Krishna Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 4
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: yhrkworks@gmail.com

అధర్వణ వేదాంతర్గత

5     కృష్ణోపనిషత్

శ్లోక తాత్పర్య పుష్పమ్

శ్లో।। యో రామః కృష్ణతాం ఏత్య సార్వాత్మ్యం ప్రాప్య లీలయా,
అతోషయత్ దేవమౌని పటలం, తం నతో-స్మి అహమ్।।
(తం నతో-స్మ్యహమ్।)।।

ఏ శ్రీరామచంద్రుడైతే శ్రీకృష్ణుడుగా అవతరించి సర్వాత్మత్వము ప్రదర్శించుచు లీలామానుష వేషధారి అయినారో, దేవతలకు- మునులకు-సమస్త జీవులకు పరమానందము కలుగజేసారో, అట్టి శ్రీరామ, శ్రీకృష్ణావతారములకు నమస్కరిస్తున్నాము.

ప్రథమ ఖండః - బృందావన సంచారార్థము

1. ఓం
శ్రీ మహావిష్ణుగ్ం సచ్చిదానంద
లక్షణగ్ం-రామచంద్రం దృష్ట్వా,
సర్వాంగ సుందరం - మునయో
వనవాసినో, విస్మితా బభూవుః।
శ్రీమాన్ మహావిష్ణు అవతారుడు, సచ్చిదానంద సౌందర్య లక్షుణుడు, సర్వాంగ సుందరుడు అగు శ్రీరామచంద్రుని మూర్తీభవించిన ప్రకృతి గత విభవమును చూచిన వనవాసులగు మునులు విస్మిత - అత్యంత ఆశ్చర్య చకితులు అయారు. వారి మనస్సు శ్రీరామచంద్రుని మూర్తీవిభవముతో ‘తన్మయము’ పొందసాగింది.
తగ్ం హోచుః (హ ఊచుః) :
నో అవద్యం అవతారాన్ వైగణ్యంతే।
ఆలింగామో భవంతమ్ ఇతి।
వనవాసులగు మునులు: శ్రీరామచంద్రా! వైగణ్యమగు (గణించలేనంతది అగు), నిర్దుష్టము అగు మీ ఈ రామావతార సౌందర్యము చూచి, పరవసించి, ఆలింగనము కోరు కొంటున్నామయ్యా! మాకు ప్రసాదించండి. (పుంసాం మోహన రూపాయ)।
శ్రీరామౌవాచ :
భవాంతరే కృష్ణావతారే యూయం
గోపికా భూత్వా మామ్ ఆలింగథ।।
శ్రీరామచంద్రుడు : ప్రియమునులారా! నేను కూడా మీ భక్తికి ఆకర్షితుడనే. (ద్వాపరయుగంలో) రాబోవు నా శ్రీకృష్ణావతారము సందర్భములో మనము ఆలింగనముచే ఆనందిద్దాము. మీరంతా కృష్ణావతారము సమయములో గోపబాలురుగాను, గోపికలుగాను జన్మలు స్వీకరించండి.
మునయౌ ఊచుః :
అన్యే యే అవతారాః తే హి
గోపాన్ నః, స్త్రీః చ (స్త్రీశ్చ) నో కురు।
అన్యోన్య విగ్రహం ధార్యం
తవ అంగ స్పర్శనాత్ ఇహ।।
మునులు : శ్రీరామబ్రహ్మసౌందర్యమూర్తీ! రాఘవా! మీరు మాకు మాట ఇస్తున్నతీరుగా మమ్ములను గోపబాలురుగాను, గోపికా స్త్రీలుగాను పుట్టించండి. మనకు అన్యోన్య విగ్రహ - ఆలింగనములు సిద్ధించును గాక. మీయొక్క అంగస్పర్శ యొక్క పరమానందమును మేము పొందుతాము
శశ్వత్ స్పర్శయితా అస్మాకం
గృహ్ణామో అవతారాన్ వయమ్।
(గృహీణామో-వతారాన్)
(తమలో తాము): ‘‘మనము మరల జన్మించి గోపీ - గోపికలుగా శ్రీకృష్ణుని అంగస్పర్శచే ద్వాపరయుగములో పులకితులమయ్యెదము.
(ద్వాపరయుగము చివరివరకు) వేచి ఉందాము.
రుద్రాదీనాం వచః శ్రుత్వా-
ప్రోవాచ భగవన్ స్వయమ్:


