[[@YHRK]] [[@Spiritual]]

Kshurika Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 3
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: yhrkworks@gmail.com

కృష్ణ యజుర్వేదాంతర్గత

32     క్షురికోపనిషత్

(క్షురిక = కత్తి)

శ్లోక తాత్పర్య పుష్పమ్


శ్లో।। కైవల్యనాడిక అంతస్థ పరాభూమి నివాసినమ్
క్షురికోపనిషత్ యోగ భాసురం రామమ్ ఆశ్రయే।।

కైవల్యనాడీ అంతర్గతుడు, పరాస్థానము నివాసముగా కలవాడు, క్షురికోపనిషత్ ప్రవచిత యోగమును హృదయము నందు ప్రకాశింపజేయువాడు / ప్రకాశమానుడు అగు శ్రీరామచంద్రమూర్తిని ఎల్లప్పుడు ఆశ్రయించుచున్నాము.

ఓం
1. క్షురికాం సం ప్రవక్ష్యామి
ధారణాం యోగ సిద్ధయే
యాం పాప్య న పునర్జన్మ
యోగయుక్తస్య జాయతే।।
‘ఓం’కార స్వరూప పరబ్రహ్మమును స్మరిస్తున్నాము.
ఏ యోగము యొక్కధారణ వలన యోగసిద్ధిని పొందిన తరువాత, అట్టి సిద్ధియొక్క ప్రాప్తిచే ఆ యోగయుక్తునికి పునః జన్మ ఉండదో, అట్టి ‘క్షురికయోగ ధారణ’ గురించి ఇప్పుడు మనము వివరించి చెప్పుకొను చున్నాము.

(క్షురిక = కత్తి /చురకత్తి /మంగలి కత్తి)
2. వేద తత్త్వార్థ విహితం
యథోక్తం హి, స్వయంభువా।
నిశ్శబ్దం దేశమ్ ఆస్థాయ,
తత్ర ‘ఆసనం’ అవస్థితః।।
మొట్టమొదట వేదతత్త్వార్థమునకు సానుకూలము, విహితమగు ఈ యోగము (పరమేశ్వరునిచే) స్వయంభువు అగు బ్రహ్మదేవులవారికి ఉపదేశించబడింది.

పరమేశ్వరుడు: ఓ స్వయంభువా! బ్రహ్మదేవా! యోగాభ్యాసి మొట్టమొదట జనసంచారము లేని నిశ్శబ్దమైన ప్రదేశమును ఎన్నుకొని అవస్థితుడై ఉండాలి. ఆ చోట ఆసీనుడై (ఆసనమును ఆశ్రయించి) యోగాభ్యాసమునకు సంసిద్ధుడు అగునుగాక!
3. కూర్మో అంగానీవ సంహృత్య
మనో హృది నిరుధ్య చ,
మాత్రా ద్వాదశ (12) యోగేన
ప్రణవేన శనైః శనైః।।
తాబేలు తన అంగములను సందర్భనులననుసరించి ప్రమాదము శంకించినప్పుడు వెనుకకు తీసుకోవటం, సానుకూలంగా ఉన్నప్పుడు బయటకు విస్తరింపజేసి చక్కగా ఉపయోగించుకోవటం చేస్తూ ఉంటుంది కదా!

అట్లాగే యోగాభ్యాసి ‘12’ మాత్రల కాలము పూరక యోగాభ్యాసమును ప్రారంభించి ప్రణవోపాసన నిర్వర్తించును గాక! ఇంద్రియములను ఏ విషయములలో నియమించాలో ఏ విషయముల నుండి ఉపసంహరించాలో - గ్రహించి వివివేచనతో నిర్ణయము చేసుకొని, వాటిని జయించి, తత్త్వజ్ఞాన-అనుభవముల మార్గమునకు ఈ ఇంద్రియములను మరల్చాలి.
4. పూరయేత్ సర్వం ఆత్మానగ్ం
సర్వ ద్వారం నిరుధ్య చ
ఉరో ముఖ కటిగ్రీవం
కించిత్ హృదయమ్ ఉన్నతమ్।।
దేహముయొక్క నవ ద్వారములను నిరోధించుచూ, ముఖము-కటి (మొల)- గ్రీవము (మెడ)లను నిలువుగాను, హృదయమును ఉన్నతము (ఎత్తు)గాను ధారణ చేస్తూ పూరక - కుంభకములను (గాలి నింపటం ధారణ చేయటం) నిర్వర్తించాలి.
5. ప్రాణాం తు సంధారయే తస్మిన్
నాస - అభ్యంతర చారిణః
భూత్వా తత్ర ఆయత ప్రాణః
శనైః ఉచ్ఛ్వాసమ్ ఉచ్ఛ్వసేత్।।
నాసిక (ముక్కు)లో స్వతంత్రంగా సంచారములు చేస్తున్న వాయువును (1) (ఇడనాడిలో) పూరించటము, (2) నవద్వారములను మూసి ఉంచి శిరస్సునందు, ముఖమునందు ధారణ చేస్తూ కుంభకము, (3) (పింగళనాడి ద్వారా) రేచకము (గాలిని వదలటము) అను ప్రాణాయామా భ్యాసమును నిర్వర్తించాలి. నెమ్మదిగా ఉచ్ఛ్వాసమును తన ఆధీనములో కలిగి ఉంటూ ఉచ్ఛ్వసించాలి. నెమ్మదిగా గాలిని పీల్చి (కుంభక - రేచకములు) అభ్యసించాలి.
6. స్థిరమ్ ఆత్మ దృఢం కృత్వా
అంగుష్ఠేన సమాహితః
ద్వే గుల్ఫేతు ప్రకుర్వీత
జంఘేచైవ త్రయః త్రయః।।
యోగి స్థిరమైన (తన శరీరము స్థిరముగా ధారణ చేయుటకు తనకు సానుకూలమైన) ఆసనమును ధరించాలి. (1) కుడి బొటనవ్రేలుతో కుడి నాసికా రంధ్రమును మూసి, వాయువును లోనికి ఎడమ నాసికారంధ్రము ద్వారా ఇడనాడిలో పూరకము చేసి, (2) కుడి అనామిక - కనిష్ఠికలతో (ఉంగరపు వ్రేలు, చిటికిన వ్రేలులతో) ఎడమ నాసికా రంధ్రమును మూసి వుంచి (48 మాత్రల కాలము - చిటికెల కాలము) కుంభకము చేసి, (3) అటు తరువాత (24 మాత్రలకాలము) వాయువును కుడిముక్కు రంధ్రము ద్వారా వదలాలి.

