అపానే। - ఉంగరపు వ్రేలుతో అపానప్రాణమునకు జల-తర్పణము.
⌘ మధ్యమయా వ్యానే। - మధ్యవ్రేలుతో వ్యానప్రాణమునకు జల తర్పణము.
⌘ సర్వాభిః ఉదానే। - అన్ని వ్రేల్లు (5 వ్రేళ్ళు) కలిపి ఉదాన ప్రాణమునకు జల-తర్పణము.
⌘ ప్రదేశిన్యా సమానే। - అరచేతి నుండి సమాన ప్రాణమునకు జల-తర్పణము.
⌘ తూష్ణీం ఏకామ్। - అన్ని వ్రేళ్ళు, అరచేయి కలిపి మరల ఒకసారి బ్రహ్మతత్త్వమునకు జలామృత తర్పణము.
ఏకా ఋచా జుహోతి। | ఋచా (సూర్యాగ్ని) యందు | ఒకసారి |
ద్వే ఆహవనీయే। | ఆవహననీయాగ్నికి | రెండుసార్లు |
ఏకాం దక్షిణాగ్నౌ। | దక్షిణాగ్నికి | ఒకసారి |
ఏకాం గార్హపత్యే। | గార్హపత్యాగ్నికి | ఒకసారి |
ఏకాం ప్రాయశ్చిత్తయే। | సర్వప్రాయాశ్చిత్తముగా | అరచేయి ముని వ్రేళ్ళ మీదుగా మరొక్కసారి నేయిని అగ్నికి సమర్పిస్తూ, |
ప్రక్కగా జలమును తర్పణము చేయాలి. (అగ్నికి కించిత్ కుడిగా పళ్లెములో జలమును అన్నివ్రేళ్ళతో వదలాలి).
అటు తరువాత….
అథా అపి ధానమ్ అసి। నీవు పరంధామ స్థానమును ప్రకాశింపజేయగలుగుదువు!.
అమృతత్త్వాయా ఉపస్పృశ్య పునః ఆదాయ। జలమును స్పృశించుచూ అమృతత్త్వమును భావన చేస్తున్నాము.
పునః స్పృశేత్! మరల మరల స్పృశించుచున్నాము! (కుడి చేతి మునివ్రేళ్ళతో జలమును స్పృశించాలి. వదలాలి. మరల స్పృశించాలి).
ఇప్పుడిక….
సన్వే ప్రాణావ ఆపో గృహీత్వా, హృదయమ్ అనుపలభ్య, జపేత్।
జలమును ‘ప్రాణశక్తి స్వరూపం’గా భావిస్తూ, ఎడమ చేతియందు తీసుకొని, హృదయమునకు దగ్గరగా ఎడమచేతి గుప్పిటను తాకిస్తూ….ఈ విధంగా జపము చేయాలి.
ప్రాణో అగ్నిః పరమాత్మా పంచవాయుభిః - ఆవృతః।
అభయగ్ం సర్వభూతేభ్యో। న మే భీతిః కదాచన। ఇతి।।
పరమాత్మ మొట్టమొదటి ప్రాణాగ్ని తేజోస్వరూపుడైనారు. అటుతరువాత, పంచవాయు స్వరూపులై (ప్రాణ-అపాన-వ్యాన-ఉదాన-సమాన ప్రాణముల స్వరూపుడై) అన్ని దేహములలో ఆవృతులుగా (ఆక్రమించుకొని) ఉన్నారు.
అభయగ్ం సర్వభూతేషు। పరమాత్మయే ప్రాణస్వరూపుడై సర్వజీవులకు సర్వదా అభయప్రదాత అయి ఉన్నారు. అందుచేత నేను దేనికీ భయము పొందవలసిన అగత్యమేమున్నది? నాతోబాటుగా నాయందు సర్వదా (దేహమున్నప్పుడు, లేనప్పుడు కూడా) ప్రాణేశ్వరుడై ప్రకాశిస్తూనే ఉంటారు కదా! పరమాత్మ ప్రాణేశ్వరుడై నన్ను వదలరు. నేను ఆయనను వదలను. ఈలోగా జడమైన దేహాలు వస్తూ పోతూ ఉండవచ్చు గాక! నాకేమి భయం?