‘‘అంగ సంగం కరిష్యామి।
భవత్ వాక్యం కరోమి అహమ్’’।
రుద్రాది దేవతల, మునుల మనోభావములను గమనించిన భగవానుడగు శ్రీరాముడు ఇంకా కూడా ఇట్లా పలికారు :
‘‘మీ వాక్యములు కృష్ణావతారములో తప్పక సిద్ధింపజేస్తాను’’. మనము అంగాంగముల పరస్పరస్పర్శ ఆస్వాదిద్దాము.
మోదితాః తే సురాః సర్వే ‘‘కృతకృత్య అధునా వయమ్’’।।
యో నందః పరమానందో । యశోదా ముక్తి గేహినీ।
అది విని దేవతలు, మునులు, మోదము, సంతోషము పొందారు. ‘‘మేము కృతకృత్యులమైనాము’’ - అని తలచారు.
నందుడే పరమానందము। యశోదయే ముక్తికాంత। (పరమానందమే నందుడుగాను, ముక్తికాంత యశోదగాను రూపుదాల్చారు).
2. మాయా సా త్రివిధా ప్రోక్తా : -
సత్త్వ రాజస తామసీ। ప్రోక్తా చ సాత్త్వికీ రుద్రే।
భక్తే బ్రహ్మణి రాజసీ। తామసీ దైత్య పక్షేషు
మాయా త్రేధా హి ఉదాహృతా।।
మాయ త్రివిధములుగా గమనించబడుతోంది।
(1) సత్త్వము (2) రజోగుణము (3) తమోగుణము.
రుద్రభగవానునియందు సాత్విక తేజస్సు, బ్రహ్మదేవుని యందు రాజసతేజస్సు ఏర్పడి ఉన్నాయి. తామసము దైత్యుల వెంటనంటి ఉంటోంది. ఈ విధంగా మాయ ‘3’ రూపములై ఉంటుంది.
అజేయా వైష్ణవీ మాయా, జప్యేన సా అజితాపురా।
దేవకీ బ్రహ్మపుత్రా సా
యా వేదైః ఉపగీయతే।।
వైష్ణవీమాయ అజేయమైనది. అది జప తపాదులచేత కూడా తెలియబడరాదు।
వేదములచే గానము చేయబడుచున్న బ్రహ్మ పుత్రికయే - దేవకి।
3. నిగమో వసుదేవో యో।
వేదార్థః కృష్ణ, రామయోః।
స్తువంతి సతతం యత్ మే (యన్మే)
సో అవతీర్ణో మహీతలే।।
- నిగమములే (వేదములే) వసుదేవుని రూపము దాల్చాయి.
- వేదములు స్తుతించు వేదార్థ స్వరూపులు - రామ, కృష్ణులు. వేదముల పరాకాష్ఠార్థములే శ్రీకృష్ణ బలరాముల రూపములు దాల్చి భూమిపై లీలావినోదముగా అవతరించాయి. ‘సో2హమ్’, ‘తత్త్వమ్’, ‘అహంపర్వస్య ప్రభవో’ మొదలైన మహావాక్యాలు రామ-కృష్ణులుగా అవతరించాయి.
వనే బృందావనే క్రీడన్
గోప గోపీ సురైః సహ
గోప్యో గావ ఋచః తస్య।
యష్టికా కమలాసనః।।
‘‘బృందావనము’’ దేవతల మునుల అవతారులగు గోప-గోపికల క్రీడా వినోద మైదానము. అక్కడి గోవులు పరమాత్మ మహిమ గురించిన స్తుతి మంత్రగానముల రూపములగు ఋక్కులు.
ఆ గోవులను కట్టి ఉంచుచేతికర్ర (యష్టికము) కమలాసనుడు. (సృష్టికర్త అగు బ్రహ్మ భగవానుడు).
వంశస్తు భగవాన్ రుద్రః।
శృంగమ్ ఇంద్రః ।
సఖా సురః।
గోకులవనం వైకుంఠం।
తాపసాః తత్ర తే ద్రుమాః।।
వెదురుకర్ర (వంశము / వేణువు / పిల్లనగ్రోవి) - భగవానుడగు రుద్రుడు। ఆ బృందావనములోని కొండ శిఖరము ఇంద్రుని రూపము. చిన్ని కృష్ణుని సఖులందరు సురులు (దేవతలు).
ఆ గోకులవనమే వైకుంఠము. అక్కడి లతలన్నీ తపోసంపన్నులగు మునివరేణ్యులు.
లోభ క్రోధ భయా దైత్యాః।
కలికాలః తిరస్కృతః।
గోపరూపో హరిః సాక్షాత్,
మాయా విగ్రహ ధారణః।।
అక్కడికి వచ్చి బాలకృష్ణుని చేతిలో మరణము పొందిన దైత్యులు (రాక్షసులు) ఎవరు? కలికాల స్వాభావికములగు - లోభ - క్రోధ - భయ గుణములు. వాటి తిరస్కారము. అక్కడి గోపబాలుని రూపము - మాయా విగ్రహధారుడగు సాక్షాత్ విష్ణుదేవుని అవతారము.
4. దుర్బోధం కుహకం తస్య,
మాయయా మోహితం జగత్।
దుర్జయా సా సురైః సర్వైః
యష్టి రూపో భవేత్ విధిః।।
వైష్ణవీమాయ అత్యంత చమత్కారమైనది. దుర్బేధ్యమైనది. అది దృశ్యజగత్ రూపమున ప్రదర్శనమగుచు అందరిని జయించివేస్తోంది. దేవతలంతటి వారినే మోపింపజేస్తోంది. అట్టి కల్పితమగు దృశ్యమాయకు కర్రరూపముగా (కట్టుకొయ్య రూపంగా) సృష్టికర్త అగు విధి (బ్రహ్మదేవుడు) ప్రదర్శితులగు చున్నారు.
రుద్రో యేన కృతో వంశః
తస్య మాయా జగత్ కథమ్?
బలం జ్ఞానగ్ం సురాణాం వై
తేషాం జ్ఞానగ్ం హృతం క్షణాత్।
ఏ విష్ణుమాయలో తన్మయులై రుద్రదేవుడంతటి వారు లీలామానుష వేషధారులగు శ్రీకృష్ణ భగవానుని చేతిలో వేణువు (పిల్లనిగ్రోవి) అయ్యారో, అట్టి మాయా జగత్తును శ్రీకృష్ణ కృపలేనిదే మనము దాటగలమా? లేనేలేదు.
అక్కడి కృష్ణమాయలో దేవతలంతటివారు తమ (అనన్య) జ్ఞానమును హృతము (హరించబడినది) కాగా, సర్వము ఏమరిచి - క్షణంలో గోప గోపికా బాలలుగా అగుచున్నారే!
శేషనాగో భవేత్ రామః।
కృష్ణో బ్రహ్మైవ శాశ్వతమ్।।
అష్టావష్ట సహస్రే ద్వే
శతాధిక్యాః స్త్రియః తథా।
ఆదిశేషుడు అక్కడ బలరాముడు అయ్యారు. ఇక శ్రీకృష్ణుడే శాశ్వతమగు పరబ్రహ్మస్వరూపము. అట్టి పరబ్రహ్మమే వినోద కల్పిత రూపమై - 16,108 స్త్రీల రూపములు గాను, కృష్ణుని అష్టభార్యలుగా కూడాను రూపము దాల్చుచున్నది. సమస్తము అగుచున్నది.
5. ఋచో ఉపనిషదః తావై।
బ్రహ్మరూపా బుచః స్త్రియః।
ద్వేషః చాణూర మల్లో-యం।
మత్సరో ముష్టికో అజయః।
ఋక్కులే ఉపనిషత్తులు. అట్టి బ్రహ్మరూపమగు ఋక్కులే గోపికాస్త్రీలు.
చాణూరమల్లుడు ‘‘ద్వేషము’’. సామాన్యులకు అజేయుడైన ముష్టికుడే - ‘‘మత్సరము’’ (ఇరువురిని కంస సభ ప్రవేశించే ముందు బాలకృష్ణ- బలరాములు సంహరించారు)
దర్పః కువలయాపీడో।
గర్వో రక్షః। ఖగో బకః।
దయా సా రోహిణీ మాతా।
సత్యభామా ‘ధర’ ఇతి వై।
కువలయపీడయే ‘‘దర్పము’’. కొంగరూపముగల బకుడే ‘‘గర్వము’’.
రోహిణియే (వసుదేవుని భార్యయే) ఈ జగత్తు రూపంగా ప్రదర్శన మగుచున్న - జగన్మాత.
‘‘భూదేవత’’ యే (ధరయే) అష్ట భార్యలలో ఒకరగు సత్యభామ.
అఘాసురో మహావ్యాధిః।
కలిః కగ్ంసః స భూపతిః।
శమో మిత్రం ‘సుదామా’ చ।
సత్యా అక్రూరః। ఉద్ధవో దమః।
అఘాసురుడు - మానసిక - శారీరక మహావ్యాధులకు ప్రతీక. కలిపురుషుడే ఆ కంస భూపతి.
శ్రీకృష్ణుని మిత్రుడు సుధాముడే ‘‘శమాగుణము’’.
‘‘సత్యము’’ అక్రూరుడుగా అవతరించింది.
‘దమము’ ఉద్ధవుడు రూపము.
(శమము సుధాముడుగా, సత్యము అక్రూరుడుగా రూపుదాల్చాయి.)
6. యః శంఖః సః స్వయం విష్ణుః,
లక్ష్మీ రూపో వ్యవస్థితః।
దుగ్ధ సింధౌ సముత్పన్నో
మేఘ ఘోషస్తు సంస్మృతః।।
‘‘పాలసముద్రంలో పుట్టిన మేఘగర్జనను నినదించుచూ సమస్త పాపభావములను సంస్కరించు ‘శంఖము’ లక్ష్మీరూపమగు విష్ణువే’’. - అను విష్ణుతత్త్వము ఎఱిగిన వారు ఎరిగి స్మరించుచున్నారు.
దుగ్ధ ఉదధీకృతః తేన, భగ్నభాండో దధి గ్రహే।
క్రీడతే బాలకో భూత్వా పూర్వవత్ చ మహోదధౌ,
సగ్ంహారార్ధం చ శత్రూణాం
రక్షణాయ చ సంస్థితః।
కృపార్థే సర్వభూతానాం
గోప్తారం ధర్మం ఆత్మజమ్।।
చిన్ని కృష్ణుని లీలలలో విశేషమై పాల్గొనుచున్న పాలకుండలే పాలసముద్రము. పాలసముద్రంలో క్రీడలు ఆడిన మహావిష్ణువే - బృందావనములోను, వ్రేపల్లెలోని పాలభాండములను గోపికల ఇళ్లలో పగలగొట్టుచున్నారు.
పాలకుండలను పగలగొట్టుచూ, తోటి గోపబాలురకు పాలు, వెన్న పంచి సంతోషింపజేయురీతిగా ‘‘దుష్కృతులను శిక్షించి సాధుగుణులను సంరక్షించి కృపారసము కురిపింప జేయుదును’’ - అను ప్రతిజ్ఞ చేయుచున్నారు. సర్వభూతములను ఆత్మజులవలె రక్షించుచున్నారు.
7. యత్ సృష్టమ్ ఈశ్వరేణ ఆసీత్
తత్ చక్రం బ్రహ్మరూప ధృత్,
జయంతి సంభవో వాయుః, చామరో ధర్మ సంజ్ఞితః।
యస్య అసౌ జ్వలనా భాసః
ఖడ్గ రూపో మహేశ్వరః।।
ఈశ్వరునిచే ఏ చక్రమైతే (విష్ణుచక్రమైతే) సృజించబడినదో - అది బ్రహ్మ దేవుని రూపమే। (బ్రహ్మయే ఈశ్వరునిచే ‘చక్రము’గా నిర్మితులైనారు).
జయంతి (విష్ణుచిహ్నమగు పతాకము) జగత్తులో వాయువుగా సంభవించుచున్నది. చామరము (వింజామరము, దండము) - ‘ధర్మము’నకు సంజ్ఞ (చామరమే ధర్మ దేవత). జ్వలిస్తున్న (మెరుస్తున్న) - ఖడ్గమే - ‘‘మహేశ్వరుడు’’.
కశ్యపో లూఖలః ఖ్యాతో।
రజ్జుః మాతా అదితిః తథా।
చక్రగ్ం శంఖం చ సగ్ంసిద్ధిం
బిందుం వై సర్వ మూర్ధని।
శ్రీకృష్ణుని బాల్య లీలలో కనిపించే రోలు (యశోద రోలుకు కట్టటము, రోలుతో వృక్ష శాప విమోచనము) కశ్యపుడు (మరీచికి కళ వలన పుట్టి ప్రజాపతి స్థానము అలంకరించినవారు. (దేవతలకు, రాక్షసులకు కూడా తండ్రి).
‘‘త్రాడు’’ - అదితి (దేవతల తల్లి). చక్ర - శంఖములు శ్రీకృష్ణుని మూర్ధమున (ముఖశిఖర స్థానములో) బిందురూపమున (చుక్కబొట్టుల రూపంగా) ఏర్పడి ఉన్నాయి.
యావంతి దేవరూపాణి
వదంతి విబుధా జనాః।
దేవతలంతా శ్రీకృష్ణుని సర్వ అలంకారములు. దేవతలు వేంచేసియున్న స్థానము బృందావనము, బాలకృష్ణునితో ఆడి - పాడి గడిపిన వారంతా ఆయా దేవతల అవతారములుగా విబుధులు చెప్పుతూ ఉంటారు.
నమంతి దేవరూపేభ్య
ఏవం ఆది, న సగ్ంశయః।
గదా చ కాళికా సాక్షాత్,
సర్వశత్రు నిబర్హిణీ।
బృందావన కృష్ణుని సాకారరూపములను, బృందావనములోని ఆయా విశేషములన్నీ దేవతారూపములుగా భావించి, నిస్సంశయముగా నమస్కరిస్తున్నాము.
శత్రుసంహారము చేయు స్వామివారి ఆయుధమగు ‘గద’ను సాక్షాత్ కాళికాదేవి రూపముగా నమస్కరిస్తున్నాము.
ధనుః శాఙ్గం స్వమాయా చ।
శరత్కాలః - సుభోజనః।
అబ్జకాండం జగత్ బీజం,
ధృతం పాణౌ స్వలీలయా।
కృష్ణ స్వామివారి చేతిలోని ధనస్సు ‘స్వమాయ’ యొక్క రూపము. కాలస్వరూపులగు శ్రీకృష్ణస్వామి యొక్క శరత్కాల ప్రదర్శనయే అక్కడి ఆహార (భోజన) రూపము. స్వామి తన చేత ధరించిన తామరకాడ జగత్తుకు బీజరూపంగా నమస్కరిస్తున్నాము.
గరుడో వట భాండీరః
సుదామా నారదో మునిః।।
ఏ వటవృక్షము క్రింద (మఱ్ఱి వృక్షముక్రింద) బాలకృష్ణుడు చల్దులు ఆరగించారో అదియే గరుడుని రూపము.
బ్రహ్మర్షియగు నారదుడే శ్రీకృష్ణుని బాల్యమిత్రుడగు సుదాముడు.

