[[@YHRK]] [[@Spiritual]]
ārunika Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 3
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com
ఆరుణికాఖ్యోపనిషత్ఖ్యాతసంన్యాసినోఽమలాః . యత్ప్రబోధాద్యాంతి ముక్తిం తద్రామబ్రహ్మ మే గతిః .. |
|
శ్లో।। ఆరుణికాఖ్య ఉపనిషత్ ఖ్యాతం సభ్యాసినో అమతాః యత్ ప్రబోధాత్ యాతి ముక్తిం, తత్ రామబ్రహ్మ మే గతిః |
‘‘పరమాత్మ అన్యుడు’’ - అని చెప్పు మతములను, వాదోపవాదములను వదలి, ఈ ‘ఆరుణికోపనిషత్’చే గుర్తు చేయబడుచున్న ‘‘అఖండ- రామబ్రహ్మతత్త్వము’’ను అభ్యసించటము, అధ్యయనము చేయటము-ముక్తికి ఉత్తమమగు మార్గము. అనన్యుడగు ఆత్మారామ బ్రహ్మమే (శ్రీరామబ్రహ్మమే) తానవటము - అంతిమ లక్ష్యము. జీవులందరికి అదియే ఉత్తమగతి। |
ప్రథమః ఖండః
ఓం ఆరుణిః ప్రాజాపత్యః ప్రజాపతేర్లోకం జగామ . తం గత్వోవాచ . కేన భగవన్కర్మాణ్యశేషతో విసృజామీతి . |
|
1. ఓం ఆరుణిః ప్రాజాపత్యః ప్రజాపతేః లోకమ్ జగామ। తం గత్వ ఉవాచ : ‘‘కేన, భగవన్! కర్మాణి అశేషతో విసృజామి?’’ ఇతి।। |
ఓంకార స్వరూపుడగు పరమాత్మకు నమస్కరిస్తూ! ఒకానొక సందర్భములో ప్రజాపతి కుమారుడు, మహాప్రజ్ఞావంతుడు అగు ఆరుణిముని ప్రజాపతి లోకము వెళ్ళి తన తండ్రి, సృష్టికర్తయగు ప్రజాపతిని సందర్శించారు. ఆరుణిముని : హే భగవన్! పితృదేవా! లోకాల సృష్టికర్తయగు ప్రజాపతీ! త్యాగేనైవతు కైవల్యమ్ - అన్నీ త్యజిస్తేనే కైవల్యము - అని ముక్తపురుషులగు మహనీయులు సూచిస్తున్నారు కదా! మరి, కర్మలను అశేషంగా మొదలంట్లా త్యజించటం ఎట్లా? నాకు బోధించండి! |
తం హోవాచ ప్రజాపతిస్తవ పుత్రాన్భ్రాతౄన్బంధ్వాదీంఛిఖాం యజ్ఞోపవీతం యాగం స్వాధ్యాయం భూర్లోకభువర్లోకస్వర్లోకమహర్లోకజనోలోకతపోలోకసత్యలోకం చాతలతలాతలవితలసుతలరసాతలమహాతలపాతాలం బ్రహ్మాండం చ విసృజేత్ . |
|
2. తం హ ఉవాచ ప్రజాపతిః : తవ పుత్రాన్, అహ్రాతౄన్, బంధ్వ - ఆదీం, శిఖామ్, యజ్ఞోపవీతమ్, యాగం చ సూత్రం చ, స్వాధ్యాయం చ భూలోక - భువర్లోక - సువర్లోక - మహర్లోక - జనోలోక - తపోలోక - సత్యలోకం చ, అతల - వితల - సుతల - పాతాళ రసాతల - తలాతల - మహాతల బ్రహ్మాండం చ విసృజేత్।। |
శ్రీ ప్రజాపతి : అవును ప్రియపుత్రా! నీవు పుత్రులను, సోదరులను, ‘బంధువులు మిత్రులు, శత్రువులు’ మొదలైనవాటిని, శిఖను, యజ్ఞోపవీతమును, యాగములను, వేదశాస్త్రములను, వేద పఠనములను, భూ-భువర్-సువర్- మహర్-జనో-తపో-సత్య...ఏడు ఊర్ధ్వలోకములను, అతల-వితల-సుతల- పాతాళ-రసాల-తలాతల-మహాతల అధోలోకములను, ఈ సర్వబ్రహ్మాండమును పరబ్రహ్మసాక్షాత్కారమునకై - త్యజించివేయి. (అన్నీ త్యజించివేయగా, అప్పటికీ ఏ నీ స్వరూపము నీకు అనన్యమై శేషించియే ఉంటుందో, అదియే నీ స్వాభావిక - వాస్తవ ఆత్మస్వరూపము) |
దండమాచ్ఛాదనం చైవ కౌపీనం చ పరిగ్రహేత్ . శేషం విసృజేదితి .. 1.. |
|
3. దండమ్, ఆచ్ఛాదనమ్, కౌపీనంచ పరిగ్రహేత్। శేషమ్ విసృజేత్। శేషమ్ విసృజేత్ ।।ఇతి।। |
సన్న్యాసుల ఉపకరణములయినటువంటి దండము, ఏదో ఒక దేహాచ్ఛాదనము గోచి, ఇటువంటి దేహమునకు అత్యవసరమైనవి మాత్రమే కలిగి ఉండు. మిగతావన్నీ వదలివేయి. వదలటానికి ఉపాయం - వదలి ఉండటమే! వదలటమును కూడా వదలివేయి। మనస్సుతో సమస్తము త్యజించి ఉండు. మనస్సుతో సమస్తము త్యజించి ఉండు. |
ద్వితీయః ఖండః
గృహస్థో బ్రహ్మచారీ వా వానప్రస్థో వా ఉపవీతం భూమావప్సు వా విసృజేత్ . లౌకికాగ్నీనుదరాగ్నౌ సమారోపయేత్ . గాయత్రీం చ స్వవాచాగ్నౌ సమారోపయేత్ . కుటీచరో బ్రహ్మచారీ కుటుంబం విసృజేత్ . పాత్రం విసృజేత్ . పవిత్రం విసృజేత్ . దండాెంలోకాంశ్చ విసృజేదితి హోవాచ . అత ఉర్ధ్వమమంత్రవదాచరేత్ . ఊర్ధ్వగమనం విసృజేత్ . ఔషధవదశనమాచరేత్ . త్రిసంధ్యాదౌ స్నానమాచరేత్ . సంధిం సమాధావాత్మన్యాచరేత్ . సర్వేషు వేదేష్వారణ్యకమావర్తయేదుపనిషదమావర్తయేదుపనిషదమావర్తయ్ ఏదితి .. 2.. |
|
1. గృహస్థో బ్రహ్మచారీ వానప్రస్థో వా లౌకికాగ్నీన్ ఉదరాగ్నౌ సమారోపయేత్।। |
ఒకడు గృహస్థుడు కావచ్చు. బ్రహ్మచారి కావచ్చు. లేక, వానప్రస్థుడు కావచ్చు గాక! ఆతడు లోక ప్రయోజనప్రదములగు (లౌకిక ఫలప్రదమైన) అగ్నికార్యములను సర్వజీవుల జీవనాధారము అయినట్టి ‘జఠరాగ్ని’యందు సమారోపితం చేయాలి. ఈ దేహములో నేను చేయు జఠర- అగ్న్యౌపాసన సర్వశరీరధారియగు జఠరాగ్ని దేవుడు స్వీకరించుగాక! లోక కళ్యాణమగుగాక - అని సంకల్పించివేయి. |
2. గాయత్రీమ్ చ ‘స్వ-వాక్’ అగ్నౌ సా మారోపయేత్। 3. ఉపవీతమ్ భూమా అప్సు వా విసృజేత్। 4. కుటీచరో బ్రహ్మచారీ కుటుంబమ్ విసృజేత్। 5. పాత్రం విసృజేత్। 6. పవిత్రమ్ విసృజేత్। 7. దండాన్ లోకాని విసృజేత్ ఇతి।। |
⌘ గాయత్రీ మంత్ర జపకర్మను ‘స్వ-వాక్’ (Own expressive energy of sound) అనే అగ్నిని సమారోపించి సమర్పించు. (ఉచ్ఛారణ పెదిమలతోను చేయకుండా, మనో శక్తితో మంత్ర మననము చేయటం) ⌘ ఉపవీతము (దంధ్యమును) ‘‘భూమి - జలము’’...లయందు త్యజించివేయి. ( 3 ప్రోగులు దేనికి గుర్తుయో, అట్టి - ‘3’ అవస్థలు ధారణ చేయు ‘నేను’ ధారణచేయటము). ⌘ కుటీచరుడు, బ్రహ్మచారి కూడా కుటుంబసంబంధములను మనస్సుచే త్యజించివేయునుగాక। ఫలితమును త్యజించును గాక! ⌘ వానప్రస్థుడు, సన్న్యాసి - కూడా పాత్రల మమకారము విడచివేయాలి. ⌘ భిక్షకుడైతే భిక్షపాత్రను కూడా విడవాలి. వస్త్రములను కూడా విడచిపెట్టాలి. లౌకికమైన త్రి-దండమును కూడా లోకానికి విడచివేయాలి. (వాటిపట్ల ఏర్పడే ‘మమ’కారము విడువాలి). |
