[[@YHRK]] [[@Spiritual]]

Kaivalya Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 2
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: yhrkworks@gmail.com

కృష్ణ యజుర్వేదాంతర్గత

10     కైవల్యోపనిషత్

శ్లోక తాత్పర్య పుష్పమ్


శ్లో।। కైవల్యోపనిషత్ వేద్యమ్ కైవల్య ఆనంద తుందిలమ్
కైవల్య గిరిజ ఆరామమ్, స్వమాత్రమ్ కలయేత్ అహమ్।

కేవల స్వస్వరూపమునకు దారిచూపునది, నిర్హేతుక - కేవలానందమును ప్రసాదించునది. ‘కైవల్యము’ అనే కొండ శిఖరముపైగల ఆరామ విశ్రాంత గృహమునకు జేర్చునది - అగు కైవల్యమార్గమును ఈ కైవల్యోపనిషత్ ప్రసాదించగలదు.

1 అథ అశ్వలాయనో
భగవన్తం, పరమేష్ఠినం
పరిసమేత్య, ఉవాచ।।
ఒకప్పుడు → అశ్వలాయన మునివరేణ్యులు - సాధన చతుష్టయమును చక్కగా అభ్యాసము చేసినవారై, అటు తరువాత→ భగవంతుడు, పరమేశ్వరుడు అగు బ్రహ్మదేవుని సన్నిధానానికి ఆత్మజ్ఞానార్థి అయి వెళ్లారు. ఈ విధంగా ప్రశ్నించారు.
2 అధీహి భగవన్। బ్రహ్మవిద్యామ్, వరిష్ఠామ్,
సదా సద్భిః సేవ్యమానామ్ నిగూఢామ్,
యయా అచిరాత్ సర్వపాపం వ్యపోహ్య
‘పరాత్ పరమ్ పురుషమ్’ ఉపైతి దివ్యమ్।।
(ఉపైతి విద్వాన్)।
హే భగవాన్! బ్రహ్మవిద్యావరిష్ఠా। పరమేష్ఠీ । బ్రహ్మదేవా।
- ఎల్లప్పుడు సత్పురుషుల చేతను, మహనీయుల చేతను సేవించబడుచున్నది,
- ‘అతి రహస్యము’ అయి ఉన్నట్టిది,
- త్వరితగతిగా సర్వ పాప-అల్ప - సాంసారిక దృష్టుల నుండి ఈ జీవుని సముద్ధరించునది,
- అత్యంత ఉన్నతము - ప్రాముఖ్యము అయినది
అగు ‘బ్రహ్మవిద్య’ కొరకై మిమ్ములను ఆశ్రయిస్తున్నాను.

స్వామీ! ఈ జీవునికి సంబంధించి ఇహము-పరములకు ఆవల గల దివ్యమగు పరాత్-పరమ పురుషార్థస్థానమును మేము ఎట్లా పొందగలుగుతామో, అట్టి మార్గమును ఉపదేశించమని మిమ్ములను ప్రార్థిస్తున్నాను.
3 తస్మై సహో వాచ పితామహశ్చ:
శ్రద్ధా భక్తి ధ్యాన యోగాత్ అవైహి।
న కర్మణా, న ప్రజయా - ధనేన।
త్యాగేన ఏకే అమృతత్వమానశుః।।
అప్పుడు పితామహుడు (సృష్టికర్తయగు బ్రహ్మదేవుడు) అశ్వలాయన మునికి ఇట్లు బోధించసాగారు.