బృందా భక్తిః, ప్రియా బుద్ధిః -
సర్వ జంతు ప్రకాశినీ।
తస్మాత్ న భిన్నం, న అభిన్నం- అభిర్భిన్నో
న వై విభుః।
భూమా ఉత్తారితం సర్వం
వైకుంఠం స్వర్గవాసి నామ్।।
‘భక్తి’యే అక్కడి బృందాదేవి. ‘‘ప్రియమగు బుద్ధి’’యే బృందావనములో సర్వ జంతువులుగా ప్రకాశము (ప్రదర్శనము).
🌹 పరమాత్మకు భిన్నమైనది లేదు. అంతా ఆయన ప్రత్యక్ష ప్రదర్శనమే.
🌹 పరమాత్మ సర్వదా సమస్తమునకు పరము (Beyond) అయి ఉన్నారు కనుక ఆయనకు భిన్నమైనది లేదు. అభిన్నమైనది (భిన్నము కానిది) లేదు.
- కొంత భిన్నము, కొంత భిన్నము కానిది కూడా ఏదీ లేదు. విశేషముగా త్రిభిన్నమైనదీ ఏదీ లేదు. ఎందుకంటే, అంతా ఆ పరమాత్మయే.
- వైకుంఠమే బృందావనమునకు దిగివచ్చింది. అందుచేత దేవతలందరు అక్కడ బృందావనవాసులై ఉండసాగారు.
- ఇత్యుపనిషత్-
(ప్రథమ ఖండః)
= ఇత్యుపనిషత్ = ఇతి ప్రథమఖండము
ఇతి కృష్ణతత్త్వ సమీప్య, సంస్పర్శలు.ద్వితీయ ఖండః - ఏకము నుండి అనేకము