(స)హోవాచ।। 8. అత ఊర్ధ్వమ్ అమంత్రవత్ ఆచరేత్। 9. ఊర్ధ్వగమనమ్ విసృజేత్। 10. ఔషధవత్ అశనమ్ ఆచరేత్। |
ఇకప్పుడు, ‘అమంత్రత్వము’ (మంత్ర సంబంధమైన నియమ త్యాగం) ఆచరించుము. మంత్ర - తంత్రాదులకు సంబంధించిన నియమములన్ని కూడా ఆకాశమునకు సమర్పించి, మంత్ర - తంత్ర నియమరహితుడవగుదువుగాక! ఊర్ధ్వలోకములు పొందటానికి శాస్త్రములు చెప్పే యజ్ఞయాగాది కర్మలను, క్రతువులను కూడా పరిత్యజించినవాడవై ఉండు. నాలుకను, రుచులను జయించాలి. కేవలము జీవించటానికి మాత్రమే ఔషధమువలె ఆహారము తీసుకోవాలి. జీవించటంకోసం ఆహారము. అంతేగాని, ఆహారము కొరకు జీవించరాదు. |
11. త్రి సంధ్య - ఆదౌ స్నానమ్ ఆచరేత్। 12. సంధిమ్ సమాధావ ఆత్మని ఆచరేత్। 13. సర్వేషు వేదేషు ఆరణ్యకమ్ ఆవర్తయేత్। ఉపనిషదమ్ ఆవర్తయేత్। ఉపనిషదమ్ ఆవర్తయేత్ ।।ఇతి।। |
⌘ త్రిసంధ్యలకు ముందే ఉన్న కేవలమగు ఆత్మయందు స్నానం చేయాలి. (‘‘ప్రాపంచిక విషయములను అంతరంగమునుండి రహితం చేయటం...’’ అనే ఆనందజలధిలో స్నానము చేయాలి). ⌘ సంధ్యా వందన కర్మను ‘సమాధి’రూపమగు ఆత్మయందు ఆచరించాలి. సమస్తమును ఆత్మయందు సమాధానపరచివేయి. (సంధ్య = సంధి = ఆలోచనకు - ఆలోచనకు మధ్యగల స్వస్థానము) ⌘ సర్వవేదములలోని ఆరణ్యకములను పఠించు చుండెదవుగాక! (అరణ్యకము = ఉపాసన, జ్ఞాన విభాగము). ⌘ ఉపనిషత్ చూపిస్తున్న పరమార్థమును హృదయస్థము చేసుకొంటూ ఆత్మ ధ్యానమును అనువర్తించెదవు గాక! బాహ్యమున - అంతరమున కూడా ఆత్మగా ఆత్మయందు ఆత్మోపాసనగా చేసివేయి. ఆత్మతో ఆత్మను ఉపాసించు. |
తృతీయః ఖండః
ఖల్వహం బ్రహ్మసూచనాత్సూత్రం బ్రహ్మసూత్రమహమేవ విద్వాంత్రివృత్సూత్రం త్యజేద్విద్వాన్య ఏవం వేద సంన్యస్తం మయా సంన్యస్తం మయా సంన్యస్తం మయేతి త్రిరుక్త్వాభయం సర్వభూతేభ్యో మత్తః సర్వం ప్రవర్తతే . సఖామాగోపాయోజః సఖాయోఽసీంద్రస్య వజ్రోఽసి వార్త్రఘ్నః శర్మ మే భవ యత్పాపం తన్నివారయేతి . అనేన మంత్రేణ కృతం వాఇణవం దండం కౌపీనం పరిగ్రహేదౌషధవదశనమాచరేదౌషధవదశనం ప్రాశ్నీయాద్యథాలాభమశ్నీయాత్ . బ్రహ్మచర్యమహింసా చాపరిగ్రహం చ సత్యం చ యత్నేన హే రక్షత హే రక్షత హే రక్షత ఇతి .. 3.. |
|
1. ఖలు ‘‘అహమ్ బ్రహ్మ’’ - సూచనాత్ సూత్రమ్। ‘‘బ్రహ్మసూత్రమ్ అహమేవ’’ - విద్వాన్- త్రివృత్ సూత్రమ్ త్యజేత్- విద్వాన్ య ఏవమ్ వేద। ‘‘సన్న్యస్తమ్ మయా సన్న్యస్తమ్ మయా। సన్న్యస్తమ్ మయా।’’ ఇతి త్రిః ఉక్త్వా....... అభయమ్ సర్వభూతేభ్యో మత్తః సర్వమ్ ప్రవర్తతే ।। ఇతి।। |
‘ఓ ఆరుణీ! ప్రియపుత్రా! ఎట్లా త్యజించాలి’ అని నీవు అడిగావు. ఏది త్యజించాలో చెప్పాను. అయితే, త్యజించటమెందుకు? ఒక పరమ సత్యము కొరకు, అది చెప్పుచున్నాను. విను. ‘బ్రహ్మము’ అను శబ్దము ఏ అర్థము కొరకై చెప్పబడుచున్నదో అది ‘నేనే’! ఈ దృశ్యము ‘తెలియబడుచున్నది’ - కదా! దీనిని తెలుసుకొనుచున్నవాడో? ‘నేను’. అట్టి ‘నేను’ గురించే ‘బ్రహ్మము’ అనునది సూచనగా సూచించబడుచున్నది. అయితే, నాకు సంబంధించి ‘‘తెలుసుకున్నవాడు - తెలివి - తెలియబడుచున్నది’’ - ఈ మూడిటిని దాటిచూడగా, ‘‘నేను’ను తెలుసుకొనే నేను’’..యే ‘‘దృక్’’ రూపమైనది. అదియే బ్రహ్మము. ‘‘ద్రష్ట - దృశ్యము - దర్శనముల రూపంగా ఉన్నది నేనే’’....అని తెలుసుకోవటమే బ్రహ్మమును ఎరుగట. అట్లు ఎరిగి, భౌతికమగు త్రిసూత్రమును వదలి ఉండు. ‘‘మయా సన్న్యస్తమ్’’....అని ముమ్మారుగా ద్రష్ట - దర్శన - దృశ్యములను అధిగమించి ‘‘అభయస్వరూపుడను. బ్రహ్మమే సహజరూపముగాగల నేను ఈ సర్వము, ఈ సర్వజీవులుగా కూడా అయి ఉన్నాను. నా చేతనే సర్వము ప్రవర్తించుచున్నది’’....అని గమనించటమే ...బ్రహ్మతత్త్వా నుభవము. త్యజించటమును కూడా త్యజించు. సర్వము నీవే అయి ఉండగా ఇక త్యజించవలసినది, సన్న్యసించవలసినది ఏమున్నది? (బంగారము ఆభరణమును త్యజించటమేమిటి? జలము తరంగమున త్యజించమెక్కడిది!) |
2. సఖా మా గోపా యోజః సఖా, యో అసి ఇంద్రస్య వజ్రోసి వా వృర్ద్రఘ్నః శర్మ మే భవ, యత్ పాపమ్ తత్ నివారయేతి।। |
నేను ధారణ చేస్తున్న ‘‘ద్రష్ట - దర్శన - దృశ్య’’రూపమగు త్రిదండమా! నీవు నాకు ఇంత వరకు అనన్యమగు ప్రియసఖుడవు. ఓ త్రిదండమా! నీవు నాకు శుభప్రదమై ఉండుము! సన్న్యాసినై త్రిదండమగు ద్రష్ట - దర్శన - దృశ్యములను దాటి ఉండి, బ్రహ్మమే స్వరూపముగా కలవాడనై, ఆ మూడిటిని త్రిదండముగా ధారణ చేసినవాడనై ఉండెదనుగాక!’’ - అను ధారణ చేయి. శర్మ మే భవ : సమస్త జనులకు నేను ఆత్మగా (బ్రహ్మముగా) అభయ ప్రదాతను అగుదునుగాక! సర్వము నాకు ప్రియమే। ఇష్టమే। బ్రహ్మమునకు ‘సంజ్ఞ’ అగు ఈ బ్రహ్మదండము నాయొక్క పాప వృత్తులను నివారింపజేయును గాక! |
3. అనేన మంత్రేణ కృతమ్ వైణవమ్, దండమ్, కౌపీనమ్ పరిగ్రహేత్। ఔషధవత్ అశనమ్ ఆచరేత్। ఔషధవత్ అశనమ్ ప్రాశ్నీయాత్। యథా లాభమ్ అశ్నీయాత్। |
‘‘ఖల్వహమ్ బ్రహ్మ’’ ‘‘నేను బ్రహ్మమే అయి ఉన్నాను’’ అను మంత్రము పఠిస్తూ - కుడిచేత్తో దండము చేబూనాలి! కౌపీనమును కూడా బ్రహ్మమును - జపిస్తూ ధరించాలి. ఔషధము (Medicine) వలె అన్నమును భుజించాలి. ఏ ఆహారము లభిస్తే అదియే ‘ఆకలి’ అనే జబ్బుకు ఔషధంవలె (Light Medicine) స్వీకరించాలి. ‘‘నేను ఇది తినాలి! అది తినను’’...ఇత్యాదులు కలిగి ఉండకూడదు. లభించిన సాత్వికహారమును ప్రియముగా స్వీకరించాలి. |
4. బ్రహ్మచర్యమ్ అహింసాం చ అపరిగ్రహం చ, సత్యం చ యత్నేన హే రక్షత। హే రక్షత। హే రక్షత। ఇతి।। |
