[[@YHRK]] [[@Spiritual]]
Swētāswatara Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 3
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: yhrkworks@gmail.com
శ్లో।। ఓం-సహనావవతు। |
గురు శిష్యులమగు మా ఇరువురిని |
ప్రథమో అధ్యాయః - కిం జ్ఞేయమ్?
ఓం 1. బ్రహ్మవాదినో వదన్తి। కిం కారణమ్ బ్రహ్మ? కుతః స్మజాతా? జీవా (నా)మ కేన? క్వ చ సం ప్రతిష్ఠితా? అధిష్ఠితాః కేన సుఖేతరేషు వర్తామహే- బ్రహ్మ విదో వ్యవస్థామ్? |
కొందరు మహనీయులు ఒకానొకచోట సమావేశమైనారు. కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను పరిశీలించి, శ్రీ శ్వేతాశ్వతర మహర్షి ప్రవచనములు పఠిస్తూ - అధ్యయనము చేయనారంభించిరి. - ఈ ప్రపంచము సృష్టించబడటానికి ఏమి కారణం? ఎవరు కారణము? బ్రహ్మయా? బ్రహ్మమా? బ్రహ్మము అనగానేమి? - ఇదంతా ఎందుకు, ఎవరిచేత కల్పించబడుతోంది? ఇదంతా ఎవరి స్మృతి? ఎవరి అనుభూతి? - ఈ జీవుడు ఎవరు? ఎవరిచేత దేనివలన జన్మిస్తున్నాడు? ఎవరి శక్తిచే చరిస్తున్నాడు? మనమెవరము? - ఎవరి వలన మనమంతా జీవించగలుగుచున్నాము? ఈ జగత్తుకు మును-ముందుగా మనమంతా ఎక్కడ ఉండి సంప్రతిష్ఠులమై ఉన్నాము? ఇప్పుడు ఎక్కడ ఉన్నాము? ప్రళయంలో ఎక్కడ ఉంటాము? అనగా జగత్తు లేనప్పుడు మనమెక్కడ ఉంటున్నాం? జగత్తులు లేకపోతే కూడా మనము ఉంటామా? ఇప్పుడు జీవులకు ఈ సుఖ-దుఃఖాలన్నీ కల్పిస్తున్నది ఎవరు? బ్రహ్మము ఎరిగినవారు బ్రహ్మాండములను అధిగమించినవారు కదా! వారు ఎక్కడ వ్యవస్థితులై ఉంటారు? ఎక్కడ సుఖంగా వర్తిస్తూ ఉంటారు? బ్రహ్మాండమునందా? బ్రహ్మమునందా? మరప్పుడు అజ్ఞానులు ఉండేది ఎక్కడ? ఈ ప్రపంచమంతా ఎట్లా ఏర్పడుతోంది? |
2. కాలః। స్వభావో। నియతిః। య (యా)దృచ్ఛా। భూతాని। యోనిః। పురుష - ఇతి చింత్యమ్। సంయోగ, యేషాత్ న తు ఆత్మభావాత్। ఆత్మా అపి అనీశః సుఖ-దుఃఖ హేతోః।। |
లోకాయతుకులు: ‘స్వభావము’ (Nature) చేతనే అంతా కలుగుతోంది. ఇంతలోనే నశిస్తోంది. ఇదంతా లోకరీతియే। స్వభావోస్తు ప్రవర్తతే। -స్వభావము కారణమా? నియతివాదులు: నియతి (Destiny) అనే ఒకానొక మహత్తర శక్తిచే ఇదందా ఇట్లా నియమించబడుతోంది. నేను - నీవు మొదలైనవన్నీ కూడా, ఆ నియతియొక్క కల్పనయే. (నియతి = Destiny) మీమాంసవాదులు: కర్మఫలంగానే ఈ సమస్తము ఇట్లా ఏర్పడుతోంది. జన్మలు, స్థితులు, గతులు - ఇదంతా స్వకీయ కర్మల ప్రభావమే! కనుక కర్మలు కారణమా? యాదృచ్ఛ వాదులు / నిరీశ్వరవాదులు: అంతా అకారణం. యాదృచ్ఛికంగా ఇదంతా ఇట్లా ఏర్పడి ఉంటోంది. యాదృచ్ఛికంగానే నశిస్తోంది. ఇందులో ఎవ్వరి ప్రమేయము లేదు. కనుక ఇదంతా యాదృచ్ఛికమా? జగత్ నిత్యత్వవాదులు / పంచభూతవాదులు : భూమి-జలము-అగ్ని- వాయువు-ఆకాశముచే ఇదంతా నిర్మించబడి ఇక ఆపై ప్రవర్తిస్తోంది. అవి ఎప్పటికీ జగత్తులను నిర్మిస్తూ, నశింపజేస్తూనే ఉంటాయి. కాబట్టి ఈ జగత్తు ఇట్లాగే శాశ్వతమా? ప్రకృతివాదులు : ఇదంతా ప్రకృతియొక్క యోనియందు (గర్భమునందు) రూపుదిద్దుకుంటోంది. అన్నిటికి ప్రకృతియే కారణము. కాబట్టి కారణము ప్రకృతియేనా? పురుష/దైవీ వాదులు: అచింత్యుడగు ‘పురుషుడు’ (దేవుడు) ఉన్నారు. ఆయన హిరణ్యగర్భుడై జీవులను సృష్టిస్తున్నారు. కనుక పురుషుడు కారణమా? నిరీశ్వరవాదులు: స్త్రీ-పురుషుల శృంగార సంయోగముచే ఈ జీవుడు పుట్టుచున్నాడు. కనుక వారి శృంగారము కారణమా? ఇవన్నీ కావు. ఆత్మయొక్క భావనయే ఇదంతా! సుఖ దుఖ హేతువగు జీవాత్మ కూడా ఆత్మవినోద భావనయే. ఆత్మ కేవలము. నిత్య సత్యము. |
3. తే ధ్యాన యోగాత్ అనుగతా అపశ్యన్ దేవాత్మశక్తిగ్ం స్వగుణైః నిగూఢామ్, యః కారణాని నిఖిలాని తాని కాలాత్మ యుక్తాని అధితిష్ఠతి ఏకః।। |
బ్రహ్మవేత్తలు:
మహనీయులు ధ్యానయోగముచే, ‘‘ఏకము- అఖండము అగు పరమాత్మ యొక్క నిగూఢము-త్రిగుణరూపము అగు దైవీ కల్పిత స్వదివ్య శక్తియందు భ్రమాత్మకంగా కనిపిస్తున్న మాయయే ఇదంతా! కాల స్వరూపుడగు పరమాత్మ స్వకీయ మాయచే జీవాత్మను కల్పించుకుంటున్నారు. స్వీయ కల్పనాశక్తి యగు మాయచే తనయందు తానే లీలా వినోదముగా జగత్తును కూడా భావనచేసికొని జీవాత్మగా ఆస్వాదిస్తున్నారు’’ అని దర్శించి గానం చేయసాగారు. |
4. తమ్ ఏక నేమిం, త్రివృతగ్ం షోడశాంతగ్ం। శతార్థ ఆరం(50), విగ్ంశతి (20) ప్రత్యరాభిః। అష్టకైః (8) షడ్భిః(6), విశ్వరూపైక పాశమ్। త్రిమార్గ భేదమ్ ద్వి నిమిత్తైక మోహమ్।। |
ఆ పరమాత్మను గురించి ఏవిధంగా అధ్యయనులగు తత్త్వవేత్తలు దర్శిస్తూ చెప్పుచున్నారో - అదంతా ఈవిధంగా చెప్పుకోసాగారు. 1. పరమాత్మ సర్వదా ఏకమే అయి ఉన్నారు. 2. ‘కార్య-కారణావస్ధ’ అనే బండి చక్రమునకు ఇరుసు వంటి వారు. (ఇరుసు చక్రమును త్రిప్పుతోంది. కానీ బండి చక్రమే ఇరుసును త్రిప్పుచున్నట్లు అగుపిస్తుంది). 3. త్రిగుణాత్మకమైన ప్రకృతిచే ఆవరించబడినట్లు కనిపించుచుకూడా, వాస్తవానికి పరమాత్మ త్రిగుణాతీతులు. 4. 16 విశేషములు, 50 ఆకులు (అరములు) 20 ప్రత్యరములు గల బండి చక్రము కలవానిగా స్వయం ప్రదర్శితులు. 5. ‘6’, ‘8’ తత్త్వ విశేషాలు గల ‘విశ్వరూపము’ అనే ప్రదర్శనము పాశముగా కలవారు. 6. త్రిమార్గములలో (జాగ్రత్-స్వప్న-సుషుప్తులలో) క్రీడగా సంచరించువారు. 7. రెండు (నిమిత్త-ఉపాదాన) కారణములతో కనబడుచున్నవారు. 8. మోహ పరవశునిగా ప్రదర్శనమగుచున్నారు. జీవాత్మగా అయినట్లు భ్రమింపజేస్తున్నారు. అని ఆత్మసాక్షాత్కార-సిద్ధులు దర్శించుచున్నారు. అట్టి విశేషములతో కూడిన ‘ఆత్మ’యే ఈ జీవుని నిజ-వాస్తవ-సహజ-సత్య స్వరూపము. |
5. పంచ స్రోతో అంబుం పంచ యోని - ఉగ్ర వక్త్రాం పంచ ప్రాణ - ఊర్మిం పంచ బుద్ధ్యాది మూలామ్, పంచ ఆవర్తామ్ పంచ దుఃఖౌగ వేగామ్ పంచాశత్ (50) భేదామ్ పంచ పర్వామ్ అధీమః। |
‘పరమాత్మ’ అనే నదిని…, ⌘ పంచేంద్రియములే (కనులు, చెవులు, నోరు, ముక్కు, చర్మము) ప్రవాహముల రూపంగాను, ⌘ యోని (జన్మస్థానము) రూపములగు పంచ మహాభూతములే ఉగ్రతరంగాలుగాను, ⌘ పంచ ప్రాణములే అలలుగాను (ప్రాణ - అపాన - వ్యాన - ఉదాన-సమానములు), ⌘ అంతరంగములోని బుద్ధి (దేహ మనో బుద్ధి చిత్త అహంకారములు) -ఇత్యాది పంచ వస్తువులే ఆదిమూలమైన ఐదు ఆవర్తములుగాను (ఆది-సృష్టి-స్థితి-వృద్ధి-లయ-పునః ఉద్భవ బుద్ధులు కెరటములుగా) ⌘ శబ్దము మొదలైన పంచ దుఃఖ విషయములే (శబ్ద స్పర్శ రూప రస గంధములు) సుడిగుండములుగాను, ⌘ 50 రకములగు (తమోమోహ) భేదములు ప్రదర్శించునది గాను, ⌘ 5 రకముల క్లేశములు కలదిగాను, ధ్యానించుచున్నాము! ఇవన్నీ ఏకము-అఖండము అగు పరమాత్మ అనే నదిలోని అంతర్విశేషాలే! |
6. సర్వా జీవే సర్వ సంస్థే బృహంతే, అస్మిన్ హగ్ం సో అహ్రామ్యతే బ్రహ్మచక్రే పృథక్ ఆత్మానమ్ ప్రేరితారమ్ చ మత్వా జుష్టః తతః, తేన అమృతత్వమేతి।। |
- సర్వజీవులకు, సర్వమునకు సంస్థానము, జీవము కూడా అయినట్టిది…, - బృహత్తరమైనది, - సర్వజీవులకు లయ స్ధానము కూడా అయినట్టిది…, మహత్తరమైనది, - కార్య కారణ చమత్కారము ప్రదర్శించునది, సమస్తమునకు ప్రేరణ రూపము. అగు బ్రహ్మచక్రములో నివసించుచున్న ఈ జీవుడు తనకుతానే అనాత్మరూపములగు దేహ సంబంధమైన సంఘాతములను ప్రేరేపించుకొని, పక్షి-జంతు-మానవ-దేవతాది అనేక ఉపాధులలో సంచారాలు సలుపుచున్నాడు. తనయొక్క అమృత-జీవ-బ్రహ్మైక్య స్వరూపమును ఏమరచినవాడై అనేక దుఃఖములు అనుభవిస్తున్నాడు. |
7. ఉద్గీతమ్ ఏతత్ పరమం తు బ్రహ్మ తస్మిగ్ం త్రయగ్ం స్వప్రతిష్ఠ అక్షరం చ। అత్ర అంతరం వేదవిదో విదిత్వా లీనా బ్రహ్మణి తత్పరా యోని ముక్తాః।। |
ఎప్పుడో- ‘‘నేను దేహపరిమితుడను. బద్ధుడును. జీవాత్మను’’ - అనే నిదుర నుండి మెలకువ పొంది, లేచుచున్నాడు. సామవేద గాన గీత స్వరూపము, పరము, అక్షరము అగు బ్రహ్మమును ఉపాసించటం ప్రారంభిస్తున్నాడు. ‘‘ఆహా"! భోగించువాడు, భోగించబడు దృశ్యము, భోగము… ఈ మూడూ కూడా నా సహజ రూపమగు బ్రహ్మముయొక్క గర్భమునందే ప్రతిష్ఠితమై ఉన్నాయి కదా!’’ అనునది - బ్రహ్మవిద్యా సముపార్జనచే తెలుసు కుంటున్నాడు. అట్టి వేద - వేదాంత వేద్యమును తెలుసుకొని, జన్మ-కర్మల నుండి విముక్తుడై బ్రహ్మమునందు తత్పరుడగుచున్నాడు. |
8. సంయుక్తమ్ ఏతత్ క్షరమ్-అక్షరం చ వ్యక్త అవ్యక్తం భరతే విశ్వమ్ ఈశః, అనీశశ్చ ఆత్మా బధ్యతే భోక్తృ భావాత్ జ్ఞాత్వా దేవమ్ ముచ్యతే సర్వపాశైః।। (జ్ఞాత్వాత్ ఏవమ్ ముచ్యతే సర్వపాశైః।) |
ఈశ్వరుడు - క్షర-అక్షరములను వ్యక్త-అవ్యక్తములను ఒకచోటికి తెచ్చి, ఆ రెండిటిని భరించుచు - ఈ సమిష్ఠి రూప విశ్వ స్వప్నమును అనుభవించుచున్నాడు. ‘‘తాను దర్శించేదంతా - తనకు తానే దృశ్యముగా విస్తరించి ఉండటం’’ -అనే తన యొక్క ఈశ్వరత్వమును ఏమరచిన పరమాత్మ…, స్వకీయ కల్పనా చమత్కారమగు భోక్తృభావన యందు, అను-భావనయందు నిమగ్నమై ఉంటున్నారు. అనీశత్వ భావనచే బద్ధుడగు చున్నాడు. తనయొక్క కారణ కారణ స్వరూపమును, ఈశత్వ భావనను ఎరిగినప్పుడు ఈ జీవుడు సర్వపాశముల నుండి విముక్తుడగుచున్నాడు. |
9. జ్ఞ-అజ్ఞౌ ద్వాః అజా ఈశ-అనీశాః। అజా హి ఏకా భోక్తృ-భోగ్యార్థయుక్తా, అనంతశ్చ ఆత్మా విశ్వరూపో హి అకర్తా త్రయం యదా విందతే బ్రహ్మమ్ ఏతత్।। |
ఈశ్వరుడు …. సర్వజ్ఞుడు. జీవుడో …. అల్పజ్ఞుడు. ఈ ఇద్దరు కూడా భోక్తృ → భోగ్య → యుక్తులే! ఈ జీవుడు - ఈశ్వరుడు కూడా జన్మ వికారములు లేనివారే! ‘‘భోక్త-భోగము-భోగించబడునది’’…. అనునవిగా ఏదైతే ‘తనవి’గా కలిగియుండి ఆ మూడిటిని ఆస్వాదిస్తోందో…, అదియే బ్రహ్మము. అనంతాత్మ - విశ్వరూపము -అకర్త - ఈ మూడు బ్రహ్మముయొక్క విశేషణములు. స్వాభావిక లక్షణములు. |
10. క్షరం, ప్రధానమ్ అమృత అక్షరగ్ం హరః క్షరాత్మా నావీశతే దేవ ఏకః తస్య అభిధ్యానాత్ యోజనా తత్త్వ వాదాత్ భూయశ్చ అంతే విశ్వ మాయా నివృత్తిః।। |
క్షరము - అనగా మార్పు చెందునది. ‘ప్రధానము’, ‘మాయ’ అని కూడా అంటారు. అక్షరము - మార్పు చెందనిది. అమృతము. తదితరమును మార్పు చెందింపజేస్తూ కూడా, తాను మార్పు చెందదు. హరుడు - అవిద్యను హరించువాడు. సర్వమును నియమించువాడు. తత్త్వస్వరూపుడు - పరమాత్మ. క్షర-అక్షరములకు ఆవల ఉన్నట్టి ఆ తత్ స్వరూప పరమాత్మను తత్త్వవేత్తలు ప్రవచిస్తున్నారు. అట్టి పర (ఆవల) బ్రహ్మమును ఎరిగినప్పుడు విశ్వమాయ నివృత్తి అగుచున్నది. |
11. జ్ఞాత్వాత్ ఏవగ్ం (జ్ఞాత్వాదేవగ్ం) సర్వపాశ అపహానిః। క్షీణైః, క్లేశైః జన్మ-మృత్యుః ప్రహాణిః। తస్య అభిధ్యానాత్ తృతీయమ్ దేహ భేదే విశ్వైశ్వర్యమ్ కేవల ఆప్తకామః। |
సర్వ జీవుల సహజ స్వరూపమయి, క్షరాక్షరములకు ఆవల సర్వదా ప్రకాశించుచున్నట్టి - పరమాత్మ స్వరూపమును ఎరిగిన తరువాత…, - సర్వ పాశములు (బంధములు) నశిస్తాయి. - జనన-మరణ రూప క్లేశములన్నీ క్షీణిస్తాయి. అట్టి జీవ-ఈశ్వరులకు ఆవల తృతీయుడై (మూడవవాడై) వెలుగొందు పరమాత్మను ఎవడు ధ్యానిస్తాడో… అట్టివాడు ‘నేను దేహమును’ అనే భౌతిక దేహబంధత్వమును అధిగమించి వేస్తున్నాడు. విశ్వమంతా తన ఐశ్వర్యముగా దర్శిస్తున్నాడు. ఆప్తకాముడగుచున్నాడు. |
12. ఏతత్ జ్ఞేయం నిత్యమేవ ఆత్మ సగ్ంస్థం
న అతః పరమ్ వేదితవ్యగ్ం హి కించిత్। భోక్తా భోగ్యమ్ ప్రేరితారమ్ చ మత్వా సర్వమ్ పోక్తమ్ త్రివిధమ్ బ్రహ్మమ్ ఏతత్।। |
తనయందే అనునిత్యముగా సంస్థితుడై సర్వమును (జీవ-ఈశ్వర చమత్కారములను) ప్రకాశింపజేయుచున్న పరమాత్మయే తెలుసుకొనవలసిన వాడు. ఇక అంతకు మించి వేరుగా తెలుసు కొనవలసినది ఏదీ కించిత్ కూడా లేదు. - భోక్త అయినట్టి ఈ జీవుడు. - భోగ్యవస్తువై, ఈ ఎదురుగా గల ప్రపంచము. - ఆ రెండిటికి ప్రేరకుడగు ఈశ్వరుడు. ఈ మూడు వేరు వేరుగా కనిపిస్తున్నప్పటికీ, బ్రహ్మమే ఈ మూడుగా అజ్ఞానదృష్టికి కనిపిస్తోంది. జ్ఞానముచే ఈ మూడు ‘‘ఏకము-అఖండము అగు బ్రహ్మమే’’ - అని తెలియవస్తోంది. |
13. వహ్నేః యథా యోనిగతస్య మూర్తిః న దృశ్యతే, నైవ చ లింగనాశః స భూయ ఏవ ఇంధన యోని గృహ్యః తద్వా ఉభయం వై ప్రణవేన దేహే।। |
రెండు కొయ్య చెక్కలను (కట్టెలను) ఒరిపిడి చేస్తే (అరణి) అగ్ని పుడుతోంది. అనగా? అగ్ని కట్టెలలో దాగి ఉన్నది. కట్టెలను కళ్ళతో చూస్తే అందులో అగ్ని ఉన్నట్లుగా గాని, ఆ కట్టెలలో అగ్ని ధర్మాలుగాని అగుపించవు. ఈవిధంగా ఇంధనములలో అగ్ని దాగి ఉన్నట్లు, ఈ దేహమునందు పరమాత్మ తన అనంత చిదానంద- సర్వకారణ, స్వకారణ తత్త్వసమన్వితులై తనయొక్క అనంతశక్తిని ప్రదర్శించక, మౌనముగా ఉన్నారు. అంతరమున దాగి ఉన్న అట్టి దివ్యమగు పరమాత్మను - ‘‘ప్రణవోపాసన’’ అనే జీవ-ఈశ్వరభావ కట్టెల ఒరిపిడిచే ప్రజ్వలింపజేయాలి! (కర్తవ్యమ్ దైవమాహ్నికమ్). |
14. స్వదేహమ్ అరణిం కృత్వా ప్రణవమ్ చ ఉత్తర-అరణిమ్ ధ్యాన నిర్మథన-అభ్యాసాత్ దేవం పశ్యేత్ నిగూఢవత్।। |
అంతరాత్మయై సర్వదా రహస్యంగా హృదయంలో ప్రకాశిస్తున్న ఆ పరమాత్మను దర్శించాలి. ఎట్లా? ❋ ఈ దేహమును (సాధనముగా) క్రింద కొయ్యగాను, ❋ ప్రణవమును పై కొయ్యగాను (ఉత్తర ఆరణిగాను) - చేసి, ❋ ధ్యానము - అనే అభ్యాస రూపమై నిర్మధనము (ఒరిపిడి)తో హృదయములోనే దర్శించాలి! |
15. తిలేషు తైలమ్, దధినీవ సర్పిః, ఆపః స్రోతః, స్వరణీషు చ అగ్నిః ఏవమ్ ఆత్మ ఆత్మని జాయతే అసౌ సత్యేన ఏనం తపసా యో అనుపస్యతి।। |
❋ నువ్వులలో నూనె ఉన్నది. అయితే గానుగ ఆడితేనే లభిస్తుంది. ❋ పెరుగులో నేయి ఉన్నది. చిలికి వెన్న తీసి కాచితేనే పొందబడుతుంది. ❋ ఆకారం కలిగియున్న తరంగాలలో నిరాకారమగు జలమున్నది. వివేకము చేతనే ఇది గమనించగలం! ❋ అరణి (కొయ్య)లో అగ్ని దాగి ఉన్నది. ఒరిపిడి చేతనే అది బహిర్గతమై కాంతిని - వేడిని ప్రసాదించగలదు. (అరణి = యజ్ఞవిధానంలో మధించి నిప్పును పుట్టించే కొయ్య) అట్లాగే 1) సందర్భమాత్ర సత్యమును అధిగమించి స్వాభావికమగు శాశ్వత సత్యమును ఆశ్రయించటం 2) తపన రూపమైన తపస్సు…. ఈ రెండింటి చేతనే హృదయాంతరంగుడగు పరమాత్మను దర్శించి, ఈ సర్వము పరమాత్మ స్వరూపంగా ఈ జీవుడు చూడగలుగుతాడు. |
16. సర్వ వ్యాపినమ్ ఆత్మానమ్ క్షీరే సర్పిరివ అర్పితమ్ ఆత్మవిద్యా తపో మూలం, తత్ బ్రహ్మోపనిషత్ పరమ్।। తత్ బ్రహ్మోపనిషత్ పరమ్ ।।ఇతి।। |
స్వస్వరూపము - సహజరూపము - సర్వసాక్షి అగు ఆత్మ - పాలలో వెన్నవలె జాగ్రత్-స్వప్న-సుషుప్తి దృశ్యములందు అంతటా సమస్తమును వ్యాపించి ఉన్నట్టిది. అటువంటి ఆత్మ గురించిన విద్య - తపస్సుచే తనే (తద్విషయమై తపన రూపమగు తపనపూర్వకమైన, ప్రయత్నము చేతనే) లభిస్తోంది. ఆ పరమగు పరబ్రహ్మమే సర్వదా సామీప్యమును పొందవలసిన శాశ్వత వస్తువు! ఆత్మకు అన్యంగా ఏది పొందితే ఏమి లాభం? ఎంత వరకు లాభం? ఇతి ఉపనిషత్! |
ద్వితీయో2ధ్యాయః (బ్రహ్మవాదుల సంభాషణము)
1. ఓం। యుంజానః ప్రథమమ్ మనః తత్త్వాయ సవితా ధియః అగ్నే - జ్యోతిః నిచాయ్య పృధివ్యా అధ్యాభరత్।। |
మొట్టమొదటగా - ఈ మనస్సును ఉత్తమమైన బుద్ధితో ఇంద్రియ విషయముల నుండి ఉపశమింపజేస్తూ…., సంవిత్ (సత్ ం విత్) స్వరూపుడు, ‘ఓం’కార స్వరూపుడు అగు పరమాత్మయందు…, నియమించాలి. అందుకొరకై అగ్ని - జ్యోతిల ఉపాసనచే భౌతిక తత్త్వమును అధిగమించే నిత్యోపాసనలో నిమగ్నమయి ఉంటున్నాము. |
2. యుక్తేన మనసా వయం దేవస్య సవితుః సవే సువర్గే యాయ శక్త్యా। |
అట్టి సవిత్రు (సత్-విత్-ఋత్) దేవతయగు పరమాత్మయందు మనో లగ్నము చేసే నిమిత్తమై, సత్సంగ పూర్వకంగా సువర్గము (ఆత్మజ్ఞులను) ఆశ్రయించటానికి మేము ప్రయత్నశీలురమగుచున్నామ |
3. యుక్త్వాయ మనసా దేవాన్ సువర్యతో ధియా దివమ్, బృహత్ జ్యోతిః కరిష్యతః సవితా ప్రసువాతి తాన్।। |
ఆ సవిత్రు దేవత వాత్సల్యముతో మనస్సును పరమాత్మయందు ఏకాగ్రము చేసే బుద్ధిని మాకు ప్రసాదించును గాక! అందుకొరకై బృహత్ జ్యోతిని (జ్యోతిర్జ్యోతి-స్వయం జ్యోతిని) దర్శింపజేసి అనుగ్రహించును గాక! |
4. యుంజతే మన, ఉత యుంజతే ధియో విప్రా, విప్రస్య బృహతో విపశ్చితః। విహోత్రాదధే వయునా విదేక ఇన్మహీ దేవస్య సవితుః పరిష్టుతిః।। |
వేద విప్రులు - మహనీయులు, బృహత్ అగు బ్రహ్మమును దర్శించు ఆశయము గల వారై తమయొక్క చిత్తమును బ్రహ్మ దర్శనమునందే నిలుపుచూ ఏకాగ్రం చేస్తున్నారు. ‘సవిత్రు’ అను శబ్దముచే చెప్పబడువాడు, బృహత్ స్వరూపుడు అగు పరమాత్మను విపశ్చితులు (విశేష దార్శనికులు) సందర్శిస్తున్నారు. ‘‘సర్వ వ్యాపకుడు, సర్వే సర్వత్రా పరివేష్టించియున్నవాడు, మహితాత్ముడు అగు పరమాత్మయే ఈ సమస్తము’’ - అని వివేకముచే ఎరుగుచున్నారు. |
5. యుజే వాం (యుంజేవాం) బ్రహ్మపూర్వ్యమ్ నమోభిర్వి శ్లోకాయన్తి పథ్యేవ సూరేః శృణ్వస్తు విశ్వే। అమృతస్య పుత్రా! ఆయే ధామాని దివ్యాని తస్థుః।। |
మేము దేవతలకు - సృష్టికర్తకు కూడా మునుముందే ఉన్నట్టి పరమాత్మను స్తుతిస్తూ నమస్కరిస్తున్నాము. తత్త్వవేత్తలగు, విజ్ఞులగు సూరులు- వైతాళికులై, మమ్ములను నిదురలేపుచున్నారు. ఓ అమృతస్వరూపులారా! ఆ ‘‘దివ్యమగు ఆత్మ’’ అను దివ్య ధామమును చేరుటకై ఆత్మతత్త్వ గానమును వినిపిస్తున్నాము. వినండి. మనస్సును నిలపండి. |
6. అగ్నిః యత్రా అభిమథ్యతే, వాయుః యత్రా అభియుంజతే, సోమో యత్రా అతిరిచ్యతే, తత్ర సంజాయతే మనః।। |
ఓ మనో బుద్ధులారా! మీయొక్క ఉత్పత్తి స్థానము ఏది? ఆత్మయే। అగ్ని ఏ తేజో తత్త్వమునందు వెలుగొందుచున్నదో, వాయువు ఎద్దానిచే ప్రేరితమై చలిస్తోందో, ఏది చంద్ర లోకమును అధిగమించినదై ఉన్నదో… అట్టి ఆత్మనుండి ఆత్మకు భిన్నంగా ఉన్నట్లుగా - మనస్సు జనిస్తోంది. (వాస్తవానికి మనస్సు ఆత్మకు అభిన్నమే అయి ఉన్నది). |
7. సవిత్రా పసవేన జుషే తత్ బ్రహ్మ పూర్వ్యమ్ తత్ర యోనిం కృణవసే సహితే పూర్వమ్ అక్షివత్।। |
కారణకారణుడు, సవిత్రు (సత్-విత్) రూపుడు, సృష్టి-సృష్టికర్తల కంటే కూడా పురాతనుడు అగు దృక్‌స్వరూప పరబ్రహ్మమును సేవించు చున్నాము. ఈ జన్మ-కర్మల రూపమగు సంసారము నుండి విముక్తిని పొందటానికి - ‘‘సృష్టికే యోని (జన్మ స్ధానము) అగు పరబ్రహ్మమును ధ్యానించటం, ఉపాసించటం, ఎరగటము’’ - తప్పితే వేరు మార్గమే లేదు. |
8. త్రిః ఉన్నతగ్ం (త్రిరున్నతగ్ం) స్ధాప్య సమం శరీరమ్, హృది ఇంద్రియాణి మనసా సంనివేశ్య। బ్రహ్మోడుపేన ప్రతరేత విద్వాన్ స్రోతాంసి సర్వాణి భయావహాని।। |
అట్టి పరబ్రహ్మమును ధ్యానించటానికి మార్గము? యోగధారణ! అది ఎట్లా? శిరస్సు-కంఠము-శరీరము… ఈ మూడిటినీ కూడా సమానముగాను, నిలువుగాను, నిశ్చలముగాను నిలపాలి. - ఇంద్రియములను, ఇంద్రియ విషయముల మననరూపమగు మనస్సును ‘హృదయము’నందు స్థాపించాలి. (నా హృదయమునందే అవన్నీ ఉన్నాయి కదా… అనే భావనను ఆశ్రయించటమే హృదయమునందు స్ధాపించటం). బ్రహ్మముగా ఈ సర్వమును భావించాలి. సంసార సముద్రములో గల భయావహమగు జనన-మరణ తరంగాలను దాటివేయాలి. |
9. ప్రాణాన్ ప్రపీడ్యే హ స యుక్త చేష్టః క్షీణే ప్రాణే నాసికయా ఉచ్ఛ్వసీత, దుష్టాశ్వయుక్తమ్ ఇవ వాహమేనమ్ విద్వాన్ మనో ధారయేత్ అప్రమత్తః।। |
ఒక రథికుడు రథం అధిరోహించాడు. రథసారధి రథమును నడుపుతూ ఉన్నాడు. రథం అడ్డ-దిడ్డంగా, బహు ప్రమాదయుక్తంగా పోతోంది. ‘‘ఏమిటిరా ఇది?’’ అని తెలివితో అంతా రథికుడు పరిశీలించాడు. ‘‘ఆహా"! ఈ గుర్రములు పెంకివి. చెడ్డవి. చెప్పినమాట వినక ఇష్టం వచ్చినట్లు రథమును లాగుచున్నాయి’’ అని గమనించాడు. ఇక, గట్టి కళ్లెములతో గుర్రములను అదుపు పెట్టి, శ్రద్ధ వివేకములతో వశం చేసుకొని రథం నడిపి గమ్యం చేర్చనారంభించాడు. ఆ రీతిగా…. యుక్తాహార - విహార - ప్రాణ యోగాభ్యాసములతో ఈ ప్రాణములను నిరోధించి, ప్రాణాయామముతో ప్రాణ కదలికలను వశం చేసుకోవాలి. అట్టి ప్రాణయామ రూప అభ్యాసముతో అప్రమత్తతగా మనస్సును వశం చేసుకొని ‘ఆత్మభావన’ యందు ధారణ చేయాలి. నిలపాలి. అనగా ‘‘సమస్తము ఆత్మ ప్రదర్శనమే’’ అనునది స్వానుభవమే సిద్ధించుకోవాలి. (‘మనస్సు’ అనే దుష్ట- అశ్వమును శ్వేతాశ్వతరం చేయాలి). |
10. సమే శుచౌ శర్కరా వహ్ని వాలుకా వివర్జితే శబ్ద జలాశ్రయాదిభిః మనో-అనుకూలేన తు చక్షు పీడనే గుహా నివాత ఆశ్రయణే ప్రయోజయేత్।। |
ప్రాణాయామము: ఆత్మతత్త్వ ధ్యానము కొరకై యోగాభ్యాసము కొనసాగించటానికి ప్రదేశముయొక్క సానుకూల్యత సహకారి కారణము. యోగము అభ్యసించే ప్రదేశము. ♠︎ ఎత్తుపల్లాలు లేనిదై, ♠︎ పరిశుభ్రంగా ఉన్నదై, ♠︎ గులకరాళ్ళు - అగ్ని - యిసుక లేనట్టి (ఊడ్చిన) ప్రదేశమై, ♠︎ జలాశయధ్వనులు, వీధి ధ్వనులు వినబడనట్టివై, ♠︎ మనస్సుకు అనుకూలంగా అనిపించేదై, ♠︎ ఏకాంతంగా ఉండి, ♠︎ పెనుగాలులు వీచనిదై - ఉండటము అధిక ప్రయోజనకరము. |
11. నీహార ధూమ అర్క అనల అనిలానామ్ ఖద్యోత విద్యుత్ స్ఫటిక శశీనామ్ ఏతాని రూపాణి పురస్సరాణి బ్రహ్మణి అభివ్యక్తికరాణి యోగే।। |
యోగాభ్యాసం చేస్తూ ఉండగా చిత్త వృత్తి - అనుభూతులయొక్క దశలు ఏ రీతిగా ఉంటాయి? ✤ మొట్టమొదట అంతా చల్లగాను, మంచు ప్రదేశమువలెను, ✤ తరువాత నీటిలోంచి - మంచు పొగవలె, ✤ క్రమంగా అగ్నివలె ఉష్ణత్వము, వెచ్చదనము, ✤ ఆ తరువాత మెఱుపు తీగల కాంతివలెను, ✤ అటుపై స్ఫటికమును చూస్తున్న అనుభవమువంటిదిగా, ✤ అక్కడినుండి పున్నమి వెన్నెల కాంతివంటి అనుభూతిగాను, …. ఇటువంటివి బ్రహ్మ భావనకు అభివ్యక్తములు. ‘‘యోగసిద్ధి ప్రవృద్ధమౌతోంది’’…. అని అనుకోవటానికి గుర్తులు. సంజ్ఞలు. |
12. పృథ్విః - అప్ - తేజో - అనిల - ఖే సముత్థితే పంచాత్మకే యోగ గుణే ప్రవృత్తే। న తస్య రోగో, న జరా, న మృత్యుః ప్రాప్తస్య యోగాగ్నిమయమ్ శరీరమ్। |
ఈ జడమగు భౌతిక దేహము భూమి, జలము, అగ్ని/తేజస్సు, వాయువు, ఆకాశము …. అనే పంచ భూతములతో తయారైనది. యోగాభ్యాసము శ్రద్ధగా కొనసాగిస్తూ ఉండగా, ఈ జడ దేహము యోగాగ్నిచే నింపబడుచూ, యోగశక్తిచే ఉత్తేజితమౌతుంది. యోగాభ్యాసము చేయు వాని దేహము యోగాగ్నిమయమై దూదిపింజమువలె తేలికగా అగుచూ ఉంటుంది. అట్టి యోగికి రోగము, వార్ధక్యము, మృత్యువు… ఇవి బాధించవు. |
13. లఘుత్వం, ఆరోగ్యం, అలోలుపత్వం, వర్ణప్రసాదం, స్వరసౌష్ఠవం చ, గంధః శుభో మూత్ర-పురీషం అల్పమ్, యోగ ప్రవృత్తిం ప్రథమాం వదంతి।। |
యోగాభ్యాసము యొక్క ప్రభావంచేత మొదటగా శరీరము మృదువుగాను, తేలికగాను, ఆరోగ్యవంతంగాను, లౌకికమైన ఆశలకు ఆకర్షణలకు లోనుకానట్టిదిగాను, ప్రకాశమానముగాను అగుచున్నది. శరీర సౌష్ఠవం వృద్ధి చెందుతోంది. కంఠధ్వని స్పష్టత పొందుతుంది. దేహమంతా సుగంధముతో వ్యాపిస్తుంది. సమీపించినవారికి కూడా యోగుల యొక్క దేహ సుగంధము అనుభవమౌతూ ఉంటుంది. మూత్రము. పురీషము అల్పమై దుర్గంధరహితమౌతాయి. ఇవి యోగాభ్యాసమునందు ప్రవృత్తమగువారిలో మొట్టమొదట కనిపించు సులక్షణములు. |
14. యథైవ బింబం, మృదయోపలిప్తం తేజోమయమ్, అహ్రాజతే తత్సుధాంతమ్, తద్వా ఆత్మ తత్త్వమ్ ప్రసమ్ ఈక్ష్య దేహీ ఏకః కృతార్థో భవతే వీతశోకః।। |
వెండి-బంగారు-పంచలోహ విగ్రహాలు మకిలిగా ఉన్నప్పుడు ఇల్లాలు ఏం చేస్తుంది? కచ్చిక-మట్టి మొదలైన వాటితో పూసి, రాపిడి చేసి నిర్మల జలంతో కడిగి పరిశుభ్రం చేస్తుంది. అట్లా చేసినప్పుడు ఆ విగ్రహాలు తళతళ మెరుస్తూ పవిత్రంగా అగుచున్నాయి కదా! అట్లాగే, ప్రాణయామము, ధారణ, మంత్రోపాసన - ఇత్యాది యోగసాధనలచే హృదయం నిర్మలమౌతోంది. ఆ యోగి (దేహి) ఆత్మ సందర్శనం చేసినవాడై అద్వితీయుడు, కృతార్థుడు, శోక వివర్జితుడు అగుచున్నాడు. |
15. యదా ఆత్మతత్త్వేన తు బ్రహ్మతత్త్వం దీపోపమే న ఇహ యుక్తః ప్రపశ్యేత్, అజమ్, ధృవగ్ం, సర్వ తత్త్వైః విశుద్ధమ్ జ్ఞాత్వా దేవమ్ ముచ్యతే సర్వ పాశైః। |
యోగాభ్యాస ప్రభావంచేత ఆ యోగియొక్క అంతఃకరణము బ్రహ్మతత్త్వము నందు క్రమంగా లీనమై, నిశ్చల దీపంవలె ప్రకాశిస్తుంది. ఆతడు ఆత్మస్వరూపుడై ప్రకాశిస్తూ ‘యుక్తుడు’ అని పిలువబడుచున్నాడు. ఆ యుక్తుడు క్రమక్రమంగా జన్మరహితము, ధృవము, సర్వతత్త్వ స్వరూపము. విశుద్ధము అగు ఆత్మ భగవానుని స్వస్వరూపముగా తెలుసుకొన్నవాడై, సర్వపాశముల నుండి విముక్తుడగుచున్నాడు. |
16. ఏష హి దేవః ప్రదిశో అనుసర్వాః పూర్వోహి జాతః స ఉ గర్భే అంతః। స ఏవ జాతః, స జనిష్యమాణః ప్రత్యఞ్ జనాం తిష్ఠతి సర్వతో ముఖః।। |
(యోగసాధనచే అనుభవమగు చున్నట్టి) ఆ పరమాత్మ…., సర్వ దిక్కులా-ఉప దిక్కులా వ్యాపించియున్నవారు. ఈ జీవునియొక్క జన్మలన్నిటికీ మునుముందే, జన్మలకు కర్మలకు ఈవల-ఆవల ప్రకాశించుచున్నట్టివారు. ఆ ఆత్మ భగవానుడే, సర్వమును జనింపజేస్తూ, సర్వముగా జనించుచున్నవారు కూడా! సర్వ జీవుల స్వరూపుడై, సర్వులకు సర్వమునకు వేరై అన్ని వైపులా ఆనంద-తేజోమూర్తియై విలసిల్లుచున్నారు. అందరికి అభిముఖుడుగా విశ్వతోముఖంగా ఉన్నారు. |
17. యో దేవో అగ్నౌ, యో అప్సు, యో విశ్వం, భువనమ్ అవివేశ, య ఓషధీషు, యో వనస్పతిషు, తస్మై దేవాయ నమో నమః।। |
ఏ ఆత్మ దేవుడైతే అగ్నియందు, జలమునందు, విశ్వమంతా, భూమియందు, భూమిలో పరివేష్ఠితమైన ఓషధుల-వనస్పతుల రూపంగాను సర్వతోముఖుడై, సర్వస్వరూపుడై వేంచేసి యున్నారో - అట్టి స్వస్వరూపుడు-సర్వస్వరూపుడు, దేవదేవుడు అగు పరమాత్మకు నమో నమః। నమో వాక్కములు! నమస్కారము! |
తృతీయో2ధ్యాయః - ఏకో హి రుద్రో। న ద్వితీయాస్తు।
ఓం। 1. య ఏకో జాలవాన్ ఈశత ఈశనీభిః। సర్వాన్ లోకాన్ ఈశత ఈశనీభిః। య ఏవ ఏక ఇహ ఉద్భవే - సంభవే చ య ఏతత్ విదుః అమృతాః తే భవంతి।। |
అఖండము-ఏకము అగు పరమాత్మ మాయా విష్టుడై తన విశ్వశక్తితో - సర్వమును నియమించువారు, - నియమించబడుచున్నవారు కూడా అగుచు… ఈ సర్వలోకములను వ్యాపింపజేస్తూ, సర్వలోకములుగా వ్యాపించి ఉన్న వారగుచున్నారు. ఆయనే…. ఇదంతాగా - ఉద్భవించుచున్నవారు! - ఉద్భవింపజేయుచున్నవారు కూడా! అట్టి పరమాత్మను ఎరిగినప్పుడు ఆ యోగి (జీవుడు) అమృత స్వరూపుడు అగుచున్నాడు. జన్మ - జరా - మృత్యు పరిధులను దాటివేసిన వాడగుచున్నాడు. |
2. ఏకో హి రుద్రో, న ద్వితీయాయ తస్థుః యః ఇమామ్ లోకాన్ ఈశత ఈశనీభిః। ప్రత్యఞ్ జనాం తిష్ఠతి (ఈ) సంచుకో చ అంతకాలే సగ్ంసృజ్య విశ్వా భువనాని గోపాః।। |
రుద్రభగవానుడు ఒక్కడే! ఆయనకు ద్వితీయమనునది ఎక్కడా ఏదీ లేదు. ఆయనయే స్వశక్తిచే దృశ్యమంతా విస్తరింపజేస్తూనే దృశ్యస్వరూపుడై కూడా ఉన్నారు. నియమించువారు, నియమించబడునది కూడా ఆయనయే! అంతేకాదు. అందరిలోను ప్రత్యక్ ఆత్మ స్వరూపుడై ఉన్నారు. ఇదంతా పరిపోషిస్తూ, ప్రళయ కాలమునందు అంతా తనయందు విలీనము చేసివేసుకుంటున్నారు. |
3. విశ్వతః చక్షుః, ఉత విశ్వతో ముఖో, విశ్వతో బాహుః ఉత విశ్వః పాత్, సం బాహుభ్యాం గ(ద)మతి సంపత త్రైః, తత్రైః ద్యావా పృథివీ జనయన్ దేవ ఏకః।। |
పరమాత్మయగు ఆ రుద్రభగవానుడు ఆకాశము-భూమి-అంతరాళమును సృష్టిస్తూ సర్వత్ర ద్రష్టయై దర్శిస్తున్నారు. దృశ్యములు కూడా ఆయనయే! అంతటా ముఖములు కలవాడు. ఏక స్వరూపుడై కూడా అనేక రూపములతో ప్రకాశిస్తున్నారు. అనేక బాహువులు కలిగి, అనేకములుగా పాదములు కలిగి, అనేక సమావేశములు కల్పిస్తున్నారు. ఆ బాహువులతో అనేక సేవా కార్యక్రమములు నిర్వర్తిస్తూ, ఆకాశము-భూమి-జీవులుగా అగుచూ కూడా…. సర్వదా ఏక - అఖండ - అక్షర స్వరూపుడు! |