ఓ బిడ్డా! అశ్వలాయనా! నీవు తెలుసుకోవాలనుకొంటున్న పరాత్ పరమపురుషుని చేరాలంటే, అందుకు శ్రద్ధ, భక్తి, ధ్యానము, యోగముల అభ్యాసమే శరణ్యము. అంతేగాని లౌకిక కర్మల చేతనో, పుత్ర-శిష్య, బంధు-మిత్ర ఇత్యాది జనసంపద చేతనో, ధనము చేతనో లభించేది కాదు, ఒక్క ‘త్యాగము’ అను మార్గములో వెళ్లితేనే అమృతత్త్వమును ఈ జీవుడు పొందగలుగుతాడు.
4 పరేణ నాకం, నిహితం గుహాయాం,
వీహ్రాజతే యత్ యతయో విశన్తి,
వేదాంత విజ్ఞాన సునిశ్చిత అర్థాః
సన్యాస యోగాత్ యతయః శుద్ధ సత్త్వాః।।
ఆ స్థానము స్వర్గము మొ।।న ఊర్థ్వలోకములకు కూడా ఆవల ఉన్నట్టిది. అయితే అది ఈ జీవుని యొక్క హృదయ గుహలోనే ఉన్నది. కనుక అత్యంత సామీప్యమైనది కూడా!
(1) వేదాంత విజ్ఞానము చేత సునిశ్చితమైన అర్థమును బుద్ధిలో గ్రహించటం చేతను,
(2) ‘‘ఇంద్రియ దృశ్యములో నాది అనునది ఇక్కడ ఏదీ లేదు! సర్వము పరమాత్మకు చెందినదే’’ అనే రూపముతో కూడిన సన్న్యాస యోగము చేతను..,
సంపాదించుకున్న నిర్మల బుద్ధితో వివేకులు ఆ పరబ్రహ్మమును ఇక్కడే, ఇప్పుడే, తమయందే పొందుచున్నారు. అద్దానియందు ప్రవేశించి సుఖ విశ్రాంతి శీలురు అగుచున్నారు.
5 తే బ్రహ్మలోకేషు పరాన్తకాలే
పరామృతాత్ పరిముచ్యంతి సర్వే,
వివిక్త దేశే చ సుఖాసనస్థః
శుచిః సమగ్రీవ శిరః శరీరః।।
అట్టివారు ఇహ సంబంధమైన జన్మ-కర్మల వ్యవహారమంతా అధిగమించి, పరమునకు (స్వర్గాదులకు) ఆవల చేరి బ్రహ్మలోకములో ప్రవేశించి, ఆపై సర్వమునుండి విడివడి పర-అమృత స్థానము ను అధిరోహిస్తున్నారు.
ఇక అందుకు మార్గము :
→ ఏకాంత ప్రదేశములో సుఖాసనమును ఆశ్రయిస్తూ మనస్సును నిర్మలముగా, శుచిగా తీర్చిదిద్దుకుంటూ, శిరస్సు - శరీరము నిలువుగా ధారణ చేసి యోగాభ్యాసం చేయాలి.
6 అంత్యాశ్రమ స్థః, సకల-ఇంద్రియాణి
నిరుధ్య, భక్త్యా స్వగురుమ్ ప్రణమ్య
హృత్ పుండరీకమ్ విరజమ్-విశుద్ధమ్
విచిన్త్య, మధ్యే విశదమ్ విశోకమ్।।
→ చతుర్విధ ఆశ్రమ పరిథులను దాటివేసిన స్థానములో సంస్థితుడై, నాది-నేనులను అధిగమించిన ఉత్తమ బుద్ధితో,
→ సకల ఇంద్రియ - ఇంద్రియ విషయముల మననమును నిరోధిస్తూ..
→ భక్తి-ప్రపత్తులతో బ్రహ్మతత్త్వమును బోధించు సద్గురువునకు ప్రణమిల్లుతూ గురువుపై ‘గురి’ కలిగియుండి,
→ హృదయ కమలము నుండి రజో-తమోగుణములను ప్రయత్న పూర్వకంగా తొలగించుకొంటూ,
→ సర్వ దిగుళ్లను, శోకములను సుదూరంగా నెట్టివేస్తూ,
→ హృదయ మధ్యగతుడైన పరమాత్మను చింతన చేయాలి!
‘‘సర్వాత్మకుడవు, సర్వతత్త్వస్వరూపుడవు అగు పరమాత్మా! మీరు నా హృదయమున వేంచేసియే ఉన్నారు కదా!’’ - అని ఉపాసించాలి.
7 అచిన్త్యమ్, అవ్యక్తమ్, అనన్తరూపమ్,
శివం ప్రశాన్తమ్ అమృతం బ్రహ్మయోనిమ్।
తత్ ఆది-మధ్య-అన్త విహీనమ్, ఏకమ్,
విభుమ్ చిదానన్దమ్, అరూపమ్, అద్భుతమ్।।
ఆ పరాత్పరుడగు పరమాత్మ ఎట్టివాడు?
అచిన్త్యుడు। → మనస్సులో ‘ఇట్టిది’ అని నిర్వచించగలిగేవారు కాదు. అవ్యక్తుడు. అనన్తరూపుడు। శుభస్వరూపుడు। పరమప్రశాంతుడు। అమృతుడు। పరబ్రహ్మస్వరూపుడు। ఆది మధ్యాంత రహితుడు। ఏకమ్। నిత్యమ్।
అనేకముగా కానివాడు! సర్వముగా ప్రకాశించువాడు! విభుడు! చిదానందస్వరూపుడు! అరూపుడు! అద్భుతుడు!..
ఈ రీతిగా హృదయకమలములో ఆయనను ఉపాసించాలి.
8 ఉమా సహాయమ్, పరమేశ్వరమ్ ప్రభుమ్,
త్రిలోచనమ్ నీలకంఠమ్ ప్రశాన్తమ్,
.. ధ్యాత్వా మునిః గచ్ఛతి భూతయోనిమ్ →
సమస్త సాక్షిమ్, తమసః పరస్తాత్।।
ప్రకృతి రూపమగు ‘ఉమ’తో కూడుకొన్నవాడు! పరమేశ్వరుడు! సర్వమునకు ఆవల ప్రకాశించువాడు! త్రిలోచనుడు! నీలకంఠుడు! పరమప్రశాంత స్వరూపుడు! సమస్తమునకు సాక్షి! తమస్సు నుండి రజో, సత్వములు బయల్వెడలుచుండగా ఆయన సర్వదా తమస్సుకు ఆవల ప్రకాశించువాడు!
అట్టి పరాత్పరుని ధ్యానిస్తూ, సర్వ భూతజాలములకు ఉత్పత్తి స్థానమగు పరమాత్మను మునులు చేరుచున్నారు.
9 స బ్రహ్మా। స శివ। స ఇన్ద్రః।
సో అక్షరః। పరమః స్వరాట్।
స ఏవ విష్ణుః। స ప్రాణః।
స కాలో అగ్నిః। స చన్ద్రమాః।
ఆయనయే ఆదికారణుడు! ఆయనయే సృష్టికర్తయగు బ్రహ్మ! సదాశివుడు! ఇంద్రుడు! నాశనము లేనివాడు! శ్రేష్ఠుడు! స్వయమ్ ప్రభువు!
ఆయనయే సర్వముగా వేంచేసిన విష్ణువు (Al-present)! ఆయనయే ప్రాణశక్తి స్వరూపుడు! ప్రాణాధారుడు! ఆయనయే కాలస్వరూపుడు! త్రికాలముల ఆయన రూపమే! అగ్నిగా వెలుగొందుచున్నవాడు! చంద్రుడుగా సర్వము శీతలముగా, చల్లగా చూస్తూ, అమృతకిరణములను ప్రసరింపజేస్తున్న స్వామి।
10 స ఏవ సర్వమ్ యత్ భూతమ్,
యచ్ఛ భవ్యగ్ం। సనాతనమ్।
జ్ఞాత్వా, తమ్ మృత్యుమ్ అత్యేతి।
న అన్యః పంథా విముక్తయే।।
ఇంతః పూర్వము ఉన్నది, ఇప్పుడు ఉండి ఉన్నట్టిది, ఇక ముందు ఉండబోవునది.. సర్వము సర్వదా సనాతనమగు ఆ పరమాత్మయే!
అట్టి త్రికాలాతీత - సర్వాత్మ స్వరూపుడగు పరమాత్మ (పరబ్రహ్మము)ను ఎరుగుటచేత మాత్రమే ఈ జీవుడు మృత్యువును జయించివేయగలడు! లేదా; మృత్యువుకు బద్ధుడైయ్యే ఉండవలసి వస్తోంది! ఇంతకుమించి మృత్యువును జయించటానికి వేరే త్రోవ లేనే లేదు.
11 సర్వ భూతస్థమ్ ఆత్మానమ్,
సర్వ భూతాని చ ఆత్మని,
సం పశ్యన్ బ్రహ్మ పరమమ్ యాతి।
న అన్యేతి (అన్యేన) హేతునా।
పరమాత్మను ఎరుగుట అనగా? ఏమని ఎరుగటము? పరమాత్మ సర్వజీవులలో వేంచేసియున్నవారుగా. సర్వుల అంతర్యామిగా!
- పరమాత్మయే సర్వ జీవులుగా ఉన్నారు! ఆత్మ సర్వజీవులయందు, ఆత్మయందే సమస్త జీవులు సంస్థితులై ఉన్నారు.
ఇట్టి మనో అభ్యాసముచే జీవులు పరబ్రహ్మమును దర్శించగలరు. పరమాత్మ సందర్శనమునకు వేరే త్రోవ లేదు!
12 ఆత్మానమ్ అరణిమ్ కృత్వా
ప్రణవం చ ఉత్తరారణిమ్
జ్ఞాన నిర్మథన - అభ్యాసాత్
పాశమ్ (పాపం) దహతి పండితః।।
నిత్యానిత్య వివేకి యగు పండితుడు..,
జీవాత్మను → ఘర్షణచే అగ్ని పుట్టించే రెండు కొయ్యచెక్కలలో - క్రింద అరణి (చెక్క)గాను, ఓంకారము యొక్క అర్థమగు ప్రణవము→ ను పై కొయ్య చెక్క (అరణి)గాను
జ్ఞానము-అనే ఒరిపిడి చేతను, ఆత్మానుభవాగ్నిని జనింపజేస్తున్నాడు. అట్టి బ్రహ్మ జ్ఞానాగ్నితో సంసార పాశమును-మృత్యుపాశమును, దృశ్యము గురించిన భావావేశ పాశమును.., దహించివేస్తున్నాడు. భస్మము చేసి వేస్తున్నాడు.
13 స ఏవ మాయా పరిమోహితాత్మా,
‘శరీరమ్’ ఆస్థాయ కరోతి సర్వమ్।
స్త్ర్యన్న (స్త్రీ-అన్న) పానాది విచిత్ర భోగైః
స ఏవ జాగ్రత్ పరితృప్తిమ్ ఏతి।।
జాగ్రత్: అనన్యుడు, అఖండుడు అగు పరమాత్మయే ఒకానొకప్పుడు స్వకల్పితమాయచే (లేక) కల్పన - భావనలచే తనకు అన్యమైనది తానే కల్పించుకొని పరిమోహితుడగుచున్నారు. శబ్ద స్పర్శ రూప రస గంధానుభవములందు అభిలషితుడై ఈ ‘శరీరము’ అనే ఇంద్రియార్థ యంత్రమును ఆశ్రయించుచున్నారు. ఇక సర్వము నిర్వర్తిస్తూ అనేక కర్మల యందు అభినివేసితుడు అగుచున్నారు. స్త్రీ సాంగత్యము, అన్నపానాదులు మొదలైనవన్నీ జాగ్రదావస్థలో పొందుతూ, ‘‘ఇవియే నాకు తృప్తి-సంతోషము కలుగజేస్తున్నాయి కదా! కనుక ఇవియే నా సంపూర్ణ-ప్రపంచము’’ అని తలచటం ప్రారంభిస్తున్నాడు. జాగ్రత్‌లో ఇంద్రియ విషయజాలములో చిక్కుకొనుచున్నారు.
14 స్వప్నే తు జీవః సుఖ-దుఃఖ భోక్తా,
స్వమాయయా కల్పిత విశ్వలోకే।
సుషుప్తి కాలే సకలే విలీనే
తమో-భి భూతః సుఖ రూపమ్ ఏతి।।
స్వప్నము: ఇక స్వప్నములోనో..? తనమాయచే తానే ఒక స్వప్నదృశ్యమును కల్పించుకొని, ‘ఊహ’ అనే కన్యను తన వెంట నిడుకొని, ఆ స్వప్నలోకంలో విహరిస్తూ ‘‘నేను ఇంతటివరకే! ఇదియే నేను’’.. అని తలచటం ప్రారంభిస్తున్నారు.
సుషుప్త సందర్భములోనో..? సర్వజాగ్రత్ -స్వప్నవిషయములు ఆయన యందు అప్రదర్శితరూపమై లయము పొందగా, ఆతడు అజ్ఞానము - ఖండత్వములచే ఏర్పడి ఆవరించబడి విషయముల శ్రమచే ఏర్పడిన ‘‘తమోరూప సుఖము’’ను కల్పితముగా అనుభవిస్తున్నారు.
15 పునశ్చ జన్మాన్తర కర్మయోగాత్
స ఏవ జీవః స్వపితి ప్రబుద్ధః
పురత్రయే క్రీడతి యశ్చజీవః,
తత్ అస్తు జాతగ్ం సకలమ్ విచిత్రమ్।।
ఈ విధంగా జాగ్రత్తులో రోజురోజు అనేక ఇంద్రియ విషయాలు పొందుచూ వదలుచూ ఉండగా, స్వప్నదశలో అనేక స్వప్నాలు వచ్చి ఉండి, కరగిపోవుచుండగా,
ఈ దేహము బాల్య-కౌమార-యౌవన-వార్ధక్య దశలలో మార్పు చెందుచూ ఒకనాటికి శిథిలమైపోతోంది. ఈ దేహము నశిస్తోంది. ‘‘ఇంద్రియ విషయ జగత్తు నాపట్ల సత్యమే కదా!’’ అని భావించిన కారణముగా మరల మరొక దేహము కర్మానుసారంగా వచ్చిపడుతోంది. ఈతడు ఇతఃపూర్వపు దేహము సంబంధించిన విశేషాలను స్వప్నతుల్యంగా త్యజించి, క్రొత్త దేహంతో ‘‘ఈ వర్తమాన ఇంద్రియ విషయాలే సత్యము కదా!’’ అని అనుకొని పునర్జన్మ రూపుడు అగుచున్నాడు. ఎవ్వడైతే జాగ్రత్-స్వప్న- సుషుప్తులనే 3 పురములలో సంచారాలు చేస్తున్నాడో, ఆతని వలననే ఆతని నుండియే ఈ విచిత్ర విశ్వమంతా జనిస్తోంది. తిరిగి ఆతనియందే లయిస్తోంది.
