[[@YHRK]] [[@Spiritual]]

kaTa Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 2
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com
Courtesy - sanskritdocuments.org (For ORIGINAL Slokas Without Sandhi Splitting)


కృష్ణయజుర్వేదాంతర్గత

7     కఠోపనిషత్‌

(లేక) కఠవల్లి ఉపనిషత్‌

శ్లోక తాత్పర్య పుష్పమ్



ఓం సహ నావవతు . సహ నౌ భునక్తు . సహవీర్యం కరవావహై .
తేజస్వి నావధీతమస్తు . మా విద్విషావహై ..
ఓం శాంతిః శాంతిః శాంతిః ..

శ్లో|| సహ నావావతు| సహ నౌ భునక్తు|
సహ వీర్యం కరవావహై|
తేజస్వినావధీతమస్తు| మా విద్వషావహై|
ఓం శాంతిః| శాంతిః| శాంతిః||

స = ఆ పరమాత్మ,
నౌ = గురుశిష్యులమగు మన ఇరువురిని,
అవతు = కాపాడును గాక!,
భునక్తు = అనుభవశీలురుగా చేయును గాక! విద్యావృతమైన వీర్యమును సంపాదించెదము గాక!
మా అధీతము (అధ్యయనము) తేజోవంతమగును గాక! పరస్పరము అయిష్టరహితులమై ఉండకుండెదము గాక!

ప్రథమ వల్లీ


ఓం ఉశన్ హ వై వాజశ్రవసః సర్వవేదసం దదౌ .
తస్య హ నచికేతా నామ పుత్ర ఆస .. 1..
1. ఓం ఉశన్‌ హవై వాజశ్రవసః సర్వ వేదసం దదౌ|
తస్య హ నచికేతా నామపుత్రః ఆస||
హ వై = అనగా …. అనగా,
వాజస్రవసః = వజస్రవుని కుమారుడు వాజస్రవసువు,
ఉశన్‌ = స్వర్గాధిఫలములు కోరినవాడై,
సర్వవేద సందదౌ = తనకున్నదంతా ఇచ్చి వేసే ప్రక్రియతో కూడిన విశ్వజిత్‌ యాగము చేస్తూ చివ్వరిగా ‘సర్వస్వ దాన విధి’ ప్రారంభించారు.

తగ్ం హ కుమారగ్ం సంతం దక్షిణాసు
నీయమానాసు శ్రద్ధావివేశ సోఽమన్యత .. 2..
2. తగ్ం హ కుమారగ్ం సంతం
‘‘దక్షిణాసు నీయమానాసు శ్రద్ధా అవివేశ’’ సో అమన్యత|
ఆయన కుమారుడు నచికేతుడు. ఆ కుమారుడు ‘‘మా నాన్న దక్షిణ ఇస్తున్నప్పుడు శ్రద్ధ లేదేమి’’ - అని అనుకున్నాడు.

పీతోదకా జగ్ధతృణా దుగ్ధదోహా నిరింద్రియాః .
అనందా నామ తే లోకాస్తాన్ స గచ్ఛతి తా దదత్ .. 3..
3. (అ)పీతోదకా, జగ్ధతృణా, దుగ్ధదోహా, నిరింద్రియాః
ఆనందా నామ తే లోకాః తాన్‌ స గచ్ఛతి తా దదత్‌?
ఇంత కష్టపడి యజ్ఞము చేసిన తరువాత, మరి ‘‘నీళ్ళు త్రాగలేని - గడ్డి తినలేని - పాలు ఇవ్వలేని, ఇంద్రియాలు క్షీణించిన ఒట్టి పోయిన గోవులు దానం చేస్తే ఉత్తమ లోకాలు ఎట్లా లభిస్తాయి?’’ అని నచికేతుడు అనుకున్నాడు.

స హోవాచ పితరం తత కస్మై మాం దాస్యసీతి .
ద్వితీయం తృతీయం తగ్ం హోవాచ మృత్యవే త్వా దదామీతి .. 4..
4. సహోవాచ పితరం తత
‘‘కస్మై మాం దాస్యసి?’’ ఇతి | ద్వితీయం - తృతీయం
తగ్ం హ ఉవాచ ‘‘మృత్యవే త్వాం దదామి’’ ఇతి ||
నచికేతుడు : నాన్నగారూ! ఇక నన్ను ఎవరికి దానం చేస్తారు? అని రెండు మూడుసార్లు రెట్టించి అడిగాడు.
గౌతముడు : మృత్యుదేవతకు నిన్ను దానం చేస్తున్నాను.

బహూనామేమి ప్రథమో బహూనామేమి మధ్యమః .
కిఀ స్విద్యమస్య కర్తవ్యం యన్మయాఽద్య కరిష్యతి .. 5..
5. నచికేతౌవాచ :
బహూనామ్‌ ఏమి ప్రథమం, బహూనామ్‌ఏమి మధ్యమః|
కిగ్‌ం స్విత్‌ యమస్య కర్తవ్యమ్‌ యత్‌ మయా అద్య కరిష్యతి ||
నచికేతుడు : నాన్నగారూ! దిగులు చెందకండి. చాలా మంది నాకన్నా ముందే పోయారు. చాలామంది కన్నా ముందు నేనూ పోతున్నాను. అసంఖ్యాకంగా జనులు (ప్రారంభంలో లేకుండా) మధ్యలో వచ్చి, మధ్యలోనే పోతున్నారు. శ్రీ యమదేవులకు నేను ఇవ్వబడటమే ఇప్పటి మన కర్తవ్యం. అది అట్లే జరుగుగాక!

అనుపశ్య యథా పూర్వే ప్రతిపశ్య తథాఽపరే .
సస్యమివ మర్త్యః పచ్యతే సస్యమివాజాయతే పునః .. 6..
6. అనుపశ్య యథా పూర్వే, ప్రతిపశ్య తథా అపరే|
సస్యమ్‌ ఇవ మర్త్యః పచ్యతే, సస్యమివా జాయతే పునః ||
మన పూర్వీకులు ఎట్లా సత్యాన్ని పాటించారో, … మనమూ అట్లాగే పాటించాలి కదా! ఇక చావు గురించి అంటారా? ధాన్యం పడి రాలుతోంది. మరల పుట్టుకొస్తోంది. ఈ భౌతిక శరీరాలన్నీ ఇంతే కదా!

వైశ్వానరః ప్రవిశత్యతిథిర్బ్రాహ్మణో గృహాన్ .
తస్యైతాఀ శాంతిం కుర్వంతి హర వైవస్వతోదకం .. 7..
7. యమౌవాచ :
వైశ్వానరః ప్రవిశతి అతిథిః బ్రాహ్మణో గృహాన్‌
తస్త్య ఏతాగ్‌ం శాంతిం కుర్వన్తి హర వైవస్వతోదకమ్‌ ||
యమభగవానుడు : బ్రాహ్మణుడగు అతిథి అగ్నిరూపంగా ఇంటికి వచ్చినట్లు భావించి వైవస్వతోదకముతో శాంతింపజేయాలి.

ఆశాప్రతీక్షే సంగతఀ సూనృతాం
చేష్టాపూర్తే పుత్రపశూఀశ్చ సర్వాన్ .
ఏతద్వృంక్తే పురుషస్యాల్పమేధసో
యస్యానశ్నన్వసతి బ్రాహ్మణో గృహే .. 8..
8. ఆశా ప్రతీక్షే సంగతగ్‌ం సూనృతాం చ
ఇష్టా - పూర్తే పుత్ర పశూగ్‌ంశ్చ సర్వాన్‌
ఏతత్‌ వృంఙ్‌క్తే పురుషస్య అల్పమేధసో
యస్య అనశ్నన్‌ వసతి బ్రాహ్మణో గృహే ||
ఎవరి గృహంలో ప్రవేశించిన అతిథికి ఆహారాదులు అందించలేదో అట్టి గృహస్తుని ఆశలు, ఆకాంక్షలు - సత్సంగఫలాలు, ఇష్టా - ప్రయోజనాలు, సంతానాది సంపదలు మొదలైనవి ఫలించకయే ఉంటాయి.

తిస్రో రాత్రీర్యదవాత్సీర్గృహే మే-
ఽనశ్నన్ బ్రహ్మన్నతిథిర్నమస్యః .
నమస్తేఽస్తు బ్రహ్మన్ స్వస్తి మేఽస్తు
తస్మాత్ప్రతి త్రీన్వరాన్వృణీష్వ .. 9..
9. తిస్రోరాత్రీః యత్‌ అవాత్సీ గృహే మే
అనశ్నన్‌ బ్రహ్మన్‌! అతిథిః! నమస్యః|
నమస్తే అస్తు బ్రహ్మన్‌! స్వస్తి మే అస్తు!
తస్మాత్‌ ప్రతి త్రీన్‌ వరాన్‌ వృణీస్వ ||
ఓ బ్రహ్మన్‌! బ్రాహ్మణోత్తమా! అతిథిదేవా! నమస్కారం! నిరాహారులై ఈ మా లోకంలో 3 రాత్రులు ఉన్నారు కదా! అందుకు ప్రతిగా 3 వరాలు కోరుకోండి! మా లోకమునకు అతిథిగా వేంచేసిన మీకు స్వస్తి| శుభమగు గాక! మీరు సంతోషించినవారై, అది నాకు స్వస్థి అగుగాక!

శాంతసంకల్పః సుమనా యథా స్యాద్
వీతమన్యుర్గౌతమో మాఽభి మృత్యో .
త్వత్ప్రసృష్టం మాఽభివదేత్ప్రతీత
ఏతత్ త్రయాణాం ప్రథమం వరం వృణే .. 10..
10. నచికేతౌవాచ :
శాంత సంకల్పః సుమనాః యథా స్యాత్‌
వీతమన్యుః, గౌతమో అభి, మృత్యో |
తత్‌ ప్రసృష్టం, మాం అభివదేత్‌ ప్రతీత
ఏతత్‌ త్రయాణాం ప్రథమం వరం వృణే ||
నచికేతుడు : ఓ మృత్యుదేవా! నా తండ్రి గౌతములు శాంతి సంకల్పులు - సుమనస్కులు అగుదురు గాక! నాపట్ల కోపం తొలగి, వారు ప్రశాంతులు అయ్యెదరు గాక! మీచే మరల సృష్టించబడినప్పుడు నన్ను గుర్తించి నా పితృదేవులు ప్రేమగా ఆహ్వానించెదరుగాక!

యథా పురస్తాద్ భవితా ప్రతీత
ఔద్దాలకిరారుణిర్మత్ప్రసృష్టః .
సుఖఀ రాత్రీః శయితా వీతమన్యుః
త్వాం దదృశివాన్మృత్యుముఖాత్ ప్రముక్తం .. 11..
11. యమౌవాచ :
యథా పురస్తాత్‌ భవితా ప్రతీత
ఔద్దాలకిః ఆరుణిః మత్‌ ప్రసృష్టః
సుఖం రాత్రీః శయితా వీతమన్యుః
త్వాం దదృశివాన్‌ మృత్యుముఖాత్‌ ప్రముక్తమ్‌ ||
యమభగవానుడు : నాచే తిరిగి సృష్టించబడి మృత్యు ముఖం నుండి వెలువడిన నిన్ను చూచి ఔద్దాలకుడు - (అరుణి కుమారుడైన) ఆరుణి - అయిన మీ నాన్నగారు ఇదివరకటి లాగానే ఇకముందు కూడా ప్రేమగానే ఆదరిస్తారు. కోపం పోయి, రాత్రి సుఖంగా నిదురిస్తారు.

స్వర్గే లోకే న భయం కించనాస్తి
న తత్ర త్వం న జరయా బిభేతి .
ఉభే తీర్త్వాఽశనాయాపిపాసే
శోకాతిగో మోదతే స్వర్గలోకే .. 12..
12. నచికేతౌవాచ :
స్వర్గలోకే న భయం కించ న అస్తి (కించ నాస్తి)
న తత్ర త్వం, న జరయా భిభేతి|
ఉభేతీర్త్వా ‘‘అశనాయా పిపాసే’’
శోకాతిగో మోదతే స్వర్గలోకే ||
నచికేతుడు : స్వామీ! స్వర్గలోకంలో భయం అనేది కొంచెం కూడా ఉండదు. అక్కడ మీరు ఉండరు కదా! అక్కడ వృద్ధాప్యం కూడా ఉండదు. అక్కడివారు ఆకలి దప్పికలను అధిగమించి ఉంటారు. శోకాన్ని అధిగమించి స్వర్గలోకంలో సుఖంగా ఉంటారట. మా భూలోకములో (భౌతిక లోకములలో) ఆకలి-దప్పికల బాధ, ముసలితనము-చావుల భయము తప్పవు.

స త్వమగ్నిం స్వర్గ్యమధ్యేషి మృత్యో
ప్రబ్రూహి త్వఀ శ్రద్దధానాయ మహ్యం .
స్వర్గలోకా అమృతత్వం భజంత
ఏతద్ ద్వితీయేన వృణే వరేణ .. 13..
13. స త్వమ్‌ అగ్నిం స్వర్గ్యం అధ్యేషి, మృత్యో!
ప్రభ్రూహి తం శ్రద్ధదానాయ మహ్యమ్‌
స్వర్గలోకా అమృతత్వం భజన్త
ఏతత్‌ ద్వితీయేన వృణే వరేణ ||
ఓ మృత్యుదేవా! అటువంటి అగ్నికార్యాన్ని (యజ్ఞాన్ని) మీరు ఎఱిగి ఉన్నారు కదా! స్వర్గలోకం రూపమగు అమృతత్వాన్ని ప్రసాదించే యజ్ఞాన్ని విధి విధానంగా చెప్పండి. ఇదియే నేను కోరుకొనే రెండవ వరం. నేను శ్రద్ధగా వినుటకు, ఆచరించుటకు సంసిద్ధుడను.

ప్ర తే బ్రవీమి తదు మే నిబోధ
స్వర్గ్యమగ్నిం నచికేతః ప్రజానన్ .
అనంతలోకాప్తిమథో ప్రతిష్ఠాం
విద్ధి త్వమేతం నిహితం గుహాయాం .. 14..
14. నచికేతౌవాచ :
ప్ర తే బ్రవీమి తత్‌ ఉ మే నిబోధ
స్వర్గ్యమగ్నిం నచికేత! ప్రజానన్‌
అనంత లోకాప్తిం అథో ప్రతిష్ఠాం
విధ్ధి తమ్‌ ఏనమ్‌ నిహితం గుహాయాం ||
యమభగవానుడు : ఓ నచికేతా! విద్వాంసుల హృదయ గుహలో ప్రతిష్ఠితమై ఉన్నట్టి, ఉత్తమ లోకాలు ప్రసాదించ గలిగినట్టి అగ్ని - యజ్ఞమును (అగ్ని కార్యమును) బోధిస్తున్నాను. జాగరూకుడవై గ్రహించు.

లోకాదిమగ్నిం తమువాచ తస్మై
యా ఇష్టకా యావతీర్వా యథా వా .
స చాపి తత్ప్రత్యవదద్యథోక్తం
అథాస్య మృత్యుః పునరేవాహ తుష్టః .. 15..
15. లోకాదిమ్‌ అగ్నిమ్‌ తమ్‌ ఉవాచ తస్మై
యా ఇష్టకా, యావతీర్వా, యథా వా
స చ అపి తత్‌ వ్రవదత్‌ యథోక్తమ్‌
అథాస్య మృత్యుః పునరేవ ఆహ తుష్టః ||
అప్పుడు యమధర్మరాజు జగత్తుకు మూలమైనట్టి అగ్న్యోపాసనా సంబంధమైన యజ్ఞమును నేర్పసాగారు. ఇటుకలు అమర్చటం నుండి (దేవతాహ్వానము నుండి అవబృథ స్నానము వరకు) విధి విధానమంతా అన్ని వివరాలతో బోధించారు. సంతోషముగా యమభగవానునిచే బోధించబడగా, నచికేతుడు సంతుష్టుడైనాడు.

తమబ్రవీత్ ప్రీయమాణో మహాత్మా
వరం తవేహాద్య దదామి భూయః .
తవైవ నామ్నా భవితాఽయమగ్నిః
సృంకాం చేమామనేకరూపాం గృహాణ .. 16..
16. తమ్‌ అబ్రవీతి (యమౌవాచ :)
ప్రియమాణో మహాత్మా!
వరం తవ ఇహ ఆద్య దదామి భూయః
తవైవ నామ్నాః భవితా యమ్‌ అగ్నిః
సృంకాంచ ఇమామ్‌ అనేక రూపాం గృహాణ ||
యమభగవానుడు : ఓ ప్రియమానుడనగు మహాత్మా! నీవు కోరినట్లు ఇప్పుడే ప్రసాదిస్తున్నాను. ఇది ‘నచికేతయజ్ఞం’ అనే నీ పేరుతో ప్రసిద్ధి కాగలదు. అనేక పుష్పములతో కూడిన ఈ పూదండ నీకు అలంకారమగుగాక! స్వీకరించు.

త్రిణాచికేతస్త్రిభిరేత్య సంధిం
త్రికర్మకృత్తరతి జన్మమృత్యూ .
బ్రహ్మజజ్ఞం దేవమీడ్యం విదిత్వా
నిచాయ్యేమాఀ శాంతిమత్యంతమేతి .. 17..
17. త్రిణాచికేతః త్రిభిః ఏత్య సంధిం,
త్రికర్మకృత్‌ తరతి జన్మ - మృత్యూ
బ్రహ్మజజ్ఞం దేవమ్‌ ఈడ్యం విదిత్వా
నిచాయ్య ఇమాగ్‌ం శాన్తిం అత్యంతం ఏతి ||
ఈ నాచికేత యజ్ఞం 3 సార్లు విధిపూర్వకంగా నిర్వర్తించినవాడు జన్మమృత్యు బంధం నుండి తరిస్తాడు. ఇది బ్రహ్మదేవుని సంకల్పంలోంచి వచ్చిన త్రయం (పరికరములు - విధానం - అనుసంధానం). ఇద్దానిని ఎరిగి, నిర్వర్తించిన నచికేతుడు అత్యంత శాన్తిని పొందాడు.

త్రిణాచికేతస్త్రయమేతద్విదిత్వా
య ఏవం విద్వాఀశ్చినుతే నాచికేతం .
స మృత్యుపాశాన్ పురతః ప్రణోద్య
శోకాతిగో మోదతే స్వర్గలోకే .. 18..
18. త్రిణాచికేతః త్రయమ్‌ ఏతత్‌ విదిత్వా
య ఏవం విద్వాన్‌ చినుతే నాచికేతమ్‌
స మృత్యుపాశాన్‌ పురతః ప్రణోద్య
శోకాతిగో మోదతే స్వర్గలోకే ||
‘‘పరికరములు - విధానం - అనుసంధానం’’ అనే ‘3’ విభాగములను చక్కగా గ్రహించి ఈ నాచికేత యజ్ఞమును 3 సార్లు ఎవ్వడు నిర్వర్తిస్తాడో, ఆతడు జీవించి ఉండగానే మృత్యుపాశముల నుండి విడివడుతాడు. నిమ్నలోకములను అధిగమించి స్వర్గలోకవాసము సంపాదించుకుంటున్నాడు.

ఏష తేఽగ్నిర్నచికేతః స్వర్గ్యో
యమవృణీథా ద్వితీయేన వరేణ .
ఏతమగ్నిం తవైవ ప్రవక్ష్యంతి జనాసః
తృతీయం వరం నచికేతో వృణీష్వ .. 19..
19. ఏషతే అగ్నిర్‌ నాచికేతః స్వర్గ్యో
యమ్‌ వృణీథా ద్వితీయేన వరేణ||
ఏతం అగ్నిం తవైవ ప్రవక్ష్యంతి జనాసః
తృతీయం వరం నచికేతో! వృణీష్వ ||
ఓ నచికేతా! స్వర్గాన్ని ప్రసాదించే నీచే ’2’వ వరంగా అడగబడిన ఈ యజ్ఞం ఇకనుండి జనులు నీ పేరు చేర్చి చెప్పుకొనెదరు గాక! ఏదీ? నీ 3వ వరం కోరుకో!

యేయం ప్రేతే విచికిత్సా మనుష్యే-
ఽస్తీత్యేకే నాయమస్తీతి చైకే .
ఏతద్విద్యామనుశిష్టస్త్వయాఽహం
వరాణామేష వరస్తృతీయః .. 20..
20. నచికేతౌవాచ :
యేయం ప్రేతే విచికిత్సా మనుష్యేః
‘‘అస్తి!’’ ఇత్యేకే| ‘‘న అయమ్‌ అస్తి’’ …. ఇతి చ ఏకే|
ఏతత్‌ విద్యామ్‌ అనుశిష్టః త్వయా అహమ్‌!
వరాణామ్‌ ఏష వరః తృతీయః ||
నచికేతుడు :

మనుష్యుడు మరణించిన తరువాత ఈతనికి ఏమగుచున్నది? - యథాతథంగా ‘ఉనికి’ని కొనసాగిస్తూనే ఉంటాడని కొందరంటున్నారు. ’‘ఈ దేహం తరువాత ఇతనికి ఇక ఉనికియే లేదు’’ అని మరికొందరంటున్నారు. ఇద్దాని గురించి 3వ వరంగా తెలుసుకోవాలనుకుంటున్నాను.


దేవైరత్రాపి విచికిత్సితం పురా
న హి సువిజ్ఞేయమణురేష ధర్మః .
అన్యం వరం నచికేతో వృణీష్వ
మా మోపరోత్సీరతి మా సృజైనం .. 21..
21. యమౌవాచ :
దేవైః అత్ర అపి విచికిత్సితం పురా,
న హి సువిజ్ఞేయం| అణురేష ధర్మః |
అన్యం వరం నచికేతో! వృణీష్వ
మా ఉపరోత్సీః, అతి మా సృజైనమ్‌ ||
యమభగవానుడు : నాయనా! అది దేవతలకు కూడా చర్చనీయాంశమై, విమర్శనా వస్తువై, అతి సూక్ష్మమైన విషయం. అట్టిది నన్ను అడక్కు. అది వదలి ఇంకేదైనా వరం కోరుకో! సృష్టికి అతీతమైన విషయం అడుగవద్దయ్యా! సృష్టిలో ఏమి కావాలో కోరుకో!

దేవైరత్రాపి విచికిత్సితం కిల
త్వం చ మృత్యో యన్న సుజ్ఞేయమాత్థ .
వక్తా చాస్య త్వాదృగన్యో న లభ్యో
నాన్యో వరస్తుల్య ఏతస్య కశ్చిత్ .. 22..
22. నచికేతౌవాచ :
దేవైః అత్రాపి విచికిత్సితం కిల|
త్వమ్‌ చ మృత్యో యత్‌ న సుజ్ఞేయం ఆత్థ?
వక్తా చ అస్య త్వాదృగ్‌ అన్యో న లభ్యో
నా అన్యోవరస్తుల్య ఏతస్య కశ్చిత్‌ ||
నచికేతుడు : అట్లాగా స్వామీ! దేవతలకే అది చర్చనీయాంశమగుచున్నదా? మరి అటువంటి విషయం మృత్యువుకే అధిదేవత అయిన మీతో సమానులైనవారు ఎవ్వరు నాకు చెప్పటానికి లభ్యపడతారు? అందుచేత నాకు మరింకే వరం అఖర్లేదు. ‘మృత్యువు’ గురించే చెప్పండి, చాలు.

శతాయుషః పుత్రపౌత్రాన్వృణీష్వా
బహూన్పశూన్ హస్తిహిరణ్యమశ్వాన్ .
భూమేర్మహదాయతనం వృణీష్వ
స్వయం చ జీవ శరదో యావదిచ్ఛసి .. 23..
23. యమౌవాచ :
శతాయుషః పుత్ర-పౌత్రాన్‌ వృణీష్వ
బహూన్‌ పశూన్‌ హస్తి హిరణ్యమ్‌ అశ్వాన్‌
భూమే మహత్‌ ఆయతనమ్‌ వృణీష్వ|
స్వయం చ జీవ శరదో యావత్‌ ఇచ్ఛసి ||
యమభగవానుడు : నిండు నూరేళ్ళు ఆయుష్షు, పుత్రులు, మనుమలు, ఏనుగులు - బంగారం - గుఱ్ఱములు - సువిస్తారమైన భూభాగం - ఇటువంటి సంపదలన్నీ అడుగు. లేదా ఇచ్ఛా మరణం కోరుకో, ఇస్తాను.

ఏతత్తుల్యం యది మన్యసే వరం
వృణీష్వ విత్తం చిరజీవికాం చ .
మహాభూమౌ నచికేతస్త్వమేధి
కామానాం త్వా కామభాజం కరోమి .. 24..
24. ఏతత్‌ తుల్యం యది మన్యసే వరం
వృణీష్వ, విత్తం, చిరజీవి కాంచ |
మహా భూమౌ నచికేతా! త్వం ఏధి
కామానాం త్వా కామ భాజనం కరోమి ||
సంపదలతో కూడిన చిరకాల జీవితం - ఇటువంటి నీకు బాగుగా నచ్చిన ఏ వరమైనా కోరుకో! సంవిస్తారమైన రాజ్య సంపద అయినా సరే! నీవు ఇంకేం కోరుకొంటే అవన్నీ ఇస్తాను.

యే యే కామా దుర్లభా మర్త్యలోకే
సర్వాన్ కామాఀశ్ఛందతః ప్రార్థయస్వ .
ఇమా రామాః సరథాః సతూర్యా
న హీదృశా లంభనీయా మనుష్యైః .
ఆభిర్మత్ప్రత్తాభిః పరిచారయస్వ
నచికేతో మరణం మాఽనుప్రాక్షీః .. 25..
25. యే యే కామా దుర్లభా మర్త్యలోకే
సర్వాన్‌ కామాన్‌ ఛందతః ప్రార్థయస్వ
ఇమా ఆరామాః సరథాః సతూర్యాః
న హి ఈదృశా లంభనీయా మనుష్యైః
ఆభిః మత్‌ ప్రత్తాభిః పరిచారయస్య
నచికేతో! మరణం మా అనుప్రాక్షీః ||
జనులంతా ఏవేమి ‘‘లభిస్తే బాగుండు! కానీ, దుర్లభం’’ అని అనుకుంటూ ఉంటారో, …. అటువంటివేవైనా, - కన్యలు, ఆరామములు, సన్మానాలు, వందిమాగధులు ఇవన్నీ కోరుకో. ఇస్తాను. ‘మృత్యువు’ అనుదాని గురించి మాత్రం మళ్ళీ అడుగవద్దయ్యా!

శ్వోభావా మర్త్యస్య యదంతకైతత్
సర్వేంద్రియాణాం జరయంతి తేజః .
అపి సర్వం జీవితమల్పమేవ
తవైవ వాహాస్తవ నృత్యగీతే .. 26..
26. నచికేతౌవాచ :

శ్వోఽభావో మర్త్యస్య యత్  అంతకా! ఏతత్‌,
సర్వేంద్రియాణాం జరయంతి తేజః
అపి సర్వం జీవితమ్‌ అల్పమేవ|
తవైవ వాహాః తవ నృత్యగీతే ||

నచికేతుడు : హే యమధర్మరాజా! ఈ మానవ జీవితం రేపటికో మాపటికో చేయి జారిపోయేదే! ఈ దేహము రేపటి వరకు ఉంటుందని ఏ మాత్రమూ చెప్పలేము. ఈ ఇంద్రియాలు కొద్ది రోజులు బలం పుంజుకొని ఆపై తమ తేజం రోజు రోజుకూ పోగొట్టుకుంటూ ఉంటాయి. అసలీ జీవితమే ఒక అల్పకాల వ్యవహారం. అందుచేత మీరు చెప్పే నృత్యగీతాలు మీ దగ్గరే పెట్టుకోండి. వాటితో నాకే ప్రయోజనమూ కనిపించటం లేదు.

న విత్తేన తర్పణీయో మనుష్యో
లప్స్యామహే విత్తమద్రాక్ష్మ చేత్త్వా .
జీవిష్యామో యావదీశిష్యసి త్వం
వరస్తు మే వరణీయః స ఏవ .. 27..
27. న విత్తేన తర్పణీయో మనుష్యో |
లప్స్యామహే విత్తమ్‌ అద్రాక్ష్మచేత్‌ త్వా
జీవిష్యామో యావత్‌ ఈశిష్యసి త్వం
వరస్తు మే వరణీయః స ఏవ ||
సంపదలున్న వారంతా సుఖ శాంతులతో ఉన్నారా? లేదు. అయినా, అవన్నీ మీవంటి మహనీయ దర్శనంతో వాటికవే లభిస్తాయి. మహనీయుల దర్శనమే మహద్భాగ్యము. ఇక మా యీ దేహం సంగతంటారా? దేహాలన్నీ మీయొక్క అనుమతి తోనే కొనసాగుతాయి. ఎప్పుడు మీరు కాదంటారో, అవన్నీ మానుండి తొలగుతాయి. అందుచేత మృత్యువు గురించి జ్ఞానమే సరి అయినది. మేము కోరుకోదగిన వరం అదే కదా!

అజీర్యతామమృతానాముపేత్య
జీర్యన్మర్త్యః క్వధఃస్థః ప్రజానన్ .
అభిధ్యాయన్ వర్ణరతిప్రమోదాన్
అతిదీర్ఘే జీవితే కో రమేత .. 28..
28. ఆజీర్యతామ్‌ అమృతానామ్‌ ఉపేత్య
జీర్యన్‌ మర్త్యః క్వధస్థః (క్వత్‌దాస్థః)ప్రజానన్‌
అభిధ్యాయన్‌ వర్ణరతి ప్రమోదాన్‌
అనతి దీర్ఘే జీవితే కో రమేత?

స్వామీ! చావుపుట్టుకల మధ్య చిక్కి ఎక్కడో భూమిపై జీవిస్తూ ఉండే క్షుద్ర జీవియగు నేను మరణమునకు అధిదేవత - అమృత స్వరూపులు అగు మిమ్ములను దర్శించే భాగ్యం పొంది కూడా ‘‘సంపదలు - దీర్ఘాయుష్షు’’ …. ఇటువంటి చిన్నచిన్న విషయాలు కోరుకోవటం ఎట్లా చేస్తాను చెప్పండి? కాల పురుషుని దర్శించి కాలముతో నశించే విషయాలు కోరుకోవటమేమిటి?


యస్మిన్నిదం విచికిత్సంతి మృత్యో
యత్సాంపరాయే మహతి బ్రూహి నస్తత్ .
యోఽయం వరో గూఢమనుప్రవిష్టో
నాన్యం తస్మాన్నచికేతా వృణీతే .. 29..
29. యస్మిన్‌ ఇదమ్‌ విచికిత్సంతి, మృత్యో!
యత్‌ సాంపరాయే మహతి బ్రూహి నస్తత్‌
యో అయం వరో గూఢమ్‌ అనుప్రవిష్టో
న అన్యం తస్మాత్‌ నచికేతాః వృణీతే ||
ఏది పరమ రహస్యమో, ఎద్దాని యందు ప్రతి ఒక్కరు ఏదో నాటికి ప్రవేశించటం అనివార్యమగుటచేత ప్రతి ఒక్కరు తప్పక విచారణచే తెలుసుకో వలసియున్నదో, ఏది చాలా చాలా మందికి అనుమానములతో కూడినది (Not aware of) అయివున్నదో - అటువంటి గొప్ప విశేషం అయినట్టి ‘మృత్యువు’ గురించి, పరలోకము గురించి నాకు చెప్పండి. అది తప్పితే నాకు ఇంకేమీ అఖర్లేదు.

ద్వితీయ వల్లీ


అన్యచ్ఛ్రేయోఽన్యదుతైవ ప్రేయ-
స్తే ఉభే నానార్థే పురుషఀ సినీతః .
తయోః శ్రేయ ఆదదానస్య సాధు
భవతి హీయతేఽర్థాద్య ఉ ప్రేయో వృణీతే .. 1..
1. యమౌవాచ :
అన్యత్‌ శ్రేయో, అన్యత్‌ ఉతైవ ప్రేయః
తే ఉభే నానార్థే పురుషం సినీతః
తయోః ‘‘శ్రేయః’’ ఆదదానస్య ‘‘సాధు’’ భవతి|
హీయతే అర్ధాత్‌ యః ఉ ప్రేయో వృణీతే ||
యమభగవానుడు : సరేనయ్యా విను. చెపుతాను. 1) శ్రేయస్సు కలుగచేసేవి 2) ప్రియంగా ఉండేవి అనే రెండు వేరువేరైన విషయ సమూహాలు ఈ జీవుని సమీపిస్తున్నాయి. వాటి వాటి పర్యవసానాలు వేఱువేఱుగా ఉంటున్నాయి. శ్రేయస్సును ఆశ్రయిస్తే ఈ జీవుడు సాధు (సాధించవలసినది సాధించినవాడు) అగుచున్నాడు. ప్రేయస్సు (ఇంద్రియములకు ప్రియంగా ఉందికదా అని) ఆశ్రయించినవాడు తాను ఎందుకు పుట్టాడో … ఆ గమ్యం నుండి తొలగినవాడగుచున్నాడు. ‘అల్పార్థము’ కొరకై వెళ్ళి, పరమార్థమును పోగొట్టుకొనుచున్నాడు.

శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేతః
తౌ సంపరీత్య వివినక్తి ధీరః .
శ్రేయో హి ధీరోఽభి ప్రేయసో వృణీతే
ప్రేయో మందో యోగక్షేమాద్వృణీతే .. 2..
2. శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమ్‌ ఏతః
తౌ సంపరీత్య వివినక్తి ధీరః|
శ్రేయో హి ధీరో అభి ప్రేయసో వృణీతే,
ప్రేయో మందో యోగక్షేమాత్‌ వృణీతే ||
చాలా మంది తెలివి తక్కువగా జీవిస్తూ ‘‘ఇది శ్రేయస్సు - ఇది ప్రేయస్సు’’ (ఇది శ్రేయోదాయకము. ఇది ఇంద్రియములకు మాత్రమే ప్రియము) అని విచక్షణయే చేయటంలేదు. తెలివిగలవాడు మాత్రం తనను సమీపించేవాటిని పరిశీలించి ఏది శ్రేయస్సో, ఏది ప్రేయస్సో వివేచన చేస్తున్నాడు. సూక్ష్మబుద్ధి కలవాడు శ్రేయస్సును స్వీకరించి ప్రేయస్సును వదిలేస్తున్నాడు. అల్పబుద్ధి కలవాడు శ్రేయస్సును వదిలి ప్రేయస్సులో (ఇంద్రియములకు ప్రియంగా ఉండే వాటిలో) యోగక్షేమాలు వెతుక్కుంటున్నాడు.

స త్వం ప్రియాన్ప్రియరూపాంశ్చ కామాన్
అభిధ్యాయన్నచికేతోఽత్యస్రాక్షీః .
నైతాం సృంకాం విత్తమయీమవాప్తో
యస్యాం మజ్జంతి బహవో మనుష్యాః .. 3..
3. స త్వం ప్రియాన్‌ ప్రియరూపాంశ్చ కామాన్‌
అభిధ్యాయన్‌ నచికేతో అతి అస్రాక్షీః
న ఏతాం సృంకాం విత్తమయీం అవాప్తో
యస్యాం మజ్జన్తి బహవో మనుష్యాః ||
ఓ నచికేతా! చాలామంది జనులు ఏ ధన-జన సంపదలు ముఖ్యాశయముగా కలిగి ఉండి వాటిలో మునిగి తేలుతున్నారో, …. అటువంటి ‘‘ప్రియ - అప్రియ రూపంగా కనిపించే కోరికలు’’ ప్రక్కకునెట్టి జ్ఞానాన్ని కోరుకున్నావు. చాలామంచిది.

దూరమేతే విపరీతే విషూచీ
అవిద్యా యా చ విద్యేతి జ్ఞాతా .
విద్యాభీప్సినం నచికేతసం మన్యే
న త్వా కామా బహవోఽలోలుపంత .. 4..
4. దూరమ్‌ ఏతే విపరీతే విషూచీ
అవిద్యాయాం చ విద్యేతి జ్ఞాతా,
విద్యా అభీప్సినం నచికేతసం మన్యే
న త్వా కామా బహవో లోలుపంత ||
ఓ నచికేత బాలకా! ఒకదానికొకటి సంబంధంలేని, దూర ప్రయోజనము (అనగా పరస్పరం వ్యతిరేకమైన ప్రయోజనము) కలిగినట్టి విద్య - అవిద్యలు (Education - Ignorance) ఎటువంటివో నీవు గ్రహించావు. అనేకులు కోరుకొనే ప్రాపంచక సంపదలు కోరుకొనక, ఏది నిన్ను ఉద్ధరిస్తుందో అటువంటి విద్యను కోరుకున్నావు. సంతోషము.

అవిద్యాయామంతరే వర్తమానాః
స్వయం ధీరాః పండితంమన్యమానాః .
దంద్రమ్యమాణాః పరియంతి మూఢా
అంధేనైవ నీయమానా యథాంధాః .. 5..
5. అవిద్యాయాం అంతరే వర్తమానాః
స్వయం ధీరాః పండితం మన్యమానాః
దంద్రమ్యమాణాః పరియన్తి మూఢాః
అంధేన ఏవ నీయమానా యథా అంధాః ||
కొందరైతే లౌకికమైన లోకసంబంధములైన ఆశయములకు పరిమితులై జీవిస్తున్నారు. అజ్ఞానంలో జీవితాలు కొనసాగిస్తూ ‘‘ఈ వర్తమానమే, ఈ ప్రత్యక్షమే మన ఆలంబన. మేము పండితులము. మాకు తెలియదా? మాకన్నీ తెలుసు. ఎప్పుడో జరిగేది ఎవరికి కావాలి? ఇప్పటి సంగతి చూచుకుందాం’’ అని అనుకొంటున్నారు. వారికి ఎదురెదురుగా కనిపిస్తున్నదే గొప్ప విశేషంగాను, దృశ్య విశేషములే పాండిత్యంగాను అనిపిస్తోంది. లోకసంబంధమైన ఆశయములలో పరిమితమౌతూ ఉంటే పారలౌకిక జ్ఞాన సంపద ఎట్లా లభిస్తుంది? గుడ్డివాడిని గుడ్డివాడు నడిపించటం ఎట్టిదో అది అట్టి - లౌకికాశయములు గలవారు సూచించే సూచనలు.