ఆ తరువాత పింగళానాడితో ప్రాణాయామము ఈ విధంగా గుల్ఫమునందు (చీల మండలమునందు), జంఘము (కాలిపిక్క) యందు మూడు మూడుసార్లు వాయువును నిలిపి ఆత్మయొక్క ధ్యాసతో ప్రాణయామం చేయాలి.
7. ద్వే జానునీ తథా ఊరూ,
ద్వేగుదే, శిశ్నే త్రయః త్రయః
పాయోః ఆయతనం తత్ర
నాభిదేశే సమాశ్రయేత్।।
ఇకప్పుడు దృష్టి - మనస్సు - ప్రాణములతో రెండు మోకాళ్ళ స్థానములో ధ్యాసను నిలుపుతూ 3 - 3 సార్లు ద్వయీ ప్రాణాయామము చేయాలి. అటు తరువాత గుదస్థానము (పాయువు మలవిసర్జనా ప్రదేశము) నందు, శిశ్నము (మగ గురి) ప్రదేశమునందు వాయువును నింపుతూ ధ్యాసను ఉంచి 3 - 3 సార్లు ఇడా-పింగళా ప్రాణాయామము చేయాలి. అటుపై పాయువు చుట్టూ దృష్టి - మనస్సు - ప్రాణముల ఉపకరణము (మరియు) ధ్యాసలతో చుట్టి వచ్చి, ఆ మూడిటితోను నాభి ప్రదేశమును సమాశ్రయించి ప్రాణాయామ ప్రక్రియతో వాయు కుంభకమును (మణిపూరకస్థానమగు) నాభివద్ద నిర్వర్తించాలి,
8. తత్ర నాడీ సుషుమ్నా తు
నాడీభిః దశభిః వృతా,
తత్ర రక్తా చ పీతా చ
కృష్ణా తామ్రా విలోహితా।।
ఈ (మణిపూరక చక్రస్థానమగు) నాడీ ప్రదేశములో సుషుమ్న అనే బ్రహ్మనాడి. ఇది (నాడీకందము నుండి) శిరస్సుకు ఉపరితల ప్రదేశము వరకు విస్తరించి ఉండటం చేత ‘బ్రహ్మనాడి’ అని పిలుస్తారు. ఇంకా దశ (10) ముఖ్యనాడులు ఇక్కడ ప్రారంభమగుచూ ఉన్నాయి. ఈ ప్రదేశమే నాడీకందము (కందగడ్డవలె ముద్ద). ఈ నాడీ కందము నుండి అనేక సూక్ష్మనాడులు, ఉపనాడులు బయల్వెడలుచున్నాయి. అవన్నీ రక్త (ఎరుపు) వర్ణంగాను, పీత (పసుపు వర్ణము)గాను, కృష్ణ (నలుపు)గాను, తామ్ర (రాగి) వర్ణముగాను, విలోహితం (నీలం) గాను మెరయుచున్నాయి,
9. అతి సూక్ష్మా చ తన్వీ చ
శుక్లాం నాడీం సమాశ్రయేత్
తత్ర సంచారయేత్ ప్రాణాన్
ఊర్ణ నాభీవ తంతునా।।
అట్టి నాడీ ప్రదేశములో అత్యంత సూక్ష్మము, సన్నము అగు ‘శుక్లనాడి (సుషుమ్న నాడి, బ్రహ్మనాడి) అనబడు ఇడ - పింగళ నాడుల మధ్యగల సూర్యప్రకాశ సమాన్వితమగు నాడిని సమాశ్రయించాలి. సాలెపురుగు తనచుట్టూ దారములను చుట్టుకొని ఉండు రీతిగా, ఈ సుషుమ్నను ప్రాణశక్తి ఆశ్రయించి ఉన్నది. మనస్సు, ప్రాణము, దృష్టులు కలుపుకొని ఆశ్రయించి ఉండు కుంభక ప్రాణాయామమును ధ్యానమార్గంగా అభ్యసించాలి.
10. తతో రక్తోత్పలా భాసగ్ం
హృదయ ఆయతనం మహత్
దహరం పుండరీకం తత్
వేద అంతేషు (వేదాంతేషు) నిగద్యతే।।
ఇప్పుడిక అనాహత ప్రదేశ నాడీకందము నుండి ప్రాణోపాసన ద్వారా మనో ప్రాణదృష్టులను
- ఎర్రటి కలువ పూవు వలే భాసిస్తున్నది
- అన్ని నాడుల కంటే మహత్తరమైనది
- అగు అనాహత స్థానములో గల హృదయములో ప్రకాశింపజేయాలి. (మణిపూరక ఆకాశమునుండి అనాహత స్థానము).

దహరాకాశము (హృదయాకాశము), పుండరీక (తెల్ల తామర ఆకాశము గలది) అగు అనాహత (హృదయ) స్థానములో ప్రాణాయామమును అభ్యసిస్తూ ప్రాణ - మనో దృష్టులతో క్రమంగా హృదయ స్థానమును దాటి విశుద్ధ చక్ర స్థానము (కంఠ స్థానము)ను చేర్చాలి.
11. తత్ భిత్వా కంఠం ఆయాతి,
తాం నాడీం పూరయేత్ ఇతి।
మనసస్తు పరం గుహ్యగ్ం
సుతీక్షణాం బుద్ధి నిర్మలమ్।
ఆ విధంగా హృదయాకాశమును కూడా ఛేదించి, ఇక ఇప్పుడు, (అనాహత చక్రమును అధిగమించి) మనో - ప్రాణ - దృష్టులను (ప్రాణాయామము - సహజకుంభకముల అభ్యాసముచే) విశుద్ధ చక్రస్థానమగు కంఠ ప్రదేశమునకు జేర్చి, అక్కడ ప్రాణాయామము అభ్యసించాలి. అక్కడి నాడులను ప్రాణశక్తితో పూరించాలి. నిర్మలమైన మనస్సు, సుతీక్షణామైన బుద్ధి, పవిత్రమైన దృష్టులతో ‘విశుద్ధము’ నుండి బ్రహ్మరంధ్రము, (మరియు) సహస్రారముల వరకు ధ్యాసను నిండుగా నింపి ఉంచాలి.
12. పాదస్య ఉపరి యత్ మర్మ -
తత్ ‘రూపం నామ’ చింతయేత్।
మనో ధారేణ తీక్షేణాన
యోగమ్ ఆశ్రిత్య నిత్యశః।।
సుతీక్షణామైన మనో - బుద్ధి - చిత్తముల యోగ (సంయోగ - వియోగాతీత ప్రశాంత స్థితి) ధారణమును అనునిత్యముగా ఆశ్రయిస్తూ ఉండాలి. 4 పాదముల ఆవల రూపం (తురీయాతీతము) ధారణ చేయాలి. బ్రహ్మ రంధ్రము నుండి కాలి బొటన వ్రేలు వరకు (From Head to Toe) పరమాత్మను (Eg. An actor remembering - what he is originally - while playing a particular role) (అనగా)-తన యొక్క సర్వ సహజీవులయొక్క ‘కేవలతత్’ రూపమును అనుక్షణికంగా, సర్వకాల, సర్వావస్థలయందు చింతన చేయాలి.
బుద్ధి - మనస్సులను నియమిస్తూ జ్ఞప్తితో కూడిన మననమును నిర్వర్తిస్తూ ఉండాలి.
13. ‘ఇంద్ర వజ్రమ్’ ఇతి ప్రోక్తం
మర్మ జంఘానుకృంతనమ్,
తత్ ధ్యాన బలయోగేన
ధారణాభిః నికృన్తయేత్।।
ఈ మనం చెప్పుకున్న (1) ప్రాణాయామ (2) వివిధ స్థానయోగ (3) తత్ రూప నామ చింతన - అనేక అన్యభావనలకు సంబంధించిన మర్మావయవములను (Secreat Bolckades of illusionary ignorences) - తెగనరకుచున్నది. కాబట్టి ‘ఇంద్ర వజ్రమ్ - ఇంద్రుని వజ్రాయుధము’ అని వర్ణించబడుచున్నది. అట్టి యోగముచే స్వస్వరూప భిన్నమై ప్రాప్తిస్తున్న దృశ్య రూప భ్రమాత్మక ధారణలు (అల్పదృష్టులన్నీ) ఖండించబడుచున్నాయి.
14. ఊర్వోః మధ్యేతు సంస్థాప్య
మర్మ ప్రాణ విమోచనమ్
చతుః అభ్యస్య యోగేన
ఛిందేత్ అనభిశంకితః।।
అటువంటి కేవలీ ఆత్మ యోగ సిద్ధి లభించటానికై ఆయా అడ్డంకులను యుద్ధవీరునివలే ఎదుర్కొని జయించాలి.
అందుకు ఒక యోగోపాయము. ఊరువుల (తొడల) మధ్యగా ప్రాణశక్తిని (కుంభక ప్రాణాయామము - సహజ కుంభకముల ద్వారా) సంస్థాపించి, తత్ భావనచే మర్మ ప్రాణములకు (దృశ్య విషయత్వములవైపు ప్రయాణించు ఇష్టములను) సమనస్క ప్రాణయోగముచే విమోచనము (Relief) కలిగించాలి. రోజుకు 4 సార్లు (ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం, రాత్రి) అభ్యసించటం చేత (యోగధారణచే) సర్వ శంకలు ఛిద్రమౌతాయి.
15. తతః కంఠాంతరే యోగీ
సమూహేత్ నాడి సంచయమ్,
ఏకోత్తరం నాడిశతం (101)
తాసాం మధ్యే పరాః స్మృతా (పరాస్థితా)।।
విశుద్ధ చక్రస్థానములో (కంఠ ప్రదేశములో) యోగాభ్యాసము చేయుచున్నప్పుడు ‘101’ నాడుల సమూహములు దేహములోని వివిధ ప్రదేశముల వైపుగా అమరిక కలిగినవై అనుభూతమౌతాయి. ఆ 101 నాడులలో ఊర్ధ్వముగా బ్రహ్మరంధ్రము వైపుగా నియమితమైన ఒకే ఒక్క నాడి - సుషుమ్ననాడి, ‘పరానాడి’ అని అంటారు. ఇది అన్నిటికంటే శ్రేష్ఠమైన నాడి. ఇది యోగి తనయొక్క మనో బుద్ధి దృష్టులను ముఖ్యముగా నిలుపవలసియున్న నాడి.
16. సుషుమ్నా తు పరే లీనా
విరజా బ్రహ్మ రూపిణీ।
ఇడా తిష్ఠతి వామేన (ఎడమ)
పింగళా దక్షిణేన తు (కుడి)।।
ఈ సుషుమ్న సహస్రారములోగల పరాశక్తిదేవితో లీనము పొందినది కాబట్టి ‘విరజ’ (దోష రహిత నిర్మలనాడి), ‘బ్రహ్మరూపిణి’ అయి ఉన్నది.
(నాడీకందము నుండి కంఠస్థానము వరకు) ఎడమవైపు ఇడ నాడి, కుడివైపు పింగళ నాడి ఏర్పడినవై, (అక్కడి నుండి ఆజ్ఞాచక్ర స్థానము వరకు విస్తరించి) - ప్రసరణము, ప్రభావము కలిగియున్నాయి.
17. తయోః మధ్యే పరం స్థానగ్ం
యస్తంవేద (యః తమ్ వేద), స వేదవిత్।
ద్వా సప్తతి సహస్రాణి (72,000)
ప్రతినాడీషు తై తిలమ్।।