ఓ జనులారా! (1) బ్రహ్మచర్యము (బ్రహ్మమే ఇదంతా అను భావనతో కూడి చరించటం)- (2) ఇతరులకు బాధ కలిగించటకపోవటం (అహింస) (3) ఏదీ కూడా స్వీకరించని బుద్ధి (అపరిగ్రహము)-ఈ మూడు ఏదోవిధంగా జాగరూకులై సముపార్జించుకోండి. అవి రక్షాకవచము. సత్యమును ఆశ్రయించి ఉండటం - కొరకే శాస్త్ర నియమాలు, హే పరబ్రహ్మమా! రక్షించండి! అల్ప - స్వల్ప సాంసారిక భావాల నుండి కాపాడండి! బ్రహ్మజ్ఞానమే రక్ష రేకు. |
చతుర్థః ఖండః
అథాతః పరమహంసపరివ్రాజకానామాసనశయనాదికం భూమౌ బ్రహ్మచర్యం మృత్పాత్రమలాంబుపాత్రం దారుపాత్రం వా యతీనాం కామక్రోధహర్షరోషలోభమోహదంభదర్పేచ్ఛాసూయామమత్వాహంక్ ఆరాదీనపి పరిత్యజేత్ . వర్షాసు ధ్రువశీలోఽష్టౌ మాసానేకాకీ యతిశ్చరేత్ ద్వావేవ వా విచరేద్ద్వావేవ వా విచరేదితి .. 3.. |
|
1. అథ అతః పరమహంస పరివ్రాజికానామ్ ఆసన - శయనాదికం భూమౌ। బ్రహ్మచారిణామ్ మృత్-పాత్రమ్, అలాబు పాత్రమ్ దారు పాత్రమ్, వేణు పాత్రమ్ వా । యతీనామ్ - కామ - క్రోధ - హర్ష - రోష - లోభ - మోహ - మద - మాత్సర్య - దంభ - దర్ప - ఇచ్ఛ - అసూయా మమత్వ - అహంకారాదీనామ్ అపి పరిత్యజేత్। |
ఓ ఆరుణీ! ఇంతమాత్రమే కాదు. పరమహంస - పరివ్రాజక ధర్మముల గురించి ఇంకా కొన్ని విశేషాలు ఇప్పుడు చెప్పుకుంటున్నాం. భూమిమీదనే కూర్చోవటం, పడుకోవటం నిర్వర్తించటము. నేలపైనే ఆసన - శయనములు మొదలైనవి కలిగి ఉండు. బ్రహ్మచారులు - యతులు మట్టిపాత్రగాని, సొరకాయ బుర్రపాత్రగాని, దారువు (కొయ్య) పాత్రగాని, వేణుపాత్రగాని ఉపయోగించుకోవాలి. సాధకులు వదలవలసినవి (1) ఏదో కావాలి. ఇంకా పొందాలి - అనే కామము. (2) ‘‘వారి వీరి సంగతి చూడాలి. హానిచేయాలి.’’ మొదలుగాగల కోప, కసి, క్రోధమును. (3) లౌకిక సందర్భ, సంఘటన, సంబంధములపట్ల హర్షము. (4) ‘‘వారు నన్ను అట్లా అన్నారే? ఇట్లా చూచారే!’’ - అనే రోషము. (5) ‘‘నాది - నేను దాచుకోవాలి ఎవ్వరికీ ఇవ్వను’’ - అనే లోభము. (6) ‘‘ఈ దృశ్యము నిజము, శాశ్వతము’’ - అనే మోహము. (7) ‘‘ఇవి ఎట్లాగైనా సరే పొందాలిసిందే’’ - అనే మదము, కోరిక. (8) ‘‘వీరిని నేను ఎట్లాగైనా బాధించాలి’’ - అనే మాత్సర్యము. (9) ‘‘వీరంతా అల్పులు, నేను గొప్ప. గొప్పగా కనబడాలి’’ - అనే దంభ దర్పములు. (10) ‘‘ఇవన్నీ పొందవలసిన వస్తువులు - నాకు ఇష్టం కాబట్టి’’ - అనే ఇచ్ఛ. (11) ‘‘వారు బాగుపడకూడదు’’ - అనే అసూయ. (12) ‘‘ఇవన్నీ నావే కదా’’ - అనే మమకారము. (13) ‘‘నా అంత గొప్ప ఎవరూ లేరు’’ అనే అహంకారమును మొదలైనవన్నీ మొదలంట్లా యతి అవగోరువాడు త్యజించి ఉండాలి! |
2. వర్షాసు ధ్రువశీలో, అష్టౌ మాస్య ఏకాకీ యతి శ్చరేత్ ద్వావేవ ఆచరేత్। ద్వావేవ ఆచరేత్ ।।ఇతి।। |
యతి - ఇంకా వర్షాకాలంలో చాతుర్మాసశీలుడై ఉండాలి. ఆ నాలుగు నెలలు ఒక్కచోటే, నలుగురుతో కలసి - సత్సంగము మొదలైనవి నిర్వర్తించాలి. (లేదా) కనీసము రెండు నెలలన్నా ఒక్కచోటే గడపాలి. (ద్వేమాస్యము) మిగతా ‘8’ నెలలు ఏకాకిగా, ఒకేచోట ఉండకుండా సంచారాలు చేస్తూ ఉండాలి. ఈ విధంగా ‘చోటు’కు సంబంధించిన మమకారము త్యజించి ఉండాలి. |
పంచమః ఖండః
స ఖల్వేవం యో విద్వాన్సోపనయనాదూర్ధ్వమేతాని ప్రాగ్వా త్యజేత్ . పిత్రం పుత్రమగ్న్యుపవీతం కర్మ కలత్రం చాన్యదపీహ యతయో భిక్షార్థం గ్రామం ప్రవిశంతి పాణిపాత్రముదరపాత్రం వా . ఓం హి ఓం హి ఓం హీత్యేతదుపనిషదం విన్యసేత్ .. ఖల్వేతదుపనిషదం విద్వాన్య ఏవం వేద పాలాశం బైల్వమాశ్వత్థమౌదుంబరం దండం మౌంజీం మేఖలాం యజ్ఞోపవీతం చ త్యక్త్వా శూరో య ఏవం వేద . తద్విష్ణోః పరమం పదం సదా పశ్యంతి సూరయః . దివీవ చక్షురాతతం . తద్విప్రాసో విపన్యవో జాగృవాంసః సమింధతే . విష్ణోర్యత్పరమం పదమితి . ఏవం నిర్వాణానుశాసనం వేదానుశాసనం వేదానుశాసనమితి .. 5.. |
|
1. స ఖలు వేదార్థమ్ యో విద్వాన్, స ఉపనయనాత్ ఊర్ధ్వమ్ ఏతాని ప్రాగ్వా త్యజేత్।। 2. పితరం, పుత్రమ్, అగ్నిః, ఉపవీతం, కర్మ, కళత్రం చ అన్యత్ అపి ఇహ యతయో హి భిక్షార్థమ్ గ్రామమ్ ప్రవిశంతి, - పాణిపాత్రమ్ ఉదర పాత్రం వా।। |
ఉపనయనము కొరకై గురువు దగ్గర వేదార్థములను అర్థం చేసుకొనినవాడు అగుదువుగాక। (ఉపనయనము = అనేకముగా కనిపిస్తున్న దానిలో ఏకము ఆత్మగా అనిపించు దృష్టి (Unity in the Diversity) (బ్రాహ్మీదృష్టి). ఉపనయన సంస్కారము తరువాత నిజస్వరూపమగు బ్రహ్మమును మాత్రమే ఆశ్రయించిన వాడవై ఉండెదవుగాక! ఇతఃపూర్వపు సర్వ ‘‘గుణ-సంబంధ-స్వభావములను’’ త్యజించినవాడై ఉండుము. సన్న్యాసాశ్రమము స్వీకరించువాడు - తండ్రిని, కొడుకులను, లౌకికాగ్నిని ఉపవీతము (యజ్ఞోపవీతమును) (జందియము, జందెము, జంధ్యము)ను, వైదిక లౌకిక కర్మలను, ఇల్లు - ఆరామ- సంపద - ఆస్తిపాస్తులను త్యజించాలి. యతులు - చేతిలో భిక్షపాత్రను ధరించి భిక్ష కొరకై గ్రామ గ్రామములు ప్రవేశించి తిరుగుతారు. ‘‘ఈ పొట్టయే నాకు భిక్షపాత్ర’’ అని భావిస్తూ ఉంటారు. పొట్టను చేతధరించిన భిక్షకపాత్రగా భావన చేస్తారు. |
3. ఓం హి। ఓం హి। ఓం హి। ఇతి ఏతత్ ఉపనిషదమ్ విన్యసేత్। 4. ఖలు ఏతత్ ఉపనిషదమ్ విద్వాన్ య ఏవమ్ వేద। |
ఈ కనబడేదంతా ఓంకారమే। (ఈ జగత్తు ఈజీవులు, ఈ ద్రష్ట, ఈ దృశ్యము...ఓంకారమే) అనే ఉపనిషత్ అర్థమును భావిస్తూ, సర్వమును ‘‘అస్మత్ ఓంకార రూపదేహముయొక్క అభిన్నమగు అంతర్విభాగమే’’ అని భావించాలి. ఎవడైతే సర్వము ఓంకారముగా భావిస్తూ, తాను ఓంకారస్వరూపుడనేనని ఎరిగి ఉంటాడో....ఆతడే విద్వాంసుడు. |