1. శేషో హ వై వాసుదేవాత్
‘సంకర్షణో’ నామ బీజ ఆసీత్।
సో అకామయత →
‘‘ప్రజాః సృజేయేతి।’’
వాసుదేవుడు
సమస్తమునకు మునుముందే (సృష్టికి మునుముందు) - ఏకము, సర్వశేష్యము సమస్తమునకు ఆవలిది అగు ‘కేవలసత్త’ స్వరూపుడు మాత్రమే (One existent prior to all else) ఉండి ఉన్నారు. ఆయనయే ‘‘వాసుదేవుడు’’ అనబడుచున్నారు.
అట్టి వాసుదేవుని నుండి (అనుభూతి-సంకల్పముల రూపుడగు) సంకర్షణుడు అను పేరుగల బీజతత్త్వాత్ముడు లీలగా బయలుదేరారు. ఆయన ఏకత్వమునుండి అనేక జీవాత్మలను (ప్రజలను సంకల్పించుకొనెదను)- అనే ఇచ్ఛ పొందారు.
తతః ‘ప్రద్యుమ్న’
సంజ్ఞక ఆసీత్। తస్మాత్-
అహంకార నామా, ‘అనిరుద్ధో’
- హిరణ్యగర్భో అజాయత।।
ఆ విధంగా ఆదిశేష కేవల కృష్ణ చైతన్యపురుషుడు → ‘సృష్టి’ యొక్క ఇచ్ఛచే సంకర్షణుడు అయ్యారు. సృష్టించటము ప్రారంభించి ‘సంకర్షణుడు’ గా అయి , అటుపై సృష్ట్యనుభవముకొరకై ‘అనిరుద్ధుడు’ అనబడు ‘అహంకార’ (sense of I ) రూపము దాల్చారు. ఆ తరువాత సృష్ట్యభిమానియగు హిరణ్యగర్భ (రేతస్సు, ‘అస్తి’ నామాంతర) రూపుడైనాడు.
తస్మాత్ దశ ప్రజాపతయో మరీచి - ఆద్యాః
స్థాణు దక్ష కర్దమ ప్రియవ్రత
ఉత్తానపాద వాయవో వ్యజాయంత తేభ్యః।
అక్కడినుండి (హిరణ్యగర్భ సృష్ట్యభిమానమునుండి) దశ (10) ప్రజాపతులు మరీచ్యాదులు - మరీచి, స్థాణువు, కర్ధముడు, ప్రియవ్రతుడు, ఉత్తాన పాదుడు, వాయువు మొదలైనవారంతా) - గా జనించారు. (వారంతా ‘సృష్టి’లో పాల్గొను వివిధ కళాకారులు)
(తేభ్యః) సర్వాణి భూతాని చ।
తస్మాత్ శేషాత్ ఏవ (శేషాదేవ)
సర్వాణి చ భూతాని సముత్పద్యంతే।
తస్మిన్ ఏవ ప్రలీయంతే।
పాల్గొను వివిధ కళాకారులు)
(కేవల పరమాత్మయగు) అట్టి మొట్టమొదటి ఆదిపురుషుడగు కృష్ణుని నుండి సూక్ష్మ పంచభూతములు (Place, Vibration, Heat, Liquid, Solid) ఏర్పడు చున్నాయి. ఆ ఆదిపురుషుని నుండియే సమస్త జీవజాలము ఉద్భవించి (జలంలో తరంగాలు లాగా) తిరిగి మరొకప్పుడు ఆయనయందే లీనమగుచున్నది.
స ఏవ బహుధా జాయమానః
సర్వాన్ పరిపాతి। స ఏవ
కాద్రవేయో వ్యాకరణ జ్యోతిష ఆది
శాస్త్రాణి నిర్మిమాణో బహుభిః।
ఆ ఆదిశేషుడగు పరమాత్మనుండే ఈ జీవులంతా అనేక విధములుగా పుట్టుచున్నారు. సర్వులు ఆ ఆది పురుషునిచేతనే పరిపోషింపబడుచున్నారు. అట్టి కాద్రవేయుని నుండే (ఆదిశేష సర్ప రూపమునుండే) శబ్దము, పలుకు, మాటలు, వ్యాకరణము, జ్యోతిష్యము మొదలైన శాస్త్రములన్నీ నిర్మించ బడుచున్నాయి.
(బహుభిః) ముముక్షుభిః ఉపాస్యమానో।
అఖిలాం భువం ఏకస్మిన్ శీర్షిణా సిద్ధార్థవత్ థ్రియమాణః।
సర్వైః మునిభిః సంప్రార్థ్యమానః।
అట్టి ఆదిశేష స్వరూపుడే సమస్త భువనములను థ్రియామాణుడు. (ధరించుచున్నట్టి వారు). జగత్తు విషయముల పట్ల మౌనము వహించి, ఆత్మవిశేషము పట్ల వికసితమగుచిత్తముగల మునులకు ఆయనయే ‘‘ప్రార్థింపబడువారు’’ అగుచున్నారు.
సహస్రశిఖరాణి మేరోః
శిరోభిః అవార్యమాణాన్
మహావాయుః అహంకారాన్ నిరాచకార।
మేరుపర్వత శిఖరములవలె ఆయనయొక్క వేయి ఫణములను (పడగలను) కించిత్ కూడా కదల్చలేక వాయువు తన అహంకారము త్యజించి మౌనము వహించుచున్నది. (ప్రాణాయామములకు ఆవల మౌనస్వరూపమై నిశ్చలాత్మగా ప్రాణాయామ యోగాభ్యాసులకు సందర్శనము అగుచున్నది)
స ఏవ భగవాన్ భగవంతం బహుధా విప్రీయమాణః-
అఖిలేన స్వేన (స్వ ఏన) రూపేణ యుగే యుగే,
తేన ఏవ జాయమానః స ఏవ సౌమిత్రిః ఇక్ష్వాకః।
భగవంతుడే ఆదిస్వరూపుడు. సహస్రశీర్ష - ళివేయి పడగల (శీర్షముల)రి ఆదిశేషుడు పరమాత్మయొక్క ప్రీతికొరకై, సర్వభూత రక్షణ కొరకై యుగయుగాలుగా పరమాత్మతో బాటే అవతరిస్తున్నారు.
ఆ ఆదిశేషుడే ఇక్ష్వాకు కులము (వంశము)లో సుమిత్రా తనయుడగు సౌమిత్రిగా (లక్ష్మణస్వామిగా) అవతరించారు.
2. సర్వాణి ధానుష శాస్త్రాణి,
సర్వాణి అస్త్ర శస్త్రాణి, బహుధా
విప్రీయమాణో రక్షాంసి సర్వాణి వినిఘ్నం (చ) ।
చాతుర్వర్ణ్య ధర్మాన్ ప్రవర్తయామాస।
స ఏవ భగవాన్ యుగసంధికాలే
శారదాభ్రసన్నికాశో రౌహిణేయో వాసుదేవః।।
ఆయన సర్వధానుష శాస్త్రమును (ధనుర్వేదమును) అనేక రీతులుగా రచిస్తున్నారు. రాక్షస స్వభావులను శిక్షించుచున్నారు. చాతుర్వర్ణ్య ధర్మములను రక్షించి, ప్రవర్తింపజేయుచున్నారు.
బలరామ ప్రసంశ - ఆ ఆదిశేష భగవానుడే ద్వాపర - కలియుగ సంధి కాలములో శరత్కాల మేఘమువంటి తెల్లని శరీరముతో రోహిణీ - వసుదేవుల కుమారుడై బలరాముడుగా అవతరించారు.
సర్వాణీ గదా ఆది ఆయుధ శస్త్రాణి
వ్యాచక్షాణో నైకాన్ రాజన్య మండలాన్
నిరాచికీర్షుః, భూభారమ్ అఖిలమ్ నిచ ఖాన।
అనేకమంది రాజులకు ఆ బలరాముడు గదావిద్యను బోధించారు. గదాధారులై (జరాసంధుని దండయాత్రల సందర్భములో) అనేకమంది దుష్టస్వభావులగు రాజులను మట్టికరిపించారు. భూభారమును తగ్గించారు
స ఏవ భగవాన్ యుగే
తురీయే అపి బ్రహ్మకులే జాయమానః,
సర్వా ఉపనిషదః ఉత్ దిధీర్షుః।
సర్వాణి ధర్మ శాస్త్రాణీ విస్తారయిష్ణుః।
సర్వాన్ అపి జనాన్ సంతారయిష్ణుః।
ఆ భగవానుడు నాలుగవదగు కలియుగములో బ్రహ్మ కులమునందు పుట్టి (సాధనల అంతిమఫలమగు ‘సో2హమ్’, ‘తత్త్వమ్’లను ప్రకటించు) ఉపనిషత్తులను ఉద్ధరించటానికై ఉద్దేశ్యించుచున్నారు. ధర్మశాస్త్రమును పరమార్థములను విస్తరించటానికై, జనులను తరింపజేయటానికై అవతారము స్వీకరిస్తున్నారు. (బుద్ధావతారము)
సర్వాన్ అపి వైష్ణవాన్ ధర్మాని
విజృంభయన్, సర్వాన్ అపి పాషండాన్ నిచఖాన।
స ఏవ జగదంతర్యామీ। స ఏష సర్వాత్మకః।
స ఏవ ముముక్షుభిః ధ్యేయః। స ఏవ మోక్షప్రదః।
పరమాత్ముడగు భగవానుడే అవతారుడై - సర్వ వైష్ణవ పరాకాష్ఠ ధర్మములను విజృంభింపజేస్తున్నారు. పాషండుల పరిమిత అవగాహనలను ఖండించి వేస్తున్నారు. (పాషండులు = పూజ, ప్రాణాయామము, ధ్యానము మొదలైన సాధనలను చేస్తూ కూడా ‘‘భగవంతుడు అన్యుడు, అనన్యుడు కాడు’’- అను మూర్ఖ భావమును ఆశ్రయించి ఆచార వ్యవహారములకు మాత్రమే పరిమితులైనవారు)
బుద్ధావతారము = జగదంతర్యామిత్వము నిదురలేపి, ‘‘నేను బద్ధుడను కాను’’ అను భావనను చిగురింపజేసి జనులను మోక్షప్రదులుగా తీర్చిదిద్దుతున్నారు. వారి బోధలు ముముక్షువులకు వివేక ప్రసాదితములగు ధ్యేయములు.
ఏతం స్మృత్వా సర్వేభ్యః పాపేభ్యో ముచ్యతే।
తత్ నామ సంకీర్తయన్ విష్ణు సాయుజ్యం గచ్ఛతి,-
తత్ ఏతత్।
అట్టి బుద్ధావతారము స్మరించినంతమాత్రంచేత ఈ జీవుడు సర్వపాపముల నుండి విముక్తుడు కాగలడు.
ఆ సంకీర్తనముచే విష్ణు సాయుజ్యము జనులు పొందగలరు.
దివా అధీయానః రాత్రికృతం పాపం నాశయతి।
నక్తమ్ అధీయానో దివసకృతం పాపం నాశయతి।
తత్ ఏతత్ వేదానాం రహస్యం।
తత్ ఏతత్ ఉపనిషదాం రహస్యం।
ఏతత్ అధీయానః సర్వక్రతు ఫలం లభతే।।
ఈ ఉపనిషత్తు పగలు చదివితే రాత్రి చేసిన పాపములు, రాత్రి అధ్యయనము చేస్తే పగలు చేసిన పాపములు తొలగిపోగలవు.
ఈ ఉపనిషత్తులో సమస్త వేదముల సారము నిక్షిప్తమైయున్నది.
ఈ ఉపనిషత్ అంతరార్థమును (రహస్యార్థమును) అధ్యయనము చేయువారికి సమస్త క్రతువులు నిర్వర్తించిన ఉత్తమ ఫలము లభించగలదు
శాంతిమేతి। (శాంతిం ఏతి) మనశ్శుద్ధిమేతి।
సర్వతీర్థఫలం లభతే।
య ఏవం వేద,
దేహబంధాత్ విముచ్యతే।।
- ‘‘ఇత్యుపనిషత్’’।