16 ఆధారమ్, ఆనన్దమ్, అఖండబోధమ్
యస్మిన్ లయం యాతి పురత్రయం చ।
ఏతస్మాత్ జాయతే ప్రాణో
మనః సర్వేంద్రియాణి చ।
ఖం, వాయుః, జ్యోతిః ఆపశ్చ పృథివీ విశ్వస్య ధారిణీ।।
ఈ జాగ్రత్-స్వప్న-సుషుప్తులనబడేవి ఎందులోంచి వస్తున్నాయి? ఎందులో లయిస్తున్నాయి?
సమస్తమునకు ఆధారమైనవాడు, స్వతఃగానే ఆనంద స్వరూపుడు, అఖండబోధ స్వరూపుడు అగు పరమాత్మ నుండే ఈ త్రిపురములు ఒకప్పుడు బయల్వెడలుచున్నాయి. మరొకప్పుడు లయము పొందుచున్నాయి. అందుచేత.. మనం ముఖ్యంగా గమనించవలసినది ఏమంటే,
→ ప్రాణశక్తి; మనస్సు;
→ సర్వేంద్రియాలు; ఇంద్రియ విషయాలు;
→ ఆకాశము - వాయువు - అగ్ని(జ్యోతి) - జలము - భూమి అనే పంచభూతాలు;
→ ఈ విశ్వధారిణియగు ప్రకృతి-
…. ఇవన్నీ కూడా - ఈ జీవుని సహజ స్వస్వరూపమగు - పరమాత్మ నుండే జనిస్తున్నాయి. పరమాత్మయే ఆధారముగా కలిగి ఉన్నాయి-అని!
17 యత్ పరమ్ బ్రహ్మ సర్వాత్మా
విశ్వస్య ఆయతనమ్ మహత్,
సూక్ష్మాత్ సూక్ష్మతరమ్ నిత్యమ్
తత్ త్వమేవ। త్వమేవ తత్।।
(తత్త్వమసి-సామవేద మహా వాక్యం)
‘‘ఇంతకీ పరబ్రహ్మము అనగా ఎవ్వరు?’’
ఓ అశ్వలాయనా! ఈ ప్రశ్నకు నీకు సూటిగా సమాధానము చెప్పు చున్నాను. విను. ఎవ్వరైతే సర్వమునకు పరమైనవాడో, పరబ్రహ్మ స్వరూపుడో, సర్వాత్మకుడో, మహత్ స్వరూపుడై ఈ విశ్వమంతటికీ స్థానము అయి ఉన్నాడో, సూక్ష్మము కంటే కూడా సూక్ష్ముడో, సర్వకాల- సర్వావస్థల యందు ఉండియే ఉన్నాడో, నిత్యుడో,.. ఆతడు నీవే! నీవు ఆ పరమాత్మవే! స్వస్వరూపమేవ పరమాత్మా!
(తత్త్వమసి-సామవేదము)। తత్ త్వమేవ। త్వమేవ తత్। ఇందులో సందేహమే లేదు.
18 జాగ్రత్-స్వప్న-సుషుప్త్యాది
ప్రపంచం యత్ ప్రకాశతే,
తత్ బ్రహ్మాహమ్ - ఇతి జ్ఞాత్వా
సర్వబన్దైః ప్రముచ్యతే।।
‘జాగ్రత్ -స్వప్న-సుషుప్తులలోను, జాగ్రత్-స్వప్న-సుషుప్తులుగాను ప్రపంచ స్వరూపముగాను ఏదైతే ప్రకాశిస్తోందో, అట్టి ఆ బ్రహ్మమే నేను। నేనే బ్రహ్మమును!’’ అని ఎప్పుడైతే ఈ జీవుడు గ్రహిస్తున్నాడో.. వెనువెంటనే, ఆ మరుక్షణమే సర్వబంధములు ఆతనికి ఉండవు. సర్వబంధములు ఆతనిపట్ల పటాపంచలౌతున్నాయి! (అయమాత్మా బ్రహ్మ-అధర్వణ వేదము)
19 త్రిషు థామసు యత్ భోగ్యమ్,
భోక్తా - భోగశ్చ యత్ భవేత్,
తేభ్యో విలక్షణః ‘సాక్షీ’
చిన్మాత్రో2హమ్। సదా శివః।
(‘ప్రజ్ఞానం బ్రహ్మ’ - ఋగ్వేద మహావాక్యం)
జాగ్రత్ - స్వప్న - సుషుప్తులనబడే మూడు స్థానములందూ కూడా ఏదైతే (1) భోజ్యము - అనుభవించబడునది (2) భోక్తా - అనుభవించువాడు, (3) అనుభవము - భోగము అను త్రివిధ రూపములుగా కనిపిస్తోందో ఆ త్రిరూపములను ఎరుగుచున్నట్టి చిన్మాత్ర స్వరూపుడను! విలక్షణమైయున్న సాక్షిని! సదా శివ స్వరూపుడను! ఎరుగు విషయములకు మునుముందే ఉన్నట్టి ఎరుక - (లేక) కేవల చిత్ మాత్ర.. స్వరూపుడను! జీవాత్మగా సర్వాత్మత్వమును ఏమరచినప్పటికీ, పరాత్మకాని క్షణమే లేదు. ఎల్లప్పుడు శివుడనే। (ప్రజ్ఞానం బ్రహ్మ-ఋగ్వేద మహావాక్యం)
20 మయ్యేవ సకలం జాతమ్,
మయి సర్వమ్ ప్రతిష్ఠితమ్,
మయి సర్వమ్ లయమ్ యాతి,
తత్ బ్రహ్మా అద్వయమ్ అస్మి అహమ్।।’’
(‘అహం బ్రహ్మాస్మి’-యజుర్వేద మహావాక్యం)
ఈ జాగ్రత్ - స్వప్న - సుషుప్తులు, వాటివాటి అంతర్గతమైన లోకములు, బ్రహ్మాండములు - ఇవన్నీ కూడా నావలననే, నాయందే ఏర్పడుచున్నాయి. కలుగుచున్నాయి. త్రిమూర్తులతో సహా ఇదంతా ఆత్మయందే ప్రతిష్ఠితమై యున్నది! ఇవన్నీ ఆత్మయందే లయిస్తున్నాయి. ఈ సృష్టి-స్థితి- లయములు ఎందులో దృశ్యమానమగుచున్నాయో.. అట్టి అద్వయ పరబ్రహ్మమే నేను! (అహమ్ బ్రహ్మాస్మి-యజుర్వేదం)
21 అణోరణీయాన్ అహమేవ తద్వత్।
మహాన్ అహమ్ విశ్వమిదమ్ విచిత్రమ్।
పురాతనో2హమ్। పురుషో2హమ్ ఈశో,
హిరణ్మయో2హమ్। శివరూపమస్మి।।
(చిదానంద రూపం। శివో2హమ్)
అణువు కంటే అణువుగాను, మహత్తు కంటే మహత్తుగాను అగు ఆ తత్ పురుషుడను నేనే! ఈ విచిత్రవిశ్వము నా స్వరూపమే! ఈ విశ్వమంతా శరీరమైయుండగా, నేను శరీరిని। దేహిని।
సృష్టికి ముందే ఉన్నవాడను. పురాతనుడను! జగత్తు అను క్రియకు పురుషకారము నేనే! కనుక పరమ పురుషుడను! పూర్ణ-కారణ పురుషుడను! పురుషోత్తముడను। ఈ సర్వమునకు నియామకుడను. కనుక ఈశ్వరుడను! పరమాత్మను! సర్వమును ‘ఎరుక’ అను వెలుగులో వెలిగించుచున్న జ్యోతి స్వరూపుడను! హిరణ్మయ స్వరూపుడను! సర్వ శుభంకరుడను! మంగళ స్వరూపుడను! శివరూపుడను! శివోస్మ్యహమ్! శివరూపమహమస్మి!
22 అ పాణి - పాదో2హమ్, అచిన్త్య శక్తిః।
పశ్యామి అచక్షుః స శృణోమి అకర్ణః
అహమ్ విజానామి వివిక్తరూపో।
న చ అస్తి వేత్తా మమ చిత్ సదా2హమ్।।
(అచింత్య చిన్మాత్ర రూపో2హమ్)
నేను హస్త-పాద రహితుడను! కాళ్లు-చేతులు నా అచింన్త్య శక్తిచే కదలు ఉపకరణములు మాత్రమే! అవి కదల్చువాడను! చింతించటానికి అలవి కానివాడను! కన్నులు లేనప్పటికీ సర్వము చూచువాడను.
చెవులు లేనప్పటికీ సర్వము వింటున్నది నేనే!
సర్వమునకు ఆవల గల పర - కేవలస్వరూపుడను। సర్వము తెలుసుకొను వాడను! చిత్ స్వరూపుడను! నేను ఎవ్వరికీ తెలియబడవాడను కాను! ఎల్లప్పుడు చిన్మాత్ర స్వరూపుడను! నాయొక్క ‘ఎరుక’ యొక్క చమత్కార విన్యాసమే ఈ విశ్వరూపమై చెన్నొందుచున్నది. (చిన్మాత్ర రూపో2హమ్)
23 వేదైః అనేకైః, అహమేవ వేద్యో।
వేదాన్తకృత్ వేదవిదేవ చ అహమ్।
న పుణ్య-పాపే, మమ నాస్తి నాశో,
న జన్మ దేహ-ఇంద్రియ బుద్ధిః అస్తి।।
(వేదాంత వేద్యో2హమ్)
తెలుసుకొనబడుచున్నవి అనేకము! కానీ, తెలుసుకొనుచున్న నేను ఒక్కడినే! తెలుసుకొనబడేదాని ఆవల ఉండి తెలుసుకొనుచున్నవాడను! వేదాంత (వేద = తెలియబడునది, అంత = ఆవలగల) స్వరూపుడను! అంతేకాదు! తెలియబడుచున్నదంతా కూడా నేనే! వేదములు తెలియజేస్తున్నది నా గురించే! ఆత్మస్వరూపుడనగు నాకు పుణ్య-పాపములు లేవు. జన్మ-దేహ-ఇంద్రియ- బుద్ధి-నాశన ఇత్యాది ధర్మములు ఏమాత్రము లేనివాడను!
24 న భూమిః ఆపో మమ వహ్నిః అస్తిః.
న చ అనిలో మే అస్తి నచ అంబరం చ।
-ఏవమ్ విదిత్వా పరమాత్మ రూపమ్
గుహాశయం నిష్కళం అద్వితీయమ్,
సమస్త సాక్షీగ్ం, సత్-అసత్ విహీనమ్,
ప్రయాతి శుద్ధమ్ పరమాత్మ రూపమ్।।
(కేవలో2హమ్। కైవల్యరూపో2హమ్)
ధర్మములు ఏమాత్రము లేనివాడను!
భూమి-జలము-అగ్ని-వాయువు-ఆకాశము (పంచభూతములు) లేనివాడను! అవి లేనప్పుడు కూడా నేను ఉన్నాను!
- హృదయకుహరంలో విలాసి అయి ప్రశాంతముగా ఉండువాడను।
- ఏ దోషము చేతను స్పృశించబడనివాడను।
- సమస్తమునకు కేవల సాక్షిని।
- సత్-అసత్‌లు లేనట్టి సత్ - చిత్ సమరస స్వరూపుడను.
అట్టి స్వస్వరూప పరమాత్మను ఎవ్వరు ఇప్పుడు - ఇక్కడ తెలుసుకుంటారో - వారు శుద్ధ పరమాత్మ స్వరూపులే అగుచున్నారు!
(బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి)
ఫలశృతి :
25 యః శతరుద్రీయమ్ అధీతే
సో అగ్నిపూతో భవతి।
స వాయుపూతో భవతి।
స స్వర్ణ-స్తేయాత్ పూతో భవతి।
స సురాపానాత్ పూతో భవతి।
స బ్రహ్మహత్యాయాః పూతో భవతి।
స కృత్యా-అకృత్యాత్ పూతో భవతి।
తస్మాత్ విముక్తమ్ ఆశ్రితో భవతి।
అత్యాశ్రమీ సర్వదా సకృద్వా జపేత్।।
ఫలశృతి :
‘శతరుద్రీయము’ అను మరొకపేరు గల ఈ కైవల్యోపనిషత్ ఎవరు అధ్యయనము చేస్తారో, వారు అగ్నివలె, వాయువు వలె పరమ పవిత్రులు అవుతారు.
అష్ట మహాపాతకాలైనట్టి బంగారము దొంగిలించటము, సురాపానము, బ్రహ్మహత్య మొదలైనవి చేసి ఉన్నా కూడా, ఈ ఉపనిషత్ అధ్యయనము చేత దోష నివృత్తులు కాగలరు.
నిర్వర్తించిన - నిర్వర్తించుచున్న - నిర్వర్తించబోవుచున్న - నిర్వర్తించలేక పోవుచున్న సర్వ కర్మ బంధముల నుండి విముక్తులు అగుచున్నారు.
ఈ ఉపనిషత్ అధ్యయనము, అర్థమును హృదయస్థము చేసుకొనుచున్నవాడు మోక్షమార్గమును ఆశ్రయించువాడే అగుచున్నాడు. అందుచేత -అనేకసార్లు కైవల్యోపనిషత్ అర్థమును ఆశ్రయించాలి! మరల మరల ఎల్లప్పుడూ పఠించాలి. చతుర్విధ ఆశ్రమములవారికి, ఆశ్రమాతీతులగువారికి కూడా. ఈ అధ్యయనము శుభప్రదము.
26 అనేన ‘జ్ఞానమ్’ ఆప్నోతి,
సంసారార్ణవ నాశనమ్।
తస్మాత్ ఏవమ్ విదిత్వైనమ్
కైవల్యం పదమశ్నుతే।।
కైవల్య పదమశ్నుత ఇతి।।
సంసార సాగరమును నశింపజేయగల మహత్తరగు ఆత్మ జ్ఞానమును ఈ ఉపనిషత్ పఠన - అధ్యయనములు ప్రసాదించగలదు.
ఎవ్వరైతే ఇందలి రహస్యార్థమును తెలుసుకొంటారో అట్టివారు కైవల్యపదమును పొందినవారే అగుచున్నారు.
కైవల్య సిద్ధి సిద్ధించగలదు.
ఇందలి గూడార్థము బుద్ధికి కైవల్యము ప్రసాదించగలదు!