4. యో దేవానామ్ ప్రభవశ్చ-ఉద్భవశ్చ, విశ్వాధిపో, రుద్రో, మహర్షిః। హిరణ్యగర్భమ్ జనయామాస పూర్వగ్ం స నో బుద్ధ్యా శుభయా సంయునక్తు।। |
ఏ పరమాత్మ సమస్త దేవతా సంపదలను ప్రభవింపజేస్తూ ఉన్నారో, సకల దేవతలకు ఆదికారణులో, ఈ విశ్వమునకు ఆవల ఉండి సర్వమును పరిపాలిస్తున్నారో, రుద్రుడుగా సృష్టి-స్థితి-లయములను నిర్వర్తిస్తున్నారో, మహర్షిగా సర్వజ్ఞుడై పరమసత్యమగు బ్రహ్మమును గానం చేస్తూ ఉన్నారో, హిరణ్యగర్భుడై, సృష్టికి పూర్వమే ఉండి, సర్వమును సృష్టిస్తున్నారో, అట్టి రుద్రభగవానుడు మాకు శుభమగు నిర్మల బుద్ధిని ప్రసాదించుదురు గాక! |
5. యాతే రుద్ర శివా తనూః అఘోరా-అపాప కాశినీ, తయా నః తనువా శంతమయా గిరిశంత! అభిచాకశీ హి।। |
హే రుద్రభగవాన్! మంగళకరము - శివము అగు మీ దేహము సూక్ష్మాతి సూక్ష్మము. స్మరించినంత మాత్రముచేత మాయొక్క పాప బుద్ధులను తొలగించి పవిత్ర బుద్ధిని ప్రసాదించునట్టిది. సుఖము-శాంతము- ఆనందము-కైవల్యము ప్రసాదించునట్టిది. ఓ పర్వతరాజా! రక్షించండి. అల్పబుద్ధుల నుండి మమ్ము కాపాడండి! |
6. యామిషుం గిరిశంత హస్తే (వి)బిభర్ష్యస్తవే, శివాం గిరిత్రతాం కురు మా హిగ్ంసీః పురుషం జగత్।। |
పర్వతవాసివై (కొండమీద నిలుచున్న విలుకాడివై) మమ్ములను రక్షించటానికి చేతిలో ధనస్సు ధరించి ఉన్నారు. ఆ మీ బాణములను మంగళప్రదములుగా చేసి మమ్ములను రక్షించండి. మమ్ములను ఈ దృశ్య-జగత్తు బాధించకుండా, దీనిని మాపట్ల ప్రశాంత-సుఖమయంగా చేయండి! |
7. తతః పరం బ్రహ్మ, పరం బృహంతమ్, యథా నికాయం సర్వ భూతేషు గూఢమ్, విశ్వస్యైకం (విశ్వస్త్య ఏకం) పరివేష్టితారమ్, ఈశమ్ తం జ్ఞాత్వా అమృతా భవంతి।। |
ఆ పరబ్రహ్మమూర్తి - ఈ విశ్వముకంటే మహత్తరము-ప్రత్యేకము అయినవారు. సర్వజీవాత్మలలోను అంతర్యామిగా వ్యాపించి ఉన్నవారు. సర్వత్రా స్వస్తి స్వరూపులుగా ఈ విశ్వమంతా తనయొక్క బృహత్- ఏకరూపము నందు లీనమొనర్చుకొని, పరివేష్ఠించి ఉన్నవారు. సర్వ నియామకులు, పర్యవేక్షకులు అగు ఆ మహాదేవుని ఎవరు (భక్తి-యోగ- ధ్యాన-సర్వ సమర్పణ మార్గాలలో) తెలుసుకొంటారో, వారు మృత్యు పరిధులను అధిగమించి అమృత స్వరూపులు అగుచున్నారు. (మహనీయుల - సద్గురువుల మహత్తరమగు ఆత్మతత్త్వ జ్ఞాన బోధామృత ప్రభావంచేత) స్వయమమృత స్వస్వరూపులుగా సందర్శనమగుచున్నారు. |
8. వేద అహమ్ ఏతమ్ పురుషమ్ మహాన్తమ్, ఆదిత్య వర్ణమ్, తమసః పరస్తాత్। తమ్ ఏవ విదిత్వా అతి మృత్యుమ్ ఏతి। న అన్యః పంథా విద్యతే అయనాయ। |
‘‘…. ఆదిత్య (ఆది-తత్-యత్-సర్వమునకు మొదలే, సర్వమునకు ఆవల ఉన్నట్టి) జగత్ ప్రదర్శన స్వరూపుడగు ఆదిత్యవర్ణులు, అజ్ఞానమనే తమస్సుకు పరమై ప్రకాశించువారు, తమ్ మహత్ పురుషమ్ - ఆ మహత్ స్వరూపుడు’’ అగు ఆత్మపురుషుని (పరమపురుషుని) మేము తెలుసు కొనుచున్నాము. ఎవ్వరిని తెలుసుకొన్న తరువాత మృత్యువు యొక్క పరిధి నుండి దాటిపోతామో అది తెలుసుకొంటున్నాము. మృత్యువును అధిగమించటానికి ఆత్మను ఎరుగుటయే మార్గము. అందుకు వేరే త్రోవలేదు. |
9. యస్మాత్ పరమ్-న అపరమ్(q) అస్తి కించిత్, యస్మాత్ న అణీయో, న జ్యాయో అస్తి కశ్చిత్, వృక్ష ఇవ స్తబ్ధో, దివి తిష్ఠతి ఏకః తేన ఇదమ్ పూర్ణమ్ పురుషేణ సర్వమ్।। |
ఎవ్వరైతే (ఈవల - ఆవల తానే అయి ఉండటంచేత) పరము-అపరము లేనివాడయి ఉన్నారో, - ఎవ్వరి సమక్షంలో అయితే అణువుగాని - అతి పెద్ద వస్తువు గాని తనకు వేరై లేదో…, - ఎవ్వరైతే జగత్ క్రీడా విషయములను తనకు తానే కల్పించుకొని ఆస్వాదిస్తూ, తాను వాస్తవానికి సర్వమునకు ఆవల వృక్షమువలె స్ధబ్దుడై ఉన్నారో - అట్టి పరమాత్మ చేతనే ఇదంతా పూర్ణమై ఉన్నది! |
10. తతో యత్ ఉత్తర తరమ్ తత్ అరూపమ్, అనామయమ్, య ఏతత్ విదుః అమృతాః తే భవంతి। అథ ఇతరే దుఃఖమేవ అపి యంతి।। |
ఎవ్వరైతే… ఈ జగత్ దృశ్యములో కనిపించే కార్యకారణములతో సహా- సర్వమునకు వేరై ఉన్నారో, సర్వరూపములు తానే అయి, తాను మాత్రం రూపరహితుడో…, నామ రూపరహితుడో… అట్టి పరమాత్మను తెలుసుకుంటే అట్టివాడు జనన-మరణ రహితుడు, అమృత స్వరూపుడు అగుచున్నాడు. ఇక ఇతరములైనవి ఎన్ని తెలుసుకున్నప్పటికీ దుఃఖము తొలిగేది కాదు! ఏమీ లాభం లేదు। ఉండదు। |
11. సర్వ ఆనన శిరో గ్రీవః సర్వభూత గుహ ఆశయః సర్వ వ్యాపీ స భగవానగ్ం తస్మాత్ సర్వగతః శివః।। |
ఆ పరమాత్మ ఈ సమస్త ముఖములు, శిరస్సులు, కంఠములు తానే అయి ఉన్నట్టివారు. ➤ సర్వ జీవుల హృదయ గుహలలో సర్వదా నివసిస్తున్నట్టివారు. ➤ సర్వమునందు వ్యాపించి ఉన్నట్టివారు. ➤ సర్వమును మంగళప్రదము చేస్తున్న సర్వగత స్వరూపులు. నా హృదయ గుహలో సత్యమై, నిత్యమై, సర్వదా వేంచేసి ఉన్నారు. ఆ పరమశివునికి, సదాశివునికి నమస్కరిస్తున్నాం! |
12. మహాన్ ప్రభుర్వై పురుషః సత్త్వస్య ఏష ప్రవర్తకః, సు నిర్మలామ్ ఇమామ్ ప్రాప్తిమ్ ఈశానో జ్యోతిః అవ్యయః |
ఆ సర్వాంతర్యామి, సర్వగతుడు అగు ఆ పరమశివుడు…, ❋ జగత్ దృశ్యములో ప్రత్యక్షమగుచున్న ఈ జీవునియందు వేంచేసియున్న మహత్తర వస్తువు. మహాన్ స్వరూపుడు. ❋ సర్వమునకు ప్రభువు (నియామకుడు, యజమాని, సొంతదారు). ❋ ఈ సమస్త లోకములు తనయొక్క పురుషకారమే అయి ఉన్నవారు. ❋ ‘ఉనికి’ అనే కేవల సత్ స్వరూపుడు. ఆయనకు వేరైనదంతా ఆయన యొక్క కల్పితమే అయినట్టివాడు. ❋ సమస్తమును ప్రవర్తింపజేయువాడు. ప్రేరణ స్వరూపుడు. ❋ నిత్య నిర్మలుడు. అంతా పొందుతూ కూడా నిర్మలత్వమే సహజ రూపముగా కలవాడు. ❋ సర్వత్రా, అంతటా తానే విస్తరించి ఉన్నట్టి ఈశానుడు. ❋ స్వయం-జ్యోతి స్వరూపుడు. ❋ మార్పు-చేర్పులకు ఆవలివాడు. అవ్యయుడు. |
13. అంగుష్ఠమాత్రః పురుషో అంతరాత్మా సదా జనానాగ్ం హృదయే సన్నివిష్టః। హృదామ్ అన్వీశో మనసా అభిక్లప్తో య ఏతత్ విదుః అమృతాః తే భవంతి।। |
అటువంటి బొటనువేలు (అంగుష్ఠ) మాత్రుడగు పరమపురుషుడు ఎక్కడున్నారు? సర్వ జీవుల హృదయ గుహలలో సర్వదా ప్రత్యుత్సాహ రూపంగా వేంచేసి యున్నారు. హృదయంలో పొగలేని అగ్నివలె తేజో మయుడై విరాజిల్లుచూ, ‘మనస్సు’ అనే పళ్లెముచే మూయబడి ఉన్నారు. ఎవ్వరు తమ హృదయంలో ప్రకాశిస్తున్న ఆ ఆత్మభగవానుని బుద్ధితో తెలుసుకుంటారో…, అట్టివారు అమృతస్వరూపులు అగుచున్నారు. |
14. సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్ర పాత్। స భూమిమ్ విశ్వతో వృత్వా అత్యతిష్ఠతి దశాంగులమ్।। |
ఆ ఆత్మభగవానుడు వేలాది శిరస్సులతోను, కళ్ళతోను, పాదములతోను విరాజిల్లుచూ, ఈ భూమితో సహా విశ్వమంతా దశ దిశలా వ్యాపించి, ఇదంతా తనయందు ఉన్నవారై-దీనిని అధిగమించి కూడా 10 అంగులముల పర్యంతము ఉన్నారు. (ఆత్మ పురుషుడనగు నేను - నాకు కనబడే విశ్వమంతా నిండి ఉండి, ఇదంతా అధిగమించిన వాడనై ఉన్నాను. ఇతి సో2హమ్). |
15. పురుష ఏవ ఇదగ్ం సర్వమ్ యత్ భూతమ్, యచ్చ భవ్యమ్। ఉత-అమృతత్వస్య ఈశానో యత్ అన్నే నాతిరోహతి।। |
ఇప్పుడు ఉన్నది, ఇతఃపూర్వము ఉన్నది, ఇకముందు విశ్వ స్వరూపముగా ఉండబోయేది… అంతా ఆ పరమపురుషుడే! ఆయనకు వేరై ఎక్కడా ఏదీ లేదు. ఆయన అన్నము రూపముగా (ఆహారముగా) ఇంద్రియములకు అనుభవమగు విషయములను ప్రేరేపిస్తున్నారు. ఇదంతా జనిస్తూ లయించుచూ తిరిగి పరబ్రహ్మ స్వరూపముగానే అగుచున్నది. ఇదంతా కూడా ఆ అమృత స్వరూపుడగు ఈశానుడే! ఆయన నుండే! ఆయన యందే! ఆయనగానే! ఇది బుద్ధి గ్రహిస్తే ఇక సంసారములోనికి తిరోగమనం ఉండదు. |
16. సర్వతః పాణి-పాదమ్ తత్। సర్వతో అక్షి-శిరో-ముఖమ్। సర్వతః శృతిమత్ లోకే సర్వమ్ ఆవృత్య తిష్ఠతి।। |
ఆ పరమ పురుషుడే సర్వుల యొక్క చేతులు - చేతలు, పాదములు- నడకలు. ఆయన సర్వత్రా నేత్రములు, శిరస్సులు, ముఖములు, చెవులు (వినికిడి) కలిగి యుండి సర్వమునందు ఆక్రమించుకొని సర్వముగా ఉన్నారు. (కథకు కథారచయిత లాగా!). |
17. సర్వేంద్రియ గుణాభాసగ్ం। సర్వేంద్రియ వివర్జితమ్। సర్వస్య ప్రభుమ్ ఈశానగ్ం। సర్వస్య శరణగ్ం సుహృత్।। |
ఆ పరమాత్మయే దేహములలో సర్వ - ఇంద్రియ - గుణములను ప్రకాశింప జేయుచు, వాటికి సంబంధించక….., వేరై ఉన్నారు. అవన్నీ లేనివారై ఉన్నారు. కానీ, సర్వ దేహుల ఇంద్రియములుగాను, త్రిగుణములుగాను భాసిస్తున్నది - ఆయనయే! ‘‘అయినా కూడా, ఆయన భావాతీతుడు. భావములన్నిటికీ మునుముందే ఉన్నవారు. సర్వమునకు ప్రభువుగాను, సర్వమునందు విస్తరించి ఉన్నవారుగాను, సర్వజీవులకు శరణాగతి స్థానముగాను, సహృదయులై సర్వులను కరుణిస్తూ సర్వము ప్రసాదించుచున్నవారుగాను, ఆ ఆత్మభగవానుని అర్థం చేసుకుంటూ తత్త్వార్థ మననము చేస్తూ ఉపాసించాలి. |
18. నవద్వారే పురే దేహీ హంసో లేలాయతే బహిః వశీ సర్వస్య లోకస్య స్థావరస్య - చరస్య చ।। |
ఆత్మ భగవానుడు నవ ద్వారములతో కూడిన ఈ దేహములో అణువణువు ‘సో2హమ్’ భావనచే (‘నేను’ అను భావనచే) నిండి ఉన్నారు. అంతేనా? లేదు. బాహ్యమంతా కూడా…, ‘‘హమ్ సో-సో2హమ్-నేను - నేను’’… అను తత్త్వమై అంతటా అన్నిటా నిండి ఉన్నారు. ఈ స్ధావర- జంగమాత్మకమగు జాగరూకమైనదంతా తనయొక్క వశమునందు కలిగియుండి, ఎట్లు భావిస్తే, ఆ రీతిగా అనుభూతి పొందుచూ ఆయన వేంచేసి ఉన్నారు. |
19. అపాణి పాదో జవనో గ్రహీత, ఆపశ్యత అచక్షుః। సః శృణోతి-అకర్ణః। స వేత్తి వేద్యం, న చ తస్య అస్తి వేత్తా। తమ్ ఆహుః అగ్ర్యం పురుషమ్ - మహాన్తమ్।। |
✤ ఆయనకు చేతులు లేవు. కానీ అన్నీ స్వీకరిస్తున్నారు! ✤ పాదములు లేవు. కానీ అంతటా సంచరిస్తున్నారు. ✤ కనులు లేవు. కానీ అంతా చూస్తున్నది ఆయనే! ✤ చెవులు లేవు. కానీ అంతా వింటున్నది ఆయనయే! ✤ ఆయన తెలియబడేవారు కాదు. కానీ అంతా తెలుసుకుంటూ ఉన్నది ఆయనయే! ఇదంతా ఆయన రచనయే। స్వస్వరూపుడగు ఆత్మ దేవుని అగ్రగణ్యుడగు మహత్తర-పరమ పురుషునిగా దర్శిస్తూ ఉపాసించుచున్నాము. |
20. అణోః అణీయాన్, మహతో మహీయాన్, ఆత్మా గుహాయాం నిహితో అస్య జంతోః తమ్ అక్రతుం పశ్యతి వీతశోకో ధాతుః ప్రసాదాత్ మహిమానమ్ ఈశమ్।। |
❋ సూక్ష్మాతి సూక్ష్మమగు పరమాణువు కంటే కూడా ఎంతగానో సూక్ష్మాతిసూక్ష్ముడు. ❋ మహత్తరమగు కొండ-భూమి-గాలి-అగ్ని-జలము-ఆకాశములకంటే మహత్తరమైనవాడు. ❋ ఆ ఆత్మ పురుషుడు ఈ జీవులందరి హృదయ గుహలలోనే పరమ ప్రశాంతుడై దాగి ఉన్నారు. సామాన్య దృష్టికి పంచభూతములు, దేహము, మనో-బుద్ధి-చిత్త- అహంకారములు కనిపిస్తున్నాయి. కర్మలకు సంబంధించనివాడు, పురాణ పురుషుడు, మహా మహితాత్ముడు, ఈశ్వరుడు అగు ఆ ఆత్మదేవుని (సర్వము ఆత్మ భగవానుని ప్రదర్శనముగా) దర్శించువాడు - సర్వశోకములను త్యజించి దుఃఖరహితుడగుచున్నాడు. (తరతి శోకమ్ ఆత్మవిత్)। |
21. వేదాహమ్ ఏతమ్ అజరమ్ పురాణమ్, సర్వాత్మానగ్ం, సర్వగతమ్ విభుత్వాత్, జన్మ నిరోధమ్ ప్రవదంతి యస్య బ్రహ్మవాదినో హి ప్రవదన్తి నిత్యమ్।। |
మహనీయులగు బ్రహ్మతత్త్వజ్ఞులు అనునిత్యంగా ‘‘సర్వాత్ముడు- సర్వగతుడు-విభుడు-జన్మకర్మల నుండి పునీతము చేయువాడు’’ - అగు ఏ పరబ్రహ్మము గురించి ఈవిధంగా ఎలుగెత్తి చెప్పుచున్నారో, అట్టి జరామరణములకు ఆవల సర్వదా ప్రకాశిస్తున్న పురాణ పురుషుడే ఈ జగత్ రూపంగా వెలుగొందుచున్నాడని మేము (బహ్మవేత్తల అనుభవానుసారంగా) తెలుసుకొంటున్నాము. ఇదంతా బ్రహ్మముగా తెలుసుకొంటూ దర్శిస్తున్నాము. దర్శిస్తూ జగదీశ్వర స్వరూపంగా ఈ జగత్తును ఉపాసిస్తున్నాము. బ్రహ్మమే మేమగుచున్నాము. తద్బ్రహ్మమహమేవ। |
ఇతి తృతీయో2ధ్యాయః |
ఇతి తృతీయో2ధ్యాయః |
చతుర్థో2ధ్యాయః - ఏకో ఇదమ్।
ఓం 1. య ఏకో అవర్ణో బహుధా శక్తియోగాత్ వర్ణాన్ అనేకాన్, నిహితార్థో దధాతి విచ ఏతి చ అంతే విశ్వమ్ ఆదౌ స దేవాః స నో బుద్ధ్యా శుభయా సంయునక్తు।। |
ఏక స్వరూపుడు, అవర్ణుడు (వర్గభేద రహితుడు), స్వతఃగా వేరు జీవజాతులు అనే భేదమే కించిత్ కూడా లేనివారు - అగు పరమాత్మ తనయొక్క శక్తియోగ చమత్కారముచేత జీవజాతి భేదములన్నీ కల్పించుచున్నారు. అపేక్ష లేకుండానే నానా జీవజాతిని-వస్తు ధర్మాలను రచించుచూ, పరిరక్షిస్తున్నారు. చివరికి తనయొక్క జాతి భేద రహిత స్వస్వరూపమునందు సర్వ వస్తు-జాతి భేదములను లయింపజేసు కుంటున్నారు. నిత్య ప్రకాశ స్వరూపుడు, సృష్టి-స్థితి-లయకారుడు అగు ఆ పరమాత్మ మాకు శుభము - శోభాయమానము అగు బుద్ధిని ప్రసాదించి, మమ్ములను సర్వ భ్రమలనుండి పరిరక్షించుదురు గాక! |
2. తదేవ అగ్నిః। తత్ ఆదిత్యః। తత్ వాయుః। తదు చంద్రమాః। తదేవ శుక్రమ్। అమృతమ్ తత్ బ్రహ్మ। తత్ ఆపః। స ప్రజాపతిః।। |
సృష్టి-స్థితి-లయ కారకుడగు ఆ పరమాత్మయే…, 🪔 అగ్ని స్వరూపుడై సర్వము జీవమయము - తేజోమయము చేస్తున్నారు. 🪔 ఆయనయే యతః ఆది - ఆదిస్వరూపుడగు ఆదిత్యుడు. సర్వజీవులకు త్రాణయగు సూర్యుడు. 🪔 ఆయన ‘శుక్రమ్’ - పరమశుద్ధ స్వరూపుడు. కేవలుడై సర్వ జీవుల స్వస్వరూపంగా వెలుగొందుచున్నారు. 🪔 మార్పు చేర్పులు లేనట్టి అమృతస్వరూపుడు. 🪔 ప్రతి జీవునికి సంబంధించినట్టి ‘బ్రహ్మము’ అని చెప్పబడుచున్న అత్యుత్తమ వస్తువు. 🪔 ఆయనయే జీవాధారమగు జలము. రసస్వరూపుడు. 🪔 ఆయనయే సృష్టికర్తయగు ప్రజాపతి. |
3. త్వగ్ం స్త్రీ, త్వమ్ పుమాన్ అసి। త్వమ్ కుమార ఉతవా కుమారీ। త్వమ్ జీర్ణో దండేన వంచసి। త్వమ్ జాతో భవసి సర్వతోముఖః।। |
ఓ పరమాత్మా! పరబ్రహ్మమా! నమో నమో నమో నమః। 🪔 ఈ స్త్రీ-పురుష-పుత్ర-పుత్రికా రూపములుగా మాకు కనిపిస్తున్నది మీరే స్వామీ! 🪔 అప్పుడే పుట్టిన బిడ్డ-పిల్లవాడు-యువకుడు-మధ్య వయసువాడు- ముసలివాడు కూడా మీరే! వంగిన నడుముతో జీర్ణ కర్రను చేబూని నడుస్తున్నది కూడా మీరే! 🪔 అన్నివైపులా అన్ని రూపములుగా జనిస్తున్నది మీరే! మీ నుండే సర్వ లోకములు బయలుదేరుచున్నాయి. మేమంతా మీరే అయి ఉన్నాము. |
4. నీలః పతంగో, హరితో లోహితాక్షః। స ఉద్గర్భ ఋతవః సముద్రాః। అనాదిమత్వమ్ విభుత్వ ఏన వర్తసే యతో జాతాని భువనాని విశ్వా।। |
🪔 నీలి ఇత్యాది రంగుల కనులతో మెరుస్తున్న తుమ్మెద మీరే! 🪔 ఎర్రని కన్నులు, ఆకుపచ్చ రంగు రెక్కలు గల చిలక రూపము మీరే! 🪔 మేఘములలోని ఇంద్ర ధనస్సు, వసంత-గ్రీష్మ ఆదిగా గల ఋతువులు, సముద్రము… ఇవన్నీ మీ తత్త్వములే! 🪔 మీరు ఆద్యంత రహిత స్వరూపులు. అందుచేత ఇవన్నీగా వర్తిస్తూ కూడా, దీనికంతటికీ విడిగా విభు స్వరూపులై ప్రవర్తిస్తున్నారు. ఎందులోనించి భూమి-విశ్వము బయల్వెడలుచున్నాయో అదియే మీరు! జలము నుండి తరంగములవలె - ‘నేను-నీవు’తో సహా - ఈ సమస్తము మీనుండే బయల్వెడలుచున్నది. |
5. అజామ్ ఏకాగ్ం లోహిత శుక్ల-కృష్ణామ్ బహ్వీః ప్రజాః సృజమానాగ్ం సరూపామ్ అజో హి ఏకో జుషమాణో అనుశేతే జహాతి ఏనాం భుక్త భోగామ్ అజో అన్యః।। |
ఆ దేవాదిదేవుడు - తాను జన్మరహితము, ఏకము-అరూపము అయి ఉన్నారు. పరస్వరూపుడగు ఆత్మ భగవానుడు తనయొక్క కల్పనా చమత్కారముచే సరూపము, ఇహరూపము అగు విజ్ఞాన-అజ్ఞానములతో కూడిన శుక్ల (తెలుపు) - కృష్ణ (నలుపు) జీవసమూహములను సృజియించుకుంటూ వినోదిస్తున్నారు. ఏకము, జన్మ రహితము అగు తత్త్వమే - అనేకము, జన్మ సహితము అగు జీవాత్మల వ్యవహార రూపంగా ప్రదర్శనమౌతోంది. తనయొక్క అనుభవము- అనుభూతి రూపమగు సృష్టినంతా కల్పించుకొంటూ, తాను సర్వదా యథాతథమై, అన్యము- పరము అయి (స్వప్న ద్రష్టవలె) వెలుగొందుచున్నది. |
6. ద్వా సుపర్ణా సయుజా సఖాయా సమానం వృక్షమ్ పరిషస్వజాతే। తయోః అన్యః పిప్పలగ్ం స్వాద్వత్, అనశ్నన్ అన్యో అభిచాకశీతి।। |
ఈవిధంగా పరబ్రహ్మమే జీవాత్మ, పరమాత్మలుగా (ఈశ్వరుడుగా) ప్రకాశితమగుచున్నది. (ఈ దేహము-అనే) వృక్షముపై రెండు పక్షులు నివసిస్తున్నాయి. అవి అన్యోన్య స్నేహభావముచే ఒక దానిని మరొకటి వదలక (వ్యాఖ్యాన స్వరూపము) ఉంటున్నాయి. - ఒక పక్షి అనుభూతి - అనుభవము అనే ఫలములను ఆస్వాదిస్తూ కొమ్మలపై వ్రాలుతోంది. ఎగురుతోంది. కుప్పి గంతులు వేస్తోంది కూడా. - ఇక రెండవ పక్షియో, దేనినీ అనుభవించకయే అంతాకూడా కేవలము సాక్షీభూతంగా చూస్తూ ఉన్నది. (మౌన స్వరూపము). |
7. సమానే వృక్షే పురుషో నిమగ్నో అనీశయా శోచతి ముహ్యమానః। జుష్టమ్ యదా పశ్యతి అన్యమ్ ఈశమస్య మహిమానమ్ ఇతి వీతశోకః।। |
‘జీవపురుషుడు’ - అనబడే పక్షి ఆయా స్వీయకల్పితమగు అనుభూతములలో నిమగ్నమై, వాటిచే మోహించబడుచున్నది. తనయొక్క ఈశ్వరత్వమును (తానే తన ఈ కల్పనకు కారణమై, కల్పనరూపంగా ఉంటున్నాననే విషయం) పూర్తిగా ఏమరచి, అనీశుడై అనేక దుఃఖాలు పొందుచున్నది. ఈ జీవపురుష నామధేయుడగు పక్షి, ‘‘తన సంబంధితుడే ‘ఈశ్వర పురుషుడు’’ అను - (చెట్టుపై మౌనంగా చూస్తూ ఉన్న) రెండవ పక్షియొక్క మహిమ ఏమిటో తెలుసుకొన్నప్పుడు, ఆ జీవాత్మ పక్షియొక్క దుఃఖాలన్నీ తొలగుచున్నాయి. ఏమరచినప్పుడో? దుఃఖాలు కొనసాగుచున్నాయి. |
8. ఋచో అక్షరే పరమే వ్యోమని యస్మిన్ దేవా అధివిశ్వే నిషేదుః, యః తత్ న వేద, కిం ఋచా కరిష్యతి? య ఇత్ తత్ విదుః త ఇమే సమానతే।। |
ఈశ్వర స్వరూపుడగు పరమాత్మ పరమసత్యము. అక్షరుడు. పరాకాశ స్వరూపుడు. దేవతలంతా అట్టి కేవలసాక్షి - అప్రమేయుడు అగు ఈశ్వరునినే ఆశ్రయించి ఉంటున్నారు. అట్టి పరమాత్మను తెలుసు కోకుండా వేదపాఠములుగాని, మరింకేదైనా గాని-ఏమి తెలుసుకొని ఏమి ప్రయోజనం? ఆ ఆత్మ ప్రభువును తెలుసుకుంటే ఇక తెలుసుకోవలసిన దేముంటుంది? సమస్తము తెలిసినట్లే అగుచున్నది. ఆయన గురించి తెలియకపోతే ఏమీ తెలియనట్లే! |
9. ఛందాగ్ంసి యజ్ఞాః క్రతవో వ్రతాని భూతం-భవ్యం యత్ చ వేదా వదంతి। అస్మాత్ మాయీ సృజతే విశ్వమేతత్ తస్మిగ్ంశ్చ, అన్యో మాయయా సన్నిరుద్ధః।। |
ఆ అక్షర పరబ్రహ్మమునుండియే చతుర్వేదములు, యజ్ఞములు, క్రతువులు, వ్రతములు, భూత-వర్తమాన-భవిష్యత్ కాలములు, ఈ తెలియబడుచున్న సర్వము జనిస్తున్నాయి. ఆ అక్షరుడే ఈ విశ్వమంతా తనయొక్క మాయాశక్తిచే సృష్టించుకొనుచున్నారు. ఈ విశ్వమంతా ఆ పరమాత్మయొక్క మాయయే గాని, మరింకేమీ కాదని గమనించబడు గాక! ఇదంతా కూడా ‘‘సత్’’ నుండి బయల్వెడలుచున్న ‘నిరుద్ధమే’। (విశేషమే)! |
10. మాయాంతు ప్రకృతిమ్ విద్యాత్ మాయినంతు మహేశ్వరమ్। తస్య అవయవ భూతైస్తు వ్యాప్తగ్ం సర్వమ్ ఇదమ్ జగత్।। |
మాయయే ప్రకృతి స్వరూపము. ఈ మాయ ఎవరిదో…., ఆతడే మహేశ్వరుడు- సర్వ స్వరూపుడగు ఆ పరమేశ్వరుని మాయా కల్పితమగు అవయవముల చేతనే ఈ జగత్తంతా వ్యాప్తమైయున్నది. ఏకమగు పరమాత్మయే ఈ సకల యోనులయందు వేంచేసి ఉన్నారు. ఇదంతా ఆయనయందే మరొకప్పుడు సంచయనము అగుచున్నది. |
11. యో యోనిం-యోనిం అధితిష్ఠతి ఏకో, యస్మిన్‌ను ఇదగ్ం సంచవిచైతి సర్వమ్, తమ్ ఈశానమ్ వరదం దేవమ్ ఈడ్యమ్ నిచాయ ఇమాగ్ం శాంతిమ్ అత్యంతమ్ ఏతి।। |
అట్టి సర్వముగా విస్తరించియున్న ఈశానుడు, సర్వులకు సర్వమును ప్రసాదిస్తున్నట్టి వరదుడు, దేవాదిదేవుడు అగు ఆ ఈశ్వర దర్శనముచే ఈ జీవాత్మ పరమశాంతిని పొందుచున్నాడు. |
12. యో దేవానామ్ ప్రభవశ్చ-ఉద్భవశ్చ, విశ్వాధిపో రుద్రో మహర్షిః, హిరణ్యగర్భమ్ పశ్యతి జాయమానగ్ం, స నో బుద్ధ్యా శుభయా సంయునక్తు।। |
ఏ దేవాది దేవుడు దేవతల ఉత్పత్తి-ప్రభవములకు కారణభూతులో, ఈ విశ్వమును అధిగమించి ఉన్నారో, ఆరుద్రుడు మహర్షులకు మునుముందే ఉన్నారో, ఈ సృష్టికి ప్రారంభంలో సృష్టికర్త రూపధారియై సృష్టికర్తను సృష్టించినవాడగుచున్నారో - అట్టి ఆ పరమేశ్వరుడు మాకు శుభ ప్రదమగు నిర్మల బుద్ధిని ప్రసాదించును గాక! |
13. యో దేవానామ్ అధిపో యస్మిన్ లోకా అధిశ్రితాః, య ఈశే అస్య ద్విపదః - చతుష్పదః కస్మై దేవాయ హవిషా విధేమ।। |
- ఏ ఆత్మ దేవుడు దేవతలకు కూడా అధిపతి అయి ఉన్నారో, - ఎవరియందైతే ఈ లోకములన్నీ అధిష్ఠితమై, అలంకరించబడినవై ఉన్నాయో…., - ఏ ఈశ్వరుడు రెండుకాళ్ళ మానవులకు, నాలుగుకాళ్ళ జంతువులకు నియామకుడో…., అట్టి ఆ పరంధామునకు హవిస్సులు సమర్పించుకుంటున్నాము. |
14. సూక్ష్మాతి సూక్ష్మమ్, కలిలస్య మధ్యే విశ్వస్య స్రష్టారమ్ తమ్ అనేక రూపమ్।। విశ్వస్య ఏకమ్ పరివేష్టితారమ్ జ్ఞాత్వా శివమ్ శాంతిమ్ అత్యంతమ్ ఏతి।। |
ఆ ఆత్మభగవానుడు ఈ లోకాలన్నీ ఆక్రమించి సూక్ష్మాతి సూక్ష్ముడై ఉన్నట్టివాడు। తానే అనేక రూపములను ధరిస్తూ, ఈ విశ్వమంతా సృష్టించుచున్నట్టి వాడు। కలిల ( ఎవ్వరూ ప్రవేశించజాలని) స్ధానమందు ఉన్నవారు. ఈ విశ్వమంతా తానే అయినట్టి ఏకస్వరూపుడు! విశ్వమంతా యథా తథ రూపుడై విస్తరించి పరివేష్టించుచూ ఉన్నవారు! అట్టి పరమాత్మ సర్వశుభములు ప్రసాదించువారు. అట్టి శివమయ భగవానుని తెలుసుకున్నంత మాత్రం చేతనే ఆత్యంతికమైన శుభము-శాంతి ఈ జీవునకు ప్రాప్తించగలదు. తెలుసుకున్నంత మాత్రంచేత ఈజీవుడు శివుడే అవుతున్నాడు. |
15. స ఏవ కాలో, భువనస్య గోప్తా, విశ్వాధిపః సర్వభూతేషు గూఢః యస్మిన్ ఉక్తా బ్రహ్మర్షయో దేవతాశ్చ తమేవమ్ జ్ఞాత్వా మృత్యు పాశామ్ శ్ఛినత్తి।। |
ఆయనయే కాలస్వరూపుడు. ఈ భూమండలమంతా ఆయనయొక్క సంరక్షణచేతనే నిలచియున్నది. సర్వ రక్షకుడు. ఈ విశ్వమునకు అధిపతి. సర్వజీవుల హృదయములలో అంతర్యామి. సమస్త దేహములలో రహస్యముగా దాగి ఉన్నట్టివారు. దేవతలు, బ్రహ్మర్షులు ఆయనకు స్తోత్రములు సమర్పించుచున్నారు. అట్టి పరమాత్మను ఎరిగినప్పుడు ఈ జీవుని మృత్యుపాశములు తెగిపోతున్నాయి. అట్టి జీవుడు అమృత స్వరూపుడు అగుచున్నాడు. మృత్యువుచే మార్పు-చేర్పులు పొందని తన రూపము ఆస్వాదించుచున్నాడు. |
16. ఘృతాత్ పరమ్ మండమివ అతి సూక్ష్మమ్ జ్ఞాత్వా శివగ్ం సర్వభూతేషు గూఢమ్, విశ్వస్తి ఐక్యమ్ పరివేష్టితారమ్ జ్ఞాత్వాత్ ఏవమ్ (జ్ఞాత్వా దేవం) ముచ్యతే సర్వ పాశైః।। |
పెరుగులో నేయి వలె అందరిలో సూక్ష్మముగా రహస్యముగా దాగి ఉన్న వాడు. విశ్వమంతా ఏక స్వరూపుడై పరివేష్టించి యున్నట్టి సర్వశుభంకరుడు. అట్టి పరమశివ స్వరూపుడగు దేవదేవుని ఎరిగినప్పుడు సర్వపాశముల నుండి మనము ముక్తిని పొందుచున్నాము! |
17. ఏష దేవో విశ్వకర్మా మహాత్మా సదా జనానాగ్ం హృదయే సన్నివిష్టః హృదా మనీషా మనసా అభిక్లప్తో య ఏతత్ విదుః అమృతాః తే భవంతి।। |
ఆ ఆత్మ భగవానుడే ఈ విశ్వమంతా నిర్మించిన విశ్వకర్మ. సర్వజీవులలోను జీవాత్మగా వెలయుచూ, పరమాత్మ స్వరూపుడై ఉన్నవారు. సర్వజీవుల హృదయ విహారి. సర్వాత్మకుడు కాబట్టి మహాత్ముడు. ఆయనను మనయొక్క నిర్మలమైన మనస్సుతో, సునిశితమైన బుద్ధితో - హృదయమునందే దర్శించవలసినట్టివారు. ఎవ్వరు పరమాత్మను ఈ రీతిగా తెలుసుకొంటారో, వారు అమృతమగు ఆత్మ స్వరూపులై ప్రకాశించుచున్నారు. |
18. యదా తమ్ అస్తన్ న దివా న రాత్రిః, న సత్ న చ అసత్। (శివ ఏవ కేవలః) । - అసంచ్ఛిన ఏవ కేవలః। తత్ అక్షరమ్ తత్ సవితుః వరేణ్యమ్ ప్రజ్ఞా చ తస్మాత్ ప్రసృతా పురాణీ।। |
అట్టి అంతర్యామి-స్వస్వరూపుడు-సర్మాత్మకుడు అగు పరమశివ దర్శనం ఎప్పుడు అయితే ఇకప్పుడు ✩ పగలు లేదు. రాత్రి లేదు. ✩ ఆ కేవలీ స్వరూపము సమక్షంలో సత్తులేదు. అసత్తు లేదు. ✩ శివ స్వరూపము. కేవలము స్వస్వరూపమే అది. జీవాత్మ పరిధి దాటివేసినట్టిది. ✩ ఆయన జీవుడు, ఈశ్వరుడు, ఇత్యాదులుగా భిన్నమగుటయే లేదు. ✩ అది అక్షరము. క్షరము లేనిది. సత్ ం విత్ = సంవిత్ స్వరూపము. ✩ అందరియొక్క వరేణ్యము (ఆరాధ్య వస్తువు). అందరు ఆయనవైపే చూస్తున్నారు. ✩ ‘ప్రజ్ఞానం బ్రహ్మ’ అనే వేద వాచ్యార్థమై పూర్వాత్ పూర్వముగా, పురాణ పురుషుడుగా స్తోత్రము చేయబడుచున్నది ఆయనయే! |
19. న ఏనమ్ ఊర్ధ్వమ్, న తిర్యంచమ్, న మధ్యే పరిజగ్రభత్। న తస్య ప్రతిమ అస్తి యస్య నామ మహత్ యశః।। |
ఆ పరమాత్మకు ఊర్ధ్వంగా గాని, అధోభాగం గాని, మధ్యలోగాని మరింకేమీ లేదు. అంతా ఆయనయే! మహత్తరమై, సర్వత్రా ప్రకాశస్వరూపమైయున్న అద్దానికి సంజ్ఞగా, గుర్తుగా, ప్రతిమారూపమై ఏదీ లేదు. ఆయనకు ఆయనయే సాటి. సమస్తము ఆయనయే అయి ఉండగా, ఆయనను దేనితో సాటిచేయగలం? దేనితో పోల్చి చెప్పుకోగలం? |
20. న సందృశే తిష్ఠతి రూపమస్య। న చక్షుషా పశ్యతి కశ్చన ఏనమ్। హృదా హృదిస్థమ్ మనసా య ఏనమేవమ్ విదుః అమృతాః తే భవంతి।। |
ఆత్మ - నామ రూపాత్మకమైనది కాదు. ఇంద్రియములకు విషయమైనట్టిది కాదు. భౌతికమైన కళ్ళకు కనిపించేది కాదు. హృదయంలో హృదయస్థుడై ఉన్న ఆత్మభగవానుని మనస్సుతో ఎవ్వరు తెలుసుకొంటారో, వారు తత్ అమృతరూపులై విలసిల్లుచున్నారు. |
21. అజాతో, జాత ఇత్యేవమ్ కశ్చిత్ భీరుః ప్రపద్యతే, రుద్ర యత్ తే దక్షిణమ్ ముఖమ్ తే నమాం (తేనమాం) పాహి నిత్యమ్।। |
ఆయనకు జన్మయే లేదు. సంసారము పట్ల భీతి చేతనే కొందరు ఆయనకు జన్మలు ఆపాదించి జన్మించినవానివలె భావించి నామ రూప ఉపాధి - ఆత్మకంగా స్తోత్రం చేస్తున్నారు. అట్టి పరాత్పరుడు, దక్షిణామూర్తి రూపుడగు రుద్రభగవానునకు నమస్కారము. మా మనో బుద్ధులు సంసారములో లయమవకుండా ఆ సర్వాత్మకుడగు శివభగవానుడు సంరక్షించెదరు గాక! |
22. మానస్తోకే తనయే । మాన ఆయుషి। మానో గోషు। మానో అశ్వేషుః ఈరిషః। వీరాన్‌మానో రుద్రభామితో అవధీః హవిష్మంతః సదమిత్వా హవామహే।। |
ఓ సర్వాంతర్యామీ! సర్వ తత్త్వ స్వరూపా! రుద్రభగవాన్! - మా ఆయుష్షుకు, సంతానమునకు, మనస్సులకు, మా పశు సంపదలకు హాని-ఆపదలు కలుగకుండా సంరక్షించెదరు గాక! మా వీర్యత్వమును కాపాడెదరు గాక! రుద్రాణీ అమ్మవారితో రుద్రభూమిలో కూడుకొన్న మీకు మేము హవిస్సులను సమర్పించుకొనుచున్నాము. ‘‘మమ్ములను సర్వదా అజ్ఞానము నుండి రక్షించెదరు గాక!’’ అని ప్రార్థించుచున్నాము! |
పంచమో2ధ్యాయః - ద్వే ‘‘విద్యే-అవిద్యే’’
1. ఓం। ద్వే అక్షరే బ్రహ్మపరే తు అనంతే విద్యా-అవిద్యే నిహితే యత్ర గూఢే। క్షరం తు అవిద్యా హి। అమృతం తు విద్యా। విద్యా-అవిద్యే ఈశతే అస్తు సో అన్యః।। |
ఆ ఏకమగు పరబ్రహ్మమునందు రెండు విశేషాలు - అక్షరమై, అనంతరూపమై ఎల్లప్పుడు ఉండి ఉంటున్నాయి. 1. అవిద్య 2. విద్య ఈ రెండు నాశరహితములు! అపరిచ్ఛిన్నములు! నిగూఢంగా ఉన్నాయి. మార్పు చెందేది = క్షరము - అవిద్య - మృతము. మార్పు చెందనిది = అక్షరము - విద్య - అమృతము. ఈ విద్య-అవిద్యలయొక్క నియామకుడై ఈశ్వరుడు వేరుగా ఉన్నారు. ఆ రెండిటికీ కేవలము సాక్షి అయి ఉన్నారు. |
2. యో అయోనిమ్-యోనిమ్ అధితిష్ఠతి ఏకో విశ్వాని రూపాణి యోనీశ్చ సర్వాః, ఋషిమ్ ప్రసూతమ్ కపిలమ్ యః తమ్ అగ్రే, జ్ఞానైః బిభర్తి జాయమానం చ పశ్యేత్।। |
ఈ పంచభూతములు, జీవులు వీటినన్నిటియందు అధిష్ఠించినదై ఏ పరమాత్మరూపమున్నదో…., ఏది జన్మ రహితము కాబట్టి అయోనియో, ఈ సర్వ విశ్వ జీవులకు యోని (జన్మస్థానము) అయి ఉన్నదో…, - ఏ పరమాత్మ ఋషులకు, కపిలవర్ణుడు - సర్వజ్ఞుడు అగు హిరణ్యగర్భునకు కూడా ఆయన మునుముందే ఉన్నారో…, ఇదంతా సృష్టించిన తరువాత దీనినంతా భరించువాడు కూడా అయి ఉన్నారో…. అట్టి పరమాత్మను జ్ఞానులు సర్వదా ఉపాసించుచున్నారు. |