= ఇత్యుపనిషత్ = ఇతి ద్వితీయ ఖండః
అట్టి రహస్యార్థ ఉపాసకునికి, ముముక్షువునకు ‘‘ఆత్మస్వరూపమేవాహమ్’’ రూపమగు పరమశాంతి లభించగలదు. మనస్సు నిర్మలము, ప్రశాంతము కాగలదు. సర్వతీర్థములలో స్నానము చేసిన ఫలము లభించగలదు. ఇందలి పరమార్థము తెలుసుకొన్నవాడు దేహబంధమునుండి విముక్తుడవగలడు.

‘‘నేను సర్వదా దేహరహితుడను. సర్వాత్మకుడను. కేవలీస్వరూప అవతార లీలావినోదిని’’ అని గ్రహించగలడు.

= ఇత్యుపనిషత్ = ఇతి ద్వితీయ ఖండము

ఇతి కృష్ణ ఉపనిషత్ సమాప్తా ।।
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।।


అధర్వణ వేదాంతర్గత

5     కృష్ణ ఉపనిషత్

అధ్యయన పుష్పము

1వ ఖండము - బృందావన సంచార రహస్యార్థము

ఏ శ్రీరామచంద్రుడైతే శ్రీకృష్ణుడుగా అవతరించి, లీలావినోదంగా ‘‘స్వస్వరూప సర్వాత్మత్వము’’ను సంప్రకటన చేయుచు మౌనిపటలమును బ్రహ్మానందపరచారో - అట్టి శ్రీరామ - శ్రీకృష్ణ భగవానునికి నమస్కరిస్తున్నాము.
[లోకోరమయతేతి రామః। కృష్ణస్తుభగవాన్ స్వయమ్‌]

ఒక సందర్భములో కొందరు మునివరేణ్యులు దండకార్యణములో ఆశ్రమవాసము నిర్వర్తిస్తూ ఉన్న శ్రీరామచంద్రమూర్తిని దర్శించాలనే అభిలాష కలిగినవారై, ఎక్కడెక్కడి నుండో వచ్చి సమావేశమై, శ్రీరాముడు పరివేష్ఠితులై ఉన్నచోటికి వచ్చారు. మునుల రాకను గమనించిన రామచంద్రుడు గబగబలేచి మునుల పాదపద్మములను పన్నీటి జలముతో కడిగి శిరస్సుపై దాల్చి, వారందరినీ ఒక ప్రశాంతమైన ప్రదేశములో సుఖాసీనులుగా చేసారు.

అయితే ఆ మునివరేణ్యులంతా ఆత్మారామానంద స్వరూపుడగు శ్రీరాముని సౌందర్యము చూచి తన్మయులు కాసాగారు. బాహ్య దృష్టులన్నీ వదలి శ్రీరామచంద్రుని చూస్తూ ‘‘పుంసాం మోహన రూపాయ। పుణ్య శ్లోకాయ మంగళమ్’’ అని పలుకుచూ, శ్రీరాముని ‘‘వర్ణనాతీత పరబ్రహ్మానంద సౌందర్యమును’’ తిలకిస్తూ అనిర్వచనీయానందము పొందసాగారు.

శ్రీరామచంద్రుడు ఆ మునిసత్తములందరినీ ఒక్కొక్కరుగా కుశల ప్రశ్నలు అడుగసాగారు. మునులు మాత్రం రామచంద్రుని సౌందర్య సందర్శనామృత మాధుర్యములోనే మునిగితేలసాగారు.

మునులు : శ్రీమహావిష్ణు అవతారమూర్తీ! మూర్తీభవించిన ఆత్మారామానందస్వరూపా! నీయందు మాకు అనుభూతమగుచున్న వేద-వేదాంగ ప్రవచితమైనట్టి సత్-చిత్-ఆనంద సౌందర్యము చూచి మేము మన్మథుని చూచిన రతీదేవివలె తన్మయులమగు చున్నామయ్యా! వనవాసులమగు మేము మీ సర్వాంగ సుందరము చూచి విస్మితులమగుచున్నాము. మీ ఈ మూర్తితో ఆలింగనము ప్రసాదించమని వేడుకొనుచున్నాము. అవద్యమ్ అవతారాన్ వైగణ్యంతే - ఆలింగామో భవంతమ్ - ఇతి।।

శ్రీరాముడు : ప్రియ మునీంద్రులారా! మీ భక్తికి నేను సంతోషము పొందుచున్నాను. భక్తవశడును కదా! అయితే, భవాంతరే కృష్ణావతారే యూయం గోపికా భూత్వా మామలింగథ। రాబోయే నా కృష్ణావతారములో మీరు నాతోను, నేను మీతోను శారీరకమగు (ప్రకృతిపరమగు) - ఆలింగనానందము పొందుచూ మమేకమగుదుము గాక.

రుద్రుడు, మునీశ్వరులు : అన్యే యే అవతారాః తే హి గోపా నః స్త్రీశ్చ నో కురు। అన్యోన్య విగ్రహం ధార్యం తవాంగ స్పర్శనాది హ। ఆత్మసౌందర్యా! శ్రీరామ భగవాన్। మీ తరువాతి అవతార సందర్భములో మమ్ములను వ్రజ గోపబాలురుగాను, వ్రజగోపికాస్త్రీలుగాను జన్మలు ప్రసాదించండి.

శ్రీరామచంద్రా! మనము అంగ స్పర్శకొరకై అనోన్యము ప్రియులమై ఉందాము. మీరు శ్రీకృష్ణుడుగా అవతరించినప్పుడు మరల మరల మమ్ములను అంగాంగం స్పృశించాలి సుమా! అందుకొరకై మేము వ్రజ గోపి-గోపికాజనముగా జన్మలు ఆనందంగా స్వీకరిస్తాము.

