[[@YHRK]] [[@Spiritual]]
Tējō Bindu Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 2
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com
యత్ర చిన్మాత్రకలనా యాత్యపహ్నవమంజసా . తచ్చిన్మాత్రమఖండైకరసం బ్రహ్మ భవామ్యహం .. |
|
శ్లో।। యత్ర చిన్మాత్ర కలనా యాతి అపవహ్నావ మంజసా, తత్ చిన్మాత్రమ్ అఖండ-ఏక రసమ్, బ్రహ్మభవామి అహమ్।। |
ఏ చిన్మాత్ర స్థానమునందు కల్పితమైనదంతా తొలగి పోవుచున్నదగుచున్నదో, అట్టి అఖండ ఏక చిన్మాత్ర బ్రహ్మమే నేనైయున్నాను - (అను నిశ్చిత బోధ కొరకై తేజోబిందుపనిషత్ అధ్యయనము చేయుచున్నాను). |
1వ అధ్యాయము : తేజోబిందు పరంధ్యానము
(i) తేజో బిందు ధ్యానము శ్లో।। 1–14 (ii) యోగాంగములు శ్లో।। 15–39
(iii) యోగ విఘ్నములు శ్లో।। 40–41 (iv) బ్రాహ్మీవృత్తి శ్లో।। 42–51
ఓం తేజోబిందుః పరం ధ్యానం విశ్వాత్మహృదిసంస్థితం . ఆణవం శాంభవం శాంతం స్థూలం సూక్ష్మం పరం చ యత్ .. 1.. |
|
ఓం 01. ‘తేజోబిందు’ పరం ధ్యానమ్ విశ్వాత్మ హృది సగ్ంస్థితమ్ అణుం శాంభవగ్ం శాంతమ్ స్థూలం సూక్ష్మం పరం చ యత్। |
ఓంకార రూప పరమాత్మకు నమస్కరిస్తూ…, ‘ఈ సర్వము స్వస్వరూపాత్మ బిందువు యొక్క తేజోరూపమే !’ అను ధ్యానమే → తేజోబిందు ధ్యానము. ఈ భౌతిక రూప జగత్తుకంతటికీ ‘ఆత్మ’ స్వస్వరూపాత్మయే. అదియే విశ్వాత్మ అయి, ప్రతి ఒక్కరి హృదయమున ప్రకాశమానమై (సంస్థితమై) యున్నది. ఆత్మతేజో భావనయే తేజోబిందువు యొక్క ధ్యానము. ‘ఇహము’ను దాటివేసినట్టి ‘పరంధ్యానము’. అట్టి పరధ్యాన వస్తువు అయినట్టి తేజోబిందువు సూక్ష్మాతి సూక్ష్మము కాబట్టి అణురూపం. శివతత్త్వ సంబంధమైనది కాబట్టి శాంభవము. పరమ శాంతమైనది. ఇక్కడి స్థూల సూక్ష్మములకు ఆవలి (పరమైనట్టి) తత్త్వము. అట్టి ‘శాంభవీ’ విద్యను ఇక ఇప్పుడు చెప్పుకుంటున్నాము. |
దుఃఖాఢ్యం చ దురారాధ్యం దుష్ప్రేక్ష్యం ముక్తమవ్యయం . దుర్లభం తత్స్వయం ధ్యానం మునీనాం చ మనీషిణాం .. 2.. |
|
02. దుఃఖాఢ్యం చ దురారాధ్యం దుష్ప్రేక్ష్యమ్ ముక్తమ్ అవ్యయమ్ దుర్లభం తత్ స్వయం ధ్యానమ్ మునీనాం చ మనీషిణామ్।। |
అట్టి తేజో బిందు ధ్యానముచే దుఃఖములన్నీ తొలగిపోగలవు. అది ప్రయత్నముచే మాత్రమే లభించునట్టిది. దుర్లభము. తేలికగా దర్శించలేనిది. అద్దాని స్వరూపము మాత్రము నిత్యముక్తము, అవ్యయమైనదిగా - ఉత్తమ బుద్ధిగల మునీశ్వరులు స్వయముగా ధ్యానము నందు దర్శించి - ప్రవచించుచున్నారు. ప్రయత్నశీలురకు సుసాధ్యము. |
యతాహారో జితక్రోధో జితసంగో జితేంద్రియః . నిర్ద్వంద్వో నిరహంకారో నిరాశీరపరిగ్రహః .. 3.. అగమ్యాగమకర్తా యో గమ్యాఽగమయమానసః . |
|
03. యతాహారో, జిత క్రోధో, జిత సంగో, జితేంద్రియః, నిర్ద్వంద్వో, నిరహంకారో, నిరాశీః అపరిగ్రహాః, 04. అగమ్యాగమ కర్తారో గమ్య - ఆగమన మానసాః |
నియమితమైన ఆహారము (ఇంద్రియ వ్యాపారములు) స్వీకరించువారు , క్రోధమును జయించినవారు (ఎవ్వరి పట్లా కూడా ద్వేషము, కోపము కలిగి ఉండని వారు), వస్తు - విషయ సంబంధ - సంగతి వ్యవహారములతో సంగమును (Attachment) జయించువారు, ఇంద్రియ నిగ్రహము కలవారు, ద్వంద్వ దృష్టులను అధిగమించి ఏకత్వమును దర్శించు అభ్యాసము నిర్వర్తించువారు, లౌకికమైన దేనినీ హృదయస్థానములోనికి పరిగ్రహించనివారు, (జీవులలో అనేకులకు) ఇంద్రియములకు అగమ్యమగు స్థానమును (లోకదృష్టిని వదలి పరమార్థ దృష్టిని) ఆశ్రయించువారు అద్దానిని పొందుచున్నారు. |
ముఖే త్రీణి చ విందంతి త్రిధామా హంస ఉచ్యతే .. 4.. పరం గుహ్యతమం విద్ధి హ్యస్తతంద్రో నిరాశ్రయః . సోమరూపకలా సూక్ష్మా విష్ణోస్తత్పరమం పదం .. 5.. |
|
05. ముఖే త్రీణిచ విందంతి త్రిధామా ‘హగ్ంస’ ఉచ్యతే। పరం గుహ్యతమం విద్ధి హి యస్తతంద్రీ నిరాశ్రయః సోమరూప కలా సూక్ష్మా ‘విష్ణోః’ తత్ పరమం పదమ్। |
ఇంద్రియ విషయములపై మనస్సును ప్రసరింపజేయనట్టివారు (నిరోధించువారు) → జాగ్రత్ - స్వప్న - సుషుప్తులను తమ సంచారస్థలములుగా దర్శించి ఆనందిస్తున్నారు. త్రిథాములగు అట్టివారు ‘సోఽహమ్’ - హగ్ంస’ అని స్వానుభూతులగుచున్నారు. హంస (సోఽహమ్) అర్థమగు స్వస్వరూప సహజ స్వస్థానము బాహ్యమైన రూపధారణవంటిది కాదు. పరమ రహస్యమైనది. ఎట్టి ఆశ్రయము / ఆధారము లేనట్టిది. పూర్ణచంద్రకళవలే స్వచ్ఛమైనది. సూక్ష్మమైనది. అదే ‘‘విష్ణు పదము - పరమ పదము’’ అని గ్రహించెదము గాక! అదే తేజోబిందూ స్థానము! |
త్రివక్త్రం త్రిగుణం స్థానం త్రిధాతుం రూపవర్జితం . నిశ్చలం నిర్వికల్పం చ నిరాకారం నిరాశ్రయం .. 6.. |
|
06. త్రివక్త్రం త్రిగుణం స్థానమ్ త్రిధాతుగ్ం రూపవర్జితమ్ నిశ్చలం నిర్వికల్పం చ నిరాకారం నిరాశ్రయమ్। |
అట్టి స్వస్వరూప ఆత్మతేజో బిందువును ఈ జీవుడు అనుక్షణం చిన్తన చేస్తూ, విష్ణు పదముగా చెప్పబడు స్థానముచే, సర్వ దృశ్య - బంధనములు ‘లేనివి’గా చేసివేయాలి. ఆ కేవలీ తేజోబిందుత్వము ఎటువంటిదంటే… త్రివక్త్రమ్ : మూడు ముఖములుకలది. (జీవుడు - ఈశ్వరుడు - పరమేశ్వరుడు) తన ముఖములుగా కలిగి ఉన్నట్టిది. త్రిగుణస్థానమ్ : సత్త్వ -రజో - తమో గుణముల ఉత్పత్తి స్థానము త్రిధాతుగ్ం : సత్ - చిత్ ఆనంద ధాతువులు కలిగి ఉన్నట్టిది. రూప రహితము. చలనరహితము. నిశ్చలము. కల్పనలకు ముందే ఉన్న నిర్వికల్పము. నిరాకారము. దేనినీ ఆశ్రయించనట్టిది. |
ఉపాధిరహితం స్థానం వాఙ్మనోఽతీతగోచరం . స్వభావం భావసంగ్రాహ్యమసంఘాతం పదాచ్చ్యుతం .. 7.. |
|
07. ఉపాధి రహితగ్ం స్థానమ్ వాక్ - మనో అతీత గోచరమ్, స్వభావం భావ సంగ్రాహ్యమ్ అసంఘాతం పద ‘అచ్యుతమ్’।। |
అట్టి తేజోబిందూ స్థానము ఉపాధి రహితము. ఈశ్వరునికి ‘మాయ’, జీవునికి భౌతిక దేహములు-ఉపాధులై ఉండగా - అద్దానికి ఉపాధి లేదు. వాక్కుకు (చెప్పటానికి) మనో (ఆలోచనలకు) అతీతము. అగోచరము. అది ఈ జీవుని సహజ స్వభావము. అట్టి ఆత్మతేజస్సు నుండి భావనలు బయల్వెడలుచున్నాయి. ఇదంతా తానే భావిస్తూ ఉన్నది! అది భావనచే మాత్రమే గ్రహించబడునది. దేనితో సంఘాతము (Association) లేనిది. చ్యుతి పొందనట్టిది. |
అనానానందనాతీతం దుష్ప్రేక్ష్యం ముక్తిమవ్యయం . చింత్యమేవం వినిర్ముక్తం శాశ్వతం ధ్రువమచ్యుతం .. 8.. |
|
08. అనాన్దమ్, అనాతీతమ్, దుష్ప్రేక్ష్యమ్, ముక్తమ్, అవ్యయమ్। చిన్త్యమేవం వినిర్ముక్తమ్ శాశ్వతమ్ ధ్రువమ్ అచ్యుతమ్।। |
అనుభూతికి మునుముందే ఉన్నట్టిది. ఆనన్దమునకు సాక్షి . ‘సర్వము’ అయి ఉండటము చేత అతీతమై ఎక్కడో ఉన్నది కాదు. ఇక్కడే ఉన్నట్టిది. ఇదంతా అదే! కంటికి కనబడే వస్తువు కాదు కాబట్టి దుష్ప్రేక్ష్యము. అద్దానికి ఏ బంధనములు లేవు. కనుక నిత్యముక్తము. మార్పు చెందునది కాదు. ‘తరుగుట’ అను ధర్మము లేనిది. కనుక అవ్యయము. ఆ తేజో బిందుత్వము సర్వ బంధములనుండి విముక్తి ప్రసాదించునది. త్రికాలములకు బద్ధము కాదు. అద్దానిని ఎవ్వరూ ఎటూ కదల్చలేరు, కనుక ధ్రువము. అట్టి స్వస్వరూప స్థానము చ్యుతి పొందటమే లేదు. అచ్యుతము. అదియే చింతన చేయవలసినట్టిది. |
తద్బ్రహ్మణస్తదధ్యాత్మం తద్విష్ణోస్తత్పరాయణం . అచింత్యం చిన్మయాత్మానం యద్వ్యోమ పరమం స్థితం .. 9.. |
|
09. తత్ బ్రహ్మణః, తత్ అధ్యాత్మమ్, తత్ విష్ణోః తత్ పరాయణమ్। అచిత్యం చిన్మయాత్మానమ్ యత్ వ్యోమ పరమగ్ం స్థితమ్।। |
ఆ కేవల తేజోబిందువే బ్రహ్మీస్థానము. అదియే సర్వమునకు ఆత్మ కాబట్టి ‘అధ్యాత్మము’. సర్వజీవులలోను సర్వదా సమముగా వేంచేసినదై ఉన్నది కాబట్టి విష్ణుత్వము’ (లేక) విష్ణువు. సర్వమునకు ఆవల సర్వమునకు ఆధారమైయున్నది కాబట్టి పరాయణము. (ఇహ- ఆయనమునకు వేరైన పర-ఆయనము). అది ఒక వస్తువు - సంఘటన - భౌతిక సంబంధము వంటిది కాదు. అచిన్త్యము. ‘కేవల ఎరుక (Awareness) ను స్వరూపముగా కలిగి ఉండటము చేత ‘చిన్మయాత్మ’. పరమాకాశముగా (Zone of self beyond matter & thought) సంస్థితి కలిగియున్నట్టిది. |
అశూన్యం శూన్యభావం తు శూన్యాతీతం హృది స్థితం . న ధ్యానం చ న చ ధ్యాతా న ధ్యేయో ధ్యేయ ఏవ చ .. 10.. |
|
10. అశూన్యగ్ం శూన్యభావం తు శూన్యాతీతగ్ం హృదిస్థితమ్ న ధ్యానం చ, న చ ధ్యాతా న ధ్యేయో ధ్యేయ ఏవ చ। |
అది భావరహితము కాబట్టి ‘శూన్యము’. అయినప్పటికీకూడా, అశూన్యమే! ఎందుకంటే, అద్దానినుండే ఈ సర్వము బయల్వెడలుచున్నది కదా! అందుచేత శూన్య - అశూన్యములకు అతీతమై, సర్వహృదయములలోనూ వేంచేసియే ఉన్నది. అదియే ధ్యానించ తగినట్టిది. కానీ అది ధ్యాత (Thinker) కాదు. ధ్యానము (Thinking) కాదు. ధ్యేయము (object of thinking) కూడా కాదు. అయినప్పటికీ ధ్యానించవలసినది అదియే! |
సర్వం చ న పరం శూన్యం న పరం నాపరాత్పరం . అచింత్యమప్రబుద్ధం చ న సత్యం న పరం విదుః .. 11.. |
|
11. సర్వం చ, న పరగ్ం, శూన్యం, న పరం న అపరాత్‌పరమ్, అచిన్త్యమ్ అప్రబుద్ధం చ న సత్యమ్ న పరం విదుః। |
అది ఏదో వేరై (పరమ శూన్యమై) ఉన్నది కాదు. ఇదంతా అదే! అది పరము (ఆవల ఉన్నది) కాదు. ఆ పరమునకు పరమై ఉన్నది కాదు. (ఇదంతా అదే). చింతనకు విషయముకాదు. అచింత్యము. తెలుసుకో గలిగినది కాదు. తెలుసుకొనుచున్నట్టిదే అది. అందుచేత అప్రబుద్ధము. అది సత్యము కాదు, పరము కాదు - అని విజ్ఞులు ఎరుగుచున్నారు. |
మునీనాం సంప్రయుక్తం చ న దేవా న పరం విదుః . లోభం మోహం భయం దర్పం కామం క్రోధం చ కిల్బిషం .. 12.. |
|
12. మునీనాగ్ం సంప్రయుక్తం చ న దేవా న పరం విదుః। లోభం మోహం భయం దర్పం కామం క్రోధం చ కిల్బిషమ్, |
సర్వలోక సంబంధములపట్ల ‘మౌనము వహించటము’ అనే ‘గెలుపు’ను సముపార్జించుకున్న మునీశ్వరులకు ఉపలబ్దమై, ప్రస్ఫుటమె →యున్నది. ఇహముపై ఆధిపత్యము వహించు దేవతలకు కూడా తెలియవచ్చుట లేని పరము. ఇహము కానిది. దేవతలకు పరమై తెలియవచ్చుచున్నట్టిది. |
శీతోష్ణే క్షుత్పిపాసే చ సంకల్పకవికల్పకం . న బ్రహ్మకులదర్పం చ న ముక్తిగ్రంథిసంచయం .. 13.. |
|
13. శీత - ఉష్ణే క్షుత్ పిపాసే చ సంకల్పక వికల్పకమ్ న బ్రహ్మకుల దర్పంచ న ముక్తి గ్రంథి సంచయమ్।। |
అది లోభము (నాకే ఉండాలని అనునది), మోహము (భ్రమించటము), భయము, దర్పము, (లేనిది కోరుకొనే స్వభావమగు) కామములకు చోటు లేనట్టిది. క్రోధము - పాప భావాలకు తావు దొరకనిది. శీత - ఉష్ణ - ఆకలి - దాహ సంకల్ప - వికల్పములు లేనట్టిది. ‘జాతి - కుల అహంకారముల దర్పము ఉండజాలనట్టిది. బ్రహ్మకుల దర్ప రహితము. ముక్తి సంబంధమైన బ్రహ్మ - విష్ణు - రుద్ర గ్రంథుల సంచయము, ఏకత్వము. అదియే బ్రహ్మము! |
న భయం న సుఖం దుఃఖం తథా మానావమానయోః . ఏతద్భావవినిర్ముక్తం తద్గ్రాహ్యం బ్రహ్మ తత్పరం .. 14.. |
|
14. న భయం న సుఖం దుఃఖం తథా మాన - అవమానయోః ఏతత్ భావ వినిర్ముక్తం, తత్ బ్రహ్మ బ్రహ్మ తత్పరమ్। |
భయ - దుఃఖ - సుఖ - మాన - అవమాన….ఇత్యాది భావాలన్నిటికీ ఆవల వెలుగొందుస్థానమే తత్‌పర బ్రహ్మము. అదియే పరమగు శాంత - ఆనంద స్వస్థితి. అదియే జీవుడు సంపాదించుకోవలసినది. |
యమో హి నియమస్త్యాగో మౌనం దేశశ్చ కాలతః . ఆసనం మూలబంధశ్చ దేహసామ్యం చ దృక్స్థితిః .. 15.. ప్రాణసంయమనం చైవ ప్రత్యాహారశ్చ ధారణా . ఆత్మధ్యానం సమాధిశ్చ ప్రోక్తాన్యంగాని వై క్రమాత్ .. 16.. |
|
మౌనం దేశశ్చ కాలతః ఆసనం మూలబంధశ్చ దేహసామ్యం చ దృక్ స్థితిః, 16. ప్రాణ సంయమనం చైవ ప్రత్యాహారశ్చ ధారణాః, ఆత్మధ్యానగ్ం సమాధిశ్చ పోక్తాని అంగాని వై క్రమాత్।। |
వాటియొక్క వరుసక్రమం : యమము, నియమము,దృశ్యత్యాగము, దేశ కాలములపట్ల మౌనము, ఆసనము; మూలబంధము + దేహసామ్యము + దృశ్యమునకు సాక్షియగు ‘దృక్ స్థితి’ (State of perceiver beyond perceptions) ఇంకా, - ప్రాణసంయమనము (లేక) ప్రాణాయామము; - ప్రత్యాహారము; ధారణ; ఆత్మధ్యానము; - సమాధి… ఇవన్నీ క్రమమైన యోగాంగములుగా చెప్పబడుచున్నాయి. |
సర్వం బ్రహ్మేతి వై జ్ఞానాదింద్రియగ్రామసంయమః . యమోఽఽయమితి సంప్రోక్తోఽభ్యసనీయో ముహుర్ముహుః .. 17.. |
|
17. ‘సర్వమ్ బ్రహ్మేతి’ వై జ్ఞానాత్ ఇంద్రియ గ్రామ సంయమః ‘యమో’ అయమ్ ఇతి సంప్రోక్తో అభ్యసనీయో ముహూర్ముహుః।। |
యమము : ‘ఈ ఇంద్రియములకు విషయము - దృశ్యముగా కనిపించుచున్నదంతా - సర్వము సర్వదా బ్రహ్మమే కదా!’ అను అభ్యాసమే - ముఖ్యమైన ‘యమము’. అనగా ‘సర్వమ్ బ్రహ్మేతి’….. భావన మరల మరల అభ్యసించబడటమే యమము. ‘ఈ సకల జీవరాసులు, ఈ దృశ్యము… ఇదంతా ‘బ్రహ్మము’ అను స్వస్వరూపముచే నిర్మితమైనదే….’ అను భావనయొక్క అభ్యాసమే ‘యమము’ . |
సజాతీయప్రవాహశ్చ విజాతీయతిరస్కృతిః . నియమో హి పరానందో నియమాత్క్రియతే బుధైః .. 18.. |
|
18. సజాతీయ ప్రవాహశ్చ విజాతీయ తిరస్కృతిః నియమో హి పరానందో నియమాత్ క్రియతే బుధైః।। |
నియమము : సజాతీయ ప్రవాహము - ‘సత్ రూపమగు ఆత్మభావనా రూప ఆలోచనా తరంగాలు కొనసాగించటమును, విజాతీయ (అనాత్మ భావనా) తరంగాలను తిరస్కరించటమును, ‘నేను-నీవు-వారు-వీరు పరానందాత్మ స్వరూపములము కదా’… అను మనో నియామకమును ‘నియమము’ అంటున్నారు. బుధులు (విజ్ఞులు) పాటించు అట్టి ఆలోచనల నియామకమే నియమము. మనస్సును కూడా ఆత్మగా భావించటమే నియమము. |
త్యాగః ప్రపంచరూపస్య సచ్చిదాత్మావలోకనాత్ . త్యాగో హి మహతా పూజ్యః సద్యో మోక్షప్రదాయకః .. 19.. |
|
19. త్యాగః ప్రపంచ రూపస్య సత్ - చిత్ ఆత్మావలోకనాత్ త్యాగోహి మహతాం పూజ్యః సద్యోమోక్ష ప్రదాయకః।। |
త్యాగము : బాహ్యముగా కనులకు కనిపిస్తున్నదంతా (నామ - రూప - గుణాత్మకమైనదంతా) త్యజిస్తూ, ఈ సర్వముపట్ల సత్‌చిత్ ఆత్మావలోకనమును నిర్వర్తిస్తూ ఉండటమే త్యాగము. అట్టి - ‘సర్వమును ఆత్మగా అవలోకనము చేయటము’ - అనబడు ‘త్యాగము’ను మహనీయులు పూజిస్తూ ఉంటారు. అట్టి సత్ చిత్ ఆనందాత్మగా దృశ్యమును, సహజీవులను భావించటము - ఇప్పటికిప్పుడే మోక్షమును ప్రసాదించ కలిగినట్టిది. సద్యో మోక్ష ప్రదాయకము. |
యస్మాద్వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ . యన్మౌనం యోగిభిర్గమ్యం తద్భజేత్సర్వదా బుధః .. 20.. వాచో యస్మాన్నివర్తంతే తద్వక్తుం కేన శక్యతే . ప్రపంచో యది వక్తవ్యః సోఽపి శబ్దవివర్జితః .. 21.. |
|
20. యస్మాత్ వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ, యత్ ‘మౌనమ్’ యోగిభిః గమ్యం తత్ భవేత్ సర్వదా (అ)జడైః।। 21. వాచో యస్మాత్ నివర్తంతే తత్ వక్తుమ్ కేన శక్యతే? ‘ప్రపంచో’ → యది వక్తవ్యః సోఽపి శబ్దవివర్జితః।। |
మౌనము : ఏదైతే నిర్వచించి చెప్పటానికి మనస్సు వాక్కు…ప్రయత్నించి కూడా’ చెప్పజాలక వెనుకకు మరలుచున్నాయో…అట్టి అశబ్దతత్త్వమే యోగులకు గమ్యము (place of reach) అగుచున్నది. యోగులయొక్క అట్టి పరాకాష్ఠ లక్ష్యము అగు ఆత్మ- చైతన్యరూపమే గాని, జడమైన స్థితి అయి ఉండలేదు. బ్రహ్మ భావన నుండి ‘అచ్యుతి’యే ‘కాష్ఠమౌనము’. ఎద్దానిని చెప్పుటకు వాక్కులు - తమకు చేతగాక - వెనుకకు మరలుచున్నాయో, అద్దాని గురించి ఎవ్వరు మాత్రం ఏమని ‘ఇది’ అని నిర్ణయించి చెప్పగలుగుతారు? అది ప్రపంచములోని ఒక వస్తువు వంటిది కాదు. అది వాస్తవానికి శబ్దమునకు అందనిది. ప్రపంచమైతే మాటలతో ఏదో చెప్పుకోవచ్చు. బ్రహ్మము గురించి మాటలతో నిర్వచించ జాలము. |
ఇతి వా తద్భవేన్మౌనం సర్వం సహజసంజ్ఞితం . గిరాం మౌనం తు బాలానామయుక్తం బ్రహ్మవాదినాం .. 22.. |
|
22. ఇతి వా తత్ భవేత్ మౌనం సర్వం సహజ సంజ్ఞితమ్। గిరా మౌనం తు బాలానామ్ అయుక్తం బ్రహ్మవాదినామ్ |
‘ఆ పరబ్రహ్మము వాక్కుచే ప్రకటించజాలము కదా!’ అని - (మరియు) ‘‘ఈ కనబడేదంతా అద్దానియొక్క ‘సంజ్ఞామాత్రము’ అని - గమనిస్తూ ఉండటమే ‘మౌనము’. ‘మాట్లాడకపోవటమే మౌనము’ అను మాట పసిబాలులలవంటి వారు అనుకునే మాట. బ్రహ్మవాదుల దృష్టిలో నోటితో మౌనమును ‘మౌనము’ - అని అనటం యుక్తి యుక్తమే కాదు. |
ఆదావంతే చ మధ్యే చ జనో యస్మిన్న విద్యతే . యేనేదం సతతం వ్యాప్తం స దేశో విజనః స్మృతః .. 23.. |
|
23. ఆదావంతే చ, మధ్యే చ జనో యస్మిన్ న విద్యతే, యేన ఇదం సతతం వ్యాప్తం స ‘దేశో’ విజనః స్మృతః।। |
దేశము : ఏ ప్రదేశములో (లేక) స్థానములో మొట్టమొదటగాని, మధ్యలోగాని, చివ్వరికిగాని సర్వము ఏకమే అయి ఉన్నదో, అనేకము (వేరు జనులు మొదలైనవి) అనునదే లేదో, (బంగారు ఆభరణాలన్నిటిలో బంగారమే నిండి ఉన్న తీరుగా) దేనిచేతైతే ఇదంతా వ్యాపించినదై ఉన్నదో, అదియే ‘దేశము’ అను శబ్దము యొక్క ఉత్తమార్థము. |
కల్పనా సర్వభూతానాం బ్రహ్మాదీనాం నిమేషతః . కాలశబ్దేన నిర్దిష్టం హ్యఖండానందమద్వయం .. 24.. |
|
24. కల్పనా సర్వభూతానాం బ్రహ్మాదీనాం నిమేషతః ‘కాల’ శబ్దేన నిర్దిష్టగ్ం హి అఖండానందమ్, అద్వయమ్।। |
కాలము : సృష్టికర్త బ్రహ్మదేవుడు మొదలుకొని సర్వభూతజాలము ఏ నిమిషకాలము నుండి కల్పన చేయబడుచున్నదో, అదియే ‘కాలము’ శబ్దముగా చెప్పబడుతోంది. కాలము ఆత్మయొక్క అఖండానంద స్వరూపమే. సర్వము (సర్వజగత్తు) కాలబద్ధమే! కాలమునకు వేరై, ద్వితీయమై ఏదీ లేదు. కాలము-బ్రహ్మముయొక్క స్వకీయ కల్పనయే. |
సుఖేనైవ భవేద్యస్మిన్నజస్రం బ్రహ్మచింతనం . ఆసనం తద్విజానీయాదన్యత్సుఖవినాశనం .. 25.. |
|
25. సుఖైనైవ భవేత్ యస్మిన్ (న)అజస్రం బ్రహ్మచింతనమ్ ‘ఆసనమ్’ తత్ విజానీయాత్। అన్యత్ సుఖ వినాశనమ్।। |
ఆసనము : ఈ శరీరముతో ఏ ఆసనముతో కూర్చుని ఉంటే ‘బ్రహ్మచింతన’కు సానుకూల్యమై ఉంటుందో, అదియే ఆతనికి సుఖాసనము. బ్రహ్మచింతనకు అనుకూలము కాని విధంగా ఉండేదంతా (Confining to technical factors of ‘Asanam’) - ‘సుఖవినాశనకరము’ అనియే చెప్పాలి. |
సిద్ధయే సర్వభూతాది విశ్వాధిష్ఠానమద్వయం . యస్మిన్సిద్ధిం గతాః సిద్ధాస్తత్సిద్ధాసనముచ్యతే .. 26.. |
|
26. సిద్ధయే సర్వభూతాది విశ్వాధిష్ఠానమ్ అద్వయమ్ యస్మిన్ సిద్ధిం గతాః సిద్ధాః తత్ ‘సిద్ధాసనమ్’ ఉచ్యతే।। |
సిద్ధాసనము : ఏ ఆసనముతో కూర్చుని ఉండి → సర్వజీవులకు ఆదిస్థానము, → ఈ విశ్వమునకు అధిష్ఠానము (విశ్వమంతా ఏర్పడినదైయున్న చోటు / స్థానము)… → అద్దానికి ద్వితీయమనునదే లేనట్టి అద్వయము… అయినట్టి బ్రహ్మమును సిద్ధింపజేసుకొను అభ్యాసము సుఖప్రదమో,… అదియే సిద్ధాసనము. |
యన్మూలం సర్వలోకానాం యన్మూలం చిత్తబంధనం . మూలబంధః సదా సేవ్యో యోగ్యోఽసౌ బ్రహ్మవాదినాం .. 27.. |
|
27. యన్మూలగ్ం సర్వలోకానాం, యన్మూలం చిత్తబంధనమ్, ‘మూలబంధః’ సదా సేవ్యో యోగ్యో-సౌ రాజయోగినామ్। |
మూలబంధము : ఈ లోకాలన్నిటికీ ఏది ‘మూలము’ (Root Place) అయి ఉన్నదో, అదియే ఆత్మ. ఎద్దాని చేత చిత్తమునకు బంధమును కలుగుచున్నదో అదియే బంధనము. దేనిచే చిత్తము శాశ్వత వస్తువగు ఆత్మతో సంబంధము కలుగుతోందో, అదియే మూలబంధము. రాజయోగులు సేవించే యోగము - మూలవస్తువుతో సంబంధ బంధనమే. సర్వము ఆత్మగా దర్శించు దృష్టియే మూలబంధనము. |
అంగానాం సమతాం విద్యాత్సమే బ్రహ్మణి లీయతే . నో చేన్నైవ సమానత్వమృజుత్వం శుష్కవృక్షవత్ .. 28.. |
|
28. అంగానాం సమతాం విద్యాత్ సమే బ్రహ్మణి లీయతే నోచేత్ నైవ సమానత్వమ్ ఋజుత్వగ్ం శుష్క వృక్షవత్।। |
దేహాంగములన్నీ ఒకసమమైన (సమరేఖ అయిన) స్థితికి తెచ్చి ఉంచి నిలిపి అప్పుడు బుద్ధిని బ్రహ్మమునందు లీనముచేయాలి. కేవలము దేహాంగములను సమరేఖగా (భుజములు - మెడ - తల నిఠారుగా, నిలువుగా) నిలిపి ఉంచి, మనస్సు మాత్రము బ్రహ్మమునందు లయింపజేసే ప్రయత్నం చేయకపోతే, అది కొమ్మలు విరిగి కూడా నిఠారుగా నిలచిన శిథిల వృక్షముతో సమానము. |
దృష్టీం జ్ఞానమయీం కృత్వా పశ్యేద్బ్రహ్మమయం జగత్ . సా దృష్టిః పరమోదారా న నాసాగ్రావలోకినీ .. 29.. |
|
29. దృష్టిం జ్ఞానమయీం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్। సా దృష్టిః పరమోదారా న నాసాగ్ర అవలోకినీ।। |
దృష్టి : దృష్టి యొక్క అపవిత్రత కారణంగా అనుభవము - విషయమయములకు పరిమితము అవుతోంది. దృష్టి ని జ్ఞానమయము చేస్తే ఈ జగత్తు బ్రహ్మమయముగానే కనబడగలదు. బ్రాహ్మీ దృష్టియే - పరమోత్కృష్టము. అంతేగాని దృష్టిని కేవలము ముక్కుపై నిలిపినంత మాత్రంచేత అది ఏకాగ్ర దృష్టి కాదు. |
ద్రష్టృదర్శనదృశ్యానాం విరామో యత్ర వా భవేత్ . దృష్టిస్తత్రైవ కర్తవ్యా న నాసాగ్రావలోకినీ .. 30.. |
|
30. ద్రష్టృ దర్శన దృశ్యానాం విరామో యత్ర వా భవేత్, దృష్టిః తత్రైవ కర్తవ్యా న నాసాగ్ర అవలోకినీ।। |
జ్ఞానమయ దృష్టి : ఏ దృష్టిచే ద్రష్ట (చూచువాడు) - చూపు (దర్శనము) - దృశ్యము (చూడబడునది)…యొక్క భేదమంతా ‘విరామము’ పొందినదై ‘ఏకత్వము’ సంతరించుకొనుచున్నదో, అట్టి జ్ఞానదృష్టినే అభ్యసించాలి. అంతేగాని ముక్కు యొక్క ఊర్థ్వస్థానములో చూపును నిలపినంత మాత్రాన నిజమైన, అసలైన దృష్ట్యభ్యాసము (యోగదృష్టి) కాదు. |
చిత్తాదిసర్వభావేషు బ్రహ్మత్వేనైవ భావనాత్ . నిరోధః సర్వవృత్తీనాం ప్రాణాయామః స ఉచ్యతే .. 31.. |
|
31. చిత్త - ఆది సర్వభావేషు బ్రహ్మత్వేనైవ భావనాత్, నిరోధః సర్వవృత్తీనాం ‘ప్రాణాయామః’ స ఉచ్యతే।। |
ప్రాణాయామము : మనో - బుద్ధి - చిత్త - అహంకార సంబంధితమైన వృత్తులన్నీ (భావనలన్నీ) బ్రాహ్మీభావనతో ఏకం చేసి, బ్రహ్మమునకు వేరైన - అన్యమైన సర్వ చిత్తవృత్తులను నిరోధించటమే ప్రాణాయామము -అని అనబడగలదు.(కేవలము గాలిని పీల్చి-వదలటము ప్రాణాయామము - అని అనిపించుకోదు). సమస్తము బ్రహ్మముగా అనిపించుటకొరకే వాయు నిరోధ ప్రాణాయామము. |
నిషేధనం ప్రపంచస్య రేచకాఖ్యః సమీరితః . బ్రహ్మైవాస్మీతి యా వృత్తిః పూరకో వాయురుచ్యతే .. 32.. |
|
32. నిషేధనం ప్రపంచస్య రేచకాఖ్యః సమీరితః। ‘బ్రహ్మైవాస్మి’ ఇతి యా వృత్తిః ‘పూరకో వాయుః’ ఉచ్యతే। |
రేచకము : ప్రపంచము అనబడే అనేక భేదములతో కూడిన దృష్టి - భావన - అవగాహనలను నిరోధించటము, సర్వత్రా సమమగు బ్రాహ్మీదృష్టిని నిలుపుకొని ఉంచటము - అనునవే ‘రేచకము’ (గాలిని వదలడము) అనే శబ్దముయొక్క ముఖ్యోద్దేశ్యము. భేదములను వదలకుండా కేవలము గాలిని బయటకు వదిలితే అది రేచకము కాదు. పూరకము : ‘‘బ్రహ్మైవాస్మి - నేను బ్రహ్మమే అయి ఉన్నాను’’ - అను బుద్ధియొక్క యావృత్తియే పూరకము. అంతేకాని కేవలము గాలిని గుండెలో నింపినంతమాత్రమున నిజమైన పూరకము కాదు. |
తతస్తద్వృత్తినైశ్చల్యం కుంభకః ప్రాణసంయమః . అయం చాపి ప్రబుద్ధానామజ్ఞానాం ఘ్రాణపీడనం .. 33.. |
|
33. తతః సత్ వృత్తిః నైశ్చల్యం కుంభకం ప్రాణ సంయమః అయంచాపి ప్రబుద్ధానాం అజ్ఞానాం ఘ్రాణపీడనమ్। |
కుంభకము : ‘సర్వము బ్రహ్మమే’ అను బ్రాహ్మీ వృత్తియొక్క అచంచల నిశ్చలత్వమే నిజమైన ‘ప్రాణాయామ కుంభకము’. ‘ప్రాణాయామ వృత్తి’ యొక్క తాత్త్వికార్థము తెలిసియున్న ప్రబుద్ధుల దృష్టిలో ఆత్మభావన యొక్క అచ్యుతియే కుంభకము. తత్త్వార్థము - తత్త్వ ఉద్దేశ్యము తెలియకుండా ముక్కుతో చేసేది కేవలము ‘ముక్కుపీడనము’ మాత్రమే! |
విషయేష్వాత్మతాం దృష్ట్వా మనసశ్చిత్తరంజకం . ప్రత్యాహారః స విజ్ఞేయోఽభ్యసనీయో ముహుర్ముహుః .. 34.. |
|
34. విషయేషు ఆత్మతాం దృష్ట్వా మనసః చిత్త రంజకమ్, ‘ప్రత్యాహారః’ స విజ్ఞేయో అభ్యసనీయో ముహుర్ముహుః।। |
ప్రత్యాహారము : ప్రాపంచక విషయములన్నిటినీ ‘ఆత్మయొక్క సంప్రదర్శనము’… అనబడు ఆత్మభావనాదృష్టి కలిగి, మనస్సుతో చిత్తమును ఆత్మగా దర్శనాభిలాషచే రంజింపజేయటము - ‘ప్రత్యాహారము’. అట్టి విషయములను విషయముగా కాకుండా, ఆత్మ దృష్టితో చూడటమును మరల మరల అభిరుచితో అభ్యసిస్తూ ఉండాలి. |
యత్ర యత్ర మనో యాతి బ్రహ్మణస్తత్ర దర్శనాత్ . మనసా ధారణం చైవ ధారణా సా పరా మతా .. 35.. |
|
35. యత్ర యత్ర మనోయాతి ‘బ్రహ్మణః’ తత్ర దర్శనాత్ మనసా ధారణం చ ఏవ ‘ధారణా’ సా పరామతా। |
ధారణ : ఈ మనస్సు (ఆలోచనలు) ఎక్కడికి పోయి ఏఏ విశేషములు - సంగతులు మొదలైన వాటిపై వ్రాలుచున్నదో, అక్కడక్కడ ఆయా విషయములు - వస్తువులు - వ్యక్తులు మొదలైనవన్నీ బ్రహ్మముగా దర్శనము చేస్తూ ఉండటము - ‘ధారణ’గా చెప్పబడుచున్నది. అట్టి ధారణ పరతత్త్వమును ప్రసాదించునదై ఉన్నది. |
బ్రహ్మైవాస్మీతి సద్వృత్త్యా నిరాలంబతయా స్థితిః . ధ్యానశబ్దేన విఖ్యాతః పరమానందదాయకః .. 36.. |
|
36. ‘బ్రహ్మైవాస్మి’ ఇతి సత్‌వృత్త్వా నిరాలంబతయా స్థితిః ‘ధ్యాన’ శబ్దేన విఖ్యాతః పరమానంద దాయకః।। |
ధ్యానము : సర్వ ఆవలంబనముల ఆవశ్యకతను దాటివేసి, నిరాలంబస్థితి - కేవలాత్మస్థితి యొక్క సత్తా వృత్తిని మాత్రమే ఆశ్రయిస్తూ ఉన్నప్పుడు ‘ధ్యానస్థితి’ అను శబ్దముతో చెప్పబడుతోంది. అట్టి ధ్యానము ఈ జీవునకు పరమానందదాయకము. |
నిర్వికారతయా వృత్త్యా బ్రహ్మాకారతయా పునః . వృత్తివిస్మరణం సమ్యక్సమాధిరభిధీయతే .. 37.. |
|
37. నిర్వికారతయా వృత్త్యా బ్రహ్మాకారతయా పునః వృత్తి విస్మరణగ్ం సమ్యక్ ‘సమాధిః’ అభిధీయతే।। |
సమాధి : సర్వ దృశ్య వృత్తులను (All out ward related avocations) విస్మరించి వేసి, కేవలము ‘బ్రహ్మాకారకృత్తి’ ని మాత్రమే ఆశ్రయించి ఉండుటచే ఏర్పడు ‘సర్వత్రా సమరూపము’ అయినట్టి ‘సమ్యక్ స్థితి’ని ‘సమాధి’ అని పిలచుచున్నారు. |
ఇమం చాకృత్రిమానందం తావత్సాధు సమభ్యసేత్ . లక్ష్యో యావత్క్షణాత్పుంసః ప్రత్యక్త్వం సంభవేత్స్వయం .. 38.. |
|
38. ఇమంచ అకృత్రిమానందమ్ తావత్ సాధు సమభ్యసేత్। లక్ష్యో యావత్ క్షణాత్ పుగ్ంసః ప్రత్యక్త్వగ్ం సందధేత్ స్వయమ్।। |
అట్టి అకృత్రిమ - అప్రమేయ సహజానంద స్థితిని సాధువు సర్వదా బాగుగా అభ్యసించాలి. అట్లా అభ్యసించుచూ ఉండగా ప్రత్యక్ ఆత్మతో అనుసంధానము స్వయముగా జరుగ గలదు. అదియే లక్ష్యము యొక్క సిద్ధి. |
తతః సాధననిర్ముక్తః సిద్ధో భవతి యోగిరాట్ . తత్స్వం రూపం భవేత్తస్య విషయో మనసో గిరాం .. 39.. |
|
39. తతః సాధన నిర్ముక్తః ‘సిద్ధో’ భవతి యోగిరాట్। తత్ స్వరూపమ్ భవేత్ తస్యా అవిషయో మనసో గిరామ్। |
ధ్యానముచే ‘సమాధి’ (సర్వత్రా సమస్వరూపమగు ఆత్మగా అవధరించిన స్థితి) సిద్ధిస్తూ ఉండగా, ఇక సర్వసాధనలు తమకు తామే కాలక్రమంగా ఉపశమిస్తాయి. దృష్టి ఆత్మత్వము సంతరించుకొన్నదై, సాధన - సాధ్యముల ఏకత్వము సిద్ధించగా అట్టివాడు ‘యోగీశ్వరుడు’ (లేక) యోగిరాట్ అగుచున్నాడు. అట్టి యోగి రాట్ యొక్క సర్వత్రా స్వస్వరూపానంద సందర్శనము - మనో వాక్కులకు అవిషయము. |
సమాధౌ క్రియమాణే తు విఘ్నాన్యాయాంతి వై బలాత్ . అనుసంధానరాహిత్యమాలస్యం భోగలాలసం .. 40.. |
|
విఘ్నాన్ ఆయాంతి వై బలాత్। అనుసంధానరాహిత్యం, ఆలస్యం, భోగలాలసమ్। |
(1) అనుసంధాన రాహిత్యము - ఆత్మతో అనుసంధానము కుదరక భేదదృష్టులే పెత్తనము చెలాయించటము (2) ఆలస్యము - అలసత్వము. బుద్ధి మాంద్యము. బద్ధకము. అశ్రద్ధ. (3) భోగలాలసము - దృశ్య సంబంధమైన భోగముల పట్ల లాలసత్వము. అభిలాష. కోరిక. ఆకర్షణ. అభినివేశము. |
లయస్తమశ్చ విక్షేపస్తేజః స్వేదశ్చ శూన్యతా . ఏవం హి విఘ్నబాహుల్యం త్యాజ్యం బ్రహ్మవిశారదైః .. 41.. |
|
41. లయః, తమశ్చ, విక్షేపః తేజః, స్వేదశ్చ, శూన్యతా ఏవగ్ం హి విఘ్నబాహుళ్యం త్యాజ్యం బ్రహ్మ విశారదైః।। |
(4) లయము - ఆయా సంగతి - సందర్భ - సంబంధములలో ‘లయము’ (Immersed) అగుచుండటము. (5) తమము/తమస్సు: విషయముల గురించి తెలిసీ కూడా వదలలేక, అంధకారము, అజ్ఞానము కొనసాగించటము. (6) విక్షేపము- యోగసాధన నుండి చ్యుతి (విరామ - ఉపసంహారములు) ఏర్పడటము. ధ్యాస ప్రాపంచక విషయములవైపుగా వెళ్ళి, మరలి రాకుండటము. (7) తేజము - స్వాప్నిక స్థితి (తేజసము). (8) స్వేదము - అలిసిపోవటము. చెమట పట్టటము. విసుగు. (9) శూన్యత్వము - బుద్ధిని నిస్తేజత్వము ఆక్రమించటము . ఈ అనేక రకములైన విఘ్నములను బ్రహ్మము యొక్క జ్ఞాన సముపార్జన పట్ల పట్టుదలతో ఎంతగా శ్రమించైనాసరే, త్యజించాలి. |
భావవృత్త్యా హి భావత్వం శూన్యవృత్త్యా హి శూన్యతా . బ్రహ్మవృత్త్యా హి పూర్ణత్వం తయా పూర్ణత్వమభ్యసేత్ .. 42.. |
|
42. భావ(బాహ్య) వృత్యా హి భావ (హ్య)త్వగ్ం। శూన్యవృత్త్యా హి శూన్యతా। బ్రహ్మ వృత్త్యా హి పూర్ణత్వమ్ తయా ‘పూర్ణత్వమ్’ అభ్యసేత్।। |
వృత్తులే (Practice of Avocations) అన్నిటికీ కారణము అగుచున్నాయి. భావ వృత్తులచే → భావనా పరంపరలు, భావత్వము ఏర్పడుచున్నాయి. బాహ్య వృత్తులచే → బాహ్యత్వము, శూన్యవృత్తిచే → శూన్యత్వము, బ్రహ్మ వృత్తి (బ్రాహ్మీభావన)చే → పూర్ణత్వము కలుగుచున్నాయి. అందుచే బ్రాహ్మీ వృత్తినే అభ్యసిస్తూ ‘నేను పూర్ణుడను కదా’ అను పూర్ణవృత్తినే సర్వదా ఆశ్రయించాలి. |
యే హి వృత్తిం విహాయైనాం బ్రహ్మాఖ్యాం పావనీం పరాం . వృథైవ తే తు జీవంతి పశుభిశ్చ సమా నరాః .. 43.. |
|
43. యే హి వృత్తిం విహాయైనామ్ బ్రహ్మాఖ్యాం పావనీం పరామ్ వృథైవ తే తు జీవంతి పశుభిశ్చ సమా నరాః। |
బ్రహ్మీవృత్తిని వదలనే రాదు. ఎవ్వరైతే బ్రాహ్మీభావన (ఇదంతా బ్రహ్మమే! స్వస్వరూప పరబ్రహ్మమే - అనుభావన)ను వదలి, ‘‘పావనము , పరతత్త్వ సంబంధము’’ అగు వృత్తిని ఏమరచి, దృశ్య వస్తువృత్తిని రోజురోజూ వృద్ధి చేసుకుంటారో, వారి ‘జీవితము’ అనే అవకాశము వృథా! వారు నరులు అయి కూడా పశుప్రాయులే! |
యే తు వృత్తిం విజానంతి జ్ఞాత్వా వై వర్ధయంతి యే . తే వై సత్పురుషా ధన్యా వంద్యాస్తే భువనత్రయే .. 44.. |
|
44. యే తు వృత్తిం విజానంతి జ్ఞాత్వా వై వర్ధయంతి యే, తే వై సత్పురుషా। ధన్యా। వంద్యాః తే భువన త్రయే।। |
ఎవ్వరైతే ‘‘ఇదంతా కూడా సర్వదా యథాతథమై యున్న ఆత్మయొక్క లీలా ప్రదర్శనా విశేషమే! సర్వజీవులు - నేను కూడా అఖండమై యున్న ఆత్మయే! కనుక ఈ జగత్తు - లోకాలు - జీవులు నాయొక్క ప్రియాత్మ స్వరూపమే’’ అనే ‘ఆత్మవృత్తి’ని చేబట్టుతారో అట్టి ఆత్మీయతను, (సర్వజీవులతో గల ఆత్మబంధమును) ఎరిగి, అద్దానిని ప్రవృద్ధం చేసుకుంటూ ఉంటారో - అట్టి వారే ‘సత్పురుషులు’. వారు ధన్యులు. మూడు లోకములలో నమస్కరించ తగువారు. |
యేషాం వృత్తిః సమా వృద్ధా పరిపక్వా చ సా పునః . తే వై సద్బ్రహ్మతాం ప్రాప్తా నేతరే శబ్దవాదినః .. 45.. |
|
45. యేషాం వృత్తిః సమా వృద్ధా పరిపక్వా చ సా పునః తే వై సద్బ్రహ్మతాం ప్రాప్తా నేతరే (న ఇతరే) శబ్దవాదినః।। |
ఎవ్వరైతే అట్టి ‘ఆత్మ వృత్తి’ (లేక) ‘ఇదంతా నా ప్రియమగు ఆత్మ విన్యాసప్రదర్శనమే’ అనబడు ‘బ్రాహ్మీవృత్తి’ ని బాగుగా ప్రవృద్ధి చేసుకొంటూ, అట్టి వృత్తిని ‘పరిపక్వము’ చేసుకుంటారో వారు మాత్రమే చివరికి ‘సత్బ్రహ్మత్వము’ ను ప్రాప్తింపజేసుకుంటున్నారు. అంతేగాని కేవలము ‘తత్ త్వమ్ - సోఽహమ్ - అహమ్ బ్రహ్మాస్మి’…అనే మాటలు పలుకుతూ ఉన్నంత మాత్రంచేత సద్బ్రహ్మత్వము ప్రాప్తించదు. మాట్లాడు కున్నంత మాత్రం చేత సిద్ధించదు. మననముచేత మాత్రమే సుసాధ్యము. |
కుశలా బ్రహ్మవార్తాయాం వృత్తిహీనాః సురాగిణః . తేఽప్యజ్ఞానతయా నూనం పునరాయాంతి యాంతి చ .. 46.. |
|
46. కుశలా బ్రహ్మవార్తాయాం వృత్తిహీనాః సురాగిణః తేఽపి (తే అపి) అజ్ఞానతయా నూనం పునః ఆయాంతి యాంతి చ।। |
‘బ్రహ్మము అనగా సత్‌చిత్ ఆనందము, అఖండము, సర్వము, నిత్యము’. ఈ విధంగా బ్రహ్మము గురించిన వార్తలు చెప్పుకుంటూ, ‘బ్రాహ్మీవృత్తి’ని సమవృద్ధి చేసుకోకుండా, ఆయా దృశ్య విషయములపట్ల సరాగులై (రాగము కలవారై) ఉంటే, వారు అజ్ఞానులే. అట్టి వారు జన్మ - కర్మలలోనికి రాకపోకలు కొనసాగిస్తూనే ఉంటారు. |
నిమిషార్ధం న తిష్ఠంతి వృత్తిం బ్రహ్మమయీం వినా . యథా తిష్ఠంతి బ్రహ్మాద్యాః సనకాద్యాః శుకాదయః .. 47.. |
|
47. నిమిషార్థం న తిష్ఠంతి వృత్తిం బ్రహ్మమయీం వినా యథా తిష్ఠంతి బ్రహ్మాద్యాః సనకాద్యా శుకాదయః।। |
అట్టి ‘బ్రాహ్మీవృత్తి’ని పరిపక్వము చేసుకున్నవారు ఉన్నారా? ఉన్నారు. సనకుడు, శుకుడు మొదలైన ఎందరో మహానుభావులు - ఒక్క అర నిమిషము కూడా అట్టి ‘ఆత్మీయత’ / ‘బాహ్మీవృత్తి’ని వదలి ఉండరు. ‘ఇదంతా నా ప్రియమగు ఆత్మయే!’ అనే అనుభూతిని, అవగాహనను వదలనే వదలరు. (మనము కూడా ‘బ్రాహ్మీదృష్టి’ని ఏ పరిస్థితులలోను వదలనే కూడదు) |
కారణం యస్య వై కార్యం కారణం తస్య జాయతే . కారణం తత్త్వతో నశ్యేత్కార్యాభావే విచారతః .. 48.. |
|
48. కారణం యస్య వై కార్యం కారణం తస్య జాయతే। కారణం తత్వతో నశ్యేత్ కార్య - అభావే విచారతః |
‘ఈ ‘జగత్తు’ అనే కార్యమునకు ‘కారణము’ ఏది?’…అని విచారిస్తే (‘జీవాత్మ (The Experiencer) స్వతఃగా అకారణమగు బ్రహ్మమే కాబట్టి, ఇద్దానికి) ‘కారణమే లేదు’ అని తెలియవస్తోంది. ‘ఈ జగత్తు అనే కార్యమే లేదు, అంతా సర్వదా ఆత్మయే కాబట్టి’ అను భావనచే కారణమును నశింపజేస్తే ‘‘జగత్ బంధము (లేక) సంసారబంధము’’ అనే కార్యము కూడా ‘తత్వార్థము’గా నశించిపోగలదు. |
అథ శుద్ధం భవేద్వస్తు యద్వై వాచామగోచరం . ఉదేతి శుద్ధచిత్తానాం వృత్తిజ్ఞానం తతః పరం .. 49.. |
|
49. అథ శుద్ధం భవేత్ వస్తు యద్వై వాచామ్ అగోచరమ్, ఉదేతి శుద్ధ చిత్తానాం వృత్తిజ్ఞానం తతః పరమ్।। |
అత్యంత పరిశుద్ధమగు ‘బ్రాహ్మీభావన’ (లేక) ‘ఆత్మీయవృత్తి’ అనునది ఫలించటము (సిద్ధించటము) ఎట్లా? ‘వాక్కు’కు అగోచరమై, అత్యంత శుద్ధము - నిర్మలము అయి ఉన్న ‘బ్రహ్మము’ ఏదో - ఎట్టిదో, ఎరుగుచూ, పరిశుద్ధమైన చిత్తమును పెంపొందించుకున్న వారికి తప్పక సిద్ధిస్తోంది. పరిశుద్ధమైన చిత్తమునకే పరిశుద్ధ ఆత్మవస్తువు అనుభవమై ఫలిస్తోంది. (చిత్తము = ఇష్టము) |
భావితం తీవ్రవేగేన యద్వస్తు నిశ్చయాత్మకం . దృశ్యం హ్యదృశ్యతాం నీత్వా బ్రహ్మాకారేణ చింతయేత్ .. 50.. |
|
50. భావితం తీవ్రవేగేన యద్వస్తు నిశ్చయాత్మకమ్। దృశ్యగ్ం హి అదృశ్యతాం నీత్వా బ్రహ్మాకారేణ చింతయేత్।। |
‘ఇదంతా నా ప్రియమైన ఆత్మయే’…అని తదితర జీవులపట్లా, ఈ జగత్ దృశ్యము పట్లా నాకు అనిపించటం లేదే? ఎందుచేత?’ అను ఈ ప్రశ్నకు సమాధానము- - ఒకడు ఏ వస్తువును ఏ రీతిగా తీవ్రమైన భావన చేస్తూ ఉంటాడో, ఆ వస్తువు ఆ విధంగానే నిశ్చయానుభవమై తీరుతోంది. (యత్ భావమ్ - తత్ భవతి). అందుచేత ‘దృశ్యమానమై కనిపిస్తున్న ఈ జగత్తు సర్వదా అదృశ్యరూపమగు ఆత్మయే’…అను ‘అఖండ బ్రహ్మముయొక్క ఆకారము’గా ఎల్లప్పుడూ, అన్ని పరిస్థితులలోనూ చింతన చేయాలి. అట్టి తీవ్రమైన భావనచే బ్రహ్మకారత్వముగా ఇదంతా అనుభవమవగలదు. అనుకుంటూ ఉంటే అనిపిస్తూ ఉండగలదు. |
విద్వాన్నిత్యం సుఖే తిష్ఠేద్ధియా చిద్రసపూర్ణయా .. ఇతి ప్రథమోఽధ్యాయః .. 1.. |
|
51. విద్వాన్ నిత్యం సుఖే తిష్ఠేత్ ధియా చిద్రస పూర్ణయేతి।। |
నిత్య - అనిత్య వివేకము సముపార్జించుకున్న విద్వాంసుడు - చిత్ రస పూర్ణమైన, కేవల చిత్‌ధారణా రూపమైన బుద్ధితో క్రమక్రమంగా అనునిత్యమగు ఆత్మసుఖమునందు శాశ్వత స్థానము పొంది ఉంటున్నాడు. |
2వ అధ్యాయము : అంతా అఖండ ఏక స్వరూపమే!
అథ హ కుమారః శివం పప్రచ్ఛాఽఖండైకరస- చిన్మాత్రస్వరూపమనుబ్రూహీతి . స హోవాచ పరమః శివః . అఖండైకరసం దృశ్యమఖండైకరసం జగత్ . అఖండైకరసం భావమఖండైకరసం స్వయం .. 1.. |
|
01. అథ హ కుమారః శివమ్ పప్రచ్ఛ: అఖండ ఏకరస చిన్మాత్ర స్వరూపమ్ అనుబ్రూహి। ఇతి।। సహోవాచ పరమ శివః :- అఖండైక రసం దృశ్యమ్। అఖండైక రసం జగత్। అఖండైక రసం భావమ్। అఖండైక రసగ్ం స్వయమ్।। |
ఒక సందర్భములో షణ్ముఖుడు, ప్రేమమూర్తి అగు కుమారస్వామి పిత్రుదేవులగు శివభగవానుని సమీపించి, నమస్కరించి ఈవిధంగా పరిప్రశ్నించారు. హే భగవాన్! సర్వతత్త్వస్వరూపా! శివ! దేవాది దేవా! ఆత్మ → అఖండము - ఏకరసము (unpartitioned unity) అని శాస్త్రములు అంటున్నాయి కదా! అట్టి అఖండ - ఏకరస చిన్మాత్రముయొక్క స్వరూపము ఎట్టిదో దయతో సవివరించండి. పరమ శివభగవానుడు : ఈ దృశ్యమంతా కూడా అఖండైక రస స్వరూపమేనయ్యా. అఖండము ఏకము అగు ఆత్మ సర్వదా ఎట్టి విభాగము లేనిదై, జీవ - బ్రహ్మ ఐక్యరూపమై , కేవల ఆనంద చిన్మాత్రమై వెలుగొందుచున్నది. ఉదా : ఒకనిలో వెలుగొందుచున్న ఎరుక(Awareness)యే ఆతడు నాటకములో నటించు పాత్రయందు కూడా వెలుగొందుచున్నది కదా! జీవాత్మ - పరమాత్మలు అఖండైక రస స్వరూపులే. ఈ దృశ్యము, (ద్రష్ట+దర్శనములతో సహా) జనించి గతించు ధర్మమును ప్రదర్శించే జగత్తు, అట్టి జగత్తు యొక్క అనుభూతికి కారణమగునది ‘భావము’. ఆ భావము జనించు స్వస్వరూపము-అంతా అఖండైక రసమే! |
అఖండైకరసో మంత్ర అఖండైకరసా క్రియా . అఖండైకరసం జ్ఞానమఖండైకరసం జలం .. 2.. అఖండైకరసా భూమిరఖండైకరసం వియత్ . అఖండైకరసం శాస్త్రమఖండైకరసా త్రయీ .. 3.. |
|
02. అఖండైక రసో మంత్ర। అఖండైక రసా క్రియా। అఖండైక రసం జ్ఞానమ్। అఖండైక రసం జలమ్। 03. అఖండైక రసా భూమిః అఖండైక రసం వియత్। అఖండైక రసగ్ం శాస్త్రమ్। అఖండైక రసా త్రయీ। |
ఇక్కడ బయల్వెడలు మనన రూపమగు ‘మంత్రము’, ఆ మననము నుండి బయల్వెడలు క్రియ, ఆ క్రియ నిర్వర్తించటానికి పాల్గొనుచున్న జ్ఞానము అఖండైక రసరూపమే! అఖండైక తత్త్వమే. పంచభూతములు - భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము - అఖండైక రసమే! శాస్త్రము, ఋక్ - యజో - సామ - త్రివేదములు…అఖండ - ఏక రస స్వరూపములే. |
అఖండైకరసం బ్రహ్మ చాఖండైకరసం వ్రతం . అఖండైకరసో జీవ అఖండైకరసో హ్యజః .. 4.. అఖండైకరసో బ్రహ్మా అఖండైకరసో హరిః . అఖండైకరసో రుద్ర అఖండైకరసోఽస్మ్యహం .. 5.. |
|
04. అఖండైక రసం బ్రహ్మ చ। అఖండైక రసం వ్రతమ్। అఖండైక రసో జీవ। అఖండైక రసో హి అజః। 05. అఖండైక రసో బహ్మా। అఖండైక రసో హరిః। అఖండైక రసో రుద్ర। అఖండైక రసోఽస్మి అహమ్। |
బ్రహ్మము సర్వదా అఖండము, ఏకము అగు రసస్వరూపమే. ఉపాసనారూపమగు వ్రతము, ఆ వ్రతమును ఆశ్రయించిఉండు వ్రతస్తుడు, జీవుడు, జన్మరహితుడగు ప్రజాపతి (అజుడు)…అఖండైక రసమే! సృష్టికి ఉత్పత్తి కారకుడగు బ్రహ్మ, సృష్టిని స్థితింపజేయు హరి, లయింప చేయు రుద్రుడు, ఈ సృష్టికి అనుభవరూపి (Experiencer) అగు (సాక్షినగు) నేను - అఖండ ఏకరస రూపులమే! |
అఖండైకరసో హ్యాత్మా హ్యఖండైకరసో గురుః . అఖండైకరసం లక్ష్యమఖండైకరసం మహః .. 6.. |
|
06. అఖండైక రసో హి ఆత్మా హి। అఖండైక రసో గురుః। అఖండైక రసం లక్ష్యమ్। అఖండైక రసం మహః।। |
జీవాత్మ - పరమాత్మ రూపములను ధరించుచున్న ఆత్మ, ఆ ఆత్మను నిర్వచించి బోధించుచున్న గురువు, ఆ గురువు చూపుచున్న స్వాత్మ స్వరూప భావనాసిద్ధి అనే సంలక్ష్యము, మహత్తు (కేవల బుద్ధితత్త్వము)- ఇవన్నీ అఖండ-ఏక రస స్వరూపమే. |
అఖండైకరసో దేహ అఖండైకరసం మనః . అఖండైకరసం చిత్తమఖండైకరసం సుఖం .. 7.. |
|
07. అఖండైక రసో దేహమ్। అఖండైక రసం మనః। అఖండైక రసం చిత్తమ్। అఖండైక రసగ్ం సుఖమ్।। |
ఈ భౌతిక దేహము, మనస్సు, చిత్తము, సుఖము, దుఃఖము, విద్య… ఇవన్నీ అఖండ ఏకరస పరబ్రహ్మమే! (ఉదా : ఒకానొకని కేవలమగు నటనా కౌసల్యము, పాత్రలో లీనమై నటిస్తున్నప్పటి నటనా కౌసల్యము ఒక్కటే కదా!) |
అఖండైకరసా విద్యా అఖండైకరసోఽవ్యయః . అఖండైకరసం నిత్యమఖండైకరసం పరం .. 8.. |
|
08. అఖండైక రసా విద్యా, అఖండైక రసో అవ్యయః। అఖండైక రసం నిత్యమ్, అఖండైక రసం పరమ్।। |
ఏది అవ్యయము అని, నిత్యము అని, ఇహ పర స్వరూపమని చెప్పబడుచున్నదో - అదంతా కూడా అఖండ బ్రహ్మమే. |
అఖండైకరసం కించిదఖండైకరసం పరం . అఖండైకరసాదన్యన్నాస్తి నాస్తి షడానన .. 9.. |
|
09. అఖండైక రసం కించిత్, అఖండైక రసం పరమ్। అఖండైక రసాత్ అన్యత్ నాస్తి, నాస్తి, షడానన! |
కించిజ్ఞుడు (జీవుడు) సర్వజ్ఞుడు ఈశ్వరుడు (లేక) (పరస్వరూపుడు) అఖండ - ఏక రసాత్మకమగు కేవలాత్మయే. ఓ షడాననా! కుమారస్వామీ! షణ్ముఖా! అఖండైక రసమునకు వేరై ఎక్కడా ఏదీ లేనే లేదయ్యా! - అన్యత్ నాస్తి। నాస్తి। |
అఖండైకరసాన్నాస్తి అఖండైకరసాన్న హి . అఖండైకరసాత్కించిదఖండైకరసాదహం .. 10.. |
|
10. అఖండైక రసాత్ నాస్తి। అఖండైక రసాత్ నహి। అఖండైక రసాత్ కించిత్। అఖండైక రసాత్ అహమ్।। |
అఖండైక రసమునకు వేరైనది ఏదీ లేదు…వేరైన వారు ఎవ్వరూ లేరు. ‘‘అఖండైకరసము’’ అని చెప్పుకొనే ఒకానొక వస్తువు ఏదీ లేదు. కించిత్‌కూ ఏదీ అఖండైక రసమునకు మరొకటై లేదు. ‘నేను’ (అహమ్) - అనునది అఖండైక రస స్వరూపమే! |
అఖండైకరసం స్థూలం సూక్ష్మం చాఖండరూపకం . అఖండైకరసం వేద్యమఖండైకరసో భవాన్ .. 11.. |
|
11. అఖండైక రసం స్థూలం, సూక్ష్మం చ అఖండరూపకమ్। అఖండైక రసం వేద్యం। అఖండైక రసో భవాన్। |
ఇక్కడి స్థూలంగా కనిపించేది, సూక్ష్మంగా అనిపించేది. తెలియబడు చున్నట్లుగా తెలియవచ్చేది, తెలుసుకొంటున్న నీవు-అనునదంతా కూడా ఇదంతా అఖండైక రసమే! ‘నాకు’ తెలియబడుచున్న ‘నీవు’ కూడా అఖండైక రస స్వరూపమే. |
అఖండైకరసం గుహ్యమఖండైకరసాదికం . అఖండైకరసో జ్ఞాతా హ్యఖండైకరసా స్థితిః .. 12.. |
|
12. అఖండైక రసం గుహ్యమ్। అఖండైక రసాదికమ్। (ఇదమ్) అఖండైక రసో జ్ఞాతా, అఖండైక రసా స్థితిః। |
గుప్తంగా (రహస్యంగా) ఉన్నట్టిది, ‘ఇది’గా బట్టబయలై ఉన్నది, ఇదంతా తెలుసుకొంటున్న జ్ఞాత, అజ్ఞాత స్థితి, మనము ఉన్న స్థానము కూడా అఖండైక రసమే! |
అఖండైకరసా మాతా అఖండైకరరసః పితా . అఖండైకరసో భ్రాతా అఖండైకరసః పతిః .. 13.. |
|
13. అఖండైక రసా మాతా। అఖండైక రసః పితా। అఖండైక రసో అహ్రాతా। అఖండైక రసః పతిః।। |
తల్లి - తండ్రి - సోదరులు-భర్త….మొదలైన ‘నా’ ‘నీ’ అనుకొనబడేవారు, వారు - వీరు - అంతా అఖండైక రసమే! |
అఖండైకరసం సూత్రమఖండైకరసో విరాట్ . అఖండైకరసం గాత్రమఖండైకరసం శిరః .. 14.. అఖండైకరసం చాంతరఖండైకరసం బహిః . అఖండైకరసం పూర్ణమఖండైకరసామృతం .. 15.. |
|
14. అఖండైక రసగ్ం సూత్రమ్। అఖండైక రసో విరాట్। అఖండైక రసం గాత్రమ్। అఖండైక రసం శిరః।। 15. అఖండైక రసం చ అంతరః। అఖండైక రసం బహిః। అఖండైక రసం పూర్ణమ్। అఖండైక రస అమృతమ్। |
సూత్రము-విరాట్ సూత్రప్రాయంగా చెప్పబడేది, విస్థారమైన విరాట్టు - వ్యష్ఠిశరీరములు, శిరస్సు, మనో - బుద్ధి - చిత్త - అహంకారములని ‘చతుష్టయము’ చెప్పబడే అంతరంగము, ఇంద్రియములకు బాహ్యమున కనిపించే సర్వ విషయములు - అఖండైక రస చమత్కారమే! ఎద్దానిచే ఇక్కడ కనిపించేదంతా పూర్ణమైయున్నదో, ఏది మార్పు చెందక అమృతమైయున్నదో…అదంతా కూడా అఖండైకరసమే! |
అఖైండైకరసం గోత్రమఖండైకరసం గృహం . అఖండైకరసం గోప్యమఖండైకరసశశీ .. 16.. అఖండైకరసాస్తారా అఖండైకరసో రవిః . అఖండైకరసం క్షేత్రమఖండైకరసా క్షమా .. 17.. అఖండైకరస శాంత అఖండైకరసోఽగుణః . అఖండైకరసః సాక్షీ అఖండైకరసః సుహృత్ .. 18.. |
|
16. అఖండైక రసం గోత్రమ్। అఖండైక రసం గృహం (గ్రహమ్।) అఖండైక రసం గోప్యమ్। అఖండైక రసః శశీ।। 17. అఖండైక రసాః తారా। అఖండైక రసో రవిః। అఖండైక రసం క్షేత్రమ్, అఖండైక రసా క్షమా। 18. అఖండైక రసః శాంతః। అఖండైక రసో గుణః। అఖండైక రసః సాక్షీ। అఖండైక రసః సుహృత్। |
గోత్రము (భూమిక), ఇల్లు, భూమి చుట్టూ తిరుగుచున్న గ్రహముల విన్యాసము, రహస్యంగా ఉన్న గ్రహ శకలములు, చంద్రుడు, నక్షత్రములు (తారలు), సూర్యుడు, విత్తనములు మొలకెత్తు స్థానమగు క్షేత్రము, భూమిలో - జీవులలో కనిపించే ఓర్పు - క్షమాగుణము, శాంతముగా ఉండటము, సత్వ-రజో-తమోగుణముల ప్రదర్శనము, ఆ త్రిగుణములకు ఆవల త్రిగుణాతీతుడగు సాక్షి , సహృదయులగు జనులు-అంతా అఖండైక రసమే! (‘గ్రహమ్’ అనుచోట ‘గృహమ్’ అనునది పాఠ్యాంతరము) |
అఖండైకరసో బంధురఖండైకరసః సఖా . అఖండైకరసో రాజా అఖండైకరసం పురం .. 19.. అఖండైకరసం రాజ్యమఖండైకరసాః ప్రజాః . అఖండైకరసం తారమఖండైకరసో జపః .. 20.. అఖండైకరసం ధ్యానమఖండైకరసం పదం . అఖండైకరసం గ్రాహ్యమఖండైకరసం మహత్ .. 21.. |
|
19. అఖండైక రసో బంధుః అఖండైక రసః సఖా। అఖండైక రసో రాజా। అఖండైక రసమ్ పురమ్। 20. అఖండైక రసగ్ం రాజ్యమ్। అఖండైక రసా ప్రజాః। అఖండైక రసం తారమ్। అఖండైక రసో జపః। 21. అఖండైక రసం ధ్యానమ్। అఖండైక రసం పదమ్। అఖండైక రసం గ్రాహ్యమ్। అఖండైక రసమ్ మహత్।। |
తనకు సహృదయుడు అయినవాడు (తనమంచి కోరుకొనువాడు), బంధువు, స్నేహితుడు, తనను పాలించు-దండించు రాజు, తాను ఉన్న పురము, గ్రామము, తదితరులైన ఆ రాజ్య ప్రజలు తాను కూడా - అఖండైక రసమే. తరింపజేయునట్టిది, జపించబడునది, జపము, ధ్యానింపబడునది, ధ్యానము అట్టి ధ్యానము వలన ప్రాప్తించే పదము, ధ్యానముచే గ్రహించబడు గ్రాహ్యము….అఖండైక రసరూపమే! ‘సర్వ దేహములలోని నేనైన నేను’…అనే మహదత్వము (మహత్‌తత్త్వము = నాలోని ఈ సర్వ జగత్ రూపుడనైన నేను) - అఖండైక రసమే. |
అఖండైకరసం జ్యోతిరఖండైకరసం ధనం . అఖండైకరసం భోజ్యమఖండైకరసం హవిః .. 22.. అఖండైకరసో హోమ అఖండైకరసో జపః . అఖండైకరసం స్వర్గమఖండైకరసః స్వయం .. 23.. |
|
22. అఖండైక రసం జ్యోతిః। అఖండైక రసం ఘనమ్। అఖండైక రసం భోజ్యమ్। అఖండైక రసగ్ం హవిః।। 23. అఖండైక రసో హోమమ్। అఖండైక రసో జపః। అఖండైక రసం స్వర్గమ్। అఖండైక రసః స్వయమ్। |
సర్వులలోని ఆత్మజ్యోతి స్వరూపము, ఘనీభూతమై కనిపించేది, భుజించబడునది, అనుభవించబడేది, దేవతలకు సమర్పించబడే హవిస్సు, హోమ కార్యక్రమము, తపనతో కూడి తలచు రూపమైన జపము, జప-హోమముల ఫలరూపములై సుఖమయంగా కనిపించే స్వర్గలోకము, ఆ ఆయా లోకములను అనుభవముగా పొందుచున్న తానైన తాను - అంతా అఖండైక రసమే! |
అఖండైకరసం సర్వం చిన్మాత్రమితి భావయేత్ . చిన్మాత్రమేవ చిన్మాత్రమఖండైకరసం పరం .. 24.. భవవర్జితచిన్మాత్రం సర్వం చిన్మాత్రమేవ హి . ఇదం చ సర్వం చిన్మాత్రమయం చిన్మయమేవ హి .. 25.. |
|
సర్వం చిన్మాత్రమేవ 24. అఖండైక రసగ్ం సర్వమ్, చిన్మాత్రమితి భావయేత్। చిన్మాత్రమేవ చిన్మాత్రం అఖండైక రసంగ్ం రసమ్। సర్వం చిన్మాత్రమేవ హి 25. భవవర్జిత చిన్మాత్రగ్ం సర్వం చిన్మాత్రమేవ హి। ఇదం చ సర్వం చిన్మాత్ర మయం, చిన్మయమేవ హి। |
‘‘అఖండైక రసమే చిన్మాత్రము’’ - అని భావన చేయబడు గాక. చిత్ = ఎరుక, చిన్మాత్రము = ఎరుగబడేదంతా ‘ఎరుక’ యొక్క రూపమే! ఇదంతా ఈ సర్వము కూడా అఖండైక రసముగాను చిన్మాత్రము (స్వకీయమైన ఎరుకయొక్క సంప్రదర్శనము) గాను, ఎరుగుచున్నవాడు - చిన్మాత్ర స్వరూపుడుగా ఎరిగి ఉండుము. సమస్తము చిన్మాత్ర భావనయే। చిన్మాత్ర స్వరూపమే। ఎరుక + ఎరుగబడేది ఎరుగుచున్నవానిని కూడా కలుపుకొని సమస్తము చిన్మాత్రమే. ఎరుగుచున్న వానినుండి ‘ఎరుక’ అద్వితీయమై బయల్వెడలు తోంది. ఎరుగబడేదంతా ఎరుక యొక్క రూపమే! చిన్మాత్రమే! ఇదంతా కూడా స్వకీయమైన ‘ఎరుక’ అను చిన్మాత్రముతో నిండి ఉన్నది. సర్వము చిన్మయమే! భావవర్జిత చిన్మాత్రం! ఎరుగబడేది లేనప్పుడు కూడా ఎరుక ఉన్నది. ఎరుక లేనప్పుడు కూడా ఎరుగుచున్నవాడు ఉంటాడు. ఈ మూడు ఎల్లప్పుడు ఏక స్వరూపమై ఉంటాయి. |
ఆత్మభావం చ చిన్మాత్రమఖండైకరసం విదుః . సర్వలోకం చ చిన్మాత్రం వత్తా మత్తా చ చిన్మయం .. 26.. |
|
26. ఆత్మభావం చ చిన్మాత్రమ్, అఖండైక రసం విదుః। సర్వలోకం చ చిన్మాత్రం, త్వత్తా మత్తా చ చిన్మయమ్। |
నేను ఇదంతా ఆత్మగా భావిస్తున్నాను’ అనునది కూడా ఎరుక విన్యాసమే! చిన్మాత్రమే! అంఖండైక రసమే! ఈ లోకమంతా ‘స్వకీయ ఎరుక’ రూపమే! ‘నాది - నీది - నేను - నీవు’ అంతా చిన్మాత్రమే! స్వకీయ చిత్ స్వరూపమునుండే అద్వితీయంగా ‘‘నేను-నీవు-ఆతడు’’ మొదలైనవి (అగ్ని నుండి అగ్ని శిఖవలె) బయల్వెడలుచున్నాయి. అన్యమైనదంతా అనన్యమగు చిన్మాత్ర ప్రదర్శనమే. |
ఆకాశో భూర్జలం వాయురగ్నిర్బ్రహ్మా హరిః శివః . యత్కించిద్యన్న కించిచ్చ సర్వం చిన్మాత్రమేవ హి .. 27.. |
|
27. ఆకాశో భూః జలం వాయుః అగ్నిః బ్రహ్మా హరిః శివః యత్ కించిత్, యత్ న కించిత్ చ సర్వం చిన్మాత్రమేవ హి। |
ఆకాశము, భూమి, జలము, వాయువు, అగ్ని (పంచభూతములు), వాటితో జగత్ వస్తువులను ప్రణాళిక చేస్తున్న బ్రహ్మభగవానుడు, సర్వజీవులను పరిపోషిస్తూ పరిరక్షిస్తున్న హరి, సర్వ శుభ - సుఖ - ఆనంద ప్రదుడగు శివుడు - అంతా చిన్మాత్రమే. ఏది కించిత్ (కించిత్జ్ఞుడగు జీవుడు) యో, ఏది సర్వజ్ఞమో (ఈశ్వరుడో) - ఈ రెండూ చిన్మాత్రమే! |
అఖండైకరసం సర్వం యద్యచ్చిన్మాత్రమేవ హి . భూతం భవ్యం భవిష్యచ్చ సర్వం చిన్మాత్రమేవ హి .. 28.. |
|
28. అఖండైక రసగ్ం సర్వం, యద్యత్ చిన్మాత్రమేవ హి। భూతం భవ్యం భవిష్యచ్చ, సర్వం చిన్మాత్రమేవ హి।। |
తెలుసుకొనువాడే ‘తెలియబడునది’ అను రూపమగుచున్నది. (knower - what ever being known) అనబడు రెండూ కూడా- ఏది అగుచున్నదో, అదంతా - అఖండైక రసమగు చిన్మాత్రమే! ఇతః పూర్వము ఉన్నది, ఇప్పుడు ఉన్నది, ఇక ముందు ఉండబోవునది …. సర్వము చిన్మాత్రమే! |
ద్రవ్యం కాలం చ చిన్మాత్రం జ్ఞానం జ్ఞేయం చిదేవ హి . జ్ఞాతా చిన్మాత్రరూపశ్చ సర్వం చిన్మయమేవ హి .. 29.. |
|
29. ద్రవ్యం కాలం చ చిన్మాత్రం, జ్ఞానం జ్ఞేయం చిదేవ హి జ్ఞాతా చిన్మాత్రరూపశ్చ, సర్వం చిన్మయమేవ హి। |
ద్రవ్యము (Matter), కాలము (Time) , జ్ఞానము (knowing), జ్ఞేయము (That being known) చిన్మాత్రమే. జ్ఞాత (knower) కూడా చిన్మాత్రమే! సర్వము సర్వదా చిన్మాత్రమే! |
సంభాషణం చ చిన్మాత్రం యద్యచ్చిన్మాత్రమేవ హి . అసచ్చ సచ్చ చిన్మాత్రమాద్యంతం చిన్మయం సదా .. 30.. |
|
30. సంభాషణం చ చిన్మాత్రం యద్యత్ చిన్మాత్రమేవ హి। అసత్ చ సత్ చ చిన్మాత్రం ఆద్యంతం చిన్మయగ్ం సదా। |
సంభాషించుకొనే ‘భాష’ చిన్మాత్రమే. ఆ భాషతో ఏమేమి చెప్పబడుతోందో, అదీ చిన్మాత్రమే! జాగ్రత్ కల్పన - ఊహ - భావము - స్వప్నకల్పన - భ్రమ’ మొదలైనవాటితో కలిపి అనుభవమగుచున్నదంతా చిన్మాత్రమే! సత్తు అగు ద్రష్ట (కేవల స్వస్వరూపము), అసత్తగు దృశ్యజగత్తు కూడా చిన్మాత్రమే. ఈ జగత్తు యొక్క మొదలు - మధ్య - అంతము కూడా చిన్మాత్రమే! |
ఆదిరంతశ్చ చిన్మాత్రం గురుశిష్యాది చిన్మయం . దృగ్దృశ్యం యది చిన్మాత్రమస్తి చేచ్చిన్మయం సదా .. 31.. |
|
31. ఆది - అంతశ్చ చిన్మాత్రం గురు - శిష్యాది చిన్మయమ్। దృక్ - దృశ్యం యది చిన్మాత్రం అస్తి చేత్, చిన్మయగ్ం సదా।। |
ప్రతి ఒక్క జీవునియొక్క ఆది మధ్య అంతములు చిన్మాత్రమే! ఆత్మ వస్తువును అధ్యయనము చేయు గురు - శిష్య వ్యవహారమంతా చిన్మాత్రమే! చిన్మయానందమే. ‘పరబ్రహ్మమునుండి దృక్-ద్రష్ట-దర్శన - దృశ్యములు వేరుగా ఉన్నాయి’ అని ఎవరికైనా అనిపిస్తే, ఆ ఉన్నట్లుగా ఉన్నదంతా కూడా చిన్మాత్రమే. |
సర్వాశ్చర్యం హి చిన్మాత్రం దేహం చిన్మాత్రమేవ హి . లింగం చ కారణం చైవ చిన్మాత్రాన్న హి విద్యతే .. 32.. |
|
32. సర్వాశ్చర్యం చ చిన్మాత్రం। దేహః చిన్మాత్రమ్ ఏవ హి। లింగం చ కారణం చ ఏవ చిన్మాత్రాత్ నహి విద్యతే। |
దేహములోని సర్వాశ్చర్య స్వరూపుడగు ‘దేహి’, ఆ దేహి కదిలిస్తూ ఉండటం చేత కదలుచూ ఉన్న దేహము, దేహి - దేహము - దృశ్యముల మధ్యగా ప్రవర్తనమగుచున్నట్లుగా విడమర్చి చెప్పబడు లింగశరీరము (సూక్ష్మ శరీరము), కారణ (సంస్కార) శరీరము… ఇవన్నీ చిన్మాత్రమునకు ఏమాత్రము వేరుకాదు. |
అహం త్వం చైవ చిన్మాత్రం మూర్తామూర్తాదిచిన్మయం . పుణ్యం పాపం చ చిన్మాత్రం జీవశ్చిన్మాత్రవిగ్రహః .. 33.. |
|
33. అహం - త్వం చైవ చిన్మాత్రం మూర్త - అమూర్తాది చిన్మయమ్। పుణ్యం పాపం చ చిన్మాత్రం దేహః చిన్మాత్ర విగ్రహః।। |
నేను - నీవు అనునది, మూర్తీభవించినట్టిది (with form - physical body - feelings - etc.,), అమూర్తము (The user of the body feeler) మొదలైనవి, పుణ్య - పాపములు, దేహము యొక్క ఆకార విశేషాలు…ఇవన్నీ చిన్మయమే! |
చిన్మాత్రాన్నాస్తి సంకల్పశ్చిన్మాత్రాన్నాస్తి వేదనం . చిన్మాత్రాన్నాస్తి మంత్రాది చిన్మాత్రాన్నాస్తి దేవతా .. 34.. చిన్మాత్రాన్నాస్తి దిక్పాలాశ్చిన్మాత్రాద్వ్యావహారికం . చిన్మాత్రాత్పరమం బ్రహ్మ చిన్మాత్రాన్నాస్తి కోఽపి హి .. 35.. |
|
34. చిన్మాత్రాత్ నాస్తి సంకల్పః చిన్మాత్రాత్ నాస్తి వేదనమ్। చిన్మాత్రాత్ నాస్తి మంత్రాది, చిన్మాత్రాత్ నాస్తి దేవతా। 35. చిన్మాత్రాత్ నాస్తి దిక్పాలాః చిన్మాత్రాత్ వ్యావహారికమ్। చిన్మాత్రాత్ పరమం బ్రహ్మ। చిన్మాత్రాత్ నాస్తికోఽపి హి।। |
‘చిన్మయము’నకు వేరుగా సంకల్పము (Ideation sending the feeling towards some thing) లేదు. సంకల్పించబడుచున్న ‘విషయము’ అనునదీ లేదు. చిన్మయమునకు వేరై మననము లేదు. ధ్యానము రూపమగు ‘మంత్రము - పూజ - ధ్యాస - భక్తిభావన’ మొదలైనవీ లేవు. ఆ మంత్రముచే సంబోధించబడే ‘దేవత’ లేదు. వ్యవహారమునంతటినీ నడుపుచున్న దిక్పాలకులులేరు. వ్యావహారికము, పరబ్రహ్మము అను ఉభయము చిన్మాత్రమే. చిన్మాత్రమే పరబ్రహ్మము అయి ఉన్నది. చిన్మాత్రమునకు వేరైనదంటూ ఎక్కడా ఏదీ లేదు. |
చిన్మాత్రాన్నాస్తి మాయా చ చిన్మాత్రాన్నాస్తి పూజనం . చిన్మాత్రాన్నాస్తి మంతవ్యం చిన్మాత్రాన్నాస్తి సత్యకం .. 36.. |
|
36. చిన్మాత్రాత్ నాస్తి మాయా చ చిన్మాత్రాత్ నాస్తి పూజనమ్। చిన్మాత్రాత్ నాస్తి మన్తవ్యమ్। చిన్మాత్రాత్ నాస్తి సత్యకమ్।। |
చిన్మాత్రమునకు వేరుగా ‘మాయ’ (కల్పన - భావించుటచే జనించేది - ఊహించుటచే అనుభవమయ్యేది) అనునది లేదు. ఎవ్వరు ఏ నామ - రూపములతో పూజించినా కూడా సర్వజీవుల కేవలమగు చిన్మాత్రమే పూజించబడుచున్నది. చిన్మాత్రమే ప్రతి ఒక్కరి మననము కూడా. మననము చేయబడుచున్నది, మననము చేయువాడు కూడా స్వయముగా చిన్మాత్రమే! |
చిన్మాత్రాన్నాస్తి కోశాది చిన్మాత్రాన్నాస్తి వై వసు . చిన్మాత్రాన్నాస్తి మౌనం చ చిన్మాత్రాన్నస్త్యమౌనకం .. 37.. |
|
37. చిన్మాత్రాత్ నాస్తి కోశాది, చిన్మాత్రాత్ నాస్తి వైవసు చిన్మాత్రాత్ నాస్తి మౌనం చ చిన్మాత్రాత్ నాస్తి అమౌనకమ్। |
చిన్మాత్రమునకు వేరుగా అన్నమయ - ప్రాణమయ - మనోమయ - విజ్ఞానమయ - ఆనందమయ…పంచకోశములు లేవు. అష్ట వసువులు (కిరణ విశేషములు) లేవు. ‘మౌనము’ - చిన్మాత్రమునకు వేరు కాదు. అమౌనము కూడా చిన్మాత్రమే. విరాగము చిన్మాత్రరూపమే! మాట్లాడకుండా ఉండటము, మాట్లాడుచూ ఉండటము - చిన్మాత్రమే. |
చిన్మాత్రాన్నాస్తి వైరాగ్యం సర్వం చిన్మాత్రమేవ హి . యచ్చ యావచ్చ చిన్మాత్రం యచ్చ యావచ్చ దృశ్యతే .. 38.. యచ్చ యావచ్చ దూరస్థం సర్వం చిన్మాత్రమేవ హి . |
|
38. చిన్మాత్రాత్ నాస్తి వైరాగ్యగ్ం, సర్వం చిన్మాత్రమేవ హి యచ్చ యావచ్చ చిన్మాత్రం, యచ్చ యావచ్చ దృశ్యతే।। యచ్చ యావచ్చ దూరస్థగ్ం, సర్వం చిన్మాత్రమేవ హి।। |
సర్వము చిన్మాత్రమే! ఏదైతే ఉన్నదో, ఏదేది కనిపిస్తోందో, ఏది ఏదైతే కళ్ళకు కనబడకుండా సుదూరముగా ఉన్నదో - అట్టి సర్వము చిన్మాత్రమే! సాకారములగు దేహములు, వాటి నిర్మాణమును- కొనసాగటమును నిర్వర్తించే అశరీరులగు దివ్యదేవతా ప్రజ్ఞలు - చిన్మాత్రమే. |
యచ్చ యావచ్చ భూతాది యచ్చ యావచ్చ లక్ష్యతే .. 39.. |
|
39. యచ్చ యావచ్చ భూతాది యచ్చ యావచ్చ లక్ష్యతే, |
ఏఏ అకాశ - వాయు - గాలి - అగ్ని - భూ మొదలైన పంచభూతాదులుగా ఇంద్రియములకు లక్ష్యమై (విషయమై) ఉన్నాయో… అదంతా చిన్మాత్రమే! |
యచ్చ యావచ్చ వేదాంతాః సర్వం చిన్మాత్రమేవ హి . చిన్మాత్రాన్నాస్తి గమనం చిన్మాత్రాన్నాస్తి మోక్షకం .. 40.. |
|
40. యచ్చ యావచ్చ వేదాంతాః। సర్వం చిన్మాత్రమ్ ఏవ హి। చిన్మాత్రాత్ నాస్తి గమనం। చిన్మాత్రాత్ నాస్తి మోక్షకమ్।। |
ఏ ఏ యావత్తు - తెలియబడే అంతటికీ కూడా ఆవల ‘‘తెలుసు కొనుచున్న వాని’’ రూపముగా - ప్రకాశమానమగుచున్నదో … అదంతా చిన్మాత్రమే! చిన్మాత్రమునకు వేరుగా ఈ దేహ - మనో - బుద్ధి - చిత్త - అహంకారముల గమనము లేదు. ‘తెలియబడేదంతా నా తెలివియొక్క ప్రదర్శనమే’ అనబడు ‘‘సర్వబంధ విముక్త రూప, స్వస్వరూప, ఆత్మభావనా మోక్షము’’ అనబడునది కూడా చిన్మాత్రమే! |
చిన్మాత్రాన్నాస్తి లక్ష్యం చ సర్వం చిన్మాత్రమేవ హి . అఖండైకరసం బ్రహ్మ చిన్మాత్రాన్న హి విద్యతే .. 41.. |
|
41. చిన్మాత్రాత్ నాస్తి లక్ష్యం చ సర్వం చిన్మాత్రమేవ హి। అఖండైకరసం బ్రహ్మ చిన్మాత్రాత్ నహి విద్యతే।। |
చిన్మాత్రమునకు వేరైన మరొక లక్ష్యము ఏదీ లేదు. అఖండైక బ్రహ్మ చిన్మాత్రమే ఇదంతా! అద్దానికి వేరైనది ఎక్కడా ఏదీ లేదు. అన్యముగా తెలియబడునదంటూ ఎక్కడా ఏదీ ఏ సమయమందునూ లేదు. అన్యము-అనన్యము, ఏకము-ద్వైతము, సందర్భము - సహజము – సమస్తము అఖండైక రస - బ్రహ్మ చిన్మాత్రమే. అందుకు వేరై ఏదీ లేదు. |
శాస్త్రే మయి త్వయీశే చ హ్యఖండైకరసో భవాన్ . ఇత్యేకరూపతయా యో వా జానాత్యహం త్వితి .. 42.. సకృజ్జ్ఞానేన ముక్తిః స్యాత్సమ్యగ్జ్ఞానే స్వయం గురుః .. 43.. ఇతి ద్వితీయోఽధ్యాయః .. 2.. |
|
42. శాస్త్రే మయి - త్వయీ శే చ హి। అఖండైక రసో భవాన్। ఇతి ఏక రూపక తయా యో వా జానాతి అహం తు।। ఇతి సకృత్ జ్ఞానేన ముక్తస్స్యాత్। సమ్యక్ జ్ఞానే స్వయం గురుః ఇతి।। |
ఓ ప్రియకుమారా! కుమారస్వామి! షణ్ముఖా! శాస్త్రములయందు, నాయందు, నీయందు, ఈశ్వరుని యందు అఖండైక రస స్వరూపడవై నీవు సర్వదా ఉన్నావయ్యా! ఎవ్వరైతే, ‘‘లోకములయందు, ఈ సర్వజీవులయందు, లోకపాలకులయందు అఖండ-ఏక చిదానంద కేవల రూపుడనై సర్వదా నేనే సమముగా ఉనికి కలిగి ఉన్నాను’’ - అను చిన్మాత్ర భావన కలిగి ఉంటున్నాడో…అట్టి అఖండైక సుజ్ఞాని (అట్టి సమ్యక్ జ్ఞానముచే) ముక్తుడు అగుచున్నాడు. ‘సమ్మక్ జ్ఞానేన స్వయంగురుః’। - సమ్యక్ జ్ఞానము సముపార్జించుకొనువాడు స్వయముగా తనకు తానే ‘గురువు’ అగుచున్నాడు. సర్వశ్రేష్ఠుడై ప్రకాశించుచున్నాడు. ‘ఆత్మైవహి గురుః’ ధ్యాని అయి తరిస్తున్నాడు. ‘ఆలోచన’ ఎక్కడి నుండి వస్తోందో, అట్టి ఆత్మయే గురువు - అని గమనించి అట్టి ఆత్మయే తానగుచున్నాడు. (చిన్మాత్రము = ఎరుక + సమన్వయము + అనుభూతి The Knowing + The Giving of Meaning + The Experiencing) |
3వ అధ్యాయము : ఆత్మయొక్క స్వానుభవము
కుమారః పితరమాత్మానుభవమనుబ్రూహీతి పప్రచ్ఛ . స హోవాచ పరః శివః . పరబ్రహ్మస్వరూపోఽహం పరమానందమస్మ్యహం . కేవలం జ్ఞానరూపోఽహం కేవలం పరమోఽస్మ్యహం .. 1.. |
||
01. కుమారః పితరమ్ ‘ఆత్మానుభవమ్’ అనుబ్రూహి-ఇతి పప్రచ్ఛ। సహోవాచ పరశ్శివః పరానుభవము పరబ్రహ్మ స్వరూపోఽహమ్। పరమానందమస్మి అహమ్। కేవలం జ్ఞానరూపోఽహమ్। కేవలం పరమోఽస్మ్యహమ్।। |
కుమారస్వామి: తండ్రీ! పరమశివా! ఆత్మయొక్క స్వానుభవము ఎట్టిదో వివరించి విశదీకరించండి. - నేను జాగ్రత్‌లోనో, స్వప్నములోనో సుషుప్తిలోనో కనిపించే ఇహస్వరూప పరిమితుడను కాను. మరి? ఇహమునకు ఆధారమగు పరబ్రహ్మ స్వరూపుడను. - ఇహపరిమితులు లేనివాడను కాబట్టి పరమానందరూపుడను. - తెలుసుకొనటకు మునుముందే ఉన్నట్టి కేవలజ్ఞానరూపుడను. సర్వమునకు ఆవలగల పరస్వరూపుడను. |
|
కేవలం శాంతరూపోఽహం కేవలం చిన్మయోఽస్మ్యహం . కేవలం నిత్యరూపోఽహం కేవలం శాశ్వతోఽస్మ్యహం .. 2.. |
||
02. కేవలగ్ం శాంత రూపోఽహమ్ కేవలం చిన్మయోఽస్మ్యహమ్। కేవలం నిత్యరూపోఽహం కేవలగ్ం శాశ్వతోఽస్మ్యహమ్। |
- కేవల శాంతస్వరూపుడను. జలంలో తరంగాలు ఉంటాయి. అయితే జలము తరంగాలుగా చెదరటం లేదు కదా! ఆ రీతిగా నిత్య శాంతరూపుడను. ‘ఎరుక’ అను కేవలీ లక్షణముచే చిన్మయస్వరూపుడను. - కేవలము అగు ఆత్మచే నిత్య - శాశ్వత స్వరూపుడను. |
|
కేవలం సత్త్వరూపోఽహమహం త్యక్త్వాహమస్మ్యహం . సర్వహీనస్వరూపోఽహం చిదాకాశమయోఽస్మ్యహం .. 3.. |
||
03. కేవలగ్ం సత్త్వరూపోఽహమ్ అహం త్యక్త్వా, అహమస్మ్యహమ్। సర్వహీన స్వరూపోఽహమ్। చిదాకాశమయోఽస్మ్యహమ్।। |
సత్ - ఉనికి (‘నేను ఉన్నాను కదా’ అనబడు) కేవల సత్త్వరూపుడను! పరిశుద్ధ చిదాకాశమయుడను. ‘నేను అనుకొనుటకు మునుముందే ఉన్న అహమహమ్ స్వరూపుడను. ఏదీ లేనప్పటికీ నేను ఉండియే ఉంటాను కాబట్టి సర్వహీనస్వరూపుడను. చిదాకాశమయుడన |
|
కేవలం తుర్యరూపోఽస్మి తుర్యాతీతోఽస్మి కేవలః . సదా చైతన్యరూపోఽస్మి చిదానందమయోఽస్మ్యహం .. 4.. |
||
04. కేవలం తుర్యరూపోఽస్మి తుర్యాతీతోఽస్మి కేవలః। సదా చైతన్య రూపోఽస్మి, చిదానందమయోఽస్మ్యహమ్।। |
జాగ్రత్ - స్వప్న - సుషుప్తులు నావైయున్న కేవల తుర్య (4వ) రూపుడను. నా తుర్యమునకు నేను సాక్షిని కనుక కేవల తుర్యాతీతుడను కూడా! జాగృత్ - స్వప్న - సుషుప్తులు నాయొక్క చైతన్య ప్రదర్శనములే కాబట్టి,…. సదా చైతన్యరూపుడను. సర్వమునకు నాయొక్క ఎరుకయే మూలపదార్థము కనుక చిదానందమయుడను. |
|
కేవలాకారరూపోఽస్మి శుద్ధరూపోఽస్మ్యహం సదా . కేవలం జ్ఞానరూపోఽస్మి కేవలం ప్రియమస్మ్యహం .. 5.. |
||
05. కేవలాకార రూపోఽస్మి। శుద్ధరూపోఽస్మ్యహగ్ం సదా। కేవలం జ్ఞాన రూపోఽస్మి। కేవలం ప్రియమస్మ్యహమ్।। |