5. పాలాశం బైల్వ మౌదుంబరమ్ అశ్వత్థమ్ దండమ్ మౌంజీమ్, మేఖలామ్ యజ్ఞోపవీతం చ త్యక్త్వా శూరో య ఏవం వేద।। |
ఆ యతి.... మోదుగ - బిల్వ - రావి - మేడి కర్రతో చేసిన దండమును, కృష్ణాజినముము, (ముంజగడ్డిని పేని తయారుచేసుకొన్న మొలత్రాడును), యజ్ఞోపవీతమును కూడా త్యజించి.... → సాధించవలసినది సిద్ధించిన తరువాత సాధనములను త్యజించు తీరుగా, అన్నీ తనయందు ఏకం చేసుకొను ఆత్మనే ఎరుగుచున్నాడు. ఆత్మత్వము వహించి అన్నీ త్యజిస్తున్నాడు. మౌని అయి విరాజిల్లుచున్నాడు. శూరుడై యజ్ఞోపవీత ధారణ నియమును కూడా త్యజించినవాడై (అతీతుడై) ఉంటున్నాడు. |
6. తద్విష్ణోణాః పరమమ్ పదగ్ం సదా పశ్యంతి సూరయః దివీవ చక్షుః ఆతతమ్ తత్ విప్రా సో విపన్యవో జాగృవాగ్ం సః సమింధతే విష్ణోణాః యత్ పరమమ్ పదమ్।। ఇతి।। |
పరమపదమగు విష్ణువునే అట్టి శూరులు సదా, సర్వదా, సర్వత్రా సందర్శిస్తున్నారు. దివ్యచక్షువులతో దర్శించి విష్ణుసాయుజ్యము పొందుచున్నారు. ఎవ్వరైతే మాయానిద్ర నుండి జాగృతులై, కామ - క్రోధ రహితులై, నిర్మల హృదయులై ఉంటారో-అట్టివారు నిర్మల పదము అగు విష్ణుదేవుని అంతటా అన్నీగా దర్శించగలరు. ఆయనయే అందరికీ చేరవలసిన పరాకాష్ఠ! ఆయనయే నీవు. ఆయనయే నేను. ఆయనయే ఈ జగత్తు. |
7. ఏవమ్ నిర్వాణ -అనుశాసనమ్। వేద-అనుశాసనమ్। వేదానుశాసనమితి।। |
ఇది మోక్షశాస్త్రము (నిర్వాణశాస్త్రము) యొక్క - వేదములు చూపిస్తున్న - సశాస్త్రీయ సూచితమైన మార్గము। వేదానుశాసనమ్ । నిర్వాణానుశాసనమ్। |
ఇతి ఆరుణికోపనిషత్।
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।।
శాంతి పాఠమ్
ఓం |
వేదములలో అంతర్విభాగమైయున్న ఉపనిషత్తులు ప్రతిపాదిస్తున్న పరబ్రహ్మతత్త్వముయొక్క హృదయస్థము కొరకై ఆ పరమాత్మ నాయొక్క అంగములను, వాక్కును, పంచప్రాణములను, కనులను, కనబడువాటిని, చెవులను, వినుచున్నవాటిని, (ఇంకా కూడా) బలమును, పట్టుదలను, తదితర ఇంద్రియములన్నిటినీ - మృదుమధురముగా, ఆప్యాయముగా తీర్చిదిద్ది పరిరక్షించునుగాక। పరిపోషించునుగాక - అని ఉపాసిస్తున్నాను. |
ప్రథమః ఖండః
‘ఓం’ సర్వాత్మకుడు - సర్వతత్త్వస్వరూపుడు - సర్వతత్త్వ విదూరుడు అగు ‘‘ఓంకార సంజ్ఞాస్వరూప పరమాత్మ’’కు నమస్కరించుచున్నాము.
┄ ┄ ┄
ఒకానొక సందర్భములో....,
ప్రజాపతి కుమారుడు, మహాప్రజ్ఞావంతుడు, లోక కళ్యాణ మహదాశయుడు...అగు శ్రీ ఆరుణి మునీంద్రులవారు బ్రహ్మలోకము సందర్శించటం జరిగింది. పితృదేవులగు ప్రజాపతిని సమీపించి త్రిప్రదక్షిణములు - సాష్టాంగదండ ప్రణామములు సమర్పించారు.
ఆరుణి మునీంద్రుడు : హే భగవన్! పితృదేవా! సృష్టి స్థితి లయకారకా! ప్రజాపతీ! సద్గురు వరేణ్యులగు మిమ్ములను అస్మత్ ధర్మ-సందేహములను తొలగించుకోవటానికి సదవకాశము ప్రసాదించప్రార్థన.
‘త్యాగేనైవతు కైవల్యమ్’ - ‘‘సర్వము త్యజించటం చేతనే కైవల్యము లభించగలదు’’ అని ముక్తపురుషులగు మహానుభావులయొక్క (మరియు) వేదవాఙ్మయము యొక్క ఆప్తవాక్యము కదా! మరి సర్వకర్మలను మొదలంట్లా, అశేషంగా త్యజించే తీరు ఏది? ఏ విధంగా?...ఇది నాకు దయతో బోధించండి.
శ్రీ ప్రజాపతి : అవును నాయనా! త్యాగేన ఏవ తు కైవల్యమ్। ‘త్యజించటము’ చేతనే ఈ జీవునికి కైవల్యము లభిస్తోంది. వేరే త్రోవ లేదు. ‘నాది’ - అనునదే సంసార బంధము. (నాటకములోని నటుని క్రియలు పాత్రధారునికి చెందని తీరుగా) ‘నాది కాదు’....అని ఎరుగుటచేత, త్యజించి ఉండటంచేత బంధవిముక్తి జరుగగలదు. అందుచేత నీవు చెప్పినట్లు, కర్మాణి అశేషతో విసృజామీతి - కర్మలన్నీ అశేషంగా వదలి ఉండటమే ఉపాయము. నీయొక్క పుత్రులను, సోదరులను, తదితర బంధువులు - మిత్రులు - అయిన వాళ్ళు - కానివాళ్ళు - ఇష్టమైనవాళ్లు - అయిష్టమైన వాళ్లు, ఇవన్నీ కూడా వదలి వేసినవాడవై ఉండెదవుగాక! అనగా వారి నందరినీ స్వస్వరూపాత్మగా సందర్శించెదవు గాక! నాటకములో పాత్రధారుడు బంధువులను కలిగి ఉండి కూడా ‘‘వీరు నా బంధువులు కాదు’’ అని ఎరిగియే ఉంటాడు కదా!
అంతే కాదు!
శిఖను, యజ్ఞోపవీతమును, ‘‘యజ్ఞ - యాగములు నిర్వర్తించకపోతే ఎట్లా?’’ అనురూపముగల ఆదుర్దా - ఆవేశ - ఆశయాలను, వేదమంత్ర పఠనములను కూడా అకర్త - అభోక్త భావనాసమన్వితుడవై వదలి ఉండెదవు గాక!
ఈ సృష్టిలో కనిపిస్తున్న
⌘ భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోక.... నామములతో ప్రసిద్ధమైయున్న ఊర్ధ్వసప్తలోకములను....,
⌘ అతల - వితల - సుతల - పాతాళ - రసాతల - తలాతల - మహాతల...పేర్లుగల అధోసప్త లోకములను,
....ఈ 14 లోకములతో కూడిన బ్రహ్మాండమునంతా విడిచిపెట్టియే చరిస్తూ ఉండు. ‘‘అవన్నీ నాయందు లేవు. నేను వాటియందు లేను’’ - అను ‘‘అసంగ, అతీత’’ భావనను మననము చేస్తూ ఉండు.
ఎందుకంటే, ఈ జీవుడు బహుదూరపు బాటసారియై, ఈ 14 లోకాలలో అనేక ఉపాధులు పొంది పొంది, వాటివాటి సంబంధితమైన అనేక సంస్కారపరంపరలు అంతరంగమున పేర్చుకొని ఉన్నాడు కాబట్టి, వాటిని ఇప్పుడు వదిలించుకోవాలి. ఈ 14 లోక సంగతులను, సమాచారములను భ్రమ మాత్రంగా అర్థం చేసుకొని.... వాటిని బుద్ధితో వదలినవాడై ‘బంధవిముక్తి’ని ఆశయముగా కలవాడై ఉండటము సముచితము, అత్యవసరము కూడా!
లోకమర్యాద కొరకు మాత్రమే - ఒక్క (1) త్రిదండము, (2) అచ్ఛాదనము, (3) కౌపీనము.... ఈ మూడు మాత్రమే కలిగియుండి, ఇక - శేషమ్ విసృజేత్ - శేషమ్ విసృజేత్...మిగతా శేషించినదంతా ‘నాది కాదు’ అని ఎరిగియే (వదలినవాడవై) ఉండుము.