ద్వితీయ ఖండము
వైశ్వానరాగ్నికి ఆహుతులు
విశ్వో అసి వైశ్వానరో! విశ్వరూపం త్వయా ధార్యతే!
ఓ వైశ్వనరా! విశ్వేశ్వరా। ‘‘ఈ విశ్వమంతా వైశ్వానరాగ్నిగా ఉన్నది మీరే’’ - అని మిమ్ములను దర్శిస్తూ, ఉపాసించుచున్నాము.
ఇంకా కూడా చెప్పాలంటే…ఈ విశ్వము వైశ్వానరునిచేతనే, (లేక) పరమాత్మచేతనే ‘ధారణ’ చేయబడుతోంది.
ఈ తెలియబడుచున్న విశ్వమంతా మీకు సమర్పించబడు ఆహుతియే!
బ్రహ్మ మొదలు స్తంభము వరకు (ఆ బ్రహ్మ స్తంభ పర్యంతము) ప్రాణదేవుని అమృతరూపమే!
అట్టి వైశ్వానరాగ్ని హోత్రునియందు
- ఏదీ జనించటమూ లేదు!
- ఏదీ నశించటమూ లేదు.
తత్పురుషాయ - తర్పయామి। అభిషించామి।
పురుషుడు : జన్మ - కర్మలకు మునుముందే సత్-చిత్-ఆనంద స్వరూపుడై, నిర్విషయుడై ఉండి ఈ జన్మ - కర్మలు మొదలైన సర్వానుభవములతో సహా సర్వము తన పురుషకారముగా కలిగియున్నవారు!
(నా యొక్క, ప్రతి ఒక్కని యొక్క) ‘‘కేవలీ రూపము’’!
నిష్క్రియుడై ఉండి కూడా సర్వకారణ కారణుడు!
ఈ దృశ్యములు, ఈ లోకములు, ఈ కనబడే సమస్తము ఎవ్వరియొక్క పురుషకారమో ఆతడే ‘‘పురుషుడు’’ - అని వ్యవహరించబడుచున్నారు.
పురుషుడు - పురుషకారము - పరమపురుషుడు (త్రిమూర్తి స్వరూపము)
(1). ఇహ పురుషుడు - జీవాత్మ
ఈ జగత్తులో దేహముతో కూడి భౌతికంగా కనిపిస్తూ, జగన్నాటకంలో ఆయా సంగతి-సందర్భము-సంబంధములకు పరిమితమై కనిపిస్తున్నదంతా భౌతికదేహ పరిమితము అగు స్వకీయ పురుషకారము. ఒక నాటకములోని నేను నటించు పాత్ర వంటిది.
(2). ఈశ్వర పురుషుడు : (జన్మ - జన్మాంతర బాటసారి, పురుషకారుడు, కేవల పురుషకారము)
దేహ - దేహాంతరములు తనవిగా భావిస్తూ, సమిష్ఠిగా వ్యవహరించు పురుషకారము. ఏకానేక దేహ సందర్భములలో పాల్గొనుచున్న, దేహములోకి ప్రవేశ-నిష్క్రణములను నిర్వర్తిస్తున్న స్వకీయ పురుషకారము. అనేక జన్మలు తనవైనట్టి పురుషుడు. అనేక నాటకములలో నటించుచున్న నటనయొక్క నటనా విశేషము (The art of acting) వంటిది. దేహ దేహాంతరములలోని నేనైన నేను. (నటునిగా నటనా కౌశల్యము వంటిది).
(3). పరమ పురుషుడు - కేవల సాక్షి
అనేక జన్మ - కర్మలలో కూడా ప్రకాశించుచూ - నిష్క్రమిస్తూ ఉన్న ఈశ్వరపురుషకారమునకు కూడా ఆవల (పరముగా) ఉన్న కేవల సాక్షీ - చైతన్యము. జన్మ పురుషకారమునకు, జన్మ జన్మాంతర పురుషకారమునకు ఆవల (పరమై) యున్న - నేనైన నేను.