నేను పదార్థములకు - శరీరములకు, మనో - బుద్ధులకు వేరైనట్టి ‘ఆత్మ’ అనబడు కేవలాకారరూపుడను. శుద్ధ పరబ్రహ్మ పరాత్పరుడను! ‘తెలియబడటము’నకు మునుముందే ఉన్న - కేవల జ్ఞానరూపుడను. ప్రియమైన వస్తువులకు మునుముందే గల కేవల ప్రియస్వరూపుడను. |
|
నిర్వికల్పస్వరూపోఽస్మి నిరీహోఽస్మి నిరామయః . సదాఽసంగస్వరూపోఽస్మి నిర్వికారోఽహమవ్యయః .. 6.. |
||
06. నిర్వికల్ప స్వరూపోఽస్మి। నిరీహోఽస్మి నిరామయః। సదానంద స్వరూపోఽస్మి। నిర్వికారోఽహమవ్యయః।। |
సంకల్పించుటకు మునుముందే ఉన్నట్టి నిర్వికల్ప స్వరూపుడను. కల్పనలన్నీ నానుండే! నాచేతనే! కలంతా తనదే అయినవాడు కలలోని కొన్ని వస్తువులను కోరుకోవటం, మరికొన్ని వదలాలనుకోవటం ఉండదు కదా! అట్లాగే నేను నిరీహస్వరూపుడను. (నిర్-ఈహ =కోరికలు లేనివాడను). బంగారముతో ఆభరణము చేస్తున్నప్పటికీ బంగారములో ఆభరణత్వము లేదు కదా! అట్లాగే నేను విషయరహితుడను. నిరామయుడను. |
|
సదైకరసరూపోఽస్మి సదా చిన్మాత్రవిగ్రహః . అపరిచ్ఛిన్నరూపోఽస్మి హ్యఖండానందరూపవాన్ .. 7.. |
||
07. సదైక రస రూపోఽస్మి। సదా చిన్మాత్రవిగ్రహః। అపరిచ్ఛిన్న రూపోఽస్మి, హి అనంతానంద రూపవాన్।। |
సర్వదా సత్ స్వరూపుడను. నాయొక్క ఉనికిచే నేనే ఆనందించు స్వ-సదానంద స్వరూపుడను. ఎల్లప్పుడు కేవల చిత్ (ఎరుగుటకు ముందేగల ఎరుక) - స్వరూపుడను. చిన్మాత్రవిగ్రహుడను. మార్పు చేర్పులు లేనివాడను కాబట్టి అవ్యయుడను. నిర్వికారుడను. కలలో పదిమంది కనిపిస్తూ ఉండగా, ఆ కల తనదైనట్టివాడు పది రూపములుగా అగుచున్నాడా? నాటక రచయిత నాటకములోని అనేక పాత్రలుగా విభాగమగుటలేదుకదా! అట్లాగే నేను అపరిచ్ఛిన్నరూపుడను. నా ఆనందమే అనంతరూపములను దాల్చుచున్నది. అందుచేత అనంతానంద రూపుడను. (నాటక పాత్రలలోని పరస్పర సంబంధములు రచయితను అంటనివిధంగా నేను నిర్వికారుడను). |
|
సత్పరానందరూపోఽస్మి చిత్పరానందమస్మ్యహం . అంతరాంతరరూపోఽహమవాఙ్మనసగోచరః .. 8.. |
||
08. సత్ పరానంద రూపోఽస్మి, చిత్ పరానందమస్మ్యహమ్। అంతరాంతర రూపోఽహమ్, అవాక్ మానస గోచరః। |
సత్తు - పరము - ఆనందము అగు సత్ పరానంద రూపుడను. అట్లాగే ఎరుకచే చిత్ పరానంద రూపుడను. అంతరమునకు కూడా అంతరమైన రూపమును. వాక్కు - మనస్సులకు గోచరము కానివాడను. అగోచరుడను. |
|
ఆత్మానందస్వరూపోఽహం సత్యానందోఽస్మ్యహం సదా . ఆత్మారామస్వరూపోఽస్మి హ్యయమాత్మా సదాశివః .. 9.. |
||
09. ఆత్మానంద స్వరూపోహగ్ం। సత్యానందోఽస్మ్యహగ్ం సదా। ఆత్మారామ స్వరూపోఽస్మి, హి అహమ్ ఆత్మా సదా శివః। |
ఆత్మానందస్వరూపుడను, ఎల్లప్పుడు సత్యానంద స్వరూపుడను. ఈ జగత్తంతా ఆత్మయే. కనుక ఆత్మయందు రమించు ఆత్మానంద స్వరూపుడను. ఎరిగినప్పుడు - ఎరుగనప్పుడు కూడా నేను సదాశివుడనే! ఆత్మారామ స్వరూపుడను. నేనే ఆత్మను! |
|
ఆత్మప్రకాశరూపోఽస్మి హ్యాత్మజ్యోతిరసోఽస్మ్యహం . ఆదిమధ్యాంతహీనోఽస్మి హ్యాకాశసదృశోఽస్మ్యహం .. 10.. |
||
10. ఆత్మప్రకాశ రూపోఽస్మి, హి ఆత్మజ్యోతీ రసోఽస్మ్యహమ్। ఆది మధ్య అంత హీనోఽస్మి, హి ఆకాశ సదృశోఽస్మ్యహమ్।। |
సర్వమును ఆత్మయే ప్రకాశింపజేయుచుండగా, నేను ఆత్మ ప్రకాశరూపుడను. ఒకే అగ్ని తేజస్సు అన్ని దీపములుగా ప్రకాశమానమగు తీరుగా, ఆత్మజ్యోతి రసస్వరూపుడను అయి - సర్వజీవులుగా వెలుగొందుచున్నాను. నాకు ఆది - మధ్య - అంతములు లేవు. ఆకాశమువలే మొదలు - మధ్య - చివరలు లేని నిర్వికారుడను. సమస్తము నానుండే బయల్వెడలుచున్నప్పటికీ వస్తురహితుడను. |
|
నిత్యశుద్ధచిదానందసత్తామాత్రోఽహమవ్యయః . నిత్యబుద్ధవిశుద్ధైకసచ్చిదానందమస్మ్యహం .. 11.. |
||
11. నిత్యశుద్ధ చిదానంద సత్తామాత్రోఽహమ్ అవ్యయః। నిత్యబుద్ధ విశుద్ధైక సత్ చిత్ ఆనందమస్మి అహమ్।। |
ఈశ్వరుడు - జీవుడు - జగత్తు ఎద్దాని నుండి బయల్వెడలి, ఎద్దానిలో ప్రదర్శనమగుచూ, ఎద్దానియందు లయమగుచున్నాయో - అట్టి నిత్య శుద్ధ - చిదానంద (ఎరుక అను అనుభూతి లక్షణముగా గల) - సత్తామాత్ర (ఉనికి స్వభావముగా గల) అవ్యయస్వరూపుడను. బుద్ధి (Intellectual) అను నిత్యబుద్ధ స్వరూపుడను. విశుద్ధుడను. (దోషములు అంట జాలనివాడను) . అందరిలోని బుద్ధి… అను ఏకస్వరూపుడను. సత్ (ఉనికి) - చిత్ (ఎరుక) - ఆనంద (అనుభూతి)… అను కేవలీలక్షణ ప్రదర్శకుడను. | |
నిత్యశేషస్వరూపోఽస్మి సర్వాతీతోఽస్మ్యహం సదా . రూపాతీతస్వరూపోఽస్మి పరమాకాశవిగ్రహః .. 12.. |
||
12. నిత్య శేష స్వరూపోఽస్మి, సర్వాతీతోఽస్మ్యహగ్ం సదా। రూపాతీత స్వరూపోఽస్మి పరమాకాశ విగ్రహః।। |
నిత్యమైనట్టిదిబీ జాగ్రత్ అంతర్గత - స్వప్నాంతర్గత - సుషుప్తి అంతర్గత సర్వ విశేషాలు లయించిపోయినప్పటికీ, అప్పటికీ శేషించుచున్నట్టిదిబీ సర్వమునకు అతీతమైయున్నట్టిది - అగు స్వస్వరూపుడను. నా స్వరూపము రూపరహితము. కదిలే - శరీరమునకు, ఆలోచనలకు రూపమున్నదేమో గాని… కదిలించే దేహికి ఆలోచించేవానికి రూపమెక్కడిది? పరమాకాశమే నా సహజ స్వరూపము. పరమాకాశ విగ్రహుడను. |
|
భూమానందస్వరూపోఽస్మి భాషాహీనోఽస్మ్యహం సదా . సర్వాధిష్ఠానరూపోఽస్మి సర్వదా చిద్ఘనోఽస్మ్యహం .. 13.. |
||
13. భూమానన్ద స్వరూపోఽస్మి। భాషా హీనోఽస్మ్యహగ్ం సదా। సర్వాధిష్ఠాన రూపోఽస్మి। సర్వదా చిద్ఘనోఽస్మ్యహమ్।। |
ఆత్యంతికమగు భూమానంద స్వరూపుడనై ఉన్నాను. అట్టి నా భూమానంద స్వరూపము ఎవ్వరూ భాషించలేరు కాబట్టి ఎల్లప్పుడు భాషాహీన స్వరూపుడను. సర్వ ఆభరణములను బంగారమే అధిష్ఠించియున్న తీరుగా సర్వ దేహములలో దేహులుగా అధిష్ఠించి ఉన్నవాడను. సర్వకాల - సర్వ అవస్థలలోనూ ఘనీభూతమైన చిత్ స్వరూపుడను. సర్వదా చిత్ ఘనరూపుడను. | |
దేహభావవిహీనోఽస్మి చింతాహీనోఽస్మి సర్వదా . చిత్తవృత్తివిహీనోఽహం చిదాత్మైకరసోఽస్మ్యహం .. 14.. |
||
14. దేహ భావ విహీనోఽస్మి చింతా హీనోఽస్మి సర్వదా। చిత్తవృత్తి విహీనోఽహం చిదాత్మైక రసోఽస్మ్యహమ్।। |
దేహముతో కనిపిస్తూనే దేహమునకు అతీతమగు ‘‘కేవల దేహీ స్వరూపుడను’’. భావనలకు - చింతనలకు మునుముందే ఉన్నవాడను - నేనుంటే అవన్నీ ఉంటాయి. అవి లేకపోయినా కూడా నేనుంటాను. అందుచేత దేహభావ విహీనుడను. చింతాహీనుడను. చిత్తవృత్తులు నానుండి బయల్వెడలుచుండవచ్చుగాక! వాటికి అతీతమగువాడను. చిత్తవృత్తి విహీనుడను. చిత్ఆత్మ - ఏక రస స్వరూపుడను. |
|
సర్వదృశ్యవిహీనోఽహం దృగ్రూపోఽస్మ్యహమేవ హి . సర్వదా పూర్ణరూపోఽస్మి నిత్యతృప్తోఽస్మ్యహం సదా .. 15.. |
||
15. సర్వ దృశ్య విహీనోఽహమ్। ‘దృక్’ రూపోఽస్మి అహమేవ హి। సర్వదా పూర్ణ రూపోఽస్మి। నిత్యతృప్తోఽస్మ్యహగ్ం సదా |
ద్రష్ట ఇంద్రియ దృశ్యములను ఆస్వాదిస్తూ ఉండగా, ఆ ద్రష్టయే నాకు దృశ్య వస్తువు అగుచున్నాడు. సర్వ దేహములలోని ద్రష్టత్వమునకు అతీతమైయున్న సర్వ దృశ్య రహిత - దృక్ స్వరూపుడను. అంతేగాని దృశ్యములో విభాగము కాదు. నేను స్వతఃగానే పూర్ణుడను. అంతేగానీ, మరింకొకటేదోవచ్చి, అప్పుడు పూర్ణుడను కాబోవటము లేదు. ఆత్మగా జీవాత్మ - జగత్తులు నా అంతర్గత కల్పితములు. మరింకొకటేదీ నాకూ లభించవలసిన ఆవశ్యకత నాకులేదు. నాకు నేనే నా ఆత్మతత్త్వము చేత నిత్యతృప్తుడనై ఉన్నాను. |
|
అహం బ్రహ్మైవ సర్వం స్యాదహం చైతన్యమేవ హి . అహమేవాహమేవాస్మి భూమాకాశస్వరూపవాన్ .. 16.. |
||
16. అహం బ్రహ్మైవ సర్వగ్ం స్యాత్। అహం చైతన్యమేవ హి। అహమేవ అహమేవాస్మి। భూమాకాశ స్వరూపవాన్।। |
ఇదంతా నాకు నేనుగా వినోదము కొరకై నేనే సృష్టించుకొనుచున్నవాడను. కనుక బ్రహ్మను. సర్వదేహములలోని ‘‘కదల్చు శక్తి ’’ అగు చైతన్య స్వరూపుడను. సర్వ దేహములలో ‘నేను’గా ఉన్నది నేనే! నేనే ఇదంతా అయినట్టి భూమాకాశ స్వరూపుడను. ఏది సర్వత్రా సర్వదా వెలయుచు, ఈ కనబడేదంతా ‘తానే’ అయి ఉన్నదో, అట్టి బ్రహ్మమే నేను. | |
అహమేవ మహానాత్మా హ్యహమేవ పరాత్పరః . అహమన్యవదాభామి హ్యహమేవ శరీరవత్ .. 17.. |
||
17. అహమేవ మహాన్ ఆత్మా హి। అహమేవ పరాత్పరః। అహమ్ అన్యవత్ ఆభామి హి। అహమేవ శరీరవత్।। |
కథలోని పాత్రల స్వభావాలన్నీ ఆ కథా రచయిత కల్పనలే అయి ఉన్న తీరుగా, సర్వదేహులలో ఆత్మగా ప్రకాశించుటచే మహాన్ ఆత్మ స్వరూపుడను. ఈ జీవునికి ఇహ - పరస్వరూపములకు పరమైనట్టి మహాన్ ఆత్ముడనుకాబట్టి పరాత్‌పరుడను. పరాత్ పరుడునగు నేను - నాకు నేనే జీవాత్మ అయి, ‘‘నేను వేరుగా ఉన్నట్లుగా’’ ఆస్వాదిస్తున్న వాడను. శరీరి - శరీరములు నాకు వేరైనట్లు నేనే వాటియందు ప్రతిబింబిస్తున్నాను. |
|
అహం శిష్యవదాభామి హ్యయం లోకత్రయాశ్రయః . అహం కాలత్రయాతీత అహం వేదైరుపాసితః .. 18.. |
||
18. అహగ్ం శిష్యవత్ ఆభామి హి అహం లోకత్రయాశ్రయః। అహం కాలత్రయాతీత అహం వేదైః ఉపాసితః।। |
నాకు నేనే సర్వదా కేవలాత్మ స్వరూపుడనై ఉండి, నా గురించి (ఆత్మ గురించి) నేనే విద్యార్థిని అగుచున్నాను. శిష్యునివలే కూడా ఆభాసిస్తున్నాను. ఈ భూ - భువర్ - సువర్ లోకములు ఆశ్రయించి ఉన్నది మమాత్మనే! నన్నే! ఆత్మనై సర్వదా యథాతథుడను. అందుచేత భూత - వర్తమాన - భవిష్యత్ కాలములకు అతీతుడను. వేదములన్నీ ఉపాసిస్తున్నది, అభివర్ణిస్తున్నది, నిర్వచిస్తున్నదీ నా ఆత్మ స్వరూపమునే! నన్నే? లోకాలు, కాలము, తెలియబడే సమస్తము నన్ను ఆశ్రయించినవై ఉన్నాయి. |
|
అహం శాస్త్రేణ నిర్ణీత అహం చిత్తే వ్యవస్థితః . మత్త్యక్తం నాస్తి కించిద్వా మత్త్యక్తం పృథివీ చ వా .. 19.. |
||
19. అహగ్ం శాస్త్రేణ నిరీణాత। అహం చిత్తే వ్యవస్థితః। మత్ త్యక్తం నాస్తి కించిద్వా, మత్ త్యక్తం పృథివీ చ వా(న)।। |
వేద - పురాణ - ఇతిహాస శాస్త్రములు నన్నే అభివర్ణిస్తూ ఎలుగెత్తి గానం చేస్తున్నాయి. ‘చిత్తము’ అనునది నాయందే వ్యవస్థితమై ఉన్నది. నన్ను ఏదీ కించిత్ కూడా వదలి ఉండటములేదు. ఈ పృథివి నన్ను ఆశ్రయించియే వ్యక్తీకరణమౌతోంది. సమస్తము సర్వదా నన్ను ఆశ్రయించినవై ఉన్నాయి. (అంతేకాని, నేను వాటిని ఆశ్రయించి లేను). |
|
మయాతిరిక్తం యద్యద్వా తత్తన్నాస్తీతి నిశ్చిను . అహం బ్రహ్మాస్మి సిద్ధోఽస్మి నిత్యశుద్ధోఽస్మ్యహం సదా .. 20.. |
||
20. మయా అతిరిక్తం యత్‌యత్ వా, ‘తత్ తత్ నాస్తి’ ఇతి నిశ్చిను। అహం బ్రహ్మాస్మి। సిద్ధోఽస్మి। నిత్యశుద్ధోఽస్మి అహగ్ం సదా।। |
నన్ను అధిగమించి ఏదీ లేదు. అధిగమించి ఏమైనా ఉంటే అది స్వతఃగా లేనిదే! ఎందుకంటే, అంతటా సర్వదా నేనే ఉన్నాను. నేను బ్రహ్మమును. సర్వమును సిద్ధింపజేయువాడను. ఎల్లప్పుడు నిత్యశుద్ధుడను. దృశ్య - దేహ - మనో - చిత్త - బుద్ధి - అహంకారముల దోషములచే కించిత్ కూడా స్పృశించబడనివాడను. దృశ్య మనో చిత్త అహంకారములతో సహా సమస్తము నాచే సిద్ధింపజేయబడుచున్నాయి. | |
నిర్గుణః కేవలాత్మాస్మి నిరాకారోఽస్మ్యహం సదా . కేవలం బ్రహ్మమాత్రోఽస్మి హ్యజరోఽస్మ్యమరోఽస్మ్యహం .. 21.. |
||
21. నిర్గుణః కేవలాత్మాఽస్మి నిరాకారోఽస్మ్యహం సదా। కేవలం బ్రహ్మమాత్రోఽస్మి హి అజరోఽస్మి। అమరోఽస్మ్యహమ్।। |
త్రిగుణములు నన్ను ఆశ్రయించి ఉన్నాయి. వాటికి ఆవల నిర్గుణుడను. కేవలాత్మ స్వరూపుడను. దేహమునకు ఆకారముండవచ్చుగాక! దేహికి ఆకారము ఎక్కడిది? నేను ఆత్మగా సర్వదా నిర్వికారుడను. ఆకార రహితుడను. కేవల పరబ్రహ్మస్వరూపుడను. దేహ ధర్మములైనట్టి బాల్య-యౌవన-వార్ధక్యములు లేనివాడను. పాంచభౌతిక దేహము నన్ను ఆశ్రయించినదై ఉన్నది. అంతేగాని దేహము నాకు ఆధారము కాదు. నిరాధారుడను. అజరుడను. మరణధర్మము లేనివాడను. అమరుడను. |
|
స్వయమేవ స్వయం భామి స్వయమేవ సదాత్మకః . స్వయమేవాత్మని స్వస్థః స్వయమేవ పరా గతిః .. 22.. |
||
22. స్వయమేవ స్వయం భామి। స్వయమేవ సదాత్మకః। స్వయమేవ ఆత్మని స్వస్థం। స్వయమేవ పరాగతిః।। |
నన్ను మరొకటేదీ భాసింపచేయటములేదు. స్వయం ప్రకాశకుడను. నన్ను నేనే ప్రభవింపజేయువాడను, ప్రకటించువాడను, ప్రదర్శించువాడను, ప్రకాశస్వరూపుడను కూడా! నాకు నేనే సర్వదా జీవాత్మ-ఈశ్వరాత్మలతో కూడిన సదాత్ముడను. (సత్ - అనునది మరొకరెవ్వరో నాకు ఇచ్చుచున్నది కాదు). నాకు నేనుగా ఆత్మయందు ఆత్మగా స్వస్థుడను. నేనే సర్వమునకు పరాగతిని. | |
స్వయమేవ స్వయం భంజే స్వయమేవ స్వయం రమే . స్వయమేవ స్వయం జ్యోతిః స్వయమేవ స్వయం మహః .. 23.. |
||
23. స్వయమేవ స్వయం భుంక్తే। స్వయమేవ స్వయగ్ం రమే। స్వయమేవ స్వయం జ్యోతిః। స్వయమేవ స్వయమ్ మహః।। |
నాకై నేనే స్వయముగా జీవాత్మ - జగదనుభవములను కల్పించుకొని ఆస్వాదించుచున్నాను. నాయందు నేనే జీవాత్మనై లోకములను కల్పించుకొని, తదితర జీవాత్మలు నేనే అయి, వాటియందు (స్వప్న సదృశంగా) రమించుచున్నాను. జీవాత్మ - పరమాత్మలు నేనే! వాటిని నాకు నేనే వెలిగించుకొనుచున్న స్వయం జ్యోతి స్వరూపుడను. స్వయముగా నాకు నేనే సర్వాంతర్యామిని. అందుచేత మహత్ స్వరూపుడను. (స్వప్నంలో కనిపించేవాటన్నిటికీ స్వప్న ద్రష్టయే కారణము, అంతర్యామి కదా!) |
|
స్వస్యాత్మని స్వయం రంస్యే స్వాత్మన్యేవ విలోకయే . స్వాత్మన్యేవ సుఖాసీనః స్వాత్మమాత్రావశేషకః .. 24.. |
||
24. స్వస్యాత్మని స్వయగ్ం రంస్యే। స్వాత్మన్యేవ విలోకయే। స్వాత్మన్యేవ సుఖాసీనః। స్వాత్మ మాత్రావశేషకః।। |
నా ఆత్మయందు నేను కల్పించుకొన్న ‘14 లోకములు’ అనే మైదానము నందు నేనే క్రీడించుచున్నాను. నా ఆత్మను నేనే లోక - లోక విషయముల రూపమున మౌనంగా చూస్తూ ఉన్నాను. సర్వదా స్వాత్మయందు నేను సుఖాశీనుడనై ఉన్నాను. సర్వదా ఆత్మగా శేషించుచున్నవాడను. |
|
స్వచైతన్యే స్వయం స్థాస్యే స్వాత్మరాజ్యే సుఖే రమే . స్వాత్మసింహాసనే స్థిత్వా స్వాత్మనోఽన్యన్న చింతయే .. 25.. |
||
25. స్వచైతన్యే స్వయగ్ం స్థాస్యే స్వాత్మ రాజ్యే సుఖే రమే। స్వాత్మసింహాసనే స్థిత్వా స్వాత్మనో అన్యత్ న చింతయే।। |
స్వచైతన్యమునందు స్వయముగా సంస్థాపించుకొనుచున్నవాడనై స్వాత్మరాజ్యమునందు సుఖపూర్వకంగా రమించుచున్నాను. ‘స్వాత్మ’ అనే సింహాసనముపై అధిష్ఠితుడనై… ఇక స్వాత్మకు అన్యమైనది చింతన చేయటము లేదు. స్వాత్మయందే చింతన కలిగి ఉన్నాను. రాజసింహాసనముపై అధిష్ఠించిన రాజాధిరాజు ‘నేను ద్వారపాలకుడి పనులు చేయాలి కదా’ అని అనుకోడు కదా! దృశ్యమంతా నా చింతన స్వరూపమే! (What ever being seen is in my own thought - presentation / visualization) | |
చిద్రూపమాత్రం బ్రహ్మైవ సచ్చిదానందమద్వయం . ఆనందఘన ఏవాహమహం బ్రహ్మాస్మి కేవలం .. 26.. |
||
26. చిద్రూపమాత్రం బ్రహ్మైవ సత్-చిత్-ఆనందమ్ అద్వయమ్। ఆనంద ఘన ఏవ అహమ్, అహమ్ బ్రహ్మాస్మి కేవలమ్।। |
నేను దేహమునా? కాదు. జీవుడనా? కాదు. చిద్రూపమాత్ర (కేవల ఎరుకరూప) పరబ్రహ్మమును! ద్వితీయమనునదే లేనట్టి సత్ - చిత్ ఆనంద స్వరూపుడను. ఘనీభూత ఆనందస్వరూపుడను. నేను కేవలము బ్రహ్మమునే! | |
సర్వదా సర్వశూన్యోఽహం సర్వాత్మానందవానహం . నిత్యానందస్వరూపోఽహమాత్మాకాశోఽస్మి నిత్యదా .. 27.. |
||
27. సర్వదా సర్వ శూన్యోఽహగ్ం సర్వాత్మానందవాన్ అహమ్। నిత్యానంద స్వరూపోఽహమ్ ఆత్మాకాశోఽస్మి నిత్యదా।। |
నాయందు జగత్తులు లేవు. సహజీవులు లేరు. లోకాలులేవు. కలలో చూచినదంతా వాస్తవానికి శూన్యమే కదా! నేను శూన్యమాత్ర స్వరూపుడనే! నాకు భిన్నము అయినదేదీ లేదు. నేను జీవాత్మను కాదు. సర్వాత్మకుడను. సర్వాత్మానంద విగ్రహుడను. నిత్యానంద స్వరూపుడను. ఆత్మాకాశ స్వరూప - అనునిత్యుడను. | |
అహమేవ హృదాకాశశ్చిదాదిత్యస్వరూపవాన్ . ఆత్మనాత్మని తృప్తోఽస్మి హ్యరూపోఽస్మ్యహమవ్యయః .. 28.. |
||
28. అహమేవ హృదాకాశే చిదాదిత్య స్వరూపవాన్। ఆత్మన్ ఆత్మని త్పప్తోఽస్మి, హి అరూపోఽస్మి అహం అవ్యయః।। |
హృదయాకాశములో చిదాదిత్యుడనై (చిత్ అనబడు సూర్యుడను అయి) వెలుగుచున్నది నేనే! ఆత్మచేత ఆత్మగా సదా సంతృప్తుడనై ఉన్నాను! అవ్యయుడను! నామ రూప రహితుడను. సర్వ రూపములు నావే అయి ఉండగా, ఇక నాది ఏ రూపము? సర్వత్రా నా రూపమే కాబట్టి నేను రూపరహితుడను! |
|
ఏకసంఖ్యావిహీనోఽస్మి నిత్యముక్తస్వరూపవాన్ . ఆకాశాదపి సూక్ష్మోఽహమాద్యంతాభావవానహం .. 29.. |
||
29. ఏకసంఖ్యా విహీనోఽస్మి నిత్యముక్త స్వరూపవాన్। ఆకాశాత్ అపి సూక్ష్మోఽహమ్ ఆద్యంత (ఆది-అంత) అభావవాన్ అహమ్। |
నాకు అనేక సంఖ్యా లేదు! ఏకసంఖ్య లేనివాడను! ఒకటి ఉంటే సంఖ్యలన్నీ ఉన్నట్లే. కానీ ‘లేదు’ (’0’స్వరూపుడను). జీవాత్మకు ముక్తి లేదు. పరమాత్మకు బంధమూ లేదు. ‘‘జీవాత్మ’’ - నా భావన మాత్రమే. పరమాత్మ స్వరూపుడను కాబట్టి - నిత్యముక్త స్వరూపుడను. ఆకాశము కంటే కూడా అత్యంత సూక్ష్ముడను, నాకు ఆది లేదు. అంతము లేదు. ఆది - అంతము లేనివాడికి మధ్య ఎక్కడున్నది? |
|
సర్వప్రకాశరూపోఽహం పరావరసుఖోఽస్మ్యహం . సత్తామాత్రస్వరూపోఽహం శుద్ధమోక్షస్వరూపవాన్ .. 30.. |
||
30. సర్వప్రకాశ రూపోఽహమ్ పరాపర సుఖోఽస్మ్యహమ్ సత్తామాత్ర స్వరూపోఽహమ్ శుద్ధ మోక్ష స్వరూపవాన్।। |
సర్వమును ప్రకాశింపజేయువాడను. నేను ప్రకాశింపజేయుటచేతనే ‘తెలియబడుట’ అనునది సిద్ధిస్తోంది. ఇహ - పర (పరాపర) సుఖ స్వరూపుడనై ఉన్నాను. ఆ రెండూ నా సుఖ స్వరూపములే! కేవల సత్తామాత్ర స్వరూపుడను. నా ఉనికి యొక్క ప్రసరణయే ఈ సర్వ లోకముల ఉనికి. నా ఇహస్వరూపము నాకు నాయొక్క ప్రతిబింబము వంటిది. కనుక నా ఇహ స్వరూపమునకు బంధములేదు. పరస్వరూపము గా ఇహమంతా నా కల్పనయే. నా పరస్వరూపమునకు ఇహముచే బంధము కలుగజాలదు. కనుక సర్వదా శుద్ధ మోక్ష స్వరూపుడను. |
|
సత్యానందస్వరూపోఽహం జ్ఞానానందఘనోఽస్మ్యహం . విజ్ఞానమాత్రరూపోఽహం సచ్చిదానందలక్షణః .. 31.. |
||
31. సత్యానంద స్వరూపోఽహమ్ జ్ఞానానంద ఘనోఽస్మ్యహమ్ విజ్ఞానమాత్ర రూపోఽహగ్ం సచ్చిదానంద (సత్-చిత్-ఆనంద) లక్షణః।। |
సత్యానంద స్వరూపుడను. జ్ఞానానంద ఘనుడను. విజ్ఞానమాత్ర రూపుడను. సత్-చిత్-ఆనంద లక్షణుడను. ఘనీభూతమైనట్టి కేవలసత్, కేవలచిత్ (జ్ఞాన), కేవలానంద, కేవల విజ్ఞాన స్వరూపుడను. |
|
బ్రహ్మమాత్రమిదం సర్వం బ్రహ్మణోఽన్యన్న కించన . తదేవాహం సదానందం బ్రహ్మైవాహం సనాతనం .. 32.. |
||
32. బ్రహ్మమాత్ర మిదగ్ం సర్వం। బ్రహ్మణో అన్యత్ న కించన। తదేవాహగ్ం (తత్ ఏవ అహగ్ం) సదానందం, బ్రహ్మైవాహగ్ం (బ్రహ్మైవ అహగ్ం) సనాతనమ్। |
ఓ షణ్ముఖా! ఇదంతా కూడా బ్రహ్మమే అయి ఉన్నదయ్యా! బ్రహ్మమునకు వేరై ఎక్కడా ఏదీ కించిత్ కూడా లేదు! లేదు! ఈ జగత్తుగా కనిపించేదంతా సనాతనము (జగత్తుకు ముందే ఉన్నది) అగు సదానంద పరబ్రహ్మమే! సదానంద-సనాతన సకలాధారమగు బ్రహ్మమే నేను. |
|
త్వమిత్యేతత్తదిత్యేతన్మత్తోఽన్యన్నాస్తి కించన . చిచ్చైతన్యస్వరూపోఽహమహమేవ శివః పరః .. 33.. |
||
33. ‘త్వమ్’ ఇత్యేతత్, ‘తత్’ ఇత్యేతత్, మత్తో అన్యో నాస్తి కించన। చిత్ చైతన్య స్వరూపోఽహమ్, అహమేవ పరశ్శివః।। |
నీవు నేనే అయి ఉన్నావు. నేను నీవే అయి ఉన్నాను. త్వమ్-అహమ్ అనునవి అఖండ తత్ స్వరూపమే! నేనే బ్రహ్మమును. కాబట్టి నాకు వేరైనది ఎక్కడా ఏదీ లేదు. చిత్ చైతన్య స్వరూపుడను. పరశ్శివుడను నేనే! ఇహజ్జీవుడను నేనే! మనమంతా ఏక అఖండ ఆత్మానంద స్వరూపులము. |
|
అతిభావస్వరూపోఽహమహమేవ సుఖాత్మకః . సాక్షివస్తువిహీనత్వాత్సాక్షిత్వం నాస్తి మే సదా .. 34.. |
||
34. అతిభావ స్వరూపోఽహమ్ అహమేవ సుఖాత్మకః। సాక్ష్యవస్తు విహీనత్వాత్ సాక్షిత్వం నాస్తి మే సదా।। |
భావములకు మునుముందటి స్వరూపమును. భావనారాయణుడను. నా నుండి భావాలు వస్తున్నాయి కనుక ముందే ఉన్నాను. జగత్తు కన్నా ముందే ఉన్నవాడిని. సుఖాత్మక స్వరూపుడను. వస్తు రహితమగు సాక్షాత్ స్వరూపుడును. నేను కేవలుడను అవటం చేత దేనికీ నాకు సాక్షిత్వము లేదు. అనగా సర్వమునకు నేను సాక్షినై ఉండగా, నన్ను సాక్షిగా చూస్తున్నది మరొక్కటేదీ లేదు. నేను దేనికీ సాక్షినీ కాదు. | |
కేవలం బ్రహ్మమాత్రత్వాదహమాత్మా సనాతనః . అహమేవాదిశేషోఽహమహం శేషోఽహమేవ హి .. 35.. |
||
కేవలమ్ బ్రహ్మాహమస్మి 35. కేవలం బ్రహ్మ మాత్రత్వాత్ అహమాత్మా సనాతనః। అహమేవ ఆదిశేషోఽహమ్। అహగ్ం శేషో అహమేవ హి।। |
నేను కేవల పరబ్రహ్మమును. ‘కేవల బ్రహ్మము’యే నాయొక్క సహజ - నిత్యస్వరూపము. దేహముల కంటే, భావముల కంటే, ఎరుగట కంటే, అనుభూతుల (Feelings) కంటే, ద్వితీయమైన సర్వము కంటే మునుముందే ఉన్న స్వరూపమును ‘బ్రహ్మము’ అని అంటున్నారు. అందుచేత నేను సనాతనమగు బ్రహ్మమే అయి ఉన్నాను. ద్వితీయమై దృశ్య-దేహ-మనో-బుద్ధి-చిత్త- అహంకారాలు మొదలైనవి ప్రక్కన పెడుతూపోతే, చివ్వరికి శేషించే ఆదిశేషుడను! నేనుకు కూడా నేనైన వాడను. ఆవల శేషించి ఉన్నట్టివాడను. |
|
నామరూపవిముక్తోఽహమహమానందవిగ్రహః . ఇంద్రియాభావరూపోఽహం సర్వభావస్వరూపకః .. 36.. |
||
36. నామరూప విముక్తోఽహమ్ అహమ్ ఆనంద విగ్రహః। ఇంద్రియాభావరూపోఽహగ్ం సర్వ భావ స్వరూపకః।। |
నామ-రూపములు ఈ పాంచ భౌతిక ప్రపంచమగు లోకములకు సంబంధించినవి. నేనో? ఈ జగత్ దృశ్య సమస్తము ఎద్దానిలో ఉన్నదో, అట్టి ఆత్మ స్వరూపుడను. అట్టి ఆత్మ పరబ్రహ్మ స్వరూపుడనగు నాకు నామరూపముల పరిమితత్వమే లేదు. అందుచేత మూర్తీభవించిన ఆనందమును. ఇంద్రియములను ఆభావించనప్పుడు కూడా అమూర్తి రూపుడనై, అభావ స్వరూపుడనై ఉన్నాను. ఇది ఇట్లా ఉండగా… సర్వ భావములను స్వరూపముగా కలవాడిని. భావములకు స్వరూప ప్రదాతను కూడా. | |
బంధముక్తివిహీనోఽహం శాశ్వతానందవిగ్రహః . ఆదిచైతన్యమాత్రోఽహమఖండైకరసోఽస్మ్యహం .. 37.. |
||
37. బంధ - ముక్తి విహీనోఽహగ్ం శాశ్వతానంద విగ్రహః। ఆది చైతన్య మాత్రోఽహమ్ అఖండైక రసోఽస్మ్యహమ్।। |
సందర్భ సత్యమగు జీవాత్మ - జగత్తులు జలంలోని ప్రతిబింబ సూర్యుని వంటివి. సహజము-అప్రమేయము అగు ఆత్మను అగుటచే, నాకు బంధమే లేదు. బంధము లేదు. కనుక, ‘ముక్తి’ కూడా లేదు. బంధముక్తులు లేని కారణంగా కేవలానందరూపుడను. శాశ్వతానంద విగ్రహుడను. సర్వము కల్పనయే! నేనే లీలగా కల్పించువాడను. నా చైతన్య (Active) స్వరూపము నుండే ‘లోకములు - దృశ్యములు’ అను కల్పన బయల్వెడలు తోంది. కనుక ఆదిచైతన్య మాత్రుడను. అఖండ - ఏక రసస్వరూపుడను. |
|
వాఙ్మనోఽగోచరశ్చాహం సర్వత్ర సుఖవానహం . సర్వత్ర పూర్ణరూపోఽహం భూమానందమయోఽస్మ్యహం .. 38.. |
||
38. వాక్ మనో (అ)గోచరశ్చ అహగ్ం। సర్వత్ర సుఖవాన్ అహమ్। సర్వత్ర పూర్ణరూపోఽహం। భూమానంద మయోఽస్మ్యహమ్।। |
ఎందుకు కల్పనను కలిగి ఉన్నాను? ఎందుకు కల్పనను నిర్వర్తిస్తున్నాను? అదంతా నా వినోదము మాత్రమే! అందుచేత - వాక్కుకు, మనస్సుకు గోచరమయ్యేదంతా నా కల్పనయే కాబట్టి - నేనే అయి ఉన్నాను. కానీ, వాక్ మనస్సులకు గోచరము కానట్టి ఆత్మను. అంతా నా సుఖస్వరూపమే! సర్వత్రా సర్వముగా పూర్ణుడనై ప్రదర్శన స్వరూపుడను. భూమానందమయుడను. |
|
సర్వత్ర తృప్తిరూపోఽహం పరామృతరసోఽస్మ్యహం . ఏకమేవాద్వితీయం సద్బ్రహ్మైవాహం న సంశయః .. 39.. |
||
39. సర్వత్ర తృప్తి రూపోఽహం। పరామృత రసోఽస్మ్యహమ్। ఏకమేవాద్వితీయగ్ం సత్ బ్రహ్మైవాహమ్। న సంశయః ।। |
సర్వమునకు పరమైన ఆవల అయి ఉన్న అమృత రసస్వరూపుడను! సర్వత్రా తృప్తి రూపుడనై వెలయుచున్నవాడను! ఏకము - అద్వితీయము అగు సత్ బ్రహ్మమే స్వరూపముగా కలవాడను. ఏకం ఏవ, అద్వితీయ సత్ బ్రహ్మమే నేను! |
|
సర్వశూన్యస్వరూపోఽహం సకలాగమగోచరః . ముక్తోఽహం మోక్షరూపోఽహం నిర్వాణసుఖరూపవాన్ .. 40.. |
||
40. సర్వశూన్య స్వరూపోఽహగ్ం సకలాగమ గోచరః। ముక్తోఽహం। మోక్షరూపోఽహం। నిర్వాణ సుఖ రూపవాన్।। |
ఈ జగత్ దృశ్యమంతా నేనే ఆత్మగా పరిపూర్ణుడనై ఉండటంచేత, ఇదంతా నా స్వరూపమే! కానీ, నాలో ‘జగత్తులు’ అనబడే కల్పన ఏదీ మొదలే లేదు. బంగారు ఆభరణమంతా బంగారమే అయినప్పటికీ బంగారము నందు ఆభరణము ఉన్నట్లా? దర్పణంలో దృశ్యము కనబడినంత మాత్రం చేత దృశ్యవస్తువులు ఉన్నట్లా? కాదు కదా! కనుక సర్వశూన్య స్వరూపుడను. సకల వేదములలో కనిపించే వేదపురుషుడును. ముక్తుడను. మోక్ష స్వరూపుడను. నిర్వాణ సుఖ స్వరూపుడను. |
|
సత్యవిజ్ఞానమాత్రోఽహం సన్మాత్రానందవానహం . తురీయాతీతరూపోఽహం నిర్వికల్పస్వరూపవాన్ .. 41.. |
||
41. సత్య విజ్ఞాన మాత్రోఽహం। సన్మాత్రానందవాన్ అహమ్। తురీయాతీత రూపోఽహం నిర్వికల్ప స్వరూపవాన్।। |
నేను దేహ - మనో - బుద్ధి - దృశ్య - చిత్త - అహంకారులు కాదు! అవి నా కల్పనలు! మరి నేనెవరు? కేవల సత్, కేవల చిత్ , కేవల ఆనంద స్వరూపుడను. అనగా సత్య విజ్ఞానమాత్రుడను. సత్ - మాత్ర ఆనందుడను. అహమ్ తత్। తత్ అహమ్। జాగ్రత్ - స్వప్న - సుషుప్తులలో సంచారాలు చేస్తున్న తురీయుడనైనప్పటికీ, ఆ తురీయము (నాలుగవది)నకు కూడా కర్తను. సాక్షిని. కనుక తురీయా తీతుడను. సర్వ కల్పనల కర్తగా మునుముందే ఉన్నవాడిని కాబట్టి, నిర్వికల్పుడను. |
|
సర్వదా హ్యజరూపోఽహం నీరాగోఽస్మి నిరంజనః . అహం శుద్ధోఽస్మి బుద్ధోఽస్మి నిత్యోఽస్మి ప్రభురస్మ్యహం .. 42.. |
||
42. సర్వదా హి ‘అజ’ రూపోఽహమ్ నీరాగోఽస్మి నిరంజనః। అహగ్ం శుద్ధోఽస్మి। బుద్ధోఽస్మి। నిత్యోఽస్మి। విభురస్మ్యహమ్।। |
దేహముతో పుట్టను. చావను. ఎందుకంటే దేహము నా ‘కల్పనా కళ’లో ఒకానొక ఉపకరణము మాత్రమే! అసలు నాకు పుట్టుకయే లేదు. సర్వదా జన్మరహితుడను. జన్మలకు మునుముందే ఉన్నాను. నా కలలో కనిపించే కొన్ని వస్తువులపట్ల రాగమేముంటుంది? మరికొన్ని వస్తువుల పట్ల ద్వేషమేముంటుంది? కనుక నీరాగుడను. రాగరహితుడను. నిత్య నిర్మలుడను. నిత్యుడను. సర్వనియామక విభుడను. |
|
ఓంకారార్థస్వరూపోఽస్మి నిష్కలంకమయోఽస్మ్యహం . చిదాకారస్వరూపోఽస్మి నాహమస్మి న సోఽస్మ్యహం .. 43.. |
||
43. ‘ఓం’కారార్థ స్వరూపోఽస్మి నిష్కళంకమయోఽస్మ్యహమ్। చిదాకార స్వరూపోఽస్మి నాఽహమస్మి। న సోఽస్మ్యహమ్।। |
కలలో మురికిగుంటలోపడితే..కల తనదైనవాడికి ఆ మురికి అంటుతుందా? లేదు కదా! అట్లాగే నాకు లోకసంబంధమైన ఏ దోషములు అంటవు. కనుక నిత్యశుద్ధుడను. తెలియబడేదానికి మునుముందే ఉన్న కేవలబుద్ధి స్వరూపుడను! నేను నిత్యుడను! అనిత్యమైన వాటికి విభువును! నియామకుడును! సొంతదారుడను! ‘ఓం’ కారము యొక్క అర్థము ఏదై ఉన్నదో, ఆ అర్థమే నా స్వరూపము. కలలోని దోష వస్తువులు కల తనదైన వానిని అంటవు కదా? ఆ విధంగా ‘నిత్య బుద్ధ - సర్వసాక్షి ఆత్మ’నగు నన్ను ఏ దోషములు అంటవు. నిష్కళంక రూపుడను. సర్వదా చిదాకారస్వరూపుడను. నేను ఏదీ అవను. దేనికీ చెందినవాడను కాను. నేను నేనే! నేను ఏదీ అగుటలేదు. ఏదీ నేనుగా అగుటలేదు. | |
న హి కించిత్స్వరూపోఽస్మి నిర్వ్యాపారస్వరూపవాన్ . నిరంశోఽస్మి నిరాభాసో న మనో నేంద్రియోఽస్మ్యహం .. 44.. |
||
44. నహి కించిత్ స్వరూపోఽస్మి నిర్వ్యాపార స్వరూపవాన్। నిరంశోఽస్మి నిరాభాసో, న మనో, నేంద్రియోఽస్మ్యహమ్।। |
బంగారు లోహమునకు స్వతఃగా, ఆకారములేదు. ఆభరణమునకు ఆకారము ఉన్నంత మాత్రంచేత బంగారమునకు ఆకారము ఉన్నట్లు కాదు. అట్లాగే నేను కించిత్ కూడా స్వరూపము కలిగిలేను. నాటక దీపమువలె నిష్క్రియుడను. నేనేమీ చేయటము లేదు. వ్యాపార - వ్యావహారరహితుడను. జీవాత్మ నా అంశయే అయి కూడా నేను అంశ రహితుడు. (ఒకడు కొడుకుగా - అల్లుడుగా అయి ఉండి కూడా అవేమీ తాను కాదు కదా). నేను మనస్సుగాని ఇంద్రియములుగాని అగుటలేదు. |
|
న బుద్ధిర్న వికల్పోఽహం న దేహాదిత్రయోఽస్మ్యహం . న జాగ్రత్స్వప్నరూపోఽహం న సుషుప్తిస్వరూపవాన్ .. 45.. |
||
45. న బుద్ధిః న వికల్పోఽహమ్ న దేహాది త్రయోఽస్మ్యహమ్। న జాగ్రత్ స్వప్న రూపోఽహమ్ న సుషుప్తి స్వరూపవాన్।। |
బుద్ధి యొక్క వికల్పములు నేను కాదు. ఎందుకంటే, బుద్ధి ఎట్లా ఉన్నా నేను నేనుగానే ఉంటాను కదా! నాకు స్థూల-సూక్ష్మ-కారణ దేహములు ఏమీ లేవు. అవన్నీ-నా కలలోని (లేక) నేను నాకొరకై వ్రాస్తున్న కథలోని విశేషములవంటివి. నేను జాగ్రత్ స్వరూపుడను కాదు. స్వప్న స్వరూపుడను కాదు. సుషుప్తిరూపుడను కాదు. అవన్నీ నా స్వీయ కల్పనా సంచార ప్రదేశములే కానీ, నేను కాదు. అవి నా స్వరూపము కాదు. స్వభావము కాదు. |
|
న తాపత్రయరూపోఽహం నేషణాత్రయవానహం . శ్రవణం నాస్తి మే సిద్ధేర్మననం చ చిదాత్మని .. 46.. |
||
46. న తాపత్రయ రూపోఽహమ్ న ఈషణాత్రయవాన్ అహమ్। శ్రవణం నాస్తి మే సిద్ధేః మననం చ చిదాత్మని।। |
ఆధి భౌతిక - ఆధి దైవిక - ఆధి ఆత్మిక (తాపత్రయ) రూపుడను కాదు. దృశ్యము - మనస్సు - బుద్ధిలలో ఉండే ఈషణములు (కోరికలు) నా రూపము కాదు. ‘వినిన తరువాత సిద్ధి పొందుతాను’ అనునది గాని, ‘మననము చేత అప్పుడు చిదాత్మను’ అనునదేదీ నాకు లేదు. ఎందుకంటే నేను ఎల్లప్పుడు సిద్ధించియే ఉన్న చిదాత్మనే! |
|
సజాతీయం న మే కించిద్విజాతీయం న మే క్వచిత్ . స్వగతం చ న మే కించిన్న మే భేదత్రయం క్వచిత్ .. 47.. |
||
47. సజాతీయం న మే కించిత్ విజాతీయం న మే క్వచిత్। స్వగతం చ న మే కించిత్ న మే దేహత్రయం క్వచిత్।। |
నాకు చెందినది గానీ, నాకు చెందనిది గాని ఏదీ లేదు. అంతా నేనే! నేను ఏదీ కాదు. అందుచేత నాకు ‘సజాతీయము’ అయిగానీ, ‘విజాతీయము’ అయిగానీ ఏదీ లేదు. నాయందు వ్యక్తిగతమై కూడా, స్వగతమై కూడా ఏదీ లేదు. నాకు కించిత్ కూడా స్థూల - సూక్ష్మ - కారణదేహాలు (దేహత్రయము) లేవు. |
|
అసత్యం హి మనోరూపమసత్యం బుద్ధిరూపకం . అహంకారమసిద్ధీతి నిత్యోఽహం శాశ్వతో హ్యజః .. 48.. |
||
మమాతిరక్తమ్ అసత్తేవ (అసతోమా సద్గమయ) 48. అసత్యగ్ం హి మనో రూపమ్। అసత్యం బుద్ధి రూపకమ్। అహంకారమ్ అసత్, ‘ధీ’ ఇతి, నిత్యోఽహగ్ం, శాశ్వతో హి అజః।। |
నాకు వేరైనదంతా అసత్తే - లేనిదే. (అసతో మా సత్ గమయ) ఈ కనబడేదంతా నాటకంలోని సంఘటనలవలే, స్వప్నంలోని వస్తు జాలము వలే, కథలోని కోటీశ్వరునివలే స్వతఃగా అసత్యము! సందర్భోచితమై మాత్రమే ‘ఉన్నది’ అగుచున్నది! ఆ విధంగా మనోరూపమై, బుద్ధి రూపమై - ఊహలోని వస్తు ఆకారము వలే ఇదంతా అసత్యము! అహంకారము కూడా అసత్యమని స్వతఃగా ఉన్నది కాదని బుద్ధితో గమనించబడుచున్నది. బుద్ధికి ఆవల సాక్షిగా, జాగ్రత్ స్వప్న సుషుప్తులకు ఆవలగా ఉన్న ‘నేను’ మాత్రమే నిత్యుడను. శాశ్వతుడను. మిగతావన్నీ కల్పనచే ఉంటాయి. కల్పన ఉపసంహరిస్తే - మొత్తం పోతాయి. నేనుంటేనే కల్పన! |
|
దేహత్రయమసద్విద్ధి కాలత్రయమసత్సదా . గుణత్రయమసత్విద్ధి హ్యయం సత్యాత్మకః శుచిః .. 49.. |
||
49. దేహత్రయమ్ అసత్ విద్ధి। కాలత్రయమ్ అసత్ సదా। గుణత్రయమ్ అసత్ విద్ధి హి, అహగ్ం సత్యాత్మకః శుచిః।। |
స్థూల - సూక్ష్మ - కారణ దేహములు (దేహత్రయము), భూత - వర్తమాన - భవిష్యత్ దశలతో కూడిన కాలము…ఈ రెండూ అసత్తే! సత్వ - రజ - తమో త్రిగుణములు కూడా స్వతఃగా లేవు. నాటకీయత వంటి కల్పన ఉంటే అవి ఉంటాయి. కనుక స్వతఃగా అసత్తే! మరి ‘సత్తు’ ఏది! నేనే! నేనే సత్యాత్మకుడను! శుచిని! |
|
శ్రుతం సర్వమసత్ద్విద్ధి వేదం సర్వమసత్సదా . శాస్త్రం సర్వమసత్ద్విద్ధి హ్యహం సత్యచిదాత్మకః .. 50.. |
||
50. శ్రుతగ్ం సర్వం అసత్ విద్ధి వేదగ్ం సర్వం అసత్ సదా। శాస్త్రగ్ం సర్వం అసత్ విద్ధి హి, అహగ్ం సత్యం చిదాత్మకః।। |
వినబడేదంతా అసత్తే. వినుచున్న నేనే సత్యమును. తెలియబడుచున్న ఈ సర్వము అసత్తే! తెలుసుకొనుచున్నవాడనగు నేను మాత్రమే సత్యమును! శాస్త్రములు అన్నీ అసత్తే అయి ఉన్నాయి. అవన్నీ ‘అనుభవము’ నుండి ప్రావిద్భవిస్తున్నాయి. నేనో? అనుభవిని! సత్యమగు చిదాత్మను. అనుభవము లేనప్పుడు కూడా ఉండి ఉన్నవాడను. |
|
మూర్తిత్రయమసద్విద్ధి సర్వభూతమసత్సదా . సర్వతత్త్వమసద్విద్ధి హ్యయం భూమా సదాశివః .. 51.. |
||
51. మూర్తిత్రయమ్ అసత్ విద్ధి। సర్వ భూతమ్ అసత్ సదా। సర్వ తత్త్వమ్ అసత్ విద్ధి హి, అహం భూమా సదాశివః।। |
మూర్తీభవించిన సృష్టి - స్థితి - లయములు, అద్దాని అధిదేవతలగు బ్రహ్మ - విష్ణు-మహేశ్వరులు…జగత్ కల్పనా దృష్టిచే అసత్తే! సృష్టించబడే సర్వ భూతజాలము కూడా అసత్తే! స్వతఃగా ఉనికి లేదు. ‘అది నీవు’ సంబంధించిన శాస్త్ర వివరణలు కూడా అసత్తే! సర్వము కంటే భూమరూపుడను! సదాశివుడను! నేనే అవన్నీ అగుచు, వేరై ఉంటూ, పరమ సత్యమును అయి ఉన్నాను. | |
గురుశిష్యమసద్విద్ధి గురోర్మంత్రమసత్తతః . యద్దృశ్యం తదసద్విద్ధి న మాం విద్ధి తథావిధం .. 52.. |
||
52. గురు శిష్యమ్ అసత్ విద్ధి। గురోః మత్రం అసత్ తతః। యత్ దృశ్యం తత్ అసత్ విద్ధి। న మాం విద్ధి తథా విధమ్।। |
గురువు - శిష్యుడు అనునది అసత్తేనని గమనించు. ఆ ఇరువురి మధ్య సంభాషణ వస్తువగు ఆత్మయే సత్యము. గురువు సూచిస్తున్న మంత్రము - ప్రాణయామ విధులు మొదలైనవి కూడా అసత్తేనని ఎరుగుము. అవి ఉపాసించు నేను సత్యము అని గ్రహించు. ఏది కనులకు కనబడుతోందో, అది అసత్తేనని ఎరిగి ఉండు. ‘నేను’ - మాత్రమే నిత్య సత్తు - అని కూడా ఎరుగము. చూచువాడు సత్యము! చూడబడునదంతా అసత్తే! |
|
యచ్చింత్యం తదసద్విద్ధి యన్న్యాయం తదసత్సదా . యద్ధితం తదసద్విద్ధి న మాం విద్ధి తథావిధం .. 53.. |
||
53. యత్ చిన్త్యమ్ తత్ అసత్ విద్ధి। యత్ న్యాయం తత్ అసత్ సదా। యద్ధితం తత్ అసత్ విద్ధి న మాం విద్ధి తథావిధమ్।। |
ఓ షణ్ముఖా! ఏది చిత్తము (లేక) ఇష్టముగా కనిపిస్తోందో అదంతా అసత్తే! ‘న్యాయము’ [జగత్ - మనో - బుద్ధి - చిత్త అహంకార న్యాయము (లేక) వాటివాటి ధర్మములు]…అసత్తే. ఏది హితము - రుచి అని అనిపిస్తోందో అదంతా అసత్తే అని ఎరుగుము! ‘ఆ చిత్తము - హితము ఎవ్వరిదో అట్టి ‘నేను’ అసత్తుకాదు. సత్తే అని గమనించు. |
|
సర్వాన్ప్రాణానసద్విద్ధి సర్వాన్భోగానసత్త్వితి . దృష్టం శ్రుతమసద్విద్ధి ఓతం ప్రోతమసన్మయం .. 54.. కార్యాకార్యమసద్విద్ధి నష్టం ప్రాప్తమసన్మయం . |
||
54. సర్వాన్ ప్రాణాన్ అసత్ విద్ధి। సర్వాన్ భోగాన్ అసత్ (వ) ఇతి దృష్టగ్ం శ్రుతమ్ అసత్ విద్ధి ఓత ప్రోతమ్ అసత్ మయమ్। కార్య - అకార్యమ్ అసత్ విద్ధి। నష్టం ప్రాప్తం అసత్ మయమ్।। |
పంచ ప్రాణములు, సర్వప్రాణులు, వారి వారి భోగములు (Experiences and enjoyments) అసత్తే! దృష్టము (చూడబడుచున్నది), శ్రుతము (వినబడుచున్నది), వాటియొక్క ఓత ప్రోతములు అసత్తే! వినువాడు చూచువాడు మాత్రమే అఖండమగు సత్తు! (ఓత-ప్రోతము = నిలువుగాను, అడ్డముగాను వ్యాపించి ఉన్నట్టిది). (దృష్టాంతం = వస్త్రములో దారము) ‘ఇది చేశాను. అది చేయలేదు - ఏదో చెయ్యలేకపోయాను…అది లాభించింది. ఇది నష్టమయింది’’ → ఇదంతా అసత్తే! అదంతా అట్లా భావన చేస్తున్న - భావనకు మునుముందే ఉన్న ‘నేను’ మాత్రమే సత్తు. |
|
దుఃఖాదుఃఖమసద్విద్ధి సర్వాసర్వమన్మయం .. 55.. పూర్ణాపూర్ణమసద్విద్ధి ధర్మాధర్మమసన్మయం . లాభాలాభావసద్విద్ధి జయాజయమసన్మయం .. 56.. శబ్దం సర్వమసద్విద్ధి స్పర్శం సర్వమసత్సదా . రూపం సర్వమసద్విద్ధి రసం సర్వమసన్మయం .. 57.. గంధం సర్వమసద్విద్ధి సర్వాజ్ఞానమసన్మయం . అసదేవ సదా సర్వమసదేవ భవోద్భవం .. 58.. |
||
55. దుఃఖ - అదుఃఖమ్ అసత్ విద్ధి। సర్వాసర్వమ్ అసన్మయమ్। పూర్ణాపూర్ణమ్ (పూర్ణ-అపూర్ణమ్) అసత్ విద్ధి। ధర్మాధర్మమ్ (ధర్మ-అధర్మమ్) అసత్‌మయమ్।। 56. లాభాలాభమ్ అసత్ విద్ధి। జయాజయమ్ (జయ-అజయమ్) అసన్మయమ్। శబ్దగ్ం సర్వం అసత్ విద్ధి। స్పర్శగ్ం సర్వం అసత్ సదా।। 57. రూపగ్ం సర్వం అసత్ విద్ధి। రసగ్ం సర్వం అసత్‌మయమ్।। 58. గంధగ్ం సర్వమ్ అసత్ విద్ధి। సర్వ జ్ఞానమ్ అసత్ మయమ్।। అసదేవ సదా సర్వమ్। అసదేవ భవోద్భవమ్।। |
భావన చేస్తున్న - భావనకు మునుముందే ఉన్న ‘నేను’ మాత్రమే సత్తు. ఓ కుమారా! కుమారస్వామీ! దుఃఖము - సుఖము - రెండూ అసత్తేనని ఎరిగి ఉండు! ‘ఇది వేరు! ఈ సర్వము - అదికాదు’…అనునదంతా అసత్తే! అవన్నీ ఆ రీతిగా భావన చేస్తూ, ఆవల ఉన్నట్టి ‘నేను’ మాత్రమే సత్తు. ఇది పూర్ణము-అది అపూర్ణము, ఇది ధర్మము-అది అధర్మము, ఇది లాభము-అది నష్టము, ఇది జయము-అది అపజయము…ఇవన్నీ అసత్తే! సర్వశబ్ద ప్రపంచము అసత్తుగా చూడు! శబ్ద-స్పర్శ-రూప-రస గంధములు, (పంచతన్మాత్రలు), వాటి వాటి విషయములు, ఆ విషయసంబంధమైన జ్ఞానము…అవన్నీ ఎల్లప్పుడు అసత్తే! ఉంటూ ఉన్నది - ఉద్భవించుచూ ఉన్నదీ… (భవ-ఉద్భవములు) అంతా అసత్తే! అవన్నీ ఏ ‘నేను’కు అనుభవములై ఉంటున్నాయో, ‘అట్టి ఆవల గల నేను’ మాత్రమే సత్తు! (నాటకములోని పాత్రల పరస్పర సంబంధ-అనుబంధ-బాంధవ్య- వ్యవహార విశేషములన్నీ అసత్తు. నాటకమునకు వేరైన రచయిత, పాత్రకు వేరైన పాత్రధారుని స్వస్వరూపము మాత్రమే సత్తు) |
|
అసదేవ గుణం సర్వం సన్మాత్రమహమేవ హి . స్వాత్మమంత్రం సదా పశ్యేత్స్వాత్మమంత్రం సదాభ్యసేత్ .. 59.. |
||
59. అసదేవ గుణం సర్వగ్ం। సన్మాత్రమ్ అహమేవ హి। ‘అహమ్ బ్రహ్మాస్మి’ మననమ్ స్వాత్మమంత్రగ్ం సదా పశ్యేత్। స్వాత్మ మంత్రగ్ం సదా అభ్యసేత్।। |
సత్వరజోతమో త్రిగుణ ప్రదర్శనమంతా అసత్తే! అట్టి గుణములకు ఆధారుడు - ప్రదర్శకుడు అగు ‘అహమ్ - నేను’ మాత్రమే సన్మాత్రము (సర్వదా, సర్వత్రా, సర్వమై ఉన్నట్టిది). నేనే బ్రహ్మమును - అను మననమే మంత్రము. ఓ షణ్ముఖా! ‘స్వాత్మ’ను (నేనే ఆత్మను) మననరూప మంత్రమునే దర్శించాలి. ‘ఈ కనబడే జగత్తంతా స్వాత్మయే! నేనే!’… అనునది స్వాత్మమంత్రము. అదియే సర్వదా అభ్యసించవలసినట్టిది. |
|
అహం బ్రహ్మాస్మి మంత్రోఽయం దృశ్యపాపం వినాశయేత్ . అహం బ్రహ్మాస్మి మంత్రోఽయమన్యమంత్రం వినాశయేత్ .. 60.. |
||
60. ‘‘అహమ్ బ్రహ్మాస్మి’’ మంత్రోఽయం దృశ్యపాపం వినాశయేత్। అహమ్ బ్రహ్మాస్మి మంత్రోఽయం అన్య మంత్రం వినాశయేత్।। |
‘అహమ్ బ్రహ్మాస్మి - నేను స్వయముగా బ్రహ్మమే అయి ఉన్నాను’ అను మననమే (మననాత్ త్రాయతే ఇతి) మంత్రః - మంత్రము. అయ్యది- ‘దృశ్యము నాకు వేరు’ అనే దోషము వినాశనము కాగలదు. ‘అహమ్ బ్రహ్మాస్మి’ మంత్ర - మంత్రార్థ మననములచే ‘అన్యము’ అనునది నశించి, ఈ జీవుడు అనన్యమగు ఆత్మస్వరూపుడు కాగలడు. |
|
అహం బ్రహ్మాస్మి మంత్రోఽయం దేహదోషం వినాశయేత్ . అహం బ్రహ్మాస్మి మంత్రోఽయం జన్మపాపం వినాశయేత్ .. 61.. |
||
61. అహమ్ బ్రహ్మాస్మి మంత్రోఽయం దేహదోషం వినాశయేత్। అహమ్ బ్రహ్మాస్మి మంత్రోఽయం జన్మపాపం (పాశం) వినాశయేత్।। |
‘అఖండము - సర్వము అయి ఉన్న బ్రహ్మమే నేను కదా!’ అని అనుకుంటూ (మననము చేస్తూ) ఉండగా ‘నేను దేహపరిమితుడను’…అనే దేహదోషము నశిస్తుంది. ‘నేను జన్మలకు బద్ధుడను’…అనే జన్మపాపము తొలగుతుంది. జన్మల పాశము ముడి విడివడుచున్నది. |
|
అహం బ్రహ్మాస్మి మంత్రోఽయం మృత్యుపాశం వినాశయేత్ . అహం బ్రహ్మాస్మి మంత్రోఽయం ద్వైతదుఃఖం వినాశయేత్ .. 62.. |
||
62. అహంబ్రహ్మాస్మి మంత్రోఽయం మృత్యుపాశం వినాశయేత్। అహం బ్రహ్మాస్మి మంత్రోఽయం ద్వైత దుఃఖం వినాశయేత్।। |
‘అహమ్ బ్రహ్మాస్మి - నేను వస్తుతః స్వతఃగా బ్రహ్మమునే’ అను మననముచే…. మార్పు - చేర్పుల రూపముగల ‘ఏదో పొందుచున్నానే - కోల్పోవుచున్నానే!’ అను భావములతో కూడిన మృత్యుపాశము తెగిపోగలదు. మరణ భయం తొలగుచున్నది. జీవాత్మ వేరు - జగత్తు వేరు, జీవుడు వేరు - శివుడు వేరు….అనే ద్వైత దుఃఖము తొలగిపోతుంది. |
|
అహం బ్రహ్మాస్మి మంత్రోఽయం భేదబుద్ధిం వినాశయేత్ . అహం బ్రహ్మాస్మి మంత్రోఽయం చింతాదుఃఖం వినాశయేత్ .. 63.. |
||
63. అహం బ్రహ్మాస్మి మంత్రోఽయం భేదబుద్ధిం వినాశయేత్। అహం బ్రహ్మాస్మి మంత్రోఽయం చింతా దుఃఖం వినాశయేత్।। |
‘‘ అహం బ్రహ్మాస్మి’’ - మంత్రము యొక్క భావన - ఉపాసనచేత ‘వారు వేరు - వీరు వేరు - మనము వేరు’ అనే భేదబుద్ధి రహితమౌతుంది. సర్వచింతలు, దుఃఖములు (worries and anguish) తుడిచివేయ బడతాయి. |
|
అహం బ్రహ్మాస్మి మంత్రోఽయం బుద్ధివ్యాధిం వినాశయేత్ . అహం బ్రహ్మాస్మి మంత్రోఽయం చిత్తబంధం వినాశయేత్ .. 64.. |
||
64. అహం బ్రహ్మాస్మి మంత్రోఽయం బుద్ధి వ్యాధిం వినాశయేత్। అహం బ్రహ్మాస్మి మంత్రోఽయం చిత్త బంధం వినాశయేత్।। |
‘పరిమిత - సంకుచితమైన అవగాహనలు’ అనే బుద్ధి వ్యాధి శమిస్తోంది. ‘నేను చిత్తముచే బంధింపబడ్డాను’ అనే చిత్తబంధము వీగిపోతుంది. |
|
అహం బ్రహ్మాస్మి మంత్రోఽయం సర్వవ్యాధీన్వినాశయేత్ . అహం బ్రహ్మాస్మి మంత్రోఽయం సర్వశోకం వినాశయేత్ .. 65.. |
||
65. అహం బ్రహ్మాస్మి మంత్రోఽయగ్ం సర్వవ్యాధీన్ వినాశయేత్। అహం బ్రహ్మాస్మి మంత్రోఽయగ్ం సర్వ శోకం వినాశయేత్।। |
‘ఈ శరీరము - ఇద్దాని వ్యాధులు నన్ను ఇట్లా చేసి వేస్తున్నాయి’ అనునవి తరిగిపోతాయి. శోకము (meloncholy) → తోకముడుస్తుంది. |
|
అహం బ్రహ్మాస్మి మంత్రోఽయం కామాదీన్నాశయేత్క్షణాత్ . అహం బ్రహ్మాస్మి మంత్రోఽయం క్రోధశక్తిం వినాశయేత్ .. 66.. |
||
66. అహమ్ బ్రహ్మాస్మి మంత్రోఽయగ్ం కామాదీన్ నాశయేత్ క్షణాత్। అహమ్ బ్రహ్మాస్మి మంత్రోఽయం క్రోథ వృత్తిం వినాశయేత్। |
‘నాకేదో లేదు. ఇంకేదో కావలసిందే’ అనే రూపముగల కామము మొదలైనవి క్షణంలో మటుమాయమౌతాయి. కోపము - క్రోధవృత్తులు నివృత్తి చెందుతాయి. |
|
అహం బ్రహ్మాస్మి మంత్రోఽయం చిత్తవృత్తిం వినాశయేత్ . అహం బ్రహ్మాస్మి మంత్రోఽయం సంకల్పాదీన్వినాశయేత్ .. 67.. |
||
67. అహమ్ బ్రహ్మాస్మి మంత్రోఽయం చిత్త వృత్తిం వినాశయేత్। అహమ్ బ్రహ్మాస్మి మంత్రోఽయగ్ం సంకల్పాదీన్ వినాశయేత్। |
చిత్తము యొక్క వృత్తులు (Avocations) సమసిపోతాయి. ‘నేను సంకల్పబద్ధుడను’ అను సంకల్పము కాస్తా ‘అహమ్ బ్రహ్మాస్మి’ అను సంకల్పమునందు - మహత్ లయము అగుచున్నది. వేడి నీటిలో విడచిన మంచుగడ్డ యొక్క ఆకారము వలే… సంకల్పములన్నీ (చిత్త వృత్తులన్నీ) ఆత్మయందు లయమయి, ఆత్మయే సర్వముగా తెలియబడగలదు. |
|
అహం బ్రహ్మాస్మి మంత్రోఽయం కోటిదోషం వినాశయేత్ . అహం బ్రహ్మాస్మి మంత్రోఽయం సర్వతంత్రం వినాశయేత్ .. 68.. |
||
68. అహమ్ బ్రహ్మాస్మి మంత్రోఽయం కోటి దోషం వినాశయేత్। అహమ్ బ్రహ్మాస్మి మంత్రోఽయగ్ం సర్వ తంత్రం వినాశయేత్। |
‘అహమ్ బ్రహ్మాస్మి’ అను మననరూప మంత్రముచే కోటి దోషములు తొలగిపోతున్నాయి. కామక్రోధ లోభమోహ సంబంధమైన వృత్తులన్నీ నివృత్తి అగుచున్నాయి. సర్వ తంత్రములు, తంతువులు తెగిపోవుచున్నాయి. వ్యతిరిక్త తంత్రములన్నీ అబాధరూపమౌతాయి. |
|
అహం బ్రహ్మాస్మి మంత్రోఽయమాత్మాజ్ఞానం వినాశయేత్ . అహం బ్రహ్మాస్మి మంత్రోఽయమాత్మలోకజయప్రదః .. 69.. |
||
69. అహమ్ బ్రహ్మాస్మి మంత్రోఽయం ఆత్మ - అజ్ఞానం వినాశయేత్। అహమ్ బ్రహ్మాస్మి మంత్రోఽయం ఆత్మ-లోక జయప్రదః। |
ఓ కార్తికేయా! ఆత్మకు సంబంధించి ఏమరపు రూపమగు అజ్ఞానము సుజ్ఞానముచే తొలగించబడుచున్నది. ఆత్మావలోకమునందు నిన్ను విజయునిగా చేస్తున్నది. ఆత్మావలోకమునతో అహమ్-అఖండమగు ఆత్మతో ఏకీభూతమగు చున్నది. | |
అహం బ్రహ్మాస్మి మంత్రోఽయమప్రతర్క్యసుఖప్రదః . అహం బ్రహ్మాస్మి మంత్రోఽయమజడత్వం ప్రయచ్ఛతి .. 70.. |
||
70. అహం బ్రహ్మాస్మి మంత్రోఽయం అప్రతర్క్య సుఖప్రదః। అహం బ్రహ్మాస్మి మంత్రోఽయం అజడత్వం ప్రయచ్ఛతి। |
అహమ్ బ్రహ్మాస్మి మంత్రముచే లౌకిక వాదనలకు, తర్కములకు అందని ఆత్మసుఖమును ప్రసాదిస్తున్నది. అజడత్వమంతా తొలగి, నీవు చైతన్య ఆనందుడవు అగుచున్నావు. |
|
అహం బ్రహ్మాస్మి మంత్రోఽయమనాత్మాసురమర్దనః . అహం బ్రహ్మాస్మి వజ్రోఽయమనాత్మాఖ్యగిరీన్హరేత్ .. 71.. |
||
71. అహం బ్రహ్మాస్మి మంత్రోఽయం అనాత్మ-అసురమర్దనః। అహం బ్రహ్మాస్మి మంత్రోఽయం అనాత్మాఖ్య గిరీన్ హరేత్।। |
అనాత్మత్వమును, అహంకారము - బలము - దర్పము - క్రోధము - పారుష్యము - అజ్ఞానము - ఆభిజాత్యము మొదలైన ఆసురీగుణములు అహమ్ బ్రహ్మాస్మి మననముచే మర్దించివేయబడుచున్నాయి. ‘అనాత్మ’ అనే అవగాహనలతో నిర్మితమైన పెద్దపెద్ద కొండలను హరించి వేయుచున్నది. |
|
అహం బ్రహ్మాస్మి మంత్రోఽయమనాత్మాఖ్యాసురాన్హరేత్ . అహం బ్రహ్మాస్మి మంత్రోఽయం సర్వాంస్తాన్మోక్షయిష్యతి .. 72.. |
||
72. అహం బ్రహ్మాస్మి మంత్రోఽయం అనాత్మాఖ్య అసురాన్ హరేత్। అహం బ్రహ్మాస్మి మంత్రోఽయగ్ం సర్వాగ్ంస్తాన్ మోక్షయిష్యతి।। |
‘నేను బ్రహ్మమునే కదా’ అను మననము ‘అనాత్మ’ అనే రాక్షసుని సంహరించి వేస్తోంది. ‘అహమ్ బ్రహ్మాస్మి’ మంత్రము ఎట్టివానికైనా సరే మోక్షమును ప్రసాదించగలదు. సర్వమనో బంధములనుండి విడిపించివేయగలదు. |
|
అహం బ్రహ్మాస్మి మంత్రోఽయం జ్ఞానానందం ప్రయచ్ఛతి . సప్తకోటిమహామంత్రం జన్మకోటిశతప్రదం .. 73.. |
||
73. ‘అహం బ్రహ్మాస్మి’ మంత్రోఽయం జ్ఞానానందం ప్రయచ్ఛతి। సప్తకోటి మహామత్రం జన్మకోటి శతప్రదమ్।। |
జ్ఞానానందమును ప్రసాదించుచున్నది. ‘అహమ్ బ్రహ్మాస్మి’ మంత్రము 7 కోట్ల (అన్య దేవతా) మహామంత్ర జపముతో సమానము. కోటిజన్మల పుణ్య ఫలమును ప్రసాదించగలదు. |
|
సర్వమంత్రాన్సముత్సృజ్య ఏతం మంత్రం సమభ్యసేత్ . సద్యో మోక్షమవాప్నోతి నాత్ర సందేహమణ్వపి .. 74.. ఇతి తృతీయోధ్యాయః .. 3.. |
||
74. సర్వమంత్రాన్ సముత్సృజ్య ఏతత్ మంత్రగ్ం సదా అభ్యసేత్। సద్యో మోక్షమ్ అవాప్నోతి। నాస్తి సందేహమ్ అణ్వపి। ఇతి।। |
అందుచేత ఓ కుమారస్వామీ! షణ్ముఖా! అన్ని (అన్యదేవతా భావన) మంత్రములను వదలివేసి ‘అహమ్ బ్రహ్మాస్మి’ మంత్రమును ఆశ్రయించు! అట్టి ఆశ్రయముచే ఇప్పటికిప్పుడే కళ్లు తెరచి, వెలుతురు చూచు రీతిగా సద్యోముక్తి పొందగలవు. (సోహ-మ్ - శివోఽహమ్ - అహమిత్యేవ విభావయేత్ భవానీమ్ - ఇత్యాదులు అహమ్ బ్రహ్మాస్మి మంత్రములు). ఇందులో సందేహమే లేదయ్యా. |
|
|
||
4వ అధ్యాయము : జీవన్ముక్త - విదేహముక్తుల లక్షణములు
కుమారః పరమేశ్వరం పప్రచ్ఛ జీవన్ముక్తవిదేహముక్తయోః స్థితిమనుబ్రూహీతి . స హోవాచ పరః శివః . చిదాత్మాహం పరాత్మాహం నిర్గుణోఽహం పరాత్పరః . ఆత్మమాత్రేణ యస్తిష్ఠేత్స జీవన్ముక్త ఉచ్యతే .. 1.. |
|
01. కుమారః పరమేశ్వరమ్ పప్రచ్ఛ : ‘జీవన్ముక్త’ ‘విదేహముక్త’ యోః స్థితిమ్ అనుబ్రూహి - ఇతి। స హోవాచ పరశ్శివః - నిర్గుణోఽహం పరాత్పరః, ఆత్మమాత్రేణ యః తిష్ఠేత్ సః ‘‘జీవన్ముక్త’’ ఉచ్యతే। |
ప్రేమాస్పదుడు, కరుణామయుడు అగు కుమారస్వామి - పిత్రుదేవులు, పరమేశ్వరుడు అగు శివభగవానుని ఇంకా ఇట్లా అభ్యర్థించారు. కుమారస్వామి : హే సర్వాంతర్యామీ! లోకశుభంకరా! శివ భగవాన్! నామీద కరుణతో ‘అహమ్ బ్రహ్మాసి’ మంత్ర ఔన్నత్యము తెలియజేశారు. ఇప్పుడిక జీవన్ముక్తుడు - విదేహముక్తుడు అను వారి స్థితులు ఎట్టివో దయతో విశదీకరించండి. జీవన్ముక్తుడు ఈ విధంగా భావన కలిగి ఉంటాడు. - నేను దృశ్యములో ఒక రూపమునుకాను. కేవల చిత్ స్వరూపముచే ‘చిదాత్మ’ను. - సర్వమునకు పరమైన కేవల సాక్షిని కాబట్టి పరాత్మను. - కేవల ఆత్మను. (ఇట్టి అవగాహన - అనుభూతి కలవాడు జీవన్ముక్తుడు.) |
దేహత్రయాతిరిక్తోఽహం శుద్ధచైతన్యమస్మ్యహం . బ్రహ్మాహమితి యస్యాంతః స జీవనముక్త ఉచ్యతే .. 2.. |
|
02. దేహత్రయ అతిరోక్తోహగ్ం శుద్ధ చైతన్యమస్మ్యహమ్। ‘బహ్మాహమ్’ - ఇతి యస్య అంతః →సః జీవన్ముక్త ఉచ్యతే। |
హిమగిరినందినీ ప్రియతనయా! శ్రీ కార్తికేయా! జీవన్ముక్తుడు ఇంకా కూడా ఇట్లా భావిస్తాడు. ‘‘ఈ స్థూల - సూక్ష్మ - జీవాత్మ దేహములను అధిగమించిన స్వరూపము గలవాడిని! శుద్ధ చైతన్య స్వరూపుడను! నేను జ్ఞాన అజ్ఞానములతో సంబంధం లేకుండా సర్వదా బ్రహ్మమునే’’ అని అంతరమున ఎరిగి ఉంటాడు. |
ఆనందఘనరూపోఽస్మి పరానందఘనోఽస్మ్యహం . యస్య దేహాదికం నాస్తి యస్య బ్రహ్మేతి నిశ్చయః . పరమానందపూర్ణో యః స జీవన్ముక్త ఉచ్యతే .. 3.. |
|
03. ఆనందఘన రూపోఽస్మి పరానందఘనోఽస్మ్యహమ్। యస్య దేహాదికం నాస్తి, యస్య బ్రహ్మేతి నిశ్చయః పరమానందపూర్ణో యః, స జీవన్ముక్త ఉచ్యతే।। |
- ఘనీభూత ఆనంద స్వరూపుడను! - నాకు చెందిన ‘ఇహము’ అంతా జగన్నాటకములోనిది. నేనో? పరానంద ఘన స్వరూపుడను - అని ఎరిగి ఉంటాడు. - ఎవ్వరి దృష్టిలో ఈ దేహము మొదలైనవి మొదలే లేనివై ఉన్నాయో, - ఎవ్వరు ‘ఇదంతా బ్రహ్మమే’ అను నిశ్చయము కలిగి ఉంటారో…, - ఎవ్వడు పరమానందముచే పూర్ణుడై ఉంటాడో….ఆతడే జీవన్ముక్తుడు. |
యస్య కించిదహం నాస్తి చిన్మాత్రేణావతిష్ఠతే . చైతన్యమాత్రో యస్యాంతశ్చిన్మాత్రైకస్వరూపవాన్ .. 4.. |
|
04. యస్య కించిత్ అహమ్ నాస్తి చిన్మాత్రేణ అవతిష్ఠతి, చైతన్యమాత్రం యస్యాంతః చిన్మాత్రైక స్వరూపవాన్।। |
- ఎవ్వనికి ‘నేను కర్తను-నేను భోక్తను’ అనునది కించిత్ కూడా ఉండదో… - ‘అహం’ అనుదానికి మునుముందే ప్రవర్తమానమై - ప్రకాశమానమై యున్న ‘కేవలచిన్మాత్రము’ నందు అవతిష్ఠితుడు అయి ఉంటాడో… - ఎవని నిశ్చయమును అనుసరించి ఇదంతా ఏకమగు చైతన్యమాత్రమో, ‘ఎరుక’ అను చిన్మాత్ర ఏకస్వరూపమో (అంతేగాని అనేకము అయి ఉండలేదో) …, ఆతడే జీవన్ముక్తుడు. |
సర్వత్ర పూర్ణరూపాత్మా సర్వత్రాత్మావశేషకః . ఆనందరతిరవ్యక్తః పరిపూర్ణశ్చిదాత్మకః .. 5.. |
|
05. సర్వత్ర పూర్ణ రూపాత్మా। సర్వత్ర ఆత్మావశేషకః। ఆనంద రతిః అవ్యక్తః పరిపూర్ణః చిదాత్మకః।। |
ఎవ్వడైతే… - సర్వత్రా పూర్ణమై యున్నట్టి రూపము అగు ఆత్మ స్వరూపుడై ఉంటాడో…, - అందరియొక్క ఆత్మయే తానుగా శేషిస్తూ ఆనందించువాడై ఉంటాడో…, - అవ్యక్తమగు ఆత్మయందే ఎల్లప్పుడూ రమిస్తూ ఉంటాడో (దృశ్యము నందు రమించువాడై ఉండడో), - పరిపూర్ణుడు, చిదాత్మకుడు అయి ఉంటాడో…ఆతడే జీవన్ముక్తుడు. |
శుద్ధచైతన్యరూపాత్మా సర్వసంగవివర్జితః . నిత్యానందః ప్రసన్నాత్మా హ్యన్యచింతావివర్జితః .. 6 కించిదస్తిత్వహీనో యః స జీవన్ముక్త ఉచ్యతే . |
|
06. శుద్ధ చైతన్య రూపాత్మా, సర్వసంగ వివర్జితః। నిత్యానందః ప్రసన్నాత్మా హి, అన్య చింతా వివర్జితః। కించిత్ అస్తిత్వ హీనో యః, స జీవన్ముక్త ఉచ్యతే।। |
- ఎవ్వడు శుద్ధ చైతన్య రూపాత్ముడై…సర్వ సంగములను అంతరంగము నందు వివర్జించినవాడై ఉంటాడో…, -ఆత్మాఽహమ్ భావనచే అన్యచింతనలను వదలి ఉంటాడో, తనయందు కించిత్ కూడా ఆత్మకు అన్యమగు ద్వైత విశేషము ఏదీ కలిగి ఉండడో…ఆతడే జీవన్ముక్తుడు! |
న మే చిత్తం న మే బుద్ధిర్నాహంకారో న చేంద్రియం .. 7.. న మే దేహః కదాచిద్వా న మే ప్రాణాదయః క్వచిత్ . న మే మాయా న మే కామో న మే క్రోధః పరోఽస్మ్యహం .. 8.. |
|
న అహంకారో న చ ఇంద్రియమ్। 08. న మే దేహః కదాచిత్ వా, న మే ప్రాణాదయః క్వచిత్। న మే మాయా న మే కామో। న మే క్రోధః పరోఽస్మ్యహమ్। |
జీవన్ముక్తుడు ఈ విధంగా ‘ఆత్మగానము’ చేయుచున్నాడు! - నేను కేవలాత్మస్వరూపుడను. ఆత్మగా నిర్మల స్వరూపుడనై ఉండటము చేత నాకు చిత్తము - బుద్ధి - అహంకారము - ఇంద్రియములు…. (అంతరంగము) భౌతికదేహము మొదలైనవేవీ లేవు. ప్రాణములు మొదలైనవి కూడా లేవు. ఆకాశములో నగరములు ఉండని విధంగా నాకు మాయ, కామ, క్రోధములు, లోభ మోహ మద మాత్సర్యములు మొదలైనవి ఏవీ లేవు. (పాత్ర సంబంధించినవి నటనాకళలో ఉన్నవి ఎట్లా అవుతాయి?) |
న మే కించిదిదం వాపి న మే కించిత్క్వచిజ్జగత్ . న మే దోషో న మే లింగం న మే చక్షుర్న మే మనః .. 9.. |
|
09. న మే కించిత్ ఇదం వాఽపి। న మే కించిత్ క్వచిత్ జగత్। న మే దోషో। న మే లింగం। న మే చక్షుః। న మే మనః।। |
ఇక్కడ ఉన్నది ఏదీ కించిత్ కూడా నేను కలిగి లేను! ఈ జగత్తు కించిత్ కూడా నాకు లేదు! ఆత్మగా నిత్య నిర్మలుడను. దేహధర్మములైనట్టి స్త్రీ - పురుష - జాతి ఇత్యాదులులేవు. చూపులేదు. మనస్సు లేదు. (ఒక వేళ ఉంటే అవి నా కల్పనా చమత్కారాలే! నా అంశ అగు జీవాత్మకు చెందినవి మాత్రమే). |
న మే శ్రోత్రం న మే నాసా న మే జిహ్వా న మే కరః . న మే జాగ్రన్న మే స్వప్నం న మే కారణమణ్వపి .. 10.. న మే తురీయమితి యః స జీవన్ముక్త ఉచ్యతే . |
|
10. న మే శ్రోత్రం। న మే నాసా। న మే జిహ్వా। న మే కరః। న మే జాగ్రత్। న మే స్వప్నం। న మే కారణమ్ అణ్వపి। న మే తురీయమ్-ఇతి యః, స జీవన్ముక్త ఉచ్యతే।। |
నాకు చెవులు - ముక్కు - నాలుక, వినికిడి - వాసన - రుచి….ఈ ఈ ధర్మములు లేవు. ఆత్మనగు నాకు ‘కారణము’ అంటూ ఏదీ లేదు. కారణదేహము లేదు. నాకు జాగ్రత్ - స్వప్న - సుషుప్తులు లేనట్లే…‘తురీయము’ అనబడు 4వది (చతురీయము) కూడా లేదు-అని ఎరిగి ఉండువాడే జీవన్ముక్తుడు. |
ఇదం సర్వం న మే కించిదయం సర్వం న మే క్వచిత్ .. 11.. |
|
11. ఇదగ్ం సర్వం న మే కించిత్, అయగ్ం సర్వం న మే క్వచిత్। |
ఇక్కడ సర్వము గాని, అక్కడ సర్వముగాని, మరొకచోట గాని నాకు ఏదీ లేదు. బంగారు ఆభరణమునకు ‘నా సొంత దారు ఈతడు - ఆతడు’ అనునదేమీ ఉండదు కదా! |
న మే కాలో న మే దేశో న మే వస్తు న మే మతిః . న మే స్నానం న మే సంధ్యా న మే దైవం న మే స్థలం .. 12.. న మే తీర్థం న మే సేవా న మే జ్ఞానం న మే పదం . న మే బంధో న మే జన్మ న మే వాక్యం న మే రవిః .. 13.. |
|
12. న మే కాలో, న మే దేశో, న మే వస్తు న మే మతిః। న మే స్నానం నమే సంధ్యా। న మే దైవం। న మే స్థలమ్। 13. న మే తీర్థం। న మే సేవా। న మే జ్ఞానం। న మే పదమ్। న మే బంధుః। న మే జన్మ। న మే వాక్యం। న మే రవిః। |
నాకు కాలము (Time Factor) లేదు. దేశము (place factor) లేదు. వస్తు స్వభావము లేదు. బుద్ధి పరిమితుడను కాను. ఆత్మగా నాకు స్నానము లేదు! సంధ్య (ఉపాసన) లేదు! దైవము లేదు! స్థలము లేదు! తీర్థము లేదు! తీర్థసేవనము లేదు! జ్ఞానము లేదు! జ్ఞానపదము లేదు! బంధువులేడు! జన్మలేదు! వార్ధక్యము లేదు! రవి (సూర్యుడు)లేడు! నేనే ఉన్నాను! నేనై ఉన్నాను. |
న మే పుణ్యం న మే పాపం న మే కార్యం న మే శుభం . నే మే జీవ ఇతి స్వాత్మా న మే కించిజ్జగత్రయం .. 14.. |
|
14. న మే పుణ్యం। న మే పాపం। న మే కార్యం। న మే శుభమ్। న మే జీవ ఇతి స్వాత్మా, న మే కించిత్ జగత్త్రయమ్।। |
నాకు పుణ్యములేదు. పాపము లేదు! చేయవలసిన కార్యము లేదు! శుభాశుభములు లేవు! జీవుడు లేడు! సర్వదా ‘స్వాత్మ’నగు నాకు మూడు లోకములు లేవు! |
న మే మోక్షో న మే ద్వైతం న మే వేదో న మే విధిః . న మేఽన్తికం న మే దూరం న మే బోధో న మే రహః .. 15.. న మే గురుర్న మే శిష్యో న మే హీనో న చాధికః . న మే బ్రహ్మ న మే విష్ణుర్న మే రుద్రో న చంద్రమాః .. 16.. |
|
15. న మే మోక్షో। న మే ద్వైతం। న మే వేదో। న మే విధిః। న మే అంతికం। న మే దూరం। న మే బోధో। న మే రహః।। 16. న మే గురుః। న మే శిష్యో। న మే హీనో। న చ అధికః। న మే బ్రహ్మా। న మే విష్ణుః। న మే రుద్రో। న చంద్రమాః।। |
సర్వదా ఆత్మ స్వరూపుడనగు నాకు మోక్షము లేదు! ద్వైతము లేదు! వేదము లేదు! విధి లేదు? విధానము లేదు! కట్టుబాట్లు లేవు! నాకు దగ్గిర లేదు. దూరము లేదు. బోధ లేదు. రహస్యము లేదు. ‘గురువు’ లేదు. ‘శిష్యుడు’ లేదు. హీనత్వములేదు. అధికత్వము లేదు. నాకు సృష్టికర్తయగు బ్రహ్మలేడు! విష్ణువు లేరు! రుద్రుడు లేరు. చంద్రుడు లేడు! |
న మే పృథ్వీ న మే తోయం న మే వాయుర్న మే వియత్ . న మే వహ్నిర్న మే గోత్రం న మే లక్ష్యం న మే భవః .. 17.. |
|
17. న మే పృథ్వీ। న మే తోయం। న మే వాయుః। న మే వియత్। న మే వహ్నిః। న మే గోత్రం। న మే లక్ష్యం। న మే భవః।। |
నాకు పృథివి లేదు! జలము లేదు! వాయువు లేదు! ఆకాశము లేదు! అగ్ని లేదు! జాతి, కుల సంబంధమైన గోత్రము లేదు! లక్ష్యము లేదు! పుట్టుక లేదు! చావు లేదు! ఈ జన్మ లేదు! మరుజన్మ లేదు! చోటు లేదు! |
న మే ధ్యాతా న మే ధ్యేయం న మే ధ్యానం న మే మనుః . న మే శీతం న మే చోష్ణం న మే తృష్ణా న మే క్షుధా .. 18.. |
|
18. న మే ధ్యాతా। న మే ధ్యేయమ్। న మే ధ్యానం। న మే మనుః। న మే శీతం। న మే చ ఉష్ణం। న మే తృష్ణా। న మే క్షుధా।। |
నాకు ధ్యానించువాడు-ధ్యానించబడునది ధ్యానము-మంత్రము (Thinker, object of thinking - process of thinking, the culture of thinking)… అనునవేవీ లేవు! నాకు చల్లదనము లేదు. వేడితనము లేదు! ఆకలి - దప్పికలు లేవు! మానవ ధర్మములు, మను ధర్మములు అనునవీ లేవు. |
న మే మిత్రం న మే శత్రుర్న మే మోహో న మే జయః . న మే పూర్వం న మే పశ్చాన్న మే చోర్ధ్వం న మే దిశః .. 19.. |
|
19. న మే మిత్రం। న మే శత్రుః। న మే మోహో। న మే జయః। న మే పూర్వమ్ న మే పశ్చాత్। న మే చ ఊర్థ్వమ్। న మే దిశః।। |
- కేవల ఆత్మస్వరూపుడను అగు నాకు మిత్రుడు లేడు! శత్రువు లేడు! - అయినవాడు లేడు! కానివాడు లేడు! - మోహము (Illusion) లేదు! జయాపజయములులేవు! - నాకు ‘ఇంతకుముందు’ అనునది లేదు. ‘ఇకముందు’ అనునదీ లేదు. తూర్పు - పడమర - ఊర్థ్వము - తదితర దిశలు లేవు! |
న మే వక్తవ్యమల్పం వా న మే శ్రోతవ్యమణ్వపి . న మే గంతవ్యమీషద్వా న మే ధ్యాతవ్యమణ్వపి .. 20.. |
|
20. న మే వక్తవ్యమ్ అల్పం వా। న మే శ్రోతవ్యమ్ అణ్వపి। న మే గంతవ్యమ్ ఈషద్వాత్। న మే ధ్యాతవ్యమ్ అణ్వపి। |
నాకు చెప్పవలసినది కొంచము కూడా లేదు! వినవలసినది అణువంత కూడా లేదు! చూడవలసినది ఈషణ్మాత్రము లేదు! ధ్యానించవలసినది అణుమాత్రం కూడా లేదు! |
న మే భోక్తవ్యమీషద్వా న మే స్మర్తవ్యమణ్వపి . న మే భోగో న మే రాగో న మే యాగో న మే లయః .. 21.. న మే మౌర్ఖ్యం న మే శాంతం న మే బంధో న మే ప్రియం . న మే మోదః ప్రమోదో వా న మే స్థూలం న మే కృశం .. 22.. |
|
21. న మే భోక్తవ్యమ్ ఈషద్వాత్। న మే స్మర్తవ్యమ్ అణ్వపి। న మే భోగో। న మే రాగో। న మే యోగో। న మే లయః।। 22. న మే మౌర్ఖ్యం। న మే శాంతం। న మే బంధో న మే ప్రియమ్। న మే మోదః ప్రమోదో వా। న మే స్థూలం। న మే కృశమ్। |
భోక్తవ్యము (అనుభవించవలసినది) కానీ, స్మరించవలసినదికానీ కూడా ఈషణ్మాత్రము - అణువంత కూడా లేవు! నాకు భోగము లేదు. రాగము లేదు. యోగము లేదు. లయము లేదు. నాకు మూర్ఖత్వము లేదు. శాంతత్వము లేదు. బంధము లేదు. ప్రియత్వము లేదు. మోదము చెందవలసినది లేదు. ప్రమోదము పొందుచున్నది లేదు. స్థూలమైనది లేదు. కృశము (సూక్ష్మము లేదు). |
న మే దీర్ఘం న మే హ్రస్వం న మే వృద్ధిర్న మే క్షయః . అధ్యారోపోఽపవాదో వా న మే చైకం న మే బహు .. 23.. |
|
23. న మే దీర్ఘం। న మే హ్రస్వం। న మే వృద్ధిః। న మే క్షయః। అధ్యారోప అపవాదోవా, న మే చ ఏకం। న మే బహు।। |
నాకు దీర్ఘములేదు. హ్రస్వము (చిన్నది - పొట్టిది) లేదు. వృద్ధి లేదు. క్షయము లేదు. అధ్యారోపవాదము లేదు. అపవాదము లేదు. ఏకము లేదు. బహులము లేదు. |
న మే ఆంధ్యం న మే మాంద్యం న మే పట్విదమణ్వపి . న మే మాంసం న మే రక్తం న మే మేదో న మే హ్యసృక్ .. 24.. న మే మజ్జా న మేఽస్థిర్వా న మే త్వగ్ధాతు సప్తకం . న మే శుక్లం న మే రక్తం న మే నీలం నమే పృథక్ .. 25.. న మే తాపో న మే లాభో ముఖ్యం గౌణం న మే క్వచిత్ . న మే భ్రాంతిర్న మే స్థైర్యం న మే గుహ్యం న మే కులం .. 26.. |
|
24. న మే ఆంధ్యం। న మే మాంద్యం। న మే పట్విదమ్ అణ్వపి। న మే మాగ్ంసం। న మే రక్తం। న మే మేదో। న మే హి అసృక్। 25. న మే మజ్జా। న మే అస్తి అస్థి। న మే త్వక్, ధాతు సప్తకమ్। న మే శుక్లం। న మే రక్తం। న మే నీలం। న మే పృథక్। 26. న మే తాపో। న మే లాభో। న ముఖ్యం, గౌణం। న మే క్వచిత్। న మే అహ్రాంతిః। న మే స్థైర్యం। న మే గుహ్యం। న మే కులమ్।। |
నాకు అంధత్వము లేదు. మాంద్యత్వము లేదు. పటుత్వము (సమర్థత) లేదు. ఇవన్నీ నాకు అణువంత కూడా లేదు! నాకు మాంసము లేదు - రక్తము లేదు. మేదస్సు లేదు. క్రొవ్వు లేదు. మజ్జ లేదు. బొమికలు లేవు! చర్మము లేదు! సప్త ధాతువులులేవు! తెలుపు - ఎరుపు - నీలము రంగులుగానీ, తదితర రంగులుగానీ లేవు! నాకు తాపము లేదు! లాభము లేదు! ముఖ్యమైనది - ముఖ్యము కానిది అంటూ ఏదీ లేదు! అహ్రాంతి లేదు! స్థైర్యము లేదు! రహస్యము లేదు! కులము, జాతి, వర్ణ విభాగములు ఇవేవీ నాకు లేవు. |
న మే త్యాజ్యం న మే గ్రాహ్యం న మే హాస్యం న మే నయః . న మే వృత్తం న మే గ్లానిర్న మే శోష్యం న మే సుఖం .. 27.. |
|
27. న మే త్యాజ్యం। న మే గ్రాహ్యం। న మే హాస్యం। న మే నయః। న మే వ్రతం। న మే గ్లానిః। న మే శోచ్యం। న మే సుఖమ్।।। |
నాకు త్యజించవలసినది లేదు! గ్రహించవలసినది అంతకన్నా లేదు! హసించవలసిన (నవ్వవలసిన), హాస్యము లేదు! నయము లేదు! భవములేదు! వ్రతములేదు, గ్లాని (త్రోవతప్పుట) లేదు! శోచనము చేయవలసినది (దుఃఖము) లేదు! సుఖము లేదు! |
న మే జ్ఞాతా న మే జ్ఞానం న మే జ్ఞేయం న మే స్వయం . న మే తుభ్యం నమే మహ్యం న మే త్వం చ న మే త్వహం .. 28.. |
|
28. న మే జ్ఞాతా। న మే జ్ఞానం। న మే జ్ఞేయం। న మే స్వయమ్। న మే తుభ్యం। న మే మహ్యం। న మే త్వం చ। న మే త్వహమ్।। |
నాకు జ్ఞాత (ఎరుగుచున్నవాడు) లేడు! జ్ఞానము లేదు! జ్ఞేయము (తెలుసుకోవలసినది) లేదు! నీకు - నాకు, నీది - నాది అనునవేవీ లేవు! |