ఇతి కైవల్యోపనిషత్ ।
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।।కృష్ణ యజుర్వేదాంతర్గత

10     కైవల్య ఉపనిషత్

అధ్యయన పుష్పము

శ్లో।। కైవల్యోపనిషత్ వేద్యమ్ కైవల్య ఆనందతుందిలమ్।
కైవల్య గిరిజారామమ్ స్వమాత్రమ్ కలయేత్ అహమ్।

కైవల్యోపనిషత్‌ను ఉపాశించటము, ఆరాధించటము, పఠించటము, అధ్యయనము చేయటము.. అనునది -
→ ‘కైవల్యానందము’ అనే ఆనంద రసమును ఆస్వాదించటమే।
→ జగజ్జనని పార్వతీదేవి సంచరించే కైవల్యము అనే ఆనందవనములో ప్రవేశించటము, విహరించటమూను।
→ ‘‘అహమేవ తత్ పరబ్రహ్మమ్’’ అను పరమసత్యముతో మమేకమగుచుండటమే!

┄┄┄

శ్రీ అశ్వలాయన మునీంద్రులవారు గొప్ప భక్తి-ధ్యాన-యోగ సాధనా సంపన్నులు. వారు సుదీర్ఘకాలము - శ్రవణ-మనన- అధ్యయన-నిదిధ్యాసలు, శమ-సంతోష-సత్సంగ-విచారణ రూపములైన సాధన చతుష్టయమును సేవించినట్టి ముని ప్రవరేణ్యులు.

ఒకరోజు…,
ఆ ఆశ్వలాయన మునీశ్వరులు 14 లోకములలో సంచారములు చేస్తూ బ్రహ్మలోకము ప్రవేశించారు. పరమానందస్వరూపులు, మహత్తర ప్రజ్ఞా దురంధరులు, సృష్టికర్త, మహత్ వరేణ్యులు, అపార కరుణామయులు, పరమేష్ఠి, భగవంతుడు, సర్వజీవులకు ప్రియము కలుగజేసే పితామహులు అగు బ్రహ్మదేవుని దర్శించారు. భక్తి-ప్రపత్తులతో సాష్టాంగ దండప్రణామములు సమర్పించారు. స్వామి పాదపద్మములను ఆనందాశ్రువులతో అభిషేకించారు.

అశ్వలాయనముని: హే పరబ్రహ్మమూర్తీ! లోకేశ్వరా! బ్రహ్మవిత్! పితామహా! సర్వాంతర్యామీ! సర్వతత్త్వ స్వరూపా! జ్ఞానానంద ఐశ్వర్యా! మా నమస్కారములు ప్రేమతో స్వీకరించెదరుగాక!

బ్రహ్మదేవుడు : బిడ్డా! నీ భక్తికి మెచ్చుకొంటున్నాను. శుభమగు గాక! నీవు ఏమి అభిలషిస్తున్నావో, అది నెరవేరుస్తాను. కోరుకోవయ్యా!

అశ్వలాయనముని : హే భగవాన్! పూర్వ పుణ్యవశము చేతను, మీ యొక్క కరుణాకటాక్ష వీక్షణ చేతను మీ దర్శనభాగ్యం నాకు ఇప్పుడు లభించింది.

విద్యలన్నిటికీ రాజవిద్య బ్రహ్మవిద్యయే కదా! వరిష్ఠము - మహత్తరము - పరమ పవిత్రము, సత్పురుషులచే ఎల్లప్పుడు సేవించబడుతూ ఉండేది, రహస్యములలోకెల్లా పరమరహస్యము (నిగూఢము) అగు పరబ్రహ్మము గురించి మీ నుండి తెలుసుకోవాలనునదే నా అభిలాష. అట్టి బ్రహ్మము గురించి విశదీకరించమని నా విన్నపము.

ఇహ-పరములకు ఆవల గల దివ్యమగు ‘‘పరాత్-పరమ పురుషస్థానము’’ను మేము చేరుకొనేది ఎట్లాగో.., దయతో ఉపదేశించండి!

సంసారమునందు చిక్కి అనేక భ్రమలందు సంచరించే మేము, మాయొక్క పాప - అల్ప దృష్టుల నుండి విముక్తి పొంది, చంచలత్వమును జయించి పరాత్పర పురుషుని పాదపద్మముల వద్ద బుద్ధి స్థిరత్వమును పొందేది ఏ మార్గంలో? కైవల్యమునకు ఉత్తమము-సులభము అగు ఉపాయమేమిటి? అట్టి బ్రహ్మవిద్యను ఉపదేశించవలసినదిగా మిమ్ములను శరణువేడుతూ మరల మరల అభ్యర్ధిస్తున్నాను.

పితామహుడగు బ్రహ్మదేవుడు : నాయనా! శ్రేయోదాయకము, శోభాయమానము అయినట్టి విషయమునే అడిగావు.

బ్రహ్మము ఎట్టిది? నేను ఎవరు?

ఈ రెండిటికి ఉత్తమమైన సమాధానము సముపార్జించుకోవటమే బ్రహ్మవిద్యోపార్జనము. అదియే పరాత్ పరమ పురుషస్థానము చేరే ఉపాయము, కేవలీ స్వస్వరూపానుభవమగు కైవల్యము కూడా! అయితే, బ్రహ్మము గురించి తెలుసుకోవటము ఎట్లా? అందుకు నాలుగు సాధనలను (సాధన చతుష్టయమును) చెప్పబడుచున్నాయి. ఈ నాలుగింటిని ఈ జీవుడు ఒకసారే ఆశ్రయించాలి. ఆచరించాలి సుమా!

1.) శ్రద్ధ : ఈ జీవుడు దేనిపై శ్రద్ధ చూపిస్తున్నాడో, అద్దానినే పొందుచున్నాడు. అశాశ్వతము, దుఃఖప్రదము అగు లోకాంతర్గత విషయాల పట్ల శ్రద్ధ కలిగి ఉండటం చేత, అవియే పొందటం జరుగుతోంది. కానీ, ప్రయోజనం? దుఃఖము తొలగుట లేదు.
పరమశాంతము, అఖండానందము, సంసారదోష నివారకము అగు బ్రహ్మము-బ్రహ్మజ్ఞానము పట్ల శ్రద్ధ కలిగి ఉంటే, అది ఈ జీవుడు తప్పక పొందగలడు.

2.) భక్తి : పరాప్రేమస్వరూపమైన భక్తి పెంపొందించుకోవాలి. అప్పుడు బ్రహ్మజ్ఞానము స్వయముగా వికసించగలదు. సర్వే-సర్వత్రా ప్రేమయే భక్తి యొక్క ముఖ్య లక్షణము! ప్రపత్తి (శరణాగతి) అందుకు త్రోవ! పరాప్రేమ అనగా - తల్లికి బిడ్డ పట్ల గల ‘అవ్యాజప్రేమ’ వంటిది. సర్వ సహజనులపట్ల సహజమైనట్టి వ్యాజాతీతమైన ప్రేమభావన కలిగి ఉండటమే ‘భక్తి’.

3.) ధ్యానము : ధ్యాసను పరమాత్మ వైపుగా నడిపించాలి. అనగా, తదితరములైన ఇంద్రియ విషయములపై ధ్యాస సన్నగిల్లుతూ రావాలి. ధ్యాసను పవిత్రపరచుకొంటూ ఉండాలి. వేటివేటిచే మనస్సు చంచలమౌతోందో గమనించి, ఆయా సర్వ విషయములనుండి ధ్యాసను వెనుకకు మరల్చి, పరమాత్మ గురించిన అనునిత్య అనుక్షణిక ధ్యాస కలిగి ఉండటమే ‘ధ్యానము’. ఇదంతా పరమాత్మగా దర్శించటమే ‘‘ఆత్మదర్శనము’’. సహజీవులను చూస్తున్నప్పుడు అన్యములైనట్టి నామ-రూప గుణములను ప్రక్కకుపెట్టి దృష్టిని అఖండ - ఆత్మవైపుగా మరల్చాలి!

4.) యోగసాధన : యోగ సాధనలచే చిత్తము యొక్క ప్రాపంచిక వృత్తులను తొలగించుకుంటూ రావాలి. యోగ సాధనచే బుద్ధి నిర్మలము, సునిశితము, విస్తారము కాగలదు.

ఈ ఈ అభ్యాసములు ఈ జీవుని క్రమంగా పరాత్‌పర స్థానమునకు జేరుస్తాయి. అంతేగాని, కేవలము లౌకిక కర్మల చేతగాని, పుత్ర-మిత్ర-శిష్య-తదితర బంధు జనసందోహముల సముపార్జన చేతగాని, సంపదల చేతగాని - పరాత్ పరమపురుషత్వము లభించేదికాదు.

త్యాగము : త్యాగేన ఏకే అమృతత్వమానసుః (త్యాగేనైవతు కైవల్యమ్।) ‘‘నాది అనునది సర్వదా పరమాత్మదే-’’ అను రూపంగా సర్వము త్యజించినవాడై ఉండటమే ఉత్తమమార్గము. ‘త్యాగము’ అను మార్గము అమృతస్థానమును జేర్చగలుగుతుంది.

ఆ పరపదము స్వర్గము మొదలైన సుఖమయమగు ఊర్థ్వలోకాలకు కూడా ఆవల ప్రకాశించుచున్నట్టిది. అది ఆత్మస్థానము!

అయితే…, ఆత్మ ఎక్కడో ఆవల సుదూరంగా ఉన్నదా? కాదు. సహజమగు స్వస్వరూపమే. పరేణ నాకం నిహితం గుహాయాం వీహ్రాజతే యత్ యతయో విశన్తి। స్వర్గాది ఊర్థ్వలోకాలో? బాహ్య విశేషాలు మాత్రమే! కనుక ఈ జీవునికి ఆ పరాత్‌పరమపదమే అత్యంత సామీప్యమైనట్టిది. ఇందుకు విజ్ఞులు రెండు ఉపాయాలు సూచిస్తున్నారు.

(1) వేదాంత విజ్ఞాన సునిశ్చితార్ధాః। ప్రతినిత్యము వేదాంత శాస్త్రముచే ప్రతిపాదించబడుచున్న ఆత్మ విషయకమైన పరమసత్యమును అర్థం చేసుకొంటూ ‘పరమార్థము’ (The Final and the Absolute of one’s own self) పట్ల సునిశ్చితమగు బుద్ధిని పరిపోషించుకోవటం!

(2) సన్న్యాస యోగాత్ :సత్ న్యాసమ్ - ఇతి సన్న్యాసమే. ‘‘సర్వము ఆ పరమాత్మకు సర్వదా చెందినదే’’.. అనే సంయోగ-వియోగాతీత యోగభావనను అనునిత్యముగా అభ్యసిస్తూ ఉండటము. ‘సర్వమ్ ‘సత్’ బ్రహ్మముగా న్యాసించుటచే (లేక) ఉపాసించుటచే ఏర్పడు ‘యోగస్థితి’యే ‘సన్న్యాసయోగము’.

ఈ ఉభయ ప్రయత్నములతో తీర్చిదిద్దుకున్నట్టి సాత్విక- పరిశుద్ధ బుద్ధిచే ఈ జీవుడు సంసారము నుండి బహిర్గతుడై, పరాత్‌పరమ్- బ్రహ్మమ్ స్థానమును తప్పక చేరగలడు.

మహనీయులగు యతులు అట్టి ఇహ (భౌతిక) - పర (స్వర్గాది మానసిక) లోకాలను, జన్మ-కర్మ బంధములను దాటివేసి, సర్వ విషయ-వ్యవహార-సందర్భ-సంకల్పిత దృష్టులను తెగనరికి, బ్రాహ్మీ దృష్టిని ఆశ్రయిస్తున్నారు. బ్రహ్మలోకములో ప్రవేశించిన వారై, ఇక ఇక్కడి నుండి పరాంతకాలమున అమృత స్వరూపమగు స్వస్థానము (సహజ స్వస్వరూపము)ను చేరుచున్నారు.
అందుకు మార్గము ఏమిటి? మరికొంత విశ్లేషించుకుందాము.