3. ఏకైకం జాలమ్ బహుధా వికుర్వన్ యస్మిన్ క్షేత్రే సగ్ంహరతి ఏష దేవః। భూయః సృష్ట్వా పథయః తథేశః సర్వాధిపత్యమ్ కురుతే మహాత్మా।। |
మహా మహితాత్ముడగు ఆత్మ భగవానుడు అనేక లక్షల జీవరాసులను సృష్టించుచున్నారు. సర్వ క్షేత్రములలో క్షేత్రజ్ఞుడై వెలయుచు, సృష్టి సంహార నిర్వాహకుడై ఉంటూ, ఇంతలోనే మరల మరల సృష్టిస్తూ, సృష్టి-స్థితి-లయములు - అనే క్రీడా వినోద తతంగాలకు ఆధిపత్యము వహిస్తున్నారు. |
4. సర్వా దిశ ఊర్థ్వమ్-అధశ్చ-తిర్యక్, ప్రకాశయన్ అహ్రాజతే యత్ న నడ్వాన్ (యద్వనడ్వాన్)। ఏవగ్ం స దేవో భగవాన్ వరేణ్యో యోని స్వభావన్ అధితిష్ఠతి ఏకః।। |
సూర్యుడు తన ప్రకాశముచే పైన-క్రింద-వెనుక-ముందు కాంతివంతము చేస్తూ వెలుగుతో నింపివేస్తున్న విధంగా…., శ్రేష్ఠాతి శ్రేష్ఠుడు అగు ఆ ఆత్మ దేవుడు ఏక స్వరూపుడే అయి ఉండి, స్వభావపూర్వకంగా సర్వ యోనులందు వెలుగుచూ, సర్వజీవుల హృదయాలను, ద్రష్ట-దర్శన-దృశ్యములను ప్రజ్ఞామయం చేసి వేస్తున్నారు. |
5. యచ్చ స్వభావమ్ పచతి విశ్వయోనిః పాచ్యాగ్ంశ్చ సర్వాన్ పరిణామయే ద్యః సర్వమ్ ఏతత్ విశ్వమ్ అధితిష్ఠతి ఏకో గుణాగ్ంశ్చ సర్వాన్ వినియోజయేద్యః।। |
ఎవ్వరియొక్క స్వభావ (ప్రకృతి) చమత్కారముచే విశ్వయొక్క ఉత్పత్తి- పరిణామములు జరుగుచున్నాయో, ఈ విశ్వమంతా ఎవరియొక్క అధిష్ఠానము అయి ఉన్నదో, ఆయనయే త్రిగుణముల నియామకుడు। పంచభూతముల అనుసంధానకర్త। ఆయన నియోజించటం చేతనే విశ్వము ప్రదర్శితమగుచున్నది. ఈ దృశ్యమంతా ఒక కథ। ఆయన పాఠకుల ఆనందము కొరకై వ్రాస్తున్న కథారచయిత। |
6. తత్ వేద గుహ్య-ఉపనిషత్సు గూఢమ్ తత్ బ్రహ్మా వేదతే బ్రహ్మయోనిమ్ యే పూర్వమ్ దేవా-ఋషయశ్చ తత్ విదుః తే తన్మయా అమృతావై బభూవుః।। |
ఆ పరమాత్మయే ఉపనిషత్తులచే విశదీకరించబడుచున్న విధంగా జీవుల గుహ్యాతి గుహ్యమగు సహజ స్వరూపం! వేద ప్రమాణమగు బ్రహ్మస్థానము. దేవతలకు, సత్యద్రష్టలగు ఋషులకు మునుముందే ఉన్నట్టి అట్టి తత్ వస్తువును - ఎరిగి ఈ జీవుడు ‘‘అహమస్మి తత్ - నేను అదే’’…. అని గ్రహించినవాడై అమృతస్వరూపుడుగా ప్రకాశించు చున్నాడు. |
7. గుణాన్వయో యః ఫల కర్మ కర్తా। కృతస్య తస్యైవ స చ ఉపభోక్తా। స విశ్వరూపః త్రిగుణః త్రివర్త్మా విశ్వాధిపః సంచరతి స్వకర్మభిః।। |
ఈ జీవుడు స్వతఃగా విశ్వరూపుడు. త్రిగుణములకు కల్పించుకొను వినోది. విశ్వమునకు ఆత్మగా ఆవలివాడు. ఇట్లు అయినప్పటికీ కూడా ఈ జీవాత్మ త్రిగుణములను ఆశ్రయించినవాడై కర్మలు నిర్వర్తించు కర్తృత్వము-కర్మఫలములకు భోక్తృత్వము అనుక్షణికంగా వహిస్తున్నాడు. ఇహ - పరలోకాలలో సంచారములు చేస్తున్నాడు. త్రిగుణబద్ధుడై ఉంటున్నాడు. ఆయనయే ‘జీవాత్మ’గా, ఈసమస్తము ఆస్వాదిస్తున్నారు కదా! పరమాత్మయో? విశ్వరూపుడై, త్రిగుణములకు ఆవల ఉండి, జాగ్రత్-స్వప్న-సుషుప్తులను లీలా వినోద సంచార స్థలములుగా చేసుకొన్నవాడై ఉంటున్నారు. ఈ ఇరువురు ఏక రూపులే! |
8. అంగుష్ఠమాత్రో, రవితుల్య రూపః సంకల్ప - అహంకార సమన్వితో యః బుద్ధేః గుణేన, ఆత్మ గుణేన చ ఏవ ఆరాగ్ర మాత్రో హి అపరో-పి దృష్టః।। |
అంగుష్ఠ మాత్రుడగు పరమ పురుషుడు-సూర్యునివలె స్వయం ప్రకాశకుడు. సంకల్ప అహంకారములు తాను కాక, తనవై, తాను వేరుగా ఉన్నట్టివాడు. బుద్ధి ఆతనిది. కాబట్టి బుద్ధియొక్క లక్షణములకంటే విలక్షణుడు. దేహ లక్షణములైనట్టి జన్మ-బాల్య-యౌవన-వార్ధక్య మరణ ధర్మములకు పరమైనవాడు. ఈవిధంగా జీవాత్మ-పరమాత్మ ధర్మాలు వేరు వేరై కూడా ఇద్దరు ఇనుప శీలల వలె కలిసియే ఉంటున్నారు. అయితే ఆత్మ సర్వదా అద్వితీయమే గాని, ద్వితీయము కలిగి లేదు. |
9. వాలాగ్ర శత-భాగస్య, శతథా కల్పితస్య చ భాగో జీవః స విజ్ఞేయః స చ అనంత్యాయ కల్పతే।। |
ఈ జీవాత్మ వాస్తవానికి ఒక వెంట్రుకయొక్క చిట్టచివ్వరి కొనభాగము నూరవ వంతు విభాగముయొక్క నూరవవంతు భాగముకంటే కూడా అత్యంత సూక్ష్మాతి సూక్ష్ముడు. వాస్తవానికి అనంత రూపమగు పరమాత్మయే ఈతడు. ఇది తెలుసుకొన్నప్పుడు ఈ జీవుడు తనయొక్క అనంతత్వమును దర్శించి బ్రహ్మానంద భరితుడగుచున్నాడు. |
10. నైవ స్త్రీ, న పుమాన్ ఏష। నైవ చ అయం నపుంసకః। యత్ యత్ శరీరమ్ ఆదత్తే తేన తేన సయుజ్యతే।। |
ఈ జీవాత్మయొక్క వాస్తవ స్వస్వరూపము స్త్రీ కాదు. పురుషుడు కాదు. ఈయన ఏ శరీరము శరీరిగా ఆశ్రయిస్తే, అది తానైనట్లు కొద్దిసేపు భావించి తన్మయుడవటం మాత్రమే ఇక్కడ జరుగుతోంది. అజ్ఞాన దృష్టికి దేహ స్వరూపుడివలె అనిపిస్తోంది. అది అవాస్తవ దృష్టియే. దేహికి ఈ దేహత్వము, భౌతిక దేహము ఐహికమగు ‘మోహము’ మాత్రమే! |
11. సంకల్పన-స్పర్శన దృష్టి మోహైః గ్రాస అంబు వృష్ట్యా చ ఆత్మ వివృద్ధ జన్మ కర్మానుగ అస్య అనుక్రమేణ దేహీ స్థానేషు రూపాణి అభి సంప్రపద్యతే।। |
పరమాత్మయొక్క స్వకీయ మాయాశక్తిచే-అనన్యమైన కల్పనానుగతంగా రూపుదిద్దుకొన్న ఈ జీవాత్మ….,- సంకల్పము-స్పర్శన- దృష్టి-రస-గంధ భావ పరంపరలచే మోహితుడై జల తరంగమువలె అనేక ఉపాధులలో నిమగ్నమగుచున్నాడు. జన్మ, కర్మలు, కర్మల వలన పునః జన్మ, పునఃజన్మము వలన మరల కర్మలు-ఈవిధంగా కొనసాగుతోంది. దేహి (దేహ ధారణ చేయుచున్నవాడై) దేహమును ఆశ్రయించి అన్న పానాదులు స్వీకరిస్తూ శరీరమును ప్రవృద్ధపరచుకొనుచున్నాడు. అది శిధిలమైన తరువాత మరొక దేహం। కర్మల సంబంధమైన పుణ్య- పాపానుసారంగా ఈ జీవుడు(ఆత్మగా తానున్న చోటే ఉండియే) అనేక ఆకారములగు స్ధావర-జంగమ దేహములను పొందుచున్నాడు. |
12. స్థూలాని-సూక్ష్మాని బహూని చ ఏవ రూపాణి దేహీ స్వగుణైః వృణోతి క్రియా గుణైః - ఆత్మ గుణైశ్చ తేషామ్ సంయోగ హేతుః అపరో-పి దృష్టః।। |
తన సత్త్వ-రజో-తమో గుణానుసారంగా, స్వకీయ సంస్కారములను అనుసరించి అనేక దేహరూపములను ఆశ్రయించుచున్నాడు. స్థూల-సూక్ష్మ గుణ సమన్వితుడై కనబడుచున్నాడు. జన్మ-కర్మ- మరణముల మధ్య చిక్కుకొన్నవానివలె అగుచున్నాడు. అపరాదృష్టిచే - అనేకసార్లు, అనేకచోట్ల, అనేక విధములైన సంయోగ-వియోగములకు బద్ధుడు అగుచున్నాడు. |
13. అనాది-అనంతమ్ కలిలస్య మధ్యే విశ్వస్య స్రష్టారమ్ తమ్ అనేక రూపమ్ విశ్వస్య ఏకమ్ పరివేష్టితారమ్ జ్ఞాత్వాత్ ఏవమ్ (జ్ఞాత్వాదేవం) ముచ్యతే సర్వపాశైః।। |
‘‘అయ్యో! నేను ఈ జన్మ-కర్మలను దాటలేకపోవుచున్నానే! కలిలస్య మధ్యే - దోషముల కల్పనలలో చిక్కుకొని ఉన్నానే’’ - అని భావిస్తున్నాడు. వాస్తవానికి ఈ జీవాత్మ దేహములచేతగాని, ఇంద్రియ విషయములచేత గాని బద్ధుడు కాడు. వాటియందు చిక్కుకున్న పిట్టవంటి వాడు కానే కాదు. ఈతడు ఆద్యంత రహితుడు. ఈ మాయా మయ సంసార సాగరమునకు తానే సృష్టికర్త. అనేక రూపములను తనకు తానే కల్పించుకొనుచున్నట్టి వాడు. సర్వవ్యాపి. ఏక స్వరూపుడై విశ్వమంతా నిండి ఉండి, అట్టి స్వయం కల్పిత విశ్వమునందు సంచారములు చేయుచున్నవాడు. తానే అంతటా ఉండి, అన్నీ తానే అయి, అంతా అనుభవించుచున్నట్టివాడు. అట్టి తనయొక్క సహజరూపమగు మహదాత్మను ఎప్పుడు గ్రహిస్తాడో అప్పుడు ఈతడు సర్వ పాశముల నుండి విముక్తుడగుచున్నాడు. |
14. భావ గ్రాహ్యమ్, అనీడాఖ్యమ్ భావ-అభావ కరగ్ం శివమ్, కలా సర్గ కరమ్ దేవమ్ యే విదుః తే జహుః తనుమ్।। |
ఎవ్వడైతే ‘‘నేను ఈ భౌతిక దేహమునకు మాత్రమే సంబంధించిన వాడిని కదా…!’’ … అనే దేహాభిమానము వదలి…, ⌘ ‘భావన’ అనే ప్రక్రియ నాచే ప్రారంభవకముందే-నేను ఉన్నట్టి వాడను. ⌘ భావములు నాచే స్వీకరించబడుచూ ఉంటాయి. వదల బడుచూ ఉంటాయి. ⌘ భావాభావములకు ఉత్పత్తి స్థానమగు శివానంద స్వరూపుడను…, ⌘ కలన (కల్పన), సర్గము - నాయొక్క ఆత్మ విన్యాసములే - … అని గ్రహిస్తాడో, ఈ దేహమును తానుగా ధరించి-త్యజించే వస్త్రము వంటిదిగా భావిస్తూ సర్వ దేహ జనిత భావములను తనకు వేరైనవిగా చూస్తాడో…, (షోడశ కళా సమన్వితుడగు) ఆత్మగా తనను తాను భావిస్తాడో… ఆతడు బంధ విముక్తుడే! ఆతడు దేహస్థితిని అధిగమించి వేస్తున్నాడు. ‘‘దేహి’’ స్థానమును ఆస్వాదిస్తున్నాడు. |
షష్ఠమో2ధ్యాయః
ఓం।। 1. ‘స్వభావమ్’ - ఏకే కవయో వదంతి। ‘కాలమ్’ - తథా అన్యే తథా అన్యే పరిముహ్యమానాః। దేవస్య ఏష్య మహిమాతు లోకే యేన ఇదమ్ అహ్రామ్య తే బ్రహ్మ చక్రమ్।। |
బ్రహ్మవాదులు తమ సంవాదమును విశ్వము-జీవాత్మ-ఈశ్వరుడు…. విషయాల గురించి ఇట్లా కొనసాగించసాగారు. ‘‘ఈ అనంత విశ్వ సృష్టికి కారణమేమిటి? ఎవ్వరు?’’ అనే ప్రశ్నకు మరల మనం వద్దాం. ‘స్వభావము’ - అని కొందరు పండితుల అభిప్రాయము. కాదు - ‘కాలము’ అని మరి కొందరంటున్నారు. ఇట్లా వేరు వేరైన పరిముహ్యమానమైన అభిప్రాయాలు ఉండవచ్చు గాక. ఈ విశ్వము ఆత్మయొక్క మహిమయే - దీపపు కాంతిలో వస్తు ఆకారములు కనిపిస్తున్నట్లుగా! భ్రమకు కూడా బ్రహ్మచక్రమే కారణం! |
2. యేన ఆవృతమ్ నిత్యమ్ ఇదగ్ం హి సర్వమ్ జ్ఞః, కాలకాలో, గుణీ, సర్వవిద్యః, తేన ఈశితమ్ కర్మ వివర్తతే ఇహ పృథ్వీ-ఆపః - తేజో అనిల-ఖాని చింత్యమ్।। |
ఈ విశ్వమంతా కూడా ఎవ్వనిచే ఆవృతము (ఆవరించబడినదై, కప్పబడినదై) ఉన్నదో, అట్టి పరమాత్మ:- - కేవల జ్ఞాన స్వరూపుడు - కాలమును కూడా నియమించునట్టివాడు - త్రిగుణములకు ఆవల ‘గుణి’ స్వరూపుడు. - సర్వజ్ఞుడు. ఆయన యొక్క ఆలోచనా చమాత్కారములే క్రియాశీలకమై - పంచభూతములు, శుభాశుభ కర్మలు, అవి నిర్వర్తించే ఈ పాంచభౌతిక దేహాలు, కర్మఫలములు, జీవుని జన్మ జన్మాంతరములుగా - వివర్తమౌతున్నాయి. |
3. తత్ కర్మ కృత్వా వినివృత్య భూయః తత్త్వస్య తత్త్వేన సమేత్య యోగమ్ ఏకేన - ద్వాభ్యామ్ - త్రిభిః - అష్టభిర్వా కాలేన చ ఆత్మగుణైశ్చ సూక్ష్మైః।। |
పరమాత్మ భగవానుడు తనయొక్క ఒకానొక ‘అంశ’ అగు క్రియా విశేషమును…, ఏకేన ….. ఏక స్వరూపుడుగాను, ద్వాభ్యామ్ ….. జీవ-ఈశ్వరులు గాను, త్రిభిః …… త్రిగుణములు గాను, అష్టభిర్వా … పంచభూతములు మనస్సు బుద్ధి అహంభావన అనబడే అష్టవిధ ప్రకృతిగాను, కాలేన చ …. కాల స్వరూపముగాను విస్తరింపజేస్తూ ఉన్నారు. మరల ఈ తతంగమంతా నిర్వర్తిస్తున్న తనయొక్క ‘కర్మ ప్రవృత్తి యోగము’ అనే అంశను - నివృత్తింపజేస్తున్నారు. అప్పుడిక తనయొక్క జగత్ తత్త్వమును ఆత్మతత్త్వమునందు ఏకము-సంయోగము చేసివేస్తున్నారు. ‘జీవాత్మ’గా అయి, ఈ జగత్తును ఆస్వాదిస్తున్నారు. కానీ, అఖండాత్మగా సర్వదా యథాతథుడు. |
4. ఆరభ్య కర్మాణి గుణాన్వితాని భావాగ్ంశ్చ సర్వాని వినియోజయేద్యః తేషామ్ అభావే కృతకర్మ నాశః కర్మక్షయే యాతి స తత్త్వతో అన్యః।। |
అందుచేత కర్మబద్ధులమైయున్న మనం ఇప్పుడు ఏం చేయాలి? ఈ కర్మబంధములను త్రెంచి మోక్షభాగులం కావాలి. ఎట్లా? సర్వభావాలు మొట్టమొదటే సర్వాత్మకుడగు పరమాత్మయందు నియమించుకొని, ఇక అటుపై మనం ప్రారంభించుచున్న త్రిగుణాత్మకములైన సర్వ కర్మలను పరమాత్మకు సమర్పిస్తూ, జగద్దృశ్యమును పరమాత్మ రూపంగా భావన చేయటమును ఆశయంగా కలిగి నిర్వర్తించాలి. ఇదియే ‘‘అభావనా సహిత కర్మకృత్యములు’’ అగుచున్నది. ఈవిధంగా, దృశ్య అభావన-పరమాత్మ భావనా కృతంగా కర్మలు నిర్వర్తించుచుండగా కర్మ బంధాలు తొలగిపోతాయి. కృతాకృత కర్మలకు వేరై ఉన్నట్టి ఆత్మతత్త్వము నందు ప్రవేశము లభించ గలదు. |
5. ఆదిః స సంయోగ నిమిత్త హేతుః పరః త్రికాలాత్ అకలో-పి దృష్టః తమ్ విశ్వరూపమ్ భవ భూతమ్ ఈడ్యమ్ దేవమ్, స్వచిత్తస్థమ్ ఉపాస్య పూర్వమ్।। |
ఆ పరమాత్మ…, ఆదిః - మొట్టమొదటే ఉన్నట్టివారు (ఏకేన). సంయోగః - ద్వితీయమగు జగత్తును కల్పించుకొని సంయోగము పొందుచున్నవారు (ద్వాభ్యామ్). నిమిత్తహేతుః - జగత్తుకు మూలకారణుడు. నిమిత్త కారణులు. జగత్తుగా నిమిత్త కారణులు. పరమాత్మగా ఉపాదాన కారణులు. దృష్టాంతము ‘‘కృష్ణుడు మధురముగా మురళీగానము వినిపించిరి’’ మురళీ = నిమిత్త కారణము, కృష్ణుడు = ఉపాదాన కారణము. పరః త్రికాలాత్ - త్రికాలములకు ఆవల ఉన్నట్టివాడు. అకలో-పి దృష్టః - దృశ్య రహితుడై ఉంటూనే తన కల్పనకు ద్రష్టగా ఉన్నవారు. కల్పనారహితులే అయినప్పటికీ, జగత్‌కల్పనా దృష్టులన్నీ ఆయనవే. విశ్వరూపమ్ - ఈ విశ్వమంతా తన రూపముగా కలవారు. భవభూతమ్ - పంచభూతములకు కర్త. ఈడ్యమ్ దేవమ్ - స్తోత్రములకు అర్హుడు. పూర్వమ్ - దేవతలకు కూడా పూర్వమే ఉన్నవారు. ఆయనను ‘‘నా హృదయమునందే ఉన్నారు కదా!’’ …. అను భావనతో చిత్తముతో ఉపాసించెదము గాక! హృదయములోనే ఆయనను గమనించి ఆరాధించెదము గాక! |
6. స వృక్ష కాలాకృతిభిః పరో అన్యో యస్మాత్ ప్రపంచః పరివర్తతే అయమ్, ధర్మావహమ్ పాపనుదమ్ భగేశమ్ జ్ఞాత్వా ఆత్మస్థమ్ అమృతమ్ విశ్వధామ।। |
ఏ పరమపురుషుడైతే…., ❋ ‘దృశ్యముతో పెట్టుకున్న సంబంధము’ అనే సంసార వృక్షమునకు, - కాలమునకు కూడా ‘‘పరము’’ - (అన్యము) అయి ఉన్నారో…, ❋ ఎవరి వలన ఈ కనబడుచున్న ప్రపంచమంతా పరివర్తనశీలమై ఉనికిని కొనసాగిస్తోందో…, అట్టి ఆ పరమాత్మను …. ధర్మ రక్షకునిగాను, …. పాప- అల్ప దృష్టులను తొలగించువానిగాను, …. స్వహృదయ నివాసిగాను, …. అమృత స్వరూపుడుగాను (మరణానంతరము కూడా వెంటనంటి ఉండువాడుగాను), …. ఈ విశ్వమునకు ఆధారుడుగాను, మనము తెలుసుకొన్నప్పుడు మనమే పరబ్రహ్మ స్వరూపులమై ప్రకాశిస్తున్నాము. |
7. తమ్ ఈశ్వరాణామ్ పరమమ్ మహేశ్వరమ్ తం దేవతానాం పరమం చ దైవతమ్। పతిం పతీనామ్, పరమం పరస్తాత్ విదామ దేవమ్ భువనేశమ్ ఈడ్యమ్।। |
మన ఉపాసనకు అర్హము-పరమ సత్యము అగు ఆ పరమాత్మ ఎట్టివారు? 💐 ఆయన జీవ-ఈశ్వరులకంటే పరము (ఆవల)గా ఉన్నట్టి మహేశ్వరుడు. 💐 దేవతలకు ఆవల (పరమై) ఉన్నట్టి దేవ దేవుడు. 💐 ఆయన పతికే పతి. ప్రజాపతి. 💐 పరమునకే పరము అయినట్టి పరాత్‌పరుడు. శ్రేష్టమునకే శ్రేష్టమైన వాడు. ఈ సమస్త లోకములకు ఈశుడు. 💐 దేవతలచే స్తుతించబడి సమస్తము ప్రసాదించువారు. జ్యోతికే జ్యోతి. 💐 తన భావావేశమునందే ఈ సమస్తము సిద్ధింపజేసుకొంటూ కూడా, భావాతీతుడు. |
8. న తస్య కార్యమ్, కరణం చ విద్యతే। న తత్ సమశ్చ, అభ్యధికశ్చ దృశ్యతే। పరా అస్య శక్తిః వివిధైవ శ్రూయతే, స్వాభావికీ జ్ఞానబల క్రియా చ।। |
విద్వాంసులు ఈ రీతిగా ఆత్మ భగవానుని గానం చేస్తున్నారు. ✩ ఆయనకు - కరణ (ఇంద్రియ) - కార్య-కారణ-కర్తృత్వాలు లేవు. ✩ పరమాత్మకు సమానమైనదేదీ లేదు. ఇక అధికమైనదేది ఉంటుంది? ✩ ఆయనకు చెందిన పరాశక్తియే వివిధ రూపములుగా అగుచు, ఈ జగత్తులోని నానాత్వంగా తెలియవస్తోంది, వినవస్తోంది, కనబడుతోంది. ✩ ఆయన శక్తి స్వాభావికమైనది. జ్ఞాన క్రియా సమన్వితమైనది. |
9. న తస్య కశ్చిత్ పతిః అస్తి లోకే। న చ ఈశితా, నైవ చ తస్య లింగమ్। న కారణమ్ కరణాధిప అధిపో, న (స) చ అస్య కశ్చిత్ జనితా, న చ అధిపః।। |
✩ ప్రభువులకే ప్రభువగు ఆ సర్వాంతర్యామి పరమాత్మకు మరొక నియామకుడెవ్వరూ లేరు. ఆయనయే సమస్తమునకు పతి. ✩ అంతటా వేంచేసి ఉన్న ఆయన కొరకై వెళ్ళవలసిన చోటు మరేదీ లేదు. వెతక వలసిన పని లేదు. ✩ నిరాకారుడగు ఆయన స్త్రీ-పుం-నపుంసకాది లింగ రహితుడు. ‘‘ఆకారము ఇది’’ - అనునదేదీ లేనివాడు. ✩ ఆయన కారణ రహితుడు. ఆయనకు కారణాధిపుడై మరొక అధిపుడు లేడు. కార్య-కారణ-కారణాధిప రహితుడు. ✩ ఆయనను జనింపజేసేవాడు గాని, అధిపుడు గాని ఆయనకు లేరు. ఆయన జనింపజేయునది ఏదీ లేదు. నిష్క్రియుడు. అట్టి సర్వస్వరూప ఆత్మ భగవానునే మనం ఉపాసిస్తున్నాము. ఉపాసించాలి. |
10. యః తంతునాభ ఇవ తంతుభిః ప్రధానజైః స్వభావతః, దేవ ఏకః సమావృణోత్ స నో దధాతు బ్రహ్మ అవ్యయమ్।। |
ఒక సాలెపురుగు తన నుండి తానే దారములను బహిర్గతం చేస్తూ, ఆ సాలె చక్రములో తానే క్రీడగా విహరిస్తూ ఉంటుంది. సంచారము చేస్తూ ఉంటుంది. అట్లాగే, పరమాత్మ తన యొక్క ప్రప్రథమ ప్రధాన రూపమగు ‘స్వభావము’ నుండి బయల్వెడలుచున్న విశ్వతంతువులచే కప్పబడినవాడి వలె ఉంటున్నారు. అట్టి ఏక స్వరూప దేవాది దేవుడగు ఆత్మ భగవానుడు మాకు అవ్యయమగు ‘బ్రహ్మాహమ్’ స్థానమును ప్రసాదించు గాక! |
11. ఏకో దేవః సర్వభూతేషు గూఢః సర్వ వ్యాపీ, సర్వభూతాంతరాత్మా కర్మాధ్యక్షః - సర్వభూతాధివాసః సాక్షీ చేతా కేవలో నిర్గుణశ్చ।। |
ఏకము-ఏకాత్మ స్వరూపుడు అగు పరమాత్మ సర్వుల హృదయములలో రహస్యముగా (లౌకిక దృష్టికి బట్టబయలు కాకుండా) వేంచేసినవారై ఉన్నారు. దాగి ఉన్నారు. ★ (స్వప్న ద్రష్టయే స్వప్నమంతా నిండి ఉన్నట్లుగా) ఆయన సర్వవ్యాపి. సర్వముగా వ్యాపించి ఉన్నట్టివారు. ★ సర్వజీవులయొక్క అంతరాత్మ స్వరూపులు. ★ సర్వకర్మలకు అధ్యక్షుడు. ఆయన సంకల్పములే సర్వ కర్మ రూపాలుగా, సమస్త ప్రదర్శనములుగా సిద్ధిస్తున్నాయి. ★ సర్వభూతజాలములందు సర్వదా నివసిస్తున్నవారు. సర్వభూతాధి వాసులు. ★ సర్వకర్మలకు - సర్వ హృదయ విశేషములకు - సర్వ కార్యక్రమములకు కేవలసాక్షి. ★ బుద్ధికి కూడా సాక్షి. ★ కేవలుడు. నిర్గుణుడు కూడా! |
12. ఏకో వశీ నిష్క్రియాణాం, బహూనామ్ ఏకగ్ం బీజం (రూపం) బహుధా యః కరోతి, తమ్ ఆత్మస్ధమ్ యే అనుపశ్యంతి ధీరాః తేషాగ్ం సుఖమ్ శాశ్వతమ్। నేతరేషామ్ (న-ఇతరేషామ్)।। |
నిష్క్రియుడు - ఏకరూపుడు అగు పరమాత్మ ఏక స్వరూపుడైయ్యే ఉండి, తనను తాను అనేక రూపములుగా ప్రదర్శించుకొనుచున్నారు. ఏకరూపుడై యుండి, అనేక రూపములుగా ప్రదర్శితుడు అగుచున్న ఆ పరమాత్మను ఎవరు తమయందే గమనించి గుర్తించి, దర్శించి మమేకమగుచున్నారో…, వారియొక్క సుఖమే శాశ్వతము, తదితరులది శాశ్వతమైన సుఖము కాదు. (విషయముల నుండి, ద్వితీయమునుండి లభించే సుఖము అశాశ్వతము, దుఃఖ మిశ్రితము కూడా!). |
13. నిత్యో (n)నిత్యానామ్, చేతనః చేతనానామ్, ఏకో బహూనామ్ యో విదధాతి కామాన్, తత్ కారణగ్ం సాంఖ్యయోగ అది-గమ్యమ్। జ్ఞాత్వాత్ ఏవమ్ (జ్ఞాత్వా దేవం) ముచ్యతే సర్వపాశైః।। |
ఏదైతే అనిత్యమైన దేహాలలో గుణములతో అంతర్లీనంగా నిత్యమై యున్నదో…, నిత్యుడగు జీవునిలో సర్వదా నిత్యముగా, ప్రకాశమానమో, ⌘ కదిలే వస్తువులలో కదిలించుచున్నదై ఉన్నదో…, ⌘ అనేక రూపములుగా తన ఇచ్ఛచే తాను (ఏకమే అయి ఉండియే) - ధరిస్తున్నదో, సమస్త జీవులకు ‘ఇచ్ఛ ప్రదాత’ అయి విరాజిల్లుచున్నదో (కామేశ్వరీ కామేశ్వర స్వరూపమో) ⌘ కారణములన్నిటికీ ఆదికారణమైయున్నదో, ⌘ ఎద్దాని గురించైతే - విశ్లేషణ-విచారణ రూపమైన సాంఖ్యయోగులు (తదితర ద్వైత-అద్వైత-విశిష్టాద్వైత ఇత్యాది సిద్ధాంతాలన్నీ) ఆత్యంతికమైనదిగా ప్రతిపాదించటం జరుగుతోందో… అట్టి పరబ్రహ్మ తత్త్వమును ఎరిగినప్పుడు సర్వబంధములు తెగిపోతాయి. అనగా, అట్టి ఆత్మదేవుని గురించి ఎరుగుటచేత మాత్రమే - ఇక్కడి సంసార బంధములన్నీ పటాపంచలు కాగలవు. |
14. న తత్ర సూర్యో భాతి। న చంద్ర-తారకమ్। న ఇమా విద్యుతో భాంతి, కుతో అయమ్ అగ్నిః? తమేవ భాంతమ్ అనుభాతి సర్వగ్ం। తస్య భాసా సర్వమిదమ్ విభాతి।। |
ఆత్మ - ఇక్కడి భౌతికమగు సూర్యకాంతిలో కనబడే ఒక వస్తువు వంటిది కాదు. - చంద్ర-నక్షత్ర కాంతిలో కనబడేదేది, కనుగొన కలిగినది కాదు. - జ్యోతియొక్క వెలుగు వంటిది కాదు. ఇక అది అగ్ని-వెలుగు కాదని వేరే చెప్పాలా? - ఆత్మ ప్రకాశించటం చేతనే, తత్ర్పాకాశ విశేషాలుగా-సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, జ్యోతి…, ఇవన్నీ కూడా ఆత్మచైతన్యము నుండి వెలుగునుపొంది ప్రకాశమును ప్రదర్శించుచున్నాయి. |
15. ఏకోహగ్ం సో భువనస్య అస్య మధ్యే, స ఏవ అగ్నిః సలిలే సన్నివిష్టః। తమేవమ్ విదిత్వా అతిమృత్యుమ్ ఏతి। న అన్యః పంథా విద్యతే అయనాయ।। |
ఈ భూనభోంతరాలలో వెలుగొందుచూ దహించుచున్న అగ్ని వలె ఆయన సర్వ దేహములలో వేంచేసి, సర్వమును వెలిగిస్తున్నారు. - ఆయన గురించియే మనము అందరమూ తెలుసుకోవలసింది. అట్టి ఆత్మ భగవానుని తెలుసుకొని మాత్రమే ‘‘నేను మృత్యువుచే బద్ధుడనుగాను. దేహానంతరము కూడా ఉంటాను కదా!’’ … అనే విషయం గ్రహించి మృత్యు పరిధులను దాటిపోగలుగుచున్నాము. మృత్యువును అధిగమించటానికై ఆత్మతత్త్వ జ్ఞానము మించినది వేరే ఏ పంథా (మార్గము) లేనే లేదు. వేరే విధానము లేదు. |
16. స విశ్వకృత్। విశ్వవిత్। ఆత్మయోనిః। జ్ఞః। కాల కాలో। గుణీ। సర్వ విద్యః। ప్రధాన క్షేత్రజ్ఞ పతిః। గుణేశః సగ్ంసార మోక్ష స్థితి బంధహేతుః।। |
ఆ పరమపురుషుడు…, ❋ ఈ విశ్వమునకు కర్త. ❋ ఈ విశ్వమును ఎరుగుచున్నవాడు. ❋ జీవాత్మలందరికీ ఉత్పత్తి స్థానమము. ❋ జ్ఞానస్వరూపుడు. ❋ కాలమును కూడా నియమించు కాలఃకాలుడు. ❋ త్రిగుణములు తనవైనవాడు. ❋ సర్వమును ఎరిగినవాడు (యః విత్ విద్యః). ❋ ప్రధాన క్షేత్రజ్ఞుడగు సృష్టికర్తకు పతి. క్షేత్రజ్ఞత్వమునకు యజమాని. ❋ త్రిగుణములకు ప్రభువు. ❋ సంసారము జనించటానికి, స్థితికి, విముక్తికి కారణుడు. బంధహేతువు. బంధ విముక్తిని ప్రసాదించువాడు కూడా. |
17. స తన్మయో హి అమృత ఈశ సంస్థో, జ్ఞః సర్వగో భువనస్య అస్య గోప్తా, య ఈశే అస్య జగతో నిత్యమేవ। న అన్యో హేతుః విద్యత ఈశనాయ।। |
❋ అట్టి అమృత స్వరూపుడు అగు ఈశుని ఉనికిచే ఈ విశ్వమంతా తన్మయమైయున్నది. ❋ ఆ ఆత్మ భగవానుడు కేవల జ్ఞాస్వరూపుడై అంతటా విస్తరించి ఉన్నవారు. సర్వగతుడు. ❋ ఈ సమస్త భూమండల పరిపాలకుడు. ❋ సర్వత్రా తానే విస్తరించినవాడై ఉండటంచేత - ఈ జగత్తుకు ఈశ్వరుడు - నిత్యుడు. కాబట్టి ఆత్మయే ఈ జగత్తుకు హేతువు. ఆ ఈశ్వరునికి వేరుగా మరొకరెవరూ కారణమై ఉండలేదు. స్వయం కారణుడు। కారణ కారణుడు। అకారణుడు। |
18. యో బ్రహ్మాణం విదధాతి పూర్వమ్, యో వై వేదాగ్ంశ్చ ప్రహిణోతి తస్మై, తగ్ం హ దేవమ్ ఆత్మబుద్ధి ప్రకాశమ్ ముముక్షుర్వై శరణమహమ్ ప్రపద్యే।। |
ఏ పరమాత్మ సృష్టికి ముందు సృష్టికర్తను సృష్టించి విధి- వేదములను ఉపదేశించారో, అట్టి ఆత్మ భగవానుడు మాయందు ఆత్మ బుద్ధిని ప్రసాదింపజేయును గాక! మా యందే ఉన్నట్టి ఆ పరమాత్మ సుస్పష్టమగుటకు గాను ముముక్షువులమై (మోక్షేచ్ఛ కలవారమై) సద్గురువులను, ఆ ఆత్మదేవుని శరణు వేడుచున్నాము. |
19. నిష్కలమ్, నిష్క్రియగ్ం, శాంతమ్, నిరవద్యమ్, నిరంజనమ్। అమృతస్య పరగ్ం సేతుం, దగ్ధ ఇంధనమివ అనలమ్।। |
❋ నిష్కలంకుడు (దోషరహితుడు, నిత్య నిర్మలుడు), ❋ కర్మలకు అతీతుడైనవాడవటంచేత నిష్క్రియుడు, ❋ పరమశాంత స్వరూపుడు, ❋ నిరవద్యుడు, ❋ నిరంజనుడు (దోష-వికార రహితుడు)…., (అనింద్యుడు-నిర్లేపుడు), ❋ అమృతత్వమును సముపార్జించుకోవటానికై వంతెనవంటివాడు, ❋ మండుచున్న అగ్నివలె తేజోరూపుడు - అగు పరమాత్మను శరణువేడుచున్నాము. |
20. యదా చర్మవత్ ఆకాశమ్ వేష్టయిష్యంతి మానవాః, తదా శివమ్ (దేవమ్) అవిజ్ఞాయ దుఃఖస్య అంతో (న) భవిష్యతి।। (స విజ్ఞాయ దుఃఖస్య అంతో అవశ్యమ్ భవిష్యతి) |
ఆకాశమంతా చుట్టుచుట్టి వస్త్రము వలె ధరించటం ఎవ్వరివల్లనైనా అవుతుందా? లేదు కదా! అట్లాగే ఆత్మ శివ భగవానుని తెలుసుకోనంత కాలము జగత్ దృశ్యముతో ఏర్పడిన సంబంధ రూపమగు సంసార దుఃఖము, భయము తొలగనే తొలదు. కొనసాగుచూనే ఉంటాయి. తెలుసుకుంటే తప్పక తొలగుతుంది. |
21. తపః ప్రభావాత్ దేవ ప్రసాదాచ్చ బ్రహ్మహా శ్వేతాశ్వతరో అథ విద్వాన్ అత్యాశ్రమిభ్యః పరమమ్ పవిత్రమ్ ప్రో వాచ సమ్యక్ ఋషి సంఘ జుష్టమ్।। శ్వేతశ్వతర మహర్షిభ్యోం శ్వేతాశ్వతర నమః। |
శ్రీ గురుభ్యోనమః। - కర్మ-భక్తి-యోగాదులతో కూడిన తపస్సు యొక్క ప్రభావము చేతను, - సర్వాత్మకుడగు పరమశివ భగవానుని అనుగ్రహముచేత, నిష్టాతుడు, పండితుడు అగు - శ్వేతాశ్వతర మహర్షి బ్రహ్మ జ్ఞానమునందు విద్వాంసుడై లోక కల్యాణార్ధమై ప్రప్రధమంగా మాకు బోధించిన పరమాత్మ తత్త్వ విశేషములే ఈ శ్వేతాశ్వతరోపనిషత్. ఋషిగణము పలికిన పరమ పవిత్రమగు పరబ్రహ్మతత్త్వమునే శ్రీశ్వేతాశ్వతర మహర్షి యతి సంఘమునకు బోధించారు. అదియే ఆశ్రమ వాసులగు మనము ఇప్పుడు చెప్పుకున్నాము. శ్వేతాశ్వతర మహర్షిభ్యోం నమః। |
22. వేదాంతే పరమమ్ గుహ్యమ్ పురా కల్ప ప్రచోదితమ్। న అప్రశాన్తాయ దాతవ్యమ్- న (దాతవ్యమ్) అపుత్రాయ శిష్యాయ వై పునః।। |
తెలియబడడేది ఎవ్వరు తెలుసుకుంటున్నారో, ఆ తెలుసుకొనే ఆయన యొక్క తత్త్వమేమిటో విశదీకరించేదే వేదాంతశాస్త్రము. అట్టి వేదాంత శాస్త్రముచే చెప్పబడుచున్నట్టిది, ప్రతిపాదించబడుచున్న పరమ సత్యము అయినట్టిది - మనము చెప్పుకున్నాము. ఇది పరమ రహస్యమైనది, రహస్యములలో కెల్ల రహస్యము. పూర్వకల్పములందు కూడా ప్రబోధించబడినట్టిది అయిన ఈ ఆత్మతత్త్వ శాస్త్ర విశేషాలను బోధించటానికి ఇంద్రియ విషయములపట్ల, జగత్ విశేషములపట్ల, జగత్ విశేషములపట్ల కొంత ప్రశాంతత సంపాదించు కొన్నవాడే అర్హుడు. తితిక్షా సంపన్నుడై, జగత్ విషయాకర్షణలను త్యజించుచున్నవాడే ఇందుకు తగినవాడు. అట్టి ప్రశాంతత సంపాదించుకోనప్పుడు, అట్టివాడు కొడుకు అయినా, శిష్యుడైనా కూడా ఈ ఉపనిషత్‌తత్త్వమును బోధించటానికి అర్హుడు కాడు. గురు శుశ్రూష, పితృభక్తి కలవానికే ఉత్తమ అర్హత. |
23. యస్య దేవే పరాభక్తిః యథా దేవే తథా గురౌ। తస్మైతే కథితా హి అర్థాః ప్రకాశంతే మహాత్మనః ప్రకాశంతే మహాత్మన ఇత్యుపనిషత్ |
- ఎవడు పరమాత్మకు భక్తుడై ఉంటాడో, - గురువుపట్ల దైవ భావముతో భక్తి-ప్రపత్తులు కలిగి ఉంటాడో…, అట్టి దైవభక్తి - గురుభక్తి కలవానికి మనము విరించుకొన్న ఈ ఆత్మబోధ- ఆతడు వింటూ ఉండగానే అనుభవమునకు రాగలదు. అట్టివాని సునిశిత-నిర్మల-విస్తార బుద్ధికి ఆత్మసామీప్యము సిద్ధించగలదు. ‘ఆత్మాహమ్’ అనునది తప్పక అనుభూతమౌతుంది. మహాత్మత్వము, స్వ-అనుభూతమై ఇప్పుడే ఇక్కడే సిద్ధించ గలదు. |
24. బ్రహ్మవాదినో వదన్తి సప్తదశ (17)। యుంజానః షోడశ (16)। య ఏకో జాలవాన్ ఏకవిగ్ం శతిః (21)। య ఏకోవర్ణో ద్వావిగ్ం శతిః (22)। ద్వే అక్షరే చతుర్దశ (14)। స్వభావమ్ ఏకే । త్రయోవిగ్ంశతిః (23) ఆహత్య త్రయోదశాధికం శతమ్ (113) (17+16+21+22+14+23 = 113) |
బ్రహ్మజ్ఞులు ఈ ఉపనిషత్ విశేషములను సప్తదశ (17) ఆత్మమహా విద్యగా చెప్పుకొస్తున్నారు. (17) ఇంకా 16, షోడశ మహావిద్యగా అభివర్ణిస్తూ ఉంటారు. (16) ఇంకా 21 తత్త్వ విశేషాలతో కూడినది గాను, ఇంకా మరికొందరు (21) ఇంకా 22 తత్త్వములలోని ఏకత్వమును ప్రవచించు సూత్రతత్త్వ ప్రవచనముగాను, చెప్పుకొంటున్నారు. (22) చతుర్దశభువనముల అక్షర - క్షరతత్త్వమును బోధించునదిగా కొందరు పండితులు ఉపాసిస్తున్నారు. (14) మరికొందరు 23 తత్త్వములలో, అనుస్యూతమైన (ఒక్కటిగా కూర్చబడిన) ఏకత్వము చెప్పు శాస్త్రముగా ఉపాసిస్తున్నారు. (23) (17+16+21+22+14+23 = 113) 113 విభజనలు గల మాయను జయించే ఉపాయముగా ప్రవచిస్తున్నారు. |
ఇతి కృష్ణయజుర్వేదాంతర్గత శ్వేతాశ్వరోపనిషత్।
ఓం శాంతిః। శాంతిః శాంతిః।।
ప్రథమాధ్యాయః - బ్రహ్మవాదుల సంభాషణము -ఒక శిష్యుని విశ్లేషణము
ఓం! శ్రీ శ్వేతాశ్వర మునీంద్రులు మహా ప్రజ్ఞావంతులు. గురుముఖతః బ్రహ్మతత్త్వము గురించి వింటూ, వేద-వేదాంగ, వేదాంత, వేదాంత-వేద్య విద్యా సార విషయాలు వివేక విజ్ఞాన దృష్టితో బహుకాలం పరిశీలించినట్టివారు. స్వకీయ విచారణ, వివేచనలను మరల-మరల ఆశ్రయిస్తూ సత్సంగములలో పాల్గొనుచూ బ్రహ్మతత్త్వజ్ఞాన - జ్ఞేయములను సముపార్జించుకొన్న మహామహనీయులు. బ్రహ్మతత్త్వజ్ఞులగు మహర్షి.