న సాంపరాయః ప్రతిభాతి బాలం
ప్రమాద్యంతం విత్తమోహేన మూఢం .
అయం లోకో నాస్తి పర ఇతి మానీ
పునః పునర్వశమాపద్యతే మే .. 6..
6. న సాంపరాయః ప్రతిభాతి బాలం
ప్రమాద్యంతం విత్త మోహేన మూఢమ్‌
‘‘అయం లోకో, నాస్తి పర’’ ఇతి మానీ
పునః పునః వశమ్‌ ఆపద్యతే మే !
అల్లరియే స్వభావంగా గల పిల్లవానికి ‘‘భవిష్యత్‌ ఏమిటి?’’ అనేది తట్టదు చూచావా? అట్లాగే బాలుడు వంటి ఈ జీవుడు ‘‘దేహానంతరము నా స్థితి ఏమి? గతి ఏమిటి?’’ అనేది యోచించటం లేదు. ఇక్కడి ధన-జన సంపదలకు ఆకర్షితుడై, ఆపై, అజాగరూకుడై జీవిస్తున్నాడు. ‘‘ఇప్పుడిది ఉన్నది. తరువాత ఏమి ఉన్నదో, ఏమి లేదో, ….. ఆలోచించనేవద్దు’’ అని తలచి, చివరికి మరల మరల మృత్యుకోరలలో ప్రవేశిస్తున్నాడు. మరల మరల నన్ను సమీపిస్తూ అనేకసార్లు జనన మరణ చక్రంలో తిరుగాడుచున్నాడు.

శ్రవణాయాపి బహుభిర్యో న లభ్యః
శృణ్వంతోఽపి బహవో యం న విద్యుః .
ఆశ్చర్యో వక్తా కుశలోఽస్య లబ్ధా
ఆశ్చర్యో జ్ఞాతా కుశలానుశిష్టః .. 7..
7. శ్రవణాయాఽపి బహుభిః యో న లభ్యః
శృణ్వంతోఽపి బహవో యం న విద్యుః
ఆశ్చర్యో వక్తా కుశలో అస్య లబ్దాః
ఆశ్చర్యో జ్ఞాతా కుశలా అనుశిష్టః ||
“నేనెవ్వరు? ఈ జీవితం ఏమిటి? ఈ తదనంతరం నా స్థితి ఏమి? గతి ఏమిటి?” …. అనేది వినటానికే చాలా మందికి సందర్భము కుదరటం లేదు. ఒకవేళ ఏదైనా వినినా లేక చెప్పగలిగినా …, అది తెలియబడటమే లేదు. చెప్పేవాడు అత్యంతాశ్చర్యమైన కుశలము కలిగిఉండాలి. వినేవాడు మహదాశ్చర్యమైన అవగాహన చేసుకొనే సామర్థ్యము సిద్ధించుకొని ఉండాలి మరి?

న నరేణావరేణ ప్రోక్త ఏష
సువిజ్ఞేయో బహుధా చింత్యమానః .
అనన్యప్రోక్తే గతిరత్ర నాస్తి
అణీయాన్ హ్యతర్క్యమణుప్రమాణాత్ .. 8..
8. న నరేణ అవరేణ ప్రోక్త ఏష సువిజ్ఞేయో
బహుధా చింత్యమానః
అనన్య ప్రోక్తే గతిః అత్ర నాస్తి |
అణీయాన్‌ హి అతర్క్యమ్‌ అణు ప్రమాణాత్‌ ||
బలహీనుడైనవాడు ఎంతగా చింతనచేసి చెప్పినా అది మనకు సుస్ఫష్టమగు స్వానుభవంగా అర్థం అయ్యేది కాదు. అయితే మనకు మహనీయులగువారు తాము గమనిస్తున్నది చెప్పితే గాని అది తెలిసేదీ కాదు. ఎందుకంటే అది తర్కములకు-వితర్కములకు అతీతమైనది. అణువువలె అతి సూక్ష్మమైనది కూడా!

నైషా తర్కేణ మతిరాపనేయా
ప్రోక్తాన్యేనైవ సుజ్ఞానాయ ప్రేష్ఠ .
యాం త్వమాపః సత్యధృతిర్బతాసి
త్వాదృఙ్నో భూయాన్నచికేతః ప్రష్టా .. 9..
9. న ఏషా తర్కేణ మతిః ఆపనేయా
ప్రోక్తా అన్యేనైవ సుజ్ఞానాయ, ప్రేష్ఠ |
యాం త్వమ్‌ ఆపః ‘‘సత్య ధృతి’’ బత అసి
త్వాదృక్‌ నో భూయాన్‌ నచికేత ప్రష్టా |
బిడ్డా! నచికేతా! నీవలె ఇంత పట్టుదలగా నన్నెవ్వరూ అడుగలేదు. నీవు సత్య వస్తువుపట్ల ఎంతో నిష్ట పట్టుదల కలిగి ఉండటం నాకు ఆశ్చర్యమే! అది కేవలం తర్క - వితర్కాలతో లభించేది కాదు. అనుభవజ్ఞుల నుండి వినకపోతే అది తేలికగా తెలియవచ్చేదీ కాదు.

జానామ్యహం శేవధిరిత్యనిత్యం
న హ్యధ్రువైః ప్రాప్యతే హి ధ్రువం తత్ .
తతో మయా నాచికేతశ్చితోఽగ్నిః
అనిత్యైర్ద్రవ్యైః ప్రాప్తవానస్మి నిత్యం .. 10..
10. జానామి అహమ్‌ శేవధిః అనిత్యం
న హి అధృవైః ప్రాప్యతే హి ధృవం తత్‌
తతో మయాన్‌ నాచికేతః చితో అగ్నిః
అనిత్యైః ద్రవ్యైః ప్రాప్తవానస్మి నిత్యమ్‌ ||
అవును. ఈ ప్రపంచంలో (ధన - దారా - పుత్ర - సేవక - వందిమాగధ - రాజ్యాది) సంపదలన్నీ అనిత్యమైనవి-అని నాకు తెలుసు. అనిత్యమైన వస్తు-విషయాదులు నిత్యానందం సుస్థిరానందం ప్రసాదించగలవా? లేనే లేదు. అయితే, ఈ నాచికేతయజ్ఞము మొదలైన ఆయా అనిత్య వస్తువులతో ఆశయ శుద్ధి బలంచేత నిత్యమైనది సంపాదించుకోవచ్చు. నేనట్లా సంపాదించుకున్నాను.

కామస్యాప్తిం జగతః ప్రతిష్ఠాం
క్రతోరానంత్యమభయస్య పారం .
స్తోమమహదురుగాయం ప్రతిష్ఠాం దృష్ట్వా
ధృత్యా ధీరో నచికేతోఽత్యస్రాక్షీః .. 11..
11. కామ్యాస్య ఆప్తిం జగతః ప్రతిష్ఠాం
క్రతోః ఆనంత్యమ్‌ అభయస్య పారమ్‌
సోమమ్‌ మహత్‌ ఉరుగాయం ప్రతిష్ఠాం(దృష్ట్వా)
ధృత్వా ధీరో నచికేత అత్యస్రాక్షీః ||
ఓ నచికేతా! జగత్తులో లభించగల గొప్పగొప్ప కోరికల పరిపూర్తిని, క్రతువుల అంత్య ఫలములైన స్వర్గాదులను, ఆరాధ్యము - గొప్పవి - ఉన్నతము అని అందరూ అనుకొనే ప్రాపంచక విశేషాలను నీవు ధీరుడవై అధిగమించి, వాటిని ప్రక్కకు పెట్టి జ్ఞానాన్ని అడిగావు. శాశ్వత వస్తువును ఆశ్రయించావు.

తం దుర్దర్శం గూఢమనుప్రవిష్టం
గుహాహితం గహ్వరేష్ఠం పురాణం .
అధ్యాత్మయోగాధిగమేన దేవం
మత్వా ధీరో హర్షశోకౌ జహాతి .. 12..
12. ‘తం’ దుర్దర్శమ్‌| గూఢమ్‌| అనుప్రవిష్టమ్‌|
గుహాహితమ్‌| గహ్వరేష్ఠం| పురాణమ్‌|
అధ్యాత్మయోగాత్‌ అధిగమేనత్‌ ఏవం
మత్వా ధీరో హర్ష శోకౌ జహాతి ||
జన్మ - మృత్యువులకు, సుఖ-దుఃఖములకు, దృశ్య వ్యవహారములకు విషయమేగాని ‘ఆత్మ’ అనబడే ఒకానొక సర్వోత్కృష్ట విషయమున్నది. అట్టి ‘తత్‌ ఆత్మ’ - సులభంగా దర్శించగలిగేది కాదు. సూక్ష్మంగా, రహస్యంగా, అంతర్లీనంగా, అనంతకాలంగా ఈ సమస్తము తానే అయి వేంచేసి యున్నది. ప్రతి ఒక్కరి హృదయ గుహలో దాగి ఉన్నది. ఈ కనబడే శరీరాలన్నిటిలో అంతర్లీనమై ఉన్నది. ‘‘అంతరాత్మ యోగము’’ అనే సాధన ద్వారా దానిని ఎవరు సమీపించి - సాక్షాత్కరించుకుంటారో … అట్టి ధీరులు ఇక్కడి హర్షశోకాలు జయించి వేస్తున్నారు.

ఏతచ్ఛ్రుత్వా సంపరిగృహ్య మర్త్యః
ప్రవృహ్య ధర్మ్యమణుమేతమాప్య .
స మోదతే మోదనీయఀ హి లబ్ధ్వా
వివృతఀ సద్మ నచికేతసం మన్యే .. 13..
13. ఏతత్‌ శృత్వా సంపరిగృహ్య మర్త్యః
ప్రవృహ్య ధర్మ్యమ్‌ అణుమ్‌ ఏతమ్‌ ఆప్య
స మోదతే మోదనీయం హి లబ్ధ్వా
వివృతం సద్మ నచికేతసం మన్యే ||
అట్టి ‘ఆత్మ’ అనబడే స్వస్వరూప ధర్మమును చక్కగా వివేకముతో, సూక్ష్మబుద్ధితో విని, అర్థం చేసుకొని (ఆత్మభావన) పొందినవాడవై ఆనందించటానికి సిద్ధపడుచున్న ఓ నచికేతా! అట్టి ఆత్మానంద గృహం నీకొరకై తన తలుపులు తెరచిందని నాకు అనిపిస్తోంది.

అన్యత్ర ధర్మాదన్యత్రాధర్మా-
దన్యత్రాస్మాత్కృతాకృతాత్ .
అన్యత్ర భూతాచ్చ భవ్యాచ్చ
యత్తత్పశ్యసి తద్వద .. 14..
14. నచికేతౌవాచ :
అన్యత్ర ధర్మాత్‌ - అన్యత్ర అధర్మాత్‌,
అన్యత్ర అస్మాత్‌ కృత - అకృతాత్‌
అన్యత్ర భూతాచ్చ - భవ్యాచ్చ
యత్‌ ‘తత్‌’ పశ్యసి, తత్‌ వద ||
నచికేతుడు : గురుదేవా! ‘‘ఇది ధర్మము - ఇది ధర్మముకాదు’’ అనే వ్యవహారములన్నిటికీ, కృత-అకృతములకు, జరిగేవి - జరగనివి - భూత - భవిష్యత్తులకు - కూడా వేరైనది ఏ ‘తత్‌’ అనబడేది మీరు దర్శిస్తున్నారో, అద్దానిని నాకు బోధించ ప్రార్థన.

సర్వే వేదా యత్పదమామనంతి
తపాగ్ంసి సర్వాణి చ యద్వదంతి .
యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి
తత్తే పదగ్ం సంగ్రహేణ బ్రవీమ్యోమిత్యేతత్ .. 15..
15. శ్రీ యమౌవాచ :
సర్వే వేదా యత్‌పదమ్‌ ఆమనంతి,
తపాంసి సర్వాణి చ యత్‌ వదంతి,
యత్‌ ఇచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి,
తత్‌ తే పదం సంగ్రహేణ బ్రవీమి|
‘ఓం’ ఇత్యేతత్‌ !
యమభగవానుడు : అట్టి తత్‌ పదమగు ‘ఆత్మ’ గురించి ఇక విను. సర్వ వేదములు ఏ స్థానము (లేక) గమ్యమును నొక్కి వక్కాణిస్తున్నాయో, తపోధనులగు మహనీయులంతా ఏ పరమ వస్తువును ప్రకటిస్తున్నారో, ఎద్దానిని స్వానుభవసిద్ధంగా పొందాలని ఆశయంతో కొందరు బ్రహ్మవిద్యాభ్యాసమును (బ్రహ్మచర్యమును) ఆశ్రయిస్తున్నారో … ఆ ‘తత్‌పదము’ గురించి సంగ్రహంగా (సంజ్ఞా పూర్వకంగా) ‘‘ఓం’’ అని (వేద - పురాణ - స్మృతి ఇతిహాస ఇత్యాది) శాస్త్రములచే చెప్పబడింది.

ఏతద్ధ్యేవాక్షరం బ్రహ్మ ఏతద్ధ్యేవాక్షరం పరం .
ఏతద్ధ్యేవాక్షరం జ్ఞాత్వా యో యదిచ్ఛతి తస్య తత్ .. 16..
16. ఏ ‘తత్‌’ హిఏవ అక్షరం బ్రహ్మ|
ఏ ‘తత్‌’ హిఏవ అక్షరం పరమ్‌|
ఏ ‘తత్‌’ హిఏవ అక్షరం జ్ఞాత్వా,
యో యదిచ్ఛతి తస్య తత్‌ ||
ఏదైతే తన ఇచ్ఛ చేతనే ఇదంతా ఇట్లా పొందబడుచున్నదో … అట్టి (’ఓం’కార సంజ్ఞకు అర్థముగా చెన్నొందే) తత్‌ వస్తువు మార్పు - చేర్పులు లేని అక్షర బ్రహ్మము. ఆ అక్షరమే అన్నిటికంటే ముందుగా, అన్నిటికీ వేఱుగా ఉన్నది. అది గ్రహిస్తే అన్నీ గ్రహించినట్లే అవుతుంది. తత్‌ బ్రహ్మమును ఎరుగుటకు ఇష్టపడుచున్న తానే ‘బ్రహ్మము’ అగుచున్నాడు.

ఏతదాలంబనఀ శ్రేష్ఠమేతదాలంబనం పరం .
ఏతదాలంబనం జ్ఞాత్వా బ్రహ్మలోకే మహీయతే .. 17..
17. ఏ’తత్‌’ ఆలంబనం శ్రేష్ఠం|
ఏ ‘తత్‌’ ఆలంబనం పరమ్‌|
ఏ ‘తత్‌’ ఆలంబనం జ్ఞాత్వా,
బ్రహ్మలోకే మహీయతే ||
‘ఓం’ అనే సంజ్ఞకు అర్థమైనట్టి ‘తత్‌’ కేవలాత్మ యొక్క ఆలంబనమే శ్రేష్ఠము. అదియే అన్నిటికంటే మహత్తరము. అద్దానిని గ్రహించినవాడు బ్రహ్మలోకంలో కూడా స్తుతించబడుచున్నాడు.

న జాయతే మ్రియతే వా విపశ్చి-
న్నాయం కుతశ్చిన్న బభూవ కశ్చిత్ .
అజో నిత్యః శాశ్వతోఽయం పురాణో
న హన్యతే హన్యమానే శరీరే .. 18..
18. న జాయతే మ్రియతే వా విపశ్చిత్‌|
న అయమ్‌ కుతశ్చిత్‌ న బభూవ కశ్చిత్‌|
అజో నిత్యః! శాశ్వతో అయం పురాణో!
న హన్యతే| హన్యమానే శరీరే!
(అన్నిటినీ ఏది తనయందు - తనచేతనే కలిగియున్నదో అట్టి) ఆత్మ -పుట్టటం లేదు. చావటం లేదు. ఎక్కడి నుండో ఇక్కడికి రావటం లేదు. ఇక్కడి నుండి ఎక్కడికీ పోవటం లేదు. అది జన్మరహితము - నిత్యము - శాశ్వతము - సనాతనము కూడా! అది మరణించటమే లేదు. ఈ శరీరాలు మాత్రమే మరణిస్తున్నాయి. శరీరికి చావులేదు. (ఈ జీవుని వాస్తవ-సహజ స్వరూపమగు ఆత్మకు చావు అనునదే లేదు. సర్వదా యథాతథము).

హంతా చేన్మన్యతే హంతుం హతశ్చేన్మన్యతే హతం .
ఉభౌ తౌ న విజానీతో నాయఀ హంతి న హన్యతే .. 19..
19. హన్తా చేత్‌ మన్యతే హన్తుమ్‌,
హతః చేత్‌ మన్యతే హతమ్‌,
ఉభే తౌ న విజానీతో |
నా అయం హన్తి| న హన్యతే ||
దేహి వేరు. దేహం వేరు. ఎవ్వరైతే ‘‘నేను చంపుతున్నాను’’ అని అనుకుంటున్నారో, మరెవ్వరైతే ‘‘నేను చస్తున్నాను’’ అని అనుకుంటున్నారో, … ఆ ఇద్దరూ ‘దేహి’ గురించి చెప్పుకోవటం లేదు. దేహి తాను చావదు. మరొక దేహిని చంపదు. (ఆత్మ సర్వదా ఏకము-అఖండము కాబట్టి-చంపుట, చచ్చుట అనే ధర్మమే ఆత్మకు లేదు).

అణోరణీయాన్మహతో మహీయా-
నాత్మాఽస్య జంతోర్నిహితో గుహాయాం .
తమక్రతుః పశ్యతి వీతశోకో
ధాతుప్రసాదాన్మహిమానమాత్మనః .. 20..
20. అణోః అణీయామ్‌| మహతో మహీయాన్‌|
ఆత్మా అస్య జంతోః నిహితో గుహాయామ్‌
తమ్‌ అక్రతుః పశ్యతి వీత శోకో
ధాతుః ప్రసాదాత్‌ మహిమానమ్‌ ఆహాత్మనః ||
ఈ సర్వ జీవుల హృదయంలోనే సర్వదా ఏర్పడి ఉన్న ఆత్మ (దేహి స్వరూపము - తత్‌) అణువు కంటే అతిసూక్ష్మం. పెద్ద వస్తువులన్నిటి కంటే అతిపెద్దది (అత్యంత ఘనీభూతం). ఎవ్వరైతే తమ అంతరంగంలోని బాహ్య ఇంద్రియ సంబంధమైన దృశ్య సంబంధమైన సమస్త వేదనలను రహితం చేసుకొని, లోక విషయాలకు విచారించక, ఇంద్రియములు పవిత్రంగా చేసుకొని ఉంటారో, … అట్టివారు నిర్మలము - పవిత్రము అయినట్టి ఆత్మయొక్క మహిమను అంతరంగంలోనే దర్శిస్తున్నారు.

ఆసీనో దూరం వ్రజతి శయానో యాతి సర్వతః .
కస్తం మదామదం దేవం మదన్యో జ్ఞాతుమర్హతి .. 21..
21. ఆసీనో దూరం వ్రజతి|
శయానో యాతి సర్వతః|
కస్తం (కః తమ్‌) మద - ఆమదం దేవం
మదన్యో జ్ఞాతుమ్‌ అర్హతి?
అది ఉన్నచోటే ఉండి అంతా ఆక్రమించుకొని ఉంటోంది. శయనించి ఉండి అంతా సంచరిస్తోంది. అది ఆనంద స్వరూపమా? ఆనందమునకు కూడా కేవల సాక్షియా? అది ఎవరికి వారే తమకు తామే అనుభవం చేసుకోవలసియున్నది. తనదైన ఆత్మను తానుగాక, మరెవ్వరు తెలుసుకోగలరు?

అశరీరం శరీరేష్వనవస్థేష్వవస్థితం .
మహాంతం విభుమాత్మానం మత్వా ధీరో న శోచతి .. 22..
22. అశరీరం| శరీరేషు అనవస్థే అవస్థితమ్‌|
మహాన్తం, విభుమ్‌, ఆత్మానమ్‌
మత్వాధీరో న శోచతి||
అది శరీరరహితమైనప్పటికీ ఈ అశాశ్వతమగు సర్వ శరీరములలోను, విషయముల లోను ప్రతిబింబిస్తోంది. అట్టి మహత్తరము - సర్వగతము అగు ఆత్మ గురించి తెలుసుకొన్న తరువాత అట్టి బుద్ధి వికసించినట్టి ధీరుడు ఇక దేనికీ శోకించడు.

నాయమాత్మా ప్రవచనేన లభ్యో
న మేధయా న బహునా శ్రుతేన .
యమేవైష వృణుతే తేన లభ్యః
తస్యైష ఆత్మా వివృణుతే తనూగ్ం స్వాం .. 23..
23. న అయమాత్మా ప్రవచనేన లభ్యో
న మేధయా న బహూనా శ్రుతేన
యమ్‌ ఏవ ఏష వృణుతే తేన లభ్యః
తస్య ఏష ఆత్మా వివృణుతే తనూం స్వామ్‌ ||
అట్టి ఆత్మ యొక్క సందర్శనం ప్రవచనములతో లభించేది కాదు. తెలివితేటలతోనో వేదాధ్యయనంతోనో లభించేది కూడా కాదు. ఆ ఆత్మ ఎవరిని వరిస్తుందో వారికి అది లభిస్తుంది. ఎవరికి అఖండాత్మ ప్రియమైనది అవుతుందో, వారు ఆత్మకు ప్రియమగుచున్నారు.

నావిరతో దుశ్చరితాన్నాశాంతో నాసమాహితః .
నాశాంతమానసో వాఽపి ప్రజ్ఞానేనైనమాప్నుయాత్ .. 24..
24. న అవిరతో దుశ్చరితాన్‌
న అశాంతో న అసమాహితః
న అశాంత మనోసోవాఽపి |
ప్రజ్ఞానేన ఏనం ఆప్నుయాత్‌ ||
దుష్ప్రవర్తన నుండి (కోపము-పగ-ద్వేషము-ఆవేశము మొదలైనవి) ఎవరు విరమించరో, అశాంతమగు ప్రవర్తన - తదితరులపట్ల అసమభావన, అశాంతమగు మనస్సు మొదలైనవి ఎవ్వరు కొనసాగిస్తారో, వారు తెలివితేటలు ఉండి కూడా అది (ఆత్మయే-వాహమ్‌ స్థితి-స్థానమును) పొందలేరు.

యస్య బ్రహ్మ చ క్షత్రం చ ఉభే భవత ఓదనః .
మృత్యుర్యస్యోపసేచనం క ఇత్థా వేద యత్ర సః .. 25..
25. యస్య బ్రహ్మ చ - క్షత్రం చ ఉభే భవత ఓదనః
మృత్యుః యస్య ఉప సేచనం, కః ఇత్థాః వేద్ద యత్ర సః ||
ఏ సర్వాంతర్యామియగు ఆత్మకు బ్రహ్మజ్ఞానము - వ్యవహారిక సామర్థ్యము ఆహారము వంటివో, మృత్యువు ఫలహారం (ఉపాహారం-టిఫిన్‌) వంటిదో ‘‘అట్టి ఆత్మ ఇట్టిది’’ అని ఎవరికి తెలుసు? (ఆ తెలుసుకునేదే అదై ఉన్నది కదా!).
(జాగ్రత్‌ స్వప్న సుషుప్తులు అద్దాని ‘ఎరుక’ యొక్క విభవములు)

తృతీయ వల్లీ


ఋతం పిబంతౌ సుకృతస్య లోకే
గుహాం ప్రవిష్టౌ పరమే పరార్ధే .
ఛాయాతపౌ బ్రహ్మవిదో వదంతి
పంచాగ్నయో యే చ త్రిణాచికేతాః .. 1..
1. ఋతం పిబన్తౌ సుకృతస్య, లోకే
గుహాం ప్రవిష్టౌ పరమే పరార్థ్యే
ఛాయా - తపౌ బ్రహ్మవిదో వదంతి|
పంచాగ్నయో యే చ త్రిణాచికేతః ||
అట్టి ఆత్మ - (1) పరము (2) ఇహము అనబడు (పరమాత్మ - జీవాత్మ అనబడు) రెండు విభవములు కలిగియున్నది. 1) పరము - పరార్థము అయి, సర్వహృదయగుహలలో ప్రవేశించి నిశ్చలమైయున్న పరమాత్మ 2) ఈ దృశ్యములో ప్రవేశించి స్వయం కృతములగు ఫలములను అనుభవించే జీవాత్మ. ఇవి రెండూ కేవలాత్మ యొక్క ‘‘వెలుగు - అద్దానియందలి నీడ వంటివి’’ అని యోగయజ్ఞవిదులు చెప్పుచున్నారు. మొదటిది వెలుగు - సహజము - స్వస్వరూపము. రెండవది నీడ - ఆరోపితము (వేషము) వంటిది. సందర్భమాత్రము.

యః సేతురీజానానామక్షరం బ్రహ్మ యత్ పరం .
అభయం తితీర్షతాం పారం నాచికేతగ్ం శకేమహి .. 2..
ఆత్మానఀ రథితం విద్ధి శరీరం రథమేవ తు .
బుద్ధిం తు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవ చ .. 3..
ఇంద్రియాణి హయానాహుర్విషయాఀ స్తేషు గోచరాన్ .
ఆత్మేంద్రియమనోయుక్తం భోక్తేత్యాహుర్మనీషిణః .. 4..
2. యః సేతుః ఈ జనానామ్‌, అక్షరమ్‌ యత్‌ పరమ్‌,
అభయం తితీర్షతాం పారం నాచికేతగ్ం శకేమహి ||

3. ఆత్మానం రథినమ్‌ విద్ధి| శరీరం రథమ్‌ ఏవతు|
బుద్ధింతు సారథిం విద్ధి| మనః ప్రగ్రహమ్‌ ఏవ చ ||

4. ఇంద్రియాణి హయాన్‌ ఆహు
విషయాన్‌ తేషు గోచరాన్‌
ఆత్మా ఇంద్రియ - మనోయుక్తం
భోక్తా-ఇతి ఆహుః మణీషిణః ||
ఏ యాగకర్త ‘‘యజ్ఞాది ఆయా సుకర్మలన్నీ కూడా’’ - అభయము ఆవలి వడ్డు అగు ఆత్మానుభూతికి సేతువువంటిది’’ అని గ్రహిస్తాడో అట్టి నాచికేతాది యజ్ఞాదులు సాఫల్యములు అగుచున్నాయి - అని మేము గ్రహించి ఉన్నాము.

‘‘జీవాత్మ ఇట్టిది?’’ … అని గ్రహించటానికి ఒక ఉపమానం చెపుతాను. విను. జీవాత్మ రథమును అధిరోహించిన రథికుడు. ఈ శరీరము రథము. బుద్ధియే ఈ రథమునకు సారథి. మనస్సు కళ్ళాలు. ఇంద్రియాలు ఈ రథానికి అమర్చబడిన గుఱ్ఱాలు. శబ్ద - స్పర్శ - రూప - రస - గంధాలు ఈ ఇంద్రియములనే గుఱ్ఱాలకు దారికి ప్రక్కగా గల పచ్చగడ్డి పరకలు. దేహాత్మ (జీవాత్మ) ఇంద్రియ మనస్సులతో కూడినదై ఈ ఇంద్రియ విషయములకు భోక్త (Experiencer)గా ఇదంతా కొనసాగిస్తోంది.


యస్త్వవిజ్ఞానవాన్భవత్యయుక్తేన మనసా సదా .
తస్యేంద్రియాణ్యవశ్యాని దుష్టాశ్వా ఇవ సారథేః .. 5..
5. యస్తు అవిజ్ఞానవాన్‌ భవతి
అయుక్తేన మనసా సదా,
తస్య ఇంద్రియాణి అవశ్యాని
దుష్ట అశ్వా ఇవ సారథేః ||
ఏ ‘జీవాత్మ’ అనబడే రథికుని బుద్ధి అయుక్తమై (దృశ్య వ్యవహార ధ్యాసావేశ పరంపరలు కలిగినదై), ఆతని మనస్సు ప్రాపంచక విషయముల వైపుగా ఎక్కుబెట్టబడి ఉంటుందో, … ఆ రథికుని (జీవుని) గుఱ్ఱాలు - సారథి (ఇంద్రియాలు-బుద్ధి) దుష్ట గుఱ్ఱములవలె దృశ్య వ్యవహారముల వైపుగా రథికుని ప్రయాణింపచేస్తున్నాయి.

యస్తు విజ్ఞానవాన్భవతి యుక్తేన మనసా సదా .
తస్యేంద్రియాణి వశ్యాని సదశ్వా ఇవ సారథేః .. 6..
6. యస్తు విజ్ఞానవాన్‌ భవతి యుక్తేన మనసా సదా,
తస్య ఇంద్రియాణి వశ్యాని, సథ్వా ఇవ సారథేః |
రథికుని (జీవాత్మ యొక్క) సారథి (బుద్ధి) విజ్ఞానముతో కూడుకొని (తెలివి కలిగినదై), కళ్ళెము (మనస్సు) సన్మార్గంలో నియమించబడుతూ ఉంటాయో, అట్టి రథికుని (జీవుని) గుఱ్ఱాలు (ఇంద్రియాలు) వశంలో ఉన్నవై ఉంటాయి. మంచి సారథి యొక్క మాట విని ఆ జీవాత్మ ప్రయాణం సరిఅయిన మార్గంలో కొనసాగింపజేస్తాయి. (ఈ ఇంద్రియాలే మంచికి - చెడుకు కూడా ఉపయోగిస్తాయి. ఈ బుద్ధియే ఆత్మానందము వైపుగా గానీ, ఇటు దృశ్యపరంపరల (నిబద్ధత) వైపుగానీ జీవుని నడిపించగలదు).

యస్త్వవిజ్ఞానవాన్భవత్యమనస్కః సదాఽశుచిః .
న స తత్పదమాప్నోతి సంసారం చాధిగచ్ఛతి .. 7..
7. యస్తు అవిజ్ఞానవాన్‌ భవతి, అమనస్కః సదా అశుచిః,
న స ‘‘తత్‌ పదమ్‌’’ ఆప్నోతి| సంసారం చ అధిగచ్ఛతి ||
ఎవ్వరిబుద్ధి అవిజ్ఞానంగా (వెళ్ళవలసిన లక్ష్యము గురించి ఎఱుగనిదై), మనస్సు అశుచిగా ఉంటుందో, (అజ్ఞానబుద్ధి - దోషపూరితమైన మనస్సుగల) ’‘తత్‌ పదము’’ను చేరక ఈ సంసారంలోనే పచార్లు చేస్తూ ఉండి పోతున్నాడ

యస్తు విజ్ఞానవాన్భవతి సమనస్కః సదా శుచిః .
స తు తత్పదమాప్నోతి యస్మాద్భూయో న జాయతే .. 8..
8. యస్తు విజ్ఞానవాన్‌ భవతి
స మనస్కః సదా శుచిః,
స తు ‘‘తత్‌ పదమ్‌’’ ఆప్నోతి-
యస్మాత్‌ భూయో న జాయతే ||
ఎవ్వడైతే విజ్ఞానవంతుడై, ఆతని మనస్సు ఎల్లప్పుడూ, శుచి (నిర్మలం)గా ఉంటుందో … అట్టివాడు అచంచలమగు తత్‌పదము పొందగలడు. మార్పు-చేర్పులను అధిగమించినట్టి (అమృత) స్థితి సిద్ధించుకోగలడు.

విజ్ఞానసారథిర్యస్తు మనః ప్రగ్రహవాన్నరః .
సోఽధ్వనః పారమాప్నోతి తద్విష్ణోః పరమం పదం .. 9..
9. విజ్ఞాన సారథిః యస్తు, మనః ప్రగ్రహవాన్‌ నరః,
సో అధ్వనః పారమ్‌ ఆప్నోతి
తత్‌ విష్ణోః పరమమ్‌ పదమ్‌ ||
సారథి (బుద్ధి) విజ్ఞాని అయి, కళ్ళెమువలె మనస్సు అదుపులో ఉంటుందో, … అట్టివాడు ఈ సంసారమునకు ఆవలిగట్టు అయినట్టి విష్ణు పదము చేరుచున్నాడు.

ఇంద్రియేభ్యః పరా హ్యర్థా అర్థేభ్యశ్చ పరం మనః .
మనసస్తు పరా బుద్ధిర్బుద్ధేరాత్మా మహాన్పరః .. 10..
10. ఇంద్రియేభ్యః పరా హి అర్థాః|
అర్ధేభ్యశ్చ పరం మనః|
మనసస్తు పరా బుద్ధిః|
బుద్ధేః ‘‘ఆత్మా మహాన్‌’’ పరః
ఓ నచికేతా! మరల క్రోడీకరించి చెప్పుచున్నాను. ఈ జీవుని కళ్ళు - చెవులు - నాలుక మొదలైన ఇంద్రియాలకంటే ‘‘చూపు - వినికిడి - రుచి’’ మొదలైన ఇంద్రియార్ధాలు ఉన్నతమైనవి. ఇంద్రియార్ధాలకంటే మనస్సు ఇంకా గొప్పది. మనస్సుకంటే బుద్ధి మరింకా గొప్పది. బుద్ధికంటే జీవాత్మ మరింకెంతో గొప్పది.

మహతః పరమవ్యక్తమవ్యక్తాత్పురుషః పరః .
పురుషాన్న పరం కించిత్సా కాష్ఠా సా పరా గతిః .. 11..
11. మహతః పరమమ్‌ అవ్యక్తం| అవ్యక్తాత్‌ పురుషః పరః|
పురుషాత్‌ న పరం కించిత్‌| సా కాష్ఠా | సా పరా గతిః |
జీవాత్మకంటే అవ్యక్తం ఇంకా గొప్పది. ఆ అవ్యక్తం కంటే పురుషుడు గొప్పవాడు. అది (జీవుని రూపక్రమంలో) చిట్టచివరిది. అది అంతిమ (పరమ) స్థానం.

ఏష సర్వేషు భూతేషు గూఢోఽఽత్మా న ప్రకాశతే .
దృశ్యతే త్వగ్ర్యయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభిః .. 12..
12. ఏష సర్వేషు భూతేషు, గూఢో ఆత్మా న ప్రకాశతే|
దృశ్యతే తు అగ్య్రయా బుద్ధ్యా
సూక్ష్మయా సూక్ష్మ దర్శిభిః ||
అట్టి ‘పురుషుడు’ అను పరమాత్మ సర్వజీవుల దేహాలలో రహస్యంగా దాగి ఉండి కూడా అనేకులకు తెలియరావటం లేదు. స్ఫురించటం లేదు. అయితే సూక్ష్మమైన, సుతీక్షణమైన, విస్తారమైన బుద్ధికి మాత్రమే అది ప్రదర్శితమౌతోంది.

యచ్ఛేద్వాఙ్మనసీ ప్రాజ్ఞస్తద్యచ్ఛేజ్జ్ఞాన ఆత్మని .
జ్ఞానమాత్మని మహతి నియచ్ఛేత్తద్యచ్ఛేచ్ఛాంత ఆత్మని .. 13..
13. యచ్ఛేత్‌ వాక్‌ మనసీ ప్రాజ్ఞః|
తత్‌ యచ్ఛేత్‌ జ్ఞానే ఆత్మని|
జ్ఞానమ్‌ ఆత్మని మహతి నియచ్ఛేత్‌
తత్‌ యచ్ఛేత్‌ శాంత ఆత్మని ||
ఓ నచికేతా! జీవితాన్ని సద్వినియోగపరచుకోవాలి సుమా! ఎట్లా? ఈ ఇంద్రియార్ధాలను మనోరూపంగా గమనించి మనస్సులో లయంచేయాలి. మరి మనస్సునో … ‘జ్ఞానాత్మ’ (బుద్ధి)లో లయం చేయాలి. జ్ఞానాత్మను (బుద్ధిని) జీవాత్మలోను, జీవాత్మను సర్వాత్మకమగు ’శాంతాత్మ’లోను లయం చేయాలి.

ఉత్తిష్ఠత జాగ్రత
ప్రాప్య వరాన్నిబోధత .
క్షురస్య ధారా నిశితా దురత్యయా
దుర్గం పథస్తత్కవయో వదంతి .. 14..
14. ఉత్తిష్ఠత| జాగ్రత|
ప్రాప్యవరాన్‌ నిబోధత|
కక్షురస్య ధారా నిశితా దురత్యయా
దుర్గం పథః తత్‌ …. కవయో వదంతి ||
కనుక ఓ నచికేతా! ఈ ‘జీవితము’ అనే అవకాశమును సద్వినియోగ పరచుకోవాలయ్యా! ‘‘సర్వాత్మకమగు పరమాత్మయే నా సహజమగు వాస్తవ అనునిత్య రూపం’’ అని గ్రహించే ప్రయత్నం ప్రారంభించు. లేఁ! ఉత్తిష్ఠ ప్రమత్తత నుండి బయల్వెడులు! జాగరూకుడవుకా! అది పొందినవారిని ఆశ్రయించి, వారి బోధ గ్రహించు. ‘‘అట్టి ఆత్మ సాక్షాత్కారమునకు మార్గము కత్తిమీద సామువంటిదే. అత్యంత శ్రద్ధ, అధ్యయనము, అభ్యాసము అత్యవసరం’’ అని తత్త్వజ్ఞులు గుర్తు చేస్తున్నారు.

అశబ్దమస్పర్శమరూపమవ్యయం
తథాఽరసం నిత్యమగంధవచ్చ యత్ .
అనాద్యనంతం మహతః పరం ధ్రువం
నిచాయ్య తన్మృత్యుముఖాత్ ప్రముచ్యతే .. 15..
15. అశబ్దమ్‌| అస్పర్శమ్‌| అరూమ్‌| అవ్యయమ్‌|
తథా అరసమ్‌ నిత్యమ్‌ అగంధవత్‌ చ యత్‌
అనాద్యంతం ! మహతః పరమ్‌ ధ్రువమ్‌ |
నిచాయ్య తం మృత్యుముఖాత్‌ ప్రముచ్యతే ||
ఆత్మ శబ్ద - స్పర్శ - రూప - రస - గంధములకు అవిషయమై, జీవాత్మ విభాగరహితమై, అవ్యయమైనది. సర్వదా యథాతథమైయున్నది. అద్దానిని సాక్షాత్కరించుకున్నవాడు ‘మృత్యువు’ యొక్క పరిధి నుండి అధిగమిస్తున్నాడు

నాచికేతముపాఖ్యానం మృత్యుప్రోక్తఀ సనాతనం .
ఉక్త్వా శ్రుత్వా చ మేధావీ బ్రహ్మలోకే మహీయతే .. 16..
16. నాచికేతం ఉపాఖ్యానం మృత్యు ప్రోక్తం సనాతనమ్‌
ఉక్త్వా శ్రుత్వా చ మేధావీ బ్రహ్మలోకే మహీయతే ||
మృత్యుదేవతయగు యమధర్మరాజుచే నాచికేతునికి బోధించబడిన ఈ ఉపాఖ్యానం (విజ్ఞుల ప్రవచన రూపంగా) బోధించబడగా విని గ్రహించిన మేధావి బ్రహ్మలోకంలో స్తుతించబడుచున్నాడు.

