[[@YHRK]] [[@Spiritual]]
Skanda Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 3
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com
యత్రాసంభవతాం యాతి స్వాతిరిక్తభిదాతతిః . . సంవిన్మాత్రం పరం బ్రహ్మ తత్స్వమాత్రం విజృంభతే .. |
శ్లో।। యత్ర అసంభిన్నతాం యాతి, |
స్వస్వరూపమునకు వేరుగా కనిపించేదంతా సత్- అభిన్నత్వము నందు లయించగా, అప్పటికీ శేషించు సత్-విత్‌మాత్ర పరబ్రహ్మమే స్వస్వరూపమై సర్వత్రా విజృంభణము కలిగి ఉన్నదగుచున్నది. |
అచ్యుతోఽస్మి మహాదేవ తవ కారుణ్యలేశతః . విజ్ఞానఘన ఏవాస్మి శివోఽస్మి కిమతః పరం .. 1.. |
|
ఓం 1. అచ్యుతోఽస్మి మహాదేవ! తవ కారుణ్య లేశతః। విజ్ఞాన ఘనఏవాఽస్మి। శివోఽస్మి। కిమ్ అతః పరమ్? |
గురుదేవా! నృశింహ భగవన్! మీరు బోధించిన ఆత్మజ్ఞానముచేత పవిత్రుడనైనాను. మీయొక్క బోధానుగ్రహంచేత ధన్యుడను. ఇప్పుడు నాగురించే నాకు గల ఆత్మానుభూతిని మీకు విశదీకరించుకొని ఆనందిస్తున్నాను స్వామీ! వినండి. హే మహాదేవా! నేను ఆత్మ స్వరూపమునుండి ఎప్పుడూ కూడా (సర్వదా) చ్యుతి లేనివాడనే. అచ్యుతుడను. ఇది మీ యొక్క లవలేశపు కారుణ్యముచే, మీ బోధానుసారం తెలుసుకున్నాను. స్వామీ! నేను జీవమాత్రుడను కాను. కేవల శివస్వరూపుడను! విజ్ఞాన ఘన (కేవల విజ్ఞాన) స్వరూపుడను! శివుడనై యున్నాను. ఇంతకు మించి నా గురించి మరొకటేముంటుంది? |
న నిజం నిజవద్భాతి అంతఃకరణజృంభణాత్ . అంతఃకరణనాశేన సంవిన్మాత్రస్థితో హరిః .. 2.. సంవిన్మాత్రస్థితశ్చాహమజోఽస్మి కిమతః పరం . |
|
2. న నిజం నిజవత్ భాతి అంతఃకరణ జృంభణాత్। అంతఃకరణ నాశేన సంవిత్ (సత్-విత్) మాత్ర స్థితో హరిః। సంవిత్ మాత్ర స్థితశ్చ అహమ్, అజోఽస్మి। కిమ్ అతః పరమ్? |
మీ బోధామృతము వినిన తరువాత ‘‘నేను అచ్యుతుడను, విజ్ఞాన ఘన స్వరూపుడను, శివానంద స్వరూపుడనై ఉన్నాను’’ అని ఇప్పుడు ఒప్పుకుంటున్నాను. అయితే ఇదివరకు అది నేను కాదా? అదియే! కానీ ఇంతకుముందు అంతఃకరణముయొక్క విజృంభవశంగా నిజమైనది నిజంగా భాసించనే లేదు. నిజం కానిది నిజంవలె భాసించింది. ఇప్పుడో, మీరు కరుణామూర్తులై ప్రసాదించిన బోధచే, అంతఃకరణము నశించుటచే - హరి ‘సత్’ - ‘చిత్’ మాత్ర స్థితుడని, అజుడు (సృష్టికర్త) కూడా అదియేనని, నేను కూడా అదేవిధంగా సత్-విత్ మాత్ర స్థితుడనని, హరి-అజుడు-నేను కూడా జన్మ రహితులమని తెలిసిపోతోంది. ఇంతకుమించి, వేరైనదేముంది? తెలుసుకోవలసినది ఏమున్నది? హరియందు నేను, నాయందు హరి పరస్పరము పూర్ణమైయున్నాము. |
వ్యతిరిక్తం జడం సర్వం స్వప్నవచ్చ వినశ్యతి .. 3.. చిజ్జడానాం తు యో ద్రష్టా సోఽచ్యుతో జ్ఞానవిగ్రహః . |
|
3. వ్యతిరిక్తం జడం సర్వం స్వప్నవత్ చ వినశ్యతి। చిత్ జడానాం తు యో ద్రష్టా సో అచ్యుతో, జ్ఞాన విగ్రహః। |
సంవిత్ మాత్రమగు ఆత్మకు వేరుగా ఏదైతే ‘‘కనిపించినది, అనిపించినది’’ గా ఉంటుందో అదంతా కూడా - మెలకువ వచ్చినప్పటి (గడచిన) కలలోని దృశ్యమువలె - పూర్తిగా వినాశమగుచున్నది. అయితే ‘‘ఇది చిత్, ఇది జడము’’ - అని నాలో ఉండే ఏ ద్రష్ట అయితే చూచుచూ ఉన్నాడో, ఆ కేవల జ్ఞాన విగ్రహుడు - సర్వదా తన కేవల ద్రష్టత్వము నుండి చ్యుతి పొందటము లేదు. అనగా నేను ఆత్మగా సర్వదా అచ్యుతుడను. |
స ఏవ హి జ్యోతిషాం జ్యోతిః స ఏవ పరమేశ్వరః . |
|
4. స ఏవ హి మహాదేవః। స ఏవ హి మహా హరిః। స ఏవ జ్యోతిషాం జ్యోతిః। స ఏవ పరమేశ్వరః। |
ఆ నాలోని చ్యుతి పొందని (అచ్యుతుడైనట్టి) నేనైన నేనే - మహాదేవుడగు శివుడు. ఆ ‘నేనే’ మహత్-తత్త్వుడగు హరి కూడా! ఆ కేవలాత్మయే జ్యోతిలన్నిటికీ జ్యోతి అయినట్టి ‘పరంజ్యోతి’. ఆయనయే పరమేశ్వరుడు। నాలో ‘నేను’గా ఉన్నది - సర్వ దేహములలో ‘నేను’గా ప్రదర్శనమగుచున్న ఆ పరమేశ్వరుడే! |
స ఏవ హి పరం బ్రహ్మ తద్బ్రహ్మాహం న సంశయః .. 5.. జీవః శివః శివో జీవః స జీవః కేవలః శివః . |
|
5. స ఏవ హి పరంబ్రహ్మ। తత్ బ్రహ్మ-అహమ్। న సంశయః। జీవః శివః। శివో జీవః। స జీవః కేవలః శివః।। |
ఆయనయే పరంబ్రహ్మము అయి ఉన్నారు. ఆ బ్రహ్మమే నేను. తదితరమైనదంతా సందర్భ పరిమిత కల్పనా మాత్రమే. శాశ్వతమగు సహజ సత్యము కాదు. నేను సర్వదా బ్రహ్మమునే! ఇందులో సంశయమే లేదు. ఈ జీవుడుగా కనిపిస్తున్నది శివుడే! శివుడే జీవుడుగా ఉన్నాడు. అందుచేత ఈ జీవుడు సర్వదా కేవలుడగు శివుడే! ఒకడు-నాటకంలో పాత్రగా కనిపిస్తున్నప్పటికీ, పాత్రధారుడుగా పాత్రను వేరు కానిదెప్పుడు? |