ఈ విధంగా ప్రతి జీవుడుకి సంబంధించి
(1) ఇహ పురుషకారము (వర్తమాన దేహత్వమునకు పరిమితమైన ‘నేను’)
(2) ఈశ్వర పురుషకారము (జన్మ జన్మాంతరములుగా ప్రయాణిస్తూ జన్మ జన్మాంతరములను విస్తరింపజేస్తున్న నేనైన నేను)
(3) పరమ పురుషకారము (కేవల సాక్షి, నిష్క్రియుడు, కానీ, కారణకారణుడు! మౌన స్వరూపుడు - అగు నేనైన నేను….)
అను త్రివిధములైన ‘నేను’లు ప్రవర్తమానమై ఉంటున్నాయి.
త్రిమూర్తి స్వరూపుడగు తత్ పురుషోపాసన - అమృత జలాభిషేక విధి
త్రిమూర్తి (One who is executing his manifestations im ‘3’ Frames) స్వరూపుడగు ఆ స్వస్వరూప పరమ పురుషుని ఉపాసించు చున్నాము.
ధ్యాయేత - అగ్నిహోత్రమ్ జుహోతి. అట్టి ‘‘సర్వము తానైన’’, ‘‘నేను కూడా తానైన’’ పరాత్‌పరపురుషుని స్తుతిస్తున్నాను. సర్వమునకు అంతర్లీనుడై యున్న ఆ చైతన్య పురుషుని ధ్యానిస్తున్నాను. ఆయన చైతన్యమును ‘అగ్నిహోత్రుడు’గా ధ్యానిస్తున్నాను. తత్ స్వరూపుడగు అగ్నిహోత్రుని కొరకై హోమరూపంగా అగ్నికి హోమ ద్రవ్యములను (నెయ్యి మొదలైనవాటిని)….ఇదిగో, సమర్పిస్తున్నాను.
అట్టి అగ్నిహోత్రుడు ఎట్టివారు? సర్వేషాం ఏవ సూనుః భవతి! ఆ తత్ పురుషుడే సమస్త జీవులలో ప్రాణాగ్ని హోత్ర స్వరూపుడై, ప్రతి ఒక్క జీవునికి ప్రియాతి ప్రియుడై ఉన్నారు. సర్వజీవులకు ఆనందమును పంచిపెట్టుచున్నారు. ఆయన మన శరీరమునందు అణువణువూ వేంచేసి వెలుగొందుచూ ఉన్నారు. అట్టి ఆత్మస్వరూపుడగు ప్రాణాగ్నిహోత్రుడు విశ్వమంతా నిండియున్నారు. వైశ్వానరుడై విశ్వరూప ధారణ చేయుచున్నట్టివారు. పరబ్రహ్మమే ఆయన! ఈ విధంగా అగ్నిహోత్ర బుద్ధిని భావనచే ప్రేరేపించుకోవాలి. |
‘‘యజ్ఞ పరివృతా ఆహుతీః హోమయతి, స్వే శరీరయజ్ఞమ్ పరివర్తయామి!’’ ‘‘నా ముఖమునందు, సర్వముఖములందు (సర్వతోముఖః) ప్రత్యక్ష స్వరూపుడై, ప్రాణాగ్నిహోత్రుడు ఆత్మానంద చైతన్యముగా వెలుగొందుచున్నారు’’…. అని భావించుచున్నాము. ఇంద్రియ కార్యక్రమములన్నీ, ఏతత్ విషయములతో సహా ‘ప్రాణాగ్నిహోత్రావధానము’ చేస్తూ ఆహుతులుగా ఆ తత్ స్వరూపునికి సమర్పించుచున్నాము. ఇట్టి ‘శారీరయజ్ఞము’ ను అనుక్షణికం చేసుకుంటున్నాము. ఇంద్రియానుభవముల సమర్పణగా నిర్వర్తించుచున్నాము.
చతుర్విధ శారీరాంతర్గత అగ్న్యౌపాసనలు
‘శారీరకయజ్ఞము’ అను విషయము గురించి వివరించుకుంటున్న మనము ఇప్పుడు ఈ భౌతిక శరీరములో పరివేష్ఠితమై (వేంచేసి, స్థితిపొందియున్న) 4 అగ్నుల గురించి చతుర్విధోపాసనకొరకై - చెప్పుకుంటున్నాము.