ద్వితీయః ఖండః
ఆరుణి మునీంద్రుడు : తండ్రీ! మీరు చెప్పిన, ‘వదలివేసి ఉండు’....అనే మాట - ఒక్క సన్న్యాసికి మాత్రమే వర్తిస్తుందా? లేక గృహస్థ - బ్రహ్మచారి - వానప్రస్థ ఆశ్రమవాసులకు కూడానా? మరి లోక విషయాలను త్యజించే పద్ధతి, మార్గము ఏమిటి? విధానమేది? అది ఎట్లా సాధ్యం?
శ్రీ ప్రజాపతి : ఒకడు బ్రహ్మచారి కావచ్చు, గృహస్థుడు కావచ్చును, వానప్రస్థుడు కావచ్చును, సన్న్యాసి కావచ్చును గాక! ‘సర్వము త్యజించి ఉండటం’ అనునదే మార్గము. దృశ్యమును దృశ్యముగా త్యజించి ఆత్మభావనతో సందర్శించటమే ఉపాయము. అదియే అసలైన సన్న్యాసము. అంతేగాని అది (చతుర్విధ) ఆశ్రమ సంబంధమైనది కాదు.
లోకిగ్నీన్ ఉదరాగ్నౌ సమారోపయేత్ : లోక సంబంధమైన యాగ - అగ్ని - అగ్ని కార్య సంబంధమైన అగ్నిని ‘‘సర్వదేహాలలో వేంచేసి ఆహారమును రసతత్త్వముగా మార్చే జఠరాగ్ని’’...కి సమారోపించబడుగాక!
‘‘ఈ బాహ్యాగ్ని - సర్వజీవరక్షకుడు, సర్వాంతర్యామియగు పరమాత్మయొక్క జఠరాగ్ని తత్త్వమే। కనుక పరమాత్మస్వరూపమే’’...అను భావముతో నీవు నిర్వర్తిస్తున్న అగ్నికార్యములన్నీ సమర్పించబడుగాక! (అహమ్ వైశ్వానరో భూత్వా ప్రాణినామ్ దేహమాశ్రితః, ప్రాణాపాన సమాయుక్తమ్ పచామి - అన్నమ్ చతుర్విధమ్ - గీతాచార్యులు)
గాయత్రీమ్ చ స్వ-వాక్ అగ్నౌ సమారోపయేత్ :
‘‘ఏ వరేణ్యుడగు సవితృ (సత్ - విత్ - ఋత్) పరమాత్మ ఈ భూ - భువర్ - సువర్...మొదలైన సర్వలోకాలను తన చైతన్యస్ఫూర్తితో ఉత్తేజింపజేస్తున్నారో, వెలిగిస్తున్నారో....అట్టి భర్గోదేవుడు (సూర్యభగవానుడు) నా బుద్ధిని ప్రేరేపించు గాక!’’
- అను మంత్రోపాసనను, వాక్ అగ్నికి నా మంత్రఫలముగా సమర్పిస్తున్నాను’’ - అని భావించు.
ఈ విధంగా గాయత్రీ మంత్రజప ఫలమును స్వ-వాక్ అగ్నికి సమర్పించటమగుచున్నది. ‘‘ఆ పరమాత్మ నాయందు వాక్ శక్తి స్వరూపుడై ప్రకాశించుచున్నారు కదా!’’ .....అని భావించటమే, అట్టి సమర్పణ. ‘‘సర్వ శబ్దములు భర్గోదేవ సంప్రదర్శనలే’’....అని భావించటమే - సమర్పించటము అయి ఉన్నది. (పెదిమలు కదలకుండా గాయత్రీ మంత్రోచ్ఛారణ చేయటము, పరమార్థమును భావన చేయటము - ఇది కూడా వాక్ అగ్నికి ఆహుతి సమర్పణ)
ఉపవీతమ్ భూమావా - అప్సువా విసృజేత్ : ఏ ఉపవీతమును బ్రహ్మసూత్రముగా ధరించి, ‘‘బ్రహ్మమే నేను - అహం బ్రహ్మాస్మి...అని చెప్పటానికే నేను ధరిస్తున్నాను’’...అని భావిస్తున్నావో, అట్టి ‘‘అహమేవ తత్ బ్రహ్మ’’ భావనను సుస్థిరం చేసుకో. ఇక భౌతికమైన ప్రత్తితో నిర్మితమైన ఉపవీతముతో (బ్రాహ్మీ భావము సుస్థిరపడినవానికి) వేరుగా పని ఏమున్నది? కనుక ఈ భౌతికమైన యజ్ఞోపవీతము లోకానుకూలముకొరకు ధరించినప్పటికీ, ‘‘ఇద్దానిని నేను భూదేవతకు, అగ్ని దేవునికి సమర్పించుచున్నాను’’ అని భావించు. అద్దానిని భూమియొక్క, అగ్నియొక్క మహిమరూపంగా భావించు.
ఈ విధంగా ఉపవీతమును భూమి - అగ్ని - ఉపాసనా పూర్వకంగా త్యజించినవాడవై ఉండు. ‘‘స్వతఃగా భూ - అగ్ని స్వరూపమగు ఓ ఉపవీతమా! నీకు నమస్కారము’’.....అని ఉపాసించు.
కుటీచరో, బ్రహ్మచారీ - కుటుంబం విసృజేత్ : (ఒక కుటీరములో నివసించు సన్న్యాసి = కుటీచరుడు)
ఆశ్రమ వ్యవస్థలో ఉండే కుటీరుడుగా గాని, బ్రహ్మచారిగా గాని ఉంటే తల్లి - తండ్రి - భార్య - పిల్లలు. ఇటువంటి సర్వసంబంధములు మొదలే త్యజించిఉండు. అనగా, ‘‘భార్య, తల్లిదండ్రుల, పిల్లల, తదితర సర్వ బంధువుల, సంబంధీకుల, అసంబంధీకుల రూపముగా ఉన్నది - ఓ పరబ్రహ్మమా! మీరే కదా!’’ అని భావిస్తూ, వారి - వారితో సంబంధములను, వారి వారి పట్ల ధర్మములు బ్రహ్మోపాసనగా తీర్చిదిద్దుకోవాలి! భావించాలి!
పాత్రం విసృజేత్ : భిక్షుకుడివి - సన్న్యాసివి అయి ‘పాత్ర’ను కూడా విసర్జించివేయి. చేతిలో ధరించిన భిక్షకపాత్రను ‘‘ఇది బ్రహ్మముతో మమేకత్వము కొరకై ధ్యాన - ఉపాసనా - సాధన వస్తువు కదా’’ - అని భావించటమే - త్యజించటము (‘‘ఈ జగత్తులో నా పాత్ర భగవత్ సంకల్పమే’’....అనునదియే పాత్ర త్యాజ్యము). (జగత్తులోని మన పాత్రను (our role) జగజ్జననికి సమర్పణగా నిర్వర్తించటము - పాత్రను విసృజించటముగా చెప్పబడుతోంది)
పవిత్రం విసృజేత్ : పితృకార్యములు మొదలైన ఆయా సందర్భములలో ‘పవిత్రము’ రూపముగా (సంజ్ఞగా) ఉంగరపు వ్రేలుతో ధరించే దర్భ ఉంగరమును కూడా త్యజించి ఉండుము. సన్న్యాసాలంకారములగు కాషాయ వస్త్రములు, విభూతి, కుంకుమ వంటి అలంకార ప్రదర్శనములు కూడా త్యజించినవాడవగుదువు గాక! ‘‘ఇవన్నీ పరమాత్మతత్త్వ సంజ్ఞలు. కనుక పరమాత్మాలంకారములేగాని, నావికావు!’’... అని భావించు. వాటివాటి గూడార్థములను (ఉద్ధరిణ, పంచపాత్ర, పవిత్రము, ఉత్తరీయము, పంచి... మొదలైన) ఉపాసనా ఉపకరణముల అంతరార్థమును ధారణ చేయి. బాహ్యరూపములను వదలి ఉండి.
దండాన్ లోకాన్ విసృజేత్। :
తులసి దండలు, రుద్రాక్ష దండలు, పూదండలు.... ఇటువంటివి వదలి ఉండు. కర్ర సంబంధమైన త్రిదండమును కూడా వదలి ఉండు. (రుద్రాక్ష = సర్వము ఆత్మయందు లయము చేయు దృష్టి; పూదండ = జగద్దృశ్యమును మాలవలె అలంకారముగా భావన; త్రిదండము = త్రిగుణములు, త్రికాలములు, త్రి-అవస్థలు ఉపకరణములుగా భావించటము. అట్టి ‘అంతరార్థభావన’ను ధారణ చేయటము.
ఆరుణి మునీంద్రులు : స్వామీ! పితృదేవా! హే ప్రజాపతీ! ఆ విధంగా మీరు చెప్పినట్లు త్యజిస్తూ.....ఇక ఆశ్రయించవలసినది దేనిని? ఏఏ నియమ - విధానములు కలిగి ఉండాలి?
శ్రీ ప్రజాపతి: ఇక, భౌతికమైన మంత్ర నియమాలు త్యజించియే, మంత్ర - మంత్రార్థముల (వాటి వాటి అంతరార్థముల) ఉపాసనగా అత్యంత జాగరూకుడవై అనుసరించాలి.