‘‘యోగాభ్యాసము’’

వివిక్తదేశే చ : ‘‘నేను - దృశ్యము - పరమాత్మ’’ల అఖండత్వము మాత్రమే భావించగలిగే ప్రదేశము → వివిక్తదేశము (Isolated place). అటువంటి ఏకాంత ప్రదేశము ఆశ్రయించటము. (మనస్సుతో, బుద్ధితో పరమాత్మ తత్త్వ సంబంధమైన మనన-అవగాహన-అన్వయములే ‘ఏకాంతోపాసన’ లేక ‘వివిక్తోపాసన’).

సుఖాసనస్థః : అట్టి ఏకాంత ప్రదేశములో సుఖమైన ఆసనమును (A Physical setting posture which is very convenient to the body as well as to condition the thought process) అవధరించటము.

బాహ్య - అభ్యంతర శుచి : శుచి అయిన భావాలను ఆశ్రయించటము. అశుచి అయిన భావాలను (వాళ్ల అటువంటివారు - నేను అంత - వీరు ఇంత-వారు ఎంత- ఇత్యాది భావాలను) దూరంగా ఉంచగలిగేట్లు పరిసరాలను ఎన్నుకోవటము. పరిశుభ్రపరచుకోవటము.

సమగ్రీవ శిరః-శరీరః : ఇక యోగసాధన - ధ్యానములకు ఉపక్రమించాలి. యోగాభ్యాసము చేస్తూ ఉన్నప్పుడు - శిరోఉపరిభాగము - శిరస్సు - మెడ- శరీరము నిఠారుగా, నిశ్చలముగా సుఖాసనరీతిగా నిలిపి ఉంచటము.

అత్యాశ్రమస్థః : చిత్తమును ఆశ్రమ (కూర్చునియున్న) పరిసరాలన్నీ అధిగమింపజేయటం.

సకల ఇంద్రయాణి నిరుధ్య : సమస్త ఇంద్రియములను, ఇంద్రియ విషయములను బాహ్యముననే నిరోధించి; సుదూరంగా త్యజించి, పారద్రోలాలి. (స్పర్శాన్ కృత్యా బహిః బాహ్యాన్).

భక్త్యా స్వగురుమ్ ప్రణమ్య : భక్తితో స్వగురువుకు, ఇష్టదైవమునకు ప్రణామములు, స్తోత్రములు సమర్పణ చేయాలి.

హృత్ పుండరీకమ్ విరజమ్-విశుద్ధమ్ (అంతర్-శుచిః) : హృదయ కమలమును చుట్టుకొని ఉన్న రజో-తమోగుణ దోషములను తొలగించుకొంటూ, పరిశుభ్రపరచుకొంటూ…, ప్రయత్నపూర్వకంగా బయటకు నెట్టివేస్తూ ఉండాలి.

విశోకమ్ : సర్వదిగుళ్లను, శోకములను, నిరుత్సాహములను, బద్ధకములను తొలగించివేసుకొంటూ ఉండాలి.

మధ్యే విశదమ్ : హృదయ కమలము మధ్యలో ప్రవేశించాలి.

విచిన్త్య! : సర్వాంతర్యామి, సర్వతత్త్వస్వరూపుడు అగు - ఆ పరమాత్మను ధ్యానము చేయాలి!

అశ్వలాయనుడు : స్వామీ! ఆ విధంగా తగు ప్రయత్నము - శుభ్రత-జాగరూకతతో స్వీయ హృదయ పుష్పములో ప్రవేశించిన తరువాత, ధ్యానించవలసిన ధ్యేయ వస్తువు ఏది? ఎవరు? ఎట్టిది? ‘పరమాత్మ’ అనగా ఎవరు?

(పితమాహ) బ్రహ్మ దేవులవారు : అట్టి ధ్యేయ వస్తువగు పరమాత్మ గురించి చెప్పుచున్నాను. విను.

అచిన్త్యమ్ : అది నామ - గుణ - రూపాత్మకమైనది కాదు. కేవల చైతన్యము. సర్వ చింతనలకు ఆవల ఉన్నట్టిది. కాబట్టి ఆచిన్త్యమ్. (బుద్ధిగ్రాహ్యమ్ - అతీంద్రియమ్). బుద్ధితో (through common sense) గ్రహించగలిగేదే గాని, మనస్సుతో ఊహించగలిగేది కూడా కాదు. ఇంద్రియములకు విషయమై ఉండలేదు.

అవ్యక్తమ్ : తానే సమస్తమును వ్యక్తీకరిస్తూ, తాను మాత్రం సర్వవ్యక్తీకరణములకు మునుముందు - ఆవలగా ఉన్నట్టిది. (It is the manifestor of all manifestations. Hence it is not any thing appearing as manifested).

అనన్తరూపమ్ : ఉత్పత్తి అయ్యే ప్రతిదానికి ఒకానొకప్పుడు వినాశనము అనివార్యము. యత్ దృశ్యమ్ - తత్ నశ్యమ్! సర్వసాక్షి అగు పరమాత్మయో! అంతమే లేనివాడు. దేహముతో పుట్టువాడుకాదు. దేహముతో అంతమయ్యేవాడు కాదు. అనన్తరూపుడు.

శివమ్ : సర్వము తానే అయి ఉండటం చేత సర్వునకు శుభము చేకూర్చువాడు. శుభస్వరూపుడు. సుఖస్వరూపుడు. సర్వస్వరూపుడు కాబట్టి సర్వమునకు శ్రేయస్సు కలుగజేయువాడు. శివస్వరూపుడు!

ప్రశాన్తమ్ : పరమ ప్రశాంత స్వరూపుడు. స్వప్నములో ఏఏ విశేషాలు ఉన్నప్పటికీ ఆ స్వప్నద్రష్టను అవి స్పృశించవుకదా! అట్లాగే ‘‘అహమ్’’నకు కూడా ఉత్పత్తి స్థానమగు పరబ్రహ్మము పరమ ప్రశాంతము. జాగ్రత్-స్వప్న-సుషుప్తులకు కేవల సాక్షి అయి వెలుగొందువాడు.

తత్ : వేద వాఙ్మయము అద్దానికి ‘తత్’ అను పేరు పెట్టింది ఈ లోకాలు, అందలి జీవాత్మలు ఎద్దాని కల్పనయో, ఎద్దాని నుండి బయల్వెడలుచున్నాయో, అదియే తత్. తత్ ఏవ త్వమ్। అదియే ‘నీవు’ - అయి ఉన్నావయ్యా!

అమృతమ్ బ్రహ్మయోనిమ్। ‘‘ఆది - మధ్య - అంత’’ హీనమ్ : మార్పు - చేర్పులు లేనట్టిది. సర్వమునకు జననస్థానము బ్రహ్మ యోని! అట్టి పరమాత్మకు - మొదలు - మధ్య- చివర అనునవే లేవు. ఉత్పత్తియే లేనప్పుడు, సర్వమునకు కారణ - కారణము అయినప్పుడు అద్దానికి పుట్టుక ఇత్యాదులు ఎక్కడుంటాయి? పరబ్రహ్మము - ఆదిమధ్యాంత రహితము! సర్వదా కేవలము!

ఏకమ్ : పరమాత్మ సర్వదా ఏకమే గాని అనేకము కాదు, అనేకముగా కనిపిస్తున్నప్పటికీ.. ఆత్మజ్ఞాన దృష్టిచే ‘ఏకమే’! కథలో వేరువేరైన అనేక విశేషాలు ఉండవచ్చుగాక. కానీ రచయిత సర్వదా ఒక్కడేకదా!

విభుమ్ : జీవాత్మ - జగత్తులకు విభుడు. యజమాని, భవస్య ముఖ్యకారణమ్ ఇతి విభుమ్। మూలకారణడు। యస్త్యచ విభూతిమ్ ఇతి విభుమ్! ఇదంతా ఎవరి విభూతి-విభవమో.. ఆయనయే పరమాత్మ!

చిదానన్దమ్ : ‘ఎరుగుట-ఎరుక’ అనునది ఎవ్వరియొక్క స్వకీయ విన్యాసపూర్వక విలాసమో ఆయనయే పరమాత్మ! ఈ జాగ్రత్-స్వప్న-సుషుప్తులు ఆత్మ యొక్క ఆనంద క్రీడావిలాసమే। పరమాత్మ సర్వదా ఆనంద విలాసుడు! చిదానంద చిద్విలాసుడు! జగత్ కల్పనా క్రీడావినోది!

అరూపమ్ :
- బంగారమునకు ‘ఇది’ అనబడే రూపమేయున్నది? కాని ఆభరణరూపముగా కనిపిస్తున్నది బంగారమే!
- అగ్నికి ‘ఇది’ అనబడు రూపమేమున్నది? కానీ, ఏ వస్తువును దహిస్తూ ఉంటోందో,.. ఆ ఆకారము కలిగి ఉన్నట్లు కనిపిస్తుంది?
- పరమాత్మ సర్వరూపములు తనవై ఉన్నవాడు! కనుక అరూపుడు! రూపరహితుడు! అన్ని రూపములు తానై ఉన్నవాడికి ‘ఇది రూపము’ - అనునదేమున్నది?
- దేహమునకు రూపము ఉన్నది. మరి, ‘దేహి’కి రూపమేముంటుంది?
- కదిలే దేహములకు రూపమున్నది! కదిలించేవానికి రూపము ఏమై ఉంటుందని అనగలం? ఈ విధముగా పరమాత్మ అరూపుడు!

అద్భుతమ్: పరమాశ్చర్యకరమైనది. అతఃభుతమ్-సర్వభూతములును తానై.., అనేకముగా కనిపిస్తూ సర్వదా ‘ఏకమే’ అయి ఉన్నవాడు.

న-భూతమ్ ఇతి అద్భుతమ్ : ‘సర్వసాక్షి’ అనురూపముగా వేరే అయి (Mere witness), కంటికి కనబడనివాడై ఉన్నవాడు.
- సర్వ జీవ-బుద్ధులందు సంకల్ప- వికల్పములను సర్వత చేయుచు,
- నిర్వికల్పుడు అగుచు ఉన్నవాడు ఈ విధంగా పరమాత్మ మహాద్భుతుడు!

ఉమా సహాయమ్ : ఆ పరమేశ్వరుడు ‘ఉమ’ను తోడుగా కలిగి ఉన్నవాడు. పరమాత్మ కేవల సత్ స్వరూపుడై ప్రకృతి ‘ఉ’ + జీవాహంకారము (మ) లచే ప్రదర్శితుడగుచున్నాడు.

ఓం = అ+ఉ+మ - 
    శివశివా = శివ + శివా స్వరూపుడు 
       = పురుషుడు + ప్రకృతి స్వరూపుడు 
       = సత్ + చిత్ + ఆనంద స్వరూపుడు

సత్ - చిత్ - ఆనందములను తన వెంట తోడుగా కలిగి ఉండటం చేత - పరమాత్మ ‘ఉమా సహాయమ్’ బిరుదాంకితుడు!
(PRESENCE BEING ACCOMPANIED BY PERCEPTION + PERCEIVER)

పరమేశ్వరమ్ : పరమ్ = ఆవల

ఆవల ‘కేవలుడు’ (Absolute) గా ఉండి…,
ఈవల అంతటా తానే అయి వెలుగొందుచున్నవాడు.