న మే జరా న మే బాల్యం న మే యౌవనమణ్వపి . అహం బ్రహ్మాస్మ్యహం బ్రహ్మాస్మ్యహం బ్రహ్మేతి నిశ్చయః .. 29.. చిదహం చిదహం చేతి స జీవన్ముక్త ఉచ్యతే . |
|
29. న మే జరా। న మే బాల్యం। న మే యౌవనమ్ అణ్వపి అహమ్ బ్రహ్మాస్మి। అహమ్ బ్రహ్మాస్మి। అహం బ్రహ్మేతి నిశ్చయః।। చిదహం చిదహం చేతి స ‘జీవన్ముక్త’ ఉచ్యతే।। |
నాకు అణువంత కూడా బాల్య-యౌవన-వార్ధక్య-మరణములు లేవు! నేనే బ్రహ్మమును! నేను బ్రహ్మమును. బ్రహ్మము అనగా నా సహజ స్వరూపమే! నేనే! నేను బ్రహ్మమే - అనునది సునిశ్చయము. నేను చిత్‌రూపుడను. నేను చిత్‌రూపుడను. ఎరుగువాడిని నేనే! ఎరుగబడునదంతా కూడా నేనే… అని ఎరిగినవాడే ‘జీవన్ముక్తుడు’ అని చెప్పబడుచున్నాడు. |
బ్రహ్మైవాహం చిదేవాహం పరో వాహం న సంశయః .. 30.. |
|
30. బ్రహ్మైవాహమ్। చిదేవాహమ్। పరోవాహమ్ - న సంశయః। |
ఓ షణ్ముఖా! జీవన్ముక్తిని గురించి ఇంకా విను. నేనే బ్రహ్మమును! నేను చిత్ స్వరూపుడను! ఈ సర్వమునకు పరమై ఉన్నవాడను! ఇందులో సంశయమే లేదు! |
స్వయమేవ స్వయం హంసః స్వయమేవ స్వయం స్థితః . స్వయమేవ స్వయం పశ్యేత్స్వాత్మరాజ్యే సుఖం వసేత్ .. 31.. స్వాత్మానందం స్వయం భోక్ష్యేత్స జీవన్ముక్త ఉచ్యతే . |
|
31. స్వయమేవ స్వయం హంసః। స్వయమేవ స్వయం స్థితః। స్వయమేవ స్వయం పశ్యేత్। స్వాత్మరాజ్యే సుఖం వసేత్।। స్వాత్మానందగ్ం స్వయం భుంక్తే, స జీవన్ముక్త ఉచ్యతే।। |
‘‘నాకు నేనే స్వయముగా ‘హంస’ను, ‘సోఽహమ్’! నాయందు నేనే స్వయముగా సంస్థితుడనై ఉన్నాను! నాకు నేనే నా ఆత్మనే సర్వత్రా దర్శించుచున్నాను! స్వాత్మ రాజ్యమునందు సర్వదా సుఖవంతుడనై ఉన్నాను! స్వాత్మానంద స్వరూపుడనై సర్వము జగత్ దృశ్యముగా… నన్ను నేనే ఆస్వాదించుచున్నాను!’’ - అను అవగాహన కలవాడే జీవన్ముక్తుడు. |
స్వయమేవైకవీరోఽగ్రే స్వయమేవ ప్రభుః స్మృతః .. 32.. |
|
32. స్వయమేవ ఏక వీరో అగ్రే। స్వయమేవ ‘ప్రభుః’ స్మృతః। స్వస్వరూపే స్వయం స్వష్స్యేత్, స జీవన్ముక్త ఉచ్యతే।। |
‘‘నేనే స్వయముగా సర్వ అనుభవములకు మునుముందే ఉండి, స్వయముగా వీరాగ్రేశ్వరుడనై, ప్రభువునై, స్వస్వరూపమునందు స్వయముగా కించిత్ నిద్రా-ముద్ర వహించుచున్నవాడను’’- అని ఎరిగియున్నవాడు జీవన్ముక్తుడు. |
బ్రహ్మభూతః ప్రశాంతాత్మా బ్రహ్మానందమయః సుఖీ . స్వచ్ఛరూపో మహామౌనీ వైదేహీ ముక్త ఏవ సః .. 33.. |
|
విదేహముక్తుడు - వైదేహీముక్త ఏవ సః। 33. బ్రహ్మభూతః ప్రశాంతాత్మా, బ్రహ్మానందమయః సుఖీ, స్వచ్ఛరూపో మహామౌనీ, వైదేహీముక్త ఏవ సః।। |
వైదేహీ (విదేహ) ముక్తుడు బ్రహ్మమే తన స్వరూపముగా కలవాడై, బ్రహ్మభూతుడై, పరమ ప్రశాంతాత్ముడై, బ్రహ్మానందమయుడై, స్వచ్ఛరూపుడై, ఆత్మసుఖమును ఆస్వాదిస్తూ, సర్వ విశేషములపట్ల మహామౌనము అవధరించి ఉన్నవాడు… → విదేహముక్తుడు! |
సర్వాత్మా సమరూపాత్మా శుద్ధాత్మా త్వహముత్థితః . ఏకవర్జిత ఏకాత్మా సర్వాత్మా స్వాత్మమాత్రకః .. 34.. |
|
34. సర్వాత్మా సమరూపాత్మా శుద్ధాత్మా తు, అహమ్ ఉత్థితః, ఏకవర్జిత ఏకాత్మా సర్వాత్మా స్వాత్మ మాత్రకః।। |
‘‘సర్వజీవులలో ఆత్మరూపుడై వెలుగొందు వాడను! సర్వులలో సమ స్వరూపుడుగా నన్ను నేను దర్శించువాడను! శుద్ధాత్మ స్వరూపుడనై అంతటా, అందరిలో, అందరుగా నేనే ఉదయిస్తున్నాను!’’ → అని విదేహముక్తుడు అనుభూతుడై ఉంటున్నాడు. |
అజాత్మా చామృతాత్మాహం స్వయమాత్మాహమవ్యయః . లక్ష్యాత్మా లలితాత్మాహం తూష్ణీమాత్మస్వభావవాన్ .. 35.. |
|
35. అజాత్మా చ అమృతాత్మాహగ్ం స్వయమ్ ఆత్మాఽహమ్ అవ్యయః। లక్ష్యాత్మా లలితాత్మాఽహం తూష్ణీమాత్రా స్వభావవాన్।। |
ఏకత్వము - ద్విత్వము…లేని వాడను! సర్వదా ఏకాత్ముడను! సర్వుల ఆత్మయే స్వాత్మ (మమాత్మ). నా ఆత్మయే సర్వ భూతములలోని (జీవులలోని) ఆత్మ అయి ఉన్నది! జన్మరహితము-అమృతము-అవ్యయము అగు ఆత్మయే స్వయముగా అయి ఉన్నాను కదా! సర్వమునకు, సర్వులకు లక్ష్యము అయి ఉన్నట్టి ఆత్మను! ఎవ్వరూ ఎప్పుడూ అలక్ష్యము చేయబడనట్టి ఆత్మను! అత్యంత సులభము, లలితము (సౌమ్యము) అగు ఆత్మను! కానీ ఆత్మ స్వభావమును పట్టించుకోకుండా స్వీయకల్పనలో సంచరించువాడను. జగద్దృశ్యముపట్ల స్వభావంగానే తూష్ణీమాత్ర స్వభావుడను కూడా! |
ఆనందాత్మా ప్రియో హ్యాత్మా మోక్షాత్మా బంధవర్జితః . బ్రహ్మైవాహం చిదేవాహమేవం వాపి న చింత్యతే .. 36.. |
|
36. ఆనందాత్మా, ప్రియో హి ఆత్మా, మోక్షాత్మా బంధ వర్జితః। బ్రహ్మైవాహం। చిదేవాహమ్। ఏవం వాఽపి న చింత్యతే।। |
ఓమయూరాసనా! షణ్ముఖా! ఇంకా కూడా, విదేహముక్తుని స్వస్వరూపానుభూతి ఎట్లా ఉంటుందో…విను! ‘‘నేను సహజముగానే ఆనందాత్ముడను. అందరికి ప్రియమైన ఆత్మను. బంధ రహితమగు మోక్షాత్మను. ‘బ్రహ్మము’ అని చెప్పుచున్నది నా గురించే! నేనే బ్రహ్మమును! కేవల చిన్మాత్రమును’’ అని ఎరిగి ఉంటాడు. తానే బ్రహ్మము అయి సంచరిస్తూ ఉంటాడు. ఇక ‘చింతన’ అనునది ఏముంటుంది? ఉండదు! |
చిన్మాత్రేణైవ యస్తిష్ఠేద్వైదేహీ ముక్త ఏవ సః .. 37.. |
|
37. చిన్మాత్రేణైవ యః తిష్ఠేత్, వైదేహీ ముక్త ఏవ సః।। |
ఎవ్వడైతే ఎల్లవేళలా సర్వమునకు అధిష్ఠానము - సర్వస్వరూపము అగు - ‘చిన్మాత్రత్వము’నందే ప్రతిష్ఠితుడై ఉంటాడో….ఆతడే విదేహముక్తుడు. |
నిశ్చయం చ పరిత్యజ్య అహం బ్రహ్మేతి నిశ్చయం . ఆనందభరితస్వాంతో వైదేహీ ముక్త ఏవ సః .. 38.. |
|
38. నిశ్చయం చ పరిత్యజ్య ‘అహం బ్రహ్మేతి’ నిశ్చయమ్ ఆనందభరిత స్వాంతో వైదేహీ ముక్త ఏవ సః।। |
ప్రపంచమునకు సంబంధించిన సర్వ నిశ్చయములను అభిప్రాయములను పరిత్యజించివేసి ‘ఈ సర్వులు, సర్వము ఏ బ్రహ్మమైయున్నదో ఆ బ్రహ్మమే నేను’ … అను అహమ్ బ్రహ్మాస్మి నిర్ణయమొక్కటే కలిగి ఉంటాడు. సర్వదా బ్రహ్మానందభరితుడై ఉండువాడు విదేహముక్తుడే! |
సర్వమస్తీతి నాస్తీతి నిశ్చయం త్యజ్య తిష్ఠతి . అహం బ్రహ్మాస్మి నాస్మీతి సచ్చిదానందమాత్రకః .. 39.. |
|
39. సర్వం అస్తీతి నాస్తీతి నిశ్చయం త్యజ్య తిష్ఠతి అహంబ్రహ్మాస్మి, నాస్మి ఇతి సచ్చిదానంద (సత్-చిత్-ఆనంద) మాత్రకః। |
‘ఈ ఎదురుగా కనబడేది ఉన్నదా? లేదా?’…అనే మీమాంస - ఇక ఆతడు త్యజించి, అధిగమించినవాడై ఉంటాడు. స్వప్నమంతా ‘స్వప్నద్రష్టదే అయినట్లుగా ఇదంతా నాదే. నేనే ఇట్లా ఉన్నాను’ అనునది కూడా (ద్వితీయం కాబట్టి) ఉండదు! తానే అది అయి సత్ చిత్ ఆనంద విగ్రహుడు అయి ఉంటాడు! సందృశ్యమైయ్యేదంతా స్వయముగా తానే అయి వెలుగొందుచూ ఉంటారు. |
కించిత్క్వచిత్కదాచిచ్చ ఆత్మానం న స్పృశత్యసౌ . తూష్ణీమేవ స్థితస్తూష్ణీం తూష్ణీం సత్యం న కించన .. 40.. |
|
40. కించిత్ క్వచిత్ కదాచిత్ చ ఆత్మానం న స్పృశతి అసౌ। తూష్ణీమ్ ఏవగ్ం స్థితః, తూష్ణీం తూష్ణీం సత్యం న కించన।। |
కొద్దిగాకూడా ఎప్పుడైనా ఎక్కడైనా కూడా తనయందు ‘తనకు వేరు’ అను రీతిగా స్పృశించడు. దేనినీ స్వీకరించక ‘బాహ్యము - అన్యము’ అనబడేదంతా తుష్ణీకరించి, ‘ఇదంతా నేనే’ అను ఏకైక సత్యమును మాత్రమే తూష్ణీకరించక, సర్వదా ఆస్వాదించువాడై ఉంటాడు. |
పరమాత్మా గుణాతీతః సర్వాత్మా భూతభావనః . |
|
41. పరమాత్మా గుణాతీతః సర్వాత్మా భూతభావనః। |
గుణాతీతుడై పరమాత్మగా ఉంటాడు. సర్వదేహులకు తానే ఆత్మస్వరూపుడై, సర్వత్రా స్వస్వరూపుడై విరాజిల్లుతూ ఉంటారు. |
కాలభేదం వస్తుభేదం దేశభేదం స్వభేదకం .. 41.. కించిద్భేదం న తస్యాస్తి కించిద్వాపి న విద్యతే . అహం త్వం తదిదం సోఽయం కాలాత్మా కాలహీనకః .. 42.. |
|
42. కాలభేదం వస్తుభేదం దేశ భేదగ్ం స్వభేదకమ్ కించిత్ భేదం న తస్య అస్తి। కించిత్ వాపి న విద్యతే।। అహం-త్వం-తత్ ఇదం సోఽయం కాలాత్మా కాలహీనకః।। |
ఆతడు త్రికాలములలో ఏకసత్యమగు పరబ్రహ్మమై ప్రకాశిస్తూ భూత - వర్తమాన-భవిష్యత్ త్రికాలభేదములేనివాడై ఉంటాడు. ‘సర్వము స్వస్వరూప బ్రహ్మమే! నేనే!’ అను ఎరుకచే వస్తుభేదరహితుడై ఉంటాడు! ‘ఈ సర్వము నాయందే కదా!’ అను సందర్శనముచే దేశభేదము ఉండదు! ‘నేను - నీవు-అది-ఇది-ఆతడు-ఈతడు’…ఇవన్నీ తనయొక్క కాలాత్మత్వమునందు దర్శిస్తూ కాలాతీతుడై కాలరహితుడై, కేవల సాక్షి అయి ఉంటారు. |
శూన్యాత్మా సూక్ష్మరూపాత్మా విశ్వాత్మా విశ్వహీనకః . దేవాత్మాదేవహీనాత్మా మేయాత్మా మేయవర్జితః .. 43.. |
|
43. శూన్యాత్మా, సూక్ష్మరూపాత్మా, విశ్వాత్మా, విశ్వహీనకః। దేవాత్మా, దేవహీనాత్మా, మేయాత్మా, మేయ వర్జితః। |
- ఈ జాగ్రత్-స్వప్న-సుషుప్తి విశేషాలన్నీ కథలోని, కల్పనలోని, ఊహలోని విశేషాలుగా (అనగా) వాస్తవానికి లేనివిగా చూస్తూ ఉండటం చేత శూన్యాత్ముడై ఉంటారు. - సర్వమునకు (ఈ కనబడే స్థూలమైనట్టి సర్వమునకు) తానే సూక్ష్మరూపాత్ముడు అయి దర్శిస్తారు. ఈ విశ్వమంతటికీ తానే ఆత్మ అయి, అదే సమయంలో విశ్వరహితుడై ఉంటున్నారు. - దేవతలందరికీ తానే ఆత్మ అయి ఉంటూనే, దేవతా రహితుడై, కేవల సాక్షి అయి చెన్నొందుచున్నారు. మేయాత్మ (పరిమితుడు జీవాత్మ) తానే అయి, అదే సమయంలో-అపరిమితాత్మ స్వరూపుడై ప్రభవిస్తూ ఉంటారు. |
సర్వత్ర జడహీనాత్మా సర్వేషామంతరాత్మకః . సర్వసంకల్పహీనాత్మా చిన్మాత్రోఽస్మీతి సర్వదా .. 44.. |
|
44. సర్వత్ర జడహీనాత్మా సర్వేషాం అంతరాత్మకః। సర్వ సంకల్ప హీనాత్మా చిన్మాత్రోఽస్మి ఇతి సర్వదా।। |
- అంతటా జడహీనుడై, చైతన్యస్వరూపుడుగా ఉంటాడు. సర్వదేహులకు, సర్వదేవతలకు అంతరాత్మ అయి ఆనందపూరితుడై ఉంటాడు. సర్వభూతములు తానే అయి, సర్వసాక్షిగా వేరై - భేదమనునదే లేనివాడై ఉంటాడు. సర్వసంకల్ప రహితుడై, ‘‘సర్వదా చిన్మాత్ర స్వరూపుడను నేను’’ అను ఎరుకచే తానే సత్ - చిత్ మాత్రుడై వెలుగొందుచూ ఉంటారు. |
కేవలః పరమాత్మాహం కేవలో జ్ఞానవిగ్రహః . సత్తామాత్రస్వరూపాత్మా నాన్యత్కించిజ్జగద్భయం .. 45.. |
|
45. కేవలః పరమాత్మాహమ్ కేవలో జ్ఞాన విగ్రహః। సత్తామాత్ర స్వరూపాత్మా న అన్యత్ కించిత్ జగత్ భయమ్। |
ఇహమంతా తన భావనా - లీలా వినోదమై, ఏ పరమాత్మయొక్క విభవమై యున్నదో , అట్టి పరమాత్మకు అభిన్నుడను నేను! పరిశుద్ధ - కేవల జ్ఞానవిగ్రహుడను! అట్టి నా జ్ఞాన స్వరూపము (తెలివి) నుండి జ్ఞేయము (తెలియబడే ఈ సమస్తము)… అభిన్నమై ప్రదర్శితమవుతోంది. ఏ కేవలసత్త నుండి ‘జగత్ సత్త-అహమ్ సత్త-త్వమ్ సత్త-సఃసత్త-ఇదమ్ సత్త’…ఇవన్నీ బయల్వెడలుచున్నాయో…అట్టి కేవల సత్తాస్వరూపుడను. నాకు వేరైన జగత్ కించిత్ కూడా లేదు. అందుచేత అభయుడను. |
జీవేశ్వరేతి వాక్క్వేతి వేదశాస్త్రాద్యహం త్వితి . ఇదం చైతన్యమేవేతి అహం చైతన్యమిత్యపి .. 46.. ఇతి నిశ్చయశూన్యో యో వైదేహీ ముక్త ఏవ సః . |
|
46. ‘‘జీవ-ఈశ్వరేతి’’ వాక్యేతి, వేద శాస్త్రాది యత్ ‘‘అహం’’ తు ఇతి, ‘‘ఇదం చైతన్యమేవ’’-ఇతి। అహం ‘‘చైతన్యమితి’’-అపి - ఇతి నిశ్చయ శూన్యో యో, వైదేహీ ముక్త ఏవ సః।। |
అట్టి నా గురించి ప్రబోధిస్తూ ప్రవచించటానికి వేదములు శాస్త్రములు ‘జీవుడు-ఈశ్వరుడు, అహమ్‌బ్రహ్మ, ఇదమ్ చైతన్యమేవ మొదలైన శబ్దాలు కల్పిస్తున్నాయి. అవన్నీ సర్వదా నేనే! నాగురించియే. అంతేగాని జీవేశ్వరులు అనగా, బ్రహ్మము-చైతన్యము అనగా మరెవరిగురించో కాదు. ఇదంతా శుద్ధ చైతన్యము. నేనో? శుద్ధ చైతన్య స్వరూపుడను. ఇట్టి నిశ్చయము కలిగి ఉన్నవాడు విదేహముక్తుడు। |
చైతన్యమాత్రసంసిద్ధః స్వాత్మారామః సుఖాసనః .. 47.. అపరిచ్ఛిన్నరూపాత్మా అణుస్థూలాదివర్జితః . తుర్యతుర్యా పరానందో వైదేహీ ముక్త ఏవ సః .. 48.. |
|
47. చైతన్యమాత్ర సంసిద్ధః ‘‘స్వాత్మా రామః’’ సుఖాసనః। 48. అపరిచ్ఛిన్న రూపాత్మా అణు-స్థూలాది వర్జితః, తుర్యతుర్యః పరానందో, వైదేహీ ముక్త ఏవ సః।। |
- ఎవ్వడైతే ‘నేను కేవల చిత్ చైతన్య మాత్రుడను’ అను నిశ్చయ - నిశ్చల భావనకు సర్వదా సర్వత్రా సంసిద్ధుడై, స్వ-ఆత్మారాముడై సుఖాసీనుడై ఉంటాడో…., - ‘‘నీవు-నేను-అతడు-వాడు-వీడు-అది-ఇది-దేవతలు-మానవులు- జంతువులు’’ మొదలైన పరిచ్ఛిన్నత్వము కించిత్ కూడా లేనట్టివాడై , సూక్ష్మము (అణువు) - స్థూలము మొదలైన భేదములను తిరస్కరించినట్టి అతీత స్థానము ఆశ్రయించి అపరిచ్ఛిన్నరూపుడై ఉంటాడో…. - జాగ్రత్ - స్వప్న - సుషుప్తులకు ‘సాక్షి’ అగు తుర్యమునకే తుర్యుడై, పరానందుడై ఉంటాడో…అట్టివాడే విదేహముక్తుడు. |
నామరూపవిహీనాత్మా పరసంవిత్సుఖాత్మకః . తురీయాతీతరూపాత్మా శుభాశుభవివర్జితః .. 49.. |
|
49. నామ - రూప విహీనాత్మా పర సంవిత్ సుఖాత్మకః తురీయాతీత రూపాత్మా శుభాశుభ వివర్జితః।। |
ఓ కార్తికేయా! కుమారా! సర్వజన ప్రియా! ఇంకా ఈ విదేహముక్తుని అనుభవం గురించి…విను! - ఎవ్వరి దృష్టిలో …, → నేను నామ - రూప పరిమితుడనుకాను! అపరిమిత - ఆనందాత్మను! → ఇహమునకు ఆధారమైనట్టి పర (సత్ విత్ - సంవిత్) సుఖాత్ముడను! → జాగ్రత్-స్వప్న-సుషుప్తులకు ‘సాక్షి’ అయినట్టి, ‘కర్త’ అయినట్టి తురీయమునకు కూడా అతీతుడను. తురీయమును ఒక అంశగా గల రూపుడను! → ఈ సర్వము సర్వదా సర్వత్రా నేనే అయి ఉండటముచేత, నాకు… ‘ఇది శుభము - అదికాదు’ అనునది లేదు. శుభాశుభ వివర్జితుడను! |
యోగాత్మా యోగయుక్తాత్మా బంధమోక్షవివర్జితః . గుణాగుణవిహీనాత్మా దేశకాలాదివర్జితః .. 50.. సాక్ష్యసాక్షిత్వహీనాత్మా కించిత్కించిన్న కించన . యస్య ప్రపంచమానం న బ్రహ్మాకారమపీహ న .. 51.. |
|
50. యోగాత్మా, యోగయుక్తాత్మా, బంధ - ముక్తి వివర్జితః। గుణాగుణ విహీనాత్మా దేశ కాలాది వర్జితః।। 51. సాక్షి - అసాక్షిత్వ హీనాత్మా కించిత్ కించిత్ న కించన యస్య ప్రపంచ భానం న। బ్రహ్మాకారమపి ఇహ న।। |
- జీవాత్మ - పరమాత్మల ఏకత్వమగు యోగాత్మను. యోగయుక్తాత్మను. నా కల్పనలో నా కల్పితమగు జీవాత్మకు (స్వతఃగా లేదు కాబట్టి) బంధము లేదు. పరమాత్మగా సర్వమునకు వేరై ఉన్నాను. కాబట్టి దేని వలనా నాకు బంధము లేదు. బంధమే లేని చోట ముక్తి ఎక్కడిది? బంధ - ముక్తి వివర్జితుడను. గుణ-అగుణములు లేనట్టి, దేశకాలములకు సంబంధము కానట్టి కేవల ఆత్మను. ఈ సర్వము నాదై, నేనే అయి నాయందే ఉండటంచేత - దేశ కాల భేదము లేనట్టివాడను. కించిత్ కించిత్ కూడా నాకు సాక్షిత్వము లేదు. అసాక్షిత్వము లేదు! ఇక్కడ ప్రపంచాకారము లేదు. బ్రహ్మాకారము లేదు. |
స్వస్వరూపే స్వయంజ్యోతిః స్వస్వరూపే స్వయంరతిః . వాచామగోచరానందో వాఙ్మనోగోచరః స్వయం .. 52.. అతీతాతీతభావో యో వైదేహీ ముక్త ఏవ సః . |
|
52. స్వస్వరూపే స్వయం జ్యోతిః స్వస్వరూపే స్వయం రతిః। వాచామ్ అగోచరానందో వాక్ మనో అగోచరః స్వయమ్। అతీతాతీత భావో యో వైదేహీ ముక్త ఏవ సః।। |
- నా స్వస్వరూపము (సర్వదీపములను వెలిగించు అగ్నివలె) స్వయం జ్యోతి స్వరూపము! - స్వస్వరూపము నందు ‘జగత్’ అనే స్వీయకల్పనయందు స్వయముగా రమించుచున్నాను! చెప్పటానికి వీలు లేనివాడను. వాక్ - మనస్సులు ప్రకటించలేని స్వానంద స్వస్వరూపుడను! ఇట్టి సర్వాతీత భావము కలవాడు ‘విదేహముక్తుడు’ అని పిలువబడుచున్నారయ్యా! |
చిత్తవృత్తేరతీతో యశ్చిత్తవృత్త్యవభాసకః .. 53.. సర్వవృత్తివిహీనాత్మా వైదేహీ ముక్త ఏవ సః . తస్మిన్కాలే విదేహీతి దేహస్మరణవర్జితః .. 54.. |
|
53,54. చిత్త వృత్తేః అతీతో యః, చిత్త వృత్తిః అవభాసకః।। సర్వవృత్తి విహీనాత్మా వైదేహీముక్త ఏవ సః।। తస్మిన్ కాలే విదేహీతి దేహస్మరణ వర్జితః।। |
ఎవ్వడైతే…., - చిత్త వృత్తులన్నిటికీ అతీతుడై, సాక్షి అయి, మౌనముగా సందర్శించువాడై ఉంటాడో…. - చిత్త వృత్తులను తన నుండి (సూర్యుని నుండి సూర్యకిరణములను వలె) ప్రసరించునట్టి స్వరూపుడై ఉంటాడో…, - సర్వ వృత్తులు లేనట్టి స్థానమును (వృత్తి, రహిత స్థానమును) అలంకరించి సర్వాలంకృతుడై ఉంటాడో…ఆతడే విదేహముక్తుడు. ఏ క్షణంలో నీవుగాని, ఏ జీవుడైనా కానీ ‘దేహస్మరణము’ను విస్మరించి వేస్తాడో… (దేహస్మరణ రహితుడౌతాడో) ఆ క్షణం నుండి ఆతడు విదేహముక్తుడే! |
ఈషన్మాత్రం స్మృతం చేద్యస్తదా సర్వసమన్వితః . పరైరదృష్టబాహ్యాత్మా పరమానందచిద్ధనః .. 55.. |
|
55. ఈషన్మాత్రగ్ం స్మృతం చేద్యః తదా సర్వ సమన్వితః। పరైః అదృష్ట బాహ్యాత్మా పరమానంద చిద్ఘనః।। |
ఆ విదేహముక్తుడు తనయొక్క అనంత - అఖండ - దివ్య చైతన్యము నుండి బయల్వెడలు అనంత చిత్ కిరణములయొక్క ఒక చిన్న స్ఫురణ విభాగములో (ఈషణ్మాత్రములో) ఈ సర్వజగత్ విభూతులు కలిగియున్నవాడై ఉంటున్నారు! పరులకు కనబడని బాహ్యాత్ముడై, పరమానంద చిద్ఘనుడై, అంతరమున దేదీప్యమానముగా వెలుగొందుచున్నారు. |
పరైరదృష్టబాహ్యాత్మా సర్వవేదాంతగోచరః . బ్రహ్మామృతరసాస్వాదో బ్రహ్మామృతరసాయనః .. 56.. |
|
సర్వ వేదాంత గోచరః బ్రహ్మామృత రసా స్వాదో బ్రహ్మామృత రసాయనః।। |
బ్రహ్మామృత రసమును గ్రోలుచూ, బ్రహ్మామృతరసస్వరూపుడై అంతటా సంప్రదర్శితుడై ఉంటున్నారు. |
బ్రహ్మామృతరసాసక్తో బ్రహ్మామృతరసః స్వయం . బ్రహ్మామృతరసే మగ్నో బ్రహ్మానందశివార్చనః .. 57.. |
|
57. బ్రహ్మామృత రస అసక్తో, బ్రహ్మామృత రసః స్వయమ్। బ్రహ్మామృత రసే మగ్నో బ్రహ్మానంద శివార్చనః।। |
→ ఎల్లవేళలా ‘బ్రహ్మముయొక్క అనుభూతి’ అను రసమును గ్రోలుటయందు. ఆసక్తచిత్తుడై ఉంటారు. → అంతటితో ఆగరు. సక్తత లేకుండానే తనకు తానే బ్రహ్మామృత రసస్వరూపుడై విరాజిల్లుచున్నారు. → బ్రహ్మామృత రసమునందు అనునిత్యము నిమగ్నుడై, అనుక్షణికంగా బ్రహ్మానంద శివార్చనను నిర్వర్తించుచున్నారు. బ్రహ్మానందమే ఆతని శివార్చన. |
బ్రహ్మామృతరసే తృప్తో బ్రహ్మానందానుభావకః . బ్రహ్మానందశివానందో బ్రహ్మానందరసప్రభః .. 58.. |
|
58. బ్రహ్మామృత రసే తృప్తో బ్రహ్మానందానుభావకః। బ్రహ్మానంద శివానందో బ్రహ్మానంద రసప్రభః।। |
→ బ్రహ్మానంద రసాస్వాదనచే పరమ సంతృప్తుడై ఉంటున్నారు. → సర్వత్రా ‘ఇదంతా నాయొక్క బ్రహ్మానందానుభవమే!’ అని భావించువాడై ఉంటున్నారు. → బ్రహ్మానంద శివ - ఆనందుడై బ్రహ్మానంద - అమృతరస - మధుర రసప్రభలతో వెలుగొందుచున్నారు. |
బ్రహ్మానందపరం జ్యోతిర్బ్రహ్మానందనిరంతరః . బ్రహ్మానందరసాన్నాదో బ్రహ్మానందకుటుంబకః .. 59.. |
|
59. బ్రహ్మానంద పరంజ్యోతిః బ్రహ్మానంద నిరంతరః। బ్రహ్మానంద రసాత్ నాదో బ్రహ్మానంద కుటుంబకః।। |
- (సహస్ర దీపములలోని దీపకాంతివలె) బ్రహ్మానంద పరంజ్యోతి స్వరూపుడై నిరంతరము పరమానంద-అనునిత్య ఆస్వాదుడై ఉంటున్నారు. ఎల్లవేళలా బ్రహ్మానంద రసనాదమును, శబ్దములను, బ్రహ్మానంద పలుకులను పలుకుచున్నాడు. బ్రహ్మానంద కుటుంబీకుడై జగత్తులో నివసిస్తున్నారు. |
బ్రహ్మానందరసారూఢో బ్రహ్మానందైకచిద్ధనః . బ్రహ్మానందరసోద్బాహో బ్రహ్మానందరసంభరః .. 60.. |
|
60. బ్రహ్మానంద రథారూఢో బ్రహ్మానందైక చిద్ఘనః। బ్రహ్మానంద రస ఉద్వాహో బ్రహ్మానంద రసంభరః।। |
‘బ్రహ్మానందము’ అనే రధమును అధిష్టించిన వాడై విహరిస్తున్నారు. బ్రహ్మానంద - ఏకరస - చిద్ఘనులై వెలుగొందుచున్నారు. బ్రహ్మానంద రసదేవతా దాంపత్య సమేతుడై బ్రహ్మానందముతో నిండి ఉన్నవాడగుచున్నారు. బ్రహ్మానంద రసంభరుడు అగుచున్నాడు. రసభరితుడై ఊయలలూగుచున్నారు. |
బ్రహ్మానందజనైర్యుక్తో బ్రహ్మానందాత్మని స్థితః . ఆత్మరూపమిదం సర్వమాత్మనోఽన్యన్న కంచన .. 61.. |
|
61. బ్రహ్మానంద జనైః యుక్తో బ్రహ్మానందాత్మని స్థితః। ఆత్మరూపమ్ ఇదగ్ం సర్వమ్ ఆత్మతో అన్యత్ న కించన।। |
బహ్మానందమును ఎరిగిన సహజనులతో కూడి బ్రహ్మానందాత్మయందు స్థాపితుడై ఉంటున్నారు. |
సర్వమాత్మాహమాత్మాస్మి పరమాత్మా పరాత్మకః . నిత్యానంద స్వరూపాత్మా వైదేహీ ముక్త ఏవ సః .. 62.. |
|
62. సర్వమ్ ఆత్మాహమ్, ఆత్మాస్మి పరమాత్మా పరాత్మకః, నిత్యానంద స్వరూపాత్మా వైదేహీ ముక్త ఏవ సః।। |
ఆత్మనగు నేనే ఈ సర్వము అయి ఉన్నాను. నిత్యానంద స్వరూపాత్మ స్వరూపమగు పరమాత్మను! సర్వము నేనై న నేనే నేను! - ఇట్టి అనుభూతి - అవగాహనలచే, అట్టివాడు విదేహముక్తుడే! |
పూర్ణరూపో మహానాత్మా ప్రీతాత్మా శాశ్వతాత్మకః . సర్వాంతర్యామిరూపాత్మా నిర్మలాత్మా నిరాత్మకః .. 63.. |
|
63. పూర్ణరూపో మహాన్ ఆత్మా ప్రీతాత్మా శాశ్వతాత్మకః సర్వాంతర్యామి రూపాత్మా నిర్మలాత్మా నిరాత్మకః।। |
ఎవ్వరైతే…. - (పంచజ్ఞానేంద్రియములు - పంచకర్మేంద్రియ విషయములు - మనోబుద్ధి చిత్త అహంకారములు - జీవాత్మ - ఈశ్వరాత్మలతో కూడిన షోడశ కళలతో కూడిన) సర్వము తానే అయినట్టి ‘పూర్ణరూపమహాన్’ ఆత్మగా ఉంటారో, - చిదానంద - ప్రీతిస్వరూపుడుగా తనను తాను భావిస్తారో, - ‘నేను శాశ్వతమగు అమృతాత్మను’ అని ఆస్వాదిస్తూ ఉంటారో, - సర్వాంతర్యామి రూపాత్ముడై ఉంటారో, - నిర్మలాత్ముడై ప్రకాశమానుడౌతారో, - ఆత్మతత్త్వమునకు ఆవల నిరాత్మకులై కూడా ఉంటారో…, |
నిర్వికారస్వరూపాత్మా శుద్ధాత్మా శాంతరూపకః . శాంతాశాంతస్వరూపాత్మా నైకాత్మత్వవివర్జితః .. 64.. |
|
64. నిర్వికార స్వరూపాత్మా శుద్ధాత్మా శాంతరూపకః శాంత శాంత స్వరూపాత్మా నైకాత్మత్వ వివర్జితః।। |
- వికార రహితమగు (దృశ్యత్వము - దేహత్వము మొదలైన వికారములు లేనట్టి) కేవలాత్మ స్వరూపుడుగా ఉంటారో…, - పరమశాంతమగు పరిశుద్ధాత్ములై ఉంటారో…, - శాంతమునకే శాంత స్వరూపులై ఉంటారో…, - సర్వదా ఏకాత్ములై, అనేకాత్మలు కానివాలై, అఖండులై… ఏకానేకాత్మత్వ మును కూడా విసర్జించి ఉంటారో, ఆయనయే విదేహముక్తుడు! |
జీవాత్మపరమాత్మేతి చింతాసర్వస్వవర్జితః . ముక్తాముక్తస్వరూపాత్మా ముక్తాముక్తవివర్జితః .. 65.. బంధమోక్షస్వరూపాత్మా బంధమోక్షవివర్జితః . ద్వైతాద్వైతస్వరూపాత్మా ద్వైతాద్వైతవివర్జితః .. 66.. |
|
65. జీవాత్మ - పరమాత్మేతి చింతా సర్వస్వ వర్జితః। ముక్తాముక్త స్వరూపాత్మా, ముక్తాముక్త వివర్జితః।। 66. బంధమోక్ష స్వరూపాత్మా, బంధమోక్ష వివర్జితః। ద్వైతాద్వైత స్వరూపాత్మా, ద్వైతాద్వైత వివర్జితః।। |
జీవాత్మ - పరమాత్మలు’ అనే భేదచింతనను అతిక్రమించి ఉంటారో.., -జీవాత్మకమైన సర్వస్వమును-పాము తన కుబుసమును వదలునట్లు వదిలి వేసి ఉంటారో (జీవాత్మ పరమాత్మయేనని ఎరిగి ఉంటారో), - పరమాత్మగా ముక్తము - జీవాత్మగా అముక్తము అను ఉభయములు స్వభావ చమత్కారముగా ప్రదర్శిస్తూ ముక్త - అముక్తములను (Relief and bondage) రెంటినీ జయించి ఉంటారో…, - బంధ - మోక్షములు ఆత్మస్వరూపముగా గమనిస్తూ (తానే అయి) బంధమోక్షములను వివర్జించివేస్తారో.., -ద్వైత - అద్వైతములు రెండూ ఆత్మ స్వరూపములుగా గ్రహించి, తానే అయి ద్వైత - అద్వైత వివర్జితుడై ఉంటారో ఆయనయే విదేహముక్తుడు! |
సర్వాసర్వస్వరూపాత్మా సర్వాసర్వవివర్జితః . మోదప్రమోదరూపాత్మా మోదాదివినివర్జితః .. 67.. |
|
67. సర్వాసర్వ స్వరూపాత్మా సర్వాసర్వ వివర్జితః। మోదప్రమోద రూపాత్మా మోదాది వినివర్జితః।। |
సర్వ - అసర్వ స్వరూపాత్మగా అయి సర్వ - అసర్వములను వదలివేసి ఉంటారో….., మోద - ప్రమోద స్వరూపాత్మను ఎరిగి మోదములన్నీ (All Pleasantaries) జయించివేసి ఉంటారో… |
సర్వసంకల్పహీనాత్మా వైదేహీ ముక్త ఏవ సః . నిష్కలాత్మా నిర్మలాత్మా బుద్ధాత్మాపురుషాత్మకః .. 68.. |
|
68. సర్వసంకల్పహీనాత్మా వైదేహీ ముక్త ఏవ సః।। నిష్కళాత్మా నిర్మలాత్మా బుద్ధాత్మా పురుషాత్మకః।। |
సర్వ సంకల్పములను రహితం చేసుకొని, సంకల్పములకు ఉత్పత్తి స్థానమగు కేవల స్వస్వరూపమునందు స్థితి పొంది ఉంటారో, అట్టివారే విదేహముక్తులు. ఎట్టివారైతే… సర్వులయొక్క, తమయొక్క స్వస్వరూపమును - సర్వ సందర్భములకు ఆవలగల కళంకము లేవీ స్పృశించజాలని నిష్కళాత్మ గాను, కళాతీతంగాను, నిత్యనిర్మలాత్మగాను, కేవలీ - బుద్ధాత్మగాను, పరమపురుషాత్మగాను దర్శించుచున్నారో, వారే విదేహముక్తులు. |
ఆనందాదివిహీనాత్మా అమృతాత్మామృతాత్మకః . కాలత్రయస్వరూపాత్మా కాలత్రయవివర్జితః .. 69.. అఖిలాత్మా హ్యమేయాత్మా మానాత్మా మానవర్జితః . నిత్యప్రత్యక్షరూపాత్మా నిత్యప్రత్యక్షనిర్ణయః .. 70.. అన్యహీనస్వభావాత్మా అన్యహీనస్వయంప్రభః . విద్యావిద్యాదిమేయాత్మా విద్యావిద్యాదివర్జితః .. 71.. |
|
69. ఆనందదాది విహీనాత్మా, అమృతాత్మా అమృతాత్మకః। కాలత్రయ స్వరూపాత్మా, కాలత్రయ వివర్జితః।। 70. అఖిలాత్మా హి అమేయాత్మా, మానాత్మా మాన వర్జితః। నిత్యప్రత్యక్షరూపాత్మా, నిత్యప్రత్యక్ష వర్జితః।। 71. అన్యహీన స్వభావాత్మా, అన్యహీన స్వయం ప్రభః విద్యా అవిద్యాది మేయాత్మా, విద్యా-అవిద్యాది వర్జితః।। |
-‘నేను అన్నమయ - ప్రాణమయ - మనోమయ - విజ్ఞానమయ - ఆనందమయ కోశములన్నీ లేనట్టివాడను! - అమృతాత్మను! అమృతాత్మకుడను! - త్రికాలాత్మ స్వరూపుడను! త్రికాలములు లేనట్టివాడను. - అఖిలాత్మ స్వరూపుడను. అందుచేత అమేయ - అనంతాత్ముడను! - ఈ ప్రత్యక్షమంతా నా ఆత్మ స్వరూపమే! అయితే, నిత్యప్రత్యక్ష రహితుడను కూడా! - ‘అన్యము’ అనునదే లేనట్టి స్వభావముగల ఆత్మను! - అన్యముయొక్క అవసరమే లేనట్టి స్వయంప్రకాశాత్మను! - విద్య - అవిద్యలు మమాత్మ స్వరూపమే! కానీ విద్య-అవిద్య మొదలైనవేవీ కించిత్‌కూడా లేనట్టి స్వయం సంపూర్ణాత్మను! |
నిత్యానిత్యవిహీనాత్మా ఇహాముత్రవివర్జితః . శమాదిషట్కశూన్యాత్మా ముముక్షుత్వాదివర్జితః .. 72.. |
|
72. నిత్యానిత్య విహీనాత్మా ఇహాముత్ర వివర్జితః శమాది షట్క శూన్యాత్మా ముముక్షుత్వాది వర్జితః।। |
- ఆత్మస్వరూపుడుగా నాకు నిత్య-అనిత్యములనేవేవీ లేవు! ఇహ - ఆముత్ర (ఈవల దృశ్య-ఆవల దృశ్యరహిత స్థానఫలములు) లేనట్టివాడను! - ఆత్మ సర్వదా నాయందు నేనే అయి సిద్ధించియుండగా ఇక ఆపై నాయందు - శమము, దమము, మొదలైన షట్కసాధన సంపత్తికి చోటు ఏది? లేదు? ముముక్షుత్వము కూడా లేదు. సర్వదా ఆత్మ నా స్వరూపమే అయి ఉండగా, ఇక అందుకై ‘మోక్ష - అపేక్ష’ అనునదేమున్నది? సర్వదా సిద్ధించియున్న దానికి సాధన సంపత్తితో పనేమున్నది? |
స్థూలదేహవిహీనాత్మా సూక్ష్మదేహవివర్జితః . కారణాదివిహీనాత్మా తురీయాదివివర్జితః .. 73.. |
|
73. స్థూలదేహ విహీనాత్మా సూక్ష్మదేహ వివర్జితః కారణాది విహీనాత్మా తురీయాది వివర్జితః।। |
- సర్వదా ఆత్మయే స్వరూపముగా కలిగియున్నట్టి నాకు స్థూలదేహము లేదు. సూక్ష్మ దేహము లేదు. కారణదేహము - సంస్కార దేహము మొదలైనవి లేవు. తురీయావస్థ లేదు. అసలు అవస్థలే లేవు. సర్వదా యథాస్థితుడను కదా! |
అన్నకోశవిహీనాత్మా ప్రాణకోశవివర్జితః . మనఃకోశవిహీనాత్మా విజ్ఞానాదివివర్జితః .. 74.. ఆనందకోశహీనాత్మా పంచకోశవివర్జితః . నిర్వికల్పస్వరూపాత్మా సవికల్పవివర్జితః .. 75.. |
|
74. అన్నకోశ విహీనాత్మా, ప్రాణకోశ వివర్జితః మనఃకోశ విహీనాత్మా, విజ్ఞానాది వివర్జితః।। 75. ఆనందకోశ హీనాత్మా, పంచకోశ వివర్జితః। నిర్వికల్ప స్వరూపాత్మా, సవికల్ప వివర్జితః।। |
ఆత్మ గురించి వివరించి - నిర్వచించి చూపుటకొరకై అన్నమయ - ప్రాణమయ-మనోమయ-విజ్ఞానమయ - ఆనందమయ…పంచకోశములు శాస్త్రములు కల్పించి చెప్పుచున్నాయి. వాస్తవానికి నేను ఆత్మగా పంచకోశ వివర్జితుడను! ఆత్మభావన సిద్ధించుచుండగా, ఇక ఆ విభాగముల చర్చతో పని లేదు. సర్వ సంకల్పములకు జననస్థానమగు ఆత్మయే నేను! కనుక ‘సవికల్పత్వము’ను వివర్జించినప్పటి నిర్వికల్ప స్వరూపాత్మను అయి ఉన్నాను! |
దృశ్యానువిద్ధహీనాత్మా శబ్దవిద్ధవివర్జితః . సదా సమాధిశూన్యాత్మా ఆదిమధ్యాంతవర్జితః .. 76.. |
|
76. దృశ్యానువిద్ధ హీనాత్మా శబ్దవిద్ధ వివర్జితః సదా సమాధి శూన్యాత్మా ఆదిమధ్యాంత వర్జితః।। |
దృశ్యమునకు ద్రష్టత్వము, శబ్దమునకు శ్రవణత్వము అను ధర్మములు ఆత్మనగు నా ధర్మములు కావు. అవి మనో సంబంధమైనవి. ఎల్లప్పుడూ ఆత్మనిష్ఠుడనే! సమాధి అనునది కూడా ఆత్మగా నాధర్మము కాదు. అది బుద్ధి ధర్మము మాత్రమే. ఎందుకంటే, నాకు మొదలు - మధ్య - చివర లేదు. (మనోబుద్ధులకు అవి ఉంటే ఉండవచ్చు గాక!). |
ప్రజ్ఞానవాక్యహీనాత్మా అహంబ్రహ్మాస్మివర్జితః . తత్త్వమస్యాదిహీనాత్మా అయమాత్మేత్యభావకః .. 77.. |
|
77. ప్రజ్ఞాన వాక్య హీనాత్మా ‘అహమ్‌బ్రహ్మాస్మి’ వర్జితః।। ‘తత్త్వమసి’ - ఆది హీనాత్మా। ‘అయమాత్మా’ ఇతి అభావకః।। |
అనిర్వచనీయమగు కేవలీ పరబ్రహ్మస్వరూపుడను. నా గురించి ‘ప్రజ్ఞ’ ‘బ్రహ్మము’ ‘త్వమ్’ ‘ఆత్మ’ అనునవన్నీ బోధించుటకై కల్పించబడుచున్నాయి. - ప్రజ్ఞ (తెలివి) కంటే ముందే ఉన్నవాడిని. కనుక ప్రజ్ఞాన వాక్యహీనుడను! - అవాక్ మానస గోచరుడను. కనుక ‘బ్రహ్మాస్మి’ అను శబ్దవర్జితుడను! - అఖండ స్వరూపుడనగుటచే ‘త్వమ్’ ‘తత్త్వము’ అనునది కూడా లేనివాడను. అఖండ భావన స్వాభావికమైన తరువాత, ఇక వాటితో పని ఏమి? |
ఓంకారవాచ్యహీనాత్మా సర్వవాచ్యవివర్జితః . అవస్థాత్రయహీనాత్మా అక్షరాత్మా చిదాత్మకః .. 78.. |
|
78. ఓంకార వాచ్య హీనాత్మా సర్వ వాచ్య వివర్జితః। అవస్థాత్రయ హీనాత్మా అక్షరాత్మా చిద్మాతకః।। |
- జీవాత్మ నా స్వరూప - స్వభాములుకావు. అయమాత్మా అభావుడను. వాక్కులచే ‘ఓం’ అనుసంజ్ఞామాత్రముచేత, వాచ్యమాత్రము చేత సర్వాత్మకమగు మమ ఆత్మరూపము ‘ఇది’అని చెప్పజాలనిది. సర్వవాచ్యములు (శబ్దవర్ణములు) నిర్వచించజాలనిది. ‘కైవల్యము’ అనుభవైకవేద్యమైనది మాత్రమే. భాషకు అందేది కాదు. జాగ్రత్ - స్వప్న - సుషుప్తులు నా సంచారము కొరకు స్వీయకల్పనలగుట చేత…., నా స్వరూపమునకు అవస్థలకు వేరైనట్టిది. అక్షరము - చిదాత్మకము అయినట్టిది! నేను అవస్థాత్రయ రహితుడను. నా స్వరూపము పరిధిరహితము. |
ఆత్మజ్ఞేయాదిహీనాత్మా యత్కించిదిదమాత్మకః . భానాభానవిహీనాత్మా వైదేహీ ముక్త ఏవ సః .. 79.. |
|
79. ఆత్మజ్ఞేయాది హీనాత్మా యత్ కించత్ ఇదమ్ ఆత్మకః। భావాభావ విహీనాత్మా (భానాభావ విహీనాత్మా) వైదేహీముక్త ఏవ సః।। |
ఆత్మ తెలుసుకోబడునది కూడా కాదు. ‘‘తెలుసుకొనుచున్నది’’ ‘‘తెలియబడునది’’, ‘‘తెలుసుకోవటము’’ కూడా తానే అయి ఉన్నట్టిది. తెలియబడే దృశ్య జగత్ విషయము కానప్పటికీ, తెలియబడేదంతా ‘తానే’ అయినట్టిది. ఆత్మ భావ - అభావ రహితమైనది! ఈవిధంగా స్వస్వభావము గురించి ఎరిగియున్నవాడు. తత్ భావనాభ్యాసముగలవాడు - విదేహముక్తుడు! |
ఆత్మానమేవ వీక్షస్వ ఆత్మానం బోధయ స్వకం . స్వమాత్మానం స్వయం భుంక్ష్వ స్వస్థో భవ షడానన .. 80.. స్వమాత్మని స్వయం తృప్తః స్వమాత్మానం స్వయం చర . ఆత్మానమేవ మోదస్వ వైదేహీ ముక్తికో భవేత్యుపనిషత్ .. ఇతి చతుర్థోఽధ్యాయః .. 4.. |
|
80. ఆత్మానమేవ వీక్షస్వ ఆత్మానం బోధయ స్వకమ్। స్వమాత్మానం స్వయం భుక్ష్వ స్వస్థో భవ, షడానన! 81. స్వ ఆత్మని స్వయం తృప్తః స్వమాత్మానగ్ం స్వయం చర। ఆత్మానమేవ మోదస్వ। వైదేహీ ముక్తికో భవ। ఇత్యుపనిషత్।। |
ఓ షణ్ముఖా! షడాననా! కుమారస్వామీ! (1) ఇదంతా ఆత్మగా భావించి ఆత్మనే సందర్శించుచుండుము. (2) ఆత్మబోధ స్వరూపుడవై ప్రకాశించుము. (3) స్వస్వరూపాత్మనే స్వయముగా ఆస్వాదిస్తూ, ఈ దృశ్యమునంతటినీ స్వస్వరూపముగా దర్శిస్తూ ఆత్మచే స్వస్థుడనై ఉండుము. (4) స్వస్వరూపాత్మయొక్క జ్ఞాన - విజ్ఞాన అనుభవములచే స్వయంతృప్తుడవై ఉండుము. స్వాత్మయందే దృశ్యమునంతా స్వాత్మకు అభిన్నమని ఎరిగినవాడవై స్వయముగా చరించుచుండుము. (5) ఆత్మచే ఆత్మను దర్శిస్తూ, ఆత్మయందే సంచరిస్తూ రమిస్తూ ఆనందించుము. విదేహముక్తుడవై ఉండుము. ఇత్యుపనిషత్ |
5వ అధ్యాయము : ఆత్మ - అనాత్మ వివేకము
నిదాఘో నామ వై మునిః పప్రచ్ఛ ఋభుం భగవంతమాత్మానాత్మవివేకమనుబ్రూహీతి . స హోవాచ ఋభుః . సర్వవాచోఽవధిర్బ్రహ్మ సర్వచింతావధిర్గురుః . సర్వకారణకార్యాత్మా కార్యకారణవర్జితః .. 1.. |
|||
01. ‘నిదాఘో’ నామ వై మునిః పప్రచ్ఛ ఋభుం భగవంతమ్ ఆత్మ - అనాత్మ వివేకమ్ అనుబ్రూహి - ఇతి’। సహోవాచ హ ఋభుః సర్వ వాచో అవధిః బ్రహ్మ। సర్వ చింతా అవధిః గురుః। సర్వ కారణ కార్యాత్మా కార్యకారణ వర్జితః। |
‘నిదాఘుడు’ అను మునిపుంగవుడు ఒకప్పుడు సద్గురువు, భగవంతుడు అగు ఋభుమహర్షిని సమీపించారు. నమస్కరించారు. నిధాఘముని : హే భగవాన్! ఋభుమహర్షీ! ‘ఆత్మ - అనాత్మ వివేకము’ గురించి ప్రసంగిస్తూ దయచేసి నాకు బోధించండి. ఋభుమహర్షి : నాయనా! నిదాఘా। బ్రహ్మము సర్వ వాచ్యములకు (భాషకు -వాక్యములకు-చెప్పటానికి) అవధి (ఆవల) అయి ఉన్నది. సర్వవాక్కులకు సర్వచింతలకు అవధి (పరాకాష్ఠ). కేవల - ఆత్మాహమ్ సిద్ధుని అనుభవం ఏమిటో విను. చెప్పుతాను. సర్వ కార్య కారణములకు ఆత్మయే కారణము. కానీ ఆత్మ కార్య - కారణములకు సంబంధించినదే కాదు. |
||
సర్వసంకల్పరహితః సర్వనాదమయః శివః . సర్వవర్జితచిన్మాత్రః సర్వానందమయః పరః .. 2.. సర్వతేజఃప్రకాశాత్మా నాదానందమయాత్మకః . సర్వానుభవనిర్ముక్తః సర్వధ్యానవివర్జితః .. 3.. |
|||
02. సర్వ సంకల్ప రహితః, సర్వనాదమయః శివః। సర్వ వర్జిత చిన్మాత్రః। సర్వానందమయః పరః।। 03. సర్వతేజః ప్రకాశాత్మా నాదానందమయాత్మకః। సర్వానుభవ నిర్ముక్తః సర్వధ్యాన వివర్జితః।। |
ఆత్మ సంకల్పములకు విషయమే కాదు. ఎందుకంటే, ఆత్మ నుండే ఆత్మచే ఆత్మకు అభిన్నమై- సంకల్పములు బయల్వెడలుచున్నాయి. అయితే, ఆత్మ సర్వనాదమయ శివస్వరూపము। సర్వము అధిగమించినట్టి కేవల చిత్ (ఎరుక) మాత్రము (చిన్మాత్రము). కానీ అద్దానికి ఇదంతా ఆనందమయమై, సర్వమునకు సర్వదా వేరైయున్నది. తన తేజస్సుతో సర్వము ప్రకాశింపజేయుచున్నదై, ‘నాదానందమయము’ అగు ఆత్మయే ప్రదర్శనమానమగుచున్నది. ఆత్మ → సర్వ అనుభవములనుండి విడివడినట్టిది! సర్వ ధ్యానములకు వేరైనట్టిది! ‘ఆత్మ’ అనునది ధ్యాతయొక్క సహజమగు స్వస్వరూపమే అయి ఉన్నది. |
||
సర్వనాదకలాతీత ఏష ఆత్మాహమవ్యయః . ఆత్మానాత్మవివేకాదిభేదాభేదవివర్జితః .. 4.. |
|||
04. సర్వ నాద కలాతీత ఏష ఆత్మా అహమ్ - అవ్యయః। ఆత్మ-అనాత్మ వివేకాది భేద-అభేద వివర్జితః। |
సర్వ నాద - కళలకు అతీతమైయున్న అట్టి అవ్యయమగు ఆత్మయే నేనై ఉన్నాను. ఆత్మ-అనాత్మ వివేకము మొదలైన వాటిచే ఆత్మ సంబంధితమైలేదు. ‘ఇది ఆత్మ - అది అనాత్మ’…. అను భేద - అభేదములను వివేకి - దాటివేసి ఉంటాడు. |
||
శాంతాశాంతాదిహీనాత్మా నాదాంతర్జ్యోతిరూపకః . మహావాక్యార్థతో దూరో బ్రహ్మాస్మీత్యతిదూరతః .. 5.. |
|||
05. శాంతాశాంత విహీనాత్మా నాదాంత జ్యోతిరూపకః।। మహావాక్యార్థతో ‘బ్రహ్మాస్మి’ ఇతి అతి దూరతః।। |
శాంత - అశాంత రహితమగు (ఆ రెండింటికీ సాక్షి అగు) ఆత్మను ఆతడు సర్వత్రా దర్శించుచున్నాడు. నాదమునకు ఆవల ‘వత్తి లేని జ్యోతి’ రూపకుడై వెలుగొందుచున్నాడు. ‘బ్రహ్మాస్మి’ అను మాటలకు కూడా అతిదూరంగా ఉంటున్నాడు. బ్రహ్మమే తానైనప్పుడు, ఇక బ్రహ్మాస్మి వాక్యార్థము అవసరమే లేనివాడగుచున్నాడు. (మామిడిపండు తన ‘తీపి’ గురించి ప్రచారము చేసుకోవలసిన పనేమున్నది) |
||
తచ్ఛబ్దవర్జ్యస్త్వంశబ్దహీనో వాక్యార్థవర్జితః . క్షరాక్షరవిహీనో యో నాదాంతర్జ్యోతిరేవ సః .. 6.. |
|||
06. ‘తత్’ శబ్ద వర్జః ‘త్వమ్’ శబ్ద హీనో వాక్యార్థ వర్జితః। క్షరాక్షర విహీనో యో నాదాంత జ్యోతిరేవ సః। |
బ్రహ్మమును సిద్ధించుకొన్నవారు - తత్ - త్వమ్ శబ్దముల భేదమును రహితము చేసి ఏక - అఖండ బ్రహ్మమును దర్శించువారై ఉంటున్నారు. సర్వ వాక్యార్థములను అధిగమించి ఏకత్వమునందు ఐక్యత్వము పొందిన వాడగుచున్నారు. నాదమునకు ఆవల తత్త్వార్థ రూప కేవల జ్యోతి స్వరూపులై, ఇక క్షర - అక్షర భేద రహితులగుచున్నారు. |
||
అఖండైకరసో వాహమానందోఽస్మీతి వర్జితః . సర్వాతీతస్వభావాత్మా నాదాంతర్జ్యోతిరేవ సః .. 7.. |
|||
07. అఖండైక రసోవాహమ్, ఆనందోఽస్మి - ఇతి వర్జితః సర్వాతీత స్వభావాత్మా, నాదాంత జ్యోతిరేవ సః।। |
‘నేనే అఖండైక (అఖండ + ఏక) రస ఆనందస్వరూపుడను’… మొదలైన శబ్దముల ఆవస్యకతను కూడా దాటివేసిన వారై సర్వమునకు అతీతమగు - నాదమునకు ఆవల కేవల స్వయం-జ్యోతి స్వరూపుడై సంప్రకాశమానుడగుచున్నారు. |
||
ఆత్మేతి శబ్దహీనో య ఆత్మశబ్దార్థవర్జితః . సచ్చిదానందహీనో య ఏషైవాత్మా సనాతనః .. 8.. |
|||
08. ‘ఆత్మ’ ఇతి శబ్ద హీనోఽయం ఆత్మ శబ్దార్థ వర్జితః సత్-చిత్-ఆనంద హీనో య ఏషైవ ఆత్మా సనాతనః।। |
‘ఇది నా ఆత్మ’ అను శబ్దములను అధిగమించి ఆత్మ శబ్దార్థములను వదలి వేసినవాడగుచున్నారు. (ఆత్మయే తానై ఉండగా, ఇక ‘ఆత్మ’ అను శబ్దార్థముల విచారణతో పనిఏమి?). ఆతనిపట్ల సత్ - చిత్ - ఆనంద శబ్దముల వ్యవహారమంతా తొలగి తనకు తానే ‘సనాతనాత్మ’గా వెలుగొందుచున్నాడు. ఆతడు బ్రహ్మము గురించి ఎరిగినవాడు మాత్రమే కాడు! బ్రహ్మమే తాను! |
||
స నిర్దేష్టుమశక్యో యో వేదవాక్యైరగమ్యతః . యస్య కించిద్బహిర్నాస్తి కించిదంతః కియన్న చ .. 9.. |
|||
09. స నిర్దేష్టుమ్ అశక్యో యో వేద వాక్యైః అగమ్యగః, యస్య కంచిత్ బహిః నాస్తి కించిత్ అంతః కియత్ న చ। |
అట్టి బ్రహ్మమే తానై యున్న వాని స్థితి ‘ఇట్టిది’ అని నిర్ణయించి - నిర్దేశించి చెప్పలేము! వేదవాక్యములకు కూడా దొరుకనివాడు! కేవలానుభవము నందు బ్రహ్మమే తానై వెలుగొందువాడు! ఆతనికిక బాహ్య ప్రపంచము లేదు. అంతర ప్రపంచము లేదు. ఆ భేదమే ఉండదు. శాస్త్ర పాఠ్యాంశాలన్నీ మౌనము వహిస్తాయి! ఆతడు మౌనాననుభవుడై ఉంటాడు! (మౌనవాఖ్యా ప్రకటిత పరబ్రహ్మ తత్త్వమ్ యువానమ్) |
||
యస్య లింగం ప్రపంచం వా బ్రహ్మైవాత్మా న సంశయః . నాస్తి యస్య శరీరం వా జీవో వా భూతభౌతికః .. 10.. |
|||
10. యస్య లింగం ప్రపంచం వా బ్రహ్మైవ ఆత్మా, న సంశయః। నాస్తి యస్య శరీరం వా జీవోవా భూత భౌతికః।। |
అఖండమగు ఆత్మయే తానైయున్న ఆత్మస్థితియందు…, తానే బ్రహ్మమై వెలుగొందుచుండగా ఇక ఈ భౌతిక (లింగ) ప్రపంచమంతా ఆతని దృష్టిలో (నాటకం-పాత్రయొక్క నాటకీయ సంబంధాలు వలె) స్వతఃగా లేనిదే అగుచున్నది. - ‘అహమ్ బ్రహ్మాస్మి’ శబ్దమును దాటి, భావనలో ప్రవేశించి ఉన్నవానికి ఇక, - శరీరము - జీవాత్మ - భౌతికమైన భూత ప్రపంచము కల్పనామాత్రమై, ‘లేనివే’ అగుచున్నాయి. ఎవరో వ్రాసిన ఏదో కథవలె వినోదరూపమగుచున్నాయి. |
||
నామరూపాదికం నాస్తి భోజ్యం వా భోగభుక్చ వా . సద్వాఽసద్వా స్థితిర్వాపి యస్య నాస్తి క్షరాక్షరం .. 11.. |
|||
11. నామరూపాదికం నాస్తి, భోజ్యం వా, భోగభుక్చ వా, సద్వా-అసద్వా స్థితిర్వ అపి, యస్య నాస్తి క్షర - అక్షరమ్।। |
- నామ రూపములు, బోగించబడునది - భోగము - భోగించువాడు (All that being experienced - Experiencing - Experiencer) ‘లేనివే’ అగుచున్నాయి. సత్తు - అసత్తు, క్షరము - అక్షరము…అను వాటికి కూడా స్థానము లేనట్టిది ఆత్మానుభవము! |
||
గుణం వా విగుణం వాపి సమ ఆత్మా న సంశయః . యస్య వాచ్యం వాచకం వా శ్రవణం మననం చ వా .. 12.. గురుశిష్యాదిభేదం వా దేవలోకాః సురాసురాః . యత్ర ధర్మమధర్మం వా శుద్ధం వాశుద్ధమణ్వపి .. 13.. |
|||
12. గుణం వా విగుణంవా పి, సమ ఆత్మా, న సంశయః, యస్య వాచ్యం వాచకం వా శ్రవణం మననం చ వా, 13. గురు శిష్యాది భేదం వా దేవలోకాః సుర - అసురాః యత్ర ధర్మం - అధర్మం వా శుద్ధం వా అశుద్ధమ్ అణ్వపి।। |
కేవలాత్మానుభవమునందు ప్రవేశించిన వానికి…. - త్రిగుణములు లేవు. గుణరాహిత్యము లేదు. ‘గుణములను దాటివేస్తేనే ఆత్మ అనుభవమౌతుంది’ అను సందేహమే ఉండదు. గుణసహిత - గుణరహిత స్థితులలో సమమగు ఆత్మయే అనుభవైక వేద్యము అగుచున్నది! ఎవ్వనియొక్క ‘వచించువాడు - వచనము - వచించబడునది, వినబడునది - వినికిడి - వినువాడు, మనస్సు - మననము - మననము చేయబడే వస్తువు → ఇవన్నీ ఆత్మయందు లయించి, లేనివగుచున్నాయో, - గురుశిష్య భేదమంతా సమసిపోతోందో, దేవ - భూ - పాతళములనబడే లోక భేదములు కనబడకుండా పోతున్నాయో, - దేవతలు - రాక్షసులు మొదలైన భేదమంతా ఏ ఆత్మానుభవి సమక్షంలో అభేదము సంతరించుకుంటున్నాయో…, - ఏ చోట ధర్మ - అధర్మములకు శుద్ధ - అశుద్ధములకు అణువంత కూడా చోటులేదో…, |
||
యత్ర కాలమకాలం వా నిశ్చయః సంశయో న హి . యత్ర మంత్రమమంత్రం వా విద్యావిద్యే న విద్యతే .. 14.. |
|||
14. యత్రకాలమ్ అకాలం వా నిశ్చయః, సంశయో నహి, యత్ర మంత్రం - అమంత్రం వా విద్య - అవిద్యే న విద్యతే।। |
- ఎచ్చట త్రికాలములు అకాలములో ఏకమై ఆత్మయొక్క నిశ్చయము అశంసయము స్థిరరూపము పొందుతాయో, - ఎక్కడ మంత్ర - అమంత్రములు, విద్య - అవిద్యలు…అనునవి భేదమై కనుపించవో…, |
||
ద్రష్టృదర్శనదృశ్యం వా ఈషన్మాత్రం కలాత్మకం . అనాత్మేతి ప్రసంగో వా హ్యనాత్మేతి మనోఽపి వా .. 15.. |
|||
15. ద్రష్టృ దర్శన దృశ్యం వా ఈషణ్మాత్రం కలాత్మకమ్, అనాత్మేతి ప్రసంగో వా హి అనాత్మేతి మనోఽపి వా, |
- ద్రష్ట - దర్శన - దృశ్య భేదమంతా కూడా ఆత్మయొక్క కించిత్ కలాప్రదర్శన విశేషము మాత్రమే. - ‘అనాత్మ’ అనునదే మాట్లాడటానికి గాని, మనస్సులో ఆలోచించటానికి గాని ఏమాత్రము ఉండి ఉండదో… అదియే అనన్యాత్మత్వము. |
||
అనాత్మేతి జగద్వాపి నాస్తి నాస్తి నిశ్చిను . సర్వసంకల్పశూన్యత్వాత్సర్వకార్యవివర్జనాత్ .. 16.. |
|||
16. అనాత్మేతి జగద్వాపి, నాస్తి నాస్తీతి నిశ్చిను।। సర్వసంకల్ప శూన్యత్వాత్, సర్వ కార్య వివర్జనాత్। |
- ఏచోట ‘ఈ జగత్తు అనాత్మ’ అనునది ఏమాత్రము ‘లేనిది’ అగుచున్నదో, అదియే ఆత్మత్వము, ఆత్మస్థానము, ఆత్మానుభవిత్వము కూడా. ఆత్మ సర్వసంకల్ప రహితము, సర్వసంకల్పాతీతము కూడా. |
||
కేవలం బ్రహ్మమాత్రత్వాన్నాస్త్యనాత్మేతి నిశ్చిను . దేహత్రయవిహీనత్వాత్కాలత్రయవివర్జనాత్ .. 17.. |
|||
17. కేవలం బ్రహ్మమాత్రత్వాత్ నాస్తి అనాత్మేతి నిశ్చిను। దేహత్రయ విహీనత్వాత్, కాలత్రయ వివర్జనాత్, |
ఓ నిదాఘ మనిసత్తమా! ఆత్మస్థితి గురించి ఇంకా కొన్ని విశేషాలు వినండి. - కేవలము బ్రహ్మము మాత్రమే ఉన్నది. ‘అనాత్మ’ అనునదే లేదు. - ఆత్మ అకర్త-అభోక్త కాబట్టి ‘ఇది చేశాను - అది చేయలేదు. ఇంకా అది చేయాలి’ అను రూపము గల కార్యక్రమములన్నీ అంతరమున వదలివేసిన స్థితి! అట్టి ఆత్మ స్థితిలో స్థూలదేహము లేదు. సూక్ష్మదేహము లేదు. కారణదేహము లేదు. భూతకాలము లేదు. వర్తమాన కాలము లేదు. భవిష్యత్ కాలము లేదు. ఆత్మవేత్త → దేహత్రయ - కాలత్రయ వివర్జితుడై, సర్వదా కేవలుడై ఉంటాడు! |
||
జీవత్రయగుణాభావాత్తాపత్రయవివర్జనాత్ . లోకత్రయవిహీనత్వాత్సర్వమాత్మేతి శాసనాత్ .. 18.. |
|||
18. జీవత్రయ గుణ అభావాత్, తాపత్రయ వివర్జనాత్, లోకత్రయ విహీనత్వాత్- సర్వమ్ ఆత్మేతి శాసనాత్।। |
అట్టి ‘ఆత్మమేవాహమ్’ స్థితి… → జీవుడు - ఈశ్వరుడు - ఆత్మల భేదము, బాల్య - యౌవన, వార్ధక్య భేదము లేనట్టిది. → ఆథి భౌతిక - ఆధి దైవిక - ఆధ్యాత్మిక తాపములు విసర్జించివేసినట్టిది. - భూ - సుర - పాతాళ లోకముల నివాస భేదమే ఉండనట్టిది. ‘సర్వము ఆత్మయే’ అను అనుశాసనము కలిగి ఉన్నట్టిది. |
||
చిత్తాభాచ్చింతనీయం దేహాభావాజ్జరా న చ . పాదాభావాద్గతిర్నాస్తి హస్తాభావాత్క్రియా న చ .. 19.. |
|||
19. చిత్త అభావాత్ చింతనీయం (న), దేహ అభావత్ జరా-న చ। పాద అభావాత్ గతిః నాస్తి। హస్త అభావాత్ క్రియా న చ।। |
- ఆత్మానుభవము సమక్షములో దేహత్వమే లేదు కాబట్టి, వార్ధక్యము లేదు. - పాదములు అభావించబడుటచేత గతి (Walking towards whatever) అనునది లేనిదే! - చేతుల భావమే అభావమై పోతోంది కనుక, క్రియలు ఉండనివే! |
||
మృత్యుర్నాస్తి జనాభావాద్బుద్ధ్యభావాత్సుఖాదికం . ధర్మో నాస్తి శుచిర్నాస్తి సత్యం నాస్తి భయం న చ .. 20.. |
|||
20. మృత్యుః నాస్తి జనన అభావాత్ బుద్ధి అభావాత్ సుఖాదికమ్। ధర్మో నాస్తి। శుచిః నాస్తి। సత్యం నాస్తి। భయం న చ।। |
- ‘ఆత్మనగు నేను దేహముతో పుట్టువాడను కాను’…అను ‘జన్మ’ - అభావము స్వభావసిద్ధమై ఉండటముచేత, ‘మృత్యువు’ కూడా లేనిదే. - ఆత్మానుభవము సమక్షంలో ‘బుద్ధి’ (way of interpreting) ‘లేనిదే’ అగుటచేత సుఖదుఃఖాలు లేనివే! ‘అహమాత్మా’ భావన సమక్షంలో ధర్మము - అధర్మము, శుచి - అశుచి, సత్యము - అసత్యము, భయము - అభయములు కూడా మొదలే లేనివగుచున్నాయి. |
||
అక్షరోచ్చారణం నాస్తి గురుశిష్యాది నాస్త్యపి . ఏకాభావే ద్వితీయం న న ద్వితీయే న చైకతా .. 21.. |
|||
21. అక్షరోచ్చారణం నాస్తి గురు - శిష్యాది నాస్తి అపి, ఏక అభావే ద్వితీయః న న ద్వితీయే, న చ ఏకతా।। |
‘కేవల పరబ్రహ్మమ్’ - నిశ్చలానుభవ ఉచ్చారణను దాటిపోయినట్టి స్థితి కాబట్టి అక్షరము(Letters)కు (‘ఓం’ శబ్దోచ్చారణలకు) ఆత్మన ఆవల ఉన్నట్టిది. ఆత్మ సర్వదా ఏకమే కాబట్టి - గురుశిష్య భేదం లేనిదే. ‘ద్వితీయభావము’ అనునదే లేకపోవటం చేత ‘ఏకభావము’ లేనిదే! ద్వితీయమే లేనిచేట ఏకత్వము మాత్రము ఎక్కడిది? | ||
సత్యత్వమస్తి చేత్కించిదసత్యం న చ సంభవేత్ . అసత్యత్వం యది భవేత్సత్యత్వం న ఘటిష్యతి .. 22.. |
|||
22. సత్యత్వమ్ అస్తిచేత కించిత్, అసత్యం న చ సంభవేత్। అసత్యత్వం యది భవేత్, సత్యత్వం న ఘటిష్యతి।। |
ఆత్మానుభూతి’ ఉన్నచోట సత్యము లేదు. అసత్యము లేదు… ‘సత్యత్వము’ అనేది ఉండటం జరిగితే, ‘ఇది అసత్యము’ అనునది కూడా ఉండగలదేమో. అసత్యత్వము ఉన్నచోట్ల సత్యత్వము ఎట్లా ఘటిస్తుంది? ఘటించదు కదా! |
||
శుభం యద్యశుభం విద్ధి అశుభాచ్ఛుభమిష్యతే . భయం యద్యభవం విద్ధి అభయాద్భయమాపతేత్ .. 23.. |
|||
23. శుభం యది, అశుభం విద్ధి హి, అశుభాత్ శుభమ్ ఇష్యతే। భయం యత్, అభయం విద్ధి, న భయాత్ భయమ్ ఆపతేత్।। |
‘ఇది శుభము’ అని ఉన్నచోట ‘అది అశుభము’ అనునది కూడా ఉన్నదే అగుచున్నది. అశుభము ఉన్నచోట ‘అది శుభము’ అనునది అక్కడే ఉన్నది అగుచున్నది. ఆత్మభావనకు శుభాశుభములు లేవు. ‘భయము‘ ఉన్నచోట ‘అట్లా అయితే అభయము’… అనునది ఉన్నదే అగుచున్నది. ‘ఇది అభయము’ అనునది ఉన్నచోట ‘అది భయము’ అనునది ఉన్నట్లే! ఆత్మ భావన ఉన్నచోట భయ-అభయములు రెండూ ఉండవు. |
||
బంధత్వమపి చేన్మోక్షో బంధాభావే క్వ మోక్షతా . మరణం యది చేజ్జన్మ జన్మాభావే మృతిర్న చ .. 24.. |
|||
24. బంధత్వమ్ అపి చేత్ మోక్షో బంధ అభావే న మోక్షతా। మరణం యదిచేత్ జన్మ జన్మ అభావే మృతిః న చ।। |
‘బంధము’ ఒక వేళ్ళ ఉంటే…అప్పుడు అక్కడ ‘మోక్షము ఎట్లాగురా?’ అనే ప్రశ్న ఉంటుంది. ‘బంధము అనునదే లేదు’…అని అభావించబడిన చోట మోక్ష మెక్కడిది? ‘ఆత్మభావన’ ఉన్నచోట బంధ -మోక్ష భావనలకు చోటు ఉండదు. పునర్జన్మ ఉన్నదా? ‘మరణము’ అనేది ఉంటే…అప్పుడు ‘జన్మ’ అనేది ఉంటుంది. ‘మరణము’ అనే భావనయే లేనిచోట ‘జన్మ’ అనునది ఎక్కడిది? ఆత్మభావన ఉన్నచోట జనన మరణములు లేవు. ఆత్మదృష్ట్యా ఈ జన్మయే లేనప్పుడు ఇక పునర్జన్మ ఎక్కడిది? |
||
త్వమిత్యపి భవేచ్చాహం త్వం నో చేదహమేవ న . ఇదం యది తదేవాస్తి తదభాదిదం న చ .. 25.. |
|||
25. ‘త్వమ్’ ఇతి అపి భవేత్ చ ‘అహమ్’, త్వమ్ నోచేత్ అహమేవ న। ‘ఇదం’ యది ‘తదేవ’ అస్తి, తత్ అభావాత్ ‘ఇదం’ న చ।। |
కలలో ఎవ్వరో కనిపిస్తూ ఉంటే…ఆ ‘నీవు’ అనబడునది వాస్తవానికి లేదు కదా! ఆత్మభావనచే ఈ జాగ్రత్‌లో ‘నీవు!’ అనునది కూడా రహితమై పోతోంది. ‘నీవు’ (త్వమ్) లేనిచోట ‘నేను’ (అహమ్) కూడా లేనిదే! ఇది (జీవాత్మ - జగత్తు) ఉంటే అది (పరమ్) ఉన్నదగుచున్నది. ‘ఇదమ్’…. అను భావన ఆత్మయొక్క భావనచే రహితమగుచున్నప్పుడు ఇక ‘తత్’ భావన మాత్రము ఎక్కడిది? (ఆ రెండూ వేరువేరుగా లేనివే). |
||
అస్తీతి చేన్నాస్తి తదా నాస్తి చేదస్తి కించన . కార్యం చేత్కారణం కించిత్కార్యాభావే న కారణం .. 26.. |
|||
26. అస్తి ఇతి చేత్ నాస్తి తదా, నాస్తి చేత్ అస్తి కించ న। కార్యం చేత్ కారణం కించిత్ కార్య అభావే న కారణమ్।। |
‘ఇది ఉన్నది’ అని అనుచున్నచోట ‘అది లేదు’ అనునది ఉంటున్న దగుచున్నది. ‘అది లేదు’ అన్నచోట మరొకటి ‘ఉన్నది’ అనునది స్ఫురణలో ఉంటుంది. ఆత్మభావనయందు ‘ఉన్నది - లేదు’ అనునదేదీ లేదు. ‘కార్యము ఇది’…. (something happened) అనునది ఉన్న చోట కారణము కించిత్‌గా అయినా ఉంటుంది. ‘‘కార్యము లేదు’’ - అని కార్యమును అభావించినప్పుడు కారణము ఎక్కడుంటుంది? ఆత్మ కార్యకారణ రహితము! ఈ జగత్తంతా కూడా కార్యకారణ రహితము! |
||
ద్వైతం యది తదాఽద్వైతం ద్వైతాభావే ద్వయం న చ . దృశ్యం యది దృగప్యస్తి దృశ్యాభావే దృగేన న .. 27.. |
|||
27. ద్వైతం యది, తదా అద్వైతం, ద్వైత అభావే ద్వయం న చ। దృశ్యం యది (చేత్) దృక్ అపి అస్తి దృశ్య అభావే దృక్ ఏవ న।। |
ద్వైత భావన ఉండి ఉన్నచోట ఇది ‘అద్వైతము’ అనుభావన ఉంటుంది. రెండవది ఉన్నచోట ‘ఒకటి’ ఉన్నదగుచున్నది. రెండవదే లేనిచోట ఒక్కటి మాత్రము ఎక్కడిది? ఆత్మ భావనయందు ద్వైత అద్వైతములు లేవు. దృశ్యము అనేది నిజానికి ఉంటే, ‘ద్రష్ట’ అనే వాడు ఉండినవాడై ఉంటాడు. ఆత్మభావనచే దృశ్యమే అభావించబడుచుండగా, ఇక ద్రష్ట ఎక్కడున్నాడు? |
||
అంతర్యది బహిః సత్యమంతా భావే బహిర్న చ . పూర్ణత్వమస్తి చేత్కించిదపూర్ణత్వం ప్రసజ్యతే .. 28.. తస్మాదేతత్క్వచిన్నాస్తి త్వం చాహం వా ఇమే ఇదం . నాస్తి దృష్టాంతికం సత్యే నాస్తి దార్ష్టాంతికం హ్యజే .. 29.. |
|||
28. అంతర్ యది, బహిః సత్యం అంతః అభావే బహిః న చ। పూర్ణత్వమ్ అస్తిచేత్ కించిత్ అపూర్ణత్వం ప్రసజ్యతే।। 29. తస్మాత్ ఏతత్ క్వచిత్ నాస్తి త్వం చ అహం వా ఇమే ఇదమ్। నాస్తి దృష్టాంతగ్ం సత్యే నాస్తి దార్‌ష్టాంతికగ్ం హి యజే।। |
‘పూర్ణత్వము ఉన్నది’ అనుచోట కించిత్ అపూర్ణత్వముగా (Concept of relativity) ఉండియే ఉంటుంది. ఆత్మకు పూర్ణ-అపూర్ణత్వములు లేవు! అందుచేత ఓ నిదాఘ మునీంద్రా! మీకు జగత్తులో స్ఫురిస్తున్న ‘నేను - నీవు - ఆతడు - అది - ఇది’ మొదలైనవన్నీ మొదలే లేవు. ‘మొట్టమొదటగా ఆత్మయే ఉన్నది. ఇప్పుడూ ఆత్మయే ఉన్నది’…అనునదే ఆత్మ భావన! దృష్టాంతాలన్నీ సృష్టి కల్పనలో జనించినవే. ఆత్మ తప్పించి వేరుగా ఏదీ లేనప్పుడు, ఆత్మ జన్మరహితమై ఉండగా, ఇక ఆత్మను చూపు ‘దృష్టాంతము’ ఎక్కడున్నది? ‘దార్‌ష్టాంతగ్’గా చూపబడునది ఏమున్నది? అంతా ఆత్మయే! |
||
పరంబ్రహ్మాహమస్మీతి స్మరణస్య మనో న హి . బ్రహ్మమాత్రం జగదిదం బ్రహ్మమాత్రం త్వమప్యహం .. 30.. |
|||
30. ‘పరం బ్రహ్మాహమస్మి’ ఇతి స్మరణస్య మనో నహి। బ్రహ్మమాత్రం జగత్ ఇదం। బ్రహ్మమాత్రం త్వమపి అహమ్।। |
ఆత్మనో అన్యత్ నాస్తి ‘నేను ఇహమ్ - జగత్తులో ఒక వస్తువును కాదు. పరమ్ బ్రహ్మమునే - అనే మనన ప్రయత్న రూప మనో స్మరణ కూడా ఆత్మాఽహమ్ భావన సమక్షంలో నిలచి ఉండదు. మనస్సే లేనిదగుచున్నచోట ఆ మనస్సు యొక్క ఎట్టి స్మరణకైనా చోటెక్కడిది? ఏ మనస్సుకు ఈ జగత్తు కనిపిస్తోందో, అట్టి జగత్తంతా కూడా స్వతఃగానే ‘బ్రహ్మము’ అయి ఉన్నది. నీవు బ్రహ్మమే! నేను బ్రహ్మమే! |
||
చిన్మాత్రం కేవలం చాహం నాస్త్యనాత్మ్యేతి నిశ్చిను . ఇదం ప్రపంచం నాస్త్యేవ నోత్పన్నం నో స్థితం క్వచిత్ .. 31.. |
|||
31. చిన్మాత్రం కేవలం చ అహమ్ నాస్తి అనాత్మేతి నిశ్చిను। ఇదం ప్రపంచం నాస్త్యేవ నోత్పన్నం (న ఉత్పన్నం), నో స్థితం క్వచిత్।। |
‘‘బ్రహ్మమే ‘నేనుగా - నీవుగా’ సర్వదా అయి ఉన్నది’’ అని బుద్ధితో గ్రహించిన తరువాత అప్పుడు…. సమస్తము చిన్మాత్ర స్వరూపముకదా! ఇక ‘అనాత్మ’ అనునది ఎక్కడున్నది? కనుక, ‘అనాత్మ’ అనునదే లేదను నిశ్చయము కలిగి ఉండుము. బ్రహ్మము అద్వితీయము (రెండవది లేనట్టిది) అయి ఉండగా, నీకు వేరుగా గాని, నాకు వేరుగా గాని, దృశ్యప్రపంచమునకు వేరైగాని ఉండ జాలదు. ప్రపంచము అనునదే లేదు. ఉత్పత్తి కాలేదు. స్థితించియున్నదీ లేదు. లయించబోవునదీ లేదు. ప్రపంచము ఆత్మయే! |
||
చిత్తం ప్రపంచమిత్యాహుర్నాస్తి నాస్త్యేవ సర్వదా . న ప్రపంచం న చిత్తాది నాహంకారో న జీవకః .. 32.. |
|||
32. చిత్తం ప్రపంచం ఇత్యాహుః నాస్తి నాస్త్యేవ సర్వదా। న ప్రపంచం, న చిత్తాది న అహంకారో, న జీవకః।। |
‘ఈ ప్రపంచము చిత్తము యొక్క స్వానుభవమే’…అని చెప్పబడవలసినదీ లేదు. చిత్తము - ప్రపంచము అనబడేవి ఎప్పుడూ లేవు. లేనే లేవు. ఇక వాటి లయమెక్కడిది? ప్రపంచము లేదు. చిత్తము - మనస్సు - బుద్ధి - అహంకారము మొదలైనవి కూడా లేనే లేవు. కాబట్టి ఆత్మకు వేరై ‘జీవుడు’ అనబడువాడే లేడు. నాటకంలో కనిపించే పాత్ర వాస్తవానికి ఎక్కడ సత్యమై ఉన్నది? జగత్తులో జీవాత్మ అట్టిదే! (స్వప్నంలో దృశ్యము వాస్తవానికి లేనట్లే, జాగ్రత్‌లోని దృశ్యము కూడా వాస్తవానికి లేదు). |
||
మాయాకార్యాదికం నాస్తి మాయా నాస్తి భయం నహి . కర్తా నాస్తి క్రియా నాస్తి శ్రవణం మననం నహి .. 33.. |
|||
33. మాయా కార్యాదికం నాస్తి మాయా నాస్తి భయం నహి। కర్తా నాస్తి। క్రియా నాస్తి। శ్రవణం మననం నహి।। |
చిత్తము - జగత్తు - జీవాత్మలు ఆత్మకు వేరై లేనేలేదు. అప్పుడు మాయ - వాటి కార్యములు మాత్రం ఎక్కడున్నాయి? మాయ లేదు. (యా మా)! (కలలోని క్రియలకు కర్తలేని తీరుగా)…ఇక్కడ కర్తలేడు. క్రియ లేదు. శ్రవణ - మనన - నిదిధ్యాసలు లేవు. |
||
సమాధిద్వితయం నాస్తి మాతృమానాది నాస్తి హి . అజ్ఞానం చాపి నాస్త్యేవ హ్యవివేకం కదాచన .. 34.. |
|||
34. సమాధి ద్వితయం నాస్తి మాతృమానాది నాస్తి హి। అజ్ఞానంచాఽపి నాస్త్యేవ హి, అవివేకం కదాచ న।। |
నేనూ-నీవూ ఆత్మయే కదా! ఇక వేరే ధ్యానమెక్కడిది? ‘సమాధి’ ఎక్కడిది? ఆత్మను వదిలి ద్వితీయములో ప్రవేశించటము (సమాధి నుండి చ్యుతి) లేదు. ప్రమాణము లేదు. మానము లేదు. అవమానములేదు. నీవు-నేను, ఆత్మకాని క్షణమే లేదు. అటువంటప్పుడు అజ్ఞానము మాత్రము ఎక్కడిది? అది తొలగటమెక్కడిది? అజ్ఞానము లేదు. అవివేకములేదు. అంతా ఆత్మయే! |
||
అనుబంధచతుష్కం న సంబంధత్రయమేవ న . న గంగా న గయా సేతుర్న భూతం నాన్యదస్తి హి .. 35.. |
|||
35. అనుబంధ చతుష్కం న। సంబంధ త్రయమ్ ఏవ న। న గంగా న గయా సేతుః న భూతం న అన్యత్ అస్తి హి।। |
సర్వదా ఆత్మస్వరూపులమైయున్న మనకు అనుబంధ చతుష్కము (జగత్తుతో-దేహముతో-ఆలోచనతో-ఇష్టముతో అనుబంధము) లేనే లేదు. - త్రికాలములతో, దృశ్య - జీవ - ఈశ్వరులతో, అహమ్ - త్వమ్ - సః లతో ఆత్మకు సంబంధత్రయము లేదు. - గంగాస్నానముచే పవిత్రులమవటము, గయ ఉత్తమ లోకాలకు సేతువు అవటం, పాంచభౌతికత్వము, అద్దానికి వేరైనవి… ఇవన్నీ లేవు. ఆత్మగా ఉండజాలవు. |
||
న భూమిర్న జలం నాగ్నిర్న న వాయుర్న చ ఖం క్వచిత్ . న దేవా న చ దిక్పాలా న వేదా న గురుః క్వచిత్ .. 36.. |
|||
36. న భూమిః న జలం న అగ్నిః న వాయుః న చ ఖం క్వచిత్। న దేవా, న చ దిక్పాలా, న వేదా న గురుః క్వచిత్।। |
‘ఆత్మాఽహమ్’ స్వరూపులమగు మనము సహజముగా అఖండాత్మయే అయి ఉండగా…భూ-జల- అగ్ని-వాయు-ఆకాశ స్వరూప సంబంధము లేనేలేదు. మనము పంచభూతములకు సంబంధించినవారము కాము. అవి మనకు సంబంధించినవి కావు. కల్పన కల్పనయే కదా! ఆత్మ సర్వదా అఖండము - అప్రమేయము కదా! అందుచేత ఇక (వేరుగా) దేవతలూ లేరు. దిక్పాలకులు లేరు. వేదములు లేవు. గురువులులేరు. |
||
న దూరం నాస్తికం నాలం న మధ్యం న క్వచిత్స్థితం . నాద్వైతం ద్వైతసత్యం వా హ్యసత్యం వా ఇదం న చ .. 37.. |
|||
37. న దూరం న అన్తికం న అన్తం న మధ్యం న క్వచిత్ స్థితమ్। న అద్వైతం ద్వైత సత్యం వా హి, అసత్యం వా ఇదం న చ।। |
సహజ-అప్రమేయ-నిర్మల-ఆత్మ స్వరూపులమై ఉండటము చేత ఆత్మగా మనకు ‘వారు దూరము’ అనునదీ లేదు. ‘వీరు దగ్గిర’ అనునదీ కించిత్ కూడా లేదు. దూరము-దగ్గర-మధ్య-ఇక్కడ-ఎక్కడో ఇవన్నీ లేవు. - అద్వైతము లేదు. ద్వైతమూ లేదు. ఇక్కడ సత్యము లేదు. అసత్యము లేదు. సందర్భంగా అంతా సత్యమే! సహజంగా చూస్తే అంతా అసత్యమే! |
||
బంధమోక్షాదికం నాస్తి సద్వాఽసద్వా సుఖాది వా . జాతిర్నాస్తి గతిర్నాస్తి వర్ణో నాస్తి న లౌకికం .. 38.. |
|||
38. బంధ మోక్షాదికం నాస్తి సద్వా అసద్వా సుఖాది వా। జాతిః నాస్తి। గతిః నాస్తి। వర్ణో నాస్తి, న లౌకికమ్।। |
జీవాత్మ పరమాత్మకు అంశ - ప్రతిబింబ రూపము కనుక పరమాత్మగా బంధమోక్షాదులులేవు. ఆత్మ సర్వమునకు వేరై (అప్రమేయమై ఉన్నదికాబట్టి) ఆత్మకు బంధ మోక్షములు మొదలే లేవు. అట్లాగే సత్తు లేదు. అసత్తులేదు. సుఖము లేదు. దుఃఖము లేదు. దేహధర్మములైనట్టి జాతి - గతి - కదలిక - రాకపోకలు - లౌకిక ధర్మాలు - ఇవన్నీ కూడా సర్వదా త్రికాలములలోను ఆత్మస్వరూపులమగు మనకెక్కడివి? అసలే లేవు! |
||
సర్వం బ్రహ్మేతి నాస్త్యేవ బ్రహ్మ ఇత్యపి నాస్తి హి . చిదిత్యేవేతి నాస్త్యేవ చిదహంభాషణం న హి .. 39.. |
|||
39. సర్వం బ్రహ్మేతి నాస్త్యేవ బ్రహ్మ ఇత్యేవ నాస్తి హి। చిత్ ఇత్యేవేతి నాస్త్యేవ చిదహమ్ భాషణం నహి।। |
మనము సర్వదా సర్వ కల్పనా స్వరూపమగు బ్రహ్మమే అయి ఉండగా, మనకిక ‘సర్వంఖిల్విదమ్ బ్రహ్మ’ ‘బ్రహ్మతత్త్వము’-ఇటువంటి వాక్యార్థము లతో పనేమున్నది? అవన్నీ ఆత్మగా మనకు లేవు. అట్లాగే ‘‘చిత్ - చిదహమ్ - చిత్ త్వమ్’’ఇత్యాది సంభాషణల వలన కొత్తగా వచ్చేదేమున్నది? పోయేదే మున్నది? అహమ్ ఆత్మా! త్వమ్ ఆత్మా! - మాలలతో పనేమున్నది! (అఖండత్వము, అప్రమేయత్వము స్వాభావికమే అగుచున్నది). | ||
అహం బ్రహ్మాస్మి నాస్త్యేవ నిత్యశుద్ధోఽస్మి న క్వచిత్ . వాచా యదుచ్యతే కించిన్మనసా మనుతే క్వచిత్ .. 40.. |
|||
40. అహం బ్రహ్మాస్మి నాస్త్యేవ నిత్యశుద్ధోఽస్మి న క్వచిత్। వాచా యత్ ఉచ్యతే కించిత్, మనసా మనుతే క్వచిత్, |
‘అహం బ్రహ్మాస్మి - నిత్య శుద్ధోఽస్మి’ అని వాక్కుతో చెప్పటం, మననము చేయటం మొదలైనవేవీ అవసరమే లేదు. అద్వితీయత్వము నా స్వభావమే! ఇక మాటలతో పని ఏమి? (ఒక అధికారి ‘నేను అధికారినే!’ - అనే జపము చేయటం అవసరం లేదు కదా!). |
||
బుద్ధ్యా నిశ్చినుతే నాస్తి చిత్తేన జ్ఞాయతే నహి . యోగీ యోగాదికం నాస్తి సదా సర్వం సదా న చ .. 41.. |
|||
41. బుద్ధ్యా నిశ్చినుతే నాస్తి। చిత్తేన, జ్ఞాయతే నహి। యోగీ యోగాదికం నాస్తి సదా సర్వగ్ం సదా న చ।। |
బుద్ధితో కొత్తగా నిశ్చయించవలసినది ఏమున్నది? చిత్తముతో తెలుసు కోవలసినదేమున్నది? ‘మనము సర్వదా ఆత్మానంద స్వస్వరూపులము’… అనేది ఎప్పటికీ ఉన్న మాటయే! యోగీత్వము లేదు. యోగత్వము లేదు. ‘అంతా నేనే! ఏదీ నేను కాదు’ అనే విశేషణ వర్ణములుతోనూ పనిలేదు. (స్వస్వరూపము సర్వదా కేవలాత్మయే కదా!). |
||
అహోరాత్రాదికం నాస్తి స్నానధ్యానాదికం నహి . భ్రాంతిరభ్రాంతిర్నాస్త్యేవ నాస్త్యనాత్మేతి నిశ్చిను .. 42.. |
|||
42. అహోరాత్రాదికం నాస్తి స్నాన ధ్యానాదికం నహి। అహ్రాంతిః ఆహ్రాంతిః అపి న నాస్తి అనాత్మేతి నిశ్చిను।। |
కాలః కాల (కాలనియామక) స్వరూపమగు కాలమే లేదు. పగలు లేదు. రాత్రిలేదు. సంధ్యా సమయమనునదీ లేదు. స్నానము లేదు. ధ్యానము మొదలైనవి లేవు. ధ్యానము యొక్క ఆశయ వస్తువే నేనై ఉండగా… ఇక నేనే అయి ఉన్న ఆత్మ గురించిన నియమ నిష్ఠలు ఎందుకు? నేను నేనై, ఈ జగత్తు నా భావన అయి సర్వము నాకు అద్వితీయమై ఉండగా, ఇక అహ్రాంతి ఎక్కడిది? ఆహ్రాంతి ఎక్కడిది? అనాత్మ అని మీరు దేనిగురించి అడిగారో అట్టి దేదీ లేదు! నాకు వేరైనదుంటే కదా అనాత్మ! ‘వేరు’ అని అనుకోవటమే అనాత్మ! |
||
వేదశాస్త్రం పురాణం చ కార్యం కారణమీశ్వరః . లోకో భూతం జనస్త్వైక్యం సర్వం మిథ్యా న సంశయః .. 43.. |
|||
కార్యం కారణం ఈశ్వరః లోకో భూతం జనస్తి ఐక్యగ్ం సర్వం మిథ్యా న సంశయః।। |
|
||
బంధో మోక్షః సుఖం దుఃఖం ధ్యానం చిత్తం సురాసురాః . గౌణం ముఖ్యం పరం చాన్యత్సర్వం మిథ్యా న సంశయః .. 44.. |
|||
44. బంధో మోక్షః సుఖం ధ్యానం, చిత్తం సుర అసురాః, గౌణం, ముఖ్యం పరం చ అన్యత్, సర్వం మిథ్యా న సంశయః।। |
బంధము - మోక్షము - సుఖము - దుఃఖము - సాధన - ధ్యానము - చిత్తము - దేవతలు - రాక్షసులు - గౌణము (అముఖ్యము) - ముఖ్యము - పరము - అపరము - అన్నీ మిథ్యయే। అనుమానమే అక్కర్లేదు. |
||
వాచా వదతి యత్కించిత్సంకల్పైః కల్ప్యతే చ యత్ . మనసా చింత్యతే యద్యత్సర్వం మిథ్యా న సంశయః .. 45.. |
|||
45. వాచా వదతి యత్ కించిత్ సంకల్పైః కల్ప్యతే క్వచిత్ మనసా చింత్యతే యత్‌యత్ సర్వం మిథ్యా న సంశయః।। |
- వాక్కుతో ఏమేమి - ఏకించిత్ పలుకబడుచూ ఉంటోందో, - సంకల్పములచే ఏదేది కల్పితమై ఉండటము జరుగుతోందో, - మనస్సుతో ఏదేది ఆలోచనా రూపమగుచున్నదో…అట్టి సర్వము మిథ్యయే! సందేహించవలసినదే లేదు! (ఆ మాట్లాడువాడు, ఆ సంకల్పించు వాడు, ఆ ఆలోచించువాడు - అగునట్టి ఆత్మయే సత్యము). |
||
బుద్ధ్యా నిశ్చీయతే కించిచ్చిత్తే నిశ్చీయతే క్వచిత్ . శాస్త్రైః ప్రపంచ్యతే యద్యన్నేత్రేణైవ నిరీక్ష్యతే .. 46.. శ్రోత్రాభ్యాం శ్రూయతే యద్యదన్యత్సద్భావమేవ చ . నేత్రం శ్రోత్రం గాత్రమేవ మిథ్యేతి చ సునిశ్చితం .. 47.. |
|||