శ్రీరాముడు : అంగ సంగం కరిష్యామి। భవధ్వాక్యమ్ కరోమి అహమ్। ఓ మునులారా! రుద్రాది దేవతలారా! మీరు అభిలషిస్తున్నట్లుగా ‘‘అంగసంగము’’ తప్పక పొంది ఆనందించెదము గాక.

ఆ మాటలు విని దేవతలు, మునులు ‘‘ఆహా! మేము కృతకృత్యులము’’ అని సంతోషించి, శ్రీరామచంద్రుని సమక్షంలో కొంతసేపు గడిపి తృప్తిగా తమతమ స్థానములకు తిరోముఖులు అయ్యారు.

వారంతా ద్వాపరయుగములో శ్రీకృష్ణునితో బాటుగా వ్రజగోపబాల-గోపికా స్త్రీలుగా జన్మలు స్వీకరించారు.

పరమానందదేవత → నందుడుగాను
ముక్తిదేవత → యశోదగాను జన్మలు పొందారు.

⌘⌘⌘

మాయ - సత్త్వ రజో తమో గుణములుగా చెప్పబడుతోంది. రుద్రునియందు సత్త్వము, బ్రహ్మయందు రాజసగుణము, తామసగుణము దైత్యుల వైపుగా ఉంటుంది.

ఈ విధంగా మాయ ‘3’ విధములైనదిగా చెప్పబడుతోంది. అట్టి విష్ణుమాయ అజేయమైనది. జప-తపములు మాత్రం చేత కూడా తొలగేది కాదు. అందుకుగాను - పరంధాముడగు శ్రీకృష్ణోపాసనయే శరణ్యము.

దేవకి : వేదములచే వర్ణించబడు బ్రహ్మపుత్రికయే దేవకి. (బ్రహ్మ భావనయే ప్రకృతిపరంగా ‘‘దేవకి’’ అయినది).
వసుదేవుడు: వేదములు (నిగమములు) వసుదేవుని రూపము.

కృష్ణ-రాములు : వేదములలోని కర్మ - ఉపాసన - జ్ఞానవిచాణ తత్త్వమే వసుదేవుడు. వేదమహావాక్యములగు ‘సో2హమ్, తత్‌త్వమ్’ల పరమార్థానుభవమే → భూమిపై కృష్ణ - బలరాములుగా అవతరించారు. ‘‘మత్తః పరతరం నాన్యాత్ కించిదస్తి’’, ‘‘అహం సర్వస్య ప్రభవో’’, ‘‘మయాతతమిదం సర్వం జగదవ్యక్త మార్తినా’’ - మొదలైన మహావాక్యాలు భగవద్గీతాకృతంగా జాలువారాయి.

బృందావనము : వనే బృందావనే క్రీడన్ గోప-గోపీస్సురై సః। దేవతలు, ఋషులు, మునులు గోపబాలురుగా అవతరించి క్రీడించు స్థలము.

గోపికలు, గోవులు := మునులు, శ్రుతులు

గోప్యోగావ ఋచః। ఋగ్వేదములోని ఋక్కులు, గోపికలు→ గోవులుగా రూపము తీసుకున్నాయి.
యష్టికా కమలాసనః। చేతికర్ర (కట్టుకర్ర) (ఆవులను మేపునప్పుడు గోపబాలురు ఉపయోగించు కర్ర) గోపగృహముయొక్క బ్రహ్మదేవుడు.
వంశస్తు భగవాన్ రుద్రః బాలకృష్ణుడు ఉపయోగిస్తున్న వంశీ (పిల్లనగ్రోవి) - భగవానుడగు రుద్రుడు.
శృంగం ఇంద్రః। బృందావనములోని గోవర్ధనగిరి శిఖరము ఇంద్రుడు.
సఖా సురః। దేవతలు - శ్రీకృష్ణుని ప్రియ స్నేహితులు, సఖులు.
గోకులవనం వైకుంఠం। ఆ గోకులవనము - వైకుంఠము.
తాపసాః తత్ర తే ద్రుమాః। అక్కడి చెట్లు, లతలు తాపసులగు మునులు.

లోభ క్రోథ భయా దైత్యైః కలికాలః తిరస్కృతః। కలికాల స్వాభావికములైన లోభ క్రోధ భయాదులు-దైత్యులు (రాక్షసులు). అక్కడ తిరస్కారము పొందువారు. బాలకృష్ణునిచే సంహరించబడిన ‘పూతన’ మొదలైన అసురులంతా అరిషట్‌వర్గ ప్రతీకలు.

గోపరూపో హరిః సాక్షాత్ మాయా విగ్రహధారిణః। వైకుంఠవాసుడగు శ్రీహరియే బృందావనములో గోపబాలుడగు శ్రీకృష్ణ గోపాలుడు. సాక్షాత్ హరియే మాయా మానుషవేషధారి అయి బృందావనములో బ్రహ్మానందము ప్రసాదిస్తూ లీలలు ప్రదర్శిస్తున్నారు.

వైష్ణవమాయ - దురత్యయము (దాటరానిది), దుర్బోద్యము (అర్థము కానిది). దుర్భేధ్యము (బేధింపజాలనిది) కూడా!
ఈ జగత్తంతా మాయామోహితమై కుహకము (లోతైనగోయివలె) అయి వర్తిస్తోంది.
దేవతలకు కూడా దుర్జయము (జయింపరానిది) .

☘︎ విధి (బ్రహ్మదేవుడు) అంతటివాడు బృందావనంలో వెదురు కర్ర రూపము దాల్చుచున్నారు.
☘︎ రుద్రుడంతటివాడు వెదురు నిర్మితమైన మోహనమురళి రూపము ధరించి శ్రీకృష్ణస్పర్శపొంది ఆనందిస్తున్నారు.
☘︎ మహర్షులు, మునులు, దేవతలు - అంతటివారు బాలకృష్ణుని మోహనమురళీగానము వినటానికి బృందావనములో పరుగులు ఎత్తుచున్నారు.
☘︎ మాయాజగత్తును ఎవరు మాత్రం జయించగలరు? మాయచే దేవతలంతటి వారి అనన్య-జ్ఞానము కూడా క్షణంలో హరించబడుతోందే! అట్టి మాయను జయించే ఉపాయమేమిటి? మాయ (మాయ తనదైనట్టి) బాలకృష్ణుని శరణువేడుచూ, శరణాగతిని ఆశ్రయించటమే।

❋ శేషనాగో భవేత్ రామః - ఆదిశేషుడే (సర్వము లయించగా అప్పటికీ శేషించియుండు ఆదిగా శేషించువాడే) - బలరాముడుగా అవతరించారు.
❋ కృష్ణో బ్రహ్మైవ శాశ్వతమ్। శాశ్వతమగు పరబ్రహ్మమే శ్రీకృష్ణుడు.
❋ ఋక్కులు, ఉపనిషత్తులు→ గోపికా స్త్రీలుగా అవతరిస్తున్నారు. గోపికా స్త్రీలు బ్రహ్మము గురించి గానము చేయు ‘ఋక్’ రూపులే।

ద్వేషము → చానూర మల్లుడు।
మత్సరము → ముష్టిక మల్లుడు।
దర్పము → ‘కువలయపీడ’ అనే ఏనుగు।
గర్వము → బకాసురుడు ళిఖగ (కొంగ) రూప రాక్షసుడురి।
దయ → రోహిణీమాత।
ధర (భూమి) → సత్యభామ।
మహావ్యాధి (వదలలేకపోతున్న మానసికమైన రుగ్మతలు) → అఘాసురుడు।
కలిపురుషునిడే → కంసుడు।
శమము → కృష్ణమిత్రుడైన సుదాముడు।
సత్యము → అక్రూరుడు।
దమము → ఉద్ధవుడు।

శంఖముగా రూపుదాల్చినది ఏది? లక్ష్మీరూపముగా వ్యవస్థితుడై యున్నది విష్ణువే. సః స్వయం విష్ణుః లక్ష్మీ రూపో వ్యవస్థితః।

పాల సముద్రమే వ్రజగోపికా గృహములలోని పాలకుండల రూపము. బాలకృష్ణుడు గోపికల ఇళ్లలో పగలగొట్టిన పాలు - పెరుగు కుండలే - ‘‘మహావిష్ణువు యొక్క పాలసముద్రములోని బాలా - లీలా - క్రీడా వినోదములు.’’