అట్టి శ్వేతాశ్వతర మునివర్యుల ఆత్మ ప్రవచన - ప్రబోధములను శ్రవణం చేస్తూ, ఆత్మ తత్త్వోపాసకులై అధ్యయనముచేస్తున్న ఆయన శిష్యులు వేద వేదాంత విద్యాతత్పరులై ఉండేవారు. ఏదో సందర్భంలో ఒకసారి ఒకచోట సమావేశమైనారు.
మహనీయులు, విజ్ఞులు, ఆత్మజ్ఞాన నిత్యోపాసకులు ఎక్కడైనా ఏదైనా సందర్భంగా కలిస్తే లోక సంబంధమైన జనుల పరస్పర వ్యవహారికమైన విషయాలు చెప్పుకుంటారా? లేదు. వారు ఆత్మతత్త్వజ్ఞానమే ఆశయముగా కలిగియుండి…. సంభాషించుకొంటారు కదా! ఆ శిష్యులు కూడా సత్సంగపూర్వకంగా సమావేశమై శ్రీ శ్వేతాశ్వతర మహర్షియొక్క బోధలను ఈవిధంగా మననము చేసుకోసాగారు.
శ్వేతాశ్వతర మహర్షి శిష్య బృందము - తాత్త్విక ప్రశ్నల పరిశీలన
బ్రహ్మతత్త్వజ్ఞానానందమే జీవిత మహదాశయముగా కలిగి ఉండినట్టి మహామహనీయులు, సద్గురువులు అగు శ్రీ శ్వేతాశ్వతర మహర్షి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను పరిశీలించవలసినదిగా నిద్రలేపుతూ, గుర్తు చేస్తూ ఉన్నారు కదా! ఆ ప్రశ్నలేమిటో ఇప్పుడు చెప్పుకొని, తత్ సంబంధిత సమాధానములను, విశేషములను వివరించుకొందాం.
❓ కిం కారణమ్ బ్రహ్మ? బ్రహ్మము దేని దేనికి కారణముగా అగుచున్నది? ఏది తాను కారణముగా కలిగియున్నది?
❓ కుతః స్మృతిః జాతం? ఈ దృశ్యమంతా ఎందులో ఉన్నది? ఒక వేళ ఇది ‘స్మృతి’ రూపమైతే, ఆ స్మృతి ఎందులోంచి బయల్వెడలుతోంది? ఈ విశ్వము ఎవ్వరియొక్క స్మృతి? (స్మృతి = జ్ఞాపకము, స్వ-అనుభూతి).
❓ జీవామ కేన? (జీవా నామ కేన?) జీవులమగు మనమంతా ఎవరిచేత సృజింపబడుచున్నాము? దేని వలన మనమంతా జీవించగలుగుచున్నాము?
❓ క్వచ సంప్రతిష్ఠితా? ఈ సృష్టికి ముందు, ఈ సృష్టిలో మనం ప్రవేశించకముందు మనమంతా ఎందులో ప్రతిష్ఠితులమై ఉన్నాము? ఇప్పుడు ఎందులో ప్రతిష్ఠితులమై ఉంటున్నాము? ముందు ముందు ఎక్కడ ఉంటాము? మరణము తరువాత ఎక్కడ (లోక) ఎందులో ఉండబోవుచున్నాము? ప్రళయానంతరము మన ఉనికి ఎక్కడ? ఈ జగత్తు ఎక్కడికి పోబోవుచున్నది?
❓ అధిష్ఠితాః కేన సుఖేతరేషు వర్తామహే? ఎవ్వరి సంకల్పము - అధికారమును అనుసరించి మనము సుఖదుఃఖములను పొందుతూ వర్తిస్తున్నాం? ఎందుకు పొందుచున్నాము? సుఖముగానే ఉండాలంటే అది ఎట్లా?
⌘
మొట్టమొదటగా ఈ జగత్ సృష్టికి మూలకారణము ఏమిటి? ఎవరు?
(1) ‘‘కాలమే’’ (TIME): ….అని కాలవాదులు అంటున్నారు. వారి ఉద్దేశ్యంలో ‘‘ఇదంతా కాలమహిమ మాత్రమే’’. కాలముచే వస్తోంది। కాలముచే తనే లయిస్తోంది. ఈ జగత్తుకు ఇంకెవ్వరూ కారణం కాదు!….’’ మరి ఆ కాలమును నియమిస్తున్న వారెవ్వరు? ‘‘కాలః కాలుడు’ (కాలమునే నియమిస్తున్నవారు) ఎవ్వరైనా ఉన్నారా?
(2) ‘‘స్వభావో’’ (Naturality): (లోకాయతులు మొ।।న వారు) ‘‘ఈ జగత్తు స్వభావం చేత జనిస్తోంది, ప్రవర్తిస్తోంది’’ అని అంటూ ఉంటారు. స్వభావమే ఇదంతా! మరి అట్లా అయితే, జగత్తును జనింపజేస్తున్న స్వభావము ఎవరిది? ఎవరిచేత, ఎవరి స్వభావంగా ఏర్పడినదగుచున్నది? స్వభావము ఎవ్వరిదీ అవకుండానే, తనకుతానే ప్రవర్తనశీలము కాగలదా?
(3) ‘‘నియతి’’ (destiny): ఒకానొక నియామక శక్తి ఇదంతా నియమించి జగత్తును ప్రదర్శనమగుచున్నట్లుగా చేస్తోంది-అని అంటూ ఉంటారు (నియతివాదులు). ఆ నియతిని, ‘‘ఇట్లా నియమించాలి!’’ అని నియమించుచున్న వారెవరు? నియమించువారు, నిర్దేశించువారు లేకుండానే నియమములచే తనే జగత్తు ప్రదర్శించబడగలదా?
(4) ‘యదృచ్ఛ’ (just accidental) : ఒక కుండను ఒక కర్రతో పగులగొట్టినప్పుడు ఒక్కొక్క కుండముక్క ఒక్కో ఆకారంగా ఉంటుంది. ఏ కుండ పెంకు ఏ ఆకారంలో ఉన్నదో….ఆయా వివిధ ఆకారాలకి కారణం? ఏ కారణములేదు. అందుచేత యాదృచ్ఛికం. ఈ సృష్టికి కారణమంటూ ఏదీ లేదు. అట్లాగే ఈ జగత్తు యాదృచ్ఛికంగా ఏర్పడి ఉంటోంది. ఏదీ కారణం కాదు’’ (నిరీశ్వరవాదులు) అంటున్నారు. అప్పుడు ఇక మనకు ఏర్పడుచున్న సుఖ దుఃఖాలు కూడా యాదృచ్ఛికమనే (Without being intended by any body) అనుకోవాలా? ఇదంతా యాదృచ్ఛికమైనది మాత్రమే అయితే, ఇది మనకు ఎందుకు వ్యవహారశీలమై అగుపిస్తోంది?
(5) భూతాని : ‘‘ఈ జగత్తు పంచభూతములైనటువంటి భూమి (Solid), జలము (liquid), అగ్ని (heat), వాయువు (vapour vibration), ఆకాశము (place - స్థలము - స్థానము) - ఈ ఐదు పంచభూతముల సమ్మేళనము. రకరకాల పాళ్లతో (In different quantities) సంయోగ వియోగములచే ఈ కనపడే స్థావర జంగమరూపాలన్నీ ఏర్పడుచున్నాయి. నశిస్తున్నాయి. ఇంతకుమించి ఇక్కడగాని - మరెక్కడగాని, ఏదీ లేదు. ఇది ఎప్పటికీ ఇంతే జరుగుతుంది. (జగత్ నిత్యత్వ వాదులు).
‘‘భావాలు, అభిప్రాయాలు, ఆశయాలు, సుఖఃదుఖాలు ఎట్లా పొందబడుచున్నాయి? వాటికి పంచభూతాలే కారణమా?’’ అంటే, ‘నేను’ అనేదే లేదా? (లేక) ‘నేను’ అనునది పంచభూతముల కలయికచే ఏర్పడి, అవి విడిపోగానే లేకుండా పోతోందా? - ఇవన్నీ ప్రశ్నలు అగుచున్నాయి.
(6) యోని: ‘‘ప్రకృతి తన గర్భమునందు ఈ దృశ్య జగత్తంతా కలిగినదై ఉంటోంది’’ అని కొందరి అభిప్రాయం. దేనియొక్క ప్రకృతి? దేనియొక్క యోని (లేక) గర్భమునందు ఇదంతా ఏర్పడినదై ఉంటోంది?
(7) పురుష ఇతి చింత్యమ్ : ఈ జీవునియొక్క స్వీయ చింతనా పురుషకారమే ఈ జగదనుభవం అని కొందరు యోగుల అభిప్రాయం. ఈ జీవుని చిత్తానుసారమే ఇదంతా ప్రాప్తిస్తున్నప్పుడు, మరి ఈ జీవుడెవరు? వాస్తవరూపమేమిటి?
(8) సంయోగ : స్త్రీ పురుష సంయోగము జగత్తుకు జీవుల దేహాలకుకారణము అని మరికొందరి భావన! మరి ఈ భౌతిక దేహము ఎవరి ప్రజ్ఞచేత ఈ రూపుదిద్దుకొంటోంది? ‘నేను’ అనునది ఎక్కడి నుండి వస్తోంది? బిడ్డల మనస్తత్త్వాలకు కర్త ఎవరు? తల్లితండ్రులా?
ఇవన్నీ అసలైన కారణములని అనటానికి వీలులేదు. ఎందుకంటే అవి ‘నేను’ అను ఉచ్ఛారణను నిర్వర్తిస్తూ ‘నేను’ అను అనుభవజ్ఞుని రూపమున ఉన్న ‘ఆత్మ గురించి విశ్లేషించటం లేదు. సుఖదుఃఖాలు ఎందుకు వస్తున్నాయో, ఎవ్వరి యొక్క తత్త్వముగాను, అనుభవజ్ఞుని రూపంగాను ఇదంతా ఉన్నదో వివరించటం లేదు. ‘‘నేను ఇది’’ అని నిస్సందేహంగా వివరించలేక పోతున్నాయని అనక తప్పదు.
ఉపనిషత్ వాణి
వేదాంతులు : ఇదంతా ఆత్మయొక్క భావనా వైచిత్ర్యమే। ఆత్మయే స్వీయకల్పితమగు జగత్ భావనయందు స్వయముగా ప్రవేశించి ఆస్వాదిస్తూ ఉండగా, ఎప్పుడో తన ఈశ్వరత్వమును ఏమరచుచున్నది. (స్వప్నంలో జరుగుచున్న తీరుగా) భావనాజనిత జగత్తులో తన్మయమగుచు తన ఈశ్వరత్వమును (తన కల్పనే కాబట్టి తానే జగత్ భావములకు యజమానినని) మరచిపోయి, సుఖ దుఃఖములు అనుభవిస్తోంది. తన ఈశ్వరత్వము ఎరుగటం జరిగిందా, - ఇక సుఖదుఃఖ ద్వంద్వములను అధిగమించినదై సహజమగు ఆత్మత్వమును సంతరించుకుంటోంది. ఇది వేదాంతశాస్త్ర వివరణ! |
బ్రహ్మవేత్తలు (బ్రహ్మము గురించి పరిశోధించువారు) ఈ విశ్వము, ఈ దృశ్య జగత్తు ఏమై ఉన్నది - అనే విషయం పరీక్షించి :-
→ ఇదంతా పరమాత్మయొక్క మాయాకల్పన। మాయా ప్రదర్శన విశేషమే। మాయా వినోదమే।
→ అట్టి పరమాత్మ…….సమస్త కల్పనాశక్తి సంపన్నుడు. అనంతగుణ సాగరుడు. నిగూఢముగా స్వగుణములు కలవాడై జగత్ ప్రదర్శన, దర్శన, ఆస్వాదములను మాయా ఉపాధితో నిర్వర్తిస్తున్నారు.
→ ఈ ‘జీవుడు’ - అనునది కూడా పరమాత్మయొక్క స్వకీయ ప్రదర్శనమే।
ఆ పరమాత్మ యొక్క నిగూఢమగు మాయా శక్తి రూప త్రిగుణ చమత్కారమే ‘‘విశ్వము (లేక) జగత్తు’’ - అని ధ్యానము ద్వారా గమనించుచున్నారు. ఆ రీతిగా గానం చేస్తున్నారు.
అనేకములుగా కనిపించుచున్న ఈ విశ్వమునకు అద్వితీయుడు, కాలస్వరూపుడు, లీలావినోదియగు పరమాత్మయే కారణము. ఆయన ద్రష్ట-దర్శన-దృశ్య త్రిపుటీ స్వరూపుడై సర్వమునకు వేరుగా ఉండియే జగదనుభవమునందు ప్రకాశించుచున్నారు. అనువర్తిస్తున్నారు. ఆస్వాదించుచున్నారు. అందులో బద్ధుడుగా కూడా అగుపించుచున్నారు. వాస్తవానికి నిత్యముక్తడే! (దృష్టాంతము: కల తనదైనవాడు - కల). కాబట్టి ఈ జీవుడుగా కనిపిస్తున్నది పరమాత్మయొక్క విభవమే।
సత్యద్రష్టలగు మహనీయులు-కేవలము, సమస్తమునకు ఆవల (పరము) అగు పరమాత్మను ఏవిధంగా దర్శిస్తున్నారంటే…,
ఏకము : అనేకముగా కనిపిస్తున్నప్పటికీ ఏకమే అయినట్టివారుగాను….,
నేమిమ్ : బండి చక్రము నందు మధ్యగాగల నేమి (ఇరుసు) తన చుట్టూ చక్రమంతటినీ త్రిప్పుకొంటున్నట్లు - ఈ విశ్వమంతటినీ తన చుట్టూ పరిభ్రమింపజేసుకుంటున్న వారుగాను…,
త్రివృతగ్ం : సత్త్వ - రజో - తమో త్రిగుణములచే ఆవరించబడి ఉన్నవారిగాను, (లేక) జాగ్రత్ - స్వప్న - సుషుప్తులనబడే త్రిదశలను తనయొక్క ‘3’ విధములైన ‘వృత్తులు’గా కలవారుగాను…,
షోడశాంతగ్ం : 16 కళలకు ఆవల గల కళాకారునిగాను (ఆ షోడశకళలు తనవైనవాడుగాను), అనగా పంచ 15 ఇంద్రియ - ఇంద్రియ విషయములకు, పంచప్రాణములకు, అంతఃకరణ చతుష్టయమునకు, జీవ-ఈశ్వర రూపములకు ఆవల ప్రకాశించు తేజోరూపుడుగాను,
శతార్ధారమ్: నేమికి చక్రములోని రేఖలవలె ‘50’ ఆకులు ప్రదర్శించువారుగాను (పంచ - పంచ → ‘భూత’ - ‘ప్రాణ’ - ‘ఉపప్రాణ’ - ‘‘కర్మేంద్రియ’’, ‘‘జ్ఞానేంద్రియ’’ - (‘‘ఇంద్రియ విషయ’’) ఇత్యాదులు కలవారుగాను,
విగ్ంశతి వ్యాత్యరాభి : ‘20’ ఉపరేఖలు కలిగి ఉన్నట్టివారు గాను.
అష్టకైః (8) - షట్‌భిః (6) విశ్వరూప ఏక పాశకం : 6–8 తత్త్వములతో - త్రాళ్ళతో కూడి విశ్వరూప కల్పన - అనే పాశము (బంధము) కలిగి ఉన్నట్టి వారుగాను, (పంచేంద్రియములు ం అంతఃకరణము / మనో బుద్ధి చిత్తములు)
త్రిమార్గభేదం - ధర్మ - అర్ధ - కామములచే ‘3’ మార్గములు కలిగియున్న వారుగాను…,
ద్వినిమిత్తమ్ : పుణ్య - పాపకర్మలు అనే రెండూ నిమిత్త కారణములుగా కలిగి ఉన్నట్టి వారుగాను,
ఏక మోహమ్ : (కల్పన-ఊహ-భావన రూపమగు) మోహముతో కూడి ఉన్నవారిగాను,
ఆ పరమాత్మను దర్శించుచున్నారు.! సమస్తమునకు ఆవల సాక్షిగా తేజోమూర్తులై నిత్యోదితంగా సమస్త దేహములలో సర్వదా వెలుగొందుచున్నటిదిగాను - ఆత్మను ఉపాసిస్తున్నారు. అట్టి మార్గంగా ‘సో2హమ్’ భావమును సిద్ధించుకొంటున్నారు.
⌘
పరమాత్మ ఒక నదీస్వరూపమని దృష్టాంతంగా అనుకుంటే
→ పంచశ్రోతో అంబుమ్ : పంచేంద్రియములనే తరంగాలకు (వాటి వాటి విషయాలకు కూడా) ఆత్మభగవానుడే జలస్వరూపుడై ఉన్నారు.
→ పంచ యోనిః ఉగ్రవక్త్రాం : స్థూలము, ద్రవము, ఉష్ణము, స్పందము, స్థానము అనబడు 5 (ఐదు) - వక్రగతులకు ఉత్పత్తి స్థానము (యోని) అయి ఉన్నారు. ఉగ్రమైన ముఖములు (Appearences). కలిగి ఉన్నారు.
→ పంచప్రాణ ఊర్మిమ్ : ప్రాణ - ఆపాన - వ్యాన - ఉదాన - సమానములను పంచ ప్రాణ చలన రూపములైన అలలకు స్పందన రూపమగు మూలప్రాణశక్తి (లేక) మూల చైతన్య రూపము. కదిలించేవారుగా ఉన్నారు.
→ పంచబుద్ధ్య - ఆది మూలమ్ : దేహము - మనస్సు - బుద్ధి - చిత్తము - అహంకారము అను ‘5’ తెలియబడే రూపములకు (లేక) స్వభావములకు ఆదిస్థానము (ప్రారంభస్థానము) అయి ఉన్నారు.
→ పంచ ఆవర్తామ్ - పంచ దుఃఖేఘ వేగామ్ : జన్మ - మరణ - ఆథిదైవిక - ఆథి భౌతిక - ఆథి ఆత్మిక పంచ దుఃఖములకు, దుర్భావన - దుర్‌హేళన - దూషణ - దుర్ పరిగ్రహణ - ద్రోహచింతన అనబడే పంచ అఘములకు వెనుకగా వేగరూపముగా ఉన్నట్టి చేతన చమత్కారము.
→ పంచాశత్ భేదం : ఆకలి - దప్పిక - రుచి - స్పర్శ - రూప….అశనములను కలిగించుచున్నవారు.
→ పంచపర్యామ్ : శిశు-బాల్య-కౌమార-యౌవన-వార్థక్య దశలను (పర్యములను) కల్పన చేసుకొని ఆస్వాదించుచున్నట్టివారు.
అట్టి లక్షణ, విలక్షణునిగా పరమాత్మను ధ్యానించాలి. సర్వమునకు కారణ కారణంగా పరబ్రహ్మమును భావిస్తూ ఉపాసించాలి.
ఇంకా ఆత్మ ఎట్టిది? ఏమని నిర్వర్తిస్తోంది? అను విషయమై ఆత్మగా దర్శించేమార్గంలో….
సర్వాజీవే : ‘‘సర్వజీవుల యొక్క జీవనరూపము ఆత్మయే’’ - అను సందర్శనముతో,
సర్వసంస్థే : సర్వులయందు, సర్వమునందును సర్వదా సంస్థితమై (ఏర్పడియున్నదై) ఉన్నట్టిదిగాను,
బృహత్ : అన్నింటికంటే మహత్తరమైనట్టిదిగాను దర్శించాలి.
ఈ జీవుడు వాస్తవానికి ఆత్మ స్వరూపుడే! స్వతఃగా బ్రహ్మచైతన్యమే!
- సర్వజీవ స్వరూపము
- సర్వత్రా ఉన్నట్టిది,
- బృహత్తరము
అగు బ్రహ్మముకు అనన్యుడే। అన్యము కాదు। బ్రహ్మము జీవునకు అన్యము కాదు।
ఏమైతేనేం? ఈ జీవుడు, బ్రహ్మచక్రములో నివసిస్తూనే, ఈ దేహము ఇంద్రియ విషయములు మొదలైన ఆయా వ్యవహారములలో చిక్కుకొని, వివిధరకములైన మనుష్య - జంతు దేవతాది స్వభావములను ప్రేరేపించుకొనుచు, అసంఖ్యాకములైన ఉపాధులలో సంచారాలు సలుపుచున్నాడు.
అట్టి సందర్భంలో తనయొక్క సహజము, అమృతతుల్య జీవ బ్రహ్మైక్య స్వభావము - అగు స్వస్వరూపమును ఏమరిచి ఉంటున్నాడు. ఫలితంగా అనేక సుఖ దుఃఖములను అనుభవించటం సుదీర్ఘంగా కొనసాగిస్తున్నాడు.
అనగా….
‘బ్రహ్మమే నేను’ అనునది ఏమరచి (స్వకీయ కల్పనారూపమగు) బ్రహ్మ చక్రములో ప్రవేశించి జన్మకర్మ భావ పరంపరలలో పరిభ్రమిస్తున్నాడు.
(ఉదాహరణకు / దృష్టాంతానికి : ఒకడు ‘నేను జాగృత్‌లో ఇది కదా!…..అనునది ఏమరచి, స్వీయ రచన అగు స్వప్నములో ప్రవేశించి, స్వప్నదృశ్యములో తదాత్మ్యము చెందుతూ భయము - దుఃఖము - సుఖము - వేదన మొ।।నవన్నీ పొందుచున్నతీరుగా) ఈ జీవుడు తనయొక్క అమృతస్వరూపమును పరిశీలించటమే లేదు.
ఎప్పుడో ఒకానొకప్పుడు -
ఏకారణంగానో ‘‘నేను దేహబద్ధుడనా? జీవాత్మ పరిమితుడనా? జన్మ - కర్మలచే దొర్లించబడు జడ వస్తువునా? లేక, ఇంతకుమించిన సత్యము నాకు సంబంధించినదై, ఏమైనా ఉన్నదా?’’ అనే మీమాంస ఈ జీవునిలో బయలుదేరుతోంది. ఇక ముముక్షువు అయి, నిదురలేవటం ప్రారంభిస్తున్నాడు. బ్రహ్మము గురించిన విద్యార్థి అగుచున్నాడు.
♠︎ సామవేద గానస్వరూపమగు ఉద్గీతము,
♠︎ సర్వమునకు పరమై ఆవల ఉన్నట్టిది,
♠︎ సర్వులలో సర్వ శ్రేష్ఠమై ‘పరబ్రహ్మము’ అని చెప్పబడుచున్నట్టిది,
♠︎ భోక్త (Experimear) - ప్రేరణ (Inspiration) - భోగ్యము (That being experienced) అను త్రిపుటికి స్థానమైనట్టిది,
♠︎ తనయందుతానే సర్వదా ఏర్పడినదై, ప్రతిష్ఠితమై ఉన్నట్టిది….
♠︎ మార్పు - చేర్పులు లేక ‘అక్షరము’ అయినట్టిది….,
అగు తనయొక్క అమృత స్వరూపమువైపుగా జ్ఞానచక్షువులు తెరచి, దృష్టిని సారిస్తున్నాడు.
వేదవిదులచే ఉద్గీతము (గానము) చేయబడుచున్న పరబ్రహ్మము గురించి ఎరుగుచున్నాడు. ఎరిగి బుద్ధిని నిలుపుచున్నాడు. ఇట్టి పరమునకు కూడా ఆవల ఉన్నట్టి ‘పరాత్ పరము’ అనే యోనియందు ప్రవేశించి, ఇక జన్మ కర్మలనుండి విముక్తుడు అగుచున్నాడు. కేవలము బ్రహ్మతత్పరుడై, ఈ జగత్తునందు క్రీడా వినోదివలె, దేని చేతను స్పృశించబడనివాడై, ఆత్మోద్యానవన సంచారి అగుచూ ఆనందంగా విహరిస్తున్నాడు.
జీవ - ఈశ్వరులు
జీవుడు - ‘‘వ్యక్తము, అవ్యక్తము’’ - అను రెండు భావతత్త్వాలను, ‘‘క్షరము, అక్షరము’’ అను రెండు చమత్కార ప్రదర్శనములను ఒకచోటికి తెచ్చుకొని ఆరెండిటిని భరిస్తూ, ‘విశ్వము’ అనే స్వప్నమును ఆస్వాదించుచున్నాడు.
నేనే దీనికంతటికీ (వ్యక్తావ్యక్తములకు) రచయితను కదా (I am the Author of those two twins) - అనే విషయమై ఏమరుస్తున్నారు.
‘‘నేను భోక్తను. (I am merely a recepient). ఇవన్నీ నాచే భోగించబడుచున్నాయి. (These are all being experienced by me) ఇట్టి భావనలు కారణంగా స్వకీయ కల్పనా, భావనా చమత్కారములచే తానే నిబద్ధుడై ఉంటున్నాడు.
ఈ విధంగా ఈ జీవునికి సంసారమంతా ప్రాప్తిస్తూ అనేక ఉపాధులు, స్థితిగతుల రూపంగా ఆతనిపట్ల సంప్రదర్శితమౌతోంది. ఇదంతా అనేక దుఃఖ పరిణామాలకు కారణమగుచున్నది.
మరి అటువంటి స్వీయ కల్పిత దుఃఖబంధములు తొలగటానికి దారి ఏది? ఈశ్వర దర్శనమే।
ఎప్పుడైతే ‘‘క్షర - అక్షరములకు, వ్యక్తి - అవ్యక్తములకు సాక్షి, కారణుడు అగు ఈశ్వరుని సందర్శనముచే అనీశ్వరత్వము తొలగుతుందో, అప్పుడు ఆ జీవుడు సర్వ ఉపాధుల రాకపోకలకు ఆవల గల ఈశ్వరత్వ జ్ఞానానందముచే స్పృశించబడుచున్నాడు.
జీవుడుగా వర్తమానంలో పొందుచున్నట్టి సర్వబంధముల (From Bondage of physical Body and limitation to the physical appearance) నుండి విముక్తుడు (RELIEVED) అగుచున్నాడు. ‘‘అనేక దేహపరంపరా నాటకములలో అనేక పాత్రలుగా నటించగల కళాత్మకుడను. మరి ‘‘ఒక నాటకములో ఒకపాత్ర’’ వంటి ఈ వర్తమాన దేహము-దృశ్యములచే ఎట్లా బంధించబడతాను?’’ - అని గమనిస్తున్నాడు.
ఈశ్వరుడు
ఈశ్వరుడు - సర్వజ్ఞుడు. అన్నీ తెలిసినవాడు. (అన్నీ అంటే….ఎక్కడ ఏమి జరుగుతోందో, ఎప్పుడు ఏం జరుగుతోందో తెలిసినవాడు - అని కాదు. మరి?) ఈ దేహముల రాక పోకలు - ఇవన్నీ ఆవల ఉండి చూస్తూ ఉన్నట్టివాడు. జన్మ-మృత్యువుకు ఈవల-ఆవల స్థితిగతులు ఏమిటో, ఎట్టివో…ఈ తతంగమంతా తాను వేరుగా ఉండి, వేరుగా ఎరుగుచూ ఉన్నవాడు. సాక్షి స్వరూపుడు.
జీవుడో, ఒక దేహము జనించిన తరువాత, దేహ సంబంధమైన శబ్ద - స్పర్శ - రూప - రస - గంధ విశేషాలు మాత్రమే ఎరిగి ఉంటున్నవాడు. వాటికి తాను పరిమితుడై ఉన్నట్లుగా భావించువాడు. తన శరీరమే తనకు పరిధిగా అనుకొనుచున్నవాడు.
ఈ జీవ - ఈశ్వరులు ఇద్దరు జన్మరహితులే! కలలో ఉండి కలను ఆస్వాదించే నేను కలతో జనించను కదా! అట్లాగే జన్మ నాదైన నేను-‘‘జన్మ’’లో జనించను.
ఈ విధంగా జీవ - ఈశ్వరులు జన్మలకు వేరే అయి ఉన్నవారేగాని జన్మాంతర్గతులై, జన్మలోని అంతర్విభాగస్వరూపులు కాదు. ఈ ఇరువురు భోగించువాడు - భోగించబడునది అనే ఉభయార్థములు (Both Functions) కలవారే! ఇరువురు మాయచే గోచరించేవారే!
పరబ్రహ్మము - బ్రహ్మజ్ఞానము
ఈ ద్రష్ట-దర్శన-దృశ్యములను స్వకీయ కల్పనగా కలిగి ఉన్నట్టిదే పరబ్రహ్మము.
అట్టి (ఈ జీవునియొక్క) పరబ్రహ్మ స్వరూపము ఎటువంటిది?
👉 అనంత స్వరూపమైయున్నది। దేహములచేతగాని, దృశ్య పరంపరలచేత గాని పరిమితము కాదు।
👉 జీవ-ఈశ్వరులు అద్దాని మాయా ప్రకృతి యొక్క ప్రదర్శనలే।
👉 కేవల - ఆత్మస్వరూపమై విరాజిల్లుచున్నట్టిది।
👉 విశ్వరూపో…. ఈ విశ్వమంతా తనయొక్క రూపముగా కలిగియున్నట్టిది।
👉 మాయి : ఈ మాయ తనదై ఉన్నట్టిది।
👉 అకర్త। అభోక్త।
అట్టి పరమాత్మ అనంతునిగాను, విశ్వరూపునిగాను, అకర్త - అభోక్తగాను, త్రిపుటిని కల్పించుకొనే క్రీడావినోదిగాను, సర్వుల సహజానంద స్వరూపముగాను….ఎవరు తెలుసుకొంటున్నారో…. వారు పరబ్రహ్మ స్వరూపులే! యదా విందతే బ్రహ్మమేతత్।।
క్షరము : జీవుని ఇంద్రియములకు అనుభవమయ్యేదంతా - నశించబోవు స్వభావము కలిగి ఉన్నట్టిది. ‘మార్పు చెందటం’ అనివార్యమై యున్నట్టిది. ‘ప్రధానము, మాయ’ అని కూడా చెప్పబడునది.
అక్షరము / అమృతము : పరమాత్మయో? అక్షరుడు. క్షరమును హరించువాడవటంచేత ‘హరుడు’. అవిద్యను హరించువాడు కనుక కూడా హరుడు. అనేకత్వమంతా హరించి ఏకస్వరూపుడై ప్రకాశించుచున్నవాడు కాబట్టి హరుడు. అమృతస్వరూపుడగు ఆ హరుని ధ్యానించటం చేతను, మరల మరల ఉపాసించటం చేతను, శివతత్త్వచింతన - శివ తత్త్వార్ధ దర్శనము చేతను భూయః శాంతే విశ్వ మాయా నివృత్తిః - ఈ విశ్వమాయా నివృత్తి అయి , తిరిగి ఈ జీవుడు పరమశాంతిని పొందుచున్నాడు. అనగా, ‘జీవో2హమ్’ కాస్తా ‘శివో2హమ్’…. గా సహజమై రూపుదిద్దుకుంటోంది.