46. బుధ్యా నిశ్చీయతే కించిత్, చిత్తే నిశ్చీయతే క్వచిత్ శాస్త్రైః ప్రపంచ్యతే యత్‌యత్, నేత్రేణైవ నిరీక్ష్యతే, 47. శ్రోత్రాభ్యాం శ్రూయతే యత్‌యత్, అన్యత్ సద్భావమేవ చ, నేత్రం శ్రోత్రం గాత్రమేవ, మిథ్యేతి చ సునిశ్చితమ్।। |
బుద్ధితో ఏదేది ఏకించిత్, అయినా ‘‘ఇది ఇంతే’’ అని నిశ్చయించబడినదై ఉంటోందో, చిత్తముచే ఏదేది ‘బాగు బాగు’ అని ఇష్టమగుచున్నదో, శాస్త్రములచే ఏదేది విస్తరించబడి, విశ్లేషించబడి ‘మనోబుద్ధి-చిత్త- అహంకార-బంధ-మోక్ష’ భాషాయుక్తముగా విభజన పూర్వకంగా చెప్పుకుపోబడుచున్నదో, కళ్లతో ఏదేది ‘ఇది బాగులేదు’ అని చూడబడుచూ ఉన్నదో, చెవులతో ఏదేది వినబడుచూ ఉంటోందో, ఏది మంచి - చెడు - చేయాలి-చేయకూడదు - సద్భావము - దుర్భావముగా చెప్పబడుచూ ఉన్నదో- అంతా మిథ్యయే! - ఈ కళ్లు - చెవులు - గొంతు ….ఇవన్నీ మిథ్యయే. ఇది సునిశ్చితం! |
||
ఇదమిత్యేవ నిర్దిష్టమయమిత్యేవ కల్ప్యతే . త్వమహం తదిదం సోఽహమన్యత్సద్భావమేవ చ .. 48.. యద్యత్సంభావ్యతే లోకే సర్వసంకల్పసంభ్రమః . సర్వాధ్యాసం సర్వగోప్యం సర్వభోగప్రభేదకం .. 49.. సర్వదోషప్రభేదాచ్చ నాస్త్యనాత్మేతి నిశ్చిను . మదీయం చ త్వదీయం చ మమేతి చ తవేతి చ .. 50.. |
|||
48. ఇదమ్ ఇత్యేవ నిర్దిష్టమ్, అయమ్ ఇత్యేవ కల్ప్యతే, త్వమ్, అహమ్, తత్ ఇదగ్ం సోఽహమ్, అన్యత్, సద్భావమేవ చ, 49. యత్ యత్ సంభావ్యతే లోకే, సర్వ సంకల్ప సంభ్రమః సర్వ అధ్యాసగ్ం, సర్వ గోప్యగ్ం, సర్వభోగ ప్రభేదకమ్, 50. సర్వ దోష ప్రభేదాశ్చ నాస్తి। అనాత్మేతి నిశ్చిను।। మదీయం చ, త్వదీయం చ మమేతి చ, తవేతి చ, |
ఏది అనాత్మగా చూడాలి? - ఇది ఇట్లాగే చేయాలి! అట్లా చేయరాదు. - ఇది ఇట్లాగే తెలుసుకోవాలి. ఆ రీతిగా తెలుసుకోరాదు. - దీనిపట్ల ఇటువంటి కల్పనయే తగును. అట్టి ఆ రీతి కల్పన తగదు. - నీవు-నేను-అది-ఇది-నేను ఇది, అది కాదు - ఇవి మంచి భావాలు. మంచిగా ఉండాలి-ఇటువంటి రీతిగా లోకంలో సంభవించే సర్వసంకల్ప విభ్రమములన్నీ అనాత్మయే! అనాత్మగా చూచీ - చూడక ఉండాలి. → అట్లాగో - ఇట్లాగో అనుకోకూడనివి (ఉదా : చావు గురించి మాట్లాడుకోకూడదు…మొదలైనవి) అన్నీ కూడా…, → గొప్ప గొప్ప రహస్యములుగా అనుకోబడుతూ ఉండేవి…, → గొప్ప - తక్కువ భోగ విషయాలుగా అనుకోబడేవి…, → సర్వ దోషములకు సంబంధించిన బేధాభిప్రాయములు…ఇవన్నీ లేవు. అవన్నీ సందర్భములకు సంబంధించి మాత్రమే ఉన్నాయి. సందర్భము లేకుంటే లేవు. కనుక అనాత్మగా గమనించబడవలసినవే. |
||
మహ్యం తుభ్యం మయేత్యాది తత్సర్వం వితథం భవేత్ . రక్షకో విష్ణురిత్యాది బ్రహ్మా సృష్టేస్తు కారణం .. 51.. సంహారే రుద్ర ఇత్యేవం సర్వం మిథ్యేతి నిశ్చిను . |
|||
51. మహ్యం తుభ్యం మయా ఇత్యాది తత్ సర్వం వితథం భవేత్। రక్షకో విష్ణుః ఇత్యాది, బ్రహ్మ సృష్టేస్తు కారణమ్, 52. సగ్ంహారే రుద్ర ఇత్యేవగ్ం - సర్వం మిథ్యేతి నిశ్చిను। |
ఓ నిదాఘా! ‘‘ఇది నాకు చెందిన వ్యవహారము. అదంతా నీకు చెందినది. ఇదంతా నాది. అదంతా నీది. నేను చేసేది ఇది. నీవు చేసేది అది’’…ఇదంతా ఏదీ వాస్తవానికి లేవు. భావాలు - అభిప్రాయాలు - ఆవేశాలు - ఆవేదనలు నిమిషానికి ఓ తీరు…కనుక లేవు - అను భావన కలిగియే ఉండండి. ‘‘జగత్తుకు రక్షకుడు విష్ణువు. సృష్టించువాడు బ్రహ్మదేవుడు. సంహారకుడు రుద్రుడు - ఇవన్నీ మిథ్యయే’’….అను నిశ్చయము కలిగి ఉండండి. |
||
స్నానం జపస్తపో హోమః స్వాధ్యాయో దేవపూజనం .. 52.. మంత్రం తంత్రం చ సత్సంగో గుణదోషవిజృంభణం . అంతఃకరణసద్భావ అవిద్యాశ్చ సంభవః .. 53.. అనేకకోటిబ్రహ్మాండం సర్వం మిథ్యేతి నిశ్చిను . |
|||
53. స్నానం జపః తపో హోమః, స్వాధ్యాయో దేవపూజనమ్ మంత్రం తంత్రం చ సత్సంగో, గుణ దోష విజృంభణమ్, అంతఃకరణ సద్భావ, అవిద్యాయాశ్చ సంభవః అనేక కోటి బ్రహ్మాండగ్ం, సర్వం మిథ్యేతి నిశ్చిను। |
స్నాన నియమములు, జపోవిధులు, తపోనిష్ఠలు, హోమక్రియలు, స్వాధ్యాయన పారాయణములు, దేవతాపూజలు, మంత్రములు, తంత్రములు, సత్సంగములు, గుణదోషముల విజృంభణములు, అంతఃకరణము, సద్భావములు, అవిద్య, ఏవేవి సంభవిస్తున్నాయో….అవన్నీ కూడా, అనేక కోటి బ్రహ్మాండములనబడునవి - సర్వము మిథ్యయే → అను అంతర్భావన - నిశ్చయము కలిగియే ఉండండి. |
||
సర్వదేశికవాక్యోక్తిర్యేన కేనాపి నిశ్చితం .. 54.. దృశ్యతే జగతి యద్యద్యద్యజ్జగతి వీక్ష్యతే . వర్తతే జగతి యద్యత్సర్వం మిథ్యేతి నిశ్చిను .. 55.. |
|||
54. సర్వదేశిక వాక్యోక్త్యా యేన కేనాపి నిశ్చితమ్, 55. దృశ్యతే జగతిః యత్ యత్, యత్ యత్ జగతి వీక్ష్యతే, వర్తతే జగతి యత్ యత్, తత్ సర్వం మిథ్యేతి నిశ్చిను। |
సర్వ ఉపదేశవాక్యముల ప్రబోధములు, దేనిచే ఏదేది ఎట్లా నిశ్చయింప బడుచున్నవో….అవన్నీ, ఏదది కళ్లకు ఎదురుగా జగత్తుగా కనిపిస్తోందో…అట్టిదృశ్య జగత్తు, ఏదేది జగత్తును చూస్తోందో….అదియు, ఏదేది జగత్తులో వర్తిస్తోందో అది - అంతా కూడా మిథ్యయే! (స్వప్నములోని స్వప్నద్రష్ట స్వప్నానుభవాలవలె గమనించి ఉండండి). |
||
యేన కేనాక్షరేణోక్తం యేన కేన వినిశ్చితం . యేన కేనాపి గదితం యేన కేనాపి మోదితం .. 56.. |
|||
56. యేన కేన అక్షరేణ ఉక్తం, యేన కేన వినిశ్చితమ్, యేన కేనాపి గదితం, యేన కేనాపి మోదితమ్, |
దేనిచేత ఏదైతే ‘అక్షరము’గా చెప్పబడుచున్నదో, దేని సహాయముచే (ఏ ఏ గురు వాక్యాదుల దృష్టాంతములచే) ఏది సునిశ్చితము అని చెప్పబడు తోందో, ఏదేది-దేనిచే గమనించబడుతోందో, ఏది దేనిచే ఆనందింప బడుచున్నదో, |
||
యేన కేనాపి యద్దత్తం యేన కేనాపి యత్కృతం . యత్ర యత్ర శుభం కర్మ యత్ర యత్ర చ దుష్కృతం .. 57.. యద్యత్కరోషి సత్యేన సర్వం మిథ్యేతి నిశ్చిను . త్వమేవ పరమాత్మాసి త్వమేవ పరమో గురుః .. 58.. |
|||
57. యేన కేనాపి యత్ దత్తం, యేన కేనాపి యత్ కృతమ్, యత్ర యత్ర శుభం కర్మ, యత్ర యత్ర చ దుష్కృతమ్, 58. యత్ యత్ కరోషి సత్యేన సర్వం మిథ్యేతి నిశ్చను। |
- ఏది దేనిచే ఎవ్వరికి ఇవ్వబడుచూ గమనించబడుచున్నదో, - ఏది దేనిచేత, దేని కొరకు నిర్వర్తించబడుతోందో, - ఎక్కడెక్కడ ఏది శుభకర్మగా అనుకోబడుతోందో, - ఎక్కడెక్కడ ఏది ఎవరిచేత అశుభకర్మగా పరిగణించబడుతోందో…, - ఏదేది ఎక్కడ ఎట్లా చేస్తూ ఇది ‘సత్యమే’ అను భావనతో చూస్తూ ఉన్నారో - అదంతా ‘మిథ్యయే’ అని ఎరిగియే ఉండండి. |
||
త్వమేవాకాశరూపోఽసి సాక్షిహీనోఽసి సర్వదా . త్వమేవ సర్వభావోఽసి త్వం బ్రహ్మాసి న సంశయః .. 59.. |
|||
త్వమేవ పరమో గురుః। త్వమేవ ఆకాశరూపోఽసి సాక్షి హీనోఽసి సర్వదా। త్వమేవ సర్వభావోఽసి త్వమ్ బ్రహ్మాఽసి। న సంశయః।। |
ఋభుమహర్షి : నీవే పరమాత్మ. నీవే పరమ గురువు! నీకు నీవే పరమాత్మ - పరమ గురువు అయి ఉండగా, ‘పరమాత్మ వేరు, నేను వేరు’…… అనునది మిథ్యయే మరి. (ఆత్మైవహి గురుః। గురోర్గురుః।) - నీవే ఇటు, భౌతికాకాశ - అటు, పరమాకాశరూపుడవు కూడా! - నీవు దృశ్య-దేహ-మనో-చిత్త-అహంకార-జీవాత్మ-ఈశ్వరాత్మలకు కేవలసాక్షివి. జాగ్రత్-స్వప్న-సుషుప్తులకు కూడా సాక్షివి. నీకు సాక్షి ఇంకెవరూ లేరు. నీయొక్క సర్వభావములు నీ స్వరూపమే. నీవే బ్రహ్మమువు. సంశయమే ఉండనక్కర్లేదు. |
||
కాలహీనోఽసి కాలోఽసి సదా బ్రహ్మాసి చిద్ఘనః . సర్వతః స్వస్వరూపోఽసి చైతన్యఘనవానసి .. 60.. సత్యోఽసి సిద్ధోఽసి సనాతనోఽసి ముక్తోఽసి మోక్షోఽసి ముదామృతోఽసి . దేవోఽసి శాంతోఽసి నిరామయోఽసి బ్రహ్మాసి పూర్ణోఽసి పరాత్పరోఽసి .. 61.. |
|||
60. కాలహీనోఽసి, కాలోఽసి, సదా బ్రహ్మాసి చిద్ఘనః। సర్వతః సర్వరూపోఽసి స్వస్వరూపోఽసి చైతన్యఘనవాన్ అసి।। 61. సత్యోఽసి। సిద్ధోఽసి। సనాతనోఽసి। ముక్తోఽసి। మోక్షోఽసి। ముదామృతోఽసి। దేవోఽసి। శాంతోఽసి। నిరామయోఽసి। బ్రహ్మాసి। పూర్ణోఽసి। పరాత్పరోఽసి।। |
త్రికాలములలో ఏకరూపుడవు కాబట్టి నీవు కాలమునకు సంబంధించిన వాడివే కావు. కాల రహితుడవు. కానీ కాల స్వరూపుడవునీవే! (నాటకంలోని పాత్ర నీవు కావు. కానీ జరుగుచున్న నాటకంలో పాత్రగా కనిపిస్తున్నది మాత్రం నీవే - అను తీరుగా!) సదా చిద్ఘన (ఘనీభూతమైన ఎరుకతో కూడిన) బ్రహ్మమువు. సర్వత్రా సర్వరూపములు నీవే! ఘనీభూత చైతన్య స్వరూపుడవు. సత్ య- సత్యరూపుడవు. సర్వము నీ చేతనే సిద్ధింపజేయ బడుతోంది. కనుక సిద్ధిరూపుడవు. జన్మ-కర్మములకంటే , ఈ లోకముల ప్రహసనముకంటే మునుముందే ఉండి ఉన్నవాడిని. కనుక సనాతనుడవు. ఆత్మస్వరూపుడవగుటచే నిత్యముక్తుడవు. ఆత్మకు బంధమెక్కడిది? కనుక ‘మోక్ష రూపుడవు. నీ క్రీడా వినోదమే సరదాయే ఈ సృష్టి. కనుక ఆనందామృతుడవు. దేవతలకే దేవుడవు. శాంతస్వరూపుడవు. నిరామయుడవు. నీవే బ్రహ్మమువు. పూర్ణుడవు. పరాత్పరుడవు! |
||
సమోఽసి సచ్చాపి సనాతనోఽస సత్యాదివాక్యైః ప్రతిబోధితోఽసి . సర్వాంగహీనోఽసి సదా స్థితోఽసి బ్రహ్మేంద్రరుద్రాదివిభావితోఽసి .. 62.. |
|||
62. సమోఽసి। సచ్చాఽసి। సనాతనోఽసి। సత్యాది వాక్యైః ప్రతిబోధితోఽసి। బ్రహ్మేంద్ర రుద్రాది విభావతోఽసి।। సర్వాంగ హీనోఽసి। సదా స్థితోఽసి। |
సర్వము నీవే కనుక సర్వసముడవు. కేవల సత్ స్వరూపుడవు. సర్వకల్పనలు నీవే కాబట్టి సనాతనుడవు! సత్ - చిత్ - ఆనంద→ ఉనికి - ఎరుక - అనుభూతి … మొదలైన అనేక వాక్యములలో ప్రబోధించబడునది నీ స్వరూపమే! బ్రహ్మ - ఇంద్రుడు - రుద్రుడు మొదలైన అన్నిరూపములుగా ప్రకాశించుచున్నది నీవేనయ్యా! అంగరహితుడవు. సదాస్థితుడవు. |
||
సర్వప్రపంచభ్రమవర్జితోఽసి సర్వేషు భూతేషు చ భాసితోఽసి . సర్వత్ర సంకల్పవివర్జితోఽసి సర్వాగమాంతార్థవిభావితోఽసి .. 63.. |
|||
63. సర్వ ప్రపంచ భ్రమవర్జితోఽసి। సర్వేషు భూతేషు చ భాసితోఽసి। సర్వత్ర సంకల్ప వివర్జితోఽసి। సర్వ ఆగమాంత అర్థ విభావితోఽసి। |
స్వప్నము (కల) తనదైనవాడు కలలో ఎప్పుడైనా బంధించబడుచున్నాడా? లేదుకదా! ఈ సర్వ ప్రపంచ భ్రమ నీకు వాస్తవానికి లేదు. ఎందుకంటే మెలకువ రాగానే కల కరిగిపోయిన రీతిగా, ఎప్పుడనుకుంటే అప్పుడు ప్రపంచభ్రమను త్యజించగలిగియే ఉన్నావు. కల తనదైనవాడే కలలో భావనా పూర్వకంగా అనేకమందిగా కనిపిస్తున్నట్లుగా, నీ జాగృత్‌లోని సర్వజీవులుగా భాసిస్తున్నది నీవే! నీ జాగృత్‌లో నీవు కాక మరెవ్వరూ భాసించటంలేదు. సర్వత్రా సంకల్పములకు వేరుగా ఉన్నవాడివే గానీ, ఎవరి సంకల్పమో నీవు కావు. సర్వ సంకల్పములు లేనివాడివే నీవు. సర్వవేదముల అంతరార్థములుగా, ఆ అంతరార్థములతో ప్రకాశించుచున్నట్టివాడవు. |
||
సర్వత్ర సంతోషసుఖాసనోఽసి సర్వత్ర గత్యాదివివర్జితోఽసి . సర్వత్ర లక్ష్యాదివివర్జితోఽసి ధ్యాతోఽసి విష్ణ్వాదిసురైరజస్రం .. 64.. |
|||
64. సర్వత్ర సంతోష సుఖాసనోఽసి। సర్వత్ర ‘గతి’ ఆది వివర్జితోఽసి। సర్వత్ర లక్ష్యాది వివర్జితోఽసి। ధ్యాతోఽసి। విష్ణ్వాది సురైః అజస్రమ్।। |
ఈ జగత్ దృశ్యానుభవము, బంధ - మోక్షముల వ్యవహారమంతా నీకు క్రీడ! సరదా! నీ ఆనందము. అందుచేత, నీవు సర్వత్రా సంతోష - సుఖసమన్వితంగా ఆశీనుడవై ఉన్నావు. నీవు ఎక్కడి నుండి - ఎక్కడకు వెళ్ళుటయే లేదు. అందుచేత…గతి అనునది ఏమాత్రము లేనట్టివాడవు. ఈ కనబడేదంతా నీయందే నీవు నీవుగా ఉండటమే! కాబట్టి నీవు పొందవలసినదీ లేదు. చేరవలసినదీ లేదు. అనగా ‘లక్ష్యము’ మొదలైనవేవీ లేనివాడవు. విష్ణువు మొదలైన దేవతలకు అనుక్షణము ధ్యానవస్తువు నీవే అయి ఉన్నావు సుమా! |
||
చిదాకారస్వరూపోఽసి చిన్మాత్రోఽసి నిరంకుశః . ఆత్మన్యేవ స్థితోఽసి త్వం సర్వశూన్యోఽసి నిర్గుణః .. 65.. |
|||
65. చిదాకార స్వరూపోఽసి। చిన్మాత్రోఽసి నిరంకుశః। ఆత్మన్యేవ స్థితోఽసి త్వగ్ం। సర్వశూన్యోఽసి నిర్గుణః।। |
నీవు భౌతిక దేహాకార స్వరూపుడవేమోనని అనుకుంటున్నావా? కానే కాదయ్యా! ‘కేవల ఎరుక’ అగు చిదాకారస్వరూపుడవు. నీవు నీ ఆత్మస్థానము నుండి చ్యుతి పొందిన క్షణమే లేదు. ఎల్లప్పుడూ ఆత్మస్థితుడివే! నిన్ను ఆత్మస్థితి నుండి ఎవ్వరూ కదల్చజాలరు. నిరంకుశముగా ఆత్మయందు స్థితి కలిగి ఉన్నావు. నీలో జగత్తులు లేవు. గుణములు లేవు. దర్పణములోవలే అవి నీ ప్రదర్శనములు మాత్రమే! కనుక సర్వశూన్యుడవు. నిర్గుణుడవు. |
||
ఆనందోఽసి పరోఽసి త్వమేక ఏవాద్వితీయకః . చిద్ఘనానందరూపోఽసి పరిపూర్ణస్వరూపకః .. 66.. |
|||
66. ఆనందోఽసి। పరోఽసి । త్వమ్ ఏకఏవ అద్వితీయకః। చిద్ఘనానన్ద రూపోఽసి పరిరూర్ణ స్వరూపకః।। |
ఈ జగత్తుల కల్పన అంతా నీ ఆనందము. ఆనందించటము నీ స్వభావము. ఆనంద స్వరూపుడివి కదా, మరి! సర్వమునకు ఆవల సర్వదా విజయంచేసి ఉన్నవాడివి. నీవు ఎల్లప్పుడు పరస్వరూపుడివే! నీకు ద్వితీయమైనది ఎక్కడా ఏదీ లేదు కనుక… ఏకస్వరూపుడవే! అనేక స్వరూపుడివి కావు. చిద్ఘన - ఆనందరూపుడవు. నీ ఆత్మ రూపమును గురువు అగు నేనో, మరొక ఇష్టదైవమో వచ్చి పరిపూర్ణము చేయవలసిన పనిలేదు. స్వతఃగానే పరిపూర్ణ స్వరూపుడవు! |
||
సదసి త్వమసి జ్ఞోఽసి సోఽసి జానాసి వీక్షసి . సచ్చిదానందరూపోఽసి వాసుదేవోఽసి వై ప్రభుః .. 67.. |
|||
67. సదసి త్వమసి జ్ఞోఽసి। సోఽసి జానాసి, పశ్యసి। సత్-చిత్-ఆనంద రూపోఽసి। వాసుదేవోఽసి వై విభుః।। |
ఆ నిర్మల - కేవల సత్ రూపమగు ఆత్మ నీవేనని నీవు ఎరిగియే ఉన్నావు. అదియే నీవని నీకు ఎరుకయే! (You know everything) చూస్తూనే ఉన్నావు. (గురువుగా) నేను గుర్తు చేయవలసిన సందర్భము కూడా నీ లీలానందము మాత్రమే. నీవు సర్వదా సత్ - చిత్ - ఆనందరూపుడవు. సర్వ జగత్తులకు నియామకుడవై, ఉండుటచేత విభుడవు. సర్వ జీవులలో వేంచేసి ఉండటము చేత వాసుదేవుడవు! |
||
అమృతోఽసి విభుశ్చాసి చంచలో హ్యచలో హ్యసి . సర్వోఽసి సర్వహీనోఽసి శాంతాశాంతవివర్జితః .. 68.. సత్తామాత్రప్రకాశోఽసి సత్తాసామాన్యకో హ్యసి . నిత్యసిద్ధిస్వరూపోఽసి సర్వసిద్ధివివర్జితః .. 69.. |
|||
68. అమృతోఽసి విభుశ్చాసి। చంచలో హి అచలోహి అసి। సర్వోఽసి। సర్వ హీనోఽసి। శాంతాశాంత వివర్జితః। 69. సత్తామాత్ర ప్రకాశోఽసి సత్తాసామాన్యకో హి అసి। నిత్యసిద్ధ స్వరూపోఽసి। సర్వసిద్ధి వివర్జితః। |
ఓ నిదాఘ నామ మహాశయా! నీవు ఆత్మవు! జన్మ - మరణములకు విషయమే కావు. అమృత స్వరూపుడవు. దేహములో పుట్టువాడవు కావు. చావువాడవు కావు. మనోబుద్ధి చిత్త అహంకారములకు నియామకుడవు! విభువువు. ఎప్పటికీ ఏ కదలికలు లేనివాడివి. అచలుడవు → అయి ఉండి కూడా → సర్వ కదలికలు నీవే కాబట్టి, చంచలుడవు కూడా. సర్వమును కదల్చువాడవు! కదలిక లేనివాడవు! అన్నీ నీవే అయి, ఏమీ కానట్టి వాడవు. నీవు రచించే నవలలో పాత్రలు నీ కల్పిత వైభవమే అయి కూడా, నీ నవలలో ఏపాత్రగాగానీ నీవు అగుట లేదు కదా! ఇది కూడా అట్టిదే! నీవు శాంతుడవు కాదు! అశాంతుడవు కాదు. ఆ రెండిటితో సంబంధము లేనివాడవు. శాంతాశాంత వివర్జితుడవు. నీ స్వరూపమును నీవు ఇప్పుడు వ్రతములు జపములు-ప్రాణాయామాది యోగములు నిర్వర్తించి సిద్ధించుకోవలసినది కానే కాదు. నీవు నిత్యసిద్ధ స్వరూపుడవు. అది అట్లుండగా ఇక్కడ సిద్ధించినట్లు కనబడేదేదీ కూడా ఏమాత్రము లేనట్టి వాడవు. |
||
ఈషన్మాత్రవిశూన్యోఽసి అణుమాత్రవివర్జితః . అస్తిత్వవర్జితోఽసి త్వం నాస్తిత్వాదివివర్జితః .. 70.. |
|||
70. ఈషన్మాత్ర విశూన్యోఽసి అణుమాత్ర వివర్జితః। అస్తిత్వ వర్జితోఽసి త్వం నాస్తిత్వాది వివర్జితః।। |
నీవు ఈషణ్మాత్రము కూడా ఈ జగత్తులో లేవు. అస్వరూపుడవు. అణుమాత్ర కూడా స్వరూపము లేనివాడవు. నీవు ఉంటేనే దేహాలు, జగత్తులు, అస్తిత్వాలు ఉంటాయి. ఇక నీకో? అస్తిత్వము లేదు. నాస్తిత్వము లేదు. నీ కలలో నీవు ఉన్నావా? ఉన్నావు. వాస్తవానికి కలలో ఉన్నావా? లేదు. కల నీది కాని, కలలోనివాడవుకాదు. నీయొక్కజగత్ అస్తిత్వ - నాస్తిత్వాలు ఇట్టివే। |
||
లక్ష్యలక్షణహీనోఽసి నిర్వికారో నిరామయః . సర్వనాదాంతరోఽసి త్వం కలాకాష్ఠావివర్జితః .. 71.. |
|||
71. లక్ష్య లక్షణ హీనోఽసి నిర్వికారో, నిరామయః। సర్వ నాదాంతరోసి త్వం కలా కాష్ఠా వివర్జితః।। |
నీకు ‘ఇది లక్ష్యము’ అనునది ఏదీ లేదు. అంతా నీయందే ఉండి ఉండగా నీకు లక్ష్యము (objective) ఏముంటుంది? లక్ష్యము లేనివాడవు కనుక, లక్షణములు కూడా లేనివాడవే! సర్వ శబ్ద స్వరూపుడవు. అక్షరుడవు. సర్వనాదముల అంతరమున చైతన్యరూపుడవై వేంచేసి ఉన్నావు. కలా (కల్పనా - భ్రమయుక్త) కాష్ఠము (శరీరము) లేనట్టి వాడవు. |
||
బ్రహ్మవిష్ణ్వీశహీనోఽసి స్వస్వరూపం ప్రపశ్యసి . స్వస్వరూపావశేషోఽసి స్వానందాబ్ధౌ నిమజ్జసి .. 72.. |
|||
72. బ్రహ్మ విష్ణు ఈశ హీనోఽసి। స్వస్వరూపం ప్రపశ్యసి।। స్వస్వరూప విశేషోఽసి। స్వానందాబ్ధౌ నిమజ్జసి।। |
సర్వదా స్వస్వరూపమునే జగత్ దృశ్యముగా సుసందర్శిస్తున్న నీకు → సృష్టి లేదు. స్థితి లేదు - లయము లేదు. బ్రహ్మ లేరు. విష్ణువు లేరు. రుద్రుడు లేరు. ఇదంతా నీకు స్వప్నము వంటిదే! నీ స్వప్నమునకు నీకు వేరైన సృష్టికర్త - స్థితికర్త - లయకర్త ఉండరు కదా! త్రికర్తృత్వములు నీవే అయి ఉన్నావు. త్రిమూర్తులు నీ స్వస్వరూప-అభిన్న విశేషములే! నీవు స్వస్వరూప విశేషుడవై స్వ-ఆనంద మహాసముద్రములో మునుగుచు - తేలుచు ఉండుటమే నీకు జగత్ ఉత్పత్తి - నాశనములు. |
||
స్వాత్మరాజ్యే స్వమేవాసి స్వయంభావవివర్జితః . శిష్టపూర్ణస్వరూపోఽసి స్వస్మాత్కించిన్న పశ్యసి .. 73.. |
|||
73. స్వాత్మ రాజ్యే స్వమేవాఽసి। స్వయం భావ వివర్జితః। శిష్ట పూర్ణ స్వరూపోఽసి। స్వస్మాత్ కించిత్ న పశ్యసి।। |
నీ ‘స్వాత్మరాజ్యము’లో నీవే స్వయముగా ‘స్వయం భువము’ను ఏమరచి (వదలి) స్వయముగా ఉన్నావు. శిష్టపూర్ణ స్వరూపుడవై ఉన్నావు. స్వాత్మను కించిత్ దర్శించని వాడవై, అజ్ఞాన భూమికలను నీ అంగీకారముతోనే నీవు పొందుచున్నావు. | ||
స్వస్వరూపాన్న చలసి స్వస్వరూపేణ జృంభసి . స్వస్వరూపాదనన్యోఽసి హ్యహమేవాసి నిశ్చిను .. 74.. |
|||
74. స్వస్వరూపాత్ న చలసి స్వస్వరూపేణ జృంభసి। స్వస్వరూపాత్ అనన్యోఽసి, హి, అహమేవాసి నిశ్చిను।। |
స్వస్వరూపము నుండి ఏమాత్రము చలించకుండానే స్వస్వరూపముతో జగత్ దృశ్యుడవై విజృంభిస్తున్నావు. స్వస్వరూపమునకు నీవు అన్యుడవై ఉండటము అనునదే లేదు. కనుక ‘ఈ కనబడేదంతా నీవే! నాయొక్క స్వరూపమే!’…. అని ఎరిగి ఉండుము. నిశ్చయుడవై ప్రకాశించుము. |
||
ఇదం ప్రపంచం యత్కించిద్యద్యజ్జగతి విద్యతే . దృశ్యరూపం చ దృగ్రూపం సర్వం శశవిషాణవత్ .. 75.. |
|||
యద్యత్ (యత్ యత్) జగతి విద్యతే, ‘దృశ్య’ రూపంచ ‘దృక్’ రూపగ్ం సర్వగ్ం శశ విషాణవత్।। (కుందేటి కొమ్మువంటిది) |
- ఏదేది నీకు జగత్తుగా తెలియవస్తోందో…, - ఏది దృక్ - ద్రష్ట - దృశ్యముగా నీముందు సంప్రదర్శనమౌతోందో,… అదంతా కుందేటి కొమ్ములవలే మొదలే లేదు. కుందేలు పరుగులు తీస్తూ ఉంటే చెవులు రిక్కరించటముచేత కొమ్ములు ఉన్నట్లు కనిపించవచ్చు గాక. కానీ లేవు. ఈ జగత్తు అట్టిదే! |
||
భూమిరాపోఽనలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ . అహంకారశ్చ తేజశ్చ లోకం భువనమండలం .. 76.. |
|||
76. భూమిః ఆపో అనలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ, ‘అహం’ కారశ్చ, తేజశ్చ, లోకం, భువన మండలమ్, |
→ పంచభూతములగు భూమి (solid), జలము (liquid), అగ్ని(Heat), వాయువు(movement / Flow factor), ఆకాశము (splacement), మనస్సు, బుద్ధి, అహంకారము, తేజస్సు, ఈ లోకము, తదితర భువన మండలములు - ఇవన్నీ ‘‘నాటకంలోని, కథలోని స్వప్నంలోని విషయాలువలె’’, కుందేలుకు కొమ్ములు వలె’’ - స్వతఃగా లేవు. |
||
నాశో జన్మ చ సత్యం చ పుణ్యపాపజయాదికం . రాగః కామః క్రోధలోభౌ ధ్యానం ధ్యేయం గుణం పరం .. 77.. |
|||
77. నాశం జన్మ చ, సత్యం చ పుణ్యపాప జయాదికమ్ రాగః కామః క్రోధ లోభౌ ధ్యానం ధ్యేయం గుణమ్ పరమ్, |
నశించునవి, జనించునవి, సత్యమైనవి (వాస్తవంగా ఉన్నవి), పుణ్య- పాపములు, జయ - అపజయము, రాగము - కామము - క్రోధము - లోభములు, ధ్యానము - ధ్యానింపబడుచున్న వస్తువులు, ధ్యాస, ధ్యానించువాడు, త్రిగుణములు, త్రిగుణములకు పరమైనది…ఇవన్నీ స్వతఃగా లేవు. జగత్ - భ్రమచే మాత్రమే ఉన్నాయి. |
||
గురుశిష్యోపదేశాదిరాదిరంతం శమం శుభం . భూతం భవ్యం వర్తమానం లక్ష్యం లక్షణమద్వయం .. 78.. శమో విచారః సంతోషో భోక్తృభోజ్యాదిరూపకం . యమాద్యష్టాంగయోగం చ గమనాగమనాత్మకం .. 79.. |
|||
78. గురు - శిష్య ఉపదేశాదిః, ఆది అంతః శమం శుభమ్, భూతం భవ్యం వర్తమానం, లక్ష్యం లక్షణమ్ అద్వయమ్, 79. శమో విచారః సంతోషో భోక్తృ భోజ్యాది రూపకమ్, ‘యమ’ ఆది అష్టాంగ యోగం చ, గమన - ఆగమనాత్మకమ్, |
గురువు-శిష్యుడు-గురూపదేశములు, ఆద్యంతములు, శమము (ఇంద్రియ నిగ్రహము), శుభాశుభములు కూడా-వాస్తవమైన ఉనికి కలిగిలేవు. భూత-వర్తమాన-భవిష్యత్‌రూపమగు కాలము, సాధన లక్ష్యమగు అద్వయ లక్షణము, శమము - విచారణ - సంతోషము - సత్సంగము అనబడు సాధన చతుష్టయము. భోక్త - భోగము - భోగించునది అగు త్రిపుటి, యమము - నియమము - ఆసనము - ప్రాణాయామము - ప్రత్యాహారము - తితిక్ష-ధారణ (ధ్యానము) - సమాధి…అను అష్ఠాంగయోగములు, గమన - ఆగమానాత్మకములు (రాక - పోకలు) - ఇవన్నీ అసన్మయమే! నాటకంలోని సంఘటనలవలెనే స్వతఃగా లేవు. |
||
ఆదిమధ్యాంతరంగం చ గ్రాహ్యం త్యాజ్యం హరిః శివః . ఇంద్రియాణి మనశ్చైవ అవస్థాత్రితయం తథా .. 80.. |
|||
80. ఆది మధ్య అంతం చ, అంతరంగం చ, గ్రాహ్యగ్ం త్యాజ్యగ్ం హరిః శివః, ఇంద్రియాణి, మనశ్చైవ, అవస్థా త్రితయం తథా।। |
ఆది (మొదలు), మధ్య (In between), అంతము, అంతరంగము (Inner recess of Heart), గ్రాహ్యము (స్వీకరించవలసినవి), త్యాజ్యము (వదలవలసినవి), సర్వాంతర్యామియగు హరి, శుభంకరుడు అగు శివుడు, ఇంద్రియములు, మనస్సు, జాగ్రత్ స్వప్న సుషుప్తి అవస్థల - ఇవన్నీ కుందేటికి కొమ్ములవలే వాస్తవానికి లేవు. |
||
చతుర్వింశతితత్త్వం చ సాధనానాం చతుష్టయం . సజాతీయం విజాతీయం లోకా భూరాదయః క్రమాత్ .. 81.. |
|||
81. చతుర్విగ్ంశతి (24) తత్త్వం చ సాధనానాం చతుష్టయమ్ సజాతీయం విజాతీయం లోకా భూః ఆదయః క్రమాత్, |
పంచప్రాణములు + పంచకర్మేంద్రియములు + పంచ జ్ఞానేంద్రియములు’ + పంచేంద్రియ విషయములు + మనోబుద్ధి చిత్త అహంకారములు - 24-తత్త్వములు, సాధన చతుష్టయము అయినట్టి శమము (ఇంద్రియ నిగ్రహము)+విచారణ+సత్సంగము+సంతోషము, భూ-భువర్ సువర్ -మహర్-జనో-తపో-సత్య ఊర్ధ్వ (7)లోకములు, అతల - వితల -సుతల - తలాతల - రసాతల - మహాతల - పాతాళ అధో (7)లోకములు…ఇవన్నీ (కుందేటికి కొమ్ములవలే) స్వతఃగా లేవు. కల్పనచే ఉన్నాయి |
||
సర్వవర్ణాశ్రమాచారం మంత్రతంత్రాదిసంగ్రహం . విద్యావిద్యాదిరూపం చ సర్వవేదం జడాజడం .. 82.. బంధమోక్షవిభాగం చ జ్ఞానవిజ్ఞానరూపకం . బోధాబోధస్వరూపం వా ద్వైతాద్వైతాదిభాషణం .. 83.. సర్వవేదాంతసిద్ధాంతం సర్వశాస్త్రార్థనిర్ణయం . అనేకజీవసద్భావమేకజీవాదినిర్ణయం .. 84.. యద్యద్ధ్యాయతి చిత్తేన యద్యత్సంకల్పతే క్వచిత్ . బుద్ధ్యా నిశ్చీయతే యద్యద్గురుణా సంశృణోతి యత్ .. 85.. |
|||
82. సర్వ వర్ణాశ్రమాచారం, మంత్ర తంత్రాది సంగ్రహమ్, విద్యా - అవిద్యాది రూపం చ, సర్వ వేదం జడాజడమ్, 83. బంధ మోక్ష విభాగం చ, జ్ఞాన విజ్ఞాన రూపకమ్, బోధాబోధ స్వరూపం వా, ద్వైత - అద్వైతాది భాషణమ్, 84. సర్వ వేదాంత సిద్ధాంతగ్ం, సర్వ శాస్త్రార్థ నిర్ణయమ్, అనేక జీవ సద్భావమ్, ఏక జీవాది నిర్ణయమ్, 85. యత్ యత్ ధ్యాయతి చిత్తేన, యత్ యత్ సంకల్పతే క్వచిత్, బుద్ధ్యా నిశ్చీయతే యత్ యత్, గురుణా సగ్ంశృణోతి యత్, |
సర్వ వర్ణాశ్రమ ఆచారాలు, మంత్ర-తంత్ర వ్యవహారాలు, విద్య - అవిద్యలు, సర్వవేదములు, జడ-అజడములు, శాస్త్రములలోని బంధ-మోక్ష పాఠ్యాంశ విభాగములు, జ్ఞాన - విజ్ఞా విశేషాలు, బోధ - అబోధ స్వరూపము, ద్వైత - అద్వైత సంభాషణాపూర్వక చర్చలు, సర్వవేదాంత సిద్ధాంతాలు, సర్వశాస్త్రములు - వాటి వాటి భాష్యములు, వేదోపవాద నిర్ణయములు, అనేక జీవుల అనేక సద్భావనలు, జీవైక్య (అఖండాత్మ) నిర్ణయాలు, ఇవన్నీ మాయలోనివే! కల్పనలోనివే! వాస్తవ దృష్టిచే లేనివే! ఆత్మగురించిన అజ్ఞానము తొలగటానికై విజ్ఞులచే కల్పించబడినవి మాత్రమే. - ఈ చిత్తముతో ఏవేవి ధ్యానించబడుచున్నాయో, ఏదేది కొద్దిగానైనా సంకల్పించబడుచున్నదో, బుద్ధి ఏమేమి నిర్ణయిస్తోందో, గురువు చెప్పునది శ్రద్ధగా వినబడుచున్నదో…. అంతా కల్పనా విశేషాలే! మాయయే! కుందేటి కొమ్ములవలే మొదలే లేనివి! |
||
యద్యద్వాచా వ్యాకరోతి యద్యదాచార్యభాషణం . యద్యత్స్వరేంద్రియైర్భావ్యం యద్యన్మీమాంసతే పృథక్ .. 86.. |
|||
86. యత్ యత్ వాచా వ్యాకరోతి, యత్ యత్ ఆచార్య భాషణమ్, యత్ యత్ సర్వేంద్రియైః భావ్యం, (భాష్యం), యత్ యత్ మీమాంస్యతే పృథక్, |
ఏదేది వాక్కుచే వ్యావహరించబడుచూ ప్రవచించబడుతోందో…, ఏదేది ఆచార్యులచే భాషణము (ఉపన్యాసముగా)గా చెప్పబడుతోందో, - ఏదేది అన్ని ఇంద్రియములచే భావించబడుచున్నదో…, ఏదేది భాష్యముగా చెప్పబడుతోందో, - ఏదేది - ‘ఇది వేరు - మేము చెప్పేది వేరు’…అనురూపముగా మీమాంస చేయబడుచున్నదో (చర్చించబడుతోందో…), |
||
యద్యన్న్యాయేన నిర్ణీతం మహద్భిర్వేదపారగైః . శివః క్షరతి లోకాన్వై విష్ణుః పాతి జగత్త్రయం .. 87.. బ్రహ్మా సృజతి లోకాన్వై ఏవమాదిక్రియాదికం . యద్యదస్తి పురాణేషు యద్యద్వేదేషు నిర్ణయం .. 88.. |
|||
87. యత్ యత్ న్యాయేన నిరీణాతం మహద్భిః వేద పారగైః, ‘‘శివో రక్షతి లోకాన్’’ వై, ‘‘విష్ణుః పాతి జగత్రయమ్’’, 88. బ్రహ్మా సృజతి లోకాన్వై, ఏవమ్ ఆది క్రియాదికమ్, యత్ యత్ అస్తి పురాణేషు, యత్ యత్ వేదేషు నిశ్చయవ్ |
- ఏదేది ‘న్యాయము’ ‘విధి’…‘అనుసరించవలసినది’ అని మహనీయులగు వేదపారగులు చెప్పుచున్నారో, ‘‘అది అట్లాగే చేయాలి! వేదవాక్కు కదా!’’….అని జనులచే అనుసరించబడుచున్నదో, (‘సర్వః వ్యర్థం మరణ సమయే సాంబ ఏకః సహాయః। శివో రక్షతి లోకాన్’) - శివుడే లోకాలకు రక్షకుడు. విష్ణువే త్రిలోకములకు పాలకుడు → అను భావనలు, ‘బ్రహ్మయే ఇదంతా సృష్టిస్తున్నారు’ మొదలైన దేవతాకర్తృత్వ ఆపాదన భావములు…ఇవన్నీ మాయలోనివే! పురాణాలలో పురాణ పురుషుల - అవతార పురుషుల మహిమల అభివర్ణనములు, పురాణాలలో ‘ఉన్నవి’గా చెప్పబడునవి, వేదముల నిర్ణయాత్మకమై వర్ణ - ఆశ్రమ ధర్మాలు. - ఇవన్నీ కుందేటి కొమ్మువంటివే! వాస్తవానికి లేనివిగా మాయలోనివే |
||
సర్వోపనిషదాం భావం సర్వం శశవిషాణవత్ . దేహోఽహమితి సంకల్పం తదంతఃకరణం స్మృతం .. 89.. దేహోఽహమితి సంకల్పో మహత్సంసార ఉచ్యతే . దేహోఽహమితి సంకల్పస్తద్బంధమితి చోచ్యతే .. 90.. |
|||
89. సర్వ ఉపనిషదాం భావగ్ం సర్వగ్ం శశ విషాణవత్।। ‘‘దేహోఽహమ్’’ - సంకల్ప పర్యవసానం ‘దేహోఽహమ్’ ఇతి సంకల్పమ్ తత్ అంతఃకరణగ్ం స్మృతమ్। 90. ‘దేహోఽహమ్’ ఇతి సంకల్పో ‘మహత్సగ్ంసార’ (మహత్ సంసార) ఉచ్యతే। ‘దేహోఽహమ్’ ఇతి సంకల్పం తత్ ‘బంధమ్’ ఇతి చ ఉచ్యతే।। |
ఉపనిషత్తులచే చెప్పబడు (యోగాది) వ్యవహారములు - కుందేటి కొమ్ముల వంటివే.
ఋభు మహర్షి : ‘కుందేటి కొమ్ముల వలే వాస్తవానికి లేదు’….అని ఎరిగి ఉండమని చెప్పినదంతా ‘ఉన్నది’ అని అనేకమంది దేహులకు అనిపిస్తూ ఉండటానికి కారణము, ఉత్పత్తి స్థానము కూడా - దేహోఽహమ్ భావనయే! ‘నేను పాంచభౌతిక దేహమును’ అను సంకల్పమే… → ‘అంతఃకరణము’ అని చెప్పుకోబడుచున్నది. (లేక) అంతకరణములో - అల్ప, దుష్ట సంకల్పముల వ్యసనములచే ఏర్పడుచున్నది! → ‘మహా-భీకర -సంసారబంధము’ అని అదియే అనబడుచున్నది! ‘నేను ఈ దేహమును మాత్రమే’ - అనునదే ఈ జీవునికి బంధము. ‘‘ దేహము నాకు సంబంధించినది - దేహమునకు నేను సంబంధించిన వాడను’’…అను అవినాభావ సంబంధమే బంధము’! ‘‘దేహమే నా ప్రారంభము. దేహమే నా ముగింపు’’ - అనునదే ‘‘సంసారభ్రమ’’. |
||
దేహోఽహమితి సంకల్పస్తద్దుఃఖమితి చోచ్యతే . దేహోఽహమితి యద్భానం తదేవ నరకం స్మృతం .. 91.. |
|||
91. ‘దేహోఽహమ్’ ఇతి సంకల్పమ్ తత్ ‘దుఃఖమ్’ ఇతి చ ఉచ్యతే। ‘దేహోఽహమ్’ ఇతి యత్ జ్ఞానం తదేవ ‘నరకమ్’ స్మృతమ్। |
ఏ తెలివి-ప్రజ్ఞ-జ్ఞానముచే నీవు (లేక ఈ జీవుడు) దేహోఽహమ్ సంకల్ప మును ఆశ్రయిస్తుండటం జరుగుతోందో, అదియే దుఃఖము (worry)! అదియే నరకము! నేను దేహమాత్రుడనుకాను - ‘‘దేహమునకు వేరైన ‘దేహి’ని కదా నేను!’’ అను దాని ఏమరపుయే నరక దుఃఖముగా అగుచున్నదని చెప్పబడుతోంది. |
||
దేహోఽహమితి సంకల్పో జగత్సర్వమితీర్యతే . దేహోఽహమితి సంకల్పో హృదయగ్రంథిరీరితిః .. 92.. |
|||
92. ‘దేహోఽహమ్’ ఇతి సంకల్పం ‘జగత్ సర్వం’ ఇతి ఈర్యతే। ‘దేహోఽహమ్’ ఇతి సంకల్పో ‘హృదయగ్రంధిః’ ఈరితః। |
‘దృశ్యజగత్తు’…అని పొందబడుచూ - చూడబడుచున్నది కూడా… దేహోఽహమ్ భావనా వృక్ష ఫలమే. ‘నేను దేహమును’ అను భావనా సంకల్పమే - బ్రహ్మగ్రంథి (ఇదంతా సృష్టించబడుతోంది)’. - విష్ణుగ్రంథి (ఇది పరిపోషించబడుతోంది). - రుద్రగ్రంథి (ఇది లయింపజేయబడుతోంది). …అనబడు త్రిగ్రంథి రూప భ్రమలు. ఇవియే హృదయగ్రంథులుగా అభివర్ణించబడుచున్నాయి. |
||
దేహోఽహమితి యజ్జ్ఞానం తదేవాజ్ఞానముచ్యతే . దేహోఽహమితి యజ్జ్ఞానం తదసద్భావమేవ చ .. 93.. |
|||
93. ‘దేహోఽహమ్’ ఇతి యత్ జ్ఞానం, తదేవ ‘అజ్ఞానమ్’ ఉచ్యతే। ‘దేహోఽహమ్’ ఇతి యత్ జ్ఞానం, తత్ ‘అసద్భావమ్’ ఏవచ।। |
‘అజ్ఞానము’గా చెప్పబడుచున్నదంతా ఈ దేహమే నేను - అను జ్ఞానమే! దేహోఽహమ్ భావనయే ‘అసత్ భావన’ (నేను దేహత్వమునకు వేరై ఉన్నాను - అనునది ఏమరచటము) అయి ఉన్నది. |
||
దేహోఽహమితి యా బుద్ధిః సా చావిద్యేతి భణ్యతే . దేహోఽహమితి యజ్జ్ఞానం తదేవ ద్వైతముచ్యతే .. 94.. |
|||
94. ‘దేహోఽహమ్’ ఇతి యా బుద్ధిః సా చ ‘అవిద్య’ ఇతి మన్యతే। ‘దేహోఽహమ్’ ఇతి యత్ జ్ఞానం తదేవ ‘ద్వైతమ్’ ఉచ్యతే।। |
అవిద్య : ఏ బుద్ధిచే ‘దేహమే నేను’ ‘దేహమాత్రుడను’….అను భావన పరిపోషించబడుతోందో అదియే అవిద్య. ‘దేహముచే పరిమితుడను’ అను శబ్దముచే ఉద్దేశ్యించబడుచున్నట్టిదే ‘ద్వైతము’ అను దోషముగా చెప్పబడుతోంది. |
||
దేహోఽహమితి సంకల్పః సత్యజీవః స ఏవ హి . దేహోఽహమితి యజ్జ్ఞానం పరిచ్ఛిన్నమితీరితం .. 95.. |
|||
95. ‘దేహోఽహమ్’ ఇతి సంకల్పః సత్ య ‘జీవః’ స ఏవ హి। ‘దేహోఽహమ్’ ఇతి యత్ జ్ఞానం ‘పరిచ్ఛిన్నమ్’ ఇతీరితమ్। |
దేహోఽహమ్ భావన చేతనే ‘జీవుడు’ అనునది ఏర్పడినదగుచున్నది. (దేహోఽహమ్ భావన తొలగితే ఈ జీవుడు శివుడే)! ‘నేను వేరు - నీవు వేరు - దేవత వేరు - గురువు వేరు’…ఇటువంటిదంతా దేహోఽహమ్ భావనా రూపమే. దేహోఽహమ్ జ్ఞానఫలితమే! |
||
దేహోఽహమితి సంకల్పో మహాపాపమితి స్ఫుటం . దేహోఽహమితి యా బుద్ధిస్తృష్ణా దోషామయః కిల .. 96.. |
|||
96. ‘దేహోఽహమ్’ ఇతి సంకల్పో ‘మహాపాపమ్’ ఇతి స్ఫుటమ్। ‘దేహోఽహమ్’ ఇతి యా బుద్ధిః ‘తృష్ణా దోషామయః’ కిల।। |
‘‘ఈ పాంచభౌతిక దేహము మాత్రమే నా రూపము - గుణము - స్వభావము’’ - అనునదే ‘మహాపాపము’ రూపముగా ప్రస్ఫుటమగుచున్నది. ‘ఈ దేహము మాత్రమే నాయొక్క ధర్మము అయి ఉన్నది’-అనునదే తృష్ణ- (దాహము). ఏదోకావాలి-పొందాలి! లేదా, నా గతి ఇంతే!’…అను రూపముగా ఈ జీవునికి ప్రాప్తిస్తున్నదే తృష్ణ. తృష్ణాదోషముచే పరిమితమగు ఇహము ప్రాప్తిస్తోంది. అపరిమితమగు ఆత్మ ఏమరువబడుచున్నది. |
||
యత్కించిదపి సంకల్పస్తాపత్రయమితీరితం . కామం క్రోధం బంధనం సర్వదుఃఖం విశ్వం దోషం కాలనానాస్వరూపం . యత్కించేదం సర్వసంకల్పజాలం తత్కించేదం మానసం సోమ విద్ధి .. 97.. |
|||
97. యత్ కించిదపి సంకల్పం ‘తాపత్రయమ్’ ఇతీరితమ్।। కామం, క్రోధం, బంధనం, సర్వ దుఃఖం, విశ్వం దోషం కాల నానాస్వరూపమ్। యత్ కించ ఇదగ్ం సర్వ సంకల్ప జాలం, తత్ కించ ఇదగ్ం ‘మానగ్ం’ సోమ్య! విద్ధి।। |
‘దేహమే నేను’ అను భావనయొక్క కించిత్ సంకల్పమే ఆధి భౌతిక - ఆధ్యాత్మిక - ఆథి దైవిక - అను త్రితాపములకు దారితీస్తోంది. దేహోఽహమ్ భావననే ‘తాపత్రయము’ అంటున్నారు. కామము (ఏదో కావాలని తపన); క్రోధము (పగ-ద్వేషము - అసూయ); బంధనము; సర్వదుఃఖములు; ‘ఈ విశ్వము నాకు దోషములచే ప్రాప్తించింది’….అనే విశ్వదోష దర్శనము; ఇప్పుడు ఇట్లా - అప్పుడు అట్లా అనబడే కాలచక్ర స్వరూపానుభవము → ఇవన్నీ దేహోఽహమ్ సంకల్పజాల పరిణామాలే! ‘దేహోఽహమ్’ భావననుండే మనస్సు జనిస్తోంది. కలనా (భ్రమాత్మక) భావ ప్రభావమే దేహోఽహమ్ భావన. |
||
మన ఏవ జగత్సర్వం మన ఏవ మహారిపుః . మన ఏవ హి సంసారో మన ఏవ జగత్త్రయం .. 98.. |
|||
మన ఏవ సదా రిపుః। మన ఏవ హి సంసారో। మన ఏవ జగత్రయమ్।। |
ఋభుమహర్షి : మనస్సే ఈ సర్వజగత్ స్వరూపము అయి ఉన్నదయ్యా! స్వస్వరూపము యొక్క చిత్ శక్తి నుండే సంకల్పరూపంగా అది బయల్వెడలు తోంది. ఈ జీవుని విషయంలో మనస్సే శత్రువు. అంతకు వేరైన శత్రువే లేడు. ‘సంసారము’ అను శబ్దమునకు - ‘దృశ్యముతో స్వయముగా ఏర్పరచుకొన్న అపార్థము’ - అనునది శబ్దార్థము అయినప్పటికీ, అద్దాని అంతరార్థము - పరమార్థము మాత్రము మనస్సే! మనస్సే ఈ భూ - దివి - పాతాళ త్రిజగత్తులు కూడా! |
||
మన ఏవ మహద్దుఃఖం మన ఏవ జరాదికం . మన ఏవ హి కాలశ్చ మన ఏవ మలం తథా .. 99.. |
|||
99. మన ఏవ మహత్ దుఃఖం మన ఏవ జరాదికమ్ మన ఏవ హి కాలశ్చ మన ఏవ మలం తథా।। |
మనస్సే ఈ జీవునిపట్ల అవిజ్ఞాతుడై ఉన్నంతకాలము మహత్ (గొప్ప) దుఃఖ (Worry) రూపము. మనస్సే బాల్య - యౌవన - వార్ధక్య రూపములుగా ప్రవర్తిస్తోంది. మనస్సే కాలస్వరూపము. మనస్సు లేనివానికి భూత-వర్తమాన-భవిష్యత్ కాలమే లేదు. అరిషట్ వర్గములు మనోరూపమే! సర్వ మలములకు (దోషాలకు) మనస్సే కారణం. |
||
మన ఏవ హి సంకల్పో మన ఏవ హి జీవకః . మన ఏవ హి చిత్తం చ మనోఽహంకార ఏవ చ .. 100.. |
|||
100. మన ఏవహి సంకల్పో మన ఏవహి జీవకః మన ఏవహి చిత్తం చ మనో అహంకార ఏవ చ।। |
మనస్సుయొక్క రూపమేమిటి? సంకల్పించుటయే! సంకల్పములకు వేరుగా మనస్సు ఏదీ లేదు. ‘జీవుడు’ అనగా భౌతిక దేహము కాదు. మరి? మనస్సే! ‘చిత్తము - ఇష్టము’ → అనగా కూడా మనస్సే. మనస్సే అహంకార రూపము కూడా! |
||
మన ఏవ మహద్బంధం మనోఽన్తఃకరణం చ తత్ . మన ఏవ హి భూమిశ్చ మన ఏవ హి తోయకం .. 101.. మన ఏవ హి తేజశ్చ మన ఏవ మరున్మహాన్ . మన ఏవ హి చాకాశం మన ఏవ హి శబ్దకం .. 102.. |
|||
101. మన ఏవ మహత్ బంధం మనో అంతఃకరణం చ తత్ మన ఏవహి భూమిశ్చ మన ఏవహి తోయకమ్।। 102. మన ఏవహి తేజశ్చ మన ఏవహి మరుత్ మహాన్। మన ఏవ హి చ ఆకాశం మన ఏవ హి శబ్దకమ్।। |
ఈ జీవుడు → భార్యాబిడ్డలో, సంగతి - సందర్భ - సంబంధ - బాంధవ్యములో, సంపద - ఆపదలో, భౌతిక దేహమో → ఇవన్నీ బంధమనుకుంటున్నాడు. కాదు. కానేకాదు. మనస్సే అసలైన మహత్ (గొప్ప) బంధము. - మనస్సే అంతఃకరణము. - ఇంకా కూడా చెప్పాలంటే… మనస్సే భూమి - జలము - తేజస్సు - వాయువు - ఆకాశము…అనబడు పంచభూతముల వాస్తవ - అంతర్గతరూపము. - శబ్దములన్నింటికీ జనన స్థానము మనస్సేనయ్యా |
||
స్పర్శం రూపం రసం గంధం కోశాః పంచ మనోభవాః . జాగ్రత్స్వప్నసుషుప్త్యాది మనోమయరితీరితం .. 103.. |
|||
103. స్పర్శ రూపం రసం గంధం కోశాః పంచ మనో భవాః। జాగ్రత్ స్వప్న సుషుప్త్యాది మనోమయమ్ ఇతీరితమ్।। |
- మనస్సే శబ్ద - స్పర్శ - రూప - రస - గంధములగు ఇంద్రియ విషయముల వాస్తవరూపము. మనోభావములే విషయరూపములుగా ప్రదర్శనమగుచున్నాయి. - శాస్త్రములు నిర్వచిస్తున్న భూతమయ - ప్రాణమయ - మనోమయ - విజ్ఞానమయ - ఆనందమయ - పంచకోశములు మనోసాగర భావతరంగాలే! జాగ్రత్ - స్వప్న - సుషుప్త మొదలైన దశలన్నీ మనస్సే! మనస్సే ఆయా దశల రూపముగా సంప్రదర్శితము అగుచున్నది. |
||
దిక్పాలా వసవో రుద్రా ఆదిత్యాశ్చ మనోమయాః . దృశ్యం జడం ద్వంద్వజాతమజ్ఞానం మానసం స్మృతం .. 104.. |
|||
104. దిక్పాలా వసవో రుద్రా ఆదిత్యాశ్చ మనోమయాః। దృశ్యం జడం ద్వంద్వజాతమ్ అజ్ఞానమ్ - మానసం స్మృతమ్।। |
ఇంద్రుడు-యముడు-వాయువు మొదలైన అష్టదిక్పాలకులు, అష్ట వసువులు, ఏకాదశరుద్రులు, ద్వాదశ ఆదిత్యులు మొదలైనవన్నీ మనోమయములే! ఎదురుగా కనిపిస్తున్న ఈ దృశ్యము, ఇక్కడ జడ - చేతనములుగా కనిపించేది, ఇక్కడ కనబడే సుఖ - దుఃఖ, శీత - ఉష్ణ మొదలైన ద్వంద్వములవలన అనుభవమగుచున్న ఆయా విశేషాలు…ఇవన్నీ కూడా ‘అజ్ఞానముతో కూడిన మనన రూప మనస్సు చేతనే అది అట్లున్నది’ అను నిశ్చయము కలిగి ఉండుము. |
||
సంకల్పమేవ యత్కించిత్తత్తన్నాస్తీతి నిశ్చిను . నాస్తి నాస్తి జగత్సర్వం గురుశిష్యాదికం నహీత్యుపనిషత్ .. 105.. ఇతి పంచమోఽధ్యాయః .. 5.. |
|||
105. సంకల్పమేవ యత్ కించిత్ తత్త్వం నాస్తి ఇతి నిశ్చిను। నాస్తి నాస్తి జగత్ సర్వం। గురు శిష్యాదికం న హి ।। ఇత్యుపనిషత్ |
సంకల్పించుట చేతనే మనస్సు. మనస్సుయొక్క అభ్యాస దృష్టిల చేతనే - జగత్ జీవులు ఈఈ తీరుగా ఉన్నారని గమనించు. సంకల్పమే లేకుంటే జగత్తు లేదు. గురువు లేడు. శిష్యుడు లేడు. ‘సంకల్పము’ లేకుంటే ‘నీవు’ ఎక్కడిది? సంకల్పములచేతనే ‘నేను-నీవు’ మొదలైనవి ఏర్పడి ఉంటున్నాయి. సంకల్పము రహితమైతేనో, … ‘నేను-నీవు’లతో సహా సర్వము అఖండమగు ఆత్మయే! ఇత్యుపనిషత్ |
||
6వ అధ్యాయము : సర్వం సచ్చిదానందమ్ - న అన్యమ్
ఋభుః .. సర్వం సచ్చిన్మయం విద్ధి సర్వం సచ్చిన్మయం తతం . సచ్చిదానందమద్వైతం సచ్చిదానందమద్వయం .. 1.. |
|||
01. బుభుః ఉవాచ : సర్వగ్ం సత్ - చిత్ మయం విద్ధి, సర్వగ్ం సత్ చిత్ మయం తతమ్। సత్ చిత్ ఆనందమ్ అద్వైతగ్ం సత్ చిత్ ఆనందమ్ అవ్యయమ్। |
శ్రీ నిదాఘుడు : ఈ ఎదురుగా ఘనీభూతమై కనిపిస్తున్న శబ్ద - స్పర్శ - రూప - రస - గంధ సమన్వితమై అనేక సంఘటనలు, సంబంధములు, సుఖదుఃఖములతో కూడిన జగత్ దృశ్యము యొక్క - వాస్తవ స్వరూపము ఏమిటి? ఎక్కడి నుండి ఇది జనించి ఇక్కడ సిద్ధిస్తోంది? శ్రీ ఋభుమహర్షి : ఓ ప్రియ నిధాఘమునీ! ఇదంతా కూడా స్వస్వరూపాత్మ స్వభావమగు ‘సత్ (ఉనికి) - చిత్ (ఎరుక)’ చేత నిండి, ‘తన్మయము’ అయి ఉన్నది. ఈ సర్వము ‘సత్‌చిత్ ఆనంద అద్వైత అవ్యయము’ చేతనే విస్తరించినదై ఉన్నది. |
||
సచ్చిదానందమాత్రం హి సచ్చిదానందమన్యకం . సచ్చిదానందరూపోఽహం సచ్చిదానందమేవ ఖం .. 2.. |
|||
02. సచ్చిదానంద మాత్రగ్ం హి సచ్చిదానందమ్ అన్యకమ్। సచ్చిదానంద రూపోఽహగ్ం సచ్చిదానందమేవ ఖమ్। |
ఇదంతా నీయొక్క సత్‌చిత్ ఆనంద స్వరూపమే. (అనుభూతి). నీ స్వస్వరూపమునకు ద్వితీయము కానట్టిది. అద్వితీయము. అన్యమైనదంతా అవ్యయమగు నీ సత్ - చిత్ - ఆనందమే. (దృష్టాంతము - ఒకడు తెలుగు అక్షరములతో కథరాస్తే, అక్షరములు తరుగుతాయా? పెరుగుతాయ?’ లేదుకదా! అక్షరములు అవ్యయము కదా! అట్లాగే నేను నీవు కూడా అవ్యయమగు ఆత్మాకాశ స్వరూపులమే! వారు-వీరు అందరము సర్వదా సచ్చిదానంద రూపులము). |
||
సచ్చిదానందమేవ త్వం సచ్చిదానందకోఽస్మ్యహం . మనోబుద్ధిరహంకారచిత్తసంఘాతకా అమీ .. 3.. |
|||
03. సచ్చిదానందమేవ త్వగ్ం। సచ్చిదానంకోఽస్మి అహమ్। మనోబుద్ధి అహంకార చిత్త సంఘాతకా హి యమీ।। |
నీవు శరీరము కాదు. అంతరంగముకాదు. అభిప్రాయములు - భావములు కాదు. ఆ వాటన్నిటికంటే ముందే ఉన్న సత్‌చిత్ ఆనంద మాత్రుడవు! నీకు అన్యమైనదంతా ఏమిటంటావా? అదంతా కూడా నీయొక్క సర్వదా సత్‌చిత్ ఆనంద మాత్రమే! నేను, ఈ భూత, చిత్త , చిదాకాశములు, నీయొక్క సచ్చిదానందమే! అహమ్, అహంకారము, చిత్తము, ఆ చిత్తమునకు లభిస్తున్న విషయ పరంపరల సంఘాతము, మనస్సు - మనో సంఘాతములు… ఇవేవీ సత్‌చిత్ ఆనందమునకు వేరు కాదు! |
||
న త్వం నాహం న చాన్యద్వా సర్వం బ్రహ్మైవ కేవలం . న వాక్యం న పదం వేదం నాక్షరం న జడం క్వచిత్ .. 4.. |
|||
04. న త్వం, న అహం, న చ అన్యం వా। సర్వం బ్రహ్మైవ కేవలమ్। న వాక్యం న పదం వేదమ్ న అక్షరం న జడం క్వచిత్।। |
సత్‌చిదానందమే బ్రహ్మము! ఇదంతా బ్రహ్మమే! అట్టి బ్రహ్మమునకు వేరుగా నీవు లేవు! నేను లేను! లోకపాలకులు లేరు! మరెవ్వరూ లేరు. వాక్యము, ఆ వాక్యములోని పదజాలము (కర్త-కర్మ-క్రియలు), వేదము (తెలియబడేదంతా), అక్షరము (మార్పు లేనిది), జడము (తాను కదలిక - మరొకరిచే కదలించబడేది) - ఇవన్నీ సత్ చిత్ ఆనందస్వరూపమగు బ్రహ్మమునకు ఏమాత్రము వేరుకాదు. (స్వప్నములో కనిపించిన ఒక మూల ఉన్న గృహములోని ఒకానొక గది కూడా - స్వప్న ద్రష్ట యొక్క ఊహాచైతన్య విశేషమే అయిన తీరుగా - ఇదంతా ఏర్పడినదగుచున్నది) |
||
న మధ్యం నాది నాంతం వా న సత్యం న నిబంధజం . న దుఃఖం న సుఖం భావం న మాయా ప్రకృతిస్తథా .. 5.. |
|||
05. న మధ్యం న ఆది న అంతం వా న సత్యం, న నిబంధనమ్। న దుఃఖం న సుఖం భావం। న మాయా ప్రకృతిః తథా। |
నీయొక్క - నాయొక్క కేవలీ స్వరూపమగు సత్‌చిత్ ఆనంద పరబ్రహ్మమునకు వేరై…మొదలు లేదు. మధ్య లేదు. చివ్వర ఏదీ లేదు. బ్రహ్మమునకు వేరై మరొక సత్యము లేదు. నిబంధనము లేదు. సుఖ దుఃఖ భావాలు లేవు. మాయలేదు. ప్రకృతి లేదు. |
||
న దేహం న ముఖం ఘ్రాణం న జిహ్వా న చ తాలునీ . న దంతోష్ఠౌ లలాటం చ నిశ్వాసోచ్ఛ్వాస ఏవ చ .. 6.. |
|||
06. న దేహం న ముఖం ఘ్రాణం న జిహ్వా న చ తాలునీ న దంతోష్ఠౌ లలాటం చ నిశ్వాస ఉచ్ఛ్వాస ఏవ చ।। |
సత్ - చిత్ - ఆనందమగు బ్రహ్మము (లేక) పరతత్త్వమునకు వేరై - దేహము లేదు. ముఖము లేదు. తాలువు (దవుడ) లేదు. చెవులు - దంతములు - లలాటము (Fore face) లేవు. ఉచ్ఛ్వాస - నిశ్వాసలు కూడా వేరై లేవు. |
||
న స్వేదమస్థి మాంసం చ న రక్తం న చ మూత్రకం . న దూరం నాంతికం నాంగం నోదరం న కిరీటకం .. 7.. |
|||
07. న స్వేదమ్ అస్థి మాగ్ంసం చ న రక్తం న చ మూత్రకమ్। న దూరం న అంతికం న అంగం న ఉదరం న కిరీటకమ్।। |
స్వేదము (చెమట) - అస్థులు (బొమికలు) - మాంసము - రక్తము - దగ్గిర - దూరములు, అంగములు, పొట్ట - కిరీటకము (నుదురు) - ఏవీ బ్రహ్మము నుండి వేరు కాదు |
||
న హస్తపాదచలనం న శాస్త్రం న చ శాసనం . న వేత్తా వేదనం వేద్యం న జాగ్రత్స్వప్నసుప్తయః .. 8.. |
|||
08. న హస్త పాద చలనం న శాస్త్రం న చ శాసనమ్। న వేత్తా వేదనం వేద్యం న జాగ్రత్ స్వప్న సుప్తయః।। |
చేతులు, కాళ్ళు, వాటి కదలికలు, శాస్త్రములు, శాసనములు, తెలిసినవాడు, తెలిసికొనటము, తెలియబడునది, జాగ్రత్ స్వప్న - సుషుప్తులు ఇవన్నీ కూడా బ్రహ్మమునకు వేరైనవి కావు. |
||
తుర్యాతీతం న మే కించిత్సర్వం సచ్చిన్మయం తతం . నాధ్యాత్మికం నాధిభూతం నాధిదైవం న మాయికం .. 9.. |
|||
09. తుర్యాతీతమ్ న మే కించిత్, సర్వగ్ం సచ్చిన్మయం తతమ్। న అధ్యాత్మికం। న అధిభూతమ్। న అధిదైవం ।న మాయికమ్।। |
సత్‌చిత్ అగు బ్రహ్మమునకు వేరుగా తుర్యాతీతములేదు. అధ్యాత్మిక - ఆధి భూత అధిదైవికములు లేవు. |
||
న విశ్వతైజసః ప్రాజ్ఞో విరాట్సూత్రాత్మకేశ్వరః . న గమాగమచేష్టా చ న నష్టం న ప్రయోజనం .. 10.. |
|||
10. న విశ్వః తైజసః ప్రాజ్ఞో విరాట్ సూత్రాత్మకః ఈశ్వరాః। న గమ ఆగమ చేష్టా చ న నష్టం। న ప్రయోజనమ్। |
బ్రహ్మమునకు వేరుగా- → విశ్వుడు (జాగ్రత్ అనుభవము కొరకై మనచే అంశగా నియమిత పురుషాకార పురుషుడు)గాని - తేజసుడు (స్వస్నానుభవము కొరకై నియమించబడు పురుషాకార పురుషుడు) గాని, - ప్రాజ్ఞుడు (గాఢ నిద్రానుభవము వహించే {తురీయునిచేఊ నియమిత పురుషాకార పురుషుడు)గాని లేరు. - జాగ్రత్ - స్వప్న సుషుప్తులు, విరాట్ పురుషుడు, సూత్రాత్మకుడు, ఈశ్వరుడు, దేహియొక్క రాకపోకలు, దేహముల రాకపోకలు, నష్టము - ప్రయోజనము.. ఇవన్నీ కూడా బ్రహ్మమునకు వేరుగా లేవు. |
||
త్యాజ్యం గ్రాహ్యం న దూష్యం వా హ్యమేధ్యామేధ్యకం తథా . న పీనం న కృశం క్లేదం న కాలం దేశభాషణం .. 11.. |
|||
11. త్యాజ్యం గ్రాహ్యం న దూష్యం వా హి అమేధ్యా మేధ్యకం తథా న పీనం న కృశం క్లేదం న కాలం దేశ - భాషణమ్।। |
త్యజించవలసినట్టివి, గ్రహించవలసినట్టివి, దూషించవలసినవిగా కనిపించేవి, వినతగినవి, వినకూడనివి, చిన్నవి, కృశించేవి, కష్టమైనవి ఇవన్నీ కూడా బ్రహ్మమునకు వేరై లేవు. కాలము, దేశ-భాషణములు, దృశ్య సంబంధమైన ఈ సర్వము, భయము, ద్వైతము, వృక్షములు, పర్వతములు-అన్నీ కూడా బ్రహ్మమునకు వేరుగా లేవు. బ్రహ్మమే అయి ఉన్నాయి. |
||
న సర్వం న భయం ద్వైతం న వృక్షతృణపర్వతాః . న ధ్యానం యోగసంసిద్ధిర్న బ్రహ్మవైశ్యక్షత్రకం .. 12.. న పక్షీ న మృగో నాంగీ న లోభో మోహ ఏవ చ . న మదో న చ మాత్సర్యం కామక్రోధాదయస్తథా .. 13.. |
|||
12. న సర్వం న భయం ద్వైతం, న వృక్షః తృణ పర్వతాః న ధ్యానం యోగ సగ్ంసిద్ధిః, న బ్రహ్మ క్షత్ర వైశ్యకమ్।। 13. న పక్షీ న మృగో న అంగీ, న లోభో మోహ ఏవ చ। న మదో, న చ మాత్సర్యం, కామక్రోధాదయః తథా।। |
-ధ్యాస - ధ్యానము, యోగము, యోగచ్యుతి, యోగసంసిద్ధి, - బ్రహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు, పక్షులు, మృగములు, వస్త్రము, లోభము, మోహము, అంతా బ్రహ్మమే! మదము, మాత్సర్యము, కామ-క్రోధములు (అరిషట్ వర్గము).. ఇవన్నీ బ్రహ్మమునకు వేరుకానివై ఉన్నాయి. |
||
న స్త్రీశూద్రబిడాలాది భక్ష్యభోజ్యాదికం చ యత్ . న ప్రౌఢహీనో నాస్తిక్యం న వార్తావసరోఽతి హి .. 14.. న లౌకికో న లోకో వా న వ్యాపారో న మూఢతా . న భోక్తా భోజనం భోజ్యం న పాత్రం పానపేయకం .. 15.. |
|||
14 న స్త్రీ శూద్ర బిడాలాది, భక్ష్య భోజ్యాదికంచ యత్ న ప్రౌఢ హీనో నాస్తిక్యం, న వార్త - అవసరో అస్తి హి।। 15 న లౌకికో అలౌకికోవా, న వ్యాపారో న మూఢతా। న భోక్తా భోజనం భోజ్యం, న మాతా మాన మేయకమ్। |
స్త్రీలు, శూద్రులు, పిల్లి, మేక, భక్ష్యములు, బోజ్యములు, లేహ్యములు, నపుంసకులు, నాస్తికులు, వార్తలు, అవసరములు.. ఇవేమియు లేవు. బ్రహ్మము మాత్రమే ఉన్నది. బ్రహ్మమునకు అవేమీ వేరు కాదు. లౌకిక (లోకసంబంధమైన) వ్యాపారములుగాని, అలౌకిక క్రియా-కార్యక్రమములుగాని, మూఢత్వముగాని, భోక్త (Consumer) - భోజనము (Consuming) - భోజ్యము (Being Consumed) ప్రమాత-ప్రమాణము - ప్రమేయములు గాని.., |
||
న శత్రుమిత్రపుత్రాదిర్న మాతా న పితా స్వసా . న జన్మ న మృతిర్వృద్ధిర్న దేహోఽహమితి భ్రమః .. 16.. |
|||
16 న శత్రు మిత్ర పుత్రాది న మాతా న పితా స్వసా। న జన్మ న మృతిః వృద్ధిః న ‘దేహోఽహమ్’ - ఇతి భ్రమః।। |
శత్రు-మిత్రులు, పుత్రులు, తల్లి-తండ్రులు - తోబుట్టువులు గాని, జన్మ-మృత్యువులు, హాని-వృద్ధులు, ‘దేహమే నేను’ అను భావనలు గాని.., ఇవేవీ బ్రహ్మమునకు అన్యము కాదు! |
||
న శూన్యం నాపి చాశూన్యం నాంతఃకరణసంసృతిః . న రాత్రిర్న దివా నక్తం న బ్రహ్మా న హరిః శివః .. 17.. |
|||
17 న శూన్యం నాపి చ అశూన్యం న అంతఃకరణ సగ్ంసృతిః న రాత్రిః న దివా నక్తం న బ్రహ్మా న హరిః శివః।। |
- శూన్య అశూన్యములుగాని, - మనస్సు-బుద్ధి-చిత్తము-అహంకారము.. అనబడే అంతఃకరణముగాని, రాత్రి-పగలు-అర్ధరాత్రులు గాని, బ్రహ్మ-హరి-శివులుఇవన్నీలేవు. బ్రహ్మమే ఇవన్నీ అయి ఉన్నాయి. బ్రహ్మమునకు వేరుగా చూస్తే అవేవీ లేవు. |
||
న వారపక్షమాసాది వత్సరం న చ చంచలం . న బ్రహ్మలోకో వైకుంఠో న కైలాసో న చాన్యకః .. 18.. |
|||
18 న వార పక్ష మాసాది వత్సరం న చ చంచలమ్। న బ్రహ్మలోకో వైకుంఠో న కైలాసో న చ అన్యతః।। |
‘7’ వారములు, శుక్ల - కృష్ణపక్షములు, ద్వాదశ (12) నెలలు, ఋతువులు, సంవత్సరములు, చంచలమగు కాలగతి, ఈ రోజులు, ఆ రోజులు.. ఇవన్నీ బ్రహ్మమే! బ్రహ్మలోకము - వైకుంఠము - కైలాసము తదితర లోకములు.. అవన్నీ కూడా బ్రహ్మమునకు వేరుగా లేవు. |
||
న స్వర్గో న చ దేవేంద్రో నాగ్నిలోకో న చాగ్నికః . న యమో యమలోకో వా న లోకా లోకపాలకాః .. 19.. |
|||
19 న స్వర్గోం న చ దేవేంద్రో న అగ్నిలోకో, న చ అగ్నికః। న యమో యమలోకోవా అన్యలోకా, లోకపాలకాః।। |
దివ్యమగు సువర్లోకము, అద్దాని అధినేత అగు దేవేంద్రుడు, అగ్నిలోకము, ఆ అగ్ని లోకాధిపతి అగు అగ్నిదేవుడు, యమలోకము, అద్దానికి అధిపతియగు యమభగవానుడు, తదితర లోకములు, వాటి వాటి అధిపతులు.. అంతా కూడా బ్రహ్మమునకు వేరుగా లేరు! బ్రహ్మమునకు వేరు కాదు! బ్రహ్మమే అయి ఉన్నారు! |
||
న భూర్భువఃస్వస్త్రైలోక్యం న పాతాలం న భూతలం . నావిద్యా న చ విద్యా చ న మాయా ప్రకృతిర్జడా .. 20.. |
|||
20 న భూర్భువ స్వః త్రైలోక్యం న పాతాళం న చ భూతలమ్। న అవిద్యా, న చ విద్యా చ న మాయా ప్రకృతిః జడా।। |
భూ-భువర్-సువర్లోకములు, తదితర ఊర్ధ్వ-అధో(పాతాళము) మొదలైన లోకములు, భూతలము, ఆయా లోకపాలకులు, అవిద్య, విద్య, మాయ, ప్రకృతి, జడము, చేతనము.. ఇవన్నీ బ్రహ్మము కంటే వేరుగా లేవు. వేరు కావు. బ్రహ్మమే అయి ఉన్నాయి! |
||
న స్థిరం క్షణికం నాశం న గతిర్న చ ధావనం . న ధ్యాతవ్యం న మే ధ్యానం న మంత్రో న జపః క్వచిత్ .. 21.. |
|||
21 న స్థిరం క్షణికం నాశం న గతిః న చ ధావనమ్। న ధ్యాతవ్యం న మే స్నానం న మంత్రో న జపః క్వచిత్।। |
స్థిరమై ఉండేవి, క్షణికమై ఉండేవి, కొంతకాలము ఉండి నశించునవి, గతి, నిర్గతి, ధావనము (నిర్మలముగా చేయు విధి-విధానములు) - ధ్యానింపవలసినది, స్నానము, మంత్రము, జపము.. అన్నీ బ్రహ్మమునకు ద్వితీయమై లేవు. బ్రహ్మమే అయి ఉన్నాయి. |
||
న పదార్థా న పూజార్హం నాభిషేకో న చార్చనం . న పుష్పం న ఫలం పత్రం గంధపుష్పాదిధూపకం .. 22.. |
|||
22 న పదార్థం, న పూజార్థం, న అభిషేకం, న చ అర్చనమ్, న పుష్పం న ఫలం పత్రం, గంథ పుష్పాది ధూపకమ్।। |
ఇక్కడ కనిపించే పదార్థములు, పూజాద్రవ్యములు, అభిషేకము, అర్చనము, పుష్పము, ఫలము, ఆకులు, గంథపుష్పములు, ధూపము, |
||
న స్తోత్రం న నమస్కారో న ప్రదక్షిణమణ్వపి . న ప్రార్థనా పృథగ్భావో న హవిర్నాగ్నివందనం .. 23.. |
|||
23 న స్తోత్రం న నమస్కారో న ప్రదక్షిణమ్ అణ్వపి। న ప్రార్థనా పృథక్ భావో న హవిః న నివేదనమ్।। |
స్తోత్రము, నమస్కారము, ప్రదక్షిణము.. ఇవన్నీ అణువంత కూడా బ్రహ్మమునకు వేరు కావు! అనేక నామరూపాలతో దైవమును ప్రార్థించటము, యజ్ఞములో సమర్పించే హవిస్సు, ఇంకా అనేక ఆయా నివేదనలు, |
||
న హోమో న చ కర్మాణి న దుర్వాక్యం సుభాషణం . న గాయత్రీ న వా సంధిర్న మనస్యం న దుఃస్థితిః .. 24.. |
|||
24 న హోమో న చ కర్మాణి న దుర్వాక్యగ్ం సుభాషణమ్। న గాయత్రీ న వా సంధిః న మనస్యం న దుస్స్థితిః ।। |
హోమకర్మలు, తదితర వివిధ కర్మలు…. ఇవన్నీ బ్రహ్మమే కాని, వేరు కాదు. బాధించే దుర్వాక్యములు, సంతోషము కలిగించే సుసంభాషణములు, గాయత్రీ మంత్రము, సంధ్యావందనము, మానసిక స్థితిగతులు, దుస్థితులు.. ఇవన్నీ ఆత్మకు అనన్యమే కానీ.. అన్యము కానే కావు! |
||
న దురాశా న దుష్టాత్మా న చాండాలో న పౌల్కసః . న దుఃసహం దురాలాపం న కిరాతో న కైతవం .. 25.. |
|||
25 న దురాశా న దుష్టాత్మా న చండాలో న పౌల్కసః న దుస్సహం దురాలాపం న కిరాతో న కైతవమ్।। |
గొప్ప దురాశాపరుడు, దుష్టమైన ఆలోచనలు గల దుష్టాత్ముడు, చండాలుడు, పౌల్కసుడు.. (దాసీకి-యజమానికి జనించినవాడు) దుస్సాహసములు, ఇతరుల గురించి దూషణగా - చెడ్డగా మాట్లాడటము → ఇవన్నీ కూడా బ్రహ్మమునకు అభిన్నమేగాని, భిన్నము కాదు. |
||
న పక్షపాతం న పక్షం వా న విభూషణతస్కరౌ . న చ దంభో దాంభికో వా న హీనో నాధికో నరః .. 26.. |
|||
26 న పక్షపాతం పక్షం వా న విభూషణ తస్కరౌ న చ దంభో దాంభికో వా న హీనో న అధికో నరః।। |
- పక్షపాత బుద్ధి, ఒక పక్షంలో ఉండి రెండవ పక్షమును తిట్టిపోయుటము, అలంకారములుగా కలిగి ఉన్న వస్తువులు (ఆభరణములు), - దొంగతనములు చేయువాడు - లేని గొప్పలు చెప్పుకొనటమనే దంభము, దాంభికము, నరులలో హీనులు, అధికులు.. ఇవన్నీ, బ్రహ్మమే కానీ ఏ మాత్రము వేరు కాదు. |
||
నైకం ద్వయం త్రయం తుర్యం న మహత్వం న చాల్పతా . న పూర్ణం న పరిచ్ఛిన్నం న కాశీ న వ్రతం తపః .. 27.. |
|||
27 న ఏకం ద్వయం త్రయం తుర్యం న మహత్త్వం న చ అల్పతా। న పూర్ణం న పరిచ్ఛిన్నం న కాశీ, న కృతం తపః।। |
ఏ ఒక్కటో (ఏకము) అయి ఉండటము, రెండుగా అయి ఉండటము (ద్వంద్వము), మూడు అయి ఉండటము, నాలుగు అయి ఉండటము, పూర్ణమైనది, పరిచ్ఛిన్నమైనది, ‘కాశి’ వంటి పుణ్యక్షేత్రములు, నిర్వర్తించి యున్న కర్మలు, తపస్సు-ఇవన్నీ కూడా ఆత్మయే! ఆత్మకు వేరుకావు! ఆత్మయే బ్రహ్మము. సచ్చిదానందమే! |
||
న గోత్రం న కులం సూత్రం న విభుత్వం న శూన్యతా . న స్త్రీ న యోషిన్నో వృద్ధా న కన్యా న వితంతుతా .. 28.. |
|||
28 న గోత్రం న కులగ్ం సూత్రం న విభుత్వం న శూన్యతా। న స్త్రీ న వయోషిన్ నో వృద్ధా న కన్యా న వితంతు తా।। |
కుల-గోత్రములు, వాటివాటికి సంబంధించిన జీవన సూత్రములు, ఆయా.. సందర్భములకు, జనులకు నియామకుడై ఉండటము, నిండుగా ఉండటము, నిర్విషయత్వము (లేక) శూన్యత్వము, స్త్రీలు, వయస్సులో ఉన్నవారు, వృద్ధులు, కన్యలు, భర్త చనిపోయినట్టి వితంతువులు.. అంతా బ్రహ్మమయమే! బ్రహ్మమునకు వేరు కాదు. |
||
న సూతకం న జాతం వా నాంతర్ముఖసువిభ్రమః . న మహావాక్యమైక్యం వా నాణిమాదివిభూతయః .. 29.. |
|||
29 న సూతకం న జాతం వా న అంతర్ముఖ సువిభ్రమః। న మహావాక్యం ఐక్యం వా న అణిమాది విభూతయః।। |
సూతకము (మైల), జననము, మరణము, అంతర్ముఖత్వము, సంవిభ్రమములు, మహావాక్యములు, పరమాత్మతో ఐక్యమవటము, అణిమ - గరిమ - లఘిమ - ఈశిత్వ-ప్రాకామ్య - ఇచ్ఛ - వశిత్వ మొదలైన విభూతులు.. అంతా బ్రహ్మమే. బ్రహ్మమునకు వేరై లేవు. |
||
సర్వచైతన్యమాత్రత్వాత్సర్వదోషః సదా న హి . సర్వం సన్మాత్రరూపత్వాత్సచ్చిదానందమాత్రకం .. 30.. |
|||
30 సర్వం చైతన్యమాత్రత్వాత్ సర్వ దోషః సదా న హి। సర్వగ్ం సన్మాత్ర రూపత్వాత్ సత్ చిత్ ఆనంద మాత్రకమ్।। |
‘‘సర్వము చైతన్య మాత్రమే’’ - అయి ఉండటము చేత ఎక్కడా ఏవీ దోషములు కావు. సర్వము ‘‘సత్- మాత్రము’’చే తయారైనవే కాబట్టి సత్‌చిత్ ఆనందమే! (కొన్ని బంగారు ఆభరణములలో ‘‘ఆభరణమైతే నాకు నచ్చదు’’ అన్నంత మాత్రాన బంగారమునకు లోటు ఏముంటుంది?) | ||
బ్రహ్మైవ సర్వం నాన్యోఽస్తి తదహం తదహం తథా . తదేవాహం తదేవాహం బ్రహ్మైవాహం సనాతనం .. 31.. |
|||
31 బ్రహ్మైవ సర్వం, న అన్యోఽస్తి। తత్ అహమ్। తత్ అహమ్ తథా, తదేవాహమ్। తదేవాహమ్। బహ్మైవాహగ్ం సనాతనమ్।। |
సర్వము బ్రహ్మమే! బ్రహ్మమునకు వేరై ఏదీ ఎక్కడా లేదు. కాబట్టి నేను బ్రహ్మమునకు వేరెట్లా అవుతాను? బ్రహ్మమునే! ఈ విధంగా నేనెప్పుడూ బ్రహ్మమే! ఆ తత్‌బ్రహ్మమే నేను. అదియే నేను! సర్వజన్మ-కర్మలకు, జగత్తులకు మునుముందే ఉండి ఉంటున్నదైనట్టి బ్రహ్మమును! అందుకే ‘సనాతన బ్రహ్మము’ అని పిలువబడుచున్నాను. |
||
బ్రహ్మైవాహం న సంసారీ బ్రహ్మైవాహం న మే మనః . బ్రహ్మైవాహం న మే బుద్ధిర్బ్రహ్మైవాహం న చేంద్రియః .. 32.. బ్రహ్మైవాహం న దేహోఽహం బ్రహ్మైవాహం న గోచరః . బ్రహ్మైవాహం న జీవోఽహం బ్రహ్మైవాహం న భేదభూః .. 33.. |
|||
బ్రహ్మైవాహం న మే మనః। బ్రహ్మైవాహం న మే బుద్ధిః। బ్రహ్మైవాహం న చ ఇంద్రియమ్।। 33 బ్రహ్మైవాహం న దేహోఽహం బ్రహ్మైవాహం న గోచరః। బ్రహ్మైవాహం న జీవోఽహం బ్రహ్మైవాహం న చేదభూః।। (న అచేతభూః) |
- సంసారిని కాదు. దృశ్యబద్ధుడనుకాదు! - ఆలోచన నా నుండి బ్రయల్వెడలుతోంది. నేను ఆలోచన కాదు! కాబట్టి మనస్సును కాదు! బ్రహ్మమునే! - తెలివి నా నుండి బ్రయల్వెడలే ఒక స్ఫూర్తి. అంతేగాని నేను తెలివిని కాదు. అనగా బుద్ధిని కాదు. నేను బ్రహ్మమును’. అహమ్ బ్రహ్మాస్మి. - జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు నేను ఉపయోగించు - నా స్ఫూర్తి రూపములగు ఉపకరణములు. అంతేగాని నేను ఇంద్రియములు కాదు. సదా శివబ్రహ్మమునే! -ఈ భౌతిక దేహము నాచే ఉత్తేజింపజేయబడుచున్న, కదల్చబడుచున్న ఒక వస్తువు. ఈ దేహము నేను కాదు! సర్వదా బ్రహ్మమును! - కళ్లకు గోచరమయ్యేదేదీ నేను కాదు. ఇదంతా నాయందు నా కల్పన! అందుచేత నేను ఎల్లప్పుడు బ్రహ్మమే! - నేను బ్రహ్మమును. అంతేగాని దేహముచే కదల్చబడు అచేతనుడను కాదు. జీవుడను కాదు. |
||
బ్రహ్మైవాహం జడో నాహమహం బ్రహ్మ న మే మృతిః . బ్రహ్మైవాహం న చ ప్రాణో బ్రహ్మైవాహం పరాత్పరః .. 34.. |
|||
34 బ్రహ్మైవాహం జడో నాఽహమ్ అహం బ్రహ్మ। న మే మృతిః। బ్రహ్మైవాహం న చ ప్రాణో బ్రహ్మై వాహం పరాత్ పరః।। |
అచేతనమగు జడమును కాదు. సర్వము సచేతనముగా చేయుచున్న బ్రహ్మమే నేను! సృష్టి అంతా భావన - కల్పన! నేనో? భావన - కల్పనలకు కర్తను. అందుచేత నేనే బ్రహ్మదేవుని సృష్టికల్పనా కళాకారుడను. (నా స్వప్నంలో నేను సృష్టించటం లేదా?) కనుక బ్రహ్మను నేనే. మార్పులకు కారణము బ్రహ్మముగా నేనే, కాబట్టి ‘మృత్యువు’ను కూడా నేనే! ప్రాణములు స్వతఃగా జడము. నేను ప్రాణములు కదల్చుచున్న చైతన్యబ్రహ్మమును. కనుక ప్రాణములు నేను కాదు. ప్రాణేశ్వరుడను |
||
ఇదం బ్రహ్మ పరం బ్రహ్మ సత్యం బ్రహ్మ ప్రభుర్హి సః . కాలో బ్రహ్మ కలా బ్రహ్మ సుఖం బ్రహ్మ స్వయంప్రభం .. 35.. |
|||
35 ఇదం బ్రహ్మ। పరం బ్రహ్మ। సత్యం బ్రహ్మ। ప్రభుర్హి సః। కాలో బ్రహ్మ। కలా బ్రహ్మ। సుఖం బ్రహ్మ స్వయం ప్రభమ్।। |
జగత్తుగా ఉన్నది బ్రహ్మము! దీనికి సాక్షిగా ఉండి ‘పరము’గా ఉన్నట్టిది బ్రహ్మమే! సత్యము (యమ్ సత్) బ్రహ్మము! ఈ సర్వమునకు అధికారి, ప్రభువు బ్రహ్మమే! కాలము బ్రహ్మమే! కల్పన కూడా బ్రహ్మమే! సుఖము బ్రహ్మమే! నేనే బ్రహ్మమును. ‘బ్రహ్మము’ అయినట్టి నన్ను వేరెవరో భావింపజేయటము లేదు. బ్రహ్మముగా నేనే సర్వమును భావిస్తున్నాను. |
||
ఏకం బ్రహ్మ ద్వయం బ్రహ్మ మోహో బ్రహ్మ శమాదికం . దోషో బ్రహ్మ గుణో బ్రహ్మ దమః శాంతం విభుః ప్రభుః .. 36.. |
|||
36 ఏకం బ్రహ్మ। ద్వయం బ్రహ్మ। మోహో బ్రహ్మ శమాది కమ్। దోషో బ్రహ్మ, గుణో బ్రహ్మ, దమః శాంతం విభుః ప్రభుః। |
-‘ఏకము’గా ఉన్నదీ బ్రహ్మమే! - ద్వయము (పరమాత్మ - జీవాత్మలు)గా ఉన్నదీ బ్రహ్మమే! మోహము బ్రహ్మమే! ఆ మోహము శమింపజేయు విధి విధానములు, ప్రక్రియలు బ్రహ్మమే! దోషము బ్రహ్మమే! గుణములు బ్రహ్మమే! దోషగుణములు బ్రహ్మమే! అంతరింద్రియములు బ్రహ్మమే! అంతరింద్రియ నిగ్రహము బ్రహ్మమే! అప్పుడు లభిస్తున్న శాంతి బ్రహ్మమే! ఇదంతా ఎవ్వరి విభూతియో, ఆ విభువు బ్రహ్మమే! దీనికంతటికీ యజమాని పాలించువాడు, ప్రభువు కూడా బ్రహ్మమే! |
||
లోకో బ్రహ్మ గురుర్బ్రహ్మ శిష్యో బ్రహ్మ సదాశివః . పూర్వం బ్రహ్మ పరం బ్రహ్మ శుద్ధం బ్రహ్మ శుభాశుభం .. 37.. |
|||
37 లోకో బ్రహ్మ। గురుర్బ్రహ్మ। శిష్యో బ్రహ్మ సదా శివః। పూర్వం బ్రహ్మ। పరం బ్రహ్మ। శుద్ధం బ్రహ్మ శుభాశుభమ్।। |
ఈ లోకమంతా బ్రహ్మమే! దీనినంతటినీ బ్రహ్మముగా నిర్వచించి సుస్పష్టీకరిస్తున్న బ్రహ్మానుభావుడగు గురువు బ్రహ్మమే! గురు ప్రవచనములను భక్తి-జ్ఞాన-వైరాగ్యములతో వినుచున్న శిష్యుడు బ్రహ్మమే! వినకముందు - వినుచున్నప్పుడు - వినిన తరువాత ఆ గురుశిష్యులిద్దరూ ‘సదా’ - శివబ్రహ్మస్వరూపులే! పూర్వము (Past)) బ్రహ్మమే! ముందు ముందు (In future) ఉండబోవునది బ్రహ్మమే! పూర్వ-పరములు లేనట్టి శుద్ధము - బ్రహ్మమే! శుభము - అశుభము కూడా బ్రహ్మమే! |
||
జీవ ఏవ సదా బ్రహ్మ సచ్చిదానందమస్మ్యహం . సర్వం బ్రహ్మమయం ప్రోక్తం సర్వం బ్రహ్మమయం జగత్ .. 38.. |
|||
38 జీవ ఏవ సదా బ్రహ్మ సచ్చిదానందమస్మి అహమ్।। సర్వం బ్రహ్మమయం ప్రోక్తం, సర్వం బ్రహ్మమయం జగత్।। |
ఈ జీవుడు త్రికాలములలోను, త్రిదశలలోను, ఎరుగక-ఎరుగుచూ- ఎరిగిన తరువాత కూడా బ్రహ్మమే. నీకు ఇదంతా చెప్పుచూ ఉన్న నేను సదా శివబ్రహ్మమునే! నీవు బ్రహ్మమే. ఇదంతా నేను ఇట్లా ఇప్పుడు నిర్ణయించి చెప్పటము లేదు. వేద-ఉపనిషత్తులు, సత్యదర్శులు- వారందరిచే అంతా ‘బ్రహ్మమయము’ అని చెప్పబడుచూనే ఉన్నది. ‘‘మట్టి బొమ్మలో అంతా మట్టియే’’ అను విధంగా - జగత్తు సర్వము బ్రహ్మమయమే! |
||
స్వయం బ్రహ్మ న సందేహః స్వస్మాదన్యన్న కించన . సర్వమాత్మైవ శుద్ధాత్మా సర్వం చిన్మాత్రమద్వయం .. 39.. నిత్యనిర్మలరూపాత్మా హ్యాత్మనోఽన్యన్న కించన . అణుమాత్రలసద్రూపమణుమాత్రమిదం జగత్ .. 40.. |
|||
39 స్వయం బ్రహ్మ న సందేహః స్వస్మాత్ అన్యత్ న కించన। సర్వం ఆత్మైవ, శుద్ధాత్మా। సర్వం చిన్మాత్రమద్వయమ్।।
అణుమాత్ర లసత్ రూపం, అణుమాత్రమ్ ఇదం జగత్।। |
నీవు-నేను-ఆతడు-ఈతడు-వారు-వీరు మనమంతా స్వయముగా ‘బ్రహ్మము’ అయిఉన్నాము! మనము ‘బ్రహ్మము’ అగుటకు మరొక్కటేదీ రావలసిన-పొందవలసిన పనిలేదు. చేయవలసినది లేదు. ఇందులో సందేహమే లేదు. స్వస్వరూపమునకు అన్యమై ఎక్కడా-ఏదీ లేదు. ఓ శుద్ధాత్మా! ఇదంతా నీ ఆత్మయేనయ్యా! సర్వము అద్వయమగు చిన్మాత్రమే!