(1) సూర్యాగ్ని : సూర్య మండలాకృతిః। సహస్ర రశ్మి పరివృత। సూర్యమండల - ఆకృతి కలిగియున్నట్టిది. వేలాది తేజోకిరణములను జ్ఞానకిరణములను దేహమంతా, దృశ్యమంతా ప్రసరింపజేస్తున్నట్టి అగ్ని. ఏకర్షిభూత్వా మూర్ధ్ని తిష్ఠతి! ఒకే సూర్యుడు తన తేజోకిరణములను అసంఖ్యాక ప్రదేశములలోని వస్తు సముదాయముపై ప్రసరింపజేస్తున్న విధంగా…ఈ సూర్యాగ్ని ఒకేచోట ఉండి శరీరమంతా తన కిరణజాలమును (ఉత్సాహ-సావాస-ఎరుక అనుభూతి రూప కిరణములను) ప్రసరింపజేస్తోంది.(The Factor of Enlightening).
శరీరములోని సూర్యాగ్నిస్థానము = మూర్ధ్ని స్థానము (ముఖ్యముగా) ముఖముయొక్క ఊర్ధ్వభాగము (Fore face).
(2) దర్శనాగ్ని : చతురాకృతిః। ఆహవనీయోభూత్వా ముఖే తిష్ఠతి।। చతురస్రాకృతి కలిగియున్నట్టిది. దర్శించు సవరూపము. (The Factor of perceiving). దీనిని యజ్ఞవాజ్మయంలో ‘‘ఆహవనీయాగ్ని’’ అని పిలుస్తున్నారు.
శరీరములో దర్శనాగ్ని (లేక) ఆహవనీయాగ్ని యొక్క స్థానము - ముఖము (Entire Face).
దర్శనాగ్నిర్నామ చతురాకృతిః। ఆహవనీయోభూత్వాముఖే తిష్ఠతి।।
(3) శారీరోఽగ్ని : జఠా ప్రణుదా హవిః అనస్కందతి। అర్థచంద్రాకృతిః। దక్షిణాగ్ని భూత్వా హృదయే తిష్ఠతి।। దీనినే ‘జఠరాగ్ని’ అని అంటారు. ‘దక్షిణాగ్ని’ అని కూడా చెప్పబడుతోంది. అర్థచంద్రాకృతి ఆకారము కలిగినదై ‘హృదయస్థానము’ నందు సంస్థితమైయున్నది. సర్వపదార్థములను హవిస్సులుగా స్వీకరించుచున్నట్టిది. మనోబుద్ధి సంబంధమైన సర్వ విశేషములను ‘హుతము’ చేయుచున్నట్టి అగ్ని.
(4) కోష్ఠాగ్ని : నాభి స్థానములో ప్రదర్శితమగుచున్నట్టి ‘అగ్ని’.
- అశితములను → మ్రింగబడుచున్నవాటిని,
- పీతములను → త్రాగబడుచున్నవాటిని,
- లీఢములను → నాలుకతో పీల్చబడుచున్న వాటిని,
- ఖాదితములను → పళ్ళతో నవలబడుచున్న వాటిని,
వీటినన్నిటినీ ‘సమము’గా చేసి జీర్ణమగునట్లు చేయుచున్న అగ్ని. ‘గార్హాపత్యాగ్ని’ అని కూడా చెప్పబడుచున్నది.
కోష్ఠాగ్నిర్నామ అశిత - పీత - లీఢ - ఖాదితగ్ం సమ్యక్ విషయిత్వా గార్హపత్యేభూత్వా, నాభ్యాం తిష్ఠతి।।
⌘
ప్రాయశ్చిత్తాగ్ని - అంతర్హితాగ్ని : మంత్ర (మనన) రూపముగా - సూర్యాగ్ని, దర్శనాగ్ని, శారీరోఽగ్ని, కోష్ఠాగ్నులకు అంతర్లీనమై, అంతర్గతంగా, క్రిందుగా (As a base) ఏర్పడియున్న అగ్నిని ‘అంతర్హితాగ్ని’ అని, ప్రాయశ్చిత్తాగ్ని అని పిలుస్తున్నారు.
ప్రాయః = మునుముందుగా ఉన్నట్టి
చిత్తాగ్ని = ప్రియస్వరూపంగా వెలుగొందుచున్న తేజోరూపము.