య ఇమం పరమం గుహ్యం శ్రావయేద్ బ్రహ్మసంసది .
ప్రయతః శ్రాద్ధకాలే వా తదానంత్యాయ కల్పతే .
తదానంత్యాయ కల్పత ఇతి .. 17..
17. య ఇమం పరమమ్‌ గుహ్యమ్‌
శ్రావ్య(వ)యేత్‌ బ్రహ్మసంసది
ప్రయతః శ్రాద్ధకాలే వా
తదా అనంత్యాయ కల్పతే
తదా అనంత్యాయ కల్పత ఇతి ||
(ఇంద్రియముల లభ్య విషయాలను మనస్సు నందు, మనస్సును జ్ఞానాత్మ (జీవాత్మ) యందు, జ్ఞానాత్మను శాంతాత్మ (పరమాత్మ) యందు లయింపచేయటం అనే సంవిధానము) పరమగుహ్యమైన శాస్త్రీయ విశేషం. బ్రహ్మ జ్ఞానుల సభలోను, శ్రాద్ధ కాలంలోను (ఎవరైనా మరణించిన సందర్భాలలో) ఇది గానం చేసేవారికి (ప్రవచనము చెప్పువారికి, వినేవారికి) అనిర్వచనీయము - అనిర్దేశ్యము అయిన ప్రయోజనం లభించగలదు. ఇది శాస్త్ర వాక్య నిర్ణయం.

ద్వితీయాధ్యాయం

చతుర్థ వల్లీ


పరాంచి ఖాని వ్యతృణత్ స్వయంభూ-
స్తస్మాత్పరాఙ్పశ్యతి నాంతరాత్మన్ .
కశ్చిద్ధీరః ప్రత్యగాత్మానమైక్ష-
దావృత్తచక్షురమృతత్వమిచ్ఛన్ .. 1..
1. యమౌవాచ :
పరాంచి ఖాని వ్యతృణత్‌ స్వయంభూః|
తస్మాత్‌ పరాక్‌ పశ్యతి | న అంతరాత్మన్‌ |
కశ్చిత్‌ ధీరః ప్రత్యగాత్మానమ్‌ ఐక్షత్‌
ఆవృత్త చకక్షుః అమృతత్త్వమ్‌ ఇచ్ఛన్‌ ||
ఓ నచికేతా! మరి అనేకమంది జీవులు ఇట్టి ఆశయం కలిగి ఉండక కేవలం ఇంద్రియ విషయములనే ఆశ్రయిస్తున్నారెందుకంటావా? స్వయంభువు అగు బ్రహ్మదేవుడు ఈ దేహములను సంకల్పిస్తున్నప్పుడు ‘‘ఇంద్రియములు బయటకు చూపు వినికిడి మొదలైన బాహ్య ప్రసరణములు / అనువర్తనములు కలిగివుండుగాక!’’ … అని భావించారు. అందుచేత ఈ ఇంద్రియాలు బహిర్గతంగా వ్యవహరిస్తున్నాయి. అయితే ఉత్తమ ధీశక్తి (బుద్ధి) గల జీవుడు వాటి ప్రసరణను అంతరంగా నియమించి అమృతత్వమును పొందుచున్నాడు. మృతత్వ పరిథులను అధిగమించి మార్పు చెందని ఆత్మభావన సిద్ధించుకొనుచున్నాడు.

పరాచః కామాననుయంతి బాలా-
స్తే మృత్యోర్యంతి వితతస్య పాశం .
అథ ధీరా అమృతత్వం విదిత్వా
ధ్రువమధ్రువేష్విహ న ప్రార్థయంతే .. 2..
2. పరాచః కామాన్‌ అనుయంతి బాలాః
తే మృత్యోః యంతి వితతస్య పాశమ్‌|
అథ ధీరా అమృతత్త్వం విదిత్వా,
ధృవమ్‌ - అధృవేషు, ఇహ న ప్రార్థయంతే ||
(పిల్లలు చదువుకొమ్మంటుంటే ఆటలు - ఆట వస్తువులు కోరుకుంటారు చూచావా? అట్లా) బాలురవంటి ఈ జీవులు బాహ్య వస్తువులనే కోరుకుంటున్నారు. ఫలితంగా మృత్యు పాశములకు బద్ధులౌతున్నారు. అయితే ఉత్తమబుద్ధిగల ఒకానొకడు మాత్రం శాశ్వత - అశాశ్వతములేమిటో గ్రహంచి అమృతత్వమునే కోరుకుంటున్నాడు. ఈ ఇహలోక దృశ్య విశేషాలు కోరుకోవటం లేదు.

యేన రూపం రసం గంధం శబ్దాన్ స్పర్శాꣳశ్చ మైథునాన్ .
ఏతేనైవ విజానాతి కిమత్ర పరిశిష్యతే . ఏతద్వై తత్ .. 3..
3. యేన రూపం - రసం - గంధం
శబ్దాన్‌ - స్పర్శాంశ్చ - మైథునామ్‌
ఏతేనైవ విజానాతి, కిమ్‌ అత్ర పరిశిష్యతే? ఏ తద్వై తత్‌
ఈ రూప - రస - గంధ - శబ్ద - స్పర్శ - స్త్రీ పురుష సమాగమాలు వంటివన్నీ దేనిచే (దేనికి) తెలియవస్తున్నాయో … అట్టి తెలుసుకుంటున్నదానిని తెలుసుకొన్న తరువాత ఇక ఇక్కడ తెలుసుకోవలసింది ఏమున్నది? ఆ తత్‌ అను పరమాత్మ జీవునియందు ‘తెలుసుకుంటున్నవాడు’ (The knower prior to knowing) అను రూపంగా ఉంటున్నాడు. అట్టి ఆత్మతత్త్వము గురించి వివరణయే నీ ప్రశ్నకు సమాధానము.

స్వప్నాంతం జాగరితాంతం చోభౌ యేనానుపశ్యతి .
మహాంతం విభుమాత్మానం మత్వా ధీరో న శోచతి .. 4..
4. స్వప్నాంతం జాగరితాంతం చ ఉభే యేన అనుపస్యతి
మహాంతమ్‌ విభుమ్‌ ఆత్మానం, మత్వా ధీరో న శోచతి ||
జాగ్రత్‌లో ఈ జాగ్రత్‌ జగత్తు కనిపిస్తోంది. స్వప్నంలో స్వప్న జగత్తు తెలియవస్తోంది. ఏది స్వప్న-జాగ్రత్తులకు ఆవల ద్రష్ట అయి, ద్రష్టగా విస్తరించి ఉన్నదో, దేనిచేత ఈ జాగ్రత్‌ - స్వప్న జగత్తులు తెలియవస్తున్నాయో, అట్టి ఆత్మ మహత్తరము, సర్వమునకు ప్రభువు అయివున్నది. అట్టి ఆత్మను ఎఱిగిన ధీరుడు ఇక దేనికీ శోకించడు.

య ఇమం మధ్వదం వేద ఆత్మానం జీవమంతికాత్ .
ఈశానం భూతభవ్యస్య న తతో విజుగుప్సతే . ఏతద్వై తత్ .. 5..
5. య ఇమం మధ్వదం వేద
ఆత్మానమ్‌ జీవమ్‌ - అంతికాత్‌
ఈశానం భూత - భవ్యస్య
న తతో విజుగుప్సతే ఏతద్వై ‘‘తత్‌’’ !
కర్మ ఫలములను అనుభవిస్తూ కనిపించే ఈ జీవాత్మ, ఎందులో ‘‘ఈ దృశ్య - దృశ్యాంతర్గత వ్యవహారమంతా అనుభూతమగుచున్నదో - అట్టి మాధుర్యపరచు మధ్వనము (మధు-వనము), కాలత్రయముగా విస్తరించియున్న ఈశ్వరుడు- ఈ సమస్తము ఆత్మయే’’…. అని ఎవ్వరు ఎఱుగుచున్నాడో, అట్టివాడు సర్వ మనో క్లేశములను అధిగమిస్తున్నాడు. భూత-భవిష్యత్‌ నియామకుడే (పరమాత్మయే) తానుగా తానై గమనిస్తున్నాడు.

యః పూర్వం తపసో జాతమద్భ్యః పూర్వమజాయత .
గుహాం ప్రవిశ్య తిష్ఠంతం యో భూతేభిర్వ్యపశ్యత . ఏతద్వై తత్ .. 6..
6. యః పూర్వం తపసో జాతమ్‌,
అద్భ్యః పూర్వమ్‌ అజాయత|
గుహాం ప్రవిశ్య తిష్ఠంతం యో భూతేభిః
యః వ్యపశ్యత, ఏతద్వై ‘తత్‌’ ||
ఏదైతే పూర్వము తపః ఫలంగా లభిస్తూ పూర్వానికి పూర్వమై ఉండి, సర్వ హృదయములలో ప్రవేశించి ఉండి, పంచభూతములతో కూడి ఉన్నట్లుగా పంచభూతాత్మికమై కనిపిస్తున్నదో, అట్టి ఆత్మను సాక్షాత్కరించుకొని, అట్టి ఆత్మయే తన స్వరూపంగా గ్రహిస్తున్నాడు. తన ఆత్మయే ఆ పరమాత్మ! పరమాత్మయే ఈ జీవాత్మ.

యా ప్రాణేన సంభవత్యదితిర్దేవతామయీ .
గుహాం ప్రవిశ్య తిష్ఠంతీం యా భూతేభిర్వ్యజాయత . ఏతద్వై తత్ .. 7..
7. యా ప్రాణేన సంభవతి అదితిః దేవతామయీ ….,
గుహాం ప్రవిశ్య తిష్ఠంతీం
యా భూతేభిః వ్యజాయత| ఏతద్వై తత్‌ |
ఏదైతే పంచ ప్రాణముల రూపంగా సర్వదేహాలలోను సంభవిస్తోందో, దిగిరాకుండానే సర్వదేవతలకు స్వస్వరూపంగా ఏర్పడి ఉన్నదో, సర్వజీవుల హృదయగుహలలో ప్రవేశించి సర్వదా ప్రకాశిస్తోందో, ఏదైతే అనేక - అసంఖ్యాక జీవులుగా అయినట్లు అనిపిస్తోందో, … అదియే పరమాత్మ.

అరణ్యోర్నిహితో జాతవేదా గర్భ ఇవ సుభృతో గర్భిణీభిః .
దివే దివే ఈడ్యో జాగృవద్భిర్హవిష్మద్భిర్మనుష్యేభిరగ్నిః . ఏతద్వై తత్ .. 8..
8. అరణ్యోః నిహితో జాతవేదా
గర్భ ఇవ సుభృతో గర్భిణీభిః
దివే దివే ఈడ్యో జాగృవద్భిః
హవిష్మద్భిః మనుష్యేభిః అగ్నిః ! ఏతద్వై తత్‌ !
అరుణిలో (కట్టెలో) దాగివున్న అగ్నిలాగా గర్భిణీ స్త్రీచే పరిపోషించబడే గర్భస్థ శిశువులాగా, దిన-దినము ప్రబోధితమగుచున్న ‘జాగ్రత్‌’లాగా, హోమాగ్నిలో మనుష్యులచే సమర్పించబడే హవిష్షులాగా, ఏదైతే అంతటా - మౌనంగా, కారణ కారణంగా, అకారణంగా - అన్నిటా ఏర్పడినదై ఉన్నదో అదియే ఆ’తత్‌’ అనే ‘శాంతాత్మ’.

యతశ్చోదేతి సూర్యోఽస్తం యత్ర చ గచ్ఛతి .
తం దేవాః సర్వేఽర్పితాస్తదు నాత్యేతి కశ్చన . ఏతద్వై తత్ .. 9..
9. యతశ్చ ఉదేతి సూర్యో, అస్తం యత్ర చ గచ్ఛతి,
తం దేవాః సర్వే అర్పితా తత్‌ ఉ నా-త్యేతి కశ్చన ||
ఏతత్‌ వై తత్‌||
ఎద్దానినుండైతే సూర్యుడు ఉదయిస్తూ తిరిగి ఎద్దానియందు అస్తమిస్తున్నాడో … ఎద్దానియందు సర్వదేవతలు అలంకారరూపులై ఆభరణములుగా అమర్చబడినవారై ఉన్నారో అట్టి ’ఆత్మ’ను అతిక్రమించి మరింకేమీ లేదు. ఉండజాలదు.

యదేవేహ తదముత్ర యదముత్ర తదన్విహ .
మృత్యోః స మృత్యుమాప్నోతి య ఇహ నానేవ పశ్యతి .. 10..
10. యత్‌ ఏవ ఇహ …. తత్‌ అముత్ర|
యత్‌ అముత్ర … తత్‌ అను ఇహ |
మృత్యో స మృత్యుః ఆప్నోతి
య ఇహ నానేవ పశ్యతి ||
ఇక మృత్యువు గురించి విను. ఇక్కడ ఏమున్నదో, మృత్యు తదనంతరం కూడా అక్కడ అదే ఉన్నది. అక్కడ ఏమున్నదో, …. ఇక్కడ అదే ఉన్నది. ఆత్మయే మృత్యువుకు ఈవల-ఆవల ఏక స్వరూపమై ఏర్పడి ఉన్నది. ఎక్కడా కూడా అనేక మనునదే లేదు. ఎవ్వరైతే ఇక్కడ నానాత్వం దర్శిస్తారో, వారు ఒక మృత్యువు నుండి (స్థితి-గతి నుండి) ఇంకొక మృత్యువుకు ప్రయాణాలు కొనసాగిస్తూనే ఉంటారు. (ఏకత్వం దర్శించేవారి దృష్టికి మృత్యువు లేదు.

మనసైవేదమాప్తవ్యం నేహ నానాఽస్తి కించన .
మృత్యోః స మృత్యుం గచ్ఛతి య ఇహ నానేవ పశ్యతి .. 11..
11. మనసా ఏవ ఇదమ్‌ ఆప్తవ్యమ్‌, న ఇహ(నేహ) నానాఽస్తి కించన
మృత్యోః స మృత్యుం గచ్ఛతి, య ఇహ నానా ఇవ పశ్యతి ||
ఇక్కడ ఉన్నదంతా ఏకమగు ‘శాంతాత్మ’ యొక్క విన్యాసము. వాస్తవానికి ఇక్కడ నానాత్వమనేది కించిత్‌ కూడా లేదు. అయితే ఇక్కడ మనస్సే ఇదంతా భిన్న భిన్నంగా పొందటం జరుగుతోంది. ఇక్కడ ఎంతవరకు ఎవ్వరికి నానాత్వం కనిపిస్తోందో వారు ఒక మృత్యువు నుండి మరొక మృత్యువుకు ప్రయాణిస్తూనే ఉండవలసి వస్తోంది. అమృతమగు ఆత్మ స్వానుభవమగుట లేదు.

అంగుష్ఠమాత్రః పురుషో మధ్య ఆత్మని తిష్ఠతి .
ఈశానం భూతభవ్యస్య న తతో విజుగుప్సతే . ఏతద్వై తత్ .. 12..
అంగుష్ఠమాత్రః పురుషో జ్యోతిరివాధూమకః .
ఈశానో భూతభవ్యస్య స ఏవాద్య స ఉ శ్వః . ఏతద్వై తత్ .. 13..
12. అంగుష్ఠ మాత్రః పురుషో మధ్య ఆత్మని తిష్ఠతి
ఈశానో భూత-భవ్యస్య, న తతో విజుగుప్సతి-ఏతద్వైతత్‌||

13. అంగుష్ఠమాత్రః పురుషో జ్యోతిః ఇవ అధూమకః
ఈశానో భూత భవ్యస్య | స యేవ ఆద్య | స ఉ శ్వః |
ఏతత్‌ వై తత్‌||
బొటనవ్రేలు ప్రమాణం (నిలువుగా నిలిపిన బొటనవ్రేలు ‘తత్‌’కు చిహ్నం) గల ’‘ఆత్మ పురుషుడు’’ కాలత్రయ నియామకుడై (భూత-వర్తమాన-భవిష్యత్తులందు యథాతథమై), సర్వుల హృదయాకాశంలో మధ్యగా తిష్ఠితుడై ఉన్నారు. ఆయన పొగలేని జ్యోతి (అగ్ని) వలె వెలుగొందుచూ సర్వుల దేహాలలో సర్వదా వేంచేసి ఉన్నారు. వారి దర్శనమే ఏకత్వ దర్శనం. వారే ప్రతి జీవుని నిన్నటి - నేటి - రేపటి నిజస్వరూపం. అట్టి కేవల ఆత్మజ్యోతి స్వరూపమే ఇదంతా.

యథోదకం దుర్గే వృష్టం పర్వతేషు విధావతి .
ఏవం ధర్మాన్ పృథక్ పశ్యంస్తానేవానువిధావతి .. 14..
యథోదకం శుద్ధే శుద్ధమాసిక్తం తాదృగేవ భవతి .
ఏవం మునేర్విజానత ఆత్మా భవతి గౌతమ .. 15..
14. యథా ఉదకం దుర్గే వృష్టం
పర్వతేషు విధావతి,
ఏవమ్‌ ధర్మాన్‌ పృథ్వ పశ్యన్‌
తానేవ అను విధావతి||

15. యథా ఉదకం శుద్ధే శుద్ధం ఆసిక్తం తాదృగేవ భవతి,
ఏవం మునే విజానతా ఆత్మా భవతి ! గౌతమా !
ఎత్తైన కొండపై పడ్డ వర్షపునీరు పల్లముజేరునట్లు, భేదదృష్టి గల జీవుడు అనేక ఉపాధులలోకి నిమ్నగతుడు అగుచున్నాడు. శుద్ధమైన ఉదకం శుద్ధమైన ఉదకంలో పోయపడినప్పుడు శుద్ధమైన ఉదకంగానే అయిపోతుంది చూచావా? రెండూ గుర్తు పట్టనంతగా కలిసిపోతాయి కదా! మలినము (అజ్ఞానము)తో కూడిన ఆత్మ ‘జీవుడు’ అని చెప్పబడుతోంది. అజ్ఞానం తొలగిన మరుక్షణం ఈ జీవుడే పరమాత్మ. దృష్టి ఆత్మజ్ఞానమయమైన మరుక్షణం జీవుడు - బ్రహ్మము అను రెండు వేరుగా ఉండవు. ఏకము, అఖండము అగు ఆత్మయే సర్వదా స్వానుభవమౌతుంది.

పంచమ వల్లీ


పురమేకాదశద్వారమజస్యావక్రచేతసః .
అనుష్ఠాయ న శోచతి విముక్తశ్చ విముచ్యతే . ఏతద్వై తత్ .. 1..
1. పురమ్‌ ఏకాదశ ద్వారమ్‌ అజస్య అవక్ర చేతసః
అనుష్ఠాయ న శోచతి, విముక్తశ్చ విముచ్యతే|
ఏతత్‌ వై తత్‌||
ఏ జన్మ రహితమగు ‘తత్‌’ - (శాంతాత్మ) 11 ద్వారములు గల ఈ దేహము అనే పురంలో ప్రకాశిస్తున్నారో, …. అట్టి ఆత్మ తత్త్వము (సర్వాత్మ)ను ఎవరు అచంచలమైన - అకుంఠితమైన బుద్ధితో ఉపాసిస్తున్నారో అట్టివారికి దుఃఖ విషయమే ఉండదు. అంతేకాదు. అజ్ఞాన బంధం తొలగి జన్మమృత్యువుల నుండి విముక్తుడగుచున్నారు.

హఀసః శుచిషద్వసురంతరిక్షసద్-
హోతా వేదిషదతిథిర్దురోణసత్ .
నృషద్వరసదృతసద్వ్యోమసద్
అబ్జా గోజా ఋతజా అద్రిజా ఋతం బృహత్ .. 2..
2. హగ్ంసః (హంసః) శుచిషత్‌| వసుః అంతరిక్షసత్‌|
హోతా వేదిసత్‌| అతిధిః దురోణసత్‌|
నృషత్‌| వరసత్‌| ఋతసత్‌| వ్యోమసత్‌|
అబ్జా, గోజా, ఋతజా, అద్రిజా, ఋతమ్‌ బృహత్‌ ||
ఒకే సూర్యుడు అనేక ప్రదేశాలలో ప్రకాశిస్తున్నట్లు, ఆత్మ భగవానుడు అనేక దేహాలలో అనేక జీవన ప్రకాశములను ప్రదర్శిస్తున్నారు. ఒకేగాలి యొక్క అనేక తరంగాలు ఆకాశంలో ఉంటున్నట్లు, అసంఖ్యాక మనో వృత్తి పరంపరలు జీవులు రూపంగా అద్దానియందే ఉన్నాయి. యజ్ఞవేదికపై అగ్నిలాగా, కుండలోని సోమంలాగా … మానవులలో - దేవతలలో-యజ్ఞంలో - కొండపై …. అంతటా బృహత్తరమైన సత్యమై - ఆత్మ దేవాది దేవుడే సర్వత్రా వెలయుచున్నాడు.

ఊర్ధ్వం ప్రాణమున్నయత్యపానం ప్రత్యగస్యతి .
మధ్యే వామనమాసీనం విశ్వే దేవా ఉపాసతే .. 3..
3. ఊర్ధ్వం ప్రాణమ్‌ ఉన్నయతి, అపానం ప్రత్యక్‌ అస్యతి,
మధ్యే వామనం ఆశీనం విశ్వే దేవాః ఉపాసతే ||
సర్వాత్మకుడగు ఆత్మభగవానుడే సమస్త దేహాలలో ఉండి, ప్రాణమును ఊర్ధ్వానికి, అపానమును క్రిందకు ప్రసరింపజేస్తూ, … ఆ ప్రాణ-అపానముల మధ్య ఆశీనుడై, ఈ విశ్వము తన రూపముగా కలవాడై అందరు దేవతల చేత ఉపాశించ బడుచున్నారు.

అస్య విస్రంసమానస్య శరీరస్థస్య దేహినః .
దేహాద్విముచ్యమానస్య కిమత్ర పరిశిష్యతే . ఏతద్వై తత్ .. 4..
4. అస్య విస్రంసమానస్య శరీరస్థస్య తస్య దేహినః
దేహాత్‌ విముచ్యమానస్య కిమ్‌ అత్ర పరిశిష్యతే,
ఏతత్‌ వై తత్‌ !
ఈ జీవుని యందు దేహము + శాంతాత్మ కలియకయే కలిసిఉన్నాయి. దేహి నుండి దేహ - దేహత్వములు విడదీసి చూస్తే అప్పుడిక ఏది కేవలమై సర్వదా శేషిస్తోందో … అదియే ఆత్మ, (దేహం నుండి మన దేహి స్వరూపం విడదీసి చూస్తే కేవలమగు అట్టి స్వస్వరూపమే ఆత్మ).

న ప్రాణేన నాపానేన మర్త్యో జీవతి కశ్చన .
ఇతరేణ తు జీవంతి యస్మిన్నేతావుపాశ్రితౌ .. 5..
5. న ప్రాణేన, న అపానేన మర్త్యో జీవతి కశ్చన|
ఇతరేణ తు జీవంతి యస్మిన్‌ ఏతా ఉపాశ్రితౌ ||
ఓ నచికేతా! ఈ జీవుడు ప్రాణ - అపానముల కారణంగా జీవిస్తున్నాడను కొంటున్నావా? లేదు. ప్రాణ - అపానములు దేని ఆధారముచే కదలుచున్నాయో (రెండింటిని ఏది కదల్చుచున్నదో) అట్టి ఆత్మశక్తియొక్క మహిమవలన జీవిస్తున్నాడు.

హంత త ఇదం ప్రవక్ష్యామి గుహ్యం బ్రహ్మ సనాతనం .
యథా చ మరణం ప్రాప్య ఆత్మా భవతి గౌతమ .. 6..
6. హంత ! తే ఇదం ప్రవక్ష్యామి గుహ్యం బ్రహ్మ సనాతనమ్‌|
‘‘యథా చ మరణం ప్రాప్య ఆత్మాభవతి’’ గౌతమ్‌
బిడ్డా! ఇప్పుడు అతి రహస్యమగు సనాతన-బ్రహ్మము గురించి, మరణానంతరం జీవాత్మకు ఏమగుచున్నదో … దాని గురించి చెప్పుచున్నాను. శ్రద్ధగా ఆలకించు.
(సనాతనము = జన్మకర్మల కంటే మునుముందే ఉన్న స్వస్వరూపము).

యోనిమన్యే ప్రపద్యంతే శరీరత్వాయ దేహినః .
స్థాణుమన్యేఽనుసంయంతి యథాకర్మ యథాశ్రుతం .. 7..
7. యోనిమ్‌ అన్యే ప్రపద్యంతే శరీరత్వాయ దేహినః
స్థాణుమ్‌ అన్యే అనుసంయాతి యథా కర్మ, యథా శ్రుతమ్‌ ||
ఈ జీవుని అభ్యాస - జ్ఞానములను అనుసరించియే వర్తమాన దేహము పొందటం జరుగుతుంది. ఇక ఇప్పటి కర్మ - జ్ఞానములను అనుసరించి మరొక యోని (దేహం)లో ప్రవేశించటమో, మరొక స్థానువు (చెట్లు - రాయి) మొదలైన రూపాలు పొందటమో జరుగుతోంది.

య ఏష సుప్తేషు జాగర్తి కామం కామం పురుషో నిర్మిమాణః .
తదేవ శుక్రం తద్బ్రహ్మ తదేవామృతముచ్యతే .
తస్మిఀల్లోకాః శ్రితాః సర్వే తదు నాత్యేతి కశ్చన . ఏతద్వై తత్ .. 8..
8. య ఏషు సుప్తేషు జాగర్తి
కామం కామం పురుషో నిర్మిమాణః,
తదేవ శుక్రం| తత్‌ బ్రహ్మ | తదేవ అమృతమ్‌ ఉచ్యతే|
తస్మిన్‌ లోకాః శ్రితాః సర్వే| తత్‌ ఉ న అత్యేతి కశ్చన! ఏతద్వై తత్‌!
మనస్సు చేతనే అవన్నీ పొందబడుచున్నాయి. అయితే, ఏదైతే స్వప్న - జాగ్రత్తులలో తనకు తానుగా, తాను కోరుకొన్న రీతిగానే దృశ్యాలు కల్పించుకొంటోందో, వాటికి తాను సర్వదా వేరుగానే ఉంటోందో అదియే నిర్మలమగు తత్‌బ్రహ్మము. అద్దాని స్వరూపం అమృతము. అద్దానియందు లోకాలన్నీ అమర్చబడి ఉన్నాయి. దానిని దాటి ఇక ఏదీలేదు. ఎద్దానిని దాటటానికి మరింకేమీ లేదో … అదియే బ్రహ్మము.

అగ్నిర్యథైకో భువనం ప్రవిష్టో
రూపం రూపం ప్రతిరూపో బభూవ .
ఏకస్తథా సర్వభూతాంతరాత్మా
రూపం రూపం ప్రతిరూపో బహిశ్చ .. 9..
9. అగ్నిః యథా ఏకో భువనం ప్రవిష్టో
రూపం - రూపం ప్రతిరూపో బభూవ
ఏకః తథా సర్వభూత ‘అంతరాత్మా’
రూపం - రూపం ప్రతిరూపో బహిశ్చ ||
అగ్ని అంతటా ఒక్కటే అయి, తనకంటూ ఏ ఆకృతిలేనిదై ఉండికూడా, ఏ వస్తువును స్పృశిస్తే ఆ వస్తు ఆకారం తాను సంతరించుకొంటోంది చూచావా? అయినా కూడా, అగ్ని తాను కాల్చుచున్న వస్తువుకు పరిమితము కాదు కదా! సర్వజీవులలోని అంతరాత్మ సర్వదా ఏకమే అయి ఉండి ఈ దేహములను ఆశ్రయించి తద్రూపంగా తానే అగుచున్నది. అయినా కూడా నామ-రూపములచే పరిమితము కాదు.

వాయుర్యథైకో భువనం ప్రవిష్టో
రూపం రూపం ప్రతిరూపో బభూవ .
ఏకస్తథా సర్వభూతాంతరాత్మా
రూపం రూపం ప్రతిరూపో బహిశ్చ .. 10..
10. వాయుః యథా ఏకో, భువనం ప్రవిష్టో
రూపం - రూపం ప్రతిరూపం బభూవ,
ఏకః తధా సర్వభూతాంతరాత్మా
రూపం - రూపం ప్రతిరూపో బహిశ్చ ||
వాయువు అంతటా ఏకమే అయివుండి ఏ (బూరవంటి) వస్తువులలో ప్రవేశిస్తే ఆ రూపం తనదేగా అగుచున్నదో, సర్వజీవుల అంతరాత్మ (పురుషుడు) సర్వదా ఏకము - అరూపము అయి ఉండియే ఈ సర్వరూపాలుగా ప్రదర్శితము అగుచున్నది.

సూర్యో యథా సర్వలోకస్య చక్షుః
న లిప్యతే చాక్షుషైర్బాహ్యదోషైః .
ఏకస్తథా సర్వభూతాంతరాత్మా
న లిప్యతే లోకదుఃఖేన బాహ్యః .. 11..
11. సూర్యో యథా సర్వలోకస్య చకక్షుః
న లిప్యతే చాకక్షుషైః బాహ్య దోషైః
ఏకః తథా సర్వభూతాంతరాత్మా
న లిప్యతే లోక దుఃఖేన బాహ్యః ||
సూర్యకిరణాలు ప్రసరిస్తున్నాయి. వస్తువులను ప్రకాశింపజేస్తున్నాయి. అయితే, ఒకనికి కంటి దోషంచేత వస్తువులు సరిగ్గా కనబడకపోతే ఆ దోషం సూర్యకిరణాలకు అంటుతోందా? లేదే! పోనీ ఆ వస్తువుల దోషములు సూర్య కిరణములకు అంటుతాయా? అదీ లేదు. అలాగే ఈ ఈ జీవులు లౌకికంగా అనుభవించే సుఖదుఃఖాలు మొదలైనవి అంతరాత్మకు అంటవు.

ఏకో వశీ సర్వభూతాంతరాత్మా
ఏకం రూపం బహుధా యః కరోతి .
తమాత్మస్థం యేఽనుపశ్యంతి ధీరాః
తేషాం సుఖం శాశ్వతం నేతరేషాం .. 12..

12. ఏకో వశీ సర్వభూతాంతరాత్మా
ఏకం రూపం (బీజం) బహుధా యః కరోతి
తమ్‌ ఆత్మస్థం యే అనుపస్యంతి ధీరాః
తేషాం సుఖమ్‌ శాశ్వతం ! నేతరేషామ్‌ (న-ఇతరేషామ్‌) ||

ఏ సర్వ నియామకుడు, సర్వాంతర్యామి, సర్వభూతాంతరాత్మ ఏకరూపుడై కూడా అనేక రూపాలుగా ప్రవర్తిస్తూ కనిపిస్తున్నాడో … అట్టి సర్వాంతర్యామిని తన హృదయము నందే దర్శించుచున్న ధీమంతుని సుఖము మాత్రమే శాశ్వతము. తదితరుల సుఖము అశాశ్వతము.

నిత్యోఽనిత్యానాం చేతనశ్చేతనానాం
ఏకో బహూనాం యో విదధాతి కామాన్ .
తమాత్మస్థం యేఽనుపశ్యంతి ధీరాః
తేషాం శాంతిః శాశ్వతీ నేతరేషాం .. 13..
13. నిత్యో అనిత్యానాం, చేతనః చేతనానామ్‌
ఏకో బహూనామ్‌ యో విదధాతి కామాన్‌,
తమ్‌ ‘‘ఆత్మస్థం’’ యే అనుపశ్యంతి ధీరాః
తేషాం శాంతిః శాశ్వతీ| నేతరేషామ్‌ || (న-ఇతరేషామ్‌)||
అనిత్యమైన వస్తువుల మధ్య నిత్యమైనది. కదిలేవన్నిటినీ కదిలించేది. తాను ఏకమే అయి ఉండి అనేకుల రూపంగా కోర్కెలు నెరవేర్చునది అయినట్టి - ఆ సర్వాంతర్యామి - సర్వ నియామకము అగు ఆత్మను తనయందే ఏధీరుడు దర్శిస్తాడో, … ఆతడే శాశ్వతమగు శాంతిని పొందుచున్నాడు. అట్లా దర్శించనివాడు శాంతిని పొందలేకపోతున్నాడు.

తదేతదితి మన్యంతేఽనిర్దేశ్యం పరమం సుఖం .
కథం ను తద్విజానీయాం కిము భాతి విభాతి వా .. 14..
14. ‘‘తత్‌ ఏతత్‌’’ ఇతి మన్యంతే
అనిర్దేశ్యమ్‌ | పరమమ్‌ సుఖమ్‌,
కథ ను తత్‌ విజానీయామ్‌ ? కిమ్‌ ఉభాతి విభాతి వా?
‘‘దృశ్యరూపంగా కనిపిస్తూనే అనిర్దేశ్యము - పరమ సుఖము అయినట్టి ఈ నా యొక్క - నాయందలి ఈ కేవలీతత్త్వమే అది’’ అని ఆత్మజ్ఞులు గమనించుచున్నారు. అది ప్రకాశించేదా? ప్రకాశింపచేసేదా? తెలియబడేది? తెలుసుకొనేదే అది. అద్దానిని తెలుసుకోవటమెక్కడిది? (గమనించటమే అద్దాని అనుభవం).

న తత్ర సూర్యో భాతి న చంద్రతారకం
నేమా విద్యుతో భాంతి కుతోఽయమగ్నిః .
తమేవ భాంతమనుభాతి సర్వం
తస్య భాసా సర్వమిదం విభాతి .. 15..
15. న తత్ర సూర్యో భాతి | న చంద్ర - తారకం |
నేమా (న ఇమా) విద్యుతో భాతిః (భాంతి) |
కుతో అయమ్‌ అగ్నిః? తమేవ భాంతమ్‌ అనుభాతి సర్వం|
తస్య భాసా సర్వమిదం విభాతి ||
ఈ సూర్య - చంద్ర - నక్షత్రాలు విద్యుత్‌ కాంతిలో అది చూడబడేది కాదు. అద్దాని ప్రకాశం చేతనే సూర్య చంద్ర నక్షత్రాదులు చేతనము పొంది ప్రకాశమును ప్రదర్శించగలుగుచున్నాయి.

షష్ఠమ వల్లీ


ఊర్ధ్వమూలోఽవాక్శాఖ ఏషోఽశ్వత్థః సనాతనః .
తదేవ శుక్రం తద్బ్రహ్మ తదేవామృతముచ్యతే .
తస్మిఀల్లోకాః శ్రితాః సర్వే తదు నాత్యేతి కశ్చన . ఏతద్వై తత్ .. 1..
1. ఊర్ధ్వమూలో అవాక్‌ శాఖః|
ఏషో అశ్వత్థః సనాతనః| తదేవ శుక్రం| తత్‌ బ్రహ్మ|
తదేవ అమృతమ్‌ ఉచ్యతే| తస్మిన్‌ లోకాః శ్రితాః సర్వే
తత్‌ ఉ నాత్యేతి కశ్చన, ఏతద్వైతత్‌||
ఈ దృశ్యము ‘అనే అశ్వత్థ వృక్షము’ యొక్క మూలము ఆత్మయందు, శాఖలు క్రింద వైపుగా ప్రకృతి యందు విస్తరించి ఉన్నాయి. అనగా, (ఈ దృశ్యము యొక్క) మూలము ఊర్ధ్వంగా, శాఖలు క్రిందికి ఉన్నాయి. (ఊర్ధ్వమున నిర్గుణ బ్రహ్మము. ఈ జగత్తు సగుణ బ్రహ్మము). పైన నిర్గుణంగా - క్రిందికి సగుణంగా ఏదేతై అంతటా ఉన్నదో …. అదియే తేజోమయ రూపము - శుద్ధము అగు పరమాత్మ. దేనినైతే ఏదీ అతిక్రమించజాలతో అదియే ఆ ‘తత్‌’. శబ్ధార్థ మగు కేవలాత్మ (లేక) పరబ్రహ్మము కూడా.

యదిదం కిం చ జగత్ సర్వం ప్రాణ ఏజతి నిఃసృతం .
మహద్భయం వజ్రముద్యతం య ఏతద్విదురమృతాస్తే భవంతి .. 2..
2. యత్‌ ఇదం కించ జగత్‌ సర్వం
ప్రాణ ఏజతి నిః సృతామ్‌
మహత్‌ భయం వజ్రం ఉద్యతమ్‌
య ఏతత్‌ విదుః, అమృతాః తే భవంతి ||
కించిత్‌ నుండి ‘బృహత్‌’ దాకా ‘జగత్‌’ అని పిలువబడే - ఇక్కడి సర్వము ఎద్దాని యొక్క ప్రాణశక్తి యొక్క ప్రదర్శనా చమత్కారమో, ఏదైతే ఎత్తబడిన వజ్రమువలె వెనుకగా ఉండి సర్వమును నియమించి నడిపిస్తోందో అట్టి సర్వాత్మస్వరూపమగు అంతరాత్మ (లేక) బ్రహ్మమును ఎరుగుటచేత మాత్రమే ‘అమృతత్వము’ లభిస్తోంది. ‘మృతత్వము’ అధిగమించబడుతోంది.

భయాదస్యాగ్నిస్తపతి భయాత్తపతి సూర్యః .
భయాదింద్రశ్చ వాయుశ్చ మృత్యుర్ధావతి పంచమః .. 3..
3. భయాత్‌ అస్య అగ్నిః తపతి| భయాత్‌ తపతి సూర్యః|
భయాత్‌ ఇంథ్చ్ర, వాయుశ్చ| మృత్యుః ధావతి పంచమ ||
అద్దానియొక్క భయము చేతనే సర్వము ప్రవర్తిస్తోంది. భయము చేతనే అగ్ని మండుతోంది. సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. ఇంద్రుడు ఇంద్రియములను పాలిస్తున్నారు. వాయువు సంచనములతో కూడి ప్రసరిస్తున్నది. అద్దాని భయముచే నియమానుసారంగా (జన్మ-బాల్యము-కౌమార-యౌవనము-వార్థక్యములకు ఆవల) ’5’వది అగు మృత్యువు తన ధర్మాన్ని నిర్వర్తిస్తోంది.