అంతటా - అన్నిటా - అన్నీ గా ప్రకాశమానుడు అగుచున్నవాడు. అన్నిటిలోను, అన్నిటిగాను ప్రకాశించుచున్నట్టి వాడు.

పరమ్ = మహత్తరమై, ఈశ్వరమ్ = విస్తరించి ఉన్నవాడు

[ సమమ్ సర్వేషు భూతేషు తిష్ఠన్తమ్ పరమేశ్వరమ్।
ఈశ్వరః సర్వభూతానామ్ హృత్ దేశే తిష్ఠతి! (భగవద్గీత) ]

ప్రభుమ్: సర్వనియామకుడు. పరబ్రహ్మము యొక్క ఇచ్ఛానుసారమే మాయ, జన్మ-కర్మలు, బంధము, మోక్షము.. ఇత్యాదులన్నీ ఉనికి కలిగి ఉంటున్నాయి. ఆయనయే సర్వమునకు అధినాయకుడు! ప్రభువు!

త్రిలోచనమ్ : ఆ పరబ్రహ్మమే - ఒక విషయమును ఒక భావనను, ఒక సంకల్పమును, ఒక అభిప్రాయమును, ఒక అభిరుచిని, ఒక బంధమును
→ సృష్టించుకోవటము - (To Create),
→ స్థితింపజేసుకోవటము - (To Maintain),
→ లయింపజేయుటము - (To Desolve),
తన యందు నిర్వర్తిస్తుండటం చేత పరమాత్మ త్రినేత్రుడు. అనన్యమగు పరమాత్మయే జీవాత్మగా అయి
- జాగ్రత్
- స్వప్న
- సుషుప్తి
అను మూడు వేరువేరైన దృష్టులను (Different channels) తనకు అన్యమైనదాని వలె కల్పించుకొనటము కూడా ఆయన యొక్క త్రినేత్రత్వము.

ఇట్టి త్రిపుటీ తత్త్వములు కూడా → పరాత్ పరము, ప్రతి ఒక్కరి కేవలీ స్వస్వరూపము, అగు పరబ్రహ్మమూర్తి నుండే బయల్వెడలుచున్నాయి. కనుక ఆయన త్రిలోచనుడు, త్రిమూర్తి అని కూడా అభివర్ణించబడుచున్నారు. జాగ్రత్ స్వప్నసుషుప్తులుగా మూర్తీభవించువాడు.

నీలకంఠమ్ : ఈ ఇంద్రియములకు కనబడేదంతా కాలముచే నశించేదే! పరాత్పరుడు, పరమపురుషుడు అగు ఆత్మదేవుడు కాలబద్ధుడుకాడు. కాలనియామకుడు.

ఆయన మృత్యు రూపముతో జగత్తులను హరించి, మరల ఉద్భవరూపంతో సంస్కార బీజముతో సృష్టిస్తున్నారు. జగత్తులు నశించవచ్చుగాక! జగత్ తత్త్వమును ఆ పరమేశ్వరుడు రక్షించి పునః సృష్టికి కారణభూతుడగుచున్నారు.

‘వినాశనము’ అను కాలకూటవిషాన్ని కంఠమునందు ధరించి జగత్తులను రక్షిస్తూ ఉంటాడు కాబట్టి పరమాత్మ ‘నీలకంఠుడు’.

సర్వజ్ఞుడగు పరమాత్మ జీవాంశ స్వరూపుడై…, ‘నీలత్వసంజ్ఞ’ అయినట్టి ‘ఏమరపు’ నందు తదితరమైనది దాచి ఉంచుకుంటున్నారు.

‘ఏమరపు’ను నీలకంఠముగా కలిగి ఉండి, సర్వమును పరిరక్షించుచునే ఉన్నారు. కనుక పరమాత్మ ‘నీలకంఠ’ బిరుదాంకితుడు అగుచున్నాడు.

ప్రశాన్తమ్ : పరమాత్మ సర్వము లయించగా, శాంతించగా కూడా శేషించేవాడు. ఈ జగత్ విషయములకు సాక్షి.
జగత్తులు ఉన్నప్పుడు లేనప్పుడు కూడా సర్వదా ప్రశాంత స్వరూపుడు.

సమస్త సాక్షిమ్ : సమస్తమునకు కేవలసాక్షి (Mere witness) అయిన వాడు.

తమసః పరస్తాత్ : అజ్ఞానమునకు ఆవల, ఆదికారణుడై ఉన్నవాడు.

ఓ అశ్వలాయన మునీంద్రా!
తనయందు వేంచేసియున్న పరమాత్మ సందర్శనము కొరకై, ఈ జీవుడు ఏంచేయాలి?

నిర్మలముగా తీర్చిదిద్దుకోబడిన హృదయములో ప్రవేశించి, హృదయములోనే దాగి ఉన్న పరాత్పరభాగవానుని…,
- అచిన్త్యునిగా, అవ్యక్తునిగా, అనన్తరూపునిగా..
- శివమ్ - ప్రశాంతమ్ - తత్త్వ రూపునిగా,
- అమృత స్వరూపునిగా,
- ఆది మధ్యాంతరహితునిగా,
- ఏకస్వరూపుడు - విభువు - గా,
- చిదానన్ద స్వరూపునిగా, అరూపునిగా,
- అద్భుత రూపునిగా,
- ఉమాసహాయునిగా, పరమేశ్వరునిగా, ప్రభువుగా, త్రిలోచనునిగా, నీలకంఠునిగా,
- ప్రశాంతునిగా,
కేవల సాక్షిగా, అజ్ఞానాంధకారమునకు ఆవల ఉన్నవాడుగా
మనస్సుతోను బుద్ధిలోను శ్రద్ధగా ఉపాసించాలి!

అట్టి యోగి సర్వమునకు ఆదికారణము అగు పరమాత్మస్థానమునకు చేరుచున్నాడు.

🙏 🙏 🙏

సమస్తమునకు ఆవల కేవలసాక్షి-సర్వకారణుడు అగు ఆ పరాత్‌పరుడే…,
- సృష్టి సంకల్ప నిర్వర్తకుడు, పితామహుడు, ప్రజాపతి - అగు బ్రహ్మ.
- సర్వ శుభ-సుఖ-ఆనంద ప్రదాతయగు శివుడు.
- ఇంద్రియతత్త్వములకు అధిపతి - అధిదేవుడు అగు ఇన్ద్రుడు.
- నాశనరహితమగు అక్షరుడు.
- దేహమునకు ‘దేహి’ వలె, ఈ విరాట్ విశ్వమునకు (బ్రహ్మాండమునకు) పరమ స్వరాట్! విరాట్ స్వరూపుడు! విశ్వరూపుడు!
- సర్వములోను - సర్వముగాను సర్వదా వేంచేసిఉన్న విష్ణువు.
- సర్వులలోను - సర్వములోను కదిలిస్తున్న, ఉజ్జీవింపజేస్తున్న ప్రాణేశ్వరుడు! ప్రాణశక్తిస్వరూపుడు! సర్వులకు ప్రాణప్రదాత!
- సర్వమును సృష్టించి - స్థితింపజేసి - లయింపజేసే కాలస్వరూపుడు.
- సర్వమును తన ఉష్ణత్వముచే కాపాడుచు, సర్వమును దహించివేయగల అగ్నిదేవుడు! తేజోరూపుడు! జ్యోతిస్వరూపుడు!
- సర్వమును చల్లపరుస్తూ, భూమికి ఓజస్సును, ఓషధీ రసమును ప్రసాదిస్తున్న చంద్రుడు (చంద్రమసః).

ఇంతేకాదు!

సయేవ సర్వమ్
→ యత్ భూతమ్
→ యచ్ఛ భవ్యగ్ం
→ సనాతనమ్!

ఎప్పుడు - ఎక్కడ - ఏది ఉనికి కలిగి ఉంటుందో,.. అదంతా కూడా పరబ్రహ్మస్వరూపమే!

ఇతః పూర్వము ఉండి ఉన్నది, ఇప్పుడున్నది ఇక ముందు ఉండబోయేది, సనాతనమై ముందుగానే ఉండి ఎప్పటికీ ఉండేది,

అంతా కూడా…,
‘‘చిదానంద రూపము, పరాత్ పరము అగు- పరబ్రహ్మమే!’’

ఎప్పుడైతే సర్వస్వరూపుడు, స్వహృదయాంతరంగుడు, అనన్యుడు అగు పరమాత్మను ఈ జీవుడు తెలుసుకుంటాడో, అప్పుడు మాత్రమే మృత్యువును జయించివేయగలడు!

‘‘ఒకటి పోగొట్టుకోవటం - మరొకటి పొందుచుండటం - అనే రూపము గల
మృత్యువును అధిగమించి సర్వాతీతమగు కేవల - అచ్యుత - ‘‘అమృతస్వరూపుడు’’ అగుచున్నాడు!

ఈ జీవుడు ఏ బంధము (Bondage, the shackles of Relatedness)ను అనుభవిస్తున్నాడో, అది తొలగాలంటే..,
అమృతతుల్యమగు ఆత్మను ఎరుగవలసిందే! ఇక వేరే త్రోవ లేదు! మరే కారణంగాను శాంతి లభించదు. జ్ఞానేనైవతు కైవల్యమ్। ఆత్మను ఎరుగటయే కైవల్యము! ఎరుగకపోవటమే సంసారము!

అని గ్రహించటమొక్కటే బంధవిముక్తికి మార్గము. కైవల్యపదము!

అట్టి ఆత్మతత్త్వజ్ఞానము, ఆత్మసాక్షాత్కారము, ఆత్మాహమ్ భావము సముపార్జించుకోవటానికై,

(1) జీవాత్మను (లేక) బుద్ధిని (లేక) మనస్సును (లేక) సాధన వస్తువగు ఈ దేహము → యజ్ఞాగ్ని విధానములో అగ్నిని జనింపజేసే అరణియొక్క ‘‘క్రింద అరణి (క్రింద కొయ్య)’’.
(2) ఓంకార రూపమగు ప్రణవము - మరియు అంతర్గతములు :
- అ+ఉ+మ+ ‘అర్ధమాత్ర
- జాగ్రత్ + స్వప్న + సుషుప్తి + తురీయములు
→ యజ్ఞాగ్ని జనింపజేయటానికి ‘‘పై అరణి (పైకొయ్య)’’
(3) ఆత్మజ్ఞాన నిర్మధన అభ్యాసము : → ఆ రెండింటిని అగ్ని కొరకై సంఘటితము చేయటము.

బుద్ధిని+ఉపాసనను తీవ్రం చేసి ఆత్మజ్ఞానాగ్నిని జనింపజేసి నిత్యానిత్య వివేకులు తమను బంధిస్తున్న సంసార పాశములను తగులబెట్టి భస్మము చేసి వేసి బంధవిముక్తులగుచున్నారు. అన్యమైనదంతా ‘ఆత్మాహమ్’ జ్ఞానాగ్నిచే దహించివేసి, అనన్యస్వరూపులై, త్రిలోకములను భస్మధారణగా చేస్తూ, భస్మభూషితులగుచున్నారు.

ఆత్మాహమ్ స్థానము

అనే ఆత్మాహమ్ స్థానమును, కైవల్య పదమును వివేకి (జీవితము అనే అవకాశమును ఎట్లా ఉపయోగించుకోవాలో - తెలిసినవాడు) - చేరుచున్నాడు.