ఊర్ధ్వమ్ అమంత్రవత్ ఆచరేత్. పైకి మననరూప - మంత్రోపాసనా ఔన్నత్యాలు కలవానివలె కనబడుచూనే,.... మనస్సును నియమించు. ఇష్టదైవ తత్త్వముగురించిన మననపరుడై ఉండాలి. పైపై భేషజాలు త్యజించి ఉండి...., లోన ఉపాసన కొనసాగించు.
అట్లాగే, ఊర్ధ్వగమనమ్ విసృజేత్। ‘‘ఊర్ధ్వలోకాలు పొందాలి. స్వర్గ - ఇత్యాది సుఖలోకాలు చేరెదను గాక’’...అనే ఆశయములనన్నిటినీ త్యజించినవాడవై ఉండు! ‘‘సమస్తము పరమాత్మయే అయి ఉండగా, ఆయన కొరకై ఎక్కడికి వెళ్ళాలి? ఎప్పటికో చూడటమేమిటీ? - అనే ఆత్మదర్శనము అభ్యాసము చేయి.
ఆహారము : ‘ఆకలి’ అనే వ్యాధియొక్క ఉపశమనము కొరకు మాత్రమే ఔషధము (Medicine) వలె ఆహారమును స్వీకరించాలి. ఔషధవత్ అశనమ్ ఆచరేత్! అంతేగాని ‘‘నాకు ఇది ఇష్టము. అదియే ఇంకా తినాలి’’....ఇటువంటి రుచి - ఇష్టములకు ఆహారము విషయమై వశుడవై ఉండరాదు. ‘ఇంద్రియములకు రుచి కదా’ అనే రూపంగా పరుగులు తీస్తూ, ఆత్మభావన నుండి ‘చ్యుతి’ని ఆహ్వానించవద్దు.
త్రిసంధ్య ఆదౌ స్నానమ్ ఆచరేత్ :
త్రివేణీ సంగమస్థానమగు....
గృహస్థులు, బ్రహ్మచారులు ప్రాతః - మధ్యాహ్న - సాయంత్ర సంధ్యా సమయాలలో ఉపాసనలకొరకై స్నానం నిర్వర్తిస్తారు కదా! సంధిం సమాధావ ఆత్మని ఆచరేత్! ‘‘ఇక్కడి ద్రష్ట (నేను) - దర్శనము (నాచూపు) - దృశ్యము (నాకు ఇంద్రియములకు అనుభూతమై తారసబడుచున్నది)....ఈ మూడూ ఆత్మస్వరూపమే!’’....అను త్రివేణీ సంధి స్థానములో ఆత్మోపాసకుడవై జగత్ విషయములపట్ల మౌనము వహించి ఉండు. ఆత్మ భావనా ఏకాగ్రతతో కూడిన సమాధి అభ్యాసము (లేక) ధారణను ఆచరిస్తూ ఉండెదవుగాక। ‘‘ఆత్మయే సమస్త జగత్తుగా, సకల జీవులుగా ప్రదర్శనమగుచున్నది’’ అనునదే ‘‘సంధి సమాధాన ఆచరణము’’.
సర్వేషు వేదేషు ఆరణ్యకమ్ ఆవర్తయేత్! ఉపనిషదమ్ ఆవర్తయేత్।
- వేదముల చివరగా ‘వేదాంతము’గా చెప్పబడుచు,
- పరమాత్మయొక్క అతి సామీప్య ప్రవచనార్థములు, అనుభవరూపములు, ఆత్మతత్త్వమును ఆశ్రయించాలి. తపస్సుచే ఎరిగినట్టి బ్రహ్మజ్ఞుల బ్రహ్మముయొక్క అభివర్ణనములను, మార్గదర్శకములు అగు ఆరణ్యకములను, ఉపనిషత్తులను పరిశీలించాలి. ఎల్లప్పుడు పఠించాలి। అర్థం చేసుకోవాలి। తదర్థమును ఆచరించాలి। వాటియొక్క మహదార్థమును మనోగతం కావాలి. అట్టి దృష్టిని పావనము, నిశ్చలము చేసుకొంటూ, జగత్తును దర్శించాలి.
తృతీయః ఖండః - ఆత్మారాధన
ఇక...,
ఖలు అహమ్ బ్రహ్మ → నేను బ్రహ్మమునే (స్వతఃగా, సహజముగా) అయి ఉన్నాను (సందర్భముగా జీవాత్మను కూడా)।
సూచనాత్ సూత్రమ్ → బ్రహ్మముయొక్క తత్త్వమును సూచించునది సూత్రము.
బ్రహ్మసూత్రమ్ → ‘నేను బ్రహ్మమునే’ అని సూచిస్తున్నదే సూత్రము.
అహమేవ విద్వాన్ → ఇదంతా కూడా ‘‘తెలుసుకొనబడునది + తెలుసుకొనువాడు’’... ఈ రెండింటి సమావేశమే। తెలుసుకొనుచున్న నేను బ్రహ్మమే! బ్రహ్మమే స్వరూపముగల నాయందే ‘తెలియబడునది’, అనే సూత్రము ఉండిఉన్నది. అస్మత్ బ్రహ్మసూత్రధారణయే ఈ జగత్తు!
ఈ విధంగా ఎరుగుట - ధారణ చేసి ఉండటమే ‘బ్రహ్మసూత్రధారణ’! (1) తెలుసుకొను నేను (2) తెలివి (3) తెలియబడునది....ఈ మూడూ కూడా అఖండబ్రహ్మమే! ఇటువంటి ‘నేనే బ్రహ్మమును! ఇదంతా బ్రహ్మమగు నేనే’’....అను ధారణను ప్రవృద్ధం చేసుకుంటూ,....ఇక ఈ ‘త్రివృత్’ భౌతికసూత్రమును వదలివేయాలి! మనస్సుతో త్యజించియే ఉండాలి. ‘ఉపవీతము’ను ‘బ్రాహ్మీభావనా సంజ్ఞ’గా ఉద్దేశించాలి.
బ్రహ్మమునకు వేరుగా అనిపించేది బ్రహ్మమునందు లయం చేస్తూ రావాలి. అన్యమంతా ‘అనన్యము’ అగు ఆత్మయందు లయింపజేయువాడు (లేక) ఆత్మకు అనన్యముగా (ఆత్మకు వేరుకానట్లు, సర్వము ఆత్మయే - బ్రహ్మమే అయి ఉన్నట్లు)...దర్శించువాడే విద్వాంసుడు.
త్యజేత్ విద్వాన్, అన్య - ఏవమ్ వేద! జగత్తును జగత్తుగా త్యజించి, బ్రహ్మముగా దర్శించు అనన్య భావనా సంపద గలవాడే విద్వాంసుడు. ఎరుగవలసినది ఎరిగినవాడు.
‘‘సన్యస్తం మయా। సన్యస్తం మయా। సన్యస్తం మయా।’’
(మయా-నాయొక్క; సత్-న్యస్తం = సత్ చమత్కార భావనయే)
‘‘ఈ దృశ్యము - జగత్తు - విశ్వము....ఇదంతా కూడా సత్ స్వరూపుడనగు నాయొక్క స్వరూప ధారణ - భావనయే!’’.....అని త్రి సమయములందు, త్రి లోకములందు, త్రి అవస్థలయందు, త్రి సంధ్యలయందు, (భూత-వర్తమాన-భవిష్యత్ కాలములను, పాతాళ - భూ - స్వర్గలోకములను, జాగృత్ స్వప్న - సుషుప్తులను, ప్రాతః - మధ్యాహ్న - సాయం సంధ్యా స్థానములందు)....ధారణ చేయాలి. ఇదియే ‘‘సూత్ర యజ్ఞోపవీతధారణ’’, ‘‘త్రిసంధ్యోపాసన’’ కూడా!
అంతా బ్రహ్మమే। నేను బ్రహ్మమును। నాకు వేరుగా ద్రష్ట - దృశ్యము - దర్శనములనబడేవి లేవు. నాకు వేరుగా నేను - నీవు - ఆతడు...అనునవి లేవు. కర్త - కర్మ - క్రియ లేవు! తత్ - త్వమ్ - అహమ్ రూపమంతా బ్రహ్మమే।
నాయొక్క బ్రాహ్మీ తత్త్వము చేతనే అవన్నీ ఉన్నట్లుగా నాచే కల్పించబడి, ఆస్వాదించబడుచున్నాయి.
ఈ సర్వము నేనే! ఈ సర్వమునకు సాక్షినై వేరే కూడా నేనే!
ఉభయం మయ్యేతి → జీవాత్మను - పరమాత్మను, ఇహస్వరూపమును - పరస్వరూపమును నేనే!
మత్తః సర్వమ్ ప్రవర్తతే → నా వలననే ఈ సర్వము ఈ రీతిగా ప్రవర్తితమగుచున్నది.....అనునదే సత్-న్యాసము (లేక) సన్న్యాసము.
ఆత్మయే ఆరాధనా వస్తువు। ఆత్మయే ఆరాధన। ఆత్మయే ఆరాధించుచున్నవాడు।
ఇదియే త్రిసూత్ర సన్న్యాసము.
అంతేగాని, దూది నిర్మిత జంధ్యమును (యజ్ఞోపవీతము)ను సన్న్యసించినంత మాత్రంచేత అది ‘మయా సన్యస్తస్థితి’ కాదు సుమా! కాషాయ వస్త్రధారణ సన్న్యాసమునకు అభ్యాసవిధానమేకాని, వాస్తవమైన సన్న్యాసము కాదు.