ఇహ చేదశకద్బోద్ధుం ప్రాక్షరీరస్య విస్రసః .
తతః సర్గేషు లోకేషు శరీరత్వాయ కల్పతే .. 4..
4. ఇహచేత్‌ అశకత్‌ బోద్ధుం, ప్రాక్‌ శరీరస్య విస్రసః
(నచేత్‌) తతః సర్గేషు లోకేషు, శరీరత్వాయ కల్పతే ||
ఆ ‘తత్‌’ లేక ‘శాంతాత్మ’ అగు పరతత్త్వాన్ని ఇక్కడే ఈశరీరం కూలక ముందే ఎవ్వడైతే గ్రహించడో, పరమాత్మ జ్ఞానాన్ని సంపాదించడో … అట్టివాడు మరల మరల ప్రాణులుండే లోకాలలో జన్మలు, మృత్యువులు పొందుతూనే ఉంటాడు.

యథాఽఽదర్శే తథాఽఽత్మని యథా స్వప్నే తథా పితృలోకే .
యథాఽప్సు పరీవ దదృశే తథా గంధర్వలోకే
ఛాయాతపయోరివ బ్రహ్మలోకే .. 5..
5. యథా ఆదర్శే తథా ఆత్మని|
యథా స్వప్నే తథా పిత్రులోకే|
యథా అప్సు పరీవ దదృశే
తథా గంధర్వలోకే|
ఛాయా - తపయేరివ బ్రహ్మలోకే ||
అట్టి సర్వాతీతమైన ఆత్మయొక్క స్వరూపం హృదయం అద్దంలోని ప్రతిబింబం లాగా కనిపిస్తోంది. పితృలోకంలో స్వప్న వస్తువువలె, గంధర్వ లోకంలో జలంలోని తరంగంలాగా అనుభవమౌతోంది. బ్రహ్మలోకంలో ప్రకాశము - నీడలవలె బ్రహ్మము - దృశ్యజగత్తులు తెలియవస్తున్నాయి. (ఆత్మ జ్ఞానికి అనునిత్యమగు స్వస్వరూపమే అగుచున్నది).

ఇంద్రియాణాం పృథగ్భావముదయాస్తమయౌ చ యత్ .
పృథగుత్పద్యమానానాం మత్వా ధీరో న శోచతి .. 6..
6. ఇంద్రియాణాం పృథక్‌ భావమ్‌
ఉదయ - అస్తమయౌ చ యత్‌
పృథక్‌ ఉత్పద్యమానానాం
మత్వా ధీరో న శోచతి ||
ఉత్పత్తి - వినాశనములు స్వభావంగా గల ఈ ఇంద్రియములకంటే వేఱై, వీటికి సాక్షి అయి పరబ్రహ్మము సంప్రకాశమానమై ఉన్నది.. ఈ ఇంద్రియములు వేఱు-వేఱైన పంచతత్త్వాల నుండి జనించి ఇక్కడ కలిసి మరల యథాస్థానం (ఆత్మలోనికే) చేరుచున్నాయి. ఆత్మ సర్వదా యథాస్థానంలో యథాతథంగా ఉన్నది. ఇది గ్రహించిన ధీరుడు ఇక దేనికీ శోకించడు.

ఇంద్రియేభ్యః పరం మనో మనసః సత్త్వముత్తమం .
సత్త్వాదధి మహానాత్మా మహతోఽవ్యక్తముత్తమం .. 7..
7. ఇంద్రియేభ్యః పరం మనః|
మనసః సత్వమ్‌ ఉత్తమమ్‌|
సత్వాన్‌ అధి మహాన్‌ ఆత్మా
మహతో అవ్యక్తమ్‌ ఉత్తమమ్‌ ||
ఇంద్రియ - ఇంద్రియార్థ ములకు వేరుగా మనస్సు ఉన్నది. మనస్సుకు అతీతంగా బుద్ధి ఉన్నది. బుద్ధికి ఆవల బుద్ధికి అతీతమై జీవాత్మ ఉన్నది. అట్టి జీవాత్మకంటే ‘అవ్యక్తము’ (జీవాత్మగా వ్యక్తమయ్యేది) ఉన్నది.

అవ్యక్తాత్తు పరః పురుషో వ్యాపకోఽలింగ ఏవ చ .
యం జ్ఞాత్వా ముచ్యతే జంతురమృతత్వం చ గచ్ఛతి .. 8..
8. అవ్యక్తాత్‌ తు పరః పురుషో
వ్యాపకో అలింగయేవ చ|
యత్‌ జ్ఞాత్వా ముచ్యతే జంతుః
అమృతత్త్వం చ గచ్ఛతి ||
ఆ అవ్యక్తానికి ఆవల పురుషుడు సర్వ వ్యాపకుడై, ఇంద్రియములకు అవిషయుడై, వాటికి నియామకుడు - యజమాని అయివున్నాడు. అట్టి తన సర్వాత్మ స్వరూపాన్ని గ్రహించిన జీవుడు సర్వ బంధముల నుండి విడివడి అమృతత్వమును తనయొక్క అనిత్య-అప్రతిహత స్వానుభవముగా తీర్చిదిద్దుకొనుచున్నాడు.

న సందృశే తిష్ఠతి రూపమస్య
న చక్షుషా పశ్యతి కశ్చనైనం .
హృదా మనీషా మనసాఽభిక్లృప్తో
య ఏతద్విదురమృతాస్తే భవంతి .. 9..
9. న సందృశే తిష్ఠతి రూపమ్‌ అస్య|
న చకక్షుషా పశ్యతి కశ్చన ఏనమ్‌|
హృదా మనీషా మనసా అభిక్లుప్తో,
య ఏతత్‌ విదుః, అమృతాః తే భవంతి ||
అట్టి పరమపురుషుని రూపము ఇంద్రియములకు దృశ్య రూపంగా గోచరించేది కాదు. అనగా కళ్ళకు కనిపించేది కాదు. మరి? నిర్మలమైన బుద్ధికి హృదయంలోనే అభివ్యక్తమగుచున్నాడు. అట్టి తన హృదయంలోనే వేంచేసియున్న ఆ పరమపురుషుని గ్రహించినవాడు మృత్యువును అధిగమించి అమృతరూపుడగుచున్నాడు. (అందుచేత మృత్యువును జయించటానికే, మృత్యువు గురించి ఎరగటమే మార్గమైయున్నది).

యదా పంచావతిష్ఠంతే జ్ఞానాని మనసా సహ .
బుద్ధిశ్చ న విచేష్టతే తామాహుః పరమాం గతిం .. 10..
10. యదా పంచా అవతిష్ఠంతే
జ్ఞానాని మనసా సహ,
బుద్ధిశ్చ న విచేషేత
తామ్‌ ఆహుః పరమాం గతిమ్‌ ||
పంచ జ్ఞానేంద్రియములు (చూపు - వినికిడి - వాసనాస్వాదన - రుచి- స్పర్శ), - మనస్సు - బుద్ధి తమ చంచలత్వము త్యజించి ఎప్పుడు నిశ్చలత్వము పొందుతాయో, అప్పుడు ‘పరమపురుషత్వము’ అనబడు పరమ పదము స్వయముగా సిద్ధించుచున్నది. అదియే ‘పరమగతి’ అనబడుచున్నది.

తాం యోగమితి మన్యంతే స్థిరామింద్రియధారణాం .
అప్రమత్తస్తదా భవతి యోగో హి ప్రభవాప్యయౌ .. 11..
11. తాం ‘యోగమ్‌’ ఇతి మన్యంతే
స్థిరా ఇంద్రియ ధారణమ్‌|
అప్రమత్తః తదా భవతి
యోగో హి ప్రభవాప్యయౌ (ప్రభవ అపి అయౌ) ||
బాహ్యేంద్రియములను ఉపయోగించకపోవటమే ‘యోగము’ - అని కొందరు అజ్ఞానం చేత అనుకుంటున్నారు. కానీ, ఎప్పుడు ‘ఇదంతా పరమాత్మయే’ అనే అప్రమత్తత సునిశ్చితమై ఉంటుందో, అప్పటి అట్టి ఆత్మధ్యాన-ఆత్మభావనా రూపమగు - అనునిత్య సందర్శనమే యోగము - యోగధారణ కూడా.

నైవ వాచా న మనసా ప్రాప్తుం శక్యో న చక్షుషా .
అస్తీతి బ్రువతోఽన్యత్ర కథం తదుపలభ్యతే .. 12..
12. నైవ (న ఏవ) వాచా, న మనసా
ప్రాప్తుం శక్యో, న చకక్షుషా|
‘‘అస్తి’’ ఇతి బ్రువతో - అన్యత్ర
కథం ‘‘తత్‌’’ ఉపలభ్యతే?
అట్టి పరమ పురుషుని స్థానము - ఈ భౌతికమైన వాక్‌ - చకక్షువు - మనస్సులను ఉపయోగించి పరిశోధించి ఎవ్వరూ తెలుసుకోజాలరు. ‘‘ఆత్మ ఉన్నది’’ అని గ్రహించినవారి అనుభవమే ఆత్మతత్త్వమునకు ప్రమాణం. అంతకుమించి త్రోవఏది?

అస్తీత్యేవోపలబ్ధవ్యస్తత్త్వభావేన చోభయోః .
అస్తీత్యేవోపలబ్ధస్య తత్త్వభావః ప్రసీదతి .. 13..
13. ‘అస్తి’ ఇత్యేవ ఉపలబ్ధవ్యః
తత్త్వ భావేన చ ఉభయోః|
‘అస్తి’ ఇత్యేవ ఉపలబ్ధస్య
తత్త్వ భావః ప్రసీదతి ||
‘‘మట్టి - మట్టి బొమ్మలలో మట్టియే సత్యమయినట్లు, ఈ నామ రూపాత్మక జగత్తుకు ఆధారమై శాంతాత్మ సర్వత్రా వేంచేసినదై ఉన్నది. అదియే ఈ తదితర జీవులతో కూడిన దృశ్య జగత్తుగా కనిపిస్తోంది’’ - అని అభ్యాసం చేస్తూ ఉంటే అది తప్పక ఉపలబ్దం అవుతోంది.

యదా సర్వే ప్రముచ్యంతే కామా యేఽస్య హృది శ్రితాః .
అథ మర్త్యోఽమృతో భవత్యత్ర బ్రహ్మ సమశ్నుతే .. 14..
14. యదా సర్వే ప్రముచ్యంతే
కామాయే అస్య హృది శ్రితాః,
అథ మర్త్యో అమృతో భవతి|
అత్ర బ్రహ్మ సమశ్నుతే || (సః అశ్నుతే)
ఎప్పటికైతే ‘‘ఈ దృశ్యంలో ఏదో కావాలి - పొందాలి - తొలగాలి’’ అని అభిలషించే ‘కామము’ అనే వ్యసనము హృదయమునుండి తొలగుతుందో అప్పుడు ఈ జీవుడు ఇక్కడే ఇప్పుడే బ్రహ్మమును పొందుచున్నాడు. ’బ్రహ్మమే తాను’గా అయి అవిచ్ఛిన్నమగు ఆత్మానందమును సిద్ధించుకొనుచున్నాడు.

యదా సర్వే ప్రభిద్యంతే హృదయస్యేహ గ్రంథయః .
అథ మర్త్యోఽమృతో భవత్యేతావద్ధ్యనుశాసనం .. 15..
15. యదా సర్వే ప్రభిద్యంతే
హృదయస్య ఇహ గ్రంథయః
అథ మర్త్యో అమృతో భవతి|
ఏతావత్‌ హి అనుశాసనం ||
హృదయములోని అనేక చిక్కుముళ్ళు ఒక్కొక్కటిగా వీడుతూ ఉండగా ఇక్కడే ఈ జీవాత్మ పరమాత్మగా రూపొందగలడు - అని శాస్త్రములు చెప్పే అంతిమ సిద్ధాంతం. శాస్త్రము యొక్క అనుశాసనము.

శతం చైకా చ హృదయస్య నాడ్య-
స్తాసాం మూర్ధానమభినిఃసృతైకా .
తయోర్ధ్వమాయన్నమృతత్వమేతి
విష్వఙ్ఙన్యా ఉత్క్రమణే భవంతి .. 16..
16. శతం చ ఏకా చ హృదయస్య నాడ్యః
తాసాం మూర్ధానం అభినిస్సృత ఏకా|
తయో ‘‘ఊర్ధ్వమ్‌’’ ఆయనం అమృతత్వమ్‌ ఏతి|
విష్వన్‌ అన్యా ఉత్క్రమణే భవంతి ||
హృదయం నుండి బయలుదేరే 101 నాడీ మార్గాలలో 100 నాడీమార్గాలు శబ్ద - స్పర్శ - రూప - రస - గంధానుభావములవైపుగా ప్రసరించి ఉన్నాయి. ఒకానొక నాడీ మార్గం మాత్రం ఊర్ధ్వగామి అయివున్నది. అట్టి (బ్రహ్మనాడి అనబడు) 101వ నాడియొక్క అభ్యాసపూర్వక ‘అనుసరణము’ చేతనే ఈ జీవుడు మృత్యువు యొక్క పరిధిని అధిగమిస్తున్నాడు.

అంగుష్ఠమాత్రః పురుషోఽన్తరాత్మా
సదా జనానాం హృదయే సంనివిష్టః .
తం స్వాచ్ఛరీరాత్ప్రవృహేన్ముంజాదివేషీకాం ధైర్యేణ .
తం విద్యాచ్ఛుక్రమమృతం తం విద్యాచ్ఛుక్రమమృతమితి .. 17..

17. అంగుష్ఠమాత్రః పురుషో అంతరాత్మా
సదా జనానాం హృదయే సన్నివిష్టః,
తం స్వాత్‌ శరీరాత్‌ ప్రవృహేత్‌
ముంజాత్‌ ఇవ ఇషీకామ్‌ ధైర్యేణ
తం విద్యాత్‌ శుక్రమ్‌ అమృతమ్‌|
తం విద్యాత్‌ శుక్రమ్‌ అమృతమ్‌| ఇతి ||

అంగుష్ఠమాత్ర పరిమాణం గల ఆ సర్వాంతర్యామియగు పరమ పురుషుడు సమస్త ప్రాణుల హృదయములో ‘‘కేవల - నిర్మల సాక్షి’‘యై - వెలుగొందుచున్నాడు. ఆయనయే అంతరాత్మ - పరబ్రహ్మము - పరమపురుషుడు - పరమాత్మ కూడా! ఈ జీవుడు ముంజ గడ్డి నుండి ఈకను పైకి తీసినట్లు ఆ తనయందలి అంతరాత్మను తన శరీరము నుండి వేఱుపరచుకోవాలి. ’‘ఈ శరీర ధర్మములేవీ ఆ అంతరాత్మకు లేవు’’ అని గ్రహించాలి. శరీరము-దృశ్యముల కంటే ఆత్మ భిన్నమైనదని గమనించాలి. ‘‘అట్టి ఆత్మకు ఈ సమస్తము అభిన్నము’’ అని కూడా గమనించాలి. ఆ వేఱుబడిన అంగుష్ఠమాత్ర పురుషుని ‘‘పరిశుద్ధ చిన్మాత్రము - అమృత స్వరూపము’’ అగు బ్రహ్మముగా గ్రహించాలి. ఆ పరిశుద్ధ బ్రహ్మమే తానని సుస్పష్ట - సునిశ్చిత పరచుకోవాలి.

మృత్యుప్రోక్తాం నచికేతోఽథ లబ్ధ్వా
విద్యామేతాం యోగవిధిం చ కృత్స్నం .
బ్రహ్మప్రాప్తో విరజోఽభూద్విమృత్యు-
రన్యోఽప్యేవం యో విదధ్యాత్మమేవ .. 18..
18. మృత్యు ప్రోక్తాం నచికేతో అధ లబ్ధ్వా
విద్యాం ఏతాం యోగ విధించ కృత్స్నమ్‌
బ్రహ్మ ప్రాప్తో విరజో అభూత్‌ విమృత్యుః||
అన్యోఽపి ఏవం యో విదతి అధ్యాత్మ మేవ ||
మృత్యుదేవతయగు యమభగవానునిచే ఈ బ్రహ్మవిద్య బోధించబడినది. అట్టి బ్రహ్మ విద్యను యోగవిధిగా ఎవ్వడైతే పొందినవాడై నిర్మల దర్శనమును సంతరించు కుంటాడో, … అట్టివాడు బ్రహ్మమే తన స్వరూప - స్వభావాలుగా గమనిస్తున్నాడు. ‘‘మృత్యువు నా స్వభావమే కాదు’’ అని గ్రహిస్తున్నాడు.
ఎవ్వరైనా సరే శ్రద్ధతో కూడిన అధ్యయనముచే ఈ ఆత్మ విద్య గ్రహించి ఆచరించటానికి అర్హులే.

సహ నావవతు . సహ నౌ భునక్తు . సహ వీర్యం కరవావహై .
తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై .. 19..
ఓం శాంతిః శాంతిః శాంతిః ..
ఓం సహనావవతు| సహనౌ భునక్తు|
సహవీర్యం కరవావహై| తేజస్వినా వధీతమస్తు| మావిద్విషావహైః|
ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః
గురుశిష్యులమగు మేమిరువురము ఆత్మభగవానుని అనుగ్రహ పాత్రుల మయ్యెదముగాక! ఈ గురు - శిష్య సంవాద ఫలము ఇరువురము భుజించెదముగాక! ఇరువురము వీర్య - తేజములతో శోభించెదము గాక! ఒకరినొకరు ద్వేషించక ప్రేమించు కొనెదముగాక!

ఇతి కఠవల్లీ ఉపనిషత్‌
కఠోపనిషత్‌ సమాప్తా
ఓం శాంతిః| శాంతిః| శాంతిః||



కృష్ణయజుర్వేదాంతర్గత

7     కఠ ఉపనిషత్‌

(లేక) కఠ వల్లీ ఉపనిషత్‌

అధ్యయన పుష్పము

(1.) ప్రథమ వల్లీ - ‘‘పరిప్రశ్న’’

అరుణి మునీంద్రుని కుమారుడు ఆరుణి. వాజస్రవసువు - నామధేయుడు. ఆయన ‘‘నేను ఆనందమయమైన లోకాలు పొందాలి’’ - అనే ఆశయంతో అనేక యాగములు, యజ్ఞములు నిర్వర్తిస్తూ ఉండేవారు.

ఆయనకుగల బహు సంతానంలో మధ్యవాడు ‘నచికేతుడు’. 7 సంవత్సరముల వయస్సువాడు. తండ్రి వెంట ఉండి, యాగ సమయములలో తండ్రి దగ్గరే కూర్చుని, ఆయా యాగ విధానాలలో పాల్గొంటూ తండ్రికి చేదోడుగా సేవిస్తూ ఉండేవాడు. ఆ పిల్లవాని చురుకుతనము, యోగ-జ్ఞానములపట్ల గల సునిశితమైన అవగాహనలను చూచి తల్లిదండ్రులు, గురువులు ఆనందం పొందుతూ ఉండేవారు.

ఒకసారి ఆ వాజశ్రవసువు ‘విశ్వజిత్‌’ అనే పేరుగల గొప్ప యాగం ప్రారంభించారు. ఆ యాగ కార్యక్రమం కొన్నిరోజులుగా కొనసాగింది. సుదూర ప్రాంతాల నుండి అనేకమంది వచ్చి ఆ యాగ కార్యక్రమంలో పాల్గొన్నారు. చూచి ఆనందించారు. క్రమంగా యాగమంతా పూర్తి కావస్తూ, ఆ కార్యక్రమము చివరి రోజుకు వచ్చింది. యాగము యొక్క నియమమును అనుసరించి ఆ యజ్ఞకర్త అయిన వాజశ్రవసువు ‘విశ్వజిత్‌’ అనే శబ్దార్ధాన్ని ఉద్దేశిస్తూ తనకున్న సంపదను ఇతరులకు ఇచ్చివేయవలసియున్నది. తనకున్నది ఇచ్చే సంజ్ఞారూపంగా తన గోసంపదలోగల ఆవులను ముందుగానే ఎంపికచేసి ఉంచుకున్నారు. ఇక ఆపై యాగఫలప్రదాన కార్యక్రమ విభాగంగా ఆ యాగంలో పాల్గొన్న ఒక్కొక్క బ్రాహ్మణుని పిలిచి ఒక్కొక్క ఆవును దానం ఇచ్చివేయటం ప్రారంభించారు.

కుమారుడైన నచికేతుడు తండ్రి చేస్తున్న సర్వస్వదాన కార్యక్రమంలో తండ్రికి ఎప్పటిలాగానే సహాయం చేస్తూ ఉన్నాడు. ఆ 7 సంవత్సరాల పిల్లవాడంటే తండ్రికి ఎంతో ఇష్టం. ఆ పిల్లవాడు కూడా తల్లిదండ్రులను - ఆరాధ్య ప్రత్యక్ష దేవతలు - అనే భావంతో చూచేవాడు. చిన్నప్పటి నుండే తండ్రి దగ్గర, గురువుల దగ్గర అనేక పవిత్రమైన శాస్త్ర విశేషాలు విని, ఆ ప్రయోజనంగా అత్యంత వినమ్రతతో సేవించటం ఆతనికి అలవాటైన విషయమే. ఆతడు అప్పటికీ గురుకులంలో విద్యాభ్యాసియే.

⌘ ⌘ ⌘

ఆ విధంగా గోదానాలు తండ్రిచేస్తూ ఉండగా, ఇంతలో నచికేతుడు అక్కడ దానం చేయబడుచున్న గోవులను కాకతాళీయంగా, పరికించి చూడటం జరిగింది. అట్లా చూస్తూ చూస్తూ ఉండగా, ….. ఆతని మనస్సులో తళుక్కుమని ఒక ఆలోచన వచ్చి, … అది మరింతగా బలం పుంజుకోసాగింది. ఆ నచికేతుడు అట్లా ఆలోచిస్తూనే తండ్రి వాజశ్రవసువు దగ్గరకు అడుగులు వేస్తూ వెళ్ళి ఇట్లా ప్రశ్నించసాగాడు.

నచికేతుడు : తండ్రీ! ఇప్పుడు నాకు ఒక అనుమానం వచ్చింది. అడగటానికి అనుజ్ఞయే కదా?
గోవులను దానంచేస్తూ, అనేకమందితో చిరునవ్వుల పలకరింపులు నిర్వర్తిస్తూ ఉన్న వాజశ్రవసువు కొడుకు ముద్దుగా అంటున్న మాటలు విని, ముద్దుగా దగ్గిరకు పిలిచారు. అక్కడి వేద పండితులతో, ‘‘వేదపండిత వరేణ్యులారా! ఈ మా అబ్బాయికి ఏదో అనుమానం వచ్చినట్లుంది.’’ …. అని పలుకుచూ చిరునవ్వుతో నచికేతునివైపు మెల్లగా చూచారు.

వాజశ్రవసువు : ఏమిటి నాన్నా! నీకు ఏమి అనుమానం వచ్చిందో, …. అడుగు!

నచికేతుడు : తండ్రీ! మనం ఈ విశ్వజిత్‌ యాగము ఎందుకు చేస్తున్నారు? దీనివలన మనకు ఏమిటి లాభం?

వాజశ్రవసువు : అదేమిరా! అట్లా అడుగుతావు! ఏమి ప్రశ్నరా అది? ఈ యాగం చేస్తే ముందుముందు ఈ యాగ దేవతలు మనకు, మన పితృ దేవతలకు, ఉత్తమ లోకాలు ప్రసాదిస్తారు.

నచికేతుడు : అవును కదా! ఆనందమయ లోకాలు ముందుముందు లభించాలని కదా, ఇటువంటి యాగం మనం శ్రమపడి చేస్తున్నాం?

వాజశ్రవసువు : అవును! అది సరే! ఇప్పుడా విషయం ఎందుకడుగుచున్నావ్‌? పోయి చెప్పిన పనిలో ఉండు, నాయనా!

నచికేతుడు : అదిగో! అటు చూడండి! మనం దానం చేయటానికి మన పశువుల కొట్టం నుండి తెచ్చిన ఆవులన్నీ కూడా ఎట్లా ఉన్నాయో గమనిస్తున్నారా? పీతోదకా జగ్ధతృణా, దుగ్ధ దోహా నిరింద్రియాః| అవన్నీ ముసలి ఆవులు. వయసు మీదపడి, రేపోమాపో చావుకు సిద్ధంగా ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి. అవి - గడ్డి మేసే స్థితిలో కూడా కనిపించటం లేదే! ఇక పాలు ఇచ్చే ప్రసక్తి ఎక్కడ? చిక్కి శల్యమై వార్ధక్యంతో నిలబడే శక్తిలేని ఆవులనా మనం దానం చేసేది? ఎందుకూ పనికిరాని ఆవులను దానంచేస్తే పుచ్చుకొన్నవారికి ఏమి ప్రయోజనము? ఏప్రయోజనమూ లేనప్పుడు, ఇక మనకు ఈ దానాలవల్ల ఆనందమయమైన లోకాలు ఎట్లా లభిస్తాయి? అటువంటి ప్రయోజనం లభించనప్పుడు మరి, ఇంత కష్టపడి ఇన్నిరోజులుగా ఈ యాగం చేయటం ఎందుకు?

వాజశ్రవసువు : నచికేతా! అట్లా అనకూడదు నాయనా! పెద్దపెద్దవారు వచ్చారు. ఆవులను దానంగా స్వీకరిస్తున్నారు. సరేలేఁ! తరువాత మాట్లాడుకుందాం. నీవు పోయి ఆ ఆవుల దగ్గర నిలబడు. పోఁ! అవి అటూ ఇటూ పోతాయేమో!

నచికేతుడు : ఆఁ! ఆ ఆవులా? అవి ఎటు పోతాయి? వాటికి అడుగులు వేసే ఓపికయే కనిపించటం లేదండీ, నాన్నగారూ! ముందు ఈ విషయం చెప్పండి. ఈ బక్కచిక్కి, ఒట్టిపోయి, చావుకు సిద్ధంగా ఉన్న ఆవులను దానంచేస్తే పుచ్చుకొన్నవారికి తోలుకొనిపోయి, మేపే శ్రమేగాని, లాభమేముంటుంది? దానం పుచ్చుకొన్నవారు సుఖపడనప్పుడు, లాభపడనప్పుడు ఈ దానాలు చేస్తున్న మనకు ఏమి ప్రయోజనం? ప్రయోజనం లేకుండా ఇంతటి యాగం మనం ఎందుకు చేస్తున్నామో చెప్పండి? ఇదంతా నిష్ప్రయోజనమైన శ్రమ కాదా?

వాజశ్రవసువు : ఒరై! నచికేతా! పిచ్చిపిచ్చి మాటలు ఆపుతావా? లేదా? ఎప్పుడు - ఎక్కడ - ఏమి మాట్లాడాలో తెలియదురా నీకూ? పెద్ద పెద్ద మాటలు మాట్లాడుచున్నావే? నోరు మూసుకొని ముందు పనిచేయి! నాకు కోపం తెప్పించకు. ఊఁ! పోఁ!

నచికేతుడు : అది కాదు తండ్రీ! మనం ఈ దానాలు ఎందుకు చేస్తున్నార? చేసి ఎవరికి ఏం ప్రయోజనం? నామాటలు అర్థం చేసుకోండి! ఇంత కష్టపడి ఈ గొప్ప యాగం చేస్తున్నాం కదా! ఇంత పనికిరాని గోవులను ఎందుకు దానం చేస్తున్నామో ముందు నాకు చెప్పండి?

వాజశ్రవసువు : ఓరీ! పనికిరాని పశువూ! పనికిరాని మాటలు ఆపు! ఇక్కడి నుండి పోఁ!

నచికేతుడు : నాన్నా! నేను పనికిరాని పశువునే కదా! ఈ పనికిరాని ఆవులను దానం చేస్తున్నారు కదా! అట్లాగే పనికిరాని పశువువంటి నన్ను కూడా దానం చేస్తున్నారా? ఎవరికి దానం చేస్తున్నారు? చెప్పండి! ఊఁ! చెప్పండి!

వాజశ్రవసువు : నిన్ను కూడానాఁ! ఆఁ! అట్లాగా? నిన్నుకూడా దానం చేస్తున్నాను. నిన్ను ఇప్పుడే ఆ యమ ధర్మరాజుకు సమర్పిస్తున్నాను! శ్రీ యమధర్మరాజార్పణమస్తు! పో, ఇక్కడి నుంచి!

నచికేతుడు : నాన్నగారు! అట్లే అగుగాక! మీరు చెప్పినట్లు నేను యమధర్మరాజుకు సమర్పించబడినవాడనగుచున్నాను. ఇదిగో! ఇప్పుడే యమపురికి బయలుదేరుచున్నాను! తండ్రీ! దయచేసి నాగురించి మీరు ఆదుర్దా పడవద్దు. అమ్మని కూడా దిగులు పెట్టుకోవద్దని చెప్పండి! అన్నయ్యలు - తమ్ముళ్లు ఉన్నారు కదా! వారిని చూచి ప్రశాంత పడమనండి. మీరిద్దరు ఊరటపడి ఉండండి. ‘‘అయ్యో, వీడు యమధర్మరాజు దగ్గరకు వెళ్ళిపోయినాడే! ఎంత కష్టం?’’ …. అని కించిత్తుగా కూడా మీరెవ్వరూ విచారించకండి. ఇందులో విశేషమేమున్నది? ఈ నా శరీరం - ఈ అందరి శరీరాలు ఈ రోజో - రేపో ఏదో మిషతో కాల గర్భంలో కలిసిపోయేవే కదా! ఈ భూమిమీదకు ఎన్నో దేహాలు వస్తున్నాయి. పోతున్నాయి. ప్రతి సంవత్సరం ధాన్యపు గింజలు కూడా మొలుస్తున్నాయి. అవి జనులు తింటున్నారు. ఆవిధంగా అవి నశించి పోతున్నాయి. ఈ అసంఖ్యాక దేహాలన్నీ అసంఖ్యాక ధాన్యపు గింజలవంటివే కదా! కనుక దేహాల రాకపోకలు పెద్ద విషయమేమీకాదు. ఇదిగో ఇప్పుడే నేను యోగబలంతో ప్రాణ ప్రసరణను స్థంభింపజేసి ఈ దేహమును చిత్తముతో త్యజించి యమపురికి వెళ్ళుచున్నాను! తల్లితండ్రులారా! సోదరులారా! పెద్దలారా! నాకు శలవు ఇప్పించండి.

⌘ ⌘ ⌘

ఇట్లా పలికి ఆ నచికేతుడు అక్కడే ఒక మూలగా ఉన్న ఖాళీ ప్రదేశములో ఆసీనుడై, క్షణంలో పద్మాసనం ధరించాడు. ప్రాణ - అపానములను స్థంభింపజేసాడు. సూక్ష్మదేహముతో ప్రాణములను సప్రాణ సమర్పణ చేయనారంభించాడు. అట్టి ప్రాణ నిష్క్రమణ ప్రక్రియతో ఒకడు తాను ధరించిన ఉంగరమునో, యజ్ఞపవీతమునో త్యజించినట్లు భౌతిక దేహం వదిలి, ‘సూక్ష్మదేహి’ (లేక) అతివాహిక దేహి అయి, ఇక అక్కడినుండి బయల్వెడలాడు. ‘‘యమ భగవానునికి దానంగా సమర్పించబడిన నేను, వారిని ఇప్పుడు దర్శించెదను గాక!’’ …. అనే మనో-ఉద్వేగంతో అప్పటికప్పుడే యమలోకపు ద్వారాలు సమీపించాడు.

⌘ ⌘ ⌘

ఆరుణి, సోమయాజి అగు వాజశ్రవసువు కుమారుని మాటలువింటూ బదులుపలికే ప్రయత్నంలో ఉండగానే, అంతా జరిగిపోయింది. నచికేతుడు యోగ ప్రక్రియతో ప్రాణములు స్థంభింపజేసాడు. మనస్సులో సర్వస్వదాన వేదమంత్రమును మననం చేస్తూ దేహం నుండి ప్రాణ-మనస్సులను బయల్వెడలదీసాడు. అంతా కూడా కొన్ని రెప్పపాటులకాలములో జరిగిపోయింది. వాజశ్రవసువు ఇదంతా చూస్తూ నిశ్చేష్ఠితుడై చతికిలపడి కూర్చుండి పోయారు. ఒక్కసారిగా ఆ వాతావరణమంతా ఆశ్చర్యకరంగాను, అక్కడి బంధుమిత్రులకు దుఃఖకరంగాను మారిపోయింది.

⌘ ⌘ ⌘

నచికేతుని యమద్వార ప్రవేశము

నచికేతుడు సూక్ష్మదేహి అయి (ఆతివాహిక దేహంతో - మనోదేహంతో) యమలోకంలో ప్రవేశించి యమలోకపు ప్రవేశద్వారాలు సమీపించాడు. అక్కడి యమలోకపు ద్వారపాలకులు నచికేతుని ద్వారం దగ్గరే ఆపివేశారు.

యమభటులు : ఓ నచికేత నామధేయ జీవాత్మా! నీయందు నరక ద్వారాన్ని ప్రవేశించే లక్షణములు కనబడటంలేదయ్యా| నీపట్ల ఇంకా నీ వర్తమాన భౌతిక దేహ సంబంధమైన ఆయువు తొణికిసలాడుతూ కనిపిస్తోంది. నీకు ఈ ద్వారాలు ప్రవేశించే అనుమతి లేదు. అయినా ఇక్కడికి ఎట్లా రాగలిగావు? వెళ్ళు వెళ్ళు! తిరిగి నీ భౌతిక దేహం ఆశ్రయించు.

నచికేతుడు : అయ్యలారా! నేను కర్మమార్గంగా ఈ నరకద్వారాలు సమీపించటం లేదన్నమాట వాస్తవమే! అయితే మా తండ్రిగారయిన వాజశ్రవసువు విశ్వజిత్‌ యాగ కార్యక్రమంలో అంతర్భాగంగా సర్వస్వదానంగా-యమధర్మరాజుల వారికి నన్ను సమర్పించారు. అందుచేత యాగవిధానము అనుసరించి నేను యమభగవానులవారి సేవకై ఇక్కడికి వచ్చాను.

యమభటులు : యాగకర్తచే ఫలప్రదాన రూపంగా నీవు యమభగవానునికి సమర్పించబడ్డావా! ఇటువంటి దానము మేము కనీ - వినీ ఎరుగమే! అయినా, …. ఇది మృత్యుద్వారం. ఈ ద్వారం గుండా భౌతిక దేహం నుండి మరణించినవారికి మాత్రమే ప్రవేశం ఇవ్వాలని మాకు నియమించబడిన ఆజ్ఞ. అందుచేత మిమ్ములను అనుమతించము. వెళ్ళు. దేహంలో తిరిగి ప్రవేశించు.

నచికేతుడు : పోనీ, ఒక సహాయం చేయండి. ‘‘శ్రీ వాజశ్రవసువు కుమారులలో మధ్యముడైన నచికేతనామధేయ జీవుడు విశ్వజిత్‌ యాగానంతరము చేస్తున్న సర్వస్వ-దానక్రియలలో పశుసంపదా సమర్పణగా తమకు సమర్పించబడి, మిమ్ములను సేవించటానికై ఇక్కడ వేచి ఉన్నాడు’’-అని మృత్యుదేవులగు యమధర్మరాజులవారికి తెలియజేయండి. నేను ఇక్కడే వారి ఆజ్ఞ కొరకై వేచి ఉంటాను.

యమభటులు : ఇదంతా భలేబాగున్నదయ్యా! మేము మా అధికారుల అనుజ్ఞలేనిదే ఈ ప్రదేశం విడచి వెళ్ళము. అయినా, యమధర్మరాజులవారు వేరేచోటికి వెళ్ళిఉన్నారు. 3 రోజుల తరువాతగాని రారు. అందుచేత, నీవు నీ భౌతిక దేహంలో ప్రవేశించు. ఇక వెళ్ళు! తరువాత అవన్నీ చూచుకోవచ్చు.

నచికేతుడు : ఓ మహానుభావులారా! యమభటులారా! యమధర్మరాజులవారికి యాగఫలప్రదానంగా సమర్పించబడటంచేత నేను వారి ఆజ్ఞా బద్ధుడను. వారి ఆజ్ఞలేనిదే ఎటూ వెళ్ళను. వారు వచ్చేవరకు ఇక్కడే వేచిఉండి, వారిని దర్శించుకుంటాను. అటు తరువాత వారు ఏవిధంగా ఆజ్ఞాపిస్తే ఆవిధంగానే అగుగాక! ఇక మీ పని మీరు చూచుకుంటూ ఉండండి.

⌘ ⌘ ⌘

ఈ విధంగా పలికి ఆ నచికేతుడు నరక ద్వారముల సమీపంగా యమధర్మరాజు రాకకై వేచి ఉండనారంభించాడు. యమభటులు ఇక చేసేదేమీలేక, …. తమకు విధించబడిన కార్యక్రమములలో నిమగ్నమైనారు.

ఈ విధంగా మూడు రోజులు గడచిపోయాయి.

మూడు రోజుల తరువాత ఒకానొక సమయంలో యమదేవులవారు మహిష వాహనులై నిజలోకంలో ప్రవేశిస్తూ రాజద్వారము వద్ద వేచిఉన్న నచికేతుని గమనించి కించిత్‌ ఆశ్చర్యచకితులైనారు. దివ్యదృష్టితో విషయమంతా గమనించారు. ఆ బాలుడిని సమీపించారు. ఆ బాలకుడు తటాలున లేచి లోకగురువగు యమధర్మరాజుకు సాష్టాంగ దండ ప్రణామములు సమర్పించాడు. అప్పుడు ఆయన చిరునవ్వుతో ఆ పిల్లవాని చెయ్యి పట్టుకొని తన అంతఃపురం వైపుగా తీసుకొని పోసాగారు.
అంతఃపురంలో తన రాణిని పిలిచి ఇట్లా అన్నారు.

యమధర్మరాజు : ఓ ప్రియసఖీ! ఈ పిల్లవాడిని చూచావా! ఈతడు తండ్రి చిరాకుగానో, పరాకుగానో పలికిన సర్వస్వదాన వేదమంత్రమును ఆశ్రయించి మనలోకంలో తనకు తానుగా ప్రవేశించాడు. ఈతడు మృతుడు కాదు. కాబట్టి ఈ విధంగా అగ్నిదేవుని రూపంగా మన ఇంటికి వచ్చిన ఈ బ్రాహ్మణ వటువు. మనకు అగ్నిదేవునితో సమానమైన అతిథి దేవుడు. వైశ్వానరః ప్రవిశతి అతిథి బ్రాహ్మణో గృహాన్‌| తస్య ఏతాగ్ం శాన్తిం కుర్వన్తి వైవశ్వతోదకం| వైశ్వా నరాగ్నిరూపంగా అతిథి గృహస్థుని ఇంట్లో ప్రవేశిస్తాడు. మనం వారిని గృహస్థ ధర్మంగా అన్న - పానములు సమర్పించి సశాంతింపజేయాలి కదా! అగ్నిరూపుడై వచ్చిన అతిథిని ఏ గృహస్తుడు ఆదరణగా వైవశ్వతోదక - అన్నపానాదులతో సశాంతింపజేయడో … అట్టి వెఱ్ఱి గృహస్థుని ఆశలు, ఆకాంక్షలు, సత్సంగఫలాలు, సత్యవాక్‌ మహిమలు, పొందవలసినవి, పూర్తి కావలసియున్న కార్యక్రమాలు భంగపాటు పొంది ఎదురువస్తాయి. కలసి రావలసిన కాలం వెనుతిరిగిపోతుంది. అందుచేత ఈ అతిథి దేవుని మనం సంతోషింపజేసి ఉత్తమ ప్రయోజనశీలురం అవుదాం.