|
||
అణుమాత్రం శరీరం వా హ్యణుమాత్రమసత్యకం . అణుమాత్రమచింత్యం వా చింత్యం వా హ్యణుమాత్రకం .. 41.. బ్రహ్మైవ సర్వం చిన్మాత్రం బ్రహ్మమాత్రం జగత్త్రయం . ఆనందం పరమానందమన్యత్కించిన్న కించన .. 42.. |
|||
41 అణుమాత్రం శరీరం వా హి అణుమాత్రం అసత్యకమ్। అణుమాత్రం అచింత్యం వా చింత్యం వా హి అణుమాత్రకమ్।। |
నా ‘పరబ్రహ్మము’ అనబడు అనంత చిదానందములో ఒకానొక చిత్ అణువు శరీరత్వము. ‘కల్పన-అసత్యము’’ అనేవి కూడా అణుమాత్రమే! అచింత్యమైనదంతా ఆత్మాకాశమునందు అణుమాత్రమే! చింత్యమైనది కూడా అనంతాత్మయందు అణుమాత్రమే! |
||
బ్రహ్మమాత్రం జగత్ త్రయమ్। ఆనన్దమ్ పరమానన్దమ్ అన్యత్ కించిత్ న కించన।। |
|
||
చైతన్యమాత్రమోంకారం బ్రహ్మైవ సకలం స్వయం . అహమేవ జగత్సర్వమహమేవ పరం పదం .. 43.. |
|||
43 చైతన్య మాత్రం ఓం కారం, బ్రహ్మైన సకలగ్ం స్వయమ్ అహమేవ జగత్ సర్వమ్। అహమేవ పరం పదమ్।। |
ఓంకారము చైతన్య బ్రహ్మమాత్రమే! ఈ సకలము స్వయముగా బ్రహ్మమే! నేను స్వయముగా బ్రహ్మమునే! కనుక నేనే సర్వజగత్తును! నేనే ఈ జగత్తుకు ఆవల గల పరమపదమును కూడా! |
||
అహమేవ గుణాతీత అహమేవ పరాత్పరః . అహమేవ పరం బ్రహ్మ అహమేవ గురోర్గురుః .. 44.. |
|||
44 అహమేవ గుణాతీత(మ్)। అహమేవ పరాత్ పరః। అహమేవ పరంబ్రహ్మ అహమేవ గురోర్గురుః।। |
నేను గుణములకు ఉత్పత్తి స్థానమగుటచేత నేనే గుణాతీతుడను. ఈ ఇహమునకు ఆవల దీనికి సాక్షిగా ఉన్న ‘పరము’ (That Beyond the present)ను కూడా నేనే! కేవల సాక్షినై యుండుటచేత పరాత్-పరుడను. నేనే పర బ్రహ్మమును. గురువు - శిష్యులకు ఆత్మయే విషయము (Subject) కనుక, నేనే ‘ఆత్మ’ను అయి ఉండటము చేత.. నేనే గురోర్గురువును. |
||
అహమేవాఖిలాధార అహమేవ సుఖాత్సుఖం . ఆత్మనోఽన్యజ్జగన్నాస్తి ఆత్మనోఽన్యత్సుఖం న చ .. 45.. |
|||
45 అహమేవ అఖిలాధార, అహమేవ సుఖాత్ సుఖమ్। ఆత్మనో అన్యత్ జగత్ నాస్తి, ఆత్మనో అన్యత్ సుఖం చ న।। |
ఈ కనబడే దృశ్యాంతర్గత లోకములన్నిటికీ ఆధారముగా ఉన్నది ఆత్మయే! ఆత్మయే నేను కాబట్టి, నేనే ఆధారము! అంతేకాదు. నేను సుఖమునకే సుఖస్వరూపమైయున్నాను. ఆత్మయే స్వయముగా సుఖస్వరూపం. ఇంక ఆత్మకు వేరైన సుఖముతో పనిఏముంది? |
||
ఆత్మనోఽన్యా గతిర్నాస్తి సర్వమాత్మమయం జగత్ . ఆత్మనోఽన్యన్నహి క్వాపి ఆత్మనోఽన్యత్తృణం నహి .. 46.. |
|||
46 ఆత్మనో అన్య ఆగతిః నాస్తి సర్వం ఆత్మమయం జగత్। ఆత్మనో అన్యత్ నహి క్వాపి ఆత్మనో అన్యత్ తృణం నహి।। |
ఆత్మనగు నేను ఆత్మకు వేరైనట్టి మరింకెక్కడికీ వచ్చియుండలేదు. నేను ఎక్కడికి వచ్చియున్నానో,.. అదంతా ఆత్మయే! ఎందుకంటే, ఈ సర్వజగత్తు మమాత్మమయమే కనుక! ఆత్మకు వేరై ఎక్కడా ఏదీ లేదు కాబట్టి! ఆత్మకు వేరుగా ఒక గడ్డిపరకంతటిది కూడా ఏదీ ఎక్కడా లేకుండటం చేత। |
||
ఆత్మనోఽన్యత్తుషం నాస్తి సర్వమాత్మమయం జగత్ . బ్రహ్మమాత్రమిదం సర్వం బ్రహ్మమాత్రమసన్న హి .. 47.. |
|||
47 ఆత్మనో అన్యత్ తుషత్ నాస్తి సర్వం ఆత్మమయం జగత్। బ్రహ్మమాత్రమ్ ఇదగ్ం సర్వం బ్రహ్మమాత్రమ్। అసత్ నహి।। |
ఆత్మకు అన్యమై (వేరై) ఒక ఊకపాయ (వడ్లగింజపై పొర) అంత కూడా ఏదీ లేదు. ఈ సమస్తము, ఈ దృశ్యమంతా కూడా బ్రహ్మమాత్రమే! బ్రహ్మము సర్వదా ‘సత్తు’యే కాబట్టి ఇదంతా అసత్ అన వీలు లేదు కూడా! ఆత్మకు వేరుగా ఏదీ లేదు కాబట్టి - అసత్తు అనునదే లేదు. |
||
బ్రహ్మమాత్రం శ్రుతం సర్వం స్వయం బ్రహ్మైవ కేవలం . బ్రహ్మమాత్రం వృతం సర్వం బ్రహ్మమాత్రం రసం సుఖం .. 48.. |
|||
48 బ్రహ్మమాత్రం శ్రుతం సర్వం స్వయం బ్రహ్మైవ కేవలమ్। బ్రహ్మమాత్రం వృతం సర్వం బ్రహ్మమాత్రం రసం సుఖమ్।। |
వినబడుచున్నదంతా బ్రహ్మమే! వినుచున్నట్టి నీవు కూడా కేవలము బ్రహ్మమువే! (‘‘మామిడి పండులో మామిడి రసము’’ వలె) ఇదంతా బ్రహ్మమాత్రముచే - బ్రహ్మమగు నీచే ఆవృతమైయున్నది. రసము - రస సుఖము బ్రహ్మమే! బ్రహ్మముయొక్క మధురరసానుభూతియే ఈ ‘దృశ్యజగత్తు’’ - అనబడు ప్రదర్శనమంతా కూడా. |
||
బ్రహ్మమాత్రం చిదాకాశం సచ్చిదానందమవ్యయం . బ్రహ్మణోఽన్యతరన్నాస్తి బ్రహ్మణోఽన్యజ్జగన్న చ .. 49.. |
|||
49 బ్రహ్మమాత్రం చిదాకాశమ్ సచ్చిదానందమవ్యయమ్। బ్రహ్మణో అన్యతరత్ నాస్తి బ్రహ్మణో అన్యత్ జగత్ న చ।। |
చిదాకాశము (The Zone of Awareness (or) Knowing) - సచ్చిదా నందము - అవ్యయము అగు బ్రహ్మము యొక్క స్వరూపమే ఇదంతా. బ్రహ్మమునకు వేరైగాని, దాటివేసికాని, ఎక్కడా ఏదీ లేదు. వేరుగా జగత్తు మొదలుగా ఏదీ ఉండజాలదు’’ - ఈ సిద్ధాంతానుసారము బ్రహ్మమునకు వేరై జగత్తు లేదు. నేను లేను, నీవు లేవు. మనమంతా కూడా అఖండాత్మానంద స్వరూపులమే. |
||
బ్రహ్మణోఽన్యదహ నాస్తి బ్రహ్మణోఽన్యత్ఫలం నహి . బ్రహ్మణోఽన్యత్తృణం నాస్తి బ్రహ్మణోఽన్యత్పదం నహి .. 50.. |
|||
50 బ్రహ్మణో అన్యత్ అహం నాస్తి। బ్రహ్మణో అన్యత్ ఫలం నహి। బ్రహ్మణో అన్యత్ తృణత్ నాస్తి। బ్రహ్మణో అన్యత్ పదం నహి।। |
బ్రహ్మమునకు వేరుగా అహమ్-నేను అనునది లేదు. బ్రహ్మమునకు వేరుగా కర్మ ఫలములు లేవు. బ్రహ్మమునకు వేరుగా గడ్డి పరక కూడా లేదు. బ్రహ్మమునకు వేరుగా ఇంద్రపదము - బ్రహ్మపదము - విష్ణుపదము మొదలైనవి లేవు. సమస్తము సర్వదా పరబ్రహ్మమే అయి ఉండగా - ఇక ఊర్థ్వ లోకాలకు వెళ్ళవలసిన పనేమి? |
||
బ్రహ్మణోఽన్యద్గురుర్నాస్తి బ్రహ్మణోఽన్యమసద్వపుః . బ్రహ్మణోఽన్యన్న చాహంతా త్వత్తేదంతే నహి క్వచిత్ .. 51.. |
|||
51 బ్రహ్మణో అన్యో గురుః నాస్తి। బ్రహ్మణో అన్యత్ అసత్ వపుః। బ్రహ్మణో అన్యత్ న చ అహంతా త్వత్ తా, ఇదంతే నహి క్వచిత్।। |
బ్రహ్మమునకు వేరుగా గురువు లేడు. బ్రహ్మమునకు వేరుగా ఏదైనా ఉన్నదనిపిస్తే - ఆ అనిపించేది ‘అసత్ మాత్రమే’ అని చెప్పబడుతోంది. బ్రహ్మమునకు వేరై నాకు చెందినదంటూ ఏదీ లేదు. నీకు చెందినది లేదు. మరొకరికి చెందినదీ లేదు. ఇదంతా ఏదీ లేదు. కొంచము కూడా లేదు. సమస్తము సర్వదా బ్రహ్మమునకు అనన్యము. |
||
స్వయం బ్రహ్మాత్మకం విద్ధి స్వస్మాదన్యన్న కించన . యత్కించిద్దృశ్యతే లోకే యత్కించిద్భాష్యతే జనైః .. 52.. యత్కించిద్భుజ్యతే క్వాపి తత్సర్వమసదేవ హి . కర్తృభేదం క్రియాభేదం గుణభేదం రసాదికం .. 53.. లింగభేదమిదం సర్వమసదేవ సదా సుఖం . |
|||
→ యత్ కించిత్ దృశ్యతే లోకే, → యత్ కించిత్ భాష్యతే జనైః, 53 → యత్ కించిత్ భుజ్యతే క్వాపి, తత్ సర్వం ‘అసత్’ ఏవ హి।। కర్తృభేదం, క్రియాభేదం, గుణభేదం రసాదికమ్, 54 లింగభేదం ఇదగ్ం సర్వం, అసదేవ సదా సుఖమ్। |
బ్రహ్మము సదా సమస్వరూపమై, సర్వుల యందు సమముగా వేంచేసినదై ఉన్నది. ఇక ఇక్కడి కర్తృత్వ భేదము, క్రియాభేదములు, గుణభేదములు, రసానుభవముల అల్పాధికములు, లింగ భేదము (Gender Differences) - అసత్తుయే! స్వతఃగా లేవు! బ్రహ్మమే అయిఉన్నాయి. |
||
కాలభేదం దేశభేదం వస్తుభేదం జయాజయం .. 54.. యద్యద్భేదం చ తత్సర్వమసదేవ హి కేవలం . |
|||
కాల భేదం దేశ భేదం, వస్తు భేదం జయాజయమ్ 55 యత్ యత్ భేదం చ, తత్ సర్వమ్ అసత్ ఏవహి కేవలమ్।। |
ఇది వరకు-ఇప్పుడు-ఇక ముందు అనబడే కాలభేదము, ఈ ప్రదేశము -ఆప్రదేశము అనబడే దేశభేదములు, వస్తుభేదములు, జయ- అపజయ ములు-అవన్నీ కూడా కథలోని-కలలోని సంఘటనలవలె-అసత్ మాత్రమే! |
||
అసదంతఃకరణకమసదేవేంద్రియాదికం .. 55.. అసత్ప్రాణాదికం సర్వం సంఘాతమసదాత్మకం . అసత్యం పంచకోశాఖ్యమసత్యం పంచ దేవతాః .. 56.. |
|||
అసత్ అంతఃకరణకమ్, అసత్ ఏవ ఇంద్రియాదికమ్। 56 అసత్ ప్రాణాదికం సర్వం సంఘాతమ్ అసదాత్మకమ్। అసత్యం పంచకోశాఖ్యం। అసత్యం పంచదేవతాః। |
మనో-బుద్ధి-చిత్త-అహంకారాలనబడే అంతఃకరణములు అసత్తే! పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, పంచ ప్రాణములు, ప్రాణాదికమైనవి అన్నీ, (ఇష్టంగా అనిపించేవన్నీ, వాటిలో ఏర్పడే సంఘాతము (Association), అన్నమయ-ప్రాణమయ- మనోమయ- విజ్ఞానమయ- ఆనందమయములనబడే పంచకోశములు, భూదేవత - వాయుదేవత - జలదేవత-అగ్నిదేవత-ఆకాశదేవత అనబడే పంచదేవతలు కూడా అసత్తే! (ఆత్మమాత్రమే సత్తు). | ||
అసత్యం షడ్వికారాది అసత్యమరివర్గకం . అసత్యం షడృతుశ్చైవ అసత్యం షడ్రసస్తథా .. 57.. |
|||
57 అసత్యగ్ం ‘షట్’(6) వికారాది అసత్యం అరి వర్గకమ్। అసత్యగ్ం షట్ ఋతుశ్చైవ అసత్యగ్ం షట్ రసః తథా।। |
షట్ (ఆరు) వికారాలు, అసత్యమే! అనగా, (పుట్టుక-వృద్ధి-ప్రవృద్ధి- అపక్షయము -క్షయము-వినాశనము).. అనునవన్నీ కూడా అసత్తే! (అట్లాగే) ‘‘కామ-క్రోధ-లోభ-మోహ- మద - మాత్సర్యములు’’.. అనే అరిషట్ (‘6’ శత్రువుల) వర్గము, (అదేవిధంగా) వసంత-గీష్మ-వర్ష - హేమంత - శశిర- శరత్ ఋతువులు, షట్(6) రుచులు.. ఇవన్నీ అసత్యమే! |
||
సచ్చిదానందమాత్రోఽహమనుత్పన్నమిదం జగత్ . ఆత్మైవాహం పరం సత్యం నాన్యాః సంసారదృష్టయః .. 58.. |
|||
58 సత్ చిత్ ఆనంద మాత్రోఽహమ్ అనుత్పన్నం ఇదం జగత్। ఆత్మైవాహం చిదానందో న అన్యాః సగ్ంసార దృష్టయః। |
ఓ నిదాఘ మహాత్మా! నేను దృశ్యమును కాదు, దేహమును కాదు. అంతరంగము కాదు. మునిని కాదు, మహర్షిని మొదలైనవి కాను. కేవలము సత్-చిత్-ఆనంద మాత్రుడను. మరి నేను పొందుతూ ఉన్న ఈ జగత్ విషయం ఏమంటావా? స్వప్నములో కనిపించిన ‘రెండస్తుల మేడ’ వలె ఇది మొదలే ఉత్పన్నము కాలేదు. నేను చిదానందమగు ఆత్మయే! (దీపం వెలుగుచున్నచోట చీకటి ఉండజాలని విధంగా) ఆత్మకు అన్యమగు సంసార దృష్టులకు చోటెక్కడిది? ఉండజాలదు. |
||
సత్యమానందరూపోఽహం చిద్ఘనానందవిగ్రహః . అహమేవ పరానంద అహమేవ పరాత్పరః .. 59.. జ్ఞానాకారమిదం సర్వం జ్ఞానానందోఽహమద్వయః . సర్వప్రకాశరూపోఽహం సర్వాభావస్వరూపకం .. 60.. |
|||
59 సత్యమానంద రూపోఽహమ్ చిద్ఘనానంద విగ్రహః। జ్ఞానాకారమ్ ఇదగ్ం సర్వం జ్ఞానానందోఽహమ్ అద్వయః।। అహమేవ పరానందీః। అహమేవ పరాత్పరః। 60 సర్వ ప్రకాశ రూపోఽహగ్ం సర్వాభావ స్వరూపకః। |
సత్యము (సత్)-ఆనందము.. స్వరూపముగా కలిగి ఉన్నవాడను. ‘‘ఘనీభూతమగు ఎరుక’’యే నా విగ్రహస్వరూము. ఇక ఈ జగత్తు నా యొక్క జ్ఞాన స్వరూపము. నాయొక్క ‘ఎరుక’యే జగత్ రూపమై ఎరుగబడుచున్నదిగా అగుచున్నది. అద్వయమగు జ్ఞాననానందుడను. తెలియబడేదంతా నా జ్ఞానానందస్వరూపమే! నేనే పరానందుడను. పరాత్పరుడను. ఏది ఏరీతిగా తెలియబడుచున్నదో, అది అట్లు ప్రకాశింపజేస్తూ ఉన్నది, సర్వభావములు ప్రదర్శిస్తూ ఉన్నట్టిది - ఇదంతా నా స్వరూపమే! |
||
అహమేవ సదా భామీత్యేవం రూపం కుతోఽప్యసత్ . త్వమిత్యేవం పరం బ్రహ్మ చిన్మయానందరూపవాన్ .. 61.. |
|||
61 అహమేవ సదా భామి ఇత్యేవగ్ం రూపం కుతోఽపి అసత్? త్వమ్ ఇత్యేవం పరంబ్రహ్మ చిన్మయానంద రూపవాన్।। |
(సూర్యుడు సదా ప్రకాశించుచూ సర్వజగత్ వస్తువులను ప్రకాశింప జేయుచున్నవిధంగా) నేను సర్వజగత్ విశేషాలను భాసింపజేస్తున్న స్వయం భాసకుడను. సర్వ నామరూపాత్మకమైన విశేషాలన్నీ నా ‘సత్‌భాసము’ (వెలుగు)చే భాసించుచుండగా, అసత్తు ఎట్లా అవుతాయి? అంతా నా సత్ స్వరూపమే కాబట్టి ‘అసత్’ అనునదే లేదు. నాచే భాసింపబడుచున్న ‘నీవు’ కూడా సర్వదా పరబ్రహ్మస్వరూపుడవే! చిన్మయానంద రూపుడవు అయి ఉన్నావు. నీవు నా సత్ సర్వరూపము. నేను నీ సత్ స్వరూపమును. జగత్ మన సత్ స్వరూపమే! ఇక అసత్ ఎక్కడిది? |
||
చిదాకారం చిదాకాశం చిదేవ పరమం సుఖం . ఆత్మైవాహమసన్నాహం కూటస్థోఽహం గురుః పరః .. 62.. |
|||
62 చిదాకారం చిదాకాశం చిదేవ పరమగ్ం సుఖమ్। ఆత్మైవాహమ్। అసత్ న అహమ్। కూటస్థోఽహం గురుః పరః।। |
ఓ నిదాఘమునీంద్రా! ఈ భూత-చిత్తాకాశములు వాస్తవ సుఖరూపమైనవి కావు. నాయొక్క చిదాకాశరూపమగు చిదాకార చిత్ రూపమే పరమ సుఖరూపము. నేను ఆత్మ స్వరూపుడనే! అసత్ స్వరూపుడను కాను. సర్వమునకు కేంద్రీకృత బిందు స్థానమును. కూటస్థుడను. పరస్వరూపు డను. మహోత్కృష్ట వస్తువు అగుటచేత గురువును. (లఘువును కాను). |
||
సచ్చిదానందమాత్రోఽహమనుత్పన్నమిదం జగత్ . కాలో నాస్తి జగన్నాస్తి మాయాప్రకృతిరేవ న .. 63.. |
|||
63 సచ్చిదానంద మాత్రోఽహమ్। అనుత్పన్నం ఇదం జగత్। కాలో నాస్తి। జగత్ నాస్తి। మాయా ప్రకృతిరేవ న।। |
కేవల సత్-చిత్‌మాత్ర రూపుడను. ఈ ‘జగత్తు’ అనబడేది (స్వప్నంలో బండరాయిలాగా, కుందేటి కొమ్మువలె, కల్పితమగు కథలో అందమయిన స్త్రీ వలె) మొదలే ఉత్పన్నము కాలేదు. కాలము లేదు. జగత్తు లేదు. మాయలేదు. ప్రకృతి కూడా లేనట్టిదే. |
||
అహమేవ హరిః సాక్షాదహమేవ సదాశివః . శుద్ధచైతన్యభావోఽహం శుద్ధసత్త్వానుభావనః .. 64.. |
|||
64 అహమేవ హరిః సాక్షాత్। అహమేవ సదాశివః। శుద్ధ చైతన్య భావోఽహగ్ం శుద్ధ సత్త్వానుభావనః।। |
కేవలాత్మానంద స్వరూపముచే నేనే సాక్షాత్ లోకరక్షకుడగు హరిని. నేనే సదాశివ స్వరూపుడను. శుద్ధ చైతన్య కేవల (భావించు) భావస్వరూపుడను. శుద్ధ సత్త్వమును భావన చేయుచున్నట్టివాడను. (అను భావన చేయువాడను) |
||
అద్వయానందమాత్రోఽహం చిద్ఘనైకరసోఽస్మ్యహం . సర్వం బ్రహ్మైవ సతతం సర్వం బ్రహ్మైవ కేవలం .. 65.. |
|||
65 అద్వయానందమాత్రోఽహమ్ చిద్ఘనైక రసోఽస్మ్యహమ్। సర్వం బ్రహ్మైవ సతతగ్ం। సర్వం బ్రహ్మైవ కేవలమ్।। |
(ద్వితీయ మనునదే లేనట్టివాడనగుటచే) అద్వయానందమాత్రుడను. చిద్ఘన రస స్వరూపుడను. కేవల బ్రాహ్మీ స్వరూపుడును. ఈ సర్వము ఎల్లప్పుడూ బ్రహ్మమే! కేవలము బ్రహ్మము మాత్రమే! మరింకేమీ కాదు! ‘అన్యమైనది’ అనునది ఏమైనా ఉంటే, - బ్రహ్మము (లేక) ఆత్మ అనన్యము, అఖండము ఎట్లా అవుతుంది? |
||
సర్వం బ్రహ్మైవ సతతం సర్వం బ్రహ్మైవ చేతనం . సర్వాంతర్యామిరూపోఽహం సర్వసాక్షిత్వలక్షణః .. 66.. |
|||
66 సర్వం బ్రహ్మైవ సతతగ్ం సర్వం బ్రహ్మైవ చేతనమ్। సర్వాంతర్యామి రూపోఽహగ్ం సర్వ సాక్షిత్వ లక్షణః।। |
సర్వము సర్వదా (సతతము) శివ బ్రహ్మమే! సర్వచేతనములు (కదలికలు) బ్రహ్మమే! కనుక నేను సర్వదా బ్రహ్మమును. అందుచేత సర్వుల యొక్క అంతర్యామి స్వరూపుడను! సర్వజీవులలోని ‘కేవలసాక్షిత్వము’ - అనునది- నా యొక్క స్వభావసిద్ధ లక్షణము అయి ఉన్నది. |
||
పరమాత్మా పరం జ్యోతిః పరం ధామ పరా గతిః . సర్వవేదాంతసారోఽహం సర్వశాస్త్రసునిశ్చితః .. 67.. |
|||
67 పరమాత్మా పరంజ్యోతిః పరంధామ పరాగతిః। సర్వవేదాంత సారోఽహగ్ం సర్వశాస్త్ర సునిశ్చితః।। |
‘‘పరమాత్మ’ - అనబడేది నా సహజ - స్వభావసిద్ధరూపము. సర్వజీవాత్మలు నాయందు జ్యోతులుగా వెలుగొందుచున్న పరంజ్యోతి స్వరూపుడను. (ఒకే అగ్ని వేలాది దీపములలో వెలుగొందుచూ ఏకస్వరూపమైయున్న తీరుగా)! సర్వమునకు ఆవల ఏక స్వరూపుడనై ఉండగా, సర్వము వెలుగొందుచున్నది. సర్వ వేదాంత - సిద్ధాంత సారస్వరూపుడను. నా యొక్క సహజ - వాస్తవ స్వరూపమే నేను. సర్వశాస్త్రములు ఏ కేవలీ - సహజ-స్వస్వరూమును సునిశ్చయించి ప్రకటిస్తున్నాయో, అది నేనే! అది నేనే! అదే నేను. |
||
యోగానందస్వరూపోఽహం ముఖ్యానందమహోదయః . సర్వజ్ఞానప్రకాశోఽస్మి ముఖ్యవిజ్ఞానవిగ్రహః .. 68.. |
|||
68 యోగానంద స్వరూపోఽహం ముఖ్యానంద మహోదయః సర్వజ్ఞాన ప్రకాశోఽస్మి ముఖ్య విజ్ఞాన విగ్రహః।। |
సర్వము యొక్క ఏకత్వముగా అగు యోగ- ఆనంద స్వరూపుడను. ‘‘సర్వ’’ ఆనందములకు పరాకాష్ఠను! ప్రాముఖ్యము - ప్రముఖము అగు ఆనందము స్వరూపముగా కలవాడను! సర్వజ్ఞానములను ప్రకాశింపజేయు వాడను! సర్వజ్ఞానముల ప్రకాశమంతా నాదే! జ్ఞానములకు పరాకాష్ఠ యగు ఆత్మజ్ఞాన-పరమార్థస్వరూపుడను! ముఖ్యజ్ఞాన విగ్రహుడను! |
||
తుర్యాతుర్యప్రకాశోఽస్మి తుర్యాతుర్యాదివర్జితః . చిదక్ష్రోఽన్ సత్యోఽహం వాసుదవోఽజరరోఽమరః .. 69.. |
|||
69 తుర్యాతుర్య ప్రకాశోఽస్మి తుర్యాతుర్యాది వర్జితః। చిత్ అక్షరోఽహం సత్యోఽహం వాసుదేవో అజరో అమరః।। |
తుర్యముగా (జాగ్రత్-స్వప్న - సుషుప్తులలో సంచరించువాడిగా), జాగ్రత్ - స్వప్న-సుషుప్తులను నా యొక్క ప్రకాశము (Enlightenment)గా కలవాడను! అయితే తుర్య - అతుర్యములు నాకు లేవు. అక్షరమగు(Endless) చిత్ స్వరూపుడను. సత్యస్వరూపుడను! సర్వజీవులయందు సర్వదా వేంచేసి ఉన్నవాడిని కాబట్టి వాసుదేవుడను! జరామరణములకు సంబంధించిన వాడినే కాను. అవి నాకు సంబంధించినవీ కావు. నేను వాటికి సంబంధించి లేను. |
||
అహం బ్రహ్మ చిదాకాశం నిత్యం బ్రహ్మ నిరంజనం . శుద్ధం బుద్ధం సదాముక్తమనామకమరూపకం .. 70.. |
|||
70 అహంబ్రహ్మ చిదాకాశం నిత్యం బ్రహ్మ నిరంజనమ్। శుద్ధం బుద్ధం సదా ముక్తమ్ అనాత్మకమ్। అరూపకమ్। |
చిదాకాశ పరంబ్రహ్మ స్వరూపుడను! నిత్యుడను! బ్రహ్మమును! దోషము లేవీ స్పృశించజాలనివాడను! శుద్ధుడను! కేవల బుద్ధి మాత్రుడను! పరస్వరూపుడనగు నేను దేనిచేతనూ బంధింపబడువాడను కాను! అనాత్మను ప్రదర్శించువాడను కూడా నేనే! రూపరహితుడను! సర్వరూపములు నావే. |
||
సచ్చిదానందరూపోఽహమనుంత్పన్నమిదం జగత్ . సత్యాసత్యం జగన్నాస్తి సంకల్పకలనాదికం .. 71.. నిత్యానందమయం బ్రహ్మ కేవలం సర్వదా స్వయం . అనంతమవ్యయం శాంతమేకరూపమనామయం .. 72.. |
|||
71 సచ్చిదానంద రూపోఽహగ్ం అనుత్పన్నమ్ ఇదం జగత్। సత్యాసత్యం జగత్ నాస్తి సంకల్ప కలనాదికమ్।। 72 నిత్యానందమయం బ్రహ్మ, కేవలగ్ం సర్వదా స్వయమ్। అనంతమ్ అవ్యయగ్ం శాంతమ్, ఏకరూపమ్, అనామయమ్। |
సత్ చిత్ ఆనందరూపుడనగు నా సమక్షంలో జగత్తు అనునది ఉత్పన్నమే అయి ఉండలేదు. మరి? ఈ జగత్తు సంకల్పములచే నిర్మితము. అందుచేత ఈ జగత్తు సత్యము కాదు. అసత్యము కాదు. నేనే స్వయముగా సర్వదా - కేవలమగు నిత్యానందమయ పరబ్రహ్మమును. అనంతుడను. అవ్యయుడను. పరమ శాంతుడను. ఏకరూపుడను. జగత్ దృశ్యరహితుడను. పరిమితములు లేనివాడను. |
||
మత్తోఽన్యదస్తి చేన్మిథ్యా యథా మరుమరీచికా . వంధ్యాకుమారవచనే భీతిశ్చేదస్తి కించన .. 73.. |
|||
వంధ్యాకుమార వచనే… భీతిశ్చేత్ అస్తి కించన? |
|
||
శశశృంగేణ నాగేంద్రో మృతశ్చేజ్జగదస్తి తత్ . మృగతృష్ణాజలం పీత్వా తృప్తశ్చేదస్త్విదం జగత్ .. 74.. |
|||
74 శశ శృంగేణ నా గేంద్రో మృతశ్చేత్ జగదస్తి తత్। మృగతృష్ణా జలం పీత్వా తృప్తశ్చేత్ అస్తి ఇదం జగత్।। |
‘‘ఒకాయనకు పిచ్చపిచ్చగా దాహం వేస్తూ ఉండగా, మృగతృష్ణలో జలం త్రాగి ఆ దాహంకాస్తా తీర్చుకొన్నాడు. తృప్తి పొందాడు’’.. అనునది వాస్తవమైతే, అప్పుడు జగత్తు వాస్తవమే! |
||
నరశృంగేణ నష్టశ్చేత్కశ్చిదస్త్విదమేవ హి . గంధర్వనగరే సత్యే జగద్భవతి సర్వదా .. 75.. |
|||
75 నరశృంగేణ నష్టశ్చేత్ కశ్చిత్ అస్తి ఇదమేవ హి। గంధర్వ నగరే సత్యే జగత్ భవతి సర్వదా।। |
‘‘ఒక నరుడు తనయొక్క రెండు కొమ్ములు కారణంగా చాలా నష్టము పొందాడు’’ - అనేది సత్యమైతే - ఈ జగత్తు సత్యమే! మనోకల్పనా రూపమగు (A City created and shown by a Magician) అను గంధర్వనగరము నిజంగానే ఉండి ఉంటే, ఈ జగత్తు ఉన్నట్లే మరి! |
||
గగనే నీలిమాసత్యే జగత్సత్యం భవిష్యతి . శుక్తికారజతం సత్యం భూషణం చేజ్జగద్భవేత్ .. 76.. |
|||
76 గగనే నీలిమాసత్వేత్ జగత్ సత్యం భవిష్యతి। శుక్తికా రజతం సత్యం భూషణం చేత్ జగత్ భవేత్।। |
‘‘ఆకాశం నీలంగా కనబడటానికి కారణం ఎవ్వరో ఆకాశంలో నీలపు రంగు పొడి చల్లారు’’- ఇది సత్యమేనా? ఇది నిజమైతే ‘జగత్తు సత్యము’ అనునది కూడా సత్యమే! ‘‘ఒక గొప్ప పెద్దమనిషి ముత్యపు చిప్పలు ఏరి తీసుకువచ్చి, వాటిలో లభించిన వెండితో వాళ్ల ఆవిడకు మట్టెలు, చిరుగజ్జలు చేయించాడు’’ అనునది సాధ్యమే అయితే, ఈ జగత్తు యొక్క ఉనికి సాధ్యము. |
||
రజ్జుసర్పేణ దష్టశ్చేన్నరో భవతు సంసృతిః . జాతరూపేణ బాణేన జ్వాలాగ్నౌ నాశితే జగత్ .. 77.. |
|||
77 రజ్జు సర్పేణ దష్టశ్చేత్ నరో భవతు సంసృతిః। జాతరూపేన బాణేన జ్వాలాగ్నౌ నాశితే జగత్। |
‘ఒక తెలివి గలవాడు త్రోవలో పోతూ పోతూ ఒకత్రాడును చూచి పాము- అని భ్రమించాడు. అంతే. ఆ పాము కాస్తా ఆతనిని కరచింది. లబోదిబో మంటున్నాడు’’ - ఇది ఇట్లా అని ఒప్పుకుంటే, సంసారము అనునది కూడా ఉన్నట్లు ఒప్పుకోవచ్చు. ‘‘ఒకచోట ఒక ఇల్లు తగులబడుతోంది. ఒకానొకడు తన మనస్సుతో బాణము సంధించి వదిలాడు. అగ్ని ఆరి, మరల ఇల్లు యథాతథంగా కనబడుతోంది’’. ఇది నిజమా? నిజమైతే జగత్తూండినట్లు. లేదా, లేనట్లు! |
||
వింధ్యాటవ్యాం పాయసాన్నమస్తి చేజ్జగదుద్భవః . రంభాస్తంభేన కాష్ఠేన పాకసిద్ధౌ జగద్భవేత్ .. 78.. |
|||
78 వింధ్యాటవ్యాం పాయససాన్నమ్ అస్తిచేత్ జగత్ ఉద్భవః। రంభా స్తంభేన కాష్ఠేన పాకే సిద్ధే జగత్ భవేత్। |
‘‘వింధ్య పర్వతముపై గల అడవిలో ఒకచోట పాయసము (పాలు- సగ్గుబియ్యముతో చేసే తీపి వంటకము) తో నిండియున్న తటాకము జనించింది. పాయసము తెచ్చుకొందాము రండి!’’ .. అనేది నిజమైతే, ఈ జగత్తు జనించటం నిజమే! ‘‘అరటి బోదె (అరటి కాండము)ను వంట చెరకుగా ఉపయోగించి ఆయన వంట చేస్తూన్నాడు.. మనం పోయి తినివద్దాం రండి’’ → అనే మాట నిజంగా సిద్ధిస్తే.. ఈ జగత్తు సిద్ధించినట్లు! |
||
సద్యః కుమారికరూపైః పాకే సిద్ధే జగద్భవేత్ . చిత్రస్థదీపైస్తమసో నాశశ్చేదస్త్విదం జగత్ .. 79.. |
|||
79 సద్యః కుమారికా రూపైః పాకే సిద్ధే జగత్ భవేత్। చిత్ర స్థ దీపైః తమసో నాశశ్చేత్ అస్తి ఇదం (అస్త్విదం) జగత్।। |
‘‘ఒకావిడ ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితం ఒక కుమార్తెను కన్నది. అప్పుడే పుట్టిన ఆ పాపాయి కుమారి అయి, వంట ఇంటిలో దండిగా వంటలు చేస్తోంది! అన్నీ సిద్ధం అవుచున్నాయి. పోయి తిందాము రండి!’’ - ఇది నిజమైతే జగత్తు నిజమే! ‘‘ఒకాయన చిత్తు కాగితంపై ఒక దీపపు బొమ్మను కలముతో చిత్రలేఖనం చేశాడు. అది చీకటిని పొగొడుతోంది’’ - ఇది నిజమా? జగత్తు అంతే! |
||
మాసాత్పూర్వం మృతో మర్త్యో హ్యాగతశ్చేజ్జగద్భవేత్ . తక్రం క్షీరస్వరూపం చేత్క్వచిన్నిత్యం జగద్భవేత్ .. 80.. |
|||
80 మాసాత్ పూర్వం మృతో మర్త్యో హి ఆగతశ్చేత్ భవేత్ జగత్।। తక్రం క్షీరస్వరూపం చేత్ క్వచిత్ నిత్యం జగత్ భవేత్।। |
‘‘ఈ ఊరిలో ఒకాయన నెలరోజుల క్రితం చనిపోయాడు. ఆయన మనందరినీ పలకరించటానికి ఇప్పుడు వచ్చాడట. పదండి, కాసేపు ఆతనితో మాట్లాడి వద్దాం’’.. అనేది వాస్తవమా? జగత్తు అంతే వాస్తవం! ‘‘ఒక గొప్పావిడ! పెరుగును మజ్జిగగా చిలికింది. అవన్నీ పాలుగా అయ్యాయి!’’ ఇది నిజంగా జరిగితే ఈ జగత్తు అనునిత్యమై ఉండగలదు |
||
గోస్తనాదుద్భవం క్షీరం పునరారోపణే జగత్ . భూరజోఽబ్ధౌ సముత్పన్నే జగద్భవతు సర్వదా .. 81.. |
|||
81 గో స్తనాత్ ఉద్భవం క్షీరం పునః ఆరోపణే జగత్। భూరజో అబ్ధౌ సముత్పన్నం జగత్ భవతు సర్వదా।। |
‘‘ఒకాయన ఆవు పొదుగుల నుండి చెంబు నిండా పాలు పిండాడట. ఇక పాలు ఇంటికి తీసుకుపోదామని అనుకుంటూ ఉండగా, ఆ పాలన్నీ పైకి లేచి తిరిగి ఆవు పొదుగులోకి పోయాయి’’.. అనునది ఆరోపించగలిగితే ఈ జగత్తు ఉన్నదని ఆరోపించవచ్చునేమో! ‘‘ఒకాయన ఒక మట్టి గడ్డను రెండు చేతులతో పొడిచేశాడు. ఆతడు చూస్తూ ఉండగానే, ఆ మట్టి పొడిలోని ఒక రజను నుండి గొప్ప మహా సముద్రం పుట్టి ఊరిని ముంచి వేసింది’’ అనునది జరిగితే, ఈ జగత్తు ఎల్లప్పుడూ ఉన్నట్లు! లేదా, స్వతఃగా లేనట్లు! |
||
కూర్మరోమ్ణా గజే బద్ధే జగదస్తు మదోత్కటే . నాలస్థతంతునా మేరుశ్చాలితశ్చేజ్జగద్భవేత్ .. 82.. |
|||
82 కూర్మరోమాణా గజే బద్ధే జగదస్తు మదోత్కటే। నాళస్థ తంతునా మేరుః చాలితశ్చేత్ జగత్ భవేత్।। |
‘‘ఒక తాబేలు నెమ్మదిగా కదులుతూ వెళ్తోంది. ఈలోగా ఏం జరిగిందీ! ఒక మదించిన ఏనుగు ఉరకలు వేస్తూ వస్తోంది! తాబేలుకు భలే కోపం వచ్చింది. ‘‘అరె"! నాకు ఎదురుగా నువ్వు వస్తావా?’’ అంటూ ఆ తాబేలు తన వెంట్రుకలతో ఆ పెద్ద మదించిన మదపుటేనుగును కట్టిపడేసింది’’.. ఇది సత్యమే అయితే జగత్తు సత్యమే! ‘‘ఒక పెద్దాయన తామరతూడులోని సన్నని దారములను భుజముపై తగిలించుకొని వెళ్లి మేరుపర్వతాన్ని ఆ దారములతో కట్టి అటూ ఇటూ ఊపుతున్నాడు రండి! చూద్దాము’’ → ఇది నిజమనుకుంటే జగత్తు ఉన్నట్లు అనుకోవచ్చు. |
||
తరంగమాలయా సింధుర్బద్ధశ్చేదస్త్విదం జగత్ . అగ్నేరధశ్చేజ్జ్వలనం జగద్భవతు సర్వదా .. 83.. |
|||
83 తరంగ మాలయా సింధుః బద్ధశ్చేత్ అస్తి ఇదం జగత్। అగ్నేః అధశ్చేత్ జ్వలనం జగత్ భవతు సర్వదా।। |
‘‘ఇంకొక మహానుభావుడు సముద్రంలోని తరంగాలను ఒక మాలగా చుట్టి ఆ సముద్రాన్నే కట్టివేశాడు’’ - అంటే, మనం ఒప్పుకుంటే, అప్పుడు జగత్తు ఉన్నట్లు ఒప్పుకోవచ్చు. అగ్నిజ్వాలలు పైకికాకుండా క్రిందికి జ్వలిస్తూ ఉంటే, జగత్తు సర్వదా ఉన్నట్లు. |
||
జ్వాలావహ్నిః శీతలశ్చేదస్తిరూపమిదం జగత్ . జ్వాలాగ్నిమండలే పద్మవృద్ధిశ్చేజ్జగదస్త్విదం .. 84.. |
|||
84 జ్వాలావహ్నిః శీతళశ్చేత్ అస్తి రూపం ఇదం జగత్। జ్వాలాగ్నిమండలే పద్మవృద్ధిశ్చేత్ జగత్ అస్తి ఇదమ్।। |
‘‘అగ్ని జ్వాలలు ఎంత చల్లగా ఉన్నాయో’’ అనునది నిజమైతే, ఈ జగత్తుకు రూపము ఉన్నట్లు! లేదా, జగత్తు లేదు. ఒక రూపమూ లేదు! ‘‘ఒక చోట గొప్ప అగ్నిజ్వాలలతో మండలముగా (Zone circle)గా మండుతోంది. అందులోంచి ఒక పద్మము పుట్టి ఇప్పుడిప్పుడే వికసిస్తోంది’’.. అట్లా జరిగితే, అప్పుడీ జగత్తు - ఉన్నట్లు! |
||
మహచ్ఛైలేంద్రనీలం వా సంభవచ్చేదిదం జగత్ . మేరురాగత్య పద్మాక్షే స్థితశ్చేదస్త్విదం జగత్ .. 85.. |
|||
85 మహత్‌శైల ఇంద్రనీలం వా, సంభవశ్చేత్ ఇదం జగత్।। మేరుః ఆగత్య పద్మాక్షే (పద్మకుక్షే) స్థిత శ్చేత్, అస్తి ఇదం జగత్। |
‘‘ఒక చోట ఒకాయన చెరువు నుండి నీళ్లు తెచ్చి ఒక కడవ (Pot) లో పోశాడు. అప్పుడు ఆ కడవలోంచి ఒక పెద్ద ఇంద్రనీలపర్వతము పుట్టు కొచ్చింది’’ ఇది నిజమా? నిజమైతే ఈ జగత్తు అనబడేది సంభవించినట్లు. ‘‘ఒకరోజు ఏమైందో తెలుసా? మేరుపర్వతం మొత్తంగా కదలి వస్తూ ఉన్నది. త్రోవలో ఒక తటాకము ఉన్నది. ఆ తటాకములో ఒక పద్మము ఉన్నది. మేరు పర్వతము ఆ పద్మములో దూరి, ఒదిగి ఉన్నది’’ - ఇది సాధ్యం అయితే, ఈ జగత్తు ఉండి ఉండటం సాధ్యం! |
||
నిగిరేచ్చేద్భృంగసూనుర్మేరుం చలవదస్త్విదం . మశకేన హతే సింహే జగత్సత్యం తదాస్తు తే .. 86.. |
|||
86 నిగిరేచ్చేత్ భృంగ సూనుః మేరుః చలవత్, అస్తి ఇదమ్।। మశకేన హతే సింహే జగత్ సత్యం తదా స్తుతే।। |
- తుమ్మెద ‘ఘుం’కారమే చేయదు. - మేరు పర్వతము కదలి, ఎగిరిగంతులు వేస్తోంది. - ఒక దోమ సింహమును చంపిండి. ఈ జగత్తు ఉండి ఉండటము అనేది, అటువంటి నిజము మాత్రమే! పైవి జరిగితేనే జగత్తు సత్యమైనదైనట్లు! |
||
అణుకోటరవిస్తీర్ణే త్రైలోక్యం చేజ్జగద్భవేత్ . తృణానలశ్చ నిత్యశ్చేత్క్షణికం తజ్జగద్భవేత్ .. 87.. |
|||
87 అణుకోటర విస్తీర్ణే త్రైలోక్యం చేత్ జగత్ భవేత్। తృణా అనలశ్చ నిత్యశ్చేత్ క్షణికం తత్ జగత్ భవేత్।। |
‘‘ఒక గోడకు అతి చిన్నదైన, అణువంత పరిమాణము గల రంధ్రమున్నది. అటువంటి అణుప్రమాణమైన స్థలంలో ఈ భూమి, గ్రహాలు, నక్షత్ర మండలాలు, దివ్యలోకాలు, పాతాళలోకాలు మొదలైన వాటితో కూడిన త్రిలోకాలు - ఎందుకో మరి, ఇరుక్కున్నాయి’’.. ఇది అవుననుకుంటే, ఈ జగత్తు ఉన్నది అవగలదు. ‘‘ఒక గడ్డి పరకను అగ్ని అంటుకున్నది. అది 100 సంవత్సరములుగా కాలుతూనే ఉన్నది’’…. నిజంగా జరిగితే, ఈ జగత్తు ఒక్క క్షణమైనా ఉన్నది అవగలదు. |
||
స్వప్నదృష్టం చ యద్వస్తు జాగరే చేజ్జగద్భవః . నదీవేగో నిశ్చలశ్చేత్కేనాపీదం భవేజ్జగత్ .. 88.. |
|||
88 సప్న దృష్టం చ యత్ వస్తు జాగరేచేత్ జగత్ భవః। నదీ వేగో నిశ్చలశ్చేత్ కేనాపి ఇదం జగత్ భవేత్। |
‘‘కలలో ఒక రెండు అంతస్థుల మేడ కట్టించాను. ఇదిగో, ఇప్పుడు ఈ జాగ్రత్తులో ఆ మేడకు రంగులు వేయువారిని పిలిపించి మంచి మంచి రంగులు వేయిస్తున్నాను’’.. అనునది అట్లాగే అయి ఉంటే, ఎట్లాగో ఈ జగత్తు నిజంగానే ఉన్నట్లు లెక్క! ‘‘వేగంగా ప్రవహించే నదీ జలము, ఒక్కసారి నిశ్చలం పొందిదీ.’’ - అన్నది.. అన్నట్లే అయితే ఏదో విధంగా జగత్తు ఉన్నదే అవుతుంది. |
||
క్షుధితస్యాగ్నిర్భోజ్యశ్చేన్నిమిషం కల్పితం భవేత్ . జాత్యంధై రత్నవిషయః సుజ్ఞాతశ్చేజ్జగత్సదా .. 89.. |
|||
89 క్షుధి తస్య అగ్నిః భోజ్యశ్చేత్ నిమిషం కల్పితం భవేత్। జాత్యంధై రత్న విషయః సుజ్ఞానశ్చేత్, జగత్ సదా।। |
‘‘ఒకనికి ఆకలివేసింది.. వెంటనే అగ్నిశిఖలను నమిలి మ్రింగాడు. ఆకలి తీరింది’’ - ఇది నిజమైతే ఒక నిమిషమైనా ఈ జగత్తు ఉన్నట్లు ఒప్పుకోవచ్చేమో! ఒక పుట్టు గ్రుడ్డివాడు ఉన్నాడు. ఆతడు అంతదూరం నుండే ‘‘ఇవి రాళ్ళు-ఇవి రత్నాలు- ఇవి ఈ జాతి రత్నాలు’’- అని చెప్పగలిగితే ఈ జగత్తు ఉన్నదనవచ్చు. |
||
నపుంసకకుమారస్య స్త్రీసుఖం చేద్భవజ్జగత్ . నిర్మితః శశశృంగేణ రథశ్చేజ్జగదస్తి తత్ .. 90.. |
|||
90 నపుంసక కుమారస్య స్త్రీ సుఖం చేత్ భవేత్ జగత్। నిర్మితః శశ శృంగేణ రథశ్చేత్ జగత్ అస్తి తత్।। |
‘‘నపుంసకుని కుమారునికి స్త్రీ సుఖము తెలుసు, పొందుచున్నాడు’’.. అని ఎవ్వరైనా అంటే.. ఈ జగత్తు ఉన్నదనవచ్చు. ‘‘ఒక గొప్ప కమ్మరి కుందేటి కొమ్ములు ఏరుకొని వచ్చి వాటితో రథమును నిర్మిస్తున్నాడు. ఆ రథంలో మనము త్వరలో ఊరేగుదాం’’ అన్నది నిజమే అయితే, జగత్తు ఉన్నట్లు. |
||
సద్యోజాతా తు యా కన్యా భోగయోగ్యా భవేజ్జగత్ . వంధ్యా గర్భాప్తతత్సౌఖ్యం జ్ఞాతా చేదస్త్విదం జగత్ .. 91.. |
|||
91 సద్యో జాతాతు యా కన్యా భోగ యోగ్యా భవేత్ జగత్।। వంధ్యాగర్భ ఆప్తితః సౌఖ్యం జ్ఞాతం చేత్ అస్తి ఇదమ్ జగత్।। |
‘‘ఇప్పుడే ఒక కన్య పుట్టింది. ఆమె ఇప్పుడే భోగించుటకు యోగ్యురాలు అయింది’’ - అన్నది అంతే అయితే, అప్పుడు జగత్తు ఉన్నదని చెప్పవచ్చు. ‘‘వంధ్యాపుత్రుని (గొడ్రాలి కుమారుని) వలన సుఖము తెలియవచ్చు చున్నది - అని అనగలిగితే ‘జగత్తు’ అనబడేది నిజంగా ఉన్నట్లు. |
||
కాకో వా హంసవద్గచ్ఛేజ్జగద్భవతు నిశ్చలం . మహాఖరో వా సింహేన యుధ్యతే చేజ్జగత్స్థితిః .. 92.. |
|||
92 కాకోవా హంసవత్ గచ్ఛేత్ జగత్ భవతు నిశ్చలమ్।। మహాఖరో వా సింహేన యుధ్యతే చేత్ జగత్ స్థితిః।। |
‘‘ఒక కాకి-హంసవలె నడవటము, నీటిలో ఈత కొట్టటము, ఎగరటము చేస్తోంది’’ అనునది సంభవిస్తే.. అప్పుడు జగత్తు నిశ్చలంగా ఉన్నదను కోవచ్చు. ‘‘ఒక గొప్పగాడిద సింహముతో యుద్ధము చేసింది. సింహము ఓడిపోయింది’’.. అనునదే యదార్థము అయితే, ఈ జగత్తు స్థితి కలిగినదై ఉన్నదనవచ్చు. |
||
మహాఖరో గజగతిం గతశ్చేజ్జగదస్తు తత్ . సంపూర్ణచంద్రసూర్యశ్చేజ్జగద్భాతు స్వయం జడం .. 93.. |
|||
93 మహాఖరో గజగతిం గతశ్చేత్ జగదస్తు తత్। సంపూర్ణ చంద్రః సూర్యశ్చేత్ జగత్ భాతు స్వయం జడమ్।। |
‘‘ఒక గాడిద గజపతి (ఏనుగుల నాయక ఏనుగు)తో సమానంగా హుందాగా నడుస్తూ ఉన్నది’’ అని అనగలిగితే (గాడిద నడకలో గజపతి యొక్క హుందాతనం ఉన్నది - అంటే) అప్పుడు.. ఈ జగత్తు ఉన్నదని భావించవచ్చు. ‘‘ఈ రోజు పౌర్ణమి కదా! ఆకాశంలో పూర్ణచంద్రుడు ఆహ్లాదంగా వెలుగుచున్నాడు. అర్ధరాత్రి అయింది. బయటకు వచ్చి నేను వచ్చి, పూర్ణచంద్రుని చూస్తూ ఉన్నాను. ఇంతలో ఆపూర్ణచంద్రుడు ఒక్కసారిగా మధ్యాహ్న సూర్యుడై తీవ్రమైన ఉష్ణకాంతులు - ఉష్ణకిరణాలు ప్రసరింపజేయసాగాడు. ఆ వేడికి తట్టుకోలేక, ఏం చేయాలో తెలియక నీ దగ్గరకు వచ్చానయ్యా! - అని అంటే ఆతని మాటలు నమ్ముతామా? ‘‘ఈ జడ జగత్తు స్వయముగా నా పట్ల వాస్తవరూపమై భాసిస్తోంది’’.. అనునది అటువంటి వార్త. |
||
చంద్రసూర్యాదికౌ త్యక్త్వా రాహుశ్చేద్దృశ్యతే జగత్ . భృష్టబీజసముత్పన్నవృద్ధిశ్చేజ్జగదస్తు సత్ .. 94.. |
|||
94 చంద్ర సూర్యాదికౌ త్యక్త్వా రాహుశ్చేత్ దృశ్యతే జగత్। భ్రష్ట బీజ సముత్పన్న వృద్ధిశ్చేత్ జగత్ అస్తు తత్।। |
చంద్ర-సూర్యులు కనబడకుండా రాహువు మాత్రం కనబడటం జరిగితే జగత్ - దృశ్యము, దాని వలన బంధము ఉండినట్లు. పూర్తిగా కుళ్లిపోయిన ఒక బీజము తిరిగి అంకురించి, పెద్దవృక్షము బయల్వెడలటము నిజమైతే, జగత్తు- జగత్ బంధము నిజము. |
||
దరిద్రో ధనికానాం చ సుఖం భుంక్తే తదా జగత్ . శునా వీర్యేణ సింహస్తు జితో యది జగత్తదా .. 95.. |
|||
95 దరిద్రో ధనికానాం చ సుఖం జానాతిచేత్ జగత్। శునా వీర్యేణ సింహస్తు జితో యది, జగత్ తదా।। |
‘‘ఒక దరిద్రుడు ఉన్నాడు. ఆతని దగ్గర అంతులేని ధనము ఉన్నది. ఆ ధనంతో సుఖంగా ఉన్నాడు తెలుసా?’’- అన్నది అర్ధ సహితమైన వాక్యమైతే, జగత్తు ఉండినట్లు. ‘‘కుక్క భౌభౌ అంటూ ఉంటే సింహము భయపడి గజగజ వణుకుతోంది’’ .. అనునది నిజమైతే ఈ దృశ్య జగత్తు ఉండి తీరుచున్నట్లు. |
||
జ్ఞానినో హృదయం మూఢైర్జ్ఞాతం చేత్కల్పనం తదా . శ్వానేన సాగరే పీతే నిఃశేషేణ మనో భవేత్ .. 96.. |
|||
96 జ్ఞానినో హృదయా మూఢైః, జ్ఞాతం చేత్ కల్పనం తదా శ్వానేన సాగరే పీతే, నిశ్శేషేణ, → మనో భవేత్।। |
‘‘ఆత్మజ్ఞాని యొక్క జగత్‌దర్శన - స్వస్వరూపానందము’’ మూర్ఖుడగు అజ్ఞానికి అర్థం అయితే, ఒక కుక్కపిల్ల సముద్ర జలమంతా తాగగలిగితే, అప్పుడు ‘మనస్సు’ అనబడేది నిజంగా ఉన్నట్లు! |
||
శుద్ధాకాశో మనుష్యేషు పతితశ్చేత్తదా జగత్ . భూమౌ వా పతితం వ్యోమ వ్యోమపుష్పం సుగంధకం .. 97.. శుద్ధాకాశే వనే జాతే చలితే తు తదా జగత్ . కేవలే దర్పణే నాస్తి ప్రతిబింబం తదా జగత్ .. 98.. |
|||
97 శుద్ధాకాశో మనుష్యేషు పతితశ్చేత్ తదా జగత్। భూమౌ వా పతితం వ్యోమ వ్యోమ పుష్పం సుగంధకమ్, 98 శుద్ధాకాశే వనే జాతే చలితే తు తదా జగత్। కేవలే దర్పణే నాస్తి, ప్రతిబింబం తదా జగత్।। |
‘‘శుద్ధమగు ఆకాశము ఎక్కడి నుండో వచ్చి ఒక మనుష్యునిపై పడిందట తెలుసా’’ అని చెప్పే మాట ఎట్టిదో, ఈ జగత్తు ఉన్నది - అని అనటం అటువంటిది. -‘‘ఆకాశం భూమిపై రాలిపడింది’’ అనటము.., -‘‘ఆకాశంలో ఒక పుష్పము పుట్టింది. అది ఎంత సువాసనయో’’.. అని ఆకాశపుష్పం గురించి కవి వర్ణించటము, - శుద్ధాకాశములో పుష్పవనము పుట్టి, ఆకాశంలో సంచారాలు చేస్తోంది.. అని చెప్పుకోవటము.. ఇవన్నీ ఎటువంటివో.. ‘‘ ఈ జగత్తు ఉన్నది. నాకు బంధనమగుచున్నది. దీని నుండి విముక్తి ఎక్కడ?’’ అని అనటం అటువంటిది. దర్పణం లేకుండానే ఎదురుగా ముఖం కనబడితే, ‘‘దర్పణం (Mirror)లో నా ముఖము కనిపిస్తోంది. కనుక నా ముఖము దర్పణములో ఉన్నది’’ - అని అనగలిగితే, - అట్లాగే ఈ జగత్తు బాహ్యము లోనో-లోపలనో ఉన్నదని అనవచ్చు. |
||
అజకుక్షౌ జగన్నాస్తి హ్యాత్మకుక్షౌ జగన్నహి . సర్వథా భేదకలనం ద్వైతాద్వైతం న విద్యతే .. 99.. |
|||
99 అజకుక్షౌ జగత్ నాస్తి హి, ఆత్మకుక్షౌ జగత్ నహి। సర్వదా భేద కలనం, ద్వైతాద్వైతం న విద్యతే।। |
ఒక మేకపొట్టలో ఈ జగత్తు ఉన్నదా? లేదు. అట్లాగే నా పొట్టలో గాని, నాలోగాని → ఈ అనేక భేదముల సంకల్పము, ద్వైత-అద్వైత వ్యవహారములతో కూడినది → అగు ఈ జగత్తులేదు. ఆత్మయందు జగత్తు లేదు. | ||
మాయాకార్యమిదం భేదమస్తి చేద్బ్రహ్మభావనం . దేహోఽహమితి దుఃఖం చేద్బ్రహ్మాహమితి నిశ్చయః .. 100.. |
|||
100 మాయాకార్యం ఇదం భేదమ్ అస్తి చేత్→ బ్రహ్మ భావనమ్। దేహోఽహమ్ ఇతి దుఃఖం చేత్ ‘బ్రహ్మాహమ్’ - ఇతి నిశ్చయః।। |
ఇక్కడి జగత్తు అనేక భేదములతో స్వకీయ కల్ప లేక ‘మాయ’ చేత ఒకవేళ ఉన్నదని ఎవ్వరైనా అంటే, అప్పుడు ‘‘ఇదంతా బ్రహ్మము యొక్క భావనా చమత్కారమే’’ అని అనక తప్పదు. మాయాజగత్తు ఉన్నది. ఈ దేహముచే నేను పరిమితుడను. ఈ దేహమే నేను’’.. అను-భ్రమాత్మకమైన మూర్ఖత్వమే అన్ని అరిష్టములకు, దుఃఖములకు మూలము- అని గమనించబడుగాక! ‘‘బ్రహ్మమే నేను-నేను బ్రహ్మమునే’’ అని సునిశ్చితము చేసుకొనబడుగాక! |
||
హృదయగ్రంథిరస్తిత్వే ఛిద్యతే బ్రహ్మచక్రకం . సంశయే సమనుప్రాప్తే బ్రహ్మనిశ్చయమాశ్రయేత్ .. 101.. |
|||
101 హృదయ గ్రంథిః అస్తిత్వే ఛేదనే బ్రహ్మచక్రకం సగ్ంశయే సమను ప్రాప్తే బ్రహ్మ నిశ్చయమ్ ఆశ్రయేత్। |
హృదయగ్రంథి అనగా (1) బ్రహ్మగ్రంథి= ఈ జగత్తు సృష్టించబడింది; (2) విష్ణు గ్రంథి = ఈ జగత్తు పరిపోషించబడుతోంది. (3) రుద్రగ్రంథి = ఇది లయిస్తోంది. ‘‘నేను ఎల్లప్పుడూ కూడా కేవలము నిత్యానందమయము అయి ఉన్నాను కదా’’ అనునదే సత్యాశ్రయము. ఈ జగత్తు ఎప్పుడైనా ఉన్నది - అని నీకు అనిపిస్తే.. బ్రహ్మమునే నేను - అనే విష్ణు చక్రముతో ఖండించివేయాలి ‘‘ఈ జగత్తు ఉన్నది కదా! లేదంటారేం?’’ అనే సంశయము కొనసాగటం జరుగుతూ ఉంటే, ఇకప్పుడు ‘ఇదంతా బ్రహ్మమే’- అను బ్రహ్మనిశ్చయము మరల మరల ఆశ్రయించటమే జగత్ - దుఃఖమునకు ఉపాయము. |
||
అనాత్మరూపచోరశ్చేదాత్మరత్నస్య రక్షణం . నిత్యానందమయం బ్రహ్మ కేవలం సర్వదా స్వయం .. 102.. |
|||
102 అనాత్మరూప చోరశ్చేత్, ఆత్మరత్నస్య రక్షణమ్। నిత్యానందమయం బ్రహ్మ, కేవలగ్ం సర్వదా స్వయమ్।। |
హృదయగృహములో అనాత్మరూపమైన (ఆత్మకు నేను వేరు-నీవు వేరు- దైవము వేరు అనురూపమైన) దొంగ ప్రవేశిస్తూ ఉంటే ‘‘బ్రహ్మసత్యమ్- జగత్ మిథ్య’’.. అను బ్రహ్మవిద్యచే ‘ఆత్మ’ అను రత్నమును రక్షించుకోవాలి. |
||
ఏవమాదిసుదృష్టాంతైః సాధితం బ్రహ్మమాత్రకం . బ్రహ్మైవ సర్వభవనం భువనం నామ సంత్యజ .. 103.. |
|||
103 ఏవం ఆది సుదృష్టాంతైః సాధితం బ్రహ్మమాత్రకమ్। బ్రహ్మైవ సర్వ భు (భ)భవనం భువనం నామ సంత్యజ।। |
‘‘బ్రహ్మమునే అయి ఉన్నాను’’ అను సిద్ధాంతమును చెప్పుచున్న బ్రహ్మవేత్తల దృష్టాంతములను, ప్రవచనములను, సంబోధనములను విచారణ చేసి, ‘‘సర్వము బ్రహ్మమే! కనుక నేను బ్రహ్మమునే!’’ అను అవగాహనను సునిశ్చితమును ఆరూఢము చేసుకోవాలి! ఓ నిదాఘా! ‘‘ఈ లోకమంతా బ్రహ్మమే అయి ఉన్నదికదా’’ అను అనుక్షణికమైన భావనచే (భావన చేస్తూ) ‘లోకము’ అనే శబ్దమే వదలివేయవయ్యా! |
||
అహం బ్రహ్మేతి నిశ్చిత్య అహంభావం పరిత్యజ . సర్వమేవ లయం యాతి సుప్తహస్తస్థపుష్పవత్ .. 104.. |
|||
104 ‘అహం బ్రహ్మేతి’ నిశ్చిత్య అహం భావం పరిత్యజ। సర్వమేవ లయం యాతి సుప్త హస్తస్థ పుష్పవత్।। |
‘‘ఈ సర్వము బ్రహ్మమే! నేను బ్రహ్మమును! కనుక నేనే ఇదంతా’’ అనబడు ‘అహమ్ బ్రహ్మభావన’ సహాయముతో వ్యష్టి అభిమానముతో కూడిన ‘అహమ్‌భావము’ను పరిత్యజించివేయి. దేహాహమ్ భావనను దాటివేసి ఆత్మాహమ్ భావనను సునిశ్చయపరచుకో. ఎప్పుడైతే ‘‘బ్రహ్మాహమ్’’ భావనను సదా మననము చేస్తూ ఉంటావో,.. అప్పుడు → సర్వ జగత్ భావావేశాలు తమకు తామే లయిస్తాయి. ఒకడు గుప్పెట్లో పువ్వు పెట్టుకొని పరుండగా, నిద్రపట్టగానే, - మూసిన గుప్పెట తెరుచుకొని పుష్పము చేయిజారు రీతిగా దేహాహమ్ - వ్యష్టి అహమ్- జాత్యహమ్.. మొదలైనన్నీ జారిపోతాయి. |
||
న దేహో న చ కర్మాణి సర్వం బ్రహ్మైవ కేవలం . న భూతం న చ కార్యం చ న చావస్థాచతుష్టయం .. 105.. |
|||
105 న దేహో న చ కర్మాణి సర్వం బ్రహ్మైవ కేవలమ్। న భూతం న చ కార్యం చ న చ అవస్థా చతుష్టయమ్।। |
‘బ్రహ్మాహమ్’ భావన చిగురిస్తూ, ఫలించుచుండగా.., → ఇక ఈ దేహము ఉండదు. మరొక దేహము ఉండదు. దేహత్వమే మటుమాయమౌతుంది. → అటుపై సంచిత - ఆగామి - ప్రారబ్ద కర్మ విశేషములన్నీ ‘‘లేనివి’’గా అగుచున్నాయి. సర్వము కేవలము బ్రహ్మమే అయి ఉండగా.. అవన్నీ అవిషయాలౌతాయి. ‘‘పంచభూతములు, వాటి వాటి కార్యములు, జాగ్రత్-స్వప్న-సుషుప్తి- తురీయములనబడే అవస్థాచతుష్టయము కూడా లేనివే అగుచున్నాయి. |
||
లక్షణాత్రయవిజ్ఞానం సర్వం బ్రహ్మైవ కేవలం . సర్వవ్యాపారముత్సృజ్య హ్యహం బ్రహ్మేతి భావయ .. 106.. |
|||
106 లక్షణా త్రయ విజ్ఞానగ్ం సర్వం బ్రహ్మైవ కేవలమ్। సర్వ వ్యాపారమ్ ఉత్సృజ్య ‘అహమ్ బ్రహ్మేతి భావయ।। |
సత్వ-రజో-తమో లక్షణ త్రయమంతా కూడా - వాటి వాటి విజ్ఞాన విశేషాలతో సహా - సర్వము కేవలము బ్రహ్మమే. కనుక, సర్వ ఇంద్రియ వ్యాపారములు, తత్ సాధనలు వదలివేసి ‘‘నేనే బ్రహ్మమును’’.. అను ఆత్యంతికమగు భావనను నిర్వర్తిస్తూ ఉండండి. పరమోద్దేశ్యమును వదలకయే ఉండండి. | ||
అహం బ్రహ్మ న సందేహో హ్యహం బ్రహ్మ చిదాత్మకం . సచ్చిదానందమాత్రోఽహమితి నిశ్చిత్య తత్త్యజ .. 107.. |
|||
107 అహం బ్రహ్మ, న సందేహో హి। అహం బ్రహ్మ చిదాత్మకమ్। సచ్చిదానంద మాత్రోఽహమ్ ఇతి నిశ్చిత్య తత్ త్యజ।। |
ఓ తత్త్వ స్వరూపా! ‘‘నేనే బ్రహ్మమును! సందేహమే లేదు! చిదాత్మకుడను। పరబ్రహ్మమును। కేవల సత్-చిత్ - ఆనందమాత్రుడను!’’ → ఇట్టి నిశ్చయముతో తత్త్వజ్ఞానివై ఉండు. క్రమంగా అట్టి నిశ్చయము చేయు ప్రయత్నమును కూడా త్యజించి, అదియే స్వభావసిద్ధంగా నీవై ఉండుము. |
||
శాంకరీయం మహాశాస్త్రం న దేయం యస్య కస్యచిత్ . నాస్తికాయ కృతఘ్నాయ దుర్వృత్తాయ దురాత్మనే .. 108.. |
|||
108 శాంకరం తు మహాస్త్రం న దేయం యస్య కస్య చిత్। నాస్తి కాయ కృతఘ్నాయ దుర్వృత్తాయ దురాత్మనే।। |
‘‘శ్రీ శాంకరము’’ అని పిలువబడు ఈ తేజోబిందూపనిషత్ మహా శాస్త్రమును (విరాగిత్వము, వినమ్రత్వము, గురుభక్తి, మహదాశయము)ల అర్హత చూచి మాత్రమే బోధించాలి. శ్రోత యొక్క వైరాగ్య పూర్వక - ఉత్తమోత్తమ సత్య ఆశయము లేకుంటే బోధించకూడదు. నాస్తికుడు, కృతఘ్నుడు, దుష్టవృత్తి ప్రవృత్తులు కలవాడు, దురాత్ముడు అగువాడు ఇందలి పరమ సత్యమును విశదీకరించి బోధించటానికి అర్హుడు కాడని విజ్ఞులచే నిర్ణయించబడుచున్నది. |
||
గురుభక్తివిశుద్ధాంతఃకరణాయ మహాత్మనే . సమ్యక్పరీక్ష్య దాతవ్యం మాసం షాణ్మాసవత్సరం .. 109.. |
|||
109 గురుభక్తి విశుద్ధాంతఃకరణాయ మహాత్మనే, సమ్యక్ పరీక్ష్య దాతవ్యం మాసగ్ం - షణ్మాస -వత్సరమ్।। |
గురుభక్తి, విశుద్ధాంతః కరణము కలవాడు, మహదాశయము కలవాడు, విశ్వప్రేమ-సహనశీలత-ఉత్తమశీలము మొదలైన మహాత్ముల లక్షణములు కలవానికి తప్పక బోధించాలి. అయితే ఒక నెలయో, 3 నెలలో, 6 నెలలో, సంవత్సరమో ఆతనిని పరీక్షించి, ఆతని సాధన సంపత్తిని అనుసరించి ఇది బోధించటము సముచితము. |
||
సర్వోపనిషదభ్యాసం దూరతస్త్యజ్య సాదరం . తేజోబిందూపనిషదమభ్యసేత్సర్వదా ముదా .. 110.. |
|||
110 సర్వోపనిషత్ అభ్యాసం దూరతః త్యజ్య సాదరమ్ ‘‘తేజోబిందూపనిషత్’’ అభ్యసేత్ సర్వదా ముదా।। |
సర్వ ఉపనిషత్ అభ్యాసములను సాదరంగా దూరంగా ఉంచి, ఈ ‘‘తేజోబిందూపనిషత్’’ను ప్రశాంతముగా ఉపాసించటము సర్వదా గొప్ప ఫలము అగుచున్నది. |
||
సకృదభ్యాసమాత్రేణ బ్రహ్మైవ భవతి స్వయం . బ్రహ్మైవ భవతి స్వయమిత్యుపనిషత్ .. |
|||
111 సకృత్ అభ్యాసమాత్రేణ బ్రహ్మైవ భవతి స్వయమ్।। |
ఈ ఉపనిషత్ పరమార్థమున కొద్దిగా అభ్యసించినంత మాత్రము చేతనే ఆ పరిశీలించువాడు స్వయముగా బ్రహ్మమై వెలుగొందుచున్నాడు |
||
ఇతి తేజో బిందూపనిషత్।
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।।
1వ అధ్యాయము : స్వస్వరూప- చిత్‌రసపూర్ణ జగత్
ఇప్పుడిక - ఇహధ్యాసలను అధిగమించగా లభించగలుగు ‘‘పరధ్యాస’’ (లేక) ‘‘పరధ్యానము’’ (లేక) ‘‘పరతత్త్వధ్యానము’’ గురించి ఈ ‘‘తేజోబిందూపనిషత్’’గా మనము చెప్పుకోబోవుచున్నాము.
ఏ ‘భావనాజ్యోతి’’ అయితే - ఈ విశ్వమంతా తన స్వస్వరూపమైయున్న ‘విశ్వాత్మ’ యొక్క హృదయాకాశమున తేజోరూపంగా సంస్థితమై ప్రకాశించుచున్నదో, అదియే ‘పరతత్త్వధ్యానము’నకు ధారణ వస్తువు అయి ఉన్నది. అట్టి ‘తేజో బిందు కేవలీతత్త్వము’ ధ్యానములో సిద్ధించుచూ.. అణు ప్రకాశానందరూపమైయున్నది.
తేజోబిందూ ధ్యానము ‘శాంకర విద్య’, ‘శాంభవీ విద్య’గా.. మునిలోకములో సుప్రసిద్ధము.
ఏదైతే ఈ స్థూలము, సూక్ష్మము తానే అయి ఉండియే, ఆ ఉభయములకు పరము (Beyond and Before).. అయి ఉన్నదో, అద్దాని సందర్శనమే శాంభవీ దర్శనము. హృదయాంతర్గత తేజోబిందువునందు, జగత్ తేజస్సును (బిందువునందు విశ్వమును) దర్శించుటయే అందుకు సదభ్యాసము.
అట్టి ‘‘బిందు పస్య తేజోపాసన’’ →
💐 సర్వ దుఃఖములకు (for all worries) చెలియలికట్ట కనుక దుఃఖాడ్యము.