18. ఛిద్యతే ధ్యానయోగేన।
సుషుమ్న ఏకా న భిద్యతే।
యోగనిర్మల సారేణ
క్షురేణ అనల వర్చసా।।
అట్టి ఇడ - పింగళ నాడుల మధ్య ఏ బ్రహ్మనాడి - కేవల తేజో ప్రజ్ఞా సమన్వితమై ప్రకాశించుచున్నదో అట్టి సుషుమ్నను ఎరిగినవాడే వేదవేత్త. తెలుసుకొనవలసినది తెలుసుకొనుచున్నాడు.
దేహంలో ‘72000’ నాడీ-ఉపనాడులు. 100 నాడీ సమూహములు జీవశక్తిని (ప్రాణశక్తిని) దేహమంతా విస్తరింపజేస్తున్నాయి. ‘ధ్యానయోగము’ అనే కత్తిచే 100 నాడుల ప్రాణప్రవాహము ప్రాణయోగాభ్యాసిపట్ల నిరోధించబడు చున్నాయి. (వశమై ఉంటున్నాయి).
ఒక్క సుషుమ్ననాడి బ్రహ్మనాడి మాత్రము ఛేదించబడదు. నిరోధింపబడ జాలదు.
యోగాభ్యాసము యొక్క జలముగా అగ్నివలె తేజోమానమగు సుషుమ్న స్వానుభవము కాగలదు. క్షవరపు కత్తివలే అగ్ని తేజస్సుతో కూడిన సుషుమ్నానుభవముచే తదితర నాడులలో ఆ యోగాభ్యాసి ధ్యాస యొక్క ప్రయాణవేగము సన్నగిల్లగలదు.
19. ఛిందేత్, నాడీ శతం ధీరః
ప్రభావాత్ ఇహ జన్మని,
జాతీ పుష్ప సమం యోగీ
యదా పశ్యతి తైతిలమ్।।
(తైతిలము = ఒక కరణముగా।
(As a Functional Hand)
ధీరుడైనవాడు 100 నాడుల ప్రాణప్రవాహ వేగమును (ప్రియభావవేగము) ఛిద్రం చేసి సుషుమ్ననాడియందు దృక్ మనో ప్రాణములతో అభ్యాస పూర్వకంగా ప్రకాశించుచున్నాడు. జాతీపుష్ప - సుగంధముల అవినాభావము వలే (ఒక్కటే అగు తీరుగా) - బ్రహ్మరంధ్రమును దాటి సహస్రార ప్రవేశి అయి, ఆ యోగి ఆత్మతో ఏకత్వము, అనన్యత్వము సిద్ధించుకొనుచున్నాడు.
20. ఏవం శుభ - అశుభైః భావైః
స నాడీనాం విభావయేత్।
తత్ భావితాః ప్రపద్యంతే
పునర్జన్మ వివర్జితాః।
101 నాడులలో సుషుమ్ననాడి తప్ప, తక్కిన 100 నాడులు శుభ - అశుభ భావములతో కూడిన గమన ఆగమనములు (Goings & Comings) కలిగి ఉంటున్నాయి. పునర్జన్మకు హేతువులు అగుచున్నాయి. 101వ నాడి అగు సుషుమ్నను ఉపాసించుయోగి తక్కిన 100 నాడుల నాడీ ప్రవాహవేగమును జయించి పునర్జన్మ రాహిత్యము పొందుచున్నాడు.
21. తపో విజిత చిత్తస్తు
నిశ్శబ్దం దేశమ్ ఆస్థితః,
నిస్సంగః సాంగ యోగజ్ఞో
నిరపేక్షః శనైః శనైః
ప్రాణయోగాభ్యాసి అగు యోగి…,
→ తపస్సుచే చిత్తమును జయించినవాడై.
→ సంగములన్నీ జయించి - నిస్సంగుడై,
→ యోగాంగమును ఎరిగినవాడై.
→ నెమ్మది నెమ్మదిగా అపేక్షలన్నీ దాటిపోయి, జయించి నిరపేక్షుడై, నిశ్శబ్దమగు స్థానమును చేరి ఉంటున్నాడు.
22. పాశాగ్ం ఛిత్వా యథాహగ్ంసో
నిర్విశంకం ఖం ఉత్సతేత్ (ఉత్పతేత్)।
ఛిన్న పాశః తథా జీవః
సంసారం తరతే సదా।।
→ నిర్విషయము, నిష్ప్రపంచము అగు మౌనస్థానమును అంతరంగమున ధరించినవాడై.
→ సర్వ సంసార పాశములను హృదయమునుండి తొలగించుకొన్నవాడై,
→ కట్టు విప్పుకొన్న హంస హాయిగా ఆకాశంలో విహరించునట్లుగా ఆత్మాకాశంలో విహరిస్తూ
సర్వ సంసార బంధములనుండి సదా పాశవిముక్తుడై తరించుచున్నాడు.
23. యథా నిర్వాణ కాలేతు
దీపో దగ్ధ్వా లయం వ్రజేత్,
తథా సర్వాణి కర్మాణి
యోగీ దగ్ధ్వా లయం వ్రజేత్।।
ఏవిధంగా అయితే వెలుగుచున్న దీపము నిర్వాణకాలంలో కాలటం అయిపోయి దీపపు వత్తి మొదలైన వాటినన్నిటినీ కాల్చివేసి విశ్వాగ్నిలో ప్రవేశిస్తోందో, అదే విధంగా యోగాభ్యాసముచే యోగసిద్ధిని పొందిన యోగి సర్వకర్మ వ్యవహారములను దగ్ధము చేసి వేసి, ‘అఖండాత్మ’యందు ‘లయము’ పొంది, తానే విశ్వాత్మకుడుగా అగుచున్నాడు.
24. ప్రాణాయామ సుతీక్షేణాన
మాత్రా ధారేణ యోగవిత్,
వైరాగ్య ఉపల ఘృష్టేన
ఛిత్వా తంతూః న బధ్యతే।।
యోగవేత్త సుతీక్షణామైన ప్రాణాయామ అభ్యాసమునకు ఉపక్రమించి, మాత్రల (పూరక 12 మాత్రలు, కుంభక 32 మాత్రలు, రేచక - 24 మాత్రలు) ధారణను అభ్యసించి, ‘వైరాగ్యము’ అనే పదునైన ఖడ్గమును సంపాదించుకొని సర్వ సంసార తంతువులను త్రెంచి వేయుచున్నాడు. బంధ విముక్తుడగుచున్నాడు.
25. అమృతత్వం సమాప్నోతి
యదా కామాత్ ప్రముచ్యతే
సర్వ ఈషణా వినిర్ముక్తః
ఛిత్వా తంతుం, న బధ్యతే।।
ఛిత్వా తంతుం న బధ్యత ఇతి।।
ఎప్పుడైతే యోగి దృశ్యమునకు సంబంధించిన సర్వ కామముల (Desires, wishes and expectations pertaining to material scenario) నుండి ప్రముచ్యుడు (Relieved, left them all aside) అగుచున్నాడో, (ధనేషణ మొదలైన) సర్వ ఈషణములనుండి విముక్తుడౌతాడో.
అప్పుడు అతడు సర్వ సంసార తంతువులను (బంధములను) త్రెంచివేసినవాడై ప్రకాశిస్తున్నాడు.
బంధ రహితుడగుచున్నాడు.
ఆతనిని బంధించగలిగినది ఈ జగత్తులో ఏదీ ఉండజాలదు.

ఇతి క్షురికోపనిషత్
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।।కృష్ణ యజుర్వేదాంతర్గత

32     క్షురికోపనిషత్

(క్షురిక = కత్తి)

అధ్యయన పుష్పము

‘కైవల్యనాడి’యగు సుషుమ్నయందు ప్రకాశమానుడై ఉన్నవాడు, జీవునికి స్వకీయ సాక్షి స్వరూపమగు పరభూమిక యందు నిత్యనివాసి, ఈ ‘క్షురికోపనిషత్’చే విశదీకరించి సూచించబడుచున్న యోగాభ్యాసమునకు పరమప్రయోజనము అగు ‘ఆత్మానందతత్త్వము’ను భాసింపజేయు ఆత్మారాముడగు శ్రీరామచంద్రమూర్తి స్వామిని ఆశ్రయించుచున్నాము.