జ్ఞాత్వా దేవగ్ం సర్వ పాశాపహానిః - అట్టి అక్షర బ్రహ్మ భగవానుని తెలుసుకోగానే సర్వ దృశ్యపాశములు తెగిపోతున్నాయి.
క్షీనైః క్లేశైః జన్మ - మృత్యు ప్రహాణిః - అట్టి తత్త్వజ్ఞానము సర్వక్లేశములను క్షీణింపజేయగలదు. జన్మ మృత్యు బాధలను ఉపశమింపజేయుచున్నది.
జీవ - ఈశ్వరులకు వేరైయున్న పరమాత్మ తత్త్వమును (మూడవ తత్త్వమును) తెలుసుకొన్నప్పుడు ‘ఈ భౌతిక దేహము నాకు బంధమగుచున్నది’ అను రూపంగా ఉంటున్న దేహబంధమునుండి విడివడి, పొందవలసినది పొందినవాడు (ఆప్తకాముడు) అగుచున్నాడు. పరబ్రహ్మస్వరూపుడే అగుచున్నాడు.
ఓ మిత్రులారా ! మనమంతా కూడా…., ఏతత్ జ్ఞేయమ్ నిత్యమేవ ఆత్మసగ్ంస్థం। మనలోనే సర్వదా వేంచేసి, సంస్థితుడైయున్న ఆ జీవ - ఈశ్వర కళా విశేష స్వరూపుడగు ‘పరమాత్మ’యే మనము సర్వదా తెలుసుకుంటూ ఉండవలసిన వస్తువు. అంతకుమించి తెలుసుకోవలసినదంటూ మరింకేదీ లేనే లేదు. అదొక్కటే పట్టుకోవాలి. మిగతావన్నీ పట్టుకొన్నా కూడా, వదలియే ఉండాలి!
అయితే…,
→ భోక్త (Feeler, Experiencer) అయినట్టి ఈ జీవుడు,
→ ఈతడు ఆస్వాదిస్తున్న ఈ దృశ్యజగత్తు, విశ్వము
→ ఆ రెండిటికీ సంధానమగు పరస్వరూపుడుగా ఉన్న ఈశ్వరుడు (లేక) ప్రేరకుడు (The inspirer).
ఈ మూడూ కూడా అజ్ఞాన దృష్టి చేతమాత్రమే వేరు వేరైనట్లుగా కనిపిస్తున్నాయి.
మనలో ఏకస్వరూపుడు - నిష్క్రియుడు అగు పరమాత్మయే జీవ - దృశ్య - ఈశ్వరులుగా కనిపిస్తున్నారు. కవియొక్క రచనా చమత్కారమే నవలంతా అయి ఉన్నతీరుగా, -బ్రహ్మమే ఈ సర్వము అయి ఉన్నది. మనయొక్క స్వరూప-స్వభావాలు బ్రహ్మమే! మనము అఖండము - అప్రమేయము అగు బ్రహ్మమే అయి ఉన్నాము.
పరమాత్మను ఎక్కడ దర్శించగలము?
అరణి (కొయ్య చెక్కలు)లో అగ్ని దాగి ఉండి, వాటిని ఒకదానితో మరొకటి ఒరిపిడి కలిగించినప్పుడు ఆ అగ్ని నిప్పు కణముల రూపంలో (యజ్ఞ యాగాలలో మొట్టమొదట అగ్నిని జనింపజేసే ప్రక్రియలో) బయల్వెడలుతోంది. ఆ కొయ్యలను విడిగా ఎక్కడైనా చూచినప్పుడు వాటియందు అగ్ని కళ్ళకు కనబడదు కదా!
కొయ్యలో అగ్నియొక్క స్వరూపము (తేజస్సు) గాని, అగ్నియొక్క గుణములు (తగులబెట్టం మొ।।వి) గాని, (ఆ కొయ్యచెక్కను కంటితో చూచినప్పుడు) ఏవిధంగా అయితే, కనిపించవో,….. కంటికి కనబడకపోయినా కూడా ఆ అగ్నికి లింగ నాశనము లేదో….,
ఆ విధంగానే…..,
పరమాత్మ-ప్రకాశకము, సర్వాంతర్యామిత్వము, అప్రమేయము, నిత్యత్వము - ఇత్యాది కలిగియే ఉండి, ప్రతి దేహమునందు సర్వదా వెలుగొందుచూనే ఉన్నారు. అయితే అప్రయత్నశీలుడై ఉన్నప్పుడు - ఆ దేహికి (ఇంద్రియ విషయములవలె) - (కొయ్యలో దాగిన అగ్నిలాగానే) - అనుభవమవటం లేదు.
‘ప్రణవము యొక్క ఉపాసన’ అనే అభ్యాసరూప ఒరిపిడిచే, ఘాతముచే, మధనముచే - ఆత్మస్వరూపము ఆ దేహికి దేహమునందే అనుభూతము అవుతోంది. అనగా తనయొక్క సర్వ నియామకము - అనంత చిదాకాశ స్వరూపము అగు ఆత్మయొక్క అనుభవము తనయందే కలుగుతోంది. కాబట్టి, ఈ జీవుడే ఈశ్వరుడు అభావనారూప - అరణిచే ఆత్మాగ్నిని ప్రజల్వింపచేయాలి.
⌘ ఈ ప్రకృతికి చెందినది - ప్రకృతి ప్రసాదితము అగు ఈ భౌతిక దేహోపకరణమును - క్రింది అరణి (క్రింది కొయ్య)గాను…. (ఈ దేహమును సాధన వస్తువుగాను)
⌘ మనస్సుతో ప్రణవమును (అకార - ఉకార - మకారములను, జాగ్రత్ - స్వప్న - సుషుప్తుల సాక్షి, జీవ - దృశ్య - ఈశ్వర భావముల ఆవలగల ఆత్మ పురుషుడు, ప్రకృతి - పురుష కారముల ఆవల పురుషోత్తముడు - అనే భావన) ఉత్తరారణి (క్రింద కొయ్య) గాను,
⌘ ధ్యాస, - ధ్యానము (ఇదంతా శివానంద తత్త్వమే అను భావన)….అను అభ్యాసమును నిర్మధనరూపంగాను (కొయ్య - కొయ్యలను రాపిడి చేసే విధిగాను…) [ధ్యానము = ఏకాగ్రత + అనుస్మరణ Concentration and repeatedly chanting the idea, etc.,] నిర్వర్తించుచూ, ఈ జీవుడు తనయందు గూఢముగా దాగియున్న పరమాత్మతత్త్వమును ప్రజ్వలింపజేసుకోవాలి. వెలికి తీయాలి.
దృష్టాంతంగా…,
⌘ నువ్వులలో నూనె ఉంటుందా? ఎందుకు ఉండదు? తప్పక ఉంటుంది. మరి నువ్వులను చూచినప్పుడు నూనెయొక్క రూపముగాని, లక్షణాలు గాని లభిస్తాయా? లేదు. నువ్వులను గానుగ ఆడితే….అప్పుడు రూప - గుణ - లక్షణాలతో సహా నువ్వులనూనె లభిస్తోంది. అట్లాగే ఆత్మోపాసనారూపమగు ప్రణవధ్యానముచే పరమాత్మ ఈ జీవునికి తనయందే లభిస్తున్నారు.
⌘ పాలలో నేయి (Ghee) ఉన్నదా? ఉన్నది. నెయ్యి లభించేది పాలలోంచే కదా! మరి ఎట్లా లభిస్తుంది? పాలు కాచి, తోడు వేసి, ఆ తరువాత పెరుగును చిలికి వెన్న తీసి మరల కాస్తే….అప్పుడు నేయి లభిస్తుంది. అట్లాగే, సాధనచే తనయందలి పరమాత్మ అనుభవము కాగలడు.
⌘ తరంగము జలము కోసము వెతకటం ఎటువంటిదో, ఈ జీవుడు పరమాత్మకోసం వెతకటం అటువంటిది. తరంగాలలోనే జలమున్నట్లు, తరంగము జలమునకు అభిన్నమైనట్లు, ఈ జీవాత్మయందు (లేదా, ఈ దేహమునందు) పరమాత్మ సర్వదా వేంచేసి ఉన్నారు.
(పై దృష్టాంతాలవలె) దేహమునందే పరమాత్మ నిగురుకప్పిన నిప్పువలె దాగి ఉన్నారు. మనయందే మనము అట్టి పరమాత్మను దర్శించాలి.
➤ అసత్యమును అధిగమించి సత్యమునే బుద్ధితో ఆశ్రయిస్తూ ఉండటము. (బుద్ధితో సర్వము పరమాత్మగా భావన చేయటము) (అసతోమా సద్గమయ),
➤ ఆత్మదర్శనము నిమిత్తమై బుద్ధిని నిర్మలం చేసుకొను రూపమైన తపన (లేక) తపస్సు.
ఈ రెండిటి సహాయంతో హృదయాంతరంగుడగు పరమాత్మను, బుద్ధిమంతులు సర్వదా దర్శిస్తున్నారు. మనము అట్టి పరమాత్మభావనను సముపార్జించుకొనెదముగాక!
ఒక పాత్రలోని పాలలో వెన్న ఎక్కడ ఉన్నది? పాలకు క్రిందగానా? పై పాలలోనా? ఉత్తరమువైపు పాలలోనా? దక్షిణమువైపు పాలలోనా? లేదు, లేదు! వెన్న పాలలో అంతటా ఉన్నది.
అట్లాగే…..
మనయొక్క మహదాశయ విషయమగు - స్వస్వరూప పరమాత్మ…..:-
★ బాహ్యమునగల ఈ విశ్వమునందు (ఇంద్రియములచే పొందబడుచున్న జగద్దృశ్యమునందు),
★ అంతరంగమున గల మనోబుద్ధి చిత్త అహంకారములందును,
అంతటా, అన్నిటా, సమస్తము తానే అయి వెలయుచున్నారు.
అట్టి పరబ్రహ్మము గురించియే ఉపనిషత్ మనకు ‘‘నీయందుగల ఇదియే పరమాత్మ’’ అని చూపుచున్నది. (తత్త్వమసీతి।) ఇక చూడటమో…మనవంతు! విద్యార్ధులమై మనము ఆత్మ విద్యను ఆత్మానుభవము పొందుటకొరకై అభ్యసిస్తూ ఉండెదముగాక!
ద్వితీయో2ధ్యాయః - యోగాభ్యాసము - చిత్తయోగ స్థితులు-రెండవ శిష్యుని విశ్లేషణము
మునుముందుగా ఉత్తమము - సుతీక్షణము - విస్తారము అగు బుద్ధితో ఈ మనస్సును ఇంద్రియ విషయముల నుండి విరమింపజేయుచు, ఉపశమింపజేస్తూ రావాలి.
‘ఓం’ సజ్ఞార్థము అయినవాడు, సంవిత్ స్వరూపుడు (సత్ + విత్ - (ఉనికి + ఎరుక)బీ సత్‌విత్‌బీ సవిత్/ సంవిత్‌బీ (విరమింపజేయటము = ‘ఇది’ ఆత్మకు వేరైనది’’ అను భేదము వదలి, ‘ఆత్మ భావనతో దృశ్యమును దర్శించటము).
సత్ + విత్ + ఋత్ (సత్యము) = సవితృ స్వరూపుడు అగు పరమాత్మ యందు మనస్సును నియమించాలి.
‘‘ఈ గుణప్రదర్శనలు - రూపనామాలు పరమాత్మతత్త్వ ప్రదర్శనమే। కాబట్టి, సవితృరూపమే! ఓంకారమే!’’ - అను పవిత్ర బుద్ధి, ఇంద్రియ దృష్ట్యతీత భావనయే - ఇక్కడ మనము చెప్పుకొనే ‘మనస్సును నియమించటము’ అనునది.
ఈ మార్గములో మనస్సును నియమించే ఉపాయములు - నిత్యోపాసనా శాస్త్రీయ విధానములైనట్టి
- అగ్న్యోపాసన, ధ్యానోపాసన, జ్యోతి ఉపాసన, ప్రాణోపాసన, దైవోపాసన, సత్కర్మోపాసన మొదలైనవి.
ఇట్టి అభ్యాసములచే భూతతత్వమును శుద్ధి చేసుకోవాలి. మనస్సును - కళ్ళకు భౌతికంగా కనిపిస్తూన్న నామ రూపాత్మకమైనదానిని, త్రిగుణ సంబంధమైన సమస్తమును - అధిగమింపజేయాలి.
అనగా, మనస్సును విషయములనుండి దాటించాలి. విషయము విషయములుగా కాకుండా ‘‘ఇదంతా కూడా ‘పరబ్రహ్మము’ అనే కథారచయిత యొక్క కథా కథన చమత్కారమే’’ - అని అనిపించాలి. ఈ విధంగా మనము సంవిత్ సర్వరూపమగు బ్రహ్మ తత్త్వముపై మనస్సు నిలుపుటకొరకై మహనీయులతో సత్సంగము, ధ్యానముల సాయముతో ఏకాగ్రతను ఆశ్రయిస్తూ ప్రయత్నశీలురము అయ్యెదముగాక!
ఒకడు ధ్యానము - తపస్సు - యజ్ఞము - మొ।।వాటిచే మనస్సును, బుద్ధిని ‘‘అందరిలో, అందరుగా ఉన్నవాడు - వేదస్వరూపుడు - అందరినీ ప్రేరేపించువాడు’’ …అగు పరమాత్మయందు నిలుపుతూ, రాగా అట్టివాడు ‘విప్రుడు’ అని అనిపించుకుంటున్నాడు. వేదమును ఈ తీరుగా శాస్త్రమును అభ్యసించి ‘విప్రుడు’ అగుచున్నాడు.
విప్రుడు శాస్త్రార్థముల ఎరిగినవాడై బృహత్ స్వరూపమగు బ్రహ్మమును స్వానుభవముగా పొందుచూ ‘బ్రాహ్మణుడు’ అగుచున్నారు. చిత్తము బ్రహ్మమునందు నిశ్చలమగుచుండుటచే బ్రాహ్మణత్వము సిద్ధిస్తోంది.
సర్వత్రా వ్యాపించియున్నవాడు, ‘సవితృ’ శబ్దముచే పలుకబడుచున్నవాడు, దేవతలకే దేవుడు అగు అట్టి పరబ్రహ్మముపట్ల యజ్ఞభావితులమై ఎల్లప్పుడు బ్రహ్మజ్ఞులు చూపిన మార్గములో స్తోత్రములు చేసెదము గాక! నిష్ఠ కలిగి ఉండెదము గాక!
పూర్వాత్ పూర్వ ప్రకాశమానము, సమస్తమునకు ప్రకాశకము అగు పరబ్రహ్మమునకు మనము భక్తి ప్రపత్తులతో నమస్కరించుచున్నాము. శ్లోకాయన్తి। గానము చేయుచున్నాము. సూరులగు ఆత్మజ్ఞుల మార్గమే మనము నడిచే సన్మార్గ పధము. బ్రహ్మపథమే మనము ఆశ్రయించవలసినట్టిది. ఆ పరమేశ్వరుని వైపుగా అమృత స్వరూపులగు (సృష్టికర్త అగు) బ్రహ్మ - మొదలైన దేవతలు మన ప్రార్థనలను ఆలకించి, మనకు మార్గదర్శకులు అయ్యెదరు గాక!
ఓ మనో-బుద్ధులారా!
రండి! మావెంట నడవండి. మిమ్ములను పరబ్రహ్మోపాసనయందు నియమించుచున్నాము. ఆ దివ్యమైన పరంధామమును చేరుటలో మీరు మాకు సహాయకులై మా వెంట వచ్చెదరు గాక!
ఓ మనస్సా!
→ ఎక్కడ అగ్నిని ఆహ్వానించి మేము క్రతువులు, ఉపాసనలు నిర్వర్తిస్తున్నామో….
→ ఎక్కడ ప్రాణోపాసనాదులతో వాయుదేవుని ద్వారా పరమాత్మ యొక్క ఉపాసనకు ఉపక్రమిస్తున్నామో…,
→ ఎక్కడ సోమో (యజ్ఞ) నిష్ఠులమై యజ్ఞపురుషుని మేము ఆరాధిస్తున్నామో….,
అక్కడనే నీవు నిలచి ఉండెదవుగాక! జగత్ విషయరూప మనస్సుతో మేము క్రతు - యజ్ఞ - తపో - ధ్యాన - యోగములతో పరమాత్మను ఉపాసిస్తున్నాము. తత్ప్రయోజనముగా పరమాత్మ సంబంధితమైన మనస్సు మాపట్ల వికసించును గాక! మా బుద్ధి పరమాత్మ ప్రాంగణము చేరుటకై ప్రేరేపితమగును గాక!
┄ ┄ ┄
ఈ మనస్సు - బుద్ధి ఎక్కడి నుండి జనిస్తున్నాయి? అగ్ని ఏ తేజో తత్త్వమునందు వెలుగొందుచున్నదో, వాయువు ఎద్దానిచే ప్రేరితమై చరిస్తోందో, ఏది చంద్రలోకమునకు ఆవల ఉండి (ఔషధ రూప ప్రశాంత) చంద్రలోకమునకు జనించే స్థానమైయున్నదో….అట్టి పరబ్రహ్మమే మనో బుద్ధుల ఉత్పత్తి స్థానము కూడా!
ఓ మనో బుద్ధులారా! బ్రహ్మజ్ఞులు చూపించే ఆత్మ సందర్శన మార్గములో మీరు మా వెంటనంటి నడువటం మీకు స్వభావమే అయి ఉన్నది. కనుక కృత్రిమమగు ఇంద్రియ విషయ మననమునుండి విరమించుచూ, స్వాభావికమగు ఆత్మయందు రమించుటకై సహకారి కారణములవండి.
సత్ - విత్ - ఋత్ (సవితృ) రూపుడు, సృష్టికర్తయగు బ్రహ్మకు కూడా ఆది కారణుడు, సృష్టి కంటే మునుముందే ఉన్నట్టి పురాతనుడు అగు పరమాత్మను మనో బుద్ధి చిత్తహంకార యుక్తంగా సేవించినప్పుడు మాత్రమే - ఈ సంసార బంధములనుండి మనము విముక్తులము కాగలము. ఈ సర్వము ఆయనగా దర్శించటమే - మనము అనుసరించు మార్గము. అట్టి పరబ్రహ్మోపాసన కొరకై సద్గురువులు యోగేశ్వరులగు మహనీయులు మనకు ధ్యానమార్గము సూచించుచున్నారు.
ధ్యానము
→ ధ్యానము చేయడానికై చక్కటి ప్రదేశమును ఎన్నుకొని,
→ సుఖాసనా శీలురమై, (శరీరము అనుకూలమై దీర్ఘకాలము నిశ్చలముగా ఉండగల ఆసనమును స్వీకరించి),
→ శిరస్సు - కంఠము - శరీరము…..ఈ మూడింటినీ కూడా నిలువుగాను, నిశ్చలముగాను ధారణచేస్తూ,
→ ఇంద్రియములను - ఇంద్రియార్థములందు, ఇంద్రియార్థములను, ఇంద్రియ విషయములను మనస్సునందు, మనస్సును హృదయస్థానమునందు నిలిపి,
→ ఈ సర్వమును బ్రహ్మముగా భావన చేస్తూ,
→ ‘‘బ్రహ్మభావన’’ అనే ఓడ సహాయంతో జనన - మరణ రూప తరంగములతో అనేక భయములను కలుగజేస్తున్న సంసార రూపసముద్రమును మనము దాటివేయాలి.
‘మనస్సు’ అనే దుష్టాశ్వాన్ని (దుష్ట అభ్యాసములు గల గుర్రమును) సదభ్యాసములచే కడిగి ‘శ్వేతాశ్వము’ (నిర్మలమైన తెల్లటిగుర్రం)గా తీర్చిదిద్దుకోవాలి.
తెలివైన రథికుడు
‘జీవుడు’ అనే రథికుడు ‘దేహము’ అనే రథాన్ని అధిరోహించి, ఇక గమ్యము వైపుగా సాగిపోతున్నాడు. అయితే రథం ఆనందమయమైన ‘పరమాత్మ’ వైపుగా కాకుండా, దుఃఖప్రదమగు ఇంద్రియ విషయ పరంపరల వైపుగా పరుగులు తీస్తోంది. ఫలితం? బంధములు తెచ్చిపెట్టుకుంటోంది.
అప్పుడు ఆ రథికుడు పరిశీలించాలి… విషయమేమిటిరా? అని!
‘‘-ఆహా"! ఈ గుర్రాలు (ఇంద్రియాలు) మొండివి. సారధి (బుద్ధి) బలహీనుడు. ఆతనిని కూడా తప్పుత్రోవ అవి పట్టిస్తున్నాయి. సారధి చేతిలోని కళ్ళాలు (మనస్సు) బలహీనమైనవి. ఆశయాలు (చిత్తము) అల్పమైనవి’’ - అని గమనించి, ఇక వాటిని సరిచేయుటయందు ప్రయత్నశీలుడు అవ్వాలి కదా!
అట్లాగే, మనము ఆవిధముగా నేర్పుగల రథికులమై, దేహిగా ఈ దేహమనే రథమును సరియైనమార్గంలో ఉత్తమమైన మనోబుద్ధి - చిత్తములతో ఆత్మభావనవైపుగా ఉపయోగించుకోవాలి. శాస్త్రములు - గురువులు సూచించే ఉపాయాలు ఆశ్రయిస్తూ ఆత్మావగాహన - ఆత్మభావన వైపుగా అవగాహనను మరలించాలి.
★ యుక్తము (wel disciplined) అగు ఆహార - విహారములతో (యుక్తాహార విహారస్య),
★ మనస్సును ఇంద్రియ విషయసమూహముల నుండి నిరోధిస్తూ,
★ ప్రాణ - ఆపానముల కదలికలను వశంచేసుకోవటానికై కొరకై ప్రాణాయామమును అభ్యసిస్తూ…..
★ అప్రమత్తులమై మనస్సును సర్వత్రా ఆత్మభావనయందు ధారణ చేస్తూ
హృదయస్థుడగు పరమాత్మయందు ధ్యాసను నిశ్చలమగునట్లుగా నిలుపుతూ, మన మన సాధనలు కొనసాగించెదము గాక! ఆత్మభగవానునిలో ఏకత్వము, అనన్యత్వము కొరకై ఆత్మతత్త్వధ్యానమునకు ఉపక్రమించెదము గాక!
ప్రాణాయామాభ్యాసము
(సాధనపూర్వకంగా) ప్రాణ - అపానముల కదలికల నిరోధ - సమత్వ అభ్యాసమే-ప్రాణాయామము. నాసిక నుండి గాలి పీల్చి, నాశికపై భ్రూమధ్యగా నిశ్చలం చేస్తూ, అట్టి సాధనచే మనస్సును విషయములనుండి నిరోధించి ఆత్మవైపుగా మహనీయులు మరల్చుచున్నారు. మనము కూడా అప్రమత్తతతో అట్టి ధారణను దైనందికంగా ఆశ్రయించెదము గాక!
1) ప్రాణాయామము 2) ఇంద్రియ విషయముల నుండి విరమించటము 3) ఆత్మయందు నియమించటము-అనే మూడు ప్రక్రియలతో కూడిన ధ్యానసహితమైన ప్రాణోపాసనయొక్క సానుకూల్యత కొరకై కొన్ని పరిసర సంబంధమైన జాగరూకలు కూడా అవసరం.
ప్రదేశము
⬭ ఎత్తు పల్లాలు లేనిదై ఉండాలి.
⬭ పరిశుభ్రంగా తీర్చిదిద్దుకోవాలి.
⬭ గులకరాళ్లు, బురద, ఇసుక, దుమ్ము, ధూళి లేకుండా శుభ్రముగా చేసుకోవాలి.
⬭ జలాశయ ధ్వనులు, డబడబ శబ్దములు, జంతువుల కేకలు….ఇటువంటివి బిగ్గరగా వినబడని స్థలమై ఉండాలి.
⬭ పరిసరములు మనస్సును రంజింపజేయుతీరుగా ఉండాలి. గురువుల-ఇష్ట దేవతల ప్రతిమలు, పటములతో అలంకరించబడినవై, ప్రశాంతము ప్రసాదించేవిగా ఉండుగాక!
⬭ ఆ ప్రదేశము పెనుగాలి వీచనిదై ఉండును గాక! ఏకాంతమునకు సానుకూలమై ఉండును గాక! మనస్సును రంజింపజేస్తూ అనుద్వేగమును, ప్రశాంతత కలిగించునదై ఉండాలి.
యోగాభ్యాసము చేస్తూ ఉండగా ప్రవృద్ధమగు చిత్తయోగ స్థితులు
🪔 మొట్టమొదట శరీరముయొక్క లోపల బయట కూడా మంచువలె చల్లగా (coldness) అనిపించటం ప్రారంభిస్తుంది. (విషయముల ఉపసంహరణ)
🪔 క్రమంగా పొగ - వెచ్చతనము (అగ్ని దగ్గరలో ఉన్నట్లుగా) అనుభూతం కాగలదు. (ఉత్సాహము)
🪔 తరువాత చుట్టూ జలప్రవాహం ఉన్నట్లు అనిపించగలదు. (పరమాత్మయొక్క ఉనికి)
🪔 అటు తరువాత అంతటా ఆకాశము, ఆ ఆకాశములో మెఱుపుల ప్రకాశము అనుభూతమవుతుంది. (తేజోరూపము)
🪔 అటుపై తెల్లటి స్పటికము వలె కనిపిస్తుంది (సాత్వికత)
🪔 ఆపై పున్నమినాటి చంద్రకాంతి వలె ఈ దృశ్యము పరమ ప్రశాంతముగాను, మనోహరంగాను, మధురముగాను గోచరమవుతూ వస్తుంది (ఆనందము)
….. ఇవన్నీ బ్రహ్మమును క్రమక్రమంగా అభివ్యక్తీకరించు సంజ్ఞలు. ఇట్టి గుర్తులు…యోగమును సిద్ధింపజేయు యత్నములు సఫలమగుచున్నట్లు, క్రమంగా బ్రహ్మప్రాప్తికి సమీపమగుచున్నట్లు భావిస్తూ ఉండెదము గాక.
భౌతికదేహంలో యోగాగ్ని ప్రభావం
ఈ భౌతిక దేహము - (1) పృథివి (solid) - (2) ఆపః (liquid)- (3) తేజో (Heat) - (4) వాయువు (స్పందన) (5) ఆకాశము (placing) - లతో కూడిన - ఒక జడవస్తువే అయి ఉన్నది.
ప్రకృతిచే ప్రసాదించబడిన ప్రాణశక్తి ఇద్దానిని ఉత్తేజపరుస్తూ, సత్-చిత్ స్వరూపుడగు జీవునికి నివాసయోగ్యముగా అగుచున్నది. అయితే ఈ దేహము జడమే అయి ఉండినప్పటికీ, యోగులు యోగసాధనలు నిర్వర్తిస్తూ ఉండగా పవిత్రమగు యోగాగ్ని ఈ దేహములో ప్రత్యక్షమై వృద్ధి చెందసాగుతుంది. యోగ అభ్యాసము యొక్క ప్రవృత్తిచే దేహము దూదిపింజమువలె తేలికగా, ఉత్సాహముతో కూడిన కదలికలు కలిగినదగుచున్నది. నైరాశ్యము తొలగుచూ, ఏకాగ్రత వృద్ధి చెందసాగుతుంది.
ప్రాణాయామాభ్యాసముచే యోగాగ్నిమయమైన శరీరము కలవానిపట్ల మృత్యుభయము, జరా భయము, రోగభయము తొలగుతాయి. శరీరము తేలికగాను, మృదువుగాను, ఆరోగ్యవంతముగా అగుచున్నది. మనస్సు - లౌకికమైన ఆశ, నిరాశ, పేరాశలను అధిగమించుచున్నది. బుద్ధి - ఇంద్రియ లోలుపత్వమును, దృశ్య ఆకర్షణలను జయించివేయుచు, ప్రకాశమానముగా అగుచున్నది. భౌతికదేహము పుష్టిగా సౌష్ఠవము పొందుచున్నది. కంఠధ్వనిలో సుస్పష్టత, నిర్దుష్టిత, సుశబ్దత, గాంభీర్యత, మధురనాదము పెంపొందుతూ ఉంటాయి. ‘‘యోగాభ్యాసి’’ యొక్క శబ్దోచ్చారణను వింటున్నప్పుడు అనిర్వచనీయమగు ఆనందము, ఉత్సాహము, ప్రేరణ సహజంగానే కలుగుతూ ఉంటాయి.
యోగుల శరీరము సుగంధమును వెదజల్లుచున్నదై ఉంటుంది. మూత్రము - పురీషము - చెమట తక్కువ అగుచూ వస్తాయి. అవి దుర్గంధ రహితము అగుచూ ఉంటాయి.
ఇవన్నీ యోగాభ్యాసం ప్రారంభించినవారి స్వాభావిక లక్షణాలుగా యోగశాస్త్రముచే పేర్కొనబడుచున్నాయి. అందుచేత మనమంతా శ్రద్ధగా, దైనందికంగా, భయము-విషాదము-బద్ధకము వదలివేసి సర్వదా ప్రాణాయోగాభ్యాసనిరతులమై ఉండెదము గాక!
┄ ┄ ┄
ఇంటి ఇల్లాలు ఇంటిలోని వెండి - రాగి - బంగారు - పంచలోహ విగ్రహాలు మకిలి పట్టినప్పుడు ఏంచేస్తున్నారు? కచ్చిక, మట్టి మొదలైనవాటిని పూసి, రాపిడి చేసి, తోమి, ఆ తరువాత నిర్మలమైన జలముతో పరిశుభ్రం చేస్తున్నారు. అప్పుడు ఆ విగ్రహాలు పవిత్రము - శుభ్రము అయి తళతళ మెరుస్తూ ఉంటాయి.
అదేరీతిగా ప్రాణాయామము-ధారణ-మంత్రోచ్చారణ-ఇత్యాది ప్రయత్నములచే శ్రద్ధాభక్తులతో కూడిన యోగి యొక్క మనో - బుద్ధులు పవిత్రతను, పరిశుభ్రతను, నిర్మలతను సంతరించుకో సాగుతాయి. ఆ యోగి క్రమంగా ఆత్మసందర్శనం చేత అద్వితీయుడు, కృతార్థుడు, శోకవర్జితుడు, స్వస్వరూపాత్మానంద భరితుడు అయి బ్రహ్మానందమునందు ఓలలాడుచున్నాడు.
యోగాభ్యాసము యొక్క ప్రభావంచేత యోగియొక్క అంతఃకరణములో బ్రహ్మతత్త్వము స్వయముగా ప్రకాశిస్తున్నది. (తత్ స్వయం యోగ సంసిద్ధః కాలేన ఆత్మని విందతి). క్రమంగా బుద్ధి నిశ్చలము - నిర్మలము అగుచూ ఆత్మతత్త్వమునందు లీనమగుచున్నది. ఆ యోగి ఆత్మస్వరూపియై ప్రకాశిస్తూ ‘యుక్తుడు’ అని పిలువబడుచున్నాడు. ఇంకా ఆపై (యోగాభ్యాస విశేషం చేత) ఆతడు - అజము, ధృవము, సర్వతత్త్వస్వరూపము, విశుద్ధము, దివ్యము - అగు ఆత్మను ఎరిగి, సర్వ మానసిక దోషములనుండి విముక్తుడగుచు మోక్షరూపమగు ఆత్మాకాశ స్వరూపుడై విహరిస్తున్నాడు. కేవల సర్వాత్మానందస్వరూపుడై, నాలుగు దిక్కులలోను - నాలుగు ఉప దిక్కులలోను, క్రింద - పైనా, 14 లోకాలలోను నిండినవాడగుచున్నాడు. సర్వదా సర్వమునకు అతీతుడై, కేవలసాక్షీభూతుడై సర్వమును ఆస్వాదిస్తూ ఉంటాడు. సమస్తమునందు స్వస్వరూపాత్మను, స్వస్వరూపాత్మయందే సమస్తమును దర్శించుచూ ఆ యోగయుక్తుడు ఆత్మానంద భరితుడై ఉంటున్నాడు. ఇహమును, పరమును సుఖప్రదంగా సమన్వయించుకొని ఉంటాడు.
జన్మల కన్న మునుముందే గల ‘తత్’ స్వరూపుడౌతాడు. జన్మలు వస్తూ, పోతూ ఉన్నప్పుడు, జన్మల రాక పోకలు సశాంతించినప్పుడు కూడా ఏకరూపుడై అఖండానందస్వరూపుడై, చిద్విలాసుడై విరాజిల్లుచున్నాడు. ‘‘నేనే అన్ని చోట్లా అన్ని రూపములుగా జనిస్తున్నాను. అన్ని రూపములుగా అంతటా ఉన్నది నేనే! నాది కానిదిగాని, నేను కానిది ఎక్కడా ఏదీ లేదు’’…అనే ఆత్మా2హమ్ తత్త్వాన్ని స్వభావసిద్ధంగా ఆస్వాదిస్తున్నాడు.
సర్వత్రా సర్వమై సర్వతోముఖుడై, సర్వమునకు వేరై ప్రకాశించుచున్నాడు.
┄ ┄ ┄
ఏ ఆత్మ భగవానుడైతే…,
అగ్నియందు తేజోరూపుడై,
జలమునందు రసస్వరూపుడై,
విశ్వమంతా విశ్వాంతర్గతుడై,
భువనమంతా భౌమానందరూపుడై,
భూమియందు ఓషధీస్వరూపుడై,
వృక్షలతలయందు వనస్పతి స్వరూపుడై,
సర్వముతానై, సర్వమునకు సాక్షి అయి సమస్త జీవుల సహజస్వస్వరూపుడై, సర్వమునకు పరుడై ఉన్నారో….
అట్టి పరమపురుషునికి, దేవాది దేవునికి నమో నమో నమో నమః।। ఏదేది ‘నాది-నాది’ అని మనకు అనిపిస్తున్నదో, అదంతా కూడా, ‘‘సమస్తము ఆ పరమ పురుషునిదే’’ అను సమర్పణ అభ్యాసించుచుండగా, మనము పరమపురుషుడే అగుచున్నాము.
తృతీయో2ధ్యాయః - ఏకో రుద్రో। - 3వ శిష్యుని విశ్లేషణము
శ్వేతాశ్వతర మహర్షి :
ఏకము - అఖండము అగు ఆ పరమాత్మ మాయాకల్పనయందు సముత్సాహి అయి, మాయావిష్టుడై, తనయొక్క విశ్వకల్పనాశక్తితో….
⌘ ఈ సర్వమును నియమించువారు (The creator),
⌘ నియమించబడుచునట్టి ఈ సమస్తము (The created)
….. ఈ ఉభయముతానే అయి బాలాలీలావినోదము సలుపుచున్నాడు.
⌘ ఈ సర్వమును వ్యాపింపజేస్తున్నది ఆయనయే।
⌘ ఈ సర్వముగా వ్యాపించుచున్నదీ కూడా ఆయనయే।
ఆత్మభగవానుడే….
⌘ ఉద్భవింపజేయుచున్న వాడు (ఈశ్వరుడు),
⌘ ఉద్భవించుచున్న అనుభవుడు (జీవుడు),
⌘ ఉద్భవించబడుచున్నది (ప్రకృతి) కూడా!
ఎవ్వరైతే సర్వస్వరూపుడు - స్వస్వరూపుడు కూడా అయి ఉన్నారో,…అట్టి పరబ్రహ్మము గురించి ఎవ్వరైతే యోగానుభవ పూర్వకంగా తెలుసుకొనుచున్నారో,….వారు మృత్యువు యొక్క పరిధులు అధిగమించి (జన్మచే ఏదో పొందుచున్నాను - మృత్యువుతో ఏదో కోల్పోవుచున్నాను అనే భ్రమను తొలగించుకున్నవారై) అమృతత్త్వమును సంతరించుకొనుచున్నారు.
┄ ┄ ┄
సర్వాంతర్యామియగు భగవానుడగు రుద్రుడు ఒక్కరే! ఆ ఒక్కడే ఈశ్వరుడు - జీవుడు - జగత్ దృశ్యరూపములుగా (త్రిమూర్తి స్వరూపుడై) అంతటా సర్వదా వేంచేసియున్నారు. నేను - నీవు - అతడు - అది - ఇది - పురుషుడు - ప్రకృతి….ఇత్యాదులు ఆయనకు వేరుగా లేవు. ఏకము - సర్వము అగు ఆ రుద్రభగవానుడే సమస్తము అయిఉన్నారు. అందుచేత భగవానుడగు రుద్రుడు అద్వితీయుడు. ఆయనకు ద్వితీయ మనునది లేనేలేదు. సర్వము ఆయనయే! శివాత్ పరతరమ్ నాస్తి. ఆయనయే అంతటా విస్తరించి, సమస్త జీవులలోను సర్వస్వరూపుడై ఉన్నారు. విస్తరింపజేసేది - విస్తరించియున్నది - ఆస్వాదించుచున్నది - ఆస్వాదించబడుచున్నది కూడా! నియమించుచున్నది - నియమించబడుచున్నది కూడా ఆయనే!
అందరిలోను, అందరుగాను ప్రత్యగాత్మరూపులై వెలుగొందుచున్నదీ ఆయనే. ఆయన తనయొక్క మాయాశక్తి (లేక) కల్పనాకళా విశేషముచే చతుర్దశ భువనములతో కూడి ఈ విశ్వమును తనయందు తానే వినోదియై సృష్టిస్తున్నారు. స్థితింపజేస్తున్నారు. పరిపోషిస్తున్నారు. లయింపజేస్తున్నారు. పునః సృష్టించుచున్నారు. ప్రళయకాలములో తనయందు ఈ సర్వమును లీనము చేసుకుంటున్నారు. కాలస్వరూపుడై సృష్టి-స్థితి-లయములు నిర్వర్తిస్తూనే, ‘‘అకర్తయై, పరమై’’ ఉంటున్నారు.
ఆ రుద్రభగవానుడు ఒక్కడే! ఏకమే అయి అనేకముగా (అజ్ఞానమున్నంతవరకు) అనిపిస్తున్నారు. ఆయన తన నుండి ఆకాశము- భూమి- అంతరాళము (In between space)లను సృష్టించుకొని సర్వత్రా ద్రష్టయై వీక్షిస్తున్నారు. ద్రష్ట-దృశ్యము-దర్శనము….తానే అయి సర్వత్రా చక్షువులు కలిగి ఉన్నారు. దృష్టాంతానికి ఒకడు నిదురించి తనయందు తానే స్వప్నదృశ్యమును కల్పించుకొని ఆస్వాదిస్తూ ఉన్నప్పుడు
⌘ స్వప్నమంతా తనయందే! ➤ స్వప్నము తనదే!
⌘ స్వప్నాంతర్గత ద్రష్ట తానే! ➤ స్వప్న దృశ్యమంతా తానే తన స్వప్న చైతన్యము స్వరూపముచే నింపి ఉంచటము.
⌘ స్వప్నమునకు తాను సర్వదా వేరే! ➤ స్వప్నము లేకున్నా కూడా తాను ఉండియే ఉంటున్నవారు -
…అగుచున్నాడు కదా! స్వప్నంలో స్వప్న ద్రష్టకు వేరైనదేమున్నది? తాను స్వప్నములోని ఏదో ఒక రూపము అవటమెక్కడున్నది.
అట్లాగే ‘‘పరమాత్మ స్వరూపుడనగు నేను జాగ్రత్ - స్వప్న - సుషుప్తులను, ద్రష్ట - దర్శన - దృశ్యములను కల్పించుకొంటూ, సర్వమునకు వేరై (ప్రత్యక్ ఆత్మ స్వరూపుడనై) ఉన్నానుకదా!’’ అనునది సద్గురుబోధానుసారము (మరియు) తత్త్వశాస్త్ర మహావాక్యానుసారము గ్రహించెదము గాక!
(స్వప్నంలో కనిపించే వ్యక్తులందరూ - స్వప్నము తనదైనవానియొక్క భావనా స్వరూపులే అయి, వారందరు ఆతనికి అభిన్నస్వరూపులు అయినరీతిగా),… పరమాత్మయే సర్వే సర్వత్రా అన్నివైపులా ముఖములు కలిగినవారై ఉన్నారు. అంతటా బాహువులు (వేరువేరైన (Functioning), పాదములు (wandering) కలిగి అనేక రూపములుగా అగుచున్నారు. అనేకములైన వేరు వేరు సమావేశములను (Multi-Associations and verieties of relationships in the unity) నిర్వర్తిస్తున్నారు. మట్టి ఒక్కటే అయినప్పటికి (సంక్రాంతి బొమ్మల కొలువులో) అనేక రీతులైన వేరు వేరు బొమ్మల సమూహాలుగా కనిపిస్తున్నట్లు - పరమాత్మయే ఈ దృశ్యమంతా కలిగి ఉంటున్నారు. ఆయన తనయొక్క ‘ఉభయబాహువుల శక్తి సామర్థ్యముచే - ఆకాశము, భూమి, మానవుడు మొదలైనవాటిని, ఇంకా సర్వ జీవరాసులను జనింపజేస్తున్నారు.