💐 ఉత్తమ యోగ సాధనచేతనే సందర్శనమగుచున్నది. కాబట్టి దురాఢ్యము.
💐 పవిత్రము, ఆత్మభావనాయుతము అగు దివ్య దృష్టిచే అఖండానుభవరూపముగా ప్రాప్తించటమే శాంకరీ విద్య. అట్టి తేజో బిందుధ్యానము దుష్ప్రేక్షము, దుర్లభమైనది. అయితే ఉపాసనచే సులభమే.
💐 ఈ జీవునికి అట్టి విశ్వ హృదయాంతర్గత తేజోధ్యానము ముక్తిదాయకము. అవ్యయ స్వరూపానుభవప్రసాదము.
💐 బుద్ధి సమన్వితులగు మునీశ్వరులచే అది ‘స్వస్వరూపాత్మ ధ్యానము’గా అభ్యసించబడుచున్నది. అట్టి అభ్యాసముచే (ఈ జగత్తంతా తేజోబిందురూపముగా ఉపాసించుటచే).. ఆ యోగి హంస (సోఽహమ్) - పరమహంస అగుచున్నాడు.
(‘‘తేజోబిందూ ధ్యానము = ఈ జగత్తును స్వస్వరూపాత్మ తేజస్సు యొక్క ఒక బిందురూపంగా.. ధ్యానించటము’’ ).
‘సోఽహంస’ హంసయోగము యొక్క యోగాభ్యాసం - ఎవరికి సులభ సాధ్యము?
💐 నియమిత ఆహారులు. ఇంద్రియ వ్యాపారములపై కట్టడి కలిగియున్నట్టివారు.
💐 క్రోధమును జయించినవారు.1). అవతలవారి తప్పుల గురించిన సమాచారములను, ఊసులను ఏ మాత్రం అంతరంగములోకి రానీయకపోవటం (లేక) హృదయము నుండి పార త్రోలివేసి ఉండటము. (2). ఇదంతా ఆత్మ - ఆరామంగా దర్శిస్తూ ఉండటము. అట్టి యోగాభ్యాసికి ఈ జగత్తు నియమిత (విషయ) ఆహారరూపము- అగుచున్నది.
💐 జిత స్సంగో - తోటి జనులతోను, సందర్భములతోను, సంఘటనలోను, - ‘‘ఇవి నాకు చెందినవి-నేను వీటికి చెందినవాడను’’.. అను సంగము (Attachment) ను జయించినవారు. ఆత్మసంగులై ఉంటున్నవారు.
💐 జితేంద్రియః - ఇంద్రియ విషయములకు తాను వశుడై ఉండక, తాను వాటిని నియమించువాడై - వాటిని తనయొక్క సాక్షిత్వముచే జయించినవారై ఉండువారు. ఇంద్రియ నిగ్రహము కలవారు. (ఇంద్రియములకు దాసులు కాక, ఇవి తమకే దాసులుగా మలచుకొనుచున్నవారు).
💐 నిర్ద్వందో - ద్వంద్వములగు సుఖదుఃఖములను, శీతోష్ణములను, సంపద-ఆపదలను సమదృష్టితో సందర్శించు ఓర్పు-నేర్పు - కూర్పు కలవారు. ఆయా వివిధ సందర్భములలో ఏకత్వమును దర్శించు అభ్యాసము కలవారు,
💐 నిరహంకారో - మమకారముచే రూపుదిద్దుకునే అహంకారమును హృదయంలో ‘రహితము’ చేసుకొనువారు,
💐 నిరాశీ - ‘‘నేను ఇది పొందలేదే ? ఇంకా అది పొందాలే!’’ అను అసంఖ్యాకమగు ఆశాపాశ - దుర్వాసనలలో చిక్కుకొననివారు.
💐 అపరిగ్రహః - పడవనీళ్లలో ఉన్నప్పటికీ, నీళ్లు పడవలోనికి రానివ్వని పడవవానివలె, సర్వాంతర్యామియగు పరమాత్మను ఆహ్వానించవలసిన హృదయగర్భములోనికి ప్రాపంచక విషయములు, సందర్భములు, గుణసామ్యతలను రానివ్వనివారు, (స్పర్శాన్ కృత్యా బహిః బాహ్యన్).. బయట లోకసంబంధమైన (లౌకిక) విషయాలు బయటనే వదలి ఉంచు అభ్యాసము కలవారు.
💐 అగమ్యా గమనకర్తారో.. దృశ్యము నందు మనస్సును నియమించకుండా (పరిమితము చేయక) - అదృశ్యరూపము- దృశ్య ప్రాపంచము దృష్ట్యా అగమ్యము.. అగు ‘‘ఆత్మతత్వము’’ వైపుగా గమన శీలురై ఉండు మననము (మనస్సు) కలవారు.
పారమార్థిక దృష్టిని అధిగమించి పరామర్థి దృష్టిని ఆశ్రయించువారు →
అట్టివారు జాగ్రత్-స్వప్న సుషుప్తులనబడు త్రిస్థానములను తమ యొక్క త్రిముఖములుగా సందర్శిస్తూ ఆనందిస్తున్నారు.
అంతేగాని ‘‘నేను జాగ్రత్‌లోని వాడిని. జాగ్రత్ పరిమితుడను. దేహపరిమితుడను’’.. అను పరిమితత్వము పొందటము లేదు.
అపరిమితానందులై, త్రివిధములకు అతీతులై సంచరిస్తున్నారు. ‘హంస’ (సోఽహమ్ ధ్యానపరులు)గా వారు చెప్పబడుచున్నారు.
పరము-పరమ రహస్యము - పరతమము (Superlative) అగు పరబ్రహ్మము (లేక) పరమాత్మత్వమును పుణికిపుచ్చుకున్నవారై, నిరాధారత్వము సముపార్జించుకొనుచున్నారు.
అట్టి పరమాత్మానుభవము (లేక) పరతత్త్వానుభవము ఎటువంటిది?
💐 నిరాధారుడు / నిరాశ్రయుడు = ‘‘నేను జాగ్రత్ - జాగ్రత్ అంతర్గత విషయాలచే గాని, స్వప్న-స్వప్నాంతర్గత విషయాలచేగాని, సుషుప్తి- సుషుప్తి అంతర్గత విషయాలచేగాని పరిమితుడను కాను, వాటిపై ఆధారపడనట్టి కేవలీ స్వరూపుడను కదా!’’ అను భావన యొక్క ధారణ। జగత్తు చేతగాని, మరి దేనిచేతగాని, తాను ధరింపబడనట్టి జగదతీత - ధ్యానావగాహన।
ఆతడు పూర్ణచంద్రకళారూపుడై, సూక్ష్మస్వరూప-స్వభావుడై, స్థూలత్వమును అధిగమిస్తున్నాడు. ‘‘విష్ణుపదము’’.. అగు తత్ పదము (ఆత్మపదము) చేరుచున్నవాడు.
💐 త్రివక్త్రమ్ : - జాగ్రత్-స్వప్న - సుషుప్తులలో ‘నేను’ అనే జీవాత్మత్వమును అధిగమించి ‘‘జాగ్రత్-స్వప్న-సుషుప్తులు నా యొక్క ముఖ-కవళికలే’’ అను పరమాత్మ స్థానమును చేరుచున్నాడు. ఇహస్థానమంతా తన పరస్థానము నందు అంతర్గతము చేసివేయుచున్నవాడు.
💐 త్రిగుణ స్థానమ్ : సత్వ-రజో-తమో గుణములకు బద్ధుడు కానివాడై, వాటికి తానే ఉత్పత్తి స్థానముగా ఎరుగుచున్నవాడు.
💐 త్రిధాతగ్ం : సత్-చిత్-ఆనంద (త్రిధాతు) కేవల ధర్మములు స్వభావసిద్ధమైనట్టివాడు.
💐 రూపవర్జితమ్ : నామ-రూపములైనట్టి దృశ్య వ్యవహారమంతటికీ అతీతుడై, సాక్షి అయి ప్రకాశమానుడగుచున్నవాడు.
💐 నిశ్చలమ్-నిర్వికల్పం : చంచల జగత్తును ఇంద్రియములతో చూస్తూనే తాను నిశ్చలుడు, నిర్వికల్పుడు అయి ఉంటున్నవాడు.
💐 ఉపాధి రహితగ్ం-స్థానమ్ : ఇంద్రియములకు → దృశ్యము ఉపాధి. ఇంద్రియములు → దేహమునకు ఉపాధి. దేహమో → దేహికి ఉపాధి. సర్వాంతర్యామిత్వమునకు → దేహి ఉపాధి. ఆ యోగి సర్వాంతర్యామిత్వము సంతరించుకొని.. ఉపాధి లేనివాడై (తాను దేనికీ ఉపాధి కానివాడై) ప్రకాశించుచున్నవాడు.
💐 వాక్ మనో అతీతమ్ - అగోచరమ్ : వాక్కుకు-మనస్సుకు అలభ్యుడై, అగోచరుడై, అతీతుడై నిర్మలబుద్ధిచే తనను తాను ఎరుగుచున్నవాడై ఉంటున్నవాడు.
స్వస్వభావమగు ఆత్మభావనను గ్రహించుచున్నవాడగుచు, అసంఘాతపదము (A state not touched by and not associated with any thing else) అగు ‘అచ్యుతత్వము’ను పుణికిపుచ్చుకొనుచున్నాడు.
అదియే ఈ ప్రతి ఒక్క జీవుని సహజానంద స్వభావ - స్వరూపము.
అందులోంచి బయల్వెడలే భావాలన్నీ - భావించబడేవన్నీ అద్దాని స్వరూపమే కాబట్టి, అది అనాతీతము (దేనికీ అతీతము కాదు)-అని కూడా అనబడుతోంది. అచ్యుతము కూడా (‘‘సర్వసాక్షి, సమస్తమునకు కారణకారము అగు పరబ్రహ్మము నేనే’’ - అను కచ్చితమైన అవగాహననుండి చ్యుతి పొందకపోవటము).
ఆత్మానుభవము భౌతికమైన కళ్లకు కనిపించేది కాదు. కేవలము నిర్మలమగు బుద్ధికి స్వయముగా అనుభవమయ్యేది. కనుక దుష్ప్రేక్షము.
అది నిత్యముక్తస్వరూపము. ఇహ స్వరూపము జగత్ నాటక అంతర్గతమై ఉంటుంది కాబట్టి నిత్యబద్ధము. పరస్వరూపము సర్వదా ఆవల - కేవల సాక్షి కాబట్టి - అద్దానికి లోక-శాస్త్ర-దృశ్య బంధమూ లేదు. అందుచేత ఆ యోగి చేరుస్థానము (తేజోబిందూపాసకునికి అనుభవమగు స్థానము) - ‘‘నిత్యముక్తమైనట్టిది’’.
ఈ జీవుడు ఈ ఉపనిషత్‌లో చెప్పబడబోవు తేజోబిందూధ్యానము ద్వారా అట్టి శాశ్వతము - ధ్రువము - అచ్యుతము - అగు నిత్య వినిర్ముక్త స్థానము గురించే చింతన చేయాలి. అదియే మహదాశయము. తదితరమైనదంతా అల్పాశయములే! అదియే బ్రాహ్మీస్థానము, అధ్యాత్మస్థానము, సర్వులకు ఆత్మస్థానము.
అట్టి విష్ణుత్వమే పారాయణము చేయవలసినట్టిది. అది అచింత్యము. కేవలము బుద్ధి (common sense)కి అనుభవమై ప్రాప్తించునది. అది చిన్మయానందస్వరూపము. (‘ఎరుక’ అను విన్యాసానందస్వరూపము). ఆ తేజో బిందుస్థానము పరమాకాశమునందు సంస్థితమై ఉన్నట్టిది. ఈ జీవుని వాస్తవ స్వరూపము పరమాకాశమే.
అది నిర్విషయము కాబట్టి శూన్య స్వరూపము. అట్లా అయి ఉండి కూడా అది శూన్యము కాదు. ఈ సర్వము అద్దాని నుండియే జనించుచుండగా, లోకములకు-లోకపాలకులకు-లోకులకు జననస్థానమై ఉండగా, - అది శూన్యమెట్లా అవుతుంది? కనుక అశూన్యము!
ఆ తేజోబిందు సంజ్ఞయగు ఆత్మ…,
శూన్యమునకు కూడా సాక్షిగా, హృదయమున సంస్థితమై ఉండటము చేత ‘శూన్యమునకు అతీతము’.
తేజో బిందుస్వరూపమగు ఆత్మ -
1. ధ్యానము (Thinking) కాదు.
2. ధ్యాత (Thinker) కూడా కాదు.
3. ధ్యేయము (That being thought) కూడా కాదు.
కానీ అది సర్వుల ధ్యేయస్వరూపమే! ఆ మూడూ కూడా అదియే!
అది శూన్యమే (contains nothing there in) అయి ఉండి కూడా, ఈ సర్వమునకు వేరైనది కాదు. అది అచిన్త్యము! బుద్ధితో క్రొత్తగా కనిపెట్టవలసినది కాదు. కాబట్టి ప్రబుద్ధము కాదు. అది అప్రబుద్ధము.
అది ఈ కనబడేదిగా అగుటలేదు. కనుక సత్. (యమ్ సత్ - ఉన్న వస్తువేదీ) కాదు.
మరి ఎక్కడో ఆవల (పరమ్) ఉన్నట్టిది కాదు! ఈ సర్వమునకు వేరు కాదు! అసత్ కాదు.
… అని విజ్ఞులు వర్ణిస్తూ ఉన్నారు. మునులు ఆరాధిస్తున్నారు.
ఇంకా కూడా అది అన్యదేవతల రూపము కాదు! పరమై మరెక్కడో ఉన్నదీ కాదు! తపో-ధ్యాన సంపదచే అది సంప్రయుక్తము (ప్రయత్నములచే లబ్ధము) అగుచున్నట్టిదియే.
అందుచేత…,
అంతరంగ సంకల్పదోషములగు లోభము, మోహము, భయము, దర్పము, కామ-క్రోధములు-అనబడే దోషములను త్యజించి; ఆధిభౌతికములగు శీత-ఉష్ణ ఆకలి దప్పికల సంకల్పములను, కుల-జాతి-బ్రహ్మ కుల దర్పముల మొదలంట్లా వదలిబీ భయము-సుఖము-దుఃఖము-మానావమానములు మొదలైన భావములను పరిత్యజించి, ‘‘సర్వమునకు వేరై ఆవల పరమై’’ యున్న తత్ బ్రహ్మమును (బ్రాహ్మీదృష్టిని) ఆశ్రయించి ఉండాలి!
అట్టి తేజోబిందుయోగ సంజ్ఞితమగు ‘‘కేవలాత్మ స్వస్వరూపధ్యాన నిష్ట’’ నిశ్చలమవటానికై లోకకల్యాణమూర్తులగు తత్త్వవేత్తలచే - శాస్త్రముల రూపంగా ‘అంగయోగములు’ గా చెప్పబడుచున్నాయి.
అవి : యమము; నియమము; (దృశ్య వ్యవహారమును త్యజించి రూపమగు) త్యాగము; మౌనము; దేశము; కాలము; ఆసనము; మూలబంధము; దేహసామ్యత్వము; దృక్‌స్థితి; ప్రాణ సంయమనము; ప్రత్యాహారము; ధారణ, ఆత్మధ్యానము; సమాధి. ఇవన్నీ వరుసక్రమంగా ‘అంగములు (step by step)… రూపంగా ప్రతిపాదించబడుచున్నాయి.
అంగయోగములు
(1) యమము :
సర్వమ్ బ్రహ్మేతి వైజ్ఞానాత్ ఇంద్రియ గ్రామ సంయమః యమో-సంప్రోక్తః ।
ఈ కనులు -చెవులు మొదలైన ఇంద్రియములకు అనుభూతి-దృశ్యముల రూపమున ప్రాప్తిస్తున్నదంతా కూడా ‘బ్రహ్మమే’ అను విజ్ఞానము కలిగి ఉండటమే ‘యమము’. అట్లా అనిపించటానికి చేయుచున్న యత్నమే యమాంగ యోగము.
అభ్యసనీయో ముహుర్ముహు। ‘‘ఈ సమస్త దృశ్యము వేదాంతశాస్త్ర - గురు వాక్యానుసారము ఆత్మకు అభిన్నము కదా’’ అని మరల మరల అనేకసార్లుగా అభ్యసించాలి! ‘‘ఈ సకల జీవులు, జీవరాసులు ‘బ్రహ్మము’ యొక్క నాటకీయ సంప్రదర్శనా క్రీడా వినోదమే!’’ - అను జ్ఞాపకము పదిలపరచుకోవటము, ప్రవృద్ధ పరచుకోవటము - ఇదే ‘యమము’ యొక్క ముఖ్యార్థము .
(2) నియమము : ‘‘సర్వము పరబ్రహ్మమే! ఆత్మయే’’ అను ఆత్మభావనకు సానుకూలమగు క్రియలను, ఆలోచనలను అనువర్తించటము; భేదదృష్టులను బేదభావములను నిరోధించటము - .. ఇదియే నియమము. ఉత్తమబుద్ధితో పరానందపూర్వకమైన భావనలను వృద్ధి చేసుకోవటము, ‘‘ఇహపరిమిత దృష్టులను, భేదమును వృద్ధి చేయు భావనలను - క్రియామార్గములను’’ - త్యజిస్తూ ఉండటము - నియమము. వివేకవంతులచే ఇట్టి నియమము సదా ఆశ్రయించబడుతోంది.
(3) త్యాగము : ఈ దృశ్య ప్రపంచములో బాహ్యముగా కనిపిస్తున్న నామ-రూపాత్మకమైనదంతా బాహ్యముననే వదలి, అంతర్ దృష్టిచే ‘‘ఇదంతా సత్‌చిత్ ఆనంద రూపమే! ఆత్మయే!’’.. అను భావనను ఆశ్రయించటమే త్యాగము.
విజ్ఞులగు మహనీయులు బాహ్య దృష్టిని త్యజించి ఆత్మదృష్టితో చూడటమును అనునిత్యంగా అభ్యసిస్తూ ఉంటారు! అట్టి అన్యదృష్టిని వదలుచూ, అనన్యాత్మ దృష్టిని ఆశ్రయించు ప్రయత్నమే - ‘త్యాగము’ అనబడుతోంది.
ఈ విధంగా సర్వజీవులను, సమస్త దృశ్యమును సచ్చిదానందాత్మగా దర్శించటమును అభ్యసించుటచేత, అది సద్యోమోక్ష ప్రదాయకము. సూటిగా, (సాధన కాల వ్యవధి మొదలైనవి అవసరం లేకుండా) ఇప్పటికిప్పుడే - ‘‘నాకు బంధము ఉండజాలదు’’ అను మోక్షభావన రూపుదిద్దుకోగలదు.
(4) మౌనము : యస్మాత్ వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ। ఏ ఆత్మ చైతన్యమును.. వాక్కు - ‘‘ఇది ఇట్టిది’’ అని వర్ణించలేక (నిర్వచించలేక) తన యజమాని అగు మనస్సుతో సహా వెనుకకు మరలుచున్నదో, అద్దానిని బుద్ధితో (with the help of common sense) గమనించుచుండటమే ‘మౌనము’.
యోగులు అజడమగు ఆత్మను మనో-వాక్కులకు అతీతమై, సర్వదేహములుగా వేంచేసి ఉన్నట్లుగా గమనిస్తూ, అట్టి అనునిత్య-అనుభావనయే తమ గమ్యముగా (As a main objective) కలిగి ఉంటారు.
వాచో యస్మాత్ నివర్తంతే, తత్ వక్తుమ్ కేన శక్యతే? వాక్కు అద్దానిని వర్ణించలేక వెనుకకు మరలుతూ ఉంటే, ఎవ్వరు మాత్రము ఆత్మాఽహమ్ అనుభవము గురించి ఏమి చెప్పగలరు?
ప్రపంచో యది వక్తవ్యః, సోఽపి శబ్ద వివర్జితః।। ‘‘ఈ ప్రపంచము ఇటువంటిది’’ అని చెప్పటానికే మాటలు చాలవు. ఇక, ద్రష్ట-దృశ్య-దృక్ రూపమగు ఆత్మ గురించి మాటలతో ఏమి చెప్పగలము? ఇది ఎరిగి, వాక్కు - మనస్సుల సహాయముతో వాక్ అతీత వస్తువును దర్శించు యత్నమే మౌనము!
➤ పరబ్రహ్మము వాక్కుకు అందునది కాదు.
➤ ఈ ప్రపంచమంతా ఆ పరబ్రహ్మమును ఎరుగుటకు ఒక గుర్తు (Smybol) వంటిది! ఒక సంజ్ఞ!
అని అనుకోవటమే మౌనము.
అంతేగాని కేవలము మాటలు మాట్లాడకపోవటము మౌనము కాదు. గిరా మౌనం తు బాలానామ్ ఆయుక్తమ్ బ్రహ్మవాదినామ్! బ్రహ్మమును ఎరిగిన బ్రహ్మవాదులు ‘‘ఒక కొండ వలె మాట్లాడకపోవటము మౌనమని చిన్నపిల్లల వంటివారు చెప్పేది’’.. అని గమనించువారై ఉంటారు. ‘‘ఈ సర్వము ఆత్మకు అనన్యము’’ - అను భావనయే మౌనభావన.
(5) దేశో :
ఆదావంన్తే చ మధ్యే చ జనో యస్మిన్ న విద్యతే।
తెలుసుకొనుచున్నదే ఆత్మ. ఈ తెలియబడేదంతా - (దీని మొదలు - మధ్య - చివర కూడా) ఆత్మ యొక్క కల్పనావిభాగము. దేని ప్రారంభము - మధ్య కూడా ఎవ్వరూ ఎరుగరో, - ఏది సర్వదా ‘ఏకమే’ అయి ఉండటం చేత - (‘‘అనేకము-అనేక మంది జీవాత్మలు - లోక భేదములు - పుణ్య-పాప విభాగములు’’.. మొదలైన) భేదములన్నీ అద్దానియందు ఆపాదించలేమో…, అదియే ఆత్మ.
➤ బంగారు ఆభరణాలన్నీ బంగారము చేతనే వ్యాపించి ఉన్న తీరుగా..,
➤ మట్టి కుండలన్నీ మట్టిచే నిర్మితమైయుండునట్లుగా..,
యేన ఇదం సతతం వ్యాప్తం, స దేశో విజనః స్మృతః।। దేనియందు, దేనిచేత ఈ కనబడే సర్వము (ద్రష్ట-దృశ్యములతో సహా).. కల్పితము అయి, విస్తరించబడినదై ఉన్నదో.. అదియే ‘దేశము’. (ఆత్మతత్త్వమే దేశము).
ఎక్కడ ‘నీవు-నేను’ మొదలైన ద్వితీయమంతా లయించినదై, సర్వసమమగు అఖండ-ఏక-అద్వితీయ ఆత్మభావన ప్రభవించి, వెల్లవిరిస్తుందో.. అదియే దేశము!
కాలము : కల్పనా సర్వభూతానాం బ్రహ్మాదీనాం నిమేషతః, కాలశబ్దేన నిర్దిష్టగ్ం హి అఖండానందమ్ అద్వయమ్: ఏ మహత్తరమగు, అఖండానందరూపమగు, అద్వయమగు ‘‘అహమ్ బ్రహ్మాస్మి’’ భావన సమక్షంలో.. సృష్టికర్తయగు బ్రహ్మదేవుని నుండి సర్వభూతములతో (ఇక్కడి అసంఖ్యాత జీవులతో) కూడిన దృశ్య కల్పనంతా ‘‘నిమేషమాత్రము’’ (ఒక నిమిషకాలం ఉంటుంది. మరొక నిముషానికి లేనిది అగుచున్నది) - అని దర్శించబడుచున్నదో.., అట్టి నిమేషకాల సర్వజగత్ దృష్టి భావనా వైచిత్ర్య సందర్శన బుద్ధిరూపమే- కాలము. జగత్ కల్పనను, కాలముయొక్క కల్పనగా దర్శించుచుండటమే - కాలజ్ఞానము.
ఆసనమ్ : ఏ ఆసనము (posture of Body) ‘బ్రహ్మచింతన’కు సానుకూల్యము, సుఖప్రదము అయి ఉంటుందో… అదియే ‘‘సుఖాసనము’’. బ్రహ్మచింతనకు సానుకూల్యము కానిది, శరీర కష్టములో మాత్రమే కూడినది - సుఖాసనమని అనిపించుకోదు. ‘బ్రహ్మము’ యొక్క చింతనకు సానుకూల్యంగాని ఏ ఆసమైనా కూడా సుఖమును పోగొట్టేది.. అనియే ఎరుగబడుగాక!
సిద్ధాసనము : ఎవరికి వారికి ‘ఆత్మభావన’ సానుకూల్యమగునదే సిద్ధాసనము.
- సర్వజీవులలో సమముగా ఏ ‘‘అఖండ-అప్రమేయ నిత్యస్వయంప్రకాశక ఆత్మ’’ అధిష్ఠానమైయున్నదో
- ఈ జీవులంతా ఏ ఆత్మయందు స్థానము కలిగి ఉన్నారో…,
- సర్వ జీవుల ఆదిస్థానము సందర్శనమౌతుందో…,
- ఈ విశ్వమంతా ఎద్దాని యందు (ఆభరణము బంగారమునందు వలె, మట్టితో చేసిన బొమ్మ మట్టి యందువలె) అధిష్ఠానమై యున్నదో…,
అట్టి పరతత్త్వ భావన, (కేవల బ్రహ్మము యొక్క) అవగాహన సిద్ధింపజేయగలిగినదే ‘‘సిద్ధాసనము’’.
మూలబంధము : ‘చిత్తము’ యొక్క వాస్తవ రూపమేమిటి? లోకముల అనుభవరూపమే చిత్తము. అట్టి చిత్తమునకు లోకములకు ‘మూలము’ (Basis and Root) అగు ఆత్మతో - రాజయోగము (అష్టాంగయోగములు) ద్వారా చేయు సంయోగ ప్రయత్నము - ‘‘మూలబంధము’’ అనబడుతోంది.
ఏ ప్రయత్నముచే ఈ దేహాంగములన్నీ ఒక ఋజుక్రమము (సమరేఖ స్థితికి) వచ్చి, చిత్తము ఆత్మయందు లయింపజేయటమునకు సానుకూల్యమగుచున్నదో, అదియే మూలబంధము.
సర్వభేదములను అధిగమించి (సమం సర్వేషు భూతేషు తిష్ఠంతమ్ పరమేశ్వరమ్), సర్వ స్వరూపమగు పరమాత్మత్వమును సిద్ధింపజేసుకొను ప్రయత్నమే మూలబంధము.
ఈ బుద్ధిని సర్వ సమస్వరూపమగు ఆత్మత్వమును ఆశ్రయించు ఆశయమునందు నియమించుకోకుండా, కేవలము దేహాంగములను సమరేఖగా (మెడ-ముఖము-తల మొదలైనవి నిఠారుగా ఉంచి) చేయు యోగసాధన… నిస్సారమైన యత్నమే అవుతుంది.
అఖండ - ఆత్మతత్త్వానుభవ ఆశయము లేనట్టి యోగసాధన-కొమ్మలు విరిగి నిఠారుగా నిలిచి ఉన్న శిథిల వృక్షముతో సమానము. యోగ విద్య యొక్క వాస్తవ ఫలము - ఆత్మానుభవము ప్రసాదించుటయే.
దృష్టి :
దృష్టిమ్ జ్ఞానమయీమ్ కృత్వా పశ్యేత్ బ్రహ్మమయమ్ జగత్!
దృష్టిని జ్ఞానమయము చేయుటచే, ఈ జగత్తు జగత్తుగా కాకుండా.. బ్రహ్మమయమై కనిపించగలదు. అట్టి పరమ-ఉదారమగు దృష్టియే ‘‘దృష్టి-అభ్యాసము’’. అంతేగాని, ముక్కుకు ఊర్ధ్వభాగము నందు దృష్టిని నిలపటము నిజమైన దృష్టి-అభ్యాసము అయి ఉండలేదు.
దృష్టి యొక్క దోషము చేతనే ధ్యాస ఇంద్రియ విషయములకు పరిమితమగుచూ, ఆత్మసందర్శనము మరుగున పడుచున్నది.
‘‘సర్వము పరబ్రహ్మమే కదా!’’.. అను దృష్టి ప్రసిద్ధమగుచుండగా, ఇంక ‘‘నాసాగ్రదృష్టి అభ్యాసము’’తో పెద్దగా పని ఏమున్నది?
నాసాగ్రదృష్టి :
ద్రష్టయే దృష్టి రూపుడై దృశ్యమును (స్వప్న సంఘటన వలెనే) పొందుచున్నాడు. ఏ దృష్టిచే ద్రష్ట-దర్శన-దృశ్యములు శమించినవై, ఆత్మదృష్టి రూపుచెందుచున్నదో, అదియే అసలైన దృష్టి. ముక్కుకు ఊర్ధ్వంగా దృష్టిని నిలుపటము వాస్తవమైన నాసాగ్ర- దృష్టియేకాదు.
ప్రాణాయామము :
చిత్తాది సర్వభావేషు బ్రహ్మత్వేనైవ భావనాత్, నిరోధః సర్వవృత్తీనాం ‘‘ప్రాణాయామ’’ స ఉచ్యతే। వాయు పూరక-రేచక-కుంభకాలే ప్రాణాయామమవదు. చిత్తము యొక్క ప్రాపంచక, నామరూపాత్మక, భేద పూర్వక-వృత్తులను ఉపశమింప జేస్తూ, చిత్తము యొక్క సర్వభావములతో ‘బ్రహ్మము’ను భావన చేయటమే అసలైన ‘‘ప్రాణాయామము’’.
రేచకము : నిషేధనం ప్రపంచస్య రేచకాఖ్యః సమీరతః। ఈ ప్రపంచ దృశ్యమును పాంచభౌతిక కలన (Illusion)గా భావిస్తూ బ్రాహ్మీదృష్టితో ప్రపంచమును త్యజించి ఉండటమే రేచకము. కేవలం గుండెలోని గాలి బయటకు వదలటము రేచకము కాదు. జగత్తును జగత్తుగా త్యజించి ఉండటమే - రేచకము.
కుంభకము :
తతః తత్ వృత్తి నైశ్చల్యం కుంభకం ప్రాణ సంయమః
→ ఈ సర్వజీవులలో నా సహజానంద స్వస్వరూప పరపరబ్రహ్మమే వేంచేసినదై యున్నది.
→ సహజానంద బ్రహ్మము అన్ని రూపాలుగా, నీవు-నేనుగా సర్వదా ప్రకాశించుచున్నది.
→ నేను సర్వాత్మకుడనై ఈ అందరిలో - అందరుగా ప్రకాశించువాడనై ఉన్నాను…
అను ‘‘సర్వజనులలో స్వస్వరూపాత్మను దర్శించు బుద్ధి వృత్తి’’ని ఆశ్రయించు ప్రయత్నమే ‘కుంభకము’.
ఆ ఆత్మీయమగు వృత్తిని ఆయా సర్వ పరిస్థితులతోను, సర్వ సందర్భములలోను వదలి ఉండకపోవటమే - ప్రాణ సంయమ (ప్రాణాయామ) పూర్వక కుంభకము. అట్టి ప్రబుద్ధమే కుంభకము యొక్క అసలైన ఉద్దేశ్యము.
అట్టి ‘‘ఈ సర్వము నాయందు - ఈ సర్వమునందు నేను’’… అనునది నిద్ర లేపకుండా.. కేవలము ముక్కుతో బాహ్యమున గాని, అంతరమునగాని గాలి బిగిస్తే.. అది ముక్కును పీడించటమేగాని ‘ప్రాణాయామము-ప్రాణసంయమము’ అవదు.
ప్రత్యాహారము :
జనులు మనస్సును ఇంద్రియ విషయములపై ప్రసరింపజేసి, తద్వారా మనస్సును రంజింపజేయు ప్రయత్నములో - రోజులు గడుపుచున్నారుకదా! ఈ జీవుడు జీవితమును సాఫల్యము చేసుకోవటానికై ‘ప్రత్యాహారము’.. ఒక అంగముగా చెప్పబడుతోంది. అనగా?
విషయేషు (స్వ) ఆత్మతాం దృష్ట్వా మనసః చిత్తరంజనమ్ ‘ప్రత్యాహారమ్’ సవిజ్ఞేయో!
ఇంద్రియములకు విషయములైనట్టి ఈ జగత్తులోని శబ్ద స్పర్శ రూప రస గంధ విశేషాలు ఆత్మదృష్టితో చూడటం, మనస్సుతో ఆత్మగా ఆస్వాదించటము-ప్రత్యాహారము.
ధారణ :
యత్రయత్ర మనో యాతి, బ్రహ్మణః తత్ర దర్శనాత్, మనసా ధారణం చ ఏవ ధారణా।
ఈ మనస్సు (లేక) ఆలోచన ఎక్కడెక్కడ ఏ ఏ విషయములపై ప్రియ-అప్రియములతో కూడి వ్రాలుచున్నదో.. అట్టి ‘‘ఆయా సర్వ విషయములు సర్వదా బ్రహ్మమే స్వరూపముగా కలిగిఉన్నాయి’’.. అని మనస్సుతో అవగాహన వదలకపోవటము ‘ధారణ’. అట్టి ధారణ యొక్క అభ్యాసముచే ఈ జీవుడు స్వయముగా ‘పరతత్త్వము’ను సముపార్జించుకోగలడు.
ధ్యానము :
‘‘నేను బ్రహ్మమే అయి ఉన్నాను’’.. అనునదే సత్‌వృత్తి (Absolute - Al-present sense). ‘‘ఈ దృశ్యముపై గాని, ఈ దేహముపైగాని, మనోబుద్ధి చిత్త అహంకారములయొక్క స్థితి-గతులపైగాని కించిత్ కూడా ఆధారపడిలేను. నిరాలంబ (Non-Dependent) - స్థితియందు బ్రహ్మముగా సుస్థాపితుడనై ఉన్నాను’’ అను స్థితి - ‘ధ్యానము’ అను శబ్దముచే ఉద్దేశ్యించబడుతోంది. అట్టి ‘‘నేను బ్రహ్మమునే - ‘‘బ్రహ్మైవాహమస్మి’’ ధ్యాస (లేక) ధ్యానము పరమానందదాయకమై ఉన్నది.
సమాధి :
సర్వ దృశ్య వృత్తులను త్యజించివేసి, వికారములన్నీ వదలివేసి, నిర్వికారత్వముతో కూడిన బ్రాహ్మీవృత్తిని మరల మరల అవధరించువాడై ఉండటమే సమాధి.
‘‘వీరు ఇట్టి వారు - వారు అట్టివారు; ఇది పొందాలి- అది తొలగాలి; ఇది కావాలి- అది వద్దు; ఇది చేయాలి - అది చేయకూడదు’’ - మొదలైన ఈ ద్వంద్వ వృత్తులన్నీ దాటివేసి…, సర్వమునకు సాక్షి అయి - మౌని అయి, సర్వసమరూపమగు సమ్యక్ స్థితియందు నెలకొని ఉండటము ‘సమాధి’ అని అనబడుతోంది. |
సిద్ధి :
ఆనందము రెండు విధములైనది.
(1) వస్తువుల నుండి లభించునది - కృత్రిమమైనది, పరతంత్రమైనది కూడా
(2) సహజమైనది, స్వతంత్రమైనది.
సంసారదృష్టులు కారణంగా ఈ జీవుని ఆనందము వస్తువులపై సందర్భములపై, సంఘటనలపై ఆధారపడినదై ఉంటోంది.
సాధువు యొక్క (లేక) యోగి యొక్క విషయము ఇందుకు భిన్నమై ఉంటోంది. ఆతడు ఇప్పుడే ఇక్కడే ‘‘సహజము-అకృత్రిమము అగు ఆనందము’’ను సిద్ధించుకొనుటయందు నిమగ్నుడై, అందుకొరకై కర్మ-యోగ-తపో-ధ్యాన-సమాధులను అభ్యాసపరికరములుగా కలిగి ఉంటున్నాడు. అట్టి అభ్యాసముచే ‘‘ప్రత్యగాత్మ’’తో అనుసంధానము స్వయముగా ఏర్పడుచున్నది. అట్లు ఏర్పడటమే సిద్ధి-సిద్ధుడు-సిద్ధ సమాధియోగి’’.. మొదలైన ఆయా పరాకాష్ఠస్థితి శబ్దములుగా చెప్పబడుచున్నాయి.
ధ్యానము యొక్క (వృత్తిరహిత ఆత్మధ్యాస) యొక్క అభ్యాసముచే సర్వసమ-సమరస పూర్వక అనుభవమగు సమాధి సిద్ధిస్తోంది. అది ‘‘సర్వము సమరూపమగు ఆత్మగా అవధరించటము’’ అను స్థితి. తానే సర్వతత్త్వస్వరూపుడై బ్రహ్మానందించటము.
అటుపై ఇక ఇతఃపూర్వపు సర్వసాధనలు తమకు తామే ఉపశమిస్తాయి. స్వతఃగానే అకృత్రిమమగు ‘‘స్వయమాత్మా-మమాత్మా ఇదమ్ సర్వమ్’’-అను ద్రష్టత్వమునకు సాక్షిత్వము (దృక్) స్వభావసిద్ధమగుచున్నది. దృష్టి ఆత్మత్వము సంతరించుకొన్నదై, సాధన-సాధ్యములు ఏకరూపము, పొందుచున్నాయి.
అట్టివాడే ‘యోగీశ్వరుడు’ (లేక) ‘యోగిరాట్’. ఆతడు ఆస్వాదించు స్వయం-స్వస్వరూపత్వము మాటలతో చెప్పజాలనిది.
అట్టి సమాధి ఫలమగు ‘సర్వమహమేవ’ స్థానము (లేక ‘సమాధి పరాకాష్టస్థానము’) చేరుటకు నిర్విర్తించు యోగి యొక్క ప్రయత్నములకు కలుగు విఘ్నములలో కొన్నిటి గురించి ఇక్కడ మనము ఉదహరించుకొనుచున్నాము.
‘‘యోగాభ్యాసము’’ సమయంలో కలిగే విఘ్నములు
(1) అనుసంధాన రాహిత్యము : అనేక భేదభావములు, అభినివేశములు, స్నేహ-ద్వేష అభిప్రాయములు, తప్పు-ఒప్పుల ఆపాదనలు.. మొదలైనవన్నీ పెత్తనము చెలాయించటం చేత.. ‘‘ఇదంతా అఖండమగు ఆత్మయే! మమాత్మయే ఇదంతా’’.. అను అనుభూతి పూర్తిగా మరుగునపడుతూ ఉంటోంది. బుద్ధి ఆత్మతో అనుసంధానము పొందుటలేదు. (The Unitedness with the finest truth is remaining as uncatched)
(2) ఆలస్యము : బుద్ధి మాంద్యము. బద్ధకము. పరిశీలించాలనే ఉత్సుకత మందగించి ఉండటము. అతి నిద్ర.
(3) భోగలాలసత్వము : ఇంద్రియ విషయ రూపములగు భోగముల పట్ల అభిలాష. నామ-రూపముల పట్ల, ఆయా సంబంధ- అనుబంధముల పట్ల రాగము. మమకారము. ఆకాంక్ష! (Expectations).
(4) లయము : కొన్ని సంగతి-సంబంధములలో లీనమై ఉండటము. నూతిలోని కప్పవలె అల్పబుద్ధికి పరిమితమవటము. అంతకుమించినదేదీ పరిశీలించుటకు, అభ్యసించటానికి, తెలుసుకోవటానికి తిరస్కార భావము కలిగి ఉండటము. సంగతి-సంబంధము- సందర్భములలోను, అనుబంధ బాంధవ్యములలోను లయమైపోయి ఉండటం.
(5) తమము : అజ్ఞానముతో కూడిన సంకుచితత్వము. అసంగత్వము. అవివేకము, అపరిశీలనాత్మకమైన, దురావేశపూరితమైన అజ్ఞాన భూమికాభ్యాసములు. వివేకదృష్టికై వెతికే ప్రయత్నము లేకపోవటము.
(6) విక్షేపము : ఒకటి తరువాత మరొక ధ్యాస, ఒకేసారే అనేక ధ్యాసలు కలిగి ఉండటము. ఏకాగ్రత ఏమాత్రము లేకపోవటము. ఒకచోట ఒక విశేషము వింటూనే ధ్యాస-మరొక చోటికి వెళ్లుచున్నదై ఉండటము.
(7) తేజస్సు : యోగాభ్యాసము కొనసాగుచుండగా దర్శనమగు తేజస్సు (తేజస్సు కూడా ఆత్మకు అన్యమే కాబట్టి అనన్యమగు ‘‘ఆత్మాఽహమ్ స్థితి-స్థానము’’ పొందుటకు ముందుగా దర్శనమయ్యే తేజస్సు కూడా ‘సమాధి’ అభ్యాసమునకు ఒక విఘ్నముగా చెప్పబడుచున్నది)
(8) స్వేదము :దేహము అలసి, సొలసిపోవటము. చెమట పట్టటము. [యోగ/సమాధి అభ్యాసములలో చెమట (Sweating)… ఒకానొక స్థితిగాను, క్రమంగా..అభ్యాసము కొనసాగుచుండగా స్వేదము(చెమట) కలుగకపోవటము తరువాతి మెట్టుగా జరుగుతూ ఉంటుంది].
(9) శూన్యతా : యోగాభ్యాసము (లేక) సమాధి అభ్యాసము - అనునది - దృశ్యవస్తువుల (నామ-రూప-గుణముల) త్యాజ్యరూపము. అభ్యాసము కొనసాగుచుండగా ఒకానొక స్థితిలో పదార్థరహిత-విషయ రహిత శూన్యత్వము అనుభవమగుచున్నది. అట్టి స్తబ్ధత ఒక విఘ్నముగా అగుచున్నది. సోఽహమ్ రూపమగు ఆత్మ శూన్యము కాదు. స్తబ్ధము కాదు. సర్వమును చేతనపరచు చైతన్యము. ఈ జగత్తులన్నీ ఎందులోంచి బయల్వెడలినవై ప్రకాశమగుచున్నాయో అది శూన్యము ఎట్లా అవుతుంది? అందుచేత మరికొంత యోగాభ్యాసముచే ‘‘సర్వము తానైన నేను (ఆత్మ)! సర్వమునకు సాక్షి అయిన నేను (ఆత్మ)!’’.. అను స్థితి (శూన్యమును కూడా అధిగమించుటచే) సిద్ధించగలదు.
ఈ విధంగా అనేక విఘ్నములు అనేక రూపాలుగా (బాహుళ్యంగా) కలుగుతూ ఉంటాయి. యోగి వాటినన్నిటినీ-బ్రహ్మవిచారణ (బ్రహ్మజ్ఞానము-బ్రహ్మము గురించిన సమాచారము - అవగాహన), గురువుతో సంభాషణ - ఓరిమి సహాయంతో-త్యజిస్తూ, జయిస్తూ అధిగమించాలి. పట్టుదలతో కూడిన అభ్యాసమే అందుకు ఉపాయము.
అన్నిటికీ కారణము దురభ్యాసము - అందుకిక ఉపాయము సదభ్యాసమే!
ఈ జీవుడు ఏదేది దేహముతోను, మనస్సుతోనూ, చిత్తముతోను అభ్యసిస్తూ ఉంటే, అదియే సిద్ధిస్తూ కొనసాగుతుంది. అభ్యాసము యొక్క ప్రభావము అటువంటిది మరి!
భావవృత్త్యా హి భావత్వగ్ం - ‘‘ఈ జగత్తు అనేక రూపములుగా ఉన్నది. బంధములు కలిగించగలదు. ఇష్టములు పొందాలి, బాధలు తొలగాలి. నమ్మతగినవి- నమ్మరానివి ఇక్కడ ఉన్నాయి’’ - ఇటువంటి మొదలైన అనేక అనుభవములుగా ఇక్కడివన్నీ ప్రాప్తిస్తున్నాయి. ఇటువంటి ఏఏ భావ వృత్తులు ఒకడు ఆశ్రయిస్తూ ఉంటాడో.. ఆ రకమైన భావ వృత్తియే ఘనీభూతమై - అట్టివాడు అదియే స్వానుభవముగా, అనుభూతిగా పొందుచున్నాడు. అవియే ఆతని స్వభావముగా అగుచున్నాయి. భావముల అధికత్వముచే, ఆ రీతిగానే అనిపించటము ప్రారంభిస్తోంది. (యద్భావమ్ తత్ భవతి).
శూన్య వృత్త్యా హి శూన్యతా : ‘ఇదేమీ లేదు’ అనే శూన్యవృత్తిని ఆశ్రయించినవాడు శూన్యత్వమే పొందుచున్నాడు.
బ్రహ్మవృత్త్యా హి పూర్ణత్వమ్ : ‘‘నాతో సహా ఈ సమస్తము ‘‘అఖండము, ఆనందరూపము’’ అగు పరబ్రహ్మమే’’ - అను బ్రాహ్మీవృత్తిని అభ్యసిస్తే, ‘బ్రహ్మము’గానే అనిపించగలదు.
✤ ఇక్కడ అనుభవమగు జాగ్రత్-స్వప్న-సుషుప్తి.. అంతర్గత దృశ్యములు,
✤ ఆ దృశ్యములు విషయములుగా కలిగియున్న ఇంద్రియములు, ఇంద్రియములతో కూడిన ఈ భౌతికదేహము,
✤ ఆ ఇంద్రియములకు ఆధారమైయున్న రూప-చూపు-వినికిడి-రుచి-వాసన-స్పర్శరూప ఇంద్రియానుభవములు, వాటికి సంబంధితులగు-ఇంద్రియ దేవతలు..
ఇవన్నీ అభ్యాసంచేతనే సిద్ధిస్తున్నాయి. ‘‘అన్ని తరంగాలలోను ఒకే జలమున్నవిధంగా-ఏకము, అఖండము, అక్షరము అగు బ్రహ్మమే’’ - అను వృత్తిచే, ‘‘బ్రహ్మమే అయి ఉన్న నేను పూర్ణుడను’’ - అను పూర్ణత్వం సిద్ధిస్తోంది.
బ్రాహ్మీవృత్తి :
❋ ఈ దేహమును కదల్చుచున్న దేహి, ఆతని ‘‘ఈ దేహము నాది’’ అనే జీవత్వము, (ఈ దేహమునకు నేను పరిమితుడను-అనునది)
❋ ‘‘నేను వస్తూ-పొతూ ఉన్న అనేక దేహములకు సంబంధించినవాడను’’.. అనబడు ఈశ్వరత్వము, (అనేక దేహములలోనివాడను-అనునది).
❋ ‘‘సర్వదేహములలో నేనై ఉన్న నేను’’ అను సర్వాంతర్యామిత్వము,
❋ ‘‘సర్వమునకు, సమస్తమునకు వేరైయున్న నేను’’ అను అప్రమేయత్వము’’- ఇవన్నీ కూడా అభ్యాసవశమే!
‘‘ఇదంతా అఖండము - నిత్యము - అప్రమేయము అగు బ్రహ్మమే’’ అను వృత్తిని ఎల్లప్పుడు అభ్యసిస్తూ ఉండటం చేత మాత్రమే - అట్టి ‘బ్రాహ్మీవృత్తి’చే ఈ జీవుడు ‘పూర్ణత్వము’ పొందగలడు.
అందుచేత ‘‘ఈ సర్వము సర్వదా నేనైన నేను’’.. అను వృత్తిచే పూర్ణత్వమునే అభ్యసించి, ఉత్తమ ప్రయోజనమగు ‘పూర్ణుడు’గా రూపుదిద్దుకోవటమే అన్నిటికంటే ఉత్తమము. అదియే జీవితము యొక్క మహదాశయము.
‘‘భావన చేతనే బంధము-భావన చేతనే మోక్షము అనుభవమగుచున్నాయి’’ అని గమనించబడు గాక!
అనగా..
‘‘ఈ సర్వ శరీరధారులగు జీవులు - సర్వ అశరీర దివ్య ప్రజ్ఞారూపులగు దేవతలు - ఈ లోక లోకాంతరములు.. ఇవన్నీ కూడా-నాతో సహా-సర్వదా అఖండమగు బ్రహ్మమేకదా’’.. అను ‘పవిత్రము, పరము’ అగు వృత్తిని ఆశ్రయించాలి.
అట్లా ఆశ్రయించక, అనేక భేదములతో కూడిన (జాతి భేదములు - దేహభేదములు-స్వభావ భేదములు-జీవేశ్వరభేదములు-గురుశిష్య భేదములు మొదలైన వాటితో కూడిన) భేదవృత్తులనే ఆశ్రయిస్తూ (అభ్యసిస్తూ) ఉంటే.. వారి ‘జీవితము’ అనే అవకాశము వృధాయే - అగుచున్నది. ఎందుచేతనంటే, అఖండమగు ఆత్మ అనుభవమునకు రాదు.
ఈ సర్వము బ్రహ్మమే! నేను బ్రహ్మమునే! ఈ సర్వము నేనే.. అనురూపముతో కూడిన బ్రాహ్మీ భావన (లేక) బ్రాహ్మీ వృత్తిని వృద్ధి చేసుకోకుండా, ఎవ్వరు అంతరంగములో దృశ్యవృత్తులనే వృద్ధి చేసుకుంటూ ఉంటారో.., అట్టివారు మానవజన్మ అనే గొప్ప సదవకాశమును పోగొట్టుకొని దుర్వ్యసనపరులు అగుచున్నారు. వారు పశుప్రాయులే!
ఎవ్వరైతే ఏ వృత్తి (Avocation) యొక్క పర్యవసాసనమెట్టిదో, ఏ వృత్తి బ్రాహ్మీస్థానము చేర్చగలదో ఎరిగినవారై.. బ్రాహ్మీ వృత్తి (ఈ సర్వము మమాత్మయే! అఖండమగు బ్రహ్మమే! - అను వృత్తి) యొక్క అభ్యాసములను రోజురోజూ వృద్ధి చేసుకుంటూ ఉంటారో..,
👉 అట్టివారు ధన్యులు.. ‘సత్పురుషులు’ అని పిలువబడుచున్నారు.
👉 వారు త్రిలోకపూజ్యులు
అందుచేత..
బ్రాహ్మీవృత్తిచే బ్రాహ్మీదృష్టియొక్క సమవృద్ధిని పొందుచూ, బుద్ధి - పరిపక్వతము సంతరించుకోసాగుతుంది. అట్టివారు ‘సత్‌బ్రహ్మత్వము’ను సిద్ధింపజేసుకొనుచున్నారు.
మహావాక్యములు పలుకుచున్నంత మాత్రంచేత సరిపోతుందా?
‘‘అహమ్ బ్రహ్మాస్మి - సోఽహమ్ - తత్త్వమ్ - సర్వం ఖల్విదమ్ బ్రహ్మ - జీవోబ్రహ్మేతి నా పరః’’ మొదలైన శబ్దములను మాత్రము ఉచ్ఛరిస్తూ, ఆ శబ్దార్థములకు సంబంధించిన ‘‘మనోవృత్తి-బుద్ధియొక్క అవగాహన, చిత్తముచే ఇష్టము’’.. అను రూపముగల బ్రాహ్మీవృత్తులను వృద్ధి చేసుకోకుండా ఉంటే లాభమేమున్నది? వృత్తులను ఆశ్రయించకుండా శబ్దములను పలికినంత మాత్రము చేత ఒకడు ‘సత్బ్రహ్మత్వము’ను సంతరించుకోగలడా? లేదు. శబ్దముతోబాటు స్వకీయభావనలను అభ్యాసపూర్వకంగా సమున్నతపరచుచున్నప్పుడే ప్రయోజనము.
ఒకానొకడు బ్రహ్మము గురించి - బ్రహ్మము గురించిన సమాచారము గురించి చదవటములోను, సంభాషించటములోను గొప్ప ప్రావీణ్యత కలిగి ఉండి కూడా సరిపోదు. జనులచే ‘‘ఆహా"! ఈతనికి ఎన్ని విషయాలు అనర్గళంగా చెప్పగల ప్రావీణ్యత ఉన్నది!’’ అని మెచ్చుకోబడుచూ గూడా.., సంపూర్ణత సంతరించుకున్నట్లు కాదు. తెలుసుకొన్నట్టి బ్రహ్మీతత్త్వమును అనిపించే వరకు అనుకోవాలి. అదే తాను కావాలి.
ఈ సర్వము పరబ్రహ్మమే! ‘‘ఈ కనబడే జగత్తుయొక్క., జనులందరి యొక్క, నా యొక్క సహజ రూపము-పరతత్త్వమే కదా!’’ అని అనిపించే వరకు శ్రవణ-మననముల అభ్యాసము అత్యావశ్యకము. (ప్రాణాయామము, ఆరాధన,పూజ, సాకారోపాసన మొదలైన ఇవన్నీ అభ్యసించటమును అందుకు ఉద్దేశ్యించారు).
‘‘అనుకోవటము - అనిపించుటము’’ అను బ్రాహ్మీవృత్తిని అభ్యసిస్తున్నవాడై ఉండకపోతే? (మరియు) రాగ-ద్వేషవృత్తులను కొనసాగిస్తూనే ఉంటేనో? అట్టివాడు తెలిసి తెలిసి అజ్ఞాన దశను విడచిపెట్టనట్లే అగుచున్నది. ఆతడు అజ్ఞానియేగాని, సుజ్ఞానికాదు. ఇక ఆతని పట్ల ‘పునరపి జననం-పునరపి మరణం’ అను దేహ-దేహాంతర రాకపోకలు తప్పునవి కావు. పునః ఆయాంతి యాంతిచ!
అట్టి సుస్థిరమైన - నిశ్చలమైన - సర్వమును సర్వదా బ్రహ్మముగా దర్శించు ‘బ్రాహ్మీవృత్తి యొక్క సిద్ధత్వము’ పొందినవారు ఉన్నారా? ఓ"! తప్పకుండా ఉన్నారు. మనకు (పౌరాణికంగానో, చారిత్రకంగానో, వినికిడిగానో) కొన్ని పేర్లు మాత్రమే తెలిసి ఉండవచ్చుగాక! కానీ బ్రాహ్మీ దృష్టిని పూర్ణముగా సిద్ధించుకొన్నవారు తప్పక సర్వకాలములలోను, సర్వజీవజాతులలోను అనేకులు ఉండియే ఉన్నారు.
బ్రహ్మమానసపుత్రుడగు సనకుడు, వ్యాసపుత్రుడగు శుకమహర్షి మొదలైన ఎందరో మహానుభావులు!
వారు ఒక నిముషంలో అర్ధభాగం కూడా ‘బ్రాహ్మీవృత్తి’ని విడనాడి ఉండరు.
కార్య-కారణ రహితత్వం
ఒక వ్యక్తి దూరంగా కనిపిస్తున్న బాటలో నడిచి వెళ్ళుచున్నట్లుగా కనిపిస్తోందనుకోండి. ఆ ‘నడవటము’ అనే కార్యము నడచువానికి భిన్నమా? కాదు. అట్లాగే ఒక కార్యమునకు అద్దాని కారణము భిన్నము కాదు. కారణము చేతనే కార్యము ఏర్పడినదిగా అగుచున్నది.
ఇప్పుడు… కారణమును తొలగిస్తేనో? కార్యమే ఉండదు కదా!
అనగా, ‘నడచువాడే లేడు’ అనునది (సత్యమును పరిశీలించినప్పుడు) సిద్ధించిందనుకోండి. అప్పుడు ‘నడవటము’ అనునది తనకు తానే లేనిదగుచున్నది కదా!
‘‘ఈ జగత్తుకు, జీవాత్మకు కారణము తత్త్వతః లేదు. ఎందుకంటే, ‘‘ఆత్మ సదా నిష్క్రియము, కారణత్వమునకు సంబంధించనట్టిదది’’ - అని తత్త్వార్థపూర్వకంగా ఎరిగినప్పుడు, అట్టి విచారణచే ‘‘అద్వితీయమగు ఆత్మపట్ల జగత్తు, జీవాత్మల కారణత్వము లేదు’’.. అనునది సుస్పష్టమగుచున్నది.
విచారణచే ‘‘జగత్తు-జీవాత్మలు (That being experienced and experiencer).. ‘లేనివే’ అను అభావము పొందుచున్నాయి. అనగా ‘‘ఆత్మయే ఒకానొక అవిజ్ఞాత దృష్టిచే (లేక) అవిచారణదృష్టిచే జగత్తు -జీవాత్మలుగా అగుపించుచున్నది’’.. అను ‘‘కార్య అభావము’’ సిద్ధిస్తోంది.
ఎప్పుడైతే వాక్కుకు కూడా అగోచరము, శుద్ధము అగు ఆత్మ వస్తువు వృత్తి జ్ఞానముచే (శుద్ధ) చిత్తమునకు పరమై అనుభూతమగుచున్నదో- అప్పుడిక ఈ ఇంద్రియ జగత్తు, జగత్తును ఇంద్రియములతో అనుభూతపరచుకొన్న ద్రష్ట కూడా-శుద్ధము అగు ఆత్మకు వేరై ఉండవు! అనగా అప్పుడిక జీవాత్మ-జగత్తులు కూడా శుద్ధమగు ఆత్మగానే - శుద్ధమగు చిత్తమునకు నిత్యానుభూతమై ఉంటాయి. సస్వరూపాత్మయొక్క సంప్రదర్శనమే ఈ సమస్త జగత్ - దృశ్యము కూడా.
నాటకములో రచయితది కానిదేది? అయినది ఏది? అట్లాగే దృశ్యములో ద్రష్టకు చెందినదేది? చెందనిదేది?
ఒకడు ఏ వస్తువును తీవ్ర చింతనతో ఏ విధంగా భావనచేస్తే, అది ఆ రీతిగానే అనుభూతమగుచున్నది.
‘‘దృశ్యములో కనిపించే అనేకత్వమంతా సత్యమే’’ అను భావనచే ఇదంతా ఆత్మకు భిన్నమువలె, (ద్వైతమై) అనుభవమగుచున్నది.
అందుచేత ‘‘దృశ్యమానమగు (కళ్లకు ఎదురుగా కనిపిస్తున్న) ఈ జగత్తు - అదృశ్యమాన స్వరూపమగు ఆత్మయే అయి ఉన్నది’’ అను నిశ్చయాత్మక బుద్ధిని ప్రవృద్ధ పరచుకోవాలి.
ఈ సర్వము బ్రహ్మాకారముగా చింతన చేయాలి!
దృశ్యగ్ం హి అదృశ్యతాం నీత్వా బ్రహ్మాకారేణ చింతయేత్!
సర్వము స్వస్వరూప ‘చిత్‌రస పూర్ణము’గా దర్శించుచు, నిత్యానిత్య వివేకియగు విద్వాంసుడు ఆత్మసుఖమును సర్వదా, అనునిత్యముగా ఆస్వాదించుచున్నాడు.
2వ అధ్యాయము : అఖండ - ఏక రస చిన్మాత్రము
ఒకానొక సమయములో షణ్ముఖుడు, దేవసేనాధిపతి, లోకకల్యాణమూర్తి అగు కుమారస్వామి, పితృదేవులగు పరమశివ స్వామిని సమీపించి, సాష్టాంగ దండప్రణామములు సమర్పించి ఈ రీతిగా పరిప్రశ్నించసాగారు.
కుమారస్వామి: హే భగవాన్! అస్మత్ పితృదేవా! జగత్ పితా! సర్వతత్త్వాత్మకా! సర్వతత్త్వ స్వరూపా! శివమహాదేవా! ‘‘స్వస్వరూపమగు ఆత్మ అఖండము - ఏకరసము అయి ఉన్నది’’ అని ఆత్మజ్ఞులు అభివర్ణిస్తున్నారు. అట్టి ‘‘అఖండ ఏకరస చిన్మాత్రము’’ గురించి మీ నుండి సవివరణగా వినాలని అభిలషిస్తున్నాను. దయతో వివరించప్రార్థన!
ఎందుకంటే, మా బుద్ధి ‘నేను - నీవు-జగత్తు’ మొదలైన రూపములతో కూడిన ఖండత్వము త్యజించలేకపోతోందే? మరిక, అఖండమగు ఆత్మదృష్టి మాపట్ల సిద్ధించేది ఎట్లా? దయతో దారి చూపండి.
పరమ శివ భగవానుడు : ఓ ప్రియకుమారస్వామీ! మయూరాసనా!
అఖండము … ఖండముగా కానట్టిది,
ఏకము … అనేకంగా కనిపిస్తూ కూడా సర్వదా ‘ఏకమే’ అయి ఉన్నట్టిది -
అగు ఆత్మయే ఇదంతా కూడా. నీవు-నేను-తదితరులు → మనమంతా కూడా సర్వదా అఖండాత్మ స్వరూపులమే!
దృష్టాంతములు :
✤ నాటకంలో అనేక పాత్రలు - ఆ పాత్రలకు ఆయా స్వభావాలు ఉండవచ్చుగాక! అవన్నీ అఖండము-ఏకము అగు నాటక రచయిత యొక్క ‘రచనా శైలి’ యేకదా అట్టి ఊహాచైతన్యము ఒక్కటే కదా!
✤ వినటము, చూడటము, స్పర్శానుభవము మొదలైనవి వేరువేరే అయినప్పటికీ - అవన్నీ తనవైన ఈ దేహియొక్క అనుభూతి అనుభవము ఒక్కటే కదా!
✤ కలలో అనేక విధములగు వస్తువులు, జనులు, ఆ జనుల స్వభావములు, స్వప్నాంతర్గద్రష్ట. ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఆతీరుగా కనిపించేవన్నీ స్వప్నము తనదైన వాని ఏక-అఖండ స్వప్నకళాచైతన్యము యొక్క సంప్రదర్శనమే కదా!
(1) సందృశ్యమై కనిపిస్తున్న ఈ ‘జగత్తు’ భావనా వైచిత్ర్యమే. అట్టి ‘భావన’, ఆ భావన తనదైయున్నట్టి భావికుడు (స్వస్వరూపము), భావించబడినది-ఈ మూడూ కూడా (జగత్తు, భావన, భావించువాడూ కూడా) అఖండేకరస రూపమే! అఖండ బ్రహ్మమే! అఖండాత్మయే!
ఈ జగత్తు, ఇది విషయముగా కలిగియున్నట్టి మననము, మంత్రము, ఈ దేహ-ఇంద్రియ-మనస్సులతో నిర్వర్తించబడే సర్వక్రియలు, ఆ క్రియలు నిర్వర్తించుటకై ఆధారమైయున్న జ్ఞానము.. ఇవన్నీ అఖండైకరసరూపమగు ఆత్మయే! బ్రహ్మమే!
అట్లాగే జలము, భూమి, ఆకాశము, మహనీయుల స్వానుభవములు, వారి వాక్కులను, గ్రంధీకరించే ఋక్-యజో-సామ త్రివేదములు.. అఖండైక రసరూపమే!
సృష్ట్యభిమాని అగు బ్రహ్మ, వేద-పురాణ-ఇతిహాసములచే జీవుల ఉద్ధరణ కొరకై చెప్పబడుచున్న వ్రతములు, అవన్నీ అనుసరించే ఈ జీవులు.. అంతా అఖండైక రసమే!
ప్రజాపతియగు అజుడు అదియే! ఈ సృష్టికి కర్తయగు బ్రహ్మ, ఇద్దానిని పరిపోషిస్తూ రక్షించుచున్న హరి, లయకారకుడగు రుద్రుడు, ఈ సృష్టికి సాక్షినై దర్శించుచున్న ‘‘నేను’’.. అంతా అఖండైక రసబ్రహ్మమే!
‘ఆత్మ’ అనబడునది, అట్టి ఆత్మను నిర్వచించి ‘తత్త్వమసి’ అని బోధిస్తున్న గురువు, ఆ గురువు తన శిష్యునికి గుర్తు చేస్తున్న సత్‌లక్ష్యము, కేవల బుద్ధి స్వరూపమగు ‘మహత్తు’ - ఇవన్నీ అఖండైక రసస్వరూపమే!
ఈ భౌతిక దేహము, అంతరంగ విభాగములగు మనస్సు (ఆలోచనలు), బుద్ధి (విచక్షణ చేయు విభాగము), చిత్తము (ఇష్టము), వ్యష్టిగతమైన అహంకారము - అన్నీకూడా అఖండైక రసరూపములే! ఆత్మను బోధించు విద్య, ఆ విద్యచే పొందబడు అవ్యయాత్మ - అఖండైకరసమే! ‘కించిత్’ అనబడు ఇంద్రియ విషయజగత్తు, జీవుడు(ఇహాత్మ), వీటికి, పరమైయున్న పరాత్మ (పరము)-అన్నీ అఖండమే!
ఓ షడాననా! అఖండ-ఏక రసమగు ఆత్మకు వేరై ఏక్కడా ఏదీ లేదు. లేదు. ఏ ఒక్కరు అఖండైకరసమునకు వేరుకాదు. అహంకారము, మమకారము మొదలైనవి కూడా అఖండైక రసరూపమే!
ఇక్కడ స్థూలముగా (పాంచభౌతాత్మికమై)కనిపించేది, సూక్ష్మంగా (మనోబుద్ధిచిత్త అహంకార రూపములుగాను, సూక్ష్మదేహంగాను) కనిపించేది, తెలియబడుచున్నదై కనిపించేది, అట్లాగే నీవు-నేనుగా కనిపించేది.. అంతా ఏకరసమే!
ఎదురుగా ప్రదర్శితమై కనిపించేది, రహస్యమై ఎదురుగా కనబడక దివ్యశక్తియుతులగు దేవతల క్రియా రూపంగా సృష్టి రచనకు కారణమగుచూ ఉండి ఉన్నట్టిది, ఇదంతా తెలిసికొనియున్న జ్ఞాత, ఇక్కడ స్థితి-గతి కలిగియున్నవి…ఇవన్నీ సర్వదా ఆనందైక రసమే.
తల్లి, తండ్రి, భర్త, భార్య, సోదరులు.., ఈ జీవులను పరస్పరము సంబంధ రూపముగా కలిపి ఉంచే అంతర్గత సూత్రము (సూత్రేమణి గణా ఇవ), విరాట్ రూపము, వ్యష్టి శరీరములు, ఆ శరీరముల ఆలోచనా విభాగములు, ఈ సర్వ జీవులలోని అంతరంగ-బాహ్యరంగములు- ఇవన్నీ సర్వదా అఖండానంద ఆత్మ రూపమే!
సూత్రప్రాయంగా చెప్పబడేవి, సవివరణాత్మకముగా చెప్పబడేవి, దానం చేయబడేవి, ఆస్వాదించబడేవి, మనస్సు యొక్క అంతర్ విభాగము, బహిర్ విభాగము - అంతా అఖండాత్మయే!
ఇక్కడి సర్వము అయినట్టి పూర్ణము, మార్పుచేర్పులను పొందువిభాగము.. అంతా అమృతైక రసమే!
ఇల్లు, వాకిలి, కుటుంబజనులు, సగోత్రీకులు, తదితరులు, చంద్రుడు, నక్షత్రములు, సూర్యుడు, క్షేత్రములు, క్షేత్రపాలకులు, గుణములు, ఆ గుణములు సశాంతించినప్పటి శాంతి, జగత్తులో సంచరించు జీవునియొక్క ఉనికి, (జీవునిలోని) సాక్షి, సర్వజగత్ సర్వసాక్షి… అంతా ఏక అఖండ రస తత్త్వమే!
ఈ జీవుని యొక్క ప్రేమించే సహృదయులు, బంధువులు, స్నేహితులు, మధ్యస్తులు, తదితరులు, రాజు, అంతఃపురము, రాజ్యము, ప్రజలు, ఈ జీవుని తరింపజేయు మార్గములో జపము, ధ్యానము, ధ్యానముచే పొందబడు పదము (స్థానము), ధ్యానముచే గ్రహించబడునవి, ‘‘సర్వదేహములలోని ‘నేను’ నేను’’ అను రూపముగల మహదత్వము… అంతా అఖండైక రస సంప్రదర్శనమే!
ఆత్మజ్యోతి, అఖండ జ్యోతి, సర్వమును వెలిగించు జ్యోతి, ఘనీభూతమై కనిపించే అనుభవములు, భుజింపబడేవి, యజ్ఞములో సమర్పించబడే హవిస్సు, హోమద్రవ్యములు, హోమవిధానములు, జపములు, యజ్ఞఫలములు అయినట్టి స్వర్గాది లోకములు, ఆ యజ్ఞఫలముగా - ఊర్థ్వలోకములు పొందుచున్న ఈ జీవులు (యజ్ఞకర్త)….. ఇవన్నీ అఖండైక రసమే!
సర్వము చిన్మాత్రముగా భావన చేయు చిన్మాత్రము కూడా అఖండైక రసరూపమే సుమా!
ఇట్టి అభ్యాసపూర్వకమైన దృష్టి-అవగాహనలచే నీయొక్క అఖండైక రస స్వస్వరూపము నీకే సాక్షాత్కారము కాగలదయ్యా!
చిన్మాత్ర భావన
అంతా ఎరుగుచున్నట్టివాని ఎరుక రూపమే! |
చిత్ = ఎరుక. చిన్మాత్రము = (1) ఎరుగువాడు + (2) ఎరుగుబడునది + (3) ఆ ఎరుగువానిని సాక్షి అయి దర్శిస్తున్నవాడు
(Knower + Known + Witness to The Knower)
ఈ కనబడేదంతా - ‘‘నా యొక్క కేవల స్వరూపమగు ‘ఎరుక’యే - ‘ఎరుగబడుచున్నది’గా అయి, ఎరుకచే పొందబడుచున్నది’ - అనునదే పరమ సత్యమగు చిద్భాము.
ఈ ఎరుగబడేదంతా స్వకీయ చిన్మాత్రమే! కేవల సాక్షియే లేనప్పుడు ‘ఎరుగుచున్నవాడు’ కూడా ఉండజాలడు. ఎరుగబడేదీ ఉండదు! కనుక ఈ తెలియబడుచున్న సర్వము కేవల చిన్మాత్రరూపమే! చిన్మయమే!
మట్టి బొమ్మలన్నీ మట్టియే అయి ఉన్న తీరుగా.., తెలియబడుచున్నదంతా స్వకీయ చిత్ చైతన్య స్వరూపమే!
‘ఆత్మభావన’చే ఇదంతా ఆత్మచిన్మాత్రమే అగుచున్నది! (దృష్టాంతము: గాఢ నిద్రలో ఉన్నవానికి జాగ్రదనుభవి - జాగ్రత్ దృశ్యము ‘లేనివే’ అయినవగుచున్నాయి కదా!)
→ ఆత్మభావన కూడా చిన్మాత్రమే! అదీ అఖండైక రసమే!
→ ఈ సర్వలోకములుబీ ఆయా లోకములలో తారసబడుచున్న నీవు, నేను, నీది, నాది, పంచభూతములు (ఆకాశము-భూమి- జలము-వాయువు-అగ్ని), బ్రహ్మదేవుడు, హరి, శివుడు.. మొదలైన ఇవన్నీ కేవల చిన్మాత్ర స్వరూపములే! ఏది కించిత్తుయో, ఏది మహత్తరమైయున్నదో.. అదంతా చిన్మాత్రమే.
అఖండైక రసముగా మనము ఇక్కడ వివరించి చెప్పుకొనినవన్నీ కూడా, అంతా కూడా చిన్మాత్రమే!
→ ఇప్పుడున్నది, ఇతఃపూర్వము ఉండి ఉన్నది, ఇక ఉండబోవునది.. అంతా చిన్మాత్రమే!
అనగా, ఒకనికి అనుభవమగుచూ ఉన్న సమస్తమూ - ఆ ఎరుగుచున్న వాని ఎరుకరూపమే! అఖండరూపమే!
→ ద్రవ్యము, కాలము, జ్ఞానము (process of knowing), జ్ఞేయము (That which is being known), జ్ఞాత (The knower)… అంతా చిన్మాత్రమే! సర్వసంభాషణలు, అసత్, సత్ - ఇవన్నీ మొదటి నుండి చివరి వరకు చిన్మాత్రమే!
→ సర్వము ఆద్యంతము చిన్మాత్రమే! గురువు-శిష్యుడు-వారివారి పరస్పర భావనా దృష్టులతో సహా చిన్మాత్రస్వరూపులే! ఈ ద్రష్ట-దృశ్యము స్వతఃగా సత్యమే అయి ఉంటే, ఇదీ చిన్మాత్రమే! సూర్యుడు, చంద్రుడు, దేహము, దేహి, లింగశరీరము (భావనా శరీరము, సంస్కార శరీరము, సంకల్ప రూపశరీరము), కారణ శరీరము.. ఇవన్నీ కూడా చిన్మాత్రమే. భక్తుడు - ఇష్టదైవము ఉభయులు చిన్మాత్ర స్వరూపులే.
→ ఎరుక+ఒక తీరుగా ఎరుగుట + ఎరుగబడునది - ఇవన్నీ కూడా ఏక - అఖండమగు - చిన్మాత్ర శరీరమునకు వేరుకాదు. అట్టి చినాత్రము ఆత్మయొక్క తేజో విభవమే.
⌘
ఆహా! ఈ చిన్మాత్రము ఎంత ఆశ్చర్యమైనది! సర్వాశ్చర్యం చ చిన్మాత్రం!
🌹 తెలుసుకొంటూ ఉన్నదీ తానే! 🌹 తెలివి తానే! 🌹 తెలియబడుచున్నదంతా తానే!
ఇట్లయి ఉండి కూడా, అట్టి చిన్మారతము - సర్వమును తనకు వేరైనట్లు దర్శించుచూ, (తన స్వరూపమగు, తనకు అభిన్నమగు) ‘‘తెలియబడుదానిచే’’ ‘నిబద్ధత’ (Bounded) పొందుచూ ‘సంసార బంధము’ పొందుచున్నది. (The knower is being encompased by his own facet of knowing). (దృష్టాంతము → స్వప్నసందర్భము)
ఈ జీవుడు చిన్మయ స్వరూపుడే అయి ఉండి, తన ‘‘చిన్మయమహత్మ్యము’’ నుండి ‘అన్యము’ను కల్పించుకొని, ఆ అన్యము నందు చిన్మయరూపబంధము పొందుచూ - ‘‘ఇప్పుడు నేను బద్ధుడను! ఓ చిన్మయ పరమాత్మా! మీరెక్కడున్నారు! రండి! నన్ను బంధము నుండి తొలగించండి’’ అని - తన యొక్క నిత్యనిర్మల స్వరూపమగు ‘కేవల చిన్మయమును ఎలుగెత్తి ప్రార్థన చేయుచున్నాడు.
ఓ కుమారస్వామీ! అహమ్ త్వమ్‌చైవ చిన్మాత్రమ్. నీవు-నేను - బంధము- మోక్షమూ అంతా చిన్మయమే.
మూర్తీభవిస్తూ (As form) కనిపించేది, మూర్తీభవించటమును నిర్వర్తిస్తూ తాను మాత్రము ఏమాత్రము మూర్తీభవించక అమూర్తమై (one that is exhibiting all forms while one’s own self is continuing as non-exhibitive)… యున్నది - ఉభయము అఖండ - ఏక చిన్మాతమ్రే!
పుణ్యం పాపం చ చిన్మాత్రమ్: ‘ఇది పుణ్యము-ఇది పాపము’.. అని అనుకోబడేది, చెప్పుకోబడేది.. ఆ పాపఫలములు, పుణ్యఫలములుగా భావించబడేది.. అవన్నీ అట్లు అనుకోవటం చేతనే ఆ రూపమై సిద్ధిస్తున్నాయి. కనుక చిన్మాత్రరూపములే!
ఒకటి ఒకతీరుగా అనుకుని, అట్లు ఎరిగి, అట్లే పొందటమే చిన్మాత్రరూపప్రదర్శనా చమత్కారము! (యత్ భావమ్ తత్‌భవతి)
దేహః చిన్మాత్ర ఏవహి : ఈ భౌతిక దేహము, ఇందులో భౌతికంగా కనిపించే వస్తుజాలము, ఇంద్రియ ప్రదర్శనలు, దేహి.. ఇవన్నీ చిన్మాత్ర రూపమే!
స్థూల శరీరము … Physical Body.
లింగ శరీరము … Thoughts and Feelings Body. Experiencing Body.
కారణ శరీరము … A body which is cause to లింగ శరీరము. Habit-derived Body.
శరీరి … One who is operating all above.
…. అన్నీ చిన్మాత్రమే!
చిన్మాత్రమునకు వేరుగా సంకల్పము (Assumption and Visualization) గాని, వేదనము (Experiencing) గాని లేవు. అనుభవరూపమైనదంతా ‘‘కేవల చిన్మాత్రము’’ అనే ముడిపదార్ధము (Raw-material)తో రూపుదిద్దుకొన్నవే! ఈ జీవుడు సర్వదా కేవల చిన్మాత్ర స్వరూపుడే!
⌘
చిన్మయ రూపమునకు వేరుగా మనన రూపమగు మంత్రము లేదు. మంత్రదేవతా లేదు. ఇంద్రుడు-వరుణుడు-వాయువు-యముడు మొదలైన దిక్పాలకులు లేరు. ఈ పాంచభౌతిక వ్యవహారికమైనది, భౌతికంగా వ్యవహారముగా కనిపించనట్టి దేవతా ప్రజ్ఞలు (సృష్టిని తమ ప్రజ్ఞతో నామరూపాత్మకంగా చేస్తూ ప్రదర్శించువారు) లేరు. చిన్మాత్రమునకు వేరుగా ‘ఆవల గల నేను’ అను అన్యస్థితమగు పరబ్రహ్మము లేదు. చిన్మాత్రము (తెలివి-ఎరుక-ధ్యాసరూపము)నకు వేరు ఎక్కడా ఏదీ ఏ మాత్రమూ లేదు. వేరై ఎవ్వరూ లేరు. శివుడనగు నేను (వేరుగా) లేను. షణ్ముఖుడువగు నీవూ చిన్మాత్రమునకు వేరు కాదు.
చిన్మాత్రమునకు వేరుగా…
⌘ ‘లేనిది ఉన్నట్లుగా కనిపించటము - ఉన్నది లేనట్లుగా కనిపించటము’’.. అనబడే ‘మాయ’ లేదు.
⌘ మరొక పూజనీయమైనది ఏదీ లేదు. పూజనీయము (దేవత-గురువు ఇత్యాదులు)గా స్వీకరించబడుచున్నదంతా చిన్మాత్రమే!
⌘ మననము చేయబడుచున్నదేదీ (చిన్మాత్రమునకు అన్యమై) లేదు. మనస్సుచే మననము చేయబడుచున్నదంతా చిన్మాత్రమే!
⌘ నాస్తి సత్యమ్! చిన్మాత్రమునకు వేరై ఉనికి కలిగియున్నది ఏదీ లేదు!
⌘ స్థూలమయ - ప్రాణమయ - మనోమయ - విజ్ఞానమయ - ఆనందమయ పంచకోశములూ లేవు. అవన్నీ స్వకీయ చిన్మయ (ఎరుక) రూపమే!
⌘ ఈ భౌతిక వస్తు-భౌతిక దేహ రూప నిర్మాతలు (The engineers of All physical forms) అగు అష్టవసువులు లేరు. ఆ ప్రజ్ఞలన్నీ (దివ్యప్రజ్ఞారూప దేవతలంతా) చిన్మయానందరూపులే!
⌘ ‘సర్వము లేవు’ అని మౌనము వహించు కేవలాకాశమూ లేదు. అట్టి మౌనము చిన్మయ స్వరూపమే!
⌘ అనురాగము-విరాగము లేదు. వైరాగ్యము (దేనిపట్ల మమకారము-ధ్యాస-ఆశలేనట్టి స్థితి) కూడా చిన్మయరూపమే.
సర్వమ్ చిన్మాత్రమేవ హి…!
అంతా చిన్మాత్రమే అయి ఉన్నది!
⌘ ఏదేది కారణకారణమై యున్నదో…,
⌘ ఏదేది కార్యరూపమై దృశ్యరూపముగా అనుభూతమగుచున్నదో…,
⌘ ఎక్కడ ఏదైతే దూరంగా ఉన్నట్లు అనుభూతమౌతుందో…,
⌘ ఎక్కడ ఏదేది పాంచభౌతికంగాను, జీవుల రూపముగాను అగుపిస్తూ ఉన్నదో…,
⌘ ఎక్కడ ఏదేది ఆశయము (Objective, Target) రూపముగా లక్ష్యమై ఉన్నదో.., ఎక్కడ ఏదేది తెలియబడుచున్నదానికి ఆవల తెలుసుకుంటూ ఉన్నట్టి వేదాంత రూపము (వేదముతెలియబడునదిబీ అంతము = ఆవల :: తెలుసుకొనుచున్నట్టిది). - అయి ఉన్నదో…,
అట్టి సమస్తమూ స్వయముగా ‘స్వకీయమగు ఎరుక’ రూపమే! చిన్మాత్రమే!
అఖండైక రసబ్రహ్మమే! బ్రహ్మమే అయి ఉన్న కేవల చిన్మాత్ర ప్రదర్శనా చమత్కారమే? చిన్మాత్రమునకు వేరై ఎక్కడా ఏదీ లేదు. సర్వగమనములు (All Movements from place to place as well as mental state to state)… చిన్మాత్రమయములే!
స్వకీయ ఎరుకచే నిర్మించుకోబడుచున్నవే జగత్ పరంపరలు! - ఇదంతా నీవే!
బంధము - మోక్షము కూడా ‘ఎరుక’కు సంబంధించినవే! కనుక చిన్మాత్రరూపములే! ఏ లక్ష్యముతో మోక్షార్ధీయి ముముక్షువులు
యత్నశీలురై ఉన్నారో.. అది కూడా చిన్మాత్రమునకు ఏ మాత్రము వేరుకాదు.
అఖండైకరస రూపమగు చిన్మాత్రమునకు వేరుగా జీవుడు లేడు. శివుడు లేడు!
ఓ ప్రియ కుమారస్వామీ! షణ్ముఖా! ఒక ముఖ్యమైన రహస్యము చెప్పుచున్నాను.. విను!
తత్‌త్వమ్। శాస్త్రములయందు, నా యందు, నీ యందు అఖండైక రసస్వరూపుడవై నీవే సర్వదా ప్రకాశించుచున్నావు. నీవు కానిదేదీ నీకు అన్యంగా ఏమాత్రమూ ఎప్పుడూ లేదు.
(జీవా! నీవే బ్రహ్మమని స్మృతి తెలుపంగ, నీకేలా తెలియదు, లేరా! పరబ్రహ్మరూపము నీవై ఉండగ…. మరుపేల వచ్చెను? లేరా! జీవా! నీవే బ్రహ్మము!)
⌘
ఇదంతా నేనే! సోఽహమ్।
‘‘ఈ సర్వలోకములయందు, సర్వ జీవులయందు, సర్వదేవతలయందు, సర్వలోకస్థులయందు అఖండ-ఏకరూపుడనై, కేవల చిన్మత్ర స్వరూపుడనై సర్వత్ర సమముగా ప్రకాశించుచున్నది నేనే! మమాత్మయే! అహమస్మి ఇదమ్ సర్వమ్। సంశయో నాస్తి తత్ర।
ఈ సర్వము నాయొక్క అఖండ-అప్రమేయ చిన్మాత సంప్రదర్శనమే! … యిట్టి సకృత్ (I am the maker and worker for all else) అను జ్ఞానముచే, సర్వము ఏకరూపముగా స్వస్వరూపముగా దర్శించు అభ్యాసముచే ఈ జీవుడు ముక్తుడే అగుచున్నాడు..
సమ్యక్ (సర్వ సమస్వరూపమగు ఆత్మయే నేను అను) జ్ఞానముచే ఈ జీవుడు తనకు తానే ‘గురువు’ అగుచున్నాడు (ఆత్మైవహి గురుః). అంధకారమంతా తొలగిపోగా తానే సర్వమై వెలుగొందుచున్నాడు. (అహమ్ సర్వస్య ప్రభవో।)
⌘
3వ అధ్యాయము : స్వ-ఆత్మానుభవమ్
శ్రీకుమారస్వామి: ఆత్మానుభవమ్ అనుబ్రూహీతి।
తండ్రీ! మేము దేహానుభవము, దృశ్యానుభవము, సుఖ-దుఃఖానుభవము, లోకానుభవము, జన్మానుభవము మొదలైనవన్నీ అనుశ్రుతంగా పొందుచూ ఉన్నాము. ఆత్మానుభవమే ఈ జీవుని జన్మ-కర్మల పరమాశయము కదా! అట్టి ఆత్మానుభవము సిద్ధించుకొన్న వాని స్వానుభవము ఏ విధంగా ఉంటుందో, దయతో వివరించండి.
శ్రీ పరమశివుడు : ‘‘ఆత్మమేవాహమ్’’ అనుభవము→ ఈ జన్మ-కర్మ విశేషాలతో సహా దేని చేతనూ స్పృశించబడక, సర్వమునకు అప్రమేయమై, కాలగతిచే మార్పు చెందక, అనునిత్యంగా స్వానుభవమై ఉంటోంది. ఆత్మజ్ఞానము యొక్క పరిపక్వతచే ‘‘సర్వాంతర్యామి- సర్వస్వరూపము-సర్వము అయి ఉన్నది నేనే కదా!’’.. అను ఆత్మానందమునందు ఆత్మానుభవి డోలలాడుచూ ఉంటున్నాడు.
★ ఇక్కడి ఉన్నదంతటికీ (ఇహమునకు) ఆధారమై, అసంగమైయున్న పరబ్రహ్మ స్వరూపుడను నేను. మట్టియే మట్టి బొమ్మలకు ఆధారమై మట్టిగానే ఉండిఉండు రీతిగా, నేను సర్వస్వరూపుడను.సర్వాతీతుడను. పరబ్రహ్మస్వరూపుడను. పరబ్రహ్మ స్వరూపోఽహమ్।
★ ఇహానందము ఒక వస్తువుపైనో, సంఘటనపైనో, సంబంధముపైనో ఆధారమై జనిస్తోంది. ఏ ఆనందముకొరకై సకల లోక జీవులు దేవులాడుచున్నారో, అట్టి ఆనందమే నా స్వాభావిక స్వరూపము. పరమానందమే నేను! పరమానందమస్మ్యహమ్ ।
★ నిర్హేతుక - ఆనంద స్వరూపుడను. (I need no external reason to be happy. It is my own natural form)
★ ఏ‘జ్ఞానము’ మునుముందుగా ఉండి ఉండటము చేతనే సర్వము ఎరుగబడుచున్నదో,.. అట్టి తెలియబడటానికి ముందే ఉన్నట్టి కేవలం జ్ఞానరూపోఽహమ్।
★ ఇక్కడ తారసబడే దృశ్య - ఇంద్రియ - దేహ - మనో - బుద్ధి - చిత్త - అహంకార - జీవాత్మ - ఈశ్వరాత్మలకు పరము (Beyond) - అయి ఉన్నాను. కేవలుడనై (As Absolute prior to commenament of Relativity at its core) ఉన్నాను. కేవలమ్ పరమోస్మ్యహమ్।
★ జాగ్రత్- స్వప్న-సుషుప్తులు నాయందు ప్రదర్శితమగుచూ లయిస్తూ ఉండగా, నేను పరమశాంతుడనై, మౌనముగా సాక్షినై ఉన్నాను. కేవలమ్ శాంతరూపోఽహమ్। శాంతానందాత్మస్వరూపమును వీడని వాడనై చిరునవ్వుతో జాగ్రత్-స్వప్న-సుషుప్తులను చూస్తూ ఉన్నట్టివాడను. దేహముల రాక - పోకలు కూడా స్వకీయ వినోదములోని కించిత్ సందర్భములు.
★ నాయొక్క ఎరుక (చిత్)నుండియే ఎరుగుచున్నవాడు (The knower), ఎరుగుట (knowing), ఎరుగబడుచున్నది (That being known) లీలా వినోదముగా ప్రదర్శనమగుచున్నాయి. ఈ అన్ని లోకములుగా తెలియబడుచున్నదంతా నా చిన్మయానందరూపమే! కేవలమ్ చిన్మయోస్మ్యహమ్ । ఎవరు ఎక్కడ ఏది ఎట్లా ఆస్వాదించినాకూడా, అది నాయొక్క చిన్మయానందరూపమే.
★ ‘కాలము’ (Time factor) నా చిన్మయరూపమే! కాబట్టి త్రికాలములకు (The past, the present, the future) ఆవల నిత్యస్వరూపుడనై వెలుగొందువాడనై ఉన్నాను. కేవలమ్ నిత్యరూపోఽహమ్। నిత్యానందస్వరూపుడను.
★ ఈ జగత్తుల రాక - పోకలకు ఆవల శాశ్వతమై ఉన్నట్టివాడను. జగత్తు ఊహాకల్పితమై ఉండగా, నేను ఊహకు జననస్థానమై ఉన్నట్టివాడను. కేవల శాశ్వతోస్మ్యహమ్।
★ నేను కేవలము ఉనికి (సత్) స్వరూపుడనై ఉండగా, నా కేవలసత్ యొక్క ఒక్క కిరణమువలననే ఈ భౌతిక దేహములు, లోకములు, లోకపాలకులు.. మొదలైనవన్నీ కించిత్ ‘సత్’ను పొంది ప్రకాశమానమగుచున్నాయి. విలక్షణమగు సత్‌స్వరూపుడనై ఉన్నాను. కేవలగ్ం సత్యరూపోఽహమ్। ‘‘నేను ఉన్నాను కదా’’.. అను నాయొక్క సత్ నుండియే సర్వము ఉనికిని పొందుచున్నది. కేవల సత్‌స్వరూపుడనై ఈ సర్వమునకు సత్తు (ఉనికిని) ప్రసాదించువాడను!
★ ‘అహమ్-నేను’ అను భావన నాయొక్క కేవల స్వరూపమునుండి బయల్వెడలుచున్నది. అనగా ‘అహమ్’ కన్నా కూడా మునుముందే కేవలుడనై ఉన్నట్టివాడను. ‘అహమ్’ అనునది ప్రదర్శించనప్పుడుకూడా అహమ్‌స్వరూపుడనై ఉన్నట్టివాడను. ‘నేను’కు కూడా జనస్థానమగు నేనై ఉన్నవాడను. ‘నేను’ను కదలించు నేనైన వాడను! అహమ్ త్యక్త్వా అహమస్మ్యహమ్! అందరిలోని నేను నేనే అయి ఉన్నట్టి వాడను! కనుక నేను ‘అహమ్’ పరిమితుడను కాను. జాగ్రత్-స్వప్న–సుషుప్తులలోని ‘నేను’ను త్యజించినా కూడా శేషించే ఉండే సర్వాతీతమగు నేనే ‘నేను’.
★ ఈ భౌతిక దేహమునకు ఆకారము ఉండవచ్చుగాక! దీనిని కదల్చు చైతన్య స్వరూపుడనగు నాకు ఏ ఆకారమూలేదు. నాయొక్క దేహిత్వ విశేషముచే దేహమును కదల్చుచున్నప్పటికీ, నాకు ఏ స్వరూపము లేదు. స్వరూపమే లేనట్టి స్వరూపుడను. సర్వహీన స్వరూపోఽహమ్।
★ ఈ ఎరుగబడుచున్న సర్వమునందు ‘ఎరుక’ అను రసమై ఉన్నట్టి వాడను. అనంతమగు ఎరుక స్వరూపుడను. అంతటా ‘ఎరుక’చే వెలయుచున్నట్టివాడను. చిదాకాశమయోస్మ్యహమ్ ! ‘ఎరుగుట’ అనునది ఏమాత్రము తరగని కేవల-ఎరుక స్వరూపుడను.
★ నాకై నేను జాగ్రత్-స్వప్న-సుషుప్తులు కల్పించుకొని, - నాయొక్క ఒక ‘అంశ’ - సంకల్పిత-అసంకల్పితంగా వాటిలో ప్రవేశ నిష్క్రమణములు నిర్వర్తిస్తూ ఉండగా వినోదిస్తున్నాను. అంతేగాని నేను జాగ్రత్‌లోనివాడను కాను. స్వప్నములోని వాడను కాను! సుషుప్తిలోని వాడను కాను! అందుచేత ‘4వ వాడు - చతురీయుడు-తురీయము’ అను పేరుతో శాస్త్రములు పిలుస్తున్నాయి. జాగ్రత్ - స్వప్న - సుషుప్తులు లేనప్పుడు కూడా… నేను తురీయస్వరూపుడనై ఉండియే ఉన్నాను. అందుచేత కేవల తురీయుడను. కేవల తుర్యరూపోఽస్మి!
★ అంతేకాదు. ఆ జాగ్రత్ - స్వప్న - సుషుప్తి సంచార స్వరూపునికికూడా ఆవల ఉండి, మౌనంగా - ప్రశాంతంగా - జాగ్రత్- స్వప్న - సుషుప్తి కల్పనలకు, ప్రవేశ - నిష్క్రమణలకు కర్తయగు తురీయమును కూడా మౌనంగా చూస్తూ ఉన్నట్టివాడను. కేవల నిష్క్రియ స్వరూపుడను. తుర్యాతీతోఽస్మి కేవలః!
★ ఆలోచనలను, భావములను, దృశ్యభావ-అభావములను నాచైతన్యశక్తిచే ప్రదర్శితము చేయువాడను. జాగ్రత్-స్వప్న-సుషుప్తులు, అందలి ఆయా విశేషములు నా చైతన్యస్వభావముచేతనే చేతనములై ఉంటున్నాయి. ‘‘నేను మానవుడును-దేవతను’’ మొదలైనవన్నీ చైతన్యపరచువాడను. నా చైతన్యశక్తి సర్వమునకు మునుముందుగానే ప్రకాశమానమై ఉన్నది. అద్దానికి కాల - దేశ - స్థాన పరిమితులు లేవు! ‘కథ’ వ్రాసేవాడు. కథలోని విషయములచే పరిమితుడా? కాదు కదా! ఈ విధంగా ఎల్లప్పుడు చైతన్యస్వరూపుడనై ఉన్నాను. సదా చైతన్యరూపోఽస్మి!