ఆ ‘‘మయా సన్న్యాసీ’’ భావన ఆశ్రయించు యోగి ఇంకా కూడా ఇట్లా భావన - నిర్ద్వంద్వమగు అవగాహన కలిగి ఉంటున్నాడు.
ఓ బ్రహ్మదండమా! త్రిదండమా!
అందుచేత ఓ దండమా! నీవు నాకు సఖుడవు! మిత్రుడవు సుమా!
శ్లో।। సఖా మా గోపా, యోజః సఖా, యో అసీ ఇంద్ర స్య వజ్రోఽసి
వార్ద్రఘ్న శర్మ మే భవ। యత్ పాపమ్ తన్నివారయేతి।।
‘‘బ్రహ్మమునందే నేను బ్రహ్మమునై చరిస్తున్నాను’’...అనే నిర్మల-ఉత్తమబుద్ధి-కొరకై, (బ్రహ్మచర్యము-కొరకై)-బ్రహ్మమును ఉపాసించాలి.
అహింసాం చ। అపరిగ్రహం చ। → అహింస-‘‘ఎవ్వరికీ బాధ కలిగించకుండెదనుగాక! అంతా బ్రహ్మమే అయి ఉండటంచేత ఎవరికి ఏ బాధ కలిగించినా కూడా...అది నన్ను నేను బాధించుకోవటము వంటిదే కదా!’’ - అను స్వాత్మ - తత్త్వ భావన కలిగియుండు. సర్వదా దేనినీ పొందనివాడవై ఉండు. ‘ఇది నాది’ అని దేనినీ పరిగ్రహించకుండెదవు.
┄ ┄ ┄
ఓ జనులారా! స్వస్వరూప పరబ్రహ్మ సాక్షాత్కారమునకై ఉపాయాలు చెప్పుచున్నాను...వినండి.
బ్రహ్మ చర్యం చ....!
మీరు బ్రహ్మచర్యమును ఆచరించండి.
బ్రహ్మమే సహజస్వరూపముగా కలిగియున్న నేను - బ్రహ్మమే స్వరూపముగాగల ఈ విశ్వజగత్తునందు, బ్రహ్మమే స్వరూపముగా కలిగినట్టి సహజీవులతో కూడి - బ్రహ్మమునందు సంచరిస్తూ ఉన్నాను. |
మరల చెప్పుచున్నాను -
అహింసా చ :! అహింసా స్వభావులై, అహింసను వ్రతముగా స్వీకరించి ఉండండి. ‘‘సర్వము పరబ్రహ్మమే కనుక, ఎవరినైనా మనో - వాచా - కర్మణా బాధించటము నన్ను నేను బాధించుకోవటమే గదా!’’ - అనునది దృష్టిలో కలిగి ఉన్నవారు తత్త్వశాస్త్రార్థమును (త్వమ్-తత్ అసి) అభ్యసించి బ్రహ్మభావమునకు అర్హులు కాగలరు.
అపరిగ్రహం చ : ‘‘ఈ జగత్తులో ఏదీ నాది కాదు. అంతా పరమాత్మదే! పరమాత్మ దేహము ప్రసాదించుటచే ఈ దేహము ఆయనదే! ఆహారము పరబ్రహ్మ ప్రసాదితము. అట్లాగే సర్వవస్తువులు కూడా (బడికి వెళ్ళిన బాలుడు చదువుకోవటానికి, విజ్ఞుడవటానికే తరగతి గది, కుర్చీ, బెంచీలు ఉపయోగించుకోవాలి. అంతేగాని పాఠశాలలో ఏదీ ఆతనిది కాదు కదా!)’’ - నావి కావు - అనునది ‘‘అపరిగ్రహము’’.
ఈ జీవుడు సృష్టిలో విద్యార్థియే! విశ్వమే విద్యాలయం! ఇది విశ్వవిద్యాలయము(This Universe is 'University'). అందుచేత ఏదీ పరిగ్రహించనివారై ‘నాది’ ‘నాది’... అని భావించక, సర్వము పొందండి. ఆస్వాదించండి. (తేన-త్యక్తేన భుంజీదా)! అపరిగ్రహులై ఉండండి.
సత్యం చ : ఈ ఇంద్రియ దృశ్య వ్యవహారమంతా కూడా సందర్భముచే మాత్రమే సత్యము. భావనచే మాత్రమే సత్యము. మనో కల్పితములగు సంబంధ - అనుబంధ - బాంధవ్య - ఆశ - అభిప్రాయములచే మాత్రమే సత్యము. కల్పన....అయిన దానినంతా అధిగమించండి. వాస్తవమగు ఆత్మను మాత్రమే పరిగ్రహించండి.
గురు - శాస్త్ర పాఠ్యాంశ పారాయణులై అసత్తును అధిగమించి పరమ సత్యమునే ఆశ్రయించండి!
యత్నేన : (శరణాగతి యోగము) : పరబ్రహ్మ సాక్షాత్కారమునకై సర్వదా ప్రయత్నశీలురై ఉండండి. సర్వాత్మకుడగు పరమాత్మను హే రక్షత! హే రక్షత! హే రక్షత! - అని శరణువేడండి! మీరు అప్పుడు తప్పక స్వయముగా బ్రాహ్మీ స్వరూపులై ప్రకాశించగలరు.
చతుర్థః ఖండః
శ్రీ ప్రజాపతి : ఓ ప్రియపుత్రా! ఆరుణీ!
ఈ విధంగా ‘ఆత్మాహమ్’ అను భావన - అనుభూతి - ఆస్వాదన కొరకై - మహదాశయము కొరకై... అల్పాశయ సంబంధమై ఇహ విషయాలు త్యజించాలి - అని అనుకొన్నాము కదా!
భౌతిక - మనో సంబంధములైన పుత్ర - మిత్ర కళత్రాది దృశ్య విషయములతో ఏర్పడుచున్న దేహ సంబంధములను, లోకములతో ఏర్పడుచున్న బాంధవ్యములను, దండము - కమండలము - ఆశ్రమములు - గృహములు మొదలైన ఆయా (గృహస్థాది ఆశ్రమ) సాధన వస్తువులతో ఏర్పడే అనుబంధములు దాటివేయి. అవన్నీ లోకానికే వదలి ఉండు.
దేహము కొరకు ఆహారమును తీసుకుంటూ, దేహము - మనస్సు - జగత్తుల సంధి స్థానమును (సంధ్యాస్థానమును) ఉపాసిస్తూ, ఈ జగత్ దృష్టులను జయించి, ఆత్మ దృష్టిని - భావనలను పెంపొందించుకొనెదవుగాక ....అని సమీక్షించి చెప్పుకొనుచున్నాము.
(1) బ్రహ్మచర్యము (2) అహింస (3) అపరిగ్రహము (4) సత్యాశ్రయము - అను నాలుగు స్థంభాలు గల గృహంలో వసించు.
ఈ విధంగా ‘‘ఏది ఏ రీతిగా ఎందుకొరకు-ఎంతవరకు త్యజించి ఉండాలి? ఏది ఏ రూపముగా ఎట్లా ఆశ్రయించి ఉపాసించాలి?’’... అని గ్రహించిన వారై ఎందరో మహనీయులు ఉన్నారు. వారంతా పరమహంసలై, పరివ్రాజకులై ఈ ఈ దేహాలను జగత్తులను త్రోవలో కనిపించే స్వల్ప విషయాలుగా చూస్తూ వీటికి ఆద్యంతమూ అతీతులై ఉంటున్నారు. అట్టి పరమహంసలకు ఇదంతా బంధముగా కాకుండా, క్రీడా వినోదమాత్రంగా ప్రదర్శితమౌతోంది.
ఇదియే నీవు అడిగిన దృశ్య త్యాగము - కర్మ త్యాగము యొక్క పరిపక్వరూపము.
┄ ┄ ┄
శ్రీ ఆరుణి మునీంద్రులు : తండ్రీ! పరస్వరూపమగు ఆత్మయందే రమిస్తూ, ఇహమంతా ఆత్మయందు లయింపజేసి దర్శించు పరమహంసల గురించి కూడా దయచేసి సూచించి చెప్పవలసినదిగా ప్రార్థిస్తున్నాము.
శ్రీ ప్రజాపతి : సరే! ఇప్పుడు మన సంవాదము యొక్క సారవాక్యములుగా ఉత్తమాచరణులగు ‘పరమహంస పరివ్రాజకులు’ గురించి సూచనగా చెప్పుకుందాము.
శబ్దార్థము : పరమహంస = సోఽహమ్ పరమ్ = జన్మ-కర్మలకు ఆవల పరమైయున్న కేవలాత్మయే నేను.
ఆసన శయనాదికం భూమౌ : ఈ భూమి అంతా వారు కూర్చునే - పరుండే స్థానముగా భావిస్తారు. ఒక స్థానము - ఒక ప్రదేశమునకు పరిమితులవరు. ఇదంతా బహుదూరపు బాటసారులవలె పరివ్రాజకులై చూస్తూ ఉంటారు.