ఏ కారణకారణుడగు పరమాత్మ -
• సర్వదేవతా స్వరూపముగా ప్రభవిస్తున్నారో,
• దేవతలకు ఆదికారణుడో,
• దేవతలకు సర్వశక్తి - సంపద - పరిపాలన ప్రభావములను ప్రసాదిస్తున్నారో,
• విశ్వాధిపో…ఈ విశ్వమునకు ఆవల సాక్షీభూతుడై ఉండి ఈ విశ్వమంతా పరిపాలిస్తున్నారో…..,
• రుద్రుడై సృష్టి - స్థితి - లయములను పర్యవేక్షిస్తున్నారో…..,
• (మహత్ + ఋత్ + ఈష = మహర్షి) మహత్తరమగు ‘‘ఆత్మౌపమ్యేవ సర్వత్రా’’ అను ప్రజ్ఞగల మహర్షుల రూపము ధరించి, పరమసత్యము గురించి విశ్వమంతా వినిపించేరీతిగా గానం చేస్తున్నారో….,
• హిరణ్యగర్భుడై ఈ విశ్వములోని పదార్థములను, వాటి - వాటి ధర్మములను, జీవరాసులను, జీవన స్రవంతులను, సృష్టినంతటినీ కల్పనా చమత్కారంగా సృష్టిస్తున్నారో…, సృష్టికి పూర్వమే ఉండి, సృష్టిని భావించి, సంకల్పించి, ఇదంతా నడుపుచున్నారో…, అట్టి ఆత్మ భగవానుడు మనకు నిర్మల బుద్ధిని ప్రసాదించి, అల్ప భౌతిక దర్శనమునుండి రక్షించి, ఆత్మదర్శనము అను శుభదృష్టిని ప్రసాదించెదరు గాక!
హే పరమపురుషా! పరంధామా!
సర్వాత్మకుడవు, సర్వతత్త్వ స్వరూపుడవు, సర్వతత్త్వ విదూరుడవు అగు హే రుద్రభగవాన్! శివము - మంగళకరము అగు మీ విశ్వశరీరము మా భౌతికమైన - అల్పమైన కళ్లకు, దృష్టికి స్థూలముగా కనిపిస్తున్నప్పటికి కూడా మీరు అఘోరస్వరూపులు! సూక్ష్మాతి సూక్ష్మమగు, సర్వాధారమగు, సర్వులలోని ప్రేరణమగు - చిత్ చైతన్యానంద దేహులు.
అపా ప్రకాశినీ! ‘దోషములు’ అణే చీకట్లను తొలగించు ప్రకాశస్వరూపా! మీయొక్క విశ్వకళా స్వరూపము - శోభాయమానము అగు శివానంద స్వరూపమును కించిత్ స్మరించినంత మాత్రంచేతనే మీరు మాయొక్క అల్పబుద్ధులను పాపదృష్టులను తొలగించి మమ్ములను పవిత్రులను, పునీతులను చేయుచున్నారు.
పర్వతనివాసియగు ఓ రుద్ర దేవా!
అల్పజ్ఞులమై సంసారలంపటములో చిక్కియున్న మాపై మీ అమృతవీక్షణములను ప్రసరింపజేయండి! సుఖ-శాంతి - ఆనంద కైవల్యములను-అభిచాకశీహి। -మాపై కరుణతో మాకు ప్రసాదించెదరుగాక! ఆత్మభావనామృతమును అందించెదరుగాక!
మీరు పర్వతవాసియై, హస్తములలో శివధనస్సును, శంఖమును, డమరుకమును ధరించి ఎందుకు సంచరిస్తున్నారు? అనేక ఉపాధులుగా దృశ్యమును వాస్తవమైనదిగా నమ్మి, తత్ఫలితంగా భవబంధముల రూపంగా అనేక దుఃఖములను పొందుచూ దిక్కుతోచక ‘పాహి’, ‘పాహి’ అని అర్ధిస్తున్న మమ్ములను రక్షించటం కోసమే కదా! మీ కరుణా కటాక్ష వీక్షణచే….మమ్ము మా సంసారభావాలు, దృష్టులు ఇక మమ్ము బాధించకుండును గాక! మాపట్ల ఇదంతా శివము-శాంతము-ఆత్మానందప్రదము అగు గాక! ఈ జగత్తు పరమ పురుషుడగు రుద్ర భగవానుని సంప్రదర్శనారూపమై అనుభూతమగును గాక!
┄ ┄ ┄
శ్లో।। తతః పరంబ్రహ్మ పరం బృహంతం, యథా నికాయం సర్వభూతేషు గూఢం,
విశ్వస్య ఏకం పరివేష్టితారమ్, ఈశం - తం జ్ఞాత్వా అమృతా భవంతి।।
ఆ పరంబ్రహ్మమూర్తి….
✤ ఈ విశ్వ రూపుడై ఉండియే….ఈ విశ్వముకంటే పరము (ప్రత్యేకము, మహత్తరము) అయి, పరబ్రహ్మము అయి ఉన్నారు.
✤ ఒక నటునియొక్క ‘పాత్రధారణకు’ సంబంధించని వ్యక్తిగతమగు ఆవల రూపమువలె సర్వదా పరమై ఉన్నవారు.
✤ సమస్తమును అధిగమించు, బృహత్తరమై సర్వత్రా విస్తరించి ఉన్నారు.
✤ సర్వదా ఈ సమస్తమును తనయందు లీనము చేసుకొని యున్నారు.
✤ సర్వ జీవులలోను ‘అంతర్యామి’ అయి వ్యాపించి, సర్వము సర్వదా తానే అయి ఉన్నారు. అందుచేత మాలోని ప్రతి ఒక్కరికి అనన్యులు.
✤ ఈ విశ్వమంతా తన ఏకరూపముయొక్క ఒక ‘అంశ’గా కలిగి ఉండి సర్వమును నియమించుచు, పర్యవేష్టించుచున్నారు.
✤ సర్వనియామకుడై ఈశ్వరుడుగా, పర్యవేక్షకుడుగా, ప్రేక్షకుడుగా కూడా - వ్యాపించి ఉన్నవారు. సమస్తమునందు సర్వదా వర్తించుచున్నారు.
అట్టి రుద్రభగవానుని, మహాదేవుని ఎవ్వరైతే…. పైవిధంగా ఎరుగుచున్నారో, అట్టివారు మృత్యువు (మార్పు) యొక్క పరిధులను దాటి, అమృతులగుచున్నారు.
స్వస్వరూపాత్మ భగవానుని,
✤ సర్వదేవతా స్వరూపుడుగా….,
✤ విశ్వ స్వరూపుడుగా….,
✤ విశ్వభర్త - హర్తగా….,
✤ సర్వాంతర్యామిగా…..,
✤ స్వహృదయాంతర్గతునిగా….,
✤ సర్వ స్వరూపునిగా…..,
✤ స్వస్వరూపునిగా…..,
భక్తి - జ్ఞాన - యోగ - వైరాగ్య మార్గాల కలగలపుగా అధ్యయనముచేస్తూ తెలుసుకొంటారో,…వారు ఇప్పుడే, ఇక్కడే అమృతస్వరూపులు అగుచున్నారు!
(మన సద్గురువులు శ్రీ శ్వేతాశ్వతర మహర్షి వంటి) బ్రహ్మజ్ఞుల, తత్త్వజ్ఞుల, విదితవేద్యుల బోధలు విన్న…. మనము బ్రహ్మతత్త్వమును ఎరుగుచున్నాము. బృహత్తరమగు స్వస్వరూపమును సర్వత్రా గమనిస్తూ నిత్యానందులమగుచున్నాము.
శ్లో।। వేదాహమ్ ఏతం పురుషం మహాన్తమ్, ఆదిత్య వర్ణం తమసః పరస్తాత్,
తమేవ విదిత్వా, ‘అతి మృత్యుమ్’ ఏతి। న అన్యః పంథా విద్యతే అయనాయ।।
→ ఆది + తత్ + యత్ = ఆదిత్య। ఎవ్వరైతే సర్వమునకు ఆదిస్వరూపులై ఉన్నారో….(సర్వ కిరణములు జీవులైతే, పరమాత్మ సూర్యభగవానుడు వంటి) అట్టి ఆదిత్యుడై, ఆదిత్యవర్ణుడై, నిత్యస్వయం ప్రకాశకుడై,
→ ఎదురుగా పాంచ భౌతికంగా అనిపించే దృశ్యము - అనే అజ్ఞాన చీకటికి ఆవల స్వయం ప్రకాశస్వరూపుడై, సమస్తమునకు ప్రకాశకుడై….., మనలోనే - అంధకారమునకు ఆవల, ఆ అంధకారమును చూస్తూ ఉన్నవారై ఉన్నారో,
మహత్తరము-మహిమాన్వితములతో కూడిన ఏ పరమ పురుషుడు సర్వత్రా ప్రకాశమానులై ఉన్నారో,…..ఆ ఆత్మ భగవానుని గురించి సద్గురు బోధల సహాయంతో మనము తెలుసుకుంటున్నాము.
ఆయనను తెలుసుకొని మనము మృత్యుపరిధులను దాటివేస్తున్నాము. ‘‘దేహములు రావచ్చు - పోవచ్చు గాక! మనము ఆ రాక పోకలకు సంబంధించిన వారిమే కాము! అవి ఆత్మస్వరూపులమగు మనకు సంబంధించినవి కావు’’…..అని గ్రహించినవారమై మృత్యువును దాటివేసిన వారము అగుచున్నాము. జన్మ-జీవన్-జరా-మృత్యువులకు సాక్షీభూతులమై, చెదరని చిరునవ్వుతో వీక్షించుచున్నాము.
ఆత్మ గురించి ఎరుగుటయే మృత్యువును అధిగమించటము. అమృతస్వరూపులం అవటము. మృత్యువును దాటి వేయటానికి ఉపనిషత్ వాణి - గురువాక్యముల - వేద మహావాక్యార్థములు అగు టోందో,
అట్టి పరమపురుషునిచే ఈ సర్వము పూర్ణమైయున్నది। తేన ఇదమ్ పూర్ణమ్ పురుషేణ సర్వము ‘ఆత్మేయేవాస్మ్యహమ్’ అను జ్ఞానము - అనుక్షణిక సుస్థిరానుభవము సంపాదించుకోవటమే ! అది తప్పించి, వేరే త్రోవలేదు!
అమృతత్వము = దేహ మనో చిత్త అహంకారములకు సంబంధించినవై కనిపిస్తున్న మార్పు-చేర్పుల పరిధిలచే స్పృశించబడని కేవల స్వస్వరూపానుభవము.
➤ యస్మాత్ పరం నాపరమ్ అస్తి కించిత్। ఎద్దానికైతే ‘‘పరమైనది (ఆవల) - అపరమైనది (ఈవల)’’ అంటూ వేరుగా ఏదీ లేదో, అంతా ఆత్మస్వరూపమే, ఆత్మ ప్రదర్శనమే కాబట్టి ఆత్మకు ఆవల - ఈవల మరేమీ లేనట్టిదై ఉన్నదో…,
➤ (యస్మాత్) న అణీయో - న జాయో అస్తి కశ్చిత్ సూక్ష్మాతిసూక్ష్మమై ఉన్నది కాబట్టి, ఏ ఆత్మ వస్తువు కంటే సూక్ష్మమైనది మరింకేదీ లేదో, ఈ స్థూలముగా కనిపించేదంతా కూడా అద్దాని కల్పనయే కాబట్టి, అద్దాని కంటే మరేదీ స్థూలము అయి ఉండదో…,
➤ వృక్ష ఇవ స్తబ్దో। ఏది వృక్షమువలె దేహముల - గుణముల రాకపోకల, వర్తన - అవర్తనముల సందర్భములలో కూడా యథాస్థానంలో ఉన్నచోటే (ఎటూ కదలక) యథాతథమై ఉంటోందో….,
➤ దివి తిష్ఠతి ఏకః - భూతాకాశము వలెనే ఏ ఆత్మాకాశము సర్వదా ఏకము, అఖండము అయి ఉంటోందో,
అట్టి పరమపురుషునిచే ఈ సర్వము పూర్ణమైయున్నది। తేన ఇదమ్ పూర్ణమ్ పురుషేణ సర్వము (All this is filled up by, as well as made up of that absolute self - parama purusha)। ఆ పూర్ణ పురుషుడే - నేను। నీవు। సమస్త జీవులు। దేవతలు। లోకములు। సమస్తము కూడా। అట్టి పరమపురుష నిత్య సందర్శనమే ఆత్మజ్ఞానము, ఆత్మోపాసన, ఆత్మసాక్షాత్కారము కూడా!
శ్లో।। తతో యత్ ఉత్తర తరం, తత్ అరూపం అనామయమ్
య ఏతత్ విదుః అమృతాః తే భవంతి।।
ఏ పరమపురుషుడైతే…,
♠︎ ఈ దృశ్యములో కనిపించే కార్య - కారణ - కర్తృత్వములతో సహా ఈ సర్వమునకు ఆవల, సర్వదా వేరై, సమస్తమును ప్రకాశింపజేయువారై ఉన్నారో….
♠︎ రూపములన్నీ తనవే అయి కూడా రూపరహితులై ఉన్నారో….
♠︎ ఈ విశ్వమంతా తనయందే కలిగి ఉండి కూడా, తనయందు ఏదీ లేనివాడై, అనామయుడై ఉన్నారో….
ఎవ్వరు అట్టి పరబ్రహ్మమును తెలుసుకుంటున్నారో… అట్టి వారు ఆ అమృతస్వరూపమే అగుచున్నారు.
అథ ఇతరే దుఃఖమేవ అపి యంతి।। తదితరమైనది ఏది ఎంతగా ఎంతవరకు తెలుసుకున్నప్పటికీ దుఃఖము తొలగదు. శాశ్వతమైన సుఖము లభించదు. వాస్తవానికి తదితరమైనదంతా దుఃఖప్రదమేగాని, సుఖప్రదము కాదు.
♠︎ సర్వ ఆనన శిరో గ్రీవః। ఈ సర్వ ముఖములు, శిరస్సులు, కంఠములు ఆ పరమపురుషునివే….!
♠︎ సర్వభూత గుహాశయః। సర్వ హృదయ గుహలను నిండి ఉండి, సర్వజీవుల ఆశయములుగా నాటకీయ ప్రదర్శించుచున్నది మహారచయిత అగు ఆ పరమపురుషుడే!
♠︎ సర్వవ్యాపీ స భగవాన్। (నాటకంలోని సర్వపాత్రల స్వభావములు, ఆశయములు నాటకరచయితవే కదా!) ఈ సర్వము పరమాత్మయొక్క సూత్రధారిత్వమే. అందుచేత ఆయనయే సర్వగతుడగు శివ భగవానుడు। సర్వగతశ్శివః।
♠︎ మహాన్ ప్రభుర్వై పురుషః। సర్వపురుషకారములు స్వీయ ప్రదర్శనమే అయి ఉన్న మహాపురుషుడు! జగద్దృశ్యమంతా ఆయన ప్రవర్తనా చమత్కారమే।
♠︎ ప్రభుః। సర్వమునకు నియామకుడు! నిర్ణయ కర్త! పరిపాలించుచున్నట్టివాడు। ప్రభువు।
♠︎ పురుషః। సర్వజీవులలోని క్రియా విశేషుడు! ఈ సమస్త లోకములు తనయొక్క పురుషకారమే అయి ఉన్నవాడు.
♠︎ సత్త్వస్యః। కేవల ‘సత్’ స్వరూపుడు. ఆయనయే ‘ఉనికి’ (సత్) కలవాడు. తదితరమైనదంతా కేవలము కల్పనయే.
♠︎ ప్రవర్తకః। ఇదంతా ఆయనయొక్క సంచారము-సంచలనము అయి ఉన్నవారు. ఈ విశ్వమును ప్రవర్తింపజేయువారు - సర్వస్య ఏష ప్రవర్తకః!
♠︎ సునిర్మలా। సునిర్మలుడు. ఆయనను కర్మ-జన్మ దోషములు స్పృశించనే లేవు.
♠︎ ఈశానో - అంతటా విస్తరించి యున్నట్టి ఈశానుడు.
♠︎ జ్యోతి స్వరూపులు। జ్యోతికే జ్యోతి। స్వయం జ్యోతి స్వరూపులు।
♠︎ ఆత్మజ్యోతి స్వరూపులు. మార్పు-చేర్పుల పరిధులకు అతీతులు. అవ్యయులు।
ఆయనను ఉపాసించువాడు అట్టి శివస్వరూపుడే అగుచున్నాడు. ఆయనను స్వస్వరూపుడుగా దర్శించటమే మహదాశయము.
శ్లో।। అంగుష్ఠ మాత్రః పురుషో అంతరాత్మా, సదా జనానాగ్ం హృదయే సన్నివిష్టః
హృదా మన్వీశో మనసా అభిక్లప్తో, య ఏతత్ విదుః, ‘అమృతా’ తే భవంతి।।
స్వహృదయంలోనే అంగుష్ఠ (బొటనవేలు పరిమాణంగల) ప్రేరకుడు - తేజోమయుడుగా ప్రకాశిస్తున్న ఆ పరమపురుషుడే - సర్వజీవుల హృదయగుహలో - సర్వదా ప్రకాశమానుడై ఉన్నారు. పొగలేని అగ్నివలె తన చిత్‌ప్రకాశమును అంతటా వెదజల్లుచున్నారు. ‘మనస్సు’ అనే పళ్లెముచే మూయబడి ఉన్నారు. ఆ పళ్లెము చివరల నుంచి ప్రసరించే కాంతియే విశ్వరూపముగా అభివ్యక్తమగుచున్నది.
ఎవ్వరైతే తమ హృదయమునందే ప్రకాశించుచున్న ఆత్మభగవానుని బుద్ధితో గ్రహిస్తూ ఉంటారో, వారే మోక్షస్వరూపులు। అమృతస్వరూపులు। ఆత్మానందాను భవులు।
హృదయంలో సర్వాత్మకుడగు పరమాత్మ అంగుష్ఠమాత్రుడై వసించుచు తనయందు తానే బ్రహ్మాండ దృశ్యమంతా కల్పించుకొని ఆస్వాదించటమునుగా గమనించటమే ‘యోగ దర్శనం’! ‘ఆత్మదర్శనం!’ (అంగుష్ఠ = యోగముద్రలలో బొటనవ్రేలును నిలువుగా ధారణ చేయటము - ‘తత్’ - పరమాత్మకు సంజ్ఞ।) చూపుడు వ్రేలు ‘త్వమ్’కు సంజ్ఞ. క్రింద మూడు వ్రేళ్లు సత్వ-రజో-తమో గుణములకు సంజ్ఞ.
ఆ పరమపురుషుడు…
శ్లో।। సహస్ర శీర్‌షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్
స భూమిం విశ్వతో వృత్త్వా, అత్యతిష్ఠతి దశాంగులమ్।।
- ఒక ‘అడుగు’ (one feet) లో -మార్పు చెందు ఈ విశ్వమంతా 2 అంగుళములుగా ఇమిడి ఉండగా, పరమాత్మ ఇంకా ఆవల పది అంగుళములుగా మార్పు చెందని రూపముతో విస్తరించి ఉన్నారు. (దేహి దేహమును దాటి మనో, బుద్ధి, చిత్త, అహంకార, ఈశ్వరులుగా గుణత్రయంగా, జీవ-ఈశ్వరులుగా విస్తరించి ఉన్నది). - అనగా, నా ఆత్మ యందు ఈ విశ్వమంతా 2 అంగుళములతో ఇమిడి ఉండగా, నేను ఈ విశ్వమునకు ఆవల ఆత్మస్వరూపుడనై విస్తరించి ఉన్నాను. - స్వప్నద్రష్ట స్వప్నములోని సర్వ రూపములు తానే అయి, స్వప్నమంతా తానే ఆక్రమించియుండి, స్వప్నమునకు ఆవల విస్తరించి ఉన్న రీతిగా మమాత్మ ఈ సర్వమును అధిగమించినదై ఉన్నది. |
పరమపురుషుడు: ఈ సమస్తము ఏ పరమాత్మయొక్క పురుషకారమో, ఆయనయే పరమ పురుషుడు.
ఇప్పుడు విశ్వరూపంగా (వర్తమానంలో) ఉన్నది, ఇతఃపూర్వ (భూతకాలము)లో ఉండి ఉన్నది. భవిష్యత్‌లో విశ్వరూపంగా ఉండబోవుచున్నది కూడా- ఇదంతా కూడా పరమ పురుషుడే! పురుష ఏవ ఇదగ్ం సర్వం, యత్ భూతం, యచ్ఛ భవ్యం। ఆయనకు వేరై-ఇప్పుడుగాని, ఇతఃపూర్వముగాని, ఇకముందుగాని - ఏదీ లేదు. ఈ విశ్వము జనించుచున్నది ఆ పరబ్రహ్మమునందే! ఉన్నది పరబ్రహ్మమునందే! లయించబోయేది కూడా పరబ్రహ్మమునందే! ఇదంతా…, ఉత అమృతత్త్వస్య ఈశానో, యదన్నేనా తిరోహతి।
ఆయన నుండే! ఆయనగానే! ఇదంతా అయి ఉన్నది ఆయనే! పరబ్రహ్మ స్వరూపుడగు ఈశానుడే! నేను-నీవు-దృశ్యము….అంతా స్వతఃగా సర్వదా పరబ్రహ్మమే! ఒక గొప్ప రచనలో రచయితచేత కానట్టిది ఏముంటుంది? ఆయన రచనలో ఆయనకు బాహ్యమైనదేముంటుంది? ఆయనను అన్నముగా (అనుభవముగా) సిద్ధించుకొన్నవాడు తిరిగి ‘అన్యము’నకు తిరోధానము పొందడు.
✩ సర్వ చేతులు - చేతలు ఆయనవే! - సర్వతః - పాణి।
✩ సర్వ పాదములు - నడకలు ఆయనకు చెందినవే! - పాదం తత్।
✩ సర్వ నేత్రములు - వేరు వేరైన సర్వ దృష్టులు, ద్రష్టలు ఆయన యొక్క భావనాచమత్కారమే! - సర్వతో అక్షి।
✩ సర్వ శిరస్సులు - ఆలోచనలు ఆయనకు చెందినవే! - శిరో।
✩ సర్వముఖములు - ఆయన సంప్రదర్శనములే! - ముఖమ్।
✩ అందరి చెవులు ఆయనవే అయి ఉండి, అంతా వినుచూ ఉన్నది ఆయనే. - సర్వతః శ్రుతమత్।
✩ లోకములన్నీ ఆవరించి, అన్నిటా అంతటా, అన్నీగా ఆ పరమాత్మయే తిష్ఠించుకొని ఉన్నారు. - లోకే-సర్వమ్ ఆవృత్య తిష్ఠతి।
సర్వత్రా చేతులు, కాళ్ళు, కళ్ళు, శిరస్సులు, ముఖములు, చెవులు కలిగిఉండి సర్వత్రా వేంచేసి, ఆవరించి ఉండి, సర్వ దేహములలో అణువణువు వ్యాపించి, -
- పంచ కర్మేంద్రియములందు,
- పంచ జ్ఞానేంద్రియములందు,
- వాటి వాటివిషయములందు,
- త్రిగుణములయందు,
ఉండి, అవన్నీగా ఆ ఆత్మభగవానుడే భాసిస్తున్నారు. సర్వేంద్రియ గుణాభాసగ్ం।
❋ కంటిలో చూపుగా - ద్రష్టగా - దృశ్యముగా,
❋ చెవులలో వినికిడిగా - శ్రోతగా - శబ్దముగా,
❋ చర్మములో స్పర్శగా - స్పృశించువాడుగా - స్పృశవిశేషములుగా,
❋ నాలుకలో రుచిగా - రసజ్ఞునిగా - తినుచున్న పదార్థములలో ‘రుచి’గా,
❋ ముక్కులో సువాసనగా - సువాసనాస్వాదిగా - పుష్పములుగా -
అభాసించుచున్నది ఆ పరమాత్మయే!
సర్వేంద్రియ వివర్జితమ్। ఇంద్రియార్థములుగా ఉండి, అవన్నీ లేనివాడై, వాటికి సంబంధించనివాడై ఆ పరమాత్మ ప్రకాశించుచున్నారు. రచయిత తాను రచించిన నాటకములోని కొన్ని పాత్రలకు చెందినవాడు కాడు కదా! అట్లాగే పరమాత్మ-స్వీయ రచన అగు జగన్నాటకమునకు సంబంధించకయే ఉన్నారు.
ఈ సర్వమునకు ఆయనయే నియామకుడు. ప్రభువు. సర్వులకు సర్వశుభములు కలుగజేస్తున్న సుహృత్! సర్వులకు సర్వము తన కరుణచే ప్రసాదించుచు, సర్వులకు శరణాగతి అయి ఉన్నవారు!
ఈ విధంగా స్వస్వరూపుడగు ఆత్మభగవానుని మనస్సుతో వీక్షిస్తూ, బుద్ధితో గ్రహించుచుండెదము గాక!
┄ ┄ ┄
ఈ దేహి ‘9’ ద్వారములు కలిగిన ఈ జడదేహమును చైతన్యపరచువాడై ‘హంసో - సో2హమ్’….అను ‘నేను’ భావనతో అంతరమునందే కాకుండా, బాహ్యమున కూడా ప్రకాశించుచున్నారు. ఎరుక అనుభావనతో సర్వము ఎరుగుచున్నారు. అట్టి దేహి చైతన్యమే స్థావర జంగమాత్మకమగు ఈ లోకముల రూపము కూడా!
ఈ జీవుడు వాస్తవానికి ‘సో2హమ్’లో - సః పరమాత్మ వాచ్య సహజస్వరూపుడే - అయి ఉండి కూడా, స్వీయ కల్పనకు అభిన్నమగు స్థావర - జంగమాత్మకమగు దృశ్యమునకు వశుడై పంజరములో చిక్కుకున్న పక్షివలె….
‘‘నేను ఈ జగద్దృశ్యమునందు ఏదో కారణం చేత చిక్కుకొన్నాను. ఇక్కడి సంఘటన - సంబంధ - అనుబంధ బాంధవ్య-సంపద-ఆపదలకు వశుడనై ఈ దేహబంధము నేను అనుభవించవలసి వస్తోంది కదా!’’ అని తలచటం ప్రారంభిస్తున్నాడు.
ఈ దేహియొక్క సహజస్వస్వరూపము ఆత్మయే! అట్టి పరమాత్మకు -
అపాణీ : చేతులు లేవు. కానీ, ఈ జీవుల చేతులు - చేతలు ఆయనకు చెందినవే! కానీ ఆయనకు ఆపాదించలేము. సర్వము స్వీకరిస్తున్నది ఆయనే। కానీ ఏమీ స్వీకరించరు. పాత్రల చేతలన్నీ నాటక రచయితవే అయి ఉండి కూడా, ఆయనకు పాత్రయొక్క గ్రాహ్య-త్యాజ్యములు ఆపాదించలేము కదా!
అపాదౌ : పాదములు లేవు. అంతా తానే అయి ఉండగా ఎక్కడికి వెళ్తారు? ఆయనకు ఇక పాదము లెక్కడుంటాయి? అయితే ఈ సర్వజీవుల పాదములు - నడకలు, నడతలు అన్నీ ఆ పరమాత్మవే!
- స్వప్నంలో కనిపించే జనుల కదలికలన్నీ కూడా, స్వప్నములోని ‘నేను-అహమ్’ తో సహా స్వప్నము ఎవరివో- ఆ యొక్క స్వప్న ద్రష్టవేకదా!
ఈ విధంగా దృశ్యమంతా సంచారములుగా కలిగి ఉన్నారు.
పశ్యతి-అచక్షుః : ఆయనకు కనులు లేవు. కానీ అన్నీ చక్షువుల ద్వారా అంతటా చూస్తున్నది ఆత్మభగవానుడే! అన్ని కళ్ళు ఆయనవే! ఈ విశ్వములోని వేరువేరైన దృష్టులన్నీ ఆయనవే। (పాత్రల యొక్క వారివారి దృష్టులన్నీ రచయిత చేత కల్పించబడినవే కదా!)
స శృణోతి అకర్ణః : ఆయనకు చెవులు లేవు. కానీ, సర్వుల చెవులన్నీ తనవే అయి, సర్వశబ్ద - సంభాషణలను వినుచున్నది ఆయనే!
న వేత్తి వేద్యమ్ : ఆ పరమాత్మ తెలియబడువాడు కాదు. కానీ, అందరిలో ఉండి అన్నీ తెలుసుకొంటున్నది ఆయనయే! ఆయనయొక్క చిదానందమే సర్వ జీవులలో ఎరుక (knowing)గా ఉండి, సర్వము ఎరుగుచున్నదై ఉన్నది.
ఈ రీతిగా తెలియబడేవాడు కాకపోయినప్పటికీ అన్నీ తెలుసుకుంటున్నవారై ఉంటున్నారు.
న చ తస్య అస్తి వేత్తా : ఆయన అంతా తెలుసుకుంటూ ఉంటారు గాని, ఆయనను తెలుసుకుంటున్నవాడు ఎవ్వడూలేడు. ఆయన తెలియబడేవారు కాదు. ఆయన ‘తెలియబడేవాడు’గా అవ్వాలంటే ఆయనకు వేరుగా తెలుసుకుంటున్నవాడు మరొకడు ఉండాలికదా! తెలుసుకొనేదీ - తెలియబడేదీ ఆయనయే! ‘‘ఆత్మను నేను తెలుసుకోవాలి’’ - అని ఎవరు అనుకుంటున్నాడో……. ఆతడే ఆ ఆత్మ అయి ఉండగా….ఆత్మను ఎట్లా ఎవ్వడు మాత్రం తెలుసుకొంటాడు?
కళ్ళతో ఎదురుగా ఉన్నవన్నీ చూడవచ్చునేమో! ఆ కళ్ళతో ‘చూచువాడిని’ (user of those physical eyes) చూడగలమా?
చెవులతో బాహ్యవిషయాలు వినగలం. అంతేగాని ఈ చెవులతో ‘వినుచున్నవానిని’ శ్రవణ విషయంగా వినగలమా? లేదు.
అట్లాగే తెలుసుకొనుచున్నవాడే ఆత్మస్వరూపుడై ఉండగా, ఆతడు ఆత్మను వేరైన వస్తువువలెనో, విషయము వలెనో తెలుసుకోలేడు కదా!
అయితే అట్టి ఆత్మ భగవానుడు నిర్మలమైన బుద్ధికి తెలియబడగలదు. ‘వేదాంతశాస్త్రం - తత్త్వ శాస్త్రం - ఉపనిషత్తులు చెప్పుచున్నది నా గురించే। నాయొక్క జీవాత్మత్వము ఎందులోంచి వస్తోందో….అట్టి నా యొక్క (ఆవల…ఉన్న) పరమాత్మత్వము గురించే కదా!’….అని బుద్ధికి అనుభవమునకు రాగలదు.
అట్టి - సర్వమునకు ఆవల జ్యోతి స్వరూపుడై వెలుగొందు మనందరి స్వస్వరూపాత్మయే….
అట్లా అయి ఉండి కూడా, ఆ ఆత్మ సర్వజీవులలోను, హృదయ గుహలో దాగి ఉన్నది.
సామాన్య దృష్టికి పాంచభౌతిక దృశ్యాలు, గుణాలు కనిపిస్తున్నాయి. మనో - బుద్ధి - చిత్త - అహంకారాలు అంతరంగమున దృశ్యమానమవుతున్నాయి.
సర్వప్రాణులలోను సంస్థితుడై, కర్మలకు - జన్మలకు సంబంధించని ఆ పరమపురుషుని మహిమ ఏమిటో, ఎట్టిదో ఎవరు తెలుసుకోగలరు? ఆత్మను ఎవరు తెలుసుకోగలరు? సమస్తమును, ఆదుర్దాలను, శోకములను అధిగమించిన నిర్మలబుద్ధిని సంపాదించుకొన్నవారు మాత్రమే బుద్ధితో తెలుసుకొనుచున్నారు. దర్శిస్తున్నారు. ఆత్మయే ఆత్మను ఎరుగగలదు।
అట్టి ఎరుకచే…,
పురుషుడు పురుషోత్తముడై
మానవుడు మాధవుడై
జీవాత్మ పరమాత్మ అయి ప్రకాశించుచున్నాడు!
అట్టి పరమ పురుషుని (పురుషమ్ మహాన్తమ్)
అజరం : భౌతిక దేహ ధర్మాలు అయినట్టి జన్మ - జరా - మరణములకు సంబంధించనివానిగాను…..,
పురాణం : జన్మకర్మలకు మునుముందే ఉండి ఉన్నవానిగాను, వాటికి సంబంధించక కేవల సాక్షిగాను, దేహముల రాక పోకలప్పుడు కూడా యథాతథంగా ఉన్నవానిగాను…., (పురా నవమ్),
సర్వాత్మానగ్ం : (స్వప్నంలో కనిపిస్తూ కదలుచున్న వారందరు స్వప్నద్రష్ట యొక్క హృదయాంతర్గత స్వరూపులే అయినట్లుగా) నాయొక్క - నీయొక్క - మనందరియొక్క అఖండాత్మ స్వరూపునిగాను….,
సర్వగతమ్ - సర్వములోను, సర్వముగాను విస్తరించి ఉన్నవానిగాను,
విభుత్వమ్ - జాగ్రత్ - స్వప్న - సుషుప్తి ఇత్యాదులన్నిటికీ, సర్వ లోకములకు నియామకుడు - విభువుగాను,
నిత్యమ్ - నిత్య-సత్యము అయి ఉన్నవానిగాను,
వేదోపనిషత్తులు అభివర్ణిస్తున్నాయి. ఎలుగెత్తి గానం చేస్తున్నాయి.
ఆ పరమాత్మ, పరబ్రహ్మమును ఎరిగిన బ్రహ్మవాదులగు మహనీయులు మనకు మనయొక్క జన్మ - కర్మబంధముల విముక్తికొరకై మనమీద వాత్సల్యముతో, కరుణతో అనునిత్యంగా గానం చేస్తూ, బ్రహ్మగీతిని వినిపిస్తున్నారు!
మనము శ్రద్ధభక్తులతో ఆత్మశ్రేయస్సు కొరకై విని, ఎరిగెదము గాక!
సర్వ ప్రయత్నములతో స్వానుభవంగా సిద్ధించుకొనెదము గాక!
చతుర్థో2ధ్యాయః - జీవ-ఈశ్వర-పరమాత్మా2హమ్–4వ శిష్యుని విశ్లేషణము
ఓం
స్వతఃగానే ఏకస్వరూపుడు, జీవజాతి భేదరహితుడు అగు ఆ పరమాత్మ - తనయొక్క కల్పనా, మాయా శక్తిచేత బహుత్వమును క్రీడా - లీలా వినోదార్థమై స్వకీయ చమత్కారంగా ప్రేరేపించుకొనుచున్నారు. అనేక భేదములతోకూడిన జీవజాతులను కల్పించుకొని ఆస్వాదిస్తున్నారు. తాను అపేక్షారహితుడై ఉండియే అనేక వస్తు జాతి ధర్మ భేదములను కల్పించుకొని, క్రీడిస్తూ ఎప్పుడో ఈ సర్వమును తనయందు లయింపజేసుకుంటున్నారు. ఈ విశ్వముయొక్క సృష్టి - స్థితి - లయకారకుడగు పరమాత్మ మనకందరికి శుభము - శోభాయమానము - మహదాశయయుక్తము అయిన బుద్ధిని ప్రసాదించి, మనలను సర్వ సంసారభ్రమల నుండి సంరక్షించుదురు గాక!
సర్వ కల్పనాకారకుడగు ఆ పరమాత్మయే…..,
తదేవమ్ అగ్నిః : అగ్ని - జ్యోతి స్వరూపుడై ఈ సర్వమును జీవన్‌మయముగాను, తేజోవంతముగాను చేస్తూ, ఈ సర్వమును ప్రకాశింపజేయుచున్నారు. ఉష్ణస్వరూపులై సర్వ దేహములలో ప్రవేసించి, వాటిని సంరక్షిస్తున్నారు.
తత్ ఆదిత్యః : (యత్ ఆదిః తత్ ఆదిత్యః!) ఏదైతే సర్వమునకు మునుముందే ఉన్నదో, అదియే ఆదిత్యరూపం. ఆ పరమాత్మయే ఆదియందు సత్ - చిత్ - చైతన్యస్వరూపుడై ఉన్నారు. ఇప్పటికీ, ఎప్పటికీ యథాతథుడై ఉన్నారు! ఆయనయే ఆకాశంలో సూర్యుడై ప్రకాశించుచున్నారు.
తత్ వాయుః : ఆయనయే బాహ్య - అభ్యంతరములలో స్పందన రూపముగా, ప్రాణస్వరూపుడుగా సంచరించుచున్న వాయుదేవుడు!
తదు చంద్రమా : చల్లటి కాంతులు వెదజల్లుచూ ఓజోశక్తిచే భూమికి ఔషధతత్త్వమును ప్రసరింపజేయుచున్న చంద్రుడుగా ఉన్నది ఆ ఆత్మభగవానుడే!
తదేవ శుక్రమ్ (శుభ్రుడు): ఆయన సర్వదా మంగళ స్వరూపుడు. నిత్య నిర్మలుడు. పరిశుద్ధుడు. దేహ-జన్మ-కర్మ-గుణ దోషములకు ఆవలివాడు. నాటక దీపపు కాంతిలో నాటకం జరుగుచున్నప్పటికీ, నాటకంలోని మంచి - చెడు పాత్రలు నాటక దీపానికి తాకవుకదా! ఆత్మ సర్వదా పరము, పరిశుద్ధము కూడా!
తత్ అమృతమ్ : ఆయన అమృతస్వరూపుడు. జన్మ - మృత్యువులకు సంబంధించక, కేవల సాక్షియై ఉన్నట్టివారు. మార్పులు చేర్పులు లేనట్టివారు.
తత్ ఆపః : ఆయన ఆపః (జల) స్వరూపుడై, సర్వజీవులకు జీవనత్రాణ అయి ఉన్నారు. జలస్వరూపులై పదార్థములందు, దేహములందు వెలయుచున్నారు. దేహములకు ‘త్రాణ’ అగుచున్నారు.
తత్ బ్రహ్మ : ఆ స్వస్వరూపుడగు పరమ పురుషుడే - పరబ్రహ్మము.
తత్ ప్రజాపతిః : ఆయనయే సృష్టికర్తయగు ప్రజాపతి. బ్రహ్మదేవుడు.
మమాత్మానంద స్వరూపుడవగు ఓ పరమ పురుషా! పరమాత్మా! త్వగ్ం స్త్రీ। త్వం పుమాన్ అసి। త్వం కుమార, ఉతవా కుమారీ।
ఓ దేవాదిదేవా! వివిధ రూపములతో ఇక్కడ కనిపిస్తున్నదంతా మీరే! కళ్ళకు కనిపించకుండానే, సృష్టి వ్యవహారమునందు పాల్గొనుచున్న దివ్య-దేవతా మహా ప్రజ్ఞలు కూడా మీరే!
జలమునందు తరంగమువలె సృష్టిని మీ నుండి సృష్టించుకొని, ఆస్వాదించి తిరిగి జన్మరహితులగు మీయందే లయింపజేసుకుంటున్నారు! సర్వమునకు సర్వదా వేరుగానే ఉండి ఉంటున్నారు. స్వప్నద్రష్టకు స్వప్నము ఎట్టిదో, విశ్వేశ్వరులగు మీకు విశ్వము అట్టిది!
మేమంతా కూడా మీకు అభిన్నమైనట్టి భిన్న భిన్న స్వరూపులము! మీయొక్క అభిన్నము నుండి బయల్వెడలిన భిన్న భిన్న కిరణ స్వరూపులమే!
![]() |
దేహ వృక్షము - రెండు పక్షులు (పిప్పల (రావి) వృక్షము) ఒక వృక్షము రెండు పక్షులు, క్రింద కొమ్మలమీద పైన - జీవాత్మ చిటారుకొమ్మ మీద - ఈశ్వరుడు ఈ జీవాత్మ-ఈశ్వరులు (నాటకములోని పాత్ర-పాత్రధారుని నటనా కౌశలమువలె) ఒకరినొకరు పట్టుకోరు. విడువరు. |
దేహము అనే గొప్ప వృక్షముపై పరమాత్మయొక్క స్వాభావిక రూపములగు (లేక) లీలా వినోద కల్పనా రూపములగు రెండు పక్షులు (జీవుడు - ఈశ్వరుడు) వ్రాలి, కాలమును గడుపుచున్నాయి. ఆరెండిటినీ పరమాత్మయే ప్రకాశింపచేయుచున్నారు. ఒకటి కొమ్మకొమ్మలపై వ్రాలుతోంది. మరొకటి చిటారు కొమ్మపైన (అనగా, సహస్రారములో) మౌనంగా, ప్రశాంతంగా కూర్చుని ఉన్నది. ఆ రెండు పక్షులు విడరాని బంధముతో, అన్యోన్యంగా అత్యంత స్నేహభావంతో ఒకదానితో మరొకటి ఎంతగానో సంబంధించినవై, సహజీవత్వమును కొనసాగిస్తున్నాయి.
అందులో -
క్రింద పక్షి (జీవుడు) : అనుభూతి - అనుభవము అనే పిప్పల (రావి) ఫలములను ఆస్వాదిస్తూ కొమ్మ - కొమ్మపై గెంతుతోంది. వ్రాలుతోంది. ఎగురుతోంది. ఇంద్రియ విషయానుభవములలో నిమగ్నమై ఉన్నది. (నాటకములోని ‘పాత్ర’కు సంబంధించిన స్వరూప స్వభావముల వంటివి).