వేదతత్త్వార్థసారమగు ఈ క్షురికోపనిషత్ హృదయమును ఒకప్పుడు సర్వాంతర్యామి, సర్వతత్త్వ స్వరూపుడు అగు పరమేశ్వరునిచే సృష్టికర్తయగు బ్రహ్మదేవునికి బోధించటం జరిగింది. అదియే ఇప్పుడు యోగాభ్యాస విధి విధాన పూర్వకంగా మనము చెప్పుకుంటున్నాము.

┄ ┄ ┄

ఒక సందర్భంలో బ్రహ్మదేవుల వారు శివ భగవానుని సమీపించి ‘‘ఈ జీవుడు సమస్త దుఃఖముల నుండి ఉద్ధారణ పొందు మార్గము’’ గురించి బోధించటానికై అభ్యర్థించారు.

శివ భగవానుడు : ‘ఓం’ (అని మంగళాశాసనము చేయుచూ)…:

ఓ సృష్టి కర్తా! బ్రహ్మభగవాన్! స్వయంభువా! వినండి. ఏదైతే ‘ధారణాయోగసిద్ధి’ అయి ఉన్నదో, అట్టి (పదునైన మంగలి కత్తి వలె)- సంసారబంధములను త్రెంచు యోగాభ్యాసరూప ‘చురకత్తి’ (మరియు) యోగతత్త్వముల గురించి ఇప్పుడు మనము చెప్పుకొంటున్నాము. వినండి. అట్టి యోగాభ్యాస ఫలమగు యోగసిద్ధి యొక్క ప్రాప్తిచే ఆ యోగయుక్తుడు ఇక పునర్జన్మ రహితుడై ప్రకాశించగలడు.

┄ ┄ ┄

వేదమ్ : ‘‘తెలియబడునది’’ - అని శబ్దార్థము. తెలియబడునదంతా కూడా తెలుసుకొనువానికి అభిన్నము.
ఇది తెలుసుకొనుచున్నవాడు వేదాంతుడు. తెలియబడు దానికి ఆవల ‘తెలుసుకొనుచూ’ ఉన్నవాడు. ‘అఖండాత్మ’కు అభిన్నమగువాడు. ఇదియే చతుర్వేద అంతరార్థ సారము.

తత్త్వార్థ సారము : ‘తత్ త్వమేవ’। ‘‘నీవు తత్ ఆత్మ స్వరూపుడవే’’ అనునది మహావాక్యము. ఎదురుగా కనబడు ‘నీవు’ను పరమాత్మకు అనన్యము - అను దృష్టియొక్క అభ్యాసముచే ‘సో2హమ్’ సిద్ధించగలదు.

వేద-తత్త్వార్థ జ్ఞానముచే ఈ జీవుడు పునః శివత్వము సంతరించుకోగలడు. అయితే, యోగాభ్యాసము లేనిదే జ్ఞానము-అనునిత్యము, స్వానుభవము, సందేహరహితము (నిస్సందేహరూపము) అవదు. అందుచేత, ముముక్షువు బుద్ధిని నిర్మలము, సునిశితము చేయటానికై జ్ఞానముతో బాటుగా యోగాభ్యాసమునకై ఉపక్రమించాలి. ఆ రెండూ ఒకే సమయములో అభ్యసించాలి. అవి రెండూ ‘మోక్ష’ మార్గములో ప్రయాణించటానికి ఉపకరించు వాహనమునకు రెండు బండి చక్రములవంటివి.

యోగాభ్యాసమునకు సంసిద్ధుడగుచున్న యోగాభ్యాసి మొట్టమొదట నిశ్శబ్ద దేశం ఆస్థాయ। లోక సంబంధమైన వ్యవహారములు, విశేషములు, సంగతులు, జనులతో పరస్పర ‘సానుకూల్య ప్రాతికూల్యములైన సంబంధ అనుబంధ బాంధవ్యములు - ఇవన్నీ దరిచేరనట్టి ‘నిశ్శబ్ద ఏకాంతప్రదేశము’ను ఎన్నుకోవాలి.

తత్ర ఆసనం అవస్థితః। తనకు ఇష్టముగా ఉండే చక్కటి చోటును ఎన్నుకోవాలి. పద్మాసనము ధారణ చేయునుగాక. (లేక) తన శరీరమునకు (నొప్పి అనిపించకుండా) సానుకూల్యముగాను, నిశ్చలంగా ఎక్కువసేపు ఉండగల ఆసనం - ఏదైనా సరే, సుఖాసనం ఎన్నుకొని అవధరించాలి.

ప్రత్యాహారము : హే బ్రహ్మ భగవాన్! ఈ జీవుడు ఈ స్వస్వరూపజ్ఞానార్ధి అయి (లేక) మోక్షార్థియై అయి అఖండాత్మత్వమును సిద్ధించుకోవటానికై ఇంద్రియములను ముముక్షు మార్గంలో నియమించాలి.

ముముక్షువు (లేక) యోగాభ్యాసిని - (ఆత్మతత్త్వసిద్ధియొక్క సాధన కొరకై సుఖాసీనుడై కళ్లు మూసుకోగానే) - ప్రారంభంలో అనేక జన్మల అభిరుచి - అభ్యాసముల సంస్కార సంబంధమైన (కారణదేహసంబంధమైన) భావావేశములు చుట్టుముట్టటం ప్రారంభిస్తాయి. ఆత్మజ్ఞాన సమాచారము ఎంతగా సంపాదించి ఉన్నప్పటికీ, ఈ మనస్సుకు సంబంధించిన ఇంతకు ముందటి విషయముల అలవాటు చేత బలవత్తరంగా రూపుదిద్దుకున్న పుణ్య పాపసంబంధమైన సంస్కారములు ఆగక, పేట్రేగసాగుతాయి. వాటిని ఎదుర్కొని ఈ జీవుడు జయించాలి. ద్వంద్వాతీతమగు ‘‘ఆత్మాహమ్’’ భావనను సంతరించుకోవాలి.

స్వయంభువు (బ్రహ్మదేవుడు) : స్వామీ! ఈశ్వరా! అవును. నా సృష్టిలోని నా బిడ్డలగు ఈ జీవులు ఆయా ఉపాధి పరంపరలలో ఆర్జించుకొన్న సంస్కారములచేతనే పక్షి - మృగ - మానవ - దేవత - తిర్యక్…ఆది అనేక దేహపరంపరల పరిధులను అతిక్రమించలేకపోతున్నారు. దయతో ఉపాయములు, అభ్యాసములు, నియమములు, యోగాభ్యాసవిధానము - ఇవన్నీ విశదీకరించండి.

విషయముల నుండి ఉపసంహారము

పరమేశ్వరుడు : కూర్మో అంగానీవ, సంహృత్య, తాబేలు ఆహారము కోసము బయల్వెడలి నడచి వెళ్ళుచూ ఉండగా, ఏదైనా ప్రమాద సంకేతము పొడచూపగానే ఏమి చేస్తుంది? తన శరీర భాగములను వెనుకకు మరల్చి చిప్ప (డిప్ప) భాగమును మాత్రమే బయటకు కలిగి ఉండి, కదలక ఉండి పోతుంది. అప్పుడు ఒక ఏనుగు వచ్చి త్రొక్కినా తన చిప్ప (తాబేటి వీపుపైగల పెంకు)లో దాగిన తాబేలుకు ఏమి హాని ఉండదు. మరల ప్రమాద సంకేతము తొలగగానే ఆ తాబేలు ఆహారము కొరకై అంగములను బయటకు చాచి కదలసాగుతుంది.

అట్లాగే :-
🌺 సంహృత్య మనో హృది నిరుధ్యచ। ఇంద్రియ విషయపరంపరలపై వ్రాలుచున్న మనస్సును వెనుకకు మరల్చటము.
🌺 వెనుకకు మరలిన మనస్సును (భక్తుడు గర్భగుడిలో ప్రవేశించి దైవముపై బుద్ధి పెట్టి ఉపాసన చేయు రీతిగా) ‘హృదయము’లో ప్రవేశింపజేసి, హృదయములోనే వేంచేసియున్న సర్వాంతర్యామియగు పరమాత్మను దర్శించటానికి ఉపక్రమించాలి.
🌺 అందుకుగాను, నిర్మలము, సునిశితము, విస్థారముగా బుద్ధిని సంస్కరించుకోవాలి. సత్యదృష్టిచే పరిపూర్ణమగునట్లు తనను తాను సంసిద్ధము చేయాలి.