తుషేణ బద్ధో వ్రీహిః స్యాత్తుషాభావేన తండులః .. 6.. ఏవం బద్ధస్తథా జీవః కర్మనాశే సదాశివః . |
|
6. తుషేణ బద్ధో వ్రీహిః స్యాత్ తుషా అభావేతు తణ్డులః। ఏవమ్ బద్ధః తథా జీవః కర్మనాశే సదాశివః।। |
వడ్లు బియ్యము ఒక్కటెలా అవుతాయి? అవవు కాని, ఊక విభాగంతో కూడా అది వడ్ల గింజయే. ఊక తొలగిస్తేనో? బియ్యపు గింజ. అంతేగాని వడ్లగింజకు బియ్యపు గింజ వేరు కాదు. ఈ జీవునిలో ‘ఆత్మ’ ఎక్కడున్నది? వడ్లపు పొరలో అంతరంగా బియ్యపు గింజవలె, జీవ స్వభావముయొక్క అంతరమున వేంచేసినదై ఉన్నది. ‘‘నేను కర్మలచే బద్ధుడను’’ - అని అనుకొనుచున్నవాడు ‘జీవుడు’గా అనబడుచున్నాడు. ‘కర్మలచే బద్ధముకాని స్వరూపుడను’ అను ఎరుకచే, (కర్మల అభావముచే) నేను సదాశివుడను. (జీవుడుగా ఉన్న సందర్భము నందు, జీవత్వమును (లేక) కర్మల పరిధులను అధిగమించినప్పుడు కూడా) - ఎల్లప్పుడూ ‘నేను’ శివ స్వరూపుడనే. (నటుని సహజ స్వరూపము సర్వదా నాటకమునకు వేరై ఉండుతీరుగా). సదా శివుడనే। |
పాశబద్ధస్తథా జీవః పాశముక్తః సదాశివః .. 7.. |
|
7. పాశ బద్ధః సదా జీవః పాశముక్తః సదా శివః। శివాయ విష్ణు రూపాయ, శివ రూపాయ విష్ణవే। |
జన్మ కర్మల పాశములకు బద్ధుడై ఉన్నప్పుడు శివుడే జీవుడు. ‘బద్ధుడను కాను’ అని గమనిస్తున్నప్పుడు ఈ జీవుడే - శివుడు. ఆశ, మోహముచే ఈ జీవునిపట్ల పాశములు. శివ భక్తుడు ఆశా- పాశబద్ధుడు కానప్పుడు - శివుడే! విష్ణు భక్తుడు పాశబద్ధుడు కానప్పుడు విష్ణువై! శివుడే విష్ణు రూపముగా ఉన్నారు. విష్ణువే శివరూపుడై ఉన్నారు. |
శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః .. 8.. యథా శివమయో విష్ణురేవం విష్ణుమయః శివః . |
|
8. శివస్య హృదయం విష్ణుః విష్ణుశ్చ హృదయగ్ం శివః। యథా శివమయో విష్ణుః ఏవం విష్ణుమయః శివః।। |
శివునియొక్క హృదయము విష్ణువే। విష్ణువు యొక్క హృదయాంతర్గతుడు శివుడే కూడా। ఏవిధంగా విష్ణువు శివమయుడై ఉన్నారో, అదేవిధంగా శివుడు విష్ణుమయుడై ఉన్నారు. (శివుడుగా విష్ణువుగా ఉపాసించబడేది - ఏకము, అఖండము అగు ఆత్మయే।) |
యథాంతరం న పశ్యామి తథా మే స్వస్తిరాయుషి .. 9.. యథాంతరం న భేదాః స్యుః శివకేశవయోస్తథా . |
|
9. యథా అన్తరం న పస్యామి తథా మే స్వస్తిః ఆయుషి। యథా అన్తరం న భేదాస్యుః శివ కేశవయోః తథా।। |
ఎప్పుడైతే విష్ణుతత్త్వమునకు శివతత్త్వమునకు భేదమే కనిపించదో, అప్పుడు నాయొక్క ఆయుష్షు (జీవితము) స్వస్థి పొందుచున్నది. ఎవ్వరికి శివ-కేశవ భేదము ఏమాత్రము అనిపించదో, కనిపించదో - ఆతడే అభేదమగు ఆత్మను అనుభూతపరచుకోవటానికి అర్హుడు. |
దేహో దేవాలయః ప్రోక్తః స జీవః కేవలః శివః .. 10.. త్యజేదజ్ఞాననిర్మాల్యం సోఽహంభావేన పూజయేత్ . |
|
10. దేహో దేవాలయః ప్రోక్తో, జీవో దేవః సదాశివః। త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం, ‘సోఽహమ్’ భావేన పూజయేత్। |
స్వామీ! నృశింహా! ‘‘ఈ దేహము బంధము కదా!’’- అని అజ్ఞాన దశలో అనిపించేది. మీరు బోధించిన ఆత్మ జ్ఞానము వినిన తరువాత ఇప్పుడేమి అనిపిస్తోందో చెప్పుతాను. వినండి. ఈ దేహమే దేవాలయము. ఇందులో దేహియే (లేక జీవుడే) దైవము. సదాశివుడు. దేవుడనబడేవాడు మరింకెక్కడో లేడు. అట్టి దేహములో ఈ జీవుడు - ‘‘అజ్ఞానము’’ అను నిర్మాల్యమును తొలగించుకొని ‘సోఽహమ్’ భావముతో స్వస్వరూప సదాశివుని పూజించును గాక! |
అభేదదర్శనం జ్ఞానం ధ్యానం నిర్విషయం మనః . స్నానం మనోమలత్యాగః శౌచమింద్రియనిగ్రహః .. 11.. బ్రహ్మామృతం పిబేద్భైక్ష్యమాచరేద్దేహరక్షణే . |
|
11. అభేద దర్శనం జ్ఞానం। ధ్యానం నిర్విషయం మనః। స్నానం మనోమల త్యాగః। శౌచం ఇంద్రియ నిగ్రహః। బ్రహ్మామృతం పిబేత్, భైక్షం ఆచరేత్ దేహ రక్షణే। |
జ్ఞానము - సర్వజీవులలోను సర్వదా సమస్వరూపమై వేంచేసియున్న పరమాత్మను అభేదంగా దర్శించటమే జ్ఞానము. (సమం సర్వేషు భూతేషు తిష్ఠంతం పరమేశ్వరమ్)। ధ్యానము - మనస్సును విషయముల వైపు నుండి ఉపసంహరించి కేవలము - నిర్విషయము చేసుకొని ఉండటమే ధ్యానము. (అనేకముగా కనిపిస్తున్నదానిలో ఏకమగు ఆత్మయొక్క ధ్యాస, మననములే ధ్యానము). స్నానం - మనస్సులో కు-సంస్కారరూపాలుగా పేరుకొనియున్న కామ-క్రోధ-లోభ-మోహ-మద-మాత్సర్య - దోష వర్గములను త్యజిస్తూ ఉండటమే స్నానము. శౌచము - ఇంద్రియములను నిగ్రహించి, నియమించి ఉంచటమే ‘శౌచము’. (అంతేగాని బాహ్యమైన మడి, ఆచారములు కాదు). ఇది గ్రహించి దేహ రక్షణ కొరకై భిక్షాటణం చేస్తూ, సదా ‘బ్రహ్మభావన’ అను అమృతమును త్రాగుచూ ఉండాలి. |