ఈ ప్రాయశ్చిత్తాగ్ని:
ఈ విధంగా ఈ శారీరయజ్ఞశాలలో చతుర్విధ అగ్నులు, వాటికి ఆధారమైయున్న (ఆధారరూప) ప్రాయశ్చిత్తాగ్ని సంప్రదర్శనమానమై ఉన్నాయి. ఆయా క్రియా విశేషములన్నిటికీ శక్తిని ప్రసాదిస్తూ, శక్తి ప్రదర్శరూపమై విరాజిల్లుచున్నాయి.
అగ్నిహోత్ర ప్రాణాగ్ని ప్రదర్శనమే ఈ విశ్వము యొక్క అనునిత్యరూపము. ఇట్టి అగ్నుల బుద్ధిపూర్వకమైన ఉపాసనయే ‘‘పంచాగ్నిహోత్రోపాసన’’గా యోగ-యజ్ఞ వాఙ్మయ ప్రసిద్ధము.
3వ ఖండము & 4వ ఖండము
శారీర యజ్ఞోపాసన
ప్రియ ఆత్మస్వరూపులారా!
ఈ భౌతిక శరీరమే ఒక యజ్ఞశాల.
ఈ శారీరక యజ్ఞశాలలోని యూప (జంతువును కట్టి ఉంచు నిలువు స్తంభము) యొక్క సంజ్ఞ గురించి, రచనా శోభితమైయున్న ఈ ‘శరీరము’లో జరుగు ‘శారీరక యజ్ఞము’లోని అంతర్లీన యజ్ఞసంజ్ఞా విశేషాలు (సమన్వయములు) గురించి ఇప్పుడు చెప్పుకుందాము.
ముముక్షువగు యోగి ఈ ‘శారీరక యజ్ఞశాల - యజ్ఞములను ఏవిధంగా ఉపాసించి, ‘ఆత్మమేవాహమ్’, స్థానమును సుస్థీరించుకోవాలో…అది వివరించుకుంటున్నాము.
శారీరక యజ్ఞ భావనా - యజ్ఞ వివరణములు
(దర్శనా విధానములు - ఉపాసనా విధులు)
3వ ఖండము ఈ శారీరక యజ్ఞమునకు = |
4వ ఖండము అస్య శారీర యజ్ఞస్య, యూప రసనా శోభితస్య…. |
---|---|
కో యజమానః - యజమాని ఎవ్వరు? కా పత్నీ? పత్ని ఎవ్వరు? కే ఋత్విజః? యజ్ఞమును సమవేక్షించు (దర్శకుడు) ఎవ్వరు? |
ఆత్మా యజమానో। - జీవాత్మయే యజమాని. (వ్యష్ఠిగతమైన ‘నేను’)। ‘‘బుద్ధి’’। వేదములే ఋత్విజులు (The conductors) |
కే సదస్యాః? ఆహ్వానుతులగు శారీర యజ్ఞమును వీక్షించు సభాసదు లెవ్వరు? |
సర్వ సహజీవులు. కేవల సాక్షీ స్వరూపుడగు స్వస్వరూపాత్మ। |
కాని యజ్ఞ పాత్రాణి? యజ్ఞ పాత్రలు ఏవేవి? |
పంచేంద్రియములు। |
కాని హవీగ్ంషి? అగ్నిలో వ్రేల్చుటకు సిద్ధము చేయబడు అన్నము, నెయ్యి మొదలుగా గల ‘హవిస్సు’ ఏది? |
శబ్ద స్పర్శ రూప రస గంధములు। |
వేదిక ఏది? - కా వేదిః? |
ఈ శరీరమంతా వేదికయే। |
అంతర్వేదిక ఏది? - కా అంతర్వేదిః? |
నాశిక (ముక్కు)। |
ద్రోణ కలశము ఏది? - కో ద్రోణ కలశః? |
మూర్ధ్నము। |
రథము ఏది? - కో రథః? |
మనస్సు। (మనోరథము) |
పశువు ఏది? కః పశుః? |
కామము। |
అధ్వర్యుడు - ఈ శరీర యజ్ఞములో యజుర్వేద మంత్రవిధులను నడుపువాడు - ఎవ్వరు? - కో అధ్వర్యుః? |
అహంకారము। |
ఋగ్వేద మంత్రములను ఎరిగి ఋక్కుల గానంతో హోమము చేయించుహోత ఎవ్వరు? కోహోతా? |
చిత్తము। |