యోగాభ్యాసము

పూరకము : తాబేలు తన అవయవములను లోనికి తీసుకొనేవిధంగా యోగాభ్యాసి గాలిని ముక్కుపుటముల ద్వారా (12 మాత్రల కాలము) మెల్లమెల్లగా లోనికి తెచ్చుకొను యోగాభ్యాసము.

మాత్ర : చిటిక కాలము. సూది మొనను వస్త్రములో గ్రుచ్చి తీసివేయునంతకాలము. (‘సెకను’కాలమని భావించవచ్చు).
పూరక ప్రారంభ క్షణములనుండి శరీరములోగల నవ ద్వారములను (‘2’ కళ్లు, ‘2 ’ చెవులు, ‘2’ ముక్కు పుటములు, నోరు, శిశ్నము, గుదములను) సంకల్ప - ప్రాణ యోగము సహాయంతో వాయు ప్రసరణమును భావాత్మికంగా నిరోధించి ఉంచాలి.

కుంభకము : ముక్కు ద్వారా లోనికి పీల్చిన వాయువును (36 మాత్రల కాలము) ధారణ చేయాలి. అట్టి సమయంలో ముఖమును, మొల (కటి ప్రదేశము)ను, గ్రీవమును (మెడను) నిఠారుగాను, హృదయమును ఉన్నతము (ఎత్తు)గాను ధారణ చేయాలి.

రేచకము : పూరకము ద్వారా స్వీకరించబడిన వాయువును కుంభక ధారణ చేసిన తరువాత ఇక నెమ్మదిగా (24 మాత్రల కాలము) వదలాలి. అదియే ‘రేచకము’.

ముక్కులో స్వతంత్రముగా ఉచ్ఛ్వాస నిశ్వాసముల రూపంగా సంచారము చేయుచున్న ప్రాణవాయువులను

(1) బాహ్యమునకు రేచకము (12 మాత్రలు)
(2) పూరకము (12 మాత్రలు)
(3) కుంభకము (36 మాత్రలు)
(4) పునఃరేచకము (24 మాత్రలు)

ఇది ప్రాణాయామ అభ్యాస విధానము. అట్టి ‘ప్రాణాయామాభ్యాసము’చే ప్రాణశక్తిని స్వావలంబనము (Self control) చేసుకోవాలి. ఉచ్ఛ్వాసమును క్రమవిధానంగా నెమ్మదిగా ఉచ్ఛ్వసించాలి.

దృఢముగా స్థిరమైన ఆసనముతో దేహమును ధారణ చేసి, ప్రాణాయామ విధిగా దేహమును ‘స్వస్వరూపాత్మ’తో పూరించి ఉంచు అభ్యాసమునకు ఉపక్రమించాలి.

ఇడా పూరకము

(1) ముందుగా రెండు ముక్కు పుటములతో గాలిని బయటకు వదలుచూ బాహ్య రేచకం నిర్వర్తించి,
(2) కుడి బొటనవ్రేలుతో కుడివైపు ముక్కుపుటమును (రంధ్రమును) సున్నితంగా మూసి ఉంచాలి.
(3) ఎడమవైపు ముక్కు పుటతో 12 మాత్రల కాలము ఇడనాడిలోనికి గాలిని పీల్చాలి.
(4) రెండు భుజములను, మెడను,ముఖమును నిఠారుగా ధరించి, గుండెలో వాయువుతో నిలుపుతూ 36 మాత్రల కాలము వాయువును కుంభకము చేయాలి.
(5) నవ ద్వారములు కుంభక సమయంలో బుద్ధితో స్థిరముగా, మూసి ఉంచాలి.
(6) అటు తరువాత కుడి బొటనవ్రేలును కుడి ముక్కు పుటమునుండి నెమ్మదిగా తొలగిస్తూ వాయువును రేచకము చేయాలి.

ఆ తరువాత

పింగళీ పూరకము

(1) ముందుగా (పైన చెప్పినట్లు) బాహ్య రేచకము, (Leaving the Air out) రెండు ముక్కు పుటముల ద్వారా నిర్వర్తించాలి.
(2) అప్పుడు ఎడమ ముక్కు పుటను మూసి ఉంచాలి.
(3) కుడి ముక్కు పుటతో గాలిని పీల్చి పింగళ నాడియందు వాయువును పూరకము చేసి (నింపి) ఉంచాలి.
(4) కుంభకమును యథావిధిగా నిర్వర్తించి వాయువును నిలిపి ఉంచాలి.
(5) నవరంధ్రములను (నవద్వారములను) ధారణ రూపంగా బిగించి ఉంచాలి.
(6) ఎడమ ముక్కు పుటమును నెమ్మదిగా తెరచుచు గాలిని బయటకు వదలాలి. (కాలనియమము-పైవిధంగానే).

ఇవి ప్రాణాయామము యొక్క 12 దశలుగా చెప్పబడుచున్నాయి.

దేహముయొక్క వివిధ ప్రదేశములలో వాయువును పూరించి, ప్రాణాయామ కుంభకమును నిర్వర్తించటము పై విధంగా ప్రాణాయామమును నిర్వర్తించుచూ దేహములోని ఆయా వివిధ ప్రదేశములలో ‘దృష్టి - మనో - ప్రాణములను’ నిలుపుతూ, సహజస్వస్వరూపముతో నింపుచూ కుంభకమును నిర్వర్తించాలి.

ఉభయ ముక్కు రంధ్రముల ద్వారా చేయు వేరువేరు పూరకములతో దేహములోని ఆయా ప్రదేశములతో కుంభకము నిర్వర్తించాలి. అదే సమయం దృశ్య విషయ త్యాగరూపమగు ప్రత్యాహారం చేయాలి. (3 + 3 సార్లు నిర్వర్తించాలి). (భ్రూమధ్యలో ధ్యాస నిలపటము - అందుకు ఉపాయము).

ఒకస్థానము తరువాత మరొకచోట ధ్యాసను ధారణ చేయవలసిన స్థానములు.
(1) పాద - అంగుష్ఠములు → రెండు కాళ్ల బొటనవ్రేళ్ల ప్రదేశములు).
(2) గుల్ఫే - ద్వే → రెండు చీలమండల ప్రదేశములు.
(3) జంఘే ద్వే → రెండు కాళ్ల పిక్కల ప్రదేశములు.
(4) ద్వే జానునీ → రెండు మోకాళ్ల ప్రదేశములు.
(5) ఊరూ ద్వే → రెండు తొడల ప్రదేశములు.
(6) గుదే → గుద ప్రదేశము (మూలాధార ఆకాశము).
(7) శిశ్నే → శిశ్న ప్రదేశము (మూత్రవిసర్జకావయవము).
(8) పాయువు → విసర్జనావయవము (గుదమునకు కించిత్ ఊర్ధ్వ ప్రదేశము. స్వాధిష్ఠాన ప్రదేశము).

కుంభక సమయంలో నిశ్చంత కొరకై, మనోనిశ్చలము కొరకై గురువునుగాని, ఇష్ట దైవమునుగాని, ఓంకారమునుగాని ధ్యానం చేస్తూ ఉండవచ్చును. ఆయా ప్రదేశములలో సాకారమును (గురు పాదపద్మములు, ఇష్ట దైవము మొదలైన వాటిలో ఏదో ఒకటి) ధ్యానించటముచే ప్రాణాయామ ప్రక్రియ సుఖవంతము కాగలదు.

పై ప్రదేశములలో ప్రాణాయామ ధారణ, కుంభకములతో మనస్సు - ప్రాణ - దృష్టులను ఏకంగా చేసి నిలుపుచూ ఉండాలి. పాయువునుచుట్టి అక్కడి నుండి నాభిప్రదేశము (మణిపూరకములో) బుద్ధిని ఒక సమయ నియమంగా (Duly following certain timing) కుంభకం చేయాలి. ఇప్పటివరకు చెప్పిన (1) పాదబొటనవ్రేళ్ళు, (2) చీలమండలములు, (3) కాళ్ళ పిక్కలు, (4) మోకాళ్ళు, (5) తొడలు, (6) గుదము, (7) శిశ్నము, (8) పాయువు ప్రదేశములలో ఇడ - పింగళ ప్రాణాయామములతో (2 రేచకములు + 2 కుంభకములు + ‘2’ పూరకములతో) ప్రారంభంలో ఒకసారి, కొన్ని రోజుల అభ్యాసము తరువాత రెండుసార్లుగాని, మూడుసార్లుగాని నిర్వర్తించెదరుగాక। (కుంభక సమయంలో) నాభి ప్రదేశంలో బుద్ధితో ప్రాణ - దృష్టి - మనస్సు (ధ్యాస)లను నిలిపెదరు గాక।

నాభి ప్రదేశ ఆశ్రయము (లేక) మణిపూరక ఆకాశ ఆశ్రయము

పాయోః ఆయతనం తత్ర నాభిదేశే సమాశ్రయేత్। ఇప్పుడిక మణిపూరక ప్రదేశములో ధ్యాసను (బుద్ధిని) నిలిపి, దృష్టి - ప్రాణ - మనస్సులను నాభి ప్రదేశములో నిలుపుతూ ద్విపద ప్రాణాయామము (ఒకసారి ఇడ లోనికి, తరువాత పింగళలోనికి గాలి పీల్చి) చేయాలి. మణిపూరక స్థానమును జయించే వరకు ప్రాణాయామాభ్యాసమును యోగులు నిర్వర్తించుచున్నారు.