వసేదేకాంతికో భూత్వా చైకాంతే ద్వైతవర్జితే . ఇత్యేవమాచరేద్ధీమాన్స ఏవం ముక్తిమాప్నుయాత్ .. 12.. |
|
12. వసేత్ ఏకాన్తికో భూత్వా చ, ‘ఏకాన్తే ద్వైత వర్జితే’। ఇత్యేవమ్ ఆచరేత్ ధీమాన్ స ఏవం ముక్తిమ్ అప్నుయాత్।। |
ఏకాన్తముగా వసిస్తూ కాలము గడపాలి. ఏకాన్తము అనగా? ‘‘ఇదంతా పరమాత్మ స్వరూపమే’’ అను ఎరుక - అనుభూతులే ఏకాంతము. ద్వైతమును వర్జించి ఉండటమే ఏకాంతము. ఏకము, అఖండము అగు ఆత్మను సర్వే సర్వత్రా దర్శించటమే ఏకాంతము. ఇట్టి ఆచరణ గల ధీమంతుడు ఇక్కడే ముక్తిని పొందుచున్నాడు. |
శ్రీపరమధామ్నే స్వస్తి చిరాయుష్యోన్నమ ఇతి . |
|
13. శ్రీమత్ పరమ ధామ్నే స్వస్తి చిరాయుష ‘ఓం’ నమ ఇతి |
శ్రీమత్ పరమధామ్నము (అఖండ అద్వితీయ ఆత్మత్వము) సంతరించుకొని స్వస్తిని, మరణము లేని చిరాయువును పొందటము - అను స్థితిని పొందెదను గాక! ‘న’కారము - ‘మ’కారము నందు (పర-ఇహములందు) ‘స్వస్తి’ పొందును గాక! ఇదంతా ‘నమ’ - పరమాత్మ - జీవాత్మల ఏకరూపమే! |
విరించినారాయణశంకరాత్మకం నృసింహ దేవేశ తవ ప్రసాదతః . అచింత్యమవ్యక్తమనంతమవ్యయం వేదాత్మకం బ్రహ్మ నిజం విజానతే .. 13.. |
|
14. విరించి నారాయణ శంకరాత్మకం, నృసింహ! దేవేశ! తవ ప్రసాదతః, ‘‘అచిన్త్యమ్। అవ్యక్తమ్। అనన్తమ్। అవ్యయమ్। దేవాత్మకమ్ బ్రహ్మ నిజమ్’’ - విజానతే। |
హే లక్ష్మీ నృసింహ స్వామీ! దేవదేవేశా! విరించి-నారాయణ-శంకరాత్మకా! మీరు బోధించిన ఆత్మతత్త్వ పాఠ్యాంశములను విని నేను..., అచిన్త్యము, అవ్యక్తము, అనన్తము, అవ్యయము, సర్వ దేవాత్మకము అగు పరబ్రహ్మము యొక్క నిజ స్వరూపమును, అద్దానితో నాయొక్క అనన్య స్వరూపమును తెలుసుకొనుచున్నానయ్యా! |
తద్విష్ణోః పరమం పదం సదా పశ్యంతి సూరయః . దివీవ చక్షురాతతం .. 14.. తద్విప్రాసో విపన్యవో జాగృవాంసః సమింధతే . విష్ణోర్యత్పరమం పదం . ఇత్యేతన్నిర్వాణానుశాసనమితి వేదానుశాసనమితి వేదానుశాసనమిత్యుపనిషత్ .. 15.. .. ఇతి కృష్ణయజుర్వేదీయ స్కందోపనిషత్సమాప్తా .. |
|
15. తద్విష్ణోః పరమం పదగ్ం సదా పశ్యన్తి సూరయః దివీవ చక్షుః ఆతతమ్। తత్ విప్రా సో విపన్యవో జాగృవాం సః సమిన్ధతే, విష్ణోః యత్ పరమమ్ పదమ్।। ఇతి ఏవం నిర్వాణానుశాసనమ్।। వేదాను శాసనమ్।। |
దృశ్యపరిమితత్వముపై విజయమును సిద్ధించుకొన్న సూరులు తత్ విష్ణు పరమపదమునే ఎల్లప్పుడు సర్వత్రా దర్శించుచున్నారు. (అంతేగాని, అది ఏదో లోకమునకు వెళ్ళి ఎప్పటికో పొందవలసినదిగా విష్ణు పరమపదము గురించి తలచరు). కంటి నుండి బయల్వెడలిన చూపు ఆకాశమంతా ఆక్రమించుచున్నట్లు, విష్ణుతత్త్వము సర్వత్రా నిండి ఉన్నది. దివ్యమైన చక్షువులను పొంది సర్వమును విష్ణుతత్త్వముగా దర్శిస్తూ, విప్రులు (వేదహృదయము ఎరిగినవారు) అజ్ఞాన పరిధులను దాటి ఉంటున్నారు. ఎల్లప్పుడు జ్ఞాన నేత్రములను తెరచుకొనియున్న వారై పరమపదమగు విష్ణుతత్వమును ఇప్పుడే ఇక్కడే సర్వత్రా సర్వదా సందర్శించుచూ పరమానంద భరితులై ఉంటున్నారు. అట్టి మహనీయులే మాకు అనుసరణీయులు. ఇదియే నిర్వాణానురూప అనుశాసనము. వేదానుశాసనము. వేదముల అంతిమ సిద్ధాంతరూప ప్రవచనము. |
ఇతి స్కందోపనిషత్ సమాప్తమ్।
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।।
శ్లో।। యత్ర అసంభిన్నతాం యాతి స్వ-అతిరిక్త భిదా తతిః
సంవిత్ (సత్‌విత్) మాత్రం పరబ్రహ్మ తత్ ‘స్వమాత్రం’ విజృంభతే।।
ఎక్కడైతే భిన్నమగు (నాకు వేరైన) అసత్తు, స్వస్వరూపమునకు అతిరిక్తమై (వేరై) కనిపిస్తోందో, అదంతా కూడా ‘స్వస్వరూపమే’. (అనగా) సత్ - విత్ (ఉనికి - ఎరుక) రూపమగు పరబ్రహ్మమే - ఆయా రూపములుగా (జలమే తరంగముల రూపంగాను, బంగారమే ఆభరణములుగాను విజృంభించుతీరుగా) విజృంభించుచున్నది. స్వస్వరూపమునకు వేరుగా ఏదీ లేదు. ఎక్కడా లేదు. ఎప్పుడూ లేదు. అట్టి పరబ్రహ్మమునకు, సర్వాంతర్యామికి, సర్వతత్త్వ స్వరూపునికి నమస్కారము.
లోకపితలగు పార్వతీ - పరమేశ్వరుల ప్రియతనయుడు, స్కాందపురాణ ప్రసిద్ధుడు- కుమారస్వామి, కార్తికేయుడు, మహాసేనుడు, షడాననుడు, షణ్ముఖుడు ఇత్యాది) బహునామాలంకృతుడు శ్రీ స్కందభగవానుడు.