ఇంకా కూడా - శారీర యజ్ఞ భావనా అభ్యాసమునందు
3వ ఖండము ఈ శారీరక యజ్ఞమునకు = |
4వ ఖండము అస్య శారీర యజ్ఞస్య, యూప రసనా శోభితస్య…. |
---|---|
బ్రాహ్మణాచ్ఛగ్ంసీ కో? (బ్రాహ్మణములు ఉపాసింపజేయువారు) |
- ప్రాణవాయువు (లోనికి పీల్చు గాలి) |
- ప్రతి ప్రస్థాత (ఛంద ప్రస్తారము చేయువాడు) కః? |
- అపాన వాయువు |
- ప్రస్తోత-వేద శాస్త్ర నియమములను పాటింపజేయువాడు |
- వ్యానవాయువు (యజ్ఞపరికరములను అమరిక చేయువాడు) |
- మైత్రావరుణుడు ఎవ్వరు? దేవతలతో ప్రేమపూర్వక వచనములు పలికించువాడు |
- సమాన ప్రాణవాయువు |
క ఉద్గాతా? దేవతాహ్వానముల యాజ్ఞీకుడు ఆహ్వాన వచన, స్తోత్రములు చెప్పువాడు |
- ఉదాన వాయువు |
గ్రీవ-ఆధారము ఏది? (జలమును ధారగపోయు ఆధారపాత్ర) |
- మెడ, మెడనరము |
పోతా ఎవ్వరు? |
- ప్రజ్ఞ |
దర్భలు ఏవి? |
దర్భలు ఏవి? |
నెయ్యిని ఆహుతి ఇచ్చునప్పుడు ఉపయోగించు కొయ్య గరిట అగు ‘స్రువము’ ఏది? |
- కుడిచేయి |
నెయ్యిని ఆహుతి ఇచ్చునప్పుడు ఉపయోగించు కొయ్య గరిట అగు ‘స్రువము’ ఏది? |
- కుడిచేయి |
యజ్ఞపాత్రలు |
- ఇంద్రియములు |
ఆజ్య స్థాలీ (హోమపాత్ర) ఏది? |
- ఎడమ చేయి |
ఏది ఆజ్య భాగము? కా ఆజ్యభాగే। |
- కనులు, చూచువాడు |
ప్రయాజ భాగము ఏది? |
- చూపు |
అనూయాజ భాగము ఏది? |
- త్రిగుణములు |
ఇడా ఏది? |
- జిహ్వ |
- సూక్త వాకము ఏది? (శ్రీసూక్త, పురుష సూక్త విభాగములు) |
- ఓష్ఠము (పెదవులు), దంతములు |
- శంయోర్వాకము |
- తాలువు (దవడ) |
పత్నీ సంయాజకులు ఎవరు? (ధర్మపత్నులు) |
- స్మృతి, దయ, క్షాంతి, అహింస |
యూపము ఏది? |
- ఓం కారము |
రశనము ఏది? (నడుముకు కట్టు త్రాడు) |
- నిర్ణయము |
దక్షిణ ఏది? |
- ఇంద్రియ విషయములను త్యజించి, అతీతుడై ఉండటము |
అవబృథము ఏది? |
- మరణము |
సర్వాణి అస్మిం దేవతా శరీరే అధి సమాహితః।। వారణాస్యాం మృతోవాఽపి |
- ఈ శరీరము చేరు పవిత్రస్థలమే ‘వారణాసి’. దేవతలంతా ‘వారణాసి’ అను ఈ సమగ్ర శరీరములో వేంచేసియే ఉన్నారు. |
ఈవిధంగా సమస్తము ఈ శరీరముతోనే సమాహితమై ఉన్నది. ఈ శరీరమును సాధన వస్తువుగాను, మహత్తరమగు వేదశాలగాను ఉపాశించబడు గాక!
‘శారీర బ్రాహ్మణము’ (లేక) ‘ప్రాణాగ్ని హోత్రోపనిషత్’ పఠించుచుండగా, దేహ యజ్ఞ అనువర్తనచే ఈ జన్మయందే మోక్షము సిద్ధించగలదు.
🙏 ఇతి “ప్రాణ అగ్నిహోత్ర” ఉపనిషత్ 🙏
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।।