జయించటము అనగా? (1) స్వాభావికంగా, అప్రయత్నంగా ఆ ప్రదేశములో దృష్టి మనో ప్రాణములను నిలిపి, ప్రత్యాహారపూర్వకంగా పరమాత్మ గురించిన మననము చేయగలగటం. (2) స్వభావకుంభకం సిద్ధించటము. (రేచక-పూరకముల అవసరము లేకుండానే ‘ధ్యాస’ను నిశ్చలము చేయుటద్వారా ఆయాచోట్ల ప్రాణమును నిశ్చలము చేయటము).

నాడులు

ఈ మణిపూరక ప్రదేశంలో (నాభి ప్రదేశంలో)గల ‘నాడీకందము’ నందు ఇడ, పింగళ మొదలైన నాడులతో కూడుకొని ‘సుషుమ్న’ నాడి ఉన్నది. ఈ సుషుమ్న శిరస్సుయొక్క ఉపరితలంలోగల బ్రహ్మరంధ్రము వరకు విస్తరించి ఉండుటచేత ‘బ్రహ్మనాడి’ అని అంటారు.

ఇంకా ఈ నాభి ప్రదేశంలో ఎరుపు, పసుపురంగు, నలుపు, రాగిరంగు, నీలము, తెలుపు విశిష్టతలతో కూడిన సూక్ష్మ నాడులు అనేకం ఉన్నాయి. ఈ నాభి కందము నుండి 72,000 నాడులు, ఉపనాడులు బయల్వెడలి శరీరముయొక్క మూలమూలలా వ్యాపించినవై ఉంటున్నాయి. వాటినన్నిటినీ ఒక సాలెపురుగు తన దారములను చూచుకొను విధంగా భావన చేస్తూ, అతి ముఖ్యమైన ‘సుషుమ్ననాడీ మార్గము’లో మనో ప్రాణ దృష్టులను యోగులు నిలుపుచున్నారు.

హృదయకమల స్థాన ప్రవేశము

క్రమంగా నాభి ప్రదేశము తరువాత హృదయ కమలంలో దృష్టి-ధ్యాస-ప్రాణశక్తులను నిలుపుతూ ప్రాణాయామాభ్యాసము నిర్వర్తించబడుగాక।

ఈ హృదయ కమలము వికసించిన ఎర్ర కలువ పుష్పము వలే ప్రకాశము కలిగినదై ఉంటోంది. సర్వనాడులను చైతన్యపరచు ముఖ్యమైన ప్రదేశము - అని ‘హృదయము’నకు శబ్దార్ధము. తతో రక్తోత్పలా భాసగ్ం హృదయ ఆయతనం మహత్।

కంఠస్థాన (విశుద్ధ చక్రాకాశ) ప్రవేశము

తత్ భిత్వా కంఠం ఆయాతి, తాం నాడీం పూరయేత్ ఇతి। హృదయస్థానములో ధ్యాసను నిలుపుచూ కొంత కాలము ప్రాణయోగాభ్యాసమును అభ్యసించిన తరువాత, ఆ స్థానమును జయించి క్రమంగా విశుద్ధ చక్రస్థానమగు కంఠ ప్రదేశమునకు దృష్టి - మనో - ప్రాణధ్యాసలను ప్రవేశింపజేసి ప్రాణాయామము కొనసాగించెదరు గాక!

కాలి బొటనవ్రేలు నుండి విశుద్ధ చక్రస్ధానము వరకు, దైనందికంగా మనో - ప్రాణములను, దృష్టిని నిలుపుచూ విశుద్ధ చక్ర ప్రదేశమునందు నిలుపుచున్నారు. విశుద్ధములో స్వాభావిక కుంభకము సిద్ధించే వరకు అభ్యాసమును కొనసాగించుచున్నారు. పూరక-కుంభక-రేచక పూర్వకంగా, ఇడా-పింగళాంతస్థంగా కొనసాగించాలి.

ఆజ్ఞా చక్రస్థాన త్రిపుటీ పూరణము

ఆ తరువాత విశుద్ధ స్థానమును జయించి, దృష్టిని ఆ రెండు కనుబొమ్మల మధ్య లోతు ప్రదేశమునగల ఆజ్ఞాచక్ర ప్రదేశమునకు జేర్చి, ప్రాణాయామము నిర్వర్తిస్తూ ఉండాలి. ఈ ఆజ్ఞాచక్రము ఇంద్రియములను, ఇంద్రియార్థములను, ఇంద్రియ విషయములను దాటి వేసినట్టి (లేక) జయించి వేసినట్టు యోగస్థానము.

త్రిపుటియగు (1) ‘చూచుచున్నట్టివాడు (The perceiver) (2) చూడటము (Perceiving) (3) చూడబడుచున్నది (object) (అట్లాగే వినువాడు,వినటము, వినబడునవి) సంగమము (Associated) పొంది ఏకరూపముగా దర్శించగల యోగస్థానము కాబట్టి ‘త్రిపుటి’ అని కూడా అంటారు.

ఈ విధంగా ప్రాణయోగాభ్యాసము సహాయంతో ఆజ్ఞా చక్ర ప్రదేశమును ‘స్వస్వరూపాత్మ’ యొక్క సహజానందముతో నింపివేసి, ఇంద్రియాతీతమగు జీవాత్మత్వమును మననము చేయుచుండాలి.

బ్రహ్మరంధ్రము వరకు

క్రమంగా ఈ ఆజ్ఞా - చక్రస్థానమును కూడా జయించి, ఆత్మతత్త్వముతో ఆజ్ఞాచక్ర ప్రదేశమునుండి బ్రహ్మరంధ్రము వరకు గల ప్రదేశమును ఆత్మ భావనాపూర్వకంగా నింపివేయాలి. (Let the space between ‘Agna chakra’ and ‘Brahma randram’ be filled up and held with ‘Absolute sense of Self’. (అనగా) ఆజ్ఞాచక్రములో స్వాభావిక కుంభకము సిద్ధించిన తరువాత, ఇక శిరస్సులో ‘కుంభకము’ అభ్యసించాలి.

సహస్రార ప్రవేశము

ఆజ్ఞా చక్ర - బ్రహ్మ రంధ్రముల మధ్యగల ఆకాశమును జయించి (లేక, స్వాభావికకుంభకము సిద్ధించుకటని దాటిపోయి) యోగవేత్త క్రమంగా బ్రహ్మరంధ్రము ద్వారా సహస్రారమున ప్రవేశించుచున్నాడు. ఆజ్ఞాచక్రమునుండి బ్రహ్మరంధ్రమునుండి 12 అంగులముల స్థానము వరకు ఆత్మభావనతో పూరించుచున్నాడు.

ఇంతవరకు ‘దేహములో నేనున్నాను’ అను జీవుని స్థితి నుండి ఆ యోగాభ్యాసి ‘దేహము నాలో ఉన్నది’ అను పరస్థానము నందు దృష్టి, ప్రాణశక్తి, ధ్యాసలను నిలుపుచూ, సహస్రారమునందు తన ఉనికిని స్వభావ సిద్ధముగా గమనించుచున్నాడు. ‘జగత్తులలో నేను’ లేక ‘లోకములలో నేను’ అను స్థితి నుండి ‘నాయందు ఈ జగత్తు. నాయందు లోకములు’…అను లోకములకే అంతర్గత స్థానము అగుచున్నాడు. జగత్తులలో నేను (జీవాత్మ) - నాలో జగత్తులు (పరమాత్మ) - అను ఉభయముల అఖండత్వము, ఆ రెండిటికీ వేరైన కేవలత్వము… ఈ మూడిటి స్వాభావిక కుంభకము అభ్యసించుచున్నాడు.

ఇది ‘స్వప్నములో నేను’ను అధిగమించి ‘స్వప్నము నాయందు కదా!’ అను స్వయమాత్మా సమవగాహనా స్థానము.

పాదస్య ఉపరియత్ మర్మ తత్ రూపమ్, తత్ రూపం నామ చింతయేత్।
‘ఈ దృశ్యము, దేహము, విశ్వము, విరాట్ అనబడే ‘4’ పాదములను దాటి వేయగా, ఆవలగల తత్ రూప - తత్ పరమాత్మ యొక్క ‘‘తదేక చింతన’’ చేయాలి.