ఒక సందర్భములో శివభగవానుడు వివరించి చెప్పుచున్న ‘ఈ జీవుడే బ్రహ్మము’ అను మహార్థపూర్వకమగు జీవబ్రహ్మైక్య పరిభాషణమును శ్రద్ధగా అందరూ విన్నారు. అక్కడివారందరూ మహదానందము పొందుచుండగా, స్కందుడు మాత్రం - ‘జీవుడనగు నేను పరమాత్మను అవుతానా? ఎట్లా? అనేక జీవసంబంధిత సంస్కారాలు తొలగినప్పుడు కదా, పరబ్రహ్మ స్వరూపుడనయ్యేది!’ అని తలుస్తూ ఆత్మతత్త్వ శ్రవణానందమును పొందవలసినంతగా పొందటములేదు. స్కందుని డోలాయమాన చిత్తమునందు ‘జీవశ్శివః’ భావము సరిపడునంతగా అంకురించక పోవటమును ముఖకవళికలనుబట్టి సర్వాత్మకుడగు సాంబశివులవారు గమనించారు. స్కందుని దగ్గరకు పిలిచారు.
పరమశివుడు : బిడ్డా! స్కందా! యోగముచే కర్మల అతీతత్వము, జ్ఞానముచే ఛిన్న సంశయము ఉద్దేశ్యమైయున్నది. ‘ఈ జీవుడు స్వయముగా శివస్వరూపుడేనా?’ అనే విషయములో నీవు ఇంకనూ సందేహ నివృత్తుడువు కావలసి ఉన్నట్లుగా నాకు అనిపిస్తోంది. అందుచేత నీవు తపస్సుకు ఉపక్రమించు. నీ ఇష్ట దైవము, సర్వాంతర్యామి అగు శ్రీ లక్ష్మీ నృశింహస్వామిని ఉపాసించు. ఆ శ్రీమన్నారాయణుని కరుణచే సందేహ నివృత్తుడవు కాగలవు. ఆయన సర్వజ్ఞుడు. నిన్ను సంసార భ్రమలనుండి తమ బోధచే సముద్ధరించగలరు.
స్కందుడు ఆ మాటలు విన్నారు. వెంటనే లేచి నిలుచున్నారు. మాతాపితలగు పార్వతీపరమేశ్వరుల పాదపద్మములకు సాష్టాంగదండ ప్రణామములు సమర్పించారు. వారి అనుజ్ఞను పొందినవారై ఒక ఏకాంత ప్రదేశములో ఆసీనులై, శ్రీమన్నారాయణుని అవతారమగు శ్రీ నృశింహస్వామిని భక్తి - జ్ఞాన - వైరాగ్య - ప్రపత్తులతో ఉపాసించసాగారు.
కొంతకాలం గడచింది. ఒకానొక రోజు దివ్యతేజో విలాసుడు, ఆర్త త్రాణపరాయణుడు, చిద్విలాస లీలావేషధారుడు - అగు శ్రీ నృశింహ స్వామి ప్రత్యక్షమైనారు. వేదనారాయణుడగు ఆ స్వామి యొక్క దర్శనముచే పులకాంకితుడై, స్తోత్రములు సమర్పించి, స్కందుడు బ్రహ్మతత్త్వజ్ఞానము బోధించమని అర్థించారు. అట్టి అభ్యర్ధనను విని శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆనందభరితులు అయ్యారు.
⌘
అప్పుడు స్వామి పూసగ్రుచ్చినట్లు
🙏 పరబ్రహ్మమునుండి లీలా వినోదచమత్కారంగా బయల్వెడులుచున్న స్వకీయ ప్రకృతి చమత్కారము।
🙏 ద్రష్ట - దృశ్యముల ఆవిర్భావము. ఆత్మతో వాటియొక్క అనన్యత్వము।
🙏 దేహ - దేహాంతరముల చమత్కారము। ఆత్మయొక్క కేవలీ-అప్రమేయత్వము।
🙏 జీవబ్రహ్మైక్య తత్త్వము। ఆత్మయొక్క అఖండ జ్యోతి స్వరూపము।
ఇవన్నీ సవివరంగా తేటతెల్లపరచారు. స్కందుడు ఇష్టదైవమగు నృశింహస్వామి చెప్పినదంతా విన్నారు. పరమానందము పొందారు. పరబ్రహ్మముయొక్క అనన్య తత్త్వముతో మమేకత్వము సిద్ధించుకున్నారు. శ్రీ లక్ష్మీనృశింహస్వామి ఇంకా ఇట్లా అనసాగారు.
⌘
శ్రీ నృశింహస్వామి : ప్రియభక్తా! స్కందా! నీవు అడుగుచుండగా నేను బోధించిన వేదసారమగు ‘తత్త్వమ్’ జ్ఞానవిశేషములన్నీ శ్రద్ధగా విన్నావు కదా! ఇప్పుడు నీవు శివతత్త్వము గురించి, విష్ణుతత్త్వము గురించి ఏవిధంగా సమన్వయించుకుని హృదయాంతర్గతము చేసుకున్నావో...అది వివరించి చెప్పు. వింటాను.
⌘
శ్రీ స్కందుడు : హే మహాదేవా! నృశింహభగవన్!
ఏ సర్వాత్మకమగు పరబ్రహ్మతత్త్వమును ‘ఓం’ అను ‘ఏకము - అక్షరము’ అగు శబ్దముతో వేద - వేదాంగములు గానము చేయుచున్నాయో, అట్టి కేవలీ స్వరూపమునందు మమేకమై ఉంటున్నాను. ఇదంతా మీ కృపా కటాక్షము చేతనే తెలుసుకున్నాను. సద్గురువరేణ్యులై నన్ను మీరు మీ బోధామృతముచే సంస్కరించుచుండగా, నాయందే నేను, నన్ను గురించిన నిర్వివాద-పరాకాష్ఠ సత్యమును గమనించి, ఆస్వాదిస్తున్నాను.
నన్ను నేను స్వయం సత్ స్వరూపుడుగాను, కేవల విజ్ఞాన ఘనుడనుగాను, ఘనీభూతమైన ‘ఎరుక’చే కేవలచిత్ స్వరూపుడుగాను, శివస్వరూపుడనుగాను గమనించుచున్నాను. ఇంతకుమించి కావలసినదేమున్నది?
ఇంతకు పూర్వము - నిజము కానిదంతా కూడా - నిజమువలె భాసించటం జరుగుతూ వచ్చినది. న నిజమ్, నిజవత్ భాతి! అందుకు కారణమేమిటి? అంతఃకరణ జృంభణాత్। నాయొక్క అంతకరణ విభాగములగు మనోబుద్ధి చిత్త అహంకారములయొక్క దృశ్య సంబంధమైన విజృంభణయే! అట్టి అంతఃకరణము జయించబడగా, సంవిత్ స్వరూపుడగు ‘హరి’గా శేషించుచున్నాను. అనగా, మనోబుద్ధి చిత్త అహంకారూప అంతఃకరణమును వదలివేసినప్పుడు (లేక) దాటివేసినప్పుడు సంవితమాత్రుడనై శేషించుచున్నాను.
సంవిత్ = కేవలమగు సత్ + కేవలమగు విత్ = ఉనికి + ఎరుక వెంటనంటియున్న కేవలాత్మ స్వరూపుడను.
నా స్వస్వరూపమును గురించిన - కేవలమైన సత్ (ఉనికి) మరియు కేవలమగు ఎరుకల గమనికచే అప్పుడు ఇక నేను కూడా హరివలె, అజుడు (బ్రహ్మదేవుని) వలె-జనన మరణ రహితుడను! ఆత్మగా కర్మలకు కర్మఫలములకు అసంబంధితుడను. ఆత్మకు వేరై మరింకేముంటుంది? కిమ్ అతః పరమ్?