ఓ బ్రాహ్మణ బాలకా! ఓ మా అతిథి దేవా! ఓ నచికేతా! నీ యొక్క శాశ్వతానంద శుద్ధ చైతన్యాత్మకు ప్రణామములు. మాపై కోపగించకు. హే బ్రహ్మన్‌! నమస్కారము. నీవు నా గృహానికి వచ్చి అతిథిగా ఉండి 3 రోజులు మాచే ఉదక అన్న పానాదులు సమర్పించబడకుండానే ఉన్నావు కదా! అందుచేత అందుకు ప్రతిగా నీకు 3 వరాలు ఇచ్చి నిన్ను సంతోషింపజేసి, దోషనివృత్తిని పొందాలని నేను నిర్ణయించుకొన్నాను.

మరొక విషయం. నీ అంతట నీవే దానం ఇవ్వబడినట్లుగా భావన చేసి మాలోకం వచ్చావని గమనించాను. నీకు ఇంకా కొన్ని సంవత్సరాలు భూమిపై నచికేత నామదేహముతో జీవించుటకై కాల-నిర్ణయమై ఉన్నది. నీవు మరల భూమిపై దేహముతో తిరిగి జీవించనున్నావు. కనుక ‘మరల జీవించాలి’ అని నీవు కోరుకోవలసిన పనిలేదు. అది నీకు ఉపలబ్దం అయ్యే ఉన్నదికదా! ఇక నీకు ఇప్పుడు ఇచ్చిన 3 వరాలు అడిగి స్వీకరించు. అతిథి అనశ్నదోషము (అతిథికి భోజనం పెట్టని దోషమును) నాకు కలుగకుండా, శాంతి - సంతోషములు కలుగజేయి.

నచికేతుడు : హే మృత్యుదేవా! మీ ధర్మ నిరతి అమోఘం| శ్లాఘనీయం| మీకు సమర్పించబడుటచే నేను సదా మీ సేవకుణ్ణే! మీ నిర్ణయమును అనుసరించి తిరిగి నచికేతనామధేయ దేహమును ధరిస్తాను. నా సర్వస్వమునూ ’‘మీ సేవయందు నియమించబడినట్టిది - మీకు చెందినది’’గా భావించి జీవితమును సేవక భావంతో కొనసాగిస్తాను. అట్లాగే మీ ఆజ్ఞను శిరసావహించే నిమిత్తమై మిమ్ములను ఇప్పుడు 3 వరాలు కూడా కోరుకుంటాను. మీకు పరమశాంతము - ఐశ్వర్యము అగుగాక! మీ కరుణకు, అనుగ్రహమునకు కృతజ్ఞుణ్ణి.

మొదటి వరము

నా మొట్టమొదటి వరము ఏమిటో అడుగుతున్నాను …. వినండి! ఓ వరప్రదాతా! నా తండ్రిగారైన వాజశ్రవసు నామధేయులగు గౌతములు ఆతురత తీరినవారై శాంత మనస్కులు అయ్యెదరుగాక! వేదనలన్నీ తొలగి సంతుష్టచిత్తులు అయి, నాపట్ల కోపతాపములు లేకుండా ఉండెదరు గాక! మీచే మరల సృష్టించబడిన నన్ను నా యథాతథమైన దేహముతో చూచి, గుర్తించి ప్రేమగా ఇతఃపూర్వంలాగా తన సమీపానికి ఆహ్వానించెదరుగాక! ఇది నేను కోరుకొనే మొట్టమొదటి వరం.

యమధర్మరాజు : అట్లే అగుగాక! మృత్యుముఖం నుండి వెలువడి, నాచే తిరిగి సృష్టించబడినప్పుడు నిన్ను చూచి ‘ఔద్దాలకుడు - ఆరుణి’ అయిన నీ తండ్రిగారు ఇదివరకటిలాగానే గుర్తిస్తారు. నిన్ను చూచుకొని రాత్రికి హాయిగా నిదురిస్తారు. ఆయనకు నీపై కోపం ఉండదు. పూర్వంలాగానే నీతో ఎంతో ప్రేమగాను, ఆప్యాయంగాను ఉంటారు. మంచిది. ఇప్పుడు నీ రెండవ వరం కోరుకో!

రెండవ వరము

నచికేతుడు : కృతజ్ఞుణ్ణి స్వామీ! ఇక రెండవ వరం కోరుకుంటున్నాను వినండి. హే మహాత్మా! మా లోకంలో మేము దేహబద్ధులమై, ఈ దేహముపై అవినాభావంతో దేహముపై ఆధారపడిఉన్నవారమై జీవిస్తూ ఉంటాం. ఎంతగా ఆయుష్షు ఉన్నప్పటికీ ఎప్పుడు మరణిస్తామో తెలియక ఎప్పటికప్పుడు కొంత భయపడుతూనే ఉంటాం. అయితే, …. మానవులు ఉత్తమ యజ్ఞములు ఆచరిస్తే స్వర్గలోకం లభిస్తుందని, అట్టి స్వర్గలోకంలో ‘‘అయ్యో! ఈ శరీరానికి ఎప్పుడు ఏమౌతుందో?’’ అనే మృత్యుభయం ఉండదని మా పురాణ, ఇతిహాస ప్రవక్తలు చెప్పుచూ ఉంటారు. స్వర్గలోకంలో వృద్ధాప్యముగాని, మృత్యువుగాని ఏమాత్రం ఉండవుట. అనగా అక్కడకు మీరు ప్రవేశించనే ప్రవేశించరు. అక్కడి వారికి ఆకలి - దప్పికలు కూడా ఉండవని వింటూ ఉంటాం. వారు శోకము - ఆదుర్దా - భయము - దిక్కుతోచకపోవటం … ఇటువంటివన్నీ అధిగమించివేసి ఉంటారట. అటువంటి స్వర్గలోకంలో ప్రవేశించటానికి సహకరించగల ’‘సులభము - సుందరము అయిన యజ్ఞము -యజ్ఞ విధానము’’నకు మీరు అధిదేవత అని, అట్టిది మీకు మాత్రమే సవివరంగా తెలుసునని నేను పెద్దలు చెప్పగా విని ఉన్నాను. ఓ మృత్యు అధినేతా! నిర్వర్తించటానికి అనేకమందికి సులభంగా ఉండే అటువంటి అగ్ని కార్యాన్ని (యజ్ఞమును) మీరు ఎఱిగియే ఉన్నారు కదా! దానిని నాకు దయతో ఉపదేశించండి. ఆ విధివిధానం మీ దగ్గర తెలుసుకొని ఇక్కడే నేను నిర్వర్తించే భాగ్యమును ప్రసాదించండి. ఇది నేను మా సహ మానవులకు ఉపదేశిస్తాను. అప్పుడు వారుకూడా ఆ యజ్ఞమును నిర్వర్తించి సులభంగా స్వర్గలోకం పొందటానికి అర్హులై ఆనందిస్తారు. నాకు ప్రాప్తించిన ఈ మీ సందర్శనము లోకములకు ఆవిధంగా ఉపయోగపడాలని నా అభిలాష. కనుక నాకు వరంగా ఆ స్వర్గ ప్రసాదితమగు యజ్ఞమును విధి-విధానంతో సహా ఉపదేశించి తద్వారా ఈ నా శిష్యత్వమును అంగీకరించండి.

యమధర్మరాజు : ఓ ప్రియ నచికేతా! నీ ఈ రెండవ వరం నాకు మరింతగా సంతోషం కలుగజేస్తోందయ్యా! అవును. అటువంటి సులభతరమైన అగ్నికార్యమును దేవదేవుడగు పరమేశ్వర ప్రసాదితంగా నేను ఎఱిగిఉన్నాను. ఆ అగ్నికార్యము అన్ని లౌకిక - పారలౌకిక కోర్కెలు తీర్చగలిగినది. అది యజ్ఞదకక్షులగు కొద్దిమంది వేదవిద్వాంసుల హృదయ గుహలలో దాగిఉన్నది. అది నీకు విధి - విధానంగా బోధిస్తాను. అంతేకాదు. సహజీవుల సుఖ - ఐశ్వర్యములను దృష్టిలో పెట్టుకొని అడిగావు కదా! నీ చరిత్ర లోకప్రసిద్ధమౌతుంది. నీవు ధన్యుడవవుతావు. నీచేత 3 సార్లు ఇక్కడే నిర్వర్తింపజేస్తాను. ఋత్విక్కులను, అధి దేవతలను, దిక్పాలకులను ఎట్లా ఆహ్వానించాలో, ఎట్లా మంత్ర ముగ్ధంగా అగ్నికార్యం ప్రారంభించాలో, ఏఏ మంత్రోచ్ఛారణలతో నిర్వర్తించాలో … ఇవన్నీ ముందుగా బోధిస్తాను. అటు తరువాత నీవు కోరినట్లుగా నీచేత 3 సార్లు నిర్వర్తింపచేస్తాను. అంతేకాదు. ఇంకొక విషయం. జగత్తుకు మూలమైన అగ్నిదేవుని ఆరాధనతో కూడిన ఈ యజ్ఞము ఇకముందు భూమిపై నీ పేరుమీదుగా ‘‘నాచికేత యజ్ఞము’’ అని యజ్ఞ శాస్త్రములందు ప్రసిద్ధమై ఉండుగాక! లోకమునకు - సహజీవులకు క్షేమము కలగాలని కోరే నీవంటి వారంటే నాకు ఎంతో ఇష్టం. అందుచేత, ఇదిగో! అనేక రంగుల పూలతో నిర్మించబడిన ఈ పూదండ (Garland)ను సన్మాన పూర్వకంగా బహూకరిస్తున్నాను. ఈ యజ్ఞమును 3 సార్లు ఎవ్వరు నిర్వర్తిస్తారో…. వారు మృత్యువు-మృత్యుతదనంతర దుర్భర స్థితులన్నీ త్రుటిలో దాటిపోతారు. జన్మ - మృత్యు మధ్యస్థితుల నుండి తరిస్తారు. ఈ నాచికేత యజ్ఞం బ్రహ్మదేవుని ముఖతః ప్రసాదించబడినది సుమా!

ఇట్లా పలికి యమధర్మరాజు నచికేతునకు
- యజ్ఞ పరికరాలు - యజ్ఞ విధానం
- అనుసంధానం - ధ్యాన - నిష్ఠాదులు
- యజ్ఞ పరిసమాప్తి - యజ్ఞ సమర్పణా విధానం
- లోకశాంతి - లోకకళ్యాణ ప్రవచన మంత్రాలు
- అవబృథ స్నానము
మొదలైనవన్నీ విధివిధానంగా బోధించారు. అప్పటికప్పుడే యమభగవానుని ఋత్విక్‌ - పర్యవేక్షణలో 3 సార్లు ఆ నచికేతుడు ’‘నాచికేత యజ్ఞము’’ను నిర్వర్తించి మృత్యు పాశముల నుండి విడివడినవాడయ్యాడు.

యమధర్మరాజు : ఓ నచికేతా! ఈ విధంగా ఈ నాచికేత యజ్ఞమును 3 సార్లు నిర్వర్తించి ధన్యుడవయ్యావయ్యా! ఇక ఇప్పుడు 3వ వరం నిస్సంశయంగా నీకు ఇష్టమైనది కోరుకో!

మూడవ వరము

నచికేతుడు : ఓ లోకగురూ! యమధర్మరాజా! మేము మానవులం అనివార్యంగా మృత్యువును పొందవలసినదే కదా! అయితే, ‘‘మృత్యువు తరువాత ఏమౌతుంది?’’ అనే విషయం అప్పుడప్పుడు శాస్త్రకారుల చర్చనీయాంశంగా ఉంటూ వస్తోంది. ‘‘మృత్యువు అను స్థితి ఎట్టిది? అటు తరువాత ఆ మృతుని స్థితి-గతులు ఎట్లా ఉంటున్నాయి?’’ అనే విషయంలో మా భూలోకంలో రకరకాల అభిప్రాయాలు జనులు కలిగి ఉంటున్నారు.

➤ 1.) మృత్యువు తరువాత జీవుడు ఉనికిని కలిగియే ఉంటాడు. ఆతడు నశించటం లేదు. దేహం మాత్రమే కోల్పోవుచున్నాడు. దేహి యథాతథం
➤ 2.) మృత్యువుతోబాటే దేహము - జీవుడు ఈ రెండూ నశిస్తున్నాయి.

ఈవిధంగా పరస్పర వ్యతిరిక్తమైన అభిప్రాయాలు, వాదోపవాదములు లోకంలో ప్రచారంగా ఉన్నాయి.

స్వామీ! ‘‘మృత్యువు తరువాత ఈ జీవునికి స్థితి ఎట్టిది?’’ …. అనే విషయం మీచే బోధింపబడినవాడినై తెలుసుకోవాలని అనుకుంటున్నాను.

మీరు నాకు సద్గురువులై ‘‘జీవాత్మ స్వరూప స్వభావములు - మృత్యువు - మృత్యుతదనంతరము’’ - అనే విషయాలు బోధించండి. ఇదే నేను మిమ్ములను అభ్యర్థించే 3వ వరం.

యమధర్మరాజు : ఓయీ నచికేతా! ఆశ్చర్యం! అతి సంక్లిష్టమైన పెద్ద విశేషమే అడిగావు. నీవు మృత్యువు గురించి అడుగుతావని ఊహించనే లేదయ్యా! నీవు అడగటం మంచిదే! కానీ, అది దేవతలంతటి వారికి కూడా అంత సులభంగా అర్థంకాని విషయం. నీవా, ఒక 7 సంవత్సరాల మానవ బాలకుడివి కదా! అది అంత తేలికగా అర్థం అయ్యే విషయమేమీ కాదు. ఎందుకంటే అది అత్యంత ప్రజ్ఞ - సూక్ష్మదృష్టి కలవారికి మాత్రమే అవగతం అవుతుంది! అందుచేత నీవు నీకు ఇష్టమైన ఇంకేదైనా వరం కోరుకో! అంతేగాని. మృత్యువు - మృత్యు తదనంతర స్థితిగతుల గురించి మాత్రం మరల నన్ను అడుగవద్దు సుమా! సృష్టిలో ఏదైనా విశేషమును వరంగా కోరుకో. అంతేగాని, సృష్టికి అతీతమైనది కోరుకోకు.

నచికేతుడు : ఆహాఁ! దేవైః అత్రాఽపి విచికిత్సితం కిల! అది దేవతలంతటి వారికి కూడా సందేహాలు కలగించేంతటి విషయమా! ఆశ్చర్యమే! అనగా, మీరే ఒప్పుకుంటున్నారు కదా, … మృత్యు విషయంలో చాలా చాలా మందికి సందేహాలు ఉంటూ ఉంటాయని! మానవుణ్ణి, అల్పజ్ఞుడిని. నాకు సందేహం కలగటంలో ఆశ్చర్యమేమున్నది? … మీరో, మృత్యుదేవత! మృత్యు వ్యవహారానికి అధిపతి. (You are the Authority for the Concept of Death). అంతటి మీ వద్దే నాకు అది తెలియకపోతే, ఇక నాకు చెప్పగలిగేవారెవరు తారసపడతారు చెప్పండి? అందుచేత నాకు ‘‘మృత్యువు-మృత్యుతదనంతర స్థితి’’ గురించే వరరూపంగా బోధించండి. మరింకే వరమూ నాకు అవసరం లేదు.

యమధర్మరాజు : నాయనా! నచికేతా! నా మాట విను. ఏతత్‌ తుల్యం యది మన్యసే వరం వృణీస్వ| ‘మృత్యువు యొక్క స్థితి-గతుల గురించి మాత్రం నన్ను అడగకయ్యా! నీకు ఇంక ఏం కావాలన్నా సరే, కోరుకో! నిండు నూరేళ్ళు ఆయుష్షు కావాలా? అడుగు. ముద్దులొలికే కుమారులు, మనుమలు, మునిమనుమలు కావాలా? గొప్ప పశు సంపద ఏనుగులు-బంగారం వంటివి కావాలా? గుఱ్ఱాలు మొదలైన గొప్ప సంపదలు కావాలా? అతి విశాలమైన భూమికి యజమానివి కావాలా? కోరుకో! కాదూ? ’‘నేను బతకాలని అనుకున్ననాళ్లూ బ్రతికి ఉండాలి’’ అని అడుగుతావా? నీకు ఇచ్ఛా మరణం వరంగా ఇస్తాను. నీవు అడిగిన వరంతో సమానమనుకునే మరింకే వరమైనా సరే, ప్రసాదిస్తాను. సువిశాలమైన అనేక భూములు నీకు సొంతం కావాలా? పోనీ, ‘ఏది కోరుకుంటే అది నాకు వెంటనే లభించాలి’’ అని కోరుకొంటావా? సరే కోరుకో. మీ మానవ లోకంలో ఏఏ అభీష్టాలు నెరవేరటం అతిదుర్లభమని జనులు అనుకుంటూ ఉంటారో, అటువంటిది ఏదైనా సరే,…. అడుగు. సుందరకన్యలు, రథాలు, నిరంతరం నీ గుణ-గణాలు అనేకమంది పొగిడే గొప్ప గొప్ప పేరు ప్రతిష్ఠలు, ఎత్తైన భవనాలు-ఇవన్నీ నీకు లభించేటట్లు చేస్తాను. అందుచేత నచికేతా! ‘‘మృత్యు తదనంతరం స్థితి ఏమిటి?’’ - అనే ప్రశ్న మాత్రం విరమించు. సరేనా? ఏదీ? ఇంకేం కావాలో నీ మూడవవరం అడుగు.

నచికేతుడు : స్వామీ! మీకు తెలియనిది ఏమున్నది? శ్వోఽభావో - మర్త్యస్య యత్‌, అన్తక| ఏతత్‌| ఓ అన్తక దేవా! ఈ మా భౌతిక దేహాలు ఎప్పుడు నేల కూలుతాయో ఎవ్వరం చెప్పగలం? రేపటి రోజుకు ఇవి ఉంటాయో ఉండవో కూడా నమ్మజాలము. ఇక ఈ ఇంద్రియాలున్నాయి చూచారా! ఇంద్రియాణాం జరయన్తి తేజః| ఇవి కొద్దికాలం మమ్ములను అలరించినప్పటికీ, క్రమక్రమంగా కాలానుగతంగా తమ తేజస్సును పోగొట్టుకొంటూ ఉంటాయి. ఇటువంటి ఇంద్రియాలతో మేము పొందే విషయాల వలన మాకు ఒరిగేదేమున్నది? ఏమి ఆనందము? ఏమి ప్రయోజనం? ఏమి లాభం? అటువంటి ఇంద్రియ విషయములు, వస్తువులు మీ వంటి మహనీయులు మాకు ఇస్తే ఏమున్నది? మేము పుచ్చుకొని సంతోషించేదేమున్నది? అపి సర్వం జీవితమ్‌ అల్పమేవ| అసలు ఈ జీవితమే అతి స్వల్పకాల పరిమితం కదా! అందుచేత మీరు నాకు ప్రసాదిస్తానన్న నృత్యగీతాలన్నీ దయచేసి మీ దగ్గరే అట్టేపెట్టేసుకోండి, స్వామీ! అవన్నీ నాకు అవసరమే లేదు. నేను ‘మృత్యువు’ గురించే తెలుసుకోవాలి.

అయ్యా! మీరు సిరులు ప్రసాదిస్తానని కనికరించారు. బాగానే ఉన్నది. అయితే మా మానవులలో సిరులు పొంది అనుభవిస్తున్నవారు చాలా మంది ఉన్నారు. కానీ ఏం లాభం! వారు వాటితో తృప్తి పొందటమే లేదే! తృప్తి పొందనప్పుడు ఎంత పొంది ఏం లాభం చెప్పండి! సిరులు లేనివారు ‘‘అయ్యో! మాకు ఆ గృహాలు - ఆరామాలు - వాహనాలు - ధనరాసులు లభిస్తే ఎంతబాగు!’’ అనుకుంటున్న మాట నిజమే! కానీ, అవన్నీ లభించిన వారిలో ‘‘మరింకేమీ అవసరం లేదు’’ అనే తృప్తి - సంతోషాలు అగుపించటం లేదే! అయినా మహాత్మా! మీవంటి మహనీయుల - మహత్‌ పురుషుల దర్శనం అయిన తరువాత ఇక నావంటి జీవులకు ఇక లోటేముంటుంది? (మహాపురుష సంశ్రయః|). మహనీయులగు తమ ఆశ్రయముకంటే మహద్భాగ్యం భూమిపై మరొకటుంటుందా? ఉండదు. నాకు అవసరమైనవి అవసరమైనంతవరకు మీ దర్శన ప్రభావం చేత వాటికవే లభిస్తాయి.

ఇంకొక విషయం కూడా! మీరు ఎంతవరకు అనుమతిస్తారో, నిర్దేశిస్తారో అంతవరకు ఈ దేహముతో భూమిపై మేము సంచరిస్తూ ఉంటాము. ఎప్పుడు మీ సొత్తు అయిన ఈ దేహమును మీరు స్వీకరించాలని అనుకుంటారో, మరుక్షణం ఇది మీ పాదాలు చేరుతుంది. దేహంతోబాటే ‘నావి’ అనుకొన్నవన్నీ మరునిముషం మరెవరివో అయిపోతాయి. కాబట్టి ఈ దేహంతో అనుభవించే వస్తు - విషయ - స్థితి - గతుల గురించి మిమ్ములను వరంగా ప్రార్థించాలని నాకు ఏమాత్రము కించిత్‌కూడా అనిపించటం లేదు. అందుచేత ‘‘మృత్యువు - మృత్యు తదనంతర స్థితి-గతులు’’ గురించి జ్ఞాన భిక్ష ప్రసాదించండి. నాకు అంతే చాలు.

హే భగవన్‌! మహాత్మా! మేము చావు - పుట్టుకల మధ్య చిక్కుకొని అవిశ్రాంతంగా పరిభ్రమిస్తున్న కీటక జీవులం. ఇక మీరో! మార్పు-చేర్పులకు అతీతమైన కాల స్వరూపులు. అమృత స్వరూపులు. ఎక్కడో భూలోకంలో ఒక దేహమును ఆశ్రయించి ఉన్న నాకు నా పితృ దేవుల యాగ మహిమా విశేషం చేత ఈ రోజు మీ దర్శన భాగ్యం లభించింది. అట్టి పరమోత్కృష్టమై, మానవులకు సామాన్యంగా అలభ్యమై ఉండే - మీ దర్శనం లభించిన తరువాత ఇక మేము సుదీర్ఘ జీవితం, ధన - గృహ - వస్త్ర - భూ - రాజ్య సంపదలు కోరుకోవటమంటే, …. అంతకన్నా తెలివితక్కువతనం ఇంకెక్కడన్నా ఉంటుందా చెప్పండి? మీ దర్శనం చేసుకొని ఇక అల్ప వస్తువులను కోరుకోవటమంటే … మహారాజు దయకు పాత్రులమై తినుబండారాలు కోరుకోవటం వంటిది కదా? మీ దయకు పాత్రుడనై కూడా మా లోకంలో భౌతిక సంపద - దీర్ఘాయుష్షు మొదలైనవి వరంగా కోరుకోవటం తెలివితక్కువ కాదా మరి?

స్వామీ! నేను మృత్యువు గురించి సహచరులతో సంభాషించియే ఉన్నాను. అయితే నాకు సమగ్రమైన - నిర్దుష్టమైన అవగాహన లభించలేదు. కాబట్టి ‘‘మృత్యు తదనంతరం’’ అనే విషయమై మీ ప్రవచనము - బోధ వినాలని నేను నిర్ణయించుకున్నాను. ఎందుకంటారా? ప్రతి ఒక్క జీవుడు ఎప్పటికో - అప్పటికి మృత్యువులో ప్రవేశించటం అనివార్యం కదా! మరి జనులు మృత్యువు గురించి తెలుసుకోకపోతే ఎట్లా చెప్పండి? అందుచేత కూడా, ఈ నచికేతుడు మీవంటి జ్ఞాన సిరుడగు మహనీయుని నుండి మరింకేమి కోరుకోడు. నాకు మృత్యువు - మృత్యుతదనంతర స్థితి-గతుల గురించి మాత్రమే వివరించి జ్ఞానమును ప్రసాదించండి. నన్ను పవిత్రునిగా తీర్చిదిద్దండి. నాపై మీ బోధామృతమును వర్షింపజేయండి. నమో నమః|


(2.) ద్వితీయ వల్లీ - నాయమాత్మా ప్రవచనేన లభ్యో

శ్రీ యమధర్మరాజు : ఓ నచికేతా! నీ పట్టుదల నాకు ఎంతో సంతోషాన్ని కలిగించిందయ్యా! చాలా మంచిది!
అవును. ఈ జీవుని ఈ దృశ్య ప్రపంచం నుండి నిరంతరం రెండు వేరువేరు రకాలైన విశేషాలు సమీపిస్తున్నాయి. అవి ఏమిటో చెపుతాను, విను. అన్యత్‌ శ్రేయో| అన్యత్‌ ఉతైవ ప్రేయః|

1. ప్రేయస్సు: ఇంద్రియములకు ప్రియంగా ఉంటాయి. కానీ కాలక్రమేణా వాటిని ఆశ్రయించినవారిని జన్మ-కర్మ బద్ధులుగాను, లోకవ్యవహార నిబద్ధులుగాను చేసివేస్తూ ఉంటాయి. వీటిని ఆశ్రయించిన వారు ఏ ఆశయంతో పుట్టారో-అది పొందలేక చివరికి జీవితాశయము నుండి, లక్ష్యము నుండి పతనం(చ్యుతి) పొందుతున్నారు. ఏ ఉద్దేశ్యముతో ఈ ‘మానవజన్మ పొందాలి’ అని భావించి ఎంతో శ్రమించి ఈ అవకాశము సంపాదించుకొన్నారో, … అదీ జీవితమహదాశయం. అంతేగాని ఇక్కడ ఏదో పొందటము, కలిగియుండటము, సొంతమనిపించుకోవటం, చివరకు వదలి ఎటో పోవటము - ఇవి జన్మకు ముందటి ఆశయాలు కావు కదా! ఇంద్రియ ప్రియములైన దృశ్య విశేషాలు వాస్తవమైన క్షేమమును ప్రసాదించజాలవు.

2. శ్రేయస్సు : ఇవి కూడా ప్రతి జీవుని సమీపిస్తూనే ఉన్నాయి. అయితే అవి పైకి (ఇంద్రియములకు) ప్రియంగా కనబడకపోవచ్చు. కానీ ఈ దేహము పొందిన జీవునికి దేహ - దేహానంతరము కూడా శుభప్రదము, సుఖప్రదము, ప్రశాంతప్రదము అయిఉంటున్నాయి. (దైవీగుణములు, భక్తి-జ్ఞాన-యోగసాధనలు మొదలగునవి శ్రేయోపదములు).

అయితే, ఈ జీవులు చేస్తున్నదేమిటి? అనేకమంది తమను సమీపిస్తున్న విషయ పరంపరలను, వ్యవహారముల పర్యవసానములను పరిశీలించటం లేదు. ‘‘ఇది ప్రేయస్సా? శ్రేయస్సా?’’ అని విచారణతో గమనించకుండానే వాటిని ఆశ్రయిస్తున్నారు. మందబుద్ధి గలవాడేమో వివేచన చేయకుండా ప్రేయోమార్గం అనుసరిస్తూ ఇంద్రియములకు ప్రియంగా ఉండే వస్తు - విషయ - వ్యవహార పరంపరలను కోరుకుంటున్నాడు. శ్రేయో హి ధీరో అభి ప్రేయసో వృణీతే| సుతీక్షణము, సునిశితము, విస్తారము, ఉత్తమము (sharp and highter strata) అయిన బుద్ధిగలవాడు శ్రేయ - ప్రేయ పర్యవసానములను ముందుగానే గమనిస్తున్నాడు. ప్రేయస్సును ప్రక్కకి నెట్టి, శ్రేయో విశేషములనే అభిప్రేయముగా (అత్యంత ఇష్టముగా) కోరుకొని బాగుపడుచున్నాడు. ‘జీవితము’ అనే అవకాశమును సద్వినియోగపరచుకుంటున్నాడు.

ప్రేయోమార్గం అనుసరించువాడు దృశ్యములో - ‘‘అవి కావాలి - ఇవి కావాలి’’ అని మననం చేస్తూ యోగ క్షేమాలను (ఏవో ఇంకా లాభించాలని, ఉన్నవి పోకూడదని) ఆశిస్తూ, ఆశ్రయిస్తూ నిమ్న మార్గాలు (The paths paving way to lower physical forms) కోరి తెచ్చుకొంటున్నాడు.

శ్రేయోమార్గం ఎన్నుకొన్న ధీరుడు ఇక ‘‘ప్రపంచంలో ఏదో పొందాలి? ఏదో కావాలి? ఏదేదో తొలగాలి. ఎక్కడికో వెళ్ళాలి. ఇప్పటికి ఇది సంపాదించి, అది ఎప్పటికో ఏదో విధంగా అట్లా పొందాలి.’’ …. ఇటువంటి ప్రేలాపనలన్నీ మొదలంట్లా త్యజించి ఉంటున్నాడు. ‘‘నాకు శాశ్వతమైన శ్రేయస్సు ఏమార్గంలో, ఏ ప్రవర్తనచే, ఏ ప్రయత్నంతో, ఏ అవగాహన వలన, ఏ అభ్యాస ఫలంగా, ఏఏ కార్యక్రమాల ద్వారా సిద్ధిస్తుంది?’’ … అని బుద్ధితో గ్రహించి జీవితాన్ని సార్థకం చేసుకుంటున్నాడు.

ఓ నచికేతా! నిన్ను చూస్తే నాకు చాలా సంతోషంగా ఉన్నదయ్యా! ఎందుచేతనంటావా? స త్వం ప్రియాన్‌ ప్రియరూపాశ్చ కామా, న అభిధ్యాయన్‌, నచికేతో! అత్య్రసాక్షీః| పైపైన - ప్రియరూపంగా ఉండే వస్తుజాలాన్ని కోరుకోకుండా, ప్రక్కకునెట్టివేస్తున్నావు. పరతత్త్వాన్ని కోరుకుంటున్నావు. జనులలో అనేకులు ఈ దృశ్యజగత్తులో ఏవేవో పొందాలనే ఆవేశంతో, ఏదో పొందలేదనే ఆవేదనలలో మునిగి తేలుతూ ఆయుష్షునూ, అవకాశాలనూ బూడిదపాలు చేసుకుంటున్నారే! అవును| నీవు తలచినట్లు, చెప్పినట్లు అవిద్య - విద్య …. ఈ రెండు ఒకదానితో మరొకదానికి సాపత్యమెక్కడిది? ఈ రెండూ ఒకదానికి మరొకటి బహుదూరమైనవి. అవిద్య ఉన్నది చూచావూ! దాని అంతిమ ఫలితాలన్నీ ఆనందమునకు దూరంగాచేసివేసేవే! విపరీత ఫలాలను తెచ్చి పెట్టేవే! ఈ లోకంలో అనేకమంది గొప్ప విషయాలనుకొనే ధనము, ప్రతిష్ఠ, గృహాలు, రాజ్యాలు - ఇవన్నీ చూచుకొని వాటిలో మునిగి తేలుతూ ఆశ-నిరాశ-దురాశ-పేరాశల జాడ్యంతో తమకు కలుగబోయే తదనంతర విపరీత పరిణామాలేమిటో గమనించటమే లేదు సుమా! అనేకులను క్షణంలో ప్రలోభంలో ముంచెత్తుతున్న ప్రాపంచిక సంపదా వ్యవహారాలు నీవు కోరుకోనేలేదు. మంచిది! ’విద్య’ను కోరుకున్నావు. న త్వా కామా బహవో లోలుపన్త|

కొందరి గతిని చూస్తూ ఉంటే నాకు ‘‘అయ్యో!’’ అనిపిస్తోందయ్యా! - అవిద్యాయాం అన్తరే వర్తమానాః, స్వయం ధీరాః పండితం మన్యమానాః| ‘‘ఎప్పుడో ఏదో జరుగుతుందంటే, ఇప్పుడెందుకు విచారం! ఇప్పటికి ఎట్లాగొట్లా హాయిగా తిని - త్రాగి-పొంది- ఏదైనా చేసి ఆనందిద్దాం. ఇప్పుడు హాయిగా ఉండటం, తినటం, త్రాగటం, అనుభవించటం, ఏదో మార్గంగా ఇంత సంపాదించి సొమ్ము చేసుకోవటం, వెనుక వేయటం ముఖ్యం. ఇక అధ్యాత్మ విద్యా? అది ముసలివాళ్ళం అయిన తరువాత చూచుకుందాం! తొందరేమీ లేదు’’… అని తలుస్తున్నారు. శాస్త్రములు హెచ్చరిస్తూనే ఉన్నాయి. తాను వినరు. వినకపోగా, వినేవారిని చూచి అవహేళన| ‘‘మాకన్నీ తెలుసు| ఏమిటి ఈ శాస్త్రాలు? ఎందుకొచ్చిన భక్తి - జ్ఞానాలు?’’ అని తలచి వాటిని తిరస్కరిస్తున్నారు. ‘‘ఆఁ! పుణ్యం లేదు. పాపం లేదు. జ్ఞానం లేదు. శాస్త్రం లేదు. ఇప్పుడు హాయిగా ఉంటే చాలదూ’’! అని కూకలిడుతున్నారు. ‘‘హాయిగా ఉండక ఎందుకొచ్చిన సాధనలు? ఏమీ అవసరం లేదు. మాకు తెలియదా? పిచ్చి వాళ్లే శాస్త్రవిధులు - గుళ్ళు - గోపురాలు - సాధనలు - పూజలు అంటూ ఉంటారు. వాళ్లే తెలివితక్కువ వాళ్ళు! మేమే తెలివిగలవాళ్ళం. ధనము, హోదా, అధికారం, పేరు, ప్రతిష్ఠ, ఇళ్ళు, వస్త్రాలు, స్త్రీ సహవాసాలు - ఇవన్నీ ముఖ్యం. మూలకూర్చుని ఏదో దేవుడు - భక్తి - యోగం - జ్ఞానం అనుకుంటూ చివరికి ఏమీ పొందక ఏడుస్తూ కూర్చోవాలా?’’ … అని తమ ‘కుమార్గం’ ప్రచారం చేస్తున్నారు.

అట్టివారు ఆయా ప్రాపంచిక విషయాలలో పడుతూ లేస్తూ అనేక సుఖ-దుఃఖాలకు దాసులై వర్తిస్తూ, మరొక వైపుగా ‘‘శ్రేయోమార్గం’’ వైపు ప్రయాణించే వాళ్ళని చూచి అపహాస్యం కూడా చేస్తున్నారు. ఇది ఎట్లా ఉందంటే,… తానే గ్రుడ్డివాడు. ఇక తాను గ్రుడ్డివాడైన మరొకరిని నడిపించటం! ప్రేయోమార్గం ప్రచారం చేసేవారు అట్టివారు. అంధేనైవ నీయమానా యథా అంధాః|

ఆశ్చర్యం చూచావా? ‘‘సాంపరాయము (దేహమునకు ఆవల) నా స్థితి - గతులు ఎట్టివి?’’ అని అనేకమంది జనులు పరిశీలించరాయె! అవును. న సాంపరాయః ప్రతిభాతి బాలం| ప్రమాద్యంతే విత్త మోహేన మూఢమ్‌| పసిబాలురవంటి వారికి ఏది తెలుసుకోవాలో, ఏది ఏవిధంగా ఉద్దేశ్యించి ఆచరించాలో ఏం తెలుస్తుంది? ఈ ధన - మాన - జన వ్యవహారాలలోపడి అజాగరూకులై అహంకార-మమకారాలను పరిపోషించుకొని జీవిస్తూ ‘‘ఆహాఁ! ఇదీ బ్రతుకంటే!’’ అని అనుకుంటున్నారు. తమ గతి తెలియకపోయినా జ్ఞానము దృష్ట్యా అజాగరూకమైన భౌతిక విషయాలు ప్రచారం చేసుకొంటూ పోతున్నారే! ‘‘ఇప్పుడింతే! తినటం! త్రాగటం! సంపాదించటం! అనుభవించటం! ఇక ముందు లేదు. తరువాత లేదు. ఎవడు చూడొచ్చాడు! ఇప్పటి తరువాత గురించి ఆలోచించకండి. ‘అయం లోకో, నాస్తి పర|’ - ఇతి మానీ| మృత్యువు తరువాత ఏమౌతుందో ఇప్పుడెందుకు? ఇప్పుడు ఇక్కడ ఇంతవరకు చూచుకుందాం! అంతే! ఆ తరువాత గురించి ఇప్పుడేమీ చెప్పకండి!’’ …. అని బోధిస్తూ తమను తామే మోసం చేసుకొంటున్నారు. ఇతరులను కూడా మోసం చేస్తున్నారు. ‘‘చదువెందుకు? హాయిగా అల్లరి చేద్దాం. తరువాత సంగతి తరువాత చూచుకుందాం’’ అని పలికే పిల్లవాళ్ళ గోలలాగా ఉన్నాయి, …. అనేక మంది జీవుల జీవిత వ్యవహారాలు! అటువంటి అజ్ఞానులగు జీవుల గతి ఏమిటంటావా? జీవితమంతా వృధాగా గడిపి చివరికి నా పాశాలలో మరల మరల అనేకసార్లు చిక్కుకుంటున్నారు. పునః పునః వశమ్‌ ఆపద్యతే మే|

ఓ నచికేతా! నీవు ‘‘మృత్యువు తరువాత జీవుని స్థితి ఏమిటి?’’ అనే అత్యంత ప్రాముఖ్యమైన ప్రశ్నకు వచ్చావు. మంచిది. నీకు కొన్ని తాత్త్విక రహస్యాలు చెపుతాను. ‘‘పరతత్త్వము’’ మహనీయ ప్రతిపాదితమైనది. అట్టి శాస్త్ర - మహనీయ ప్రవచితమైన తత్త్వ విశేషాలు చెప్పుచూ ఉండగా మృత్యువుగురించి నీకు అవగతమౌతుంది. అయితే తాత్త్విక విశేషాలు నీకు బోధించబోయే ముందు ఒక్కమాట చెపుతాను. విను. శ్రవణాయామ్‌ బహుభిః యో న లభ్యః| శృణ్వంతోఽపి బహవో యం న విదుః|

మనం ఎంతగానో తత్త్వశాస్త్రం చెప్పుకోవచ్చు. చెప్పుకోవాలికూడా! మంచిదే. అయితే కేవలం విన్నంత మాత్రం చేత తత్త్వజ్ఞానం లభిస్తుందా? శాస్త్రజ్ఞానం వేరు. తత్త్వానుభూతి వేరు. అందుచేత వినే విశేషాలు నీకు నీవు అనుభవైక వేద్యం చేసుకోకపోతే నీవు విని ఏం లాభం? నేను వినిపించి ఏం ప్రయోజనం. అది ఎంతగానో వినినా లభించకపోవచ్చు. ఎంతగానో చెప్పినా, … ఆ చెప్పేవాడికే అనుభవం కాకనూపోవచ్చు కూడా! కనుక ఈ చెప్పటం - వినటం మనిద్దరికి స్వానుభవమైనప్పుడే ఇరువురికి ప్రయోజనం!
- అశ్చర్యో వక్తా కుశలో అస్య లబ్ధాః| ఆశ్చర్యో జ్ఞాతా కుశలా అనుశిష్టః|
చెప్పేవాడు అత్యంతాశ్చర్యమైన ‘‘చెప్పే చాతుర్యం’’ కలవాడు ….,
వినేవాడు మహత్తరమైన ‘‘వినే చాతుర్యం’’ కలవాడు …,
అయినప్పుడే మన ఈ గురు - శిష్య సంవాదము మనకు ఉత్తమ ప్రయోజనం ప్రసాదించ గలదు. మనకు అనుభవైకవేద్యం కాగలదు. కనుక నేను అత్యంత శ్రద్ధ - కుశలతలతో నీకు బోధించగలగాలి. నీవు శ్రద్ధ - కుశలతలతో వినగలగాలి. సర్వాత్మకుడగు పరమేశ్వరుని కరుణచే మన ఈ గురు - శిష్య సంబోధనా క్రమము అగు పరమాత్మ జ్ఞానము ఉభయ కుశలంగా ప్రకాశించునుగాక!