♠︎ ♠︎ ♠︎ ♠︎ ♠︎

అశ్వలాయనముని : హే పితామహా! సృష్టి ప్రజ్ఞానంద రూపా! లోకగురూ! నాదొక సందేహము.
- అసలీ మాయ ఎవరిది?
- ఎందుకు ఎట్లా కల్పించబడి మమ్ములను నిబద్ధులుగా చేసివేస్తోంది?
- మేము ఎందుచేత ఎవరి కారణంగా ఇందులో చిక్కుకుని ఉన్నాము?
- ఇందులోంచి తేలికగా బయల్వెడలటం ఎట్లా?

బ్రహ్మదేవుడు : అంతా కూడా పరబ్రహ్మస్వరూపుడగు పరమాత్మయొక్క స్వీయ క్రీడా కల్పనా విశేషమే!

ఒకడు తన స్వప్న దృశ్యమును తానే కల్పించుకొని అందులో సుదూర ప్రదేశాలలో స్వప్నానుభూతి పూర్వకంగా విహరిస్తూ ‘‘నేను గదిలోనే ఉండి నిదురిస్తున్నానుకదా!’’.. అనే విషయం ఏమరుస్తూ ఉన్నాడు. నిదుర లేవగానే స్వప్నదృశ్యమంతా క్షణంలో త్యజించి జాగ్రత్‌లో కార్యక్రమాలు పునః ప్రారంభిస్తున్నాడు కదా!

అట్లాగే పరమాత్మ జీవాత్మత్వము - అనే కల్పన చేసుకొని ‘‘ఇది నా కల్పనే కదా!’’ - అనునది ఏమరుస్తున్నాడు.

జీవాత్మ - జాగ్రత్ అవస్థ

→ స్వయముగా తన మాయను తానే కల్పించుకొని అందులో ప్రవేశిస్తున్నాడు,
→ తన కల్పనయందు తానే పరిమోహితుడు (Deeply illusioned) అగుచున్నాడు.
→ భౌతిక శరీరము నందు ప్రవేశించి, ఇందులో సంస్థితుడై, ఇక ఆపై పంచేంద్రియములను ఉపయోగిస్తూ అనేక కార్యక్రమ పరంపరలలో ‘నిమగ్నుడు’ అగుచున్నాడు.
→ శృంగారము, అన్నము, పానము, గృహములు, ధనము, దేహముల రాకపోకలు, లోకములో ప్రవేశ - నిష్క్రమణములు ఇటువంటి చిత్ర - విచిత్రములైన భోగములను ఆశిస్తూ, ఆశ్రయిస్తూ, అనుభవిస్తూ, గర్విస్తూ, శోకిస్తూ.. రోజులు గడుపుచున్నాడు.
→ ఇంకొక విచిత్రం ! నూతిలోని కప్ప (కూపస్థ మండూకము) ‘‘ప్రపంచమంతా ఇంతే!’’.. అని అనుకుంటుంది చూచావా? స్త్రీ- అన్న-పానేషు విచిత్రభోగైః - స ఏవజాగ్రత్ పరితృప్తమేతి!

‘‘నా యొక్క మొత్తము వ్యవహారత్వము - నా సమస్తము ఈ ఎదురుగా దేహ-ఇంద్రియాలచే ప్రాప్తిస్తున్న జాగ్రత్‌కు మాత్రమే పరిమితము’’.. అని తలచటం, నమ్మి ఉండటం, పరిమితమైపోవటం ప్రారంభిస్తున్నాడు. ఎప్పటికప్పుడు అంతంతవరకు మాత్రమే తనను తాను గమనిస్తూ పరితృప్తి పొందినవాడై ఉంటున్నాడు.

⌘ ‘‘ఈ జాగ్రత్‌కు వేరై- నాకు కావలసినది, నేను పొందవలసినది, ఆశించవలసినది, తెలుసుకోవలసింది నాకు సంబంధించి - ఇంకేమీ లేదు.

⌘ ఈ జాగ్రత్‌లో నేను ఏమేమి సంపదలు, సంబంధాలు, అనుబంధాలు, బాంధవ్యాలు, పేరు-ప్రతిష్టలు కలిగి ఉన్నానో,… ఇంతవరకే నాకు చెందినవి. వీటి వరకే నేను చెందినవాడను. నా సంగతి ఇంతింత మాత్రమే.
ఇవి అనుకూలమా?… సంతోషము!
ప్రతికూలమా?.. నాకు పరమ దుఃఖము. నా కొంప మునిగినట్లే!

⌘ ఈ జాగ్రత్‌లో ఏమి పొందితే, అది వాస్తవానికి పొందినట్లు. ఏదేది పొందలేదో, అది నేను పొందనట్లే కదా మరి!’’
అని అత్యంత దృఢంగా భావన చేస్తూ నిమగ్నమగుచున్నాడు.

జీవాత్మ - స్వప్నావస్థ

స్వప్నేతు జీవః సుఖ-దుఖ భోక్తా స్వమాయయా కల్పిత విశ్వలోకే!

ఇంద్రియ బాహ్యత్వమును జాగ్రత్ రూపముగా కొంతసేపు అనుభవించిన ఈ జీవుడు దైనందికంగా, తనకు తానే (on a Daily basis) స్వప్న జగత్తులో ప్రవేశిస్తున్నాడు. స్వప్నము ఎవరి కల్పన? మరొకరి కల్పనయా? కానే కాదు.

జాగ్రత్ - స్వప్నములు రెండూ స్వకీయ కల్పనలే!

ఈ జీవుడు తనకు తానే తన ఊహాచమత్కారముచే స్వప్నలోకమును కల్పించుకొని, ‘‘ఈ కనబడే (స్వప్న) జగత్ మాత్రమే నాకు సంబంధించిన పూర్ణ సత్యము కదా!’’ అని భావన చేస్తున్నాడు.

‘‘ఈ స్వప్నలోకంలో నాకిప్పుడు కనిపిస్తున్నదే నాకు సంబంధించిన విశ్వమంతా! ఇక్కడి సుఖ-దుఃఖాలు వాస్తవమైనవే’’ అని తలచుచున్నాడు.

అనగా…,
😴 స్వప్నలోకంలో విహరిస్తున్నప్పుడు ఆ స్వప్న ద్రష్టకు జాగ్రత్ - లేనిది, అవాస్తవము అగుచున్నది. స్వప్నలోకమే సర్వస్వముగా నమ్మబడుచున్నది.
😕 జాగ్రత్‌లో విహరిస్తున్నప్పుడు వర్తమాన జాగ్రత్ (ఇంద్రియాలతో ఇంద్రియార్థ దృశ్యములు) సత్యముగా అనిపిస్తూ, ‘‘స్వప్న విషయాలన్నీ - భ్రమాత్మకము మాత్రమే కదా!’’ - అని అనిపిస్తూ ఉంటోంది.
జాగ్రత్ లోకమే సర్వస్వముగా భావించబడుతూ వస్తోంది!

జీవాత్మ- సుషుప్తి అవస్థ

సుషుప్త కాలే సకలే విహీనే
తమో-భిభూతః సుఖరూపమేతి!

ఈ జీవుడు ‘సుషుప్తి’ని ఆశ్రయించుచున్న సమయంలో ఇక ఆతడు జాగ్రత్ -స్వప్నములలో అనుభవిస్తూ వస్తున్న సర్వ విషయాలు, విశేషాలు, సందర్భాలు ‘మౌనము’ అను పెట్టెలో దాచి ఉంచబడుచున్నాయి. (Both are hided in silence)

నిర్విషయ తమోస్థితి (Sheer Ignorance of all else) పొందబడుతోంది!
ఆ తమో స్థితిలో విషయ సంబంధమైన మానసిక శ్రమ లేకపోవటం చేత…,
🌺 ఇదియే సుఖస్థితి!
🌺 నాకు విషయములే లేవు! జ్ఞాపకమునకు రాకుండునుగాక!
🌺 ఈ స్థితియే నాకు సంబంధించిన సమస్తము కూడా!…
అని ఈ జీవాత్మ భావించి, ఆ తమో సుషుప్త స్థితియే సర్వస్వముగా ఆపాదించుకొని ఆస్వాదించుచున్నాడు.

పునర్జన్మ : ఈ జీవాత్మ కర్మయోగముచేత ఈ దేహానంతరము మరొక దేహము పొందుచున్నాడు. మరల బాల్య-యౌవన వార్ధక్యాలు! మరల జాగ్రత్ - స్వప్న - సుషుప్తులు! ఇదంతా, అంతులేని క్రీడ! సంచార విలాసము!

పరస్వరూపమ్ : జాగ్రత్- స్వప్న- సుషుప్తులు జీవుని యొక్క ‘ఇహ’ స్వరూపాలు. ఈ జాగ్రత్ - స్వప్న- సుషుప్తులకు ఆవల పరమై ఈ జీవాత్మ యొక్క సాక్షీభూత- ఆత్మ స్వరూపము అనునిత్య చైతన్య జ్యోతి అయి ప్రకాశిస్తోంది. జాగ్రత్-స్వప్న-సుషుప్తులను ప్రదర్శించునదై, సర్వమును చేతనముగా చేయుచున్నదై ఉన్నది.

అదియే ఈ జీవుని యొక్క
🙏 పరమాత్మత్వము! (విష్ణుతత్త్వము).
🙏 పరతత్త్వ స్వరూపము! (శివతత్త్వము).
🙏 చిత్ చైతన్య స్వరూపము! (దేవీ దివ్యస్వరూపము).

అట్టి ‘‘పర, పరాత్పర, కేవలీ ఆత్మ’’ స్వరూపము ఎట్టిదో… ఇక విను.

జలంలో తరంగాలవలె జాగ్రత్-స్వప్న సుషుప్తులు, దేహముల రాక-పోకలు, ఇంకా లోకముల రాకపోకలు కూడా →
→ ఆత్మ నుండే (పరస్వరూపము నుండే) బయల్వెడలుచున్నాయి.
→ ఆత్మయందే లయమును పొందుచున్నాయి.

యస్మాత్ జాయతే ప్రాణో, మనః సర్వేంద్రియాణిచ:
❋ ఎందులోంచైతే ప్రాణశక్తి (Energy), మనస్సు (ఆలోచన) - వీక్షణ - భావన (Thought), సర్వ ఇంద్రియాలు బయలుదేరుచున్నాయో…
❋ ఎందులోంచి భూమి (Solid), జలము / ద్రవము (liquid), అగ్ని (Heat & Light), వాయువు (సర్వ సంచలనములు), ఆకాశము (స్థలము).. అనే పంచభూతములు బయల్వెడలుచున్నాయో..
❋ ఎందులో ఈ విశ్వమంతా ప్రదర్శితమౌతోందో…,
అదియే పరమాత్మ! (పరమ్ + ఆత్మ)

ఓ అశ్వలాయన మునీంద్రా!
ఇక్కడ ఒక అతిముఖ్యమైన విషయము గమనించు!