వ్యతిరిక్తం జడం సర్వం స్వప్నవత్ చ వినశ్యతి! రాత్రి కలలో కనిపించని స్వప్న సంఘటనలు, సందర్భములు, సంగతులు, సంబంధములు, అనుబంధములు మొదలైనవన్నీ తెల్లవారి మెలకువరాగానే ఏమౌతున్నాయి? క్షణంలో మటుమాయమై ‘మొదలే లేనివి’ అగుచున్నాయి కదా! ‘‘అవన్నీ ఎక్కడ జరిగినాయి? ఎప్పుడు జరిగినాయి? ఎందుకు జరిగినాయి?’’ మొదలైన ప్రశ్నలకు సమాధానమేముంటుంది? వస్తుతః లేనిదానికి ఉనికి ఎక్కడిది? అట్లాగే ఆత్మ చైతన్యమునకు అన్యమై (వేరై) కనబడుచున్నదంతా స్వయముగా చూస్తే జడము (స్వతఃగా లేనిది) మాత్రమే! ఈ దృశ్యము స్వతఃగా ఉన్నది కాదు. ఆత్మయొక్క భావనచే, కించిత్ ఏమరపు జోడగుచుండగా - తనకు తానే ఉన్నట్లు అగుపించునట్టిది.
చిత్ (ఎరుగుచున్నది) - జడము (ఎరుగబడుచున్నవి) - ఈ రెండూ కూడా ‘ఏ ద్రష్ట’చే ఎరుగబడుచున్నాయో, అట్టి కేవల జ్ఞానవిగ్రహుడు ఆత్మ నుంచి చ్యుతిపొందువాడే కాదు. అచ్యుతుడు. అట్టి సర్వజీవులలోని కేవల ద్రష్టయే మహాదేవుడగు శంకరుడు. ఆయనయే హరి. ఆయనయే బ్రహ్మ. ఆయనయే జ్యోతులన్నిటికీ జ్యోతిస్వరూపుడు. వెలిగించబడువాటన్నిటికీ జ్యోతిస్వరూపుడు. ఎరుగబడుచున్న అంతటికీ ఆధారమై ఉన్నవాడు.
ఆయనయే నాటకములోని, నటుని యొక్క సహజ స్వస్వరూపము వలే పరమేశ్వరుడు. (పరమ్ = ఆవల, ఈశ్వరుడు = సర్వత్రా విస్తరించి ఉన్నవాడు).
ఆయనయే ఈవలకు అంతటికీ ఆధారమైయున్న ఆవలగల పరంబ్రహ్మము. పరంధాముడు. పరమాత్ముడు. పరమేశ్వరుడు. పరానంద శాశ్వత స్వరూపుడు.
గురుదేవా! నృశింహభగవాన్!
తద్బ్రహ్మాహమ్। న సంశయః। అట్టి పరబ్రహ్మమే నేనై ఉన్నాను. ఇందులో కించిత్ కూడా సందేహము లేదు.
జీవశ్శివః శివోజీవః స జీవః కేవల శ్శివః। తరంగము జలమే కదా! ఆభరణము బంగారమే కదా! పాత్రగా కనిపించేది పాత్రధారుడే కదా! మట్టి బొమ్మగా కనిపించేది మట్టియే కదా! శిల్పము శిలయే అయిఉన్నది కదా! సర్పరజ్జు అహ్రాంతిలో కనిపించేదంతా రజ్జువుయే కదా! (పాములాగా కనిపిస్తున్నది త్రాడుయే కదా!).
అదే తీరుగా....,
🌺 ఈ జీవుడు (Individual self) గా కనిపిస్తున్నది. సర్వాంతర్యామి, సర్వతత్త్వ స్వరూపుడు, సర్వాంతర్గతుడు. సర్వసంప్రదర్శనుడు, సరతత్త్వ విదూరుడు, అగు ‘శివుడే’ (That 'self' of the universe) అయి ఉన్నాడు.
🌺 శివుడే జీవుడుగా కనిపిస్తున్నారు.
వడ్లగింజలో బియ్యపుగింజ
తుషేణ బద్ధో వీహ్రిః స్యాత్। తుషా అభావే తు తణ్డులః। ‘ధాన్యము వేరు. బియ్యము వేరు’గా కనిపిస్తూ ఉండవచ్చుగాక! ఊక (పొట్టుపొర)చే కప్పి ఉన్నప్పుడు ‘ధాన్యపుగింజ’ అని అంటాము. ఊక (పొర)ను తొలగిస్తే ‘బియ్యపు గింజ’ అని పిలుస్తాము కదా!
అదే విధంగా, ఏవం బద్ధః తథా జీవః। ‘జన్మ - కర్మ - సంబంధం - అనుబంధ...ఇత్యాదులచే నేను బద్ధుడను కదా!’ అని తలచుచున్నప్పుడు అట్టి వానిని ‘జీవుడు’ అని పిలుస్తున్నాము.
ఎవ్వడైనా ‘అయ్యా! నేను జన్మలకంటే, మునుముందే విడిగా ఉన్నాను. ఎప్పటికీ ‘వేరే’ అయి ఉన్నాను. నేను ఉంటేనే జన్మలు. నేను ఉంటేనే కర్మలు. అనగా నేను జన్మలకు కర్మలకు ఆధారుడునై సర్వదా ఉన్నాను. అందుచేత కర్మలచే నేను బద్ధుడను ఎట్లా అవుతాను. కాను’ అని తలచినప్పుడో? ఆ విధంగా నిర్ద్వంద్వంగా ఎరిగి ఉన్నప్పుడో? కర్మ నాశే సదాశివః। ఎవరి దృష్టిలో కర్మలు, కర్మబంధములు మొదటే సందర్భ కల్పన మాత్రములై, స్వతఃగా ‘లేనివి’గా అగుచున్నాయో, అప్పుడు ఆతడే ‘సదా శివుడు’. ఆతడు శివస్వరూపుడే!
పాశ బద్ధః సదా జీవః
ఎవ్వడు తనను గురించి తాను - ‘‘జన్మ - కర్మ - పునర్జన్మ - సంబంధ - అనుబంధ - బాంధవ్య - జాగ్రత్ వ్యావహారిక’ - ఇత్యాది ‘విషయములు’ అనే త్రాళ్లచే బద్ధుడను. పరిమితుడను. సత్వ - రజో - తమోగుణములు, ఈ జగత్ దృశ్యము మొదలైనవాటిచే నిబద్ధుడను’’ - అని అనుకుంటూ ఉన్నాడో....ఆతడు సదా జీవుడే!
ఏ జీవుడైతే,..
పాశముక్తః సదా శివః
✤ స్వకీయ కల్పన: జన్మలు, కర్మలు ఇవన్నీ కూడా ఆత్మస్వరూపుడనగు నా సమక్షములో నా చేతనే నాయొక్క క్రీడావినోదంగా, నాయొక్క కల్పనా / ఊహా / భావనా విభాగంలో కనిపిస్తున్న స్వయం కల్పిత విశేషములు.
✤ స్వప్న దృష్టాంతము: స్వప్నము తనదైనవాడు స్వప్నములోని విశేషములచే సంబంధితుడై కొనసాగుచున్నాడా? లేదు. స్వప్నము తనదైన వానిని - ఆ స్వప్నములోని కొన్ని సంఘటనలు బయటకువచ్చి బంధిస్తాయా? లేనే లేదు.
✤ బంగారము - ఆభరణము దృష్టాంతము : ‘ఆభరణము’ అనునది బంగారమును బంధిస్తోందా? అది జరుగుటయే లేదు! ‘‘గొలుసుయొక్క గుండ్రటి ఆకారము బంగారమును తనలో బంధిస్తోంది’’ - అని అంటామా? అనము.