⌘⌘⌘

మొట్టమొదట నీవు ‘‘మృత్యు తదనంతర స్థితి’’ అనే విషయం గురించి అడిగినప్పుడే నేను ఎంతో సంతోషించాను. అయినా కూడా నీకు అనేక లోక సామాన్యములైన ప్రలోభాలను (గృహాలు - రాజ్యాలు - స్త్రీలు - దీర్ఘాయుష్షు - సంపద - ప్రాభవము (popularity) మొదలైనవి) వరాలుగా ఇవ్వబోయాను. ఎందుకో తెలుసా? తత్త్వజ్ఞానమునకు నీవు సంసిద్ధుడవో కాదో - కొంచెం పరీక్షించాను. ప్రాపంచక విశేషాలు - సంపదలు మొదలైన వాటిపట్ల దృష్టి - ఆకర్షణ జయించనివారికి తత్త్వశాస్త్రం చెప్పటం చెవిటివాని ముందు శ్రావ్యంగా - లయబద్ధంగా శంఖం ఊదటం వంటిది. అట్టి ప్రవచనము వలన నీకూ - నాకూ ప్రయోజనం ఉండదు. ప్రాపంచకమైన ‘‘దృష్టి - ధ్యాస - భావన - ఆశ - అభిప్రాయము - అభిరుచి - ఉద్దేశ్యము’’ మొదలైనవన్నీ సమబుద్ధిచే క్రమంగా అధిగమించాలి. అట్లా అవగాహన సంపాదించుకున్నవాడు మాత్రమే అతి సూక్ష్మమగు విషయాలు గ్రహించ గలుగుతాడు. ప్రాపంచక ప్రయోజనములను అధిగమించలేని బలహీనులకు ఎంతగా చెప్పినా, వారు మరింకెంతగానో వినినా, విచారణ చేసినా అట్టివారు (నీవు తెలుసుకోవాలనుకున్న) మృత్యు తదనంతర స్థితి-గతి విశేషాలు గ్రహించలేరు.

ఎందుచేతనంటే….,
‘‘దేహ సంబంధముచేత ఏర్పడిన అనుబంధరూపము - అనతగిన ఇంద్రియ విషయ ప్రపంచమే- నాయొక్క స్వరూప పరిధి’’ అను బలీయమైన బుద్ధితో తన్మయుడై ఉన్నవానికి - ‘‘ఎప్పటికీ యథాతథము, దేహ వ్యవహారములకు ఏమాత్రము సంబంధించనిది, సర్వదా కేవలము అగు స్వస్వరూపము’’ గురించి బోధించటమెట్లా?

ఇంకొక విషయం. అనుభవజ్ఞులగు మహనీయుల దగ్గర చేరి వారివద్ద విని తెలుసు కోవలసినదే ఈ ‘ఆత్మ విద్య!’, అది గ్రహించటానికి వేరే ఉపాయం లేదు. ఎందుకంటే అది ప్రపంచమును అధిగమించి పరిశీలించటం వంటిది. అంతేగాని ప్రపంచంలోని ఒక వస్తువునో - విషయమునో చూచి ఇంద్రియములతో గ్రహించటంవంటిది కాదు. అది అణువుకంటే అతి సూక్ష్మమైన విషయం. కేవలం తర్క - వితర్కములు చేస్తే గ్రహించగలిగేది కాదు. అనుభవజ్ఞులగువారు - వారియొక్క స్వానుభవదర్శనము వివరించి చెప్పితే మాత్రమే గ్రహించగలం. (తదితర శాస్త్రాలవలె అది తెలివితేటలున్నంత మాత్రాన, ఏదో చదివియో, తర్కించియో మరుక్షణం గ్రహించబడేది కాదు).

సుజ్ఞానులగు మహనీయులు ఉన్నారు.
- వారివద్ద శ్రద్ధగా విని వారి అనుభవము - అనుభూతులను గ్రహించాలి.
- ప్రాపంచిక విషయాలను ప్రక్కకునెట్టగల బలమైన - సుతీక్షణమైన బుద్ధితో విని అవగాహన చేసుకోవాలి.

ఏ పరమ సత్యము గురించి నీవు ‘‘తెలుసుకోవాల్సిందే’’ అనే సత్యధృతి - పట్టుదల - ఉత్సాహము చూపించావో, … అట్టి సంసిద్ధత లేకపోతే అద్దానిని ఎవ్వరూ గ్రహించనే లేరు. ‘‘ప్రాపంచక సంబంధములు ఎట్లాగన్నా ఉండనీ… నాకు మాత్రం నా గురించిన సత్యము తెలియవలసిందే’’ - అనే ’సత్యధృతి’ని ప్రకటించావు. నాకు సంతోషము, ఆశ్చర్యము కూడా (నీ పట్టుదలను చూచి) కలుగుచున్నాయి.

అవును. నీవు చెప్పింది వాస్తవమే!

ఈ జగత్తులో జీవించి ఉన్నంతవరకు అనేకమంది జీవులు ఏవేవో విశేషాలు - వస్తు జాలములు మొదలైనవి పొందాలని తాపత్రయం పొందుచున్నారు. నాకూ తెలుసు! అదంతా వృథా ప్రయాసయే! అట్లా ఏది పొందాలని అనేకమంది జనులు విశేషంగా ఉత్సాహపడుచున్నారో - అవన్నీ అనిత్యము. అధృవము. న హి అధృవైః ప్రాప్యతే హి ధృవమ్‌ తత్‌| అనిత్యమైన వస్తువు పొందాలనే ఆశయం నిత్యమైన ఆనందాన్ని అందించగలదా? లేనే లేదు. జనులు ఇది గ్రహించక యజ్ఞాదులను అనిత్యమగు స్వర్గాది లోకాల కొరకై నిర్వర్తిస్తూ, చివరికి అనిత్యమైనవి పొంది నిత్యా నందమును (లేక) అను నిత్యమగు ఆత్మ స్థానమును అందుకోలేక పోతున్నారు. (They are missing permanent happiness). ఇప్పుడు నీకు నచికేత యజ్ఞం చెప్పాను చూడు! అటువంటి సర్వయజ్ఞాలు అనిత్య ద్రవ్యములతో నిర్వర్తించబడేవే! వాటి లోక సంబంధమైన కర్మఫలములు అధృవమే. అయితే అనిత్య ద్రవ్యములతో నిర్వర్తించబడే యజ్ఞాదులు నిత్యమైన పరతత్త్వమును (ఆత్మజ్ఞానమును) పొందాలనే ఆశయంతో నిర్వర్తించి నిత్య వస్తువును పొందవచ్చు సుమా!

అనిత్యమగు జీవితమనే అవకాశం ఉపయోగించి నిత్యమగు వస్తువును నేను సంపాదించుకొన్నాను. అట్లాగే ఎవ్వరైనా సంపాదించుకోవచ్చు. అట్లాకాకుండా - కోరికలు ఫలించాలని, ఇప్పటికన్నా ఇంకేవేవో దృశ్య విషయాలు సముపార్జించాలని నీవు అనుకోలేదు. అవన్నీ నీకు నేను ఇవ్వచూపినా కూడా, నీవు అందుకు లోబడక, తాత్త్విక జ్ఞానం (‘తత్‌’ లేక ’పరమాత్మ’కు సంబంధించిన విజ్ఞానం) కోరుకొన్నావు. సంతోషము.

ఆత్మదర్శనము : తమ్‌ దుర్దర్శనమ్‌| గూఢమ్‌| అనుప్రవిష్టమ్‌| గుహాహితమ్‌| గహ్వరేష్ఠమ్‌| పురాణమ్‌| నీవు అడిగిన దేహమునకు అతీతవిషయమైన ‘‘దేహతదనంతర’’ జీవ స్వస్వరూపస్థితి సులభంగా చూడగలిగేది, గ్రహించగలిగేది కాదు. అది అత్యంత సూక్ష్మమైన విషయం. దేహమునకు సంబంధించని (దేహముతో జనించక - దేహముతో నశించక ఉండే) ఈ జీవుని స్వస్వరూపమే అందుకు సమాధానము. అదియే ఆత్మతత్త్వ స్వరూపము.

అట్టి ఈ జీవుని ఆత్మ స్వరూపం కళ్ళకు కనిపించేది కాదు. అది అనుభవమగుచున్న సమస్తమునందు అంతటా అరతర్లీనంగా ప్రసరించి ఉన్నట్టిది. అత్యంత రహస్యంగా అంతటా ఏర్పడి ఉన్నట్టిది. సర్వజీవుల హృదయగుహలో దాగి ఉన్నట్టిది. ఈ శరీరంలోనే సర్వదా వేంచేసియే ఉన్నట్టిది. ఈ శరీరముకూడా అద్దాని చమత్కారమే. అట్టి ఆత్మ పురాతనమైనది. అయ్యది ‘‘ఆత్మ సందర్శనం, ఆత్మ సాక్షాత్కారం’’ అని పెద్దలచే చెప్పబడుతోంది. ‘‘అధ్యాత్మ యోగము’’ అని పిలువబడే అంతరాత్మసాధన ద్వారా అది తప్పక పొందవచ్చు. అట్టి ఆత్మ సాక్షాత్కారం సంపాదించుకొన్న మహనీయులు ఉన్నారు. అంతటా ఆత్మను సాక్షాత్కరించుకొన్న ధీరుడు, ఇక ఇక్కడి హర్షశోకాలను అతి సులభంగా దాటి వేస్తున్నాడయ్యా! ఆధ్యాత్మయోగాత్‌ అధిగమేన ఏవం, మత్వా ధీరో హర్షశోకౌ జహాతి|

అట్టి అధ్యాత్మ శాస్త్రమును చక్కగా - బాగుగా - సుదీర్ఘంగా - అభ్యాసపూర్వకంగా వినాలి. విని ఊరుకోకూడదు. బుద్ధితో గ్రహించాలి. వివేచనతో, వివేక బుద్ధితో గ్రహించి అట్టి ఆత్మ స్వభావంగా చెప్పబడినదానిని స్వస్వభావంగా, స్వాత్మ ధర్మముగా మరల్చుకోవాలి. అట్టి స్వస్వరూప దర్శనం మనకు స్వభావ సిద్ధం కావాలి. అప్పుడు సమస్త వస్తురూప ఆనందములకు సర్వదా అతీతమైన ఆత్మానందానికి అర్హులం.

అట్టి స్వస్వరూపానంద ప్రదమగు ఆత్మ సాక్షాత్కారానికి (సర్వదా సర్వమును ఆత్మ స్వరూపంగా దర్శించగలిగే మహోన్నత ఆత్మీయస్థితికి) నీవు ఇప్పుడు అర్హత పొంది సంసిద్ధుడవై ఉన్నావని నాకు అనిపిస్తోందయ్యా!

నచికేతుడు : స్వామీ! ‘‘ఇది చేయండి - ఇది చేయకండి’’ …. అనే వేద శాస్త్రముల విభాగములకు, ధర్మ - అధర్మ విభాగములకు, కృత - అకృత కర్మ వ్యవహారములకు సంబంధించిన దేశ - కాల - ఆచారాది వ్యవహారములకు - వీటన్నిటికీ అతీతమై, ఉత్కృష్టమై, సర్వమునకు ఆధారమైనట్టి శాస్త్రసారం ఏమిటో నాకు బోధించవలసినదిగా మీ పాదములను స్పృశిస్తూ అర్ధిస్తున్నాను.హే గురువర్యా! ఏ పదము భూత - వర్తమాన - భవిష్యత్‌లకు యాజమాన్యం వహిస్తున్నదో అట్టి తత్‌పదము గురించి చెప్పండి.

శ్రీ యమధర్మరాజు : సరేఁ! శ్రద్ధాసక్తుడవై విను.

⌘⌘⌘


- ఏ స్థానము (లేక) పదము గురించి వేద శాస్త్రములన్నీ నొక్కి వక్కాణిస్తున్నాయో ….,
- తపోధనులంతా అంతిమంగా ఏ స్థితిని పరాకాష్ఠగా ప్రకటించి ప్రపంచానికి చెప్పుచున్నారో …,
- ఏ స్థానమును సంపాదించుకోవాలనే మహదాశయులంతా కొందరు బ్రహ్మచర్య వ్రతులై ఆచార్యులను సమీపించుచూ సర్వయుక్తులు ఉపాయములు ఆశ్రయించి, సర్వశక్తులు సమర్పించి ప్రయత్నశీలురై ఉంటున్నారో…,
ఆ పదము (లేక) స్థానము (లేక) గమ్యమును సంగ్రహంగా (In a Nut-Shell) ‘‘ఓం’’ అనే సంజ్ఞచే వేదోపనిషత్తులచే ప్రతిపాదించబడుతోంది.

అట్టి ‘ఓం’ కారముచే ఉద్దేశ్యించబడేదే సర్వుల ఏకాత్మ స్వరూపమగు పరమాత్మ. సర్వుల అంతర్యామి. మార్పుచేర్పులు పొందనిది కాబట్టి అది అక్షరం. అదియే సమస్త జగత్‌ వ్యవహారమునకు పరమైనది. అది అంతటికీ పరమై, సర్వరూపములు తానే అయివున్నట్టిది. ఏ జీవుడైతే అట్టి తనయొక్క సర్వాత్మకమైన నిత్య నిర్మలాత్మ స్వరూపం సుస్పష్టము - నిర్దుష్టము - అనునిత్యము - స్వాభావికము చేసుకుంటాడో, … అట్టి జ్ఞాన విజ్ఞాని ఏది పొందాలో అది పొందినవాడే!

ఓ నచికేతా! అట్టి సర్వాత్మకమగు ఆత్మస్వరూపమును ఆశ్రయించటమే శ్రేష్ఠము. ఇక మిగతాదేది పొంది కూడా లాభమేమున్నది? కేవలము, పరము అగు స్వస్వరూపాత్మ అన్నిటికంటే ఉత్కృష్టం. అట్టి ఆశ్రయమును తెలుసుకొన్నవాడు బ్రహ్మజ్ఞానులకు కూడా దృష్టాంతము, సోదాహరణము అగుచున్నాడు.

సర్వ ఉపాధులతో ’‘జ్ఞాత (Knower)’’గా వేంచేసియున్న మనందరి ఆత్మేశ్వరుడు - మన స్వస్వరూపము అయినట్టి జ్ఞాతాత్మ వాస్తవానికి జనించటమూ లేదు. మరణించటమూ లేదు. అది ఎక్కడి నుంచో ఇక్కడికి రావటం లేదు. ఇక్కడి నుండి మరెక్కడికో పోవటమూ లేదు.

’ఆత్మ అనబడు సమస్త జీవుల కేవలస్వరూపము - ఎటువంటిదంటే ….,
- జన్మ కర్మాదులు లేనిది.
- భూత - వర్తమాన - భవిష్యత్తులలో యథాతథరూపంగా ఉన్నది.
- కాలబద్ధం కాదు. శాశ్వతం.
- అది అన్నిటికీ మునుముందే ఉన్నది. కనుక ‘పురాణం’ అని చెప్పబడుతోంది. పురానవం| పూర్వమువలెనే ఇప్పటికిప్పుడూ సిద్ధమయ్యే ఉన్నది.

అట్టి సర్వాత్మకమగు మన ఆత్మరూపం నశించేదికాదు. ఇక మరణం ఎవరికి? ఈ దేహాదులు వస్తూ ఉంటాయి. పోతూ ఉంటాయి. అంతే! ఈ ఈ దేహాలకు వేరై, ‘దేహి’ సర్వదా ఆత్మ స్వరూపంగా వెలుగొందుచూనే ఉన్నాడు.

నచికేతుడు : మహాత్మా! మరి మాకు కంటికి కనిపించే ఈ చావటం - చంపటం మొదలైనవన్నీ ఏమిటి?

యమధర్మరాజు : సరస్సులోని జలంలో బుడుగలులాగా ఆత్మయందు ఈ అనేక దేహాదులు కనబడుతున్నాయి. కనుమరుగవుతున్నాయి. కాని ఈ జీవుడు తనయొక్క ఆత్మ స్వరూపం ఏమరచటం చేత ‘‘ఈ దేహమే నేను’’ అని భ్రమించి పరిభ్రమిస్తున్నాడు.

- అయ్యో! నేనిప్పుడు మరణిస్తున్నానే!
- ఆహాఁ! ఇప్పుడు ఈ దేహిని నేను చంపుచున్నాను’’
ఇట్లా అనుకునే ఆ ఇద్దరు జీవులు ఎందుకట్లా అనుకుంటున్నారంటావా? ఆ ఇద్దరూ కూడా దేహ-దృశ్యాదుల గురించి మాత్రమే దృష్టిలో పెట్టుకొని మాట్లాడుకొంటున్నారు. తమతమ ‘దేహి’ స్వరూపమేమిటో - అద్దాని గురించి వారు విజ్ఞానపూర్వకమైన ఆత్మదృష్టి కలిగియుండటము లేదు. కాబట్టే అట్లా భ్రమతో కూడిన పరిమిత దర్శనము పొందుచున్నారు. ఆ ఉభయ దేహుల ఆత్మస్వరూపం తాను చచ్చేది కాదు. తనకు వేరుగా ఉన్న మరొక ఆత్మను చంపేదీ కాదు. వేఱువేఱు తరంగాలలో వేఱువేఱైన జలం ఉన్నదా? ఒక తరంగ జలం మరొక తరంగ జలమును భేదించట మెక్కడిది? సర్వుల ఆత్మ ఒక్కటే అయివుండగా, ఉభయులూ ఆత్మయే తమ-తమ వాస్తవ స్వరూపంగా కలిగి ఉండగా, …. ఒక జీవాత్మ మరొక జీవాత్మను చంపటమెక్కడిది? అదంతా దేహముల దృష్టికి కనిపిస్తోంది. అంతే!

- ఒక పర్వతంతో పోలిస్తే అణువు ఎంతటి సూక్ష్మమో, …. అణువు కంటే ఆత్మ అంతటి సూక్ష్మం!
- అయితే, సృష్టిలోగల అతి పెద్దదైన సర్వ వస్తువులకంటే ఆత్మ బహు మహత్తరమైనది. బహు ఘనీభూతమైనది. సుస్పష్టమైనది.
- అది ఎక్కడో దూరంగా ఉన్నదా? లేనే లేదు. సర్వజీవుల హృదయ గుహలలో సర్వదా వేంచేసియే ఉన్నది.

మరి అద్దానిని దర్శించాలంటే? అది అంత సులభం కాదు. కానీ ఒకానొకవిధంగా అది సులభమే కూడా!

ఎవ్వరైతే ఇంద్రియములకు విషయములగుచున్న ఈ జగద్విషయములపట్ల సర్వ కోరికలను త్యజించి, దృశ్య సంబంధమైన సర్వ ఆందోళనలను జయించి వేసి ఉంటారో …., అట్టివారు నిర్మలము కావించబడిన తమ ఇంద్రియములచే అంతటా … అన్నిటా … అన్నీగా ఉన్న ఆత్మను దర్శించి ఆనందిస్తున్నారు.

ఆసీనో దూరం వ్రజతి| శయానో యాతి సర్వతః| అంతటా ఆక్రమించి ఉన్నట్టి ఆత్మ ఉన్నచోటే కూర్చుని ఉండి అంతటా సంచరించుచున్నదై ఉంటోంది. దూరమును అధిగమించి ప్రయాణించగలుగుతోంది. శయనించియే అంతటా ప్రసరించి ఉంటోంది. అది ఆనందరూపమా? ఆనందాతీతమా? అద్దాని అనుభవం ఎట్టిది? అది నాకు నేను, నీకు నీవు (ఎవరికి వారే) ఆస్వాదించి అనుభవించవలసినదేగాని ఒకరికి మరొకరు అందివ్వగలిగేది కాదు.

అశరీరగ్ం శరీరేషు అనవస్తేషు అవస్థితమ్‌| ఆత్మ అశరీరి. అద్దానికి శరీరమనేదే లేదు. కానీ, ఆ ఈ కనబడే అశాశ్వత శరీరాలలో అది ప్రవేశించి ఉంటోంది. అది అన్నిటికన్నా పరము - మహత్తరము అయివున్నది. సర్వగతమైనది. అట్టి తనయొక్క ఆత్మ స్వరూపం ఎఱిగిన జీవుడు ఇక ఎందుకు శోకిస్తాడు? శోకించడు. మత్వా ధీరో న శోచతి|

నచికేతుడు : మహాత్మా! అట్టి ఆత్మను గురించి ఇప్పుడు నాకు బోధించండి. నేను మీ ద్వారా అద్దాని గురించి తెలుసుకొని, ఆత్మతత్త్వజ్ఞుడను అవుతాను.

శ్రీ యమధర్మరాజు : న అయమ్‌ ఆత్మా ప్రవచనేన లభ్యో| అట్టి ఆత్మానుభవం మాటలతో చెప్పితే తెలియబడేది కాదు. సొంత మేధస్సును ఉపయోగించి తెలుసుకోగలిగేది కూడా కాదు. చదవటంవలననో, వినటంవలననో అనుభవానికి వస్తుందా … అంటే, … అదీ కాదు. ఆ ఆత్మ భగవానుడు ఎవ్వరిని వరిస్తే వారికే అది లభ్యం! వారికే ఆత్మ స్వశరీరాన్ని విశదపరుచుకొనుచున్నది. ఎవరికి ఆత్మ ప్రియమౌతుందో అది వారికి ప్రియమై లభిస్తుంది.

ఎవ్వరైతే సహజీవులను ద్వేషించటం - బాధించటం - అవమానించటం - అల్పభావన కలిగిఉండటం … ఇటువంటి దుశ్చరితముల నుండి విరమించరో, ఆత్మభావనను ఆశ్రయించరో-అట్టి వారు ఎంతగా చదివినా, విన్నా, మాట్లాడినా ఆత్మస్వరూపమును గ్రహించజాలరు. అశాంతమైన - చంచలమైన మనస్సు - బుద్ధి కలవారు తెలివితేటలు కలిగియుండి కూడా ఆత్మానుభవమును పొందజాలరు.

సర్వ బ్రహ్మజ్ఞాన సమాచారములు, సర్వ క్రియా దక్షతలు ఎద్దానియొక్క ఆహారమో, ఎద్దానికి మృత్యువు ఒక ఫలహారం వంటిదో అట్టిది ‘‘ఇట్టిది’’ అని ఎవ్వరు తెలుసుకోగలరు? ఎక్కడ ఏమని గుర్తించి దర్శించగలరు? అద్దానిని నిర్ణయించి ఎవరు నిర్వచించగలరు? ఎవరికి వారు తమయందు సర్వభావములకు జనన స్థానముగా - స్వానుభవం పొందవలసినదే.


(3.) తృతీయ వల్లీ :: అజ్ఞానవాన్‌ - విజ్ఞానవాన్‌

జీవాత్మ - పరమాత్మ

శ్రీ యమధర్మరాజు : ఓ నచికేతా!

1) సర్వ జీవుల హృదయ గుహలో వశించే బ్రహ్మము లేక ‘‘ఆత్మ’’ (The Absolute Self)
2) లోకంలో ప్రవేశించి ‘జీవుడు’ అని పిలువబడుతూ సుకృత - దుష్కృత ఫలములను తనవిగా అనుభవించే ఆత్మయొక్క ప్రాపంచిక స్వరూపము. (The Incidental Self)
ఈ రెండూ కూడా ఎట్టివి? ఎట్టివో చెప్పుచున్నాను, విను.

👉 ఆత్మ వస్తువువంటిదైతే … జీవుడు అద్దాని నీడవంటిది.
👉 ఆత్మ స్వప్నసాక్షి - స్వప్నమునకు అప్రమేయుడు అగు కేవలసాక్షి. జీవుడో - స్వప్నములోని అనుభవి/సంచారి.
👉 ఆత్మ కథా రచయిత. జీవుడు అట్టి రచనలోనే ఒక ‘పాత్ర’. (Role).
అని బ్రహ్మవిదులు పలుకుచున్నారు.

వాస్తవానికి, ఈ దృశ్య జగత్తులో సుఖ - దుఃఖ, కర్మ - కర్మఫల ప్రాంగణంలో సంచరిస్తున్న జీవుని స్వస్వరూపం (స్వప్నద్రష్ట స్వరూపం స్వప్నానికి అప్రమేయమే అయినట్లు) దృశ్యమునకు సర్వదా అప్రమేయమే అయివున్నది. ఆత్మయొక్క ‘నీడ’ మాత్రమే ఈ ‘జీవుడు’ ఆత్మయొక్క ‘అంశ’ అగు ఈ జీవుని రూపం బాహ్యరూపంగా దృశ్యజగత్తులో సంచరిస్తోంది.

ఆత్మగా ‘‘నేను’’ జీవుడుగా ‘‘నేను’’
సర్వాత్మకము - వ్యష్టాత్మకము.
ఆత్మ స్వరూపం సహజం (సమస్తమును కదిలించునది) - ‘జీవుడు’ అనునది ఆరోపితం. సందర్భములలో పరిమితమై కనిపించు చేతనరూపము. (కదలుచున్న రూపము).
ఆత్మ నాటకమునకు అప్రమేయమైన నటుని వ్యక్తిగత రూపం - జీవుడు ఒక నాటకంలోని నటుని పాత్ర
ఆత్మ కర్మరహితము. నిత్య నిర్మలము. - పూర్వ, తత్పూర్వ వాసనా చోదితమైన జన్మకర్మ విభాగములకు భోక్త ఈ జీవుడు.

అయితే ఈ జీవుడు వాస్తవానికి ఆత్మ స్వరూపుడే! ఒక నాటకంలోని పాత్రలాగానే జీవాత్మకు వేరైన, స్వతంత్రమైన ఉనికి లేదు.

పంచాగ్నుల రూపముతో పోల్చతగు (అన్నమయ - ప్రాణమయ - మనోమయ - విజ్ఞానమయ - ఆనందమయ) పంచకోశములకు ఆవల హృదయ కుహరంలోనే ఆత్మ యథాతథంగా సర్వదా వేంచేసియే యున్నది. ఆత్మయొక్క భావనామాత్రమే జగదనుభవం.

నీవు నావద్ద నేర్చిన త్రినాచికేతాది సుకృతముల ఫలం ప్రాపంచకమైన స్వర్గాదులు మాత్రమే! హృదయ గుహలోగల ఆత్మను అంతటా, అన్నిటా, అన్నీగా, దర్శించువాడు (ఆత్మయొక్క తేజస్సును గ్రహించువాడు) ‘ఆత్మదర్శి’ అగుచున్నాడు. అట్టి పరమ - పదార్థము (separate - unaffectedly placed) అగు ఆత్మయొక్క చమత్కారమే ఈ దృశ్యము యొక్క ప్రదర్శనము. ‘‘అది సర్వ - అంతర్గతము’’ అని గ్రహించు దృష్టికలవాడు ‘‘నేను జీవుడను’’ అనే భ్రమను అధిగమించి వేస్తున్నాడు. అప్పుడాతడు స్వస్వరూపముగా భాసిస్తున్నాడు.

అట్టి ఆత్మ సందర్శనము సర్వ కోరికలకు ఆవలిగట్టు. ఈ దృశ్యమును అధిగమించాలనే ఆశయము కలవారికి కూడా భూ ప్రపంచంలోని యజ్ఞ యాగాది ఆయా సర్వకర్మలు వంతెన వంటివి అగుచున్నాయి. అయితే బ్రహ్మలోకంవరకు అన్యము రూపంగా పొందేవన్నీ మిధ్యయే! ఆత్మ సందర్శనా అభ్యాసమే అన్నింటికి పరమైన స్థానం. అదియే అభయస్థితి. అట్టి స్థితికి ఆయా ప్రాపంచిక శాస్త్ర విహిత విధి విధానములు సహకరించగలవు. అనిత్యమగు వస్తువులను ఉపయోగించి నిత్యమగు ఆత్మతత్త్వము ఎవ్వరైనా తప్పక పొందవచ్చునని నా అభిప్రాయం.

అట్టి ఆత్మ సందర్శనం ఏవిధంగా పొందవచ్చునో … సంజ్ఞా పూర్వకంగా (దృష్టాంతంగా) చెపుతాను, విను.

ఒక మహారాజు తనకు అత్యంత ప్రీతి పాత్రమైన ఒక ప్రదేశానికి వెళ్ళదలచి ఒక రథం అధిరోహించారనుకో!

ఆత్మ (జీవాత్మ)
రథికుడు (The one who is owner of chariot vehicle) అని భావించు.
ఈ శరీరమో?
జీవాత్మ అధిరోహించినట్టి రథం.
ఈ ఇంద్రియాలు
ఈ శరీర రథానికి పూన్చబడిన గుఱ్ఱాలు.
మనస్సు
ఆ గుఱ్ఱాల ముక్కుకు - మెడకు తగిలించే కళ్లెములు.
బుద్ధి
రథసారధి
ఇంద్రియ విషయాలైనట్టి శబ్ద- స్పర్శ - రూప - రస - గంథములు
దృశ్య విషయములు - వ్యవహారాలు - ఆ గుఱ్ఱములను ఆకర్షిస్తున్న మార్గమునకు ప్రక్కగా గల గడ్డిపరకలు

ఆత్మ ఇంద్రియ - మనస్సులతో కూడుకొన్నదై ఈ ఈ విషయాలను అనుభవిస్తోంది. ఇప్పుడిక…,

యస్తు అజ్ఞాన్‌వాన్‌ భవతి|
దీర్ఘప్రయాణీకుడగు ఆ మహారాజు (లేక రథికుడు) ‘‘ఆహాఁ! నా గుఱ్ఱాలు రహదారికి ప్రక్కగా ఉండే గడ్డి పరకలంటే ఇష్టపడుతున్నాయి. తిననిద్దాము. అందుకు అవసరమైతే - రధమును రహదారి నుండి మళ్ళించి ఈ గుఱ్ఱాలు కోరుకొనే గడ్డి పరకలవైపుగా నడిపిస్తాను. అప్పుడు గుఱ్ఱాలు గడ్డి తిని ఆనందిస్తాయి కదా’’ … అని తలచి, తాను అత్యవసరంగా వెళ్ళవలసిన ప్రదేశమునకు ప్రయాణమును విరమించి, రధాన్ని వెళ్ళవలసియున్న మార్గం నుండి రహదారి ప్రక్కకి నడిపిస్తే అది సముచితమేనా? కాదుకదా! ఈ మానవులు ఇంద్రియ విషయములను పొందటమే ఆశయంగా కలిగియుండి, జీవితమనే అవకాశాన్ని వెచ్చించటం అటువంటిది.

గుఱ్ఱాలకు పూన్చిన కళ్ళాలు పట్టులేనివైతే? పస - త్రాన - గట్టితనము లేని పీచుతో కూడిన త్రాళ్ళతో తయారయినవయితే? అప్పుడు? ఆ బలహీనమైన కళ్ళాలు గుఱ్ఱాలను అదుపులో ఉంచలేవుకదా! అందుచేత రధికుడు (లేక ఆ మహారాజు) ప్రయాణించాలను కొంటున్న మార్గం నుండి ప్రక్క త్రోవపట్టి, ఆ గుఱ్ఱాలు త్రోవకు ప్రక్కగా గల గడ్డి పోచల వైపుకు రధాన్ని త్రోసుకుపోవడం జరుగగలదు కదా! సారధి - తన యజమానికి ఏది శుభాశయమో, అది మరచిపోయి (ఆ గుఱ్ఱాలను అదుపులో పెట్టవలసింది పోయి) గుఱ్ఱాల ఆకర్షణకు అనుకూలంగా రధాన్ని త్రోలుకు పోవటం జరిగితే? రథికుడు తను వెళ్ళవలసిన మార్గమును ఏమరచి గుఱ్ఱాల ఉద్దేశ్యమునే అనుకరిస్తే? అప్పుడు ఆ ప్రయాణం సరిగా కొనసాగుతుందా? లేదు.

అట్లాగే ….,
- రథికుడు (The owner of chariot) అయిన ఈ ‘‘దేహి’’ అజ్ఞాని అయి,
- అది అలుసుగా చూచుకొని సారధి అయిన ‘‘బుద్ధి’’ చంచలమైన చేతులు కలవాడై, ‘మనస్సు’ అనే కళ్ళెమును చేతులతో గట్టిగా పట్టుకోకుండా….,
- ‘మనస్సు’ అనే కళ్ళెములు ఇంద్రియములు అనే గుఱ్ఱములను అదుపులో ఉంచే గట్టితనము (సదభ్యాసము) లేనివై ఉంటే …,
ఇక ఆ రథం అనే శరీరము (లేక) జీవుని యొక్క ప్రయాణం వెళ్ళుచున్న మార్గము - అల్పమైన ఆశయములవైపే అగుచున్నది. రథికుని ప్రయాణం ‘ఆనందం’ అనే స్థానానికి కాకుండా ‘‘దుఃఖము - వేదన - అజ్ఞానము - దురాశయము - దురభిరుచులు….’’ అనే దుష్ట స్థానానికి ప్రయాణం కొనసాగుతోంది.

దుష్ట గుఱ్ఱాలు సారథి యొక్క అదుపు తప్పుచున్నట్లుగా …. ఇంద్రియాలు బుద్ధి యొక్క అదుపు తప్పుచున్నాయి.
అట్లా కాకుండా …., యస్తు విజ్ఞానవాన్‌ భవతి|

ఎప్పుడైతే ఈ జీవుని యొక్క ‘బుద్ధి’ విజ్ఞానముతో కూడుకొనినదై ఉంటుందో, మనస్సు సాధనాబలం సమకూర్చుకొంటూ ఉంటుందో, ఎల్లప్పుడు ఇంద్రియములు వశంలో ఉండి ప్రవర్తిస్తూ ఉంటాయో, … అటువంటి జీవుని జీవిత ప్రయాణం ఈ సంసార మహారణ్యాన్ని దాటించివేసేవిగా ఉండగలుగుతోంది. ఆ గుఱ్ఱాలు ఆ రథాన్ని వెళ్ళవలసిన వైపుగా తీసుకుపోతున్నాయి! అవ్యాజము, స్వాభావికము అగు ఆత్మానందమువైపుగా ఈ జీవుడు సుఖ ప్రయాణము కొనసాగించగలడు.

ఓ నచికేతా! మరల చెప్పుచున్నాను. విను.

ఏ జీవుడైతే అజ్ఞానములోనే ఉంటూ, అపవిత్రమైన మనస్సుతో అశుచి అయిన ఆశయములు - భావములు - కార్యక్రమములు - ప్రవర్తనలు వదలడో, అట్టివాడు ‘తత్‌’ అని చెప్పబడే పరమాత్మానంద స్థానం చేరలేడు. ‘‘సర్వము’’ ఆత్మగా దర్శించటం’’ అనే ‘తత్పదం’ సంపాదించుకోనేలేడు. అట్టివాడు ఈ సంసారారణ్యంలోనే పరిభ్రమిస్తూ ఈ దృశ్యములోని ఆయా విశేషములే ఆశిస్తూ దురాశ - నిస్పృహ - వేదన - రోదనలకు లోనుఅవుతూ, ఒక దుఃఖం నుండి మరొక దుఃఖానికి (From one group of worries to another group of worries) ప్రయాణిస్తూనే ఉంటాడు అంతే!

విజ్ఞాన సారథిః యస్తు|
ఏ జీవుడైతే ‘విజ్ఞానము’ సారథిగా కలిగినవాడై, పెద్దలు - శాస్త్రములు బోధించే మార్గములను అనుసరిస్తూ, పవిత్రమైన ఆశయములు - భావములు - ఉద్దేశ్యములు కలిగివున్న మనస్సు పెంపొందించుకొంటూ ఉంటాడో, అప్పుడు ఆ జీవుని ప్రయాణం ‘‘విష్ణుపదం’’ అనే పరమపదం (లేక ‘సాయుజ్యం’ అనే స్థానం) చేరుతుంది. ‘‘సర్వము విష్ణుమయం - పరమాత్మయే ఈ సర్వజీవులు, దృశ్యముగా నాకు అనిపిస్తున్నారు’’ అను నిశ్చలమైన దృష్టిని - దృఢ నిత్యానుభవమును సంపాదించుకొంటున్నాడు.