ఈ జాగ్రత్ - స్వప్న - సుషుప్తి - తురీయ చతుష్పాదములకు ఆవల కేవలమై, వాటికి ఆధారమై, ఆ నాలిగిటిని తనయందు ప్రశాంతంగా, లీలావినోదంగా కలిగియున్నదైయున్న అఖండ అప్రమేయ కేవల చైతన్యాత్మను చింతనచేస్తూ ఉండు గాక!

అట్టి ‘సర్వము’ అయిన పరమాత్మకు తనను అభిన్నంగా భావన చేస్తూ ఉండాలి. ‘సో2హమ్’ భావనయందు సంయోగ యోగమును ఆశ్రయించాలి.

మనోధారణేన తీక్షేణాన యోగమ్ ఆశ్రిత్య నిత్యశః - తీక్షణమైన మనోధారణచే నిత్యుడు, కేవలుడు, సర్వుడు అగు ‘పరబ్రహ్మమేవాహమ్’ భావనలో ప్రవేశించాలి. ‘ఈ అనేకముగా కనిపిస్తూ ఏకమే అయి ఉన్న పూదండలోని దారము వంటి పరమాత్మ స్వరూపుడనే నేను కదా!’ అనే ఆత్మ తృప్తిని యోగి సిద్ధించుకొనును గాక!

‘ఈ సర్వము నేనే అయి, ఈ సర్వమునకు సాక్షినై, ఈ సర్వమునకు పరమై సర్వదా సర్వత్రా వెలయుచున్నాను’. అను మనోధారణాయోగమును అనునిత్యముగా అభ్యాసము చేయటము యోగాభ్యాసము యొక్క ఉత్తరోత్తర స్థితి.

⌘⌘

ఈ విధంగా (1) పూరక, కుంభక, రేచక - ఇడా - పింగళా రేచక ప్రాణాయామము (2) కాలి బొటనవ్రేలు నుండి శివరస్థానమగు సహస్రారము వరకు వివిధ ప్రదేశములలో ప్రాణయోగధారణచే మనో - ప్రాణ - దృష్టులను ప్రవేశింపజేయటము (4) దృశ్య - దేహి - దేహ - విరాట్ విశ్వములకు ఆవలగల కేవలమగు పరమాత్మ (పరమ్ = ఆవల) పట్ల మనోధారణ యోగము- వీటిని యోగాభ్యాసి యోగాభ్యాసపూర్వకంగా అభ్యసించును గాక!

ఇట్టి ఆత్మ ధ్యానముతో కూడిన యోగాభ్యాసముచే - పర్వతములను నరికివేయు వజ్రాయుధమువలె - సాంసారిక ధ్యాసలన్నీ ఖండించి వేయబడతాయి. అనన్యమగు ధారణ స్వాభావికమౌతుంది.

‘‘ఇంద్ర వజ్రమ్’’ ఇతి ప్రోక్తం మర్మ జంఘాను కృంతనమ్। ఈ యోగాభ్యాసము శరీరములోని మర్మజంఝములను (గ్రంథులను) మొదలంట్లా త్రెంచి వేస్తుంది కాబట్టి ‘ఇంద్ర వజ్రము’ అంటారు.

అట్టి స్వాభావికత్వము కొరకై…(1) ఉరువుల (తొడల) మధ్యగా దృష్టిని నిలిపి, ప్రాణశక్తిని ఆరోపించి, (2) మర్మములందు పరిమితము, సంబంధితము అయి ఉన్న ప్రాణశక్తిని బయల్వెడలదీస్తూ, పైన చెప్పిన ‘చాతుర్‌యోగముల అభ్యాసము’ చే ఊర్ధ్వగమనము చేయించాలి. అప్పుడిక సర్వ సంసార బంధములు తెగిపోగలవు. అన్ని అభిశంకలు తొలగిపోతాయి.

ప్రాణాయామాభ్యాసము చేయటానికి సూచించిన సమయములు

సర్వకాలములు తగిన సమయమే. అయితే అభ్యాసులకు ప్రారంభంలో కాలనియమము ఈ విధంగా సూచించబడుతోంది.

ప్రాతః కాలము బ్రహ్మ ముహూర్తము 4 AM to 6 AM
మధ్యాహ్న కాలము 11 AM to 01 PM
సాయం సంధ్యాకాలము 4 AM to 6 PM
రాత్రి కాలము 8 PM to 10 PM

ప్రాతఃకాలం నుండి రాత్రి కాలము వరకు రోజుకు 4 పర్యాయములు - కాలిబొటనవ్రేలు స్థానము మొదలుకొని - శిరస్సుపైగల సహస్రారము చివరి వరకు ఆయా (పైన చెప్పబడిన) స్థానములలో ప్రాణాయామ కుంభకము అభ్యాసము చేయును గాక।

‘ఇంద్రవ్యజ యోగాభ్యాసము’నందు మనో-దృష్టి-ప్రాణములను నియమించాలి.

‘తత్’ రూపనామ చింతనతో కూడుకొన్న అహమ్ - త్వమ్‌లతో సహా అఖండమైయున్న పరమాత్మను ఆరాధిస్తూ ఉండాలి.

క్రమంగా సమస్త దృశ్యమును ‘తత్ రూప పరమాత్మ స్వరూపము’గా భావనచేయును గాక!

దృష్టిని తత్ భావనతో పవిత్రము చేసుకోవాలి.

ప్రాణశక్తిని వశం చేసుకొని తద్వారా మనస్సును తత్ భావనతో నింపివేయాలి. (అనగా) అనేకము పట్ల వ్యవహరిస్తున్న ‘ఇచ్ఛాశక్తి’ని ‘ఏకము-అఖండము’ అగు ఆత్మకు నివేదనము చేయాలి.

బ్రహ్మరూపిణియగు బ్రహ్మనాడి (లేక) సుషుమ్న (లేక) పరానాడి

కంఠ ప్రదేశములో (విశుద్ధ చక్ర ప్రదేశములో) 101 నాడులు సంచయము కలిగి ప్రవర్తన శీలమై ఉన్నది. వాటన్నిటికి మధ్యగా గల ఒక ముఖ్య నాడి - ‘స్థిరనాడి’ అని ‘సుషుమ్న’ అని, ‘బ్రహ్మనాడి’ అని పిలవబడుచూ ఉన్నది.

ఇది శిరస్సు యొక్క ఉపరితలమునగల ‘సుషిరగము’ అను రంధ్రమువరకు (బ్రహ్మరంధ్రము వరకు) విస్తరించి యుండటంచేత ‘సుషుమ్న’ అంటున్నారు.

ఇది దేహమునుండి బ్రహ్మము వరకు (జీవుని నుండి - ఏకము, అక్షరము అగు పరమాత్మ వరకు) సూక్ష్మరూపంగా సూత్రభూతమై యుండటం చేత ‘పరానాడి’ అని కూడా అంటారు.

పరబ్రహ్మమునందు లీనమై ఉండటంచేత, ‘బ్రహ్మరూపిణి’ అని కూడా చెప్పబడుతోంది.

రజోగుణ - తమోగుణ రహితమై, శుద్ధ సత్త్వగుణ సమన్వితమై, నిర్మల ప్రకాశవంతమైయున్న నాడి కాబట్టి ‘విరజ’ అని కూడా అనబడుతోంది.

ఈ సుషుమ్న నాడికి :-
⬅|     వామ (ఎడమ) వైపుగా ‘ఇడ’ నాడి.
   |➡   దక్షిణ (కుడి) వైపుగా ‘పింగళ’ నాడి.

ఇడ పింగళ నాడుల మధ్యగల సుషుమ్ననాడియందు శ్రేష్ఠమైనట్టి ‘బ్రహ్మస్థానము’ లేక ‘పరంస్థానము’ ఉన్నది.
తయో ర్మధ్యే పరం స్థానగ్ం। యస్తం వేద స వేదవిత్।
అట్టి సుషుమ్నను, అందలి బ్రహ్మీ స్థానమును ఎరిగినవాడు ‘వేదవిత్’ (తెలుసుకొనవలసినది తెలుసుకున్నవాడు) అగుచున్నాడు.

శరీరములో 72000 నాడులు (మరియు) ఉపనాడులు. ఆ నాడులన్నిటిలో ప్రాణశక్తి స్వభావముగా స్థానము కలిగి, ప్రసరించుచున్నదై ఉంటోంది. ప్రతి నాడి - ఉపనాడి యందు తైతిలము (ఒక కరణము, Functional Hand) ఉన్నది. అటువంటి నాడీ గతమైనటువంటి ప్రాణప్రసరణము యోగ నిర్మలసారము (యోగముచే సిద్ధించిన నిర్మలమైన సారస్థితి) అనే కత్తి (Sharp Knife)చే భేదించబడగలదు. నిరోధించబడగలదు.