పై పక్షి (ఈశ్వరుడు) : దేనినీ స్వీకరించక, అనుభవించక సర్వమునకు కేవలము ‘సాక్షి’ అయి ప్రశాంతంగా, అతీతంగా ఉండి అంతా వీక్షిస్తోంది. సాక్షీభూతంగా, ఇంద్రియ విషయాలకు, భావాలకు - అన్నిటికీ ఆవల ఉండి ఉన్నది. ఈ భౌతిక దేహముల రాకపోకలను కూడా కేవలం సాక్షిగా, మౌనంగా చూస్తూ ఉన్నది. (నటుని ‘నటనా కౌశలము’ వంటిది).
జీవుడు
ఆ రెండు పక్షులలో జీవాత్మ పక్షి - ‘‘నేను ఈ దేహమునకు, కర్మ - అకర్మలకు, పుణ్య - పాపములకు సంబంధించినవాడను! జన్మ - మృత్యువుల మధ్య బద్ధుడను. ఇంతవరకే నేను…’’ అని అనుకుంటూ ఉన్నాడు.
‘‘ఎవ్వరో ఎప్పుడో సృష్టించిన సృష్టిలో నేను ఇట్లా పిట్టవలె చిక్కుకున్నాను. నా గతి ఏమిటి? ఇంతేనా?’’…. అనే బంధ భావనలో కుములుచున్నది. ఒక చమత్కారం ఏమిటంటే…., ఈ జీవుడు తనను తాను సమగ్రముగా ఎరుగుటయే లేదు. ‘‘నాయొక్క జాగ్రత్‌కు (నా స్వప్నంలాగానే) రచయితను నేనే కదా! అంతా నిండి ఉన్న వాడిని కదా! ఇదంతా నాయొక్క ఈశ్వర స్వరూప మహిమయే కదా!’’ అనే విషయము ఆతని దృష్టిలో ఏమాత్రము లేదు. అటువంటిదే జాగ్రత్ కూడా. తనదైన ‘ఈశ్వరత్వము’ను ఏమరచి, అనీశుడై శోకగ్రస్తుడై ఉంటున్నాడు.
కల కంటున్నవాడు - ‘‘కలనాదే కదా!’’ అనునది దృష్టిలో ఉండక, కలలో బంధమును పొందునట్లే, ‘‘జాగ్రత్ నాదే’’ అని ఏమరచి జాగ్రత్‌లో బంధము - బానిసత్వము అనుభవిస్తున్నాడు.
ఈశ్వరుడు
ఎప్పుడో, ఎన్నడో ఆ జీవాత్మపక్షి ఆత్మ శాస్త్ర పాఠ్యాంశములను, సద్గురు బోధనలను, సో2హమ్-తత్త్వమ్-జీవోబ్రహ్మేతి నా-పరః ఇత్యాది మహావాక్యముల విచారణ ఉపక్రమిస్తోంది.
ఈ జీవుడు తనకు తోడై ఉన్న యజమాని, నియామకుడు, సహజ సహచరుడు, స్వస్వరూపి అగు ‘ఈశ్వరుడు’….అను (ఈ దేహములోని) ఆ రెండవ పక్షిని సందర్శించుచున్నది. పశ్యతి అన్యమ్ ఈశమ్ అస్య మహిమానమ్ ఇతి వీత శోకః। ఈశ్వరుని మహిమ ఏమిటో, ఎట్టివాడో గ్రహించుచుండగా, జీవాత్మ పక్షియొక్క సర్వవేదనలు, దుఃఖములు స్వభావపూర్వకంగా తొలగిపోతున్నాయి. ‘‘ఓహో! అప్రమేయమగు ఆత్మస్వరూపుడనగు నా కల్పనయే ఈ జీవ - ఈశ్వరత్వము కూడా’’ అని గమనించి వినోదించ నారంభిస్తున్నాడు. ఈ జీవ - ఈశ్వరులు ఉభయము ఆత్మజ్యోతి యొక్క దివ్యకాంతి పుంజములే!
పరమాత్మ
యః తత్ న వేద, కిమ్ ఋచా కరిష్యతి? అట్టి పరమాత్మను ఆశ్రయించకుండా, ఊరికే ఋగ్వేద మంత్రములను మొ।।వాటిని ఉదాత్త-అనుదాత్త స్వరములను పెదిమలతో ఉచ్ఛరించి ‘‘మేము వేదజ్ఞులము’’ అని అనుకున్నంత మాత్రాంచేత ఏమి ప్రయోజనం? వేదములను పలుకుచూ కూడా తెలుసుకోవలసినది (ఆత్మను) తెలుసుకోకపోవటమే అగుచున్నది.
సర్వతత్త్వ స్వరూపుడు, స్వస్వరూపుడు అగు పరమాత్మను తెలుసుకొని మాత్రమే మనము కృతార్ధులము కాగలము!
ఆయనను నాకు, నీకు, ఈ సమస్తమునకు - అనన్యుడుగా ఎఱగాలి సుమా!
┄ ┄ ┄
ఆ అక్షర పరబ్రహ్మము అగు పరమాత్మనుండియే,
- ఋక్-యజుర్-సామ-అథర్వణ చతుర్వేదములు,
- యజ్ఞములు, యాగములు, క్రతువులు, వ్రతములు,
- కాలచమత్కారములగు భూత - వర్తమాన - భవిష్యత్తులు,
- యత్ వేదా….ఇంద్రియములకు తెలియబడుచున్న ఈ సమస్తము -
ఇవన్నీ కూడా బయల్వెడలుచున్నాయి.
1. భౌతికదేహమును తన ఉపాధిగా కలిగియున్న ఈ జీవుడు,
2. ‘మాయ’ యే తన ఉపాధిగా కలిగియున్న ఈశ్వరుడు,
3. ఎదురుగా గల ఈ విశ్వము….,
ఇదంతాగా కూడా అక్షరుడగు పరబ్రహ్మమే తన అనిర్వచనీయ మాయా శక్తిచే ఆయావిధములుగా విజృంభించుచున్నది.
ఇదంతా ఆయనకు అద్వితీయమే. అట్లు అయి ఉండి కూడా, వేరుగా ఉన్నట్లుగా ఆయనయే సంబంధమును స్వభావంగా కల్పించుకొని, (మరొకవైపుగా) సాక్షియై దర్శిస్తున్నారు. ఈ విశ్వమంతా ఆ పరమాత్మయొక్క మాయా లీలా విలాసమే। మరింకేమీ కాదు।
మాయాంతు ప్రకృతిం విద్ధి। మాయినంతు మహేశ్వరః।
- ఈ ప్రకృతియే మాయ.
- ఈ మాయ ఎవరిదో,…..ఆతడే మహేశ్వరుడు (మాయి).
తస్య అవయవ భూతైస్తు వ్యాప్తగ్ం సర్వమిదమ్ జగత్।।
ఆ మహేశ్వరుని మాయా కల్పితములైనట్టి స్వీయ అవయవములచేతనే నవరసరముల రూపంగా ఈ ఎదురుగా మనకు కనిపిస్తున్న జగత్తంతా వ్యాప్తమైయున్నది.
ఏకము - అఖండము అగు ఆ మహేశ్వరుడే :-
- సమస్త జీవుల బాహ్య - అభ్యంతర రూపము।
- మూల ప్రకృతి।
- అవాంతర ప్రకృతులు।
- మాయ।
- పంచభూతములు, వాటి వాటి వివిధ సమ్మేళన రూపములు, ధర్మములు, త్రిగుణములు….. కూడా!
వీటన్నింటితో కూడుకొన్నవాడై, యోని - యోని యందును, సర్వ ఉపాధులయందును ‘అంతర్యామి’ అయి అధిష్ఠించి (Having occupied the entirety) ఉన్నారు.
ఇవన్నీ ఆయనయందే మాయగా (వేరుగా లేకపోయినప్పటికీ - వేరుగా ఉన్నట్లుగా - మా యా - యా మా) అగుపిస్తున్నవగుచున్నాయి.
ప్రళయకాలములో ఇవన్నీ ఆ మహేశ్వరుని యందే లయించుచున్నాయి. కథ కథారచయితలోనే ఉండి, ఆయనచేతనే బహిర్గతము చేయబడుచూ, ఆయన చేతనే ముగించబడుచున్నవిధంగా…., విశ్వేశ్వరుడే విశ్వకల్పనను కలిగియుండి, మరల ఎప్పుడో విరమించుచున్నారు.
మరల సృష్టికాలంలో అవన్నీ కూడా ఆయా నానా రూప-నామములతో బయల్వెడలుచూ, ఆ మహేశ్వరునియొక్క విశ్వరూపములో అంతర్విభాగంగా మాయాకల్పిత చమత్కారములై ప్రదర్శనమగుచున్నాయి.
అట్టి ఈశానుడు, సర్వమును ప్రసాదించుచున్న సర్వవరదుడు, దేవదేవుడు, స్తోత్రార్హుడు, మహేశ్వరుడు అగు ఈశ్వరుని (పరమాత్మ)ను సందర్శించి, ఆయనతో మమేకమై, ‘బ్రహ్మైవాహమస్మి’ భావనను ఆశ్రయించినవారమై పరమశాంతిని పొందెదము గాక!
┄ ┄ ┄
శ్లో।। యో దేవానాం ప్రభవశ్చ, ఉద్భవశ్చ, విశ్వాధిపో, రుద్రో, మహర్షిః హిరణ్యగర్భం
పశ్యతి జాయమానగ్ం, స నో బుద్ధ్యా శుభయా సంయునక్తు।।
ఏ దేవదేవుడైతే…., (లేక) ఏ సర్వాత్మకుడగు ఆత్మభగవానుడైతే…,
✤ దేవతల రూపముగా ప్రభవిస్తూ, ఉద్భవించువాడై, లోకములన్నీ పరిపాలిస్తున్నారో, దేవతలకే జననస్థానమై ఉన్నారో….,
✤ ఈ విశ్వమంతా నిండి ఉండి, విశ్వమును అధిగమించి ఉన్నారో….,
✤ రుద్రుడై సృష్టి - స్థితి లయములను పర్యవేక్షిస్తున్నారో….,
✤ మహత్ ఋతమో, పరమసత్యమై ఉన్నారో…, ఋషి అయి పరమసత్యమును ప్రవచించువారో…,
✤ సృష్టికి ముందు సృష్టికర్తను సృష్టించుచున్నారో..,
✤ ఎవ్వరికి సృష్టి - సృష్టికర్త అభిన్నమై ఉన్నాయో….,
స నో బుద్ధ్యా శుభయా సంయునక్తు। అట్టి పరమేశ్వరుడు,.. శుభ-శాంతి-సహజానందప్రదమగు ఆత్మబుద్ధిని, మనకు ప్రసాదించునుగాక!
★ యో దేవానాం అధిపో…, ఏ పరంధాముడు దేవతలకు కూడా అధిపతియో….,
★ యస్మిన్ లోకా అధిశ్రితాః, ఏ లోకేశ్వరునియందైతే ఈ లోకములన్నీ ఆశ్రయము కలిగినవై ఉన్నాయో,
★ య ఈశే అస్య ద్విపదశ్చ, చతుష్పదః, ఏ సర్వేశ్వరుడైతే రెండు పాదములుగల మనుష్యులను, నాలుగు పాదముల జంతువులను, తదితర సర్వ జీవులను సృష్టించి - క్రీడావినోది అయి నియమించుచున్నారో, సర్వనియామకుడో….,
కస్మై దేవాయ హవిషా విధేమ। అట్టి మనందరియొక్క స్వామికి యజ్ఞపూర్వకమైన సర్వకర్మలను హవిస్సులుగా సమర్పించుచున్నాము. ‘ఇంద్రియ విషయములు’ అనబడే పురోడశము మొ।।న ద్రవ్యములతో సపర్యలు అర్పిస్తున్నాము.
ఓ దేవ దేవా! మా ఈ ఇంద్రియ మనో బుద్ధులు మీకు చెందినవే! మేమో… మీకు అభిన్నులము! ఇక తదితరము గురించి ఎక్కువగా చెప్పవలసినది ఏమున్నది?
✩ సూక్ష్మాతి సూక్ష్ముడు అయి జగత్తంతా మధ్యగా వెలయుచున్నట్టి వారు…, - సూక్ష్మాతి సూక్ష్మమ్, కలిలస్యమధ్యే।
✩ ఈ విశ్వ రచనకు రచయిత (The Author of this creation), - విశ్వస్య స్రష్టారం।
✩ అనేక రూపములో ధరిస్తూ, ఈ సర్వ రూపములు తానే అయి ఉన్నవారు…, తమ్ అనేక రూపం।
✩ ఈ విశ్వమంతా తన ఏకరూపమై ఈ సర్వమును సర్వదా పరివేష్టించుచున్నవారు, - రూపరహితులు. విశ్వస్య ఏకం। పరివేష్టితారం।
అగు ఆ శివస్వరూప పరమాత్మని తెలుసుకొన్నప్పుడు ఈ జీవాత్మ పరమ శాంతిని పొందుచున్నాడు. సర్వశుభములు సంపాదించు కొనుచున్నాడు. - జ్ఞాత్వా శివం శాంతిం అత్యంతం ఏతి।
ఆ శివానంద భగవానుడే….,
⬭ కాలస్వరూపులు। భూత వర్తమాన భవిష్యత్తులు ఆయనకు అల్పాహారములు।
⬭ 14 లోకాలలోని సర్వజీవరాసులను అభయహస్తులై సంరక్షిస్తున్నట్టివారు।
⬭ ఈ విశ్వమును పరిపాలిస్తున్నట్టివారు।
⬭ సర్వ ప్రాణులలో సర్వదా రహస్యముగా దాగిఉన్నవారు। నిగూఢరూపులు।
⬭ బ్రహ్మర్షులకు, మహర్షులకు, దేవతలకు ధ్యానవస్తువులైనవారు। దేవదేవుడు। దేవాది దేవుడు।
తమేవమ్ జ్ఞాత్వా మృత్యు పాశామ్ చ్ఛినత్తి।
ఆయనను ఎక్కడో - ఏమో - ఎవ్వరో….తెలుసుకొన్న జీవుడు శివస్వరూపుడై మృత్యుపాశములను ఛేదించివేస్తున్నాడు. ఆయనను ఆరాధిస్తూ ఉండగా, ఆయన మనయందే నిత్యానంద స్వరూపులై సందర్శనమును ప్రదర్శించుచున్నారు.
┄ ┄ ┄
అట్టి ఆ పరమాత్మ ఉన్నదెక్కడ? ఆయన స్థానమేది? |
ఘృతాత్ పరమ్ మండమివ : మీగడలో ఆ మీగడ కంటే వేరైన ‘నేయి’ అతి సూక్ష్మముగా ఉండి ఉన్నది కదా! అదే విధంగా సర్వప్రాణులలోను ఆ శివభగవానుడు గూఢముగా ఉండి ఉన్నారని - సూక్ష్మ దృష్టిచే మాత్రమే తెలియవచ్చుచున్నది. అతి సూక్ష్మంగా ఈ విశ్వమంతా ఆయనయే పరివేష్టితులై ఉన్నారు. అట్టి దేవదేవుని ఎరుగుచుండగా సర్వపాశముల నుండి మనము విముక్తులమగుచున్నాము.
విశ్వకర్మ (The Worker of the universe), మహాత్ముడు అగు ఆత్మభగవానుడు సర్వ దేహముల నిర్మాణకర్తయై వెలయుచున్నారు. సర్వజనుల హృదయములను తన తేజస్సుచే నింపివేస్తున్నారు। సర్వుల హృదయవిహారి। ఆయనను నిర్మలమైన మనస్సుతో పరిశుద్ధమగు బుద్ధితో స్వహృదయంలోనే దర్శించాలి. ఇది ఎవరు గ్రహించి ఉంటారో, వారు ఈ విశ్వమును తమ హృదయములోని పరమాత్మయొక్క మాయా విలాసంగా గ్రహించి అమృతస్వరూపులగుచున్నారు.
ఎప్పుడు ఆ సర్వాంతర్యామి, సర్వము తనయందే కలిగిఉన్నట్టి అధిష్ఠానము యొక్క దర్శనము సిద్ధిస్తుందో…., అట్టి ఆ స్థితి ఎటువంటిది?
❆ ఇక అది పగలు కాదు. రాత్రి కాదు. రేపు గాదు. నిన్న గాదు. నేడు కాదు.
❆ ఆ పరమాత్మ సందర్శనముచే సత్ - అసత్తులు చర్చ ఉండదు.
❆ ఆయన కేవలీస్వరూపుడై వెలుగొందుతూ నాయొక్క, సమస్త సహజీవులయొక్క అంతర్-హృదయుడై, బాహ్య సంప్రదర్శనుడై తెలియవస్తారు.
❆ ఆయనయే అక్షరస్వరూపుడు.
❆ ఆయన సవితుః (సత్ + విత్, ఉనికి + ఎరుక) గా వరేణ్యుడుగా (నిత్యస్తోత్రార్హుడుగా), సర్వమును తన ‘ఎరుక’ అనే అగ్ని తేజస్సులచే వెలిగించువాడుగా అనుభూతమౌతాడు.
❆ సర్వ - స్వరూపుడుగ అనంతకాలంగా అంతటా విస్తరించి ఉన్నవాడు (ప్రసృతా పురాణీ).
ఆయనయే స్తోత్రము చేయవలసిన వస్తువు. వరేణ్యుడు। పురాణ పురుషుడు। పురాణవేత్త। సర్వదేహాలకంటే మునుముందే ఉన్నట్టివారు।
‘ప్రజ్ఞానమ్ బ్రహ్మ’ అను వేదమహాక్యార్థము యొక్క అనుభవ స్వరూపమై ఉన్నవారు! ఒక పెద్ద వస్తువు ఒకచోట ఉన్నప్పుడు ‘‘ఆ వస్తువు ఎట్టిది? ఏమై ఉన్నది? ఏ పదార్థముతో తయారయ్యింది?’…అని తెలుసుకోవటానికి ఆ పెద్ద వస్తువును పైనుండీ క్రిందనుండీ, వెనుకనుండీ, ముందు నుండీ…. నిలబడి పరిశీలించి ‘‘ఇది ఇట్టిది’’ అని ఒక నిర్ణయానికి రాగలము. కానీ ఆత్మయో? అద్దానికి ఊర్థ్వ - అధో - వెనుక - ముందు దిక్కులనుండి పరిశీలించి తెలుసుకొనవలసిన వస్తువు కాదు. అంతటా అదియే అయి ఉండగా,… అద్దానిని లౌకికంగా పరీక్షించటమెట్లా?
ఎవరు అద్దానిని ‘‘ఎట్టిది?’’ అని పరిశీలించటానికి సంసిద్ధులగుచున్నారో…., అది ఆ పరిశీలన చేయుచున్న స్వాభావికమగు స్వస్వరూపమే - అయి ఉన్నది. అట్టివాడు తనయొక్క వ్యష్టిగతమైనదంతా సమర్పించివేసి, ‘‘అదియే నేను కదా! సో2హమ్। - అని బ్రహ్మానందభరితుడగుచున్నాడు.
వేదమహావాక్యములు, శాస్త్ర విశ్లేషణములు, గురు అనుభవములే అద్దానికి ప్రమాణము. స్వవిచారణయే అద్దాని విద్యార్జన!
న తస్య ప్రతిమ అస్తి యస్య నామ మహత్ యశః।।
ఏదైతే మహత్తరమైన యశస్సు - కీర్తి కలిగి యున్నదో, అట్టి పరమాత్మ ‘‘ఇది। ఇదియే।’’ అని చెప్పటానికి సరిపోయే సంజ్ఞలుగాని, ప్రమాణములుగాని లేవు. అద్దాని వంటిది, ప్రతిమగా (వేరుగా) వర్ణించగలిగినది మరొక్కటి ఎక్కడా లేదు. అన్ని రూపాలు ఆత్మవే అయి ఉండగా, ఆత్మయొక్క రూపము ‘ఇది ఇట్టిది’ అని ఏమి చెప్పగలం?
అద్దానిని ఒక ఆకారమునకు (లేక) ప్రతిమకు పరిమితం చేయలేము. ప్రతిమలు అందుకు కల్పిత సంజ్ఞలు మాత్రమే।
న సందృశే తిష్ఠతి రూపమస్య।
అది దృశ్య జగత్తులో కనిపించే ఏ రూపమూ కాదు. భౌతికమైన కళ్లతో అద్దానిని ఎవ్వరూ చూచివచ్చి మనకు ‘ఇది’ అని చెప్పగలిగేది కాదు.
హృదా హృదిస్థమ్ మనసా య ఏనమేవమ్ విదుః అమృతాః తే భవంతి।
(హిరణ్యకశ్యపుడు విష్ణులోకంతో సహా అన్ని లోకాలు వెతికి వెతికి, తన హృదయంలోనే వేంచేసి ఉన్న విష్ణు భగవానుని గుర్తించక తన హృదయమునందు పరిశీలించక…… ‘విష్ణువే లేడు’… అని అనటం ప్రారంభించిన తీరుగా) ఆత్మ భగవానుడు ఇంద్రియ గోచరుడు కాదు.
హృదయమునందే హృదయస్థుడై ఇంద్రియములను, ఇంద్రియ జగత్తులను వెలిగించుచున్న దివ్యచైతన్యమూర్తి! విశ్వమూగా మూర్తీభవించినవాడు.
అందుచేత ఆ ఆత్మదేవుని మనస్సుతో ఎవ్వరు తమ హృదయమునందే దర్శిస్తారో…, అట్టివారు ఆయనను తెలుసుకొని తత్ అమృత స్వరూపులై విరాజిల్లుచున్నారు.
ఆయనకు జన్మయే లేదు. జన్మయే లేని పరమాత్మకు పౌరాణికులు జన్మలు కల్పించి, ఆపాదించి సంసారారణ్యమునందు భీరువులై భయ ఉద్వేగములకు లోను అయినట్టి అజ్ఞుల కొరకై, వారి సముద్ధరణ కొరకై - ప్రథమ పాఠ్యాంశములుగా కల్పనచేసి చెప్పుకొస్తున్నారు.
అజాతో, ‘జాత’ - ఇతి ఏవం కశ్చిత్ భీరుః ప్రవద్యతే।। జన్మలే లేని ఆ పరమాత్మకు జన్మలు కల్పించి భీరువులు (సంసార భయము కలవారు) స్తోత్రములు చేస్తున్నారు. విజ్ఞులు జన్మ రహితునిగా గమనిస్తూ స్తుతిస్తున్నారు. అట్టి దక్షిణ ముఖుడగు రుద్ర భగవానుడు మనలను ఇంద్రియ దృష్టులనుండి కాపాడి, ఉద్ధరించి జ్ఞానదృష్టి - ఆత్మదృష్టి ప్రసాదించెదరు గాక!
మన స్తోత్రములను స్వీకరించి మనలను అజ్ఞాన నిబిడాంధకారము నుండి వెలుతురు వైపుగా నడిపించెదరు గాక!
దక్షిణముఖుడు దక్షిణామూర్తి
జ్ఞాననేత్రములను, దివ్య దృష్టిని, ఆత్మౌపమ్యేవ సర్వత్రా - భావనను ప్రసాదించటానికై ప్రత్యుత్సాహంతో, కరుణతో మనవైపు ముఖము త్రిప్పి ఉన్నవారు.
⌘
➤ ఆత్మేశ్వరా! సర్వాంతర్యామీ! సర్వతత్త్వ స్వరూపా! పరమపురుషా! దక్షిణామూర్తీ!
➤ అనుగ్రహస్వరూపులగు మీరు మాకు, మా సహజీవులందరికీ కష్టములు తొలగించి, సుఖములను, వృద్ధిని ప్రసాదించెదరుగాక!
➤ మా ప్రకృతి సంపదకు, గోసంపదకు అశ్వసంపదకు ఆపదలు రాకుండా మమ్ములను సంరక్షించెదరుగాక!
➤ ఆయురారోగ్య ఐశ్వర్యములు సర్వజీవులకు ప్రసాదిస్తూ, దుఃఖములు పోగొట్టి, ఆత్మజ్ఞానానందమువైపుగా మమ్ములను నడిపించెదరు గాక!
➤ అజ్ఞానము - భయము - దుఃఖము - అల్పభావములనుండి కాపాడి వీర్యవంతులుగా మమ్ము తీర్చిదిద్దెదరుగాక!
మిమ్ములను మేము ప్రార్థనలు చేసి బుద్ధిని పవిత్రం చేసుకుంటున్నాం. యజ్ఞ-హోమ హవిస్సులను, స్వధర్మ హవిస్సులను, స్తోత్ర హవిస్సులను మీకు భక్తితో సమర్పించుకొనుచున్నాము. జగదంబతో రుద్రభూమిలో సంచరిస్తున్న మీ పాద పద్మములకు మాయొక్క సర్వకర్మఫలములను భక్తి - జ్ఞాన - యోగ - శరణాగతి పుష్పములుగా సమర్పించుకుంటున్నాం.
మాయొక్క అజ్ఞాన దృష్టులను శుద్ధపరచి, విజ్ఞాన దృష్టిని ప్రసాదిస్తూ, మమ్ములను ఆత్మదృష్టివైపు మరలిస్తూ సముద్ధరించవలసిందిగా ప్రార్థిస్తున్నాము। వేడుకొంటున్నాము। నుతులు సమర్పిస్తున్నాము.
పంచమో2ధ్యాయః - ఆత్మైవహి ఇదమ్ సర్వమ్। - 5వ శిష్యుని విశ్లేషణము
ఏకము, అక్షరము, అనంతము అగు పరబ్రహ్మమునందు అనాదిగా రెండు చమత్కారమైన విశేషాలు నిగూఢంగా దాగి ఉంటున్నాయి.
(1) అవిద్య (2) విద్య
ఈ రెండు కూడా ఆత్మవలెనే అనంతత్వము, అపరిచ్ఛిన్నత్వము సంచరించుకొనియే ఉంటున్నాయి.
అవిద్య : క్షరంతు అవిద్యా హి। మార్పు చెందునది - అవిద్య।
విద్య : అమృతంతు విద్యా! అమృతస్వరూపమైనది. మార్పు - చేర్పులు లేనట్టి విషయమును గురించిన జ్ఞానము - విద్య।
ఈ రెండిటి యొక్క నియామకుడగు ఈశ్వరుడు - రెండింటికీ వేరుగా సాక్షి అయి అప్రమేయ స్వరూపుడై ఉన్నారు! ఆయన విద్య - అవిద్యలకు పరమై ఉండటంచే ‘పరమాత్మ’ అని చెప్పబడుచున్నారు. ఆయన ఏకరూపుడే అయి ఉండి, వేరు వేరు దేహాలలో వేరువేరుగా కనిపిస్తూ ఉన్నారు - బంగారము ఒక్కటే అయి ఉండి వేరు వేరు ఆభరణములుగా కనిపిస్తున్న తీరుగా!
ఆయనయే ఈ విశ్వమునకు, ఇందలి సర్వ జీవరాసులకు యోనిస్థానము (జన్మస్థానము) అయి ఉన్నారు.
పరమాత్మ
💐 సత్యమును ప్రకటించు ఋషులకు కూడా మునుముందే పరమ సత్యమగు పరమాత్మ కేవలమైయే ఉన్నారు. ఋషులు సత్యమును దర్శించి గానంచేస్తూ ఉన్నారు. (అహం ఆదిర్హి దేవానాం, మహర్షీణాం చ)
💐 సృష్టికర్త, హిరణ్యగర్భనామధేయుడు, సర్వము ఎరిగియున్నవారు, కపిలవర్ణుడు అగు బ్రహ్మదేవుడికి కూడా ముందే ఉన్నవారు। సృష్టికర్తకు ఆయన సృష్టికర్త। (సృష్టియొక్క భావనకు మునుముందే ‘నేను’ - ఉన్నది).
💐 ఈ సృష్టినంతా భరిస్తున్నది, ఆహారము ప్రసాదిస్తూ పరిపోషించుచున్నదికూడా ఆ ఆత్మభగవానుడే!
అట్టి మహత్తరము, సర్వము కంటే విశిష్టము అయిన పరమాత్మను ఆత్మజ్ఞానులు సదా ఉపాసించుచున్నారు. అందరిలోను గల ఆ పరమాత్మను సర్వదా దర్శించుచూ, ఆరాధిస్తున్నారు. మనము ఆ మహనీయులగు ఆత్మజ్ఞుల మార్గమును అనుసరించెదము గాక! ఆత్మభగవానుడు తనయొక్క మాయాశక్తిచే, తనయందు వేరువేరైన (84 లక్షల) విధములైన జీవజాతులను సృష్టించుచున్నారు.
అట్టి సర్వజీవుల దేహములందు తానే ‘క్షేత్రజ్ఞుడు’ అయి వెలయుచున్నారు.
💐 సృష్టిస్తున్నారు. సృష్టిరూపులై ప్రదర్శనమగుచున్నారు.
💐 పరిపోషిస్తున్నారు. పరిపోషించబడేదంతా ‘తానే’ అయి ఉన్నారు।
💐 తనయందు లయం చేసుకుంటున్నారు. ‘జగద్దృశ్యము స్వస్వరూపాత్మకు అభిన్నము’ అను భావనయే ‘లయము’।
💐 మరల ఎప్పుడో క్రీడాభిలాషిగా సృష్టిస్తున్నాను. మనో కల్పనయొక్క ప్రారంభమే ‘సృష్టి’।
ఈ విశ్వ సృష్టి - స్థితి - లయలకు అధిపతియై సర్వము నిర్వర్తిస్తూనే ఆ పరమాత్మ - తాను మాత్రం నిర్వికారుడు, అప్రమేయుడు, పరుడు, నిర్విషయుడు అయి ఉన్నారు. సర్వము ప్రకాశింపజేస్తూనే సూర్యకాంతి దేనికీ సంబంధించనిదే అయి, ఏదీ స్వీకరించక ఉంటున్నరీతిగా పరమాత్మ సర్వకారణుడు, కారణరహితుడుగా… ప్రదర్శనమగుచున్నారు.
➤ సర్వభూతములను తానే అయి
➤ సర్వసాక్షిగా వేరై
➤ సర్వదా కేవల స్వరూపుడై
‘అకర్త’గా….. ప్రకాశిస్తున్నారు. ఇహ స్వరూపుడుగా ‘కర్త’। పరస్వరూపుడుగా అకర్త। ఇహ స్వరూపుడుగా ‘భోక్త’। పరస్వరూపుడుగా ‘అభోక్త’. ఈవిధంగా ఉభయమై ఆనందిస్తూ ఉన్నారు.
⌘⌘⌘
సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటే ఆ తేజస్సు అన్నివైపులా ప్రసరిస్తూ, చీకట్లను పాలత్రోలి కాంతివంతముగా చేయుచున్నది కదా! అదే రీతిగా ఆత్మభగవానుడు ఏకస్వరూపుడై ఉండి, విశ్వమంతా దశదిశలలోను, సర్వజీవరాసులలో వెలుగొందుచున్నారు. ప్రతి దేహియొక్క ద్రష్ట - దర్శన - దృశ్యములను ప్రకాశింపజేయుచున్నారు. ఆ పరమాత్మ యొక్క స్వభావమే ‘ప్రకృతి’ రూపము సంతరించుకొనుచున్నదై…,
♠︎ ఈ విశ్వము యొక్క ఉత్పత్తి - స్థితి - పరిణామము - ఉపశమనములను ప్రదర్శిస్తోంది.
♠︎ ఈ జగత్తంతా తన అధిష్ఠానముగా (స్వకీయప్రదర్శనముగా) కలిగినదైయున్నది.
అట్టి స్వభావమే ‘అథ్యాత్మము’ అని పిలువబడుతోంది (స్వభావో ‘అథ్యాత్మ’ ఉచ్యతే।)
ఆయనయొక్క ప్రదర్శనమే ‘‘మాయ, ప్రకృతి, రతి, కామ’’ అను శబ్దములుగా కూడా చెప్పబడుతోంది.
ఆయనయే పంచభూతముల యొక్క అనుసంధానకర్త. పదార్థములు, వాటి వాటి ధర్మములకు మూలకారకుడు. ఆయన నియోజించుటచేతనే (At his proclaimation) ఈ విశ్వము చేతనత్వము పొందినదై ఇట్లు ప్రవర్తించటం జరుగుతోంది!
ఉపనిషత్తులచే విశదీకరించబడుచు, ఎలుగెత్తి చాటబడుచూ, ప్రతి జీవునిలో రహస్యముగా దాగి వున్న తత్త్వముగా, సత్యముగా ఉన్నది ఆ పరమాత్మయే! ప్రతి జీవునియొక్క గుహ్యాతిగుహ్యమైన (రహస్యములలోకెల్లా రహస్యమైనట్టి) సహజరూపము ఆయనయే!
♛ వేదములే ప్రమాణము అయి ఉన్నట్టిది…,
♛ వేద మహావాక్యార్థమైనట్టిది….,
♛ సత్యద్రష్టలగు ఋషులకు, దేవతలకు మునుముందే ఉన్నట్టిది…., ఆ పరబ్రహ్మమే!
అట్టి పరబ్రహ్మమును ‘సో2హమ్, తత్త్వమ్’గా తెలుసుకొని ఈ జీవుడు తత్ స్వరూపుడై అమృతస్వరూపముగా ప్రకాశించుచున్నాడు! నాలో నేనై కనిపించే పురుషకారము - ఆ పరమపురుషుని ప్రదర్శనమే।
ఆయన నాకు అనన్యుడు। నేను ఆయనకు అనన్యుడను।
ఇతి పరమాత్మ।।
జీవాత్మ
పరమాత్మయొక్క స్వీయ కల్పితాంశయే అగు ఈ జీవాత్మ….,
✤ గుణాన్వయో యః। ప్రకృతిలోని సత్త్వ - రజో - తమో గుణములను ఆశ్రయించినవాడై…..,
✤ ఫల కర్మ కర్తా, కృతస్య। కర్మలను నిర్వర్తిస్తూ…., కర్తృత్వము వహిస్తూ,
✤ తస్యైవ స చ ఉపభోక్తా। ఆ కర్మలకు - కర్మఫలములకు కర్తృత్త్వ భోకృత్త్వములు వహిస్తూ….,
✤ అనుక్షణికంగా కర్మ-కర్మఫలముల ‘ధ్యాస’ వృద్ధి చెందుచుండగా, పర్యవసానముగా సుఖ-దుఃఖ అనుభవములు కలిగి ఉంటూ,
✤ త్రిగుణబద్ధుడై…,
14 లోకాలలో అసంఖ్యాక ఉపాధులలో రాకపోకలు సుదీర్ఘకాలంగా కొనసాగిస్తున్నాడు. వచ్చిన చోటు నుండి బయల్వెడలుచున్నాడు. ఎప్పుడో బయలుదేరినచోటికే వచ్చుచున్నాడు. ప్రతిచోటు ఆతనికి కేంద్రబిందువే అగుచున్నది.
ఈశ్వరుడు
ఇక ఈశ్వరుడో? త్రిగుణములకు, దేహముల రాక పోకలకు, సర్వసందర్భములకు సాక్షియై ఉంటున్నాడు. జాగ్రత్ - స్వప్న - సుషుప్తులకు కూడా సంబంధించనివాడై మౌనంగా చూస్తూ ఉన్నారు. విశ్వరూపుడై, ఈ విశ్వమును అధిగమించినవారై ఉంటున్నారు. జీవాత్మత్వమును ఒక నాటకములోని పాత్రవంటిది గాను, ఈశ్వరత్వము ఆ నటుని ‘నటనా కౌశలము’ వంటిదిగాను - దృష్టాంతపూర్వకంగా వివరించబడుతోంది.
ఒక చమత్కారం -
ఈ జీవాత్మ తనకే చెందిన ఈశ్వరత్వమును సందర్శించటమే లేదు. సందర్శించిన మరుక్షణం సర్వ దుఃఖములు బంధములు తొలగగలవు.
అకర్త-కర్త :: అభోక్త-భోక్త
శ్లో।। అంగుష్ఠమాత్రో రవితుల్యరూపః, సంకల్ప అహంకార సమన్వితో యః
బుద్ధేర్గుణేన ఆత్మగుణేనచైవ ఆరాగ్రమాత్రో హి అపరో2పి దృష్టః।।
సర్వుల హృదయాలలోను ఆ చైతన్యపురుషుడు అంగుష్ఠమాత్రుడై, సూర్యునివలె స్వయం ప్రకాశకుడై, సంకల్ప-అహంకారములను కల్పించుకొనుచున్నవాడై, (అయినప్పటికీ) వాటికి సంబంధించనివాడై - వేరుగా (పరమ్) ఉన్నారు. సర్వకల్పనలను కల్పించుకొంటూ అకర్తగానే ఉంటూనే వినోదిస్తున్నారు. జీవాత్మగా బుద్ధిని, గుణములను కల్పించుకొని వాటిల్లో చక్రభ్రమణమును పొందుచున్నారు.
ఈ జీవాత్మ వాస్తవానికి - ఒక వెంట్రుకయొక్క చిట్టచివరి భాగము యొక్క నూరవవంతు (1/100)లో నూరవ వంతు కంటే కూడా (1/100 x 1/100) అత్యంత సూక్ష్మాతి సూక్ష్మ స్వరూపుడు! పరదృష్టిచే పరమాత్మయే అయి ఉండి, అపర దృష్టిచే ‘జీవాత్మ’గా అగుపిస్తూ, ‘‘బద్ధునివలె’’ చూడబడుచున్నాడు.
వస్తుతః ఈ జీవుడు పరమాత్మ స్వరూపుడే గాని మరింకేమీ అయి ఉండలేదు కదా! జీవో శివః! ఇది తెలుసుకొన్నవారమై మనము మనయొక్క శివత్వమును ఉపాసించి, దర్శించి, ప్రవేశించి, తన్మయులమై బ్రహ్మానంద భరితులము అయ్యెదముగాక!
ఆ పరమ పురుషుడు (లేక) పరమాత్మ ఎట్టివాడు? - మరికొంత అభివర్ణించుకుందాము।
నైవ స్త్రీ, న పుమాన్ ఏష, నైవ చ అయం నపుంసకః। ఆ ఆత్మదేవుడు స్త్రీయా? పురుషుడా? నపుంసకుడా? ఇవేమీ ఏమాత్రము కానేకాదు!
అయితే…,
✤ స్త్రీ దేహము ఆశ్రయించి స్త్రీగాను,
✤ పురుషదేహము ఆశ్రయించి పురుషుడుగాను,
✤ నపుంసక దేహము ఆశ్రయించి నపుంసకుడుగాను
✤ దేవతా దేహము ఆశ్రయించి దేవతగాను,
✤ జంతు దేహము ఆశ్రయించి జంతువుగాను,
అగుచున్నది ఆ ఆత్మదేవుడే! అట్లా అగుచున్నప్పటికీ ఆయన సర్వదా యథాతథుడే।
ఒకడు ఒక నాటకంలో ఒక పాత్రగా నటిస్తూ…,
- తాను స్వతఃగా ఏదై ఉన్నాడో…అది కోల్పోవుచున్నాడా? లేదు!
- పాత్రగా నాటకరంగముపై కనిపిస్తున్నది ఎవరు? ఆ నటుడే?
- నాటక పాత్ర యొక్క గుణములు వస్త్రధారణ, సంబంధములు మొ।।నవి నటుడివా? కాదు.
నాటక పాత్ర కల్పితమే అయినట్లు, ఈశ్వరుని సమక్షంలో జీవాత్మ నాటక పాత్రవలె కల్పితముగా, దృష్టము (కనిపించేది) అగుచున్నది. ఈ జీవాత్మ పరిమితునివలె అగుపిస్తూ ఉన్నప్పటికీ, వాస్తవానికి సర్వదా పరమాత్మ స్వరూపుడే! అనంతుడే!
అట్టి జీవాత్మ కూడా
❋ అనాది। అనంతుడు। ఆద్యంతరహితుడు। (ప్రకృతిం, పురుషంచైవ విద్ధి అనాదీ ఉభావసి)।
❋ జీవాత్మ వాస్తవానికి ఇంద్రియ బద్ధుడు కాడు।
❋ తానే మాయా సంసారమునకు సృష్టికర్త. తాను పొందుచున్న అవస్ధలకు తానే రచయిత, దర్శకుడు, నటుడు, ప్రేక్షకుడు, విమర్శకుడు కూడా। మరొకరెవరో కాదు।
❋ మాయలో ఉన్నవాడే - మాయా రచయిత కూడా! మాయా రచయితగా ‘మాయి’ అనబడుచున్నాడు.
❋ అనేక రూపములు కలిగి ఉండినట్టి విశ్వస్రష్ట కూడా। (అజ్ఞాన దృష్టికి) ఈ ‘జీవుడు’ రూపముగా కనిపిస్తున్నది పరమాత్మయే।
❋ సర్వ వ్యాపి అయి ఉండువాడు। స్వప్న ద్రష్టయొక్క ఉపద్రష్టా చైతన్యమే స్వప్నమంతా వ్యాపించి ఉంటునట్లు, ఈ జీవుని ఉపద్రష్ట (సాక్షీ) చైతన్యమే జాగ్రత్ అంతటా వ్యాపించినదై ఉన్నది.
❋ తాను కల్పించుకొను విశ్వములకు తానే పర్యవేక్షకుడు కూడా!