✤ నటుడు - పాత్ర దృష్టాంతము : ఒకడు ఒక నాటకంలో ఒక పాత్రగా నటిస్తున్నంత మాత్రం చేత ‘ఆ పాత్ర ఆతనిని బంధిస్తోంది?’ అని ఎవ్వరైనా అంటారా? అనరు!
✤ జలము - తరంగము దృష్టాంతము : ఒక తరంగము జలమును బంధిస్తోంది అని చెప్పుతామా? చెప్పము!
✤ సూర్యుడు కిరణము దృష్టాంతము : సూర్యకిరణాలు ఒక గోపురముపై ప్రసరిస్తూ ఉన్నప్పుడు ఆ గోపురము సూర్యుడిని బంధిస్తోంది - అని ప్రకటిస్తామా? ప్రకటించము.
✤ సూర్యుడు - ప్రతిబింబము దృష్టాంతము : సూర్యుడు ఒక తటాకములో ప్రతిబింబిస్తున్నప్పుడు, ఆ సూర్యప్రతిబింబము తటాక జలతరంగములు కారణంగా కదులుచున్నది కాబట్టి ‘సూర్యుడు నీటిలో కదలుచున్నాడు’ అను వాక్యము సత్యమా? లేదు. అది సత్య దూరమైన మాట.
అట్లాగే ఏ జీవుడైతే ‘‘జీవుడుగా కనిపిస్తున్నంత మాత్రము చేత నాకు గాని, మరొక జీవునికిగాని - (ఆత్మస్వరూపము దృష్ట్యా) - బంధము మొదలేలేదు. అఖండాత్మయే నేను, నీవు, త్రిమూర్తులు, త్రిలోకజీవులు కూడా!’’ అను అసంశయ దృష్టితో ప్రశాంతశీలుడై చూస్తూ ఉంటాడో పాశముక్తః సదా శివః। అట్టి పాశముక్తుడు ఎల్లప్పుడూ శివుడే! ఎవరి దృష్టిలో తనకు, తదితరులకు కూడా ‘బంధము ఎప్పుడూ లేదు’ అను ఎరుకచే సునిశ్చితుడు (సునిశ్చయుడు) అయి ఉంటాడో, ఆతడు ‘జీవుడు’ అనిపించుకోడు. మరి?
‘‘సదాశివుడే!’’
శ్రీ నృశింహస్వామి : ప్రియ స్కందా! షణ్ముఖా! మురుగా! గౌరీపుత్రా! పావన చరితా! నేను బోధించిన ఆత్మతత్త్వ విశేషములపట్ల నీయొక్క ‘అవగాహన’ నాకు పరమానందమును కలుగజేస్తోందయ్యా! నీవు చెప్పినదంతా నీపట్ల, ప్రతిఒక్క జీవుని పట్ల అక్షరసత్యము. వేదోపనిషత్ ప్రవచనసారము. ఉన్న నిజము. బాగు. బాగు. అయితే నేను మరొక ప్రశ్న వేస్తున్నాను. నీ సమాధానమేమిటో వివరించు.
నీ పితృదేవులు, సర్వశుభంకరులు, లోకకళ్యాణమూర్తియగు శివభగవానుని సూచనను అనుసరించి నా కొరకై భక్తి- తపస్సులను సమర్పించి, నావద్ద బ్రహ్మతత్త్వము గురించి శ్రవణం చేస్తూ వస్తున్నావు కదా! ఇక, పరమసత్యము గురించి ఉన్నది ఉన్నట్లుగా చెప్పు.
శివతత్త్వము ఎట్టిది? విష్ణుతత్త్వము ఏమై ఉన్నది? ఈ రెండింటిలో ఏఏ సమాన -అసమాన-ప్రత్యేక విశేషాలు నీకు కనిపిస్తున్నాయి? వాటి వాటి సారూప్య, సాపేక్షతలు ఎటువంటివి? సమన్వయించియో, విభేదించియో చెప్పయ్యా! వింటాను.
శ్రీ స్కందుడు : హే భగవాన్! శ్రీ నృశింహదేవాదిదేవా! మీరు ప్రవచించిన ఆత్మబోధ వినటంచేత పునీతుడనైన నేను, మీరు నన్ను పరీక్షిస్తున్న విధంగా విష్ణు-శివ తత్త్వ సాపేక్షత-సారూప్యత’’ ల గురించి నాకు అనిపిస్తూ ఉన్నది. చెప్పుచున్నాను. దయతో వినండి.
శివాయ విష్ణురూపాయ : శివుడు కేవలాత్మ అయితే, విష్ణువు ఆ శివుని ప్రత్యక్షరూపము.
శివరూపాయ విష్ణవే : విష్ణువే శివ స్వరూపుడై వెలయుచున్నారు. విష్ణువు కేవలాత్ముడైతే, ఆతని ప్రత్యక్ష రూపము - శివుడు.
శివస్య హృదయం విష్ణుః : శివునియొక్క హృదయము (కేవలీ స్వరూపము ప్రదర్శనమగు స్థానము) విష్ణువే!
విష్ణుశ్చ హృదయం శివః : విష్ణువు యొక్క హృదయము శివతత్త్వమే!
యథా శివమయో విష్ణుః : ఏ విధంగా అయితే విష్ణువు శివమయమై ఉన్నారో, విష్ణువుచే పరిపోషించబడు ఈ విశ్వము శివమయమై ఉన్నదో...,
ఏవం విష్ణుమయం శివః : ఆ రీతిగానే శివుడు విష్ణుమయమైయున్నారు. ఈ విశ్వము విష్ణుమయమై యున్నది.
శివస్వరూపమంతా విష్ణువే! విష్ణు స్వరూపమంతా శివుడే!
శివ - కేశవులు అభేద, అఖండ, అప్రమేయ, అనునిత్య ఆత్మానంద స్వరూపులే! ఆ ఇరువురికి కించిత్ కూడా భేదము లేదు. శివ - కేశవులకు ఎంతవరకు అభేదముగా నాకు సందర్శనమగుచున్నదో, అంతవరకు ఆ తీరుగా నా ఈ ఆయుష్షు పవిత్రమై, పరమస్వస్తిని, పరమానందమును పొందుచున్నాను. యథా అన్తరం న పశ్యామి, తథా మే స్వస్తిః ఆయుషి।। భేదమును దర్శిస్తున్నంతసేపు ఆయుష్షు, సాధనలు వృధాయే.
హే గురువరేణ్యా! ప్రహ్లాదవరదా! శ్రీ లక్ష్మీనృశింహస్వామీ! సద్గురువై ఈ మీ శిష్య పరమాణువును అడిగిన శివ - విష్ణు తత్త్వ సాపేక్షలగురించి నా సమగ్రము, సంక్షిప్తము అగు సమాధానము వినండి.
శ్రీ నృశింహస్వామి : బిడ్డా! కార్తికేయా! నీవు పరమసత్యమును సుస్పష్టీకరించి నాకు ఇంకా అధికంగా ప్రియశిష్యుడవగుచున్నావు. నీవు చెప్పినది నిజము. సత్యము. పరమ ప్రస్ఫుటము.
ఇప్పుడు ఇంకొక ప్రశ్న.