బ్రహ్మచారిణామ్ - ‘‘నేను నీవు, ఇది - అది...అంతా బ్రహ్మమే’’ అనే భావనయందు, భావనతో, భావికులై సంచరిస్తూ ఉంటారు. ‘‘బ్రహ్మ తత్త్వము’’నందే ఆచరణ, అవగాహన, అనుభూతి కలిగి ఉంటారు.
యతీనామ్ : (‘‘యతః సర్వాని భూతాని ప్రతిభాంతి - స్థితానిచ - తదహమ్’’....) ఇదంతా ఎందులో ప్రతిబింబిస్తూ, స్థానముగా కలిగినదై ఉన్నదో....అట్టి పరబ్రహ్మముతో మమేకమై ఉంటారు. యతులై ఉంటారు.
మృత్ పాత్రమ్ - అలాబు పాత్రమ్ - దారు పాత్రమ్ - వేణుపాత్రం వా : ఈ దేహమును, లోకసంబంధమైన జీవితమును (దేహమును) - మట్టి పాత్ర, సొరకాయ పాత్ర, దారువు పాత్ర, వేణు పాత్రగా భావించి జ్ఞానదర్శకులతో సంచరిస్తూ ఆత్మజ్ఞానానంద భిక్షాటకులై ఉంటారు.
కామ - క్రోధ - హర్ష - రోష - లోభ - మోహ - మద - మాత్సర్య - దంభ - దర్ప - ఇచ్ఛ - మమత్వ - అహంకారము మొదలైనవాటిని - పరిత్యజించి ఉంటారు. ఇవన్నీ అజ్ఞానరూపములుగా, బంధకారకములుగా గమనించినవారై పరిత్యజిస్తేనే....పరతత్త్వము బోధపడి, ఒకడు ‘పరమహంసత్వము’ను సముపార్జించుకోగలడు.
యతులు చాతుర్మాస్యవ్రతులై వర్షాకాలపు ‘4’ మాసములు ఒక్కచోటనే ఉండి తత్త్వార్థ జ్ఞానోపాసన, వేదాంత సాహిత్య ఉపాసన నిర్వర్తిస్తున్నారు. (లేదా) రెండు మాసముల కాలము ద్విమాస్యవ్రతులై ఉంటారు.
తక్కిన ‘8’ నెలలు లోకసంచారులై ఒక్కరుగా గాని, ఇద్దరుగాగాని అనేక ప్రదేశ - అనుగతులై ఉంటున్నారు. తత్త్వార్థజ్ఞానచక్షువులతో - దృష్టులతో కూడి సంచరిస్తున్నారు. జీవ - బ్రహ్మైక్యానుభవ ఉపాసకులై లోకసంచారాలు చేస్తున్నారయ్యా! అట్టి వారికి - ఈ లోకములలో సంచారమంతా ‘‘తమయందు తాము’’ సంచారరూపమగు ‘‘ఆత్మయందు ఆత్మసంచారము’’ - అగుచూ ఉన్నది.
పంచమః ఖండః - ఓం హి। ఓం హి। ఓం హి।।
మొట్టమొదట వేదార్థమును - ఆత్మతత్త్వ జ్ఞానమును సముపార్జించుకోవాలి!
ఊర్ధ్వదృష్టిని, ఆత్మదర్శన పవిత్ర బుద్ధిని క్రమంగా పెంపొందించుకుంటూ - ఏతాని ప్రాక్‌వా త్యజేత్....సర్వ ఇతఃపూర్వపు జగత్ విషయాలు త్యజించి వేస్తూ ఉండాలి. (Unlearning of impressions pertaining past to worldly events)
సో ఉపనయనాత్ ఏతాని త్యజేత్ - సర్వ ప్రాపంచక విశేషాలను అధిగమించు విజ్ఞానదృష్టి ప్రవృద్ధపరచుకొనునుగాక! ‘ఆత్మసామీప్యత’ యొక్క సహాయముతో ‘జగత్‌సామీప్యత’ను అధిగమించాలి. జగత్తును జగత్తుగా కాకుండా ‘‘అస్మత్ ఆత్మ - స్వరూపమే’’ - ఇతి భావయేత్ సదా!’’ - అభ్యాసము చేయాలి।
పితరం-పుత్రమ్-అగ్నిమ్-ఉపవీతమ్-కర్మ-కళత్రమ్ అన్యదపి ఇహ యతయో - కుటుంబ సంబంధములు, ఉపవీతము ఇత్యాది సాధన వస్తువుల సంబంధము, తదితర సర్వలౌకిక సంబంధములను అధిగమించి వేయి. ఆత్మదృష్టియందు లయింపజేసివేయాలి।
సమస్త సంబంధములను ‘‘ఆత్మసంబంధము, అహమాత్మా-పరమాత్మా భావన’’ యందు కరిగించివేస్తూ ఉండు. ప్రయత్నశీలుడై ‘యతివి అగుము’! యతయో ఇతి యతిః।
యత యో హి భిక్షార్థమ్ - గ్రామమ్ ప్రవిశంతి పాణి పాత్రమ్ ఉదరపాత్రం వా! ఉభయ హస్తములను కర్మ యోగ - కర్మ ఫల సమర్పణపరంగా ‘‘పాణిపాత్ర - రెండు చేతులు తెరచి జత చేయటం’’....గా, జ్ఞానభిక్షాపాత్రగా ధారణ చేస్తూ, ఉదరమే (పొట్టయే) జ్ఞాన భిక్షస్వీకార స్థానంగాను దర్శించు.
ఓం హి! ఓం హి! ఓం హి!
ఇదంతా ఓంకారమే! సర్వజీవులు ఓంకార స్వరూపులే! నేను ఓంకార స్వరూపుడనే! సమస్త వాక్ జాతమూ ఓంకారమే!
అను ఉపనిషత్ గానరూపమగు దృఢభావనను హృదయమునందు పరిపుష్టం చేసుకొంటూ, తత్ప్రయోజనము కొరకే - చాతుర్మాస్యము - (4 నెలల వర్షాకాలము), చాతుర్మాసానంతర తదితర ‘2/3’ సంవత్సరకాలము - (8 నెలలు కూడా) జ్ఞానాన్వేషణాశీలురు అయి ఉండెదరు గాక!
ఆత్మస్వరూపమును ఎరుగుచు
ఖలు తత్ ఉపనిషదమ్ విద్వాన్ య ఏవం వేద।
ఉపనిషత్ ప్రబోధమగు బ్రహ్మతత్త్వమును, అర్థము చేసుకొని, విద్వాంసుడై ‘ఆత్మాహమ్’ త్వమును, బ్రాహ్మీ స్వరూపతత్త్వమును బుద్ధియందు, హృదయమునందు నిలుపుకోవాలి సుమా!
ఆత్మజ్ఞానము సముపార్జించుకుంటూ.....
మోదుగ-బిల్వ-రావి- మేడి కర్రతో చేసిన దండమును, కృష్ణాజినమును, ఎండుగడ్డితో నేసిన మొలత్రాడును కూడా త్యజించి.....
దేని చేతను కంపించనివాడవగుము. ‘‘అకంపితుడవు’’ అయి ఉండుము.
┄ ┄ ┄
మనము చెప్పుకొన్న ఈ ఉపనిషత్ వాణిని ఎవరు తెలుసుకుంటారో (య ఏవం వేద)....
తద్విష్ణోణా పరమం పదం సదా పస్యంతి సూరయః దివీవ చక్షుః ఆతతమ్।
తత్ విప్రా సో విపన్యవో జాగృవాం సః సమింధతే, విష్ణోః యత్ పరమమ్ పదమ్।।
ఈ జగత్ విషయములన్నీ బుద్ధితో త్యజించుచూ, ఆత్మభావనతో నింపివేస్తూ ఏ పరమమగు విష్ణు (అంతటా - అన్నీగా విస్తరించియున్న ఆత్మ) స్థానమును మహనీయులు చేరుచున్నారో....
ఇక్కడి జగత్ విషయములన్నీ బుద్ధితో త్యజించి ఆత్మభావనతో నింపి...
సూరులు, దివ్యమైన దృష్టితో సర్వము - సర్వత్ర విష్ణుతత్త్వముగా చూస్తూ, విష్ణుస్వరూపులగుచున్నారో - వారు మాత్రమే జాగ్రత్తులు. తక్కినవారు నిద్రాపరవశులే.
ఆత్మభావనయందు నిదుర లేచినవారై అట్టి విప్రులు (వేద - వేదాంత తత్త్వవిదులు) పవిత్రమగు ఆ పరమపదమగు విష్ణుత్వము స్పష్టముగా పలుకుచూ, చూస్తూ, ఆస్వాదిస్తూ తరిస్తున్నారు.
ఇప్పుడే ఇక్కడే విష్ణుత్వమును సంతరించుకొనుచున్నారు.
వేద-పురాణ-ఇతిహస-ఉపనిషత్ ఇత్యాది సమస్త వాఙ్మయములలోను విష్ణుపదధ్యానము - ప్రబోధయే గమనించినవారై ఉంటున్నారు.
ఇది నిర్వాణ అనుశాసనము. మోక్షశాస్త్రము యొక్క ప్రవచనము।
వేదాను శాసనము। వేదములచే అనుశాసనంగా ఎలుగెత్తి గానం చేయబడుచున్న వేదాంత తత్త్వము।
🙏 ఇతి ఆరుణిక ఉపనిషత్ 🙏
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।।