ఛిద్యతే ధ్యాన యోగేన। సుషుమ్న ఏకా న ఛిద్యతే।
యోగాభ్యాసముచే ‘100’ నాడులు నిరోధించబడ గలవు. కానీ 101వది అగు ఒక్క సుషుమ్నయొక్క ప్రాణ ప్రసరణము మాత్రమే ఏమాత్రము నిరోధించబడదు.

‘యోగనిర్మలసారము’ (The Energy essence of yoga Abhyaasa) అనే కత్తిచే తక్కిన నాడులు క్షురకము (కత్తిరించటం, జయించటము) జరుగగా అగ్ని యొక్క తేజస్సుచే వెలుగొందుచున్న సుషుమ్న అనుభవమునకు రాగలదు.

అట్టి సుషుమ్నయందు దృష్టి - ప్రాణ - చిత్తము (ఇష్టము)లను (లేక) మనస్సులను నియమించి, యోగాభ్యాసము చేయాలి. ఏవిధంగా అయితే ‘‘జాతి పుష్పము (జాజికాయ చెట్టు పుష్పం)-అద్దానియొక్క సువాసన’’ వేరువేరు కానివై ఉంటాయో, ఆ విధంగా ‘సుషుమ్న’ యందు దృష్టి - మనస్సు - ప్రాణములను ఏకం చేసి, బ్రహ్మీస్థానము - బ్రహ్మమును దర్శించాలి. (అనగా) మనో ప్రాణ దృష్టుల ప్రసరణమును (తైతిలమును) ఉపకరణములుగా దర్శిస్తూ బ్రాహ్మీ స్థానమును ఆశ్రయించాలి.

‘సుషుమ్ననాడి’ తప్ప తక్కిన నాడులన్నీ కూడా శుభ - అశుభ భావనలతో కూడిన అనేక రాకపోకలు కలిగి ఉన్నాయి. (ఉదా : దృష్టి, వినికిడి, స్పర్శ, రుచి, వాసనలను ప్రసరింపజేయునాడులన్నీ ఇష్ట - అయిష్టములతో కూడిన ప్రాణశక్తి ప్రసరణలతో కూడినవై ఉంటున్నాయి). అట్టి తన్మాత్రల ఇష్టాఇష్టములన్నీ కూడా ఈ జీవుని పట్ల పునర్జన్మ హేతువులై ప్రవర్తిస్తూ ఉంటున్నాయి. వాటినన్నిటినీ అభావించినవాడై, వాటివాటి భావములను దాటినవాడై, వాటిని లెక్కచేయనివాడై, యోగి సుషుమ్నను ఆశ్రయించటంచేత, అట్టి సుషుమ్ననాడీ అంతర్గత ధ్యాస - దృష్టులు ఆ యోగిపట్ల ‘మోక్షప్రదము’ అగుచున్నాయి.

ఏ యోగి అయితే…..,
★ తపోవిజిత చిత్తస్తుడై - తపోయోగము, ప్రాణయోగాభ్యాసముచే చిత్తము (ఇంద్రియ విషయములపట్ల ఇష్టమునకు సంబంధించిన ఆవేశము)ను జయించినవాడై,
★ శబ్ద స్పర్శ రూప రస గంధాధి విషయములను నిశ్శబ్దము చేసివేస్తూ,
★ ఇంద్రియ ద్వారములను నిగ్రహించుచూ,
★ ప్రత్యాహారముగా ఆత్మభావనయొక్క సాధనములందు నియమించుచూ,
★ ఏకాంత వాసుడై (పరమాత్మను సహజీవులకు అనన్యముగా చూచువాడై) (It is not merely Physical experience. It is way of looking at others, other things and events),
★ నిశ్శబ్దం దేశమ్ ఆశ్రితః - నిశ్శబ్దమైన ప్రదేశమును ఆశ్రయించినవాడై, (సమస్త లౌకిక సంబంధములను దాటివేసినవాడై),
★ నిస్సంగః - సమస్త సంగములను (All-Attachments) హృదయ కుహరమునందు రహితము చేసుకున్నవాడై,
★ సాంగ యోగజ్ఞో - యోగముయొక్క వివిధ అంగములను (Step by step) ఎరిగినవాడై,
★ నిరపేక్షః శనైః శనైః - సర్వ విషయములపట్ల అపేక్షను (Inquisitiveness / deep expectation / strong desire) కొంచెం కొంచెం రహితము చేసుకొన్నవాడై, (నాటకములో నటించువాడికి నాటకములోని విషయములతో ‘సంగము’ - లేని తీరుగా) నిరపేక్షుడై,
★ పాశాగ్ం ఛిత్వా - సర్వ పాశములను (All Bonds) త్రెంచి వేసుకొనినవాడు అగుచున్నాడు.

యథా హగ్ంసో నిర్విశంకం ఖమ్ ఉత్పతేత్ - ఏ విధంగా కుట్టు త్రాళ్లను త్రెంచుకొన్న హంస ఆకాశంలో హాయిగా, శంకా రహితంగా ఎగురుచూ విహారములు చేస్తూ ఉంటుందో…- ఛిన్న పాశః తథా జీవః సంసారం తారతే సదా’ - ఆ విధంగా యోగి కూడా దృశ్య పాశములనుండి విముక్తుడై, సంసారమునుండి తరించినవాడై - ఆత్మాకాశమునందు ‘అహమ్ బ్రహ్మాస్మి’ భావనతో హాయిగా విహరించుచున్నాడు.

ఏ విధంగా అయితే వెలుగుచున్న దీపము క్రమంగా నూనె ఇంకిపోగా చివరికి వత్తిని కూడా కాల్చి మసి చేసి వేస్తోందో, ఆ విధంగా యథా నిర్వాణ కాలేతు దీపో దగ్ధ్వా లయం వ్రజేత్। యోగి యోగము యొక్క అంతిమ స్థితియందు (అంతిమ ఫలప్రాప్తిచే) సర్వకర్మబంధములను మొదలంట్లా భస్మము చేసివేస్తున్నాడు. ‘స్వస్వరూపము, సహజరూపము’ అగు ‘ఆత్మాహమ్’ నందు ‘జీవాత్మాహమ్’ను కరిగించివేయుచున్నాడు.

(నీళ్లలో కరిగిన మంచుగడ్డవలె) నామరూపాత్మకమైనదంతా ఆత్మయందు ఏకము చేసి వేయుచున్నాడు. మాత్రధారణ (పూరకము - 12 మాత్రలు, కుంభకము - 36 మాత్రలు, రేచకము - 24 మాత్రలు)తో కూడిన ప్రాణాయామ (ప్రాణయోగ) అభ్యాసముచే యోగవేత్త ‘వైరాగ్యము’ అను గండశిలపై జ్ఞానఖడ్గమును పదునుబెట్టి, సర్వ సాంసారిక త్రాళ్లను (తంతువులను) త్రెంచివేసి సర్వే సర్వత్రా సర్వదా ‘బంధరహితుడు’ అగుచున్నాడు.

శ్లో।। అమృతత్వం సమాప్నోతి యదా కామాత్ ప్రముచ్యతే,
సర్వ ఈషణామ్ వినిర్ముక్తః ఛిత్వా తంతుం న బధ్యతే।।

ఎవ్వడు ఈ దృశ్యము పట్ల,
✷ ఇది ఇట్లే ఉండాలి. వారు ఇట్లా ఉండకూడదు।
✷ ఇది పొందాలి. అది తొలగాలి।
✷ ఏదో పొందాలి. చేయాలి।
✷ ఇంకేదో తొలగాలి. కావాలి।
✷ ఇప్పుడు కాదు. ఇది కాదు. అప్పుడు అది వస్తుంది.
……ఈఈ రూపములను దాల్చుచున్న సర్వ కామములు (wishes, expectations, desires, passions etc) మొదలంట్లా యోగాగ్నితో దగ్ధం చేసి వేస్తూ, యోగబలముతో తొలగించివేసుకొని ఉంటాడో…
అట్టివాడు -

ఛిత్వా తంతుం న బధ్యతే।
ఛిత్వా తంతుం న బధ్యత। - ఇతి।।

సర్వ బంధములను తెగగ్రొట్టి బంధరహితుడగుచున్నాడు.

ఎవరి దృష్టిలో తనపట్ల సంసార బంధము అంతరమున మొదలంట్లా తొలగినదై ఉంటోందో…‘తదేవ మోక్షమ్’।
‘‘నాకు బంధము అనునది మొదలే లేదు’’ - అనునదే మోక్షము।🙏 ఇతి క్షురిక ఉపనిషత్ సమాప్తా 🙏
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।।