సమస్త జనుల సంసార భాండములను పగలగొట్టటమే శ్రీకృష్ణుని - సాధురక్షణ, దుష్టశిక్షణ. అదంతా జీవుని దోషములు తొలగించు చమత్కారము. ఆయన ధర్మ రక్షకుడై ఉండటమనేది సర్వభూతములపై దయాకటాక్షవీక్షణము (ఆర్తజనులను రక్షించటము). దుష్టత్వమును తొలగించటము, సాధుత్వమును సముత్సాహపరచటమే - శ్రీకృష్ణావతారముఖ్యోద్దేశ్యము.

చక్రము : ఈశ్వరునిచే బ్రహ్మయే ‘చక్రము’గా సృష్టించబడ్డారు.

(బృందావనములో) వాయువీచిక శబ్దములు :- పరమాత్మకు ‘జయమగుగాక’ అని జేజేలు పలికే నాదములు. జయంతి సంభవో వాయుః।

చామరము → ధర్మదేవతకు సంజ్ఞ (ధర్మో రక్షతి రక్షితః - అని గుర్తు చేయు సంజ్ఞ).

ప్రజ్వలించు ఖడ్గము → మహేశ్వరుడు - యస్య అసౌ జ్వలనా భాసః, ఖడ్గ రూపో మహేశ్వరః। (మహా - ఈశ్వరుడు = సమస్త జగత్తుగా విస్తరించియున్న స్వస్వరూప విస్తారణ ప్రదర్శనము). అజ్ఞానమూలములను ఖండించునది - ఖడ్గము.

అక్కడి రోలు → కశ్యప ప్రజాపతి। కశ్యపో లూఖలః ఖ్యాతో।

కృష్ణయ్య నడుముకు కట్టిన త్రాడు → అదితి। రజ్జుః మాతా అదితిః। (‘పుత్ర’ ఇత్యాది మమకార బంధము).

‘తత్త్వమ్’ - ‘సో2హమ్’ మహావాక్యములకు ప్రతీకలు.

మోక్షమునకు సంసిద్ధతయే - చక్ర, శంఖములు (బంధము ఎందుకు లేదో విశ్లేషించి చెప్పే ఉపనిషత్ వచనములు).

బిందువు → కృష్ణుని మూర్థస్థానము (Point of foreface) (సమస్తము తనయందు దర్శించు స్థానము).

‘‘ఇవన్నీ దేవతారూపములే’’ అని తత్త్వజ్ఞులగు విబుధజనుల (Inteligent Beings) యొక్క సమన్వయ వచనములు. అట్టి దేవతా రూపములకే అందరు నమస్కరిస్తున్నారు. సంశయరహితంగా కృష్ణుని అలంకారములలో సర్వదేవతారూపములను దర్శిస్తున్నారు.

స్వామి చేతిలోని గద - సాక్షాత్ అరిషట్‌వర్గ శత్రు సంహారి యగు కాళికాదేవి।
స్వమాయయే - ‘శాఙ్గముము’ అనబడే ధనుస్సు.
అక్కడి శరత్కాలము - భోజనము। మధుర ఆహార రూపము.
చేతిలో ధరించుచున్న తామర కాడయే - ‘జగత్’ అనే వృక్షమునకు ‘‘బీజము’’-అనే సంజ్ఞ। స్వకీయ కల్పనలన్నిటికీ ఉత్పత్తి స్థానమగు స్వస్వరూపము
వటవృక్షము - గరుడుడు।
నారదుడే - సుదాముడు।
బృందాదేవి - భక్తి స్వరూపము।

బృందా భక్తిఃప్రియా బుద్ధి, సర్వజంతు ప్రకాశినీ। - సర్వజీవులలో బుద్ధిరూపముగా వెలయుచు ప్రియస్వరూపిణిగా ఉన్నదియే బృందావనము.

సమస్తము కృష్ణపరమాత్మయే। ఆయనకు భిన్నమైనదేదీ లేదు. భిన్నముగా కనిపిస్తున్నదంతా అభిన్నుడగు కృష్ణతత్త్వమే। గోపస్త్రీలు, బృందాదేవి మొదలైనవారికెవ్వరికీ కృష్ణుడు భిన్నము కాదు. శ్రీకృష్ణుడు ఎవ్వరికీ భిన్నుడు కాడు. అభిన్నుడు. మనమంతా శ్రీకృష్ణ చైతన్యప్రభునిత్యానందస్వరూపులమే।।

స్వర్గవాసులు వైకుంఠమును కోరుకోగా, అప్పుడు వైకుంఠమే బృందావనమునకు దిగివచ్చింది. దేవతలంతా పరమానందముగా వైకుంఠతుల్యమగు బృందావనములో గోపబాల - గోపికా - గో - పుష్ప - వృక్షములుగా అయి, సర్వాత్మకమగు శ్రీకృష్ణపరబ్రహ్మ తత్త్వమును వినోదించసాగారు.

ఇత్యుపనిషత్ - ప్రథమాధ్యాయః।।


2వ ఖండము - ఏకమునుండి అనేకము

[ వాసుదేవ-సంకర్షణ-ప్రద్యుమ్న-అనిరుద్ధ-హిరణ్యగర్భ-ప్రజాపతీ-భూతజాలయో ]

మెట్టమొదట జగదతీత - జగత్ రహిత కేవలస్వరూపుడగు వాసుదేవుడే ఏకస్వరూపుడై అఖండుడై సర్వత్రా వేంచేసియున్నారు.
ఆయన కేవల - నిర్విషయ - ఏకాంత - అనన్య - ఆనందాత్మ స్వరూపుడు.

(అహంకార నామా అనురుద్ధో హిరణ్యగర్భో అజాయత।) (అనిరుద్ధ = Unstoppable).

ఆయన నుండి దశ (10) ప్రజాపతులు, మరీచి, స్థాణువు, దక్షుడు, కర్దముడు, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు, వాయువు మొదలైనవారు జనించారు. వారి నుండి సమస్త భూతజాలము జనించింది.
❋ [ ప్రజాపతులు (21) : (భారతము, భాగవతము, దేవీ భాగవతము).
1. బ్రహ్మ 2. స్థాణువు 3. మనువు 4. దక్షుడు 5. భృగువు 6. ధర్ముడు 7. యముడు 8. మరీచి 9. అంగిరసుడు 10. అత్రి 11. పులస్త్యుడు 12. కర్దముడు 13. క్రతువు 14. వసిష్ఠుడు 15. పరమేష్ఠి 16. సూర్యుడు 17. సోముడు 18. కర్దముడు 19. క్రోధుడు 20. అర్వాకుడు 21. ప్రీతుడు ]
❋ ఆదిశేషునినుండి సర్వభూతములు జనించటము, తిరిగి ఆయనయందే లీనమవటము (జల-తరంగన్యాయంగా) జరుగుతోంది.

స ఏవ బహుధా జాయమానః సర్వాన్ పరిపాతి। కేవలుడు, ఆదిస్వరూపుడు, ఆద్యంత రహితుడు అగు పరమాత్మ అనేక విధములుగా పుట్టుచు, సమస్తము తన యొక్క ధారణయందు కలిగి ఉంటున్నారు.