తత్త్వమసి (సామవేదప్రవచమ్) : ఏదైతే సర్వాత్మకమై, తన మహత్‌గా ఈ విశ్వమును ప్రదర్శించుచున్నదో, సూక్ష్మాతి సూక్ష్మమైయున్నదో, కాలానికి కూడా ఆవల నిత్యమై - నిత్య సత్యమైయున్నదో..
అట్టి పరబ్రహ్మము -

అయమాత్మాబ్రహ్మ (అధర్వణవేద ప్రవచనము) : జాగ్రత్ - స్వప్నము - సుషుప్తి మొదలైన అనేక విషయాలు, విశేషాలతో కూడినవన్నీ ఎద్దానిచేత ప్రకాశింపజేయబడుచూ ఉన్నాయో, అట్టి బ్రహ్మమే నేను! ఈ ‘జీవాత్మ’ అనబడునది బ్రహ్మమే.

అంతేగాని,
… జాగృత్‌లోనో, స్వప్నములోనో, సుషుప్తిలోనో చిక్కుకొన్న ఒక జీవశకలాన్ని కాదు!

‘జాగ్రత్’ అనునది ఆత్మస్వరూపుడనగు నాచేత ప్రకాశింపజేయబడుతోంది. ఇక అందులో, నా ప్రకాశరూపమైన-‘త్వమ్’ ఇత్యాది అనేక విశేషాలు.

అట్లాగే స్వప్నము, సుషుప్తి కూడా!

ఈ విధంగా…,
‘‘జాగ్రత్ స్వప్న సుషుప్తులు ప్రకాశింపజేయు, ప్రదర్శనచేయు, ప్రకటిత పరచు బ్రహ్మము నేనే’’… అని నీవు గ్రహించుచుండగా, సర్వ బంధములు వాటికవే తొలగిపోయి, నీవు ముక్తుడవు (Relieved of every thing) అగుచున్నావు. ‘‘ఆత్మ నా సహజ రూపము కాబట్టి బంధమే లేదు’’ అను అవగాహన (Convinced state)యే ముక్తి, మోక్షము కూడా! సో2హమ్।

ప్రజ్ఞానమ్ బ్రహ్మ : (ఋగ్వేదవాక్యము) - ‘ఎరుక’ రూపముగా ఏది ఉన్నదో, అది బ్రహ్మమే। తెలివియే। ‘తెలియబడుచున్నది’గా విస్తారమగుచున్నది. ‘ఎరుక + ఎరుగబడునది’ ల రూపమగు ప్రజ్ఞానమే బ్రహ్మము.

జగదనుభవము అనగా…,
✤ అనుభవించువాడు.
✤ అనుభవము.
✤ అనుభవించబడునది.

వీటిని త్రిధామములు (లేక) త్రిస్థానములు అని అంటాము. ఈ మూడింటికి వేరై, విలక్షణమై, కేవల సాక్షియై ఏదైతే ఉన్నదో,
అట్టి
- కేవల చిన్మాత్ర స్వరూపుడను!
- సదాశివ స్వరూపుడను నేను!

ఒక నాటకంలో నేను పాత్ర వహిస్తూ ఉంటే, ఆ పాత్ర యొక్క
(1) ‘‘అనుభవించువాడు (Actor),
(2) అనుభవించబడునది (నాటకములోని సంగతులు, సందర్భములు),
(3) నటన (Acting)
.. ఈ మూడింటికి వేరై ఉన్నాను కదా!

అట్లాగే పైన చెప్పబడిన జగత్తు సంబంధమైన త్రిధామములు జగన్నాటకాంతర్గతం!

ఇక నేనో? చిదానందరూపమ్ శివో2హమ్! శివో2హమ్! కేవల ప్రజ్ఞాన - ఆనంద స్వరూపుడను.

అహమ్ బ్రహ్మా-స్మి - యజుర్వేదమహావాక్యము :
ఈ సర్వము నా నుండే జనించుచున్నది → మయ్యేవ సకలమ్ జాతమ్!
ఈ సర్వము నాయందే ప్రతిష్టితమై ఉన్నది → మయి సర్వమ్ ప్రతిష్ఠితమ్!
ఇదంతా నా యందే లయించుచున్నది → మయి సర్వమ్ లయమ్ యాతి!
అట్టి అద్వితీయ బ్రహ్మమే నేనై ఉన్నాను → తత్ బ్రహ్మమద్వయమస్తి అహమ్!

⌘ అణువుకంటే కూడా సూక్ష్మాతి సూక్ష్ముడను!
⌘ మహత్తు కంటే మహత్తరమైనవాడను!
⌘ చిత్రవిచిత్రములతో కూడిన ఈ విశ్వమంతా నా యొక్క రూపవిశేషమే!
⌘ అన్నిటికీ మొదలే ఉన్నవాడను! పురాతన పురుషుడను! సనాతనుడను!
⌘ ఈశ్వరుడనై అంతటా అన్నీగా వ్యాపించిఉన్నది నేనే!
⌘ ఆనంద తేజోరూపుడను! జ్యోతి స్వరూపుడను!
⌘ సర్వమును పవిత్రముగా చేసివేయు మంగళ స్వరూపుడను. శివో2హమ్! శివో2హమ్। శివో2హమ్।
⌘ బ్రహ్మమే స్వరూపముగా గలిగినట్టి నాకు కాళ్లు-చేతులు లేవు. కానీ కాళ్లు-చేతులను చైతన్యపరచువాడను నేనే!
⌘ మనస్సుచే ‘‘ఇట్టిది’’ అని నిర్వచించబడజాలని అచిన్త్య శక్తి స్వరూపుడను! కానీ మనస్సు నా చిదానందముచే ప్రేరణమగుచున్న - చేతనమగుచున్న వస్తువే!
⌘ నా యొక్క వివిధ రూపములన్నీ నేనే ఎరిగినవాడిని! ఎరుగుచున్నవాడను! (1) జాగ్రత్‌లో నేను! (2) స్వప్నములో నేను! సుషుప్తిలో నేను! తురీయుడగు నేను! అన్నీ నేనైన నేను। - అన్నీ ఎరిగియే ఉన్నవాడను.

నన్ను ఎరుగువారు మరొకరెవరూ లేరు! నేను సర్వము సర్వదా ఎరుచున్నట్టి వాడను. ఇదంతా నా యొక్క చిదానంద విన్యాసమే!
తెలుసుకోబడుచున్నవి అనేకము. ఎరుగుచున్నవాడిని మాత్రము నేనొక్కడినే!

తెలియబడేదంతా తెలుసుకుంటున్నవాడిని కూడా తెలుసుకొంటున్నవాడిని!
తెలియబడేదానికి ఆవల ఉండి సర్వము తెలుసుకొనుచున్నవాడిని!
వేదాంత కృత్। వేదవిదేవ చ అహమ్! వేదములు తెలుపుచున్నది నాగురించే!
నాకు పుణ్యము లేదు! పాపము లేదు! మార్పు లేదు! చేర్పు లేదు! జన్మ లేదు! మృత్యువు లేదు! దేహము లేదు! మనస్సు లేదు! బుద్ధికి ఆవల ఉన్న వాడను! అందుచేత బుద్ధిరహితుడను! నాకు ఇంద్రియములు లేవు! న జన్మ దేహ ఇంద్రియ బుద్ధ్యాది - అస్తి।

పరాత్ పరస్వరూపుడనగు నాకు పంచభూతములైనట్టి భూమి-జలము-అగ్ని-వాయువు-ఆకాశము లేవు. వాటికి వేరుగా, వాటికి ఆవల, వాటికి ఉత్పత్తి స్థానమై నేనున్నాను.

ఈ విధంగా పరబ్రహ్మస్వరూపుడనగు నేను సర్వహృదయములలోని అంతర్యామిగా ఉన్నవాడను। ఎట్టి సాంసారిక- పాంచభౌతిక దోషములచే స్పృశించబడనివాడను! అంతా నా స్వరూపమే! నాకు ద్వితీయమనునది ఎక్కడా ఏదీ లేదు! అద్వితీయుడను!

అంతేకాదు!

సమస్తమునకు (నాటక దీపమువలె) కేవలము ‘సాక్షిని’ (I am a mere witness being quite beyond and quite unaffected by what all that tends to happen)! నేను సత్తును కాదు! అసత్తునుకాదు! సదసత్తును కాను.

దృశ్యములోని - జగత్తులోని - విశ్వములోని ఒకానొక వస్తువు-రూపము -నామము కాదు! కనుక సత్తును కాదు.

నేను ఉండుటచేతనే ఈ జగత్తుకు సత్తుగా కల్పితమగుచున్నది. వస్తువురూపము, నామము యొక్క ఆధారము నేనే! అందుచేత నేను అసత్తును కూడా కాదు! ఈ విధంగా ‘సత్-అసత్ విహీనమహమ్!

ఎవ్వరైతే పైన చెప్పిన విశేషణములతో కూడిన తమ యొక్క పరమాత్మ రూపమును తెలుసుకుంటారో…

బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి।

అట్టివారు శుద్ధ పరమాత్మయందు ప్రవేశించి, శుద్ధ పరమాత్మ స్వరూపులే అగుచున్నారు!

—⌘—

‘శతరుద్రీయము’ అని కూడా పేరుతో చెప్పబడుచున్న ఈ కైవల్యోపనిషత్ ఎవ్వరైతే అధ్యయనం చేస్తారో, వారు అగ్నివలె పరమపవిత్రులౌతారు. వాయువు వలె నిర్మలులౌతారు.

సురాపానము, బ్రహ్మహత్య ఇత్యాది దోషముల నుండి కడిగి వేయబడతారు!

కృత(నిర్వర్తించినవి) అకృత (నిర్వర్తించనివి) అగు సర్వకర్మదోషముల నుండి విముక్తులౌతారు. కృతకృత్యా పూతో భవతి! కృతకృత్యులు అవుతారు. పరమ నిర్మలత్వము సంతరించుకోగలరు.

సంసార బంధవిముక్తి కొరకై ఈ కైవల్యోపనిషత్‌ను బుద్ధితో ఆశ్రయించెదరుగాక! వర్ణాశ్రమవాసులందరికీ (4 ఆశ్రమముల వారికి) ఈ ఉపానిషత్ అర్ధం గొప్ప ఉపాయం. వర్ణాశ్రమ ధర్మాలను త్యజించినవాడు కూడా ఈ ఉపనిషత్ పరిశీలిస్తూ అధ్యయనము చేస్తూ తదర్ధమును జపము (మననము) చేయునుగాక! తప్పక మహత్తర ప్రయోజనము సిద్ధించి తీరుతుంది!

ఈ కైల్యోపనిషత్ పఠనము - మననము- అధ్యయనము చేస్తూ చేస్తూ ఉండగా..,
- పరాత్ పరమపదము లభించగలదు.
- అట్టి వానియొక్క సంసార సాగరము - మండు వేసవికాలపు ఎండలో చిన్నగుంటలోని జలమువలె - ఇగిరిపోగలదు.

అందుచేత, ఇందలి విషయము తెలుసుకోవటము కైవల్య పదమే! అని ఆర్యుల వాక్యం! కేవలీ స్వస్వరూపానుభవ అనునిత్యత్వమే కైవల్యము.

అట్టి కైవల్యము - అనునది కరతలామలకం అవుతుంది! అనునిత్యంగా స్వబుద్ధికి స్వానుభవం కాగలదు.🙏 ఇతి కైవల్య ఉపనిషత్ ‌🙏
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।।