ఈ దేహధారియగు జీవునికి - ప్రకృతిలో కనిపిస్తున్న ఆతని భౌతిక దేహమునకు గల పరస్పర సంబంధము ఎట్టిది? ఈ జీవుడు ఎవరిని పూజించటముచేత అది పరాకాష్ఠ అయిన పూజ అగుచున్నది? నీవు నా బోధచే గ్రహించినది ప్రస్ఫుటిస్తూ వివరించు.
శ్రీ స్కందుడు : మహాత్మా! విష్ణు భగవాన్! కరుణామయుడగు లక్ష్మీ నృశింహమూర్తీ! విశ్వముగా మూర్తీభవించిన విశ్వాంతర్యామీ! విశ్వకరా విశ్వదూరా! విశ్వాత్మకా! విశ్వ స్వరూపా! అవిశ్వుడా! శాశ్వతుడా! అజుడా!
మీరు ఆజ్ఞాపించినట్లుగా (1) జీవుడు, (2) భౌతిక దేహము, (3) దేవునియొక్క అత్యావశ్యక ఉపాసనల గురించి సమాధానముగా వినమ్రుడనై చెప్పుకొనుచున్నాను. వినండి.
దేహో ‘దేవాలయః’ ప్రోక్తో : ఈ దేహమే ‘దేవాలయము’ అని వేద-ఉపనిషత్తుల హృదయము. (ఆగమ శాస్త్రము దేవాలయమును దేహ నిర్మాణమును అనుసరించియే నిర్మాణ విధానమును సశాస్త్రీకరించున్నది).
జీవో దేవః సదాశివః : ఈ దేహములో వేంచేసియున్న జీవుడు ఎవ్వరు? సదాశివుడే! ‘‘ఒకడు జ్ఞానియా, అజ్ఞానియా?’’ - అనే ప్రశ్న, ఆ ప్రశ్నకు సమాధానము కూడా బుద్ధి పరిమితమైన విశేషమే. ప్రతి దేహములోను - ‘‘బుద్ధికి ఆవల వేంచేసి ఉండి (సత్) బుద్ధిని, తదితరమైన చిత్త - అహంకార - దృశ్య మాన జగత్తులను ప్రకాశింపజేయుచున్న ఈ జీవుడు సహజంగా ఎవ్వరు?’’ - అని గమనిస్తే సదాశివుడే! సర్వకాల - సర్వావస్ధలయందు ఈ జీవుడు శివస్వరూపుడే!
అయితే ఈ జీవుడు దేహములో ఉపకరణములుగా ఉన్నట్టి ఇంద్రియములకు సంబంధితమైన విషయములలో చిక్కుకొని తనయొక్క సదాశివత్వమును ఏమరచినవాడై తిరుగాడుచున్నాడు.
అందుచేత ఈ జీవుడు తనయొక్క సహజమగు (ఆత్మలో) అనన్యత్వమును తిరిగి స్వానుభవముగా చేసుకోవటానికై....
త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం : ఏ విధంగా అర్చకాచార్యులవారు దేవాలయంలోని గర్భగుడిలో నిర్మాల్యమును తొలగించి మూలవిగ్రహము సాలంకృతం చేస్తారో, ఆ విధంగా జీవులమగు మేము తత్త్వజ్ఞులగు సద్గురువుల బోధచే ‘అజ్ఞానము’ అనే నిర్మాల్యమును మా హృదయ - గర్భగుడి నుండి తొలగించి వేసి పరిశ్రుభపరచుకొనెదము గాక! సర్వాత్మకుడగు శివుని సర్వదా సర్వత్రా అవిరోధంగా, అవిరామంగా, అనుక్షణికంగా దర్శించటమే - అజ్ఞాన నైర్మాల్య విసర్జనము.
సోఽహమ్ భావేన పూజయేత్ : ఈ జీవుడు తన హృదయాకాశమున సర్వదా వేంచేసియున్న సర్వాత్మకుడగు, జగత్ ప్రదర్శనా వినోదియగు పరమాత్మను మనసా, వాచా, కర్మణా.... ‘‘సోఽహమ్’’ భావనతో ఆరాధించాలి (లేక) పూజించాలి. ‘‘నాయొక్క పరస్వరూపమే సహజ సత్యము. ఇక ఇహముగా కనిపించేది మనో కల్పితము. ‘‘నీవు’’ మొదలైనవి కూడా అట్టిదే’’ - అనునదే సోఽహమ్ భావ పుష్పము.
🙏 ‘స్వామీ! నేనుగా ఉన్నది నీవేనయ్యా! నేనే నీవు, నీవే నేను కాబట్టి నేనే ఈ సర్వ జీవులలో, సర్వజీవులుగా, సర్వజగత్తులో, సర్వజగత్తుగా ఉన్నాను కూడా। |
అను ‘సోఽహమ్’ భావము అనే పుష్పమాలతో స్వస్వరూపాత్మ భగవానుని అలంకరించాలి.
నేను ఎవ్వరివ్వరితో మాట్లాడుచున్నానో, చూస్తున్నానో, ఎవ్వరెవ్వరి గురించి వినుచున్నానో, నాకు తెలిసినవారంతా, తెలియనివారంతా ‘సదాశివస్వరూపులే!’ అను భావనా పుష్పములతో స్వస్వరూపుడగు అఖండాత్మ భగవానుని ప్రేమ, ఆత్మ - భావనావేశములను జోడించి నిత్యము పూజించాలి.
శ్రీలక్ష్మీ నృశింహ స్వామి : వత్సా! స్కందా! నీ సమాధానము అమోఘము. నాకు బ్రహ్మానందము కలుగుజేస్తోందయ్యా! నిన్ను మెచ్చుకొంటున్నాను.
ఇప్పుడింకా చెప్పు.
‘జ్ఞానము’, ‘ధ్యానము’, ‘స్నానము’, ‘పానీయస్వీకారము’ ‘రక్షణ’, ‘ఏకాంతవాసము’ ‘ముక్తి’. - ఈ ఈ విషయాల గురించి నీ అవగాహనను వివరించు.
స్కందుడు :
జ్ఞానం : లౌకికమైన జ్ఞానముగాని, శాస్త్రజ్ఞానముగాని నిజమైన జ్ఞానము కాదు. మరి? అభేద దర్శనం జ్ఞానం.
(‘‘సమం సర్వేషుభూతేషు తిష్ఠంతం పరమేశ్వరమ్’’ రూపమగు) జ్ఞానదృష్టియే - అభేద దర్శనము).
‘ఏకము, అక్షరము అగు పరమాత్మయే ఇన్ని రూపాలలో, ఇన్ని రూపాలుగా కూడా ఉన్నారు’ అని అనిపించేవరకు అనుకుంటూ ఉండటమే జ్ఞానము.
ధ్యానము : మనస్సును ఇంద్రియ విషయములనుండి వెనుకకు మరల్చి ‘మౌనము’ అవధరింపజేయటమే ధ్యానము. ధ్యానం నిర్విషయం మనః। క్రమంగా అనేక విషయ పరంపరలలో పాల్గొనుచున్న మనస్సును నిశ్చల మనస్సుతో (ఉన్మనితో) సర్వ సందర్భములలో చేతిలో ధరించిన ఉపకరణమువలె - ధారణ చేసి ఉంచటము - ధ్యానము యొక్క లక్ష్యశుద్ధి లక్షణము. విషయములలో ఉంటూ కూడా నిర్విషయుడనై ఉండటమే ‘ధ్యానము’.