ఓ నచికేతా! ఈ ‘జీవుడు’ అనబడే బాటసారి వెళ్ళవలసిన స్థానం - ‘‘ఈ సమస్తము సర్వదా విష్ణమయమే| విష్ణురూపమే’’ … అని దర్శించగలిగే స్థితియే సుమా! అంతేగాని, ఇంద్రియ విషయముల వెంట - దృశ్య పరిమిత వ్యవహారముల వెంట పరుగులు తీయటం, అనేక భేదములను బుద్ధియందు కొనసాగించటము కానే కాదు. ఏమాత్రమూ కాదు.

ఇంద్రియేభ్యః పరా హి ‘‘అర్థాః’’ (Experiencing Faculty)
ఈ ఇంద్రియములు గొప్పవే! అయితే -
ఈ చెవులు - చర్మము - కళ్ళు - నాలుక - ముక్కు అనబడే పంచేంద్రియముల కంటే కూడా, ‘‘వినటం - స్పర్శానుభవం - రూపదర్శనము - రుచి ఆస్వాదించటం - వాసన చూడటం’’ …. అనబడే శబ్ద - స్పర్శ - రూప - రస - గంధాలు … (‘‘ఇంద్రియార్ధాలు’’) ఇంకా గొప్పవి. ఇంద్రియాలు ఉపయోగించనప్పుడు కూడా స్వప్నంలో ‘‘వినటం - స్పర్శ - రూపము - రుచి - వాసన’’ అనే అనుభవాలు ఈ జీవుడు పొందుచున్నాడు కదా!

అందుచేత ఇంద్రియముల కంటే ఇంద్రియార్థములు గొప్పవి. ఇంద్రియార్థాలకు ఇంద్రియములు ఉపకరణములు అయివున్నాయి.

అనగా,
చెవుల కంటే ….. వినికిడి గొప్పది ….. వినికిడికి చెవులు ఉపకరణములు.
చర్మము కంటే ….. స్పర్శానుభవం గొప్పది ….. స్పర్శకు చర్మము ఉపకరణము.
కంటి కంటే ….. చూపు గొప్పది ….. చూపుకు కనులు ఉపకరణములు.
నాలుక కంటే ….. రుచిగొప్పది ….. రుచికి నాలుక ఉపకరణము.
ముక్కు కంటే ….. వాసనానుభవం గొప్పది ….. వాసనకు ముక్కు ఉపకరణము.

అట్టి వినికిడి మొదలైన పంచతన్మాత్రలు ’దేహి’కి సంబంధించిన అర్థములు. (అంతేగాని, దేహమునకు పరిమితమైనవి కావు).

అర్థేభ్యశ్చ పరం మనః (Thinking Faculty)
శబ్ద-స్పర్శ-రూప-రస-గంధాలనబడే ఇంద్రియానుభవాలు (ఇంద్రియార్థాలు) గొప్పవే! అయితే, అంతకన్నా కూడా, అవన్నీ తన అనుభవాలుగా పొందే మననమే రూపముగా గల - మనస్సు ఉన్నతమైనది. ఇంద్రియార్థాలు మనస్సుకు ఉపకరణాలు.

ఒక ఉపకరణం కంటే వాటిని ఉపయోగించేవాడు ఏవిధంగా అధికుడో, … ఇంద్రియార్థాలకంటే ‘‘ఆలోచన - అనుభవం - అనుభూతి’’ …. మొదలైన వాటితో నిర్మించబడే మనస్సు మరింత ఎత్తైన స్థానంలో ఉన్నది.

మనస్సును అనుసరించే-ఇంద్రియార్థాలు అనుభవించబడుచున్నాయి. కళ్ళు తెరిచి ఉండవచ్చు. కానీ ధ్యాస ఎక్కడో ఉంటే ఆ కనబడేవి అనుభవించబడవుకదా!
కనుక, ఇంద్రియార్థముల కంటే మనస్సు మహత్తరమైనది.

మనసస్తు పరా బుద్ధేః (Discriminating Faculty)
మనస్సుకు ఆవల ‘విచక్షణ’ అనే జ్ఞానం (లేక బుద్ధి) ఉన్నది. అది ‘‘ఇది ఆలోచిద్దాం? ఇది ఆలోచించటం మానివేద్దాం?’’ …. అనేది నిర్ణయిస్తూ ఉంటుంది.
కనుక మనస్సు కంటే బుద్ధి ఉత్కృష్టమైనది. బుద్ధికి మనస్సు ఉపకరణము.

బుద్ధేః ఆత్మా మహాన్‌ పరః (Individual unit of self)
ఉచిత - అనుచిత విచక్షణా రూపమగు ‘బుద్ధి’ కంటే ‘జీవాత్మ’ (వ్యష్టిత్వము) అధిగమించినదైయున్నది. విచక్షణ (Differentiation) ఎద్దానిచే నిర్వర్తించబడుతోందో అట్టి ‘మహత్తు’ అని చెప్పబడే జీవాత్మ బుద్ధికి ఆవల ఉన్నది. మహత్‌ స్వరూపుడగు జీవాత్మకు బుద్ధి ఉపకరణము.

మహతః పరమ్‌ అవ్యక్తం (That which is exhibiting “The sense of Individual self” while it itself is “Non-Exhibitive”)
జీవాత్మ అనబడే మహత్తు కంటే అతీతము ఉత్కృష్టము ఏది? ఏదైతే తాను ఇంద్రియాదులకు విషయమే కాకుండా, అంతకుముందే ఉండి, అవ్యక్త స్వరూపమై, …. ఇంద్రియ విషయములకు అనుభవరూపమైన ఈ జీవుని స్వకీయ ప్రదర్శనముగా కలిగి ఉన్నదో…, అట్టి అవ్యక్తము ఉత్కృష్టమైనది.
- ఈ జీవుని వ్యక్తరూపం ఈ శరీరం.
- భావాలు - అనుభవాలు - అనుభూతుల రూపంగా కనిపించేది కూడా వ్యక్తరూపమే.
- బుద్ధి - చిత్తము - అహంకారము రూపంగా కనిపించేది కూడా జీవుని వ్యక్తరూపం.
- ఈ దేహ-మనో-బుద్ధి-చిత్త-అహంకారాలన్నీ తనవిగా ధరిస్తూ, తానుమాత్రం వాటి యందుగాని, వాటిచేతగాని పరిమితముకాక, కానీ వాటినన్నిటినీ తానే వ్యక్తీకరిస్తోందో, … అది అవ్యక్తం. వ్యక్తీకరించబడుచున్న సర్వ విషయములకంటే కూడా ’తాను’గా ఉంటూ వ్యక్తీకరిస్తున్నప్పటి తత్త్వము ఉత్కృష్టమైనదే కదా! ఆ వ్యక్తీకరిస్తున్న తాను (అవ్యక్తంగా ఉంటున్న రూపము) ఈ జీవుని ఉన్నతోన్నత రూపం. అవ్యక్తముయొక్క వ్యక్తీకరణమే జీవాత్మ.

అవ్యక్తాత్‌ పురుషం పరః (Al-pervading and universally present self)
ఈ జీవునికి అట్టి అవ్యక్తము కంటే కూడా సర్వోత్కృష్టమైన మరొక రూపం ఉన్నది. అట్టి మహత్తర అవ్యక్తాతీత రూపమును ‘పురుషుడు’ అంటారు. జాగ్రత్‌ స్వప్న సుషుప్తులలో ప్రదర్శనమగుచున్న సమస్తము తన పురుషకారమే అయి ఉన్న తత్త్వమ్‌- ‘పురుషుడు’. ‘‘ఈ సమస్తము మమాత్మానంద ప్రదర్శనమే’’ అను పురుషకారము కలిగియున్నవాడే పురుషుడు (లేక) పరమపురుషుడు.

కఠ-ఉపనిషత్-దృశ్యానుభవం

ఏదైతే - ద్రష్ట - దృశ్యములను తనయందు ధరిస్తూ సర్వ తదితర రూపములు తానే అయి, తనచే దర్శించబడే సర్వ దృశ్య జడ - చేతనములందు అంతర్లీనమై, ఇదంతా స్వస్వరూపముగా సర్వదా ‘తానే’గా కలిగియున్నదై యున్నదో … అదియే ‘పురుషుడు’. తనచే కల్పించబడిన దానియందు తానే మౌనంగా ప్రవేశించి, తన రూపమును తానే తదితర సర్వజీవులుగా - సర్వలోకములుగా - సర్వ తత్త్వములుగా పొందుచున్నదో …. అట్టి ఈ జీవునియొక్క సర్వోత్కృష్ట రూపమే పురుషరూపం. ఇదియే ’‘సమస్తము నేనైన నేను’’.

పురుషాన్‌ న పరః కించిత్‌| సా కాష్ఠా| సా పరా గతిః|
‘‘దృశ్యముగా పొందబడుచున్న సమస్త ప్రదర్శన రూపము తానే’’ అయినట్టి ఒకానొక ‘‘సర్వాంతర్యామిత్వమగు తత్త్వరూపము’’ ఈ జీవునికి ఉన్నది. ఆ తన సర్వాంతర్యామిత్వమే ‘‘పరమ పురుషుడు’’ అని చెప్పబడుతోంది. అదియే ప్రతిజీవుని పరమావధి. అదియే చరమ గమ్యం. ఆ తరువాత, అటుపై మరింకేమీ లేదు. (అద్దాని అనునిత్యానుభవమే కైవల్యము - అనబడుచున్నది).

శ్లో|| ఏష సర్వేషు భూతేషు గూఢౌ ఆత్మా న ప్రకాశతే|
దృశ్యతే తు అగ్య్రయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభి||

ఓ నచికేతా! ఈ జీవుడు సర్వ దృశ్యమునకు ఆధారమైయున్న తన పరమ పురుష రూపాన్ని ఏమరచి, ‘‘నేను ఈ దేహాన్ని. చచ్చేవాడిని. పుట్టేవాడిని’’ అనే భ్రమను తనకు తానే కల్పించుకొని అద్దానియందు పడరాని పాట్లన్నీ పడుతున్నాడు.

ఆహా! ప్రతి జీవునిలోను ఈ సర్వాత్మక ప్రభావ సహితమైన పరమ పురుషరూపం వెంటనంటి యుండి కూడా, బుద్ధికి ప్రకాశం కావటంలేదే! (It is silently and secretly accompanying everybody, while people are often not coscious of it). ఈ జీవునికి తనయొక్క సర్వాంతర్యామి రూపం-‘‘అతి నిర్మలము-సుతీక్షణము’’ అయిన బుద్ధికి మాత్రమే సాక్షాత్కరించగలదు. స్వకీయ బుద్ధియే ‘‘దేహ మనోబుద్ధి - చిత్త - అహంకారాలే నేను’’ అనే అల్పత్వమును ఆహ్వానించి తన విస్తరణను పరిమితం చేసుకుంటోంది. అట్టి ఆ బుద్ధి యొక్క సూక్ష్మదర్శన-నిశిత పరిశీలనచే, నిర్మలత్వముచే-ఈ జీవునికి తన ‘‘సర్వాంతర్యామిత్వం’’ అనుభూతం అవుతోంది.

కాబట్టి నచికేతా! నీవు నీయొక్క సర్వాంతర్యామిత్వమును అనుభూతపరచే పరమ పురుష రూపం నిర్మలమైన - సునిశితమైన బుద్ధి (అవగాహన)తో సుస్పష్టం చేసుకొంటే చాలు, అంతా నీకే సువిదతమౌతుంది. స్వప్నద్రష్ట తన భావనారూపమునే స్వప్నంలో అనేక వస్తువులు నిర్మిస్తున్నట్లుగా, ఈ జాగ్రత్‌ ద్రష్ట కూడా తనకు అనుభవమయ్యేదంతా తానే అయి, సర్వమునందు మునుముందుగానే సర్వదా వేంచేసియున్నాడు. తన భావనారూపమే తాను జగత్తుగా పొందుచున్నాడు.

⌘⌘⌘

నచికేతుడు : హే జగద్గురూ! అట్టి పరమపురుష స్వరూపం మాకు అనుభవమయ్యే ఉపాయం చెప్పండి.

వాక్కు - మనస్సు - జ్ఞానాత్మ - మహత్‌ - శాంతాత్మ

శ్రీ యమధర్మరాజు : ‘జీవితము’ అనే ఈ మహత్తరమైన అవకాశాన్ని ‘‘సద్వినియోగ పరచుకోవాలి’’ అనే ఆశయం మొట్టమొదట కలిగిఉండాలి సుమా! అప్పుడిక సంసిద్ధుడవై ప్రయత్నశీలుడవై ఉంటే అట్టి సర్వాంతర్యామి స్వరూపం అవగతం - సుస్పష్టం - అనుభూతం కావటానికి మార్గం విను.

ఉత్తమ సాధకుడైన ప్రాజ్ఞుడు ఇంద్రియ గోళములను ఇంద్రియార్థములలో ‘ఏకము’ చేయుచున్నాడు. వాక్‌ - దృశ్య - స్పర్శాది ఇంద్రియ విషయాలన్నీ అధిగమించి ’‘ఇదంతా మనస్సు యొక్క చర్యలే కదా! కనుక వీటికి ఆధారమైన ‘మనస్సు’ను పట్టుకుంటాను’’ అని నిర్ణయించుకుంటున్నాడు. ఈ జగత్‌ విషయాలన్నీ ఆలోచనలకు మూలస్థానమైన మనస్సులో లయము చేయుచున్నాడు.

అట్టి మనస్సు (Thought & Feeling) ఎక్కడి నుండి బయలుదేరుతోంది? ‘బుద్ధి’ (Logic) అనబడే జ్ఞానాత్మలో నుంచి. యుక్తాయుక్త నిర్ణయాత్మకము - విచక్షణాజ్ఞానరూపము యే ‘జ్ఞానాత్మ’. కనుక ఈ మనస్సును ఒకానొక అంతర్విభాగంగా అర్థం చేసుకొంటూ మనస్సును జ్ఞానాత్మలో లయింపజేస్తున్నాడు.

ఇప్పుడు ఇక విచక్షణా జ్ఞానరూపమైన బుద్ధి (లేక) జ్ఞానాత్మ ఎందులోనుంచి బయల్వెడలుతోంది? ’జీవాత్మ’లో (జీవించాలి-అనే అభిమానముగల వాని) నుండి. కనుక జ్ఞానాత్మను (బుద్ధిని) జీవాత్మయొక్క ప్రతిరూపంగా గమనించి అద్దానిని ‘మహత్తు’ అనబడే ’జీవాత్మ’లో లయం చేసివేస్తున్నాడు.

మరి ఈ మహాన్‌ ఆత్మ అనబడే జీవాత్మ ఎందులోనుంచి బయల్వెడలుతోంది? సర్వాత్మ స్వరూపమగు ‘‘శాంతాత్మ’’ నుండి. తరంగాలు అనేక ఆకారాలు, కదలికలు, సంయోగ - వియోగాలు పొందుచుండవచ్చుగాక! కాని జలం సర్వదా యథాతథం కదా! తరంగాలన్నీ జలంలోనే, జలమునకు అభేదమై ఉన్నాయి కదా! అట్లాగే ఈ జీవాత్మత్త్వాన్ని పరమ ప్రశాంతమగు ‘శాంతాత్మ’ యొక్క అభేదరూపంగా గమనించి, తద్వారా జీవాత్మత్వమును శాంతాత్మత్వమునందు లయం చేస్తున్నాడు.

(శాంతాత్మ = జలము. జీవాత్మ / మహత్తు = తరంగము)

ఓ నచికేతా! ఎప్పుడైతే ఈ జీవాత్మ తత్త్వము ’శాంతాత్మత్త్వము’లో లయం అవుతుందో, అప్పుడీ జీవుడు సర్వ ఋగ్మతలకు, మనోవేదనలకు ఆవలితీరం (The other End) జేరుచున్నాడు. అట్టి ఆశయం సిద్ధింపజేసుకోవటమే జీవునియొక్క పరమగమ్యం.

అందుకు ఈ మానవ జీవితం మహత్తరమైన అవకాశం! కనుక ఓ బాలకా! ప్రియ నచికేతా! లేఁ! అజ్ఞాన నిద్ర నుండి మెళుకువ తెచ్చుకో! అట్టి ‘‘ప్రశాంతాత్మత్వము’’ లేక ‘‘అఖండాత్మత్వము’’ (A transformation from “Sense of Individual Self” to “The Universally Al-Present & Al-Pervading SELF”) సిద్ధించుకోవటానికి సంసిద్ధపడు.

అతి జాగరూకుడవై ఉండు. ఉత్తిష్ఠ| జాగ్రత| ప్రాప్యవరాం నిబోధిత| అది సిద్ధించుకొన్న మహనీయులు ఉన్నారు. వారి పాద పద్మములను ఆశ్రయించు.

క్షురస్య ధారా నిశితా దురత్యయా, దుర్గం పథం తత్‌ - కవయో వదంతి| అది ‘‘కత్తిమీద నడిచి వెళ్ళటం’‘వలె అతికుశలతతో నడువవలసిన మార్గం. అయితే ’‘శాశ్వతమైన శాంతి పొందటానికి మహనీయుల బోధయే మార్గము, శరణ్యము’’ …. అని విజ్ఞులు ఎలుగెత్తి గానం చేస్తూ మనకు చెప్పుచున్నారు సుమా!

శాంతాత్మత్వము యొక్క నిర్వచనం

ఈ జీవుని శాశ్వతానంద - అఖండ రూపమగు ‘‘శాంతాత్మ’’ - ఎటువంటిది? విను.

శబ్దములతో వివరించగలిగేది కాదు. అశబ్దమ్‌|

అట్టి శాంతాత్మ యొక్క తత్త్వము సర్వ వాక్య-వర్ణనలకు అతీతం. శబ్ద - స్పర్శ - రూప - రస - గంధములలో ఈ ప్రపంచం ఉన్నది. శాంతాత్మయో, వీటికి ఆవల ఉన్నది. పరమ్‌|

అవ్యయమైనది. అద్దానికి మార్పు-చేర్పులు లేవు. ఈ శరీరాదులకు శబ్దాది తన్మాత్రలకు మొదలు - చివర ఉన్నది కదా! అయితే, …. శాంతాత్మ ఆద్యంతరహితమైనది. జీవాత్మ భావనకు కూడా అతీతమైనది. వ్యయము కానట్టిది. అవ్యయమ్‌|

అదొక్కటే ధ్రువమైన స్థానం. (That is only solidly constant). తదితరమైనదంతా అధ్రువమే. (All else is variable).

అట్టి స్వస్వరూపమగు శాంతాత్మను సాక్షాత్కరించుకొన్న జీవుడు మృత్యు ముఖం నుండి సర్వదా విడివడినవాడు అగుచున్నాడు. ‘‘నేను దేహముతో పుట్టను. దేహముతో చావను’’ - అను అవగాహనతో సునిశ్చయుడై ఉంటున్నాడు.

⌘⌘⌘

జగద్గురువగు యమధర్మరాజుల వారిచే ప్రవచించబడిన ఈ నాచికేతోపాఖ్యానంలో (ఇప్పటిదాకా) సూచించబడిన ఉపాఖ్యానాంతర్గత విశేషము ‘‘బ్రహ్మీస్థితి’‘యే ఆశయముగా కలిగియున్నది. ఇది విచారణ చేసి, అర్థం చేసుకొని హృదయస్థం చేసుకున్నవారు ’‘అనిర్వచనీయము - తెంపులేనిది’’ - అయినట్టి ఉత్తమోత్తమమైన ప్రయోజనము సిద్ధించుకొనుచున్నారు.
ఇది - ‘‘లోకములకు - జీవులకు అనంత ప్రయోజనం ప్రసాదించుగాక’’ - అని అనుశాసనము.


(4.) చతుర్థ వల్లీ - ఆత్మవేత్త ఆత్మస్వరూపుడే అగుచున్నాడు

నచికేతుడు : హే లోకగురూ! శ్రీ యమధర్మరాజా! మీరు ఇప్పుడు చెప్పియున్న ‘‘శాంతాత్మ స్థానము’’ అనునది నాకు పరమాశ్చర్యమును గొలుపుచున్నది. ఎందుకంటారా? లోకంలో అనేకమంది జీవులు ఈ ప్రపంచంలో ఏదో సొంతం కావాలని, పొందాలని, అనుభవం చేసుకోవాలని ఇంద్రియ విషయములవెంటే పరుగులు తీస్తున్నారు. అంతేగాని దృశ్యత్వమును అధిగమించి, మనస్సును బుద్ధియందు, బుద్ధిని జీవాత్మయందు, జీవాత్మను శాంతాత్మయందు లయింపజేసుకొనే ప్రయత్నంలోనే లేరు. అనేకులు పూజలు, ధ్యానములు, ప్రాణాయమములు, యజ్ఞ - యాగాదుల వంటి అనేక కార్యక్రమములను అనేక శ్రమలకు ఓర్చి నిర్వర్తిస్తూ ‘‘మాకు సుఖమయమగు స్వర్గాది లోకాలు లభించాలి’’ అను ఆశయం మాత్రమే కలిగి ఉంటున్నారు. అంతేగాని, ‘‘ఈ జీవాత్మత్వమును సర్వాంతర్యామియగు శాంతాత్మలో లయింపజేయాలి’’ అనే లక్ష్యమును అనుకరించటం లేదే? ఇది ఇట్లా ఎందుకు జరుగుతోంది?

శ్రీ యమ ధర్మరాజు : అవునయ్యా! నీవు చెప్పినట్లు అనేకమంది ‘‘శాంతాత్మస్థితి’‘ని ఆశయంగా కలిగి ఉండకుండా, ’‘ఈ దృశ్యము నుండి ఏదో పొందాలి! ఇప్పటికో, … లేదా … మరో జన్మకో! మరణించిన తరువాత స్వర్గలోకంలో సుఖాలు పొందాలి’’ ….. అని భావిస్తూ ఏవేవో ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇక మరింకొందరైతే ‘‘ఈ శరీరం నశించనున్నది! ఈ కలిగియున్న సంబంధాలు - అనుబంధాలు - బాంధవ్యాలు శరీరంతోబాటే నన్ను విడువనున్నాయి’’ … అనే విషయం గమనించటానికి కొంచెంగా కూడా సిద్ధంగా లేరు. ఎందుచేతనంటావా?

శ్లో|| పరాంచి ఖాని వితృణత్‌ స్వయం భూః
తస్మాత్‌ పరాక్‌ పశ్యతి| న అంతరాత్మన్‌||

ఈ దృశ్యరచయిత (సృష్టికర్త)యగు బ్రహ్మదేవుడు ఈ దేహ నిర్మాణము సంకల్పించినపుడు ‘‘ఇంద్రియములు బహిర్గతంగా వ్యవహరించునవై ఉండు గాక!’’ అని చమత్కారంగా లీలా క్రీడా వినోదంగా సంకల్పించియున్నారు. అందుచేత ఈ ఇంద్రియాలన్నీ బహిర్గతంగా అమర్చబడి, బాహ్యానికే ప్రసరిస్తూ ఉన్నాయి.

కళ్ళు చూస్తున్నాయి ….. కానీ చూచేవాడిని చూడలేకపోతున్నాయి.
చెవులు వింటున్నాయి ….. అయితే, వినేవాడిని వినలేకపోతున్నాయి.
నాలుక రుచిచూస్తోంది … రుచి చూచేవాడిని మాత్రం రుచి చూడలేకపోతున్నది.
చర్మం స్పర్శను అనుభవిస్తోంది …. అయినా స్పర్శను అనుభవించేవాడిని స్పృశించటం లేదు.
ముక్కు వాసన చూస్తోంది … వాసనానుభవం పొందేవాడిని ఏమాత్రము ఆఘ్రాణించ లేకపోతోంది.

ఈ ఇంద్రియాలన్నీ ఇంద్రియ విషయములనే పొందుచున్నాయి. కాని, ఆ ఇంద్రియానుభవం పొందే అనుభవజ్ఞుని అనుభూతం చేసుకోలేకపోతున్నాయి. ఈ ఇంద్రియములను ధరించిన జీవుడు ఇంద్రియ విషయములనే పొందుచున్నాడుగానీ, వీటికి ముందే ఆధారంగా ఉన్న స్వస్వరూపమును దర్శించటం లేదు.

అయితే …., కశ్చిత్‌ ధీరః ప్రత్యగాత్మానమ్‌ ఐచ్ఛత్‌ ఆవృత్త చకక్షుః అమృతత్త్వమ్‌ ఇచ్ఛన్‌||
వేలాదిమంది జీవులలో ఒకానొకడు వీటికి అతీతమైన తన నిజ స్వస్వరూపమును అర్థం చేసుకోవాలనే ఇష్టము పొందుతున్నాడు. ‘‘ఇంద్రియాలను ఆశ్రయించి, ఇంద్రియ విషయ పరిమితంగా జీవించి ఏం లాభం? ఒకనాడు ఇవి పోగొట్టుకోక తప్పదు’’ అని గమనిస్తున్నాడు. ‘‘ఇంద్రియములను విషయములతో సహా కోల్పోవటం’’ అనే మృత్యువుకు ముందే, వాటిని అధిగమించి అమృతమగు ఆత్మతత్త్వమును సంతరించుకోవాలనే ఆశయమును కలిగిఉంటున్నాడు.

ఏవిధంగా? ఇంద్రియములు ఉండికూడా ఇంద్రియములకు ఇంద్రియ విషయములకు అప్రమేయత్వమును (తాను వాటికిగాని - అవి తనకుగాని సంబంధించనివిగా) అభ్యసిస్తూ జీవితమును కొనసాగిస్తున్నాడు. ‘‘ఇక్కడ - ఇంకా ఏదో కావాలి’’ అనే కామమును మొదలంట్లా త్యజించి వేస్తున్నాడు. ఈ ఇంద్రియములను అంతర్గతం (Internalise) చేసి, ఇంద్రియములు ఏ ఆధారంతో వ్యక్తీకరణమౌతున్నాయో అట్టి అమృత స్వరూపమగు తన శాంతాత్మ స్వరూపమును సమీపించి ఆస్వాదిస్తున్నాడు. అట్టివాడు మృత్యువు యొక్క పరిధిని అధిగమించి అమృతత్త్వమును సంతరించుకుంటున్నాడు.

ఓ నచికేతా! పరాచః కామాన్‌ అనుయంతి బాలాః| తే మృత్యుః యంతి వితతస్య పాశమ్‌| చిన్నపిల్లలు ‘‘ఇది తింటే ఆరోగ్యం - ఇది తింటే అనారోగ్యం’’ అని విభేదించక, తినుబండారాలు కావాలని రుచిచే ఆకర్షించబడుతూ అమ్మను అడుగుతారు చూచావా? అట్లాగే బాలురతో పోల్చబడిన ఈ జీవులు ‘‘బాహ్యమున ఏదోకావాలి! ఏదో పొందాలి! ఏదో దక్కాలి! ఏదో తొలగాలి! ఏదో సొంతమని అనిపించుకోవాలి’’ …. అని కోరుకుంటున్నారు. ఏ జీవుడైనా సరే ….. ఏది ఎక్కడ పొందటం జరిగినా కూడా, అది ఒక నాటికి ఆ లోకంలో వదలవలసిందే అయివున్నది కదా! అందుచేత ఎవరెవరు తమలో ‘‘ఏదో కావాలి’’ అనే కామాన్ని మనస్సులో పెంపొందించుకొని జీవిస్తూ ఉన్నారో, అట్టివారు కాలముచే మోసగించబడినవారై, ఒకనాటికి నా మృత్యు పాశములలోకి వచ్చి తగుల్కొంటున్నారు.

ఈ కామము (A tendency to desire for something) అనేదానికి అంతు అంటూ లేదు. ఒకటి కావాలని కోరుకొని, అది పొందిన తరువాత ‘కామము’ ముగుస్తోందా? లేనేలేదు. ‘‘ఇంకొకటేదో కావాలి’’ అని మరుక్షణం అనిపిస్తూనే ఉంటుంది. కనుకనే నా మృత్యుపాశాలు కూడా అతి విస్తారమై - ఈ జీవునిపట్ల ప్రవర్తిస్తున్నాయి. అయితే, బుద్ధికుశలత గల ధీరుడు ‘‘మార్పు చెందే స్వభావంగల వస్తువులు కోరుకొని లాభం ఏమిటి? ఏది మృత్యువు (లేక-మార్పు) చేరలేదో ఆ స్థానం సంపాదించుకుంటాను’’ ….. అని నిర్ణయము కలిగిఉంటున్నాడు. ధ్రువము (Permanent) - అధ్రువము (Temporary) అనే విభేదం చేసి, అశాశ్వత విషయాలను ప్రక్కకునెట్టి, శాశ్వత విషయము వైపుగా దృష్టి సారిస్తున్నాడు. అమృత స్వరూపుడగుచున్నాడు.

బిడ్డా! ‘‘ఇక్కడి రూపము - రసము - గంధము - శబ్దము - స్పర్శ - జీవుల సమాగమము …. వీటన్నిటిలో ఏది ధ్రువము (Permanent)? ఏది కాదు?’’ …. అని విచక్షించుకోవాలి సుమా! ఇవి శాశ్వతం కాదు. ఇవన్నీ కూడా, …. వాటిపట్ల ఏర్పడుచున్న అభిరుచి - ఆశయములతో సహా మొదలంట్లా మార్పు చెందబోతున్నాయి. జగద్విశేషాలన్నీ కూడా కాలంతోనే ప్రాప్తించి, కాలంతోనే నశిస్తున్నాయి. అయితే, …. దేనియందు (మరియు) దేనిచేత ఈ శబ్ద - స్పర్శ - రూప - రస - గంధాలు తెలియవస్తున్నాయో, అద్దానిని తెలుసుకుంటే, ఇక ఇక్కడ ఈ పంచతన్మాత్ర ప్రపంచంలో తెలుసుకోవలసినది, కోరుకోవలసినది ఏదీ మిగలదు.

ఏదైతే ఈ శబ్ద - స్పర్శ - రూప - రస - గంధాలు ఎరుగుచున్నదో ….
అదియే ‘ఆత్మ’. ఈ జీవుడు ఆత్మస్వరూపుడే గాని దేహ స్వరూపుడుకాదు. ఈ పంచ తన్మాత్రలోని ఆయా విశేషాలు నిజమైన - శాశ్వతమైన - నిరవధికమైన సుఖ - శాంతి - తృప్తులను ప్రసాదించజాలవు. పైగా మృత్యువుకు పరిమితము చేసి ఉంచుతాయి. ఏదైతే ఇవన్నీ పొందుతోందో అట్టి ’ఆత్మ’యే ఈ జీవుడు తెలుసుకోవలసిన శాశ్వత వస్తువు. అద్దానిని తెలుసుకొని - స్వస్వరూపానుభవస్థితి సంపాదించుకొన్నవారికి ఇక్కడ తెలుసుకొనవలసినది - పొందవలసినది ఏదీ లేదు. అట్టి కేవల స్వస్వరూపమే ‘శాంతాత్మ’.

ఆత్మ అనగా …..?

ఏదైతే …,

అట్టి శాంతాత్మయే సర్వుల హృదయ గుహలలో వేంచేసి స్థిరంగా నివసిస్తోందని అనుకున్నాం కదా! అదియే సర్వదేహాలలో ప్రాణ స్వరూపంగా ఉద్భవిస్తోంది. సర్వ దేవతలు అట్టి శాంతాత్మయందే అలంకరించబడినవారై ఉంటున్నారు. అది ఈ సృష్టి రూపంగా వెలువడుచున్నట్లు అజ్ఞాన దృష్టికి అనిపిస్తోంది కాని, వాస్తవానికి అది యథాతథం.

ఈ సర్వ దృశ్యము ఆ శాంతాత్మ స్వరూపమే!
- ఈ దృశ్యరూపంగా కనిపించేది …….,
- ఈ దృశ్యాంతర్గతంగా వేంచేసియున్నది …….,
- ఈ దృశ్యమును దర్శించేది - అంతా ఆ శాంతాత్మయే!
- కట్టెలలో దాగివుండి, ఒరిపిడిచే బయల్వెడలే అగ్నిలాగా …
- గర్భిణీ స్త్రీ గర్భంలో ఒదిగి ఉండి అనేక పూర్వ-తత్‌పూర్వ జన్మల అనుభూతులను మౌనంగా మననం చేస్తున్న గర్భస్థ శిశువులాగా …,
- ప్రతిరోజు ప్రజ్వలించబడుచు - చక్కగా పోషించబడే జాగ్రత్తు అనే ప్రబోధములాగా (గాఢ నిద్ర పోయేవానిలో దాగివున్న జాగ్రదనుభవంలాగా),
- మనుష్యులచే సమర్పించబడి ప్రజ్వలనము కొనసాగిస్తున్న హోమాగ్నిలోని హవిష్షులాగా (నేయిలోని అగ్నిని ప్రజ్వలింపజేసే గుణంలాగా),
ఈ దృశ్యములోను, సర్వుల హృదయములలోను, సర్వ వ్యవహారములలోను, సర్వ అనుభూతులలోను, సర్వ ఆశయములలోను ఏ ఆత్మ వ్యాపించి ఉన్నదో … అదియే ఈ జీవుని వాస్తవ శాంతాత్మ స్వరూపం!

ఓ నచికేతా! యతశ్చ ఉదతి సూర్యో, అస్తం యత్ర చ గచ్ఛతి, తం దేవాః సర్వే అర్పితా| ఈ సూర్యుడు ఎక్కడ నుండి ఉదయిస్తున్నాడో, ఎందులో అస్తమిస్తున్నాడో, ఎద్దాని యందు దేవతలంతా మణిదీపాలవలె అలంకరించబడిఉన్నారో, ….. అట్టి ఆత్మకు ఆవల ఇంకేమీ లేదు. తత్‌ ఉ నాత్యేతి కశ్చన|

ఇక మృత్యువు విషయానికొస్తే,
యత్‌ ఏవ ఇహ తత్‌ అముత్ర| యత్‌ అముత్ర తత్‌ అను ఇహ| మృత్యువుకు ఈవల ఏమున్నదో మృత్యువుకు ఆవల అదియే ఉన్నది. ఇక్కడ - అక్కడ సర్వదా ఆత్మయే సత్యం. అయితే, ఈ జీవులు అనేక ఆశలయొక్క నిరంతరాభ్యాసం చేత ఒక దుఃఖం నుండి న మరొక దుఃఖానికి, ఒక మృత్యువు నుండి ⇔ మరొక మృత్యువుకు ప్రయాణాలు కొనసాగిస్తున్నారేగాని, శాంతి స్థానమును చేరలేకపోతున్నారు.

ఎందుచేతనంటావా?
ఇక్కడ నానాత్వమును దర్శించే అభ్యాసం చేత!

మృత్యోః స మృత్యు గచ్ఛతి, య ఇహ నానేవ పశ్యతి|
ఇక్కడ నానాత్వమును దర్శించునంతకాలం అట్టి ద్రష్టకు ‘‘ఒక స్థితిని కోల్పోవటం - మరొక స్థితిని పొందటం’’ అను సంఘటన ఇట్లాగే కొనసాగుచున్నది. ఉభయ స్థితులలోని సమస్వరూపమగు ఆత్మ సందర్శనాభ్యాసముచే ‘‘మృత్యువు లేదు’’ అను అతీతస్థితి ద్యోతకమగుచున్నది. సర్వత్రా శాంతాత్మ సందర్శనమొక్కటే అందుకు ఉపాయం.

ఓ నచికేతా! ఇక్కడగాని, మరెక్కడగాని వాస్తవానికి అనేకత్వము లేదు. ఏకత్వమే సర్వే సర్వత్రా సర్వదా తాండవిస్తోంది. నీ యందు నా యందు - సర్వ జీవులయందు - సర్వ లోకముల యందు - లోకాధిపతుల యందు అఖండమగు ఆత్మయే సత్యము - నిత్యము.

నచికేతుడు : స్వామీ! మరి మాకు ఇక్కడ అనుక్షణం అనేకత్వం అనుభవమగుచున్నది కదా!

శ్రీ యమధర్మరాజు : అదాఁ! మనసా ఏవ ఇదమ్‌ ఆప్తవ్యమ్‌| మనస్సే ఈ దృశ్యమును - ఇక్కడ అనేకత్వమును పొందుతోంది. నేహ (న ఇహ) నానాస్తి కించన| ఇక్కడ నానాత్వము కొంచము కూడా అంతరంగాత్మ దృష్ట్యా - లేనేలేదు. ఆత్మదర్శనాభ్యాసం కలవాడు ఇక్కడ సర్వము ఆత్మమయంగా, ఆత్మరూపంగా, ఆత్మ ప్రదర్శనంగా, ఆత్మాంతర్గతంగా, కేవలాత్మ స్వరూపంగా దర్శిస్తున్నారు. అదియే ఆత్మదర్శనం. అదియే ఆత్మ సాక్షాత్కారం. అదియే పరమపురుషదర్శనం, సమాధి కూడా!

ఇక్కడ అనేకత్వం ఎవరికి కనిపిస్తోందో, అట్టివారు ఒక మృత్యువు నుండి మరొక మృత్యువుకు ప్రయాణిస్తూనే ఉంటారు సుమా!

ఆత్మజ్యోతి

ప్రతి జీవుని యొక్క అంతరంగంలోని హృదయాకాశంలో పరమాత్మ అంగుష్ఠమాత్రుడై (బొటనవేలు నిశ్చలంగా నిలబెట్టినప్పటి స్థిర స్వరూపంలాగా) హృదయ మధ్యంగా వేంచేసియే ఉన్నారు. ఆయనయే భూత - భవిష్యత్తులకు ఈశ్వరుడై పరిపాలిస్తున్నారు. పొగలేని దీపంలాగా సమస్తమును వెలిగిస్తున్న జ్యోతి స్వరూపుడై ప్రకాశిస్తున్నారు. ఆ పరమపురుషుడు హృదయంలో నిన్న ఉండి ఉన్నారు. ఈ రోజు ఉన్నారు. రేపూ ఉంటారు. వారి ఉనికిని గ్రహించిన జీవునకు ఇక దిగులు ఎందుకుంటుంది? అట్టి ఆత్మజ్యోతిని అనుభూతం చేసుకోకుండా, దేహముల రాకపోకలతో సహా-చిన్న చిన్న విషయాలకు దిగులెందుకు పడాలి? భయమెందుకు?

అయితే తన యందలి ఆ పరమపురుషుని ఉనికిని అనుభూతం చేసుకోవటమెట్లా? నిర్మలమైన జలం నిర్మలమైన జలంలో స్వభావసిద్ధంగా కలిసిపోతుంది చూచావా? నిర్మలమైన మనస్సు మాత్రమే ఆత్మను దర్శించగలదు. తన యొక్క ఆత్మ స్వరూపమును గ్రహించినవాడు నిత్యనిర్మలాత్మ స్వరూపుడగా అగుచున్నాడు. ఆత్మవేత్త ఆత్మయే అగుచున్నాడు. (ఆత్మవిత్‌ ఆత్మైవ భవతి)


(5.) పంచమ వల్లీ :: ఆత్మప్రకాశం - ‘బ్రహ్మము’ అనగా?