స ఏవ కాద్రవేయో వ్యాకరణ జ్యోతిషాది శాస్త్రాని నిర్మిమానో। - ఆ ఆదిశేషుడే భాషలు, వ్యాకరణము, జ్యోతిషము మొదలైన శాస్త్రములను నిర్మించి సృష్టియందు ప్రతిక్షేపించుచున్నారు.

(స ఏవ) బహుభిః ముముక్షుభిః ఉపాస్యమానో। అనేకమంది ముముక్షువులు ఏ పేరుతోనైనా ఉపాసిస్తూ ఉన్నది ఆ కృష్ణ చైతన్యతత్త్వమునే।

సర్వత్రా సర్వులు అఖండమగు ఆత్మనే ఉపాసిస్తున్నారు. అఖిలాం భువమ్ ఏకస్మిన్ శీర్షిణా సిద్ధార్థ వద్రియమాణః। శ్రీకృష్ణ పరమాత్మ సమస్తభూరూపమును (Entire solid) తన సహస్రాది సువిస్తార శిరస్సులలోని ఒక శిరస్సుపై నిలిచిన ఆవగింజంత"గా) ధరించుచున్నారు.

సర్వైః మునైః సంప్రార్థ్యమానః। సర్వ మునులచే సర్వాత్మకుడుగా ఆ శ్రీకృష్ణపరమాత్మయే అనేక నామరూపములతో సంప్రార్థించబడుచున్నారు.


ఆదిశేషుడు

హేమపర్వతముయొక్క వేలాది శిఖరములవలె ఉన్న ఆ పరమాత్మయే ఆదిశేషుడు. ఆదిశేషుని శిరస్సులలో ఒక్కదానినైనా కూడా - వాయువు కించిత్ కూడా కదల్చజాలక సిగ్గుతో వెనుకకు తిరిగి తన అహంకారమును పోగొట్టుకొనుచున్నది. అట్టి ఆదిశేషుడు, అద్యంత రహితుడు - అగు పరమాత్మకు ఆనందము కలుగజేయటానికై యుగయుగములుగా పరమాత్మతోబాటే అవతరించుచున్నారు.

స ఏవ సౌమిత్రిః ఐక్ష్వాకః। ఆయనయే ఇక్ష్వాకు వంశములో ‘లక్ష్మణుడు’గా శ్రీరామచంద్రునికి తమ్ముడై అవతరించారు.

ఆ నిర్వికారుడు, నిర్వికల్పుడు అగు పరమాత్మాంశయే సంకర్షుణుడై (బలరాముడై) సమస్త ‘ధనుష శాస్త్రము’ను, సర్వ అస్త్రశస్త్రముల విశేషములను బహువిధములుగా రచిస్తున్నారు. వాటిని ఉపయోగించి రాక్షస సంహారము నిర్వర్తిస్తున్నారు. ధర్మరక్షణను లీలగా నిర్వర్తిస్తూ బ్రాహ్మణ - క్షత్రియ - వైశ్య - శూద్ర చాతుర్వర్ణ్య ధర్మములను ప్రవర్తింపజేయుచున్నారు.

బలరామావతారము :

సయేవ భగవాన్ యుగసంధికాలే శరదాభ్ర సన్నికాశో రౌహిణేయో వాసుదేవః ।

అట్టి పరాత్పరుడగు ఆదిశేషుడే యుగసంధికాలంలో (ద్వాపర - కలి యుగ సంధి సమయములో) శరత్కార మేఘమువంటి తెల్లటి సమమైన శరీరముతో రోహిణీ వసుదేవుల కుమారుడు ‘బలరాముడు’గా జన్మించారు. గద మొదలైన ఆయుధవిద్యను అనేకమంది రాజులకు నేర్పించారు. మధురపై దండయాత్ర చేసిన అనేకమంది రాక్షస స్వభావులగు రాజులను నిర్జించారు. భూభారమును తగ్గించారు. దుష్టశిక్షణ - శిష్ట రక్షణ నిర్వర్తించారు.


బుద్ధావతారము

స ఏవ భగవాన్ యుగే తురీయే-పి బ్రహ్మకులే జాయ మానః సర్వా ఉపనిషదః ఉద్దిధీర్షుః। ఆ పరంధాముడే (నాలుగవదగు) కలియుగములో బ్రహ్మకులమున పుట్టి జనులను తరింపజేయటానికై యజ్ఞము మొదలైన కర్మమాత్ర పరిమితములను ప్రశ్నిస్తూ ఉపనిషత్తులను పునరుద్ధరింపజేయుచున్నారు. సర్వజనులకు రక్షణ కల్పిస్తున్నారు. వైష్ణవ ధర్మములను విజృంభింపజేస్తూ పాషండమతములను జల్లెడపట్టుచున్నారు. (పరమాత్మను అన్యునిగా నమ్మచూపు వాదోపవాదములను, ‘‘జీవాత్మ మాత్రమేవా2హమ్’’ - పరిమిత భావములను - ‘‘పాషండము’’ అని ఇక్కడ ఉద్దేశ్యము.


పరమాత్మ!

✤ అట్టి పరమాత్మయే సమస్త జగత్తుకు అంతర్యామి। పరమాత్మయే శ్రీకృష్ణ-ప్రకృతిగత రూపధారుడై జగద్గురువుగా విలసిల్లుచున్నారు.
స ఏష సర్వాత్మకః। ఆయన సర్వజీవుల ఆత్మస్వరూపుడు. సర్వాత్మకుడు.
✤ ముముక్షువులందరికీ ఆ సర్వాత్మకుడగు భగవానుడే ధ్యేయవస్తువు.
✤ ఆయనయే జీవులకు సమస్త బంధములను తొలగించు మోక్షప్రదాత। (తరతి శోకమ్ ఆత్మవిత్).
✤ అట్టి పరమాత్మయే, పరాత్పరుడే-ముముక్షు-ధ్యేయస్వరూపుడు. మోక్షప్రదాత. సర్వాంతర్యామి అగు ఆ పరమాత్మను స్మరిస్తూ ఉండగా ఈ జీవుడు సర్వపాపకర్మల నుండి, దోష దృష్టులనుండి విముక్తుడు కాగలడు. ఏతం స్మృత్వా సర్వేభ్యః పాపేభ్యో ముచ్యతే।
తన్నామ సంకీర్తయన్ విష్ణు సాయుజ్యం గచ్ఛతి। అట్టి పరమాత్మను సంకీర్తనము చేయుచుండగా ఈ జీవుడు విష్ణుసాయుజ్యము (సర్వత్రా సర్వదా స్వాత్మయగు విష్ణు సందర్శనము) పొందగలడు. ‘విష్ణుతత్త్వ జ్ఞాని’, ‘‘విష్ణు సో2హమ్ స్వానుభవి’’ కాగలడు.


ఫలశ్రుతి

అట్టి శ్రీకృష్ణ పరబ్రహ్మముయొక్క స్మరణ - కీర్తనలచే,
పగలు స్మరణచే రాత్రి పాపములు తొలగగలవు. రాత్రి స్మరణచే - పగలు పాపములు ప్రక్షాళనమవుతాయి.
మనము ఈ ఉపనిషత్తులో చెప్పుకొన్న వేదోపనిషత్ రహస్యము యొక్క అధ్యయన - ఉపాసనలచే సర్వక్రతువులు చేసిన ఫలము లభించగలదు.

మనశ్శుద్ధి, మనశ్శాంతి లభించగలదు.

సర్వతీర్థముల స్నానఫలం పొందగలరు.

ఇందలి తత్త్వము తెలుసుకోవటంచేత ‘‘దేహబంధము’’ (ఈ దేహమే నాకు బంధము - అను స్వయంకల్పిత భావన) నుండి విముక్తుడు కాగలడు.

ఇతి శ్రీకృష్ణ ఉపపనిషత్
ఓం శాంతిః। శాంతిః। శాంతిః।