స్నానము : ఈ మనస్సు అభ్యాసవశం చేత విషయములలో మునిగి త్రేలటము, ఇష్ట - అయిష్టములతో కూడి ఉండటము జరుగుతోంది. ఫలితంగా అనేక దృశ్య విషయాకర్షణలకు, సుఖ దుఃఖపరంపరలకు ‘లోను’ అయి ఉండటం జరుగుతోంది. బుద్ధి - అరిషట్ వర్గములకు (కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములకు - వాటి వాటి వర్గములతోసహా, క్రమ్ముకొనబడినదై ఉంటోంది. ‘స్నానం’ మనోమల త్యాగః : అట్టి మనో దోషములను మనస్సు నుండి తొలగించుకొనటమే ‘స్నానము’. అంతేగాని జలస్నానము నిజమైన (ఆధ్యాత్మికమైన) స్నానము కాదు.
శౌచము : ఇంద్రియముల ప్రవర్తనా విశేషములకు తాను ‘దాసుడు’ అగుటచే, అది అనేక అజ్ఞానభూమికలకు, అంధకార బంధురస్థానములకు, (విజ్ఞానము యొక్క అధ్యయనమునకు అవకాశములు స్వల్పమైయున్న) అల్ప ఉపాధులకు త్రోవచేయుచు, నడిపించుచున్నాయి. ఇప్పుడు జీవులమగు మేము ‘ఇంద్రియములు’ అను గోవులను పాలించు గోపాలురము కావాలి. అంతేగాని, ఇంద్రియములకు, ఇంద్రియ విషయములకు సేవకులుగా ఉండిపోరాదు. ఇంద్రియములను నిగ్రహించి వశం చేసుకోవాలి. వాటిని ప్రత్యాహారమార్గముగా కర్మయోగ - భక్తి యోగ - జ్ఞాన యోగ - క్రియా యోగ మార్గములలో నియమించాలి. ఆ విధంగా ఇంద్రియములను నియమించటమే ‘శౌచము’. శౌచమ్ ఇంద్రియ నిగ్రహః।
భైక్షమాచరేత్ దేహరక్షణే : భిక్షకులమై ఈ దేహ సంరక్షణార్థం ఆహారము పొందాలి. తినటానికి బ్రతకకూడదు. బ్రతకటానికి మాత్రమే తినాలి. ఆహారము - దేహరక్షణ కొరకు, దేహరక్షణ - ప్రాణములుదేహములో కలిగి ఉండటానికి (ప్రాణరక్షణ) కొరకు, ప్రాణరక్షణ ఆత్మజ్ఞానము కొరకు, ఆత్మజ్ఞానము పునఃదేహ పరంపరల ప్రవాహమును నిరోధించటానికి అయి ఉండు గాక!
బ్రహ్మామృతం పిబేత్ : (దేహే జాతే న జతోఽసి। దేహే నష్టే న నశ్యఽసి।...అను సిద్ధాంతమును అనుసరించి) ‘నేను దేహముతో ప్రారంభము కాను. దేహనాశనముతో ముగియను’ అని గ్రహించెదము గాక! ‘బ్రహ్మాహమస్మి’ - ‘నేను బ్రహ్మము’ అని ఎరుగుచూ, మార్పు - చేర్పుల పరిధియగు మృత్యువును అధిగమించి ‘అమృతత్వము’ను సంచరించుకొనెదము గాక! ‘బ్రహ్మము’ అనే అమృతమును త్రాగి బ్రాహ్మీదృష్టిచే ‘బ్రహ్మమే నేను’ అను అమృతతుల్యమగు స్థానమును పొంది ఉండెదము గాక!
ఏకాన్తవాసము
ఎవ్వడైతే....
‘ఈ కనబడే సమస్తము శివతత్త్వమే। నేను జీవుడుగా ఈ జగత్తును శివస్వరూపంగా ఎరుగుచూ ఉపాసన చేయుచున్నాను’ అను అభేదభావనోపాసన చేస్తూ ఉంటాడో,
ఆతడు ‘ఏకాన్త వాసి’ అగుచున్నాడు.
సర్వ ద్వైతములను వదలివేయటమే ఏకాన్తము. అట్టి ఏకాన్త వాసులమై మేము ఉండెదము గాక! ‘‘శివాత్ పరతరం నాస్తి’’। అను భావముయొక్క మననమే పరమాత్మతో ఏకాంత సేవ.
అనేకంగా ఇక్కడ కనిపిస్తూ ఉన్నప్పటికీ, ‘ఏకము’గా అనిపించటమే ‘‘ఏకాంతవాసము’’.
ఈ విధంగా స్నాన - ధ్యాన - శౌచ - భైక్ష - బ్రహ్మామృతపాన, ద్వైత వర్జిత ఏకాంత వాసములను - ఏ ధీమంతుడైతే (తెలివిగలవాడైతే) ఆచరణగా కలిగియుంటాడో, అట్టివాడు ‘ముక్తుడు’ అగుచున్నాడు. ఆతడు ‘పరమధామ్నము’ను జేరి పరమాత్మత్వమును సంతరించుకొనుచున్నాడు.
అట్టి శ్రీమత్ పరమ ధామ్నమును చేరి ఆయుష్షును పరమ పవిత్రము చేసుకొని స్వస్తిని పొందిన మహనీయులకు నమస్కరించుచున్నాను.
ఓ లక్ష్మీ నరశింహా! దేవదేవేశా! విరించి నారాయణ శంకరాత్మా! మీ యొక్క భోధామృతమును గ్రోలిన నేను ‘అచిన్త్యము, అవ్యక్తము, అనన్తము, అవ్యయము, దివ్యము-అగు నిజ బ్రాహ్మీస్వరూపమునందు ప్రవేశితుడనై, పరమపదమును (లేక) విష్ణు పదమును సంతరించుకొనుచున్నానయ్యా! కృతజ్ఞోస్మి। తవ నామస్మరణం-భవరోగ హరణమ్। తవ పాద దర్శనమ్-సర్వ పాప నాశనమ్।। నమో నమః।।
⌘
దివీవ చక్షురాతమ్ -- కంటి రంధ్రము నుండి బయల్వెడలిన చూపుశక్తి ఆకాశమంతా నిండియున్న విధంగా, అజ్ఞానమును జయించిన సూరులు - సర్వే సర్వత్రా సదా విష్ణుపదమునే దర్శించుచున్నారు.
తత్ విప్రా సో విపన్యవో, జాగృవాంసః సమింధతే, విష్ణోః యత్ ‘పరమం పదమ్’।। ఆ విష్ణువు యొక్క ‘పరమ పదము’ విప్రులు (ఆత్మజ్ఞానులు) సర్వదా దర్శిస్తున్నారు. ఆరాధిస్తున్నారు. సదా ఆత్మభావనయందు మేల్కొని ఉంటున్నట్టి జ్ఞానదృష్టి, జ్ఞాన నేత్రములుగల వేదజ్ఞులకు నమస్కారములు.
వేద హృదయమును ఎరిగియున్న విప్రులు ఆ విష్ణు పదమునే సదా స్తుతిస్తున్నారు. క్రమంగా అద్దానితో మమేకమగుచున్నారు.
⌘
ఇత్యేవం నిర్వాణానుశాసనమ్। ఇదియే మోక్ష శాస్త్రము ప్రకటించి నిర్వాణము యొక్క అనుశాసనము.
ఇత్యేవం వేదానుశాసనమ్। ఇదియే చతుర్వేదములు అనుశాసన పూర్వకంగా ఎలుగెత్తి గానము చేయుచున్నాయి.
🙏 ఇతి స్కంద ఉపనిషత్ 🙏
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।