ఈ విధంగా జీవాత్మ పరమాత్మల సమాన ధర్మములను ఎవ్వరు గ్రహిస్తారో, వారు సంసార పాశములనుండి విముక్తుడు అగుచున్నట్లే. ఈ జీవుడు తానే పరమాత్మనని తెలుసుకోగానే బంధములన్నీ తెగిపోతున్నాయి. ఇంతకు మించి బంధము తొలగటానికి వేరే ఉపాయమే లేదు.
ఎవ్వడైతే…
‘‘నేను ఈ దేహమునకు పరిమితుడను మాత్రమే కదా! ఈ దేహము నాకు సంబంధించినది. దీనికి నేను సంబంధించినవాడను’….. అనే దేహాభిమానము మొదలంట్లా వదలివేసి, ఇక ఆపై -
🪔 ‘‘జాగ్రత్‌లో తటస్తిస్తున్న ‘‘నేను’’ అను భావనలకు మునుముందే ఉన్నట్టి భావాతీతుడను. త్రిగుణరహిత కేవల చైతన్య స్వరూపుడను. భావములను నియమించు ఆత్మ స్వరూపుడను. సృష్టికర్తను. భావములకు ప్రభవించు స్థానమును.
🪔 భావములు నాచే స్వీకరించబడుతూ ఉంటాయి. వదలబడుచూ ఉంటాయి. అయినప్పటికీ కూడా, భావములకు బద్ధుడను కాను. భావములచే పరిమితుడను కాను. భావములపై ఆధార పడువాడను కాను.
🪔 భావ - అభావములకు ఉత్పత్తి స్థానమగు శివానంద స్వరూపుడను!’’
….అని గ్రహిస్తాడో - అదియే భావాతీత ధ్యానము.
‘‘ఈ దేహము - మాయ - సంసారము - బంధము - ఇవన్నీ కూడా - నేను ధరించి, కొంత సమయం ఉంచుకొని, ఆపై ఎప్పుడో విడిచిపెట్టే వస్త్రము వంటివి మాత్రమే!’’
- అని గమనిస్తూ ఉంటాడో…. అదియే త్రిగుణాతీత దర్శనము.
దేహ - భావాదులతో సహా ఈ సర్వము తనకు వేరైనవిగా చూస్తాడో…, (మరియు) సమస్తము తన ‘అనుభూతి’ అను ఆనందము యొక్క విస్తరణ రూపమే… అని గమనిస్తూ ఉంటాడో, - అదియే దేహాతీతము.
‘‘అహమస్మి తత్ ఆత్మ దేవః’’ అని తెలుసుకొనినవాడై, ఈ దేహాదులను మనస్సుతో త్యజించినవాడై ఉంటాడో…., అదియే మనో-అతీతము. దేహాతీతము.
ఆతడికి ఇక బంధమెక్కడిది? సర్వదా ముక్తుడే! ఆతనిపట్ల ‘‘మోక్షము ఎట్లా లభిస్తుంది?’’ అనే ప్రశ్న ఇక ఉండదు. దాని సమాధానముయొక్క ఆవశ్యకత కూడా శేషించదు.
షష్ఠమో2ధ్యాయః - తమ్ ఆత్మస్థమ్ - సద్గురు విశ్లేషణము
అటు తరువాత బ్రహ్మవాది అగు శ్వేతాశ్వతరమహర్షి తన యొక్క ప్రియశిష్యులకు ఈవిధంగా మరికొన్ని విశేషాలు బోధించసాగారు.
శ్వేతాశ్వతర మహర్షి: మమాత్మానంద స్వరూపులగు ప్రియశిష్యులారా! బిడ్డలారా! మమోపాసనా దివ్య స్వరూపులారా!
❓ ఈ విశ్వము / దృశ్యము / ప్రకృతి ఎట్లా జనించింది?
❓ జీవాత్మ - ఈశ్వరుడు - పరమాత్మ…అను విషయమై ఇంకేమి వివరాలు?
అనే విషయం గురించి మరికొన్ని విశేషాలు ఈ విధంగా సత్సంగరూపంగా సంభాషించుకొంటున్నాము. వినండి.
⌘
‘‘ఈ ఎదురుగా కనిపిస్తున్న అనంత విశ్వసృష్టికి ఏది కారణమైయున్నది?’’ అను విషయం గురించి వేరు వేరు వక్తలు చెప్పుచున్న విశేషాలు మరికొంత వివేక దృష్టితో వినండి.
స్వభావవాదులు
‘‘ఈ దృశ్యమునకు కారణము స్వభావము. ఇదంతా స్వభావరీత్యా (In its natural course) ఈ విధంగా వస్తువులు, దేహాలు, పదార్థాలు, పంచభూతాలు….ఇవన్నీ ఏర్పడుచున్నాయి. కొంత కాలానికి నశిస్తున్నాయి. దీనిని ఎవరూ సృష్టించటంలేదు’’….అని స్వభావవాదుల అభిప్రాయము. అయితే ఇక్కడ ‘‘ఈ జీవాత్మ ఎవరు? స్వభావము అనునది ఎవరిది? ఎవ్వరిదీ కాకుంటే ఎందుకు ఇట్లా స్వభావము కలిగి ఉంటోంది?’’….అనే ప్రశ్నలు ఉండిపోతున్నాయి. కనుక ఇది ‘అనాత్మవాదము’ అని అనబడుతోంది.
‘కాల’వాదులు
‘‘ఇదంతా కాలమే సృష్టిస్తోంది! కాలమే నశింపజేస్తోంది’’ అనునది వీరి అభిప్రాయము. అప్పుడు, ‘‘కాలమును నియమించువారెవ్వరైనా ఉన్నారా? ఎందుకు కాలము ఇట్లా సృష్టిస్తోంది?’’ అనే ప్రశ్నలు అట్లాగే ఉంటున్నాయి. మరి-కాలము కృతమా? స్వయం కృతమా? వీటికి సమాధానము లేదు కాబట్టి, - ఇది పరిమితవాదముగా చూడబడుతోంది.
ఇట్లా ఎన్నెన్నో పరిముహ్యము(Illusion) తో కూడిన విశ్వకారణవాదములు చెప్పబడుచున్నాయి.. ఇక ఇప్పుడు మనం ఉపనిషత్ వాఙ్మయము చెప్పునది, బ్రహ్మవేత్తలగు ఆత్మజ్ఞుల వాక్కులను దృష్టిలో పెట్టుకొని ఈ విషయమై వివరించుకుందాము.
బ్రహ్మము జీవుడుగా అవరోహణము - జీవుడు బ్రహ్మముగా ఆరోహణము ఇదియే బ్రహ్మచక్రము! ఏమరపు - జ్ఞాపకముల చమత్కారము। క్రీడా వినోదము।
వాస్తవానికి ఈ జగత్తంతా సర్వదా పరమాత్మ స్వరూపమే అయి ఉండి, పరమాత్మ చేతనే ఆవరించబడినదై ఉన్నది.
(1) జ్ఞః : పరమాత్మ కేవల జ్ఞాన స్వరూపుడు. ముందుగా ‘తెలుసుకోవటం’ అను ఆత్మ చైతన్యశక్తి ప్రవర్తమానమైనతరువాతనే తెలియడుచున్నదంతా అనన్యంగా బయల్వెడలుతోంది.
తెలియబడటం ప్రారంభం కాకముందే ఉన్న తెలివి → జ్ఞః, కేవల చిత్। నిర్మల చిత్। పరమాత్మ।
(2) ఆ ‘తెలివి’ని ఉపయోగించుచూ తెలియబడునది కల్పించుకొనువాడు → ఈశ్వరుడు.
(3) తెలియబడుదానిలో ప్రవేశించి ‘‘నేను ఇందులో చిక్కుకుని, ఈ తెలియబడు దానితో సంబంధితుడను, బంధితుడను అయినాను’’ అని తలచువాడు → జీవుడు. ఈ ముగ్గురు ఒక్కటే। త్రిమూర్తులను ధరించటం జరుగుతోంది.
అనగా, ఈ మూడు కూడా (కేవల చిత్-ఈశ్వరుడు-జీవుడు) పరమాత్మయందే, పరమాత్మ చేతనే, పరమాత్మకు అభిన్నమైనవై ఉండగా, పరమాత్మ - యథాతథుడు (చేతి కదలికలు దేహివే అయి, దేహి కదలకయేఉన్న తీరుగా) - అయిఉంటున్నారు.
ఈ విధంగా పరమాత్మయే జ్ఞః (జ్ఞాన) స్వరూపుడు ప్రజ్ఞాస్వరూపుడు (ప్రజ్ఞానమ్ బ్రహ్మ). ఆయన సర్వజ్ఞుడు. సర్వము ఎరిగినవాడు.
కాలః కాలో: ఈ దేహాలు, జగత్తులు, బ్రహ్మాండములు కాలముచే నియమించబడి, కాలముచే జనించి, కాలముచే పరిపోషించబడి, కాలముచే మ్రింగివేయబడుచున్నాయి. మార్పు చెందుచున్న ఈ సర్వమునకు కాలమే కర్త అగుచున్నది. అయితే, పరమాత్మయే లీలగా కాలమును నియమించువారు. కాలమునకు ఆవల ఉన్నవారు. భూత-వర్తమాన-భవిష్యత్‌లచేత గాని,వాటిల్లో సర్వ విశేషములచేత గాని మార్పు చెందనివారు. అందుచేత కాలమునకే కాలమైనట్టివారు. కాలఃకాలుడు। (కాలఃకాలః ప్రసన్నానామ్, కాలః కిన్ను కరిష్యతి?)
అట్టి ‘‘మహాకాలుడు’’ అను బిరుదుగల రుద్ర-శివ భగవానుని తెలుసుకొన్న తరువాత కాలబద్ధత, నిబద్ధత ఆత్మను ఏమిచేయగలదు?
గుణీ : గుణములు తనవైనవాడు పరమాత్మ. ఆయన తనయొక్క మాయాశక్తిచే సత్వ-రజో-తమో గుణములను తన ఇచ్ఛానుసారంగా ప్రదర్శించువారు. అంతేగాని గుణముల మధ్య ఉన్నవారు కాదు. గుణబద్ధులు కాదు। గుణములకు పరమాత్మ ఆధారము. అంతేగాని, పరమాత్మ గుణములపై ఆధారుడు కానేకాదు.
సర్వవిద్యః : ఈ దేహముల రాకపోకలు, జీవాత్మ కల్పనలు, లోక కల్పనలు, బంధ - మోక్షములు - ఇవన్నీ ఎరిగియే ఉండి, సర్వసాక్షి అయి ఉన్నవారు. సర్వజ్ఞుడు. ఆ ఆత్మభగవానుని నుండి బయల్వెడలిన భావనా చమత్కారములు ఆయనవలననే - శుభాశుభ కర్మలరూపంగాను, జగత్తు రూపంగాను వివర్తము (Emanating /Emerging from out of) అగుచున్నాయి. వాటి వివర్తనా ప్రదర్శనములే ఇక్కడి పంచభూతములు, వాటి వాటి ధర్మములు, పాంచభౌతిక దేహములు కూడా! జన్మలు - జన్మాంతరములు ఆ ఆత్మయొక్క ఈశ్వర చమత్కార సంబంధమైన వివర్తము(Derived)లే।
ఆ ఆత్మభగవానుడు తనయొక్క ఒకానొక మహత్తరమగు ‘క్రియాంశ’ నుండి…,
ఇవన్నీ విర్తము (Deduced) అగుచున్నాయి.
కర్మసాక్షి అగు ఆ ఆత్మభగవానుడు ఈ జగత్ తతంగమంతా వీటన్నిటిలో కొనసాగిస్తూ, మరల ఎప్పుడో….తాను ప్రదర్శిస్తూ వస్తున్న ‘కర్మ ప్రవృత్తి యోగము’ను ఉపశమింపజేస్తూ, ‘నివృత్తి యోగము’ను ఆశ్రయిస్తున్నారు. చిన్నపిల్లవాడు వినోదంగా కొంతసేపు ఆడుకొని, ఆ ఆటలు ఆపి, ఇంటికి చేరువిధంగా ఇదంతా జరుగుచున్నది. ఆ ఆత్మదేవుడు తన అంశయగు జగత్‌తత్త్వమును ఏకము, అఖండము అగు ఆత్మస్వరూపమునందు సంయోగము చేసివేస్తున్నారు. ఆత్మ - ఈశ్వరుడు - జీవుడు - దృశ్యము ఇవన్నీ ఏకము - అఖండము అగు స్వస్వరూపంగా ఆస్వాదిస్తున్నారు. ఇదియే ‘బ్రహ్మచక్రము’ అని కూడా అంటారు.
మిత్రులారా! మనం సర్వ కర్మ శృంఖలములను త్రెంచుకొని మోక్షిభాగి కావటానికై, ఈ ‘జన్మ’ అనే అవకాశమును సద్వినియోగం చేసుకోవాలి. అందుకొరకై - ఉత్తమ కార్యక్రమములను ఆశ్రయించెదముగాక! క్రియా యోగము, ధ్యానము, స్వధర్మ పూర్వక కర్మయోగము, భక్తియోగము దైవీ గుణాశ్రయము మొదలైనవన్నీ అందుకు ఉపాయములు.
భావాతీతమును (లేక) అభావమును ఆశ్రయిస్తూ కర్మలు నిర్వర్తించుచుండగా ‘కృతకర్మ నాశనము’ జరుగగలదు. మనం చేస్తున్న కర్మలు మన దృష్టిలో అవిషయములవగలవు. ‘‘కర్మలచే నేను బద్ధుడను అగువాడను కాను’’…. అను అతీత దృష్టి జనించి, క్రమంగా ప్రవృద్ధము కాగలదు.
కర్మ అభావ - ఆత్మ భావనల కర్మలు నిర్వర్తిస్తూ ఉండగా కర్మబంధాలు వాటికవే తొలగిపోతాయి. కర్మ బంధములు తొలగటానికై వేరే మరొక ప్రయత్నము (Another different programme) తో అగత్యముండదు.
అప్పుడు కృత - అకృత (చేస్తున్నట్టి - చేయనట్టి) కర్మలకు వేరైనట్టి ఆత్మతత్త్వమునందు మనము ప్రవేశించగలము! ఆత్మగా ప్రకాశించగలము!
కిం తత్ పరమమ్?
తత్ పరమాత్మ ఎట్టివాడంటే….
ఆదిః : సర్వమునకు మొట్టమొదటే ఉన్నట్టివారు. (నాయొక్క ఆది-పరాశక్తి స్వరూపము).
సంయోగాత్ : ఆయన తనకు ద్వితీయమువలె కనిపించే జగత్తును స్వకీయ క్రీడావినోదముగా తానే కల్పించుకొని సంయోగము పొందుచున్నారు. ఆయనయొక్క ‘‘సంయోగ భావనచే’’ జగత్తు (జనిస్తూ గతిస్తూ మధ్యలో కనిపిస్తున్నట్టి దృశ్య వ్యవహారము) - ఉన్నట్లు, ‘వియోగభావన’చే ‘మొదలే లేనిది’ అగుచున్నది.
నిమిత్త హేతుః : సర్వమునకు నిమిత్తహేతువై ఉన్నారు. (ఉదా : ఒక పని జరుగుచున్నప్పుడు చేతులు - ఉపాదానకారణం! ఆ చేతులు ఉపయోగించువాడు నిమిత్త కారణం).
పరమ్ : ఈ సర్వమునకు పరమై, అప్రమేయుడై, అసంబంధితుడై ఉన్నట్టివారు. (పరమ్ = ఆవల, ఇహమ్ = ఈవల)
త్రికాలాత్ పరమ్ : మూడుకాలములకు ఆవలి వారు. భూత-వర్తమాన-భవిష్యత్తులలోని నాయొక్క యథాతథ కేవలీ స్వరూపుడు.
అకలో2పి దృష్టః : తన కలము (కల్పన)కు తానే ద్రష్టయై తిలకించునట్టివారు. తన కల్పనకు తానే ‘భోక్త’ అయి, సంబంధితుడు అగుచూ, ‘బంధము’ను అనుభవముగా పొందుచున్నవాడు.
తమ్ విశ్వరూపమ్ : తన కల్పనయే అయి ఉన్న ఈ విశ్వమంతా తన రూపముగా కలవాడు. (సమస్తము నేనైన నేను).
భవ భూతమ్ : పంచభూత స్వరూపుడు (ఈ పాంచభౌతిక దృశ్యమంతా ‘తానే’ అయి ఉన్న వాడు. ఈ భౌతికంగా ఏర్పడినదై (భవమై) ఉన్నదంతా ఆయన యొక్క సంప్రదర్శనా చమత్కారమే.
ఈడ్యమ్ దేవమ్ : స్తోత్రార్హుడైన దేవాదిదేవుడు! ఆ ఆత్మ భగవానుడే దేవతలచేత కూడా సదా స్తుతించబడుచున్నాడు.
స్వచిత్తస్థమ్ : ప్రతి ఒక్క జీవుని యొక్క స్వకీయ చిత్తమునందే సర్వదా వేంచేసి ఉన్నవారు. (“The Absolute Self” that is dwelling in one’s own Zone of INTEREST)
ఉపాస్య పూర్వమ్ : మన పూర్వీకులచే కూడా ఉపాసించబడియున్నవారు. మహర్షులకు, దేవతలకు కూడా ఉపాస్య వస్తువై ఉన్నవారు!
సవృక్షః : వృక్షమువలె సమస్తము ప్రసాదించువారు. ఎటూ కదలనివారు.
సవృక్ష - కాలాకృతిభిః పరో - అన్యో : ఈ దృశ్యముతో పెట్టుకొనియున్న ‘‘అజ్ఞాన సంబంధము’’ అనే సంసార వృక్షమునకు - కాలమునకు కూడా పరము - అన్యము అయినట్టివారు!
యస్మాత్ అయమ్ ప్రపంచమ్ పరివర్తతే : ఎవనియందైతే ఈ పరివర్తన (changing factor) శీలమైయున్న ప్రపంచమంతా ఏర్పడినదై ఉన్నదో…అట్టి పరమాత్మను ఉపాసించుచున్నాము. ఆరాధిస్తున్నాము. ఆయన - తాను ఏమాత్రము మార్పు చెందకయే, సమస్తమైన మార్పు-చేర్పులకు ఆలవాలము అగుచున్నట్టివారు.
ఆయనను…,
తెలుసుకొని, ఆయనను ఆత్మస్థునిగా, మనయందే సర్వదా ఉన్నవారిగా దర్శిస్తూ ఉండగా,
ఇక మనము -
✩ పరబ్రహ్మ స్వరూపులమై,
✩ అమృతరూపులమై,
✩ ఈ విశ్వమంతా మన ధామముగా (House) గమనిస్తున్నవారమై ప్రకాశించుచుండగలము.
మనము ఉపాసించుచున్నట్టి ఆ సర్వాత్మకుడగు పరమాత్మ…..,
✩ అంతటా నిండి ఉండి, విస్తరించియుండి సర్వమును నియమించుచున్న ఈశ్వరుడు.
✩ సర్వ దేహములలో మహత్తరమైన వస్తువై, జీవ - ఈశ్వరులకు పరమై ప్రకాశిస్తున్న ఆత్మభగవానుడు।
✩ దేవతలకే నియామకుడైనట్టి దేవాది దేవుడు। తమ్ దేవతానాంచ పరమంచ దైవతమ్। దేవతలకు కూడా స్తుతించువస్తువై, ఉపాస్య వస్తువై ఉన్నవారు। సమస్త జీవుల స్వస్వరూపాత్మ దేవుడై సర్వత్రా వెలయుచున్నారు.
✩ విశ్వపతికే పతి అయి, భరించువారిని కూడా భరించువాడై ఉన్నవారు. భువనేశ్వరుడై, భువనములన్నీ రక్షిస్తున్నవారు. అట్టి ఆత్మ భగవానుని జగత్‌రూపముగా గమనిస్తూ, ఆ ఆత్మదేవునిగా స్థుతించెదముగాక! ఆరాధించెదముగాక!
ఈ జగత్తంతా ఆయనయొక్క ప్రత్యక్ష-ఆనంద స్వరూపమే। మరింకేమీ కాదు.
అట్టి పరమపురుషునకు,
✩ కార్య - కారణ - కర్తృత్వములు లేవు.
✩ ఇంద్రియములకు గాని - ఇంద్రియ విషయములకుగాని పట్టుబడనివారు. ఎందుకంటే ఆయన వాటికి సంబంధించినవారు కాదు. అప్రమేయములు. వస్త్రము ధరించినవాడు వస్త్రముగా అవడు కదా! ఆయన సర్వదా సమస్తమునకు పరస్వరూపులు।
ఈ జీవునికి సంబంధించి సహజరూపమే అయి ఉన్న - ఆయనకు సమానమైన మరొక వస్తువే లేదు! ఇక మించినదంటూ మరేమీ లేదని చెప్పవలసిన పనేమున్నది?
ఆయనయొక్క పరాశక్తియే ఈ ఈ విధములైన దేవ - మనుష్య - తిర్యక్ జీవలోకములుగా, (14 లోకములుగా) మనోబుద్ధి చిత్త అహంకారములుగా, తదితరమైన ఈ ఆకాశ భూమ్యాదులుగా విలసిల్లుచున్నది.
ఆయనకు శక్తి మరొకరు ఇచ్చేది కాదు. స్వాభావికమైనది. ఇచ్ఛా - క్రియా - జ్ఞాన సంపన్నుడు ఆయన! అవియే ఈ జగత్ దృశ్యము యొక్క మూలపదార్థములు. మూలప్రకృతి. ఆయనకు లోకాలలో మరొక పతి లేడు. ఆయనయే సర్వలోకములు. సర్వము నియమించే ఆయనకు మరొక నియామకుడు లేడు. సర్వనియామకుడు! నియామక రహితుడు!
✩ నిరాకారుడగు ఆయనకు స్త్రీ-పురుష-నపుంసక-జడ-చేతన భేదములు లేవు. ఆయన అవన్నీ అగుచూ, ఏదీ కానట్టివారు. కవి. పురాణుడు. అనుశాసితారుడు.
✩ ఆయన కారణరహితుడు. ఆయనకు ‘‘ఇది కారణము’’ - అనునది ఏమీ లేదు. అకారణుడు. మరొకరెవ్వరూ ఆయనకు కారణమైలేడు. కాబట్టి ఆయన స్వభావమైనట్టి ప్రకృత్తి -జగత్తులు - జీవుడు - బంధము - మోక్షము. మొదలైనదంతా కూడా అకారణము.
కారణాలన్నిటికీ కారణుడైన అకారణుడు ఆయన! ఆయన దేని - దేనికి కారణమో…అదంతా…ఆయనవలెనే అకారణం. ఆయన నుండి వేరే ఏదీ జనించటమూ లేదు! వేరుగా ఉన్నదీ లేదు! లయించటమూ లేదు! అట్టి పరమాత్మనే, పరబ్రహ్మమునే, పరమపురుషునే మనము ఉపాసించి, ఆయనకు అనన్యమగుచున్నాము. పరమాత్మస్వరూపులమై ప్రకాశిస్తున్నాము.
మనము ఆయనకాని క్షణమే లేదు. ఆయన మనము కాని క్షణమూ లేదు.
⌘
ఒక సాలె పురుగు…
✤ తన నుండి తానే లాలాజలమును దారముల రూపంగా బయల్వెడలుచుండగా…,
✤ ఆ దారములు సాలెదారపుచక్రములుగా తెరరూపంగా ఏర్పడి…,
✤ ఆ సాలెదారపు చక్రములో సాలె పురుగు విలాసముగా విహరిస్తున్నట్లుగా…,
అవ్యయమగు బ్రహ్మము బ్రహ్మాండము అనే గొప్ప సాలెచక్రము వంటి దానిని నిర్మించుకొని…అందులో వినోదంగా విహరిస్తూ సంచారము చేస్తోంది.
అట్టి ఆత్మస్వరూప మహాపురుషుడు మనకు అవ్యయమగు బ్రహ్మజ్ఞాన - స్థాన - అనుభవములను ప్రసాదించెదరుగాక!
శ్లో।। ఏకో దేవః సర్వభూతేషు గూఢః, సర్వవ్యాపీ సర్వభూత - అంతరాత్మా।
కర్మాధ్యక్షః సర్వభూతాధివాసః సాక్షీ చేతా కేవలో నిర్గుణశ్చ।।
సర్వజీవుల అంతరాత్మగా ఏకస్వరూపుడగు ఆ పరమాత్మయే, దేవాది దేవుడై వేంచేసి వసించుచున్నారు. అంతర్యామియై అందరిలో, అందరుగా - దాగి ఉన్నారు.
ఆయన -
🙏 సర్వవ్యాపకుడు!
🙏 సర్వులయొక్క అంతరాత్మ।
🙏 సర్వకర్మలకు అధ్యక్షుడు!
🙏 సర్వజీవులలో అధివాసుడు। అధినాధుడు। అధి దైవము।
🙏 సర్వులలోని కేవలసాక్షి!
🙏 గుణములకు ఆధారమై, నిర్గుణుడై ఉన్నవారు।
ఆయన నిష్క్రియుడయి ఉండి కూడా అనేక జీవులలో మనో - బుద్ధి - చిత్త - అహంకార స్వరూపుడై సర్వమును నిర్వర్తింపజేస్తున్నారు.
ఏకరూపియే అయి, అనేక రూపములుగా కనిపిస్తున్నారు.
తమ్ ఆత్మస్థమ్ యే అనుపశ్యంతి ధీరాః,
తేషాగ్ం సుఖమ్ శాశ్వతమ్। నేతరేషామ్। (న ఇతరేషామ్)।
ఎవ్వరైతే అట్టి ఆ పరమాత్మను తమయందే
- కేవల సాక్షిగా - అప్రమేయుడుగా,
- మహాకర్తగా - విశ్వరూపుడుగా
ఇంకా ఇంతవరకు చెప్పుకున్న ఆయా సర్వవిశేషసమన్వితునిగా దర్శిస్తారో…, అట్టివారు శాశ్వత సుఖమును పొంది, ఆస్వాదించుచున్నారు. తదితరుల సుఖము శాశ్వతము కాదు! కాలబద్ధము. దుఃఖమిశ్రితము. సందర్భ పరిమితము.
పరమాత్మయొక్క ప్రదర్శనయే-ఇక్కడి వక్త, శ్రోత, తదితరులు కూడా! ఈ సత్యము ఎఱుగుచున్నప్పుడు ఇక మనకు బంధమెక్కడిది? మోక్షము ఎందుకు?
నిత్యో-అనిత్యానామ్ : అనిత్యమైన దేహాదులలో ఎవ్వరైతే నిత్యుడై వేంచేసి ఉన్నారో…,
చేతనః చేతనానామ్ : దేహము, మనస్సు, బుద్ధి మొ।।న వాటితో సహా కదిలే సర్వ వస్తువులకు ‘కదిలించేవాడు’గా ఉన్నారో….,
ఏకో బహూనామ్ : అనేకములుగా కనిపిస్తూ సర్వదా ఏకమే అయి ఉన్నారో….,
యో విదధాతి కామాన్ : సర్వజీవుల వాంఛితార్థములను ప్రసాదించుచున్న వారై ఉన్నారో…,
తత్ కారణగ్ం : కారణాలన్నిటికీ కారణమైయున్నారో…,
సాంఖ్యయోగాది గమ్యమ్ : ‘‘కిం తత్? కిం సత్? అది ఏమైయున్నది?’’ అను విచారణలచే చివరికి తెలియవచ్చువారై ఉన్నారో…,
అట్టి స్వస్వరూప పరమపురుషుని, ఆత్మభగవానుని తెలుసుకొనగానే సర్వపాశములు లేనివైపోతాయి. సర్వబంధములు బంధము కలిగించనివగుచున్నాయి.
⌘
సూర్యకిరణములు ప్రసరించటముచే విశ్వములోని వస్తువులు భాసించి కళ్లకు కనిపిస్తూ ఉంటాయి. ఆత్మదేవునియొక్క ప్రజ్ఞా-ప్రదర్శనమే ఈ భౌతిక ప్రపంచం. అయితే ఆత్మ ఈ భౌతిక సూర్యకిరణములచే భాసించేది కాదు.
❆ అట్లాగే చంద్రుని - నక్షత్రముల కిరణములచే, ఆ వెలుగులో కనిపించేది కూడా లేదు.
❆ విద్యుత్ కిరణములతో, మెఱుపుల వెలుగులలో కూడా భాసించేది కాదు. ఇక అగ్ని యొక్క వెలుగులో కనిపించేది కూడా కానట్లే కదా!
మరి?
తమేవ భాంతమ్ అనుభాతి సర్వగ్ం।
తస్య భాసా, సర్వమిదం విభాతి ।।
ఆ ఆత్మభగవానుడు ఈ సూర్య - చంద్ర - నక్షత్ర - విద్యుత్ - అగ్ని…ఇత్యాది తేజోమయ పదార్థములన్నీ తనయొక్క తేజస్సుచే తేజోమయం చేయటంచేత అవి వెలుగొందుచున్నాయి. ఆయన వెలుగులో ఇవన్నీ సాకారంగా కనిపిస్తున్నాయి. వెలుగుచున్న దీపపు కాంతియే దర్పణంతో వెలుగుగా కనబడుచున్న రీతిగా। సూర్య-చంద్ర-నక్షత్ర-విద్యుత్తులలో కనబడే సాకారమంతా ఆత్మభగవానుని ‘అనుభావన’చే అనుభవమగుచున్నది మాత్రమే!
గది మధ్యలో దీపం వెలుగుచూ ఉంటే గదిలో (10) వైపులా కాంతివంతమై, అక్కడి వస్తువులు, ఆకారాలు…మొదలైనవన్నీ కనిపిస్తున్నాయి కదా! అట్లాగే, ఈ విశ్వమునందు మధ్యగా ఆత్మజ్యోతి వెలుగుచున్నది కాబట్టి ఈ విశ్వము, ఈ లోకములు, ఈ దేహములు మొదలైనవన్నీ కూడా తేజోమయము, స్పందనశక్తి మయము, ప్రత్యుత్సాహమయము పొందినవై ఉంటున్నాయి. ఆయన అగ్నిస్వరూపుడై, జలస్వరూపుడై, తేజోరూపుడై, రసస్వరూపుడై అన్నిటా వేంచేసి ఉన్నారు.
తమేవమ్ విదిత్వా అతి మృత్యుమ్ ఏతి!
న అన్యః పంథా విద్యతే అయనాయ।।
అట్టి పరబ్రహ్మమును, పరమాత్మను ‘‘నాయందుగల ఈతడే। ఈతనియందే ఈ సమస్తము’’। అని తెలుసుకొన్నప్పుడు మాత్రమే ‘మృత్యువు’ అను పరిధిని దాటగలం. అందుకు మరొక మార్గమే లేదు. |
ఆ ఆత్మ భగవానుడే….
🪔 (స) విశ్వకృత్ - ఈ విశ్వమునకు కర్త। (He is the worker of the universe).
🪔 విశ్వవిత్ - ఇదంతా విశ్వముగా ఎరుగుచున్నది ఆయనయే। (He is the knower).
🪔 ఆత్మయోనిః - జీవులందరి ఉత్పత్తి స్థానము కూడా ఆత్మభగవానుడే। (He is the place of begining and place of birth of all).
🪔 జ్ఞః - కేవల జ్ఞానస్వరూపుడు (The absolute form of knowing).
కాలకాలో: కాలమును నియమించువారు. కాలమునకే కాలమైనవారు. (The origin and generating point of factor of time).
🪔 జ్ఞః సర్వగో : భూత - వర్తమాన - భవిష్యత్తులను, దేహముయొక్క ఆవల - ఈవల, జాగ్రత్ - స్వప్న సుషుప్తుల చమత్కారమును… అంతా ఎరిగి ఉన్నవారు. సర్వజ్ఞుడు.
(జాగ్రత్‌నకో, స్వప్నమునకో, సుషుప్తికో పరిమితమైనట్టి ఈ ఎరుక కలవాడు - (కించిజ్ఞుడు) ఈ జీవుడు)
🪔 గుణీ - సర్వవిద్యః (యః సర్వవిత్): త్రిగుణములు తనవైనవాడు. ఇహ-పరములు నిర్దుష్టముగా, అన్నీ తెలుసుకుంటూ ఉన్నవాడు.
ఈ విశ్వమంతా కూడా అట్టి అమృతానంద స్వరూపుడగు పరమేశ్వరుని ఉనికిచే సర్వే సర్వత్రా నిండినదై ఉన్నది.
ఆయనయే తన జ్ఞానశక్తిచే ఈ భూమండలమంతా సంరక్షణ చేస్తున్నారు. సర్వగతుడు. సర్వముగా విస్తరించి ఉన్నారు. ఈ జగత్తు అనిత్యము. (లేక) కల్పన. అనిత్యమైన సమస్తమునకు నిత్యమగు ఆత్మభగవానుడే ‘అంతర్లీనుడు’.
ఆయనకు వేరైన హేతువు ఈ జగత్తుకు లేదు. పరమాత్మయే సర్వమునకు కారణము। కారణ కారణము కూడా। ఆయనయొక్క వినోద సంకల్ప చమత్కారమే ఇదంతా!
ఏ పరమాత్మ అయితే…..,
అగు ఆ ఆత్మభగవానుని మేము శరణువేడుచున్నాము.
ఏ విధంగా అయితే….చర్మవత్ ఆకాశమ్ వేష్టయిష్యంతి మానవాః…. మానవుడు తనకు కనబడే ఆకాశమంతా చాపలా చుట్టి వస్త్రమువలె (ఒక పంచెవలె) చుట్టి ధరించటం కుదురుతుందా? కుదరదు కదా!
తదా శివమ్ అవిజ్ఞాయ దుఃఖస్య అంతో భవిష్యతి?
ఆ రీతిగా…,
శివస్వరూపుడగు ఆత్మభగవానుని ఎరగనంతవరకు ఆనంద వస్త్రమును ధరించలేడు. ఈ జీవునిపట్ల దుఃఖపరంపరలు తొలగవు.
⌘
ఈ విధంగా, విద్వాంసుడు, బ్రహ్మజ్ఞుడు, తత్త్వవేత్త, సద్గురువు అగు శ్రీ శ్వేతాశ్వతర మునీంద్రులవారు ప్రసాదించిన జ్ఞానబోధను వారి శిష్య - ప్రశిష్యులు మననపూర్వకంగా ఈ శ్వేతాశ్వ తరోపనిషత్‌గా సంభాషించుకొన్నారు. సత్సంగ పూర్వకంగా చెప్పుకున్నారు.
⌘
ఇందలి విషయము - చతుర్విధ ఆశ్రమ వాసులకు పరమ పవిత్రమగు ఆత్మతత్త్వ విచారణ అయి ఉన్నది. ఋషిపుంగవులచే చెప్పబడు సమ్యక్‌వచన రూపము అయి ఉన్నది!
వేదాంతము : ఈ తెలియబడేదంతా ఎవరు తెలుసుకుంటున్నారో ఆ తెలుసుకుంటున్న వానిగురించి తెలియజెప్పు శాస్త్రము.
శేతాశ్వతర మునీంద్రుల అంతేవాసులు (శిష్యులు) శ్వేతాశ్వతరోపనిషత్ విషయముల రూపంగా పరమము, అతి ముఖ్యము, రహస్యము, ఇతఃపూర్వమే మహనీయ ప్రవచితము - అగు ఈ వేదాంత శాస్త్రసార విశేషాలు జీవుని తప్పక సముద్ధరించగలవు.
⌘
శిష్యులు : అందరము విన్నాము కదా! ఇది జనులకు దుఃఖము తొలగించే ఔషధము కాబట్టి, మనమంతా, ఎవ్వరము ఎక్కడుంటే, అక్కడ జనులకు ఇందలి విశేషాలు మరల మరల వివరణగా బోధిస్తూ మననము చేసెదము గాక!
అయితే,
పరమ పవిత్రమైన ఇందలి విషయం మనము క్రోధము - ఆవేశము - లోభము - మాత్సర్యము - ఇటువంటి దుష్టగుణములను ఆశ్రయిస్తూ…. అప్రశాంతంగా ఉండే వారికి చెప్పకూడదు. అట్టి దురహంకారి, ఆవేశపరుడు - స్వీయ శిష్యుడైనా సరే, సొంతకుమారుడైనా సరే - బోధించటానికి అర్హుడు కాడు.
తపస్సు ధ్యానములచే బుద్ధి నిర్మలం చేసుకుంటూ భక్తి - వైరాగ్యములచే మనస్సును పవిత్రం చేసుకొంటున్న వారికి, శుశ్రూష భావము కలవారికి ఈ ఉపనిషత్ విశేషాలు….,
- మముక్షు సాధనములు,
- మోక్ష మార్గము - కూడా అగుచున్నాయి.
‘‘దుష్ట అభ్యాసములు, దురభిప్రాయము, మదమాత్సర్యములు విరమించాలి’’…. అనే నిర్ణయము కలిగి, అందుకు ప్రయత్నశీలురై ఉన్నవారు ఇది వినటానికి తప్పక అర్హులు. అవి విరమించే ప్రయత్నమునకు సిద్ధపడనివారు అనర్హులు.
శ్లో।। యస్య దేవే పరాభక్తిః, యథా దేవే తథా గురౌ
తస్య ఏతే కధితా హి అర్థా ప్రకాశంతే మహాత్మనః।
ప్రకాశంతే మహాత్మనః ఇతి।।
ఎవ్వరైతే….,
❋ పరాభక్తి : పరమాత్మపట్ల పరాభక్తి సమన్వితులై ఉంటారో… (సా తు అస్మిన్ పరమ ప్రేమ రూపా చ),
❋ గురుశుశ్రూష : గురువును భగవత్ స్వరూపముగా పూజిస్తూ, గురుసేవకులై గురుభక్తి కలిగి ఉంటారో…, పరిప్రశ్నలతో గురుముఖతః బ్రహ్మతత్త్వమును అభ్యసించువారై ఉంటారో…,
అట్టి వారంతా ఇందలి పరమార్థమును బోధించబడటానికి అర్హులు. అట్టివారు సమీపించి అడిగినప్పుడు తప్పక మనము బోధించెదము గాక!
ఇందలి ఆత్మ తత్త్వ విశేషము వినుచుండగా, అట్టి అధ్యయనుడు జీవాత్మ పరిమితత్త్వమును, జీవాత్మత్వమును అధిగమించి సర్వతత్త్వాత్మత్వమును, మహాత్మత్వమును తప్పక సంతరించుకోగలడు.
‘‘సో2హమ్’’ భావమును అర్థం చేసుకోగలడు! ‘తత్త్వమ్’తో ఏకము చేసివేయగలడు. స్వాభావికంగా అనుక్షణికముగా తీర్చిదిద్దుకోగలడు.
కేవలసాక్షి, స్రష్ట, భర్త, భోక్త, జీవ - ఈశ్వర స్వరూపుడు, ఈ విశ్వముయొక్క బాహ్య - అభ్యంతరస్వరూపుడు, సర్వము తానే అయి
బ్రహ్మతత్త్వోపాసకులము, ‘‘సర్వము బ్రహ్మమే అని ప్రకటించు….(సర్వమ్ ఖల్విదమ్ బ్రహ్మ। అయమాత్మా బ్రహ్మ। జీవో బ్రహ్మేతి నాపర ఇతి। తత్ త్వమ్। త్వమేవా2హమ్। తత్ త్వమ్ శివేతి। శివాత్ పరతరమ్ నాస్తి। కేవలో శివమితి। విశ్వమ్ విష్ణుః। ఇత్యాది) వేద మహావాక్యములను బ్రహ్మవాదులమై ఉపాసిస్తున్నాము.
సద్గురువులగు శ్వేతాశ్వతర మహర్షి బోధించిన ఆత్మస్వరూప జ్ఞానసారము మనకు సర్వదా మార్గదర్శకమగు గాక!
ఆ బ్రహ్మము - పరమపురుషుని గురించి చెప్పు మహనీయులే బ్రహ్మవాదులు। బ్రాహ్మణులు।
బ్రహ్మవాదులు : బ్రహ్మమే కర్మేంద్రియ పంచకము - జ్ఞానేంద్రియ పంచకము - పంచప్రాణములు, జీవుడు - ఈశ్వరుడుగా అను 17 తత్త్వములుగా ప్రదర్శితమగుచున్నట్లుగా సిద్ధాంతీకరించుచున్నారు. ఆత్మభగవానుడు షోడశ కళాస్వరూపుడుగా అభివర్ణించబడుచున్నారు.
(17) సప్త తత్త్వములుగా, (16) యుంజానములుగా,
ఏకతత్త్వమ్ । (21) చమత్కారములుగా।
ఏకవర్ణమ్ । (22) వర్ణ సమ్మేళనముగా।
‘శివ’ - ద్వి అక్షరే.... (2) ద్వి-అక్షరుడుగా, (14) చమత్కారములుగా అగుచున్నాడు.
ఒకే పరమాత్మ । (23) స్వభావములుగా।
ఈవిధంగా (113) పదర్శనములకు ఆవలగా వేంచేసియున్న భగవానునికి నమస్కారము।
వివిధ ఆత్మ ద్రష్టలచే ప్రవచించబడే ఏకస్వరూపుడగు ఆ పరమాత్మ సర్వలోక వాసులకు శుభములు ప్రసాదించుగాక!
🙏 ఇతి శ్వేతాశ్వతర ఉపనిషత్ 🙏
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।