★ ఆనందమయమగు నా ఎరుకయే ఆనంద విశేష రూపమగు ‘ఎరుగబడురూపము’గా ప్రవర్తిల్లుచున్నది. ఇదంతా నా ఆనందమయ స్వీయ కల్పానా విన్యాసమే! ‘ఎరుక’ను వినియోగించి ఆనందించువాడను. చిదానందోఽహమ్! చిదానందయోస్మ్యహమ్!
★ నా యొక్క సహజస్వరూపము కేవలాకార స్వరూపము! కేవలాకార రూపోఽస్మి! దృశ్య-దేహ-జీవాత్మల దోషములచే ఏక్షణంలోనూ తాకబడను. కలలోని వస్తువుల దోషములు ఆ కల (స్వప్నము) తనదైన వానిని తాకవు కదా! నాటకములోని కొన్ని పాత్రల మంచి-చెడులు - నాటకమును రచించిన రచయితవి ఏక్షణములోనూ అవవుకదా! అట్లాగే కేవలాత్మాకారుడనగు నన్ను జన్మ-కర్మల దోషములు అంటజాలవు. శుద్ధరూపోఽస్మ్యహమ్ సదా!
★ జ్ఞానినై అనేక విషయములు తెలుసుకొనుచున్నప్పుడు,… ఆ తెలియబడే అన్నిటికీ మునుముందే కేవల జ్ఞానరూపుడనై ఉన్న వాడను! ‘‘అది తెలుసుకోవటము’’ - అనేది నా సహజ - కేవలీ రూపము. కేవలం జ్ఞానరూపోఽస్మి! నేను ప్రియత్వము ప్రదర్శిస్తూ, కొన్ని వస్తు-విషయ-వ్యక్తుల పట్ల ప్రియముగా ఉండవచ్చుగాక! అవన్నీ తారసబడకముందే కేవల ప్రియత్వము కలిగియుండటం చేతనే అది సిద్ధిస్తోంది. కాబట్టి కేవల ప్రియస్వరూపుడను. కేవలం ప్రియమస్మ్యహమ్!
★ సర్వ సంకల్పములకు మునుముందే ఉన్నట్టి సంకల్ప రహిత కేవలాత్మను! సంకల్పములకు ముందు, సంకల్పములు ఏర్పడుచున్నప్పుడు, సంకల్పములు లయించినప్పుడు కూడా యథాతథమగు తత్‌స్వరూపుడను. నిర్వికల్ప స్వరూపోఽహమ్!
★ (నవలా రచయిత-నవలవలె) సర్వము నేనే అయి ఉండటం చేత ‘ఇది కావాలి’ అనురూపముగల ‘కోరిక’ ఏదీ లేనివాడను. అన్నీ మట్టితో చేసిన బొమ్మలే అయి ఉండగా, అట్టి మట్టికి కొన్ని బొమ్మలపై మాత్రమే ఇష్టమనునది ఏముంటుంది? కల అంతా తనదై ఉండగా, కలలో కొన్ని వస్తువులు ఉంచుకోవాలనే ఈషణము ఆతనికి ఏముంటుంది? ఈ జగత్ దృశ్యమంతా నేనే అయి ఉండటం చేత.. నేను నిర్ - ఈహ (కోరిక రహిత) స్వరూపుడను! ఈ జగత్తంతా నా రచనా చమత్కారముగా రచించుట చేత, ఆత్మకు అభిన్నంగా దర్శించటం చేత ఎల్లప్పుడు ఆనందించువాడనై ఉంటున్నాను. సదానంద స్వరూపోఽహమ్! ఒకడు తాను వ్రాసిన ఒక నవలలోని సంఘటనలకు, పాత్రల పరస్పర సంబంధములకు (అనేక నవలలు వ్రాయురచయిత అయిన) తానే వికారములు పొందడు కదా! ఈ జగత్తంతా ఆత్మ యొక్క స్వీయ రచనా వైభవంగాను, నేను ఆత్మాస్వరూపుడుగాను గమనించుచుండటం చేత వికారములేవీ లేనివాడనగుచున్నాను. నిర్వికార స్వరూపోఽహమ్! ఆత్మగా మార్పు-చేర్పులు లేకుండటం చేత అవ్యయుడను.
★ ‘‘నేను - నీవు - దృశ్యజగత్తు - లోకములు - లోకపాలకులు’’.. ఇదంతా ‘సత్’ అను ఏకరసమే.. అని గమనించుచున్నాను. కేవల చిత్ స్వరూప విగ్రహుడనై ఇదంతా నా ‘ఎరుక’ యొక్క విన్యాసముగా దర్శించుచున్నాను. సత్-ఏకరస రూపోఽస్మి సదా చిన్మాత్ర విగ్రహః।।
★ ఆత్మనగు నాకు ‘‘నేను-నీవు-ఆతడు-ఈతడు’’ ఇత్యాది పరిచ్ఛిన్నత్వమే లేదు. అంతా అఖండ-ఏకరసాత్మయే అయి ఉండగా జీవుడు - ఈశ్వరుడు-దృశ్యము - అను భేదములు ఎక్కడివి? అపరిచ్ఛిన్న రూపోఽస్మి। అందుచేత ‘‘అనంతుడను కూడా’’ - అను ఆనందమును ఆస్వాదించుచూ ఉన్నాను. అనంతానంద రూపవాన్! ఆత్మగా నా ఉనికి చేతనే సర్వము ఉనికి పొందుచుండటం చేత సర్వమునకు ఆవల సత్ - పరరూపుడను. సత్ పరానందరూపోఽస్మి! కలలో 10 మంది కనిపిస్తూ ఉన్నంత మాత్రముచేత కల తనదైనవాడు (1) ఆ 10 రూపములుగా అగుచుండనట్లు, (2) ఆ కలలోని 10 రూపములకు తానే ‘సత్’ అగుచున్నట్లు, (3) ఆ 10 మందికి తాను వేరై ఉన్నట్లుగా - సత్ పరానందరూపమును సంతరించుకొని ఉన్నాను.
★ తెలియబడే అంతటికీ ఆవల ఉండి, తెలియబడేదంతా నా చిత్ రూపమే (ఎరుక - తెలివి రూపమే) అగుటచే చిత్‌పరానంద మస్మ్యహమ్!
★ మనో-బుద్ధి-చిత్త-అహంకారములు ప్రదర్శనమగుచున్నట్టి స్థానమగు ‘ఆత్మ’ను. అంతరమునకు అంతరరూపుడను! అంతరాంతర రూపోఽహమ్! మాటలకు-మనస్సుకు అందనివాడను. అవాక్ మానస గోచరుడను.
★ ఆనందమగు ఆత్మయే నా సహజ-అనునిత్య-అప్రతిహతరూపము. ఆత్మానంద స్వరూపోఽహగ్ం! నా యొక్క ఉనికియే నాకు ఆనందమగుచున్నట్టివాడను. ఉనికి-ఎరుక నన్ను వీడవు (presence & consciousness at its absolute do continue ever with me). సత్యానందోఽస్మ్యహగ్ం సదా!
★ ఆత్మయొక్క ప్రకాశము (manifestation of Absolute self) రూపముగా కలవాడను. ఆత్మతేజో-జ్యోతి స్వరూపుడను! ఆత్మ ప్రకాశరూపోఽస్మి! ఆత్మజ్యోతీ రసోఽస్మ్యహమ్! ఆది-మధ్య-అంతములు లేనివాడను. ఆకాశమువలె అనంతుడను! ఆది మధ్యాంతహీనోఽస్మి। ఆకాశ సదృశోస్మ్యహమ్।
★ సర్వము బయల్వెడలి-నిలిచి-లయించునట్టి కేవలతత్త్వుడను. నిత్యశుద్ధుడను. చిదానంద (కేవల) మాత్రుడను. అవ్యయుడను. కేవల చిత్‌చే నిత్యబుద్ధుడను (Ever awakened consciousness). సత్ చిత్ ఆనందస్వరూపుడను. విశుద్ధ-ఏకస్వరూపుడను.
★ సర్వము లయించిన తరువాత కూడా శేషించి యుండు కేవల సత్-చిత్ స్వరూపుడను. సదా సర్వమునకు ఆవల ఉన్నవాడను! సర్వ నామ-రూపములకు అతీతుడను. మూర్తీభవించిన పరమాకాశ స్వరూపుడను. పరమాకాశ విగ్రహుడను.
★ స్వతఃగానే భూమానన్దస్వరూపుడను. సర్వ ఆనందములకు ఉత్పత్తి స్థానమగు కేవలానంద స్వరూపుడను. భాషకు భావములకు అందనివాడను. సర్వము నేనై ప్రకాశించుచున్నాను కాబట్టి భాషించుటకు, భాషించబడుటకు అవిషయుడను. సర్వ బంగారు ఆభరణములకు బంగారమే అధిష్ఠానమైయున్నరీతిగా, ఈ జగత్ దృశ్య - దేహ - మనో - బుద్ధి - చిత్త - అహంకార - జీవాత్మలకు, జంతు - మానవ - దేవతాది సర్వమునకు అధిష్ఠానమైయున్నాను. ఈ సర్వము నాయొక్క ఘనీభూతమైన ‘ఎరుక’యే కాబట్టి చిదానందఘనుడను. చిదానంద ఘనోస్మ్యహమ్!
★ సూర్యుని కిరణములచే వస్తు ఆకారములు ప్రకాశించినంతమాత్రము చేత, ఆ వస్తు ఆకారమును సూర్యునికి ఆపాదించముకదా! అట్లాగే, ఆత్మయొక్క చైతన్య స్ఫూర్తిచే (లేక) తేజోజ్యోతి యొక్క వెలుగులో దేహములు, చిత్తములు, ప్రకాశించుచుండవచ్చుగాక! వాస్తవానికి ఆత్మగా నేను దేహభావరహితుడను. చిత్తవృత్తులు కూడా లేనివాడను. నా తేజస్సు నందు చింతనలు ప్రవర్తిస్తున్నాయి. చిదాత్మైక రస స్వరూపుడను!
★ దృశ్యము-ద్రష్టలకు ఆవల సాక్షిని. దృక్ స్వరూపుడను. అందుచేత నాకు ‘దృశ్యము’ అనునదే లేదు. కేవల దృక్ రూపుడను.
సదా సర్వదా పూర్ణుడను. మరింకొకటేదో వచ్చి నాకు పూర్ణత్వము ప్రసాదించవలసిన అగత్యమే లేదు. స్వతఃగానే పూర్ణుడను. జీవాత్మ-జగత్తులు నా పూర్ణత్వము నుండి ప్రసరించు కిరణములు. చంద్ర కిరణములు పూర్ణచంద్రుని నుండి బయల్వెడలుతాయి. అంతేగాని చంద్ర కిరణములు, ఆ కిరణములు ప్రసరించే ప్రదేశములు - అవన్నీ చంద్రుని క్రొత్తగా పూర్ణుని చేస్తాయా? లేదుకదా! స్వతఃగానే పూర్ణుడనవటం చేత నిత్యతృప్తుడను!
★ అహమ్ బ్రహ్మైవ సర్వగ్ం స్యాత్! అంతటా-అన్నిటా-అంతాగా-అన్నీగా నేనే బ్రహ్మమై ఉన్నాను. సర్వమును చేతనపరచుచున్న చైతన్యస్వరూపుడను! నేను నేనే గాని మరొకటేదీ అవను! కాను. భూమాకాశ-పరాకాశ-ఆత్మాకాశ స్వరూపుడనై సర్వత్రా వెలయుచున్నాను. (I am the occupant of Matter, the subtle beyond matter and the Al-present SELF).
★ నేనే మహాన్ ఆత్మను! ఆత్మ సర్వదా అఖండము కాబట్టి సర్వుల ఆత్మను నేనే! సర్వాత్మకుడను! ఇహమునకు ఆవల గల పరమునకు కూడా పరమై ఉండటం చేత పరాత్ పరుడను. అయితే ‘జీవాత్మ-ఈశ్వరుడు’.. ఇత్యాదులుగా వేరువేరుగా కనిపిస్తూ ఆభాసిస్తున్నది (Refraction) కూడా నేనే! సర్వదేహములలో ‘శరీరి’గా ఉన్నది నేనే! నేనే! అంతేకాదు. ఆత్మస్వరూపుడనే అయి ఉండి కూడా నా గురించి నేనే శిష్యుడనై ఆత్మ గురించి తెలుసుకొను ప్రయత్నమునందు నిమగ్నుడను అగుచున్నది కూడా నేనే! ఆత్మ గురించి బోధిస్తున్న గురువును కూడా నేనే!
★ త్రిలోకములను ఆశ్రయించి ఉన్నవాడిని కూడా నేనే! త్రిలోకములుగా సంప్రదర్శితుడను కూడా!
★ త్రికాలములకు అతీతుడను కూడా!
★ వేదములను ఉపాసించునది, వేదములచే నిర్ణయించి చెప్పబడుచున్నది.. రెండూ నేనే!
చిత్తము రూపముగా సర్వజీవులలో అవస్థితుడనై ఉన్నది నేనే!
ఇంతెందుకు! నన్ను ఏదీ త్యజించి ఉండజాలదు. నాకు వేరై పృథివి, ఆకాశము మొదలైనవి లేవు. ఆత్మస్వరూపుడనగు నన్ను అధిగమించి ఏదైనా ఉన్నదనిపిస్తే… అది వాస్తవానికి లేనిదే అయి ఉన్నది.
నాకు నేనే-మరొకరి ప్రమేయమేదీ లేకుండానే-సర్వదృశ్యములు, ద్రష్ట-దృక్ (చూచువానిని చూచువాడు) రూపములుగా భాసించుచున్నాను. మరొకటేదీ నన్ను భాసింపజేయుటము లేదు. నాకు నేను స్వయముగా సత్-చిత్ ఆత్మకుడను! స్వయముగా ఆత్మస్వరూపుడనై స్వస్థుడనై ఉన్నాను.
నేనే మార్గమును! నేనే సర్వజీవులు చేరు స్థానమును కూడా! పరాగతిని (The ultimate end to every thing and every body).
స్వయమేవ స్వయం భుక్తే! రమే! నాకు నేనే స్వయముగా జీవాత్మ-జగత్ కల్పనలను కల్పించుకొని సర్వము ఆస్వాదించుచున్నాను. స్వయముగా నేనే సర్వరూపములుగా, సర్వలోకములలో రమించువాడను. స్వయం జ్యోతి స్వరూపుడను. నాకు నేనే మహత్తర స్వరూపుడను, మహత్ స్వరూపుడను కూడా! ఆత్మానందుడను! ఆత్మా రాముడను!
ఆత్మస్వరూపుడనగు నాకు నేనే అస్మత్ ఆత్మయందు 14 లోకములు కల్పించుకొని, ఆ 14 లోకాల మైదానములలో క్రీడించుచున్నాను. స్వాత్మని విలోకయే! నా ఆత్మను నేనే జీవాత్మపరంగా, దృశ్యపరంగా, మనోబుద్ధి చిత్త అహంకారపరంగా స్వయంగా విలోకిస్తున్నాను. నాచే అవలోకించబడునదంతా- నా అవలోకనా చమత్కారమే!
స్వాత్మ రాజ్యమునందు రమించుచూ అనంత విశ్రాంతిని ఆస్వాదిస్తూ ఉన్నాను. సర్వదా స్వాత్మగా శేషించినవాడనై ఆత్మ సింహాసనముపై కూర్చుని ఉన్నాను. ఇంక దేనికీ చింతించక, ప్రశాంత-ఆనందములను పొందుచున్నవాడనై ఉన్నాను.
స్వ-చైతన్యమునందు స్వయముగా ఈ సర్వమును స్థాపించుకొని,- ‘‘ఆత్మనగు నాకు ఎక్కడా ఏదీ అన్యముగాలేదు’’.. అనుభావనతో ఆత్మ సామ్రాజ్య చక్రవర్తిత్వము అధిరోహించినవాడనై ఉన్నాను! ఒక చక్రవర్తి ‘‘నేను ద్వారపాలకుడివలె ఉంటే బాగుండును!’’.. అని అనుకోడుకదా! అట్లాగే ‘‘ఇది నేను అవ్వాలి!’’ అని ఏదీ కోరుకోవటము లేదు.
నేను దేహాదులు కాను! సత్‌చిత్ మాత్ర అనందమయమగు బ్రహ్మమును। అద్వయుడను। ఆనందఘనుడను। కేవలము బ్రహ్మమును। అహమ్ బ్రహ్మాస్మి కేవలమ్!
రచయితలో ఆతని నవలలోని పాత్రలు ఉండి ఉండనట్లు, నేను సర్వదా సర్వశూన్యుడను। సర్వాత్మానందుడను। నిత్యానంత స్వరూపుడను। ఆత్మాకాశ స్వరూపుడను। నాలో జగద్దృశ్యము లేదు. తదితర జీవులు లేరు.
నేనే హృదయాకాశంలో చిత్-ఆదిత్య సూర్యుడనై వెలుగొందుచున్నాను. ఆత్మచేత ఆత్మతృప్తుడనై ఉంటున్నాను. రూపరహితుడను! అవ్యయుడను!
ఏకమై ఉన్నవాడను! అంతేగాని ఏకసంఖ్యకు చెందినవాడను కాను! జీవాత్మ నాటకంలోని పాత్రవలె కల్పితము కాబట్టి అద్దానికి ‘ముక్తి’ అనునది లేదు. అద్దంలో ప్రతిబింబానికి బంధమేమున్నది? మోక్షమేమున్నది? పరమాత్మగా-నేను దేనికీ చెందనివాడను. అప్రమేయుడను. దేనిచేతను పరిమితుడను కాను. కాబట్టి - నిత్యముక్తస్వరూపుడను!
ఆకాశము కంటే అత్యంత సూక్ష్ముడను. నాకు ఆది-మధ్య-అంతములు లేవు.
సర్వమును ప్రకాశింపజేయుచున్నట్టివాడను. పర-అపరములచే సుఖస్వరూపుడనై ఉన్నాను. కేవల సత్తామాత్రస్వరూపుడను. సర్వదా శుద్ధ-మోక్ష స్వరూపుడను! అంతేగాని ఇప్పటికిప్పుడు ఏవేవో సాధనలు చేసి అటుతరువాత మాత్రమే మోక్షము పొందవలసినట్టివాడను కాను. |
సత్యానంద-జ్ఞానానంద-ఘనస్వరూపుడను! నా సత్ (ఉనికి)యే నాకు ఆనందము! నా కేవల జ్ఞానస్వరూపమే నాకు ఆభరణము!
సత్-చిత్-ఆనంద లక్షణుడను. సచ్చిదానందుడను! చిన్మయానందుడను!
⌘
ఓ షణ్ముఖా! బ్రహ్మమాత్రమిదగ్ం సర్వమ్! ఇదంతా కూడా బ్రహ్మమేనయ్యా! బ్రహ్మమునకు వేరుగా ఎక్కడా ఏదీ లేనేలేదు! ఈ జగత్తుగా కనిపించేదంతా కూడా సనాతనము అయినట్టి (జగత్తుగా కనిపించటానికి మునుముందే ఉన్నట్టి) సదానంద పరబ్రహ్మ స్వరూపమే!
అట్టి పరబ్రహ్మమునకు వేరుగా నీవు-ఆతడు-నేను లేము. నీవు-ఆతడు-నేనుగా ఉన్నది ఆ అఖండ సనాతన పరబ్రహ్మమే!
నేను సర్వదా చిత్ చైతన్యస్వరూపుడను! పరమగు శివ స్వరూపుడను! సదాశివుడను!
నేను ఏదియో, నీవు అదియే! సోఽహమ్! తత్ త్వమ్!
ఇదియే ఆత్మతత్త్వవేత్తయొక్క- ఆత్మైతత్త్వ స్వరూపునియొక్క అనుభూతి! అనుభవము! ఎలుగెత్తి పలుకు స్వానుభవ జ్ఞానము. |
కోఽహమ్! కేవలమ్ బ్రహ్మమేవాహమ్
కుమారస్వామి : పరమాత్మా! సర్వజన ఆనందసుఖప్రదాతా! పరమశివా! పితృదేవా! వేద-ఉపనిషత్తులు గానం చేస్తూ ఉన్న మహామంత్రము - మహావాక్యము అగు ‘‘అహమ్ బ్రహ్మాఽస్మి’’.. యొక్క మహదార్థము - అంతరార్థము ఏమిటో… మరికొంత వివరించమని మిమ్ములను అభ్యర్ధిస్తున్నాను.
పరమశివుడు: బిడ్డా! షణ్ముఖా! ‘అహమ్ బ్రహ్మాస్మి’ అను వేద-ఉపనిషత్ మహావాక్యమును (పైన చెప్పుకొన్నదే కాకుండా), మరికొంత వివరణగా చెప్పుచున్నాను…విను.
⌘
నేను కేవలము బ్రహ్మమాత్రడను. అందుచేత, జన్మ-కర్మలకు ఆది స్వరూపమై.., వాటికి మునుముందే పరమోత్తేజరూపమైయున్న ఆత్మయే నేను. జీవాత్మ-జగత్తులకు కూడా ఆదిరూపము, జననస్థానము అయిఉన్న పరబ్రహ్మమును. పరమాత్మస్వరూపుడను.
సర్వము (లోకములు-భావనలు మొదలైనవన్నిటికీ) ఆదిస్వరూపుడను. అవన్నీ అధిగమించినప్పుడు (లేక) లయించినప్పుడు కూడా శేషించి ఉన్నవాడిని కనుక ఆదిశేషుడను. ‘అహమ్’ అనునది లయించినప్పుడు కూడా శేషించి ఉండు కేవలాఽహమ్ స్వరూపుడను. ‘నేను’ అను భావానుభూతికి జనన స్థానమగు నేనైనట్టిదే నేను.
ఇక్కడి ‘జగత్తు’ అనబడే -దృశ్యములో కనిపించే నామరూపములకు సంబంధించినవాడను కాను. వాటిచే పరిమితుడనుకాను. సర్వదా నామ-రూప విముక్తుడను (always beyond name and form). వాటి దుఃఖము నాకు లేదు కనుక ఎల్లప్పుడు ఆనందవిగ్రహుడను.
ఇంద్రియముల (కళ్లు-చెవులు చూపు-వినికిడి) మొదలైనవి నా ప్రాణ చైతన్యప్రదర్శనా చమత్కారములు. మునుముందే ఉన్నట్టి నేను - ఇంద్రియ అభావరూపోఽహగ్ం! ఇంద్రియ భావములు అభావించినప్పటి కేవల భావరూపుడను. అయితే, నా అభావస్వరూపము నుండే సర్వభావములు ప్రదర్శితమగుచున్నాయి కాబట్టి.. సర్వభావ స్వరూపుడను కూడా!
నాకు ‘జీవాత్మ’ అనునది జలములో ప్రతిబింబించే బింబము వంటిది. ప్రతిబింబమునకు బంధమేమి? మోక్షమేమి?
బింబస్వరూపమగు పరమాత్మగా సర్వమునకు పరమై-ఆవల ఉన్నట్టి అస్మత్ ఆత్మ స్వరూపమునకు బంధమేమి? మోక్షమేమి?
కాబట్టి బంధ-ముక్తిరహితుడను! శాశ్వత-ఆనంద విగ్రహుడను! మొట్టమొదటియే ఉండిఉంటున్న ఆదిచైతన్యమాత్రుడను. అఖండ-ఏక రస స్వరూపుడను.
ఈ కనబడేదంతా కల్పనయే! ఇక నేనో? సర్వకల్పనలకు కారణ కారణుడను. కల్పన చేయుకర్మకు కర్తను. సాక్షిని.
నా చైతన్యస్వరూపము (my own feature of activating every thing) నుండియే ఈ లోకములు, దృశ్యములు ప్రకటనమగుచూ ప్రదర్శనమగుచున్నాయి. కాబట్టి ఆదిచైతన్య రూపోఽహమ్! వాక్ మనో గోచరశ్చ అహమ్! వాక్-మనస్సులకు గోచరమగుచున్నదంతా నేనే అయి ఉన్నాను. ఈ దృశ్యమంతా సర్వత్రా సుఖ-ఆనంద స్వరూపుడనై వేంచేసి యున్నాను. స్వప్నమంతా స్వప్నద్రష్ట యొక్క స్వప్నచైతన్యమే నిండి ఉన్నట్లు, ఈ సర్వము నా సుఖానందరూపమే! సర్వత్రా పరిపూర్ణరూపుడనై జగత్తు -ద్రష్ట- దృశ్యములందు నిండియుండి యున్నాను. (I am filled up in all this else). ఈ సర్వము నేనే అయినట్టి భూమానందమయుడను.
ఒక నాటక రచయిత వ్రాస్తున్న నాటకములోని పాత్రలన్నీ అతని ‘కల్పనాచమత్కృతులే’ అయినప్పటికీ.. ‘ఆ రచయితలో పాత్రలు-పాత్రల స్వభావాలు ఉన్నాయి’.. అని అనముకదా! ఈ సర్వరూపములు నేను అయి ఉండినప్పటికీ… నా యందు ఏ రూపములు లేవు. అందుచేత సర్వ శూన్య స్వరూపోఽహగ్ం!
సర్వ వేదములు నన్ను గోచరింపజేయటానికే ఉన్నాయి. వేదవేద్యుడను! వేదములు అభివర్ణిస్తూ ఎలిగెత్తి గానం చేస్తున్నది మమాత్మస్వరూపము గురించే! సకల ఆగమ గోచరుడను!
ఆత్మగా నిత్యముక్తుడను! ఆత్మానగునాకు దేహ-దృశ్యాదులు బంధమేకాదు. కనుక స్వతఃగానే మోక్షరూపుడను! నిర్వాణ సుఖరూపుడను!
సర్వస్వరూపుడనగు నేను సర్వత్రా స్వస్వరూపానందముచే సదా సంతృప్తరూపుడను! పరము - అమృతరసము రూపముగా కలవాడను!
ఏకమేవాద్వితీయం బ్రహ్మ! సర్వమునకు అద్వితీయము అగుటచే ఏకరస స్వరూపుడను. సర్వదా కేవలమగు సత్‌బ్రహ్మమే అయి ఉన్నాను. ఇందులో కించిత్ కూడా సందేహమే లేదు. సత్యము-జ్ఞానము-అనంతము అగు బ్రహ్మమును. సత్ (కేవలమైన ఉనికి-Absolute presence) మాత్రానందవంతుడను.
జాగ్రత్-స్వప్న-సుషుప్తులనబడే స్వీయ కల్పితమైన మైదానములలో సంచరించే ‘తురీయము’నకు కూడా సాక్షిని. తురీయాతీతరూపుడను. సర్వకల్పనలకు ఆవలివాడను. నిర్వికల్ప స్వరూపుడను.
దేహముతో పుట్టువాడను కాను. దేహముతో నశించువాడను కాను. దేహమునకు పుట్టుక ఉండవచ్చు గాక! ‘దేహి’ని అగు నాకు ‘‘పుట్టుక’’యే లేదు! సర్వదా హి ‘అజ’ రూపోఽహమ్! సర్వము నేను అయి ఉండటం చేత, నాకు దేనిపట్లా రాగము లేదు. ద్వేషము లేదు. నిరంజనుడను. నిత్యనిర్మలుడను. నిత్యశుద్దుడను. నిత్య ప్రబుద్ధుడను. బుద్ధిరూపముగా ఎల్లప్పుడు మేలుకొనియే ఉన్నట్టివాడను. ఎల్లప్పుడు ఉండియే ఉన్నవాడిని! నిత్యోఽస్మి! మనో-బుద్ధి-చిత్త-అహంకారాలకు నేనే నియామకుడను.
‘ఓం’ కారమునకు ఏ అర్థము ప్రతిపాదించబడుచున్నదో… అట్టి కేవలాత్మస్వరూపుడను. మనోబుద్ధి చిత్త అహంకారములు ఆత్మనగు నన్ను అంటవు. నిష్కళంకమయోఽస్మ్యహమ్।
సర్వదా శుద్ధ చిత్ (ఎరుక అను చైతన్య) ఆకార స్వరూపుడను. సర్వదా చిదాకార స్వరూపుడనేగాని మరొకటేదీ ఎప్పుడూ అగుటలేదు! మరొకటేదీ నేనుగాగానూ అవటము లేదు. నాకు నేనే నేనైయున్నాను.
సర్వస్వరూపములు - ఆత్మగా ‘నావే’ అయిఉండటముచేత ‘‘ఇది నా స్వరూపము’’ అనునదేదీ కూడా లేనట్టివాడను. నహి కించిత్ స్వరూపోఽస్మి!
‘బంగారపు ఆభరణము’ అను సందర్భములో ‘ఆభరణమగుట’ అను కర్తృత్వము బంగారమునకు ఆపాదించలేము. అట్లాగే ‘‘ఇది నీ ఆభరణము-అది నా ఆభరణము’’.. అను ‘నీ-నా’ అనుదానికి కూడా బంగారమునకు కర్తృత్వముగాని, సంబంధముగాని కించిత్ కూడా ఉండదుకదా! అదేవిధంగా ఆత్మగా నాకు ఎట్టి కర్తృత్వమూ లేదు. భోక్తృత్వము లేదు. నిర్వ్యాపార స్వరూపవాన్! కర్తృత్వ-భోక్తృత్వ వ్యాపారములేవీ లేనివాడను.
‘‘జీవాత్మ నా అంశ. జగత్తు కూడా నా అంశ. మనో-బుద్ధులు నా అంశలే!’’.. అని ఎవ్వరైనా అంటారేమో! వాస్తవానికి ఆత్మగా అఖండుడను-అప్రమేయుడను కాబట్టి నాకు ఎట్టి అంశలు లేవు! నిరంశోఽస్మి! నేను ఏదీగా ఆభాసించటము లేదు. జీవాత్మగానో, దేహముగానో, స్వభావముగానో ఆభాసించువాడను కూడా కాను! నిరాభాసోఽస్మి।
అట్లాగే,
మనస్సు-ఇంద్రియములు నేను కాదు. న మనో, నేంద్రియోఽస్మ్యహమ్।
బుద్ధి వికల్పములు-సంకల్పములు కలిగి ఉన్నా-లేకున్నా కూడా.. ఆత్మగా నేను సర్వదా యథాతథమైయున్నాను. బుద్ధి (విచక్షణ)ని ఉపయోగించుచున్నప్పుడు (జాగ్రత్-స్వప్నదశలు), బుద్ధిని ఉపయోగించనప్పుడు (గాఢనిద్ర దశయందు), బుద్ధి మౌనరూపము దాల్చినప్పుడు (సమాధియందు) నాయొక్క ఆత్మస్వరూపము ఏదీ పొందటము లేదు. పోగొట్టుకొనటము లేదు. కనుక, న బుద్ధి, న వికల్పోఽహమ్! బుద్ధి నేను కాదు. వికల్పములు-సంకల్పములు (Thought culture and thoughts) నేను కాదు. నేను సంకల్పములు జనించు స్థానమును (I am that where from ideas emanate).
ఈ -
(1) స్థూల (matter related)
(2) సూక్ష్మ (Thoughts feelings views, ideas etc, related)
(3) కారణ (A personality that ie. framed by Repetence of acts relating to thoughts, feelings, ideas etc.,) - త్రిదేహములు నేను కాదు.
ఆ మూడిటికి వేరై, ‘దేహి’ని అయి ఉన్నాను.
కనుక న దేహాది త్రయోస్మ్యహమ్! ఆ మూడు దేహములు నేను కాదు.
న జాగ్రత్ స్వప్న రూపోఽహమ్। న సుషుప్తి స్వరూపవాన్: జాగ్రత్-స్వప్న-సుషుప్తులు నేను ప్రవర్తించు రంగ స్థలములు (Platforms) కావచ్చుగాక! అవి నా స్వరూపములు అయిఉండలేదు. అంతేకాదు. అవి నాకు కలలో కనిపించే వస్తువుల వంటివి. నేను వాటికి అప్రమేయుడనగు ఆత్మను! కేవల సాక్షిని. వాటికి ఆధారమైనవాడిని.
న తాపత్రయ రూపోఽహమ్! న ఈషణాత్రయవాన్। ఇక్కడి ఆధిభౌతిక (Matter related worries), అధిదైవిక (Incident related worries), ఆధ్యాత్మిక (worries while understanding myself).. తాపత్రయములకు సంబంధించిన వాడినికాదు! అవన్నీ బుద్ధికి సంబంధించినవి. నేనో? బుద్ధికి ఆవల ఆత్మజ్యోతిగా వెలుగొందువాడను. నాటక దీపమునకు - నాటకములోని సంఘటనలకు… సంబంధమేలేనట్లుగా, ఆత్మనగు నేను తాపత్రయములకు వేరైనవాడను.
అట్లాగే దృశ్యములోను- మనస్సులోను-బుద్ధిలోను జనించి లయిస్తూ ఉండే ఈ షణములకు (ఈషణత్రయము-భార్యేషణ, పుత్రేషణ, ధనేషణలకు) సంబంధించినవాడను కాను! అవన్నీ సూక్ష్మ-సంస్కార దేహములకు సంబంధించినవి. ఆత్మనగు నేను సర్వదా వేరై ప్రకాశించువాడనై ఉన్నాను.
నిత్యసిద్ధుడను : చిదాత్మ ఎల్లప్పుడు సిద్ధించియే ఉన్నది. అట్టి కేవలాత్మత్వము ఇప్పుడు శ్రవణము చేతను, మననము చేతనూ క్రొత్తగా సిద్ధించేది కాదు.
సర్వము ఆత్మస్వరూపమై, నేను ఆత్మస్వరూపమై ఉండటం చేత, అఖండాత్మ స్వరూపుడనగు నాకు సజాతీయముగాని, విజాతీయముగాని, (నా జాతికి చెందినది. వేరైనజాతికి చెందినది - (My group, (or) my subset (or) the other group) అనునవి కించిత్ కూడా లేవు. స్వగతమైనది లేదు. పరగతమైనది లేదు. దేహత్రయము లేదు. అంతా నాదే! అంతా నేనే! ఏదీ నేను కాదు! నాకు వేరైనదంటూ ఎక్కడా ఏదీ లేదు.
నాకు వేరైనది ఏదైనా…. అది అసత్తే! మమాతిరిక్తం అసత్తేవ!
ఈ దృశ్యములో అంతర్భాగమై కనిపించే సంఘటనలు, దృశ్య-దేహ-మనో-బుద్ధి-చిత్త-అహంకారములు మొదలైనవి… ఇవన్నీ కథలోని కోటీశ్వరునివలె, స్వప్నంలోని ‘3’ అండస్తుల ‘మేడ’ వలెన వాస్తవానికి కాల్పికము. ఆత్మమాత్రమే సత్యము! ఆత్మగా నేను మాత్రమే సత్యము. తదితరమైనదంతా అసత్తు.
అసత్తు = సందర్భంతో జతచేసి చూస్తే ఉన్నది. సందర్భము లేదనుకుంటే లేనట్టిది.
దృష్టాంతము - ‘సూర్యుడు - భూమి’ల సంబంధముగా చూస్తే తూర్పు-పడమరలు ఉన్నాయి. సూర్యుడు-భూమి లేనిచోట అవిలేవు. కనుక తూర్పు-పడమరలు స్వతఃగా లేవు.
జాగ్రత్‌లో ఉన్నవి స్వప్నంలో లేవు. స్వప్నంలో ఉన్నవి జాగ్రత్తుతో లేవు. కనుక అవి సందర్భ సత్యములేకాని, సహజ సత్యములు కావు. సహజము (Original) సందర్భముల యొక్క ఆవస్యకత లేనట్టిదియే సత్తు. తదితరమైనవి అసత్తే!
(“I am a Bank Officer” is true when questioned as “What are you doing?”. “What am I at the Absolute?”.. Its answer is “సత్”. “What am I contextually, relatively, incidentally, temporarily, place and time relatedly (for the time or place being)” - all this is అసత్, in fact, not true).
మననమే మనస్సు యొక్క రూపం! మననముతో ఊహించబడేది భావనను అసరించి ఉంటుంది. కనుక సహజము-నిత్యము అగు సత్యము కాదు. భావన మారితే అనుభవము మారిపోగలదు. అందుచేత మనస్సు, ఆ మనస్సుచే పొందబడేదీ.. అసత్తే!
అట్లాగే, బుద్ధిరూపంగా చెప్పబడేది, అహంకారరూపముగా పొందబడేదీ కూడా అసత్తే! నేను ఉన్నాను కాబట్టి అవన్నీ నాచే నిర్మితమగుచున్నాయి. అవన్నీ అనిత్యము, సందర్భ పరిమితము, అవాస్తవము కూడా. కేవలుడను, ఆత్మరూపుడను అగు నేను మాత్రమే నిత్యుడను. శాశ్వతుడను. జన్మరహితుడను. ఎందుకంటే నేను ఉండటము చేత మాత్రమే జన్మలు, మనస్సు బుద్ధి, అహంకారము మొదలైనవన్నీ నాయొక్క క్రీడాకల్పనగా ఏర్పడి, ప్రవర్తించి, తిరిగి నాయందే లయిస్తున్నాయి. నేను ఉండటము చేతనే ఏర్పడినవై ఉన్నవి-నన్ను ఎట్లా బంధిస్తాయి?
ఓ ప్రియపుత్రా! షణ్ముఖ ! కుమారస్వామీ! ‘అసత్’ గురించి ఇంకా కూడా చెప్పుచున్నాను. విను.
⌘ శాస్త్రములు విశ్లేషించి చెప్పుచున్న స్థూల-సూక్ష్మ-కారణ త్రిదేహములు కూడా అసత్తే. ఎందుకంటే ‘‘అవి స్వతఃగా లేవు. ఆత్మ గురించి నిరూపించి చెప్పటానికై శాస్త్రములు సహకారికంగా విభజనలను కల్పించి చెప్పుచున్నాయి’’-అని గ్రహించి ఉండుము.
⌘ అట్లాగే ‘భూత - వర్తమాన - భవిష్యత్’ అనబడే త్రిరూపములుగా కనిపించే కాలము కూడా కల్పనయే! అసత్తే! సహజంగా ఉన్నట్టిది కాదు. సాపేక్షికంగా మాత్రమే (merely As a relative factor) ఉన్నట్టిది. జాగ్రత్‌లోని, దేశ-కాల పరిమాణములు స్వప్నంలో అగుపించటము లేదు కదా!
⌘ సత్త్వ-రజో-తమోగుణములు కూడా ఒకదానితో మరియొకటి పోల్చినప్పటి.. మనో అనుభూతములు మాత్రమే! ఆ త్రిగుణములు కూడా అసత్తే! త్రిదేహములకు ‘దేహి’ ఎవ్వరో, త్రికాలములకు ‘కాల్పికుడు’ ఎవ్వరో, త్రిగుణములకు ‘గుణి’ ఎవ్వరో అది నేను. దేహి-కాల్పికుడు-గుణి అనునవి నా కల్పనలు కాబట్టి అసత్తు. వాటి దోషములచే స్పృశించబడనివాడను, శుచిని, సత్యాత్మకుడను నేను! నేను మాత్రమే సత్తు!
⌘ శ్రుతగ్ం సర్వం అసత్ విద్ధి। వినబడుచున్నదంతా అసత్తుగా గమనించబడుగాక! వినబడుచున్నదంతా అసత్తే! వినుచున్నట్టి నేను మాత్రమే సత్తు! శ్రోత సత్తు. శ్రుతము - అసత్తు.
⌘ వేదగ్ం సర్వం అసత్ సదా! తెలియబడుచున్నదంతా కల్పనా విశేషమే. కాబట్టి ‘అసత్తే’. ఎరుగుచున్నట్టి నేను మాత్రమే ‘సత్తు’.
⌘ శాస్త్రగ్ం సత్యం అసత్ విద్ధి। శాస్త్రములు అన్నీ కూడా అసత్తే! అట్టి శాస్త్రములు ఎవ్వరి అనుభవము నుండి జనిస్తున్నాయో, అట్టి చిదాత్మకుడనగు నేను మాత్రమే సత్తు!
⌘ మూర్తిత్రయం అసత్ విద్ధి। ఇక్కడ మూర్తీభవించనట్లుగా కనిపిస్తున్న సృష్టి-స్థితి-లయములు, వాటి అభిమానమూర్తులగు బ్రహ్మ-విష్ణు-రుద్రులు కూడా ‘అసత్’ (లేక) సందర్భానుచిత కల్పనలోని విభాగ విశేషములే.
⌘ సర్వభూతమ్ అసత్ సదా! అట్టి సృష్టిలో కనిపించే భూతజాలమంతా కూడా (జీవులంతా కూడా).. స్వప్నములో కనిపించే జీవులవలె పరస్పర భేదముల దృష్ట్యా అసత్తే! ఇక్కడి సర్వజీవుల వేరువేరైన సర్వస్వభావములు అసత్తే! ఇవన్నీ ఎవ్వరికి అనుభవరూపములై ఉంటున్నాయో అట్టి మహత్తరము, భౌమము, సదాశివుడను అగు నేను మాత్రమే సత్తు!
⌘ గురు-శిష్యమ్ అసత్ విద్ధి। గురోః మంత్రం అసత్ తతః। ఇక్కడి గురువు-శిష్యుడు అనునదంతా కాల్పికము. అసత్తే! ఆ గురుశిష్యులిరువురికీ ‘‘బోధక మహత్‌విషయమగు కేవలాత్మానుభవము’’ మాత్రమే సత్తు! అట్లాగే - గురువు శిష్యునికి నియమించు మనన రూపమగు మంత్రము కూడా అసత్తే. ఆ మననరూప-ఆత్యంతిక సూచనయగు ఆత్మయే సత్యము. అవన్నీ సత్యమగు ఆత్మను గుర్తుచేయుటకొరకై ఉన్నాయి.
⌘ యత్ దృశ్యం తత్ అసత్ విద్ధి। ఏ దృశ్యము ఇంద్రియములకు ఎదురుగా ‘జగత్ దృశ్యము’ రూపముగా ప్రాప్తిస్తూ ఉన్నదో.. అదంతా అసత్తే అయి ఉన్నది. కళ్ళకు కనిపించేదంతా చూపుశక్తి-దృష్టి-ఉద్దేశ్యములను అనుసరించి ఆయా రీతిగా అనుభవమగుచున్నది.
అయితే, న మాం విద్ధి తధా విధమ్ ! నేను మాత్రం ఆ విధంగా అసత్ కాదు. కేవల సత్ స్వరూపుడను.
ఏది చిత్తము (ఇష్టము-ఇచ్ఛ).. గా విభాగించి చెప్పబడుచున్నదో అది ‘అసత్తే’ అని గ్రహించబడుగాక!
ఏది మనోబుద్ధి చిత్త అహంకారములచే ‘‘న్యాయము’’ అని, ‘‘ధర్మము (feature)’’ అని గమనించబడుచున్నదో.. అదంతా అసత్తే!
ఏ చిత్తము (లేక) ఇష్టము నాదో, ఏ న్యాయము (feature) నాదో,.. అట్టి నేను సత్ స్వరూపుడను. ఏది ‘హితము’ అని అనబడుచున్నదో.. అది అసత్తే! ఆ హితము ఎవరికో, అట్టి నేను మాత్రము సత్తే! (హితము మొదలైనవాటి వలె) నేను మాత్రము అసత్తు కానే కాదు!
సర్వప్రాణములు (ప్రాణ-అపాన-వ్యాన-ఉదాన-సమాన-సప్రాణములు), అఖండ ప్రాణము యొక్క విభజన రూపమగు ప్రాణులు, అవన్నీ ‘అసత్తే’ అని ఎరిగి ఉండాలి.
‘‘ఇదంటే నాకు ప్రాణము’’ అనబడే సర్వభోగములు కూడా మొదలే అసత్తు!
ఇష్టంగా వినబడేది, ఇష్టంగా (ప్రాణంగా) కనబడేది.. అదంతా అసత్తే!
అవన్నీ దేనిచే (వస్త్రమునందు వలె) ఓత-ప్రోతమైయున్నదో.. అదీ అసత్తే!
ఆ ప్రాణశక్తి ప్రీతి, ఆ భోగముల పట్ల ఏర్పడే ఆప్యాయత.. అంతా అసత్తే!
ఆ ప్రాణశక్తి ఎవ్వరిదో.. అట్టి నేను మాత్రము సర్వదా సత్తు! ప్రాణములు - ప్రాణేశ్వరుడనగు నాయొక్క శక్తి ప్రదర్శనము మాత్రమే.
చేయవలసినది-చేస్తున్నది-చేయలేకపోయినది-చేయకూడనిది-లాభము-నష్టము అంతా కూడా…. మొట్టమొదటి నుండి చిట్టచివ్వరి దాకా అసత్-మయమే! - ఇది నాకు దుఃఖము (Worrying), అది నాకు సుఖకరము.. అనిపించేదంతా కూడా అసత్తే!
సర్వము - కొంత విభాగము
పూర్ణము - అపూర్ణము
ధర్మము - అధర్మము
లాభము - అలాభము (నష్టము)
జయించాను - ఓడిపోయాను (అపజయము)
మొదలైన ద్వంద్వములు, వాటివాటికి సంబంధించి - సంబంధించని సర్వశబ్దములు అసత్తే!
శబ్దము-స్పర్శ-రూపము-రసము-గంధము-… వాటికి సంబంధించిన ఏకానేక విషయాలు, విశేషాలు, ఆయా జ్ఞానములు, సమాచారములు.. అంతా అసత్తు-తో తయారైనవి మాత్రమే! ఉన్నది.. ఉండబోయేది- ఉద్భవించి ఉన్నట్టిది- ఉద్భవించబోయేది, ఇది వరకు ఉన్నది, ఇప్పుడున్నది, ఇక ముందుముందు ఉండబోయేది - భవ ఉద్భవమ్…. అంతా అసత్‌మయమే! స్వప్నంలో కనిపించిన ఇంటిలోని ఇల్లు, వాకిలి, వంట ఇల్లుల మధ్య భేదము వంటివే ఇక్కడి తేడాలన్నీ - సర్వగుణములు, ధర్మములు, న్యాయములు.. అన్నీ అసత్తే!
సన్మాత్రమ్ అహమేవ హి! కేవల సత్‌మాత్ర స్వరూపుడనగు నేను మాత్రమే సత్యమును! నిత్యమును!
అహమ్ బ్రహ్మాస్మి మననమ్।
కుమారస్వామి : తండ్రీ! జగద్గురూ! సర్వశుభంకరా! పరమశివా! ‘‘నేను మాత్రమే సత్తు. తదితరమైనదంతా అసత్తు!’’ → అని బ్రహ్మమును నిర్వచించుచున్న తమ మహావాక్యములు మహత్తరము. మహతత్త్వ-ప్రదము. సులభముగా అనుభవైకవేద్యము కూడా! స్వామీ! ‘‘అహమ్ బ్రహ్మాస్మి’’ అను మననము గురించి అద్దాని స్వానుభవసిద్ధి గురించి దయచేసి మరికొంత వివరించండి!
పరమశివుడు : ఓ షణ్ముఖా! అహమ్ బ్రహ్మాస్మి-మననము మహత్తరమైనది! సర్వరుగ్మతకు మహదౌషధం. అందుచేత ఎప్పుడూ స్వా-త్మ (స్వస్వరూపాత్మ)నే దర్శిస్తూ ఉండాలి. ఈ ‘‘సర్వము మమాత్మయే’’ (మమాత్మా సర్వభూతాత్మ)! అరూపమగు మమాత్మయే ఈ జగత్-దృశ్యము-ఇందలి సర్వజీవుల రూపము తానైఉన్నది అను మననము (లేక) మంత్రము..ను అభ్యసిస్తూ ఉండాలి. ఆ మంత్రార్థభావనతో సర్వము గమనించబడుగాక!
‘‘నా సహజమగు స్వరూపము-స్వభావము సర్వదా బ్రహ్మమే అయి ఉన్నది అహమ్ బ్రహ్మాస్మి’’.. అనుమంత్రము →
❋ సర్వదృశ్య దోషములను (భేదదృష్టులను) తొలగించివేయగలదు. నశింపజేయగలదు.
❋ తదితర లోకసంబంధమైన మననములన్నిటినీ ఏకము చేయగలదు. ‘అన్యత్వము’ (భగవంతుడనగా నాకు వేరు)-అను దోషము తొలగిపోగలదు. అనన్యత్వమును నిత్యోదితముగా చేసివేయగలదు.
❋ దేహముతో మమేకమవటము ‘‘(దేహమ్ వినా నేను లేను’’ - అను దేహతాదాత్మ్యము), దేహ బంధము, దేహబాధలకు కృంగటము, దేహము నశిస్తే సర్వము కోల్పోతానేమో-అనే మృత్యుభయము→ వీటన్నిటితో కూడిన దేహదోషములను దరిజేరనీయదు.
❋ ‘‘నేను జన్మ-కర్మలకు బద్ధుడను. జనన-మరణ చక్రములో చిక్కుకున్నాను. జనన-మరణములకు సంబంధితుడను’’- అను జన్మదోషము - కర్మపాపము, మొదలైన భ్రమల నుండి సంరక్షణ ప్రసాదించగలదు.
❋ ‘‘నేను దేహముతో పుట్టువాడను. దేహముతో చచ్చువాడను. మృత్యువుకు నేను ఎరకానున్నాను. మృత్యువు నన్ను త్రాళ్ళతో కట్టి ఎటో ఈడ్చుకు పోబోవుచున్నది’’ - అను మృత్యుపాశమును పటాపంచలు చేయగలదు.
❋ జీవాత్మ వేరు- పరమాత్మవేరు; దృశ్యము వేరు-ద్రష్టవేరు; ఇప్పుడు వేరు-దేహానంతరము వేరు; నేను వేరు-నీవు వేరు; జ్ఞానివేరు-అజ్ఞానివేరు → ఇత్యాది ద్వైతభావములచే బుద్ధియందు ఘనీభూతమై ఉంటున్న ‘ద్వైతదుఃఖము’ను మొదలంట్లా కడిగివేయగలదు.
❋ తదితర సహజీవులపై పెంపొందించుకొనియున్న భేదబుద్ధి.. అనే భయానకమగు రుగ్మత నుండి, అట్టి శ్రాంతి (శ్రమ) నుండి విశ్రాంతి ప్రసాదించగలదు.
❋ ‘‘భార్య-భర్త-సంతానము-మిత్రులు’’.. మొదలైన వాటిగురించి, స్థితి-గతులగురించి, భీకర సముద్ర తరంగము వలె ఎదురగుచున్న అసంఖ్యాక చింతనలు, వాటి వలన కలిగే దుఃఖములు (worries) తోకముడుస్తాయి.
❋ ఈ లౌకికమైన బుద్ధి అనేక రుగ్మతలు కలిగియుంటోంది. అవన్నీ అల్పాశయములు (Lower state objectives), అల్పమైన అవగాహనలు, దుష్టమగు అభిప్రాయములు భయ ఉద్వేగములు మొదలైనవాటి రూపముగా పరిణమిస్తోంది. అట్టి బుద్ధివ్యాధి (ఆధి).. ఉపశమించగలదు.
❋ ‘‘నేను దేహములకు, బాంధవ్యములకు, ఆయా సంగతులకు బద్ధుడను’’ అను చిత్తబంధము తెగిపోగలదు.
❋ శారీరక వ్యాధులు బాధించజాలవు. ఆత్మోత్సాహము సమక్షములో అవన్నీ ‘చిన్నవి’ అని అనిపించగలవు.
❋ సర్వ శోకములు (All lamentation and melancholy) మటు మాయమైపోతాయి. ప్రక్షాళనమైపోతాయి.
❋ ‘‘నాకు ఏదో కావాలి! ఏదో పొందాలి! పొందనంతవరకు ఈ నా దీనస్థితి తొలగదు’’.. అను రూపముగా జనించే కామము మొదలైనవి అకామమైపోగలవు.
❋ ‘‘వారి సంగతి చూడాలి. వీరిని బాధించాలి. మరింకెవరినో వేధించాలి’’.. ఇటువంటి క్రోధవృత్తులు నివృత్తి అవుతాయి.
❋ చిత్తములో జన్మజన్మలుగా పేరుకొనియున్న అసంఖ్యాక వృత్తులు (దృశ్య సంబంధమైన ధ్యాసలు - uncountable Avocations)… వదలిపోతాయి.
❋ ‘‘క్షణక్షణం ఏదో ఒకటి సంకల్పిస్తూనే ఉండటము’’.. అనే అవిశ్రాంత దుష్ట-అల్పచర్యలు, వికల్పములు మొదలైన మానసిక దోషములు శలవు తీసుకుంటాయి.
❋ మనో-బుద్ధి-చిత్త అహంకారములలో రూపుదిద్దుకొనియున్న కోటిదోషములను ‘అహమ్ బ్రహ్మాస్మి’.. మంత్రము మొదలంట్లా కడిగివేయగలదు. సర్వపరతంత్రములను కూడా ‘అహమ్ బ్రహ్మాస్మి’ స్థితి.. నిర్వీర్యము చేయగలదు.
❋ అజ్ఞానమును పటాపంచలు చేసివేయగలదు.
❋ ఆత్మవలోకమునందు ప్రవేశించి అట్టి అహమ్ బ్రహ్మాస్మి మంత్రద్రష్ట - అనే వీరుడు - ఆత్మలోకమును దిగ్విజయుడై ఆక్రమించగలడు.
❋ ఆతడు ‘ఇది’ అని నిర్ణయించలేనట్టి, వాదనలకు అందని అప్రతర్క్య స్థానము పొందుచున్నాడు.
❋ అట్టి ఆత్మాహమ్ మనన ద్రష్టయందు జడత్వము మచ్చునకు కూడా దొరుకదు. ఆతడు అజడుడు!
❋ ‘అహమ్-బ్రహ్మాస్మి’ని సిద్ధించుకొనుచుండగా అజ్ఞానాసురుడు ఓడిపోగలడు.
‘‘దేహమే నేను! బద్ధుడను! పరిమితుడను! అల్పుడను! మనస్సు శత్రువు! ఇంకేదో లభిస్తేగాని త్రోవలేదు. కుల-మత-జాతి భేదములచే గొప్ప-తక్కువలు ఉంటాయి! జీవుడు ఆగామి-ప్రారబ్ధ-సంచిత కర్మల బద్ధుడు। మోక్షము అసాధ్యము। బంధము అనివార్యము। చాలామంది దొంగలే! కొందరు నాకు గిట్టనివారు. మరి కొందరు శత్రువులను బాధించాలి!’’.. మొదలుగా గల అనేక బంధనములకు త్రోవచూపిస్తున్న, జన్మ-కర్మలకు నిబద్ధించుచున్న ‘అనాత్మ’ అని చెప్పబడు అసురుడు… ఓడించబడి, సంహరించివేయబడగలడు.
❋ ‘అహమ్ బ్రహ్మాస్మి’ అను తత్త్వార్ధమననముచే సర్వజనులకు కూడా (ఎవ్వరు ఎట్టివారైనాసరే) సర్వబంధములు విడిపోయి ‘మోక్షము’ కరతలామలకము కాగలదు.
❋ ఈ జీవుడు ఆత్మానుభూతిని అనుక్షణికం చేసుకొన్నవాడై ‘జ్ఞానానందము’ అను పరమ పవిత్రస్థానము చేరుకోగలడు.
❋ కోటి జన్మలలో 7కోట్ల ఆయా అన్యదేవతా మహామంత్రములను జపిస్తే కలిగే పుణ్యఫలము ‘‘అహమ్ బ్రహ్మాస్మి’’ మంత్రముచే ఇప్పుడే, ఇక్కడే లభిస్తోంది.
అందుచేత ఓ సర్వజనులారా! ఓ ఉమామహేశ్వర ప్రియనందనా! హిమవతీపుత్రా! ప్రేమమూర్తీ! భక్తజన రక్షకా! కుమారస్వామీ!.. నేను వేరు - దైవము వేరు.. అను పరోక్ష భావనలతో కూడిన సర్వమంత్రములను (మననములను) క్రమంగా దాటివేయి.
ఓ జనులారా! బ్రహ్మము గురించి తెలుసుకొని, ‘‘నేనే బ్రహ్మమును. అహమ్ బ్రహ్మాస్మి’’ అను మంత్రమును, మననమును, నిదిధ్యాసను మీరంతా ఆశ్రయించండి.
సర్వమంత్రాన్ సముత్సృజ్య ఏతత్ మంత్రగ్ం సదా అభ్యసేత్! అన్నీ వదలండి. అహమ్ బ్రహ్మాస్మి మంత్రమును ఒక్కటే పట్టుకోండి. ఇక అద్దాని ఫలమంటారా? సద్యోమోక్షమ్ అవాప్నోతి!.. ‘‘సాధనలు, ఉపాసన, జ్ఞానసముపార్జన, భక్తిజ్ఞాన వైరాగ్యములు’’.. మొదలైన క్రమముక్తి విశేషాల ఆవశ్యకత ఉండదు! (సద్యోమోక్షమ్ = ఇప్పటికిప్పుడే ఇక్కడే సర్వబంధనములు తొలగి మోక్షము లభించటము).
నాస్తి సందేహమ్ అణ్వపి! ఇందులో అణువంత సందేహము కూడా ఉండవలసిన పనిలేదయ్యా।
4వ అధ్యాయము - జీవన్ముక్త - విదేహముక్త లక్షణములు
కుమారస్వామి : హే లోకశుభ శంకరా! మహేశ్వరా! ‘‘ఈ సర్వము బ్రహ్మమే! నేను బ్రహ్మమే! ఈ సర్వము నాయొక్క బ్రాహ్మీ స్వరూపము’’ .. అను మహత్తరమైన అర్థమును కలిగియుండి, అద్వితీయ స్థానమును జేర్చు ‘‘అహమ్ బ్రహ్మాస్మి’’ అను మంత్ర మననము-ఉపాసనల ప్రయోజనము ఎట్టిదో.. అమోఘంగా వివరించినందుకు మీకు కృతజ్ఞుడను.
పితృదేవా! శివభగవాన్! ఇక ఇప్పుడు జీవన్ముక్త - విదేహముక్తులు లక్షణములు ఏతీరైనవో.. మీరు తెలియజెప్పుచుండగా తెలుసుకోవాలని భావిస్తున్నాను. మిమ్ములను అభ్యర్థిస్తున్నాను.
పరమశివుడు : బిడ్డా! విను.
జీవన్ముక్తుని లక్షణములు
‘‘నేను ఎవ్వరు? ఏమి అయిఉన్నాను? ఏమి అయి ఉండనేలేదు?’’ అని తనను గురించి తాను సుస్పష్టముగా ఎరిగి ఉంటున్నవాడే జీవన్ముక్తుడు. ఆతడు స్వస్వరూపమగు ఆత్మగా (లేక) తనను తాను ఏఏ ఉపాయములతో ఆత్మస్వరూపునిగా తెలుసుకొంటూ ఉన్నాడో,.. అవియే జీవన్ముక్త లక్షణములు.
జీవన్ముక్తుని స్వస్వరూపావగాహనా గానము
చిదాత్మాఽహమ్ : ‘ఎరుక+ ఎరుగబడునది’.. ఏక స్వరూపమై ఉంటున్న ‘కేవల ఎరుక’ స్వరూపుడను! చిదాత్మను! జగత్తులన్నీ నా ‘ఎరుక’ లేక ‘చిత్’ నుండియే రూపుదిద్దుకుంటున్నాయి. ఈ కనబడేదంతా నా చిదాత్మయే! సర్వదా నేను చిదాత్మనే!
పరాత్మాఽహమ్ : ఒక కథకు ఆ కథారచయిత ‘కథకు పరము (Beyond) - కథకు ఆత్మ’ అయి ఉన్నాడు. ఒక స్వప్నమునకు ఆ స్వప్నము తనదైనవాడు - స్వప్నమునకు పరము, స్వప్నమునకు ఆత్మ అయిఉన్నాడు.
అట్లాగే…. (1) ఈ జగత్ దృశ్యము అంతటికీ.. నేను ఆవల ఉన్నాను. (2) దీనికంతటికీ సర్వదా ఆత్మను అయిఉన్నాను. నాకు కనబడుచున్న సమస్త దృశ్యమునకు ఆత్మను నేనే - అనునదే జీవన్ముక్త లక్షణము.
నిర్గుణోఽహమ్ : ఒక నాటక రచయిత - కోపము, ప్రేమ-మాయ, అమాయకత్వము, శృంగారము, క్రోధము, సౌమ్యత, దుఃఖము, ఆవేశము- మొదలైన నవరసాలు జోడించి నాటకం వ్రాస్తాడు. కానీ,.. ఆ నవరసాలు ఆయనలో ఉన్నాయా? ఆయన లక్షణములా? కాదు! అట్లాగే…. ఆ నాటకలో పాత్రలు ధరించే పాత్ర ధారులకు సంబంధించినవా? అబ్బే! కానే కాదు. పోనీ, ఆ నాటకం చూచే ప్రేక్షకులవా? అసలే కాదు!
మరెవ్వరివి? ఎవ్వరివీ కాదు!
నాటకము వినోదము కొరకు వ్రాయబడుతోంది; నటులచే నటించబడుతోంది; ప్రేక్షకులచే వినోదముగా చూడబడుతోంది. అట్లాగే.. సత్వ - రజో - తమోగుణ నిర్మితమైన ఈ జగత్ దృశ్యము, ఈ లోక-లోకాంతరములు.. ఇవన్నీ కూడా →
- సృష్టికర్తవి (బ్రహ్మదేవునివి).. కావు!
- ఇందులో జీవులై పాల్గొనుచున్నవారివి కాదు! కర్మ-జీవులుగా ఇవన్నీ అనుభవముగా పొందుచున్నవారివి కావు!
- చూస్తున్న ‘ద్రష్ట’వీ కావు.
మరెవ్వరివి? ఎవ్వరివీ కాదు! ఇదంతా లీలా వినోదంగా కల్పించబడి, ఇంద్రజాలము-స్వప్నవస్తువువలె.. ఎదురుగా అనుభూతమగుచున్నది. ఇది సుస్పష్టముగా గమనించుచున్నట్టివాడు జీవన్ముక్తుడు. గుణాతీతుడై, నిర్గుణుడై ఇదంతా క్రీడావిశేషాలుగా, లీలా వినోదముగా జీవన్ముక్తుడు దర్శిస్తున్నాడు.
పరాత్పరః : ఇంద్రియములకు ఎదురుగా కనిపించేదంతా ‘ఇహము’ (here). దీని తన అనుభూతిగా కలిగి ఉన్నవాడో పరస్వరూపుడు (లేక) జీవుడు. అట్టి పరము (జీవుడు..experiencer)ను - దృశ్యవిషయము వలె కలిగి ఉన్నవాడు - పరాత్ పరుడు. పరమునకు కూడా పరమైనవాడు. తనను తాను-(సర్వము ఎందులోఉన్నదో.. ‘అది తాను’ గా-ఆస్వాదిస్తూ..) ‘పరాత్పరుడు’.. అయి ఉంటున్నాడు. ఈ జగత్తులన్నిటినీ, సహజీవులందరినీ కూడా తన పరాత్పర తేజోవిశేషముగా జీవన్ముక్తుడు దర్శిస్తున్నాడు.
ఆత్మమాత్రేణ యః తిష్ఠేత్, సః జీవన్ముక్త - ఉచ్యతే! ఎవ్వడైతే సర్వదా కేవల-ఆత్మమాత్రుడై శేషించి ఉంటాడో.. ఆతడు జీవన్ముక్తుడు. ఏదైతే దృశ్యాత్మగా-జీవాత్మగా-ఈశ్వరాత్మగా-పరాత్మగా కూడా ఉన్నదో.. అట్టి ఆత్మయే, తానై సంతిష్టించుకొని ఉంటున్నవాడే జీవన్ముక్తుడు.
⌘ ⌘ ⌘
కుమారస్వామి : తండ్రీ! శివమహేశ్వరా! కైలాసవాసా! జీవన్ముక్తుని స్వభావ లక్షణములుగా ‘‘చిదాత్మాహమ్ పరాత్మాహమ్ నిర్గుణోఽహమ్ పరాత్పరోఽహమ్ ఆత్మమాత్రోఽహమ్’’.. అనునవి మహత్తరంగా వివరించారు. అమోఘము!
ఇంకా కూడా మరికొన్ని విశేషాలు మా యొక్క జీవన్ముక్తత్వ సిద్ధి కొరకై, జీవన్ముక్తుని అవగాహనల గురించి, చెప్పవలసినందిగా విన్నపము.
పరమశివ భగవానుడు : ఓ పార్వతీ ప్రియనందనా! విను. చెప్పుచున్నాను.
దేహ త్రయ అతిరిక్తోహగ్ం : ఇక్కడ కనిపించే స్థూల - సూక్ష్మ - కారణ దేహములు మాయాకల్పితములు. ఒక మంత్రగాడి (magician) కల్పనా ప్రదర్శన (magic show) లో అంతర్భాగముల వంటివి. అట్టి స్థూల (matter related) - సూక్ష్మ (thought-related) - కారణ (mental habit - related) దేహములకు వేరైనది ఆత్మ. అట్టి ఆత్మయొక్క అనునిత్య దర్శనమును జీవన్ముక్తుడు కలిగి ఉంటున్నాడు. అట్టి ఆత్మయే ‘తత్’ శబ్దముచే చెప్పబడుచూ, ‘త్వమ్’నకు ‘అహమ్’నకు అనన్యముగా నిర్వచించబడుతోంది.
‘‘ఆత్మనగు నేను ‘దేహి’గా ఉండటం చేతనే స్థూల-సూక్ష్మ-కారణములు ఉనికిని కలిగి ఉన్నాయి. అంతేగాని, వాటిలో నేను లేను. నాలో అవి లేవు.’’ → అని ఎరిగిన వాడై ఉంటున్నాడు.
శుద్ధ చైతన్యమస్మ్యహమ్: ‘‘కదలువాడు-కదలునది’’ కూడా అయిఉన్న కేవల-శుద్ధ (Absolute) చైతన్యస్వరూపుడను.
మనో-బుద్ధి-చిత్త - అహంకారాలకు భావనా చైతన్యము, భౌతికదేహమునకు జీవన చైతన్యము, జగత్ దృశ్యమునకు అనుభవ చైతన్యము నేనే!
ఆ మూడిటికీ వేరైన సాక్షీచైతన్యరూపుడను! ఆ మూడిటికీ అందనివాడను! ఆ మూడిటిచే స్పృశించబడనివాడను! కాబట్టి - శుద్ధ చైతన్య స్వరూపమై ఉన్నాను ’’ అని జీవన్ముక్తుడు గమనించుచున్నాడు. ‘సర్వమునకు ఆవల గల బ్రహ్మమే నేను’ - అని గ్రహిస్తున్నాడు.
సర్వసంగ వివర్జితః : కలలో కనిపించినవన్నీ ఆ కల తనదైనట్టివానియొక్క కల్పనే అయినప్పటికీ,.. ఆ కల తనదైనవాడు-(స్వప్న కాల్పికుడు) - స్వప్నముతో ప్రారంభమగుట లేదు. స్వప్నముతో ముగియడు. అట్లాగే ‘‘ఆత్మనగు నేను జాగ్రత్-స్వప్న-సుషుప్తుల కల్పనకు మునుముందే, ‘‘సర్వమునకు కల్పించువాడినై, సర్వమునకు వేరై, కల్పనా రహితుడనై.. ఉన్నాను’’.. అను స్వావలంబన సహితుడై (జీవనన్ముక్తుడు) ఉంటున్నాడు.
నిత్యానంద ప్రసన్నాత్మా: ‘‘జాగ్రత్-స్వప్న-సుషుప్తులు నా ఆనంద ప్రదర్శనము.. ఆనందములో విభాగములు. ఆత్మగా, నేను నిత్య-ఆనంద ప్రసన్నత్వము - అను సలక్షణుడనై ఉన్నాను’’.. అని అవగాహనను వీడనివాడై ఉంటున్నాడు. అన్యచింతా వివర్జితః। ఈ విశ్వమంతా ఆత్మస్వరూపమే! నేను ఆ ఆత్మనే! కనుక ఈ 14 లోకాలలో నాకు అన్యమైనది లేదు. స్వప్నద్రష్టకు వేరుగా స్వప్నంలో ఏదైనా విభాగం ఉంటుందా? ఉండదు. నా భావనకు వేరై ఎక్కడా ఏదీ లేదు. కనుక అన్యచింతనా రహితుడను. ఇదంతా నాకు అనన్యము. నేను ఈ సర్వమునకు అనన్యమును - అని జీవన్ముక్తుడు ఎరిగి ఉంటున్నాడు.
శ్లో।। యస్య దేహాదికం నాస్తి, యస్య బ్రహ్మేతి నిశ్చయః,
పరమానంద పూర్ణోయః (తస్య) ఆనంద ఘనరూపోఽస్మి! పరానంద ఘనోస్మ్యహమ్।
‘‘ఎవ్వరికైతే స్థూల సూక్ష్మ కారణ.. ఇత్యాది దేహములు లేనేలేవో, ఎవ్వరు సర్వదా బ్రహ్మమే నిశ్చయముగా అయిన్నారో, పరమానందముచే స్వయముగా పూర్ణులై ఉన్నారో.. అట్టి ఆనంద-పరానంద ఘనపూర్ణుడను’’ అని తనను తాను సందర్శించుకొనుచున్నవాడే జీవన్ముక్తుడు.
‘‘ఎవ్వరిపట్ల కించిత్ కూడా పరిమితమైన ‘నేను’నకు (జాగ్రత్‌లోని నేను -స్వప్నములోని నేను. సుషుప్తిలోని నేను లకు)చోటు లేదో, ‘‘సర్వమునకు ఆవల కేవల చిన్మాత్రస్వరూపుడనై - స్వభావుడనై ఉన్నానో.. అదియే నేను!’’.. అను అవగాహనను పుణికి పుచ్చుకొని ఉంటున్నాడో, ఆతడే జీవన్ముక్తుడు.
అట్టి జీవన్ముక్తుడు..,
👉 ఈ కనబడేదంతా నా ఆత్మస్వరూపముచే నిండినదై ఉన్నది → అను అనుభూతిచే సర్వత్రా పరిపూర్ణరూపాత్ముడై ఉంటున్నాడు.
👉 ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఉండిఉన్నప్పటికీ సర్వదా ఆత్మగా శేషించువాడై ప్రకాశించుచున్నాడు.
👉 వ్యక్తీకరణమగుచున్న ఈ జగత్తుకు ఆవల అవ్యక్తానందమునందు రమించుచున్నాడు.
👉 తాను పరిపూర్ణ చిత్-ఆనందుడై ఉండియే జగత్తులో దేహిగా కూడా చరిస్తున్నాడు.
👉 సర్వసంగములను (All Attachments) విసర్జించివేసి, శుద్ధచైతన్య స్వరూపుడై వెలుగొందుచున్నాడు.
👉 సర్వ చింతలు త్యజించి ‘అన్యము’ అనునదే లేనివాడై నిత్యానంద ప్రసన్నాత్ముడై ఉంటున్నాడు.
👉 దేనిలోనూ కించిత్ కూడా అస్థిత్వము లేనివాడై సర్వము తనయందే దర్శించుచున్నాడు.
ఓ షణ్ముఖా : ఆ జీవన్ముక్తుడు ఇంకా కూడా తనను తాను ఈఈ విధంగా దర్శించుచున్నాడు.
👉 నిత్యోదిక చైతన్యరూపుడను. (I am always over-flowing Inspiration). అట్టి నిత్య చైతన్యరూపుడనగు నాకు మనోబుద్ధి-చిత్త-అహంకారాలు లేవు. ఇంద్రియములు లేవు. అవన్నీ బ్రహ్మజ్ఞాన పాఠ్యాంశముగా నా పట్ల కల్పించబడి చెప్పుకోబడుచున్నాయి. నా కల్పనలోనివి నాకు చెందిన లక్షణములు అవవుగదా! నాటకంలోని పాత్ర లక్షణాలు, స్వభావాలు నాటక రచయితకి ఆపాదించలేనట్లే - ఇక్కడి దేహము, అంతరంగము, ప్రాణతత్త్వము మొదలైనవన్నీ నా స్వరూప సంబంధమైనవి కావు. స్వీయ కల్పనలో విశేషములు మాత్రమే!
👉 ఆత్మనై యున్న నాకు దేహము లేదు. పంచప్రాణములు లేవు. అట్లాగే మాయలేదు. కామము లేదు. క్రోధము లేదు. కలలో ఊహగా జనించినవి ఊహలోని అంతర్భాగములేగాని ‘నావి’ కావు. నేను కలిగి ఉన్నట్టివి కావు. కలలోని విశేషాలు నా స్వభావంగా ఎవ్వరూ ఆపాదించనూలేరు కదా! అట్లాగే జాగ్రత్ కూడా స్వకీయ కల్పిత స్వప్నమువంటిదేగాని, మరొకరెవరో కల్పించగా నేను ప్రవేశించినది కాదు.
👉 ఇక్కడ ఉన్నదేదీ (శరీరము మొదలైనవి) నేను కాదు. నాకు ‘జగత్తు’ అనబడునది కించిత్ కూడా ఎన్నడూ లేదు. మనోబుద్ధి చిత్త సంబంధమైన ఏ దోషములు నా స్వరూపమునకు సంబంధించినవి కావు. దేహము యొక్క లింగభేదము, కళ్లు-చూపు, తదితర ఇంద్రియములు, మనస్సు - ఇవేవీ నాకు లేవు. అతన్నీ జగత్‌స్వప్న-కల్పనలోనివి. చెవులు-నాలుక-ముక్కు-చేతులు.. ఇవన్నీ కూడా నాకు సంబంధించినవి కావు. జాగ్రత్-స్వప్నములు గాని, వాటిని పొందుటకు గల కారణములుగాని నాకు సంబంధించినవి కావు. జాగ్రత్-స్వప్న-సుషుప్తి-తురీయములకు చెందినవాడిని కాను. కనుక అవన్నీ నా యొక్క (ఆత్మయొక్క) విభాగమే కావు. ఆత్మయొక్క సమక్షముచే ఆత్మయందు స్వయంకల్పితమగుచున్న - ఆత్మకు అభిన్నమైన స్వకీయ విశేషాలు మాత్రమే అవి.
… ఇట్టి అవగాహనచే.. అట్టివాడు ‘జీవన్ముక్తుడు’గా చెప్పబడుచున్నాడయ్యా!
ఓ హిమగిరినందిని ప్రియకుమారా! కరుణామయుడుగా ప్రసిద్ధుడా! కార్తికేయా!
జీవన్ముక్తుడు → ఈ జగత్ దృశ్యమును, జన్మకర్మలను చూస్తూనే.. ఎట్టి అవగాహన కలిగి ఉంటాడో.. మరికొన్ని విశేషాలు ఇంకా చెప్పుచున్నాను. విను.
జీవన్ముక్తుని మరికొన్ని అవగాహనా విశేషములు
⌘ ఇక్కడ నేను ఏదేదిగా కనిపిస్తూ ఉన్నానో, అదంతా కూడా కించిత్ కూడా నేను కాదు. ఇదగ్ం సర్వమ్ నమే కించిత్! దృష్టిచే కనిపించేదంతా దృష్టికి సంబంధించినది మాత్రమే! నాకు సంబంధించినది కాదు. (ఎందుకంటే, యత్ దృశ్యమ్ - తత్ నశ్యమ్ కనుక)
⌘ నాకు సంబంధించిన వస్తువంటూ ఇక్కడ ఏదీ లేదు. ఈ దేహము మొదలైనవి జగత్ కల్పనలోనివి. నేనో, కల్పనా రహితమగు ‘తేజోస్వరూప కేవలాత్మ’ను.
⌘ ఇక్కడి ఆచరణ రూపంగా కనిపించే స్నానము, సంధ్య, దైవము మొదలైనట్టి ఇవేమీ నాకు లేవు. నేను సేవించవలసియున్న తీర్థ స్థలము లేదు. నాది అను స్థలము లేదు.
⌘ నాకు జ్ఞానదశలు, జ్ఞానము, అజ్ఞానము.. ఇవన్నీ లేవు. జ్ఞాన-జ్ఞేయములన్నీ కల్పనాదృష్టితో ఉన్నట్లు అగుపిస్తూ కూడా,.. ఆత్మదృష్టిచే లేనట్టివే!
⌘ ‘దేహి’కి కూడా సాక్షినగు నాకు దేహమే లేదు. కాబట్టి జన్మలేదు. బంధువులు లేరు. కల్పన చేతనో (లేక) ఊహగానో కల్పించబడే కథనములలో కనిపించే వాటికి ఒకదానితో మరొకదానికి బంధుత్వమేముంటుంది?
⌘ ఆత్మనగు నాకు ఇది పుణ్యము-అది పాపము అనబడునదేదీ లేదు. నేనొక కథ వ్రాస్తే అందులోని పాత్రల స్వభావాలు-స్వరూపాలు నావి అవుతాయా? లేదుకదా!
అందుచేత నాకు సంబంధించినవై →
… పాపపుణ్యములు లేవు.
… కార్యములు లేవు. వాటి వలన కలిగే శుభములు లేవు. అకార్యములు లేవు. వాటివలన అశుభములు లేవు.
… జీవాత్మ లేదు! నాకు చెందినది మాత్రమే అయినట్టి ‘స్వాత్మ’ అనునదీ లేదు.
… నాపట్ల స్వర్గ-మర్త్య-పాతాళ లోకములు (త్రిజగత్తులు) లేవు. వాటి యందు నాయొక్క ప్రవేశ-నిష్క్రమణములు లేవు.
… మోక్షము లేదు. ఆ మోక్షమునకు అవరోధమని చెప్పబడే ద్వైతము లేదు.
… ‘‘….ఇది నాకు దగ్గిర అయినది. అది నాకు దూరముగా ఉన్నది..’’ - అనునదేదీ లేదు. నాస్వప్నంలో నాకు దూరమైనదేది? దగ్గరయినది ఏది?
… ప్రదర్శనమైనది లేదు. రహస్యమైనది లేదు. బోధ లేదు. అబోధ లేదు. ఏకమగు ఆత్మయే ఉన్నది.
… ‘‘సర్వము నేనైన నేను’’ అను నా సర్వాత్మకత్వమునకు.. గురువు (బోధించువాడు) లేడు. శిష్యుడు (బోధింపబడవలసి ఆవశ్యకత కలవాడు) లేడు.
… నేను ఎవ్వరికన్నా హీనుడనుకాను. అధికుడను కాను. అధిక-అల్పత్వములనునవేవీ లేవు. అందరిలో ఆత్మగా వేంచేసి ఉండగా సర్వులు మమాత్మ సహజరూపులే అయి ఉండగా…, ఇక ఏది దేనికంటే అధిక-అల్పములు కలిగి ఉంటుంది? కలలో ఎవ్వరో ఇద్దరు కనిపిస్తే నిద్రలేచి ఎవరు ఎవరి కంటే గొప్ప - అని నిర్ణయించుకుంటాము? అల్పులని సిద్ధాంతీకరించుకుంటాము?
… ఆత్మనగు నానుండే బయల్వెడలు ఊహ-భావన-లీల-వినోదము-కల్పనయే ఈ సృష్టి. అందుచేత కేవలస్వరూపమగు మమాత్మ సమక్షములో సృష్టికర్తయగు బ్రహ్మ, స్థితికారుడగు విష్ణువు, లయకారుడగు రుద్రుడు, మనోరూపుడగు చంద్రుడు కూడా కల్పన, (లేక) మాయలోని విశేషములే! ఆత్మకు వేరుగా బ్రహ్మ-విష్ణు-రుద్రులు లేరు. చంద్రుడు లేరు! తదితర దేవతలు లేరు!
… ఆత్మదృష్ట్యా ఇక్కడి పృథివి (Solid), తోయము. (జలము-Liquid), అగ్ని (Heat), వాయువు (Air, సంచలనము), ఆకాశము (space) అను పంచభూతములు కూడా లేవు. కుల-గోత్రములు లేవు. మరొకటైన (ఆత్మకు వేరైన) లక్ష్యము లేదు. ఎందుకంటే నాకు పుట్టుకయే లేదు. దేహముతో పుట్టను. చావను. దేహమునకు పరమై యున్న నాకు దేహిగా కుల-గోత్ర-జాతి-దేశ భేదము లేమి ఉంటాయి?
… ‘కలలోని నేను’ అనునది ‘‘కల నాదైన నేను’’ యొక్క కల్పనయే కదా! కలలో నాకు వేరుగా ధ్యాత-(One who is observing), ధ్యానము (observation), ధ్యేయము (That being observed).. ఉన్నాయా? లేవుకదా! అట్లాగే జాగ్రత్ స్వప్న సుషుప్తులకు కేవల-మౌన సాక్షినగు నాకు ఎక్కడా (జాగ్రత్ మొదలైనవాటిలో) ధ్యాత-ధ్యానము-ధ్యేయము లేవు. అట్లాగే ‘మనస్సు’ అనబడునది నాకు వేరుగా లేదు. నా ఆలోచనల ప్రదర్శనమునే శాస్త్రములు -‘మనస్సు’ అని ‘ఇష్టము’ అని - పిలుస్తున్నాయి.
ఇంకా….
- నాకు శీత-ఉష్ణములు, ఆకలి-దాహములు లేవు. అవన్నీ భౌతిక శరీర ధర్మములు. ఆత్మధర్మములు కావు.
- నాకు శత్రువు లేడు. మిత్రుడు లేడు. మోహము లేదు. ఆ మోహముపై జయము అనునదీ లేదు. అవన్నీ కలలోని సంఘటనల వంటివి. అవి మనో ధర్మములు. ఆత్మనగు నా ధర్మములు (Features) కావు.
- ఆత్మనగు నేను జన్మలకంటే, కర్మల కంటే మునుముందే ఉన్నాను. ఇప్పుడు ఆత్మగా ఏమై ఉన్నానో, ఇతఃపూర్వము అదియే అయి ఉన్నాను. ఇక ముందు అదియే అయి ఉండబోవుచున్నాను. క్రితం జన్మలోను-ఇప్పుడు-వచ్చే జన్మలోను నేను నేనుగానే ఉంటాను. అందుచేత నాకు పూర్వము (past) అనునది లేదు. పశ్చాత్ (Now Afterwards) అను మరొకటేదీ లేదు. నాకు పైన-క్రింద–8 దిక్కులు.. ఇవన్నీ లేవు. సూర్యుడు-భూమిలను ప్రక్కకు పెట్టితే దిక్కులే లేనివిధంగా… నాకు దిక్కులు లేవు.
- నేను నా గురించి ఆత్మగా మరొకరికి చెప్పవలసినదేదీ కొంచము కూడా లేడు. ఇతరుల నుండి నా గురించి వినవలసినదీ అణువంతకూడా లేదు. క్రొత్తగా చూడవలసినది ఈ షణ్మాత్రము కూడా 14 లోకాలలో ఎక్కడా ఏదీ లేదు. అణువంత క్రొత్తగా ఆలోచించవలసినది (ధ్యాతత్వము) కూడా ఏదీ లేదు. నాకు మరొకటేదో భోగించవలసినది లేదు.స్మరించవలసినది (స్మర్తవ్యము).. కూడా లేవు.
- నాకు భోగము లేదు. రాగము లేదు. యోగము లేదు. ఏదో పోయి ఎందులోనో లయించవలసినదీ లేదు.
- ఆత్మనగు నానుండే గుణములన్నీ బయల్వెడలుచున్నాయి. అందుచేత సహజంగానే గుణములకు ఆవల గుణాతీతుడను. నాకు మూర్ఖగుణము లేదు. శాంతగుణము లేదు. ప్రియమైనది లేదు. అప్రియమైనది లేదు. బంధము లేదు. మోక్షము లేదు. ఈ దృశ్యజగత్తులో నాకు ఏదీ మోదము (సంతోషము) చెందవలసినది లేదు. ప్రమోదము (మహదానందము) పొందవలసినదీ లేదు.
- నాకు స్థూలత్వము లేదు. కృశత్వము లేదు. ఆ రెండు ఈ భౌతిక దేహధర్మములు. ఆత్మనగు నా ధర్మాలు కాదు. అట్లాగే ‘‘పొడుగు-పొట్టి-వృద్ధి-క్షయము’’ - ఇవేమీ లేవు.
- అధ్యారోపవాదము (ఆత్మ జీవుడుగా అగుచున్నది), అపవాదము (జీవాత్మ-పరమాత్మ ఒకే చోట గల రెండు తత్త్వములు. రెండు కలిగి యున్న పక్షులు) బీ ఏకము - బహుళము = ఇవన్నీ కూడా ఆత్మను నిర్ణయించలేవు. ఆత్మకు ఆరోపించబడజాలవు.
- అంధత్వము- మాంద్యత్వము (బుద్ధి మాంద్యము), స్థూలత్వము, అణుత్వము, రక్త-మాంస మేదో (క్రొవ్వు))- బొమికలు - మజ్జ-చర్మము-సప్తధాతువులు-శుక్లము-రక్తము-ఎరుపు-నీలము.. ఇవన్నీ దేహవిశేషాలేగాని, ఆత్మకు సంబంధించియే లేవు.
తపస్సు, తపో ఫలితాలు-ఇవన్నీ ప్రకృతిలోని మనో-బుద్ధులకు సంబంధించినవేగాని, ఆవల (పరమ్) ఆత్మనగు నాకు అవి సంబంధించి లేవు. బంధించేవికావు. ‘‘ఇది ముఖ్యము-ఇది గౌణము(తక్కువగా ముఖ్యము)’’ - అను ముఖ్యాముఖ్య భేదమేదీ ఆత్మగా నాకు లేవు.
నాకు అహ్రాంతి లేదు. స్థైర్యము లేదు. కులము లేదు. ‘వ్యక్తిగత రహస్యము’ అనునదేదీ లేదు. అట్లాగే ‘‘ఇది నేను తప్పక త్యజించాలి - అనునదీ లేదు. ‘‘అది నేను తప్పక గ్రహించాలి’’ - అనునదీ లేదు. ‘నయము’ (Softway) అనునది లేదు. భయము లేదు. హాస్యము లేదు. అపహాస్యము లేదు. ఎవ్వరిచేతనూ అపహాస్యము చేయబడువాడనుగాను. అవన్నీ అహంకారము యొక్క, మనస్సు యొక్క ధర్మాలు.
ఆత్మనగు నాకు వ్రతములు, నియమములు, వ్రత ఫలితములు, అడ్డంకులు, దిగుళ్ళు, దుఃఖాలు, సుఖము, మౌఢ్యము మొదలైనవి లేవు. అవన్నీ మనస్సు పొందవచ్చుగాక! వాటిచే స్పృశించబడువాడను కాను.
అట్లాగే ‘‘తెలుసుకొనువాడు (జ్ఞాత); తెలుసుకోవటం (జ్ఞానము); తెలియబడునది (జ్ఞేయము) - అను ధర్మములు ఆత్మనగునాకు లేవు. అవన్నీ స్వకీయ కల్పన అగు ‘జీవాత్మ’కు సంబంధించినవి! అవి కేవలాత్మకు సంబంధించినవి కావు.
అట్లాగే నేను (స్వయం)-నీవు (తుభ్యం), మహ్యం (నాకు చెందినది)-త్వంచ (నీకు సంబంధించినవి), ‘నేనైన నీవు’, ‘నీవైననేను’.. అనునవీ లేవు. అవన్నీ ఊహ-అపోహల విన్యాసము మాత్రమే!
ఈ దేహము పొందే జన్మ-బాల్య-కౌమార - యౌవన-వార్ధక్య-మరణ ధర్మములు ఆత్మనగు నాకు లేవు.
నేను సర్వదా బ్రహ్మమునే! సర్వదా బ్రహ్మమునే! బ్రహ్మమునకు వేరైనదేదీ నేను కాదు! చిదానందరూపుడను! ఇది సునిశ్చితం!
ఇట్టి తీరుగా ఎవరికి నిశ్చయము ఉంటుందో - ఆతడు జీవన్ముక్తుడే!
అనగా ఎవ్వరికైతే సంశయములన్నీ తొలగిపోగా →
సర్వమునకు కారణం నేనే! కార్యము నేనే! అని ఎరిగి ఉన్నవాడు ‘‘జీవన్ముక్తుడు!’’
విదేహముక్తుడు |
బ్రహ్మజ్ఞానమును విజ్ఞానరూపముగా ధరించి - జీవన్ముక్తుడు స్వయంప్రకాశకుడగు సూర్యభగవానునివలె విదేహముక్తుడై ప్రకాశించుచున్నాడు.
ఇట్టివాడు - విదేహముక్తుడు.
ఓ స్వామినాధా! షణ్ముఖా! ఇంకా విదేహముక్తుని స్వానుభవం గురించి మరికొన్ని విశేషాలు చెప్పుకుందాము.
‘‘నేను అనంత కోటి జీవులలో ఒక జీవాత్మను’’ అను కల్పనను అధిగమించి ‘‘సర్వులలోని అంతర్యామిని! సర్వాత్మకుడను. సర్వజీవులలో సమముగా ప్రకాశించు సమరూపాత్ముడను - నేను’’ - అను అనుభవము ఆతనియందు స్వాభావికమై ఉంటుంది.
సమరూపాత్ముడు → సర్వము నందు సమముగా తనను (ఆత్మానమ్ సర్వరూపస్థమ్),
→ సర్వము తనయందు, (ఆత్మని సర్వరూపాని చ),
→ సర్వులు తన ఆత్మరూపులుగాను (సర్వే మమాత్మరూపం చ),
→ తాను సర్వుల ఆత్మరూపుడుగాను (మమాత్మా సర్వరూపాత్మా),
శుద్ధాత్ముడు - అయి ఉంటాడు. జగత్ రహిత-మనోబుద్ధి రహిత కేవలీ స్వరూపత్వమును కించిత్ కూడా ఏమరువక ఉండువాడు విదేహముక్తుడు.
ఏకవర్జిత ఏకాత్మా! సర్వాత్మా స్వాత్మమాత్రకః! ‘‘నేను ఏకమే! ఇన్ని రూపములు నేనే’’.. అను ఏకాత్మభావనా ప్రయత్నము యొక్క అవసరం లేకుండానే స్వాభావికంగానే ఏకాత్ముడు అయి ఉంటాడు.
ఆత్మ అనగా ఈ వ్యష్టి దేహమునకు పరిమితమైనదికాదు. సర్వజీవుల స్వరూపమైయున్నటిది. సర్వజీవులుగా ఉన్నట్టి నేనే మమాత్మ! ఈ విశ్వమంతా నాశరీరము! నా స్వభావము! అన్ని రూపాలు నేనైన నేనే నేను’’.. అను స్వానుభూతి- అచంచలానుభవమునందు సర్వదా సుపత్రిష్టితుడై ఉంటున్నారు. విశ్వరూపుడై, ‘‘విశ్వరూప సందర్శన యోగము’’ ను సిద్ధించుకొనినవాడై ఉంటాడు.
ఎద్దాని నుండి దేహములు - ఇంద్రియ జగత్తులు - జలంలో తరంగాల వలె, స్వప్నంలో గ్రామసీమలవలె, బంగారంలో ఆభరణములవలె జనిస్తూ ఉన్నప్పటికీ, తనకు మాత్రం ‘జన్మ’ అను ధర్మమే లేదో, సర్వదా నేను అట్టి అజాత్మను। మార్పు-మృతము లేనట్టి అమృతస్వరూపుడను! నాకు నేనే స్వయముగా ఆత్మ అయిఉన్నట్టివాడను! అంతేగాని, మరొకరి ప్రమేయముతోనో, ప్రయత్నములోనో ‘ఆత్మ’ను అగుచుండటం లేదు.
అక్షరములు ఉపయోగించి ఒకడు ఒక కథ వ్రాస్తే…. అక్షరములు పెరగవు తరుగవు కదా! ఆ విధంగా జగత్తుల ఆవిర్భావ - ఉనికి-తిరోభావములచే ఆత్మనగు నేను తరుగుట లేదు. పెరుగుట లేదు. అందుచేత అవ్యయుడను.
సర్వజీవులయొక్క సర్వ ప్రయత్నముల, సర్వసాధనముల, వేద-ఉపనిషత్-పురాణ-ఆచారాది సర్వ విశేషముల.. అంతిమసారము, లక్ష్యము.. నేనే। సూక్ష్మమునకే సూక్ష్మమగు లలితాత్ముడను! స్వభావము (ప్రకృతి-భావన-ఊహ).. అగు ఈ దృశ్య జగత్తుకు.. అట్టి స్వభావము నాదైనట్టివాడను! స్వభావమును కూడా తుష్ణీకరించు స్వస్వభావుడను!
పరమానందాత్మను! సర్వులకు ప్రియమగు ఆత్మను! నేను దేనికీ సంబంధించక, బద్ధుడు కానట్టివాడను!
అందుచేత నిత్యముక్త-మోక్ష స్వరూపమగు ఆత్మయే నేను! చిత్‌స్వరూపుడను! కేవలుడను! చైతన్య స్వరూపుడను, ఎరుక స్వరూపుడను అగు నాకు ఇక ‘చింతలు’ ఏమి ఉంటాయి? చిత్ స్వరూపుడనై, చింతలు లేనట్టివాడను! అస్మత్ స్వస్వరూప సందర్శనాగ్నిచే చింతలన్నీ నిశ్చింతలుగా చేసి వేయుచున్నాను.
ఈ విధంగా ఎవ్వరైతే తమను తాము అఖండ-అప్రమేయాత్మగా ఎరుగుచున్నారో.. వారు విదేహముక్తులు!
సర్వ తదితర నిశ్చయములను సుదూరముగా పరిత్యజించి ‘‘అహమ్ బ్రహాస్మి’’ నిశ్చయమును మాత్రమే కలిగి ఉంటున్నారు. బ్రహ్మము యొక్క సర్వత్వము, సర్వసమత్వము, నిత్యత్వము, ఆనందత్వములను తన ఆనంద స్వభావముగా గమనించి అనునిత్యముగాను, స్వాభావికంగాను ఆనందస్వాంతుడై ఉండువారు విదేహముక్తుడు.