శ్రీ యమధర్మరాజు : ఓ నచికేతా! జన్మ రహితుడు - కేవల ప్రజ్ఞాస్వరూపుడు అగు ఆత్మ భగవానుడు ఈ 11 ద్వారములుగల దేహనగరం (1 నోఱు + 2 కళ్ళు + 2 చెవులు + 2 ముక్కు రంధ్రాలు + నాభి + పురీషం + మూత్రద్వారం + ఆలోచన) ప్రవేశించి ఉన్నారు. ఏ జీవుడైతే తన దేహము నందు, సమస్త దేహములందు కూడా వేంచేసియున్న ఆత్మ భగవానుని ఉపాసిస్తాడో …. ఆతనికిక ఏ దిగుళ్ళు, వేదనలు ఉండవు. ‘దృశ్య ధ్యాస’ అనే బంధము నుండి విడివడినవాడై జన్మ - మృత్యు చక్రం నుండి వైదొలగి ప్రకాశిస్తున్నాడు.

కేవలాత్మ ప్రతిఒక్క దేహములో …. మౌనంగా ప్రశాంతంగా, కారణకారణంగా ప్రదర్శనశీలమైయున్నది.

ఆత్మయే ఆ సర్వముగా వేంచేసినదై యున్నది.

ఆత్మ చైతన్యమే ఊర్ధ్వములో ప్రాణరూపముగాను, అధోమార్గంలో అపానరూపమై ప్రవహించుచున్నదై, ఈ జీవుల సర్వ దేహములను చైతన్యవంతం చేయుచున్నది. ఆ ప్రాణ - అపానముల మధ్య అత్యంత మౌనంగా చలనాచలనముల లయస్థానమై, ప్రాణోపాసకుల ఉపాసనాదైవమై అందరు దేవతలచేత ఆరాధింపబడుచున్నది.

ఏ జీవుడైతే ఈ దేహభావన - దృశ్యభావన నుండి విడివడినవాడై తన స్వరూపమును సందర్శిస్తాడో ఆతనికి అనుభూతమయ్యే నిత్య - నిర్మల నిరాకార స్వరూపమే ‘ఆత్మ’. ఆత్మ దర్శనమైతే ఇక్కడ జన్మలు లేవు, జగత్తులు లేవు.

ఓ మునిబాలకా! న ప్రాణేన, న అపానేన మర్త్యో జీవతి కశ్చన| ఈ జీవుడు ఎట్లా జీవిస్తున్నాడు! ఈ శరీరాలన్నీ ఎట్లా కదులు చున్నాయి? ప్రాణ - అపానముల వల్లనా? కానేకాదు. ఆ ప్రాణాపానముల సంచాలనము ఎద్దానిచే నిర్వర్తించబడుతోందో అట్టి ఆత్మయొక్క ప్రభావంచేత మాత్రమే జీవిస్తున్నాడు!

‘‘మృత్యు తదనంతరమ్‌-కర్మ జ్ఞానానుసారమ్‌ పునః దేహమ్‌’’

ఓ నచికేతా! ఇప్పుడు …., అతి రహస్యము అయినట్టి సనాతన బ్రాహ్మీతత్త్వం చెప్పుచున్నాను. ‘‘మృత్యు తదనంతరం అసలీ జీవునికి ఏమేమి అగుచున్నది?’’ … అనే ప్రశ్నకు సమాధానం చెప్పుచున్నాను. విను.

మరణానంతరం ఈ జీవుని జీవచైతన్యము ఈ భౌతిక దేహమును ఒక నిరుపయోగమైన వస్తువును త్యజించునట్లు త్యజిస్తోంది. అటు తరువాత తనయొక్క ‘‘జ్ఞానాత్మ (బుద్ధి)’’ యొక్క స్థితిని అనుసరించి మరొక ఉపాధిని ఆశ్రయిస్తోంది.

నిర్వర్తించియున్న కర్మలయొక్క …,
సంపాదించుకొనియున్న జ్ఞానము యొక్క …
ప్రభావం చేత,
ఒకప్పుడు ఈ జీవుడు ఆత్మ జ్ఞానముకొరకై అర్హమైన మరొక యోనిలో ప్రవేశిస్తున్నాడు. ఇంకొకప్పుడు స్థానువు (కొండరాయి మొదలైన) రూపములలో ప్రవేశించి (ఆత్మ జ్ఞానము ఏమరచి, దృశ్య తాదాత్మ్యముతో) నిదుర కొనసాగిస్తున్నాడు.

బ్రహ్మము అనగా?

అయితే …,
య ఏష సుప్తేషు జాగర్తి కామం కామం పురుషో నిర్మిమాణః, తదేవ శుక్రం| తత్‌ బ్రహ్మ| ఈ జీవుడు గాఢ నిద్రలో ఉన్నప్పుడు కూడా ఏది మెళుకువగా ఉన్నదో, అదే శుక్రమగు బ్రహ్మము. ఏదైతే నిద్రలో స్వప్నరూపంగాను, జాగ్రత్తులో దృశ్యరూపంగాను తన ఇచ్ఛానుసారమే ఆయా విషయపరంపరలను స్వప్న - జాగ్రత్‌రూపములుగా పొందుచూ అనుభవిస్తోందో … ఆ సర్వానుభవములకు ఆవల ఉన్నట్టి సర్వ కర్తృత్వ - సర్వాతీత స్వరూపమే బ్రహ్మము. అదియే ఆత్మ. అది అమృత స్వరూపం.

ఉపాధులు వస్తూ - పోతూ ఉండగా, ఏదైతే వాటినన్నింటినీ తనయందు పొందటం జరుగుతోందో, …. అదే ఆత్మ! ఆ ఆత్మలోనే ఈ లోకాలన్నీ, ఈ ఉపాధులన్నీ కల్పితమగుచూ ఉన్నాయి. అట్టి ఆత్మ సర్వదా పరిశుద్ధము. అద్దానికి ఆవల మరింకేమీ లేదు.

నచికేతుడు : స్వామీ! మనకు ఎదురుగా జీవులు కనిపిస్తున్నారుకదా! వీరంతా ఎవరి కర్మ - జ్ఞానములు వారివేగా కలిగియున్నవారై ఉంటున్నారు. అనగా ఈ అసంఖ్యాక జీవాత్మలు వేఱువేఱే కదా! వీరంతా ఎందులోంచి బయల్వెడలుచున్నారు?

శ్రీ యమధర్మరాజు : ‘‘పరమ పురుషుడు’’ అని చెప్పుకున్న ‘శాంతాత్మ’ ఏకమే! అనేకం కాదు. సముద్రజలమంతా ఒక్కటే అయినప్పటికీ వేరు వేరు ఆకారములు గల అసంఖ్యాక తరంగాలు ప్రతిరోజు అద్దానిలో ఉద్భవిస్తున్నాయి చూచావా? అట్లాగే శాంతాత్మా మహాసముద్రంలో ఈ ‘జీవులు’ అనబడే పిల్ల తరంగాలు, ‘లోకాలు’ అనబడే మహాతరంగాలు ప్రకటితమగుచున్నాయి. తరంగాలెన్ని ఉన్నా అంతా జలమే కదా! ఎంతమంది జీవులున్నా …. అంతా ఆత్మయొక్క ఆపాదిత రూపము మాత్రమే.

కొన్ని దృష్టాంతాలతో ఇది మరింత సుస్పష్టపరుస్తాను. విను.

అగ్నిః యథా ఏకో భువనం ప్రవిష్టో రూపం రూపం ప్రతిరూపో బభూవ| అగ్ని విశ్వమంతా ఆక్రమించుకొని ఉండి, ఒక వస్తువును కాలుస్తున్నప్పుడు ఆ వస్తు ఆకారము పొందినట్లుగా కనిపిస్తుంది కదా! ఏక తథా సర్వభూతాంత్మరాత్మా రూపం రూపం ప్రతిరూపో బహిశ్చ| ఏకమే అయి ఉండియే ఆత్మ సమస్త జీవులలో - ఒక్కొక్కరిలో - అంతరాత్మ అయి బాహ్యమునకు అనేక రూపాలు, ప్రతి రూపాలు దాల్చుచున్నది. రూపాలు వేరైనా ఆత్మ ఒక్కటే!

- వాయువు ఒక్కటే అయినప్పటికీ బూర - బంతివంటి ఆయా వస్తువులలో ప్రవేశించి ఆయా ఆకారాలన్నీ తానే రూపము ఇచ్చుచున్నదగుచున్నది కదా! అట్లాగే సర్వ జీవులలోని అంతరాత్మ ఒక్కటే అయివుండి కూడా, … తోలు తిత్తి వంటి ఈ దేహములలో ఒక్కొక్క రూపము బాహ్యానికి ప్రదర్శిస్తూ, … మనోబుద్ధి - చిత్తములను ఆకారమాత్రంగా ధరిస్తోంది.

సూర్యో యథా సర్వలోకస్య చకక్షుః, న లిప్యతే చాకక్షుసైః బాహ్య దోషైః - ఒకనికి చూపు సన్నగిల్లటంచేత వెలుతురు గాని - వెలుతురులోని వస్తువులుగాని కనిపించక పోవచ్చు. అంతమాత్రంచేత సూర్యకాంతికి (ఏకాంతిలో తదితరులు ఆయా వస్తువులను చూస్తున్నారో … అట్టి వెలుతురుకు) ఆ కంటిదోషం అంటుతుందా! మరొకనికి ’’మెల్లకన్ను (Asticmatism)వ అనే దోషంచేత వెలతురులో ఒక వస్తువు రెండు-మూడుగా కనిపిస్తాయి. ఆ కంటి దోషము ఆ వస్తువును తాకి రెండు-మూడుగా చేస్తుందా? లేదు కదా! అట్లాగే కంటి దోషము సూర్యకాంతిని స్పృశించనట్లే ఈ జగత్తులోని మంచి-చెడు, మాన-అమానములు, సుఖ-దుఃఖములు, అధిక-న్యూనతలు, అందము - అంద వికారములు, ఆత్మను స్పృశించవు. (ఇదియే ఆత్మయొక్క అస్పృశ్య సిద్ధాంతము). సర్వ జీవులలోని ఏకస్వరూపమగు అంతరాత్మకు ఈ జీవుల దుఃఖాదులతో సంబంధమే లేదు. ఇక ఈ సుఖ-దుఃఖాది ద్వంద్వాలు మనోవికారములు మాత్రమే!

ఆత్మ సర్వథా ఏకమై, సర్వనియామకమై సర్వ జీవులలోని అంతరాత్మగా, సర్వదా ప్రకాశిస్తోంది. తన రూపము ఏకమే అయినప్పటికీ - ఒకే సముద్ర జలముయొక్క వేలాది సముద్ర తరంగాలులాగా - అనేక రూపాలుగా ప్రదర్శితమౌతోంది. అట్లు అనేక రూపాలుగా ప్రకటనమగుచున్న ఏకైకాత్మను ఏ జీవులైతే సూక్ష్మబుద్ధితో సర్వే - సర్వత్రా దర్శిస్తూ ఉపాసిస్తారో, వారు అద్దానిని తమయందే గాంచుచున్నారు. ‘‘తమ ఆత్మయే సర్వజీవుల ఆత్మ కూడా’’ అని గమనిస్తున్నారు. తన ఆత్మయందే ఆ విశ్వాత్మ యొక్క ఉనికిని గమనించి ఉపాసిస్తున్నట్టి ధీరుని సుఖము మాత్రమే శాశ్వతము. ఇక తదితరుల సుఖమంటావా, …. అది ప్రతిబింబ సుఖము మాత్రమే! అట్టిది నిత్యము - శాశ్వతము అయిన సుఖము కాదు. పైగా, దుఃఖ మిశ్రితము కూడా.

అట్టి సర్వజీవులలోని ఆత్మను తమయందే సందర్శిస్తున్న సుఖము నిరవధికము (No need to desire anything else after understanding that). తెంపులేనిది. అట్టి ఆత్మ సుఖమే సుఖము. (జగత్తులలో కనిపించే పుత్ర-మిత్ర-దంపత-సంపద సుఖాలన్నీ సుఖమువలె కనిపించే మనోభ్రమ మాత్రమే).

‘‘నా యందలి ఇయ్యదియే సర్వజీవులలోని అంతరాత్మ’’ అని గమనించి ఎవ్వరు నిత్యోపాసన చేస్తారో, … వారి సుఖము సర్వోత్కృష్టమైనది. ఆత్మ సుఖము ‘ఇట్టిది’ అని నేను నిర్వచించజాలను. ఆత్మ తనకు తానే ప్రకాశిస్తూ, సర్వమును ప్రకాశింపజేయు చుండగా, … అద్దానిచే వెలిగించబడే ఈ ఇంద్రియములతో అద్దానిని ‘‘ఇట్టిది’’ అని నిర్ణయించి చెప్పడమెట్లా? ‘‘అది స్వయం ప్రకాశం కదా! అదే ఇదా? ఇదే అదా? తదితర ప్రకాశకమా!’’ … ఇటువంటి ప్రశ్నలు ఆత్మానందం పొందే వారి సమక్షంలో ఉదయించటమేలేదు.

అట్టి ఆత్మను ఏ వెలుగులో దర్శించాలి? న తత్ర సూర్యో భాతి| న చంద్ర తారకమ్‌| నేమా విద్యుతో భాంతి కుతో అయమ్‌ అగ్నిః? సర్వమ్‌| ఈ భౌతిక సూర్య-చంద్ర-నక్షత్ర-విద్యుత్‌ కాంతులు తమ వెలుగుచే అద్దానిని చూపగలవా? లేదు. తమేవ భాంతమ్‌ అనుభాతి సర్వమ్‌| తస్య భాసా సర్వమిదమ్‌ విభాతి| అది ప్రకాశిస్తూ ఉంటే, ఆ ఆత్మ దేవుని ప్రకాశ విభాగంగా సూర్య-చంద్ర-నక్షత్ర విద్యుత్తులు ప్రకాశిస్తున్నాయి సుమా!


(6.) షష్ఠమ వల్లీ - పరమాత్మ - సంసారము - జగత్తు

శ్రీ యమధర్మరాజు : ఓ నచికేతా! జీవుడు ఈ దృశ్యమును ఏరూపంగా దర్శిస్తున్నాడో …. అదియే ‘సంసారము’ అని చెప్పబడుతోంది. ఈ స్వర్గ - భూ - నరకాది లోకాలే ఆ సంసారము అనబడే అశ్వత్థ వృక్షము (న శ్వో అపి స్థాస్యతి - ఇతి అశ్వత్థం … రేపు మరొక విధంగా ఉండేది) సుమా!

అనిత్యమైనదంతా నిత్యమైనదానిలోనే అమర్చబడినదై ఉన్నది. ఈ లోకాలలో ఎంత వెతికినా తృప్తి - ఆనందం లభించదయ్యా! ఇవన్నీ ఎద్దానిలో (అద్దానికి అభేదంగా) అమర్చబడిఉన్నాయో, అట్టి చైతన్యాత్మ సర్వదా అత్యంత నిర్మలం. అదియే ‘బ్రహ్మము’ అనే శబ్దముచే ఉద్దేశించబడుతోంది. అట్టి బ్రహ్మము అమృతము. తదితరంగా అనిపించేదంతా మార్పుచెందనున్నది కాబట్టి ‘మృతము’.

ఈ లోకాలన్నీ ఆ పరబ్రహ్మమును ఆశ్రయించి, అద్దానియందే, అద్దాని రూపంగానే ఉన్నాయి. అట్టి పరబ్రహ్మము ఎందులోనూ లేదు. అద్దానిని అధిగమించి మరింకేమీ లేదు. బ్రహ్మదేవుని మొదలు స్థావరం వరకు గల ఈ జగత్తంతా కూడా సర్వప్రాణుల ప్రాణ స్వరూపమైనట్టి ఆ పరబ్రహ్మము నుండి బహిర్గతమై, అద్దానియందే ఉనికిని కలిగిఉంటోంది. అయ్యది ఇదంతా తన ఆధీనంలో కలిగియున్నదై, సర్వనియామకమై చెన్నొందుతోంది. అద్దాని నియమానుసారమే ఈ జగత్తులన్నీ ప్రవర్తిస్తున్నాయి. అది ఎత్తబడిన వజ్రంలాగా సర్వమును నియమించి ప్రవర్తింపజేస్తోంది.

అట్టి పరబ్రహ్మము (లేక) పరమ పురుషుని తత్త్వము గ్రహించిన జీవుడు జనన - మరణరహితుడగుచున్నాడు. జనన - మరణములు కూడా దేనిచే నియమించబడుచున్నాయో, … అట్టి తత్త్వము ఆత్మ. ‘ఆత్మయే తాను’ - అని ఎఱిగిన తరువాత ఇక మృత్యువుచే పరిమితత్వం ఎందుకు పొందుతాడు? అట్టి విజ్ఞుడు అమృత స్వరూపుడే సుమా!

ఆ పరబ్రహ్మము సర్వనియామకము కదా! అద్దాని నియామకమును అనుసరించే, ….. అద్దాని పట్ల భయం చేతనే …,
అగ్ని … ఊర్ధ్వగా ప్రజ్వలిస్తోంది.
సూర్యుడు … ఆకాశమునందు ప్రకాశిస్తున్నారు.
ఇంద్రుడు … త్రిలోకములు ఏలుచున్నారు.
వాయువు … సర్వత్రా ప్రసరిస్తోంది
మృత్యువు … దేహ - దేహానంతర సంబంధమైన తన విధిని నిర్వర్తిస్తోంది.

ఓ నచికేతా! ఈ మానవదేహం పొందటం అట్టి సర్వనియామకమగు పరమాత్మ గురించి తెలుసుకోవటానికి ఒక అరుదైన అవకాశం సుమా! ఈ శరీరపతనానికి ముందే ఇక్కడ ఆ పరమాత్మ గురించిన జ్ఞానమును సంపాదించుకోవాలి. అలా ఆత్మ జ్ఞానాన్ని ఇక్కడే ఇప్పుడే ఈ శరీరం ఉండగానే ఎవ్వరు సంపాదించుకోరో, … వారి అవస్థలు వర్ణనాతీతం-అని హెచ్చరిస్తున్నాను. అట్టి వారు ఈ సృష్టిలోని ఈ ఈ లోకాలలో ఉపాధులు పొందటం, గర్భంలో ఉండి వేదనలు అనుభవించటం - ఇట్లా కొనసాగిస్తూనే ఉండవలసి వస్తోంది. వారు మరల మరల శరీర ధారణం, మరల - మరల మరణములు పొందటానికి మాత్రమే అర్హులగుచున్నారు.

అట్టి ఆత్మ … మరేదో లోకం ప్రవేశించి చూడవలసిన వస్తువు కాదు. ఇప్పుడే - ఇక్కడే అంతరంగంలో అద్దాని దర్శనం చేసుకోవాలి. ‘‘నేను దేహాకార పరిమితుడను’’ అనునది వదలుచూ, సమస్తము అమర్చబడినవైయున్న శాంతాత్మనే నేను’’ అనునది యోగ-జ్ఞానాభ్యాసము.

ఆత్మ - జగత్తు

మానవ లోకంలో దర్పణ ప్రతిబింబంగా :

ఈ మానవ లోకంలో (భౌతికరూపమై, ఇంద్రియవిషయ రూపములుగా) కనిపించేదంతా కూడా ……,
‘ఆత్మ’ అనే దర్పణంలోని ప్రతిబింబమువంటిది.

దర్పణం దృశ్యమును ప్రతిబింబిస్తున్నప్పటికీ ఆ ప్రతిబింబ దృశ్యములోని విశేషాలచే దర్పణం మార్పు-చేర్పులు ఏమైనా పొందుతోందా? లేదుకదా!

కాబట్టి ఓ నచికేతా!

‘‘నా స్వరూపము బ్రహ్మము అనబడే దర్పణము వంటిది! ఈ దృశ్యము, ఈ లోకాలు … ఇవన్నీ కూడా మమాత్మయందు - దర్పణంలో ప్రతిబింబించే దృశ్య పరంపరల వంటివి. నేను ఆత్మస్వరూపుడను. ఈ దృశ్యము ఆత్మ స్వరూపుడనగు నాయందు బాహ్య - అంతర్గత - మనోబుద్ధి చిత్త అహంకార రూపములలో ప్రతిబింబిస్తున్నాయి’’
అని సర్వదా అవగాహన పెంపొందించుకో.

పితృలోకంలో స్వప్నంలా :
స్వప్నంలోని అంతర్గత విశేషాలన్నీ స్వప్నంలోనే ముగుస్తున్నాయి. స్వప్న ద్రష్ట యొక్క స్వస్వరూపము స్వప్నమునకు ముందు-తరువాత కూడా యథాతథం కదా! అట్లాగే ‘‘ఆత్మ స్వరూపుడనగు నేను యథాతథం. ఈ దృశ్యము నా కలలోని విశేషాలు వంటివి మాత్రమే’’ … అని పితృలోక వాసుల సందర్శనంలాగా (పితృలోకం జేరిన జీవునికి తన జీవించియున్నప్పటి అనుభూతులన్నీ స్వప్న సదృశంగా అనిపిస్తున్నట్లు) … గ్రహించి ఉండు.

గంధర్వం లోకంలో నదీజల ప్రతిబింబిత వృక్షంలా :
ఒడ్డునగల వృక్షము యొక్క శాఖలు నిశ్చల జలంలో యథాతథంగా కనిపిస్తాయి. చంచల జలంలోనో … వృక్షమే ఎటకో ప్రయాణిస్తున్నట్లు కనబడుతోంది. అట్లాగే …,
ఆత్మజ్ఞానంచేత …………………. ఇదంతా నిశ్చల పరబ్రహ్మముగానే కనిపిస్తోంది. జగద్దృశ్యమంతా - జలంలో కనిపించే (ఒడ్డునగల) వృక్ష ప్రతిబింబముయొక్క కదలికల వంటిది.

చంచల మనస్సు నుండి చూచేవారికి ఇది చంచల జగత్తుగా అగుపిస్తోంది. చంచలంలోని నిశ్చలత్వమేమిటో ఆత్మజ్ఞానులకు మాత్రమే సువిదితమౌతోంది?

ఛాయా తపయోరివ బ్రహ్మలోకే :
బ్రహ్మమును గురించి శాస్త్రజ్ఞానం కలవారు ’‘బ్రహ్మము వెలుగుగా, ఈ జగత్తు నీడ’’గా అభివర్ణిస్తున్నారు.

బ్రహ్మమును ఇక్కడే ఇప్పుడే యథాతథంగా ఆత్మ స్వరూపం (As one’s own absolute self)గా దర్శించాలి. ఉపాసించాలి. అనుభూతం చేసుకోవాలి. అది ఇప్పుడే ఇక్కడే జరుగవలసినది. ఏదో లోకం వెళ్ళిన తరువాత కాదు.

ఈ ఇంద్రియములకు ఉదయాస్తమయములు (A beginning and an end) ఉన్నాయి. ఆత్మ ఈ ఉత్పత్తి - వినాశన ధర్మములు గల ఇంద్రియములకే వేఱుగా ఉన్నది. ‘ఉత్పత్తి’ అనే ధర్మముగల సర్వ విషయములకు మునుముందుగానే ఆత్మ యథాతథ స్వరూపంతో వేంచేసియే ఉన్నది.

అట్టి తన యొక్క ఆత్మ స్వరూపమును ఎవ్వరు గ్రహిస్తారో, … అట్టివారు ఈ ఇంద్రియ విషయములచే నిర్మితమైన జగత్తును చూచి ఏమాత్రం శోకించరు. భ్రమించరు. బ్రాహ్మీభావమునందు అచ్యుతులై ఉంటారు.

ఓ నచికేతా!

అట్టి ‘పరమ పురుషుడు’ అని చెప్పబడే పరమాత్మ యొక్క రూపం కంటికి కనిపించే దృశ్యము వంటిది కాదు. దృశ్యములోని ఒకానొక విభాగమూకాదు. ఏదో లోకంలో తారసపడేదీ కాదు. మరి? ఆత్మయొక్క స్వరూపం ఎవరికివారికి తమ హృదయంలోనే తమయొక్క నిర్మలం చేయబడిన బుద్ధికి అభివ్యక్తం అగుచున్నది. అదియే ప్రతిజీవుని పరమపద స్థానము.

సర్వాత్మకుడగు పరమాత్మ సందర్శనం

నచికేతుడు : మహాత్మా! మాయందే సర్వదా వేంచేసి, తిష్ఠ వేసుకొని యున్న సర్వాత్మకుడగు ఆ పరమ పురుషుని సందర్శనం మాకు లభించేది ఎట్లా? అనుక్షణికంగా స్వానుభవమయ్యేది ఏతీరుగా?

శ్రీ యమధర్మరాజు : అట్టి సందర్శనం లభించకపోవటానికి కారణం గమనించి, ఆ కారణమును తొలగించుకో!

నచికేతుడు : అంతరంగంలో సర్వదా వేంచేసియున్న ఆ సాక్షియగు పరమాత్మ దర్శనం మాకు అనుభవమవకపోవటానికి కారణం?

శ్రీ యమధర్మరాజు : ఈ పంచేంద్రియములు - మనస్సు - బుద్ధి ఎప్పుడు తమ చంచలత్వమును త్యజించి నిశ్చలమౌతాయో, … అప్పటి ‘‘అనునిత్యానుభవస్థితి’‘యే ఆత్మానుభవం. కొందరు ఇంద్రియ - నిశ్చలధారణయే ‘యోగము’ అని తలచుచున్నారు. బ్రాహ్మీ-భావన (లేక) అవగాహన యొక్క నిశ్చలత్వమే వాస్తవమైన నిశ్చలత్వం. అట్టి ’‘బుద్ధి యొక్క నిశ్చల నిశ్చయత్వం’’ సంపాదించుకొని, అటుపై అప్రమత్తుడై సర్వే - సర్వత్రా ఆత్మదర్శనం చేయాలి. అంతా ఆత్మగా దర్శించటమే నిశ్చల యోగధారణ.

అట్టి ఆత్మ - (భౌతికా - రసాయనిక శాస్త్రాలవలె) ప్రాపంచ ప్రమాణములుచేతగాని, మనస్సు చేతగాని, కళ్ళచేతగాని, పొందబడేది కాదు. ‘‘ఆత్మ ఉన్నది’’ అని అనుభవ పూర్వకంగా చెప్పే మహనీయుల వాక్యాలే అద్దాని అస్థిత్వానికి ప్రమాణం. అందుచేత అనుభవజ్ఞుల ఆత్మ ప్రవచనాలు సర్వదా శరణ్యం. ‘సత్సంగము’ అత్యంతావశ్యకం!

‘‘ఆత్మ (పరమ పురుషుడు - సర్వాంతర్యామి) ఉన్నది’’ …. అని శాస్త్ర వాక్యములు - గురు వాక్యములు విశ్వసించి ప్రయత్నంచే వారికి అది ఉపలబ్ధం అవుతోంది. అందుచేత దృశ్యమునకు ఆధారము, అతీతము అగు ’ఆత్మ’పట్ల విశ్వాసం పెంపొందించుకోవాలి. గురువాక్యములపై, శాస్త్ర ప్రవచిత సాధనలపై, తనపై విశ్వాసము అందుకు ఉపాయము.

‘‘ఆత్మ నిరుపాధికము (ఉపాధి యొక్క ఆవశ్యకత లేనిది. నిర్వికారము)’’

ఉపాధులకు సంబంధించని ఆత్మ యొక్క విజ్ఞానమును మహనీయుల ఆప్త వాక్యముల నుండియే మనకు లభించగలదు. ఎవ్వరు విశ్వాసంతో కార్యదీక్షతో అందుకు ప్రయత్నిస్తారో అట్టివారికి అది తప్పక అభిముఖం అవుతోంది. ప్రత్యక్షం అవుతోంది. అనుభూతమౌతోంది.

నచికేతుడు : ‘‘సర్వాత్మకము - స్వస్వరూపము’’ అగు పరమపురుషుడగు స్వీయాత్మ దర్శనం ఎప్పటికి, ఎట్లా ఉపలభ్యమౌతుంది?

శ్రీ యమధర్మరాజు : ఎప్పటికో, విను.

యదా సర్వే ప్రముచ్యంతే కామా యే అస్య హృది శ్రితాః, అథ మర్త్యో అమృతో భవతి| - ఎప్పటికైతే హృదయములోని దృశ్యమునకు సంబంధించిన సర్వ కోరికలు (ఏదో కావాలి - ఇంకేదో పొందాలని - ఉన్నదేదో తొలగాలనే భావావేశం) తొలగుతాయో, అట్టి నిర్మల హృదయమును సంపాదించుకున్న జీవుడు ఇప్పుడే - ఇక్కడే అమృతత్వమును సంపాదించుకుంటున్నాడు. అత్ర బ్రహ్మ సమశ్నుతే|| ఇక్కడే బ్రహ్మమును పొందుచున్నాడు.

యదా సర్వే ప్రభిద్యంతే హృదయస్య ఇహ గ్రంథయః| - ఎప్పుడైతే ఈ జీవుడు తనయందలి అజ్ఞాన బంధములన్నీ హృదయంలో లేకుండా చేసుకుంటాడో, … అట్టివాడు ఇక్కడే అమృత స్వరూపుడై వెలుగొందుచున్నాడు.

ఇదియే శాస్త్రములన్నిటి యొక్క అతిపవిత్రమైన అంతిమ ప్రవచనం. శాస్త్రానుశాసనం. అప్రతిహత సిద్ధాంతము.

[
గ్రంథి = కంతి - చిక్కుముడి, బంధము, అడ్డంకి -

బ్రహ్మ గ్రంథి = రజోగుణం. ప్రపంచ వ్యవహారం సంకల్పించటం. ‘సృష్టియందు నేను బద్ధుడను’ అని భ్రమించటం.
‘ఇది ఉంటేనే నా ఉనికి’ అని భావించటం. (సృష్ట్యభిమానము).

విష్ణు గ్రంథి = కర్తృత్వాభిమానం. అహంకారం - మమకారం. ‘నేను పంచకోశములకు సంబంధించినవాడిని’ అని భావించటం (స్ధిత్యభిమానము).

రుద్ర గ్రంథి = సృష్టి లయము కావాలనే అభిమానము ‘‘నాపట్ల సృష్టి వ్యసనము తొలగు గాక!’’ - అనే ఆవేశము
గ్రంథి ఏర్పడటం లయము గురించిన అభిమానము

- నేను సంగుడను → నేను అసంగుడను
- నేను వికారుడను → నేను నిర్వికారుడను
- నేను సంసారిని → నేను అసంసారిని.
- నేను మరణశీలుడను → నేను అమృత స్వరూపుడను.
]

ఈ సృష్టి - స్థితి - లయ అభిమానములను జయించి (త్యజించి) ఉండటమే గ్రంథి భేదము.

యోగ మార్గము - బ్రహ్మ మండల ప్రవేశము

హృదయం నుండి 101 నాడులు బయలుదేరి దేహమంతా విస్తరించినవై ఉన్నాయి. అవన్నీ ఇంద్రియములను నియమించటానికి వార్తాహరులవలె ప్రవర్తిస్తున్నాయి.

ఆ 101 నాడులులో ఒకానొక్కటి మాత్రమే ఊర్ధ్వముగా శిరస్సు యొక్క ఉపరిభాగము వరకు వ్యాపించినదై యున్నది.

యోగి ‘సుషుమ్న’ అనే నాడిద్వారా శిరస్సును అధిగమించి ‘ఊర్ధ్వాభిముఖుడు’ అగుచున్నాడు. మిగతా నాడులను త్యజించి ఇంద్రియ-ఇంద్రియాభిముఖములగుచున్న నాడీ మార్గములను అధిగమించి, శిరస్సు వైపుగా (బ్రహ్మరంధ్రము వైపుగా) ప్రయాణిస్తున్న నాడిని అభ్యాసపూర్వకంగా అనుసరించుచున్నాడు. ఊర్థ్వాభిమఖుడై సర్వఇంద్రియ విషయ ప్రపంచమును అధిగమించి వేస్తున్నాడు. సూర్యలోకం (అజ్ఞా మండలం / జ్ఞాన మండలం) ద్వారా బ్రహ్మమండలం పొంది అమృతత్వం పొందుచున్నాడు. అట్టి యోగ మార్గ ప్రయాణంలో దేహము ఉపకరణంగా అగుచున్నది.

అట్లా కాకుండా ఇంద్రియ విషయములగు శబ్ద స్పర్శ రూప రస గంధములవైపుగా విస్తరించియున్న మిగతా 100 నాడులు ఆశ్రయించినవాడు ప్రాణ ఉత్క్రమణము సందర్భములో మరల ఇంద్రియ విషయముల దిశగా ప్రయాణించుచున్నాడు. అట్టి ప్రయాణం పునః పునః సంసార బంధమును కొనసాగేటట్లు చేస్తోంది.

ఉపసంహారము

ఓ బిడ్డా! నచికేతా! సర్వాత్మకుడగు పరమపురుషుని గురించి మనము ఇప్పటి వరకు చెప్పుకున్నాము. ఇది మృతమును జయించు మార్గము. ఈ మన సంవాదము యొక్క ఉపసంహరణ సందర్భంగా మరొక్కసారి సమీక్షించి చెప్పుకుందాం.

1) అంగుష్ఠ మాత్రుడగు మార్పుచేర్పులు లేని పురుషుడు (ఆత్మ) సమస్త ప్రాణుల హృదయములో వేంచేసియే ఉన్నారు.
2) ఆయనయే సర్వజీవుల అంతరాత్మ. కేవలాత్మ. సహజ అనునిత్య స్వరూపము.
3) ముంజగడ్డి నుండి గోరుతో ‘ఈనె’ను (యజ్ఞ సాధనముల నిమిత్తం) బయటకు తీస్తారు చూచావా? అట్లా ఈ జీవుడు ఆ అంగుష్ఠ మాత్రుడగు పరమాత్మను తనయొక్క పంచేంద్రియ-పంచతన్మాత్ర భూతమగు శరీరము నుండి వేరుపరచి బయటకు తీయాలి.
4) ’‘ఈ శరీర ధర్మము లేవీ సర్వాత్మకుడగు అంతరాత్మకు లేవు’’ … అని గమనించాలి. ‘‘ఈ శరీరముకంటే ఆత్మ భిన్నమైనది’’ …. అని గ్రహించాలి.
5) ఆ వేఱుపరచబడిన అంగుష్ఠమాత్ర పురుషుని సమస్తమునకు అనన్యమైనవాడుగా, సర్వాంతర్యామిగా, పరిశుద్ధ ప్రభువుగా, చిన్మాత్రముగా, అమృత స్వరూపంగా గుర్తించు.

- ఆయనయే పరమపురుషుడు
- ఆయనయే పురుషోత్తముడు
- ఆయనయే బ్రహ్మము.
- ఆయనయే పరబ్రహ్మము
- ఆయనయే నీవు-నేను-ప్రతిఒక్క జీవుడు కూడా! ఈ మన సందర్భ స్వరూపమునకు ఆధారమైన స్వస్వరూప-సహజపురుషుడు ఆయనయే.
ఆయనను తెలుసుకొన్నప్పుడు ఈ జీవుడు పరిశుద్ధుడు అవుతాడు. ’మృతము’ను జయించి ‘అమృతత్వము’ సిద్ధించుటకు అదియే ఉపాయము.
ఆయనను గ్రహించి శుద్ధుడవు అవటమే సర్వరుగ్మతలకు ఏకైక ఉపాయం.

మృత్యుదేవతయగు శ్రీ యమధర్మరాజు బోధించిన ఈ ’బ్రహ్మ విద్య’ను నచికేతుడు అత్యంత జాగరూకతతో శ్రద్ధగా మనస్సును ఏకాగ్రంచేసి, బుద్ధితో గ్రహించి హృదయస్థం చేసుకున్నాడు. యోగ విధి పొందినవాడైనాడు.

బ్రహ్మమే తన స్వభావంగా తననుతాను తీర్చిదిద్దుకున్నాడు.

అప్పుడు నచికేతుడు లేచి నిలుచున్నాడు. యోగులకు, భక్తులకు, జ్ఞానులకు, పరిశుద్ధ హృదయులకు ప్రేమాస్పదుడుగా అనుభవుడగు యమభగవానుని సమీపించాడు. త్రి-ప్రదక్షణములు చేసాడు. వారు ప్రసాదించిన బ్రహ్మజ్ఞానమునకు కృతజ్ఞతాపూర్వకంగా సద్గురు-స్తుతులు సమర్పిస్తూ సాష్టాంగ దండ ప్రణామములు సమర్పించాడు.

‘‘స్వామీ! మీకు ‘సర్వస్వదానము’గా సమర్పించబడిన నేను మీ ఆజ్ఞానుసారం ’‘సమస్తము సద్గురువుకు చెందినదే’’ - అని భావిస్తూ, భగవత్‌ ప్రసాదంగా జీవితమును గడపుతాను’’ - అని పలికాడు.

స్వామివద్ద శెలవు తీసుకొని, సర్వ సమర్పణ భావనా సమన్వితుడై, ఆ నచికేతుడు గురు ఆజ్ఞానుసారంగా యోగమార్గంలో భూలోకగతుడై తిరిగి నాచికేత నామధేయ భౌతిక శరీరములో ప్రవేశించాడు. పునః జీవితుడై పితృదేవతలకు, బంధుజనమునకు పరమానందము కలిగించారు.

క్రమంగా గురు వాక్యములు గుర్తు చేసుకుంటూ ‘‘శుద్ధము, నిర్మలము, అప్రమేయము, సర్వము, అఖండము, నిత్యము, శాశ్వతము, అద్వితీయము’’ అగు - బ్రహ్మమే తానైనాడు.

ధూళి తొలగించబడిన అద్దమువలె స్వభావసిద్ధంగా ప్రకాశించాడు. ‘‘నాకు మృత్యువు స్వభావమే కాదు’’ అని గ్రహించినవాడైనాడు.

ఎవ్వరైనా సరే, నచికేతునివలె శ్రీ యమధర్మరాజు ప్రవచితమైన బ్రహ్మవిద్యను గ్రహించి అమృత స్వరూపులు కాగలరు.



🙏 ఇతి కఠ ఉపనిషత్ ‌🙏
(లేక) కృష్ణయజుర్వేదాంతర్గత కఠ వల్లీ ఉపనిషత్‌
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।।