ఈ సర్వము ఉన్నదా? లేదా? అనే చర్చ-విచారణ-నిర్ణయములను (మేడను చేరువాడు మెట్ల దాటి వేయుతీరుగా) అధిగమిస్తున్నాడు. ‘‘నేను బ్రహ్మమును! (లేక) కాను!.. మొదలైన చర్చనీయాంశ ప్రయాసలను వదలి ‘‘సత్ చిత్ ఆనంద మాత్రము’’.. తనకు తానే అయి వెలుగొందుచున్నవాడు - విదేహముక్తుడు. ‘‘ఈ సమస్త విశ్వము అస్మత్ దేహమగుచుండగా నేను విశ్వదేహిని. విశ్వముగా విశదీకరించుకొనుచున్న విశ్వేశ్వరుడను’’ - అను ఎరుక గలవాడు.
‘‘ఏదీ, ఎప్పుడూ, ఏకించిత్ కూడా - ఆకాశమువలె కేవల సాక్షి అగు - ఆత్మను స్పృశించదు’’… అని గ్రహించి సర్వ అన్యత్వములను తూష్ణీకరించినవాడై, ఒక్క పరమ సత్యమగు ఆత్మను తుష్ణీకరించక, ఏమరచక సర్వము తానై ఆనందించువాడు - విదేహముక్తుడు. తనను తాను ఈ కనబడే సమస్తమునకు అనన్యుడై దీపించువాడు ఆతడు.
గుణములన్నిటికీ అతీతుడై (గుణాతీతుడై) ‘‘ఈ సర్వజీవులకు ఆత్మను సర్వదా నేనే’’.. అను ‘‘సర్వభూతాత్మభూతాత్మ’’ భావనను నిశ్చలముగా కలిగి ఉంటున్నాడు. ఆతనికి కాలభేదము గాని, వస్తు భేదముగాని, దేశభేదముగాని, స్వ-పర భేదముగాని కించిత్ కూడా శేషించి ఉండదు!
‘‘నాకు-నీకు-ఇద్దానికి కాలాత్ముడను. కాలస్వరూపుడను. కాలహీనుడను (కాలరహితుడను). కాలఃకాలుడను. ఏదీ కూడా ఎందులో అయితే ఏమాత్రమూ లేదో,.. అట్టి శూన్యాత్ముడను. పరమశూన్యరూపుడను. ఈ విశ్వమంతటికీ ఆత్మను! విశ్వరహితుడను. దేవతలందరికీ ఆత్మనైనట్టివాడను. దేవతా రహితుడను! పరిమితములైనట్టివాటికన్నిటికీ ఆత్మనై ఉన్నట్టి అపరిమితుడను! కలలో కనిపించిన జడమగు రాయికి స్వప్న ద్రష్ట యొక్క దివ్య-స్వప్నకళాచైతన్యమే మూలవస్తువయిఉన్న తీరుగా, జాగ్రత్‌లో సర్వత్ర జడముగా కనిపించునదంతా నా జాగ్రత్ చైతన్యరూపమే అయి ఉన్నవాడను. నిత్యోదిత చైతన్య స్వరూపుడను కాబట్టి జడత్వ రహితుడను! సంకల్పముల కల్పనా రహితుడను’’
…. అని ఎరిగి ఉండువాడే విదేహముక్తుడు.
⌘
ఇంకా కూడా,
‘‘పర సంవిత్ (పర+సత్+విత్) సుఖ స్వరూపుడనై సర్వమునకు, ఆవల-ఈవల కూడా ఆక్రమించుకొని ఉన్నవాడను, తురీయాతీతస్వరూపుడనగు నాకు శుభ-అశుభములనువేవీ లేవు.
❋ గుణరహితుడను.గుణాతీతుడను. త్రిగుణానంద స్వరూపుడను. అయితే, ఒక కళాకారుడు కళను ప్రదర్శించి ఆనందించు రీతిగా, నేను త్రిగుణ ప్రదర్శనముచేసి వినోదిస్తూ ఉంటాను.
❋ దేశకాల పరిమితములు లేనివాడను. అవి స్వీయకల్పనలోని ఒకానొక విభవము మాత్రమే.
❋ నేను దేనికీ సాక్షి కాదు. ఏదీ నాకు సాక్షి కాదు. సాక్షిత్వ-అసాక్షిత్వములనేవేవీ నాకు లేవు.
❋ ఏ కొంచములో ఏ కొంచమై నాయందు ఈ కొంచముగా ప్రపంచ రూపముదాల్చి యున్నట్లు అనిపిస్తోందో, అట్టి ఇదంతా సత్యదృష్టి కాదు. స్వకీయ వినోదచమత్కార దృష్టి. వినోదకల్పనలో సత్యాసత్యములేమి ఉంటాయి?
❋ ఇక్కడ ప్రపంచాకారము లేదు. బ్రహ్మాకారము లేదు. సమస్తము సర్వదా అఖండమగు బ్రహ్మమే అయి ఉన్నది.
❋ ‘‘స్వస్వరూపమే స్వయం జ్యోతి స్వరూపము. స్వస్వరూపమునందే స్వయముగా జగత్ భావననై రమించుచున్నాను. ఈ జగత్ నాయొక్క కేవలీ స్వరూపమే’’.. అను సత్యముచే సిద్ధించుచున్న ఆనంద స్వరూపుడను. మనస్సుకు, వాక్కుకు అగోచరుడను. నేను నా స్వరూపమును వివరించి ఇట్టిదని మాటలతో చెప్పజాలను! అతీతమునకే అతీతమైయున్న భావనా మాత్ర సంవేద్యుడను.
❋ చిత్తవృత్తులుగా ప్రకాశిస్తూనే చిత్తవృత్తులకు అతీతుడనై యున్నవాడను, ఏ వృత్తీ లేనివాడను. సర్వవృత్తి విహీనాత్మా!
⌘
ఇట్టి అనుభూతి కలవాడు విదేహముక్తుడు! ఒకడు వస్త్రము ధరించియే వస్త్రన్మరణాతీతుడగునట్లు, దేహస్మరణాతీతుడై వెలయుచున్నాడు. ఆ విదేహముక్తుడు తన దివ్య-అనంత-అఖండ చైతన్యము యొక్క ఒకానొక స్వల్ప విభాగము నందు చిత్ కిరణ-స్పృహరూపంగా ఈ జగత్ విభూతులన్నీ ప్రదర్శించుచున్నవాడై ఉంటున్నాడు.
⌘
ఆ విదేహముక్తుడు ఇతరుల దృష్టికి ‘‘ఇట్టి అనుభవము కదా’’.. అని కనిపించటము లేదు. పరైః అదృష్టబాహ్యాత్మా! సర్వవేదాంత శాస్త్రములకు మాత్రమే సవిషయుడు అగుచున్నారు. సర్వదా ‘బ్రహ్మామృతము’.. అనే రసాస్వాదన చేయుచున్నారు. బ్రహ్మామృత రసస్వరూపుడై విరాజిల్లుచున్నారు.
ఇతరులకు తనయొక్క ‘‘చిన్మాయానంద విదేహముక్త్యనుభవము’’ను తెలుపవలసిన అగత్యముగాని, విధానముగాని లేకయే జగదుద్యానవనంలో లీలగా విహరిస్తున్నారు. దేనిపట్లా కించిత్ కూడా ఆసక్తి లేనివారై, కేవలము ‘బ్రహ్మము’ అను సర్వసమము - సర్వరూపము- సర్వాతీతము అగు రసమునందు మాత్రమే సదా తేలియాడుచూ ఉంటున్నారు.
అంతేకాదు.
అట్టి బ్రహ్మామృతరసము స్వయముగా తానే అగుచున్నారు. బ్రహ్మానందరసము నందు నిమగ్నుడై సర్వదా బ్రహ్మానందమనే శివార్చనను అనుక్షణము నిర్వర్తిస్తున్నారు.
బ్రహ్మానంద-అనుభావకుడై బ్రహ్మానందముచే నిత్యతృప్తుడై ఉంటున్నారు.
బ్రహ్మానంద శివానందుడై బ్రహ్మానంద రసప్రభలను సర్వత్రా వెదజల్లుచున్నారు.
బ్రహ్మానంద పరంజ్యోతి స్వరూపులై వెలుగొందుచున్నారు.
నిరంతరము బ్రహ్మానందమునందు ఓలలాడుచున్నారు.
బ్రహ్మానంద కుటుంబసభ్యుడై బ్రహ్మానంద రసనాదమును సంసార జీవులకు వినిపించుచున్నారు.
బ్రహ్మానంద-చిత్ (ఎరుక) ఘనీ భూతుడై బ్రహ్మానంద రథమును అధిరోహించి, విశ్వమంతా సంచరిస్తున్నారు. బ్రహ్మానంద రసభరితుడై బ్రహ్మానందమునందు ఊయల ఊగుచున్నారు.
బ్రహ్మానందులగు సహజనులతో కూడి బ్రహ్మానందాత్మ గృహముతో బ్రహ్మము గురించి కథలు కథలుగా చెప్పుకుంటూ నివసించుచున్నారు.
ఆత్మరూపమ్ ఇదగ్ం సర్వమ్
ఆత్మనో అన్యత్ న కించనా!
ఇదంతా ఆత్మయే! నేను ఆత్మను! ఆత్మకు వేరుగా ఎక్కడా ఏదీ లేదు. నాకు వేరైనదంటూ ఏదీ లేదు. ఇదంతా మమాత్మానంద - స్వవిస్తార స్వరూపమే. ఆత్మయే పరమాత్మ! పరమాత్మస్వరూపుడనగు నేను పరాత్ పరాత్మను। సర్వులు నా ఆత్మయే! సర్వుల ఆత్మ నేనే! నిత్యానంద స్వరూపాత్ముడను! త్వమ్ - తత్‌లకు నేను ఆత్మను. త్వమ్ - తత్‌లు నీకు ఆత్మ। ఆత్మ సర్వదా అఖండము. అహమ్-త్వమ్-సః - తత్‌ల భేదమే లేని ఏకాక్షరాత్మను.
→ ఇట్లు గమనిస్తూ సర్వము తానై, సర్వమునకు వేరై ఇదంతా దర్శిస్తూ, సందర్శించుచున్నదంతా తానే అయి ఆనందించువాడు ‘విదేహముక్తుడు’!
➤ ఆత్మచే సర్వదా పూర్ణుడై ఉండుటచే పూర్ణాత్ముడు!
➤ సర్వాత్మకుడగుటచే మహాన్ ఆత్మ!
➤ సర్వులకు ప్రీతి అయిన వస్తువుగా తనను తాను దర్శిస్తూ, ప్రీతితో సర్వులను దర్శించుచూ ఉండుటచే ప్రీతాత్ముడు!
➤ త్రికాలములలో యథాతథుడు కాబట్టి - శాశ్వతాత్ముడు.
➤ తనను తాను సర్వజీవుల ‘అంతర్యామి’గా దర్శించుచుండటం చేత ‘సర్వాంతర్యామి’. నవలలోని పాత్రలన్నిటికీ నవలా రచయితవలె, కలలో కనిపించే వ్యక్తులందరికి స్వప్న - ద్రష్ట వలె - ఈ జాగ్రత్‌లో సర్వులకు తానే ఆత్మ.
➤ ఆకాశము దేనిచేతనూ దోషము పొందని తీరుగా బాహ్య-అంతరంగముల దోషము ఆతడు పొందుటలేదు కనుక ‘నిర్మలాత్ముడు’
➤ నామరూపములన్నీ తనవే అయి ఉండటం చేత - అరూపాత్ముడు.
➤ ఆత్మకు ఆవల కేవల సాక్షి కనుక నిరాత్ముడు!
➤ దేహాదులకు సంబంధించిన ఎట్టి వికారములు, మస్సుకు సంబంధించిన విషాదములు, బుద్ధికి సంబంధించిన ఎట్టి వివాదములు, చిత్తమునకు సంబంధించిన ఎట్టి వినోదములు పొందనివాడై ఉంటాడు కాబట్టి నిర్వికారస్వరూపాత్ముడు!
➤ కేవల స్వరూపుడు కనుక శుద్ధాత్ముడు.
➤ సర్వజగత్ విశేషములు తనయందు సర్వదా సశాంతించినవై ఉండటం చేత పరమశాంతరూపుడు.
⌘⌘⌘
✤ ఏక-అనేకములను ద్వైత-అద్వైతములను వదిలియున్నవాడు కాబట్టి అనేకాత్ముడు కాదు. వ్యష్టిగత జీవాత్ముడు కూడా కాడు. సర్వులకు ఆత్ముడు. ఆత్మమాత్రమే అయి ఉన్నవాడు కాబట్టి అద్దానికి ఏక-అనేకములు కూడా ఆపాదించలేము!
✤ ‘‘ఇది జీవాత్మ-ఇది పరమాత్మ’’-అనే చర్చలు, వాదోపవాదములు-అన్నీ వదలివేసి ఉంటాడు. మామిడి పండు తింటూ ఉండగా ఇక-మామిడి పండు రుచి గురించి చర్చలతో పనేమీ? వర్ణనములు అన్వయించుకోవటమెందుకు?
✤ తానే ముక్త (పర)-అముక్త (ఇహ).. ఏక స్వరూపుడుకాబట్టి ముక్త-అముక్తముల ఊసులన్నీ వదలివేస్తున్నాడు! ‘‘జీవాత్మ ప్రతిబింబము వంటిది కాబట్టి ‘విముక్తి’ అనే ప్రసంగమే లేదు. ‘‘పరమాత్మ నిత్యముక్తముకదా! కనుక నాకు బంధము లేదు, ముక్తిలేదు’’.. అని గమనిస్తూ ఉన్న ముక్తాముక్త విముక్తాత్ముడు! ‘‘నేను నా వినోదముకొరకై నాటకపాత్రవలె కల్పించుకొన్న జీవుడు - అనబడుదానికి ముక్తి ప్రసంగమెక్కడిది? ఎందుకు?’’ - అని ప్రశ్నిస్తాడు.
✤ బంధము -మోక్షము తనకు అభిన్నంగా దర్శిస్తూ బంధమోక్షరహితుడగుచున్నాడు.
✤ ద్వైతాద్వైత స్వరూపాత్ముడై ద్వైత-అద్వైతములను త్యజించివేస్తున్నాడు.
✤ సర్వాసర్వ స్వరూపాత్ముడై, సర్వ-అపసర్వముల ప్రహసనమంతా అధిగమించివేసి ఉంటున్నారు.
✤ మోద-ప్రమోదములు (సంతోష-ఆనందములు) తానే అయి ఆ రెండింటినీ విడిచివేసి ఉంటున్నాడు. సర్వ సంకల్పములకు ఆవల గల ‘‘సంకల్పములు ఎందులోంచి బయలుదేరుచున్నాయో, అట్టి నేనైన నేను’’ అను ఆత్మత్వము ఆస్వాదిస్తున్నాడు. జాగ్రత్-స్వప్న-సుషుప్తులకు ఆదిరూపము, జననస్థానము తానే అయి సంప్రకాశమానుడగుచున్నాడు.
ఇట్టివాడు విదేహముక్తుడే! - సర్వ సంకల్పహీనాత్మా వైదేహీముక్త ఏవ సః।
⌘⌘⌘
♠︎ సర్వకళలకు ఉత్పత్తి స్థానము. ఆత్మ కళంకములు అంటజాలవు కాబట్టి తాను నిష్కళాత్ముడు.
♠︎ నిత్య నిర్మలాత్ముడు. పరమ పురుషుడు! కేవల బుద్ధిస్వరూపుడు! విషయాతీతుడగుటచే మౌనస్వరూపుడు!
♠︎ ఆనందములకు-అనానందములకు పట్టుపడనివాడు. అమృతాత్ముడై ఈ సర్వమును అమృతమయము చేయుచున్నట్టివాడు.
♠︎ భూత-వర్తమాన-భవిష్యత్తులనబడే త్రికాల స్వరూపుడై త్రికాలమును వివర్జించివేస్తున్నాడు. కాలాతీతుడు। భావాతీతుడు। త్రిగుణాతీతుడు।
♠︎ అఖిలాత్ముడగుటచే అమేయుడు! ఆద్యంత రహితుడు! పరిమితములు లేనివాడు. అపరిమితుడు.
♠︎ తనను తాను ఆత్మగా మానము (self respect) కలిగి ఉంటూనే సర్వము తానైనట్టి విశ్వాభిమానుడు. వ్యష్టిత్వపరిధులు దాటివేసినవాడు.
♠︎ నిత్య ప్రత్యక్ష రూపాత్ముడై ఉండియే, నిత్య ప్రత్యక్షత్వము లేనివాడై ఉంటాడు. కనబడుచున్నదంతా తానే అయి, కనబడనివాడై ఉంటాడు.
♠︎ ‘అన్యము’ అను స్వభావము ఏమాత్రము లేనివాడై ఉండియే, అన్యమైనదంతా తానే అయి ఉంటాడు. ‘‘అన్యమైనదిగా ప్రకాశించుచున్నది నేనే కదా!’’… అని ఆస్వాదిస్తున్నారు.
♠︎ విద్య-అవిద్యలచే పరిమితుడు అగుచూనే, విద్య-అవిద్యలను వదలి ఉంటారు.
♠︎ ఆతడు నిత్య-అనిత్యములను విడచివేసినవాడై, ఇహము (here-జీవాత్మ) ఆముత్రము (పరము)ల రహితుడై ఆవల-ఈవల ఉంటున్నాడు.
♠︎ ఆత్మయే తాను అయిఉన్నట్టి నిశ్చల-సుస్థిరభావనచేత, ఇక ఆతనికి ముముక్షుత్వముతోను, శమము-దమము-తితిక్ష-ధారణ… ఇత్యాది ‘శమాది షట్‌కము’ తోనూ క్రొత్తగా పొందవలసినది ఏదీ ఉండదు.
♠︎ ఆత్మను విశదీకరించటానికి శాస్త్రములు స్థూల-సూక్ష్మ-కారణ-తురీయ-తురీయాతీత- ఇత్యాది దేహ విభజనలు చెప్పుచున్నాయి. అఖండాత్మత్వము పుణికిపుచ్చుకొన్న విదేహముక్తునికి అట్టి స్థూల దేహము నుండి - తురీయాతీతము వరకు విశ్లేషించబడు విభాగ సమాచారము యొక్క ఆవశ్యకత శమిస్తోంది. అట్లాగే అన్నమయ-ప్రాణమయ-మనోమయ- విజ్ఞానమయ- ఆనందమయ-పంచకోశవిభాగ పాఠ్యాంశముల ఆవశ్యకత కూడా ఉండదు. లక్ష్యము చేరుకొన్న తరువాత మార్గమధ్యలోని విశ్లేషణలతో సమాచారములతో పనేముంటుంది?
♠︎ ఆతడు కల్పనలకు మునుముందే ఉన్న ‘కల్పించువాడు’ అయినట్టి స్వస్వరూపమును ఆశ్రయించుచున్నవాడై, సర్వకల్పనలను (సవికల్పమును) దాటి, ఆవలగల నిర్వికల్పాత్ముడై ఉంటున్నారు. సంకల్పముల ఉనికి చేతగాని, నిరోధించుటచేతగాని ఆతనికి ‘ఆత్మానుభవము’ను మించి పొందవలసినదేమీ ఉండదు. ఆతని ఆత్మానుభవము సంకల్ప-వికల్పములచే శాసించబడజాలదు.
♠︎ దృశ్యము-ద్రష్ట-దర్శన విభాగరహితుడై ఏకాత్మస్వరూపుడై ఉంటారు. ఇక దృశ్యమును ఆశ్రయించనివారై, సర్వశబ్దజాలములను అధిగమించి ఉంటారు.
♠︎ ఆతడు సర్వదా ఆత్మయందు రమించుచుండుట చేత, అష్టాంగ యోగములలో ఆఖరిదగు ‘సమాధి’ యొక్క అభ్యాసముతో క్రొత్తగా పని ఉండదు. సిద్ధించవలసినది సిద్ధించగా, ఇక సాధన వస్తువులతో ఆతనికి పని ఏదీ కనిపించదు. సర్వత్రా స్వస్వరూప సందర్శనము స్వాభావికము అగుచున్నది.
♠︎ ఇక ఆతడు ఆత్మయే తానై ఉండగా,.. అహమ్ బ్రహ్మాస్మి, తత్త్వమసి అయమాత్మా బ్రహ్మ.. మొదలైన భావనలను ఆశ్రయించు ప్రక్రియలతో ఆతనికి పని ఉండదు. ‘ఓం’కారము యొక్క పరమార్థమును సిద్ధింపజేసుకొనుటచేత, ‘ఓం’ ఇత్యాది శబ్దముల అభ్యాసముచే కొత్తగా కావలసినది ఉండదు. భావనలోకి అనుభవములోనికి వెళ్లిన వానికి ఇక శబ్దములతో పని ఏముంటుంది?
♠︎ ఆత్మను ఎరిగి ‘మమేకము’ అయి ఉండటం చేత ‘‘జాగ్రత్-స్వప్న-సుషుప్తులు నా స్వయం కల్పిత లీలా వినోదమైదానములు అంతేగాని నాయొక్క దశలుకావు’’…అని గ్రహించి ఉంటారు. తాను ఎల్లప్పుడూ అక్షరుడై, చిదాత్మకుడై తేజరిల్లుచూ ఉంటారు.
తెలుసుకొనవలసినది ఆత్మయే! అందుకు వేరైన జ్ఞేయము - మొదలై వ్యవహారమంతా లేనివాడై ఉంటారు. ‘‘కించిత్ నుండి బృహత్‌వరకు ఈ సర్వము ఆత్మయగు నేనే’’ అని ఆస్వాదించువానికి వేరే జ్ఞేయవస్తు నిరూపణలతో పనేమున్నది?
ఆతడు భావ-అభావ రహితుడై, కేవలుడై ప్రకాశించుచున్నారు. అట్టి నిత్య-అనుక్షణికానుభవము కలవాడే విదేహముక్తుడు.
ఓ హిమగిరినందిని ప్రియకుమారా! భవభయహారా! షడానానా! బిడ్డా! కుమారస్వామీ!
ఆత్మచే ఆత్మ సంతృప్తుడవై ఉండుము.
అద్వితీయమగు స్వాత్మయందే రమించువాడవగుము.
అంతేగాని ద్వితీయముగా భావిస్తూ దృశ్యజగత్ వర్తివై ఉండకుము.
ఇక ఆపై ఈ జగన్నాటకములో ఎట్లా కనిపిస్తూ ఉండాలో, అట్లాగే ఉండుము.
ఆత్మచే ఆత్మగా ఆనందించువాడవై ‘‘విదేహముక్తుడు’’గా ప్రకాశించుము.
5వ అధ్యాయము - ఆత్మ-అనాత్మ వివేకము
(ఓం నిదాఘ మునీంద్రాయ నమః! శ్రీ ఋభు మహర్షిభ్యోం నమః)
నిదాఘుడు తపః తేజో సంపన్నులగు మునీశ్వరులు. ఆయన ఒకసారి సద్గురువు, బ్రహ్మజ్ఞాని, భగవంతుడు అగు ఋభుమహర్షిని సద్గురువుగా దర్శించి, అర్చించి, సంతోషింపజేసి ఈ విధంగా విజ్ఞాపనను సమర్పించారు.
నిదాఘ మునీంద్రుడు : హే బ్రహ్మజ్ఞా! సద్గురూ! ఋభు మహర్షీ! జ్ఞానార్థినై అడుగుచున్నాను. దయతో ‘ఆత్మ - అనాత్మ వివేకము గురించి బోధించ ప్రార్థన!
ఋభు మహర్షి : సర్వవాక్యములకు ఆవల - బ్రహ్మము, ఆ బ్రహ్మానుభవమును సిద్ధించుకొన్న గురువు సంప్రకాశమానులై ఉన్నారు. బ్రహ్మము సర్వకారణ-కార్యములకు ఆవల ఉండి, సర్వకారణ-కార్యములకు ఆత్మగా (రూపముగా) విరాజిల్లుచున్నదయ్యా! అనిర్వచనీయమగు ఆత్మ గురించి వాక్కు మనస్సులను ఉపయోగించి ఎట్లా తెలియజేయగలను? అది అవాక్ మానసగోచరం!
అయినాకూడా, విద్యార్థివై భక్తి-శ్రద్ధలతో అడుగుచున్నావు కాబట్టి, గురువుల స్వానుభవము, గురువులచే బోధించబడుచున్న రీతి, గురువుల సాంప్రదాయములను దృష్టిలో పెట్టుకుని మనము కొన్ని విశేషాలు చెప్పుకొందాము. వినండి.
ఆత్మ ఎట్టిది? - ఏష ఆత్మా సనాతనః
ఆత్మ - సర్వ సంకల్పములకు మునుముందే ఉన్నట్టిది. ఈ జన్మ-కర్మ-దృశ్య వ్యవహారములన్నీ సంకల్పములచే నిర్మితమైనవి మాత్రమే! ఆత్మయో సంకల్పరహితము. సంకల్పములకు విషయము కాదు. |
కానీ సర్వ నాదమయము! శివస్వరూపము! నామరూపాత్మకమైనట్టి సర్వమునందు అట్టి శివతత్త్వమే (లేక) ఆత్మయే నిండి ఉన్నది. సమస్త సంకల్పములకు జనన స్థానము. శివానందము. ఇంక, సంకల్పములచే పొందబడేది కూడా శివానంద స్వరూపమే!
⌘ తెలియబడేదంతా దాటివేసి, ఆవల చూచినప్పుడు తెలుసుకొనుచున్నది (The perceiver, the knower) కదా, ఉన్నది! అట్టి కేవల చిన్మాతమ్రే ఆత్మ! సర్వమునకు పరమై, అయితే సర్వ ఆనందము (All experiences) తన స్వరూపమైయున్నట్టిది. (ఆనందము = Experience, అనుభూతి).
⌘ సర్వత్రా తేజోప్రకాశరూపమై విరాజిల్లుచున్నట్టిది. అద్దాని తేజోరూపమే ఈ జీవాత్మ, జగత్తులు. నాదానందమయమై, సర్వశబ్దముల ఆనందరూపమైయున్నది.
⌘ సర్వ అనుభవములకు మునుముందే ఉండి ఉన్నదై, సర్వానుభవ రహితమైయున్నది. సర్వ ధ్యానములు లయించగా, సమస్త ధ్యాసలు మౌనము వహించగా - అప్పటికీ శేషించు ‘ధ్యాని’ యొక్క కేవలీ-ధ్యాసవర్జిత రూపమైయున్నది.
⌘ ఇక్కడి నాద (expression) -కళ (Art)లకు అతీతమై, ఆవల ఆత్మ ఉన్నది. సర్వ సంప్రదర్శనలకు, సర్వేంద్రియ రూపములకు ఇంద్రియ విషయములకు కళాత్మకమై, (The artist) నాదరూపమై (expressive), ఆధారమై, అవన్నీ వాస్తవానికి స్వతఃగా లేనట్టిదై, తన కల్పనచే అవన్నీ ప్రకటించుచున్నట్టిదై ఉన్నట్టిది. ‘నాది-నాయొక్క’ అనునదంతటికీ ఆవల, ‘నేను’కు (అహమ్) మునుముందుగా అవ్యయమై యున్నట్టిది.
⌘ అవ్యయము = ఒక చతురత గల నటుడు ఒకానొక నాటకములో ఒక పాత్రగా నటిస్తూ ఉన్నాడనుకుందాం. అట్లా నటిస్తూ ఆతని నటనా కళ (The Art of Acting) ఖర్చు అయిపోతోందంటామా? లేదు కదా! ఈ విధంగా, ఆత్మ ‘‘అహమ్, దేహమ్, దృశ్యమ్’’ లను ప్రకాశింపజేయు కళను ప్రదర్శిస్తూ ఉన్నప్పటికీ.. ఆత్మ యొక్క ప్రదర్శనా కళ (The Art of Manifestation) వ్యయము అనటం లేదు. ఒక నటుడు దుఃఖము ప్రదర్శించవలసిన దృశ్య సంఘటన (Scene) లో నటిస్తూ ఉండగా, ‘ఈతని నటనా చాతుర్యము దుఃఖిస్తోంది’’ - అని అనము కదా!
⌘ ఆ నటుడు (Artist) కళ (Art)కు ఆవల ఉన్నవాడు కాబట్టి, నాదము (expression) తనదై యున్నవాడు కనుక…, సర్వనాద- కళాతీత ఏష ఆత్మా అహమ్ అవ్యయః। ఓ నిదాఘ మహాశయా! నాద-కళలకు (expression)లకు ఆవల (As Artist) నా యొక్క అవ్యయ స్వరూపమే ‘ఆత్మ’ అనబడుచున్నది.
ఓ నిదాఘ మహదాశయా! మీ యొక్క-నాయొక్క అఖండ-సనాతన ఆత్మ గురించి మరికొన్ని విశేషాలు వివరించుకుంటున్నాము. వినండి.
⌘
ఆత్మానాత్మ వివేకాది భేదాభేదవివర్జితః : సర్వజీవులలో ఆత్మ సమముగా వేంచేసి ప్రకాశమానమగుచున్నది. అట్టి ఆత్మ - ఆత్మవివేకము (శాస్త్ర సమాచారము)కలవానిలో అధికంగాను, అవివేకిలో అల్పంగానూ ఉన్నదా? లేనేలేదు. (సమం సర్వేషుభూతేషు తిష్ఠంతమ్ పరమేశ్వరమ్). అందుచేత ఆత్మ-అనాత్మల వివేక-అవివేకములకు సంబంధించనిదై, ఆ రెండింటికీ వివర్జితమై యున్నది.
శాంతాశాంత విహీనాత్మాః ఒక శాంతునిలోను, ఒక అశాంతునిలోను ఆత్మ సమరసమైయున్నది. అందుచేత మనస్సు పొందు శాంత-అశాంత సందర్భములకు ప్రమేయములేనిదై, ఆ రెండింటిని విడిచిపెట్టినదై ఉన్నది. వేరై ఉన్నది.
నాదాంతర్జ్యోతి రూపకః : సర్వ సంప్రదర్శనలకు (To All expressions) ఆవల, వాటినన్నిటినీ వెలిగించుచున్న జ్యోతిస్వరూపము. నాటక రంగము (Drama stage) పై పాత్రల విన్యాసమంతా - అక్కడి దీపపు కాంతిలోనే అగుపిస్తున్న తీరుగా - ఆత్మ యొక్క ప్రకాశములోనే లోకులు-లోక పాలకులతో కూడిన లోకదృశ్యమంతా అగుపిస్తోంది.
మహావాక్యార్ధ ‘బ్రహ్మాస్మి’ - ఇతి.. అతి దూరతః : వేద వాఙ్మయము ‘తత్త్వమ్’, ‘సోఽహమ్’, ‘జీవోబ్రహ్మేతి నా పరః’, ‘అయమాత్మా బ్రహ్మ’, ‘సర్వమ్ ఖల్విదమ్ బ్రహ్మ’, ‘అహమ్ బ్రహ్మాస్మి’.. మొదలైన మహావాక్యములు ప్రకటిస్తోంది. అవన్నీ విశ్లేషిస్తూ వివరిస్తూ తత్త్వశాస్త్ర విచారణ అంతా చెప్పబడుతోంది. మంచిదే! కానీ,.. అట్టి మహావాక్యముల ఉచ్చారణ మాత్రము చేత ఆత్మ తెలియబడజాలదు. ఆత్మానుభవము స్వానుభవరూపము. మహావాక్యములు అందుకు గుర్తింపు సూచనలు (Signal Board messages) వంటివి.
అందుచేత ఓ నిదాఘా! ‘‘మహావాక్యార్ధములకు కూడా ఆత్మ సుదూరమై ఉన్నది’’, అని గుర్తెరిగి, వాటి సూచనలు గ్రహించి, మనన-నిదిధ్యాసలతో ఆత్మత్వమును పుణికిపుచ్చుకోవాలయ్యా! ‘‘మహావాక్యార్ధములకు ఆత్మానుభవం సుదూరము’’.. అని, అందుచేతనే, చెప్పబడుతోంది.
తత్ - త్వమ్.. వాక్యార్థవర్జితః : ‘‘బంగారు ఆభరణము’’లో బంగారము-ఆభరణము వేరువేరు కాదుకదా! అట్లాగే ‘ఈ ఆభరణము ఆయనది- అదేమో నీది-ఇక ఇది నాది కదా’’.. అను దానినంతటికీ బంగారముతో ఏమి సంబంధము? అట్లాగే, అహమ్-త్వమ్-తత్ (సోఽహమ్-తత్త్వమ్ ఇత్యాది) వాక్యార్థములతో సంబంధము లేదు. ఆత్మ శబ్దార్థ-వాక్య రహితము.
క్షరాక్షర విహీనో : అది అంతము గల వాక్యములు → అక్షరాలలో నుండి వస్తున్నాయి. అక్షరాలు - నాదమునకు గుర్తింపులు. నాదము - శబ్దము నుండి, శబ్దము - జీవాత్మ నుండి, జీవాత్మ- పరమాత్మ నుండి ప్రదర్శనమగుచున్నాయి. అయితే, ఆత్మ-క్షర-అక్షర ప్రదర్శనా రూపముగా (జీవత్మరూపకంగా) కనబడుచూనే, క్షర-అక్షర రహితమై ఉన్నది. అట్టి ఆత్మయే నా యొక్క-నీయొక్క-మనందరి యొక్క సహజస్వభావము.
నాదము (Expression/sound) నకు ఆవల, అద్దానికి వేరై జ్యోతిరూపముగా ఆత్మ వెలుగొందుచున్నది.
ఆత్మకు క్షరము (క్షీణించుట), అక్షరము (క్షీణమనునది లేకపోవటం) - అనే ధర్మములు (Features) లేవు.
అఖండైక రూపోఽహమ్! ఆనందోఽస్మి - ఇతివర్జితః : ‘‘నేను అఖండము - ఏకము అగు ఆనందరూపుడను’’ మొదలైన వాక్య పరంపరలన్నీ కూడా… ఆత్మానుభవము సమక్షంలో ఇక మౌనము వహిస్తున్నాయి. ఆత్మయే మనమై ఉండగా,.. ఇక మనకు ఆత్మ గురించిన వాక్య సమూహమెందుకు? మధురమగు పదార్థము ఆస్వాదిస్తూ ఉన్నవాని వద్దకు వెళ్లి, ‘‘ఇక మనము ‘మాధుర్యము’ ఎట్లా ఉంటుందో వాక్యములచే వివరించుకుందామా?’’ - అని అనటమెందుకు?
ఆత్మ సర్వమునకు అతీతమైయుండటమును స్వభావముగా కలిగి ఉన్నది. నాదమునకు ఆవల (సర్వ శబ్దములకు, వాటి అర్థములకు మునుముందే, వాటిని అతిక్రమించి) - వాటిని వెలిగించే జ్యోతి స్వరూపం!
‘ఆత్మ’ గురించిన అనుభవం ‘ఆత్మ’ శబ్దమును కూడా వదలినట్టిది. అనుభవము నుండి శాస్త్రము, శాస్త్ర శబ్దములు వస్తున్నాయి. శబ్దము నుండి అనుభవం కాదు. శ్రోతపట్ల స్వయంగా అనుభవము ప్రారంభం కాగానే శబ్దములు ఉపశమిస్తున్నాయి. కనుక ఆత్మ-ఆత్మశబ్దరహితము కూడా!
సత్ చిత్ ఆనంద హీనోఽయం, ఏషైవ ఆత్మా సనాతనః। సత్ (ఉనికి), చిత్ (ఎరుక) ఆనందము (అనుభూతి) [లేక] (అహమ్-చిత్త, బుద్ధులు-మనస్సు).. ఆత్మకు లక్షణ విశేషములు అయి ఉన్నాయి. అయితే లక్షణములు కలవాడు ఆయాలక్షణములకు మునుముందే ఉండాలి కదా! లక్షణములు లేనప్పుడు కూడా ఉండి ఉండాలి కదా! సత్-చిత్-ఆనందములకు మునుముందే ఆత్మ ఉండిఉండటం చేత, ‘‘ఆత్మ సనాతనము’’ (That which is there prior to all else) - అనబడుచున్నది.
ఓ నిదాఘ మహాశయా! ఆత్మను ‘ఇది’ అని నిర్దేశించి చెప్పటము ఎట్లా చెప్పండి?
అది శబ్దములకు, లక్షణములకు మునుముందే ఉండటము చేత ‘ఇది’ అని నిర్దేశించి చెప్పలేము. అందుచేత అనిర్దేశ్యము. వేదవాక్యములు కూడా అద్దానిని వర్ణించగలవేమోగాని, నిర్దేశించి (duly defining as this is that) చెప్పజాలవు. అందుచేత వేదవాక్యములకు కూడా పరిమితమవజాలము.
➤ ఎద్దానికి కించిత్ కూడా బాహ్య-అంతరములు (The outer and Inner zones/spheres) లేనేలేవో..,
➤ ఎద్దానికి స్థూల-సూక్ష్మ-కారణ శరీరములనబడేవి మొదలే లేవో.., జాగ్రత్-స్వప్న-సుషుప్త దేహములు ఎద్దానికి సంబంధించినవే అయి ఉండవో,
➤ జీవుడు-జీవులు-భౌతికరూపములు ఇత్యాది భేదమంతా ఎద్దానికి సంబంధించినవే అయి ఉండదో…,
➤ ఎద్దాని సమక్షంలో అయితే ఈ నామరూపాత్మక - లింగ ప్రపంచము కలలోని వస్తువులవలె ఉనికి లేనిదగుచున్నదో
బ్రహ్మైవ ఆత్మా న సంశయం: అట్టి బ్రహ్మమే ఆత్మ (The self) అయి ఉన్నది. ఇందులో సంశయమే లేదు. (There is no doubt at all).
(ఆత్మ = The Self);
(బ్రహ్మము = The Al-present and Al-pervading Self);
⌘
❋ ఎద్దానికి నామ-రూపములు మొదలైనవి మొదలే లేవో, ఎప్పుడూ కూడా లేవో..,
❋ ఎద్దానికి - భోగించువాడు-భోగించబడునది-భోగము.. అను విభాగములు స్వల్పముగా కూడా ఏ సమయమందునూ ఏర్పడుటయే లేదో…, (అవన్నీ సందర్భ పరిమితమైన ఆరోపణలు మాత్రమేనో),
❋ ఎద్దానికి సత్ (ఉనికి) గాని, అసత్ (లేమి)కాని, క్షర-అక్షరములుగాని ఆపాదించి (విభజిస్తూ) చెప్పజాలమో,
❋ అది సగుణమనిగాని, నిర్గుణమనిగాని చెప్పుతూ నిర్ణయించలేమో..,
అదియే ఆత్మ! సందేహం లేదు!
❋ దేనికైతే-చెప్పబడునది (వాచకము)-చెప్పువాడుబీ వినబడునది-వినువాడుబీ మననము-మననము చేయువాడుబీ గురువు-శిష్యుడు భేదములుబీ దేవ-మానవ-పాతాళ లోకభేదములుబీ ‘‘దేవతలు- రాక్షసులు, ధర్మ-అధర్మ, శుద్ధ- అశుద్ధ’’ మొదలైన భేదములు అణువంత కూడా ఏ మాత్రమూ లేవో..,
❋ ఎద్దాని సమక్షంలో కాలము కూడా ‘అకాలము’ అయి ఉంటోందో →
అదియే ఆత్మ! ఇది నిశ్చయము! సంశయము లేదు!
❋ ఎద్దాని సమక్షంలో ద్రష్ట (Pereciver) - దృశ్యము (Object) - దర్శనము (Perception) అనునవన్నీ ఈషణ్‌మాత్రంగా లేకయే కల్పనారూపము మాత్రమే అయి ఉన్నాయో…,
❋ ‘‘ఇది ఆత్మ-ఇది అనాత్మ’’ అను ప్రసంగములు, మనోవ్యాపారములు - ఇవన్నీ కొద్దిసేపు చేయు ఊహ-కల్పనల వంటివి మాత్రమే అగుచున్నాయో,
అదియే ఆత్మ!
ఓ నిదాఘ మునివర్యా! ఇక్కడ, మీరు అడిగిన ‘అనాత్మ’ గురించి కొన్ని విశేషాలు చెప్పుకుందాము.
అనాత్మ
ఏది సందర్భముచే కల్పించబడి, సందర్భము నశిస్తే తాను కూడా లేనిదగుచున్నదో.. అదియే అనాత్మ!
ఒక నాటకంలో (లేదా) ఒక కథలో ‘‘ఈమె ఆతనికి భార్య! ఆమె ఆతనికి తల్లి! ఆతడు ఇటువంటి స్వభావము కలవాడు’’.. అనునదంతా ‘నాటకము’ (లేక) కథకు మాత్రమే పరిమిత సత్యము గాని,.. వాస్తవ సత్యము కాదు కదా! వాస్తవము, సహజము అగు సత్యము కాకుండా, ఒకానొక కల్పన చేతనో, సందర్భముచేతనో, భావన చేతనో, ఊహచేతనో అనిపించేది, కనిపించేది, అనుభూతమయ్యేదంతా ‘అనాత్మ’ అని పిలువబడుతోంది.
స్వతఃగా ఉన్నది - ఆత్మ,
స్వతఃగా లేనిది - అనాత్మ -
… అనబడుచూ ఉన్నది.
ద్రష్ట దర్శన దృశ్యములు కూడా స్వతఃగా (By themselves) ఉన్నట్టివి కావు.
కలలో ‘‘కల’’చూచువాడు, ‘‘కలలో చూడబడునవి’’ - ఇవన్నీ కల సందర్భంలో ‘‘నిజమే! ఉన్నాయి!’’.. అని అనిపించవచ్చుగాక! జాగ్రత్‌కు వచ్చినవాడు కలలో కనిపించిన రెండంతస్తుల మేడ కొరకై వెతకుచున్నాడా? లేదు. ఎందుచేత? స్వతఃగా లేదు కాబట్టి.
అట్లాగే, ఆత్మను ఎరిగిన వానికి ద్రష్ట-దర్శన-దృశ్యముల భేదమే ఉండదు. అవన్నీ స్వతఃగా లేనివే అగుచున్నాయి. అనాత్మను నిర్వచించటానికిగాని, మనస్సుతో యోచించటానికిగాని స్వతఃగా లేదు! లేని దాని గురించి చెప్పవలసినదేమున్నది? ఉన్నది తొలగే ప్రసక్తే లేదు!
✤ జీవుల పరస్పర సంబంధ-బాంధవ్యములన్నీ సందర్భోచితమై, ప్రసంగమాత్రంగా ఉండవచ్చుగాక! స్వతఃగా అసత్తు!
✤ ఏ మనస్సుచే దృశ్యమంతా అనుభూతమగుచున్నదో అట్టి మనన-ఆలోచన రూప మనస్సు. అనాత్మయే (లేనిది). ఆలోచించుటకు మునుముందే ఉన్న ఆత్మయే సర్వదా ఉన్నది.
✤ ఈ జాగ్రత్తు కూడా స్వతఃగా లేదు. భావించుటచే ఉన్నట్లుగాను, అభావనచే లేనిదిగాను అగుచున్నది.
అందుచేత ఓ నిదాఘా! ఈ జగత్తు నాస్తి! నాస్తి! లేదు! లేదు! నిశ్చయముగా లేదు. దీనిని భావనగా దర్శించే నీవు భావాతీతుడవై ఉన్నావు. ఏది నీ సహజరూపమో అది మాత్రమే ఆత్మ! మిగిలినదంతా అనాత్మ! (ఉదాహరణకు నేను ఒకనికి తండ్రిని, మరొకరికి కొడుకును. వృత్తిచే ఉద్యోగిని, సంబంధముచే స్నేహితుడను - అనునవన్నీ అనాత్మ. ‘నేను’ అనునది ఆత్మ).
అందుచేత,
సర్వసంకల్ప శూన్యుడవై, సర్వసంకల్పములను దూరంగా వదలివేసి ‘‘కేవలము బ్రహ్మమును’’ అను నిశ్చయమును సుదృఢపరచుకో! ‘అనాత్మ అనునదేలేదు’’.. అని కృతనిశ్చయుడవగుము.
స్థూల-సూక్ష్మ-కారణ దేహములు స్వతఃగా ఉన్నవి కావు. అట్లాగే భూత-వర్తమాన-భవిష్యత్ త్రికాలములు స్వతఃగా లేవు.
సాత్విక-రాజసిక-తామసిక త్రిగుణములు కూడా అభావించగా అప్పటికి శేషించునది ఆత్మ. స్వర్గ-మర్త్య-పాతాళ త్రిలోకములు కూడా స్వతఃగా లేవు. ఇవన్నీ కలలోని విశేషాలు వంటివి. కల తనదైనవాని కల్పనల వంటివే అవన్నీ! ఆత్మ మాత్రమే సత్యము! సహజము! త్రికాలములచే అసాధ్యము! కాబట్టి ‘‘సర్వము ఆత్మయే’’.. అని అనుశాసనము.
నాస్తి ఇతి - మిథ్యా న సంశయః - మిథ్యేతి నిశ్చను।
ఋబు మహర్షి : ఓ నిదాఘ మునీంద్రా!
‘ఇతినాస్తి’.. ‘లేనిది - లేదు’ అని దేని గురించి ఆత్మజ్ఞులు నిర్ణయము కలిగి ఉంటున్నారో.. అట్టి ‘‘నాస్తీతి! మిథ్యాయేతి ’’ - లేనిది - మిథ్య (Illusion) అయినది - అగుదాని గురించి మనము మరికొన్ని విషయాలు ఇప్పుడు వివరణ చేసుకుంటున్నాము. వినండి.
ఒకని ‘స్వప్న-చైతన్య సత్త’ నుండి స్వప్నము → ఊహ, భావనా, కల్పనామాత్రంగా బయల్వెడలుతోంది. స్వప్నములోని వస్తువులు వాస్తవానికి ‘లేనివే’ అగుచున్నాయికదా! అట్లాగే ఆతని ‘జాగ్రత్ చైతన్యసత్తా’ నుండి ఊహా-భావనా-కల్పనామాత్రంగా జాగ్రత్ దృశ్యానుభవము, దృశ్యము బయల్వెడలుచున్నాయి. అనగా, దృశ్యాంతర్గత విషయానుభవాలన్నీ స్వతఃగా లేవు. కల్పనచే మాత్రమే ఉన్నాయి.
చిత్త అభావాత్ చింతనీయం నః। చిత్ (ఎరుక) నుండి ‘తెలుసుకోవటము’ బయలుదేరుచున్నది. ‘తెలుసుకోవటము’ అనునది ఇష్ట-అయిష్టములతో కూడినదై ‘చిత్తము’గా రూపుదిద్దుకొనుచున్నది. అట్టి చిత్తము- ‘‘స్వప్నములో నాచే కల్పించబడిన నేను’’ వంటిది. ‘‘నేను రచించిన నాటకములో సముత్సహముతో కూడి సంభాషించు ఒక పాత్ర’’ వంటిది. ఈ విధంగా ‘చిత్తము’ అనునది కల్పనచే ఉన్నదే గాని, స్వతఃగా ఉన్నది కాదు. చిత్తమే స్వతఃగా లేదు కాబట్టి చింతనీయములగు విషయములు కూడా స్వతఃగా నాస్తి-లేవు!
దేహి అభావాత్ జరా న చ। దేహము ఆత్మకు ఐహికమైన కల్పన వంటిది. దేహమే (నేను యొక్క సమక్షంలో) స్వతఃగా లేదు. కాబట్టి బాల్య - యౌవన- వార్ధక్య - జన్మ - పునర్జన్మలు కూడా నాస్తి - లేనివే!
పాద అభావాత్ గతిర్నాస్తిః। దేహము కూడా కల్పనా విషయమే! ఇది ‘‘నా స్వప్నములోని నా దేహము’’ వంటిదే! ఆత్మదృష్ట్యా స్వతఃగా లేదు. ఇక ‘‘అద్దానికి ‘పాదాలు ఉండటము’ అనునదీ లేదు. పాదాలే లేవు కాబట్టి గతి-నడక-నడుచు ప్రదేశములు కూడా స్వతఃగా లేనివే! నడకలు, నడిచే ప్రదేశములు - ఇవన్నీ ఏమని భావిస్తే (తీర్థయాత్రా ప్రదేశంగానో, మిత్రదేశంగానో, శతృప్రదేశంగానో, పవిత్రంగానో, అపవిత్రంగానో), ఎట్లా భావిస్తే - అట్లే ఉంటాయి. భావించకుంటే లేనివే! అభావనచే - పాదములు లేవు. అవి నడుస్తున్న గతులు లేవు. ఆత్మ చేతననే అవి ఉంటున్నాయి. కలలో - ఒకడు ఒకచోటి నుండి మరొక చోటికి నడచి వెళ్ళినప్పుడు- నిజంగానే నడచినట్లు కాదు కదా.
హస్త అభావాత్ క్రియాన చ। దేహమువలె చేతులు కూడా కల్పనా విభాగములే! కాబట్టి చేతులతో చేసే క్రియలు కూడా స్వప్నములోని క్రియావిశేషాల వలె లేనివే! చేతులు, చేతలు కూడా స్వతఃగా లేవు. ఆత్మచేత ఉనికి పొందుచున్నాయి.
మృత్యుః నాస్తి జనన అభావాత్। ఏ జీవుడూ దేహముతో పుట్టువాడు కాడు. దేహముతో ముగియడు. (దేహే జాతే న జాతోఽసి। దేహే నష్టే న నశ్యతి)! దేహము స్వీకరించటము-త్యజించటము మాత్రమే ఇక్కడ జరుగుతోంది. జీవాత్మ ఎవరు? పరమాత్మ యొక్క జగత్ దర్పణ-ప్రతిబింబమే. కాబట్టి, అఖండమగు పరాత్మకు జననమే లేదు. జననమే లేనిదానికి మరణము మాత్రము ఎక్కడది?
బుద్ధి అభావాత్ సుఖాదికమ్। ఆత్మ నుండి లీలా వినోదముగా ‘‘ఇట్లా ఉంటే బాగుంటుంది. అట్లా ఉండకుంటే బాగుండదు’’.. అను రూపముగల బుద్ధి (వివేచన) బయల్వెడలుతోంది. ఆ బుద్ధికి ఇది సుఖము-అది దుఃఖము; ఒకటి ఆనందము - మరొకటి విషాదము-మొదలైన భావాలు పుట్టుకొస్తున్నాయి. అవి అనుభూతిరూపమై అనుభవములుగా సిద్ధిస్తున్నాయి. కలలో ఏది కనిపించినా, కల తనదైనవాడు తన ఆవలి స్థానము కోల్పోవుచున్నాడా? లేదు కదా! బుద్ధి-మనో-భావములచే భావములకు ఆవలిదగు ఆత్మకు ఏదీ రాదు! ఏదీ పోదు. బుద్ధియే స్వతఃగా ఉన్నట్టిది కాదు. కాబట్టి సుఖము, దుఃఖము, సంతోషము, విషాదము - మొదలైనవి కూడా స్వతఃగా లేవు. భావిస్తే ఉంటాయి. భావించనప్పుడు భావనకు ముందే సర్వదా భావాతీతమై ఉన్నదే ఆత్మ.
అదేవిధంగా ధర్మము లేదు. శుచి లేదు. సత్యము లేదు. భయము లేదు. అవన్నీ భావనలోనుండి జనించిన సందర్భ - సత్యములేగాని, సహజ సత్యములు కావు. ఆత్మ మాత్రమే సహజ సత్యము!
అట్లాగే కేవలమగు ఆత్మత్వము సిద్ధించిన తరువాత
👉 అక్షర (‘ఓం’) ఉచ్ఛారణ లేదు.
👉 గురువు-శిష్యుడు అను భేదము ఉండదు. ఇరువురికి ఆత్మయే ధ్యేయపరాకాష్ఠ కదా!
👉 ‘ద్వితీయము’ అనునది మొదలే లేనిదగుటచే ‘ఏకము’ అనునది కూడా ఏదీ లేదు. ఒకవేళ ద్వితీయం ఉంటే ఏకమూ ఉంటుంది. రెండూ ఉండనప్పుడు, సర్వము ఆత్మయే అగుచున్నప్పుడు ఇక - ఏకత్వము గురించిన చర్చనీయాంశము ఏముంటుంది?
‘సత్తు’ అనునదే ఉన్నది.. - అని అన్నప్పుడు ఇక అసత్తుకు కించిత్తు కూడా చోటు దొరకదు! ‘అసత్యత్వము’ ఒకవేళ్ళ ఉంటే, అప్పుడు ‘సత్యము’ ఉండజాలదు. ఆత్మయే ఉన్నది. సత్-అసత్‌లు అజ్ఞానమునకు సంబంధించిన విచారణ సందర్భము కొరకు మాత్రమే ఉన్నాయి. ఆత్మభావన అనుభవములోనికి రాగానే ఆ రెండిటి ఊసే ఉండదు.
‘‘జగత్తు ఉన్నది. కానీ ఆత్మకు కించిత్ కూడా భిన్నము కాదు! ఆత్మయొక్క భావనయే జగత్తుయొక్క ఉనికి రూపము’’ అనునదే సిద్ధిస్తోంది. జగత్తు స్వస్వరూపాత్మగానే స్వభావసిద్ధమగుచున్నది.
‘ఇది శుభము’ అని ఉన్నచోట ‘అది అశుభము సుమా!’ అని చెప్పబడుచున్నట్లే - అనగా, ‘అశుభము’ ఉన్నచోట శుభము కూడా ఉన్నట్లే అగుచున్నది. భయం ఉంటే అభయం కూడా ఉన్నట్లే. అట్లాగే ‘అభయము’ ఉన్నచోట భయము ఉన్నదే-అగుచున్నది. ఆత్మభావన ఉన్నచోట భయ-అభయములు రెండింటికీ చోటు ఉండదు. అవన్నీ ఆత్మయొక్క భావనామాత్రములే.
👉 ‘బంధము’ (Bondage) అనునది ఎక్కడ ఉంటే అక్కడ ‘మోక్షము ఎట్లాగురా?’’ అనే ప్రశ్న ఉదయిస్తుంది. బంధము ‘లేదు’ అని బుద్ధికి సునిశ్చితమైనప్పుడు (లేక) బంధము అవగాహనచే అభావించబడినప్పుడు, ఇక క్రొత్తగా మోక్షము పొందవలసిన దేముంటుంది? ‘బంధము లేదు’ - అని మనస్సుకు అనిపించటమే ఆత్మభావన! బంధము యొక్క అభావమే మోక్షము. (పాశబద్ధః తథా జీవః। పాశముక్తః సదాశివః)
👉 మరణము ఉంటే జన్మ ఉంటుంది. మరణము అభావించబడితే? జన్మ ఉండదు. జన్మ అభావించబడితేనో? మరణం లేనిది అగుచున్నది. ‘దేహము లేకున్నా, ఉన్నా కూడా నేను ఉండియే తీరుచున్నాను కదా!’’.. అని భావిస్తే ఇకప్పుడు? జనన-మరణాలు దేహసంబంధమైన సంఘటనలు మాత్రమే. ఆత్మకు సంబంధించినవి అవవు!
👉 ‘త్వమ్-నీవు’ అనేది ఉన్నదని భావన చేస్తే ‘అహమ్-నేను’ అనునది ‘ఉన్నది’అగుచున్నది. స్వప్నములో ‘నేను-నీవు’.. అనునవి ఎక్కడున్నాయి? జాగ్రత్ కూడా అట్టిదే. ‘‘త్వమ్-అనునది లేదు’’.. అని భావన చేస్తే, అప్పుడు ఇక, ‘అహమ్’ భావన కూడా ‘లేనిది’ అగుచున్నది.
👉 ‘ఇది ఇప్పుడు ఉన్నది’ అని భావిస్తే అప్పుడు ‘‘అది అప్పుడు ఉన్నది’’ అగుచున్నది. ‘ఇది ఇప్పుడే లేదు’.. అన్నప్పుడు ‘‘అది అప్పుడూ లేదు’ అను భావన సిద్ధిస్తోంది. తత్ అభావేత్ ఇదమ్ న చ। ‘అది లేదు’ అని భావిస్తే ‘‘ఇదీ లేదు’’.. అను భావన అనుభవమవగలదు. ‘ఆత్మకు ఇదీ లేదు అదీ లేదు’.. అని అభావిస్తే, ఇక ఆత్మయే భావించబడగలదు!
👉 ఒక వస్తువు ‘ఉన్నది’ అని భావిస్తే, అద్దానిపట్ల ప్రేమయో, ద్వేషమో ఉంటాయి. ‘వస్తువే లేదు’’ అని భావిస్తే ప్రేమ - ద్వేషములకు చోటెక్కడిది? ‘జగత్తు - జగదనుభవము స్వయముగా లేదు’ అని అభావిస్తే లేనిదే అగుచున్నది. లేని వస్తువు వలన బంధమెక్కడిది? మోక్షమెక్కడిది?
👉 ‘కార్యము ఉన్నది’ అని భావిస్తే దానికి ‘కారణము కించిత్ అయినా ఉన్నది’ అనునది కూడా భావిస్తున్నట్లే! ‘‘కార్యము (ఈ జగత్తు) లేదు’’ అని భావిస్తేనో? కారణము కూడా అభావించినట్లే!
👉 ద్వైతము భావించబడితే, అద్వైతము కూడా భావించినట్లే! ‘రెండవది ఉన్నది’ అని అనుకుంటే ‘‘ఒకానొకటి రెండుగా ఉన్నది’’.. అని భావించినట్లేకదా! ద్వైతమును అభావిస్తే, అప్పుడు ద్వైత-అద్వైతములు రెండూ అభావించబడి, లేనివగుచున్నాయి. ఆత్మభావన స్వభావసిద్ధమగుచున్నప్పుడు ద్వైత-అద్వైతములు రెండూ ‘అభావన’ను సంతరించుకుంటున్నాయి.
👉 దృశ్యమును భావిస్తే దృక్ (Perceiver) యొక్క ఉనికిని భావించబడినదగుచున్నది. దృశ్యము అభావించబడినప్పుడు దృక్ కూడా లేనిదగుచున్నది! ‘చూడబడునది’ అభావించబడినప్పుడు, ‘చూచువాడు’ కూడా అభావించబడుచున్నాడు. అనగా ఆ రెండిటి ఏకస్వరూపమగు ఆత్మగానే ఈ జీవుడు నిస్సందేహంగా తెలియబడుచూ శేషిస్తున్నాడు.
👉 ‘అంతరము’ అనునది నిజంగా ఉంటే, ‘బాహ్యము’ అనునది కూడా ఉన్నదే అగుచున్నది. అంతరమును అభావిస్తే, బాహ్యము లేనిదే అగుచున్నది. కనుక బాహ్య-అంతరము భావనచే ఉండటము, అభావనచే లేనివి-అగుచున్నాయి.
👉 పూర్ణత్వము ఉన్నట్లైతే ‘అపూర్ణత్వము’ భావించబడినట్లే అగుచున్నది. పూర్ణత్వ-అపూర్ణత్వములు అభావించబడినప్పుడు ఆ రెండూ లేనివగుచున్నాయి. అఖండ - అప్రమేయ - స్వస్వరూపాత్మయే భావ - అభావముల సాక్షిగా ఈ జీవునిపట్ల శేషించినదగుచున్నది.
⌘
సంకల్పనామాత్రమ్ ఇదగ్ం సర్వమ్।
అందుచేత ఓ నిదాఘ మునివరా! జగత్తులో కనిపిస్తున్న నేను-నీవు-ఆతడు-అది, ద్రష్ట-దర్శన-దృశ్యములు, ఆత్మ-అనాత్మలు, దేహత్రయములు, కాలత్రయములు, తాపత్రయములు, లోకత్రయములు, చిత్త-చింతనీయములు, పాద-గతులు, హస్త-క్రియలు, జన్మ-మృత్యువులు, ధర్మ-అధర్మములు, క్షర-అక్షరములు, ఏక-ద్వితీయములు, సత్య-అసత్యములు, శుభ-అశుభములు, భయ-అభయములు, బంధ-మోక్షములు, జీవన్-మరణములు, త్వమ్-అహమ్‌లు, ఇదమ్-తత్‌లు, అస్తి-నాస్తిలు, కార్యకారణములు, ద్వైత-అద్వైతములు, దృశ్య-ద్రష్టలు, బాహ్య-అంతరంగములు, పూర్ణత్వ-అపూర్ణత్వములు.. ఇవన్నీ సంకల్పించుటచే (లేక) భావనచే ఉన్నాయి. అభావించినప్పుడు అవన్నీ లేవు. స్వప్నసంకల్పము ఎట్టిదో.. జాగ్రత్ సంకల్పము అట్టిదే!
- ఆత్మ ఒక్కటే సర్వదా ఉన్నది!
- ఆత్మయొక్క భావనచే ద్రష్టత్వము - దృశ్యము సిద్ధిస్తున్నాయి.
- రెండూ, సిద్ధించి, ఇక తదితరమైన దంతా పొందబడుచున్నది.
ఆత్మ-‘‘యత్ భావం, తత్ భావతీతి’’- దేనిని ఎట్లా భావిస్తే, అది అట్లే సిద్ధిస్తోంది. ఆత్మ సర్వమునకు ఆవల, సర్వజగత్ కల్పనలకు కారణమై, కేవలమై, మనోవాక్అగోచరమై ఉండగా, అద్దానికి దృష్టాంతము ఏమున్నది? ఆ దృష్టాంతము ద్వారా నిర్వచించి ‘ఇది ఇంతే’.. అని చెప్పగలిగినది ఎవ్వరు? (దార్‌ష్టాంతికగ్ం ఎవ్వరు?) ఆత్మ ఎక్కడున్నది? ఏమైయున్నది? ఏరూపంగా ఉన్నది? ఇక్కడిదంతా ఆత్మయే। ఆత్మ సర్వమునకు అప్రమేయము కూడా!
ఓ నిదాఘ ఆత్మానంద స్వరూపా! ఏదైతే ‘పరబ్రహ్మము’ అను శబ్దమునకు అర్థమైయున్నదో,.. అది అహమస్మి, నేనే! అట్టి పరబ్రహ్మమే ఈ జగత్తు! అదియే నీవు! అది మనస్సు యొక్క స్మరణకు, స్ఫురణకు కూడా అందునది కాది! కేవలమగు బుద్ధికి మాత్రమే అనుభవం.
ఇదంతా అట్టి కేవల చిత్ మాత్రమే! (The absolute presence and its absolute knowing)! నేను-నీవు ఆ చిన్మాత్రస్వరూపులమే! ‘‘సర్వము చిన్మాత్రాత్మమే అయి ఉండగా, ఇక ‘అనాత్మ’ అనునది ఎక్కడున్నది? ‘‘అటువంటిది ఏదీ లేదు’’ అని గమనించువారై ఉండండి!
⌘
ఇక, ఈ దృశ్యప్రపంచమంటారా?
ఇది వస్తుతః లేదు. ఇదం ప్రపంచం నాస్త్యేవ, న ఉత్పన్నం! నో స్థితం క్వచిత్! కలలో కనిపించిన నగర వీధులలోని జనబాహుళ్యము ఉత్పన్నమైనదెప్పుడు? నశించునదెప్పుడు? అట్లాగే ఈ ఇంద్రియములకు కనిపించే పాంచభౌతికమైన దృశ్యప్రపంచము ఉత్పన్నము అవనూ లేదు! నశించబోవటమూ లేదు. ఉత్పన్నమే కానిది నశించటమెక్కడిది? మరి ఇదంతా ఎదురుగా ఎట్లా కనిపిస్తోందంటారా?
‘‘ఇదంతా చిత్తము యొక్క స్వకీయ కల్పనా దృశ్య విశేషము’’ మాత్రమే! ఇక చిత్తము ఎక్కడి నుండి వచ్చింది? బాహ్యమునుండియా? కాదు. చిత్ నుండియే. చిత్తము ‘ఇష్టము+భావన’ రూపంగా బయల్వెడలుతోంది. కనుక, చిత్‌కు వేరైన ఉనికి చిత్తమునకు లేదు.
ఈ విధంగా చిత్తము గాని, ఆ చిత్తము ‘నాది’ అనుకుంటున్న అహంకారముగాని, ఆ చిత్తమునకు విషయమగు ‘ప్రపంచము’ అనబడునదిగాని, ఆ అహంకారము ‘నాది’ అనుకొనే’ జీవుడు గాని - స్వతఃగా లేవు! ఆత్మస్వరూపుడవగు నీ యొక్క భావనలే అవన్నీ! శాస్త్రములు ఆత్మను వర్ణించి చెప్పటానికై - ‘జీవాత్మ, అహంకారము, చిత్తము, ప్రాణము, ఇంద్రియములు, ప్రపంచము’ ఇవన్నీ విభాగించి చెప్పుచున్నాయి. ఏకోసత్! విప్రాబహుధా వదంతి! ఆత్మ అనన్యము కాబట్టి ఆత్మకు వేరై అవన్నీ లేనివే!
ఆత్మయే సర్వదా మన సహజ స్వరూపమై యుండగా ‘‘అజ్ఞానము, అది తొలగించుకోవటము, అందుకు ఆత్మజ్ఞానము’’.. ఇవన్నీ స్వతఃగా లేవు. భావనచే ఏర్పడి భావనచే తొలగుచుండగా, భావనకు ‘ఆది’ స్థానమగు ఆత్మ యథాతథము! సర్వదా సిద్ధించియున్న ఆత్మకు సాధనలతో పనిఏమి?
ఆత్మనగు నాకు ‘‘దృశ్యముతో - దేహముతో - జీవాత్మతో ఈశ్వరాత్మతో’’ - అనుబంధ చతుష్కము లేదు. అహమ్ - త్వమ్ - తత్ త్రి సంబంధములు లేవు. పవిత్రత-అపవిత్ర ద్వంద్వములు లేవు. అపవిత్రత తొలగటానికై - గంగాస్నానము, గయా పిండము, సేతు దర్శనము, భౌతిక దేహము, పాంచభౌతికతత్వము మొదలైనవేవీ లేవు.
🌺 పంచభూతములగు భూమి-జలము-అగ్ని-వాయువు-ఆకాశము ఇవన్నీ స్వతఃగా లేవు. ఆత్మచేతననే, ఆత్మనుండియే ఉనికిని పొందుచున్నాయి. (ఆత్మాత్-ఆకాశమ్; ఆకాశాత్ -వాయుః; వాయుః-అగ్నిః; అగ్నిః-ఆపః; ఆపః-పృధ్వి కాబట్టి). ఆత్మకు భిన్నమై అవి లేవు. ‘‘ఆత్మానుభవము-ఆత్మయొక్క భావములు’’ చేతనే అవి అనుభూతమగుచున్నాయి. వాటి వివిధ రూపములగు ఈ దృశ్య ప్రపంచమంతా భావనాకల్పితమే!
🌺 సర్వము ఆత్మయే అయి, ఆత్మ - సర్వదా అఖండమై ఉండటం చేత - దేవతలు లేరు. దిక్పాలకులు లేరు. వేదములు లేవు.. శాస్త్రము లేవు. గురువులు లేరు. శిష్యులు లేరు. కలలోని వస్తువుల వలె అవి స్వతఃగా లేవు. భావనాజగత్తు వలెనే భావనా లోకపాలకదేవతలు, వారిని స్తుతించు వేదములు కూడా లేనివే! అవన్నీ ‘ఆత్మాఽహమ్’ భావనకు తిరిగి మార్గము చూపునై, మార్గములోనే ఉండిపోవుచున్నాయి.
🌺 ఇక్కడి దూరము-దగ్గర-ఆది-మధ్య-అంతము మొదలైనవన్నీ స్వయముగా లేవు. అవన్నీ పోలికలకు సంబంధించిన సంకల్పములచే (Assumption pertaining to relativity).. ఉన్నవిగా అనిపిస్తున్నాయి. అంతేకాదు. ఇక్కడ ద్వైతము లేదు. అద్వైతము లేదు. సత్యమైనది లేదు. అసత్యమైనది లేదు. ఎవరు ఏది ఎట్లా భావించుచూ ఉంటే (యత్ భావమ్), అది అట్లే అనుభవమై సిద్ధిస్తోంది. (తత్ భవతి).
🌺 ఇక్కడ బంధము లేదు. మోక్షము లేదు. ఆత్మ మాత్రమే సత్యమై ఉన్నది. అద్దాని జీవాత్మత్వము నాటకములోని పాత్రధారణవంటివి మాత్రమే. ఆత్మ నిత్యముక్తమై ఉండగా, బంధమెవరికి? మోక్షమెవరికి? ఆత్మను బంధించగలిగినట్టి ఏది?
🌺 ఇక్కడ సత్తు (that which has presence & existence) లేదు. అసత్తు లేదు. సత్ సుఖము లేదు. అసత్ దుఃఖము లేదు. జాతి లేదు. దేశ-కాలములు లేవు. వర్ణములు లేవు. ఆ భేదములన్నీ కల్పనలోనివే! అట్లాగే.. లోక సంబంధమైగాని, 14 లోకములుగాని ఏవీ ఆత్మతత్త్వము దృష్ట్యా లేవు. ఆ లోకములలోని జీవులు ఈ లోకములోనికి రావటము - పోవటము, స్థితి-గతి.. ఇవన్నీ ఏవీ లేవు. లోకములతో బాటు లోకపాలకులు లేరు. వేరువేరు సమయ-అసమయ సందర్భములలో వేరువేరు వస్త్రములు ధరించుచున్నప్పటికీ, ఆ వ్యక్తి వేరు వేరు కాదు కదా! అట్లాగే, ఇవన్నీ ప్రదర్శించు అఖండాత్మ.. ఇవన్నీ అగుట లేదు. సంకల్ప మాత్రం చేతనే అవి ఉన్నట్లుగా భావించబడటము, అనుభూతిగా సారూప్యమవటము జరుగుతోంది.
అట్లాగే - శాస్త్రములు వక్కాణిస్తున్న… సర్వము బ్రహ్మమే (సర్వమ్ ఖల్విదమ్ బ్రహ్మ)లో బ్రహ్మము అనబడునదేదీ మరొకటై లేదు. ‘చిత్’ అనునదీ లేదు. ‘చిదాభాసమ్’ అనే తెలియుట యొక్క ఆభాసరూప జగత్ దృశ్యము లేదు. ‘నేను చిత్‌రూపుడను’ అనిగానీ.. అవునా - కాదా?’’…. అనునదంతా లేదు.
దూరంగా కనిపించే కొండలు నునుపుగా ఉన్నట్లనిపించవచ్చు గాక! ‘‘అక్కడ నునుపు ఉన్నదా? ఆ నునుపుకు కారణమెవ్వరు? ఎందుచేత’’ - అనునది ఎట్టిదో, జగత్తుగా కనిపించే ఇదంతా అంతే! నునుపు గురించి వర్ణించి, విమర్శించుకోవటమే ఈ ‘‘జగత్. అనుభవ విమర్శ’’.
‘‘అహమ్ బ్రహ్మాఽస్మి। నేను బ్రహ్మమును; నిత్యశుద్ధుడను’’ ఇటువంటివన్నీ కూడా కొంచము కూడా లేవు.
అంతేకాదు. వాచా యత్ ఉచ్యతే కించిత్, మనసా మనుతే క్వచిత్, బుద్ధ్యా నిశ్చినుతే నాస్తి, చిత్తేన జా (జ్ఞా)యతే నహి! వాక్కు చేత ఏదేది చెప్పబడుచూ ఉన్నదో, మనస్సుచే ఏదేది ఆలోచించబడుతోందో, బుద్ధితో ఏదేది నిశ్చయించబడుతోందో, చిత్తములో ఏదేది తెలుసుకోబడుతోందో, పొందబడుచున్నదో - అవన్నీ కూడా వాస్తవానికి లేవు. భావనా సందర్భంలో భావనా కల్పనలు మాత్రమే! అట్లాగే యోగి, పరమయోగి, యోగీశ్వరుడు, యోగము, యోగాధికము.. ఇవన్నీకూడా లేవు! రాత్రి-పగలు-మధ్యాహ్నము-అర్ధరాత్రి- ప్రదోషకాలము ఇవన్నీ లేవు. కాలమే కల్పనా విశేషమైనప్పుడు, ఆ విభజనలు కూడా.. అట్టి కల్పనా విశేషాలే కదా!
ఆ విధంగానే అహ్రాంతి లేదు. ఆహ్రాంతి లేదు. అనాత్మ అనబడేది లేదు. వేద-శాస్త్ర-పురాణాలు లేవు. అవన్నీ కొన్ని కల్పనలకు విరుగుడుగా మరికొన్ని కల్పనలు వంటివి. కాలులో విరిగిన ముల్లును తొలగించటానికి ఉపయోగపడే మరొక ముల్లు వంటివి.
కార్యము లేదు. కారణము లేదు. జీవుడులేడు. ఈశ్వరుడు లేడు. భౌతిక లోకము లేవు. జన సమూహములు లేవు. అన్నీ మిథ్యయే!
అంతామిథ్యయే - సర్వం మిథ్యా। న సంశయః
ఈ దృశ్యముగా కనబడేది, అద్దానికి ద్రష్టత్వము వహించినదై ఉన్నది - ఈ ఈ మొదలైనవన్నీ కూడా తరచి చూస్తే స్వతఃగా ఉన్నవి కావు. లేనేలేవు. ‘‘స్వప్నములోని నేను-స్వప్నములో నాకు కనిపించే ప్రదేశములు, పదార్థములు, రూపనామములు’’ వలె- అంతా మిథ్యయే ! స్వతఃగా లేవు. ఊహాకల్పితంగా ఉండినవి మాత్రమే!
💐 వేద-శాస్త్ర పురాణాలు, కార్యకారణ కర్తృత్వములు, పుణ్య-పాపలోకములు, ఆయా లోకములలో అనుభవాలు, ఒక్కొక్క లోకములోని జనసమూహాలు.. అన్నీ మిథ్యయే! న సంశయః।
💐 బంధుత్వములు, బంధువులు, బంధము, మోక్షము, సుఖము, దుఃఖము, ధ్యానము, ధ్యానఫలములు, చిత్తము, దేవతలు, రాక్షసులు, ముఖ్యమైనవి, అముఖ్యము (గౌణము) అయినవి, ఇహము, పరమైనవి, ఇక్కడ కనిపిస్తున్నవి, మరొకచోట (పుణ్య-పాప లోకములలో)ఉన్నట్లుగా చెప్పబడేవి… అంతా మిథ్యయే. వాస్తవానికి లేవు. ఉన్నాయని అనుకుంటూఉంటే,.. ఉన్నట్లే అగుచున్నాయి. ఆత్మ కల్పించుకోకపోతే అవేవీ లేవు. ఆత్మ కల్పించుకొంటే మాత్రమే ఉంటాయి. ఆత్మకు అన్యమైనదంతా కల్పితమే.
💐 వాక్కుతో ఏకించిత్ పలుకబడుచూ ఉన్నదో..,
💐 సంకల్పములతో ఏదేది సంకల్పించబడుచూ ఉన్నదో…,
💐 మనస్సుచే ఏదేది ఆలోచన చేయబడుచూ ఉన్నదో..,
💐 బుద్ధితో ఏదేది ఏ రకంగా నిశ్చయించబడుచూ ఉన్నదో..,
💐 చిత్తముతో ఇష్టముగా ఏదేది అనుకోబడుచూ ఉన్నదో…,
💐 శాస్త్రములచే ఏవేవి దృశ్య, ద్రష్ట, దృక్, దేహ, దేహి, జీవాత్మ , ఈశ్వరాత్మ , పరమాత్మ , మనో బుద్ధి చిత్త అహంకార, త్రిభువన, ఇహ పర, పాంచభౌతిక, ఇంద్రియ ఇంద్రియార్థ, బంధ మోక్ష, వ్రత నియమ, ప్రాణాయామ - రేచక పూరక-కుంభక, మూలాధారాది షట్‌చక్ర, చతుర్విధ ఆశ్రమ ధర్మ, మరణానంతర లోకముల వర్ణన మొదలైనవన్నీ సవిస్తారముగా.. చెప్పబడుచున్నదో,…
💐 కళ్లకు ఏదేది కనిపిస్తోందో..,
💐 ఏదేది చెవులకు వినిపిస్తూ ఉన్నదో..,
💐 సత్ భావములుగా, దుర్భావములుగా ఏవేవి నీతి శాస్త్రములచే నిర్ణయించి చెప్పబడుచున్నాయో…,
💐 యజ్ఞ-దాన-తపస్సులు మొదలైనవి వాటి వాటి బాహ్య ప్రయోజనములు,
ఈ విధంగా కళ్లతో, చెవులతో గొంతుకతో నిర్వర్తించుచున్నవి, నిర్వర్తించవలసినదిగా బోధించేవీ, సంబోధించేవీ, సంభోగించేవీ..
ఇవన్నీ మిథ్యయే। ఇది నిశ్చయము। సునిశ్చితము। అనుమానమే లేదు!
💐 ఇది ఇట్లాగే చేయాలి! అది అట్లా చేయకూడదు.. సానుకూల-మత ఆచారములు, అసానుకూల అనాచారములు, వాటికి సంబంధించిన విధి-నిషేధములు, వాటి ఫలములు,
💐 నేను, నీవు, ఆతడు.. నేను ఇట్టివాడను. నీవు అట్టివాడు, ఆతడు అటువంటివాడు, నేను ఆతడే. (సోఽహమ్), తత్‌త్వమ్ (నీవు అదే), జీవుడే బ్రహ్మము, బ్రహ్మమే జీవుడు - మొదలైన ఆయా సర్వ సంభావ్యములు (భావించబడేవి), సంభాషణలు, సంకల్పములు, సంభ్రమములు, ధ్యానించవలసినవిగా-ధ్యానించకూడనివిగా చెప్పబడేవి, రహస్యములుగా అనుకోబడేవి,
అంతా నాస్తి! మిథ్యయే।
💐 సర్వభోగములు, వాటికి సంబంధించిన ప్రయత్నములు, వారికి-వీరికి-నీకు-నాకు మధ్య గల భేదములు, స్థితి-గతి భేదములు, వారి-వీరి-నీ-నా దోషములు, దోషవృత్తులుగా చెప్పబడేవి..,
… ఇవన్నీ నాస్తి! లేవు! అనాత్మయే!
👉 అనే నిశ్చయము కలిగి ఉండియే ఈ ప్రపంచంలో చరించాలి.
ఓ నిదాఘ మునిసత్తమా! ఈ దృశ్య సంఘటనా సమస్తము కూడా మిథ్యయే - అనునది ఏమరువక, ఆత్మత్వమునకై ఉపయోగించుకొని అటు తరువాత ‘మిథ్యయే’ అని వదలివేయాలి! ఎందుకంటే ‘ఆత్మ ఏవాహమ్’ అను భావము సమక్షములో వాటన్నిటికీ చోటులేదు! ఇంకా వినండి.
‘‘నీవు-నేను-నీది-నాది-నీ స్వభావము-నా స్వభావము-నీవు ఎట్టివాడవు-నేను ఎట్టివాడను-వారు-వీరు ఎట్టివారు- దేవుడు జీవుడు-అల్పుడు-అధికుడు-జ్ఞాని-అజ్ఞాని.. ఇవన్నీ కూడా మిథ్యయే! సహజ సత్యము కాదు. కానీ, ‘‘ఆత్మత్వము ధరించటానికి ఉపకరణములు అవగలవు!’’.. అని ఎరిగి జగత్తులో చరించాలి. ఎందుకంటే ‘‘బ్రహ్మసత్యమ్- జగత్ మిథ్యా’’.. అనునది మహావాక్య సత్యప్రకటనము కాబట్టి।
ఇంకా కూడా వినండి!
🦜 బ్రహ్మ ఈ సృష్టికి కారణుడు. విష్ణువు పరిపోషకుడు. రుద్రుడు ఈ జగత్తుకు లయకారకుడు!
🦜 విష్ణువే సర్వజీవుల రక్షకుడు!
🦜 శివుడు విష్ణు రూపుడు! విష్ణువు శివరూపుడు!
🦜 భవ భయములు, భవ బంధములు.., భవము= ఉన్నది- ఈ జగత్తు ఉన్నది. మరణించిన తరువత ఈ జగత్తు పోగొట్టుకుంటాము. ఇప్పుడు ఇక్కడ ఉన్నాము. అప్పుడు అక్కడ ఉంటాము. అది ఎట్లా ఉంటుదో మరి…? ఈఈ రూపముగా గల భావములు
🦜 ఆ భవబంధము, భయము పోగొట్టుకోవాలి. ఎట్లా? స్నానము! జపము! తపస్సు! హోమము! స్వాధ్యాయము! దేవతా పూజలు! మంత్రములు! తంత్రములు!
🦜 సత్సంగములు! గుణదోష విజృంభణములు!
🦜 అంతఃకరణము। అందులోని సద్భావములు-దుర్భావములు! అవిద్య! విద్య! బ్రహ్మాండము! అనేక కోటి బ్రహ్మాండములు..,
ఇవన్నీ మిథ్యయే! ఆత్మను ఎరిగి ఆస్వాదించువానికి ఇవన్నీ కూడా కల్పనామాత్రమే.. అగుచున్నది!
ఓ నిదాఘ యతీంద్రా!! మరికొంతగా కూడా, కొన్ని విశేషాలు - ‘మిథ్య’ గురించి వినండి!
☞ సర్వ ఉపదేశవాక్యములు, వాటికి సంబంధించిన సుదీర్ఘమైన ప్రబోధములు, ఏదేది ఏదేదిగా నిశ్చయింపబడుచున్నదో.. అదంతా కూడా,
☞ ఏ దృశ్యజగత్తు ఘనీభూతమై కనిపిస్తోందో అట్టి ఈ జగత్ దృశ్యము, ఇందులో కనిపించే (భార్య-భర్త-కొడుకు- కూతురు- స్నేహితుడు-శ్రేయోభిలాషి-అయినవారు-కానివారు-మిత్రులు మొదలైన) పరస్పర సంబంధ- అనుబంధ - బాంధవ్యములు, ఈ జగత్తులో ఆయా నా యొక్క, మీయొక్క తదితరుల యొక్క వర్తనములు, అనువర్తనములు,
ఇవన్నీ కూడా మిథ్యయే! కల్పనయే!
భావనానుసారంగా ఉండేవే! అభావముతో లేనివే! స్వప్న సంకల్పముల వంటివే!
🙏 ఏదేది ‘అక్షరము’ అని అభివర్ణించబడుతోందో.. ఏదేది దేనిచేత పొందబడగలదని నిర్ణయించి చెప్పబడుతోందో,.. ఏదేది దేనిచేత గమనించబడుతోందో,.. ఏదేది దేనిచేత ఆనందానుభవంగా చూడబడుతోందో..,
🙏 ఏది ఎవ్వరికి ఎక్కడ ఇవ్వబడుతూ ఉన్నదో.., ఏది ఎవ్వరి నుండి ఎక్కడ ఎప్పుడు పొందబడుతోందో, ఏదేది శుభకర్మ అని - అశుభకర్మ అని భావించబడుతోందో…
అంతా మిథ్యయే!
ఓ నిదాఘా!
‘‘అంతా మిథ్యయే కదా!’’ అని ఎరిగి ఉండండి. మిథ్యను మిథ్యగా గమనించకపోతే స్వకీయ సహజరూపమగు ఆత్మను ఈ జీవుడు గమనించకయే ఉండిపోతాడు. మిథ్యను మిథ్యగా దర్శించటమే సత్యదర్శనము. |
అప్పుడు ఆత్మ సులభముగా, స్వయముగా అభిన్నానుభవమై, అద్వితీయమై, అనునిత్యమై సిద్ధించగలదు.
త్వమేవ సర్వమ్- ఇదంతా నీవే
నిదాఘ మునీంద్రుడు : స్వామీ! ‘‘ఈ సర్వము మిథ్యయే - జగన్మిథ్యా’’.. అను మహావాక్యార్ధమును సవివరంగా ప్రవచించారు. మీరు చెప్పిన విశేషములు వినటం చేత అనేక సాంసారిక-మనోరుగ్మతలు తొలగుచున్నాయనుటలో సందేహమే లేదు. మీకు మేమంతా కృతజ్ఞులము స్వామీ!
హే మహాత్మా! సద్గురూ! ఇప్పుడు నాదొక ప్రశ్న…. మీ చేత ఈ విషయాలన్నీ బోధిస్తూ ఉండగా విద్యార్థినై, ముముక్షువునై బుద్ధి వికాసము పొందుచున్న నేనెవ్వరు? పరమ సత్యమును నిర్మోహమోటముగా, ముక్కుకు సూటిగా చెప్పుచున్న మీరెవ్వరు? మనిద్దరి మధ్య ఇప్పుడు కొనసాగుచున్న గురు-శిష్య భేదము కూడా మిథ్యయేనంటారా? నేనెవ్వరు? పరమాత్మ ఎవ్వరు? పరమాత్మకు నాకు గల సంబంధమేమిటి? నా బుద్ధిని వికశింపజేస్తున్న సద్గురువులగు మీరెవ్వరు? మనిద్దరి సంబంధము ఎట్టిది?.. ఈ విషయాలు నాకు సుస్పష్టమయ్యే తీరుగా మీ ప్రవచనము కొనసాగించవలసినదిగా వేడుకొనుచున్నాను. పరమాత్మ-పరమగురువు కూడా మిథ్యయేనా? - దయతో వివరించండి!
ఋభు మహర్షి : నాయనా! నిదాఘా! ఇప్పుడు తత్త్వశాస్త్రమును వివరిస్తున్నాను. వినండి. త్వమ్- నీవు.. తత్.. ఆదియే అసి-అయి ఉన్నావు. త్వమేవ పరమాత్మాఽసి! త్వమేవ సరమో గురుః। ఆ ‘పరమాత్మ’ అనుబడునది సర్వదా సాక్షాత్తు నీవేనయ్యా! నీవే పరమగురువువు! ఆత్మైవహి గురుః, ఆత్మయే గురువు! నీవు ఆత్మవే!
నిదాఘుడు: ఇప్పుడు మీరు చెప్పుసిద్ధాంత వాక్యమును మరికొంత సుస్పష్టంగా, సోదాహరణ పూర్వకంగా దయతో సవివరించండి!
ఋభు మహర్షి : నీవే సాక్షాత్తూ భూతాకాశరూపుడవు! చిత్తాకాశ రూపుడవు! చిదాకాశరూపుడవు! అంతేగాని, కేవలమూ రక్త-మాంస-బొమికల కలయిక అగు ఒక చిన్నగుట్టవు కావు!
ఇహముగా నీకు కనిపించేదంతాకూడా నీ యొక్క అనంతగుణస్వరూపమగు ఒకానొక అంశ అయినట్టి జీవాత్మత్వరూపము మాత్రమే! ఇది నీళ్లలో సూర్య ప్రతిబింబము వంటిది. ఆకాశ సూర్యునివలె నీవు సర్వదా పరమాత్మవే! ఈ జగదనుభవములకు, అవన్నీ పొందుచున్న జీవాత్మకు కేవల సాక్షివి. అంతేకాదు! నీ పరమాత్మ స్వరూపమునకు మరొక సాక్షి ఎవ్వరూ ఎన్నడూ లేరు. సర్వము నీ యొక్క సాక్షిత్వ- స్వకీయ పరికల్పనలే!
సర్వము భావిస్తున్నది నీవే! అంతేగాని నీవు మరొక్కరి భావనవు కావు. నిన్ను నీవే జగత్ విషయములుగా భావించుచుండటం చేత ‘సర్వభావకుడవు’ అయి ఉన్నావు. ‘బ్రహ్మము’ అని దేనిగురించి వేదోపనిషత్తులు, పురాణములు ఎలుగెత్తి గానం చేస్తున్నాయో అది నీవే! అంతేగాని, నీకు వేరైన మరొకటి కాదు. కాదు! త్వమ్ సదా బ్రహ్మాసి! నీవు బ్రహ్మమువే అయి ఉన్నావు. న సంశయః। ఇందులో కించిత్ కూడా అనుమానించవలసినది లేనేలేదయ్యా।
కాలహీనోఽసి। కాలోఽసి! : సదాశివ బ్రహ్మమగు నీవు కాలబద్ధుడవు కాదు. త్రికాలములలో యథాతథరూపుడవు. కాల రహితుడవు. కాలము లేనప్పుడు కూడా నీవు ఉన్నావు. మరొక్క చమత్కారం, ఏమిటంటే, - ‘కాలము’ రూపముగా ఉన్నది కూడా నీవే! కాలస్వరూపుడవు! కాలనియామకుడవు! కాలః కాలుడవు। కాలమును ధరించినవాడవై లోకములను కల్పించి, కొనసాగించి, లయింపజేసుకొంటున్నట్టి లీలావినోద సహిత - కేవల సత్తా స్వరూపుడవు. (దృష్టాంతము - జాగ్రత్‌లో కనిపిస్తున్న ‘కాలము’ స్వప్నములో ఉండదు. స్వప్నములో కనిపించేది ‘సుషుప్తి’లో ఉండటము లేదు కదా!)
✤ ఎల్లప్పుడు చిద్ఘనీభూతమగు బ్రహ్మమువే!
✤ సర్వత్రా సర్వరూపుడవై (ఘనీభూత చిద్ఘన బ్రహ్మమై) వెలుగొందుచున్నావు. చైతన్య స్వరూపుడవు! నీకు అన్యమై నీకు కనిపిస్తున్నదంతా - నీయొక్క ఆత్మ తేజోవిభవమే.
✤ సత్య స్వరూపుడవు. సర్వదా స్వస్వరూపుడవు! స్వసిద్ధుడవు! నిన్ను నీవే కల్పనా జగత్తునందు సిద్ధింపజేసుకుంటున్నావు.
✤ జన్మ-కర్మలకంటే మునుముందే ఉన్నవాడవు! అందుచేత సనాతనుడవు! ఆది స్వరూపుడవు! ఆద్యంతరహితుడవు!
✤ ఆత్మవే అయి ఉండటం చేత నిత్యముక్తుడవు. వస్తుజాలము ఆకాశమును బంధించగలవా? లేదు. అట్లాగే, ఈ జగత్ దృశ్యములుగాని, మనో-బుద్ధి-చిత్త-అహంకారములుగాని, జీవన్-మరణములుగా-ఆత్మాకాశస్వరూపుడవగు నిన్ను స్పృశించనైనా లేవు. ఇక జగత్ సందర్భములు, సంఘటనలు నిన్నెట్లా బంధిస్తాయి?
✤ నీవు దృశ్య-దేహ-మనో-బుద్ధి-చిత్త-అహంకార-జీవాత్మలకు ఏ మాత్రమూ కూడా బద్ధుడవుకాదు. సర్వదా మోక్షస్వరూపుడవు. సర్వదా ఆనంద-అమృతమును గ్రోలువాడవు!
✤ ఆత్మవే అగుటచే సర్వదేవతా స్వరూపుడవు. సర్వదా సర్వము నీయందే స-శాంతించునట్టి పరమశాంత స్వభావుడవు.
✤ నీయందు జగత్తులు లేవు. నీ కల్పనలే ఈ జగత్తు. సర్వదా నిరామయుడవు! నిర్విషయుడవు! సమస్త జగత్తులు నీయొక్క భావనా చమత్కారములు మాత్రమే.
✤ సర్వము నీయందే కలవాడవు! పూర్ణుడవు! పరిపూర్ణుడవు! పరబ్రహ్మమువు.
✤ ఇహమునకు ఆవల గల పరస్వరూపుడవు! ఆ పరమునకు కూడా సాక్షివవటం చేత పరాత్-పరుడవు.
✤ సర్వజీవులలో సమస్వరూపుడవై ఉన్నవాడవు. సమోఽసి! సమం సర్వేషు భూతేషు! సత్ స్వరూపుడవు. సనాతనుడవు! సత్-చిత్- ఆనందము, కేవలసత్, నిత్యము, ప్రజ్ఞానఘనము.. ఇత్యాది వాక్యముల ద్వారా గురువుల ప్రబోధిస్తున్నది నీ గురించే! నీ చే చూడబడే సకల జీవులలో నీవే సత్తారూపుడుగా వేంచేసిఉన్నావు.
✤ బ్రహ్మ-ఇంద్ర-రుద్ర ఇత్యాది సర్వదేవతలంతా కూడా నీ స్వస్వరూపాత్మ సంప్రదర్శనమే! సర్వలోక పాలకులలో నీవు ఆత్మరూపుడుగా సంప్రకాశమానుడవు. సర్వదేవతల (అష్టోత్తర శత-సాహస్ర) నామార్చన వర్ణనముల పరమార్థము నీయొక్క కేవలీ పర స్వరూపమే.
✤ సర్వజీవుల రూపముగా భాసిస్తూ ఉన్నది నీవే! అట్లా భాసిస్తూనే,… సర్వసాక్షిగా వేరుగా ఉన్నవాడవు. భ్రమరహితుడవు కూడా! సర్వప్రపంచ భ్రమ వర్జితుడవు, భ్రమరహితుడవు.
✤ సర్వ ఉపనిషత్తుల, సర్వవేదముల అంతరార్థముల విభవమంతా నీవే! సర్వసంకల్పములు నీవే అయి, సర్వసంకల్పములకు ఆవల సర్వసంకల్పరహితుడవై, సంకల్పించువాడవై ప్రకాశించుచున్నావు. సర్వదేవతల స్తోత్రములు నీయొక్క కేవల స్వరూప స్తుతులే.
✤ ఆనంద స్వరూపుడవు. నీ క్రీడా-లీలా-బాలా వినోదరూపమే ఈ జగత్ ప్రదర్శనము. సర్వ సంతోష-సుఖాసీనుడవు. సృష్టిలోని కదలికలన్నీ నీవే అయి కూడా, గతులన్నిటినీ త్యజించియున్నవాడవు. గతి <